Karimnagar
-
వారంలోగా ఎల్ఆర్ఎస్ పూర్తి కావాలె
కరీంనగర్ అర్బన్: ఎల్ఆర్ఎస్ 2020 పెండింగ్ దరఖాస్తుల ప్రక్రియను వారం రోజుల్లోగా పూర్తి చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో ఎల్ఆర్ఎస్ పెండింగ్ దరఖాస్తులపై ఇరిగేషన్, పంచాయతీ, రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. దరఖాస్తులు ఎక్కువగా ఉన్న గ్రామాల్లో అదనపు సిబ్బందిని కేటాయిస్తామన్నారు. ఎంపీవోలు, ఆర్ఐలు, పంచాయతీ కార్యదర్శులు, అసిస్టెంట్ ఇంజినీర్లు సమన్వయంతో పని చేస్తూ పెండింగ్ దరఖాస్తులు పూర్తి చేయాలని అన్నారు. కరీంనగర్ కార్పొరేషన్, కరీంనగర్ రూరల్, కొత్తపల్లి మున్సిపాలిటీ, కొత్తపల్లి మండల పరిధిలోని దరఖాస్తులు పరిష్కరించేందుకు అదనంగా 9 మంది సిబ్బందిని కేటాయిస్తామని తెలిపారు. నిబంధన ప్రకారం లేని దరఖాస్తులు తిరస్కరించి, మిగతావి పరిష్కరించాలన్నారు. అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, డీఎల్పీవో శ్రీనివాస్ పాల్గొన్నారు. -
‘దిశ’ శిక్షణ సద్వినియోగం చేసుకోవాలె
● కలెక్టర్ పమేలా సత్పతికరీంనగర్: జిల్లా వ్యాప్తంగా కస్తూరిబా బాలికల విద్యాలయాల్లో వాయిస్ ఫర్ గర్ల్స్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన దిశ శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. కరీంనగర్ సప్తగిరికాలనీలోని కస్తూరిబా బాలికల పాఠశాలను మంగళవారం సందర్శించారు. పాఠశాలలో దిశ శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించారు. జిల్లాలోని కస్తూరిబా పాఠశాలల్లో 7, 8, 9 తరగతుకు చదువుతున్న బాలికలకు దిశ శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. 46మంది టీం మెంబర్లు శిక్షణ ఇస్తున్నారని అన్నారు. బాలికలకు జీవితంలో ఉపయోగపడే ఎన్నో అంశాలు ఉంటాయని తెలిపారు. జిల్లా బాలికల అభివృద్ధి అధికారి కృపారాణి, ప్రిన్సిపాల్ పుష్పారాణి పాల్గొన్నారు. -
ఇయ్యాల్టి నుంచి ప్రత్యేక అధికారి పాలన
● బాధ్యతలు చేపట్టనున్న కలెక్టర్నగరపాలకసంస్థలో బుధవారం నుంచి ప్రత్యేక అధికారి పాలన రానుంది. పాలకవర్గం పదవీ కాలం మంగళవారం ముగిసింది. కలెక్టర్ పమేలా సత్పతిని బల్దియా ప్రత్యేక అధికారిగా నియమించారు. బుధవారం ఉదయం 11 గంటలకు ఆమె బాధ్యతలు స్వీకరించనున్నారు. కలెక్టర్ నేతృత్వంలో ప్రత్యేక అధికారి పాలన మొదలవుతుండడంపై నగరవాసులు భారీగానే ఆశలు పెట్టుకున్నారు. గాడి తప్పిన నగరపాలకసంస్థలోని వివిధ విభాగాలను సరైన మార్గంలోకి మళ్లించాలంటున్నారు. ముఖ్యంగా అధికారులు, ఉద్యోగుల్లో లోపించిన జవాబుదారితనం, జాడ లేని పారదర్శకతపై కలెక్టర్ దృష్టి సారించాల్సి ఉంది. ఇంజనీరింగ్, శానిటేషన్, రెవెన్యూ, టౌన్‌ప్లానింగ్, మెప్మా విభాగాల్లో చోటుచేసుకొంటున్న అక్రమాలు, అవినీతి ఆరోపణలు, ఫిర్యాదులపై ఆరా తీస్తే సగం సమస్యలు తీరే అవకాశం ఉంది. కొంతమంది ఔట్సోర్సింగ్ ఉద్యోగుల ఆధిపత్యమే నగరపాలకసంస్థలో అధికం. కొద్దిమంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులు పూర్తిగా కార్యాలయాన్ని తమ నియంత్రణలో పెట్టుకోవడంతో పాటు, రెగ్యులర్ అధికారులనే బెదిరించిన ఉదంతాలు గతంలో చోటుచేసుకొన్నాయి. కలెక్టర్ సెక్షన్ల వారిగా సమీక్షించి చర్యలు చేపడితే తప్ప బల్దియా గాడినపడే అవకాశం లేదు. -
బల్దియా కమిషనర్‌కు విలీన గ్రామాల బాధ్యత
కరీంనగర్ కార్పొరేషన్: నగరపాలకసంస్థలో విలీనమైన కొత్తపల్లి మున్సిపాలిటీ, చింతకుంట, మల్కాపూర్(లక్ష్మిపూర్), బొమ్మకల్, దుర్శేడ్, గోపాల్పూర్ గ్రామపంచాయతీల బాధ్యతలను కమిషనర్ చాహ త్ బాజ్పేయ్కి అప్పగిస్తూ సీడీఎంఏ ఆదేశాలు జారీ చేసింది. గ్రామపంచాయతీల్లో సంవత్సర కాలంగా స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగుతుండగా, కొత్తపల్లి మున్సిపాలిటీ పాలకవర్గం పదవీ కాలం ఈ నెల 26వ తేదీతో ముగిసింది. గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీ నగరపాలకసంస్థలో విలీనం కావడంతో ఇక నుంచి వాటి పూర్తి నిర్వహణ నగరపాలకసంస్థచేపట్టనుంది. దీనితో గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీకి సంబంధించి మినట్స్బుక్స్ సీజ్ చేయడంతో పాటు, బ్యాంక్ ఖాతాలు క్లోజ్ చేయనున్నారు. కరీంనగర్ కార్పొరేషన్ పేరిట కొత్తగా ఏదైనా జాతీయ బ్యాంక్‌లో అకౌంట్ తీయాలని,భవనాలు,కార్యాలయాలకు నగరపాలకసంస్థ బోర్డులు ఏర్పాటు చేయాలని సీడీఎంఏ ఆదేశాల్లో పేర్కొన్నారు. గామపంచాయతీల ప్రొఫైల్, ఉద్యోగులు, సిబ్బంది వివరాలు, ఆస్తులు ,డిపాజిట్లు, పన్నులు, కొనసాగుతున్న పథకాలు, బిల్లులు చెల్లింపులు, గత మూడేళ్ల భవన, లేఅవుట్ అనుమతులు తదితర సమగ్ర వివరాలను ఫిబ్రవరి 6వ తేదీలోగా తమకు పంపించాలని సీడీఎంఏ పేర్కొంది. -
ప్రభుత్వ కళాశాలల్లో ఉజ్వల భవిష్యత్
కరీంనగర్ సిటీ: ప్రభుత్వ కళాశాలల్లో చదివినవారికి ఉజ్వల భవిష్యత్ ఉంటుందని కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. కరీంనగర్‌లోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో మంగళవారం ఫెరియా ఫియస్టా పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన వివిధ ఎగ్జిబిట్లు ఆకట్టుకున్నాయి. ముఖ్య అతిథిగా కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ.. స్థానికంగా అన్ని వసతులు, అనుభవజ్ఞులైన అధ్యాపకులు ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేరి విద్యార్థులు ఉజ్వల భవిష్యత్‌ను నిర్మించుకోవాలని సూచించారు. చదువుతో పాటు సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని తెలిపారు. అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ మాట్లాడుతూ... కళాశాలలోని సౌకర్యాలను వినియోగంలోకి తెచ్చేందుకు సహకారం అందిస్తామని తెలిపారు. ప్రిన్సిపాల్ డి.వరలక్ష్మి మాట్లాడుతూ 2,700 మంది విద్యార్థులతో స్వయం ప్రతిపత్తి కలిగిన మహిళా డిగ్రీ కళాశాల ఉత్తర తెలంగాణలో ప్రముఖ విద్యాసంస్థగా రూపొందుతోందని తెలిపారు. ఫెరియా ఫియస్టా కార్యక్రమంలో విద్యార్థులు ఏర్పాటు చేసిన 160 స్టాళ్లను కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ ప్రారంభించారు. మెడికవర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో హెల్త్‌క్యాంపు నిర్వహించారు. పాటలు, నృత్య పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఫెరియా ఫియస్టా కన్వీనర్ డాక్టర్ ఆర్.మొగిలి, కో– ఆర్డినేటర్లు, రజిని, స్రవంతి పాల్గొన్నారు. కలెక్టర్ పమేలా సత్పతి అలరించిన ఫెరియా ఫియస్టా -
‘స్థానిక’ ఎన్నికలకు సిద్ధం కావాలి: బీజేపీ
కరీంనగర్‌టౌన్: స్థానిక సంస్థల ఎన్నికల కోసం పార్టీని బలోపేతం చేయడానికి పోలింగ్ బూత్ అధ్యక్షులు కృషి చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. కరీంనగర్ గోదాంగడ్డలోని ఎస్బీఐ ఫంక్షన్హాల్లో మంగళవారం పోలింగ్ బూత్ అధ్యక్షులతో ముఖ్య సమావేశం నిర్వహించారు. కృష్ణారెడ్డి మాట్లాడుతూ పోలింగ్ బూత్ అధ్యక్షులు పార్టీని బలోపేతం చేయాలన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శులు శ్రీనివాస్‌గౌడ్, మాడ వెంకటరెడ్డి, మేయర్ వై.సునీల్‌రావు, కన్నబోయిన ఓదెలు, వాసాల రమేశ్ పాల్గొన్నారు. ‘రాజకీయ సన్యాసం తీసుకుంటావా?’కరీంనగర్: సాక్ష్యాలతో మీ అవినీతిని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటావా అని బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్లా హరిశంకర్ మాజీ మేయర్ సునీల్‌రావుకు సవాల్ విసిరారు. మంగళవారం ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కార్యాలయంలో మాట్లాడుతూ సునీల్‌రావు ఓ ఐరన్‌లెగ్ అని విమర్శించారు. గత ఐదేళ్లలో మేయర్‌గా ఆయన చేసిన అవినీతిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. బండి సంజయ్ సునీల్ రావుతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మాజీ డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి, బీఆర్ఎస్ నాయకులు రాజేందర్రావు, మహేశ్, గందె మాధవి, గుగ్గిళ్ల జయశ్రీ, తిరుపతి పాల్గొన్నారు. టీబీ రహిత జిల్లాగా మార్చాలి కరీంనగర్‌రూరల్: కరీంనగర్ జిల్లాను టీబీ రహితంగా మార్చడానికి అన్ని ప్రభుత్వశాఖలు కృషి చేయాలని జిల్లా క్షయ వ్యాధి నివారణ అధికారి డాక్టర్ కేవీ.రవీందర్‌రెడ్డి కోరారు. మంగళవారం కరీంనగర్ మండల పరిషత్తు సమావేశ మందిరంలో ఇంపాక్ట్ ఇండియా ఆధ్వర్యంలో టీబీ ముక్త్ గ్రామపంచాయతీ కా ర్యక్రమంలో భాగంగా కరీంనగర్‌రూరల్, కొత్తపల్లి, గన్నేరువరం మండలాల పంచాయ తీ కార్యదర్శులకు ఒకరోజు శిక్షణ నిర్వహించారు. ఎంపీడీవో సంజీవరావు, ఎంపీవోలు జగన్మోహన్రెడ్డి, నర్సింహరెడ్డి పాల్గొన్నారు. సదరం షెడ్యూల్ ఖరారుకరీంనగర్టౌన్: జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో సదరం షెడ్యూల్ ఖరారు చేశారు. ఫిబ్రవరి, మార్చి నెలకు సంబంధించిన సదరం తేదీలను మంగళవారం ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వీరారెడ్డి ఒక ప్రకటనలో వెల్లడించారు. ఫిబ్రవరి 3, 4 తేదీల్లో ఆర్థో, 6న మానసిక రోగులు, 10న కంటి చూపు, 13న వినికిడి మూగ (చెవుడు), మార్చి 4న ఆర్థో, 11న మానసిక రోగులు, 18న కంటి చూపు, 24న వినికిడి మూగ (చెవుడు) నిర్ధారణ శిబిరాలు నిర్వహించనట్లు తెలిపారు. ఈనెల 29వ తేదీ ఉదయం 11.30 గంటల నుంచి మీ సేవల్లో స్లాట్ బుకింగ్ చేసుకోవాలని సూచించారు. నేడు గాంధీభవన్‌లో ఉమ్మడి జిల్లా నేతలతో సమావేశంకరీంనగర్ కార్పొరేషన్: ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ సమావేశం బుధవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో జరగనుంది. ఎమ్మెల్సీ ఎన్నికలు, సంక్షేమ పథకాలు, క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి తదితర అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. జిల్లా ఇన్చార్జి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో జరగనున్న ఈ సమావేశంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జీలు, డీసీసీ అధ్యక్షులు, ఆహ్వానితులు హాజరుకానున్నారు. ‘రైతు భరోసా’ విడుదలకరీంనగర్ అర్బన్: రైతు భరోసా పెట్టుబడి సాయం రైతుల ఖాతాకు చేరింది. మండలానికో గ్రామాన్ని ఎంపిక చేయగా సదరు గ్రామాల రైతుల ఖాతాకు ఎకరాకు రూ.6వేల చొప్పున చేరాయి. 14,226 మంది రైతులకు గానూ రూ.15,96,31,095 నిధులు విడుదలయ్యాయి. 313 గ్రామాలకు గానూ 15 గ్రామాలకు రైతు భరోసా జమవగా మిగతా గ్రామాలకు రెండు, మూడు రోజుల్లో ప్రక్రియ ప్రారంభమవుతుందని సమాచారం. -
డీటీలుగా పదోన్నతి
కరీంనగర్ అర్బన్: జిల్లాలో పలువురికి నాయబ్ తహసీల్దార్లుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కలెక్టరేట్ ప్రధాన విభాగంలో పనిచేసే సీనియర్ అసిస్టెంట్లు తిరుపతి సంపత్, ప్రణీత్, మణ్మిత్ సింగ్, ఎఫ్ఐ రాజమధుకర్, ఆర్ఐలు మాధవి, శివరామకృష్ణ, ఫహీం, శరత్‌కుమార్‌కు నాయబ్ తహశీల్దార్లుగా పదోన్నతి లభించింది. శివరామకృష్ణ, శరత్ కుమార్‌ను కామారెడ్డి జిల్లాకు అలాట్ చేయగా ప్రణీత్ కరీంనగర్ డీఎం సివిల్ సప్లై కార్యాలయంలో పోస్టింగ్ ఇచ్చారు. మన్మిత్ సింగ్, రాజమధుకర్, సంపత్, మాధవి, ఫహీంలను సిద్దిపేట జిల్లాకు అలాట్ చేశారు. -
బందోబస్తు.. బహిష్కరణ
● నిర్బంధం నడుమ బల్దియా వీడ్కోలు సభ ● ఆఖరిరోజు కార్పొరేటర్లకు చేదు అనుభవం ● బహిష్కరించిన బీఆర్ఎస్ కార్పొరేటర్లుకరీంనగర్ కార్పొరేషన్: అసాధారణ నిర్బంధం నడుమ బల్దియా పాలకవర్గం వీడ్కోలు సభ ముగిసింది. శాంతిభద్రతలను కాపాడేందుకు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసినా, అందుకు తగినట్లుగా నగరపాలకసంస్థ అధికారులు ఏర్పాట్లు చేయడంలో విఫలమవడంతో చివరిరోజు కార్పొరేటర్లకు చేదు అనుభవం ఎదురైంది. బీజేపీ కండువాతో ఉన్న మేయర్ సునీల్‌రావు చేతులమీదుగా సన్మానం చేయించుకోమంటూ బీఆర్ఎస్ కార్పొరేటర్లు సభను బహిష్కరించారు. నిర్బంధంలో భాగంగా కార్యాలయ సేవలను పూర్తిగా నిలిపివేయడంతో, వివిధ సేవల కోసం వచ్చిన ప్రజలు వెనుదిరగాల్సి వచ్చింది. అసాధారణ నిర్బంధం నగరపాలకసంస్థ కార్యాలయంలో కార్పొరేటర్లు, కో– ఆప్షన్‌సభ్యులు, ఎక్స్ అఫిషియో సభ్యులకు ఆత్మీయ వీడ్కోలు సభ ఏర్పాటు చేశారు. మేయర్ యాదగిరి సునీల్‌రావు ఇటీవల బీజేపీలో చేరడం, ఆయనకు, బీఆర్ఎస్కు నడుమ మాటల యుద్ధం కొనసాగుతుండడం తెలిసిందే. ఈ క్రమంలో శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా ఉండేందుకు పోలీ సులు మూడంచెల బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యాలయానికి వెళ్లే రెండు గేట్లలో ఒక గేట్‌కు తాళం వేసి, మరో గేట్ వద్ద పోలీసులు తనిఖీ చేసి లోనికి పంపించారు. కార్పొరేటర్లను మినహా ఎవరినీ లోనికి అనుమతించొద్దని బల్దియా ఉన్నతాధికారుల ఆదేశాలతో పోలీసులు వారిని మాత్రమే లోనికి పంపించారు. గుర్తించాల్సిన ఉద్యోగులు ప్రవేశం వద్ద లేకపోవడంతో, కార్పొరేటర్లను ఆపి పేర్లు అడగడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను పిలిచి అవమానిస్తారా అంటూ మండిపడ్డారు. గతంలో కార్పొరేటర్ల దంపతులను సన్మానించారని,వారిని కూడా అనుమతించాలని బీఆర్ఎస్ కార్పొరేటర్లు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కింది అంతస్తులోని చాంబర్లో మాత్రమే కూర్చోవాలని చెప్పి కుటుంబసభ్యులను పంపించారు. మొదటి అంతస్తులోని హాల్లోకి కార్పొరేటర్లనే అనుమతించారు. ఆత్మీయ వీడ్కోలు సభభకు మీడియాను అధికారులు అనుమతించకపోగా, కౌన్సిల్ హాల్లో కాకుండా అధికారులు సమీక్షా సమావేశాలు పెట్టుకునే హాల్లో సన్మానించడం ఆశ్చర్యం కలిగించింది. బీఆర్ఎస్ బహిష్కరణ సభకు హాజరైన బీఆర్ఎస్ కార్పొరేటర్లు సన్మానం చేయించుకోకుండా వెనుదిరిగారు. ముగ్గురు కార్పొరేటర్లను సన్మానించాక మేయర్ అఫ్రాన్(మేయర్ వేసుకొనే గౌను)కు బదులుగా బీజేపీ కండువా వేసుకొని సన్మానం చేయడంపై బీఆర్ఎస్ కార్పొరేటర్ వి.రాజేందర్రావు అభ్యంతరం తెలిపారు. మేయర్ చేత తాము సన్మానం చేసుకోమనడంతో, మీరొచ్చినప్పుడు తాను పక్కకు జరుగుతానంటూ మేయర్ బదులిచ్చారు. ఇదే క్రమంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు సభను బహిష్కరించి బయటకు వ చ్చారు. మేయర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రజాసేవలు బంద్ అసాధారణ నిర్బంధం నడుమ ప్రజలకు అందాల్సిన సేవలను కూడా అధికారులు పూర్తిగా నిలిపివేశారు. వివిధ సేవల కోసం కార్యాలయానికి వచ్చిన ప్రజలను మెయిన్ గేట్ నుంచి అటే పంపించారు. కార్యాలయానికి దూరంగా పౌరసేవా కేంద్ర భవనం ఉన్నప్పటికి, ప్రజలను రానీయకపోవడం వివాదాస్పదంగా మారింది. ఆత్మీయ సన్మానం పాలకవర్గం పదవీ కాలం ముగియడంతో కార్పొరేటర్లను సన్మానించారు. బీఆర్ఎస్ మినహా, కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం కార్పొరేటర్లను సన్మానించగా, మేయర్ సునీల్‌రావు, కమిషనర్ చాహత్ బాజ్పేయ్లను కార్పొరేటర్లు సన్మానించారు. నగర రూపురేఖలు మార్చాం : మేయర్ తమ పాలకవర్గ హయాంలో అన్ని రంగాల్లో నగరాన్ని అభివృద్ధిచేశామని మేయర్ యాదగిరి సునీల్‌రావు అన్నారు. మీడియాతో మాట్లాడుతూ వేల కోట్ల రూపాయలతో నగర రూపురేఖలు మార్చామన్నారు. తమ పదవీకాలం ఎంతగానో సంతృప్తినిచ్చిందన్నారు. కాగా మేయర్ బీజేపీ కండుడా కప్పుకొని సన్మానించడం సరికాదని మాజీ మేయర్, బీఆర్ఎస్ కార్పొరేటర్ సర్ధార్ రవీందర్ సింగ్ అన్నారు. సభకు ఆహ్వానించి తమను అవమానించారని కార్పొరేటర్ గందె మాధవి అన్నారు. -
అట్టహాసంగా పోలీసు క్రీడాపోటీలు
కరీంనగర్‌స్పోర్ట్స్/కరీంనగర్‌టౌన్: రాష్ట్ర 3వ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ పోటీలు కరీంనగర్‌లోని పరేడ్ మైదానంలో మంగళవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఇంటెలిజెన్స్ డీజీ శివధర్‌రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. పోరాటాల గడ్డ కరీంనగర్లో రాష్ట్రస్థాయి పోలీస్ క్రీడా పోటీలు జరగడం ఆనందంగా ఉందన్నారు. ఆలిండియా పోలీస్ క్రీడోత్సవాల్లో తెలంగాణ జట్లు పతకాల పంట పండించాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ఆవిర్భావం అనంతరం 2015లో ఆదిలాబాద్‌లో, 2017లో వరంగల్‌లో పోటీలు జరగ్గా.. ఇప్పుడు కరీంనగర్లో జరుగుతున్నాయన్నారు. ఈ పోటీల్లో తెలంగాణ నుంచి 2,380 మంది క్రీడాకారులు పాల్గొనడం, అందులో మహిళలు ఉండడం సంతోషకరమన్నారు. పోటీలకు ఏర్పాట్లు చేసిన సీపీ అభిషేక్ మహంతిని అభినందించారు. ఐజీ ఎస్.చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ పోలీస్ ఉద్యోగం అంటేనే ఎంతో ఒత్తిడితో ఉండే ఉద్యోగం అని ఇలాంటి పోటీలతో ఉపశమనం కలుగుతుందన్నారు. ఐజీ రమేశ్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లా విభజన అనంతరం అట్టహాసంగా పోటీలు జరుగుతున్నాయన్నారు. అనంతరం క్రీడాకారుల మార్చ్ఫాస్ట్, గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం తెలంగాణ పోలీస్ క్రీడా పతాకాన్ని, పోలీస్ అధికారులు వసుంధర, మాధవి రూపొందించిన స్పోర్ట్స్ అంథమ్ సీడీని ఆవిష్కరించారు. కరీంనగర్, రామగుండం సీపీలు అభిషేక్ మహంతి, శ్రీనివాసులు, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల ఎస్పీలు అఖిల్ మహాజన్, అశోక్ కుమార్, శిక్షణ ఐపీఎస్ వసుంధర, రాష్ట్ర ఒలింపిక్ సంఘం సంయుక్త కార్యదర్శి జనార్దన్‌రెడ్డి పాల్గొన్నారు.● ఏడేళ్ల అనంతరం జరుగుతున్న రాష్ట్రస్థాయి పోటీలు ● పోరాటాల గడ్డపై క్రీడా పోటీలు నిర్వహించడం ఆనందంగా ఉంది ● ఇంటెలిజెన్స్ డీజీ శివధర్ రెడ్డి ● ఉత్సాహంగా రాష్ట్ర 3వ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ -
నేరెళ్ల హత్య కేసులో మరో వ్యక్తి రిమాండ్
ధర్మపురి: ధర్మపురి మండలం నేరెళ్ల గ్రామంలో ఓ వ్యక్తిని హత్య చేసి.. కాల్చి చంపిన సంఘటనలో పోలీసులు గతంలో ఇద్దరిని అరెస్టు చేసిన విషయం తెల్సిందే. ఇదే ఘటనలో పాల్గొన్న మరో వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు సీఐ రాంనర్సింహారెడ్డి తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. మండలంలోని కమలాపూర్‌కు చెందిన నేరెళ్ల గోపాల్, నేరెల్లకు చెందిన గండికోట శేఖర్ కలిసి 2024 డిసెంబర్ 12న ఉత్తరప్రదేశ్‌కు చెందిన రాహుల్ సూర్యప్రకాశ్సింగ్ను ముంబయి నుంచి కారులో నేరెల్లకు తీసుకొచ్చారు. డిసెంబర్ 13న సాంబశివ దేవాలయం వద్ద హత్య చేసి సారంగపూర్ మండలం బట్టపెల్లి, పోతారం అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి దహనం చేశారు. ఈ ఘటనపై ముమ్మరంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు గోపాల్, శేఖర్‌ను డిసెంబర్ 22న అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. ఈ కేసులో సంబంధమున్నట్లు అనుమానిస్తున్న మూడో వ్యక్తి మెరుగు లస్మయ్యను మంగళవారం అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. -
ఒలింపియాడ్‌లో అల్ఫోర్స్ విద్యార్థుల ప్రతిభ
కొత్తపల్లి(కరీంనగర్): కర్నాటకకు చెందిన ప్రముఖ పోటీ పరీక్షల సంస్థ చింతన ప్రకాశన్ ఇటీవల నిర్వహించిన మ్యాథ్, సైన్స్, చిత్రలేఖనం ఒలింపియాడ్‌లో కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ టెక్నో స్కూల్ విద్యార్థులు అత్యున్నత ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయిలో ర్యాంకులు సాధించినట్లు ఆ విద్యా సంస్థల చైర్మన్ డా.వి.నరేందర్ రెడ్డి తెలిపారు. పాఠశాల ఆవరణలో మంగళవారం ర్యాంకులు సాధించిన విద్యార్థులను అభినందించిన ఆయన మాట్లాడుతూ ప్రాథమిక స్థాయి నుంచి వివిధ విషయాలతో పాటు ముఖ్యంగా గణితం, సైన్స్‌లోని విషయాలపై ప్రత్యేక దృష్టి సారించేలా ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. జాతీయస్థాయిలో చిత్రలేఖనం ఒలింపియాడ్‌లో టి.భవిష్య (4వ తరగతి), ఎ.సమీక్ష, (8వ), మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్‌లో ఇ.సుహాస్ (7వ), జి.సాయి సంహిత (8వ), సైన్స్ ఒలింపియాడ్‌లో ఎన్.వినాయక్ (7వ)రాణించగా మరికొంతమంది విద్యార్థులు రాష్ట్ర, జిల్లాస్థాయిలో ర్యాంకులు సాధించినట్లు పేర్కొన్నారు. -
మంత్రివర్యా.. మాటలు వెనక్కి తీసుకోండి
కరీంనగర్ అర్బన్: కరీంనగర్ కలెక్టర్‌తో మాట్లాడిన మాటలను మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెనక్కి తీసుకోవాలని, లేని పక్షంలో తమ మద్దతు ఉండదని జిల్లా ఎంప్లాయీస్ జేఏసీ భాగస్వామ్య పక్షాలు స్పష్టం చేశాయి. జిల్లాలో దాదాపు 50 వేల మంది ఉద్యోగులున్నారని ప్రజాస్వామ్య పద్ధతిలో బుద్ధి చెబుతామని పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం టీఎన్జీవో, టీజీవో, పెన్షనర్లు, నాలుగో తరగతి ఉద్యోగులు, ట్రెజరీ, జెడ్పీ, పంచాయతీరాజ్, మహిళా జేఏసీ సంఘాలు ప్రకటన విడుదల చేశాయి. స్వార్థ రాజకీయాలకు అధికారులు, ఉద్యోగులను బలి చేయడం భావ్యం కాదన్నారు. రోజురోజుకు దిగజారుడు రాజకీయం పెరుగుతోందని అవేదన వ్యక్తం చేశాయి. రాజకీయాల్లోకి ఐఎఎస్, ఐపీఎస్‌లను లాగితే తామెంటో నిరూపించే రోజులొస్తాయని ప్రకటించారు. జిల్లాలో జరిగిన ఘటనల క్రమంలో రాష్ట్ర జేఏసీ దృష్టికి తీసుకెళ్లామని వివరించారు. కలెక్టర్ చేసిన తప్పేంటని, అన్ని రాజకీయపక్షాలను, ప్రజాప్రతినిధులను కలుపుకొని ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజల్లోకి తీసుకుపోయి అనుక్షణం పర్యవేక్షించడమే తప్పా అని ప్రశ్నించారు. అనాలోచితంగా సహనాన్ని కోల్పోయి కలెక్టర్‌పై అవాకులు, చవాకులు మాట్లాడటం, బాధ్యత గల పదవిలో ఉన్నవారికి తగదని హితవు పలికారు. సహనాన్ని పరీక్షించొద్దని, తాము తలుచుకుంటే ప్రజలతో మమేకమై ఏ ప్రజాప్రతినిధి ఏమి చేస్తున్నాడో సవివరంగా వివరించే శక్తి, సత్తా ఉందని గుర్తుంచుకోవాలని సూచించారు. టీఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాసరెడ్డి, కార్యదర్శి సంగెం లక్ష్మణ్ రావు, టీజీవో అధ్యక్షుడు మడిపల్లి కాళిచరణ్, కార్యదర్శి అరవింద్ రెడ్డి, నాగరాజు, కేంద్ర సంఘం ఉపాధ్యక్షుడు నాగుల నరసింహస్వామి, అసోసియేట్ అధ్యక్షుడు ఒంటెల రవీందర్ రెడ్డి, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు కోట రామస్వామి, మహిళా జేఏసీ చైర్మన్ ఇరుమల్ల శారద తదితరులు ఉన్నారు. కలెక్టర్‌పై అనుచిత వ్యాఖ్యలు సహించం ఎంప్లాయీస్ జేఏసీ భాగస్వామ్య పక్షాల ధ్వజం -
మైనార్టీ గురుకులాల్లో ప్రవేశాలు
కరీంనగర్/కరీంనగర్‌రూరల్: జిల్లాలోని మైనార్టీ గురుకులాల్లో ప్రవేశాల కోసం దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 18నుంచి ప్రారంభమైంది. వచ్చేనెల 28వరకు ప్రక్రియ కొనసాగనుంది. ఆయా గురుకులాల్లో అడ్మిషన్ల కోసం ఉపాధ్యాయులు ఇంటింటా ప్రచా రం నిర్వహిస్తున్నారు. జిల్లాలో మొత్తం 9 మైనార్టీ గురుకుల పాఠశాలలున్నాయి. వీటిలో ఐదు బాలుర, నాలుగు బాలికల పాఠశాలలున్నాయి. కరీంనగర్ మండలం బొమ్మకల్‌లోని విట్స్ కళాశాల ప్రాంగణంలో బాలుర గురుకుల పాఠశాల–1, ఇరుకుల్లలో బాలు ర పాఠశాల–2, మొగ్ధుంపూర్‌లో బాలుర పాఠశాల–3, కరీంనగర్‌లోని గణేష్‌నగర్‌లో బాలికల పాఠశాల–2, రేకుర్తిలో బాలికల పాఠశాల–1,జమ్మికుంటలో బాలికల పాఠశాల,హుజురాబాద్‌లో బాలుర పాఠశాల,చొప్పదండిలో బాలికల పాఠశాల, మానకొండూరులో బాలుర పాఠశాలలున్నాయి. మైనా ర్టీలతోపాటు బీసీ, ఎస్సీ,ఎస్టీ విద్యార్థులను ప్రోత్సహించేందుకు గురుకులాల్లో ప్రభుత్వం అవకాశం కల్పించింది. 2025–26 విద్యాసంవత్సరానికి 5వ తరగతితోపాటు ఇంటర్ ప్రథమ సంవత్సరం ఎంపీసీ, బైపీసీ కోర్సులు, 6,7,8 తరగతుల్లో మైనార్టీ మిగులు సీట్ల భర్తీ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ఆన్లైన్ ద్వారా విద్యార్ధులు దరఖాస్తు చేసుకునే వీలుంది. రిజర్వేషన్లు ఇలా... గురుకుల పాఠశాలల్లో అడ్మిషన్ల కోసం రిజర్వేషన్ విధానం అమలు చేస్తున్నారు. ఒక్కో గురుకుల పాఠశాలలో మొత్తం 80 సీట్లు ఉంటాయి. దీనిలో 75 శాతం మైనార్టీలు, 25శాతం నాన్ మైనార్టీలకు ప్రవేశం కల్పించారు. మైనార్టీ కోటాలో ముస్లింలకు 64శాతం, క్రిస్టియన్లు 7శాతం, జైన, పార్సీ, బౌద్ధ,సిక్కులకు కలిపి 4శాతం సీట్లు కెటాయించారు. నాన్ మైనార్టీ కోటాలో ఎస్సీలకు 6శాతం, ఎస్టీ 4శాతం, బీసీ 12శాతం, ఓసీలకు 3శాతం సీట్లున్నాయి. ఉపాధ్యాయుల ప్రచారం మైనార్టీ గురుకులాల్లో ప్రవేశాల కోసం ఉపాధ్యాయులు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. బొమ్మకల్ బైపాస్‌లోని విట్స్ ప్రాంగణంలోని మైనార్టీ గురుకుల బాలుర పాఠశాల–1 చెందిన ఉపాధ్యాయులు ప్రిన్సిపాల్ వీర్ల మహేశ్ ఆధ్వర్యంలో కరీంనగర్‌లోని ముస్లిం జనాభా ఉన్న ప్రాంతాల్లో ప్రచారం చేస్తున్నారు. ఇంటింటా తిరుగుతూ కరపత్రాలు పంపిణీ చేస్తున్నారు. అడ్మిషన్ల కోసం ఉపాధ్యాయుల ప్రచారం జిల్లాలో తొమ్మిది పాఠశాలలుసద్వినియోగం చేసుకోవాలి మైనార్టీ గురుకులాల్లోని సౌకర్యాలను వివరిస్తు అడ్మిషన్లపై విస్తృత ప్రచారం చేపట్టాం. తమ పిల్లలను పాఠశాలల్లో చేర్పించేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నాం. తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – సురేశ్, ఆర్ఎల్సీ, కరీంనగర్ -
వివాహిత అదృశ్యం
గోదావరిఖని: స్థానిక శ్రీనగర్‌కాలనీకి చెందిన తోట వరలక్ష్మి తన కుమారుడు తోట ఆద్విక్తో కలిసి ఇంట్లో నుంచి ఎటో వెళ్లిపోయిందని పోలీసులు మంగళవారం తెలిపారు. ఇంట్లో గొడవ కావడంతో తాను ఆత్మహత్య చేసుకుంటానని చెప్పి బయకు వెళ్లిపోయిందన్నారు. ఆచూకీ తెలిసిన వారు గోదావరిఖని వన్‌టౌన్ సీఐ–1 నంబరు 87126 56516, సీఐ–2 నంబరు 87126 56517కు ఫోన్‌చేసి సమాచారం ఇవ్వాలని, లేదా డయల్ 100 నంబరుకు ఫోన్ చేయాలని పోలీసులు సూచించారు. రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతికరీంనగర్రూరల్: తీగలగుట్టపల్లి రైల్వేస్టేషన్ వద్ద మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి వయస్సు 28 నుంచి 30 సంవత్సరాలలోపు ఉంటుంది. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించారు. సంబంధింకులు ఎవరైనా కరీంనగర్ రూరల్ పోలీసు స్టేషన్లో సంప్రదించాలని సీఐ ప్రదీప్‌కుమార్ సూచించారు. బీఫార్మసీ విద్యార్థిని మృతిహుజూరాబాద్/వరంగల్ క్రైం: హనుమకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని నయీంనగర్‌లోని వాగ్దేవి బీఫార్మసీ కళాశాలలో చదువుతున్న సాయిచంద్రిక ఫ్యాన్‌కు ఉరేసుకొని అనుమానాస్పదంగా మృతిచెందినట్లు ఇన్స్పెక్టర్ వై.సతీశ్ తెలిపారు. కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్‌కు చెందిన బీపార్మసీ సెకండియర్ చదువుతున్న సాయి చంద్రిక (20) ఈనెల 26న హాస్టల్లో ఫ్యాన్‌కు ఉరేసుకోగా ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. మెరుగైనా చికిత్స కోసం ఈనెల 27న కరీంనగర్‌కు తరలిస్తుండగా చనిపోయినట్లు తెలిపారు. విద్యార్థిని తండ్రి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. భూ తగాదా కేసులో ఐదేళ్ల జైలుఇబ్రహీంపట్నం: భూతగాదాలతో ఓ వ్యక్తిపై హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడికి మెట్పల్లి అసిస్టెంట్ సెషన్స్ న్యాయమూర్తి నాగేశ్వర్రావు ఐదేళ్ల జైలు, రూ.2 వేల జరిమానా విధిస్తూ మంగళవారం తీర్పుచెప్పారు. సీఐ నిరంజన్‌రెడ్డి కథనం ప్రకారం.. ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండ గ్రామానికి చెందిన సల్వాల రాజేందర్ వ్యవసాయం చేసుకుని జీవిస్తాడు. అదే గ్రామానికి చెందిన చిన్న లక్ష్మయ్య అలియాస్ లస్మయ్య మధ్య భూ హద్దుల విషయంలో గొడవలు జరిగాయి. 2017 సెప్టెంబర్ 2న రాజేందర్ పొలం పనులు చేసుకుంటుండగా చిన్న లక్ష్మయ్య గొడ్డలితో దాడిచేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. బాధితుడి భార్య పద్మ ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్సై రామునాయక్ హత్యాయత్నం కేసు నమోదు చేశారు. పోలీసులు కోర్టులో సాక్షులను ప్రవేశపెట్టడంతో నిందితుడికి ఐదేళ్ల జైలు, రూ.2 వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. అప్పటి ఎస్సై రాము, కోర్టు కానిస్టేబుల్ కవితను ఎస్పీ ఆశోక్ కుమార్, మెట్పల్లి డీఎస్పీ రాములు అభినందించినట్లు సీఐ తెలిపారు. -
నమ్మించి రూ.60వేలు కాజేసిన సైబర్ మోసగాడు
వేములవాడఅర్బన్: సైబర్ మోసగాని చేతిలో ఆన్లైన్ సెంటర్ నిర్వాహకుడు మోసపోయిన ఘటన సోమవారం జరగ్గా.. మంగళవారం వెలుగులోకి వచ్చింది. జరిగింది. బాధితుడి కథనం ప్రకారం.. వేములవాడ మండలం అగ్రహారంలో ఆన్లైన్ సెంటర్ నిర్వహిస్తున్న మహేశ్‌కు సోమవారం గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి తాను డాక్టర్ రాజిరెడ్డి అని పరిచయం చేసుకున్నాడు. తనకు ఆన్లైన్ ద్వారా (ఫోన్ పే లేదా గూగుల్ పే) డబ్బు పంపిస్తే కమీషన్ ఇస్తానని, తన మనిషి వచ్చి డబ్బులు ఇస్తాడని ఎర వేశాడు. ఇదే సైబర్ మోసగాడు వేములవాడ నందికమాన్ వద్ద ఉన్న ఓ బిర్యాని సెంటర్ నిర్వాహకుడు సురేశ్‌కు ఫోన్ చేసి తాను డిగ్రీ కళాశాల లెక్చరర్ రాజిరెడ్డి అని పరిచయం చేసుకున్నాడు. తనకు 110 బిర్యాణిలు కావాలని తెలుపగా, సురేశ్ అడ్వా న్స్ డబ్బులు కావాలని అడిగాడు. అగ్రహారంలోని ఆన్లైన్ సెంటర్ వద్దకు వెళ్లి ఫోన్ చేస్తే డబ్బులు ఇస్తారని తెలిపాడు. సురేశ్ అక్కడికి వెళ్లి రాజిరెడ్డికి కాల్ చేసి ఆన్లైన్ సెంటర్ మహేశ్‌కు ఇచ్చా డు. రాజిరెడ్డి ఫోన్లో మహేశ్‌తో మాట్లాడుతూ తన కు రూ.65 వేలు ఆన్లైన్ ద్వారా పంపించాలని, సు రేశ్ డబ్బులు తీసుకువచ్చాడని నమ్మించాడు. దీంతో మహేశ్ రెండు నంబర్లకు ఫోన్ పే ద్వారా రూ. 65 వేలు పంపించాడు. అనంతరం సురేశ్‌ను మహే శ్ డబ్బులు అడిగాడు. కాగా తనకు బిర్యాని డబ్బులు రూ.5 వేలు అడ్వాన్స్ ఆన్లైన్ సెంటర్లో మహే శ్ ఇస్తాడని చెబితే ఇక్కడికి వచ్చానని సురేశ్ పేర్కొన్నాడు. వెంటనే బాధితులిద్దరూ సైబర్ మోసగాడు రాజిరెడ్డికి ఫోన్ చేయగా స్విచ్చాఫ్ రావడంతో మోసపోయినట్లు గుర్తించి 1930కు ఫిర్యాదు చేశారు. -
రైతుల నిరాహార దీక్ష
రుణమాఫీ, రైతు భరోసా కోసం కథలాపూర్: రుణమాఫీ చేయాలని, రైతు భరోసా నిధులు ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం భూషణరావుపేటలో అన్నదాతలు మంగళవారం నిరాహారదీక్ష చేపట్టారు. ముందుగా ప్రభుత్వ పాఠశాల నుంచి గ్రామపంచాయతీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం గ్రామపంచాయతీ ఎదురుగా ఉన్న మహాత్మగాంధీ విగ్రహం వద్ద దీక్ష చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేయాలని, రైతు భరోసా నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. నిరాహార దీక్షలో అన్ని పార్టీల రైతులు కూర్చోవడం విశేషం. దీక్ష శిబిరం వద్దకు తహసీల్దార్ వినోద్, ఏవో యోగితా, ఎస్సై నవీన్‌కుమార్ చేరుకున్నారు. దీక్ష విరమించాలని, సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. దీనిపై రైతులు మాట్లాడుతూ.. ఇప్పటికే రైతుభరోసా మూడుసార్లు రావాల్సి ఉందని, ఇంకెప్పుడు ఇస్తారని అధికారులను ప్రశ్నించారు. వారు కొద్దిసేపు నచ్చజెప్పడంతో దీక్ష విరమించారు. రైతు నాయకులు లోక శశిధర్‌రెడ్డి, గడ్డం రాజేశ్వర్‌రెడ్డి, బద్దం మహేందర్‌రెడ్డి, గడ్డం రాజారెడ్డి, కొండ ఆంజనేయులు, కొత్తపెల్లి శ్రీనివాస్, గడ్డం శేఖర్‌రెడ్డి, ముస్కు శ్రీనివాస్, పుర్కుటపు నర్సారెడ్డి, తీట్ల శంకర్, రవినాయక్, కృష్ణారెడ్డి, వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు. -
సౌదీలో రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి
● మరో ముగ్గురికి గాయాలు మెట్పల్లి/ఇబ్రహీంపట్నం: సౌదీ అరేబియాలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉపాధి కోసం వెళ్లిన పట్టణంలోని రేగుంటకు చెందిన కాపెల్లి రమేశ్ (30) మృతి చెందాడు. ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండకు చెందిన మరో ముగ్గురు గాయపడి అక్కడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. స్థానికుల కథనం ప్రకారం రేగుంటకు చెందిన రమేశ్ మూడు నెలల క్రితం ఉపాధి కోసం సౌదీ అరేబియాకు వెళ్లాడు. అక్కడి జీజాన్లోని ఓ సప్లయ్ కంపెనీలో పనిచేస్తున్న 25 మంది ఎప్పటిలాగే మంగళవారం మినీ బస్సులో విధులకు బయల్దేరారు. ఎదురుగా వచ్చిన ట్రక్కు మినీ బస్సును ఢీకొనడంతో వివిధ దేశాలకు చెందిన 15 మంది మృత్యువాత పడ్డారు. వీరిలో కాపెల్లి రమేశ్ కూడా ఉన్నారు. ఇదే సంఘటనలో వర్షకొండకు చెందిన జంగిటి శ్రీనివాస్ ఛాతిలో గాయం కావడంతో అక్కడ ఆసుపత్రికి తరలించారు. అరపల్లి శ్రీధర్ చేయి విరిగింది. సల్కం అంకిత్‌కు గాయాలు అయినట్లు కుటుంబసభ్యులకు సమాచారం చేరవేశారు. గాయపడిన వారు క్షేమంగా ఉన్నారని తెలియడంతో ఇక్కడి కుటుంబ సభ్యులు ఊపిరిపీల్చుకున్నారు. రమేశ్‌కు భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఉపాధి కోసం వెళ్లిన అతడు అంతలోనే మృత్యువాత పడడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలవిస్తున్నారు. -
పూల‘బత్తి’
కలెక్టర్ పమేలా సత్పతికి అగరుబత్తుల ప్యాకెట్‌ను అందిస్తున్న జైళ్ల శాఖ డీజీ సౌమ్యమిశ్రా(ఫైల్) కరీంనగర్‌క్రైం: వివిధ ఆలయాల్లో పూజకు వినియోగించిన పుష్పాలతో అగరుబత్తీలు తయారు చేసే సరికొత్త ఒరవడికి జైళ్ల శాఖ శ్రీకారం చుట్టింది. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో వాడిన పూలతో అగరబత్తులు తయారు చేయాలని జైళ్ల శాఖ సంకల్పించింది. మొదట ప్రయోగాత్మకంగా కరీంనగర్ జిల్లా జైలులో ప్రారంభించారు. ఇప్పటికే విద్యాసంస్థలకు బెంచీలు, డెస్క్‌లు, షాంపులు, సబ్బులు, ఫినాయిల్, ఇంట్లో ఉపయోగపడే వస్తు సామగ్రి, తదితర వస్తువులను జైళ్ల శాఖ ఖైదీలతో తయారు చేయిస్తుంది. కరీంనగర్‌తో పాటు అన్ని జైళ్లలో వస్తువుల తయారీతో పాటు పెట్రోల్‌బంక్‌లు నిర్వహిస్తూ ఖైదీలకు ఉపాధి చూపించడంతో పాటు ఆదాయం సమకూర్చుకుంటుంది. మార్కెట్లో లభించే వస్తువులతో పోల్చితే తక్కువ ధర ఉండడం, నాణ్యత పాటించడంతో జైళ్లలో తయారైన వస్తువులకు డిమాండ్ పెరుగుతుంది. రసాయనాలు లేకుండా.. జైళ్లశాఖ ఆధ్వర్యంలో ఉత్పత్తి అవుతున్న వస్తువులలో రసాయనాలు వాడకుండా సహజసిద్ధంగా తయారు చేస్తుండడంతో చాలా మంది వాడుతున్నారు. అగరుబత్తులు కూడా రసాయనాలు, ఇతరత్రా ఏమీ కలపకుండా ఆలయాల్లో పూజకు వినియోగించిన పూలను సేకరించి వాటితో తయారు చేస్తున్నారు. వాడిన పూలను ఎండబెట్టి, పొడి చేసి వాటితో సహజమైన పదార్థాలు కలిపి అగరబత్తులు తయారు చేస్తున్నారు. ఆలయాల నుంచి పూల సేకరణకు దేవాదాయశాఖ నుంచి అనుమతి తీసుకోనున్నట్లు తెలిసింది. ఇటీవల కరీంనగర్ జైలు సందర్శనకు వచ్చిన జైళ్లశాఖ డీజీ సౌమ్యమిశ్రా అగరుబత్తుల తయారీ కేంద్రాన్ని పరిశీలించి హర్షం వ్యక్తం చేశారు. కలెక్టర్ పమేలా సత్పతికి జైలులో తయారైన అగరుబత్తులు అందజేశారు. వీటిని మార్కెట్లో ప్రవేశపెట్టడంతో పాటు ఇతర జైళ్లలోనూ అగరుబత్తుల తయారీ కేంద్రాలు ప్రారంభిస్తామని, వీటికి మంచి డిమాండ్ ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్యాకెట్ ధర రూ.50.. జైలులో తయారు చేస్తున్న అగరుబత్తుల తయారీకి వాడిన పూలు, ఇతర పదార్థాలు వాడుతున్నారు. అత్తుక్కోవడానికి యారయార పౌడర్, మండడానికి రాళం పొడి(కర్పూరం పొడి), చెక్కపొడి, పూలను ఎండబెటి పౌడర్ కలుపుతున్నారు. ఖైదీలతో మ్యానువల్ మిషన్ ద్వారా రోజుకు 2,500 నుంచి 3,000 వరకు అగరుబత్తులు తయారు చేయిస్తున్నారు. భవిష్యత్‌లో ఆర్డర్లు పెరిగితే ఆటోమేషన్ మిషన్ ఏర్పాటుకు ప్రతిపాదనలు చేయాలని జైళ్లశాఖ భావిస్తుంది. జైలుతో తయారు చేసే ప్యాకెట్లో 65 నుంచి 70 అగరుబత్తులు ఉంటుండగా, ప్యాకెట్ ధర రూ.50 ఉంటుంది. సహజసిద్ధంగా.. రాష్ట్రంలోనే మొదటగా కరీంనగర్ జైలులో వాడిన పూలతో అగరుబత్తులు తయారీ జరుగుతుంది. స్థానిక ఆలయాల్లో పూజలకు ఉపయోగించిన వాడిపోయిన పూలను సేకరించి ఎండబెట్టి, సహజ సిద్ధమైన పదార్థాలు కలుపుతూ అగర్బత్తులు తయారు చేస్తుండడంతో ఆధరణ లభిస్తుంది. – శ్రీనివాస్, జైలు సూపరింటెండెంట్ -
ఇంటికి చేరిన బాధితుడు
కోనరావుపేట(వేములవాడ): ఉపాధి నిమిత్తం ఓ యువకుడు సౌదీ వెళ్లగా కంపెనీ యాజమాన్యం వేతనమివ్వక, అడిగితే కొట్టడంతో బాధితుడు తన గోడు వెల్లబోసుకున్నాడు. అతడి వ్యథను ‘సాక్షి’ వెలుగులోకి తేవడంతో ప్రభుత్వ విప్ స్పందించి బాధితుడు ఇంటికి చేరేలా చర్యలు తీసుకోగా మంగళవారం చేరుకున్నాడు. వివరాలు.. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కొలనూరు గ్రామానికి చెందిన మెరుగు అంజి ఏడాది క్రితం బతుకుదెరువు కోసం డ్రైవరు వీసాపై బొంబాయ్‌లోని విజయ్ గల్ఫ్ ఆఫీసులో రూ.లక్షన్నర చెల్లించి సౌదీ వెళ్లాడు. అక్కడ కంపెనీవారు ఐదు నెలల నుంచి జీతం ఇవ్వకుండా, పని చేయించుకుని సరైన సమయానికి అన్నం పెట్టకుండా పాస్‌పోర్టు లాక్కొని ఇబ్బందులు పెట్టారు. డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వకుండా అక్కడి ఇబ్బందులకు గురి చేస్తున్నారని, తనను కాపాడాలని బాధితుడు అంజి సీఎం రేవంత్‌రెడ్డి, విప్ ఆది శ్రీనివాస్‌ను సోషల్ మీడియాలో వేడుకోగా, అతడి బాధను శ్రీసాక్షిశ్రీ 2024 ఆగస్ట్ 9న ప్రచురించింది. విప్ ఆది తక్షణమే స్పందించి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇండియన్ ఎంబసీ, సౌదీ అరేబియా దేశానికి లేఖ రాసి అధికారులతో మాట్లాడారు. అంజి ఆచూకీ తెలుసుకోవాలని సౌదీలో ఉన్న ఎన్నారై బైరదేవ్ యాదవ్‌ను కోరాడు. ఈనేపథ్యంలో అంజి ఆచూకీని బైరదేవ్యాదవ్ కనుక్కొని తన రూంలో ఐదు నెలలపాటు ఆశ్రయం కల్పించాడు. పాస్‌పోర్ట్ కంపెనీవారు ఇవ్వకపోవడంతో కొత్త పాస్‌పోర్ట్, వీసా టిక్కెట్ కొని ఏర్పాట్లు పూర్తవడంతో ఈనెల 27న బయలుదేరిన అంజి మంగళవారం ఇంటికి చేరాడు. ఈసందర్భంగా విప్ ఆది శ్రీనివాస్, ఐదు నెలలు ఆశ్రయం కల్పించిన బైరాదేవ్ యాదవ్‌కు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. సౌదీలో కొలనూర్వాసి నరకయాతన వెలుగులోకి తెచ్చిన ‘సాక్షి’ కథనం స్పందించి ఎంబసీకి లేఖ రాసిన విప్ శ్రీనివాస్ -
రౌడీ షీటర్ జిల్లా బహిష్కరణ
సిరిసిల్లక్రైం: నేర ప్రవత్తిని మార్చుకోకుంటే జిల్లా బహిష్కరణ చే స్తామని పోలీస్ బాస్ వెల్లడించిన 72 గంటల్లోనే చర్యలు చేపట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన రౌడీ షీటర్ మోయిజ్పై జిల్లా బహిష్కరణ వేటు వేస్తూ టౌన్ సీఐ కృష్ణ మంగళవారం నోటీసులు జారీ చేశారు. మోయిజ్ జిల్లాలో ఎక్కడైనా కనపడితే పోలీస్ వారికి సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. అతడిపై సిరిసిల్ల టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 11 కేసులు ఉన్నాయని, హ త్య, హత్యాయత్నం, ఆయుధాల చట్టం, బెదిరింపులకు పాల్పడడం, యూట్యూబ్ చానల్ వేదికగా వ్య క్తిని విచక్షణారహితంగా కొట్టడం వంటి కేసుల్లో నిందుతునిగా ఉండి రౌడీషీటర్ ఉన్నా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడంతో నోటీసు జారీ చేసినట్లు వివరించారు. ప్రజాశాంతికి, సామాన్య ప్రజా నీకానికి ఇబ్బందులు కలిగిస్తున్నాడనే ఫిర్యాదుల మేరకు అతడిపై తెలంగాణ సామాజిక వ్యతిరేక, ప్రమాదకర కార్యక్రమ చట్టం 1980 ప్రకారం జిల్లా బహిష్కరణ నోటీస్ జారీ చేశామని వెల్లడిచంచారు. ఆన్లైన్ బెట్టింగ్‌లో నష్టం.. అద్దెకు ఉంటున్న ఇంట్లో చోరీఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఆన్లైన్ బెట్టింగ్‌లకు అలవాటుపడిన యువకుడు, డబ్బుల కోసం అద్దెకు ఉ ంటున్న ఇంటికే కన్నం వేసిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగింది. ఎల్లారెడ్డిపేట ఎస్సై రమాకాంత్ తెలిపిన వివరాలు.. రుద్రంగి మండల కేంద్రానికి చెందిన కాసోజి విజయ్ మండల కేంద్రంలోని బందారపు గంగిరెడ్డి ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. విజ య్ స్థానికంగా ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చే స్తున్నాడు. ఇటీవల ఆన్లైన్ బెట్టింగ్‌కు అలవాటు పడ్డాడు. డబ్బు కోసం ఎనిమిదేళ్లుగా అద్దెకు ఉంటు న్న ఇంటిపైనే కన్నేశాడు. ఇటీవల ఇంట్లో ఎవరూ లేని సమయంలో చోరీకి పాల్పడ్డాడు. ఇంట్లో దాచి న 4 తులాల బంగారం గొలుసు, అర తులం కమ్మలు, ఐదు గ్రాముల ఉంగరం, అర తులం చైన్ ఎత్తుకెళ్లాడు. బాధితుడు గంగిరెడ్డి ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. మంగళవారం మండల కేంద్రంలోని కొత్తబస్టాండ్ ఏరియాలో విజయ్‌ని అదుపులోకి తీసుకొని విచారించగా దొంగతనం చేసినట్లు అంగీకరించగా, రిమాండ్‌కు తరలించారు. -
ఉన్న ఆస్తిని అమ్మేశారు
మాది హుజూరాబాద్‌లోని కాకతీయకాలనీ. నా భర్త శ్రవణ్‌కుమార్ బ్లడ్ క్యాన్సర్‌తో మరణించారు. మాకు ఇద్దరు ఆడపిల్లలు, ఒక కుమారుడు. రెక్కాడితే గానీ పూట గడవని పరిస్థితి. పిల్లల పోషణకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా. నా భర్త ఇల్లే నాకు ఆధారం. నాకు తెలియకుండా అత్త, మామ, ఆడపడచులు విక్రయించారు. ఇదెక్కడి అన్యాయమని సబ్ రిజిస్ట్రార్, సీఐని కలిస్తే న్యాయం జరగలేదు. గతంలోనే సబ్ రిజిస్ట్రార్‌ను కలిసి ఫిర్యాదు చేసిన. ఎలా రిజిస్ట్రేషన్ చేస్తారని అడిగితే మరిచిపోయానని చెబుతున్నారు. ఇప్పుడు నా కుటుంబానికి ఆధారమేదీ.. దయలేని అత్తమామలు రోడ్డున పడేశారు. – వీరగోని రవళి, హుజూరాబాద్ -
పోలీసుల క్రీడా సంరంభం
● నేటి నుంచి కరీంనగర్లో రాష్ట్ర స్థాయి పోలీస్ స్పోర్స్ట్ అండ్ గేమ్స్ ● 20 జోన్ల నుంచి హాజరుకానున్న 2,500 మంది క్రీడాకారులు ● పోటీలను ప్రారంభించనున్న ఇంటెలిజెన్స్ డీజీపీ శివధర్‌రెడ్డి సాక్షిప్రతినిధి, కరీంనగర్/కరీంనగర్‌క్రైం: మూడో రాష్ట్రస్థాయి పోలీస్ క్రీడాపోటీలు మంగళవారం నుంచి నాలుగు రోజులపాటు కరీంనగర్ పోలీస్ క్రీడామైదానంలో జరగనున్నాయి. కరీంనగర్ కమిషనరేట్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ పోటీలకు రాష్ట్రంలోని 20 పోలీస్ జోన్ల నుంచి 2,500 మంది క్రీడాకారులు హాజరుకానున్నారు. జిల్లా కేంద్రంలోని 12 వేదికలపై 29 క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించేందుకు సీపీ అభిషేక్ మహంతి ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తిచేశారు. మంగళవారం సాయంత్రం 4 గంటలకు హెడ్‌క్వార్టర్స్‌లోని పరేడ్ మైదానంలో జరిగే పోటీలను ఇంటెలిజెన్స్ డీజీపీ జి.శివధర్‌రెడ్డి ప్రారంభించనున్నారు. జిల్లా కేంద్రంలోని సీటీసీ, హెడ్ క్వార్టర్స్, అంబేడ్కర్ స్టేడియం, స్పోర్ట్స్ స్కూల్, సీపీటీసీ, కరీంనగర్ క్లబ్, జీఎస్ అకాడమీ తదితర ప్రాంతాల్లో పోటీలు నిర్వహిస్తారు. ఫుట్‌బాల్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, అథ్లెటిక్స్, హ్యాండ్‌బాల్, రెజ్లింగ్, స్విమ్మింగ్, వాటర్ స్పోర్ట్స్, షటిల్, జూడో, వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్, హాకీ, లాన్ టెన్నిస్, టేబుల్ టెన్నిస్, యోగా తదితర పోటీలు నిర్వహించనున్నారు. ఫిబ్రవరి ఒకటిన పోటీల ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీజీపీ జితేందర్ హాజరుకానున్నారు. స్పోర్ట్స్ కాంప్లెక్స్‌కు తాళం.. స్పోర్ట్స్ మీట్ కోసం కమిషనరేట్, అంబేడ్కర్ స్టేడియం, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ముందస్తు అనుమతితో ఏర్పాట్లు చేశారు. ఈనెల 20వ తేదీన అనుమతి కోసం పోలీసుశాఖ దరఖాస్తు చేసుకుంది. ఇందులో భాగంగా పోలీసులు వేడుకకు వచ్చేవారి కోసం స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో సోమవారం మధ్యాహ్నం మంచాలు, బెడ్లువేసి వెళ్లిపోయారు. తీర సాయంత్రం స్పోర్ట్స్ కాంప్లెక్స్‌కు తాళంవేసి ఉండటంతో పోలీసులు కంగుతిన్నారు. వాస్తవానికి ఇటీవలే ప్రారంభించిన సదరు స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రస్తుతం మున్సిపాలిటీ పరిధిలోనే ఉంది. దాన్ని అధికారులు పూర్తిగా స్వాధీనం చేసుకోలేదు. వెంటనే విషయాన్ని కరీంనగర్ పోలీసు ఉన్నతాధికారులు డీజీపీ కార్యాలయానికి చేరవేశారు. దీంతో డీజీపీ జితేందర్ రంగంలోకి దిగి వ్యవహారాన్ని చక్కదిద్దారని సమాచారం. అయినా.. సోమవారం అర్ధరాత్రి వరకూ.. తాళాలు అలాగే వేసి ఉండటంతో ఈవెంట్‌కు వచ్చే అతిథులు ఎక్కడ ఉంటారన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. ఈనెల మూడో తేదీ నుంచి ఇదే పనుల్లో తలమునకలైన పోలీసులు స్పోర్ట్స్ కాంప్లెక్స్‌కు తాళం వేసి ఉండటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. కరీంనగర్‌కు ప్రతిష్టాత్మకం క్రీడావేడుకకు కలిగిన ఆటంకాలపై నేనేం మాట్లాడను. నాకు పనే ముఖ్యం. కరీంనగర్ జిల్లాకు ఈ వేడుక ప్రతిష్టాత్మకం. సుమారు 2,200 మంది పోలీసులు హాజరవుతున్న ఈ క్రీడాపండుగలో 27 క్రీడా అంశాలలో పోటీలు జరుగుతున్నాయి. పదేండ్లుగా జరగని ఈ క్రీడాపండుగకు ఈసారి కరీంనగర్ వేదిక కావడం సంతోషకరం. దీన్ని విజయవంతం చేస్తాం. – సీపీ అభిషేక్ మహంతి -
పాలక.. వీడ్కోలిక
● ముగియనున్న బల్దియా కౌన్సిల్ ● నేడు ఆత్మీయ వీడ్కోలు సమావేశంకరీంనగర్ కార్పొరేషన్: నగరపాలకసంస్థ పాలకవర్గ పదవీకాలం మంగళవారంతో ముగియనుంది. ఇతర మున్సిపాల్టీల పదవీ కాలం ఈ నెల 26తోనే ముగిసింది. కానీ 2020లో ఎన్ని కలకు ముందు డివిజన్ల పునర్విభజన అశాసీ్త్రయంగా ఉందంటూ కొంతమంది కోర్టును ఆశ్రయించడంతో కరీంనగర్లో రెండురోజులు ఆలస్యంగా ఎన్నికలు జరిగాయి. దీంతో ఇతర మున్సిపాల్టీలతో పోల్చితే రెండురోజుల తర్వాత నగరపాలక పదవీకాలం ముగుస్తోంది. నిధుల వరద 2020 జనవరి 29న బాధ్యతలు చేపట్టిన ప్రస్తుత పాలకవర్గం హయాంలో నిధులు వరదలా వచ్చాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా సుమారు రూ.1,700 కోట్లతో న గరంలో వివిధ అభివృద్ధి పనులు జరిగాయి. స్మార్ట్ సిటీ నిధులు రూ.930 కోట్లతో నగరంలోని జంక్షన్లు, రో డ్లు, 24/7 తాగునీటి సరఫరా తదితర పనులతో నగర రూపురేఖలు మారిపోయాయి. అలాగే అమృత్ 1 కింద రూ.132 కోట్లు, అమృత్ 2 కింద 147 కోట్లు తాగునీటి సరఫరా కోసం కేటాయించారు. సాధారణ నిధులు రూ.200 కోట్లు, పట్టణ ప్రగతి నిధులు రూ.80 కోట్లు, 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.40 కోట్లు, ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులు రూ.5 కోట్లు, సపాయి మిత్ర సురక్షా కింద వచ్చిన రూ.4 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు. ఆరోపణలు.. ఫిర్యాదులు ప్రస్తుత పాలకవర్గ హయాంలో ఆరోపణలు, ఫిర్యాదులు వెల్లువెత్తాయి. స్మార్ట్ సిటీ పనుల్లో నాణ్యత లోపించిందని అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కయ్యారంటూ కార్పొరేటర్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఒక్క గాంధీ జంక్షన్ అభివృద్ధికి సంబంధించి బిల్లులు అధికంగా చెల్లించారంటూ ‘సాక్షి’లో వచ్చిన కథనం మేరకు అప్పటి ఇన్చార్జి కమిషనర్, అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ సంబంధిత కాంట్రాక్టర్ నుంచి డబ్బులు రికవరీ చేయించడం బల్దియా చరిత్రలో మొదటిదిగా నిలిచింది. నేడు వీడ్కోలు సమావేశం నగరపాలక పాలకవర్గ పదవీకాలం ముగుస్తున్నందున మంగళవారం ఉదయం 11 గంటలకు నగరపాలక స మావేశ మందిరంలో జరిగే వీడ్కోలు సమావేశానికి కా ర్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, ఎక్స్ అఫిషియో సభ్యులు హాజరుకావాలని మేయర్ యాదగిరి సునీల్‌రావు, నగరపాలక కమిషనర్ చాహత్ బాజ్‌పేయ్ కోరారు. -
అక్రమ పట్టాలు రద్దు చేయాలి
మూడుదశాబ్దాల క్రితం దొరల వద్ద భూములు కొనుగోలు చేశాం. 30 ఏళ్లుగా పంటలు పండిస్తున్నం. కాస్తు, కబ్జాలో మేమే ఉన్నాం. కానీ ఓ తహసీల్దార్, ఆర్ఐ ఏలాంటి విచారణ లేకుండానే 2006లో సంబంధం లేని వ్యక్తుల పేరిట భూ రికార్డులో నమోదు చేశారు. అప్పటి నుంచి పోరాటం చేస్తున్నాం. అక్రమంగా పట్టా చేసుకుని మమ్మల్ని భయాభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఉన్నతాధికారులు మోఖాపై విచారణ జరిపి సదరు పట్టాలను రద్దు చేసి మాకు శాశ్వత పరిష్కారం చూపాలి. – కోరపల్లి–వెంకటేశ్వరపల్లి గ్రామస్తులు, జమ్మికుంటరహదారి విస్తరణ ఆపండి ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేసేలా స్థలమున్నా నిబంధనలు మార్చి రోడ్లను నిర్మిస్తున్నారు. వంద గజాల్లో రహదారిని నిర్మించే అవకాశమున్నా కావాలని ఇబ్బందులు సృష్టిస్తున్నారు. 125 గజాల పేరుతో ఆర్అండ్బీ ఉత్తర్వులు జారీ చేయడం చాలా ఇబ్బందికరం. వంద గజాలకు మించి నిర్మాణాలుండవని, గతంలోనే సెట్‌బ్యాక్ చేసి నిర్మాణాలు చేసుకున్నాం. తీరా 125 గజాలని సర్క్యులర్ తెచ్చి నిర్మాణాలను కూల్చే ప్రయత్నం చేస్తే ఊరుకోం. ఉన్నతాధికారులు చొరవ చూపి పరిష్కారం చూపాలి. – ఆర్వోబీ జేఏసీ సభ్యులు, తీగలగుట్టపల్లి, కరీంనగర్ -
బీజేపీలో చేరితే భయమెందుకు..?
● నగర మేయర్ యాదగిరి సునీల్రావుకరీంనగర్కార్పొరేషన్: తాను బీజేపీలో చేరితో బీఆర్ఎస్ నాయకులు ఎందుకు భయపడుతున్నారని నగర మేయర్‌యాదగిరి సునీల్‌రావు ప్రశ్నించారు. తన ఐదేండ్ల పాలనలో నగరంలో జరిగిన పనులు, పదేండ్లలో కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన పనులపై విచారణ జరిపించాలని కోరారు. సోమవారం నగరంలోని ఎస్బీఎస్ ఫంక్షన్హాల్లో మాట్లాడారు. నగర అభివృద్ధికి బండి సంజయ్ నిధులు తెచ్చాడని, భవిష్యత్‌లోనూ నగర అభివృద్ధి కొనసాగాలనే తాను బీజేపీలో చేరానన్నారు. కానీ తాను బీజేపీలో చేరిననాటి నుంచి బీఆర్ఎస్ నేతలకు నిద్రపట్టడం లేదన్నారు. వాళ్ల అవినీతి చిట్టా బయటపెడుతానని భయపడుతున్నట్లున్నారని చెప్పారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్పొరేటర్లతో కలిసి తనపై అవిశ్వాసం పెడుతుండడాన్ని అపహాస్యం చేశారు. పదవీ కాలం ముగిసిన తర్వాత అవిశ్వాసం పెట్టుకోవచ్చని చమత్కరించారు. ఈ నెల 29న ప్రత్యేక అధికారి బాధ్యతలు తీసుకున్న తర్వాత ఐదేళ్లలో జరిగిన పనులపై జిల్లా కలెక్టర్ విచారణ చేపట్టాలని కోరారు. ఓ నాయకుడి వలె తాను అన్ని నగరాల్లో ఫామ్‌హౌస్‌లు కట్టుకోలేదని, తన బినామీల లాగా చిప్పలు కడిగి, ఇప్పుడు రూ.500 కోట్లకు ఎదగలేదన్నారు. వేసిన బీటీ రోడ్లు మళ్లీ వేసి బిల్లులు తీసుకున్నది ఆ నాయకుడి బినామీలేనన్నారు. ఇసుకపై కేంద్ర విజిలెన్స్‌కు ఫిర్యాదు చేస్తానని పేర్కొన్నారు. వచ్చే బల్దియా ఎన్నికల్లో బీఆర్ఎస్కు సింగిల్ డిజిట్ కూడా దాటనీయమన్నారు. సమావేశంలో బీజేపీ కార్పొరేటర్లు దుర్శేడ్ అనూప్‌కుమార్, కాసర్ల ఆనంద్, రాపర్తి విజయ, నాయకులు బండ రమణారెడ్డి, నాగవల్లి భాస్కర్, నాగసముద్రం ప్రవీణ్, కొండపల్లి సతీశ్, చంద్రమౌళి, కన్నం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సమస్యల పరిష్కారానికి కృషిజమ్మికుంట(హుజూరాబాద్): మున్సిపల్ పరిధిలో ప్రధాన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ అన్నారు. సోమవారం జమ్మికుంట మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్‌గా బాధ్యతలు స్వీకరించి మాట్లాడారు. పన్నుల వసూళ్లలో రాష్ట్రంలో ముందడుగులో ఉన్న జమ్మికుంట మున్సిపాలిటీ అభివృద్ధిలో ముందు ఉండేలా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. పట్టణంపై అవగాహన ఉందని, ఏలాంటి సమస్యలైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. అంతకముందు అదనపు కలెక్టర్‌ను మున్సిపల్ కమిషనర్ ఎండీ అయాజ్ శాలువతో సత్కరించి, మొక్క అందజేశారు. కార్యక్రమంలో మేనేజర్ రాజిరెడ్డి, ఏఈ నరేశ్, టీపీవో శ్రీధర్, సీనియర్ అసిస్టెంట్లు భాస్కర్, వాణి, సిబ్బంది పాల్గొన్నారు.నాలుగువందల ఇళ్లు కట్టిస్తే పోటీ చేయను● ఎమ్మెల్యేకు మాజీ ఎమ్మెల్యే సవాల్మానకొండూర్: కనీసం నాలుగువందల ఇళ్లు కట్టించి, బిల్లులు ఇప్పిస్తే తాను ఇక్కడి నుంచి పోటీ చేయనని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు సవాల్ విసిరారు. సోమవారం మానకొండూర్‌లో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావుతో కలిసి మాట్లాడారు. పథకాల పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం లబ్ధిదారుల ఆశలపై నీళ్లు చల్లుతుందన్నారు. ఎంతో గొప్పగా పథకాలు తీసుకువస్తున్నామని హడావుడిగా నియోజకవర్గంలో పోస్టర్లు అంటిస్తూ ప్రచారం చేసుకుంటున్నారని హేళన చేశారు. నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరైతే గ్రామసభల్లో చదివిన లిస్టులో 40 వేల మందికి ఎలా ఇళ్లు కట్టిస్తారని ప్రశ్నించారు. రైతు భరోసా రూ.15 వేల నుంచి రూ.12 వేలు ఇస్తామన్నప్పుడే మీ పతనం మొదలైందన్నారు. దయచేసి ప్రజలు ఇళ్లకు ముగ్గులు పోసుకుని అప్పులపాలు కావద్దన్నారు. ప్రభుత్వం వద్ద డబ్బులు ఉంటే ఆదివారమే రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద డబ్బులు వేసేవారని, ఎన్నికలకోసమే ఈ జిమ్మిక్కులన్నారు. మాజీ జెడ్పీటీసీ తాళ్లపల్లి శేఖర్‌గౌడ్, మాజీ సర్పంచ్ రామంచ గోపాల్‌రెడ్డి, నాయకులు శాతరాజు యాదగిరి, నెల్లి శంకర్, బాలెంకి మల్లేశం పాల్గొన్నారు.