Tamil Nadu
-
నైజీరియన్ యువతులతో వ్యభిచారం...
తిరువొత్తియూరు: కోయంబేడు మార్కెట్ ఎదురుగా ఉన్న మంగమాల్ నగర్ ప్రాంతంలో వ్యభిచారం జరుగుతోందని స్థానిక పోలీసులకు బుధవారం సమాచారం అందింది. ఇన్స్పెక్టర్ అరుల్ మణిమారన్, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని తనిఖీలు చేపట్టారు. నైజీరియాకు చెందిన యువతులు ఓ ఇంటిలో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఆ తర్వాత వ్యభిచారం నిర్వహిస్తున్న నైజీరియాకు చెందిన 9 మంది యువతులను పోలీసులు రక్షించారు. అద్దె ఇంట్లో ఉంటూ సెల్ ఫోన్ యాప్ ద్వారా కస్టమర్లను సంప్రదించి ఈ వ్యవహారం సాగిస్తున్నట్లు సమాచారం. రక్షించబడిన 9 మంది నైజీరియన్ మహిళలను మైలాపూర్‌లోని ప్రభుత్వ ఆశ్రమానికి అప్పగించారు. వీరితో సంబంధం ఉన్న ముఠాలపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. -
శ్రీవారి దర్శనానికి 8 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో కంపార్ట్మెంట్లు ఖాళీగా ఉన్నాయి. మంగళవారం అర్ధరాత్రి వరకు 64,525 మంది స్వామివారిని దర్శించుకోగా 19,880 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.53 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 8 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 2 గంటల్లో దర్శనం లభిస్తోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలో వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. కేటాయించిన సమయాన్ని కంటే ముందు వెళ్లిన భక్తులను క్యూలో అనుమతించరని స్పష్టం చేసింది. -
లారీ ఢీకొని ఇద్దరికి తీవ్రగాయాలు
గాయపడిన వారు తమిళనాడు వాసులు నాగలాపురం: లారీ ఢీకొనడంతో మోటార్ సైక్లిస్టులు తీవ్రంగా గాయపడిన సంఘటన బుధవారం మండలంలోని అచ్చమనాయుడు కండ్రిగ వద్ద చోటుచేసుకుంది. పోలీసుల కథనం..చైన్నె నుంచి జిప్సం లారీ తిరుపతి మీదుగా తాడిపత్రికి వెళ్తోంది. అదే సమయంలో తమిళనాడులోని తిరువళ్లూరుకు చెందిన అరవింద్(28), నరసింహులు(26) సొంత పని నిమిత్తం తిరుపతి నుంచి తమ సొంతూరుకు ద్విచక్ర వాహనంలో వెళ్తుండగా అచ్చమనాయుడు కండ్రిగ తిరుపతి–చైన్నె జాతీయ రహదారిపై ఎదురుగా వస్తున్న లారీ వారిని ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని 108లో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నరు. -
సేవకులకు అవార్డుల ప్రదానం
కొరుక్కుపేట: పర్యావరణ పరిరక్షణ, ప్రకృతి వైపరీత్యాల్లో సేవలు, మానవతా దృక్పథం వంటి సామాజిక సేవలు చేస్తున్న లయన్స్ క్లబ్‌లకు అవార్డులను సోమవారం రాత్రి ప్రదానం చేశారు. ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ 324ఎం జిల్లా నేతృత్వంలో జరిగిన కార్యక్రమానికి జిల్లా గవర్నర్ ఎన్. వరదరాజన్ పాల్గొని సమాజానికి సేవ చేస్తున్న వారికి జిల్లా ఫస్ట్ అవార్‌ుడ్స పేరుతో అవార్డులను ప్రదానం చేశారు. ఇందులో లయన్స్ క్లబ్ ఆఫ్ సౌత్ సిటీ అధ్యక్షురాలు డాక్టర్ ఏవీ శివకుమారికి ఆరు అవార్డులను జిల్లా గవర్నర్ చేతుల మీదుగా అందుకున్నారు. ఫస్ట్ వైస్ జిల్లా గవర్నర్ ఎస్ .బోస్, సెకండ్ జిల్లా గవర్నర్ రాజేష్ ఎం.జోషి పాల్గొన్నారు. 15న అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశం సాక్షి, చైన్నె: డిసెంబరు 15వ తేదీన అన్నాడీఎంకే సర్వ సభ్య సమావేశం జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై దృష్టి పెడుతూ ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి పళణిస్వామి బుధవారం ప్రకటన చేశారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బలోపేతం దిశగా చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి చర్చించి తీర్మానాలు చేయనున్నారు. అలాగే డిసెంబరు 5న దివంగత సీఎం జయలలిత వర్ధంతి కార్యక్రమాలకు నిర్ణయించారు. ముగ్గురు చైన్ స్నాచర్స్ అరెస్ట్ అన్నానగర్: చైన్నె కొలత్తూరు పూంబుహార్ నగర్ 6వ క్రాస్ వీధికి చెందిన విజయలక్ష్మి(63). మంగళవారం సాయంత్రం తన సోదరి వసంతతో కలసి దుకాణానికి వెళ్లి కూరగాయలు కొనుగోలు చేసింది. కొళత్తూరు వీవీగగర్ 2వ వీధిలో ఆమె నడుచుకుంటూ వెళ్తుండగా బైకు పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆమె మెడలోని 5 సవర్ల తాళి చైన్‌ను లాక్కొని పరారయ్యారు. కొళత్తూరు పోలీసులు రాజమంగళం, పుళల్ ప్రాంతాల్లో జరిగిన చైన్ స్నాచింగ్ ఘటనతో పోల్చి చూడగా ఒక్కరి ప్రమేయం ఉన్నట్లు తేలింది. ఆమేరకు తిరువళ్లూరు జిల్లా పుదు గుమ్మిడిపూండి కందిగై ప్రాంతానికి చెందిన ధనుష్ (19), బాలకృష్ణాపురం ప్రాంతానికి చెందిన దినేష్‌కుమార్ (20), 17 ఏళ్ల బాలుడిని బుధవారం ఉదయం అరెస్టు చేశారు. వారి నుంచి మూడు చైన్లు, సెల్ఫోన్న్ను స్వాధీనం చేసుకున్నారు. -
ఘనంగా ‘ధర్మనిధి’ సదస్సు
తిరుపతి సిటీ : పద్మావతి మహిళా వర్సిటీ తెలుగు అధ్యయన శాఖ ఆధ్వర్యంలో పోపూరి వేంకట సుబ్బారావు స్మారక ధర్మనిధి సదస్సును బుధవారం సావేరీ సెమినార్ హాల్లో ఘనంగా నిర్వహించారు. తెలుగు శాఖాధ్యక్షులు కొలకలూరి మధుజ్యోతి మాట్లాడుతూ మహిళల వేదన, బాధలు, తమను తాము ఆవిష్కరించుకునే తీరును సీ్త్రల జీవితచరిత్రలు తెలియజేస్తాయన్నారు. రచయిత్రి ఓల్గా మాట్లాడుతూ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంతో తన అనుబంధం, వర్సిటీ స్థాపనలో తండ్రి పోపూరి వేంకట సుబ్బారావు అనుభవాలను పంచుకున్నారు. సీ్త్ర విద్య ఉపయోగాలను విశదీకరించారు. అనంతరం స్రీ సామాజిక భద్రత అనే అంశంపై నిర్వహించిన కథల పోటీలలో విజేతలకు నగదు బహుమతులు అందజేశారు. డాక్టర్ యువశ్రీ, ప్రొఫెసర్ కాత్యాయని, వి ప్రతిమ, డాక్టర్ సుభాషిణి, డాక్టర్ లక్ష్మీ ప్రియ పాల్గొన్నారు. -
ఉత్తరాది యువకులు నలుగురి అరెస్ట్
తిరువొత్తియూరు: హత్య కేసులో బెయిల్‌పై జైలు నుంచి బయటకు వచ్చిన నిందితులు కోర్టుకు హాజరు కాకుండా అజ్ఞాతంలోకి వెళ్లడంతో ఉత్తరాది రాష్ట్రానికి చెందిన నలుగురిని బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. కొలపాకంలో 2014వ సంవత్సరం కన్స్ట్రక్షన్స్ పనిజరుగుతున్న చోట అసోం చెందిన జూబిన్ థియెరి (21) అనే అతను హత్య చేయబడ్డాడు. ఈ కేసులో అతనితో పాటు సహా పనిచేస్తున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రం చెందిన సురేష్, బిందు, అమృతలాల్, జితేందర్‌లను అరెస్టు చేశారు. తర్వాత వారు బెయిల్‌పై బయటకు విడుదలై వచ్చారు. వారు కోర్టుకు హాజరు కాకుండా ఐదు సంవత్సరాలుగా అజ్ఞాతంలోకి వెళ్లారు.ఈ క్రమంలో ప్రత్యేక బృందం పోలీసులు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లి అక్కడ ఉన్న సురేష్, జితేందర్‌ను తిరువళ్లూరు జిల్లాకు చెందిన పోలీసులు అమృతలాల్ను తిరునీర్మలై ప్రాంతంలో బిందు అనే అతని అరెస్టు చేశారు. -
యువన్‌శంకర్ రాజా నిర్మిస్తున్న స్వీట్హార్ట్
తమిళసినిమా: ప్రముఖ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తూ తన వైఎస్ఆర్ ఫిలింస్ పతాకంపై నిర్మిస్తున్న తాజా చిత్రం స్వీట్ హార్ట్. ఈయన ఇంతకు ముందు ఫ్యార్ ప్రేమమ్ కాదల్ తదితర విజయవంతమైన చిత్రాలను నిర్మించారన్నది గమనార్హం. తమిళసినిమాలో కథానాయకుడిగా ఎదుగుతున్న రియోరాజ్ కథానాయకుడిగా నటిస్తున్న ఇందులో నటి గోపిక రమేశ్ నాయకిగా నటిస్తున్నారు. అరుణాచలేశ్వరన్, రెంజీ బనికర్, తులసీ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఇందులో నటుడు రెడిన్ కింగ్స్లీ కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా స్వీనిక్ ఎస్.సుకుమార్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. బాలాజీ సుబ్రమణియం ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రం పూర్తిగా రొమాంటిక్, కామెడీ జానర్లో తెరకెక్కుతున్నట్లు దర్శకుడు తెలిపారు. కాగా ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను బుధవారం విడుదల చేశారు. ఇది ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కాగా ఇది యువన్ శంకర్‌రాజా సంగీతాన్ని అందిస్తున్న 183వ చిత్రం అన్నది గమనార్హం. కాగా ఈ స్వీట్ హార్ట్ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు నిర్మాత యువన్‌శంకర్‌రాజా మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. -
ఉదయనిధికి బ్రహ్మరథం
సాక్షి, చైన్నె: డీఎంకే వారసుడు, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ బుధవారం 47వ వసంతంలోకి అడుగు పెట్టారు. డిప్యూటీ సీఎం హోదాలో తొలి బర్త్‌డేను ఉదయనిధి జరుపుకోవడంతో ఆయన నేతృత్వం వహిస్తున్న యువజన విభాగం వర్గాలు సంబరాలు చేసుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉదయోత్సవం పేరిట వేడుకలను నిర్వహించారు. పేదలకు సంక్షేమ, సహాయకాలను పంపిణీ చేశారు. వివరాలు.. రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి, డీఎంకే యువజన విభాగం ప్రధాన కార్యదర్శి ఉదయ నిధి స్టాలిన్‌కు గత బర్త్‌డే సందర్భంగా డిప్యూటీ సీఎం పదవీ ఇవ్వాలనే నినాదం మిన్నంటిన విషయం తెలిసిందే. ఎట్టకేలకు లోక్‌సభ ఎన్నికల అనంతరం ఆయనకు ప్రమోషన్ దక్కింది. డిప్యూటీ సీఎంగా, డీఎంకే యువజన విభాగం ప్రధాన కార్యదర్శిగా ఆయన దూసుకెళ్తున్నారు. ప్రజలతో మమేకం అయ్యే విధంగా రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలలో నిమగ్నమమ్యారు. ఈ పరిస్థితుల్లో బుధవారం ఆయన 47వ వసంతంలోకి అడుగు పెట్టారు. ఆయన బర్త్‌డేను డీఎంకే యువజన విభాగం వాడవాడలలో సేవా కార్యక్రమాల రూపంలో జరుపుకున్నాయి. ఉదయోత్సవం పేరిట సంబరాలలో మునిగాయి. ఉదయాన్నే తండ్రి, సీఎం స్టాలిన్, తల్లి దుర్గా ఆశీస్సులను ఉదయనిధి అందుకున్నారు. కుటుంబంతో కలిసి ఆనందాన్ని పంచుకున్నారు. అనంతరం మెరీనా తీరంలోని దివంగత సీఎం అన్నాదురై, దివంగత నేత, తాతయ్య కరుణానిధి సమాధి వద్ద నివాళులర్పించారు. ద్రవిడ సిద్ధాంతకర్త పెరియార్ దిడల్ వద్ద అంజలి ఘటించారు. గోపాలపురంలో ఉన్న నానమ్మ దయాళుల అమ్మాల్, సీఐటీ నగర్లో మరో అవ్వరాజాత్తి అమ్మాల్ ఇంటికి వెళ్లి ఆశీస్సులు అందుకున్నారు. యువజన విభాగం నేతృత్వంలో బర్త్‌డే సంబరాలు 47వ వసంతంలోకి ఉదయనిధి తల్లిదండ్రులు ఆశీస్సులు వాడవాడలా ఉదయోత్సవం పేరిట వేడుకలు సంబరాలు.. డీఎంకే యూత్ నేతృత్వంలో ఉదయనిధి బర్త్‌డే సంబరాల కార్యక్రమం చైన్నెలో పలు చోట్ల జరిగింది. మంత్రులు శేఖర్‌బాబు, ఎం. సుబ్రమణియన్, ఏవీవేలు, అన్బిల్ మహేశ్ నేతృత్వంలో పలుచోట్ల జరిగిన సేవా కార్యక్రమాలకు ఉదయనిధి హాజరయ్యారు. అలాగే డీఎంకే ప్రధాన కార్యాలయంలో అభిమానులు, యువజన నేతలు, కార్యకర్తలను ఉదయనిధి కలిశారు. ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ కేడర్ కానుకలను అందజేశారు. ఇక డీఎంకే కూటమి పార్టీల నేతలు ఉదయనిధికి బర్త్‌డే శుభాకాంక్షలు తెలియజేవారు. -
అధిక నిధులు కేటాయించాలి
వేలూరు: ఉన్నత విద్యకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధిక నిధులు కేటాయించాలని వీఐటీ చాన్స్‌లర్ విశ్వనాథన్ అన్నారు. వేలూరు వీఐటీ యూనివర్సిటీ ఆవరణలో అందరికీ ఉన్నత విద్యా పథకం కింద స్కాలర్‌షిప్‌ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం అందరికీ ట్రస్ట్ ద్వారా నిరుపేద విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు ప్రతి ఏడాది స్కాలర్షిప్లు అందజేస్తున్నామన్నారు. ప్రస్తుతం 720 మందికి రూ.62 లక్షల ఉపకార వేతనాలు ఇస్తున్నామన్నారు. ఈ సంవత్సరం నుంచి వేలూరు ఉమ్మడి జిల్లాతోపాటు తిరువణ్ణామలై జిల్లాలోని విద్యార్థులకు ఇస్తున్నామని తెలిపారు. వేలూరు జిల్లాలో హిందువులు, ముస్లింలు ఉన్నప్పటికీ అన్నదమ్ములుగా కలసిమెలసి ఉంటున్నామన్నారు. అయితే విద్యలో మాత్రం వెనకబడి ఉన్నామని చెప్పారు. విద్యతోనే కుటుంబం, దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందగలవన్నారు. వీఐటీలో స్టార్స్ పథకాన్ని అమలు చేస్తున్నామని వీటి ద్వారా గ్రామీణ నిరుపేద విద్యార్థులను ప్రొత్సహించి ఉన్నత విద్యను అందజేసేందుకే ఈ పథకాన్ని తీసుకొచ్చామని చెప్పారు. అందరికీ ఉన్నత విద్యా పథకానికి వీఐటీలోని ప్రొఫెసర్లతోపాటు ప్రతి ఒక్క సిబ్బంది ఒక్క రోజు వేతనంతో పాటు దాతల ద్వారా నిధులను సేకరిస్తున్నామన్నారు. అనంతరం స్కాలర్‌షిప్‌ల చెక్కులను అందజేశారు. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పిచ్చాండి, ఎమ్మెల్యే కార్తికేయన్, అందరికీ ఉన్నత విద్యా ట్రస్ట్ కోశాధికారి జౌరీలాల్ జైన్, సభ్యులు లక్ష్మణన్, కేఎంజీ రాజేంద్రన్, లోకనాతన్, డాక్టర్ నర్మద, రాజేష్‌కుమార్ జైన్, మైలాంబిగై పాల్గొన్నారు. -
క్లుప్తంగా
4వ అంతస్తు నుంచి జారి పడి విద్యార్థిని దుర్మరణం అన్నానగర్: చైన్నె సమీపంలోని మడిపాక్కం సౌత్ రాంనగర్ ప్రాంతానికి చెందిన యోగేశ్వరన్ కూ మార్తె హరిణి (15). వేళచ్చేరిలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. ఈ స్థితిలో బుధవారం బట్టలు ఆరబెట్టేందుకు హరిణి 4వ అంతస్తులోని తన నివాసం టెర్రస్ పైకి వెళ్లింది. బట్టలు తీసేందుకు ప్రయత్నిస్తుండగా 4వ అంత స్తు నుంచి జారి కిందపడింది. ఆమె తుంటి ఎము క విరిగిపోయింది. వెంటనే ఇరుగుపొరుగు వారు ఆమెను రక్షించి చికిత్స నిమిత్తం పల్లికరనైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. మడిపాక్కం పోలీసులు కేసు నమోదు చేసి హరిణి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం క్రోంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రభుత్వ బస్సు ఢీకొని దంపతులు.. అన్నానగర్: విరుదునగర్ జిల్లా రాజపాళ్యం సమీపంలోని సమత్తువపురం ప్రాంతానికి చెందిన మహ్మద్ ఘస్సాలీ (38). ఇతని భార్య నూరూల్ ఫాతిమా (28). వీరికి 4, 6 ఏళ్ల ఇద్దరు కుమారులు ఉన్నారు. మహ్మద్ ఘస్సాలీ వస్త్ర వ్యాపారి. నూరుల్ ఫాతిమా దిండుక్కల్ జిల్లా కొడైకెనాల్లో విద్యాశాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో భార్యాభర్తలిద్దరూ బుధవారం బైకులో రాజపాళెం నుంచి శ్రీవిల్లిపుత్తూరు వెళ్తున్నారు. వీరి బైకు మదురై–కొల్లాం జాతీయ రహదారిపై వన్నియంబట్టి పోలీస్ స్టేషన్ సమీపంలో వస్తుండగా శ్రీవిల్లిపుత్తూరు నుంచి పాపనాశం వైపు వస్తున్న ప్రభుత్వ బస్సు ఢీ కొట్టింది. గాయపడిన దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఇద్దరి మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం ని మిత్తం శ్రీవిల్లిపుత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వన్నియంబట్టి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పోక్సోచట్టం కింద అరెస్టయిన వృద్ధుడు అనారోగ్యంతో.. తిరువొత్తియూరు: పోక్సో చట్టం కింద అరెస్టయి పులల్ జైలులో ఉన్న వృద్ధుడు మృతి చెందాడు. వివరాలు.. చైన్నె, కీల్ కట్టనై సమీపము నన్మంగళానికి చెందిన విజయ్ కుమార్ (63) ఇతన్ని సేలయూరు పోలీసులు పొక్సో చట్టం కింద అరెస్టు చేసి పులల్ జైల్లో పెట్టారు. ఈ క్రమంలో అతనికి హఠాత్తుగా అనారోగ్యంతో ఏర్పడింది. పోలీసులు అతన్ని చికిత్స కోసం స్టాన్లీ ప్రభుత్వాసుపత్రిలో చేర్చారు అక్కడ చికిత్స పొందుతూ విజయ్ కుమార్ బుధవారం మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు. -
జనవరి 29న ఆరాధన మహోత్సవం
తిరుమల: ప్రముఖ వాగ్గేయకారుడు, కన్నడ సంగీత పదకవితా పితామహుడైన శ్రీ పురందరదాసుల ఆరాధన మహోత్సవాన్ని 2025 జనవరి 29వ తేదీన టీటీడీ వైభవంగా నిర్వహించనుంది. సహస్ర దీపాలంకరణ సేవ అనంతరం మలయప్పస్వామి ఉభయ దేవేరులతో కలిసి సాయంత్రం 5.30 గంటలకు తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనానికి విచ్చేస్తారు. సంగీత కళాకారుల బృందగానం ఆలకించిన అనంతరం స్వామివారు రాత్రి 8 గంటలకు బయలుదేరి 9 గంటలకు ఆలయానికి చేరుకుంటారు. పురందరదాసుల ఆరాధనా మహోత్సవం సందర్భంగా టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. -
క్లుప్తంగా
విద్యుత్ షాక్‌తో ఇద్దరి మృతి వేలూరు: విద్యుత్‌షాక్‌కు గురై ఇద్దరు పంపు ఆపరేటర్లు మృతిచెందారు. వేలూరు జిల్లా అనకట్టు నియోజకవర్గంలోని రంగప్పన్ కోటాయి ప్రాంతంలో విద్యుత్ స్తంభాలు నాటేందుకు వేపంకుప్పం పంపు ఆపరేటర్లు వినాయకపురానికి చెందిన ముత్తుకుమరన్(45), అశోక్‌కుమార్(55) వెళ్లారు. బుధవారం సాయంత్రం విద్యుత్ స్తంభాలు నాటడం పూర్తి కావడంతో విద్యుత్ తీగలు లాగుతుండగా పక్కన ఉన్న విద్యుత్ తీగ రాసుకొని విద్యుత్ సరఫరా అయింది. ఆ సమయంలో విద్యుత్ తీగలు పట్టుకొని లాగుతున్న ముత్తుకుమరన్, అశోకుమార్ విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందారు. విషయం తెలుసుకున్న విద్యుత్ శాఖ అధికారులు వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపి వేసి పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. చీర అంటుకుని వృద్ధురాలు.. అన్నానగర్: చీరకు దీపం అంటుకుని ఓ వృద్ధురాలు మృతిచెందింది. చైన్నెలోని విరుగంబాక్కం సాయి నగర్‌కు చెందిన కనక (83). ఈమె తన సోదరుడు రామ్మూర్తి ఇంట్లో ఉంటోంది. 10 రోజుల క్రితం రామమూర్తి పని నిమిత్తం ఊరికి వెళ్లాడు.ఈ పరిస్థితిలో మంగళవారం సాయంత్రం ఎప్పటిలాగే అదే ప్రాంతానికి చెందిన వ్యక్తి కనకకు రాత్రి భోజనం పెట్టేందుకు వచ్చి చూడగా కనక ఇంట్లోనే కాలిన స్థితిలో శవంగా పడి ఉంది. వంటనే విరుగంపబాక్కం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేకే నగర్ ఈఎస్ఐ ఆస్పత్రికి తరలించారు. మంగళవారం సాయంత్రం కనక ఇంట్లో దీపం వెలిగించినపుడు చీరకు మంటలు అంటుకుని మృతి చెంది ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. విరుగంబాక్కం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. గంజాయి కేసులో మూడేళ్ల జైలు అన్నానగర్: గంజాయి కేసులో ఓ వ్యక్తికి మూడేళ్ల జైలు శిక్ష విధించారు. తేని జిల్లాలోని దేవా పోలీస్‌స్టేషన్‌న్‌కు పక్కా సమాచారంతో 2019 నవంబర్ 9న పోలీసులు రంగనాథపురం రోడ్డులోని చిన్న దేవికులం సమీపంలో గస్తీలో నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో అటుగా వచ్చిన బైకును తనిఖీ చేయగా 8 కిలోల గంజాయిని తీసుకెళ్తున్నట్లు గుర్తించారు. దీనికి సంబంధించి దేవరం పాచియమ్మన్ కోవిల్ స్ట్రీట్ ప్రాంతంలో మహేశ్వరన్ (40) అరెస్టు చేసి జైలుకు తరలించారు. 8 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మదురై జిల్లా ప్రిన్సిపల్ ఈసీ, ఎన్టీపీఎస్ ప్రత్యేక కోర్టులో కేసు పెండింగ్‌లో ఉంది. ఈ పరిస్థితిల్లో బుధవారం జరిగిన విచారణలో న్యాయమూర్తి హరిహరకుమార్ నిందితుడు మహేశ్వరన్‌కు మూడేళ్ల జైలుశిక్ష, రూ.25 వేల జరిమానా విధించారు. గంజాయి తరలింపు: ఆరుగురి అరెస్ట్ తిరువొత్తియూరు: గంజాయి కేసులో యువతి సహా ఆరుగురు అరెస్ట్ అయ్యారు. చైన్నె తిరువొత్తియూరు పెరుమాళ్ ఆలయం వీధికి చెందిన పృథ్వీరాజ్ (24). ఇతను గంజాయి వ్యాపారి. మనలి శ్రీనివాసన్ వీధికి చెందిన జోష్వా (23), తాంబరానికి చెందిన భరత్ (22). వీరందరిని గంజాయి విచారణ కోసం తిరువొత్తియూరు కోర్టుకు తీసుకొచ్చారు. కోర్టు ప్రాంగణంలో ఉండగా వారు గంజాయి కలిగి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. తిరువొత్తియూరు పోలీసులు అక్కడికి చేరుకుని వారి వద్ద విచారణ చేశారు. ఇందులో గంజాయి కేసులో సంబంధం ఉన్న ఎర్నాఊరు సునామీ క్వార్టర్స్‌కు చెందిన నందిని (22), అనే యువతి పుళల్ జైలులో ఉన్న తన భర్త విజయ్‌కు ఇచ్చేందుకు రాజాతీనగర్ మురళి, యోగేశ్వరన్ అనే వారి మూలంగా కోర్టుకు హాజరై పైన తెలిపిన వారికి గంజాయి ఇచ్చి పంపేందుకు ప్రయత్నించినట్లు తెలిసింది. దీంతో ఇన్స్పెక్టర్ రజనీష్ విచారణ చేసి నందిని, మురళి సహా ఆరుగురిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచి జైలుకు తరలించారు. 50 సవర్ల నగలు చోరీ తిరువొత్తియూరు: చైన్నె కార్పొరేషన్లో అధికారిగా పనిచేస్తున్న మహిళా ఉద్యోగి ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు 50 సవర్ల నగలను చోరీ చేశారు. మాధవరం సారంగపాణి వీధికి చెందిన ఆనందరాజ్. ఐటీ సంస్థలో అధికారి. ఇతని భార్య కవిప్రియ చైన్నె కార్పొరేషన్లో సహాయ ఇంజినీర్. కవిప్రియ ఓ కార్యక్రమానికి నగలు వేసుకొని వెళ్లడానికి బీరువాలో ఉంచిన నగల కోసం చూడగా 40 సవర్ల నగలు అదృశ్యమై ఉన్నాయి. దీంతో గత కొన్ని రోజుల క్రితం 10 సవర్ల నగలు అదృశ్యమయ్యాయని, ఈ క్రమంలో తక్కిన నగలు చోరీ అయినట్లు ఆమె గుర్తించారు. బీరువా పగలగొట్టకుండా ఉండడంతో ఇంటికొచ్చేవారే నగలను చోరీ చేసి ఉండొచ్చని తెలిసింది. దీనిపై మాధవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వెంకన్న వైభవం
శ్రీనివాసమంగాపురంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో బుధవారం వేడుకగా కార్తీక వనభోజన మహోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా దేవదేవేరులకు వైభవంగా స్నపన తిరుమంజనం జరిపించారు. అనంతరం షడ్రసోపేతంగా సిద్ధం చేసిన వంటకాలతో భక్తులకు వన భోజనం వడ్డించారు. టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం, ఆలయ డిప్యూటీ ఈఓ వరలక్ష్మి, ఏఈఓ గోపీనాథ్, సూపరింటెండెంట్ బాలకుమార్, టెంపుల్ ఇన్స్పెక్టర్లు కిరణ్‌కుమార్‌రెడ్డి, ధనశేఖర్ పాల్గొన్నారు. – చంద్రగిరి -
ప్రపంచ మూలాలకు భారతీయ ఇంజినీరింగ్
కొరుక్కుపేట: భారతీయ ఇంజినీరింగ్‌ను ప్రపంచంలోని ప్రతి మూలకు తీసుకెళ్లడంలో ఈఈపీసీ కీలక పాత్ర పోషిస్తుందని భారత ప్రభుత్వ వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ జాయింట్ సెక్రటరీ విమల్ ఆనంద్ అన్నారు. ఈమేరకు ఈఈపీసీ ఆధ్వర్యంలో చైన్నె ట్రేడ్ సెంటర్ వేదికగా మూడు రోజుల అంతర్జాతీయ ఇంజినీరింగ్ సోర్సింగ్ షో (ఐఈఎస్‌ఎస్ –12)ను బుధవారం ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ భారతీయ ఇంజినీరింగ్ ఆధునిక సాంకేతికతో దూసుకుపోతుందని అన్నారు. ఇంజినీరింగ్ షో విజయవంతం కావాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వ ఎంఎస్ఎంఈ ప్రిన్సిపల్ సెక్రటరీ అతుల్ ఆనంద్, ఈఈపీసీ ఇండియా చైర్మన్ పంకజ్ చడ్డా, వైస్ చైర్మన్ ఆకాష్షా పాల్గొన్నారు. -
బాల్యవివాహాలు లేని భారత్ స్థాపిద్దాం
కొరుక్కుపేట: బాల్యావివాహాలు లేని భారతదేశాన్ని స్థాపించుకుందామని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ–చైన్నె సౌత్ చైర్మన్ రాజ్‌కుమార్ ముత్తుకృష్ణన్ పిలుపునిచ్చారు. ఈమేరకు ఇండియన్ కమ్యూనిటీ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ (ఐసీడబ్ల్యూఓ), జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రెన్ సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ స్థాయి కార్యక్రమం బాల్య వివాహాలు లేని భారత్ పేరుతో ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఐసీడబ్ల్యూఓ ప్రధాన కార్యదర్శి ఏజే హరిహరన్ అధ్యక్షతన చైన్నె అన్నానగర్ వెస్ట్ వల్లలార్ కాలనీలోని ఐసీడబ్ల్యూఓ ప్రధాన కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ భారత్ అనే భారీ బ్యానర్‌ను రాజ్‌కుమార్ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ చట్టాలు అమలులో ఉన్నా ఇంకా బాల్య వివాహాలను అడ్డుకోలేకపోతున్నామని అన్నారు. కొవ్వొత్తులు వెలిగించి బాల్య వివాహాల నిర్మూలనపై ప్రతిజ్ఞ చేశారు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు ఏ.భక్తవత్సలం , ఏవీఏ– అసోసియేషన్ ఫర్ వలంటీర్స్ యాక్షన్ స్టేట్ కో–ఆర్డినేటర్ నాదర్షా మాలిమ్, విద్యార్థులు పాల్గొన్నారు. -
వైద్య విద్యార్థిని ఆత్మహత్య
అన్నానగర్: చిదంబరంలో మంగళవారం రాత్రి వైద్య విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు.. క్రిష్ణగిరి జిల్లా, హోసూరు, తిరుపతి నగర్ తూర్పుకు చెందిన శ్రీధర్ కుమార్తె రక్షనా (28). కోయంబత్తూరులో బిడీఎస్ పూర్తి చేసిన తర్వాత, ఆమె చిదంబరం ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎండీఎస్ కోర్సులో చేరింది. ఈ విద్యార్థిని తన తోటి విద్యార్థులతో కలిసి ఓ ఇంటిని అద్దెకు తీసుకుని కాలేజీకి వెళ్లి వస్తోంది. రక్షనా తరచూ కడుపునొప్పితో బాధపడుతోందని తెలుస్తుంది. మంగళ వారం రాత్రి ఒక్కసారిగా కడుపునొప్పి రావడంతో తల్లితో మాట్లాడింది. ఆ తర్వాత అక్కడే ఉన్న స్నేహి తులు బయటకు వెళ్లి తిరిగి వచ్చే సరికి చీరతో ఉరేసు కుని ఆత్మహత్యకు పాల్పడింది. విద్యార్థిని తండ్రి శ్రీధర్ ఫిర్యాదు మేరకు అన్నామలైనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మద్యం మత్తులో మహిళ హల్చల్ అన్నానగర్: కరూర్ బస్ స్టేషన్ సమీపంలో మంగళవారం ఉదయం 40 ఏళ్ల మహిళ మద్యం మత్తులో వీరంగం సృష్టించింది. దీంతో ప్రజలు పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం అక్కడికి చేరుకున్న పోలీసులు మహిళను విచారించారు. ఇందులో తిరుపూర్ జిల్లా పల్లడంకు చెందిన మహిళ అని, రూ.5 వేలు ఎవరో మోసం చేశారని ఆ డబ్బును రికవరీ చేసేందుకు గొడవకు దిగినట్లు తెలిసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 756 విదేశీ మద్యం బాటిళ్లు స్వాధీనం అన్నానగర్: ఆత్తూరు సమీపంలో బుధవారం కారుతో పాటు 756 విదేశీ మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు.. తూత్తుకుడి జిల్లా, అత్తూరు పోలీస్ స్టేషన్ అసిస్టెంట్ ఇన్‌న్‌స్పెక్టర్ కుమార్, పోలీసులు బాలమురుగన్, మునియస్వామి బుధవారం వేకువజామున పూమంగళం ముత్తారమ్మన్ ఆలయం దగ్గర గస్తీకి వెళ్లారు. అనంతరం ఆ ప్రాంతంలో ఎవరూ లేకుండా పార్క్ చేసిన కారును సోదా చేశారు. అందులో 756 విదేశీ మద్యం బాటిళ్లను దాచి ఉంచినట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. కారు యజమాని చోళీయాకురిచ్చి కురుంబూర్కు చెందిన తంగపాండి కుమారుడు మురుగన్ కోసం గాలిస్తున్నారు. నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక దాడి తిరువొత్తియూరు: నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక దాడి చేసిన వ్యక్తికి ప్రత్యేక కోర్టు 20 ఏళ్లు జైలు శిక్ష విధించింది. విల్లుపురం సమీపం వలవనూర్ అంబేడ్కర్ వీధికి చెందిన తనికై య్ వేల్ (38), ఇతను గత 2018 ఏళ్ల అదే ప్రాంతానికి చెందిన నాలుగేళ్ల బాలికపై లైంగిక దాడి చేశాడు. దీని గురించి వలవనూరు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు 30.6.2018లో తనికై వేలు పై పోక్సో చట్టం కేసు నమోదు చేసి అతని అరెస్టు చేశారు. ఈ కేసు విచారణ విల్లుపురం ప్రత్యేక కోర్టులో జరుగుతూ వచ్చింది. ఈక్రమంలో బుధవారం న్యాయమూర్తి వినోద తీర్పు ఇచ్చారు. నిందితుడు తనికై వేల్కు 20 ఏళ్ల జైలు శిక్ష రూ. 10 వేలు జరిమానా విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. అలాగే బాధింపబడిన చిన్నారి కుటుంబానికి ప్రభుత్వం తరపున రూ. 7 లక్షలు పరిహారం అందజేయాలని పేర్కొన్నారు. దీంతో తనికై వేల్‌ను కడలూరు సెంట్రల్ జైలులో పెట్టారు. -
బందోబస్తు నడుమ ఆక్రమణల తొలగింపు
తిరువళ్లూరు: పట్టణంలోని వేర్వేరు ప్రాంతాల్లో అక్రమ కట్టడాలను గుర్తించి నోటీసులు జారీ చేసిన క్రమంలో బుధవారం అధికారులు భారీ పోలీసు బందోబస్తు నడుమ ఆక్రమణలను తొలగించారు. వివరాలు.. తిరువళ్లూరు పట్టణంలోని పత్తియాల్పేటతో సహా వేర్వేరు ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగేలా కొందరు భవనాలు, షెడ్లను ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ డాక్టర్ ప్రభుశంకర్‌కు ఫిర్యాదులు అందాయి. ఆక్రమణలను తొలగించి రోడ్డు నిర్మాణం చేయాలని కోరుతూ వినతి పత్రం అందించారు. ఈ వినతులపై కలెక్టర్ స్పందిస్తూ అక్రమ కట్టడాలను గుర్తించి వాటిని తొలగించి రోడ్డు విస్తరణ పనులను చేపట్టాలని మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. ఇందులో భాగంగానే బుధవారం భారీ పోలీసు బందోబస్తు నడుమ అధికారులు పత్తియాల్పేటలో అక్రమ కట్టడాలను కూల్చివేశారు. కట్టడాలను కూల్చే సమయంలో కొందరు అధికారులతో వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. అయితే పోలీసుల సహకారంతో కట్టడాలు, ప్రహరీగోడలను అధికారులు కూల్చివేశారు. -
ఇళయరాజాతోపని చేయడం అదృష్టం
విడుదలై – 2 చిత్ర ఆడియో విడుదల వేదికపై దర్శకుడు వెట్రిమారన్, ఇళయరాజా, విజయ్‌సేతుపతి, నటి భవానీశ్రీ తమిళసినిమా: విడుదలై – 2 చిత్రానికి ఇళయరాజా సంగీతాన్ని అందించడం తన అదృష్టం అని దర్శకుడు వెట్రిమారన్ పేర్కొన్నారు. ఈయన ఇంతకు ముందు తెరకెక్కించిన చిత్రం విడుదలై. నటుడు సూరి కథానాయకుడిగా పరిచయం అయిన ఈ చిత్రంలో విజయ్‌సేతుపతి ప్రధాన పాత్రను పోషించారు. ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతాన్ని అందించారు. ఆర్ఎస్.ఇన్ఫోటెయిన్మెంట్ పతాకంపై ఎల్రెడ్.కుమార్ నిర్మించిన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. దీంతో దీనికి సీక్వెల్‌గా విడుదలై– 2 చిత్రాన్ని ఇదే టీమ్ రూపొందించింది. ఈ చిత్రం డిశంబర్ 20వ తేదీన తెరపైకి రానుంది. ఈ సందర్భంగా చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని మంగళవారం సాయంత్రం చైన్నె, సెట్పెట్లోని లేడీ ఆండాళ్ స్కూల్లో నిర్వహించారు. ఇందులో పాల్గొన్న నటుడు సూరి మాట్లాడుతూ గత 49 ఏళ్లుగా అందరి ఇళ్ల విశేషాల్లోనూ ఇళయరాజా అయ్యానే వేడుక నాయకుడు అని అన్నారు. ఆయన సంగీత దైవం, సంగీత వైద్యుడు ఇలా అన్నింటికీ అర్హుడు ఆయనేనని పేర్కొన్నారు. ఆయన సంగీతం అందించిన చిత్రంలో నటించడం తన భాగ్యం అని అన్నారు. విజయ్‌సేతుపతి మాట్లాడుతూ సూరి వంటి పెద్ద హీరో ఆయన చిత్రంలో నటించే అవకాశం తనకు కల్పించారని పేర్కొన్నారు. భావోద్రేకాలను సంగీతంగా మార్చేవారు ఇళయరాజా అని అన్నారు. ఆయన సంగీతంతో తనకు చాలా ఆనందాన్ని కలిగించిన ఆయనకు ధన్యవాదాలు అన్నారు. విడుదలై – 2 చిత్రాన్ని దర్శకుడు వెట్రిమారన్ మాత్రమే హక్కును పొందడానికి అర్హుడని అన్నారు. నేను బీకామ్‌ను మూడేళ్లు చదివానని, ఈ చిత్రం కోసం వెట్రిమారన్ స్కూల్లో నాలుగు ఏళ్లు చదివిన విద్యార్థినని పేర్కొన్నారు. విడుదలై 2 చిత్రం పూర్తి కావడం బాధగా ఉందని, అయినా ఈ ప్రయాణానికి కృతజ్ఞతలు అని నిర్మాత ఎల్రెడ్ కుమార్ పేర్కొన్నారు. దర్శకుడు వెట్రిమారన్ మాట్లాడుతూ ఒక చిత్ర నిర్మాణానికి చాలా శ్రమ అవసరం అన్నారు. ఒకరు నమ్మిన విషయాన్ని ఇతరులు గుడ్డిగా నమ్మడం అన్నదే చిత్ర విజయానికి ముఖ్యం అన్నారు. చిత్రాన్ని 2020 డిసెంబర్ నెలలో ప్రారంభించామని, ఇంచుమించు నాలుగేళ్లు అయ్యిందని, ఇంత కాలం ఈ చిత్ర కథను గుర్తించుకుని పరిపూర్ణ నమ్మకంతో పని చేసిన యూనిట్ సభ్యులకు ధన్యవాదాలు అన్నారు. ఈ చిత్రంలోకి ఇళయరాజా రావడం తన అదృష్టం అన్నారు. ఈ చిత్రంలోని నాలుగు పాటలను ఆయనే రాశారని చెప్పారు. విడుదలై 2 చిత్రానికి కథే మాస్టార్ అని దర్శకుడు వెట్రిమారన్ పేర్కొన్నారు. -
ఐఐటీ మద్రాసు కార్బన్ జీరో ఛాలెంజ్
కొరుక్కుపేట: ఐఐటీ –మద్రాసు, థేల్స్ సంయుక్త నిర్వహణలో కార్బన్ జీరో ఛాలెంజ్ (సీజెడ్సీ 4.0)పోటీల్లో పర్యావరణ అనుకూల సాంకేతికతను అభివృద్ధి చేసిన ఆరు జట్లు అగ్రస్థానంలో నిలిచినట్లు ఐఐటీ మద్రాసు కార్బన్ ఛాలెంజ్ కో– ఆర్డినేటర్ ప్రోఫెసర్ ఇందుమతి నంబి తెలిపారు . ఈ సందర్భంగా బుధవారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ –మద్రాస్ (ఐఐటీ– మద్రాస్), థేల్స్‌తో విద్యార్థులను వినూత్న ఆవిష్కరణవైపు ప్రోత్సహించేలా దేశవ్యాప్తంగా కార్బన్ జీరో ఛాలెంజ్ (సీజెడ్సీ 4.0) ని నిర్వహించారు. ఈ పోటీలకు దేశవ్యాప్తంగా 775 యూనివర్సిటీలు, 430 స్టార్టప్స్ నుంచి 2000 మంది ఉత్సాహంగా పాల్గొన్నాయని తెలిపారు. ఈ ఛాలెంజ్‌లో 6 టీమ్‌లు అగ్రస్థానంలో నిలిచాయని అన్నారు. ఈ సందర్భంగా ఆరు టీమ్‌లను ఘనంగా సత్కరించారు. పర్యావరణ అనుకూల సాంకేతికతను అభివృద్ధి చేసిన మొదటి 6 టీమ్‌లకు రూ.10 లక్షల వరకు స్టార్టప్ సీడ్ ఫండింగ్‌ను అందుకుంటారని తెలిపారు. అనంతరం థేల్స్ – ఇండిమా వైస్ ప్రెసిడెంట్ ఆశీష్ సరాఫ్ మాట్లాడుతూ ఐఐటీ మద్రాసుతో కలసి థేల్స్ కార్బన్ జీరో ఛాలెంజ్ నిర్వహించడం గర్వంగా ఉందన్నారు. పచ్చటి ప్రపంచాన్ని పెంపొందించడంలో తాము దీర్ఘకాలిన నిబద్ధతకు అనుగుణంగా ముందుకెళ్తున్నట్లు తెలిపారు. -
గంజాయి కేసులో తండ్రి, కొడుకు అరెస్టు
తిరువొత్తియూరు: కొడుంగయూరు నివాసం ఉంటున్న నాగరాజు తిరువొత్తియూరు మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్. అతని కుమారుడు యువరాజ్‌పై పలు కేసులు ఉన్నాయి. ఒక కేసులో గైర్హాజరైన నాగరాజ్, అతని కుమారుడు యువరాజ్ కోసం తిరువొత్తియూరు పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ దశలో వారు ఇంట్లో ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇంట్లో దాక్కున్న నాగరాజ్, అతని కుమారుడు యువరాజ్‌ను అరెస్టు చేశారు. వారి ఇంట్లో సోదా చేయగా 2 కిలోల గంజాయి, మత్తుమందు మాత్రలు, 2 పట్టా కత్తులు లభించాయి. పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన ఇద్దరు వ్యక్తులను కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు. -
ఫుట్‌బాల్ క్రీడాకారుడికి మోకాలి మార్పిడి శస్త్రచికిత్స
సాక్షి, చైన్నె: విదేశీ పుట్‌బాల్ క్రీడాకారుడికి చైన్నె అడయార్‌లోని ఎంజీఎం మలర్ ఆస్పత్రిలో మోకాలి మార్పిడి శస్త్ర చికిత్స జరిగింది. అత్యాధునిక విధానంలో అరుదైన ఈ శస్త్ర చికిత్సను నిర్వహించారు. ఈ వివరాలను బుధవారం ప్రకటించారు. కొలంబియా పుట్ బాల్ క్రీడాకారుడిగాపేరు గడించి పస్తుతం ఆ జట్టు మేనేజర్‌గా ఉన్న రిచర్డ్ తోవా గత ఆరు నెలలుగా భరించలేని మోకాళ్ల నొప్పులతో బాధ పడుతూ వచ్చారు. ఇటీవల ఎంజీఎం హెల్త్‌కేర్ మలర్ అడయార్ను ఆయన సందర్శించారు. కుడి మోకాలిలో ఉన్న సమస్యను గుర్తించి సమగ్ర పరిశోధనలతో తక్షణ శస్త్రచికిత్సకు నిర్ణయించారు. ఈ నెల రెండవ వారంలో ఆయనకు మోకాలి మార్పిడి శస్త్ర చికిత్సను విజయవంతంగా చైన్నె వైద్యులు నిర్వహించారు. ఫుట్‌బాల్ ఆటగాళ్లలో సాధారణమైన ఆరోగ్య సమస్యలలో ఒకటైనా ఇలాంటలి సమస్యతో మోకాళ్లకు గణనీయమైన ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంద ని డాక్టర్ నందకుమార్ సుందరం తెలిపారు. రిచర్డ్ తోవా విషయంలో అధునాతన గ్రేడ్ ఐవీ ఆస్టియో ఆర్థరైటిస్ గణనీయమైన నొప్పి ఈ సమస్యకు దారి తీసి నట్లు వివరించారు. ఇన్వాసివ్ టెక్నిక్‌ని ఉపయోగించి ఈ శస్త్ర చికిత్స ప్రక్రియ జరిగినట్లు తెలిపారు. -
విద్యార్థి పుస్తకంలో కులం పేరు రాసిన టీచర్ సస్పెన్షన్
వేలూరు: తిరుపత్తూరు జిల్లా కునిసి మోటూరు గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉంది. ఇక్కడ 100 మందికి పైగా విద్యార్థులు విద్య అభ్యసిస్తున్నారు. ఈ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్న ఒకరు పాఠ్యాంశంలోని ఓ సంగీతం గురించిన పాఠాన్ని బోధించారు. ఆ సమయంలో ఆ సంగీతాన్ని ఓ కులానికి చెందిన వారు మాత్రమే ఉపయోగిస్తారని విద్యార్థి పుస్తకంలో ఆ విద్యార్థి కులం పేరును రాసి అందరి విద్యార్థులకు అవగాహన కల్పించినట్లు తెలుస్తోంది. దీంతో ఆ విద్యార్థి ఈ విషయాన్ని ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు తెలియజేశాడు. దీంతో రెండు రోజుల అనంతరం గ్రామ పెద్దలు పాఠశాలకు వెళ్లి టీచర్‌ను నిలదీశారు. ఇందుకు టీచర్ సరైన సమాధానం చెప్పలేదు. అనంతరం కునసి మోటూరు గ్రామానికి చెందిన గ్రామస్తులు, వీసీకే కార్యకర్తలు సంయుక్తంగా మంగళవారం మధ్యాహ్నం పాఠశాలను ముట్టడించి ధర్నా నిర్వహించారు. ఆ సమయంలో విద్యార్థి కులం పేరును పాఠ్య పుస్తకంలో రాసిన టీచర్‌ను అరెస్ట్ చేయాలని నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న విద్యాశాఖ సీఈఒ పున్యకోటి, తహసీల్దార్ నవనీతమ్, పోలీసులు సంగటనా స్థలానికి చేరుకొని స్థానికులతో చర్చలు జరిపారు. టీచర్‌పై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ప్రజలకు హామీ ఇచ్చారు. దీంతో ఆందోళన కారులు ధర్నాను విరమించారు. వీటి పై అధికారులు విచారణ జరిపారు. అనంతరం విద్యార్థి పాఠ్య పుస్తకంలో కులం పేరు రాసిన విషయం నిర్ధారణ కావడంతో టీచర్ విజయకుమార్‌ను సస్పెండ్ చూస్తూ విద్యాశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. -
ప్రజలతో స్నేహపూర్వకంగా మెలగాలి
వేలూరు: పోలీసులు ప్రజలతో స్నేహభావంతో మెలగాలని డీఐజీ దేవరాణి అన్నారు. తమిళనాడు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆధ్వద్వర్యంలో రెండవ స్థాయి పోలీస్ కానిస్టేబుల్ పరీక్షలు నిర్వహించారు. వేలూరు జిల్లాలో ఉత్తీర్ణత సాధించిన వారికి ఉద్యోగ నియామక పత్రాలను అభ్యర్థులకు ఎస్పీ మదివాణన్ అధ్యక్షతన బుధవారం ఉదయం అందజేశారు. డీఐజీ ముఖ్య అతిథిగా హాజరై వేలూరు జిల్లాలో ఎంపికై న పోలీస్ కానిస్టేబుల్‌గా 39 మందికి, అగ్నిమాపక శాఖలో 11 మందికి, జైళ్లశాఖలో ఇద్దరికి మొత్తం 52 మందికి ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. పోలీసులు విధి నిర్వహణలో ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వీటన్నంటికీ భయాందోళన చెందకుండా నిర్భంయంగా పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో వేలూరు సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ పరశరామన్, అఽగ్నిమాపక శాఖ అధికారి లక్ష్మి నారాయణన్, 15వ బెటాలియన్ ప్రత్యేక కమోండో మణి, అదనపు ఎస్పీ భాస్కరన్ తదితరులున్నారు. సరిహద్దుల్లో తనిఖీలు మరింత ముమ్మరం తిరువళ్లూరు: పొరుగు రాష్ట్రాల నుంచి ఎర్రచందనం, గంజాయి అక్రమ రవాణాను అరికట్టడానికి సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద తనీఖీలను మరింత ముమ్మరం చేసినట్టు తిరువళ్లూరు ఎస్పీ శ్రీనివాసపెరుమాల్ తెలిపారు. తమిళనాడు పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ఇటీవల పరిక్షలను నిర్వహించి ఉద్యోగులను ఎంపిక చేశారు. అనంతరం తిరువల్లూరు జిల్లాకు సెకండరీగ్రేడ్ ఆయుధ విభాగానికి ఐదుగురు, తమిళనాడు స్పెషల్ పోలీసు విభాగానికి 21 మంది, అగ్నిమాపక విభాగానికి 12 మంది, జైలు వార్డెన్ విభాగానికి ఒకరు చొప్పున మొత్తం 39 మందిని కేటాయించారు. జిల్లాకు కేటాయించిన ఉద్యోగులకు నియామక ఉత్తర్వులను ఎస్పీ శ్రీనివాసపెరుమాల్ బుధవారం ఉదయం అందజేశారు. నూతనంగా ఉద్యోగంలో చేరుతున్న యువకులు నిష్పక్షపాతంగా నిజాయితీగా తమ విధులు నిర్వహించాలని ఎస్పీ పిలుపు నిచ్చారు. అనంతరం మీడియా సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా సరిహద్దులో ఉన్న చెక్‌పోస్టుల్లో తనిఖీలు మరింత ముమ్మరం చేసి గంజాయి, ఎర్రచందనం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యాసంస్థలు, అధ్యాత్మిక కేంద్రాల వద్ద గంజాయి విక్రయాన్ని సైతం పూర్తిగా నిషేధించినట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో పలువురు పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ఊటీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
– ఆహ్వానం పలికిన గవర్నర్, మంత్రి సాక్షి, చైన్నె: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నాలుగు రోజుల పర్యటన నిమిత్తం బుధవారం ఊటీకి చేరుకున్నారు. ఇక్కడ జరిగే పలుకార్యక్రమాలలో పాల్గొనడంతో పాటు విశ్రాంతి తీసుకోనున్నారు. ఈ క్మరంలో ఢిల్లీ నుంచి కోయంబత్తూరు సూలూరు విమానాశ్రయానికి రాష్ట్రపతి ఉదయం చేరుకున్నారు. ఇక్కడి నుంచి ఆర్మీ హెలికాప్టర్లో ఊటీ వెళ్లారు. ఇక్కడి రాజ్ నివాస్‌లో బస చేశారు. ఊటీకి చేరుకున్న రాష్ట్రపతికి గవర్నర్ ఆర్ఎన్ రవి, మంత్రి శివ వి. మెయ్యనాథన్, కలెక్టర్ లక్ష్మీ భవ్య ఆహ్వానం పలికారు. బుధవారం అంతా రాష్ట్రపతి విశ్రాంతి తీసుకున్నారు. గురువారం ఊటీ నుంచి రోడ్డు మార్గంలో కున్నూరుకు వెళ్లనున్నారు. ఇక్కడి వెల్లింగ్ టన్ ఆర్మీ శిక్షణ కేంద్రంలో జరిగే కార్యక్రమానికి హాజరవుతారు. 29వ తేదీన ఊటీ సందర్శనతో పాటు విశ్రాంతి తీసుకోనున్నారు. 30వ తేదీన కోయంబత్తూరుకు చేరుకునే రాష్ట్రపతి, తిరువారూర్ సెంట్రల్ వర్సిటీ స్నాతకోత్సవానికి హాజరు కానున్నారు. ఈ పర్యటన ముగించుకుని కోయంబత్తూరుకు చేరుకుని తిరుపతికి ప్రయాణం అవుతారని తెలిసింది. రాష్ట్రపతి రాకతో ఊటీని నిఘా నీడలోకి తీసుకొచ్చారు. రాజ్ నివాస్ పరిసరాలలో 2 వేల మంది పోలీసులతో, కున్నూరు పరిసరాలలో మరో 1000 మంత్రితో భద్రతను కల్పించారు. తిరువారూర్ సెంట్రల్ వర్సిటీ పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. అయితే వర్షాలు పడుతున్న నేపథ్యంలో రాష్ట్రపతి పర్యటన ఇక్కడ సాగేనా అన్నది వేచి చూడాల్సిందే. -
బస్సు మెట్ల పై నుంచి పడి విద్యార్థి మృతి
అన్నానగర్: కడలూరులోని దేవనాంపట్టినం ప్రాంతానికి చెందిన కన్నదాసన్. ఇతని కొడుకు కైలాష్ (16). మంజకుప్పంలోని సెయింట్ వల్లనా ర్ హయ్యర్ సెకండరీ పాఠశాలలో ప్లస్–1 చదువుతున్నాడు. రోజూలాగే మంగళవారం కూడా పాఠశాలకు వచ్చాడు. సాయంత్రం పాఠశాల ముగించుకుని కడలూరు బ్రాంచ్ జైలు దగ్గర ఆగిన దేవనాంపట్టినం వెళ్లే ప్రైవేట్ బస్సు ఎక్కాడు. అతను ముందు మెట్ల దగ్గర నిలబడి ప్రయాణించినట్లు తెలుస్తుంది. బస్సు జడ్జెస్ రెసిడెన్స్ రోడ్డుకు వెళ్లేసరికి విద్యార్థి కై లాష్ ఒక్కసారిగా మెట్లపై నుంచి జారి కిందపడ్డాడు. అప్పుడు బస్సు వెనుక చక్రం అతని తలపై ఎక్కిదిగింది. ఈ ప్రమాదంలో కై లాష్ తల నుజ్జునుజ్జు అయి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానిక పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. కత్తులతో తిరుగుతున్న ఇద్దరు యువకుల అరెస్ట్ తిరువొత్తియూరు: చైన్నె, చాకలిపేట రౌండ్ ఠాణా సమీపంలో ఉన్న మద్యం షాపు వద్ద కత్తితో తిరుగుతున్న కొరుక్కు పేటకు చెందిన పార్థసారథి నాలుగవ వీధికి చెందిన కృష్ణమూర్తి, ఆర్కే నగర్ భారతి నగర్ నివాస ప్రాంతానికి చెందిన స్మైలీ వసంత్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వారిపై సెల్‌ఫోన్ దారి దోపిడీ తదితర పలు చోరీ కేసులు ఉన్నట్లు తెలిపారు. ఈమేరకు ఇన్స్పెక్టర్ రాజారామ్ కేసు విచారణ చేస్తున్నారు.