nmc
-
త్వరలో 612 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మెడికల్ అడ్మిషన్ల ప్రక్రియ మొదలైంది. వచ్చే నెల ఒకటో తేదీ నుంచే తరగతులు ప్రారంభం కానున్నాయి. అందులో భాగంగా ఈ ఏడాది నుంచి కొత్తగా 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అందుబాటులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) మార్గదర్శకాలకు అనుగుణంగా అధ్యాపకుల పోస్టులను భర్తీ చేసేందుకు వైద్య, ఆరోగ్యశాఖ ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే అన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 643 మంది అధ్యాపకులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియమించారు. ఇవిగాక మరో 612 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను రెగ్యులర్ పద్ధతిలో భర్తీ చేసేందుకు వైద్య, ఆరోగ్యశాఖ సన్నాహాలు మొదలుపెట్టింది. ఆ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశంతో త్వరలో ఆయా పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఈ మేరకు మెడికల్ అండ్ హెల్త్ సర్విసెస్ రిక్రూట్మెంట్ బోర్డుకు మంత్రి అనుమతి ఇచ్చారు. అవసరమైతే మరో విడతలోనూ అధ్యాపక పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. మరోవైపు ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేస్తామని వైద్య,ఆరోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి. 2 వారాల్లో 3,967 పోస్టులకు నోటిఫికేషన్లు కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటు, ఆస్పత్రుల ఆధునీకరణ తదితర కారణాలతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో భారీగా ఖాళీలు ఏర్పడ్డాయి. నర్సింగ్ ఆఫీసర్ నియామకాలకు సంబంధించిన ఫలితాలను విడుదల చేయించి, ఒకేసారి 6,956 మందిని భర్తీ చేశారు. 285 మంది ల్యాబ్ టెక్నీషియన్లు, 48 మంది ఫిజియోథెరపిస్టులు, 18 మంది డ్రగ్ ఇన్స్పెక్టర్లను నియమించారు. మొత్తంగా ఇప్పటివరకూ 7,308 పోస్టులు భర్తీ చేశారు. గత రెండు వారాల్లో 4 వేల పోస్టులకు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఈ నెల 11వ తేదీన 1,284 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు, ఈ నెల 17వ తేదీన మరో 2,050 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు, రెండ్రోజుల క్రితం 633 ఫార్మసిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు. వీటితోపాటు 1,666 మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ (ఫీమేల్), 156 ఆయుష్ మెడికల్ ఆఫీసర్, 435 సివిల్ సర్జన్, 24 ఫుడ్ ఇన్స్పెక్టర్, 435 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. మరోవైపు వైద్య విధాన పరిషత్ పరిధిలోని జిల్లా, ఏరియా ఆస్పత్రులు, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో సుమారు 1,600 స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం కోరుతూ వైద్య, ఆరోగ్యశాఖ ఫైల్ పంపింది. ఆర్థికశాఖ నుంచి గ్రీన్‌సిగ్నల్ రాగానే ఈ పోస్టులకు కూడా నోటిఫికేషన్లు ఇస్తా మని మంత్రి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. -
విద్యార్థులకు ఇంత ద్రోహమా?
సాక్షి, అమరావతి: వైద్య విద్య చదవాలని ఆశించే రాష్ట్రంలోని విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు, ఉచిత వైద్యం అందకుండా పేదవర్గాలకు ప్రస్తుత కూటమి ప్రభుత్వం చేస్తున్న ద్రోహం మరే రాష్ట్ర ప్రభుత్వమూ చేయదని ఏపీ మెడికోస్ పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు అన్నారు. రాష్ట్రంలో సామాన్యులకు వైద్య విద్య, ఉచిత వైద్యం అందకుండా చేయాలన్న లక్ష్యంతోనే సీఎం చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తోందని అభిప్రాయపడ్డారు. ప్రారంభానికి సిద్ధంగా ఉన్న 5 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలకు అనుమతులు తెచ్చుకోవాల్సింది పోయి, నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) పులివెందుల కళాశాలకు 50 సీట్లు ఇస్తామన్న సీట్లను కూడా వద్దని లేఖ రాయడమేంటని ప్రశ్నించారు. ఇలా ఏ ప్రభుత్వమైనా చేస్తుందా అని నిలదీశారు. పక్క రాష్ట్రం తెలంగాణలో నాలుగు కొత్త వైద్య కళాశాలలకు కేంద్రం అనుమతించి, సీట్లు కేటాయించగా, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏపీపై ఆధారపడిన పరిస్థితుల్లో సీఎం చంద్రబాబు కేంద్రంతో కొట్లాడి కొత్త కళాశాలలు, సీట్లు రాబట్టాల్సింది పోయి.. ఇలా చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరంలో ఐదు వైద్య కళాశాలలను ప్రారంభించలేకపోవడం వల్ల విద్యార్థులు 700 ఎంబీబీఎస్ సీట్లు కోల్పోయారని తెలిపారు. రాష్ట్రంలో వైద్య విద్య ఆశావహులకు తీరని అన్యాయం జరిగిందని డాక్టర్ వెంకటేశ్వర్లు ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటర్వ్యూలో వెల్లడించిన అభిప్రాయాలు ఆయన మాటల్లోనే.. చంద్రబాబు ప్రభుత్వం నమ్మక ద్రోహం గత ప్రభుత్వంలో కొత్త వైద్య కళాశాలల్లో సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని ప్రవేశపెట్టారు. రిజర్వేషన్ వర్గాల్లోని మెరిట్ విద్యార్థులపై ప్రభావం చూపుతున్న ఈ విధానాన్ని తమ ప్రభుత్వం ఏర్పాటైన వంద రోజుల్లో రద్దు చేస్తామని టీడీపీ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చి0ది. దీంతో వైద్య విద్య ఆశావహులు, మెడికోలు టీడీపీపై నమ్మకం పెట్టుకున్నారు. సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని రద్దు చేసి ఉంటే ఈ విద్యా సంవత్సరంలోనే 300 ఎంబీబీఎస్ సీట్లు కన్వినర్ కోటాలోకి కొత్తగా వచ్చేవి. అయితే సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని రద్దు చేయకుండా టీడీపీ నమ్మక ద్రోహం చేసింది. మరోవైపు ఐదు కొత్త వైద్య కళాశాలలు ప్రారంభిస్తే కన్వినర్ కోటాలో మరిన్ని సీట్లు వస్తాయని పేద, మధ్యతరగతి కుటుంబాలు ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి. అయితే, చంద్రబాబు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఆ కళాశాలలకు అనుమతులు రాబట్టకుండా తీరని నష్టం కలిగించింది. పులివెందుల కళాశాలకు 50 సీట్లు మంజూరు చేసినా, కళాశాల నిర్వహించలేమని ప్రభుత్వమే ఎన్ఎంసీకి లేఖ రాసి రద్దు చేయించింది. ఏ రాష్ట్ర ప్రభుత్వమూ ఇలా చేయదు. కేవలం ఏయూ రీజియన్‌లో పాడేరుకు 50 సీట్లు మాత్రమే వచ్చాయి. అందులో 22 సీట్లు మాత్రమే కన్వినర్ కోటాకు, 11 ఓపెన్ కాంపిటీషన్‌కు పోగా 11 సీట్లే రిజర్వేషన్ వర్గాలకు లభిస్తున్నాయి. ఎస్వీ రీజియన్‌లో ఒక్క సీటు కూడా పెరగలేదు. పులివెందులకు 50 సీట్లు తిరస్కరించకపోయి ఉంటే కన్వినర్ కోటాలో రిజర్వేషన్ వర్గాలకు 11, ఓపెన్ కాంపిటీషన్లో 11 సీట్లు అయినా దక్కేవి. వాస్తవానికి కొత్త కళాశాలలు ప్రారంభమై సీట్లు పెరుగుతాయని చాలా మంది మెరిట్ విద్యార్థులు యాజమాన్య కోటా ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోలేదు. ఇప్పుడేమో కటాఫ్‌లు అమాంతంగా పెరుగుతున్నాయి. దీంతో వారంతా తీవ్ర ఆందోళనలో ఉన్నారు. అలాంటి విద్యార్థులకు అన్యాయం జరుగకుండా కనీసం యాజమాన్య కోటాలో దరఖాస్తుకు మరోసారి అవకాశం కల్పించాలి. ఇలాగైతే సామాన్యులకు వైద్య విద్య దూరమవుతుంది కొత్త వైద్య కళాశాలలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తామని చెబుతున్నారు. ఇదే జరిగితే సామాన్య, మధ్య తరగతి కుటుంబాల పిల్లలు వైద్య విద్యను అభ్యసించలేని పరిస్థితి వస్తుంది. పేదలు సైతం బోధనాస్పత్రుల్లో వైద్యం చేయించుకోవాలంటే డబ్బు చెల్లించాల్సి వస్తుంది. ప్రైవేటు వైద్య కళాశాలలకు అనుబంధంగా ఉండే బోధనాస్పత్రుల్లో రోగులకంటే వైద్య విద్యార్థులే ఎక్కువగా ఉంటారు. సరిపడా ఫ్యాకల్టీ, రోగులు ఉండరు. ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెబితే వాటిలోనూ ఇవే పరిస్థితులు ఉంటాయి. ఈరోజు మచిలీపట్నం, ఏలూరు, రాజమండ్రి వంటి ప్రాంతాల్లో కొత్త వైద్య కళాశాలలు, బోధనాస్పత్రులు అందుబాటులోకి వచ్చాయి. దీంతో అక్కడ రోగులు కిటకిటలాడుతున్నారు. ఎందుకంటే వాటిలో ఉచితంగా వైద్య సేవలు అందుతున్నాయి కాబట్టే. అదే ప్రైవేట్‌కు కట్టబెడితే డబ్బు పెట్టి పేదలు వైద్యం పొందే అవకాశం ఉంటుందా? ప్రైవేట్ వైద్య విద్యకు పట్టం రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ప్రైవేట్ వైద్య విద్యకు పట్టం కడుతోంది. ఇంత దారుణం మరే రాష్ట్రంలోనూ ఉండదు. సీఎం చంద్రబాబు గత చరిత్రను పరిశీలిస్తే ప్రైవేట్ వైద్య విద్యకు పట్టం కట్టి, పేద, మధ్య తరగతి వర్గాలకు వైద్య విద్యను దూరం చేయాలన్నదే ఆయన లక్ష్యమని స్పష్టమవుతుంది. గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా ప్రైవేట్ కళాశాలల్లో ఎంబీబీఎస్, పీజీ వైద్య విద్య కోర్సుల్లో ఫీజులను విచ్చలవిడిగా పెంచారు. డబ్బున్న వారికే వైద్య పట్టా అన్నట్టుగా తయారు చేశారు. 2014–19 మధ్య ప్రైవేట్‌లో యాజమాన్య కోటాలో మెడికల్ పీజీ ఫీజును రూ.5.25 లక్షల నుంచి ఏకంగా రూ.24.20 లక్షలకు పెంచారు. రూ.5.25 లక్షల ఫీజు అంటే బ్యాంక్ లోన్ తీసుకొనో, బయట అప్పులు చేసో పేద, మధ్య తరగతి వైద్యులు పీజీ చేయడానికి సాహసిస్తారు. పీజీలో చేరాక వారికి వచ్చే స్టైఫండ్‌తో అప్పు తీర్చుకోవచ్చనే నమ్మకం ఉంటుంది. ఐదింతలు పెంచే సరికి ఆ అవకాశం కూడా లేక, అంత ఫీజు కట్టలేక చాలా మంది పీజీ చదవలేకపోయారు. అంతే కాదు టీడీపీ అధికారంలో ఉండగా రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలలు ఏర్పాటు చేసి, మెడిసిన్ సీట్లు తెచ్చిన దాఖలాలూ లేవు.ఈడబ్ల్యూఎస్ కోటాపైనా ఇదే తీరు ఈడబ్ల్యూఎస్ కోటా పైనా చంద్రబాబు ప్రభుత్వం తీరు ఇలానే ఉంది. ఎంబీబీఎస్ సీట్లను పెంచి ఈడబ్ల్యూఎస్ కోటా అమలు చేయాలని నిబంధనలు చెబుతున్నాయి. కానీ సీట్లు పెంచకుండా కోటా అమలుకు జీవో ఇచ్చి ప్రభుత్వం చేతులు దులిపేసుకుంది. కోర్టులో కేసులు వేస్తే జీవో రద్దు చేస్తామని ప్రభుత్వం వెల్లడించిందే గానీ సీట్లు పెంచడానికి కృషి చేస్తామని మాత్రం చెప్పలేదు. అంటే రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్ల కొరత సృష్టించి, ప్రైవేట్ వైద్య కళాశాలలకు డిమాండ్ పెరిగేలా చేస్తున్నారు. -
నాలుగు మెడికల్ కాలేజీలకే ఎన్ఎంసీ అనుమతి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా నాలుగు ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు జాతీయ వైద్యమండలి (ఎన్ఎంసీ) అనుమతి ఇచ్చింది. ఈ మేరకు లెటర్ ఆఫ్ పర్మిషన్ (ఎల్ఓపీ) జారీ చేసింది. ప్రభుత్వం ఈ ఏడాదికి 8 కాలేజీల కోసం దరఖాస్తు చేసిన సంగతి తెలిసిందే. వాటిలో నాలుగింటికే అనుమతులొచ్చాయి. ములుగు, నర్సంపేట, గద్వాల, నారాయణపేట మెడికల్ కాలేజీల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి వైద్యవిద్య ప్రవేశాలకు ఎన్ఎంసీ పచ్చజెండా ఊపింది. యాదాద్రి భువనగిరి, మహేశ్వరం, కుత్బుల్లాపూర్, మెదక్ కాలేజీలకు ఎన్ఎంసీ అనుమతులు ఇవ్వలేదు. వీటి ఎల్ఓపీ కోసం రాష్ట్ర ప్రభుత్వం మరోమారు అప్పీల్‌కు వెళ్లనుంది. కాగా, గత నెల ఈ కాలేజీలన్నింటికీ అనుమతులు ఇవ్వలేమని ఎన్ఎంసీ తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే. దీంతో తమకు మరో అవకాశం ఇవ్వాలని, లోపాలను సరిచేసుకుంటామని ప్రభుత్వం అప్పీల్‌కు వెళ్లింది. ఆ తర్వాత అధ్యాపకులను నియమించింది. 245 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లకు అసోసియేట్ ప్రొఫెసర్లుగా పదోన్నతులు కల్పించింది. కొత్త కాలేజీలకు పోస్టు చేసింది.ఇటీవల సాధారణ బదిలీల్లో భాగంగా ఆ కాలేజీలకు రెగ్యులర్ ప్రిన్సిపాల్స్, ఆస్పత్రుల సూపరింటెండెంట్లను పంపింది. ప్రస్తుతం తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేట్‌లో కలిపి 56 మెడికల్ కాలేజీలున్నాయి. వాటిల్లో మొత్తం కలిపి 8,515 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు 28 ఉండగా..వాటిలో 3,915 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. వీటికి అదనంగా మరో 200 సీట్లు కలవనున్నాయి. ఒక్కో కొత్త కాలేజీల్లో 50 సీట్ల కోసం అనుమతులు కోరుతూ దరఖాస్తు చేశారు. వాటిలో నాలుగింటికి అనుమతులొచ్చాయి. దీంతో సర్కారీ కాలేజీల్లో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 4,115కు చేరనుంది. రాష్ట్రానికి చేరుకున్న నీట్ ర్యాంకులు కాగా నీట్ రాష్ట్రస్థాయి ర్యాంకులు తెలంగాణకు చేరుకున్నాయి. ఈ మేరకు కాళోజీ విశ్వవిద్యాలయవర్గాలు ఢిల్లీకి వెళ్లి ఆ డేటాను తీసుకొచ్చాయి. ఆ డేటాను విశ్లేషించి రాష్ట్రస్థాయి ర్యాంకులు తయారు చేసి శనివారం విడుదల చేసే అవకాశముంది. -
విద్యార్థుల ఆశలపై నీళ్లు
సాక్షి, అమరావతి: అనుకున్నంతా అయింది.. రాష్ట్రంలో ఈ ఏడాది ప్రారంభించాల్సి ఉన్న ఐదు కొత్త ప్రభుత్వ కళాశాలల ప్రారంభంపై నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్ఎంసీ) నీళ్లుజల్లింది. ఈ ఏడు తరగతులు ప్రారంభించుకునేందుకు అనుమతివ్వలేదు. దీంతో వీటిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. వీటికి అనుమతులు సాధించడంలో టీడీపీ–జనసేన–బీజేపీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపెట్టకపోవడమే కారణమని వైద్యశాఖ వర్గాల్లో పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది.ఉద్దేశపూర్వకంగానే ఈ కొత్త కళాశాలల ప్రారంభానికి చంద్రబాబు మోకాలడ్డారన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. నిజానికి.. 2024–25 విద్యా సంవత్సరం నుంచి పులివెందుల, ఆదోని, మార్కాపురం, మదనపల్లె, పాడేరులలో ఈ కళాశాలలు ప్రారంభించడానికి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం బాటలు వేసింది. ఇందులో భాగంగా.. ఈ ఐదుచోట్ల ఏపీ వైద్య విధాన పరిషత్ (ఏపీవీవీపీ) ఆస్పత్రులను బోధనాస్పత్రులుగా అభివృద్ధి చేయడంతో పాటు, వైద్య కళాశాలలు ప్రారంభించడానికి వీలుగా పోస్టులను మంజూరుచేసి భర్తీ ప్రక్రియ చేపట్టింది. కానీ, ఎన్నికల అనంతరం ఏర్పడ్డ కూటమి ప్రభుత్వం ఇందుకు అనుగుణంగా చర్యలు తీసుకోలేదు. కనీసం చర్చించని బాబు సర్కారు.. గత నెల 4వ తేదీన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. 12న సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేశారు. జూన్ 25న వైద్య కళాశాలల్లో ఎన్ఎంసీ బృందాలు తనిఖీలు నిర్వహించాయి. సీఎంగా బాధ్యతలు స్వీకరించి ప్రభుత్వం ఏర్పాటుచేయడానికంటే ముందే సీఎస్ నియామకం, ఇతర అధికారుల మార్పు చేపట్టారు. ఈ అంశాలపై ఫోకస్ పెట్టిన బాబు అండ్ కో ప్రజల భవిష్యత్తు వైద్య అవసరాలు, విద్యార్థుల ఆకాంక్షలతో ముడిపడి ఉన్న వైద్య కళాశాలల ప్రారంభంపై మాత్రం దృష్టిపెట్టలేదు. పైగా.. సీఎం హోదాలో ఈనెల 3న వైద్యశాఖపై బాబు తొలి సమీక్ష నిర్వహించారు.ఇందులో కూడా వైద్య కళాశాలల అంశాన్ని చర్చించలేదు. మరోవైపు.. తనిఖీల అనంతరం కళాశాలలతో వర్చువల్‌గా సమావేశం నిర్వహించిన ఎన్ఎంసీ పలు లోపాలపై రాష్ట్ర అధికారుల నుంచి వివరణ కోరింది. అడ్మిషన్లు ప్రారంభించే నాటికి తొలి ఏడాది విద్యార్థులకు తరగతులు నిర్వహించడానికి వీలుగా కళాశాలల్లో ల్యాబ్, లెక్చర్ హాల్, హాస్టళ్లు అందుబాటులో ఉంటే సరిపోతుంది. ఐదుచోట్ల 80 శాతం మేర ఈ సదుపాయాలున్నాయి. ఇంటీరియర్ పనులు, పలు పరికరాలను సమకూరిస్తే సరిపోతుంది. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో తరగతులు ప్రారంభమయ్యే అవకాశమున్నందున ఈలోపు వసతులను కలి్పంచడానికి వీలుంటుంది.కానీ, ఈ అంశాలను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో చర్చించి ఒప్పించే ప్రయత్నం చేయలేదు. పైగా.. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి అయ్యుండి చంద్రబాబు ఈ విషయాన్ని పట్టించుకోలేదు. మరోవైపు.. ఈ కళాశాలల్లో పూర్తిస్థాయిలో ఫ్యాకల్టీని నియమించడానికి సీఎం జగన్ ప్రభుత్వం పలు దఫాలుగా నోటిఫికేషన్లు ఇచి్చంది. నగరాలకు దూరంగా ఉన్న క్రమంలో పలు స్పెషాలిటీల్లో వైద్యులు ముందుకు రానందున ప్రత్యేక ప్రోత్సాహకాలిస్తామని కూడా ప్రకటించింది.ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక మూడు వారాలు.. సీఎం ప్రమాణ స్వీకారం అయ్యాక రెండు వారాల పాటు సమయం ఉన్నప్పటికీ ఈ కొత్త వైద్య కళాశాలల ప్రారంభం గురించి పైస్థాయిలో ఏమాత్రం చర్చించలేదు. అలా చర్చించి అనుమతులు రాబట్టడానికి ఫ్యాకల్టీ కొరతను అధిగమించేలా చర్యలు తీసుకుని ఉంటే బాగుండేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సూపర్ స్పెషాలిటీ వైద్యం చేరువే లక్ష్యంగా.. రాష్ట్ర ప్రజలందరికీ సూపర్ స్పెషాలిటీ వైద్యం చేరువ చేయడంతో పాటు, విద్యార్థులకు వైద్య విద్యావకాశాలను పెంచడమే లక్ష్యంగా రూ.8 వేల కోట్లకు పైగా నిధులతో 17 కొత్త వైద్య కళాశాలల నిర్మాణానికి గత సీఎం జగన్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఓ వైపు కళాశాలల నిర్మాణం చేపడుతూనే విజయనగరం, ఏలూరు, రాజమండ్రి, మచిలీపట్నం, నంద్యాల కళాశాలలను గత విద్యా సంవత్సరంలో ప్రారంభించింది. వందేళ్ల చరిత్రలో తొలిసారిగా ఒకే ఏడాది 750 ఎంబీబీఎస్ సీట్లను సమకూర్చింది. ఈ ఏడాది ఐదు కళాశాలలను, మిగిలిన ఏడు కళాశాలలను 2025–26లో ప్రారంభించేలా ప్రణాళిక రచించింది. అనుమతులు వస్తే 500 సీట్లు..ఇదిలా ఉంటే.. ఐదు కళాశాలలకు అనుమతులు లభిస్తే ఒక్కోచోట 100 చొప్పున 500 ఎంబీబీఎస్ సీట్లు కొత్తగా సమకూరేవి. 10 లక్షల జనాభాకు వంద సీట్లు అనే నిబంధనను గత ఏడాది ఎన్ఎంసీ ప్రవేశపెట్టింది. అలాగే, కళాశాలలకు అనుమతులు మంజూరు కోసం కొత్త నిబంధనలను తీసుకొచి్చంది. దీంతో రాష్ట్రం నుంచి ఐదు వైద్య కళాశాలలకు దరఖాస్తు చేయడానికి కూడా వీల్లేని పరిస్థితి నెలకొనడంతో అప్పట్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం కేంద్రంతో చర్చలు జరిపి, నిబంధనల నుంచి మినహాయింపు తెచ్చుకుని దరఖాస్తు చేసింది.అదే విధంగా.. 2023–24లో విజయనగరం, ఏలూరు, రాజమండ్రి, మచిలీపట్నం, నంద్యాల వైద్య కళాశాలల ప్రారంభ సమయంలో కేంద్రంతో సంప్రదింపులు జరిపి, వంద శాతం 750కు గాను 750 ఎంబీబీఎస్ సీట్లను రాబట్టింది. తొలివిడత తనిఖీల్లో విజయనగరం మినహా, మిగిలిన నాలుగు కళాశాలలకు అప్పట్లో అనుమతులు రాలేదు. భవనాలు, హాస్టళ్లు సిద్ధంగా లేకపోవడంతో పాటు, పలు అంశాల్లో కొరత ఉందని నిరాకరించారు. కానీ, అడ్మిషన్లు ప్రారంభమయ్యే నాటికి అన్ని వసతులు కలి్పస్తామని ఎన్ఎంసీకి హామీ ఇవ్వడం ద్వారా రెండో విడత తనిఖీల్లో అనుమతులను రాబట్టారు. ప్రస్తుతం కూడా అనుమతుల నిరాకరణపై అప్పీల్‌కు అవకాశం ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపకపోతే విద్యార్థులకు తీవ్రనష్టం జరిగే అవకాశముంది. -
10 లక్షల జనాభాకు 100 ఎంబీబీఎస్ సీట్లు.. 2025–26 నుంచి
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా 10 లక్షల జనాభాకు 100 ఎంబీబీఎస్ సీట్ల ప్రాతిపదికన కొత్త వైద్యకళాశాలల ఏర్పాటుకు అనుమతులు ఇచ్చే నిబంధనను 2025–26 విద్యాసంవత్సరం నుంచి అమలుచేస్తామని నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) వెల్లడించింది. ఈ మేరకు ఎన్ఎంసీ అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డ్ ప్రెసిడెంట్ డాక్టర్ అరుణ్ వి.వానికర్ బుధవారం ప్రకటించారు. దీంతో వచ్చే ఏడాది మన రాష్ట్రానికి రావాల్సిన ఐదు వైద్యకళాశాలలకు అనుమతికి మార్గం సుగమమైంది. 10 లక్షల జనాభాకు 100 ఎంబీబీఎస్ సీట్ల ప్రాతిపదికన కొత్త వైద్యకళాశాలల ఏర్పాటుకు అనుమతులు ఇచ్చే నిబంధనను 2024–25 విద్యాసంవత్సరం నుంచే అమల్లోకి తెస్తున్నట్టు ఈ ఏడాది ఆగస్ట్‌లో ఎన్ఎంసీ ప్రకటించింది. ఈ నిబంధనతో ఏపీతోపాటు దక్షిణాది రాష్ట్రాల్లో కొత్త వైద్యకళాశాలల ఏర్పాటుకు అవకాశంలేని పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉండగా రాష్ట్రంలో ప్రభుత్వ వైద్యరంగాన్ని బలోపేతం చేయడంతోపాటు అన్ని ప్రాంతాలకు సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు చేరువ చేయడం, మన విద్యార్థులకు వైద్యవిద్య అవకాశాలు పెంచడం కోసం సీఎం జగన్ ప్రభుత్వం 17 కొత్త వైద్యకళాశాలలు ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 2023–24 విద్యాసంవత్సరంలో ఐదు కళాశాలలు అందుబాటులోకి వచ్చాయి. 2024–25లో మరో ఐదు వైద్యకళాశాలల కోసం ఎన్ఎంసీకి దరఖాస్తు చేశారు. తాజా నిబంధనలు అమలు చేస్తామన్న నేపథ్యంలో వీటిపై ఎన్ఎంసీ పునఃసమీక్షించాలని కోరుతూ సీఎం వైఎస్ జగన్‌తోపాటు పలు రాష్ట్రాల సీఎంలు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఇటీవల ఢిల్లీలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయను కలిసిన ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని ఈ నిబంధనలను పునఃపరిశీలించాలని కోరారు. ఈ వినతికి ఆయన సానుకూలంగా స్పందించారు. ఈ నేపథ్యంలో తాజా నిబంధనలను 2025–26 నుంచి అమలు చేస్తామని ఎన్ఎంసీ ప్రకటించడం గమనార్హం. -
వైద్యులకు స్టైపెండ్ అందడం లేదు!
సాక్షి, హైదరాబాద్: ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఎంబీబీఎస్ ఇంటర్న్‌లకు, పీజీ వైద్య విద్యార్థులకు స్టైపెండ్ ఇవ్వడం లేదని తేలింది. ఈ సమస్యపై జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) ఆధ్వర్యంలో గూగుల్ ఫాం ద్వారా ఆన్లైన్ సర్వే నిర్వహించింది. మరోవైపు దేశవ్యాప్తంగా వైద్య విద్యార్థులు ఎన్ఎంసీకి ఫిర్యాదులు చేస్తున్నారు. మొత్తంగా 70 శాతం మంది యూజీ ఇంటర్న్‌లకు, పీజీ విద్యార్థులకు స్టైపెండ్ అందడం లేదని తేలింది. దీంతో ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లోని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా అధికారులు జోక్యం చేసుకొని స్టైఫండ్ ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 10,178 మందితో ఆన్లైన్ సర్వే... ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ ఇంటర్న్లు, పీజీ వైద్య విద్యార్థులకు స్టైపెండ్ చెల్లించే సమస్యపై గూగుల్ ఫాం ద్వారా ఆన్లైన్ సర్వే జరిగింది. పీజీ విద్యార్థుల నుంచి మొత్తం 10,178 మంది నుంచి ఫీడ్ బ్యాక్ వచ్చింది. అందులో 7,901 మంది వివరాలను విశ్లేషించారు. దేశవ్యాప్తంగా 19 రాష్ట్రాలలోని 213 ప్రైవేట్ మెడికల్ కాలేజీల నుంచి ఫీడ్‌బ్యాక్ స్వీకరించారు. అందులో 2,110 మంది పీజీ విద్యార్థులు తమకు స్టైపెండ్ అందడం లేదని స్పష్టం చేశారు. 4,288 మంది విద్యార్థులు తమకు చెల్లించే స్టైపెండ్ ఆయా రాష్ట్రాల్లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలు చెల్లిస్తున్న స్టైపెండ్‌తో సమానంగా ఉండటం లేదని వెల్లడించారు. తమకు వచ్చే స్టైపెండ్‌ను ఆయా ప్రైవేట్ మెడికల్ కాలేజీల యాజమాన్యాలే వెనక్కు తీసుకుంటున్నాయని పేర్కొన్నారు. అనేక కాలేజీలు కాగితాలపై మాత్రం విద్యార్థులకు స్టైపెండ్ ఇస్తున్నట్లు రాసుకుంటున్నాయి. కానీ వాస్తవంగా వారికి ఒక్క పైసా ఇవ్వడంలేదు. ఆందోళనలకు సిద్ధమవుతున్న జూ.డాక్టర్లు... తెలంగాణలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని జూనియర్ డాక్టర్లు స్టైపెండ్ చెల్లింపులో జాప్యంపై సమ్మెకు సిద్ధమవుతున్నారు. మెజారిటీ ప్రైవేట్ కాలేజీలు స్టైపెండ్లు చెల్లించడం లేదని, ఈ సమస్యపై ఎన్ఎంసీని ఆశ్రయించినట్లు విద్యార్థులు చెబుతున్నారు. అయితే ప్రైవేట్ కాలేజీల విద్యా ర్థులు సమ్మెకు వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి. వారు యూనియన్లు ఏర్పాటు చేసుకుంటే యాజమాన్యాలు సహించడంలేదు. గత్యంతరం లేక అప్పులు చేయాల్సి వస్తుందని హైదరా బాద్‌లోని ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీకి చెందిన ఒక జూనియర్ డాక్టర్ అభిప్రాయపడ్డారు. ఏదేమైనా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి స్టైపెండ్ వచ్చేలా ఆందోళనలు చేస్తామని కొందరు విద్యార్థులు అంటున్నారు. కాగా, వైద్య విద్యార్థులకు స్టైపెండ్‌చెల్లించక పోవడంపై వైద్యవిద్య అధికారులను ‘సాక్షి’ వివరణ కోరేందుకు ప్రయత్నించగా అధికా రులు అందుబాటులోకి రాకపోవడం గమనార్హం. -
మేం చెప్పే వరకూ ఆగండి
సాక్షి, అమరావతి: ఈ ఏడాది పీజీ మెడికల్ కోర్సుల్లో ప్రైవేటు వైద్య కళాశాలల్లో యాజమాన్య కోటా రివైజ్డ్ ఫేజ్ –1 కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన అభ్యర్థులు సంబంధిత కాలేజీల్లో రిపోర్ట్ చేయవద్దని డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం బుధవారం ప్రకటించింది. రాజమండ్రిలోని జీఎస్ఎల్ కళాశాలలో ఎండీ– రేడియో డయగ్నోసిస్ కోర్సులో 14 సీట్లకు నకిలీ అనుమతులు జారీ అయినట్లు నేసనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) మంగళవారం తెలిపింది. దీంతో యాజమాన్య కోటా విద్యార్థుల ప్రవేశాల ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేశారు. విశ్వవిద్యాలయం మళ్లీ తెలిపే వరకూ విద్యార్థులు కళాశాలల్లో రిపోర్ట్ చేయద్దని రిజిస్ట్రార్ డాక్టర్ రాధికారెడ్డి కోరారు. ఇప్పటికే కళాశాలల్లో రిపోర్ట్ చేసిన, చేయని విద్యార్థులు విశ్వవిద్యాలయం నుంచి జారీ చేసే తదుపరి నిర్ణయం కోసం వెబ్‌సైట్‌ను చూస్తుండాలని సూచించారు. ఎన్ఎంసీకి వైద్య, ఆరోగ్య శాఖ లేఖ నంద్యాల జిల్లా శాంతీరామ్, విజయనగరం జిల్లా మహారాజా, తూర్పుగోదావరి జిల్లా జీఎస్ఎల్ వైద్య కళాశాలల్లో నకిలీ అనుమతులతో పీజీ సీట్లు పెంచినట్లు వెల్లడవడంతో గత నెలలో నిర్వహించిన తొలి దశ కౌన్సెలింగ్‌ను విశ్వవిద్యాలయం రద్దు చేసింది. ఎన్ఎంసీ నుంచి స్పష్టత తీసుకుని తిరిగి మొదటి నుంచి కౌన్సెలింగ్ నిర్వహించి సోమవారం సీట్లు కేటాయించింది. అయితే అనూహ్యంగా మంగళవారం మరో 14 సీట్లకు జీఎస్ఎల్ నకిలీ అనుమతులు ఉన్నాయంటూ ఎన్ఎంసీ పేర్కొంది. దీంతో ఈ అంశంపై స్పష్టత కోసం వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు ఎన్ఎంసీకి లేఖ రాశారు. ఎన్ఎంసీ నుంచి వివరణ వచ్చాక తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. నకిలీ అనుమతులపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు ఎన్ఎంసీ సమాచారమిచ్చిందని తెలిపారు. ఫిర్యాదు వివరాలను కోరామని చెప్పారు. విచారణకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని తెలియజేశామన్నారు. మరో వైపు నకిలీ అనుమతుల అంశంపై మూడు కళాశాలలకు విశ్వవిద్యాలయం వీసీ నోటీసులు జారీ చేసినట్టు తెలిపారు. -
వైఎస్సార్ హెల్త్ యూనివర్శిటీ పీజీ మెడికల్ సీట్ల కౌన్సెలింగ్ రద్దు
విజయవాడ: వైఎస్సార్ హెల్త్ యూనివర్శిటీ పీజీ మెడికల్ సీట్ల కౌన్సిలింగ్ రద్దయ్యింది. మెడికల్ కళాశాలల సీట్ల భర్తీలో ప్రైవేట్ మెడికల్ కాలేజీలు అవతవకలు పాల్పడ్డాయి. ఈ విషయాన్ని గుర్తించిన (నేషనల్ మెడికల్ కమిషన్) ఎన్ఎంసీ.. కౌన్సిలింగ్ ప్రక్రియను నిలిపివేసింది. ఎన్ఎంసీ నుంచి సీట్ల పెంపుదలపై ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు నకిలీ ఆదేశాలు వచ్చాయి. ఈ అవతవకల విషయం వెలుగులోకి రావడంతో తిరిగి కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభించాలని వైఎస్సార్ హెల్త్ యూనివర్శిటీకి ఆదేశాలు జారీ చేసింది ఎన్ఎంసీ. నంద్యాల శాంతి రామ్ మెడికల్ కాలేజీలో 7 ఎండి జనరల్ మెడిసిన్ సీట్లకు బదులుగా, 24 సీట్లను భర్తీ చేశారని గుర్తించిన ఎన్ఎంసీ.. రాజమహేంద్రవరం జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ లో 24 సీట్లుండగా 40 జనరల్ మెడిసిన్ సీట్లను భర్తి చేసినట్లు పసిగట్టింది. విజయనగరం మహారాజా ఇన్సిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో ఎక్కువ సీట్లు భర్తీ చేసినట్లు గుర్తించారు. ప్రైవేట్ మెడికల్ కళాశాలలకి ఎన్ఎంసీ పేరుతో ఫేక్ ఆర్డర్స్ వచ్చినట్లు గుర్తించారు. ఈ వ్యవహారంలో కొందరి ఉద్యోగుల పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంటి దొంగలను గుర్తించే పనిలో నిమగ్నమైంది ఎన్ఎంసీ. మూడు మెడికల్ కళాశాలలపై చర్యలు తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. కౌన్సిలింగ్ ప్రక్రియ రద్దు కావడంతో విద్యార్ధులు ఇబ్బంధి పడకుండా యూనివర్సిటీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. -
పల్మనరీ మెడిసిన్ ఔట్
సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్ సీట్లతో మెడికల్ కాలేజీ పెట్టడానికి సంబంధించిన తాజా మార్గదర్శకాలను జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) విడుదల చేసింది. మూడేళ్ల తర్వాత ప్రస్తుత పరిస్థితులను ఆధారం చేసుకొని గత మార్గదర్శకాల్లో పలు మార్పులు చేర్పులు చేసింది. గతంలో మెడికల్ కాలేజీకి అనుమతి రావాలంటే 24 డిపార్ట్మెంట్లు తప్పనిసరిగా ఉండాలి. ప్రస్తుతం వాటిల్లో నాలుగింటిని తొలగించి, ఒక దాన్ని చేర్చారు. అంటే 21 విభాగాలు ఉంటే సరిపోతుంది. అయితే ఎంబీబీఎస్ విద్యార్థులకు కీలకమైన పల్మనరీ మెడిసిన్ విభాగం తొలగించడంపై విమర్శలు వస్తున్నాయి. దీనితో పాటు ప్రాధాన్యత కలిగిన ఎమర్జెన్సీ మెడిసిన్, ఫిజికల్ మెడిసిన్ అండ్ రిహాబిలిటేషన్, రేడియేషన్ అంకాలజీ విభాగాలను కూడా ఎన్ఎంసీ తొలగించింది. కొత్తగా సమీకృత వైద్య పరిశోధన విభాగాన్ని తీసుకొచ్చింది. అత్యవసర వైద్యానికి ప్రాధాన్యం ఇచి్చంది. సాధారణ పడకలను 8 శాతం తగ్గించి ఐసీయూ పడకలను మాత్రం 120 శాతం పెంచింది. పల్మనాలజీ కిందే ఛాతీ, ఊపిరితిత్తుల వ్యాధులు ఛాతీ, ఊపిరితిత్తులు సంబంధిత వ్యాధులు లేదా కరోనా వంటి సమయాల్లో పల్మనరీ మెడిసిన్ కీలకమైనది. టీబీ వ్యాధి కూడా దీని కిందకే వస్తుంది. వెంటిలేటర్ మీద ఉండే రోగులను పల్మనరీ, అనెస్తీషియా విభాగాల వైద్యులే చూస్తారు. అలాంటి ప్రాధాన్యత కలిగిన విభాగాన్ని తొలగించడంపై సంబంధిత వైద్యులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పల్మనరీని తీసేయడం వల్ల అనెస్తీషియా, జనరల్ మెడిసిన్ స్పెషలిస్టులపై భారం పడుతుందని అంటున్నారు. కాలేజీలో తొలగించిన విభాగాలకు చెందిన పీజీలు ఉండరు. దానికి సంబంధించిన వైద్యం కూడా అందుబాటులో ఉండదు. పల్మనరీ మెడిసిన్ రద్దు సమంజసం కాదు 50 ఏళ్లుగా ఉన్న పల్మనరీ మెడిసిన్ విభాగం తప్పనిసరి నిబంధన తొలగించడం సరైన చర్య కాదు. 2025 నాటికి టీబీ నిర్మూలనను లక్ష్యంగా పెట్టుకున్న భారత్ పల్మనరీ వంటి కీలకమైన విభాగాన్ని తీసేయడం సమంజసం కాదు. – డాక్టర్ కిరణ్ మాదల, సైంటిఫిక్ కమిటీ కన్వినర్,ఐఎంఏ, తెలంగాణ మరికొన్ని మార్గదర్శకాలు అనెస్తీషియా కింద పెయిన్ మేనేజ్మెంట్ విభాగాన్ని తీసుకొచ్చారు. దీర్ఘకాలిక నొప్పులు, మోకాళ్ల నొప్పులు, నడుము నొప్పులు వంటివి ఈ విభాగం కిందికి వస్తాయి. యోగాను ఒక విభాగంగా ప్రవేశపెట్టారు. ఈ మేరకు వేర్వేరుగా స్త్రీ, పురుష శిక్షకులు ఉండాలి. గతంలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు 300 పడకలు అవసరం కాగా, ప్రస్తుతం వాటిని 220కి కుదించారు. స్కిల్ ల్యాబ్ తప్పనిసరి చేశారు. ఎంబీబీఎస్ విద్యార్థులు నేరుగా రోగుల మీద కాకుండా బొమ్మల మీద ప్రయోగం చేసేందుకు దీన్ని తప్పనిసరి చేశారు. గతంలో కాలేజీకి సొంత భవనం ఉండాలన్న నియమం ఉండేది. ఇప్పుడు 30 ఏళ్లు లీజుతో కూడిన భవనం ఉంటే సరిపోతుంది. కాలేజీ, అనుబంధ ఆసుపత్రి మధ్య దూరం గతంలో 10 కిలోమీటర్లు, 30 నిమిషాల ప్రయాణంతో చేరగలిగేలా ఉండాలన్న నియమం ఉండేది. ఇప్పుడు దీనిని కేవలం 30 నిమిషాల్లో చేరగలిగే దూరంలో ఉండాలన్న నియమానికి పరిమితం చేశారు. ఎన్ని సీట్లకు ఎన్ని జర్నల్స్, పుస్తకాలు ఉండాలన్నది స్పష్టం చేశారు. మెడికల్ కాలేజీకి అనుబంధంగా డాక్టర్లు, నర్సులతో పాటు మొత్తం 17 మంది సిబ్బందితో అర్బన్ హెల్త్ సెంటర్ ఉండాలి. ఎంబీబీఎస్ విద్యార్థులను ఇక్కడికి శిక్షణకు పంపుతారు. గతంలో ఎంబీబీఎస్, హౌసర్జన్లు, రెసిడెంట్లకు హాస్టల్ వసతి తప్పనిసరిగా ఉండేది. ఇప్పుడు రెసిడెంట్లకు తీసేశారు. -
ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్లకు ఇక నెక్ట్స్
సాక్షి, అమరావతి: దేశంలో వైద్య విద్యలో నాణ్యతను పెంచడానికి నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) సంస్కరణలు చేపడుతోంది. ఇందులో భాగంగా ఎంబీబీఎస్ తుది సంవత్సరం విద్యార్థులకు నేషనల్ ఎగ్జిట్ టెస్ట్(నెక్ట్స్) నిర్వహించనుంది. ఈ ఏడాది ఎంబీబీఎస్ పూర్తి చేసుకుంటున్న విద్యార్థులతోనే నెక్ట్స్ ప్రారంభించనున్నారు. దీనిని స్టెప్–1, స్టెప్–2గా రెండు పరీక్షలుగా నిర్వహిస్తారు. ఎంబీబీఎస్ పాస్‌కు, మెడికల్ ప్రాక్టీస్‌కు లైసెన్స్, రిజిస్ట్రేషన్‌కు ఈ పరీక్ష ఉతీ్తర్ణత తప్పనిసరి. దీంతో పాటు పీజీ మెడికల్ సీటులో ప్రవేశాలకూ ఈ అర్హతే ఆధారం కానుంది. విదేశాల్లో చదివిన వారికి కూడా ఈ పరీక్ష ద్వారానే గుర్తింపు ఇస్తారు. ఈ క్రమంలో విద్యార్థుల్లో నెక్ట్స్‌పై అవగాహన కల్పించడం కోసం వచ్చే నెల 28న స్టెప్–1 మాక్ టెస్ట్ నిర్వహిస్తున్నారు. కొనసాగుతున్న దరఖాస్తుల ప్రక్రియ మాక్ టెస్ట్‌కు దరఖాస్తుల స్వీకరణ ఇప్పటికే ప్రారంభించారు. వచ్చే నెల 10వ తేదీ సాయంత్రం 5 గంటలు దరఖాస్తుకు చివరి గడువు. ఢిల్లీ ఎయిమ్స్ ఆధ్వర్యంలో మాక్ టెస్టు నిర్వహిస్తారు. https://www.aiimsexams.ac.in/ వెబ్సైట్లో ఆన్లైన్ అప్లికేషన్ అందుబాటులో ఉంచారు. జనరల్/ఓబీసీ విద్యార్థులు రూ. 2 వేలు, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు రూ. వెయ్యి దరఖాస్తు రుసుము చెల్లించాలి. వికలాంగులకు దరఖాస్తు రుసుము మినహాయించారు. మూడు స్టేజ్లలో మాక్ దరఖాస్తు ప్రక్రియ ఉంటుంది. మూడు రోజులు స్టెప్–1 స్టెప్–1 పరీక్షను మూడు రోజులు నిర్వహించాలని ఎన్ఎంసీ ప్రతిపాదించింది. పూర్తిగా మల్టిపుల్ చాయిస్(ఎంసీక్యూ) విధానంలో స్టెప్–1లో ఆరు పేపర్లు ఉంటాయి. రోజుకు రెండు సబ్జెక్టుల చొప్పున రోజు విడిచి రోజు పరీక్షలు నిర్వహిస్తారు. స్టెప్–1 అనంతరం ఆరోగ్య విశ్వవిద్యాలయాలు నిర్వహించే ప్రాక్టికల్స్‌లో ఉత్తీ ర్ణులవ్వాలి. వీరికి హౌస్ సర్జన్ చేయడానికి అర్హత ఉంటుంది. హౌస్ సర్జన్ అనంతరం స్టెప్–2 పరీక్ష ఉంటుంది. స్టెప్–1లోని ఆరు సబ్జెక్ట్లతో పాటు ఆర్థోపెడిక్స్, ఫిజికల్ మెడిసిన్ రీహబిలిటేషన్ (పీఎంఆర్)లో ఎవల్యూషన్ మెథడ్‌లో క్లినికల్ ప్రాక్టికల్స్ ఉంటాయి. -
నేడు ‘నెక్స్ట్’పై వెబినార్
సాక్షి, అమరావతి: నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ (నెక్స్ట్)పై మంగళవారం నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) వెబినార్ నిర్వహించనుంది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలు ఈ వెబినార్‌లో పాల్గొనాలని ఇప్పటికే ఎన్ఎంసీ ఆదేశాలు జారీచేసింది. ఎంబీబీఎస్ పాసైనవారు ఉన్నత విద్య, ప్రాక్టీస్, రిజిస్టేషన్ల కోసం ప్రస్తుతం అనుసరిస్తున్న వేర్వేరు విధానాలన్నింటినీ తొలగించి నెక్స్ట్ పేరుతో ఉమ్మడి పరీక్ష నిర్వహించాలని ఎన్ఎంసీ భావిస్తోంది. ఈ క్రమంలో నెక్స్ట్ గురించి విద్యార్థులు, అధ్యాపకులకు ఈ వెబినార్‌లో ఎన్ఎంసీ చైర్మన్ సురేశ్ చంద్ర శర్మ వివరిస్తారు. విద్యార్థుల సందేహాలను నివృత్తి చేస్తారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో వెబినార్ కోసం లెక్చర్ హాల్స్‌లో ప్రిన్సిపాల్స్ ఏర్పాట్లుచేశారు. -
10 లక్షల జనాభాకు ఓ మెడికల్ కాలేజీ
సాక్షి, హైదరాబాద్: 10 లక్షల జనాభా కలిగిన ప్రాంతంలో కొత్త మెడికల్ కాలేజీ స్థాపన కోసం దరఖాస్తు చేసుకోవచ్చని జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) స్పష్టం చేసింది. అయితే ఇప్పటికే ఆ ప్రాంతంలో ఎలాంటి మెడికల్ కాలేజీ ఉనికిలో ఉండకూడదని పేర్కొంది. కొత్త మెడికల్ కాలేజీ స్థాపన నిబంధనలు, ఎంబీబీఎస్‌లో సీట్ల పెంపుదలకు సంబంధించి ఎన్ఎంసీ తాజాగా ముసాయిదా మార్గదర్శకాలు జారీచేసింది. 2024–25 వైద్య విద్యా సంవత్సరం నుంచి ఇవి అమలులోకి వస్తాయని పేర్కొంది. కొత్త మెడికల్ కాలేజీలకు 50/100/150 సీట్ల వరకే అనుమతి ఇస్తామని, అంతకంటే ఎక్కువ సీట్లు కేటాయించబోమని పేర్కొంది. అయితే గతంలోనే అధిక సీట్ల కోసం (150కు మించి) దరఖాస్తు చేసుకుంటే దాన్ని పరిగణలోకి తీసుకుంటామంది. కొత్త మార్గదర్శకాలకు అనుగుణంగా ఉన్న కాలేజీలకు మాత్రమే ఎంబీబీఎస్ అడ్మిషన్లు కొనసాగించడానికి అర్హత కలిగి ఉంటాయని పేర్కొంది. గ్రామీణ ప్రాంత ఆసుపత్రులతో అనుసంధానం కొత్తగా అనుమతి తీసుకునే మెడికల్ కాలేజీకి అనుబంధంగా గ్రామీణ ఆరోగ్య శిక్షణ కేంద్రాలు/ కమ్యూనిటీ హెల్త్/ అర్బన్ హెల్త్ సెంటర్లు ఉండాలి. ఒక్కో కేంద్రానికి 15 మంది విద్యార్థులను ఇంటర్న్‌గా పంపేలా ఉండాలి. ఈ కేంద్రాలు మెడికల్ కాలేజీ యాజమాన్యంలో లేదా ప్రభుత్వంలోని ఆరోగ్య కేంద్రానికి చెందినవిగా ఉండాలి. నగరాల్లో మినహా ఈ ఆరోగ్య కేంద్రాలు 30 కిలోమీటర్ల దూరంలో ఉండాలి. అల్పాహారం, సాంస్కృతిక కార్యకలాపాలు, యోగా శిక్షణ, ఇండోర్ గేమ్స్, కౌన్సెలింగ్ సదుపాయాలు ఉండాలి. బయోమెట్రిక్ హాజరు మెడికల్ కాలేజీల్లో ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ హాజరు వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఎన్ఎంసీ సూచించింది. దీని పరిధిలోకి అధ్యాపకులు, ట్యూటర్లు, సీనియర్ రెసిడెంట్లు వస్తారు. హాజరును సరిగా పాటించని ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలి. అన్ని కాలేజీల బయోమెట్రిక్ మెషీన్లను ఎన్ఎంసీ కమాండ్ కంట్రోల్ సెంటర్‌కి అనుసంధానం చేయాలి. ప్రతీ మెడికల్ కాలేజీ సీసీటీవీ వ్యవస్థ కలిగి ఉండాలి. అధునాతన సౌకర్యాలతో కూడిన లైబ్రరీ ఉండాలి. కొత్త మార్గదర్శకాలివీ.. ♦ 30 ఏళ్లపాటు లీజుకు తీసుకున్న స్థలమైతే అందులో భవన నిర్మాణాలు చేపట్టాలి. ♦ కాలేజీ, బోధనాసుపత్రులకు వేర్వేరు భవనాలు ఉన్నట్లయితే వాటి మధ్య దూరం గరిష్టంగా 30 నిమిషాల్లో చేరేలా ఉండాలి. ♦ ఆసుపత్రిలో కనీసం 220 పడకలుండాలి. ♦ఎంబీబీఎస్ అడ్మిషన్ల కోసం ఏర్పాటు చేసే కాలేజీలో తప్పనిసరిగా అనాటమీ, ఫిజియా లజీ, బయోకెమిస్ట్రీ, పాథాలజీ, మైక్రోబయాలజీ, ఫార్మకాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్ అండ్ టాక్సికాలజీ, కమ్యూనిటీ మెడిసిన్, జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్స్, సైకియా ట్రీ, డెర్మటాలజీ, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, నేత్ర వైద్యం, గైనకాలజీ, అనస్థీషియాలజీ, డెంటిస్ట్రీ, ఫిజికల్ మెడిసిన్ అండ్ రిహాబిలిటేషన్, అత్యవసర వైద్యం, ఇంటిగ్రేటివ్ మెడికల్ రీసెర్చ్ విభాగాలు తప్పనిసరిగా ఉండాలి. -
నీట్ మెడికల్ పీజీ స్టేట్ ర్యాంక్‌లు విడుదల
సాక్షి, హైదరాబాద్: నీట్ పీజీ మెడికల్, నీట్ ఎండీఎస్ రాష్ట్రస్థాయి ర్యాంకులు విడుదలయ్యాయి. ఫలితాలు విడుదలైన మూడు నెలల తర్వాత రాష్ట్రస్థాయి డేటాను జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) విడుదల చేసింది. ఎన్ఎంసీ నుంచి రాష్ట్ర స్థాయి ర్యాంకుల వివరాలు అందినట్లు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వర్గాలు వెల్లడించాయిN. నీట్ పీజీలో రాష్ట్రం నుంచి దాదాపు 12 వేల మంది పరీక్ష రాయగా 5,690 మంది అర్హత పొందారు. నీట్ ఎండీఎస్‌లో 602 మంది అర్హత సాధించినట్లు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం తెలిపింది. పీజీ మెడికల్ పరీక్ష మార్చి 5వ తేదీన జరిగింది. ఆ తర్వాత పది రోజులకు ఫలితాలు వచ్చాయి. వచ్చిన మార్కులు, జాతీయ స్థాయి ర్యాంకులను బట్టి విద్యార్థుల క్రమ సంఖ్య ఆధారంగా స్టేట్ ర్యాంకులు నిర్ధారించినట్లు అధికారులు వెల్లడించారు. ఇది కేవలం జాతీయస్థాయి ర్యాంకుల ఆధారంగా తయారు చేసిందేనని, మెరిట్ జాబితా కాదని కాళోజీ వర్సిటీ తెలిపింది. నీట్ పీజీ మెడికల్‌లో రాష్ట్రస్థాయిలో మొదటి పది స్థానాల్లో వి.వి.కౌశిక్ అల్వార్, వేణు మాధవ్ పిన్నింటి, నంబూరి కృష్ణశ్రీ, జి.పవిత్ర, జీశన్ అహ్మద్ జాలీలి, రెగోటి అశ్రిత, తంగెడ కౌశిక్, కనుమిల్లి ప్రదీప్, బైరోజు శివ సాయితేజ, గడ్డం నిఖిత ఉన్నారు. నీట్ ఎండీఎస్ మొదటి పది స్థానాల్లో వర్ణిక పారుపల్లి, దుంప తేజస్వి, జె.కుసుమ, రుంజాల సుసన్ దైసీ క్రిస్, ముత్యాల శ్రీసాయి సుఖేష్ రొంపికుంట్ల శాలిని, మనీష కుమారి, సోమ చాణక్య, చర్క సౌమేశ్వరి, అక్షయ్ కులకర్ణి ఉన్నారు. 2,300కు పైగా క్లినికల్ సీట్లు.. రాష్ట్రవ్యాప్తంగా 32 ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 2,722 పీజీ మెడికల్ సీట్లున్నాయి. అందులో దాదాపు 400 నాన్ క్లినికల్ సీట్లు పోగా, మిగిలినవి క్లినికల్ సీట్లు ఉంటాయని వర్సిటీ వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వ కాలేజీల్లోని 15% సీట్లను జాతీయ స్థాయి కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేస్తారు. మిగిలిన వాటిని రాష్ట్ర కౌన్సెలింగ్‌లో భర్తీ చేస్తారు. అయితే ఈసారి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఒకేసారి ఏకీకృత కౌన్సెలింగ్ నిర్వహించే అవకాశముంది. దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందని కాళోజీ వర్గాలు తెలిపాయి. కాగా వచ్చే నెలలో పీజీ మెడికల్ కౌన్సెలింగ్ జరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఎంబీబీఎస్ ఇంటర్న్íÙప్ పూర్తి కాకపోవడం వల్ల ఈ ఆలస్యం జరుగుతోంది. కాగా పీజీ మెడికల్ క్లినికల్ సీట్లకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అందుకే కోట్లు ఖర్చు చేసి మరీ ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని ఆ సీట్లలో చేరుతుంటారు. ఒక్క సీటు కూడా మిగలదు. సీట్లు పొందినవారు స్పెషలిస్టు వైద్యులుగా తమ కెరీర్‌ను మలుచుకుంటారు. ఇక నాన్ క్లినికల్ పీజీ సీట్లను పట్టించుకునే వారే ఉండరు. ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో ఉండే కన్వీనర్ కోటా సీట్లలోనూ విద్యార్థులు చేరడం లేదంటేనే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. క్లినికల్ విభాగంలో మొత్తం 14 సబ్జెక్టులుండగా..నాన్ క్లినికల్‌లో 9 సబ్జెక్టులు ఉన్నాయి. -
కొత్త నిబంధనలు వచ్చేశాయ్.. ఎంబీబీఎస్ 9 ఏళ్లలో పూర్తి చేయాలి
న్యూఢిల్లీ: ఎంబీబీఎస్ కోర్సును విద్యార్థులు తొమ్మిదేళ్లలోగా పూర్తి చేయాలని, ఫస్టియర్‌ను నాలుగు ప్రయత్నాల్లో పూర్తి చేయాలని నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) తాజాగా నిబంధనలు తీసుకువచ్చింది. ఈ మేరకు ఈ నెల 2న గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ రెగ్యులేషన్స్–2023(జీఎంఈఆర్–23) గెజిట్‌ను విడుదల చేసింది. అండర్గ్రాడ్యుయేట్ కోర్సులో అడ్మిషన్ పొందిన తేదీ నుంచి తొమ్మిదేళ్లలోగా ఆ కోర్సును విద్యార్థులు పూర్తి చేయాలి. ఎంబీబీఎస్ కోర్సులో మొదటి సంవత్సరం పూర్తి చేసేందుకు విద్యార్థులకు ఎట్టిపరిస్థితుల్లోనూ నాలుగుకు మించి ప్రయత్నాలకు అవకాశమివ్వరు. వైద్య సంస్థల్లో గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశానికి నీట్–యూజీ మెరిట్ లిస్ట్ ప్రాతిపదికన ఉమ్మడి కౌన్సెలింగ్ ఉండాలి. చదవండి: రూ.10 అడిగితే ప్రాణం తీశాడు -
అడ్డదారులు తొక్కితే నిషేధమే!
సాక్షి, హైదరాబాద్: వైద్య విద్య (ఎంబీబీఎస్) ప్రవేశాల్లో అడ్డదారులు తొక్కే మెడికల్ కాలేజీలపై నిషేధం విధిస్తామని జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) హెచ్చరించింది. తప్పుడు పద్దతుల్లో ఇచ్చే మొదటి సీటుకు రూ.కోటి, రెండో సీటుకు రూ.2 కోట్లు జరిమానా విధిస్తామని.. మరోసారి తప్పు చేస్తే తదుపరి ఏడాది సంబంధిత మెడికల్ కాలేజీని నిషేధిస్తామని స్పష్టం చేసింది. మెడికల్ అడ్మిషన్లు తదితర అంశాలపై గెజిట్ నోటిఫికేషన్లను జారీచేసింది. బ్లాక్ చేసి అమ్ముకుంటూ.. దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీలు ఎంబీబీఎస్ సీట్లను బ్లాక్ చేసి కోట్ల రూపాయలకు అమ్ముకుంటున్న ఉదంతాలు ఎన్నో బయటపడుతున్నాయి. ముఖ్యంగా బీ కేటగిరీ సీట్లను ఎన్నారై సీట్లుగా మార్చుకోవడం, తప్పుడు అర్హతలున్నా సీట్లు ఇవ్వడం, అడ్మిషన్ల కాలపరిమితి ముగిసిన తర్వాత కూడా సీట్లు కేటాయించడం వంటి అక్రమాలు జరుగుతున్నాయి. దీనితో అర్హులైన విద్యార్థులకు అన్యాయం జరుగుతోంది. ఇక నుంచి మెడికల్ కాలేజీలకు రేటింగ్ వైద్య కాలేజీల ఏర్పాటు, కొత్త కోర్సుల అనుమతి కోసం ఎన్ఎంసీ నిబంధనలను విడుదల చేసింది. వీటి అమలుకు ‘మెడికల్ అసెస్మెంట్ అండ్ రేటింగ్ బోర్డు (మార్బ్)’ను ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించింది. మార్బ్ నుంచి లిఖితపూర్వక అనుమతులు లేకుండా కొత్తగా వైద్య కాలేజీలు ఏర్పాటు చేయడానికిగానీ, కొత్త కోర్సులు ప్రారంభించడానికిగానీ వీల్లేదు. ఎంబీబీఎస్, పీజీ కోర్సుల కోసం కొత్త కాలేజీల ఏర్పాటుకు ఈ సంస్థ దరఖాస్తులు ఆహ్వానించినప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహంతో ఏర్పాటైన స్వయం ప్రతిపత్తి సంస్థలు, సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ కింద ఏర్పాటైన కంపెనీలు దరఖాస్తు చేసుకోవచ్చు. మార్బ్ అన్ని కోణాల్లో పరిశీలించి అనుమతి ఇస్తుంది. మార్బ్ అనుమతి లేకుండా ఇప్పటికే తరగతులు నిర్వహిస్తున్న ఏ మెడికల్ కాలేజీలో కూడా సీట్లు పెంచడానికి వీల్లేదు. మార్బ్ థర్డ్ పార్టీ సంస్థల సాయంతో మెడికల్ కాలేజీల పనితీరును పరిశీలించి రేటింగ్ ఇస్తుంది. ఇక ప్రతీ మెడికల్ కాలేజీ వార్షిక నివేదికను సంబంధిత బోర్డులకు అందజేయాలి. గుర్తింపు పొందిన వైద్య అర్హత ఉంటేనే.. గుర్తింపు పొందిన వైద్య అర్హతలు లేకుండా ఏ వ్యక్తి కూడా మెడికల్ ప్రాక్టీస్ చేయకూడదని ఎన్ఎంసీ స్పష్టం చేసింది. ఇందుకోసం ‘మెడికల్ ప్రాక్టీషనర్ల నమోదు, మెడిసిన్ నిబంధనల ప్రాక్టీస్ లైసెన్స్– 2023’ను విడుదల చేసింది. మెడికల్ ప్రాక్టీస్ చేయడానికి లైసెన్సు కోసం నేషనల్ మెడికల్ రిజిస్టర్లో నమోదు చేసుకోవాలి. విదేశాల్లో వైద్యవిద్య చదివినవారు జాతీయ స్థాయిలో సంబంధిత పరీక్ష పాస్ కావాలి. రాష్ట్ర వైద్య మండలిలో దరఖాస్తు ఆమోదం పొందిన తర్వాత, అది జాతీయ వైద్య రిజిస్టర్లోనూ, రాష్ట్ర వైద్య రిజిస్టర్లో కూడా కనిపిస్తుంది. రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్కు జారీచేసిన మెడిసిన్ ప్రాక్టీస్ లైసెన్స్ ఐదేళ్ల వరకు చెల్లుబాటు అవుతుంది. తర్వాత స్టేట్ మెడికల్ కౌన్సిల్‌కు దరఖాస్తు చేసుకుని లైసెన్స్‌ను పునరుద్ధరించుకోవాలి. అంతర్జాతీయ ప్రమాణాలతో వైద్యం అత్యున్నత, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా దేశవ్యాప్తంగా వైద్య విద్య ఉండాలని ఎన్ఎంసీ స్పష్టం చేసింది. అందుకోసం ‘గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ రెగ్యులేషన్స్–2023’ను విడుదల చేసింది. విద్యార్థి కి ఉన్నతమైన, నాణ్యమైన ఎంబీబీఎస్ లేదా ఇతర అండర్ గ్రాడ్యుయేట్ వైద్య విద్యను అందించడానికి తగిన ప్రణాళికను అమలు చేయాలని సూచించింది. -
ఎన్ఎంసీ తీరు మారాలి
దేశంలో వైద్య విద్య పర్యవేక్షణకు నెలకొల్పిన భారతీయ వైద్య మండలి(ఎంసీఐ) భ్రష్టుపట్టిందనీ, దాని ప్రక్షాళన అసాధ్యమనీ పదమూడేళ్ల క్రితం సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ఆ తర్వాత 2019లో కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బిల్లు చట్టమై జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) ఆవిర్భవించింది. 2020 సెప్టెంబర్ నుంచి కొత్త సంస్థ పనిచేయటం ప్రారంభమైంది. పాత వ్యవస్థలోని లోపాలనూ, దోషాలనూ పరిహరించి కొత్త వ్యవస్థ వస్తున్నదంటే ఎవరైనా స్వాగతిస్తారు. కానీ ఈ మూడేళ్లలో ఎన్ఎంసీ ఆచరణ సరిగా ఉందా లేదా అన్నదే ప్రశ్న. కొత్త చట్టం వచ్చినప్పుడూ, కొత్త వ్యవస్థలు రూపుదిద్దుకున్నప్పుడూ సంబంధిత రంగాల్లోనివారు నిశితంగా గమనిస్తారు. అవి తమ ఆశలకూ, ఆకాంక్షలకూ అనుగుణంగా ఉన్నాయో లేదో తరచి చూస్తారు. ఎంబీబీఎస్ పూర్తయ్యాక వైద్య వృత్తిలో ప్రవేశించేందుకైనా, పీజీ కోర్సుల్లో ప్రవేశం కోరడానికైనా నేషనల్ ఎగ్జిట్ టెస్ట్(నెక్ట్స్) పేరిట జరిగే ఉమ్మడి ప్రవేశపరీక్ష రాయాల్సిందేనన్న నిబంధనను బిల్లుపై పార్లమెంటు చర్చిస్తున్న సమయంలోనే వైద్యరంగ నిపుణులు, వైద్య విద్యార్థులు గట్టిగా వ్యతిరేకించారు. అలాగే ఫీజుల నిర్ణయం విషయంలోనూ ఆందోళన వ్యక్తమైంది. వారి అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ అది చట్టంగా మారింది. దాని సంగతలావుంచి కొత్త వ్యవస్థ అయినా పారదర్శకతకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదా? దేశవ్యాప్తంగా 38 వైద్య కళాశాలల గుర్తింపు రద్దు చేస్తున్నట్టు ఈమధ్యే ఎన్ఎంసీ ప్రకటించింది. మరో వందకు పైగా వైద్య కళాశాలల్లో అనేక లోటుపాట్లను గుర్తించి వాటిని సరిచేసుకోనట్టయితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. నిజానికి గతంలో ఎంసీఐ సైతం ఇలాంటి తనిఖీలే చేస్తుండేది. చర్యలు తీసుకునేది. అయినా దానిపై ఎందుకు ఆరోపణలొచ్చేవో, అది ఎందుకు భ్రష్టుపట్టిపోయిందో కొత్త వ్యవస్థ సారథులు సరిగా అర్థం చేసుకున్నట్టు లేరు. వచ్చే నెలలో మొదటి సంవత్సరం ఎంబీబీఎస్ ప్రవేశాలుంటాయి గనుక ఎన్ఎంసీ ముందుగానే వైద్య కళాశాలలను తనిఖీ చేయటం మెచ్చదగింది. గుర్తింపు రద్దు చేసినంత మాత్రాన వెంటనే ఆ కళాశాలలకు కేటాయించిన సీట్లన్నీ రద్దుకావు. అవి సకాలంలో మేల్కొని దిద్దుబాటు చర్యలు తీసుకుని, తిరిగి దరఖాస్తు చేసుకుంటే ఎన్ఎంసీ పరిశీలించి అనుమతులు పునరుద్ధరిస్తుంది. అలాగే ఎన్ఎంసీ సంతృప్తి చెందని పక్షంలో సంబంధిత కళాశాల కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖను కూడా ఆశ్రయించే వెసులుబాటుంది. వైద్య కళాశాలలపై ప్రధానంగా బోధనా సిబ్బంది కొరత విషయంలోనే ఆరోపణలొస్తున్నాయి. రెసిడెంట్ డాక్టర్ల సమస్య సరేసరి. ఇక ఇత రేతర మౌలిక సదుపాయాల లేమి సైతం ఎన్ఎంసీ కన్నెర్రకు కారణమవుతోంది. వైద్య కళాశాలల్లో విద్యా ప్రమాణాల తీరుతెన్నులనూ, అక్కడి మౌలిక సదుపాయాల కల్పననూ మదింపు వేయటం చాలా అవసరం. అయితే ఆ ప్రక్రియలో పారదర్శకత లోపిస్తే మాత్రం ప్రయోజనం శూన్యం. వాస్త వానికి ఎన్ఎంసీ చట్టం–2019లోని సెక్షన్ 26(ఈ) ప్రకారం సంస్థకు చెందిన మెడికల్ అసెస్మెంట్ అండ్ రేటింగ్ బోర్డ్ (మార్బ్) కళాశాల తీరుతెన్నులపై ఇచ్చే మదింపు, ఆ కళాశాలకిచ్చే రేటింగ్ అందరికీ అందుబాటులో ఉంచాలి. కానీ ఈ నెల మొదట్లో జారీ చేసిన కళాశాలల ఏర్పాటు, మదింపు, రేటింగ్ నిబంధనల్లోని సెక్షన్ 25 దీన్ని నీరుగారుస్తోంది. నిజానికి ఎన్ఎంసీ ఏర్పడింది మొదలు కళాశాలల మదింపు నివేదికల జాడే లేదు. సరిగదా అంతక్రితం ఎంసీఐ ఉన్నప్పుడు పొందుపరిచిన మదింపు నివేదికలు, రేటింగ్‌లు సైతం మాయమయ్యాయి. ఫలానా కళాశాలలో ఏ సదుపాయాలు లోపించాయో, దానిపై ఎందుకు చర్యలు తీసుకోవలసి వచ్చిందో, కాలక్రమంలో అది ఏయే అంశాల్లో మెరుగుపడిందో అందరికీ తెలియకపోతే ఎట్లా? ఇక ఆ తనిఖీల వల్ల సాధారణ విద్యార్థులకు ఒరిగేదేముంటుంది? విద్యార్థులు నచ్చిన కళాశాలను ఎంపిక చేసుకునే సమయంలో ఎన్ఎంసీ మదింపు నివేదికలు అందుబాటులో ఉంటే, కళాశాల పూర్వ చరిత్ర తెలిస్తే వారు మెరుగైన నిర్ణయం తీసుకోగలుగుతారు. అంతేతప్ప కేవలం అది ప్రకటించిన ఫలితాన్నీ, దాని రేటింగ్‌నూ చూసి ఎలా సరిపెట్టుకుంటారు? ఈ చిన్న విషయం ఎన్ఎంసీకి తెలియదా? ఇలాంటి ధోరణి అటు కళాశాలలకు సైతం నష్టం కలిగిస్తుంది. రేటింగ్ సరిగా లేని కళాశాలలో స్వల్ప లోటుపాట్లు మాత్రమే ఉండొచ్చు. అవి సరిచేసుకునే స్థాయిలోనే ఉండొచ్చు. కానీ ప్రత్యర్థి కళాశాలకు చెందినవారు మాత్రం ఆ లోపాలను భూతద్దంలో చూపి తప్పుడు ప్రచారానికి దిగొచ్చు. విద్యార్థులకు తగిన సమాచారం అందుబాటులో లేకపోవటంతో ఆ కళాశాలపై అనాసక్తి ప్రదర్శిస్తారు. ఎన్ఎంసీ తీరుపై కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ)కి చాన్నాళ్ల క్రితమే ఫిర్యాదులు దాఖలయ్యాయి. ఆ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని సీఐసీ మొన్న మార్చిలో ఆదేశాలు కూడా ఇచ్చింది. తీరా ఈ నెల మొదట్లో నోటిఫై చేసిన నిబంధనలు గమనిస్తే సీఐసీ ఆదేశాలు బేఖాతరైనట్టు అర్థమవుతుంది. గతంలో పనిచేసిన ఎంసీఐ అవినీతిమయం అయిందని రద్దు చేస్తే, దాని స్థానంలో వచ్చిన ఎన్ఎంసీ కూడా అదే బాటలో సాగుతున్నదన్న అభిప్రాయం కలిగిస్తే, పారదర్శకతకు పాతరేస్తే ఏమనాలి? ఇది సరికాదు. దేశంలోని ప్రతి వైద్య కళాశాలకు సంబంధించి ఎంసీఐ కాలంనాటి మదింపు నివేదికలు, రేటింగ్‌లతోపాటు ఎన్ఎంసీ గత మూడేళ్ల అంచనాలు సైతం అందరికీ అందుబాటులో ఉంచాలి. విద్యార్థులు మెరుగైన నిర్ణయం తీసుకొనేందుకు తోడ్పడాలి. -
తెలంగాణలో 13 మెడికల్ కాలేజీలకు ఎన్ఎంసీ అనుమతి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 9 ప్రభుత్వ, 4 ప్రైవేటు మెడికల్ కాలేజీలు కలిపి మొత్తం 13 మెడికల్ కాలేజీలకు నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) అనుమతి ఇచ్చింది. ప్రభుత్వ మెడికల్ కాలేజీలన్నీ పూర్తిగా రాష్ట్ర నిధులతో ఏర్పాటు చేస్తున్నవేనని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అంతేగానీ కేంద్రం రూపాయి ఇవ్వలేదని, రాష్ట్రంలో మెడికల్ కాలేజీలకు కేంద్రం ఆమోద ముద్ర అని సోషల్ మీడియా, మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవం అన్నారు. ఎన్ఎంసీ అటానమస్ బాడీ అని, నిర్దేశించిన అన్ని నిబంధనలు సంతృప్తి పరిచేలా ఉన్నాయా లేవా అని పరిశీలించిన తర్వాతే మెడికల్ కాలేజీలకు అనుమతి ఇస్తుందని ఆయన తెలిపారు. -
వైద్య విద్యలో నూతన అధ్యాయం.. ఏపీ చరిత్రలోనే రికార్డు..
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర వైద్య విద్యలో నూతన అధ్యాయాన్ని ఆవిష్కరించారు. 2019 ఎన్నికలకు ముందు రాష్ట్రంలో పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక వైద్య కళాశాల ఉండేలా చర్యలు తీసుకుంటామన్న హామీని నెరవేరుస్తూ ప్రస్తుతం ఉన్న 11 వైద్య కళాశాలలకు అదనంగా 17 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. వీటిలో ఈ విద్యా సంవత్సరం (2023–24) ఐదు కళాశాలల్లో 750 ఎంబీబీఎస్ సీట్లలో ప్రవేశాలకు నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) అనుమతి ఇచ్చింది. మచిలీపట్నం, ఏలూరు, నంద్యాల, రాజమండ్రి, విజయనగరం కళాశాలల్లో ఈ ఏడాది నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర చరిత్రలో ఇదే ప్రథమం.. ప్రభుత్వ రంగంలో ఒకే ఏడాది ఐదు వైద్య కళాశాలలు ప్రారంభం అవడం రాష్ట్ర చరిత్రలో ఇదే ప్రథమం. రాష్ట్రంలో మొట్టమొదటగా 1923లో ఆంధ్ర వైద్య కళాశాల ఏర్పాటైంది. అప్పటి నుంచి 2019కి అంటే 96 ఏళ్లలో 11 ప్రభుత్వ వైద్య కళాశాలలు మాత్రమే ఏర్పాటయ్యాయి. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వైద్య విద్యా రంగం అభివృద్ధికి వేగంగా చర్యలు చేపట్టారు. నాడు – నేడు పథకం కింద రూ.16 వేల కోట్లకు పైగా ఖర్చుతో ప్రభుత్వ వైద్య రంగం బలోపేతానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా రూ.8,480 కోట్లతో 17 కొత్త వైద్య కళాశాలల నిర్మాణం చేపట్టారు. కరోనా వ్యాప్తి, లాక్ డౌన్ వంటి ఒడిదుడుకులను కూడా అధిగమించి వైద్య కళాశాలలు నిరి్మస్తున్నారు. వీటిలో ఐదు కాలేజీలు ఈ ఏడాది ప్రారంభమవుతున్నాయి. ప్రస్తుతం ఉన్న 11 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 2,185 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. కొత్త కళాశాలలతో మరో 750 సీట్లు పెరుగుతాయి. దీంతో ప్రభుత్వ రంగంలోనే రాష్ట్రంలో 2,935 సీట్లు ఉంటాయి. వీటిలో 15 శాతం ఆల్ ఇండియా కోటాలో భర్తీ చేస్తారు. మిగిలిన సీట్లను రాష్ట్ర కోటాలో భర్తీ చేస్తారు. వచ్చే ఏడాది పులివెందుల, పాడేరు, ఆదోని కళాశాలలు, ఆ తర్వాతి ఏడాది మిగిలిన తొమ్మిది కళాశాలలు ప్రారంభించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మరోవైపు ఇప్పటికే ఉన్న కళాశాలలు, ఆస్పత్రులను రూ.3,820 కోట్లతో బలోపేతం చేస్తోంది. అంతేకాకుండా ఎన్ఎంసీ నిబంధనలకు అనుగుణంగా వైద్య కళాశాలల్లో మానవ వనరులు, ఇతర సదుపాయాలను సమకూర్చింది. వీటన్నింటి ఫలితంగా 627 పీజీ సీట్లు పెరిగాయి. తద్వారా భవిష్యత్‌లో రాష్ట్రంలో స్పెషలిస్ట్ వైద్యుల సంఖ్య పెరగనుంది. ఆగస్టులో అడ్మిషన్లు.. సెప్టెంబర్‌లో తరగతులు రాష్ట్ర వైద్య శాఖ మంత్రి విడదల రజిని గుంటూరు ఎడ్యుకేషన్: రాష్ట్రంలో కొత్తగా నిర్మించిన 5 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో తరగతుల ప్రారంభానికి ఎన్ఎంసీ అనుమతులివ్వడం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్తశుద్ధికి నిదర్శనమని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని చెప్పారు. మంత్రి గురువారం ఇక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దే సంకల్పంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 17 కాలేజీలు నిర్మిస్తున్నారని తెలిపారు. తొలి విడతలో విజయనగరం, నంద్యాల, ఏలూరు, రాజమండ్రి, మచిలీపట్నం కాలేజీల నిర్మాణం పూర్తయిందని, వీటిలో అడ్మిషన్లకు ఎన్ఎంసీ అనుమతిచ్చిందని చెప్పారు. ఈ కళాశాలల్లో ఆగస్టులో అడ్మిషన్లు చేపట్టి, సెప్టెంబర్‌లో తరగతులు ప్రారంభిస్తామన్నారు. మెడికల్ సీట్ల కోసం రాష్ట్ర విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఏపీలోనే అవకాశాలను కల్పిస్తున్నట్లు వివరించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ కాలేజీల్లో 2019కి ముందు 1,926 పీజీ సీట్లు ఉండగా, గత నాలుగేళ్లలో కొత్తగా 462 పీజీ సీట్లను మంజూరు చేయించినట్లు చెప్పారు. గత నాలుగేళ్లలో వైద్య, ఆరోగ్య శాఖలో వైద్యులతో పాటు కొత్తగా 49 వేల పోస్టులను భర్తీ చేయడం చరిత్రాత్మకమన్నారు. విజనరీ అని చెప్పుకునే చంద్రబాబు ఏం చేశారు? విజనరీ అని చెప్పుకునే చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా ఉన్న సమయంలో ప్రభుత్వ రంగంలో ఒక్క మెడికల్ కళాశాల అయినా నిర్మించారా అని మంత్రి ప్రశ్నించారు. బాబు హయాంలో ఒక్క గవర్నమెంట్ హాస్పటల్లో కూడా సరైన డాక్టర్లు, వైద్యం, మందులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, సెల్ఫోన్ల వెలుతురులో ఆపరేషన్లు చేశారని అన్నారు. చంద్రబాబు చేసింది శూన్యం.. ‘40 ఏళ్ల రాజకీయ అనుభవం.. 14 ఏళ్లు సీఎం.. 13 ఏళ్లు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశా.. నాకంటే సీనియర్ ఎవరున్నారు.’ అంటూ గొప్పలు చెప్పుకొనే టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో వైద్య కళాశాలలు ఏర్పాటు చేసి ప్రజలకు ఉచితంగా సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలందించేందుకు చూపిన చొరవ మాత్రం శూన్యం. అధికారంలో ఉన్నన్ని రోజులూ ప్రైవేటు రంగంలో వైద్య కళాశాలల ఏర్పాటును మాత్రమే ప్రోత్సహించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ప్రైవేటు మెడికల్ కళాశాలల్లో 13 టీడీపీ అధికారంలో ఉండగా ఏర్పడినవే కావడం ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. ఇది కూడా చదవండి: సూపర్‌ఫాస్ట్ రైల్వే లైన్లకు పచ్చ జెండా -
మచిలీపట్నం వైద్య కళాశాలకు గ్రీన్‌సిగ్నల్
సాక్షి, అమరావతి/మచిలీపట్నం టౌన్: కృష్ణాజిల్లా మచిలీపట్నం ప్రభుత్వ వైద్య కళాశాలలో 150 ఎంబీబీఎస్ సీట్లకు 2023–24 విద్యా సంవత్సరం నుంచి అడ్మిషన్లు చేపట్టడానికి నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ), మెడికల్ అసెస్మెంట్ మరియు రేటింగ్ బోర్డు అనుమతులిచ్చింది. ఈ మేరకు గురువారం వైద్య కళాశాల ప్రిన్సిపాల్ విజయకుమారికి ఎన్ఎంసీ నుంచి ఉత్తర్వులు అందాయి. ఇప్పటికే ఏలూరు, నంద్యాల, విజయనగరం వైద్య కళాశాలల్లో రానున్న విద్యా సంవత్సరంలో అడ్మిషన్లు మొదలు పెట్టడానికి లైన్‌క్లియర్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మచిలీపట్నం కళాశాలకు కూడా గ్రీన్‌సిగ్నల్ రావడంతో నాలుగు వైద్య కళాశాలల్లో ఒక్కోచోట 150 చొప్పున మొత్తం 600 ఎంబీబీఎస్ సీట్లు కొత్తగా వచ్చినట్లైంది. మరోవైపు.. రాజమండ్రి వైద్య కళాశాలకు అనుమతులు రావాల్సి ఉంది. ఈ కళాశాలలో కూడా మరో 150 సీట్లు అందుబాటులోకి వస్తాయి. దీంతో ఈ ఏడాది ఏకంగా 750 ఎంబీబీఎస్ సీట్లు పెరగనున్నాయి. రాష్ట్ర చరిత్రలో ఒకే ఏడాది ఐదు ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రారంభమవుతుండటం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా మచిలీపట్నం మెడికల్ కాలేజి ప్రిన్సిపాల్ విజయకుమారి ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ఈ ఏడాది తరగతుల నిర్వహణకు అన్నీ సిద్ధంచేశామని చెప్పారు. నూతన భవనాల్లో తరగతి గదుల నిర్మాణం పూర్తయ్యిందని.. ఫర్నిచర్, హాస్టల్‌కు అవసరమైన సామాగ్రి నెలాఖరుకుకల్లా వస్తుందన్నారు. రూ.8,480 కోట్లతో 17 వైద్య కళాశాలలు.. రాష్ట్రంలో వైద్య విద్యలో నూతన అధ్యాయానికి తెరతీస్తూ సీఎం జగన్ ప్రభుత్వం రూ.8,480 కోట్లతో 17 వైద్య కళాశాలలు ఏర్పాటుచేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రానున్న విద్యాసంవత్సరంలో ఐదుచోట్ల అడ్మిషన్లు ప్రారంభిస్తున్నారు. మరోవైపు.. 2024–25లో పులివెందుల, ఆదోని, పాడేరు కళాశాలల్లో అడ్మిషన్లు ప్రారంభించాలని కార్యాచరణ రూపొందించారు. ఇందుకు ఇప్పటికే చర్యలు ప్రారంభించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 11 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 2,185 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. కొత్తగా ఏర్పాటవుతున్న 17 వైద్య కళాశాలల్లో మరో 2,100 ఎంబీబీఎస్ సీట్లు సమకూరనున్నాయి. ముఖ్యమంత్రికి ‘పేర్ని’ కృతజ్ఞతలు ఇక మచిలీపట్నంలో శరవేగంగా వైద్య కళాశాలను ఏర్పాటుచేస్తున్న సీఎం జగన్‌కి మాజీమంత్రి, మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని కృతజ్ఞతలు తెలిపారు. 67 ఎకరాల విస్తీర్ణంలో రూ.550 కోట్లతో వైద్య కళాశాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని.. నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయన్నారు. ఇదే క్రమంలో రానున్న విద్యా సంవత్సరం నుంచి అడ్మిషన్లు చేపట్టడానికి అనుమతులు రావడం సంతోషకరమన్నారు. అలాగే, బందరు ప్రజల చిరకాల స్వప్నమైన పోర్టు నిర్మాణానికి ఈనెల 22న సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నట్లు ఆయన తెలిపారు. చదవండి: హోంశాఖ సమీక్షలో సీఎం జగన్ కీలక ప్రకటన -
కాబోయే వైద్యులకూ కావాలి వైద్యం!
వారంతా స్టెత్‌పట్టి రోగుల నాడి చూడాల్సిన మెడికోలు... కానీ వారిలో కొందరు మానసిక ఒత్తిళ్లకు చిత్తవుతున్నారు! మనోవేదనను తాళలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు!! గత కొన్నేళ్లుగా దేశవ్యాప్తంగా ఈ ధోరణి చోటుచేసుకుంటోంది. రాష్ట్రంలోనూ ఇటీవల కాలంలో పలువురు వైద్య విద్యార్థులు ప్రాణాలు తీసుకున్నారు. భావిభారత వైద్యులకు ఈ పరిస్థితి ఎందుకు తలెత్తుతోంది? అందుకుగల కారణాలు ఏమిటి? సాక్షి, హైదరాబాద్: జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) చేపట్టిన అధ్యయనం ప్రకారం 2010 నుంచి 2019 మ«ధ్య దేశవ్యాప్తంగా 125 వైద్య విద్యార్థులు, 105 మంది రెసిడెంట్ డాక్టర్లు, 128 మంది వైద్యులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. బలవన్మరణాలకు పాల్పడిన ప్రతి 10 మందిలో ఏడుగురు 30 ఏళ్లలోపు వారేనని అధ్యయనంలో వెల్లడైంది. అలాగే ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాదిలోనే (కేరళ మినహా) ఎక్కువ మంది మెడికోల ఆత్మహత్యలు నమోదయ్యాయని, గత ఐదేళ్లలో 64 మంది ఎంబీబీఎస్, 55 పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికోలు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఎన్ఎంసీ వెల్లడించింది. ఒత్తిళ్లు.. విభేదాలు.. అనారోగ్యం.. మెడికోల ఆత్మహత్యలను ఎన్ఎంసీ విశ్లేషించగా విస్తుగొలిపే విషయాలు వెల్లడయ్యాయి. మెడికోల ఆత్మహత్యలు ఎక్కువగా జరిగే విభాగాల్లో అనస్తీ షియాలజీ (22.4 శాతం) తొలి స్థానంలో నిలవగా ఆ తర్వాత స్థానంలో ప్రసూతి–గైనకాలజీ (16 శాతం) నిలిచింది. ఆత్మహత్యలకు పాల్పడుతున్న వైద్య విద్యార్థుల్లో (45.2 శాతం), రెసిడెంట్ డాక్టర్లలో (23.1 శాతం) చదువుల ఒత్తిడి కారణమవుతోంది. అలాగే వైద్యుల దాంపత్య జీవితంలో మనస్పర్థలు (26.7 శాతం), మానసిక సమస్యలు (వైద్య విద్యార్థుల్లో 24 శాతం, వైద్యుల్లో 20 శాతం), వేధింపులు (20.5 శాతం) ఆత్మహత్యలకు ఇతర కారణాలుగా నిలిచాయి. ఆత్మహత్యలకు పాల్పడిన వారిలో 13 శాతం మంది గతంలో మానసిక వైద్య సహాయం కోరడం గమనార్హం. ఆర్టీఐ కార్యకర్త వివేక్ పాండే ఇటీవల అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ అధ్యయన ఫలితాల్ని విడుదల చేసింది. మరోవైపు వైద్యవృత్తిలో ఉన్నవారిలో ఆత్మహత్య ప్రమాదం సాధారణ జనాభా కంటే దాదాపు 2.5 రెట్లు ఎక్కువని ఇండియన్ మెడికల్ అసోసియేషన్–జూనియర్ డాక్టర్స్ నెట్వర్క్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టడీస్ కమిటీ హెడ్ రిమీ డే పేర్కొన్నారు. చదువుకు గుడ్‌బై చెబుతున్నారు దాదాపు అన్ని మెడికల్ కాలేజీల్లో నియమాలు, రక్షణలు సహాయక వ్యవస్థలు ఉన్నప్పటికీ సక్రమంగా అమలు కావడం లేదని... అందుకే 1,166 మంది విద్యార్థులు వైద్య కళాశాలలకు వీడ్కోలు పలికారని అధ్యయనం తేలి్చంది. వారిలో 160 మంది ఎంబీబీఎస్, 1,006 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు చదువుతున్న వారు ఉన్నారు. ఎన్ఎంఏ కీలక సూచనలివీ... ♦ వైద్య విద్యార్థులు మాదకద్రవ్యాలు, మద్యం, పొగాకు ఇతర దురలవాట్లకు దూరంగా ఉండాలి. ♦సామాజిక మాధ్యమ పరిధి, ఉపయోగంతో పాటు విచక్షణారహిత వినియోగంతో వచ్చే వృత్తిపరమైన ప్రమాదాల గురించి వైద్య విద్యార్థులు తప్పనిసరిగా తెలుసుకోవాలి. ♦ రోగులతో సమర్థంగా కమ్యూనికేట్ చేయడానికి స్థానిక భాషను నేర్చుకోవాలి. ♦ విద్యార్థులు ఎదుర్కొనే ఒత్తిడి, మానసిక అనారోగ్య సమస్యల గురించి ప్రొఫెసర్లు తప్పనిసరిగా తెలుసుకోవాలి. ♦ వైద్య విద్యార్థుల సమస్యలను పరిష్కరించడానికి అందుబాటులో ఉన్న పరిష్కార ప్రక్రియల గురించి అవగాహన పెంచుకోవాలి. అధ్యయనం జరగాలి... ‘వెలుగులోకి వచ్చేవి, మీడియా లో చర్చకు నోచుకున్నవే కాదు. బయటకు రాని మరికొన్ని ఆ త్మహత్యల ఉదంతాలూ ఉన్నా యి. ప్రైవేటు మెడికల్ కాలేజీ ల్లో నిబంధనల పేరిట విద్యార్థుల్ని విపరీతమైన ఒత్తిడికి లోనుచేస్తున్నారు. ఇక ఆస్పత్రుల్లో 24/7 షిఫ్టులు, కుటుంబానికి దూరంగా ఉండటం, ఆర్థిక కష్టాలు, కొన్ని చోట్ల ర్యాగింగ్, కుల వివక్ష, భవిష్యత్తుపై భయం వంటివి వైద్య విద్యార్థులు ఎదుర్కొంటున్నారు. దీనిపై సమగ్ర అధ్యయనం జరపాలి. నివారించే దిశగా కార్యాచరణ రూపొందించాలి. – డాక్టర్ బీఎన్ రావు, ఐఎంఏ అధ్యక్షుడు ఒత్తిడి ఉంది... పరీక్షల దశలోనే ఒత్తిడి బా గా ఉంది. ఇంటర్న్స్, పీజీలకు రెగ్యులర్ డ్యూటీల భారం ఉంటోంది. ముఖ్యంగా ప్రభుత్వాస్పత్రుల్లో ఎక్కు వమంది రోగులు, తక్కువ మంది వైద్యులు ఉండటం వల్ల నిర్ణీత పనివేళలు ఉండవు. సర్జరీల్లో ఉండే వారికి మరింత ఎక్కువ పనిభారం ఉంటోంది. –డాక్టర్ కౌశిక్ డెర్మా, జూనియర్ వైద్యుల సంఘం అధ్యక్షుడు -
మెడికల్ కాలేజీల్లో 147 ప్రొఫెసర్ పోస్టులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, బోధనాసుపత్రుల్లో 147 ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ కాంట్రాక్టు పోస్టులకు నోటిఫికేషన్ జారీ అయింది. జాతీయ మెడికల్ కమి షన్ (ఎన్ఎంసీ) మార్గదర్శకాల మేరకు.. 69 ఏళ్ల వయసున్నవారు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఈ మేరకు వైద్యవిద్య డైరెక్టర్ (డీఎంఈ) రమేశ్‌రెడ్డి నోటిఫికే షన్లో పేర్కొన్నారు. ఈ పోస్టులకు ఈ నెల 12న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. అదే రోజున తుది జాబితా ప్రకటిస్తారు. ఎంపికైనవారు ఈ నెల 23వ తేదీ నాటికి ఆయా చోట్ల చేరాల్సి ఉంటుంది. ఏడాది పాటు ఆయా కాలేజీలు, ఆస్పత్రుల్లో ప్రొఫె సర్లుగా, అసోసియేట్ ప్రొఫెసర్లుగా కాంట్రాక్టు విధానంలో పనిచేయాల్సి ఉంటుంది. ఎంపికలో తెలంగాణకు చెందినవారికి ప్రాధాన్యమిస్తారు. స్థానిక అభ్యర్థులు అందుబాటులో లేకుంటే ఇతర రాష్ట్రాల వారికి అవకాశం కల్పిస్తారు. నోటిఫికేషన్ నాటికి అభ్యర్థుల వయసు 69 ఏళ్లు దాటకూడదు. రూ. లక్షా 90 వేల వరకు వేతనం అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లకు నెలకు రూ.50 వేలు వేత నం ఇస్తారు. మిగతా విభాగాల అసోసియేట్ ప్రొఫె సర్లకు రూ.లక్షన్నర, ప్రొఫెసర్లకు రూ.1.90 లక్షలు ఇస్తారు. ఇవి కాంట్రాక్టు నియామకాలు కావడం వల్ల.. ఆయా పోస్టులకు ప్రమోషన్లు, రెగ్యులర్ నియామకాలు జరిగితే వీరిని తొలగిస్తారు. అనాట మీలో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు 9 చొప్పున భర్తీ చేస్తారు. ఫిజియాలజీలో 9 ప్రొఫె సర్, ఏడు అసోసియేట్ ప్రొఫెసర్.. బయోకెమి స్ట్రీలో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు 9 చొప్పున.. ఫార్మకాలజీలో ఏడు అసోసియేట్, పాథాలజీలో 9 అసోసియేట్, మైక్రోబయాలజీలో ఏడు అసోసియేట్, జనరల్ మెడిసిన్‌లో 9 ప్రొఫె సర్, డెర్మటాలజీలో 4 అసోసియేట్, సైకియాట్రీలో 9 అసోసియేట్, రెస్పిరేటరీ మెడిసిన్‌లో ఐదు అసోసియేట్, జనరల్ సర్జరీలో 9 ప్రొఫెసర్, ఆర్థోపెడిక్స్‌లో 9 అసోసియేట్, గైనకాలజీలో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు 9 చొప్పున, ఎమర్జెన్సీ మెడిసిన్‌లో 9 అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. -
మాకు సీట్లు ఇప్పించండి..
ఎంజీఎం: రాష్ట్రంలో జాతీయ వైద్య కమిషన్ (ఎన్ ఎంసీ) ఇటీవల రద్దు చేసిన మెడికల్ సీట్ల విషయంలో వివాదం ఇంకా కొనసాగుతోంది. ఎన్ఎంఆర్, టీఆర్ఆర్, మహావీర్ మెడికల్ కళాశాలల్లో సీట్లను ఎన్ఎంసీ రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ కాలేజీల్లో అడ్మిషన్ పొందిన విద్యార్థులకు ఇతర మెడికల్ కళాశాలల్లో సీట్లు కేటాయించాలని ఎన్ఎంసీ ఆదేశించినా వరంగల్ కాళోజీ ఆరోగ్య వర్సిటీ పట్టించుకోకపోవడంతో మూడు కళాశాలల విద్యా ర్థులు, వారి తల్లిదండ్రులు శుక్రవారం ఆరోగ్య వర్సిటీ ఎదుట వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. తమకు వెంటనే సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. కాగా, విద్యార్థులు, వారి తల్లిదండ్రులను లోపలికి అనుమ తించకుండా పోలీసులు యూనివర్సిటీ గేటు ఎదు టనే అడ్డుకున్నారు. దీంతో వారు అక్కడే ఆందోళన కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ సందర్భంగా వైద్యవిద్యార్థులు మాట్లాడుతూ ఆరోగ్య వర్సిటీ అ«ధికారులు, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని, లేకుంటే ఆమరణ దీక్ష చేపడతామని హెచ్చరించారు. దీనిపై వర్సిటీ అధికారులు మాట్లాడు తూ ఎన్ఎంసీ ఆదేశాలు ఇవ్వడం సబబుగానే ఉందని, అయితే ఇక్కడ 450 మంది ఎంబీబీఎస్ విద్యా ర్థులు, 111 మంది పీజీ విద్యార్థులు ఉన్నారని, ఇంత పెద్ద మొత్తంలో విద్యార్థులను సర్దుబాటు చేయ డం కష్టమన్నారు. భవిష్యత్‌లో సాంకేతికంగా, చట్టపరంగా ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉందని చెప్పారు. ఈ సమస్యపై రాష్ట్ర ప్రభుత్వమే ప్రత్యేక పరిస్థితుల్లో ఈ సీట్లను సర్దుబాటు చేస్తున్నామని ప్రత్యేక జీఓ తెస్తే ఎవరికీ ఇబ్బంది ఉండదన్నారు. -
రోగులపై ప్రత్యక్ష ప్రయోగాలొద్దు
పీజీ వైద్య విద్యలో జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) మరిన్ని సంస్కరణలను తీసుకొచ్చింది. 23 సంవత్సరాల తర్వాత పీజీ వైద్యవిద్యలో మార్పులకు శ్రీకారం చుట్టిన ఎన్ఎంసీ... 2022–23 విద్యా సంవత్సరం నుంచి కొత్తగా తీసుకొచ్చిన విధానాన్ని అమలు చేయాలని స్పష్టం చేసింది. ఇప్పటివరకు పీజీ కోర్సులు చదువుతున్న వైద్య విద్యార్థులు పాఠ్యాంశానికి సంబంధించిన అంశాలను నేర్చుకోవడంతోపాటు కోర్సు చివర్లో పరీక్షలు రాస్తున్నారు. దీంతో వైద్యులంతా ఒకే తరహా వైఖరికి అలవాటుపడుతున్నట్లు గుర్తించిన ఎన్ఎంసీ... తాజాగా ఆ విధానాలను సంస్కరించింది. పలు రకాల మార్పులు చేస్తూ సరికొత్త విధానాలను ప్రవేశపెట్టింది. కొత్తగా అమల్లో్లకి తెచ్చిన విధానంతో పాఠ్యాంశానికి సంబంధించిన అంశాలే కాకుండా రోగితో మెలిగే తీరు, కేసులను నిర్వహించే పద్ధతులు, ప్రయోగాలు తదితరాలన్నింటా నూతన విధానాలను తీసుకొచ్చింది. – సాక్షి, హైదరాబాద్ వైద్యవిద్యలో చివరగా 1998 సంవత్సరంలో అప్పటి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సంస్కరణలు వచ్చాయి. ఆ తర్వాత 2018లో మరిన్ని సంస్కరణలను ప్రభుత్వం తీసుకురాగా... వాటిని 2022’–23 సంవత్సరం నుంచి ఎన్ఎంసీ అమలు చేస్తోంది. పుస్తకాల్లోని సిలబస్ ఆధారంగా పాఠ్యాంశాలను అర్థం చేసుకున్నప్పటికీ... అభ్యసన కార్యక్రమాలన్నీ నైపుణ్యంఆధారంగా చేపట్టేలా వైద్య విద్య సాగాలని ఎన్ఎంసీ ఆదేశించింది. ఈ మేరకు నైపుణ్య ఆధారిత పీజీ వైద్య విద్యను ప్రవేశపెట్టింది. ఆ మేరకు నిబంధనలు పొందుపరిచి అందుకు సంబంధించిన మార్గదర్శకాలను వైద్య విద్యాసంస్థలకు జారీ చేసింది. ఇప్పటివరకు పీజీ వైద్య విద్యార్థులు పాఠ్యాంశాన్ని వినడం (థియరీ), నిపుణుల సమక్షంలో రోగులపై ప్రయోగాలు చేయడం జరిగేది. థియరీ క్లాస్‌లో విజ్ఞానాన్ని సంపాదించడం, ప్రయోగాత్మకంగా చికిత్స అందించడం, పరీక్షలకు హాజరై ఉత్తీర్ణత సాధించడం లాంటి మూడు పద్ధతులుండేవి. ఇకపై పీజీ వైద్య విద్యార్థి తాను చదువుతున్న స్పెషలైజేషన్ కోర్సుకు సంబంధించి పాఠ్యాంశాలను వినడంతోపాటు నేరుగా రోగులపై శిక్షణలో భాగంగా ప్రయోగాలు చేసే వీలు లేదు. ఎందుకంటే వైద్య విద్యార్థులు చేస్తున్న ప్రత్యక్ష ప్రయోగాలతో రోగులకు ఇతరత్రా అనారోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయి. కొన్ని సందర్భాల్లో ఇవి వికటించడంతో ప్రాణాలు సైతం కోల్పోతున్న ఉదాహరణలున్నాయి. ఈ క్రమంలో ఇకపై విద్యార్థులు పాఠ్యాంశాన్ని అర్థం చేసుకున్నాక మనుషులను పోలిన మోడల్స్ (నమూనా)పై నిర్దిష్ట పద్ధతిలో ప్రయోగాలు జరపాలి. ఉదాహరణకు గైనకాలజిస్ట్ నేరుగా డెలివరీ చేయకుండా గర్భిణిగా ఉన్న మహిళ రూపాన్ని పోలిన బొమ్మపై నిర్దేశించిన నిబంధనలు పాటిస్తూ డెలివరీ చేయాల్సి ఉంటుంది. ప్రతి మెడికల్ కాలేజీలో స్కిల్ ల్యాబ్స్ తప్పకుండా ఉండాలని జాతీయ మెడికల్ కమిషన్ స్పష్టం చేసింది. స్కిల్ ల్యాబ్ నిర్వహణ ఆధారంగా కాలేజీలకు ర్యాంకింగ్ లు సైతం ఇవ్వనున్నట్లు తాజా మార్గదర్శకాల్లో పొందుప ర్చింది. స్కిల్ ల్యాబ్స్‌లో వైద్య విద్యార్థులు నైపుణ్యం ఆధారిత విజ్ఞానాన్ని పెంచుకుంటారు. ఇందులో అన్ని వైద్యశాస్త్రాలకు సంబం ధించిన అన్ని నమూనాలు, ఉదాహరణలతో సహా అందుబాటులో ఉంటాయి. స్కిల్ ల్యాబ్స్ ఆధారంగానే పీజీ సీట్ల కేటాయింపు ఉంటుంది. Ü పీజీ వైద్య విద్యా ర్థులు రోగితో ఎలా మాట్లాడాలి... వారితో ఎలాంటి వైఖరిని కలిగి ఉండాలి తదితర అంశాలపైనా అవగాహన కల్పిస్తారు. అదేవిధంగా ప్రతి మూడు నెలలకోసారి ప్రతి అంశంపైనా ప్రయోగ పరీక్షలు నిర్వహిస్తారు. పాఠ్యాంశ పరిజ్ఞానం, రోగితో మాట్లాడటం, ప్రయోగ పరీక్షలు చేసి చూపడంపై ఎగ్జామ్స్ ఉంటాయి. ప్రతి మూడు నెలలకోసారి ప్రతి సబ్జెక్ట్‌పై కొన్ని లక్ష్యాలను చేరుకుంటూ కోర్సును ముందుకు తీసుకెళ్లాలి. పీజీ వైద్యవిద్యలో ప్రస్తుతం 77 సబ్జెక్టులు ఉన్నాయి. అందులో 30 ఎండీలు, 6 ఎంఎస్‌లు, 19 డిప్లొమాలు, 15 డీఎంలు, 7 ఎంసీహెచ్‌ల విభాగాలు ఉంటాయి. ప్రతి కోర్సుకు మూడు నెలలకోసారి ఏం సాధించాలో లక్ష్యాలు ఉంటాయి. రోగితో ఎలా వ్యవహరిస్తారన్న దానిపై ప్రతి మూడు నెలలకోసారి పరీక్ష ఉంటుంది. రోగితో ఎలా మాట్లాడాలన్న దానిపై శిక్షణ ఇస్తారు. కఠినంగా ఉంటే మార్పులు చేపట్టే అవకాశం ఉంటుంది. -
చైనా చదువులపై తస్మాత్ జాగ్రత్త
సాక్షి, అమరావతి: చైనాలో చదవాలనుకునే విద్యార్థులు భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా వాటిలో చేరే ముందే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ), అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ), నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) హెచ్చరించాయి. ఈ మేరకు యూజీసీ, ఏఐసీటీఈ ఉమ్మడిగా, ఎన్ఎంసీ వేర్వేరుగా ఇటీవల సర్క్యులర్లు విడుదల చేశాయి. గత కొంతకాలంగా చైనాలో మళ్లీ కోవిడ్ తీవ్రరూపం దాలుస్తోంది. కేసులు, మరణాలు భారీగా పెరుగుతున్నాయి. దీంతో చైనా ప్రయాణ ఆంక్షలను కఠినతరం చేసింది. విద్యార్థులకు ఆన్లైన్లో కోర్సులు ఆఫర్ చేస్తోంది. ఈ నేపథ్యంలో చైనా విద్యాసంస్థల్లో చదవాలనుకునే విద్యార్థులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని యూజీసీ, ఏఐసీటీఈ, ఎన్ఎంసీ సూచించాయి. ఒకటికి రెండుసార్లు బేరీజు వేసుకుని మంచి విద్యాసంస్థలను ఎంపిక చేసుకోవాలని కోరాయి. ‘కోవిడ్ నేపథ్యంలో చైనా ప్రభుత్వం నవంబర్ 2020 నుంచి అన్ని వీసాలను సస్పెండ్ చేసింది. వీటి కారణంగా పెద్ద సంఖ్యలో భారతీయ విద్యార్థులు తమ చదువులను కొనసాగించేందుకు చైనాకు తిరిగి వెళ్లలేకపోయారు. ఆ ఆంక్షలను ఇంకా తొలగించలేదు సరికదా చదువుల కొనసాగింపునకు వీలుగా ఇప్పటివరకు పరిమితులతో కూడా సడలింపు ఇవ్వలేదు. ఈ తరుణంలో చైనాలోని కొన్ని విశ్వవిద్యాలయాలు ప్రస్తుత, రాబోయే విద్యా సంవత్సరాలకు వివిధ డిగ్రీ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి నోటీసులు జారీ చేశాయి. వివిధ కోర్సుల్లో చేరిన వారితోపాటు కొత్తగా చేరే వారికి ఆయా కోర్సులను ఆన్లైన్లో నిర్వహిస్తామని ఆ వర్సిటీలు తెలిపాయి. భారతదేశంలో ప్రస్తుత నిబంధనల ప్రకారం.. ముందస్తు అనుమతి లేకుండా ఆన్లైన్ విధానంలో అభ్యసించే డిగ్రీ కోర్సులను యూజీసీ, ఏఐసీటీఈ గుర్తించవు. విద్యార్థులు నిర్దిష్ట డిగ్రీ కోర్సును ఎంచుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. దేశంలో అనుమతులు లేని కోర్సులను విదేశాల్లో అభ్యసించడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి’ అని ఏఐసీటీఈ, యూజీసీ హెచ్చరించాయి. ఆన్లైన్ విధానంలో సమస్యలు.. నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) కూడా ఇదే విధమైన నోటీసును ఈ ఏడాది ఫిబ్రవరిలో జారీ చేసింది. చైనా వర్సిటీల్లో చదవాలనుకునే విద్యార్థులకు ఆ దేశం విధించిన కఠినమైన ఆంక్షల గురించి ముందుగానే నోటీసు ద్వారా తెలియజేసింది. విదేశీ వర్సిటీల్లో విద్యను అభ్యసించడానికి తగిన దేశాన్ని ఎంచుకోవడంలో జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది. కోవిడ్ కేసులు వెలుగుచూడటంతో 2020 మార్చిలో భారతీయ విద్యార్థులు స్వదేశానికి తిరిగి వచ్చారు. అప్పటి నుంచి ఆన్లైన్ విధానంలో చదువులను కొనసాగిస్తున్నారు. ఈ విధానంలో విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వైద్య విద్యార్థులకు ప్రాక్టికల్స్ విషయంలో మరిన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ సమస్యను చైనాతో చర్చించి పరిష్కరించాలని విద్యార్థులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. -
మార్పు ఎందుకు మహాశయా?
దేనికైనా సమయం, సందర్భం ఉండాలి. అదీ కాకుంటే, అత్యవసరమైనా ఉండాలి. అవేవీ లేకుండా సాధారణ అంశాలలో అవసరం లేని మార్పులు చేసి, వాటిని అసాధారణ చర్చనీయాంశాలుగా మార్చడం ఇటీవల ప్రబలుతున్న పాలకుల, పాలనా సంస్థల వైఖరి. దానికి తాజా ఉదాహరణ – పట్టభద్రులయ్యాక వృత్తి బాధ్యతలు చేపట్టే ముందు వైద్యులు చేసే శపథాన్ని మార్చాలంటూ జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) చేసిన సూచన. దాదాపు ప్రపంచ వ్యాప్తంగా వైద్యవృత్తిలోకి వచ్చేవారందరూ ఆనవాయితీగా చేసే హిప్పోక్రేట్స్ శపథాన్ని మన దేశంలో ఆయుర్వేద వైద్య శిఖామణి చరకుడు పేర్కొన్న మాటలతో మార్చాలన్న హఠాత్ సూచన వివాదాస్పదమైంది. ఇకపై కళాశాలల్లో తెల్లకోటు వేసుకొని వృత్తిలోకి వచ్చే వైద్య విద్యార్థులు సర్వసాధారణ ‘హిప్పోక్రేట్స్ ప్రమాణా’నికి బదులుగా ఎన్ఎంసీ వెబ్‌సైట్‌లోని ‘మహర్షి చరకుడి శపథం’ చేయాల్సి ఉంటుంది. దేశంలోని వైద్య కళాశాలలతో ఈ ఫిబ్రవరి 7 నాటి సమావేశంలో ఎన్ఎంసీ ఈ సంగతి చెప్పడంతో తేనెతుట్టె కదిలినట్టయింది. వైద్య విద్య, విధానాలను నియంత్రించడానికి దేశంలోని ‘భారతీయ వైద్య మండలి’ స్థానంలో రెండేళ్ళ క్రితం 2020లో ఎన్ఎంసీని పెట్టారు. పాలకుల ఆశీస్సులతో పుట్టుకొచ్చిన ఈ కొత్త నియంత్రణ వ్యవస్థ వారి భావధారను ప్రవచిస్తూ, ప్రచారంలో పెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో ఈ శపథంలో మార్పు కూడా భాగమని విమర్శలు వస్తున్నాయి. 3 లక్షలకు పైగా సభ్యులున్న ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఈ మార్పును వ్యతిరేకించింది. ఇది వైద్యవిద్యను సైతం కాషాయీకరించే ప్రయత్నమని రాజకీయ వాదులు ఆరోపిస్తున్నారు. నిజానికి, ప్రస్తుతం ప్రపంచమంతటా వైద్యులు చేస్తున్న శపథానికీ ఓ చరిత్ర ఉంది. అది ప్రపంచ వైద్యచరిత్రలో ప్రముఖుడిగా భావించే క్రీస్తుపూర్వం 4 – 5 శతాబ్దాలకు చెందిన గ్రీకు వైద్యశిఖామణి హిప్పోక్రేట్స్ తన వైద్యగ్రంథంలో పేర్కొన్న మాటలని భావన. అయితే, అది ఆయన వ్యక్తిగతంగా రాసినది కాకపోవచ్చనే వాదనా ఉంది. ఎవరిదైనప్పటికీ వైద్యంలో నైతిక విలువలపై ప్రాచీన భావవ్యక్తీకరణ అదేననీ, నేటికీ దానికి ప్రాధాన్యం ఉందనీ పాశ్చాత్య ప్రపంచం భావిస్తుంటుంది. రోగి గోప్యతను కాపాడడం, చెడు చేయకపోవడం లాంటి విలువలను ప్రస్తావించే ప్రమాణం అది. ‘రోగి స్వస్థత కోసమే తప్ప, అతనికి నష్టం కలిగించడానికి వైద్యాన్ని వాడను. అడిగినా సరే ఎవరికీ విషమివ్వను. ఎవరి గడపతొక్కినా, అస్వస్థులకు సాయపడేందుకే ప్రయత్నిస్తాను. ఉద్దేశ పూర్వకంగా ఎవరికీ హాని చేయను. ఏ రోగిని కలిసినా, ఆ వ్యక్తి గోప్యతకు భిన్నంగా వివరాలు బయటపెట్టను’ అని సాగుతుంది ఆ శపథం. నైతికత రీత్యా ఆ భావనలన్నీ ఎవరికైనా, ఎప్పటికైనా అనుసరణీయాలే. ఇంకా చెప్పాలంటే, ప్రతిపాదిత ‘చరక శపథం’లోనూ ఇలాంటి మాటలే ఉన్నాయి. ప్రాచీన భారతీయ వైద్యానికి ప్రాతిపదిక ‘చరక సంహిత’లో ఔషధ చికిత్స చరకుడు చెబితే, క్రీ.శ. 4వ శతాబ్దపు శుశ్రుతుడు శస్త్రచికిత్సా విధానాన్ని వివరించాడు. గ్రీకు విధానాల కన్నా మన ఆయుర్వేద పద్ధతులే మెరుగైనవనీ ఓ వాదన. ఆ తులనాత్మక చర్చలోకి వెళ్ళకుండా, చరక సంహితలో భావాలు చూస్తే – వాటికీ, హిప్పోక్రేట్స్ మాటలకూ సారంలో ఆట్టే తేడా లేదు. మంచి మాటలు పేర్కొన్నది హిప్పోక్రేట్స్ అయితేనేం? చరకుడు అయితేనేం? అది గ్రహించకుండా, అందులో ఏం తప్పుందని ఇప్పుడీ మార్పు చేస్తున్నట్టు? ఏ సంకేతాలివ్వడానికి చేస్తున్నట్టు? ప్రపంచమంతటా అక్షరమక్షరం ఒకేలా వైద్య శపథం లేకున్నా, స్ఫూర్తి మాత్రం రోగి గోప్యత, ఆరోగ్య పరిరక్షణే! అమెరికన్, బ్రిటీష్ మెడికల్ అసోసియేషన్లకూ హిప్పోక్రేట్స్ మాటలే ప్రాతిపదిక. ప్రపంచ మెడికల్ అసోసియేషన్ సైతం 1949లో అంతర్జాతీయ వైద్య నైతిక సూత్రావళిని చేపట్టింది. కాలగతిలో మార్పులు చేసుకుంటూ, నిరుడు మే నెలలో వైద్య ప్రపంచంతో పాటు మొత్తం సమాజానికి ఆధునిక అంతర్జాతీయ సూత్రావళి ప్రతిపాదననూ ప్రచురించింది. మన దగ్గర వైద్యకళాశాలల్లో చేయించే శపథంలోని మాటల్లో ఎడనెడ మార్పులున్నా ‘వైద్యో నారాయణో హరిః’ అనే భావనలో మార్పు లేదు. సాక్షాత్తూ దైవంగా భావించే ఆ ప్రాణదాతల నైతికతలో మార్పు లేదు. వరుస కరోనా వేవ్‌లలో పోరాడుతున్న వైద్యప్రపంచంలో ఇప్పుడీ కొత్త రచ్చ అవసరమా? వైద్య శపథాన్ని మారిస్తే వచ్చే ప్రత్యేక లాభమేమిటో అర్థం కాదు. ప్రభువుల మనసెరిగి ప్రవర్తించడానికో, మనసు చూరగొనడానికో మార్చాలనుకొంటే అంత కన్నా అవివేకమూ లేదు. అయితే, పాలకవర్గాలు సాగిస్తున్న పచ్చి కాషాయీకరణకు ఇది పరాకాష్ఠ అనేది ఆధార రహిత ఆరోపణ అని సంప్రదాయవాదుల మాట. ‘ఎయిమ్స్’ లాంటిచోట వార్షిక స్నాతకోత్సవంలో అనేక ఏళ్ళుగా చరక శపథమే చేస్తున్నారంటున్నారు. అలాగే అనుకున్నా, ఊరంతా ఒక దారి అయితే, ఉలిపికట్టెది ఒక దారిగా ప్రపంచ పోకడకు భిన్నంగా తీసుకుంటున్న హఠాన్నిర్ణయానికి సహేతుకత ఏమిటో అర్థం కాదు. ఆర్థిక సరళీకరణతో ప్రపంచమంతా కుగ్రామంగా మారిన రోజుల్లో ఈ వైద్య శపథంలో మాత్రం అందరి బాట కాదనే అత్యవసరం ఏమొచ్చింది? ఆ మాటకొస్తే ఏ ప్రమాణం చేశామన్నదాని కన్నా, దాన్ని ఏ మేరకు పాటిస్తున్నాం, అలాంటి వైద్య, ఆరోగ్య రంగానికి బడ్జెట్లలో ఏ మాత్రం తోడ్పాటునిస్తున్నాం అన్నది కీలకం. పాలకులు చూడాల్సింది ఆ ప్రజా సంక్షేమం. అవి చేస్తామని శపథాలు చేసి గద్దెనెక్కి, తీరా ఆ చేతలు వదిలేసి, ఈ చిన్న మాటలు పట్టు కొంటే ఎలా? ఈ కరోనా కష్టకాలంలో పట్టించుకోవాల్సింది – ఆ శపథాలనే కానీ, ఈ శపథాలను కాదు!