Cancel notes
-
నోట్ల రద్దుపై ఆర్బీఐ అభ్యంతరాలు
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు వల్ల నల్లధనం, నకిలీ నోట్లను అరికట్టొచ్చన్న కేంద్ర ప్రభుత్వ వాదనపై ఆర్బీఐ అభ్యంతరం వ్యక్తం చేసిందని కాంగ్రెస్ పేర్కొంది. పెద్ద నోట్ల రద్దును ప్రకటించడానికి ముందు అంటే 2016 నవంబర్ 8న సాయంత్రం 5.30 నిమిషాలకు ఆర్బీఐ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సమావేశానికి సంబంధించిన (మినిట్స్) వివరాలను సోమవారం కాంగ్రెస్ అధికార ప్రతినిధి జైరాం రమేశ్ మీడియాకు విడుదల చేశారు. ‘నల్లధనం చాలా వరకు కరెన్సీ రూపంలో లేదు. రియల్ రంగంలోని ఆస్తులు, బంగారం రూపంలో ఉన్నాయి. నోట్ల రద్దు నిర్ణయం వల్ల ఎలాంటి ప్రభావం ఉండదు’అని ఆర్బీఐ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సమావేశంలో పేర్కొన్నట్లు రమేశ్ తెలిపారు. ‘ఆర్థిక వ్యవస్థలో పెరుగుదల మాత్రమే అసలైన పెరుగుదల. అంతేకానీ చెలామణి అవుతున్న కరెన్సీ పెరుగుదల ఆర్థిక వ్యవస్థపై అంతగా ప్రభావం చూపదు. నల్ల ధనం తగ్గుతుందన్న వాదన నోట్ల రద్దు నిర్ణయాన్ని పెద్దగా సమర్థించదు’అని ఆర్బీఐ వ్యాఖ్యలను ఉటంకించారు. దేశంలో చెలామణీ అవుతున్న మొత్తం కరెన్సీలో నకిలీ నోట్లు కేవలం రూ.400 కోట్లు ఉంటుందని, అది చాలా తక్కువ ప్రాముఖ్యం ఉన్న విషయమని ఆర్బీఐ తెలిపినట్లు చెప్పారు. -
అంత డబ్బు డిపాజిట్‌పై రిటర్న్‌లు వేయలేదేం!
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు అనంతరం బ్యాంక్ అకౌంట్లలో భారీ డిపాజిట్లు, ఇందుకు సంబంధించి సకాలంలో ఐటీ రిటర్న్‌లు దాఖలు చేయడంలో వైఫల్యం వంటి అంశాలపై ఆదాయపు పన్ను శాఖ దృష్టి సారించింది. రూ.25 లక్షలు పైబడి డిపాజిట్ చేసిన ఈ తరహా 1.16 లక్షల వ్యక్తులు, సంస్థలకు నోటీసులు జారీ చేసింది. సీబీడీటీ (ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డ్) చైర్మన్ సుశీల్ చంద్ర ఈ విషయాన్ని వెల్లడించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... ► పెద్ద నోట్ల తర్వాత భారీ ఎత్తున నగదు డిపాజిట్ చేసి, ఐటీ రిటర్స్లు దాఖలు చేసిన వారి అకౌంట్లను కూడా క్షుణ్ణంగా పరిశీలించి, తగిన సమాధానాలు రాబడుతున్నాం. ► తమ బ్యాంక్ ఖాతాల్లో రూ.2.5 లక్షల పైన రద్దయిన రూ.500, రూ. 1000 డిపాజిట్లు చేసిన దాదాపు 18 లక్షల వ్యక్తులు, కంపెనీలకు ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. ► వీరిలో కూడా ఐటీ రిటర్స్లు దాఖలు చేయని వ్యక్తులు, కంపెనీలను రెండుగా విభజించింది. ఇందులో ఒక విభాగం రూ.25లక్షలకు పైగా డిపాజిట్ చేసిన వర్గం. మరో వర్గం రూ.10 నుంచి 25 లక్షల వరకూ డిపాజిట్ చేసిన వర్గం. ► రూ.25 లక్షల పైబడి డిపాజిట్‌చేసి, రిటర్న్‌లు దాఖలు చేయని వారు 1.16 లక్షలు. వీరందరినీ 30 రోజుల్లోపు రిటర్నులు వేయాలని ఆదేశించాం. -
ఐటీ రిటర్నుల్లో 25% వృద్ధి
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు (డీమోనిటైజేషన్) పరిణామాల అనంతరం ఆదాయ పన్ను రిటర్నులు (ఐటీఆర్) దాఖలు చేసే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. 2016–17 సంవత్సరానికి గాను 2.82 కోట్ల రిటర్నులు వచ్చినట్లు ఆదాయ పన్ను విభాగం తెలిపింది. ఇది అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో దాఖలైన 2.22 కోట్ల ఐటీఆర్‌లతో పోలిస్తే 25.3 శాతం అధికమని వివరించింది. ఆగస్టు 5 దాకా మొత్తం 2.82 కోట్ల రిటర్నులు దాఖలైనట్లు ఆదాయ పన్ను విభాగం పేర్కొంది. వాస్తవానికి ఐటీఆర్‌ల దాఖలుకు జూలై 31 ఆఖరు తేదీ అయినప్పటికీ.. కొన్ని వర్గాల కోసం ఆగస్టు 5 దాకా ప్రభుత్వం పొడిగించిన సంగతి తెలిసిందే. కొత్తగా మరింత మందిని పన్ను పరిధిలోకి తేగలిగినట్లు తాజా గణాం కాలు సూచిస్తున్నాయని ఆదాయ పన్ను విభాగం పేర్కొంది. వ్యక్తిగత ఆదాయ పన్ను ను సంబంధించి (కార్పొరేట్ ట్యాక్స్ కాకుం డా) అడ్వాన్స్ ట్యాక్స్ వసూళ్లు ఆగస్టు 5 నా టికి 41.79 శాతం వృద్ధి నమోదు చేశాయి. -
ప్రతికూలంలో అమ్మకాలెలా?
సాక్షి, హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దు ప్రభావంతో ప్రస్తుతం మార్కెట్లో ప్రతికూల వాతావరణం నెలకొంది. ఇలాంటి సమయంలో అధిక ధర రావటం కొంచెం కష్టమే. అయితే కొంచెం ప్రణాళిక, మరికొంత నేర్పు ఉంటే సులువగానే విక్రయించొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ⇒ మార్కెట్ పరిస్థితులు ఎలా ఉన్నప్పుటికీ కొన్ని అంశాలు స్థిరాస్తి ధరలను ప్రభావితం చేస్తుంటాయి. ఒకవేళ అవి ప్రతికూలంగా ఉన్నా.. వాటిని మెరుగుపరచడానికి, మార్చడానికి అవకాశం ఉండదు. ఉదాహరణకు స్థిరాసిత ఏ ప్రాంతంలో ఉంది? ఇరుగుపొరుగు ఎవరుంటారు? వంటి విషయాలన్నమాట. ఒకవేళ స్థిరాస్తి మంచి ప్రాంతంలో ఉంటే అమ్మకందారులు మంచి ధర పొందుతారు. ఇందుకు భిన్నంగా ఉంటే విక్రయానికి అనువైన పరిస్థితుల కోసం కసరత్తు చేయాల్సి ఉంటుంది. సరైన ధర చెప్పడం, ఆస్తికి సంబంధించిన పత్రాలన్నింటినీ పక్కాగా ఉంచుకోవటం, సరైన సమయంలో, సరైన కొనుగోలుదారున్ని పట్టుకోవటం వంటివన్నమాట. ⇒ ఇంటి ధరను ప్రధానంగా స్థిరాస్తి ఉన్న ప్రాంతం, దాని నిర్మాణ ఖర్చులు, స్థలం ధర నిర్ణయిస్తాయి. అయితే పూర్తిగా ఈ అంశాలే ధరను నిర్ణయిచవు. మార్కెట్ సెంటిమెంట్ కూడా భాగస్వామే. గిరాకీ, సరఫరాలు కూడా కొంతమేర ప్రభావాన్ని చూపిస్తాయి. కాబట్టి స్థిరాస్తిని అమ్మాలనుకున్నప్పుడు ముందుగా మార్కెట్ పరిస్థితుల్ని అధ్యయనం చేయాలి. ధరల పోకడ ఎలా ఉంది? ఆ ప్రాంతంలో సగటు ధర ఎంత? వంటి విషయాలపై దృష్టిపెట్టాలి. ⇒ విక్రయించాలనుకున్న స్థిరాస్తికి సంబంధించిన న్యాయపరమైన అంశాలను కొనుగోలుదారుడికి స్పష్టంగా వివరించాలి. అతనికేమైనా సందేహాలుంటే ఓపిగ్గా నివృత్తి చేయాలి. యాజమాన్య హక్కుల విషయంలో ఎలాంటి వివాదాలు లేవని తేలాకే కొనుగోలుదారులు ముందడుగు వేస్తాడని గుర్తుంచుకోండి. -
రీమోనిటైజేషన్ పూర్తయ్యింది..
నోట్ల రద్దు అనంతర పరిస్థితిపై అరుణ్‌జైట్లీ రాంచీ: పెద్ద నోట్ల అనంతరం నెలకొన్ని ద్రవ్య కొరత సమస్య దాదాపు తొలగిపోయిందనీ, రీమోనిటైజేషన్ (నగదును అందుబాటులోకి తీసుకురావడం) ప్రక్రియ దాదాపు పూర్తయ్యిందనీ ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ గురువారం పేర్కొన్నారు. రోజూవారీ నగదు సరఫరా పరిస్థితిని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) జాగ్రత్తగా పరిశీలిస్తోందని కూడా జైట్లీ వివరించారు. నల్లధనం నిరోధం, తీవ్రవాదులకు నిధులు అందకుండా చేయడం, నగదు లావాదేవీల డిజిటలైజేషన్ వంటి లక్ష్యాలను ఉద్దేశించి నవంబర్ 8న ప్రధాని నరేంద్రమోదీ రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. దీనితో నగదు లభ్యత సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. జార్ఖండ్‌లో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సులో పాల్గొన్న ఆర్థికమంత్రి ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడిన అంశాల్లో ముఖ్యమైనవి... ⇔ నగదు ఆధారిత ఆర్థిక వ్యవస్థతో ఎన్నో ఇబ్బందులు ఉన్నాయని అన్నారు. నేరాలు పెరగడానికి, పన్నులు ఎగవేయడానికి నగదు ఆధారిత వ్యవస్థ దోహదపడుతుందనీ విశ్లేషించారు. ⇔ దేశంలో ప్రస్తుత వాణిజ్య, వ్యాపార విధానాలు మారాలని ఆయా అంశాలు మరింత సరళతరం కావాల్సి ఉందని విశ్లేషించారు. ⇔ నోట్ల రద్దు అనంతరం బ్యాంకులకు ఆయా నోట్ల డిపాజిట్లు ఎంత మొత్తంలో జరిగాయన్న ప్రశ్నకు ఆర్థికమంత్రి సమాధానం చెబుతూ, ‘‘కరెన్సీ లెక్కింపు ప్రక్రియ ఆసాంతం పూర్తయిన తర్వాతే సంబంధిత డిపాజిట్ల మొత్తాన్ని వెల్లడించడం జరుగుతుంది’’ అని ఇటీవలే ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ పేర్కొన్న విషయాన్ని ప్రస్తావించారు. నోట్ల రద్దుతో వృద్ధి పెరుగుతుంది: ఆర్థికశాఖ ఇదిలావుండగా, పెద్ద నోట్ల రద్దుతో ఆర్థికవృద్ధి మరింత పెరుగుతుందని ఆర్థికశాఖ సహాయమంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ న్యూఢిల్లీలో గురువారం జరిగిన ఒక కార్యక్రమంలో చెప్పారు. ఆర్థిక వ్యవస్థలో 23 శాతం ‘‘షాడో ఎనాకమీ’గా ఉందని, పేర్కొన్న ఆయన, నోట్ల రద్దు, డిజిటలైజేషన్ చొరవల వల్ల ఇక ముందు పన్ను చెల్లింపుల పరిధి మరింత విస్తరిస్తుందని అన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో నగదు నిష్పత్తి 4 శాతం ఉంటే, భారత్‌లో ఏకంగా 12 శాతంగా ఉందని ఈ సందర్భంగా తెలిపారు. ప్రధాని మోదీ నవంబర్ 8 పెద్ద నోట్ల రద్దు నిర్ణయం చొరవతో ప్రజలు డిజిటల్ ఆర్థిక లావాదేవీలవైపు అడుగులు వేస్తున్నారని అన్నారు. -
‘క్యాష్‌లెస్’కు ఊతం
►ఎస్‌హెచ్‌జీ మహిళలకు స్మార్ట్ ఫోన్లు ►కొనుగోలుకు స్త్రీనిధి ద్వారా రూ.6 వేల రుణం ►24 వాయిదాల్లో చెల్లించేందుకు నిర్ణయం ►నగదు రహిత లావాదేవీలు పెంచేందుకు ప్రభుత్వ ప్రయత్నం ►రూరల్ జిల్లాలో 1.62 లక్షల మందికి లబ్ధి వరంగల్ రూరల్ (వెల్ఫేర్) : కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత దేశ వ్యాప్తంగా నగదు రహిత లావాదేవీలు పెంచేందుకు అనేక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆర్టీసీ బస్సులు, బస్టాండ్లు, ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో స్వైపింగ్ మిషన్లు ఏర్పాటు చేయాలని భావిస్తోంది. అయితే క్యాష్‌లెస్ లావాదేవీలను పెంచేందుకు తాజాగా మరో అడుగు ముందుకు పడుతోంది. రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ)ల్లోని మహిళల వద్ద స్మార్ట్ఫోన్లు ఉంటే నగదు రహిత లావాదేవీలు ఊపందుకుంటాయని భావించి వారికి అవగాహన కల్పించాలని అధికారులు నిర్ణయించారు. కాగా, సంఘాల్లోని మహిళలకు ఫోన్లు కొనుగోలు చేసే ఆర్థిక స్తోమత లేదని గుర్తించి.. స్త్రీనిధి బ్యాంకు ద్వారా రుణం ఇచ్చేందుకు రంగం సిద్ధమవుతున్నారు. దీంతో రూరల్ జిల్లాలో 1.62 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. రూ.6 వేలు.. 24 వాయిదాలు మహిళా సంఘాల్లోని సభ్యులు ఒక్కొక్కరు సెల్‌ఫోన్ కొనుగోలు చేసేందుకు రూ.6 వేల చొప్పున స్త్రీ నిధి బ్యాంకు ద్వారా రుణం అంజేయనున్నారు. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలతో స్త్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ కమిటీ సమావేశంలో అధికారులు నిర్ణయించారు. ఇలా రుణంగా అందే నగదుతో మహిళలు ఏ కంపెనీ ఆండ్రాయిడ్ సెల్‌ఫోన్ అయినా కొనుగోలు చేసుకోవచ్చు. అనంతరం 24 వాయిదాల్లో రూ.275 చొప్పున ఈ నగదును తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఒక్కో మహిళ తీసుకున్న రూ.6 వేలకు రూ.6,600 చెల్లించాల్సి వస్తుంది. ఇది పెద్దగా భారమేం కాదు కనుక మహిళలంతా స్మార్ట్ఫోన్లు కొనుగోలు చేస్తారని, తద్వారా నగదు రహిత లావాదేవీలు పెరుగుతాయనేది ప్రభుత్వ భావిస్తోంది. కాగా, అందరూ రుణం తీసుకోవాలనే నిబంధన విధించకపోవడంతో ఆసక్తి ఉన్న వారే రుణం తీసుకోవడంతో పాటు స్మార్ట్ఫోన్లు కొనుగోలు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. స్త్రీ ‘నిధి’ సాయం.. స్త్రీనిధి బ్యాంకు ద్వారా స్వయం సహాయక సంఘాల మహిళలకు చేయూతనిచ్చేందుకు అనేక పథకాలు అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ ఆర్థిక సంవత్సరం మహిళా సంఘాలకు రూ.71.54 కోట్ల రుణాలు ఇవ్వాల్సి ఉంది. అయితే, ఇందులో ఇప్పటివరకు రూ.30 కోట్ల మేరకు అందజేశారు. దీంతో మిగిలిన రూ.41 కోట్లను వచ్చే నెల ముగిసేలోగా అందజేయాలని అధికారులు భావిస్తున్నారు. అన్ని గ్రామాల్లో వంద శాతం మరుగుదొడ్ల నిర్మాణాలను పూర్తి చేయాలన్న లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు సాగుతున్నాయి. ఇందులో భాగం గా మరుగుదొడ్డి నిర్మాణానికి అయ్యే ఖర్చులో రూ.12 వేలను స్త్రీనిధి ద్వారా రుణంగా ఇస్తారు. ఈ రుణాన్ని తిరిగి 12 నెలల్లో వడ్డీతో సహా చెల్లించాల్సి ఉం టుంది. ఒకవేళ ఆలోగా నిర్మాణ బిల్లు ప్రభుత్వం నుంచి ఇస్తే ఆ వెంటనే చెల్లించాలనే నిబంధన విధించారు. -
టు కె రన్
మొబైల్ గేమ్ ఇటీవల భారత ప్రభుత్వం నోట్లు రద్దు చేసిన అంశాన్ని ఆధారంగా చేసుకుని ‘మిస్ ప్లేస్డ్ మైండ్స్’ సంస్థ ఒక మొబైల్ గేమ్ రూపొందించింది. ఆండ్రాయిడ్‌లో వచ్చిన ఈ గేమ్ పేరు ‘టు కె రన్’. కరెంట్ టాపిక్‌ని ఆధారంగా మన దేశంలో ఒక గేమ్ మార్కెట్లోకి రావడం ఇదే ప్రథమం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ క్యారికేచర్లతో యానిమేషన్ చేసి రూపొందిన ఈ గేమ్‌ను జనవరి మొదటి వారంలో మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ గేమ్‌లో... ఎన్నికల గుర్తుతో నోట్లను కొల్లగొడుతున్న అరవింద్ కేజ్రీవాల్‌ను అదుపు చేస్తున్న కానిస్టేబుల్‌గా మోడీ లాఠీతో కనిపిస్తారు. ఈ గేమ్ ఆడేందుకు తేలిగ్గా ఉంది. చూడటానికి ఆసక్తికరంగా ఉంది. సూర్యప్రకాశ్ (విజయవాడ), చంద్రధర్, సాయి తేజ, మోహనవంశీ, శిఖాశర్మ (హైదరాబాద్) ఈ గేమ్ రూపకర్తలు. గూగుల్ ప్లే నుంచి దీనిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. -
భారీ పన్ను వసూళ్లు..!
నోట్ల రద్దు ప్రభావం లేదని చెబుతున్నాయ్ • ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ విశ్లేషణ • వృద్ధి వేగం తగ్గుతుందన్నది అపోహేనన్న అభిప్రాయం న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వృద్ధిపై రూ.500, రూ.1,000 నోట రద్దు ప్రభావం ఎంతమాత్రం లేదని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ సోమవారం మరోసారి విశ్లేషించారు. డిసెంబర్లో పరోక్ష పన్ను వసూళ్లలో భారీగా 14.2% (రూ.76 వేల కోట్లు) వృద్ధి నమోదయ్యిందని ఆయన పేర్కొంటూ, తయారీ రంగం పురోభివృద్ధి, తద్వారా ఎక్సైజ్ సుంకాల మెరుగుదలను ఈ చక్కటి వసూళ్లు సూచిస్తున్నట్లు తెలిపారు. ఆర్థికమంత్రి వెల్లడించిన అంశాల్లో ముఖ్యమైనవి... ⇔ డిసెంబర్లో పరోక్ష పన్నుల వసూళ్లను వేర్వేరుగా చూస్తే... ఎక్సైజ్ వసూళ్లు 31.6% (రూ.36,000 కోట్లు) పెరిగాయి. సేవల పన్ను వసూళ్లలో వృద్ధి 12.4%(రూ.23,000 కోట్లు). అయితే కస్టమ్స్‌లో మాత్రం అసలు వృద్ధిలేకపోగా 6.3% క్షీణించింది. పసిడి దిగుమతులు పడిపోవడమే దీనికి కారణం. ⇔ ఏప్రిల్–డిసెంబర్ కాలంలో చూస్తే... పరోక్ష పన్ను వసూళ్లు 25% వృద్ధితో రూ.6.30 లక్షల కోట్లకు చేరాయి. బడ్జెట్ అంచనాల్లో ఇది 81%. ప్రత్యక్ష పన్ను వసూళ్లు 12.01 శాతం ఎగసి, రూ.5.53 లక్షల కోట్లు. బడ్జెట్ అంచనాలో ఇది 65 శాతం. ⇔ డీమోనిటైజేషన్ అనంతరం ఉపాధి అవకాశాలు తగ్గాయన్న వార్తలు అన్నీ వాస్తవ ప్రాతిపదికతో కూడినవి కావు. వృద్ధి అంకెలు... ఇలాంటి ఊహాజనిత ప్రాతిపదికలను సమర్థించడం లేదు. పన్నులు, ఆయా గణాంకాలే వాస్తవం. ⇔ ఇక చాలా రాష్ట్రాల్లో వ్యాట్ వసూళ్లు నవంబర్‌లో కూడా పెరిగాయి. ⇔ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) అంకెలు, పన్ను వసూళ్ల అంకెలకు పొంతన కుదరడం లేదనడం సరికాదు. జీడీపీపై ఇప్పుడు వచ్చింది ముందస్తు అంచనాలు మాత్రమే. తుది గణాంకాలపై మాత్రమే మనం స్పందించాల్సి ఉంటుంది. -
తుగ్లక్‌ను గుర్తుకుతెచ్చిన మోదీ నిర్ణయం
వరంగల్ : దేశంలో రైతులు, చిన్న వ్యాపారస్తులు, మధ్యతరగతి, పేద ప్రజలు పడుతున్న ఇబ్బందులకు చూస్తుంటే పెద్ద నోట్లను రద్దు చేసిన ప్రధాన మంత్రి మోదీ నిర్ణయం తుగ్లక్‌ను గుర్తుకు తెచ్చిందని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ రీజినల్ కోఆర్డినేటర్ పీసీ.విష్ణునాథ్ అన్నారు. ఏఐసీసీ, టీపీసీసీ ఇచ్చిన పిలుపు మేరకు వరంగల్‌లో డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి అధ్యక్షతన శుక్రవారం పెద్ద నోట్ల రద్దుపై ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో, విదేశాల్లో ఉన్న నల్లధనం తెచ్చేందుకు పెద్ద నోట్లను రద్దు చేస్తున్నామని మోదీ ప్రకటించారన్నారు. నోట్ల రద్దుతో 50రోజుల పాటు ఇబ్బందులు ఉంటాయని, అనంతరం ఉంటే తనను ఉరితీయాలని మోదీ ప్రకటన చేశారని, ప్రస్తుతం ఇంకా ఇబ్బందులు కొనసాగుతున్నందున ఏం చేయాలో ఆ పార్టీ నేతలు చెప్పాలన్నారు. నోట్ల రద్దు వల్ల పాత రూ.500, రూ.1000 నోట్లు ఎన్ని కోట్లు వచ్చాయో చెప్పాలని పీఎం మోదీని ప్రశ్నిస్తే నోరు మెదపడం లేదన్నారు. ఈ విషయంపై ఆర్బీఐని ప్రశ్నించినా వారి వద్ద నుంచి కూడా ఎలాంటి సమాచారమూ రావడం లేదని విష్ణునాథ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం నోట్ల రద్దుతో అతి పెద్ద కుంభకోణానికి పాల్పడిందని ఆరోపించారు. పీఎం మోదీ తీసుకున్న నిర్ణయంతో దేశానికి నష్టం జరుగుతున్న విషయాలను గుర్తించి ఆ పార్టీ నేతలు ఇప్పుడు తప్పుడు నిర్ణయం అని బహిరంగంగా ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. పెద్ద నోట్ల రద్దుకు కొన్ని రోజుల ముందు బీజేపీ, ఆర్ఎస్ఎస్ సంస్థలు దేశ వ్యాప్తంగా వందల కోట్ల రూపాయలతో ఆస్తులను కొనుగోలు చేశాయన్నారు. ఈ క్రమంలో బీజేపీ నేతలు బీహార్‌లో 8, ఒడిషాలో 14 ఆస్తులను రూ.3.41కోట్లకు కొనుగోళ్లు చేసిన విషయాన్ని కాంగ్రెస్ బహిర్గతం చేసిందన్నా రు. మాజీ కేంద్ర మంత్రి బలరాంనాయక్ మాట్లాడుతూ పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ప్రధాని మోదీ ఏకపక్షంగా తీసుకోవడంతోనే ఆర్థిక ఇబ్బందులు నెలకొన్నాయన్నారు. దేశంలో ప్రజాప్రయోజనాల దృష్ట్యా నిర్ణయం తీసుకునే ముందు లోక్‌సభ, రాజ్యసభల్లో చర్చించి తీసుకుంటారని, అలా కాకుండా ఏకపక్షంగా తీసుకున్నారని ఆరోపించారు. ఈ సభలో కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, డీసీసీబీ చైర్మన్జంగా రాఘవరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గుండెబోయిన విజయరామారావు, గండ్ర వెంకటరమణారెడ్డి, ఆరెపల్లి మోహన్, కొండేటి శ్రీధర్, పొదెం వీరయ్య, ఆరోగ్యం, మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, గ్రేటర్ నాయకులు కట్ల శ్రీనివాస్‌రావు, రాజనాల శ్రీహరి, టీపీసీసీ కార్యదర్శి శ్రీనివాస్ పాల్గొన్నారు. సమావేశ అనంతరం వరంగల్ అర్బన్ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేసేందుకు కాంగ్రెస్ నాయకులు ర్యాలీగా వెళ్తుండగా పోలీ సులు అడ్డుకొని అరెస్ట్ చేసి సుబేదారి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. -
రూ. 650 కోట్లు డిపాజిట్
పదుల సంఖ్యలో మూతపడిన ఏటీఎంలు కొన్నింటిలోనే రూ.500 కొత్త నోట్లు వరంగల్ : కేంద్ర ప్రభుత్వం రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేసిన కారణంగా వాటి చెలామణి లేకపోవడంతో బ్యాంకుల్లో సుమారు రూ.650కోట్లకు పైగా పెద్ద నోట్లు డిపాజిట్ అయినట్లు బ్యాంకు అధికారులు తెలుపుతున్నారు. నోట్ల రద్దుతో 50రోజుల పాటు ఇబ్బందులు ఉంటాయని, కొత్త సంవత్సరం మొదటి తేది నుంచి లావాదేవీల్లో ఇబ్బందులు తొలగిపోతాయని ప్రధాన మంత్రి మోదీ ప్రకటించినా నోట్ల కష్టాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పుడిప్పుడే బ్యాంకు అధికారులు ఏటీఎంలను పునరుద్ధరించే పనిలో పడ్డారు. అర్బన్ జిల్లా కేంద్రంలో ఎస్బీఐ, ఎస్బీహెచ్, అంధ్రా బ్యాంకులతో పాటు హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ లాంటి ప్రైవేట్ బ్యాంకుల్లో ఎక్కువ మొత్తాల్లో నోట్లు డిపాజిట్ అయినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పెద్ద వ్యాపారులు మొదటి వారం రోజుల్లోనే ఎక్కవ మొత్తాల్లో డిపాజిట్ చేసి అందుకు ప్రత్యామ్నాయంగా కొత్త నోట్లను సమకూర్చుకున్నట్లు తెలిసింది. కొంత మంది ఇక్కడ డిపాజిట్లు చేయకుండా హైదరాబాద్, విజయవాడ లాంటి పెద్ద నగరాలకు తమకు వ్యాపార లావాదేవిల్లో భాగస్వాములతో నోట్ల మార్పిడి చేసుకున్నట్లు సమాచారం. వరంగల్ అర్బన్ జిల్లాలో వివిధ బ్యాంకులకు చెందిన 196 శాఖలు ఉండగా 215 ఏటీఎంలు ఉన్నాయి. ఇందులో 18,50,774 మంది వినియోగదారులు ఖాతాలు కలిగి ఉన్నారు. 86 ఏటీఎంలలో డబ్బులు పెట్టకుండా మూసివేసినట్లు బ్యాంకుల అధికారులు తెలిపారు. ఇవి నవంబర్ 8వ తేదీ నుంచి ఇప్పటి వరకు పనిచేయడం లేదు. మూసిన షెట్టర్లు తెరవలేదు. కొన్ని ఏటీఎంలు అడపదడపా డబ్బులు ఉన్నప్పుడే పనిచేస్తున్నాయి. డబ్బులు లోడ్ చేసిన రెండు, మూడు గంటలు పనిచేస్తున్నాయి. అనంతరం మళ్లీ మరుసటి రోజు వచ్చి లోడ్ చేస్తే తప్పా పనిచేయని స్థితిలో ఉన్నాయి. బ్యాంకులు ఉన్న చోట ఏర్పాటు చేసిన ఏటీఎంలు మాత్రమే నిరంతరం పనిచేస్తున్నాయి. జనవరి 1వ తేది నుంచి పలు ఏటీఎంల్లో కొత్త రూ.500నోట్లు లభ్యమవుతున్నాయి. బ్యాంకుల వద్ద ఉన్న ఏటీఎంలో వినియోగదారులకు ఒక్క లావాదేవికి రూ.4500 వరకు ఏటీఎంల్లో డ్రా చేసుకునే వెసలుబాటు కలిగింది. -
చితికిన చిరుజీవి
ఇల్లు ఖాళీ చేయాల్సిన పరిస్థితి పేరు: కె.నాగశివ, వ్యాపారం: కొబ్బరి బోండాల విక్రయం ఏరియా: వనస్థలిపురం ►నోట్ల రద్దుకు ముందు: రోజుకు రూ.3 వేల విక్రయాలు ►ఆదాయం: రోజుకు రూ.400 చొప్పున నెలకు రూ.12 వేలు ►నోట్ల రద్దు తర్వాత: రోజుకు రూ.500 విక్రయాలు ►ఆదాయం: రోజుకు రూ.80 చొప్పున నెలకు రూ.2400 ► నెలవారీ ఖర్చులు: ఇంటిఅద్దె రూ.3 వేలు, పిల్లల ఫీజులు రూ.2 వేలు, నిత్యావసరాలు: రూ.3 వేలు మొత్తం: 8000 అవస్థలివీ.. ఫైనాన్షియర్ నుంచి తీసుకున్న రూ.50 వేల అప్పుకుగాను రోజువారీగా రూ.500 చొప్పున చెల్లించడం లేదు. దీంతో ఫైనాన్షియర్ల ఒత్తిళ్లు. ►రెండు నెలలుగా ఇంటి అద్దె చెల్లించ లేదు. ఇల్లు ఖాళీ చేయాలని ఓనర్ వార్నింగ్ ►కొనేవారు లేక తెచ్చిన కొబ్బరిబోండాలు మురిగిపోతున్నాయి. ►బ్యాంకులకు ఐదుమార్లు వెళ్లినా నగదు దొరకలేదు. ► రెండు నెలలుగా మరో రూ.10 వేలు అప్పు చేసి కుటుంబ పోషణ. రోజుకు వంద కూడా కష్టమే.. పేరు: అనిత వ్యాపారం: కూరగాయల విక్రయం ఏరియా: బీఎన్‌రెడ్డినగర్ నోట్ల రద్దుకు ముందు: రోజుకు రూ.2 వేల విక్రయాలు ఆదాయం: రోజుకు రూ.400 చొప్పున నెలకు రూ.12వేలు నోట్ల రద్దు తర్వాత : కనాకష్టంగా రోజుకు రూ.400 విక్రయాలు ఆదాయం: రోజుకు రూ.70 చొప్పున నెలకు రూ.2100 నెలవారీ ఖర్చులు:ఇంటి అద్దె రూ.2500, పిల్లల ఫీజులు:రూ.1500, నిత్యావసరాలు:రూ.3 లు..మొత్తంగా: రూ.7వేలు అవస్థలివీ... ►ఇంటి అద్దె, పిల్లల ఫీజులు చెల్లించడం కష్టమవుతోంది ► రోజుకు రూ.100 కూడా గిట్టుబాటు కావడంలేదు. ► తెచ్చిన కూరగాయలు కొనేవారు లేక మురిగిపోతున్నాయి. ► దరలు దిగివచ్చినా కొనేవారు లేరు. ► కుటుంబ పోషణకు రూ.10 వేలు అప్పు అడిగితే ఎవరూ ఇవ్వడంలేదు. కుటుంబం చిన్నాభిన్నం పేరు: ప్రసాద్, పని: తాపీ మేస్త్రీ నోట్ల రద్దకు ముందు: రోజూ పని దొరికేది. నెలకు కనీసం రూ.15–18 వేల వరకు వచ్చేది. ఖర్చులు: ఇంటి అద్దె రూ.3000, చీటీ వాయిదా రూ.5000, నిత్యావసరాలు: రూ.3000, రూ.1000 పాల బిల్లు..మొత్తం రూ.12 వేలు ప్రస్తుతం నెలవారీ ఆదాయం: రూ.5 వేల లోపలే (రోజూ పనిదొరకడంలేదు) అవస్థలు ఇవీ... నిర్మాణ పనులు నిలిచిపోవడంతో నెలకు రూ.5 వేలు కూడా సంపాదించలేని దుస్థితి. ఒక వేళ పని దొరికినా చేసిన పనికి యజమాని నగదు ఇవ్వడం లేదు. వారానికి ఒకసారి చెక్కు రూపంలో ఇస్తున్నారు. హైదరాబాద్‌లో బ్యాంకు ఖాతా లేదు. దీంతో ఒంగోలు పంపి అకౌంట్లో వేయగా బ్యాంక్ నుంచి చెక్ క్లియరెన్స్ రావడానికి 15 రోజులు పడుతుంది. తీరా ఎకౌంట్లో జమ చేసిన తర్వాత చేతికి డబ్బులు రాలేదు. పిల్లలకు జ్వరం వస్తే డాక్టర్ వద్దకు తీసుకెళ్లేందుకు కూడా డబ్బుల్లేక భార్య, పిల్లలను సొంతూరుకు పంపాడు. ఇంటి యజమాని అద్దె కోసం ఒత్తిడి చేశారు. చేసేది లేక ఇళ్లు ఖాళీ చేశాడు. ప్రస్తుతం ఇక్కడ ఒక్కడే ఉంటూ..పని చేస్తున్న చోటే ఇంటి యజమానిని బతిమిలాడి..తాత్కాలికంగా ఓ గుడిసె వేసుకున్నాడు. కుటుంబం చిన్నాభిన్నమైందని విలపిస్తున్నాడు. -
‘నోట్ల రద్దు’పై రిజర్వు బ్యాంకు పిల్లిమొగ్గలు
-
43 రోజులు.. 60 పల్టీలు!
• ‘నోట్ల రద్దు’పై రిజర్వు బ్యాంకు పిల్లిమొగ్గలు • మోదీ ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేయలేక ఆపసోపాలు... • గత 43 రోజుల్లో.. ఏకంగా 60 సార్లు వెనుకడుగు నోట్ల రద్దు’నిర్ణయాన్ని అమలు చేయడంలో రిజర్వు బ్యాంకు ఆపసోపాలు పడుతోంది. ఉద్ధండులైన ఆర్థికవేత్తలున్నా.. అడ్డగోలు నిర్ణయాలతో అసంబద్ధ నిబంధనలను ప్రకటిస్తూ నవ్వుల పాలవుతోంది. తర్వాత నాలుక కరుచుకుని.. వాటిని వెనక్కి తీసుకుంటోంది. ఇలా నోట్ల రద్దును ప్రకటిం చిన నవంబర్ 8 నుంచి ఇప్పటివరకు.. 43 రోజుల వ్యవధిలో ఏకంగా 60 సార్లు జరిగింది. అందులో కొన్ని ప్రధాన అంశాలు.. నవంబర్ 8న మోదీ నోట్ల రద్దును ప్రకటించారు. నవంబర్ 10 నుంచి డిసెంబర్ 30 వరకు పోస్టాఫీసులు,బ్యాంకుల్లో పాత నోట్లు ఎంత మొత్తమైనా డిపాజిట్ చేయవచ్చని ఆర్బీఐ చెప్పింది. తర్వాత 4 రోజులకే ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడుతూ.. పాతనోట్ల డిపాజిట్‌కు తొందరపడవద్దని, ఇంకా 46 రోజుల టైముందనీ సెలవిచ్చారు. పరిమితులపై మల్లగుల్లాలు: నవంబర్ 8 తర్వాత బ్యాంకుల్లోంచి పాత నోట్లకు బదులుగా విత్‌డ్రా చేసుకోగలిగిన మొత్తం రోజుకు రూ.4వేలు. ఈ పరిస్థితి 15 రోజులు ఉంటుందని ఆర్బీఐ భరోసా ఇచ్చింది. కానీ 9 రోజులకే మాట మార్చి.. రోజుకు రూ.2 వేల కంటే ఎక్కువ విత్‌డ్రా కుదరదంది. తర్వాత.. నవంబర్ 15న నోట్ల మార్పిడి చేసుకున్న వారి వేలిపై ముద్రవేస్తామని ప్రకటన చేసింది. ఎన్నికల సంఘం అక్షింతలతో వెనక్కి తగ్గి, బేషరతుగా ఎంత మొత్తమైనా డిపాజిట్ చేసుకోవచ్చంది. తర్వాత రూ.2.5 లక్షల కంటే ఎక్కువ వేస్తే విచారణ, చర్యలు ఉంటాయని బాంబు పేల్చింది. సడలింపులు.. బిగింపులు: విత్‌డ్రా నిబంధనలపై జనం మండిపడ్డంతో.. ఇంట్లో పెళ్లి జరుగుతుంటే ఖాతా నుంచి రూ.2.5 లక్షల వరకూ విత్‌డ్రా చేసుకోవచ్చని ప్రకటించింది. కానీ పలు నిబంధనలు పెట్టింది. ఖాతాదారు వివరాలన్నీ (కేవైసీ) తెలిపిన ఖాతాల్లోంచే విత్‌డ్రాకు అనుమతించడం, డిసెంబర్ 30 లోపు పెళ్లి ఉంటేనే నగదు ఇవ్వడం వంటి నిబంధనలపై ఆగ్రహం వ్యక్తమైంది. తరువాత వారానికి రూ.24 వేల వరకూ విత్‌డ్రా చేసుకోవచ్చని.. రైతులు, కంపెనీలు రూ.50 వేల వరకు తీసుకోవచ్చని మినహాయింపులు ఇచ్చింది. మరో పిల్లిమొగ్గ! తాజాగా రూ.5వేల కంటే ఎక్కువ మొత్తంలో పాత నోట్లను డిపాజిట్ చేసేందుకు ఒకే ఒక్క అవకాశం కల్పిస్తామని.. అది కూడా అప్పటివరకూ ఎందుకు డిపాజిట్ చేయలేకపోయా రో బ్యాంకు అధికారులకు వివరణ ఇచ్చాకేనని ఆర్బీఐ హుకుం జారీ చేసింది. ‘మా ప్రధాని, ఆర్థిక మంత్రి డిసెంబర్ 30 దాకా డిపాజిట్ చేసుకోవచ్చన్నారు కాబట్టి నేను ఇప్పటివరకూ చేయలేదు’ అన్న కామెంట్లు బ్యాంకులకు చేరడంతో మళ్లీ వెనక్కితగ్గింది. ‘మీ డబ్బు.. ఎంతైనా జమచేసుకోండి!’ అంటూ నాలుక కరిచేసుకుంది! – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
నోట్ల మార్పిడిలో ఆర్బీఐ ఆఫీసర్ హస్తం!
సాక్షి, బెంగళూరు: పెద్ద నోట్ల రద్దు తర్వాత నోట్ల మార్పిడి అక్రమాల్లో రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులు దొరికిపోతుండగా, తాజాగా బెంగళూరులో ఐపీఎస్ అధికారి భార్య, ఆర్బీఐ అధికారిణిపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. బెంగళూరులోని నృపతుంగ రోడ్లో ఉన్న రిజర్వు బ్యాంకు కార్యాలయంలో పనిచేస్తున్న ఓ మహిళాధికారి రాష్ట్ర మంత్రులకు సంబంధించిన పాత పెద్ద నోట్లను అక్రమ మార్గాల్లో మార్చడానికి సహకరించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీనియర్ ఐపీఎస్ అధికారి భార్య అయిన సదరు మహిళాధికారిపై సీబీఐ అధికారులు సాక్ష్యాలను సేకరిస్తున్నారు. భర్త ఐపీఎస్ అధికారి ద్వారా ఆమెతో పరిచయం పెంచుకున్న కొంత మంది కర్ణాటక మంత్రులు తమ వద్ద ఉన్న రూ. 5 కోట్ల నుంచి రూ. 8 కోట్ల వరకు నల్లధనాన్ని అక్రమ మార్గాల్లో వైట్‌మనీగా మార్చుకున్నారనే ఆరోపణలున్నాయి. సహకార బ్యాంకులపై విచారణ: నవంబర్ 10–14 తేదీల్లో మంగళూరు జిల్లా సహకారి బ్యాంకులోని సేవింగ్స్ అకౌంట్లలో రూ.428 కోట్లు డిపాజిట్ అయినట్లు సమాచారం. డీసీసీ బ్యాంకుల్లో డిపాజిట్ అయిన పెద్ద మొత్తంలోని నగదుకు సంబంధించి వివరాలను సేకరించడానికి నాబార్డుతో విచారణ జరిపించనుంది. -
పెద్ద నోట్ల రద్దు ప్రభావంపై అనిశ్చితి
ఆర్బీఐ ఎంపీసీ అభిప్రాయం ముంబై: పెద్ద కరెన్సీ నోట్ల రద్దు నేపథ్యంలో ద్రవ్యోల్బణ లక్ష్యంపై దృష్టి కారణంగానే కీలక రేట్లను యధాతథంగా కొనసాగించడానికే ఆర్బీఐ గవర్నర్ ఊర్జిత్ పటేల్ మొగ్గు చూపారు. పెద్ద కరెన్సీ నోట్ల రద్దు ప్రభావం ఆర్థిక వ్యవస్థపై ఏ మేరకు వుండొచ్చనే అంశంపై అనిశ్చితి నెలకొందని పటేల్ అభిప్రాయపడ్డారు. ఈ నెల 6–7 మధ్య జరిగిన ఆర్బీఐ మోనేటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) సమావేశ వివరాలను ఆర్బీఐ విడుదల చేసింది. ఈ వివరాల ప్రకా రం... ఈ కమిటీలోని ఆరుగురు సభ్యులు రెపో రేటు ను 6.25 శాతంగా ఉంచడానికే మొగ్గు చూపారు. ⇔ ద్రవ్యోల్బణాన్ని 4 శాతం రేంజ్‌లోనే నియంత్రించాలనే విషయంపైనే దృష్టి కేంద్రీకరించాలని పటేల్ సూచించారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ద్రవ్యోల్బణం వచ్చే ఏడాది పెరిగే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. ⇔ నోట్ల రద్దు కారణంగా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం తాత్కాలికమే అయినప్పటికీ, స్వల్ప కాలిక ప్రభా వం ఉంటుందని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఆర్. గాంధీ కూడా అభిప్రాయపడ్డారు. అయితే మధ్య కాలానికి వృద్ధి అవకాశాలపై చెప్పుకోదగ్గ ప్రతికూల ప్రభావాలు ఉండకపోవచ్చని పేర్కొన్నారు. చమురు ధరలు, భౌగోళిక–రాజకీయ స్థితిగతుల ప్రభావం ఉంటుందని వివరించారు. ⇔ పెద్ద నోట్ల రద్దు ఆర్థిక వ్యవస్థకు ఊహించని షాక్ అని మరో సభ్యుడు రవీంద్ర హెచ్ డోలాకియా అభిప్రాయపడ్డారు. ఫలితంగా జీడీపీ అంచనాల ను తగ్గించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. అయితే ఈ ప్రభావం తాత్కాలికమేనని వివరించారు. ⇔ పెద్ద నోట్ల రద్దు ప్రభావాలను తట్టుకునే స్థాయిలోనే మన ఆర్థిక వ్యవస్థ ఉందని మరో ఎంపీసీ సభ్యురాలు పామి దువా అభిప్రాయపడ్డారు. ఆర్థిక కార్యకలాపాలపై పెద్ద నోట్ల రద్దు ప్రభావం తాత్కాలికమేనని ఆమె పేర్కొన్నారు. ⇔ డిమాండ్ తగ్గుతుండడం, దేశీయంగా సరఫరా సంబంధిత సమస్యలు తాత్కాలికమేనని మరో ఎంపీసీ సభ్యుడు దేబబ్రత పాత్ర అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ పరిణామాలు, స్థూల ఆర్థిక అంశాలకు సంబంధించినరిస్క్లు, ఎక్కువ కాలం ప్రభావం చూపుతాయని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. -
కొత్త నోట్లపై కాకి లెక్కలు..!
• ఆర్బీఐ, ప్రభుత్వ గణాంకాల్లో వ్యత్యాసాలు • సరఫరాలో రూ. 1.13 లక్షల కోట్ల తేడా • చెలామణీలోని నోట్లపైనా గందరగోళం... పెద్ద నోట్ల రద్దు దరిమిలా ఇటు ప్రభుత్వం, అటు రిజర్వ్ బ్యాంక్ కొత్త నోట్ల లభ్యత గురించి రోజుకో ప్రకటన చేస్తూ వస్తున్నాయి. అయితే ప్రభుత్వం, ఆర్బీఐ చెప్పే లెక్కల మధ్య పొంతన కుదరకపోతుండటమే చిక్కులు తెచ్చిపెడుతోంది. రెండు రోజుల వ్యవధిలోనే పెద్ద నోట్ల సరఫరా భారీగా పెరిగిపోవడం.. మళ్లీ అంతలోనే పదకొండు రోజుల పాటు అసలు నోట్ల సరఫరా ఊసే లేకపోవడం మొదలైనవి అనేక సందేహాలకు తావిస్తున్నాయంటున్నారు విశ్లేషకులు. ఇదంతా చూస్తుంటే.. కొత్త నోట్ల విషయంలో పార్లమెంటును, ప్రజలను ప్రభుత్వం పక్కదోవ పట్టిస్తూనైనా ఉండొచ్చు లేదా ఆర్బీఐ లెక్కల్లోనే తప్పులైనా ఉండొచ్చని వారు అభిప్రాయపడుతున్నారు. ఇందుకు గణాంకాలతో సహా వారు ఆధారాలు చూపుతున్నారు. ఏది నిజం.. నవంబర్ 27 దాకా ఏటీఎంలు, బ్యాంకు శాఖల ద్వారా ప్రజలు దాదాపు రూ. 2.16 లక్షల కోట్ల కొత్త నోట్లను విత్‌డ్రా చేసుకున్నట్లు నవంబర్ 28న రిజర్వ్ బ్యాంక్ ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే, ఇందులో ఏయే నోట్లు, ఎన్నెన్ని ఉన్నాయన్నది వివరించలేదు. కనుక ఇందులో ఎంతో కొంత మొత్తం రూ. 100 లేదా అంతకన్నా తక్కువ విలువ చేసే నోట్లు కూడా ఉన్నాయని భావించవచ్చు. ఇక ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ డిసెంబర్ 6న పార్లమెంట్లో చెప్పిన వివరాలను బట్టి చూస్తే నవంబర్ 29 దాకా రూ. 2,000 నోట్లు 160.8 కోట్లు, రూ. 500 నోట్లు 15.6 కోట్లు.. అంటే మొత్తం సుమారు రూ. 3.29 లక్షల కోట్లు విలువ చేసే 176.4 కోట్ల నోట్లు సరఫరా అయ్యాయి. ఇక్కడ పరిశీలించాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. ఆర్బీఐ లెక్కల ప్రకారం డీమోనిటైజేషన్ తర్వాత 17 రోజుల వ్యవధిలో రూ. 2.16 లక్షల కోట్లు అంటే.. రోజుకు సగటున రూ. 12,700 కోట్ల మేర సరఫరా అయ్యాయి. కానీ ప్రభుత్వ లెక్కలను బట్టి చూస్తే నవంబర్ 29కి రూ. 3.29 లక్షల కోట్ల విలువైన నోట్లు సరఫరా అయ్యాయి. అంటే.. కేవలం రెండు రోజుల వ్యవధిలో కరెన్సీ సరఫరా ఏకంగా రూ. 1.13 లక్షల కోట్ల మేర పెరిగిపోయింది. పైపెచ్చు ఆర్బీఐ చెప్పిన గణాంకాల్లో చిన్నా, పెద్ద అన్ని రకాల డినామినేషన్ల నోట్లు ఉండగా.. మంత్రి చెప్పిన వివరాలు కేవలం పెద్ద నోట్లకు సంబంధించినవే. ఒకవేళ చిన్న నోట్లను కూడా పరిగణనలోకి తీసుకుని ఉంటే నవంబర్ 29 దాకా సరఫరా అయిన నోట్లు మరింత ఎక్కువగానే పెరిగేవి. మరిన్ని సందేహాలు.. ఇక మరో ఆసక్తికరమైన విషయం చూద్దాం. డిసెంబర్ 7న పాలసీ సమీక్ష సందర్భంగా ఆర్బీఐ మరిన్ని కొత్త గణాంకాలను వెల్లడించింది. అంతకు ముందు రోజు నాటి దాకా రూ.4 లక్షల కోట్ల మొత్తాన్ని సరఫరా చేసినట్లు ఆర్బీఐ డిçప్యూటీ గవర్నర్ ఆర్ గాంధీ చెప్పుకొచ్చారు. ఇందులో రూ. 1.06 లక్షల కోట్లు చిన్న నోట్లు అని ఆయన పేర్కొన్నారు. అంటే మిగతావి (రూ. 2.94 లక్షల కోట్లు) పెద్ద నోట్లేనని భావించవచ్చు. నవంబర్ 29 దాకా జరిగిన నోట్ల సరఫరాకు సంబంధించి వారం రోజుల ముందు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పార్లమెంటులో చెప్పిన రూ. 3.29 లక్షల కోట్ల కన్నా ఇది తక్కువే. ఈ గందరగోళం ఇక్కడితో ఆగలేదు. డిసెంబర్ 10 దాకా 170 కోట్ల మేర రూ. 2,000, రూ. 500 నోట్లను సరఫరా చేసినట్లు డిసెంబర్ 12న గాంధీ తెలిపారు. అంటే నవంబర్ 29 దాకా 176 కోట్ల పెద్ద నోట్లను సరఫరా చేశామంటూ మంత్రి చెప్పిన 11 రోజుల తర్వాత.. ఆయన చెబుతున్న దానికన్నా తక్కువ నోట్లే సరఫరా చేశామని ఆర్బీఐ చెప్పినట్లయ్యింది. పోనీ ఒకవేళ.. మేఘ్వాల్ అర కొరను పక్కన పెట్టిæ రౌండ్ ఫిగర్ చేసి 170 కోట్లని చెప్పారనుకుంటే నవంబర్ 29 –డిసెంబర్ 10 మధ్య కొత్త నోట్ల సరఫరా లేదా ముద్రణా నిల్చిపోయిందని అనుకోవాలా? ఆర్బీఐ ఈ వ్యత్యాసాలను ఎలా వివరించగలదు? నోట్లపై ఆర్బీఐ వివరణ చలామణీలోని నోట్లపై జర్నలిస్టు, సమాచార హక్కు కార్యకర్త అనిల్ గల్గాలికి ఇచ్చిన సమాధానంపై వివాదం రేగడంతో ఆర్బీఐ వివరణ ఇచ్చింది. చలామణీలోని నోట్లతో పాటు ఇంకా అందుబాటులోకి తేని నోట్లను కూడా కలిపి అనిల్ ప్రశ్నకు సమాధానం ఇచ్చినట్లు పేర్కొంది. వివరాల్లోకి వెడితే.. నవంబర్ 8 నాటికి (డీమోనిటైజేషన్ ప్రకటించిన తేది) చలామణీలో ఎన్ని నోట్లు ఉన్నాయి, ఎన్ని కొత్త కరెన్సీ నోట్లను ముద్రించారు తదితర వివరాలు ఇవ్వాల్సిందిగా సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద ఆర్బీఐని అనిల్ కోరారు. అధికారిక లెక్కల ప్రకారం నవంబర్ 4 దాకా రూ. 17.97 లక్షల కోట్లు చలామణీలో ఉన్నాయి. అయితే, అనిల్ ప్రశ్నకు ఆర్బీఐ ఇచ్చిన సమాధానం ప్రకారం ఈ మొత్తం ఏకంగా రూ. 23.9 లక్షల కోట్లుగా ఉంది. ఫలితంగా రెండింటి మధ్య పొంతన లేక గందరగోళ పరిస్థితి తలెత్తింది. రెండింటి మధ్య వ్యత్యాస మొత్తం (సుమారు రూ. 6 లక్షల కోట్లు) తమ లాకర్లలోనే ఉంటుందని, దీన్ని చలామణీలోకి తేకపోవడం వల్ల అందుకు సంబంధించిన డేటాలో ప్రతిఫలించదని ఆర్బీఐ తెలిపింది. ఏ నోట్లు ముద్రిస్తున్నారో.. తగినన్ని నోట్లు వీలైనంత త్వరగా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రింటింగ్ ప్రెస్‌లు ఓవర్‌టైమ్ పనిచేస్తున్నాయంటూ ప్రభుత్వం చెబుతూ వస్తోంది. డీమోనిటేజైషన్ ప్రకటించిన తర్వాత కొద్ది రోజుల వ్యవధిలో ముద్రించిన నోట్లలో సింహభాగం 80–90 శాతం రూ. 500 నోట్లే ఉన్నాయని కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగం కార్యదర్శి శక్తికాంత దాస్.. డిసెంబర్ 17న దూరదర్శన్‌కి ఇచ్చిన ఇంటర్వూ్యలో చెప్పారు. ఇక మేఘ్వాల్ సమాచారం ప్రకారం నవంబర్ 29 దాకా (అంటే డీమోనిటైజేషన్ అయిన 20 రోజుల దాకా) సరఫరా చేసిన రూ. 500 నోట్ల విలువ రూ. 7,800 కోట్లే (దాదాపు 15.6 కోట్ల నోట్లు). రద్దు చేసిన నోట్ల విలువలో (రూ. 8.58 లక్షల కోట్లు) కొత్తగా ముద్రించిన రూ. 500 నోట్లు ఒక్కశాతం కన్నా (0.91 శాతం) తక్కువే ఉండటం గమనార్హం. పోనీ గాంధీ చెప్పిన మాటలు బట్టి చూసినా.. నవంబర్ 10న.. అంటే డీమోనిటైజేషన్ ప్రకటించి నెల రోజులు గడిచినా కూడా పరిస్థితిలో పెద్దగా మార్పు లేదన్నమాట. ఇక, రూ. 2,000 నోట్లను నెలల తరబడి ముద్రిస్తూనే ఉన్నామని, చెప్పుకోతగ్గ పరిమాణంలో ఇవి చలామణీలో ఉన్నాయని శక్తికాంత దాస్ చెప్పారు. గణాంకాల ప్రకారం నవంబర్ 29 నాటి దాకా సరఫరా అయిన రూ. 2,000 నోట్ల విలువ సుమారు రూ. 3.21 లక్షల కోట్లు (160.8 కోట్లు రూ. 2,000) ఉంటుంది. రద్దయిన పెద్ద నోట్లు (రూ. 1,000) విలువ రూ. 6.86 లక్షల కోట్లలో ఇది దాదాపు 47%. అయితే, వినియోగానికి అనువుగా లేనంత పెద్ద నోటు కావడంతో(రూ.2,000) ఇవి ఎక్కువగా చెలామణీలోకి వచ్చినా నగదు ఎకానమీలో ఉపయోగం లేకుండా పోయిం ది. మళ్లీ డిసెంబర్ 10న గాంధీ వెల్లడించిన సమాచారం ప్రకారం రూ. 2,000 నోట్ల సరఫరా పరిమాణంలో మార్పేమీ లేదు. దీంతో నోట్ల వెతలు తీరాలంటే ప్రధాని చెప్పిన 50 రోజుల గడువు సరిపోయేట్లుగా లేదనేది పరిశీలకుల మాట. -
‘రద్దు’ తర్వాత పట్టుకుంది రూ.11 కోట్ల నగదే!
‘నోట్ల రద్దు’ తర్వాత ఏపీ, తెలంగాణలో ఐటీ శాఖ చర్యలివి సాక్షి, హైదరాబాద్: నోట్లు రద్దు తర్వాత దేశవ్యాప్తంగా ఐటీ సోదాలు, దాడుల్లో వందల కోట్లలో కొత్త, పాత నోట్లు, నల్లధనం బయటపడుతుంటే... ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మాత్రం పట్టుకున్నది రూ.11 కోట్లు మాత్రమే. ఇందులో కొత్త నోట్ల విలువ రూ.1.9 కోట్లు. అసలు ఈ రెండు రాష్ట్రాల్లో కలిపి కూడా చేసిన తనిఖీలు, సోదాలు 11 మాత్రమే. ఇక ఆస్తులు, బంగారం రూపంలో కలిపి గుర్తించిన మొత్తం నల్లధనం రూ.280 కోట్లు. ఆదాయ పన్ను శాఖ హైదరాబాద్ డైరెక్టర్ జనరల్ నీనా నిగమ్ వెల్లడించిన సమాచారం ఇది. సోమవారం హైదరాబాద్‌లోని ఆదాయ పన్ను శాఖ కార్యాలయంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఆదాయ పన్ను శాఖ తీసుకున్న చర్యలను నీనా నిగమ్ వెల్లడించారు. ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఇప్పటివరకు ఇరు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 30 తనిఖీలు/సోదాలు నిర్వహించామని.. రూ.760 కోట్ల విలువైన లెక్కల్లో చూపని ఆస్తులను గుర్తించామని తెలిపారు. -
బ్యాంకుల నెత్తిన నోట్ల రద్దు బండ..!
• పెరుగుతున్న వ్యయాలు • రుణాలకు డిమాండ్ తగ్గుదల • తాత్కాలికంగా తప్పని సమస్యలు న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దుతో కుప్పలకొద్దీ వచ్చి పడిన డిపాజిట్ల ప్రయోజనాలు బ్యాంకులకు ఎప్పుడో దీర్ఘకాలంలో వచ్చే అవకాశాలు ఉన్నప్పటికీ.. ప్రస్తుతానికి మాత్రం వాటికి సమస్యలు తప్పేట్లు లేవు. ఒకవైపురుణాలకు డిమాండ్ పడిపోవటంతో పాటు మరోవైపు.. కొత్త పరిణామాల కారణంగా అదనపు వ్యయాలు తోడవుతుండటమూ దీనికి కారణం. భారీ ఎత్తున చలామణిలో ఉన్న రూ. 500, రూ.1,000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం గత నెలలో ప్రకటించడం బ్యాంకింగ్ రంగాన్ని గణనీయంగా కుదిపేసింది. అంత భారీ స్థాయిలో నగదును మళ్లీ రీప్లేస్ చేయాల్సివచ్చేసరికి రిజర్వ్ బ్యాంక్ వద్ద ఒక్కసారిగా కొత్త నోట్లకు కొరత ఏర్పడింది. ప్రింటింగ్ ప్రెస్‌లు నిరంతరం పనిచేస్తూనే ఉన్నా.. రద్దయిన నోట్లలో ఇప్పటికి మూడో వంతు నగదు మాత్రమే ఆర్బీఐ అందుబాటులోకితేగలిగిందని అంచనా. ఇటువంటి పరిస్థితుల్లో వ్యాపార విశ్వాసం తీవ్రంగా దెబ్బతిని రుణాలకు డిమాండ్ పడిపోయింది. రుణాలివ్వడానికి బ్యాంకుల దగ్గర పుష్కలంగా నిధులున్నప్పటికీ.. పాత నోట్లు డిపాజిట్‌చేసేందుకు వచ్చే ఖాతాదారులను చూసుకోవడంపైనే బ్యాంకు సిబ్బంది ప్రధానంగా దృష్టి పెట్టాల్సి వస్తుండటంతో ఇతరత్రా కార్యకలాపాలు కుంటుపడుతున్నాయి. డీమోనిటైజేషన్‌పై ఆందోళనతో డిపాజిట్ చేసేందుకువస్తున్న ఖాతాదారులకు ముందుగా ఉపశమనం కల్పించడం తమకు ముఖ్యమని, రుణాలివ్వడానికి బోలెడంత సమయం ఉందని బ్యాంకింగ్ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే, ఇప్పటికే రుణ వృద్ధి మందగించినసమస్యతో సతమతమవుతున్న బ్యాంకులకు ఈ పరిణామాలన్నీ గోరుచుట్టుపై రోకటిపోటుగా మారాయి. మందగించిన రుణ వృద్ధి.. జూలై–సెప్టెంబర్ ›త్రైమాసికంలో మిగతా ప్రపంచ దేశాల కన్నా కూడా వేగవంతంగా భారత ఎకానమీ 7.3 శాతం మేర వృద్ధి నమోదు చేసింది. ఉపాధి కల్పనకు కనీసం ఎనిమిది శాతం వృద్ధినైనా నిలకడగా కొనసాగించాల్సిఉంటుంది. ఇందుకోసం ప్రైవేట్ పెట్టుబడులు పెరగాలి. ఎకానమీకి ఊతంగా నిల్చే వివిధ రంగాలకు బ్యాంకులు రుణాలు అందించాలి. ఇది జరగాలంటే బ్యాంకింగ్ రంగం సరిగ్గా ఉండాలి. అయితే చాన్నాళ్లుగా అంతంతమాత్రం లాభదాయకత, మొండిబకాయిల భారంతో కుంగుతున్న బ్యాంకింగ్ వ్యవస్థకు.. ప్రస్తుత కష్టం తాత్కాలికమైనదైనా కూడా చాలా బాధాకరమైనదిగానే పరిణమించవచ్చు. ఒకవేళ వ్యాపారాలు కోలుకోవడానికి ఇంకాఆలస్యమైతే.. ఇక్కట్లు మరింతగా పెరగొచ్చు. ప్రస్తుతం డీమోనిటైజేషన్ దెబ్బతో వ్యాపార కార్యకలాపాల నిర్వహణ, విస్తరణ కోసం లోన్ తీసుకుందామనుకునే వ్యాపారవర్గాలకు రుణం దొరకని పరిస్థితి నెలకొంది. ప్రతీబ్యాంకు సిబ్బందీ కరెన్సీని మార్చే హడావుడిలో ఉండటమే తప్ప తమకు రుణాలివ్వడంపై దృష్టే పెట్టడం లేదని వ్యాపారవర్గాలు ఆవేదన వెలిబుచ్చుతున్నాయి. దీంతో, ఏటా రెండంకెల శాతం స్థాయిలో వృద్ధి చెందుతున్న అమ్మకాలు ఈసారి అంతకు మించి పడిపోయే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అంచనాల్లో మార్పులు .. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో రుణ వృద్ధి అంచనాలను బ్యాంకులు సవరించుకుంటున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ ఈ ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి కనీసం 10 శాతమైనా రుణ వృద్ధి సాధించాలనినిర్దేశించుకున్నప్పటికీ.. సాధ్యపడకపోవచ్చని బ్యాంకు వర్గాలు చెబుతున్నాయి. రిటైల్ రుణాలకు డిమాండ్ తగ్గినట్లు పేర్కొన్నాయి. మరోవైపు పాత నోట్లతో బకాయిలను ముందస్తుగా తీర్చేస్తుండటం సైతం మొత్తంరుణాల పోర్ట్‌ఫోలియోపై ప్రతికూల ప్రభావం చూపుతోందని ఎస్బీఐ వర్గాలు తెలిపాయి. అయితే, ఈ లోటు అంతటినీ.. నాలుగో త్రైమాసికంలో భర్తీ చేసుకోవాలని ఎస్బీఐ భావిస్తోంది. మరోవైపు, రుణ వృద్ధి మళ్లీ సాధారణస్థాయికి రావడానికి కనీసం రెండు త్రైమాసికాలైనా పట్టేస్తుందని ఇతర బ్యాంకుల అధికారులు చెబుతున్నారు. మొత్తం మీద ఈ ఆర్థిక సంవత్సరంలో S బ్యాంకింగ్ రంగంలో రుణ వృద్ధి ఆరు శాతానికి పడిపోవచ్చనికన్సల్టెన్సీ సంస్థలు అంచనా వేస్తున్నాయి. అదే జరిగితే 1962 తర్వాత ఇదే అత్యంత తక్కువ స్థాయి వృద్ధి కాగలదు. రుణ వృద్ధి గత ఆర్థిక సంవత్సరం 10.9 శాతంగాను, అంతకు ముందు 9 శాతంగానూ నమోదైంది. వ్యయాల మోత.. డీమోనిటైజేషన్ దరిమిలా బ్యాంకుల తాత్కాలిక వ్యయాలూ పెరిగాయి. ఉద్యోగులకు ఓవర్‌టైమ్ చెల్లించడం, పాత నోట్లను డిపాజిట్ చేసుకునేందుకో లేదా మార్చుకునేందుకో పెద్ద ఎత్తున వస్తున్న ఖాతాదారులనుఅదుపులో ఉంచేందుకు అదనంగా సెక్యూరిటీ గార్డులను నియమించుకోవాల్సి వస్తుండటం మొదలైన వాటికోసం బ్యాంకులు అదనంగా వెచ్చించాల్సి వస్తోంది. కొత్త నోట్లకు అనుగుణంగా ఏటీఎంలను రీకాలిబ్రేట్చేసేందుకయ్యే వ్యయాలు వీటికి అదనం. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) అంచనాల ప్రకారం ఈ వ్యయాలు సుమారు రూ. 35,100 కోట్ల మేర ఉండొచ్చు. ఇది కాకుండా.. ఈ ఏడాది ఆఖరుదాకా ఏటీఎం లావాదేవీలు, ఇతరత్రా కార్డు చెల్లింపులపై ఫీజులు వసూలు చేయొద్దన్న ఆర్బీఐ ఆదేశం కూడా బ్యాంకుల ఆదాయ మార్గాలకు ప్రతికూలంగా మారింది. ఆర్బీఐ అనూహ్యంగా కీలక పాలసీ రేట్లనుయథాతథంగా ఉంచడం వల్ల బాండ్ మార్కెట్లు తగ్గడంతో బ్యాంకులు ఇప్పటిదాకా వాటిపై పెట్టుకున్న ఆశలూ ఆవిరైపోయాయి. ప్రస్తుతం అనేకానేక సమస్యల్లో ఉన్నప్పటికీ.. దీర్ఘకాలంలో బ్యాంకులకు ఈ పరిణామంమంచిదేనంటున్నారు విశ్లేషకులు. మరిన్ని నిధులు అధికారికంగా వ్యవస్థలోకి రావడం, క్రెడిట్ కార్డుల వినియోగం.. ఇతరత్రా ఆర్థిక సేవల వినియోగం పెరగడం మొదలైనవి ఇందుకు దోహదపడగలవంటున్నారు. -
ఆ విరాళాలను నిషేధించండి!
పార్టీలకు రూ. 2 వేలు, ఆ పైబడిన అజ్ఞాత విరాళాలపై ఈసీ న్యూఢిల్లీ: ఎన్నికల్లో నల్లధన ప్రవాహాన్ని అరికట్టడానికి ఎన్నికల కమిషన్ కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా పార్టీలకు రెండు వేల రూపాయలు, ఆ పైబడి అజ్ఞాతంగా ఇచ్చే విరాళాలపై నిషేధం విధించేందుకు చట్టాల్లో మార్పులు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఇలాంటి విరాళాలపై రాజ్యాంగ పరంగాగానీ, చట్ట పరంగాగానీ నిషేధం లేదు. అయితే ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 29సీ ప్రకారం ‘పరోక్ష పాక్షిక నిషేధం’ ఉంది. విరాళాల డిక్లరేషన్ అవసరాలకు అనుగుణంగా ఇది సాధ్యం. కానీ, అలాంటి డిక్లరేషన్లు రూ. 20 వేలకు పైబడిన విరాళాలకు మాత్రమే తప్పనిసరి. ఇప్పుడు రెండు వేల రూపాయలు కంటే పైబడిన అనామక విరాళాలను నిషేధించాలని కేంద్రాన్ని ఈసీ కోరింది. ఇక లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి సీట్లు గెలుచుకున్న పార్టీలకు మాత్రమే ఐటీ మినహాయింపు కొనసాగించాలని కూడా ఈసీ పేర్కొంది. కాగా, నోట్ల రద్దు తర్వాత రాజకీయ పార్టీలకు విరాళాల స్వీకరణలో ప్రత్యేక సడలింపులు ఏమీ లేవని, పాత రూ. 500, రూ. 1000 నోట్లను అవి తీసుకోరాదని రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్ ఆధియా ట్విటర్లో పేర్కొన్నారు. అలా చేస్తే ఐటీ అధికారులకు సమాధానం చెప్పాల్సి ఉంటుందని పేర్కొన్నారు. -
అవినీతిని రూపుమాపేందుకే పెద్ద నోట్ల రద్దు
ఆర్ఎస్ఎస్ తెలంగాణ సంఘ చాలక్ వెంకటేశ్వర్రావు నగరంలో కదం తొక్కిన స్వయం సేవకులు నిక్కర్ నుంచి ప్యాంట్‌కు మారాక తొలి సమ్మేళనం విద్యారణ్యపురి : వేళ్లూనుకుపోయిన అవినీతిని రూపుమాపేందుకు కేంద్రప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుందని ఆర్ఎస్ఎస్ తెలంగాణ ప్రాంత సంఘచాలక్ అధ్యక్షుడు ప్యాట వెంకటేశ్వర్రావు అన్నారు. అలాగే, కశ్మీర్ వంటి ప్రాంతాల్లో అల్లర్లు తగ్గుముఖం పడుతున్నాయని పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తల గణవేశ్(యూనిఫాం) నిక్కర్ నుంచి ప్యాంట్‌కు మారాక వరంగల్‌లోని తరుణ స్వయం సేవకుల కోసం తొలి సమ్మేళనాన్ని ఆదివారం ఏర్పాటుచేశారు. హన్మకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ మైదానంలో జరిగిన ఈ సమ్మేళనంలో వెంకటేశ్వర్రావు ముఖ్యఅతిథి మాట్లాడారు. పెద్దనోట్ల రద్దుతో సామాన్య ప్రజలు తొలుత ఇబ్బంది పడుతున్నా.. ఎవరూ ప్రధాని నిర్ణయాన్ని వ్యతిరేకించడం లేదన్నారు. నల్లధనం కలిగిన ఉన్న వారు మాత్రం ఎలా మార్చుకోవాలో తెలియక నోట్ల రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. తొమ్మిది దశాబ్దాల ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ ప్రారంభమై తొమ్మిది దశాబ్దాలు గడిచిందని.. అప్పటి నుంచి దేశం నలుమూలలా సంఘ కార్యక్రమాలను విస్తరించాయని వెంకటేశ్వర్రావు తెలిపారు. దేశ ప్రజల్లో జాతీయత భావాన్ని నింపడంలో సంఘం నిరంతరం కృషి చేస్తుంండగా.. సమాజంలోని మార్పులకు అనుగుణంగా తనను తాను తీర్చిదిద్దుకుంటూ ముందుకు సాగుతోందన్నారు. 1925నుంచి ఉన్న సంఘ గణవేష్ మార్పు విషయమై అఖిల భారత స్థాయిలో చర్చించాక కాలానికి అనుగుణంగా, అందరికీ సౌకర్యంగా ఉండేలా నిక్కర్ స్థానంలో ప్యాంట్ ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. అయితే, గణవేష్ మారినా సంఘం సిద్ధాంతాలు మారవని ఆయన స్పష్టం చేశారు. దళితుల పట్ల వివక్ష చూపని సంస్థగా ఆర్ఎస్ఎస్కు పేరుందన్నారు. అనంతరం జ్యుడీషియల్ ఉద్యోగుల సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కుమ్మరి జగన్నాథం మాట్లాడుతూ దేశరక్షణ, అభివృద్ధికి అంకిత భావంతో పనిచేసే ఏకైక సంస్థ ఆర్ఎస్ఎస్ అని పేర్కొన్నారు. సమావేశంలో ఆర్ఎస్ఎస్ వరంగల్ జిల్లా, మహానగర అధ్యక్షులు శ్రీనివాస్‌రెడ్డి, పాణుగంటి విశ్వనాథ్ మాట్లాడారు. కాగా, సమ్మేళనంలో తొలుత స్వయం సేవకులు నూతన యూనిఫాంతో హన్మకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి హన్మకొండ చౌరస్తా, అశో కా జంక్షన్, పెట్రోల్‌పంపు, కమ్మరి వాడ, కిషన్‌పుర, పరేడ్ గ్రౌండ్ మీదుగా నిర్వహించిన పధ సంచలన్(రూట్ మార్చ్) ఆకట్టుకుంది. -
తొలిరోజునే బీజేపీకి ఇరకాటం!
అసెంబ్లీలో పెద్దనోట్ల రద్దు అంశం చర్చకు రావడంపై అసంతృప్తి అధికార టీఆర్ఎస్ తీరుపై కమలనాథుల గుర్రు సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాల తొలిరోజునే బీజేపీ శాసనసభాపక్షం సభలో ఇరుకున పడే పరిస్థితి ఎదురుకానుంది. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పెద్దనోట్లను రద్దు చేయడంతో రాష్ట్రంలోని వివిధవర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిం దే. ఈ నేపథ్యంలో శుక్రవారం ప్రారంభం కానున్న శాసనసభ సమావేశాల మొదటిరోజునే ఈ అంశంపై చర్చకు అధి కారపక్షం ఆమోదం తెలపడంతో రాష్ట్ర బీజేపీ సంకటంలో పడింది. మోదీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అటు లోక్‌సభ, రాజ్యసభలను కుదిపేస్తుండగా, జాతీయస్థాయిలో విపక్షపార్టీల విమర్శలను తిప్పికొట్టేందుకు బీజేపీ ఎంతో శ్రమించాల్సి వస్తోంది. క్షేత్రస్థాయి లో సమస్యలు పరిష్కారం కాక.. బ్యాంకులు, ఏటీఎంలలో డబ్బులు దొరకక ప్రజల ఇబ్బందులు తీవ్రం కావడంతో కేంద్ర నిర్ణయాన్ని సమర్థిస్తూ సమాధానాలు చెప్పుకోవడం బీజేపీ నాయకులకు కష్టంగా మారుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర అసెంబ్లీలో ఈ అంశంపై చర్చకు అవకాశం ఇవ్వడమంటే బీజేపీ ప్రభుత్వంపై విపక్షాల దాడికి అవకాశం ఇచ్చినట్లేననే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను సభలో ఎండగడతామని, కనీసం 20 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలంటూ బీజేఎల్పీ డిమాండ్ చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. కానీ అందుకు పూర్తి భిన్నంగా సమావేశాల తొలిరోజునే విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి రావడాన్ని రాష్ట్ర బీజేపీ నేతలు జీర్ణించుకోలేక పోతున్నారు. బీజేపీ పట్ల అధికార టీఆర్ఎస్ వ్యవహరిస్తున్న తీరుపై ఆ పార్టీ నాయకులు గుర్రుగా ఉన్నారు. పెద్దనోట్ల రద్దుపై మోదీ తీసుకున్న నిర్ణయాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుగా వ్యతిరేకించి, ఆ తర్వాత మంచి నిర్ణయమని ప్రకటించడం బీజేపీ జాతీయ నాయకత్వాన్ని ఒకింత సంతోష పరిచింది. అటు ఈ నిర్ణయాన్ని సమర్థిస్తూనే, నోట్ల రద్దు నిర్ణయం అమలు సరిగా లేదని కిందిస్థాయిలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటూ ఎప్పటికప్పుడు ఏదో ఒక పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వం తన అసంతుష్ట వైఖరిని స్పష్టం చేస్తుండడం బీజేపీ నాయకులకు మింగుడు పడడం లేదు. విపక్షాలకు అవకాశం.. ఈ పరిణామాల దృష్ట్యా అసెంబ్లీలో మోదీ ప్రభుత్వం, బీజేపీ నాయకత్వంపై కాంగ్రెస్, ఎంఐఎం, ఇతర విపక్షాల విమర్శలకు పరోక్షంగా అధికార టీఆర్ఎస్ అవకాశం ఇచ్చినట్లుగా భావించాల్సి ఉంటుందని ఈ పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. -
నోట్ల రద్దుతో నేనూ సహనం కోల్పోయా!
బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్‌రాజు సాక్షి, అమరావతి: నోట్ల రద్దు వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతున్నారని, ఓ దశలో తాను కూడా సహనం కోల్పోయానని బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్‌రాజు తెలిపారు. వెలగపూడిలోని సచివాలయంలో బుధవారం ముఖ్యమంత్రిని కలిసిన ఆయన మీడియాతో మాట్లాడారు. బ్యాకుల్లో వారానికి రూ.24 వేలు ఇస్తారని చెప్పినా ఇవ్వడంలేదన్నారు. తన కుమారుణ్ని డబ్బు కోసం బ్యాంకుకు పంపితే కేవలం రూ. 6,000 ఇచ్చారని వాపోయారు. బ్యాంకర్లు నల్ల కుబేరులతో కుమ్మక్కై అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఆర్బీఐ బ్యాంకులకు సరిపడా డబ్బును విమానాల్లో పంపాలన్నారు. -
టోకు వస్తువుల డిమాండూ డౌన్!
• నవంబర్‌లో టోకు ద్రవ్యోల్బణం 3.15% • పెద్ద నోట్ల రద్దు ప్రభావం... న్యూఢిల్లీ: రూ.500, రూ.1,000 పెద్ద నోట్ల రద్దు ప్రభావం వ్యవస్థలో డిమాండ్‌పై స్పష్టంగా కనిపిస్తోంది. రిటైల్‌తో పాటు టోకు వస్తువుల డిమాండ్ ప్రత్యేకించి ఆహార ఉత్పత్తుల విషయంలో భారీగా పడిపోయింది. నవంబర్‌లో టోకు ద్రవ్యోల్బణం 3.15 శాతంగా నమోదయ్యింది. అంటే టోకు వస్తువుల బాస్కెట్ ధర 2015 నవంబర్‌తో పోల్చితే 2016 నవంబర్‌లో 3.15 శాతమే పెరిగిందన్నమాట. అక్టోబర్‌లో ఈ రేటు 3.39 శాతం. ఫుడ్, నాన్–ఫుడ్ ఆర్టికల్స్ విభాగంలో డిమాండ్ మందగమన జాడలు బుధవారం వాణిజ్యమంత్రిత్వశాఖ విడుదల చేసిన గణాంకాల్లో కనిపించాయి. మంగళవారం విడుదలైన నవంబర్ రిటైల్ ద్రవ్యోల్బణం కూడా రెండేళ్ల కనిష్ట స్థాయిలో 3.63 శాతంగా నమోదయిన సంగతి తెలిసిందే. తాజా గణాంకాలు చూస్తే... ప్రైమరీ ఆర్టికల్స్: ఫుడ్, నాన్–ఫుడ్ ఆర్టికల్స్‌తో కూడిన ఈ విభాగంలో టోకు ద్రవ్యోల్బణం 1.25 శాతంగా ఉంది. గత ఏడాది ఇదే కాలంలో ఈ రేటు 2.15 శాతం. వేర్వేరుగా చూస్తే, ఫుడ్ ఆర్టికల్స్‌లో రేటు 2.55 శాతం నుంచి 1.54 శాతానికి తగ్గింది (అక్టోబర్‌లో 4.34 శాతం). నాన్–ఫుడ్ ఆర్టికల్స్‌లో ద్రవ్యోల్బణం పెరక్కపోగా –0.14% క్షీణించింది. గత ఏడాది ఇదే కాలంలో ఈ రేటు 6.33 శాతం. ఆహార ఉత్పత్తులకు సంబంధించి టోకున కూరగాయల ధరలు అసలు పెరక్కపోగా, – 24.10 శాతం క్షీణించాయి. తయారీ: మొత్తం సూచీలో దాదాపు 60 శాతం వాటా కలిగిన ఈ విభాగంలో కూడా టోకు ద్రవ్యోల్బణం –1.42 క్షీణత నుంచి 3.20 శాతం పెరుగుదల నమోదుచేసుకుంది. -
రిటర్నుల సవరణ పేరుతో మోసం చేస్తే చర్యలు
ఆదాయపన్ను శాఖ హెచ్చరిక న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు తర్వాత ఆదాయపన్ను రిటర్నుల్లో పెద్ద ఎత్తున సవరణలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు ఉంటాయని కేంద్రం హెచ్చరించింది. బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన మొత్తాలను గత సంవత్సరపు ఆదాయంగా చూపించే చర్యలకు పాల్పడితే విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 139(5) ప్రకారం ఓ వ్యక్తి గడిచిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించి దాఖలు చేసిన రిటర్నులకు సవరణలు చేయవచ్చు. తాజాగా పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో భారీగా పన్ను చెల్లించకుండా తప్పించుకునేందుకు కొందరు... లెక్కల్లో చూపని తమ సంపదను గత సంవత్సరం ఆదాయంగా చూపించే ప్రయత్నం చేస్తుండడంతో ఆదాయపన్ను శాఖ తీవ్రంగా హెచ్చరించింది. ఆదాయాన్ని స్వచ్ఛందంగా వెల్లడిస్తే 50 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. దీనికి బదులు గత సంవత్సరపు ఆదాయంగా చూపిస్తే 30 శాతం పన్నుతోనే బయటపడేందుకు అవకాశం ఉంది. కానీ ఐటీ శాఖ నోటీసులిచ్చి, ఇలా సవరించినట్లు తేలిస్తే.. భారీ పన్ను, జరిమానానూ చెల్లించాల్సి ఉంటుంది. లోపాల సవరణకే పరిమితం... ‘‘సెక్షన్ 139(5) అన్నది రిటర్నుల్లో ఏదైనా తప్పిదం, పొరపాటు ఉంటే సవరణ పేర్కొనడానికి మాత్రమే. అంతేకానీ, లోగడ పేర్కొన్న ఆదాయానికి గణనీయంగా మార్పులు చేసేందుకు కాదు’’ అని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) తన ప్రకటనలో స్పష్టం చేసింది. నవంబర్ 8 తర్వాత (పెద్ద నోట్ల రద్దు) కొంత మంది పన్ను చెల్లింపుదారులు ఈ నిబంధనను దుర్వినియోగం చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చినట్టు పేర్కొంది. -
సమస్య తీవ్రతను గుర్తించండి
పెద్ద నోట్ల రద్దుపై హైకోర్టు ⇔సమస్యకు వెంటనే పరిష్కారం చూపాలన్న ధర్మాసనం ⇔కౌంటర్ దాఖలుకు గడువు కోరిన కేంద్రం ⇔బుధవారం వరకు గడువు ⇔మరోసారి గడువు పెంచేది లేదని స్పష్టీకరణ సాక్షి, హైదరాబాద్ : నోట్ల రద్దు నేపథ్యంలో నెల రోజులుగా ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కేంద్ర ప్రభుత్వం గుర్తించాలని ఉమ్మడి హైకోర్టు పేర్కొంది. సమస్య తీవ్రతను గుర్తించి అందుకు అనుగుణంగా స్పందించాల్సిన అవసరం ఉందని తేల్చి చెప్పింది. ఈ మొత్తం వ్యవహారంలో కౌంటర్ దాఖలు చేయడానికి కేంద్రానికి మరికొంత గడువునిస్తూ.. ఇకపై గడువు పెంచడం సాధ్యం కాదని తెలుపుతూ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ అంబటి శంకరనారాయణలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 14కు వాయిదా వేసింది. రూ.1000, రూ.500 నోట్ల రద్దుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం గత నెల 8న జారీ చేసిన నోటిఫికేషన్‌ను చట్ట విరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ హైదరాబాద్‌కు చెందిన సుక్కా వెంకటేశ్వరరావు, న్యాయవాది కె.శ్రీనివాస్‌లు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. నగదు ఉపసంహరణ పరిమితులను సవాలు చేస్తూ మాజీ మంత్రి ఎం.వి.మైసూరారెడ్డి మరో వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలన్నింటిపై ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం గురువారం మరోసారి విచారించింది. దొడ్డిదారిలో కోట్లు... మైసూరారెడ్డి తరఫు న్యాయవాది బాలాజీ వాదనలు వినిపిస్తూ.. అకస్మాత్తుగా నోట్లను రద్దు చేసిన ప్రభుత్వం ప్రజల ఇబ్బందులను చాలా తేలిగ్గా తీసుకుంటోందన్నారు. నోట్లు అందక తాజాగా ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నారని వివరించారు. సామాన్యుడు 100 రూపాయలు పొందేందుకు నానా అవస్థలు పడుతుంటే పెద్దలు మాత్రం దొడ్డిదారుల్లో కోట్ల రూపాయల కొత్త నోట్లు దక్కించుకుంటున్నారని తెలిపారు. పెళ్లిళ్లు పబ్బాలు జరుపుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారన్నారు. ఈ రోజు (గురువారం)తో నోట్లు రద్దు చేసి నెల అయిందని, మొదటి రోజు పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడూ అలానే ఉందని వివరించారు. అసలు బ్యాంకులకు పంపిన నగదు వివరాల గురించి కేంద్ర ప్రభుత్వం నోరు మెదపడం లేదని, దీనిని అడ్డం పెట్టుకుని అనేక మంది పెద్దలు లబ్ది పొందుతున్నారని తెలిపారు. వారంలో రూ.24 వేలను ఉపసంహరించుకోవచ్చునని ఆర్బీఐ చెబుతుంటే, బ్యాంకులు రూ.5 వేలకు మించి ఇవ్వడం లేదన్నారు. నోట్ల రద్దు మొదలు, ఉపసంహరణ పరిమితుల వరకు కేంద్రం చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తోందన్నారు. ప్రభుత్వం తన కనీస బాధ్యతలను విస్మరించి ఇష్టమొచ్చిన రీతిలో ప్రవర్తిస్తోందని వివరించారు. ఇందుకు ఇప్పటి వరకు కౌంటర్ దాఖలు చేయకపోవడమే నిదర్శనమన్నారు. అటు పార్లమెంట్లో సమాధానం చెప్పని కేంద్రం, ఇటు న్యాయస్థానాలకు సైతం సమాధానాలు చెప్పడం లేదన్నారు. రాజకీయాల గురించి మాట్లాడొద్దు... ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. రాజకీయం గురించి, వ్యక్తుల గురించి కోర్టులో మాట్లాడవద్దని, వాటిని బయట చూసుకోవాలని బాలాజీకి తేల్చి చెప్పింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమేనని, ఈ విషయంలో ఏం చేయగలమో పరిశీలిస్తున్నామని తెలిపింది. కేంద్ర ప్రభుత్వం చేసింది చట్ట విరుద్ధమా? కాదా? అన్న విషయాన్ని తేలుస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) కె.ఎం.నటరాజ్ స్పందిస్తూ, కౌంటర్ దాదాపుగా పూర్తయిందని, మరికొన్ని వివరాలు జోడించాల్సి ఉందని, అందువల్ల కొంత గడువు ఇవ్వాలని కోరారు. బ్యాంకుల వద్ద డబ్బు లేదు... ‘బ్యాంకుల వద్ద డబ్బు లేదు. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతీ రోజూ సమస్య ఎదురవుతూనే ఉంది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో సమస్య అధికంగా ఉంది. ప్రజలు పడుతున్న ఈ ఇబ్బందులను గుర్తించండి. సమస్య పరిష్కా రానికి తగిన విధంగా స్పందించండి’ అని ధర్మాసనం నటరాజ్‌కు స్పష్టం చేసింది. మళ్లీ బాలాజీ జోక్యం చేసుకుంటూ.. ప్రైవేటు బ్యాంకుల్లో కొత్త నోట్ల చెలామణి ఎక్కువగా ఉందని, దొడ్డిదారిన బడా బాబులు నల్లధనాన్ని మార్చుకుంటున్నారని తెలిపారు. అక్కడ కూడా తగిన స్థాయిలో డబ్బు లేదన్న ధర్మాసనం.. బుధవారం నాటికి కౌంటర్ దాఖలు చేసి తీరాలని నటరాజ్‌కు తేల్చి చెప్పింది. మరోసారి వాయిదాలు వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఏవైనా ఆదేశాలు ఇస్తే తప్ప, తాము ఈ వ్యాజ్యాలపై విచారణను కొనసాగిస్తామని తెలిపింది. మీ సంగతేమిటని ఆర్బీఐ తరఫు న్యాయవాది బి.నళిన్‌కుమార్‌ను ప్రశ్నించగా, తాము కూడా తదుపరి విచారణకల్లా కౌంటర్ దాఖలు చేస్తామని ఆయన తెలిపారు. రుణాల చెల్లింపుల్లో రైతుల ఇబ్బందులపై వివరణ ఇవ్వండి నోట్ల రద్దు నేపథ్యంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) కు నగదు మార్పిడి, డిపాజిట్ల అవకాశం లేకుండా విధించిన నిషేధంపై ఉమ్మడి హైకోర్టు గురువారం ఆర్బీఐ, కేంద్ర ప్రభు త్వాల వివరణ కోరింది. పీఏసీఎస్‌లపై ఆర్బీఐ నిషేధంవల్ల బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న వ్యవసాయ రుణాలు సకాలంలో చెల్లించే పరిస్థితి లేదని, ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు చెందిన బి.మంగయ్య, మరో ఏడుగురు రైతులు హైకోర్టును ఆశ్ర యించారు. రైతులు రుణాలు చెల్లించేందుకు వెళితే డబ్బు తీసుకోవడం లేదని పిటిషనర్ల తరఫు న్యాయవాది తెలిపారు. రుణం చెల్లిం చకపోతే, తిరిగి రుణం పొందే అవకాశం ఉం డదన్నారు. దీంతో ప్రైవేట్ ఫైనాన్షియర్లను ఆశ్రయించాల్సి వస్తుందన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. రుణాల చెల్లింపులో రైతు ల ఇబ్బందులను తొలగించేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారో వివరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని, ఆర్బీఐని ఆదేశిస్తూ విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.