Aerospace
-
సీ295 ప్రాజెక్ట్ ఎందుకంత ప్రత్యేకం?
యూరప్ అవతల తొలిసారిగా విదేశంలో తయారవుతున్న సీ295 రకం విమానం ఇప్పుడు భారత రక్షణ విమానయాన రంగంలో కొత్త చర్చకు తెరలేపింది. విదేశీ విమానాల తయారీ యూనిట్ ఆరంభంతో దేశీయంగా విమానయాన రంగం రూపురేఖలు మారే వీలుందని విశ్లేషణలు వెలువడుతున్నాయి. త్రివిధ దళాల సన్నద్ధతనూ ఈ విమానాలు మెరుగు పరుస్తాయని చెబుతున్నారు.మెరుపు స్థాయిలో మోహరింపు కొత్త విమానాల రాకతో భారత సైన్యం సన్నద్ధత స్థాయి పెరగనుంది. యుద్ధ సామగ్రి ఉపకరణాలతోపాటు సైన్యాన్ని సైతం వేగంగా అనుకున్న చోటికి తరలించవచ్చు. దీంతోపాటు సరకులను తీసుకెళ్లవచ్చు. విపత్తుల వేళ వైద్యసాయం కోసం మెడికల్ పరికరాలు, ఔషధాలనూ తరలించవచ్చు. తీరగస్తీ విధుల్లోనూ వీటిని చక్కగా ఉపయోగించుకోవచ్చు. కాలం చెల్లిన సోవియట్ ఆంటోనోవ్ ఏఎన్–32, హిందుస్తాన్ ఏరోనాటిక్స్ ఏవిరో748 విమానాల స్థానంలో వీటిని వినియోగంలోకి తెస్తారు. అధునాతన సాంకేతికతలనూ దీనికి జోడించే వెసులుబాటు ఉందని రక్షణరంగ నిపుణులు కునాల్ బిశ్వాస్ చెప్పారు. పర్వతమయ చైనా, భారత్ సరిహద్దు వెంట అత్యవసరంగా సైనికులను దింపేందుకు వీలుగా చిన్నపాటి స్థలంలోనూ దీనిని ల్యాండ్ చేయొచ్చు. టేకాఫ్‌కు తక్కువ పొడవైన రన్‌వే ఉన్నా సరిపోతుంది. గంటలకు 482 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోగలదు. తొమ్మిది టన్నుల బరువులను మోయగలదు. 71 మంది సాధారణ సైనికులను లేదంటే బరువైన ఆయుధాలున్న సాయుధ పారాట్రూప్ సైనికులు 48 మందిని ఒకేసారి తీసుకెళ్లగలదు. దీంతో వాయుసేన సన్నద్థత మెరుగుపడనుంది. జంట టర్బో ఇంజన్లుండే ఈ విమానం ద్వారా గాల్లోంచే సరకులను కిందకు దింపొచ్చు. ఎల్రక్టానిక్ సిగ్నల్ నిఘా, వేగంగా ఇంధనం నింపుకునే సామర్థ్యం ఇలా పలు ప్రత్యేకతలు దీని సొంతం. భారత రక్షణరంగంలో బహుళార్థ ప్రయోజనకారిగా ఈ విమానం పేరొందనుంది. మేక్ ఇన్ ఇండియాకు ఊతంరక్షణ రంగ ఉపకరణాల విడిభాగాలను దేశీయంగా తయారుచేసి ఈ రంగంలో స్వావలంభన సాధించాలనుకున్న మోదీ ప్రభుత్వానికి ఈ ప్రాజెక్ట్ ఎంతగానో దోహదపడనుంది. దిగుమతులు భారం తగ్గడంతో ‘మేక్ ఇన్ ఇండియా’, ‘ఆత్మనిర్భరత భారత్’ఆశయాలు ఈ ప్రాజెక్ట్‌తో మరింతగా సాకారం కానున్నాయి. అన్ని విడిభాగాలు ఇక్కడే తయారుచేసి అసెంబ్లింగ్ చేసి 2026 సెపె్టంబర్‌కల్లా తొలి విమానాన్ని తయారుచేయనున్నారు. ఒప్పందంలో భాగంగా 56 విమానాలు భారత్‌కు అందాల్సి ఉండగా 16 విమానాలను స్పెయిన్‌లోనే తయారుచేసి పంపిస్తారు. మిగతా 40 విమానాలను వడోదరలోని నూతన కర్మాగారంలో అసెంబ్లింగ్ చేస్తారు. సీ295 విమానానికి సంబంధించిన ముఖ్యమైన విడిభాగాల తయారీ హైదరాబాద్‌లో జరగనుంది. అక్కడి టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ మెయిన్ కాంపోనెంట్స్ అసెంబ్లీ యూనిట్లో వీటిని చిన్న భాగాలను జతచేస్తారు. తర్వాత పెద్ద భాగాలను వడోదరలో అసెంబ్లింగ్ చేసి పూర్తి విమానాన్ని తయారుచేస్తారు. ఏరోస్పేస్ మౌలిక సదుపాయాల వృద్ధి ఏరోస్పేస్ మౌలికవసతుల విభాగంలో శిక్షణ, నిర్వాహణ వ్యవస్థలూ విస్తరించనున్నాయి. ఈ విమానాలను నడిపేందుకు, రిపేర్, మెయింటెనెన్స్ వంటి పనులకు వాయుసేనలో అదనపు సిబ్బంది అవసరమవుతారు. దీంతో అదనపు ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయి. వాడుతున్న విమానాలకు నిర్వహణ, విడిభాగాల తయారీ, సరఫరా గొలుసు వంటి ఇతరత్రా విభాగాలూ విస్తరించనున్నాయి. ఈ మొత్తం వ్యవస్థల కోసం ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో స్టిక్ హోల్డింగ్ విభాగం, ఆగ్రాలోని ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లో శిక్షణాకేంద్రాన్ని కొత్తగా నెలకొల్పనున్నారు. దీంతో ఇన్నాళ్లూ ఎయిర్‌బస్, బోయింగ్, ఏటీఆర్సహా ప్రభుత్వరంగ హిందుస్తాన్ ఏరోనాటిక్స్‌కు తోడుగా టాటా వారి సంస్థలూ ఈ రంగంలో మరింతగా విస్తరించనున్నాయి. ఎగుమతులకూ ప్రోత్సాహం దేశీయ అవసరాలకు తీరాక అదనపు ఉత్పత్తుల ఎగుమతికీ ఈ ప్రాజెక్ట్ బాటలు వేయనుంది. సైనిక, సరకు రవాణా విమానాల తయారీకి ఉద్దేశించిన ఈ ప్రాజెక్ట్ అనుకున్నదానికంటే బాగా విజయవంతమైతే భవిష్యత్తులో పౌరవిమానాల తయారీ చేపట్టే వీలుంది. అప్పుడిక వేల కోట్లు ఖర్చు పెట్టి విదేశీ విమానాలను కొనుగోలుచేసే బదులు దేశీయంగానే పౌరవిమానాలను తయారుచేయొచ్చు. తయారీ ఖర్చు సైతం గణనీయంగా తగ్గనుంది. భారతీయ ఏవియేషన్ రంగంలో ఆత్మనిర్భరతకు హామీ ఇస్తున్న ఈ ప్రాజెక్ట్ మరిన్ని కొత్త ప్రాజెక్టుల రాకపై ఆశలు పెంచుతోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ పెరగనున్న ఉపాధి అవకాశాలుఇన్నాళ్లూ హైదరాబాద్, బెల్గామ్, బెంగళూరులకే అధికంగా పరిమితమైన ఏరోస్పేస్ పరిశ్రమ కొత్త ప్రాజెక్ట్ కారణంగా వడోదరలో విస్తరించనుంది. స్థానికంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి. ఇది ఆర్థికాభివృద్ధికి దోహదపడనుంది. ప్రత్యక్షంగా 3,000 మందికి, పరోక్షంగా 15,000 మందికి ఉపాధి లభించనుంది. ఒక్కో విమానం తయారీకి 10 లక్షల పని గంటల సమయం పట్టనుంది. అంటే ఆమేరకు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు సంబంధించి వేలాది మందికి పని దొరుకుతుంది. -
జాబిల్లిపై కారులో!
టోక్యో: సంప్రదాయకంగా అపోలో మిషన్ మొదలు తాజా ప్రయోగాల దాకా జాబిల్లిపై జరిగిన అన్ని ప్రయోగాల్లో ల్యాండర్, రోవర్‌లనే అధికంగా వాడారు. మానవరహితంగా కదిలే రోవర్ కొద్దిపాటి దూరాలకు వెళ్లగలవు. అక్కడి ఉపరితల మట్టిని తవ్వి చిన్నపాటి ప్రయోగాలు చేయగలవు. అయితే వీటికి చెల్లుచీటి పాడేస్తూ చంద్రుడిపై ఏకంగా కారులో వ్యోమగాములు ప్రయాణించేలా ఒక అధునాతన స్పెషల్ కారును తయారుచేస్తామని జపాన్ ప్రకటించింది. ఆటోమోటివ్ దిగ్గజం టొయోటాతో కలిసి తాము తయారుచేయబోయే భారీ వాహనం వివరాలను జపాన్‌లోని జపాన్ ఏరోస్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీ(జాక్సా) తాజాగా వెల్లడించింది. భూమి లాంటి వాతావరణం అక్కడ లేని కారణంగా చంద్రుడి ఉపరితలంపై గురుత్వాకర్షణ చాలా తక్కువ. దీంతో సాధారణ కారు అక్కడ చకచకా ముందు కదలడం చాలా కష్టం. అందుకే ఒత్తిడితో నడిచే ప్రత్యేక వాహనాన్ని రూపొందిస్తామని టొయోటా సంస్థ తెలిపింది. ఈ కారు కథాకమామిషు ఓసారి చూద్దాం.. అమెరికా నాసా వారి ప్రతిష్టాత్మక ఆరి్టమిస్–8 మిషన్ ప్రాజెక్ట్‌లో భాగంగా కారులా ఉండే అత్యాధునిక రోవర్ వాహనాన్ని సిద్ధంచేయనున్నారు. ఈ వాహనంలో వ్యోమగాములు ఎక్కువ కాలం గడపొచ్చు. సంప్రదాయ రోవర్ మాదిరిగా స్వల్ప దూరాలకుకాకుండా చాలా దూరాలకు ఈ వాహనం వెళ్లగలదు. వ్యోమగాములు చేపట్టబోయే అన్ని ప్రయోగాలకు సంబంధించిన ఉపకరణాలు ఇందులో ఉంటాయి. గతంలో ఎన్నడూ వెళ్లని ప్రాంతాలకు వెళ్తూ కారు లోపల, వెలుపల ప్రయోగాలు చేయొచ్చు. చందమామపై వేర్వేరు ప్రదేశాల వాతావరణ పరిస్థితులను ప్రత్యక్షంగా చూస్తూ వ్యోమగాములు అక్కడి నేల స్వభావాన్ని అంచనావేయొచ్చు. వ్యోమగాముల రక్షణ కోసం లైఫ్ సపోర్టింగ్ సిస్టమ్, వాహనం దిగి ఎక్కువసేపు బయట గడిపితే రేడియేషన్ ప్రభా వానికి లోనుకాకుండా ప్రత్యేక రక్షణ ఏర్పాట్లు, దిగి సులభంగా ఆ ప్రాంతంలో కలియతిరిగేందుకు ‘ఎయిర్‌లాక్’వ్యవస్థ ఇలా పలు ఏర్పాట్లతో వాహనాన్ని తీర్చిదిద్దుతామని జాక్సా తెలిపింది. ఆటోమొబైల్ సాంకేతికతలో జపాన్‌ది అందెవేసిన చేయి. దీంతో జ పాన్ టెక్నాలజీ, అంతరిక్ష అనుభవం చంద్రుడి ఉపరితలంపై కొత్త తరహా ప్రయోగాలకు బాటలు వేస్తాయని నాసా తెలిపింది. -
ఏరోస్పేస్ శిక్షణకు 25 మంది డిప్లొమా విద్యార్థుల ఎంపిక
మురళీనగర్ (విశాఖ ఉత్తర): పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులు చేసిన ప్రతి విద్యార్థికి అత్యున్నత ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకున్నట్లు రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ విభాగం డిప్యూటీ డైరెక్టర్ (డీడీ) డాక్టర్ ఎంఏవీ రామకృష్ణ చెప్పారు. ఏరోస్పేస్ రంగంలో పారిశ్రామిక శిక్షణకు విద్యార్థుల ఎంపిక ప్రక్రియను ఆయన ఆధ్వర్యంలో విశాఖ కంచరపాలెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో శుక్రవారం నిర్వహించారు. ఏరోస్పేస్ రంగంలో విశాఖ అభివృద్ధి చెందుతున్నందున ఇక్కడ నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందించేందుకు ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీని ఎంపిక చేశామన్నారు. గ్లోబల్ ఏరోస్పేస్ కంపెనీ బోయింగ్, లెర్నింగ్ లింక్స్ ఫౌండేషన్ సహకారంతో మెకానికల్ డిప్లొమా విద్యార్థులకు 6 నెలల పారిశ్రామిక శిక్షణకు గాను రెండో బ్యాచ్ ఎంపిక ప్రక్రియ నిర్వహించినట్లు చెప్పారు. ఈ ప్రక్రియలో 134 మంది పాల్గొనగా రాత, మౌఖిక పరీక్ష ద్వారా 25 మందిని ఏరోస్పేస్లో శిక్షణకు ఎంపిక చేసినట్లు చెప్పారు. వీరిలో 12 మంది బాలురు, 13 మంది బాలికలున్నట్లు చెప్పారు. వీరికి అచ్యుతాపురంలోని ఎంఎస్ఎంఈ టెక్నాలజీ కేంద్రంలో శిక్షణనిస్తారని, శిక్షణ కాలంలో బోయింగ్ కంపెనీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) కింద లెర్నింగ్ లింక్స్ ఫౌండేషన్‌కు నిధులు అందిస్తుందని తెలిపారు. లెర్నింగ్ లింక్స్ ఫౌండేషన్ సంస్థ ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్లో శిక్షణ తీసుకునే విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.35,000 కోర్సు ఫీజుతోపాటు నెలకు రూ.3,000 ఉపకార వేతనం చెల్లిస్తుందన్నారు. -
ఏరోస్పేస్, డిఫెన్స్, ఈవీ రంగాల్లోకి రేమండ్
మైనీ ప్రెసిషన్ ప్రొడక్ట్స్ లిమిటెడ్‌లో 59.25% వాటాను రూ.682 కోట్లకు కొనుగోలు చేస్తున్నట్లు రేమండ్ గ్రూప్ ప్రకటించింది. దాంతో రేమండ్ గ్రూప్ ఏరోస్పేస్, డిఫెన్స్, ఈవీ విడిభాగాలు తయారీ రంగంలోని ప్రవేశించనుంది. ఏరోస్పేస్, విద్యుత్ వాహనాలు, రక్షణ విభాగాల్లో మైనీ ప్రెసిషన్ ప్రోడక్ట్స్ కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ఇదీ చదవండి: ‘రహస్య అల్గారిథమ్’తో రూ.100 కోట్లు మోసగించిన అమెజాన్ జేకే ఫైల్స్ అండ్ ఇంజినీరింగ్ అనుబంధ సంస్థ రింగ్ ప్లస్ అక్వా ద్వారా ఈ కొనుగోలు చేపట్టనున్నట్లు సంస్థ తెలిపింది. కొనుగోలు అనంతరం జేకే ఫైల్స్, రింగ్ ప్లస్ అక్వా, మైనీ ప్రెసిషన్లను కలిపి కొత్త అనుబంధ సంస్థ న్యూకోను ఏర్పాటు చేయనుంది. దాంతో న్యూకోలో రేమండ్కు 66.3 శాతం వాటా ఉంటుంది. ఈ ప్రకటన వెలువడిన వెంటనే రేమండ్ లిమిటెడ్ షేర్లు 3% పెరిగాయి . బీఎస్ఈలో రేమండ్ స్టాక్ 2.86% పెరిగి రూ.1866కి చేరుకుంది. -
దేశ ఆయుధ పరిశ్రమలో నవశకం !
వాషింగ్టన్: గగనతలంలో శత్రుదేశంపై పైచేయి సాధించేందుకు మెరుపువేగంతో దూసుకెళ్లి దాడి చేసే యుద్ధవిమానాలు అవసరం. ఆ విమానాలకు అపార శక్తిని సరఫరాచేసే జెట్ ఇంజన్లే గుండెకాయ. అలాంటి అత్యంత అధునాతన ఎఫ్414 జెట్ ఇంజన్లను భారత్‌లోనే తొలిసారిగా తయారుచేసేందుకు మార్గం సుగమమైంది. ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా ఇది సాధ్యమైంది. భారత్‌లోనే ఫైటర్‌జెట్ ఇంజన్లను తయారుచేసేందుకు సంబంధించిన చరిత్రాత్మక అవగాహన ఒప్పందం జనరల్ ఎలక్ట్రిక్(జీఈ) ఏరోస్పేస్, హిందుస్తాన్ ఎరోనాటిక్స్ (హాల్) మధ్య అమెరికాలో కుదిరింది. ‘భారత వాయుసేనకు చెందిన అధునాతన తేలికపాటి యుద్ధవిమానం తేజస్‌లో శక్తివంత ఎఫ్414 ఇంజన్లను బిగిస్తారు. ఈ ఇంజన్లను భారత్‌లోనే తయారుచేస్తామని జీఈ ప్రకటించింది. ఒప్పందాలు ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా భారత్–అమెరికా మధ్య పలు కీలక ఒప్పందాలు కుదిరాయి. అవి.. 1. ఇరుదేశాల నడుమ కుదిరిన మారీటైమ్ ఒప్పందం ప్రకారం.. ఆసియా ప్రాంతంలో సంచరించే అమెరికా నావికాదళం నౌకలు ఒకవేళ మరమ్మతులకు గురైతే భారత్‌లోని షిప్‌యార్డుల్లో ఆగవచ్చు. మరమ్మతులు చేసుకోవచ్చు. 2. సముద్రాలపై నిఘా కోసం ఆర్మ్డ్ ఎంక్యూ–9బీ సీ గార్డియన్ డ్రోన్లను అమెరికా నుంచి భారత్ కొనుగోలు చేయనుంది. దీనిపై ఒప్పందం కుదిరింది. 3. అమెరికాకు చెందిన చిప్ తయారీ కంపెనీ ‘మైక్రాన్’ గుజరాత్లో సెమీ కండక్టర్ల తయారీ, పరీక్షల ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం 800 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనుంది. ఈ ఇంజన్ అసమానం ‘ఎఫ్414 ఇంజన్ పనితీరుతో ఏదీ సాటిరాదు. మా కస్టమర్ దేశాల సైనిక అవసరాలు తీర్చడంలో, అత్యుత్తమ ఇంజన్లను అందించేందుకు సదా సిద్దం. ఇరుదేశాల ధృడ భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలన్న మోదీ, బైడెన్ దార్శనికతలో మేం కూడా భాగస్వాములు కావడం గర్వంగా ఉంది’ అని లారెన్స్ జూనియర్ అన్నారు. తొలి దఫాలో 99 ఇంజన్లను తయారుచేస్తారు. ఇన్నాళ్లూ రష్యా, ఐరోపా దేశాల నుంచే యుద్ధవిమానాలను కొనుగోలు ఒప్పందాలు చేసుకున్న భారత్ ఇప్పుడు అమెరికా దిగ్గజ సంస్థతో తయారీ ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో భారత ఆయుధ పరిశ్రమలో నూతన శకం ఆరంభం కానుంది. ఎఫ్414–ఐఎన్ఎస్6 ఇంజన్ల ఉమ్మడి తయారీ భాగస్వామ్యంతోపాటు అడ్వాన్స్డ్ మీడియా కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్(ఏఎంసీఏ)ఎంకే2 ఇంజన్ ప్రోగ్రామ్ కోసం భారత్‌తో జీఈ కలిసి పనిచేయనుంది. ప్రస్తుతం భారత వాయుసేన తేలికపాటి 88 యుద్ధ విమానాల కోసం హాల్.. జీఈ 404 ఇంజన్లనే దిగుమతి చేసుకుని వాటికి బిగిస్తోంది. ఇకపై శక్తివంత ఎఫ్414 ఇంజన్ల సామర్థ్యంతో గగనతలంలో భారత వాయుసేన సత్తా మరింత ఇనుమడించనుంది. ఇటీవల ఫ్రాన్స్‌కు చెందిన యుద్దవిమానాల తయారీ సంస్థ దసాల్ట్ నుంచి 36 రఫేల్ యుద్దవిమానాలను భారత్ కొనుగోలుచేయడం తెల్సిందే. -
లోకేష్ మెషీన్స్ కొత్త ప్లాంటు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సీఎన్సీ మెషీన్స్, వాహన విడిభాగాల తయారీలో ఉన్న లోకేష్ మెషీన్స్ రక్షణ, అంతరిక్ష రంగ ఉత్పత్తుల విభాగంలోకి ప్రవేశిస్తోంది. ఇందుకోసం హైదరాబాద్ సమీపంలోకి కాలకల్ వద్ద 11 ఎకరాల్లో ప్లాంటును నెలకొల్పుతోంది. తొలి దశలో రూ.100 కోట్ల వ్యయం చేయనుంది. 4–6 నెలల్లో ఉత్పత్తి ప్రారంభం అవుతుందని కంపెనీ డైరెక్టర్ ఎం.శ్రీనివాస్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ‘భారత్‌తోపాటు అంతర్జాతీయ మార్కెట్ కోసం నూతన కేంద్రంలో చిన్న, మధ్యతరహా ఆయుధాలను తయారు చేస్తాం. ప్రత్యక్షంగా 200, పరోక్షంగా 800 మందికి ఉపాధి లభిస్తుంది. రెండవ దశలో మరో రూ.150 కోట్లు వెచ్చిస్తాం. ప్రతిపాదిత ఫెసిలిటీ పక్కన 3 ఎకరాల్లో వెండార్ పార్క్ ఏర్పాటు చేస్తాం. విడిభాగాల తయారీలో ఉన్న 8 యూనిట్లు ఈ పార్క్‌లో వచ్చే అవకాశం ఉంది. లోకేష్ మెషీన్స్ ఆర్డర్ బుక్ రూ.250 కోట్లుంది. 2021–22లో రూ.201 కోట్ల టర్నోవర్ సాధించాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 25–30 శాతం వృద్ధి ఆశిస్తున్నాం’ అని వివరించారు. మేడ్చల్ కేంద్రంలో కంపెనీ కొత్త విభాగాన్ని లోకేష్ మెషీన్స్ ఎండీ ఎం.లోకేశ్వర రావు సమక్షంలో రక్షణ మంత్రి శాస్త్రీయ సలహాదారు జి.సతీష్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. -
ఏరోస్పేస్లో స్టార్టప్‌లకు ఊతం
సాక్షి, హైదరాబాద్: ఏరోస్పేస్ రంగంలో స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్)తో కలిసి టీ–హబ్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఈ మేరకు ఇరు సంస్థల మధ్య శుక్రవారం పరస్పర అవగాహన ఒప్పందం కుదిరింది. రెండేళ్లపాటు అమల్లో ఉండే ఈ ఒప్పందం ద్వారా వైమానిక, రక్షణ రంగాల మార్కెట్లో స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు చర్యలు చేపట్టనున్నారు. స్టాటిస్టా సంస్థ నివేదిక ప్రకారం 2021 నుంచి 2027 మధ్య వైమానిక, రక్షణ రంగాల మార్కెట్ వార్షిక వృద్ధిరేటు (సీఏజీఆర్) 13.1శాతంగా ఉంటుందని అంచనా వేస్తున్న నేపథ్యంలో టీ–హబ్, హెచ్ఏఎల్ భాగస్వామ్యానికి ప్రాధాన్యత ఏర్పడింది. పెరుగుతున్న మార్కెట్ డిమాండ్‌ను అందుకునేదిశగా.. స్టార్టప్‌లకు అవసరమైన నైపుణ్యం, వనరులు, మార్కెట్‌తో అనుసంధానం, ఆవిష్కరణల కోసం అవసరమయ్యే సాయాన్ని టీహబ్, హెచ్ఏఎల్ సంయుక్తంగా సమకూరుస్తాయి. స్టార్టప్‌ల ఆవిష్కరణలకు రూపం ఇచ్చేందుకు ఏరోస్పేస్ రంగ నిపుణుల తోడ్పాటు ఇప్పించేందుకు హెచ్ఏఎల్ చర్యలు చేపడుతుంది. స్టార్టప్‌లకు అవసరమయ్యే మార్గదర్శనం, శిక్షణ, విజయం సాధించేందుకు అవసరమైన అన్ని వనరులను టీ–హబ్ సమకూరుస్తుంది. ఏరో స్పేస్ రంగంలో కొత్త అవకాశాలు: టీ–హబ్ సీఈఓ ఎంఎస్ఆర్ ఏరోస్పేస్ రంగంలో స్టార్టప్‌లకు కొత్త అవకాశాలు సృష్టించేందుకు హెచ్ఏఎల్తో తమ భాగస్వామ్యం ఉపయోగపడుతుందని టీ–హబ్ సీఈఓ ఎం.శ్రీనివాసరావు చెప్పారు. టీ–హబ్ వనరులు, హెచ్ఏఎల్ నైపుణ్యాల కలబోతతో స్టార్టప్‌ల ఆవిష్కరణలు కొత్త పుంతలు తొక్కుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్‌లో బలంగా ఉన్న ఆవిష్కరణల వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకుని స్టార్టప్‌లను సరైన దిశలో నడిపేందుకు టీ–హబ్‌తో తమ భాగస్వామ్యం మంచి ఉదాహరణగా నిలుస్తుందని హెచ్ఏఎల్ (ఇంజనీరింగ్, పరిశోధన అభివృద్ధి) డైరక్టర్ డీకే సునీల్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ఆత్మ నిర్భర్ ప్రణాళికలో భాగంగా పన్నులు పోగా మిగిలే హెచ్ఏఎల్ లాభాల్లో 2 శాతాన్ని సాంకేతిక రంగంలో పనిచేస్తున్న స్టార్టప్‌ల కోసం కేటాయిస్తున్నామని తెలిపారు. వివిధ రంగాలకు చెందిన సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకున్న టీ–హబ్ ఇప్పటికే అనేక విజయాలు సాధించిందని వివరించారు. -
బెంగళూరులో ప్రాట్ అండ్ విట్నీ ఇంజినీరింగ్ సెంటర్
ముంబై: విమాన ఇంజిన్ల తయారీ సంస్థ ప్రాట్ అండ్ విట్నీ తాజాగా బెంగళూరులో తమ ఇండియా ఇంజినీరింగ్ సెంటర్ (ఐఈసీ)ని ప్రారంభించింది. దాదాపు రూ. 295 కోట్లతో దీన్ని ఏర్పాటు చేసింది. ఇందులో 50 మంది పైగా సిబ్బంది ఉండగా, వచ్చే నాలుగేళ్లలో 450 మందిని తీసుకోనున్నట్లు కంపెనీ తెలిపింది. ప్రాట్ అండ్ విట్నీ ఇండియా కేపబిలిటీ సెంటర్, కోలిన్స్ ఏరోస్పేస్ సెంటర్‌తో పాటు అమెరికా, కెనడా తదితర దేశాల్లోని కార్యాలయాలతో ఐఈసీ కలిసి పనిచేయనుంది. దేశీయంగా పటిష్టమైన ఏరోస్పేస్ వ్యవస్థను నిర్మించడంపై భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నట్లు కంపెనీ వైస్ ప్రెసిడెంట్ జెఫ్ హంట్ తెలిపారు. -
అండగా ఉంటాం.. పెట్టుబడులతో రండి
సాక్షి, హైదరాబాద్: దేశంలో రక్షణరంగ కంపెనీలకు అనుకూల పరిస్థితులు కలిగిన రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు చెప్పారు. గత ఏడేళ్లలో ఈ వ్యవస్థ బాగా విస్తరించిందన్నారు. ఆదిభట్ల, నాదర్గుల్, జీఎంఆర్ ఏరోస్పేస్, హార్డ్‌వేర్ పార్క్, ఈ–సిటీ, ఇబ్రహీంపట్నం వంటి ప్రత్యేక ఏరోస్పేస్, డిఫెన్స్ రంగ పారిశ్రామికవాడలు తెలంగాణలో ఉన్నాయని, పెట్టుబడులతో రావాలని విజ్ఞప్తి చేశారు. అన్ని విధాలుగా సహకారం అందించి, అండగా ఉంటామని డిఫెన్స్ కంపెనీల ప్రతినిధులకు హామీ ఇచ్చారు. భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ), సొసైటీ ఆఫ్ ఇండియన్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరర్స్ (ఎస్ఐడీఎం) ఆధ్వర్యంలో సోమవారం ఢిల్లీలో జరిగిన రక్షణరంగ కంపెనీల ప్రతినిధుల సమావేశంలో కేటీఆర్ హైదరాబాద్ నుంచి వర్చువల్‌గా పాల్గొని మాట్లాడారు. డిఫెన్స్, ఏరోస్పేస్ రంగాల్లో స్థానికంగా వెయ్యికిపైగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలున్నాయని తెలిపారు. రాష్ట్రంలోని రక్షణరంగ పరిశోధన, అభివృద్ధి రంగం అత్యంత కీలకమైనదని, హైదరాబాద్ నగరానికి ‘మిస్సైల్ హబ్ ఆఫ్ ఇండియా’గా పేరు ఉందన్నారు. డీఆర్డీఓ, భెల్, హెచ్ఏఎల్ వంటి అనేక రక్షణరంగ సంస్థలు ఇక్కడ ఉన్నాయన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రపంచ దిగ్గజ ఏరోస్పేస్, డిఫెన్స్ సంస్థలు ఇక్కడ భారీ పెట్టుబడులు పెట్టినట్లు గుర్తుచేశారు. అమెరికా, యూకే, ఫ్రాన్స్, ఇజ్రాయెల్ తదితర దేశాలకు చెందిన ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్ (ఓఈఎం) కంపెనీలు ఒకేచోట ఇంత భారీగా పెట్టుబడులు పెట్టిన నగరం మరొకటి లేదని తేల్చిచెప్పారు. లాక్ హీడ్ మార్టిన్, బోయింగ్, జీఈ, సాఫ్రాన్ వంటి అనేక కంపెనీలు తమ కార్యకలాపాలను హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రక్షణ రంగమే ప్రాధాన్యత ఏరోస్పేస్, డిఫెన్స్‌ను ప్రాధాన్యత రంగంగా గుర్తించి భారీ పెట్టుబడులను ఆకర్షించేందుకు సంస్కరణలను తెచ్చామని కేటీఆర్ తెలిపారు. టీఎస్–బీపాస్, ప్రపంచస్థాయి మౌలిక వసతులు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, 24 గంటల విద్యుత్ సరఫరా వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని తమ పెట్టుబడి ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని కోరారు. ‘టాస్క్’ద్వారా ప్రైవేట్ సంస్థలకు అవసరమైన మానవ వనరుల శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. క్రాన్ఫీల్డ్ యూనివర్సిటీ వంటి సంస్థలతో అవగాహన ఒప్పందాలను కుదుర్చుకున్నట్లు చెప్పారు. టీ–హబ్, వీ–హబ్, టీ–వర్క్స్‌లతో నగరంలో పరిశోధనలు, ఆవిష్కరణలకు ఊతమొచ్చిందన్నారు. -
బోయింగ్‌కు ఆజాద్ ఎన్ఏఎస్ విడిభాగాలు
హైదరాబాద్: విమానాల తయారీ దిగ్గజం బోయింగ్‌కు తొలి విడిభాగాల కన్సైన్మెంట్ను అందించినట్లు ఆజాద్ ఇంజినీరింగ్ తెలిపింది. జాతీయ ఏరోస్పేస్ ప్రమాణాలకు (ఎన్ఏఎస్) అనుగుణంగా వీటిని ఉత్పత్తి చేసినట్లు వివరించింది. వివిధ బోయింగ్ విమానాలకు అవసరమైన కీలక ఏరోస్పేస్ భాగాలు వీటిలో ఉన్నట్లు సంస్థ వ్యవస్థాపకుడు రాకేష్ చాప్దర్ తెలిపారు. ప్రతిష్టాత్మక ఆత్మనిర్భర భారత్ నినాదంలో భాగంగా హైదరాబాద్‌లో అదనంగా మరో యూనిట్‌ను ప్రారంభిస్తున్నట్లు వివరించారు. ఏరోస్పేస్, రక్షణ తదితర రంగాలకు అవసరమైన ఉత్పత్తులను ఆజాద్ ఇంజినీరింగ్ తయారు చేస్తోంది. -
మిధానితో బోయింగ్ జట్టు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఏరోస్పేస్ రంగంలో వినియోగించే పరికరాలకు అవసరమైన ముడి వస్తువులను దేశీయంగానే అభివృద్ధి చేసే అంశంపై మిశ్ర ధాతు నిగమ్ (మిధాని)తో కలిసి పనిచేసే అవకాశాలు పరిశీలిస్తున్నట్లు బోయింగ్ ఇండియా వెల్లడించింది. ఏరోస్పేస్, రక్షణ రంగంలో భారత్ స్వయం సమృద్ధి సాధించేందుకు ప్రత్యేకమైన మెటీరియల్స్, మిశ్రమ లోహాల లభ్యత కీలకమని పేర్కొంది. భారత్‌లోని తమ సరఫరా వ్యవస్థలో ప్రభుత్వ రంగ సంస్థలు ముఖ్య పాత్ర పోషిస్తున్నాయని బోయింగ్ ఇండియా ప్రెసిడెంట్ సలిల్ గుప్తే తెలిపారు. అధునాతన టెక్నాలజీ ఉత్పత్తులను దేశీయంగానే తయారు చేసే సామర్థ్యాలను పెంచుకునేందుకు బహుళ జాతి సంస్థలతో కలిసి పనిచేయాలన్న తమ లక్ష్యానికి అనుగుణంగా ఈ భాగస్వామ్యం ఉండగలదని మిధాని సీఎండీ సంజయ్ కుమార్ ఝా తెలిపారు. చదవండి: ఆ కారు క్రేజ్ వేరబ్బా, రెండేళ్లు వెయిటింగ్.. అయినా అదే కావాలంటున్న కస్టమర్లు! -
కృష్ణబిలం ‘వినిపిస్తోంది’.. ఆడియో క్లిప్ విడుదల చేసిన నాసా
కృష్ణబిలం.. ఆయువు తీరిన తార తనలోకి తాను కుంచించుకుపోయే క్రమంలో ఏర్పడే అనంత గురుత్వాకర్షణ శక్తి కేంద్రం. సెకనుకు మూడు లక్షల కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే కాంతితో సహా సర్వాన్నీ శాశ్వతంగా తనలోకి లాక్కుంటుంది. దాని గుండా కాంతి కూడా ప్రసరించలేదు గనక కృష్ణబిలం (బ్లాక్‌హోల్) ఎలా ఉంటుందో మనం చూసే అవకాశం లేదు. అలాంటి కృష్ణబిలం నాసా శాస్త్రవేత్తల కృషి ఫలితంగా తొలిసారి ‘వినిపించింది’. ఇందుకోసం 2003లో సేకరించిన ఒక కృష్ణబిలం తాలూకు డేటాకు శాస్త్రీయ పద్ధతిలో నాసా శబ్ద రూపమిచ్చింది. దాని కేంద్రం నుంచి అన్నివైపులకూ ఊహాతీతమైన వేగంతో నిత్యం వెలువడే అతి తీవ్రమైన ఒత్తిడి తరంగాలను శబ్ద రూపంలోకి మార్చి విడుదల చేసింది. శబ్దం శూన్యంలో ప్రయాణించదన్నది తెలిసిందే. అంతరిక్షం చాలావరకూ శూన్యమయం. కానీ పాలపుంతల సమూహాల్లో అపారమైన వాయువులుంటాయి. వాటిగుండా ప్రయాణించే కృష్ణబిలపు ఒత్తిడి తరంగాలకు నాసా తాలూకు చంద్ర అబ్జర్వేటరీ స్వర రూపమిచ్చింది. ఈ శబ్దం అచ్చం హారర్ సినిమాల్లో నేపథ్య సంగీతం మాదిరిగా ‘హూం’.. అంటూ వినిపిస్తోంది. నాసా విడుదల చేసిన వీడియోలో దీన్ని స్పష్టంగా వినవచ్చు. సైన్స్‌ను మరింత మందికి చేరువ చేసే లక్ష్యంతోనే ఈ శబ్ద సృష్టి చేసినట్టు నాసా తెలిపింది. ఇదీ చదవండి: మిస్టరీ గెలాక్సీ చిక్కింది -
హైదరాబాద్ కేంద్రంగా హెలికాప్టర్ గేర్స్ బాక్స్‌ల తయారీ..వందల కోట్ల పెట్టుబడులు!
Skanda Aerospace: హైదరాబాద్ కేంద్రంగా హెలికాఫ్టర్ పార్ట్‌లను తయారు చేసే మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్ అందుబాటులోకి రానుంది. ఇందుకోసం ప్రముఖ స్కందా ఏరో స్పేస్ సంస్థ వందల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. రఘు వంశీ మెషిన్ టూల్స్, అమెరికాకు చెందిన రేవ్ గేర్ సంస్థలు సంయుక్తంగా రాజధానిలో స్కందా ఏరో స్పేస్ ప్రొడక్షన్ పేరుతో యూనిట్‌ను నెలకొల్పనున్నారు. ఈ ప్రొడక్షన్ యూనిట్లో హెలికాఫ్టర్ గేర్స్, గేర్ బాక్స్‌లను తయారు కానున్నాయి. ఇందుకోసం సుమారు రూ.250కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. అమెరికా టెక్సాస్‌లో ఉన్న రేవ్ గేర్స్ తో పాటు రఘు వంశీ మెషిన్ టూల్స్ సంస్థ సైతం ఏవియేషన్ సంస్థలతో పాటు ఇతర ఆటో మోటీవ్ సంస్థలకు కావాల్సిన ఉత్పత్తుల్ని సరఫరా చేస్తుంది. -
రష్యన్ డ్రోన్ విధ్వంసం: వైరల్ వీడియో
Video Footage Of The Drone Strike: ఉక్రెయిన్ పై రష్యా భూ, వాయు, జల మార్గాలలో నిరవధికంగా పోరు సలుపుతూనే ఉంది. ఈ క్రమంలో రష్యా అత్యాధునిక డ్రోన్ టెక్నాలజీతో కూడా మరోవైపు నుంచి దాడులు చేస్తోంది. ఈ క్రమంలో ఒక రష్యన్ డ్రోన్ ఉక్రెయిన్‌లోని డొనెట్స్క్లోని ఐదార్ బెటాలియన్ కమాండ్, అబ్జర్వేషన్ పోస్ట్‌ను ధ్వంసం చేసిందని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది. అంతేకాదు డ్రోన్ దాడికి సంబంధించిన వీడియో ఫుటేజీని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ఓరియన్ డ్రోన్(ఇనోఖోడెట్స్ అని కూడా పిలుస్తారు) అనేది క్రోన్ష్టాడ్ట్ అభివృద్ధిపరిచిన అత్యాధునిక డ్రోన్. ఈ డ్రోన్ విమానం మాదిరి ఒక మోస్తారు ఎత్తులో ఉండి క్షిపణులతో దాడులు చేస్తోంది. అంతేకాదు ఈ డ్రోన్‌కి సుమారు నాలుగు క్షిపణులను మోసుకెళ్లగల సామర్థ్యం గలదు. పైగా 24 గంటల పాటు గాలిలో ఉండగలదు. ఈ మేరకు ఈ డ్రోన్ విధ్వంసానికి సంబంధించి వీడియో ప్రస్తుతం ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. The destruction of the command and observation post of Aidar battalion by crew of unmanned aerial vehicle Inokhodets of the Russian Aerospace Forces in the territory of the Donetsk People's Republic. The target was hit by guided aerial munition. pic.twitter.com/0EYlHoNqpR — Минобороны России (@mod_russia) March 4, 2022 (చదవండి: జెలెన్ స్కీకి హ్యాండ్ ఇచ్చిన నాటో.. ఉక్రెయిన్ అభ్యర్థన తిరస్కరణ) -
2022లో రాకెట్ ప్రయోగం! దూసుకుపోతున్న హైదరాబాద్ స్టార్టప్
టెక్నాలజీలో బెంగళూరుతో పోటీ పడేందుకు హైదరాబాద్ రెడీ అవుతోంది. స్టార్టప్ కల్చర్ నగరంలో వేళ్లూనుకుంటోంది. నగరం నుంచి ఫస్ట్ స్టార్టప్ యూనికార్న్ వచ్చిన మరుసటి రోజే మరో తీపి కబురు అందింది. నిధుల సమీకరణ ఎయిరోస్పేస్ టెక్నాలజీపై హైదరాబాద్ కేంద్రంగా స్కైరూట్ స్టార్టప్ పని చేస్తోంది. గడిచిన 18 నెలల కాలంలో విక్రమ్ స్పేస్ లాంచ్ సిరీస్‌లో ప్రొపల్షన్ టెక్నాలజీని మరింతగా అభివృద్ధి చేశారు. ఇక పూర్తి స్థాయి ఫలితాలుకు కొద్ది దూరంలో ఈ స్టార్టప్ ఉంది. కాగా ఈ స్టార్టప్ వెంచర్ క్యాపిటలిస్టులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఫండ్ రైజింగ్‌లో భాగంగా సిరీస్ బీలో స్కైరూట్ 4.5 మిలియన్ డాలర్ల పెట్టుబడిని సమీకరించింది. అంతకు ముందు సిరీస్ ఏలో 11 మిలియన్ డాలర్ల వరకు పెట్టుబడిని తేగలిగింది. ఇప్పటి వరకు స్కైరూట్‌లో వెంచర్ క్యాపిటలిస్టులు 17 మిలియన్ డాలర్ల (రూ. 127 కోట్లు) వరకు పెట్టుబడులు పెట్టారు. 2022లో రాకెట్ ప్రయోగం నిధుల సమీకరణ బాగుండటంతో రాకెట్ లాంఛింగ్‌కి అవసరమైన ‘క్రిటిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్’ పనులు శరవేగంగా చేసుకుంటూ పోతోంది స్కూరూట్. 2022లోనే స్కైరూట్ విక్రమ్ రాకెట్‌ను ప్రయోగించాలనే లక్ష్యంతో పని చేస్తోంది. రాకెట్ టెక్నాలజీ ఇన్ఫ్రా విషయంలో ఇస్రో, స్కూరూట్ల మధ్య ఎంఓయూ ఉంది. సీన్ మారుతోంది హురున్ ఇండియా ఇటీవల వెల్లడించిన స్టార్టప్ జాబితాలో హైదరాబాద్ పెద్ద పీట దక్కలేదు. కొత్తగా వస్తున్న స్టార్టప్‌లు, స్టార్టప్లన ఉంచి యూనికార్న్‌గా ఎదుగుతున్న సంస్థలు ఎక్కువగా బెంగళూరు, ముంబై, ఢిల్లీల నుంచే ఎక్కువగా వస్తున్నాయి. కానీ రాబోయే రోజుల్లో హైదరాబాద్ పరిస్థితి మెరుగుపడవచ్చనే నమ్మకాన్ని రోజురోజుకు సానుకూల ఫలితాలు ప్రకటిస్తున్న స్టార్టప్‌లు కల్పిస్తున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా ఎయిరోస్పేస్ టెక్నాలజీ కొత్త రూపు తీసుకోబోతోంది. ఇక్కడ నెలకొల్పిన స్టార్టప్ కంపెనీలపై వెంచర్ క్యాపిటలిస్టులు నమ్మకం చూపించడం ఈ నమ్మకాన్ని బలపరుస్తోంది. చదవండి:యూనికార్న్ కంపెనీగా అవతరించిన హైదరాబాద్ కంపెనీ.. కేటీఆర్ అభినందనలు! -
టాటా బోయింగ్ కేంద్రంలో కొత్త ప్రొడక్షన్ లైన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఏరోస్పేస్ ప్రొడక్ట్స్ తయారీలో ఉన్న టాటా బోయింగ్ ఏరోస్పేస్ విమానం వెనుక భాగంలో ఉండే కీలక విడిభాగమైన వెర్టికల్ ఫిన్ స్ట్రక్చర్స్‌ను ఉత్పత్తి చేయనుంది. ఇందుకోసం కొత్త ప్రొడక్షన్ లైన్‌ను జోడించింది. ఇక్కడ బోయింగ్ 737 రకానికి చెందిన విమానాల ఫిన్ స్ట్రక్చర్స్‌ను రూపొందిస్తారు. ఈ విస్తరణతో అదనపు ఉపాధి అవకాశాలతోపాటు నైపుణ్య అభివృద్ధికి వీలు కలుగుతుంది. బోయింగ్, టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ సంయుక్తంగా టాటా బోయింగ్ ఏరోస్పేస్ను హైదరాబాద్ సమీపంలోని ఆదిభట్ల వద్ద స్థాపించాయి. తాజా విస్తరణ మైలురాయిగా నిలుస్తుందని ఇరు సంస్థలు శుక్రవారం వెల్లడించాయి. రక్షణ ఉత్పత్తుల తయారీలో భారతదేశాన్ని స్వావలంబనగా మార్చడానికి జేవీకి ఉన్న నిబద్ధతకు కొత్త ప్రొడక్షన్ లైన్ మరొక నిదర్శనమని టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ఎండీ, సీఈవో సుకరన్ సింగ్ తెలిపారు. నూతన లైన్‌ను చేర్చడం భారత అంతరిక్ష, రక్షణ రంగ ఉత్పత్తుల తయారీ వృద్ధిలో గుర్తించదగ్గ ముందడుగు అని తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. దేశంలో రక్షణ, ఏరోస్పేస్ పరిశ్రమకు తెలంగాణ ఒక స్థాపిత కేంద్రంగా ఉందని గుర్తుచేశారు. పెద్ద ఎత్తున నిపుణులైన, పరిశ్రమకు అవసరమైన మానవ వనరులు ఇక్కడ కొలువుదీరారని తెలిపారు. కాగా, 14,000 పైచిలుకు చదరపు మీటర్ల విస్తీర్ణంలోని ఈ అత్యాధునిక ఫెసిలిటీలో బోయింగ్ ఏహెచ్–64 అపాచీ హెలికాప్లర్ల ప్రధాన భాగాలను సైతం తయారు చేస్తున్నారు. -
ఏరోస్పేస్, డిఫెన్స్... హబ్‌గా తెలంగాణ
సాక్షి, హైదరాబాద్ : విమానయాన, రక్షణ రంగాల్లో భారతదేశం అతిపెద్ద మార్కెట్లలో ఒకటిగా అవతరిస్తోంది. విమానయాన రంగంలో అతివేగంగా ఎదుగుతున్న దేశాల్లో భారత్ మూడోస్థానంలో ఉంది. మిలటరీ ఆధునీకరణకు వచ్చే ఐదేళ్లలో రూ.9.5 లక్షల కోట్లు ఖర్చు పెట్టాలని కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలో రక్షణరంగంలో స్వయం సమృద్ధి సాధించడం లక్ష్యంగా ప్రైవేటు పెట్టుబడులకు దారులు తెరవడంతో అనేక విదేశీ ఒరిజినల్ ఎక్విప్మెంట్ మాన్యుఫాక్చరర్స్ (ఓఈ ఎం) భారతీయ కంపెనీలతో వ్యూహాత్మక భాగ స్వామ్యం కుదుర్చుకుంటున్నాయి. మరోవైపు విమానయాన, రక్షణ రంగాల్లో పెట్టుబడులు, ఉపాధి అవకాశాలను దృష్టిలో పెట్టుకుని... వీటికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని తెలంగాణ ప్రభు త్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో పెట్టుబడుల ఆకర్షణకు అవసరమైన విధానాలు, మౌలిక వసతులు, శిక్షణ వంటి అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఏరోస్పేస్ యూనివర్సిటీ... ఏరోస్పేస్, డిఫెన్స్ రంగంలో పేరొందిన పలు అంతర్జాతీయ సంస్థలు రాష్ట్రానికి రావడంతో తెలంగాణ ‘ఏరోస్పేస్, డిఫెన్స్ హబ్’గా రూపు దిద్దుకుంటోంది. లాక్‌హీడ్ మార్టిన్, బోయింగ్, సాఫ్రాన్, టాటా, ప్రాట్ విట్నీ, జీఈ, కొలిన్స్ ఏరోస్పేస్, ఐఏఐ, థేల్స్, ఆదాని, రఫేల్ వంటి సంస్థలు రాష్ట్రం లో ఇప్పటికే భారీ పెట్టుబడులు పెట్టాయి. వివిధ ఏరోస్పేస్ పార్కుల్లో స్థలం కేటాయింపు, టీఎస్ఐపాస్ ద్వారా 15 రోజుల్లోనే పారిశ్రామిక అనుమతులు, రూ.200 కోట్లకు పైబడిన పెట్టుబడులతో వచ్చే కంపెనీలకు రాయితీలు తదితరాలపై ప్రత్యేక ఏరోస్పేస్, డిఫెన్స్ పాలసీని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. విమానయాన, రక్షణ పరికరాల ఉత్పత్తులకు అవసరమైన మానవ వనరులను అందించేందుకు ప్రపంచస్థాయి నైపుణ్య శిక్షణ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ప్రఖ్యాత శిక్షణ సంస్థలు ఎంబ్రీ రిడిల్ ఏరోనాటికల్ యూనివర్సిటీ (యూఎస్), క్రేన్ఫీల్డ్ యూనివర్సిటీ (యూకే), ఏరో క్యాంపస్ అక్వెంటైన్ (ఫ్రాన్స్) భాగస్వామ్యంతో అందరికీ అందుబాటులో ఉండే ఫీజుతో ఏరోస్పేస్, డిఫెన్స్ కోర్సుల్లో శిక్షణ ఇస్తారు. వీటితో పాటు తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) ద్వారా కొత్త పరిశ్రమల్లో పనిచేసే సిబ్బందికి శిక్షణ ఇస్తారు. ఇదిలా ఉంటే ప్రపంచస్థాయి ఏరోస్పేస్ యూనివర్సిటీని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. ఆవిష్కరణలు.. స్టార్టప్‌లకు ప్రోత్సాహం ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో ఆవిష్కరణలు, స్టార్టప్‌ల వాతావరణం ప్రోత్సహించేలా పరిశ్రమల శాఖ ప్రణాళికలు సిద్దం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ టెక్నాలజీ ఇంక్యుబేటర్ ‘టీ హబ్’అమెరికాకు చెంది న బోయింగ్, ప్రాట్ విట్నీ, కొలిన్స్ఏరోస్పేస్వంటి వంటి సంస్థలతో స్టార్టప్‌ల కోసం భాగస్వామ్యం కుదుర్చుకుంది. అతిపెద్ద ప్రోటోటైపింగ్ సెంటర్ ‘టీ వర్క్స్’లో దేశీయ ఏరోస్పేస్, డిఫెన్స్ హార్డ్‌వేర్ స్టార్టప్‌లు పురుడు పోసుకునే అవకాశం ఉంది. మరో రెండు ఏరోస్పేస్ పార్కులు మౌలికవసతుల పరంగా చూస్తే రాష్ట్రంలో ప్రస్తుతం నాలుగు ఏరోస్పేస్ పార్కులతో పాటు, రెండు హార్డ్‌వేర్ పార్కులు, 50 జనరల్ ఇంజనీరింగ్ పార్కులు ఉన్నాయి. వీటితో పాటు పలు ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్లు, హార్డ్‌వేర్ పార్కులు, టెక్నాలజీ పార్కులు, ఎస్ఈజెడ్లు కూడా ఏవియేషన్, డిఫెన్స్ రంగాల అవసరాలను తీరుస్తున్నాయి. ఈ రంగంలో వస్తున్న డిమాండ్‌ను తట్టుకునేందుకు మరో రెండు ఏరోస్పేస్, డిఫెన్స్ పార్కులను ఏర్పాటు చేయాలని రాష్ట ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో విమాన, రక్షణ రంగ పరిశ్రమలు ఏరోస్పేస్, డిఫెన్స్ రంగంలో పెద్ద కంపెనీలు 25 ఎంఎస్ఎంఈలు 1,000 పైగా -
ఏరోస్పేస్‌కు కొత్త రెక్కలు
సాక్షి, హైదరాబాద్: ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాన్ని అత్యంత ప్రాధాన్యత రంగంగా గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ రంగంలో మరిన్ని పెట్టుబడులు ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది. రాష్ట్రంలో ఏరోస్పేస్ రంగం అభివృద్ధికి ఉన్న అవకాశాలను వివరించేందుకు ఈ ఏడాది మార్చిలో జరిగే ‘వింగ్స్ ఇండియా–2020’ని వేదికగా చేసుకోవాలని భావిస్తోంది. భారతీయ పౌర విమానయాన పరిశ్రమకు తలమాణికంగా భావించే ఈ కార్యక్రమాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ, ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా భాగస్వామ్యంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. మార్చి 12 నుంచి 15వ తేదీ వరకు హైదరాబాద్‌లో నిర్వహించే ‘వింగ్స్ ఇండియా 2020’లో భాగంగా అంతర్జాతీయ ప్రదర్శన, సదస్సులుంటాయి. ‘ఫ్లైయింగ్ ఫర్ ఆల్’నినాదంతో జరిగే ‘వింగ్స్ ఇండియా’ద్వారా రాష్ట్రంలో ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ప్రపంచానికి పరిచయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల అభివృద్ధికి అవసరమైన వాతావరణం వృద్ధి చెందగా.. ఎయిరోస్పేస్ మాన్యుఫ్యాక్చరింగ్‌లో ప్రపంచస్థాయి కంపెనీలు బోయింగ్, జీఈ, రాఫెల్, లాక్‌హీడ్ మార్టిన్ వంటి సంస్థలు తెలంగాణలో తమ కార్యకలాపాలు ప్రారంభించాయి. వీటితో పాటు సుమారు వేయి చిన్న, మధ్య తరహా ఏరోస్పేస్, రక్షణ రంగ పరిశ్రమలు, నాలుగు ఏరోస్పేస్ పార్కులున్నాయి. వీటితో పాటు ఎలక్ట్రానిక్స్ తయారీ క్లస్టర్లు, హార్డ్‌వేర్ పార్కులు, టెక్నాలజీ సెజ్‌లు రాష్ట్రంలో ఉండటంతో భవిష్యత్‌లో ఏరోస్సేస్, డిఫెన్స్ రంగాల వృద్ధికి మరింత అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఏరోస్పేస్ శిక్షణపైనా దృష్టి ఏరోస్పేస్ రంగం అభివృద్ధికి అవసరమైన మౌలిక సౌకర్యాల కల్పనతోపాటు శిక్షణ రంగంపైనా దృష్టి సారించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎయిరోస్పేస్, డిఫెన్స్ రంగంలో ఇప్పటికే బోయింగ్, ఫ్రాట్ అండ్ విట్నీ, కోలిన్స్ ఏరోస్పేస్ వంటి స్టార్టప్ సంస్థలతో నూతన ఆవిష్కరణల కోసం ‘టీ హబ్’పనిచేస్తోంది. త్వరలో ప్రారంభమయ్యే ‘టీ వర్క్స్’ద్వారా కూడా ఈ రంగంలో కొత్త ఆవిష్కరణలు సాధ్యమవుతాయని అంచనా వేస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఏరోస్పేస్, డిఫెన్స్ రంగ పరిశ్రమలకు అవసరమైన మానవ వనరులకు తెలంగాణ అకాడమీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ స్కిల్స్ (టాస్క్) తరఫున శిక్షణ ఇస్తుండగా, ఇందులో భాగస్వాములు కావాల్సిందిగా ఈ రంగాలకు చెందిన సంస్థలను రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. దేశంలోనే తొలిసారిగా డ్రోన్ పాలసీని రూపొందించిన రాష్ట్రం.. ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలకు ప్రత్యేక పాలసీ తయారు చేయాలనే యోచనలో ఉంది. పారిశ్రామికవాడల్లో హెలిపోర్టులు.. దేశవ్యాప్తంగా వచ్చే నాలుగేళ్లలో వంద ఎయిర్‌పోర్టులను అభివృద్ధి చేస్తామని కేంద్రం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రతిపాదనల్లో పేర్కొంది. మామునూరు (వరంగల్), ఆదిలాబాద్, కొత్తగూడెం, జక్రాన్‌పల్లి (నిజామాబాద్), బసంత్‌నగర్ (పెద్దపల్లి), అడ్డాకుల (మహబూబ్‌నగర్)లో ఎయిర్‌పోర్టుల ఏర్పాటును రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిం ది. ఈ 6 ఎయిర్‌పోర్టుల అభివృద్ధికి ఉన్న సాధ్యాసాధ్యాలపై ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా అధ్యయనం చేస్తోంది. హైదరాబాద్ బయట వరంగల్, నిజామాబాద్, ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఐటీ క్లస్టర్లను ఏర్పాటు చేస్తోంది. ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పాటవుతున్న ఐటీ క్లస్టర్లతో పాటు, ఫార్మాసిటీ వంటి భారీ పారిశ్రామికవాడల్లో హెలిపోర్టుల ఏర్పాటును రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. ఈ హెలీపోర్టుల ద్వారా రాష్ట్రంలో టెంపుల్ టూరిజం కూడా అభివృద్ధి చెందడంతో పాటు, పారిశ్రామిక పెట్టుబడులకు కూడా ఊతం లభిస్తుందనే అంచనా వేస్తోంది. వీటి ఏర్పాటుకు అవసరమైన అనుమతులు, మౌలిక సౌకర్యాల ఏర్పాటుకు నిధులు ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతోంది. -
ఏరోస్పేస్.. యమాజోష్..!
సాక్షి, హైదరాబాద్ : ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ).. బిజినెస్ ప్రాసెస్ ఔట్సోర్సింగ్(బీపీవో).. నాలెడ్జ్ ప్రాసెస్ ఔట్సోర్సింగ్(కేపీవో) రంగాలకు నిలయంగా మారిన హైదరాబాద్ మహానగరం ఇప్పుడు ఏరోస్పేస్, ఎయిర్‌క్రాఫ్ట్ రంగాలకు కూడా హబ్‌గా మారుతోంది. నూతన పరిశ్రమల ఏర్పాటుకు వివిధ విభాగాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగే విధానానికి స్వస్తి పలుకుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏకగవాక్ష విధానంలో ఒకేసారి అన్ని అనుమతులు మంజూరు చేసేందుకు వీలుగా టీఎస్ఐపాస్(తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టం)విధానానికి 2015 జూన్‌లో శ్రీకారం చుట్టిన విషయం విదితమే. టీఎస్ఐపాస్ విధానం రాకతో 2015 జూన్ నుంచి 2017 డిసెంబర్ వరకూ గ్రేటర్ పరిధిలో వివిధ రంగాలకు సంబంధించి 386 మంది నూతన పరిశ్రమల ఏర్పాటుకు దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో 207 కంపెనీలు మరో మూడు నెలల్లో కార్యకలాపాలు ప్రారంభించేందుకు సన్నాహాలు మొదలుపెట్టాయి. ఆయా కంపెనీల ఏర్పాటుతో సుమారు రూ.2,407 కోట్ల పెట్టుబడులు నగరానికి తరలివచ్చినట్లు పరిశ్రమల శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇందులో అత్యధికంగా 60 ఏరోస్పేస్, ఎయిర్‌క్రాఫ్ట్ విడిభాగాల తయారీ పరిశ్రమలే ఉన్నాయి. ఆ తర్వాత తయారీ రంగం, ప్లాస్టిక్, సోలార్, ఐటీ రంగ పరిశ్రమలు ఉన్నాయి. ఇవన్నీ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలే. వీటి ద్వారా సుమారు 22 వేల మందికి నూతనంగా ఉపాధి దక్కే అవకాశాలు ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. మరో మూడు నెలల్లో షురూ ప్రధానంగా గ్రేటర్ శివార్లలోని ఆదిభట్ల, నాదర్గుల్, మంగల్‌పల్లి, అంబర్పేట్, జీడిమెట్ల, పాశమైలారం, ఖాజిపల్లి, బొంతపల్లి, పటాన్చెరు, కాటేదాన్, మల్లాపూర్ తదితర ప్రాంతాల్లో నూతన పరిశ్రమలు ఏర్పాటుకానున్నాయి. ఆయా కంపెనీలకు అనుమతుల ప్రక్రియ పూర్తి కావడంతో మరో మూడు నెలల్లో ఉత్పత్తి ప్రారంభించే అవకాశాలున్నట్లు పరిశ్రమల శాఖ వర్గాలు తెలిపాయి. మొత్తంగా 386 మంది దరఖాస్తులు సమర్పించగా.. సాంకేతిక కారణాలు, భూమి, ఇతర మౌలిక వసతుల లభ్యత, పరపతి సౌకర్యం తదితర సమస్యల కారణంగా 179 కంపెనీల ఏర్పాటు ప్రక్రియ మందగించింది. ప్రస్తుతానికి 207 కంపెనీలు మాత్రమే కార్యరూపం దాల్చనున్నట్లు తెలిసింది. మిగతావి కూడా దశలవారీగా సమస్యలను అధిగమించి కంపెనీలు నెలకొల్పే అవకాశాలున్నట్లు సమాచారం. కాగా మహానగరానికి ఆనుకుని ఉన్న ఆయా పారిశ్రామిక వాడల్లో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు సుమారు 3 వేల వరకు ఉన్నట్లు పరిశ్రమల శాఖ వర్గాలు వెల్లడించాయి. -
ఏరోస్పేస్ రంగంలో ఆవిష్కరణలకు ఊతం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హారిజోన్–ఎక్స్ ఇండియా ఇన్నోవేషన్ చాలెంజ్ పేరుతో దేశంలో ఏరోస్పేస్ రంగంలో వినూత్న ఆవిష్కరణలకు ఊతమిచ్చే కార్యక్రమానికి బోయింగ్ శ్రీకారం చుట్టింది. ఇందుకోసం టీ–హబ్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. అటానమస్, అన్మ్యాన్డ్ సిస్టమ్స్, అడ్వాన్స్డ్ మాన్యుఫాక్చరింగ్, ఇండస్ట్రియల్ ఐవోటీ, ఆటోమేషన్, అనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ విభాగాల్లో క్లిష్ట సవాళ్లకు పరిష్కారాలను కనుగొనేందుకు స్టార్టప్స్‌ను ప్రోత్సహిస్తారు. 22 వారాలపాటు సాగే ఈ హంట్‌లో ఎంపికైన స్టార్టప్స్ తమ ఆలోచనకు తుదిరూపు ఇచ్చేందుకు టీ–హబ్‌లో మూడు నెలలపాటు యాక్సిలరేటర్ ప్రోగ్రామ్‌లో అవకాశం కల్పిస్తారు. స్టార్టప్ ఇండియా, బోయింగ్ బృందం, పరిశ్రమ నిపుణులు మెంటార్లుగా వ్యవహరిస్తారు. పోటీలో విజేతలకు భవిష్యత్తులో బోయింగ్‌తో భాగస్వామ్యానికి అవకాశం ఉంటుంది. ఏరోస్పేస్ రంగంలో పనిచేస్తున్న ఔత్సాహిక వ్యాపారవేత్తలు, ఆవిష్కర్తలకు పెట్టుబడులతో మద్దతు ఇవ్వనున్నట్టు బోయింగ్ ఇండి యా ప్రెసిడెంట్ ప్రత్యూష్ కుమార్ మంగళవారమిక్కడ ఈ సందర్భంగా తెలిపారు. ఆవిష్కరణలకు ముఖ ద్వారంగా టీ–హబ్ నిలిచిందని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. కాగా, బోయింగ్ హైదరాబాద్ కార్యలయం త్వరలో ప్రారంభం కానుంది. విస్తరణలో భాగంగా దేశంలో ఉద్యోగుల సంఖ్యను ప్రస్తుతమున్న 1,200ల నుంచి 3,000లకు చేర్చనుంది. -
వస్తోంది.. సూపర్‌సానిక్ జెట్ ఫ్లయిట్
వేగానికి కొత్త అర్థం చెప్పేలా మొదటితతరం సూపర్‌సానిక్ జెట్ విమానాలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. సన్ ఆఫ్ కాంకర్డ్గా పిలిచే కొత్తతరం సూపర్ సానిక్ జెట్ విమానాన్ని శనివారం ఇంగ్లండ్‌లో టెస్ట్ ఫ్లయింగ్ నిర్వహించారు. ఇంతవరకూ ఈ విమానానికి పేరు పెట్టకపోయినా.. ప్రొటోటైప్ ఎస్-512 క్విట్ సూపర్‌సానిక్ విమానంగా సైంటిస్టులు పిలుస్తున్నారు. శనివారం టెస్ట్ ఫ్లై పూర్తి చేసుకున్న ఈ విమానం.. వేగానికి మారుపేరుగా చెప్పుకోవచ్చు. అట్లాంటిక్ మహాసముద్రాన్ని అవలీలగా మూడుగంటల్లా దాటేస్తుంది. ఇది ధ్వని వేగం కన్నా.. 1.6 రెట్లు అధికంగా ప్రయాణిస్తుంది. దీనిని అమెరికా విమానయాన సంస్థ అయిన స్పైక్ ఏరోస్పేస్ రూపొందించింది. సన్ ఆఫ్ కాంకర్డ్గా పిలుచుకునే ఈ విమానాన్ని 2021 నాటికి వినియోగదారులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకువస్తామని స్పైక్ ఏరోస్పేస్ చెబుతోంది. 22 మంది ప్రయాణికులు ప్రయాణించగలిగే ఈ విమానంలో అత్యంత లగ్జరీగా ఉంటుంది. -
అంతరిక్షంలో చిత్రమైన పేలుడు!
కనుగొన్న నాసా వాషింగ్టన్: అమెరికాకు చెందిన నాసా పంపిన చంద్ర అబ్జర్వేటరీ కొన్ని చిత్రమైన ఎక్స్‌రే కిరణాలను కనుగొంది. ఇవి పేలుడు ద్వారా సంభవించి ఉంటాయని ప్రాథమికంగా నిర్ధా రణకు వచ్చారు. కానీ ఈ కిరణాలు ఇంతవరకు శాస్త్రవేత్తలు చూడనివని నాసా శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇవి అంతరిక్షంలో ‘చంద్ర డీప్ ఫీల్డ్ సౌత్’ ప్రాంతం నుంచి వచ్చాయని తెలిపారు. ఈ పేలుడు భూమికి 10.7 బిలియన్ కాంతి సంవత్సరాల దూరంలోని ఓ చిన్న గెలాక్సీలో ఏర్పడి ఉండవచ్చని పేర్కొన్నారు. ఈ ఎక్స్‌రే కిరణాలు కొన్ని నిమిషాల పాటు మన పాలపుంతలోని నక్షత్రాలన్నిటికంటే ఎక్కువ శక్తిని విడుదల చేశాయి. ఈ పేలుడు జరిగిన ప్రదేశాన్ని కనుక్కున్నా కచ్చితంగా ఎక్కడ జరిగిందో ఇప్పటికీ తెలుసుకోలేకపోయామని శాస్త్రవేత్తలు అన్నారు. ఇది తమకు ఓ పజిల్లా మారిందని పేర్కొన్నారు. -
వాడిన రాకెట్‌ను మళ్లీ వాడారు
కేప్ కానావెరల్: అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ స్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ టెక్నాలజీస్ కార్పొరేషన్ (స్పేస్ ఎక్స్) మొట్టమొదటి సారిగా పునర్వినియోగ రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించింది. ఈ మేరకు ఫాల్కన్ 9 అనే రాకెట్ ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి గురువారం సమాచార ప్రసార ఉపగ్రహాన్ని విజయవంతంగా అంతరిక్షంలోకి పంపించింది. మొదటిసారి ఈ రాకెట్‌ను ఏడాది క్రితం అంతరిక్షంలోకి వెళ్లి తిరిగి సముద్రం సురక్షితంగా ల్యాండ్ చేశారు. మళ్లీ అదే రాకెట్‌కు తొమ్మిది ఇంజన్లను ఏర్పాటు చేయడంతోపాటు స్పేస్ ఎక్స్ దీన్ని ఆధునికీకరించింది. లక్సెంబర్గ్‌లోని ఎస్ఈఎస్ కంపెనీకి చెందిన ఉపగ్రహాన్ని ఈ రాకెట్లో అంతరిక్షంలోకి స్పేస్ ఎక్స్ పంపించింది. తిరిగి ఈ రాకెట్‌ను విజయవంతంగా సముద్రంపై ల్యాండ్ చేయాలన్న లక్ష్యంతో శాస్త్రవేత్తలు ఉన్నారు. కాగా, గతంలో ఎన్నడూ లేని విధంగా విజయవంతంగా జరిపిన ఈ ప్రయోగం గొప్ప ముందడుగు అని స్పేస్ ఎక్స్ ముఖ్య సాంకేతిక అధికారి మార్టిన్ హాల్లివెల్ అన్నారు. -
మొదటి అడుగు
కథ ‘‘ఈ ప్రపంచంలోని మనుషుల్లో నూటికి తొంభై మంది స్వార్థ్ధపరులే. అసలు మనుషులే కనిపించని ప్రపంచానికి వెళ్లిపోదామనిపిస్తోంది’’ అవంతిక తరచుగా అనే మాటలివి. ‘‘మనుషులు కనపడని ప్రపంచం అంటూ ఉంటుందా?’’ అని నవ్వేవాడిని నేను ఆమె మాటలకి. కానీ ఇప్పుడు చూస్తున్నాను. రోజుల తరబడి వెదికినా ఒక్క మనిషి కూడా కనబడని ప్రపంచాన్ని కళ్ల ఎదుట చూస్తున్నాను. మేము ప్రయాణం చేస్తున్న అంతరిక్ష నౌక భూమిని దాటి దాదాపు రెండు వందల ఎనభై మిలియన్ కిలోమీటర్లకి పైగా అంతరిక్షంలో ప్రయాణం చేసి వచ్చి అప్పుడే అంగారక గ్రహాన్ని చేరుకుంది. ఏ దేశమూ ఊహించని విధంగా మొట్టమొదటిసారిగా అంగారక గ్రహమ్మీదకి భారతదేశం తన వ్యోమగాములని పంపించింది. అంతరిక్ష పరిశోధనలో ఎంతో ముందుండే అమెరికా సైతం అప్పటిదాకా అంగారక గ్రహమ్మీదకి పరిశోధనా శాటిలైట్లని మాత్రమే పంపగలిగింది కానీ వ్యోమగాములని పంపి అంగారక గ్రహమ్మీద మనిషి చేత మొదటి అడుగు వేయించలేకపోయింది. అలాంటిది భారతదేశం మొట్టమొదటిసారిగా అంగారక గ్రహమ్మీదకి మనుషులని పంపడంతో ప్రస్తుతం ప్రపంచం దృష్టంతా ఇటే ఉంది. మానవజాతి మనుగడనే మలుపు తిప్పగల పరిశోధన ఇది అని అందరికీ తెలుసు. మా నలుగురిలోకీ ఎక్కువ ఉద్వేగంగా కనిపిస్తున్నది ప్రణీత్. ఎందుకంటే, మరికొద్దిక్షణాల్లో మా అంతరిక్ష నౌక అంగారక గ్రహమ్మీదకి అడుగుపెట్టగానే, ఆ గ్రహమ్మీద మొట్టమొదటిసారిగా కాలు మోపబోయేది అతడే! మానవజాతి చరిత్రలోనే తన పేరు సుస్థిరంగా నిలిచిపోయే సంఘటన కొద్ది క్షణాల్లో జరగబోతోందని తెలిసిన ఏ మనిషికైనా అలాంటి ఉద్వేగం కలుగడం సహజమే. మిగిలిన ఇద్దరినీ వదిలేసి నేను ప్రత్యేకంగా ప్రణీత్ హావభావాలని గమనించడానికి కారణం ఉంది. అదేమిటంటే, కొన్ని పరిస్థితుల వల్ల, ఈ ప్రయోగంలో అతడు కెప్టెన్ స్థానంలో ఉన్నాడు కానీ, నిజానికి ఆ స్థానంలో ఉండాల్సిన వ్యక్తిని నేను! వయసులోనూ, హోదాలోనూ నాకంటే చిన్నవాడైన అతడు చేసిన కొన్ని ప్రయత్నాల వల్ల అతడు ఆ అవకాశాన్ని దక్కించుకోగలిగాడు కానీ, నిజానికి ఆ స్థానానికి అన్ని విధాలుగా అర్హుడినైన వ్యక్తిని నేను. పై అధికారుల ముందు ధైర్యం చేసి నా బాధని వెళ్లగక్కినా, ఎన్నో విషయాలని పరిగణనలోకి తీసుకుని పకడ్బందీగా రూపొందించిన ఎంపిక ప్రక్రియ ఇది. అయినా ఇందులో నువ్వు బాధపడే విషయం ఏముంది? ఎంపికైన నలుగురు వ్యోమగాముల్లో నువ్వు కూడా ఉన్నావు కదా? మీ నౌక అంగారక గ్రహం మీద దాదాపు ఆరు గంటలు ఉంటుంది. అక్కడ వాతావరణం అనుకూలంగా ఉంటే, మీరు కూడా ఆ గ్రహమ్మీద కాలు పెడతారు. ఒకరు ముందూ ఒకరు వెనుకా అంతే అన్న సమాధానమే వచ్చింది. ఒకరు ముందూ, ఒకరు వెనుకా అని ఎంత తేలికగా అనగలిగారు?! రోవర్‌ను ఈ గ్రహమ్మీదకి పంపి ఇక్కడి వాతావరణాన్ని పరిశీలించడం దగ్గర నుంచీ ఈరోజు వరకూ అంగారక గ్రహమ్మీద పరిశోధనలో కీలక పాత్ర వహిస్తూ మొదటినుంచీ ఈ ప్రయోగం మీద ఎంతో శ్రద్ధతో, ప్రేమతో పని చేసిన నాకు దక్కాల్సిన అపురూపమైన అవకాశాన్ని మరొకరు దక్కించుకుంటే, ఆ బాధ ఎలాంటిదో అనుభవించే నాకు తెలుస్తుంది కానీ వాళ్లకేం అర్థమౌతుంది? నీల్ ఆర్మ్ స్ట్రాంగ్తోపాటు ఎడ్విన్ ఆల్డ్రిన్, మైకేల్ కొలిన్స్ కూడా అపోలో-11 నౌకలో ప్రయాణించారు. కానీ చంద్రుడిపై అడుగిడిన తొలివ్యక్తిగా నీల్ ఆర్మ్ స్ట్రాంగే ప్రపంచానికి గుర్తుంటాడు కానీ మిగిలినవాళ్ల పేర్లు ఎవరికి తెలుసు? కొలంబియా అంతరిక్ష నౌకలో కల్పనా చావ్లాతో పాటు మరో ఆరుగురు వ్యోమగాములు కూడా ప్రాణాలు కోల్పోయారు. వాళ్ల పేర్లు ఎంతమందికి తెలుసు? నేను ఆలోచనల్లో ఉండగానే మా అంతరిక్ష నౌక అంగారక గ్రహమ్మీద ల్యాండ్ అవడం, బయటి వాతావరణం వ్యోమగామి దిగడానికి అనువుగా ఉందన్న సంకేతాన్ని నౌకలో ఉన్న సూపర్ కంప్యూటర్లు నిర్ధారణ చేయడం జరిగిపోయాయి.తను వేసుకున్న స్పేస్ సూట్‌ని మరోసారి సవరించుకుని, ఆక్సిజన్ సిలిండర్‌ని సరి చూసుకుని, మావైపు విజయ సూచకంగా బొటన వేలు ఎత్తి చూపించాడు ప్రణీత్. నేను అప్రయత్నంగా అతడి కళ్లలోకి చూసాను. సరిగ్గా అదే సమయానికి ప్రణీత్ కూడా నావైపు చూసాడు. బయటి వాతావరణం ముఖానికి తాకకుండా రక్షణ కవచంలా వున్న స్పేస్ సూట్లోని హెల్మెట్ వంటి అమరిక తాలూకు దళసరి అద్దాల వెనుకనుంచి నుంచి కూడా అతడి కళ్లల్లోని భావం స్పష్టంగా కనిపించింది నాకు. ఆ కళ్లలో స్నేహ భావం కానీ, కృతజ్ఞత కానీ లేదు. విజయం సాధించే ముందు యుద్ధంలో ప్రత్యర్ధి వైపు చూసే చూపులా కసిగా, గర్వంగా ఉంది. ఒక్క క్షణం నా మనస్సు కలుక్కుమంది. ఎవరికి తెలియకపోయినా, ఈ ప్రయోగంలో కెప్టెన్ స్థానాన్ని దక్కించుకోవడానికి మా ఇద్దరి మధ్య ఉన్న పోటీ మాకు తెలుసు! ఆ క్షణంలో అతడి చూపులని తట్టుకోలేక గిలగిలలాడిపోయాను. మన మౌనాన్ని అవతలివారు చేతకానితనం అనుకుంటే అంతకన్నా పరాజయం మరొకటుండదు. భరింపశక్యం కానటువంటి ఒకానొక భావోద్వేగంలో అనాలోచితంగానే చేసేశాను ఆ పనిని. అంతరిక్ష నౌకలో నాకున్న అనుభవాన్నంతా ఉపయోగించి మెరుపు వేగంతో మేము ఉన్న ప్రదేశానికి వెనుక వైపుకు కదిలాను. మొదటి నుంచీ ఈ ప్రయోగంలో మమేకమైపోయి పనిచేయడం వల్ల ఆ నౌకలో ఉన్న అంగుళం అంగుళం, అందులోని సాంకేతిక విషయాలతో సహా నాకు పరిచయమే. ఎక్కడ ఏ మీట నొక్కితే ఏం జరుగుతుందో, దాన్ని ఎలా సరిచేయవచ్చో అన్న విషయాల మీద నాకున్న అవగాహన మా నలుగురిలో మరెవ్వరికీ లేదు. క్షణాల్లోనే నౌకా స్వరూపమంతా కంప్యూటర్ గ్రాఫిక్స్‌తో సహా నా మెదడులో కదలాడింది. క్షణంలో వెయ్యో వంతు కాలంలో నేను చెయ్యదలుచుకున్న పనికి మెదడులో ఒక క్రమరూపం ఏర్పడిపోయింది. నా చేతులు వేగంగా కదిలి అక్కడి మీటలని నొక్కాయి. నేను చేసిన ఆ పని వల్ల ఎవ్వరూ ఊహించని విధంగా నాకోసం అంతరిక్ష నౌక వెనుక భాగంలో సన్నని ద్వారం తెరుచుకుంది ! ముందు భాగంలో అంగారక గ్రహమ్మీద అడుగుపెట్టడానికి ప్రణీత్ ఇంకా కౌంట్ డౌన్ చేస్తుండగానే వెనుకవైపు తెరుచుకున్న ద్వారం గుండా నేను బయటకి దూకేసాను. నేను దూకిన మరుక్షణంలోనే తెరుచుకున్న ఆ సన్నని ద్వారం మరలా యధావిధిగా మూసుకుపోయింది. మేము తిరిగి వెళ్లాక ఈ విషయం ఒక చర్చనీయాంశం అవుతుందని నాకు తెలుసు. వెనుక వైపు ద్వారం సాంకేతిక లోపం వల్ల తెరుచుకుందనీ, దానిని మూసే ప్రయత్నంలో నేను అనుకోకుండా బయటికి అడుగు పెట్టాల్సి వచ్చిందని చెప్పచ్చు. నేను చేసిన ఆ పని వల్ల ఆ క్షణంలో నా శరీరంతో పాటు మనసు కూడా గాల్లో తేలిపోతున్నట్టుగా అనిపించింది. అంగారక గ్రహమ్మీద కాలుపెట్టబోతున్న మొట్టమొదటి మానవుడ్ని నే...నే!! సరైన జాగ్రత్తలు తీసుకోకుండా ముందుకు దూకడం వల్ల ఒక్కసారిగా నా కాలు నేల (ఈ ప్రయోగం సరైనది కాదేమో, అంగారగ గ్రహ ఉపరితలం అనాలనుకుంటా) మీద ఆనలేదు. కాలు ఒక్కసారి గ్రహ ఉపరితలాన్ని తాకడం వల్ల, నేను రెండు మూడు పల్టీలు కొట్టినట్టుగా గాల్లోకి ఎగిరాను. భూమికీ అంగారక గ్రహానికీ ఉన్న అతి ముఖ్యమైన తేడాల్లో గ్రావిటీ ఒకటి. భూమి మీద ఉండే గ్రావిటీలో సగానికన్నా తక్కువ అంగారక గ్రహమ్మీద ఉంటుంది. భూమి మీద వంద కేజీల బరువుండే మనిషి అంగారక గ్రహమ్మీద కేవలం ముప్ఫై ఎనిమిది కేజీలు మాత్రమే ఉంటాడు. భూమి మీద అడుగు వేసేంత ఒత్తిడితో అంగారకుడి మీద అడుగు వెయ్యాల్సిన అవసరం ఉండదు. బహుశా నేను పల్టీలు కొట్టడానికి అదే కారణం అయి ఉంటుందనుకుంటూ, నా శరీరం అంగారకుడి మీద దొర్లుతుంటే, ఆ స్పర్శని ఆస్వాదిస్తున్నట్టుగా ఉండిపోయాను కొద్దిసేపు. భూమికీ అంగారక గ్రహానికీ ఉష్ణోగ్రతలోనూ, వాతావరణ ఒత్తిడిలోనూ కూడా చాలా వ్యత్యాసం ఉంటుంది. నేను వేసుకున్న స్పేస్ సూట్, దానిలో అమర్చి ఉన్న ఆక్సిజన్ మాస్కు నాకు ఆ తేడాని పెద్దగా తెలియనివ్వడం లేదు. నా శరీరం ఆగకుండా మరిన్ని పల్టీలు కొడుతుంటే, నేను ఆ గ్రహమ్మీద నిలదొక్కుకోలేకపోవడానికి కారణం గ్రావిటీలో ఉన్న తేడా కాదేమోనని, బహుశా నేను దిగిన వెనక వైపు భాగంలో ఏదో చిన్నపాటి లోయ వంటిది ఉందేమో, నేను ఆ లోయలో పడిపోతున్నానేమోనన్న అనుమానం వచ్చింది. ఆ అనుమానం రాగానే నా గుండె దడదడలాడింది. భయంగా చుట్టూ ఉన్న పరిసరాలని గమనించాను. మొదలేదో చివరేదో తెలియనట్టుగా ఎటు చూసినా నారింజ రంగుతో మెరిసిపోతున్న పరిసరాలు... అప్పటి వరకూ కొన్ని వందలసార్లు సాటిలైటు తీసిన ఛాయాచిత్రాలలో చూసిన వాటిని ఇప్పుడు ప్రత్యక్షంగా కళ్ళతో చూస్తున్నాను. మనసులో ఆ అనుమానమే లేకపోతే దానినంతా ఎంతో బాగా ఆస్వాదించేవాడిని. పల్టీలు కొట్టిన తరువాత చాలాసేపటికి నేను తిన్నగా నిలబడగలిగాను. శరీరం నా స్వాధీనంలోకి వచ్చిన వెంటనే నేను చేసిన మొట్టమొదటి పని మా అంతరిక్ష నౌక ఎక్కడ ఉందా అని వెతకడం! కనుచూపు మేరలో ఎక్కడా మా నౌక వున్న జాడలు కనిపించలేదు. నేను ఊహించినది నిజమే. నేను ఏదో లోయలోకి జారి చాలా దూరం వచ్చేసాను. నా గుండెలు దడదడలాడాయి. హెల్ప్... అని గట్టిగా అరవాలనిపించింది. నేను అరిచినా అక్కడ ఎవరికీ వినిపించదని తెలుసు. అసలు నేను వేసుకున్న స్పేస్ సూట్లోంచి ఆ శబ్దం బయటికే రాదు. పరిశోధన చేస్తున్న సమయంలో అంగారక గ్రహమ్మీద కాలు పెట్టగానే ఏవేవో చెయ్యాలనుకున్నాను. అక్కడి శిలాజాలని సేకరించాలనీ, వాతావరణాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలనీ, అంగారకుడి మీద గడిపిన కొద్ది సమయంలో ఒక థీసిస్‌కి సరిపడినంత పరిజ్ఞానాన్ని బుర్రలో నింపుకోవాలనీ, ప్రపంచానికి అంగారకుడ్ని కొత్తగా పరిచయం చెయ్యాలనీ ఎన్నెన్నో అనుకున్నాను. కానీ ప్రస్తుతం నా మనసులో భయం తప్ప మరో ఆలోచన రావడం లేదు. వచ్చిన దిక్కుకే వేగంగా వెనక్కి పరిగెత్తాలనుకున్నాను. ఉద్రిక్తతతో గట్టిగట్టిగా అడుగులు వేస్తే గ్రావిటీ తేడా వల్ల మళ్లీ శరీరం గాలిలోకి ఎగరవచ్చేమోనన్న అనుమానం వచ్చి నెమ్మదిగానే అడుగులు వేస్తూ వెనుదిరిగాను. వెనుదిరిగాక అప్పుడు మెదిలింది అసలైన ప్రశ్న నా మెదడులో... ఇప్పుడు నేను ఎటు వైపుకు వెళ్లాలి?! గాల్లో పల్టీలు కొడుతూ రావడం వల్ల అసలు నేను ఎటు వైపు నుంచి వచ్చానో అన్న విషయం కూడా అర్థం కావడం లేదు. ఇప్పుడు నేను ఏ వైపుకు వెళ్లి మా అంతరిక్ష నౌకని వెదకాలి?! నా స్థానంలో ప్రణీత్‌ని మా పరిశోధనకి కెప్టెన్‌గా నియమిస్తున్నామన్న ప్రకటన విన్నప్పుడు కూడా రాని ఏడుపు అప్పుడు నాకు తన్నుకుని వచ్చింది. నన్ను నేను సంభాళించుకున్నాను. గాలిలో పల్టీలు కొట్టినా గ్రావిటీ తక్కువగా ఉన్న ఆ గ్రహమ్మీద నేను మా నౌకకి ఎక్కువ దూరం వచ్చి ఉండనని నాకు నేను ధైర్యం చెప్పుకున్నాను. కళ్లు మూసుకుని ముందుగా ఏదో ఒక వైపు ప్రయాణం సాగించాలి. ఆ వైపు కొద్ది దూరం వెళ్లాక నౌక కనిపించకపోతే మళ్లీ వెనక్కి వచ్చి మరో దిక్కుకి ప్రయాణం సాగించాలి. అటు కూడా అలాగే చెయ్యాలి. ఏదో ఒక వైపుకే గుడ్డిగా నడుచుకుంటూ వెళ్లడం కన్నా, ఇలా అన్ని వైపులకీ కొద్ది కొద్ది దూరం వెళ్లి ప్రయత్నించడం వల్ల మా వాళ్లని వెదికి పట్టుకోవడానికి ప్రాబబిలిటీ ఎక్కువ ఉంటుంది అనుకుని మనసులోనే లెక్కలు వేసుకుని నడక ప్రారంభించాను. నేను దొర్లుతూ వచ్చిన సమయాన్ని లెక్కకట్టి, ఆ వేగాన్ని అంచనా వేసి ఒక్కో దిక్కుకీ ఎంత దూరం నడవాలో లెక్కలు కట్టుకుని ఒక్కో దిక్కులో దిక్కులేనివాడిలా ఇనుప ఖనిజాలతో ఎర్రబారిన అంగారక గ్రహం ఉపరితలమ్మీద నడక సాగించాను. ఎంత దూరం నడిచినా మా నౌక జాడ తెలియడం లేదు. సమయం గడుస్తున్న కొద్దీ నా ప్రాణాలర్పించైనా మావాళ్లని చూడాలన్న తహతహ మొదలైంది నాలో. మా అంతరిక్ష నౌక కేవలం ఆరు గంటలపాటే అంగారక గ్రహమ్మీద గడపగలదు. ఆరుగంటల లోపు అక్కడి నుంచి బయలుదేరకపోతే అది తిరుగు ప్రయాణం చెయ్యడానికి పనికి రాదు. ఆ విషయం నాకు బాగా తెలుసు. అందుకే, నేను వెళ్లినా వెళ్లకపోయినా సరిగ్గా ఆరు గంటలయ్యే సరికి వాళ్లు ముగ్గురూ తిరుగు ప్రయాణం ప్రారంభిస్తారు. అప్పుడు నా పరిస్థితి ఏమిటి?! అవంతిక అన్న అసలు మనుషులే లేని ప్రపంచంలో నిజంగా గడపాల్సి వస్తే ఎంత భయంకరంగా ఉంటుందో అర్ధమౌతున్న కొద్దీ నేను చేసిన పనికి నాలో పశ్చాత్తాపం కలుగసాగింది. అంగారక గ్రహం మీద రోజు యొక్క పరిమాణానికీ, భూమికీ పెద్దగా తేడా ఉండదు. దూరంగా అంగారక గ్రహమ్మీద సూర్యాస్తమయం కనిపిస్తోంది. ఆకాశంలో సూర్యుడి గమనాన్ని బట్టి మేము అక్కడ అడుగుపెట్టి ఎంత సమయం అయ్యిందో అంచనా వెయ్యగలిగాను. మా అంతరిక్ష నౌక బయలుదేరడానికి ఇంకా కొద్ది నిమిషాలు మాత్రమే సమయం ఉందన్న విషయం అర్థమైంది నాకు. అప్పటివరకూ నౌక కనుచూపు మేరలో కూడా కనిపించలేదు. ఇంకా ఎన్ని లోయలు దాటాలో, ఎన్ని పర్వతాలని ఎక్కాలో... అదంతా ఈ కొద్ది నిమిషాల్లో సాధ్యమయ్యే పనేనా? నిస్సత్తువ ఆవరించడంతో కుప్పకూలిపోయాను. ఆ నౌక వెళ్లిపోయిందంటే, ఇంక భూమితో నా సంబంధాలు శాశ్వతంగా తెగతెంపులైపోతాయి. నేను ఈ గ్రహమ్మీద తప్పిపోయానన్న విషయం తెలిసినా నాకోసం, నన్ను వెదకడం కోసం ఇన్ని కోట్లు ఖర్చుచేసి ప్రభుత్వం మళ్లీ మరొక వ్యోమ నౌకని ఇక్కడికి ఎట్టి పరిస్థితులలోనూ పంపదు. అసలు నేను అప్పటిదాకా జీవించి ఉండగలనన్న నమ్మకం కూడా భూమ్మీద ఎవరికీ ఉండదు. సైంటిస్టుగా ఎంతో ఎత్తుకు ఎదగాలని ఎన్నో కలలు కన్న నా జీవితం ఇలా అనామకంగా ఈ అన్య గ్రహమ్మీద అంతమౌతుందన్న విషయం నేనెన్నడూ ఊహించలేదు. నా స్థితికి సంతాపం తెలియ చేస్తున్నట్టుగా నేను కిందపడ్డ చోట ఎర్రగా పైకి లేచింది ఒక ధూళి మేఘం. నీరసంతో సోలిపోతున్న నా కళ్లకి ఆ ధూళిలోంచి మసగ్గా కనిపించింది దూరంగా ఒక చిన్న కదలిక. కళ్లు చిట్లించుకుని మళ్లీ చూసాను. అది భ్రమ కాదు... నిజమే. దూరంగా ఒక కదలిక కనిపిస్తూ క్షణాల్లోనే ఆ దృశ్యం క్రమంగా నా కళ్లకి స్పష్టమౌసాగింది. నా కళ్లు మెరిసాయి. దూరం నుంచి నావైపే నడుచుకుంటూ వస్తున్నది... స్పేస్ సూట్లో ఉన్న ప్రణీత్!! అతడ్ని గుర్తుపట్టగానే, ఏదో శక్తి నాలోంచి తన్నుకు వస్తున్నట్టుగా నన్ను లేపింది. గ్రావిటీ గురించి కూడా ఆలోచించకుండా శక్తి కొలదీ అడుగులు వేస్తూ పరుగుపెడుతూ వెళ్లి ప్రణీత్‌ని గాఢంగా కౌగిలించుకున్నాను! ప్రణీత్ కూడా నన్ను ఆలింగనం చేసుకుంటూ నా కళ్లలోకి కళ్లుపెట్టి చూసాడు... అతడి కళ్లలో ప్రేమ... స్నేహం!! నేను తేరుకునే లోగానే అతడు నా చేతిని పట్టుకుని నన్ను దాదాపుగా లాక్కుని వెడుతున్నట్టుగా పరిగెట్టసాగాడు. ఏమీ ఆలోచించే స్థితిలో లేని నేను ఏదో అపురూపమైన పెన్నిధిని పట్టుకున్నట్టుగా ప్రణీత్ చెయ్యి పట్టుకుని అతడు లాక్కుని వెడుతున్న వైపు కదిలిపోతున్నాను. దాదాపు పది నిమిషాలకి మేము మా అంతరిక్ష నౌక ముందు ఉన్నాము. అలాగే నన్ను లాక్కు వెడుతున్నట్టుగా నౌకలోకి ఎక్కించేసాడు ప్రణీత్. మేము ఎక్కిన వెంటనే, క్షణాల్లోనే నౌక తలుపులు మూసుకోవడం, నౌక గాలిలోకి లేవడం జరిగిపోయాయి. ‘‘అసలు ఏం జరిగింది?’’ మిగిలిన వ్యోమగాములు అన్నారు. ‘‘సాంకేతిక లోపం వల్ల వెనుక తలుపు తెరుచుకుంది. దాన్ని సరిచేసే ప్రయత్నంలో నేను బయటకి జారిపోయాను. అటువైపు లోయ ఉన్నట్టుంది’’ గొంతులోని అపరాధ భావం నాకే తెలిసిపోతోంది. ‘‘ఏది ఏమైనా ప్రణీత్ కన్నా ముందర నువ్వే అంగారక గ్రహమ్మీద అడుగు పెట్టావు. అంగారక గ్రహమ్మీద మొదటి అడుగు పెట్టిన మానవుడిగా నీ పేరు చరిత్రలో స్థిరంగా ఉండిపోతుంది’’ నవ్వుతూ అన్నారు వాళ్లు. ఒకప్పుడైతే వాళ్ల మాటలకి నాకు గర్వంగా అనిపించేది. కానీ అప్పుడు అలా అనిపించలేదు. ప్రణీత్ వైపు చూసాను. అతడు నా వైపు చూడడం లేదు. ఏదో పనిలో ఉన్నాడు. నా మనసులో ఒకే ప్రశ్న... ఎన్నడూ లేనిది అంగారక గ్రహమ్మీద నన్ను వెదుక్కుంటూ వచ్చినప్పుడు ప్రణీత్ కళ్లలో నాకు ప్రేమ, స్నేహం ఎందుకు కనపడ్డాయి?! బాగా ఆలోచిస్తే నాకొక విషయం అర్థమైంది. ఆ క్షణంలో ప్రేమ, స్నేహం అన్న భావనలు నిజానికి అతడివి కావు... నావి! అతడి చూపులు ఎప్పుడూ ఒకలాగే ఉంటాయి. తేడా అల్లా నేను ఊహించుకోవడంలోనే. అంటే, అంతకుముందు శిక్షణలో నేను అతడి కళ్లలో చూసిన స్వార్ధం, అంగారక గ్రహం మీద దిగబోయే ముందు అతడి కళ్లలో చూసిన కసి, శత్రుత్వం... అవి కూడా నావేనా?! అసూయ బానిసజాతి సహజ లక్షణం. ఈ అసూయే మన జాతీయ శీలానికి దాపురించిన వినాశకారి. సర్వశక్తిమంతుడైన ఆ పరమేశ్వరుడు సైతం మనలోని ఈ అసూయ కారణంగానే, మనకేమీ చెయ్యలేకున్నాడు’ స్వామి వివేకానంద మాటలు గుర్తుకు వచ్చాయి. మరో ఎనిమిది నెలలు ప్రయాణం చేసి తిరిగి భూమ్మీదకి చేరుకుంది అంతరిక్షనౌక. ఈ ఎనిమిది నెలల కాలం నా ఆలోచనల్లో చాలా మార్పుని తీసుకువచ్చింది. అంగారక గ్రహమ్మీద మొదటి అడుగుపెట్టిన మానవుడిగా అప్పటికే ప్రపంచం మొత్త్తమ్మీద నా పేరు మార్మోగిపోతోంది. భూమి మీద విజయవంతంగా ల్యాండ్ అయిన మా అంతరిక్ష నౌకలోంచి మొదటగా ప్రణీత్ దిగాడు. తరువాత మిగిలిన ఇద్దరూ దిగారు. అందరికన్నా చివరగా నేను కిందకి దిగి భూమ్మీద కాలుపెట్టాను. అంగారక గ్రహమ్మిద పెట్టినది కాదు - మారిన మనిషిగా తిరిగి వచ్చి భూమ్మీద పెట్టినదే నేను గర్వించగలిగే నా ‘మొదటి అడుగు’ అనిపించింది నాకు. - ఆకునూరి మురళీకృష్ణ -
భారత్‌లో ఇన్వెస్ట్ చేయండి..
► ఇన్ఫ్రా, ఏరోస్పేస్ రంగాల్లో అవకాశాలు ► ఆర్థిక వృద్ధికి అనుకూల పరిస్థితులు కల్పించాం ► రష్యా సంస్థల సీఈవోలతో భేటీలో ప్రధాని మోదీ మాస్కో: అధిక వృద్ధి రేటుతో ముందుకెడుతున్న భారత్‌లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా రష్యా ఇన్వెస్టర్లను ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానించారు. ఏరోస్పేస్, వజ్రాలు, ఇన్ఫ్రా తదితర రంగాల్లో పెట్టుబడులకు అపార అవకాశాలున్నాయన్నారు. అధిక ఆర్థిక వృద్ధి సాధనకు అవసరమైన సానుకూల పరిస్థితులను తమ ప్రభుత్వం కల్పించిందని సీఈవోల ఫోరం సమావేశంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో కలిసి పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు. భారత్ స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ) 7.4 శాతం వృద్ధి సాధించిందని, వృద్ధి జోరు నిలకడగా కొనసాగుతుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి, ప్రపంచ బ్యాంకు కూడా పేర్కొన్నాయని మోదీ తెలిపారు. వ్యాపారాలకు అనువుగా ఉండేలా పరిస్థితులను మెరుగుపర్చే ప్రయత్నాలు కొనసాగుతాయని చెప్పారు. భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టతను సూచించేలా.. కరెంటు అకౌంటు లోటు (క్యాడ్) గణాంకాలు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల రాక మొదలైనవి మెరుగ్గా ఉన్నాయన్నారు. భారత్‌ను అంతర్జాతీయ తయారీ హబ్‌గా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన చెప్పారు. ‘భారత్‌లో అత్యుత్తమమైన మౌలిక సదుపాయాల కల్పనకు కసరత్తు చేస్తున్నాం. ప్రభుత్వ కృషితో దేశ ఎకానమీ నిలకడైన వృద్ధిని సాధిస్తోంది. స్థిరమైన, పారదర్శకమైన పన్నుల విధానాన్ని అమలు చేసేందుకు కట్టుబడి ఉన్నాం’ అని మోదీ పేర్కొన్నారు. ఇరు దేశాలకు ఉపయుక్తంగా ఉండే మేకిన్ ఇండియా కార్యక్రమంలో పాలుపంచుకోవడం ద్వారా రష్యా కూడా ప్రయోజనాలు అందిపుచ్చుకోవాలని ఆయన సూచించారు. భారత వజ్ర వ్యాపార రంగంలో రష్యా కీలక పాత్ర పోషించగలదన్నారు. మరోవైపు, రష్యా చమురు, గ్యాస్ రంగంలో భారతీయ కంపెనీలు మరింతగా పాలుపంచుకోవాలని పుతిన్ చెప్పారు. భారతీయ కంపెనీలు రష్యాలో ఇన్వెస్ట్ చేయడానికి అడ్డంకులను తొలగించడంపైనా దృష్టి పెట్టాల్సి ఉందన్నారు. రష్యా సంస్థతో రిలయన్స్ డిఫెన్స్ జట్టు మాస్కో: ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటన సందర్భంగా భారత్‌కు చెందిన రిలయన్స్ డిఫెన్స్.. రష్యా ఎయిర్‌డిఫెన్స్ మిసైల్స్ సిస్టమ్స్ తయారీ దిగ్గజం అల్మాజ్యాంటేతో గురువారం భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీని ప్రకారం భారత్ రక్షణ దళాలకు అవసరమైన మొత్తం ఎయిర్‌డిఫెన్స్ మిసైల్స్(క్షిపణులు), రాడార్ సిస్టమ్స్‌ను ఇరు సంస్థలు కలిసి తయారు చేయనున్నాయి. ఇప్పటికే అల్మాజ్యాంటే అభివృద్ధి చేసిన ఎస్-400 ట్రయంఫ్ ఎయిర్‌డిఫెన్స్ సిస్టమ్‌ను కొనుగోలు చేసే ప్రణాళికల్లో భారత్ ఉంది. ఈ కొనుగోలు విలువ దాదాపు రూ.40 వేల కోట్లుగా అంచనా. రిలయన్స్ డిఫెన్స్ .. అడాగ్ గ్రూపునకు చెందిన రిలయన్స్ ఇన్ఫ్రా అనుబంధ సంస్థ. ఓవీఎల్, రాస్‌నెఫ్ట్ ఒప్పందం.. రష్యాలోని రెండో అతి పెద్ద చమురు క్షేత్రం వాంకోర్‌లో 15% వాటాల కొనుగోలు ప్రక్రియలో తొలి దశ పూర్తి సందర్భంగా రాస్నెఫ్ట్తో ఓఎన్జీసీ విదేశ్(ఓవీఎల్) కన్ఫర్మేషన్ డీల్ కుదుర్చుకుంది. ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ సమక్షంలో ఓవీఎల్ ఎండీ నరేంద్ర కే వర్మ, రాస్‌నెఫ్ట్ చైర్మన్ ఐగర్ సెచిన్ ఇందుకు సంబంధించిన పత్రాలపై సంతకాలు చేశారు. 1.26 బిలియన్ డాలర్లు వెచ్చించి వాంకోర్‌లో ఓవీఎల్ 15% వాటా కొనుగోలు చేస్తోంది.