aqua farmers
-
ఆక్వా రైతుల ఉద్యమ బాట
సాక్షి, అమరావతి: ఆక్వా రంగ సమస్యల పరిష్కారానికి ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఆక్వా రైతులు ఉద్యమ బాట పడుతున్నారు. సమస్యలు పరిష్కరించకపోతే క్రాప్ హాలిడే ప్రకటించేందుకూ సిద్ధమవుతున్నారు. ఈ నెల 3న తలపెట్టిన ‘ఛలో పాలకొల్లు’ ద్వారా భవిష్యత్ కార్యాచరణ రూపొందించనున్నారు. అకాడెమీ ఆఫ్ సస్టైనబుల్ ఇంటిగ్రేటెడ్ లివింగ్, జై భారత్ క్షీర రామ ఆక్వా రైతు సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి తీర ప్రాంత జిల్లాల రైతులు పాల్గొంటున్నారు.ఈ సమావేశంలో చర్చించే అంశాలు, తీర్మానాల వివరాలను అకాడెమీ ఆఫ్ సస్టైనబుల్ ఇంటిగ్రేటెడ్ లివింగ్ డైరెక్టర్ షేక్ అలీ హుసేన్, ఆక్వా రైతు సంఘం అ«ధ్యక్ష, కార్యదర్శులు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు, బోనం చినబాబు సోమవారం మీడియాకు వివరించారు. తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోతే ఆక్వా సాగుకు క్రాప్ హాలిడే ప్రకటిస్తామని హెచ్చరించారు.ఆక్వా రైతుల డిమాండ్లు ఇవీ.. ⇒ ఆక్వా రంగం బలోపేతానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి, ఏటా కనీసం రూ.1000 కోట్లు కేటాయించాలి ⇒ జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగా చేపలు, రొయ్యలకు కనీస మద్దతు ధర ప్రకటించేందుకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలి ⇒ దేశంలోనే ఎక్కడా లేని విధంగా గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏపీ ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీ (అప్సడా) చట్టాన్ని మరింత సమర్ధంగా అమలు చేయాలి ⇒ అప్సడా చట్టం ద్వారా హేచరీలను నియంత్రించాలి. నాణ్యత లేని వనామీ రొయ్యల మేత తయారు చేసే కంపెనీలను మూసివేయాలి. ⇒ అప్సడా చట్టం ద్వారా ఆక్వా రైతుల రిజి్రస్టేషన్‌ను మరింత సరళతరం చేసేందుకు మండల స్థాయిలో రిజి్రస్టేషన్ మేళాలు నిర్వహించాలి ⇒ వ్యవసాయ, ఉద్యాన పంటల మాదిరిగానే మార్కెట్లో డిమాండ్‌కు అనుగుణంగా ఏఏ ఆక్వా ఉత్పత్తులు ఎంత విస్తీర్ణంలో సాగు చేయాలో ఏటా పంటల ప్రణాళిక ముందస్తుగా తయారు చేసి కచి్ఛతంగా అమలు చేయాలి ⇒ ఆక్వా సాగుకు ఉపయోగించే పెట్రో ఉత్పత్తులను జిల్లా పౌర సరఫరాల సంస్థ ద్వారా సబ్సిడీపై అందించాలి ⇒ ఆక్వా సాగుకు ఉపయోగించే విద్యుత్ పరికరాలు, ట్రాన్స్ఫార్మర్లలో ఉత్పన్నమయ్యే సమస్యల పరిష్కారానికి విద్యుత్ శాఖ ద్వారా ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలి ⇒ ఆక్వా రైతుల ఫిర్యాదుల పరిష్కారానికి సింగిల్ విండో విధానం ప్రవేశÔ¶ పెట్టాలి. ⇒ దళారీల వల్ల మోసపోతున్న రైతుల కోసం తీర ప్రాంత జిల్లాల్లో ఆక్వా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయాలి ⇒ నియోజకవర్గ స్థాయిలో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ ఆక్వా ల్యాబ్స్‌కు అనుబంధంగా మండలానికో ల్యాబ్, మండలానికో యాంటీ బయాటిక్ ల్యాబ్ ఏర్పాటు చేయాలి ⇒ గత ప్రభుత్వం శ్రీకారం చుట్టిన ఆక్వా యూనివర్శిటీని వేగంగా పూర్తి చేసేందుకు తక్షణమే రూ.350 కోట్లు కేటాయించాలి. యూనివర్సిటీ ద్వారా వనామీ రొయ్యల సాగులో మెళకువులపై రైతులకు శిక్షణ ఇవ్వాలి ⇒ ఆక్వా పరికరాలకు 90 శాతం సబ్సిడీ, రిటైల్ అవుట్లెట్లకు 90 శాతం ఆరి్ధక సాయం అందించాలి ⇒ ఎన్నికల్లో ఇచి్చన హామీ మేరకు తీరప్రాంత జిల్లాల్లో ఆక్వా ఉత్పత్తుల నిల్వకు 90 శాతం సబ్సిడీతో శీతల గిడ్డంగులు నిర్మించాలి ⇒ జోన్‌తో సంబంధం లేకుండా ఎకరాకు యూనిట్ రూ.1.50కే విద్యుత్ సరఫరా చేయాలి. హేచరీలు, ఆక్వా నర్సరీలు, ప్రాసెసింగ్ యూనిట్లకు కూడా సబ్సిడీపై విద్యుత్ అందించాలి. ⇒ తల్లి రొయ్యలు, లార్వా, పోస్ట్ లార్వా ఫీడ్లతో పాటు మేత తయారీలో ఉపయోగించే ముడి పదార్ధాల దిగుమతిపై సుంకం ఎత్తివేయాలి -
ఆక్వా, పాడి రైతులకు భరోసా
సాక్షి, అమరావతి: కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా పాడి, ఆక్వా రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక భరోసా కల్పిస్తోంది. ఒక్కో ఆక్వా రైతుకు గరిష్టంగా రూ.10 లక్షల వరకు ఆరి్థక చేయూతనిస్తుండగా.. పాడి రైతులకు ఎలాంటి హామీ లేకుండా రూ.1.60 లక్షల వరకు రుణాలిస్తోంది. కార్డుల జారీ, రుణ పరపతి కోసం ప్రత్యేకంగా ఆండ్రాయిడ్ ఆధారిత అప్లికేషన్ కూడా అభివృద్ధి చేసింది. జిల్లాల వారీగా లక్ష్యాలను నిర్దేశించి మరీ రుణాలు మంజూరు చేస్తోంది. ముందెన్నడూ లేనివిధంగా ఐదేళ్లలో రూ.4,420.38 కోట్ల రుణాలను ప్రభుత్వం అందించింది. కార్డు పొందే పాడి రైతులకు బీమా సదుపాయం కూడా కల్పించింది. తీసుకున్న రుణంపై చెల్లించే వడ్డీలో 1.5 శాతం చొప్పున ఏటా వడ్డీ రాయితీ పొందొచ్చు. సకాలంలో చెల్లించిన వారికైతే 3 శాతం వరకు వడ్డీ రాయితీ పొందే అవకాశం ఉంటుంది. మొత్తంగా ఐదేళ్లలో 1.30 లక్షల మంది పాడి, ఆక్వా రైతులకు రూ.4,420 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం రుణాలుగా అందించింది. పాడి రైతులకు రూ.1,747.18 కోట్లు వైఎస్సార్ చేయూత, ఆసరా వంటి పథకాల ద్వారా పొందిన లబి్ధతో పాడి పశువులు, సన్న జీవాలు కొనుగోలు చేసిన పాడి రైతులకు ప్రభుత్వం పశు కిసాన్ క్రెడిట్ కార్డులు జారీ చేసింది. జగనన్న పాలవెల్లువ, జగనన్న జీవక్రాంతి పథకాల కింద ఐదేళ్లలో 5.15 లక్షల మందికి మూగ, సన్నజీవాలను అందించింది. వీరందరికీ కిసాన్ క్రెడిట్ కార్డులు జారీ చేసింది. కార్డులు పొందిన వారిలో ఇప్పటివరకు 1,38,392 మంది రుణాల కోసం దరఖాస్తు చేయగా, వారిలో 1,13,399 మందిని అర్హులుగా గుర్తించింది. వీరిలో ఇప్పటికే 1,09,199 మందికి రూ.1.60 లక్షల వరకు రుణాలు ఇచి్చంది. ఇలా రూ.1,747.18 కోట్ల రుణం అందించింది. వ్యక్తిగతంగానే కాకుండా గ్రూపులుగా ఏర్పడినా కేసీసీ కార్డులు జారీ చేసేందుకు అవకాశం కల్పించింది. ఆర్బీకేల ద్వారా దరఖాస్తు చేసే పాడి రైతులు ఎంతకాలం నుంచి పశుపోషణ చేస్తున్నారు, ఎంత పాడి ఉంది, ఎన్ని పాలను ఉత్పత్తి చేస్తున్నారనే వివరాలను స్థానిక పశువైద్యాధికారి ధ్రువీకరిస్తే చాలు. ఎలాంటి హామీ లేకుండా రుణాలు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంది. ఈ రుణాలతో పాడి రైతులు పశువులు, సన్నజీవాలకు షెడ్లు, మంచినీటి తొట్టెల నిర్మాణం, తాళ్లు, ఇతర సామగ్రితో పాటు పశుగ్రాసం కొనుగోలు చేశారు. ఆక్వా రైతులకు రూ.2,673 కోట్లు ఐదేళ్లలో 19,059 మంది ఆక్వా రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులను ప్రభుత్వం జారీ చేసింది. కార్డులు పొందిన ఆక్వా రైతులకు ప్రతి సీజన్లో రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు రుణం ఇస్తోంది. ఇందులో మొదటి రూ.2 లక్షలను కేసీసీ రుణంగా పరిగణిస్తోంది. రూ.2 లక్షలపై 2 శాతం, మిగిలిన రుణం సకాలంలో చెల్లిస్తే ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్ కింద మరో 3 శాతం వడ్డీ రాయితీ పొందే వెసులుబాటు కల్పించింది. ఇలా ఐదేళ్లలో రూ.2,673 కోట్లను రుణాలుగా ఇచ్చింది. -
రొయ్య రైతుల ‘ధర’హాసం
సాక్షి, అమరావతి: ఏపీలో 100 కౌంట్ రొయ్యలకు ప్రభుత్వం నిర్దేశించిన ధర కిలో రూ.210. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రాసెసింగ్ యూనిట్లు చెల్లిస్తున్న ధర రూ.245. ఇదే కౌంట్ రొయ్యలను గుజరాత్, తమిళనాడులో రూ.230కు కొనుగోలు చేస్తుండగా.. ఒడిశాలో రూ.210కు మించి కొనడం లేదు. 30 కౌంట్ రొయ్యలకు ఏపీ ప్రభుత్వం నిర్దేశించిన ధర రూ.380 కాగా.. ప్రాసెసింగ్ ఆపరేటర్లు కొనుగోలు చేస్తున్న ధర రూ.470. ఇదే కౌంట్ రొయ్యలను ఒడిశాలో రూ.370, గుజరాత్లో రూ.380, తమిళనాడులో రూ.430కు కొనుగోలు చేస్తున్నారు. ఏపీలో దక్కుతున్న గిట్టుబాటు ధర దేశంలో మరే రాష్ట్రంలోనూ రొయ్యల రైతులకు దక్కడం లేదు. ఆక్వా రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో చేస్తున్న కృషే ఇందుకు ప్రధాన కారణమని ఆక్వా రైతులే చెబుతున్నారు. ఫలించిన ప్రభుత్వ చర్యలు ఆక్వా జోన్ పరిధిలో 10 ఎకరాల్లోపు విస్తీర్ణంలో చెరువులు కలిగిన ప్రతి రైతుకూ యూనిట్ విద్యుత్ రూ.1.50కే సబ్సిడీపై ప్రభుత్వం అందిస్తోంది. నాణ్యమైన సీడ్, ఫీడ్ అందిస్తూ.. పంట చేతికొచ్చే సమయంలో గిట్టుబాటు ధర కల్పన కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. సంక్షోభ సమయంలో ఏ ఒక్క రైతు ఆర్థికంగా నష్టపోకూడదన్న సంకల్పంతో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, సీదిరి అప్పలరాజు, అప్సడా కో–వైస్ చైర్మన్ వడ్డి రఘురామ్‌తో ఏర్పాటు చేసిన ఆక్వా సాధికారత కమిటీ ప్రతి నెలా సమావేశమవుతూ రైతులకు ఏ మాత్రం నష్టం కలుగకుండా క్షేత్ర స్థాయిలో పరిస్థితులకు అనుగుణంగా స్పందిస్తోంది. ప్రభుత్వం నిర్దేశించిన ధరలు, మార్కెట్లో కొనుగోలు చేస్తున్న ధరలను సమీక్షిస్తూ ప్రతి రైతుకు మద్దతు ధర దక్కేలా యంత్రాంగానికి దిశా నిర్దేశం చేస్తోంది. మరోవైపు అప్సడా ఆధ్వర్యంలో ప్రతి 15 రోజులకు ఒకసారి రైతులతో పాటు ప్రాసెసింగ్ ఆపరేటర్లు, ఎగుమతిదారులతో సమావేశాలు నిర్వహిస్తూ అంతర్జాతీయంగా ధరలు పతనమైన సందర్భంలో కూడా స్థానికంగా ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటోంది. ఆక్వా రైతు సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నంబర్‌తో కాల్ సెంటర్‌ను సైతం ఏర్పాటు చేసింది. ఇలా అడుగడుగునా ప్రభుత్వం అండగా నిలుస్తుండడంతో రాష్ట్రంలో ఆక్వా రైతులకు అన్ని విధాలుగా భరోసా లభిస్తోంది. మంచి ధర వస్తోంది ఆక్వా రైతులకు మంచి ధర లభిస్తోంది. ప్రభుత్వం నిర్దేశించిన ధర కంటే ఎక్కువ ధర చెల్లిస్తున్నారు. పొరుగు రాష్ట్రాల కంటే మిన్నగా ఏపీ రైతులకు గిట్టుబాటు ధర దక్కుతోంది. గడచిన ఐదేళ్లలో ఆక్వా రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాలుగా అండగా నిలిచింది. – వత్సవాయి లక్ష్మీకుమార్రాజా, ఆక్వా రైతు, అరిపిరాల, కృష్ణా జిల్లా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ప్రతి 10 రోజులకు ఒకసారి రొయ్యల ధరలను సమీక్షిస్తున్నాం. మార్కెట్లో హెచ్చుతగ్గులను గమనిస్తూ ప్రభుత్వం నిర్దేశించిన ధర రైతులకు దక్కేలా చూస్తున్నాం. ఈ నాలుగేళ్లలో ఏ ఒక్క ఆక్వా రైతు నష్టపోకుండా ప్రభుత్వం అన్నివిధాలుగా తోడుగా నిలిచింది. మూడుసార్లు పెంచిన ఫీడ్ ధరలను కంపెనీలు ఉపసంహరింపజేశాం. నాణ్యమైన సీడ్, ఫీడ్ అందేలా ఎప్పటికప్పుడు కృషి చేస్తున్నాం. – వడ్డి రఘురామ్, కో–వైస్ చైర్మన్, అప్సడా -
అర్హతగల ఆక్వా రైతులందరికీ విద్యుత్ సబ్సిడీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అర్హులైన ఆక్వా రైతులందరికీ సబ్సిడీపై విద్యుత్ సరఫరా చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రరావు, బొత్స సత్యనారాయణ, డాక్టర్ సీదిరి అప్పలరాజు, అప్సడా కో వైస్ చైర్మన్ వడ్డి రఘురాం స్పష్టంచేశారు. విజయవాడలోని మంత్రి పెద్దిరెడ్డి క్యాంప్ కార్యాలయంలో మంగళవారం ఆక్వా సాధికారికత కమిటీ సమావేశం జరిగింది. ఇటీవల ఈ–ఫిష్ సర్వే ద్వారా ఆక్వా జోన్ పరిధిలో 10 ఎకరాల్లోపు అర్హత పొందిన 3,467 విద్యుత్ కన్‌క్షన్లకు మార్చి ఒకటో తేదీ నుంచి విద్యుత్ సబ్సిడీ వర్తింపజేయాలని డిస్కమ్‌లను ఆదేశిస్తూ ఈ సమావేశంలో తీర్మానం చేశారు. రాష్ట్రంలో 4,68,458 ఎకరాల్లో ఆక్వా సాగవుతుండగా, దానిలో 3,33,593.87 ఎకరాలు ఆక్వాజోన్ పరిధిలో 10 ఎకరాల్లోపు ఉన్నట్టుగా ఈ–ఫిష్ సర్వే ద్వారా నిర్ధారించినట్లు మంత్రులు తెలిపారు. మొత్తం 66,993 విద్యుత్ కనెక్షన్లలో ఇప్పటికే ఆక్వా జోన్ పరిధిలో అర్హత పొందిన 50,605 కనెక్షన్లకు విద్యుత్ సబ్సిడీ వర్తింపజేస్తుండగా, తాజాగా కమిటీ ఆమోదంతో ఆ సంఖ్య 54,072కు పెరిగిందన్నారు. ఆక్వా రైతుల తరఫున రాష్ట్ర ప్రభుత్వం గత నాలుగేళ్లుగా రూ.3,306.5 కోట్లు విద్యుత్ సబ్సిడీని డిస్కమ్‌లకు చెల్లించిందన్నారు. తాజాగా అర్హత పొందిన కనెక్షన్లకు ఏటా రూ.55 కోట్లు అదనపు భారం పడనుందన్నారు. ఆక్వా రైతాంగానికి అండగా నిలిచేందుకు సీఎం వైఎస్ జగన్ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. నాణ్యమైన సీడ్ సరఫరా విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని వడ్డీ రఘురాం చెప్పారు. ఇక నుంచి అప్సడా అనుమతి పొందిన తర్వాతే విదేశాల నుంచి బ్రూడర్స్‌ను దిగుమతి చేసుకోవాలని, అలా చేయని కంపెనీలపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. కొత్తగా విద్యుత్ కనెక్షన్లు పొందేవారిలో అర్హులను గుర్తించి సబ్సిడీ వర్తింపజేసేందుకు మూడు నెలలకు ఒకసారి సమీక్షిస్తామన్నారు. ఏపీలోనే వంద కౌంట్ రూ.245 ఆక్వా ఉత్పత్తుల రేట్లను ఆర్బీకేల ద్వారా ప్రకటిస్తూ, దళారుల చేతుల్లో రైతులు మోసపోకుండా తీసుకున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయని అధికారులు వివరించారు. వంద కౌంట్ రొయ్యలకు కేజీకి రూ.245 ధర ప్రస్తుతం మార్కెట్లో లభిస్తోందన్నారు. గుజరాత్, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలోనే ఎక్కువ రేటు రైతుకు దక్కుతోందన్నారు. సమావేశంలో స్పెషల్ సీఎస్‌లు గోపాలకృష్ణ ద్వివేది, నీరబ్‌కుమార్ ప్రసాద్, కె.విజయానంద్ జెన్కో ఎండీ కేవీఎన్ చక్రధర్‌బాబు, మత్స్యశాఖ కమిషనర్ కూనపురెడ్డి కన్నబాబు తదితరులు పాల్గొన్నారు. -
రొయ్యకు బీమా.. రైతుకు ధీమా
సాక్షి, భీమవరం: ఆక్వా రైతుకు అడుగడుగునా అండగా నిలుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం బీమా సదుపాయంతో సాగులో వారికి ధీమా కల్పించే దిశగా అడుగులు వేస్తోంది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవతో బీమా పాలసీ కల్పనకు ఇప్పటికే రాష్ట్రాన్ని కేంద్రం పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. బీమా పాలసీలపై రైతులకు అవగాహన కల్పించి, వారి అభిప్రాయాలు తీసుకునేందుకు ఆలిండియా ప్రాన్ ఫెడరేషన్, స్టేట్ ప్రాన్ ఫెడరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఏపీ స్టేట్ ఆక్వా డెవలప్మెంట్ అథారిటీ (అప్సడా) అవగాహన సదస్సులు నిర్వహిస్తోంది. అందులో భాగంగా శనివారం పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరంలో అప్సడా వైస్ చైర్మన్ వడ్డి రఘురాం అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల నుంచి 200 మందికి పైగా ఆక్వా రైతు సంఘాల నాయకులు, రైతులు హాజరయ్యారు. ఓరియంటల్, అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ, అలయన్స్ ఇన్సూరెన్స్ బ్రోకర్స్ కంపెనీలకు చెందిన ప్రతినిధులు హాజరై వారు అందించే పాలసీల వివరాలను రైతులకు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. సాగు కాలం, ప్రీమియం రేట్లు, సైక్లోన్ జోన్, నాన్ సైక్లోన్ జోన్లలో పాలసీ కవరేజీ వివరాల గురించి అవగాహన కల్పించారు. రైతులు తమ ఎంపిక ప్రకారం 135 రోజుల నుంచి 180 రోజుల వరకు ప్రాథమిక కవర్‌ను ఎంచుకోవడం ద్వారా ప్రకృతి వైపరీత్యాల నుంచి పంట నష్టాన్ని కవర్ చేసుకోవచ్చునని తెలిపారు. పాలసీలపై రైతులు లేవనెత్తిన సందేహాలను బీమా సంస్థల ప్రతినిధులు నివృత్తి చేశారు. వ్యాధులు, వాతావరణ పరిస్థితులు, పెరుగుతున్న ఖర్చులు, మార్కెట్ సమస్యలు, ఇతర సవాళ్లను ఆక్వా రైతులు అధిగమించేందుకు ప్రభుత్వం బీమా పాలసీ తెచ్చిందని ఫిషరీస్ అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ అంజలి ఈ సందర్భంగా తెలిపారు. ఫిషరీస్ జేడీ మాధవీలత, డిప్యూటీ డైరెక్టర్ ఆనందరావు, జిల్లా మత్స్యశాఖ అధికారి ఆర్వీఎస్వీ ప్రసాద్, నేషనల్ ప్రాన్ ఫార్మర్స్ అధ్యక్షుడు ఐపీఆర్ మోహనరావు, ఏపీ ప్రాన్ ఫార్మర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ జీకేఎఫ్ సుబ్బరాజు, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ మల్ల రాంబాబు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కృష్ణా ఆక్వా ఫార్మర్స్ అధ్యక్షుడు నాగభూషణం, వత్సవాయి కుమార్‌రాజా తదితరులు పాల్గొన్నారు. రైతుల ప్రయోజనాల కోసమే బీమా ఈ సదస్సులో అప్సడా వైస్ చైర్మన్ వడ్డి రఘురాం మాట్లాడుతూ ఆక్వా రైతుల ప్రయోజనాలకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధిక ప్రాధాన్యమిస్తున్నారని చెప్పారు. ఏదోక పాలసీని తెచ్చి రైతులపై రుద్దకుండా వారి సూచన మేరకు ప్రయోజనకరమైన పాలసీ తేవాలన్న లక్ష్యంతో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా సదస్సులు నిర్వహిస్తోందన్నారు. ఫిబ్రవరి 10 నాటికి సదస్సులు పూర్తి చేసి పాలసీలపై రైతుల నుంచి వచ్చిన సూచనలను సీఎం జగన్ దృష్టికి తీసుకువెళతామని తెలిపారు. గత ఎన్నికలకు ఆరు నెలల ముందు చంద్రబాబు ఆక్వా రైతులకు పెట్టిన రూ. 340 కోట్ల విద్యుత్ బకాయిలను వైఎస్ జగన్ ప్రభుత్వం చెల్లించిందని వివరించారు. అప్సడా ఏర్పడిన ఏడాదిన్నర కాలంలో రైతులకు మూడు లక్షలకు పైగా సబ్సిడీ విద్యుత్ కనెక్షన్లు ఇచ్చామన్నారు. రాష్ట్రంలో బ్రూడల్ స్టాక్ మెయింటెనెన్స్ సెంటర్ (బీఎంసీ) ఏర్పాటులో గత ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. విశాఖపట్నం జిల్లా నక్కపల్లి మండలం బంగారుపేటలో రూ. 36 కోట్లతో బీఎంసీ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించిందని, ఆగస్టు నాటికి ప్రారంభించే విధంగా సీఎం జగన్ యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నారని రఘురాం తెలిపారు. -
చంద్రబాబు మమ్మల్ని మోసం చేస్తే..సీఎం జగన్ ఆదుకున్నారు..
-
రొయ్యల రైతుకు చేదోడు.. చైన్ డ్రాగింగ్ బోట్!
చైన్ డ్రాగింగ్ బోట్’.. రొయ్యల సాగులో రైతులకు ఉపయోగపడే ఒక ఆవిష్కరణ ఇది. ఆక్వా సాగులో శారీరక కష్టం, ఖర్చు, వ్యాధుల బెడద తగ్గించడంతో పాటు రొయ్యల నాణ్యత పెంపొందించేందుకు ఈ చైన్ డ్రాగింగ్ బోట్ ఉపయోగపడుతుంది. చైన్ డ్రాగింగ్ అంటే? రొయ్యల పట్టుబడి పూర్తయిన తర్వాత చెరువును ఎండగడతారు. ఎండి నెర్రెలుబారిన ఆ చెరువులో మళ్లీ రొయ్యల సాగు ప్రారంభించడానికి చెరువులో నీరు నింపిన తర్వాత.. నేలను సిద్ధం చేసే క్రమంలో ఇనుప గొలుసులు చెరువు అడుగున వేసి, ఇద్దరు మనుషులు నడుములోతు నీటిలో నడుస్తూ లాగుతారు. దీన్నే చైన్ డ్రాగింగ్ అంటారు. తద్వారా చెరువు అడుగు మట్టిలో వ్యర్థాలు, విషవాయువులు బయటకు వెళ్లిపోవటంతో పాటు రొయ్యలకు సహజ ఆహారమైన ప్లవకాలు వృద్ధి చెందుతాయి. అయితే, మనుషులు నీటిలో నడుస్తూ చైన్ డ్రాగింగ్ చేయటం వ్యయ ప్రయాసలతో కూడిన పని. ఈ పనిని సులువుగా, తక్కువ కాలంలో, తక్కువ ఖర్చుతో చేయడానికి ఉపయోగపడే వినూత్నమైన పడవకు గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మెకానికల్ ఇంజనీరింగ్ అధ్యాపకుడు డాక్టర్ తౌసీఫ్ అహ్మద్ రూపుకల్పన చేశారు. ఈ ‘చైన్ డ్రాగింగ్ బోట్’ఆక్వా రైతులకు ఎంతో ప్రయోజనకరంగా నిలుస్తోంది. గుంటూరు జిల్లా నిజాంపట్నం ప్రాంతంలోని ఆక్వా రైతుల కోరిక మేరకు నాలుగేళ్ల క్రితం డాక్టర్ ౖతౌసీఫ్ పరిశోధనలు ప్రారంభించారు. ఈ క్రమంలో యూనివర్సిటీలోని త్రీడీ ఎక్స్పీరియన్స్ ల్యాబ్‌లో ‘చైన్ డ్రాగింగ్ బోట్’ను డిజైన్ చేశారు. ఈ ఆవిష్కరణకు భారతీయ పేటెంట్ సంస్థ 2020లో డిజైన్ పేటెంట్‌ను మంజూరు చేసింది. 'చైన్ డ్రాగింగ్ బోట్’ లీటరు పెట్రోల్‌తో 2 గంటలు పనిచేస్తుంది. దీనితో అర గంట సమయంలోనే 10 ఎకరాల్లోని రొయ్యల చెరువుల్లో చైన్ డ్రాగింగ్ పనిని పూర్తి చేయవచ్చని డా. తౌసీఫ్ తెలిపారు. మనుషులు చేసిన దానికంటే అధిక సామర్థ్యంతో స్లడ్జ్ వంటి వ్యర్థాలను తొలగించటం, చెరువు అడుగు నేలను గుల్లబరచటంలో ప్రయోజనకారిగా నిలుస్తోందన్నారు. ‘ఆంగ్రూ’ ప్రోత్సాహం ‘చైన్ డ్రాగింగ్ బోట్’కు సంబంధించి డాక్టర్ వైఎస్సార్ ఏఎన్‌యూ ఇంజనీరింగ్ కళాశాలలోని త్రీడీ ఎక్స్పీరియన్స్ ల్యాబ్‌లో ప్రత్యేక డిజైన్‌ను రూపొందించిన డా. తౌసీఫ్ అహ్మద్.. అందుకు అనుగుణంగా మూడు ప్రత్యేక స్టీల్ ఫ్రేమ్‌లతో కూడిన బోట్‌ను తయారు చేయించారు. దానికి జీఎక్స్ 160 హోండా ఇంజన్‌ను, వెను చైన్‌ను అమర్చారు. పెట్రోల్‌తో నడిచే ఈ బోట్‌పై ఒకరు కూర్చుని నడపవచ్చు. దీని తొలి బోట్‌ను రైతులకు ఇచ్చి వాడిన తర్వాత వారి సూచనల మేరకు తగు మార్పులు చేశారు. చైన్ డ్రాగింగ్ బోట్ ప్రాజెక్టుకు తిరుపతిలోని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్విద్యాలయం (ఆంగ్రూ) పోషన్ ఇంక్యూబేషన్ సెంటర్ రూ. 5 లక్షలను అందించింది. ఈ ఆవిష్కరణను న్యూఢిల్లీలోని ప్రధాన మంత్రి కిసాన్ మేళాలో కూడా ఇటీవల ప్రదర్శించారు. సబ్సిడి కోసం ప్రయత్నిస్తున్నాం.. చైన్ డ్రాగింగ్ బోట్ వాడకం వల్ల రొయ్యల నాణ్యత, సర్వయివల్ రేటు పెరుగుతుంది. ‘ఆంగ్రూ’ సహకారంతో కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా సబ్సిడీపై ఆక్వా రైతులకు ఈ బోట్లను అందించేందుకు చర్యలు చేపడుతున్నాం. తౌషా టెక్నాలజీ ఇన్నోవేషన్ అనే స్టార్టప్ ద్వారా రైతులకు వారం రోజుల్లో తయారు చేయించి ఇస్తున్నాం. – డా. తౌసీఫ్ అహ్మద్ (98852 09780), ఆవిష్కర్త, నాగార్జున యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్, గుంటూరు రొయ్యలు పెరిగే కాలంలో కూడా.. ‘చైన్ డ్రాగింగ్ బోట్’కు ఆక్వా రైతుల నుంచి ఆదరణ లభిస్తోంది. డా. తౌసీఫ్ అహ్మద్ రెండు బోట్లను తయారు చేసి నిజాంపట్నం ప్రాంతంలోని ఆక్వా రైతులకు అందజేశారు. ఒకొక్క బోట్ తయారీ వ్యయం రూ. 80 నుంచి 90 వేలు ఉంటుందని, ఆర్డర్ ఇచ్చిన వారం రోజుల్లో తయారు చేసి ఇవ్వగలం. ఆక్వా రైతులకు అవగాహన కల్పించేందుకు ఒక బోట్‌ను విజయవాడలోని కృష్ణా నదీ తీరంలో ప్రదర్శనకు పెట్టారు. బోట్‌ను మనిషి గట్టు మీద నుంచే రిమోట్ పద్ధతిలో విద్యుత్తు బ్యాటరీ లేదా సౌర విద్యుత్తు ద్వారా నడిపించేందుకు పరిశోధనలు కొనసాగిస్తున్నానని డా. తౌసీఫ్ తెలిపారు. రొయ్యల సాగు ప్రారంభ దశలోనే కాకుండా, రొయ్యల పెంపకం జరిగే కాలంలో కూడా చైన్ డ్రాగింగ్ బోట్‌ను నడిపేందుకు ఆయన పరిశోధనలు కొనసాగిస్తున్నారు. పనిలో పనిగా డైనమిక్ ఎయిరేషన్ వ్యవస్థను కూడా ఈ బోట్‌కు అనుసంధానం చేస్తున్నామన్నారు. రొయ్య పిల్లలకు హాని కలగకుండా ఉండేలా అల్యూమినియం ప్రొపెల్లర్‌కు బదులు ఫైబర్ ప్రొపెల్లర్‌ను వినియోగించనున్నామని వివరించారు. – దాళా రమేష్ బాబు, సాక్షి ప్రతినిధి, గుంటూరు ఇన్పుట్స్: డా.ఎన్.అశోక్ కుమార్, సాక్షి, ఏఎన్‌యూ (చదవండి: కొబ్బరికాయ భూగర్భ జలాల జాడను కనిపెట్టగలదా? సైన్స్ ఏం చెబుతోంది..?) -
తల్లి రొయ్య ఇక లోకల్
సాక్షిప్రతినిధి, కాకినాడ: అమెరికన్ తల్లి రొయ్యకు మన ఆక్వా రైతులు త్వరలో గుడ్‌బై చెప్పనున్నారు. తల్లి రొయ్యలను దేశీయంగా మన హేచరీల్లో ఉత్పత్తి చేసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. తీర ప్రాంత రాష్ట్రాల్లోని హేచరీల్లో రొయ్య పిల్లల పునరుత్పత్తి కోసం తల్లి రొయ్యలను కొన్నేళ్లుగా లక్షలు వెచ్చించి అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. మన హేచరీల్లో బ్లాక్ టైగర్(మోనాడామ్) తల్లి రొయ్యలు 2009కి ముందు భారతీయ సముద్ర జలాల్లో లభించేవి. ఆ తర్వాత బ్లాక్‌టైగర్ 60 శాతం బాక్టీరియాతో రోగాల బారిన పడి తల్లి రొయ్యలు దెబ్బతిన్నాయి. అనంతరం రోగాల్లేని తల్లి రొయ్యలను ఉత్పత్తి చేస్తున్న అమెరికా నుంచి వెనామీ దిగుమతికి కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. పసిఫిక్ మహాసముద్రంలో మాత్రమే లభించే ఈ వెనామీ(ఎగ్జోటిక్ స్పీసిస్)వైట్‌లెగ్ ష్రింప్‌ను దిగుమతి చేసుకునేలా నిబంధనలను సడలించింది. అమెరికాలో వెనామీని పునరుత్పత్తి చేస్తున్న కంపెనీల్లో ఎంపిక చేసిన 14 కంపెనీల నుంచి తల్లి రొయ్య దిగుమతి చేసుకునేలా ఒప్పందం కుదిరింది. ఇలా దిగుమతి చేసుకునే వెనామీని చెన్నైలోని సెంట్రల్ క్వారంటైన్లో ఐదు రోజులు అన్ని పరీక్షల అనంతరం ఒడిశా, గుజరాత్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ సహా.. మన రాష్ట్రంలోని హేచరీల్లో వినియోగిస్తున్నారు. వెనామీ తల్లి రొయ్య ప్రస్తుతం అమెరికాలో 80 డాలర్లు (రూ.6,400) పలుకుతోంది. కస్టమ్స్, లాజిస్టిక్, ఫ్లైట్ చార్జీలు 30 శాతం అదనంగా కలుపుకొంటే సుమారు రూ.10,000 వరకు అవుతుంది. ఇక్కడి హేచరీలు అమెరికాలోని టెక్సాస్, ఫ్లోరిడా రాష్ట్రాల నుంచి ఏటా 2లక్షల నుంచి 2.50 లక్షల తల్లి రొయ్యలను దిగుమతి చేసుకుంటున్నాయి. దేశవ్యాప్తంగా తీరంలో 550 హేచరీలుంటే అత్యధికంగా మూడొంతులు హేచరీలు కాకినాడ తీరంలోనే ఉండటం విశేషం. మరో రెండేళ్ల సమయం.. కోస్టల్ ఆక్వా కల్చర్ అథారిటీకి కేంద్రం తీసుకొచ్చి న సవరణలు వెనామీ తల్లి రొయ్యల స్థానే.. దేశీయంగా తల్లి రొయ్యల ఉత్పత్తికి మార్గం సుగమం చేశాయని చెప్పొచ్చు. ఇందుకోసం రెండు దశలను కేంద్ర ప్రభుత్వం నిర్దేశించింది. తొలి దశలో బ్రూడ్‌స్టాక్ మల్టిప్లికేషన్ సెంటర్(బీఎంసీ)లు, మలి దశలో న్యూక్లియర్ బ్రీడింగ్ సెంటర్(ఎన్బీఎస్)లు నెలకొల్పుకోవచ్చు. ఈ రెండు దశలు పూర్తయ్యేసరికి తల్లి రొయ్య కోసం అమెరికాపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. ఈ రెండు దశలు చేరుకోవడానికి మరో రెండేళ్లు పడుతుందని అంచనా. తొలి దశలో భాగంగా బీఎంసీ ద్వారా తల్లి రొయ్య స్థానంలో పిల్ల రొయ్యలను దిగుమతి చేసుకుంటారు. బ్రూడ్‌స్టాక్ మల్టిప్లికేషన్ సెంటర్(బీఎంసీ)లలో పిల్ల రొయ్యలను పునరుత్పత్తి చేస్తారు. అమెరికా నుంచి దిగుమతిచేసుకునే ఒక తల్లి రొయ్య స్థానంలో అంతే ఖర్చుతో 1000 పిల్ల రొయ్యలను పునరుత్పత్తి చేయొచ్చు. ఇలా పిల్ల రొయ్యలను దిగుమతి చేసుకుని బీఎంసీలలో పునరుత్పత్తి చేస్తారు. ఈ ప్రక్రియ ఇప్పటికే మన రాష్ట్రంలో నిర్వహించేందుకు వీలుగా పలు సెంటర్లకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం నెల్లూరు బీఎంఆర్, భీమవరం ఆమందా, శ్రీకాకుళం కోనాబే, విశాఖలో ఎమ్పెడా బీఎంసీ(బ్రూడ్‌స్టాక్ మల్టిప్లికేషన్ సెంటర్స్)లు సిద్ధమయ్యాయి. మలి దశలో ఇక అమెరికా వైపు కన్నెత్తి చూడాల్సిన అవసరం లేకుండా మనమే నేరుగా తల్లి రొయ్యను పునరుత్పత్తి చేయొచ్చు. ఇందుకోసం న్యూక్లియర్ బ్రీడింగ్ సెంటర్లు నెలకొల్పుతారు. ప్రస్తుతం అమెరికాలో మాత్రమే నిర్వహిస్తున్న సెంటినల్ ట్రైల్స్ ఇక్కడ ఏర్పాటు చేసే ఎన్బీసీలలో నిర్వహిస్తారు. ఇక్కడి వాతావరణ పరిస్థితులకనుగుణంగా జెనెటిక్ బ్రీడింగ్, జెనెటిక్ ప్రాసెసింగ్ చేస్తారు. ఇక లక్షలు ఖర్చుపెట్టాల్సిన అవసరం ఉండదు.. బ్రూడ్‌స్టాక్ మల్టిప్లికేషన్ సెంటర్ల ఏర్పాటు ద్వారా మన తల్లి రొయ్యను మనమే పునరుత్పత్తి చేసుకునేందుకు వీలుంటుంది. దీనివల్ల అమెరికా నుంచి లక్షలు ఖర్చుపెట్టి తల్లి రొయ్యలను దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఇక ఉండదు. – హరినారాయణరావు, ప్రధాన కార్యదర్శి, ఆలిండియా ష్రింప్హేచరీస్ అసోసియేషన్ -
ఆక్వా రైతును కాపాడుకుందాం..
సాక్షి, అమరావతి : ఆక్వా రైతును కాపాడుకోకుంటే ఆ పరిశ్రమ మనుగడకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని రాజ్యసభ సభ్యుడు బీదా మస్తాన్‌రావు, అప్సడా వైస్ చైర్మన్ వడ్డి రఘురాంలు కంపెనీలను హెచ్చరించారు. ఆక్వా రైతుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తోందని, అదే రీతిలో ఈ పరిశ్రమలు కూడా అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. రైతులు, హేచరీలు, మందుల కంపెనీల ప్రతినిధులతో శనివారం విజయవాడలో జరిగిన సాధికారత కమిటీ భేటీలో ఎంపీ మస్తాన్‌రావు మాట్లాడుతూ తమిళనాడు, గుజరాత్ వంటి రాష్ట్రాలు యూనిట్ విద్యుత్ రూ.8కి సరఫరా చేస్తుండగా.. మన రాష్ట్రంలో మాత్రమే యూనిట్ రూ.1.50కే సరఫరా చేస్తున్నట్టు చెప్పారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కౌంట్ రూ.210 చొప్పున కొనుగోలు చేసినా ఎగుమతిదారులకు ఎలాంటి నష్టం వాటిల్లదన్నారు. హేచరీలతో పాటు ఫీడ్ ప్లాంట్ నిర్వాహకులు కూడా రైతులపై భారం తగ్గించేందుకు ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. రైతులతో పాటు హేచరీలు, ఎగుమతిదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు సంబంధించి ఢిల్లీకి ప్రతినిధుల బృందం వస్తే సంబంధిత మంత్రుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సీఆర్‌జెడ్ పరిధిలోని హేచరీలను మూసివేయాలన్న గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను అమలు చేయకుండా అడ్డుకోగలిగామని, ఆ మేరకు కోస్టల్ ఆక్వాకల్చర్ అథారిటీ(సీఏఏ) చట్టసవరణ జరిగేలా కృషి చేస్తున్నట్టు తెలిపారు. వడ్డి రఘురాం మాట్లాడుతూ నాణ్యమైన సీడ్ సరఫరా చేయని హేచరీలపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. అనధికారిక, నిబంధనలు పాటించని హేచరీలపై చర్యలు తీసుకుంటామన్నారు. ఇక నుంచి ప్రతి నెలా రైతులతో సమావేశాలు నిర్వహించాలని సీఎం జగన్ ఆదేశించినట్టు వెల్లడించారు. 30 పైసలకే వనామీ సీడ్ సరఫరా నాణ్యమైన వనామీ సీడ్‌ను 30 పైసలకు రైతులకు అందుబాటులో ఉంచుతామని హేచరీ యజమానులు భరోసా ఇచ్చారు. నాణ్యమైన టైగర్ సీడ్ దొరకని కారణంగా ఉత్పత్తి దెబ్బతిని నష్టపోయామని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత సీజన్లో టైగర్ సీడ్ ఉత్పత్తిని తగ్గించాలని రఘురాం కోరగా.. హేచరీల యజమానులు ఆ మేరకు స్పందించారు. బ్రూడ్ స్టాక్ క్వాలిటీ మేనేజ్మెంట్పై సెపె్టంబర్ 29న విశాఖలో జరిగే జాతీయ స్థాయి సెమినార్లో రైతులను కూడా భాగస్వాములను చేస్తామని హేచరీ ప్రతినిధులు చెప్పారు. జాతీయ రొయ్య హేచరీల సంఘం అధ్యక్షుడు యల్లంకి రవికుమార్, జాతీయ రొయ్య రైతుల సంఘం అధ్యక్షుడు ఐపీఆర్ మోహన్‌రాజు, సీఏఏ డైరెక్టర్ (చెన్నై) పి.శంకరరావు ఎంపెడా రీజనల్ మేనేజర్ జయభేల్ తదితరులు పాల్గొన్నారు. -
Fact Check: ఆక్వా రైతు బరువు కాదు.. బాధ్యత
సాక్షి, అమరావతి: కళ్ల ముందు వాస్తవాలు స్పష్టంగా కనిపిస్తున్నా అవేవీ తెలీనట్లు కళ్లున్న కబోదిలా వ్యవహరిస్తూ అబద్ధాలను అడ్డగోలుగా అచ్చేయడంలో ఈనాడు రామోజీకే చెల్లింది. పైపెచ్చు పచ్చ పార్టీని జాకీలు పెట్టి మరీ పైకి లేపేందుకు తెగ ప్రయాసపడుతోంది. ఇందులో భాగంగా తన ప్రతి కథనంలోనూ గత ప్రభుత్వాన్ని ఆహా ఓహో అంటూ కీర్తించేందుకు నానాపాట్లు పడుతోంది. పత్రికా విలువలు ఎలాగూ లేవు.. కనీసం ప్రజలు నవ్వుతారనే ఇంగిత జ్ఞానం కూడా లేదు. ఆక్వా రైతులకు సబ్సిడీ ఇస్తానని మోసంచేసి, ఎన్నికలు సమీపించిన వేళ కొన్నిరోజులు మాత్రమే సబ్సిడీ ఇస్తున్నట్లు నటించి ఆ సొమ్మునూ డిస్కంలకు ఎగ్గొట్టిన గత టీడీపీ ప్రభుత్వ భాగోతాలను ఆ పత్రిక నిస్సిగ్గుగా దాచిపెట్టింది. ‘‘ఆక్వారైతు బరువయ్యాడా’’.. అంటూ రాష్ట్ర ప్రభుత్వంపై ఇష్టారాజ్యంగా విషం కక్కింది. నిజానికి.. అధికారంలోకి వచ్చిన నాటి నుంచే సబ్సిడీ ఇచ్చి ఆక్వా రైతులను వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆదుకుంది. ఆక్వా రైతేకాదు.. రాష్ట్రంలోని ఏ రైతూ తమకు బరువు కాదని, వారందరి సంక్షేమం తమ బాధ్యతని ప్రభుత్వం తన చేతల ద్వారా చాటిచెబుతోంది. పచ్చ పత్రిక రాయని వాస్తవాలను ఇంధన శాఖ శనివారం మీడియాకు వెల్లడించింది. ఆ వివరాలివీ.. ఆరోపణ: ఆక్వా విద్యుత్ సర్వీసులకు యూనిట్ ధరను రూ.7 నుంచి రూ.2కు తగ్గించిన గత ప్రభుత్వం.. వాస్తవం: గత ప్రభుత్వం 2014 నుంచి 2016 వరకు ఆక్వా సాగుకు స్లాట్ల ఆధారంగా విద్యుత్ టారిఫ్‌ను యూనిట్‌కు రూ.4.63 నుంచి రూ.7.00 వరకూ వేసి అత్యధిక భారం మోపింది. 2016 నుంచి 2018 మే వరకూ యూనిట్ రేటు రూ.3.86 చొప్పున సరఫరా చేసింది. ఇక ఎన్నికలకు కొద్దినెలల ముందు యూనిట్‌కు రూ.2 చొప్పున ఇచ్చింది. అందుకోసం ఇవ్వాల్సిన సబ్సిడీ భారం రూ.312.05 కోట్లను విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లకు చెల్లించకుండా బాకీ పెట్టింది. దానిని ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రస్తుత వైఎస్సార్సీపీ ప్రభుత్వం భరించాల్సి వచ్చింది. అంటే.. గత ప్రభుత్వం ఆక్వా రైతులకు రాయితీతో కూడిన విద్యుత్ సరఫరా చేయలేదనేది స్పష్టంగా తెలుస్తోంది. కానీ, ఈనాడు మాత్రం ఈ నిజాన్ని దాచేసి, గత ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చిందని ఎడాపెడా రాసేసింది. ఆరోపణ: అర్హుల గుర్తింపు పేరుతో రాయితీ నిలిపేశారు.. వాస్తవం: ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే జూలై 2019 నుండి అన్ని ఆక్వా కనెక్షన్లకు యూనిట్ రూ.1.50 పైసలకే విద్యుత్ సరఫరా చేస్తోంది. అప్పటి నుంచి మార్చి 2023 వరకూ ప్రతి యూనిట్‌పై రూ.2.36 పైసలు చొప్పున మొత్తం రూ.2,792.88 కోట్లు విద్యుత్ సబ్సిడీ భారం మోస్తూ ఆక్వా రైతులను ఆదుకుంటోంది. 2022 జూలై నుంచి ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ జోన్లలో ఆక్వాసాగు చేస్తున్న రైతులకు యూనిట్‌ను రూ.1.50 పైసలకు విద్యుత్ సరఫరా చేయడానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. నాన్–ఆక్వా జోన్లలోనూ అర్హత కలిగిన ఆక్వా జోన్లను గుర్తించి ఆయా చెరువులను ఆక్వా జోన్లుగా పరిగణిస్తూ జిల్లా గెజిట్లలో నోటిఫై చేసింది. తద్వారా మొత్తం ఈ సర్వే ద్వారా గుర్తించిన 4.66 లక్షల ఎకరాల ఆక్వా సాగులో 4.22 లక్షల ఎకరాలను ఆక్వా జోన్లలో చేరుస్తూ నోటిఫై చేసింది. వీటిలో మొత్తం 63,754 ఆక్వా కనెక్షన్లలో 46,445 ఆక్వా కనెక్షన్లను అర్హత కలిగినవిగా గుర్తించి ఆ కనెక్షన్లు కలిగిన ఆక్వా రైతులకు యూనిట్‌ను రూ.1.50 పైసలకు విద్యుత్ సరఫరా చేస్తోంది. యూనిట్ సర్వీస్ ధర రూ.6.89 పైసలకు పెరిగిన నేపథ్యంలో ఆక్వా, నాన్–ఆక్వా జోన్లలో ఉన్న 10 ఎకరాలపైన ఆక్వా చెరువులు కలిగి ఉన్న అధిక సాగు రైతులకు చెందిన 17,309 కనెక్షన్లకు యూనిట్‌ను రూ.3.85 పైసలకు విద్యుత్ సరఫరా చేస్తోంది. ఆక్వా రైతులకు రాయితీపై విద్యుత్ సరఫరా చేస్తున్నారనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి. అసలు ఇవ్వడంలేదని ఎలా రాస్తారు రామోజీ? ఆరోపణ: అధికారంలోకి వచ్చాక ఆక్వా రైతుల గోడు పట్టించుకోవడంలేదు.. వాస్తవం: ఆక్వా రైతులు తమ రొయ్య ఉత్పత్తులను అంతర్జాతీయ విపణిలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వచ్చేది. కానీ, ఆ అవసరంలేకుండా రాష్ట్ర ప్రభుత్వం సాధికార కమిటీ ద్వారా వివిధ కౌంట్ల రొయ్యలకు కనీస కొనుగోలు ధరలను నిర్ణయించింది. ఆ ధరలకు తగ్గకుండా కొనుగోలు చేసేట్లుగా చర్యలు తీసుకుని అమలుచేస్తోంది. రైతుభరోసా (ఆర్బీకే) కేంద్రాల్లో కొనుగోలు ధరల పట్టిక, కాల్ సెంటర్ నెంబర్‌ను అందుబాటులో ఉంచింది. ఏ రైతుకైనా రొయ్యల అమ్మకంలో ఇబ్బంది ఎదురైతే తమ సమస్యలను, ఫిర్యాదులను ప్రభుత్వానికి తెలియజేసేలా ఏర్పాటుచేసింది. రొయ్య మేత ధరలను కూడా మేత ఉత్పత్తిదారులు ఇష్టానుసారం పెంచకుండా, సంప్రదింపుల ద్వారా మాత్రమే పెంచడానికి అనుమతి తీసుకునేలా కట్టుబాటు విధించింది. ఆక్వాసాగు రైతుల ప్రయోజనం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాలన్నీ పట్టించుకోవడంలో భాగం కాదా రామోజీ? మీ కళ్లకు ఇవేమీ ఎందుకు కనిపించడంలేదు?? -
రొయ్యల కోసం ఆక్వారోబో
సాక్షి, అమరావతి: అత్యాధునిక సాంకేతిక పరిజా్ఞనాన్ని అందిపుచ్చుకున్న ఓ ఆక్వా రైతు రొయ్యల పెంపకంలో రోబోను వినియోగిస్తూ అద్భుత ఫలితాలు సాధిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సమీపంలోని చినఅమిరం గ్రామానికి చెందిన వత్సవాయి లక్ష్మీకుమార్‌రాజు మద్రాస్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్‌లో కంప్యూటర్ సైన్స్ పూర్తి చేశారు. కొంతకాలం సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసిన ఆయన ఆ కొలువును వదిలి రొయ్యల సాగు చేపట్టారు. కృష్ణా జిల్లా నందివాడ మండలం అరిపిరాల గ్రామంలో దాదాపు 700 ఎకరాల్లో రొయ్యలను పెంచుతున్నారు. వాటికి ఆహారం అందించేందుకు ఆక్వా రోబో (బాట్)ను తయారు చేయించుకుని వినియోగిస్తున్నారు. ఇది సౌర విద్యుత్ తానే తయారు చేసుకుని పని చేస్తుంది. విద్యుత్ ఆదా కోసం అనేక సాంకేతిక విధానాలను, పరికరాలను వాడుతున్నారు. ఈ మొత్తం వ్యవస్థను ఒక ప్రత్యేక మొబైల్ యాప్ ద్వారా అరచేతిలోనే నడిపిస్తున్నారు. ఆక్వా రంగంలో భారతదేశంలోనే తొలి రోబో ఇదే కావడం విశేషం. కూలీల అవసరం లేకుండానే..: చెరువులోని రొయ్యలకు మనుషులే ఆహారం (ఫీడింగ్) అందించడం సర్వసాధారణంగా జరుగుతుంటుంది. అది అనేక ఇబ్బందులతో కూడుకోవడంతో పాటు ఆహారం సకాలంలో అందేది కాదు. దీంతో మార్కెట్లో ఆటోమేటిక్ ఫీడర్ల కోసం వెతికారు. కానీ.. అవి కూడా ఒకేచోట ఫీడింగ్ చేసేవి. దానివల్ల రొయ్యలన్నిటికీ ఆహారం సమానంగా అందేది కాదు. దీంతో చెరువు మొత్తం తిరిగేలా యంత్రాన్ని తయారు చేస్తే బాగుంటుందనే ఆలోచనకు వచ్చారు లక్ష్మీకుమార్‌రాజు. నెక్ట్ ఆక్వా సంస్థతో తన ఆలోచనను పంచుకున్నారు. ఆ సంస్థ ఐఐటీ గ్రాడ్యుయేట్లతో ఏర్పాటైంది. వారికి ఈ ఆలోచన నచ్చి నాలుగేళ్ల పాటు అరిపిరాలలోనే ఉండి పరిశోధన చేశారు. రకరకాల ప్రయత్నాల తరువాత చివరకు మూవింగ్ రోబోను తయారు చేశారు. చెరువులో తాడుతో (గైడెడ్) లైన్లా కట్టి దాని సాయంతో రెండేళ్లుగా ఈ రోబోను నడుపుతున్నారు. దీని ఆపరేటింగ్ మొత్తం మొబైల్‌తోనే జరుగుతుంది. ఎన్ని కేజీల ఆహారం.. ఏ సమయంలో.. ఎన్నిసార్లు అందించాలనేది ముందుగానే ప్రోగ్రా>మింగ్ చేసుకోవచ్చు. దాని ప్రకారం కచ్చితంగా అంతే ఆహారాన్ని ఆయా సమయాల్లో ఈ రోబో రొయ్యలకు అందిస్తుంది. ముఖ్యంగా ఈ రోబోకి అవసరమైన విద్యుత్‌ను దానిపైనే అమర్చిన సౌర పలకల ద్వారా తానే తయారు చేసుకుంటుంది. క్షణక్షణం.. అప్రమత్తం కరెంట్ ట్రాన్స్ఫార్మర్ (సీటీ) లేదా పవర్ మోనిటర్ (బ్లాక్ బాక్స్)అనే పరికరంతో విద్యుత్ సరఫరాను పర్యవేక్షిస్తున్నారు. ఇది ఆటోమేటిక్ పవర్ ఫ్యాక్టర్ కంట్రోలర్‌గా పనిచేస్తూ విద్యుత్ నష్టాలను, విద్యుత్ బిల్లులను తగ్గిస్తుంది. ఎన్ని ఏరియేటర్స్ (రొయ్యలకు ఆక్సిజన్ అందించే పరికరాలు) పని చేస్తున్నాయనేది నిరంతరం చూస్తుంటుంది. ఏరియేటర్స్ ఆగితే వెంటనే చెబుతుంది. మూడు మొబైల్ నంబర్లకు ఫోన్ అలర్ట్ వెళ్లిపోతుంది. నిజానికి ప్రతి పరిశ్రమలో ఆటోమేటిక్ పవర్ ఫ్యాక్టర్ కంట్రోలర్స్ వాడుతుంటారు. వీటిని ఆక్వాలో వాడటం అనేది చాలా అరుదు. మోటార్లు ఆగిపోతే వెంటనే సరిచేసి ఆన్ చేయాలి. లేదంటే రొయ్యలు చనిపోతాయి. ఇందుకోసం రైతులు రాత్రివేళల్లో చెరువుల వద్ద కాపలాగా పడుకోవాల్సి వస్తోంది. అలాంటి సమయంలో విద్యుత్ ప్రమాదాల బారినపడి రైతులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు జరుగుతున్నాయి. ఈ సమస్యలను పవర్ మోనిటర్ తీరుస్తోంది. ఎన్ని ఏరియేటర్స్ ఆన్ చేస్తే అన్నే కెపాసిటర్లు ఆన్ అయ్యేలా చూస్తుంది. అవి ఆగిపోతే కెపాసిటర్లను ఆపేస్తుంది. జనరేటర్ పనితీరును కూడా ఇది పర్యవేక్షిస్తుంది. దీనివల్ల డీజిల్ దొంగతనాన్ని అరికట్టవచ్చు. స్మార్ట్ స్టార్టర్ కంట్రోలర్ అనే పరికరం ద్వారా మొబైల్‌తోనే ఏరియేటర్స్ని ఆన్ చేయవచ్చు. అవి ఎంతసేపు పనిచేయాలనేది ప్రోగ్రామింగ్ చేసుకోవచ్చు. సాంకేతిక సమస్య ఏదైనా ఏర్పడితే మొబైల్‌కి సమాచారం వచ్చేస్తుంది. ఇలా చేయడం వల్ల మోటారు కాలిపోకుండా కాపాడుతుంది. విద్యుత్ బిల్లులు ఆదా విద్యుత్ వ్యవస్థకు సాంకేతికతను జోడించి మా చెరువుల్లో వినియోగిస్తున్నాం. పర్యావరణ హితం కోరి 15 ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను వాడుతున్నాం. పవర్ మాంక్స్ సాఫ్ట్వేర్ ద్వారా చెరువుల మొత్తం ఎంత విద్యుత్ వినియోగం జరుగుతోంది, సరఫరా ఎలా ఉంది, ఎక్కడైనా సాంకేతిక, భౌతిక ఇబ్బందులు ఉన్నాయా అనేది రియల్ టైమ్ (ఎప్పటికప్పుడు) సమాచారాన్ని టీవీ (మోనిటర్)లో కనిపించేలా సెన్సార్లు ఏర్పాటు చేశాం. దీనివల్ల 95 శాతం కంటే ఎక్కువగా విద్యుత్ వినియోగం సక్రమంగా జరుగుతోంది. ప్రతి 100 కేవీ ట్రాన్స్ఫార్మర్పై నెలకు కనీసం రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకూ విద్యుత్ ఆదా అవుతోంది. – వత్సవాయి లక్ష్మీకుమార్‌రాజు, ఆక్వా రైతు -
ఆక్వా రైతులకు శుభవార్త
-
మండ పీతకు మంచి డిమాండ్.. 4 లక్షల ఆదాయం!
సాక్షి, అమలాపురం: ఆక్వాలో కీలకమైన చేపలు, వనామీ రొయ్యల పెంపకం సంక్షోభంలో కూరుకుపోతోంది. మరీ ముఖ్యంగా వనామీ సాగు రైతులకు నష్టదాయకంగా మారింది. ప్రభుత్వం కనీస మద్దతు ధర ప్రకటిస్తున్నా ఎగుమతిదారులు కొనుగోలు చేయకపోవడంతో రైతులకు నష్టాలు తెచ్చిపెడుతోంది. దీంతో పలువురు ఆక్వా రైతులు ప్రత్యామ్నాయ సాగు వైపు దృష్టిసారించారు. ప్రస్తుతం వారు పీతల సాగుపై ఆసక్తి చూపుతుండగా.. అందుకు ప్రభుత్వం దన్నుగా నిలిచేందుకు సిద్ధమైంది. పీతల సాగుకు మద్దతుగా పలు చర్యలు తీసుకుంటోంది. కోనసీమలో ఒకటిన్నర దశాబ్దాలుగా తీర ప్రాంత మండలాల్లో పీతల సాగు చేస్తున్నారు. ఏళ్లు గడుస్తున్నా సాగు విస్తీర్ణం మాత్రం పెద్దగా పెరగలేదు. జిల్లాలో ఐ.పోలవరం, కాట్రేనికోన, ఉప్పలగుప్తం మండలాల్లో కేవలం 200 ఎకరాల్లో సాగు జరుగుతోంది. దీనిని మరింత పెంచేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమవుతోంది. అంతర్జాతీయంగా ఇటీవల కాలంలో మన దేశం నుంచి పీతల ఎగుమతి పెరుగుతోంది. సెల్లా సెరటా, స్కెల్లా ట్రాంక్బారికా (మండ పీత) రకాలకు మంచి డిమాండ్ ఉంది. ఇవి కిలో రూ.600 నుంచి రూ.వెయ్యి వరకూ ధర పలుకుతున్నాయి. ఈ రకం పీతల పెంపకం లాభదాయకంగా ఉంటుందని మత్స్యశాఖాధికారులు చెబుతున్నారు. ఎకరా సాగుకు రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకూ ఖర్చు కాగా, దిగుబడిని బట్టి ఎకరాకు రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకూ ఆదాయం వచ్చే అవకాశముంది. చిర్రయానాంలో హేచరీ పీతల సాగు ప్రోత్సాహంలో భాగంగా కాట్రేనికోన మండలం చిర్రయానాం వద్ద ప్రైవేట్ హేచరీ నిర్మాణానికి మత్స్యశాఖ ప్రోత్సాహం అందిస్తోంది. స్థానికంగా హేచరీ వస్తే పీతల సీడ్ తక్కువ ధరకు రావడంతో పాటు సాగు విస్తీర్ణం పెరుగుతుందని అంచనా. ప్రస్తుతం ఆర్జీసీ విజయవాడ నుంచి, చెన్నై నుంచి తీసుకువస్తున్నారు. ఇది రైతులకు భారంగా మారింది. ఇదే సమయంలో సాగు ప్రోత్సాహంలో భాగంగా పెట్టుబడికి అవసరమైన రుణ పరిమితిని ఇటీవల డిస్ట్రిక్ట్ లెవిల్ టెక్నికల్ కమిటీ (డీఎల్టీసీ) పెంచిన విషయం తెలిసిందే. కమిటీ ఎకరాకు రూ.78 వేలుగా పేర్కొనగా, జిల్లా కలెక్టర్ శుక్లా దీనిని రూ.లక్షకు పెంచాలని సూచించారు. వనామీకి ప్రత్యామ్నాయంగా పీతల సాగు పెంచితే అటు వనామీకి కూడా మంచి డిమాండ్ వస్తోందని అంచనా. మూడు రకాలుగా.. పీతల సాగు మూడు రకాలుగా చేయవచ్చు. కానీ జిల్లా రైతులు కేవలం సంప్రదాయ పద్ధతిలో చెరువుల చుట్టూ వలలు వేసి పెంపకం చేపడుతున్నారు. సాధారణ ఆక్వా చెరువుల మాదిరిగానే ఇక్కడా చేస్తున్నారు. దీంతో పాటు బాక్సులలో పీతలను పెంచే అవకాశముంది. అభివృద్ధి చెందిన దేశాల్లో బాక్సులలో పీతలను పెంచుతున్నారు. మూడో రకం సాఫ్ట్ సెల్స్ ఎప్పటికప్పుడు సేకరించడం ద్వారా సాగు చేస్తారు. మన తీరం అనుకూలం జిల్లాలో ఇప్పుడు మూడు మండలాల్లో మాత్రమే చాలా తక్కువ మొత్తంలో పీతల సాగు జరుగుతోంది. పీతల సాగుకు తీర ప్రాంత మండలాలు అనుకూలం. ఇటు వరికి, అటు రొయ్యల సాగుకు పనికిరాని చౌడు నేలల్లో సైతం పండించవచ్చు. ఆక్వా రైతులు ముందుకు వస్తే ప్రభుత్వం సాగుకు సాంకేతిక సహకారం, ఇతర ప్రోత్సాహకాలు అందిస్తుంది. –షేక్ లాల్ మహ్మద్, జిల్లా మత్స్యశాఖాధికారి -
బ్రాండింగ్ ‘చేప’ట్టిన సర్కారు.. ‘ఫిష్ ఆంధ్ర’కు ప్రమోషన్
సాక్షి, అమరావతి: ’ఫిష్ ఆంధ్ర’ బ్రాండింగ్‌ను మరింతగా ప్రోత్సహించేందుకు మత్స్య శాఖచర్యలు చేపట్టింది. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న ఒడిదుడుకులతో ఆక్వా రంగంలో తరచూ తలెత్తుతున్న సంక్షోభం దృష్ట్యా కేవలం ఎగుమతులపైనే ఆధారపడకుండా స్థానిక వినియోగంపైనా దృష్టి సారించాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకు అనుగుణంగా మత్స్య ఉత్పత్తుల తలసరి వినియోగం పెంచడం.. తద్వారా ఆక్వా రైతులు, మత్స్యకారులకు అండగా నిలబడటమే లక్ష్యంగా ముందుకెళుతోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో లభించే సముద్ర, రైతులు పండించే మత్స్య ఉత్పత్తులను ‘ఫిష్ ఆంధ్ర’ పేరిట హబ్‌లు, అవుట్‌లెట్స్, కియోస్క్‌ల ద్వారా మత్స్య శాఖ విక్రయిస్తోంది. వీటిని బ్రాండింగ్ చేసేందుకు ప్రత్యేకంగా యూట్యూబ్ చానల్‌తో పాటు ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్, టెలిగ్రామ్, ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా వేదికల ద్వారా ప్రమోట్ చేయనుంది. డోర్ డెలివరీ కోసం ప్రత్యేకంగా యాప్‌ను డిజైన్ చేయనున్నారు. కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ వ్యవస్థ (సీఆర్ఎంఎస్) ద్వారా వినియోగదారులు ఎలాంటి ఉత్పత్తులను ఎక్కువగా ఇష్టపడుతున్నారనే దానిపై ప్రతిరోజూ ఫీడ్ బ్యాక్ తీసుకుంటూ మార్కెటింగ్ సౌకర్యాలను కల్పించనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా కన్సల్టెంట్ నియమించనున్నారు. ఆసక్తి కల్గిన ఏజెన్సీల నుంచి రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్స్ (ఆర్ఎఫ్పీ) కోరుతూ బుధవారం మత్స్యశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి గల ఏజెన్సీలు www.fisheries.ap.gov.in అనే వెబ్సైట్ ద్వారా టెండర్ డాక్యుమెంట్స్ డౌన్లోడ్ చేసుకుని వచ్చే నెలాఖరులోగా apfisheriestender@gmail.comలో దరఖాస్తు చేసుకోవాలని మత్స్యశాఖ కమిషనర్ కె.కన్నబాబు కోరారు. -
జోన్.. జోష్
ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న కరెంట్ కష్టాలను తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో వినూత్న ప్రణాళిక రూపొందించింది. ఆక్వా జోనేషన్ విధానంతో సాగు చేసే విస్తీర్ణం, రైతుల వివరాలతో లెక్కలు తేల్చి అన్ని విధాలా ఆదుకునేందుకు కసరత్తు చేస్తోంది. ఈ–ఫిష్ యాప్‌లో వివరాలు నమోదు చేయడం ద్వారా ఎంత విద్యుత్ అవసరమో గుర్తించి రైతులకు విద్యుత్ చార్జీల భారం నుంచి భారీ విముక్తిని కల్పించనుంది. విడవలూరు: ఆక్వా రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఆక్వా జోనేషన్ విధానం వరంగా మారనుంది. ఇప్పటికే ప్రపంచ మార్కెట్లో రొయ్యల ధరల ఒడిదుడుకుల కారణంగా జిల్లాలోని ఆక్వా రైతులు అతలాకుతలమవుతున్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కచ్చితమైన నిర్ణయాలు తీసుకుంటున్నప్పటికీ క్షేతస్థాయిలో దళారులు మొండి చేయి చూపుతున్నారు. ఆక్వా రైతులకు అండగా ఉండేందుకు ఇప్పటికే ఆక్వా జోనేషన్ విధానం అమల్లోకి తెచ్చింది. మత్స్యశాఖ, విద్యుత్, రెవెన్యూ శాఖల ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో సర్వే చేపడుతున్న అధికారులు ఆక్వా సాగు విస్తీర్ణం, రైతుల వివరాలు, విద్యుత్ వినియోగం వివరాలను ఈ–ఫిష్ యాప్ ద్వారా నమోదు చేస్తున్నారు. తాజాగా మరోసారి సర్వే ప్రారంభించారు. ఇంకా నమోదు చేసుకోని రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించేందుకు ప్రస్తుతం గ్రామ సభలను నిర్వహిస్తున్నారు. ఆక్వా రైతులకు ఊరట ప్రతి ఆక్వా రైతు ఈ–ఫిష్‌లో నమోదు చేసుకోవడం వల్ల వారికి కరెంట్ చార్జీలు భారీగా తగ్గుముఖం పడుతాయి. జిల్లాలోని తీర ప్రాంతాలైన ఉలవపాడు, గుడ్లూరు, కావలి, బోగోలు, అల్లూరు, విడవలూరు, ఇందుకూరుపేట, తోటపల్లిగూడూరు, ముత్తుకూరు మండలాల్లో ఆక్వా సాగు కింద రొయ్యలు, చేపలను సాగు చేస్తున్నారు. ఈ 9 మండలాల్లో సుమారు 8,500 మంది రైతులు సుమారు 40 వేల ఎకరాల ఆక్వా సాగు చేస్తున్నారు. ఏటా రెండు దఫాలుగా సాగు జరుగుతోంది. ఈ సాగులో మొదటి నెలలో ఎకరా గుంతకు రెండు ఏయిరేటర్లు, రెండు మోటార్లు నిత్యం నియోగించాలి. రెండో నెలలో నాలుగు ఏయిరేటర్లు, రెండు మోటార్లు, మూడో నెలలో ఆరు ఏయిరేటర్లు, రెండు మోటార్లను రైతులు వినియోగిస్తుంటారు. ఏడాదికి రూ. 480 కోట్ల మేర భారం ప్రస్తుతం ఆక్వా సాగు కింద విద్యుత్ యూనిట్‌ను రూ.3.85 చొప్పున వసూలు చేస్తున్నారు. నెలకు ఒక ఎకరాకు రూ.30 వేల విద్యుత్ బిల్లు వస్తుంది. అయితే ఈ–ఫిష్ రీ సర్వే పూర్తయ్యాక యూనిట్ విద్యుత్‌ను రూ.1.50లకే అందిస్తారు. దీంతో నెలకు ఎకరాకు సుమారు రూ.10 వేల లోపు మాత్రమే విద్యుత్ బిల్లు వస్తుంది. ఈ లెక్కన నెలకు ప్రభుత్వంపై దాదాపు రూ.80 కోట్లు భారం పడనుంది. ఏడాదిలో ఆక్వా సాగు జరిగే ఆరు నెలలకు నెలకు రూ. 80 కోట్లు చొప్పున రూ.480 కోట్ల మేర భారం పడనుంది. ఈ– ఫిష్ నమోదు ప్రక్రియ ఇలా.. ►కేవలం 10 ఎకరాల్లోపు విస్తీర్ణం కలిగిన రైతులు మాత్రమే ఈ పథకానికి అర్హులు. ►ఆక్వా సాగు చేసే పరిధిలోని సచివాలయంలో మత్స్యశాఖ ఉద్యోగి ద్వారా నమోదు ప్రక్రియ చేసుకోవాలి. ►రైతుకు సంబంధించిన ఆక్వా సాగు విస్తీర్ణ ధ్రువీకరణ పత్రాలు, సర్వే నంబర్ పత్రాలు, విద్యుత్ సర్వీస్ నంబర్ పత్రాలు, ఆధార్‌కార్డు, మత్స్యశాఖ వారు జారీ చేసిన లైసెన్సు లేదా, కార్డును ఉద్యోగులకు అందజేయాలి. ►అనంతరం వాటిని జిల్లా మత్స్యశాఖ జేడీ కార్యాలయానికి పంపి అక్కడ నుంచి విద్యుత్ జిల్లా అధికారులకు నివేదికను అందజేస్తారు. రైతులకు భారీ ఊరట ఆక్వా జోనేషన్ నిజంగా ఆక్వా రైతుల పాలిట వరం. ప్రస్తుతం ఆక్వా సాగు ఒడిదుడుకుల మధ్య సాగడంతో నష్టాలను చవి చూస్తున్నాం. విద్యుత్ బిల్లులు కూడా చెల్లించలేకపోతున్నాం. ఈ విధానంతో యూనిట్ విద్యుత్ కేవలం రూ.1.50లకే మాత్రమే పడడంతో చాలా వరకు కష్టాలు తీరనున్నాయి. – వెంకటేశ్వర్లు, రామచంద్రాపురం, విడవలూరు మండలం చిన్న రైతులకు మేలు ఈ ఆక్వా జోనేషన్ చిన్న, సన్న కారు ఆక్వా రైతులు చాల మేలు కలిగిస్తుంది. ప్రస్తుతం ఈ పథకం ద్వారా కేవలం 10 ఎకరాల లోపు వారు మాత్రమే నమోదు చేసుకోవాల్సి ఉంది. చిన్న రైతులకు విద్యుత్ భారం తగ్గనుంది. చిన్న రైతులు కూడా సాగు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. – సంతోష్, ఆక్వా రైతు, గంగపట్నం, ఇందుకూరుపేట మండలం ఆక్వా జోనేషన్ వరం ఈ ఆక్వా జోనేషన్ పథకం ద్వారా విద్యుత్ చార్జీలు భారీగా తగ్గుతాయి. ఇప్పటికే మా సిబ్బంది రీ సర్వే చేసి గ్రామ సభలను నిర్వహిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 40 వేల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న సాగును నమోదు చేస్తున్నాం. ఇంకా నమోదు చేసుకోని రైతులు సచివాలయాలను సంప్రదించి నమోదు చేసుకోవాలి. – నాగేశ్వరరావు, మత్స్యశాఖ జేడీ -
రొయ్యల కొనుగోళ్లు: కోతేస్తే.. కొరడా
అంతర్జాతీయ మార్కెట్లో ఒడిదుడుకుల కారణంగా ఆక్వా ఎగుమతులు తగ్గుముఖం పట్టాయి. ధరల పతనంతో రొయ్య రైతులు దిగాలు పడ్డారు. ఈ సమయంలో ప్రభుత్వం అండగా నిలబడింది. గిట్టుబాటు ధర కల్పించేందుకు ముందుకొచ్చింది. ధరల స్థిరీకరణకు ఆక్వా సాధికారత కమిటీని ఏర్పాటు చేసింది. ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు కొనుగోలు చేయని ప్రాసెసింగ్ కంపెనీలపై కొరడా ఝులిపించేందుకు రంగం సిద్ధం చేసింది. మరో వైపు ఆక్వా రైతులు, ప్రాసెసింగ్ యూనిట్ల యజమానులు, సీడ్, ఫీడ్ తయారీదారులు సమన్వయంతో ముందుకు సాగేలా చర్యలు చేపట్టింది. ఎప్పుటికప్పుడు ధరలను సమీక్షిస్తూనే రైతుల కోసం జిల్లా మత్స్యశాఖ అధికారులు హెల్ప్‌లైన్ నంబర్లను అందుబాటులోకి తెచ్చారు. హెల్ప్‌లైన్ నంబర్లు : 9392905878, 9392905879 సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో దాదాపు 16 వేల ఎకరాల్లో ఆక్వా సాగవుతోంది. ప్రధానంగా రొయ్యల సాగు చేపడుతున్నారు. రొయ్యల సాగును మూడు విడతల్లో చేపడతారు. ప్రధాన రెండు సీజన్లలో అధిక సంఖ్యలో రైతులు అధిక మొత్తంలో దిగుబడి సాధిస్తారు. ఒక్కో సీజన్లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో దాదాపు 30 వేల టన్నుల రొయ్యల దిగుబడి వస్తోంది. ఈ మొత్తాన్ని ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఆక్వా ప్రాసెసింగ్ ప్లాంట్లు కొనుగోలు చేయాల్సిందే. జిల్లాలో ఉన్న ఆక్వా ప్రాసెసింగ్ ప్లాంట్లు దేవీ సీ ఫుడ్స్, జీవీఆర్ ఆక్వా, మున్నంగి ఆక్వా, సదరన్ ఆక్వా, కళ్యాణి ఆక్వా, నీలా ఆక్వా, క్రిస్టల్ ఆక్వా, రాయల్ ఆక్వా, ఆక్వా టీకాలు కొనుగోలు చేయాలి. ఇదిలా ఉండగా అంతర్జాతీయంగా ఏర్పడిన సంక్షోభంతో రొయ్యల ధరలు క్రమంగా తగ్గుతూ వచ్చాయి. దీనిని సాకుగా చూపి వ్యాపారులు రైతులను నిలువుదోపిడీ చేస్తున్నారు. ఆక్వా వ్యాపారులు, ప్రాసెసింగ్ ప్లాంట్ల నిర్వాహకులు, ఎగుమతిదారులు కుమ్మక్కై కూడబలుక్కుని రొయ్యలు సాగు చేస్తున్న రైతులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. దీంతో నీలివిప్లవానికి పెట్టింది పేరైన ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రొయ్యల రైతులు విలవిల్లాడిపోతున్నారు. ఈ దశలో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగింది. గత నెల 17వ తేదీ విజయవాడలో అధికారులు, మంత్రులు కలిసి రొయ్యల రైతులు, వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. వ్యాపారులకు దిశానిర్దేశం చేశారు. అయినా వారిలో మార్పురాలేదు. రైతుల పక్షాన ప్రభుత్వం... ప్రభుత్వం ఆక్వా రైతుల పక్షాన నిలిచింది. వ్యాపారులు, ఎగుమతిదారులతో మంత్రుల సబ్ కమిటీ సంప్రదింపులు జరిపింది. ప్రస్తుతం ఎగుమతులు లేవని, అందుకోసం తగ్గించి కొనుగోలు చేయాల్సి వస్తుందని వ్యాపారులు, ఎగుమతిదారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయాన్ని బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కూడిన మంత్రుల సబ్ కమిటీ సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లింది. రొయ్యలు పచ్చి సరుకు కాబట్టి ప్రభుత్వమే ఒక మెట్టు దిగి గతంలో నిర్ణయించిన ధరను కొంచెం తగ్గించి కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ధరలు సవరించిన ప్రభుత్వం... వ్యాపారులు, ఎగుమతిదారులు అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తక్కువగా ఉన్నాయనడంతో ప్రభుత్వం ఆక్వా రైతులతో చర్చించిన మీదట ధరల్లో కొంత మార్పు చేసింది. ప్రభుత్వం పెద్ద మనసు చేసుకుని ముందు నిర్ణయించిన ధరలను కొంచెం తగ్గించి కొనుగోలు చేయాలని నూతన ధరలను ప్రకటించింది. ఆ ధరలకు కొనుగోలు చేస్తున్నామంటూనే నూతనంగా నిర్ణయించిన ధరలను కూడా పెడచెవిన పెట్టి మరీ తక్కువకు కొనుగోలు చేయడం ప్రారంభించారు. బుధవారం మరోసారి రాష్ట్ర మంత్రులు సాధికారిత కమిటీతో సమావేశమయ్యారు. ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు కొనుగోలు చేయని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఎప్పటికప్పుడు అంతర్జాతీయ మార్కెట్‌తో పాటు స్థానిక మార్కెట్లో ధరలను సమీక్షించేందుకు వీలుగా చర్యలు తీసుకుంటున్నట్టు జిల్లా మత్స్యశాఖ అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన రేట్లకు కొనుగోలు చేయకపోతే రైతులు తమ దృష్టికి తీసుకురావాలని సూచిస్తున్నారు. ఈ విషయంపై రైతులకు ఆవగాహన కల్పిస్తున్నారు. ఇందుకు సంబంధించి హెల్ప్‌లైన్ నంబర్లు కూడా అందుబాటులో ఉంచారు. ఇక్కడ పండించిన పంట ఉత్పత్తులను ఇదే ప్రాంతంలో విక్రయించుకునేలా చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాల వారీగా ఆక్వా రైతు కమిటీలు గురువారం జూమ్ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ప్రభుత్వ నిర్ణయం మేరకు నడుచుకునేలా తీర్మానం చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం రొయ్యల రైతులకు అండగా ఉంది. అందుకే అటు వ్యాపారులతో, ఇటు రైతులతో విరామం లేకుండా చర్చలు జరుపుతోంది. అయినా రొయ్యల ధరల విషయంలో వ్యాపారుల్లో మార్పు లేదు. ప్రభుత్వం స్పష్టంగా చెప్పినా రొయ్యల ప్రాసెసింగ్ ప్లాంట్ల యజమానులు, వ్యాపారులు రైతులను నిలువునా నష్టపరుస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన ధరల కంటే తక్కువకు కొనుగోలు చేయడం ద్వారా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. – దుగ్గినేని గోపీనా«థ్, రొయ్యల రైతు సంఘ నాయకుడు వ్యాపారులు, ఎగుమతిదారులు తీరు మార్చుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం ఆక్వా సాగుకు పూర్తి భరోసానిస్తోంది. కరోనా సమయంలోనూ రైతులకు ఇబ్బంది లేకుండా వ్యాపారులతో రొయ్యలు కొనుగోలు చేయించింది. 10 ఎకరాల్లోపు సాగు చేసే రైతులకు విద్యుత్ చార్జీ యూనిట్‌కు కేవలం రూ.1.50గా నిర్ణయించింది. ఇటీవల రొయ్య మేత ధరలను టన్ను రూ.2,600కు తగ్గించింది. ప్రస్తుతం ఆక్వా వ్యాపారులు ధరలు తగ్గించేందుకు ప్రయత్నిస్తే ప్రభుత్వం 100 కౌంట్ రూ.210గా నిర్ణయించి వ్యాపారులచే కొనుగోలు చేయిస్తోంది. – మాలె రంగారెడ్డి, ఆక్వా రైతు, మూలగుంటపాడు ఇతర దేశాల్లో తక్కువ ధరకు రొయ్యల ఎగుమతి ఇతర దేశాల్లో తక్కువ ధరకు రొయ్యలు ఎగుమతి చేయడం వలన మన దేశం రొయ్యల ధర దిగజారింది. యూరప్ కంట్రీస్‌లో ఉన్న ఈక్విల్యాండ్ దేశంలో రొయ్యలు 100 కౌంట్ రూ.140కు విక్రయిస్తున్నారు. అక్కడ ఏడాది క్రితం రొయ్యల కల్చర్ మొదలుపెట్టారు. ఎకరానికి 5 టన్నులకు తగ్గకుండా తీస్తారు. మన దేశంలో 2 టన్నుల్లోపే వస్తుంది. వారికి ఎగుమతి ఖర్చులు, రొయ్యల యూనిట్లు దగ్గర ఉండటం వలన చార్జీలు తక్కువ. అందుకే తక్కువ ధరకు ఇస్తారు. మనదేశంలో రొయ్యల రైతులకు 100 కౌంట్ ధర రూ.250కు తగ్గకుండా ఇస్తేనే గిట్టుబాటవుతుంది. – గాదె కోటిరెడ్డి, రొయ్యల రైతు, గాదెపాలెం -
‘ఆక్వా’ సంక్షోభం తాత్కాలికమే
సాక్షి, రాజమహేంద్రవరం: ‘ఆక్వా సంక్షోభం అంతర్జాతీయ స్థాయిలో ఏర్పడిందని.. మరో రెండు నెలల్లో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని.. సంక్షోభం నుంచి రైతులను గట్టెక్కించేందుకు ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు రొయ్యలు కొనుగోలు చేస్తామని సీఫుడ్స్ ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షులు అల్లూరి ఇంద్రకుమార్, రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్రావ్, అసోసియేషన్ నేతలు వెల్లడించారు. రాజమహేంద్రవరంలో గురువారం ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు తదితర జిల్లాలకు చెందిన రైతులు, ఎగుమతిదారుల సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో వారు మాట్లాడారు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ఫలితంగా యూరోపియన్, చైనాల జీరో కోవిడ్ పాలసీ అమలు, అమెరికాలో వనామీ రొయ్యల నిల్వలు పెరిగిపోవడం లాంటి పరిణామాలతో ఆక్వా రంగం గత మూడు నెలలుగా సంక్షోభాన్ని ఎదుర్కొంటోందన్నారు. డిసెంబర్, జనవరి నెలల్లో విదేశాల్లో పండుగలు ఉన్నాయని.. అక్కడ నిల్వ ఉన్న సరుకుతోపాటు దేశంలో ఎగుమతిదారుల వద్ద ఉన్న సరుకు అమ్ముడుపోతుందని, ఫలితంగా భారత్‌లో తిరిగి రొయ్యల ఎగుమతులు పుంజుకుంటాయన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రైతులకు అండగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం సూచించిన మేరకు 100 కౌంట్ రూ.210, 30 కౌంట్ రూ.380కి కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రతిరోజూ ధరల్లో మార్పులేకుండా 10–20 రోజుల పాటు నిర్ణీత ధర ఇచ్చేందుకు అంగీకరించారు. సంక్షోభంలో ఉన్న రైతులను ఆదుకోవాల్సింది పోయి.. కొంతమంది జె–ట్యాక్స్, ఆ ట్యాక్స్, ఈ ట్యాక్స్ అంటూ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నాలను మానుకోవాలని హితవు పలికారు. వ్యవసాయం తర్వాత అత్యధిక సాగులో ఉన్న ఆక్వా రంగంపై లేనిపోని ఆరోపణలుచేసి రైతులతో రాజకీయం చెయ్యొద్దని వారు విజ్ఞప్తి చేశారు. క్రాప్ హాలిడే ఆలోచనే లేదు: ఆక్వా రంగం సంక్షోభాలు రైతులకు కొత్తేమీకాదన్నారు. టైగర్ రొయ్య సాగులో నష్టాలు చూశారన్నారు. ప్రస్తుతం వనామీలో సంక్షోభం తాత్కాలికమేనని వారు స్పష్టంచేశారు. రైతులు క్రాప్ హాలిడే ప్రకటిస్తారన్న ఆరోపణలను వారు ఖండించారు. అలాంటి ఆలోచన రైతులకు లేదన్నారు. కేవలం గిట్టుబాటు ధర కావాలని డిమాండ్ చేస్తున్నారన్నారు. అందుకనుగుణంగా ప్రభుత్వం ఎప్పటికప్పుడు రైతులు, ఎగుమతిదారులను సంప్రదిస్తూ సూచనలు చేస్తోందన్నారు. ఇందుకుగాను ఒక కమిటీ వేసి మరీ పర్యవేక్షిస్తోందని గుర్తుచేశారు. రైతుల సమస్యలపై సంప్రదించేందుకు త్వరలో టోల్‌ఫ్రీ నంబర్‌ను కూడా ఏర్పాటుచేస్తామన్నారు. రైతులకు సూచనలు.. ఆక్వా రంగంలో నష్టాల నుంచి గట్టెక్కాలంటే రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనుసరించాలని విధానాలపై వక్తలు అవగాహన కల్పించారు. భవిష్యత్తులో ఎలా ముందుకెళ్లాలన్న అంశంపై చర్చించారు. ఈ సందర్భంగా రైతులకు పలు సూచనలు చేశారు. అవి.. ► అందరూ ఒకేసారి పంట వేసి ఇబ్బందులు పడకుండా క్రాప్ రొటేషన్ పద్ధతి పాటించాలి. ► ఎగుమతులకు ఇబ్బందికరంగా మారిన 100 కౌంట్ రొయ్యల సాగుకు స్వస్తిపలికి 70, 80, 30 కౌంట్ రొయ్యలపై దృష్టిపెట్టాలి. ► చెరువుల్లో తక్కువ స్థాయిలో సీడ్ వేసి ఎక్కువ కౌంట్ సాధించేలా ప్రణాలికాబద్ధంగా వ్యవహరించాలి. ► దేశంలో 8 లక్షల మెట్రిక్ టన్నుల రొయ్యలు ఉత్పత్తి అవుతుంటే ఒక్క ఆంధ్రప్రదేశ్ నుంచే 5 లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి జరుగుతోంది. ► ఇందులో సింహభాగం ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచే ఉంటోంది. పెద్ద రైతులకూ విద్యుత్ సబ్సిడీ ఇవ్వాలి ప్రభుత్వం చిన్న రైతులకు విద్యుత్ సబ్సిడీ ఇస్తోంది. వాటిని పెద్ద రైతులకూ అమలుచేయాలి. మేతల ధరలు పెరగడంతో ఉత్పత్తి వ్యయం పెరుగుతోంది. నాణ్యమైన సీడ్, మేత లభించకపోవడం ఓ కారణమైపోతోంది. – రుద్రరాజు నానిరాజు, ఆక్వా రైతులు, కోనసీమ -
పది రోజుల్లో ‘ఆక్వా సమస్య’ పరిష్కారం
సాక్షి, అమరావతి: అంతర్జాతీయ మార్కెట్లో ఒడిదొడుకుల వల్లే ఆక్వా ఎగుమతులు తగ్గాయని, పది రోజుల్లో ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో ఆక్వా సిండికేట్ వ్యాపారులకు కొమ్ముకాసి, రైతుల పొట్టకొట్టిన టీడీపీ నేతలు ఇప్పుడు ప్రభుత్వంపై దుష్ఫ్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ నేతల నేతృత్వంలో ప్రతిపక్షాలు చేస్తున్న విష ప్రచారాన్ని నమ్మవద్దని ఆక్వా రైతులకు విజ్ఞప్తి చేశారు. ఆయన బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. చైనా, అమెరికా వంటి దేశాలకు ఎగుమతులు తగ్గడం వల్ల ఆక్వా ధరలు.. ప్రధానంగా రొయ్యల ధరలు తగ్గాయని తెలిపారు. ఈక్వెడార్ దేశంలో రొయ్యల ఉత్పత్తి గణనీయంగా పెరగడమూ కారణమని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తక్షణమే స్పందించి ఆక్వా రైతులకు అండగా నిలిచేందుకు మంత్రుల నేతృత్వంలో సాధికార కమిటీని ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. ఈ కమిటీ ఇప్పటికే ఎగుమతిదారులతో సమావేశమై మద్దతు ధర ఇవ్వాలని ఆదేశించిందన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ఒడిదుడుకులు ఏర్పడినప్పుడు రొయ్యలు, చేపలను నిల్వ చేసుకోవడానికి రూ.546 కోట్లతో పది ప్రాసెసింగ్ యూనిట్లు, 23 ప్రీ ప్రాసెసింగ్ యూనిట్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఆక్వా రైతులకు ఎన్నో ప్రయోజనాలు ఆక్వా రైతులకు సీఎం జగన్ ఎన్నో ప్రయోజనాలు చేకూర్చారని తెలిపారు. పాదయాత్ర చేసిన సందర్భంగా యూనిట్ విద్యుత్ రూ.1.50కే హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక దానిని అమలు చేశారని చెప్పారు. దీనివల్ల 86 శాతం రైతులకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. మూడేళ్లలో విద్యుత్ సబ్సిడీ రూపంలోనే రూ.2,377 కోట్లు ఇచ్చారన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో ఆక్వాకు రూ. 100 కోట్లు కూడా ఖర్చు చేయలేదని చెప్పారు. కరోనా సంక్షోభంలోనూ సీఎం జగన్ రైతులకు అండగా నిలిచారని, ఎన్నడూ లేని రీతిలో ఆక్వా ఉత్పత్తులకు మంచి ధరలు ఇప్పించారని గుర్తు చేశారు. తక్కువ ధరకు నాణ్యమైన విత్తనం (సీడ్), ఫీడ్ (మేత) అందించేలా చట్టాలను తెచ్చారన్నారు. ఈ చర్యల ద్వారా పెట్టుబడి వ్యయాన్ని తగ్గిస్తున్నారని వివరించారు. ఆక్వా డెవలప్మెంట్ అథారిటీని కూడా ఏర్పాటు చేశారన్నారు. అనుమతులను సులభతరం చేయడం వల్ల ఆక్వా సాగు ఐదు లక్షల ఎకరాలకు చేరుకుందన్నారు. ఆక్వా సాగులో దేశంలో రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో నిలిపిన ఘనత సీఎంకు దక్కిందన్నారు. వాస్తవాలు ఇలా ఉంటే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు శిష్యులైన కొందరు వ్యాపారులు సిండికేట్ అయ్యి ఆక్వా రంగాన్ని దెబ్బతీసేలా దుష్ఫ్రచారం చేస్తున్నారని, వారి ఆటలు సాగనివ్వబోమని చెప్పారు. -
జగన్ ప్రభుత్వం ఆక్వా రైతులకి అండగా నిలిచింది : ఏపీ చీఫ్ విప్ ప్రసాద రాజు
-
నిర్దేశించిన ధరలకు రొయ్యలు కొనాల్సిందే
సాక్షి, అమరావతి: ‘ఆక్వా రైతులను ఇబ్బంది పెట్టేలా వ్యవహరిస్తే ఊరుకునే ప్రసక్తి లేదు. 100 కౌంట్ రొయ్యలకు కనీసం రూ.210 తగ్గకుండా చెల్లించాల్సిందే. ఇదే రీతిలో మిగిలిన కౌంట్ ధరలు కూడా చెల్లించేలా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు కొనుగోలు చేయాల్సిందే. ఇష్టమొచ్చినట్టు రొయ్యల ధరలు తగ్గిస్తే చర్యలు తప్పవు’ అని ఆక్వా ప్రాసెసింగ్ ప్లాంట్ల నిర్వాహకులను ఆక్వా సాధికార కమిటీ హెచ్చరించింది. ఆక్వా రైతులు, ప్రాసెసింగ్ యూనిట్ల నిర్వాహకులు, సీడ్, ఫీడ్ కంపెనీల ప్రతినిధులతో ఏపీఐఐసీ భవనంలో గురువారం ఆక్వా సాధికార కమిటీ భేటీ జరిగింది. రాష్ట్ర పశు సంవర్ధక, మత్స్యశాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ రైతులకు అండగా నిలిచే విషయంలో ప్రాసెసింగ్ కంపెనీలు పెద్ద మనసు చాటుకోవాలని కోరారు. కనీసం10 రోజులపాటు ఇవే ధరలు కొనసాగాలని, ప్రభుత్వం రోజూ కొనుగోళ్లు, ధరలను సమీక్షిస్తుందని చెప్పారు. ధరల విషయంలో ప్రతి 10 రోజులకు ఒకసారి సమావేశమై తగిన నిర్ణయాలు తీసుకుందామని సూచించారు. మార్కెట్ బాగోలేదనే సాకుతో ధరలను తగ్గిస్తామంటే సహించేది లేదన్నారు. ఏపీ ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీ (అప్సడా) వైస్ చైర్మన్ వడ్డి రఘురామ్ మాట్లాడుతూ రైతులను గందరగోళపరిచేలా కంపెనీలు వ్యవహరించొద్దని హితవు పలికారు. ధరలు, మార్కెట్ పరిస్థితులపై ప్రతి రోజు మానిటరింగ్ చేస్తున్నామని చెప్పారు. రైతుల వద్ద ఉన్న సరుకును పూర్తి స్థాయిలో నిర్దేశించిన ధరలకు కొనుగోలు చేయాలని కోరారు. కొనుగోళ్ల విషయంలో రైతుల నుంచి ఫిర్యాదులొస్తే చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం వెనుకాడదన్నారు. జాతీయ రొయ్య రైతుల సంఘం అధ్యక్షుడు ఐపీఆర్ మోహన్‌రాజు మాట్లాడుతూ ప్రాసెసింగ్ కంపెనీలను ఇబ్బంది పెట్టడం తమ ఉద్దేశం కాదని, వాళ్లెంత కొనుగోలు చేయగలరో ముందే చెబితే ఆ మేరకే ఇక నుంచి ఉత్పత్తి చేస్తామని చెప్పారు. మార్కెట్ లేనప్పుడు ఎందుకు 80 బిలియన్ల సీడ్, 16 లక్షల టన్నుల ఫీడ్ ఉత్పత్తి చేస్తున్నారని ప్రశ్నించారు. యూఎస్ మార్కెట్ ఆగిపోయిందని, చైనా మార్కెట్ ఓపెన్ కాలేదని, అందువల్లే పూర్తి స్థాయిలో కొనుగోలు చేయలేకపోతున్నామని పలువురు ప్రాసెసింగ్ యూనిట్ల నిర్వాహకులు సాధికార కమిటీ దృష్టికి తీసుకొచ్చారు. అయినా రైతుల వద్ద ఉన్న సరుకును ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. మత్స్యశాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, కమిషనర్ కన్నబాబు పాల్గొన్నారు. ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు వద్దు ప్రభుత్వంతో చర్చల అనంతరం నాలుగు నెలలుగా రాష్ట్రంలో రొయ్యల మేతల్ని తగ్గింపు ధరలకు సరఫరా చేస్తున్నామని రొయ్యల మేత తయారీదారుల సంఘం పేర్కొంది. ముడి సరుకుల ధరలు పెరిగినప్పటికీ రొయ్యల రైతుల అభ్యర్థన, ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. కానీ, రొయ్యల మేత తయారీదారుల నుంచి రూ.5 వేల కోట్లు వసూలు చేయడం ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని కొందరు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని స్పష్టం చేసింది. రాష్ట్రంలో రొయ్యల మేత తయారీ పరిశ్రమ ఏడాది టర్నోవరే రూ.5 వేల కోట్లు ఉంటుందని తెలిపింది. అలాంటిది ప్రభుత్వానికి రూ.5 వేల కోట్లు లంచంగా ఇవ్వనున్నారని కొందరు రాజకీయ నేతలు ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉందని పేర్కొంది. -
ఎస్‌ఐఎఫ్‌టీ ఆక్వా ల్యాబ్‌కు అంతర్జాతీయ గుర్తింపు
సాక్షి, అమరావతి: రాష్ట్ర మత్స్య సాంకేతిక పరిజ్ఞాన సంస్థ (స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీ (ఎస్‌ఐఎఫ్‌టీ) కాకినాడ)కు మరో అరుదైన గౌరవం దక్కింది. ఎస్‌ఐఎఫ్‌టీలోని ఆక్వా లేబొరేటరీకి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆక్వా ల్యాబ్‌ల నైపుణ్యతను పరీక్షించేందుకు అమెరికాకు చెందిన ఆరిజోనా యూనివర్సిటీ నిర్వహించే రింగ్ టెస్ట్‌లో ఎస్‌ఐఎఫ్‌టీ అత్యుత్తమ ప్రతిభను కనబర్చింది. ఇందులో 14 దేశాలకు చెందిన 29 ఆక్వా ల్యాబ్‌లతో పాటు భారత్ తరఫున ఎస్‌ఐఎఫ్‌టీ ఆక్వా ల్యాబ్ పాల్గొంది. రొయ్యలలో తెల్లమచ్చల వ్యాధి, ఎంట్రోసైటోజూన్ హైపాటోపెనై (ఈహెచ్‌పీ) వ్యాధి కారకాలను నిర్ణీత కాలవ్యవధిలో అత్యంత సమర్థవంతంగా పరీక్షించి గుర్తించగలగడంతో ఎస్‌ఐఎఫ్‌టీలోని ఆక్వా ల్యాబ్ విజయం సాధించింది. ల్యాబ్, పరీక్షల నిర్వహణ, వ్యాధి కారకాల గుర్తింపులో అంతర్జాతీయ ప్రమాణాలు పాటిస్తున్న ల్యాబ్‌గా ఎస్‌ఐఎఫ్‌టీ ల్యాబ్‌ను ఆరిజోనా యూనివర్సిటీ గుర్తించింది. అంతర్జాతీయ ప్రమాణాలతో 61 పరీక్షలు 2001లో కాకినాడ ఎస్‌ఐఎఫ్‌టీలో ఏర్పాటైన రియల్ టైం పాలీమరేస్ చైన్ రియాక్షన్ (ఆర్టీపీసీఆర్) ఆక్వా ల్యాబ్‌కు 2017లో ఐఎస్ఓ సర్టిఫికేషన్ రాగా, గతేడాది బోర్డ్ ఆఫ్ క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పనిచేసే నేషనల్ అక్రిడిటేషన్ బోర్డు లిమిటెడ్ (ఎన్ఏబీఎల్) గుర్తింపు కూడా లభించింది. ఇక్కడ అంతర్జాతీయ ప్రమాణాలతో 61 రకాల పరీక్షలు చేస్తుంటారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆక్వా కల్చర్ యాక్ట్ (అప్సడా) నియమావళి ప్రకారం వివిధ రకాల మేతలు, సీడ్ నాణ్యతలను పరీక్షించి ధృవీకరించేందుకు ఎస్‌ఐఎఫ్‌టీ ఆక్వాకల్చర్ ల్యాబ్ రాష్ట్ర రిఫరల్ ల్యాబ్‌గా పనిచేస్తోంది. అలాగే, నాణ్యమైన ఆక్వా ఉత్పత్తులు సాధించడమే లక్ష్యంగా రూ.50.30 కోట్ల అంచనా వ్యయంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న ఎనిమిది ఆక్వా ల్యాబ్స్‌ను ఆధునీకరించడంతోపాటు కొత్తగా 27 ఇంటిగ్రేటెడ్ ఆక్వా ల్యాబ్స్‌ను ఏర్పాటుచేస్తోంది. 35 ల్యాబ్‌లలో స్థానిక అవసరాలను బట్టి 14 చోట్ల మేతల నాణ్యత విశ్లేషణ, 17 చోట్ల పీసీఆర్, 14 చోట్ల క్వాలిటీ కంట్రోల్æ పరీక్షలు చేసేందుకు ఏర్పాట్లుచేశారు. ఆక్వా రైతులు వినియోగించుకోవాలి ఎన్ఏబీఎల్ గుర్తింపు పొందిన ఎస్‌ఐఎఫ్‌టీ ఆక్వా ల్యాబ్‌ను ఆరిజోనా యూనివర్సిటీ కూడా గుర్తించడం ద్వారా మన ల్యాబ్ అంతర్జాతీయ ప్రమాణాలు కల్గిన ల్యాబ్‌గా ఖ్యాతిని గడించింది. ఆక్వా రైతులు, హేచరీలు ఈ ల్యాబ్ సేవలను సద్వినియోగం చేసుకుని సుస్థిర సాగుతో పాటు అధిక దిగుబడులు సాధించేందుకు కృషిచేయాలి. – పి.కోటేశ్వరరావు, ప్రిన్సిపల్, ఎస్‌ఐఎఫ్‌టీ -
రొయ్య రైతుకు బాసట
సాక్షి, అమరావతి: రొయ్య రైతుకు రాష్ట్ర ప్రభుత్వం బాసటగా నిలుస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో రొయ్య ధరలు తగ్గుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆక్వా రైతులను ఆదుకోవడానికి చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రైతుల వద్ద ఉన్న రొయ్యలు పూర్తి స్థాయిలో అమ్ముడయ్యే వరకు వారికి అండగా నిలవాలని స్పష్టంగా చెప్పారు. దీంతో సీనియర్ మంత్రుల సారథ్యంలో ఏర్పాటు చేసిన ఆక్వా సాధికారత కమిటీ రంగంలోకి దిగింది. కమిటీ సభ్యులైన మత్స్య శాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు, ఏపీ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ (అప్సడా) వైస్ చైర్మన్ వడ్డి రఘురాం, స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, కమిషనర్ కన్నబాబు ప్రతి రోజు మార్కెట్‌ను నిశితంగా పరిశీలిస్తున్నారు. రొయ్య ధరలను సమీక్షించి, ఆక్వా రైతులకు నష్టం కలగకుండా కమిటీ చర్యలు చేపడుతోంది. సమీపంలోని ప్రాసెస్ కంపెనీల ద్వారా రొయ్యలు కొనుగోలు చేయిస్తోంది. రవాణాకు అవసరమైన వాహనాలను సమకూరుస్తూ క్రయవిక్రయాలను దగ్గరుండి పర్యవేక్షిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్‌ను బూచిగా చూపి ధరలు తగ్గించే ప్రాసెసింగ్ యూనిట్లపై కఠిన చర్యలకు సైతం కమిటీ సిద్ధమవుతోంది. అవసరమైతే కంపెనీల్లో విస్తృత తనిఖీలు చేపట్టాలని యోచిస్తోంది. త్వరలో మరోసారి రాష్ట్రస్థాయిలో ఆక్వా రైతులు, ప్రాసెసింగ్ యూనిట్లు, ఫీడ్, సీడ్ కంపెనీలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. నిలకడగా కౌంట్ ధరలు రాష్ట్రంలో ప్రస్తుతం వంద కౌంట్ రొయ్యలు రూ.190కు, 30 కౌంట్ రొయ్యలను రూ. 370కి తక్కువ కాకుండా కొనుగోలు చేస్తున్నారు. మిగిలిన కౌంట్ ధరలూ నిలకడగానే ఉన్నాయి. 100 కౌంట్ రొయ్యలను కనీసం రూ.240కు కొనాలని ప్రాసెసింగ్ కంపెనీలకు ప్రభుత్వం ఆదేశించింది. అయితే ప్రస్తుతం మార్కెట్ ఒడిదుడుకుల నేపథ్యంలో 100 కౌంట్ రూ.220కు తక్కువ కాకుండా కొనాలని కంపెనీలను ఆదేశించింది. అమెరికా, చైనా, ఈక్విడార్ దేశాల నుంచి ఆర్డర్లు ఊపందుకోగానే ప్రభుత్వం నిర్దేశించిన రేట్లకే కొంటామని కంపెనీలు చెబుతున్నాయి. వచ్చేవారంలో చైనా మార్కెట్ ఓపెన్ కానుండడంతో 100 కౌంట్ ధరలు రూ.240కు పైగా పెరిగే అవకాశాలున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. విపక్షాలది దుష్ప్రచారం రొయ్య రైతులను ప్రభుత్వం పట్టించుకోవడంలేదంటూ విపక్షాలు చేస్తున్నది దుష్ప్రచారం. రాష్ట్రంలో ఎక్కడా వంద కౌంట్ రూ.190కు తగ్గలేదు. ప్రతిరోజూ మార్కెట్‌ను సమీక్షిస్తూ కౌంట్ ధర రూ.240కి పెంచేలా చర్యలు తీసుకుంటున్నాం. ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు కొనాలని ప్రాసెసింగ్ కంపెనీలను ఆదేశించాం. అవసరమైతే కంపెనీలపై చర్యలకు సైతం ప్రభుత్వం వెనుకాడదు. ఆ అధికారాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాధికారత కమిటీకి ఇచ్చారు. –వడ్డి రఘురాం, వైస్ చైర్మన్,అప్సడా ఆందోళన వద్దు రొయ్య రైతులు ఆందోళన చెందాల్సిన ప నిలేదు. వారం పదిరోజుల్లో చైనా మార్కెట్ ఓపెన్ అవుతుంది. ఎగుమతులు పుంజుకుంటాయి. వందకౌంట్కు రూ. 240 కుపైగా ధర వస్తుంది. – ఐపీఆర్ మోహనరాజు, జాతీయ రొయ్య రైతుల సంఘం అధ్యక్షుడు -
Aqua Farmers: ఆక్వా రైతులను ముంచేస్తున్నారు..
వ్యాపారులంతా ఒక్కటయ్యారు. సిండికేట్‌గా మారి ఆక్వా రైతులను నిట్టనిలువునా ముంచేస్తున్నారు. 40 కౌంట్ రొయ్యలను రూ.395కి కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించింది. వ్యాపారులు మాత్రం రూ.330కే కొనుగోలు చేస్తున్నారు. నిర్ణీత ధరలకే రైతుల నుంచి రొయ్యలు కొనుగోలు చేయాలని స్పష్టం చేసినా.. వారిలో ఎలాంటి మార్పు కనిపించడంలేదు. సంబంధిత శాఖల అధికారులు సైతం దృష్టి సారించకపోవడంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వ్యాపారులు, ప్రాసెసింగ్ ప్లాంట్ల యజమానుల తీరుతో సాగుకు పెట్టిన పెట్టుబడి రాక ఆక్వా రైతుల పరిస్థితి దయనీయంగా మారింది సాక్షి ప్రతినిధి, ఒంగోలు: డాలర్ల పంటగా పేరొందిన ఆక్వా సాగును ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు పథకాలు అమలు చేస్తోంది. గత ప్రభుత్వ నిర్ణయాలతో తీవ్రంగా నష్టపోయిన వీరిని ఆదుకునేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యుత్ రాయితీలు ప్రకటించారు. వాణిజ్యపరంగా అండగా నిలిచేందుకు ఆక్వా హబ్‌లు, మార్కెట్లను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. కానీ, వ్యాపారులు మాత్రం రైతులను అడ్డగోలుగా దోచేస్తున్నారు. ఎంతగా అంటే.. ఒక్కో రైతు రూ.లక్షల్లో నష్టపోయేంత. రాష్ట్ర వ్యాప్తంగా రొయ్యల రైతులు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం గుర్తించింది. ఈ నెల 17వ తేదీ విజయవాడలో అధికారులు, మంత్రులు, రైతులు, వ్యాపారులతో ఉమ్మడిగా సమావేశం నిర్వహించింది. రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే రొయ్యలు కొనుగోలు చేయాలని వ్యాపారులకు దిశానిర్దేశం చేసింది. సమావేశం ముగిసి పదిరోజులు కావస్తున్నా వ్యాపారులు, రొయ్యల ప్రాసెసింగ్ ప్లాంట్ల యజమానుల్లో కనీస మార్పు రాలేదు. దానికితోడు జిల్లాలోని అధికారులు సైతం రొయ్యల మార్కెట్‌పై దృష్టి సారించకపోవడం కూడా ప్రధాన కారణమని విమర్శలూ వినిపిస్తున్నాయి. విజయవాడలో వ్యాపారులతో ప్రభుత్వం చర్చలు జరిపి కనీస మద్దతు ధర ప్రకటించినా ఆ ధరలను వ్యాపారులు అమలు చేయడం లేదు. ప్రభుత్వం ప్రకటించిన ధర కంటే వెనామీ రొయ్యలు కేజీకి రూ.30 నుంచి రూ.55 వరకు తక్కువకు కొనుగోలు చేస్తున్నారు. కౌంట్ పేరుతో దోపిడీ... వ్యాపారులు కూటమికట్టి ఇష్టారీతిన దోపిడీ చేస్తున్నారు. వెనామీతో పాటు టైగర్ రొయ్యలను కూడా తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. అందుబాటులో ఉన్న కౌంట్ రొయ్యలు తీసుకోకుండా లేని కౌంట్ రొయ్యలు కావాలని వ్యాపారులు మెలికపెట్టి మరీ దోచుకుంటున్నారు. ప్రభుత్వం ప్రకటించిన ధరకంటే మరీ తక్కువ చేసి కొనుగోలు చేయడంతో రైతులు భారీగా నష్టపోవాల్సి వస్తోంది. ఎకరా సాగుకయ్యే ఖర్చు రూ.4.15 లక్షలు... రైతును తీవ్రంగా నష్టపరుస్తున్నారు వ్యాపారులు, రొయ్యల ప్రాసెసింగ్ ప్లాంట్ల నిర్వాహకులు రైతులను తీవ్రంగా నష్టపరుస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయకుండా ఇబ్బందులు పెడుతున్నారు. అధికారుల పట్టించుకోవడం లేదు. దిగుబడి వచ్చిన తర్వాత రొయ్యలను నిల్వ చేసుకునే అవకాశం లేదు. దీనిని ఆసరా చేసుకుంటున్న వ్యాపారులు ఇష్టమొచ్చిన ధరకు కొనుగోలు చేస్తున్నారు. అధికారులు పట్టించుకుని ప్రాసెసింగ్ ప్లాంట్ల యజమానుల ఎగుమతులను ఆపేయాలి. అప్పుడే వాళ్లకు కష్టం అర్థమవుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే వ్యాపారులు రైతులను అణగదొక్కుతున్నారు. – బత్తుల రమేష్‌రెడ్డి, ఆక్వా రైతు, కొత్తపట్నం అధికారులు నిర్లక్ష్యం వీడాలి రొయ్యల ధరల విషయంలో జిల్లా అధికారులు నిర్లక్ష్యం వీడాలి. ప్రభుత్వం స్పష్టంగా చెప్పినా రొయ్యల ప్రాసెసింగ్ ప్లాంట్ల యజమానులు, వ్యాపారులు రైతులను నిలువునా నష్టపరుస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన ధరల కంటే తక్కువకు కొనుగోలు చేయడం వలన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలి. లేకుంటే రైతులు తీవ్రంగా నష్టపోతారు. – దుగ్గినేని గోపీనాథ్, రొయ్యల రైతుల సంఘ నాయకుడు జిల్లా వ్యాప్తంగా సమావేశం ఏర్పాటు చేస్తాం జిల్లా వ్యాప్తంగా రొయ్యల వ్యాపారులు, రైతులతో త్వరలో సమావేశం ఏర్పాటు చేస్తాం. ప్రభుత్వం ఇప్పటికే వారికి ప్రకటించిన ధరలకే అమ్మాలని నిర్దేశించింది. అయినా తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని ఫిర్యాదులు వస్తున్నాయి. కలెక్టర్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వం నిర్దేశించిన ధరలను అమలుచేస్తాం. – ఆవుల చంద్రశేఖరరెడ్డి, మత్స్యశాఖ జిల్లా అధికారి -
AP: రొయ్య రైతుకు బాసట
సాక్షి, అమరావతి: ఆక్వా ఫీడ్ ధరలను ఇష్టారీతిన పెంచడం, రొయ్యల కౌంట్ ధరలను తగ్గించడంపై సీఎం వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆక్వా ఫీడ్ తయారీ కంపెనీలు, ప్రాసెసర్లు దిగి వచ్చారు. పెంచిన ఆక్వా ఫీడ్ ధరలను పూర్తిగా ఉపసంహరించుకోవడంతో పాటు రొయ్యల కౌంట్ ధరలను పెంచేందుకు అంగీకరించారు. గురువారం మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో జరిగిన ఆక్వా సాధికార కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 17 నుంచి దీనిని అమలు చేస్తామని ప్రకటించారు. రొయ్యల ఫీడ్ ధరలు ఇష్టానుసారం పెంచుతున్నారని, కౌంట్ ధరలు తగ్గిస్తున్నారంటూ ఆక్వా రైతులు ఫిర్యాదు చేయడంతో, ఈ వ్యవహారంపై సీఎం వైఎస్ జగన్ సీరియస్ అయ్యారు. మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, సీదిరి అప్పలరాజు, అప్సడా వైస్ చైర్మన్ వడ్డి రఘురాం నేతృత్వంలో సాధికార కమిటీని ఏర్పాటు చేశారు. బుధవారం జరిగిన కమిటీ తొలిభేటీలో మంత్రుల ఆదేశాల మేరకు ఆక్వా రైతులు, ఫీడ్ తయారీదారులు, ప్రాసెసర్లతో గురువారం సాయంత్రం విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. మంత్రి అప్పలరాజు నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో అప్సడా వైస్ చైర్మన్ వడ్డి రఘురాం, స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, కమిషనర్ కె.కన్నబాబు పాల్గొన్నారు. రైతులు, ఫీడ్ కంపెనీలు, ప్రాసెసర్ల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. రైతులకు నష్టం కలిగించే చర్యలొద్దు ఆక్వా రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారికి నష్టం కలిగించే చర్యలను ఉపేక్షించబోమని మంత్రి అప్పలరాజు స్పష్టంచేశారు. ప్రభుత్వం, రైతులతో చర్చించకుండా ఇష్టానుసారం ఫీడ్ ధరలు పెంచినా, కౌంట్ ధరలు తగ్గించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. పెంచిన ఫీడ్ ధరలు తగ్గించాలని, కౌంట్ ధరలను పెంచాలని ఆదేశించారు. స్టేక్ హోల్డర్స్, ఎగుమతిదారులు, ప్రాసెసరల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. లాజిస్టిక్స్ సమస్యలేమైనా ఉంటే చెప్పాలని సూచించారు. ముడి సరుకుల ధరలు పెరగడం వల్లే ఫీడ్ ధరలు పెంచాల్సి వచ్చిందని వారు కమిటీ దృష్టికి తీసుకువచ్చారు. సోయాబీన్, ఫిష్ ఆయిల్, ఇతర ముడిసరుకుల ధరలు గతంతో పోలిస్తే ఇప్పుడు తగ్గాయని, ఈ సమయంలో పెంచిన ధరలు ఎందుకు కొనసాగిస్తున్నారని అప్సడా వైస్ చైర్మన్ రఘురాం ప్రశ్నించారు. పెంచిన ఫీడ్ ధరలను తగ్గించాలని కమిటీ ఆదేశించింది. దీంతో నెల క్రితం టన్నుకి రూ.2,600 చొప్పున పెంచిన ఫీడ్ ధరను ఉపసంహరించుకునేందుకు తయారీదారులు అంగీకరించారు. కౌంట్‌కు రూ.55 వరకు పెంపునకు ప్రాసెసర్లు అంగీకారం రొయ్యల కౌంట్ ధరలు అనూహ్యంగా తగ్గించడంపైనా సమావేశంలో చర్చించారు. రూ.270 నుంచి రూ. 280 ఉన్న 100 కౌంట్ «ధరను రూ.200కు, రూ.420కు పైగా ఉన్న 30 కౌంట్ ధరను రూ.380కు తగ్గించారు. మిగిలిన కౌంట్ ధరలను కూడా రూ.30 నుంచి రూ.80 వరకు తగ్గించారు. ఈ విషయం సీఏం దృష్టికి వెళ్లడం, ఆయన ఆదేశాలతో సాధికార కమిటీ ఏర్పాటు చేయడంతో కౌంట్‌కు రూ.20 నుంచి రూ.35 వరకు పెంచారు. ఈ ధరలు ఏమాత్రం లాభసాటి కాదని రైతులు స్పష్టంచేసారు. అంతర్జాతీయంగా ధరలు నిలకడగా ఉన్నప్పుడు ఇక్కడ ఏ విధంగా తగ్గిస్తారని, తక్షణం పెంచాల్సిందేనని మంత్రి, అప్సడా వైస్ చైర్మన్లు ఆదేశించారు. దీంతో సీఎం జోక్యం చేసుకోడానికి ముందు ఉన్న ధరలతో పోలిస్తే కౌంట్‌కు రూ.40 నుంచి రూ.55 మేర పెంచేందుకు ప్రాసెసర్లు అంగీకరించారు. ఫీడ్ ధరల తగ్గింపు, కౌంట్ ధరల పెంపును 17వ తేదీ నుంచి అమలు చేస్తామని తెలిపారు. ఈ ధరల వివరాలను అన్ని ఆర్బీకేల్లో ప్రదర్శించాలని, ఇవే ధరలు 24వ తేదీ వరకు కొనసాగించాలని మంత్రి సూచించారు. ఇకపై ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన తర్వాతే ధరలపై నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. -
‘ఆక్వా’లో ఏమిటీ దందా?
సాక్షి, అమరావతి: ఆక్వా రైతుల ఫిర్యాదులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సీరియస్‌గా స్పందించారు. ఆక్వా ధరల పతనం, ఆక్వా ఫీడ్ ధర పెంపుపై రైతులు, రైతు సంఘాల నేతలు ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు. వ్యాపారులు సిండికేట్‌గా మారి ధరలు తగ్గించేస్తున్నారని వాపోయారు. ఈ ఫిర్యాదులను తీవ్రంగా పరిగణించిన సీఎం.. ముగ్గురు మంత్రులు, సీనియర్ అధికారులతో సాధికారత కమిటీ ఏర్పాటు చేశారు. వారంలోగా సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. ఎవరైనా సరే రైతులకు నష్టం కలిగిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. ఆక్వా రైతులకు అండగా నిలిచేందుకు ప్రత్యేక చట్టాలు తీసుకొచ్చినా, సిండికేట్‌గా మారి రైతులను నష్టపరచడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సీఎం ఆదేశాల మేరకు మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, సీదిరి అప్పలరాజుతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పర్యావరణ, అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, పశు సంవర్ధక, మత్స్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, మత్స్యశాఖ కమిషనర్లతో సాధికారత కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. మత్స్యశాఖ కమిషనర్ కమిటీ సభ్య కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. ఈ కమిటీ ఆక్వా ఫీడ్ సరఫరా, ఆక్వా ఫీడ్ ధర, ఆక్వా కొనుగోలు ధర.. సంబంధిత అంశాలను అధ్యయనం చేయడంతో పాటు రైతులు నష్టపోకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలనే అంశాలపై వారంలోగా ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలి. నాణ్యత, ధరల పర్యవేక్షణకూ చట్టం ► ఆక్వా రైతుల ప్రయోజనాలను పరిరక్షించడమే లక్ష్యంగా కొత్తగా ముఖ్యమంత్రి అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ (ఏపీఎస్డీఏ) ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చట్టం చేసింది. ఈ చట్టం ద్వారా ఆక్వాకల్చర్‌కు సంబంధించిన అన్ని రకాల కార్యకలాపాలు, ఉత్పత్తులు, సేవల ఏకీకృత డెలివరీ మెకానిజం ఒకే గొడుకు కిందకు తీసుకు వచ్చింది. ► ఆక్వాకల్చర్ ఇన్పుట్ల (విత్తనం, మేత) నాణ్యత, ధర, ఉత్పత్తుల ధరల పర్యవేక్షణ, నియంత్రణను ఈ అథారిటీ చూస్తుంది. ఆక్వాకల్చర్ వాటాదారులకు ఆన్లైన్ ప్రక్రియ ద్వారా లైసెన్స్‌లు, ఎండార్స్మెంట్ల జారీని సులభతరం చేస్తుంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా ఆక్వా ఉత్పత్తుల వాణిజ్యం, ఎగుమతి కోసం అనుకూలమైన వాతావరణాన్ని ప్రోత్సహిస్తుంది. ప్రత్యేకంగా యూనివర్సిటీ ► మత్స్య పరిశ్రమ, ఆక్వాకల్చర్ సమగ్రాభివృద్ధి కోసం ఆ రంగంలో నిపుణుల అవసరాన్ని ప్రభుత్వం గుర్తించింది. ఇందులో భాగంగా అత్యధిక ప్రాధాన్యతనిస్తూ ప్రత్యేక చట్టం ద్వారా ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్సిటీని పశ్చిమ గోదావరి జిల్లాలో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలో ఆక్వా రంగ అభివృద్ధికి ఈ యూనివర్సిటీ ఎంతగానో దోహదపడుతుంది. ► కోవిడ్ సంక్షోభ సమయంలో కూడా 2020లో ప్రభుత్వం ఆక్వా రైతులకు అండగా నిలబడేందుకు పలు చర్యలు తీసుకుంది. రొయ్యలు దిగుమతి చేసుకునే దేశాల్లో నిషేధం కారణంగా.. ధరలు గణనీయంగా పడిపోవడంతో పాటు రైతులు తమ ఉత్పత్తులను అమ్ముకోలేని పరిస్థితి తలెత్తింది. ఆ పరిస్థితుల్లో ప్రభుత్వం జోక్యం చేసుకుని, శీతల గిడ్డంగులను, ప్రాసెసింగ్ ప్లాంట్లను వెంటనే తెరిపించడంతో పాటు రైతుల ఉత్పత్తులకు తగిన ధరలను నిర్ణయించింది. బ్యాంకుల ద్వారా భరోసా ► ప్రైవేట్ రంగంలో అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకునే పరిస్థితి లేకుండా.. ఆక్వా రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులు జారీ. మత్స్య శాఖ ఆధ్వర్యంలో బ్యాంకుల నుంచి రుణాలు. ఈ– మత్స్యకార పోర్టల్‌లో అందుబాటులో జిల్లాలు, సెక్టార్, బ్యాంకుల వారీగా రుణాలు పొందిన వారి వివరాలు. ఇప్పటి వరకు 19,059 కిసాన్ క్రెడిట్ కార్డుల జారీ. రూ.2,673 కోట్ల రుణం మంజూరు. ► కొత్తగా 27 ఇంటిగ్రేటెడ్ ఆక్వా కల్చర్ ల్యాబ్‌లు. ఇప్పటికే ఉన్న మరో 8 ల్యాబ్‌ల ఆధునికీకరణ. తద్వారా అన్ని కోస్తా జిల్లాల్లోని 35 ప్రాంతాల్లో ల్యాబ్‌లు. నీరు, మట్టి విశ్లేషణ చేయడంతోపాటు వివిధ రకాల పరీక్షల కోసం రూ.50 కోట్లు కేటాయింపు. ఈ ల్యాబ్‌ల్లో 14 ఆక్వా ల్యాబ్‌లు కాగా, 3 మొబైల్.. మిగతావి ఇంటిగ్రేటెడ్ ఆక్వా ల్యాబ్‌లు. 2022 ఆఖరుకు అందుబాటులోకి ఆక్వా ల్యాబ్‌లు. ఆక్వా రైతుల కోసం, ఫిష్ ఫీడ్ కోసం ప్రత్యేక చట్టం ► ఆక్వా రైతుల ప్రయోజనాలను పరిరక్షించడానికి ‘ఆంధ్రప్రదేశ్ ఆక్వాకల్చర్ సీడ్ (క్వాలిటీ కంట్రోల్) చట్టం–2020ని రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. ఆక్వా సీడ్లో నకిలీకి ఆస్కారం లేకుండా నాణ్యమైన సీడ్‌ను మాత్రమే రైతులకు సరఫరా చేసేలా చర్యలు చేపట్టింది. నకిలీ, అక్రమ పద్ధతుల్లో సాగుతున్న సీడ్ వ్యాపారాలను నిరోధించేందుకు చట్టం ద్వారా చర్యలు తీసుకుంది. ► ఫిష్ ఫీడ్ నాణ్యతకు ప్రత్యేక చట్టం చేసింది. ఆక్వా కల్చర్ నిర్వహణ వ్యయంలో 60 శాతం ఫీడ్‌కు ఖర్చు అవుతుంది. దేశం మొత్తం మీద ఫిష్ ఫీడ్‌లో క్వాలిటీ కంట్రోల్ కోసం ఎలాంటి నియంత్రణ యంత్రాంగం అందుబాటులో లేదు. ఈ నేపథ్యంలో ఫిష్ ఫీడ్‌కు సంబంధించి.. అధిక ధరలు, సిండికేట్ వ్యవహారాలను నియంత్రించడానికి, మత్స్య పరిశ్రమ మనుగడ కోసం ఏపీ ప్రభుత్వం ఏకంగా ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. ప్రత్యేకంగా చేపల మేత పరిశ్రమల్లో అనైతిక, చట్టవిరుద్ధమైన పద్ధతులను నిరోధించడానికి, చేపల మేత వ్యాపారంలో నాణ్యత నియంత్రణ చర్యలను అమలు చేయడానికి దేశంలోనే తొలిసారిగా ఫిష్ ఫీడ్ (క్వాలిటీ, కంట్రోల్ ) చట్టం–2020 తీసుకువచ్చింది. ఆక్వా రైతుల సంక్షేమ కోసం ఎన్నో నిర్ణయాలు ► ఆక్వా రైతులకు అండగా నిలబడేందుకు ఉత్పాదక వ్యయాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం నాణ్యమైన విద్యుత్‌ను 24 గంటల పాటు యూనిట్ రూ.1.50 చొప్పున సరఫరా చేస్తోంది. ► 2016లో ఆక్వా రైతులకు పవర్ టారిఫ్ యూనిట్ రూ.4.63 నుంచి రూ.7 కాగా.. 2016 నుంచి 2018 మే వరకు యూనిట్ రూ.3.86 చొప్పున సరఫరా చేశారు. 2108 జూన్ నుంచి 2019 జూన్ వరకు రూ.2కే యూనిట్ సరఫరా చేయగా, జూలైలో ప్రస్తుత ప్రభుత్వం యూనిట్ ధరను రూ.1.50కి తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2019–20 నుంచి 2021–22 వరకు రాష్ట్ర ప్రభుత్వం ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీ కింద రూ.2,377.52 కోట్లు ఇచ్చింది. ► గ్రామ స్థాయిలో రైతు భరోసా కేంద్రాల ద్వారా అండగా నిలుస్తోంది. రాయితీతో కూడిన ఫీడ్ వంటి ఇన్పుట్స్ అందించడంతో పాటు, ఆక్వా సాగులో అత్యాధునిక, వినూత్న విధానాల్లో శిక్షణ. దీనికోసం ఆర్బీకే స్థాయిలో దాదాపు 732 మంది విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్లను నియామకం. ► ఆక్వా రైతుల ఉత్పత్తులకు లాభదాయకమైన ధర కల్పించేందుకు ఈ–క్రాప్ (ఇ–ఫిష్) బుకింగ్ సౌకర్యం. ఈ–ఫిష్ యాప్ సహకారంతో సుమారు 4.02 లక్షల హెక్టార్లలో మత్స్య, రొయ్యల సాగు విస్తీర్ణం నమోదు. ► ఇ–మత్స్యకార పోర్టల్ సహాయంతో ఫార్మర్ ఫీల్డ్ స్కూల్ ఏర్పాటు. తద్వారా ఆక్వా సాగులో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడంతో పాటు, అత్యాధునిక సౌకర్యాల వినియోగంపైన శిక్షణ. ఆర్బీకేల ద్వారా రూ.13.27 కోట్ల విలువైన 2,473 మెట్రిక్ టన్నుల ఫీడ్ సరఫరా.