TS Special
-
పాలమూరు ప్రాజెక్టులన్నీ పూర్తిచేస్తాం
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తిచేయా లని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని నీటిపారుదలశాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్‌రెడ్డి ప్రకటించారు. సోమవారం సచివాలయంలో పాలమూరు–రంగారెడ్డి, నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకం, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులపై మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి డాక్టర్ వంశీచంద్‌రెడ్డి, ఎమ్మెల్యేలు యెన్న ం శ్రీనివాస్‌రెడ్డి(మహబూబ్‌నగర్), వాకిటి శ్రీహరి ముదిరాజ్(మక్తల్), జి.మధుసూదన్ రెడ్డి (దేవరకద్ర), డాక్టర్ చిట్టెం పర్ణికారెడ్డి (నారాయణపేట)లతో కలిసి, సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కొడంగల్, నారాయణ పేట, మక్తల్ నియోజవర్గాలకు నీరందించడానికి వీలుగా నారాయణపేట–కొడంగల్ ఎత్తి పోతల పథకం చేపట్టడానికి వీలుగా 2014 మే 28వ తేదీన ఉత్తర్వులుజారీ చేశారని, ఆ ప్రాజె క్టును చేపడితే కొడంగల్, నారాయణపేట, మక్తల్ నియోజకవర్గాలకు నీరందేదని, దీనికోసం రూ.133.86 కోట్లను మంజూరు చేస్తూ ప్రభుత్వం పరిపాలన అనుమతినిచ్చినా, ఆ పథకాన్ని చేపట్టలేదని, నివేదించారు. తక్షణమే ఆ ప్రాజెక్టు నిర్మాణ పనులకు అనుమతినివ్వా లని వీరు నివేదించగా... మంత్రి సానుకూలంగా స్పందిస్తూ త్వరలోనే పనులపై నిర్ణయం తీసుకుంటామన్నారు. రేవంత్‌రెడ్డి పట్టుదలతో 2014 మేనెలలోనే నారాయణపేట– కొడంగల్ ఎత్తిపోతలకు ప్రభుత్వం పరిపాలన అనుమతినిస్తే... గత ప్రభుత్వం పక్కన పెట్టిందని ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్ రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వం పథకాన్ని చేపట్టి ఉంటే లక్ష ఎకరాలకు పైగా నీరందేదని గుర్తు చేశారు.కోయిల్గర్ ప్రాజెక్టు సామర్థ్యం మరో రెండు టీఎంసీలు పెంచాలని మంత్రి ఉత్తమ్‌ను కోరామని మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. 2014లోపే ఉమ్మడి జిల్లాలో 70 శాతం ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయని, 7 లక్షల ఎకరాలకు నీరందించే ప్రాజెక్టును పక్కనపెట్టి, రూ.50 వేల కోట్లతో రీ ఇంజనీరింగ్ పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం చేపట్టారని, రూ.30 వేల కోట్లు వెచ్చించినా ఒక్క ఎకరాకు ఈ పథకంతో నీరందలేదని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి మండిపడ్డారు. ఉద్దేశపూర్వకంగానే జీఓ నంబరు 69ని గత ప్రభుత్వం పక్కనపెట్టిందని ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి మండిపడ్డారు. పాలమూరులో వలసలు తగ్గలేదు మహబూబ్‌నగర్ అంతా పచ్చగా లేదని, ఇంకా నీటి గోసతో అల్లాడుతుందని మహబూబ్ నగర్లో ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం మంత్రిని కలిసిన అనంతరం సచివాలయ మీడియా పాయింట్ వద్ద విలేకరులతో వారు మాట్లాడారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో మహబూబ్‌నగర్ జిల్లాకు చేసిందని శూన్యమని నిప్పులు చెరిగారు. వలసలు తగ్గలేదని..వలపోత ఆగలేదన్నారు. ముంబై బస్సు రావడం ఆగలేదు...పనుల కోసం ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లకా తప్పలేని పరిస్థితి అని ధ్వజమెత్తారు. ఏదో చేశామని చెబుతున్న బీఆర్ఎస్ ఏం చేసిందో చెప్పాలని నిలదీశారు. ఒక్క పిల్ల కాల్వ నుంచి ఒక ఎకరానికి నీళ్లు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. పేపర్లు, మాటల మీద పని తప్పా...ఎక్కడా అభివృద్ధి జరగలేదని మండిపడ్డారు. -
హెచ్ఎండీఏలో ‘ఏసీబీ’ ప్రకంపనలు
సాక్షి, హైదరాబాద్: హెచ్ఎండీఏలో ఏసీబీ దాడులు ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణపై దాడుల నేపథ్యంలో ఏ క్షణంలో ఏం జరుగుతుందోననే ఆందోళన నెలకొంది. బాలకృష్ణ ఇంటిపై దాడులు అనంతరం ఏసీబీ అధికారులు తమ దర్యాఫ్తులో భాగంగా హెచ్ఎండీఏపై దృష్టి సారించారు. గత మూడేళ్లలో ప్రణాళికా విభాగం నుంచి ఇచి్చన అనుమతులకు సంబంధించిన ఫైళ్లను పరిశీలించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. ఈ క్రమంలో ఆదివారం సెలవు దినమైనప్పటికీ ప్రణాళికా విభాగానికి చెందిన ప్లానింగ్ అధికారులు, ఏపీఓలు, జేపీలు, ఇతర సిబ్బంది విధుల్లో పాల్గొన్నారు. మరోవైపు ఈ మూడేళ్ల అనుమతులకు సంబంధించిన ఫైళ్లను హెచ్ఎండీఏ కమిషనర్ దానకిషోర్‌కు కూడా అధికారులు అందజేశారు. శంకర్పల్లి, శంషాబాద్, ఘటకేసర్, మేడ్చల్ జోన్లలో పెద్ద సంఖ్యలో వివిధ రకాల అనుమతుల కోసం దరఖాస్తులు వెల్లువెత్తాయి. టీఎస్‌బీపాస్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నప్పటికీ కొందరు అధికారులు ‘డాక్యుమెంట్ల పరిశీలన’సాకుతో అక్రమార్జన కోసం నిబంధనలను ఉల్లంఘించి అనుమతులు ఇచ్చారు. కన్జర్వేషన్ జోన్లలో ఉన్న భూములను యథేచ్చగా కమర్షియల్, రెసిడెన్షియల్ జోన్లలోకి మార్చేశారు. హైదరాబాద్ గ్రోత్ కారిడార్ పరిధిలోనూ ఇలాంటి అక్రమాలు చాలా జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికలకు ముందు వట్టి నాగులపల్లి ప్రాంతానికి చెందిన సుమారు 70 భూమారి్పడి ఫైళ్లకు ఆగమేఘాల మీద అనుమతులు ఇవ్వడం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అదే తరహాలో మరిన్ని అక్రమ అనుమతులు ఇచి్చనట్లు లభించిన సమాచారం ఆధారంగా ఏసీబీ అధికారులు హెచ్ఎండీఏ ప్రణాళికా విభాగంపై దృష్టి సారించినట్లు తెలిసింది. ఔటర్ సమీపంలో ఉన్న మణికొండ, పుప్పాలగూడ, కోకాపేట్, నార్సింగి, మంచిరేవుల, తదితర ప్రాంతాల్లో బహుళ అంతస్తుల భవనాల నిర్మాణంలో పెద్ద ఎత్తున నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. గ్రోత్ కారిడార్‌లో భవిష్యత్తులో వాహనాల రద్దీని నియంత్రించేందుకు సమాంతర రహదారుల కోసం కేటాయించిన భూముల్లో పలుచోట్ల ఇలాంటి ఉల్లంఘనలు జరిగినట్లు తెలిసింది. మరోవైపు బాలకృష్ణ ఇంటిపై దాడులు, అతడి అరెస్టు, రిమాండ్ అనంతరం వెలుగులోకి వచి్చన అక్రమ ఆస్తులకు సంబంధించి రోజుకో కొత్త విషయం బయట పడుతుండడంతో హెచ్ఎండీఏ అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. అడ్డగోలుగా అనుమతులు ప్రస్తుతం ఏసీబీ.. బాలకృష్ణకు నమ్మిన బంట్లుగా ఉండి ఆయనకు అన్ని విధాలుగా సహకరించిన కొందరు అధికారులపై ప్రధానంగా ఫోకస్ పెట్టినట్లు తెలిసింది. లే అవుట్లు, భవన నిర్మాణాలు, ప్రత్యేకించి హైరైజ్ భవనాల కోసం అడ్డగోలుగా అనుమతులు ఇచ్చారు. కొన్నిచోట్ల పర్యావరణ సంస్థలు విధించిన ఆంక్షలను సైతం పక్కన పెట్టి, నీటివనరులు ఉన్న చోట భవనాలకు అనుమతులిచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. అలాగే పారిశ్రామిక ప్రాంతాల్లో నివాస సముదాయాలు వెలిశాయి. ఇలాంటి అనుమతులను ఇచ్చేందుకు ఒకరిద్దరు ఏపీఓ స్థాయి అధికారులు బాలకృష్ణకు ప్రధాన అనుచరుల మాదిరి వ్యవహరించినట్లు సమాచారం. ఈ క్రమంలో వారు సైతం రూ.కోట్లలో అక్రమార్జనకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక కీలకమైన జోన్లో పని చేస్తున్న ఒక ఏపీఓ బాలకృష్ణకు అత్యంత సన్నిహితుడిగా ఉండి అన్ని రకాల వ్యవహారాలు చక్కబెట్టినట్లు తెలిసింది. దీంతో ఏసీబీ అధికారులు ఆ ఏపీఓపై ప్రధానంగా దృష్టి సారించినట్లు సమాచారం. మరోవైపు బాలకృష్ణపై ఏసీబీ దాడుల అనంతరం ఒకరిద్దరు వ్యక్తిగత కారణాలు చూపుతూ దీర్ఘకాలిక సెలవుపై వెళ్లడం గమనార్హం. -
ట్రాన్స్‌కో, జెన్కో డైరెక్టర్ పోస్టులకు నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర విద్యుత్ సరఫరా సంస్థ (టీఎస్ ట్రాన్స్‌కో), తెలంగాణ రాష్ట్ర విద్యుదుత్పాదన సంస్థ (టీఎస్ జెన్కో)లలో కొత్త డైరెక్టర్ల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం సోమవారం వేర్వేరు నోటిఫికేషన్లు జారీ చేసింది. ట్రాన్స్‌కో డైరెక్టర్ (గ్రిడ్, ట్రాన్స్మిషన్), డైరెక్టర్(ఫైనాన్స్), డైరెక్టర్ (ప్రాజెక్ట్స్) పోస్టులతోపాటు జెన్కో డైరెక్టర్ (జలవిద్యుత్), డైరెక్టర్ (థర్మల్, ప్రాజెక్టులు), డైరెక్టర్ (హెచ్ఆర్ అండ్ ఐఆర్), డైరెక్టర్ (కోల్–లాజిస్టిక్స్), డైరెక్టర్ (ఫైనాన్స్–కమర్షియల్) పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానించింది. దరఖా స్తుదారుల వయసు 62 ఏళ్లలోపు ఉండాలని స్పష్టం చేసింది. ట్రాన్స్‌కో, జెన్కో డైరెక్టర్ల పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి మార్చి 1ని చివరి తేదీగా నిర్ణయించింది. త్వరలోనే డిస్కమ్‌ల డైరెక్టర్ పోస్టులకు కూడా నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక.. ట్రాన్స్‌కో, జెన్కో, టీఎస్ఎస్పీడీసీఎల్, టీఎస్ఎన్పీడీసీఎల్ సంస్థల్లో డైరెక్టర్లుగా సంబంధిత విభాగాల్లో అనుభవం, పరిజ్ఞానం కలిగిన అర్హులైన ఇన్ సర్వీస్, రిటైర్డ్ విద్యుత్ అధికారులను ప్రభుత్వం ఎంపిక చేయనుంది. డైరెక్టర్ల నియమకానికి మార్గదర్శకాలను జారీ చేస్తూ 2012 మే 14న జారీ చేసిన జీవో 18 ప్రకారం.. ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఇంటర్వ్యూ నిర్వహించి ఒక్కో డైరెక్టర్ పోస్టుకు ముగ్గురి పేర్లతో షార్ట్ లీస్టును రూపొందించి ప్రభుత్వానికి సిఫారసు చేయనుంది. ఈ కమిటీలో ఆయా విద్యుత్ సంస్థల సీఎండీలు కన్వీనర్లుగా, రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థల శాఖ ముఖ్యకార్యదర్శి, ప్రభుత్వం నామినేట్ చేసే విద్యుత్‌రంగ ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ సభ్యులుగా ఉండనున్నారు. కమిటీ సిఫారసు చేసిన షార్ట్ లిస్టు లోని ముగ్గురు వ్యక్తుల నుంచి ఒకరిని డైరెక్టర్‌గా నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఇక పదవీ కాలం రెండేళ్లు మాత్రమే.. డైరెక్టర్ పదవి కాలం రెండేళ్లు మాత్రమే. పనితీరును మదించడం ద్వారా సెలక్షన్ కమిటీ సిఫారసులతో మరో ఏడాది, ఆ తర్వాత కూడా ఇంకో ఏడాది పొడిగించడానికి వీలుంది. -
రెండు దరఖాస్తులు చాలు
సాక్షి, హైదరాబాద్: జాతీయ స్థాయిలో వైద్య విద్య కౌన్సెలింగ్, అడ్మిషన్ల ప్రక్రియను జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) సరళతరం చేసింది. ఎయిమ్స్ వంటి జాతీయస్థాయి మెడికల్ కాలేజీలతోపాటు రాష్ట్రాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం జరిగే కౌన్సెలింగ్లకు పదుల సంఖ్యలో దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేకుండా విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు దేశవ్యాప్తంగా ఉన్న లక్షకుపైగా ఎంబీబీఎస్ సీట్లకు కేవలం రెండు దరఖాస్తులతో పోటీపడొచ్చు. ఇందులో ప్రైవేటు కాలేజీల కోసం ఒకటి, ప్రభుత్వ కాలేజీల కోసం మరో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఎక్కడ సీటు వస్తే అక్కడ చేరవచ్చు. విద్యార్థి కోరుకున్నచోట సీటు రాకుంటే.. తదుపరి కౌన్సెలింగ్‌లలో పాల్గొనవచ్చు. దీనిపై త్వరలోనే ఆదేశాలు వెలువడనున్నాయని ఎన్ఎంసీ వర్గాలు తెలిపాయి. 2024–25 వైద్య విద్యా సంవత్సరం నుంచే ఈ విధానం అమల్లోకి రానుందని వెల్లడించాయి. జాతీయ స్థాయి మెరిట్ అయినా వేర్వేరుగా..: దేశవ్యాప్తంగా 681 మెడికల్ కాలేజీల్లో 1.04 లక్షల ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఎంఎస్, ఎండీ, డీఎన్బీ ఇలా 67,802 పీజీ మెడికల్ సీట్లున్నాయి. జాతీయ, రాష్ట్రస్థాయి రెండింటిలోనూ సీట్లను నీట్ ప్రవేశపరీక్ష ర్యాంకుల ఆధారంగా కౌన్సెలింగ్ నిర్వహించి భర్తీ చేస్తారు. ప్రస్తుతం ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల కోసం అఖిల భారత ర్యాంకు ఆధారంగా మెరిట్ జాబితాను తయారు చేస్తున్నారు. అభ్యర్థులు తమ రాష్ట్ర పరిధిలో దరఖాస్తు చేసుకున్నప్పుడు.. వారిని రాష్ట్ర కేటగిరీగా గుర్తించి, తదనుగుణంగా మెరిట్ జాబితాలను తయారు చేసేవారు. కేంద్ర ప్రభుత్వం అన్ని మెడికల్ కాలేజీల్లోని 15శాతం ఆలిండియా కోటా సీట్లకు, డీమ్డ్ యూనివర్సిటీలు, సెంట్రల్ యూనివర్సిటీలు, ఈఎస్ఐసీ, ఏఎఫ్ఎంసీ, బీహెచ్‌యూ, ఏఎంయూ కాలేజీల్లో సీట్ల భర్తీ కోసం కౌన్సెలింగ్ నిర్వహించేది. అభ్యర్థులెవరైనా ఈ 15 శాతం ఆలిండియా కోటా సీట్లకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక రాష్ట్ర కోటా, రాష్ట్రాల పరిధిలోకి వచ్చే ఇతర సీట్లకోసం అభ్యర్థులు తమ సొంత రాష్ట్రాల్లోని కాలేజీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రాల్లో కౌన్సెలింగ్ అధికారులు కూడా.. ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లోని సీట్లకు ఆలిండియా ర్యాంకుల ఆధారంగా మెరిట్ జాబితాలు తయారు చేసి అడ్మిషన్లు చేస్తారు. ప్రైవేట్ సీట్లకూ జాతీయస్థాయి కౌన్సెలింగ్ ప్రస్తుతం రాష్ట్రాల్లోని ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ సీట్లకు ఆయా రాష్ట్రాల్లోనే కౌన్సెలింగ్ జరుగుతోంది. వాటిలో కనీ్వనర్ కోటాకు వేరుగా, బీ కేటగిరీ, ఎన్నారై కోటాల సీట్లకు వేర్వేరుగా కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. వీటిలోని ఓపెన్ కేటగిరీ సీట్లకు దేశంలోని ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ కౌన్సెలింగ్ కోసం వేర్వేరుగా దరఖాస్తులు చేసుకోవాల్సి వస్తోంది. ఎన్ఎంసీ నిర్ణయం అమల్లోకి వస్తే.. ఇకపై దేశవ్యాప్తంగా ఉన్న ప్రైవేటు కాలేజీల్లోని వివిధ కేటగిరీల సీట్లకు ఒకే దరఖాస్తు సరిపోతుంది, ఒకేసారి కౌన్సెలింగ్ జరుగుతుంది. ► ఉదాహరణకు తెలంగాణలోని ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో ఉన్న బీ కేటగిరీ సీట్లలో 85శాతం స్థానికులకు కేటాయించగా, మిగతా 15శాతం ఓపెన్ కేటగిరీ సీట్లకు దేశంలోని ఏ రాష్ట్రం వారైనా పోటీపడొచ్చు. ఈ ఓపెన్ కేటగిరీ రిజర్వేషన్లు వివిధ రాష్ట్రాల్లో వేర్వేరుగా ఉన్నాయి. ఒకే దరఖాస్తు ద్వారా ఆయా రాష్ట్రాల్లోని కాలేజీల్లో ఎక్కడో ఒకచోట సీటు పొందవచ్చు. నచ్చినచోట చేరవచ్చని, లేకుంటే తదుపరి కౌన్సెలింగ్‌లో పాల్గొనవచ్చని ఎన్ఎంసీ అధికారులు చెప్తున్నారు. ► గత ఏడాది దేశవ్యాప్తంగా 20.87 లక్షల మంది నీట్ యూజీ పరీక్ష రాశారు. మొత్తం 11,45,976 మంది అర్హత సాధించగా.. అందులో ఏపీ నుంచి 42,836, తెలంగాణ నుంచి 42,654 మంది ఉన్నారు. ఒకేసారి విస్తృతంగా కౌన్సెలింగ్ ప్రస్తుత నిబంధనల మేరకు అభ్యర్థులు జాతీయ స్థాయి మెడికల్ కాలేజీల్లోని ఎంబీబీఎస్ సీట్లకు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాలి. డీమ్డ్ వర్సిటీల్లోని కాలేజీలకు వేరుగా, వివిధ రాష్ట్రాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీలకు వేర్వేరుగా దరఖాస్తులు చేసుకోవాలి. ఇలా పదుల సంఖ్యలో, కొందరైతే 50 నుంచి 60 దరఖాస్తులు చేసిన సందర్భాలూ ఉన్నాయి. రాష్ట్రాల్లోని కాలేజీల్లో 15% జాతీయ స్థాయి ఓపెన్ కోటాకు ఏ రాష్ట్రంవారైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటివరకు వీటికి ప్రత్యేకంగా కౌన్సెలింగ్ జరిగేది. ఆ కౌన్సెలింగ్ పూర్తయ్యాక రాష్ట్రాల్లోని మిగతా కనీ్వనర్ కోటా సీట్లకు కౌన్సెలింగ్ జరిపేవారు. ఈ ఏడాది నుంచి జాతీయ, రాష్ట్రస్థాయి సీట్లన్నింటికీ ఒకేసారి.. అంటే ఒకే తేదీల్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. -
బాలకృష్ణ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు
సాక్షి, హైదరాబాద్: హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణను ఏసీబీ మరో వారం రోజుల కస్టడీ కోరనున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో బాలకృష్ణ ఆమోదించిన ఫైల్స్, బినామీ ఆస్థులపై ఏసీబీ ఫోకస్ పెట్టింది. మరోవైపు.. బాలకృష్ణ రిమాండ్ రిపోర్ట్‌లో కీలక అంశాలను అధికారులు వెల్లడించారు. కాగా, లేఅవుట్ అనుమతుల కోసం బాలకృష్ణ భారీగా లంచాలు డిమాండ్ చేసినట్లు రిమాండ్ రిపోర్ట్ పేర్కొన్నారు. అప్లికేషన్లలో తప్పులు ఉన్నాయని లాభాలు పొందినట్టు తెలిపారు. ప్లాట్స్ నిర్మాణాల్లో విల్లాలను సైతం లంచంగా బాలకృష్ణ తీసుకున్నాడు. బాలకృష్ణ ఆధ్వర్యంలో హెచ్ఎండీఏ, రెరాలో భారీగా అక్రమాలు జరిగినట్టు స్పష్టం చేశారు. హెచ్ఎండీఏలోని మూడు జోన్లపై బాలకృష్ణకు మంచిపట్టు ఉందని గుర్తించారు. ఇక, హెచ్ఎండీఏలోని కీలక పోస్టులో బాలకృష్ణ సుదీర్ఘంగా పనిచేశారు. మరోవైపు.. బాలకృష్ణను కస్టడీలోకి తీసుకున్నాక ఏసీబీ బ్యాంక్ లాకర్లను ఓపెన్ చేయనుంది. ఇదే సమయంలో బాలకృష్ణకు సహాయం చేసిన అధికారులపై కూడా విచారించనున్నారు. ఇదిలా ఉండగా.. వట్టి నాగులపల్లిలో ప్రభుత్వ భూముల యాజమాన్యం, వినియోగ హక్కుల మార్పిడిపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అక్రమాలు జరిగిన భూముల ఫైల్స్‌పై సాంకేతిక కమిటీ ఏర్పాటు చేసి విచారణ జరిపే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. వట్టి నాగులపల్లిలో ఎలక్షన్ కోడ్‌కు కొద్దిరోజుల ముందే పెద్ద ఎత్తున భూ వినియోగ మార్పిడి జరిగినట్టు అధికారులు గుర్తించారు. ఆ సమయంలో హెచ్ఎండీఏ డైరెక్టర్‌గా లేకపోయినా ఫైల్స్ ఆమోదంలో బాలకృష్ణ పాత్రపై ఏసీబీ అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఇక, హెచ్ఎండీఏ నుండి ఆరు నెలల క్రితమే బదిలీ అయి తెలంగాణ రేరా సెక్రటరీగా బాలకృష్ణ విధులు నిర్వహిస్తున్నారు. దీంతో, బాలకృష్ణ హయాంలో ఇచ్చిన అక్రమ అనుమతులపై ఏసీబీ దర్యాప్తు చేపట్టింది. అయితే, బాలకృష్ణ తన దగ్గరి బంధువులను ఔట్ సోర్సింగ్ ఉద్యోగులుగా నియమించుకుని అక్రమాలకు పాల్పడినట్టు అధికారులు గుర్తించారు. కొందరు పొలిటికల్ లీడర్లు కూడా అక్రమాలకు మధ్యవర్తులుగా వ్యవహరించినట్టు సమాచారం. -
HYD: పాస్‌పోర్టు స్కామ్ కేసులో దర్యాప్తు ముమ్మరం.. మరో ఇద్దరి అరెస్టు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో సంచలనం సృష్టించిన పాస్‌పోర్టుల కుంభకోణం కేసులో తెలంగాణ సీఐడీ దర్యాప్తును వేగవంతం చేసింది. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి అనర్హులకు పాస్ పోర్టులు జారీ చేసిన వ్యవహారంలో సీఐడీ మరో ఇద్దరిని అరెస్టు చేసింది. అనంతపురానికి చెందిన ఏజెంట్‌తో పాటు మరొకరిని సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. వీరి నుంచి పాస్‌పోర్టులు సహా పలు నకిలీ డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు ఈ కేసులో 12 మందిని సీఐడీ అరెస్టు చేయగా.. తాజా అరెస్టులతో ఈ సంఖ్య 14కి చేరింది. నిందితులందరిని కస్టడీకి తీసుకొని విచారించనుంది. ఇప్పటికే 92 నకిలీ పాస్‌పోర్టులను సీఐడీ గుర్తించింది. అరెస్టయిన ఏజెంట్ల నుంచి సేకరించిన సమాచారంతో 35కి పైగా పాస్‌పోర్టులు రద్దు చేసింది. దేశంలోని అన్ని విమానాశ్రయాలను అప్రమత్తం చేసింది. పలువురు నిందితులు ఇప్పటికే విదేశాలకు పారిపోయినట్లు గుర్తించింది.. మిగతావారినైనా దేశం దాటకుండా ఉండేందుకు లుక్అవుట్ నోటీసులు జారీ చేస్తోంది. పాస్‌పోర్టుల జారీలో కీలక పాత్ర పోషించిన స్పెషల్ బ్రాంచ్ అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకునేందుకు సీఐడీ అధికారులు రంగం సిద్ధం చేశారు. పాస్‌పోర్టు జారీ, ప్రక్రియ పూర్తయ్యేందుకు ఏజెంట్లు.. అధికారులకు లంచాలు ఇచ్చారని సీఐడీ ఆధారాలు సేకరించింది. -
కామారెడ్డి ఎమ్మెల్యే మరో సంచలన నిర్ణయం..
సాక్షి, కామారెడ్డి: అసెంబ్లీ ఎన్నికల సమయంలో సొంత మేనిఫెస్టో ప్రకటించడంతోపాటు, ఇద్దరు ఉద్ధండులను ఓడించి చరిత్ర సృష్టించిన కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి(కేవీఆర్) మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రోడ్డు విస్తరణ కోసం ముందుగా తన ఇంటిని కూల్చేందుకు ముందుకొచ్చారు. కామారెడ్డి పట్టణంలోని పాత బస్టాండ్ నుంచి అడ్లూర్ రోడ్డు వరకు విస్తరణకు ఎన్నో ఆటంకాలు ఎదురయ్యాయి. ఇదే రోడ్డులో ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఇల్లుతోపాటు మాజీ మంత్రి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ ఇల్లు కూడా ఉంది. ట్రాఫిక్ పెరగడంతోపాటు, పలుచోట్ల ఆక్రమణలతో ఈ రోడ్డు ఇరుకుగా మారింది. ఈ నేపథ్యంలో రోడ్డు విస్తరణ కోసం స్వచ్ఛందంగా తన ఇంటిని కూల్చేందుకు ఎమ్మెల్యే కేవీఆర్ సిద్ధమయ్యారు. శనివారం ఇంటి కూల్చివేత పనులు ప్రారంభించాలని నిర్ణయించారు. తన ఇంటితోనే రోడ్డు వెడల్పు పనులు జరిగేలా ప్రణాళిక రూపొందించిన ఆయన.. పదిరోజుల క్రితమే ఇంటిని ఖాళీ చేసి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి మారారు. వెయ్యి గజాలకుపైగా స్థలాన్ని మున్సిపల్ అధికారులు అప్పగించారు. మరోవైపు రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఇళ్ల యజమానులకు నోటీసులు ఇచ్చేందుకు బల్దియా అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఎమ్మెల్యే ఇంటిని కూల్చివేశాక రోడ్డు వెడల్పు పనులు ఏ మేరకు ముందుకు సాగుతాయో అన్న విషయమై పట్టణంలో చర్చ నడుస్తోంది. -
మెట్లెక్కకుండానే.. బస్సెక్కొచ్చు!
చింతపల్లి (దేవరకొండ): వృద్ధులైన అమ్మమ్మ, నానమ్మ బస్సు ఎక్కేందుకు పడుతున్న ఇబ్బందులను చూసిన ఓ తొమ్మిదో తరగతి విద్యార్థి.. మెట్లు ఎక్కకుండానే బస్సులోపలికి వెళ్లగలిగే ఓ పరికరాన్ని డిజైన్ చేశాడు. సైన్స్ పాఠాల్లోని పాస్కల్ సూత్రాన్ని ఆధారం చేసుకుని, థర్మాకోల్, సిరంజీలు, పైపులతో ప్రొటోటైప్‌ను సిద్ధం చేశాడు. నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం మాల్ వెంకటేశ్వరనగర్‌కు చెందిన తోలు చంద్రయ్య, చిట్టెమ్మ దంపతుల కుమారుడు అజయ్ ఘనత ఇది. అక్కడి జెడ్పీ హైసూ్కల్లో 9వ తరగతి చదువుతున్న అజయ్.. ఫిజిక్స్ టీచర్ శ్రీవిద్య సహకారంతో ‘పాస్కల్ డివైజ్ ప్రొటోటైప్’ను రూపొందించాడు. ఇందులో పాస్కల్ సూత్రం ఆధారంగా హైడ్రాలిక్ పద్ధతిలో పనిచేసే ఒక ప్లాట్‌ఫాం ఉంటుంది. బస్సు ఆగినప్పుడు డ్రైవర్ ఒక లీవర్ లాగితే.. ఆ ప్లాట్‌ఫాం డోర్ దగ్గర నేలపైకి వస్తుంది. దానిపైకి ప్రయాణికులు ఎక్కాక మరో లీవర్ లాగితే.. ఆ ప్లాట్‌ఫాం మెల్లగా పైకిలేచి బస్సులోపలికి వెళ్లేంత ఎత్తుకు చేరుతుంది. వారు నేరుగా బస్సులోపలికి వెళ్లొచ్చు. రాష్ట్రస్థాయి సైన్స్ ఫెస్టివల్లో ఆకట్టుకున్న ఈ ఎగ్జిబిట్.. సౌత్ ఇండియా స్థాయి సైన్స్ ఫెస్టివల్లో ప్రదర్శనకు ఎంపికైంది. ఈ నెల 27 నుంచి 29వ తేదీ వరకు విజయవాడలో ఆ ప్రదర్శన జరగనుంది. పెద్దవాళ్లు ఇబ్బంది పడటం చూసి.. ‘‘మా అమ్మమ్మ, నానమ్మ, పెద్దవాళ్లు, గర్భిణులు బస్సు ఎక్కే సమయంలో ఇబ్బందిపడటం చూశాను. వారు సులువుగా బస్సు ఎక్కేలా పరికరం తయారు చేయాలనే ఆలోచన వచ్చింది. మా సైన్స్ టీచర్ సహకారంతో ఈ పరికరానికి రూపకల్పన చేశాను. వృద్ధులు, గర్భిణులు, వికలాంగులు, కీళ్లనొప్పులున్న వారికి ఇది ఎంతో ప్రయోజనకరం. బరువైన లగేజీలను బస్సులోకి తీసుకెళ్లడానికి కూడా ఉపయోగపడుతుంది..’’ అని అజయ్ చెప్పాడు. ఇక పాస్కల్ డివైజ్‌తో ఎంతో ప్రయోజనం ఉంటుందని, దాతలు ముందుకొస్తే దాని ప్రొటోటైప్ ఆవిష్కరించేందుకు వీలవుతుందని టీచర్ శ్రీవిద్య తెలిపారు. -
HYD: పీజీ ఉమెన్స్ హాస్టల్లో కలకలం.. బాత్రూంలోకి చొరబడ్డ ఆగంతకులు
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని ఉస్మానియా మహిళా పీజీ కాలేజీ హాస్టల్లో కలకలం చోటుచేసుకుంది. శుక్రవారం అర్ధరాగర్ల్స్ హాస్టల్ బాత్రూమ్లోకి ఇద్దరు ఆగంతకులు చొరబడ్డారు. గమనించిన విద్యార్ధులు.. ఓ వ్యక్తిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని బంధించారు. మరో వ్యక్తి పరారయ్యాడు. విద్యార్ధుల చేతికి చిక్కిన దుండగుడికి దేహశుద్ది చేశారు. హాస్టల్లో భద్రతా లోపంపై విద్యార్ధులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. తమకు సరైన రక్షణ లేదంటూ నిరనస వ్యక్తం చేశారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పీజీ కళాశాలలో విద్యార్థులు ఆందోళన విరమించారు. దీనిపై నార్త్‌జోన్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ..అర్ధరాత్రి సమయంలో ముగ్గురు ఆగంతకులు పీజీ కాలేజ్ లేడీస్ హాస్టల్లోకి వచ్చారని తెలిపారు. నిందితులు గోడ దూకి లోకి ప్రవేశించారని పేర్కొన్నారు. వసతి గృహంలోని బాత్రూం వద్ద అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించారని తెలిపారు. హాస్టల్లో భద్రత సిబ్బంది సహాయంతో నిందితుడిని పట్టుకున్న విద్యార్ధులు అతన్ని చితకబాదారని చెప్పారు. వసతి గృహంలోని విద్యార్థుల రక్షణ కోసం ప్రత్యేకంగా గస్తి ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. విద్యార్థుల రక్షణ విషయంలో కళాశాల ప్రిన్సిపల్, వీసీతో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపడతామని చెప్పారు. చదవండి: కామారెడ్డి ఎమ్మెల్యే మరో సంచలన నిర్ణయం.. -
Adilabad:అవార్డు అందుకున్న రోజే హఠాన్మరణం
సాక్షి, ఆదిలాబాద్: ఆదిలాబాద్ మున్సిపల్ కార్యాలయ మేనేజర్ చెన్నమాధవ దివాకర్ (56) హఠాన్మ రణం చెందారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో శుక్రవారం ఉదయం నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో ఆయన కలెక్టర్ రాహుల్‌రాజ్ చేతుల మీదుగా ఉత్తమ అధికారిగా ప్రశంసాపత్రం అందుకున్నారు. అనంతరం పట్టణంలోని అంబికానగర్‌లో గల తన ఇంటికి వెళ్లారు. అల్పాహారం తింటుండగా శ్వాస సమస్య తలెత్తడంతో కుటుంబీకులు జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దివ్యాంగుడైన దివా కర్కు భార్య నాగలక్ష్మి, కుమా రులు మణికంఠ సాయి, గిరిధర్ సాయి ఉన్నారు. మంచిర్యాల జిల్లా నస్పూర్‌కు చెందిన దివాకర్ 2003లో ఆదిలాబాద్ మున్సిపల్ కార్యాలయంలో టైపిస్ట్‌గా నియుక్తులయ్యారు. అంచెలంచెలుగా ఎదిగి మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్న ఆయన ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో స్థిరపడ్డారు. అవార్డు వచ్చిన ఆనందంలో ఇంటికి వెళ్లిన ఆయన గంట వ్యవధిలోనే మృత్యుఒడికి చేరడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. చదవండి: బేగంపేట పీజీ ఉమెన్స్ హాస్టల్లో కలకలం.. బాత్రూంలోకి చొరబడ్డ ఆగంతకులు -
భక్తరామదాసు విగ్రహం ఇదిగో!
నేలకొండపల్లి శ్రీసీతారామచంద్రస్వామి భక్తుడు కంచర్ల గోపన్న (భక్త రామదాసు) విగ్రహం తొలిసారిగా వెలుగులోకి వచ్చింది. భద్రాచలం ఆలయ నిర్మాత రామదాసు ఎలా ఉండేవారు, ఆయన ఆహార్యం ఏమిటనేది ఇప్పటివరకు స్పష్టత లేదు. దీంతో కళాకారులు తమ ఉహాల మేరకు విగ్రహాలు, చిత్రాలు రూపొందించారు. ఇదే కోవలో ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలోని కంచర్ల గోపన్న నివాసంలో కొనసాగుతున్న ధ్యాన మందిరంలోని కాంస్య విగ్రహం, ఖమ్మంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో ఉన్న మరో విగ్రహాన్ని కళాకారులు తమ ఊహల మేరకు రూపొందించారు. ఈ క్రమంలో తాజాగా నేలకొండపల్లికి చెందిన పసుమర్తి శ్రీనివాస్ అనే వ్యక్తి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన సందర్భంలో ఆవరణలోని రావిచెట్టు వద్ద ఉన్న ఓ విగ్రహాన్ని గుర్తించారు. దీంతో ఆయన కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వినర్ రామోజు హరగోపాల్, కోకన్వినర్ కట్టా శ్రీనివాస్‌కు సమాచారం ఇవ్వగా వారు వచ్చి ఆ విగ్రహాన్ని పరిశీలించారు. అనంతరం అది రామదాసు విగ్రహామేనని చెబుతూ శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. దీంతో పోలీస్‌స్టేషన్ వద్ద వెలుగుచూసిన ఆ విగ్రహాన్ని ఎస్సై బి.సతీశ్ చేతుల మీదుగా రామదాసు పదోతరం వారసుడు కంచర్ల శ్రీనివాసరావుకు అప్పగించగా ధ్యానమందిరంలో ఏర్పాటు చేశారు. రామదాసు జయంతి ఉత్సవాల నాటికి ఈ విగ్రహం ప్రతిష్టాపనపై భద్రాచలం దేవస్థానం అధికారులు ప్రణాళిక రూపొందించాలని వారసులు కోరారు. విగ్రహం ఎలా ఉందంటే.. కాసెపోసి కట్టిన ధోవతి, పైబట్ట లేకుండా అర్ధనగ్నంగా.. అంజలి ముద్రతో మొన కిందికి పెట్టిన కత్తి, మీసాలు, తల వెనక జారుముడి వేసుకున్న గోష్పాద శిఖతో విగ్రహం కనిపిస్తోంది. కుడి, ఎడమ భుజాలపై శంకుచక్రాలు ఉండడంతో వైష్ణవ భక్తునిగా తెలుస్తోంది. కాగా, ఈ విగ్రహం రాజోచిత ఆహార్యంతో లేనందున అక్కన్న, మాదన్నలది కాదని, వారి మేనల్లుడుభక్త రామదాసుదేనని కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేశారు. స్టేషన్‌కు ఎలా చేరింది? నేలకొండపల్లిలో పాత సెంటర్‌గా పేరున్న రావిచెట్టు బజార్లో చాలా ఏళ్ల క్రితం పోలీస్‌స్టేషన్ ఉండేది. 1997లో నూతనంగా నిర్మించిన పోలీస్‌స్టేషన్‌కు పాత స్టేషన్ నుంచి ఫరి్నచర్, తాజాగా బయటపడిన విగ్రహాన్ని కూడా తీసుకొచ్చారు. ఈ క్రమంలో విగ్రహాన్ని స్టేషన్ ఆవరణలోని రావి చెట్టు తొర్రలో భద్రపర్చగా ఇన్నాళ్లూ ఎవరూ పట్టించుకోలేదు. అయితే, ఆ విగ్రహం పాత పోలీసుస్టేషన్‌కు ఎలా చేరింది? ఎవరు తీసుకొచ్చారనే అంశంపై ఎక్కడా రికార్డులు లేవని చెపుతున్నారు. -
గురుకులంలో 317 చిక్కులు
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ గురుకుల విద్యా సంస్థల్లో నూతన జోనల్ విధానం ప్రకారం ఉద్యోగుల కేటాయింపుల ప్రక్రియ గందరగోళంగా మారింది. దాదాపు ఏడాదిన్నర క్రితమే కేటగిరీల వారీగా ఉద్యోగుల స్థానికత ఆధారంగా జోన్లు, మల్టీజోన్లు కేటాయించినప్పటికీ వారంతా ఇంకా పాత స్థానాల్లోనే కొనసాగుతున్నారు. 2022–23 విద్యా సంవత్సరంలోనే నూతన కేటాయింపులు జరిపినప్పటికీ... విద్యా సంవత్సరం మధ్యలో మార్పులు జరిపితే బోధన, అభ్యసనలకు ఇబ్బందులు కలుగుతాయనే ఉద్దేశంతో కాస్త గడువు ఇచ్చింది. కేటాయింపులు పూర్తయినప్పటికీ స్థానచలనం కలిగిన ఉద్యోగులు 2023–24 విద్యా సంవత్సరం మొదటి రోజు నుంచి నూతన పోస్టింగ్‌లలో చేరాలని స్పష్టం చేసింది. అయితే నూతన కేటాయింపులపై వివిధ వర్గాల ఉద్యోగులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఎక్కడి ప్రక్రియ అక్కడే నిలిచిపోయింది. మొత్తంగా, రాష్ట్రంలో అమల్లోకి వచ్చిన నూతన జోనల్ విధానానికి అనుగుణంగా అన్ని ప్రభుత్వ శాఖలు అమలు పూర్తి చేయగా... సంక్షేమ గురుకులాల్లో మాత్రం ఈ ప్రక్రియ ముందుకు సాగలేదు. అన్నింటికీ అడ్డంకులే సంక్షేమ గురుకుల సొసైటీల పరిధిలో వెయ్యికి పైబడి విద్యా సంస్థలున్నాయి. రాష్ట్రంలో ఐదు గురుకుల సొసైటీలు ఉండగా... సంక్షేమ శాఖల పరిధిలో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్), తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీటీడబ్ల్యూఆర్ఈఐఎస్), తెలంగాణ మైనార్టీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(టీఎంఆర్ఈఐఎస్), మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(ఎంజేపీటీబీడబ్ల్యూ ఆర్ఈఐఎస్)లు కొనసాగుతున్నాయి. తెలంగాణ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(టీ ఆర్ఈఐఎస్) మాత్రం విద్యాశాఖ పరిధిలో ఉంది. రాష్ట్రంలోని అన్ని గురుకుల విద్యా సంస్థల్లో ప్రస్తుతం 35వేల మంది బోధన, బోధనేతర సిబ్బంది పనిచేస్తున్నారు. మరో 12వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ సాగుతోంది. ఈ ప్రక్రియ పూర్తయితే గురుకుల సొసైటీ ఉద్యోగుల సంఖ్య భారీగా పెరగనుంది. కొత్తగా గురుకుల విద్యా సంస్థల్లో నియామకాలు జరగాలన్నా.... ప్రస్తుతం ఉన్న ఉద్యోగులకు బదిలీలు, పదోన్నతులు చేపట్టాలన్నా నూతన జోనల్ విధానం ప్రకారం ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియ పూర్తి కావాల్సిందే. నూతన జోనల్ విధానానికి అనుగుణంగా ఉద్యోగుల కేటాయింపులు పూర్తయితేనే ఏయే జోన్లు, ఏయే మల్టీ జోన్లు, ఏయే జిల్లాల్లో ఉద్యోగ ఖాళీలు, పనిచేస్తున్న ఉద్యోగులు, సీనియార్టీ తదితరాలు స్పష్టంగా తెలుస్తాయి. ఆ జాబితాకు అనుగుణంగా బదిలీలు, పదోన్నతులు, కొత్తగా నియామకాలు పూర్తి చేస్తారు. కానీ గురుకులాల్లో ఉద్యోగుల కేటాయింపులు పూర్తికాకపోవడంతో గందరగోళంగా మారింది. బదిలీలకు ఐదేళ్లు పూర్తి... గురుకుల విద్యా సంస్థల్లో ఉద్యోగుల బదిలీలు చేపట్టి ఐదేళ్లు పూర్తయింది. 2018–19 విద్యా సంవత్సరం ప్రారంభంలో రాష్ట్ర ప్రభుత్వం బదిలీలకు అవకాశం కల్పించింది. అప్పటి నుంచి ఇప్పటివరకు మళ్లీ బదిలీలు జరగలేదు. మరోవైపు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల పాఠశాలల్లోని వివిధ కేటగిరీల్లో కొత్తగా పోస్టులు మంజూరు కావడం, ప్రమోషన్ పోస్టులు సైతం పెద్ద మొత్తంలో ఉండటంతో పదోన్నతుల ప్రక్రియ సైతం చేపట్టాల్సి ఉంది. ఇవికాకుండా గురుకులాల్లో 12వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు సంబంధించిన అర్హత పరీక్షలు పూర్తయ్యాయి. అతి త్వరలో మెరిట్ జాబితా... అర్హుల గుర్తింపు పూర్తయితే వారికి పోస్టింగ్‌లు ఇవ్వాలి. ఎక్కడెక్కడ ఖాళీలున్నాయో స్పష్టత వస్తే తప్ప నియామక ఉత్తర్వులు ఇచ్చే వీలు లేదు. కొత్తగా ఉద్యోగాల్లో చేరే వారికి సాధారణంగా మూడు, నాలుగు కేటగిరీల్లోని ప్రాంతాల్లోనే నియమిస్తారు. ప్రస్తుతం ఉద్యోగుల కేటాయింపులు పూర్తయితే తప్ప ఖాళీలపై స్పష్టత రాదని అధికారవర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. -
‘గ్యారంటీ’గా ముందుకెళ్తున్నాం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం కొలువుదీరిన క్షణం నుంచీ ప్రజల కు ఇచ్చిన హామీలను నెరవేర్చే కార్యాచరణ మొదలైందని.. ఆరు గ్యారంటీల్లో రెండు ఇప్పటికే అమల్లోకి వచ్చాయని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. మిగతా గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేసి ప్రజల ముఖాల్లో ఆనందం చూడాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. గత పాలకుల నిర్వాకంతో చిన్నాభిన్నమైన ఆర్థిక పరిస్థితి, వ్యవస్థలను సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్తున్నామని వ్యాఖ్యానించారు. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో గవర్నర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. వివరాలు ఆమె మాటల్లోనే.. ‘‘పాలకులు రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా వ్యవహరించినప్పుడు.. పోరాటాలు, తీర్పుల ద్వారా అధికారాన్ని నియంత్రించే శక్తిని ప్రజలకు రాజ్యాంగం ఇచ్చింది. ఆ రాజ్యాంగ స్ఫూర్తి, హక్కులతోనే తెలంగాణ సాధించుకున్నాం. తెలంగాణలో పాలన రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా సాగినప్పుడు, దీనికి చరమగీతం పాడే అవకాశాన్ని కూడా రాజ్యాంగం ఇచ్చింది. గత 10 ఏళ్లలో పాలకులు రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా, నియంతృత్వ ధోరణితో వ్యవహరించడాన్ని సహించని తెలంగాణ సమాజం.. ఇటీవలి ఎన్నికల్లో తమ తీర్పు ద్వారా ఆ ధోరణికి చరమగీతం పాడింది. ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంది. వ్యవస్థలను పునర్నిర్మించుకుంటున్నాం గత పదేళ్లలో విధ్వంసమైన రాజ్యాంగ విలువలు, రాజ్యాంగబద్ధ సంస్థలు, వ్యవస్థలను ఇప్పుడిప్పుడే పునర్నిర్మించుకుంటున్నాం. శాసన, కార్యనిర్వాహక వ్యవస్థల్లో రాజ్యాంగబద్ధమైన విలువలు, విధానాలు, పద్ధతులను పునరుద్ధరణ చేసుకుంటున్నాం. సమాజంలోని అన్నివర్గాలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు దక్కాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోంది. ప్రజాపాలనలో 1.25 కోట్ల దరఖాస్తులు ప్రతి అర్హుడికి సంక్షేమ ఫలాలు అందించడం ప్రభుత్వ బాధ్యత. డిసెంబర్ 28 నుండి జనవరి 6 వరకు ప్రజల నుంచి పథకాల అమలు కోసం 1,25,84,383 దరఖాస్తులను స్వీకరించగా.. అందులో ఐదు గ్యారెంటీల కోసం దరఖాస్తులు 1,05,91,636, ఇతర దరఖాస్తులు 19,92,747 వచ్చాయి. వీటిని శాఖలవారీగా క్రోడీకరించి, కంప్యూటరీకరించి పరిష్కారానికి కార్యచరణ ప్రణాళిక రూపొందిస్తున్నాం. యువతలో అపోహలు వద్దు గత పదేళ్లు యువతకు ఉపాధి, ఉద్యోగాల విషయంలో పూర్తి నిర్లక్ష్యం జరిగింది. ఇప్పుడు రేవంత్‌రెడ్డి సారథ్యంలోని ప్రజాప్రభుత్వం ఈ విషయంలో గట్టి దృష్టి పెట్టింది. టీఎస్పీఎస్సీ ప్రక్షాళన ప్రక్రియ పూర్తికాగానే ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీ ప్రక్రియ మొదలవుతుంది. యువత ఎలాంటి అనుమానాలు, అపోహలకు లోను కావాల్సిన అవసరం లేదు. గతంలో ఎన్నడూ లేనివిధంగా దావోస్ ప్రపంచ ఆర్థిక వేదికలో రూ.40,232 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకోవడం రాష్ట్ర పురోగమనానికి సంకేతం. ముఖ్యమంత్రి, వారి బృందాన్ని అభినందిస్తున్నాను. రూ.2లక్షల రుణమాఫీకి చర్యలు రైతులకు మా ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుందని హామీ ఇస్తున్నాం. వరంగల్ డిక్లరేషన్ అమలుకు కార్యచరణతోపాటు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. రైతు భరోసా పథకాన్ని సంపూర్ణంగా అమలు చేయడానికి కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే చిన్న, సన్నకారు రైతుల ఖాతాలలో రైతు భరోసా నిధులు జమచేశాం. రూ.2 లక్షల రుణమాఫీ కోసం బ్యాంకులతో సంప్రదింపులు జరుగుతున్నాయి. సామాన్యులు సైతం సీఎంను కలవచ్చు గత ప్రభుత్వం సామాన్యులకు అందుబాటులో లేదు. ఇప్పుడు ప్రజాభవన్‌లో ప్రతి మంగళ, శుక్రవారాలు ప్రభుత్వం ప్రజాసమస్యలను వింటోంది. ఈ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. రాష్ట్రంలో తొలిసారిగా ప్రజాస్వామ్య పాలన తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారిగా రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణమైన, ప్రజల హక్కులను, స్వేచ్ఛను గౌరవించే పాలన మొదలైంది. అంబేడ్కర్ స్ఫూర్తితో పేద, బడుగు, బలహీన వర్గాలు, గిరిజనులు, మైనారిటీల అభ్యున్నతే లక్ష్యంగా ప్రజాపాలన అడుగులు వేస్తోంది. ఇదే స్పూర్తితో ఇక ముందు కూడా పాలన సాగాలని, అభివృద్ధిలో తెలంగాణ అత్యున్నత శిఖరాలకు చేరాలని, సంక్షేమంతో ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలని కోరుకుంటున్నాను..’’ అని గవర్నర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. -
నిధులైనా... విధులైనా...
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీల్లో ప్రథమ పౌరులు గందరగోళంలో పడ్డారు. వారం రోజుల్లో పదవీకాలం ముగియనుండటం.. గతంలో సొంత నిధులతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు ఇంకా రాకపోవడంపై సర్పంచులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే పెండింగ్ బిల్లులకు సంబంధించి నిధులైనా ఇవ్వాలని.. లేకుంటే మరో ఆరు నెలలపాటు పదవీకాలమైనా పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. పల్లెల్లో ప్రత్యేకాధికారుల పాలన అంటే ప్రజాస్వామ్యానికి విలువే ఉండదని స్పష్టం చేస్తున్నారు. అప్పులు చేసి మరీ గ్రామాల్లో పనులు చేయించామని.. పెండింగ్ బిల్లులు రాకపోతే సమస్యల్లో మునిగిపోతామని వాపోతున్నారు. ఊర్లలో పనులు చేయించి.. రాష్ట్రంలో 12,752 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. పార్టీ రహితంగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఆ గ్రామాలకు సర్పంచ్‌లు ఎన్నికయ్యారు. అందులో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, ఇతర పార్టీల సానుభూతిపరులు కూడా ఉన్నారు. గత ఐదేళ్లుగా పంచాయతీలకు నిధులు, ఇతర పనుల విషయంలో ఇబ్బందులు ఉన్నా గ్రామాల అభివృద్ధి కోసం కృషిచేశారు. గ్రామంలో అభివృద్ధి పనులతోపాటు వివిధ పథకాల కింద మంజూరైన ప్రాజెక్టుల పనులూ చేశారు. పంచాయతీల్లో నిధులు లేకున్నా.. చాలా మంది సర్పంచులు సొంత డబ్బుతోనో, అప్పులు తెచ్చో పనులు పూర్తి చేయించారు. గడువు ముగుస్తుండటంతో.. ప్రస్తుతం గ్రామాల్లో సర్పంచులు, పాలకవర్గాల పదవీకాలం ఫిబ్రవరి 1వ తేదీతో ముగుస్తోంది. రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పటికిప్పుడు గ్రామ పంచాయతీ (జీపీ) ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా లేనట్టు సంకేతాలు ఇచ్చింది. ఏప్రిల్, మే నెలల్లో లోక్‌సభ ఎన్నికలు ఉండటంతో.. అవి ముగిశాక పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని భావిస్తోంది. సర్పంచుల పదవీకాలం ముగుస్తున్న నేపథ్యంలో.. వారినే మరో ఆరు నెలలు కొనసాగించేందుకు, లేదా వివిధ ప్రభుత్వ శాఖల సిబ్బందిని గ్రామాలకు ప్రత్యేక అధికారులుగా నియమించేందుకు అవకాశం ఉంటుంది. ప్రస్తుత సర్పంచులలో చాలా వరకు బీఆర్ఎస్కు అనుకూలమైనవారేనన్న ఆలోచనతో ఉన్న కాంగ్రెస్ సర్కారు.. వారినే ఇన్చార్జులుగా కొనసాగించేందుకు సుముఖంగా లేనట్టు సంకేతాలు ఇచ్చింది. వచ్చే ఆరు నెలల పాటు (పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యేదాకా) గ్రామాల్లో పాలన బాధ్యతను ప్రత్యేకాధికారులకు అప్పగించేందుకు మొగ్గుచూపుతోంది. ఇది సర్పంచులలో కలకలం రేపుతోంది. ‘ప్రత్యేక’పాలనతో ఇబ్బందులేనంటూ.. ఫిబ్రవరి 2వ తేదీ నుంచి గ్రామాల్లో ప్రత్యేకాధికారుల పాలన మొదలవబోతోందంటూ జిల్లా, మండల స్థాయిలో అధికారులు హడావుడి చేస్తున్నారని సర్పంచులు అంటున్నారు. సొంత నిధులతో కొత్త పంచాయతీ భవనాలు, శ్మశానవాటికలు, క్రీడా మైదానాలు వంటివి నిర్మించామని.. ఉపాధి హామీ, ప్రత్యేక అభివృద్ధి నిధి, రాష్ట్ర ఆర్థిక సంస్థ పరిధిలోని పనులు చేపట్టామని చెప్తున్నారు. తమ పదవీకాలం ముగిసేలోగా పెండింగ్ బిల్లులైనా ఇప్పించాలని, లేదా ఎన్నికలు జరిగేదాకా సర్పంచ్‌లుగా కొనసాగించాలని సీఎం రేవంత్‌రెడ్డికి, పంచాయతీరాజ్ మంత్రి సీతక్కకు విజ్ఞప్తి చేస్తున్నారు. తాము రాజకీయ పార్టీల గుర్తులపై ఎన్నికకాలేదని, తమను ఒక రాజకీయపక్షానికే అనుకూలమైనవారిగా పరిగణించవద్దని కోరుతున్నారు. తమను క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై ప్రభుత్వపరంగా అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించేవారిగా గుర్తించాలని అంటున్నారు. ప్రత్యేకాధికారుల పాలన అంటే ఇబ్బందేనని.. గ్రామాల్లో అభివృద్ధి జరగదని సర్పంచులు పేర్కొంటున్నారు. అధికారులు కేవలం ఆఫీస్ వేళల్లోనే అందుబాటులో ఉంటారని.. వారాంతాలు, సెలవు రోజుల్లో వారిని సంప్రదించే అవకాశమే ఉండదని చెప్తున్నారు. దీనితో ప్రజలకు సమస్యలు వస్తాయని పేర్కొంటున్నారు. గ్రాంట్లపై ఆధారపడిన చోట సమస్య ఎక్కువ ఏడాదికిపైగా పెండింగ్ బిల్లుల సమస్య వెంటాడుతోందని.. సొంత నిధులతో చేసిన పనులకు బిల్లులు రాక ఇబ్బందిపడుతున్నామని సర్పంచ్‌లు చెప్తున్నారు. సొంత ఆదాయ వనరులు అధికంగా ఉన్న పలు మేజర్ గ్రామ పంచాయతీలు, పెద్ద గ్రామాల్లో ఇబ్బంది పెద్దగా లేదని.. ఆదాయ వనరులు అంతగా లేని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు, గ్రాంట్లపై ఆధారపడిన మధ్య, చిన్నతరహా గ్రామాలకు సమస్య ఎక్కువగా ఉందని అంటున్నారు. ఇలాంటి గ్రామ పంచాయతీల్లో రూ.6 లక్షల నుంచి రూ.11 లక్షల దాకా పెండింగ్ బిల్లులు ఉన్నాయని.. మొత్తంగా రూ.1,200 కోట్ల మేర బకాయిలు ఉండొచ్చని సర్పంచుల సంఘాలు అంచనా వేస్తున్నాయి. గతంలో రాష్ట్ర ఆర్థిక సంఘం, ఇతర అభివృద్ధి నిధులు సకాలంలో విడుదలకాకపోవడంతోపాటు నిధుల వ్యయంపై ఫ్రీజింగ్ పెట్టడంతో పెండింగ్ బిల్లుల సమస్య పెరిగిందని అంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి 15వ ఆర్థికసంఘం నిధులు నేరుగా పంచాయతీలకే అందడంతో.. కొందరు సర్పంచులు కొంతమేర బిల్లులు రాబట్టుకోగలిగారని చెప్తున్నాయి. కొనసాగిస్తే భరోసా! గతంలో సకాలంలో బిల్లులు రాక, అభివృద్ధి, ఇతర పనుల కోసం తెచ్చిన అప్పులకు వడ్డీలు చెల్లించలేక, ఇతర కారణాలతో పలువురు సర్పంచ్‌లు ఆత్మహత్య చేసుకున్నారని సర్పంచుల సంఘాలు గుర్తు చేస్తున్నాయి. అందువల్ల పెండింగ్ బిల్లులపై ప్రభుత్వం వెంటనే ఏదైనా హామీ ఇవ్వాలని కోరుతున్నాయి. లేకుంటే పంచాయతీలకు ఎన్నికలు జరిగేదాకా ఇప్పుడున్నవారినే కొనసాగిస్తే పెండింగ్ బిల్లుల రాకపై సర్పంచులకు భరోసా ఉంటుందని స్పష్టం చేస్తున్నాయి. పెండింగ్ బిల్లుల సమస్యను వెంటనే పరిష్కరించాలి: యాదయ్యగౌడ్ ఫిబ్రవరి 1న తమ పదవీకాలం ముగుస్తున్నందున పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని సీఎం రేవంత్‌రెడ్డిని తెలంగాణ సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్ ఒక ప్రకటనలో కోరారు. సర్పంచులు అప్పులు తెచ్చి గ్రామాభివృద్ధికి పాటుపడ్డారని, అలాంటి వారి సమస్యలకు రాజకీయ రంగు రుద్దవద్దని విజ్ఞప్తి చేశారు. వివిధ పనులు చేసిన బిల్లులు రాక, తెచి్చన అప్పులకు వడ్డీలు కట్టలేక ఇబ్బందిపడుతున్నామని.. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు. -
ప్రత్యామ్నాయ విద్యుత్ ఉత్పత్తిపై దృష్టి
సాక్షి, రంగారెడ్డి జిల్లా, షాబాద్: రాష్ట్ర ప్రజల భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రత్యామ్నాయ విద్యుత్ ఉత్పత్తికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం చందనవెల్లి గ్రామంలో శుక్రవారం జున్నా సోలార్ పవర్ ప్యానెల్ ఉత్పత్తి ప్లాంటును ఆయన ప్రారంభించారు. అనంతరం భట్టి మాట్లాడుతూ 2030 సంవత్సరం నాటికి డిమాండ్‌కు అనుగుణంగా ప్రత్యామ్నాయ విద్యుత్‌ను ఉత్పత్తిని చేస్తామన్నారు. విద్యుత్ రంగంపై గత ప్రభుత్వం రూ.81 వేల కోట్లకుపైగా అప్పుల భారం మోపిందని ఆయన విమర్శించారు. ఈ భారాన్ని అధిగమిస్తూ, విద్యుత్ డిమాండ్ పెరిగిపోతున్న క్రమంలో ప్రత్యామ్నాయంగా విద్యుత్ ఉత్పత్తిని పెంచుకునే దిశగా ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తోందని వెల్లడించారు. ఈ మేరకు సౌరశక్తి, పవనశక్తి, హైడెల్, చెత్త నుంచి తయారు చేసే కేంద్రాల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసి ప్రజల అవసరాలు తీరుస్తుందని చెప్పారు. చందనవెల్లి భూసేకరణలో అక్రమాలపై విచారణ రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని హైతాబాద్, చందనవెల్లి గ్రామాల్లో పరిశ్రమల కోసం చేసిన భూ సేకరణలో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. శుక్రవారం స్థానికంగా నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన భూ బాధితులను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నిజమైన లబ్థిదారులకు పరిహారం ఇప్పించేందుకు కృషి చేస్తామన్నారు. -
నకిలీ డాక్టర్లకు చెక్..
సాక్షి, హైదరాబాద్: అర్హత లేకున్నా వైద్యులుగా ప్రాక్టీస్ చేస్తున్న వారిపై, అక్రమంగా ఆసుపత్రులు నడుపుతున్నవారిపైనా తెలంగాణ రాష్ట్ర వైద్య మండలి (టీఎస్ఎంసీ) ఉక్కుపాదం మోపుతోంది. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, ఖైరతాబాద్‌లో అర్హత లేకున్నా ప్రాక్టీస్ చేస్తున్న రెండు ఆసుపత్రు లకు ఇటీవలే ఎన్నికైన కొత్త మండలి నోటీసులు జారీ చేసింది. సదరు ఆసుపత్రుల్లో యాంటీబయా టిక్స్, స్టెరాయిడ్స్ వంటి షెడ్యూల్డ్ డ్రగ్స్‌ను గుర్తించి ఈ మేరకు వాటిపై కేసులు నమోదు చేసింది. ఇంకా అనేక చోట్ల నకిలీ వైద్యుల దందాపై దాడులకు శ్రీకారం చుట్టింది. డాక్టర్లుగా చెప్పుకునే ఆర్ఎంపీలపై క్రిమినల్ కేసులు పెడతామని మండలి హెచ్చరించింది. పేరుకు ముందు ‘డాక్టర్’ హోదా పెట్టుకున్నా, ఆసుపత్రి అని రాసి ఉన్న బోర్డులు ప్రదర్శించినా, రోగులకు ప్రిస్క్రిప్షన్ రాసినా కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేసింది. ఆర్ఎంపీల ముసుగులో రాష్ట్రంలో ఆర్ఎంపీ, పీఎంపీలు 30 వేల మంది వర కు ఉన్నారని ఓ అంచనా. ప్రతీ గ్రామంలో వారు ప్రాక్టీస్ చేస్తుంటారు. అయితే కొంతమంది నకిలీ సర్టిఫికెట్లతో ఆర్ఎంపీలు, పీఎంపీల ముసుగులో డాక్టర్లుగా చెలామణీ అవుతూ.. ఇష్టారాజ్యంగా అబార్షన్లు చేయడం, అత్యధిక మోతాదులో ఉన్న యాంటీబయాటిక్స్ ఇవ్వడం, చిన్న రోగాలకు కూడా అధికంగా మందులు రాస్తున్నారని మండలి గుర్తించింది. ఇటీవల నగరంలోని మలక్‌పేట్ ప్రాంతంలో నకిలీ రిజిస్ట్రేషన్ నంబర్‌ను కలిగి ఉన్న ఒక అర్హతలేని ప్రాక్టీషనర్ ప్రిస్క్రిప్షన్‌ను పరిశీలిస్తే, శిశువుకు యాంటీబయాటిక్ ఇంజెక్షన్ మెరోపెనెమ్ రాయడం చూసి అధికారులు విస్మయం వ్యక్తం చేశారు. సహజంగా శిశువులకు ఉపయోగించే యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్లు పెద్దలకు ఉప యోగించేవి కాకుండా ప్రత్యేకంగా ఉంటాయి. పెద్ద లకు వాడే ఇంజెక్షన్లు శిశువుకు ప్రాణాంతకంగా మారతాయి. మలక్‌పేటలోని ఆ నకిలీ డాక్టర్ మాది రిగానే చాలామంది నకిలీ డాక్టర్లు మానసిక ఔష ధాల ప్రిస్క్రిప్షన్‌లోనూ ఇష్టారాజ్యంగా మందులు రాస్తున్నారని తేలింది. ఈ నేపథ్యంలో నకిలీ డిగ్రీని ప్రదర్శించడం, అర్హత లేకున్నా ప్రిస్క్రిప్షన్లు రాయ డం వంటి దృష్టాంతాలను మండలి తీవ్రంగా తీసు కుంది. మరోవైపు అడ్డగోలుగా అల్లోపతి మందు లను సూచిస్తున్న ఇద్దరు నకిలీ ఆయుష్ వైద్యులను గుర్తించి వారిపై ఆయుష్ శాఖకు లేఖ రాసింది. ఇక నకిలీ వైద్యుల ఆగడాలకు అడ్డుకట్ట వేసే క్రమంలో డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) సాయాన్ని కూడా తీసుకోవాలని మండలి నిర్ణయించింది. నకిలీ ప్రైవేట్ ప్రాక్టీషనర్ల ద్వారా రోగులకు మందులు అందకుండా చేయాలని నిర్ణయించింది. -
రాజ్‌భవన్‌లో ఎట్‌హోమ్‌కు సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శుక్రవారం సాయంత్రం రాజ్‌భవన్‌లో తేనీటి విందు ఇచ్చారు. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, డి.శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి బీజేపీ, బీఆర్ఎస్ ముఖ్య నేత లు దూరంగా ఉన్నారు. గవర్నర్ తమిళిసై సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులతో కలివిడిగా మాట్లాడారు. హైకోర్టు సీజే అలోక్ అరాధే, సీఎస్ శాంతికుమారి, టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్‌రెడ్డి, ఏఐసీసీ నేత రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు గోరెటి వెంకన్న, బండ ప్రకాశ్, ఆ ర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి పాల్గొన్నారు. పద్మ పురస్కార గ్రహీతలకు గవర్నర్, సీఎం శుభాకాంక్షలు తెలిపారు. చిందు, యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య తేనీటి విందుకు హాజరుకాగా, జ్ఞాపిక అందజేసి గవర్నర్ అభినందించారు. కాగా, త్వరలో ఏపీ పర్యటనకు వెళుతున్నట్టు మంత్రి కొండా సురేఖ తెలిపారు. దేవాదాయ శాఖ, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన అంశాలపై ఏపీతో చర్చిస్తామన్నారు. -
'ఇంటింటా ఇన్నోవేటర్' అవార్డుల ప్రదానం
హైదరాబాద్: 'ఇంటింటా ఇన్నోవేటర్ విలేజ్ ఇన్నోవేషన్ అవార్డ్స్ 2024' కార్యక్రమంతో తెలంగాణలోని 20 జిల్లాల్లోని 41 గ్రామాలలో ఇన్నోవేషన్ స్ఫూర్తి ప్రతిధ్వనించింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఇన్నోవేషన్ సెల్ (టీఎస్ఐసీ) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంతో గ్రామ పంచాయితీల పరిధిలో 44 మంది ఆవిష్కర్తలకు గుర్తింపు దక్కింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి గ్రామంలో అవార్డుల ప్రదానోత్సవం నేడు జరిగింది. 2023 ఏడాదికి 'ఇంటింటా ఇన్నోవేటర్' కార్యక్రమం కింద టీఎస్ఐసీ ద్వారా స్థానిక ఆవిష్కర్తలకు గ్రామ సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు సన్మానాలు అందించారు. ఈ కార్యక్రమం స్థానికంగా సవాళ్లను గుర్తించి పరిష్కరించడంలో గ్రామస్తులను ప్రోత్సహించడమే కాకుండా యువ తరాలకు స్ఫూర్తినిస్తుంది. 44 మంది ఆవిష్కర్తల్లో గృహిణులు, పాఠశాల పిల్లలు, కళాశాల విద్యార్థులు, వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉన్నారు. వారి వినూత్న సహకారానికి నేడు(జనవరి 26)న అవార్డులు లభించాయి. రాష్ట్రంలో సామాజిక-ఆర్థిక వృద్ధిని పెంపొందించడంలో ఈ కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తుంది. ఉజ్వల భవిష్యత్తు వైపు తమ సొంత మార్గాన్ని రూపొందించుకోవడానికి సమాజాన్ని చైతన్యపరుస్తుంది. భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, జనగాం, కామారెడ్డి, కరీంనగర్, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల, మేడ్చల్, మెదక్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, వనపర్తి, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, నిజామాబాద్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో 'విలేజ్ ఇన్నోవేషన్ అవార్డులు' అందించారు. వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, ఆహార సాంకేతికత, పర్యావరణం, ఆటోమొబైల్స్, ఆక్వాకల్చర్, సాంకేతికత, పారిశుధ్యం వంటి వివిధ రంగాలలో విస్తృతమైన ఆవిష్కరణలను ఈ కార్యక్రమం ప్రోత్సహిస్తోంది. వ్యవసాయ ఉత్పాదకతను పెంపొందించే అద్భుతమైన సాధనాల నుండి నీటి సంరక్షణ కోసం తెలివిగల పరిష్కారాల వరకు, సమస్యలను పరిష్కరించడంలో అట్టడుగు స్థాయి ఆవిష్కరణల సామర్థ్యాన్ని ఈ కార్యక్రమం గుర్తిస్తుంది. "ఇంటింటా ఇన్నోవేటర్ విలేజ్ ఇన్నోవేషన్ అవార్డ్స్ 2024" ద్వారా కేవలం ఆవిష్కర్తల గుర్తింపు మాత్రమే కాదు.. సమాజాన్ని పురోగతి వైపు నడిపించే స్ఫూర్తిని పెంపొందిస్తున్నామని టీఎస్ఐసీ డైరెక్టర్ అజిత్ రంగ్నేకర్ అన్నారు. ప్రతి గ్రామం సృజనాత్మకతతో అభివృద్ధి చెందుతున్న కేంద్రంగా మారుతుందని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి సానుకూల మార్పును తీసుకువస్తుందని పేర్కొన్నారు. ఇదీ చదవండి: మూసీ సుందరీకరణే లక్ష్యం -
Tspsc: చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన మహేందర్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ (టీఎస్పీఎస్సీ) చైర్మన్‌గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి శుక్రవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం రిపబ్లిక్ వేడుకల్లో భాగంగా టీఎస్పీఎస్సీ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆయన ఆవిష్కరించారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్‌గా మహేందర్‌రెడ్డిని సభ్యులుగా మరో నలుగురిని ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. ఈ నియామకాలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వెంటనే ఆమోదం తెలపడంతో చైర్మన్, సభ్యుల బాధ్యతల స్వీకరణకు లైన్ క్లియరైంది. టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసి నిరుద్యోగులకు న్యాయం చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా టీఎస్పీఎస్సీకి కొత్త చైర్మన్, సభ్యులను ప్రభుత్వం త్వరితగతిన నియమించింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో టీఎస్పీఎస్సీ పరీక్షల పదేపదే వాయిదాలతో పాటు, పేపర్ లీకేజీల వివాదాల్లో ఇరుక్కున్న విషయం తెలిసిందే. ఇదీచదవండి.. తమిళిసై ఒక్క విషయం గుర్తు పెట్టుకోవాలి.. కేటీఆర్ ఫైర్ -
గణతంత్ర వేడుకలు: స్పృహ తప్పి పడిపోయిన మహమూద్ అలీ
సాక్షి, హైదరాబాద్: గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మాజీ హోంమంత్రి మహమూద్ అలీ అస్వస్థతకు గురయ్యారు. జాతీయ జెండా ఆవిష్కరణలో పాల్గొన్న సందర్భంగా స్పృహ తప్ప కిందపడిపోయారు. దీంతో, హుటాహుటిన ఆయనను ఆసుపత్రికి తరలించారు. వివరాల ప్రకారం.. గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్లో జాతీయ పతకాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవిష్కరించారు. కాగా, ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం సందర్బంగా మాజీ హోం మంత్రి మహమూద్ అలీ స్పృహ తప్పి పడిపోయారు. ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో సహచర బీఆర్ఎస్ నేతలు ఆయనను పట్టుకున్నారు. అనంతరం, వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. కాగా, ఆయన ఆరోగ్య పరిస్థితిపై సమాచారం తెలియాల్సి ఉంది. తెలంగాణ భవన్లో జాతీయ జెండా ఎగరేస్తున్న సమయంలో అస్వస్థతకు గురై కిందపడి పోయిన మాజీ హోంమంత్రి మహమూద్ అలీ. pic.twitter.com/FkgrFqc0iF — Telugu Scribe (@TeluguScribe) January 26, 2024 -
స్పీకర్ గడ్డం ప్రసాద్, తమ్మినేనిని పరామర్శించిన సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. స్పీకర్ గడ్డం ప్రసాద్, సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రాన్ని పరామర్శించారు. వారి ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. వివరాల ప్రకారం.. నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్స్‌లో రిపబ్లిక్ డే వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం, సీఎం రేవంత్.. న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు వెళ్లారు. ఈ క్రమంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను కలిసి పరామర్శించారు. కాగా, ఇటీవలే స్పీకర్ ప్రసాద్ అనారోగ్యానికి గురయ్యారు. మరోవైపు.. తమ్మినేని వీరభద్రాన్ని కూడా సీఎం రేవంత్ పరామర్శించారు. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి వెళ్లిన సీఎం రేవంత్.. తమ్మినేనిని పరామర్శించారు. కాగా, తమ్మినేనికి ఇటీవల స్ట్రోక్ రావడంతో ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. దీంతో, ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. -
నియంతృత్వ ధోరణికి ప్రజలు చరమగీతం పాడారు: తమిళిసై
Live Updates.. ►ఈరోజు సాయంత్రం రాజ్‌భవన్‌లో ఎట్‌హోమ్ కార్యక్రమం ►ఎట్ హోమ్ కార్యక్రమానికి హాజరు కానున్న సీఎం రేవంత్, మంత్రులు ►హైదరాబాద్ సెక్రటేరియట్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు. ►జాతీయ పతాకవిష్కరణ చేసిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి. ►రిపబ్లిడ్ డే సందర్భంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగిస్తూ.. ‘తెలంగాణలో గత పదేళ్లలో పాలకులు రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా వ్యవహరించారు. తెలంగాణ సమాజం ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇటీవల ఎన్నికల్లో నియంతృత్వ ధోరణికి ప్రజలు తమ తీర్పు ద్వారా చరమగీతం పాడారు. అహంకారం, నియంతృత్వం చెల్లదని ప్రజలు స్పష్టమైన తీర్పు ప్రకటించారు. నియంతృత్వ ధోరణిని ప్రజలు సహించలేదు. ►పదేళ్ల పాలనలో రాజ్యాంగ విలువలు, రాజ్యాంగబద్ధ సంస్థలు, వ్యవస్థలు ఈ ప్రజా ప్రభుత్వంలో ఇప్పుడిప్పుడే మళ్లీ పునర్ నిర్మించుకుంటున్నాం. శాసన, కార్యనిర్వాహక వ్యవస్థల్లో రాజ్యాంగబద్ధమైన విలువలు, విధానాలు, పద్ధతులను పునరుద్ధరణ చేసుకుంటున్నామని చెప్పడానికి సంతోషిస్తున్నాను. ఏ ప్రభుత్వమైనా రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా పాలన సాగించినప్పుడే ప్రజాస్వామ్య, సంక్షేమ, అభివృద్ధి ఫలాలు ప్రతి పేదవాడికి అందుతాయి. ►ఏకపక్ష నిర్ణయాలు, నియంత పోకడలు ఎప్పుడూ ప్రజాస్వామ్యానికి శోభనివ్వవు. కొత్తగా ఏర్పడిన ప్రజా ప్రభుత్వం ఈ స్పృహతో పని మొదలు పెట్టింది. సమాజంలోని అన్ని వర్గాలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు దక్కాలన్న లక్ష్యంతో పని చేస్తోంది. గత ప్రభుత్వ విధానాలతో ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది’. ►గత ప్రభుత్వ అసమర్థ విధానాలతో ఆర్థికస్థితి దిగజారింది. టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేస్తున్నాం. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా నిలిచిన యువతకు గత ప్రభుత్వం అన్యాయం చేసింది. వంద రోజుల్లో అన్ని గ్యారంటీలను అమలు చేస్తాం. ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రజా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ►సైనికుల గౌరవ వందనం స్వీకరించిన గవర్నర్ తమిళిసై ►పబ్లిక్ గార్డెన్స్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించిన గవర్నర్ తమిళిసై. ►జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, అధికారులు ►నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌కు చేరుకున్న గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సీఎం రేవంత్ రెడ్డి. ►హైదరాబాద్‌లోని పబ్లిక్ గార్డెన్స్‌లో తెలంగాణ ప్రభుత్వం రిపబ్లిక్ డే వేడుకలను నిర్వహిస్తోంది. దీనికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ వేడుకల్లో పాల్గొంటారు. ►రిపబ్లిక్ డే వేడుకల కోసం పబ్లిక్ గార్డెన్‌ను అధికారులు సిద్ధం చేశారు. సీఎంతో పాటు మంత్రులు, ఐఏఎస్ అధికారులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. గవర్నర్ తమిళి సై జెండా ఆవిష్కరణ చేసిన తర్వాత రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. పోలీసుల కవాతు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ►శుక్రవారం ఉదయం సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్ సీఎం రేవంత్ చేరుకున్నారు. పరేడ్ గ్రౌండ్లో వీరుల సైనిక్ స్మారక్ వద్ద సీఎం రేవంత్ రెడ్డికి త్రివిధ దళాలు స్వాగతం పలికాయి. రిపబ్లిక్ డే సందర్భంగా వీరుల సైనిక్ స్మారకం వద్ద యుద్ధ వీరులకు సీఎం రేవంత్ నివాళులు అర్పించారు. -
ఎమ్మెస్.. టైమ్ పాస్!
సాక్షి, హైదరాబాద్: ఆర్థిక మాంద్యం ఐటీ రంగాన్ని కుదిపివేస్తున్న నేపథ్యంలో భారతీయ విద్యార్థులు విదేశీ చదువులపై దృష్టి పెట్టారు. సాఫ్ట్వేర్ రంగం గాడిన పడే వరకూ ఎంఎస్ చేయడమే మేలని భావిస్తున్నారు. ఈ కారణంగా ఈ ఏడాది విదేశీ విద్యకు వెళ్ళే వాళ్ళ సంఖ్య పెరిగింది. కరోనా నేపథ్యంలో 2021 విద్యా సంవత్సరంలో 4.44 లక్షల మంది విదేశీ విద్యకు వెళ్తే, 2022లో ఈ సంఖ్య ఏకంగా 6.84 లక్షలకు పెరిగింది. 2023 చివరి నాటికి ఈ సంఖ్య మరో 10 వేల వరకు పెరిగిందని అంచనా. అమెరికా వంటి దేశాల్లో ఐటీ సెక్టార్ తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటోందని తెలిసినా.. ఈ ఒక్క దేశానికే 2023లో 2.80 లక్షల మంది భారతీయులు విద్య కోసం వెళ్ళారు. మరోవైపు కెనడా వీసా ఆంక్షలకు నిబంధనలు పెట్టే ఆలోచనలో ఉన్నట్టు వార్తలొస్తున్నా, చదువు కోసం వెళ్ళేందుకే విద్యార్థులు ఇష్టపడుతున్నారు. ఎందుకీ పరిస్థితి..? దేశవ్యాప్తంగా ప్రతి ఏటా 12 లక్షల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు మార్కెట్లోకి వస్తున్నారు. వీరిలో కేవలం 8 శాతం మందికి మాత్రమే నైపుణ్యం ఉన్నట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నారు. బహుళజాతి కంపెనీల్లో మంచి వేతనంతో ఉద్యోగాలు పొందుతున్నది వీళ్ళే. మిగతా వాళ్ళు వచ్చిన ఉద్యోగంతో సంతృప్తి పడుతున్నారు. సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా ఏదో ఒక సాఫ్ట్వేర్ కోర్సు నేర్చుకుని సంబంధం లేని ఉద్యోగానికి వెళ్తున్నారు. ఇంతకాలం వీళ్ళ అవసరం ఉండేది. అవసరమైన శిక్షణ ఇచ్చి కంపెనీలు వారి సేవలను వినియోగించుకునేవి. కానీ ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. అమెరికాలో వచ్చిన ఆర్థిక సంక్షోభం ప్రభావం భారత్ ఐటీ రంగంపైనా ప్రభావం చూపించింది. ప్రధాన కంపెనీలన్నీ వరుసగా లే ఆఫ్‌లు ప్రకటించడంతో ఐటీ విభాగం కుదేలైంది. క్యాంపస్ నియామకాలు తగ్గాయి. కొన్ని కంపెనీలు ఆఫర్ లెటర్లు ఇచ్చినా ఉద్యోగాలుమాత్రం ఇవ్వలేదు. దీంతో బీటెక్ పూర్తి చేసిన విద్యార్థులు ఆఫ్ క్యాంపస్ ఉద్యోగాలు వెతుక్కోవాల్సి వస్తోంది. పోటీ తీవ్రంగా ఉండటంతో ఫ్రెషర్స్ పోటీని తట్టుకుని నిలబడటం కష్టంగా ఉంది. ఈ కారణంగానే విదేశాల్లో విద్యాభ్యాసానికి వెళుతున్నారు. సమయం వృథా ఎందుకుని.. చాలా కంపెనీలు ఏడాది క్రితం ఫ్రెష్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్‌కు ఆఫర్ లెటర్స్ ఇచ్చాయి. కానీ చాలా సంస్థలు ఇంత వరకూ నియామక ఉత్తర్వులు ఇవ్వలేదు. నాస్కామ్ తాజాగా జరిపిన ఓ సర్వేలో ఇలాంటి వాళ్ళు భారత్‌లో 2.5 లక్షలు ఉంటారని తేలింది. మన రాష్ట్రంలోనే 24 వేల మందికి పైగా ఉన్నట్టు స్పష్టమైంది. మరో వైపు అమెరికా ప్రాజెక్టులు తగ్గుతున్నా యని కంపెనీలు చెబుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో నియామక ఉత్తర్వులు వస్తాయన్న భరోసా లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఖాళీగా ఉండటం దేనికి? అని యువత భావిస్తోంది. ఒకవేళ ఖాళీగా ఉంటే ఆ తర్వాత జాబ్‌లోకి తీసుకోవడానికి కంపెనీలు అంతగా ఆసక్తి చూపవు. దీన్ని దృష్టిలో ఉంచుకునే పరిస్థితి చక్కబడే వరకూ ఎమ్మెస్ లాంటిది చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. లభించని బ్యాంకు రుణాలు విదేశీ విద్యకు గతంలో తేలికగా రుణాలు లభించేవి. కానీ గత ఏడాది కాలంగా బ్యాంకులు పెద్దగా ఆసక్తి చూపడం లేదనిన విద్యార్థులు అంటున్నారు. బ్యాంకు రుణాల విధానాన్ని సవరించడమే దీనికి కారణమని బ్యాంకర్లు అంటున్నారు. ఈ నేపథ్యంలో విదేశాలకు వెళ్ళేందుకు అవసరమైన సెక్యూరిటీ మొత్తం, అక్కడి ఖర్చుల కోసం ఒక్కో విద్యార్థి కనీసం రూ.40 లక్షల వరకూ అప్పు చేస్తున్నారు. ఈ మొత్తాన్ని విదేశాల్లో చదివేటప్పుడు తీర్చేద్దామన్న ధీమాతో వెళ్తున్నారు. విదేశాల్లో ఏదైనా పార్ట్‌టైం జాబ్ చేయొచ్చనేది వారి ఆలోచన. కానీ గతేడాది డిసెంబర్లో వెళ్ళిన విద్యార్థులకు అమెరికాలో చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. పార్ట్ టైం ఉద్యోగాలు దొరకడం కూడా కష్టంగా ఉందని అక్కడి విద్యార్థులు చెబుతుండటం గమనార్హం. ఐటీ కోలుకోవడంపైనే ఆశలు బీటెక్ పూర్తయ్యాక ఇండియాలో ఏడాది పాటు ఉద్యోగం కోసంవిఫల ప్రయత్నం చేశా. చివరకు అమెరికా వెళ్ళి ఎమ్మెస్ చేయాలని నిర్ణయించుకున్నా. ఇంట్లో అర ఎకరం పొలం అమ్మి డబ్బులిచ్చారు. నేను కొంత అప్పు చేశా. డిసెంబర్లో అమెరికా వచ్చా. ఇక్కడ పార్ట్ టైం జాబ్ కష్టమని కన్సల్టెన్సీలు చెబుతున్నాయి. మళ్ళీ అప్పు చేయమని తల్లిదండ్రులకు చెప్పడం ఇబ్బందిగానేఉంది. ఐటీ కోలుకుంటే పరిస్థితి మారుతుందనే నమ్మకం ఉంది. –శశాంక్ (అమెరికా వెళ్ళిన వరంగల్ విద్యార్థి) ఏడాది క్రితం ఆఫర్ లెటర్ ఇచ్చారు బీటెక్ అవ్వగానే ఆఫ్ క్యాంపస్‌లో ఓ కంపెనీ ఉద్యోగం ఆఫర్ చేసింది. ఉద్యోగం వచ్చిందని నేను, మా వాళ్ళూ బంధువులందరికీ చెప్పుకున్నాం. ఆ లెటర్ పట్టుకుని ఏడాది నిరీక్షించా. ఎంతకీ అపాయింట్మెంట్ ఆర్డర్ రాలేదు. ఇప్పుడు చిన్నతనంగా ఉంది. అందుకే అప్పు చేసి మరీ అమెరికా వెళ్ళేందుకు సిద్ధమవుతున్నా. ఎమ్మెస్ అయిపోయే లోగా పరిస్థితి మారుతుందనే ఆశ ఉంది.– పి. నీలేశ్ కుమార్ (యూఎస్ వెళ్ళేందుకు సిద్ధమైన హైదరాబాద్ విద్యార్థి) -
ఓటర్లపై ఒత్తిడి తెస్తే.. చర్యలు తీసుకోవాల్సిందే!
కూకట్పల్లి (హైదరాబాద్): ‘‘ప్రజలు స్వేచ్ఛా పూరిత వాతావరణంలో ఓటు హక్కును విని యోగించుకునేలా ఎన్నికల కమిషన్ నిబంధనలు ఉండాలి. ఓటర్లను ప్రలోభపెట్టేలా, ఒత్తిడి చేసే లా అభ్యర్థులు వ్యవహరిస్తే వారిపై తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎన్నికల కమిషన్ బాగా పనిచేసింది. కానీ ఓ అభ్యర్థి తనకు ఓటేయకపోతే ఆత్మ హత్య చేసుకుంటానంటూ ప్రచార మాధ్యమా లలోకెక్కారు. అది విచారకరం. ప్రజలను ఒత్తి డికి గురిచేసి గెలవడానికి అభ్యర్థి ప్రయత్నిస్తే ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోకపోవడం సరి కాదు..’’అని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసిన పాడి కౌశిక్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను పరోక్షంగా ప్రస్తావిస్తూ విమ ర్శించారు. గురువారం మేడ్చల్– మల్కాజ్గిరి జిల్లా కూకట్‌పల్లిలోని జేఎన్టీయూ ఆడిటోరియంలో జరిగిన 14వ జాతీయ ఓటరు దినోత్సవ కార్యక్రమంలో గవర్నర్ ప్రసంగించారు. ప్రజలు ఓటు హక్కును ఆయుధంలా ఉపయోగించుకుని తమ జీవన పరిస్థితులకు మార్చుకోవచ్చని.. ఆ మార్పే దేశ భవిష్యత్తుకు దిక్సూచిగా మారుతుందని స్పష్టం చేశారు. మంచి వారికి ఓటేయాలి.. తమ సమస్యలను వినడంతోపాటు అభివృద్ధి చేయగల సరైన వ్యక్తిని ఎంపిక చేసుకునే అవకా శం ఓటు ద్వారానే లభిస్తుందని.. అభ్యర్థుల గుణ గణాలను పూర్తిగా విశ్లేషించాకే ఓటేయాలని గవర్నర్ పిలుపునిచ్చారు. గుంతల రోడ్లను చూసి ఎమ్మెల్యేలు, ఎంపీలను తిట్టేకంటే ముందు మంచివారికి ఓటు వేయటం మంచి నిర్ణయమన్నారు. ఓటింగ్ సమయంలో వచ్చిన సెలవులను ఉపయోగించుకొని కుటుంబంతో కలసి విహార యాత్రలకు వెళ్తున్నారని.. ఆ ఆలోచన సరికాదని స్పష్టం చేశారు. యువత ఓటు హక్కును తప్ప కుండా వినియోగించుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి పిలుపునిచ్చారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్ మాట్లా డుతూ.. 18 ఏళ్లు నిండిన యువత ఓటర్లుగా నమోదు చేసుకోవాలని కోరారు. గెలవకుంటే శవయాత్ర అంటూ.. గతంలో కేసీఆర్ సర్కారు పాడి కౌశిక్‌రెడ్డిని ఎమ్మెల్సీగా సిఫార్సు చేయగా గవర్నర్ పెండింగ్‌లో పెట్టడం, దీంతో కౌశిక్‌రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం అప్పట్లో కలకలం రేపింది. ఇక ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తనను గెలిపించకపోతే కుటుంబమంతా ఆత్మహత్య చేసుకుంటామని పాడి కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఫలితాల తర్వాత తాను గెలిస్తే జైత్రయాత్ర, లేకుంటే శవయాత్ర జరుగుతుందని ఆయన పేర్కొనడం కూడా తీవ్ర దుమారం రేపింది. ప్రస్తుతం కౌశిక్‌రెడ్డిని ఉద్దేశిస్తూ గవర్నర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. -
మొత్తం ఒకేసారి చెల్లించక్కర్లేదు
సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగురోడ్డు ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణలో రాష్ట్ర ప్రభుత్వం వాటా మొత్తాన్ని ఒకేసారి చెల్లించాల్సిన అవసరం లేదని, ఈమేరకు ఇది వరకే కేంద్ర రాష్ట్రప్రభుత్వాల మధ్య అంగీకారం కుదిరిందని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి సవివర లేఖ రాశారు. రీజినల్ రింగు రోడ్డు ఉత్తర భాగానికి సంబంధించి చెల్లించాల్సిన భూపరిహారంలో 50 శాతంగా రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.2585 కోట్లను చెల్లించాలంటూ ఇటీవల కిషన్‌రెడ్డి సీఎం రేవంత్‌రెడ్డికి రాసిన లేఖకు ప్రత్యుత్తరం విడుదల చేశారు. రివాల్వింగ్ ఫండ్ రూపంలో రూ.100 కోట్లు చెల్లించటంతోపాటు, భూసేకరణకు సంబంధించి అవార్డు వారీగా, అవార్డు జారీ అయిన పక్షం రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం తన వాటా జమ చేసేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఇది వరకు అంగీకారం కుదిరిందని అందులో ప్రస్తావించారు. దాని ప్రకారం భూపరిహారంలో రాష్ట్ర ప్రభుత్వ వాటా ఒకేసారి చెల్లించాల్సిన అవసరం లేదని గుర్తు చేస్తున్నట్టు కోమటిరెడ్డి పేర్కొన్నారు. యుటిలిటీ షిఫ్టింగ్ చార్జీలను మేమే చెల్లిస్తామన్నాం కదా..: యుటిలిటీ షిఫ్టింగ్ చార్జీలను చెల్లించే పరిస్థితి లేదని గత బీఆర్ఎస్ ప్రభుత్వం పేర్కొన్నా, ఆ మొత్తాన్ని చెల్లించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని జనవరి 11న రాష్ట్ర ప్రభుత్వం ఎన్హెచ్ఏఐకి లేఖ రాసిన విషయాన్ని మంత్రి కోమటిరెడ్డి గుర్తు చేశారు. ఈమేరకు యుటిలిటీ చార్జీలకు సంబంధించి రెండు ప్రభుత్వాల మధ్య పరిష్కరించుకోవాల్సిన సమస్యలు లేనట్టేనని స్పష్టం చేశారు. భారతమాల పరియోజన పథకం కింద నిర్మిస్తున్న 11 జాతీయ రహదారులకు సంబంధించి 284 హెక్టార్లు మినహా భూసేకరణ చేయలేదని కిషన్ రెడ్డి పేర్కొన్నారని కోమటిరెడ్డి ఆ లేఖలో ప్రస్తావించారు. కానీ ఇప్పటి వరకు రీజినల్ రింగ్‌రోడ్డు మినహా మిగతా ప్రాజెక్టులకు సంబంధించి 2377 హెక్టార్లకు గానూ 1531 హెక్టార్ల భూమిని సేకరించినట్టు గుర్తు చేశారు. తెలంగాణలో జాతీయ రహదారుల పనులు వేగంగా జరిగేలా తెలంగాణ బిడ్డగా సహకరించాలని ఆయన కిషన్‌రెడ్డికి సూచించారు.