Mallya
-
రూ. 68,607 కోట్ల బాకీల రైటాఫ్
న్యూఢిల్లీ: ఉద్దేశపూర్వక ఎగవేతదారుల జాబితా లోని టాప్ 50 సంస్థలు కట్టాల్సిన రూ. 68,607 కోట్ల మేర రుణాల బాకీలను బ్యాంకులు సాంకేతికంగా రైటాఫ్ చేసినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. ఈ లిస్టులో విజయ్ మాల్యా, మెహుల్ చోక్సీ వంటి వ్యాపారవేత్తలకు చెందిన సంస్థలు కూడా ఉన్నాయి. సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద వచ్చిన దరఖాస్తుకు సంబంధించి ఆర్బీఐ ఈ మేరకు సమాధానం ఇచ్చింది. గతేడాది సెప్టెంబర్ 30 నాటి వరకు గణాంకాల ప్రకారం.. టాప్ 50 లిస్టులో.. గీతాంజలి జెమ్స్ (పరారీలో ఉన్న చోక్సీకి చెందిన సంస్థ) అత్యధికంగా రూ. 5,492 కోట్ల బాకీలు చెల్లించాల్సి ఉంది. ఆర్ఈఐ ఆగ్రో రూ. 4,314 కోట్లు, విన్సమ్ డైమండ్స్ రూ. 4,076 కోట్లు కట్టాల్సి ఉంది. మాల్యాకు చెందిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ రూ. 1,943 కోట్ల బాకీలతో 9వ స్థానంలో ఉంది. ఇక డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ రూ. 1,962 కోట్లు, ట్రాన్స్ట్రాయ్ రూ. 1,790 కోట్లు బాకీ పడ్డాయి. ఆర్టీఐ కార్యకర్త సాకేత్ గోఖలే ఫిబ్రవరి 16న ఎగవేతదారుల వివరాల కోసం ఆర్బీఐకి దరఖాస్తు చేశారు. అయితే అప్పట్లో ఆ వివరాలు అందుబాటులో లేవని పేర్కొన్న రిజర్వ్ బ్యాంక్.. ఏప్రిల్ 24న రాతపూర్వక సమాధానం ఇచ్చింది. మరోవైపు, డిఫాల్టర్ల జాబితాలో చాలా మంది అధికార బీజేపీ మిత్రులు ఉన్నారంటూ కేంద్ర ప్రభుత్వంపై విపక్ష కాంగ్రెస్ ఆరోపణలు చేసింది. అందుకే, దీనిపై తాను పార్లమెంటులోనే ప్రశ్నించినా ప్రభుత్వం దాటవేసిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్విట్టర్లో వ్యాఖ్యానించారు. 2014లో అధికారంలోకి వచ్చినప్పట్నుంచీ 2019 సెప్టెంబర్ దాకా బీజేపీ ప్రభుత్వం రూ. 6.66 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేసిందని ఆరోపించింది. -
షాకింగ్ : డిఫాల్టర్ల వేలకోట్ల రుణాలు మాఫీ
సాక్షి, ముంబై: కరోనా వైరస్ సంక్షోభంతో దేశ ఆర్థికవ్యవస్థ తీవ్రమైన మాంద్యంలోకి జారిపోతున్న వేళ రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) షాకింగ్ న్యూస్ చెప్పింది. ఉద్దేశపూర్వక ఎగవేతదారులుగా ప్రకటించిన వ్యాపార వేత్తలకు సంబంధించి రూ. 60వేల కోట్లకుపైగా మాఫీ (రైట్ ఆఫ్) చేసినట్టు వెల్లడించింది. సెప్టెంబర్ 30, 2019 నాటికి బ్యాంకులు 68,000 కోట్ల రూపాయల వరకు రుణాలను నిలిపి వేసినట్లు సమాచార హక్కు (ఆర్టీఐ) కింద అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పింది. ఆర్టీఐ కార్యకర్త సాకేత్ గోఖలే తన ట్విటర్ ఖాతాలో దీనికి సంబంధించిన వివరాలను షేర్ చేశారు. టాప్ 50 ఉద్దేశపూర్వక ఎగవేతదారులపై కాంగ్రెస్ నేత, వాయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానం నిరాకరించడంతో తాను ఇదే విషయంపై ఆర్టీఐని ఆశ్రయించినట్టు గోఖలే ట్వీట్ చేశారు. ఫిబ్రవరి 16 న టాప్-50 ఉద్దేశపూర్వక ఎగవేతదారులు, వారి ప్రస్తుత రుణ స్థితికి సంబంధించిన వివరాలను కోరగా, ఏప్రిల్ 24న తనకు ఈ సమాధానం వచ్చినట్టు గోఖలే చెప్పారు. టాప్ 50 ఉద్దేశపూర్వక ఎగవేతదారులు చెల్లించాల్సిన మొత్తం రూ .68,607 కోట్లు మాఫీ అయ్యాయని గోఖలే ట్వీట్ చేశారు. వీరిలో పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో ప్రధాన నిందితుడు మెహుల్ చోక్సీ, లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా తదితరులు ఉన్నారు. ప్రధానంగా ఈ సంస్థల్లో ఆరు డైమండ్ అండ్ జ్యుయల్లరీ సంస్థలు ఉండటం గమనార్హం. 'విల్‌ఫుల్ డిఫాల్టర్స్' జాబితాలో రుణాలను ఎగవేసి విదేశాలకు పారిపోయిన డైమండ్ వ్యాపారి మెహుల్ చోక్సీకి చెందిన గీతాంజలి జెమ్స్ లిమిటెడ్ రూ.5492 కోట్లతో అగ్రస్థానంలో ఉంది. సందీప్, సంజయ్ ఝున్ ఝన్ వాలాకు చెందిన ఎఫ్ఎంసిజి సంస్థ ఆర్ఇఐ ఆగ్రో లిమిటెడ్, (రూ. 4314 కోట్లు), జతిన్ మెహతాకు చెందిన విన్సమ్ డైమండ్స్ అండ్ జ్యువెలరీ లిమిటెడ్ ( రూ.4వేల కోట్లు) రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. రూ.2,850 కోట్లతో కాన్పూర్ ఆధారిత కంపెనీ రోటోమాక్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ ఉంది. వీరితో పాటు బాబా రామ్‌దేవ్ బాలకృష్ణ గ్రూప్ కంపెనీ రుచి సోయా ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఇండోర్ (రూ .2,212 కోట్లు) డిఫాల్టర్ల జాబితాలో ఉంది. ఇక రూ.1,943 కోట్ల విజయ్ మాల్యా కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్ కూడా ఈ జాబితాలో వుంది. మరోవైపు సుప్రీంకోర్టు తీర్పును ఉటంకిస్తూ విదేశీ రుణగ్రహీతలపై సమాచారాన్ని వెల్లడించడానికి ఆర్బీఐ నిరాకరించింది. This is why Finance Minister @nsitharaman tried to escape from a straight & clear question asked by Rahul Gandhi. Sadly - the truth can never stay hidden too long. Massive kudos to RG for calling the govt’s bluff way back in March! PS: Here’s the list if anyone missed it 😊 https://t.co/OA4moYdTYz pic.twitter.com/JsaoBewhBT — Saket Gokhale (@SaketGokhale) April 28, 2020 -
స్త్రీలోక సంచారం
బ్యాంకులు, కోర్టులు, చట్టాలు.. విజయ్ మాల్యాను వెంటాడి, వేటాడుతున్న ఈ కష్టకాలంలో ఆయనకు ఆర్థికంగా, మానసికంగా, భద్రతపరంగా ముగ్గురు మహిళలు ఆలంబనగా నిలిచారు. విజయ్ మారు తల్లి రీతూమాల్యా ఆయన్ని కోట్ల చెల్లింపుల నుంచి కొంతైనా గట్టెక్కించేందుకు ప్రయత్నిస్తున్నారు. విజయ్ ప్రియసఖి పింకీ లాల్వాణీ ఆయన్ని ఏ క్షణానికాక్షణం చుట్టుముడుతున్న ఒత్తిళ్ల నుంచి కాపాడుకునేందుకు అనుక్షణం వెన్నంటే ఉంటు న్నారు. విజయ్ కేసులో తీర్పునిచ్చిన బ్రిటన్ న్యాయమూర్తి ఎమ్మా ఆర్బర్త్‌నాట్ ఆయన్ని ఉంచబోయే ముంబై జైలు గదిలోని సదుపాయాలను ఎప్పటికప్పడు సమీక్షించాలని తీర్పునిచ్చారు. ఆస్తుల్ని అమ్మి అప్పులు తీర్చే క్రమంలో మాల్యా కంపెనీలలో అతి ప్రధానమైనదైన ‘యునైటెడ్ బ్రూవరీస్ హోల్డింగ్స్’ (యు.బి.హెచ్.ఎల్)లో తన షేర్లను అమ్మడానికి లేదని కోర్టును ఆశ్రయించడం ద్వారా రీతూ తన కుమారుడికి మేలు చేశారు. మాల్యాను భారత్‌కు అప్పగించేందుకు తమకేం అభ్యంతరం లేదని బ్రిటన్ కోర్టు తీర్పు ఇస్తున్నప్పుడు మాల్యా పక్కనే ఉన్న పింకీ లాల్వాణీ ఆయన చెంతనే ఉండి సాంత్వన వచనాలు పలికారు. ఇక జడ్జి ఎమ్మా ఆర్బర్త్‌నాట్.. ముంబై ఆర్థర్ రోడ్ జైల్లోని 12వ బ్యారక్‌లో మాల్యాను విచారణ ఖైదీగా ఉంచబోయే గదిలో ఆయన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక వసతులు, సౌకర్యాలను కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు. మాల్యా జీవితమంతా మహిళల చుట్టూనే తిరిగింది. ఇప్పుడా మహిళలే ఆయనకు ఆసరాగా ఉన్నారు. -
మాల్యా లండన్ ఆస్తుల జప్తునకు ఓకే!
లండన్: భారతీయ బ్యాంకులకు రూ.9,000 కోట్ల మేర రుణాలు ఎగవేసి లండన్‌కు వెళ్లిపోయిన మాజీ లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మాల్యా ఆస్తులు జప్తు చేయడానికి బ్రిటన్ కోర్టు ఆదేశాలిచ్చింది. తమ బకాయిలు వసూలు చేసుకునేందుకు అవకాశం కల్పించాలని కోరుతూ 13 బ్యాంకుల కన్సార్షియం వేసిన పిటిషన్‌ను విచారించిన బ్రిటన్ హైకోర్టు జడ్జి... సానుకూల ఉత్తర్వులు జారీ చేశారు. లండన్ సమీపంలోని హెర్ట్‌ఫోర్డ్ షైర్లో ఉన్న మాల్యా ఆస్తుల్లోకి ప్రవేశించేందుకు ఎన్ఫోర్స్మెంట్ అధికారికి, ఆయన ఏజెంట్లకు కోర్టు అనుమతి మంజూరు చేసింది. ప్రస్తుతం మాల్యా అక్కడే ఉంటున్నారు. అయితే, మాల్యా ఆస్తుల్లోకి ప్రవేశించాలని తామేమీ ఆదేశించడం లేదని, తమ బకాయిలు వసూలు చేసుకోవటానికి బ్యాంకులకు అవకాశం మాత్రమే ఇస్తున్నామని జడ్జి చెప్పారు. ‘‘హైకోర్ట్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి, ఆయన అధికార పరిధిలోని ఎన్ఫోర్స్మెంట్ ఏజెంట్ ఎవరైనా లేడీవాక్, బ్రాంబిల్ లాడ్జ్‌లోని అన్ని భవనాల్లోకి ప్రవేశించి సోదాలు చేసేందుకు, మాల్యాకు చెందిన వస్తువులను జప్తు చేసేందుకు అనుమతిస్తున్నట్టు’’ జస్టిస్ బిరాన్ తన ఆదేశాల్లో పేర్కొన్నారు. భవనాల్లోకి ప్రవేశించేందుకు అవసరమైతే బలప్రయోగం కూడా చేయొచ్చని కోర్టు ఆదేశించడం గమనార్హం. ఈ ఆదేశాలపై అప్పీలుకు వెళ్లేందుకు విజయ్ మాల్యా చేసుకున్న అభ్యర్థన కోర్టు పరిశీలనలో ఉంది. బ్యాంకులకు విజయం...! కాగా, తాజా ఆదేశాలతో బ్యాంకులకు అన్ని రకాల జప్తు అవకాశాలు అందుబాటులోకి వచ్చినట్టేనని ఈ కేసుతో సంబంధం ఉన్న న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. భారత డెట్ రికవరీ ట్రిబ్యునల్ ఆదేశాలను అమలు చేసేందుకు వాటికి అవకాశం లభించినట్టుగా వారు చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మాల్యా ఆస్తుల స్వాధీనానికి బ్యాంకుల అనుమతినిస్తూ భారతీయ డెట్ రికవరీ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను నిలిపివేయాలని కోరుతూ మాల్యా లోగడ బ్రిటన్ హైకోర్టును ఆశ్రయించగా చుక్కెదురైంది. 13 బ్యాంకుల్లో ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, కార్పొరేషన్ బ్యాంకు, ఐడీబీఐ బ్యాంకు, ఫెడరల్ బ్యాంకుతోపాటు జేఎం ఫైనాన్షియల్ అస్సెట్ రీకన్స్ట్రక్షన్ ఉన్నాయి. మోసం, మనీలాండరింగ్ ఆరోపణలతో మాల్యాను భారత్‌కు రప్పించేందుకు దర్యాప్తు సంస్థలు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. 159 ఆస్తుల గుర్తింపు న్యూఢిల్లీ: విజయ్‌మాల్యాకు చెందిన 159 ఆస్తులను గుర్తించినట్టు బెంగళూరు పోలీసులు ఢిల్లీ కోర్టుకు తెలియజేశారు. అయితే, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీ లాండరింగ్ కేసులో భాగంగా వీటిలో ఏ ఒక్కదానినీ స్వాధీనం చేసుకోలేదని వారు తెలిపారు. వీటిలో కొన్ని ఆస్తులను ఇప్పటికే ఈడీ ముంబై జోన్ స్వాధీనం చేసుకుందని చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్‌కు నివేదించారు. అయితే, మాల్యాకు చెందిన ఇతర ఆస్తుల గుర్తింపునకు మరింత సమయం ఇవ్వాలని ఈడీ తరఫు న్యాయవాది కోరడంతో కోర్టు అనుమతించింది. -
మాల్యాను మించిన మరో కేడీ
సాక్షి, ముంబై: వేలకోట్ల రూపాయలు ఎగవేసి లండన్‌కు చెక్కేసిన లిక్కర్ కింగ్ విజయ్‌మాల్యాను మించిన భారీ అవినీతి తిమింగలం సీబీఐ వలకు చిక్కింది. ఆ తిమింగలమే ప్రభుత్వ రంగ దిగ్గజం పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో భారీ స్కాంకు పాల్పడిన నిందితుడు ప్రముఖ సెలబ్రిటీ డైమండ్ వ్యాపారి కావడం గమనార్హం. వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా రూ.11,400 కోట్ల మేర పంజాబ్ నేషనల్ బ్యాంకులో మోసపూరిత లావాదేవీలను గుర్తించినట్టు పంజాబ్ నేషనల్ బ్యాంకు బీఎస్ఈ ఫైలింగ్‌లో పేర్కొంది. దీంతో సీబీఐ, ఈడీ అధికారులు రంగంలోకి దిగారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ అధికారులతో కుమ్మక్కై అండర్‌టేకింగ్ లెటర్లు సంపాదించి వాటిని విదేశాల్లో సొమ్ము చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో నీరవ్ మోదీ ఆఫీసులు, షోరూమ్‌లపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు దాడి చేశారు. ముంబై, ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. మాల్యా తరహాలో భారీ కుంభకోణం వెలుగులోకి రాడంతో మార్కెట్ వర్గాల్లో కలవరం మొదలైంది. దీంతో పంజాబ్ నేషనల్ కుంభకోణంపై బ్యాంకు అధికారులు మీడియా సమావేశం నిర్వహించారు. ఎలాంటి అక్రమాలను సహించమని, క్లీన్ బ్యాంకింగ్‌కు కట్టుబడి ఉన్నామని పీఎన్బీ ఎండీ , సీఈవో సునీల్ మెహతా ప్రకటించారు. వేలకోట్ల రూపాయలను ఎగవేసి సింగపూర్‌కు చెక్కేసిన నీరవ్ మోదీపై లుక్ అవుట్ జారీ అయిందని బ్యాంక్ అధికారులు వెల్లడించారు. జనవరి 30న ఎఫ్ఐఆర్ నమోదు అయిందనీ విచారణ అనంతరం పూర్తి వివరాలను వెల్లడిస్తామన్నారు. అలాగే ఈ కేసులో తమ బ్యాంకుకు చెందిన ఇద్దరు అధికారులను సస్పెండ్ చేసినట్టు చెప్పారు. దీనికి సంబంధించి రిజర్వ్ బ్యాంకు నుంచి ఇప్పటివరకు తమకు ఎలాంటి ఆదేశాలు లేవని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అవసరమైతే ఫోరెన్సిక్ ఆడిట్ కూడా చేపడతామన్నారు. 2011 నుంచి అవినీతి లావాదేవీలు చోటు చేసుకున్నట్టు జనవరి మూడవ వారంలోనే గుర్తించామన్నారు. మూడు నాలుగురోజులు అంతర్గత విచారణ అనంతరం దీనిపై సీబీఐకి ఫిర్యాదు చేశామని ఎండీ ప్రకటించారు. అక్రమ, అనధికారిక లావాదేవీలకు పాల్పడిన అధికారులపై చర్యతీసుకుంటున్నామన్నారు. నిందితులను క్షమించేదిలేదనీ, ఖాతాదారుల ఆర్థిక ప్రయోజనాలను కాపాడతామని హామీ ఇచ్చారు. మరోవైపు ఈ పరిణామాల నేపథ్యంలో పీఎన్బీ షేరు 13శాతం కుప్పకూలింది. -
కింగ్‌ఫిషర్ మాల్యాపై ఎస్ఎఫ్ఐఓ ప్రాసిక్యూషన్ కేసు!
న్యూఢిల్లీ: కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్ విషయంలో విజయ్ మాల్యా, ఇతరులపై ప్రాసిక్యూషన్ కేసులు దాఖలు చేయడానికి ఎస్ఎఫ్ఐఓకి మంత్రిత్వ శాఖ ఆమోదం లభించింది. కింగ్ ఫిషర్ ఏర్‌లైన్స్ విషయంలో విజయ్ మాల్యా, ఇతరులు పలు ఉల్లంఘనలకు పాల్పడ్డారని సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్(ఎస్ఎఫ్ఐఓ) ఒక సవివరమైన నివేదికను కార్పొరేట్ వ్యవహరాల శాఖకు సమర్పించింది. మాల్యా, కంపెనీ అధికారుల్లో కొందరు కంపెనీల చట్టంలోని వివిధ నిబంధనలను ఉల్లంఘించారని, కంపెనీల నిధులను దారిమళ్లించారని ఈ నివేదిక పేర్కొంది. ఎస్ఎఫ్ఐఓ కార్పొరేట్ మంత్రిత్వ శాఖ ఆధీనంలో ఉన్నందున ప్రాసిక్యూషన్ కేసుల దాఖలుకు ఎస్‌ఎఫ్‌ఐఓకు సదరు మంత్రిత్వ శాఖ ఆమోదం అవసరం. ఈ కేసు విషయమై కలసి చర్యలు తీసుకోవడానికి గాను, ఇటీవలే ఎస్ఎఫ్ఐఓ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలు సమావేశమై చర్చించాయని సమాచారం. కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్ రూ.9,000 కోట్ల రుణ చెల్లింపుల్లో విఫలం కావడంతో ఆ కంపెనీ అధినేత విజయ్ మాల్యాపై కేసుల దాఖలయ్యాయి. మాల్యా, ఇతర నిందితులపై ఈడీ, సీబీఐలు ఇప్పటికే వేర్వేరు చార్జిషీట్లు దాఖలయ్యాయి. ఈ విమానయాన సంస్థకు రుణాలు మంజూరు విషయంలో కొన్ని బ్యాంకుల, కొం దరు బ్యాంక్ అధికారుల పాత్రలపై దర్యాప్తు చేయాలని ఎస్ఎఫ్ఐఓ సూచించింది. ఈ కంపెనీ ప్రమోటర్లపై చర్యలు తీసుకోవాలని కూడా పేర్కొంది. -
ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు: జైట్లీ
న్యూఢిల్లీ : విజయ్ మాల్యా వ్యవహారంలో ఎన్డీయే ప్రభుత్వం, ప్రతిపక్షం కాంగ్రెస్ తీవ్రస్థాయిల్లో ఆరోపణలు గుప్పించుకుంటున్నాయి. మాల్యాకు లబ్ది మీరు చేకూర్చారంటే, మీరే రుణాలు ఇచ్చారంటూ వాదించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం లోక్ సభలో జరిగిన చర్చా కార్యక్రమంలో మోదీ ప్రభుత్వం విజయమాల్యాకు ఒక్క రూపాయి లబ్ది కూడా చేకూర్చలేదని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ స్పష్టంచేశారు. యూపీఏ పాలనలోనే నార్త్ బ్లాక్ జోక్యంతో వ్యాపారస్తులకు భారీగా రుణాలు మంజూరు చేశారని ఆరోపించారు. లోక్‌సభలో జరిగిన చర్చ కార్యక్రమంలో రుణాల విషయాలపై అరుణ్ జైట్లీ ఘాటుగా సమాధానాలిచ్చారు. గత ప్రభుత్వమే బ్యాంకుల్లో స్థూల నిరర్థక ఆస్తులకు భారీగా మినహాయింపులు ఇచ్చిందని మండిపడ్డారు. అడ్డుఅదుపు లేకుండా విచక్షణా రహితంగా కొంతమంది వ్యక్తులకు, పారిశ్రామిక వేత్తలకు రుణాలు మంజూరు చేసిందని చెప్పారు. ఎన్పీఏలకు మూల కారణం గత యూపీఏ ప్రభుత్వమేనని ఆరోపించారు. వారి దుశ్చర్యలకు తాము భరించాల్సి వస్తుందని వాపోయారు. ప్రస్తుత ప్రభుత్వం విజయ్‌మాల్యాకు రూ.1,200 కోట్ల లబ్ది చేకూర్చిందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించిన సంగతి తెలిసిందే. రాహుల్ గాంధీ ఆరోపణలపై స్పందించిన జైట్లీ, 2016 మేలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మోదీ ప్రభుత్వం ఒక్క రూపాయి లబ్ది కూడా మాల్యాకు అందించలేదని స్పష్టీకరించారు. 2016 సెప్టెంబర్ నాటికి ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఎన్పీఏలు రూ.6,30,323 కోట్లగా ఉన్నాయి. -
బడ్జెట్ ప్రసంగంలో మాల్యా ఎఫెక్ట్
న్యూఢిల్లీ: 2017-18 ఆర్థిక బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మరో కీలక వ్యాఖ్యలు చేశారు. నల్లధనం వెలికి తీతకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందన్న జైట్లీ బిగ్ టైం అఫెండర్స్ ఆస్తులను జప్తు చేయాలనే ప్రతిపాదను పరిశీలిస్తున్నట్టు చెప్పారు. దీంతో వేలకోట్ల రుణాలను ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన పారిశ్రామిక వేత్త విజయ్ మాల్యాకు పరోక్షంగా గట్టి హెచ్చరికనే చేశారు. ఆర్థిక నేరస్తులకు శిక్ష తప్పదనే సంకేతాలిచ్చారు. ఈ మేరకు వారి ఆస్థులను స్వాధీనంకోసం కొత్త చర్యలు చేపట్టనున్నట్టు ప్రకటించారు. భారతదేశం విదేశాల్లో వున్న అక్రమ ధనాన్ని వెనక్కి రప్పించేందుకు కేంద్రం అనేక క్షమాభిక్ష పథకాలు అమలు చేసింది. అయితే ఈ కొత్త ప్రతిపాదన ఆర్థిక నేరస్థులపై మరింత ఒత్తిడి పెంచనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే స్విట్జర్లాండ్, సింగపూర్ బ్యాంకుల్లో దాగి వున్న అప్రకటిత ఆదాయం, ఆభరణాల, రియల్ ఎస్టేట్ వంటి ఆస్తులపై పెట్టుబడుల ద్వారా పన్ను ఎగవేస్తున్నవారిపై విమర్శకులు, నిపుణులు ప్రశ్నించారు. కాగా లిక్కర్ టైకూన్ విజయ్ మాల్యా రూ.6,000 కోట్లకు పైగా రుణాలను ఎగ్గొట్టి లండన్ కు చెక్కేసిన సంగతి విదితమే. మరో వైపు సీబీఐ కూడా మాల్యా చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. అతడిని స్వదేశం రప్పించేందుకు శతవిధాలా ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే ఐడీబీఐ లోన్ డిఫాల్ట్ కేసులో చార్జ్ షీట్ దాఖలు చేయడంతోపాటు, ఐడీబీఐ అధికారులను, కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ సిబ్బందిని అరెస్ట్ చేసింది. ఈ కేసులో అఫిడవిల్ సీబీఐ ప్రత్యేక కోర్టులో దాఖలు చేసింది. దీంతో మంగళవారం మాల్యా మరోసారి నాన్ బెయలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. -
మాల్యా జెట్ రీ ఆక్షన్ కు కోర్టు అనుమతి
ముంబై: వేలకోట్ల రుణ ఎగవేత దారుడు , వ్యాపార వేత్త విజయ్ మాల్యా కింగ్ ఫిషర్ విమానం మరోసారి వేలం వేసేందుకు బాంబే హైకోర్టు అనుమతి మంజూరు చేసింది. ఎయిర్ బస్ 319 లగ్జూరియస్ విమానాన్ని గత వేలంలో రూ.27.39 కోట్లకు గెలుచుకున్న ఎస్జీఐ కామెక్స్ సంస్థ తాజా వేలాన్ని రద్దు చేయాల్సిందిగా కోర్టును ఆశ్రయించడంతో ఈ పరిణామం చోటు చేసుకుంది. తమ బిడ్‌ను ఉపసంహరించుకుని, తిరిగి వేలం నిర్వహించేందుకు అనుమతించాలంటూ ఎస్జీఐ బాంబే హైకోర్టును కోరింది. దీన్ని విచారించిన కోర్టు ఈ మేరకు అనుమతిని మంజూరు చేస్తూ తదుపరి విచారణను అక్టోబర్ 6 కు వాయిదా వేసింది. బిడ్ గెలుచుకున్న ఎస్జీఐ కామెక్స్ సంస్థ ..2012 అక్టోబరు నుంచీ తమకు హ్యాంగర్ చార్జీలు చెల్లించాలని ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయం (ఎంఐఏఎల్) హైకోర్టును కోరింది.దీంతో ఈ వేలం ప్రక్రియ నుంచి ఉపసంహరించుకునే వీలు కల్పించాలని ఎస్జీఐ కామెక్స్ కోర్టును అభ్యర్థించింది. ఫ్రెష్ గా మరోసారి వేలం నిర్వహించాలని, అవసరమైతే మళ్లీ బిడ్ వేస్తామని ఆ సంస్థ న్యాయవాది కోర్టును కోరారు. దీంతో న్యాయమూర్తి జస్టిస్ ఎస్సీ ధర్మాధికారి నేతృత్వంలోని బెంచ్ ఇందుకు అంగీకరించింది. దీంతోపాటుగా వేలం నిర్వహణలో నిపుణులైన, ప్రభుత్వ, లేదా ఇతర సంస్థల కంట్రోల్ లేని స్వతంత్ర ఏజెన్సీ సహాయంతో ఈ వేలం నిర్వహించాలని కోరింది. తదుపరి విచారణ సమయానికి కొత్త ఏజెన్సీ పేరును ఎస్జీఐ వెల్లడి చేయాల్సి ఉంది. మరోవైపు 17బ్యాంకులకురూ.9 వేల కోట్లకు పైగా రుణాలను ఎగ్గొట్టిన కేసులో బ్యాంకుల కన్సార్టియం పిటిషన్ పై సుప్రీంకోర్టులో మంగళవారం మరోసారి విచారణ జరగనుంది. కాగా సీజే లీజింగ్ నుంచి మాల్యాకు లీజుకు తీసుకున్నారు. అయితే మాల్యా బకాయి పడిన రూ.500 కోట్ల వసూలు కోసం సేవా పన్ను శాఖ అధికారులు డిసెంబర్, 2013 లో ఈ విమానాన్ని ఎటాచ్ చేసిన సంగతి తెలిసిందే. -
కింగ్ ఫిషర్ అధికారికి జైలు శిక్ష ఖరారు
హైదరాబాద్ : పారిశ్రామిక వేత్త విజయ్ మాల్యా ..కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ చెక్ బౌన్స్ కేసులో ఎర్రమంజిల్ ప్రత్యేక కోర్టు గురువారం శిక్షను ఖరారు చేసింది. ఈ కేసులో దోషిగా తేలిన కింగ్ ఫిషర్ మాజీ ముఖ్య అధికారి ఎ ఎ. రఘు నాథన్ కు18 నెలల జైలు శిక్షవిధిస్తూ తీర్పు చెప్పింది. ఇదే కేసులో కింగ్ ఫిషర్ మాజీ అధినేత మాల్యా కూడా దోషిగా తేలినప్పటికీ, ఆయన విదేశాలకు పారిపోవడంతో శిక్ష ఖరారు వాయిదా పడుతోంది. కాగా శంషాబాదు ఎయిర్ పోర్టులో కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ విమానాల రాకపోకలకు సంబంధించి విజయ్ మాల్యా సంస్థ జీఎంఆర్ బకాయిల చెల్లింపుల్లో భాగంగా ఇచ్చిన 50 లక్షల రూపాయల విలువ గల రెండు చెక్కులు బౌన్సయ్యాయి. దీంతో జీఎంఆర్ సంస్థ హైదరాబాదు ఎర్రమంజిల్ లోని ప్రత్యేక కోర్టులో ఫిర్యాదు చేసింది. కేసును విచారించిన కోర్టు కింగ్ ఫిషర్ మాజీ అధినేత విజయ మాల్యా, కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ లిమిటెడ్ సీనియర్ అధికారి రఘునాథన్ ఏప్రిల్ 20 న దోషిగా తేల్చిల్చింది. కానీ విజయ్ మాల్యా గైర్హాజరుతో మాల్యా పరోక్షంలో శిక్షను ఖరారు చేయలేమని చెప్పిన సంగతి తెలిసిందే. -
వేలానికి మాల్యా గోవా విల్లా
స్వదేశానికి రావాలని ఉంది...కానీ పాస్ పోర్టు రద్దయిందని చిలక పలుకులు పలికిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా కు మరో బ్యాడ్ న్యూస్. మాల్యా ప్రసిద్ధ విల్లాను వేలం వేసేందుకు ముహూర్తం ఖరారైంది. సుమారు రూ 85 కోట్ల కు దీన్ని వేలంవేయాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్యాప్ ట్రస్టీ నిర్ణయించింది. కాండోలిమ్ బీచ్ లోని 12, 350 చ.మీ విస్తీర్ణమున్నఈ విల్లా విక్రయానికి రంగం సిద్ధమైంది. అక్టోబర్ 19న ఈ వేలం నిర్వహించనున్నారు. ఈ విల్లాను తనిఖీ చేసుకోవాలనుకునే వారు సెప్టెంబర్ 26, 27, అక్టోబర్ 5, 6 తేదీల అవకాశం ఉంటుందని ట్రస్టీ తెలిపింది. విజయ్ మాల్యా గోవా వచ్చినప్పుడు ఈ విల్లాలో బస చేసి ప్రముఖులతో విందు చేసుకునేవాడు. అత్యాధునిక సదుపాయాలతో బీచ్ ఒడ్డున కొలువు దీరిన ఈ విల్లా విలువ సుమారు తొంభై కోట్లు ఉంటుందని అంచనా. కాగా సుమారు తొమ్మిదివేల కోట్ల రుణ బకాయిలు ఎగవేసి లండన్ కు పారిపోయాడు. గోవాలోని కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ వివాదంలో ఈ విల్లాను ఎస్బీఐ క్యాప్ ట్రస్టీ ఎటాచ్ చేసిన సంగతి తెలిసిందే. -
మలివిడత మాల్యా ఆస్తుల జప్తుపై ఈడీ దృష్టి
న్యూఢిల్లీ: బ్యాంకులకు రూ.9వేల కోట్ల రుణాలను చెల్లించకుండా, బ్రిటన్‌లో తలదాచుకున్న ప్రముఖ వ్యాపార వేత్త విజయ్‌మాల్యాకు సంబంధించి మరిన్ని ఆస్తులను అటాచ్ చేసే దిశగా ఈడీ తన చర్యలను ముమ్మరం చేసింది. మాల్యాపై విచారణ జరుపుతున్న ఈడీ ఇప్పటికే రూ. 8,041 కోట్ల విలువైన ఆస్తులను మనీ లాండరింగ్ చట్టం కింద అటాచ్ చేసిన విషయం తెలిసిందే. మరోసారి వేల కోట్ల రూపాయల ఆస్తులను అటాచ్ చేసే దిశగా ఈడీ దర్యాప్తు బృందం చర్యలు ముమ్మరం చేసింది. ఇందుకు సంబంధించి ముంబై కోర్టు ఆదేశాలను సైతం పొందింది. ఈ సారి అటాచ్మెంట్ చేసే వాటిలో మాల్యా విదేశీ ఆస్తులు కూడా ఉన్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈడీ ఈ నెల 3న రెండో విడత మాల్యాకు సంబంధించి రూ.6,630 కోట్ల ఆస్తులను అటాచ్ చేసిన విషయం తెలిసిందే. కాగా, మాల్యా అరెస్ట్‌కు వారంట్ జారీ చేయాలని ఇంటర్‌పోల్‌ను కోరిన ఈడీ తాజా అభియోగాలను నమోదు చేసింది. -
మాల్యాపై మరో కేసు విచారణ వేగవంతం
ముంబై: ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) మద్యం వ్యాపారి విజయ్ మాల్యా కు మరోసారి షాక్ ఇచ్చింది. ఐడీబీఐ రుణ అవకతవకల కేసులో సీరియస్ గా స్పందించిన ఈడీ మరో కేసులో విచారణను వేగవంతం చేసింది. యునైటెడ్ స్పిరిట్స్ దాఖలు చేసిన దాదాపు 9వందల కోట్ల రూపాయల ఫారిన్ ఎక్సేంజ్ నిబంధనల అతిక్రమణ ఫిర్యాదులపై దర్యాప్తు ప్రారంభించింది. విదేశీ మారక నిబంధనల ఉల్లంఘన కోణంలో దర్యాప్తు మొదలు పెట్టినట్టు ఈడీ వర్గాలు తెలిపాయి. యూఎస్ఎల్ సమర్పించిన పత్రాలపై మనీలాండరింగ్ , కేసులో ప్రత్యేక ఆర్థిక విచారణ ఏజెన్సీ ఆధర్యంలో విచారణ జరగనుందని ఈడీ అధికారి ఒకరు తెలిపారు. దాదాపు 9 వేల కోట్ల రుణాలు ఎగవేసి ప్రస్తుతం బ్రిటన్‌లో ఉన్న మాల్యాపై ఈడీ విచారిస్తున్న ఇది రెండవ కేసు కాగా రుణాల మళ్లింపు ఆరోపణలకు సంబంధించి మొదటిది. యునైటెడ్ స్పిరిట్స్ సంస్థ మాజీ ఛైర్మన్ విజయ్ మాల్యాకు వ్యతిరేకంగా రూ 900 కోట్ల మేరకు విదేశీ మారక ఉల్లంఘనలపై ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. మరోవైపు బ్యాంకుల కన్సార్టియం దాఖలు చేసిన ధిక్కారం పిటిషన్ పై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరగనుంది. కాగా అక్రమ లావాదేవీల ఆరోపణలతో మాల్యా వ్యతిరేకంగా ప్రపంచంలోనే అతి పెద్ద లిక్కర్ సంస్థ డియాజియో ఫిర్యాదుల అనంతరం, మరో కేసులో విచారణ వేగవంతం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఐడీబీఐ మనీలాండరింగ్ కేసులో మాల్యాకు చెందిన రూ.1411 ఆస్తులను ఈడీ ఎటాచ్ చేసింది. ఈ ఏడాది మార్చి 13న మాల్యా ఉద్దేశ పూర్వంగా రుణాలను ఎగ్గొట్టినట్టు ముంబై కోర్టు తేల్చి చెప్పింది. అలాగే చెక్ బౌన్స్ కేసులోఏఏఐ దాఖలు చేసిన పిటిషన్ పై దర్యాప్తుకు హాజరు కాని మాల్యాపై ముంబై కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. -
నిప్పులు చెరిగిన జైరాం రమేష్
న్యూఢిల్లీ. బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జై రాం రమేష్ నిప్పులు చెరిగారు. వేలకోట్లరుణాలను ఎగవేసిన విజయ్ మాల్యాను, కుంభకోణానికి పాల్పడిన లలిత్ మోడీని భారతదేశానికి రప్పించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని మండిపడ్డారు. మాల్య ఫంక్షన్ లకు హాజరవుతూంటే.. ప్రభుత్వం ఆయన్ని వెనక్కి రప్పించడంపై ఆసక్తి చూపడంలేదని విమర్శించారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విధానంపై స్పందించిన ఆయన ఎఫ్‌డీఐలకు 100 శాతం అనుమతిలిస్తూ చేసిన ప్రకటన ఆందోళన కలిగించేదిగా ఉందన్నారు. భారతదేశం యొక్క పర్యావరణ సమస్యలకు సమాధానంగా ఎఫ్‌డీఐ విధానాన్ని చూపించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అటు చేతన్ చౌహాన్ నియామకంపై కూడా విమర్శించిన జైరాం రమేష్ ..ఇలా ఆర్బీఐ గవర్నర్ గా రఘురాజన్ కి ఇలా ఉద్వాసన పలుకుతూ..అలా ప్రతిష్ఠాత్మకమైన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(నిఫ్ట్) ఛైర్మన్‌గా భాజపా మాజీ ఎంపీ చేతన్ కు ఆహ్వానం పలికారని ఆరోపించారు. -
భారత రాయబారి, మాల్యా.. ఓ వివాదం
లండన్: బ్యాంకులకు వేల కోట్ల రూపాయల రుణాలను ఎగవేసి బ్రిటన్ కు పారిపోయిన వ్యాపారవేత్త విజయ మాల్యా లండన్ లోని ఒక పుస్తకావిష్కరణ సభకు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి భారత రాయబారి కూడా హాజరుకావడం వివాదాన్ని రేకెత్తించింది. సహ రచయిత, పాత్రికేయుడు సన్నీ సేన్ తో కలసి సుహేల సేథ్ రచించిన 'మంత్రాస్ ఫర్ సక్సెస్' అనే పుస్తకాన్ని ప్రఖ్యాత లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో గురువారం ఆవిష్కరించారు. మీడియా నివేదికల ప్రకారం భారత హై కమిషనర్ నవతేజ్ సార్నా పాల్గొన్న సభకు మాల్యా కూడా హాజరయ్యారు. దీంతోపాటు అనంతరం జరిగిన ప్యానెల్ డిస్కషన్ సెషన్లో కూడా మాల్యా పాల్గొన్నాడని తెలిసింది. ఆ సమయంలో సార్నా అక్కడ ఉండడం విమర్శలకు తావిచ్చింది. దీనిపై ప్రభుత్వం స్పందించింది.ఇది భారత దౌత్యకార్యాలయం ఏర్పాటు చేసిన కార్యక్రమం కాదని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. మాల్యాను చూసిన మరుక్షణమే నవ్ తేజ్ ఆ వేదికనుంచి, ఆ సభనుంచి బయటకు వచ్చేసారని ప్రకటించింది. అలాగే తాము మాల్యాను ఆహ్వానించలేదనీ.. ఈ పుస్తకావిష్కరణ సభ గురించి సోషల్ మీడియా ప్రకటించడం, ముందస్తు రిజిస్ట్రేషన్ అవసరం లేకపోవడం ఈ పరిణామం చోటు చేసుకుందని నిర్వాహకులు చెప్పారని ప్రభుత్వం తెలిపింది. అయితే తన పుస్తకావిష్కరణ సభకు అందరూ ఆహ్వానితులేనని, ప్రత్యేకంగా ఎవరికీ ఆహ్వానాలు పంపలేదని రచయిత సేథ్ ట్విట్టర్ ద్వారా వివరణ ఇచ్చారు. మిగతా ప్రేక్షకుల్లాగానే మాల్యా కూడా పాల్గొన్నారని తెలిపారు. -
మాల్యా నేరస్తుడేనన్నముంబై కోర్టు
ముంబైః బ్యాంకులను మోసం చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయమాల్యా కేసును ప్రత్యేక ముంబైకోర్టు మంగళవారం మరోసారి విచారించింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారించిన కోర్టు... లిక్కర్ కింగ్ విజయమాల్యా భారత బ్యాంకులను సుమారు 9000 కోట్ల రూపాయల రుణం తీసుకొని మోసగించిన మాట వాస్తవమేనని ప్రకటించింది. విజయమాల్యాపై మనీ లాండరింగ్ చట్టంకింద ఈడీ ఈ కేసును నమోదు చేసిన విషయం తెలిసిందే. కోట్లకొద్దీ బ్యాంకులనుంచి రుణం తీసుకొని మార్చి 2 వ తేదీన మాల్యా భారత దేశంనుంచీ దొంగతనంగా పారిపోయి, లండన్ లో నివసిస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశానికి తిరిగి రావాలని పదే పదే సెంట్రల్ ఏజెన్సీనుంచి ఎన్నిసార్లు సమన్లు జారీ చేసినా ఆయన విస్మరించి అవమానిస్తున్నట్లు ఈడీ తెలిపింది. ఇప్పటికీ మాజీ రాజ్యసభ సభ్యుడు మాల్యా పాస్‌పోర్ట్ ను రద్దు చేసిన ప్రభుత్వం, అతడిని ఇండియాకు పంపించాలని బ్రిటన్ ను అభ్యర్థించింది. అయితే ఆ డిమాండ్ ను లండన్ తిరస్కరించింది. -
మాల్యా వ్యవహారంలో ఈడీకి షాక్
బ్యాంకులకు చెల్లించాల్సిన రుణాలన్నింటినీ ఎగవేసి తప్పించుకుని తిరుగుతున్న పారిశ్రామికవేత్త విజయ్ మాల్యా కు భారీ ఊరట లభించింది. ఉద్దేశ పూర్వకంగా రుణాలను ఎగ్గొట్టి బ్రిటన్ లో తలదాచుకున్న లిక్కర్ కింగ్ ను ఎలాగైనా దేశానికి రప్పించాలని చూస్తున్న ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ షాక్ తగిలింది. ఇంటర్ పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసుల జారీ చేసే వ్యూహంలో ఈడీకి భారీ నిరాశ ఎదురైంది. ఈ మేరకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అభ్యర్థనపై ప్రాథమికంగా విచారణ చేపట్టిన సంస్థ ఈడీ సమర్పించిన సాక్ష్యాలు సరిపోవని ఇంటర్ పోల్ తేల్చి చెప్పింది. అతనికి ఇప్పటికిపుడు రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేయలేమని చెప్పింది. భారత ప్రభుత్వం మాల్యాపై నేరారోపణలను రుజువు చేయలేకపోయిందని ఇంటర్ పోల్ పేర్కొంది. మరోవైపు భారత ప్రభుత్వ అభ్యర్థన పై మాల్యా వివరణను ఇంటర్ పోల్ కోరనుంది. అనంతరం ఈ మొత్తం వ్యవహారాన్ని సమక్షించనుంది. దీనికి మరో మూడు నెలలుపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా బ్యాంకులకు రూ.9000 కోట్ల రుణాలను ఎగవేసి పారిపోయిన విజయ్‌మాల్యాను బ్రిటన్ నుంచి భారత్‌కు రప్పించాలన్న కేంద్రం ప్రయత్నాలపై బ్రిటన్ ప్రభుత్వం ఇటీవల నీళ్లు చల్లింది. తమ చట్ట నిబంధనల ప్రకారం- మాల్యాను దేశం నుంచి బహిష్కరించడం సాధ్యంకాదని ఆ దేశం స్పష్టం చేసింది. కేసు విచారణలో భారత్ కు పూర్తిగా సహకరిస్తామని తెలిపింది. ఈ నేపథ్యంలో రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేయాలని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఇంటర్ పోల్ ను కోరిన సంగతి తెలిసిందే. -
మాల్యాకు రెడ్ కార్నర్ నోటీస్
న్యూఢిల్లీ : బ్యాంకులకు చెల్లించాల్సిన రుణాలన్నింటినీ ఎగవేసి తప్పించుకుని తిరుగుతున్న పారిశ్రామికవేత్త విజయ్ మాల్యాకు కొత్త చిక్కు ఎదురు కాబోతుంది. మాల్యాపై రెడ్ కార్నర్ నోటీసులు జారీకి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సిద్ధమైంది. అతనికి రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేయాలని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఇంటర్ పోల్ ను కోరింది. బ్యాంకులకు రూ.9000 కోట్ల రుణాలను ఎగవేసి, మాల్యా విదేశాలకు పారిపోయిన సంగతి తెలిసిందే. గత మంగళవారమే ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఢిల్లీ హైకోర్టు అతనికి నోటీసులు కూడా జారీ చేసింది. దీనిపై మే20 తేదీ వరకు స్పందించాలని ఆదేశించింది. మరోవైపు విజయ్‌మాల్యాను బ్రిటన్ నుంచి భారత్‌కు రప్పించాలన్న కేంద్రం ప్రయత్నానికి ఎదురుదెబ్బ తగిలింది. తమ చట్ట నిబంధనల ప్రకారం- మాల్యాను దేశం నుంచి బహిష్కరించడం సాధ్యంకాదని ఆ దేశం స్పష్టం చేసింది. కేసు విచారణలో భారత్ కు పూర్తిగా సహకరిస్తామని తెలిపింది. ‘1971 ఇమిగ్రేషన్ చట్టం ప్రకారం, ఒక వ్యక్తి పాస్‌పోర్ట్ న్యాయపరంగా చలామణిలో ఉన్నంతకాలం సంబంధిత వ్యక్తిని దేశం నుంచి వెళ్లిపోవాలని మేము ఆదేశించలేము’ అని బ్రిటన్ ప్రభుత్వం తెలిపిందని విదేశాంగ శాఖ ప్రతినిధి వికాశ్ స్వరూప్ తెలిపారు. గత నెలే అతనిపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో మాల్యాకు రెడ్ కార్నర్ నోటీసులు జారీచేసి భారత్ కు రప్పించాలని, విచారణకు తోడ్పడాలని ఇంటర్ పోల్ ను ఈడీ కోరనుంది. -
వేలానికి ముస్తాబైన మాల్యా విమానం
న్యూఢిల్లీ: లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా కు చెందిన అత్యంత ఖరీదైన విమానాన్ని వేలం వేసేందుకు రంగం సిద్ధమైంది. భారత్ లో బ్యాంకులకు రూ. 9 వేల కోట్లకు పైగా బకాయిలు పడి, వాటిని చెల్లించడంలో విఫలమై, గత నెలలో విదేశాలకు పారిపోయిన యూబీ గ్రూప్ మాజీ చైర్మన్ విజయ్ మాల్యా ఆస్తులను ఇప్పటికే బ్యాంకులు స్వాధీనం చేసుకుని అమ్మకానికి పెడుతున్న నేపథ్యంలో ఇప్పుడు సర్వీస్ ట్యాక్స్ శాఖ కూడా అదే దారిలో పయనిస్తోంది. సుమారు166 కోట్ల రూపాయలతో నవంబర్ 2006 కొనుగోలు చేసిన స్పెషల్ జెట్ కు మరిన్ని కోట్లు వెచ్చించి హంగులు అమర్చుకున్నాడు మాల్యా. ముఖ్యంగా బార్, భోజనాల గది, బెడ్ రూమ్, వంటగదివాష్ రూం లాంటి విలాసవంతమైన సౌకర్యాలను పొందుపరిచాడు. వజ్రాలు పొదిగిన బాలాజీ చిత్రాపటం, మరో నాలుగు పికాసో చిత్రాలు సహా ఇతర ఖరీదైన కళాఖండాలు లోపల అమర్చాడు. అయితే పన్నులు చెల్లించడంలో విఫలం కావడంతో ప్రభుత్వం దీన్ని స్వాధీనం చేసుకుంది. అనంతరం ఎయిర్ ఇండియా ఎయిర్ భారతదేశం ఇంజినీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్ సహకారంతో ఎయిర్ బస్ ఎ 319 ని ముస్తాబు చేశారు. చాలా మరమ్మతులు, హంగులు అమర్చిన అనంతరం ఈ మే 12, 13 తేదీల్లో ప్రభుత్వ నిర్వహణలోని ఎంఎస్టిసి లిమిటెడ్ దీన్ని వేలానికి పెట్టనున్నారు. అయితే ఎయిర్ బస్ లోని మాల్యా పిల్లల ఫోటోలతో పాటు, ఖరీదైన చిత్రాలను మినహాయించి వేలం వేయనుంది. మాల్యా నుంచి తనకు రావలసిన రూ.370 కోట్లకు పైగా పన్ను బకాయిలను రాబట్టేందుకు సర్వీస్ ట్యాక్స్ శాఖ తాజాగా మాల్యా ప్రైవేట్ విమానాన్ని అమ్మకానికి పెట్టింది. మే 12-13 తేదీల మధ్య ఈ -133 సిజె విమానాన్ని వేలం వేయనుంది. ఇంజనీరింగ్ కంపెనీ సిబ్బంది ఇప్పటికే విమానం లోపలా, బయటా శుభ్రం చేసిందనీ, 22 సీట్లు ఎయిర్‌బస్ 319 ని అందంగా తీర్చిదిద్దారని విమానాశ్రయం అధికారి ఒకరు వెల్లడించారు. కాగా దాదాపు 18 నెలల క్రితం ఆదాయపన్ను శాఖ కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్ ప్రైవేట్ జెట్ సర్వీసులను సీజ్ చేసిన సంగతి తెలిసిందే. పాస్ పోర్టును రద్దు చేసినట్టుగా విదేశాంగ శాఖ ప్రకటన, అరెస్ట్ వారెంట్ జారీ చేయనున్నారనే వార్తల నేపథ్యంలో మాల్యా వ్యవహారం నానాటికీ దిగజారిపోతున్నట్టు కనిపిస్తోంది. -
మాల్యా పాస్‌పోర్టు రద్దు
► రుణ ఎగవేత కేసుల నేపథ్యంలో విదేశాంగ శాఖ నిర్ణయం ► డిపోర్టేషన్‌కు చర్యలు వేగవంతం! న్యూఢిల్లీ: కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ రూ.9,400 కోట్ల రుణ ఎగవేత కేసుల్లో చిక్కుకుని దేశం విడిచిపోయిన విజయ్ మాల్యా పాస్ట్‌పోర్టును ఆదివారం భారత్ రద్దు చేసింది. దీంతో ప్రస్తుతం బ్రిటన్‌లో ఉన్న మాల్యాను వెనక్కిరప్పించే(డిపోర్టేషన్) ప్రక్రియ మొదలుపెట్టేందుకు మార్గం సుగమం కానుంది. ఐడీబీఐ బ్యాంకు రుణ ఎగవేతకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్(ఈడీ) దాఖలు చేసిన మనీలాండరింగ్ కేసులో ఇప్పటికే ముంబై కోర్టు మాల్యాకు నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. విచారణ కోసం ఈడీ ముందు హాజరు కావాల్సిన మాల్యా.. దీనికి మూడుసార్లు కూడా నిరాకరించడంతో ఆయన పాస్‌పోర్టును రద్దు చేయాలంటూ ఈడీ విదేశాంగ శాఖను కోరింది. దీంతో ఈ నెల 15న విదేశాంగ శాఖ మాల్యా డిప్లొమాటిక్ పాస్‌పోర్టును సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. పాస్‌పోర్టును ఎందుకు రద్దుచేయకూడదో చెప్పాలంటూ షోకాజ్ నోటీసును కూడా జారీచేసింది. దీనికి మాల్యా ఇచ్చిన సమాధానం ఏమాత్రం సంతృప్తికరంగా లేకపోవడంతో చివరకు ఆయన పాస్‌పోర్టును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాశ్ స్వరూప్ చెప్పారు. రుణ ఎగవేత కేసులు చుట్టుముట్టడంతో మాల్యా మార్చి 2న దేశం విడిచి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన బ్రిటన్‌లో ఉన్నట్లు సమాచారం. కాగా, రూ.900 కోట్ల ఐడీబీఐ రుణానికి సంబంధించి మనీలాండరింగ్ కేసులో మాల్యాను స్వదేశానికి రప్పించేందుకు(డిపోర్టేషన్) ఈడీ చర్యలు ప్రారంభించింది. ఈడీ విజ్ఞప్తి మేరకు విదేశాంగ శాఖ మాల్యా డిపోర్టేషన్‌కు సంబంధించి న్యాయ నిపుణులతో సంప్రదింపులు కూడా జరుపుతోంది. ఈ ప్రక్రియ ప్రారంభమైతే.. మాల్యాను తమకు అప్పగించాల్సిందిగా భారత్ సర్కారు.. బ్రిటన్ ప్రభుత్వ సహకారాన్ని కోరనుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. పాస్‌పోర్టు రద్దు, ముంబై కోర్టు జారీ చేసిన నాన్-బెయిలబుల్ వారెంట్ల ఆధారంగా మాల్యా డిపోర్టేషన్‌ను భారత్ కోరనుందని ఆయా వర్గాలు చెబుతున్నాయి. పాస్‌పోర్టు రద్దవటంతో విదేశాల్లో ఉండటం చట్టవిరుద్ధం అవుతుందని.. తప్పకుండా భారత్‌కు రావాల్సిందేననేది విదేశాంగ శాఖ వర్గాల వాదన. కాగా, ఇప్పుడు మాల్యా తనను బ్రిటన్‌లోనే ఉండేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా బ్రిటిష్ అధికారులను సంప్రదించే అవకాశం ఉంది. అదేవిధంగా పాస్‌పోర్టు రద్దును సవాలు చేస్తూ భారత్‌లోని కోర్టులను కూడా ఆశ్రయించవచ్చని భావిస్తున్నారు. రుణ ఎగవేత, మోసపూరిత కుట్ర, మనీలాండరింగ్ వంటి ఆరోపణలకు సంబంధించి ఈడీతోపాటు సీబీఐ, ఎస్ఎఫ్ఐఓ ఇతరత్రా దర్యాప్తు సంస్థలు కూడా మాల్యాపై విచారణ జరుపుతున్నాయి. యూకే ఓటర్ల జాబితాలో మాల్యా... రుణ ఎగవేత కేసుల కారణంగా బ్రిటన్‌కు పలాయనం చిత్తగించిన మాల్యా... అక్కడి పౌరుడిగా ఓటర్ల లిస్టులో కూడా ఉన్నారు. భారత్ నుంచి తానేమీ పరారైపోలేదని.. తనపై వస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవమంటూ వాదిస్తున్న మాల్యా.. హెర్ట్‌ఫోర్డ్‌షైర్‌లోని టెవిన్ గ్రామంలో ఉన్న మూడంతస్తుల భవంతి(లేడీవాక్)ని ప్రస్తుతం తన అధికారిక అడ్రస్‌గా ధ్రువీకరించినట్లు సండేటైమ్స్ పత్రిక పేర్కొంది. ఉత్తర లండన్ నుంచి గంటన్నర ప్రయాణంతో ఇక్కడికి చేరుకోవచ్చని తెలిపింది. కాగా, ఇక్కడున్న తన చిరునామా సమాచారాన్ని భారతీయ అధికారులకు కూడా తెలియజేసినట్లు మాల్యా చెప్పారని సండేటైమ్స్ వెల్లడించింది. బ్రిటిష్ ఫార్ములా వన్ చాంపియన్ లెవిస్ హామిల్టన్ తండ్రి వద్దనుంచి మాల్యా ఈ భవంతిని 11.5 మిలియన్ పౌండ్లకు కొనుగోలు చేశారు. విదేశీ మూలాలున్న తన కంపెనీ ద్వారా ఆయన ఈ ప్రాపర్టీని దక్కించుకున్నట్లు ఆ పత్రిక పేర్కొంది. -
విజయ్ మాల్యాను వెనక్కి రప్పిస్తాం
న్యూఢిల్లీ: బ్యాంకులకు వేలకోట్లు ఎగనామం పెట్టిన విజయ మాల్యాను స్వదేశానికి రప్పించే విషయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అభ్యర్థనకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) స్పందించింది. అతడిని విచారణ నిమిత్తం భారత్ కు రప్పించేందుకు చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. తొమ్మిదివేల కోట్ల బ్యాంకు రుణ కుంభకోణం కేసుకు సంబంధించి మాల్యాపై ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకునే ముందు నిపుణులను సంప్రదిస్తున్నట్లు తెలిపింది. తన విదేశీ ఆస్తుల వివరాలను అడిగే అధికారం బ్యాంకులకు లేదని, తన భార్యా, పిల్లలు ఎన్నారైలు కావడంతో తన ఆస్తుల వివరాలను వెల్లడించక్కర లేదని మాల్యా ఇప్పటికే సుప్రీం కోర్టుకు తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మాల్యా కేసుపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను ఈడీ సంప్రదించింది. దీంతో మాల్యా తమ న్యాయవాదులకు అందుబాటులో ఉన్నారని, అతడిని వెనక్కి తీసుకు వచ్చేందుకు (డిపోర్టేషన్) తదుపరి చర్యలకు అనుమతి కోరుతూ ఈడీ ఇచ్చిన అభ్యర్థన తమ శాఖకు అందిందని, ఆయా విషయాలపై తాము న్యాయ నిపుణులను సంప్రదిస్తున్నామని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్ తెలిపారు. మాల్యాను స్వదేశానికి రప్పించే డిపోర్టేషన్ ప్రక్రియ ప్రారంభించాలంటూ విదేశీ వ్యవహారాల శాఖను ఈడీ గురువారం ఆశ్రయించింది. ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయిన నేపథ్యంలో ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీసు (ఆర్సీఎన్) వచ్చేలా సీబీఐ కి త్వరలోనే ఈడీ లేఖ రాయనుంది. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ కు తీసుకున్న రుణంలో మాల్యా 430 కోట్ల రూపాయల వరకూ విదేశాలకు మళ్ళించారన్నది ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ వాదన. ఇదే కేసుపై విచారించిన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గతవారం మాల్యా దౌత్య పాస్ పోర్ట్ ను సస్పెండ్ చేసింది. అయితే సదరు వ్యాపారవేత్త డబ్బు లావాదేవీల్లో చట్టాన్ని ఉల్లంఘించారని, కేసు విచారణకు సరిగా సహకరించడంలేదని ఈ నేపథ్యంలో మాల్యా పాస్ పోర్టు ఎందుకు రద్దు చేయకూడదంటూ ఈడీ ప్రశ్నిస్తోంది. -
మాల్యా, లలిత్‌లను ఎందుకు రప్పించలేదు?: రాహుల్
దిగ్బోయ్ (అస్సాం): విదేశాల్లోని నల్లధనాన్ని వెనక్కి రప్పిస్తామని చెప్పి మాట తప్పారంటూ ప్రధాని మోదీని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నిలదీశారు. నల్లధనాన్ని తెప్పించి దేశంలోని ఒక్కొక్కరి బ్యాంకు ఖాతాలో రూ.15 లక్షలు జమచేస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. లిక్కర్ రారాజు విజయ్ మాల్యా, ఐపీఎల్ మాజీ చీఫ్ లలిత్‌మోదీలను విదేశాల నుంచి ఇంకా ఎందుకు రప్పించలేదని గురువారమిక్కడ జరిగిన ఎన్నికల సభలో రాహుల్ దుయ్యబట్టారు. మాల్యా విదేశాలకు పోయే రెండు మూడు రోజుల ముందు పార్లమెంటులో ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీతో మాట్లాడారని, వారేం చర్చించారో చెప్పాలన్నారు. ద్వంద్వ పౌరసత్వానికి సంబంధించి లోక్‌సభ కమిటీ ఇచ్చిన నోటీసులకు రాహుల్ బదులిచ్చారు. తనకు బ్రిటిష్ పౌరసత్వం లేదని స్పష్టంచేశారు. -
మాల్యా.. బకాయిలు చెల్లించి గౌరవం నిలుపుకో!
న్యూఢిల్లీ: ''బ్యాంకులకు బకాయిలు చెల్లించి గౌరవం నిలుపుకోండి.. లేదంటే చర్యలు తప్పవు'' అంటూ విజయ్ మాల్యాలాంటి ఎగవేతదారులను ఉద్దేశించి ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ హెచ్చరికలు చేశారు. బకాయిలు చెల్లించకుంటే బ్యాంకులు, విచారణ సంస్థలు తీసుకొనే కఠిన చర్యలకు సిద్ధంగా ఉండాలని సూచించారు. వ్యక్తిగత కేసుల్లో తాను ఎటువంటి వ్యాఖ్యలు చేయనని, పెద్ద గ్రూపుల విషయం తన బాధ్యతగా భావిస్తున్నానని ఆయన తెలిపారు. తొమ్మిది వేల కోట్ల రూపాయల వరకు బ్యాంకులకు ఎగవేసిన విజయ్ మాల్యా విషయంలో చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన ఓ ఇంటర్వూలో స్పష్టం చేశారు. బ్యాంకులకు సెక్యూరిటీలు ఉంటాయని, ఇతర సంస్థలు కూడా చట్టపరమైన చర్యల ద్వారా ఎగవేతదారుల వద్ద నుంచి బకాయిలు వసూలు చేసే పద్ధతులు ఉన్నాయని, వీటన్నింటిని సంబంధింత ఏజెన్సీలద్వారా పరిశోధన చేస్తున్నారని జైట్లీ అన్నారు. లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా భారతదేశం విడిచి మార్చి 2న లండన్ పారిపోయే ముందు... అతని గ్రూప్ సంస్థలనుంచి రికవరీ కోరుతూ ప్రభుత్వరంగ బ్యాంకులు సుప్రీంకోర్లును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఆర్థిక మాంద్యం వల్ల అనేక కంపెనీలు నష్టాల్లో కూరుకుపోయిన నేపథ్యంలో వాటి మొండి బకాయిల సమస్యకు పరిష్కారం దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు జరుపుతోంది. ప్రస్తుతం మొండి బకాయిల సమస్యకు పరిష్కార దిశగా చర్యలు ప్రారంభమయ్యాయని, ముందే చెప్పినట్లుగా ఇవి రెండు రకాలుగా ఉంటాయని, ఆర్థిక వాతావరణంలో కొన్ని, పరిశ్రమల వైఫల్యంవల్ల కొన్ని ఉంటాయని, ఇప్పుడు ఇటువంటి సమస్యలు పరిష్కరించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని జైట్తీ తెలిపారు. -
మాల్యాను ఎలా వెళ్ళనిచ్చారు?
ప్రముఖ వ్యాపారవేత్త విజయమాల్యా దేశం విడిచి వెళ్ళడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అప్పుల ఊబిలో కూరుకుపోయి, బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగనామం పెట్టిన లిక్కర్ కింగ్... విదేశాలకు వెళ్ళకూడదంటూ ఆదేశాలు ఉన్నా... ఆయన రహస్యంగా లండన్ చెక్కేయడంపై ప్రస్తుతం రాజకీయ రచ్చగా మారింది. మనీ ల్యాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాల్యాను దేశం విడిచి ఎలా వెళ్ళనిచ్చారంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రశ్నాస్త్రాలు సంధించారు. సమస్యల వలయంలో చిక్కుకున్న విజయ్ మాల్యాను దేశం విడిచి వెళ్ళేందుకు ఎలా అనుమతించారంటూ కేజ్రీవాల్...మోదీని సూటిగా ప్రశ్నించారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నుంచి నేరుగా ప్రధానికి నివేదికలు పంపినా మాల్యాను ఎలా వెళ్ళనిచ్చారో తెలపాలంటూ కేజ్రీవాల్ ట్వీట్ లో కోరారు. వేల కోట్ల రూపాయల రుణాలు బ్యాంకులకు ఎగవేసిన కేసులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాల్యాను దేశం వదిలి వెళ్ళేందుకు అనుమతించరాదంటూ సుప్రీంను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ మాల్యా మార్చి 2వ తేదీ దేశం విడిచి వెళ్ళారంటే.. ఎవరి అనుమతితో వెళ్ళారని కేజ్రీవాల్ అన్నారు. -
'మాల్యాను దేశం విడిచి ఎలా వెళ్లనిచ్చారు'
న్యూ ఢిల్లీ: బ్యాంకులకు కుచ్చు టోపీ పెట్టి విదేశాలకు పారిపోయిన కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యా వ్యవహారంపై గురువారం పార్లమెంట్లో వాడివేడి చర్చ జరిగింది. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. విజయ్ మాల్యాను దేశం విడిచి ఎలా వెళ్లనిచ్చారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నల్లడబ్బును వెనక్కి తీసుకొస్తామని చెబుతున్న ఈ ప్రభుత్వం మాల్యాకు ఎలా అనుమతులు ఎలా ఇచ్చిందో చెప్పాలన్నారు. 9000 కోట్ల రూపాయల మేర మోసానికి పాల్పడిన మాల్యా వ్యవహారంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పందించాలన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రాజ్యసభలో మాట్లాడుతూ.. మాల్యా నుండి నయా పైసతో సహా వసూలు చేస్తామని వెల్లడించారు. మాల్యాకు తమ ప్రభుత్వ హయాంలో బ్యాంకులు రుణాలు ఇవ్వలేదని, 2004 నుండి 2008 వరకు యూపీఏ ప్రభుత్వ హయాంలోనే ఆయన బ్యాంకుల నుండి రుణాలు పొందారని జైట్లీ గుర్తుచేశారు. మాల్యా ఆర్థిక నేరాలపై సీబీఐ దర్యాప్తు జరుపుతుందని ఆయన వెల్లడించారు.