Funday
-
జావెలిన్ దిగిందా లేదా!
మొహమ్మద్ అబ్దుల్ హాది ఏమీ చేతకాని, ఏ పనీ చేయలేని బతుకూ ఒక బతుకేనా? దీనికంటే ఆత్మహత్య నయమంటూ, మరుగుజ్జు అంటూ హేళన చేసిన వాళ్లంతా ఇప్పుడు అతని మీద ప్రశంసలు కురిపిస్తున్నారు. కారణం.. పారిస్ పారాలింపిక్స్‌లో అతను జావెలిన్ త్రోలో స్వర్ణాన్ని అందుకోవడమే! ఆ క్రీడాకారుడు 23 ఏళ్ల నవదీప్ సింగ్. విజయానంతరం ఆ జావెలిన్ త్రోయర్ భారత్ తిరిగి వచ్చాక, దేశ ప్రధాని నరేంద్ర మోదీ అతనితో సరదాగా మాట్లాడిన తీరు చూస్తే.. నవదీప్ తన ఆటతో ప్రపంచం దృష్టిని ఎలా ఆకర్షించాడో అర్థమవుతుంది. పారాలింపిక్స్‌లో అతను సాధించిన విజయం సామాన్యమైంది కాదు. ఆత్మన్యూనతాభావంతో బతికే ఎంతోమంది నేర్చుకోవాల్సిన పాఠం. ఆ ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకం. హరియాణాలోని పానిపట్ సమీపంలో బువానా లాఖు నవదీప్ సొంత ఊరు. తండ్రి దల్వీర్ సింగ్ స్థానిక పంచాయతీ కార్యాలయంలో ఉద్యోగి. జన్యుపరమైన లోపాలతో పుట్టడం వల్ల నవదీప్ వయసుకు తగ్గట్టు ఎదగలేకపోయాడు. పిల్లాడికి రెండేళ్లు వస్తేగానీ పరిస్థితి తీవ్రత తల్లిదండ్రులకు అర్థం కాలేదు. అప్పుడు కొడుకు చికిత్స కోసం వాళ్లు ఎంత ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. ఊర్లో అతను మరుగుజ్జు నవదీప్గా స్థిరపడిపోయాడు. దాంతో బాల్యం నుంచే అతను అత్యంత అవసరమైతే తప్ప బయటకు రాకుండా, ఇంట్లోనే ఉండిపోసాగాడు. ‘కొన్నిసార్లు మాతో కూడా మాట్లాడకుండా గదికి గడియ పెట్టుకుని, ఏడుస్తూ ఉండిపోయేవాడ’ని అతని పెద్దన్న మన్దీప్ గుర్తు చేసుకుంటాడు. కొడుకును సాధారణ స్థితికి తెచ్చేందుకు నవదీప్ తండ్రి తనకు సాధ్యమైనంతగా ప్రయత్నించాడు. నవదీప్ చదువుకునేందుకు మంచి మంచి పుస్తకాలను తెచ్చివ్వడంతో పాటు, ఇతర అంశాలపై అతను దృష్టి సారించేలా చేశాడు. రాష్ట్రపతి అవార్డుతో..నవదీప్‌ని ఒంటరితనం నుంచి బయటపడేసేవి ఆటలే అని భావించారంతా! దాంతో ఇంట్లోవాళ్లు అతణ్ణి ఆటల వైపు ప్రోత్సహించారు. నవదీప్ తండ్రికి రెజ్లింగ్‌లో స్థానిక పోటీల్లో పాల్గొన్న అనుభవం ఉంది. నవదీప్ కూడా ముందుగా రెజ్లింగ్‌లోనే సాధన చేశాడు. అయితే అక్కడా అతనికి తన ఆరోగ్యం కొంత సమస్యగా మారింది. వెన్ను నొప్పి కారణంగా రెజ్లింగ్ సాధ్యం కాదని అర్థమవడంతో దానిని వదిలేశాడు. స్థానిక గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నప్పుడు స్పోర్ట్స్‌పై మరింత ఆసక్తి పెరిగింది. పీఈటీ ప్రోత్సాహంతో అతను అథ్లెటిక్స్ వైపు మళ్లాడు. అందులో అందరితో పోటీపడుతూ సాధించిన విజయాలు నవదీప్‌కు గ్రామంలో మంచి పేరు తెచ్చి పెట్టాయి. అతని క్రీడా ప్రతిభ హరియాణాను దాటింది. వైకల్యాన్ని అధిగమించి పలు జాతీయ స్థాయి పోటీల్లోనూ మంచి ప్రదర్శన నమోదు చేశాడు. 12 ఏళ్ల వయసులో అతను కేంద్ర ప్రభుత్వం అందించే ‘రాష్ట్రీయ బాల్పురస్కార్’ అవార్డుకు ఎంపికయ్యాడు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా అందుకున్న ఈ అవార్డు తన మరుగుజ్జుతనాన్ని మరచిపోయేలా చేసింది. ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ప్రత్యేక శిక్షణతో ..బాల్పురస్కార్ అవార్డు తర్వాత క్రీడలపై పూర్తిగా దృష్టి సారించవచ్చని నవదీప్‌కు నమ్మకం కలిగింది. మరికొంత కాలం అథ్లెటిక్స్‌పై మరింత సాధన చేసి ఆటలో పదును పెంచుకున్నాడు. ఆ తర్వాత శ్రేయోభిలాషులందరూ అండగా నిలవడంతో పెద్దస్థాయిలో శిక్షణ కోసం, నవదీప్ తన 16వ ఏట ఢిల్లీకి చేరుకున్నాడు. అక్కడి కోచ్ నావల్ సింగ్ వద్ద అథ్లెటిక్స్‌లో కోచింగ్, ప్రాక్టీస్ సాగింది. నవదీప్‌కి ఇంకా తోడుగా ఉండటం వల్ల అతను పైకి రాలేడని, అతను స్వతంత్రంగా ఉండే ఏర్పాట్లు చేయాలని పెద్దన్న మన్దీప్ తన తండ్రిపై ఒత్తిడి తెచ్చాడు. దాంతో తండ్రి ఎల్ఐసీ పాలసీ ద్వారా అప్పు చేసి మరీ కొడుకు కోసం అన్ని ఏర్పాట్లు చేశాడు. కానీ కొడుకు ఒలింపిక్ విజయానికి కొన్ని నెలల ముందే ఆయన కన్నుమూశాడు. కొడుకు గెలుపును చూడలేకపోయాడు. కఠోర సాధనతో..ఢిల్లీలో శిక్షణ పొందే క్రమంలో అథ్లెటిక్స్‌లో ఏదైనా ఒక ఈవెంట్‌పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాల్సిన టైమ్ వచ్చింది. అప్పుడే హరియాణాకే చెందిన నీరజ్ చోప్రా.. అండర్–20 వరల్డ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించడం నవదీప్‌ను ఆకర్షించింది. దాంతో తనూ జావెలిన్ త్రో వైపు మొగ్గు చూపాడు. అక్కడి జావెలిన్ కోచ్ విపిన్ కసానా ఒక ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. ‘నా కెరీర్లో నేను ఎంతో మందికి శిక్షణనిచ్చాను. కానీ ఇంత తక్కువ ఎత్తు ఉన్న ఆటగాళ్లెవరూ నా వద్దకు రాలేదు. దాంతో నవదీప్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సి వచ్చింది. 2.2 మీటర్ల పొడవు ఉన్న జావెలిన్‌ను పట్టుకోవడం మొదలు భుజాలపై భారం ఉంచి విసిరే వరకు అంతా భిన్నమే. జావెలిన్‌ను విసిరే కోణాల్లో కూడా మార్పు చేయాల్సి వచ్చింది. కానీ ఏం చేసినా అతని పట్టుదల ముందు అన్నీ చిన్నవిగా అనిపించాయి. కఠోర సాధనకు నవదీప్ ఏ దశలోనూ వెనుకాడలేదు’ అని విపిన్ చెప్పారు. ఒలింపిక్ పతకాన్ని ముద్దాడి..నవదీప్ కష్టానికి ప్రతిఫలం కొద్దిరోజులకే దక్కింది. 17 ఏళ్ల వయసులో ఆసియా యూత్ పారా గేమ్స్‌లో స్వర్ణంతో అతని విజయ ప్రస్థానం మొదలైంది. ఆ తర్వాత వరల్డ్ పారా గ్రాండ్ ప్రీలో స్వర్ణం గెలిచిన అతను ఈ ఏడాది ఆరంభంలో వరల్డ్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం సాధించి ఒలింపిక్స్‌పై ఆశలు రేపాడు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ జావెలిన్ త్రో ఎఫ్ 41 విభాగంలో (తక్కువ ఎత్తు ఉన్న ఆటగాళ్ల కేటగిరీ) స్వర్ణం గెలుచుకున్నాడు. చిన్నప్పటి నుంచి చేస్తూ వస్తున్నట్లే ఈసారి కూడా తన ఊర్లో అందరికీ ఆ పతకాన్ని చూపించి గర్వంగా నిలబడ్డాడు. -
ఎల్ఈడీ లిప్ మెషిన్
ఏ ఛాయలో ఉన్నా, ఏ వయసు వారైనా తమ పెదవులు మృదువుగా, చూడచక్కగా ఉండాలనే కోరుకుంటారు. అలాంటి వారికి చిత్రంలోని ఈ డివైస్ చాలా చక్కగా పని చేస్తుంది. ఈ ఎల్ఈడీ లిప్ మెషిన్ అధరాలను అందంగా మార్చేస్తుంది.పదవులపై ముడతలు, పగుళ్లు, గీతలు ఇలా అన్నింటినీ పోగొట్టి, ‘అధర’హో అన్నట్లుగా మెరిపిస్తుంది. ఈ మెషిన్ నాలుగు వేరువేరు మోడ్స్‌తో, 56 డీప్ పెనిట్రేటింగ్ ఎల్ఈడీ టెక్నాలజీతో యూజర్ ఫ్రెండ్లీగా ఉపయోగపడుతుంది. దీన్ని పెదవులకు ఆనించి, బటన్ ఆన్ చేసుకుంటే సరిపోతుంది. సుమారు 8 వారాల పాటు రోజుకు 3 నిమిషాలు ఈ లిప్ డివైస్‌తో ట్రీట్మెంట్ తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.ఈ మెషిన్ని మీ మేకప్ కిట్‌లో భాగం చేసుకుంటే పెదవులను అందంగా, సహజంగా దొండపండులా మలచుకోవచ్చు. సురక్షితమైన సిలికాన్ తో రూపొందిన ఈ డివైస్‌తో ఎలాంటి నొప్పి కలుగదు. వేడి తీవ్రత ఇబ్బందికరంగా ఉండదు. ఈ పరికరం కొలాజన్ ఉత్పత్తిని ప్రేరేపించడంతో పాటు రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. దీనితో ట్రీట్మెంట్ ఎవరికి వారు స్వయంగా చేసుకోవచ్చు. అయితే దీన్ని వినియోగించిన ప్రతిసారి పెదవులకు ఆనించే సిలికాన్ భాగాన్ని టిష్యూతో లేదా క్లాత్‌తో క్లీన్ చేసుకుంటూ ఉండాలి. డివైస్‌కి ముందే చార్జింగ్ పెట్టుకుని వైర్‌లెస్‌గా వాడుకోవచ్చు. చార్జింగ్ బేస్ వేరుగా, ట్రీట్మెంట్ వైబ్రేషన్ మసాజర్ వేరుగా ఉండటంతో వాడకం సులభంగా ఉంటుంది. -
Diabetes: ఎలాంటి డైట్‌తో అదుపులో ఉంచొచ్చు
నాకు ఇప్పుడు 8వ నెల. డయాబెటిస్ వచ్చిందని డాక్టర్ చెప్పారు. మా తల్లిదండ్రులకు కూడా ఉంది. డైట్ చెయ్యమన్నారు. ఈ సమయంలో ఎలాంటి డైట్‌తో డయాబెటిస్‌ని అదుపులో ఉంచవచ్చు.– శిరీష, మెదక్గర్భధారణ సమయంలో డయాబెటిస్ అనేది ఏ నెలలో అయినా రావచ్చు. కుటుంబ నేపథ్యంలో ఉన్నా, ఊబకాయం ఉన్నా డయాబెటిస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జీవన శైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా అదుపు చేయవచ్చు. వీటితో తగ్గనప్పుడు మందులు ఇస్తాం. బిడ్డ పరిణతి, ఎదుగుదల బాగుండాలంటే ఎప్పుడూ డయాబెటిస్ అదుపులో ఉండాలి. గర్భధారణ సమయంలో బరువు తగ్గడానికి ప్రయత్నించకూడదు. ఎక్కువ బరువు పెరిగి డయాబెటిస్ రాకుండా ముందుగానే జాగ్రత్తపడాలి. డైటీషియన్, న్యూట్రిషన్ కౌన్సెలర్లు మీ బరువు, ఎన్ని నెలలు, మీ ఇష్టాలు వంటి అంశాలను బట్టి ఆరోగ్యకరమైన ఆహారాన్ని సూచిస్తారు. మీరు తీసుకునే ఆహారంలో చక్కెర పాళ్లు తక్కువ ఉండే ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉండే ఆహారం ఎంచుకోవాలి. అంటే ఎక్కువ ఫైబర్ ఉండే ఆహారం– బ్రౌన్ రైస్, అన్ని రకాల గింజలతో తయారు చేసిన పాస్తా, బాస్మతీ రైస్, తృణ ధాన్యాలతో తయారు చేసే ఆహార ఉత్పత్తులను తీసుకోవాలి. కొన్నిరకాల ఆహార పదార్థాలు రక్తంలో గ్లూకోజ్ స్థాయిని పెంచవు. మాంసం, చేప, గుడ్లు, పౌల్ట్రీ, నట్స్, సీడ్స్, పప్పులు, సలాడ్స్ లాంటివి మనం తినే భోజనంలో భాగం చేసుకోవాలి. మీ ఆహారం తీసుకునేటప్పుడు ఒక్కసారే ఎక్కువ మోతాదులో కాకుండా మూడుసార్లుగా విభజించుకోండి. తీపి పదార్థాలు, కేక్స్, బిస్కట్స్, చాక్లెట్స్, పుడ్డింగ్స్, ఫాస్ట్ ఫుడ్స్ లాంటివి పూర్తిగా మానేయండి. వీటికి బదులుగా రైస్ కేక్స్, క్రిస్ప్ బ్రెడ్, హోల్ గ్రెయిన్ క్రాకర్స్, ఓట్స్ కేక్స్, పాప్‌కార్న్ లాంటివి తక్కువ మోతాదులో తీసుకోవాలి. ఒకసారి తినే ఆహారంలో 40గ్రాముల కన్నా ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకోకూడదు. ప్రతి ఒక్కరి శరీర జీవక్రియ (మెటబాలిజమ్) ఒక్కలా ఉండదు. అందుకే 40గ్రాములతో మొదలుపెట్టి, రక్తంలో గ్లూకోజ్ స్థాయి రెండు గంటలకు అదుపులో ఉంటే కొంచెం పెంచుకోవచ్చు. ఎక్కువ అయితే గ్రాములను కొంచెం తగ్గించాలి. భోజనానికీ భోజనానికీ మధ్యలో ఆకలి వేస్తుందని జంక్ ఫుడ్ తినేస్తారు. అలా కాకుండా 10–15 గ్రాముల కార్బోహైడ్రేట్స్ ఉన్న చిరుతిళ్లు మాత్రమే తీసుకోవాలి. అంటే, 200 ఎంఎల్ పాలు, పెరుగు, ఒక టేబుల్ స్పూన్ పాస్తా, ఒక గుడ్డు లాంటివి. బ్రెడ్, పాస్తా, బంగాళదుంపలలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. కూరగాయలు, సలాడ్స్ ఎక్కువగా తీసుకోవచ్చు. నూనె ఎక్కువగా ఉన్న, వేయించిన పదార్థాలు తినకూడదు. పండ్లరసాలతో చక్కెర శాతం అధికంగా పెరుగుతుంది. అందుకే çపండ్లను నేరుగా తినాలి. గ్రీన్ ఆపిల్, నారింజ, ద్రాక్ష తినాలి. పాలు, పాల ఉత్పత్తులలో కాల్షియం అధికంగా ఉంటుంది. రోజుకి 2–3 సార్లు తీసుకోవాలి. 200 ఎంఎల్ పాలు, 125 గ్రాముల పెరుగు తీసుకోవచ్చు. ప్రొటీన్ ఫుడ్ ఎక్కువ తింటే పోస్ట్ మీల్ సుగర్ రాదు, అందుకే ప్రొటీన్‌ను ప్రతి ఆహారంలో చేర్చుకోవాలి. హై ఫ్యాట్ ఫుడ్ తీసుకోకూడదు. ప్రతి రెండుగంటలకోసారి నీళ్లు తాగాలి. దీనితో అజీర్ణం, మలబద్ధకం తగ్గుతాయి. బయట దొరికే ఆహారపదార్థాలను తీసుకోవడం మానేస్తే మంచిది. సుగర్ ఫ్రీ కుకీస్ కూడా ఈ సమయంలో మంచిదికాదు. మీరు డైట్ మొదలుపెట్టిన 2వారాలకి బ్లడ్ çసుగర్ లెవెల్స్ ల్యాబ్‌లో పరిశీలిస్తారు. అదుపులో ఉంటే ప్రసవం అయ్యే వరకూ అదే డైట్‌ను తీసుకోమంటారు. ఒకవేళ 9వ నెలలో ఎక్కువ అయితే తక్కువ మోతాదు సుగర్ మందులను వాడమని చెబుతారు. క్రమం తప్పకుండా ముఖ్యంగా ఆఖరి రెండు నెలలు గైనకాలజిస్ట్ సలహాలు పాటించాలి. ప్రసవం తరువాత కూడా 95శాతం డయాబెటిస్ తగ్గిపోతుంది. కానీ భవిష్యత్తులో ఎప్పుడైనా డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి సంవత్సరం ఫాస్టింగ్ బ్లడ్ సుగర్ లెవెల్స్ చెక్ చేయించుకోవాలి. ఈ లెవెల్ 100 ఎంజీ/డీఎల్ ఉంటే, ఒకసారి డయాబెటిస్ నిపుణులను కలవాలి. భవిష్యత్తులో టైప్–2 డయాబెటిస్ రాకుండా ఆహారం, వ్యాయామం, ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించాలి. నెలసరి బాధలకు చెక్‌పెట్టే ఔషధంచాలామంది మహిళలు ఎండోమెట్రియాసిస్ సమస్య కారణంగా నెలసరి సమయంలో తీవ్రమైన నొప్పి, అధిక రక్తస్రావం వంటి ఇబ్బందులతో బాధపడుతుంటారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది మహిళలు ఎండోమెట్రియాసిస్‌తో బాధపడుతున్నారు. ఈ సమస్య వల్ల మహిళలు తీవ్రమైన రక్తహీనతకు లోనవుతారు. ఎండోమెట్రియాసిస్ సమస్యను శాశ్వతంగా నయం చేసే చికిత్స పద్ధతులేవీ ఇప్పటికీ అందుబాటులోకి రాలేదు. అయితే, ఎండోమెట్రియాసిస్ వల్ల తలెత్తే నొప్పులను, అధిక రక్తస్రావాన్ని అరికట్టే ఔషధం ఇంగ్లండ్‌లో అందుబాటులోకి వచ్చింది. ‘ఇవాన్–500ఎంజీ’ పేరుతో ఇటీవల మార్కెట్లోకి విడుదలైన ఈ మాత్రలను ఎలాంటి ప్రిస్క్రిప్షన్ లేకున్నా కొనుక్కోవచ్చు. ఈ మాత్రలలో ఉండే ‘ట్రానెక్సిమిక్ యాసిడ్’ నెలసరి బాధలకు చాలా వరకు చెక్ పెడుతుంది. ఇప్పటికే ఈ మాత్రలు వాడిన మహిళలు ఇవి అద్భుతంగా పనిచేస్తున్నాయని చెబుతున్నారు. -
దుర్గార్తిశమనీ దశదిశలా దసరా
జగన్మాత అయిన దుర్గాదేవి దుర్గతులను దూరం చేస్తుందని, ఆర్తత్రాణ పరాయణ అని భక్తుల నమ్మకం. ఆర్తితో పూజించే భక్తులకు ఆపదలు రాకుండా చూసుకుంటుందని, ఐహిక ఆముష్మిక సుఖశాంతులను ప్రసాదిస్తుందని ప్రగాఢ విశ్వాసం. అందుకే ద్వాత్రింశన్నామ స్తోత్రం దుర్గాదేవిని దుర్గార్తిశమనీ అని స్తుతిస్తోంది.ప్రతి ఏటా ఆశ్వయుజ మాసంలోని శుక్లపక్ష పాడ్యమి నుంచి దశమి వరకు దేవీ నవరాత్రులు జరుగుతాయి. శరదృతువులో వచ్చే నవరాత్రులు గనుక వీటిని శరన్నవరాత్రులు అని, చివరి రోజైన దశమి రోజును విజయ దశమిగా, దసరా పండుగగా జరుపుకుంటారు గనుక వీటిని దసరా నవరాత్రులని కూడా అంటారు. ఈ నవరాత్రి వేడుకల్లో దుర్గాదేవిని వివిధ రూపాలలో ఆరాధిస్తారు.‘భూతాని దుర్గా! భువనాని దుర్గా! స్త్రీయో నరాశ్చపి పశుశ్చ దుర్గా!యద్యద్ధి దృశ్యం ఖలు నైవ దుర్గా! దుర్గా స్వరూపాదపరం న కించిత్.’పై శ్లోకానికి తాత్పర్యం ఏమిటంటే, సమస్త ప్రాణికోటి దుర్గా స్వరూపమే! సమస్త లోకాలూ దుర్గా స్వరూపమే! స్త్రీలు పురుషులు పశువులు అన్నీ దుర్గా స్వరూపమే! లోకంలో కంటికి కనిపించేవన్నీ దుర్గా స్వరూపమే! దుర్గా స్వరూపం కానిదంటూ ఏదీ లేదు. దుర్గాదేవిని నమ్ముకున్న భక్తుల భావన ఇది.దేవీ నవరాత్రులను అష్టాదశ శక్తిపీఠాలు సహా అమ్మవారి ఆలయాలన్నింటిలోనూ అత్యంత వైభవోపేతంగా జరుపుకుంటారు. ఆంధ్రప్రదేశ్ విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గ ఆలయంలో విశేషంగా జరుపుకొంటారు. నవరాత్రులలో కనకదుర్గ అమ్మవారిని వివిధ రూపాలలో అలంకరించి, రోజుకో నైవేద్యాన్ని నివేదిస్తారు.నవరాత్రులలో కనకదుర్గాదేవి అలంకారాలు1 మొదటిరోజున శ్రీ స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా బంగారురంగు వస్త్రాలతో అలంకరిస్తారు. నైవేద్యంగా తీపి బూందీ, సుండలు సమర్పిస్తారు.2 రెండో రోజున శ్రీ బాలా త్రిపురసుందరీదేవిగా గులాబిరంగు వస్త్రాలతో అలంకరిస్తారు. నైవేద్యంగా పెసరపప్పు పాయసాన్ని సమర్పిస్తారు.3 మూడో రోజున శ్రీ గాయత్రీదేవిగా కనకాంబరంరంగు వస్త్రాలతో అలంకరిస్తారు. అల్లం గారెలను నైవేద్యంగా సమర్పిస్తారు.4 నాలుగో రోజున శ్రీ అన్నపూర్ణాదేవిగా గంధంరంగు వస్త్రాలతో అలంకరిస్తారు. దద్ధ్యోదనం, కట్టెపొంగలి నైవేద్యంగా సమర్పిస్తారు.5 ఐదో రోజున శ్రీ లలితా త్రిపురసుందరీదేవిగా బంగారు రంగు వస్త్రాలతో అలంకరిస్తారు. నైవేద్యంగా పులిహోర, పెసర బూరెలను సమర్పిస్తారు.6 ఆరో రోజున శ్రీ మహాలక్ష్మీదేవిగా గులాబిరంగు వస్త్రాలతో అలంకరిస్తారు. నైవేద్యంగా పూర్ణాలు, క్షీరాన్నం సమర్పిస్తారు.7 ఏడో రోజున శ్రీ సరస్వతీదేవిగా తెలుపురంగు వస్త్రాలతో అలంకరిస్తారు. నైవేద్యంగా పరమాన్నం, దధ్యోదనం, అటుకులు, బెల్లం, శనగ పప్పు సమర్పిస్తారు.8 ఎనిమిదో రోజున శ్రీ దుర్గాదేవిగా ఎరుపురంగు వస్త్రాలతో అలంకరిస్తారు. పులగం, పులిహోరలను నైవేద్యంగా సమర్పిస్తారు.9 తొమ్మిదో రోజున శ్రీ మహిషాసురమర్దనిగా ముదురు గోధుమరంగు వస్త్రాలతో అలంకరిస్తారు. నైవేద్యంగా పులగం, పులిహోర, గారెలు, నిమ్మరసం, వడపప్పు, పానకం సమర్పిస్తారు.10 పదో రోజున శ్రీ రాజరాజేశ్వరీదేవిగా ఆకుపచ్చరంగు వస్త్రాలతో అలంకరిస్తారు. నైవేద్యంగా లడ్డూలను సమర్పిస్తారు.నవదుర్గల ఆరాధనదసరా నవరాత్రులలో అమ్మవారిని నవదుర్గల రూపాలలో కూడా పూజిస్తారు. శ్రీచక్రంలోని నవచక్రాలలో కొలువుండే దుర్గాదేవి నవరూపాల గురించి బ్రహ్మదేవుడు మార్కండేయునికి చెప్పినట్లుగా వరాహ పురాణం చెబుతోంది. వరాహ పురాణం చెప్పిన ప్రకారం–ప్రథమం శైలపుత్రీ చ ద్వితీయం బ్రహ్మచారిణీతృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకమ్పంచమం స్కందమాతేతి షష్ఠం కాత్యాయనీతి చసప్తమం కాలరాత్రీతి మహాగౌరీతి చాష్టకమ్నవమం సిద్ధిధాత్రీ చ నవదుర్గాః ప్రకీర్తితాఃఉక్తాన్యేతాని నామాని బ్రహ్మణైవ మహాత్మనాఈ నవరాత్రులలో దుర్గాదేవి భక్తులు అమ్మవారిని శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాలరాత్రి, మహాగౌరి, సిద్ధిధాత్రి అనే నవదుర్గా రూపాలలో భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు.దుర్గా సప్తశతిలో అమ్మవారి తొమ్మిదిరూపాల ప్రస్తావన మరోవిధంగా ఉన్నా, వాటిని నవదుర్గలుగా పేర్కొనలేదు. దుర్గా సప్తశతిలో మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి, నంద, శాకంబరి, భీమ, రక్తదంతిక, దుర్గా, భ్రామరీ అనే రూపాల ప్రస్తావన ఉంది. కొన్నిచోట్ల నవరాత్రులలో అమ్మవారిని ఈ రూపాలలో కూడా ప్రత్యేక అలంకరణలు, నైవేద్యాలతో ఆరాధించే సంప్రదాయం ఉంది. శమీపూజనవరాత్రుల చివరి రోజైన విజయ దశమినాడు శమీపూజ చేయడం ఆనవాయితీ. పాండవులు అరణ్యవాసం ముగించుకుని, అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు తమ ఆయుధాలను, వస్త్రాలను ఎవరికీ కనిపించకుండా శమీవృక్షం– అంటే జమ్మిచెట్టు మీద దాచారు. అజ్ఞాతవాసం ముగిసిన తర్వాత వారు శమీవృక్షానికి పూజించి, దానిపై తాము దాచుకున్న ఆయుధాలను వస్త్రాలను తిరిగి తీసుకున్నారు. శమీవృక్షంలో అపరాజితా దేవి కొలువై ఉంటుందని నమ్మకం. అపరాజితా దేవి ఆశీస్సులతోనే పాండవులు కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులపై విజయం సాధించినట్లు మహాభారతం చెబుతోంది. శ్రీరాముడు కూడా విజయదశమి రోజున అపరాజితా దేవిని పూజించి, రావణునిపై విజయం సాధించినట్లు రామాయణం చెబుతోంది. ఈ సందర్భంగా చాలాచోట్ల ఆయుధపూజలు కూడా జరుపుతారు. తెలంగాణలో శమీపూజ తర్వాత పాలపిట్ట దర్శనం చేసుకునే ఆచారం కూడా ఉంది. విజయదశమి రోజు సాయంత్రం నక్షత్ర దర్శనమైన తర్వాత శమీవృక్షం వద్దకు చేరుకుని, అపరాజితా దేవిని పూజించిన తర్వాత– ‘శమీ శమయుతే పాపం శమీ శత్రు వినాశినీఅర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియదర్శినీ’ అనే శ్లోకాన్ని పఠిస్తూ, శమీవృక్షం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. కొందరు శమీ అష్టోత్తరాన్ని కూడా పఠించి, పూజ జరుపుతారు. శమీపూజ చేయడం వల్ల అపరాజితా దేవి ఆశీస్సులు లభించడమే కాకుండా, శనిదోష నివారణ జరుగుతుందని ప్రతీతి.దసరా నవరాత్రుల సమయంలో తెలంగాణలో బతుకమ్మ పండుగను తొమ్మిది రోజుల పాటు వైభవంగా జరుపుకొంటారు. రకరకాల రంగు రంగుల పూలతో బతుకమ్మను పేర్చి, మహిళలు బతుకమ్మ చుట్టూ వలయాకారంలో తిరుగుతూ, పాటలు పాడుతూ సందడి చేస్తారు. ఈ నవరాత్రుల రోజులలో కొన్ని ప్రాంతాల్లోని మహిళలు ‘గ్రామ కుంకుమ నోము’, ‘కైలాసగౌరీ నోము’ వంటి నోములను నోచుకుంటారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బతుకమ్మ పండుగను తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రపండుగగా నిర్వహిస్తోంది. బతుకమ్మ పండుగలోనూ రోజుకో తీరులో నైవేద్యాలను సమర్పిస్తారు.పూల వేడుక బతుకమ్మ పండుగఎంగిలిపూల బతుకమ్మ: మొదటిరోజు బతుకమ్మను ఎంగిలిపూల బతుకమ్మ అంటారు. మహాలయ అమావాస్య రోజున ఈ పండుగ మొదలవుతుంది. ఈ రోజున బియ్యప్పిండి, నూకలు, నువ్వులు కలిపి నైవేద్యం తయారు చేసి సమర్పిస్తారు.అటుకుల బతుకమ్మ: ఆశ్వయుజ శుక్ల పాడ్యమి నాడు చేస్తారు. రెండో రోజు జరిగే ఈ వేడుకను అటుకుల బతుకమ్మ అంటారు. ఈ రోజున సప్పిడి పప్పు, అటుకులు, బెల్లంతో తయారు చేసిన నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పిస్తారు.ముద్దపప్పు బతుకమ్మ: మూడో రోజు వేడుకను ముద్దపప్పు బతుకమ్మ అంటారు. ఈ రోజున పాలు, బెల్లం, ముద్దపప్పుతో తయారు చేసిన నైవేద్యం సమర్పిస్తారు.నానేబియ్యం బతుకమ్మ: నాలుగో రోజు వేడుకను నానేబియ్యం బతుకమ్మ అంటారు.ఈ రోజున నానబెట్టిన బియ్యం, పాలు, బెల్లం కలిపి తయారు చేసిన నైవేద్యం సమర్పిస్తారు.అట్ల బతుకమ్మ: ఐదో రోజు వేడుకను అట్ల బతుకమ్మ అంటారు. ఈ రోజున అమ్మవారికి అట్లు లేదా దోశలను నైవేద్యంగా సమర్పిస్తారు.అలిగిన బతుకమ్మ: ఆరో రోజు వేడుకను అలిగిన బతుకమ్మ అంటారు. ఈ రోజున నైవేద్యమేమీ సమర్పించరు.వేపపండ్ల బతుకమ్మ: ఏడో రోజు వేడుకను వేపపండ్ల బతుకమ్మ అంటారు. ఈ రోజున బాగా వేపిన బియ్యప్పిండితో వేపపండ్లలా వంటకాన్ని తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు.వెన్నముద్దల బతుకమ్మ: ఎనిమిదో రోజు వేడుకను వెన్నముద్దల బతుకమ్మ అంటారు. ఈ రోజున నువ్వులు, బెల్లం వెన్నముద్ద లేదా నెయ్యిలో కలిపి నైవేద్యంగా సమర్పిస్తారు.సద్దుల బతుకమ్మ: తొమ్మిదో రోజు వేడుకను సద్దుల బతుకమ్మ అంటారు. ఇదే రోజున దుర్గాష్టమి జరుపుకొంటారు. ఈ రోజున బతుకమ్మకు పెరుగన్నం, చింతపండు పులిహోర, నిమ్మకాయ పులిహోర, కొబ్బరన్నం, నువ్వులన్నం– ఐదు రకాల నైవేద్యాలను సమర్పిస్తారు.ఆడపడుచులందరూ అత్తవారింటి నుంచి వచ్చి పుట్టింట్లో ఈ తొమ్మిదిరోజుల పూల పండుగను జరుపుకొంటారు. పండుగ ముగిసిన తర్వాత బతుకమ్మను దగ్గర్లో ఉన్న జలాల్లో నిమజ్జనం చేస్తారు. ఆంధ్రప్రదేశ్‌లోని పలనాడు ప్రాంతంలో కూడా కొన్ని చోట్ల బతుకమ్మ పండుగను జరుపుకొంటారు. పన్యాల జగన్నాథదాసు -
మెరిసే పుట్టగొడుగులు..! తింటే.. అంతే..!
మిణుగురు పురుగులు చీకట్లో వెలుగులు వెదజల్లుతూ ఎగురుతుంటాయి. ఈ పుట్టగొడుగులు కూడా మిణుగురుల్లాగానే చీకట్లో వెలుగులు వెదజల్లుతుంటాయి. రాత్రి పూర్తిగా చీకటి పడిన తర్వాత ఇవి ఆకుపచ్చ రంగులో వెలుగుతూ మిరుమిట్లు గొలుపుతాయి.‘మైసీనీ క్లోరోఫాస్’ అనే ఈ పుట్టగొడుగులు పగటివేళ మిగిలిన పుట్టగొడుగుల మాదిరిగానే బూడిదరంగు గోధుమరంగు కలగలసిన రంగులో కనిపిస్తాయి. ఇవి భారత్, శ్రీలంక, తైవాన్, ఇండోనేసియా, పోలినేసియా, ఆస్ట్రేలియా, బ్రెజిల్ తదితర దేశాల్లో కనిపిస్తాయి. అమెరికన్ వృక్షశాస్త్రవేత్త చాల్స్ రైట్ 1854లో తొలిసారిగా వీటిని జపాన్‌లోని బోనిన్ దీవుల్లో గుర్తించాడు. ఈ పుట్టగొడుగుల కాండం 2–12 అంగుళాల వరకు ఉంటుంది. పైనున్న గొడుగు వంటి భాగం 1.2 అంగుళాల వరకు ఉంటుంది. జపాన్‌లో దీనిని ‘యాకో టాకె’ అని అంటారు. అంటే, ‘రాత్రి దీపం’ అని అర్థం. రాత్రివేళ వెలుగుతూ ఆకర్షణీయంగా కనిపించే ఈ పుట్టగొడుగులు తినడానికి మాత్రం పనికిరావు. పొరపాటున తింటే, వీటిలోని విషపదార్థాలు ఒక్కోసారి ప్రాణాంతక పరిస్థితులకు దారితీస్తాయి. (చదవండి: గుండెకు ముప్పు రాకూడదంటే ఈ పరీక్షలు తప్పనిసరి..) -
ఆ ముచ్చట తీర్చే సెల్ఫీ ప్రింటర్
స్మార్ట్ఫోన్లు చేతిలోకి వచ్చాక జనాలకు ఎడాపెడా సెల్ఫీలు తీసుకోవడం అలవాటుగా మారిపోయింది. సెల్ఫీలు ఎంతసేపూ ఫోన్లోనో, కంప్యూటర్లలోనో చూసుకోవడమే తప్ప పాతకాలంలోలా వాటిని ప్రింట్ చేయించి, ఆల్బమ్స్‌లో దాచుకునే అలవాటు దాదాపు అంతరించింది.అయితే, సెల్ఫీలను ప్రింట్ చేసుకుని, దాచుకోవాలనే ముచ్చట కూడా కొందరికి ఉంటుంది. ఆ ముచ్చట తీర్చడానికే జపానీస్ కెమెరాల తయారీ కంపెనీ ‘కేనన్’ తాజాగా సెల్ఫీ ప్రింటర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ‘సెల్ఫీ క్యూఎక్స్20’ పేరుతో ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసిన ఈ ప్రింటర్‌తో స్మార్ట్‌ఫోన్ నుంచి ఫొటోలను నేరుగా ముద్రించుకోవచ్చు.అలాగే, లాప్టాప్, డెస్క్‌టాప్‌లలో భద్రపరచుకున్న ఫొటోలను కూడా ముద్రించుకోవచ్చు. సెల్ఫీ లేఔట్ యాప్ ద్వారా ఈ ప్రింటర్ పనిచేస్తుంది. ఈ యాప్ ద్వారా ప్రింట్ తీసుకోవడానికి ముందు ఫొటోలను ఎడిట్ చేసుకోవడానికి, ఎంపిక చేసుకున్న ఫొటోల కొలాజ్ తయారు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. భారత్ మార్కెట్లో దీని ధర రూ. 7,495 మాత్రమే! -
‘క్లిప్’ ఉంటే మీ సైకిల్ ఇక ఈ-సైకిల్
ప్రపంచవ్యాప్తంగా ఇటీవలి కాలంలో ఎలక్ట్రిక్ వాహనాల వాడకం బాగా పెరిగింది. ఈ–స్కూటర్లు, బైక్‌లే కాకుండా, ఈ–సైకిళ్లు కూడా వాడుకలోకి వచ్చాయి. మామూలు సైకిల్‌ను నడిపించాలంటే, పెడల్ తొక్కక తప్పదు. బలం ఉపయోగించక తప్పదు. ఎగుడు దిగుడు దారుల్లో ఎక్కువ దూరం సైకిల్ మీద వెళ్లాలంటే అలసట తప్పదు...ఇక అలాంటి ఇబ్బందేమీ ఉండదు. ఈ ‘క్లిప్’ను సైకిల్ ముందు చక్రం వైపు తగిలిస్తే చాలు, మామూలు సైకిల్ కూడా ఈ–సైకిల్‌గా మారిపోతుంది. ఇది ఎలక్ట్రిక్ మోటార్ క్లిప్. ఇది 26 అంగుళాలు, 28 అంగుళాల టైర్లకు సరిపోతుంది. దీనిలోని స్ప్రింగ్‌లోడెడ్ క్లాంప్ను ముందు చక్రం ఫోర్క్‌కు తగిలించుకుంటే, గట్టిగా పట్టి ఉంటుంది.ఇదీ చదవండి: హైదరాబాద్ హైస్పీడ్ ఎలక్ట్రిక్ బైక్లుఇందులోని లిథియం అయాన్ బ్యాటరీ ద్వారా సరఫరా అయ్యే విద్యుత్తుతో మామూలు సైకిల్ కూడా ఇట్టే ఈ–సైకిల్‌గా మారి, గంటకు గరిష్ఠంగా 25 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది. అమెరికన్ కంపెనీ ‘క్లిప్ బైక్’ దీనిని రూపొందించింది. దీని ధర 499 డాలర్లు (రూ.41,799). -
గుట్టు విప్పిన సమాధి..
‘తండ్రి సమాధి దగ్గర అన్నదమ్ముల తన్నులాట. ఉత్తరప్రదేశ్‌లోని అజీజ్పూర్లో జరిగిన ఈ సంఘటన ఊళ్లో వాళ్లందరినీ విస్మయానికి గురి చేసింది. శిథిలావస్థకు చేరిన తండ్రి సమాధికి మరమ్మతులు చేయాలని తమ్ముడు, అవసరంలేదు.. ఎలా ఉందో అలాగే ఉంచాలని అన్న పట్టుబట్టడంతో వాదన తగువుగా మారి, చేయి చేసుకోవడం వరకు వెళ్లింది. అన్న మొండిపట్టుపై అనుమానం వచ్చిన తమ్ముడు, అన్న మీద నిఘా పెట్టాడు. ఓ రాత్రివేళ అన్న.. తండ్రి సమాధి పక్కనున్న గుంతలోంచి ఒక కుండను తీసుకెళ్లడం తమ్ముడి కంటబడింది. అన్నకు ఎదురెళ్లి ఆ కుండను లాక్కొని చూశాడు. అందులో బంగారం ఉంది. హతాశుడయ్యాడు. అన్న మీద పోలీసులకు ఫిర్యాదు చేశాడు.. ’ అంటూ చదువుకుపోతున్నాడు ఐటీ ఆఫీస్‌లో.. ఓ ఉద్యోగి.నవ్వుతూ ఆ వార్తను వింటున్న ఓ మహిళా ఉద్యోగికి ఏదో అనుమానం వచ్చినట్టుంది. వెంటనే తన కొలీగ్ చేతుల్లోంచి ఆ పేపర్ లాక్కొని తమ ఆఫీసర్ క్యుబికల్ వైపు పరుగెత్తినట్టే వెళ్లింది. ఆమె చర్యకు ఆశ్చర్యపోయాడు అప్పటిదాకా వార్త చదివిన కొలీగ్. బాస్ దగ్గరకు వెళ్లిన ఆ మహిళా ఉద్యోగి ‘సర్.. మన లాస్ట్ రైడ్‌లో..’ అని ఏదో చెప్పబోతుండగా..‘లీవిట్ .. ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ వల్ల ఓ పెద్ద వ్యక్తిని ఇన్సల్ట్ చేసినట్టయింది. డిపార్ట్మెంట్ పరువుపోయింది’ అన్నాడు బాస్ అసహనంగా!‘సర్.. అతని సొంతూరులో.. ’ అని మళ్లీ ఆమె ఏదో చెప్పబోతుండగా.. ‘ఆ విషయాన్ని వదిలేయండి అన్నాను కదా..’ అన్నాడు ఫైల్లోంచి ముఖం బయటపెట్టకుండానే!‘అదికాదు సర్.. అతని సొంతూరు.. ’ అని తన మాటను పూర్తి చేయాలని ఆమె ప్రయత్నిస్తుండగా.. బాస్ మళ్లీ అడ్డుపడుతూ ‘సొంతిల్లు, బంధువుల ఇళ్లు, ఫ్యాక్టరీ, గోదామ్లు అన్నీ సర్చ్ చేశాం. ఎక్కడా చిల్లి గవ్వ, చిరిగిన డాక్యుమెంట్ కూడా దొరకలేదు’ అన్నాడు కాస్త చిరాగ్గా. ‘బట్ సర్ అతని తండ్రి సమాధి సర్చ్ చేయలేదు కదా’ స్థిరంగా అన్నది ఆ ఉద్యోగిని. అప్పుడు తలెత్తి ఆమె వంక చూశాడు అతను. ఆమె అతనికి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంటూ.. ‘సర్.. ఆ బడాబాబు, రీసెంట్గా తన తండ్రి పదిహేనో వర్ధంతి సందర్భంగా.. తన పొలంలో ఉన్న తండ్రి సమాధిని రెనోవేట్ చేశాడని మొన్ననే పేపర్లో చదివాను. దాన్నో విశ్రాంతి మందిరంలా తీర్చిదిద్దాడని పేపర్లు తెగ పొగిడాయి’ అంటూ ఆగింది. ‘అయితే ఏంటీ?’ అన్నట్టుగా చూశాడు. వెంటనే అతని చేతుల్లో తను లాక్కొచ్చిన పేపర్ పెట్టి, ఇందాక తన కొలీగ్ చదివిన వార్తను చూపించింది ఆమె. ఆ వార్త మీద దృష్టిసారించాడు ఆఫీసర్. రెండు నిమిషాల తర్వాత ‘యెస్.. ఎలా మిస్ అయ్యాం ఈ పాయింట్‌ని?’ అన్నాడు పేపర్‌ను మడిచేస్తూ!‘సర్.. ఇప్పుడు ప్లాన్ చేసుకోవచ్చు!’ అంది ఆమె ఉత్సాహంగా!నాలుగు రోజలకు.. బడాబాబు సొంతూరులోని పొలానికి చేరుకుంది ఐటీ టీమ్. పేపర్లు పొగిడినట్టే అది నిజంగానే సమాధిలా లేదు. వాచ్‌మన్ ఉన్నాడు. తామెవరో చెప్పి, ముందుకు మూవ్ అయ్యారు. ఆ సమాధిని పరిశీలిస్తుండగానే బడాబాబు తన పరివారంతో రెండు కార్లలో అక్కడికి చేరుకున్నాడు. కారు పార్క్ అవుతుండగానే హడావిడిగా కారు దిగి, పరుగెడుతున్నట్టుగా ఐటీ టీమ్‌ని చేరాడు. ‘మా కుటుంబానికి మాత్రమే పర్మిషన్ ఉన్న ప్లేస్ ఇది’ అంటూ బడాబాబు.. ఐటీ ఆఫీసర్ మీదకు పళ్లునూరుతుండగానే ‘కూల్ సర్, మీకు సంబంధించిన అన్ని చోట్లా ఇన్క్లూడింగ్ ఈ సమాధి.. సర్చ్ చేసుకునే పర్మిషన్ మాకుంది’ అంటూ అనుమతుల పత్రం చూపించాడు ఐటీ ఆఫీసర్. ప్యాంట్ జేబులోంచి కర్చీఫ్ తీసుకుని నుదుటికి పట్టిన చెమట తుడుచుకున్నాడు బడాబాబు. పక్కనే ఉన్న అతని అíసిస్టెంట్తో ‘సర్కి మంచినీళ్లు’ అంటూ సైగ చేశాడు ఐటీ ఆఫీసర్. ‘నో థాంక్స్’ అంటూ కోపంగా అక్కడే ఉన్న సిమెంట్ బెంచ్ మీద కూలబడ్డాడు బడాబాబు. సమాధి చుట్టూ పరిశీలించారు ఐటీ వాళ్లు. అనుమానం ఉన్న చోటల్లా తట్టారు. ఏమీ కనిపించలేదు. రహస్య అరలేవీ తెరుచుకోలేదు. ఇదీ వృథా ప్రయాసే కాదు కదా అనుకుంటూ బడాబాబు వైపు చూశాడు ఐటీ ఆఫీసర్. అతని ముఖంలో చాలా కంగారు కనపడుతోంది. అయితే అంతా కరెక్ట్‌గానే జరుగుతోంది అనే భరోసాకు వచ్చాడు ఐటీ ఆఫీసర్. అతను అలా అనుకుంటున్నాడో లేదో.. ‘సర్’ అంటూ పిలిచాడు ఉద్యోగి. ఒక్క అంగలో అక్కడికి వెళ్లాడు ఆఫీసర్. సరిగ్గా సమాధికి ముందు ఫ్లోరింగ్‌లోని నాలుగు మార్బుల్స్ డిజైన్‌లో ఏదో తేడాగా ఉంది. చూపించాడు ఉద్యోగి. చూశాడు ఆఫీసర్. ప్రత్యేక డిజైన్లా కనపడుతోంది కానీ.. సమ్‌థింగ్ ఫిషీ అనుకున్నాడు. బడాబాబు వైపు చూశాడు. అతనిలో కంగారు ఎక్కువైంది. కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. క్లారిటీ వచ్చేసింది ఆఫీసర్‌కి.‘సర్..’ పిలిచాడు ఆఫీసర్. ‘ఏంటీ?’ అన్నట్టుగా చూశాడు బడాబాబు. ‘కుడ్ యూ ప్లీజ్ ఓపెన్ ఇట్?’ అడిగాడు ఆఫీసర్. ‘ఓపెన్ చేయడానికి అదేమన్నా తలుపా?’ బడాబాబు సమాధానం.‘డోర్ అయితే మేమే ఓపెన్ చేసేవాళ్లం. ప్లీజ్ ఓపెన్ ఇట్..’ స్థిరంగా చెప్పాడు ఆఫీసర్. అట్టే బెట్టు చేయక జేబులోంచి రిమోట్ తీసి ఓపెన్ చేశాడు. టెన్ బై టెన్ సైజులోని నేలమాళిగ అది. అందులో అన్నీ లాకర్లే! డబ్బు, బంగారం, వెండి, బంగారు విగ్రహాలు, వజ్రాలు ఎట్సెట్రా చాలానే దొరికాయి. అయినా ఆ ఆఫీసర్ ముఖంలో విజయం తాలూకు ఆనవాళ్లు లేవు. ఎందుకంటే ఆయనకందిన లెక్కలో దొరికినవాటి లెక్క సగం కూడా లేదు. ఫార్మాలిటీస్ పూర్తిచేసుకొని, తిరుగు ప్రయాణమవుతూ ‘ఇంకేదో క్లూ మిస్ అయి ఉంటాం’ అనుకున్నాడు.ఇవి చదవండి: ఈ కిక్కిరిసిన అపార్ట్మెంట్ ఎక్కడుందో తెలుసా!? -
ఈ కిక్కిరిసిన అపార్ట్మెంట్ ఎక్కడుందో తెలుసా!?
ప్రపంచంలోనే అత్యధిక జనాభా నివాసం ఉండే అపార్ట్మెంట్ భవన సముదాయం ఇది. ఈ భవన సముదాయం రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ సమీపంలో ఉంది. ఇందులో ఏకంగా ఇరవైవేల మందికి పైగా జనాలు నివాసం ఉంటున్నారు. మనుషులతో కిక్కిరిసిన ఈ అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌ను పాశ్చాత్య మీడియా ‘హ్యూమన్ యాంట్‌హిల్’గా అభివర్ణిస్తోంది. అంటే, మనుషులు ఉండే చీమలపుట్ట అన్నమాట!ఈ భారీ అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లో 25 అంతస్తుల్లో 3,708 అపార్ట్మెంట్లు ఉన్నాయి. ఈ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ నిర్మాణం 2015లో పూర్తయింది. అప్పటి నుంచి జనాలు ఇందులోకి చేరడం మొదలుపెట్టారు. స్వల్పకాలంలోనే ఇది పూర్తిగా జనాలతో కిక్కిరిసిపోయే పరిస్థితికి చేరుకుంది. ఉచిత పార్కింగ్, కాంప్లెక్స్ లోపలే సెలూన్లు, కాఫీ షాపులు, నర్సరీ, పోస్టాఫీసు, సూపర్‌మార్కెట్ వంటి సమస్త సౌకర్యాలూ ఉండటంతో జనాలు ఇక్కడ ఉండటానికి ఇష్టపడుతున్నారు.ఇవి చదవండి: మీ ముఖాన్ని.. మెరిపించే మంత్రదండం! -
పళ్ల చిగుళ్ల.. సమస్య! ఏ ట్రీట్మెంట్ వాడాలి?
నాకు 3వ నెల. ప్రతిరోజు పళ్ల చిగుళ్ల నుంచి రక్తం కారుతోంది. భయపడి పళ్లు తోముకోవడం మానేస్తే నోటి నుంచి దుర్వాసన వస్తోంది. డాక్టర్ని కలిస్తే ఏ ట్రీట్మెంట్ చేయించుకోమంటారో అని భయంగా ఉంది. ఇలాంటి సమయంలో ఏ చికిత్స తీసుకోవాలి? – పద్మ, కొమరిపాలెంగర్భం దాల్చిన 3వ నెల నుంచే కొన్ని హార్మోన్ల మార్పుల వల్ల పళ్ల చిగుళ్లు వాపు రావడంతో పాటు కొంచెం తిమ్మిరి, నొప్పిగా కూడా ఉంటాయి. ఈ నొప్పి వల్ల చాలామంది పళ్లు తోముకోవడం మానేస్తారు. దానితో వ్యర్థ పదార్థాలు పళ్ల మధ్య ఉండి ఇన్ఫెక్షన్ ఏర్పడి దుర్వాసన వస్తుంది. చాలామందికి రక్తస్రావం కూడా అవుతుంది.దీనిని చిగురువాపు అంటారు. దంత వైద్యుణ్ణి సంప్రదించాలి. దీనికి కొన్ని మౌత్‌వాష్ లోషన్స్, మెత్తటి కుచ్చు ఉన్న చిన్న బ్రష్‌లు వాడమంటారు తప్ప ఎటువంటి చికిత్సలూ ఉండవు. దంతవైద్యుణ్ణి కలిసినప్పుడు మీరు గర్భవతని చెప్పాలి. ఏ కారణంతో అయినా చికిత్స అవసరమైతే ఈ సమయంలో చేయరు. ఎక్స్‌రే కూడా సరికాదు. ప్రసవానంతరమే చికిత్స చేస్తారు. ఈలోపు ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంటే తక్కువ మెతాదులో యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్ ఇస్తారు.దంత సమస్యలు రాకుండా మొదటి నెల నుంచే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. 2–5 నిమిషాల సమయం కేటాయించి రోజుకు రెండుసార్లు బ్రష్ చేసుకోవాలి. ఫ్లోరైడ్ ఉన్న పేస్ట్ వాడాలి. తిన్న వెంటనే పళ్ల మధ్య వ్యర్థాలు లేకుండా నోటిని శుభ్రం చేసుకోవాలి. మొదటి మూడునెలల్లో వాంతులు ఎక్కువ ఉన్నవారు, వాంతి అయిన తర్వాత నోటిని మంచినీళ్లతో కడుక్కోవాలి. దీనివల్ల వాంతిలో ఉండే ఎసిడిటీ పళ్లను పాడు చేయకుండా ఉంటుంది.వాంతి అయిన వెంటనే ఎసిడిటీతో పళ్లు బాగా సున్నితంగా అవుతాయి. అందుకే గంట తరువాత బ్రష్ చెయ్యాలి. తీపి పదార్థాలు, చల్లని పానీయాలు తాగకూడదు. టీ, కాఫీ తాగిన తరువాత నోరు శుభ్రం చేసుకోవాలి. పండ్లు, కాయగూరలు, పెరుగు లాంటివి తీసుకోవాలి. ఆల్కహాల్ ఎక్కువ ఉన్న మౌత్ వాష్‌లు వాడకూడదు. ఏదైనా శస్త్రచికిత్స తప్పనిసరైతే 5–7 నెలలో చేస్తారు. చిగుళ్ల నుంచి రక్తస్రావానికి ఏ విధమైన మందులు అవసరం లేదు. చల్లని ఐస్ ప్యాక్ పెట్టుకోవాలి. డాక్టర్ని కలిసినప్పుడు మీ ఇబ్బందులు చెబితే దానిని బట్టి ఎప్పుడెప్పుడు సంప్రదించాలో సూచిస్తారు. – డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ఇవి చదవండి: కిడ్నీ రోగులకు ఉపశమనం హెల్త్ ట్రీట్..మెనోపాజ్ ఔషధంతో లివర్‌కు ముప్పు!మెనోపాజ్ లక్షణాల నుంచి ఉపశమనం కోసం ఉపయోగించే ఔషధం వల్ల లివర్‌కు ముప్పు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఇటీవల తేలింది. మెనోపాజ్‌లో సర్వసాధారణంగా ఒంటి నుంచి వేడి ఆవిర్లు రావడం, చిరాకు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాల నుంచి ఉపశమనానికి ‘వియోజా’ మాత్రలను ఎక్కువమంది వాడుతుంటారు. ‘వియోజా’ మాత్రలలో ‘ఫెజోలినెటంట్’ అనే ఔషధం ఉంటుంది. ఇది నాన్‌హార్మోనల్ ఔషధం.ఈ ఔషధాన్ని దీర్ఘకాలం వాడినట్లయితే, లివర్‌కు తీవ్రమైన సమస్యలు ఏర్పడతాయని అమెరికాకు చెందిన ఆహార ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ) వెల్లడించింది. ఇప్పటికే లివర్ సమస్యలు ఉన్న మహిళలు ఈ ఔషధాన్ని వాడకుండా ఉండటమే మంచిదని సూచించింది. వరుసగా నలబై రోజుల పాటు ఈ ఔషధం తీసుకున్న వారిలో లివర్ దెబ్బతినడాన్ని గుర్తించినట్లు ఎఫ్‌డీఏ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అందువల్ల ఈ ఔషధం లేబుల్‌పై ‘లివర్‌కు హానికరం’ అనే హెచ్చరికను జోడించనున్నట్లు తెలిపారు. -
ప్రెగ్నెంట్ సమయంలో.. ఎలాంటి ఆహార జాగ్రత్తలు పాటించాలి?
నాకు 3వ నెల. ఆహారం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? ఏ ఆహారం తినకూడదు. తింటే ఎలాంటి ప్రమాదం ఉంటుంది. – హారిక, పెదపూడిగర్భధారణ సమయంలో రోజువారీ ఆహారాన్నే తినవచ్చు. ఇంటిలో తయారు చేసినది అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు. చాలామంది అపోహలతో ఆరోగ్యకరమైన ఆహారం కూడా తినరు. సాధారణంగా మీరు తినే ఆహారమే ఇప్పుడు కూడా తినండి. మీరు ఎప్పుడూ తినని కొత్త ఆహార పదార్థాలు, పండ్లు, కూరగాయలు, పాల ఉత్పత్తులను ఈ సమయంలో తినకండి. అవి మీ శరీరానికి సరిపడకపోతే వచ్చే ఇబ్బందులకు ఏమైనా మందులు వాడాల్సి వస్తే మంచిదికాదు. అందుకే కొత్తవి తినకండి.చాలామందికి గుడ్లు, మష్రూమ్స్, పల్లీలు, సోయా వల్ల ఎలర్జీలు వస్తాయి. పాశ్చరైజ్ చేయని చీజ్, పాలు, క్రీమ్ అసలు వాడకూడదు. వీటివల్ల ‘లిస్టెరియోసిస్’ ఇన్ఫెక్షన్ తల్లికి, బిడ్డకి వస్తుంది. మాంసాహారం తినేవారు చికెన్, మటన్లాంటివి బాగా ఉడికించి తినాలి. ఉడికించని మాంసంలో టాక్సోప్లాస్మా అనే పరాన్నజీవి ఉంటుంది. ఇది గర్భస్రావం, ఇన్ఫెక్షన్లకు దారి తీస్తుంది. లివర్‌తో తయారు చేసే ఆహార పదార్థాలలో విటమిన్ ఎ ఉంటుంది. ఇది ఎక్కువ శాతం బిడ్డకి ప్రమాదం చేస్తుంది.గుడ్లు కూడా బాగా ఉడికించినవే తినాలి. తెల్లసొన అయితే ఇంకా మంచిది. బాగా ఉడికించని గుడ్లలో సాల్మొనెల్లా బ్యాక్టీరియా ఉంటుంది. ఇది ఆహారాన్ని విషపూరితం చేస్తుంది. దీంతో బిడ్డకు ప్రమాదం లేదు కానీ తల్లికి వాంతులు, నీళ్ల విరేచనాలు కావచ్చు. చేపలు తినేవారు కూడా బాగా ఉడికించిన సముద్రపు చేపలను తినొచ్చు. ఒకవేళ తింటే కొన్ని కాలుష్య కారకాలు బిడ్డకు హాని చేస్తాయి. ట్యూనా చేపలో పాదరసం శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి అది కూడా తినకూడదు. ఆయిల్ ఎక్కువగా ఉండే చేపలు కూడా తినకూడదు. చాలామందిలో కాఫీ తాగడం మంచిదేనా అనే ప్రశ్న కూడా ఉంటుంది. నిజానికి మానేయడం మంచిది. కానీ అలవాటు ఉంది, తప్పకుండా తీసుకోవాలి అంటే రోజుకి 200 ఎంజీ కన్నా ఎక్కువ కాఫీ పొడిని తీసుకోకూడదు. అంటే ఒక కప్పు కాఫీ అని అర్థం. ఈ కెఫీన్ వేరే డ్రింక్స్‌లో కూడా ఉంటుంది. ఉదాహరణకి గ్రీన్ టీ లేదా మామూలు టీలో ప్రతి గ్రాముకు 75ఎంజీ కెఫీన్ ఉంటుంది. డార్క్ చాక్లెట్స్‌లో ప్రతి గ్రాముకు 10–25 ఎంజీ ఉంటుంది. కోలా డ్రింక్స్‌లో 40–80 ఎంజీ ఉంటుంది. ఫిల్టర్ కాఫీలో 140 ఎంజీ ఉంటుంది. అందుకే తాగకపోవడమే మంచిది. కనీసం మొదటి మూడునెలల్లో మానేయండి. పండ్లు, కూరగాయలను గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. గర్భధారణ సమయంలో డాక్టర్ సూచించిన మేరకే విటమిన్ మాత్రలు వేసుకోవాలి. – డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ఇవి చదవండి: ఒక అడవిలో తాబేళ్లు... చేపలు... కోతులు -
ఒక అడవిలో తాబేళ్లు... చేపలు... కోతులు
ఒక అడవిలో గుబురుగా ఉన్న చెట్ల మీద ఒక కోతుల జంట నివసిస్తోంది. పెద్దకోతులు మంచివే కానీ పిల్ల కోతులు నాలుగు మాత్రం చాలా అల్లరి చేస్తూ దారిలో వెళ్ళే అందరినీ ఇబ్బంది పెట్టసాగాయి. ఆ చెట్లకు కాస్త దూరంలో ఒక సెలయేరు ఉంది. అందులో కొన్ని తాబేళ్లు, చేపలు నివసిస్తున్నాయి. చేపలు, తాబేళ్లు నీటి మీద తేలియాడగానే కోతులు చెట్ల పైనుంచి పండ్లు, కాయలు, ఎండుకొమ్మలు వాటి మీదకు విసిరి బాధ పెట్టసాగాయి.‘కోతి నేస్తాలూ! మేము మీకు ఏ విధంగానూ అడ్డురావడం లేదు. మరి మీరెందుకు మమ్మల్ని నీటి పైకి రానివ్వకుండా గాయపరుస్తున్నారు?’ అని ఒకరోజు ఒక చేప ప్రశ్నించింది. ‘మేము పిల్లలం, అల్లరి చేస్తూ ఆటలు ఆడుకుంటున్నాం. మేము తినగా మిగిలినవి గిరాటు వేస్తుండగా అవి పొరపాటుగా నీళ్లల్లో పడుతున్నాయి’ అని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చింది ఓ పిల్లకోతి.‘చేప నేస్తాలూ! పిల్లకోతులు కావాలని అలా గిరాటు వేస్తున్నాయి. మనం వాటిని అడగడం వల్ల ఏమీ ఉపయోగం ఉండదు’ అంది ఓ తాబేలు.రోజురోజుకు కోతుల ఆగడాలు పెరగసాగాయి. పాపం! తాబేళ్లు, చేపలు ఏమీ చేయలేక అలాగే అవస్థపడసాగాయి. ఒక రోజున పిల్ల కోతులు ఒక కొమ్మ మీద కూర్చుని ఉయ్యాలూగుతున్నాయి. ఆ కొమ్మ బలహీనంగా ఉండటం వలన ఫెళ్లున విరిగిపోయింది. ఊగుతున్న కోతులు ఆ వేగానికి సెలయేటి నీళ్లల్లో పడిపోయాయి. వాటికి ఈత రాకపోవడంతో ‘కాపాడండి.. కాపాడండి..’ అంటూ పెద్దగా అరవసాగాయి. ఆ అరుపులకు నీళ్లల్లో ఉన్న చేపలు, తాబేళ్లు బయటకు వచ్చాయి. ‘అయ్యో! పిల్ల కోతులు నీళ్లల్లో మునిగిపోతున్నాయి, వాటిని కాపాడుదాం’ అంది ఒక తాబేలు.‘పిల్లకోతులూ! ఇలా మా వీపు మీద కూర్చోండి’ అంటూ నాలుగు పెద్ద తాబేళ్లు వాటి దగ్గరకు వెళ్ళాయి. అవి తాబేళ్ల మీద కూర్చోగానే ఈదుతూ వాటిని ఒడ్డుకు చేర్చాయి. ‘మేము మిమ్మల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టినా మీరు మా ప్రాణాలను రక్షించారు. ఇక నుంచి మనం మంచి మిత్రులుగా ఉందాం’ అన్నాయి పిల్ల కోతులు. ‘అలాగే!’ అన్నాయి తాబేళ్లు.అప్పటి నుంచి అవన్నీ చాలా స్నేహంగా ఉండసాగాయి. ఒకరోజు అడవికి ఒక బెస్తవాడు సెలయేటిలో చేపలు పట్టడానికి వచ్చాడు. అతణ్ణి చెట్టు మీద ఉన్న పిల్లకోతులు చూశాయి. ఈలోగా బెస్తవాడు వలను నీటిలోకి విసిరాడు. ఆదమరచి ఉన్న చేపలు, తాబేళ్లు వలలో చిక్కుకున్నాయి.‘ఈ రోజు నా అదృష్టం పండింది. చాలా చేపలు, తాబేళ్లు కూడా దొరికాయి’ అంటూ బెస్తవాడు సంబరపడి వాటిని తనతో తెచ్చుకున్న బుట్టలో వేసుకున్నాడు. ‘అయ్యో! మన నేస్తాలను ఇతను తీసుకెళ్లిపోతున్నాడు’ అని పిల్ల కోతులు మాట్లాడుకున్నాయి. అన్నీ కూడబలుక్కుని ఒక్కసారిగా బెస్తవాడి మీదకు దూకాయి. ఊహించని పరిణామానికి అతను కంగారుపడ్డాడు. తప్పించుకోవడానికి ప్రయత్నించినా.. కోతులు అతని శరీరాన్ని రక్కేశాయి. బుట్ట, వల అక్కడే వదిలేసి పరుగెత్తుకుంటూ పారిపోయాడు. కోతులు బుట్టను తెరిచి చేపలను, తాబేళ్లను సెలయేటిలోకి వదిలేశాయి. అవి పిల్ల కోతులకు కృతజ్ఞతలు తెలిపి హాయిగా ఊపిరి పీల్చుకున్నాయి. ‘మనం ఎప్పుడూ ఇలాగే ఒకరికి ఒకరం స్నేహంగా ఉండాలి’ అనుకున్నాయి అన్నీ! మనం ఒకరికి సహాయపడితే మనకు దేవుడు సహాయపడతాడు. – కైకాల వెంకట సుమలత -
అవును... అది యాపిల్ కోతల పండుగ!
ఏటా శరదృతువు ప్రారంభంలో యాపిల్ కోతల కాలంలో అక్కడ పండుగ జరుపుకొంటారు. ఊరంతా భారీస్థాయిలో యాపిల్పండ్ల ప్రదర్శనలు కనిపిస్తాయి. కూడళ్లలో యాపిల్పండ్లతో తీర్చిదిద్దిన కళాఖండాలు కనువిందు చేస్తాయి. ఈ విలక్షణమైన పండుగ స్వీడన్లో సిమ్రిషామ్ మునిసిపాలిటీ పరిధిలోని కివిక్ ప్రాంతంలో జరుగుతుంది. ‘కివిక్ యాపిల్ మార్కెట్ ఫెస్టివల్’గా పేరుపొందిన ఈ పండుగకు స్వీడన్ నలుమూలల నుంచే కాకుండా, యూరోప్‌లోని పలు ఇతర దేశాల నుంచి కూడా జనాలు పెద్దసంఖ్యలో వస్తుంటారు.యాపిల్ కోతల పండుగ రోజుల్లో కివిక్ ప్రాంతంలోని పిల్లా పెద్దా అందరూ యాపిల్ తోటల్లోకి, శివార్లలోని చిట్టడవుల్లోకి వెళ్లి యాపిల్‌పండ్లను కోసుకొస్తారు. యాపిల్ బుట్టలు మోసుకుంటూ, సంప్రదాయ నృత్య సంగీతాల నడుమ ఊరేగింపులు జరుపుతారు. యాపిల్ విస్తారంగా పండే కివిక్ను ‘యాపిల్ కేపిటల్ ఆఫ్ స్వీడన్’ అని కూడా అంటారు. ఇక్కడి నుంచి రకరకాల యాపిల్‌పండ్లు పెద్ద ఎత్తున విదేశాలకు ఎగుమతి అవుతుంటాయి.కివిక్లో జరిగే యాపిల్ పండుగను చూడటానికే కాకుండా, ఇక్కడి పురాతన రాతియుగం నాటి ఆనవాళ్లను, కాంస్యయుగానికి చెందిన మూడువేల ఏళ్ల నాటి శ్మశాన వాటికను, అందులోని ఆనాటి రాజు సమాధిని చూడటానికి కూడా పర్యాటకులు వస్తుంటారు. పర్యాటకులను మరింత ఆకట్టుకునేందుకు సిమ్రిషాన్ స్థానిక పరిపాలనా సంస్థ 1988 నుంచి ఇక్కడ యాపిల్ పండుగను వార్షిక వేడుకగా నిర్వహించడం ప్రారంభించింది. యాపిల్ పండుగ సందర్భంగా ఊళ్లో ఏర్పాటు చేసిన బహిరంగ వేదికలపై పలు సాంస్కృతిక కార్యక్రమాలు, కళా ప్రదర్శనలు జరుగుతాయి. ఈ ఏడాది యాపిల్ పండుగ వేడుకలు సెప్టెంబర్ 28న మొదలయ్యాయి. ఈ వేడుకలు అక్టోబర్ 6 నాటితో ముగుస్తాయి. -
కాకి హంసల కథ! పూర్వం ఒకానొక ద్వీపాన్ని..
పూర్వం ఒకానొక ద్వీపాన్ని ధర్మవర్తి అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ రాజుగారు ఉండే నగరంలోనే ఒక సంపన్న వర్తకుడు ఉండేవాడు. అతడు ఉత్తముడు. ఒకరోజు ఒక కాకి అతడి పెరటి గోడ మీద వాలింది. వర్తకుడి కొడుకులు ఆ కాకికి ఎంగిలి మెతుకులు పెట్టారు. అప్పటి నుంచి కాకి ఆ ఇంటికి అలవాటు పడింది. వర్తకుడి కొడుకులు రోజూ పెట్టే ఎంగిలి మెతుకులు తింటూ బాగా బలిసింది. బలిసి కొవ్వెక్కిన కాకికి గర్వం తలకెక్కింది. లోకంలోని పక్షులేవీ బలంలో తనకు సాటిరావని ప్రగల్భాలు పలుకుతుండేది.ఒకనాడు వర్తకుని కొడుకులు ఆ కాకిని వ్యాహ్యాళిగా సముద్ర తీరానికి తీసుకెళ్లారు. సముద్రతీరంలో కొన్ని రాజహంసలు కనిపించాయి. వర్తకుని కొడుకులు ఆ రాజహంసలను కాకికి చూపించి, ‘నువ్వు వాటి కంటే ఎత్తుగా ఎగరగలవా?’ అని అడిగారు. ‘చూడటానికి ఆ పక్షులు తెల్లగా కనిపిస్తున్నాయే గాని, బలంలో నాకు సాటిరాలేవు. అదెంత పని, అవలీలగా వాటి కంటే ఎత్తుగా ఎగరగలను’ అంది కాకి.‘సరే, వాటితో పందేనికి వెళ్లు’ ఉసిగొల్పారు వర్తకుడి కొడుకులు. ఎంగిళ్లు తిని బలిసిన కాకి తారతమ్యాలు మరచి, హంసల దగ్గరకు డాంబికంగా వెళ్లింది. తనతో పందేనికి రమ్మని పిలిచింది. కాకి తమను పందేనికి పిలవడంతో హంసలు పకపక నవ్వాయి. ‘మేం రాజహంసలం. మానససరోవరంలో ఉంటాం. విహారానికని ఇలా ఈ సముద్రతీరానికి వచ్చాం. మేం మహాబలవంతులం. హంసలకు సాటి అయిన కాకులు ఉండటం లోకంలో ఎక్కడైనా విన్నావా?’ అని హేళన చేశాయి.కాకికి పౌరుషం పొడుచుకొచ్చింది.‘నేను నూటొక్క గతులలో ఎగరగలను. ఒక్కో గతిలో ఒక్కో యోజనం చొప్పున ఆగకుండా వంద యోజనాలు అవలీలగా ఎగరగలను. మీరెలా కావాలంటే అలా ఎగురుదాం. కావాలంటే పందెం కాద్దాం’ కవ్వించింది కాకి.‘మేము నీలా రకరకాల గతులలో ఎగరలేం. నిటారుగా ఎంతదూరమైనా ఎగరగలం. అయినా, నీతో పోటీకి మేమంతా రావడం దండగ. మాలో ఏదో ఒక హంస నీతో పోటీకి వస్తుంది’ అన్నాయి హంసలు.ఒక హంస గుంపు నుంచి ముందుకు వచ్చి, ‘కాకితో పందేనికి నేను సిద్ధం’ అని పలికింది.పందెం ప్రారంభమైంది.కాకి, హంస సముద్రం మీదుగా ఎగరసాగాయి.హంస నెమ్మదిగా నిటారుగా ఎగురుతూ వెళుతుంటే, కాకి వేగంగా హంసను దాటిపోయి, మళ్లీ వెనక్కు వచ్చి హంసను వెక్కిరించసాగింది. ఎగతాళిగా ముక్కు మీద ముక్కుతో పొడవడం, తన గోళ్లతో హంస తల మీద జుట్టును రేపడం వంటి చేష్టలు చేయసాగింది. కాకి వెక్కిరింతలకు, చికాకు చేష్టలకు హంస ఏమాత్రం చలించకుండా, చిరునవ్వు నవ్వి ఊరుకుంది. చాలాదూరం ఎగిరాక కాకి అలసిపోయింది. అప్పుడు హంస నిటారుగా ఎగసి, పడమటి దిశగా ఎగరసాగింది. కాకి ఎగరలేక బలాన్నంతా కూడదీసుకుని ఎగురుతూ రొప్పసాగింది. హంస నెమ్మదిగానే ఎగురుతున్నా, కాకి ఆ వేగాన్ని కూడా అందుకోలేక బిక్కమొహం వేసింది. ఎటు చూసినా సముద్రమే కనిపిస్తోంది. కాసేపు వాలి అలసట తీర్చుకోవడానికి ఒక్క చెట్టయినా లేదు. సముద్రంలో పడిపోయి, చనిపోతానేమోనని కాకికి ప్రాణభీతి పట్టుకుంది. కాకి పరిస్థితిని గమనించిన హంస కొంటెగా, ‘నీకు రకరకాల గమనాలు వచ్చునన్నావు. ఆ విన్యాసాలేవీ చూపడం లేదేం కాకిరాజా?’ అని అడిగింది.కాకి సిగ్గుపడింది. అప్పటికే అది సముద్రంలో పడిపోయేలా ఉంది. ‘ఎంగిళ్లు తిని కొవ్వెక్కి నాకెవరూ ఎదురులేరని అనుకునేదాన్ని. నా సామర్థ్యం ఏమిటో ఇప్పుడు తెలిసి వచ్చింది. సముద్రంలో పడిపోతున్నాను. దయచేసి నన్ను కాపాడు’ అని దీనాలాపాలు చేసింది. కాకి పరిస్థితికి హంస జాలిపడింది. సముద్రంలో పడిపోతున్న కాకి శరీరాన్ని తన కాళ్లతో పైకిలాగింది. ఎగురుకుంటూ వెళ్లి ఒడ్డుకు చేర్చింది.‘ఇంకెప్పుడూ లేనిపోని డాంబికాలు పలుకకు’ అని బుద్ధిచెప్పింది హంస. ఈ కథను కురుక్షేత్రంలో శల్యుడు కర్ణుడికి చెప్పాడు.‘కర్ణా! నువ్వు కూడా వర్తకుడి పుత్రుల ఎంగిళ్లు తిన్న కాకిలాగ కౌరవుల ఎంగిళ్లు తిని అర్జునుణ్ణి ధిక్కరిస్తున్నావు. అనవసరంగా హెచ్చులకుపోతే చేటు తప్పదు! బుద్ధితెచ్చుకుని మసలుకో’ అని కర్ణుణ్ణి హెచ్చరించాడు. – సాంఖ్యాయన -
‘డార్లీ.. డార్లీ.. నీకేం కాలేదుగా?’
అ ర్థరాత్రి 2 దాటింది. ఉన్నట్టుండి ‘డా..రిన్.. సేవ్ మీ.. సేవ్ మీ’ అనే ఆర్తనాదాలు వినిపించసాగాయి. గాఢనిద్రలోంచి ఉలిక్కిపడి లేచిన డారిన్, ఆ గొంతు.. కింద నిద్రపోతున్న తన భార్యదేనని గ్రహించి క్షణాల్లో ‘డార్లీ ఏమైంది?’ అంటూ మెట్లవైపు పరుగుతీశాడు. వెళ్తూ వెళ్తూ లైట్స్ ఆన్ చేశాడు. డార్లీ నొప్పితో రొప్పుతూ గుమ్మం నుంచి బయటికి పరుగులు తీయడం కనిపించింది. ఆమె చేతిలో రక్తమోడుతున్న కత్తి ఉంది. ఆమె పరుగు చూస్తుంటే, ముందు ఎవరో పారిపోతున్నట్లే అనిపించింది. డారిన్ వేగం పెంచాడు.ఇంటికి కాస్తదూరంలో డార్లీ ఆగడం చూసి ‘డార్లీ.. డార్లీ.. నీకేం కాలేదుగా?’ అంటూనే ఆమెను పరిశీలనగా చూశాడు. ఆమె దుస్తుల నిండా రక్తం, ఒంటి మీద కత్తిపోట్లు చూసి డారిన్కి వణుకు పుట్టుకొచ్చింది. ‘డ.. డా..రిన్ .. ఎవ..డో ఇంట్లోకొచ్చి, క.. కత్తితో దాడి చేసి పారిపోయాడు’ అంది డార్లీ వణుకుతున్న స్వరంతో. భార్య మాటలు వినగానే డారిన్ కు ఇంట్లో నిద్రపోతున్న పిల్లలు గుర్తొచ్చారు. ‘íపిల్లలు?!’ అని అరుస్తూనే క్షణాల్లో లోపలికి పరుగుపెట్టాడు. చేతిలోని కత్తి అక్కడే పారేసి, అతడి వెనుకే డార్లీ కూడా పరుగెత్తింది.డార్లీ అరుపులకు కంగారులో బయటికి పరుగు తీసినప్పుడు చూడలేదు కానీ హాల్ అంతా నెత్తుటిమయంగా ఉంది. చాలాచోట్ల మనిషి ఎర్రటి అడుగుజాడలు ఉన్నాయి. అవన్నీ చూస్తూ పిల్లలు పడుకున్నవైపు వెళ్తుంటే, డారిన్ కి ప్రాణం పోయినట్లు అనిపించింది. ధైర్యం చేసి పిల్లల దగ్గరకు వెళ్లేసరికి ఇద్దరు కొడుకులు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు.అంబులెన్ ్స వచ్చేసరికే పెద్దకొడుకు ఆరేళ్ల డెవాన్ కన్నుమూశాడు. ఆసుపత్రికి వెళ్లేసరికి రెండో కొడుకు ఐదేళ్ల డామన్ చనిపోయాడు. ఆసుపత్రిలో ఉండగా అప్పటికే కత్తిగాయాలతో అల్లాడుతున్న డార్లీకి సీరియస్ అయిపోయింది. వెంటనే ఐసీయూలో పెట్టి డాక్టర్లు ఆమెకు చికిత్స మొదలుపెట్టారు. ఆ ఇంట్లో ఏ ప్రమాదానికి గురికానివారు ఇద్దరే మిగిలారు. ఒకరు డారిన్ , ఇంకొకరు మూడో కొడుకు డ్రేక్. (ఆ రాత్రి తండ్రితోనే నిద్రపోయాడు) వాడికి 9 నెలలు. దాంతో పోలీసుల కన్ను డారిన్ పైనే పడింది. అయితే 24 గంటలు గడవకముందే కథ అడ్డం తిరిగింది. డార్లీనే పిల్లల్ని చంపి, ఆత్మహత్యాయత్నం చేసుకుందంటూ ఆధారాలు పుట్టుకొచ్చాయి.కత్తి మీద డార్లీ వేలిముద్రలు బలమైన సాక్ష్యాలయ్యాయి. ఇంటి లోపలికి చొరబడటానికి వీలుగా మనిషి పట్టేంత రంధ్రం ఓ తలుపు పక్కనే కనిపించింది. అయితే అక్కడ డార్లీ తల వెంట్రుకలు దొరకడంతో నేరం నుంచి తప్పించుకోవడానికి డార్లీనే ఆ రంధ్రాన్ని చేసుంటుందని అనుమానించారు. దాంతో ఆమె కోలుకోగానే అదుపులోకి తీసుకుని విచారణ మొదలుపెట్టారు అధికారులు.‘‘ఆ రాత్రి కిల్లర్ నా పిల్లల్ని, నన్నూ పొడిచిన కత్తిని పడేసి పారిపోతుంటే, కంగారులో అదే కత్తిని నేను తీసుకుని వెంటపడ్డాను. వాడు గ్యారేజీ వైపు పారిపోయాడు’’ చెప్పింది డార్లీ. ‘సింక్‌లో రక్తం క్లీన్ చేసిన ఆనవాళ్లు ఉన్నాయని, పిల్లల్ని పొడిచేశాక, తనని తాను జాగ్రత్తగా పొడుచుకోవడం కోసం డార్లీ సింక్ ముందు చాలాసేపు ఉందని, ఆ తర్వాత డ్రామాలో భాగంగా పైన నిద్రపోతున్న డారిన్ ని పిలవడం మొదలుపెట్టిందని, ఇంట్లోకి ఏ దుండగుడు రాలేదని నమ్మిన అధికారులు ఆమెను కోర్టుకెక్కించారు.సరిగ్గా మర్డర్స్ జరిగిన వారానికి డెవాన్ పుట్టినరోజు వేడుక జరిగింది. ఈ క్రమంలోనే ఓ జర్నలిస్ట్ తీసిన డెవాన్ బర్త్‌డే వీడియోలో సమాధి దగ్గర డార్లీ నవ్వడమే కోర్టుకు బలమైన ఆధారంగా మారింది. పైగా డార్లీకి డ్రేక్ పుట్టాక, మానసిక సమస్యలతో కొన్ని నెలలు డిప్రెషన్ లోకి వెళ్లిందనే పాయింట్ డిటెక్టివ్స్ నమ్మకానికి ఊతమైంది. దాంతో కోర్టు డార్లీకి మరణశిక్ష విధించింది.అయితే భర్త డారిన్ మాత్రం డార్లీ నిర్దోషి అని బలంగా నమ్మాడు. ‘అసలే డిప్రెషన్లో ఉన్న ఒక మనిషి తన ఇద్దరు పిల్లల్ని కళ్లముందే పోగొట్టుకున్నప్పుడు మానసిక స్థితి ఏ స్థాయిలో ఉంటుందో ఆలోచించాలి. అదేరోజు(బర్త్‌డే) ఉదయం తను చాలా ఏడ్చింది’ అంటూ డార్లీ కుటుంబం మొత్తం ఆమెకే మద్దతుగా నిలిచింది. దాంతో మరణశిక్షకు బ్రేక్స్ పడ్డాయి. మరోవైపు హత్యలు జరిగిన రాత్రి ఒంటిగంటన్నర సమయంలో ఒక నల్లటి వింత కారు డార్లీ ఇంటికి సమీపంలో ఆగి ఉండటం చూశామని కొందరు సాక్షులు చెప్పారు. డార్లీ అరుపులు వినిపిస్తున్నప్పుడే ఒక కారు స్టార్ట్ అయిన శబ్దం విన్నామని ఇంకొందరు పొరుగువారు చెప్పారు. పైగా అప్పటికే ఆ ప్రాంతంలో అనేక హింసాత్మక హత్యలు, అత్యాచారాలు జరిగాయి. కొందరు దుండగులు వేలిముద్రలు దొరక్కుండా చేతులకు గ్లోవ్స్ ఉపయోగించేవారు. ఆ క్రమంలోనే డార్లీ ఇరుక్కుని ఉంటుందని కొందరు, లేదంటే డార్లీపై కక్షతో ఎవరైనా ఆమెను ఇరికించారేమోనని ఇంకొందరు నమ్మడం మొదలుపెట్టారు.1996 జూన్ 6 రాత్రి, అమెరికా, టెక్సస్, రౌలెట్లో ఈ ఉదంతం జరిగింది. డార్లీ తన ఇద్దరు పిల్లల్ని చంపిందన్న నేరారోపణలతో నేటికీ జైల్లోనే ఉంది. టెక్నాలజీ పెరగడంతో కోర్టు డీఎన్ఏ పరీక్షలకు అనేకసార్లు ఆదేశించింది. అయితే, ఇప్పటికీ ఆ పరీక్షా ఫలితాలు పెండింగ్‌లోనే ఉన్నాయి. మరోవైపు విచారణలో భాగంగా అధికారులకు ఆ ఇంట్లో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తుల వేలిముద్రలు లభించాయి. వాటిని గ్యారేజీ తలుపు మీద, ఆ రాత్రి డార్లీ నిద్రపోయిన సోఫా మీద గుర్తించారు. అయినా డార్లీ విడుదల కాలేదు.ఇద్దరు కొడుకులకు జీవిత బీమా పాలసీ ఉన్నందుకే డార్లీ పిల్లల్ని చంపిందని ప్రాసిక్యూషన్ వాదించింది. నిజానికి డార్లీ డబ్బుకోసమే హత్యలు చేసుంటే, ఆమె భర్త డారిన్ పేరుమీద ఇంకా పెద్దమొత్తంలో జీవిత బీమా పాలసీ ఉందని, మరి అతడ్ని ఎందుకు చంపలేదనే వాదన డార్లీకి అండగా నిలిచింది. సుమారు 28 ఏళ్లుగా ఈ కేసు కొనసాగుతోంది. నేరం జరిగిన పదిహేనేళ్లకు డారిన్ తన భవిష్యత్తు కోసం డార్లీకి విడాకులిచ్చేశాడు. మూడో కొడుకు డ్రేక్ ఇప్పటికీ తల్లి తరçఫునే పోరాడుతున్నాడు. ఏదిఏమైనా ముద్దులొలికే చిన్నారుల్ని ఆ రాత్రి పొడిచి చంపిందెవరో? నేటికీ మిస్టరీనే! – సంహిత నిమ్మన -
John Floor: ఆ జంప్ విలువ అమూల్యం..!
పదహారేళ్ల వయసు.. కొత్తగా రెక్కలు విప్పుకుంటూ రివ్వున ఎగిరిపోవాలని, ప్రపంచాన్ని చుట్టిరావాలని కోరుకుంటుంది! కానీ ఆ ప్రాయంలోనే జరిగిన ఒక అనూహ్య ఘటన ఆ అమ్మాయి భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేసింది. అప్పటి వరకు ఆడుతూ పాడుతూ గడిపిన ఆ బాలికకు ఆపై నడవడమే అసాధ్యమైంది. పుట్టుకతో వచ్చిన లోపానికైతే జీవితంలో సన్నద్ధత వేరుగా ఉంటుంది. కానీ ఎదుగుతున్న వయసులో ఎదురైన ఆ పరిస్థితికి ఆమె చలించిపోయింది. పట్టరాని దుఃఖాన్ని అనుభవించింది. అయితే ఆ బాధతోనే కుంగిపోకుండా.. నిలిచి పోరాడాలని నిర్ణయించుకుంది. అందుకోసం ఆమె క్రీడలను ఎంచుకుంది. ఆ దారిలో తీవ్రంగా శ్రమించి శిఖరానికి చేరింది. ఎందరికో స్ఫూర్తినిచ్చింది. ఆ అథ్లెట్ పేరు ఫ్లోర్ జాన్. నెదర్లండ్స్‌కు చెందిన పారాలింపియన్. వరుసగా రెండు పారాలింపిక్స్‌లలో స్వర్ణ పతకాలు సాధించి సత్తా చాటింది.ఫ్లోర్ జాన్ స్వస్థలం నెదర్లండ్స్‌లోని పర్మెరెండ్పట్టణం. చిన్నప్పటి నుంచి చదువులో, ఆటల్లో మహా చురుకు. టీనేజ్‌కి వచ్చాక ఆ ఉత్సాహం మరింత ఎక్కువైంది. ఎక్కడ ఎలాంటి పోటీ జరిగినా అక్కడ వాలిపోయేది. ముఖ్యంగా అథ్లెటిక్స్‌లో బహుమతి లేకుండా తిరిగొచ్చేది కాదు. ఆ ఉత్సాహంతోనే దూసుకుపోతూ, తన 17వ పుట్టినరోజు వేడుకలకు సిద్ధమవుతోన్న వేళ.. బ్యాక్టీరియల్ బ్లడ్ ఇన్ఫెక్షన్కు గురైంది. ఆ కారణంగా ఆమె కుడి కాలు, చేతి వేళ్ల ముందు భాగానికి రక్తప్రసరణ ఆగిపోయింది. దాంతో హడావిడిగా ఫ్లోర్‌ను ఆస్పత్రిలో చేర్పించారు. అసలు అలాంటి రక్త సమస్యతో ఆమె బతకడమే అసాధ్యం అనిపించింది.కాళ్లను తీసివేసి..వేర్వేరు శస్త్రచికిత్సల తర్వాత ఎట్టకేలకు డాక్టర్లు ప్రాణాపాయం నుంచి కాపాడగలిగారు. అయితే మరో షాకింగ్ విషయంతో వారు ముందుకొచ్చారు.. కుడి కాలును తొలగిస్తేనే ఇన్ఫెక్షన్ దరి చేరకుండా ఉంటుందని! ఒప్పుకోక తప్పలేదు. మోకాలి కింది భాగం నుంచి కుడి కాలును తీసేశారు. అదే తరహాలో రెండు చేతుల ఎనిమిది వేళ్లను కూడా గోళ్ల భాగం వరకు తొలగించారు. ఆ వయసులో ఇలాంటి పరిస్థితి ఎంత వేదనాభరితమో ఊహించుకోవచ్చు.ఫ్లోర్ పోరాడేందుకు సిద్ధమైంది. రీహాబిలిటేషన్ కేంద్రంలో కోలుకోవడం మొదలుపెట్టింది. ఆ తర్వాత కొద్ది రోజులకు కార్బన్ ఫైబర్‌తో కృత్రిమ కాలును అమర్చారు. కానీ కొంతకాలానికి అదే ఆమెకు భారంగా మారింది. దానివల్ల తన సహజమైన కాలును కూడా కదపడం కష్టమైపోయింది. ఆ రెండిటినీ బ్యాలెన్స్ చేసుకోలేకపోయింది. దాంతో ఈసారి తానే డాక్టర్లను సంప్రదించింది. తన రెండో కాలునూ తొలగించమని కోరింది. వైద్యులు నిర్ఘాంతపోయినా చివరకు ఒప్పుకోక తప్పలేదు. ఆపరేషన్‌తో ఆ రెండో కాలును కూడా తీసేశాక రెండు బ్లేడ్లే ఆమెను నిలబెట్టాయి.అథ్లెటిక్స్‌లోకి అడుగు పెట్టి..ఆ ఘటన తర్వాత ఫ్లోర్ సమయాన్ని వృథా చేయలేదు. ఏడాదిలోపే డచ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ పారా అథ్లెట్ల కోసం ప్రత్యేకంగా నిర్వహించిన ప్రతిభాన్వేషణ కార్యక్రమానికి హాజరైంది. అక్కడే ఆమె అథ్లెటిక్స్ను ఎంచుకుంది. ఫ్లోర్ ప్రతిభ, పట్టుదలను చూసిన కోచ్ గైడో బాన్సన్ ఆమెకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. ముందుగా 100 మీటర్లు, 200 మీటర్ల పరుగుకు మెరుగులు దిద్దుకుంది. జాతీయ స్థాయిలో, యూరోపియన్ సర్క్యూట్లో ఫ్లోర్ వరుస విజయాలు సాధించి ఆపై ప్రతిష్ఠాత్మక వరల్డ్ చాంపియన్‌షిప్‌పై దృష్టిసారించింది.పారా క్రీడల్లోకి అడుగు పెట్టిన మూడేళ్ల లోపే ఆమె ఖాతాలో వరల్డ్ చాంపియన్‌షిప్ మెడల్ చేరడం విశేషం. 2015లో దోహాలో జరిగిన ఈవెంట్లో 200 మీటర్ల పరుగులో కాంస్యం గెలుచుకుంది. 100 మీటర్ల పరుగులో ఆమె 12.78 సెకన్ల టైమింగ్‌తో కొత్త రికార్డు నమోదు చేయడంతో పాటు ర్యాంకింగ్స్‌లో కూడా మూడో స్థానానికి చేరింది. పారా అథ్లెట్లకు సంబంధించిన నిబంధనల్లో మార్పులు రావడంతో ఫ్లోర్ ఆ తర్వాత లాంగ్‌జంప్‌కు మారింది. రెండు కాళ్లూ లేని అథ్లెట్ల కేటగిరీ టి62 లాంగ్‌జంప్‌లో రెండు వరల్డ్ రికార్డులు సృష్టించిన ఈ డచ్ ప్లేయర్ తొలిసారి ఈ విభాగంలో 6 మీటర్ల దూరాన్ని జంప్ చేసిన తొలి అథ్లెట్‌గా కూడా నిలిచింది. ఇదే జోరులో లాంగ్‌జంప్‌లోనూ రెండు వరల్డ్ చాంపియన్‌షిప్ స్వర్ణాలు ఫ్లోర్‌ను వెతుక్కుంటూ వచ్చాయి.ఒలింపిక్స్ పతకాలతో..లాంగ్‌జంప్‌కు మారక ముందు 2016 రియో ఒలింపిక్స్‌లో 100 మీ., 200 మీ. పరుగులో పాల్గొన్న ఫ్లోర్ పతకాలు సాధించడంలో విఫలమైంది. ఆ తర్వాత లాంగ్‌జంప్‌లో వరుసగా మూడు టోర్నీల్లో నాలుగో స్థానానికే పరిమితమైంది. అయితే మెడల్ గెలవడమే లక్ష్యంగా 2020 టోక్యో పారాలింపిక్స్‌కు సిద్ధమైంది. ఏడాది పాటు కఠోర సాధన చేసి స్వర్ణంతో తన కలను నిజం చేసుకుంది. గత మూడేళ్లుగా తన ఆటలో అదే పదును కొనసాగించిన ఈ అథ్లెట్ 2024 పారిస్ పారాలింపిక్స్‌లోనూ తన పతకాన్ని నిలబెట్టుకుంది. వరుసగా రెండో స్వర్ణాన్ని గెలుచుకొని సత్తా చాటింది. కమ్యూనికేషన్ సైన్సెస్ చదివిన ఫ్లోర్ ఇప్పుడు క్రీడాకారిణిగానే కాదు మోటివేషనల్ స్పీకర్‌గానూ తనలాంటి ఎంతో మందికి స్ఫూర్తి పంచుతోంది. – మొహమ్మద్ అబ్దుల్ హాది ఇవి చదవండి: బలవంతంగా ఖాళీ చేయించం.. ఒప్పించి పంపిస్తాం -
రెక్కలు..
చెరువు ఏమీ ఎరగనట్టుగా ఉంది. లేత మట్టిరంగు నీరు గాలికి అలలను ఏర్పరుస్తూ ఉంది. చాలా పెద్ద చెరువే అది. ఎంత లోతు ఉంటుందో. లోతును తలుచుకునే సరికి రాఘవకు కొంచెం భయం వేసింది. మళ్లీ తెగింపు వచ్చింది. ఆ తెగింపును చెదరగొడుతున్నట్టుగా గుడి గంట టంగుమని మోగింది. రాఘవ తల తిప్పి చూశాడు.చెరువు గట్టునే ఉన్న గుడికి పనుల మీద వెళుతున్నవాళ్లు ఆగి నమస్కారాలు పెట్టి వెళుతున్నారు. కొందరు దర్శనం కోసమే వచ్చి లోపలికి వెళుతున్నారు. ఉదయం తొమ్మిది అయి ఉంటుంది. అక్కడికి కాస్త దూరంలోనే ఉన్న స్కూల్ ఫస్ట్ బెల్ కూడా టంగుమని మోగింది.రాఘవ అదేమీ పట్టనట్టుగా దృష్టిని చెరువు వైపు మళ్లించాడు. గుడి వైపు చెరువు ఒడ్డు ఉండటంతో నీళ్లు తక్కువగా ఉన్నాయి. గట్టు మీద నడుచుకుంటూ వెళితే కుడి చివర నీళ్లు ఎక్కువగా ఉన్నాయి. అంచు నుంచి జారినా దూకినా గల్లంతే. రాఘవకు చెమట పట్టింది. వెంటనే ఆకలి కూడా వేసింది. స్టవ్ మీద ఇడ్లీ ఉడుకుతుంటే తల్లి ‘ఆగరా’ అంటున్నా వచ్చేశాడు. తండ్రి గొంతు వెనుక నుంచి వినిపిస్తూనే ఉంది ‘పోనీ వెధవనీ’ అని.వెధవా తను? టెన్త్‌లో ఎన్ని మార్కులొచ్చాయి. ఇంటర్లో ఎన్ని మార్కులొచ్చాయి. బీటెక్ పూర్తి చేశాక కాలేజీలో అందరూ ‘నువ్వే టాప్. క్యాంపస్ సెలక్షన్లో నీకు ఉద్యోగం వస్తుంది’ అనంటే నిజమే అనుకున్నాడు. మార్కెట్ డౌన్లో ఉందట. క్యాంపస్ సెలక్షన్సే జరగలేదు. ఒక చిన్న కంపెనీ ముంబై నుంచి ఉద్యోగం ఇస్తానని అందిగాని అది బోగస్‌దని తేలింది. ఆరు నెలలుగా ఖాళీగా ఉన్నాడు. తండ్రిని చేతి ఖర్చులు అడగాలన్నా నామోషీగా ఉంది. తండ్రి మాత్రం ఏం చేయగలడు. చిన్న ఊరు. చిన్న ఉద్యోగం.చేతికందొస్తాడనుకున్న కొడుకు ఖాళీగా ఉంటే బాధ ఉంటుంది. విసుక్కుంటున్నాడు. రాత్రి ఫోన్ చూసుకుంటూ పడుకుని ఉంటే తిట్టాడు. ‘దేశంలో అందరికీ ఉద్యోగాలొస్తుంటే నీకెందుకు రావడం లేదురా. ముప్పొద్దులా తింటూ ఫోను చూసుకుంటూ వుంటే ఎవడిస్తాడు’ అన్నాడు. బాధ కలిగింది. థూ ఎందుకీ జన్మ అనిపించింది. హైదరాబాద్‌లో ఉన్న ఫ్రెండ్స్‌కు ఫోన్ చేశాడు. ‘మేమే బెంచ్ మీద ఉన్నాం బ్రో. ప్రాజెక్ట్‌లో దూరడం చాలా కష్టంగా ఉంది’ అన్నారు. ఏ ఆశా మిగల్లేదు. ఆ అర్ధరాత్రే వెళ్లి చెరువులో దూకుదామా అనుకున్నాడు. ధైర్యం చాల్లేదు. ఉదయాన్నే లేచి టిఫిన్ కూడా చేయకుండా ఇటొచ్చేశాడు. వచ్చి? దూకాలి. దూకాలంటే మాటలా?ఏదో అలికిడిగా కేరింతలుగా వినిపించింది. గుడి దగ్గర ఎవరో తాత. గుడ్డ పరిచి జామకాయలు అమ్ముతున్నాడు. స్కూలుకెళ్లే పిల్లలు చుట్టూ మూగి ఉన్నారు. పిల్లలు అంతగా మూగడానికి కారణం ఏమిటో చూద్దామని అటుగా అడుగులు వేశాడు. అతనికి తెలియకుండానే పెదాల మీద చిరునవ్వు వచ్చింది. తాత భుజం మీద చిలుక. పిల్లలతో ముద్దు ముద్దు మాటలు చెబుతోంది. ఆ మాటలకు పిల్లలు సంతోషంతో కేరింతలు కొడుతుంటే అది తన రెండు రెక్కల్ని అటు ఇటు ఆడిస్తూ ముక్కుతో శబ్దం చేస్తూ వారిలో మరింత ఉత్సాహాన్ని నింపుతోంది. పిల్లలు ‘హాయ్’ అని పలకరిస్తే అది దాని రెండు రెక్కల్ని కలిపి వందనం చేసింది. జామకాయలు అమ్ముతున్న తాత ‘చిలకమ్మా.. గుడి ఎటువైపుంది’ అనగానే కుడి రెక్కతో గుడి వైపు చూపిస్తూ శబ్దం చేసింది. ‘బడి ఎక్కడుందో చెప్పు’ అనగానే తన ఎడమ రెక్కతో బడివైపు చూపిస్తూ శబ్దం చేసింది. ‘బడి, గుడి అంటే నీకు ఇష్టమా తల్లీ?’ అని తాత అనగానే చిలకమ్మ అవునన్నట్లు బుర్ర ఊపుతూ శబ్దం చేసింది.తాత చిలకమ్మకి ఎంత చక్కగా ట్రైనింగ్ ఇచ్చాడో అనుకున్నాడు రాఘవ. ఓ పిల్లవాడు తాత భుజాన్ని బలంగా తాకడంతో భుజంపైన ఉన్న చిలకమ్మ కింద పడింది. ‘అయ్యో’ అంటూ దాన్ని చేతిలోకి తీసుకున్న రాఘవకి తెలిసింది దాని రెండు కాళ్లలో బలం లేదని. అది తన పొట్ట మీద తాత భుజం మీద కూచుని ఉందని. తాత వెంటనే చిలకమ్మని తన చేతిలోకి తీసుకుని దాని వీపు మీద నిమురుతూ మరల తన భుజం పైకి ఎక్కించుకుని ప్రేమగా జాంపండు తినిపించసాగాడు.రాఘవ కళ్లల్లోని బాధను చూసి ‘మనుషులకే కాదు పక్షులకు కూడా పక్షవాతం వస్తుంది బాబూ. ఇది ఇంతకు ముందు బానే ఉండేది. ఏమైందో ఏమో ఒకరోజు ఉన్నట్టుండి కాళ్లు పడిపోయాయి. కాళ్లు పడిపోయాక రెక్కలున్నా లాభం లేదు. అయినా మా చిలకమ్మ బాధ పడదు. సందడి చేయడం ఏ మాత్రం ఆపదు. దానికి తెలుసు అది సందడి ఆపేస్తే ఈ తాత దగ్గర పిల్లలు మూగరు. జామకాయలు కొనరు. అందుకే ఎగిరే శక్తి పోయినా ఎగరగలననే ఆశను చావనివ్వదు’ అన్నాడు తాత.ఆ మాటలకు చిలకమ్మ తనకి ఏదో అర్థమైనట్టుగా తాత బుగ్గ మీద ముక్కుతో అటు ఇటు రాస్తూ ముద్దాడింది. దానికి వచ్చిన కష్టంతో పోలిస్తే తనకు వచ్చిన కష్టాలు ఏమంత పెద్దవి? తల్లిదండ్రుల ఆశ తీర్చలేకపోయినందుకు బాధ కలిగి, వారికి తన మొహం చూపించలేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు.నిజంగా అలా చేస్తే వాళ్లు ఏమైపోతారు? వాళ్లు మాత్రం సంతోషంగా జీవిస్తారా? నిజంగా అది వాళ్లకి చావు కంటే పెద్ద నరకం. అంటే తన చేతులారా తన కన్న తల్లిదండ్రులని తనే చంపుకున్నట్టు కదా... ఇంతకంటే ఘోర పాపం ఉంటుందా?ఇంత ముసలివాడైన తాత జామకాయలు అమ్ముతూ ఎవరి మీద ఆధారపడకుండా జీవిస్తున్నాడే... యువకుడైన తనకీ నిరాశ ఏమిటి? తాత రాఘవ వైపు చూస్తూ ‘చెరువులో దూకడానికి వచ్చావు గదా బాబూ’ అన్నాడు.రాఘవ ఉలిక్కి పడ్డాడు.‘నీకెలా తెలుసు?’ అన్నాడు.‘ఉదయమే చూశాను బాబూ నిన్ను చెరువు గట్టున. నీలాంటి కుర్రాళ్లు ఒంటరిగా వచ్చి హైరానా పడుతుంటే ఆ మాత్రం కనిపెట్టలేనా బాబూ. నేను ముసలాణ్ణయినా ఇప్పటికీ చెరువులో ఆ చివర నుంచి ఈ చివరకు ఈదగలను. ఒకవేళ నువ్వు దూకితే లటుక్కున దూకి జుట్టు పట్టుకుని లాక్కొద్దామని ఒక కన్ను వేసే ఉంచాను. నువ్వే వచ్చావు. ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది నాయనా.. వెతకాలి. కష్టమొచ్చిన ప్రతి ఒక్కరూ చనిపోతే ఈ లోకంలో మనుషులే ఉండరు‘ అన్నాడు.రాఘవ మనసులో ఇప్పుడు ఉదయపు కోరిక పూర్తిగా చచ్చిపోయింది. కొత్త రాఘవ అయ్యాడు.‘ఈ జామకాయ తిను బాబూ’ అంటూ తన జామకాయల బుట్టలో నుంచి ఓ కాయని తీసి తాత రాఘవ చేతిలో పెట్టాడు. రాఘవ ‘అయ్యో.. నా దగ్గర పైసా కూడా లేదు తాతా’ అనగానే ‘మరేం పర్వాలేదు బాబూ’ అన్నాడు. జామకాయ చాలా రుచిగా ఉంది. చిన్న ముక్క అరచేతిలో ఉంచి చిలకమ్మ దగ్గర పెడితే స్వతంత్రంగా పొడిచి గుటుక్కుమనిపించిందది. నవ్వుకున్నాడు.‘కాయ చాలా రుచిగా ఉంది తాతా’‘ఊరవతల తోటలోవి బాబూ. వాళ్లు నాకు తెలిసినవాళ్లే. మంచి కాపొచ్చే తోట. డబ్బున్నోళ్లు. చేసుకోవాలని లేదు. ఎవరికైనా గుత్తకు ఇద్దామనుకుంటున్నారు. ఈ కాయలను ఒక ఆటోలో వేసుకొని టౌన్‌కు తీసుకెళ్లి అమ్మితే ఇక్కడ పది రూపాయలకు అక్కడ యాభై వస్తాయి. నేనా చేయలేను’ అన్నాడు తాత.రాఘవకు ్రౖడైవింగ్ వచ్చు. చిన్న ట్రాలీ అద్దెకు తీసుకోగలడు. ‘తోట యజమానితో మాట్లాడి నన్ను పరిచయం చేయి తాతా. తర్వాతి కథ నేను చూసుకుంటాను. రేపటి నుంచి మన బిజినెస్ టౌన్లోనే. నువ్వు తోడుండు చాలు’ అన్నాడు రాఘవ.‘ఏంటి బాబూ నువ్వనేది’‘అవును తాతా’ అన్నాడు రాఘవ.తాత కూడా చిరునవ్వు నవ్వాడు.‘ఏం చిలకమ్మా’ అన్నాడు.అది కిచకిచమని అంగీకారం తెలిపింది.ముగ్గురూ లేచి అక్కడ నుంచి కదిలారు. గుడి గంట మరోసారి టంగుమంది. కొత్త రెక్కలతో రాఘవ, తాత, చిలకమ్మ ముందుకు సాగిపోయారు. – నేదూరి భాను సాయి శ్రేయ -
Masaba Gupta: మసాబా.. మసాబా..
మసాబా గుప్తా.. ఇండియన్ ఫ్యాషన్ ఇండస్ట్రీలో ఒక వైబ్రెంట్ వేవ్! ఆమె రాకముందు మన ఫ్యాషన్‌లో బిగ్ అండ్ బోల్డ్ ప్రింట్స్ అంతగాలేవు! ఇప్పుడవి చాలామంది సెలబ్రిటీస్‌కి మోస్ట్‌వాంటెడ్ క్యాజువల్స్‌గా మారి, వాళ్ల స్టయిలింగ్ వార్డ్రోబ్స్కి చేరిపోతున్నాయి. క్రెడిట్ గోస్ టు ‘హౌస్ ఆఫ్ మసాబా!’ కుడోస్ టు క్రియేటర్ మసాబా గుప్తా!నా స్కిన్ కలర్, నా జుట్టు తీరుతో చాలా అవమానాలు ఎదుర్కొన్నా! అమ్మ ఇచ్చిన ధైర్యమే నన్ను నిలబెట్టింది. ఏ రంగంలో అయినా ప్రతికూలతలు ఉంటాయి. వాటిని మనకు అనుకూలంగా మలచుకోగలగడమే సక్సెస్! అంటుంది మసాబా గుప్తా.మసాబా గుప్తా ఎవరో సినీ,క్రికెట్ ప్రియులు చాలామందికి తెలిసే ఉంటుంది. నటి నీనా గుప్తా, క్రికెటర్ సర్ వివియన్ రిచర్డ్స్ కూతురు. చిన్నప్పుడెప్పుడూ ఫ్యాషన్ డిజైనర్ కావాలని కలకనలేదు ఆమె. తండ్రిలా ఆటల మీదే ఆసక్తి చూపింది. టెన్నిస్ ప్లేయర్ కావాలని కష్టపడింది. తనకు పదహారేళ్లు వచ్చేటప్పటికి ఆ ఆసక్తి, ప్రయత్నం మ్యూజిక్, డాన్స్ మీదకు మళ్లాయి. లండన్‌లో ఆ రెండిటిలో శిక్షణ తీసుకోవడం మొదలుపెట్టింది. కానీ అక్కడ ఒంటరిగా ఉండలేక వాటిని మధ్యలోనే వదిలేసి ముంబై చేరుకుంది.వచ్చాక, యాక్టింగ్ ఫీల్డ్ పట్ల ఇంట్రెస్ట్ చూపించింది. అది గమనించిన నీనా గుప్తా, ‘ఇక్కడి ఫిల్మ్ ఇండస్ట్రీ ఎక్స్పెక్ట్ చేసే సంప్రదాయ సౌందర్య ప్రమాణాలు వేరు. నువ్వు అందులో సెట్ కావు. సో.. ఆ ఆలోచనకు ఫుల్స్టాప్ పెట్టేయ్’ అంటూ బిడ్డను వెనక్కి లాగింది. ఏమాత్రం నిరుత్సాహపడక, తన క్రియేటివిటీని తన కాలేజ్ ఈవెంట్స్‌లో ప్రదర్శించసాగింది మసాబా. ఆ సమయంలోనే ఆమెలోని ఈస్తటిక్ సెన్స్, ఫ్యాషన్ స్పృహను కనిపెట్టిన ఫ్యాషన్ డిజైనర్, ఆథర్.. వెండెల్ రోడ్రిక్స్ ఆమెను ఫ్యాషన్ డిజైనింగ్ వైపు ప్రోత్సహించాడు. దాంతో మసాబా.. ముంబై, ఎస్ఎన్డీటీ యూనివర్సిటీ(శ్రీమతి నాథీబాయీ దామోదర్ ఠాక్రసే మహిళా విశ్వవిద్యాలయ్)లో అపరెల్ మాన్యుఫాక్చర్ అండ్ డిజైన్‌ను అభ్యసించింది.తను పూర్తిస్థాయిలో ఫ్యాషన్ ఇండస్ట్రీలో అడుగుపెట్టే టైమ్‌కి.. పెద్ద ప్రింట్లు, డార్క్ కలర్ల జాడ అంతగా కనపడలేదు ఆమెకు. దాంతో ఆ రెండిటినే తన యూఎస్పీగా మార్చుకుని ‘హౌస్ ఆఫ్ మసాబా’ లేబుల్‌ని ఆవిష్కరించింది. ఇండియన్ ఫ్యాషన్ ప్రపంచంలో అదొక సంచలనం. లేత రంగులు, ప్లెయిన్, చిన్న చిన్న డిజైన్స్‌నే ఎంచుకుంటున్న సెలబ్రిటీలకు మసాబా ప్రింట్స్æ వైబ్రెంట్‌గా తోచాయి. ఆ లేబుల్‌కి మారారు. ఆ అవుట్‌ఫిట్స్‌లో సెలబ్రిటీల అపియరెన్స్ రేడియెంట్గా కనిపించసాగింది.ప్రత్యేక స్టయిల్‌గా గుర్తింపురాసాగింది. అంతే ‘హౌస్ ఆఫ్ మసాబా’ బాలీవుడ్ సెలబ్రిటీల ఫేవరెట్ బ్రాండ్ అయిపోయింది. ఇంట్లో వేసుకోవడానికి మొదలు బీచ్‌లో వ్యాహ్యాళి, ప్రయాణాలు, సినిమాలు, పార్టీలు, ఫంక్షన్లు, అవార్డ్ ఈవెంట్స్ దాకా దేనికైనా మసాబా డిజైనర్ వేర్ కావాల్సిందే అని కోరుకునే స్థాయికి చేరుకుంది ఆ డిమాండ్! ఆ లిస్ట్‌లో సోనమ్ కపూర్, ప్రియంకా చోప్రా, కరీనా కపూర్ ఖాన్, కరిశ్మా కపూర్, కత్రినా కైఫ్, రాణీ ముఖర్జీ, విద్యా బాలన్, సొనాక్షీ సిన్హా, మీరా రాజ్‌పుత్ కపూర్, మౌనీ రాయ్, కరణ్ జోహార్ లాంటి మహామహులంతా ఉన్నారు. ‘హౌస్ ఆఫ్ మసాబా’ వెడ్డింగ్, రిసార్ట్ వేర్‌లోనూ సిగ్నేచర్ డిజైనింగ్‌ను మొదలుపెట్టింది. అంతేకాదు స్విమ్ వేర్, మెన్స్ వేర్, ఫ్యాషన్ జ్యూల్రీలోనూ తన నైపుణ్యాన్ని చూపిస్తోంది.ఇవి చదవండి: Elnaaz Norouzi: పర్షయన్ ప్రజ్ఞ! -
Ananda Nilayam: ఒకేచోట.. ఈ అష్టాదశ శక్తిపీఠాలు!
పురాణాల ప్రకారం, అమ్మవారిని ఆరాధించే దేవాలయాలలో ప్రశస్తమైనవి అష్టాదశ శక్తిపీఠాలు. శివుడి అర్ధాంగి సతీదేవి శరీరం 18 ముక్కలై, 18 ప్రదేశాల్లో పడ్డాయని, వాటినే అష్టాదశ శక్తిపీఠాలు అంటారని మన పురాణాలు చెబుతున్నాయి. ఈ శక్తిపీఠాలను దర్శించుకుని, అమ్మవార్ల అనుగ్రహం పొందాలని భక్తులు భావిçస్తుంటారు. రకరకాల కారణాల వల్ల కొంతమందికి శక్తిపీఠాల దర్శనభాగ్యం కరవవుతోంది. అలాంటివారికి అన్ని శక్తిపీఠాలను ఒకేచోట దర్శించుకునే అవకాశాన్ని కల్పిస్తూ అష్టాదశ శ«క్తిపీఠాలన్నిటినీ ఒకే దగ్గర నిర్మించారు.అది ఎక్కడో కాదు తెలంగాణ, సిద్దిపేట జిల్లా, కొండపాక గ్రామ శివారులోని ఆనంద నిలయంలో! గత ఏడాది నవంబరులో.. ఇక్కడి అష్టాదశ శక్తిపీఠ సహిత ఉమారామలింగేశ్వర స్వామి దేవాలయంలో 18 శక్తిపీఠాలతో పాటు లక్ష్మీగణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, శివపార్వతులనూ ప్రతిష్ఠించారు.గట్టు రాంరాజేశం గుప్త సంకల్పంతో..సిద్దిపేటకు చెందిన గట్టు రాంరాజేశం గుప్త అమ్మవారికి అపర భక్తుడు. అష్టాదశ శక్తి పీఠాలన్నిటినీ ఒకే దగ్గర నిర్మించాలని ఆయన చిరకాల కోరిక. ఒకసారి, తన మనసులో మాటను రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, ఆనంద నిలయ వ్యూహకర్త కేవీ రమణాచారి ముందుంచారు. ఆయన ట్రస్ట్ సభ్యులతో చర్చించి, ఆనంద నిలయంలో 5 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. ఆలయ నిర్మాణానికి తన వంతుగా రాంరాజేశం రూ. 1.5 కోట్లను అందజేశారు. ఆనంద నిలయం వృద్ధాశ్రమ ట్రస్ట్ సభ్యులు, ఇతర దాతల సహకారంతో మొత్తం రూ.10 కోట్ల వ్యయంతో దేవాలయాలను నిర్మించారు. అమ్మవార్ల రాతి విగ్రహాలను తమిళనాడులో తయారుచేయించారు. వీటిని పుష్పగిరి పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ అభినవోద్దండ విద్యాశంకర భారతి మహాస్వామి, శ్రీశ్రీశ్రీ మాధవానంద సరస్వతి స్వామి ప్రతిష్ఠించారు.22 దేవాలయాలు..పద్దెనిమిది శక్తిపీఠాల్లో పదిహేడు మనదేశంలో ఉండగా, శాంకరీదేవి శ్రీలంకలోని ట్రింకోమలిలో ఉంది. మన దేశంలో ఉన్న కామాక్షీదేవి (కంచి, తమిళనాడు), శృంఖలాదేవి (కోల్‌కతా, పశ్చిమబెంగాల్), చాముండేశ్వరీదేవి (మైసూరు, కర్ణాటక), జోగులాంబ (ఆలంపూర్, తెలంగాణ), భ్రమరాంబికాదేవి (శ్రీశైలం, ఆంధ్రప్రదేశ్), మహాలక్ష్మీదేవి (కొల్హాపూర్, మహారాష్ట్ర), ఏకవీరాదేవి (మాహుర్, మహారాష్ట్ర), మహాకాళీదేవి (ఉజ్జయిని, మధ్యప్రదేశ్), పురుహూతికాదేవి (పిఠాపురం, ఆంధ్రప్రదేశ్), గిరిజాదేవి (జాజ్‌పూర్, ఒడిశా), మాణిక్యాంబాదేవి (ద్రాక్షారామం, ఆంధ్రప్రదేశ్), కామాఖ్యాదేవి ( గౌహతి, అస్సాం), మాధవేశ్వరీదేవి (ప్రయాగ, ఉత్తరప్రదేశ్), వైష్ణవీదేవి (జమ్మూ, జమ్మూ– కశ్మీర్ రాష్ట్రం), మంగళగౌరీదేవి (గయ, బిహార్), విశాలాక్షీ (కాశి), సరస్వతీదేవి (శ్రీనగర్) రూపాలను కొండపాక శివారులోని ఆనంద నిలయంలో దర్శించుకోవచ్చు. ఇదే ప్రాంగణంలో లక్ష్మీగణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, మరకత లింగం, శివపార్వతులతో కూడిన 22 దేవాలయాలను నిర్మించడం విశేషం. ఆయా శక్తిపీఠాల్లో జరిగినట్లుగానే ఇక్కడా పూజాకార్యక్రమాలుంటాయి. ప్రతి పౌర్ణమికి హోమం, ప్రతి శుక్రవారం అమ్మవార్లకు ప్రత్యేక అలంకరణ చేస్తారు. దర్శనానికి పలు ప్రాంతాల నుంచి భక్తులు విచ్చేస్తున్నారు.సామాజిక సేవ.. ఆధ్యాత్మిక శోభ!ఆనంద నిలయంలో సామాజిక సేవతోపాటు ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోంది. సుమారు వంద ఎకరాల్లోని ఈ ట్రస్ట్‌లో ఒకవైపు వృద్ధాశ్రమం, మరోవైపు అనాథాశ్రమం, ఇంకోవైపు సత్యసాయి పిల్లల హృద్రోగ ఆసుపత్రి, జూనియర్ కళాశాల ఉన్నాయి. భక్తులు, సామాజిక సేవకుల సందర్శనతో ఈ ప్రాంగణమంతా సందడిగా ఉంటుంది. ఇది హైదరాబాద్‌కు 73 కిలోమీటర్లు, సిద్దిపేటకు 17 కిలోమీటర్ల దూరంలో ఉంది. – గజవెల్లి షణ్ముఖరాజు, సాక్షి, సిద్దిపేట, ఫొటోలు: కె సతీష్, స్టాఫ్ ఫొటోగ్రాఫర్శక్తిపీఠాల్లో జరిగినట్టుగానే..ఇక్కడ పూజాకార్యక్రమాలన్నిటినీ శక్తిపీఠాల్లో మాదిరే జరుపుతాం. భక్తులు అమ్మవార్లకు ఒడి బియ్యం పోస్తారు. ప్రతి శుక్రవారం ప్రత్యేక అలంకరణ ఉంటుంది. ప్రతిరోజు శివుడికి, మరకత లింగానికి రుద్రాభిషేకం చేస్తాం. – పురుషోత్తమ రామానుజ, అర్చకుడుఅందరికీ దర్శనభాగ్యం కలగాలని.. అష్టాదశ శక్తిపీఠాలను దర్శించుకోవటం కొందరికి సాధ్యపడకపోవచ్చు. అలాంటివారికి శక్తిపీఠాల దర్శనభాగ్యం అందాలనేది నాన్నగారి కోరిక. కేవీ రమణాచారి, ఇంకెంతో మంది దాతల సహకారంతో నేడు అది నెరవేరింది. – గట్టు అమర్నాథ్, రవి, శ్రీనివాస్అమ్మవారి అనుగ్రహం..కొండపాకలో అష్టాదశ శక్తిపీఠాల నిర్మాణం అమ్మవారి దయ. అమ్మవారి అనుగ్రహం, అందరి సహకారంతో దేవాలయ నిర్మాణాలు సాధ్యమయ్యాయి. – డాక్టర్ కేవీ రమణాచారి, ఆనంద నిలయ వ్యూహకర్తఇవి చదవండి: అవును..! వారిది గుర్తింపు కోసం ఆరాటమే.. -
మీరెప్పుడైనా.. ఈ మృత్యుసరోవరం గురించి విన్నారా!?
సముద్రంలో ఉన్న మృత్యుసరోవరం ఇది. సముద్రంలోకి దిగి చూస్తే, ఇది మామూలుగానే కనిపిస్తుంది గాని, ఇందులో ఈత కొట్టాలని సరదా పడితే మాత్రం, చావును కోరి కొనితెచ్చుకున్నట్లే! వంద అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ మడుగులోని అత్యంత లవణీయత కలిగిన నీరు, మీథేన్, హైడ్రోజన్ సల్ఫైడ్ వంటి ప్రాణాంతక విషవాయువులు దీనిని మృత్యుసరోవరంగా మార్చాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనిని తొలిసారిగా 2015లో కనుగొన్నారు. ఇందులో ఈదులాడేందుకు దిగి మరణించిన జంతువుల కళేబరాలను శాస్త్రవేత్తలు పరిశోధనల కోసం సేకరించి, భద్రపరచారు. గల్ఫ్ ఆఫ్ మెక్సికో వద్ద సముద్రంలోకి దిగి పరిశోధనలు సాగిస్తున్న శాస్త్రవేత్తలకు సముద్రం లోపలి భాగంలో ఈ మడుగులాంటి ప్రదేశం కనిపించింది. దాదాపు వంద అడుగుల విస్తీర్ణంలో బురదనీటితో నిండిన ఈ మడుగులోకి వెళ్లే పీతలు, మొసళ్లు వంటి జీవులు నిమిషాల్లోనే ప్రాణాలు కోల్పోవడాన్ని వారు గమనించారు.సాధారణంగా సముద్రపు నీటిలో ఉండే ఉప్పదనం కంటే, ఈ మృత్యుసరోవరం నీటి ఉప్పదనం నాలుగురెట్లు ఎక్కువని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అతి కొద్ది జలచరాలు మాత్రమే ఇందులోని పరిస్థితులను తట్టుకుని మరీ బతకగలవని, మిగిలినవి ఇందులోకి దిగితే నిమిషాల్లోనే మరణిస్తాయని చెబుతున్నారు. దీనిని ‘హాట్ టబ్ ఆఫ్ డిస్పెయిర్’ అని, ‘జకూజీ ఆఫ్ డిస్పెయిర్’ అని అభివర్ణిస్తున్నారు.ఇవి చదవండి: గ్యాప్ ఇవ్వలా... వచ్చింది -
పరివర్తనం: ‘దేవరపాలెం.. దేవరపాలెం..’
‘దేవరపాలెం.. దేవరపాలెం..’ అంటూ కండక్టర్ కనకరాజు రాబోయే స్టాపులో దిగబోయే ప్రయాణికులను అలర్ట్ చేస్తూ గట్టిగా అరిచాడు. కనకరాజు అరుపులకు కొంతమంది సీట్లలోంచి లేచి, హడావిడిగా తమ సామాన్లను తీసుకుంటున్నారు. ‘రావాలి.. రావాలి..’ అంటూ కనకరాజు వారిని మరింత వేగిరపెట్టాడు. కొంతమంది దిగిపోయాక, కొంతమంది ఎక్కారు. కనకరాజు టికెట్స్ కొట్టే కట్టర్‌తో ఎదురుగా ఉన్న ఇనుప రాడ్ మీద ‘రైట్.. రైట్..’ అంటూ గట్టిగా కొట్టాడు. అతను ఇచ్చిన శబ్దసందేశానికి బస్సు పొగలు చిమ్ముకుంటూ బయల్దేరింది.ఆ బస్టాపుకి కొద్దిదూరంలో వున్న ఒకావిడ మర్రిచెట్టు కింద కూర్చుని, బస్సులోంచి దిగుతున్న ప్రయాణికులను ఆత్రంగా చూడటం కనకరాజు కొద్దిరోజులుగా గమనిస్తున్నాడు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వచ్చే ఆ బస్ కోసమే ఆమె రెండు పూటలా వస్తోంది. ఆమెకు సుమారుగా నలభై ఐదేళ్లుంటాయి. ఆమె కళ్ళు తీక్షణంగా మెరుస్తూ, దేనికోసమో వెతుకుతున్నట్టుగా కనిపిస్తున్నాయి. ప్రతిరోజు ఇదే ఆమె క్రమం తప్పని దినచర్య!‘ఆమె ఎవరు? రోజూ ఎవరి కోసం ఎదురుచూస్తోంది?’ అనే ప్రశ్నలు ఆమెని చూసినప్పుడల్లా కనకరాజు మదిని తొలిచేస్తున్నాయి. కనకరాజు తన ఆలోచనల్లోంచి బయటికి వచ్చి, ఓ పెద్దాయనకు టికెట్ కొడుతూ ‘బాబాయ్, ఎవరావిడ?’ తన మనసుని కుదిపేస్తున్న ప్రశ్నని అతని ముందు పెట్టాడు.‘ఆవిడో పిచ్చి మాలోకమయ్యా..!’ అతను ముక్తసరిగా బదులిచ్చాడు. కనకరాజు ఇంకేమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు.తన డ్యూటీ ముగించుకొని ఇంటికి చేరుకున్న కనకరాజు నిస్సత్తువగా హాల్లోని సోఫాలో వాలిపోయాడు. భర్త రాకను గమనించిన అతని భార్య సరోజ వంటగదిలోంచి వస్తూ ‘టీ పెట్టమంటారా?’ అని అనునయంగా అడిగింది.‘వద్దు సరోజా.. అలేఖ్యకి ఇప్పుడెలా వుంది? నిద్రపోతోందా?’ దుఃఖాన్ని గుండె లోతుల్లోనే దిగమింగుకుని నెమ్మదిగా అడిగాడు కనకరాజు.‘జ్వరం కొంచెం కూడా తగ్గుముఖం పట్టడంలేదు. ఏమి తిన్నా వాంతులు చేసుకుంటోంది. ఇప్పుడే పడుకుంది’ చెప్పింది సరోజ బాధని పంటితో బిగబట్టుకుని.కనకరాజుని ఈ మధ్యకాలంలో బాగా వేధిస్తోన్న అతిపెద్ద సమస్య తన ఎనిమిదేళ్ల కూతురి అనారోగ్యం! అతని కూతురు సంవత్సర కాలంగా అంతుచిక్కని కొత్త తరహా న్యుమోనియాతో నరకాన్నే చూస్తోంది. ఏడాదిగా స్కూలుకి కూడా పోవడంలేదు. తెలిసిన వాళ్లు చెప్పిన స్పెషలిస్టులందరికీ చూపించాడు. డాక్టర్లు సూచించిన అన్నిరకాల టెస్టులు చేయించాడు, చేయిస్తూనే వున్నాడు. ఫలితం మాత్రం శూన్యం!కనకరాజుకి ఎప్పటిలాగే ఆరోజు కూడా దేవరపాలెం బస్టాపు దగ్గర రెండు దఫాలూ అదే దృశ్యం ఎదురైంది. ఈసారి ఎవరినీ అడగకూడదని, తనే స్వయంగా ఆమెని కలిసి, విషయమేంటో ఆరా తీయాలని గట్టిగా తీర్మానించుకున్నాడు. తన సెలవు రోజున దేవరపాలెం వెళ్లాడు. బస్టాపు దగ్గర్లోని ఓ బడ్డీ కొట్టులో ఒక వాటర్ బాటిల్ కొంటూ, మర్రిచెట్టు కింద కూర్చున్న ఆవిడను చూపిస్తూ ‘ఎవరండీ ఆవిడ? రోజూ అక్కడ కూర్చుని, ఎవరి కోసం ఎదురు చూస్తుంది?’ అడిగాడు కాస్త చొరవతీసుకుని.‘ఆవిడా? ఎప్పుడో చిన్నప్పుడే పారిపోయిన కొడుకు తిరిగొస్తాడని.. అవిడో పిచ్చిది సార్!’ క్లుప్తంగా బదులిచ్చాడతడు.‘ఈ మాత్రం చాలు. ఆమెని చేరుకోవడానికి’ అనుకుంటూ, ఆ పక్కనే వున్న చెక్కబల్ల మీద కూర్చున్నాడు. ఆ కాసేపటికి బస్సు రావడం, వెళ్లిపోవడం జరిగిపోయాయి. బస్సు వచ్చేటప్పుడు ఆమె కళ్లల్లో అదే వెలుగు. బస్సు వెళ్లిపోయిన మరుక్షణమే నిరాశగా ఇంటిదారి పట్టింది. కనకరాజు దూరం నుంచే ఆమెను అనుసరించసాగాడు. ఆమె వెళ్తూవెళ్తూ ఓ ఇంటి ముందు ఆగిపోయింది. అదే.. తన నివాసం కాబోలు అనుకున్నాడు. అది ఓ సెంటు స్థలంలో కట్టిన చిన్న పాత పెంకుటిల్లు.కనకరాజు ధైర్యాన్ని కూడగట్టుకుని, మరో ఆలోచన చేయకుండా గబగబా ఆమె దగ్గరకు వెళ్లి ‘అమ్మా..! నా పేరు కనకరాజు. మీ బిడ్డకోసం ఎదురు చూస్తున్నారని విన్నాను. నేను డ్యూటీ మీద చాలాచోట్లకు తిరుగుతుంటాను. మీ అబ్బాయి గురించి వివరాలు చెప్తే, నా శాయశక్తులా వెతికిపెడతాను’ నిజాయితీగా తన మనసులోని మాటని ఆమె ముందు పెట్టాడు. ఆమె కనకరాజు వైపు ఆశ్చర్యంగా చూస్తూ ‘ఎవరు బాబూ మీరు? మీరు చెబుతున్నది నిజమేనా? నా బిడ్డ నిజంగా నా చెంతకొస్తాడా?’ ఆత్రంగా అడిగింది.‘అవునన్నట్లు’ తలూపాడు కనకరాజు. ఆమె మొహం ఒక్కసారిగా కాంతివంతమైంది.‘బాబూ.. నా కొడుకు పారిపోయి పదిహేనేళ్లు గడిసిపోనాయి. కానీ ఇంతవరకు ఎవ్వరూ యివ్వని భరోసాని యిత్తున్నావు. అందరూ నన్ను ‘పిచ్చిది’ అనేటోళ్లే గానీ, ఎవరూ యిలా చెప్పలేదు బాబూ..’ తన పట్టరాని సంతోషాన్ని, కన్నీళ్ల రూపేణా వ్యక్తపరచింది.ఆమె భావోద్వేగానికి కనకరాజు ఎంతోగానో చలించిపోయాడు. అతని కంట్లో కూడా నీళ్లూరాయి.‘మీ పేరెంటమ్మా..’ అడిగాడు. ‘ఎర్రయ్యమ్మ..’ చెప్పింది.మిగతా వివరాలూ అడిగాడు కనకరాజు. తన కొడుకు పేరు రాజు అని చెప్పింది ఆమె. పదేళ్లప్పుడు మాస్టారు కొట్టారని పుస్తకాల సంచిని అక్కడే విసిరికొట్టి, ఇంటికొచ్చేశాడట. కొడుక్కి బుద్ధి రావాలని రెండు దెబ్బలు వేసిందట ఎర్రయ్యమ్మ. అంతే..కోపంతో రాజు ఊరొదిలి పారిపోయాడు. అది మొదలు ఎర్రయ్యమ్మ పిచ్చిదానిలా చుట్టుపక్కల ఊళ్లే కాదు, సిటీలోని వీథులు, రోడ్లనూ గాలించిందట. తిరిగి తిరిగి కాళ్లు అరిగాయి కానీ కొడుకు జాడ మాత్రం తెలియలేదు. అదో తీరని వెతగా మారిపోయింది. కొడుకు కోసం ఎదురుచూస్తూ లోకం దృష్టిలో పిచ్చిదైపోయింది. ప్రభుత్వం అందిస్తోన్న ఫించనుతోపాటు రెండు ఇళ్లల్లో పాచిపనులు చేస్తూ జీవితాన్ని నెట్టుకొస్తోంది. తను వుంటున్నది అద్దె ఇల్లే! అయితే ఒకప్పుడు అది తనదేనట. తాగుబోతు భర్త తన వ్యసనాల కోసం ఆ ఇంటిని అమ్మేశాడట. అయితే పెళ్లయిన మూడేళ్లకే చనిపోయాడట అతను. త్వరలోనే తన కొడుకు తనని వెతుక్కుంటూ ఇంటికి వస్తాడని ఈమధ్యనే ఓ సాధువు ఆమెకు జోస్యం చెప్పాడట.ఆమె నోట ఆ వివరాలన్నీ విన్న కనకరాజు ‘ఎర్రయ్యమ్మా, అప్పుడెప్పుడో పారిపోయిన నీ కొడుకు ఇన్నేళ్ల తర్వాత కనిపిస్తే ఎలా గుర్తుపడతావు?’ అనుమానంగా అడిగాడు. అంతే.. ఆమె గబగబా ఇంట్లోకెళ్లి, పోస్టుకార్డు సైజులో వున్న బ్లాక్ అండ్ వైట్ ఫొటో ఒకటి తెచ్చి, ‘మా రాజుగాడి కుడి చెంప మీద కంది గింజంత పుట్టుమచ్చ వుంది.. చూశావా బాబూ..?’ అంటూ ఆ ఫొటోలో స్పష్టంగా కనిపిస్తోన్న పుట్టుమచ్చని చూపించింది.కనకరాజు ఆ ఫొటోని అడుగుదామనుకునేలోపే ఎర్రయ్యమ్మే ‘ఈ ఫొటో నీ దగ్గర ఉంచు బాబూ.. మా వాడిని గుర్తుపట్టడానికి.. ఇంకా ఇలాంటి ఫొటోలు నాలుగైదు నా దగ్గరున్నాయిలే’ అంటూ ఆ ఫొటోని కనకరాజు చేతిలో పెట్టింది.ఆ ఫొటోని భద్రంగా జేబులో పెట్టుకుంటూ, చిన్న కాగితం మీద తన మొబైల్ నెంబరు రాసి ఆమెకిచ్చాడు కనకరాజు. అలా ఎర్రయ్యమ్మకు అంతులేని విశ్వాసాన్ని కలిగించి, కొండంత ధైర్యాన్ని నూరిపోసి ఆమె దగ్గర సెలవు తీసుకున్నాడు.తర్వాత కొన్ని రోజులకే డిపోవారు కనకరాజు డ్యూటీ రూటు మార్చేయడంతో అతనికి ఎర్రయ్యమ్మను చూసే వీలు చిక్కలేదు. కూతురిని తరచుగా ఆసుపత్రికి తీసుకెళ్లాల్సి రావడం వల్ల కూడా అతనికి ఎర్రయ్యమ్మను కలిసే తీరిక దొరకలేదు. అలా రెండునెలలు గడిచిపోయాయి. ఒకరోజు ఎర్రయ్యమ్మే అతనికి ఫోన్ చేసింది తన కొడుకు ఇంటికి వచ్చేశాడంటూ! ఆనందాశ్చర్యాలకు లోనయ్యాడు కనకరాజు. డ్యూటీకి సెలవు పెట్టి, ఉన్నపళంగా దేవరపాలెం బయలుదేరాడు.కనకరాజుని చూడగానే సంతోషంతో ఉప్పొంగిపోయింది ఎర్రయ్యమ్మ.‘అయ్యా! మీరు చెప్పినట్టుగానే నా బిడ్డ నాకు దక్కాడు.. మీరు నా పాలిట భగమంతుడే! తమరు కలకాలం చల్లగా ఉండాలయ్యా..’ అంటూ ఆనందబాష్పాలతో కృతజ్ఞతలు చెప్పుకుంది.‘నీ కొడుకు ఎక్కడమ్మా..?’అంటూ ఆత్రంగా అడిగాడు కనకరాజు.‘వంట సరుకులు కొనుక్కొత్తానని వెళ్లాడు బాబూ, వచ్చేత్తాడు..’ ఎర్రయ్యమ్మ అంటుండగానే ఓ పాతికేళ్ల యువకుడు రెండు చేతులతో రెండు సంచులను మోసుకుంటూ ఆ ఇంట్లోకి అడుగుపెట్టాడు.అతను ఎర్రయ్యమ్మలాగే సన్నగా, పొడవుగా వున్నాడు. ఇంకా పసితనపు ఛాయలు పోలేదు. ఏదో తేజస్సు ఆ కుర్రాడి ముఖంలో! ఎర్రయ్యమ్మ ‘రాజూ, నేను చెప్పానే, గొప్ప మనసున్న మారాజు అని.. ఈ బాబే’ అంటూ కొడుక్కి కనకరాజుని పరిచయం చేసింది.ఆ అబ్బాయి తన రెండు చేతులెత్తి కనకరాజుకి దండం పెట్టాడు. ఎర్రయ్యమ్మ, కొడుక్కి ఏదో చెప్తున్నట్టుగా సైగచేసింది. ఆ యువకుడు చెక్క బెంచీపై కూర్చున్న కనకరాజు కాళ్లకి నమస్కరించాడు.అనుకోని ఆ పరిణామానికి కనకరాజు బిత్తరపోతూ, ఆ కుర్రాడిని పైకి లేపుతూ మనస్ఫూర్తిగా ఆశీర్వదించాడు. భోంచేసి వెళ్లాలని ఎర్రయ్యమ్మ పట్టుపట్టింది. భోంచేసి, వాళ్లిద్దరి దగ్గర వీడ్కోలు తీసుకుని బస్సులో కూర్చున్న కనకరాజు మనసుకి ఎంతో ఊరటగా ఉంది. కానీ.. ఎక్కడో ఏదో తెలియని వెలితి!ఆ వెలితికి సాక్షీభూతంగా నిలిచిన ఓ సంఘటన కళ్ల ముందు కదుల్తూ అతన్ని రెండు వారాల వెనక్కు తీసుకువెళ్లింది.రాజు ఫొటోతో ఎర్రయమ్మ ఇల్లు దాటిన నాటి నుంచి ఎక్కడికి వెళ్లినా.. ఏ కుర్రాడు కనిపించినా ఆ ఫొటోతో పోల్చి చూసుకోవడం కనకరాజు దినచర్యలో భాగమైపోయింది. అలా ఎర్రయ్యమ్మ వేదన గురించే ఆలోచిస్తోన్న కనకరాజుకి ఒకరోజు.. బస్సులో ఓ పాతికేళ్ల యువకుడు బేల ముఖంతో చిన్నగా శోకిస్తూ కనిపించాడు. అది చివరి ట్రిప్ కావడంతో బస్సంతా ఖాళీగావుంది. అతన్ని గమనించిన కనకరాజు, అతని పక్కనే కూర్చుని ‘ఏమైంది బాబూ.. అంతగా కుమిలిపోతున్నావు?’ అంటూ అనునయంగా అడిగాడు. ఆ అనునయానికి కదిలిపోయిన ఆ కుర్రాడు నెమ్మదిగా గొంతు విప్పాడు.‘నా పేరు డేవిడ్ రాజు. ఒక క్రిస్టియన్ మిషనరీ స్కూల్లో చదువుకున్నాను. మా అమ్మను చూడాలని, ఆమెతో కబుర్లు చెప్పుకోవాలని ఆశ! మా అమ్మ గురించి నా శక్తి మేర చాలా సమాచారం సేకరించాను. అమ్మ నాకు తిండిపెట్టలేని దీనావస్థలో నన్ను మిషనరీ ట్రస్ట్‌లో వదిలేసిందట. ఏడాది పాటు అమ్మ ఆచూకీ కోసం చాలాచోట్లకి తిరిగాను. చాలామందిని కలిశాను. చిట్టచివరికి తన అడ్రస్ పట్టుకోగలిగాను. కానీ, నాలాంటి దురదృష్టవంతుడు ఇంకొకడు ఉండడు సార్! తను ఓ నెల కిందటే ఎవరూలేని అనాథలా చనిపోయింది. నన్ను నిజంగానే అనాథని చేస్తూ..’ అంటూ బొటబొటా కన్నీళ్లుకార్చాడు.తను చదివిన ‘లా ఆఫ్ అట్రాక్షన్’ ప్రత్యక్షంగా ఎదురుకావడంతో మాటల్లో చెప్పలేని వింతానుభూతికి లోనయ్యాడు కనకరాజు. ‘మనం ఏదైనా బలంగా కోరుకుంటే.. అది జరిగితీరుతుంది!’ అని ఆ పుస్తకంలో చదివినట్టు జ్ఞాపకం. కుర్రాడి కళ్ల కిందుగా జారిపోతున్న కన్నీళ్లను తుడుస్తూ ‘నీకు అమ్మ ప్రేమ దక్కేటట్టు చేసే బాధ్యత నాది!’ అంటూ తిరుగులేని హామీనిచ్చాడు.ఆ కుర్రాడు తన్నుకొస్తోన్న దుఃఖాన్ని ఆపుకుంటూ, కుతూహలంగా కనకరాజు వైపు చూశాడు. ‘అయితే, నీ కుడి చెంప మీద చిన్న పుట్టుమచ్చ ఒక్కటే లోటు’ అన్నాడు కనకరాజు ఏదో ఆలోచిస్తూ!ఆరోజు ఆలా రెండు హృదయాల వేదనలను ‘ఒక సంతోష సాఫల్యం’గా రూపకల్పన చేశాడు కనకరాజు.ఎర్రయ్యమ్మ, రాజును కలిసిన కనకరాజు తన ఇంటికి చేరుకునేసరికి సాయంత్రమైంది. మెయిన్ గేటు తీసి, లోనికి అడుగుపెడుతుండగా ఎదురుగా కనిపించిన దృశ్యం అతన్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. అతని కూతురు ‘నాన్నా..’ అంటూ కిలకిలా నవ్వుతూ తనకేసి పరుగుతీస్తోంది లేడిపిల్లలా. పట్టరాని భావోద్వేగంతో కూతుర్ని చేతుల్లోకి తీసుకుని గుండెకు హత్తుకున్నాడు. కళ్లు కన్నీటి సంద్రాలయ్యాయి. ఎదురుగా వస్తోన్న అతని భార్య, తల్లి ముఖాల్లో వెల్లివిరిసిన వసంతకాలపు వెలుగులు!ఆశ్చర్యంగా భార్య వైపు చూశాడు. ‘ఉదయాన్నే మీరు అలా వెళ్లారో లేదో.. ఎప్పుడూ తిననని మొండికేసే పిల్ల ‘ఆకలీ.. ఆకలీ..’ అంటూ ఒకటే గొడవ. జ్వరం ఉందేమోనని చూశాను. ఏదో మంత్రం వేసినట్టుగా పూర్తిగా మాయం! అప్పటికప్పుడు టిఫిన్ చేసి, వేడివేడిగా తినిపించాను. తిన్నప్పటి నుంచి ఒకటే అల్లరి! ఇల్లంతా ఉరుకులు, పరుగులు! ఉదయం నుంచి పది నిమిషాలకొకసారి ఏదో ఒకటి అడిగి తింటూనే ఉంది. ఒక్క వాంతి కూడా కాలేదు. నాకే ఆశ్చర్యంగా ఉందండీ..’అంటూ ఆమె సంబరంగా జరిగినదంతా చెప్పుకుపోయింది. ‘సాటి మనిషికి సాయం చేసే నీ తత్త్వమేరా నీ బిడ్డకు ఆయుష్షు పోసుంటుంది..!’ అంది కనకరాజు తల్లి, కొడుకు వైపు మెచ్చుకోలుగా చూస్తూ. తల్లి మాటలకు చిన్నగా నవ్వేస్తూ, కూతురిని మురిపెంగా చూసుకుంటూ ఇంట్లోకి నడిచాడు కనకరాజు.ఎర్రయ్యమ్మని రాజు ఎలా చూసుకుంటున్నాడో తెలుసుకోవాలన్పించి, ఒకరోజు దేవరపాలెం వెళ్లాడు కనకరాజు. సాదరంగా ఆహ్వానించింది ఎర్రయ్యమ్మ. రాజు ఇంట్లో లేడు. ఆఫీస్ పని మీద సిటీకి వెళ్లాడని చెప్పింది. సాఫ్ట్వేర్ అయిన రాజు.. వారానికి ఒకటీ, రెండ్రోజులు మాత్రమే ఆఫీసుకి వెళ్తుంటాడు. మిగతా రోజులన్నీ వర్క్ ఫ్రమ్ హోమ్. ఎర్రయ్యమ్మ కట్టూబొట్టూ పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ఆమె ఒంటి మీదకి బంగారం కూడా చేరింది. కొడుకు కోరిక మేరకు పాచిపనులకు స్వస్తి చెప్పింది.ఎర్రయ్యమ్మ చెప్పిన మరో విషయం రాజు మీద కనకరాజుకి తిరుగులేని నమ్మకాన్ని కలిగించింది. తన భర్త ద్వారా పోగొట్టుకున్న, ఒకప్పటి తన సొంతిల్లు అదే ఇప్పుడు అద్దెకున్న ఆ ఇల్లు, దాన్ని ఆనుకొని వున్న మరికొంత ఖాళీస్థలాన్నీ కొని, ఎర్రయ్యమ్మ పేరిట కాగితాలు రాయించాడని చెప్పింది. విన్న కనకరాజు తన ప్రయత్నం సంపూర్తిగా సఫలీకృతమైంది అనుకున్నాడు. మనసు నిండింది.‘ప్రతి జీవితానికి చెప్పుకోవడానికి ఏదో ఒకటి ఉండాలంటారు. నా జీవితానికిది చాలు!’ అనుకుంటూ బయల్దేరడానికి సమాయత్తమయ్యాడు కనకరాజు.కుర్చీలోంచి లేచిన కనకరాజు కాళ్లకి ఎర్రయ్యమ్మ నమస్కరించబోయింది. ఆ హఠాత్పరిణామానికి అతను బిత్తరపోయి దూరం జరుగుతూ ‘ఎర్రయ్యమ్మా, నేను నీ తమ్ముడు లాంటివాడిని. నువ్వు నా కాళ్లకు నమస్కరించడం ఏంటీ?’ అన్నాడు ఇబ్బందిపడుతూ.‘సాటిమనిషి కోసం ఆలోచించే తీరికలేని ఈ కాలంలో.. అనామకురాలైన ఈ ఎర్రయ్యమ్మ కోసం నువ్వు ఎంత తాపత్రయపడ్డావో నాకెరుకే బాబూ..! పారిపోయిన నా కొడుక్కి కుడి చెంప మీద కంది గింజంత పుట్టుమచ్చ ఉందని చెప్పాను. కానీ, వాడి ఛాతీ మీదున్న పాపిడి బిళ్లంత మరొక పుట్టుమచ్చ గురించి చెప్పలేదు! అది నీకు తెలియదు కదా బాబూ..’ అంటోన్న ఆమెకు బదులేం ఇవ్వాలో తెలియక నిశ్శబ్దంగా ఉండిపోయాడు కనకరాజు.‘నా బాధ చూడలేక, నా కొడుకు రూపంలో ఈ అబ్బాయిని, నువ్వే పంపించావని నాకు ఎరుకే బాబూ! రాజు నా కడుపున కాయకపోయినా అంతకన్నా ఎక్కువే! ఇలాంటి మారాజు బిడ్డని నాకు చూపించినందుకు నీకు ఈ ఎర్రయ్యమ్మ జనమ జనమలకు రుణపడి ఉంటాది బాబూ..! నా కొడుకు మొన్ననే నీ గురించి ఓ మాట చెప్పినాడు.. ‘కండక్టర్’ అంటే నడిపించేవాడని అర్థమట! నువ్వు, నిజంగా మా బతుకులను నడిపించిన దేవుడివయ్యా..’ అంటూ చేతులెత్తి దండం పెట్టింది.‘ఎర్రయ్యమ్మా.. నీ రాజును నీ దరికి చేర్చే క్రమంలో నిన్ను ఒక అబద్ధంతో మభ్యపెడుతున్నానని ఎంతో అపరాధభావానికి గురయ్యాను. ఆ వెలితిని కాస్త దూరం చేశావు. నేనే నీకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి’ అన్నాడు కనకరాజు. తేలికపడిన మనసుతో తన ఇంటి దారి పట్టాడు. – శ్రీనివాసరావు తిరుక్కోవుళ్ళూరు -
అవును..! వారిది గుర్తింపు కోసం ఆరాటమే..
టీనేజర్లు ఎందుకు చిత్రంగా ప్రవర్తిస్తుంటారు? ఎందుకు చిత్ర విచిత్రమైన డ్రెస్‌లు వేస్తారు? ఎందుకు ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తుంటారు? ఎందుకంటే, అదంతా గుర్తింపు నిర్మాణ (ఐడెంటిటీ ఫార్మేషన్) ప్రక్రియలో భాగం. తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నంలో భాగం. అయితే ఐడెంటిటీ ఫార్మేషన్ అనేది అంత సులువుగా, సూటిగా జరగదు. స్వీయ భావన (సెల్ఫ్–కాన్సెప్ట్), స్వీయ గౌరవం (సెల్ఫ్–ఎస్టీమ్), సామాజిక గుర్తింపు (సోషల్ ఐడెంటిటీ)ల మధ్య సంక్లిష్ట చర్యల ద్వారా జరుగుతుంది.నేనెవరు? నేనేం కావాలనుకుంటున్నాను? సమాజంలో నా స్థానం ఏమిటి? వంటి ప్రశ్నలతో యువత తర్జన భర్జన పడుతుంది. అందుకోసం విభిన్న పాత్రలను, విలువలను, విశ్వాసాలను పరీక్షిస్తారు. ఈ ప్రక్రియ సజావుగా జరిగినప్పుడు సరైన ఐడెంటిటీ ఏర్పడుతుందని లేదా గందరగోళంలో పడతారని ప్రముఖ డెవలప్మెంటల్ సైకాలజిస్ట్ ఎరిక్ ఎరిక్సన్ చెప్పాడు. అందుకే దీన్ని Identity Vs Role confusion అని పేర్కొన్నాడు.నేనెవరు?ఒక వ్యక్తికి తన సామర్థ్యం, విలువలు, వ్యక్తిత్వ లక్షణాలపై ఉన్న అవగాహననే స్వీయభావన అంటారు. యవ్వనంలో ఇది వేగంగా మారుతూ ఉంటుంది. కొత్త కొత్త స్నేహాలు చేస్తారు, కొత్త హాబీలను స్వీకరిస్తారు, కొత్త కొత్త దుస్తులు ప్రయత్నిస్తారు. విరుద్ధమైన ప్రవర్తనలను ప్రదర్శిస్తుంటారు. ఇదంతా తనను తాను తెలుసుకునే ప్రయత్నంలో భాగమే. కానీ తల్లిదండ్రులు దీన్ని తప్పుగా అర్థం చేసుకుని నిలకడగా ఉండరంటూ విమర్శిస్తుంటారు.ఉదాహరణకు, 15 ఏళ్ల మాయ చదువుపై శ్రద్ధ పెట్టడమా లేక సింగింగ్ కాంపిటీషన్స్‌లో పాల్గొనడమా అనే విషయంలో తర్జన భర్జన పడుతోంది. కానీ తల్లిదండ్రులు చదువుపైనే దృష్టిపెట్టాలని చెప్పడంతో దానికి అనుగుణంగా ఆమె స్వీయ భావన రూపుదిద్దుకుంటుంది. గుర్తింపు నిర్మాణంలో ఇది ముఖ్యమైన అంశం. యవ్వనంలో ఇలా అన్వేషించడం, నచ్చినదానికి కట్టుబడి ఉండటం వలన సరైన ఐడెంటిటీ ఏర్పడుతుందని, లేదంటే గందరగోళంలో పడతారని మీయుస్, తదితరులు చేసిన దీర్ఘకాలిక అధ్యయనం పేర్కొంది.నా విలువేంటి? ఒక వ్యక్తి తన విలువను తానెలా చూస్తున్నారనేదే స్వీయగౌరవం. ఇతరులతో పోల్చుకోవడం, విద్యాపరమైన ఒత్తిళ్లు, బాడీ ఇమేజ్‌కు సంబంధించిన అంశాల వల్ల టీనేజ్‌లో ఇది తరచుగా మారుతూ ఉంటుంది. ఉదాహరణకు, పదహారేళ్ల రవి సోషల్ మీడియా ప్రభావం వల్ల ఇతరులతో పోల్చుకుని, తాను అంత అందంగా లేనని మథనపడుతున్నాడు. దానివల్ల అతని స్వీయగౌరవం తగ్గిపోతోంది. దాంతో బయటకు వెళ్లడానికి జంకుతున్నాడు. నిజానికి చదువులో అందరికంటే ముందుంటాడు. కానీ దాని విలువను అతను గుర్తించడంలేదు. స్వీయ–కరుణ (self&compassion) అనే భావనను అభివృద్ధి చేయడం వల్ల ఈ నష్టాన్ని తగ్గించవచ్చని నెఫ్ (2011) పరిశోధనలు తేల్చాయి. సామాజిక గుర్తింపు..వ్యక్తిగత గుర్తింపుతో పాటు సామాజిక గుర్తింపు కూడా యవ్వనంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అందుకే స్నేహ సమూహాలు, సాంస్కృతిక లేదా మత సంఘాలు వంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు. ఇలాంటి సమూహాలతో గుర్తింపును కలిగి ఉండటం యువతలో భద్రత భావనను పెంచుతుంది. ఉదాహరణకు, 17 ఏళ్ల కరణ్ కుటుంబం ఉత్తర భారతం నుంచి హైదరాబాద్ వలస వచ్చింది. తమ కుటుంబ సంప్రదాయ విలువలను పాటించాలని ఇంట్లో నొక్కి చెప్పినా, కళాశాలలో అందుకు భిన్నమైన వాతావరణాన్ని ఎదుర్కొంటున్నాడు. ఈ రెండింటిలో దేన్నీ అతను వదులుకోలేడు. వాటి మధ్య రాజీ కుదుర్చుకోవడం ద్వారా అతనికి సామాజిక గుర్తింపు ఏర్పడుతుంది. అంటే యవ్వనంలో చేసే తిక్క తిక్క పనులన్నీ గుర్తింపు నిర్మాణంలో భాగమేనని గుర్తించాలి.తల్లిదండ్రులు చేయాల్సినవి..– టీన్స్‌లో జరిగే మార్పులను తల్లిదండ్రులు అర్థం చేసుకుని, పిల్లలకు అండగా నిలబడినప్పుడు వారిలో సరైన గుర్తింపు ఏర్పడుతుంది. – పిల్లల ఆలోచనలు, భావాలు, సవాళ్లు పంచుకోవడానికి విమర్శలు లేని వాతావరణాన్ని సృష్టించాలి. – భిన్న ఆసక్తులు, స్నేహాలు అన్వేషించడానికి అవసరమైన స్వేచ్ఛ కల్పించాలి. వారి ఎంపికలను గౌరవించాలి.– స్వేచ్ఛంటే విచ్చలవిడితనం కాదని, సంపూర్ణ బాధ్యత అని చెప్పాలి. అవసరమైన నిబంధనలు విధించాలి. అవసరానుగుణంగా వాటిని సడలించాలి. – ఇతరులతో పోల్చకుండా, వారి బలాలను గుర్తించి, విజయాలను ప్రశంసించాలి.– వారి పరిశీలనను, సామాజిక సంబంధాలను ప్రోత్సహించాలి. – యువత తాము గమనిస్తున్న ప్రవర్తనల ద్వారా ఎక్కువ నేర్చుకుంటారు. అందువల్ల తల్లిదండ్రులు మంచి రోల్ మోడల్స్‌గా ఉండాలి. -
కుర్రాళ్ల గుండెలకు.. ఏమవుతోంది?
మనుషుల్లో గుండెజబ్బులు సర్వసాధారణమే! నడివయసు దాటాక చాలామంది గుండెజబ్బుల బారిన పడుతుంటారు. ఆధునిక వైద్యచికిత్స పద్ధతులు మెరుగుపడటంతో గుండెజబ్బులు ఉన్నవారు కూడా తగిన చికిత్సలతో, ఔషధాల వినియోగంతో ఆయుష్షును పొడిగించుకునే వీలు ఉంటోంది. గుండెజబ్బులు గుర్తించిన తర్వాత కూడా తగిన చికిత్స పొందుతూ ఒకటి రెండు దశాబ్దాల కాలం సునాయాసంగా జీవించగలిగే వారి సంఖ్య పెరుగుతోంది.ఇదంతా చూసుకుంటే పరిస్థితి ఆశాజనకంగానే కనిపిస్తోంది గాని, ఇటీవలి కాలంలో గుండెపోటుతో యువకులు మరణిస్తున్న సంఘటనలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఆధునిక చికిత్సలు అందుబాటులోకి వచ్చినా, ఆరోగ్యంగా కనిపించే యువకుల గుండెలకు రక్షణ ఎందుకు కొరవడుతోంది? ఈ పరిస్థితులకు కారణాలేమిటి? నివారణ మార్గాలేమిటి? నేడు వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న మరణాల్లో అత్యధిక మరణాలకు కారణం గుండెజబ్బులే! ముఖ్యంగా గుండెకు రక్త సరఫరా నిలిచిపోవడం వల్ల సంభవించే ‘ఇస్కీమిక్ హార్ట్ డిసీజ్’ వల్ల అత్యధిక మరణాలు సంభవిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) చెబుతోంది. ‘వరల్డ్ హార్ట్ ఫెడరేషన్’ గత ఏడాది ‘వరల్డ్ హార్ట్ రిపోర్ట్–2023’ విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఏటా 2.05 కోట్ల మంది గుండెజబ్బులతో మరణిస్తున్నారు. సకాలంలో చికిత్స అందించినట్లయితే, వీటిలో 80 శాతం మరణాలను నివారించే అవకాశాలు ఉన్నాయని ఈ నివేదిక చెబుతోంది.గడచిన ఐదు దశాబ్దాల కాలంలో గుండెజబ్బులను గుర్తించడం, తగిన చికిత్స అందించడం దిశగా వైద్యశాస్త్రం గణనీయమైన పురోగతి సాధించింది. అయినా, ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న గుండెజబ్బు మరణాల్లో 80 శాతం ఆర్థికంగా వెనుకబడిన దేశాల్లోను, అభివృద్ధి చెందుతున్న దేశాల్లోను సంభవిస్తున్నాయి. పాత రికార్డులను చూసుకుంటే, 1990లో 1.21 కోట్ల మంది గుండెజబ్బులతో మరణించారు. అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు అధునాతన వైద్యచికిత్స పద్ధతులు, మెరుగైన పరికరాలు అందుబాటులో ఉన్నా, గుండెజబ్బుల మరణాలు దాదాపు రెట్టింపుగా నమోదవుతుండటం ఆందోళనకర పరిణామం.గుండెజబ్బులతో అకాల మరణాలు..ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న అకాల మరణాలకు గుండెజబ్బులే ప్రధాన కారణం. అకస్మాత్తుగా గుండెకు రక్త సరఫరా నిలిచిపోవడం వల్లనే అత్యధికంగా గుండెపోటు మరణాలు సంభవిస్తున్నట్లు అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రమాణాల ప్రకారం 30–70 ఏళ్ల లోపు సంభవించే మరణాలను అకాల మరణాలుగా పరిగణిస్తారు. ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న అకాల మరణాల్లో 38 శాతం మరణాలకు ఇస్కీమిక్ హార్ట్ డిసీజ్ కారణమని ‘వరల్డ్ హార్ట్ రిపోర్ట్–2023’ చెబుతోంది. ఈ అకాల మరణాలకు అనేక కారణాలు ఉన్నాయి. జీవనశైలి, శరీరంలోని జీవక్రియల తీరు, పర్యావరణ కారణాల వల్ల జనాలు గుండెజబ్బుల బారిన పడుతున్నారు.జీవనశైలి కారణాలు: తగిన శారీరక శ్రమ లేకపోవడం, పొగతాగడం, మితిమీరి మద్యం తాగడం, ఉప్పుతో కూడిన పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం.జీవక్రియ కారణాలు: అధిక రక్తపోటు, మధుమేహం, అధిక బరువు, ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండటం.పర్యావరణ కారణాలు: పరిసరాల్లో మితిమీరిన వాయు కాలుష్యం, పొగ, దుమ్ము, ధూళి నిండిన పరిసరాల్లో పనిచేయడం.ఆకస్మిక గుండెపోటుతో మరణాలు గుండెజబ్బులకు తెలిసిన కారణాలకైతే జాగ్రత్తలు తీసుకుంటాం. మరి అకస్మాత్తుగా గుండెపోటు వచ్చి, నిమిషాల్లోనే గుండె ఆగిపోతేనో! అకస్మాత్తుగా వచ్చే గుండెపోటు వల్లనే ఎక్కువమంది చికిత్స అందేలోపే ప్రాణాలు కోల్పోతున్నారు. వీరిలో చాలామంది నిన్న మొన్నటి వరకు ఆరోగ్యంగా ఉన్న యువకులు ఉంటున్నారు. ఆకస్మిక గుండెపోటు వల్ల సంభవించే మరణాలు గుండెజబ్బులతో బాధపడే వృద్ధుల్లో సహజం.ప్రతి 50 వేల మరణాల్లో ఒక యువ క్రీడాకారుడు ఉంటున్నట్లు ‘వరల్డ్ హార్ట్ రిపోర్ట్–2023’ చెబుతుండటం ఆందోళనకరం. శారీరక శ్రమతో కూడిన జీవనశైలి, క్రమం తప్పకుండా వ్యాయామం చేసేవారు, ఆటలాడే వారు కూడా ఆకస్మిక గుండెపోటుతో మరణిస్తున్నారు. ‘కోవిడ్’ తర్వాత ఇలాంటి మరణాలు ఎక్కువయ్యాయి. ‘కోవిడ్’కు ముందు ఆకస్మిక గుండెపోటుతో సంభవించే ప్రతి లక్ష మరణాల్లో ఒక యువక్రీడాకారుడు చొప్పున ఉండేవారు. ఇప్పుడు ఈ సంఖ్య రెట్టింపు కావడమే ఆందోళనకరం.ఆకస్మికంగా గుండెపోటుకు కారణాలు..ఆకస్మికంగా గుండెపోటు రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. గుండెలోని విద్యుత్ సిగ్నలింగ్ వ్యవస్థలో ఆకస్మిక మార్పులు ఆకస్మిక గుండెపోటు కలిగిస్తాయి. గుండె లయ వేగంగా పెరగడం వల్ల గుండె దిగువ భాగంలోని గదులు బాగా కుంచించుకుపోతాయి. ఫలితంగా శరీరానికి కావలసిన రక్తాన్ని అందించడంలో గుండె విఫలమవుతుంది. ప్రాణాంతకమైన ఈ పరిస్థితిని ‘వెంట్రిక్యులర్ ఫైబ్రిలేషన్’ అంటారు. ఈ పరిస్థితి వల్ల ఆకస్మిక గుండెపోటు మరణాలు సంభవిస్తుంటాయి.1. గుండె కండరం దళసరిగా తయారవడం కూడా యువకుల్లో ఆకస్మిక గుండెపోటు మరణాలకు మరో కారణం. గుండె కండరం ఒక్కోసారి దళసరిగా తయారవుతుంది. అలాంటప్పుడు గుండె శరీరానికి కావలసిన రక్తాన్ని సరఫరా చేయలేదు. గుండె కండరం దళసరిగా మారితే గుండె లయలో వేగం పెరుగుతుంది. ఈ పరిస్థితి ఒక్కోసారి ఆకస్మిక గుండెపోటుకు దారితీస్తుంది.2. గుండెలయలో హెచ్చుతగ్గులకు దారితీసే ‘బ్రుగాడా సిండ్రోమ్’, ‘వూల్ఫ్–పార్కిన్సన్–వైట్ సిండ్రోమ్’ వంటి రుగ్మతలు కూడా ఆకస్మిక గుండెపోటు మరణాలకు కారణమవుతాయి. ఇవే కాకుండా, కొందరిలో పుట్టుకతోనే గుండెలో లోపాలు ఉంటాయి. గుండెనాళాల్లోను, రక్తనాళాల్లోను హెచ్చుతగ్గులు ఉంటాయి. అలాంటప్పుడు కూడా ఆకస్మికంగా గుండెపోటుతో మరణాలు సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.3. ‘లాంగ్ క్యూటీ సిండ్రోమ్’ వల్ల కూడా ఆకస్మికంగా గుండెపోటు సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ పరిస్థితి ఉన్నవారికి గుండె చాలా వేగంగా కొట్టుకుంటూ ఉంటుంది. ‘లాంగ్ క్యూటీ సిండ్రోమ్’ కొందరిలో జన్యు కారణాల వల్ల పుట్టుక నుంచి ఉంటుంది. ఈసీజీ పరీక్ష చేయించినప్పుడు ఈ పరిస్థితి బయటపడుతుంది. ఒక్కోసారి ఇతరేతర ఆరోగ్య కారణాల వల్ల, దీర్ఘకాలికంగా వాడే మందుల దుష్ప్రభావం వల్ల కూడా ‘లాంగ్ క్యూటీ సిండ్రోమ్’ రావచ్చు. ఈ పరిస్థితి ఒక్కోసారి ఆకస్మిక గుండెపోటు మరణాలకు దారితీసే అవకాశాలు ఎక్కువ.ముందుగా గుర్తించాలంటే?ఎలాంటి ముందస్తు సూచనలు లేకుండా ఆకస్మికంగా వచ్చే గుండెపోటును ముందుగానే గుర్తించడం సాధ్యమేనా? అంటే, ఆకస్మికంగా వచ్చే గుండెపోటును నివారించడం సాధ్యం కాకపోయినా, కొన్ని ముందస్తు పరీక్షల వల్ల ఆకస్మిక గుండెపోటు మరణాలను తగ్గించగలమని వైద్య నిపుణులు చెబుతున్నారు. కఠిన వ్యాయామాలు చేసే యువకులు, క్రీడారంగంలో కొనసాగే యువకులకు ఈసీజీ పరీక్షలు తప్పనిసరి చేయడం ద్వారా వారిలో ఆకస్మిక గుండెపోటు మరణాలను తగ్గించవచ్చునని ఇటాలియన్ వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే, ఈసీజీ వల్ల పాక్షిక ప్రయోజనం మాత్రమే ఉంటుందని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ నిపుణులు చెబుతున్నారు. కుటుంబంలో అనువంశిక చరిత్ర సహా ఇతరేతర కారణాల వల్ల గుండెజబ్బులు ఉన్న యువకులు కఠిన వ్యాయామాలకు, క్రీడా పోటీలకు దూరంగా ఉండటమే మంచిదని కూడా వైద్య నిపుణులు సూచిస్తున్నారు.గుండెజబ్బుల నివారణ.. హెల్దీ లైఫ్‌స్టైల్‌తో సాధ్యమే!ఈమధ్య గుండెజబ్బులు చాలా చిన్నవయసులోనే వస్తుండటం డాక్టర్లుగా మేము చూస్తున్నాం. యువతరంలో గతంలో ఎప్పుడోగానీ కనిపించని గుండెజబ్బులు, గుండెపోటు కేసులు ఇటీవల చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఉద్యోగాల్లో పని ఒత్తిడి, పని ఒత్తడిలో పడి హడావుడిగా జంక్‌ఫుడ్ తినడం, వ్యాయామం తగ్గిపోవడం, ఫలితంగా స్థూలకాయులవడం, మద్యపానం, పొగతాగడం వంటి అలవాట్లు యువతలో గుండెజబ్బులు పెరగడానికి ప్రధాన కారణాలు. అందుకే ఆరోగ్యకరమైన సమతులాహారం తీసుకోవడం, పని ఒత్తిడి తగ్గించుకోవడానికి యోగా, ధ్యానం వంటివి చేయడం, రోజుకు 45 నిమిషాల చొప్పున వారంలో కనీసం ఐదురోజులు వ్యాయామం చేయడం వంటి హెల్దీ లైఫ్‌స్టైల్‌ను అనుసరిస్తే యువతలో గుండెజబ్బులను చాలావరకు నివారించవచ్చు.ఎలాంటి హెచ్చరిక ఉండదు..సాధారణంగా ఆకస్మిక గుండెపోటు సంభవించే ముందు ఎలాంటి హెచ్చరిక ఉండదు. ఎలాంటి ముందస్తు లక్షణాలు కనిపించవు. అయితే, కొన్ని లక్షణాలు కనిపించినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా గుండె పరీక్షలు చేయించుకోవడం మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు.నడుస్తున్నప్పుడు, ఏదైనా పని చేస్తున్నప్పుడు లేదా ఆటలాడుతున్నప్పుడు హఠాత్తుగా మూర్ఛపోవడం జరిగితే, వెంటనే వైద్య నిపుణులను సంప్రదించాలి. గుండె సమస్యల వల్ల కూడా ఇలా మూర్ఛపోయే పరిస్థితి తలెత్తుతుంది.ఉబ్బసంలాంటి పరిస్థితి లేకపోయినా, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడినట్లయితే గుండె పనితీరులో లోపాలు ఉన్నట్లే భావించాలి. ఈ పరిస్థితి ఎదురైతే, వెంటనే వైద్యనిపుణులను సంప్రదించాలి.కుటుంబ సభ్యులు ఆకస్మిక గుండెపోటు వల్ల మరణించిన చరిత్ర ఉన్నట్లయితే, ముందు జాగ్రత్తగా గుండె పరీక్షలు చేయించుకోవాలి. జన్యు కారణాల వల్ల గుండెలో లోపాలు ఉన్నట్లయితే ఆ పరీక్షల్లో బయటపడతాయి. వాటిని ముందుగానే గుర్తించినట్లయితే, తగిన చికిత్స పొందడానికి అవకాశం ఉంటుంది.ఆకస్మిక గుండెపోటు లక్షణాలు..ఆకస్మికంగా గుండెపోటు వచ్చినప్పుడు సాధారణంగా కనిపించే లక్షణాలు ఇవి:– హఠాత్తుగా కుప్పకూలిపోవడం– నాడి అందకపోవడం– ఊపిరాడకపోవడం– స్పృహ కోల్పోవడంఒక్కోసారి ఆకస్మికంగా గుండెపోటు వచ్చే ముందు ఇంకొన్ని లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఈ లక్షణాలు కనిపించిన కొద్ది నిమిషాల్లోనే గుండెపోటు వస్తుంది.– ఛాతీలో అసౌకర్యంగా ఉండటం– ఊపిరి తీసుకోవడం కష్టమవడం– నిస్సత్తువ– వేగంగా ఊపిరి తీసుకోవడం– గుండె లయ తప్పి కొట్టుకోవడం– స్పృహ కోల్పోతున్నట్లుగా అనిపించడంఈ లక్షణాలు కనిపిస్తే, వెంటనే అంబులెన్స్‌కు కాల్ చేయడం మంచిది. ఎంత వేగంగా చికిత్స అందితే రోగికి అంత మంచిది. ఈ పరిస్థితుల్లో ఉన్నవారికి వెంటనే ‘కార్డియో పల్మనరీ రిసటేషన్’ (సీపీఆర్) అందించాలి. అలాగే, అందుబాటులో ఉంటే ‘ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డీఫైబ్రిలేటర్’ (ఏఈడీ)తో ప్రాథమిక చికిత్సను అందించాలి. సీపీఆర్ చేసేటప్పుడు ఛాతీపై నిమిషానికి 100–120 సార్లు బలంగా మర్దన చేయాలి. ఆస్పత్రికి చేరేలోగా రోగికి ఈ రకమైన ప్రాథమిక చికిత్స అందిస్తే, చాలావరకు ప్రాణాపాయం తప్పుతుంది. -
స్మార్ట్ కే‘రింగ్’! మంత్రదండంలాంటి ఉంగరం
ఇప్పటికే మార్కెట్లోకి కొన్ని రకాల స్మార్ట్రింగులు అందుబాటులోకి వచ్చాయి. ఇవన్నీ ఎప్పటికప్పుడు యాప్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌కు ఆరోగ్య సమాచారాన్ని చేరవేస్తుంటాయి. తాజాగా చైనాకు చెందిన ‘కుమీ టెక్నాలజీస్’ మిగిలిన స్మార్ట్రింగులను మించిన ఫీచర్లతో ‘కుమి రింగ్ హెచ్1’ పేరుతో మంత్రదండంలా పనిచేసే స్మార్ట్రింగును అందుబాటులోకి తెచ్చింది.దీని తయారీకి మన్నికైన మైక్రోక్రిస్టలిన్ జిర్కోనియమ్ నానో సిరామిక్స్, యాంటీ బ్యాక్టీరియల్ స్టెయిన్లెస్ స్టీల్ ఉపయోగించడం విశేషం. రీచార్జబుల్ బ్యాటరీతో పనిచేసే ఈ స్మార్ట్రింగు బ్లూటూత్‌కు అనుసంధానమై పనిచేస్తుంది. శరీర ఉష్ణోగ్రత, రక్తంలో ఆక్సిజన్ స్థాయి, గుండె పనితీరు, రక్తపోటు వంటి వివరాలను ఇది ఎప్పటికప్పుడు స్మార్ట్‌ఫోన్‌కు పంపుతుంది.వ్యాయామం చేసేటప్పుడు శరీరంలోని మార్పుల వివరాలను కూడా ఇది తెలియజేస్తుంది. ఇందులో ‘ఎస్ఓఎస్’ బటన్‌ను అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించుకునే వెసులుబాటు కూడా ఉంది. ‘ఎస్ఓఎస్’ బటన్‌ను నొక్కితే, వెంటనే ముఖ్యమైన కాంటాక్ట్స్‌లో ఉన్నవారిని అప్రమత్తం చేస్తుంది. దీని ధర 199.99 డాలర్లు (రూ.16,788) మాత్రమే! -
జేబులో ఇమిడిపోయే చార్జర్
ప్రపంచవ్యాప్తంగా చాలారకాల చార్జర్లు వాడుకలో ఉన్నాయి. సాదాసీదా చార్జర్ల గరిష్ఠ సామర్థ్యం 20 వాట్ల వరకు ఉంటుంది. ఈ చార్జర్ వాటన్నింటి కంటే పూర్తిగా భిన్నమైనది. చూడటానికి చాలా చిన్నగా, జేబులో ఇమిడిపోయేంత మాత్రమే ఉంటుంది. దీనికి మూడు యూఎస్బీ పోర్టులు ఉంటాయి. వీటి ద్వారా ఒకేసారి మూడు గాడ్జెట్స్‌ను ఏకకాలంలో చార్జింగ్ చేసుకోవచ్చు.ఇది 100 వాట్ల సామర్థ్యంతో పనిచేస్తుంది. కేవలం అరవై గ్రాముల బరువు మాత్రమే ఉండే నానో చార్జర్ ఇది. ఎక్కడికైనా దీనిని తేలికగా తీసుకుపోవచ్చు. మామూలు ప్లగ్ సాకెట్లలో సులువుగా ఉపయోగించుకోవచ్చు. అంతేకాదు, ఇది చాలా వేగంగా గాడ్జెట్స్‌ను చార్జ్ చేస్తుంది. అమెరికన్ కంపెనీ ‘ఏంకర్’ ఈ నానో చార్జర్‌ను ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర 44.99 డాలర్లు (రూ.3,777) మాత్రమే!