Nandyal District News
-
లైంగిక దాడి ఘటనపై డీఈఓ విచారణ
చాగలమర్రి: మండల కేంద్రం చాగలమర్రిలోని శ్రీరాఘవేంద్ర ఉన్నత పాఠశాలలో చిన్నారిపై లైంగిక దాడి జరిగిన ఘటనపై విచారణ చేస్తున్నామని డీఈఓ జనార్దన్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన సదరు పాఠశాలకు వచ్చారు. పాఠశాలలో ప్రాథమిక, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, పీఈటీలను విచారించారు. కర్నూలు జువైనల్ హోంకు తరలించిన నిందితులిద్దరిని కూడా త్వరలో విచారిస్తామన్నారు. డీఈఓ వెంట డిప్యూటీ డీఈఓ బేగ్, జేసీబీఓ సువక్షల, ఎంఈఓలు అనురాధ, న్యామతుల్లా తదితరులు ఉన్నారు. -
నంద్యాలలో..
● నంద్యాల పట్టణంలోని ఎస్సీ బాలుర వసతి గృహంలో మరుగుదొడ్లకు తలుపులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ● బీసీ బాలుర వసతి గృహం శిథిలావస్థకు చేరుకోవడంతో ఇరుకై న అద్దె భవనంలో విద్యార్థులు వసతి పొందుతున్నారు. ● డిగ్రీ కళాశాల మైదానంలో ఉన్న ఎస్సీ బాలుర జూనియర్, డిగ్రీ కళాశాలల విద్యార్థుల వసతి గృహంలో శుభ్రత కానరావడం లేదు. ప్రహరీ గోడలు లేవు. బాత్రూములు అపరిశుభ్రంగా ఉండటంతో విద్యార్థులు బహిర్భూమికి బయటకు వెళ్తున్నారు. ఎస్టీ జూనియర్ కళాశాల బాలుర వసతి గృహంలో మరుగుదొడ్లకు తలుపులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరుగుదొడ్లకు నీటి సౌకర్యం లేకపోవడంతో ఎవరూ వీటిని ఉపయోగించడం లేదు. రైల్వేట్రాక్ పక్కకు బహిర్భూమికి వెళ్తున్నారు. బనగానపల్లెలో : ● అవుకు కస్తూరిబాగాంధీ హాస్టల్లో ఆహార పదార్థాల తయారీలో నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడంతో విద్యార్థినులు కడుపులు మాడ్చుకుంటున్నారు. విద్యాలయ స్పెషల్ ఆఫీసర్ విద్యార్థినుల పట్ల దురుసుగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ● సంజామల కస్తూరిబాగాంధీ హాస్టల్లో మినరల్ వాటర్ ప్లాంట్ పనిచేయడం లేదు. సీసీ కెమెరాలు, డైనింగ్ హాలు లేకపోవడంతో విద్యార్థినులు భోజనం చేసేందుకు సరైన వసతి లేక ఇబ్బందులు పడుతున్నారు. ● బనగానపల్లె పట్టణంలోని బీసీ బాలికల కళాశాల వసతి గృహంలో మరుగుదొడ్లు, స్నానపు గదులు అధ్వానంగా ఉన్నాయి. ప్రహరీ లేకపోవడంతో విద్యార్థినులతో పాటు సిబ్బంది రాత్రి వేళల్లో హాస్టల్లో నుంచి బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. ● కొలిమిగుండ్ల కస్తూరిబాగాంధీ బాలికల హాస్టల్లో విద్యార్థినుల సంఖ్యకు తగ్గట్టుగా డైనింగ్ హాల్ లేక పోవడంతో భోజనం వరండాలో కూర్చోని తినాల్సి వస్తుంది. విద్యార్థినులకు సరిపడ్డ టాయిలెట్లు లేవు. రెగ్యులర్ ఎస్ఓ లేరు. శ్రీశైలంలో.. ఈ నియోజవకర్గంలోని వివిధ వసతి గృహాల్లో విద్యాభ్యాసం నిర్వహిస్తున్న విద్యార్థులు భయం గుప్పిట్లో ఉన్నారు. శ్రీశైలం మండలంలోని శ్రీశైలం, సున్నిపెంట వసతి గృహాలు నల్లమల అభయారణ్యంలో ఉన్నాయి. ఈ వసతి గృహాలకు సరైన ప్రహరీగోడలు లేకపోవడంతో చిరుతలు ఎప్పుడు దాడి చేస్తాయోనని విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. ఇటీవల పలు మార్లు వసతి గృహాలకు సమీపాల్లో చిరుతలు సంచరించాయి. అలాగే ఈ నియోజకవర్గంలోని వసతి గృహాలకు సీసీ కెమెరాలు లేవు. దీంతో బాలికల రక్షణ గాలిలో దీపంగా మారింది. ఇక వసతి గదులు, మరుగుదొడ్ల గురించి చెప్పనవసరం లేదు. ఆత్మకూరు, బండిఆత్మకూరు, వెలుగోడు, మహానంది మండలాల్లో వసతి గృహాలు శిథిలావస్థకు చేరాయి. పెచ్చులు ఊడి విద్యార్థులకు గాయాలు అయిన సంఘటనలూ ఉన్నాయి. నందికొట్కూరు నియోజకవర్గంలోని పలు సంక్షేమ హాస్టళ్ల పరిస్థితి ఇదే విధంగా ఉంది. వసతిగృహాల్లో ఆర్వో ప్లాంట్లు లేవు. గదులకు కిటికీలు లేవు. పిల్లలకు ప్లేట్లు, గ్లాసులు, దుప్పట్లు, ట్రంక్ పెట్టెలు ఇవ్వలేదు. డోన్‌లో... డోన్ నియోజకవర్గంలోని సంక్షేమ వసతి గృహాల్లో అరకొర సౌకర్యాలతో విద్యార్థినీ విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. డోన్‌లోని జ్యోతిరావుపూలే వసతి గృహానికి ప్రహరీగోడ, సెక్యూరిటీ సిబ్బంది లేకపోవడంతో తరచుగా ఇక్కడి నుంచి బాలికలు పారిపోతున్న సంఘటనలు అనేకం చోటు చేసుకుంటున్నాయి. ఏపీ మోడల్, కస్తూరిబా బీసీ గురుకుల పాఠశాలలో 30 శాతం అభివృద్ధి పనులు పెండింగ్‌లో ఉండటంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్యాపిలీ ఎస్సీ వసతి గృహంలో ఆర్వో ప్లాంట్ మూత పడటంతో విద్యార్థులు మంచినీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. కుళాయి నీరు తాగుతూ తరచూ అస్వస్థతకు గురవుతున్నారు.● సంక్షేమ వసతి గృహాలను పట్టించుకోని ప్రభుత్వం ● పెచ్చులూడి శిథిలావస్థకు చేరిన పలు భవనాలు ● కానరాని శుభ్రత, ప్రహరీలు, సీసీ కెమెరాలు ● గాలిలో దీపంగా మారిన పేద పిల్లల భద్రత ● హైకోర్టు మొట్టికాయ వేసినా స్పందన లేని సర్కారు ● తీవ్ర అవస్థలు పడుతున్న విద్యార్థులు ఇక్కడ చిత్రంలో కనిపిస్తున్న మరుగుదొడ్లు మండలకేంద్రం దొర్నిపాడులోని ఎస్సీ బాలుర వసతి గృహంలోనివి. వీటికి తలుపులు, నీరు, విద్యుత్, వసతులు లేక నిరుపయోగంగా మారాయి. వాటిని ఏర్పాటు చేస్తే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని తల్లిదండ్రులు కోరుతున్నారు.అయితే, కూటమి సర్కారు ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోక పోవడంతో విద్యార్థులకు అవస్థలు తప్పడం లేదు.ప్రస్తుతం రాష్ట్రంలో బాలికలకు రక్షణ లేకుండా పోయింది. చిన్నపిల్లలపై కూడా లైంగిక దాడులు జరుగుతున్నాయి. పరిస్థితి ఇంత తీవ్రంగా ఉంటే పై చిత్రంలో కనిపిస్తున్న శిరివెళ్ల ఏపీ మోడల్ స్కూల్ బాలికల వసతి గృహం రక్షణ లేకుండా ఉంది. ఇది ప్రధాన రహదారికి సమీపంలో ఉన్నప్పటికీ సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. వసతిగృహానికి ప్రహరీ లేదు. దీంతో బాలికలు ప్రతి రోజు బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వస్తోంది. 62 భోజనాల్లో నాణ్యత పాటించని వసతిగృహాలు 67 మౌలిక వసతులు లేని హాస్టళ్లు 23,565 మొత్తం విద్యార్థుల సంఖ్య 137 జిల్లాలో మొత్తం హాస్టళ్లు 57 పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్న హాస్టళ్లు -
ఓం నమో శివ రుద్రాయ
శ్రీశైలంటెంపుల్: శ్రీగిరి క్షేత్రం హర..హర..మహాదేవా అంటూ భక్తుల శివనామస్మరణతో మారుమోగింది. కార్తీకమాసం మూడో సోమవారాన్ని పురస్కరించుకుని రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వేలాదిగా తరలివచ్చారు. వేకువజాము నుంచే మల్లన్న దర్శనానికి భక్తులు పోటెత్తారు. సాయంత్రం లక్షదీపోత్సవం, పుష్కరిణి హారతి నేత్రానందభరితంగా సాగింది. దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఈఓ ఎస్.ఎస్.చంద్రశేఖర ఆజాద్, అధికారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. భక్తులతో కిటకిటలాడిన శ్రీగిరి నేత్రానందభరితంగా లక్షదీపోత్సవం, పుష్కరిణి హారతి -
న్యాయ సంస్థలు తరలిస్తే ఊరుకోం
అన్యాయాన్ని ప్రశ్నిద్దాం సీమ ప్రాంతానికి జరిగే అన్యాయాన్ని ప్రతి న్యాయవాది ప్రశ్నించాలి. ఇందుకు వ్యక్తిగత అజెండాలను పక్కన పెట్టి సీమ ప్రజల గొంతుక వినిపించాలి. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేసేవరకు విధులు బహిష్కరించి ప్రజా ఉద్యమం చేపట్టకపోతే న్యాయవాదులంతా చరిత్ర హీనులుగా మిగిలిపోతారు. గడిచిన 50 ఏళ్లుగా సీమ ప్రాంతం అభివృద్ధికి ఆమడదూరంలో ఉంది. ఇకనైనా మనం మేలుకోవాలి. – వి.కృష్ణమూర్తి, న్యాయవాది ప్రభుత్వం దిగివచ్చే వరకు పోరాటం కర్నూలులో ఏర్పాటైన వివిధ న్యాయ సంబంధ సంస్థలు తరలింపును కలిసికట్టుగా అడ్డుకుందాం. సర్కారు దిగి వచ్చే వరకు పోరాడదాం. సీమ ప్రాంత అభివృద్ధిని కాంక్షించే ప్రతి రాజకీయ పార్టీ ఉద్యమానికి సహకరించి ప్రజల పక్షాన నిలవాలి. అప్పుడే ఈప్రాంతానికి న్యాయం జరుగుతుంది. – గోపాలకృష్ణయ్య, న్యాయవాది సీమ గొంతు కోస్తున్న బాబు అభివృద్ధిలో వెనుకబడిన ప్రాంతంలో ఒకటైన కర్నూలును కొద్దో గొప్పో అభివృద్ధి చేద్దామని గత ప్రభుత్వం లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్, ఎయిమ్స్, ట్రిపుల్ ఐటీ, రాష్ట్ర వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్, విద్యుత్ రెగ్యులేటరీ తదితర ప్రభుత్వ సంస్థలను కర్నూలులో ఏర్పాటు చేసింది. వాటిని ఇప్పుడు చంద్రబాబు అమరావతికి తరలించి సీమ ప్రజల గొంతును కోయాలని చూడటం సరికాదు. – వజ్రం భాస్కర్, సీనియర్ న్యాయవాది పార్టీలకు అతీతంగా ఉద్యమం రాష్ట్ర విభజన నాటి నుంచి సీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని న్యాయవాదులు, ప్ర జలు ఆందోళనలు చేశారు. గత ప్రభుత్వం స్పందించి కొన్ని సంస్థలను కర్నూలులో ఏర్పాటు చేసింది. ప్రస్తుత ప్రభుత్వం అందుకు విరుద్ధంగా అ న్ని సంస్థలను అమరావతికి తరలించాలని చూస్తోంది. ఇది దుర్మార్గం. దీనిపై పార్టీలకు అతీతంగా ఉద్యమం చేపడతాం. – ఆర్.నరసింహులు, న్యాయవాది కర్నూలు (లీగల్): గత ప్రభుత్వం అభివృద్ధి వికేంద్రీక రణకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది. అందులో భాగంగానే రాయలసీమ ముఖ్యద్వారమైన కర్నూలు ను న్యాయ రాజధానిగా ప్రకటించి పలు న్యాయ సంస్థలను ఏర్పాటు చేసింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం వాటిని తరలించేందుకు కుట్ర పన్నుతోంది. ఇప్పటికే కర్నూలులో ఏర్పాటైన లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్లను అమరావతికి తరలించనున్నట్లు రాష్ట్ర హైకోర్టుకు తెలపడం కూడా జరిగింది. దీనిని కర్నూలు జిల్లా న్యాయవాదులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. న్యాయ సంస్థల తరలింపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సోమవారం కర్నూలు బార్ అసోసియేషన్ అత్యవసర సర్వసభ్య సమావేశం నిర్వహించింది. ఇందులో పలువురు జిల్లా న్యాయవాదులు పాల్గొని ప్రభుత్వాన్ని తూర్పారబట్టారు. ఎన్నికల మేనిఫెస్టోలో కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఐదునెలలు గడిచినా ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. పలుమార్లు కేబినెట్ సమావేశాలు నిర్వహించి బెంచ్ విషయం ప్రస్తావించకపోవడం అన్యాయమన్నారు. రాయలసీమ వాసిగా ఉండి ఈ ప్రాంత అభివృద్ధిని విస్మరించడం సరికాదన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇక్కడ ఏర్పాటైన సంస్థలను అమరావతికి తరలించే ఆలోచన మార్చుకోకపోతే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు బి.కృష్ణమూర్తి మాట్లాడుతూ కూటమి సర్కారు వెంటనే కర్నూలులో హైకోర్టు బెంచి ఏర్పాటుకు చర్యలు తీసుకోవడంతో పాటు ఇక్కడ నుంచి ఏ ప్రభుత్వ సంస్థను తరలించమని ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు పి.రవిగువేరా మాట్లాడుతూ న్యాయ సంస్థల తరలింపును అడ్డుకునేందుకు భవిష్యత్ కార్యాచరణ రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధాన కార్యదర్శి బీఎస్ రవికాంత్ ప్రసాద్ మాట్లాడుతూ ప్రభు త్వం సీమ ప్రజల ఆగ్రహానికి గురికాకుండా ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రభుత్వ సంస్థలను ఎక్కడికీ తరలించరాదన్నారు. సీనియర్ న్యాయవాదులు వై.జయరాజు, కె.ఓంకార్ మాట్లాడుతూ మీరు గతంలో మాదిరి కాకుండా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తారని భావించి ప్రజలు అధికారంలోకి తీసుకొచ్చారని.. ఇప్పుడు మళ్లీ పాత పంథానే అవలంభిస్తే ఎలా అని ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. రాజధాని కోస్తా ప్రాంతంలో ఉంటే హైకోర్టు రాయలసీమలో ఉండాలన్నారు. ఇది సీమ ప్రజల హక్కు అన్నారు. 2014 సంవత్సరంలో కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చి తర్వాత పట్టించుకోలేదన్నారు. టీడీపీ భాగస్వామ్య పార్టీలైనా బీజేపీ, జనసేన రాయలసీమకు హైకోర్టు తరలిస్తే తమకు అభ్యంతరం లేదని పేర్కొన్న విషయాన్ని వారు గుర్తు చేశారు. ఇప్పటి వరకు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయకపోగా ఉన్న వాటికి అమరావతికి తరలిస్తే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఇందులో భాగంగా నేటి నుంచి న్యాయవాదులు తమ కోర్టు విధులను బహిష్కరించి ప్రజలతో కలసి ఉద్యమం చేయనున్నట్లు తెలిపారు. కర్నూలులో రాష్ట్ర హైకోర్టు ఏర్పాటు కాకుండా చంద్రబాబు కోర్టుల్లో పిటిషన్లు వేయించి అడ్డుకొని ఈ ప్రాంతానికి తీరని ద్రోహం చేశారని సీనియర్ న్యాయవాదులు ఎం.సుబ్బయ్య, పి.సువర్ణారెడ్డి విమర్శించారు. సమావేశంలో న్యాయవాదులు బి.చంద్రుడు, శేషన్న, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసమే గత ప్రభుత్వం న్యాయ రాజధాని ప్రకటన అందులో భాగంగానే లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్ తదితర ఏర్పాటు కూటమి ప్రభుత్వం వాటిని తరలించాలనుకోవడం దుర్మార్గం ఉపసంహరించుకోకపోతే ఉద్యమం జిల్లా న్యాయవాదులు హెచ్చరిక నేటి నుంచి విధుల బహిష్కరణకు పిలుపు -
టీబీ డ్యాం సమాచారం
పూర్తి మట్టం (అడుగులు) : 1,633 ప్రస్తుతం : 1,630.81 సామర్థ్యం (టీఎంసీలు) : 105.788 ప్రస్తుతం : 97.102 ఇన్‌ఫ్లో (క్యూసెక్కులు) : 3,590 అవుట్‌ఫ్లో : 7,325ఇది కోవెలకుంట్ల పట్టణంలోని వెలగటూరు రస్తాలో ఉన్న ఎస్సీ బాలికల వసతి గృహం. 75 మంది విద్యార్థినులు ఉండే ఈ హాస్టల్ భవనం శిథిలావస్థకు చేరుకుని కూలేందుకు సిద్ధంగా ఉంది. పెచ్చులూడి పడుతుండటంతో ఇప్పటికే రెండు గదులను మూసి వేశారు. హాస్టల్‌కు ఏర్పాటు చేసిన ప్రహారీ పూర్తిగా దెబ్బతినింది. సీసీ కెమెరాలు లేవు. ఇక మౌలిక సదుపాయాలు అస్సలే కానరావు. -
శ్రీశైలక్షేత్రాభివృద్ధికి కృషి
● నూతన ఈఓ చంద్రశేఖర ఆజాద్ శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాపుణ్యక్షేత్ర అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని దేవస్థానం నూతన ఈఓ ఎస్.ఎస్.చంద్రశేఖర ఆజాద్ అన్నారు. సోమవారం ఇన్చార్జి ఈఓ చంద్రశేఖరరెడ్డి నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. ముందుగా శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లను దర్శించుకొని మాట్లాడారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సౌకర్యవంతమైన దర్శనాలను కల్పించేందుకు చర్యలు తీసుకుంటానన్నారు. పర్యావరణ పరిరక్షణ, క్షేత్ర సుందరీకరణలో భాగంగా పచ్చదనాన్ని పెంపొందిస్తామన్నారు. పది పరీక్షల ఫీజు చెల్లింపు గడువు పెంపు నంద్యాల(న్యూటౌన్): పదవ తరగతి పరీక్షలకు ఫీజు చెల్లింపు గడువును పెంచినట్లు డీఈఓ జనార్దన్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 18వ తేదీలోపు ఫీజు చెల్లించేందుకు గడువు ఉండగా ఈ నెల 26వ తేదీ వరకు పెంచారు. రూ.50 అపరాధ రుసుంతో 19 నుంచి 25వ తేదీలోపు, రూ.200 అపరాధ రుసుంతో 26 నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు, రూ.500 అపరాధ రుసుంతో వచ్చే నెల 4 నుంచి 10వ తేదీ వరకు గడువు ఉందని డీఈఓ వెల్లడించారు. రెగ్యులర్ అభ్యర్థులకు అన్ని సబ్జెక్టులకు రూ.125, 3 సబ్జెక్టులకుపైగా ఉంటే రూ.125, 3 సబ్జెక్టుల లోపు ఉంటే రూ.110, ఒకేషనల్ అభ్యర్థులకు అదనంగా రూ.60, తక్కువ వయస్సు కలిగిన అభ్యర్థులకు రూ.300, మైగ్రేషన్ సర్టిఫికెట్ కోసం అవసరం అయితే రూ.80 ప్రకారం ఫీజులు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఫీజు చెల్లింపు తదితర పూర్తి సమాచారం కోసం www.bse.ap.gov.in అనే వెబ్‌సైట్‌ను సందర్శించాలని డీఈఓ పేర్కొన్నారు. ఉద్యోగం ఇప్పిస్తామని మోసం చేశారు బొమ్మలసత్రం: సున్నిపెంట గ్రామానికి చెందిన విఠల్ రావు, సంజయ్‌రెడ్డి, అనిల్ కుమార్ అనే వ్యక్తులు ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మబలికి రూ.8.21 లక్షలు తీసుకుని మోసం చేశారని అదే గ్రామానికి చెందిన విక్టర్‌పాల్ ఎస్పీ అధిరాజ్‌సింగ్ రాణాకు ఫిర్యాదు చేశారు. సోమవారం స్థానిక పోలీస్ సమావేశ భవనంలో ఎస్పీ స్పందన కార్యక్రమం నిర్వహించారు. ప్రజల నుంచి 78 ఫిర్యాదులు వచ్చాయి. అనంతరం ఆయన మాట్లాడుతూ చట్టపరమైన సమస్యలను వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారం చూపుతామన్నారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ యుగంధర్ బాబు తదితరులు పాల్గొన్నారు. -
ప్రజా సమస్యలను సత్వరం పరిష్కరించండి
నంద్యాల: వివిధ సమస్యలపై వచ్చిన ఫిర్యాదులను నిర్ణీత కాల పరిమితిలోగా పరిష్కచాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్, డీఆర్ఓ రాము నాయక్, అధికారులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. పెండింగ్‌లో ఉన్న అ ర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి నిర్ణీత కాలవ్యవధిలో గా వాటికి పరిష్కారం చూపాలన్నారు. ఈవిషయంలో నిర్లక్ష్యం వహించరాదన్నారు.పీజీఆర్ఎస్లో 183 దర ఖాస్తులొచ్చాయని, వీటిని పరిష్కరించాలన్నారు. ఎఫ్ఆర్బీఏ ఆధారంగానే జీతభత్యాలు ప్రభుత్వ ఆదేశాల మేరకు సచివాలయ ఉద్యోగులకు ఫేస్ రికగ్నేషన్ బేస్డ్ అటెండెన్స్ (ఎఫ్ఆర్బీఏ) ఆధారంగానే జీతాల చెల్లింపు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ, ఎంపీడీఓలను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో జిల్లా అధికారులతో పలు అభివృద్ధి అంశాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉద్యోగులు వివిధ అంశాల్లో పనితీరు మెరుగుపరుచుకుని నిర్దేశించిన లక్ష్య సాధనపై దృష్టి సారించాలన్నారు. జిల్లాలో హౌస్ హోల్డ్ ఇమేజ్ జియో ట్యాగింగ్ సర్వే 35 శాతం పెండింగ్‌లో ఉందని తక్షణమే పూర్తి చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అపార్ ఐడీ జనరేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలన్నారు. మండల స్థాయిలో సిబ్బంది పనితీరు సరిగ్గా లేదని, జిల్లా అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశం పీజీఆర్ఎస్కు 183 వినతులు -
జీఓలు అమలు చేయాలి
కర్నూలు(హాస్పిటల్): సమస్యల పరిష్కారం కోసం సీఐటీయూ రాష్ట్ర ప్రతినిధి బృందంతో ఫిబ్రవరి 9న రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పంద జీఓలను అమలు చేయాలని ఆశా వర్కర్లు డిమాండ్ చేశారు. సోమవారం ఆశా వర్కర్స్ యూనియన్, సీఐటీయూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర నాయకులు నిర్మలమ్మ, గౌస్‌దేశాయ్, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షులు నాగేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి శివలక్ష్మి మాట్లాడారు. తమ ప్రభుత్వం వస్తే ఆశాల న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తామని టీడీపీ నాయకులు హామీ ఇచ్చి ఆరు నెలలైనా అమలు చేయకపోవడం బాధాకరమన్నారు. కూటమి ప్రభుత్వం కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగులకు రిటైర్మెంట్ వయస్సును 62 ఏళ్లు చేసి ఆశ వర్కర్లకు మాత్రం 60 ఏళ్లకు ఎలాంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేకుండా ఇంటికి పంపించడం బాధాకరమన్నారు. ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్నందున ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు చేయకుండా, ఇతర పనులను కూడా ఆశా వర్కర్లతో చేయిస్తూ అధిక ఒత్తిడికి గురిచేస్తున్నారని విమర్శించారు. అనంతరం డీఎంహెచ్‌వో డాక్టర్ ఎల్.భాస్కర్‌కు వినతి పత్రం అందజేశారు. డీఎంహెచ్ఓ మాట్లాడుతూ.. ఇకపై సచివాలయాల్లో డ్యూటీలు ఉండవని, అర్బన్ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఆశా వర్కర్లను వారు నివాసం ఉండే ప్రాంతానికి బదిలీ చేస్తామని, పీహెచ్సీ డాక్టర్‌తో సెలవు తీసుకునే వీలు కల్పిస్తామని, ఆశా వర్కర్లకు ఆర్థికభారం లేకుండా 21 రికార్డులను ప్రభుత్వమే కొనుగోలు చేసి ఇచ్చే విధంగా మాట్లాడతానని, ఎన్సీడీ సర్వేకు ఆశా వర్కర్‌తోపాటు ఇతర ఉద్యోగులను కలిపి టీం వర్క్ చేసే విధంగా కలెక్టర్‌తో మాట్లాడి అమలు చేస్తామని హామీ ఇచ్చారు. సీఐటీయూ నగర నాయకులు మహమూద్, కుమార్, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. -
చెంచు గిరిజనుల సమస్యల పరిష్కారానికి కృషి
ఆత్మకూరు: చెంచు గిరిజనుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని శ్రీశైలం ఐటీడీఏ ప్రాజెక్ట్ హార్టికల్చర్ ఆఫీసర్ ధనుంజయ తెలిపారు. సోమవారం ఎంపీడీఓ కార్యాలయంలో శ్రీశైలం నియోజకవర్గంలోని చెంచుల సమస్యలపై వినతి పత్రాలు స్వీకరించారు. కొట్టాల చెరువు గ్రామానికి చెందిన గురువయ్య, విజయలక్ష్మి తమ పొలాలకు బోరుబావులు కావాలని వినతిపత్రాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన బాధితులతో మాట్లాడి వీలైనంత త్వరగా పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఐటీడీఏ ప్రత్యేకాధికారి కె.జి.నాయక్, ఏపీఓ నాగార్జున, గిరిజనులు పాల్గొన్నారు. వినతుల్లో కొన్ని.. ● తనకు రెండున్నర ఎకరాల పొలం కావాలని కొత్తపల్లి చెంచుగూడేనికి చెందిన ఉత్తలూరు నాగమ్మ వినతిపత్రం అందించారు. ● కొత్తపల్లి చెంచుగూడెం వరకు రోడ్లు నిర్మించాలని పలువురు గిరిజనులు విన్నవించారు. ● తన అత్తమామలకు చెందిన పొలాన్ని ఓబులేష్ అనే వ్యక్తి ఆన్లైన్లో ఎక్కించుకున్నాడని, న్యాయం చేయాలని ఓ మహిళ వినతి పత్రం అందించింది. ● తమ గూడేనికి తెలుగుగంగ కాలువ నుంచి ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేసి పొలాలకు సాగునీరు అందించాలని, చెరువులకు నీటితోపాటు ఇంటింటికి కుళాయి ఏర్పాటు చేయాలని, భూమిలేని కుటుంబాలకు భూమి ఇవ్వాలని, 31 కుటుంబాల వారికి ఇళ్లు, వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించి ఇవ్వాలని బండిఆత్మకూరు మండలం నారపురెడ్డికుంటకు చెందిన గిరిజనులు అర్జీ ఇచ్చారు. -
ఆలయం.. అపచారం
● కొలనుభారతి క్షేత్రం ఆవరణలో సిగరెట్ తాగుతున్న పురోహితుడు, సిబ్బంది కొత్తపల్లి: రాష్ట్రంలోనే ఏకై క సరస్వతి క్షేత్రంగా వీరాజిల్లుతున్న కొలనుభారతి దేవి ఆలయ ప్రాంగణంలో అపచారం చోటుచేసుకుంది. పురోహితుడు అమ్మవారి క్షేత్ర ప్రాంగణంలోనే సిగరెట్ తాగడం, నిబంధనలు పాటించకుండా పూజలు చేస్తుండటంతో భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే భక్తుల పట్ల కూడా దురుసుగా ప్రవర్తిస్తున్నట్లు పురోహితుడిపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం మహబూబ్ నగర్ జిల్లా భూత్పూరుకు చెందిన కొంత మంది భక్తులు ఆదివారం మధ్యాహ్నం 12:25 గంటలకు కొలనుభారతి క్షేత్రానికి చేరుకున్నారు. అప్పటికే ఆలయ తలుపులను పురోహితుడు చక్రపాణి శర్మ మూసివేశారు. దూరం నుంచి వచ్చామని, అమ్మవారికి చీరె, సారె సమర్పించేందుకు ఆలయ తలుపులు తెరవాలని కోరినా పురోహితుడు ససేమిరా అన్నారు. ఈ క్రమంలో భక్తులతో దురుసుగా వ్యవహరించినట్లు సమాచారం. అయినా బతిమాలడంతో తలుపు తీసి ఒకే ఒక్క నిమిషంలో మంత్రాలు చదివి పూజను మమ అనిపించి, రూ.501 చెల్లించాలని డిమాండ్ చేశారు. చేసేదేమీలేక భక్తులు రుసుం చెల్లించి అమ్మవారిని దర్శించుకున్నారు. కాగా అమ్మవారికి పూజ నిర్వహించే సమయంలోనూ పురోహితుడు నుదుటన కుంకుమ బొట్టు కూడా పెట్టుకోవడం లేదని ఇదేమి సంప్రదాయమని భక్తులు ప్రశ్నిస్తున్నారు. అదే రోజు క్షేత్రంలోని ఓ గదిలో పురోహితుడు కుర్చీపై, మరో సిబ్బంది కింద కూర్చొని దర్జాగా సిగరేట్ కాల్చుతూ భక్తుల కంట పడ్డారు. క్షేత్రాన్ని అపవిత్రం చేస్తున్న పురోహితుడిపై చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై ఆలయ ఈఓ రామలింగారెడ్డిని వివరణ కోరగా విచారణ జరిపి, నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకుంటామన్నారు. -
టీడీపీ నాయకుడి అక్రమ మైనింగ్‌కు కార్మికుడి బలి
● బండలు మీద పడి అక్కడికక్కడే మృతి ● కేసును నీరుగార్చుతున్న గని యజమాని ● గనిలోనే చనిపోయాడంటున్న మృతుని కుటుంబీకులు ● మృతుడి కాళ్లకు సున్నపురాయి మరకలు ● ఎవరూ ఫిర్యాదు చేయలేదంటున్న పోలీసులు డోన్/ప్యాపిలి: నంద్యాల జిల్లాలో ఓ టీడీపీ నాయకుడి అక్రమ మైనింగ్‌కు కార్మికుడు బలయ్యాడు. గనిలో బండలు మీద పడి కార్మికుడు మృతి చెందినా సమీపంలోని తోటలో కాలుజారి కింద పడి చనిపోయినట్లు చిత్రీకరించే ప్రయత్నం చేశారు. విషయం తెలిసినా పోలీసులు ఫిర్యాదు అందలేదని అంటున్నారు. మృతుడి కుటుంబీకుల కథనం ప్రకారం.. ప్యాపిలి మండలం చండ్రపల్లికి చెందిన టీడీపీ నాయకుడు, బీసీ సంఘం జాతీయ కార్యదర్శి, గొర్రెల పెంపకందారుల రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఎర్రసాని నాగేశ్వరరావు యాదవ్, ఆయన సోదరుడు ఎర్రసాని లక్ష్మీనారాయణ (అలియాస్ లచ్చియాదవ్) వారి పొలం పక్కనే కొన్నేళ్లుగా లైమ్‌స్టోన్ (సున్నపురాయి)ని యథేచ్ఛగా అక్రమంగా మైనింగ్ చేస్తున్నారు. ఈ గనిలో సోమవారం హుసేనాపురం గ్రామానికి చెందిన శివయ్య (55) సున్నపు రాయిని ట్రాక్టర్లో లోడ్ చేస్తుండగా కాలుజారి కిందపడటంతో పెద్ద బండరాయి తలపై పడి అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే, శివయ్య సమీపంలోని తోటలో కాలు జారి కింద పడి మరణించినట్లుగా గని యజమాని లచ్చి యాదవ్ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. తన తండ్రి గనిలో పనిచేస్తుండగానే మృతి చెందాడని, కాళ్లకు తెలుపు రంగు సున్నపురాయి మరకలు కూడా ఉన్నాయని మృతుడి కుమారుడు రవి చెబుతున్నాడు. ఈ ప్రమాదంపై అధికారులు విచారణ జరిపి మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఈ విషయంపై పోలీసులను వివరణ కోరగా తమకు ఫిర్యాదు అందలేదని చెబుతున్నారు. గతంలోనూ ముగ్గురి మృతి.. గత పదేళ్లలో టీడీపీ నాయకుడు లచ్చి యాదవ్ చేసే అక్రమ గనిలో ముగ్గురు కూలీలు ప్రమాదాల బారినపడి మృతి చెందినట్లు తెలిసింది. మృతుల కుటుంబ సభ్యులను భయపెట్టి కేసులు నమోదు కాకుండా చేశారని చెబుతున్నారు. ఇక్కడ అనుమతులు లేకుండానే చట్ట వ్యతిరేకంగా మైనింగ్ చేస్తున్నారని చండ్రపల్లి గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. -
శ్రీమఠంలో భక్తుల సందడి
మంత్రాలయం: ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠానికి భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. కార్తీక మాసం కావడంతో భక్తులు వేలాదిగా తరలివచ్చి స్వామి సేవలో తరిస్తున్నారు. సోమవారం భక్తులు అధిక సంఖ్యలో మంత్రాలయానికి చేరుకున్నారు. పవిత్ర తుంగభద్ర నదిలో పుణ్యస్నానాలు ఆచరించి గ్రామ దేవత మంచాలమ్మ, రాఘవేంద్రుల మూల బృందావన దర్శనం చేసుకున్నారు. స్వామి దర్శనానికి గంటన్నర సమయం పట్టింది. భక్తుల సందడితో శ్రీమఠం కారిడార్ ప్రాంగణం, అన్నపూర్ణ భోజనశాల, పరిమళ ప్రసాదం కౌంటర్లు కిక్కిరిశాయి. -
నిప్పుల వాగులో బాలిక గల్లంతు
వెలుగోడు: నిప్పుల వాగులో పదేళ్ల బాలిక గల్లంతైంది. వివరాలు.. మహానంది మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన సుంకరి హరినాథ్‌బాబు భార్యతో పాటు కుమార్తె భవ్యశ్రీ, కుమారుడు బాలీశ్వర్తో కలసి భార్య పుట్టినిల్లైన అయ్యవారిపల్లె గ్రామానికి చేరుకున్నారు. కార్తీక నోములను పురస్కరించుకొని నిప్పులవాగులో స్నానం ఆచరించేందుకు తాత రామచంద్రుడు భవ్యశ్రీ, బాలీశ్వర్లను తీసుకొనివెళ్లాడు. స్నానం ఆచరించే సమయంలో నీటి ఉద్ధృతి పెరిగి ఇద్దరు కొట్టుకొని పోగా బాలీశ్వర్ను ఒడ్డుకు చేర్చాడు. ఎంత వెతికినా భవ్యశ్రీ ఆచూకీ కనపడలేదు. కుటుంబ సభ్యులు స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
ప్రజలను మోసం చేసిన కూటమి ప్రభుత్వం
● వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సుభాష్ చంద్రబోస్ కర్నూలు (టౌన్): అఽధికారం కోసం కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను నిలువునా మోసం చేసిందని వైస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మద్దూరు సుభాష్ చంద్రబోస్ విమర్శించారు. సోమవారం సి.క్యాంపులోని తన కార్యాలయంలో ఆయన మాట్లాడారు. తన సేవలను గుర్తించి పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా నియమించిన మాజీ ముఖ్యమంత్రి జగనన్నకు, రాష్ట్ర నాయకత్వానికి, కర్నూలు, నంద్యాల జిల్లాల అధ్యక్షులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. ప్రజా సమస్యలపై పార్టీ తరపున నిరంతరం పోరాటం చేస్తానన్నారు. గత ప్రభుత్వం కన్నా మెరుగైన పథకాలు అందిస్తామని, ఇంటింటికి ఎంత మంది ఉంటే అంత మందికి సంక్షేమ పథకాలు అందిస్తామని పదే పదే చెప్పిన కూటమి నేతలు ప్రభుత్వం ఏర్పాటై ఆరు నెలలైనా సూపర్ సిక్స్‌ను అమలు చేయకపోవడం సిగ్గుచేటన్నారు. అన్ని రంగాల్లో విఫలం చెందిన కూటమి ప్రభుత్వాన్ని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్న వైస్సార్సీపీ సానుభూతి పరులను వేధించడం మానుకుని ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని హితవు పలికారు. -
రైలు నుంచి జారి పడి వృద్ధురాలి మృతి
కర్నూలు (టౌన్): రైలు నుంచి జారి పడి ఓ వృద్ధురాలు మృతి చెందింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాలు.. కర్నూలు సిటీ –దూపాడు మధ్య ఓ వృద్ధురాలు రైలు నుంచి జారి పడి అక్కడికక్కడే మృతిచెందింది. విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అక్కడ ఎలాంటి ఆధారాలు లభ్యం కాకపోవడంతో స్టేషన్ సూపరింటెండెంట్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మహానందీశ్వరుడి సన్నిధిలో తానా అధ్యక్షుడు మహానంది: కార్తీక మాసం పురస్కరించుకుని తానా అధ్యక్షుడు శృంగవరపు నిరంజన్, ఆయన సోద రులు సోమవారం మహా నందీశ్వరుడిని దర్శించుకున్నారు. అనంతరం ఆల య ఈఓ శ్రీనివాసరెడ్డితో కలిసి ప్రాంగణంలోని అభివృద్ధి పనులుపై చర్చించారు. నవదుర్గలు, నవ వినాయకుల వద్ద గ్రానైట్ ఫ్లోరింగ్ ఏర్పాటుకు ఆర్థిక సా యం అందజేస్తానని హామీ ఇచ్చారు. దీంతో ఆయనను ఈఓ, వేదపండితులు బ్రహ్మశ్రీ చెండూరిరవిశంకర అవధాని సన్మానించారు. కాగా నూతనంగా ప్రవేశపెట్టిన గంగా హారతి కార్యక్రమానికి అవసరమైన 10 రకాల హారతులతో కూడిన ఐదు సెట్లను హైదరాబాద్, సికింద్రాబాద్, కర్నూలు నగరాలకు చెందిన దొంతు నరేష్, చైతన్య, శ్రీనివాస్, మాలతి, గోవర్థన్‌రెడ్డి, మీనాకుమారి, రోశిరెడ్డి, పరిమళ, కేవీ రమణాచారి, సునీత అందించారని ఈఓ తెలిపారు. కర్నూలులో హాస్య ‘బ్రహ్మ’ సందడి కర్నూలు కల్చరల్: ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం కర్నూలులో సందడి చేశారు. సోమవారం బిర్లా కాంపౌండ్‌లో ఓ టీస్టాల్‌ను రాజ్య సభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్‌తో కలిసి బ్రహ్మానందం ప్రారంభించారు. బ్రహ్మానందాన్ని చూడడానికి పెద్ద సంఖ్యలో అభిమానులు తరలి వచ్చారు. బ్రహ్మీ అభివాదం చేయడంతో అభిమానులు కేరింతలు కొట్టారు. కర్నూలు ప్రజలు మంచి వాళ్లని, మంచి సినిమాలను ఎప్పటికై నా ఆదరిస్తారని బ్రహ్మానందం అన్నారు. అనంతరం టీజీ వెంకటేష్ నివాసానికి వెళ్లారు. పేకాటరాయుళ్ల అరెస్టు కర్నూలు (టౌన్): మూడో పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలో పేకాట ఆడుతూ ఐదుగురు పట్టుబడ్డారు. స్థానిక శ్రీనగర్ కాలనీలో ఐదుగురు వ్యక్తులు పేకాట ఆడుతున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ ఇంటిపై దాడి చేశారు. రూ.1.30 లక్షల నగదు, పేక ముక్కలు, పేకాట ఆడుతున్న ఐదుగురిని అరెస్టు చేసినట్లు సోమవారం మూడో పట్టణ పోలీసులు తెలిపారు. -
చూసిన కనులదే భాగ్యం
ఆళ్లగడ్డ: లక్ష్మీనరసింహ నామస్మరణతో అహోబిలం మార్మోగింది. ప్రహ్లాదవరదుడు ఉభయ దేవేరులతో వేంచేసిన వనభోజన మహోత్సవం కనుల పండువగా సాగింది. వేలాదిగా తరలివచ్చిన భక్తులు ఈ వేడుకను తిలకించి పరవశించిపోయారు. కార్తీక మాసం మూడో సోమవారాన్ని పురస్కరించుకుని ప్రముఖ పుణ్యక్షేత్రం అహోబిలంలో లక్ష్మీనృసింహస్వామి వనభోజన కార్యక్రమం నిర్వహించారు. ఏటా కార్తీకమాసంలో స్వామి, అమ్మవార్లను వనభోజన కార్యక్రమానికి తీసుకెళ్లి ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా మూలమూర్తులు శ్రీ ప్రహ్లాదవరదస్వామి, అమృతవల్లీ అమ్మవార్లకు వేకువజామునే సుప్రభాతసేవతో మేలుకొలిపి దివ్యదర్శనం అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత ఉత్సవ మూర్తులైన స్వామి, అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి ఉత్సవ పల్లకీలో కొలువుంచి గ్రామ శివారులోని లక్ష్మీ వనంలోకి ఊరేగింపుగా తీసుకెళ్లారు. అక్కడ వేద పండితుల వేద మంత్రోచ్ఛారణల మధ్య నవకలశ స్థాపన, పంచామృతాభిషేకం, తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరిచిన మండపంలో ఉత్సవ మూర్తులను కొలువుంచాక భక్తులు వనభోజనం చేశారు. తర్వాత స్వామి, అమ్మవారిని ఊరేగింపుగా దేవాలయ ప్రాంగణంలోకి తీసుకొచ్చారు. రాత్రి విశేష పుష్కాలంకరణ గావించిన పూల పల్లకీలో ఉత్సవ మూర్తులను కొలువుంచి మాడ వీధుల్లో గ్రామోత్సవం నర్విహించారు. వైభవంగా లక్ష్మీనృసింహుల వనభోజన మహోత్సవం గోవింద నామస్మరణతో మార్మోగిన అహోబిల క్షేత్రం -
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
ఆళ్లగడ్డ : విద్యుదాఘాదంతో వ్యక్తి మృతి చెందిన ఘటన రూరల్ మండలం కోటకందుకూరు గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన ఓబయ్య (48) సోమవారం గొర్రెలకు గ్రాసం కోసం గ్రామ శివారులో ఉన్న పొలంలోకి వెళ్లాడు. అవిశ ఆకు కోసుకుంటుండగా ప్రమాద వశాత్తు చెట్టుకొమ్మ విద్యుత్ తీగకు తగలడంతో విద్యుత్ షాక్‌కు గురై అక్కడిక్కడే మృతి చెందాడు. అటువైపు వెళ్తున్న వారు చూసి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని రూరల్ ఎస్ఐ హరిప్రసాద్ తెలిపారు. -
తల్లిదండ్రులను పూజించాలి
● వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి పగిడ్యాల: తల్లిదండ్రులను ప్రతిఒక్కరూ పూజించాలని వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి అన్నారు. కార్తీక మాసం మూడో సోమవారాన్ని పురస్కరించుకుని స్థానిక ఉమామహేశ్వర ఆలయంలో ఏర్పాటు చేసిన కార్తీక వనభోజన ఆధ్యాత్మిక కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఉమామహేశ్వర స్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించుకున్నారు. అనంతరం భక్తులతో మాట్లాడారు. సంప్రదాయ సమాజం ఆవిష్కృతం కావాలంటే తల్లిదండ్రులు తమ పిల్లలకు నైతిక విలువలను బాల్యం నుంచే నేర్పించాలన్నారు. యుక్త వయస్సు రాగానే పెళ్లిళ్లు చేసుకున్నా మగ పిల్లలు వెంటనే భార్య మాట విని తల్లిదండ్రుల నుంచి విడిపోయి వేరే కాపురాలు సాగిస్తూ భయభక్తులు లేకుండా వారికి అన్నం పెట్టని పరిస్థితులను గమనిస్తున్నామని ఆయన ఆవేదన చెందారు. కుటుంబ వ్యవస్థ బలోపేతంగా ఉండాలంటే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో స్వామీజీలు చెప్పే బోధనలను గ్రహించి పాటించాలని కోరారు. కార్తీక మాసం శివునికి ఎంతో ఇష్టమైన మాసమని దీనిని పవిత్రంగా ఆచరించడం వల్ల పుణ్యప్రాప్తి లభిస్తుందన్నారు. రాధామనోహర్ దాస్ స్వామిజీ మాట్లాడుతూ ప్రపంచమంతా బాగుండాలని కోరుకునేది సనాతన ధర్మమన్నారు. హైందవ ధర్మాన్ని రక్షించి భావితరాలకు అందించాలని ఐకమత్యంతో హిందూత్వాన్ని కాపాడుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ భగవద్గీత శ్లోకాలను నేర్చుకోవాలన్నారు. కార్యక్రమంలో గీతా ఫౌండేషన్ చైర్మన్ యోగేష్ప్రభు, బీజేపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గీతామాధురి, బీజేపీ జిల్లా మోర్చా నాయకులు బీవీ సుబ్బారెడ్డి, జిల్లా నాయకులు చల్లా దామోధర్‌రెడ్డి, శిల్ప జ్యోతి తదితరులు పాల్గొన్నారు. కొత్త ఇసుక రీచ్‌లకు టెండర్లు కర్నూలు న్యూసిటీ: జిల్లాలో కొత్తగా ప్రారంభం కానున్న మూడు ఇసుక రీచ్‌లకు టెండర్లు పిలిచినట్లు గనులు, భూగర్భ ఖనిజాల శాఖ ఉప సంచాలకులు సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కౌతాళం మడలంలో గుడికంబాలి, నదిచాగి, మరళిలో కొత్తగా ఇసుక రీచ్‌లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. వాటిల్లో ఇసుక తవ్వకం, నిర్వహణ కోసం ఆసక్తి ఉన్న కాంట్రక్టర్ల నుంచి టెండర్ల దరఖాస్తులను ఆహ్వానించినట్లు తెలిపారు. ఈ నెల 19 నుంచి 27లోపు దరఖాస్తు చేసుకునేందుకు గడువు విధించినట్లు తెలిపారు. దరఖాస్తుతో పాటు రూ.10వేల రూపాయలు డీడీ చెల్లించాల్సి ఉంటుందన్నారు. టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు ఏడాది గడువుకు దరావత్తు కింద రూ.5 లక్షలు చెలించాల్సి ఉంటుందని తెలిపారు. మాట్లాడుతున్న కాటసాని రాంభూపాల్‌రెడ్డి -
మోసపోయాం.. న్యాయం చేయండి
● ఎస్పీకి పలువురు వినతులు కర్నూలు (టౌన్): ‘ ఆన్లైన్లో ట్రేడింగ్ చేసే అలవాటు ఉంది. అప్‌స్టాక్స్ ఏంజిల్–1 అనే ట్రేడింగ్ యాప్‌లో డబ్బు ఇన్వెస్ట్ చేసి విత్ డ్రా చేస్తున్నాను. సీఐఎన్వీ అనే ట్రేడింగ్ యాప్‌లో ఇన్వెస్ట్ చేయండి... అంటూ వాట్సాప్‌లో లింక్ వచ్చింది.. ఆ లింక్‌ను క్లిక్ చేశాను. నా బ్యాంక్ అకౌంట్ నుంచి రూ.4.80 లక్షలు ట్రేడింగ్‌లో ఇన్వెస్ట్ చేశా. అయితే డబ్బు విత్‌డ్రా చేస్తుంటే రావడం లేదు. డబ్బు రికవరీ చేయించండి’ అని కర్నూలు నగరంలోని సంతోష్ నగర్‌కు చెందిన చాంద్‌బాషా ఫిర్యాదు చేశారు. సోమవారం కొత్తపేటలోని జిల్లా పోలీస్ క్యాంప్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ బిందు మాధవ్ అధ్యక్షతన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు ఎస్పీని కలిసి వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి 90 ఫిర్యాదులు వచ్చాయన్నారు. వీటన్నింటిపై విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో లీగల్ అడ్వైజర్ మల్లికార్జునరావు, సీఐ శివశంకర్ పాల్గొన్నారు. ఫిర్యాదుల్లో కొన్ని.. ● తన పేరు మీద ఉన్న ఇల్లు, రెండున్నర ఎకరాల పొలం ఆక్రమించుకోవాలని మరుదులు శివప్ప, హనుమంతు, హింసిస్తున్నారని మద్దికెర మండలం యడవలికి చెందిన అల్లమ్మ ఫిర్యాదు చేశారు. ● కర్నూలు పాతబస్టాండ్‌లోని శ్రీలక్ష్మీ జ్యువెలర్స్‌కు చెందిన నాయుడు (షాప్ 30) బంగారం చేసి ఇస్తానని చెప్పి డబ్బు తీసుకుని పరారయ్యాడని కర్నూలు కృష్ణానగర్‌కు చెందిన వనజకుమారి ఫిర్యాదు చేశారు. ● ప్లాట్ ఇప్పిస్తామని చెప్పి కృష్ణ, జయరాం అనే వ్యక్తులు తన వద్ద డబ్బు తీసుకుని మోసం చేశారని కర్నూలు వెంకటరమణ కాలనీకి చెందిన నరసింహారెడ్డి ఫిర్యాదు చేశారు. ● తన ఎకరా పొలంలోకి అక్రమంగా వచ్చి జొన్న పంట విత్తనం నాటుకోవడమేగాకుండా కేశవులు అనే వ్యక్తి దౌర్జన్యం చేస్తున్నాడని హాలహర్వి మండలం హాలహర్వి గ్రామానికి చెందిన హనుమంతమ్మ ఫిర్యాదు చేశారు. -
మంత్రి గారూ... మీకు అర్థమవుతోందా!?
లోకాయుక్త, మానవహక్కుల కమిషన్ (హెచ్ఆర్సీ) కార్యాలయాలను కర్నూలు నుంచి అమరావతికి తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలో దీనికి సంబంధించి చట్టసవరణ చేస్తాం. ఆపై తరలింపు నోటిఫికేషన్ జారీ చేస్తాం. – ఈ నెల 13న హైకోర్టుకు స్పష్టం చేసిన రాష్ట్ర ప్రభుత్వం ‘లోకాయుక్త, మానవహక్కుల కమిషన్ కర్నూలులోనే ఉంటాయి. ఇప్పటికే నెలకొల్పిన సంస్థలు తరలించబోం. ఈ విషయంపై మంత్రి నారా లోకేశ్‌తో చర్చించాం. ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు. హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు కృషి చేస్తున్నాం’ – ఈ నెల 15న మంత్రి టీజీ భరత్ ప్రకటన పై రెండు ప్రకటనలు నిశితంగా పరిశీలిస్తే ‘న్యాయసంస్థల’ తరలింపుపై ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుందని తెలిసి కూడా పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ ప్రజలను మభ్యపెట్టేలా ప్రకటన చేశారు ఓవైపు లోకాయుక్త, హెచ్ఆర్సీని అమరావతికి తలించే నిర్ణయం తీసుకున్నామని ఏకంగా హైకోర్టుకు ప్రభుత్వం స్పష్టం చేసిన తర్వాత కూడా మంత్రి భరత్ ఇలాంటి ప్రకటన చేయడం హాస్యాస్పదం! పైగా గత ప్రభుత్వం కర్నూలులో హైకోర్టుతో పాటు జ్యుడీషియల్ సిటీ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటే, హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నామని అదేదో గొప్ప ఘనతలా మంత్రి చెప్పడం శోచనీయం. కళ్లేదుటే అన్యాయం జరుగుతున్నా ఎవరిలోనూ పోరాటం కనిపించడం లేదు. -
చౌడేశ్వరిదేవి హుండీ కానుకల లెక్కింపు
బనగానపల్లె రూరల్: నందవరం చౌడేశ్వరిదేవి ఆలయ హుండీల్లో భక్తులు వేసిన కానుకలను లెక్కించారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ కామేశ్వరమ్మ, పర్యవేక్షణాధికారి హరిచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఈ ఏడాది ఆగస్టు 7 నుంచి ఇప్పటి వరకు వేసిన కానుకలను లెక్కించారు. మొత్తం రూ.18,27,724 నగదు ఉందని, బంగారం, వెండి వస్తువులను ఇంకా లెక్కించాల్సి ఉందని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ తెలిపారు. కార్యక్రమంలో ఏపీజీబీ ఫీల్డ్ ఆఫీసర్ బాబు, ఆళ్లగడ్డ సేవ సమితి సంఘం సభ్యులు, ఆలయ సిబ్బంది ఉన్నారు. 875.20 అడుగులకు శ్రీశైల జలాశయ నీటిమట్టం శ్రీశైలంప్రాజెక్ట్: శ్రీశైల జలాశయ నీటిమట్టం శనివారం సాయంత్రం సమయానికి 875.20 అడుగులకు చేరుకుంది. నీటినిల్వ 164.7532 టీఎంసీలకు చేరుకున్నాయి. సుంకేసుల నుంచి 6,759 క్యూసెక్కుల నీరు జలాశయానికి వచ్చి చేరుతుంది. శుక్రవారం నుంచి శనివారం వరకు ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి శ్రీశైలానికి అతిస్వల్పంగా 584 క్యూసెక్కుల నీరు రాగా జలాశయం నుంచి దిగువ ప్రాంతాలకు 13,952 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఎడమగట్టు విద్యుత్ కేంద్రంలో 1.816 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు. హైడల్ ప్రాజెక్టును సందర్శించిన కలెక్టర్ పాణ్యం: మండల పరిధిలోని పిన్నాపురం గ్రామ సమీపంలో ఏర్పాటు చేస్తున్న హైడల్ విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టును నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనీయా శనివారం సందర్శించారు. ప్రాజెక్టు నిర్మాణం పనులు ఎంత మేర పూర్తి అయ్యాయి.. ఇంకా చేయాల్సిన పనులు ఏమున్నాయి అని అడిగి తెలుసుకున్నారు. అలాగే ప్రాజెక్టు కోసం సేకరించిన భూముల వివరాలు, రైతులకు చెల్లించిన పరిహారం తదితర వాటిపై ఆరా తీశారు. కార్యక్రమంలో తహసీల్దార్ నరేంద్రనాథ్‌రెడ్డి, శిశవశంకర్రెడ్డి, కంపెనీ అధికారులు నాయుడు పాల్గొన్నారు. 25న జెడ్పీ సర్వసభ్య సమావేశం కర్నూలు (అర్బన్): జిల్లాపరిషత్ సర్వసభ్య సమావేశాన్ని ఈనెల 25వ తేదీన నిర్వహిస్తున్నట్లు జెడ్పీ సీఈఓ జి.నాసరరెడ్డి శనివారం రాత్రి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో గ్రామీణ నీటి సరఫరా, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్, విద్యుత్, నీటిపారుదల శాఖలపై సమీక్ష నిర్వహించడం జరుగుతుందన్నారు. సమావేశానికి కర్నూలు, నంద్యాల జిల్లాలకు చెందిన ఇన్చార్జ్ మంత్రులు నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్, మంత్రులు టీజీ భరత్, బీసీ జనార్ధన్‌రెడ్డి, ఎన్ఎండీ ఫరూక్‌తో పాటు పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సమావేశానికి ఉమ్మడి జిల్లాకు చెందిన వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు హాజరుకావాలని సీఈఓ కోరారు. -
‘పది’లో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి
నందికొట్కూరు: ఈసారి ప్రభుత్వ పాఠశాలలు పదో తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని డీఈఓ జనార్దన్‌రెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని బాలికల జెడ్పీ హైస్కూల్, సంతపేట స్కూల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. నాడు–నేడు కింద చేపట్టిన ఉర్దూ పాఠశాల నిర్మాణాలను పరిశీలించి పనులు వేగవంతంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఎంఈఓ సుభాన్‌ను ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ప్రత్యేక తరగతులు తీసుకొని ప్రతి విద్యార్థి పాస్ అయ్యేలా చూడాలన్నారు. ఈ ఏడాది ఉత్తీర్ణత శాతం పెరగాలని, అందుకు అనుగుణంగా మండల విద్యాధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ప్రత్యేక ప్రణాళికలతో ముందుకెళ్లాలన్నారు. అనంతరం మండల విద్యాశాఖ కార్యాలయంలో అపార్ నమోదు ఎంత వరకు వచ్చిందని ఆరా తీశారు. బాలికల జెడ్పీ హైస్కూల్లో గుడ్డు మాయంపై విచారణ బాలికల జెడ్పీ హైస్కూల్లో మధ్యాహ్న భోజనంలో కోడి గుడ్డు ఇవ్వడం లేదని విద్యార్థి సంఘాలు చేపట్టిన ఆందోళనపై డీఈఓ స్పందించారు. ఎందుకు గుడ్డు ఇవ్వడం లేదని శనివారం హెచ్ఎం పార్వతిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చూడాలన్నారు. అనంతరం పదో తరగతి గదిలో విద్యార్థులతో డీఈఓ ముచ్చటించారు. ఇష్టంతో చదువుకుంటే మంచి మార్కులు వస్తాయని చెప్పారు. నందికొట్కూరులోని ప్రభుత్వ పాఠశాలల తనిఖీలో డీఈఓ -
నల్లమలకు సాంకేతిక రక్ష!
కెమెరాలతో సంరక్షణ మరింత సులభం పులుల సంరక్షణ పర్యవేక్షణకు ఇన్ఫ్రా రెడ్ కెమెరాలు ఎంతో ఉపయుక్తంగా ఉన్నాయి. ఇటీవల మరింత మెరుగైన కెమెరాలు అందుబాటులోకి వచ్చాయి. వీటి ధర కాస్త ఎక్కువే అయినా నల్లమలో ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నా. ఈ కెమెరాల ఏర్పాటు వల్ల పులుల సంరక్షణ మరింత సులభమవుతుంది. – సాయిబాబా, డీడీపీటీ,ఆత్మకూరు డివిజన్ ఆత్మకూరురూరల్: మన జాతీయ జంతువు పులి. ఆహారపు గొలుసులో అగ్రస్థానంలో ఉండే వీటిని సంరక్షించుకొని..భవిష్యత్తు తరాలకు చూపించాల్సిన అవసరం ఉంది. ఈ ఉద్దేశంతోనే నాగార్జునసాగర్ – శ్రీశైలం పెద్దపులుల అభయారణ్యం అధికారులు పులుల సంరక్షణకు పలు చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా ఎప్పటికప్పుడు పులుల జాడ, కదలికలను గుర్తించేందుకు ఆధునిక సాంకేతికతను వినియోగించుకుంటున్నారు. తాజాగా నల్లమలలోని ప్రతి కదలిక కళ్ల ముందు కనిపించేలా సౌరశక్తితో పనిచేసే అత్యాధునిక కెమెరాల ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్నారు. మూడోతరం కెమెరాలో అనేక ప్రత్యేకతలు నల్లమలలో విధులు నిర్వహించే అధికారులు మొదట్లో చేత్తో పట్టుకు తిరిగే కెమెరాలతో అడవి జంతువులను రహస్యంగా ఫొటోలు తీసేవారు. వీటిని మొదటి తరం కెమెరాలు అనేవారు. తర్వాత ఇన్ఫ్రా రెడ్ కెమెరాలు వచ్చాయి. వీటిని జంతు సంచారం ఉంటుందనుకునే ప్రదేశాల్లో రెండువైపులా చెట్లకు కట్టి ఉంచుతారు. ఆ కెమెరాల ముందు నడిచి వెళ్లే జీవి శరీర ఉష్ణోగ్రతకు కెమెరా నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాలు (ఇన్ఫ్రారెడ్)తాకిన వెంటనే ఆటోమెటిక్‌గా కెమెరా క్లిక్ అయి అందులో ఉన్న మెమోరీ కార్డులో ఆ చిత్రం నిక్షిప్తమవుతుంది. నిర్ణీత సమయాల్లో ఆ మెమోరీ కార్డు నుంచి సేకరించిన చిత్రాలను విశ్లేషించి రికార్డు చేయడం పులి సంరక్షణంలో ఒక పెను మార్పుకు దారి తీసింది. తాజాగా మనిషి వేలి ముద్రల లానే పులి చర్మంపై ఉండే చారలు వేటికవే ప్రత్యేకం కావడంతో పులి చారలను బట్టి పులుల సంఖ్యను నిర్ధారించే సాఫ్ట్వేర్ అభివృద్ధి చేశారు. ఇటీవల ఎన్ఎస్టీఆర్ ఆత్మకూరు డివిజన్ నాగలూటి రేంజర్ దొరస్వామి అత్యంత ఆధునికమైన సోలార్మినీ పాన్ – టిల్ట్ కెమెరాలను తన రేంజ్లో ప్రవేశ పెట్టారు. ఎంపీ 4 వీడియో, ఆడియో టు వే సైరన్ సిస్టం కలిగిన ఇవి రాత్రి పగలు తేడా 360 డిగ్రీల కోణంలో క్వాలిటీతో ఫొటోలను తీస్తాయి. తనముందు వెళుతున్నది మనిషి అయితే వెంటనే సంబంధిత అధికారికి అలర్ట్ మెసేజ్ పంపుతాయి. ఈ కెమెరాను పర్యవేక్షించే వారు ఉన్న చోటి నుంచి వెంటనే బెదిరింపు సైరన్‌ను వినింపించ వచ్చు. అంతేకాదు ఈ కెమెరాలు నిరంతరాయంగా తనముందు వెళ్లే ప్రతి జంతువు, మనిషి ఫొటోలు తీసి మనం అనుసంధాని ంచిన మెయిల్‌కు పంపుతాయి. ఇన్ని ప్రత్యేకతలు కలిగిన ఈ కెమెరాలను ఇటీవలే ప్రయోగాత్మకంగా నా లులూటి అటవీ రేంజ్ పరిధిలో నాలుగు, ఆత్మకూరు అటవీ రేంజ్ పరిధిలో రెండు ఏర్పాటు చేశారు. దశాబ్దంలో పులి సంతతిలో అద్భుత ప్రగతి 2014 నాటికి నల్లమలలో 35 పెద్దపులులు మాత్రమే ఉండేవి. ఇవి క్రమేపి పెరుగుతూ 2024 నాటికి 87 కావడం అన్నది పులుల సంరక్షణలో ఒక అద్భుతమని చెప్పవచ్చు. 87 పులులను కచ్చితంగా గుర్తించడంలో సాంకేతికత ఎంతో ఉపయోగ పడింది. 87 పెద్దపులులను వాటికుండే కోడ్‌తో సహా చిత్రాలను కూడా అటవీ అధికారులు సేకరించారు. అడవుల్లో మానవ సంచారాన్ని దాదాపు శూన్యం చేయడం ( చెంచులకు మినహాయింపు), అక్రమంగా చెట్ల నరికివేతను నిరోధించడం, పులి ఆహార జంతువుల నిష్పత్తి పడిపోకుండా చూడడం వంటి చర్యలు దశాబ్ద కాలంలో పులుల సంఖ్య పెరుగుదలకు కారణమయ్యాయి. నల్లమల వెయ్యి పులులకు ఆశ్రయం ఇవ్వగల అటవీ ప్రాంతమని, ఇది భవిష్యత్తులో సాకారమవుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పులుల సంరక్షణకు అత్యాధునిక కెమెరాలు ఎంపీ 4 వీడియో, ఆడియో టు వే సైరన్ సిస్టం అడవిలోని ప్రతి జీవి కదలికపై నిఘా ఇప్పటికే ప్రయోగాత్మకంగా నాగలూటి, ఆత్మకూరు అటవీరేంజ్‌లలో అమలు -
డీఎస్సీ ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోండి
నంద్యాల(అర్బన్): బీసీ స్టడీ సెంటర్లో నిర్వహిస్తున్న డీఎస్సీ ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా బీసీ సంక్షేమ అధికారి ముస్తాక్‌అహమ్మద్ అన్నారు. స్థానిక రామకృష్ణ విద్యాలయంలో శనివారం ఉచిత శిక్షణను ఆయన ప్రారంభించి మాట్లాడారు. అభ్యర్థులు ప్రణాళికతో చదువుకుని ఉపాధ్యాయ పోస్టులు సాధించాలన్నారు. కార్యక్రమంలో అధికారులు ఓబులేసు, గోవర్ధనయ్య, ప్రిన్సిపాల్ మునిశేఖర్, నాగేంద్ర, సంక్షేమ అధికారులు మునిరాజ్, సువర్ణ, ముంతాజ్భేగం, సురేష్, వేణుగోపాల్, వెంకటపతి, గంగాధర్‌గౌడ్, వెంకట్‌గౌడ్ పాల్గొన్నారు. దరఖాస్తు గడువు పొడిగింపు డీఎస్సీ –2024 ఉచిత శిక్షణ దరఖాస్తు గడువును ఈనెల 19 వరకు పొడిగించినట్లు నంద్యాల జిల్లా బీసీ సంక్షేమ అధికారి ముస్తాక్ అహమ్మద్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.లక్షలోపు ఉండాలని, టెట్‌లో అర్హత సాధించిన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు స్థానిక బీఎస్ఎన్ఎల్ క్వార్టర్స్‌లోని జిల్లా వెనుకబడిన తరగతులు, సాధికారత అధికారి కార్యాలయంలో లేదా సెల్: 9989003020, 8074461664 నంబర్‌కు సంప్రదించాలన్నారు. -
వినతుల పరిష్కారానికి కృషి చేస్తా
నంద్యాల(వ్యవసాయం): స్థానిక న్యాయవాదుల విన్నపాలను తనవంతుగా పరిష్కరించడానికి కృషి చేస్తానని జిల్లా జడ్జి కబర్ది అన్నారు. శనివారం ఆయన నంద్యాల కోర్టును ఆకస్మికంగా తనిఖీ చేశారు. కోర్టులో నూతనంగా ఏర్పాటు చేసిన లిఫ్ట్‌లను ప్రారంభించారు. అనంతరం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ కోర్టు రికార్డులను భద్ర పరిచేందుకు డిజిటలైజేషన్ చేస్తున్నామన్నారు. త్వరలో నంద్యాల కోర్టులో జిల్లా కోర్టు, ఫ్యామిలీ, ఎన్ఐ యాక్టు, ఎస్సీ, ఎస్టీ కోర్టులతో పాటు బ్యాంక్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. లోక్ అదాలత్‌లో కేసులు త్వరితగతిన పరిష్కారామయ్యేలా న్యాయవాదులు సహకరించాలన్నారు. కార్యక్రమంలో మూడో అదనపు జిల్లా జడ్జి వాసు, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి రాధారాణి, రెండో అదనపు జిల్లా సీనియర్ సివిల్ జడ్జి కిరణ్‌కుమార్, ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ ఏసురత్నం, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దుర్గాప్రసాద్, భూమా వెంకటరెడ్డి, శ్రీనివాసరెడ్డి, విజయశేఖర్‌రెడ్డి, శ్రీదేవి, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.