Inter-caste marriage
-
పరువు, ఆస్తి కోసమే హత్య
ఇబ్రహీంపట్నం: కులాంతర వివాహం చేసుకోవడంతో పాటు ఆస్తి కోసం బెదిరిస్తోందనే కారణంతో సొంత అక్కను చంపిన నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. వివరాలను సీఐ సత్యనారాయణ మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. కులాంతర వివాహం, ఆస్తి వ్యవహారంతోనే కానిస్టేబుల్ నాగమణిని ఆమె సొంత తమ్ముడు కొంగర పరమేశ్(26) హత్య చేశాడని పేర్కొన్నారు. నాగమణి కదలికలపై నిందితుడికి సమాచారం ఇచ్చిన మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు. మృతురాలు నాగమణికి అక్క హైమావతి, తమ్ముడు పరమేశ్ ఉన్నారు. 2009లో అక్క వివాహం జరగ్గా ఆమె భర్తతో కలిసి తుర్కయంజాల్‌లో నివసిస్తోంది. పదేళ్ల క్రితమే తల్లిదండ్రులు చనిపోవడంతో నాగమణి, పరమేశ్ రాయపోల్‌లోని పెద్దనాన్న సంరక్షణలో పెరిగారు. 2014లో నాగమణికి పటేల్‌గూడ వాసితో వివాహం జరిగింది. ఈ సమయంలో పసుపుకుంకుమల కింద ఎకరా భూమి రాసిచ్చారు. అనంతరం భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో నాగమణి అతన్ని వదిలేసి, రాయపోల్ వచ్చేసింది. హయత్‌నగర్‌లోని హాస్టల్లో ఉంటూ పోటీ పరీక్షలకు సిద్ధమైంది. ఈ క్రమంలో 2020లో కానిస్టేబుల్‌గా ఎంపికై కుషాయిగూడ, హయత్‌నగర్ పీఎస్‌లలో పనిచేసింది. 2022లో మొదటి భర్తతో విడాకులు తీసుకుంది. రాయపోల్‌లో ఉన్నప్పుడే ఆ గ్రామానికి చెందిన బండారి శ్రీకాంత్‌తో ఉన్న పరిచయం ప్రేమగా మారింది. విషయం తెలియడంతో కుటుంబ సభ్యులు పలుమార్లు హెచ్చరించినా ఆమె వినలేదు. దీంతో మొదటి పెళ్లి జరిగిన సమయంలో ఆమెకు ఇచ్చిన ఎకరా భూమిని తిరిగి ఇచ్చేసింది. గత నెల 10న యాదగిరిగుట్టలో శ్రీకాంత్‌ను కులాంతర వివాహం చేసుకుంది. ల్యాబ్ టెక్నీషియన్, డ్రైవర్‌గా పనిచేసే శ్రీకాంత్‌తో కలిసి వనస్థలిపురం సహారా ఎస్టేట్స్‌లోని ఓ అద్దెంట్లో కాపు రం పెట్టారు. ఈ క్రమంలో తన ఎకరం తనకు తిరిగివ్వాలని తమ్ముడిని డిమాండ్ చేసింది. కులాంతర వివాహం చేసుకొని తమ పరువు తీయడమేగాకుండా, భూమి ఇవ్వాలని పేచీ పెడుతోందని పరమేశ్ ఆమెపై కక్ష పెంచుకున్నాడు. పథకం ప్రకారం ఓ కత్తి (కమ్మ కత్తి)కొని కారులో దాచిపెట్టి అవకాశం కోసం ఎదురుచూడసా గాడు. ఆదివారం భర్తతో కలిసి వచి్చందని తెలియడంతో హత్యకు సిద్ధమయ్యాడు. నాగమణి కదలికలను తెలిపేందుకు స్నేహితుడు అచ్చన శివను ఉపయోగించుకున్నాడు. సోమవారం ఉదయం స్కూటీపై విధులకు బయలుదేరిన విషయాన్ని శివ ఫోన్లో చేరవేశాడు. దీంతో పరమేశ్ కారులో ఆమెను వెంబడించాడు. మన్నె గూడ రోడ్డు జంక్షన్ వద్ద వెనకనుంచి ఢీకొట్టి, కిందపడగానే∙వెంటనే కత్తితో దాడి చేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. పోలీసులు మంగళవారం రాయపోల్ సమీపంలోని జనహర్ష వద్ద పరమేశ్‌ను పట్టుకున్నారు. అతని నుంచి కారుతోపాటు ఐ ఫోన్ స్వా«దీనం చేసుకున్నారు. ఇతనికి సహకరించిన శివ కోసం గాలిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి పర్యవేక్షణలో దర్యాప్తు చేస్తున్నారు. -
కారుతో ఢీకొట్టి.. వేట కొడవలితో నరికి
ఇబ్రహీంపట్నం: కులాంతర వివాహం చేసుకుని తమ పరువు తీసిందని, అక్కపై కక్ష పెంచుకున్న తమ్ముడు ఆమెను అతి కిరాతకంగా హతమార్చాడు. స్కూటీపై వెళుతున్న ఆమెను కారుతో ఢీకొట్టాడు. కిందపడిపోయిన ఆమె మెడ, చెంప భాగంలో వేట కొడవలితో దాడి చేశాడు. రక్తపు మడుగులో విలవిల్లాడిన ఆ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీం పట్నం మండలం రాయపోల్ గ్రామ సమీపంలో సోమవారం ఉదయం ఈ దారుణం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా.. రాయపోల్‌కు చెందిన కొంగర నాగమణి (27) హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తోంది. ఏడేళ్ల క్రితమే ఈమెకు వివాహం జరగగా, కొద్దిరోజులకే భర్త నుంచి విడాకులు తీసుకుంది. అనంతరం ఇదే గ్రామానికి చెందిన బండారి శ్రీకాంత్‌ను ప్రేమించి గత నెల 10న యాదగిరిగుట్టలో కులాంతర వివాహం చేసుకుంది. ముందుజాగ్రత్తగా తమకు రక్షణ కల్పించాలని ఇబ్రహీంపట్నం పోలీసులను ఆశ్రయించింది. దీంతో వారు ఇరు కుటుంబాలను పిలిపించి నచ్చజెప్పారు. అనంతరం దంపతులు మన్సురాబాద్‌లో కాపురం పెట్టారు. అయితే తక్కువ కులానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుని, ఊరిలో తమ కుటుంబ పరువు తీసిందని నాగమణిపై కక్ష పెంచుకున్న ఆమె తమ్ముడు పరమేశ్ అవకాశం కోసం ఎదురు చూడటం ప్రారంభించాడు. విధులకు వెళ్తుండగా.. తన తల్లిదండ్రులు హంసమ్మ, సత్తయ్యను చూసేందుకు శ్రీకాంత్ రెండురోజుల క్రితం భార్య నాగమణితో కలిసి రాయపోల్ వచ్చాడు. సోమవారం ఉదయం హయత్‌నగర్ పీఎస్‌లో విధులకు హాజరయ్యేందుకు నాగమణి ఒక్కరే స్కూటీపై బయలుదేరారు. ఊరు దాటగానే అప్పటికే దారికాచిన పరమేశ్ కారులో వెంబడించాడు. మన్నెగూడ సబ్ స్టేషన్ జంక్షన్ వద్ద స్కూటీని కారుతో వేగంగా ఢీకొట్టి, కిందపడిన ఆమెపై దాడి చేసి చంపేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న సీఐ సత్యనారాయణ సంఘటన స్థలానికి చేరుకుని క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పరమేశ్ వెంటాడుతున్నాడని చెప్పింది నాగమణి, తాను ఎనిమిదేళ్లుగా ప్రేమించుకుంటున్నామని, ఆమెకు తల్లిదండ్రులు లేకపోవడంతో నాలుగేళ్లు హాస్టల్లో ఉండి చదువుకుందని, ఆ సమయంలో అన్నీ తానై చూసుకున్నానని శ్రీకాంత్ తెలిపారు. యాదగిరిగుట్టలో తమ వివాహం జరిగిందని, నాగమణి పేరున ఉన్న ఎకరా భూమి తమకు వద్దని చెప్పామని కన్నీటి పర్యంతమయ్యారు. అయినా కనికరం లేకుండా అక్కను చంపాడని రోదించారు. పరమేశ్ తనను వెంటాడుతున్నాడని నాగమణి ఫోన్ చేసి చెప్పిందని, వెంటనే తన సోదరుడిని పంపించినా అప్పటికే దారుణం జరిగిపోయిందని వాపోయారు. మా కుమారుడికి ప్రాణహాని ఉంది సొంత అక్కనే చంపిన పరమేశ్‌తో తమ కుమారుకు శ్రీకాంత్‌కు ప్రాణహాని ఉందని హంసమ్మ, సత్తయ్య ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీకాంత్‌ను కూడా పరమేశ్ చంపేస్తాడంటూ రోదించారు. అతనికి ఉరి శిక్ష వేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు పోలీస్‌స్టేషన్ ఎదుట బంధువులతో కలిసి ఆందోళన నిర్వహించారు. సీపీఎం నేతలు వీరికి మద్దతు తెలిపారు. కాగా పరారీలో ఉన్న పరమేశ్‌ను పట్టుకునేందుకు మూడు బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నామని సీఐ సత్యనారాయణ తెలిపారు. స్కూటీని ఢీ కొట్టినప్పుడు కారు నంబర్ ప్లేట్ ఘటనా స్థలంలో పడిపోయిందని, హత్యకు వాడిన కత్తి (వేట కొడవలి)తో పాటు నంబర్ ప్లేట్‌ను స్వా«దీనం చేసుకున్నామని తెలిపారు. కులాంతర వివాహం, ఆస్తి వ్యవహారాలే హత్యకు ప్రధాన కారణాలుగా భావిస్తున్నామని సీఐ స్పష్టం చేశారు. అయితే నాగమణిని హత్య చేసిన తర్వాత పరమేశ్ నేరుగా వచ్చి పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్లు తెలుస్తోంది. పోలీసులు మాత్రం పరారీలో ఉన్నాడని చెబుతుండటం గమనార్హం. -
యువకుణ్ణి హతమార్చి.. ఆనక నిప్పంటించారు
కర్నూలు: గోనెగండ్ల మండలం అల్వాల గ్రామానికి చెందిన గాడిబండ ఆమోస్(26) దారుణ హత్యకు గురయ్యాడు. కల్లూరు మండలం శరీన్ నగర్ శివారులోని హంద్రీ నది ఒడ్డున గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి.. ఆ తరువాత పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఆమోస్ ఏడేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకోగా.. పరువు హత్య కోణంలో పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. డిగ్రీ వరకు చదువుకున్న ఆమోస్ ఏడేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన కుమ్మరి గోపాల్ కుమార్తె అరుణను కులాంతర వివాహం చేసుకున్నాడు. వీరికి నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. వారి వివాహం అమ్మాయి తల్లిదండ్రులకు ఇష్టం లేక మొదట్లో ఘర్షణలు జరిగాయి. దీంతో ఆమోస్ దంపతులు ఊరు వదిలి వచ్చేసి కొన్నాళ్లు ఆదోని, మరికొన్నాళ్లు ఎమ్మిగనూరులో కాపురం చేశారు. రెండేళ్ల క్రితం కర్నూలుకు వచ్చి కల్లూరు ఎస్టేట్‌లో నివాసముంటూ సిటీ స్క్యేర్ మాల్లో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అదృశ్యమైన రెండు రోజులకే.. ఆమోస్ రెండు రోజుల క్రితం అదృశ్యం కాగా.. శనివారం ఉదయం శరీన్‌నగర్ శివారులోని హంద్రీనది ఒడ్డున శవమై కనిపించాడు. జనసంచారం లేని ముళ్లపొదల చాటున మృతదేహం పడివుండగా.. బహిర్భూమికి వెళ్లినవారు సమాచారం ఇవ్వడంతో డీఎస్పీ కేవీ మహేష్, సీఐ శంకరయ్య ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. -
ప్రేమ, కులాంతర వివాహం.. 13 జంటలపై బహిష్కరణ వేటు
పుణె: ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నందుకుగాను వారిని కొన్నేళ్ల పాటు సామాజికంగా బహిష్కరించారు కులపెద్దలు. ఆ బహిష్కరణకు గురైంది ఒకరిద్దరు కాదు ఏకంగా 13 జంటలు. బాధితుల్లో ఒకరు ఈ వెలివేతపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కులపెద్దల పంచాయతీ భాగోతం వెలుగు చూసింది. దీంతో కులపెద్దలు ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. రాష్ట్రంలోని సంగ్లీ జిల్లాలో వివిధ ప్రాంతాలకు చెందిన నాందివాలే కమ్యూనిటీకి చెందిన జాట్లు కొంతమంది ప్రేమించి కులాంతర వివాహాలను చేసుకున్నారు. అయితే వీరికి కుల పంచాయతీ పెట్టిన కుల పెద్దలు వీరిని ఊరునుంచి బహిష్కరించారు. ఇది జరిగి కొన్నేళ్లు గడిచాక వీరిని తమకులంలో చేర్చుకునే విషయమై ఈనెల 9న పలాస్లో సమావేశం నిర్వహించారు. కులం నుంచి బహిష్కరించిన వారిని తిరిగి తమ కులంలో కలుపుకునేందుకు అనుమతించాలని సమావేశంలో కొందరు ప్రతిపాదించారు. దీనికి చాలామంది కులపెద్దల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో సమావేశంలో కులాంతర వివాహాలు చేసుకున్నవారిపై సామాజిక బహిష్కరణ మరింత కాలం అమలు చేయాలని తీర్మానించారు. చదవండి: (మదనపల్లెలో దారుణం.. పొట్టేలు తల అనుకుని యువకుని తల..) అంతకుముందు ఇటువంటి తరహా సమావేశాన్ని గతేడాది డిసెంబరులో సతారా జిల్లా కరద్‌లో నిర్వహించగా..2007లో కుల బహిష్కరణకు గురైన ఓ వ్యక్తి ప్రకాష్ భోసాలే (42) ఈ సమావేశానికి హాజరయ్యారు. అయితే ఈ సమావేశంలో కూడా సామాజిక బహిష్కరణ ఎత్తివేయాలన్న ప్రతిపాదనను కొంతమంది తీసుకురాగా కుల పెద్దలు ఒప్పుకోలేదు. ఆ సమావేశం నుంచి ప్రకాశ్ భోసాలే వెనుదిరిగి వచ్చేశారు. అనంతరం స్థానికంగా పనిచేస్తోన్న ఓ స్వచ్చంద సేవా సంస్థ అంధశ్రద్ధ నిర్మూలన్ సమితిని కలసి తమ సమస్యను వివరించారు. ఆ సమితి వారి సహాయంతో ప్రకాశ్ భోసాలే నేరుగా పలాస్ పోలీసు స్టేషన్‌కు వెళ్లి తనకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో తనలా సామాజిక బహిష్కరణకు గురైన వారు 13 జంటలు ఉన్నాయని పేర్కొనడంతో పోలీసులు ఈ కేసుపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రకాశ్ భోసాలే ఫిర్యాదు మేరకు ఆరుగురు జాట్లపై కేసు నమోదు చేసినట్లు పలాస్ ఎస్సై వికాస్ జాధవ్ తెలిపారు. చదవండి: (చైనా మాంజా గొంతు కోసేసింది: కళ్లెదుటే భర్త ప్రాణాలు పోతుంటే..) -
కులాంతర వివాహం చేసుకున్న జంటకు రూ.25 లక్షల జరిమానా
భువనేశ్వర్: సమాజంలో ఎన్ని మార్పులు వస్తున్నా కులాంతర వివాహాలను మాత్రం చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు. తాజాగా ఒడిశాలోని కియోంఝర్ జిల్లాలోని నియలిజరాన్ గ్రామానికి చెందిన గిరిజన యువకుడు మహేశ్వర్ బాస్కే అదే గ్రామంలో ఇతర కులానికి చెందిన అమ్మాయిని ప్రేమించి ఆరు నెలల క్రితం పెళ్లి చేసుకున్నాడు. అయితే వీరి వివాహాన్ని ఆ గ్రామ పెద్దలు, గ్రామస్థులంతా వ్యతిరేకించడమే కాక చంపుతామని బెదిరించారు. దీంతో ఆ జంట గ్రామాన్ని వదిలి వెళ్లిపోయారు. అయితే ఇటీవల లాక్డౌన్ కారణంగా పట్టణాల్లో పనులు లేక తిరిగి అదే గ్రామానికి రావడంతో గ్రామ పెద్దలు పంచాయితీ పెట్టారు. కులాంతర వివాహం చేసుకొని తప్పు చేసినందుకు గానూ, రూ.25 లక్షల భారీ జరిమానా కట్టాలని తీర్పు ఇచ్చారు. అంతేకాక ఆ జరిమానా చెల్లించే వరకు వారికి ఎవరూ సహాయం చేయకూడదని, కనీసం నీళ్లు కూడా ఇవ్వకూడదని గ్రామస్తులకు షరతు విధించారు. దీంతో అంత పెద్ద మొత్తంలో జరిమానా కట్టలేక ఆ జంట పోలీసులను ఆశ్రయించింది. మహేశ్వర్ మాట్లాడుతూ: ప్రస్తుతం మహేశ్వర్ తన భార్య, తల్లితో కలిసి ఊరు బయట ఉన్న తన మేనమామ ఇంట్లో ఉండాల్సి వస్తోందనీ, అంత పెద్ద మొత్తం జరిమానా తాము గ్రామ పెద్దలకి చెల్లించలేమని, తమని గ్రామంలోకి అనుమతించడానికి సాయం చేయాలని కోరుతున్నారు. ఇక ఇదే విషయంపై ఆనంద్ పూర్ కోర్టు దర్యాప్తుకి ఆదేశించింది. తాము కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నామని స్థానిక ఘాసీపుర స్టేషన్ ఇన్స్పెక్టర్ మనోరంజన్ వెల్లడించారు. -
ప్రణయ్‌ని చంపినట్లు చంపుతామని..
సాక్షి, గుంటూరు: భార్యాభర్తల పరస్పర కేసులు గుంటూరులో కలకలం రేపాయి. వివరాల్లోకెళ్తే.. దిలీప్, సౌమ్య అనే ఇరువురు రెండు నెలలక్రితం కులాంతర వివాహం చేసుకున్నారు. అయితే తమ కుమార్తెను బలవంతగా తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నట్లు అత్తమామలు కేసు పెట్టారు. అంతేగాక.. తమ కుమార్తెను వదిలేయకపోతే ప్రణయ్‌ని చంపినట్లు చంపుతామని అత్తమామలు హెచ్చరించినట్లు దిలీప్ పేర్కొంటున్నాడు. ఈ చర్యపై దిలీప్ జిల్లా ఎస్పీని కలిసి అత్తమామలపై ఫిర్యాదు చేశాడు.(విషాదం: కొడుకు వీడియో తీస్తుండగానే..) -
ప్రేమజంట కులాంతర వివాహం
కర్ణాటక, మైసూరు : కులాంతర వివాహానికి తల్లితండ్రులు అడ్డు చెప్పడంతో ఒడనాడి సంస్థ సహకారంతో బుధవారం ఆ జంట ఒక్కటైంది. అరవింద నగరకు చెందిన ఓ ప్రైవేటు సంస్థలో పని చేస్తున్న శిల్పి, నగరంలో వ్యాపారం నిర్వహిస్తున్న సాగర్లు రెండేళ్లుగా పరస్పరం ప్రేమించుకుంటున్నారు. ఇరువురి కులాలు వేరు కావడంతో శిల్పి తల్లితండ్రులు వివాహానికి అడ్డు చెప్పారు.దీంతో ఒడనాడి సంస్థ సహకారంతో నగరంలోని ఎస్ఆర్ఎస్ కాలనీలోనున్న ఒడనాడి సంస్థ కార్యాలయంలోనే ప్రేమికులు వివాహం చేసుకొని ఒక్కటయ్యారు.వివాహానికి వరుడు సాగర్ తల్లితండ్రులు కూడా హాజరయ్యారు. -
ఎస్పీని ఆశ్రయించిన ప్రేమజంట
అన్నానగర్: తమకు రక్షణ కావాలంటూ నెల్లై జిల్లా ఎస్పీని ఓ ప్రేమజంట ఆశ్రయించింది. నెల్లై సమీపం శంకర్‌నగర్ శారదాంబాల్ నగర్‌కు చెందిన మారియప్పన్ కుమార్తె సుక్ష్మిత (22). పట్టభద్రురాలైన ఈమె తెన్‌కాశిలో ఉన్న ఓ సంస్థలో పనిచేస్తోంది. కొన్ని రోజుల ముందు సుక్ష్మిత అదృశ్యమైంది. దీంతో మారియప్పన్ తాలైయుత్తు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి సుక్ష్మిత ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. ఈ స్థితిలో సుక్ష్మిత తన ప్రియుడు భర్త సివందిపట్టి గాంధీవీధికి చెందిన కోట్టైయప్పన్ (23)తో మంగళవారం నెల్లై జిల్లా పోలీసు సూపరింటెండెంట్ కార్యాలయానికి వచ్చారు. వీరి తరఫున న్యాయవాది కుమార్ ఆధ్వర్యంలో న్యాయవాదులు వచ్చారు. తరువాత కోట్టైయప్పన్ పోలీసు అధికారి వద్ద ఓ వినతి పత్రం ఇచ్చాడు. అందులో నేను పాళయంకోటలో ఉన్న ఓ కళాశాలలో బీఎస్సీ చదువు పూర్తి చేసి కేరళ రాష్ట్రం పత్తనందిట్టలో బేకరీ నడుపుతూ వస్తున్నాడు. కళాశాలలో చదివినపుడే మహిళా కళాశాలలో చదువుతున్న సుక్ష్మితతో ప్రేమ ఏర్పడింది. ఈ విషయం తెలిసి సుక్ష్మిత కన్నవారు, ఆమెకి ఇష్టంలేని వివాహానికి ఏర్పాట్లు చేస్తూ వచ్చారు. అనంతరం గత 14వ తేదీ మేము ఇంటి నుంచి పారిపోయి వివాహం చేసుకున్నాం. మేమిద్దరం వేర్వేరు కులాలకు చెందిన వారు కావడంతో హత్యాబెదిరింపులు వస్తున్నాయి. తమకు భద్రత కల్పించాలని ఆ వినతి పత్రంలో ఉంది. అనంతరం ప్రేమజంటని తాలైయుత్తు పోలీసుస్టేషన్‌కి పంపించారు. -
ప్రణయ్ ప్రతిరూపంగా పెంచుకుంటా!
మిర్యాలగూడ: ‘ప్రణయ్ హత్యలో ఎంత మంది ఉన్నారో, వారిని దారుణంగా చంపాలి. వాళ్లను ఉరి తీయొద్దు.. అతి దారుణంగా చంపితేనే అది చూసి ఎవరు ఇలాంటి హత్యలు చేయకుండా ఉంటారు. ఇది పథకం ప్రకారం చేసిన హత్యగా భావిస్తున్నా’అని అమృత పేర్కొంది. మిర్యాలగూడలో సంచలనం రేపిన పరువు హత్యకు సంబంధించి ప్రణయ్ భార్య అమృత సంచలన విషయాలు వెల్లడించింది. కొందరు నాయకుల పేర్లను బయటపెట్టింది. ఆదివారం ఆస్పత్రి నుంచి ఇంటికి వచ్చిన ఆమె ప్రణయ్ మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరైంది. ‘ప్రాణాలు తీస్తారని ప్రణయ్ భయపడేవాడు కాదు. నాకు నిత్యం తోడుగా ఉంటూ చాలా ధైర్యం చెప్పేవాడు. నన్ను ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. ప్రణయ్ అంటే నాకు ఎంత ఇష్టమో అతని తల్లిదండ్రులకు కూడా తెలుసు. నేను వారి వద్దనే ఉంటా. నాకు పుట్టే బిడ్డను ప్రణయ్‌కి ప్రతిరూపంగా పెంచుకుంటా’ అని చెప్పింది. పరువు, కుల పిచ్చి ఉన్నవాళ్లకు మానవత్వం ఉండదని, వారిని ఎవరూ క్షమించరని, శిక్ష కఠినంగా ఉండాలని కోరుకుంటున్నానని పేర్కొంది. పలువురి పేర్లు వెల్లడి... ప్రణయ్ హత్యలో తన తండ్రి మారుతీరావు, బాబాయి శ్రవణ్‌కుమార్, టీఆర్ఎస్ నేత, న్యాయ వాది భరత్‌కుమార్, నకిరేకల్ తాజా మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, కాంగ్రెస్ పార్టీ పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ కరీం, వ్యాపారవేత్తలు రంగా శ్రీకర్, రంగా రంజిత్ ఉన్నట్లు అమృత వెల్లడించింది. ‘వివాహం చేసుకున్న తర్వాత వీరేశం నన్ను, ప్రణయ్‌ని పిలిపిస్తే వెళ్లలేదు. అంతకుముందు రోజు నల్లగొండలో బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య విషయాన్ని పత్రికల్లో చూసి వెళ్లలేదు. అందుకే కేతేపల్లి పోలీస్ స్టేషన్లో ప్రణయ్ తండ్రి బాలస్వామిపై ఎల్ఐసీ డబ్బులు కట్టలేదని కేసు పెట్టించారు. ఆయన ఎల్ఐసీ ఏజెంట్ కాకపోవడంతో మేము ఐజీ వద్దకు వెళ్లాం. ఆ తర్వాత ఎస్పీని కలసి పూర్తి వివరాలు చెప్పాం’ అని గతంలో జరిగిన విషయాలను తెలియజేసింది. బయట తిరిగితే ప్రజలే చంపుతారు ప్రణయ్ తమ్ముడు అజయ్ ‘నా అన్న ప్రణయ్‌ని చంపిన మారుతీరావు బయట తిరిగితే ప్రజలే చంపుతారు. ప్రణయ్ అమృతను ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటి నుంచి వేధిస్తున్నాడు. ఇటీవల అమృతతో ఆమె తల్లి ఫోన్లో మాట్లాడేది. అలా నమ్మించి ప్రణయ్‌ని చంపారు. హత్యకు ముందురోజు వినాయచవితి నాడు నాతో ప్రణయ్ ఫోన్లో మాట్లాడాడు. ఇలా జరుగుతుందనుకోలేదు. అన్న, వదినలు అన్యోన్యంగా ఉండేవారు. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలి’ అని డిమాండ్ చేశాడు. నన్నూ చంపుతారు: ప్రణయ్ తండ్రి బాలస్వామి ‘నా కొడుకు ప్రణయ్‌ని చంపి తన కూతురిని తీసుకెళ్లాలనుకున్నాడు. అమృత అతని వద్దకు వెళ్లనంటోంది. మా వద్దనే ఉన్నా మంచిగా చూసుకుంటాం. కానీ ఆమెను తీసుకెళ్లడానికి నన్ను కూడా చంపుతాడు. మారుతీరావు, శ్రవణ్‌కుమార్‌లను శాశ్వతంగా మిర్యాలగూడ నుంచి బహిష్కరించాలి. నా కొడుకు అమృతను ప్రేమించిన నాటి నుంచే ఎన్నో సార్లు బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో ప్రణయ్ కళాశాలకు వెళ్లకుండానే పరీక్షలు రాశాడు. ఎన్ని ఇబ్బందులు పడ్డా వారిద్దరు మంచిగా ఉండేవారు. ఇటీవల అమృతతో వారి తల్లిదండ్రులు ఫోన్లో మాట్లాడుతున్నారని చెప్పేవాడు. వారి కోపం తగ్గిందని భావించాం. కానీ నమ్మించి ఇలా చంపుతాడనుకోలేదు’ అని కన్నీటి పర్యంతమయ్యాడు. -
ప్రణయ్ హత్యకు కోటి డీల్?
సాక్షిప్రతినిధి, నల్లగొండ: కుల దురహంకారంతో తన కూతురు భర్త ప్రణయ్‌ను కడతేర్చేందుకు అమృత తండ్రి మారుతీరావు రూ.కోటి డీల్ కుదుర్చుకున్నాడా..? కిరాయి హంతకులకు రూ.50 లక్షలు అడ్వాన్స్ అప్పజెప్పాడా? విశ్వసనీయ వర్గాలు అవుననే అంటున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ‘పరువు హత్య ’కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తన కూతురు అమృత కులాంతర వివాహం చేసుకోవడం గిట్టని ఆమె తండ్రి మారుతీరావు ఈ హత్యకు ప్లాన్ చేశాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చి ఆ దిశలో విచారణ జరుపుతున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. నేరుగా ఒకే గ్యాంగ్‌తో సంబంధాలు పెట్టుకోకుండా ఈ హత్యను పకడ్బందీగా చేసేందుకు మూడంచెల గ్యాంగ్‌ను మాట్లాడుకున్నారని తెలిసింది. పని పూర్తిచేస్తే రూ. కోటి ముట్టచెబుతామని మాట ఖరారు చేసుకున్నారని, అడ్వాన్సుగా రూ.50 లక్షలు చెల్లించారని చెబుతున్నారు. హైదరాబాద్, మెదక్ జిల్లాలకు చెందిన ఈ గ్యాంగ్ కనీసం రెండు నెలలుగా మిర్యాలగూడలో ప్రణయ్ ఇంటిపై నిఘా పెట్టిందని, రెక్కీ చేసిందని చెబుతున్నారు. అనధికారిక సమాచారం మేరకు హత్య జరిగిన శుక్రవారం మిర్యాలగూడ ప్రాంతంలోని బ్యాంకుల్లో మారుతీరావు అకౌంట్ల నుంచి కనీసం రూ.1.5 కోట్ల లావాదేవీలు జరిగాయని సమాచారం. కాగా, పోలీసు వర్గాల ద్వారా అందుతున్న సమాచారం మేరకు మూడు గ్యాంగులు ఇందులో పాల్గొన్నాయి. శుక్రవారం సాయంత్రానికే నిందితుడిని నల్లగొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది. హంతకులకు మారుతీరావు షెల్టర్ మారుతీరావు తన అల్లుడిని హత్య చేసేందుకు సుపారీ గ్యాంగ్‌ను మాట్లాడుకున్నాడని, ఆ గ్యాంగ్ హత్యకు మూడు రోజుల ముందరే పట్టణానికి చేరుకుందని, వారికి మారుతీరావే షెల్టర్ కల్పించారని పోలీసులు గుర్తించినట్లు సమాచారం. తన కూతురు ఆస్పత్రికి వచ్చిన విషయాన్ని మారుతీరావు ఎప్పటికప్పుడు ఫోన్‌ద్వారా తెలుసుకుంటూనే ఉన్నాడని చెబుతున్నారు. మధ్యాహ్నం ప్రణయ్ హత్య జరిగే సమయానికి ప్రధాన నిందితుడు మారుతీరావు నల్లగొండ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద ఉన్నాడని, ఒక పనికోసం ఉన్నతాధికారులను కలిసేందుకు నల్లగొండకు వచ్చాడని సమాచారం. హత్య జరిగిన తర్వాత ఫోన్ రావడంతో ఆయన కలెక్టరేట్ నుంచి వెళ్లిపోయాడని, అయితే ఎటుపోవాలో పాలుపోక జాతీయ రహదారిపై చక్కర్లు కొట్టాడని, కేతేపల్లి, కట్టంగూరు తదితర ప్రాంతాల్లో తిరిగినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రస్తుతం నల్లగొండ పోలీసుల అదుపులో ఉన్నట్లు భావిస్తున్న మారుతీరావు విచారణ అధికారుల ఎదుట నోరు విప్పినట్లు తెలుస్తోంది. కూతురి కన్నా పరువే ముఖ్యం! పోలీసుల అదుపులో ఉన్న మారుతీరావు తన కూతురిపై ఉన్న ప్రేమతోనే ఈ హత్య చేయించినట్లు చెబుతున్నాడని తెలిసింది. ‘నా కూతురిపై ప్రేమతోనే ప్రణయ్‌ని చంపించా. 9వ తరగతిలోనే ప్రణయ్, అమృతలకు వార్నింగ్ ఇచ్చా. ఎన్ని సార్లు చెప్పినా ప్రణయ్ వినలేదు. నాకు నా కూతురు కన్నా సొసైటీలో నా పరువే ముఖ్యం అనుకున్నా. సుపారీ గ్యాంగ్‌కి నా కూతురికి ఎటువంటి హాని తలపెట్టొద్దని ముందుగానే చెప్పా. ప్రణయ్‌ని చంపించినందుకు నాకేం బాధ లేదు. జైలుకి వెళ్లడానికి సిద్ధపడే ఈ ప్లాన్ వేశా..’అని నిందితుడు మారుతీరావు పోలీసులకు చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. కాగా, కొందరు పోలీసు అధికారులు మాత్రం అసలు ఆయన నోరే విప్పడం లేదని కూడా చెబుతున్నారు. మారుతీరావుది ‘ఘన’మైన చరిత్రే! కూతురి భర్తను అతి కిరాతకంగా కిరాయి హంతకులతో చంపించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మారుతీరావు వ్యక్తిగత చరిత్ర ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ నాయకులతో సన్నిహితంగా ఉండే మారుతీరావు రెవెన్యూ, పోలీసు అధికారులనూ గుప్పిట పెట్టుకున్నాడని ఆరోపణలు ఉన్నాయి. రేషన్ డీలర్‌గా జీవితం మొదలు పెట్టిన మారుతీరావు, కొందరు రెవెన్యూ అధికారులతో సత్సంబంధాలు ఏర్పరుచుకుని వారి అండదండలతో భూ దందాలు సాగించాడన్న ఆరోపణలు ఉన్నాయి. భూ దందాల కోసం అధికారులను లోబర్చుకోవడం.. వారి సరదాలు తీర్చి పనులు చేయించుకునే వాడని అంటున్నారు. ఆర్యవైశ్య, రైస్‌మిల్లర్స్ మధ్య తలెత్తే పంచాయితీలు సెటిల్ చేసేవాడని సమాచారం. రాజకీయ నేతలు, కొందరు కుల సంఘాల నాయకుల అవసరాలు తీరుస్తూ వారిని తనకు అనుకూలంగా మలచుకుని తన అక్రమ దందాలకు వాడుకునే వాడని చెబుతున్నారు. ఈ మధ్య కాలంలోనే టీఆర్ఎస్లో చేరాడని, మారుతీరావు తమ్ముడు శ్రవణ్ కేబుల్, బెల్లం వ్యాపారం సాగించేవాడని తెలుస్తోంది. విచారణ సాగుతోంది సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్యను సవాల్‌గా తీసుకుని జిల్లా పోలీసులు విచారణ చేపట్టారు. హతుడి భార్య అమృత ఫిర్యాదు మేరకు విచారణ చేస్తున్నామని జిల్లా ఎస్పీ ఏవీ రంగనాథ్ శనివారం మీడియాకు వెల్లడించారు. ఈ కేసులో కీలకంగా భావిస్తున్న వారిని విచారిస్తున్నట్లు చెప్పారు. అమృతకు ఎలాంటి ప్రాణభయం లేదని, ఆమె తన అత్తవారింటికి వెళ్లకుంటే హోమ్‌కు తరలిస్తామని మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. రెండు మూడు రోజుల్లో కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తామని, కేసు విచారణలో ఉండగా ప్రస్తుతం అన్ని వివరాలు బయటపెట్టలేమని ఎస్పీ పేర్కొన్నారు. -
కులాంతర వివాహం చేసుకుందని..
నెల్లూరు జిల్లా /గూడూరు: ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్న కుమార్తెను ఆమె తల్లిదండ్రులు కోర్టు ఆవరణ నుంచే బలవంతంగా లాక్కెళ్లారు. అడ్డొచ్చిన ఆమె భర్త బంధువులను కొట్టారు. ఈ ఘటన పట్టణంలో శనివారం సంచలనం రేకెత్తించింది. పోలీసుల సమాచారం మేరకు.. చిల్ల కూరు మండలం వల్లిపేడుకు చెందిన నిండలి రఘురామయ్య, సంపూర్ణమ్మ కుమారుడు రాధాకృష్ణ నెల్లూరులోని ఓ వస్త్ర దుకాణంలో పనిచేస్తుండేవాడు. ఈ క్రమంలో అదే ప్రాంతంలో ఉన్న ఎస్కే మీరామోహిద్దీన్ కుమార్తె అస్మాతో రాధాకృష్ణకు పరిచమై, ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. రెండేళ్ల పాటు ప్రేమించుకున్న వీరి పెళ్లికి పెద్దలు అభ్యంతరం చెప్పడంతో, రెండు నెలల క్రితం ఎదురించి వెళ్లిపోయి పెళ్లి చేసేసుకున్నారు. దీంతో అస్మా తల్లిదండ్రులు నెల్లూరులోని దర్గామిట్ట పోలీస్‌స్టేషన్‌లో తమ కుమార్తెను రాధాకృష్ణ కిడ్నాప్ చేశాడని ఫిర్యాదు చేశారు. దీంతో వారు ఆ జంటను పిలిపించగా, వారిద్దరూ మేజర్లమని, తమ ఇష్ట పూర్వకంగానే పెళ్లి చేసుకున్నట్లు చెప్పడంతో.. చేసేది లేక పోలీసులు వారికి కౌన్సెలింగ్ ఇచ్చి పంపేశారు. పెద్దలకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నామని, భవిష్యత్‌లో తమ తల్లిదండ్రుల నుంచి తమకు ప్రమాదముందని కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఇరు కుటుంబాల వారికి, నోటీసులు వెళ్లగా ఇరువురి పెద్దలతో పాటు, దంపతులు శనివారం వాయిదాకు కోర్టుకు హాజరయ్యారు. ఈ క్రమంలో అవకాశం కోసం ఎదురు చూస్తున్న అస్మా తల్లిదండ్రులతో పాటు వారి బంధువులు ఇదే అదనుగా ఆమెను బలవంతంగా లాక్కెళ్లి కారులో ఎక్కించే ప్రయత్నం చేశారు. రాధాకృష్ణతో పాటు అతని తండ్రి, వారి బంధువులు కూడా అడ్డుకునే యత్నం చేయడంతో వారిని కొట్టి అస్మాను కారులో తీసుకెళ్లిపోయారు. ఈ మేరకు రాధాకృష్ణ రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. -
రక్షణ కల్పించండి
నెల్లూరు(క్రైమ్): కుటుంబసభ్యుల నుంచి రక్షణ కల్పించాలని ఓ ప్రేమజంట పోలీసులను ఆశ్రయించింది. సోమవారం వారు నెల్లూరులోని జిల్లా పోలీసు కార్యాలయంలో అదనపు ఎస్పీ బి.శరత్‌బాబును కలిసి వినతిపత్రం సమర్పించారు. వివరాలిలా ఉన్నాయి. పొదలకూరు మండలం ప్రభగిరిపట్నంకు చెందిన జి.రామచంద్రయ్య రెండో కుమార్తె సుమతి నెల్లూరులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తూ నగరంలోని హరనాథపురంలో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఉంటోంది. ఆమెకు ఎనిమిదేళ్ల క్రితం రాపూరుకు చెందిన కారు డ్రైవర్ మాతయ్యతో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. ఇద్దరి కులాలు వేరు కావడంతో సుమతి కుటుంబసభ్యులు వారి ప్రేమను నిరాకరించారు. దీంతో ఈనెల రెండో తేదీన సుమతి, మాతయ్యలు రాపూరులో రిజిస్టర్ మ్యారేజీ చేసుకున్నారు. సుమతి హాస్టల్లో లేదన్న విషయం తెలుసుకున్న ఆమె కుటుంబసభ్యులు గాలించారు. ఫలితం లేకపోవడంతో నాలుగో నగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాతయ్యపై అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు కేసు నమోదుచేసి విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలో సోమవారం ప్రేమజంట జిల్లా పోలీసు కార్యాలయానికి చేరుకుని తమకు రక్షణ కల్పించాలని ఏఎస్పీని కోరారు. తగిన చర్యలు తీసుకోవాలని ఆయన నాలుగో నగర పోలీసులను ఆదేశించి ప్రేమజంటను ఆ స్టేషన్‌కు పంపారు. ఇన్స్పెక్టర్ వి.సుధాకర్‌రెడ్డి వారితో మాట్లాడారు. ఈ సందర్భంగా సుమతి తల్లిదండ్రులు ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేయగా నిరాకరించింది. తన ఇష్ట్రపకారామే వివాహం చేసుకున్నానని పోలీసులకు తెలిపింది. దీంతో పోలీసులు ఇరుకుటుంబాల పెద్దలకు కౌన్సిలింగ్ చేశారు. -
ప్రేమ వివాహాలకు ప్రత్యేక వింగ్
సాక్షి, చెన్నై: ప్రేమ, కులాంతర ప్రేమ వివాహాలు చేసుకునే వారికి భద్రత కల్పించే విధంగా క్రైం ప్రివెన్షల్ సెల్(సీపీసీ)ను తమిళనాడులోని మదురై జిల్లాల్లో ఏర్పాటు చేశారు. మూడు విభాగాల సమన్వయంతో ఈ వింగ్ ఏర్పాటు కాగా, ప్రేమికుల కోసం ప్రత్యేక టోల్‌ఫ్రీ నంబరును ప్రకటించారు. తమిళనాడులో కులాంతర ప్రేమ వివాహాలు పరువు హత్యలకు దారి తీస్తున్నాయి. పరువు కోసం హతమార్చడానికి కూడా వెనుకాడటం లేదు. కులాంతర ప్రేమ వివాహాలు చేసుకున్న వారిలో అనేకమంది ప్రియులు అతి కిరాతకంగా హత్యకు గురయ్యారు. గత ఏడాది శంకర్ అనే ప్రేమికుడిని పట్టపగలు నడిరోడ్డులో హత్యచేయడాన్ని మద్రాసు హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. కులాంతర ప్రేమ వివాహాలు చేసుకునే వారికి తాము అండగా ఉంటామన్నట్టుగా హైకోర్టు భరోసా ఇచ్చింది. కోర్టు ఆదేశం మేరకు దక్షిణ తమిళనాడులో ప్రధాన కేంద్రంగా ఉన్న మదురై జిల్లాలో ప్రపథమంగా ఈ ప్రత్యేక వింగ్ సోమవారం ఏర్పాటైంది. పోలీసు, సాంఘిక సంక్షేమ శాఖ, ఆది ద్రావిడ సంక్షేమ శాఖ అధికారుల సమన్వయంతో క్రైం ప్రివెన్షన్ సెల్(సీపీసీ) పేరుతో ఈ విభాగాన్ని ప్రకటించారు. అలాగే, తమను సంప్రదించాలంటూ 0452–2346302 టోల్ ఫ్రీ నంబరును ఏర్పాటు చేశారు. -
కులాంతర వివాహం వైపు నడిచిన సప్తపది
నాటి సినిమా బ్రహ్మ శిరస్సు నుంచి బ్రాహ్మణులు, వక్షం నుంచి క్షత్రియులు, ఊరువుల నుంచి వైశ్యులు, పాదాల నుంచి శూద్రులు జన్మించారని వర్ణ వ్యవస్థ చెబుతుంది. ఎవరు ఎక్కడి నుంచి జన్మించినా వీరందరికీ హృదయం ఒక్కచోటనే ఉంటుంది. గుండెలకు సమీపంగానే ఉంటుంది. దాని స్పందనలకు కులం లేదు. దాని సంవేదనలకు వర్ణం లేదు. స్త్రీ... పురుషుడు... ఉన్నవి ఈ రెండే వర్ణాలు. వీటి మధ్య ఆకర్షణే ప్రకృతి. దీనిని ఎదిరించడం వికృతి. కులాలు, వర్ణాలు మనిషి ఎదుగుదలకు ఉపయోగపడితే మంచిదే. తిరోగమనానికి హేతువుగా మారితే మాత్రం మనం మారాల్సి ఉంది... మార్చాల్సింది చాలా ఉంది. ఆ మాటను చెప్పడానికి దాదాపు 36 ఏళ్ల క్రితం కె.విశ్వనాథ్ తీసిన సినిమాయే ‘సప్తపది’. కృష్ణానది ఒడ్డున అందమైన ఊరు. ఆ ఊరి నడిబొడ్డున అమ్మవారి ఆలయం. దాని ప్రధాన అర్చకుడు యాజులు (సోమయాజులు). అతడి కొడుకు అవధాని (జె.వి.రమణమూర్తి). తోడుగా మనవడు (రవికాంత్). యాజులు కుమార్తె ఒక నాట్యకారుణ్ణి ప్రేమించి వివాహం చేసుకున్నది కనుక ఆమెను మానసికంగా బహిష్కరించి ఉంటాడు యాజులు. కాని ఆమెకు జన్మించిన హేమ (సబిత) పెరిగి పెద్దదై నృత్యకారిణిగా మారి ఊరికి వస్తే ఆమెను మనవరాలిగా స్వీకరిస్తాడు. అంతే కాదు, తన మనవడికి ఇచ్చి వివాహం జరిపించడానికి నిశ్చయిస్తాడు. ఇది హేమ మనసుకు విఘాతంగా మారుతుంది. ఎందుకంటే అప్పటికే ఆమె మనసు హరిబాబు (గిరిష్) వశమై ఉంటుంది. అతడు ఆమెనూ ఆమె నాట్యాన్నీ ఆరాధించిన భావుకుడు. వేణువుతో ఆమె నాట్యానికి బాసటగా నిలువగల కళాకారుడు. కాని ఈ అలంకారాలన్నీ అతడితో వివాహానికి ఏమాత్రం పనికి రావు. ఎందుకంటే అతడు దళితుడు. ఒక బ్రాహ్మణుల అమ్మాయి హరిజనుడితో వివాహం చేసుకోవడం అసంభవం. వర్ణవ్యవస్థకు విరుద్ధం. ఈ సంగతి తెలుసు కనుకనే హరిబాబు ఆమెను మనసులోనే వేలుపు చేసుకుని దూరంగా ఉండిపోతాడు. ఆమె పెళ్లి బావతో జరిగిపోతుంది. మనసు చెక్కలయినా మాంగల్యానికి విలువ ఇచ్చి భర్తను స్వీకరించి వచ్చిన హేమ ఆ భర్తకు శోభనం గదిలో అమ్మవారిలా కనిపిస్తుంది. అతడు హతాశుడై ఆమెకు పూజాదికాలు నిర్వహించి వెనుదిరుగుతాడు. ఎప్పుడు అతడు గదిలోకి వచ్చినా భార్య అతనికి అమ్మవారి రూపులోనే కనిపిస్తుంటుంది. ఇలా ఎందుకు? అటు ప్రియునికి దూరమై ఇటు భర్తకు చేరువ కాలేక హేమ నలిగిపోతుంది. భర్త ఆ పరిస్థితి గమనించి కారణం తెలుసుకుంటాడు. ఆమె మనసులో మరొకరు ఉండటం వల్లే ఆమె తనకు అమ్మవారిలా ఉందని గ్రహించి ఎవరిౖ¯ð తే ఆమె కోరుకుంటున్నదో అతడికే అప్పజెప్పడానికి నిశ్చయించుకుంటాడు. అతడి నిర్ణయానికి ఇంటి పెద్ద అయిన యాజులు అంగీకారం కావాల్సి ఉంటుంది. సమాజం ఏమనుకుంటుందోనని ముందు ఆందోళన చెందినా కులం, వర్ణం అనేవి ఒక మనిషి సంస్కారాన్ని బట్టి ఏర్పడేవే తప్ప జన్మను బట్టి కాదని గ్రహించి మనవరాలిని దళితుడితో పంపడానికి నిశ్చయించుకుంటాడు. ఊరు, బ్రాహ్మణ వర్గం దీనికి అడ్డుగా నిలిస్తే వారితో వాదించి గెలుస్తాడు. చివరకు తనే తోడుగా కులం, వర్ణం అనే అంతరాల చీకట్లు నిండిన ఈ రేవు నుంచి వికాసం, అభ్యుదయం వంటి వెలుతురులు నిండిన ఆ రేవు వైపుకు కదిలిపోతాడు. సినిమా ముగుస్తుంది. 1981లో ఈ సినిమా రావడం, తీయడం, దానిని ప్రేక్షకుల చేత మెప్పించడం సామాన్య విషయం కాదు. ఇందులో దర్శకుడు రెండు విషయాలను ధ్వంసం చేశాడు. ఒకటి మనసులు కలవని పెళ్లిని, రెండు ప్రేమకు అడ్డుగా నిలిచే కులాన్ని. ప్రేమించిన అమ్మాయిని దళితుడికి ఇచ్చి పెళ్లి చేయడం అనేది మామూలు వస్తువే అయి ఉండేది. కాని ఇక్కడ మరొకరి భార్య అయిన అమ్మాయికి ఆ పెళ్లిని రద్దు చేసి మరో పెళ్లి చేయడం చాలా పెద్ద విషయంగా చెప్పక తప్పదు. ‘కులాంతర వివాహాల వల్లే ఈ దేశంలో కులం అంతరిస్తుంది’ అని చెప్పాడు అంబేద్కర్. ఇది శూద్ర కులాల మధ్య సంభవించడం విశేషం కాదు. ఉన్నత కులాలకు, నిమ్నకులాలకు మధ్య ఎన్ని కులాంతర వివాహాలు జరిగితే అంత మంచిది అని ఆయన పేర్కొన్నాడు. ఆ విధంగా చూసినప్పుడు ఇది అంబేద్కర్ భావజాలం వైపు నడిచిన సినిమాగా చెప్పుకోవాలి. సొంతకూతురు సొంత కులంలోని నాట్యాచారుడిని వివాహం చేసుకుంటేనే అదో అప్రదిష్టగా భావించిన యాజులు కాలక్రమంలో తన ఇంటి ఆడపిల్ల ఒక దళితుడిని వివాహం చేసుకోవడానికి సమ్మతించడం వెనుక ఉన్న పరివర్తన, ఎదుగుదల ప్రేక్షకుణ్ణి ఆలోచనల్లో పడేస్తుంది. క్లయిమాక్స్‌లో పడవ సాగిపోతూ ఉండగా ఒక బ్రాహ్మణ పిల్లవాడు ప్రశంసగా చప్పట్లు కొడతాడు. భావితరాలు ఈ ఎదుగుదలను కొనసాగించాలనే సంకేతం అందులో ఉంది. అంతా ఔట్‌డోర్‌లో అమరావతి ప్రాంతంలో కృష్ణానది ఒడ్డున తీసిన సినిమా నాడే కాదు నేడు కూడా ఎంతో కొత్తగా తాజాగా ఉంటుంది. ‘మేము రాజులు... మీరు యాజులు... మీరు మా మాట వినాలి’ అని ఊరి పెద్దగా నటించిన అల్లు రామలింగయ్య ఆకట్టుకుంటాడు. చేసింది ఒక్క సినిమాయే అయినా ప్రేక్షకులకు హీరోయిన్ సబిత శాశ్వతంగా గుర్తుండిపోయింది. ఇక సాంకేతికంగా చూసినప్పుడు ఈ సినిమాకు అన్నీ ఎలా కుదరాలో అలా కుదిరాయి. కె.వి.మహదేవన్ సంగీతం, వేటూరి సాహిత్యం ‘శంకరాభరణం’ తర్వాత మళ్లీ మేజిక్ చేశాయి. ఇందులోని ‘అఖిలాండేశ్వరి చాముండేశ్వరి’... ‘నెమలికి నేర్పిన నడకలివీ’ పాటలు నేటికీ నృత్యం నేర్చుకునే ఆడపిల్లల ఆరంగేట్రంకు ఉపయోగ పడుతున్నాయి. ‘రేపల్లియ యద ఝల్లున పొంగిన రవళి’ డ్యూయెట్ హృద్యంగా ఉంటుంది. ఇక కులాల మధ్య ఉన్న బోలుతనాన్ని జానపద శైలిలో పెట్టి వేటూరి రాసిన సులభ పదాలు హిట్. ‘గోవుల్లు తెల్లన గోపయ్య నల్లన గోధూళి ఎర్రన ఎందువలన’... ‘ఏ కులము నీదంటే గోకులము నవ్వింది’... ఇవి పండిత పామరులను అలరించాయి. ‘పిల్లనగ్రోవికి నిలువెల్ల గాయాలు’... అని అనడం వేటూరికే సాధ్యం. జంధ్యాల సంభాషణలు సరేసరి. అన్నట్టు ఇందులో హీరో హరిష్కి కె.విశ్వనాథే డబ్బింగ్ చెప్పారు. నిమ్నకులాలు ఉన్నత కులాలతో ఘర్షణ పడటం ఎప్పుడూ ఉండేదే. కాని అసలైన ఫలితం ఉన్నత కులాలు తమలో తాము అంతర్గత సంఘర్షణ పడినప్పుడే దక్కుతుంది. మార్పు కోసం శూద్రకులాలు ఒక అడుగు వేస్తే పెద్ద కులాలు ఏడడుగులు వేయాల్సిన అవసరాన్ని చెప్పిన సినిమా ‘సప్తపది’. -
తెలంగాణలో సబ్‌ప్లాన్ అమలు అధ్వానం
కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో సబ్‌ప్లాన్ నిధులను ఖర్చు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వ తీరుపట్ల కేంద్ర సామాజిక న్యాయ, సాధికా రత శాఖ సహాయ మంత్రి రాందాస్ అథవాలే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆదివారం నగరా నికి వచ్చిన ఆయన హోటల్ హరితప్లాజాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాందాస్ అథవాలే మాట్లాడుతూ రాష్ట్రంలో షెడ్యూల్ కులాల సబ్‌ప్లాన్ కింద ఈ ఏడాది రూ.10,484 కోట్లు కేటా యించగా, ఇప్పటివరకు 60 శాతం నిధులను కూడా ప్రభుత్వం ఖర్చు చేయలేదన్నారు. ఎస్సీ, ఎస్టీ అత్యాచార చట్టం కింద నమోదైన కేసులను పరిష్కరించే విషయంలోనూ అసం తృప్తి వ్యక్తం చేశారు. సీఎం చైర్మన్‌గా ఏర్పా టైన కమిటీ మూడు నెలలకోసారి సమావే శమై కేసులను సమీక్షించాల్సి ఉండగా, ఈ ఏడాది ఒక్కటి కూడా జరగలేదన్నారు. 2015లో 1,689.. 2016లో 1,904 కేసులు నమోదయ్యాయని చెప్పారు. ఎస్సీల హత్య కేసులకు సంబంధించి 2015లో 39, 2016లో 42 హత్య కేసులు నమోదైనట్లు తెలిపారు. అట్రాసిటీ కేసుల విష యంలో తెలంగాణ దేశంలో తొమ్మిదో స్థానంలో ఉందన్నారు. కులాంతర వివాహం చేసుకున్న జంటకు డాక్టర్ అంబేడ్కర్ ఫౌండేషన్ నుంచి రూ.2.50 లక్షల ప్రోత్సాహకాన్ని కేంద్రం అందిస్తోందని చెప్పారు. తెలంగాణకు సంబంధించి 2015లో సంబంధించి 850 కులాంతర వివాహాలు నమోదు కాగా, 2016లో 251 నమోదయ్యా యన్నారు. రాష్ట్రంలో కులాంతర వివాహం చేసుకున్న వారికి రాష్ట్ర ప్రభుత్వమిస్తున్న పారి తోషికం(రూ.50వేలు) తక్కువగా ఉందని, రాజస్థాన్ ప్రభుత్వం మాదిరిగా రూ.5 లక్షల పారితోషికం ఇవ్వాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గాల కోసం అమలు చేస్తున్న మూడెకరాల భూ పంపిణీ, ఎస్సీ గురుకుల విద్యాలయాల ఏర్పాటు, విదేశీ విద్యా పథకాలను మంత్రి ప్రశంసించారు. -
కుమార్తెను కిడ్నాప్ చేసిన తల్లిదండ్రులపై కేసు
కులాంతర వివాహం చేసుకున్న కుమార్తెను అత్తవారింటి నుంచి బలవంతంగా తీసుకెళ్లిన తల్లిదండ్రులపై మేడిపల్లి పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎస్ఐ వెంకట్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... నల్లగొండ జిల్లా హనుమంతల గూడెంకు చెందిన స్వాతి(19), సూరోజ్ భీష్మాచారి(28) ప్రేమించుకున్నారు. నాలుగు నెలల క్రితం సంతోష్‌నగర్‌లోని ఆర్య సమాజంలో వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి పీర్జాదిగూడ మల్లికార్జున్‌నగర్‌లో నివాసం ఉంటున్నారు. భీష్మాచారి నారాయణగూడలోని విజయా డయాగ్నస్టిక్ సెంటర్లో ఉద్యోగం చేస్తున్నాడు. భీష్మాచారి డ్యూటీకి వెళ్లిన తరువాత స్వాతి తల్లిదండ్రులు అలివేలు, సైదిరెడ్డి వచ్చి స్వాతిని బలవంతంగా తీసుకెళ్లారు. స్థానికుల నుంచి విషయం తెలుసుకున్న భీష్మాచారి మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కిడ్నాస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రేమికులకు ఆయుధాలు
సాక్షి, చెన్నై : కులాంతర వివాహం చేసుకునే ప్రేమికులు ఆత్మరక్షణ కోసం ఆయుధాలు వాడేందుకు అ నుమతించాలని కోరుతూ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న పరువు హత్యలను తీవ్రంగా పరిగణించాలని ఓ పిటిషనర్ చేసిన విజ్ఞప్తిపై కోర్టు దృష్టి పెట్టింది. దీనిపై వివరణ ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మద్రాసు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. రాష్ట్రంలో ఇటీవలి కాలంలో కులాంతర ప్రేమ వివాహాల అనంతరం పరువు హత్యలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇలా ఇప్పటివరకూ వందకు పైగా పరువు హత్యలు జరిగినట్టు గణాం కాలు స్పష్టం చేస్తున్నాయి. ఇటీవలి కాలంలో ఈ ధర్మపురిలో ఇలవరసన్, ఓమలూరులో గోకుల్ రాజ్, ఉడుమలైలో శంకర్లు కులాంతర వివాహాలకు బలయ్యారు. వెలుగులోకి వ చ్చిన ఘటనలు కొన్నైతే , మరికొన్ని చడీ చప్పుడు కాకుండా జరిగి ఉన్నాయని చెప్పవచ్చు. ఇటీవల ఇలాంటి పరువు హత్యలను మద్రాసు హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. కులాంతర ప్రేమ వివాహాలు చేసుకునే దంపతులకు తాము అండగా ఉంటామన్నట్టు గా భరోసా ఇచ్చేందుకు సిద్ధం అ యింది. దీనికి అనుగుణంగా తగిన ఆదేశాలను మద్రాసు హైకోర్టు సింగిల్ బెంచ్ జారీ చేసినా హత్యల పర్వం మాత్రం ఆగడం లేదు. ఈ పరిస్థితుల్లో పరువు హత్యల కట్టడికి కఠిన చర్యలు తీసుకోవాలని లేదం టే, కులాంతర వివాహాలు చేసుకునే ప్రేమికులకు ఆత్మరక్షణార్థం ఆయుధాల్ని కలిగి ఉండే విధ ంగా అనుమతులు జారీ చేయాలని కోర్టులో పిటిషన్ దాఖలు అయింది. జర్నలిస్టు వరాహి దాఖలు చేసిన పిటిషన్‌పై మద్రాసు హైకోర్టు ప్రధా న న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్, న్యాయమూర్తి మహాదేవన్ నేతృత్వంలోని బెంచ్ విచారణ చేపట్టింది. ప్రేమ వివాహాలు చేసుకునే వారికి భద్రత కల్పించేందుకు తగిన చట్టం తీసుకురావాలని కోరింది. ఆయుధాల లెసైన్స్‌లు కల్పించాలన్న వాదనలను పరిగ ణించిన బెంచ్ కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలకు దీనిపై నోటీసులు జా రీ చేసింది. పిటిషనర్ విజ్ఞప్తి మేరకు వివరణ ఇవ్వాలంటూ తదుపరి విచారణను జూలై 27కు వాయిదా వేశారు. -
కులాంతర పెళ్లికి 50 వేల పన్ను
కతిహార్: భిన్నంగా వ్యవహరిస్తూ మరోసారి బీహార్ కు చెందిన ఓ పంచాయతీ తీరు వార్తల్లోకి ఎక్కింది. కులాంతర వివాహం చేసుకున్న ఓ యువజంటకు అక్షరాల రూ.50 వేల రూపాయల పన్ను వేసింది. కతిహార్ జిల్లాలోని గోగ్రా గ్రామానికి చెందిన చోటు యాదవ్ తన పక్క గ్రామం అయిన రోహియాకు చెందిన సోని కుమాయ్ అనే మరో కులానికి చెందిన అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. అనంతరం వారిద్దరు కతిహార్ లోకల్ కోర్టులో వివాహం చేసుకున్నారు. ఇదే కోర్టులోని హోటల్లో చోటు పనిచేస్తాడు. ఈ పెళ్లికి ముందు పెద్దల నుంచి సమస్యలు వచ్చినా తదనంతరం అంగీకరించారు. అయితే, తాజాగా వారు సొంత గ్రామానికి వచ్చినప్పుడు మాత్రం అసలు సమస్య మొదలైంది. గత నెలలో ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేసిన పంచాయతీ పెద్దలు కులాంతర వివాహం చేసుకున్నవారిరువురికి రూ.50 వేలు ట్యాక్స్ వేశారట. అది చెల్లించకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కూడా నోటీసులు జారీ చేశారట. దీంతో చోటు యాదవ్ బుధవారం ఈ వివరాలు మీడియాకు తెలిపాడు. తాము చాలా పేదవాళ్లమని, అంత డబ్బు చెల్లించలేమని చెప్పినా వినకుండా బెదిరించి మరి ఫైన్ వేశారని వాపోయాడు. -
కులాంతర వివాహాలకు ప్రోత్సాహం
‘అంబేడ్కర్’ పథకం కింద ఒక్కో జంటకు రూ.2.5 లక్షల సహాయం హైదరాబాద్: కులాంతర వివాహం చేసుకున్న నవ దంపతులకు ఆర్థిక సహాయమందించి వారు నిలదొక్కుకునేందుకు డా.అంబేడ్కర్ స్కీం ఫర్ సోషల్ ఇంటిగ్రేషన్ త్రూ ఇంటర్‌కాస్ట్ మ్యారేజెస్ (డా.అంబేడ్కర్ కులాంతర వివాహాల ద్వారా సామాజిక సమైక్యత పథకం) ద్వారా కేంద్రం సహాయం అందించనుంది. డా.అంబేడ్కర్ ఫౌండేషన్ ద్వారా కేంద్ర సామాజిక న్యాయ, సాధికార శాఖ ఈ పథకం గురించి ఓ ప్రకటనలో వివరించింది. దేశవ్యాప్తంగా ఏడాదికి 500 జంటలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో 34 జంటలకు సహాయం అందుతుంది. ఈ పథకం కింద రూ.2.5 లక్షలు అందజేస్తారు. ఇందులో 50 శాతం డబ్బులు డీడీ రూపంలో, మిగిలిన డబ్బును ఐదేళ్ల కాలానికి ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారు. ఈ పథకాన్ని 2013-14, 2014-15లో ప్రారంభించారు. దంపతుల్లో ఒకరు షెడ్యూల్ తరగతికి చెందిన వారై, మరొకరు ఇతర కులాల వారై ఉండి, చట్టపరంగా వివాహం చేసుకున్న వారు అర్హులు. దంపతుల ఆదాయం ఏడాదికి రూ.5 లక్షలకు మించకూడదు. అలాగే నవదంపతుల తరపున ఎంపీ కాని, ఎమ్మెల్యే కాని, జిల్లా కలెక్టర్ కాని ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించాల్సి ఉంటుంది. అంబేడ్కర్ ఫౌండేషన్ వెబ్సైట్ www.ambedkarfoundation.nic.in ద్వారా కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపాదనలను పంపించాల్సి ఉంటుంది. -
సంకెళ్లను తెంచుకొని..
కుల, మతాలను తోసిరాజని ఒక్కటైన దంపతులు మీకు అండగా ఉంటాం.. ధైర్యంగా అడుగేయండి {పముఖుల పిలుపు సిటీబ్యూరో: కట్టుబాట్లు.. ఆచార, సంప్రదాయాలు.. మూఢ విశ్వాసాలు లేని మానవతా పరిమళాల అన్వేషణకు.. కులాలు...మతాలకు అతీతంగా ఒక్కటైన జంటలవి. స్వేచ్ఛా, స్వాతంత్య్రాలను, లౌకిక, ప్రజాస్వామిక, గణతంత్ర విలువలకు అర్థంగా నిలిచే జనవరి 26వ తేదీ అంటే ఆ జంటలకు ఎంతో మక్కువ. ఆ స్ఫూర్తితోనే వారంతా సోమవారం ఇందిరా పార్కులో కలుసుకున్నారు. ‘కులాంతర,మతాంతర వివాహితుల వేదిక’ 43వ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ చంద్రయ్య, జస్టిస్ చంద్రకుమార్, జస్టిస్ యతిరాజులు, జస్టిస్ పి.ఎస్.నారాయణ, అరుణోదయ విమల, ప్రముఖ కవి నిఖిలేశ్వర్ తదితర ప్రముఖులంతా హాజరయ్యారు. వేదిక అధ్యక్షుడు, ప్రముఖ న్యాయవాది సీఎల్ఎన్ గాంధీ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. పాలకుల బాధ్యతలు, ప్రభుత్వాల కర్తవ్యనిర్వహణ, చట్టపరమైన భరోసా, సామాజిక భద్రత, భవిష్యత్తు తరాల పట్ల బాధ్యత వంటి అనేక అంశాలను సభికులు ప్రస్తావించారు. వారు ఏమన్నారంటే... రూ.లక్ష ప్రోత్సాహకానికి కృషి: మంత్రి ఈటెల సమాజ ఒరవడికి, పోకడకు భిన్నంగా కులాలకు, మతాలకు అతీతంగా ఒక్కటి కావడం గొప్ప విషయం. ప్రగతిశీల భావజాలంతో, ఆలోచనా విధానంతో కొత్త రాష్ట్రంలో అధికారం చేపట్టిన మా ప్రభుత్వంకచ్చితంగా మీకు అండగా నిలుస్తుంది. కుల,మతాలకు అతీతంగా వివాహం చేసుకున్న దంపతులకు రూ.లక్ష నగదును ప్రోత్సాహకంగా అందించేందుకు కృషి చేస్తా. కులాల పేరిట వివక్ష, అణచివేతలను అంతమొందించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ధైర్యంగా ముందుకు సాగండి: జస్టిస్ చంద్రకుమార్ కుల, మతాలకు అతీతమైన మీరు ధైర్యంగా ముందుకు సాగండి. అందరినీ ఎదురించి పెళ్లి చేసుకోవడం ఆషామాషీ కాదు. ఎన్నో ఇబ్బందులను, బాధలను, కష్టనష్టాలను అధిగమించి వచ్చారు. అందరికీ స్ఫూర్తిగా నిలిచారు. రామాయణ, మహాభారతం వంటి ఇతిహాసాల్లో సైతం కుల, మతాలకు అతీతమైన వివాహాల ప్రస్తావన ఉంది. ఇప్పటికే కులాంతర,మతాంతర వివాహం చేసుకొన్న వాళ్లు, భవిష్యత్తులో అలాంటి పెళ్లిళ్లు చేసుకోబోయేవాళ్లు భయం, ఆందోళన లేకుండా ధైర్యంగా ముందుకు సాగండి. మీకు ఉచిత న్యాయ సహాయాన్ని, నైతిక బలాన్ని అందజేసేందుకు సిద్ధంగా ఉన్నాం. సమాజ అభివృద్ధి కోసమే చట్టాలు: జస్టిస్ చంద్రయ్య నలభై ఏళ్లకు పైగా ఒక యజ్ఞంలాగా సాగుతున్న కృషి ఇది. చాలా సంతోషం. సమాజం ఒక్కో దశను అధిగమిస్తున్న కొద్దీ అనేక నూతన చట్టాలు ఉనికిలోకి వచ్చాయి. కులం, మతం కంటే ముందే వృత్తులు ఏర్పడ్డాయి. ఆ వృత్తుల ఆధారంగానే కులాలు, కట్టుబాట్లు, ఆచారాలు వచ్చాయి. కుల,మతాలకు అతీతంగా జీవించడం అనేది సమాజ అభివృద్ధిలో భాగమే. డీజీ రామరాజు స్మారక అవార్డు ప్రదానం.. . కుల నిర్మూలన కోసం కృషి చేస్తోన్న ఏపీ కుల నిర్మూలన సంఘం సభ్యులు టి.వి.దేవదత్, లక్ష్మీ దంపతులకు ఏటా ఇచ్చే డీజీ రామరాజు స్మార క అవార్డును అందజేశారు. ఈ అవార్డు కింద రూ.10 వేల నగదు, జ్ఞాపిక బహూకరించారు. ఈ ఏడాది కుల,మతాలకు అతీతంగా వివాహం చేసుకున్న వెంకటేశ్వర్లు-సంతోష, రవి-రాధ, మురళి-కృష్ణవేణి, రాజేష్-హర్షియా, మల్లేష్-మంగ దంపతులను వేదికకు పరిచయం చేశారు. -
పరుచూరి చేసిన పెళ్లి
ఎమ్మెస్ నారాయణది కులాంతర వివాహం. భాషా ప్రవీణ చదువుతున్నప్పుడు తన క్లాస్మేట్ కళాప్రపూర్ణను ఆయన ప్రేమించారు. ఆమె కూడా ఇష్టపడింది కానీ, వీరి ప్రేమను కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. దాంతో భాషా ప్రవీణ ఫైనల్ ఇయర్లో తమకు లెక్చరరైన పరుచూరి గోపాలకృష్ణ సహాయం తీసుకున్నారు. స్వతహాగా కమ్యూనిస్టు భావాలున్న వ్యక్తి కావడంతో దగ్గరుండి ఎమ్మెస్ పెళ్లి జరిపించారు పరుచూరి. చిత్రపరిశ్రమకు వచ్చేటప్పుడు కూడా గోపాలకృష్ణను ఎమ్మెస్ సంప్రతించారు. సినిమాల్లోకొచ్చాక చానాళ్లు ఎమ్మెస్‌కి అవకాశాలు రాలేదు. దాంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక ఊరెళ్లిపోతానని చెబితే, ‘మంచి టైమ్ వస్తుంది. ఓపిక పట్టు’ అని ఆయన గురువు పరుచూరి గోపాలకృష్ణ అన్నారు. ఆ మాటలకు విలువ ఇచ్చి, ఆయన ఉండిపోయారు. పైకొచ్చాక పలు సందర్భాల్లో ‘ఆ రోజు ఓపిక పట్టమని మాస్టారు నాకు మంచి సలహా ఇచ్చారు’ అనేవాడని గోపాలకృష్ణ గుర్తు చేసుకున్నారు. -
ప్రాణం తీసిన కులాంతర వివాహం
రాచగూడిపల్లె (ఒంటిమిట్ట): మండలంలోని రాచగూడిపల్లె బీసీ కాలనీలో కూతురు కులాంతర వివాహం చేసుకుందని అన్నదమ్ముళ్లు అవమానించడంతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని రాచగూడిపల్లె గ్రామానికి చెందిన గిరిజ నాలుగేళ్ల క్రితం కులాంతర వివాహం చేసుకుంది. సంక్రాంతి పండుగ రావడంతో ఇంటి వద్దకు వచ్చి తల్లిదండ్రులను తమను ఇంట్లోకి రానివ్వాల్సిందిగా బ్రతిమలాడింది. గిరిజ తండ్రి రవి కూతుర్ని క్షమించి ఇంట్లోకి ఆహ్వానించారు. అయితే రవి సోదరుడైన కృష్ణయ్య, అతని భార్య సుబ్బలక్షుమ్మలు కులాంతర వివాహం చేసుకున్న అమ్మాయిని ఇంట్లోకి ఎందుకు రానిచ్చావని అసభ్యకర పదజాలంతో దూషించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఒకానొక సందర్భంలో అతన్ని సోదరులు చితకబాదినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సోమవారం నుంచి వీరి వేధింపులు ఎక్కువ కావడంతో అవమానం భరించలేక విషద్రావం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. కుటుంబ సభ్యులు అతన్ని 108లో రిమ్స్‌కు తరలించే క్రమంలో మార్గమధ్యంలో మృతి చెందాడు. మృతుడి కుమార్తె గిరిజ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పెద్దఓబన్న తెలిపారు. -
కులాంతర వివాహానికి క్యాష్ బహుమతి
కులాల మధ్య అంతరం తగ్గించేందుకు బీహార్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా కులాంతర వివాహాలకు నజరానా ప్రకటించింది. ఈ విధంగా వివాహం చేసుకున్నజంటలో పెళ్లి కూతురు పేరు మీద ప్రభుత్వం రూ.50,000 డిపాజిట్ చేయనుంది. వీరు పెళ్లి చేసుకున్న మూడేళ్ల తర్వాత కూడా కలిసుంటేనే ఆ సొమ్మును తీసుకునే అవకాశం ఉంది. ఒక వేళ మూడేళ్లలోపు ఆ జంట విడిపోతే ఈ సొమ్మును కోల్పోవలసి ఉంటుంది. విజయవంతంగా తమ మూడేళ్ల వైవాహిక జీవితాన్నిపూర్తి చేసుకున్న తర్వాత ఈ జంట ఉమ్మడి అంగీకారంతోనే ఆ డబ్బు డ్రా చేయడం లేదా తర్వాతి కాలానికి ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకునే అవకాశం ఉంటుంది. -
మీ శ్రేయోభిలాషి
ఒక్క క్షణంలో కలిగే నమ్మకం జీవితాన్ని ఉన్నత శిఖరాల వైపు నడిపిస్తుంది. ఒక బలహీన క్షణంలో కలిగే అపనమ్మకం జీవితాన్ని బలవన్మరణం వైపు నడిపిస్తుంది. చావే పరిష్కారం అని ఆత్మహత్యకు యత్నించిన వారిలో చాలామందికి మృత్యువును చేరే దారిలో ఆ చావు ఎంత దుర్భరమో తెలుస్తుంది. బతకాలనే కోరికా పుడుతుంది. ఆఖరి క్షణం వరకూ ఆదుకునే చేయి అందకపోతుందా అని ఎదురుచూస్తుంటారు. అలాంటి క్షణాల్లో మేమున్నాం అంటూ వస్తున్నారు సాగర్ లేక్ వ్యూ పోలీసులు. కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న వారిని ఆదుకోవడమే కాదు.. వారికి బతుకుపై భరోసా కూడా కల్పిస్తున్నారు. - భువనేశ్వరి పోరాడుతాం.. గత నెల 29న కొత్తగా పెళ్లయిన ఓ జంట ఆత్మహత్య చేసుకోవడానికి సాగర్‌కు వచ్చింది. ఎవరూ లేని ప్రదేశానికి వెళ్లి ఇద్దరూ నీళ్లలో దూకేశారు. వీరిని గమనించిన లేక్ వ్యూ పోలీసులు వెంటనే రెస్పాండయ్యారు. ఇద్దరినీ కాపాడారు. రమేష్, భానుప్రియ కులాంతర వివాహం చేసుకున్నారు. ఇంట్లో వాళ్లకు దూరంగా భద్రాచలం వెళ్లి ఉద్యోగం చేసుకుని బతుకుతున్నా పెద్దల పెత్తనం వీరిని వదిలిపెట్టలేదు. కలసి జీవించలేమనుకున్న ఈ జంట కలసి చనిపోవాలని నిర్ణయించుకుంది. అయితే లేక్ వ్యూ పోలీసుల పుణ్యాన వీరిద్దరూ బతికి బట్టకట్టారు. ‘పోలీసులు రక్షించిన తర్వాత చావలేకపోయామే అని బాధపడ్డాను. కానీ వారు కౌన్సెలింగ్ చేసిన తర్వాత మా ఆలోచన తీరులో మార్పు వచ్చింది. ఆత్మహత్య కంటే హీనమైన పని మరొకటి లేదని అర్థమైంది. మా సమస్యలపై పోరాటం చేస్తూ నిజమైన ప్రేమికుల్లా జీవిస్తున్నాం ఇప్పుడు’ అంటున్న రమేష్ మాటల్లో ధైర్యం, భానుప్రియ ముఖంలో ఆనందం కనిపించాయి. అవగాహన పెంచేందుకు... హుస్సేన్‌సాగర్ ఆత్మహత్యలకు నెలవుగా మారిపోయింది. వారిని రక్షించడంతో పాటు, ఇలాంటి పనులు మళ్లీ చేయకుండా అవగాహన కల్పించాల్సిన బాధ్యత కూడా మాదే అని భావించి ఇలాంటి సదస్సులు నిర్వహిస్తున్నాం. వీరిని రక్షించడంలో భాగంగా మా పోలీసులు కూడా గాయాలపాలైన సందర్భాలున్నాయి. ఆత్మహత్య నేరమనే విషయాన్ని మరింత విస్తృతంగా ప్రచారం చేస్తూ.. వాటి నివారణకు కావాల్సిన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. - జానకమ్మ, లేక్ వ్యూ పోలీస్ ఇన్స్పెక్టర్ బతుకుపై భరోసా కోల్పోయిన వారికి ఎనీ టైం సూసైడ్ స్పాట్.. హుస్సేన్‌సాగర్. నగరం నడిబొడ్డున ఉన్న ఈ తటాకం లవ్ ఫెయిల్యూర్స్‌కు, చితికిపోయిన బతుకులకూ ప్రాణాలు తీసుకునే కాసారంగా మారింది. అర్ధాంతరంగా ప్రాణాలు వదులుకోవడానికి వచ్చిన వారి ప్రయత్నాన్ని అడ్డుకుని ఆయుష్షుపోస్తున్నారు సాగర్ లేక్‌వ్యూ పోలీసులు. ఇందు కోసం సాగర్ చుట్టూ 40 మంది లేక్ వ్యూ పోలీసులు పహారా కాస్తుంటారు. ఈ ఒక్క ఏడాదే 85 మందిని రక్షించారు. వీరందరినీ పిలిచి ట్యాంక్‌బండ్ ప్రాంతంలోనే ఒక బోట్లో అవగాహన సదుస్సు నిర్వహించారు. ఇప్పుడు హ్యాపీ.. ఎంబీఏ ఫైనాన్స్ చేసిన స్వర్ణలతది మరో కథ. ఉన్నతంగా చదువుకున్నా.. అల్పంగా ఆలోచించి చనిపోవాలని సాగర్ తీరానికి వచ్చింది. చదువు, ఉద్యోగం తప్ప మరో మాట ఎత్తకూడదన్న తల్లిదండ్రుల ఆజ్ఞకు చావుతో సమాధానం చెప్పాలనుకుంది స్వర్ణలత. ఈ ఏడాది మే 19న సాగర్‌లో దూకింది. వెంటనే పోలీసులు రక్షించారు. ఆమె కష్టాన్ని విన్నారు. ఎలా బతకాలో చెప్పారు. ‘నాకు సామాజిక విషయాలపై ఆసక్తి ఎక్కువ. పది మందికి సాయం చేయాలనుకునే తత్వం. ఉద్యోగం కేవలం నా కోసమే కాదని అనుకునేదాన్ని. నా కన్నవారే నా ఆలోచనను వ్యతిరేకించడంతో భరించలేకపోయాను. కౌన్సెలింగ్ తర్వాత నా ఆలోచన ధోరణిలో చాలా మార్పు వచ్చింది. ఇప్పుడు హ్యాపీగా ఉంటున్నాను’ అని వివరించింది స్వర్ణలత. పట్టుదల పెరిగింది.. అత్తింటి వేధింపులు భరించలేక చావు తలుపు తట్టిన ఎందరో మహిళల్లో ముషీరాబాద్‌కు చెందిన భవాని ఒకరు. అనుక్షణం అనుమానించే తాగుబోతు భర్త, ఆడపిల్ల పుట్టిందని తన కొడుక్కు విడాకులు ఇవ్వాలన్న అత్త.. ఈ సమస్యలు భవానీకి చావే మార్గం అనుకునేలా చేశాయి. విడాకులు ఇవ్వకుంటే తనను, బిడ్డనూ చంపేస్తానని భర్త బెదిరించడంతో.. బిడ్డను తన తల్లిదండ్రులకు అప్పగించి చనిపోవాలని అనుకుంది. ‘గత నెల 26న సాగర్‌కు వచ్చి నీళ్లలో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించాను. కానీ పోలీసులు చూసి నన్ను రక్షించారు. ప్రాణాలు దక్కాయి కానీ నా సమస్య మాత్రం అలాగే ఉంది’ అంటూ వాపోయింది భవాని. అయితే కౌన్సెలింగ్ తర్వాత బతికి సాధించాలనే పట్టుదల కలిగిందని చెబుతోంది. మరెందరిలోనో.. ప్రభుత్వం ఇచ్చిన స్థలం కబ్జాపాలై, అధికారులతో మొరపెట్టుకున్నా లాభం లేకపోవడంతో మెదక్ జిల్లాకు చెందిన షేక్ మహబూబ్, తోటి మహిళకు పూచీకత్తు ఇచ్చి.. అప్పులు మెడకు చుట్టుకుని పాలుపోక జీవకళ, బస్తీ లీడర్ వేధింపులు భరించలేక.. ఇంట్లో వారితో చెప్పుకోలేక అనిత.. వీరంతా సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకుందామనుకున్న వాళ్లే. వీరందరినీ రక్షించిన లేక్ వ్యూ పోలీసులు.. వారికి పునర్జన్మ ప్రసాదించారు. కౌన్సెలింగ్ నిర్వహించి బతుకు పోరులో ముందుకు సాగే విశ్వాసాన్ని ఇచ్చారు. -
ప్రేమ‘కులం’.. ఏదీ ప్రోత్సాహకం
కర్నూలు(అర్బన్): షెడ్యూల్డ్ కులాల స్త్రీ, పరుషులను ఇతర కులస్తులు వివాహం చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రోత్సాహకం అందిస్తోంది. గతంలో రూ.10వేలు అందిస్తుండగా.. మే 12, 2011 తర్వాత రూ.50వేలకు పెంచారు. అయితే బడ్జెట్ విడుదలలో నాన్చుడు ధోరణి అవలంబిస్తుండటంతో కులాంతర వివాహంతో ఒక్కటైన జంటలకు నిరాశే ఎదురవుతోంది. గత మూడు సంవత్సరాలుగా అరకొర బడ్జెట్ విడుదల చేస్తుండటంతో ఎదురుచూపులు తప్పని పరిస్థితి నెలకొంది. 2013-14 ఆర్థిక సంవత్సరంలో రూ.8.10 లక్షలు విడుదల కాగా.. గతంలో దరఖాస్తు చేసుకున్న వారిలో సీనియారిటీ ప్రకారం 41 జంటలకు ఈ మొత్తాన్ని అందజేశారు. 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.1.80 లక్షలు విడుదల కాగా ఆరు జంటలకు పంపిణీ చేశారు. ప్రస్తుతం 100 పైగా జంటలు బడ్జెట్ కోసం నిరీక్షిస్తున్నారు. కొందరికి రూ.10వేలు, మరికొందరికి రూ.50వేలు చొప్పున మొత్తం రూ.50లక్షల ప్రోత్సాహకాన్ని అందజేయాల్సి ఉంది. ఈ విషయమై జిల్లా అధికారులు పలుమార్లు నివేదిక పంపగా.. గత జూలైలో రూ.56వేలు మాత్రమే విడుదల చేయడం గమనార్హం. విడుదల చేసిన మొత్తాన్ని డ్రా చేసుకునేందుకు ఆప్షన్ లేకపోవడంతో అధికారులు కూడా చేతులెత్తేశారు. ఆ మొత్తం తీసుకునే అవకాశం కల్పిస్తే కనీసం ఐదు జంటలకైనా న్యాయం చేకూరుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ ఏడాది మార్చిలో రూ.10.70 లక్షలు విడుదల చేస్తున్నట్లు ప్రకటించినా.. ట్రెజరీల్లో ఫ్రీజింగ్ కారణంగా నయాపైసా కూడా డ్రా చేసుకునే అవకాశం లేకపోయింది. తాజాగా ఆ నిధుల ఊసే కరువైంది. మూడు సంవత్సరాల క్రితం దరఖాస్తు చేసుకున్న జంటలకు ఇప్పటికీ ప్రోత్సాహకం విడుదల చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. ప్రభుత్వంపై ఆశతో కులాంతర వివాహం చేసుకున్న జంటలు సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాయి. ఈ విషయమై సాంఘిక సంక్షేమ శాఖ డీడీ శోభారాణి స్పందిస్తూ బడ్జెట్ త్వరలోనే విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలిపారు. వివిధ పద్దుల కింద ఇప్పుడిప్పుడే నిధులు విడుదలవుతున్న దృష్ట్యా కులాంతర వివాహాలకు సంబంధించి ప్రోత్సాహకం కూడా త్వరలోనే రావచ్చన్నారు. బడ్జెట్‌కు అనుగుణంగా సీనియారిటీ ప్రకారం ప్రోత్సాహకం పంపిణీ చేస్తామన్నారు.