tummala nageshwar rao
-
మంత్రి తుమ్మలకు నిరసన సెగ
సాక్షి,ఖమ్మం : వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావుకు నిరసన సెగ తగిలింది. ఖమ్మం జిల్లా ప్రకాష్ నగర్ వరద ప్రాంతాల పర్యటనకు వెళ్లిన తుమ్మలకు వ్యతిరేకంగా స్థానికులు నినాదాలు చేశారు.గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఖమ్మం జిల్లాలో మున్నేరు వాగు ఉగ్ర రూపం దాల్చింది. ప్రకాశ్ నగర్ వద్ద డేంజర్ లెవల్లో మున్నేరు ప్రవహిస్తోంది. దీంతో ఖమ్మం పట్టణంలోని ఇండ్లలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. ఇళ్ల మధ్య నుంచి మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది.. పలు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రకాశ్ నగర్ వద్ద మున్నేరు వాగు గోదావరి నదిని తలపిస్తోంది. మున్నేరు వాగు ఉగ్రరూపం దాల్చడంతో ఖమ్మం ప్రకాష నగర్ బ్రిడ్జ్‌పై తొమ్మిది మంది చిక్కుకున్నారు.ఈ తరుణంలో ప్రకాష్ నగర్ బ్రిడ్జి వద్ద మున్నేరు వరద పరిశీలించేందుకు తమ్మల నాగేశ్వర్రావు వెళ్లారు. ఆ సమయంలో తుమ్మలకు నిరసన సెగ తగిలింది. ప్రభుత్వానికి,తుమ్మలకు వ్యతిరేకంగా వరద పరిశీలిస్తున్న తుమ్మలను అడ్డుకున్నారు. ఉదయం 9 గంటల నుండి వరదల్లో చిక్కుకున్న 9 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించ లేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేశాం
సాక్షి, హైదరాబాద్/ నల్లగొండ టౌన్: తాము ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో రూ.2 లక్షలలోపు రుణాలున్న రైతులందరికీ రుణమాఫీ చేశామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు తెలిపారు. రాష్ట్రంలోని 3,292 బ్యాంకుల బ్రాంచీలు, 909 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల నుంచి సేకరించిన పంట రుణాల వివరాలతో.. డిసెంబర్ 9వ తేదీని కటాఫ్‌గా తీసుకుని రుణమాఫీ అమలు చేశామని వివరించారు. ఈ మేరకు శనివారం మంత్రి తుమ్మల ఒక ప్రకటన విడుదల చేశారు. రుణమాఫీ విధివిధానాలను ప్రకటించిన మూడు రోజుల్లోనే తొలివిడత కింద రూ.లక్ష లోపు రుణాలున్న 11.50లక్షల మంది రైతులకు రూ.6,098.93 కోట్లు, రెండో విడతలో రూ.1.50 లక్షలలోపు రుణాలున్న 6,40,823 ఖాతాదారులకు రూ.6190.01 కోట్లు, పంద్రాగస్టు నాడు రూ.2లక్షలలోపు రుణాలున్న 4,46,832 ఖాతాల్లో రూ.5,644.24 కోట్లు.. కలిపి మొత్తంగా 22.37 లక్షల ఖాతాల్లో రూ.17,933.19 కోట్లను జమ చేయడం ద్వారా వారందర్నీ రుణవిముక్తులను చేశామని తెలిపారు. తగిన రికార్డులిస్తే మాఫీ చేస్తాం.. రేషన్‌కార్డు కేవలం కుటుంబ నిర్ధారణ కోసమే పరిగణనలోకి తీసుకున్నామని, అది మాఫీకి ప్రామాణికం కాదని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. ఆధార్‌కార్డులో తప్పులు, రేషన్‌కార్డు లేనివారు, ఇతర కారణాలతో రూ.2 లక్షల్లోపు రుణమాఫీ కాని వారు దగ్గరలోని వ్యవసాయ అధికారిని సంప్రదించి, తగిన రికార్డులు సమర్పిస్తే త్వరలో రుణమాఫీ వర్తింపజేస్తామని వివరించారు. రూ.2 లక్షల కంటే అధికంగా రుణాలున్నవారు.. సదరు అధిక మొత్తాన్ని బ్యాంకు లో జమచేస్తే, వారికి రుణమాఫీ చేయడానికి సిద్ధమవుతున్నామని తెలిపారు. కానీ రైతులను అయోమయానికి గురిచేసేలా ప్రతిపక్ష నాయకులు ప్రవర్తించడం దురదృష్టకరమని మండిపడ్డారు. తొలి, రెండో విడతలలో తప్పులు దొర్లిన 7,925 ఖాతాలను సరిచేసి, వాటికి సంబంధించిన 44.95 కోట్ల నిధులను ఇప్పటికే విడుదల చేశామని మంత్రి పేర్కొన్నారు. ఇక కొన్ని బ్యాంకుల నుంచి సాంకేతిక సమ స్యల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు రూ.70,000 నుండి రూ.80,000లోపు రుణాలున్న ఖాతాలకు సంబంధించిన వివరాలు కూడా తెప్పించుకుంటున్నట్టు వివరించారు. ప్రతిపక్ష నేతలు ని జంగా రైతు సంక్షేమాన్ని కోరేవారే అయితే.. ముందుగా వారు గత పదేళ్లలో చెల్లించకుండా వదిలేసిన రుణాల వివరాలు తెప్పించుకొని చెల్లించాలని వ్యా ఖ్యానించారు. గత ప్రభుత్వం చెల్లించని పలు పథ కాల బకాయిలను తాము చెల్లించామని తెలిపారు. రుణమాఫీపై అర్థంలేని విమర్శలు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న రుణమాఫీ విషయంలో ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు అర్థంలేనివని మంత్రి తుమ్మల మండిపడ్డారు. శనివారం నల్లగొండలోని ఎన్జీ కళాశాల మైదానంలో రైతుబడి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘అగ్రి షో’ను శనివారం ఆయన శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. రూ.2 లక్షలకు మించి ఉంటే ముందు కట్టండిఆ తర్వాత రుణమాఫీ చేస్తామంటూ రైతులకువ్యవసాయ శాఖ సూచనసాక్షి, హైదరాబాద్: రూ.2 లక్షలకు మించి రుణాలున్న రైతులు.. అదనపు సొమ్మును బ్యాంకులో కట్టాలని, మిగతా రెండు లక్షలను ప్రభుత్వం మాఫీ చేస్తుందని వ్యవసాయ శాఖ పేర్కొంది. ఉదాహరణకు ఒక రైతుకు రూ.2.10 లక్షల రుణముంటే.. అదనంగా ఉన్న రూ.10 వేలు బ్యాంకులో జమ చేస్తే, తర్వాత ప్రభుత్వం రూ.2 లక్షలను బ్యాంకులో జమ చేస్తుందని తెలిపింది. ఈ మేరకు శనివారం రాత్రి ఒక ప్రకటన జారీ చేసింది.ఆధార్, పాస్‌బుక్, రేషన్‌కార్డు తదితర వివరాలు సరిగా లేనివారి రుణమాఫీ పెండింగ్‌లో ఉందని తెలిపింది. రైతులు మండల వ్యవసాయ అధికారిని కలిసి, వివరాలను సరిచేసుకుంటే వారి ఖాతాల్లో రుణమాఫీ సొమ్ము జమ అవుతుందని ప్రకటించింది. బ్యాంకులు, ఖాతాల్లో పలు సాంకేతిక పొరపాట్ల వల్ల దాదాపు 22 వేల ఖాతాల్లో వేసిన డబ్బులు వెనక్కి వచ్చాయని... ఆ తప్పులను సరిచేసి, ఇప్పటికే 8 వేల ఖాతాలకు తిరిగి నిధులు పంపిస్తున్నామని తెలిపింది. అందువల్ల రూ.2 లక్షలలోపు రుణాలుండి ఇప్పటికీ మాఫీ కాని రైతులు మండల వ్యవసాయ అధికారిని కలిసి, అందుకు కారణం తెలుసుకోవాలని సూచించింది. కుటుంబ నిర్ధారణ జరగని కారణంగా రుణమాఫీ కాలేదని ఫిర్యాదులుంటే అధికారులు క్షేత్రస్థాయిలో వెరిఫికేషన్ చేస్తారని.. ఆ రైతు కుటుంబంలోని వారి ఆధార్ కార్డులు, ఇతర వివరాలను తీసుకుని పోర్టల్‌లో అప్లోడ్ చేస్తారని వివరించింది. రైతుల నుంచి వచ్చిన ఫిర్యాదులను నెలరోజుల్లోగా పరిశీలించి, అర్హులైన వారికి రుణమాఫీ వర్తింపజేస్తామని ప్రకటించింది. -
Telangana: నేడు రెండో విడత రుణమాఫీ
సాక్షి, హైదరాబాద్: రెండో విడత రుణమాఫీకి ప్రభుత్వం సిద్ధమైంది. మంగళవారం దాదాపు 7 లక్షల మంది రైతులకు సంబంధించిన రుణాలు మాఫీ చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. రూ.లక్షన్నర వరకు రుణాలున్న వారి బ్యాంకు ఖాతాల్లో ఈ సొమ్ము జమ చేస్తారు. రుణ మాఫీ మొదటి విడతలో రూ.లక్ష లోపు రుణా లకు సంబంధించి 11.50 లక్షల కుటుంబాలకు రూ.6,098.94 కోట్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే. కాగా వీటిలో.. రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా నుంచి ప్రభుత్వానికి అందిన సమాచారం ప్రకారం 11.32 లక్షల కుటుంబాలకు రూ.6,014 కోట్లు జమయ్యాయి.కొన్ని సాంకేతిక కారణాలతో 17,877 ఖాతాలకు చెందిన రూ.84.94 కోట్లు రైతుల ఖాతాల్లో జమ కాలేదు. కాగా రెండో విడత రుణమాఫీ చెల్లింపులకు సంబంధించి సోమవారం రాత్రి వరకు మండలాల్లోని వ్యవసాయశాఖ అధికారులకు కూడా లబి్ధదారుల జాబితా అందలేదని సమాచారం. రాత్రి పొద్దుపోయాక జాబితా అందుతుందని భావిస్తున్నారు. మొదటి విడతలో లక్ష వరకు రుణాలున్న అనేకమంది అర్హులకు రుణమాఫీ కాలేదనే విమర్శలు వచ్చాయి. దీంతో రెండో విడత రుణమాఫీలో అలాంటి పొరపాట్లు తలెత్తకుండా చర్యలు తీసుకున్నామని అధికారులు చెబుతున్నారు. వచ్చే నెలలో రూ.2 లక్షల వరకు మాఫీ: మంత్రి తుమ్మల మంగళవారం లక్షా యాభై వేల రూపాయల వరకు ఉన్న రుణాలను మాఫీ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యం ఉన్న అన్ని రైతువేదికల్లో ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమానికి ముందు నిర్వహించే రైతునేస్తం కార్యక్రమంలో రూ.లక్ష వరకు జరిగిన రుణ మాఫీకి సంబంధించి సందేహాలు ఉన్న రైతులు.. అక్కడ ఉన్న అధికారులు, బ్యాంకర్లను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని సూచించారు. అనంతరం రూ.లక్షన్నర వరకు జరిగే రుణమాఫీ కార్యక్రమాన్ని వీక్షించాల్సిందిగా రైతులకు విజ్ఙప్తి చేశారు. వచ్చే నెలలో రూ.2 లక్షల వరకు మాఫీ చేస్తామని ప్రకటించారు. ఇదీ గత ప్రభుత్వ నిర్వాకం తమ ప్రభుత్వానికి ఒక స్పష్టమైన విధానం లేదని విమర్శించిన పెద్దలకు, గత ప్రభుత్వం అనుసరించిన అసమంజస విధానాలను గుర్తు చేయదల్చుకున్నానని మంత్రి తెలిపారు. ’ప్రతి సంవత్సరం ఒక కొత్త విధానంతో రైతాంగాన్ని ఆందోళనలోకి నెట్టడమే వారి విధానంగా ఉండేది. ఒక ఏడాది పత్తి వద్దు అన్నారు. రైతులు వారి మాటలు నమ్మి కంది పంట వేస్తే కందులు కొనే నాధుడే లేరు. మరో ఏడాది పంట కాలనీలు అని ఊక దంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు.తరువాత దాని ఉసే లేదు. వరి వేస్తే ఉరి అన్నారు.. ఆ మాట నమ్మి మొక్కజొన్న వేస్తే కొనుగోలు సమయానికి మొహం చాటేశారు. సన్నాల సాగు అని సన్నాయి నొక్కులు నొక్కి తీరా మార్కెటింగ్‌కు వచ్చేసరికి బోనస్ కాదు కదా మద్దతు ధర కూడా దక్కలే. ఇక రుణమాఫీ 2014 కానీ, 2018 కానీ.. అసలు రుణమాఫీ పథకాలు కావని, వడ్డీ మాఫీ పథకాలుగా ప్రతి రైతు చెబుతాడు..’అని మంత్రి దుయ్యబట్టారు. -
ఇతర బకాయిలకు జమ చేసుకోవద్దు
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒకే దఫాలో ఇంత భారీ స్థాయిలో రుణమాఫీ చేసిన చరిత్ర లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు పేర్కొన్నారు. ఆగస్టు నెల దాటకముందే మొత్తం రూ.31 వేల కోట్లు బ్యాంకుల్లో జమ చేస్తామని చెప్పారు. రుణమాఫీ కింద విడుదల చేస్తున్న నిధులను రైతులకు సంబంధించిన ఇతర బకాయిల కింద జమ చేసుకోవద్దని బ్యాంకర్లకు స్పష్టం చేశారు. గురువారం ఉదయం సచివాలయంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో వారు మాట్లాడారు.రూ.2 లక్షల కంటే ఎక్కువ రుణం ఉన్న రైతులతో బ్యాంకర్లు మాట్లాడి బకాయిలు రికవరీ చేసుకోవాలని డిప్యూటీ సీఎం సూచించారు. ప్రభుత్వం ఇచ్చే రూ.2 లక్షలు, బ్యాంకులు రికవరీ చేసే మొత్తం కలుపుకొని రైతులను రుణ విముక్తులను చేయాలని చెప్పారు. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేతగా తాను రైతు రుణమాఫీ గ్యారెంటీ కార్డుపై సంతకం చేసి ఎన్నికల ప్రచారంలోకి వెళ్లామని గుర్తు చేశారు.ఇచి్చన మాట మేరకు రుణమాఫీ చేస్తున్నామని అన్నారు. 40 లక్షల బ్యాంకు ఖాతాల నుంచి రూ.31 వేల కోట్ల రైతు రుణాలు ఒకేసారి రికవరీ కావడం ఓ చరిత్ర అని అన్నారు. బ్యాంకర్లను వన్ టైమ్ సెటిల్మెంట్ అడగకుండా పూర్తిగా చెల్లిస్తున్నందుకు బ్యాంకర్లు కూడా రైతుల మాదిరి పండుగ చేసుకోవాలని భట్టి అన్నారు. రుణమాఫీ కాగానే రైతులకు అవసరమైన రుణాలు విరివిగా ఇవ్వాలని బ్యాంకర్లను కోరారు. దేశం గరి్వంచదగ్గ రోజు: తుమ్మల ఇది దేశం గర్వించదగిన రోజు అని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అన్నారు. రుణమాఫీ కోసం సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తీవ్రంగా శ్రమించారని తెలిపారు. వర్షాలు మొదలయ్యాయని, రైతు రుణమాఫీ నిధులు సకాలంలో అందితే వ్యవసాయం పండుగలా మారుతుందని అన్నారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, బ్యాంకుల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.నల్లగొండ జిల్లాకు ఎక్కువ నిధులు గురువారం తొలివిడత కింద రూ.లక్ష వరకు ఉన్న రుణాలను మాఫీ చేస్తూ విడుదల చేసిన నిధుల్లో అత్యధికం నల్లగొండ జిల్లాకు వెళ్లాయి. ఈ జిల్లాకు చెందిన 78,463 కుటుంబాల బ్యాంకు ఖాతాల్లో రూ.454.49 కోట్లు జమ అయ్యాయి. అసెంబ్లీ నియోజకవర్గం వారీగా తీసుకుంటే అత్యధికంగా ఆందోల్ నియోజకవర్గంలో 19,186 కుటుంబాలకు రూ.107.83 కోట్లు విడుదల అయ్యాయి. -
రైతు భరోసాపై మంత్రుల క్లారిటీ
సాక్షి,వనపర్తి: రైతులకు తాము ఇచ్చిన హమీలు అన్ని నెరవేర్చాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని రెవెన్యూ,సమాచార మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ప్రజాధనం సద్వినియోగం చేయాలనే రైతు భరోసాపై అభిప్రాయాలు సేకరిస్తున్నామన్నారు. శుక్రవారం(జులై12) వనపర్తిలో రైతు భరోసాపై అభిప్రాయ సేకరణ కోసం మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులతో కూడిన సబ్‌కమిటీ సమావేశమైంది. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ ‘కొందరు నాయకులు, ప్రతిపక్షాలు రైతుభరోసాపై రైతులను రెచ్చగొట్టాలని చూస్తున్నాయి. దీన్ని తిప్పి కొట్టాలి. ప్రతిపక్షాలు కూడా మంచి సూచనలు చేస్తే బేషజాలు లేకుండా వాటిని స్వీకరిస్తాం. రైతుభరోసా స్కీమ్‌పై ఎలాంటి అపోహలు వద్దని, ప్రజాభిప్రాయాలను అసెంబ్లీలో చర్చించి స్కీమ్ అమలు చేస్తామని హామీ ఇచ్చారు.రైతు బంధు పేరుతో రూ.25 వేల కోట్లు దుర్వినియోగం: తుమ్మల నాగేశ్వరరావురైతులు, మేధావుల అభిప్రాయం మేరకే రైతుభరోసా అమలు చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే సాగుకు పనికిరాని భూములకు రూ. 25 వేల కోట్ల రైతుబంధు ఇచ్చి నిధులు దుర్వినియోగం చేశారన్నారు. సీఎం మనసులో రైతుల పంటలకు బీమా ఇచ్చే ఆలోచన ఉందన్నారు. మద్దతుధర అందించి రైతులకు మేలు చేయాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు. -
రైతు భరోసాకు పదెకరాలు పరిమితి పెట్టండి
సాక్షి, హైదరాబాద్: రైతు భరోసా పథకానికి పరిమితులు విధించాలని.. గతంలో మాదిరి అందరికీ కాకుండా, పదెకరాల వరకు భూములున్న రైతులకే పెట్టుబడి సాయం అందించాలని రైతులు పేర్కొన్నారు. కొందరు రైతులు మాత్రం ఐదెకరాల వరకు పరిమితి పెట్టినా మంచిదేనని అన్నారు. చాలా మంది రైతులు సాగులో ఉన్న భూమికి, సాగుచేసే వారికే పెట్టుబడి సాయం అందించాలని కోరారు. ఆదాయ పన్ను చెల్లించే రైతులకు కూడా రైతు భరోసా ఇవ్వాలని కోరారు. విదేశాలకు వెళ్లే తమ పిల్లల విద్యా రుణాల కోసం బ్యాంకులకు ఆదాయ పన్ను స్టేట్మెంట్లు చూపించాల్సి వస్తుందని.. కాబట్టి ఆదాయ పన్ను చెల్లించేవారికి కూడా రైతుభరోసా ఇవ్వాలని సూచించారు. ప్రతీ వారం నిర్వహించే ‘రైతు నేస్తం’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ‘రైతు భరోసా’పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు పలు అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. కొండలు, గుట్టలు, రియల్ ఎస్టేట్ భూములు వంటి వాటికి రైతు భరోసాను నిలిపివేయాలని కోరారు.దొడ్డు రకాల వరికీ బోనస్ ఇవ్వాలిసన్న వడ్లకు రూ.500 బోనస్ ఇస్తామని ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో.. చాలా మంది రైతులు దొడ్డు రకం వరికి కూడా బోనస్ ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో దొడ్డు వరి సాగు చేసేవారే ఎక్కువని, వారికీ బోనస్ ఇస్తేనే గిట్టుబాటు ధర లభిస్తుందని పేర్కొన్నారు. సన్న రకాలకు ఎటూ డిమాండ్ ఉంటుందని.. మార్కెట్లోనూ మద్దతు ధర కంటే ఎక్కువగా రేటు పలుకుతుందని వివరించారు. ఇక సీజన్ సమయంలో పంటల సాగుకు అవసరమైన కూలీల కొరత ఉంటుందని.. దొరికినా ఖర్చు ఎక్కువ అవుతుందని అనేక మంది రైతులు వాపోయారు. అందువల్ల వ్యవసాయ యంత్రాలను సబ్సిడీపై సరఫరా చేయాలని విజ్ఞప్తి చేశారు. దాదాపు ఐదేళ్లుగా వ్యవసాయ యంత్రాల సరఫరా నిలిచిపోయిందని, దాంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు.రైతుబంధుతో రూ.25,670 కోట్లు వృథా: మంత్రి తుమ్మలగతంలో సాగులో లేని భూములకు కూడా రైతుబంధు వర్తింపజేసి.. 12 విడతల్లో దాదాపు రూ.25,670 కోట్ల ప్రజాధనం వృధా చేశారని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ఆరోపించారు. 93 శాతం వాటా ఉన్న సన్న, చిన్నకారు రైతుల వాటా రైతుబంధు మొత్తంలో 68 శాతం కూడా లేదని.. దానికితోడు 17.5 శాతం ఉన్న కౌలు రైతులను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. తమ ప్రభుత్వం రైతుబంధు స్థానంలో రైతుభరోసా పథకాన్ని తీసుకొస్తోందని, పెట్టుబడి సాయాన్ని ఎకరానికి రూ.15 వేలకు పెంచుతున్నామని చెప్పారు. అయితే రైతుబంధు తరహాలో ప్రజాధనం వృథా కాకుండా ఉండేలా పటిష్ట విధానాల రూపకల్పనకు తమ ప్రభుత్వం కసరత్తు చేస్తోందన్నారు. రైతునేస్తం కార్యక్రమంలో రైతులు వెల్లడించిన, రాత పూర్వకంగా సేకరించిన సూచనలను క్రోడీకరించి నివేదిక తయారు చేయాలని వ్యవసాయశాఖ డైరెక్టర్ గోపిని మంత్రి ఆదేశించారు. తమ ప్రభుత్వం రైతుభరోసాకు సంబంధించి ఎటువంటి విధానపరమైన నిర్ణయాలు ఇంకా తీసుకోలేదని.. పూర్తిగా అందరి అభిప్రాయాలు తీసుకున్నాక, శాసనసభలో చర్చించాక పథకాన్ని తీసుకొస్తామని చెప్పారు. ఆలస్యమైనప్పటికీ అర్హులకు మాత్రమే అందేలా రైతుభరోసాకు రూపకల్పన చేస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి, కిసాన్ సెల్ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి, రైతుసంఘం నాయకుడు అన్వేశ్‌రెడ్డి, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో 220 రకాల వరి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో 220 వెరైటీల వరి సాగు జరుగుతోందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు వెల్లడించారు. ఇందులో 60 శాతం ముతక రకాలు ఉన్నాయని చెప్పారు. కొత్త ప్రభుత్వం స్థానికంగా, ప్రపంచ మార్కెట్లో ఎక్కువ గిరాకీ ఉన్న మంచి రకాల వరి వైపు వెళ్లేలా రైతులను ప్రోత్సహించడానికి అన్ని ప్రయత్నాలు చేసిందని అన్నారు. గ్లోబల్ రైస్ సమ్మిట్–2024 శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభమయ్యింది. రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, 30 దేశాల నుంచి 250 మంది ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారు. వరి సాగులో రాష్ట్రం నంబర్ వన్వరి సాగులో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్‌గా ఉందని మంత్రి తుమ్మల ఈ సందర్భంగా పేర్కొన్నారు. కొన్నేళ్లుగా రాష్ట్రంలో వరి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగిందన్నారు. గతేడాది 1.2 కోట్ల ఎకరాలు సాగవగా, 26 మిలియన్ టన్నుల ఉత్పత్తి జరిగిందని తెలిపారు. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగిన సూపర్ ఫైన్ రైస్ రకం తెలంగాణ సోనా (ఆర్ఎన్ఆర్ 15048) దేశవ్యాప్తంగా ప్రజాదరణ పొందిందన్నారు. రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా రాష్ట్రం: ఉత్తమ్తెలంగాణ రాష్ట్రం రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా అవతరించిందని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల రైతులు ఒక సంవత్సరంలోనే 2 , 3 సార్లు వరి పండిస్తారని చెప్పారు. రాష్ట్రంలో రైస్ మిల్లింగ్ ఇండస్త్రీని విస్తరిస్తామని తెలిపారు. -
ముగ్గురు మంత్రులం ఉన్నాం..
ఖమ్మం: గత ఎన్నికల్లో తమను కడుపులో పెట్టుకుని అత్యధిక మెజార్టీతో గెలిపించగా ముగ్గురికి మంత్రి పదవులు దక్కడంతో ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తున్నామని రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మం లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ ఖమ్మంలోని జెడ్పీ సెంటర్ నుండి ముస్తఫానగర్, చర్చికాంపౌండ్, ప్రకాష్‌నగర్, బోసుబొమ్మ సెంటర్ మీదుగా గాంధీచౌక్ వరకు శుక్రవారం రాత్రి రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా చర్చికాంపౌండ్ సెంటర్లో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ బీఆర్ఎస్, బీజేపీ ఒకటేనని, ఆ రెండు పార్టీల నడుమ లోపాయికారి ఒప్పందం ఉందని తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్ తాను చేసిన తప్పుల నుండి కాపాడుకోడానికి బీజేపీతో జత కడుతున్నారని చెప్పారు. ఎన్నో మోసపూరిత హామీలు ఇచ్చి మాయమాటలతో పదేళ్లు రాజ్యమేలారని విమర్శించారు. కనీసం పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు కూడా ఇవ్వలేకపోయారని చెప్పారు.కాంగ్రెస్ హయాంలో నియోజకవర్గానికి 3,500 ఇళ్లు కట్టిస్తామని చెప్పినప్పటికీ మంత్రి తుమ్మల ఖమ్మం నియోజకవర్గానికి అదనంగా ఇళ్లు కావాలని అడిగారని తెలిపారు. గృహనిర్మాణ శాఖకు మంత్రిగా ఉన్న తాను ఖమ్మంకు ఆరు వేల ఇళ్లు మంజూరు చేస్తానని ప్రకటించారు. ఎంపీగా రఘురాంరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే కేంద్రం నుంచి అదనంగా నిధులు వస్తాయని తెలిపారు.నిరుపేదలందరికీ ఇళ్లు..మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఖమ్మంలో రోడ్ల వెంట, కాల్వగట్ల వెంట గుడిసెలు వేసుకుని ఉంటున్న వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ప్రకటించారు. వెంకటగిరి, బైపాస్ బ్రిడ్జిలు, దానవాయిగూడెం ఫిల్టర్ బెడ్, పుట్టకోట బెడ్ తన హయాంలో నిర్మించినవేనని తెలిపారు.ఖమ్మం ప్రజలు ప్రశాంతంగా అన్నదమ్ముల్లా కలిసిమెలసి ఉండాలంటే రఘురాంరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. జిల్లా నుంచి డిప్యూటీ సీఎం భట్టితో పాటు తామిద్దరం కలిసి ఖమ్మంను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసి రాష్టంలోనే ఆగ్రగామిగా ఉంచుతామని తెలిపారు. కాగా, కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని చెబుతున్న వారు ధైర్యం ఉంటే రేవంత్‌రెడ్డిని తాకాలని సూచించారు.మతోన్మాద బీజేపీ మరోమారు గెలిస్తే ప్రజల మధ్య మతవిద్వేషాలను రెచ్చగొట్టి దేశాన్ని విభజిస్తుందని తెలిపారు. అనంతరం అభ్యర్థి రఘురాంరెడ్డి మాట్లాడుతూ తనను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే ముగ్గురు మంత్రుల సమన్వయంతో జిల్లా అభివృద్ధికి పాటుపడతానని తెలిపారు. ఈ రోడ్డు షోలో డీసీసీ అధ్యక్షుడు దుర్గాప్రసాద్, నాయకులు మహ్మ ద్ జావీద్, బాలసాని లక్ష్మీనారాయణ, సాధు రమేష్‌రెడ్డి, దొబ్బల సౌజన్య తదితరులు పాల్గొన్నారు. -
మేం వచ్చాకే జనరంజక పాలన : తుమ్మల నాగేశ్వరరావు
ఖమ్మం: పదేళ్ల కాలంలో రైతు రుణమాఫీ చేయని బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. ఖమ్మంలోని క్యాంపు కార్యాలయంలో గురువారం నిర్వహించిన ఖమ్మం నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్ని ప్రభుత్వ శాఖలను బీఆర్ఎస్ భ్రష్టు పట్టించిందని ఆరోపించారు. అవినీతి, కబ్జాలతో పాటు పోలీసుల సహకారంతో బీఆర్ఎస్ నేతలు తిరిగి అధికారంలోకి వస్తామని అనుకున్నా.. కాంగ్రెస్ శ్రేణుల శక్తిసామర్థ్యాల ఎదు ట వారి ఆశలు పటాపంచలయ్యాయని తెలిపారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీలను ఒక్కటొక్కటిగా అమలు చేస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వం చేసిన అప్పులు, వడ్డీ కడుతూనే హామీలను నెరవేరుస్తున్నామని తుమ్మల చెప్పారు. కాగా, అన్నిచోట్ల పంటలు కోతకు వచ్చాయని, జిల్లాలో నీరు లేక ఎక్కడా పంట ఎండిపోలేదన్నారు. వర్షాభావ పరిస్థితులతో భూగర్భ జలాలపైనే రైతులు ఆధారపడుతున్నందున ఒక్క సెకన్ కూడా కరెంట్ పోకుండా రోజుకు రూ.50కోట్లు వెచ్చించి రాష్ట్రంలో కరెంట్ సరఫరా చేస్తున్నామని మంత్రి తెలిపారు. కాగా, లోక్‌సభ ఎన్నికల్లో ఓట్ల కోసమే బీఆర్ఎస్ నేతలు నీళ్ల రాజకీయం చేస్తున్నారని.. కానీ వారికి అసెంబ్లీ ఎన్నికల మాదిరి పరాభవం తప్పదని చెప్పారు. తమ 120 రోజుల పాలనతో దేశమంతా తెలంగాణ వైపు చూస్తోందని.. అందుకనే ఇక్కడ ఇచ్చిన గ్యారంటీలను దేశమంతా అమలు చేస్తామని ప్రకటించేందుకు రాహుల్‌గాంధీ, ఖర్గే శనివారం తుక్కుగూడ సభకు వస్తున్నారని తెలిపారు. ఈమేరకు జిల్లా నుంచి నుంచి తుక్కుగూడ సభకు పార్టీ శ్రేణులు భారీగా తరలిరావాలని మంత్రి తుమ్మల పిలుపునిచ్చారు. డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, కాంగ్రెస్ నగర అధ్యక్షుడు మహ్మద్ జావీద్, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య మాట్లాడగా డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహరా, కార్పొరేటర్లు లకావత్ సైదులు, మలీదు వెంకటేశ్వర్లు, దుద్దుకూరి వెంకటేశ్వర్లు, రాపర్తి శరత్, నాయకులు సాధు రమేష్‌రెడ్డి, మిక్కిలినేని నరేందర్, ముస్తఫా, కొంగర జ్యోతిర్మయి, పొదిల రవికుమార్‌తో పాటు నాయకులు, కార్య కర్తలు పాల్గొన్నారు. ఇవి చదవండి: ఇన్‌చార్జీలకు సవాలే.. -
కృష్ణా జలాలపై కేంద్రానికి పెత్తనం ఇవ్వొద్దు! : తమ్మినేని వీరభద్రం
సాక్షిప్రతినిధి, ఖమ్మం: కృష్ణా, గోదావరి జలాల విషయంలో శాస్త్రీయ పరిష్కారానికి ఆలోచన చేయాలే తప్ప కేంద్రానికి పెత్తనం అప్పగించొద్దని.. అదే జరిగితే రాష్ట్రానికి తీవ్ర నష్టమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఖమ్మంలోని ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏదో ఒక కొర్రీ సృష్టిస్తూ కేంద్రంలోని బీజేపీ రాష్ట్రాల పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తోందని.. తద్వారా ప్రతిపక్షాలు లేకుండా చేయాలన్నదే బీజేపీ కుట్ర అని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని బలిచేసి ఏకపక్ష పరిపాలన కోసమే ‘ఒకే దేశం.. ఒకే ఎన్నిక’పై కేంద్రం రామ్‌నాథ్ కోవింద్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటుచేసిందన్నారు. కాగా, ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేని చరిత్ర కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలదని తమ్మినేని తెలిపారు. రాష్ట్రాలు విడిపోయినా.. తెలుగు ప్రజలు అంతా ఒక్కటేనని ఆయన చెప్పారు. అయితే, రాష్ట్ర విభజన జరిగి ఏళ్లు గడుస్తుండగా.. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారం, కాళేశ్వరానికి జాతీయ హోదా వంటి హామీలేవీ నెరవేరకున్నా బీఆర్ఎస్, కాంగ్రెస్ ఐక్యంగా పోరాడకుండా ఓట్ల కోసం తగువు పడితే తెలంగాణ ప్రజలకు నష్టం కలుగుతుందని పేర్కొన్నారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలుతుందని బీఆర్ఎస్ శాపనార్థాలు పెట్టడం సరైందికాదన్నారు. బీఆర్ఎస్ రాష్ట్రంలో అభివృద్ధి చేసినా ఉద్యమాలు, హక్కుల విషయాల్లో అణిచివేయడం, ఏకపక్ష నిర్ణయాలతో ప్రతిపక్షాలపై అహంకార పూరితంగా ప్రవర్తించిందని తమ్మినేని చెప్పారు. కాగా, కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ, కార్మిక విధానాలకు వ్యతిరేకంగా ఈనెల 16న నిర్వహించే దేశ వ్యాప్త సమ్మెకు సీపీఎం మద్దతు తెలుపుతోందన్నారు. ఇక పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో ఎలా ముందుకెళ్లాలనే అంశంపై పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశాల్లో నిర్ణయం తీసుకుంటామని వీరభద్రం తెలిపారు. కాగా, పాలేరు పాత కాల్వ కింద 6వేల ఎకరాల్లో వరి, 1,227 ఎకరాల్లో చెరుకు సాగు చేసినందున నీరు విడుదల చేయించే బాధ్యత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుపై ఉందన్నారు. ఈ సమావేశంలో నాయకులు పోతినేని సుదర్శన్‌రావు, సాయిబాబా, ఎర్రా శ్రీకాంత్, బుగ్గవీటి సరళ, పొన్నం వెంకటేశ్వరరావు, కళ్యాణం వెంకటేశ్వరరావు, మాచర్ల భారతి, భూక్య వీరభద్రం, బండి రమేష్, వై.విక్రమ్ తదితరులు పాల్గొన్నారు. ఇవి చదవండి: చర్చకు తేవాల్సిన అంశాలెన్నో.. -
బీఆర్ఎస్ నేతలు అహంకారంగా మాట్లాడుతున్నారు : తుమ్మల నాగేశ్వరరావు
ఖమ్మం: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడాన్ని జీర్ణించుకోలేని బీఆర్ఎస్ నాయకులు అవాకులు, చవాకులు పేలుతున్నారని.. ఒకవేళ తాము గేట్లు తెరిస్తే ఆ పార్టీ బంగాళాఖాతంలో కలవడం ఖాయమని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం వీడీవోస్ కాలనీలోని క్యాంపు కార్యాలయంలో ఖమ్మం నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం బుధవారం ఏర్పాటుచేయగా మంత్రి మాట్లాడారు. ఎమ్మెల్యేలను కొంటాం, కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుందని బీఆర్ఎస్ నేతలు అహంకారపూరితంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అయితే, తమ ఎమ్మెల్యేలను కొనే శక్తిసామర్థ్యాలు వారికి లేవన్నారు. గత పదేళ్లు అధికారం లేకపోయినా నిర్భంధాలు, అక్రమ కేసులను ఎదుర్కొంటూ కాంగ్రెస్ జెండా మోసిన కార్యకర్తలు అభినందనీయులన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయాన ఏజెంట్లూ ఉండొద్దని ప్రలోభాలకు గురిచేసినా ప్రత్యర్థి దిమ్మతిరిగేలా 50వేల పైచిలుకు మెజార్టీతో తనను గెలిపించిన కార్యకర్తలకు రుణపడి ఉంటానని ఆయన భావోద్వేగంతో తెలిపారు. కాంగ్రెస్ గెలుపు కోసం కష్టపడిన ప్రతీ కార్యకర్తకు సముచిత గౌరవం ఉంటుందని, వారి అనుమతి లేకుండా కొత్త వారిని పార్టీలో చేర్చుకునే ప్రసక్తే లేదని మంత్రి స్పష్టం చేశారు. కాగా, గత ప్రభుత్వం మాదిరి అవినీతి జరగకుండా నిజమైన పేదలకు సంక్షేమ పథకాలు చేరేలా కార్యకర్తలు కృషిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, నాయకులు మహ్మద్ జావీద్, దొబ్బల సౌజన్య, మానుకొండ రాధాకిషోర్, సాధు రమేష్‌రెడ్డి, నాగండ్ల దీపక్‌చౌదరి, షేక్ అబ్దుల్ రషీద్ తదితరులు పాల్గొన్నారు. ఇవి చదవండి: కోర్ మీటింగ్‌లో ‘సోయం’ వ్యాఖ్యల దుమారం! -
నామినేటెడ్ పోస్టు.. మంత్రులు భట్టి, పొంగులేటి, తుమ్మల చుట్టూ ప్రదక్షిణ!
'కాంగ్రెస్ పార్టీలో నామినేటెడ్ పోస్టుల సందడి నెలకొంది. సంక్రాంతి పండుగలోగా పోస్టులు భర్తీ చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడంతో ఆశావహులు ఉత్సాహంగా ఉన్నారు. ఇదే సమయాన ఉమ్మడి జిల్లా నుంచి ఎవరెవరికి అవకాశం దక్కుతుందనే చర్చ మొదలైంది. డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చుట్టూ పలువురు ప్రదక్షిణ చేస్తున్నారు. పార్టీకి తాము చేసిన సేవలు, ఎన్నికల్లో అభ్యర్థుల విజయానికి చేసిన కృషిని వివరిస్తూ నామినేటెడ్ పోస్టు ఇప్పించాలని కోరుతున్నారు. రాష్ట్ర, జిల్లా స్థాయి ప్రధాన నామినేటెడ్ పోస్టులకు జిల్లా నుంచి ఎక్కువ మంది పోటీలో ఉండగా తొలి విడతలో ఎవరికి పదవులు దక్కుతాయనే ఉత్కంఠ నెలకొంది.' - సాక్షి ప్రతినిధి, ఖమ్మం లోక్‌సభ ఎన్నికల నేపథ్యాన.. మార్చిలోగా లోక్‌సభ ఎన్నికలు జరుగుతాయనే ప్రచారంతో నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసి క్షేత్ర స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. దీంతో ఉమ్మడి జిల్లా నుంచి నామినేటెడ్ పోస్టులు ఆశిస్తున్న నేతల వివరాలను టీపీసీసీ సేకరిస్తోంది. ఆయా నేతలకు గల జనబలం, పార్టీలో ఎప్పటి నుంచి ఉన్నారు.. తదితర అంశాలను బేరీజు వేస్తూ జాబితా సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ జాబితా ఆధారంగా సీఎం రేవంత్‌రెడ్డి ఉమ్మడి జిల్లా మంత్రులతో చర్చించాక ఎంపిక చేయనున్నట్లు తెలిసింది. రాష్ట్ర స్థాయిలో ఉన్న నామినేటెడ్ పోస్టుల్లో ప్రధానమైనవి తొలుత భర్తీ చేస్తారనే ప్రచారం సాగుతోంది. అలాగే, ఉమ్మడి జిల్లాలో ముఖ్యమైన నామినేటెడ్ పోస్టులు కొన్నింట్లో స్థానిక నేతలను నియమిస్తారని తెలుస్తోంది. తద్వారా లోక్‌సభ ఎన్నికల్లో నాయకులంతా ఏకతాటిపై నడిస్తే మెజార్టీ స్థానాలు పార్టీకి దక్కుతాయ నే అంచనాల్లో ఆ పార్టీ పెద్దలు ఉన్నారు. జాబితా పెద్దదే.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలువురు నేతలు నామినేటెడ్ పోస్టులపై ఆశలు పెట్టుకున్నారు. వైరా నియోజకవర్గం నుంచి బొర్రా రాజశేఖర్, లోకేష్‌యాదవ్, మధిర నియోజకవర్గం నుంచి పైడిపల్లి కిషోర్, డాక్టర్ కోట రాంబాబు, వక్కలగడ్డ సోమచంద్రశేఖర్, ఖమ్మం నుంచి పువ్వాళ్ల దుర్గాప్రసాద్, సాధు రమేష్‌రెడ్డి, కమర్తపు మురళి, చావా నారాయణరావు, శెట్టి రంగారావు జాబితాలో ఉన్నారు. అలాగే, కొత్తగూడెం నుంచి నాగా సీతారాములు, కొత్వాల శ్రీనివాసరావు, పినపాక నియోజకవర్గం నుంచి భట్టా విజయ్‌గాంధీ, తుళ్లూరి బ్రహ్మయ్య, ఇల్లెందు నియోజకవర్గం నుంచి రాంరెడ్డి గోపాల్‌రెడ్డి, రాంరెడ్డి చరణ్‌రెడ్డి, వడ్లమూడి దుర్గా ప్రసాద్, మేకల మల్లిబాబుయాదవ్, అశ్వారావుపేట నియోజకవర్గం నుంచి జూపల్లి రమేష్‌బాబు, ఆలపాటి రామచంద్రప్రసాద్ పదవులు ఆశిస్తున్నారు. ఇక పాలేరు నియోజకవర్గం నుంచి రామసహాయం నరేష్‌రెడ్డి, రామసహాయం వెంకట్‌రెడ్డి, మద్ది శ్రీనివాస్‌రెడ్డి, శాఖమూరి రమేష్, చావా శివరామకృష్ణ పోస్టులు దక్కించుకోవాలనే యత్నాల్లో ఉన్నారు. ఇందులో చాలా మంది రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పోస్టులపై ఆశ పెట్టుకోగా.. కొందరు ఉమ్మడి జిల్లా, ఇంకొందరు జిల్లా స్థాయి నామినేటెడ్ పోస్టులు ఆశిస్తున్నారు. కాగా, ముగ్గురు, నలుగురు నేతలు రాష్ట్రస్థాయి నామినేటెడ్ పోస్టు దక్కకపోతే ఎమ్మెల్సీ కోసం పోటీ పడాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. రాజకీయ భవిష్యత్ కోసం.. నామినేటెడ్ పోస్టులు ఆశిస్తున్న నేతలు పలువురు తాము రేసులో ముందున్నామని ప్రచారం మొదలుపెట్టారు. జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులను కలుస్తూ పార్టీ పరంగా చేసిన కార్యక్రమాలు, గతంలో నిర్వహించిన పోస్టుల వివరాలను ఇస్తున్నారు. అలాగే ఏఐసీసీ, టీపీసీసీలో తెలిసిన నేతలను కలిసి నామినేటెడ్ పోస్టుల విషయంలో వారి సహకారం కోరుతున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు ఆశావహులు ముగ్గురు మంత్రులతో పాటు పార్టీ పెద్దలనూ కలిశారు. సామాజిక సమీకరణాలను కూడా పరిశీలించి తమకు అవకాశం ఇప్పించాలని కోరినట్లు తెలిసింది. అయితే, తెలంగాణ ఏర్పడ్డాక తొలిసారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నేపథ్యాన ఎలాగైనా నామినేటెడ్ పోస్టు దక్కించుకుంటే రాజకీయ భవిష్యత్‌కు ఢోకా ఉండదని ఆశావహులు భావిస్తున్నారు. ఇవి చదవండి: ‘గ్రేటర్ వరంగల్’లో బీఆర్ఎస్కు షాక్! -
పార్లమెంట్ ఎన్నికలకు కాంగ్రెస్ ముందస్తు కార్యాచరణ!
సాక్షిప్రతినిధి, ఖమ్మం: 'పార్లమెంట్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమవుతోంది. ఇటీవల రాష్ట్రంలో విజయం సాధించిన పార్టీ.. త్వరలో జరిగే లోక్‌సభ ఎన్నికల్లోనూ రాష్ట్రంలోని 17 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా మంత్రులు, ముఖ్య నేతలు సమన్వయంతో ముందుకు వెళ్లేలా కార్యాచరణ రూపొందించింది. ఈ నేపథ్యాన అన్ని స్థానాలకు పార్టీ ఇన్చార్జిలను నియమించింది. ఖమ్మం, మహబూబాబాద్ లోక్‌సభ స్థానాల బాధ్యతను రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అప్పగించింది. అలాగే డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్కను సికింద్రాబాద్, హైదరాబాద్, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లుగా నియమించారు. సీఎం రేవంత్‌రెడ్డి తర్వాత జిల్లాకు చెందిన భట్టి, పొంగులేటికి రెండేసి పార్లమెంట్ స్థానాల బాధ్యతలు కట్టబెట్టడం విశేషం.' రాజకీయంగా సీనియర్ నాయకులు, మంత్రులైన భట్టి, తుమ్మలకు పార్టీ అధిష్టానం ప్రాధాన్యత ఇచ్చి రాజధానిలోని పార్లమెంట్ స్థానాల ఇన్చార్జి బాధ్యతలు అప్పగించింది. సామాజిక సమీకరణలు, గతంలో పనిచేసిన అనుభవాన్ని పరిగణనలోకి తీసుకొని భట్టిని సికింద్రాబాద్, హైదరాబాద్, తమ్మలను మల్కాజ్గిరి ఇన్చార్జిగా నియమించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా భట్టి హైదరాబాద్‌లో ప్రచారం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం దక్కించుకుని రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన నేపథ్యాన జోష్‌లో ఉన్న పార్టీ శ్రేణులు అదే ఉత్సాహంతో లోక్‌సభ ఎన్నికలకు సై అంటున్నాయి. పొంగులేటికి కీలకంగా.. ఖమ్మం పార్లమెంట్ స్థానం ఖమ్మం, భద్రాద్రి జిల్లాలో విస్తరించి ఉండగా, మహబూబాబాద్ పార్లమెంట్ స్థానంలో ఇక్కడి అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. దీంతో ఈ రెండు స్థానాల ఇన్చార్జిగా మంత్రి పొంగులేటి కొనసాగుతారు. అసెంబ్లీ ఎన్నికల్లో పొంగులేటి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే కాకుండా మహబాబాబాద్, వనపర్తి, నల్లగొండ జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. ఆయన ప్రచారానికి వెళ్లిన అన్ని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పదికి పది స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయమే తమ లక్ష్యమని చెప్పగా.. భద్రాచలం మినహా ఎనిమిది స్థానాల్లో కాంగ్రెస్, పొత్తులో భాగంగా కొత్తగూడెంలో సీపీఐ విజయం సాధించాయి. ఈ మేరకు భట్టి, తుమ్మలతో సమన్వయం చేసుకుంటూ పార్టీ అభ్యర్థుల విజయంలో కీలక పాత్ర పోషించిన పొంగులేటిని అధిష్టానం ప్రత్యేకంగా గుర్తించినట్లు రెండు పార్లమెంట్ స్థానాల ఇన్చార్జి బాధ్యతలు అప్పగించడంతో స్పష్టమవుతోంది. ఈ రెండింటి పరిధిలో 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, భద్రాచలంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పొత్తుతో కొత్తగూడెం స్థానాన్ని సీపీఐ దక్కించుకోగా.. మిగిలిన 12 స్థానాల్లో కాంగ్రెస్ విజయదుందుభి మోగించింది. దీంతో రెండు పార్లమెంట్ స్థానాల పరిధిలో పొంగులేటికి ఉన్న పరిచయాలు, పార్టీ కేడర్, కుటుంబ బంధుత్వం లోక్‌సభ ఎన్నికల్లోనూ అభ్యర్థుల విజయానికి కలిసొస్తుందన్న భావనతో ఆయనకు ఈ బాధ్యతలు ఇచ్చినట్లు పార్టీ నేతల ద్వారా తెలిసింది. కాగా, ఖమ్మం లోక్‌సభ స్థానం పరిధిలో ఖమ్మం, పాలేరు, మధిర, వైరా, సత్తుపల్లి, కొత్తగూడెం, అశ్వారావుపేట అసెంబ్లీ నియోజకవర్గాలు, మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో మహబాబాబాద్, డోర్నకల్, నర్సంపేట, ములుగు, పినపాక, ఇల్లెందు, భద్రాచలం అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇవి కూడా చదవండి: ‘పార్లమెంట్’పై కాంగ్రెస్ 0గురి! ఆ స్థానాలకు పోటాపోటీగా.. -
ఆయనకు ఓటమి కనిపిస్తోంది..! : పువ్వాడ అజయ్‌కుమార్
సాక్షిప్రతినిధి, ఖమ్మం: చాలా విషయాల్లో తుమ్మల నాగేశ్వరరావు బ్యాలెన్స్ తప్పాడని, ఇప్పుడు ఆయనకు ఓటమి కళ్ల ముందు కనిపిస్తుండడంతో భయం పట్టుకుని తన నామినేషన్ తిరస్కరింపజేయాలని కుట్ర పన్నాడని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్‌కుమార్ ధ్వజమెత్తారు. ఖమ్మంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో ధీరోదా త్తుడు ఽధైర్యంగా పోరాడుతాడని, పిరికివాడు వెన్నుపోటు పొడవాలని చూస్తాడని ఎద్దేవా చేశారు. 2014లో తనపై ఓడిపోయినప్పుడు, గత ఎన్నికల్లో పాలేరులో ఉపేందర్‌రెడ్డిపై కూడా ఇలాగే అధర్మ పోరాటం చేసినా విజయం దక్కలేదని తెలిపారు. ఇకనైనా ఆయన పిచ్చి ప్రయత్నాలు మానుకుని హుందాతనాన్ని కాపాడుకోవాలని హితవు పలి కారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారమే తన నామినేషన్లో అన్ని వివరాలు పూర్తి చేశానని పువ్వాడ తెలిపారు. ఒకవేళ వివరాలు సరిగా లేకపోతే స్క్రూటినీ రోజు ఉదయమే నోటీసు ఇస్తారని, అలాంటేదేమీ ఆర్ఓ నుంచి తనకు అందలేదని చెప్పారు. హెచ్‌యూఎఫ్ కాలమ్‌లో డిపెండెంట్ 1, 2, 3లో తనపై ఆధారపడే పిల్లలు ఎవరూ లేరని పేర్కొన్నానని, తన కుమారుడి వివాహమై ఉద్యోగం చేస్తున్నందునే అలా వెల్లడించానని తెలిపారు. టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి కామారెడ్డి, కొడంగల్‌లో సమర్పించిన అఫిడవిట్లలో పోలీస్ కేసులు చెప్పాల్సిన ఫార్మెట్ మూడు బాక్సుల్లో, ఏడు బాక్సుల్లో వివరాలు రాశారని తెలిపారు. అఫిడవిట్లో అడిగిన సమాచారాన్ని పొందుపరిచిన తర్వాత రిటర్నింగ్ ఆఫీసర్ తుది నిర్ణయం తీసుకుంటారని, ఎవరికై నా అపోహలు ఉంటే కోర్టుకు వెళ్లొచ్చని తెలిపారు. ఈవిషయాన్ని గుర్తించి అసత్య ఆరోపణలను తుమ్మల ఇకనైనా మానుకోవాలని, ప్రజలు కూడా గుర్తించి ధర్మం వైపు నిలబడాలని పువ్వాడ కోరారు. ఈ సమావేశంలో మేయర్ పునుకొల్లు నీరజ, డీసీసీబీ, మార్కెట్, కూరాకుల నాగభూషణం, దోరేపల్లి శ్వేత, బీఆర్ఎస్ జిల్లా సమన్వయకర్త గుండాల కృష్ణతోపాటు బచ్చు విజయ్‌కుమార్, శీలంశెట్టి వీరభద్రం, పగడాల నాగరాజు, ఖమర్, బీరెడ్డి నాగచంద్రారెడ్డి, పొన్నం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఇవి కూడా చదవండి: నేను మీవాడిని.. ఎప్పటికీ మీ వెంటే ఉంటా..! -
ఖమ్మం జిల్లా నుంచే.. తొలి నామినేషన్.. తొలి దరఖాస్తు!
సాక్షి, ఖమ్మం: అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం మొదలైంది. కాంగ్రెస్ రాష్ట్రంలోని పలు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులకు ప్రకటించగా.. మరికొన్నింటికి ఇంకా ఖరారు చేయలేదు. అయితే, ఖమ్మం అభ్యర్థిగా ఇప్పటికే వెల్లడించిన తుమ్మల నాగేశ్వరరావు శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. దీంతో రాష్ట్రంలోనే కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయనే తొలి నామినేషన్ దాఖలు చేసినట్లయింది. కాగా, కాంగ్రెస్ టికెట్ల ఖరారుకు ముందు ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. ఇందులో భాగంగా సత్తుపల్లి టికెట్ ఆశిస్తూ ఆగస్టు 18న కోటూరి మానవతారాయ్ గాంధీభవన్‌లో తొలి దరఖాస్తు అందజేశారు. ఇలా కాంగ్రెస్ టికెట్ కోసం తొలి దరఖాస్తు, తొలి నామినేషన్ ఖమ్మం జిల్లా నుంచే నమోదు కావడం విశేషం. అయితే, మానవతారాయ్కు టికెట్ మాత్రం ఇంకా ఖరారు కాలేదు. ఇవి చదవండి: మౌనంగా ఉండటమా.. లేక బరిలో దిగడమా.. ముంతాజ్ ఖాన్ దారెటు? -
అరాచకాలను ఆపేందుకే సోనియా, రాహుల్‌గాంధీ నన్ను పంపించారు! : తుమ్మల నాగేశ్వరరావు
సాక్షి, ఖమ్మం: నిజాయితీ, నిబద్ధతను జీవితాంతం వదిలిపెట్టనని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఖమ్మం 54వ డివిజన్ కార్పొరేటర్ మిక్కిలినేని మంజులనరేందర్ ఆధ్వర్యాన బుధవారం ఏర్పాటుచేసిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. రానున్న ఎన్నికలు ఖమ్మం ప్రజలకు, అక్రమ సంపాదనతో అరాచకాలు సృష్టించే వ్యక్తుల మధ్య జరుగుతున్నాయని తెలిపారు. ఇలాంటి అరాచక శక్తులకు అడ్డుకట్ట వేసేందుకే సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ తనను పంపించారని చెప్పారు. రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని.. అప్పడు అవినీతి, సెటిల్మెంట్లకు చరమగీతం పాడుతామన్నారు. ఆ తర్వాత 8, 25, 32, 39, 54వ డివిజన్లలో జరిగిన సమ్మేళనాల్లో కూడా తుమ్మల మాట్లాడారు. అలాగే, డాక్టర్ యలమంచిలి రవీంద్రనాథ్, రామకోటేశ్వరరావు తదితరులను కలిశారు. ఈ సమావేశాల్లో మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, కార్పొరేటర్ సైదులు, కమర్తపు మురళి, చావా నారాయణరావు, నాయకులు పొదిల రవికుమార్, కొప్పెర ఉపేందర్, నాగండ్ల దీపక్‌చౌదరి, సోమనాథం, వడ్డెబోయిన నర్సింహారావు, కొత్తపల్లి శ్రీనివాస్, హుస్సేన్, అమ్జద్, జంగం భాస్కర్, మారగాని వెంకట్, రఘు, గట్టు నితీశ్, వెన్నం శ్రీధర్ పాల్గొన్నారు. ఇవి చదవండి: 'ప్రజలు చందాలు పోగేసి గెలిపించారు' : మాజీ ఎమ్మెల్యే నాగపురి రాజలింగం -
TS Election 2023: కాంగ్రెస్ దూకుడు! ఖమ్మంపై తుమ్మల, పొంగులేటి స్కెచ్!
సాక్షిప్రతినిధి, ఖమ్మం: కాంగ్రెస్ దూకుడు పెంచింది. పార్టీ అభ్యర్థులను ప్రకటించిన రోజే ఖమ్మంలో చోటు చేసుకున్న పరిణామాలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రాజకీయాన్ని వేడెక్కించాయి. మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ బీఆర్ఎస్కు రాజీనామా చేయడం, వెంటనే మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆయన ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించడం.. ఆ తర్వాత ముగ్గురు కార్పొరేటర్లు, పలువురు నేతల ఇంటికి వెళ్లడం చకచకా సాగాయి. ఆదివారం మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు జరిగిన ఈ పరిణామాలు ఉత్కంఠగా కొనసాగాయి. ఇరువురు నేతలు గుంభనంగా చేసిన రాజకీయంతో బీఆర్ఎస్ షాక్‌కు గురైంది. నిర్బంధ రాజకీయం తట్టుకోలేకనే.. నిర్బంధ రాజకీయం తట్టుకోలేకనే తాము బీఆర్ఎస్ను వీడి తుమ్మల, పొంగులేటి బాటలో నడుస్తున్నట్లు కార్పొరేటర్ కమర్తపు మురళి, చావా నారాయణ విలేకరుల సమావేశంలో తెలిపారు. దీంతో నియోజకవర్గ బీఆర్ఎస్లో ఇంకా ఎవరు అసంతృప్తిగా ఉన్నారు?, ఎవరు కాంగ్రెస్‌లో చేరుతారనే చర్చ జరుగుతోంది. ఒకే రోజు ముగ్గురు కార్పొరేటర్లు కాంగ్రెస్‌లో చేరడంతో బీఆర్ఎస్కు గట్టి దెబ్బ తగిలినట్లయింది. మంత్రి పువ్వాడ ప్రగతి భవన్లో బీ ఫామ్ తీసుకుంటన్న సమయంలోనే ఖమ్మంలో జరిగిన రాజకీయం ఆ పార్టీని ఉలికిపాటుకు గురి చేసింది. ఆ తర్వాత మంత్రి హుటాహుటిన ఖమ్మం చేరుకొని బీఆర్ఎస్ కార్పొరేటర్లు, రఘునాథపాలెం మండలంలోని పార్టీ ప్రజా ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. బాలసాని రాజీనామా చేసి.. బీఆర్ఎస్పై అసంతృప్తితో ఉన్న మాజీ ఎమ్మెల్సీ బాలసాని ముందుగా ఆపార్టీకి రాజీనామా చేసి, కేసీఆర్‌కు లేఖ పంపారు. పార్టీపై అసంతృప్తిగా ఉండడం, భద్రాచలం నియోజకవర్గ సమన్వయ బాధ్యతల నుంచి తప్పించడంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న బాలసానితో ఇటీవల పొంగులేటి, తుమ్మల పలుమార్లు వేర్వేరుగా చర్చలు జరిపినట్లు తెలిసింది. తుమ్మలకు కాంగ్రెస్ అధిష్టానం ఖమ్మం సీటుపై గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో బాలసాని ఆయన వెంట నడవాలని నిర్ణయించుకున్నారు. బాలసాని కాంగ్రెస్‌లో చేరేందుకు సుముఖంగా ఉండడంతో ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన తుమ్మల, పొంగులేటి నేరుగా ఆయన ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వా నించారు. పార్టీ బలోపేతానికి తాను కృషి చేసినా అనుభవం లేని వారికి పలు బాధ్యతలు ఇచ్చి తనను అవమానించారని బాలసాని ఎమ్మెల్సీ తాతా మధునుద్దేశించి ఈ సందర్భంగా వ్యాఖ్యలు చేశారు. ఒక్కొక్కరి ఇంటికి వెళ్లి.. బాలసాని పార్టీ మారుతారని బీఆర్ఎస్ అధిష్టానం ముందే ఊహించినా ముగ్గురు కార్పొరేటర్లు, పలువురు నేతలు ఇదే బాట పట్టడంతో అటు హైదరాబాద్, ఇటు ఉమ్మడి జిల్లాలో ఆసక్తికర చర్చ జరిగింది. తుమ్మల, పొంగులేటి బాలసాని ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించాక కార్పొరేటర్లు కమర్తపు మురళి, చావా మాధురి నారాయణ, రావూరి కరుణసైదుబాబు ఇంటికి వెళ్లి వారిని కూడా కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. అనంతరం అల్లీపురంలోని బీఆర్ఎస్ నేతలు సంక్రాంతి నాగేశ్వరరావు, పత్తిపాటి వీరయ్య, మాజీ కార్పొరేటర్ చేతుల నాగేశ్వరరావు ఇంటికి తుమ్మల, పొంగులేటి వెళ్లారు. సుడా డైరెక్టర్లు కోసూరి రమేష్‌గౌడ్, ఎండీ ఖాదర్‌బాబా, మాజీ కార్పొరేటర్ భర్త పోట్ల వీరేందర్, ఏలూరి శ్రీనివాస్ కూడా తుమ్మల, పొంగులేటి వెంట నడవనున్నట్లు ప్రకటించారు. -
లెఫ్ట్‌కు 4 సీట్లు.. ఒక ఎమ్మెల్సీ?
సాక్షి, న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీలతో కాంగ్రెస్ పొత్తు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. లెఫ్ట్ పార్టిలు పట్టుబట్టినట్లు కాకుండా మధ్యేమార్గంగా చెరో రెండు స్థానాలను కేటాయించేందుకు కాంగ్రెస్ అధిష్టానం సంసిద్ధత వ్యక్తం చేసినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మునుగోడు, కొత్తగూడెం, మిర్యాలగూడ, భద్రాచలం, హుస్నాబాద్ స్థానాల్లో ఏవైనా నాలుగు స్థానాలను ఉభయ కమ్యూనిస్టులకు కేటాయించే అవకాశం ఉందని అంటున్నారు. శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి భేటీ అయ్యారు. కమ్యూనిస్టులతో సీట్ల సర్దుబాటుపై చర్చించారు. సీపీఐకి మునుగోడు, కొత్తగూడెం, హుస్నాబాద్‌లలో రెండు స్థానాలు, సీపీఎంకు మిర్యాలగూడ, భద్రాచలం సీట్లు కేటాయించే అంశాన్ని పరిశీలించారు. అయితే భద్రాచలంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నందున దీనిపై ఇంకా చర్చలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. కాగా ఉభయ కమ్యూనిస్టులు సూచించిన వారికి ఒక ఎమ్మెల్సీ స్థానం ఇచ్చేందుకు కూడా కాంగ్రెస్ చెప్పినట్లు సమాచారం. పొత్తుపై వేణుగోపాల్ నేరుగా కమ్యూనిస్టు పార్టిల పెద్దలతో ఫోన్లో మాట్లాడినట్లు చెబుతున్నారు. అవసరాన్ని బట్టి కేసీ వేణుగోపాల్, రాష్ట్ర నేతలు ఆదివారం హైదరాబాద్‌లో లెఫ్ట్ పార్టిల నేతలతో చర్చించే అవకాశం ఉంది. ఆ తర్వాతే తుది నిర్ణయం చేసే అవకాశం ఉంది. ఖమ్మం నుంచి తుమ్మల..పాలేరు నుంచి పొంగులేటి! ఖమ్మం జిల్లా నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు శనివారం ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాందీతో భేటీ అయ్యారు. సుమారు పది నిమిషాల పాటు జరిగిన సమావేశంలో కమ్యూనిస్టులతో పొత్తు వల్ల కలిసొచ్చే అంశాలపై చర్చించారు. కాగా పీలేరు నుంచి పోటీ చేయాలని తుమ్మల భావించినప్పటికీ రాహుల్ సూచన మేరకు ఖమ్మం నుంచి పోటీ చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినట్లు తెలిసింది. పాలేరు నుంచి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పోటీ చేసే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి. -
Paleru: కాంగ్రెస్ కంచుకోటలో హోరాహోరీ.. ఈసారి గెలుపెవరిదో..?
ఖమ్మం జిల్లాలో పాలేరు పాలిటిక్స్ ఎప్పుడూ డిఫరెంట్‌గానే ఉంటాయి. కొన్నేళ్లుగా ప్రతి ఎన్నికల్లో పొలిటికల్ ఈక్వేషన్స్ మారుతూనే ఉన్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలతో పాటు వామపక్షాల బలం సైతం ఇక్కడ బాగానే ఉంది. అయితే పాలేరు కాంగ్రెస్‌కు కంచుకోట అనే చెప్పాలి. 1962లో పాలేరు నియోజకవర్గం ఏర్పడ్డాక ఇప్పటి వరకు 14 సార్లు ఎన్నికలు జరగగా 10 సార్లు కాంగ్రెస్, 2 సార్లు సీపీఎం, సీపీఐ, బీఆర్ఎస్ ఒక్కోసారి గెలిచాయి. గతంలో ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గంగా ఉన్న పాలేరు 2009లో జనరల్ సీటుగా మారింది. ఒకప్పుడు వారికి కంచుకోట నియోజకవర్గంలో మొత్తం 2,15, 631 ఓటర్లున్నారు. 2009, 2014లో కాంగ్రెస్ తరపున రాంరెడ్డి వెంకటరెడ్డి విజయం సాధించారు. అనారోగ్యంతో వెంకటరెడ్డి మరణించడం వల్ల జరిగిన ఉపఎన్నికలో ఆయన సతీమణి రామిరెడ్డి సుచరితరెడ్డిని కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిగా నిలబెట్టింది. అప్పటికే ఎమ్మెల్సీ కోటలో మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావును అధికార TRS పార్టీ పోటీ చేయించగా ఆయన 45 వేల భారీ మెజారిటీతో గెలిచారు. అయితే 2018లో జరిగిన సాధారణ ఎన్నికల్లో మళ్ళీ తుమ్మల నాగేశ్వరరావు పై 7 వేల పై చిలుకు మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి గెలుపొందారు. ఆ తర్వాత కొద్దికాలానికే కందాల హస్తానికి హ్యాండిచ్చి కారెక్కేశారు. తుమ్మల చుట్టే రాజకీయాలు ఈ సారి జరగబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. సిటింగ్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. మరోవైపు YSRTP నుంచి వైఎస్ షర్మిల, సీపీఎం నుంచి తమ్మినేని వీరభద్రం, CPI నుంచి సీనియర్ నాయకుడు మౌలానా పేర్లు ప్రచారంలో ఉన్నాయి. దీంతో ఈసారి తెలంగాణ వ్యాప్తంగా చూస్తే పాలేరు సీటుకే అధిక డిమాండ్ ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రధానంగా వైఎస్సార్ టీపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య గట్టి పోటీ ఉండబోతున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ ఓటు బ్యాంకు బలంగా ఉన్నప్పటికీ వైఎస్ రాజశేఖరరెడ్డి బిడ్డగా వైఎస్ షర్మిలకు కలిసొస్తుందని అంటున్నారు. బీ.ఆర్.ఎస్ పార్టీలో ఉన్న వర్గ విబేధాలు కూడా షర్మిలకు మరో కలిసొచ్చే అంశంగా చెబుతున్నారు. నియోజకవర్గంలో బీఆర్ఎస్ రెండు వర్గాలుగా విడిపోయి కేసులు పెట్టుకోవడం..ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడం..వ్యతిరేక సభలు, సమావేశాలు నిర్వహించడం వంటి ఘటనలు బీఆర్ఎస్ పార్టీకి కొంత మైనస్ అవుతుందనే వార్తలు వస్తున్నాయి. తుమ్మల లేదా కందాలలో ఎవరికైనా ఒక్కరికే గులాబీ పార్టీ సీటు ఇస్తుంది. దీంతో ఆటోమేటిక్‌గా రెండో వ్యక్తి ప్రత్యర్థిగా మారే పరిస్థితులుంటాయి. పార్టీలోని వర్గ విభేదాలు ప్రత్యర్థులకు అవకాశం ఇచ్చినట్లవుతుందని బీఆర్ఎస్ కేడర్ ఆందోళన చెందుతోంది. పోలోమంటూ షిఫ్టింగ్‌లు ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డికి కలిసొచ్చే అంశం సొంత డబ్బుతో విద్యార్థులకు ఫ్రీ కోచింగ్, నియోజకవర్గంలో మరణించిన ప్రతి కుటుంబానికి 10 వేలు ఆర్ధిక సాయం, రైతులు వెళ్లేందుకు డొంక రోడ్ల మరమ్మతులు, దేవాలయాలకు, మసీదులకు, చర్చిలకు విరాళం అందించడంతో కొంత సానుకూలంగా కనిపిస్తోంది. బీఆర్ఎస్ పార్టీతో పొత్తులో భాగంగా సీపీఎం సైతం పాలేరు టిక్కెట్ ను ఆశిస్తున్నప్పటికీ గులాబీ పార్టీ మాత్రం టిక్కెట్ ను వదులుకునేందుకు సిద్ధంగా లేదు. తుమ్మల సైతం బీఆర్ఎస్ టికెట్ కోసం తీవ్రంగానే ప్రయత్నాలు చేస్తున్నారు. మొన్నటి వరకు పార్టీపై అసంతృప్తితో ఉన్న తుమ్మలను బీఆర్ఏస్ ఆవిర్భావసభ నేపథ్యంలో దగ్గరికి తీసుకుంది. మంత్రి హరీష్ రావ్ తుమ్మల ఇంటికి వెళ్లి చర్చలు జరపడంతో తుమ్మల మళ్లీ పార్టీలో యాక్టివ్ అయ్యారు. ఆవిర్భావ సభ ఏర్పాట్లను సైతం చూసుకున్నారు. పార్టీ కూడా తుమ్మలకు ప్రాధాన్యతను పెంచింది. దీంతో తాను పార్టీ మారే ప్రసక్తే లేదని క్లారిటి ఇచ్చారు తుమ్మల. అయితే తుమ్మలకు పాలేరు టికెట్ ఇస్తారా లేదా అన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. రాబోయే రోజుల్లో ఖమ్మం జిల్లాలో తుమ్మల కీలక భూమిక పోషించబోతున్నారని ఆయన అనుచరులు చెప్పుకొస్తున్నారు. ఎన్నికల హీట్ పెరిగిన నేపథ్యంలో ఖమ్మం రూరల్ మండలంలోని శ్రీసీటిలో కొత్తగా ఇంటిని నిర్మించుకున్నారు తుమ్మల. అటు వైఎస్ షర్మిల సైతం కర్ణగిరి సమీపంలో క్యాంప్ ఆఫీస్ నిర్మిస్తున్నారు. సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం కూడా స్వగ్రామం తెల్దారుపల్లిలో కొత్తగా ఇల్లు నిర్మించుకుంటున్నారు. అసంతృప్తి రాగాలు సామాజిక వర్గాల వారీగా చూస్తే..పాలేరులో బీసీ ఓటర్లు ఎక్కువగా ప్రభావం చూపుతారు. గిరిజన తండాలు ఎక్కువగా ఉండటంతో గెలుపు ఓటములు నిర్ణయించేది మాత్రం ఎస్టీ ఓటర్లే. కందాల ఉపేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ హామీలనే ప్రజల్లోకి తీసుకెళ్లి గెలిచారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు చూపిస్తానంటూ భరోసా ఇచ్చారు. ఎన్నికలు దగ్గరపడుతున్నా ఇప్పటి వరకు ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాలేదని నిరుద్యోగ యువత అసంతృప్తితో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నిధులివ్వకపోవడంతో గ్రామాల్లో సీసీ రోడ్లు, వాగులపై బ్రిడ్జిలు చేపట్టలేదని ప్రజలు భావిస్తున్నారు. గతంలో ప్రారంభించిన రోడ్ల పనులు మాత్రం పూర్తి చేస్తున్నారు. అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందించలేకపోవడంతో వారిలో నిరాశ కనిపిస్తోంది. భక్త రామదాసు ప్రాజెక్ట్ క్రింద ఇంకా 10 గ్రామాలకు త్రాగు నీరు అందించాల్సి ఉంది. అది కూడ త్వరగా నేరవేర్చాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. ఎమ్మెల్యే పనితీరు బాగానే ఉన్నప్పటికీ ప్రభుత్వం నుంచి నిధులు తేలేకపోవడంతో పాటు పార్టీ మారడం..పార్టీలో గ్రూప్ తగాదాలు ఆయనకు ప్రతికూలంగా ఉన్నాయంటున్నారు అక్కడి పబ్లిక్. కొందరు అధికార పార్టీ నేతలు భూ కబ్జాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక నేత అయితే షాడో ఎమ్మేల్యేగా వ్యవహరిస్తూ ఎమ్మేల్యే ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తున్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది. కాంట్రవర్సీ నేతలను కంట్రోల్ లో పెట్టకపోతే వచ్చే ఎన్నికల్లో ఎమ్మేల్యేకు మైనస్‌గా మారే ప్రమాదం ఉందని లోకల్ గా టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే కాంగ్రెస్, బీజేపీలు కూడా గట్టి అభ్యర్థులను రంగంలోకి దింపాలని ప్రయత్నిస్తున్నాయి. ప్రస్తుతం పాలేరులో కాంగ్రెస్ నుంచి రాయల నాగేశ్వరరావు ఉండగా.. బీజేపీ నుంచి కొండపల్లి శ్రీధర్ రెడ్డి పోటీ చేసేవారి జాబితాలో ఉన్నారు. మొత్తానికి వచ్చే ఎన్నికల్లో పాలేరులో ప్రధాన పార్టీల మధ్య రసవత్తరమైన పోరు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
‘దేశ రాజకీయాల్లో పెను మార్పులకు ఖమ్మం వేదిక కానుంది’
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ముందే పొలిటికల్ వాతావరణం వేడెక్కింది. సీఎం కేసీఆర్.. బీఆర్ఎస్ పార్టీతో దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఖమ్మం భారీ బహిరంగ సభకు ప్లాన్ చేశారు. దేశంలో బీజేపీ, కాంగ్రెస్‌లకు ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ అనిపించేలా.. జాతీయ రాజకీయాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఈ మేరకు ఖమ్మం బహిరంగ సభను ఘనంగా నిర్వహించాలని ఆ పార్టీ పెద్దలు భావిస్తున్నారు. ఈ మేరకు శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో ఇతర రాష్ట్రాల నేతలనూ రప్పించేందుకు మరోవైపు కసరత్తు చేస్తున్నారు. సీఎం కేసీఆర్ నుంచి ఖమ్మం స్థానిక నేతల వరకు ఈ పనిలోనే బిజీబిజీగా గడుపుతున్నారు. ఈ సందర్భంగా ఆదివారం సభ ఏర్పాటకు సంబంధించి అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా క్యాంపు కార్యాలయంలో గులాబీ నేతలు సమావేశమయ్యారు. ఎంపీ నామా, మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ చీఫ్ విప్ రేగా కాంతారావు సమావేశంలో పాల్గొన్నారు. కాగా, సమావేశం అనంతరం తుమ్మల నాగేశ్వర రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తుమ్మల మీడియాతో మాట్లాడుతూ.. 18వ తేదీన దేశ రాజకీయాల్లో పెను మార్పుకి ఖమ్మం వేదిక కానుంది. దేశ రాజకీయాల్లో మలుపు తిప్పే విధంగా సీఎం కేసీఆర్ అడుగులు వేస్తున్నారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు పాలిటికల్‌గా హీట్‌ను పెంచాయి. -
సిటీ చుట్టూ సూపర్ హైవే
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్డుకు అవతల నిర్మించనున్న రీజనల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్)ను మామూలు రహదారిలా కాకుండా ప్రపంచ స్థాయి ఎక్స్‌ప్రెస్ వేగా నిర్మించాలని అధికారులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. సంగారెడ్డి–గజ్వేల్–చౌటుప్పల్–మాల్–కడ్తాల్–షాద్‌నగర్–చేవెళ్ల–కంది పట్టణాలను కలుపుతూ 500 అడుగుల వెడల్పుతో 338 కిలో మీటర్ల పొడవుతో ఆర్ఆర్ఆర్ నిర్మాణం జరగాలన్నారు. ఇందుకు సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారు చేయాలని చెప్పారు. ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణానికి నిధుల మంజూరు కోసం కేంద్ర ప్రభుత్వంతో తానే స్వయంగా మాట్లాడతానన్నారు. రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణంపై సీఎస్ ఎస్.కె.జోషి, రోడ్లు–భవనాల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ గణపతిరెడ్డి, ఇతర అధికారులతో గురువారం ప్రగతిభవన్‌లో సీఎం చర్చించారు. రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావుతో ఫోన్లో మాట్లాడారు. ‘‘ముంబై–పుణే, అహ్మదాబాద్–వదోదర మధ్య ప్రస్తుతమున్న ఎక్స్‌ప్రెస్‌వేల కన్నా మన రీజనల్ రింగ్ రోడ్డు గొప్పగా ఉండాలి. విజయవాడ, ముంబై, బెంగళూరు, నాగ్‌పూర్‌లకు వెళ్లే జంక్షన్లను బాగా అభివృద్ధి చేయండి. ఈ నాలుగు కూడళ్ల వద్ద ప్రభుత్వం 300 నుంచి 500 ఎకరాల వరకు సేకరిస్తోంది. ఆ స్థలంలో అన్ని రకాల సదుపాయాలు కల్పించండి. పార్కింగ్, ఫుడ్ కోర్టులు, రెస్ట్ రూమ్‌లు, పార్కులు, పిల్లలు ఆడుకునే స్థలాలు, షాపింగ్ మాళ్లు, మంచినీరు, టాయిలెట్లు ఇలా అన్నీ ఏర్పాటు చేయండి. మంచి రహదారులు, రహదారుల పక్కన అన్ని సౌకర్యాలున్న దేశాల్లో పర్యటించి అధ్యయనం చేయండి’’ అని అధికారులకు సూచించారు. దేశంలోనే గొప్ప కాస్మొపాలిటిన్ నగరం హైదరాబాద్ అని, ఇక్కడి వాతావరణం, సామరస్య జీవనం వల్ల నగరం మరింతగా అభివృద్ధి చెందుతోందని అన్నారు. దేశం నలుమూలల నుంచి హైదరాబాద్‌కు రాకపోకలు పెరుగుతున్నాయని, ఈ దృష్ట్యా ఇప్పుడున్న ఓఆర్ఆర్ భవిష్యత్ అవసరాలు తీర్చలేదని, అందుకే రీజనల్ రింగ్ రోడ్డు నిర్మించాలని నిర్ణయించినట్లు చెప్పారు. దేశంలోనే గొప్ప రహదారిగా ఆర్ఆర్ఆర్ను నిర్మించనున్నామని వెల్లడించారు. -
లకారం జనహారం
నగరం జన ఉత్సాహంతో ఉప్పొంగింది. సింగారించుకున్న లకారం ట్యాంక్‌బండ్‌ను చూసి ప్రజలు మురిశారు. 5కే పరుగుతో సంబరాన్ని నింపారు. రాష్ట్ర మంత్రులు హరీశ్‌రావు, తుమ్మల నాగేశ్వరరావు ట్యాంక్‌బండ్‌ను ప్రారంభించి..హైదరాబాద్‌కు దీటుగా ఖమ్మం అభివృద్ధి చెందుతోందని కితాబునిచ్చారు. ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ ప్రత్యేక శ్రద్ధతో లకారాన్ని..నగరానికి అలంకారంగా మార్చారని అభినందించారు. ఖమ్మంస్పోర్ట్స్: జాతరను మైమరపించిన జనంతో, ఉవ్వెత్తున ఎగిసిన క్రీడాభిమానంతో 5కే రన్ దిగ్విజయంగా కొనసాగింది. నిర్వాహకులు ఊహించిన విధంగానే 5కే రన్లో ప్రాతినిధ్యం వహించేందుకు వేలాదిగా ఖమ్మం నగరవాసులు తరలివచ్చారు. సర్దార్ పటేల్ స్టేడియం వద్ద రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జెండా ఊపి రన్‌ను ప్రారంభించారు. ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకున్నవారే పరుగెత్తాలి అని నిర్వాహకులు తెలపడంతో దాదాపు వెయ్యిమందికి పైగా నగర వాసులు, ఇతర జిల్లాలకు చెందిన అథ్లెట్లు పాల్గొన్నారు. తర్వాత నగరంలోని పలు సేవాసంస్థలు, క్రీడా సంఘాలు, ఉద్యోగ సంఘాలు, ప్రైవేట్ విద్యాసంస్థల వారు భాగస్వామ్యులయ్యారు. ఖమ్మం పార్లమెంట్ సభ్యులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గడిపల్లి కవిత, కలెక్టర్ లోకేష్‌కుమార్, ఖమ్మం మున్సిపాల్ కార్పొరేషన్ కమిషనర్ సందీప్‌కుమార్ ఝూ, అడిషనల్ డీసీపీ కె.సురేష్‌కుమార్, బాలకిషన్, నగర మేయర్ డాక్టర్ జి.పాపాలాల్, 5కే రన్ నిర్వాహకులు దొడ్డ రవి, కురువేళ్ల ప్రవీణ్‌కుమార్, సినీనటులు పాల్గొన్నారు. స్టేడియం నుంచి ప్రారంభమైన ఈ రన్ ఇల్లెందు క్రాస్‌రోడ్, కోర్టు మీదుగా మమత ఆస్పత్రి మార్గం నుంచి లకారం ట్యాంక్‌బండ్ వరకు చేరుకుంది. నిర్వాహకులు 40ఏళ్లలోపు పురుషులు, మహిళల స్థానాలు ప్రకటించారు. ముందుగా నమోదు చేసుకున్నవారు 16నిమిషాల్లో రన్‌ను ముగించగా, తర్వాత మిగతా వారు..అరగంటకు ట్యాంక్‌బండ్‌కు చేరుకున్నారు. సర్దార్ పటేల్స్టేడియం నుంచి ప్రారంభమైన 5కే రన్‌తో లకారం ట్యాంక్‌బండ్ వరకు రోడ్లన్నీ జనంతో నిండాయి. స్టేడియంనుంచి లకారం ట్యాంక్‌బండ్ వరకు ఎక్కడ చూసినా జనమే కనిపించారు. క్రీడా సంఘాలకు చెందిన వారు తమ క్రీడాకారులను తీసుకుకొచ్చి రన్లో పాల్గొనే విధంగా చేశారు. చిప్ అనుసంధానంగా రన్.. జిల్లాలో తొలిసారిగా నిర్వహించిన 5కే రన్లో అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించారు. అథ్లెట్ల షూలలో ఒక చిప్‌ను అమర్చి, జీపీఎస్ ద్వారా వీరి గమనం తీరును పరిశీలించారు. తద్వారా తప్పుడు పద్ధతిలో గమ్యస్థానానికి చేరకుండా పకడ్బందీగా వ్యవహరించారు. భారీ బందోబస్తు.. అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా..పోలీసులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. స్టేడియం ప్రాంతంలోని రెండురోడ్లలో ఒక మార్గాన్ని మూసివేశారు. భద్రత ఏర్పాట్లను అడిషన్ డీసీపీ కె.సురేష్‌కుమార్ పర్యవేక్షించారు. నగర ఏసీపీలు పీవీ.గణేష్, ట్రాఫిక్ ఏసీపీ సదా నిరంజన్, రెహమాన్, సీఐలు రాజిరెడ్డి, వెంకన్నబాబు, రమేష్, తిరుపతిరెడ్డి, నాగేంద్రచారి ఆధ్వర్యంలో నిరంతరం బందోబస్తు పర్యవేక్షించారు. విజేతలు వీరే.. 40 ఏళ్లలోపు పురుషుల విభాగంలో నిర్వహించిన పరుగులో జి.విజయ్‌కుమార్(వరంగల్), ఆర్.రమేష్‌చంద్ర(మహబూబ్‌నగర్), ఎస్.వినోద్(ఖమ్మం), కె.తిరుపతి, వంశీ(ఖమ్మం అథ్లెటిక్స్ అకాడమీ) విజేతలుగా నిలిచారు. మహిళల విభాగంలో బి.నవ్య(నల్లగొండ), పి.ఉషారాణి(యూసీపీఈ వరంగల్), తేజశ్రీ(ఖమ్మం) విజేతలుగా నిలిచారు. సినీ తారల సందడి.. సినిమా తారలు శ్రీకాంత్, శివాజీ, శ్రీనివాసరెడ్డి, తారక్‌రత్న, హేమ, గాయకుడు సింహ తదితరులు హాజరై సందడి చేశారు. నృత్యాలతో ఉత్సాహం నింపారు. ఖమ్మం అంటే..కళాకారుల గుమ్మం..అని, ఇక్కడికి ఎప్పుడొచ్చినా కొత్తదనం కనిపిస్తుందని ఆనందంగా చెప్పారు. మా అసోసియేషన్ 25వ వేడుకను ఖమ్మంలో జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. శాస్త్రీయ నృత్యాలు, సినీ గేయాలపనలు నగరవాసులను అలరించాయి. -
రోడ్ల అభివృద్ధి సంస్థకు చట్టబద్ధత
సాక్షి, హైదరాబాద్: భారీ ప్రాజెక్టులు చేపట్టేందుకు వీలుగా తెలంగాణ రోడ్ల అభివృద్ధి సంస్థకు చట్టబద్ధత కల్పించనున్న ట్లు రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. తదుపరి అసెంబ్లీ సమావేశాల నాటికి ముసాయిదా బిల్లును సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించినట్టు వెల్లడించారు. న్యాక్‌లో బుధవారం జరిగిన సమీక్ష అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. అంతర్జాతీయ సంస్థల నుంచి రోడ్ల అభివృద్ధి సంస్థ భారీగా రుణం తీసుకునేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కీలక రహదారుల అభివృద్ధికి ఆ సంస్థ ద్వారా విజయబ్యాంకు కన్సార్షియం నుంచి రూ.600 కోట్లు రుణం పొందేందుకు ఏర్పాట్లు చేస్తున్న ట్లు చెప్పారు. ముఖ్యమైన, ఎంపిక చేసిన రోడ్ల ప్రాజెక్టుల కోసం ప్రత్యేకంగా తెలంగాణ రహదారుల అభివృద్ధి కార్యక్రమం (ట్రాక్)లో భాగంగా ప్రణా ళికను రూపొందిస్తున్నట్టు వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని పట్టణాలకు రహదారి అనుసంధానం చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తామని పేర్కొన్నారు. బడ్జెట్ నిధులతో ఇలాంటి పనులు సాధ్యం కానందున ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తామని మంత్రి తుమ్మల చెప్పారు. -
కృష్ణాబోర్డు నిర్ణయం చట్ట వ్యతిరేకం
ప్రాజెక్టుల నియంత్రణ నోటిఫికేషన్ సరికాదు: తుమ్మల సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్ పరిధిలోని ప్రాజెక్టులను తన నియంత్రణలోకి తెచ్చుకునేందుకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు నోటిఫికేషన్ జారీ చేయడం విభజన చట్టానికి విరుద్ధమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. బోర్డు నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోందని స్పష్టం చేశారు. కేవలం ఆంధ్రప్రదేశ్ ఒత్తిళ్లకు తలొగ్గే కృష్ణా బోర్డు ప్రాజెక్టుల నియంత్రణపై లేని అధికారాలను ప్రయోగిస్తోందని విమర్శించారు. ఆదివారం తెలంగాణ భవన్లో ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలసి తుమ్మల మీడియాతో మాట్లాడారు. కృష్ణా, గోదావరి నదుల నుంచి తెలంగాణకు కేటాయించిన నీళ్లను వాడుకోలేకపోవడం వల్లే తెలంగాణ జిల్లాలు కరువుతో అల్లాడుతున్నాయని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో చేసిన కేటాయింపుల మేరకే ప్రాజెక్టులను రీడిజైన్ చేస్తున్నామన్నారు. తెలంగాణ అభిప్రాయానికి భిన్నంగా కృష్ణా బోర్డుకు లేని అధికారాన్ని జోడించి.. సున్నితమైన అంశాన్ని మరింత జటిలం చేసుకోవద్దని ఆంధ్రప్రదేశ్‌కు విజ్ఞప్తి చేస్తున్నామని చెప్పారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఏపీ ప్రభుత్వం, ఆ ప్రాంత ప్రజలు నష్టపోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కృష్ణా బోర్డు నోటిఫికేషన్ విషయమై సోమవారం ఢిల్లీకి వెళ్లి కేంద్ర జల వనరుల శాఖమంత్రిని కలసి వాస్తవాలు వివరిస్తామన్నారు. అభివృద్ధిని చూసే టీఆర్ఎస్లో చేరా: పొంగులేటి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తెలంగాణ ప్రజల అభిప్రాయానికి భిన్నంగా కర్నూలులో దీక్ష చేపట్టినందు వల్లే తాను ఆ పార్టీని వీడానని, తెలంగాణ అభివృద్ధి కోసం కేసీఆర్ తపన చూసి టీఆర్ఎస్లో చేరానని ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. తాను కాంట్రాక్టర్‌గా పనిచేసి సంపాదించిన సొమ్ముకు నిజాయితీగా పన్ను కట్టానని... ఏ పనీ చేయకుండా కాంగ్రెస్ నాయకులు ఇన్ని ఆస్తులు ఎలా సంపాదించారో చెప్పాలని డిమాండ్ చేశారు. మధిర నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు కోరితేనే సీఎం కేసీఆర్ అక్కడికి వస్తానని చెప్పారని... కేసీఆర్‌పై భట్టి విక్రమార్క అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని పేర్కొన్నారు. తమ విమర్శల్లో ఎంత విశ్వసనీయత ఉందో ముందు తెలుసుకుని తర్వాత మాట్లాడాలని సూచించారు. -
ఉద్యమ ద్రోహి తుమ్మల కుడి భుజమా?
► పాలేరులో టీఆర్ఎస్ను ఓడించి తీరుతాం ► తెలంగాణ స్ఫూర్తి యాత్ర ముగింపు సభలో చెరుకు సుధాకర్ సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణ ఉద్యమ ద్రోహి తుమ్మల నాగేశ్వర్రావు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కుడి భుజమవుతారట.. కాలం కలిసొస్తే నడిచే కొడుకు అవుతాడట.. ఖమ్మంలో జరిగింది పక్కగా దొంగల ప్లీనరీనే, పాలేరులో టీఆర్ఎస్ను ఓడించి తీరుతాం’ అని తెలంగాణ ఉద్యమ వేదిక రాష్ట్ర కన్వీనర్ చెరుకు సుధాకర్ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. అంబేడ్కర్, పూలే జయంతి సందర్భంగా తెలంగాణ ఉద్యమ వేదిక నేత చెరుకు సుధాకర్ ఆధ్వర్యంలో ఈ నెల 14న ప్రారంభమైన తెలంగాణ స్ఫూర్తియాత్ర శనివారం ఓయూలో ముగిసింది. ఈ సందర్భంగా ఓయూ విద్యార్థి జేఏసీ ఆర్ట్స్ కళాశాల ఎదుట తెలంగాణ ఉద్యమ సామాజిక పునరేకీకరణ బహిరంగ సభ నిర్వహిం చింది. కార్యక్రమానికి విద్యార్థి జేఏసీ అధ్యక్షుడు దేశగాని సాంబశివగౌడ్ అధ్యక్షత వహించగా చెరుకు సుధాకర్, డాక్టర్ గోపినాధ్, మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎంపీ మధు యాష్కి, శ్రీశైల్‌రెడ్డి తదితరులు పాల్గొని మహానీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. అనంతరం చెరుకు సుధాకర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పాలనపై ధ్వజమెత్తారు. ఉద్యమాన్ని అడ్డుకొని, తెలంగాణ రాష్ట్ర అవతరణకు సహకరించని మంత్రులు తలసాని శ్రీనివాస్,కడియం శ్రీహరి, తుమ్మల నాగేశ్వర్రావు, మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే కొండా సురేఖలకు పార్టీలో అధిక ప్రాధాన్యతను కల్పించడం దారుణమన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని దొంగలు, లిక్కర్ మాఫియా, రౌడీలు ఏలుతున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ రాజకీయాల్లో ప్రత్యామ్నాయ గొంతుగా ప్రజలను చైతన్య పరిచేందుకు పది జిల్లాలో నిర్వహించిన స్ఫూర్తి యాత్రకు ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు లభించిందన్నారు. బంగారు తెలంగాణ తీసుకువస్తానన్న కేసీఆర్ బతుకులేని తెలంగాణగా మారుస్తున్నారని విమర్శించారు.