ఆటో బోల్తా.. ఐదుగురికి గాయాలు
నరసాపురం: 216 జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం పట్టణంలోని రుస్తుంబాద ప్రాంతంలోని విద్యార్థులను తీసుకెళ్తున్న ఆటో బోల్తా కొట్టింది. అదృష్ట వశాత్తు ఆటోలో తక్కువ మందే ఉండటం, పరిమిత వేగంతో వెళ్తున్న కారణంగా ప్రమాదం తప్పింది. ఐదుగురు విద్యార్థులకు స్వల్ప గాయలు అయ్యాయి. సీతారామపురం నుంచి ఆటోలో నలుగురు కాలేజ్ విద్యార్థులు, ముగ్గురు కాన్వెంట్ విద్యార్థులను ఎక్కించుకుని ఆటో నరసాపురం వైపు వస్తోంది. ఎదురుగా వేగంగా వస్తున్న మోటార్‌బైక్‌ను తప్పించబోయి ఆటో అదుపు తప్పి రోడ్డు దిగువకు బోల్తా కొట్టి పడిపోయింది. అక్కడున్న ఓ అపార్ట్‌మెంట్ ప్రహరీ గోడకు గుద్దుకుని నిలిచిపోయింది. అటుగా వెళ్తున్న వారు వెంటనే అందులో ప్రయాణిస్తున్న విద్యార్థులను బయటకు తీశారు.
స్విమ్మింగ్ చాంపియన్‌కు సన్మానం
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): 35వ జాతీయ సౌత్ జోన్ స్విమ్మింగ్ పోటీల్లో 50 మీటర్ల బటర్‌ఫ్‌లై విభాగంలో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం సాధించిన బలగ స్వామినాయుడుని గురువారం స్థానిక శ్రీ సూర్య ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో ఘనంగా సన్మానించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న జిల్లా క్రీడాభివృద్ధి అధికారి బి.శ్రీనివాస్ మాట్లాడుతూ క్రీడలనే ఉపాధి మార్గం చేసుకుంటూ ఎంతోమంది క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విశేషంగా రాణిస్తున్నారని తెలిపారు. వీరిని ఆదర్శంగా తీసుకుని యువ క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని సూచించారు. క్రీడల్లో రాణించడం ద్వారా ఉద్యోగావకాశాలూ మెరుగుపడతాయని స్పష్టం చేశారు. పాఠశాల డైరెక్టర్ కొండపల్లి చంద్రశేఖర్ జాతీయ స్థాయిలో పతకం సాధించిన విద్యార్థికి రూ.10 వేలు పురస్కారం అందించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు దేవరకొండ శ్రీనివాస్, నున్న స్వాతి కిషోర్, వందనాల దుర్గ భవాని శ్రీనివాస్, ఆర్నేపల్లి తిరుపతి, సూర్య స్కూల్ డైరెక్టర్ కొండపల్లి చంద్రశేఖర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment