Agriculture
-
కష్టజీవులను కబళించిన మృత్యుశకటం.. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
గార్లదిన్నె: వారంతా వ్యవసాయ కూలీలు.. రెక్కాడితేగానీ డొక్కాడని నిరుపేదలు. రోజూ మాదిరిగానే ఉదయాన్నే పనులకు వెళ్లారు. పనులు ముగించుకుని ఆటోలో ఇంటికి వెళ్తుండగా ఆర్టీసీ బస్సు రూపంలో మృత్యుశకటం కబళించింది. ఈ ఘటనలో ఎనిమిది మంది దుర్మరణం చెందగా.. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతపురం జిల్లా గార్లదిన్నెకు సమీపంలోని 44వ నంబరు జాతీయ రహదారిపై శనివారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బాధితుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. పుట్లూరు మండలం ఎల్లుట్ల గ్రామ ఎస్సీ కాలనీకి చెందిన 12 మంది వ్యవసాయ కూలీలు గార్లదిన్నె మండలం తిమ్మంపేట వద్ద అరటి తోటలో ఎరువు వేసే పనికోసం ఉదయమే ఆటోలో వచ్చారు. అక్కడ పని ముగించుకుని మధ్యాహ్నం ఇంటికి తిరుగు పయనమయ్యారు. తలగాచిపల్లి క్రాస్ వద్ద ఆటో గార్లదిన్నె వైపునకు మలుపు తీసుకుంటుండగా.. అదే సమయంలో అనంతపురం నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాలపెద్దయ్య అలియాస్ తాతయ్య (55), చిన్ననాగమ్మ (48) రామాంజినమ్మ (47), పెద్ద నాగమ్మ (60) అక్కడికక్కడే మృతిచెందారు. మిగిలిన వారికి తీవ్ర గాయాలయ్యాయి. ఆటోలో నుంచి రోడ్డు మీద పడి తీవ్రగాయాలతో హాహాకారాలు, ఆర్తనాదాలు చేస్తున్న కూలీలను స్థానికులు గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు.ఎస్ఐ గౌస్ మహమ్మద్ బాషా తన సిబ్బందితో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను 108 వాహనాల్లో అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చిన్ననాగన్న (55), జయరాముడు (48), కొండమ్మ (50), ఈశ్వరయ్య మృతిచెందారు. లక్ష్మీదేవి, పెద్దులమ్మ, రామాంజినమ్మ, గంగాధర్, ఆటో డ్రైవర్ నీలకంఠ తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నారు. మృతుల్లో చిన్ననాగన్న–చిన్ననాగమ్మ, ఈశ్వరయ్య–కొండమ్మ దంపతులు.ఒకేరోజు ఎనిమిది మంది మృతిచెందడం, ఐదుగురు గాయపడడంతో ఎల్లుట్ల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అనంతపురం ప్రభుత్వాస్పత్రి వద్ద బాధిత కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఈ ప్రమాదంపై గార్లదిన్నె పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. సంఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ జగదీష్, అనంతపురం రూరల్ డీఎస్పీ వెంకటేశ్వర్లు తదితరులు పరిశీలించారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించనున్నట్లు కలెక్టర్ వినోద్‌కుమార్ తెలిపారు.చంద్రబాబు దిగ్భ్రాంతిసాక్షి, అమరావతి: అనంతపురం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గార్లదిన్నె మండలం తలగాచిపల్లె వద్ద ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో ఎనిమిది మరణించడంపై విచారం వ్యక్తం చేశారు. పొట్టకూటి కోసం కూలి పనులకు వెళ్లొస్తూ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమన్నారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి:వైఎస్ జగన్అనంతపురం జిల్లాలో శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గార్లదిన్నె మండలం తలగాచిపల్లె వద్ద ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో ఎనిమిది మంది మరణించారు. వీరంతా కూలి పనులకు వెళ్లొస్తూ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. వారి కుటుంబాలకు వైఎస్ జగన్ ప్రగాఢ సంతాపం తెలియజేశారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఉదారంగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని.. వారికి అవసరమైన సాయం అందజేయాలని కోరారు. -
బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం పటాపంచలైంది : సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్ : కాళేశ్వరం వల్లే తెలంగాణలో వరి సాగు పెరిగిందన్న బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం పటాపంచలైందని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.ఆ ట్వీట్లో.. కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ కుంగి..నీటిని నిల్వ చేసే పరిస్థితి లేకపోయినా. ఎన్డీఎస్ఎ సూచన మేరకు అన్నారం, సుందిళ్లలోనీటిని నిల్వ చేయకపోయినా.. కాళేశ్వరంతో సంబంధం లేకుండా తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారి రికార్డు స్థాయిలో వరిధాన్యం పండింది.ఇది తెలంగాణ రైతుల ఘనత.. వారి శ్రమ, చెమట, కష్టం ఫలితం.. తెలంగాణ రైతు దేశానికే గర్వకారణం.. ఈ ఘనత సాధించిన ప్రతి రైతు సోదరుడికి హృదయపూర్వక అభినందనలు’ అంటూ సీఎం రేవంత్ తన ట్వీట్లో పేర్కొన్నారు. -
18 నుంచి వ్యవసాయ కోర్సులకు మూడో దశ కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్/ఏజీవర్సిటీ: వ్యవసాయ, ఉద్యాన కోర్సుల్లో రెగ్యులర్ కోటా సీట్ల ఖాళీల భర్తీ కోసం ఈనెల 18వ తేదీ నుంచి మూడో దశ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు వ్యవసాయ వర్సిటీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. వ్యవసాయ, ఉద్యాన డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం జరుగుతున్న స్పెషల్ కోటా మొదటి దశ కౌన్సెలింగ్ ఆదివారంతో పూర్తయింది. రెండు దశల్లో జరిగిన రెగ్యులర్ కోటా కౌన్సెలింగ్, అలాగే ఆదివారంతో పూర్తయిన మొదటి దశ స్పెషల్ కోటా కౌన్సెలింగ్ తర్వాత వ్యవసాయ, అనుబంధ కోర్సుల్లో సుమారు 213 ఖాళీలు ఏర్పడినట్లు జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డి.శివాజీ తెలిపారు.బీఎస్సీ (హానర్స్) అగ్రికల్చర్లో 80, బీవీఎస్సీ – 08, బీఎస్సీ (హానర్స్) హారి్టకల్చర్ – 70, బీఎస్సీ కమ్యూనిటీ సైన్స్ – 40, బీటెక్ ఫుడ్ టెక్నాలజీలో 15 సీట్లు ఖాళీగా ఉన్నట్టు వివరించారు. 18 నుంచి జరిగే మూడో దశ కౌన్సెలింగ్ ద్వారా ఈ కోర్సులలో ఏర్పడిన ఖాళీలను భర్తీ చేయనున్నట్లు రిజి్రస్టార్ తెలిపారు. మూడో దశ కౌన్సెలింగ్ షెడ్యూలు, కోర్సుల్లో ఖాళీలు తదితర వివరాలను విశ్వవిద్యాలయ వెబ్సైట్ www.pjtau.edu.in లో పొందవచ్చని ఆయన వివరించారు. మెరిట్ ఆధారంగానే సీట్లను భర్తీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రవేశాల్లో దళారుల ప్రమేయం ఉండదని, వారి మాయ మాటలు నమ్మి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మోసపోవద్దని ఆయన సూచించారు. -
వ్యవసాయ అనుబంధ రంగాలకు రుణాలు అందించండి
న్యూఢిల్లీ: వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించి ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను నిర్దేశించిన మేర రుణ వితరణ చేయాలంటూ బ్యాంక్‌లను కేంద్ర ఆర్థిక శాఖ కోరింది. వ్యవసాయ అనుబంధ రంగాలైన పశువుల పెంపకం, డైరీ, ఫిషరీస్‌కు రుణ వితరణ పురోగతిపై కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి ఎం.నాగరాజు మంగళవారం ఢిల్లీలో అధికారులతో కలసి సమీక్షించారు. ప్రభుత్వరంగ బ్యాంక్‌లు (పీఎస్‌బీలు), నాబార్డ్, వ్యవ సాయ అనుబంధ రంగాలు, రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీల తరఫున ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన రుణ వితరణ లక్ష్యాన్ని చేరుకునేందుకు బ్యాంక్‌లు చర్యలు తీసుకోవాలని ఈ సమావేశంలో నాగ రాజు కోరారు. అలాగే ఈ దిశగా రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని సూచించారు. వ్యవసాయ అభివృద్ధి, ఉపాధి కల్పన పరంగా అనుబంధ రంగాలకు ఉన్న ప్రాధాన్యాన్ని గుర్తు చేశారు. అన్ని ప్రాంతాల్లోనూ రుణ వితరణ సాఫీగా సాగేందుకు సమావేశాల నిర్వహణ/మదింపు చేపట్టాలని బ్యాంక్‌లను ఆదేశించారు. చేపల రైతులను గుర్తించి, వారికి కేసీసీ కింద ప్రయోజనం అందే దిశగా రాష్ట్రాలకు సహకారం అందించాలని నాబార్డ్‌ను సైతం కోరారు. -
వ్యవసాయ రంగమే ఉపాధికి ఊతం
నగర ప్రాంతాలకు తరలి వస్తోన్న లక్షలాదిమంది ప్రధానంగా ఉపాధిని పొందుతోంది, నిర్మాణ రంగంలోనే. సాఫ్ట్వేర్ రంగంలోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి పరిణామాలు అక్కడా ఉపాధికి గండికొడుతున్నాయి. ఈ స్థితిలో ఉపాధి కల్పన, ఆర్థిక వృద్ధికి రఘురావ్‌ు రాజన్ వంటి వారు కూడా సేవారంగాన్ని ఎందుకు పరిష్కారంగా చెప్పజూస్తున్నారు? నేటి ప్రపంచ పరిస్థితులలో సరుకు ఉత్పత్తి రంగం గానీ, సేవా రంగం గానీ కోట్లాది మంది నిరుద్యోగులకు బతుకుతెరువును చూపగల స్థితి లేదు. మిగిలిందల్లా, వ్యవసాయ రంగమే. వ్యవసాయం లాభసాటిగా ఉంటే గ్రామీణులు నగరాలకు రారు. అప్పుడు కారుచవకగా కార్పొరేట్లకు కార్మికులు దొరకరు. అందుకే వ్యవసాయం లాభసాటిగా లేకుండా ‘జాగ్రత్తపడటమే’ ఇప్పటి విధానం.దేశంలోని సుమారు 65% జనాభా 35 ఏళ్ల లోపువారు. వీరికి నిరుద్యోగం, చదువుకు తగిన ఉద్యోగం లేకపోవడం ప్రధాన సమస్యలు. కోవిడ్ అనంతరం సమస్య మరింత జఠిలం అయ్యింది. 2016లో మోదీ తెచ్చిపెట్టిన పెద్ద నోట్ల రద్దు, 2017లో హడావుడిగా ఆరంభమైన జీఎస్టీ వంటివి చిన్న, మధ్యతరహా పరిశ్రమలను దెబ్బతీసి నిరుద్యోగ సమస్యను మరింత పెంచాయి.దేశంలో సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామనే వాగ్దానం ఆసరాగా 2014లో బీజేపీ అధికారంలోకి రాగలిగింది. ఇదే నేపథ్యంలో, మోదీ ప్రభుత్వం సరుకు ఉత్పత్తి రంగాన్ని దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక ఉపాధి కల్పనా రంగంగా... దేశ స్థూల జాతీయ ఉత్పత్తిలో 25% స్థాయికి చేర్చే పేరిట ‘మేకిన్ ఇండియా’ కార్య క్రమాన్ని ఆరంభించింది. దశాబ్ద కాలం తర్వాత, వెనక్కిచూసుకుంటే స్థూల జాతీయ ఉత్పత్తిలో ఈ రంగం వాటా 15– 17 శాతం మధ్య ఎదుగూ బొదుగూ లేకుండా మిగిలిపోయింది. 2020లో ఆరంభమైన ‘ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల’ పథకం కూడా సాధించింది నామ మాత్రమే.మేకిన్ ఇండియా కార్యక్రమం విజయవంతం అయ్యే అవకాశాలు లేవంటూ అప్పట్లోనే రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురావ్‌ు రాజన్ చెప్పారు. చైనా ప్రపంచం యావత్తుకూ సరిపోయే స్థాయిలో, చవకగా సరుకులను ఉత్పత్తి చేస్తోంది గనుక ప్రపంచానికి మరో చైనా అవసరం లేదంటూ సున్నితంగా హెచ్చరించారు. ఈ రచయిత కూడా 2008 ఆర్థిక సంక్షోభం అనంతరం, అంతర్జాతీయంగా డిమాండ్ పతనం వంటి వివిధ కారణాలను పేర్కొంటూ మేకిన్ ఇండియా, దేశ సమస్య లకు పరిష్కారం కాదంటూ ఒక వ్యాసం రాసివున్నారు.దేశంలో నిరుద్యోగం పరిష్కారానికీ, వృద్ధి రేటు పెంపుదలకూ దారి ఏమిటనే చర్చ ముమ్మరంగా కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే, ఈ మధ్య రఘురావ్‌ు రాజన్ ‘బ్రేకింగ్ ద మౌల్డ్: రీ ఇమేజింగ్ ఇండియాస్ ఎకనామిక్ ఫ్యూచర్’ పేరిట రోహిత్ లాంబా అనే పెన్సి ల్వేనియా విశ్వవిద్యాలయ ఆచార్యునితో కలిసి ఒక పుస్తకం రాశారు. దీనిలో భాగంగా మేకిన్ ఇండియా, ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక విధానాలు ఖర్చు ఎక్కువ, ఫలితం తక్కువగా తయారయ్యాయని పేర్కొన్నారు. ఈ సరుకు ఉత్పత్తి రంగంపై దృష్టిని కాస్తంత తగ్గించు కొని, భారతదేశం ఇప్పటికే ‘బలంగా’ వున్న సేవా రంగంపై దృష్టి పెట్టాలన్నారు. తద్వారా మెరుగైన ఉపాధి కల్పన, వృద్ధి రేటులను సాధించవచ్చనేది వారి వాదన. దీని కోసమై యువజనుల నిపుణతల స్థాయిని పెంచి వారిని సేవా రంగ ఉపాధికి సిద్ధం చేయాలన్నారు.రెండవ ప్రపంచ యుద్ధానంతరం కొరియా, జపాన్... అలాగే చైనా వంటి దేశాలు అనుసరించిన ఆర్థిక వృద్ధి నమూనా అయిన మొదటగా వ్యవసాయ రంగం నుంచి సరుకు ఉత్పత్తి రంగం దిశగా సాగడం... అనంతరం మాత్రమే సేవా రంగం వృద్ధి దిశగా పయనించడం అనివార్యం కాదని రాజన్ వాదిస్తున్నారు. అనేక ధనిక దేశాలలో ఇప్పటికే సేవా రంగం వాటా జీడీపీలో 70% మేర ఉందనీ, ఈ రంగంలో జీడీపీ వాటా సుమారు 60% పైన వున్న భారత్ కూడా పాత నమూనాని పక్కన పెట్టి మరింతగా సేవా రంగంలోకి వెళ్ళాలనేది రాజన్ తర్కం. సేవా రంగం వృద్ధి చెందాలంటే యువజనుల విద్యా నిపుణతల స్థాయి సరుకు ఉత్పత్తి రంగంలో కంటే అధికంగా ఉండాలి. ఇంజనీరింగ్ విద్యార్థులు కూడా సేవా రంగం తాలూకు సాఫ్ట్వేర్ రంగంలో ప్రవేశించగలగడంలో ఎదుర్కొంటున్న సాఫ్ట్ స్కిల్స్ లోటును చూస్తున్నాం. సేవా రంగంలో ఆంగ్ల భాషా ప్రావీణ్యం అవసరం తెలిసిందే. దేశంలోని ఎంతమంది యువజనులకు ఈ రంగంలో ప్రవేశించగల స్థాయి ఆంగ్ల భాషా ప్రావీణ్యం ఉంది? దేశంలోని మొత్తం కార్మికులలో 70% మంది మాత్రమే అక్షరాస్యులు. వీరిలో కూడా 25% మంది ప్రాథమిక స్థాయి విద్యలోపే పాఠశాల చదువు మానివేసిన వారు. దేశంలోని 20% సంస్థలు మాత్రమే తమ ఉద్యోగులకు తగిన శిక్షణను ఇచ్చుకునే ఏర్పాట్లను కలిగి వున్నాయి (ప్రపంచ బ్యాంకు పరిశోధన). ఈ స్థితిలో, గ్రామీణ యువజనులను సేవా రంగం దిశగా ఇప్పటికిప్పుడు తీసుకెళ్ళగలమా? నేడు సాఫ్ట్వేర్ రంగంలోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి పరిణామాలు అక్కడా ఉపాధికి గండికొడుతున్నాయి. ఈ స్థితిలో, ఉపాధి కల్పన, ఆర్థిక వృద్ధి కోసం రఘురావ్‌ు రాజన్ వంటి వారు కూడా సేవా రంగాన్ని ఎందుకు పరిష్కారంగా చెప్పజూస్తున్నారు?దీనికి కారణం ఒక్క ముక్కలో చెప్పాలంటే ‘బీయింగ్ డిటర్మిన్స్ కాన్షియస్నెస్’ (మన అస్తిత్వమే మన ఆలోచనలను నిర్ణయిస్తుంది) అనే కార్ల్ మార్క్ ్స ఉద్బోధన. అంతర్జాతీయ ద్రవ్య సంస్థలో 2003 నుంచి 2007 వరకూ ప్రధాన ఆర్థిక సలహాదారుగా పని చేసిన రాజన్ కూడా దాటుకుని రాలేని నిజం. ఆయన అస్తిత్వం తాలూకు పరిమి తులే, ఆయనను వాస్తవాన్ని చూడనివ్వడం లేదు. నేటి ప్రపంచ పరిస్థితులలో అటు సరుకు ఉత్పత్తి రంగం గానీ, ఇటు సేవా రంగం గానీ, కోట్లాది మంది నిరుద్యోగ యువతకు బతుకుదెరువును చూప గల స్థితి లేదు. మిగిలిందల్లా, మన వ్యవసాయ రంగమే. ఈ రంగంలో ఇప్పటికే, అవసరాన్ని మించి మానవ వనరులు చిక్కుకు పోయి ఉన్నాయన్నది నిజం. ప్రస్తుత ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణ విధానాల ‘సంస్కరణల’ యుగంలో వ్యవసాయ రంగంపై చిన్న చూపు పెరిగింది. గ్రామీణ వ్యవసాయ రంగం, నగర ప్రాంత పారిశ్రామిక రంగాల మధ్యన ఉన్న సమీకరణం గ్రామీణ ప్రాంతాలకు వ్యతిరేకంగా ఉంది. వ్యవసాయ రంగ సరుకులను కారు చవుకగా, నగర ప్రాంతాలలో అందుబాటులో ఉంచడమనేది పారిశ్రామిక కార్పొరేట్ వర్గాల అవసరం. గ్రామీణ రైతాంగానికి లాభసాటి ధరలను కల్పిస్తే ఆ సరుకుల ధరలు, నగర ప్రాంత మార్కెట్లలో అధికంగా ఉంటాయి. నగర ప్రాంత కార్మికులు, ఉద్యోగులకు అవి ఖరీదైనవి అవుతాయి. అప్పుడు వేతనాల పెంపుదల కోసం యజమానులపై ఒత్తిడి తెస్తారు. ఇది పారిశ్రామిక అశాంతిగా మారవచ్చు. ఒక మోస్తరు వేతనాలతోనే పని చేయించుకోగలగాలంటే రైతాంగ ఉత్పత్తులకు తక్కువ ధరలు ఉండేలా జాగ్రత్తపడడం కార్పొరేట్లకు అవసరం. గ్రామీణ రైతాంగానికి వ్యవసాయం లాభసాటిగా ఉంటే వారు నగరాలకు రారు. అప్పుడు నగర ప్రాంతాలలో కార్మికుల సరఫరా తగ్గుతుంది. కార్మికులకు డిమాండ్ పెరుగుతుంది. దీని వలన, పారిశ్రామికవేత్తలు అధిక వేతనాలను చెల్లించి పనిలో పెట్టుకోవలసి వస్తుంది. దీనికి కూడా పరిష్కారమే గ్రామీణ వ్యవసాయం లాభ సాటిగా లేకుండా ‘జాగ్రత్తపడడం’. ఈ కథలో సూత్రధారులు ప్రపంచీకరణ వంటి నయా ఉదారవాద విధానాaలను మన మీద రుద్దుతోన్న ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధులు. ఆ ఆలోచనా విధానం తాలూకు ప్రతినిధిగా రఘురావ్‌ు రాజన్ వ్యవసాయం ఊసు ఎత్తలేరు. దాన్ని దేశానికీ, ఉపాధి కల్పనకూ దారిగా చూపలేరు. రైతుకు వ్యవసాయం లాభసాటిగా ఉంటే అది అతని కొనుగోలు శక్తిని పెంచి తద్వారా నగర ప్రాంత పారిశ్రామిక సరుకులకు డిమాండ్‌ను కల్పిస్తుంది. దేశ జనాభాలోని 55% పైన ఉన్న రైతాంగం బాగుంటే, విదేశాలలోని డిమాండ్, కొనుగోలు శక్తి, ఎగుమతులతో నిమిత్తం లేకుండా దేశంలోనే డిమాండ్‌ను సృష్టించవచ్చు. ఈ పరిష్కారాన్ని చెప్పలేని మేధా దుర్బలత్వంతో రఘురావ్‌ు రాజన్ వంటివారు మిగిలిపోతున్నారు. డి. పాపారావు వ్యాసకర్త సామాజిక, ఆర్థిక రంగాల విశ్లేషకులుమొబైల్: 98661 79615 -
క్లైమెట్ ఎమర్జెన్సీ కాలంలో సరికొత్త పరిష్కారాలు వెతకాలి
సాక్షి, హైదరాబాద్: మారిన వాతావరణ పరిస్థితులు, రైతుల ఆకాంక్షల నేపథ్యంలో వ్యవసాయ రంగంలో ఎదురవుతున్న సరికొత్త సవాళ్లకు పాత కాలపు ఆలోచనలతో కూడిన పరిష్కారాలు సరిపడవని, క్లైమెట్ ఎమర్జెన్సీ కాలంలో సరికొత్త పరిష్కారాలు వెతకాల్సిన అవసరం ఉందని సుప్రసిద్ధ వ్యవసాయ శాస్త్రవేత్త, సుస్థిర వ్యవసాయ కేంద్రం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ జీవీ రామాంజనేయులు పిలుపునిచ్చారు. సెంటర్ ఫర్ ఎకనమిక్ అండ్ సోషల్ స్టడీస్ (సెస్) మినీ ఆడిటోరియంలో మిల్లెట్ నెట్వర్క్ ఆఫ్ ఇండియా, డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ (డీడీఎస్) సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం జరిగిన చర్చాగోష్టిలో ఆయన మాట్లాడారు.చిరుధాన్యాలపై అనేక రాష్ట్రాల్లో పనిచేస్తున్న సామాజిక కార్యకర్తలు, శాస్త్రవేత్తలు, స్వచ్ఛంద సంస్థల బాధ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘క్లైమెట్ ఛేంజ్, మిల్లెట్స్, ఎకోసిస్టమ్ సర్వీసెస్’ అనే అంశంపై జరిగిన చర్చాగోష్టికి రామాంజనేయులు సమన్వయకర్తగా వ్యవహరించారు. రైతులకు వెన్నుదన్నుగా నిలిచేందుకు 30 ఏళ్ల నాడు పాలకులు ఏర్పాటు చేసిన మద్దతు వ్యవస్థలు ఇప్పటి సవాళ్లను ఎదుర్కోవటానికి పనికిరావని, కొత్త తరహా మద్దతు వ్యవస్థలను అమల్లోకి తెచ్చుకోవాల్సిన అవసరం ఉందని డా. రామాంజనేయులు సూచించారు. రైతుబంధు వంటి పథకాలను కొత్త సవాళ్ల వెలుగులో సమీక్షించుకోవాలన్నారు. రైతులకు ప్రభుత్వాలు అండగా నిలవాలిపర్యావరణ సేవలకు చెల్లింపులు అవసరం అజిమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీ అధ్యాపకురాలు డాక్టర్ మంజుల మేనన్ మాట్లాడుతూ.. రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడకుండా ప్రకృతి/ సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజలు వంటి మిశ్రమ పంటలు సాగు చేసే రైతులకు ప్రభుత్వాలు అండగా నిలవాలన్నారు. వారు ప్రభుత్వం నుంచి ఎరువులకు సంబంధించి ఎటువంటి సబ్సిడీలు పొందటం లేదు. ప్రకృతికి అనుగుణమైన సాగు పద్ధతి వల్ల పర్యావరణానికి, సమాజానికి ఎన్నో విధాలుగా ప్రయోజనం ఒనగూడుతున్నది. ఈ పర్యావరణ సేవలకు గుర్తింపుగా ఈ రైతులకు ప్రత్యేక చెల్లింపులు చేయాల్సిన అవసరం ఉందని మంజుల సూచించారు.ఇది కొత్త భావన కాదని, ఇప్పటికే అనేక దేశాల్లో అమల్లో ఉన్నదేనన్నారు. డీడీఎస్ మాదిరి రసాయన రహిత జీవవైవిధ్య సాగు వల్ల భూసారాన్ని పెంపొందించటం, సాగు నీరు ఆదా అవుతుంది, పోషక విలువలతో కూడిన ఆహారం ప్రజలకు అందుతుంది కాబట్టి ఈ రైతులకు ప్రత్యేక మద్దతు వ్యవస్థను నెలకొల్పాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. వ్యవసాయానికి ప్రభుత్వం కేటాయిస్తున్న నిధుల్లో 6% అదనపు నిధులతోనే ఈ మద్దతు వ్యవస్థను అందుబాలోకి తేవచ్చని తమ అధ్యయనంలో వెల్లడైందని మంజుల అన్నారు. రైతులు ఎందుకు నష్టపోవాలి?సీనియర్ పాత్రికేయుడు డాక్టర్ కెవి కూర్మనాధ్ మాట్లాడుతూ వాతావరణ మార్పుల వల్ల రైతులకు ఎదురవుతున్న సరికొత్త సమస్యలను పాలకులు గుర్తించకపోవటం విడ్డూరంగా ఉందన్నారు. కుండపోత వర్షాలు, అకాల వర్షాల వల్ల పత్తి, ధాన్యంలో అధిక మోతాదులో తేమ ఉంటే అందుకు రైతులు ఎందుకు నష్టపోవాలని ప్రశ్నించారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో నిబంధనలు సడలించి రైతులకు అండగా నిలవాల్సిన అవసరాన్ని ప్రభుత్వం ఎందుకు గుర్తెరగటం లేదన్నారు.చిరుధాన్యాల సాగును ప్రోత్సహించాలిరైతు స్వరాజ్య వేదిక నేత కన్నెగంటి రవి మాట్లాడుతూ, తెలంగాణ ఏర్పాటైన తర్వాత మద్దతు ధర, సేకరణ సదుపాయాల్లేక రాష్ట్రంలో చిరుధాన్యాల సాగు మరింత దిగజారిందన్నారు. అధిక బ్యాంకు రుణాలు పొందటం కోసం చిరుధాన్యాలు సాగు చేసే రైతులు కూడా తాము పత్తి, వరి వంటి పంటలు సాగు చేస్తున్నామని అధికారులతో చెబుతున్నారని, అందుకే చిరుధాన్యాల వాస్తవ సాగు విస్తీర్ణం కూడా గణాంకాల్లో ప్రతిఫలించటం లేదన్నారు. అత్యంత కాలుష్యానికి కారణమయ్యే ఇథనాల్ పరిశ్రమలు మరో 30 రాష్ట్రంలో రానున్నాయని, వీటికి ముడిసరుకు అందించటం కోసమే ప్రభుత్వం వరి సాగును ప్రత్యేక బోనస్ ప్రకటించి మరీ ప్రోత్సహిస్తున్నదన్నారు. మూడు చిరుధాన్య పంటలకు మద్దతు ధర ప్రకటించినా, జొన్నలను మాత్రమే కోర్టు ఆదేశించినప్పుడే ప్రభుత్వం సేకరిస్తోందన్నారు. పర్యావరణానికి, ప్రజారోగ్యానికి మేలు చేసే చిరుధాన్యాల సాగును ప్రోత్సహించేదుకు ప్రభుత్వం తన విధానాలను మార్చుకోవాలని రవి కోరారు. -
రైతే 'రాజు'
సాక్షి, అమరావతి: భారత దేశంలో వ్యవసాయ రంగానిదే అగ్రస్థానం. గ్రామాల్లో రైతే రాజు. గ్రామీణులకు అధిక ఆదాయాన్ని సమకూరుస్తోంది వ్యవసాయమే. పంట పండించిన వాడికే ఎక్కువ ఆదాయం వస్తోంది. మిగతా రంగాల వారి ఆదాయం రైతు కుటుంబాలకంటే తక్కువే. నాబార్డు విడుదల చేసిన ఆల్ ఇండియా రూరల్ ఫైనాన్షియల్ ఇంక్లూజివ్ సర్వే–2021–22 ఈ విషయాన్ని వెల్లడించింది. 2021–22 సంవత్సరంలో దేశంలోని రైతు కుటుంబాల నెలవారీ సగటు ఆదాయం రూ.13,661గా ఈ సర్వే తేల్చింది. వ్యవసాయేతర కుటుంబాల ఆదాయం రూ.11,348గా తెలిపింది. 2016–17తో పోలిస్తే 2021–22లో వ్యవసాయ కుటుంబాల నెలవారీ ఆదాయం రూ. 4,558 పెరిగింది. వ్యవసాయేతర కుటుంబాల ఆదాయం రూ.4,488 పెరిగింది. అన్ని కుటుంబాల్లో సగటు ఆదాయం రూ. 4,616 పెరిగింది. గ్రామీణ ప్రాంతాల కుటుంబాల నెలవారీ మొత్తం వ్యయంలో 47 శాతం ఆహార వస్తువులపైనే ఉందని, 53 శాతం ఆహారేతర వస్తువులపై ఉందని సర్వే తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లో.. ఆంధ్రప్రదేశ్‌లో 2021–22లో వ్యవసాయ కుటుంబాల సగటు నెలవారీ ఆదాయం రూ.12,294 అని ఈ సర్వే తెలిపింది. ఈ ఆదాయం 2016–17తో పోల్చితే 2021–22లో రూ. 5,195 పెరిగింది. 2016–17లో రాష్ట్రంలో గ్రామీణ కుటుంబాల నెలవారీ సగటు ఆదాయం రూ.5,842 కాగా నెలవారీ ఖర్చు రూ.5,746 ఉంది. నెలవారీ మిగులు కేవలం 96 రూపాయలు మాత్రమే. 2021–22లో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ కుటుంబాల నెలవారీ సగటు ఆదాయం 11,037 రూపాయలుండగా నెలవారీ వినియోగ వ్యయం 10,448 రూపాయలు ఉంది. నెలవారీ మిగులు 589 రూపాయలుగా ఉంది. సర్వేలో తీసుకున్న అంశాలివీ.. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ, వ్యవసాయేతర, మొత్తం కుటుంబాల నెలవారీ ఆదాయం, వినియోగ వ్యయంపై తొలిసారి 2016–17లో ఆల్ ఇండియా రూరల్ ఫైనాన్షియల్ ఇంక్లూజివ్ సర్వే జరిగింది. మళ్లీ 2021–22లో సర్వే చేసినట్లు నాబార్డు తెలిపింది. ఈ వివరాలను ఇటీవల విడుదల చేసింది. వ్యవసాయ కుటుంబాలతో పాటు వ్యవసాయేతర కుటుంబాలు, గ్రామాల్లోని మొత్తం కుటుంబాల నెలవారీ ఆదాయాన్ని లెక్కించింది. సాగుతో పాటు పశువుల పెంపకం, తోటల పెంపకం, కూలీ, ఇతర వాణిజ్య, వ్యాపారాలు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు, అటవీ ఉత్పత్తులు, తయారీ కార్యకాలపాలు, ఉపాధి హామీ, వ్యవసాయ కార్మికులు తదితర కార్యకలాపాలను పరిగణనలోకి తీసుకున్నట్లు వెల్లడించింది. నెలవారీ వినియోగ వ్యయాన్ని ఆహార, ఆహారేతర వ్యయాలను కూడా పరిగణనలోకి తీసుకున్నట్లు పేర్కొంది. -
ఇదే లక్ష్యం.. జాతీయ సదస్సులో కేంద్రమంత్రి
ఢిల్లీలోని పూసా ఇనిస్టిట్యూట్‌లో రబీ పంటల జాతీయ వ్యవసాయ సదస్సులో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పాల్గొన్నారు. భారతదేశంలో వార్షిక వ్యవసాయ ఉత్పత్తి లక్ష్యాన్ని 341.55 మిలియన్ టన్నులుగా నిర్ణయించినట్లు ఈ సందర్భంగా తెలిపారు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో రైతుల ఆదాయం మూడు నుంచి నాలుగు రెట్లు పెరిగిందని ఆయన అన్నారు.రబీ పంటల జాతీయ వ్యవసాయ సదస్సులో ఆరు రాష్ట్రాలకు చెందిన వ్యవసాయ మంత్రులు, 31 రాష్ట్రాల వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు. సదస్సులో శివరాజ్‌సింగ్ చౌహాన్, వ్యవసాయ శాఖ సహాయ మంత్రి రామ్‌నాథ్ ఠాకూర్, భగీరథ్ చౌదరిలు రైతులు వేగంగా పురోగతి సాధిస్తున్నట్లు పేర్కొన్నారు.రైతుల ఆదాయం పెరగని ప్రాంతాలకు సంబంధించిన డేటాను సేకరిస్తున్నాము. అలాంటి ప్రాంతాల్లోని రైతులపై ప్రభుత్వం మరింత శ్రద్ధ చూపుతుందని ఈ సమావేశంలో వెల్లడించారు. మోదీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన 131 రోజుల్లో రైతుల ప్రయోజనాల కోసం వేగంగా నిర్ణయాలు తీసుకుందని శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు.వచ్చే నెల నుంచి దేశవ్యాప్తంగా వ్యవసాయ వర్క్‌షాప్‌లు నిర్వహిస్తామని.. రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు కలిసి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ప్రకటించారు. 17 రాష్ట్రాలకు చెందిన వ్యవసాయ మంత్రులతో విజయవంతంగా సమావేశాలు నిర్వహించడం ద్వారా వ్యవసాయ రంగంలో రాష్ట్రాలు మెరుగుపడేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని అన్నారు.ధాన్యం ఉత్పత్తిని పెంచడం, నాణ్యమైన విత్తనాలను అందించడం, రైతులకు నష్టపరిహారం అందించడం, సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, ధాన్యాలకు సరైన నిల్వ సౌకర్యాలు కల్పించడం వంటి వాటితో పాటు ప్రపంచానికి భారతదేశాన్ని ఆహార కేంద్రంగా స్థాపించడం వంటివి ప్రభుత్వ లక్ష్యాలని చౌహాన్ వివరించారు. రబీ సీజన్లో ఆవాలు, శనగలు మొదలైన పంటల సాగుపై ప్రత్యేక దృష్టి సారిస్తాము. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేకి అన్న కాంగ్రెస్ ఆరోపణలపై శివరాజ్‌సింగ్ చౌహాన్ స్పందిస్తూ.. ప్రతిపక్షాల ప్రశ్నలకు వచ్చే సమావేశంలో సమాధానాలు చెబుతామని వెల్లడించారు. -
బంజరు భూమిని బంగరు భూమి చేసింది
‘కలిసి ఉంటేనే కాదు కష్టపడితే కూడా కలదు సుఖం’ అని అనుభవపూర్వకంగా తెలుసుకుంది సంతోష్ దేవి.తన రెక్కల కష్టంతో బంజరు భూమిని బంగరు భూమిగా మార్చింది. ఎంతోమంది రైతులను తన మార్గంలో నడిపిస్తోంది.రాజస్థాన్‌లోని సికార్ జిల్లా బేరి గ్రామంలో... 1.25 ఎకరాల బంజరు భూమితో సంతోష్ దేవి ఖేదార్ ప్రయాణం ప్రారంభమైంది. కుటుంబం వీడిపోవడంతో తన భర్త వాటాగా 1.25 ఎకరం భూమి వచ్చింది. భర్త రామ్ కరణ్ హోంగార్డ్. చాలీచాలని జీతం. దీంతో వ్యవసాయం వైపు మొగ్గు చూపింది సంతోష్‌దేవి.‘పది, ఇరవై ఎకరాలు ఉన్నవారికే దిక్కు లేదు. ఎకరంతో ఏం సాధిస్తావు? అప్పులు తప్ప ఏం మిగలవు!’ అన్నారు చాలామంది. ఈ నేపథ్యంలో ‘వ్యవసాయం లాభసాటి వ్యాపారం’ అని నిరూపించడానికి రంగంలో దిగింది సంతోష్ దేవి.‘నేను చదువుకోవాలని మా నాన్న కోరుకున్నారు. గ్రామీణ వాతావరణాన్ని ఇష్టపడే నాకు చదువుల కంటే వ్యవసాయం అంటేనే ఇష్టం’ అంటుంది సంతోష్‌దేవి. తాతగారి పొలంలో ఎప్పుడూ రసాయనిక ఎరువులు వాడకున్నా మంచి దిగుబడి వచ్చేది. ఇక్కడ మాత్రం భిన్నమైన పరిస్థితి. చాలా ఏళ్లుగా రసాయనాలు వాడడం వల్ల పొలం నిస్సారంగా మారింది. చుట్టు పక్కల నీటి వనరులు లేకపోవడంతో జొన్న, సజ్జలాంటి సంప్రదాయ పంటలే పండించేవారు.కలుపు మొక్కలతో గందరగోళంగా ఉన్న పొలాన్ని ఒక దారికి తేవడంతో మొదటి అడుగు వేసింది. రసాయనిక ఎరువుల స్థానంలో సేంద్రియ ఎరువులు వాడాలని నిర్ణయించుకుంది. దానిమ్మ పండించమని, తక్కువ భూమిలో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చని సికార్ వ్యవసాయ అధికారి సలహా ఇచ్చాడు. ఆ సలహా వారి జీవితాన్నే మార్చేసింది.220 దానిమ్మ మొక్కలను కొనడానికి గేదెను అమ్మేయాల్సి వచ్చింది. మొక్కలు కొనగా మిగిలిన డబ్బుతో పొలంలో గొట్టపు బావిని వేయించింది. నీటి ఎద్దడి ఉన్న ఆప్రాంతంలో బిందు సేద్య పద్ధతిని నమ్ముకుంది. చుక్క నీరు కూడా వృథా చేయవద్దని నిర్ణయించుకుంది. జనరేటర్‌ను అద్దెకు తీసుకుంది. గ్రామంలోని ఎంతోమంది రైతుల సలహాలు తీసుకొని సేంద్రియ ఎరువు తయారీ మొదలుపెట్టింది. లేయర్ కటింగ్, సేంద్రియ పురుగు మందులకు బెల్లం కలపడంలాంటి రకరకాల టెక్నిక్‌ల గురించి తెలుసుకుంది. మూడేళ్ల కఠోర శ్రమ ద్వారా దానిమ్మ పండ్ల తొలి దిగుబడితో మూడు లక్షల లాభం వచ్చింది. సేంద్రియ ఎరువును ఎక్కువగా వాడడం వల్ల నేల సారవంతంగా మారింది.భర్త పోలీస్‌స్టేషన్ నుంచి వచ్చిన తరువాత, పిల్లలు స్కూలు నుంచి వచ్చిన తరువాత నేరుగా పొలానికే వెళ్లేవాళ్లు. ‘ఫలితం ఎలా ఉండబోతుందో తెలియదు. కాని బాగా కష్టపడాలనుకున్నాం’ అని ఆ రోజులను గుర్తు చేసుకుంది సంతోష్‌దేవి. పండ్లతోటను నిర్వహించే అనుభవం రావడంతో యాపిల్‌లాంటి ఇతర పండ్లను పండించడంపై దృష్టి పెట్టింది.దానిమ్మ మొక్కల మధ్య నిర్దిష్టమైన దూరం ఉండాలి. ఆ ఖాళీ స్థలంలో కలుపు లేకుండా చూడాలి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆ ఖాళీల మధ్య మోసంబి మొక్కలు నాటింది. ఇది కూడా మంచి ఫలితాన్ని ఇచ్చింది. ఆ తరువాత నిమ్మ నుంచి బెల్‌లాంటి ఎన్నో మొక్కలను నాటింది. పొలంలో సోలార్ ΄్యానెళ్లను ఏర్పాటు చేసుకోవడంతో ఖర్చు తగ్గింది.‘మన దేశంలో రైతులు పడుతున్న కష్టాలకు కారణం వారు పండిస్తున్న దానికి సరైన ధర లభించకపోవడమే. దళారులు లాభాలన్నీ అనుభవిస్తున్నారు’ అంటున్న సంతోష్‌దేవి ఒక్క పండును కూడా దళారులకు అమ్మదు. అన్ని పండ్లూ నేరుగా పొలంలోనే అమ్ముతారు.సంతోష్ సాధించిన విజయాన్ని చూసి గ్రామంలోని ఇతర రైతులు కూడా దానిమ్మ మొక్కలను పెంచడంప్రారంభించారు. అయితే చాలామంది విఫలమయ్యారు. అలాంటి వారు సంతోష్‌దేవిని సలహా అడిగేవారు. నాణ్యమైన మొక్కల కొరత వల్లే వారు విఫలమవుతున్నారు అని గ్రహించిన సంతోష్ దేవి ఆ లోటును భర్తీ చేయడానికి కొత్త మొక్కల కోసం ‘షెకావది కృషి ఫామ్ అండ్ నర్సరీ’ప్రారంభించింది.కష్టఫలంనేను, నా భర్త, పిల్లలు మాత్రమే పొలంలో పనిచేసేవాళ్లం. కూలీలతో పనిచేయించే స్థోమత మాకు లేదు. అయితే ఎప్పుడూ కష్టం అనుకోలేదు. ఇంట్లో ఎలా సంతోషంగా ఉంటామో, పొలంలో అలాగే ఉండేవాళ్లం. కబుర్లు చెప్పుకుంటూనే కష్టపడేవాళ్లం. మా కష్టం ఫలించినందుకు సంతోషంగా ఉంది.– సంతోష్‌దేవి -
అధిక నిధులతోనే రైతుకు మేలు
దేశంలో దాదాపు 60 శాతం మంది రైతులు ఏమాత్రం అవకాశం ఉన్నా సరే... వ్యవసాయం మానేయాలని కోరుకుంటున్నారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. దీనికి ప్రధాన కారణం నష్టాలు! 54 ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో వ్యవసాయ నష్టాలను పూడ్చేందుకు బడ్జెట్ మద్దతును అందించని ఏకైక దేశం భారత్ మాత్రమే. ఇప్పటికీ వ్యవసాయ రంగ వృద్ధి కేవలం 1.4 శాతం మాత్రమే. వ్యవసాయాన్ని ఉద్దేశపూర్వకంగా దారిద్య్రంలో ఉంచడం దీనికి కారణం. అసమానతలను పెంచిపోషిస్తున్న ఆర్థిక సిద్ధాంతాలను ఇంకా పట్టుకుని వేలాడటంలో అర్థం లేదు. అత్యధిక జనాభా వ్యవసాయంలో ఉన్న దేశంలో దానికి అనులోమంగానే బడ్జెట్లో స్థిరంగా కొన్నేళ్లు కనీసం 50 శాతం వ్యవసాయ, గ్రామీణ రంగాలకు కేటాయించాలి.అది 1996వ సంవత్సరం. ఎన్నికల ఫలితాలు వెలువడి అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధానమంత్రిగా ఎన్నికైనట్లు ప్రకటించారు. ఒకటీ రెండు రోజుల తర్వాత, న్యూఢిల్లీలో కొంతమంది ఆర్థికవేత్తలతో ఆంతరంగిక సమా వేశం జరిగింది. ప్రధానమంత్రిగా ఎన్నికైన వాజ్‌పేయి రాకపోవడంతో, మరో రాజకీయ ప్రముఖుడు మురళీ మనోహర్ జోషి ఆ సమా వేశానికి అధ్యక్షత వహించారు.ప్రజా వ్యతిరేకతను ఎదుర్కోకుండా ఉండాలంటే, ఎన్డీఏ ప్రభుత్వం ఎలాంటి ఆర్థిక విధానాలను తీసుకురావాలో సూచించాలని ఆ సమావేశంలో ఆర్థికవేత్తలను కోరారు. హాజరైన చాలామంది ద్రవ్య లోటును నిశితంగా పరిశీలించాలనీ, కరెంట్ ఖాతా లోటును తగ్గించే మార్గాలను కనుగొనాలనీ అభిప్రాయం వెలిబుచ్చారు. కీలకమైనవిగా గుర్తించిన సమస్యలపై చాలా చర్చ జరిగింది. ఉపాధిని సృష్టించడం, తయారీని పెంచడం, ఎగుమతుల ఆర్థిక వ్యవస్థను నిర్మించడం వంటి ఇతర ముఖ్యమైన సమస్యలపై కూడా చర్చ జరిగింది.విధానపరమైన ప్రాధాన్యం దేనిపై ఉండాలో సూచించమని నన్ను అడిగినప్పుడు, వ్యవసాయంలో నిమగ్నమై ఉన్న 60 శాతం జనాభాకు బడ్జెట్లో 60 శాతం మేరకు అందించాలని నేను సమాధాన మిచ్చాను. అక్కడ ఉన్న నా సహచరుల్లో చాలామంది నాతో ఏకీభవించలేదు. వ్యవసాయానికి 60 శాతం బడ్జెట్‌ను కేటాయిస్తే ఆర్థిక వ్యవస్థ పతనమవుతుందని కొందరు హెచ్చరించారు. పరిశ్రమలు, మౌలిక సదుపాయ రంగాలకు భారీ కేటాయింపులు జరపాలనీ, దాన్నే అధిక ఆర్థిక వృద్ధికి దారితీసే కచ్చితమైన మార్గంగా తీసుకోవాలనీ వారు నొక్కి చెప్పారు. అయితే కొత్త నమూనాకూ, ఆర్థిక చింతనకూ ఇదే సమయమనీ, వ్యవసాయానికి తగిన బడ్జెట్ కేటాయింపు చేయకపోతే దేశం సర్వతోముఖంగా అభివృద్ధి చెందదనీ నేనూ నొక్కిచెప్పాను. నా సలహా ప్రధాన స్రవంతి ఆర్థికవేత్తల ఆలోచనతో పొసగదని నాకు తెలుసు. కానీ, ప్రభుత్వ వ్యతిరేకతను తప్పించుకోవడానికి ఉన్న ఏకైక మార్గం వ్యవసాయంలో, గ్రామీణాభివృద్ధిలో తగినంత పెట్టుబడి పెట్టడమేనని నా అవగాహన. మా అభిప్రాయాలను ప్రధానికి తెలియ జేస్తానని జోషి చెప్పడంతో సమావేశం ముగిసింది.కొన్ని రోజుల తర్వాత, కొత్త ప్రభుత్వం వ్యవసాయానికి 60 శాతం బడ్జెట్‌ను కేటాయించాలనే ఉద్దేశాన్ని ప్రకటించినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. వ్యవసాయంలో చాలా వనరులను అందుబాటులో ఉంచాల్సిన అవసరం గురించి మీడియాలో కోలాహలం చెలరేగింది. చాలామంది నిపుణులు దీనివల్ల ఆర్థిక వ్యవస్థ తిరోగమిస్తుందని అన్నారు. నా వాదన ఏమిటంటే, భారతదేశం అధిక వృద్ధి పథం వైపు సాగుతున్నప్పుడు, గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న తన జనాభాలో మూడింట రెండు వంతుల మందిని వెనుకే విడిచిపెట్టడం సాధ్యం కాదు.ఇది సాధ్యం చేయాలంటే, రాజకీయ తత్వవేత్త జాన్ రాల్ సూచించిన న్యాయసూత్రాలకు అనుగుణంగా నడుచుకోవాలంటే, మన విధాన ప్రయత్నం భిన్నంగా ఉండాలి. మానవ మూలధన పెట్టు బడికి, వ్యవసాయాన్ని పునర్నిర్మించడానికి, ఆరోగ్యం, విద్యారంగా లతో సహా గ్రామీణ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడానికి తగిన ఆర్థిక వనరులను కల్పించాలి. ఈ క్రమంలో, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పునరుజ్జీవింపజేయవచ్చు. క్లుప్తంగా చెప్పాలంటే, ఆర్థిక చింతనలో, విధానాల్లో కీలక మార్పు తేవడం వల్లనే, ప్రధానమంత్రి ఇప్పుడు చెబుతున్న ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’ను నిజం చేయ వచ్చు. అయితే, వాజ్‌పేయి ప్రభుత్వం 13 రోజులు మాత్రమే కొన సాగింది. దాంతో మార్పునకు బలమైన పునాది వేయగలిగే ఆశ కూడా ఉనికిలో లేకుండా పోయింది.నేను దీన్ని ఎందుకు పంచుకుంటున్నానంటే, మొత్తం బడ్జెట్లో వ్యవసాయానికి కేటాయింపులు మరింత తగ్గాయి. లక్షలాదిమంది జీవనోపాధికి వ్యవసాయం బాధ్యత వహిస్తున్న నేపథ్యంలో ఇది ఆందోళనకరం. బడ్జెట్లో వ్యవసాయం వాటా 2019–20లో అప్పటికే కనిష్ఠంగా ఉన్న 5.44 శాతం నుంచి, 2024–25లో 3.15 శాతానికి పడి పోయింది. వనరుల కేటాయింపులపై ఆధిపత్యం చలాయించేది రాజకీయ ఆర్థిక కారకాలు (బడా వ్యాపారులచే ఎక్కువగా ప్రభా వితమవుతాయి) అని గ్రహించినప్పుడు, తప్పు మార్గాలేమిటో స్పష్టంగా కనిపిస్తాయి. జనాభాలో 42.3 శాతం మంది ఇప్పటికీ వ్యవసాయంలో నిమగ్నమై ఉండగా, దాని వృద్ధి కేవలం 1.4 శాతంగా ఉంటోందంటే ఆశ్చర్యపోనవసరం లేదు. ఇంకా దారుణంగా, సగటు వ్యవసాయ ఆదాయాలు బాగా క్షీణించాయి. వాస్తవ గ్రామీణ వేతనాలు దశాబ్ద కాలంగా స్తబ్దుగా కొనసాగుతున్నాయి. నేను తరచుగా చెప్పినట్లు, వ్యవసాయాన్ని ఉద్దేశపూర్వకంగా దారిద్య్రంలో ఉంచడం దీనికి కారణం.దేశంలో దాదాపు 60 శాతం మంది రైతులు ఏమాత్రం అవకాశం ఉన్నా సరే... వ్యవసాయం మానేయాలని కోరుకుంటున్నారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. మరి భారతీయ రైతులు ఇంత దారుణంగా ఎలా నష్టపోతున్నారని మీరు ఆలోచిస్తున్నట్లయితే, ‘ఆర్గనై జేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ – డెవలప్మెంట్’ (ఓఈసీడీ) చేసిన ఇటీవలి అధ్యయనం పనికొస్తుంది. భారతీయ వ్యవసాయం అట్టడుగున ఉండటమే కాక, 2022లో 20.18 శాతం ప్రతికూల స్థూల వ్యవసాయ జమను (మైనస్) అందుకుంది. అయితే, 54 ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో ఈ వ్యవసాయ నష్టాలను పూడ్చేందుకు బడ్జెట్ మద్దతును అందించని ఏకైక దేశం భారత్ మాత్రమే.జనాభాలో దాని వాటాకు అనులోమానుపాతంలో కొన్ని సంవత్సరాలపాటు వ్యవసాయానికి సరైన వనరులను అందించినట్ల యితే, అది అద్భుతమైన ఆర్థిక పరిపుష్టిని సంతరించుకుంటుంది. వనరుల కేటాయింపులు తగ్గుముఖం పట్టిన తర్వాత, వ్యవసాయ రంగంలో అద్భుతం జరుగుతుందని ఆశించడం వ్యర్థం. 1996లో అప్పటి ఎన్డీఏ ప్రభుత్వం వ్యవసాయం, గ్రామీణాభివృద్ధికి బడ్జెట్లో 60 శాతం వాటాను అందించడానికి అంగీకరించి ఉంటే, నేటివరకు అది కొనసాగి ఉంటే, భారతదేశ గ్రామీణ ముఖచిత్రం పూర్తిగా మారి పోయి ఉండేది.ఇప్పుడు కూడా, వ్యవసాయంలో జనాభా 42.3 శాతంగా ఉన్నందున, రూ.48 లక్షల కోట్ల వార్షిక బడ్జెట్లో కనీసం 50 శాతం వ్యవసాయ, గ్రామీణ రంగాలకు కేటాయించాలని చెప్పడానికి బలమైన కారణాలు ఉన్నాయి. పేదలు, మహిళలు, యువత, అన్న దాత అనే నాలుగు కొత్త ‘కులాలను’ చేరుకోవడానికి బహుశా ఇది ఉత్తమ మార్గం. వాస్తవానికి, వ్యవసాయం అన్ని రకాల కుల రూపాలకు జీవనోపాధిని అందిస్తుంది. వ్యవసాయంలో తగిన వనరులను ఉంచడం, పనితీరును మెరుగుపర్చడం వల్ల స్థిరమైన జీవనోపాధిని నిర్మించడమే కాకుండా వ్యాపారాన్ని సమర్థంగా నిర్వహించే ఆకాంక్ష లను కూడా ప్రోత్సహిస్తుంది. వ్యవసాయంలో తగిన పెట్టుబడులను కల్పిస్తే అవి ప్రపంచంలోని 75 శాతం మంది పేదల పేదరికాన్ని తగ్గించడంలో సహాయపడతాయని ప్రపంచ బ్యాంకు కూడా ఎక్కడో అంగీకరించింది.ప్రపంచంలోని అత్యంత సంపన్నులైన 1 శాతం మంది, దిగువన ఉన్న 95 శాతం కంటే ఎక్కువ సంపదను కూడబెట్టుకున్న తరుణంలో... అసమానతలను మరింత పెంచిన ఆర్థిక సిద్ధాంతాలను పట్టుకుని వేలాడటంలో అర్థం లేదు. కాబట్టి భారతదేశం, దాని సొంత గాథను లిఖించవలసిన అవసరం ఉంది. ఇదంతా వ్యవసాయాన్ని పునరుజ్జీవింపజేయడం ద్వారా ప్రారంభమవుతుంది.దేవీందర్ శర్మ వ్యాసకర్త ఆహార, వ్యవసాయ రంగ నిపుణులుఈ–మెయిల్: hunger55@gmail.com -
ఆర్య ఏజీ, బిల్ అండ్ మెలిండా గేట్స్ ఆధ్వర్యంలో విజయవంతంగా రిత్ సమ్మిట్ 2.0
భారత్‌లో అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ గ్రెయిన్ కామర్స్ ప్లాట్‌ఫారమ్. ఆర్య ఏజీ (arya.ag) బిల్ గేట్స్, మెలిండా ఫ్రెంచ్ గేట్స్ స్థాపించిన అమెరికన్ ప్రైవేట్ ఫౌండేషన్ బిల్& మెలిండా గేట్స్ ఫౌండేషన్‌తో కలిసి దేశ రాజధాని ఢిల్లీలో రిత్ సమ్మిట్ రెండో ఎడిషన్‌ను విజయవంతంగా నిర్వహించింది. ఇండియా హాబిటాట్ సెంటర్లో జరిగిన ఈ రిట్ సమ్మిట్ ప్రముఖ అగ్రిబిజినెస్లు, టెక్నాలజీ ప్రొవైడర్లు, అంతర్జాతీయ నిపుణులు, అభివృద్ధి సంస్థలను ఒకచోట చేర్చిందివీరంతా వ్యవసాయ రంగంలో వాతావరణ స్థితిస్థాపకతను పెంపొందించడానికి భాగస్వామ్యాలు, కార్యక్రమాలు, ఆచరణాత్మక సాంకేతికతలను అన్వేషించడానికి వ్యవసాయ కమ్యూనిటీలకు స్థిరమైన భవిష్యత్తును అందించడంలో సహాయపడటానికి నిపుణులను కనెక్ట్ చేయడానికి, జ్ఞానాన్ని పంచుకోవడానికి, వినూత్న పరిష్కారాలను కనుగొనడానికి సమ్మిట్ ఒక వేదికగా మారింది.arya.ag. సహ వ్యవస్థాపకులు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆనంద్ చంద్ర తన ప్రసంగంతో సమ్మిట్‌ను ప్రారంభించారు. వాతావరణాన్ని తట్టుకోగలిగేలా వ్యవసాయం చేయడానికి ప్రతి ఒక్కరికీ ప్రయోజనం చేకూర్చే మార్కెట్-నేతృత్వంలోని నమూనా ప్రాముఖ్యతను తెలియజేశారు. దేశంలో అతిపెద్ద, ఏకైక లాభదాయకమైన అగ్రిటెక్ కంపెనీని నిర్మించడమే లక్ష్యమని తెలిపారు.ప్రతి వాటాదారులకు ప్రయోజనం చేకూర్చే మార్కెట్ నేతృత్వంలోని నమూనాను రూపొందించకపోతే వ్యవసాయ వాతావరణాన్ని స్థితిస్థాపకంగా మార్చడం అసాధ్యమని పేర్కొన్నారు, వాటాదారులందరూ కలిసి ఈ దిశలో తమ వంతు కృషి చేసేందుకు కట్టుబడి ఉంటే తప్ప ఇది కూడా సాధ్యం కాదని, అలాగే రిత్ వెనుక ఉన్న మా తత్వశాస్త్రం అదేనని ఆనంద్ పేర్కొన్నారు. -
సుస్థిర వ్యవసాయం, ఆహార భద్రతకు మరింత ఊతం
న్యూఢిల్లీ: కేంద్ర వ్యవసాయ శాఖ పరిధిలోని కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలను రెండు పథకాలు... పీఎం రాష్ట్రీయ కృషి వికాస్ యోజన, కృషోన్నతి యోజనగా హేతుబద్దీకరించాలన్న ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దేశంలో సుస్థిర వ్యవసాయం, ఆహార భద్రతకు మరింత ప్రోత్సాహం ఇవ్వడమే లక్ష్యంగా ఈ రెండు భారీ పథకాలకు ఆమోద ముద్ర వేసింది. రూ.లక్ష కోట్లకుపైగా నిధులతో పీఎం రాష్ట్రీయ కృషి వికాస్ యోజన(పీఎం–ఆర్కేవీవై), కృషోన్నతి యోజన(కేవై)ను అమలు చేసేందుకు అంగీకారం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ గురువారం సమావేశమైంది. పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సుస్థిర వ్యవసాయానికి ఊతం ఇవ్వడానికి, పీఎం–ఆర్‌కేవైవీ, ఆహార భద్రతలో స్వయం సమృద్ధి కోసం కృషోన్నతి యోజనను అమలు చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ రెండు పథకాల మొత్తం వ్యయం రూ.1,01,321 కోట్లు కాగా, ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా రూ.69,088 కోట్లు, రాష్ట్రాల వాటా రూ.32,232 కోట్లు. పీఎం–ఆర్‌కేవీవైకి రూ.57,074 కోట్లు, కృషోన్నతి యోజనకు రూ.44,246 కోట్లు ఖర్చు చేస్తారు. దాదాపు 18 పథకాలను ఈ రెండు పథకాలుగా హేతుబద్దీకరిస్తారు. రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో వీటిని అమలు చేస్తారు. » వంట నూనెల ఉత్పత్తిని భారీగా పెంచి, స్వయం సమద్ధి సాధించడానికి ‘నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్–ఆయిల్ సీడ్స్’కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలియజేసింది. రూ.10,103 కోట్లతో 2024–25 నుంచి 2030–31 వరకు ఈ కార్యక్రమం అమలు చేస్తారు. 2030–31 నాటికి దేశంలో నూనె గింజల ఉత్పత్తిని 69.7 మిలియన్ టన్నులకు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే నూనె గింజల సాగును అదనంగా 40 లక్షల హెక్టార్లు పెంచాలని నిర్ణయించింది. » మరాఠి, పాళీ, ప్రాకతం, అస్సామీ, బెంగాలీ భాషలకు ప్రాచీన భాష హోదా కల్పించేందుకు కేంద్ర కేబినెట్ అంగీకరించింది. ఈ చరిత్రాత్మక నిర్ణయమని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. భారతీయ భాషలకు ప్రాచీన హోదా ఇచ్చే విధానాన్ని 2004 అక్టోబర్ 12న కేంద్ర ప్రారంభించింది. ఇప్పటివరకు తమిళం, సంస్కతం, తెలుగు, కన్నడ, మలయాళం, ఒడియా భాషలకు ఈ హోదా లభించింది. »11.72 లక్షల మంది రైల్వే ఉద్యోగులకు ఉత్పాదక అనుసంధానిత బోనస్ చెల్లించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 78 రోజులకు గాను మొత్తం రూ.2,028.57 కోట్లు చెల్లించనున్నట్లు అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. రైల్వే శాఖ పనితీరును మరింత మెరుగుపర్చడానికి ప్రోత్సాహకంగా ఉద్యోగులకు ఈ బోనస్ చెల్లిస్తుంటారు. » చెన్నై మెట్రో రైలు ప్రాజెక్టు రెండో దశకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. -
డ్రోన్ల వినియోగంతో పెరిగిన సాగు ఉత్పత్తి
న్యూఢిల్లీ: డ్రోన్ టెక్నాలజీ కంపెనీ ఐవోటెక్ వరల్డ్ ఏవిగేషన్, రైతుల కోపరేటివ్ సొసైటీ ఇఫ్కో మధ్య భాగస్వామ్యం.. సాగు ఉత్పాదకత పెంపునకు తోడ్పినట్టు ఈ సంస్థలు ప్రకటించాయి. 2023 డిసెంబర్లో ఈ సంస్థలు భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. ఇందులో భాగంగా 500 డ్రోన్లను రైతులకు సమకూర్చాయి. సాగులో అత్యాధునిక టెక్నాలజీతో కూడిన డ్రోన్ల సాయాన్ని అందించాయి. ఇది 11 రాష్ట్రాల పరిధిలో 500 రైతులపై సానుకూల ప్రభావం చూపించినట్టు ఈ సంస్థలు వెల్లడించాయి.అగ్రిబోట్ డ్రోన్ కస్టమర్లకు ఈ సంస్థలు ఇటీవలే ప్రత్యేక పరిమిత కాల ఆఫర్‌ను కూడా ప్రకటించాయి. దీని కింద రైతులకు ఎలాంటి గరిష్ట విస్తీర్ణం పరిమితి లేకుండా ఇఫ్కో డ్రోన్లను అందిస్తుంది. పంటల నిర్వహణ, సామర్థ్యాలను పెంచడం దీని ఉద్దేశ్యమని ఇవి తెలిపాయి. ఒక డ్రోన్ ఆరు ఎకరాలకు ఒక గంటలో స్ప్రే చేసే సామర్థ్యంతో ఉంటుందని, ఒకటికి మించిన బ్యాటరీ సెట్‌తో ఒక రోజులో ఒక డ్రోన్‌తో 25 ఎకరాలకు స్ప్రే చేయొచ్చని తెలిపాయి. -
రైతుల ఆదాయం పెంచే ‘మౌలిక నిధి’
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి రైతుల పట్ల గల అమిత శ్రద్ధ, వారి జీవితాల్లో వెలుగులు నింపాలన్న తాపత్రయం ఆయన రైతుల కోసం తీసుకున్న నిర్ణయాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. అన్నదాతల జీవితాలను మార్చడమే ప్రధాని మొదటి, అత్యంత ప్రాధాన్య లక్ష్యం. అందుకే ఎన్డీయే ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తొలి 100 రోజుల్లో వ్యవసాయం, రైతులకు అధిక ప్రాధాన్యం కొనసాగించారు. రైతుల ఆదాయాన్ని పెంచడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ‘వ్యావసాయిక మౌలిక సదుపాయాల నిధి’ (ఏఐఎఫ్), ‘పీఎం ఆశా’ వంటి పథకాలలో ఈ నిబద్ధత స్పష్టంగా ప్రతిబింబిస్తుంది. ముఖ్యంగా ఏఐఎఫ్ రూపంలో సుస్థిర పరిష్కారాన్ని అందించడం ద్వారా రైతుల సాధికారతకు ప్రభుత్వం గణనీయమైన సహకారం అందిస్తోంది.దేశంలో పంట కోత అనంతర నష్టాలు ఒక పెద్ద సవాలు. ఇది వ్యవసాయ రంగ ఉత్పత్తిని ప్రభావితం చేస్తోంది. లక్షలాది రైతుల శ్రమను నీరుగారుస్తోంది. తాజా అంచనాల ప్రకారం, దేశంలో ప్రతి ఏటా మొత్తం ఆహార ఉత్పత్తిలో 16–18% ఈ విధంగా నష్టపోతున్నాం. పంట కోత, నిల్వ, రవాణా, ప్రాసెసింగ్ వంటి వివిధ సందర్భాల్లో ఈ తరహా నష్టాలను చూస్తున్నాం. సరైన నిల్వ, శీతలీకరణ సదుపాయాలు లేకపోవడం, తగిన శుద్ధి యూనిట్ల కొరత, సమర్థమైన రవాణా సదుపాయాలు లేని కారణంగా ఈ భారీ నష్టాలు ఎదురవుతున్నాయి. ఇది మొత్తం ఆహార భద్రతపై దుష్ప్రభావం చూపిస్తోంది.నిల్వ సదుపాయాలు పెరిగాయిమోదీ సమర్థ నాయకత్వంలో శాస్త్రజ్ఞుల పరిశోధనలను ప్రయోగశాల నుంచి వ్యవసాయ క్షేత్రాలకు తీసుకువెళ్లడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ‘ఆత్మనిర్భర్ భారత్’ కార్యక్రమంలో భాగంగా 2020 జూలైలో ‘ఏఐఎఫ్’ను ప్రధాని ప్రారంభించారు. రైతుల ఆదాయాన్ని పెంచడం, పంట తరువాతి నిర్వహణ సమస్యలను పరిష్కరించడం, తద్వారా ఆహార నష్టాన్ని తగ్గించడం దీని ప్రధాన లక్ష్యం. కొత్త ప్రాజెక్టులు, కొత్త తరం సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించడం ద్వారా ఈ సవాళ్లను ఎదుర్కోవాలి. ఏఐఎఫ్ కింద బ్యాంకులు 9 శాతం వడ్డీ పరిమితితో ఏడాదికి 3 శాతం వడ్డీ రాయితీ రుణాలు, ‘సీజీటీఎంఎస్ఈ’ (క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ట్రస్ట్ ఫర్ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ ప్రైజెస్) కింద ఆర్థిక సంస్థలు రూ. 2 కోట్ల వరకు రుణాలు అందిస్తాయి. ఈ పథకంలో భాగంగా గత ఆగస్టు వరకు మంజూరు చేసిన మొత్తం రూ. 47,500 కోట్లు దాటింది. ఇందులో రూ. 30 వేల కోట్లకు పైగా ఇప్పటికే వివిధ ప్రాజెక్టులకు కేటాయించారు. మంజూరైన ప్రాజెక్టుల్లో 54 శాతం... రైతులు, సహకార సంఘాలు, వ్యవసాయ ఉత్పత్తి సంస్థలు, స్వయం సహాయక సంఘా లకు అనుసంధానం కావడం విశేషం. ఇది పొలాల వద్దే మౌలిక సదుపాయాలను అందించడంలో రైతుల బలమైన భాగస్వామ్యాన్ని ప్రతిబింబిస్తుంది.పంట నష్టాల నుంచి రైతులను కాపాడటానికి నిల్వ (డ్రై, కోల్డ్ స్టోరేజీలు), రవాణా మొదలైన మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రధాని ప్రాధాన్యమిస్తున్నారు. డ్రై స్టోరేజ్ పరంగా చూస్తే, దేశంలో 1,740 లక్షల మెట్రిక్ టన్నుల పంటను నిల్వ చేసే సదుపాయాలు మాత్రమే ఉన్నాయి. ఇంకా 44% కొరత ఉంది. ఇది ఆందోళన కలిగించే విషయం. ఉద్యాన ఉత్పత్తుల కోసం, దేశంలో సుమారు 441.9 లక్షల మెట్రిక్ టన్నుల కోల్డ్ స్టోరేజీ అందుబాటులో ఉంది. ఈ సామర్థ్యం దేశంలోని పండ్లు, కూరగాయల ఉత్పత్తిలో 15.72% మాత్రమే. ఈ పరిస్థితుల్లో ఏఐఎఫ్ వల్ల సుమారు 500 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్య అంతరాన్ని తగ్గించడానికి వీలైంది. దీనివల్ల పంట కోత అనంతర నష్టం రూ. 5,700 కోట్లు ఆదా అవుతుంది. సరైన కోల్డ్ స్టోరేజీ సౌకర్యాలను అభివృద్ధి చేయడం వల్ల ఉద్యాన ఉత్పత్తుల నష్టం 10% తగ్గింది. పాతిక లక్షల మందికి ఉపాధివ్యవసాయ మౌలిక సదుపాయాల వృద్ధి, అభివృద్ధికి ఏఐఎఫ్ కొత్త ఉత్తేజాన్ని అందిస్తోంది. గత ఆగస్టు నాటికి దేశవ్యాప్తంగా 74,695 వ్యవసాయ మౌలిక సదుపాయాలకు సంబంధించిన కార్యక్రమాలకు ఏఐఎఫ్ కింద ఆమోదం లభించింది. వీటిలో 18,508 కస్టమ్ హైరింగ్ సెంటర్లు, 16,238 ప్రాథమిక ప్రాసెసింగ్ సెంటర్లు, 13,702 గోదాములు, 3,095 సార్టింగ్ అండ్ గ్రేడింగ్ యూనిట్లు, 1,901 కోల్డ్ స్టోర్స్, కోల్డ్ చైన్లు, 21,251 ఇతర రకాల మౌలిక సదుపాయాలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టులు 2015 నుంచి వ్యవసాయ రంగంలో రూ. 78,702 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాయి. ఇది ఈ రంగంలో గణనీయమైన పురోగతిని సూచిస్తుంది. ప్రభుత్వ చర్యల వల్ల యువత కూడా వ్యవసాయం వైపు ఆకర్షితులవుతున్నారు. దేశంలో సుమారు 50,000 కొత్త వ్యవసాయ సంస్థలు ఏర్పాటయ్యాయి. ఇది రైతుల స్వావలంబనకు దారి తీస్తోంది. వ్యవసాయ రంగంలో ఆవిష్కరణలను ప్రోత్సహించే దిశగా ఇది ఒక ముఖ్యమైన అడుగు. ఈ ప్రయత్నాలు 8 లక్షలకు పైగా ఉపాధి అవకాశాలను సృష్టించదానికి దోహదపడ్డాయి. భవిష్యత్తులో ఈ సంఖ్య మరింత పెరుగుతుంది. ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా 25 లక్షల ఉద్యోగాల సృష్టికి దారితీస్తుంది. పొలాల్లో అధునాతన మౌలిక సదుపాయాల కల్పన వల్ల రైతులు తమ పంటలను నేరుగా ఎక్కువమందికి అమ్ముకోవడానికి వీలు కలిగింది. ఆధునిక ప్యాకేజింగ్, స్టోరేజీ వ్యవస్థల కారణంగా రైతులు మార్కెట్లలో తమ ఉత్పత్తులను మరింత సమర్థంగా అమ్ముకోగలుగుతారు. ఫలితంగా మంచి ధర దక్కుతుంది. ఈ యత్నాలు రైతుకు సగటున 11–14% అధిక ధరలను పొందడానికి వీలు కల్పిస్తున్నాయి.పూచీకత్తు భరోసా, వడ్డీ రాయితీ ద్వారా రుణ సంస్థలు తక్కువ రిస్క్‌తో రుణాలు ఇచ్చి, తద్వారా తమ వినియోగదారులకు సాయ పడతాయి. నాబార్డ్ రీఫైనాన్ ్స సదుపాయంతో వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధిని భాగస్వామ్యం చేయడం వల్ల ప్రాథమిక వ్యవ సాయ సహకార సంఘాల(పీఏసీఎస్) వడ్డీ రేటును ఒక శాతానికి తగ్గించడం గమనార్హం. దీంతో ఇలాంటి పీఏసీఎస్‌లతో సంబంధం ఉన్న వేలాది మంది రైతులకు గణనీయమైన ప్రయోజనాలు చేకూ రాయి. ఏఐఎఫ్ కింద 9,573 పీఏసీఎస్ ప్రాజెక్టులకు నాబార్డ్ ఇప్పటి వరకు రూ. 2,970 కోట్ల రుణం మంజూరు చేసింది.ఆరు సూత్రాల వ్యూహంవ్యవసాయాన్ని లాభసాటి వ్యాపారంగా మార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ఉత్పత్తిని పెంచడం, వ్యవ సాయ వ్యయాన్ని తగ్గించడం, ఉత్పత్తికి గిట్టుబాటు ధరలు కల్పించడం, ప్రకృతి వైపరీత్యాల సమయంలో తగిన ఉపశమనం కల్పించడం, వ్యవసాయం, ప్రకృతి సేద్యాన్ని వైవిధ్యపరచడం వంటి ఆరు సూత్రాల వ్యూహంతో ముందుకు వచ్చాం. హైడ్రోపోనిక్ వ్యవ సాయం, పుట్టగొడుగుల పెంపకం, వెర్టికల్ ఫామింగ్, ఏరోపోనిక్ వ్యవసాయం, పాలీహౌస్, గ్రీన్ హౌస్ వంటి ప్రాజెక్టులను రైతు సమూహాలు, సంఘాలకు మాత్రమే కేటాయించారు. వాటి పరిధిని విస్తరించడం ద్వారా వ్యక్తిగత లబ్ధిదారులు ఇప్పుడు ఈ ప్రాజె క్టులను చేపట్టడానికి ఏఐఎఫ్ కింద అనుమతులు పొందడానికి అర్హులయ్యారు. దీనికి అదనంగా, ‘పీఎం–కుసుమ్’ యోజనలోని ‘కాంపోనెంట్ ఎ’... బంజరు, బీడు, సాగు, పచ్చిక బయలు లేదా చిత్తడి భూములలో రెండు మెగావాట్ల వరకు సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసే సదుపాయాన్ని కల్పిస్తుంది. దీనిని సులభంగా ఎఐఎఫ్ పథకంతో అనుసంధానించవచ్చు. ఈ వ్యూహాత్మక సమ్మేళనం రైతులకు వ్యక్తిగ తంగా సహాయపడుతుంది. రైతు సమూహాలను సాధికారం చేస్తుంది. ‘అన్నదాత’ నుండి ‘ఉర్జాదాతా’ (ఇంధన ప్రదాత) వరకు వారి పాత్రను పెంచుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో విశ్వసనీయమైన ఇంధన మౌలిక సదుపాయాల అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది. విస్తృత స్థాయిలో మెరుగు పడిన సమాచార వ్యవస్థ, సమష్టి కృషితో రైతు సంక్షేమంలో కొత్త వెలుగులు ప్రసరిస్తున్నాయి. ‘వికసిత భారత్’లో భాగంగా అభివృద్ధి చెందిన వ్యవసాయ రంగ కలలను సాకారం చేయడంలో ఇదొక కీలక మైలురాయిగా నిలుస్తుంది.శివరాజ్ సింగ్ చౌహాన్ వ్యాసకర్త కేంద్ర వ్యవసాయం, రైతుల సంక్షేమం; గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి; మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి -
పొలాన్నే కాన్వాస్‌గా మార్చి.. సరికొత్త ఆర్ట్‌కి ప్రాణం పోసిన రైతు!
కొన్ని కళలను కళ్లారా చూడాల్సిందే తప్ప వాటికి కొత్త అర్ధాలు చెప్పలేం. కానీ, తన కళతో యువతకు ఏది ముఖ్యమో వివరిస్తున్నారు కేరళలోని వాయనాడ్‌కు చెందిన ప్రసీత్కుమార్ తయ్యిల్ అనే వ్యక్తి. ఇంతకీ ఏం చేశాడా అంటారా.. ఫొటో చూడండి... ఇంకా అర్ధం కాలేదు విషయమేంటో స్వయంగా తెలసుకోండి. వాయనాడ్‌లోని సుల్తాన్ బతేరీకి చెందిన ఒక రైతు తన వరి పొలాన్ని కాన్వాస్‌గా మార్చేశాడు. వివిధ రకాలైన వరి రకాల నారు ఉపయోగించి క్లిష్టమైన శివుని రూపాన్ని ఆవిష్కరించాడు. యువతను వ్యవసాయంవైపు మళ్లించేందుకు ఈ కళను సృష్టించాను అని చెబుతున్నాడు. ఆ రైతు పేరు ప్రసీద్ కుమార్ తయ్యిల్. వరి పొలంలో వరి కళకు ప్రాణం పోసిన ఈ రైతును అభినందించకుండా ఉండలేం. పంట పొలాలతో కళను సృష్టించడాన్ని పాడీ ఆర్ట్ అంటారు. ఇన్‌స్టాలేషన్‌లో టాన్బో ఆర్ట్ లేదా రైస్ పాడీ ఆర్ట్ అని పిలువబడే జపనీస్ కళారూపం ఇది. దీనిని వ్యూహాత్మక పద్ధతిలో నాటిన వేలాది వరి నారు పెరిగి, ఆ తర్వాత రెమ్మల ద్వారా ఓ రూపం కనిపిస్తుంది. అరుదైన వరి వంగడాలను సంరక్షించడమే ధ్యేయంగా! ఈ కళాత్మక వెంచర్ కోసం తన 10 ఎకరాల వరి పొలంలో 30 సెంట్ల భూమిని అంకితం చేశాడు శ్రీ కుమార్. తన ప్రయత్నం కేవలం సౌందర్యానికి సంబంధించినది కాదని చెబుతున్నాడు. ‘అరుదైన స్థానిక వరి జాతులను సంరక్షించడం, వాటిని ప్రచారం చేస్తూనే, వ్యవసాయం ఒక ఆచరణీయ వృత్తిగా యువతకు అవగాహన కల్పించడం లక్ష్యం‘ అంటున్నాడు. ఆర్ట్‌కి నాలుగు రకాల వంగడాలువరి కళతో పాటు కుమార్ వ్యవసాయంలో ఎన్నో అద్భుతాలను పండిస్తుంటాడు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి సేకరించిన ఔషధ గుణాలకు ప్రసిద్ధి చెందిన 100 రకాల వరి వంగడాలతో పంటలు పండించాడు. ఈ కళాకృతి కోసం మాత్రం నాలుగు విభిన్న వరి రకాలను ఉపయోగించాడు: నాజర్ బాత్ రకానికి ఊదా ఆకులతో, రక్తశాలి, చిన్నార్, జీరకసాల, ముదురు– లేత ఆకుపచ్చ ఆకులతో ఉంటాయి. పర్యాటకులకు ఆకర్షణ మంత్రకుమార్ మాట్లాడుతూ– ‘ఆధునికతరం వ్యవసాయం నుండి డిస్కనెక్ట్ అయినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా వరి సాగులో తరచుగా అధిక ఖర్చులతో తక్కువ రాబడి వచ్చేదిగా భావిస్తుంటారు. అయితే, మూడు దశాబ్దాలుగా జపాన్, చైనాలోని రైతులు వరి కళ వంటి వినూత్న పద్ధతులను ఆవలంబిస్తూ పర్యాటకులను ఆకర్షిస్తున్నారు. సాంప్రదాయ వ్యవసాయ రాబడితోపాటు గణనీయమైన అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు. సహజ సౌందర్యంతో వయనాడ్ దేశంలోనే ప్రముఖ టూరిజం హాట్‌స్పాట్‌గా మారుతోంది. జిల్లాలోని రైతులు తమ వరి పొలాలకు పర్యాటకులను ఆకర్షించగలిగితే, వారు మరిన్ని మెరుగైన ఆర్థిక ఫలితాలను సాధిస్తారు అని ఆయన చెప్పారు. కిందటేడాది విద్యార్థులు, రైతులు, పర్యాటకులతో సహా 10,000 కంటే ఎక్కువ మంది సందర్శకులు తన సైట్‌ను సందర్శించారని శ్రీ కుమార్ చెబుతున్నాడు.అంతేకాదు, ఈ వంగడాల ద్వారా ఆకర్షణీయమైన అదనపు ఆదాయాన్ని కూడా సంపాదిస్తున్నాడు. ఇప్పటికి పది సార్లు కుమార్ తన పొలాల్లో వరి కళాకృతిని రూపొందించాడు. ఈ ప్రాజెక్ట్ దాదాపు రూ.20,000 ఖర్చుతో కూడుకున్నది. ప్రారంభ రూపురేఖలను ముందగా నేలపైన గీసుకని, ఆ తర్వాత 36 మంది కార్మికులతో కూడిన బృందంతో ఈ ఆర్ట్‌ను సాధించాడు కుమార్. (చదవండి: ఈసారి వెకేషన్‌కి పోర్బందర్ టూర్..బాపూజీ ఇంటిని చూద్దాం..!) -
మహిళల కోసం కోర్టెవా అగ్రిసైన్స్ కొత్త ప్రోగ్రామ్
భారతదేశాన్ని వ్యవసాయ దేశంగా పిలుస్తారు. వ్యవసాయం అంటే ప్రధానంగా పురుషులే కనిపిస్తారు. ఈ రంగంలో మహిళలను కూడా ప్రోత్సహించదానికి కోర్టెవా అగ్రిసైన్స్ ఓ కొత్త ప్రోగ్రామ్ ప్రారంభించింది. దీని ద్వారా 20230 నాటికి దేశంలో 20 లక్షలమంది మహిళలను ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తోంది.కోర్టెవా అగ్రిసైన్స్ ప్రారంభించిన ఈ ప్రోగ్రామ్ ద్వారా.. రైతులను, పరిశోధకులను, వ్యవస్థాపకులను తయారు చేయనుంది. ఇది కేవలం కార్పొరేట్ రంగం అభివృద్ధి చెందడానికి మాత్రమే కాకుండా.. లింగ సమానత్వం, స్థిరమైన అభివృద్ధి, ఆర్థిక వృద్ధిని ఏకీకృతం చేయడానికి ఉపయోగపడుతుంది.గ్రామీణ జీవితానికి, వ్యవసాయానికి మహిళలు వెన్నెముక. మెరుగైన వ్యవసాయ పద్ధతులు, విద్య, స్థిరమైన వ్యవసాయ పద్ధతులను పొందడం ద్వారా మహిళలు జీవితాలను మెరుగు పరుస్తుందని.. కోర్టెవా అగ్రిసైన్స్ ప్రెసిడెంట్ 'సుబ్రొటో గీడ్' పేర్కొన్నారు. ఇది దేశాభివృద్ధికి కూడా సహాయపడుతుంది, వికసిత భారత్ వైవు అడుగుల వేస్తూ ఈ సామాజిక బాధ్యతను స్వీకరించడం గర్వంగా ఉందని ఆయన అన్నారు. -
అర్బన్ అగ్రికల్చర్ సుస్థిర అభివృద్ధికి దోహదం!
2030 నాటికి ప్రపంచాన్ని మెరుగ్గా తీర్చిదిద్దుకోవటానికి ఐక్యరాజ్యసమితి 2015లో ప్రపంచ దేశాలకు నిర్దేశించిన లక్ష్యాలే సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు (ఎస్.డి.జి.లు). ఇవి 17 రకాలు. ఈ లక్ష్యాల సాధన కృషి స్థితిగతులపై సమీక్షకు ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఈనెల 22–23 తేదీల్లో కీలక శిఖరాగ్రసభ ‘ఫ్యూచర్ 2024’ జరగనుంది. ఈ నేపథ్యంలో అర్బన్ అగ్రికల్చర్ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను ఏ విధంగా ప్రభావితం చేస్తోందో తెలుసుకునేందుకు ఒక అధ్యయనం జరిగింది. యూనివర్సిటీ ఆఫ్ గ్రోనింగెన్ (నెదర్లాండ్స్)కు చెందిన డాక్టర్ ప్రజల్ ప్రధాన్ సారథ్యంలోని పరిశోధకుల బృందం ఈ అధ్యయనం నిర్వహించింది. అర్బన్ అగ్రికల్చర్ ఎస్.డి.జి.ల సాధన కృషిపై చూపుతున్న సానుకూల ప్రభావాలతో ΄ాటు ప్రతికూల ప్రభావాలను చర్చించే 76,000 పరిశోధన పత్రాల్లో నుంచి 1,450ని ఎంపిక చేసి అధ్యయనం చేయటం విశేషం. ఈ తాజా అధ్యయన ఫలితాలను జర్నల్ సెల్స్ రి΄ోర్ట్ సస్టయినబిలిటీలో ప్రచురితమయ్యాయి.అర్బన్ అగ్రికల్చర్.. అంటే? నగరాలు, నగరాల పరిసరప్రాంతాల్లో ఇళ్లపైన, ఖాళీ స్థలాల్లో చేపట్టే వ్యవసాయ కార్యకలా΄ాలనే అర్బన్ అగ్రికల్చర్‌గా చెప్పచ్చు. నగర, పట్టణప్రాంతాల్లో ఇంటిపంటలు, మిద్దె తోటలు, పెరటి తోటలు, పశుపోషణ, పాడి పరిశ్రమలు. కోళ్లు, చేపల పెంపకం.. వంటి కార్యకలా΄ాలన్నీ ఈ కోవలోకే వస్తాయి. 17 ఎస్.డి.జి.లన్నిటితోనూ అర్బన్ అగ్రికల్చర్‌కు ప్రత్యక్షంగానో పరోక్షంగానో సంబంధం ఉంది. నాణానికి అవతలి వైపు..అర్బన్ అగ్రికల్చర్ వల్ల అభివృద్ధి లక్ష్యాల సాధనకు అంతా మేలే జరుగుతుందని చెప్పలేమని, చెడు కూడా జరుగుతోందని డాక్టర్ ప్రజల్ ప్రధాన్ స్పష్టం చేశారు. ‘అర్బన్ అగ్రికల్చర్ సుస్థిర అభివృద్ధికి ఎంతగానో దోహదం చేస్తోంది. అయితే, ప్రతికూల ప్రభావాన్ని బాగా తగ్గించే అర్బన్ అగ్రికల్చర్ పద్ధతులను ΄ాటించగలిగినప్పుడే దాని ద్వారా ప్రయోజనాలు ఒనగూడతాయి. ఐరాస 2024 ఫ్యూచర్ సమ్మిట్ లక్ష్యాల సాధనకు అర్బన్ అగ్రికల్చర్ దోహదపడేదైనప్పటికీ మరో కోణాన్ని కూడా ఆవిష్కరించటం కోసం ఈ అధ్యయనం చేశాం’ అన్నారాయన. వుహాన్ యూనివర్సిటీ (చైనా) అసోసియేట్ రిసెర్చ్ ప్రోఫెసర్ యుయాన్ఛావ్ హు మాట్లాడుతూ ‘ఎస్.డి.జి.ల సాధన కృషికి అర్బన్ అగ్రికల్చర్ ఎంతగానో దోహదం చేస్తుంది. అయితే, విభిన్న ప్రదేశాల్లో ఈ కార్యకలా΄ాల వల్ల ఎదురయ్యే సవాళ్లను స్థానిక పరిస్థితులకు అనుగుణంగా అధిగమించటం ముఖ్యం’ అన్నారు. అర్బన్ అగ్రికల్చర్ కార్యకలాపాలలో సుస్థిరతకు దోహదం చేసే పద్ధతులను అనుసరించటం ద్వారా ప్రతికూల ప్రభావాలను తగ్గించవచ్చు. వాతావరణ మార్పులను తట్టుకునే విధంగా నగరాల అభివృద్ధికి ఇది దోహదం చేస్తుంది. ‘అర్బన్ అగ్రికల్చర్ వల్ల చేకూరే అనుకూల, ప్రతికూల ప్రభావాల గురించి అందుబాటులో ఉన్న సైంటిఫిక్ లిటరేచర్ను విశ్లేషించడానికి మా అధ్యయనం ద్వారా కృషి చేశాం. మొత్తంగా చూసినప్పుడు అర్బన్ అగ్రికల్చర్ వల్ల ఆహారం, విద్య, సాంఘిక సదుపాయాలను కల్పించటంతో పాటు జీవవైవిధ్యాన్ని పెంపోందించేందుకు సుస్థిరత ఎలా చేకూరుతుందో శాస్త్రబద్ధంగా ఈ అధ్యయనం రుజువులు చూపింది’ అని డాక్టర్ ప్రజల్ ప్రధాన్ వివరించారు. తాజా పోషకాహారం లభ్యతపోషకాలతో కూడిన తాజా ఆహారోత్పత్తులను స్థానికంగానే అందుబాటులోకి తేవటం.. దూరప్రాంతాల నుంచి ఆహారాన్ని తరలించాల్సిన అవసరాన్ని తగ్గించటం.. ఆహారోత్పత్తుల్ని వందల కిలోమీటర్ల నుంచి తీసుకురావటానికి ఖర్చయ్యే ఇంధనాన్ని ఆదా చేయటం ద్వారా కాలుష్యాన్ని(ఫుడ్ మైల్స్‌ను) తగ్గించటం.. వివిధ సామాజిక వర్గాల ప్రజల మధ్య సాన్నిహిత్యాన్ని పెం΄÷ందించటం.. మానసిక ఆరోగ్యాన్ని పెం΄÷ందించటం వంటివి అర్బన్ అగ్రికల్చర్ ప్రయోజనాలని ఈ అధ్యయనం తేల్చింది. బీజింగ్ ఫారెస్ట్ యూనివర్సిటీ (చైనా) పరిశోధక విద్యార్థి దయ రాజ్ సుదేబ్ ఇలా అన్నారు:‘అవకాశాలను ఉపయోగించుకునేలా ప్రజలు, సంస్థలు, ప్రభుత్వాలు అర్బన్ అగ్రికల్చర్ పద్ధతుల్లో సుస్థిర లక్ష్యాల సాధన దిశగా పరివర్తన తేవాలి..’ప్రతిబంధకాలుశుద్ధమైన, చవక ఇంధనం లభ్యతకు సంబంధించి 3,6,7 సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు, జలచరాల జీవన భద్రతకు సంబంధించి 11,12,14,16 ఎస్.డి.జి.లకు సంబంధించి అర్బన్ అగ్రికల్చర్ ప్రతికూల ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. నీరు, ఇంధనం, ఎరువులు, పురుగుమందుల అధిక వాడకం వల్ల నేల, నీరు కలుషితం కావటం.. వనరులు ఉన్న వారికే ప్రయోజనాలను పరిమితం చేయటం ద్వారా పేదలకు ఫలితాలను అందించలేని పరిస్థితులు నెలకొనటం వంటి ప్రతిబంధనాలు అర్బన్ అగ్రికల్చర్‌కు ఉన్నట్లు ఈ అధ్యయనం గుర్తించింది. ఈ సవాళ్లను సమర్థవంతంగా అధిగమించడానికి చర్యలు తీసుకుంటే అర్బన్ అగ్రికల్చర్ సుస్థిర అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందనటంలో సందేహం లేదు. -
నిజమాడితే నేరమా!
‘వాస్తవాలు మొండిఘటాలు. అవి ఓ పట్టాన లొంగవు. గణాంకాలు అలా కాదు... అవి ఎటువంచితే అటు వంగుతాయి’ అంటాడు విఖ్యాత రచయిత మార్క్ ట్వైన్. పాలకులు గణాంకాలను ఇష్టానుసారం మార్చితే... నిజాలకు మసిపూస్తే ప్రమాదం. అయితే ఏ దేశంలోనైనా జరిగేది అదే అంటారు నిరాశా వాదులు. ఆ మాటెలా వున్నా కేంద్ర ప్రభుత్వం ప్రణబ్ సేన్ ఆధ్వర్యంలోని గణాంకాల స్థాయీ సంఘాన్ని ఇటీవల రద్దు చేసిన తీరు వాంఛనీయం కాదు. ఎన్ని విమర్శలున్నా, లోపాలున్నా గణాంకాలు పాలనా నిర్వహణలో కీలకపాత్ర పోషిస్తాయి. ప్రభుత్వాలు ప్రకటించే ఏ పథకానికైనా, రూపొందించే ఏ విధానానికైనా గణాంకాలే ప్రాతిపదిక. వివిధ మంత్రిత్వ శాఖలు నిర్వహించే సర్వేల ప్రక్రియ ఎలావుండాలో, పరిశోధనకు వేటిని పరిణనలోకి తీసుకోవాలో, దాని నమూనా ఏ విధంగా ఉండాలో కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖకు సిఫార్సులు చేయటం గణాంకాల కమిటీ ప్రాథమిక విధి. దీంతోపాటు వివిధ మంత్రిత్వ శాఖలు గణాంకాల మంత్రిత్వ శాఖకు సమర్పించే సర్వే నివేదికల తీరుతెన్నులెలా వున్నాయో నిశితంగా పరిశీలించి, సందేహాలు నివృత్తి చేసుకుని ఆ ఫలితాలను ప్రకటించటం కూడా కమిటీ పనే. దేశంలోనే తొలిసారి 2019లో కేంద్రం 14 మందితో ఈ కమిటీని నియమించినప్పుడు అందరూసంతోషించారు. నిరుడు ఆ కమిటీ పరిధిని విస్తరించారు కూడా. కానీ దాన్ని కాస్తా మొన్నీమధ్య రద్దు చేశారు. జాతీయ నమూనా సర్వేలకు సంబంధించి ఇటీవల స్టీరింగ్ కమిటీ ఏర్పాటైనందున గణాంకాల కమిటీని రద్దు చేస్తున్నామని కమిటీ సభ్యులకు చెప్పారు. అసలు అప్పటికే ఆ పనిలో ఓ కమిటీ నిమగ్నమై ఉండగా కొత్త కమిటీ ఎందుకు ఏర్పాటైనట్టు? దాన్ని చూపించి పాతది రద్దు చేస్తున్నామని చెప్పటంలో ఆంతర్యం ఏమిటి? వీటికి జవాబిచ్చేవారు లేరు. ప్రభుత్వాలు తీసుకునే ప్రతి నిర్ణయానికీ, వేసే ప్రతి అడుగుకూ గణాంకాలు ప్రాణం. ఏటా బడ్జెట్ ముందు ప్రవేశపెట్టే ఆర్థిక సర్వేనే తీసుకుంటే... దేశంలో ఆహారానికి జనం ఖర్చు చేస్తున్నదెంతో, అది పట్టణాల్లో ఎలావుందో గ్రామీణ ప్రాంతాల్లో ఎలా వుందో తెలుస్తుంది. నిరుద్యోగిత ఏ విధంగా వున్నదో, వ్యవసాయ రంగంపై ఆధారపడి పనిచేస్తున్నవారి సంఖ్య ఎంతో వెల్లడవుతుంది. జనం విద్యకు ఖర్చు చేస్తున్నదెంత... ఆరోగ్యానికి ఖర్చవుతున్నదెంత అనే వివరాలు కూడా తెలు స్తాయి. ఇక పేదరిక నిర్మూలన పథకాలు క్షేత్రస్థాయిలో ఏ మేరకు ప్రభావం చూపాయో, వాటిని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఎటువంటి చర్యలు అవసరమో నిర్ణయించుకోవటా నికి గణాంకాలు తోడ్పడతాయి. అయితే ఈ గణాంకాల విశ్వసనీయత తేలాలంటే ఒక గీటురాయి అవసరం. జనాభా గణాంకాలే ఆ గీటురాయి. విషాదమేమంటే మూడేళ్ల క్రితం ప్రారంభం కావా ల్సిన జన గణన ఇంతవరకూ మన దేశంలో మొదలుకాలేదు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచీ పదేళ్లకోసారి క్రమం తప్పకుండా నిర్వహిస్తున్న ఈ గణన కరోనా మహమ్మారి విరుచుకుపడటంతో సాగలేదు. వాస్తవానికి జనగణన నోటిఫికేషన్ పద్ధతిగా 2019 మార్చిలో విడుదలైంది. దాని ప్రకారం 2020 ఏప్రిల్–సెప్టెంబర్లమధ్య తొలి దశలో ఇళ్లు, కట్టడాలు, కుటుంబాలు వగైరాలకు సంబంధించిన సర్వే పూర్తి కావాలి. 2021 ఫిబ్రవరిలో జనాభా గణన ఉండాలి. కానీ 2020 మార్చితో మొదలై ఆ ఏడాది నవంబర్ వరకూ కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉండటంతో జనాభా గణన సాధ్యపడలేదు. ఆ తర్వాతైనా వెనువెంటనే ప్రారంభించాలని కేంద్రం అనుకోలేదు. అమెరికా, చైనాలతో సహా ప్రపంచంలో ఎన్నో దేశాలు కరోనా తీవ్రత తగ్గగానే చకచకా రంగంలోకి దిగి జనాభా గణనను జయప్రదంగా పూర్తిచేశాయి. కేవలం ఘర్షణ వాతావరణం నెలకొన్న లాటిన్ అమెరికా, ఆఫ్రికా దేశాల్లో మాత్రమే జన గణన జరగలేదు. మన దగ్గర ఎందుకు కాలేదో సంజా యిషీ ఇవ్వడానికి కూడా కేంద్రం సిద్ధపడలేదు.భిన్న మంత్రిత్వ శాఖలకు అనుబంధంగా ఉండే సంస్థలూ, ఇతరత్రా స్వచ్ఛంద సంస్థలూ క్రమం తప్పకుండా సర్వేలు చేస్తున్నాయి. కానీ వాటిని దేంతో సరిపోల్చుకోవాలి? ఏ ప్రాతిపదికన వాటిని విశ్వసించాలి? తాజా జన గణన లేదు కాబట్టి 2011 నాటి జనాభా లెక్కలే వీటన్నిటికీ గీటురాయిగా వినియోగిస్తున్నారు. కానీ ఇందువల్ల వాస్తవ చిత్రం ఆవిష్కరణ కాదు. ఉదాహరణకు 2011 జనగణన ప్రాతిపదికగా మన జనాభా 120 కోట్లని తేలింది. తాజాగా అది 140 కోట్లకు చేరుకుందని చెబుతున్నారు. కానీ పాత లెక్కన పేదరికాన్నీ, ఇతర స్థితిగతులనూ గణిస్తున్నందువల్ల 12 కోట్లమంది నిరుపేదలకు ప్రజాపంపిణీ వ్యవస్థ (పీడీఎస్) సదుపాయం వర్తించటం లేదని అంటున్నారు. తమ రాష్ట్ర జనాభా పెరిగినందువల్ల అదనపు కోటా కావాలని ఏ ప్రభుత్వమైనా ఏ ప్రాతి పదికన అడగాలి? అందుకు కేంద్రం ఎలా అంగీకరించాలి? అప్పుడప్పుడు వెలువడే ప్రపంచసంస్థల సర్వేలు పేదరికాన్నీ, నిరుద్యోగితనూ, ఇతరత్రా అంశాలనూ చూపుతూ మన దేశం వెనక బడి వుందని చెబుతుంటే కేంద్రం నిష్టూరమాడుతోంది. అక్కడివరకూ ఎందుకు... మన సర్వేల రూపకల్పన, అవి వెల్లడించే ఫలితాలు దేశంలో పేదరికం పెరిగినట్టు, అభివృద్ధి జరగనట్టు అభి ప్రాయం కలగజేస్తున్నాయని ప్రధాని ఆర్థిక సలహా మండలి సభ్యురాలు శామికా రవి ఆ మధ్య విమ ర్శించారు. ఈ విషయంలో ఆమెతో ప్రణబ్ సేన్‌కు వాగ్వాదం కూడా జరిగింది. బహుశా గణాంకాల కమిటీ రద్దు వెనకున్న అసలు కారణం అదేనా? ఇద్దరి వైఖరుల్లోనూ వ్యత్యాసానికి మూలం జన గణన జరపక పోవటంలో ఉంది. ఆ పనిచేయకుండా గణాంకాల కమిటీనే రద్దు పర్చటం ఉన్నదు న్నట్టు చూపుతున్నదని అలిగి అద్దాన్ని బద్దలుకొట్టడమే అవుతుంది. -
వంట గది నుంచి పంట పొలాల్లోకి...
‘అయిదు వేళ్లు కలిస్తేనే ఐకమత్యం’ అనేది ఎంత పాత మాట అయినా ఎప్పటికప్పుడు కొత్తగా గుర్తు తెచ్చుకోదగ్గ మాట. కేరళ రాష్ట్రం త్రిసూర్ జిల్లాలో ఎంతోమంది మహిళలు ‘ప్రకృతి’ పేరుతో స్వయం సహాయక బృందాలుగా ఏర్పడుతున్నారు. ‘ప్రకృతి’ చేసిన మహత్యం ఏమిటంటే... వంటగదికి మాత్రమే పరిమితమైన వారిని పంట నొలాల్లోకి తీసుకువచ్చింది. డ్రోన్ పైలట్‌గా మార్చి కొత్త గుర్తింపు ఇచ్చింది. జెండర్ ఈక్వాలిటీ నుంచి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వరకు రకరకాల కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేలా చేసింది. పిల్లలు పెద్ద చదువులు చదివేలా చేసేలా చేసింది.సినిమాల్లో చూడడం తప్ప ఎప్పుడూ చూడని విమానంలో ప్రయాణం చేయించింది....‘మీ గురించి చెప్పండి’ అని సుధా దేవదాస్‌ను అడిగారు ప్రధాని నరేంద్ర మోది. తన వ్యక్తిగత వివరాలతో పాటు తమ స్వయం సహాయక బృందం ‘ప్రకృతి’ గురించి ప్రధానికి వివరంగా చెప్పింది సుధ.మహారాష్ట్రలోని జల్గావ్లో జరిగిన ‘లఖ్పతి దీదీస్’ కార్యక్రమంలో పాల్గొనడానికి కేరళ నుంచి వచ్చింది సుధ. ‘లఖ్‌పత్ దీదీస్’ డ్రోన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌కు కేరళ నుంచి ఎంపికైన ఇద్దరు మహిళల్లో సుధ ఒకరు. సుధ త్రిసూర్‌లోని కుఝూర్ గ్రామ పంచాయతీ వార్డ్ మెంబర్. కేరళ నుంచి ‘డ్రోన్ పైలట్’ అయిన తొలి మహిళా పంచాయతీ మెంబర్‌గా సుధ ప్రత్యేక గుర్తింపు సాధించింది.‘ఈ శిక్షణా కార్యక్రమాల పుణ్యమా అని డ్రోన్లను ఎగరవేయడం మాత్రమే కాదు ఆండ్రాయిడ్ ఫోన్లు అంటే ఏమిటి, వాటిని ఎలా ఉపయోగించాలి, పంట పొలాల్లో ఉపయోగించే ఎరువులు, మందులు... ఇలా ఎన్నో విషయాలు తెలుసుకోగలిగాం’ అంటుంది సుధ.‘ఇప్పుడు నన్ను అందరూ డ్రోన్ పైలట్ అని పిలుస్తున్నారు’ ఒకింత గర్వంగా అంటుంది సుధ. సుధలాంటి ఎంతో మంది మహిళల జీవితాలను మార్చిన స్వయం సహాయక బృందం ‘ప్రకృతి’ విషయానికి వస్తే... ‘ప్రకృతి’లో 30 సంవత్సరాల వయసు మహిళల నుంచి 63 సంవత్సరాల వయసు మహిళల వరకు ఉన్నారు. ‘ప్రకృతి’లోని పన్నెండు మంది సభ్యులు ‘గ్రామిక’‘భూమిక’ పేరుతో విధులు నిర్వహిస్తారు. ఒక్కో గ్రూప్‌లో ఆరుగురు సభ్యులు ఉంటారు. ఈ సభ్యులు గృహ నిర్మాణం, పిల్లల చదువు, పెళ్లిలాంటి ఎన్నో విషయాలలో ప్రజలకు సహాయపడతారు.‘ప్రకృతి వల్ల మా జీవన విధానం పూర్తిగా మారి΄ పోయింది’ అంటుంది 51 సంవత్సరాల సుధ. ఆమె పెద్ద కుమారుడు ఎం.టెక్., చిన్న కుమారుడు బీటెక్. చేశారు. ‘పై చదువుల కోసం పెద్ద అబ్బాయి కెనడా, చిన్న అబ్బాయి ΄ పోలాండ్ వెళుతున్నాడు’ సంతోషం నిండిన స్వరంతో అంటుంది సుధ. కొన్ని నెలల క్రితం ‘ప్రకృతి’ బృందం కేరళ నుంచి ఇండిగో విమానంలో బెంగళూరుకి వెళ్లింది. ఆ బృందంలోని ప్రతి ఒక్కరికి ఇది తొలి విమాన ప్రయాణం. అది వారికి ఆకాశమంత ఆనందాన్ని ఇచ్చింది.సాధారణ గృహిణి నుంచి గ్రామ వార్డ్ మెంబర్‌గా, ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ ‘కుటుంబశ్రీ’లో రకరకాల విధులు నిర్వహిస్తున్న కార్యకర్తగా, జెండర్ ఈక్వాలిటీ, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లకు సంబంధించి మహిళలకు శిక్షణ ఇచ్చే రిసోర్స్ పర్సన్‌గా, ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్(ఎఫ్‌పీవో) డైరెక్టర్‌గా, డ్రోన్ పైలట్‌గా రకరకాల విధులు నిర్వహిస్తున్న సుధ ఎంతోమంది గృహిణులకు రోల్‌మోడల్‌గా మారింది.‘మహిళలు ఆర్థికంగా సొంత కాళ్లమీద నిలబడినప్పుడు ఎంతో ఆత్మస్థైర్యం వస్తుంది. అది ఎన్నో విజయాలను అందిస్తుంది. ఎవరు ఏమనుకుంటారో అనే భయాలు మనసులో పెట్టుకోకుండా మనకు సంతోషం కలిగించే పని చేయాలి’ అంటుంది సుధా దేవదాస్. -
ఈమె.. డ్రోనాచార్యులే
‘నేను బాగుండాలి’ అని ఎంతోమంది అనుకుంటారు. కొందరు మాత్రం ‘అందరూ బాగుండాలి... అందులో నేనుండాలి’ అనుకుంటారు. ప్రీత్ సంధూ రెండో కోవకు చెందిన మహిళ.అగ్రీ–డ్రోన్ స్టార్టప్ ‘ఏవీపీఎల్’తో ఎంటర్‌ప్రెన్యూర్‌గా తన కలను నెరవేర్చుకోవడమే కాదు వందలాదిమందికి ఉద్యోగావకాశాలను కల్పించింది. ఎంతో మందికి మైక్రో–ఎంటర్ప్రెన్యూర్లుగా కొత్త జీవితాన్ని ఇచ్చింది. హరియాణాలోని హిస్సార్‌కు చెందిన జ్యోతి మాలిక్ ఆదర్శవాద భావాలతో పెరిగింది. స్వతంత్రంగా ఉన్నతస్థాయికి ఎదగాలనేది ఆమె కల. ముంబైలో చదువుకోవడంతో ఆమె కలలకు రెక్కలు వచ్చాయి. ఉద్యోగంలో చేరింది. అయితే తన సంతోషం ఎంతోకాలం లేదు. వ్యక్తిగత కారణాల వల్ల ఉద్యోగం నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. రెండేళ్ల తరువాత ఉద్యోగం కోసం వస్తే నిరాశే ఎదురైంది. ‘ఈ జీవితం ఇంతేనా!’ అనే నిరాశామయ కాలంలో ‘ఏవీపీఎల్’ జ్యోతి మాలిక్‌కు మైక్రో–ఎంటర్‌ప్రెన్యూర్‌గా కొత్త జీవితాన్ని ఇచ్చింది.‘ఇప్పుడు నేను ఇండిపెండెంట్. ఎవరైనా సరే, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే తమ కలను నిజం చేసుకోవచ్చు’ అంటుంది ఆత్మవిశ్వాసం నిండిన గొంతుతో జ్యోతిమాలిక్.అమృత్‌సర్‌లోని ఖాల్సా కాలేజిలో చదువుకున్న ప్రీత్ సంధూకు కల్పనా చావ్ల రోల్ మోడల్. రాకెట్లు అంటే ఆసక్తి. కాలేజీ విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని అగ్రి–డ్రోన్ స్టార్టప్ ‘ఏవీపీఎల్’ను మొదలుపెట్టింది.వ్యాపార, వ్యవసాయ రంగాలకు అవసరమైన డ్రోన్ ఆపరేషన్లలో నైపుణ్యం కోసం గ్రామీణ ప్రాంతాలలో శిక్షణా కార్యక్రమాలు నిర్వహించింది ఏవీపీఎల్. ది రిమోట్ పైలట్ సర్టిఫికెట్(ఆర్పీసీ), అగ్రికల్చర్ స్ప్రే కోర్సులు గ్రామీణ ప్రాంతాలలో ఎంతోమందికి ఉపకరించాయి. ఈ కోర్సులు సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిచయం చేయడానికే పరిమితం కాలేదు. విద్యార్థులకు ఉద్యోగాలు వచ్చేలా చేశాయి. మైక్రో–ఎంటర్‌ప్రెన్యూర్‌గా అడుగు వేయడానికి ఉపకరించాయి. ‘ఫీట్ ఆన్ ది స్ట్రీట్’ నినాదంతో ‘ఏవీపీఎల్’ 12 రాష్ట్రాల్లో ఎన్నో ప్రాంతాల్లో నిర్వహించిన కార్యక్రమాలు ఎంతోమంది జీవితాల్లో వెలుగు నింపాయి. ప్రీత్ సంధూ నాయకత్వంలో ‘ఏవీపీఎల్’ అగ్రికల్చరల్ ఇన్నోవేషన్, స్కిల్ డెవలప్మెంట్లో కొత్త ప్రమాణాలు నెలకొల్పింది. ‘ఏవీపీఎల్’ శిక్షణా కార్యక్రమాల వల్ల ఒక్క హరియాణాలోనే 800 మంది డ్రోన్ ఎంటర్ప్రెన్యూర్లుగా మారారు.‘ఆశావాదమే కాదు అవసరమైన సమయంలో ఆత్మవిశ్లేషణ కూడా అవసరం’ అంటుంది ప్రీత్.ప్రయాణం మొదలుపెట్టిన కొత్తలో తమ స్కిల్లింగ్ వెంచర్‌లోని లోపాలను విశ్లేషించింది.‘మా కంపెనీ తరఫున ఎంతోమందికి శిక్షణ ఇచ్చాం. ఇక అంతకుమించి ఆలోచించలేదు. అయితే చాలామందికి గ్రామీణ నేపథ్యం ఉండడం వల్ల పట్టణాల్లో ఉండలేక తిరిగి సొంత ఊళ్లకు వెళ్లి΄ోయేవారు. ఈ నేపథ్యంలో అసలు వారు పట్టణం ఎందుకు రావాలి? గ్రామాల్లోనే ఉద్యోగావకాశాలు సృష్టించవచ్చు కదా అనే ఆలోచన వచ్చింది’ అని గతాన్ని గుర్తు తెచ్చుకుంది ప్రీత్.‘మన దేశంలో పట్టణాల్లోనే కాదు ఎక్కడైనా సరే ఉద్యోగావకాశాలు సృష్టించవచ్చు’ అనే ఆమె నమ్మకం నిజమైంది. వ్యవసాయ రంగానికి సంబంధించిన నవీన సాంకేతిక పరిజ్ఞానంతో రూ΄÷ందించిన శిక్షణ కార్యక్రమాలు, రిమోట్ పైలట్ సర్టిఫికెట్, అగ్రికల్చర్ స్ప్రే కోర్సుల ద్వారా యువతరం ఊరు దాటి పట్టణం వెళ్లాల్సిన అవసరం లేకుండాపోయింది.‘1.5 లక్షల విలేజ్ ఎంటర్ప్రెన్యూర్లను తయారు చేయాలనేది మా లక్ష్యం. డ్రోన్లు వారి జీవితాలను మార్చివేస్తాయి అనే నమ్మకం నాకు ఉంది’ అంటుంది ‘ఏవీపీఎల్’ కో–ఫౌండర్, సీయీవో ప్రీత్ సంధూ. -
Sagubadi: ‘ఐ గ్రో యువర్ ఫుడ్’.. ఉద్యమం!
అంతర్జాతీయ సేంద్రియ వ్యవసాయ ఉద్యమ సంస్థల సమాఖ్య (ఐ.ఎఫ్.ఓ.ఎ.ఎం. –ఐఫోమ్) పిలుపు మేరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సేంద్రియ/ప్రకృతి వ్యవసాయదారులు ఈ నెల 10వ తేదీన ‘ఐ గ్రో యువర్ ఫుడ్’ పేరిట వినూత్న ప్రచారోద్యమాన్ని చేపట్టారు. ప్రజల కోసం రసాయనాల్లేకుండా ఆరోగ్యదాయకంగా చేపట్టిన సేంద్రియ వ్యవసాయం– మార్కెటింగ్ తీరుతెన్నులు.. సమస్యలు ఏమిటి? వాటి పరిష్కారానికి ప్రజలు చేయగల సహాయం ఏమిటి? వంటి అంశాలపై తమ అభి్రపాయాలతో కూడిన వీడియోలను సేంద్రియ రైతులు సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు.ఐగ్రోయువర్ఫుడ్.. బయో పేరిట ఏర్పాటైన ప్రత్యేక వెబ్సైట్లో, ఐఫోమ్ ఆర్గానిక్స్ ఇంటర్నేషనల్‌కు చెందిన వెబ్సైట్/ఎక్స్/యూట్యూబ్/ఇన్‌స్టా తదితర సోషల్ మీడియా వేదికల్లో ప్రపంచ దేశాల సేంద్రియ రైతుల షార్ట్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి. వీటిని చూసిన ప్రజలు/వినియోగదారులు తమ అభి్రపాయాలను, సూచనలను పంచుకోవడానికి వీలుంది.ఐఫోమ్ ఆర్గానిక్స్ ఇంటర్నేషనల్ 1972లో ఫ్రాన్స్‌లో ప్రారంభమైంది. వంద దేశాల్లోని సుమారు 700 సేంద్రియ వ్యవసాయ సంస్థలకు ఇప్పుడు ఐఫోమ్ సభ్యత్వం ఉంది. ఆరోగ్యం, పర్యావరణం, న్యాయం, శ్రద్ధ అనే నాలుగు మూల సూత్రాలపై ఆధారపడి సేంద్రియ వ్యవసాయాన్ని విస్తరింపజేయటమే ఐఫోమ్ తన లక్ష్యంగా పెట్టుకుంది. సేంద్రియ వ్యవసాయానికి అంతర్జాతీయ ప్రమాణాలను నిర్దేశించటంతో పాటు ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఏజన్సీలకు అక్రెడిటేషన్ ఇస్తుంది. ఆసియా, ఆఫ్రికా దేశాల్లో ఆహారోత్పత్తి చేసి ప్రజలకు అందిస్తున్న రైతుల్లో 80% మంది చిన్న, సన్నకారు రైతులేనని ఐఫోమ్ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా 57 కోట్ల వ్యవసాయ క్షేత్రాలు ఉన్నాయి. వీటిలో 90% క్షేత్రాలు ఒంటరి రైతులు లేదా రైతు కుటుంబాలే నడుపుతున్నారు. సంస్థలు/కంపెనీల ఆధ్వర్యంలో నడుస్తున్న వ్యవసాయ క్షేత్రాలు మిగతా పది శాతం మాత్రమే. https://igrowyourfood.bio/కేరళలో కౌలు సేద్యం చేస్తున్నా..!నా పేరు షమికా మోనే, మహారాష్ట్రలో పుట్టా. పరిశోధనలు వదలి పెట్టి సేంద్రియ రైతుగా మారా. కేరళలో భూమిని కౌలుకు తీసుకొని సేంద్రియ వ్యవసాయం చేస్తున్నా. అనేక రకాల దేశీ వరితో పాటు కూరగాయలు పండిస్తున్నా. పంట విత్తిన దగ్గర నుంచి నూర్పిడి,ప్రాసెసింగ్ వంటి పనులు సాధ్యమైనంత వరకు నేనే చేసుకోవటం అద్భుతమైన అనుభవం. నేను పండించిన ఆహారోత్పత్తుల్ని తింటున్న స్నేహితులు, బంధువులు చాలా సంతోషంగా ఉన్నారు. సీజన్‌కు ముందే డబ్బు పెట్టుబడిగా ఇస్తారు. పంటలు పండించిన తర్వాత.. తమకు అవసరమైన ఆహారోత్పత్తుల్ని తీసుకుంటున్నారు. దేశీ వరి బియ్యం, అటుకులతో చేసిన స్థానిక సంప్రదాయ వంటకాలను పిల్లలు కూడా ఇష్టంగా తింటున్నారు. ఐఫోమ్ ఆర్గానిక్స్ ఇంటర్నేషనల్ పిలుపు మేరకు ‘ఐగ్రోయువర్ఫుడ్’ ఉద్యమంలో భాగస్వామిని కావటం సంతోషంగా ఉంది.– షమిక మోనె, సేంద్రియ యువ మహిళా రైతు, కేరళ -
Sagubadi: ప్రకృతి సేద్యం.. బతికించింది!
దేవేంద్ర మాటలు అనంతపురం జిల్లాకు చెందిన లక్షలాది మంది రైతుల కష్టాలను ప్రతిబింబిస్తాయి. ప్రపంచంలోని ఇతర కరువు పీడిత ్రపాంతాల మాదిరిగానే ఇక్కడ వ్యవసాయం ఒక సవాలు. గత ఏడాది కరువుకు అధిక ఉష్ణోగ్రతలు తోడు కావటంతో ఎండుతున్న చీనీ తోటలు.. పంట నష్టాల మధ్య.. ఈ విద్యాధిక యువ రైతుది ఓ ఆశావహమైన కథ.‘నా పేరు పొత్తూరు దేవేంద్ర. అనంతపురం జిల్లా పుట్లూరు మండలం చిన్నమల్లేపల్లి గ్రామం. గత ఏడాది లోటు వర్షపాతంతో మా ్రపాంతంలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయి. మాకు 2.5 ఎకరాల సాగు భూమి ఉంది. మా నాన్న చిన్న వెంకట స్వామి 30 ఏళ్లు సంప్రదాయ రసాయన వ్యవసాయం చేశారు. ఆ రోజుల్లో కుటుంబ ఖర్చులకూ కనా కష్టంగా ఉండేది. ఎమ్మే చదివాను. గత 15 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నాను.నాలుగు సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. విత్తనాలు వేయటం నుంచి పంట నూర్పిడి వరకు ప్రతి పనినీ మనసు పెట్టి చేస్తున్నాను. గతంతో పోలిస్తే ఇప్పుడు మా కుటుంబం ఆర్థికంగా చాలా మెరుగైన స్థితిలో ఉంది. అంతేకాదు, వ్యవసాయ పనులను మరింత నైపుణ్యంతో చేయటం నేర్చుకున్నారు. మాకున్న 2.5 ఎకరాల్లో ఒక ఎకరంలో చీనీ(బత్తాయి) తోట ఉంది. నీటి సౌకర్యం చాలా తక్కువగా ఉన్నప్పటికీ, గత ఏడాది జూలై 31న అలసంద, పొద చిక్కుడు, సజ్జలు, కందులు, ఆముదం విత్తనాలను గుళికలుగా మార్చి.. వానకు ముందే విత్తే (పిఎండిఎస్) పద్ధతిలో విత్తాను.ప్రూనింగ్ చేసి ఘనజీవామృతం వేస్తున్న రైతుఅప్పటి నుంచి 13 నెలలుగా చీనీ చెట్ల మధ్యలో భూమిని ఒక్కసారి కూడా దున్నలేదు. కానీ, మట్టిలో బెజ్జాలు చేసి చేతులతో విత్తనాలు వేస్తూ.. ఏడాది పొడవునా కాలానుగుణమైన అంతర పంటలు పండిస్తూనే ఉన్నాం. ఇలా ఏడాది పొడవునా పంటలతో పొలాన్ని ఆకుపచ్చగా కప్పి ఉంచుతున్నాం. పడిన కొద్దిపాటి వర్షంతోనో లేదా కొద్దిపాటి నీటి తడి ద్వారానో మట్టిలో తేమను నిలుపుకుంటున్నాం. చీనీ చెట్లకు, అంతర పంటలకు అవసరమైన విధంగా నిరంతరాయంగా తేమ అందుతున్నట్లు పచ్చని పొలాన్ని చూస్తే నిర్ధారణ అవుతోంది. గత వేసవిలో అతి వేడి పరిస్థితుల్లో కూడా నేలలో తగినంత తేమ ఉంది. గడ్డీ గాదం, పంట అవశేషాలతో నేలను కప్పి ఉంచటం కూడా తోటను పచ్చగా ఉంచడంలో సహాయపడుతోంది. వీటన్నింటితో కరువు పరిస్థితులను అధిగమిస్తున్నా.నాలుగేళ్లలో ఎంతో మార్పు..ప్రకృతి వ్యవసాయం చేపట్టిన తర్వాత ఈ నాలుగేళ్లలో మా పొలం మట్టిలో, చీనీ చెట్లలో అనేక మార్పులను గమనించాను. వానపాములు, సూక్ష్మజీవులు పనిచేయటం వల్ల మట్టిలో జీవవైవిధ్యం పెరిగింది. అందుకు రుణపడి ఉన్నాం. మొక్కలు నేల నుంచి పోషకాలను తీసుకోవడం మెరుగుపడింది. ఫలితంగా చీనీ చెట్లలో ఎటువంటి సూక్ష్మధాతు లోపాలు లేవు. మంచి నాణ్యమైన పండ్ల దిగుబడి వచ్చింది. మా నాన్న రసాయనిక ఎరువులు, పురుగుమందులు వేస్తూ వ్యవసాయం చేసినప్పుడు పరిస్థితి ఇలా లేదు. గత ఏడాది అధిక ఎండలకు మా పొలానికి దగ్గర్లోని తోటల్లో కూడా చీనీ చెట్లు ఎండిపోయాయి. రైతులు చెయ్యని ప్రయత్నం లేదు. ఎన్నో రసాయనాలను స్ప్రే చేశారు. కానీ చీనీ చెట్లను రక్షించుకోలేకపోయారు.ఎపిసిఎన్ఎఫ్ చీఫ్ టెక్నాలజీ– ఇన్నోవేషన్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ్రపాజెక్ట్ మేనేజర్ లక్ష్మా నాయక్ చనిపోతున్న చీనీ చెట్లను ఎలా రక్షించుకోవాలో మాకు నేర్పించారు. ఆయన చెప్పినట్లు.. 50 శాతం ఎండిన చెట్ల కొమ్మలను నేల నుంచి 2 అడుగుల ఎత్తులో కత్తిరించి, మోళ్లకు తడి ఘన జీవామృతం పూసి, ద్రవజీవామృతం పిచికారీ చేశాం. ఆ తర్వాత చెట్టు చుట్టూ 2 అడుగుల వెడల్పున పాది చేసి, ఘనజీవామృతాన్ని వేసి, అనేక పంటల విత్తనాలు చల్లి, దానిపైన మట్టి వేశాం.కాయలతో కళకళలాడుతున్న చీనీ చెట్లుఇటువంటి పద్ధతులతో మట్టిలో సూక్ష్మజీవుల కార్యకలాపాల ఫలితంగా చనిపోతున్న చెట్లు కూడా బతికాయి. 20–25 రోజుల్లో కొత్త చిగుర్లు వచ్చాయి. తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లోనూ చెట్లు పునరుజ్జీవం పొందాయి. మృత్యువాత పడుతున్న చీనీ చెట్లను కాపాడుకోగలిగినందుకు చాలా సంతోషిస్తున్నాం. ప్రకృతి వ్యవసాయ పద్ధతుల వెనుక ఉన్న సై¯Œ ్సను అర్థం చేసుకొని ఆశ్చర్యపోయాను. రసాయనిక వ్యవసాయం చేసిన రోజుల్లో అనేక మానసిక సమస్యలు, ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నాం. వైద్యం కోసం చాలా డబ్బు ఖర్చు పెట్టాల్సి వచ్చేది. ప్రకృతి వ్యవసాయాన్ని అనుసరించిన తర్వాత పరిస్థితి మారింది. నా పొలంలో 365 రోజులు కాలానుగుణమైన కూరగాయలు, ఇతర ఆహార పంటలను అంతర పంటలుగా పండించడం ్రపారంభించాను. బయటి నుంచి ఏదైనా ఆహారాన్ని కొనుగోలు చేయడం మానేశాను. మనం ప్రకృతి వ్యవసాయంలో పండిస్తున్నది తినడం వల్ల, హాస్పిటల్ ఖర్చులు, మీరు నమ్ముతారో లేదో గాని, దాదాపు పూర్తిగా తగ్గిపోయాయి.ఎకరంలో 10 టన్నుల బత్తాయిలు..ఎనీ టైమ్ మనీ (ఏటీఎం) మోడల్‌తో పాటు ఏ–గ్రేడ్ మోడల్లో కూడా పంటలు సాగు చేస్తున్నాం. మా కూరగాయలు, తదితర పంటలను ఇంట్లో వాడుకోగా, అదనంగా వీటి ద్వారా ప్రతి నెలా రూ. 4–5 వేల వరకు ఆదాయం వస్తోంది. కుటుంబం ఖర్చులు తీరుతున్నాయి. ఈ ఒక ఎకరం చీనీ తోట నుండి ప్రతి సంవత్సరం సగటున 10 టన్నుల బత్తాయిలు పండిస్తున్నాం. గత 3 సంవత్సరాలుగా, మేం టన్ను బత్తాయి పండ్లను సగటున రూ. 30–33 వేలకు అమ్ముతున్నాం. ఏటా కనీసం రూ. 3 లక్షల ఆదాయం బత్తాయిల ద్వారా వస్తోంది. ఇక చెట్ల మధ్యలో సాగు చేసే బొబ్బర్లు, పొద అనప, కంది, సజ్జ, ఆముదం పంటలతో పాటు సూపర్ నేపియర్ గడ్డి ద్వారా వచ్చే ఆదాయం కలిపితే మొత్తం రూ. 4 నుంచి 4.5 లక్షల వరకు ఉంటుంది..’ – దేవేంద్ర, మొబైల్: 79976 44711గేదెలకూ ఇతర జంతువుల మాదిరిగానే కంటి శుక్లం సమస్య వస్తుంటుంది. కంటి కటకం తెల్లగా మారడం వల్ల దృష్టి లో΄ానికి లేదా అంధత్వానికి దారితీస్తుంది. గేదె కన్ను తెల్లగా మారినా, వాపు ఉన్నా.. కళ్ళు కనపడక వస్తువుల్ని ఢీ కొట్టడం వంటి లక్షణాలను బట్టి శుక్లం వచ్చినట్లు భావించాలి..కారణాలు..– వయస్సు: ముసలి గేదెలకు కంటిశుక్లం వచ్చే అవకాశం ఎక్కువ.– జన్యువులు: వారసత్వంగా వచ్చిన జన్యు కారణాల వల్ల కొన్ని గేదెల్లో కంటిశుక్లం రావచ్చు.– ΄ోషకాహార లోపం: విటమిన్ ఎ వంటి ముఖ్యమైన ΄ోషకాలు లోపించటం వల్ల కంటిశుక్లం ఏర్పడుతుంది.– అంటువ్యాధులు: కొన్ని అంటువ్యాధులు, ముఖ్యంగా కంటిని ప్రభావితం చేసేవి, కంటిశుక్లాలకు కారణమవుతాయి.– గాయం: గాయం వల్ల కంటి కటకాలు దెబ్బతిని శుక్లాలకు దారితీస్తుంది.– రసాయనాలు: కొన్ని రసాయనాలు/ విషతుల్య పదార్థాలు తగలటం వల్ల కంటిశుక్లం ఏర్పడవచ్చు.హోమియోపతి చికిత్స యుఫ్రేసియ– క్యు: కంటిలో 3 చుక్కలు.. రోజుకు 3 సార్లు.. 10 రోజులు వేయాలి.యుఫ్రేసియ 200: 10 మాత్రలు.. రోజుకు 2 సార్లు.. 10 రోజులు వేయాలి. 5 రోజుల్లోనే పూర్తిగా ఫలితం కనపడుతుంది.– డా. జి. రాంబాబు (94945 88885), పశువైద్యాధికారి, కడప -
ఉసురు తీసిన ముసురు
చేతిలో కొడవలి.. నెత్తిన కండువా.. ముఖంలో ఆందోళనతో 9 మంది కూలీలు ఏ చేలోనైనా చిన్న పని దొరుకుతుందేమోనన్న ఆశతో సోమవారం కృష్ణా జిల్లా చోడవరం–పెనమలూరు రోడ్డు పక్కనున్న పొలాల వైపు ఆశగా చూస్తూ వెళ్తున్నారు. ఎటు చూసినా వర్షాలు, వరదలకు దెబ్బ తిన్న పొలాలే కనిపిస్తున్నాయి. రైతే దెబ్బ తిన్నాక కూలీలకు పనిచ్చేదెవరు? ఆ కూలీల కుటుంబాల కడుపు నింపేదెవరు? ఆ ఆవేదనే వారి మాటల్లో ప్రతిధ్వనించింది. పది రోజులుగా పని లేదని, ఇంటిల్లిపాదీ ఆకలితో ఆలమటిస్తున్నామని వారు ‘సాక్షి’ ప్రతినిధి వద్ద బోరుమన్నారు. ఎడతెరిపిలేని వర్షాలు ఉపాధిని దెబ్బతీశాయని, ప్రభుత్వమూ ఆదుకోవడంలేదని, ఎన్నెన్నో అవస్థలు పడుతున్నామని వివరించారు. దాదాపు ఐదు వేల జనాభా కలిగిన చోడవరం గ్రామంలో 750 మంది వ్యవసాయ కూలీలు, 60 మంది భవన నిర్మాణ కార్మికులు పనుల్లేక, చేతిలో డబ్బు లేక ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. వీరే కాదు.. రాష్ట్రంలో ఎడతెరిపిలేని వర్షాలు, వరదలకు లక్షలాది బడుగు జీవులు బతుకుదెరువు కోల్పోయారు. పనుల్లేక ఇంటికే పరిమితమైన వ్యవసాయ కూలీలు.. ఇసుక లేక, వర్షాలతో భవన నిర్మాణ కార్మికుల అవస్థలు.. మగ్గం గుంటల్లోకి నీరు చేరి నేతన్నల అగచాట్లు.. తాటి చెట్లు తడిసిపోయి దెబ్బతిన్న గీత కార్మికులు.. పల్లె కన్నీరు పెడుతున్న తీరుపై ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్ట్ ఇది..పది లక్షల మందికి పనుల్లేవువిజయవాడలో వరదలతోపాటు గుంటూరు, బాపట్ల, ఎనీ్టఆర్, కృష్ణా, ఏలూరు, పశి్చమ గోదావరి, తూర్పు గోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాల్లో భారీ వర్షాలు వ్యవసాయ కార్మికుల ఉపాధిని తీవ్రంగా దెబ్బతీశాయి. వరి, అరటి, మొక్కజొన్న, చెరకు, ప్రత్తి, మిర్చి, పసుపు, కంద పంటలు, ఆక్వా కల్చర్ç పనులపై ఆధారపడిన లక్షలాది వ్యవసాయ కార్మికులు రోజువారీ పనులను కోల్పోయారు. రాష్ట్రంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 1.10 కోట్ల మంది వ్యవసాయ కార్మికులున్నారు. వారిలో 10 లక్షల మందికిపైగా కార్మికులు వర్షాల వల్ల పనుల్లేక పస్తులుంటున్నారు. రోజూ ఇంటిల్లిపాదీ పనిచేస్తే కానీ గడవని ఈ కుటుంబాల్లో ఇప్పుడు ఒక్కరికి కూడ పని దొరకడంలేదు. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఉత్తరాంధ్ర జిల్లాల్లోనూ కూలీల ఉపాధి దెబ్బతింది. పది రోజులుగా పనుల్లేక అవస్థలు పడుతున్న ప్రతి కుటుంబానికి తక్షణమే రూ. 10 వేలు సాయం అందించాలని, అన్ని గ్రామాల్లో ఉపాధి హామీ పనులు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గీత వృత్తికి చేటురాష్ట్రంలో అధికారిక లెక్కల ప్రకారం 2 లక్షలకుపైగా కుటుంబాలు కల్లు గీత వృత్తిపై ఆధారపడ్డాయి. పలు జిల్లాల్లో కురుస్తున్న వర్షాలకు తడిసిపోయిన తాటి చెట్లు ఎక్కేందుకు వీలు కాకపోవడంతో గీత వృత్తి నిలిచిపోయింది. వేలాది గీత కార్మికులు ఉపాధి కోల్పోయారు. వీరందరినీ ప్రభుత్వమే ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుత్తిగ నరసింహామూర్తి డిమాండ్ చేశారు.భవన నిర్మాణ రంగం కుదేలుకూటమి ప్రభుత్వం వచ్చాక ఉచిత ఇసుక విధానం అస్తవ్యస్థంగా మారడంతో భవన నిర్మాణ రంగం దెబ్బ తింది. దీనికితోడు ఇప్పుడొచి్చన వర్షాలు, వరదలకు ఇసుక రీచ్‌లలో తవ్వకాలు నిలిచిపోయాయి. దీంతో భవన నిర్మాణ రంగం మరింతగా కుదేలైంది. రాష్ట్రంలో ఆ రంగంపై ఆధారపడి జీవిస్తున్న 31 లక్షల మందికిపైగా కార్మికుల జీవనాన్ని దెబ్బతీసింది. విజయవాడలో వరద తాకిడికి అతలాకుతలమైన ప్రాంతాల్లోనే 20 వేల మందికిపైగా భవన నిర్మాణ కార్మికులు కట్టుబట్టలతో మిగిలి, ఆహారం కోసం అలమటిస్తున్నారు.నేతన్న అగచాట్లు.. వర్షాలు, వరదలకు చేనేత కుటుంబాలూ తీవ్రంగా ప్రభావితమయ్యాయి. రాష్ట్రంలో సుమారు 1.60 లక్షల మగ్గాలు ఉన్నట్టు అంచనా. పది రోజులుగా పడుతున్న వర్షాలకు ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని నేత మగ్గాల కుంటల్లోకి నీరు చేరింది. దీంతో చేనేత కార్మికుల జీవనం స్తంభించింది. వేలాది నేతన్నల కుటుంబాలు అవస్థల పాలయ్యాయి.శ్రీకాకుళం నుంచి వలసొచ్చాం కొన్నేళ్ల క్రితమే 450 కుటుంబాల వాళ్లం శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల వలసొచ్చి వ్యవసాయ పనులు చేసుకుంటున్నాయి. ఎక్కడ కూలి పని ఉంటే అక్కడకు వెళ్తుంటాం. నేను కూడా శ్రీకాకుళం జిల్లా నుంచే వచ్చాను. మేస్త్రీగా పది మందిని పనులకు తీసుకెళ్తున్నాను. వర్షాల వల్ల పది రోజులుగా పనుల్లేవు. మా కుటుంబాలన్నీ తిండి లేక అవస్థలు పడుతున్నాయి. – వడ్డేపల్లి భాస్కరరావు, మేస్త్రీకూలికెళితేనే రోజు గడిచేది వ్యవసాయ పనులకు వెళితేనే మాకు రోజు గడిచేది. ఉదయం 6 గంటలకు పనులకు వెళ్లి మధ్యాహా్నం 1గంటకు వస్తాం. రోజు కూలీ రూ.450 ఇస్తారు. ఇంటి అద్దె నెలకు రూ.4 వేలు చెల్లించాలి. ఇద్దరు ఆడ పిల్లలు. నేను, నా భార్య ఇద్దరం కష్టపడితేనే మాకు నెల భారంగా గడుస్తుంది. అలాంటిది పది రోజులుగా పనుల్లేకఅవస్థలు పడుతున్నాం. – మడల సీతారామయ్య, చోడవరంవర్షాలతో మగ్గం నేతకు ఇబ్బందులే కృష్ణా, గుంటూరు జిల్లాల్లో చేనేత మగ్గాల కుంటల్లో వర్షం నీరు చేరి చేనేత కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మగ్గాల కుంటల్లో నీరు చేరితో దాన్ని బయటకు తోడి ఆరిన తర్వాతే మళ్లీ పని మొదలు పెట్టాలి. ఇందుకు 15 నుంచి 20 రోజులు పడుతుంది. ఇన్ని రోజులూ చేనేత కార్మికులు పస్తులుండాల్సిందే. మగ్గం కుంటల్లో నీరు చేరి కొందరు, పడుగు తడిసి పాడైపోయి మరికొందరు, నేత నూలు మొత్తబడిపోయి ఇంకొందరు నేత నేసేందుకు అవకాశం లేక ఉపాధి కోల్పోయారు. – పిల్లలమర్రి బాలకృష్ణ, చేనేత నాయకుడు -
కొత్త ఉత్పత్తులకు అనుమతుల్లో జాప్యం: సింజెంటా సీఈవో
న్యూఢిల్లీ: బ్యూరోక్రసీ విధానాల కారణంగా భారత సాగురంగంలో వినూత్న ఉత్పత్తులకు అనుమతుల్లో తీవ్ర జాప్యం జరుగుతోందని అగ్రోకెమికల్స్ దిగ్గజం సింజెంటా గ్రూప్ సీఈవో జెఫ్ రోవ్ వ్యాఖ్యానించారు. దీంతో రైతులపై ప్రభావం పడుతోందన్నారు. ఈ నేపథ్యంలో రైతులకు ప్రయోజనం చేకూర్చేలా అనుమతుల ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని భారత పర్యటన సందర్భంగా ఆయన తెలిపారు.దేశీయంగా సులభతరంగా వ్యాపారాల నిర్వహణ అంశంపై స్పందిస్తూ ‘భారత్‌లో ప్రోడక్టుల అనుమతులకు సంబంధించి పాలసీ అంతా బ్యూరోక్రసీమయంగా ఉంటుంది. దీంతో అనుమతులకు చాలా సమయం పట్టేస్తుంది. ఆ ప్రభావం రైతులపై పడుతుంది‘ అని జెఫ్ పేర్కొన్నారు. కొత్త ఆవిష్కరణల కోసం రైతులు ఎంత ఎక్కువగా నిరీక్షించాల్సి వస్తే అంత ఎక్కువగా రిస్కులు ఎదుర్కొనాల్సి వస్తుందని ఆయన చెప్పారు.వినియోగదారుల వ్యవస్థను డిజిటలీకరించడంలో భారత ప్రభుత్వ కృషిని ప్రశంసించిన జెఫ్.. వ్యవసాయ రంగంలోనూ అదే తరహాలో అనుమతుల ప్రక్రియను ఆధునీకరించాలని కోరారు. వాతావరణ మార్పులతో రిస్కులే కాకుండా అవకాశాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. వచ్చే 3 ఏళ్లలో 40 ఉత్పత్తులు..రాబోయే 2–3 సంవత్సరాల్లో కొత్తగా 40 పంట సంరక్షణ ఉత్పత్తులను ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్లు జెఫ్ చెప్పారు. పరిశోధనలు, అభివృద్ధి కార్యకలాపాలపై తమ సంస్థ అంతర్జాతీయంగా ఏటా 2 బిలియన్ డాలర్లు వెచ్చిస్తుందని ఆయన పేర్కొన్నారు. భారత్‌లో తమ వ్యాపారం ఈ ఏడాది ద్వితీయార్థంలో కాస్త మెరుగుపడగలదని వివరించారు.ప్రపంచవ్యాప్తంగా ఆహార అవసరాలు పెరుగుతున్న తరుణంలో సేంద్రియ వ్యవసాయాన్ని భారీ స్థాయిలో విస్తరించడానికి అవకాశాలు తక్కువని జెఫ్ తెలిపారు. సంప్రదాయ సాగుతో పోలిస్తే సేంద్రియ వ్యవసాయ సామరŠాధ్యలు 20–30 శాతం మేర తక్కువగా ఉండటమే ఇందుకు కారణమన్నారు. ప్రత్యేకమైన భారత వ్యవసాయ రంగ సవాళ్లను పరిష్కరించడంలో డిజిటల్ టెక్నాలజీ కీలక పాత్ర పోషించగలదని జెఫ్ వివరించారు. -
అగ్రిటెక్ స్టార్టప్‌లకు బూస్ట్
న్యూఢిల్లీ: అగ్రిటెక్ స్టార్టప్‌లకు ఆర్థిక సహాయం అందించడానికి కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రూ.750 కోట్ల ఫండ్ ‘అగ్రిష్యూర్’ను ప్రారంభించారు. వ్యవసాయ రంగంలో ప్రభుత్వ, ప్రైవేట్ పెట్టుబడులను పెంచాల్సిన అవసరం ఉందని మంత్రి తెలిపారు. వ్యవసాయ రంగం పురోగతి లక్ష్యంగా దాదాపు రూ.14,000 కోట్లతో ఏడు పథకాలకు కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ‘అగ్రిష్యూర్’ ఆవిష్కరణ సందర్భంగా మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చేసిన ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలు...రూ.750 కోట్ల ‘అగ్రిష్యూర్’ (స్టార్టప్‌లు, రూరల్ ఎంటర్ప్రైజెస్) ఫండ్ ఈక్విటీ అలాగే డెట్ క్యాపిటల్ రెండింటినీ అందించడం ద్వారా స్టార్టప్‌లు, ‘అగ్రిప్రెన్యూర్’లకు మద్దతు ఇస్తుంది.స్టార్టప్‌లు ఈ నిధిని వినియోగించుకోవాలి. వ్యవసాయ రంగంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న అగ్రిటెక్ స్టార్టప్‌లకు ఎటువంటి నిధుల కొరతనూ ఎదుర్కోకుండా తగిన చర్యలు తీసుకుంటారు.గ్రామీణ భారతదేశంలో వ్యవసాయ సంబంధిత మౌలిక సదుపాయాలను సృష్టించేందుకు ప్రభుత్వం రూ.లక్ష కోట్లతో వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధిని ప్రారంభించింది. వ్యవసాయం భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. ఈ రంగం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 18 శాతం వాటాను కలిగి ఉంది. రైతులు అతిపెద్ద ఉత్పత్తిదారులు మాత్రమే కాకుండా అతిపెద్ద వినియోగదారులు కూడా అన్న విషయాన్ని గమనించాలి. ఇది ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన పరోక్ష సహకారం.రైతుల ఆదాయాన్ని పెంపొందించడంతోపాటు ఆహారం, పౌష్టికాహార భద్రతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది.ఉత్పత్తి పెంపు, ముడి పదార్థాల వ్యయం తగ్గింపు, వ్యవసాయ ఉత్పత్తులకు మంచి ధరలు, పంటల వైవిధ్యం, వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టడంపై కేంద్రం దృష్టి సారించింది. ఎరువులపై కేంద్రం భారీ రాయితీలూ కల్పిస్తోంది.వ్యవసాయ రంగానికి కొత్త ప్రయోగాలు అవసరం. చిన్న రైతులు పెద్ద ఎత్తున వ్యవసాయం చేసేందుకు గ్రూపులుగా ఏర్పడే అంశాన్ని వారు పరిశీలించాలి. మితిమీరిన రసాయన పురుగుమందులు, ఎరువుల వాడకం మంచిది కాదు. సాగునేలను సారవంతమైనదిగా కొనసాగించే విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఏఐఎఫ్ ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రదానం వ్యవసాయ రంగంలో అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (ఏఐఎఫ్) కింద వివిధ కేటగిరీల్లో అత్యుత్తమ పనితీరు కనబరిచిన బ్యాంకులు, రాష్ట్రాలకు వారి కృషిని గుర్తింపుగా వ్యవసాయ మంత్రి ఏఐఎఫ్ ఎక్స్‌లెన్స్ అవార్డులను ఈ సందర్భంగా అందజేశారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ అవార్డులు అందుకోగా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఉత్తమ పనితీరు కనబరిచిన ప్రైవేట్ రంగ బ్యాంకుగా అవార్డును స్వీకరించింది. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల విభాగంలో బరోడా రాజస్థాన్ క్షేత్రీయ గ్రామీణ బ్యాంక్, పంజాబ్ గ్రామీణ బ్యాంక్, బరోడా యూపీ గ్రామీణ బ్యాంక్, మహారాష్ట్ర గ్రామీణ బ్యాంక్, సర్వ హరియాణా గ్రామీణ బ్యాంక్ ఉత్తమ పనితీరుకు అవార్డులు అందుకున్నాయి. అత్యుత్తమ పనితీరు కనబరిచి, అవార్డులను అందుకున్న రాష్ట్రాలలో తెలంగాణసహా మధ్యప్రదేశ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ ఉన్నాయి.ఇదీ చదవండి: ప్రకృతి బీభత్సం.. ఆర్థిక నష్టం..!‘కృషినివేష్’ పోర్టల్ ఆవిష్కరణ..‘కృషినివేష్’ పేరుతో ఇంటిగ్రేటెడ్ అగ్రి ఇన్వెస్ట్మెంట్ పోర్టల్‌ను కూడా మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ సందర్భంగా ఆవిష్కరించారు. ఈ పోర్టల్ పెట్టుబడి అవకాశాలు సంబంధిత వ్యవసాయ సమాచారాన్ని కేంద్రీకరించడం ద్వారా వ్యవసాయ రంగాన్ని మార్చగలదన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. వ్యవసాయ వ్యాపారాలను మెరుగుపరచడానికి, పెట్టుబడులను ఆకర్షించడానికి, రైతుల ఆదాయాన్ని మెరుగుపరచడానికి రూపొందించిన సమగ్ర వేదికే ఈ పోర్టల్ అని ఆయన అభివర్ణించారు. వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారాన్ని సులభంగా యాక్సెస్ చేసుకోవడానికి సంబంధించి రైతులు, పారిశ్రామికవేత్తలు, ఈ రంగంలోని విభిన్న వాటాదారులకు ఈ పోర్టల్ ఉపయోగపడుతుందని చౌహాన్ తెలిపారు.