Cash for vote case
-
TG: ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా
హైదరాబాద్, సాక్షి: ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా పడింది. బుధవారం విచారణ చేపట్టిన నాంపల్లి కోర్టు తదుపరి విచారణను నవంబర్ 14వ తేదీకి వాయిదా వేసింది. జడ్జీ లీవ్‌లో ఉండటంతో కోర్టు కేసును వాయిదా వేసింది. ఇవాళ.. విచారణకు హాజరు కావాలని సీఎం రేవంత్ రెడ్డి సహా ఇతర నిందితులను గత నెల 24న కోర్టు ఆదేశించింది. గత నెల 24న విచారణకు మత్తయ్య హాజరుకాగా, మిగతా నిందితులు గైర్హాజరు అయ్యారు. నేటి విచారణకు సీఎం రేవంత్ రెడ్డి, ఉదయ్ సింహా, వేం కృష్ణ కీర్తన్, సండ్ర వెంకట వీరయ్య, సెబాస్టియన్లు హాజరు కావాల్సి ఉండగా.. కేవలం సండ్ర వెంకట వీరయ్య మాత్రమే హాజరయ్యారు. మరోవైపు.. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి కోర్టుకు హాజరు కాకపోతే.. కోర్టు ముందు నిరాహార దీక్ష చేస్తానని మంగళవారం మత్తయ్య మీడియాతో అన్నారు.ఓటుకు నోటు కేసులో నిందితుడిగా ఉన్న రేవంత్ రెడ్డి ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నారని, ఈ కేసు దర్యాప్తు అయ్యే అవకాశం ఉందని, కాబట్టి కేసును మధ్యప్రదేశ్‌కు బదిలీ చేయాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్‌పై ఇటీవల సుప్రీం కోర్టు కీలకత తీర్పు వెల్లడించింది. ‘‘కేవలం అనుమానం పైనే పిటిషన్ వేశారు. అందుకే ఈ పిటిషన్లో మేం జోక్యం చేసుకోలేం. భవిష్యత్తులో సీఎం గనుక జోక్యం చేసుకుంటే మళ్ళీ కోర్టును ఆశ్రయించండి’’ అని స్పష్టం చేసింది.చదవండి: బాబు, రేవంత్ మరోసారి కుమ్మక్కయ్యారు: ఎమ్మెల్యే ఆర్కే -
16న విచారణకు హాజరుకండి
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ‘ఓటుకు కోట్లు’కేసు విచారణకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గైర్హాజరు కావడంపై నాంపల్లి కోర్టు అసహనం వ్యక్తం చేసింది. తదుపరి విచారణ జరిగే అక్టోబర్ 16న న్యాయస్థానం ఎదుట తప్పకుండా హాజరుకావాలని ఆదేశించింది. ఈ కేసులో మంగళవారం జరిగిన విచారణకు మత్తయ్య ఒక్కరే హాజరయ్యారు. రేవంత్‌రెడ్డి, వేం కృష్ణ కీర్తన్, ఉదయ్ సింహ, సండ్ర వెంకటవీరయ్య, సెబాస్టియన్ హాజరుకాలేదు. ఒకరోజు విచారణకు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ నిందితులు వేసిన పిటిషన్లను కోర్టు అనుమతించింది. అయితే అభియోగాల నమోదుపై విచారణ కోసం వచ్చే నెల 16న మాత్రం హాజరుకావాల్సిందేనని రేవంత్ సహా నిందితులందరికీ స్పష్టం చేసింది. ఏసీబీ, ఈడీ విచారణలతో.. 2015లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ను టీడీపీ అభ్యరి్థకి మద్దతు ఇవ్వాలంటూ రూ.కోట్లు ఆశచూపిన ఆరోపణలపై నాటి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌పై ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. స్టీఫెన్సన్ ఇంట్లో రేవంత్ డబ్బు సంచులతో ఉన్న వీడియోలు అప్పట్లో తీవ్ర సంచలనంగా మారాయి. ఈ కేసులో రేవంత్ జైలుకు వెళ్లి, తర్వాత బెయిల్‌పై బయటికి వచ్చారు. రేవంత్‌ను అదుపులోకి తీసుకునే సమయంలో ఆయన వద్ద రూ.50 లక్షల నగదును ఏసీబీ స్వా«దీనం చేసుకుంది.ఈ నగదు అక్రమ మార్గాల్లో వచి్చందన్న ఏసీబీ ఆరోపణలతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా కేసు నమోదు చేసింది. ఏసీబీ, ఈడీ రెండు విచారణలు సుదీర్ఘంగా కొనసాగుతున్నాయి. ఈ వ్యవహారంలో నిందితులు మంగళవారం విచారణకు గైర్హాజరవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం.. తదుపరి విచారణకు హాజరు కా వాలని రేవంత్‌తో పాటు సెబాస్టియన్, ఉదయ్ సింహ, మత్తయ్య జెరూసలేం, సండ్ర వెంకట వీరయ్య, వేం కృష్ణ కీర్తన్‌లను ఆదేశించింది. -
ఓటుకు నోటు కేసు.. విచారణకు రావాలని సీఎం రేవంత్‌కు కోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: నాంపల్లి కోర్టులో ఓటుకు నోటు వ్యవహారానికి సంబంధించిన ఈడీ కేసులో విచారణ జరిగింది. ఈ కేసులో అక్టోబర్ 16న విచారణకు హాజరుకావాలని సీఎం రేవంత్‌రెడ్డిని న్యాయస్థానం ఆదేశించింది. నేటి విచారణకు ముత్తయ్య మినహా మిగతా నిందితులందరూ గైర్హాజరు అయ్యారు. సీఎం రేవంత్, ఉదయ్ సింహా, వేం కృష్ణ కీర్తన్, సండ్ర వెంకట వీరయ్య, సెబాస్టియన్ గైర్హాజరుపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది.అయితే ఇవాళ్టి విచారణకు మినహాయింపు ఇవ్వాలన్న నిందితుల అభ్యర్థనకు అంగీకరించిన కోర్టు.. అక్టోబరు 16న విచారణకు హాజరు కావాలని రేవంత్ సహా నిందితులందరికీ నాంపల్లి కోర్టు ఆదేశించింది.చదవండి: పార్టీ మారిన ఎమ్మెల్యేల బతుకు జూబ్లీ బస్టాండే : కేటీఆర్ -
ఓటుకు నోటు కేసులో జోక్యం చేసుకోవద్దు
సాక్షి, న్యూఢిల్లీ: ఓటుకు నోటు కేసు విచారణలో ఎట్టి పరిస్థితుల్లోనూ జోక్యం చేసుకోవద్దని ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ కేసు విచారణకు సంబంధించి ఏసీబీ డైరెక్టర్ జనరల్ ముఖ్యమంత్రికి నివేదిక ఇవ్వరాదని, ఆయనకు రిపోర్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదని స్పష్టం చేసింది. ట్రయల్ కోర్టు పారదర్శకంగా విచారణ జరపాలని సూచించింది.ఈ కేసు విచారణను తెలంగాణ నుంచి భోపాల్‌కు బదిలీ చేసేందుకు నిరాకరించింది. ఓటుకు నోటు కేసు విచారణను హైదరాబాద్ నుంచి మధ్యప్రదేశ్‌లోని భోపాల్ కోర్టుకు బదిలీ చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డితో పాటు మరో ముగ్గురు దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారణ జరిపింది. నిష్పక్షపాత విచారణ సాధ్యం కాదన్న పిటిషనర్లు రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని తెలంగాణలో ఈ కేసుపై నిష్పక్షపాత విచారణ సాధ్యం కాదని పిటిషనర్లు పేర్కొన్నారు. వారి తరఫున సీనియర్ న్యాయవాది సీఏ సుందరం వాదనలు వినిపిస్తూ.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హోం శాఖ బాధ్యతలు కూడా చూస్తున్నందున ఏసీబీ కేసులు నేరుగా ఆయన అ«దీనంలోనే ఉన్నాయని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. కేసు విచారణను తెలంగాణ నుంచి భోపాల్‌కు మార్చాలని విన్నవించారు.సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి దీనిని పర్యవేక్షించేలా ఆదేశాలివ్వాలని కోరారు. అయితే ఈ పిటిషన్ రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నదని రేవంత్‌రెడ్డి తరఫు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ కోర్టుకు తెలిపారు. ఈ కేసు విచారణ సగంలో ఉందని.. విచారణను గత ప్రభుత్వంలో నియమించిన ప్రాసిక్యూటరే నిర్వహిస్తున్నారని చెప్పారు. సుప్రీం విశ్రాంత జడ్జి పర్యవేక్షణకు నో వాదనల అనంతరం కేసు విచారణపై సుప్రీంకోర్టు విశ్రాంత జడ్జి పర్యవేక్షణను జస్టిస్ గవాయ్ ధర్మాసనం నిరాకరించింది. ఈ కేసులో విధంగానూ జోక్యం చేసుకోకూడదని రేవంత్‌రెడ్డిని ఆదేశించిన ధర్మాసనం..భవిష్యత్తులో ఈ కేసు విచారణలో రేవంత్‌రెడ్డి జోక్యంపై ఆధారాలుంటే కోర్టుకు వెళ్లొచ్చునని సూచించింది. రాష్ట్ర హోంశాఖ బాధ్యతలు కూడా చూస్తున్న రేవంత్‌రెడ్డికి ఏసీబీపై ప్రత్యక్ష నియంత్రణ ఉంటుందని, బ్యూరో డైరెక్టర్ నేరుగా ఆయనకు జవాబుదారీగా ఉంటారన్న పిటిషనర్ల ఆందోళనను పరిగణనలోకి తీసుకుంటున్నామని, ప్రాసిక్యూషన్ పనితీరులో ఏ విధంగానూ జోక్యం చేసుకోవద్దని రెండవ ప్రతివాదికి ఆదేశిస్తున్నామని బెంచ్ తెలిపింది. ఒక విచారణను ఉపసంహరించుకోవాలని ఆయన (రేవంత్‌రెడ్డి) ప్రాసిక్యూషన్‌ను ఆదేశిస్తే, అప్పుడు తాము జోక్యం చేసుకుంటామని స్పష్టం చేసింది.కోర్టు ఆదేశాలపై వ్యాఖ్యలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలిఅంతకుముందు ఈ కేసును విచారిస్తున్న సమయంలోనే, ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరు చేసినప్పుడు సీఎం రేవంత్‌రెడ్డి చేసిన కొన్ని అభ్యంతరకరమైన వ్యాఖ్యలను తాము గమనించామని ధర్మాసనం పేర్కొంది. అయితే ఈ విషయంలో రేవంత్‌రెడ్డి ఇప్పటికే తమ ముందు క్షమాపణలు చెప్పినందున ఈ అంశంలో మ రింత ముందుకు వెళ్లాలని తాము భావించడం లేదని తెలిపింది. రాజ్యాంగంలోని మూడు విభాగాలు ఒకరి పనితీరు పట్ల మరొకరు పరస్పర గౌరవాన్ని చూపించాలని సూచించింది. తీర్పులపై న్యాయమైన విమర్శలను ఎప్పుడూ స్వాగతించవచ్చని, అయితే పరిమితులను అతిక్రమించరాదని స్పష్టం చేసింది. కోర్టులు జారీ చేసే ఆదేశాలపై వ్యాఖ్యలు చేసేటప్పుడు తగినంత జాగ్రత్తగా ఉండాలని సూచించింది. -
సర్వోన్నత న్యాయస్థానం అంటే గౌరవం లేదా?
న్యూఢిల్లీ, సాక్షి: తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గురువారం ఓటుకు నోటు కేసు విచారణ సందర్భంగా.. కవిత బెయిల్ తీర్పుపై ఆయన చేసిన వ్యాఖ్యలను ధర్మాసనం ప్రస్తావించింది.ముఖ్యమంత్రి బాధ్యతగా ఉండాలి కదాఇలా ఎలా మాట్లాడతారు ?రాజకీయ నాయకులను సంప్రదించి మేము ఆదేశాలు ఇస్తామా ?మేము ఎవరి వ్యాఖ్యలు పట్టించుకోంమేము మా విధి నిర్వహిస్తాంమేము ప్రమాణ పూర్వకంగా పని చేస్తాంమేము ఎవరి పనుల్లో జోక్యం చేసుకోంసర్వోన్నత న్యాయస్థానం అంటే గౌరవం లేదా ?వ్యవస్థల పట్ల గౌరవంగా ఉండాలిఇలాంటి ప్రవర్తన ఉంటే ఓటుకు నోటు విచారణ రాష్ట్రం బయటే నిర్వహిద్దాం.. అని జస్టిస్ గవాయ్ ధర్మాసనం వ్యాఖ్యానించింది.అంతకు ముందు.. తెలంగాణ ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిందితుడిగా ఉన్నఈ కేసులో సుప్రీం కోర్టు కీలకాదేశాలు జారీ చేసింది. ఈ కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలన్న పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ గవాయి ధర్మాసనం.. విచారణకు స్పెషల్ ప్రాసిక్యూటర్‌ను నియమిస్తున్నట్లు తెలిపింది. మధ్యాహ్నాం మరోసారి విచారణ చేపట్టిన ధర్మాసనం.. స్వతంత్ర ప్రాసిక్యూటర్‌ను నియమించే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలోనే రేవంత్ తాజా వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కేసు విచారణ సోమవారానికి సెప్టెంబర్ 2వ తేదీకి వాయిదా వేసింది.కవిత బెయిల్‌పై రేవంత్ ఏమన్నారంటే..ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీం కోర్టు బెయిల్ ఇచ్చింది. ఈ పరిణామంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. ‘‘కవిత బెయిల్ కోసం ఎంపీ సీట్లు బీఆర్ఎస్ త్యాగం చేసింది నిజం. బీఆర్ఎస్ – బీజేపీ ఒప్పందంలో భాగంగానే కవితకు బెయిల్ వచ్చింది. సిసోడియా, కేజ్రీవాల్‌కు రాని బెయిల్ 5 నెలల్లోనే కవితకు ఎలా వచ్చింది? మెదక్, సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్‌లో బీజేపీకి మెజారిటీ ఇచ్చింది నిజం కాదా? ఏడు చోట్ల డిపాజిట్ కోల్పోయి, 15 చోట్ల మూడవ స్థానం వచ్చేంత బలహీనంగా బీఆర్ఎస్ ఉందా?” అని రేవంత్ అన్నారు. ఓటుకు నోటుపై పిటిషన్లో..తెలంగాణలో 2015 ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా అప్పటి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ఓటుకు నోటు వ్యవహారం నడిచింది. ఈ కేసులో పట్టుబడ్డ రేవంత్ రెడ్డి అరెస్టై జైలుకు వెళ్లారు కూడా. అయితే.. రేవంత్ ఇప్పుడు సీఎంగా ఉండడంతో ఈ కేసు విచారణను మధ్యప్రదేశ్‌కు బదిలీ చేయాలని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ బీఆర్ గవాయి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ వాదనలుకేసులో నిందితుడు రేవంత్ రెడ్డి ప్రస్తుతం తెలంగాణ సీఎంగా ఉన్నారని, దర్యాప్తు సంస్థ ఏసీబీ చూసే హోం శాఖ కూడా ఆయన వద్దే ఉందని జగదీష్ రెడ్డి తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. పీసీసీ అధ్యక్షుడిగా మహబూబ్ నగర్లో జరిగిన ర్యాలీల్లో పలుమార్లు పోలీసులపై బెదిరింపు ధోరణి ప్రదర్శించారని జగదీష్ రెడ్డి తరుఫు న్యాయవాది తెలిపారు. సీఎంగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చూస్తేనే కేసుపై ప్రభావం ఎలా ఉందో తెలుస్తుందని, ప్రభుత్వం దాఖలు చేసే కౌంటర్ అఫిడవిట్లో కూడా వైఖరి మారిందన్నారు. జస్టిస్ గవాయ్ ఏమన్నారంటే..కేవలం అపోహలతో విచారణ బదిలీ చేస్తే మన న్యాయ వ్యవస్థపై నమ్మకం లేదన్నట్టే అవుతుంది. ట్రయల్ జరిగే విషయంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నందున.. ఈ కేసు విచారణకు ఇండిపెండెంట్ ప్రాసిక్యూటర్ ని నియమిస్తాం. విశ్వసనీయతను పెంచేందుకే స్వతంత్ర ప్రాసిక్యూటర్‌ను నియమిస్తాం. 2024 ఎన్నికల తర్వాతే మీరు కోర్టుకు వచ్చారు.. ఎందుకు?. మా న్యాయ వ్యవస్థపై మాకు పూర్తి విశ్వాసం ఉంది. అందరి అనుమానాలను నివృత్తి చేసేందుకు స్పెషల్ ప్రాసిక్యూటర్ నియమిస్తాం. ఏపీ లేదంటే తెలంగాణ నుంచి ఒకరిని స్పెషల్ ప్రాసిక్యూటర్‌గా నియమిస్తాం. ప్రతి ఒక్కరి మనస్సులో విశ్వాసం ఉండేలా, మీకు అభ్యంతరం లేకుండా ప్రత్యేక ప్రాసిక్యూటర్‌ను నియమిస్తాం. తెలంగాణకు చెందిన మా సహచరులను సంప్రదించి.. ఈ నియామకాన్ని మేమే పర్యవేక్షిస్తాం. ప్రత్యేక ప్రాసిక్యూటర్ని నియమించే వ్యవహారాన్ని సుప్రీం కోర్టు నిర్ణయిస్తుందని జస్టిస్ గవాయ్ అన్నారు. కుదరని ఏకాభిప్రాయంఓటుకు నోటు పిటిషన్‌పై మధ్యాహ్నాం మరోసారి విచారణ జరిపిన న్యాయస్థానం.. ప్రత్యేక ప్రాసిక్యూటర్ నియామకం కోసం ప్రయత్నించింది. ఇరు వర్గాల నుంచి ఇద్దరి పేర్లను తీసుకుంది. అయితే ఉమామహేశ్వర్రావు, అశోక్ దేశాయ్ పేర్లపై ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో సోమవారం విచారణ నాడే ఆ ప్రక్రియను ధర్మాసనం పర్యవేక్షించే అవకాశం ఉంది. -
ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా
న్యూఢిల్లీ, సాక్షి: సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ మరోసారి వాయిదా పడింది. జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ విశ్వనాథ్‌లతో కూడిన ధర్మాసనం రెండు వారాలకు వాయిదా వేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఓటుకు నోటు కేసులో నిందితుడైన ఎనుముల రేవంత్ రెడ్డి ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారని, కాబట్టి ఈ కేసు విచారణ వేరే (వీలైతే మధ్యప్రదేశ్)కు బదిలీ చేయాలని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ పిటిషన్‌పై సుప్రీం నుంచి నోటీసులు అందుకున్న తెలంగాణ ప్రభుత్వం, రేవంత్‌రెడ్డి.. తాజాగా కౌంటర్ దాఖలు చేశారు. ఈ కౌంటర్‌ను ఇవాళ పరిశీలించిన కోర్టు.. రిజాయిండర్ దాఖలు చేసేందుకు పిటిషనర్‌కు రెండు వారాల సమయం ఇచ్చింది. -
ఓటుకు కోట్లు కేసులో సీఎం రేవంత్‌కు సుప్రీం నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ: ఓటుకు కోట్లు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న రేవంత్‌రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినందున, కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ దాఖ లైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం విచారించింది. సీఎం రేవంత్‌రెడ్డి, తెలంగాణ ప్రభుత్వం, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తదితరులకు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా కౌంటర్ దాఖలుకు ఆదేశించింది. బీఆర్ఎస్ మాజీ మంత్రులు జగదీశ్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, మహమూద్ అలీ, ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్‌ల తరఫున అడ్వొకేట్ ఆన్ రికార్డ్స్ పి.మోహిత్‌రావు ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఓటుకు కోట్లు సంబంధిత కేసులను తెలంగాణలోని ఏసీబీ కోర్టు విచారణ జరుపుతోందని తెలిపారు. రేవంత్‌రెడ్డి సీఎంగా ఉన్నందున రాష్ట్రంలో న్యాయపరమైన విచారణ సాధ్యం కాదని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్ లేదా ఛత్తీస్‌గఢ్‌ల్లోని తత్సమాన కోర్టుకు బదిలీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌ను శుక్రవారం జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం విచారించింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు సిద్ధార్ధ దవే, దామా శేషాద్రినాయుడులు వాదనలు విన్పించారు. ...వారినే విచారించాల్సిన పరిస్థితి తెలంగాణలో 2015లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు అనుకూలంగా ఓటు వేసేందుకు గాను నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు రేవంత్‌రెడ్డి రూ.కోట్లు లంచం ఆశ చూపి అడ్వాన్స్‌గా రూ.50 లక్షలు ఇవ్వజూపారనేది ప్రధాన ఆరోపణ అని తెలిపారు. రేవంత్‌రెడ్డి మాజీ బాస్, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు లంచం ఇచ్చేందుకు ప్రయత్నించారనే ఆరోపణలు ఉన్నాయని చెప్పారు. అయితే స్టీఫెన్సన్కు లంచం ఇస్తుండగా తెలంగాణ పోలీసులు, ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా రేవంతర్‌రెడ్డి తదితరుల్ని పట్టుకున్నారని, స్టీఫెన్సన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు అయిందని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. కాగా తదనంతర పరిణామాల్లో భాగంగా రేవంత్‌రెడ్డి 2017లో కాంగ్రెస్ పార్టీ లో చేరారని తెలిపారు. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించి తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని, ఈ కేసులో నిందితుడైన రేవంత్‌రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారని, కీలకమైన హోంశాఖ కూడా ఆయన వద్దే ఉందని వివరించారు. ఈ పరిస్థితుల్లో తెలంగాణలో న్యాయపరమైన విచారణ సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఏసీబీ అధికారులు ఎవరి నియంత్రణలో ఉంటారో, ఎవరికి సమాధానం చెప్పాలో వారినే విచారించాల్సిన పరిస్థితి ఉందన్నారు. రేవంత్‌పై పెండింగ్‌లో 88 కేసులు తెలంగాణలోని వేర్వేరు కోర్టుల్లో రేవంత్‌రెడ్డిపై 88 కేసులు విచారణలో ఉన్నాయని, ఆయన నేర నేపథ్యం ఎక్కువగా ఉన్నట్లు వీటిని బట్టి స్పష్టమవుతోందని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు చెప్పారు. తాము అధికారంలోకి వచ్చాక తేల్చుకుంటామంటూ తెలంగాణలోని సీనియర్ పోలీసు అధికారుల్ని రేవంత్‌రెడ్డి అనేక సందర్భాల్లో బెదిరించారని కోర్టు దృష్టికి తెచ్చారు. అంతేకాకుండా విచారణ జాప్యం చేయడానికి నిందితులు ఏదో ఒక సాకుతో 2015 నుంచి పలు పిటిషన్లు వేశారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఓటుకు కోట్లు కేసు విచారణను తెలంగాణ వెలుపల మధ్యప్రదేశ్ లేదా ఛత్తీస్‌గఢ్‌లకు బదిలీ చేయాలని విజ్ఞప్తి చేశారు. కర్ణాటక, తమిళనాడు ప్రభుత్వాలు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలమని, రేవంత్ మాజీ బాస్, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపైనా ఈ కేసులో ఆరోపణలు ఉన్నాయని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం ఈ పిటిషన్ ఎందుకు విచారించకూడదో తెలియజేయాలంటూ సీఎం రేవంత్‌సహా ఇతర ప్రతివాదులకు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. -
ఓటుకు కోట్లు కేసులో కీలక పరిణామం
సాక్షి, ఢిల్లీ: ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాలు సమాధానం చెప్పాలంటూ తెలంగాణ ప్రభుత్వానికి , ప్రతివాదులను సర్వోన్నత న్యాయస్థానం నోటీసుల్లో పేర్కొంది. ఓటుకు కోట్లు కేసును తెలంగాణ ఏసీబీ కోర్టు నుంచి పొరుగు రాష్ట్రాలైన మధ్యప్రదేశ్ లేదంటే ఛత్తీస్‌గఢ్‌కు బదిలీ చేయాలంటూ పిటిషన్ దాఖలైంది. బీఆర్ఎస్ నేతలైన గుంతకండ్ల జగదీష్‌రెడ్డి, కల్వకుంట్ల సంజయ్, ఎమ్మెల్సీ సత్యవతి రాథోథ్, మహమ్మద్ అలీలు ఈ పిటిషన్ వేశారు. రేవంత్‌రెడ్డి ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నందున.. దర్యాప్తు పారదర్శకంగా జరగదనే అనుమానాల్ని పిటిషన్లో వ్యక్తం చేశారు. శుక్రవారం ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం.. తెలంగాణ ప్రభుత్వానికి, ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. నేటి తెలంగాణ ముఖ్యమంత్రి, టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.. 2015లో టీడీపీలో ఉండగా ఈ కేసు నమోదు అయ్యింది. చంద్రబాబు ఆదేశాల మేరకు ఎల్విస్ స్టీఫెన్సన్కు రూ.50లక్షల లంచం ఇస్తుండగా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. ఇదిలా ఉంటే.. తన ‘మాజీ బాస్’, మాజీ సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకే ఈ తతంగం నడిచిందంటూ బీఆర్ఎస్ నేతలు సైతం పిటిషన్లో ప్రస్తావించడం గమనార్హం. -
నాడు ద్రోహం.. నేడు మోసం
సాక్షి, అమరావతి: ఓటుకు కోట్లు కేసు నుంచి తప్పించుకునేందుకు కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను తెలంగాణకు తాకట్టు పెట్టి రైతులకు ద్రోహం చేసిన చంద్రబాబు ఇప్పుడు సాగు, తాగునీళ్లు దక్కకుండా ప్రాజెక్టులపై ఎన్జీటీలో కేసులు దాఖలు చేయించి అఖిలపక్షం డిమాండ్‌తో మరో నాటకానికి సిద్ధమయ్యారు. నాడూ నేడూ రైతులకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు కృష్ణా జలాల వివాదంపై ప్రధాని మోదీ వద్దకు అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలని డిమాండ్ చేయడాన్ని నీటిపారుదలరంగ నిపుణులు తప్పుబడుతున్నారు. ఈ వివాదం ఏర్పడటానికి మూలకారకుడు చంద్రబాబేనని గుర్తు చేస్తున్నారు. ఈ పాపం ఎవరిది బాబూ? విభజన నేపథ్యంలో కృష్ణా జలాల వినియోగంలో రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు తలెత్తకుండా కృష్ణా బోర్డును ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం బోర్డు పరిధి, వర్కింగ్ మ్యాన్యువల్‌ను ఖరారు చేయలేదు. ప్రాజెక్టుల నిర్వహణకు మధ్యంతర ఏర్పాట్లు చేసింది. ఎవరి భూ భాగంలో ఉన్నవాటిని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించుకునేలా ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలాన్ని ఆంధ్రప్రదేశ్, నాగార్జునసాగర్‌ను తెలంగాణ సర్కార్ నిర్వహించేలా 2014లో ఏర్పాటు చేసింది. దీని ప్రకారం నాగార్జునసాగర్ ప్రాజెక్టును తెలంగాణ సర్కార్ పూర్తిగా తన అధీనంలోకి తీసుకుంది. ఏపీ భూభాగంలో ఉన్న సాగర్ కుడి కాలువకు నీటిని సరఫరా చేసే రెగ్యులేటర్‌ను కూడా తెలంగాణ ప్రభుత్వం తన అధీనంలోకి తీసుకుంది. మరోవైపు శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్కేంద్రం తన భూభాగంలో ఉందంటూ దాన్ని కూడా తెలంగాణ సర్కార్ తన నియంత్రణలోకి తీసుకుంది. ఏపీ ప్రభుత్వ అధీనంలో ఉన్న పులిచింతల ప్రాజెక్టులో జలవిద్యుత్కేంద్రం తమ భూభాగంలో ఉందనే సాకుచూపి దాన్ని కూడా తెలంగాణ సర్కార్ స్వాధీనం చేసుకుంది. కొబ్బరి చిప్పల సిద్ధాంతంతో.. తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ ఉనికిని కాపాడుకునేందుకు రెండు కళ్లు, కొబ్బరిచిప్పల సిద్ధాంతంతో ఈ అక్రమంపై నాటి సీఎం చంద్రబాబు నోరుమెదపలేదు. దీంతో అప్పటి నుంచి ఇప్పటిదాకా కృష్ణా బోర్డు ఉత్తర్వులను తెలంగాణ ప్రభుత్వం బేఖాతర్ చేస్తూ యథేచ్ఛగా ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ శ్రీశైలం దిగువకు నీటిని వదిలేస్తోంది. ఫలితంగా శ్రీశైలంలో నీటి మట్టం అడుగంటి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు సాగు, తాగునీరు అందించలేని దుస్థితి నెలకొంది. బలగాలను వెనక్కి రప్పించిన బాబు.. నాగార్జునసాగర్ కుడి కాలువకు కృష్ణా బోర్డు కేటాయించిన జలాలు పూర్తి స్థాయిలో విడుదల కాకున్నా 2015 ఫిబ్రవరి 12న తెలంగాణ సర్కార్ అర్థాంతరంగా ఆపేసింది. ఈ క్రమంలో ఆంధప్రదేశ్ భూ భాగంలో ఉన్న సాగర్ కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్‌ను స్వాధీనం చేసుకుని రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించేందుకు నాటి జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, అధికారులు పోలీసు బలగాలతో మరుసటి రోజు నాగార్జునసాగర్ వద్దకు చేరుకున్నారు. తెలంగాణ సర్కార్‌ను అస్థిరపరిచేందుకు ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ ఆడియో, వీడియో టేపులతో దొరికిపోయిన నాటి సీఎం చంబ్రాబుపై ఆ రాష్ట్ర ప్రభుత్వం ఓటుకు నోటు కేసు నమోదు చేసింది. ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు సాగర్ కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్‌ను స్వా«ధీనం చేసుకోవడానికి వెళ్లిన రాష్ట్ర అధికారులను చంద్రబాబు వెనక్కి రప్పించారు. దీంతో సాగర్ కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్ తెలంగాణ సర్కార్ అధీనంలోనే ఉండిపోయింది. కృష్ణా బోర్డు నీటిని కేటాయించినా తెలంగాణ సర్కార్ సాగర్ కుడి కాలువకు నీటిని సక్రమంగా విడుదల చేయకపోవడం వల్ల రైతులు అవస్థలు ఎదుర్కొంటున్నారు. అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోవడంలో విఫలం.. శ్రీశైలంలో 800 అడుగుల నుంచే రోజుకు 1.5 టీఎంసీల చొప్పున 90, రోజుకు 0.5 టీఎంసీ చొప్పున 30 టీఎంసీలు తరలించేలా డిండి ఎత్తిపోతలను తెలంగాణ సర్కార్ అక్రమంగా చేపట్టింది. వీటితోపాటు కేసీ కెనాల్‌కు నీళ్లందించే సుంకేశుల బ్యారేజీ జలవిస్తరణ ప్రాంతం నుంచి 5.44 టీఎంసీలు తరలించేలా తుమ్మిళ్లను, పాలేరు రిజర్వాయలోకి 5.54 టీఎంసీల ఎత్తిపోతలకు భక్త రామదాస, మిషన్ భగీరథ ప్రాజెక్టులను అక్రమంగా తెలంగాణ చేపట్టింది. నెట్టెంపాడు, ఎస్సెల్బీసీ, కల్వకుర్తి ఎత్తిపోతల సామర్థ్యం పెంచింది. ఈ ఎనిమిది ప్రాజెక్టుల ద్వారా 178.93 టీఎంసీలను అక్రమంగా తరలించేలా 2015లోనే పనులు ప్రారంభించింది. ఈ అక్రమ ప్రాజెక్టులను నిరసిస్తూ 2016లో మే 16 నుంచి 18 వరకూ కర్నూలులో ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి జలదీక్ష చేశారు. నాటి సీఎం చంద్రబాబు దీనిపై స్పందించలేదు. చివరకు తెలంగాణ అక్రమంగా చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతలను అడ్డుకోవాలని కృష్ణా డెల్టా రైతులు సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో 2016 సెప్టెంబరు 21న నాటి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి అపెక్స్ కౌన్సిల్ తొలి సమావేశాన్ని నిర్వహించారు. కేటాయింపులకు మించి ఒక్క చుక్క నీటిని కూడా అదనంగా పాలమూరు–రంగారెడ్డి, డిండి ద్వారా వాడుకోబోమని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆ సమావేశంలో చెప్పారు. కానీ తెలంగాణ అప్పటికే కేటాయించిన నీటి కంటే ఎక్కువగా వాడుకుంటోందని, అపెక్స్ కౌన్సిల్ ఆమోదం లేకుండా చేపట్టిన ఆ ప్రాజెక్టులను నిలుపుదల చేయాలని డిమాండ్ చేయడంలో నాటి సీఎం చంద్రబాబు విఫలమయ్యారు. ఓటుకు కోట్లు కేసు నుంచి తప్పించుకోవడానికే అపెక్స్ కౌన్సిల్లో రాష్ట్ర ప్రయోజనాలను తెలంగాణ సర్కార్‌కు చంద్రబాబు తాకట్టు పెట్టారని స్పష్టమవుతోంది. ఫలితంగా పాలమూరు–రంగారెడ్డి, డిండి తదితర అక్రమ ప్రాజెక్టులను తెలంగాణ నిర్విఘ్నంగా కొనసాగిస్తోంది. తుమ్మిళ్ల, భక్తరామదాస, కల్వకుర్తి, నెట్టెంపాడు, మిషన్ భగీరథలను ఇప్పటికే పూర్తి చేసింది. సొంత జిల్లా ప్రజలకు వెన్నుపోటు.. కండలేరు జలాలను తరలించి చిత్తూరు జిల్లా తూర్పు ప్రాంతాన్ని, గాలేరు–నగరి, హంద్రీ–నీవాలను అనుసంధానం చేసి పశ్చిమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేలా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సాగునీటి ప్రాజెక్టుల పనులను చేపట్టారు. అయితే ఈ ప్రాజెక్టులను నిలుపుదల చేయాలంటూ టీడీపీ నేత, చిత్తూరు జిల్లా పంచాయతీ సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షుడు జి.గుణశేఖర్‌నాయుడుతోపాటు మరో 13 మంది పార్టీ నేతలతో ఎన్జీటీలో చంద్రబాబు కేసు వేయించి తన నైజాన్ని చాటుకున్నారు. హక్కుల పరిరక్షణకు నిర్మాణాత్మక చర్యలు.. కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను పరిరక్షించేందుకు ముఖ్యమంత్రి జగన్ నిర్మాణాత్మక చర్యలు చేపట్టారని నీటిపారుదలరంగ నిపుణులు పేర్కొంటున్నారు. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల సాగు, తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు రాయలసీమ ఎత్తిపోతల చేపట్టారని, బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ కేటాయింపులను వినియోగించుకునేందుకే ఆర్డీఎస్ కుడి కాలువ పనులను చేపట్టారని స్పష్టం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టులపై తెలంగాణ సర్కార్ అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో వివాదాన్ని పరిష్కరించేందుకు గతేడాది అక్టోబర్ 6న కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అపెక్స్ కౌన్సిల్ రెండో సమావేశాన్ని నిర్వహించారు. కృష్ణా బోర్డు, సీడబ్ల్యూసీ, అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా తెలంగాణ చేపట్టిన 8 ప్రాజెక్టులను నిలుపుదల చేయాలని అపెక్స్ కౌన్సిల్లో సీఎం వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించేందుకే రాయలసీమ ఎత్తిపోతలను చేపట్టామని స్పష్టం చేశారు. తక్షణమే కృష్ణా బోర్డు పరిధిని నోటిఫై చేసి అన్ని ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తెచ్చి రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించాలని కోరారు. శ్రీశైలంలో యథేచ్ఛగా విద్యుదుత్పత్తితో కృష్ణా జలాలు వృథాగా కడలిలో కలిసేలా చేస్తూ తెలంగాణ సర్కార్ సాగిస్తోన్న అక్రమాన్ని అడ్డుకోవాలని ఇప్పటికే రెండు సార్లు ప్రధాని మోదీ, కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి షెకావత్‌లకు లేఖ రాశారు. -
ఏసీబీ స్పెషల్ కోర్టులో ఓటుకు కోట్లు కేసు విచారణ
సాక్షి, హైదరాబాద్ : ఏసీబీ స్పెషల్ కోర్టులో సోమవారం ఓటుకు కోట్లు కేసు విచారణ జరిగింది. ఉదయ్‌సింహా, సెబాస్టియన్ విచారణకు హాజరయ్యారు. విచారణ సందర్భంగా ఏసీబీ కోర్టు స్టీఫెన్సన్ గన్మెన్ల వాంగ్మూలాన్ని నమోదు చేసింది. రేపు రేవంత్‌రెడ్డి అప్పటి గన్మెన్లను విచారించనుంది. -
తుది దశకు ఓటుకు కోట్లు కేసు
సాక్షి, హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసు విచారణ తుది దశకు చేరుకుంది. ఈ నెల 8న తుది విచారణ నేపథ్యంలో ఈ కేసులో ఫిర్యాదుదారైన నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్, అతడి మిత్రుడు, కేసులో ప్రధాన సాక్షి మాల్కం టేలర్లు సోమవారం ఏసీబీ కార్యాలయానికి వెళ్లారు. తెలంగాణలో బలం లేకున్నా 2015 మేలో ఎమ్మెల్సీ బరిలో దిగిన టీడీపీ.. పలువురు ఎమ్మెల్యేల కొనుగోలుకు తెరలేపింది. ఈ విషయం కాస్తా ఏసీబీకి లీకవడంతో రహస్యంగా సీక్రెట్ ఆపరేషన్ నిర్వహించారు. మే 31న ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు ఆయన మిత్రుడు మాల్కం టేలర్ ఇంట్లో అప్పటి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి రూ.50 లక్షలు లంచం ఇస్తుండగా రెడ్ çహ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఇది అప్పట్లో జాతీయ రాజకీయాలను కుదిపేసింది. మొదట అలాంటిదేమీ లేదంటూ బుకాయించిన టీడీపీ నేతలు.. రేవంత్‌రెడ్డి రూ.50 లక్షలిస్తూ స్టీఫెన్సన్ను మభ్యపెడుతున్న వీడియోలు, స్టీఫెన్‌సన్‌తో చంద్రబాబు మాట్లాడిన ఆడియో టేపులు బయటికి రావడంతో ఆత్మరక్షణలో పడిపోయారు. ఈ కేసులో రేవంత్‌రెడ్డి, హ్యరీ సెబాస్టియన్, ఉదయసింహా, జెరుసలేం మత్తయ్యలపై ఏసీబీ కేసు నమోదు చేసింది. కొంతకాలం దర్యాప్తు బాగానే సాగినా.. తర్వాత ఈ కేసుపై తెలంగాణ ప్రభుత్వం ఆసక్తి చూపలేదు. అయితే నేతలపై ఉన్న కేసుల విచారణ వేగవంతం చేయాలని ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలతో ఈ కేసు విచారణ తిరిగి ప్రారంభమైంది. ఐదున్నర గంటలపాటు మాక్ డ్రిల్ స్టీఫెన్సన్, మాల్కం టేలర్లు మంగళవారం ఏసీబీ ప్రధాన కార్యాలయానికి వచ్చారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు అధికారులు వీరికి పలు సూచనలు ఇచ్చారు. ఆ రోజు ఏం జరిగింది? ప్రత్యర్థి లాయర్లు ఎలాంటి ప్రశ్నలు అడిగే అవకాశముంది తదితర అంశాలపై క్రాస్ ఎగ్జామినేషన్‌లో లాయర్లు ప్రశ్నించే అవకాశముంది. ఆ సమయంలో స్టీఫెన్సన్, మాల్కం టేలర్ తడబడకుండా.. తగిన సూచనలు ఇచ్చారు. దీనిపై మాక్ డ్రిల్ నిర్వహించినట్లు సమాచారం. ఈ మాక్‌డ్రిల్‌లో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అశోక్‌రెడ్డి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ సురేందర్‌రావు పాల్గొన్నట్లు తెలిసింది. ఈ కేసులో మొత్తం 418 పేజీల చార్జిషీటును ఏసీబీ దాఖలు చేసింది. కేసు దర్యాప్తు అధికారితో పాటు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, ఫిర్యాదుదారులు, ప్రధాన సాక్షులు ప్రభావితం కూడా వారిలో ఆత్మస్థైర్యం నింపేందుకు మాక్‌డ్రిల్స్ చేపడుతున్నారు. బాబే సూత్రధారి అని మత్తయ్య వాంగ్మూలం ఈ వ్యవహారంలో ఈడీ కూడా విచారణ చేస్తోంది. స్టీఫెన్సన్కు ఇవ్వజూపిన రూ.50 లక్షలు ఎవరు సమకూర్చారన్న దానిపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఈ విషయంలో టీడీపీ నేత వేం నరేందర్‌రెడ్డిని గతంలోనే విచారించిన ఈడీ గతేడాది డిసెంబర్లో ఓటుకు కోట్లు కేసు లో ఏ–4 నిందితుడిగా ఉన్న మత్తయ్య వాంగ్మూలం తీసుకుంది. తాను ఈడీకి ఇచ్చిన వాంగ్మూలాన్ని మత్తయ్య మీడియాకు విడుదల చేశాడు. అందులో మొత్తం వ్యవహారానికి సూత్రధారి అప్పటి ఏపీ సీఎం చంద్రబాబేనని, గండిపేటలో మహానాడు వేదిక వెనుక గదిలో రేవంత్‌రెడ్డి, చంద్రబాబును కలిశానని, స్టీఫెన్సన్ను టీడీపీకి అనుకూలంగా ఓటేసేలా ఒప్పిస్తే.. రూ.50 లక్షలు ఇస్తామని ఆశ జూపారని అందుకే, ఈ పనికి అంగీకరించానని పేర్కొన్నాడు. -
ఓటుకు కోట్లు కేసు: రేవంత్‌రెడ్డికి వార్నింగ్
సాక్షి, హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎంపీ రేవంత్‌రెడ్డి ప్రత్యేక కోర్టు విచారణకు సోమవారం హాజరు కాకపోవడంపై న్యాయమూర్తి సాంబశివరావునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులపై కేసులను సత్వరం విచారించాలన్న సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో కోర్టు విచారణకు నిందితులు తప్పనిసరిగా హాజరుకావాల్సిందే నని తేల్చిచెప్పారు. మంగళవారం నిందితులపై అభియోగాలు నమోదు చేయనున్న నేపథ్యంలో నిందితులంతా తప్పనిసరిగా హాజరుకావాలని, లేకపోతే అరెస్టు వారంట్ జారీ చేస్తానని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో మంగళవారం రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్, రుద్ర ఉదయసింహాతో పాటు ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యలు ప్రత్యేక కోర్టు ముందు హాజరుకావాల్సి ఉంది. వాదనలు వినిపించాలని కోరే హక్కు లేదు.. ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమాస్తులపై ఏసీబీ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ దివంగత ఎన్టీ రామారావు సతీమణి లక్ష్మీపార్వతి దాఖలు చేసిన పిటిషన్లో వాదనలు వినిపించేందుకు తమకు అనుమతివ్వాలంటూ చంద్రబాబు దాఖలు చేసుకున్న పిటిషన్‌ను ఏసీబీ ప్రత్యేక కోర్టు సోమవారం తిరస్కరించింది. వాదనలు వినిపిస్తామని కోరే హక్కు (లోకస్) చంద్రబాబుకు లేదని న్యాయమూర్తి సాంబశివరావునాయుడు స్పష్టం చేశారు. అయితే ప్రజాప్రతినిధులపై నమోదైన కేసులను సత్వరం విచారించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో.. చంద్రబాబు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన వ్యవహారంపై ఏసీబీ దర్యాప్తు కోరుతూ లక్ష్మీపార్వతి దాఖలు చేసిన పిటిషన్‌పై ఉత్తర్వులు ఇవ్వాలని ఆమె తరఫు న్యాయవాది అభ్యర్థించారు. ఇప్పటికే పలు పర్యాయాలు ఉత్తర్వులు ఇస్తామంటూ గత ఏడాదిన్నరగా న్యాయస్థానం వాయిదా వేస్తుండటంపై తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయని, ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఈ మేరకు స్పందించిన న్యాయమూర్తి తదుపరి విచారణను ఈనెల 19కి వాయిదా వేశారు. చదవండి: రేవంత్ పిటిషన్ కొట్టివేత.. -
ఏసీబీ కోర్టులో రేవంత్‌రెడ్డికి చుక్కెదురు
సాక్షి, హైదరాబాద్: ఏసీబీ కోర్టులో కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డికి చుక్కెదురైంది. ఓటుకు కోట్లు కేసు ఏసీబీ పరిధిలోకి రాదన్న రేవంత్ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. ఓటుకు కోట్లు కేసు అవినీతి నిరోధక చట్టం పరిధిలోకి వస్తుందన్న కోర్టు.. ఇప్పటికే మరో ముగ్గురు నిందితుల డిశ్చార్జ్ పిటిషన్లను కొట్టేవేసింది. గతంలో హైకోర్టు.. సండ్ర, ఉదయసింహా, సెబాస్టియన్ పిటిషన్లను కొట్టివేయగా, ఇప్పుడు రేవంత్‌రెడ్డి పిటిషన్‌ను ఏసీబీ కోర్టు కొట్టివేసింది. చదవండి: పార్టీ మారడం లేదు: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఓటుకు కోట్లుకు సంబంధించి అన్ని ఆధారాలున్న ఉన్నాయని ఏసీబీ తెలిపింది. ఆడియో, వీడియో టేపులతో సహా అన్ని ఆధారాలున్నాయని పేర్కొంది. రూ.50లక్షలు ఇస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా నిందితులు పట్టుబడ్డారని ఏసీబీ తెలిపింది. ఏసీబీ వాదనలతో ఏకీభవించిన నాంపల్లి కోర్టు.. అభియోగాల నమోదు కోసం విచారణ ఫిబ్రవరి 8కి వాయిదా వేసింది. ఫిబ్రవరి 8న నిందితులు హాజరుకావాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది. చదవండి: బీజేపీ, టీఆర్ఎస్పై ఉత్తమ్ ధ్వజం -
ఓటుకు కోట్లు కేసు విచారణ నేటికి వాయిదా..
సాక్షి, హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసును విచారించే పరిధి ఈ కోర్టుకు లేదని మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి తరఫున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా ఏసీబీ ప్రత్యేక కోర్టుకు నివేదించారు. ప్రజాప్రతినిధులపై నమోదు చేసే కేసులను విచారించే పరిధి ఈ కోర్టుకు లేదంటూ రేవంత్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి సాంబశివరావు నాయుడు సోమవారం మరోసారి విచారించారు. ఎంపీ, ఎమ్మెల్యేలపై నమోదు చేసిన ఈ కేసును విచారించే పరిధి ఎన్నికల కమిషన్‌కు మాత్రమే ఉంటుందని సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. తదుపరి విచారణను న్యాయమూర్తి మంగళవారానికి వాయిదా వేశారు. -
ఓటుకు కోట్లు కేసులో ప్రమాణానికి సిద్ధమా?
పొందూరు: ‘ఓటుకు కోట్లు కేసులో ఫోన్ రికార్డ్‌లో నీ గొంతు కాదని దబాయిస్తే.. కాణిపాకంలోని విఘ్నేశ్వరుని ముందు ప్రమాణం చేద్దాం రా?’ అని చంద్రబాబుకు అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం సవాల్ విసిరారు. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలంలోని నందివాడలో ఇళ్ల పట్టాల పంపిణీలో ఆయన మాట్లాడారు. మనుషుల్లో దేవుడిని చూసే గొప్ప మానవతావాది సీఎం జగన్ అని, అలాంటి వ్యక్తిపై నిందలు మోపడం తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుల, మతాల మధ్య చిచ్చురేపే స్వార్థ, నీచ రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. -
కీలక పరిణామం; బాబు చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
సాక్షి, హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసులో నిందితుడైన జెరూసలేం మత్తయ్య ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఎదుట హాజరై వాంగ్మూలం ఇచ్చాడు. చంద్రబాబు సమక్షంలోనే ఒప్పందం కుదిరిందని స్పష్టం చేశాడు. స్టీఫెన్సన్కు రూ.5 కోట్లు ఇస్తామని అడ్వాన్స్‌గా రూ.50లక్షలు ఇస్తానని.. చంద్రబాబు తనతో చెప్పారని పేర్కొన్నాడు. టీడీపీ మాజీ నేత, కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేవంత్‌రెడ్డి నోట్లకట్టలతో కనిపించిన వీడియో, ఈ కేసుకు సంబంధించి పలు ఆడియో రికార్డులను సైతం ఈడీ ముందు ధృవీకరించాడు. అదే విధంగా ఓట్లుకు కేసు విషయంలో తనకేమీ కాకుండా, ఏసీబీ అధికారులను మేనేజ్ చేస్తానని చంద్రబాబు తనయుడు నారా లోకేష్ హామీ ఇచ్చారని, వెంటనే విజయవాడకు వెళ్లిపోవాలని తనకు సలహా ఇచ్చినట్లు మత్తయ్య ఈడీకి చెప్పాడు.(చదవండి: ‘ఓటుకు కోట్లు’ కేసులో కీలక పరిణామం) ఈ మేరకు.. ‘‘నేను చాలాకాలంగా చంద్రబాబుకు తెలుసు. టీడీపీకి అనుకూలంగా పనిచేశాను. పలు సందర్భాలలో చంద్రబాబును కలిశాను. అయితే 2015 మహానాడు సందర్భంగా చంద్రబాబు, రేవంత్‌రెడ్డి నన్ను కలవాలనుకుంటున్నారని.. జిమ్మీబాబు నాకు చెప్పాడు. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి.. కీలకమైన విషయం మాట్లాడటానికి వాళ్లిద్దరు నన్ను రమ్మన్నారు. దీంతో హిమాయత్‌సాగర్‌లో జరుగుతున్న మహానాడుకు వెళ్లాను. జిమ్మీబాబు నన్ను చంద్రబాబు దగ్గరికి తీసుకెళ్లాడు. మహానాడు జరుగుతుండగానే చంద్రబాబునాయుడిని కలిశాను. అక్కడే ఆయన సమక్షంలోనే రేవంత్‌రెడ్డి నాతో ఈ డీల్ మాట్లాడారు. స్టీఫెన్సన్ టీడీపీకి అనుకూలంగా ఓటు వేసేవిధంగా ఒప్పించే బాధ్యత నాకు అప్పజెప్పారు. ఇందులో భాగంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి ఓటేస్తే.. స్టీఫెన్సన్కు రూ.5కోట్లు ఇస్తామని చంద్రబాబు సమక్షంలో రేవంత్‌రెడ్డి చెప్పారు. ఓటింగ్‌కు గైర్హాజరైతే రూ.3కోట్లు ఇస్తామని చెప్పమన్నారు. ఈ ఒప్పందం కుదిరిస్తే నాకు రూ.50లక్షలు ఇస్తామని చంద్రబాబు సమక్షంలో రేవంత్ చెప్పాడు. డీల్‌కు స్టీఫెన్సన్ ఒప్పుకుంటే.. ముందుగా రూ.50లక్షలు అడ్వాన్స్ ఇస్తామని చంద్రబాబే చెప్పారు. ఈ విషయంలో నేను వెళ్లి స్టీఫెన్‌సెన్‌తో మాట్లాడాలని నాకు చెప్పారు. అతడిని ఒప్పిస్తే నన్ను అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పారు. చంద్రబాబు, రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు నేను వెళ్లి స్టీఫెన్‌సన్‌తో చర్చించాను. వాళ్లిద్దరు ఆఫర్ చేసిన డీల్ గురించి స్టీఫెన్సన్కు చెప్పాను, అయితే తాను రేవంత్‌రెడ్డితో నేరుగా కలుస్తానని స్టీఫెన్సన్ నాతో చెప్పారు. ఈ విషయం రేవంత్‌రెడ్డికి చెప్పాలని సెబాస్టియన్‌కు చెప్పాను. చంద్రబాబు ఆదేశాలతో రేవంత్‌రెడ్డి డబ్బులతో స్టీఫెన్సన్ దగ్గరు వెళ్లారు. ఆ తరువాత రేవంత్‌రెడ్డి నేరుగా వెళ్లి స్టీఫెన్సన్కు బ్యాగులో డబ్బులు ఇచ్చారు. రేవంత్‌రెడ్డి డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు ఆయనను రెడ్హాండెడ్గా అరెస్టు చేశారు. రేవంత్‌రెడ్డి అరెస్టు అయిన రెండో రోజు రహస్యంగా బంజారాహిల్స్‌లోని టీడీపీ కార్యాలయానికి వెళ్లాను. హైదరాబాద్‌లోని టీడీపీ కార్యాలయంలో నారా లోకేష్‌ను కలిశాను. నీకేమీ కాదని ఏసీబీ అధికారులను మేనేజ్ చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. విజయవాడకు వెళ్లిపొమ్మని నాకు సూచించారు’’ అని మత్తయ్య తన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు పాత్రపై స్పష్టమైన ఆధారాలు లభించడంతో ఈడీ దర్యాప్తును మరింత వేగవంతం చేసింది. కాగా, 2015లో టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి అప్పటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో వేం నరేందర్ రెడ్డిని గెలిపించుకునేందుకు.. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ను ప్రలోభపెడుతూ రూ. 50 లక్షలతో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడేనని ఆరోపణలు ఉన్నాయి. అయితే ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల అనంతరం రేవంత్ రెడ్డితో పాటు వేం నరేందర్ రెడ్డి కూడా టీడీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. -
‘ఓటుకు కోట్లు’ కేసులో కీలక పరిణామం
సాక్షి, న్యూఢిల్లీ: ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు నాయుడిని ముద్దాయిగా చేర్చాలంటూ దాఖలైన పిటిషన్‌ని సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం గురువారం విచారించింది. వేసవి సెలవుల తర్వాత వచ్చే ఏడాది జూలై 14న దీన్ని విచారణ చేస్తామని కోర్టు స్పష్టం చేసింది. పిటిషనర్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తరపున సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపించారు. ‘ఓటుకు కోట్లు కేసు ఛార్జ్‌షీట్‌లో చంద్రబాబు పేరును 37 సార్లు ప్రస్తావించారు. అయినా ఆ కేసులో ఏసీబీ చంద్రబాబును ముద్దాయిగా చేర్చలేదు’ అని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ కేసులో చంద్రబాబు పేరు చేర్చి సీబీఐ దర్యాప్తు జరపాలని కోర్టును అభ్యర్ధించారు. రాజకీయ నేతల కేసులను త్వరితగతిన విచారణ జరపాలని ఇటీవలే సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. (ఓటుకు కోట్లు కేసు: ఉదయ్‌సింహ అరెస్టు) -
ఓటుకు కోట్లు కేసు: ఉదయ్‌సింహ అరెస్టు
సాక్షి, హైదరాబాద్: ఏళ్లుగా నలుగుతున్న ఓటుకు కోట్లు కేసులో బుధవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ-3 గా ఉన్న ఉదయ్‌సింహను ఏసీబీ అధికారులు నేడు అరెస్టు చేశారు. ఇప్పటికే పలువురు నిందితుల డిశ్చార్జ్ పిటీషన్లు కొట్టివేసిన ఏసీబీ ప్రత్యేక కోర్టు అభియోగాలపై విచారణ ప్రారంభించింది. విచారణకు హాజరుకాని మరో నిందితుడు ఉదయ్‌సింహపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీచేసింది. నాన్ బెయిలబుల్ వారెంట్‌ను అమలు చేసిన ఏసీబీ అధికారులు ఆయన్ను అరెస్టు చేశారు. ఏసీబీ కోర్టులో ఉదయ్‌సింహను గురువారం హాజరుపరచనున్నారు. కాగా, ఈ కేసులో ఆడియో, వీడియో టేపుల ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు కీలకం కానుంది. నిందితులపై నమోదైన అభియోగాలపై విచారణ ప్రారంభం కావటంతో కీలక సూత్రదారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. (చదవండి: ఏసీబీ కోర్టులో ఓటుకు కోట్లు కేసు విచారణ..) -
ఓటుకు కోట్లు కేసుపై విచారణ
సాక్షి, హైదరాబాద్ : ఓటుకు కోట్లు కేసులో సెబాస్టియన్ డిశ్చార్జ్ పిటిషన్‌పై ఏసీబీ కౌంటరు దాఖలు చేసింది. సెబాస్టియన్ ఫోన్‌తో కుట్రలో కీలక వివరాలు బయటపడ్డాయని ఏసీబీ తెలిపింది. సెబాస్టియన్ డిశ్చార్జ్ పిటిషన్ కొట్టివేయాలని ఏసీబీ కోర్టును కోరింది. విచారణ జాప్యం చేసేందుకే ఒకరి తర్వాత ఒకరు పిటిషన్లు దాఖలు చేశారని ఏసీబీ పేర్కొంది. ఓటుకు నోటు కేసుపై శుక్రవారం మరో సారి కోర్టులో వాదనలు జరగనున్నాయి. -
ఓటుకు కోట్లు కేసులో కీలక మలుపు
సాక్షి, హైదరాబాద్ : ఓటుకు కోట్లు కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. బుధవారం ఏసీబీ న్యాయస్థానంలో ఈ కేసు విచారణకు రాగా.. డిశ్చార్జ్ పిటిషన్లపై హైకోర్టును ఆశ్రయించినందున గడువు ఇవ్వాలని సండ్ర వెంకటవీరయ్య, రుద్ర ఉదయ్‌సింహా కోరారు. అయితే వారి అభ్యర్థనపై ఏసీబీ అభ్యంతరం తెలిపింది. డిశ్చార్జ్ పిటిషన్లపై అప్పీల్ పేరుతో గడువు ఇవ్వొద్దని కోర్టును కోరింది. ఈ నేపథ్యంలో ఈ నెల 16న ఓటుకు కోట్లు కేసులో అభియోగాల నమోదు ప్రక్రియ ప్రారంభించాలని కోర్టు నిర్ణయించింది. అభియోగాల నమోదుకు మరింత గడువు ఇవ్వాలని నిందితులు కోరగా కోర్టు నిరాకరించింది. ఈ నెల 16న నిందితులు రేవంత్ రెడ్డి, సండ్ర, ఉదయ్ సింహా, సెబాస్టియన్లు కచ్చితంగా విచారణకు హాజరు కావాలని ఏసీబీ న్యాయస్థానం ఆదేశింది. చదవండి : ‘ఓటుకు కోట్లు’ కుట్రకు ఆధారాలున్నాయి -
‘ఓటుకు కోట్లు’ కుట్రకు ఆధారాలున్నాయి
సాక్షి, హైదరాబాద్: 'ఓటుకు కోట్లు' కేసులో కుట్రకు ప్రాథమిక ఆధారాలున్నాయని ఏసీబీ ప్రత్యేక కోర్టు స్పష్టం చేసింది. ఈ దశలో నిందితులను కేసు నుంచి తొలగించలేమని (డిశ్చార్జ్) చేయలేమని, తుది విచారణ (ట్రయల్) చేపట్టాల్సిందేనని తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో నిందితులు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, రుద్ర ఉదయసింహలు దాఖలు చేసుకున్న డిశ్చార్జ్ పిటిషన్లను కొట్టేసింది. ఈ కేసుతో తమకు ఎలాంటి సంబంధం లేదని, ఉద్దేశపూర్వకంగా తమను ఇరికించారన్న వారిద్దరి వాదనను కోర్టు తోసిపుచ్చింది. ఈ మేరకు ప్రత్యేక కోర్టు ప్రధాన న్యాయమూర్తి సాంబశివరావునాయుడు సోమవారం తీర్పునిచ్చారు. నిందితులపై అభియోగాల నమోదు కోసం తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేశారు. ఈ కేసు విచారణలో భాగంగా రేవంత్‌రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య తదితరులు సోమవారం ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు. మహానాడు వేదికగా కుట్ర... టీడీపీ 2015లో నిర్వహించిన మహానాడులో ఓటుకు కోట్లు కుట్ర జరిగిందని ఏసీబీ ప్రత్యేక కోర్టుకు నివేదించింది. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ను డబ్బుతో ప్రలోభపెట్టి టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి వేం నరేందర్‌రెడ్డిని గెలిపించేందుకు కుట్ర చేశారని తెలిపింది. రేవంత్‌రెడ్డి, మత్తయ్య తదితరులతో కలసి సండ్ర కూడా కుట్రలో భాగస్వామిగా మారారని, శంషాబాద్ నోవాటెల్‌లో ఇదే అంశంపై రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్, సండ్ర సమావేశమయ్యారని పేర్కొంది. రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్, ఉదయసింహ ఫోన్‌కాల్స్, వాయిస్ కాల్స్‌లోనూ సండ్ర ప్రమేయం స్పష్టమైందని వివరించింది. సండ్ర పాత్రను నిరూపించేందుకు అన్ని సాంకేతిక ఆధారాలు ఉన్నాయని తెలిపింది. రేవంత్ అనుచరుడు ఉదయ్‌సింహకు కూడా ఈ కుట్రలో కీలకపాత్ర ఉందని ఏసీబీ తెలిపింది. స్టీఫెన్సన్ సూచించిన అపార్ట్‌మెంట్‌కు 2015 మే 31న మధ్యాహ్నం 4:40 గంటలకు రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్ ఒకే కారులో వచ్చారని, కొద్దిసేపటికి ఉదయసింహ వెర్నా కారులో రూ. 50 లక్షలున్న డబ్బు సంచి తీసుకొని అదే అపార్ట్‌మెంట్‌కు వచ్చారని ఏసీబీ వివరించింది. సీఫెన్‌సన్‌కు ఇచ్చేందుకు వేం కృష్ణకీర్తన్‌రెడ్డి నుంచి సికిం ద్రాబాద్ సమీపంలోని మెట్టుగూడ చౌరస్తా వద్దకు వెళ్లి రూ. 50 లక్షలు నగదు తీసుకురావాలని రేవంత్‌రెడ్డి ఉదయ్‌సింహకు సూచించారని తెలిపింది. ఈ కేసులో ఉదయసింహ పాత్రను నిరూపించేందుకు స్పష్టమైన ఆధారాలున్నాయని వివరించింది. ఈ వాదనతో ఏకీభవించిన న్యాయమూర్తి... వారిద్దరి డిశ్చార్జ్ పిటిషన్లను కొట్టివేశారు. -
ఓటుకు కోట్లు కేసు: ‘నాకు ప్రాణహాని’
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో పెనుదుమారం రేపిన ఓటుకు కోట్లు కేసులో ఏసీబీ కోర్టు మంగళవారం విచారణ కొనసాగించింది. వాదనలు విన్న ధర్మాసనం విచారణను ఏప్రిల్ 20కి వాయిదా వేసింది. ఈ కేసులో ఏ2 నిందితుడిగా ఉన్న సెబాస్టియన్ కోర్టుకు హాజరయ్యారు. (తెరపైకి మరోసారి ఓటుకు కోట్లు కేసు) కోర్టుకు హాజరయిన అనంతరం సెబాస్టియన్ ‘సాక్షి’తో మాట్లాడుతూ.. తనను ఈ కేసులో అన్యాయంగా ఇరికించి.. అసలు దోషులను వదిలేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ప్రాణ ఉందని.. రక్షణ కల్పించాలని కోరారు. బెదిరింపులు, దాడులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. టీడీపీ తనను ఈ కేసులో ఇరికించిందన్నారు. ఆడియో టేపుల ఫోరెన్సిక్ రిపోర్ట్‌పై విచారణ జరిగితే కీలక వ్యక్తులు వెలుగులోకి వస్తారని చెప్పారు. స్టీఫెన్సన్కు ఇవ్వజూపిన నగదు ఎక్కడ నుంచి వచ్చిందో విచారణ జరగాలన్నారు. ఈ కేసులో అసలు సూత్రధారి ఎవరో ప్రజలందరికి తెలుసన్నారు. నిజనిజాలన్ని కోర్టుకు తెలుపుతానని అందుకే సూత్రధారులతో ప్రాణహాని ఉందని సబాస్టియన్ పేర్కొన్నారు. (రేవంత్ మెడ చుట్టూ బిగుస్తున్న కేసుల ఉచ్చు) -
తెరపైకి మరోసారి ఓటుకు కోట్లు కేసు
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓటుకు కోట్లు కేసు మరోసారి తెరపైకి వచ్చింది. నేడు ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది. కేసుకు సంబంధించి ఐదుగురు నిందితులు కోర్టుకు హాజరుకావాల్సి ఉంది. ఈ కేసులో ఏ1 గా ఉన్న రేవంత్‌రెడ్డి డ్రోన్ కేసులో ప్రస్తుతం చర్లపల్లి జైలులో ఉండటంతో ఆయనను నేడు ఏసీబీ కోర్టుకు హాజరుపరుస్తారా? లేదా? అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. 2015లో టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో వేం నరేందర్ రెడ్డిని గెలిపించుకునేందుకు.. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ను ప్రలోభపెడుతూ రూ. 50 లక్షలతో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.(రేవంత్ మెడ చుట్టూ బిగుస్తున్న కేసుల ఉచ్చు) ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కీలక ఆధారాలు సేకరించిన ఏసీబీ.. మొత్తం 960 పేజీలతో చార్జిషీట్ దాఖలు చేసింది. అందులో ఈ కేసులో నిందితుల పాత్ర, అసలు సూత్రధారుల సంబంధించి కీలక విషయాలను పొందుపరిచారు. స్టీఫెన్సన్కు ఇవ్వజూపిన డబ్బు ఎక్కడ నుంచి వచ్చింది. ఎవరు సమకూర్చారు అనే అంశం కీలకంగా మారింది. ఇప్పటికే కోర్టుకు ఆడియో టేపుల ఎఫ్ఎస్ఎల్ రిపోర్టులు చేరాయి. ఓటుకు కోట్లు కేసు విచారణ ఏసీబీ కోర్టులో వేగంగా సాగుతుంది. త్వరలోనే ఈ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయి. (చర్లపల్లి జైలుకు రేవంత్..) (రేవంత్ నేరాల పుట్ట బయటపడింది) -
తెరపైకి మరోసారి ఓటుకు కోట్లు కేసు
-
మరోసారి తెరపైకి ఓటుకు కోట్లు కేసు
సాక్షి, హైదరాబాద్ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓటుకు కోట్లు కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కేసుకు సంబంధించి మంగళవారం ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది. దీంతో ఈ కేసులో నిందితులుగా ఉన్న ఐదుగురు కోర్టుకు హాజరుకావాల్సి ఉంది. ఈ కేసులో ఏ1 గా ఉన్న రేవంత్‌రెడ్డి ప్రస్తుతం చర్లపల్లి జైలులో ఉండటంతో ఆయనను రేపు ఏసీబీ కోర్టుకు హాజరుపరుస్తారా? లేదా? అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కీలక ఆధారాలు సేకరించిన ఏసీబీ.. మొత్తం 960 పేజీలతో చార్జిషీట్ దాఖలు చేసింది. అందులో ఈ కేసులో నిందితుల పాత్ర, అసలు సూత్రధారుల సంబంధించి కీలక విషయాలను పొందుపరిచారు. త్వరలోనే కీలక పరిణామాలు..! మరోవైపు ఈ కేసుకు సంబంధించిన ఆడియో టేపుల ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు కోర్టుకు చేరింది. ఈ కేసులో స్టీఫెన్సన్కు రేవంత్‌రెడ్డి ఇవ్వజూపిన డబ్బు ఎక్కడినుంచి వచ్చిందనేది కీలకం కానున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ కేసులో కీలక పరిణామాలు జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. కాగా, 2015లో టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో వేం నరేందర్ రెడ్డిని గెలిపించుకునేందుకు.. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ను ప్రలోభపెడుతూ రూ. 50 లక్షలతో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడేనని ఆరోపణలు ఉన్నాయి. అయితే ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల అనంతరం రేవంత్ రెడ్డితో పాటు వేం నరేందర్ రెడ్డి కూడా టీడీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు.