Electricity Supply
-
గ్రీన్ ఎనర్జీ లక్ష్యం 50,500 మెగావాట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పునరుత్పాదక విద్యుత్ సరఫరా సామర్థ్యాన్ని మరో దశాబ్ద కాలంలో 50,500 మెగావాట్లకు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ప్రస్తుతం రాష్ట్రం 10,095 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ సరఫరా సామర్థ్యం కలిగి ఉండగా, 2034–35 నాటికి మరో 40,405 మెగావాట్ల సామర్థ్యాన్ని వృద్ధి చేసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. రాష్ట్రంలో సౌర, పవన, డిస్ట్రిబ్యూటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ, ఎనర్జీ స్టోరేజీ ప్రాజెక్టులు, జియోథర్మల్ వంటి పునరుత్పాదక ఇంధన వనరుల ప్రాజెక్టుల ఏర్పాటును ప్రోత్సహించేందుకు లక్ష్యాలు నిర్దేశించుకుంది. ఈమేరకు తెలంగాణ రెన్యూవబుల్ ఎనర్జీ పాలసీ–2024ని ప్రభుత్వం త్వరలో ప్రకటించనుంది. లీజుకు చౌకగా సర్కారీ స్థలాలు విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు టారిఫ్ ఆధారిత కాంపిటీటివ్ బిడ్డింగ్ ద్వారా కొత్త సౌర, పవన, పంప్డ్ స్టోరేజీ విద్యుత్ ప్లాంట్లు, పవన విద్యుత్ కేంద్రాల స్థాపనకు డెవలపర్ల నుంచి బిడ్లను ఆహ్వానించనున్నాయి. వీటిని గ్రిడ్‌కు అనుసంధానం చేసి వాటితో వచ్చే విద్యుత్‌ను కొనుగోలు చేయనున్నాయి. డెవలపర్లు ప్రైవేటు, ప్రభుత్వ స్థలాల్లో ఈ ప్రాజెక్టులను స్థాపించడానికి అవకాశం ఇవ్వనున్నారు. సర్కారు స్థలాలను నామమాత్రపు అద్దెతో ప్రభుత్వం లీజుకు ఇవ్వనుంది. బిడ్డింగ్ విజేతలకు మార్కెట్ రేటులో 10శాతం లీజు రేటుతో భూములను కేటాయించనుంది. టీజీ–ఐపాస్ ద్వారా డెవలపర్లకు అన్ని అనుమతులు సత్వరంగా జారీ కానున్నాయి. డెవలపర్లు రాష్ట్రంలో సౌర, పవన విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకుని ప్రైవేటు సంస్థలకు ఓపెన్ యాక్సెస్ ద్వారా అమ్ముకునే అవకాశాన్ని కల్పించనున్నారు. సొంత అవసరాలకూ సౌర, పవన విద్యుత్ ప్లాంట్ల స్థాపనకు వీలుంటుంది. జలాశయాలపై ఫ్లోటింగ్ ప్రాజెక్టులు నీటిపారుదల శాఖ భాగస్వామ్యంతో కాంపిటీటివ్ బిడ్డింగ్ ద్వారా జలాశయాలపై ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టుల ఏర్పాటును సైతం ప్రభుత్వం ప్రోత్సహించనుంది. జలాశయాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలకు నామినేషన్ విధానంలో కేటాయించనుంది. ఇందుకుగాను నీటిపారుదల శాఖకు డిస్కంలు విద్యుత్‌లో వాటా/ నామమాత్రపు అద్దెను చెల్లిస్తాయి. = రాష్ట్రంలో ఏడాదిలో 300 రోజులు సౌరవిద్యుదుత్పత్తికి అనుకూలత ఉంటుంది. దేశంలో బలంగా గాలులు వీచే 8 రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణ 5500 మెగావాట్ల పవన విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది. = రాష్ట్రంలోని సబ్స్టేషన్ల వారీగా సౌర విద్యుత్ ప్లాంట్ల స్థాపనకు ఎక్కడ అవకాశం ఉందో వెల్లడిస్తూ డిస్కంలు ప్రకటన జారీచేయనున్నాయి. ఆ మేరకు సౌర విద్యుత్ ప్లాంట్ల స్థాపనకు స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) మహిళల నుంచి ఆసక్తి వ్యక్తీకరణను ఆహ్వానించనున్నాయి. ప్రోత్సాహకాలివీ.. –పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టుల స్థాపనకు వినియోగించే స్థలాలను వ్యవసాయేతర భూములుగా పరిగణిస్తారు. భూవినియోగ మార్పిడి అనుమతులు అవసరం ఉండదు. –డిస్కంలకు విద్యుత్ విక్రయించే ప్రాజెక్టులకు ప్రత్యేక ప్రోత్సాహకాలను అందించనున్నారు. –సూపరై్వజింగ్ చార్జీల మినహాయింపు. –ప్రాజెక్టు కోసం కొనుగోలు చేసే యంత్రాలు, పరికరాలకు 100 శాతం రాష్ట్ర జీఎస్టీ వాటాను తిరిగి చెల్లిస్తారు. –భూగరిష్ట పరిమితి చట్టం నుంచి మినహాయింపు కల్పిస్తారు. మెగావాట్ ప్రాజెక్టుకు 4 ఎకరాల వరకు ఈ వెసులుబాటు వర్తిస్తుంది. – ప్రభుత్వ పాఠశాలలు, ఇందిరమ్మ గృహాలు, ప్రభుత్వ భవనాలు, గ్రామ పంచాయతీ కార్యాలయాలపై రూఫ్‌టాప్ సౌరవిద్యుత్ ప్లాంట్ల స్థాపనను ప్రోత్సహించనున్నారు. –పంప్డ్ స్టోరేజీ విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రభుత్వ భూములను నామమాత్రపు లీజు ధరతో 45 ఏళ్ల కాలానికి ప్రభుత్వం కేటాయించనుంది. -
లంచం ఇవ్వలేదని విద్యుత్ సరఫరా నిలిపివేత
ఆత్మకూర్(ఎస్): లంచం ఇవ్వలేదని తన పొలానికి విద్యుత్ లైన్మెన్ కరెంట్ లైన్ కట్ చేశాడని ఆత్మకూర్(ఎస్) మండలం కందగట్ల గ్రామానికి చెందిన రైతు బొల్లం వీరమల్లు ఆరోపించాడు. కందగట్ల, తిమ్మాపురం గ్రామాల మధ్య గల సోలార్ కంపెనీ సమీపంలో తనకు రెండెకరాల వ్యవసాయ భూమి ఉందని, ఇటీవల కురిసిన వర్షాలకు తన వ్యవసాయ భూమి వద్ద రెండు విద్యుత్ స్తంభాలు ఒరిగి ప్రమాదకరంగా మారడంతో సరిచేయాలని గ్రామ లైన్మెన్ వెంకటయ్యను కోరినట్లు వీరమల్లు తెలిపాడు. ఈ మేరకు ఈ నెల 14వ తేదీన సిబ్బందితో సహా లైన్మెన్ వెంకటయ్య వచ్చి విద్యుత్ స్తంభాలను సరిచేసి రూ.10వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడని బాధిత రైతు ఆరోపించాడు. అంత ఇవ్వలేనని బతిమిలాడడంతో మరుసటి రోజు ఇవ్వాలని గడువు పెట్టాడని, అప్పటికీ ఇవ్వకపోవడంతో ఈ నెల 15వ తేదీన తన పొలానికి విద్యుత్ సరఫరా నిలిపివేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో శుక్రవారం ఏఈ గౌతమ్‌కు రాతపూర్వకకంగా ఫిర్యాదు చేసినట్లు వీరమల్లు తెలిపాడు. ఈ విషయమై ఆత్మకూర్(ఎస్) మండల ఏఈ గౌతమ్‌ను వివరణ కోరగా.. విచారణ చేసి లైన్మెన్పై చర్యలు తీసుకుంటానన్నారు. విద్యుత్ సిబ్బందికి ఎట్టి పరిస్థితుల్లోనూ నగదు ఇవ్వవద్దన్నారు. అవసరమైతే ప్రభుత్వానికి చెల్లించే లావాదేవీలను డీడీల రూపంలో మాత్రమే తీసుకుంటామని వెల్లడించారు. -
టీడీపీ నేత తోట కంచెకు విద్యుత్ సరఫరా.. షాక్‌తో మహిళ మృతి
వి.కోట(చిత్తూరు జిల్లా): టీడీపీ నాయకుడికి చెందిన మామిడి తోటకు వేసిన కంచెకు విద్యుత్ సరఫరా కావడంతో షాక్‌కు గురై ఓ మహిళ మృతిచెందారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా వి.కోట మండలం కేపీ బండ గ్రామంలో సోమవారం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం... వి.కోట మండలంలోని యాలకల్లు గ్రామ పంచాయతీ కేపీ బండ గ్రామంలో అహ్మద్ జాన్ తన భార్య ఆసిఫా (35), ఇద్దరు కుమార్తెలతో కలిసి నివాసం ఉంటున్నారు. వారి ఇంటి బాత్రూమ్కు అత్యంత సమీపంలో టీడీపీ నాయకుడు, సింగిల్ విండో మాజీ అధ్యక్షుడు చక్రపాణి నాయుడుకు చెందిన మామిడి తోట ఉంది.దానికి చుట్టూ ఇనుప కంచెను ఏర్పాటుచేశారు. తోటలోని విద్యుత్ మోటర్‌కు సంబంధించిన స్టార్టర్‌ను ఆ ఇనుప కంచెకు అమర్చారు. వైర్లను పక్కనున్న స్తంభానికి చుట్టారు. ఈ క్రమంలో ఆసిఫా స్నానం చేసి బయటకు వస్తూ మామిడి తోట ఇనుప కంచెను తగిలారు. ఆ కంచెకు కరెంటు సరఫరా కావడంతో ఆమె షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందారు. స్టార్టర్కు సంబంధించిన వైర్లు తెగి ఇనుప కంచెపై పడటంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు భావిస్తున్నారు. తోట యజమానిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. -
No Headline
సాక్షి, సిటీబ్యూరో: విద్యుత్ సరఫరాలో తరచూ తలెత్తే సాంకేతిక లోపాలను ముందే గుర్తించి, మెరుగైన సరఫరా కోసం డిస్కం సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం‘థర్మో విజన్’ కెమెరాలను అందుబాటులోకి తెచ్చింది. కంటికి కన్పించని అతి సూక్ష్మమైన లోపాలను కూడా ఈ కెమెరాతో గుర్తించే అవకాశం ఉంది. రాబోయే ముప్పును ముందే పసిగట్టడం ద్వారా సరఫరాలో అంతరాయాలను నివారించొచ్చు. ప్రస్తుతం గ్రేటర్‌లోని తొమ్మిది సర్కిళ్ల పరిధిలో 35 కెమెరాలను సమకూర్చింది. తద్వారా జాయింట్లలో లోపాలు, సబ్స్టేషన్లలోని పవర్ ట్రాన్స్ఫార్మర్లు, ఫీడర్లపై పడుతున్న ఒత్తిడి, ట్రాన్స్పార్మర్లలో ఆయిల్ లీకేజీలు, కేబుళ్లలో తలెత్తే సాంకేతిక లోపాలను ముందే గుర్తించి, పునరుద్ధరణ పనులు చేపట్టేందుకు అవకాశం ఉంది. నిజానికి భగ్గున మండే ఎండలకు తోడు అధికలోడు కారణంగా ఇన్సులేటర్ల మధ్య పగుళ్లు ఏర్పడుతుంటాయి. వర్షపు చినుకులు పడగానే టఫ్...మంటూ పేలిపోతుంటాయి. లైన్లు, జాయింట్ల మధ్య లూజు కనెక్షన్లు ఉంటాయి. విద్యుత్ ప్రసారం జరిగే క్రమంలో చర్..చర్..మనే శబ్ధంతో ఎర్రటి మినుగురులు ఎగిసిపడుతుంటాయి. షార్ట్‌సర్క్యూట్ తలెత్తి..వైర్లు తెగిపడే వరకు ఈ సమస్య గుర్తించలేని దుస్థితి. ఈ కెమెరాతో ఈ లోపాలను ముందే గుర్తించే అవకాశం ఉంది. తాజాగా హైదరాబాద్ సెంట్రల్ సర్కిల్ పరిధిలోని ఓ సబ్‌స్టేషన్‌లో ఆపరేషన్స్ విభాగం ఇంఛార్జీ డైరెక్టర్ నరసింహులు, సీఈ నరసింహస్వామి, బాలస్వా మిలతో కూడిన ఇంజనీర్ల బృందం ఈ థర్మోవిజన్ పరికరాల పనితీరును పరిశీలించారు. -
ప్రభుత్వ విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యాసంస్థలన్నింటికీ ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సకాలంలో నిధులు విడుదలవక సర్కారీ బడులు, కళాశాలలు కరెంటు బిల్లులు చెల్లించేందుకు ఇబ్బందులు పడుతుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ఇంధన శాఖ త్వరలో ఉత్తర్వులు జారీ చేయనుంది. ప్రత్యేక పోర్టల్‌తో అనుసంధానం సర్కారీ విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్ సరఫరా కోసం రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు ప్రత్యేక ఆన్లైన్ వెబ్ పోర్టల్‌ను రూపొందించనున్నాయి. విద్యాసంస్థలు ఏ శాఖ పరిధిలోకి వస్తే ఆ శాఖ విభాగాధిపతి (హెచ్ఓడీ)కి ఆ పోర్టల్‌ను లాగిన్ చేసే సదుపాయం కల్పిస్తాయి. తమ శాఖ పరిధిలోని విద్యాసంస్థల వివరాలను వెబ్ పోర్టల్‌లో చేర్చడం/తొలగించడం/సవరణలు(యాడ్/డిలీట్/ఎడిట్) చేయడానికి అవకాశం ఉంటుంది. అవసరాన్నిబట్టి ఆయా విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని లేదా నిలిపివేయాలని కోరే వెసులుబాటును హెచ్ఓడీలు పొందనున్నారు. ఇన్‌చార్జీలకు ‘ఉచిత’బిల్లులు విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్ సరఫరా చేసినా ప్రతినెలా క్రమం తప్పకుండా మీటర్ రీడింగ్ తీసి ఇన్చార్జి అధికారికి బిల్లులు జారీ చేస్తారు. ఇన్చార్జి అధికారులకు బిల్లులు జారీ చేస్తే ఉచిత విద్యుత్ దుర్వినియోగం కాకుండా అరికట్టేందుకు వారు చర్యలు తీసుకొనే అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ఎన్ని యూనిట్ల విద్యుత్ వాడారు? ఎంత బిల్లు వచ్చిందనే వివరాలు అందులో ఉండనున్నాయి. అయితే ఆ బిల్లులను సదరు పాఠశాల/కళాశాల/విద్యాసంస్థ చెల్లించాల్సిన అవసరముండదు. అన్ని ప్రభుత్వ విద్యాసంస్థలకు సంబంధించిన బిల్లులను సంబంధిత విభాగాధిపతులు తమ శాఖ బడ్జెట్ నిధుల నుంచి ప్రతి నెలా డిస్కంలకు చెల్లించనున్నాయి. విభాగాధిపతుల పర్యవేక్షణ... విభాగాధిపతులు తమ శాఖ పరిధిలోని విద్యాసంస్థల విద్యుత్ వినియోగం, బిల్లుల మొత్తం, గత కాలానికి సంబంధించిన వినియోగం, జారీ అయిన బిల్లులు, జరిపిన చెల్లింపులు, చెల్లించాల్సిన బకాయిల వంటి సమాచారంతో కూడిన నివేదికలను వెబ్ పోర్టల్‌లో చూసుకోవడానికి వీలుండనుంది. విద్యాసంస్థ, మండలం, జిల్లావారీగా సైతం ఈ నివేదికలు ఆన్లైన్లో జనరేట్ కానున్నాయి. సంబంధిత విభాగాధిపతులు బడ్జెట్ కేటాయింపుల నుంచి విద్యుత్ బిల్లులు చెల్లించడానికి వీలుగా పోర్టల్‌ను రాష్ట్ర ఆర్థిక శాఖతో సైతం అనుసంధానించనున్నారు. -
వర్షాకాలంలో అప్రమత్తంగా ఉండండి
సాక్షి, హైదరాబాద్: వర్షాకాలం ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యుత్ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క ఆదేశించారు. వర్షాలు, ఈదురుగాలుల మూలంగా చెట్లు విరిగిపోవడం, స్తంభాలు కూలిపోవడం, విద్యుత్ తీగలు ఊడిప డటం లాంటి ఘటనలు జరుగుతుంటాయని, క్షేత్రస్థాయి సిబ్బంది అప్రమత్తంగా ఉండి సమస్య వచి్చన వెంటనే స్పందించాలని సూచించారు. శని వారం సచివాలయంలో ఆయన విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ‘ప్రజలు, పరిశ్రమలకు అవసరమైన విద్యుత్ అందుబాటులో ఉంది.సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు చేపట్టండి. లైన్స్ క్లియరెన్స్ (ఎల్సీ) విషయంలో జాగ్రత్త వహించాలి. ఒకేసారి పలు ప్రాంతాల్లో ఎల్సీలు ఇవ్వొద్దు. ఎల్సీ తీసుకునే సమయంలో స్థానిక వినియోగదారులకు ముందస్తు సమాచారం ఇవ్వండి. వర్షాకాలంలో కరెంటు సరఫరా, మరమ్మతులు, పునరుద్ధరణ విషయంలో ఇంధన శాఖ ప్రధాన కార్యదర్శి నుంచి క్షేత్రస్థాయిలోని లైన్మెన్ వరకు అప్రమత్తంగా ఉండాలి. నిరంతరం సమీక్షలు నిర్వహించడంతో పాటు ఎప్పటికప్పుడు సమాచారం చేరవేసుకోండి’అని భట్టి ఈ సమీక్షలో సూచించారు. ఈ సమావేశంలో ఇంధన శాఖ ప్రధాన కార్యదర్శి ఎస్.ఎం.ఎ.రిజ్వి, ఎస్పీడీసీఎల్ ఎండీ ముషారఫ్ అలీ, ట్రాన్స్‌కో జేఎండీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అమరుల ఆశయాలకు అనుగుణంగా ప్రజాపాలన.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలు జరుపుకుంటున్న సందర్భంగా రాష్ట్ర ప్రజలకు భట్టి విక్రమార్క శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, ఆలోచనల మేరకు యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ ప్రజల చిరకాల కోరికను నెరవేర్చారని శనివారం ఒక ప్రకటనలో ఆయన తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ రాష్ట్ర సాధన ఆశయాలు, ఆకాంక్షలు పదేళ్లుగా ఆచరణకు నోచుకోలేదని విమర్శించారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం పాలన మొదలయ్యాక ప్రజలు స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటున్నారని తెలిపారు. -
తగ్గిన విద్యుత్ వినియోగం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎండ వేడి తగ్గింది. ఫలితంగా కరెంటు వినియోగం కూడా తగ్గింది. అది కూడా సాధారణంగా కాదు. ఈ ఏడాది వేసవిలో ఇప్పటికే రికార్డు స్థాయిలో పెరిగిన డిమాండ్.. వాతావరణం అనుకూలించడంతో తగ్గుదలలోనూ రికార్డులు సృష్టిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా రోజుకి 211 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం అవుతోంది. గతేడాది ఇదే సమయానికి 248.985 మిలియన్ యూనిట్ల వినియోగంతో పోలిస్తే.. ప్రస్తుతం ఇది 15.26 శాతం తక్కువగా నమోదైంది.ఈ నెల ప్రారంభంలో విద్యుత్ డిమాండ్ రాష్ట్ర చరిత్రలోనే మునుపెన్నడూ లేనంతగా పైపైకి పరుగులు తీసింది. భానుడి భగభగలను తట్టుకోలేని ప్రజలు ఏసీలు, ఫ్యాన్లను ఆపాలంటేనే భయపడిపోయారు. ఈ నెల 5న రోజువారీ డిమాండ్ 259.173 మిలియన్ యూనిట్లకు చేరుకుంది. ఇది గతేడాది జరిగిన వినియోగం 193 మిలియన్ యూనిట్ల కంటే 34.29 శాతం ఎక్కువ. అయినప్పటికీ రాష్ట్రంలో వినియోగదారులకు అవసరమైనంత విద్యుత్‌ను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ఎక్కడా కోతలు లేకుండా, డిమాండ్‌కు తగ్గట్టుగా విద్యుత్ సరఫరా చేయడంలో విజయవంతమైంది.అత్యధికంగా థర్మల్ ఉత్పత్తి కొద్దిరోజుల క్రితం వరకూ రాష్ట్రంలో సౌర విద్యుత్ భారీగా పెరిగి దాదాపు రెట్టింపు విద్యుత్‌ను అందించేది. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటంతో అది కాస్త తగ్గింది. అనూహ్యంగా థర్మల్ విద్యుత్ ఉత్పత్తి పెరిగింది. ప్రస్తుతం ఏపీ జెన్కో థర్మల్ నుంచి 95.221 మిలియన్ యూనిట్ల విద్యుత్ సమకూరుతోంది. అంటే రాష్ట్ర విద్యుత్ డిమాండ్‌లో దాదాపు 45 శాతం జెన్కో థర్మల్ కేంద్రాల నుంచే వస్తోంది. ఇందుకోసం వీటీపీఎస్‌లో 48,141 మెట్రిక్ టన్నులు, ఆరీ్టపీపీలో 28,984 మెట్రిక్ టన్నులు, కృష్ణపట్నంలో 18,313 మెట్రిక్ టన్నుల చొప్పున బొగ్గు అందుబాటులో ఉంది. దీనికి తోడు ఏపీ జెన్కో హైడల్ నుంచి 4.63 మి.యూ., ఏపీ జెన్కో సోలార్ నుంచి 1.98 మి.యూ. వస్తోంది. ఇక సెంట్రల్ జనరేటింగ్ స్టేషన్ల నుంచి 32.999 మి.యూ., సెయిల్, హెచ్‌పీసీఎల్, గ్యాస్ వంటి ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యూసర్ల నుంచి 30.939 మి.యూ., విండ్ నుంచి 10.937 మి.యూ., సోలార్ నుంచి 15.738 మిలియన్ యూనిట్ల చొప్పున సమకూరుతోంది. సౌర విద్యుత్ గత వారంతో పోలిస్తే దాదాపు సగానికిపైగా పడిపోయింది. మరోవైపు బహిరంగ మార్కెట్ నుంచి విద్యుత్ కొనుగోలు చేయాల్సిన అవసరం కూడా సగానికిపైగా తగ్గింది. ప్రస్తుతం యూనిట్ సగటు రేటు రూ.8.433 చొప్పున రూ.17.983 కోట్లతో 21.324 మిలియన్ యూనిట్ల విద్యుత్ మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. -
కరెంటు ఆపడం కొత్తేం కాదు
సాక్షి, అమరావతి: ఉరుములు, మెరుపులు వస్తున్నప్పుడు, వేగంగా తుపాను గాలులు వీస్తున్నప్పుడు, అల్పపీడనం కారణంగా జోరుగా వాన కురుస్తున్నప్పుడు మాత్రమే కాదు రోడ్డు మీద భారీ లోడ్‌తో ఉన్న వాహనం వెళుతున్నప్పుడు కూడా ఆయా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తుంటారు. లక్షలాది జనం ఒకే రహదారి వెంట బారులుతీరినప్పుడు, తమ నాయకుడిని చూడాలని వేలాది మంది భవనాలపై నిలబడినప్పుడు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, కరెంటు తీగలు తగిలే అవకాశాలు చాలా ఎక్కువ. ఇలాంటి సమయాల్లో అనుకోనిది ఏదైనా జరిగి తీగలు తెగి జనం మీద పడినా, ట్రాన్స్ఫార్మర్ తగిలి షాక్‌కు గురైనా అమాయకుల ప్రాణాలు క్షణాల్లో పోతాయి. అలాంటి ప్రమాదం జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా ప్రముఖుల పర్యటనలు, బహిరంగ సభలు, రోడ్ షోలు జరుగుతున్న ప్రదేశాల్లో అధికారులు విద్యుత్ సరఫరాను కాసేపు నిలిపివేస్తుంటారు. ఇది అందరి భద్రతను దృష్టిలో ఉంచుకుని చేస్తున్న చర్య మాత్రమే. దీనిని కూడా రాజకీయం చేయాలని చూశారు ఈనాడు రామోజీ. ‘జగన్ వస్తే కరెంట్ వైర్లకు కత్తిరింపే’ అంటూ ఈనాడులో వంకర రాతలు రాశారు. ప్రజల ప్రాణాలు పోతే మా కెందుకు మా అజెండా మాదే అన్నట్లు రాసిన ఆ తప్పుడు కథనాన్ని విద్యుత్ సంస్థలు తీవ్రంగా ఖండించాయి. ‘మేమంతా సిద్ధం’ పేరుతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్న బస్సు యాత్రకు ప్రజల నుంచి వస్తున్న విశేష ఆదరణను చూసి మరోమారు అక్కసు వెళ్లగక్కారు. ఈ అసత్య రాతలపై ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఏపీసీపీడీసీఎల్) సీఎండీ కె.సంతోషరావు తీవ్రంగా మండిపడ్డారు. ప్రముఖుల రోడ్ షో సందర్భంగా భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవడం సహజంగా జరిగేదేనని ఆయన వివరించారు. అంతేకాకుండా ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో జన సందోహం ఎక్కువై విద్యుత్ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని, ఆ ప్రాంతాల్లో ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఏ రాజకీయ పార్టీ ప్రముఖుల పర్యటన జరిగినా ఇదే పద్ధతిని అవలంభిస్తున్నామని స్పష్టం చేశారు. నిజానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వంటి వారి పర్యటనల సమయంలోనూ ముందు జాగ్రత్త చర్యగా విద్యుత్ సరఫరా నిలిపివేస్తుంటారు. అప్పుడు మాత్రం ప్రభుత్వం కావాలనే, వారి పర్యటనకు ఆటంకం కలిగించడం కోసమే విద్యుత్ సరఫరా నిలిపివేసిందంటూ ఇదే ఈనాడు కథనాలు రాస్తోంది. ఇటీవల పవన్ పర్యటనలో ఫ్లెక్సీ కడుతూ విద్యుత్ షాక్‌కు గురై ముగ్గురు యువకులు దుర్మరణం పాలయ్యారు. అలాంటి దుర్ఘటనలు జరగకూడదనే విద్యుత్ శాఖ అధికారులు కరెంటు నిలిపివేస్తుంటే దానిపైనా పడి ఏడ్వడం రామోజీకే చెల్లింది. -
కరెంట్ బిల్లులు పెంచాల్సిందే!
సాక్షి, హైదరాబాద్: వినియోగదారులకు విద్యుత్ సరఫరా చేసేందుకు విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు చేసే మొత్తం వ్యయ్యాన్ని విద్యుత్ బిల్లుల రూపంలో రాబట్టుకోవాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. మొత్తం వ్యయాన్ని రాబట్టుకునే క్రమంలో వినియోగదారుల విద్యుత్ చార్జీలను ఎప్పటికప్పుడు పెంచాలని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఈ నెల 10న విద్యుత్ (సవరణ) నిబంధనలు–2024ను ప్రకటిస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. తదుపరి ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ సరఫరా చేసేందుకు అవసరమైన ఆదాయానికి సంబంధించిన అంచనాలను సంబంధిత రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ)కి ప్రతి ఏటా నవంబర్‌లోగా డిస్కంలు సమర్పించాల్సి ఉంటుంది. దాన్ని పరిశీలించిన తర్వాత ఆదాయ అవసరాల మొత్తాన్ని ఈఆర్సీ ఆమోదిస్తుంది. ఈ మేరకు ఆదాయాన్ని సమకూర్చుకోవడానికి వినియోగదారుల నుంచి వసూలు చేయాల్సిన విద్యుత్ చార్జీలను సైతం ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ముందే ఈఆర్సీ ప్రకటించాల్సి ఉంటుంది. ఇకపై ఈఆర్సీ ఆమోదించే ఆదాయ అవసరాల మొత్తం, ప్రకటించిన టారిఫ్‌తో వచ్చే ఆదాయ అంచనాల మొత్తం మధ్య ఎలాంటి వ్యత్యాసం ఉండరాదని గజిట్లో కేంద్రం స్పష్టం చేసింది. ఒకవేళ వ్యత్యాసం ఉన్నా, 3 శాతానికి మించరాదని ఆదేశించింది. ప్రకృతి వైపరీత్యాల సమయంలో మాత్రమే ఈ విషయంలో మినహాయింపు ఉంటుందని తెలిపింది. లేట్ పేమెంట్ సర్‌చార్జీతో.. విద్యుదుత్పత్తి కంపెనీలకు గడువులోగా బిల్లులు చెల్లించనందుకు డిస్కంలపై విధించే లేట్ పేమెంట్ సర్‌చార్జీతో ఈ ఆదాయ వ్యత్యాసాన్ని కలిపి రానున్న మూడేళ్లలో మూడు సమ వాయిదాల్లో వసూలు చేసుకోవాలని కేంద్రం స్పష్టం చేసింది. ఈ గజిట్ అమల్లోకి రాకముందు నాటి ఆదాయ వ్యత్యాసాలను, లేట్‌పేమెంట్ సర్‌చార్జీలను మాత్రం వచ్చే ఏడేళ్లలో ఏడు సమ వాయిదాల్లో వినియోగదారుల నుంచి వసూలు చేసుకోవాలని చెప్పింది. సొంత ట్రాన్స్మిషన్ లైన్లకు లైసెన్స్ అక్కర్లేదు ఏదైనా విద్యుదుత్పత్తి కంపెనీ/కాప్టివ్ విద్యుత్ ప్లాంట్/ఎనర్జీ స్టోరేజీ సిస్టం అవసరాల కోసం ప్రత్యేక ట్రాన్స్మిషన్ లైన్లను ఏర్పాటు చేసుకోవడం, నిర్వహించడం, గ్రిడ్‌కు అనుసంధానం చేయడం కోసం ఇకపై ప్రత్యేకంగా లైసెన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. అయితే, వాటి సామర్థ్యం అంతర్రాష్ట్ర ట్రాన్స్మిషన్ వ్యవస్థ పరిధిలో 25 మెగావాట్లు, రాష్ట్ర అంతర్గత ట్రాన్స్మిషన్ వ్యవస్థ పరిధిలో 15 మెగావాట్లలోబడి ఉండాలి. ఇందుకు సాంకేతిక ప్రమాణాలు, మార్గదర్శకాలను అనుసరించాల్సి ఉంటుంది. అదనపు సర్‌చార్జీ బాదుడు వద్దు దీర్ఘకాలిక ఓపెన్ యాక్సెస్ వినియోగదారులపై విధించే అదనపు సర్‌చార్జీలతో పోలిస్తే స్వల్ప కాలిక ఓపెన్ యాక్సెస్ వినియోగదారులపై విధించే అదనపు సర్‌చార్జి 110 శాతానికి మించి ఉండరాదు. అన్ని రకాల ఓపెన్ యాక్సెస్ వినియోగదారులపై విధించే అదనపు సర్‌చార్జీలు.. డిస్కంలు కొనుగోలు చేసే విద్యుత్‌కు సంబంధించిన ఫిక్స్డ్ ధరలకు మించకుండా ఉండాలి. -
ఎంజీఎంలో అర్ధరాత్రి పవర్‌కట్.. రోగి మృతి
ఎంజీఎం: షార్ట్ సర్క్యూట్‌తో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో కరెంటు సరఫరా నిలిచిపోయింది. ఒక్కసారి ఆస్పత్రి చీకటిమయంగా మారడంతో రోగులతోపాటు వారివెంట ఉన్న బంధువులు ఆందోళనకు గురయ్యారు. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న ఓ రోగి చనిపోయాడు. అయితే ఆ రోగి వ్యాధి తీవ్రతతోనే చనిపోయినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రకటించారు. అసలేం జరిగిందంటే.. ఎంజీఎం ఆస్పత్రిలో ఏఎంసీ వార్డు వెనుకాల ఉన్న విద్యుత్ తీగలపై కోతులు చేసిన ఆగ డాలతో వైర్లు ఒక్కోటి పరస్పరం తాకాయి. షార్ట్ సర్క్యూట్ జరిగి వైర్లు కాలిపోయాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఆస్పత్రిలో సాధారణ వార్డుకు విద్యుత్ సరఫరా నిలిచిపోయినా.. జనరేటర్ ద్వారా అత్యవసర వార్డుల(ఏఎంసీ, ఐఎంసీ, ఆర్ఐసీయూ, ఎస్ఎన్సీయూ, ఎంఓటీ, ఈఓటీ)కు విద్యుత్ సరఫరా జరిగేది. కానీ జనరేటర్‌తో లింక్ ఉన్న ఉన్న విద్యుత్‌వైర్లు కూడా కాలిపోవడంతో గంటపాటు అంధకారం నెలకొంది. విద్యుత్ సరఫరా లేకపోవడంతో మృతి: రోగి బంధువుల ఆరోపణ ఆస్పత్రిలో శుక్రవారం రాత్రి ఏర్పడిన విద్యుత్ అంతరాయం కారణంగా ఆర్ఐసీయూ విభాగంలో చికిత్స పొందుతున్న బొజ్జ భిక్షపతి(45) మృతి చెందినట్లు రోగి బంధువులు ఆరోపిస్తున్నారు. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం రాజేశ్వర్‌రావు పల్లె గ్రామానికి చెందిన భిక్షపతి ఆల్కహాల్ లివర్ సిరోసిస్ సమస్యతో శుక్రవారం తెల్లవారుజామున ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యాడు. వైద్యులు అతనికి ఆర్ఐసీయూలో వెంటిలెటర్ ద్వారా చికిత్స అందిస్తున్నారు. శుక్రవారం రాత్రి ఆస్పత్రిలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో భిక్షపతికి అమర్చిన వెంటిలైటర్ నిలిచి శ్వాస తీసుకోవడం తీవ్రమైనట్లు మృతుడి బంధువులు చెబుతున్నారు. దీంతో చనిపోయాడని వాపోతున్నారు. ఈ విషయంపై ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ ఒక ప్రకటన విడుదల చేశారు. విద్యుత్ అంతరాయం ఏర్పడిన విషయం వాస్తవమేనని తెలిపారు. బాధితుడి మృతిచెందిన సమయంలో వెంటిలెటర్ బ్యాటరీ బ్యాకప్‌తో కొనసాగుతోందని పేర్కొన్నారు. భిక్షపతి మృతికి విద్యుత్ అంతరాయం కాదని, వ్యాధి తీవ్రతే కారణమని స్పష్టం చేశారు. -
విద్యుత్ పొదుపుతో భవిష్యత్‌కు వెలుగు
సాక్షి, అమరావతి: ఇంట్లో కావాల్సినంత వెలుతురు ఉంటుంది.. కానీ విద్యుత్ దీపాలు నిరంతరం వెలుగుతూనే ఉంటాయి. బయటి నుంచి చల్లగాలి శరీరాన్ని తాకుతున్నా.. ఫ్యాన్లు, ఏసీలు ఆపడానికి ఇష్టపడం. ఈ విధంగా విద్యుత్ పొదుపులో మనం చేస్తున్న చిన్నపాటి నిర్లక్ష్యమే భవిష్యత్ తరాలకు తీవ్ర ఇబ్బందులు తీసుకువచ్చే ప్రమాదముంది. వచ్చే 39 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ ఉత్పత్తి వనరులు అంతరించిపోతాయని శాస్త్రవేత్తలు, నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు మేలుకోకపోతే విద్యుత్ వెలుగులకు దూరమవ్వాల్సిన పరిస్థితి వస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ పొదుపుతో పాటు పర్యావరణంలో కర్బన ఉద్గారాలను తగ్గించడంపై దృష్టి సారించాలని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే భారత్ సహా అనేక దేశాలు విద్యుత్ పొదుపు చర్యలకు నడుం బిగించాయి. మన దేశంలో ఈ బృహత్తర యజ్ఞానికి ఆంధ్రప్రదేశ్ పెద్దపీట వేసి.. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. విద్యుత్ ఉత్పత్తి కోసం ప్రత్యామ్నాయ ప్రాజెక్టులు చేపట్టింది. అలాగే జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం సందర్భంగా గురువారం నుంచి ఈ నెల 20 వరకు వారోత్సవాలను నిర్వహిస్తోంది. భవిష్యత్ తరాల కోసం.. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో ఇతర రాష్ట్రాల కంటే మెరుగ్గా విద్యుత్ సరఫరా చేసి రికార్డు సృష్టిస్తోంది. అలాగే భవిష్యత్‌లో విద్యుత్ కోసం ఇబ్బంది పడే పరిస్థితి రాకుండా ముందస్తు ప్రణాళికల అమలుకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే 33,240 మెగావాట్ల సామర్థ్యంతో 29 పంప్డ్ స్టోరేజ్ హైడ్రో పవర్ ప్రాజెక్టుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంది. భవిష్యత్ విద్యుత్ అవసరాలకు ఇవి అందుబాటులోకి రానున్నాయి. మరోవైపు వ్యవసాయానికి 30 ఏళ్ల పాటు పగటిపూట 9 గంటలు ఉచిత విద్యుత్ అందించేందుకు 7 వేల మెగావాట్లను సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ నుంచి తీసుకుంటోంది. మన దేశంలో 2070 నాటికి కర్బన ఉద్గారాలను జీరో స్థాయికి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించింది. దీనికి తోడ్పాటునందిస్తున్న మొదటి పది రాష్ట్రాల్లో ఏపీ స్థానం సంపాదించింది. ఇప్పటికే 4.76 మిలియన్ టన్నుల కర్బన ఉద్గారాలు తగ్గించి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సులో ఏపీ.. 42 ఇంధన అవగాహన ఒప్పందాలను కుదుర్చుకుంది. పంప్డ్ స్టోరేజ్ హైడ్రో, గ్రీన్ హైడ్రోజన్, బయో డీజిల్, కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్రాజెక్టుల కోసం రాష్ట్రానికి దాదాపు రూ.9.57 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు రానున్నాయి. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు సైతం ఇంధన భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ప్రశంసిస్తున్నాయి. అయితే విద్యుత్ వెలుగులను భావితరాలకు అందించడానికి నేటి తరం కూడా తమ వంతు బాధ్యతగా విద్యుత్ పొదుపు పాటించాల్సిన అవసరముంది. ఆ దిశగా ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం ఇంధన పరిరక్షణ వారోత్సవాలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. బొగ్గు కొరతతో తిప్పలు.. ఇటీవల రష్యా, ఉక్రెయిన్ యుద్ధం వల్ల అణు విద్యుత్ కేంద్రాలు ధ్వంసమయ్యాయి. చైనా, ఆ్రస్టేలియాలో బొగ్గు కొరత వల్ల పలు దేశాలు విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. జపాన్‌లోనూ విద్యుత్ సంక్షోభం నెలకొంది. శీతాకాలంలోనైనా వెచ్చదనాన్నిచ్చే దుస్తులు ఉపయోగించాలని.. హీటర్లకు వాడే విద్యుత్ వినియోగాన్ని తగ్గించాలని అక్కడి ప్రభుత్వం తాజాగా ఆదేశాలిచ్చింది. అమెరికాలో గతేడాది కంటే 15 శాతం విద్యుత్ వినియోగంతో పాటు సహజ ఇంధన ధరలు పెరగడంతో అక్కడ ప్రతి ఆరు ఇళ్లలో ఒక ఇల్లు విద్యుత్ బకాయి చెల్లించలేని పరిస్థితి వచ్చింది. భారత్‌లో మొత్తం విద్యుత్ ఉత్పత్తిలో 70 శాతం థర్మల్ నుంచే వస్తోంది. అలాంటి థర్మల్ కేంద్రాలకు బొగ్గు కొరత వల్ల ఇబ్బందులు తప్పడం లేదు. ఈపీడీసీఎల్‌కు ఈఈఎస్ఎల్ ప్రశంసలు సాక్షి, విశాఖపట్నం: ఈ ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ.3,265.47 కోట్ల విలువైన 5,062.48 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఆదా చేసి ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఏపీఈపీడీసీఎల్) ఆదర్శంగా నిలిచింది. ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన సమీక్షలో ఈపీడీసీఎల్‌ను ఎనర్జీ ఎఫీషియన్సీ సర్విస్ లిమిటెడ్ సీఈవో విశాల్‌కపూర్ ప్రశంసించారు. అలాగే 2018–19 నాటికి 6.68 శాతంగా ఉన్న నష్టాలను.. 2023–24 సెపె్టంబర్ నాటికి 5.14 శాతానికి తగ్గించుకుంది. ఈపీడీసీఎల్ సీఎండీ ఇమ్మడి పృథ్వి తేజ్ మాట్లాడుతూ.. ‘ఇంధన పొదుపు సామర్థ్య కార్యక్రమాల నిర్వహణకు రాష్ట్ర ఇంధన శాఖ ప్రవేశపెట్టిన పాలసీని అమలుచేస్తూ విజయాలు సాధిస్తున్నాం. పరిశ్రమలు, భవన నిర్మాణ రంగం, మున్సిపల్, వ్యవసాయం, రవాణా రంగాల్లో ఇంధన పొదుపు ఎక్కువగా జరిగేలా చూస్తున్నాం. రూఫ్‌టాప్ సోలార్ విద్యుత్ వంటి ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై దృష్టి పెట్టాం. వినియోగదారులు చేస్తున్న ప్రతి ఫిర్యాదునూ పరిష్కరిస్తున్నాం’ అని చెప్పారు. -
చకచకా కరెంటు.. కుళాయి
సాక్షి, అమరావతి: ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద నిర్మిస్తున్న పేదల ఇళ్లకు మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. నిర్మాణం పూర్తయిన ఇళ్లకు చకచకా విద్యుత్, కుళాయి కనెక్షన్లను ఇస్తోంది. ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద రాష్ట్రంలో ఇళ్లు లేని పేదలకు పక్కా గృహయోగం కల్పించేందుకు 30.75లక్షల మంది మహిళల పేరిట విలువైన ఇంటి స్థలాలను ఉచితంగా పంపిణీ చేసిన విషయం తెలిసిందే. అదేవిధంగా 21.75 లక్షల (19.13 లక్షల సాధారణ, 2.62 లక్షల టిడ్కో) ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతిచ్చింది. గత నెల 12వ తేదీ నాటికి 7.42 లక్షల (5.85 లక్షల సాధారణ, 1.57 లక్షల టిడ్కో) ఇళ్ల నిర్మాణాలను పూర్తిచేసి లబ్ధిదారులకు అందజేసింది. ఇక రాష్ట్రవ్యాప్తంగా పేదలకు ఇళ్లు నిర్మిస్తున్న 17వేల కాలనీల్లో శాశ్వత మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ఏకంగా రూ.32 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తోంది. 6,655 కాలనీల్లో విద్యుత్ పనులు పూర్తి పేదల ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతున్న 9,414 వైఎస్సార్–జగనన్న కాలనీల్లో విద్యుత్ ఏర్పాటు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటి వరకు 6,655 కాలనీల్లో విద్యుత్ స్తంభాలు నాటడం, వైర్లు లాగడం, ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు పూర్తయింది. ఇక నిర్మాణం పూర్తయినవాటిలో 5,02,654 ఇళ్లకు విద్యుత్ కనెక్షన్లు ఇచ్చారు. మిగిలిన ఇళ్లకు కనెక్షన్లు ఇస్తున్నారు. అదే విధంగా నిర్మాణం పూర్తయిన ఇళ్లన్నింటికీ తాగునీటి సదుపాయం కల్పించారు. 1.15 లక్షల ఇళ్లకు ఇంకుడు గుంతలు కాలనీల్లో శాశ్వత మౌలిక సదుపాయాలైన డ్రెయిన్లు, రోడ్లు, సైడ్ కాలువలు నిర్మించాలంటే ఇళ్ల నిర్మాణాలన్నీ పూర్తికావాల్సి ఉంది. అలా కాకుండా ముందుగానే సదుపాయాలు కల్పిస్తే ఇళ్ల నిర్మాణ సమయంలో భారీ వాహనాల రాకపోకలు, ఇతర సందర్భాల్లో డ్రెయిన్లు, కాలువలు ధ్వంసమవుతాయి. అందువల్ల ప్రస్తుతం నిర్మాణం పూర్తయిన ఇళ్లకు తాత్కాలిక డ్రెయినేజీ అవసరాల కోసం ఇంకుడు గుంతలను ఏర్పాటు చేస్తున్నారు. ఇలా ఇప్పటి వరకు 1,15,973 ఇళ్లకు ఇంకుడు గుంతలను నిర్మించారు. అదేవిధంగా వైఎస్సార్, జగనన్న కాలనీలకు స్వాగత ఆర్చ్‌లను ప్రభుత్వం నిర్మిస్తోంది. 2,394 కాలనీలకు ఆర్చ్ నిర్మాణ పనులకు అనుమతులు ఇచ్చింది. ప్రస్తుతం 510 చోట్ల పనులను ప్రారంభించగా, 28 చోట్ల ఆర్చ్‌ల నిర్మాణం పూర్తయింది. మిగిలిన చోట్ల వివిధ దశల్లో నిర్మాణాలు కొనసాగుతున్నాయి. మరోవైపు నిర్మించిన ఇళ్లు అన్నింటికీ విద్యుత్, నీటి ఇంకుడు గుంతల ఏర్పాటు చేశారా.. లేదా.. అని ఆడిట్ నిర్వహించాలని ఇటీవల గృహ నిర్మాణ శాఖ అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. -
మీ తోడు దొంగల దుమ్ము దులపడం ఖాయం
సాక్షి, హైదరాబాద్: బీజే పీ శిష్యరికంతో రాష్ట్ర మంత్రి కేటీరామారావు అసత్య ప్రచారాల్లో రాటుదేలారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ సునామీ చూసి ఏం చేయాలో అర్థంకాక కోట్లాదిరూపాయలు పెట్టి అసత్య ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. కర్ణాటకలోని రైతులకు విద్యుత్ సరఫరాపై మంత్రి కేటీఆర్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా చేసిన పోస్ట్‌కు శనివారం ఆయన కౌంటర్ పోస్ట్ చేశారు. ‘నిన్న మొన్నటి దాకా కర్ణాటకలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ మిత్రపార్టీ బీజేపీ 40% కమీషన్లతో రాష్ట్రాన్ని పూర్తిగా దివాళా తీయించింది. అలాంటి పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఎన్నికల సమయంలో గ్యారంటీలను 100 రోజుల్లోపు అమలు చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తోంది. ‘తెలంగాణలో కూడా కాంగ్రెస్ దూసుకెళుతుంటే ఇన్ని రోజులు నింపుకున్న జేబులను ఇప్పుడు దులుపుతున్నరు. మీరెన్ని తప్పుడు ప్రచారాలు చేసినా, ప్రజలు మీ తోడుదొంగల దుమ్ము దులపడం ఖాయం. కాంగ్రెస్ వస్తుంది. తెలంగాణ గెలుస్తుంది’ అని రేవంత్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. -
Fact Check: కరెంటుంది.. కోతల్లేవు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యుత్ సరఫరాలో ఎటువంటి లోటుపాట్లు లేవు. గ్రామాల్లో, పట్టణ ప్రాంతాల్లో ఎక్కడా కరెంటు కోతలు లేవు. రైతులకు 9 గంటల పాటు ఉచిత విద్యుత్తు అందుతోంది. అయినా ఈనాడు పత్రిక ‘రైతులకు జగన్ షాక్’ అంటూ ఓ పసలేని కథ అచ్చేసింది. రైతులను అనవసర ఆందోళనకు గురిచేసేలా తప్పుడు కథనాన్ని ఇచ్చింది. ఈ కథనాన్ని ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల సీఎండీలు ఐ.పృధ్వీతేజ్, జె.పద్మాజనార్దనరెడ్డి, కె.సంతోషరావు ఖండించారు. వ్యవసాయానికి 9 గంటల పాటు కచ్చితంగా ఉచిత విద్యుత్‌ను అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈనాడు గురువారం ప్రచురించిన కథనం పూర్తిగా అవాస్తవమని చెప్పారు. గ్రామాల్లో రోజుకి నాలుగైదు గంటలు మించి కరెంటు అందడంలేదన్నది పచ్చి అబద్ధమని, అనధికార కోతలు విధిస్తున్నారన్నదీ అవాస్తవమేనని తెలిపారు. అన్నదాతలకు రోజుకు 9 గంటల ఉచిత విద్యుత్ సరఫరా విషయంలో ఎటువంటి రాజీ లేదని,. ఒకవేళ ఏదైనా అత్యవసర పరిస్థితి వల్ల సరఫరాలో అంతరాయం ఏర్పడితే అదే రోజు మరొక సమయంలో భర్తీ చేస్తున్నామని వెల్లడించారు. ‘సాక్షి’ ప్రతినిధికి సీఎండీలు వెల్లడించిన వివరాలు.. ► గ్రిడ్ లో ఏర్పడే ఫ్రీక్వెన్సీ హె చ్చు తగ్గులను అదుపు చేయడానికి దక్షిణ భారత లోడ్ డిస్పాచ్ సెంటర్ (బెంగళూరు) ఆదేశాలతో ఆటోమాటిక్ లోడ్ షెడ్డింగ్ విధానం అప్పుడప్పుడు అమల్లోకి వస్తుంటుంది. వెంటనే సంబంధిత విద్యుత్ సంస్థల ఇంజనీర్లు పరిస్థితిని అదుపు చేసి సరఫరాలో అంతరాయంలేకుండా చేయడానికి కృషి చేస్తున్నారు. ► ఈ సంవత్సరం వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ అక్టోబర్ నెలలో రోజుకు 210 నుంచి 215 మిలియన్ యూనిట్లు ఉండాల్సిన విద్యుత్ వినియోగం దాదాపు 245 మిలియన్ యూనిట్లుగా నమోదవుతోంది. గతేడాది ఇదే సమయానికి సరాసరి రోజువారీ వినియోగం 170 నుంచి 180 మిలియన్ యూనిట్లు ఉండేది. బుధవారం రాష్ట్రంలో 234 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ ఏర్పడింది. ఇది గతేడాది కంటే 37 శాతం ఎక్కువ. తక్కువ వర్షపాతం వల్ల తగినంత సాగు నీరు అందుబాటులో లేని పరిస్థితుల్లో వ్యవసాయ విద్యుత్ వినియోగం అంచనాలకు మించి పెరిగిపోయింది.వాతావరణ మార్పుల వల్ల పవన విద్యుత్ ఉత్పత్తి ఆశించిన స్థాయిలో లేదు. ఈ కారణాలతో రాష్ట్ర విద్యుత్ గ్రిడ్‌పై తీవ్ర ఒత్తిడి ఏర్పడుతోంది. ► ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్ సరఫరా గ్రిడ్ డిమాండ్‌కు అనుగుణంగా నిలకడగా ఉంది. ఏ విధమైన ఒడిదొడుకులు ఏర్పడినా పరిస్థితిని సరిదిద్దడానికి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఎంత ఖర్చయినా వెనుకాడకుండా స్వల్పకాలిక మార్కెట్లో విద్యుత్ కొని, సరఫరా చేయడానికి డిస్కంలు సిద్ధంగా ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితులను ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుని విద్యుత్ కొరత ఏర్పడే సమయాల్లో అత్యవసరంగా మార్కెట్ కొనుగోళ్లకు వెళ్తున్నాయి. బహిరంగ మార్కెట్ నుంచి బుధవారం యూనిట్ సగటు రేటు రూ.8.963 చొప్పున రూ.62.554 కోట్లతో 69.789 మిలియన్ యూనిట్లను కొనుగోలు చేశాయి. ► మన రాష్ట్రంలో విద్యుత్ కొరత పరిస్థితులు లేవు. బీహార్‌లో 7.60 మిలియన్ యూనిట్లు, ఉత్తరప్రదేశ్‌లో 5.73 మిలియన్ యూనిట్లు, కర్ణాటకలో 4.40 మిలియన్ యూనిట్లు, రాజస్థాన్‌లో 3.10 మిలియన్ యూనిట్లు, జమ్మూ కాశ్మీర్, లడఖ్‌లో 47.4 మిలియన్ యూనిట్ల విద్యుత్ లోటు ఉంది. కానీ మన రాష్ట్రంలో ఈ లోటు సున్నాగా ఉంది. -
24 గంటలు కరెంటు ఇవ్వాలి
గరిడేపల్లి: 24 గంటల పాటు విద్యుత్ సరఫరా చేయాలని కోరుతూ బుధవారం సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం కల్మల చెరువు విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద రైతులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ, ప్రస్తుతం పంట పొట్టదశలో ఉందని విద్యుత్ కోతలు విధించడంతో పొలాలు తడవక తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నామని చెబుతోందని, సబ్ స్టేషన్ నుంచి మాత్రం విద్యుత్ సరఫరా జరగడం లేదన్నారు. కనీసం 12 గంటలు అయినా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. సాగర్ కాల్వకు నీటి సరఫరా చేయకపోయినా విద్యుత్ సరఫరా నిరంతరాయంగా కొనసాగితే 80 శాతం పంట రైతులకు దక్కుతుందన్నారు. ధర్నాలో రైతులు సప్పిడి లచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఊరు చీకట్లో మగ్గుతోందని..
(సూర్యాపేట) : అసలే ఎడతెరిపి లేని వర్షాలు, ఆపై చెరువును తలపించేలా చుట్టూ నీరు.. దీనికి తోడు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఊరు ఊరంతా చికట్లో మగ్గిపోతోంది. దీనిని చూడలేని ఓ యువకుడు తన ప్రాణాలను ఫణంగా పెట్టి సాహసం చేశాడు. నీటిలో ఈదుకుంటూ వెళ్లి.. విద్యుత్ స్తంభంం ఎక్కి మరమ్మతులు చేసి విద్యుస్ సమస్యను తీర్చాడు. వివరాలు ఇలా ఉన్నాయి. ఆత్మకూర్(ఎస్) మండల పరిధిలోని పాతర్లపహాడ్ గ్రామానికి చెందిన కొప్పుల సంతోష్ గౌడ్ స్థానిక లైన్‌మన్ కింద హెల్పర్‌గా పనిచేస్తున్నాడు. బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. దీనికి తోడు గ్రామానికి పైభాగంలో ఉన్న అయ్యవారికుంట తండా చెరువు నుంచి శంభుని చెరువుకి వచ్చే కరకట్ట తెగిపోయింది. ఈ వరదంతా పాతర్లపహాడ్లోని ముదిరాజ్ కాలనీని ముంచెత్తింది. దీంతో గురువారం రాత్రి నుంచి గ్రామానికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీన్ని సరిచేయాలని ప్రయత్నించగా చెరువును తలపించేలా చుట్టూ వరద నీరు ఉన్న ఓ స్తంభంపై సమస్య ఉందని గుర్తించారు. ఈ స్తంభంపై మరమ్మతులు చేస్తేనే గ్రామానికి విద్యుత్ సరఫరా అవుతుందని, లేదంటే చీకట్లోనే గడపాల్సి ఉందని భావించారు. విధి నిర్వహణలో భాగంగా అక్కడే ఉన్న విద్యుత్ హెల్పర్ సంతోష్ గౌడ్ వరదను లెక్కచేయకుండా దిగాడు. చాలా దూరం ఈదుకుంటూ వెళ్లి స్తంభం ఎక్కి మరమ్మతులు పూర్తి చేసి క్షేమంగా తిరిగి వచ్చాడు. సంతోష్ గౌడ్ చేసిన సాహసానికి గ్రామ ప్రజలే కాకుండా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి కూడా ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు. -
‘పవర్’ఫుల్ ఐపీయస్ ఆఫీసర్
మనం సాంకేతికంగా ఎంత వేగంగా దూసుకుపోతున్నా, కొన్ని ప్రాంతాలలో మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే... అన్నట్లుగా ఉంది పరిస్థితి. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌కు చెందిన 70 సంవత్సరాల నూర్జహాన్ ఇంట్లో ఒక్కసారి కూడా బల్బ్ వెలగలేదు. ఆ ఇంటికి ఎలక్ట్రిసిటీ లేదు. విషయం తెలిసిన ఐపీయస్ ఆఫీసర్ అనుకృతిశర్మ వ్యక్తిగత చొరవ తీసుకొని ఆ ఇంటికి కరెంట్ తీసుకు వచ్చింది. బామ్మ కళ్లలో వెలుగులు నింపింది. ఆ ఇంట్లో బల్బ్ వెలగడమే కాదు ‘మీరు చల్లగా ఉండాలి’ అంటున్నట్లుగా ఫ్యాన్ తిరగడం మొదలుపెట్టింది. దీంతో బామ్మ ముఖం సంతోషంతో వెలిగిపోయింది. అనుకృతిని ఆలింగనం చేసుకొని స్వీట్లు పంచింది. ‘ఆమె ముఖంలో కనిపించిన సంతోషం నాకెంతో సంతృప్తిని ఇచ్చింది’ అంటూ ఈ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేసింది అనుకృతి. అనుకృతి శర్మ దయాహృదయానికి నెటిజనులు జేజేలు చెప్పారు. ‘బామ్మ ఇంట్లోనే కాదు జీవితంలోనూ వెలుగులు నిండాలి’ అంటూ కామెంట్స్ పెట్టారు. -
ఆ అవ్వ కళ్లలో ఆనందం.. ఐపీఎస్ అనుపై ప్రశంసలు
Viral Video: భావోద్వేగ సన్నివేశాలను తెర మీద చూసినప్పుడు కలిగే ఆనందం మాటల్లో వర్ణించలేనిది. అలాంటి క్షణాలు నిజజీవితంలోనూ కలిగితే!. ఆ ఆనందానికి అవధులు ఉంటాయా?.. కొన్ని కోట్లు ఖర్చు చేసినా అలాంటి ఆనందం దొరకదు మరి. యువ ఐపీఎస్ అధికారిణి అనుకృతి విషయంలోనూ అదే జరిగిందట. ఆ క్షణాల్ని ఆమె పంచుకోగా.. పలువురు అభినందిస్తున్నారు కూడా. ఉత్తర ప్రదేశ్ బులందర్‌షెహర్ జిల్లా ఐపీఎస్ అధికారిణి అనుకృతి శర్మ స్వయంగా ‘స్వదేశ్’చిత్ర అనుభూతిని పొందారట. ఆ హిందీ చిత్రంలో నాసా సైంటిస్ట్ అయిన షారూక్ ఖాన్ తన ఊరికి కరెంట్ తెప్పించడానికి చేసే ప్రయత్నాన్ని డైరెక్టర్ అశుతోష్ గోవార్కికర్ స్క్రీన్ మీద ఎంతో ఎమోషనల్‌గా చూపించారు. అలాంటి క్షణాల్ని.. అనుభూతినే తాను పొందానని ఐపీఎస్ అను స్వయంగా ట్వీట్ చేశారు. నూర్జహాన్(70) అనే వృద్ధురాలి ఇంటికి అనుకృతి దగ్గరుండి విద్యుత్ సదుపాయం అందించారు. ఆమె ఇంట్లో లైట్ వెలగగానే అటు అను ముఖంలో.. ఇటు బామ్మ ముఖంలో సంతోషం ఒక్కసారిగా వెల్లివిరిసింది. ఆ సంతోష కాంతుల్ని ట్విటర్ ద్వారా ఆమె పంచుకున్నారు. ఆమె ఇంటికి కరెంట్ తెప్పించడంలో సహకరించిన ఎస్‌హెచ్‌వో జితేంద్రకు, మొత్తం టీంకు ఆమె కృతజ్ఞతలు సైతం తెలియజేశారు. అనుకృతి శర్మ.. 2020 ఐపీఎస్ బ్యాచ్ అధికారిణి. ప్రస్తుతం బులంద్‌షెహర్‌కు అదనపు ఎస్పీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారామె. ఒంటరిగా పేదరికంలో ఉన్న నూర్జహాన్.. తన ఇంటికి వెలుగులు కావాలని నేరుగా పోలీసులను ఆశ్రయించిందట. ఆ విషయం తెలియగానే ఐపీఎస్ అనుకృతి.. ఇలా రంగంలోకి దిగి స్వయంగా ఆ ఏర్పాట్లను పర్యవేక్షించింది. అంతేకాదు ఓ ఫ్యాన్‌ను సైతం ఆ పెద్దావిడకు అందించింది. ఆపై అంతా స్వీట్లు పంచుకున్నారు. Swades moment of my life 🌸😊 Getting electricity connection to Noorjahan aunty's house literally felt lyk bringing light into her life. The smile on her face ws immensely satisfying.Thank u SHO Jitendra ji & the entire team 4 all da support 😊#uppcares @Uppolice @bulandshahrpol pic.twitter.com/3crLAeh1xv — Anukriti Sharma, IPS 🇮🇳 (@ipsanukriti14) June 26, 2023 ఇదీ చదవండి: జాతకాల పిచ్చోడా? బ్యాంక్ అధికారులకు షాకిచ్చాడుగా! -
ఏపీలో ఆల్‌టైమ్ రికార్డు దాటిన కరెంట్ వినియోగం
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ వినియోగం ఆల్‌టైమ్ రికార్డ్ స్థాయికి చేరుకుంది. తీవ్ర ఎండలతో విద్యుత్ వినియోగం అనూహ్యంగా పెరిగింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 251 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరిగింది. గత ఎనిమిదేళ్లలో ఇంత రికార్డు స్ధాయిలో విద్యుత్ వినియోగం జరగలేదు. ఎన్నడూ లేని విధంగా 12,660 మెగావాట్లకి పైగా విద్యుత్ డిమాండ్ ఏర్పడింది. రాబోయే రోజుల్లో 255 మిలియన్ యూనిట్ల వరకు అత్యధిక వినియోగం పెరగవచ్చని విద్యుత్ శాఖ చెబుతోంది. మరో వారం రోజులపాటు ఇదే విధంగా విద్యుత్ డిమాండ్ కొనసాగనున్నట్లు విద్యుత్‌శాఖ స్పెషల్ సీఎస్ విజయానంద్ తెలిపారు. అయితే ఊహించని డిమాండ్ ఏర్పడినా కూడా కోతలు లేకుండా విద్యుత్ సరఫరా చేస్తున్నామని పేర్కొన్నారు. ముందస్తు ప్రణాళికతో బహిరంగ మార్కెట్ లో పదిరూపాయిలుండే యూనిట్ విద్యుత్‌ను 6.40 రూపాయిల నుంచి 7 రూ. లోపు కొంటున్నామని తెలిపారు.విద్యుత్ డిమాండ్ ఒక్కసారిగా పెరగడంతో రోజూ 30 నుంచి 40 మిలియన్ యూనిట్లు కొనుగోలు చేస్తున్నామన్నారు. ఆయన మాట్లాడుతూ..‘అత్యధిక డిమాండ్ కారణంగా ఉభయగోదావరి జిల్లాలలోని కొన్ని లైన్లలో వచ్చిన సాంకేతిక సమస్యలని సరిచేస్తున్నాం. నున్న- గుడివాడ విద్యుత్ లైన్‌కు ఏర్పడిన సమస్యలని పరిష్కరిస్తున్నాం. ఏపీలో ఇంత విద్యుత్ డిమాండ్ ఉన్నా కోతలు విధించలేదు. సాధారణంగా ఏప్రియల్ నెలలోనే విద్యుత్ డిమాండ్ ఉంటుంది. కానీ మే నెలలో ఎండలు తీవ్రంగా ఉండటంతో ఊహించని డిమాండ్ ఏర్పడింది. మే నెలలో 215 మిలియన్ యూనిట్ల వరకే వినియోగం ఉంటుందనుకున్నాం కానీ విద్యుత్ వినియోగం రికార్డుస్ధాయిలో 250 మిలియన్ యూనిట్లు దాటేసింది’ అని వెల్లడించారు. చదవండి: కోతల్లేని కరెంట్.. ప్రభుత్వ ముందు చూపు వల్లే సాధ్యం -
కోతల్లేని కరెంట్..
నాడు చీకటి రోజులు గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ‘పట్టణాల్లో ఉదయం 6 గంటల నుంచి 11 వరకు.. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 వరకు.. గ్రామీణ ప్రాంతాల్లో అయితే పగలంతా విద్యుత్ సరఫరా ఉండదు’ అని అధికారికంగా ప్రకటనలు జారీ అయ్యేవి. ‘ఎండా కాలం కదా.. పవర్ కట్ మామూలే’ అని అప్పటి పాలకులు దబాయించే వారు. కరెంట్ ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో ఎవరికీ తెలిసేది కాదు. వంటింట్లో మిక్సీలు తిరక్క గృహిణులు, హాల్లో ఫ్యాన్ తిరక్క పిల్లలు, ఆఫీసుల్లో ఏసీలు పని చేయక ఉద్యోగులు, జిరాక్స్ సెంటర్ల వద్ద విద్యార్థుల పాట్లు అన్నీ ఇన్నీ కాదు. విద్యుత్ ఎప్పుడొస్తుందా అని కళ్లు కాయలు కాసేలా ఎదురు చూడాల్సి వచ్చేది. ఆ రోజులను గుర్తు చేస్తే చాలు ప్రజలు కథలు కథలుగా చెబుతారు. నేడు వెలుగు జిలుగులు ఎక్కడా ‘విద్యుత్ కోత’ అన్న పదానికి తావు లేకుండా సీఎం వైఎస్ జగన్ ముందు చూపుతో వ్యవహరించారు. గృహాలకు, పరిశ్రమలకు, వ్యవసాయానికి ఏ రీతినా సమస్య లేకుండా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా జరిగేలా ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం బొగ్గు నిల్వలు సరిపడా ఉండేలా చూసుకోవడంతో పాటు బయటి మార్కెట్లోనూ విద్యుత్ కొనుగోలు చేశారు. సరఫరాలో నాణ్యత పెరిగేలా వ్యవస్థాగత మార్పులు చేశారు. ఈ ఏడాది ఇదివరకెన్నడూ లేనంతగా అనూహ్యంగా డిమాండ్ పెరగడంతో అక్కడక్కడ ఓవర్‌లోడ్‌తో ట్రిప్ కావడం తప్పించి ఏ సమస్యా లేకుండా శ్రద్ధ పెట్టారు. అలాంటి చోట్ల నిమిషాల వ్యవధిలోనే మరమ్మతులు చేసేలా యంత్రాంగాన్ని సన్నద్ధం చేశారు. తద్వారా ఇళ్లలో, కార్యాలయాల్లో ఎక్కడా ‘విద్యుత్ కోత’ అన్నమాటే వినిపించడం లేదు. ఫ్యాన్లు, ఏసీలు, ఫ్రిజ్‌లు నిరంతరాయంగా పని చేస్తున్నాయి. వ్యవసాయానికి 18.49 లక్షల వ్యవసాయ సర్వీసులకు పగటి పూటే 9 గంటలు నిరంతర విద్యుత్ అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ)తో 7 వేల మెగావాట్ల కొనుగోలుకు ఒప్పందం చేసుకుంది. దీంతోపాటు రూ.1700 కోట్లతో ఫీడర్లను అప్‌గ్రేడ్ చేసింది. తద్వారా 30 ఏళ్ల పాటు రైతులకు ఉచిత విద్యుత్‌కు ఎలాంటి ఢోకా లేకుండా ఏర్పాటు చేసింది. పరిశ్రమలకూ ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేస్తోంది. సాక్షి, అమరావతి : రాష్ట్రంలో ఇదివరకెన్నడూ లేని విధంగా విద్యుత్ డిమాండ్ పెరిగినప్పటికీ, ఎక్కడా కోతలన్నదే లేకుండా సరఫరా సవ్యంగా సాగుతోంది. ఆర్థిక కార్యకలాపాలు గణనీయంగా పెరగడం, ఎండలు మండిపోతుండటం వల్ల విద్యుత్ వినియోగం అమాంతం పెరిగింది. అయినా కాసేపు కూడా విద్యుత్ కోత లేకుండా నిరంతరాయంగా సరఫరా జరిగేలా సీఎం వైఎస్ జగన్ ముందు చూపుతో వ్యవహరించారు. గత సంవత్సరం గరిష్ట డిమాండ్‌తో పోలిస్తే ఇప్పుడు 27.51 శాతం అధికంగా ఉంది. ఉష్ణోగ్రత 46 డిగ్రీలు దాటుతోంది. దీంతో జనం ఇళ్ల నుంచి బయటకు రావడానికే భయపడుతున్నారు. ఫలితంగా ఇంట్లో ఫ్యాన్లు, ఏసీలు, కూలర్లు, ఫ్రిజ్‌లు వంటి గృహోపకరణాలు నిరంతరం పని చేస్తున్నాయి. ఎక్కువ సమయం ఇంట్లోనే గడపడం వల్ల మిక్సీలు, గ్రైండర్లు, టీవీలు, కంప్యూటర్ల వినియోగం కూడా అధికంగానే ఉంటోంది. మరోవైపు పారిశ్రామిక వినియోగం కూడా పెరిగింది. ఈ నేపథ్యంలో విద్యుత్ వినియోగం రాకార్డు స్థాయిలో పెరిగిపోయింది. రోజువారీ డిమాండ్ 248.985 మిలియన్ యూనిట్లుగా నమోదవుతోంది. గత ఏడాది ఇదే సమయానికి 195.266 మిలియన్ యూనిట్లుగా ఉండింది. రోజులో పీక్ డిమాండ్ 12,482 మెగావాట్లుగా ఉంది. గత ఏడాది ఇదే సమయానికి 9308 మోగావాట్లు మాత్రమే. అంటే 34.10 శాతం పెరిగింది. పగటి పూట సగటు పీక్ డిమాండ్ 10,374 మెగావాట్లు, సాయంత్రం వేళల్లో 9,582 మెగావాట్లకు చేరుకుంది. అయినప్పటికీ గృహ, వ్యవసాయ, పారిశ్రామిక, వాణిజ్య విద్యుత్‌కు ఇబ్బంది లేకుండా, డిమాండ్‌కు తగ్గట్టుగా విద్యుత్ సంస్థలు వినియోగదారులకు నిరంతరం కరెంట్ సరఫరా చేస్తున్నాయి. ఇలా దేశంలోనే ఎక్కడా జరగడం లేదని, రాష్ట్రం అభివృద్ధిపథంలో పయనిస్తోందని చెప్పడానికి ఇదొక పెరామీటర్‌గా చెప్పవచ్చని విద్యుత్ రంగ నిపుణులు చెబుతున్నారు. ముందు చూపుతో విద్యుత్ కొనుగోలు ప్రస్తుతం ఏపీజెన్కో థర్మల్ నుంచి 89.981 మి.యూ, ఏపీ జెన్కో హైడల్ నుంచి 5.414 మి.యూ, సెంట్రల్ జెనరేటింగ్ స్టేషన్ల నుంచి 43.012 మి.యూ, సెయిల్, హెచ్‌పీసీఎల్, గ్యాస్ వంటి ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యూసర్ల నుంచి 28.510 మి.యూ, సోలార్ నుంచి 25.605 మి.యూ, విండ్ నుంచి 11.591 మి.యూ, ఇతర మార్గాల్లో 1.496 మిలియన్ యూనిట్లు చొప్పున విద్యుత్ సమకూరుతోంది. అయితే ఇది మాత్రమే సరిపోవడం లేదు. దీంతో బహిరంగ మార్కెట్ నుంచి యూనిట్ సగటు రేటు రూ.7.537 చొప్పున రూ.33.936 కోట్లతో 45.023 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ప్రతి రోజూ కొనుగోలు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో ఈ విధంగా డిమాండ్‌ను అందుకోలేక భారీగా విద్యుత్ కోతలు విధిస్తున్నారు. జార్ఖండ్‌లో 4.62 మి.యూ, హర్యానాలో 2.64 మి.యూ, ఉత్తరప్రదేశ్‌లో 2.03 మి.యూ, కర్ణాటకలో 1.97 మిలియన్ యూనిట్ల విద్యుత్ లోటు ఏర్పడింది. సరిపడా బొగ్గు నిల్వలు దేశంలోని మొత్తం విద్యుత్ ఉత్పత్తిలో 70 శాతం థర్మల్ నుంచే వస్తోంది. ఇందులో ఇప్పుడు వినియోగిస్తున్న బొగ్గుకు దాదాపు 40 శాతం నుంచి 50 శాతం అదనంగా బొగ్గును సమకూర్చుకోవాలని, విదేశీ బొగ్గును 6 శాతం దిగుమతి చేసుకుని స్వదేశీ బొగ్గుతో కలిపి వాడుకోవాలని కేంద్రం చెప్పింది. అందుకు అనుగుణంగా రైల్వే ర్యాక్స్‌ను పెంచాలని ఏపీజెన్కో, రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని, రైల్వేను కోరాయి. 14 రైల్వే ర్యాకులు సరిపోవడం లేదని, వీటితో పాటు మరో ఆరు ర్యాకులు పెంచాలని అడిగాయి. దీంతో మరో మూడు ర్యాకులు అదనంగా వచ్చాయి. వీటి ద్వారా మహానది కోల్ ఫీల్డ్స్ నుంచి, సింగరేణి కాలరీస్ నుంచి బొగ్గును తీసుకువస్తున్నారు. ఫలితంగా ప్రస్తుతం వీటీపీఎస్‌లో 83,479 మెట్రిక్ టన్నులు, ఆర్టీపీపీలో 30,001 మెట్రిక్ టన్నులు, కృష్ణపట్నంలో 29,000 మెట్రిక్ టన్నులు, హిందూజా వద్ద 19200 మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలున్నాయి. యుద్ధ ప్రాతిపదికన వీటీపీఎస్ పునరుద్ధరణ సోలార్ ఉత్పత్తి చాలా తక్కువగా ఉన్నప్పుడు, థర్మల్ జనరేటర్లు పీక్ లోడ్‌లో పని చేస్తున్నప్పుడు వీటీపీఎస్ వద్ద జనరేటర్లు ఈ నెల 17వ తేదీ రాత్రి 7 గంటలకు ట్రిప్ అయ్యాయి. పవన, సౌర విద్యుత్ ఉత్పత్తి ఆ రోజు వాతావరణం, సమయం మీద ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం రిజర్వాయర్ మట్టం తక్కువగా ఉన్నందున శ్రీశైలంలో హైడల్ ఉత్పత్తి అందుబాటులో లేదు. గ్యాస్ పరిమితి కారణంగా గ్యాస్ స్టేషన్ల నుంచి ఉత్పత్తి ఆశించిన స్థాయిలో లేదు. ఈ నేపథ్యంలో బహిరంగ మార్కెట్లో విద్యుత్‌ను కొనుగోలు చేసి మరీ ప్రజలకు అందించారు. అదే సమయంలో వీటీపీఎస్‌లో యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టి, అన్ని యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తిని పునరుద్ధరించారు. వాస్తవాలు మరచి దుష్ప్రచారం ఎక్కడా విద్యుత్ కోతలు లేకపోయినప్పటికీ చంద్రబాబుకు లబ్ధి చేకూర్చేలా ఎల్లో మీడియా తప్పుడు రాతలు రాస్తోంది. గత చంద్రబాబు ప్రభుత్వం హయాంలో విద్యుత్ సరఫరా దుస్థితిని వ్యూహాత్మకంగా విస్మరిస్తోంది. గంటల తరబడి కోతలు విధించారనే విషయాన్ని దాస్తోంది. అప్పట్లో వేసవిలో కరెంటు పరిస్థితి చెప్పనలవి కాదు. వేసవిలో కాకుండా కూడా కోతలు విధించిన రోజులున్నాయి. పరిశ్రమలకైతే ఏకంగా పవర్ హాలిడేలు ఇచ్చారు. వారంలో మూడు రోజులు పరిశ్రమలన్నింటికీ తాళం వేయాల్సి వచ్చేది. జిరాక్స్ మిషన్లు, పిండి మరలు, కూల్ డ్రింక్స్ దుకాణాలు, కూలింగ్ వాటర్ ప్లాంట్లు గంటల తరబడి పని చేయక చిరు వ్యాపారులు నష్టాలు చవిచూశారు. విద్యుత్ కోతల గురించి మాట్లాడితే అప్పటి ప్రభుత్వ పెద్దలు, మంత్రులు దబాయించే వారు. ‘ఎండా కాలం.. ఆ మాత్రం విద్యుత్ కోత ఉండదా.. ఇప్పుడే కొత్తగా కోతలు విధిస్తున్నా.. ఇది వరకు కోతల్లేవా’ అని ఎదురు దాడికి దిగేవారు. ఈ సమస్యలన్నింటికీ చెక్ పెడుతూ సీఎం జగన్ ప్రభుత్వం కోత అన్నదే లేకుండా విద్యుత్ సరఫరా చేస్తుంటే ఎల్లో మీడియాకు కడుపు మండుతోంది. వంకర బుద్ధి చూపిస్తూ.. చిన్న చిన్న సాంకేతిక కారణాలతో విద్యుత్ పోయిన ప్రాంతాలను చూపుతూ దుష్ప్రచారం చేస్తోంది. -
‘24 గంటలపాటు ఎలాంటి కోతల్లేకుండా విద్యుత్ ఇస్తున్నాం’
సాక్షి, విజయవాడ: విద్యుత్ కోతలు ఉండకూదనే తరచు సీఎం జగన్ సమీక్షలు నిర్వహిస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత ఇంతవరకూ విద్యుత్ కోతలు అనే సమస్యే రాలేదన్నారు. ఈరోజు(గురువారం) విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో రూ. 15 కోట్లతో నిర్మించిన మూడు విద్యుత్ సబ్ స్టేషన్లను మంత్రి పెద్దిరెడ్డి ప్రారంభించారు. దీనిలో భాగంగా మాట్లాడిన మంత్రి పెద్దిరెడ్డి.. ‘ 2016లో శంకుస్థాపనలు చేసి వదిలేసిన సబ్స్టేషన్లను మేం పూర్తి చేశాం. విద్యుత్ కోతలు ఉండకూడదనే తరచూ సీఎం జగన్ సమీక్షలు. వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత ఇంతవరకూ విద్యుత్ కోతల్లేవు. 24 గంటలపాటు ఎలాంటి కోతల్లేకుండా విద్యుత్ ఇస్తున్నాం. రైతులు, పరిశ్రమలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన వాగ్ధానాన్ని సీఎం నెరవేర్చారు. రైతులకు పగటిపూటే విద్యుత్ ఇస్తున్నాం. ఒక విద్యుత్ కనెక్షన్ కూడా పెండింగ్‌లో లేదు. మేం వచ్చాక లక్షా 25వేల పెండింగ్ విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేశాం. రైతులు దరఖాస్తు చేసిన వెంటనే విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేశాం. చంద్రబాబు ఏం మాట్లాడతాడో అతనికే అర్థం కాదు’ అని పేర్కొన్నారు. ఎన్జీటీ మార్గదర్శకాలకు అనుగుణంగా చర్యలు -
విద్యుత్ కొరత రాకూడదు
సాక్షి, అమరావతి: వేసవిలో విద్యుత్ కొరత రాకూడదని, డిమాండ్‌కు సరిపడా విద్యుత్‌ను సమకూర్చుకోవడానికి అన్ని విధాలుగా సిద్ధం కావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇంధన శాఖ అధికారులను ఆదేశించారు. వేసవిలో విద్యుత్ డిమాండ్, రైతులకు విద్యుత్ కనెక్షన్లు, నాణ్యమైన విద్యుత్ సరఫరా తదితర అంశాలపై శుక్రవారం ఆయన తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ఇంధన శాఖతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో విద్యుత్ సరఫరా పరిస్థితి, వేసవి డిమాండ్ అంచనాలను ఈ సందర్భంగా అధికారులు సీఎంకు వివరించారు. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నందున ఫిబ్రవరి 2వ వారం నుంచే విద్యుత్ డిమాండ్ పెరిగిందని చెప్పారు. మార్చిలో సగటున రోజుకు 240 మిలియన్ యూనిట్లు, ఏప్రిల్‌లో 250 మిలియన్ యూనిట్లు ఉంటుందని అంచనా వేశామని తెలిపారు. విద్యుత్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే పవర్ ఎక్స్చ్ంజ్ (బహిరంగ మార్కెట్)లో విద్యుత్‌ను షార్ట్ టర్మ్ టెండర్ల ద్వారా ముందస్తుగా బుక్ చేసుకున్నామని చెప్పారు. బొగ్గు నిల్వల విషయంలో కూడా అధికారులు తగిన జాగ్రత్త వహించాలని, థర్మల్ కేంద్రాలకు బొగ్గు కొరత రాకుండా అన్ని విధాలుగా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. వేసవిలో విద్యుత్ కొరత కారణంగా కరెంటు కోతలనే సమస్య ఉత్పన్నం కాకూడదని స్పష్టం చేశారు. అదే నెలలో విద్యుత్ కనెక్షన్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు అందించే వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లపై ఈ సమావేశంలో సీఎం కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇదివరకే దరఖాస్తు చేసుకున్న వారికి 1.06 లక్షల కనెక్షన్లు ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే మంజూరు చేశామని సీఎంకు అధికారులు వెల్లడించారు. మార్చి నాటికి మరో 20 వేల కనెక్షన్లపైగా మంజూరు చేస్తున్నామని చెప్పారు. రైతులకు కనెక్షన్ల మంజూరులో ఎలాంటి జాప్యం జరగకూడదన్న సీఎం.. ఇకపై ఏ నెలలో దరఖాస్తు చేసుకుంటే అదే నెలలో సర్వీసు మంజూరు చేయాలని ఆదేశించారు. ఈ ఆదేశాలను తక్షణమే అమలు చేస్తామని అధికారులు చెప్పారు. సరఫరాలో నాణ్యత విద్యుత్ సరఫరా నాణ్యతను పెంచాలన్న సీఎం ఆదేశాల మేరకు అనేక చర్యలు తీసుకున్నామని అధికారులు వివరించారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 100 విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణం పూర్తవుతోందని తెలిపారు. మార్చి ఆఖరు నాటికి వీటిని పూర్తి చేస్తామని తెలిపారు. పేదలందరికీ ఇళ్లు పథకం కింద నిర్మాణాలు పూర్తి చేసుకుంటున్న ఇళ్లకు వెంటనే కనెక్షన్లు మంజూరు చేస్తున్నామని చెప్పారు. ఇప్పటికే వైఎస్సార్ జగనన్న కాలనీల్లో 2.18 లక్షలకుపైగా ఇళ్లకు కనెక్షన్లు ఇచ్చామని, ఇళ్లు పూర్తవుతున్న కొద్దీ వాటికి శరవేగంగా కనెక్షన్లు ఇస్తున్నామని వెల్లడించారు. ఈ సమావేశంలో విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్ డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి, ఇంధన శాఖ స్పెషల్ సీఎస్ కె.విజయానంద్, పరిశ్రమల శాఖ స్పెషల్ సీఎస్ కరికాల వలవెన్, ట్రాన్స్‌కో జేఎండీలు ఐ.పృధ్వీతేజ్, బి.మల్లారెడ్డి, డిస్కంల సీఎండీలు కె.సంతోషరావు, జె.పద్మాజనార్ధనరెడ్డి, నెడ్‌క్యాప్ వీసీఎండీ ఎస్.రమణారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
అమెరికాలో భీకర మంచు తుపాను.. 1989 తర్వాత తొలిసారిగా బ్లిజ్జార్డ్ వార్నింగ్
పియెర్రె: అమెరికాను భీకర మంచు తుపాను వణికిస్తోంది. రోడ్లపై మంచు పేరుకుపోవడంతో ఎక్కడి వాహనాలక్కడే నిలిచిపోయాయి. వందలాది నివాసాలకు కరెంటు సరఫరా నిలిచిపోయింది. విమాన సర్వీసులు రద్దయ్యాయి. స్కూళ్లు మూతబడ్డాయి. వాతావరణ విభాగం 1989 తర్వాత మొదటిసారిగా మంచు తుపాను (బ్లిజ్జార్డ్) హెచ్చరికలను జారీ చేసింది. కొన్ని తీర ప్రాంతాల్లో అలలు 3 నుంచి 4.3 మీటర్ల ఎత్తున ఎగిసిపడుతున్నాయి. తుపాను తీవ్రత దృష్ట్యా సుమారు 24 రాష్ట్రాల్లోని 6.5 కోట్ల మంది ప్రజలకు వాతావరణ హెచ్చరికలు జారీ చేశారు. వ్యోమింగ్, ఆరిజోనా, న్యూ మెక్సికో, పోర్ట్‌ల్యాండ్, ఓరెగాన్ పలు చోట్ల ట్రాఫిక్ అంతరాయం ఏర్ప డింది. మిషిగన్, ఇలినాయీ, కాలిఫోర్నియా ల్లో విద్యుత్ లైన్లు తెగిపోవడంతో జనం రాత్రిళ్లు చీకట్లోనే గడిపారు. మంచు, చలిగాలులతో కాలిఫోర్నియా, సియెర్రా నెవడాల్లో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. సుమారు 1,800 విమాన సర్వీసులు రద్దు కాగా, మరో 6 వేలకు పైగా సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇలా ఉండగా, మరికొన్ని రాష్ట్రాల్లో ఇందుకు భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. నాష్‌విల్లేలో బుధవారం అత్యధికంగా 26.67 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదై 127 ఏళ్ల రికార్డు బద్దలైందని అధికారులు చెప్పారు. ఇండియానా పొలిస్, సిన్సినాటి, అట్లాంటా, లెక్జింగ్టన్, కెంటకీ, అలబామాల్లోనూ ఇదే స్థాయిలో ఎండలున్నాయి. -
పంటలకు సకాలంలో కరెంట్ ఇవ్వాలి
సాక్షి, హైదరాబాద్: పంటలు కాపాడుకోవడానికి రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం గొప్పలు చెప్పకుండా సకాలంలో పంటలకు కరెంట్ ఇవ్వాలని టీపీసీసీ నేతలు డిమాండ్ చేశారు. వ్యవసాయ రంగానికి విద్యుత్ సరఫరా అంశంపై అసెంబ్లీలో చర్చించాలన్న తమ విజ్ఞప్తిని స్పీకర్ మన్నించనందుకు నిరసనగా గురువారం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భట్టి విక్రమార్క, డి.శ్రీధర్‌బాబు, సీతక్క, జగ్గారెడ్డి సభ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద నిరసన తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్ కోతలతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు ఉచితంగా 24 గంటలు కరెంట్ ఇస్తున్నామని ప్రభుత్వం డాంబికాలు చెబుతున్నా.. కనీసం 4–5 గంటలు కూడా కరెంట్ ఇవ్వట్లేదని ధ్వజమెత్తారు. ఆ కరెంట్ కూడా ఎప్పుడు ఏ సమయానికి ఇస్తున్నారో చెప్పలేని పరిస్థితి రాష్ట్రవ్యాప్తంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ఇబ్బందుల గురించి మాట్లాడటానికి సమయం ఇవ్వాలని సభలో పదేపదే కోరినా పట్టించుకోలేదన్నారు. తమ వైపు స్పీకర్ కనీసం చూడకుండా వాయిదా తీర్మానాన్ని తిరస్కరించినందుకు బయటకు వచ్చామన్నారు. వ్యవసాయానికి 24 గంటల పాటు నిరవధికంగా ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని, విద్యుత్ కోతలపై సభలో చర్చ జరగాలన్నారు. -
కరెంట్ కోతలపై అన్నదాతల నిరసన
జగిత్యాల రూరల్: అప్రకటిత విద్యుత్ కోతలను నిరసిస్తూ జగిత్యాల జిల్లా పోరండ్ల గ్రామంలోని రైతులు ఆదివారం స్థానిక సబ్ స్టేషన్‌ను ముట్టడించారు. వ్యవసాయ రంగానికి వచ్చే త్రీఫేజ్ కరెంట్ సరఫరాలో అంతరాయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో విద్యుత్ ఉద్యోగులను కార్యాలయంలోని ఓ గదిలో ఉంచి తాళం వేశారు. సబ్‌స్టేషన్ ఎదుట సుమారు రెండు గంటలపాటు బైఠాయించారు. వ్యవసాయ రంగానికి నిరంతరం త్రీఫేజ్ విద్యుత్ సరఫరా చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా.. కనీసం ఐదు గంటలు కూడా ఇవ్వడంలేదని ఆరోపించారు. సమయపాలన లేకుండా అధికారులు కోతలు విధిస్తున్నారని ధ్వజమెత్తారు. రాత్రి, పగలు తేడాలేకుండా 24 గంటలపాటూ వ్యవసాయ బావుల వద్ద కరెంట్ కోసం పడిగాపులు కాస్తున్నామని పేర్కొన్నారు. కాగా సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని ఉద్యోగులు హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. గది తాళం తీసి వారికి విముక్తి కల్పించారు.