Dialysis
-
ప్రజారోగ్యంపై పగ
సాక్షి, అమరావతి: గత ప్రభుత్వంలో వ్యవస్థలన్నీ నాశనం చేసేశారంటూ ప్రతి వేదికపై గుండెలు బాదుకుంటున్న సీఎం చంద్రబాబే నిజానికి వాటన్నింటినీ భ్రష్టు పట్టిస్తున్నారు. గతంలో పేదలకు మేలు చేసిన అనేక కార్యక్రమాలకు ఆయన మంగళం పాడుతూ రివర్స్ పాలన చేస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రజలకు ఎంతో మేలు చేసిన పథకాలు, కార్యక్రమాలను ఉన్నపళంగా నిలిపేసి వారిని కష్టాల ఊబిలోకి నెట్టేస్తున్నారు. చివరికి.. వారి ప్రాణాలతో సైతం చంద్రబాబు ప్రభుత్వం చెలగాటమాడుతోంది. ముఖ్యంగా ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేయడం, అనుయాయులకు వాటి నిర్వహణ కాంట్రాక్టు కట్టబెట్టడం కోసం నిధులు చెల్లించకుండా 108, 104 వాహనాలను మూలనపడేయడం ఇందుకు నిదర్శనం. ఇలా చంద్రబాబు ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేసి రోగులకు చుక్కలు చూపుతోంది. ఇందులో భాగంగా డయాలసిస్ రోగులకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత రవాణా సదుపాయానికి కూడా తిలోదకాలిచ్చింది. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో డయాలసిస్‌కు ఆస్పత్రికి వెళ్లాల్సిన వ్యక్తి 108 అంబులెన్సుకు ఫోన్‌చేస్తే నిమిషాల వ్యవధిలోనే రోగి ఇంటి వద్దకు వచ్చి ఆస్పత్రికి తీసుకెళ్లేవి. కానీ, చంద్రబాబు ప్రభుత్వం గత మూడు వారాలుగా ఈ సేవలకు మంగళం పాడేసింది. బాధితులు 108కు ఫోన్ చేసినా అంబులెన్స్‌లు రావడంలేదు. ‘కేవలం తీవ్ర అనారోగ్య సమస్యలుంటేనే అంబులెన్స్ వస్తుంది.. డయాలసిస్ కోసం రాదు’ అని కాల్‌సెంటర్ ప్రతినిధులు కుండబద్దలు కొట్టినట్టు చెబుతున్నారని డయాలసిస్ బాధితులు వాపోతున్నారు.అవస్థలుపడుతూ ఆస్పత్రులకు.. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా సగటున రోజుకు 600 మందికి పైగా రోగులు 108 అంబులెన్సుల ద్వారా డయాలసిస్‌కు వెళ్లేవారు. గతేడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది జూలై వరకూ 2.50 లక్షల మందికి పైగా ఉచిత రవాణా సదుపాయాన్ని వినియోగించుకున్నారు. కానీ, చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక 108 సేవలపై చీకట్లు కమ్ముకున్నాయి. డీజిల్‌కు కూడా ప్రభుత్వం డబ్బులివ్వకపోవడంతో ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా 300కు పైగా అంబులెన్స్‌లు మూలనపడ్డాయి. ఫలితంగా డయాలసిస్‌తో పాటు ఇతర అనారోగ్య బాధితులు తీవ్ర అవస్థలు పడ్డారు. అత్యవసర సమయంలో అంబులెన్స్‌లు రాక కొందరు మరణించారు. ఉచిత రవాణా కల్పించాలని డిమాండ్.. ఎటువంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా ఉన్నపళంగా డయాలసిస్ రోగులకు ఉచిత రవాణా సౌకర్యాన్ని చంద్రబాబు ప్రభుత్వం రద్దు చేయడంతో కిడ్నీ బాధితులు తీవ్ర అవస్థలు పడుతూ ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోస్తున్నారు. గ్రామానికి 30 నుంచి 50 కి.మీల దూరంలో ఉండే డయాలసిస్ కేంద్రాలకు ఒకసారి వెళ్లి రావాలంటే కనీసం రూ.500 నుంచి రూ.1,500 వరకూ బాధితులు ఖర్చుచేయాల్సి వస్తోంది. కొందరికి వారానికి రెండు, మూడుసార్లు డయాలసిస్ అవసరమవుతోంది. వారికి ఈ ఖర్చు తలకుమించిన భారమవుతోంది. దీంతో.. ప్రయాణ ఖర్చులకు భయపడి కొందరు డయాలసిస్‌ను నిర్లక్ష్యంచేసి ప్రాణాల మీదకు తెచ్చుకునే ప్రమాదం నెలకొంటోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తిరిగి 108 అంబులెన్స్‌ల్లో ఉచిత రవాణాకు అవకాశం కల్పించాలని డయాలసిస్ రోగులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో ఆర్టీసీ బస్సుల్లోనైనా ఉచిత ప్రయాణానికి అవకాశం కల్పించాలని లేదా ప్రత్యామ్నాయ రవాణా ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు.ఎప్పుడు ఏమవుతుందోనని భయమేస్తోంది.. కొన్నేళ్లుగా నా భర్త చిరంజీవికి డయాలసిస్ చేయిస్తున్నాం. గత ప్రభుత్వ హయాంలో 108 ద్వారా ఉచితంగా ఆస్పత్రికి తీసుకువచ్చేవాళ్లం. ఇప్పుడు వాహనం రావడం లేదు. వారంలో మూడు రోజులు సర్వజనాస్పత్రికి వెళ్లాల్సి ఉంది. దీంతో ఆటోలో వచ్చినప్పుడల్లా రూ.300 వరకు ఖర్చవుతోంది. ఆటోలో వస్తున్న సమయంలో నా భర్త ఒక్కోసారి అస్వస్థతకు గురవుతున్నారు. ఎప్పుడు ఏమవుతుందోనని భయమేస్తోంది. ప్రభుత్వం ఉచిత రవాణా సౌకర్యం కల్పించి మాలాంటి వారిని ఆదుకోవాలి.– లీలావతి, వడ్డిపల్లి, ఆత్మకూరు మండలం, అనంతపురం జిల్లా తమ్ముడు నరకయాతన అనుభవిస్తున్నాడు.. మా తమ్ముడు సత్యనారాయణ కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు. అతడికి భార్య లేదు. ఇద్దరు పిల్లలు చదువుకుంటున్నారు. దీంతో డయాలసిస్‌కు నేనే తీసుకురావాల్సి వస్తోంది. ప్రతిసారీ రూ.500 వరకు ఖర్చవుతోంది. మాలాంటి పేదలకు ప్రతిసారీ ఇలా రూ.వందలు ఖర్చు పెట్టుకోవడం చాలా భారంగా ఉంది. డయాలసిస్ చేయించుకుని తీసుకెళ్లేలోపు నా తమ్ముడు నరకయాతన అనుభవిస్తున్నాడు. – జయలక్ష్మి, ధర్మభిక్షం కాలనీ, అక్కంపల్లి, అనంతపురం జిల్లా మళ్లీ 108 సేవలను పునరుద్ధరించాలి..అప్పు చేసి డయాలసిస్ కోసం తిరుగుతున్నాం. గత ప్రభుత్వం డయాలసిస్ రోగుల కోసం 108 అంబులెన్సులో ఉచిత ప్రయాణ సేవలు అందించింది. దీంతో మాకు రవాణా ఖర్చులు లేవు. ఇప్పుడు ఉన్నట్టుండి 108 సేవలను ఆపేశారు. దీంతో రవాణా చార్జీలు కష్టంగా మారాయి. మేము బంగారుపాళ్యం నుంచి ఆటోలో రావాలంటే రూ.500పైన డబ్బులు తీసుకుంటున్నారు. పేదలను దృష్టిలో ఉంచుకుని మళ్లీ 108 సేవలను పునరుద్ధరించాలి. –శ్యామల, బంగారుపాళ్యం, చిత్తూరు జిల్లాఈ చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి.. ఆంజనేయులు. అనంతపురం రూరల్ పరిధిలోని కొడిమి నివాసి అయిన ఈయన గత కొన్నేళ్లుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు. అనంతపురం సర్వజనాస్పత్రికి వారంలో మూడుసార్లు డయాలసిస్ కోసం వెళ్లాల్సి ఉంది. గత ప్రభుత్వం ఉచిత రవాణా సౌకర్యం కల్పించడంతో ఆంజనేయులు 108 అంబులెన్సులో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంటి నుంచి ఆస్పత్రికి వచ్చేవాడు. అయితే, చంద్రబాబు ప్రభుత్వం ఇటీవల ఉచిత రవాణా సదుపాయాన్ని నిలిపేయడంతో కుమారుడితో కలిసి బైకుపైన అవస్థలు పడుతూ ఆస్పత్రికి రావాల్సి వస్తోంది. ఇలా ఆంజనేయులు ఒక్కరే కాదు.. డయాలసిస్ రోగులకు చంద్రబాబు ప్రభుత్వం 108 అంబులెన్సుల్లో ఉచిత రవాణా సౌకర్యం నిలిపేయడంతో రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది రోగులు ప్రత్యక్ష నరకం చూస్తున్నారు.కొండ్రు ఇసాక్, అతడి భార్య రాణమ్మ. ప్రకాశం జిల్లా పీసీ పల్లి మండలం విజయనగర్ కాలనీలో వీరు నివాసముంటున్నారు. దాదాపు ఐదేళ్లుగా వీరు నెలలో 13 రోజులు 30 కిలోమీటర్లు ప్రయాణించి కనిగిరి వెళ్లి డయాలసిస్ చేయించుకుంటున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఇంటికి వచ్చి అంబులెన్స్ తీసుకువెళ్లేదని, డయాలసిస్ చేయించుకుని ఇంటికి వచ్చేవారమని ఆ దంపతులు చెబుతున్నారు. అయితే ఇప్పుడు మూడు వారాలుగా అంబులెన్స్ రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆటోలో వెళ్తుంటే రూ.1,000 నుంచి 1,500 తీసుకుంటున్నారని వాపోతున్నారు. ఇలా నెలలో 13 రోజులకు ఆటోకి రూ.19,500 అవుతోందని, ఇది కాకుండా మందులు రూ. 5,000 వరకూ అవుతున్నాయని కలత చెందుతున్నారు. -
కిడ్నీ మార్పిడి చేయించడం లేదని.. భార్యను చంపి భర్త ఆత్మహత్య
సిరిసిల్లక్రైం: డయాలసిస్‌తో బాధప డుతున్న ఓ భర్త తన భార్యను క్షణి కావేశంలో హత్యచేసి..ఆపై తను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసు లు తెలిపిన వివరాల ప్రకారం.. రాజన్నసిరిసిల్ల జిల్లాకేంద్రంలోని శాంతి నగర్‌కు చెందిన దూస రాజేశం(62) రెండు కిడ్నీలు కొద్దినెలల క్రితం పాడయ్యాయి. దీంతో డయాలసిస్ చేయించుకుంటున్నాడు. తనకు కిడ్నీ మార్పిడి చేయించాలని కొన్నాళ్లుగా కుటుంబ సభ్యులతో గొడవ పడు తున్నాడు.కిడ్నీ దొరకగానే శస్త్రచికిత్స చేయిద్దామని, అప్పటి వరకు ఆగాలని కుటుంబసభ్యులు సముదాయించారు. ఈ క్రమంలోనే డయాలసిస్‌తో కాలం వెళ్లదీయలేనని మనస్తా పానికి గురైన రాజేశం ఆదివారం రాత్రి ఇంట్లో ఎవరూలేని సమయంలో తన భార్య లక్ష్మి(50)ని బలమైన ఆయుధంతో తలపై కొట్టి హత్య చేశాడు. అనంతరం ఇంట్లోని పైకప్పుకు తాడుతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాజేశం పవర్‌లూమ్స్ నడిపించేవాడని కుటుంబసభ్యులు తెలిపారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో..రాజేశంకు ఇద్దరు కుమారులు. చిన్నకొడుకు విద్యాభ్యాసం కోసం హైదరాబాద్‌లో ఉండగా, పెద్ద కుమారుడు ఆదివారం తన అత్తగారింట్లో జరిగిన శుభకార్యానికి వెళ్లాడు. ఇంట్లో ఎవరూ లేరని గమనించిన రాజేశం తన భార్యను హత్య చేసి తను ఆత్మహత్యకు పాల్పడినట్టు కుమారుడు వేణు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. -
కిడ్నీలు జర భద్రం!
సాక్షి, హైదరాబాద్: మూత్రపిండాలు మానవ శరీరంలో చాలా కీలకమైన అవయవాలు. అవి సక్రమంగా పనిచేస్తేనే శరీరంలోని మిగతా అన్ని అవయవాలు సరిగ్గా ఉంటాయి. ఆరోగ్యంగా నాలుగు కాలాల పాటు జీవించగలడు. మూత్ర పిండాలు సరిగ్గా పనిచేయకపోతే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అయితే కిడ్నీ సమస్యలు ఉన్నట్టు తొలి దశలో అర్థం కాదు. ఎలాంటి లక్షణాలు కూడా బయటపడవు. దాదాపు 80 శాతంపైగా కిడ్నీలు పాడైన తర్వాతే చాలా మందికి అర్థం అవుతుంది. అప్పటికే జరగాల్సిన అనర్థం జరిగిపోతుంది. కొందరిలో కిడ్నీ సమస్యలు ఉన్నాయని తెలిసిన రెండు మూడు వారాలకే మరణాలు సంభవించే ప్రమాదం ఉంది. కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోతే శరీరంలో పేరుకుపోయే వ్యర్థ పదార్థాలను బయటకు వెళ్లిపోవు. దీంతో అవి కాస్తా విషపదార్థాలుగా మారి శరీరంలోని ఒక్కో అవయం దెబ్బతింటుంది. అలా ప్రాణాంతకంగా మారుతుంది. అందుకే కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎంతో ముఖ్యం. వారికి అదొక్కటే మార్గం.. కిడ్నీ ఫెయిల్యూర్ రెండు రకాలుగా ఉంటుంది. కొందరికి తాత్కాలికంగా, మరికొందరు పూర్తిగా కిడ్నీలు పాడైపోతాయి. డీహైడ్రేషన్, పెయిన్ కిల్లర్స్ అతిగా వాడటం, ఇన్ఫెక్షన్లు, గుండెకు రక్త ప్రసరణ నిలిచిపోవడం తదితర కారణాల వల్ల కిడ్నీలు తాత్కాలికంగా పనిచేయవు. తాత్కాలిక కిడ్నీ ఫెయిల్యూర్‌కు కూడా డయాలసిస్ చేయాలి. అయితే శాశ్వత కిడ్నీ ఫెయిల్యూర్‌కు మాత్రం దీర్ఘకాలిక డయాలసిస్ ఒక్కటే మార్గం. డయాబెటిస్, బీపీ, ఆటోఇమ్యూన్ డిసీజ్, జన్యుపరమైన సమస్యల వల్ల మూత్రపిండాలు శాశ్వతంగా పాడవుతాయి. డయాలసిస్ అంటే ఏంటి? సాధారణంగా కిడ్నీలు రక్తంలోని వ్యర్థాలను వడపోస్తాయి. కిడ్నీలు 80 శాతం పాడయ్యే వరకు ఆ పనిని చక్కగా నిర్వర్తిస్తాయి. అప్పటివరకు ఎలాంటి లక్షణాలు బయటపడవు. అంతకుమించి పాడైతే మాత్రం కిడ్నీలు చేయాల్సిన పనులను చేయలేక మొరాయిస్తాయి. అలాంటి సమయంలో వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి. ఇలాంటి వారికి డయాలసిస్ ప్రక్రియ వరప్రదాయిని అని చెప్పొచ్చు. డయాలసిస్ ప్రక్రియలో కిడ్నీలు చేయాల్సిన పనిని మెషీన్ సాయంతో రక్తాన్ని వడపోసి వ్యర్థాలను తొలగిస్తారు. హీమోడయాలసిస్ ప్రక్రియను వారానికి మూడు సార్లు చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ నాలుగు గంటల పాటు జరుగుతుంది. ఆలస్యమైతే ఏమవుతుంది? కిడ్నీలు పాడైన వారు నిరంతరం డయాలసిస్ చేయించుకోవాలి. డయాలసిస్ ఆలస్యమైతే రక్తంలో వ్యర్థ పదార్థాలు పేరుకుపోయి మిగతా అవయవాల్లో ఇన్ఫెక్షన్లు పెరుగుతాయి. ఈ విషయంలో కాస్త అలసత్వం వహించినా.. సమస్య మరింత జఠిలం కావచ్చు. కొద్ది రోజులు ఆగి చేయించుకుందామని నిర్లక్ష్యం వహిస్తే ప్రాణానికే ప్రమాదం ఉంటుంది. మూత్రం సరిగ్గానే వస్తోందని, ఆరోగ్యం బాగానే ఉందని ఆలస్యం చేసినా జరగాల్సిన నష్టం జరుగుతుంది. మూత్రపిండాలు మందకొడిగా పనిచేస్తాయి. నీటిని వడగట్టలేకపోవడంలో విఫలమవుతాయి. విషపదార్థాలు రక్తంలోనే ఉండిపోతాయి. కొన్నిసార్లు నీరు ఊపిరితిత్తుల్లోకి చేరుతుంది. దీనివల్ల ‘పల్మనరీ ఎడిమా’ అనే సమస్య ఏర్పడుతుంది. దీంతో శ్వాస తీసుకోవడంతో ఇబ్బందులు, ఆయాసం వస్తుంది. సమయానికి డయాలసిస్ చేయించుకునేవారు ఎక్కువ కాలం జీవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఫిస్టులా చేయించుకోవాల్సిందే.. డయాలసిస్ కన్నా ముందు ఫిస్టులా అనే ప్రక్రియ తప్పనిసరి. ఈ పద్ధతిలో చేయి పైన ధమని, సిరాను ఫిస్టులా అనే లావు పాటి సూది(క్యాథటీర్) ద్వారా కలుపుతారు. డయాలసిస్ ప్రక్రియ చేసే సమయంలో ఫిస్టులా లేకపోవడం వల్లే చాలా వరకు రోగి ప్రాణాపాయ స్థితిలో వెళ్లి.. చనిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే డయాలసిస్ ముందు ఫిస్టులా వేయించుకోవడం చాలా ముఖ్యం అని డాక్టర్లు చెబుతున్నారు. నీరు తీసుకోకపోవడం వల్లే.. చాలావరకు కిడ్నీ సమస్యలు పరిశుభ్రమైన నీరు తీసుకోకపోవడం వల్ల వస్తుంటాయి. ముఖ్యంగా నీళ్లలో ఉండే పాదరసం, సీసం, ఫ్లోరిన్ వంటి లోహాలు కిడ్నీలను పాడు చేస్తాయి. పారిశ్రామిక వాడల్లో ఉండే వారు తరచూ కిడ్నీ పరీక్షలు చేయించుకుంటే ముందుగానే సమస్యలను గుర్తించవచ్చు. దీంతో సరైన సమయంలో చికిత్స తీసుకుని ప్రాణాపాయస్థితి నుంచి బయటపడొచ్చు. సౌందర్య సాధనాల్లో ఉండే కెమికల్స్ కూడా కిడ్నీలు పాడయ్యేందుకు కారణం అవుతాయి.ఆహారం విషయంలో అపోహలొద్దు.. సాధారణంగా కిడ్నీ సమస్యలు ఉన్నప్పుడు మంచి ఆహారం తీసుకోవాలి. ఎలాంటి అపోహలకు తావివ్వకుండా వైద్యులు సూచించిన మేరకు సరైన ఆహారం తీసుకోవాలి. అప్పుడే శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. సరైన ఆహారం లేకపోతే ఎముకలు, కండరాలు, రక్తనాళాలు, నరాలు బలహీనమై సమస్య మరింత జఠిలమవుతుంది. అది ప్రాణాపాయస్థితికి కూడా దారి తీయొచ్చు. డయాలసిస్ ప్రక్రియ ఇప్పుడు దాదాపు అన్ని ప్రాంతాల్లో అందుబాటులో ఉంది. ఎలాంటి భయం, అనుమానాలు, అపోహలు లేకుండా రెగ్యులర్‌గా డయాలసిస్ చేయించుకుంటే ప్రాణాపాయస్థితి నుంచి బయటపడొచ్చని మూత్రపిండాల నిపుణులు చెబుతున్నారు.డయాబెటిస్, హైబీపీ కూడా కారణమే.. డయాబెటిస్ వల్ల కూడా కిడ్నీలు పాడవుతున్నాయి. డయాబెటిస్ సోకిన తర్వాత సరైన శ్రద్ధ తీసుకోకపోవడం వల్ల పదేళ్లలో కిడ్నీలు పాడవుతుంటాయి. 30– 40 ఏళ్ల వయసు వారు ఎక్కువగా ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఇక అధిక రక్తపోటు ఉన్న వారిలో కూడా కిడ్నీలు సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. బీపీ ఉన్న వారు కిడ్నీ సంబంధిత పరీక్షలు కచి్చతంగా చేయించుకోవాలి. పాలీసిస్టిక్ కిడ్నీ డిసీజ్ వంశపారంపర్యంగా వస్తుంది. ప్రతి నలుగైదుగురిలో ఒకరిలో వస్తుంది. ఇంట్లో ఎవరికైనా ఇలాంటి సమస్య ఉంటే మిగిలిన వారు కూడా పరీక్షలు చేయించుకుంటే ముందుగానే సమస్యలు గుర్తించి సరైన చికిత్స తీసుకోవచ్చు.పెయిన్ కిల్లర్స్ వల్ల.. చిన్న నొప్పి వచి్చనా ఇటీవల పెయిన్ కిల్లర్ మందులు వాడటం ఎక్కువైంది. అలాగే కడుపులో మంట తగ్గించే మందులు, యాంటీ బయాటిక్స్ వంటి మందులను ఎక్కువగా వాడటం వల్ల కిడ్నీ సమస్యలు వస్తున్నాయి. కిడ్నీల్లో రాళ్లు వస్తే సరైన చికిత్స తీసుకోకపోవడం, వాటిని తొలగించుకోకపోవడంతో ఇన్ఫెక్షన్లు పెరుగుతాయి. దీంతో కిడ్నీలు పాడైపోతాయి. 60 ఏళ్లు దాటిన వారిలో ఎక్కువగా ఇన్ఫెక్షన్ల వల్ల, పెయిన్ కిల్లర్ల, ఎసిడిటీ మందులు వాడకం వల్ల కిడ్నీలు చెడిపోతుంటాయి. కొందరిలో క్యాన్సర్ సోకిన వారిలో కూడా కిడ్నీలు పాడయ్యే అవకాశం ఉంటుంది. మైలోమా, బోన్‌మ్యారో, ల్యుకేమియా కొన్ని రకాల క్యాన్సర్లు కిడ్నీ పరీక్షల ద్వారా కూడా తెలుస్తుంది.కిడ్నీ సమస్యలు ఎందుకు వస్తాయి? చిన్నపిల్లల్లో కిడ్నీ సమస్యలు పుట్టుకతోనే వస్తున్నాయి. కడుపులో ఉండగానే స్కానింగ్‌ల ద్వారా ఈ విషయాలను గుర్తిస్తున్నారు. కిడ్నీలు సరిగ్గా ఎదగకపోవడం, మూత్ర నాళాలు సరిగ్గా అభివృద్ధి చెందకపోవడం, ఫిల్టర్లు పాడైపోవడం వల్ల చిన్న వయసులోనే డయాలసిస్ అవసరం పడుతోంది. ఈ పరిస్థితి జన్యుపరమైన లోపాల వల్ల వస్తుంటుంది. ఈ సమస్యలు ఉన్న పిల్లలు వాడే మందుల వల్ల కూడా సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉంది. వీరి శరీరాల్లో రక్త నాళాలు సరిగ్గా అభివృద్ధి చెందకపోవడం వల్ల వారికి డయాలసిస్ ప్రక్రియ చేయడం కాస్త సంక్షిష్టంగా ఉంటుంది. యువతీ యువకుల్లో కిడ్నీలో రాళ్లు, అనవసరమైన మందులు వాడటం వల్ల కిడ్నీలు పాడవుతున్నాయి.అలసత్వం వద్దు.. డయాలసిస్ చేయించుకోవడంలో అస్సలు అలసత్వం వద్దు. వారానికి మూడుసార్లు కచి్చతంగా చేయించుకుంటే ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉంటారు. రేపు, మాపు అంటూ నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదం. కుటుంబంలో ఎవరికైనా కిడ్నీ సమస్యలు ఉంటే అందరూ పరీక్షలు చేయించుకోవడం మంచిది. దీంతో ప్రాథమిక దశలోనే చికిత్స తీసుకోవచ్చు. ముఖ్యంగా పారిశ్రామికవాడల్లో ఉండేవారు కిడ్నీ పరీక్షలు చేయించుకోవాలి. సౌందర్య సాధనాల వల్ల కూడా కిడ్నీలు పాడయ్యే ప్రమాదం ఉంది. – శ్రీభూషణ్ రాజు, నెఫ్రాలజీ విభాగం అధిపతి, నిమ్స్ -
Fact Check: పచ్చ‘రోగం’ ముదిరింది
గురివింద రామోజీ అర్జంటుగా కళ్లద్దాలు మార్పించుకుంటే బావుంటుంది. చూపు మందగించడంతో రాష్ట్రంలో అభివృద్ధిని ఎటూ చూడలేకపోతున్న ఈ రాజగురువు ప్రజల రోగాలతో కూడా ఆడుకోవడం దుర్మార్గం. గత ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చి.. ఉద్దానం సమస్యకు పరిష్కారం చూపకపోతే పల్లెత్తు మాట అనని రామోజీ.. ఇప్పుడు కిడ్నీ పరిశోధన కేంద్రం, రీసెర్చ్ సెంటర్ అందరి కళ్లెదుటే అద్భుత పనితీరు కనబరుస్తున్నా కుళ్లుబోతు రాతలు రాస్తున్నారు. ఇదివరకెన్నడూ లేని విధంగా సీఎం వైఎస్ జగన్ ఏకంగా కిడ్నీ వ్యాధిపై యుద్ధమే ప్రకటించి, ఉద్దానంకు ఆరోగ్య భరోసా కల్పించడం పట్ల యావత్ ప్రపంచం ప్రశంసిస్తుంటే రామోజీ మాత్రం తప్పుడు కథనాలు వండివారుస్తున్నారు. దుర్మార్గానికి కూడా ఓ హద్దు ఉంటుంది. రామోజీ ఈ హద్దును కూడా దాటేసి చంద్రబాబు కోసం బరితెగించారు. ఈయన గారి పచ్చ రోగానికి త్వరలో ప్రజలే తగిన వైద్యం చేయడం ఖాయం. సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: చంద్రబాబు అధికారంలో ఉండగా ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేశాడు. కొన్ని దశాబ్ధాలుగా శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంత కిడ్నీ సమస్యకు శాశ్వత పరిష్కార మార్గం చూపడంలో పూర్తిగా విఫలం అయ్యారు. బాబుకు తొత్తుగా ఉన్న రామోజీరావుకు అప్పట్లో చీమ కుట్టినట్టు కూడా అనిపించలేదు. ప్రజాశ్రేయస్సు పట్ల కమిట్మెంట్ ఉన్న సీఎం జగన్ కేవలం నాలుగేళ్ల వ్యవధిలోనే ఉద్దానం ప్రాంత సమస్యకు శాశ్వత పరిష్కార మార్గం చూపారు. బాబు చేయలేనిది సీఎం జగన్ చేసి చూపించడంతో రామోజీరావుకు కన్నుకుట్టింది. దశాబ్ధాల సమస్యలను అనతికాలంలోనే పరిష్కరించిన సీఎం జగన్‌కు, వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి ప్రజల్లో ఆదరణ పెరిగి, టీడీపీ కనుమరుగు అవుతుందని భయం పట్టుకుంది. దీంతో తన ‘ఛీ’నాడులో ‘కిడ్నీ రోగం పిండేస్తోంది’ అంటూ మంగళవారం ఓ కట్టుకథను రామోజీ అల్లాడు. కిడ్నీ వ్యాధిగ్రస్తులను సీఎం జగన్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.. బాబే వాళ్లను ఉద్దరించాడంటూ సన్నాయి నొక్కుడు రాతలు రాసుకొచ్చారు. ఈ రాతలను చూసి ఉద్దానం ప్రాంత వాసులతో పాటు, రాష్ట్ర ప్రజలు పచ్చపత్రికను ఛీదరించుకుంటున్నారు. రాష్ట్రంలో కిడ్నీ బాధితులను నిర్లక్ష్యం చేసింది.. మీ బాబు కాదా రామోజీరావ్ అని ప్రశ్నిస్తున్నారు. కళ్లెదుటే ప్రాజెక్టులుంటే కబోది రాతలా.. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే ఉద్దానం కిడ్నీ సమస్యకు శాశ్వత పరిష్కార మార్గం చూపుతానని 2019 ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఆ హామీని నెరవేరుస్తూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక అడుగులు ముందుకు వేశారు. పలాసలో రూ. 85 కోట్లతో వైఎస్సార్ కిడ్నీ పరిశోధనా కేంద్రం, మరొకటి రూ. 700 కోట్లతో వైఎస్సార్ సుజలధార ప్రాజెక్టు. ఈ వ్యాధిపై పరిశోధనలు చేసేందుకు పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్, 200 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, డయాలసిస్ యూనిట్లు ఏర్పాటయ్యాయి. సుజలధార ప్రాజెక్ట్ ద్వారా కిడ్నీ ప్రభావిత పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల పరిధిలో 7 మండలాల్లోని 807 గ్రామాలకు రక్షిత నీటి సరఫరా చేపడుతున్నారు. 6.78 లక్షల జనాభా 2051 నాటికి 7.85 లక్షలకు చేరుతుందన్న అంచనాతో అప్పటి అవసరాలకు కూడా సరిపోయేలా ఒక్కొక్కరికి రోజుకు 100 లీటర్ల చొప్పున నీటి సరఫరా చేసేలా ప్రాజెక్టు నిర్మించారు. కిడ్నీ వ్యాధులపై పరిశోధనలు చేసేందుకు పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్, 200 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, డయాలసిస్ యూనిట్ల ఏర్పాటు చేశారు. విరివిగా కేంద్రాలు నెలకొల్పి.. ప్రస్తుతం టెక్కలి, పలాస, సోంపేట, కవిటి, హరిపురం ఆస్పత్రుల్లో డయాలసిస్ సెంటర్లు ఉన్నాయి. 63 మెషిన్లతో 68 పడకలపై డయాలసిస్ అందిస్తున్నారు. సోంపేట సీహెచ్‌సీ డయాలసిస్ సెంటర్లలో గతంలో 13 పడకలు ఉండేవి. ఇప్పుడవి 19కి పెరిగాయి. కవిటి సీహెచ్‌సీ డయాలసిస్ సెంటర్లలో గతంలో 10 పడకలు ఉండేవి. ఇప్పుడవి 15కి పెరిగాయి. హరిపురంలో కొత్తగా 10 పడకలతో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేశారు. కొత్తగా గోవిందపురం, అక్కుపల్లి, కంచిలి, బెలగాంలో డయాలసిస్ సెంటర్లు మంజూరయ్యాయి. ఇవికాకుండా రెండు కంటైన్డ్ బేస్డ్ సర్వీసెస్ డయాలసిస్ యూనిట్లను ఏర్పాటు చేశారు. టీడీపీ హయాంలో డయాలసిస్ రోగులకు 20 రకాల మందులే అందుబాటులో ఉండేవి. ఇప్పుడు 37రకాల మందులను అందుబాటులో ఉంచారు. రోగులకు వైద్య పరీక్షల కోసం సెమీ ఆటో ఎనలైజర్స్, ఎలక్ట్రోలైట్ ఎనలైజర్స్, యూరిన్ ఎనలైజర్స్‌ను ఉద్దానం పరిధిలో ఉన్న 29ల్యాబ్‌లలో అందుబాటులో ఉంచారు. టీడీపీ హయాంలో జిల్లా నెఫ్రాలజీ విభాగమే లేదు. ఈ ప్రభుత్వం వచ్చాక శ్రీకాకుళం జీజీహెచ్‌లో నెఫ్రాలజీ విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమించారు. పలాసలో కిడ్నీ ఆస్పత్రి నిర్మించాక స్పెషలిస్ట్‌లతో పాటు మొత్తంగా 17 మంది వైద్యులు, స్టాఫ్ నర్సులు 60 మంది, డీడీఏ స్టాఫ్ 50 మంది, సపోర్టింగ్ స్టాఫ్ 20 మంది సేవలు అందిస్తున్నారు. మొత్తం ఆస్పత్రిలో 195 పోస్టులు మంజూరుకాగా ప్రస్తుతం 127 పోస్టులను భర్తీ చేయడం జరిగింది. మిగతావి భర్తీ చేసే పనిలో ప్రభుత్వం నిమగ్నమైంది. క్రమం తప్పకుండా స్క్రీనింగ్ పరీక్షలు శ్రీకాకుళం జిల్లాలో ఉద్దాన ప్రాంతంలోని ఇచ్ఛాపురం, కవిటి, కంచిలి, సోంపేట, మందస, వజ్రపు కొత్తూరు, పలాస తదితర 7 మండలాలు, ఇచ్ఛాపురం, పలాస మున్సిపాలిటీల్లో మొత్తం 807 హేబిటేషన్ల పరిధిలో కిడ్నీ రోగులున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కచ్చితంగా స్క్రీనింగ్ క్రమం తప్పకుండా వైద్యారోగ్య శాఖ సిబ్బందితోనే నిర్వహిస్తున్నారు. ఈ ప్రాంతంలో ఉన్న మొత్తం 4,34,925 మంది జనాభాలో ఇప్పటివరకు 30,612 మందికి స్క్రీనింగ్ పూర్తి చేశారు. సీరమ్ క్రియాటిన్ సికెడి (క్రిటికల్ కిడ్నీ డిసీజ్) కేసులు సుమారుగా 3 వేల మందిని గుర్తించారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో నిర్వహించిన వైద్యశిబిరాల్లో సుమారు 49,021 మంది ఓపి చూపించుకున్నారు. ఇందులో ఇప్పటివరకు 474 మందిని సికెడి అనుమానితులుగా గుర్తించారు. 2018లో టీడీపీ హయాంలో ఉద్దాన ప్రాంతంలో కిడ్నీ రోగాలకు అసలైన కారణాల పరిశోధనకు అప్పటి ప్రభుత్వం జార్జి ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందంతో రూ.5 కోట్ల చెల్లింపునకు ఎంవోయు కుదుర్చుకుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మ్యాచింగ్ గ్రాంట్ నిధులు విడుదల చేసేందుకు అంగీకారం తెలిపింది. జాతీయ హెల్త్ మిషన్ ద్వారా రూ.2 కోట్లను విడుదల చేసింది. మిగిలిన నిధులు విడుదల చేయలేదు. ప్రభుత్వం మారిపోగా...కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ఎన్హెచ్ఎం నుంచి నిధులను సదరు జార్జి సంస్థకు పరిశోధనకై నిధులు కేటాయించేది లేదని స్పష్టం చేసింది. దీంతో మిగిలిన నిధులు ఆ సంస్థకు సర్దుబాటు కాలేదు. కొండూరు బాధితులకు కొండంత అండ ఎన్టీఆర్ జిల్లా కొండూరు ప్రాంత కిడ్నీ బాధితులకు ఈ ప్రభుత్వం పూర్తిగా అండగా నిలుస్తోంది. ఎ.కొండూరు, తిరువూరుల్లో కొత్తగా డయాలసిస్ సెంటర్లను నెలకొల్పింది. కొండూరు చుట్టుపక్కల తండాల్లో 30 ఏళ్లు పైబడిన వారందరికీ రక్త పరీక్షలను నిర్వహించి కిడ్నీ సమస్యలున్న వారిని గుర్తించింది. కిడ్నీ బాధితులకు రూ.వేల ఖరీదు చేసే మందులను ఉచితంగా సరఫరా చేస్తోంది. తిరువూరు, విజయవాడకు డయాలసిస్, ఇతర వైద్య సేవలు అవసరం ఉన్న కిడ్నీ బాధితులకు ఉచిత రవాణా కోసం ప్రత్యేకంగా ఓ అంబులెన్స్‌ను ఎ.కొండూరులో అందుబాటులో ఉంచింది. కిడ్నీ కేసులు నమోదు అవుతున్న గ్రామాలన్నింటికీ రక్షిత మంచినీటి ట్యాంకర్ల ద్వారా ప్రభుత్వం సరఫరా చేస్తోంది. ఉమ్మడి ప్రకాశం జిల్లా మార్కాపురం పరిసర ప్రాంతాల్లో కిడ్నీ బాధితులకు వైద్య సేవలను చేరువ చేయడంలో భాగంగా కొత్తగా ఏర్పాటు చేసిన మార్కాపురం బోధనాస్పత్రిలో యూరాలజీ, నెఫ్రాలజీ విభాగాలను ప్రభుత్వం మంజూరు చేసింది. పింఛన్ పెంచి.. బాసటగా నిలచి కిడ్నీ బాధితులకు గత ప్రభుత్వంలో రూ.2500 ఉన్న పింఛన్‌ను ఏకంగా రూ.10 వేలకు పెంచింది. . ప్రభుత్వం వ్యాధి తీవ్రత ఆధారంగా రెండు రకాలుగా పింఛన్లు అందజేస్తుస్తోంది. 5పైబడి సీరం క్రియేటినైన్ ఉన్న వారికి రూ.5వేలు, డయాలసిస్ రోగులకు రూ. 10వేల పింఛను ఇస్తున్నారు. ఈ లెక్కన ప్రస్తుతం 831మందికి రూ.10వేలు చొప్పున, 451 మందికి రూ.5వేలు ఇస్తున్నారు. ఈ రకంగా ఎంతమందికైనా మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇలా కిడ్నీ బాధితులకు ప్రతి అడుగులో ప్రభుత్వం అండగా నిలుస్తుంటే రామోజీ వాస్తవాలను వక్రీకరిస్తున్నారు. -
అవయవదానంతో ఇద్దరికి పునర్జన్మ
లబ్బీపేట(విజయవాడతూర్పు) : ఎన్టీఆర్ జిల్లా వెల్వడం గ్రామానికి చెందిన లక్ష్మమ్మ బ్రెయిన్ డెడ్‌కు గురికాగా.. ఆమె కుటుంబ సభ్యులు అవయవదానం చేసి ఇద్దరికి పునర్జన్మనిచ్చినట్టు అమెరికన్ కిడ్నీ ఇన్స్టిట్యూట్ వైద్యులు తెలిపారు. ఈ నెల 11న అవయవదానం చేయగా.. మూడేళ్లు, నాలుగేళ్లుగా డయాలసిస్ చేయించుకుంటూ జీవనం సాగిస్తున్న ఇద్దరికి, దాత నుంచి సేకరించిన కిడ్నీలను ట్రాన్స్‌ప్లాంట్ చేసినట్లు డాక్టర్ విట్టల్, డాక్టర్ స్వప్న తెలి పారు. ఆస్పత్రి ప్రాంగణంలో గురువారం వారు మీడియాతో మాట్లాడుతూ ఒకే రోజు ఏకకాలంలో రెండు కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు చేయడం అరుదైన ఘటనగా చెప్పారు. యూరాలజిస్టులు డాక్టర్ ప్రశాంత్‌కుమార్, డాక్టర్ ధీరజ్, డాక్టర్ మురళీకృష్ణ పాల్గొన్నారు. -
నెదర్లాండ్స్‌లో కిడ్నీ మార్పిడికే ప్రాధాన్యత
లక్డీకాపూల్: తమ దేశంలో కిడ్నీ బాధితులకు ఎక్కువ కాలం డయాలసిస్ చేయమని.. కిడ్నీ మార్పిడికే ప్రాధాన్యత ఇస్తామని నెదర్లాండ్స్ ఆరోగ్య, సంక్షేమ, క్రీడల శాఖ మంత్రి ప్రొఫెసర్ ఎర్నెస్ట్ కైపర్స్ తెలిపారు. తెలంగాణలోని వైద్య సేవలను అధ్యయనం చేసేందుకు వచ్చిన ఆయన గురువారం నిమ్స్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలోని లివర్ డయాలసిస్, మెడికల్ ఆంకాలజీ, యూరాలజీ విభాగాలను పరిశీలించి రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. స్క్రీనింగ్ కేన్సర్, మామోగ్రామ్, రొమ్ము కేన్సర్, సర్వైకల్ కేన్సర్‌కు అందిస్తున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నిమ్స్ లెర్నింగ్ సెంటర్లో నిమ్స్ వైద్యులతో ఏర్పాటు చేసిన ఇంటరాక్టివ్ సెషన్లో పాల్గొన్న కైపర్స్... నెదర్లాండ్స్‌లోని వైద్య సేవల తీరును వివరించారు. అత్యవసర చికిత్స అవసరమయ్యే రోగులను తమ దేశంలో హెలికాప్టర్లలో ఆస్పత్రికి తరలిస్తామని చెప్పారు. కోవిడ్ తర్వాత ఎదురవుతున్న పరిణామాల నేపథ్యంలో నిమ్స్‌తో కలసి ఓ వ్యాక్సిన్ రూపొందించాలన్న యోచనలో ఉన్నట్లు కైపర్స్ తెలిపారు. అలాగే వైద్యవిద్యపై ఎక్సే్ఛంజ్ ప్రోగ్రాం చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. బ్యాక్టీరియా, యాంటీబయోటెక్ డ్రగ్స్‌పై పరిశోధనలకు నిమ్స్‌తో ఒప్పందం చేసుకున్నట్లు కైపర్స్ వివరించారు. తెలంగాణలో వైద్య సేవలు బాగున్నాయి.. రాష్ట్రంలో అమలు చేస్తున్న ఆరోగ్య పథకాలు బాగున్నాయని నెదర్లాండ్స్ మంత్రి ఎర్నెస్ట్ కైపర్స్ ప్రశంసించారు. తెలంగాణలో పదేళ్ల కాలంలో మాతాశిశు మరణాల సంఖ్యను గణనీయంగా తగ్గించడం గొప్ప విషయమని... అందుకే తెలంగాణ వైద్యపరంగా నీతి అయోగ్ లెక్కల ప్రకారం 11 స్థానం నుంచి 3వ స్ధానానికి చేరిందన్నారు. కాగా, రాష్ట్రంలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లోనే ట్రామా సెంటర్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం యోచిస్తోందని నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ నగరి బీరప్ప తెలిపారు. 50 పడకలతో కూడిన ఈ సెంటర్లలో అన్ని రకాల అత్యవసర వైద్యసేవలను అందించేలా చర్యలు తీసుకుంటోందన్నారు. నెదర్లాండ్స్ మంత్రి కైపర్స్, ఆ దేశ ప్రతినిధి బృందాన్ని ఆయన ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో నిమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ ప్రొఫెసర్ నిమ్మ సత్యనారాయణ, డీన్ డాక్టర్ లిజా రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డికి పుత్రశోకం
పటాన్చెరు టౌన్: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ఇంట్లో విషాదం నెలకొంది. ఎమ్మెల్యే పెద్ద కుమారుడు విష్ణువర్ధన్‌రెడ్డి(35) గురువారం అనారోగ్యంతో మృతిచెందారు. మూడురోజుల క్రితం గచ్చిబౌలి కాంటినెంటల్ ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతుండగా కామెర్లు సోకాయి. వైద్యులు డయాలసిస్ కూడా చేశారు. వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తుండగా పరిస్థితి విషమించి తెల్లవారుజామున గుండెపోటుతో మరణించారు. సమాచారం తెలుసుకున్న మంత్రులు హరీశ్‌రావు, దయాకర్‌రావు ఆస్పత్రికి చేరుకొని ఎమ్మెల్యే కుటుంబాన్ని పరామర్శించారు. సాయంత్రం ఇక్కడ నిర్వహించిన అంత్యక్రియల్లో మంత్రులు మహమూద్ అలీ, హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు భూపాల్‌రెడ్డి, క్రాంతికిరణ్, మదన్‌రెడ్డి, మాణిక్‌రావు, జగ్గారెడ్డి, కలెక్టర్ శరత్, ఎస్పీ రమణకుమార్, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు వెన్నవరం భూపాల్‌రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, వంటేరు ప్రతాప్‌రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, సత్యనారాయణ పాల్గొన్నారు. -
రెండు కిడ్నీలు పాడై ఆస్పత్రికి వెళ్లలేని స్థితిలో నటుడు!
'ప్రముఖ దర్శకుడు, దాదాసాహెబ్ ఫాల్కే గ్రహీత శ్యామ్ బెనగల్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. అతడి రెండు కిడ్నీలు పాడైపోవడంతో నటుడు ఇంట్లోనే డయాలసిస్ చేయించుకుంటున్నారు. కనీసం ఆస్పత్రికి వెళ్లడానికి కూడా ఆయన శరీరం సహకరించడం లేదు' అంటూ రెండు రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వైరల్‌గా మారాయి. తాజాగా దీనిపై శ్యామ్ బెనగల్ కూతురు పియా స్పందించింది. అదంతా అసత్య ప్రచారమేనని కొట్టిపారేసింది. ఆయన బాగానే ఉన్నారని, కాకపోతే కొంత బ్రేక్ తీసుకుని ఆఫీసుకు వెళ్లడం లేదని చెప్పుకొచ్చింది. ఆ మాత్రం దానికే కిడ్నీలు పాడయ్యాయని, డయాలసిస్ అని రాసేయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించింది. కాగా 88 ఏళ్ల వయసున్న శ్యామ్ బెనగల్.. అంకుర్, నిషాంత్, మంతన్, భూమిక, జుబేదా, వెల్కమ్ టు సజ్జన్‌పూర్ వంటి చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఈయన నంది, ఫిలిం ఫేర్ అవార్డులతో పాటు 18 జాతీయ అవార్డులు గెలుచుకున్నారు. శ్యామ్ బెనగల్ చిత్రపరిశ్రమకు చేసిన సేవలకుగానూ భారత ప్రభుత్వం 2005లో ఆయనను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో సత్కరించింది. 1976లో పద్మ శ్రీ అవార్డు అందజేసింది. శ్యామ్ బెనగల్‌కు సొంతంగా సహ్యాద్రి ఫిలింస్ అనే నిర్మాణ సంస్థ కూడా ఉంది. తను తీసిన సినిమాల ఆధారంగా ద చర్నింగ్ విత్ విజయ్ టెండుల్కర్, సత్యజిత్ రే, ద మార్కెట్‌ప్లేస్ అనే మూడు పుస్తకాలు రాశారు. అంతేకాకుండా బంగ్లాదేశ్ మొదటి ప్రధాని షైక్ ముజ్బర్ రెహమాన్ జీవిత కథ ఆధారంగా ముజీబ్: ద మేకింగ్ ఆఫ్ ఎ నేషన్ అనే సినిమా తెరకెక్కించే పనిలో ఉన్నారు. -
ఈ రోజే బతుకుతాను.. ఈ ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియదు
భవిష్యత్తు గురించి ఆలోచించనివారుండరు. రాబోయే రోజులు, వచ్చే ఏడాది, ఇంకో పదేళ్లపాటు.. రేపటి ఆనందకర జీవనం కోసం ఆశపడుతూనే ఉంటారు. కానీ, హైదరాబాద్ హిమాయత్‌నగర్‌లో ఉంటున్న ఐలా మమతను కలిస్తే ఈ రోజుకున్న విలువ ఏంటో తెలుస్తుంది. రెండు కిడ్నీలు చెడిపోయి, 22 ఏళ్లుగా డయాలసిస్ మీద ఆధారపడి జీవిస్తున్నారు మమత. కష్టాలను అధిగమిస్తూ సొంతంగా మ్యాగజీన్ నడుపుతూ, కిడ్నీ రోగులకు మానసిక స్థైర్యం ఇస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ‘మీ నవ్వు చాలా బాగుందండి’ అని పలకరిస్తే.. రేపటి నవ్వు కూడా ఈ రోజే నవ్వేస్తాను. ఈ రోజును ఆనందంగా బతకడానికి ప్రయత్నిస్తాను’ అన్నారు. ‘ఇన్నేళ్లు కష్టాలన్నీ ఒక్కోటి అధిగమిస్తూ వచ్చాను. కానీ, ఇప్పుడు డయాలసిస్ చేయించుకోవడానికి కూడా ఆర్థికంగా లేక.. ఈ రోజు బతికితే చాలు అనుకుంటున్నాను’ అంటూ నవ్వు వెనకాల దాచుకున్న ఒక్కో వాస్తవాన్ని ఇలా కళ్లకు కట్టారు మమత. ‘‘నన్ను చూసి ఎవరు పలకరించినా ముందు నవ్వేస్తాను. ‘ఇంతబాధలోనూ నవ్వుతూ ఉంటావు’ అంటారు. కష్టం మరింత పరీక్ష పెట్టడానికే వస్తుందేమో అనిపిస్తుంటుంది. 22 ఏళ్ల క్రితం బాబు పుట్టినప్పుడు డెలివరీ తర్వాత యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది. ఆ ఇన్ఫెక్షన్ పాకి, రెండు కిడ్నీలూ చెడిపోయాయి. దీంతో రెండు కిడ్నీలను తొలగించారు. అప్పటినుంచి డయాలసిస్ తప్పనిసరైంది. మా వారికి ఉద్యోగం లేదు. ఊళ్లో ఉన్న తన తల్లిదండ్రులని చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇటు నా ఆరోగ్యపరిస్థితి ఏ మాత్రం బాగాలేదు. అమ్మ వెన్నుదన్నుగా ఉండటంతో బిడ్డ పెంపకం భారంగా అనిపించలేదు. రాత మార్చుకున్నాను.. ఆర్థికంగా ఏమీ లేదు. ఆరోగ్యమూ లేదు. నా స్థితిని అప్పటి కలెక్టర్‌కు చెప్పాను. నా మాటతీరు చూసి, పుస్తకాలు రాయమన్నాడు. అలా ‘భారతీయ సంస్కృతి’ పేరుతో మ్యాగజీన్ పెట్టుకొని, ప్రకటనలు తెచ్చుకొని నాకంటూ ఓ చిన్న లోకాన్ని ఏర్పరుచుకున్నాను. పత్రిక ద్వారా నలుగురికి సాయం చేయగలిగాను. వారంలో మూడు రోజులు డయాలసిస్. నెలకు సరిపడా చేతినిండా పని. ఈ సమయంలోనే నాలాంటి డయాలసిస్ పేషెంట్ల కోసం ఓ ఎన్జీవోను ఏర్పాటు చేశాను. కిడ్నీ రోగులకు అవగాహన కార్యక్రమాల ఏర్పాటుతో పాటు, కౌన్సిలింగ్ ఇచ్చాను. ప్రభుత్వంతో పోరాడి, వేలాది మందికి ఉచిత డయాలసిస్ అవకాశం వచ్చేలా చేశాను. మారిన రాత.. కరోనా టైమ్‌లో శారీరకంగా చాలా దెబ్బతిన్నాను. అసలే డయాలసిస్ పేషెంట్‌ను. దీనికితోడు కరోనా సోకింది. మ్యాగజీన్ ఆగిపోయింది. ఎన్జీవోలోని సభ్యులు కరోనా బారినపడి చాలామంది చనిపోయారు. సపోర్ట్‌గా ఉందనుకున్న అమ్మ మరణం... మానసికంగా బాగా కుంగిపోయాను. దీంతో చాలా ఒంటరిగా అనిపించింది. దాని నుంచి కోలుకుంటానన్న నమ్మకం కూడా కొన్నిరోజులపాటు లేదు. మా అబ్బాయి ‘ఎంతోమందికి కౌన్సెలింగ్ ఇచ్చావు. నువ్వు ఇలా ఉంటే ఎలా..’ అని ధైర్యం ఇచ్చాడు. మా అబ్బాయి ఫిల్మ్‌మేకింగ్ లో కోర్సు చేస్తున్నాడు. ఇంకా వాడి జీవితం సెట్ అవ్వాల్సి ఉంది. ప్రాణం నిలబడాలంటే.. మ్యాగజీన్ నడిపించాలన్నా, చేపట్టిన ఆర్గనైజేషన్‌ను ముందుకుతీసుకువెళ్లాలన్నా మళ్లీ సున్నా నుంచి జీవితం మొదలుపెట్టాను. ఈ ఉగాదికి మ్యాగజీన్‌ను మళ్లీ ప్రారంభించాను. కానీ, ఆర్థిక లేమి కారణంగా నడపలేకపోతున్నాను. అంతకుముందున్న శక్తి ఇప్పుడు ఉండటం లేదు. హిమోగ్లోబిన్ సడెన్‌గా పడిపోతోంది. ఇన్నేళ్లుగా డయాలసిస్ వల్ల శరీరంలో అకస్మాత్తు గా మార్పులు వస్తుంటాయి. డయాలసిస్‌కు డబ్బుల్లేక ఎప్పుడు మానేస్తానో, ఈ ప్రాణం ఎప్పుడు పోతుందో.. తెలియదు. నా కొడుకు జీవితం ఏం అవుతుందో అని మనసులో ఆందోళనగా ఉంటుంది. ఎవరైనా సాయం అందిస్తే, ఇంకొంతమందికి నా పని ద్వారా సాయం అందించగలను’’ అని వివరించారు మమత. నిన్నటి వరకు రేపటి గురించిన ఆలోచన లేకున్నా గుండెధైర్యంతో నిలదొక్కుకున్న మమత నేటి జీవనం కోసం చిరునవ్వు వెనుక దాగున్న విషాదాన్ని పరిచయం చేశారు. సాయమందించే మనసులు ఆమె చిరునవ్వును కాపాడతాయని ఆశిద్దాం. – నిర్మలారెడ్డి -
హైబ్రిడ్ మూత్రపిండంతో డయాలసిస్‌కు గుడ్‌బై?
కాలిఫోర్నియా: మూత్రపిండాల సమస్యలున్న వారు తరచూ కృత్రిమ పద్ధతులతో శరీరంలోని మలినాలను తొలగించుకుంటారనే సంగతి మనకు తెలిసిందే. డయాలసిస్‌కి త్వరలోనే గుడ్‌బై చెప్పే అవకాశం ఉంది. కాలిఫోర్నియా వర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేస్తున్న కృత్రిమ కిడ్నీలు త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది మరి. సిలికాన్ ఫిల్టర్‌తోపాటు సజీవమైన రీనల్ కణాలతో కూడిన ఈ హైబ్రిడ్ కిడ్నీ నమూనా ఇప్పటికే సిద్ధమైంది. తొలి ప్రయోగాలు విజయవంతమయ్యాయి కూడా. కిడ్నీ వ్యవస్థకు అనుసంధానించి.. శరీరంలోనే ఉంచేయగల తక్కువ సైజులో ఉంటుంది ఈ హైబ్రిడ్ కిడ్నీ. ఒకసారి అమర్చుకుంటే చాలు. బ్యాటరీల అవసరమూ లేకుండా మన రక్తం ప్రవహించే ఒత్తిడితోనే దాంట్లోని మలినాలను తొలగిస్తుంది. శరీరం ఈ మూత్రపిండాన్ని తిరస్కరించకుండా ఉంచేందుకు మందులేవీ వాడాల్సిన అవసరం లేదు. ద కిడ్నీ ప్రాజెక్ట్ పేరుతో కాలిఫోర్నియా వర్సిటీ వారు చేస్తున్న ఈ ప్రయత్నాల ఫలితంగా అరచేతిలో ఇమిడిపోయేంత చిన్న సైజు యంత్రం తయారైంది. కంప్యూటర్ చిప్‌ల తయారీలో ఉపయోగించే సిలికాన్ సాయంతో అతిసూక్ష్మమైన రంధ్రాలున్న ఫిల్టర్‌ను తయారు చేశారు. పలుచటి ఈ సిలికాన్ ఫిల్టర్ పొరలు ఒకవైపు.. రక్తంలో ఉండాల్సిన నీరు, ఇతర లవణాలను నియంత్రించే రీనల్ ట్యూబుల్ సెల్స్‌తో కూడిన బయో రియాక్టర్ ఇంకోవైపు ఉంటాయి ఈ హైబ్రిడ్ కిడ్నీలో. రోగి తాలూకూ రోగ నిరోధక వ్యవస్థ ఈ కణాలపై దాడి చేసే అవకాశం లేకుండా తగిన రక్షణ ఏర్పాట్లు కూడా ఉన్నాయి. గతంలో ఈ రెండు భాగాలను విడివిడిగా పరీక్షించి సత్ఫలితాలు సాధించిన శాస్త్రవేత్తలు తాజాగా రెండింటినీ కలిపి పరిశోధనశాలలో పరీక్షించారు. శరీరంలోని రెండు ప్రధాన ధమనులకు ఈ హైబ్రిడ్ మూత్రపిండాన్ని అనుసంధానిస్తారు. శుద్ధి చేయాల్సిన రక్తం ఒక గొట్టం గుండా దీంట్లోకి ప్రవేశిస్తుంది. శుద్ధి చేసిన రక్తాన్ని మళ్లీ ఇంకో ధమని ద్వారా శరీరంలోకి చేరుతుంది. వ్యర్థాలన్నింటినీ మూత్రాశయానికి మళ్లిస్తుంది. కాలిఫోరి్నయా వర్సిటీ శాస్త్రవేత్తల ఈ ప్రయత్నాలను మరింత విస్తృత స్థాయిలో చేపట్టేందుకు, తద్వారా సమర్థమైన కృత్రిమ మూత్రపిండాన్ని తయారు చేసేందుకు ‘కిడ్నీ–ఎక్స్’ప్రాజెక్టు ద్వారా ఇప్పటికే దాదాపు రూ.5 కోట్ల నిధులు కూడా అందాయి. -
మధుమేహం.. మాత్రల వ్యామోహం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మధుమేహం చాపకింద నీరులా విస్తరిస్తోంది. రాష్ట్రంలో వినియోగమవుతున్న మందులే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. రాష్ట్రంలో అన్ని మందుల కంటే ఎక్కువగా షుగర్ మందులే వినియోగమవుతున్నాయి. పది నెలల కాలంలో 17.72 కోట్ల మెట్ఫార్మిన్ మాత్రలు కొనుగోలు చేసి ఆస్పత్రులకు పంపించారు. ఇందులో రమారమి 15 కోట్లు పైనే గడిచిన పదినెలల్లో వినియోగమయ్యాయి. ఇవి ప్రభుత్వ ఆస్పత్రుల్లో వినియోగమైనవి మాత్రమే. ఇక ప్రైవేటు ఆస్పత్రులు, మెడికల్ షాపులకు వెళ్లి తీసుకున్న వారూ ఉన్నారు. 30 ఏళ్లు దాటిన వారిలో రాష్ట్రంలో కోటికి పైనే మధుమేహ బాధితులు ఉన్నట్టు తాజా అంచనా. ఇటీవలి కాలంలో 35 ఏళ్లు దాటిన వారూ ఎక్కువగా మధుమేహం బారిన పడుతున్నారు. ఈ ప్రమాదాన్ని తప్పించుకునేందుకు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కొన్ని పట్టణాల్లో 30 శాతం మధుమేహ బాధితులు ఉన్నట్టు తాజా గణాంకాలు చెబుతున్నాయి. బాబోయ్ పెయిన్ కిల్లర్స్! విధిలేని పరిస్థితుల్లో మినహాయిస్తే నొప్పి నివారిణ మందులు వాడకూడదు. కానీ పెయిన్ కిల్లర్స్‌కు మెజారిటీ జనం అలవాటు పడ్డారు. చిన్న చిన్న నొప్పి వచ్చినా డైక్లోఫినాక్ వంటి పెయిన్ కిల్లర్స్ వేసుకుంటున్నారు. వయసుతో పాటు వచ్చే మోకాళ్ల నొప్పులు భరించలేక చాలామంది రోజూ ఒక డైక్లొఫినాక్ మాత్ర వేసుకోవడం పరిపాటిగా మారింది. ఇలా పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడటం వల్ల కిడ్నీ జబ్బులకు గురవుతున్నారు. గడిచిన పది నెలల్లో మన రాష్ట్రంలో దాదాపు 14 కోట్ల డైక్లొఫినాక్ మాత్రలు వినియోగమయ్యాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. జ్వరాల మాత్రలంటే సాధారణమే. ఇవి ఎప్పుడూ వినియోగంలో మొదటి, రెండో స్థానాల్లో ఉంటున్నాయి. ఈసారికూడా అంతే. జీవనశైలి జబ్బుల్లో ప్రధానమైన రక్తపోటు (బీపీ) మాత్రల వినియోగమూ ఎక్కువే. ఆమ్లొడిపైన్ 5 ఎంజీ ఒక్కటే 9.64 కోట్ల మాత్రలు కొన్నారు. ఇలా ఎక్కువ వినియోగం అయిన మాత్రల్లో జీవనశైలి జబ్బులకు సంబంధించినవే ఉన్నాయి. వ్యాయామం లేకపోవడం వల్లనే.. పట్టణాల్లోనే కాదు పల్లెల్లోనూ శారీరక శ్రమ తగ్గిపోతోంది. చాలామంది చిన్న వయసులోనే మధుమేహం బారినపడుతున్నారు. దీంతో పాటు చాలామంది ఒత్తిడిలో ఉండటం కారణమే. కోవిడ్ వచ్చి పోయాక మానసిక స్థితి సరిగా లేకపోవడం, ఎక్కువ స్టెరాయిడ్స్ వాడి శాశ్వత మధుమేహంలోకి నెట్టడం జరిగింది. శారీరక శ్రమ అన్నిటికంటే ముఖ్యం. యువత మధుమేహం బారిన పడకుండా ఉండాలంటే ఒత్తిడి లేకుండా ఉండాలి. వ్యాయామం చేయాలి. – డాక్టర్ రాంబాబు, డైరెక్టర్, విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ -
ఐ ఫోన్ కోసం కిడ్నీ అమ్మాడు, చివరికి..
ఆపిల్ ఫోన్ కొనాలన్నది మిడిల్ క్లాస్‌కు నెరవేరని కల. ఆపిల్ కొత్త మోడల్ రిలీజ్ అయినప్పుడల్లా కిడ్నీ అమ్మైనా సరే ఆ ఫోన్ కొనాలని చాలా మంది జనాలు సోషల్ మీడియాలో జోకులు పేలుస్తుంటారు. కానీ ఓ వ్యక్తి మాత్రం నిజంగానే కిడ్నీ అమ్మి ఐ ఫోన్ కొన్నాడు. ఫలితంగా ఇప్పుడు మంచాన పడి మూల్యం చెల్లించుకుంటున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. చైనాకు చెందిన 17 ఏళ్ల వాంగ్ షాంగ్కన్కు ఆపిల్ ఫోన్ కొనాలని పిచ్చి. కానీ తన దగ్గర అంత మొత్తంలో డబ్బు లేకపోవడంతో మూత్రపిండాన్ని అమ్మేయాలనుకున్నాడు. అనుకున్నట్లుగానే బ్లాక్ మార్కెట్లో కుడివైపు కిడ్నీని అమ్మేశాడు. (చదవండి: 'ఆనందం' ఎక్కడ దొరుకుతుంది? ఇదిగో..) వచ్చిన సొమ్ముతో ఆపిల్ ఐపాడ్, ఐ ఫోన్ 4 కొన్నాడు. 2011లో జరిగిందీ ఘటన. కానీ కొంతకాలానికే అతని మరో కిడ్నీకి సమస్య ఏర్పడింది. ఇప్పుడది పెద్దదవడంతో అతడి స్థితి మరింత దీనంగా తయారైంది. అవయవాలు సక్రమంగా పని చేయకపోవడంతో ఆస్పత్రి పాలయ్యాడు. అతడికి తరచూ డయాలసిస్ చేస్తున్నారు. ఇక జీవితాంతం అతడు బెడ్‌కే పరిమితం కావాలని వైద్యులు చెప్పారు. కాగా బ్లాక్ మార్కెట్లో కిడ్నీ కొనుగోలు చేసిన విషయంలో ఐదుగురు సర్జన్లతో కలిపి తొమ్మిది మందిని పోలీసులు కటకటాల వెనక్కు నెట్టారు. (చదవండి: వైరల్: కోతుల్ని తరిమి కొట్టండి: సీటు గెలవండి!) -
కిడ్నీ జబ్బును గుర్తించే ‘యాప్’
సాక్షి, న్యూఢిల్లీ : బ్రిటన్‌లో కిడ్నీ సమస్యలతో ఏటా ఏకంగా లక్షమంది మరణిస్తున్నారు. అక్కడ ఆస్పత్రుల్లో చేరుతున్న రోగుల్లో ప్రతి ఐదుగురుల్లో ఒకరు కిడ్నీ సమస్యతో బాధ పడుతున్న వారేనని, సకాలంలో వారి సమస్యను గుర్తించక పోవడం వల్లనే ఎక్కువ మంది మరణిస్తున్నారని లండన్‌లోని రాయల్ ఫ్రీ ఆస్పత్రికి చెందిన వైద్య నిపుణలు తెలియజేస్తున్నారు. సకాలంలో గుర్తించినట్లయితే డయాలసిస్ లేదా కిడ్నీ ఆపరేషన్ల వరకు వెళ్లకుండా రోగులను రక్షించే అవకాశం ఉంటుందని వారంటున్నారు. సకాలంలో వైద్యులు జబ్బును గుర్తిస్తే మరణిస్తున్న ప్రతి ముగ్గురు రోగుల్లో ఒక్కరిని రక్షించవచ్చని అంటున్నారు. వైద్యుల ఆకాంక్షను సాకారం చేస్తూ గూగుల్ కంపెనీ ‘అక్యూట్ కిడ్నీ ఇంజూరి’ని 14 నిమిషాల్లో గుర్తించే విధంగా ఓ మొబైల్ యాప్‌ను తీసుకొచ్చింది. ‘స్ట్రీమ్స్’గా పిలిచే ఈ యాప్‌ను ‘గూగుల్స్ డీప్‌మైండ్’గాను అభివర్ణిస్తున్నారు. కిడ్నీ రోగిని గుర్తించడంలో ప్రతి రోగికి ఈ యాప్ ద్వారా రెండు లక్షల రూపాయల ఖర్చు కూడా తగ్గుతుందని ‘నేచర్ డిజిటల్ మెడిసిన్’ పత్రిక తాజా సంచిక వెల్లడించింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతిక విజ్ఞాన పద్ధతుల ద్వారా రోగుల్లో 87.6 శాతం ఎమర్జెన్సీ కేసులను గుర్తించగలుగుతుంటే గూగుల్ యాప్ ద్వారా 96.7 ఎమర్జెన్సీ కేసులను గుర్తించ గలుగుతున్నారట. ఆస్పత్రుల్లో ఉంటే ఐటీ టెక్నాలజీని ఉపయోగించి ఓ రోగికి సంబంధించిన సమస్త డేటాను ఈ యాప్ సేకరిస్తుంది. గుండె కొట్టుకునే రేటు, రక్తపోటు, రక్త పరీక్షల వివరాలు సేకరించి ఒక చోట నమోదు చేస్తుంది. రోగి రక్తంలో ‘క్రియాటినిన్’ ఎక్కువ మోతాదులో ఉన్నట్లయితే సదరు వైద్యుడికి వెంటనే సందేశం పంపిస్తుంది. ఈ ‘స్ట్రీమ్స్’ యాప్ ఫలితాలు అద్భుతంగా ఉన్నాయని రాయల్ ఫ్రీ ఆస్పత్రి చీఫ్ మెడికల్ ఆఫీసర్, డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డాక్టర్ క్రిస్ స్ట్రీతర్ తెలియజేశారు. -
బ్లడ్ గ్రూపులు కలవకపోయినా కిడ్నీ మార్పిడికి అవకాశం ఉందా?
నా వయసు 40 ఏళ్లు. టీచర్‌గా పనిచేస్తున్నాను. నాకు మూత్రపిండాల సమస్య ఉంది. రెండేళ్లుగా డయాలసిస్ చేయించుకుంటున్నాను. కిడ్నీ మార్పిడి చేయించుకోవడం మంచిదని తెలిసిన వాళ్లు చెబుతున్నారు. కిడ్నీ మార్పిడి తర్వాత కూడా డయాలసిస్ చేయించుకోవాల్సి వస్తుందా? మా కుటుంబ సభ్యులు నాకు కిడ్నీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ వారిలో ఎవరితో నా బ్లడ్‌గ్రూపు కలవడం లేదు. నాకు కిడ్నీ మార్పిడి చేయించుకునే అవకాశం ఉందా? దయచేసి నా సమస్యకు పరిష్కారం చూపగలరు. కిడ్నీలు పూర్తిగా పాడై డయాలసిస్‌పై ఆధారపడుతున్నా వారికి కిడ్నీ మార్పిడి ఉత్తమమైన మార్గం. మీరు రెండు పద్ధతుల ద్వారా కిడ్నీ మార్పిడి చేయించుకోవచ్చు. ఒకటి స్వాప్ ట్రాన్స్‌ప్లాంటేషన్. రెండోది ఏబీఓ ఇన్కంపాటబుల్ ట్రాన్స్‌ప్లాంటేషన్. స్వాప్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌లో మీలాంటి సమస్యతోనే బాధపడుతున్న మరొకరు ఉంటే... వారి కుటుంబ సభ్యులతో మీ బ్లడ్ మ్యాచ్ అయితే... వారి కుటుంబసభ్యులు మీకూ... మీ కుటుంబ సభ్యులు వారికీ... ఇలా దాతలను పరస్పరం మార్చుకొని... ఇరువురు బాధితులూ కిడ్నీలు పొంది, కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేయించుకోవచ్చు. అయితే ఇప్పుడు అత్యాధునికమైన ఏబీఓ ఇన్కంపాటబుల్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అందుబాటులోకి వచ్చింది. దాని వల్ల బ్లడ్‌గ్రూపు కలవకపోయినా కిడ్నీ మార్పిడి చేయించుకునే అవకాశం ఉంది. ఈ ప్రక్రియలో ప్రత్యేకమైన ప్లాస్మాఫెరాసిస్ పద్ధతిని అనుసరించి వేర్వేరు బ్లడ్గ్రూపులలోని యాంటీజెన్‌ను కలిసేలా చేస్తారు.ఏబీఓ ఇనకంపాటబుల్ ట్రాన్స్‌ప్లాంటేషన్ విధానంలో కిడ్నీ మార్పిడి చేసుకున్నవారు కూడా కంపాటబుల్ కిడ్నీ మార్పిడి మాదిరిగానే మెరుగైన ఫలితాలు పొందుతున్నారు. కిడ్నీ మార్పిడి తర్వాత డయాలసిస్‌పై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. మీరు సాధారణ జీవితం గడపగలుగుతారు. కాళ్లవాపులు వస్తున్నాయి... ఇది కిడ్నీ సమస్యా? నా వయసు 54 ఏళ్లు. రెండేళ్లుగా డయాబెటిస్ ఉంది. దాన్ని అదుపులో ఉంచుకోవడం కోసం కొంతకాలంగా మందులు వాడుతూ, ఇన్సులిన్ కూడా తీసుకుంటున్నాను. ఇటీవల నాకు కాళ్లలో వాపు వస్తోంది. దాంతోపాటు మూత్రవిసర్జనలో తీవ్ర ఇబ్బంది కలుగుతోంది. డయాబెటిస్ ఉండే కాళ్లవాపు వస్తుందా? ఈ లక్షణాలతో నాకు తీవ్ర అసౌకర్యంగా ఉంటోంది. ఇది కిడ్నీ సమస్యకు సూచన కావచ్చా? దాంతో సరిగా ఉద్యోగం చేయలేకపోతున్నాను. దయచేసి నా సమస్యకు సరైన పరిష్కారం చూపించగలరు. మీరు తెలిపిన లక్షణాలను బట్టి మీకు కిడ్నీ సంబంధిత సమస్య ఉన్నట్లు తెలుస్తోంది. డయాబెటిస్ వ్యాధిగ్రస్తుల్లో కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీకు కాళ్ల వాపులతో పాటు ముఖం వాచినట్లు ఉండటం, ఆకలి మందగించడం, నీరసంగా ఉండటం, ముఖ్యంగా రాత్రివేళల్లో ఎక్కువసార్లు మూత్రం రావడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయేమో చూసుకోండి. ఈ లక్షణాలు ఉంటే ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యలను సంప్రదించి, వారు సూచించిన పరీక్షలు చేయించుకొని వ్యాధిని నిర్ధారణ చేసుకోండి. ఒకవేళ మీకు కిడ్నీ సమస్య ఉన్నట్లు నిర్ధారణ అయినా ఆందోళన చెందకండి. ప్రస్తుతం కిడ్నీ సమస్యలకు మంచి మందులు, అత్యాధునిక వైద్య ప్రక్రియలు అందుబాటులో ఉన్నాయి. కీడ్నీ సమస్యలను ప్రాథమిక దశలో గుర్తించి సకాలంలో చికిత్స అందిస్తే మెరుగైన ఫలితాలు పొందగలుగుతారు. మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉద్యోగం చేయగలగడంతో పాటు సాధారణ జీవితం గడపగలుగుతారు. ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేస్తూ, వైద్యులను సంప్రదించడంలో ఆలస్యం చేస్తే సమస్య తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటికీ మీకు డయాబెటిస్ ఉన్నందున మీరు సాధ్యమైనంతవరకు ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి. జంక్‌ఫుడ్, ఫాస్ట్ఫుడ్స్, నూనె పదార్థాలకు సాధ్యమైనంత దూరంగా ఉండండి. మీ ఎత్తుకు తగిన విధంగా మీ శరీర బరువు ఉండేలా చూసుకోండి. దాంతోపాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ, తాజా ఆకుకూరలు, పండ్లు ఎక్కువగా తీసుకోవడం మంచిది. హాస్పిటల్లో డయాలసిస్ బదులుగా ప్రత్యామ్నాయం ఏదైనా ఉందా? నా వయసు 53 ఏళ్లు. టైప్–2 డయాబెటిస్తో బాధపడుతున్న నాకు రెండు మూత్రపిండాలూ పాడైపోయాయి. చాలాకాలంగా డయాలసిస్ చేయించుకుంటున్నాను. అయితే ప్రతిసారీ డయాలసిస్ కోసం ఆస్పత్రికి వెళ్లిరావడం ఇబ్బందిగా ఉంటోంది. దీనికి ప్రత్యామ్నాయ పద్ధతి ఉందని ఇటీవలే తెలిసింది. దాని గురించి వివరించండి. ఆస్పత్రి లేదా నర్సింగ్‌హోమ్‌లలో నిర్వహించే డయాలసిస్‌ను హీమోడయాలసిస్ అంటారు. ఇది చాలా సాధారణమైన ప్రక్రియ. అత్యధికులు అనుసరించేది కూడా ఇదే. అయితే మీరు రెగ్యులర్‌గా డయాలసిస్ కోసం ఆస్పత్రికి రావడానికి ఇబ్బందిగా ఉన్నందున, ఇంటి దగ్గర మీరే స్వయంగా, మీ కుటుంబ సభ్యుల సహాయంతో డయాలసిస్ చేసుకునే మరో ప్రక్రియ కూడా ఉంది. ఇదే పెరిటోనియల్ డయాలసిస్. దీన్ని ఇంటిదగ్గర, ఆఫీసులో, ప్రయాణాల్లో స్వయంగా చేసుకోవచ్చు. అయితే ఇంటి దగ్గర డయాలసిస్ చేసుకోగల నేర్పు, ఓర్పు పేషెంట్‌కు ఉండాలి. లేదా దీనిని చేయగలవారు ఇంట్లో అందుబాటులో ఉండాలి. పెరిటోనియల్ డయాలసిస్ ద్వారా కడుపు లోపల అంటే ఉదర కుహరంలో ఆవరించిన పొరలలో ఉండే రక్తనాళాల్లోకి డయాలసేట్ అనే ద్రవాన్ని నింపుతూ ఎప్పటికప్పుడు రక్తంలో వ్యర్థాలను బయటకు తీయవచ్చు. రక్తన్ని శుద్ధి చేసే ద్రవాన్ని కేథెటర్ ద్వారా కడుపులోకి పంపిస్తారు. ఈ ద్రవం నిర్ణీతకాలం వరకు కడుపులో ఉంటుంది. ఈ సమయంలో రక్తంలోని వ్యర్థాలు, రసాయనాలు, ద్రవాలు... కడుపులోపలి పొరను అంటిపెట్టుకుని ఉండే రక్తనాళాల నుంచి బయటకు వచ్చి డయాలసిస్ ద్రవంలో కలుస్తాయి. నిర్ణీత సమయం తర్వాత వ్యర్థాలు కలిసిన ద్రవం పేషెంట్ శరీరం వెలుపల అమర్చిన సంచిలోకి డ్రెయిన్ అవుతుంది. కడుపులోకి ద్రవాన్ని పంపడం, కొంతసేపటి తర్వాత దాన్ని బయటకు తీయడం ప్రక్రియను ఎక్స్ఛేంజ్ అంటారు. రాత్రివేళ పేషెంట్ నిద్రించే సమయంలో కూడా డయాలసిస్ చేసుకోవచ్చు. ఇందుకోసం ఆటోమేటెడ్ సైక్లర్‌ను వినియోగిస్తారు. ఈ సైక్లర్ తనంతట తానుగా డయాలసిస్ ద్రవాన్ని కడుపులోపలికి పంపించడం, నిర్ణీత వ్యవధి తర్వాత దాన్ని బయటకు డ్రెయిన్ చేయడం వంటి విధులు నిర్వహిస్తుంది. దీని వల్ల ఉదయం నిద్రలేచిన వెంటనే బ్యాగులో చేరిన వ్యర్థ ద్రవాన్ని ఖాళీ చేయవచ్చు. డా. ఎమ్. దిలీప్‌బాబు,సీనియర్ నెఫ్రాలజిస్ట్ అండ్ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ ఫిజీషియన్, యశోద హాస్పిటల్స్,సోమాజిగూడ, హైదరాబాద్ -
మా బాబు ముఖం ఉబ్బుతోంది...తగ్గేదెలా?
మా బాబు వయసు తొమ్మిదేళ్లు. ఆరేళ్ల వయసు ఉన్నప్పుడు ముఖం, కాళ్లు వాపు వచ్చాయి. యూరిన్‌లో ప్రోటీన్స్ పోయాయనీ, నెఫ్రోటిక్ సిండ్రోమ్ అని చెప్పి చికిత్స చేశారు. నెలరోజులు మందులు వాడిన తర్వాత యూరిన్‌లో ప్రోటీన్ పోవడం తగ్గింది. మందులు ఆపేశాము. మళ్లీ 15 రోజుల తర్వాత యూరిన్‌లో మళ్లీ ప్రోటీన్లు పోవడం ప్రారంభమైంది. మళ్లీ మందులు వాడితే ప్రోటీన్లు పోవడం తగ్గింది. మందులు వాడినప్పుడల్లా తగ్గి, ఆపేయగానీ యూరిన్‌లో మళ్లీ ప్రోటీన్లు పోతున్నాయి. అయితే ఎక్కువకాలం మందులు వాడితే కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం ఉందా అని ఆందోళనగా ఉంది. వాటివల్ల ఏవైనా సైడ్ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలూ ఉన్నాయా? నెఫ్రోటిక్ సిండ్రోమ్ ఉన్నప్పుడు మొదటిసారి పూర్తిగా మూడు నెలల పాటు డాక్టర్ పర్యవేక్షణలో మందులు వాడాలి. కొంతమంది పిల్లల్లో మందులు మానేయగానే మళ్లీ ప్రోటీన్ పోవడం ప్రారంభమవుతుంది. ఇలాంటి పిల్లల్లో తక్కువ మోతాదులో మందులను ఆర్నెల్ల నుంచి తొమ్మిది నెలల పాటు వాడాల్సి ఉంటుంది. కొంతమందిలో సైడ్ఎఫెక్ట్స్ కనిపించే అవకాశం ఉంటుంది. అప్పుడు వేరే మందులు వాడాల్సి ఉంటుంది. చాలామంది పిల్లల్లో ఈ వ్యాధి 12–14 సంవత్సరాల వయసప్పుడు పూర్తిగా నయమవుతుంది. కిడ్నీలు దెబ్బతినే అవకాశం చాలా తక్కువ. మీరు ఆందోళన పడకుండా డాక్టర్ పర్యవేక్షణలో మందులు వాడండి. తరతూ మూత్రంలో మంట... ఎలా తగ్గుతుంది? నా వయసు 36 ఏళ్లు. తరచూ జ్వరం వస్తోంది. మూత్రవిసర్జన సమయంలో మంటతో బాధపడుతున్నాను. మందులు వాడినప్పుడు తగ్గుతోంది. నెలలోపు మళ్లీ జ్వరం వస్తోంది. ఇలా పదే పదే జ్వరం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మీరు తరచూ జ్వరం, మూత్రంలో ఇన్ఫెక్షన్తో బాధపడుతుంటే, అది మళ్లీ మళ్లీ రావడానికి గల కారణాలు ఏమిటో ముందుగా నిర్ధారణ చేసుకోవాలి. షుగర్ ఉంటే కూడా ఇలా కొన్ని సందర్భాల్లో కావచ్చు. ఒకసారి షుగర్ పరీక్ష చేయించుకోండి. అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకొని మూత్రవిసర్జన వ్యవస్థలో ఎక్కడైనా రాళ్లు ఉన్నాయేమో చూడాలి. యాంటీబయాటిక్స్ పూర్తి కోర్సు వాడకపోతే కూడా ఇన్ఫెక్షన్స్ ఇలా తిరగబెడతాయి. ఒకవేళ యాంటీబయాటిక్స్ పూర్తికోర్సు వాడకపోతే డాక్టర్ చెప్పిన మోతాదులో మూడు నెలల పాటు అవి వాడాలి. ఇన్ఫెక్షన్స్ తరచూ తిరగబెట్టకుండా ఉండాలంటే ఎక్కువగా నీళ్లు (రోజూ రెండు నుంచి మూడు లీటర్లు) తాగుతుండాలి. మూత్రవిసర్జనను ఆపుకోకూడదు. ఒకసారి మీరు డాక్టర్‌కు చూపించుకోండి. మూత్రం ఎర్రగా వస్తోంది? భవిష్యత్తులో సమస్యా? నాకు 34 ఏళ్లు. అప్పుడప్పుడూ మూత్రం ఎర్రగా వస్తోంది. గత ఐదేళ్ల నుంచి ఇలా జరుగుతోంది. రెండు మూడు రోజుల తర్వాత తగ్గిపోతోంది. నొప్పి ఏమీ లేదు. ఇలా రావడం వల్ల భవిష్యత్తులో ఏదైనా సమస్య వస్తుందా? కిడ్నీలు దెబ్బతినే అవకాశం ఉందా? మీరు చెప్పినట్లుగా మూత్రంలో రక్తం చాలాసార్లు పోతుంటే... ఎందువల్ల ఇలా జరుగుతోంది అనే విషయాన్ని తెలుసుకోవాలి. దానికి తగినట్లుగా చికిత్స తీసుకోవాలి. ఇలా మాటిమాటికీ మూత్రంలో రక్తస్రావం అవుతుండటానికి కిడ్నీలో రాళ్లు ఉండటం, ఇన్ఫెక్షన్ ఉండటం, కిడ్నీ సమస్య లేదా మరేదైనా కిడ్నీ సమస్య (గ్లోమెరూలో నెఫ్రైటిస్ వంటిది) ఉండవచ్చు. మీరు ఒకసారి అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకోండి. మూత్రపరీ„ కూడా చేయించుకోవాలి. కిడ్నీలో రాళ్లుగానీ, ఇన్ఫెక్షన్ గానీ లేకుండా ఇలా రక్తం వస్తుంటే మూత్రంలో ప్రోటీన్ పోతుందేమోనని కూడా చూడాలి. కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ కూడా చేయించుకోవాలి. ఒకవేళ రక్తంతో పాటు ప్రోటీన్ కూడా పోతుంటే కిడ్నీ బయాప్సీ కూడా చేయించుకోవాల్సి ఉంటుంది. కిడ్నీలు దెబ్బతినకుండా ఉండేందుకు మందులు వాడాల్సి ఉంటుంది. డయాలసిస్ తర్వాత చర్మంపై దురద... ఏం చేయాలి? నా వయసు 42 ఏళ్లు. ఒక ఏడాదిగా క్రమం తప్పకుండా డయాలసిస్ చేయించుకుంటున్నాను. నాకు ఈమధ్య విపరీతంగా చర్మం దురద పెడుతోంది. ఎందుకిలా జరుగుతోంది? దురద రాకుండా ఉండటానికి ఏం చేయాలి? డయాలసిస్ చేయించుకునే పేషెంట్స్‌లో చర్మం పొడిగా అవుతుంది. అంతేకాకుండా వాళ్ల రక్తంలో ఫాస్ఫరస్ ఎక్కువగా ఉండటంవల్ల కూడా దురద ఎక్కువగా వస్తుంటుంది. చర్మం పొడిగా ఉన్నవాళ్లు స్నానం తర్వాత చర్మంపై వాజిలేన్ లేదా మాయిశ్చరైజర్ రాసుకోవాలి. రక్తంలో ఫాస్పరస్ తగ్గించే మందులు తీసుకోవడంతో పాటు ఆహారంలో పాల ఉత్పాదనలు, మాంసాహారం తీసుకోవడం తగ్గించాలి. రక్తహీనత ఉన్నవాళ్తు రక్తం పెరగడానికి మందులు వాడాలి. డాక్టర్ విక్రాంత్‌రెడ్డి, కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ -
కాళ్లలో వాపు... నురగలుగా మూత్రం!
నా వయసు 45 ఏళ్లు. నేను వృత్తిరీత్యా ఎప్పుడూ ప్రయాణాల్లోనే ఉంటాను. ఇప్పటివరకు నాకెలాంటి ఆరోగ్య సమస్యా రాలేదు. కానీ గత రెండు మూడు నెలల నుంచి దూరప్రయాణాలు చేసి వచ్చిన తర్వాత నా రెండు కాళ్లు వాస్తున్నాయి. మూత్రం కూడా బాగా నురగతో వస్తోంది. అంతేకాకుండా రాత్రిళ్లు ఎక్కువగా మూత్రం వస్తోంది. ఇలా ఎందుకు జరుగుతోంది? దయచేసి సలహా ఇవ్వండి. మూత్రపిండాల సమస్యలో ఐదు దశలు ఉంటాయి. మొదటి దశ, రెండో దశలో అసలు వ్యాధి లక్షణాలు కనిపించవు. మూడో దశలో ఆకలి మందగించడం, నీరసం, ముఖం వాచినట్లుగా ఉండటం, కాళ్లలో వాపు రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. నాలుగో దశ, ఐదో దశలో కన్ను చుట్టూ వాపు రావడం, జబ్బు ఎక్కువవుతున్న కొద్దీ వాపు ఎక్కువవుతుండటం, మూత్రం తగ్గిపోవడం, ఫిట్స్ రావడం, కొన్ని సందర్భాల్లో నడుము నొప్పి రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇక ఐదో దశ వచ్చేసరికి కిడ్నీ పనితీరు బాగా తగ్గిపోతుంది. దురదృష్టవశాత్తు చాలామందిలో వ్యాధి ఈ దశకు చేరుకున్న తర్వాతనే వైద్యులను సంప్రదిస్తున్నారు. వ్యాధి ఐదో దశకు చేరిన తర్వాత మళ్లీ దానిని సాధారణ స్థితికి తీసుకురాలేము. అందువల్ల క్రమం తప్పకుండా వైద్యులను సంప్రదిస్తూ చికిత్స కొనసాగించడం ఒక్కటే మార్గం. అయితే మీరు చెబుతున్న లక్షణాలను బట్టి చూస్తుంటే మీ కిడ్నీలో ఏవో అసాధారణ మార్పులు చోటుచేసుకుంటున్నాయని చెప్పవచ్చు. కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారిలో మీరు చెప్పిన లక్షణాలు కనిపిస్తాయి. కాబట్టి మీరు ఏమాత్రం ఆలస్యం చేయకుండా నిపుణులైన వైద్యులను సంప్రదించండి. మీకు తగిన పరీక్షలు నిర్వహించి చికిత్స చేస్తారు. ఆలస్యం చేయకూడదు. గుండెజబ్బులాగా కిడ్నీ సంబంధిత వ్యాధులకు కూడా సమయమే అత్యంత కీలకం. వ్యాధి మొదటి దశలో ఉంటే మీకు సులువుగా చికిత్స నిర్వహించే అవకాశం ఉంది. అలాగే మీ కిడ్నీ కూడా పదిలంగా ఉంటుంది. అలా కాకుండా పరీక్షలలో ఏదైనా సివియారిటీ కనిపిస్తే కూడా మీరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. అందుబాటులోకి వచ్చిన నూతన వైద్య ప్రక్రియలతో మీ కిడ్నీ సంబంధిత వ్యాధులను సమూలంగా పరిష్కరించే అవకాశం ఉంది. ఇంట్లోనే డయాలసిస్ చేసుకోవచ్చా? నా వయసు 52 ఏళ్లు. టైప్–2 డయాబెటిస్ కారణంగా నా రెండు మూత్రపిండాలూ పాడైపోయాయి. చాలాకాలంగా డయాలసిస్ చేయించుకుంటున్నాను. అయితే ప్రతిసారీ డయాలసిస్ కోసం ఆస్పత్రికి వెళ్లిరావడం ఇబ్బందిగా ఉంటోంది. ఇంట్లోనే డయాలసిస్ చేసుకునేందుకు అవకాశం ఉందా? దయచేసి వివరంగా చెప్పండి. ఆస్పత్రి లేదా నర్సింగ్‌హోమ్‌లలో నిర్వహించే డయాలసిస్‌ను హీమోడయాలసిస్ అంటారు. ఇది చాలా సాధారణమైన ప్రక్రియ. అత్యధికులు అనుసరించేది కూడా ఇదే. అయితే మీరు రెగ్యులర్‌గా డయాలసిస్ కోసం ఆస్పత్రికి రావడానికి ఇబ్బందిగా ఉన్నందున, ఇంటి దగ్గర మీరే స్వయంగా, మీ కుటుంబ సభ్యుల సహాయంతో డయాలసిస్ చేసుకునే మరో ప్రక్రియ కూడా ఉంది. ఇదే పెరిటోనియల్ డయాలసిస్. దీన్ని ఇంటిదగ్గర, ఆఫీసులో, ప్రయాణాల్లో స్వయంగా చేసుకోవచ్చు. అయితే ఇంటి దగ్గర డయాలసిస్ చేసుకోగల నేర్పు, ఓర్పు పేషెంట్‌కు ఉండాలి. లేదా దీనిని చేయగలవారు ఇంట్లో అందుబాటులో ఉండాలి. పెరిటోనియల్ డయాలసిస్ ద్వారా కడుపు లోపల అంటే ఉదర కుహరంలో ఆవరించిన పొరలలో ఉండే రక్తనాళాల్లోకి డయాలసేట్ అనే ద్రవాన్ని నింపుతూ ఎప్పటికప్పుడు రక్తంలో వ్యర్థాలను బయటకు తీయవచ్చు. రక్తాన్ని శుద్ధి చేసే ద్రవాన్ని కేథెటర్ ద్వారా కడుపులోకి పంపిస్తారు. ఈ ద్రవం నిర్ణీతకాలం వరకు కడుపులో ఉంటుంది. ఈ సమయంలో రక్తంలోని వ్యర్థాలు, రసాయనాలు, ద్రవాలు... కడుపులోపలి పొరను అంటిపెట్టుకుని ఉండే రక్తనాళాల నుంచి బయటకు వచ్చి డయాలసిస్ ద్రవంలో కలుస్తాయి. నిర్ణీత సమయం తర్వాత వ్యర్థాలు కలిసిన ద్రవం పేషెంట్ శరీరం వెలుపల అమర్చిన సంచిలోకి డ్రెయిన్ అవుతుంది. కడుపులోకి ద్రవాన్ని పంపడం, కొంతసేపటి తర్వాత దాన్ని బయటకు తీయడం ప్రక్రియను ఎక్సే ్చంజ్ అంటారు. రాత్రివేళ పేషెంట్ నిద్రించే సమయంలో కూడా డయాలసిస్ చేసుకోవచ్చు. ఇందుకోసం ఆటోమేటెడ్ సైక్లర్‌ను వినియోగిస్తారు. ఈ సైక్లర్ తనంతట తానుగా డయాలసిస్ ద్రవాన్ని కడుపులోపలికి పంపించడం, నిర్ణీత వ్యవధి తర్వాత దాన్ని బయటకు డ్రెయిన్ చేయడం వంటి విధులు నిర్వహిస్తుంది. దీని వల్ల ఉదయం నిద్రలేచిన వెంటనే బ్యాగులో చేరిన వ్యర్థ ద్రవాన్ని ఖాళీ చేయవచ్చు. బ్లడ్ గ్రూపులు కలవడం లేదు... కిడ్నీ మార్పిడి ఎలా? మా అమ్మగారి వయసు 69 ఏళ్లు. కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. రోజు విడిచి రోజు హీమోడయాలసిస్ అందిస్తున్నాము. కానీ ఆమె తన వయసు రీత్యా దాన్ని తట్టుకోలేకపోతోంది. చాలా వేదన అనుభవిస్తోంది. మాలో ఎవరైనా కిడ్నీని దానం చేద్దాం అనుకున్నాం గానీ బ్లడ్‌గ్రూపు కలవడం లేదు. ఇప్పుడు మేమేం చేయాలి? మా అమ్మగారి వేదనను తొలగించడానికి తగిన పరిష్కారం చూపండి. కిడ్నీ వంద శాతం పాడైపోయినప్పుడు మాత్రమే కిడ్నీ మార్పిడి ద్వారా రోగిని రక్షిస్తారు. అయితే ఇది అందరి విషయంలోనూ సాధ్యం కాదు. దీనికి దాత అవసరమవుతారు. లైవ్ డోనార్ (బతికి ఉన్న వారి నుంచి కిడ్నీ సేకరించడం), కెడావర్ డోనార్ (చనిపోయిన వ్యక్తి నుంచి కిడ్నీని సేకరించడం) అని రెండు రకాల దాతల నుంచి కిడ్నీని సేకరిస్తారు. లైవ్ డోనార్స్ విషయంలో రక్తసంబంధీకులు మాత్రమే కిడ్నీని దానం చేయాలి. అంతేగాక వీరి బ్లడ్ గ్రూపు కిడ్నీని పొందే వ్యక్తి బ్లడ్ గ్రూపుతో కలవాల్సి ఉంటుంది. కిడ్నీ దానం చేసేవారికి అధిక రక్తపోటు, మధుమేహం, గుండెజబ్బులు, మెదడు జబ్బులు, కాలేయవ్యాధులైన హెపటైటిస్–బి, సి ఉండకూడదు. దాత ఒక కిడ్నీ దానం చేయడం వల్ల ఎలాంటి నష్టం లేదని నిర్ధారణ చేశాకే కిడ్నీ మార్పిడి చేస్తారు. రక్తసంబంధీకుల బ్లడ్ గ్రూపులు కలవకపోతే రెండు మార్గాలు ఉన్నాయి. మొదటిది... స్వాప్ రీనల్ ట్రాన్స్‌ప్లాంటేషన్, రెండోది ఏబీఓ ఇన్కంపాటబుల్ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్. స్వాప్ రీనల్ ట్రాన్స్‌ప్లాంటేషన్... తమ రక్త సంబంధీకులకు కిడ్నీ దానం చేయాలని ఉన్నాగానీ బ్లడ్ గ్రూపులు కలవకపోవడం వల్ల అది సాధ్యపడనప్పుడు... అదే సమస్యతో బాధపడుతున్న వేరొకరి రక్త సంబంధీకులలో బ్లడ్ గ్రూపు సరిపడిందనుకోండి. ఇలా ఒకరి రక్తసంబంధీకులకు మరొకరు పరస్పరం కిడ్నీలు దానం చేసుకునే ప్రక్రియను స్వాప్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అంటారు. ఈ విధానంలో వీరి కిడ్నీని వారి బంధువుకూ, వారి కిడ్నీని వీరి బంధువుకు అమర్చే ఏర్పాటు చేస్తారు. వీరిద్దరికీ ఒకేసారి కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స జరుగుతుంది. బ్లడ్ గ్రూపులు కలవకపోయినా కిడ్నీ మార్పిడి చేయవచ్చు... అందివస్తున్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, వైద్యులలో పెరుగుతున్న నైపుణ్యాల వల్ల ప్రస్తుతం బ్లడ్‌గ్రూపులు కలవకపోయినా కిడ్నీ మార్పిడి చేయడం వీలవుతుంది. దీనికి కొన్ని ప్రత్యేకమైన పద్ధతులు అనుసరించాల్సి ఉంటుంది. కొన్ని ప్రత్యేకమైన మందులను ఉపయోగించాల్సి ఉంటుంది. బ్లడ్‌గ్రూపు సరిపడకపోయినప్పటికీ ఈ విధానంలో చేసిన కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు కూడా... కంపాటబుల్ కిడ్నీ మార్పిడి సర్జరీల మాదిరిగానే విజయవంతం అవుతున్నాయి. కాబట్టి మీరు మీ అమ్మగారికి తగిన విధానాన్ని అనుసరించేందుకు ఉపయుక్తమైన మార్గాలను తెలుసుకునేందుకు ఒకసారి అత్యంత ఆధునిక వైద్య సదుపాయాలు ఉన్నచోట, నిపుణులైన వైద్యులను సంప్రదించి తగిన సూచనలు తీసుకోండి. డాక్టర్ ఎ. శశి కిరణ్, సీనియర్ నెఫ్రాలజిస్ట్ అండ్ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ ఫిజీషియన్, యశోద హాస్పిటల్స్, మలక్‌పేట్, హైదరాబాద్ -
సూట్‌కేసులో డయాలసిస్ కేంద్రం...
‘స్పర్థయా వర్ధతే విద్య’ అని సామెత. పోటీ ఉంటేనే రాణింపు అని దీని అర్థం. హైదరాబాద్ వేదికగా 15 ఏళ్లుగా ఏటా జరుగుతున్న బయో ఆసియా సదస్సులోనూ ఇదే జరుగుతోంది. జీవశాస్త్ర రంగంలో వినూత్న ఆవిష్కరణలకు ఊతమిచ్చేందుకు సదస్సు నిర్వాహకులు ఏర్పాటు చేసిన పోటీలో అనేక స్టార్టప్ కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తూంటాయి. రెండు రోజుల క్రితమే ముగిసిన 16వ బయో ఆసియా సదస్సులో పదుల సంఖ్యలో స్టార్టప్‌లు పాల్గొనగా.. వాటిలో కీలకమైన, ఆసక్తికరమైన టెక్నాలజీలు, ఆవిష్కరణలు ఇలా ఉన్నాయి... కిడ్నీలు పూర్తిగా దెబ్బతిన్న వారు తరచూ డయాలసిస్ చేయించుకోవాల్సి ఉంటుందని మనకు తెలుసు. ఈ కేంద్రాలు తక్కువగా ఉండటం, ఒకసారి ట్రీట్మెంట్కు బోలెడంత సమయం పడుతూండటం, ఖర్చులు ఎక్కువగా ఉండటం వల్ల రోగులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారన్న వార్తలు మనం తరచూ వింటూనే ఉంటాం. ఈ నేపథ్యంలో చెన్నైకు చెందిన పద్మసీతా టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ చిన్న సూట్‌కేసులోనే ఇమిడిపోయే డయాలసిస్ యంత్రాన్ని సిద్ధం చేసింది. అయితే ఇది పూర్తిస్థాయి డయాలసిస్‌కు ప్రత్యామ్నాయం కాదని, పెరిటోనియల్ డయాలసిస్ మాత్రమే చేస్తుందని సంస్థ నిర్వాహకుడు గౌరీశంకర్ తెలిపారు. కిడ్నీ సక్రమంగా పనిచేయనివారికి ముందుగా ఈ రకమైన డయాలసిస్ చేస్తారని, పూర్తిస్థాయిలో దెబ్బతిన్న తరువాత మాత్రమే హీమో డయాలసిస్ అవసరమైనప్పటికీ మరోమార్గం లేక డాక్టర్లు రెండో రకం డయాలసిస్ చేయించుకోవాల్సిందిగా సూచిస్తూంటారని ఆయన వివరించారు. నెలకు పదివేల రూపాయల కంటే తక్కువ ఖర్చుతో ఈ యంత్రాన్ని వాడుకోవచ్చునని, రక్తశుద్ధికి వాడే రసాయనాలు తక్కువగా ఉండటమే కాకుండా, మళ్లీమళ్లీ వాడుకునే అవకాశం ఉండటం విశేషమని చెప్పారు. స్మార్ట్‌ఫోన్ యాప్ సాయంతో దీన్ని ఎక్కడి నుంచైనా పనిచేయించవచ్చునని, రోగి తన శరీరానికి అమర్చిన గొట్టంలోకి యంత్రం నుంచి వచ్చే గొట్టాన్ని కలుపుకుంటే చాలని చెప్పారు. సంప్రదాయ డయాలసిస్ యంత్రాలతో పోలిస్తే పదో వంతు తక్కువ ఖరీదు చేసే ఈ యంత్రాలను పీహెచ్‌సీలతోపాటు చిన్న చిన్న వైద్య కేంద్రాల్లోనూ వాడుకోవచ్చునని చెప్పారు. వరి పొట్టుతో ఐదు ఉప ఉత్పత్తులు... వరిపొట్టుతో కనీసం ఐదు ఉత్పత్తులను సిద్ధం చేసేందుకు ఒడిషాకు చెందిన ప్రో బయోకెమ్ ఇండియా ఓ వినూత్న టెక్నాలజీని అభివృద్ధి చేసింది. ధాన్యం మర పట్టిన తరువాత మిగిలే తవుడుతో నూనెలు చేసుకుంటాం. మిగులును దాణాగా వాడుతూంటాం. వరిపొట్టు విషయానికి వచ్చేసరికి ఇలాంటి ఆప్షన్లు ఏవీ లేవు. వృథాగా కాల్చేయాల్సిందే. ఇప్పటివరకూ ఉన్న ఈ అంచనాలను మార్చేసింది ప్రో బయోకెమ్ ఇండియా. వరి పొట్టును కొన్ని ప్రత్యేకమైన రసాయనాలతో కలిపి, ప్రాసెస్ చేసి అనేక ఉపయోగకరమైన పదార్థాలను తయారు చేయవచ్చునని వీరు నిరూపించారు. ఈ ఉప ఉత్పత్తుల్లో మైక్రో క్రిస్టలీన్ సెల్యులోజ్, సిలికాజెల్, ఆల్ఫా సెల్యూలోజ్ పోషకాలతో కూడిన ఉప్పు, చిట్టచివరిగా ప్లైవుడ్ లాంటి ఫైబర్ బోర్డులు ఉన్నాయి. వీటన్నింటికీ వేర్వేరు చోట్ల ఉపయోగాలు ఉన్నాయని, రైతుకు అదనపు ఆదాయం అందివ్వడంతోపాటు పర్యావరణానికి మేలు చేసే ఈ టెక్నాలజీని ఇతర వ్యవసాయ వ్యర్థాలకూ మళ్లించవచ్చునని ప్రో బయోకెమ్ సీఈవో మహమ్మద్ గులేబహార్ షేక్ తెలిపారు. అరచేతిలో ఈసీజీ... ఫొటోలో కనిపిస్తున బుల్లి గాడ్జెట్ పేరు సంకేత్ లైఫ్. గుండె పనితీరును గమనించేందుకు ఆసుపత్రుల్లో వాడే ఈసీజీకి సూక్ష్మరూపం అన్నమాట. ఈసీజీతో మంచి ఫలితాలు రావాలంటే దాదాపు 12 తీగలను ఛాతీలోని వేర్వేరు భాగాలకు అతికించాల్సి ఉంటుంది. సంకేత్ లైఫ్‌తో ఆ అవసరం లేదు. గాడ్జెట్ పైన కనిపిస్తున్న రెండు సూక్ష్మ రంధ్రాలపై చేతి బొటనవేళ్లు రెండూ ఉంచితే చాలు... ఎంచక్కా ఈసీజీ రీడింగ్ స్మార్ట్‌ఫోన్ యాప్‌లో వచ్చేస్తుంది. ఒకవేళ పూర్తిస్థాయి 12 లీడ్‌ల ఈసీజీ కావాలన్నా దీని ద్వారా తీసుకోవచ్చు. సంప్రదాయ ఈసీజీలతో పోలిస్తే సంకేత్ లైఫ్ ఈసీజీ రీడింగ్స్ 96 శాతం వరకూ కచ్చితత్వంతో ఉంటాయట. ఈసీజీ కోసం ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకోవచ్చు. -
రెండు కిడ్నీలు చెడిపోయాయి.. ట్రాన్స్‌ప్లాంటేషన్ వివరాలు చెప్పండి
కిడ్నీ కౌన్సెలింగ్స్ మావారి వయసు 36 ఏళ్లు. సాఫ్ట్వేర్ కంపెనీలో సీనియర్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. మా కుటుంబంలో వంశపారంపర్యంగా షుగర్ వ్యాధి ఉంది. గత ఐదేళ్లుగా విదేశాల్లోనే ఉండి పనిచేసి, ఇటీవలే స్వదేశం వచ్చారు. విదేశాల్లో ఉన్నప్పుడు ఫాస్ట్‌ఫుడ్, కూల్‌డ్రింక్స్ ఎక్కువగా తీసుకునేవారు. మద్యం, సిగరెట్ల అలవాటు కూడా ఉంది. ఈమధ్య హఠాత్తుగా ఆరోగ్యం చెడిపోతే డాక్టర్‌కు చూపించాం. రెండు కిడ్నీలు చెడిపోయాయని చెప్పారు. వారానికి మూడు, నాలుగు సార్లు డయాలసిస్ చేయించుకోవాలి. ట్రాన్స్‌ఫ్లాంటేషన్ అవసరమని చెప్పారు. మూత్రపిండాల మార్పిడి ఎలా చేస్తారు? కిడ్నీ ఎవరు ఇవ్వవచ్చు? దయచేసి వివరంగా తెలపండి. – కె. సింహాచలం, విశాఖపట్నం మన శరీరంలోని అత్యంత కీలకమైన అవయవాల్లో మూత్రపిండాలు కూడా చాలా ప్రధానమైనవి. ఇవి మన శరీరంలోని రక్తాన్ని శుద్ధిచేసి, అనవసర, ప్రమాదకర, విసర్జన పదార్థాలను నీటితో కలిపి బయటకు పంపిస్తుంటాయి. కిడ్నీలకు తీవ్రమైన వ్యాధులు సోకినప్పుడు అవ రక్తాన్ని శుద్ధి చేయలేవు. మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధుల్లో ప్రాథమిక దశలో నొప్పిగానీ, స్పష్టమైన వ్యాధి లక్షణాలేమీ కనిపించవు. దాంతో కీలకమైన ఈ అవయవాలకు వ్యాధి సోకినట్లు గుర్తించడలంలో చాలా ఆలస్యం అవుతుంది. కానీ కిడ్నీ వ్యాధుల గుర్తింపులో సమయం చాలా కీలకం. ఆలస్యం అవుతున్నకొద్దీ వ్యాధి మరింత ముదిరి చివరకు అది రీనల్ ఫెయిల్యూరుకు దారితీస్తుంది. దాంతో మూత్రపిండం తిరిగి సాధారణ స్థితికి చేరుకోవడం చాలా సందర్భాల్లో అసాధ్యం అవుతుంది. ఆ పరిస్థితిలో మూత్రపిండాల మార్పిడి (కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్) తప్ప మరో మార్గం లేని పరిస్థితి ఏర్పడుతుంది. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు దాత అవసరం. దాత నుంచి కిడ్నీ పొందడానికి ప్రభుత్వ నిర్వహణలో ఉండే ‘జీవన్‌దాన్’లో పేరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. దాత లభించేలోగా డయాలసిస్‌పై ఆధారపడటమే మార్గం. డయాలసిస్‌లో రక్తంలోని మలినాలు, అదనపు నీటిని తొలగించివేస్తారు. డయాలసిస్‌లో రెండు రకాలు ఉన్నాయి. మొదటిది హీమోడయాలసిస్, రెండోది పెరిటోనియల్ డయాలసిస్. హీమోడయాలసిస్ కోసం ఆసుపత్రికి వెళ్లాల్సి ఉంటుంది. పెరిటోనియల్ డయాలసిస్ ఇంటిదగ్గరే చేసుకోడానికి వీలవుతుంది. ప్రపంచంలోని చాలా దేశాల్లో లాగే మన దేశంలోనూ కిడ్నీ దాతల సంఖ్య చాలా తక్కువగా ఉంటున్నది. అందువల్ల వ్యాధిగ్రస్తుడి పరిస్థితిని బట్టి తొందరగా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స అవసరమైనప్పుడు కుటుంబసభ్యులు, రక్తసంబంధీకుల్లో ఎవరైనా దానం చేయవచ్చు. దాతల ఆరోగ్యం, రక్తం గ్రూపు తదితర అంశాలను పరిశీలించి డాక్టర్లు సరైన దాతను నిర్ణయిస్తారు. కిడ్నీ వ్యాధుల చికిత్సతో పాటు మూత్రపిండాల మార్పిడికి అవసరమైన పూర్తిస్థాయి సదుపాయాలు, వైద్యనిపుణులు ఇప్పుడు హైదరాబాద్‌లో కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ శస్త్రచికిత్సలో సక్సెస్‌రేటు 95 శాతం వరకు ఉండి, దాదాపు అన్నీ విజయవంతమవుతూ అనేక మందికి మంచి ఆయుర్దాయాన్ని ఇస్తున్నాయి. శస్త్రచికిత్స తర్వాత దాదాపు 10, 15 ఏళ్ల వరకు దాదాపు ఎలాంటి సమస్యలూ ఎదురుకాకుండా జాగ్రత్తలు తీసుకోడానికి వీలవుతుంది. మీవారి విషయంలో వ్యాధి నిర్ధారణ జరిగిందంటున్నారు కాబట్టి ఇక మీరు ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీ డాక్టర్ల సూచన మేరకు చికిత్స చేయించండి. డాక్టర్ ఎ. శశికిరణ్, సీనియర్ నెఫ్రాలజిస్ట్ అండ్ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ ఫిజీషియన్, యశోద హాస్పిటల్స్, మలక్‌పేట్, హైదరాబాద్ -
తెలుగు రాష్ట్రాల్లో మరో 30 నెఫ్రోప్లస్ కేంద్రాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలోని అతిపెద్ద డయాలసిస్ కేర్ నెట్వర్క్ నెఫ్రోప్లస్... ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తరణ చేపట్టింది. వచ్చే ఏడాది కాలంలో రూ.75 కోట్ల పెట్టుబడులతో ఇక్కడ కొత్తగా 30 కేంద్రాలను ఏర్పాటు చేయాలని లకి‡్ష్యంచింది. ప్రస్తుతం ఏపీ, తెలంగాణల్లో 40 సెంటర్లున్నాయి. ఫిబ్రవరి నాటికి ఏపీలో కొత్తగా 3 సెంటర్లను ప్రారంభించనున్నట్లు నెఫ్రోప్లస్ ఫౌండర్ అండ్ సీఈఓ విక్రమ్ ఉప్పాల ‘సాక్షి బిజినెస్ బ్యూరో’ ప్రతినిధితో చెప్పారు. అమెరికాకు చెందిన డావాటా హెల్త్‌కేర్ కంపెనీ ఇండియా విభాగాన్ని కొనుగోలు చేసిన సందర్భంగా సోమవారమిక్కడ విలేకరులతో ఆయన మాట్లాడారు. రెండేళ్లలో లిస్టింగ్.. ‘‘గతేడాది రూ.150 కోట్ల టర్నోవర్‌ను చేరుకున్నాం. డావిటా కొనుగోలుతో రూ.50 కోట్ల టర్నోవర్ జతయింది. దీంతో ఈ ఏడాది రూ.250 కోట్ల టర్నోవర్‌ను లకి‡్ష్యస్తున్నాం’’ అని చెప్పారాయన. రెండేళ్లలో కంపెనీని స్టాక్ ఎక్సే్ఛంజీల్లో లిస్ట్ చేస్తామన్నారు. ప్రస్తుతం దేశంలో నెఫ్రోప్లస్‌కు 93 నగరాల్లో 154 సెంటర్లున్నాయి. డావిటా కొనుగోలుతో ఈ సంఖ్య 176కు చేరింది. జనవరిలో రూ.150 నిధుల సమీకరణ ‘‘ప్రస్తుతం నెఫ్రోప్లస్‌లో 2,400 మంది ఉద్యోగులున్నారు. రోజుకు 7 వేల మందికి డయాలసిస్ సేవలందిస్తున్నాం. జనవరి నాటికి రూ.150 కోట్ల నిధులను సమీకరించనున్నాం. పలు వెంచర్ క్యాపిటలిస్టులతో చర్చలు జరుపుతున్నాం’’ అని విక్రమ్ తెలిపారు. న్యూయార్క్ స్టాక్ ఎక్సే ్చంజీలో లిస్ట్ అయిన కిడ్నీ డయాలసిస్ కేర్ డావిటా హెల్త్‌కేర్ ఇండియా విభాగమైన డావిటా కేర్ ఇండియాను... నెఫ్రోప్లస్ కొనుగోలు చేసింది. దీంతో డావిటా ఇండియాకు చెందిన 22 కేంద్రాలు, 1,700 మంది పేషెంట్లు, 400 మంది ఉద్యోగులు నెఫ్రోప్లస్‌లో విలీనమయ్యాయి. -
వైద్యం.. ‘ప్రైవేట్’కు నైవేద్యం!
రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య శాఖ వ్యవహారం ‘ప్రైవేట్’కు దాసోహం అన్నట్లుగా ఉంటోంది. గత నాలుగేళ్లలో వేల కోట్ల రూపాయల విలువ చేసే సేవలను ప్రైవేటు కంపెనీలకు ధారాదత్తం చేశారు. సర్కారు తీరుతో కార్పొరేట్ కంపెనీలకు ‘కోట్ల’ వర్షం కురుస్తుంటే పేదల రోగుల పరిస్థితి మాత్రం పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లు అవుతోంది. ఫలితంగా.. ప్రమాదకర జబ్బు దాపురిస్తే ఆరోగ్యశ్రీలో వైద్యమందుతుందో లేదో తెలియని పరిస్థితి. ఆపదలో 108కు ఫోన్‌చేస్తే వచ్చే వరకూ నమ్మకంలేదు.. దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతూ నెలవారీ మందులు తీసుకుందామని ఎదురుచూసే వృద్ధులకు 104 వాహనం దైవాధీనం. మరోవైపు.. రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ మంత్రం జపిస్తుండడంతో ఆస్పత్రుల్లో వేలాది ఖాళీలున్నా పట్టించుకునే దిక్కులేదు. మెడికల్, పారా మెడికల్, నర్సింగ్, ఏఎన్ఎం కోర్సులు పూర్తిచేసిన లక్షలాది మంది నిరుద్యోగులు ఉపాధిలేక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇవన్నీ పక్కన పెడితే.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి బోధనాసుపత్రి వరకూ డాక్టరు ఉంటాడో లేదోననే అపనమ్మకంలో రోగులు కొట్టుమిట్టాడుతున్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో పేద రోగికి భరోసా ఇచ్చిన పథకాలన్నీ వ్యయ భారం పేరుతో మిణుకు మిణుకుమంటున్నాయి. మొత్తం మీద రాష్ట్రంలో ప్రజారోగ్యం ప్రైవేటు కంపెనీలకు ప్రధాన ఆదాయ వనరుగా మారిందని అధికార వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. –సాక్షి, అమరావతి ఆరోగ్య శాఖపై మాయని మచ్చ ఇప్పటివరకూ ప్రపంచ చరిత్రలో ఎక్కడా ఒక పెద్దాసుపత్రిలో అది కూడా ఐసీయూ వార్డులో చికిత్స పొందుతున్న శిశువు.. ఎలుకలు కొరికిన కారణంగా మృత్యువాత పడిన ఘటన చవిచూడలేదు. గుంటూరు పెద్దాసుపత్రిలో ఈ విషాదం జరిగింది. రాష్ట్రంలో ఆస్పత్రుల దుస్థితి ఎలా ఉందో యావత్ దేశానికి ఈ దుర్ఘటన చాటిచెప్పింది. సిబ్బంది కొరత, మౌలిక వసతుల లేమి.. సర్కారు నిర్లక్ష్యం ఇందుకు కారణాలు. అంపశయ్యపై ఆరోగ్యశ్రీ దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో లక్షలాది మంది ప్రాణాలను నిలబెట్టిన ఆరోగ్యశ్రీ పథకం ఇప్పుడు అంపశయ్యపై మూలుగుతోంది. జాబితాలో మొత్తం 934 జబ్బులకు గాను టీడీపీ హయాంలో 133 జబ్బులను తొలగించారు. హైదరాబాద్‌లో వైద్యాన్నీ నిరాకరిస్తున్నారు. దీంతో కిడ్నీ, తలసేమియా బాధితుల ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఆరోగ్యశ్రీ పథకం ఖర్చుతో కూడుకున్నదన్న భావనతో దానిని రోజురోజుకూ నిర్వీర్యం చేస్తున్నారు. 108, 104ల రాక దేవుడికెరుక అలాగే, రాష్ట్రంలో 2014 తర్వాత 108, 104 వాహనాల సేవలు రోజురోజుకీ క్షీణిస్తున్నాయి. నిధులు కేటాయించకపోవడంతో 108లు అవసాన దశకు చేరాయి. మరమ్మతులకు, డీజిల్‌కూ డబ్బుల్లేవని ఆగిపోయిన సందర్భాలు అనేకం. వేతనాలు సకాలంలో ఇవ్వడంలేదని ఉద్యోగులు రోడ్డెక్కారు కూడా. ఇక పల్లెలకు వెళ్లాల్సిన 104 వాహనాలు ఎప్పుడెళ్తాయో, మందులెప్పుడిస్తాయో దేవుడికే ఎరుక. ఇదిలా ఉంటే.. ఆరోగ్యశ్రీ పథకంలో పనిచేస్తున్న 1604 మంది ఆరోగ్యమిత్రలను తొలగించారు. చివరకు వారు సుప్రీంకోర్టును ఆశ్రయించి కొనసాగుతున్నారు. అంతేకాక, రాష్ట్రవ్యాప్తంగా 450 హోమియో డిస్పెన్సరీలను మూసేయగా, అందులో 950 మంది సిబ్బంది ఉపాధి కోల్పోయారు. తాజాగా 102 కాల్సెంటర్లలో పనిచేస్తున్న 28 మంది మహిళా ఉద్యోగులు రోడ్డున పడ్డారు. ఒక్క ఉద్యోగ నియామకమూ లేదు రాష్ట్రంలోని అనేక ఆస్పత్రుల్లో వైద్యులు లేక రోగులు విలవిల్లాడుతున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి బోధనాసుపత్రుల వరకూ వివిధ హోదాల్లో 25వేలకు పైగా ఖాళీలున్నట్టు అంచనా. గడిచిన నాలుగేళ్లలో ఒక్క నియామకాన్ని కూడా చేపట్టలేదు. పీహెచ్‌సీలు, సీహెచ్సీలలో వైద్యుల్లేక పల్లెల్లోని ప్రజానీకం నానాయాతన పడుతున్నారు. మరోవైపు.. స్టాఫ్ నర్సులు, ఏఎన్ఎంలు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్ట్‌లు ఇలా పలు విభాగాల్లో వేలాది ఖాళీలు ఉన్నా పట్టించుకోవడంలేదు. కార్పొరేట్ సేవలో.. రాష్ట్రంలో ఇప్పటివరకూ సుమారు 26 రకాల సేవలను కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పారు. ఆయా సంస్థలకు కోట్లాది రూపాయలు ధారాదత్తం చేశారు. రక్తపరీక్షల నుంచి ఎక్స్‌రేల వరకూ అన్నీ ప్రైవేటు సంస్థలకే. ఇక 104, 102 వంటివన్నీ కార్పొరేట్ సంస్థలకే ఇచ్చారు. చిత్తూరు జిల్లా ఆస్పత్రిని కూడా ప్రైవేటుకు అప్పజెప్పారు. విశాఖలోని విమ్స్‌ను ప్రైవేటుపరం చేసేందుకు కసరత్తు దాదాపు పూర్తయింది. అలాగే, గడిచిన నాలుగేళ్లలో సుమారు రూ.2వేల కోట్ల విలువైన పనులన్నీ కార్పొరేట్ సంస్థలకు ఇచ్చారు. ఈ బాగోతంలో కోట్లు చేతులు మారినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. డయాలసిస్, హెచ్ఐవీ బాధితులకు మొండిచేయి డయాలసిస్ చేయించుకునే బాధితులకు నెలకు రూ.2,500లు చొప్పున పెన్షన్ ఇస్తామని సర్కారు హామీ ఇచ్చింది. హెచ్ఐవీ బాధితులకు కూడా నెలకు రూ.వెయ్యి పెన్షన్ ఇస్తామన్నారు. కానీ, రాష్ట్రవ్యాప్తంగా సుమారు 20వేల మంది డయాలసిస్ బాధితులుంటే 2వేల మందికే ఇస్తున్నారు. ఆరోగ్యశ్రీ కింద ప్రైవేటు ఆస్పత్రుల్లో డయాలసిస్ చేయించుకుంటున్న వారికి ఇవ్వడంలేదు. అంతేకాక, సుమారు 70వేల మంది హెచ్ఐవీ బాధితులు నాలుగేళ్లుగా పెన్షన్ కోసం నిరీక్షిస్తున్నారు. -
నా భార్యకు ప్రాణభిక్ష పెట్టండి
డాబాగార్డెన్స్(విశాఖ దక్షిణ): కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న తన భార్యకు ప్రాణభిక్ష పెట్టాలని అక్కయ్యపాలెం 80 ఫీట్ రోడ్డు రామచంద్రానగర్‌కు చెందిన పుల్లెల విజయ్ కుమార్ వేడుకున్నారు. ఈ మేరకు వీజేఎఫ్ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం ఆయన తన భార్య వెంకటేశ్వరిదేవితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మూడేళ్లుగా తన భార్య కిడ్నీ వ్యాధితో బాధపడుతుందని, ఏడాదిన్నర కిందటి వరకు డయాలసిస్, మందులతోనే రక్షించుకుంటూ వచ్చానని చెప్పారు. ప్రస్తుతం డయాలసిస్ కూడా కష్టమవుందన్నారు. వెంటనే కిడ్నీ మార్పిడి చేయాల్సిందేనని వైద్యులు చెప్పడంతో దిక్కు తోచని స్థితిలో మీడియా ముందుకు రావాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు సుమారు రూ.20 లక్షల వరకు ఖర్చు చేశానన్నారు. జీవన్‌దాన్ పథకానికి దరఖాస్తు చేశామని, దాతలు ఆదుకొని తన భార్య ప్రాణాలు నిలపాలని విజ్ఞప్తి చేశారు. సాయం చేసే దాతలు ఎస్బీఐ అకౌంట్ నంబరు 20072722127, రామలక్ష్మి బ్రాంచ్, శ్రీకాకుళానికి జమ చేయాలని, లేదా ఫోన్ నంబర్ 97037 84077లో సంప్రదించవచ్చని ఆయన తెలిపారు. -
పేదలకు ఉచితంగా డయాలసిస్
సాక్షి, సిద్దిపేట: ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేదలకు ఉచితంగా డయాలసిస్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి వెల్లడించారు. శుక్రవారం సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన డయాలసిస్ కేంద్రాన్ని మం త్రి హరీశ్‌రావుతో కలసి ఆయన ప్రారం భించారు. లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. కిడ్నీ బాధితుల సమస్యలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా 40 డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని, ఈ ప్రక్రియ నెలలోగా పూర్తి చేస్తామని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సింగిల్ యూజ్ పరికరాలను వాడుతున్నామని తెలిపారు. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వారు ఖరీదైన వైద్యం చేయిం చుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారని, దీనిని గమనించిన సీఎం కేసీఆర్ ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత డయాలసిస్ కేంద్రాల ఏర్పాటుకు వెంటనే నిధులు మంజూరు చేశా రని చెప్పారు. ప్రైవేట్ వైద్యులు చిన్నాచితకా వ్యాధులకూ అనవసరంగా ఆపరేషన్లు చేస్తే సహించమని మంత్రి హెచ్చరించారు. సర్కార్ ఆస్పత్రుల వద్ద క్యూలు ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. ‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు..’అని పాడుకున్న తెలంగాణ ప్రజలే ఇప్పుడు అవే ఆస్పత్రుల వద్ద క్యూ కడుతున్నారని చెప్పారు. ఆర్థికంగా బక్కచిక్కిన తెలంగాణ పల్లెల్లో కిడ్నీ వ్యాధి భూతంలా విస్తరి స్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. జపాన్, జర్మనీ మెడికల్ టెక్నాలజీ లతో కూడిన అధునాతన పరికరాలతో రాష్ట్ర వ్యాప్తంగా డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేస్తు న్నట్లు తెలిపారు. మొదటి డయాలసిస్ సెంటర్‌ను సిద్దిపేటలో ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. ఆస్పత్రుల ఆధునీకర ణకు వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నా మని మంత్రి వివరించారు. -
గ్రాఫీన్‌తో వేగవంతమైన డయాలసిస్!
కిడ్నీలు పాడైతే డయాలసిస్ చేయించుకోవాల్సి వస్తుందని తెలిసిందే. అయితే డయాలసిస్ చేయించుకోవాలంటే దాదాపు 4 గంటల సమయం పడుతుంది. అంతేకాదు ఆ సమయంలో విపరీతమైన నొప్పి అనుభవించాల్సి ఉంటుంది. ఈ సమస్యకు ఇంగ్లండ్‌లోని మసాచూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు ఓ పరిష్కారాన్ని కనుక్కున్నారు. గ్రాఫీన్ అనే పదార్థంతో తయారు చేసిన ఫిల్టర్లను ఉపయోగిస్తే.. డయాలసిస్ పదిరెట్లు ఎక్కువ వేగంతో జరుగుతుందని నిరూపించారు. దీంతో ఈ ప్రక్రియ అతితక్కువ సమయంలోనే పూర్తవుతుందన్న మాట. డయాలసిస్ యంత్రాల్లో ఉపయోగిస్తున్న ఫిల్టర్లు చాలా మందంగా ఉంటాయని, గ్రాఫీన్ ఒక నానోమీటర్ మందం మాత్రమే ఉండటం వల్ల రక్తంలోని వ్యర్థ పదార్థాలను సులువుగా, వేగంగా వేరు చేయొచ్చని మెకానికల్ ఇంజనీరింగ్‌కు చెందిన పిరన్ కిడాంబి అంటున్నారు. ఈ నేపథ్యంలోనే వేర్వేరు సైజుల గ్రాఫీన్ పొరలను తయారు చేసేందుకు కొత్త పద్ధతిని సిద్ధం చేశామని చెప్పారు. ఈ పద్ధతి ద్వారా కేవలం 0.66 నానోమీటర్ల సైజుండే పొటాషియం క్లోరైడ్ అణువులను కూడా ఫిల్టర్ చేయగల పొరలను సిద్ధం చేశామని తెలిపారు. ఈ పరిశోధన వివరాలు అడ్వాన్స్ మెటీరియల్స్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. -
త్వరలో నెఫ్రాలజిస్టుల నియామకం: కామినేని
శ్రీకాకుళం: త్వరలో నెఫ్రాలజిస్టులను నియమిస్తామని మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. శనివారం జిల్లాలోని శ్రీకాకుళం జిల్లా పలాసలో డయాలసిస్ సెంటర్‌ను మంత్రి అచ్చెన్నాయుడుతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్దానం ప్రాంతంలో మూడు డయాలసిస్ సెంటర్లు ప్రారంభించామన్నారు. మరో 15 రోజుల్లో కిడ్నీ బాధిత ప్రాంతాల్లో వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. -
ప్రకాశం ఏదీ?
ఒక మహానుభావుడి పేరు పెట్టుకున్న జిల్లా ఇది. కానీ... పాలకులకు ఆయనకున్న దేశభక్తి లేదు. ప్రజలంటే ఆయనకున్న అనురక్తి లేదు. మూత్రపిండాల వ్యాధితో పిల్లలు సైతం రాలిపోతున్న జిల్లా ఇది. ఈ చీకటి ప్రభుత్వం కొంచెం ప్రకాశం చూస్తే బాగుండు. ప్రకాశం జిల్లాను చూస్తే బాగుండు. మెకానిక్కు పెద్ద కష్టం పేద కుటుంబంలో పుట్టి మెకానిక్‌గా జీవనం సాగిస్తున్న 20 ఏళ్ల షేక్ షంషూర్ కిడ్నీ వ్యాధి బారినపడ్డాడు. ప్రకాశం జిల్లా సింగరాయకొండకు చెందిన ఈ యువకుడు 9వ తరగతి వరకు చదువుకున్నాడు. తండ్రి రోజు వారీ కూలీ. మెకానిక్ షాపులో పని చేసే షంషూర్ నాలుగు నెలల క్రితం అకస్మాత్తుగా కళ్లు తిరిగి పడిపోవడంతో ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. నెలరోజుల పాటు చికిత్స చేసిన వైద్యులు రక్తం తక్కువగా ఉందని, రక్తం ఎక్కిస్తే సరిపోతుందని చెప్పి రెండుసార్లు రక్తం ఎక్కించారు. కొద్దిరోజుల తరువాత ఏ ఆహారం తిన్నా వాంతి చేసుకోవడం, అందులో రక్తం కనిపించడంతో బద్వేలు నుంచి వచ్చిన భూతవైద్యుని ఆశ్రయించారు. అప్పటికి తగ్గక పోవడంతో ఒంగోలులో ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ప్రైవేటు వైద్యశాలలో చూపించారు. ఆ ఆస్పత్రి వైద్యులు పరీక్షలు నిర్వహించి రెండు కిడ్నీలు పాడయ్యాయి వెంటనే మెరుగైన చికిత్స కోసం వేరే హాస్పిటల్‌కు వెళ్లాలని సూచించారు. దీంతో వేరే హాస్పిటల్‌కు వెళ్లారు. సరిగ్గా ఆ సమయంలో పెద్ద నోట్ల రద్దుతో చికిత్సకు డబ్బు అందని పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం షంషూర్ నెల్లూరులో చికిత్స పొందుతున్నాడు. నీటి సమస్యే ప్రధాన కారణం.. కలుషితమైన నీటివల్లే తన కుమారుడి కిడ్నీలు పాడయ్యాయని డాక్టర్లు చెప్పారని షంషూర్ తండ్రి ఇబ్రహీం ఆవేదనగా తెలిపాడు. తాము పంచాయతి వారు సరఫరాచేసే కుళాయి నీరు తాగే వారమనీ ఆ నీరు వాసనగా ఉండేదని తెలిపాడు. షంషూర్కు మెడ దగ్గర రంధ్రం వేసి ఇప్పటివరకు 24 సార్లు డయాలసిస్ చేయించామనీ వారానికి మూడుసార్లు డయాలసిస్ చేయించాల్సి ఉంటుందనీ వెళ్లిన ప్రతిసారి 700 రూపాయలు ఖర్చు అవుతాయని తెలిపాడు. ఇదిగాక వారానికి 2,500 రూపాయల విలువగల ఇంజక్షన్, 500 రూపాయల మందులు, నెలకు ఒకసారి 3,500 రూపాయల విలువగల ఇంజక్షన్ వాడాల్సి వస్తోందని అంత ఖర్చు తాము ఏమాత్రం భరించలేమని కన్నీటి పర్యంతం అయ్యాడు. ఇప్పటివరకు నెల్లూరులో చికిత్సకు 44 వేల రూపాయలు ఖర్చు అయిందన్నారు. అయితే ప్రతిసారి మెడద్వారా డయాలసిస్ చేయడం కుదరదని, చెన్నై వెళ్లి చేతిలో ఆపరేషన్ ద్వారా పైపు ఏర్పాటు చేసుకొని వస్తే దాని ద్వారా డయాలసిస్ చేస్తామని నెల్లూరు వైద్యులు తెలిపారని చెప్పాడు. కూతురు పెండ్లి డబ్బుతో చికిత్స.. కూతురు ఆషా పెండ్లి కోసం 3 లక్షల రూపాయలు దాచి పెట్టామనీ పెళ్లి కూడా కుదిరిందనీ అయితే కుమారునికి వ్యాధి బయటపడటంతో చికిత్సకు డబ్బులు అవసరమని పెండ్లిని రద్దు చేసుకున్నామని ఇబ్రహీం తెలిపాడు. తాను కూడా తమ్ముడి కోసం మహారాష్ట్రలో చేస్తున్న పనిని వదిలేసి వచ్చానని అన్న షబ్బీర్ చెప్పాడు. జీవన్ ఆధార్‌లో రిజిస్ట్రేషన్ విఫలం.. గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో జీవన్ ఆధార్ స్వచ్ఛంద సంస్థ కార్యాలయంలో కిడ్నీ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని సూచించడంతో అక్కడికి వెళ్లి సాయంత్రం 5 గంటల వరకు ఉన్నామని ఎవరిని అడిగినా ఒకరిపై ఒకరు చెబుతున్నారే తప్ప రిజిస్ట్రేషన్ చేసుకోలేదని, ఎంఎల్ఏ, ఎంపి లెటరు తీసుకుని వస్తేనే రిజిస్ట్రేషన్ చేయించుకుంటామని చెప్పారన్నాడు. చివరికి ఒక స్నేహితుడి సహాయంతో వైఎస్సార్ సీపీ కొండపి నియోజకవర్గ ఇన్చార్జి వరికూటి అశోక్‌బాబు సహకారంతో జగన్ సార్‌ను కలుసుకుని తన సమస్యను చెప్పగలిగామని ఇబ్రహీం తెలిపాడు. ప్రభుత్వసాయం కోసం ఎదురు చూస్తున్నాడు. ఆరోగ్యశ్రీ వల్లే బతుకుతున్నా... గత నాలుగేళ్ల నుంచి కిడ్నీ వ్యాధితో బాధపడుతూ ఆదుకునే వారు లేక బాధపడుతున్నానని కిడ్నీ బాధితుడు మల్లెల ఎలేజర్ అన్నాడు. హనుమంతునిపాడు మండలం హాజీపురం ఎస్సీ కాలనీకి చెందిన మెల్లెలఎలేజర్ది నిరుపేద కుటుంబం. బేల్దారి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇతనికి భార్య మరియమ్మ, 5 మంది సంతానం ఉన్నారు. నాలుగు సంవత్సరాల క్రితం ఆరోగ్యం బాగా లేకపోవడంతో వైద్యుల వద్దకు వెళ్లి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పరీక్షలు చేయించుకుంటే రెండు కిడ్నీలు ఫెయిల్ అయ్యాని చెప్పారు. దాంతోవారానికి 3 సార్లు డయాలిసిస్ చేయించుకోవాల్సి వచ్చింది. అయితే డబ్బులు లేక మూడుసార్లు డయాలిసిస్ మానుకున్నాడు. దీంతో పొట్టంతా వాపు వచ్చింది. కదలలేని పరిస్థితిలో మంచం పట్టి ఉన్నాడు. కుటుంబానికి ఎటువంటి ఆదాయం లేదు. భార్యాపిల్లలు సంపాదించిన రోజువారీ కూలీతో పోషణ జరుపు కుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆరోగ్యశ్రీ కార్డు వలనే ఇంత కాలం గొంతులో ఊపిరుందని, అది లేకుంటే ఎప్పుడో మృతి చెందేవాడినని ఎలేజర్ అన్నాడు. కుటుంబం గడవక పిల్లల్ని చదువు మాన్పించి కూలి పనులకు పంపించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ ఇంట్లో పెళ్లి ఆగిపోయింది ప్రకాశం జిల్లా పీసీపల్లి మండలంలోని కొత్తపల్లికి చెందిన వీరపనేని లింగయ్య కుటుంబంలో నలుగురికి కిడ్నీ వ్యాధి సోకింది. లింగయ్యకు, అతడి భార్య నాగరత్తమ్మకు, ఐదో కుమారుడు గోపాల్‌కు, లింగయ్య వదిన నారాయణమ్మకు కిడ్నీ వ్యాధి సోకింది. ఒకే కుటుంబంలో నలుగురికి ఈ వ్యాధి సోకడంతో కుటుంబం ఛిన్నాభిన్నం అయ్యింది. లింగయ్య మిగతా నలుగురు కుమారులు తోచిన సంపాదన చేస్తూ వీరికి వైద్యం చేయిస్తున్నారు. మూడేళ్ల కిందట గోపాల్‌కు కిడ్నీలు దెబ్బతిన్నట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో అప్పటికే కుదిరిన పెళ్లి ఆగిపోయి తల్లిదండ్రులు లింగయ్య, నాగరత్తమ్మలు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఒకపక్క తమ ఇద్దరికీ అదే వ్యాధి సోకి మృత్యువుకు చేరువ అవుతుంటే యుక్తవయస్సులో ఎటువంటి సంతోషాలకు నోచుకోని తన బిడ్డ ఇలా ఈ వ్యాధి బారిన పడటం తల్లిదండ్రులను కలచివేసింది. భారమైన వైద్యఖర్చులు.. ఒకే కుటుంబంలో నలుగురికి వ్యాధి సోకడం వల్ల ప్రతి నెలా ఒక్కొక్కరికి రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు ఖర్చు అయ్యే పరిస్థితి ఉండటంతో అందరికీ వైద్యం చేసే స్తోమత లేని లింగయ్య దంపతులు సతమతమవుతున్నారు. తమ పిల్లలకు తాము భారంగా మారుతున్నామని ఏమి చేయాలో అర్థం కావడం లేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి అన్నివిధాలా సాయం చేస్తే తప్ప కోలుకోలేని ఇలాంటికుటుంబాలు ఈ ప్రాంతంలో కొల్లలు. తిరుపతమ్మకు ఆయువు పోయండి... బతకాలనే ఆశకు ఆయువు పోయండి అంటూ ఆ అమ్మాయి దాతల సాయం కోసం ఎదురు చూస్తోంది. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం పీసీపల్లి మండలంలోని పెదవరిమడుగు గ్రామానికి చెందిన నూకతోటి తిరుపతమ్మ వయసు 19 సంవత్సరాలు. వీరిది నిరుపేద కుటుంబం. తల్లి ఆదిలక్ష్మి వ్యవసాయ కూలీ. కొన్నేళ్ల కిందటే ఇల్లు విడిచి వెళ్లిపోయిన తండ్రి ఆచూకీ నేటికీ లేదు. ఈనెల 19వ తేదీ తిరుపతమ్మకు కాళ్లు, చేతులు వాపు రావడంతో ఒంగోలులోని కిడ్నీ సెంటర్‌కు తీసుకెళ్లారు. అమ్మాయికి మూత్రపిండాలు రెండూ చెడిపోయినట్లు తెలపడంతో తల్లి తల్లడిల్లిపోయింది. తమకు సెంటు భూమి కూడా లేదని, కూలిపని చేసి ఇద్దరు కుమార్తెలను పోషించి పెద్ద చేశానని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. పెళ్లి చేసి అత్తవారి ఇంటికి పంపాల్సిన వయస్సులో కూతురు గురించి గుండె పగిలే వార్త వినాల్సి వచ్చిందని ఆమె కన్నీర మున్నీరయ్యింది. ఈవిషయాన్ని పీసీపల్లి సభలో శుక్రవారం వైఎస్ జగన్‌కు విన్నవించింది. ►ప్రకాశం జిల్లాలో మితిమీరిన ఫ్లోరైడ్‌తో ప్రాణనష్టం. ► రెండేళ్లలో కిడ్నీ వ్యాధులతో 420 మంది మృతి ► అనధికారికంగా వెయ్యిమందికి పైనే ► చావుకు దగ్గరగా వందల్లో బాధితులు ► కనిగిరి, కొండపి ప్రాంతాల్లో అధికం ► రోగులకు ఉచిత వైద్యం లేదు... డయాలసిస్ లేదు ► తూతూ మంత్రంగా ప్రభుత్వ వ్యవహారం