Orissa
-
గంజాయి పంట ధ్వంసం
జయపురం: బొయిపరిగుడ సమితి జి.మజిగుడ పంచాయతీ రంగిణిగుడ, తొలటికిరిపడ పరిసర ప్రాంతాల్లోని 51 ఎకరాల్లో పండిస్తున్న గంజాయి మొక్కలను ధ్వంసం చేసినట్లు పోలీసు వర్గాలు బుధవారం వెల్లడించాయి. పోలీసులు, ఎకై ్సజ్ విభాగం అధికారులు సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో 50,600 మొక్కలను దగ్ధం చేసినట్లు తెలిపారు. వీటి విలువ సుమారు రూ.5 కోట్లు ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో జయపురం సబ్ డివిజన్ పోలీసు అధికారి అంకిత కుమార్ వర్మ, ప్రొబిషన్ ఐపీఎస్ అధికారి ఏఎస్ఎం రెడ్డి, నందపూర్ ఎకై ్సజ్ విభాగ ఇన్స్పెక్టర్ అన్నపూర్ణ రథ్, పొట్టంగి ఐఐసీ నీలమణి లెహజ, బొయిపరిగుడ ఎకై ్సజ్ ఐఐసీ భగవాన్ మహానందియ, బొయిపరిగుడ పోలీసు అధికారి దీపాంజలి ప్రధాన్, సబ్ ఇన్స్పెక్టర్ సంజీవ బెహర తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థులకు ప్రోత్సహించాలి
రాయగడ: విద్యార్థులను ప్రోత్సహిస్తే చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించగలరని కలెక్టర్ ఫరూల్ పట్వారీ అభిప్రాయపడ్డారు. స్థానిక సిరగుడలోని ఆదర్శ విద్యాలయంలో పర్గిపూల్ పేరిట శిశు మహోత్సవాలు బుధవారం జరిగాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను గుర్తించి ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు వారికి సహకారం అందించాలని సూచించారు. అప్పుడే వారు ఆయా రంగాల్లో ఉన్నత శిఖరాలను అధిరోహించగలరన్నారు. గెలుపు ఓటములను పక్కనబెట్టి ధృడ సంకల్పంతో ముందుకు సాగితే లక్ష్యాన్ని చేరుకునే అవకాశం ఉంటుందన్నారు. నైపుణ్యాలు వెలికితీయాలి విద్యార్థుల్లో నైపుణ్యాలను వెలికితీసే ప్రయత్నం చేయాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ సరస్వతీ మాఝి అన్నారు. గౌరవ అతిథిగా పాల్గొన్న ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థుల ప్రతిభకు పదునుపెట్టే ఇటువంటి తరహా కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ బసంత కుమార్ నాయక్ మాట్లాడుతూ ఈ ఉత్సవాల్లో వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థుల పాల్గొన్నారని వివరించారు. వాలీబాల్, వక్తృత్వ, వ్యాస, పరుగు పందేలు ఇలా 14 రకాల పోటీలను నిర్వహించామన్నారు. వీటిలో గెలిపొందిన వారు రాష్ట్రస్థాయిలో జరిగే పోటీల్లో పాల్గొనే అవకాశం కలుగుతుందన్నారు. జిల్లా సంక్షేమ శాఖ అధికారి భరత్ భూషన్ బిశ్వాల్, ఆదర్శ విద్యాలయం ప్రిన్సిపాల్ సంతోష్ పాత్రో తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల సైన్స్ ప్రాజెక్టుల ప్రదర్శన ఆకట్టుకుంది. -
రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో ఎంపీల భేటీ
కొరాపుట్: కేంద్ర రైల్వేమంత్రి అశ్వినీ శ్రీవైష్ణవ్‌తో నబరంగ్‌పూర్ ఎంపీ బలభద్ర మజ్జి, కలహండి ఎంపీ మాళవికా దేవిలు బుధవారం భేటీ అయ్యారు. ఈ మేరకు పార్లమెంట్ ఆవరణలో రైల్వేమంత్రి చాంబర్లో ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జయపూర్–నబరంగ్‌పూర్, జయపూర్–మల్కన్గిరిల మధ్య జరగనున్న రైల్వే నిర్మాణం కోసం జరగుతున్న భూ సేకరణ వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ భూసేకరణలో భూములు కోల్పోయిన వారికి నష్ట పరిహారాలు పెంచాలనన్నారు. అదేవిధంగా భద్రాచలం–మల్కన్‌గిరి, నబరంగ్‌పూర్–జునాఘడ్‌ల మధ్య ప్రభుత్వం నిర్మించాల్సిన నూతన రైలు మార్గం పనులు వేగవంతం చేయాలన్నారు. ఈ నిర్మాణాల వలన కూడా భూ పరిహరాలు పెంచాలని ఎంపీలు మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఎంపీలు తెచ్చిన నివేదికని రైల్వేమంత్రి పరిశీలించి వాటికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. -
ఆడబిడ్డ అమ్మకం
గురువారం శ్రీ 28 శ్రీ నవంబర్ శ్రీ 2024● సవతి తల్లి పోరుతో నాలుగేళ్ల చిన్నారి విక్రయం ● రూ.40 వేలకు అమ్మేసిన కన్నతండ్రి ● అదుపులోకి తీసుకున్న పోలీసులు భువనేశ్వర్: రాజధాని నగరంలో ఆడబిడ్డ అమ్మకం కలకలం సృష్టించింది. సవతి తల్లి ప్రేరేపణతో కన్న కూతురినే తండ్రి అమ్మేసిన ఉదంతం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బీహార్‌కు చెందిన సుబోధ్ శర్మకు మొదటి భార్యతో ఆడబిడ్డ సంతానం కలిగింది. ఆ బాలిక వయసు ప్రస్తుతం 4 ఏళ్లు. అయితే కొద్దికాలం తర్వాత గుడియా దే అనే మహిళను అతను రెండో వివాహం చేసుకున్నాడు. తొలి భార్య సంతానం ఆడబిడ్డ, రెండో భార్యతో కలిసి సుబోద్ శర్మ బీహార్ నుంచి నగరానికి చేరుకొని టొంకొపాణి ప్రాంతంలో అద్దె ఇంట్లో నివాసముండేవాడు. ఆయన వడ్రంగి వృత్తి నుంచి సమకూరిన ఆదాయంతో కాపురం నెట్టుకొస్తున్నారు. సవతి తల్లి అసూయ కాలానుక్రమంగా చిన్నారి ముద్దూముచ్చటపై సవతి తల్లికి సహించలేని అసూయ భావం పెరిగింది. ఈ విషయం గమనించిన కన్న తండ్రి సవతి తల్లి నుంచి బిడ్డని దూరంగా ఉంచడం మంచిదని భావించి అనాథ ఆశ్రమంలో చేర్చేందుకు విఫలయత్నం చేశాడు. అయితే ఈ పరిస్థితిని ఆసరాగా తీసుకున్న రెండో భార్య చిన్నారి అమ్మకానికి అతడిని ప్రేరేపించింది. బిడ్డని విక్రయించేందుకు ఇద్దరు దళారులను గుర్తించింది. వీరి సహకారంతో చిన్నారిని కొనుగోలు చేసేందుకు దంపతులను సిద్ధం చేసుకున్నారు. ఈ దంపతులు పూరీ జిల్లా పిపిలి గ్రామస్తులు. రూ.40 వేలకు డీల్ దళారులతోకలిసి చిన్నారి విక్రయానికి సిద్ధమైన అనంతరం రూ.40 వేలు ధరను నిర్ధారించారు. ఇందులో రూ.35 వేలు కన్నతండ్రి సుబోద్ శర్మకు, మిగిలిన రూ.5 వేలు సవతి తల్లికి ముట్టజెప్పారు. పిప్పిలి గ్రామానికి చెందిన రఘునాథ్ బెహరా దంపతులు దళారుల ఆధ్వర్యంలో 4 ఏళ్ల ఆడబిడ్డని రూ.40 వేలు చెల్లించి కొనుగోలు చేశారు. రూ.35 వేలు బిడ్డ కన్న తండ్రికి నగదు రూపంలో, మిగిలిన రూ.5 వేలు సవతి తల్లికి ఫోను పే ద్వారా చెల్లించి బిడ్డని తీసుకుని వెళ్లారు. ఇదంతా ఏమాత్రం బయటకు పొక్కకుండా గుట్టుగా నడిపించారు. ఇంటి ఓనర్ నిలదీయడంతో... కథ సుఖాంతం అయిందనుకునే తరుణంలో మెల్లగా అడ్డం తిరిగింది. సుబోద్ శర్మ కుటుంబం అద్దెకి ఉంటున్న ఇంటి యజమాని వీరి బిడ్డ కనబడకపోవడంతో సందేహంతో నిలదీశాడు. దీంతో గుట్టు రహస్యంగా ఉంచలేక నిజం వెల్లడించారు. ఇంటి యజమాని ఈ విషయాన్ని స్థానిక బరగడ్ ఠాణా పోలీసులకు పూస గుచ్చినట్లు వివరించాడు. ఈ కథనం ఆధారంగా పోలీసులు ప్రత్యక్షంగా రంగంలోకి దిగి బిడ్డని విక్రయించిన ఆరోపణ కింద సుబోద్ శర్మ దంపతులను తొలుత అదుపులోకి తీసుకున్నారు. వీరిని ప్రశ్నించగా సవతి తల్లి వేధింపులే కారణమని బిడ్డ తండ్రి పోలీసులకు వివరించాడు. దీనిపై ఆరాతీయగా సవతి తల్లి అంగీకరించి బిడ్డ విక్రయానికి ఏర్పాటు చేసిన దళారుల వివరాలను పోలీసులకు తెలియజేసింది. ఈ సమాచారం ఆధారంగా ఇద్దరు మహిళా దళారులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. దళారుల సమాచారం ఆధారంగా బిడ్డని కొనుగోలు చేసిన దంపతులను సైతం అదుపులోకి తీసుకుని, అమ్ముడుపోయిన బిడ్డని హస్తగతం చేసుకున్నారు. విచారణ కొనసాగుతోందని బరగడ్ ఠాణా పోలీసు అధికారి ఐఐసీ తృప్తి రంజన్ నాయక్ తెలిపారు. బిడ్డని శిశు సంక్షేమ కమిటీ (సీడబ్ల్యూసీ)కి అప్పగించనున్నట్లు ప్రకటించారు. న్యూస్‌రీల్ -
ఏకామ్ర క్షేత్రంలో ధూమపానం
భువనేశ్వర్: పవిత్ర ఏకామ్ర క్షేతం లింగరాజు దేవస్థానం ప్రధాన సముదాయంలో ఒక యాత్రికుడు ధూమపానానికి పాల్పడినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలు కలకలం రేపుతున్నాయి. పవిత్ర పుణ్యక్షేత్రంలో ఇటువంటి చేష్టలు సర్వత్రా అసంతృప్తిని కలిగిస్తున్నాయి. మరోవైపు దేవస్థానంలోనికి నిషేధిత సామగ్రితో సందర్శకుల ప్రవేశానికి కళ్లెం వేయలేకపోవడం దేవస్థానం భద్రత వ్యవస్థ డొల్లతనం బట్టబయలు చేస్తోందని విమర్శలు బలంగా వ్యాపించాయి. దేబీ105 ఇన్‌స్టా ఐడీతో సోషల్ మీడియాలో ఈ ఫొటోలు జోరుగా ప్రసారం అవుతున్నాయి. ఈ ఖాతా సమాచారం ప్రకారం వ్యక్తి పేరు దేబీ ప్రసాద్ దాస్‌గా స్పష్టం అవుతోంది. ఇతడు లింగరాజు దేవస్థానం పోటు పరిసరాల్లో ధూమపానంతో ఫొటోలు తీసుకున్నట్లు తెలుస్తుంది. మరో వ్యక్తి ఈ ఫొటోలు తీయకుంటే ఇది సాధ్యం కాదని భావిస్తున్నారు. ఈ ప్రసారానికి తక్షణమే కళ్లెం వేయాలని పలు వర్గాలు అభ్యర్థిస్తున్నాయి. స్థానిక పోలీసు ఠాణాలో ఆలయ పాలక వర్గం ఫిర్యాదు నమోదు చేసి చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. -
కొత్త అతిథులు
భువనేశ్వర్: నగర శివారులోని చందకా ఏనుగుల అభయారణ్యం గజరాజులకు అత్యంత అనుకూల అటవీ ప్రాంతం. ఈ ప్రాంతానికి కొత్తగా 2 గున్న ఏనుగులు అతిథులుగా విచ్చేశాయి. కుమారఖుంటి అటవీ ప్రాంతంలో వీటి సంరక్షణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ కొత్త అతిథులకు రాథిక, గగ్గు అని నామకరణం చేశారు. రాధిక వయసు 4 నెలలు కాగా, గగ్గు వయసు 3 నెలలు. ఈ రెండు గున్న ఏనుగులు ప్రధాన గుంపు నుంచి దారి తప్పి అల్లాడుతున్నట్లు గుర్తించిన అభయారణ్యం అధికారులు అక్కున చేర్చుకుని అభయాశ్రయం కల్పించారు. కొడుకుపై దాడి చేసిన తండ్రి అరెస్టు జయపురం: కొడుకు, తండ్రి మధ్య జరిగిన గొడవలో భాగంగా కొడుకుపై గొడ్డలితో దాడిచేసి తీవ్రంగా గాయపరిచిన తండ్రిని అరెస్టు చేసినట్లు జయపురం సదర్ పోలీసుస్టేషన్ ఇన్చార్జి, పట్టణ పోలీసు అధికారి రమణీ రంజన్ దొళాయి బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. పోలీసు అధికారి వివరణ ప్రకారం.. జయపురం సమితి ధరణహండి గ్రామంలో మానసింగ్ గోండ్, అతడి కుమారుడు పరశురాం గోండ్లు వేర్వేరుగా నివసిస్తున్నారు. అయితే ఈనెల 19వ తేదీన ఏదో కారణం వలన వీరిద్దరి మధ్య వివాదం తలెత్తింది. దీంతో మాన్సింగ్ కోపంతో గొడ్డలితో కుమారుడు పరశురాంపై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన పరుశురాంను జయపురం జిల్లా కేంద్ర ఆస్పత్రిలో బంధువులు చేర్చారు. అతడి పరిస్థితి విషమంగా ఉండడంతో కొరాపుట్ సాహిద్ లక్ష్మణ్ నాయిక్ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై బాధితుడు పరశురాం 21వ తేదీన గగణాపూర్ పోలీసు పంటిలో ఫిర్యాదు చేశాడు. గగణాపూర్ పోలీసు పంటి అధికారి రాజకిశోర్ బారిక్ కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపి నిందితుని మంగళవారం అరెస్టు చేసినట్లు వెల్లడించారు. జయపురం బంద్‌కు నిర్ణయం జయపురం: జగన్నాథ్ సాగర్ పునరుద్ధరణ చేపట్టాలనే డిమాండ్‌తో జయపురం బంద్ చేపట్టాలని మో జగన్నాథ్ ట్రస్టు నిర్ణయించింది. ఈ మేరకు ట్రస్ట్ సభ్యులు బుధవారం సమావేశమై సాగర్ పునరుద్ధరణ పనుల తీరు తెన్నులపై చర్చించారు. బంద్‌కు అన్ని రాజకీయ పార్టీలు, సంఘాలు, సంస్థల మద్దతు కోరాలని నిర్ణయించారు. ఎప్పటికప్పుడు జగన్నాథ్ సాగర్ పునరుద్ధరణ పనులు పూర్తి చేయాలని మున్సిపాలిటీకి విజ్ఞప్తులు చేస్తున్నా పట్టించుకోవడం లేదని మీడియాకు తెలిపారు. అందువలన జయపురంలో 12 గంటల బంద్ జరపాలని నిర్ణయించామని, అయితే ఎప్పుడు బంద్ జరపాలన్నది అందరితో చర్చించి నిర్ణయిస్తామని వెల్లడించారు. సమావేశంలో ట్రస్టు అధ్యక్షుడు రజనీ కాంత నాయిక్, మున్న పాణిగ్రాహి, రఘునాథ్ త్రిపాఠీ, నిరంజన్ పాణిగ్రహి, బి.చంద్రశేఖరరావు తదితరులు పాల్గొన్నారు. ధాన్యం కుప్పలు దగ్ధం రాయగడ: జిల్లాలోని మునిగుడలో ఉన్న ఇండియన్ గ్యాస్ గోడౌన్ వెనుక ఒక పొలంలో ధాన్యం కుప్పలు దగ్ధమయ్యాయి. బుధవారం మధ్యాహ్నం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.50 వేలు విలువ చేసే ధాన్యం కుప్పలు తగలబడినట్లు సమాచారం. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. -
చైతీ ఉత్సవాలకు సన్నాహాలు
రాయగడ: స్థానిక గోవింద చంద్రదేవ్ ఉన్నత పాఠశాల మైదానం వేదికగా డిసెంబర్ 26వ తేదీ నుంచి ఐదు రోజుల పాటు జరగనున్న చైతీ మహోత్సవాలకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. అందరి సహకారంతో ఉత్సవాలను నిర్వహించాలనే ఉద్దేశంతో కమిటీలు, సబ్ కమిటీలను ఏర్పాటు చేశారు. పట్టణ ప్రముఖులు, పాత్రికేయులు, విద్యావేత్తలు, అధికారులతో వేర్వేరు కార్యక్రమాలు నిర్వహించేవిధంగా మొత్తం 14 కమిటీలను ఏర్పాటు చేశారు. ప్రతీ కమిటీకి ఇచ్చిన బాధ్యతను సక్రమంగా నిర్వహించేలా యంత్రాంగం ఆయా కమిటీలకు సూచనలు, సలహాలు ఇవ్వడంతో పాటు వారి ప్రతిపాదనలను కూడా పరిగణలోకి తీసుకుంటుండడం విశేషం. సబ్ కలెక్టర్ కల్యాణి సంఘమిత్రా దేవి, జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వాహక అధికారి నిహారి రంజన్ కుహరో, ఏడీఎం భాస్కర రైతా, సంస్కృతిక విభాగాధికారి సుచిత్ర బౌరి, జిల్లా పౌరసంబంధాల శాఖ అధికారి బసంత కుమార్ ప్రధాన్‌లు కమిటీలను పర్యవేక్షిస్తున్నారు. ఆకర్షణీయంగా వేదిక ఇదిలా ఉండగా ఐదు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు సంబంధించి ఈసారి వేదిక ఆకర్షణీయంగా రూపొందించేందుకు జిల్లా యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. ఆదివాసీల సాంప్రదాయం, వారి కళలు, సంస్కృతిని ప్రతిబింబించే విధంగా కళాకారులతో వేదికను రూపొందించాలని నిర్ణయించారు. ప్రముఖుల సూచనలను పరిగణలోకి తీసుకున్న యంత్రాంగం ఈమేరకు చర్యలు తీసుకుంటుండడం గమనార్హం. -
గోల్మాల్!
ధాన్యం కొనుగోలులో.. తప్పనిసరి పరిస్థితుల్లో.. ఈ ఏడాది ఖరీఫ్ వరిపంట యంత్రాల ద్వారా కోతలు అవుతున్నా యి. పచ్చిగానే కోసిన ధాన్యం నాలుగైదు రోజుల పాటు ఎండ పెడుతున్నాం. కొంత మంది రైతులు పచ్చిగానే ధాన్యం విక్రయించారు. ఇప్పుడు ఎండిన ధాన్యం అమ్ముకునేందుకు ఎక్కడికి వెళ్లాలో తెలియడం లేదు. దీంతో ఊరిలోకి వచ్చిన దళారులకు, ట్రాక్టర్‌పైన తీసుకుని వెళ్లి రైస్ మిల్లులకు అమ్ముకుంటున్నాం. – పాలక పట్టయ్య, రైతు, జంబాడ, ఎల్.ఎన్.పేట బీజీ తప్పనిసరి.. బ్యాంక్ గ్యారెంటీ (బిజీ) లేకుండా మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేయకూడదు. సీఎస్‌డీటీని పంపించి మిల్లులను పరిశీలించమని చెబుతాను. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకుండా, బీజీలు చెల్లించకుండా ధాన్యం కొనుగోలు చేయకూడదు. పరిస్థితి తెలుసుకుని జిల్లా అధికారులకు నివేదిస్తాం. – జె.ఈశ్వరమ్మ, తహశీల్దారు, ఎల్.ఎన్.పేట ●ఎల్.ఎన్.పేట: కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. ధాన్యం విక్రయాల్లో కొందరు మిల్లర్లు, దళారుల చేతిలో అన్నదాతలు మోసపోతున్నారు. మరోవైపు తుఫాన్ హెచ్చరికలతో ధాన్యం రాశులకు ముప్పు వాటిల్లే అవకాశముండటంతో రైతుల ఆందోళనను కొందరు మిల్లర్లు క్యాష్ చేసుకుంటున్నారు. ధాన్యం కొనుగోలు చేసేందుకు మిల్లర్లు బ్యాంక్ గ్యారెంటీ (బీజీ)గా కొంత నగదు బ్యాంకులో జమచేయాలి. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత ధాన్యం డబ్బులుగా రైతులకు చెల్లింపులు చేస్తారు. ఇలా బీజీ చెల్లించిన మిల్లర్లకే కొనుగోలుకు జిల్లా అధికారులు అనుమతి ఇస్తారు. బీజీ ఉన్నంత వరకు ధాన్యం ఆ మిల్లుకు పంపించేలా సిబ్బంది పనిచేస్తారు. ఈ ఏడాది బీజీలు చెల్లించకుండానే ఇప్పటికే మిల్లర్లు వేలాది బస్తాల ధాన్యం కొనుగోలు చేసి మిల్లింగ్ కూడా ప్రారంభించారు. అయినా అడిగే వారే లేరు. కేంద్రాలు తెరిచేదెప్పుడో? ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర రైతులకు దక్కాలంటే ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి ఉంది. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని సాంకేతిక, ఇతర సిబ్బంది నియమించాలి. వీరు ధాన్యం తేమ, నాణ్యత పరిశీలించి రైతులు ధాన్యం అమ్ముకునేందుకు సహకరిస్తారు. ఖరీఫ్ వరిచేను కోతలు ప్రారంభమై నెల రోజులు అవుతున్నా ఇప్పటి వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవటంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేలా లేదని భావించిన రైతులు తప్పనిసరి పరిస్థితుల్లో దళారులు, మిల్లర్లను ఆశ్రయించి వారు అడిగిని ధరకే ధాన్యం విక్రయిస్తున్నారు. పరిశీలిస్తాం: ఆర్డీఓ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకుండా, బ్యాంక్ గ్యారెంటీ (బీజీ) లేకుండా మండలంలోని రైస్ మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేస్తున్న విషయం టెక్కలి ఆర్డీఓ ఎం కృష్ణమూర్తి దృష్టికి తీసుకెళ్లగా పరిశీలిస్తామని చెప్పారు. మిల్లుల వద్దకు సిబ్బందిని పంపించి విచారణ చేయిస్తామని, తేడాలు ఉంటే చర్యలు తీసుకుంటామని తెలిపారు. బ్యాంక్ గ్యారెంటీ, అధికారుల అనుమతి లేకుండానే మిల్లర్ల కొనుగోలు తుఫాన్ హెచ్చరికలను ‘క్యాష్’ చేసుకుంటున్న వైనం పూర్తిస్థాయిలో తెరుచుకోని కొనుగోలు కేంద్రాలు -
ఆ మిల్లర్లను ఉపేక్షించవద్దు
కరగాంలోని కొనుగోలు కేంద్రం వద్ద రికార్డులను పరిశీలిస్తున్న జేసీ నరసన్నపేట: ధాన్యం కొనుగోలు ప్రక్రియ మందకొడిగా సాగడంపై జాయింట్ కలెక్టర్ షర్మాన్ అహ్మద్‌ఖాన్ అసహనం వ్యక్తం చేశారు. కొనుగో లు కేంద్రం ఏజెన్సీ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రంలో పనిచేయని తేమ శాతం పరికరాలను గమనించి అధికారులను ప్రశ్నించారు. నరసన్నపేట మండలం కరగాం, చిక్కాలవలస కోనుగోలు కేంద్రాలను జేసీ బుధవారం పరిశీలించారు. ధాన్యం తేమ శాతం పరిశీలించి షెడ్యూల్ ఇచ్చి ట్రక్‌షీట్ జనరేట్ చేసి రైతు నచ్చిన మిల్లుకు ధాన్యం పంపేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కేంద్రాలపై నిరంతర నిఘా ఉండాలని తహసీల్దార్, డీటీ, వ్యవసాయాధికారులకు సూచించారు. కరగాం కొనుగోలు కేంద్రంలో ఏజెన్సీ కంప్యూటర్ ఆపరేటర్, టెక్నికల్ అసిస్టెంట్ సరైన సమాధానాలు చెప్పకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరి కారణంగానే ధాన్యం కొనుగోలు ఆలస్యం జరుగుతున్నట్లు ఉందని, వెంటనే సరిచేయాలని సిబ్బందిని ఆదేశించారు. వారిని బ్లాక్ లిస్టులో పెట్టండి.. నరసన్నపేటలో కొందరు మిల్లర్లు తేమ శాతం పేరుతో అదనంగా రెండు నుంచి నాలుగు కేజీల ధాన్యం అడుగుతున్నారని రైతులు జేసీ దృష్టికి తీసుకువెళ్లారు. ఇటువంటి మిల్లర్లను ఉపేక్షించవద్దని, తనిఖీలు చేసి వాస్తవమైతే అటువంటి వారిని బ్లాక్ లిస్టులో పెట్టాలని జేసీ సివిల్ సప్లయ్ డీటీని ఆదేశించారు. రైతులకు ఇబ్బంది పెడితే సహించేది లేదని హెచ్చరించారు. కొనుగోలు కేంద్రాల్లోని యంత్రానికి, మిల్లర్ల వద్ద ఉన్న యంత్రానికి తేమలో ఒక శాతం తేడా చూపిస్తోందని జిల్లా వ్యవసాయాధికారి త్రినాథస్వామి జేసీ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఆయన స్పందిస్తూ మిల్లర్ల మిషన్‌తో తమకు సంబంధం లేదని, మనం నిర్ణయించిందే ఫైనల్ అని స్పష్టం చేశారు. కార్యక్రమంలో నరసన్నపేట ఏడీ రవీంద్రభారతి, వ్వవసాయాధికారి కె.సునీత, తహసీల్దార్ సత్యనారాయణ, సీవిల్ సప్లయ్ డీటీ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోలులో అలసత్వం తగదు ఏజెన్సీ సిబ్బందిపై జేసీ ఆగ్రహం పనిచేయని తేమ శాతం యంత్రాలు చూసి అసహనం -
కొరాపుట్‌లో ఈస్టుకోస్టు జీఎం పర్యటన నేడు
కొరాపుట్: ఈస్ట్ కోస్ట్ రైల్వే జీఎం పరమేశ్వర్ పంక్వా ల్ కొరాపుట్ జిల్లాలో గురువారం పర్యటించనున్నారు. ప్రత్యేక రైలులో బయల్దేరి ఉదయం 8 గంటలకు కొరాపుట్ చేరనున్నారు. కొరాపుట్–రాయగడల మధ్య నిర్మా ణం జరుగుతున్న రైల్వే డబ్లింగ్ పనుల పురోగ తిని క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. అనంతరం ఉదయం 10 గంటలకు బయల్దేరి రాయగడ వెళ్తారు. రైల్వేలో జీఎం స్థాయి ఉన్నతాధికారి ఈ మార్గం వైపు వస్తుండడంతో రైల్వే వర్గాల్లో అప్రమత్తత నెలకొంది. విచారణకు ఆదేశం మల్కన్‌గిరి: జిల్లాలోని మత్తిలి సమితి మోహిపోదర్, కుమార్‌పల్లి పంచాయతీలో గిరిజనుల కు అడవి భూముల పట్టాలు ఇప్పిస్తానని చెప్పి లక్షలాది రూపాయులను రెవెన్యూ ఇన్స్పెక్టర్ కన్ను చరణ్ స్వయి వసూలు చేశాడని ఆ ప్రాంత గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేర కు కలెక్టర్ ఆశిష్ ఈశ్వర్ పటేల్‌కు బుధవారం ఫిర్యాదు చేశారు. తమకు పట్టాలు ఇప్పించాలని, లేదంటే తిరిగి తమ డబ్బులు అందజేయా లని కోరారు. అయితే ఈ విషయంపై కలెక్టర్ స్పందించి రెవెన్యూ అధికారిపై విచారణకు ఏడీఎం, తహసీల్దార్లకు ఆదేశించారు. విచారణ లో అభియోగాలు రుజువైతే అతనిపై చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. నో ఫ్లై జోన్ ప్రకటన భువనేశ్వర్: నగరంలోని పలుచోట్ల నో ఫ్లై జోన్, నో డ్రోన్ జోను ప్రకటించారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటన పురస్కరించుకుని జంట నగరాల పోలీసు కమిషనరేటు ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 29 నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు ఈ ఉత్తర్వులు అమలు నిరవధికంగా కొనసాగుతాయి. ఈ వ్యవధిలో పోలీసు డైరెక్టరు జనరల్ జాతీయ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాన మంత్రి రాష్ట్రానికి విచ్చేయనున్నారు. స్థానిక బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయం, ఎయిర్ పోర్టు ప్రాంతం, రాజ్ భవన్ ప్రాంతం, సభా ప్రాంగణం లోక్ సేవా భవన్, ఐపీఎస్ మెస్, మైత్రి విహార్, బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాజ్ భవన్, రాజ్ భవన్ నుంచి లోక్ సేవా భవన్, ఎయిర్ పోర్టు నుంచి ఐపీఎస్ మెస్, మైత్రి విహార్ మార్గాల్లో దారి పొడవునా నో ఫ్లై, నో డ్రోన్ జోను ప్రాంతాలుగా ప్రకటించినట్లు జంట నగరాల పోలీసు కమిషనరేటు ప్రధాన కార్యాలయం డీసీపీ పేర్కొన్నారు. జయరామ్‌కు కర్మవీర చక్ర అవార్డు సంతబొమ్మాళి: మండలంలోని రుంకు హనుమంతుపురం గ్రామానికి చెందిన పోలాకి జయరామ్ కర్మవీర చక్ర అవార్డు అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో లక్షాలాది మంది విద్యార్థుల జీవితాల్లో జీవన ప్రమాణాల అభివృద్ధికి కృషి చేసినందుకు గాను ఢిల్లీలో నవంబర్ 26న హార్డ్ఫర్ ఇండియా ఫౌండేషన్ ఫౌండర్, ప్రెసిడెంట్ ప్రిన్పెస్ ప్రాన్క్రోసి స్టూడిజా ఈ అవార్డును ప్రదానం చేశారు. కర్మవీరచ క్ర గ్లోబల్ యూత్ లీడర్స్ ఫోలోగా సైతం గుర్తింపు ఇచ్చారు. జయరామ్ హైదరాబాద్‌లో ఐటీ కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. రాష్ట్రస్థాయి సైన్స్‌ఫెయిర్ విజేతగా దుప్పలవలస ఎచ్చెర్ల క్యాంపస్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలల రాష్ట్రస్థాయి సైన్స్ ఫెయిర్ ప్రదర్శన విజయవాడలో ఈ నెల 25న నిర్వహించారు. ఇందులో దుప్పలవలస గురుకుల పాఠశాల విద్యార్థులు ‘హోం పేషెంట్స్ ఫుల్ కేర్ వీల్ చైర్’ అనే ప్రాజెక్టును ప్రదర్శించారు. 7వ తరగతి విద్యార్థి మనోజ్, ఇంటర్మీడియట్ విద్యార్థి కార్తీక్ దీనిని రూపొందించగా.. పీజీటీ జి.త్రినాథరావు గైడ్‌గా వ్యవహరిం చారు. 190 పాఠశాలల ప్రాజెక్టులో ఈ ప్రాజెక్టుకే ప్రథమ స్థానం లభించింది. ఈ సందర్భంగా విద్యార్థులను జిల్లా కో–ఆర్డినేటర్ బాలాజీ నాయక్, ప్రిన్సిపాల్ బి.బుచ్చిరాజు బుధవారం అభినందించారు. బెల్లం ఊట ధ్వంసం మెళియాపుట్టి: నాటుసారా తయారీ క్రయ విక్రయాలు నిర్వహిస్తే చర్యలు తప్పవని టెక్కలి ఎకై ్సజ్ సీఐ షేక్ మీరా సాహెబ్ హెచ్చరించారు. బుధవారం మెళియాపుట్టి మండలం రింపి గ్రామంలో టెక్కలి, నరసన్నపేట, ఎకై ్సజ్ సిబ్బంది సారా తయారీ స్థావరాలపై దాడులు నిర్వహించారు. 900 లీటర్ల బెల్లం ఊటలను ధ్వంసం చేశారు. 10 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో టెక్కలి, నరసన్నపేట ఎస్సైలు సత్యనారాయణమూర్తి, గురుమూర్తి, సిబ్బంది పాల్గొన్నారు. -
ఆకలి చావులు కాదు.. ఆహార కాలుష్యం
● మామిడి టెంకల జావ ఘటనపై ప్రభుత్వం వివరణ ● వాయిదా తీర్మానంపై అసెంబ్లీలో చర్చ ● మంత్రి రాజీనామా చేయాలని విపక్షాల డిమాండ్ భువనేశ్వర్: రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపిన కంధమల్ జిల్లా మామిడి టెంకల జావ మృతుల ఘటనపై సభలో విపక్షాలు వాయిదా తీర్మానం ప్రతిపాదించాయి. దీనిపై చర్చకు స్పీకర్ అనుమతించడంతో సభలో వాతావరణం క్రమంగా వేడెక్కింది. ఆకలి మంటలతో ఈ విచారకర సంఘటన అనివార్యమైందని ప్రధాన విపక్షం బిజూ జనతా దళ్ దుయ్యబట్టింది. అయితే ఇవి ఆకలి చావులు కాదని, ఆహా ర కాలుష్య ఘటనగా అధికార పక్షం వివరణ ఇచ్చింది. శాసనసభలో శీతాకాలం సమావేశాలు బుధవారం సభలో రెండో రోజు సభ ఆరంభంలో ప్రశ్నోత్తరాలు శాంతియుతంగా ముగియడంతో, వాయి దా తీర్మానంపై చర్చకు అనుమతి లభించింది. పాలన వ్యవస్థ అస్తవ్యస్తం నవీన్ పట్నాయక్ అందజేసిన సుందరమైన పాలన వ్యవస్థని 5 నెలల స్వల్ప నిడివిలో భారతీయ జనతా పార్టీ అస్తవ్యస్తం చేసిందని విపక్ష సభ్యుడు రణేంద్ర ప్రతాప్ స్వంయి ఆరోపించారు. లోటు రాష్ట్రాన్ని నవీన్ సర్కార్ మిగులు రాష్ట్రంగా తీర్చిదిద్దింది. కానీ బీజేపీ పాలన పగ్గాలు చేపట్టిన అతి తక్కువ కాలంలో ఆహార ధాన్యాలు అందక ఆకలి చావులు తాండవించడం ఆరంభమైందని విరుచుకుపడ్డారు. దారిద్య్ర రేఖ దిగువన ఉన్న రాష్ట్రాన్ని దారిద్య్ర రేఖ ఎగువకు ఎదుగుదల సాధించిన సమృద్ధి ఒడిశా భారతీయ జనతా పార్టీకి అందినా, పాలన దక్షత కొరవడి అస్తవ్యస్తంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. 2018 సంవత్సరంలోనే మామిడి టెంకలు ఆహారానికి యోగ్యం కాదని పేర్కొన్నారని, అయితే అధికారంలోకి రావడంతో మామిడి టెంకలు దళిత వర్గాల సాధారణ ఆహార పదార్థంగా పేర్కొనడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అకాల మరణానికి గురి కావడంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. దీనికి నైతిక బాధ్యత వహించి మంత్రి పదవికి రాజీనామా చేయాలని విపక్ష బిజూ జనతా దళ్ డిమాండ్ చేసింది. ఈ సంఘటనపై స్పందించిన ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి తక్షణమే 3 నెలల రేషను విడుదల చేసి లబ్ధిదారులకు పంపిణీ చేయాలని ఆదేశించారు. దయలేని ముఖ్యమంత్రి రాష్ట్రంలో అమాయక ప్రజలు ఆకలి చావులతో ఉసూరుమంటున్న పరిస్థితుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి సింగపూర్ పర్యటనలో తలమునకలయ్యారని కాంగ్రెసు సభ్యుడు రాజన్ ఎక్కా దుయ్యబట్టారు. బాధిత ప్రజల బాగోగుల పర్యవేక్షణ, మానవతా దృక్పథంతో పరామర్శ కోసం ప్రభావిత ప్రాంతం మండిపొంకా గ్రామం సందర్శించ లేకపోయారని మండిపడ్డారు. తిండి గింజలు కొరవడి ఆదివాసీ ప్రజలు మామిడి టెంకల జావతో పొట్ట నింపుకుని ఆకలి నుంచి గట్టెక్కే ప్రయత్నంలో మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి 35 కిలోల చొప్పున రేషన్ బియ్యం క్రమం తప్పకుండా సరఫరా చేసి, ఇటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. మామిడి టెంకలు ఆదివాసీల సాధారణ ఆహారంగా ఉప ముఖ్యమంత్రి ప్రభాతి పరిడా వ్యాఖ్యానించడంపై కాంగ్రెసు సభ్యుడు ప్రఫుల్ల చంద్ర ప్రధాన్ ఘాటుగా వ్యతిరేకించారు. పార్టీ మనుగడ కోసం ఉప ముఖ్యమంత్రి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఎంతమాత్రం తగదన్నారు. మామిడి టెంకలు ఆదివాసీల సాధారణ ఆహారం కాదని, గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆకలి తీర్చుకోవడం ఆరగించి అకాల మరణానికి గురైన విచారకర పరిస్థితిని ఉప ముఖ్యమంత్రి పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. ఆహార కాలుష్యమే: మంత్రి కృష్ణచంద్ర కంధమల్ జిల్లాలో సంభవించిన మృత్యు సంఘటన ఆకలి చావు కాదని రాష్ట్ర ఆహార, పౌర సరఫరా, వినియోగదారుల సంక్షేమ శాఖ మంత్రి కృష్ణ చంద్ర పాత్రో అన్నారు. ఇది ఆహార కాలుష్యంతో జరిగిన విచారకర ఘటనగా పేర్కొన్నారు. ఈ మేరకు వైద్య వర్గాలు జారీ చేసిన పోస్టుమార్టం నివేదిక స్పష్టం చేసిందని తెలిపారు. ఈ ఘటన చోటుచేసుకునే సమయానికి ఆహార భద్రత కింద సరుకుల పంపిణీ పుష్కలంగా ఉన్నట్లు పేర్కొన్నారు. మరోవైపు మృతుల కుటుంబీకులకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేసిందన్నారు. ఇటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ప్రభుత్వం అన్ని విధాల చర్యలను చేపడుతుందని పేర్కొన్నారు. -
పవర్ లిఫ్టింగ్‌లో జీఎంఆర్ ఐటీ విద్యార్థుల ప్రతిభ
రాజాం సిటీ: ఈ నెల 26 వరకు తమిళనాడులో జరిగిన సౌత్‌జోన్ పవర్ లిఫ్టింగ్ పోటీలలో స్థానిక జీఎంఆర్ ఐటీ విద్యార్థులు ప్రతిభ కనబర్చారని ప్రిన్సిపాల్ డాక్టర్ సీఎల్‌వీఆర్‌ఎస్‌వీ ప్రసాద్ బుధవారం తెలిపారు. జూనియర్ విభాగంలో పి.దీపిక (76 కేజీల కేటగిరీ), వి.శరత్ (59 కేజీల కేటగిరీ)లు రజత పతకాలు సాధించారని చెప్పారు. ఆ విద్యార్థులను ప్రిన్సిపాల్‌తో పాటు ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ జె.గిరీష్, స్టూడెంట్స్ డీన్ డాక్టర్ వి.రాంబాబు, అభినందించారు. పోక్సో కేసులో ముద్దాయికి ఏడేళ్ల జైలు, జరిమానావిజయనగరం క్రైమ్: విజయనగరం మహిళా పోలీసుస్టేషన్లో 2022లో నమోదైన పోక్సో కేసులో ముద్దాయికి ఏడేళ్ల జైలు, జరిమానాను పోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి విధించినట్లు ఎస్పీ వకుల్ జిందాల్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కేసు వివరాలిలా ఉన్నాయి. పూసపాటిరేగ మండలానికి చెందిన తొమ్మిదేళ్ల బాలికను అదే మండలంలోని గుంపాం గ్రామానికి చెందిన లెంక శ్రీనివాసరావు(23) కొత్తగా నిర్మిస్తున్న భవనంపైకి తీసుకువెళ్లి అత్యాచారానికి ప్రయత్నం చేసినట్లు, బాలిక తల్లి మహిళా పోలీస్‌స్టేషన్‌లో 2022లో ఫిర్యాదు చేయగా అప్పటి ఎస్సై కేటీఆర్ లక్ష్మి పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదుచేశారు. ఈ కేసు విచారణలో నేరం రుజువు కావడంతో విజయనగరం స్పెషల్ జడ్జి ఫర్ పోక్సో కోర్టు కె.నాగమణి ముద్దాయికి పై విధంగా శిక్ష విధిస్తూ తీర్పు వెల్ల డించినట్లు ఎస్పీ తెలియజేశారు. -
ప్రభుత్వ పాలనపై పీఎం సమీక్ష
● బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు మన్మోహన్ సామల్ భువనేశ్వర్: రాష్ట్ర పర్యటనకు విచ్చేయనున్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రంలో తొలి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ పాలనని సమీక్షిస్తారు. ఆయన రాక పురస్కరించుకుని ప్రతిపాదించిన రోడ్ షో కార్యక్రమం జరగదని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు మన్మోహన్ సామల్ బుధవారం తెలిపారు. రాష్ట్రంలో అత్యధికంగా 3 రోజులపాటు నిరవధికంగా ప్రధానమంత్రి బస చేయడం ఇదే తొలిసారి కావడం విశేషంగా పేర్కొన్నారు. ఈనెల 29 సాయంత్రం 4.15 గంటలకు స్థానిక బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుతారు. కాసేపు రాజ్ భవన్లో విశ్రమించి పార్టీ రాష్ట్ర కార్యాలయానికి చేరుతారు. పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలతో ప్రత్యక్షంగా సమావేశం అవుతా రు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పాలన బాగోగుల ను ప్రధానమంత్రి సమీక్షిస్తారు. ఈ సమావేశం పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుమారు 2 గంటలపాటు పార్టీ కార్యాలయంలో గడుపుతారని తెలిపారు. -
రాష్ట్రపతి పర్యటనకు సర్వం సిద్ధం
భువనేశ్వర్: డిసెంబర్ 4వ తేదీన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్ర పర్యటన పురస్కరించుకుని భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి శ్రీమందిరం సందర్శించనున్నారు. శ్రీ మందిరంలో రత్న వేదిక ముంగిట ఆమె మూల విరాటులకు పూజార్చనలు చేయనున్నారు. ఈ సందర్భంగా అనుబంధ సేవాయత్‌ల ఆధ్వర్యంలో పూజాదులు సంప్రదాయబద్ధంగా నిర్వహించేందుకు ఛొత్తీషా నియోగుల ప్రతినిధి ప్రముఖులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి శ్రీ మందిరం ప్రధాన పాలన అధికారి(సీఏవో) డాక్టర్ అరవింద కుమార్ పాఢి అధ్యక్షత వహించారు. రాష్ట్రపతి శ్రీమందిరం సందర్శన సందర్భంగా పూర్తి సహాయ సహకారాలు అందజేస్తామని ఛొత్తీషా నియోగుల సంఘం ప్రతినిథులు హామీ ఇచ్చినట్లు వివరించారు. -
29నుంచి ఎంఎస్ఎంఈల సర్వే
పార్వతీపురం: పార్వతీపురం మన్యం జిల్లాలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల(ఎంఎస్ఎంఈ) సర్వేను ఈనెల 29 నుంచి ప్రారంభించాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు బుధవారం ఆయన కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఎంపీడీఓలు, సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మున్సిపల్, మండలాల పరిధిలో జరిగే ఎంఎస్ఎంఈల సర్వేకు కమిషనర్లు, ఎంపీడీఓలు, జిల్లా స్థాయిలో జిల్లా పరిశ్రమల కేంద్రం జిల్లా మేనేజర్ నోడల్ అధికారిగా వ్యవహరిస్తారన్నారు. సర్వేకోసం ప్రభుత్వం ఒక యాప్‌ను రూపొందించిందని, యాప్ వినియోగంపై గురువారం శిక్షణ ఇచ్చి శుక్రవారం నుంచి సర్వేను ప్రారంభించేలా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రతి సచివాలయం సిబ్బంది ఒక్కొక్కరు రోజుకు ఆరు సర్వేలు పూర్తిచేయాలని సూచించారు. ఈ సర్వేను 2025 ఫిబ్రవరి 1వ తేదీనాటికి పూర్తిచేయాలని, అయితే సంక్రాంతిలోగా ఈసర్వేను పూర్తిచేసేందుకు అవసరమైన ప్రణాళికలు రచించి జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ ఎంవీ.కరుణాకర్, సహాయ సంచాలకుడు సీతారాం, ఐపీఓ కరీముల్లా, డీపీఓ టి.కొండలరావు, డీఆర్డీఏ పీడీ వై.సత్యంనాయుడు, మున్సిపల్ కమిషనర్ జి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్ -
దళితులపై దాడులు అధికమవుతున్నాయి
టెక్కలి: కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపై అత్యధికంగా దాడులు జరుగుతున్నాయని వాటిని అరికట్టాలని దళిత మహాసభ జిల్లా అధ్యక్షుడు బోకర నారాయణరావు, సమతా సైనిక్ దళ్ జిల్లా కార్యదర్శి చల్లా రామారావు కోరారు. బుధవారం టెక్కలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆర్డీఓ ఎం.కృష్ణమూర్తి నేతృత్వంలో డివిజన్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు కమిటీ సభ్యులు పలు సమస్యలను లేవనెత్తారు. నారాయణరావు మాట్లాడుతూ ప్రతి గ్రామంలో సివిల్ రైట్స్ డే కార్యక్రమాలు నిర్వహించి దళితులపై ఎలాంటి దాడులు లేకుండా శాంతియుత కమిటీలు వేయాలన్నారు. అలాగే దళితుల కోసం కేటాయించిన మానిటరీ రిలీఫ్ ఫండ్ విడుదల విషయంలో కలెక్టర్ కార్యాలయంలో గల సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారని ఫిర్యాదు చేశారు. దళితులపై జరుగుతున్న దాడుల్లో అట్రాసిటీ కేసులపై వేగవంతమైన విచారణ చేయాలని నారాయణరావు కోరారు. అలాగే ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వివిధ ఉద్యోగులపై వేధింపులు లేకుండా చూడాలని విన్నవించారు. సమావేశంలో కమిటీ సభ్యులు బి.ప్రభాకర్‌రావు, గేదెల రమణమూర్తి, డివిజన్ పరిధిలో తహసీల్దార్లు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. -
పవిత్ర స్వరూపుడు సూర్యుడు
శ్రీకాకుళం కల్చరల్ : సూర్యుడు పవిత్ర స్వరూపుడని, ప్రకృతి పరంగా ఆరోగ్యం అందిస్తాడని ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త, రుషిపీఠం వ్యవస్థాపకులు సామవేదం షణ్ముఖశర్మ అన్నారు. జిల్లా కేంద్రంలోని బాపూజీ కళామందిర్లో ఉపనిషన్మందిరం, సుమిత్రా కళాసమితి సంయుక్త నిర్వహణలో ‘శ్రీసూర్య దర్శనం’పై ఐదు రోజుల ప్రవచన యజ్ఞం బుధవారంతో ముగిసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూర్యుడికి ఉషఃకాలంలో ఉపాసన చేస్తే శక్తులు సిద్ధిస్తాయఅన్నారు. అనంతరం షణ్ముఖ శర్మను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. మహిళలు దీపాలతో హారతి పట్టారు. కార్యక్రమంలో మందిరం అధ్యక్షులు గుమ్మా నగేష్, సుమిత్రా కళాసమితి అధ్యక్షులు ఇప్పిలి శంకరశర్మ, నిష్టల నర్సింహమూర్తి, పులఖండం శ్రీనివాసరావు, గుత్తు చిన్నారావు, తెన్నేటి విక్రమశర్మ, మండవిల్లి రవి, కిల్లాన ఫల్గుణరావు, కప్పగంతుల వెంకట రమణారావు, వి.కామేశ్వరరావు, పి.బాబూరావు, సనపల నారాయణమూర్తి, జంధ్యాల శరత్‌బాబు, పూజ, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
కొంగరాంలో జ్వరాల విజృంభణ
ఎచ్చెర్ల క్యాంపస్: మండలంలోని కొంగరాం గ్రామంలో పది రోజులుగా జ్వరాలు విజృంభిస్తున్నాయి. చిన్నారుల నుంచి పెద్దల వరకు బాధితులు మంచంపట్టారు. కొందరు శ్రీకాకుళం ఆస్పత్రులకు వెళ్లి వైద్యం చేయించుకోగా.. మరికొందరు ఇంటి వద్ద ఆర్ఎంపీ వైద్యుల సేవలు పొందుతున్నారు. కాళ్ల నొప్పులు, తలనొప్పి వంటి సమస్యలతో వీరు ఇబ్బంది పడుతున్నారు. గ్రామంలో తాగునీరు కలుషితమైందంటూ గ్రామస్తులు గతంలో కలెక్టరేట్ గ్రీవెన్స్‌లో సైతం ఫిర్యాదు చేశారు. తాజాగా గ్రామంలో జ్వరాలు విజృంభించాయి. ఇప్పటికై నా అధికారులు స్పందించి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
వ్యక్తి ఆత్మహత్య
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాకేంద్రంలోని బలగ పొందరవీధికి చెందిన ఓ వ్యక్తి మనస్థాపంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు రెండో పట్టణ సీఐ ఈశ్వరరావు తెలిపారు. గిడుతూరి గోవిందరావు (52) మద్యానికి బానిస కావడంతో భార్య, కుమారుడు మందలించేవారు. ఈ క్రమంలో ఈ నెల 25న ఫూటుగా మద్యం తాగడంతో భార్య మందలించడంతో మనస్థాపానికి గురై బాత్రూమ్లో ఉన్న ఫినాయిల్ తాగాడు. వెంటనే రిమ్స్‌కు తీసుకెళ్లి వైద్య చికిత్స చేయించారు. చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చెప్పారు. ‘స్వయం ప్లస్’పై సమీక్ష ఎచ్చెర్ల క్యాంపస్: కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఈ ఏడాది ప్రారంభించిన స్వయం ప్లస్‌పై ఉన్నత విద్యా మండలి బుధవారం ఆన్లైన్లో సమీక్ష నిర్వహించింది. పలువురు విద్యారంగ నిపుణులు హాజరై పలు సూచనలు చేశారు. స్వయం ప్లస్ కోర్సుల్లో విద్యార్థులు చేరేలా ప్రోత్సహించాలని సూచించారు. విద్యార్థులు, ఆధ్యాపకులు విషయ పరిజ్ఞానం పెంచుకోవాలన్నారు. పారిశ్రామిక అవసరాలు, అంతర్జాతీయ విద్యా రంగ మార్పులపై అవగాహన కలిగి ఉండాలన్నారు. సమీక్షలో వీసీ కె.ఆర్.రజిని, వర్సిటీ అధికారులు పాల్గొన్నారు. -
నైపుణ్య శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
ఎచ్చెర్ల క్యాంపస్: ఎచ్చెర్ల ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ కేంద్రంలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్కిల్ హబ్‌లో నైపుణ్య కోర్సుల శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ఎల్.సుధాకర్‌రావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్, ప్లంబర్ కోర్సుల్లో 90 రోజుల పాటు శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు. 10వ తరగతి అర్హత కలిగి 18 నుంచి 30 ఏళ్ల వయసు గల యువత శిక్షణకు అర్హులని తెలిపారు. శిక్షణ పూర్తిచేసుకున్న వారికి ధ్రువీకరణ పత్రం మంజూరు చేయడంతో పాటు ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని పేర్కొన్నారు. ఆసక్తిగల వారు డిసెంబర్ 2లోపు విద్యార్హత ధ్రువీకరణ పత్రాలు, ఆధార్ కార్డు, రెండు పాస్‌పోర్టు సైజ్ ఫొటోలతో హాజరుకావాలని కోరారు. పూర్తి వివరాలకు 7989177887 నంబరును సంప్రదించవచ్చని పేర్కొన్నారు. -
పురుగు అశించిన వరికుప్ప కాల్చివేత
● పరిశీలించిన జిల్లా వ్యవసాయ అధికారి తారకరామారావు గంట్యాడ: ఆరుగాలం కష్టించి పండిన పంట పురుగు రూపంలో నేలపాలు కావడంతో తీవ్ర ఆవేదనకు గురైన రైతు పాడైన వరి దిబ్బను కాల్చేశాడు. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే గంట్యాడ మండలంలోని బుడతనాపల్లి గ్రామానికి చెందిన చల్లరాము ఏడు ఎకరాల పొలం కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. రెల్ల రాల్చు పురుగు మూలాన వరి పంట తీవ్రంగా దెబ్బతింది. దీన్ని తట్టుకోలేకపోయిన రైతు రెండు వరి దిబ్బలను కాల్చేశాడు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా వ్యవసాయ అధికారి వి.తారకరామారావు బుధవారం రైతు రాము కాల్చేసిన వరి పంటను పరిశీలించారు. దెబ్బతిన్న మిగతా వరి దిబ్బ(కుప్ప)లను పరిశీలించారు. సమస్య ఉంటే తన దృష్టికిగాని మండల వ్యవసాయ అధికారి దృష్టికి గానీ తీసుకు రావాల్సిందని రైతుకు సూచించారు. జిల్లాలో రెల్చ రాల్చు పురుగు వల్ల అధిక నష్టం వాటిల్లిన రైతుల వివరాలు సేకరించాలని వీఏఏలకు సూచించినట్లు జిల్లా వ్యవసాయాధికారి ఈ సందర్భంగా తెలిపారు. రైతులు రెల్ల రాల్చు పురుగు అశించిన పంటకు క్లోరిఫైరిపాస్ మందు పిచికారీ చేయాలని సూచించారు. పురుగు మందు పిచికారీ చేసిన చోట పంటనష్టం తీవ్రత తగ్గిందని చెప్పారు. కార్యక్రమంలో ఏడీఏ నాగభూషణరావు, ఏఓ శ్యామ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ధాన్యం తరలింపుపై జేసీ సమీక్ష
సీతానగరం: పార్వతీపురం మన్యం జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు మరింత వేగవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ ఎస్ఎస్ శోభిక అన్నారు. ఈ మేరకు సీతానగరం తహసీల్దార్ కార్యాలయంలో ధాన్యం కొనుగోళ్లుపై రైస్ మిల్లర్లు, జిల్లా పౌరసరఫరాలశాఖ, వ్యవసాయ శాఖ, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్లతో బుధవారం సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్బంగా జేసీ ఎస్ఎస్ శోభిక మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు వేగవంతం చేయడానికి వీలుగా బీజీలు తప్పనిసరి కావున మిల్లర్లు త్వరగా బీజీలు ఇవ్వాలని కోరారు. అల్పపీడనం ఉన్న కారణంగా ధాన్యం తడవక ముందే కళ్లాల్లో ఉన్న ధాన్యం మిల్లులకు తరలించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వాహనాల కదలిక, రశీదులు, గన్నీబ్యాగ్‌ల లక్ష్యాల చెల్లింపులకు సంబంధించిన కస్టోడియన్, సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పారు. సమావేశంలో ఎంపీపీ ప్రతినిధి బి.శ్రీరాములునాయుడు, టీడీపీ మండల అధ్యక్షుడు పి.సత్యంనాయుడు, తహసీల్దార్ ఉమామహేశ్వరరావు, రైస్‌మిల్లర్లు, జిల్లా వ్యవసాయాధికారి రాబర్ట్ పాల్, పౌర సరఫరాల సంస్థ మేనేజర్ పి.శ్రీనివాసరావు, ఏఓ అవినాష్, సీఎస్‌డీటీ రమేష్‌బాబు, కస్టోడియన్ అధికారులు పాల్గొన్నారు. గుచ్చిమిలో ధాన్యం కొనుగోలు కేంద్రం తనిఖీ మండలంలోని గుచ్చిమి రైతుసేవా కేంద్రంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ఎస్ శోభిక బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రంలో నిర్వహిస్తున్న రికార్డులను పరిశీలించిన అనంతరం ఆమె మాట్లాడుతూ స్థానికంగా నిర్వహిస్తున్న రికార్డులను తనిఖీ చేయాలని మండలవ్యవసాయాధికారి అవినాష్‌ను ఆదేశించారు. రైతు సేవా కేంద్రం నిర్వాహకులకు పలు సూచనలు ఇచ్చారు. అనంతరం పెదభోగిలి రైతు సేవాకేంద్రాన్ని పరిశీలించారు. -
చెక్‌బౌన్స్ కేసులో జైలు, జరిమానా
పాలకొండ రూరల్: చెక్‌బౌన్స్ కేసులో ముద్దాయికి రూ.లక్షా 20వేల జరిమానాతో పాటు ఏడాది జైలు శిక్షను పాలకొండ న్యాయస్థానం బుధవారం విధించింది. కోర్టు అధికారులు అందించిన వివరాల మేరకు పాలకొండలోని మురళీ మోహన్‌నగర్‌కు చెందిన సవిరిగాన దాలినాయుడికి శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో నివాసముంటున్న పిలక తిరుమల రెడ్డి 2018లో ఇచ్చిన చెక్కు బౌన్స్ కావడంతో అప్పట్లో నమోదైంది. ఈ కేసులో కొనసాగిన వాదోపవాదాల అనంతరం స్థానిక జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి ఎ.విజయ్‌కుమార్ పై విధంగా తీర్పు వెల్లడించారు. -
ఆశావాహ బ్లాక్‌లో పనులు వేగవంతం చేయాలి
పార్వతీపురం: ఆశావాహ బ్లాక్‌గా ఉన్న భామిని మండలంలో మంజూరు చేసిన పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ అన్నారు. ఆశావాహ బ్లాక్‌లో పనుల పురోగతిపై సంబంధిత అధికారులతో కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుంచి బుధవారం వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. చేపడుతున్న పనుల ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలని కోరారు. ప్రస్తుతం జరుగుతున్న పనుల ప్రగతి అనుకున్న విధంగా లక్ష్యాలు సాధించడంలో ఆశాజనకంగా లేదని అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. మందకొడిగా పనులు చేపడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆశావాహ బ్లాక్ కార్యక్రమంలో భాగంగా మలవిసర్జన రహిత గ్రామాలు తయారుకావాలని సూచించారు. సమావేశంలో ఆశావాహ బ్లాక్ ఇన్చార్జ్ మహేష్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల ఆరోగ్యానికి తొలి ప్రాధాన్యం పాఠశాల విద్యార్థుల ఆరోగ్యానికి తొలి ప్రాధాన్యం ఇస్తున్నట్లు కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ అన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వైద్యాధికారులు, ఆస్పత్రుల సూపరింటెండెంట్లతో సమీక్షించారు. వసతి గృహాల్లో ఎలాంటి ఆనారోగ్య సంఘటనలు జరగరాదని స్పష్టం చేశారు. వారంలో రెండు రోజులు ఏఎన్ఎంలు విద్యాసంస్థలను సందర్శించి, తనిఖీలు చేయాలని సూచించారు. నేత్ర వైద్య శిబిరాలను విరివిగా నిర్వహించి నేత్ర పరీక్షలను చేయాలని చెప్పారు. తాగునీరు కలుషితం కాకుండా చూడాలని సూచించారు. సమావేశంలో జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికారి డా.బి.వాగ్దేవి, డీఈఓ ఎన్.తిరుపతినాయుడు, ఏపీఎంఐడీసీ ఈఈ ఎస్.ప్రభాకరరావు, డిప్యూటీ డీఎంహెచ్ఓ టి.జగన్మోహన్రావు తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ కేంద్రాలను అందంగా తీర్చిదిద్దాలిఅంగన్వాడీ కేంద్రాలను అందంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ సీడీపీఓలను ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రంలో మౌలిక సదుపాయాల కల్ప న, బాల్య వివాహాల నిర్మూలన, పోషణ్ వాటిక నిర్వహణ తదితర అంశాలపై క్యాంప్ కార్యాలయం నుంచి బుధవారం వీడియోకాన్ఫరెన్స్ సమావేశంలో ఐసీడీఎస్ పీడీ ఎంఎన్.రాణి, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ ప్రభాకరరావు తదితరులు పాల్గొన్నారు. -
ఎర్ర జెండాలతో.. ఎరుపెక్కిన విజయనగరం
● ఘనంగా ప్రారంభమైన ఏఐఎస్ఎఫ్ మహాసభలు ● వేలాది మంది విద్యార్థులతో కాంప్లెక్స్ నుంచి ర్యాలీ ● గురజాడ కళాక్షేత్రంలో బహిరంగ సభ ● ఏఐఎస్ఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న హాజరువిజయనగరం పూల్‌బాగ్: జిల్లాకేంద్రంలో ఏఐఎస్ఎఫ్ 49వ రాష్ట్ర మహాసభల సందర్భంగా బుధవారం ర్యాలీ, బహిరంగ సభలను జయప్రదంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బహిరంగ సభకు రాష్ట్ర అధ్యక్షుడు జాన్సన్ బాబు అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా ఏఐఎస్ఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి దినేష్ రంగరాజ్, ఎమ్మెల్సీ గోరేటి వెంకన్నలు హాజరై ప్రసంగించారు. వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన జాతీయ విద్యా విధానం వల్ల లక్షలాది మంది విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారని, విద్యార్థుల మెదళ్లలో మతోన్మాదాన్ని నింపి విద్యార్థుల మధ్య మత ఘర్షణలను పెంచి పోషిస్తున్న బీజేపీ ప్రభుత్వానికి విద్యార్థులంతా భవిష్యత్తులో తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. దీనిని అడ్డు కోవాలంటే కేవలం శాసీ్త్రయ విద్యా విధానం వల్లనే జరుగుతుందన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడమే లక్ష్యంగా పరిపాలన కొనసాగిస్తోందని, పేదల ఆకలి తీర్చకుండా అంబానీ, అదానీల కుటుంబ ఆస్తులను పెంచడానికి పనిచేస్తూ దేశ సంపదనంతా వారికి కట్టబెడుతున్నారని మండిపడ్డారు. రోడ్డున పడనున్న లక్షలాదిమంది విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ వల్ల రాష్ట్రంలో ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షల మంది ఉపాధి కోల్పోతారని వారి కుటుంబాలు రోడ్డున పడతాయని ఆందోళన వ్యక్తం చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకోవడంలో విద్యార్థులు ముందుండాలని పిలుపునిచ్చారు. అలాగే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలపై ఏఐఎస్ఎఫ్ 49వ రాష్ట్ర మహాసభల్లో నూతన పోరాట పంథాను ఏర్పాటు చేసుకుని ముందుకు కొనసాగాలని అభిలషించారు. కార్యక్రమంలో మహాసభల ఆహ్వాన సంఘం అధ్యక్షుడు కామేశ్వరరావు, ఏఐఎస్ఎఫ్ జాతీయ మాజీ ఉపాధ్యక్షుడు గుజ్జుల ఈశ్వరయ్య, ఏఐఎస్ఎఫ్ మాజీ రాష్ట్ర నాయకులు నక్కిలేని బాబు, మహంకాళి సుబ్బారావు, పరుచూరి రాజేంద్ర, బుగత అశోక్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. శివారెడ్డి, రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ షేక్ మస్తాన్, ఫణీంద్ర కుమార్, బండి చలపతి, బందెల నాసర్, జి.నాగభూషణ్, కుల్లాయి స్వామి, వల రాజు, సాయికుమార్, షాబీర్ బాషా, రాష్ట్ర ప్రజానాట్యమండలి నాయకులు చంద్రనాయక్, పెంచలయ్య, రామకృష్ణ రామారావు, తదితరులు పాల్గొన్నారు.