PKL
-
తెలుగు టైటాన్స్ ఘోర ఓటమి..
పుణే: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో తెలుగు టైటాన్స్ జోరుకు హరియాణా స్టీలర్స్ చెక్ పెట్టింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో హరియాణా ఏకంగా 21 పాయింట్ల తేడాతో టైటాన్స్‌ను ఓడించింది. స్టీలర్స్ 46–25 స్కోరుతో తెలుగు టైటాన్స్ జట్టును చిత్తు చేసింది. రెయిడర్ వినయ్ (7) ఆరంభం నుంచే క్రమం తప్పకుండా పాయింట్లు తెచి్చపెట్టడంతో హరియాణా ఆధిక్యంలోకి వెళ్లింది. తర్వాత మరో రెయిడర్ శివమ్ పతారే (12) కూతలో పాయింట్ల వేగం పెంచడంతో స్కోరు అమాంతం పెరిగిపోయింది. మిగతా వారిలో ఆల్‌రౌండర్ మొహమ్మద్ రెజా (5), డిఫెండర్లు రాహుల్ (4), సంజయ్ (3) రాణించడంతో స్టీలర్స్ ఎదురులేని విజయం సాధించింది. టైటాన్స్ తరఫున స్టార్ రెయిడర్ ఆశిష్ నర్వాల్ (13) అదరగొట్టాడు. 14 సార్లు కూతకెళ్లిన ఆశిష్ రెయిడింగ్‌లో 11 పాయింట్లు చేశాడు. ప్రత్యర్థి రెయిడర్లు నిలువరించి రెండు టాకిల్ పాయింట్లు సాధించాడు. కెపె్టన్ విజయ్ మాలిక్ 5, డిఫెండర్ అంకిత్ 2 పాయింట్లు చేశారు. మొత్తం 12 జట్లు పోటీపడుతున్న ప్రొ కబడ్డీ లీగ్‌లో ఇప్పటి వరకు 18 మ్యాచ్‌లు ఆడి హరియాణా 14 మ్యాచ్‌ల్లో గెలిచింది.4 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. 72 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో కొనసాగుతోంది. తెలుగు టైటాన్స్ జట్టు 18 మ్యాచ్‌ల్లో 10 విజయాలు, 8 పరాజయాలతో 54 పాయింట్లు సాధించి ఆరో స్థానంలో నిలిచింది. అనంతరం జరిగిన రెండో మ్యాచ్‌లో దబంగ్ ఢిల్లీ 30–26 స్కోరుతో పుణేరి పల్టన్‌పై గెలుపొందింది. దబంగ్ జట్టును కెప్టెన్ అశు మలిక్ (13) ముందుండి నడిపించాడు. 19 సార్లు రెయిడింగ్‌కు వెళ్లిన 13 పాయింట్లు తెచ్చి పెట్టాడు. సహచరుల్లో నవీన్ కుమార్ (4), యోగేశ్ (3), ఆశిష్ (2) స్కోరు చేశారు. పుణేరి జట్టులో అత్యధికంగా రెయిడర్ మోహిత్ గోయత్ 7 పాయింట్లు చేశాడు. మిగతా వారిలో పంకజ్ మోహితె (5), ఆకాశ్ షిండే (4), అమన్ (3) రాణించారు. దబంగ్ ఢిల్లీ 17 మ్యాచ్‌లు ఆడి 8 విజయాలు, 5 పరాజయాలు, 4 ‘టై’లతో కలిపి మొత్తం 56 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. పుణేరి పల్టన్ 18 మ్యాచ్‌లు పూర్తి చేసుకుంది. 7 మ్యాచ్‌ల్లో నెగ్గి, 8 మ్యాచ్‌ల్లో ఓడింది. 3 మ్యాచ్‌లను ‘టై’గా ముగించింది. 49 పాయింట్లతో ఏడో ర్యాంక్‌లో ఉంది. నేడు జరిగే మ్యాచ్‌ల్లో గుజరాత్ జెయింట్స్‌తో జైపూర్ పింక్‌పాంథర్స్ (రాత్రి 8 గంటల నుంచి), బెంగాల్ వారియర్స్‌తో బెంగళూరు బుల్స్ (రాత్రి 9 గంటల నుంచి) తలపడతాయి. -
పట్నా ఫటాఫట్
నోయిడా: స్టార్ రెయిడర్లు దేవాంక్, అయాన్ విజృంభించడంతో ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్లో పట్నా పైరేట్స్ ఘనవిజయం సాధించింది. లీగ్‌లో భాగంగా మంగళవారం జరిగిన పోరులో పట్నా పైరెట్స్ 54–31 పాయింట్ల తేడాతో బెంగళూరు బుల్స్‌ను చిత్తు చేసింది. మ్యాచ్ ఆరంభం నుంచి పూర్తి ఆధిపత్యం కనబర్చిన పట్నా ప్రత్యర్థికి కోలుకునే అవకాశమే ఇవ్వలేదు. దేవాంక్ 16 పాయింట్లు, అయాన్ 12 పాయింట్లతో సత్తా చాటారు. బెంగళూరు బుల్స్ తరఫున అక్షిత్ ధుల్ (7 పాయింట్లు) కాస్త పోరాడాడు. స్టార్ రెయిడర్ ప్రదీప్ నర్వాల్ ఒక్క పాయింట్‌కే పరిమితమయ్యాడు. ఓవరాల్‌గా పట్నా 32 రెయిడ్ పాయింట్లు సాధిస్తే... బెంగళూరు జట్టు 13కే పరిమితమైంది. ప్రత్యరి్థని మూడుసార్లు ఆలౌట్ చేసిన పైరేట్స్... తాజా లీగ్‌లో ఏడో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఈ ఫలితంతో పాయింట్ల పట్టికలో పట్నా పైరెట్స్ మూడో స్థానానికి చేరింది. మరోవైపు బెంగళూరు బుల్స్ వరుసగా ఐదో పరాజయం మూటగట్టుకుంది. పుణేరి పల్టన్, యూపీ యోధాస్ మధ్య జరిగిన మరో మ్యాచ్ 29–29 పాయింట్లతో ‘టై’గా ముగిసింది. యూపీ యోధాస్ తరఫున భవానీ రాజ్‌పుత్ 10 పాయింట్లు సాధించగా... పల్టన్ తరఫున పంకజ్ 9 పాయింట్లు సాధించాడు. లీగ్‌లో భాగంగా నేడు దబంగ్ ఢిల్లీతో గుజరాత్ జెయింట్స్ (రాత్రి 8 గంటలకు), యు ముంబాతో తెలుగు టైటాన్స్ (రాత్రి 9 గంటలకు) తలపడతాయి. -
బెంగాల్ భారీ విజయం
హైదరాబాద్, నవంబర్ 9, 2024: ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్)లో బెంగాల్ వారియర్స్ దుమ్మురేపింది. అన్నింటా ఆధిపత్యం ప్రదర్శించిన బెంగాల్ శనివారం గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో 40-29తో బెంగళూరు బుల్స్‌పై ఘన విజయం సాధించింది. సమిష్టి ప్రదర్శన కనబరిచిన బెంగాల్ తరపున నితిన్‌కుమార్(14), మన్‌దీప్‌సింగ్(10) సూపర్-10తో కదంతొక్కారు. మరోవైపు బెంగళూరు జట్టులో అక్షిత్(11), అజింక్యా పవార్(8) రాణించినా..పర్దీప్ నార్వల్(2) ఘోరంగా విఫలమయ్యాడు.బెంగాల్ జోరు: ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్)లో జట్ల మధ్య పోరు రసవత్తరంగా సాగుతున్నది. లీగ్‌లో కీలకమైన ప్లేఆఫ్స్ దశకు చేరుకోవాలంటే గెలక తప్పని పరిస్థితుల నేపథ్యంలో అన్ని జట్లు తుదికంటా పోరాడుతున్నాయి. శనివారం బెంగళూరు బుల్స్, బెంగాల్ వారియర్స్ మధ్య మ్యాచ్ అభిమానులను ఆకట్టుకుంది. మాజీ చాంపియన్ బెంగాల్ తమదైన రీతిలో బెంగళూరుపై జోరు కనబరిచింది. ముఖ్యంగా స్టార్ రైడర్ మన్‌దీప్‌సింగ్ దూకుడు కనబరిచాడు. తన తొలి రైడ్‌లోనే సుబ్రమణ్యంను ఔట్ చేసి బెంగాల్ పాయింట్ల ఖాతా తెరిచాడు. మరోవైపు పర్దీప్ నార్వల్ అంతగా ఆకట్టుకోలేకపోయాడు. మ్యాచ్ 16వ నిమిషంలో డూ ఆర్ డై రైడ్‌కు వెళ్లిన బెంగళూరు రైడర్ అక్షిత్‌ను నితీశ్‌కుమార్ ఉడుం పట్టుతో బెంగాల్‌కు పాయింట్ అందించాడు. రెండు నిమిషాల వ్యవధిలో రైడ్‌కు వెళ్లిన మన్‌దీప్‌సింగ్..ఈసారి నితిన్ రావల్, పర్దీప్ నర్వాల్‌ను ఔట్ రెండు పాయింట్లతో బెంగాల్ జట్టులో జోష్ నింపాడు. బెంగళూరు తరఫున పర్దీప్ నార్వల్ విఫలమైనా..అక్షిత్ వరుస పాయింట్లతో ఆకట్టుకున్నాడు. ఓవైపు రైడింగ్‌తో పాటు డిఫెన్స్‌లోనూ బెంగాల్ జోరు కనబర్చడంతో బెంగళూరు ఢీలా పడిపోయింది. ఈ క్రమంలో తొలి అర్ధభాగం ముగిసే సరికి బెంగాల్ 15-12తో బెంగళూరుపై ఆధిక్యంలో నిలిచింది.అదే దూకుడు: కీలకమైన ద్వితీయార్ధంలో బెంగాల్ పాయింట్ల వేటలో అదే దూకుడు కనబరిచింది. అంతగా అనుభవం లేని బెంగళూరును బోల్తా కొట్టిస్తూ కీలక పాయింట్లు కొల్లగొట్టింది. మ్యాచ్ 17వ నిమిషంలో డూ ఆర్ డై రైడ్‌కు వచ్చిన నితిన్‌కుమార్..లకీకుమార్ను ఔట్ చేసి బెంగాల్‌ను ఆధిక్యంలో నిలిపాడు. నిమిషం తేడాతో రైడ్‌కు వచ్చిన మనిందర్‌సింగ్..నితిన్ నార్వల్, అజింక్యా పవార్‌ను ఔట్ చేయడంతో బెంగళూరు తొలిసారి ఆలౌటైంది. అంతగా ప్రభావం చూపని పర్దీప్ నార్వల్ స్థానంలో మరో ప్లేయర్‌ను బెంగళూరు సబ్‌స్టిట్యూట్‌గా తీసుకుంది. మ్యాచ్ మరో మూడు నిమిషాల్లో ముగస్తుందనగా బెంగళూరు రెండో సారి ఆలౌట్ కావడంతో బెంగాల్ విజయం ఖరారైంది. మ్యాచ్ ఆసాంతం మన్‌దీప్‌సింగ్ రైడింగ్ జోరు సాగింది. -
టైటాన్స్ అదుర్స్.. తలైవాస్‌పై ఉత్కంఠ విజయం
హైదరాబాద్, నవంబర్ 6: ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్)లో మరోపోరు అభిమానులను కట్టిపడేసింది. గచ్చిబౌలి స్టేడియం వేదికగా బుధవారం హోరాహోరీగా సాగిన పోరులో తెలుగు టైటాన్స్ 35-34 తేడాతో తమిళ్ తలైవాస్‌పై ఉత్కంఠ విజయం సాధించింది. పీకేఎల్-8వ సీజన్ తర్వాత తలైవాస్‌పై టైటాన్స్‌కు ఇదే తొలి విజయం కావడం విశేషం. టైటాన్స్ తరఫున స్టార్ రైడర్ పవన్ సెహ్రావత్ 12 పాయింట్లతో అదరగొట్టగా, అశిష్ నార్వల్(9), విజయ్ మాలిక్(4) ఆకట్టుకున్నారు. మరోవైపు తలైవాస్ జట్టులో సచిన్ 17 పాయింట్లతో టాప్‌స్కోరర్‌గా నిలిచినా జట్టును గెలిపించలేకపోయాడు. సచిన్‌కు తోడు నితీశ్‌కుమార్(4), నరేందర్(3) ఫర్వాలేదనిపించారు. పీకేఎల్‌లో 1000 పాయింట్ల క్లబ్లో సచిన్ తాజాగా చేరాడు. వరుసగా హ్యాట్రిక్ విజయంతో టైటాన్స్ 21 పాయింట్లతో 4వ స్థానంలోకి దూసుకురాగా, తలైవాస్ 21 పాయింట్లతో మూడులో ఉంది.ఇరు జట్లు హోరాహోరీగా..లీగ్ సాగుతున్న కొద్దీ జట్ల మధ్య పోరు నువ్వానేన్నా అన్నట్లు హోరాహోరీగా సాగుతున్నది. గత సీజన్లో అభిమానులను తీవ్రంగా నిరాశపరిచిన తెలుగు టైటాన్స్ ఈసారి అంచనాలకు అనుగుణంగా ముందుకెళుతున్నది. స్థానిక అభిమానుల మద్దతుతో ప్రత్యర్థి జట్లపై ఆధిపత్యం ప్రదర్శిస్తున్నది. లీగ్‌లో ప్లేఆఫ్స్‌కు సాధించాలంటే ప్రతీ మ్యాచ్ కీలకమైన నేపథ్యంలో అన్ని జట్లు తుదికంటా పోరాడుతున్నాయి. ప్రతీ పాయింట్‌ను కీలకంగా భావిస్తూ దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఇప్పుడు ఇదే కోవలో తెలుగు టైటాన్స్, తమిళ్ తలైవాస్ మధ్య పోరులో తొలి అర్ధభాగం ఉత్కంఠగా సాగింది. తొలి 20 నిమిషాల ఆట ముగిసే సరికి టైటాన్స్ 20-17 తేడాతో తలైవాస్‌పై ఆధిక్యం ప్రదర్శించింది. స్టార్ రైడర్ పవన్ సెహ్రావత్ తనదైన జోరు కనబరుస్తూ టైటాన్స్ కీలక పాయింట్లు అందించాడు. తొలి రెండు రైడ్లలో అంతగా ఆకట్టుకోలేకపోయిన పవన్ ఆ తర్వాత జూలు విదిల్చాడు. మ్యాచ్ 18వ నిమిషంలో విజయ్ మాలిక్ రైడ్‌తో టైటాన్స్ పాయింట్ల వేట ప్రారంభించింది. మరో ఎండ్‌లో పవన్ కూడా జతకలువడంతో టైటాన్స్ టాప్‌గేర్‌లోకి దూసుకొచ్చింది. మ్యాచ్ 12వ నిమిషంలో హిమాంశు, రోనక్ ఇద్దరిని పవన్ ఔట్ చేయడం ద్వారా తలైవాస్ తొలిసార ఆలౌటై టైటాన్స్‌కు నాలుగు పాయింట్లు సమర్పించుకుంది. సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన సచిన్ 11వ నిమిషంలో కిషన్, అశిష్‌ను ఔట్ చేసి తలైవాస్‌ను పోటీలోకి తీసుకొచ్చాడు. ఇక్కణ్నుంచి పోటీ మరింత రంజుగా మారింది. 6వ నిమిషంలో డూ ఆర్ డై రైడ్‌కు వచ్చిన టైటాన్స్ రైడర్ అశిష్ నార్వల్..అభిషేక్‌ను ఔట్ చేసి పాయింట్ కొల్లగొట్టాడు. తొలి అర్ధభాగం మరో 4 నిమిషాల్లో ముగుస్తుందనగా రైడ్‌కు వెళ్లిన పవన్‌ను..నితీశ్‌కుమార్ సూపర్ ట్యాకిల్‌తో కట్టడి చేశాడు.పవన్, సచిన్ దూకుడుఓవైపు టైటాన్స్ తరఫున పవన్, మరోవైపు తలైవాస్‌కు సచిన్ పాయింట్ల వేటలో తమదైన దూకుడు ప్రదర్శించారు. రైడ్‌కు వెళ్లడం ఆలస్యం పాయింట్ పక్కా అన్న రీతిలో దూసుకెళ్లారు. ప్రథమార్ధంలో తలైవాస్‌పై ఒకింత పైచేయి సాధించిన టైటాన్స్..కీలకమైన ద్వితీయార్ధంలో తడపబడింది. ఇదే అదనుగా తలైవాస్ తమ దాడులకు పదునుపెట్టింది. ఈ క్రమంలో మ్యాచ్ 14వ నిమిషంలో టైటాన్స్ ఆలౌటైంది. రెండు జట్ల రైడర్లు, డిఫెండర్లు తుదికంటా పోరాడటంతో మ్యాచ్ రసపట్టుగా సాగింది. దాదాపు ఆఖరి రైడ్‌కు వెళ్లిన సచిన్ ఔట్ కావడంతో తలైవాస్ గెలుపు ఆశలపై టైటాన్స్ నీళ్లు చల్లింది. మొత్తంగా పవన్, సచిన్ రైడింగ్ జోరు అభిమానులను కట్టిపడేసింది. -
యూ ముంబాదే విజయం
హైదరాబాద్, నవంబర్ 5: ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్)లో మరో ఆసక్తికర పోరు అభిమానులను అలరించింది. గచ్చిబౌలి స్టేడియం వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో యూ ముంబా 32-26తో దబాంగ్ ఢిల్లీపై అద్భుత విజయం సాధించింది. మంజీత్(9 పాయింట్లు), జాఫర్దనేశ్(5), సోమ్‌బీర్(3)..యూ ముంబా విజయంలో కీలకమయ్యారు. లీగ్‌లో ఇప్పటి వరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో మూడు విజయాలు, రెండు ఓటములు, ఒక టై ఎదుర్కొన్న ముంబా ప్రస్తుతం 19 పాయింట్లతో 5వ స్థానంలో ఉంది. మరోవైపు పోరాడి ఓడిన ఢిల్లీ 14 పాయింట్లతో 10వ స్థానంలో ఉంది. ఢిల్లీకి ఇది వరుసగా నాలుగో ఓటమి కావడం విశేషం. ఢిల్లీ తరఫున అషు మాలిక్(11) సూపర్-10 సాధించినా లాభం లేకపోయింది. యోగేశ్(6), రింకూ నార్వల్(2) ఆకట్టుకున్నారు.ఆది నుంచే హోరాహోరీ: యూ ముంబా, దబాంగ్ ఢిల్లీ ఆది నుంచే హోరాహోరీగా తలపడ్డాయి. స్టార్ రైడర్ నవీన్‌కుమార్ లేకుండానే ఢిల్లీ బరిలోకి దిగగా, యూ ముంబా సమిష్టి తత్వాన్ని నమ్ముకుంది. ఇరు జట్లు తమ తొలి రైడ్లలో పాయింట్లను సొంతం చేసుకోలేకపోయాయి. లీగ్‌లో వరుస ఓటములతో ఢిల్లీ తల్లడిల్లుతుంటే యూ ముంబా ప్రయాణం పడుతూలేస్తూ అన్నట్లు సాగుతున్నది. సందీప్‌ను ఔట్ చేసిన అజిత్ చవాన్..ముంబాకు తొలి పాయింట్ అందించగా, డూ ఆర్ డైకు వెళ్లిన ఢిల్లీ రైడర్ అషు మాలిక్..పర్వేశ్‌ను ఔట్ చేసి ఢిల్లీ పాయింట్ల ఖాతా తెరిచాడు. ఆ తర్వాత గేర్ మార్చిన యూ ముంబాకు మంజీత్ ఒకే రైడ్‌లో రెండు పాయింట్లు అందించి మంచి జోష్ నింపాడు.మరోవైపు అషు మాలిక్ వరుస రైడ్లలో ఢిల్లీకి పాయింట్లు అందిస్తూ పోవడంతో ఇరు జట్లు స్కోరు సమంగా సాగింది. ఢిల్లీ రైడర్ వినయ్ ఉత్త చేతులతో తిరిగిరాగా, అషు మాలిక్ తనదైన జోరు కొనసాగించాడు. మ్యాచ్ 13వ నిమిషంలో మంజీత్ స్థానంలో లోకేశ్ ముంబా జట్టులోకి వచ్చాడు. 11వ నిమిషంలో ముంబా రైడర్ జాఫర్దనేశ్..రింకూ నార్వల్ను ఔట్ చేసి జట్టును ముందంజలో నిలిపాడు. అయితే 8వ నిమిషంలో డూ ఆర్ డై రైడ్‌కు వెళ్లిన జాఫర్దనేశ్కు యోగేశ్ నుంచి చుక్కెదురైంది. ఇలా ఇరు జట్ల రైడర్లు, డిఫెండర్లు నువ్వానేనా అన్నట్లు తలపడటంతో ప్రథమార్ధం ముగిసే సరికి యూ ముంబా 13-13 ఢిల్లీ దబాంగ్ సమవుజ్జీలుగా నిలిచాయి.అదే దూకుడు: కీలకమైన ద్వితీయార్ధంలోనూ ఇరు జట్ల ప్లేయర్లు అదే దూకుడు కొనసాగించారు. ఎక్కడా వెనుకకు తగ్గకుండా పాయింట్ల వేటలో దూసుకెళ్లారు. డూ ఆర్ డై రైడ్‌కు వెళ్లిన ఢిల్లీ రైడర్ మోహిత్‌ను సోమ్భీర్ గట్టిగా పట్టుకోవడంతో ముంబా ఖాతాలో పాయింట్ చేరింది. అదే ఊపులో 17వ నిమిషంలో యోగేశ్, సందీప్‌ను ఔట్ చేసిన మంజీత్..ముంబాకు రెండు పాయింట్లు అందించాడు. నిమిషం తేడాతో జాఫర్దనేశ్..అశిష్, రింకూ నార్వల్ను ఔట్ చేయడంతో ఢిల్లీ తొలిసారి ఆలౌటైంది. ఈ క్రమంలో రెండు జట్లు సబ్స్టిట్యూషన్స్కు మొగ్గుచూపుతూ మార్పులు చేశాయి.ఓవైపు ఢిల్లీకి అషు మాలిక్ కీలకమైతే..మరోవైపు యూ ముంబాకు సునీల్ పెద్దదిక్కు అయ్యాడు. ఆట సాగుతున్నా కొద్ది యూ ముంబా కీలక పాయింట్లు ఖాతాలో వేసుకుంది. అషు మాలిక్ రైడింగ్‌కు వెళ్లిన ప్రతీసారి ఢిల్లీకి పాయింట్ అందించడంలో సఫలమయ్యాడు. అయితే అతనికి రైడింగ్‌లో సహకరించే వారు కరువయ్యారు. మ్యాచ్ 6వ నిమిషంలో డూ ఆర్ డై రైడ్‌కు వచ్చిన రోహిత్ రాఘవ్‌ను బిజేంద్ర పట్టేయడంతో ఢిల్లీకి పాయిట్ దక్కింది. మ్యాచ్ చివరి క్షణాల్లో ఢిల్లీ గెలిచేందుకు ప్రయత్నించినా..పట్టు వదలకుండా పోరాడిన యూ ముంబా విజయం సొంతం చేసుకుంది. -
ఎట్టకేలకు బెంగళూర్‌కు ఓ విజయం
హైదరాబాద్, 29 అక్టోబర్ 2024 : ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్లో వరుసగా నాలుగు మ్యాచుల్లో పరాజయాలు చవిచూసిన బెంగళూర్ బుల్స్ ఎట్టకేలకు గెలుపు బాట పట్టింది. మంగళవారం హైదరాబాద్‌లోని జిఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో దబంగ్ ఢిల్లీపై 34-32తో పైచేయి సాధించి, 2 పాయింట్ల తేడాతో ఉత్కంఠ విజయం నమోదు చేసింది. దబంగ్ ఢిల్లీకి ఇది ఐదు మ్యాచుల్లో రెండో ఓటమి కాగా, బెంగళూర్ బుల్స్‌కు ఇది ఐదు మ్యాచుల్లో తొలి విజయం కావటం గమనార్హం. బెంగళూర్ బుల్స్ తరఫున 11వ నిమిషంలో సబ్‌స్టిట్యూట్‌గా మ్యాట్‌పై అడుగుపెట్టిన జై భగవాన్ (11 పాయింట్లు) సూపర్ టెన్ ప్రదర్శనతో బుల్స్‌కు విజయాన్ని అందించాడు. దబంగ్ ఢిల్లీ ఆటగాళ్లలో ఆషు మాలిక్ (13 పాయింట్లు) సూపర్ టెన్తో మెరిసినా ఆ జట్టుకు పరాజయం తప్పలేదు. ప్రథమార్థం దబంగ్‌దే : వరుస పరాజయాలతో నైరాశ్యంలో ఉన్న బెంగళూర్ బుల్స్‌పై దబంగ్ ఢిల్లీ ధనాధన్ షో చేసింది. ఆరంభం నుంచీ దూకుడుగా ఆడుతూ పాయింట్లు సాధించింది. ప్రథమార్థం ఆటలోనే 22-14తో ఏకంగా ఎనిమిది పాయింట్ల ఆధిక్యం సొంతం చేసుకుంది. రెయిడర్లు ఆషు మాలిక్, వినయ్ అంచనాలు అందుకోవటంతో దబంగ్ ఢిల్లీకి ఎదురు లేకుండా పోయింది. కూతలో దబంగ్ ఢిల్లీకి బెంగళూర్ బుల్స్ పోటీ ఇచ్చినా.. డిఫెన్స్‌లో పూర్తిగా తేలిపోయింది. మెరుపు ట్యాకిల్స్‌తో ప్రథమార్థంలో ఓసారి బెంగళూర్ బుల్స్‌ను ఆలౌట్ చేసింది. బుల్స్ సూపర్ షో : సెకండ్‌హాఫ్‌లో దబంగ్ ఢిల్లీకి బెంగళూర్ బుల్స్ గట్టి పోటీ ఇచ్చింది. కెప్టెన్ పర్దీప్ నర్వాల్ కూతలో ముందుండి నడిపించగా.. డిఫెండర్లు సైతం ట్యాకిల్స్‌తో మెరిశారు. ఇదే సమయంలో దబంగ్ ఢిల్లీ సైతం పాయింట్లు ఖాతాలో వేసుకుంటూ వచ్చింది. దీంతో ద్వితీయార్థంలో సమవుజ్జీగా పాయింట్లు సాధించినా ప్రథమార్థంలో కోల్పోయిన ఆధిక్యం బెంగళూర్ బుల్స్‌ను వెంటాడింది. ఆఖరు పది నిమిషాల్లో అదరగొట్టే ప్రదర్శన చేసిన బెంగళూర్ బుల్స్ స్కోరు సమం చేసి ఏకంగా ఆధక్యంలోకి దూసుకెళ్లింది. కెప్టెన్ పర్దీప్ నర్వాల్‌ను దబంగ్ ఢిల్లీ నిలువరించినా.. జై భగవాన్ను ఆ జట్టు డిఫెండర్లు నిలువరించలేకపోయారు. 11 రెయిడ్ పాయింట్లతో మెరిసిన భగవాన్ బెంగళూర్ బుల్స్‌ను గెలుపు బాట పట్టించాడు. ఆటలో మూడోంతుల భాగం ఆధిక్యంలో నిలిచిన దబంగ్ ఢిల్లీ.. ఆఖర్లో బోల్తా పడింది. -
PKL 11: హర్యానా స్టీలర్స్ గెలుపు
హైదరాబాద్, 24 అక్టోబర్ 2024 : ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్లో హర్యానా స్టీలర్స్ తొలి విజయం నమోదు చేసింది. గత సీజన్ ఫైనలిస్ట్ హర్యానా స్టీలర్స్‌కు తొలి మ్యాచ్‌లో చుక్కెదురైనా.. రెండో మ్యాచ్‌లో గొప్పగా పుంజుకుంది. వరుస విజయాల ఊపుమీదున్న జైపూర్ పింక్ పాంథర్స్‌ను 37-25తో చిత్తు చేసి సీజన్లో తొలి విక్టరీ సాధించింది. కూతలో, పట్టులో హర్యానా స్టీలర్స్ ఆటగాళ్లు సమిష్టిగా రాణించటంతో పింక్ పాంథర్స్‌పై ఆ జట్టు 12 పాయింట్ల తేడాతో ఘన విజయం సాధించింది. రెయిడర్లు వినయ్ (10), నవీన్ (6), శివం (4).. డిఫెండర్లు రాహుల్ (3), మహ్మద్రెజా (2) సూపర్ షోతో మెరిశారు. జైపూర్ పింక్ పాంథర్స్ తరఫున రెయిడర్ అభిజిత్ మాలిక్ (6) ఒక్కడే ఆకట్టుకున్నాడు. రెజా (2), అర్జున్ (3), శ్రీకాంత్ (2) నిరాశపరిచారు.స్టీలర్స్ షో : తొలి మ్యాచ్‌లో ఓటమి చవిచూసిన గత సీజన్ రన్నరప్ హర్యానా స్టీలర్స్.. రెండో మ్యాచ్‌లో పుంజుకుంది. వరుసగా తొలి రెండు మ్యాచుల్లో విజయాలు సాధించిన జైపూర్ పింక్ పాంథర్స్‌ను నిలువరించి.. స్టీలర్స్ షో చేసింది. తొలి 20 నిమిషాల ఆటలోనే ఆధిపత్యం చూపించిన హర్యానా స్టీలర్స్ విజయానికి గట్టి పునాది వేసుకుంది. రెయిడింగ్, ట్యాక్లింగ్‌లో దుమ్మురేపిన స్టీలర్స్ ప్రథమార్థంలో 20-11తో తొమ్మిది పాయింట్ల ఆధిక్యం సాధించింది. రెయిడర్ వినయ్ సూపర్ టెన్తో చెలరేగగా.. నవీన్ సైతం అదరగొట్టాడు. డిఫెన్స్‌లో రాహుల్, మహ్మద్రెజా ఆకట్టుకున్నారు.మరోవైపు జైపూర్ పింక్ పాంథర్స్ సమిష్టిగా రాణించటంలో విఫలమైంది. ఇటు కూతలో, అటు పట్టులో తేలిపోయింది. ప్రథమార్థంలో 11 పాయింట్లు సాధించిన పింక్ పాంథర్స్ ద్వితీయార్థంలో ఆ మాత్రం ప్రదర్శన సైతం చేయలేకపోయింది. ఆల్‌రౌండ్ షోతో చెలరేగిన హర్యానా స్టీలర్స్ ఆటగాళ్లు ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్లో తొలి విజయం సాధించారు. ఈ సీజన్లో మూడు మ్యాచుల ఆడిన పింక్ పాంథర్స్‌కు ఇది తొలి పరాజయం. -
PKL 11: బెంగాల్ వారియర్స్ బోణీ, యూపీ యోధాస్‌పై 32-29తో గెలుపు
హైదరాబాద్, 24 అక్టోబర్ 2024: ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్లో బెంగాల్ వారియర్స్ బోణీ కొట్టింది. హ్యాట్రిక్ విజయంపై కన్నేసి బరిలోకి దిగిన యూపీ యోధాస్‌పై బెంగాల్ వారియర్స్ మెరుపు విజయం నమోదు చేసింది. హైదరాబాద్‌లోని జిఎంసీ బాలయోగి ఇండోర్‌స్టేడియంలో గురువారం జరిగిన తొలి మ్యాచ్‌లో యూపీ యోధాస్‌పై బెంగాల్ వారియర్స్ 32-29తో గెలుపొందింది. ఉత్కంఠ మ్యాచ్‌లో మూడు పాయింట్ల తేడాతో విజయం సాధించిన బెంగాల్ వారియర్స్.. యూపీ యోధాస్‌కు సీజన్లో తొలి ఓటమి రుచి చూపించింది. బెంగాల్ వారియర్స్ సమిష్టి ప్రదర్శనతో రాణించింది. రెయిడర్లు మణిందర్ సింగ్ (8), నితిన్ (7), సుశీల్ (7) అదరగొట్టారు. యూపీ యోధాస్ ఆల్‌రౌండర్ భరత్ (13) సూపర్ టెన్తో షో చేసినా.. ఫలితం దక్కలేదు.ప్రథమార్థం హోరాహోరీ : బెంగాల్ వారియర్స్, యూపీ యోధాస్ తొలి అర్థభాగం ఆటలో నువ్వా నేనా అన్నట్టు పోటీపడ్డాయి. తొలి రెండు మ్యాచుల్లో విజయాలతో ఊపుమీదున్న యూపీ యోధాస్‌ను ఒత్తిడిలో నిలువరించిన బెంగాల్ వారియర్స్ 12-11తో ప్రథమార్థంలో ఆధిక్యం సాధించింది. ఇరు జట్లూ రెయిడింగ్, డిఫెన్స్‌లో బలంగా ఉండటంతో ఏ జట్టు సైతం ఆలౌట్ స్కోరు చేయలేకపోయింది. భరత్ సక్సెస్ఫుల్ రెయిడ్‌తో యూపీ యోధాస్ తొలుత ఖాతా తెరిచినా.. బెంగాల్ వారియర్స్‌ను మణిందర్ సింగ్ ముందుండి నడిపించాడు. బెంగాల్ వారియర్స్ రెయిడింగ్‌లో 9 పాయింట్లు సాధించగా, యూపీ యోధాస్ 8 పాయింట్లు ఖాతాలో వేసుకుంది. డిఫెన్స్‌లో ఇరు జట్లు మూడేసి పాయింట్లు సాధించాయి.వారియర్స్ దూకుడు : ప్రథమార్థం ఆటలో ఒక్క పాయింట్ ఆధిక్యంలో నిలిచిన బెంగాల్ వారియర్స్ విరామం అనంతరం దూకుడు పెంచింది. ఆఖరు పది నిమిషాల ఆట వరకు యూపీ యోధాస్ నుంచి గట్టి పోటీ ఎదురైంది. కానీ మణిందర్ సింగ్‌కు నితిన్ జత కలవటంతో బెంగాల్ దూకుడు ముందు యూపీ యోధాస్ నిలువలేదు. వరుసగా సక్సెస్ఫుల్ రెయిడ్స్‌తో బెంగాల్ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. 25-21తో నాలుగు పాయింట్ల ముందంజ వేసిన బెంగాల్ ఆ తర్వాత యోధాస్‌కు చిక్కలేదు. యోధాస్ రెయిడర్ భరత్ సూపర్ టెన్ ప్రదర్శనతో మెరిసినా.. ఆ జట్టుకు నిరాశ తప్పలేదు. ఆఖరు రెండు నిమిషాల్లోనూ యూపీ యోధాస్ గట్టిగా ప్రయత్నించినా అప్పటికే మ్యాచ్ బెంగాల్ వారియర్స్ చేతుల్లోకి వెళ్లిపోయింది. -
PKL Season 11: పుణెరి పల్టాన్‌కు రెండో విజయం
హైదరాబాద్, అక్టోబర్ 21: ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్లో డిఫెండింగ్ చాంపియన్ పుణెరి పల్టాన్ వరుసగా రెండో విజయం సాధించింది. రైడింగ్, డిఫెన్స్‌లో పూర్తి ఆధిపత్యం చెలాయిస్తూ 15 తేడాతో పట్నా పైరేట్స్‌ను చిత్తు చేసింది. సోమవారం రాత్రి ఇక్కడి జీఎంసీ బాలయోగి గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో పుణెరి 40–25 తేడా తో పట్నా పైరేట్స్‌పై ఘన విజయం సాధించింది. కెప్టెన్, ఆల్‌రౌండర్ అస్లాం ఇనాందార్ (9 పాయింట్లు), మోహిత్ గోతయ్ (8) సత్తా చాటారు. డిఫెండర్లు గౌరవ్ ఖత్రి (6), అమన్ (6) కూడా ఆకట్టుకున్నారు. పట్నా పైరేట్స్ జట్టులో దేవాంక్ (6), అంకిత్ (6), అయాన్ (5) పోరాడినా మిగతా ఆటగాళ్లు నిరాశ పరిచారు. ఈ మ్యాచ్‌లో పుణెరి రెండుసార్లు ప్రత్యర్థిని ఆలౌట్ చేసింది. ఈ మ్యాచ్‌లో ఆట ఆరంభం నుంచే పుణెరి జోరు ప్రదర్శించింది. వరుసగా నాలుగు పాయింట్లతో 4–0తో ఆ జట్టు మ్యాచ్‌ను మొదలు పెట్టింది. పట్నా కోర్టులో ముగ్గురే మిగలగా అస్లాం ఇనాందార్‌ను సూపర్ ట్యాకిల్ చేసిన ఆ జట్టు ఖాతా తెరిచింది. మోహిత్ గోయత్‌ను కూడా ట్యాకిల్ చేసి 4–4తో స్కోరు సమం చేసింది. కానీ, అస్లాం ఇనాందర్ డబుల్ రైడ్ పాయింట్‌తో పుణెరి మళ్లీ ఆధిక్యంలోకి వచ్చింది. అక్కడి నుంచి ఆ జట్టు వరుస పాయింట్లతో విజృంభించింది. ఈ క్రమంలో 13వ నిమిషంలో ప్రత్యర్థిని తొలిసారి ఆలౌట్ చేసి 16–8తో ఆధిక్యాన్ని రెట్టింపు చేసుకుంది. అదే జోరుతో 20–10తో మొదటి అర్ధభాగాన్ని ముగించింది. విరామం తర్వాత అస్లాం ఇనాందర్‌ను నిలువరించిన పట్నా డిఫెండర్లు పంకజ్ మోహితేను సూపర్ ట్యాకిల్ చేసి తమ జట్టును రేసులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. కానీ, పల్టాన్ రైడింగ్‌తో పాటు డిఫెన్స్‌లోనూ సత్తా చాటుతూ తన ఆధిక్యాన్ని కాపాడుకుంది. ఈ క్రమంలో పట్నా కోర్టులో మిగిలిన దేవాంక్‌ను ప్రత్యర్థికి దొరికిపోయాడు. దాంతో రెండోసారి ఆలౌట్‌కు గురైన పట్నా 15–27తో వెనుకబడింది. అస్లాంతో పాటు మోహిత్ గోయత్ రైడింగ్‌లో సత్తా చాటగా.. గౌరవ్ ఖత్రి, అమన్ తమ ఉడుం పట్టుతో పట్నా రైడర్లను ఉక్కిరిబిక్కిరి చేశారు. మరోవైపు పట్నా అన్ని విభాగాల్లో తేలిపోయింది. సబ్‌స్టిట్యూట్ ఆటగాడిగా జాంగ్ కున్ లీని దింపినా పాయింట్లు రాబట్టలేక ఓటమి మూటగట్టుకుంది. కాగా, ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్లో భాగంగా మంగళవారం జరిగే తొలి మ్యాచ్‌లో జైపూర్ పింక్ పాంథర్స్‌తో తెలుగు టైటాన్స్ తలపడుతుంది. రెండో మ్యాచ్‌లో యూపీ యోధాస్‌తో బెంగళూరు బుల్స్ పోటీ పడుతుంది. -
PKL 11: ఆల్‌రౌండ్ ప్రదర్శనతో డిఫెండింగ్ చాంపియన్ పుణెరి పల్టాన్ శుభారంభం సత్తా చాటిన గౌరవ్ ఖత్రి
హైదరాబాద్, అక్టోబర్ 19: డిఫెండింగ్ చాంపియన్ పుణెరి పల్టాన్ ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్లో శుభారంభం చేసింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో సత్తా చాటుతూ పది పాయింట్ల తేడాతో హర్యానా స్టీలర్స్‌ను చిత్తు చేసింది. శనివారం రాత్రి ఇక్కడి జీఎంసీ బాలయోగి గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో పల్టాన్ 35–25 తో స్టీలర్స్‌పై ఘన విజయం సాధించింది. తన ఉడుం పట్టుతో ప్రత్యర్థులను నిలువరించిన డిఫెండర్ గౌరవ్ ఖత్రి 7 పాయింట్లతో పుణెరి విజయంలో కీలక పాత్ర పోషించాడు. కెప్టెన్, ఆల్‌రౌండర్ అస్లాం ఇనాందర్ ఐదు పాయింట్లతో ఆకట్టుకోగా.. పంకజ్ మోహితే, మోహిత్ గోయత్, అమన్ నాలుగేసి పాయింట్లు రాబట్టారు. హర్యానా స్టీలర్స్ జట్టులో శివం పతారె, శంకర్ మిశ్రా ఐదు పాయింట్లతో టాప్ స్కోరర్‌గా నిలిచారు.. ఆల్‌రౌండర్ మొహమ్మద్ రెజా షాడ్లోయి (4), రైడర్ వినయ్ పోరాడినా మిగతా ఆటగాళ్లు నిరాశ పరిచారు. ఆట ఆరంభంలో ఇరు జట్లూ వరుస పాయింట్లతో పోటాపోటీగా తలపడ్డాయి. 6–6తో స్కోరు సమంగా ఉన్న దశలో పుణెరి పల్టాన్ వేగం పెంచింది. రైడింగ్‌లో పాటు డిఫెన్స్‌లోనూ సత్తా చాటుతూ 13వ నిమిషంలోనే హర్యానా స్టీలర్స్‌ను ఆలౌట్ చేసి 13–7తో ఆధిక్యం సాధించింది. శివం పతారే డుబ్కి స్కిల్ చూపెడుతూ రెండు పాయింట్లు తీసుకురావడంతో స్టీలర్స్9–13తో పుంజుకునేలా కనిపించింది. కానీ, పంకజ్ మోహితే మూడు పాయింట్ల సూపర్ రైడ్ చేయడంతో పుణెరి తన ఆధిక్యాన్ని 18–10కి పెంచుకుంది. పుణెరి రైడర్ మోహిత్ గోయత్‌ను చియానే చేసిన సూపర్ ట్యాకిల్ చేసి రెండు పాయింట్టు రాబట్టినా పల్టాన్ 19–13 ఆధిక్యంతో తొలి అర్ధభాగాన్ని ముగించింది. రెండో భాగంలో డిఫెండర్ చియనే సత్తా చాటినా రైడింగ్‌లో హర్యానా అంతగా ఆకట్టుకోలేక వెనుకబడింది. పుణెరి డిఫెండర్ ఖత్రి వరుసగా విజయ్, శివం పతారేను ట్యాకిల్ చేశాడు. చివరి నిమిషాల్లో ఆ జట్టు తన ఆధిక్యాన్ని మరింత పెంచుకుంది. అయితే, హర్యానా ఆఖరి రైడ్‌లో శంకర్ మిశ్రా మూడు టచ్ పాయింట్లు సహా నాలుగు పాయింట్లతో సూపర్ రైడ్ చేయడంతో హర్యానా తన ఓటమి అంతరాన్ని కాస్త తగ్గించుకుంది. ఆదివారం రాత్రి జరిగే తొలి మ్యాచ్‌లో బెంగాల్ వారియర్స్–జైపూర్ పింక్ పాంథర్స్ తలపడాయి. మరో మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్–బెంగళూరు బుల్స్ పోటీ పడతాయి. -
PKL: వేలంలోకి స్టార్ ప్లేయర్లు.. తేదీలు ఖరారు
ముంబై: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్ ప్రారంభానికి ముందు ఈ నెల 15, 16తేదీల్లో ప్లేయర్ల వేలం జరగనుంది. పవన్ షెరావత్, ప్రదీప్ నర్వాల్, మణిందర్ సింగ్, ఫజల్ అట్రాచలీ, మొహమ్మద్ రెజా వంటి పలువురు స్టార్ ప్లేయర్లు ఈసారి వేలంలో పాల్గొంటున్నారు. 88 మంది ప్రధాన ప్లేయర్లను రీటెయిన్ చేసుకున్న 12 ఫ్రాంచైజీలు.. యువ ఆటగాళ్లను దక్కించుకునేందుకు సిద్ధమవుతున్నాయి.నాలుగు కేటగిరీలువేలంలో పాల్గొంటున్న ప్లేయర్లను నాలుగు కేటగిరీలుగా విభజించారు. ‘ఎ’ కేటగిరీలో ఉన్న ప్లేయర్ల కనీస ధర రూ. 30 లక్షలు కాగా.. ‘బి’ కేటగిరీలో ఉన్న వాళ్ల బేస్ ప్రైజ్ రూ. 20 లక్షలు. ‘సి’ కేటగిరీ ప్లేయర్లకు రూ.13 లక్షలు, ‘డి’ కేటగిరీ ఆటగాళ్లకు రూ. 9 లక్షలు ప్రాథమిక ధరగా నిర్ణయించారు. వేలంలో 500 మందికి పైగా ప్లేయర్లు పాల్గొననుండగా.. ఒక్కో ఫ్రాంచైజీ ఐదు కోట్లు ఖర్చు చేయనుంది. -
PKL 2024: టైటాన్స్‌కు ఏడో ఓటమి
నోయిడా: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్లో తెలుగు టైటాన్స్ జట్టు నిరాశాజనక ప్రదర్శన కొనసాగుతోంది. యు ముంబాతో శనివారం జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 32–54తో ఓడిపోయింది. ఈ లీగ్‌లో టైటాన్స్ జట్టుకిది ఏడో పరాజయం కావడం గమనార్హం. యు ముంబా తరఫున గుమన్ సింగ్ 10 పాయింట్లు, రింకూ 8 పాయింట్లు, సోంబీర్ 8 పాయింట్లు స్కోరు చేశారు. టైటాన్స్ తరఫున రజనీశ్ 8 పాయింట్లు, రాబిన్ చౌధరీ 7 పాయింట్లు, ప్రఫుల్ 7 పాయింట్లు సాధించారు. మరో మ్యాచ్‌లో దబంగ్ ఢిల్లీ 35–25తో యూపీ యోధాస్‌ను ఓడించింది. నేడు జరిగే మ్యాచ్‌ల్లో గుజరాత్ జెయింట్స్‌తో బెంగాల్ వారియర్స్; తమిళ్ తలైవాస్‌తో బెంగళూరు బుల్స్ తలపడతాయి. -
Pro Kabaddi 2022: తెలుగు టైటాన్స్ గెలుపు
సాక్షి, హైదరాబాద్: వరుసగా 11 పరాజయాల తర్వాత ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్ జట్టు రెండో విజయం అందుకుంది. శనివారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 32–26తో యు ముంబాను ఓడించింది. టైటాన్స్ తరఫున సిద్ధార్థ్ దేశాయ్ తొమ్మిది పాయింట్లు, అభిషేక్ ఐదు పాయింట్లు, విశాల్ భరద్వాజ్ నాలుగు పాయింట్లు స్కోరు చేశారు. యు ముంబా తరఫున గుమన్ సింగ్ ఎనిమిది పాయింట్లతో రాణించాడు. ఇతర మ్యాచ్‌ల్లో దబంగ్ ఢిల్లీ 30–27తో పట్నా పైరేట్స్‌పై... జైపూర్ పింక్ పాంథర్స్ 42–29తో యూపీ యోధాస్‌పై గెలిచాయి. -
మళ్లీ ఓడిన తెలుగు టైటాన్స్
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో తెలుగు టైటాన్స్ పేలవమైన ప్రదర్శన కొనసాగుతోంది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో 24–42 స్కోరుతో హరియాణా స్టీలర్స్ చేతిలో చిత్తుగా ఓడింది. హరియాణా రెయిడర్ మీతూ శర్మ అదరగొట్టాడు. 18 సార్లు కూతకెళ్లిన మీతూ 13 పాయింట్లు సాధించాడు. మిగతా వారిలో మన్జీత్ (7), కెప్టెన్ నితిన్ రావల్ (4), జైదీప్ దహియా (4) రాణించారు. తెలుగు టైటాన్స్‌లో సిద్ధార్థ్ దేశాయ్ చేసిన 5 పాయింట్లే అత్యధిక స్కోరు. ఆదర్శ్, విజయ్ కుమార్ చెరో 4 పాయింట్లు చేశారు. ఈ సీజన్లో ఏడు మ్యాచ్‌లాడిన టైటాన్స్ ఒకే ఒక్క మ్యాచ్‌లో గెలిచింది. -
ఎట్టకేలకు గెలిచిన తెలుగు టైటాన్స్
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్‌లో వరుసగా రెండు పరాజయాల తర్వాత తెలుగు టైటాన్స్ జట్టు గెలుపు బోణీ చేసింది. మాజీ చాంపియన్ పట్నా పైరేట్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 30–21తో నెగ్గింది. టైటాన్స్ తరఫున మోనూ గోయట్ 10 పాయింట్లు, సిద్ధార్థ్ దేశాయ్ 7 పాయింట్లు, సుర్జీత్ సింగ్ 4 పాయింట్లు స్కోరు చేశారు. మరో మ్యాచ్‌లో హరియాణా స్టీలర్స్ 27–22 తో తమిళ్ తలైవాస్‌ను ఓడించింది. -
Pro Kabaddi league 2022: పట్నాను నిలువరించిన పుణేరి పల్టన్
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్‌లో శనివారం మూడు మ్యాచ్‌లు జరగ్గా... చివరి నిమిషం వరకు హోరాహోరీగా సాగిన రెండు మ్యాచ్‌లు ‘డ్రా’గా ముగిశాయి. మాజీ చాంపియన్ పట్నా పైరేట్స్‌తో జరిగిన మ్యాచ్‌ను పుణేరి పల్టన్ 34–34తో ‘డ్రా’ చేసుకోగా... గుజరాత్ జెయింట్స్, తమిళ్ తలైవాస్ మ్యాచ్ కూడా 31–31తో సమంగా ముగిసింది. మూడో మ్యాచ్‌లో హరియాణా స్టీలర్స్ 41–33తో బెంగాల్ వారియర్స్‌ను ఓడించింది. పట్నాతో మ్యాచ్‌లో పుణేరి ఆటగాళ్లు అస్లాం ఇనామ్దార్ 7, మోహిత్ గోయట్ 8, ఆకాశ్ 6 పాయింట్లు స్కోరు చేశారు. పట్నా జట్టులో రోహిత్ గులియా (6), సచిన్ (8) రాణించారు. తలైవాస్‌తో మ్యాచ్‌లో గుజరాత్ రెయిడర్ రాకేశ్ 13 పాయింట్లతో అదరగొట్టాడు. బెంగాల్‌తో మ్యాచ్‌లో హరియాణా రెయిడర్ మంజీత్ ఏకంగా 19 పాయింట్లు సాధించాడు. నేడు జరిగే మ్యాచ్‌ల్లో జైపూర్ పింక్ పాంథర్స్‌తో పట్నా పైరేట్స్; బెంగాల్ వారియర్స్‌తో తెలుగు టైటాన్స్; పుణేరి పల్టన్‌తో బెంగళూరు బుల్స్ తలపడతాయి. -
PKL 2022: పరాజయంతో మొదలు
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ తొమ్మిదో సీజన్‌ను తెలుగు టైటాన్స్ జట్టు పరాజయంతో ప్రారంభించింది. మాజీ చాంపియన్ బెంగళూరు బుల్స్‌తో శుక్రవారం జరిగిన తమ తొలి మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 29–34 పాయింట్ల తేడాతో ఓడిపోయింది. తెలుగు టైటాన్స్ తరఫున రెయిడర్లు వినయ్, రజనీశ్ ఏడు పాయింట్ల చొప్పున స్కోరు చేయగా... సిద్ధార్థ్ దేశాయ్ నాలుగు పాయింట్లతో నిరాశపరిచాడు. బెంగళూరు బుల్స్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంది. నీరజ్ నర్వాల్ (7 పాయింట్లు), భరత్ (5), వికాశ్ కండోలా (5), మహేందర్ సింగ్ (4), సౌరభ్ (4 పాయింట్లు) రాణించి బెంగళూరు విజయంలో కీలకపాత్ర పోషించారు. శుక్రవారమే జరిగిన మరో రెండు మ్యాచ్‌ల్లో దబంగ్ ఢిల్లీ 41–27తో యు ముంబాను ఓడించగా... యూపీ యోధాస్ 34–32 పాయింట్ల తేడాతో జైపూర్ పింక్ పాంథర్స్ జట్టుపై గెలుపొందింది. -
Pro Kabaddi League 9: కూతకు వేళాయె!
బెంగళూరు: ఎనిమిది సీజన్లుగా అలరిస్తున్న కబడ్డీ మరోసారి అభిమానుల ముందుకు వచ్చింది. ప్రతిష్టాత్మక ప్రొ కబడ్డీ లీగ్ తొమ్మిదో సీజన్‌కు రంగం సిద్ధమైంది. బెంగళూరులో నేడు ఈ టోర్నీ ప్రారంభం కానుంది. బెంగళూరుతో పాటు హైదరాబాద్, పుణే నగరాల్లో అన్ని మ్యాచ్‌లను నిర్వహిస్తున్నారు. కరోనా సమయంలో టీవీలకే పరిమితమైన అభిమానులు ఈ సారి నేరుగా ఆటను ఆస్వాదించడం అవకాశం నిర్వాహకులు కల్పిస్తున్నారు. ఈ మూడు వేదికల్లోనూ ఫ్యాన్స్‌ను అనుమతించనున్నారు. మొత్తం 12 జట్లు లీగ్ బరిలోకి దిగుతున్నాయి. లీగ్‌లో భాగంగా మొత్తం 66 మ్యాచ్‌లు జరుగుతాయి. శుక్రవారం జరిగే తొలి పోరులో యు ముంబాతో డిఫెండింగ్ చాంపియన్ దబంగ్ ఢిల్లీ తలపడుతుంది. జాతీయ క్రీడల్లో కబడ్డీ ఈవెంట్ ముగిసిన వారం రోజుల్లోపే అందరూ ఆటగాళ్లు లీగ్‌కు సిద్ధమై బరిలోకి దిగుతున్నారు. రాహుల్ రెడీ లీగ్ వేలంలో రూ. 2.26 కోట్ల విలువ పలికిన పవన్‌కుమార్ సెహ్రావత్ (తమిళ్ తలైవాస్)పై అందరి దృష్టీ నిలిచి ఉంది. గత సీజన్లో పునేరీ తరఫున పేలవ ప్రదర్శన కనబర్చిన స్టార్ రాహుల్ చౌదరి గాయంనుంచి కోలుకొని ఈ సారి జైపూర్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇప్పటి వరకు జరిగిన ఎనిమిది సీజన్లలో పట్నా పైరేట్స్ 3 సార్లు విజేతగా నిలవగా...బెంగాల్ వారియర్స్, బెంగళూరు బుల్స్, దబంగ్ ఢిల్లీ, జైపూర్ పింక్ పాంథర్స్, యు ముంబా ఒక్కోసారి విజేతగా నిలిచాయి. టైటాన్స్ రాత మారేనా! ప్రొ కబడ్డీ లీగ్‌లో ఇప్పటి వరకు టైటిల్ గెలవని జట్లలో తెలుగు టైటాన్స్ ఒకటి. ఎనిమిది సీజన్లు కలిపి 148 మ్యాచ్‌లలో 52 గెలిచిన టైటాన్స్, అంతకంటే ఎక్కువ పరాజయాలు (77) నమోదు చేసింది. అయితే ఇతర జట్లకంటే ఎక్కువ ‘డ్రా’లు (19) కూడా టైటాన్స్ ఖాతాలో ఉన్నాయి. వీటిని విజయాలుగా మలచుకోగలిగితే కథ వేరేగా ఉండేదేమో. టైటాన్స్ జట్టు పేలవ ప్రదర్శనతో ఏడో సీజన్లో 11వ, ఎనిమిదో సీజన్లో 12వ స్థానాల్లో నిలిచింది. అయితే ఈ సారి జట్టు కాస్త మెరుగ్గా, సమతూకంగా కనిపిస్తోంది. గత రెండు సీజన్లలో ఆకట్టుకున్న రైడర్ అభిషేక్ సింగ్‌ను తీసుకోగా, మనూ గోయత్, సిద్ధార్థ్ దేశాయ్ మళ్లీ జట్టులోకి వచ్చారు. అంకిత్ బెనివాల్, రజనీశ్, డిఫెన్స్‌లో విశాల్ భరద్వాజ్ జట్టుకు కీలకం కానున్నారు. వెంకటేశ్ గౌడ్ టీమ్‌కు కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. నేడు తమ తొలి పోరులో బెంగళూరు బుల్స్‌తో తెలుగు టైటాన్స్ తలపడుతుంది. -
అక్టోబర్ 7 నుంచి ప్రో కబడ్డీ లీగ్.. తెలుగు టైటాన్స్ షెడ్యూల్ ఇదే
ప్రో కబడ్డీ లీగ్ (పీకెఎల్) సీజన్ - 9 బెంగళూరులో అక్టోబర్ 7వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా గ్రీన్కో గ్రూప్ కో–ఫౌండర్, చైర్మన్ శ్రీనివాస్ శ్రీరామనేని, ఎన్ఈడీ గ్రూప్‌కు చెందిన మహేష్ కొల్లి, గౌతమ్ రెడ్డి తెలుగు టైటాన్స్ సీజన్ 9 కొత్త జట్టు సభ్యులను పరిచయం చేశారు. తెలుగు టైటాన్స్ టీమ్ యజమాని శ్రీనివాస్ శ్రీరామనేని మాట్లాడుతూ..''గత సీజన్ నుంచి నేర్చుకున్న పాఠాలతో ఈ సీజన్‌ను విజయవంతంగా మలుచుకోలుచుకోవాలనుకుంటున్నాం. మా కొత్త స్క్వాడ్‌కి పూర్తి శిక్షణను మా కోచింగ్ సిబ్బంది అందించారు. రాబోయే సీజన్లో అభిమానులకు గర్వకారణంగా మా టీమ్ నిలవాలని ఆకాంక్షిస్తున్నాం.’’ అని పేర్కొన్నారు. తెలుగు టైటాన్స్ టీమ్ యజమాని నేదురుమల్లి గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ ‘‘సీజన్ 9 వివో ప్రో కబడ్డీ లీగ్ ప్రారంభిస్తుండటం పట్ల సంతోషంగా ఉన్నాం. మా టీమ్‌ను గత సీజన్‌తో పోలిస్తే సమూలంగా మార్చాం. ఇప్పుడు మా టీమ్‌లో అనుభవజ్ఞులైన ఆటగాళ్లతో పాటు నూతన యువ ఆటగాళ్లు కూడా ఉన్నారు. వెంకటేష్ గౌడ్, మన్జీత్‌ల కాంబినేషన్ టీమ్‌కు కప్‌ను తేగలదని విశ్వసిస్తున్నాం. ఈ సంవత్సరం కప్ గెలవాలన్న ఏకైక లక్ష్యంతో మా టీమ్ పోటీపడుతుంది’’ అని చెప్పారు. తెలుగు టైటాన్స్ కోచ్ వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ ‘‘పర్వేష్ భైంశ్వాల్, విశాల్ భరద్వాజ్, సూర్జీత్ సింగ్, రవీందర్ పహల్ టీమ్‌లో ఉన్నారు. వీరు మా ఆటగాళ్లలో అత్యంత కీలక ఆటగాళ్లు’’ అని తెలిపారు. ఇక మ్యాచ్‌లన్నీ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం కావడంతో పాటుగా డిస్నీ+హాట్‌స్టార్‌లో కూడా చూడవచ్చని తెలిపారు. ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 9లో తెలుగు టైటాన్స్ తొలి మ్యాచ్‌ను అక్టోబర్ 7న బెంగళూరు బుల్స్‌తో ఆడనుంది. తెలుగు టైటాన్స్ జట్టు: రవీందర్ పహల్ (కెప్టెన్), సిద్దార్ధ్ దేశాయ్, అంకిత్ బెనివాల్, మోను గోయత్, రజ్నీష్, అభిషేక్ సింగ్, వినయ్, సుర్జీత్ సింగ్, విశాల్ భరద్వాజ్, పర్వేష్ భైంశ్వాల్, విజయ్ కుమార్, ఆదర్శ్ , ప్రిన్స్, నితిన్, రవీందర్, మోహిత్, హనుమంతు, ముహమ్మద్ షిహాస్, పళ్ల రామకృష్ణ, మోహసేన్ మగసౌద్లూ, హమీద్ నాడర్, అంకిత్, మోహిత్ పహల్ రిజర్వ్ ప్లేయర్- సుమిత్ తెలుగు టైటాన్స్ మ్యాచ్ షెడ్యూల్.. 7 అక్టోబర్ 2022 శుక్రవారం రాత్రి 8:30 గంటలకు: తెలుగు టైటాన్స్ vs బెంగళూరు బుల్స్, శ్రీ కంఠీరవ ఇండోర్ స్టేడియం, బెంగళూరు 9 అక్టోబర్ 2022 ఆదివారం రాత్రి 8:30 గంటలకు: తెలుగు టైటాన్స్ vs బెంగాల్ వారియర్స్, శ్రీ కంఠీరవ ఇండోర్ స్టేడియం, బెంగళూరు 11 అక్టోబర్ 2022 మంగళవారం రాత్రి 8:30 గంటలకు: తెలుగు టైటాన్స్ vs పాట్నా పైరేట్స్, శ్రీ కంఠీరవ ఇండోర్ స్టేడియం, బెంగళూరు 15 అక్టోబర్ 2022 శనివారం రాత్రి 8:30 గంటలకు: తెలుగు టైటాన్స్ vs దబాంగ్ ఢిల్లీ కె.సి. శ్రీ కంఠీరవ ఇండోర్ స్టేడియం, బెంగళూరు 18 అక్టోబర్ 2022 మంగళవారం రాత్రి 8:30 గంటలకు: తెలుగు టైటాన్స్ vs పుణెరి పల్టన్, శ్రీ కంఠీరవ ఇండోర్ స్టేడియం, బెంగళూరు 22 అక్టోబర్ 2022 శనివారం రాత్రి 8:30 గంటలకు: తెలుగు టైటాన్స్ vs జైపూర్ పింక్ పాంథర్స్, శ్రీ కంఠీరవ ఇండోర్ స్టేడియం, బెంగళూరు 25 అక్టోబర్ 2022 మంగళవారం రాత్రి 8:30 గంటలకు: తెలుగు టైటాన్స్ vs హర్యానా స్టీలర్స్, శ్రీ కంఠీరవ ఇండోర్ స్టేడియం, బెంగళూరు 29 అక్టోబర్ 2022 శనివారం రాత్రి 8:30 గంటలకు: తెలుగు టైటాన్స్ vs గుజరాత్ జెయింట్స్, శ్రీ శివఛత్రపతి స్పోర్ట్స్ కాంప్లెక్స్, బలేవాడి, పూణే 31 అక్టోబర్ 2022 సోమవారం రాత్రి 8:30 గంటలకు: తెలుగు టైటాన్స్ Vs U.P. యోద్ధ శ్రీ శివఛత్రపతి స్పోర్ట్స్ కాంప్లెక్స్, బలేవాడి, పూణే 2 నవంబర్ 2022 బుధవారం రాత్రి 8:30 గంటలకు: తెలుగు టైటాన్స్ vs యు ముంబా శ్రీ శివఛత్రపతి స్పోర్ట్స్ కాంప్లెక్స్, బలేవాడి, పూణే 5 నవంబర్ 2022 శనివారం రాత్రి 8:30 గంటలకు: తెలుగు టైటాన్స్ vs తమిళ్ తలైవాస్ శ్రీ శివఛత్రపతి స్పోర్ట్స్ కాంప్లెక్స్, బలేవాడి, పూణే -
PKL 2022: ఫైనల్లో పట్నా, ఢిల్లీ
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్‌లో పట్నా పైరేట్స్, దబంగ్ ఢిల్లీ టైటిల్ పోరుకు సిద్ధమయ్యాయి. బుధవారం జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌ల్లో మాజీ విజేత పట్నా 38–27 పాయింట్లతో యూపీ యోధపై, ఢిల్లీ 40–35తో బెంగళూరు బుల్స్‌పై గెలిచాయి. పట్నాతో జరిగిన పోరులో యూపీ స్టార్ రెయిడర్ పర్దీప్ నర్వాల్ తేలిపోయాడు. 16 సార్లు రెయిడింగ్‌కు వెళ్లిన పర్దీప్ కేవలం 4 పాయింట్లే చేశాడు. పట్నా జట్టులో గుమన్ సింగ్ (8), సచిన్ (7), రెజా (6), సునీల్ (5) సమష్టిగా రాణించారు. పట్నా, ఢిల్లీ జట్ల మధ్య రేపు ఫైనల్ జరుగుతుంది. -
కబడ్డీ... కబడ్డీ...
‘కబడ్డీ.. కబడ్డీ’.. అని కూత పెట్టే ఆటగాళ్లు పాయింట్ కోసం బరిలో దిగుతారు. వేగం, ఒడుపు ఉండే ఆ ఆటలో తప్పొప్పులను ఎంచే రిఫరీ పని చాలా కష్టమైనది. నేడు ప్రో కబడ్డీ లీగ్‌లో పని చేస్తున్న పది మంది మహిళా రిఫరీలలో సంధ్య అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్‌గా, గృహిణిగా, తల్లిగా ఉంటూనే ఆమె కబడ్డీ రిఫరీగా ఆ ఉపాధి పట్ల యువతులకు కుతూహలం రేపుతోంది. కూత ఆపకూడదు. ప్రత్యర్థి శిబిరానికి చిక్క కూడదు. ఒకరినో ఇద్దరినో చిరుతలా తాకి సొంత శిబిరానికి చేరుకోవాలి. కబడ్డీ అసలు సిసలు భారతీయ పల్లె క్రీడ. ప్రధానంగా పురుష క్రీడ. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఈ ఆట ఆ తర్వాత క్రికెట్ దెబ్బకు చతికిల పడింది. తిరిగి కార్పొరేట్ అవసరాల కొద్దీ ప్రాణం పోసుకుంది. ఇసుక మైదానాల నుంచి ఖరీదైన ఇండోర్ స్టేడియంలలోకి, లైవ్ టెలికాస్ట్లలోకి, స్పాన్సరర్ల పూనికలోకి మారిన ఈ ఆట నేడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులను అలరిస్తోంది. అందుకు కొత్త కొత్త మార్గాలను అవలంబిస్తోంది. 2014లో ‘ప్రో కబడ్డీ లీగ్’ మొదలైతే 2018 నుంచి మహిళా రిఫరీలను కూడా ఈ ఆటలో ఉపయోగిస్తున్నారు. అందుకు సాగిన సెలక్షన్లలో తమిళనాడు వెల్లూరు నుంచి ఎంపికైన రిఫరీయే ఎంకె. సంధ్య. సీజన్ 6తో మొదలయ్యి ప్రస్తుతం బెంగళూరులో డిసెంబర్ 22 నుంచి సాగుతున్న సీజన్ 8లో కూడా రిఫరీగా పని చేస్తున్న సంధ్య అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. కబడ్డీ ప్లేయర్ ‘8వ తగతిలో ఉండగా మా స్కూల్ మైదానంలో కొంత మంది సీనియర్ అమ్మాయిలు కబడ్డీ ఆడటం చూశాను. నాకు ఆ ఆట నచ్చింది. అక్కా... నన్ను కూడా చేర్చుకోండి అని అడిగితే చిన్న పిల్లవు... వచ్చే సంవత్సరం టీమ్‌లోకి వద్దువులే అన్నారు. నేను వినలేదు. పీటీని అడిగి వెంటనే చేరిపోయాను’ అంటుంది సంధ్య. మరో ఇద్దరు అక్కచెల్లెళ్లు ఉన్న సంధ్య తాను మాత్రమే ఈ ఆటను ఎంచుకున్నందుకు ఎప్పుడూ నిరాశ పడలేదు. ఇంటర్లో చేరగానే సబ్ జూనియర్స్ నేషనల్ జట్టుకు ఆ తర్వాత జూనియర్స్ నేషనల్ జట్టుకు (2008) ఆడింది. ఆ తర్వాత కూడా ఆమె ఆట జోరుగా సాగేదేమో కాని జీవితం మారింది. ప్రేమ పెళ్లి సీనియర్ ఇంటర్లో ఉండగా సంధ్యకు కబడ్డీ క్రీడాకారుడు కాంతివరన్తో పరిచయమైంది. వెంటనే ప్రేమ ఆ వెంటనే పెళ్లి జరిగిపోయాయి. ‘మా పెళ్లి మా పెద్దలకు ఇష్టం లేదు. అందుకని మేము వెల్లూరు వదిలి చెన్నైకు వచ్చేశాము’ అంది సంధ్య. ఆ మరుసటి సంవత్సరమే ఆమెకు కొడుకు పుట్టాడు. జ్యూస్ ఫ్యాక్టరీలో పని చేస్తున్న కాంతివరన్కు సంధ్య టాలెంట్ తెలుసు. ‘మళ్లీ నువ్వు కబడ్డీ ఆడు’ అని ఆమెతో చెప్పాడు. ఆమెను తీర్చిదిద్దే బాధ్యతను తీసుకున్నాడు. కాని వివాహం అయ్యి, బిడ్డకు జన్మనిచ్చాక తిరిగి పూర్వపు ఫిట్నెస్తో ఆడటం అంత సులభం కాదు. ‘మేమిద్దం చాలా కష్ట పడ్డాం. ఉదయం 5 నుంచి ఆరున్నర వరకూ కబడ్డీ ఆడేదాన్ని. తిరిగి నా భర్త సాయంత్రం ఇంటికి వచ్చాక మళ్లీ ఆడేదాన్ని. అతను నా కోసం స్పెషల్ డైట్ కూడా ఫిక్స్ చేశాడు. కొత్తల్లో ఇదంతా చాలా కష్టంగా అనిపించేది. కాని పట్టుదలగా ఫిట్నెస్ సాధించి తిరిగి కబడ్డీ ప్లేయర్‌గా మారాను’ అంది సంధ్య. ఇప్పుడు సంధ్య దక్షిణ భారత మహిళ కబడ్డీ టీమ్‌లతో కలిసి కబడ్డీ ఆడటం మొదలెట్టింది. అంతే కాదు భర్త ప్రోత్సాహంతో డిగ్రీ, బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, యోగాలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లమా చేసింది. 2015 వరకూ మహిళా కబడ్డీ ప్లేయర్‌గా ఉన్న సంధ్య వెల్లూరులో తల్లి అనారోగ్యం వల్ల కొంత, పిల్లాణ్ణి ఒక్కణ్ణే వదిలేసి టోర్నమెంట్లకు వెళ్లే వీలు లేక కొంత కబడ్డీ ఆటకు దూరమైంది. తిరిగి ఆ దంపతులు వెల్లూరు చేరుకున్నారు. పిఈటీగా... వెల్లూరులో స్ప్రింగ్ డేస్ స్కూల్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్‌గా చేరింది సంధ్య. వెల్లూరులో పని వెతుక్కున్న భర్త ‘కబడ్డీ రిఫరీలకు డిమాండ్ ఉంది. ఆ పరీక్షలు రాయి’ అని ప్రోత్సహించాడు. సంధ్య ‘అమెచ్యూర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా’ నిర్వహించే రిఫరీ పరీక్షను రాసి పాసైంది. ఆ వెంటనే ఆమెకు డిస్ట్రిక్ లెవల్, ఇంటర్ జోన్ మేచ్లకు రిఫరీగా ఉండే అవకాశాలు రావడం మొదలయ్యింది. స్కూల్లో పని చేస్తూనే, కొడుకు ఆలనా పాలనా చూసుకుంటూనే, మేచ్ ఉన్నప్పుడు రిఫరీగా బయలుదేరి వెళుతోంది సంధ్య. ప్రొ కబడ్డీ లీగ్ రిఫరీగా ప్రో కబడ్డీ లీగ్ మేచెస్ కోసం మహిళా రిఫరీల సెలక్షన్స్ జరుగుతున్నాయని తెలిసి వాటిలో పాల్గొని ఎంపికైంది సంధ్య. ఇది పెద్ద విజయమే. ఎందుకంటే ప్రో కబడ్డీ లీగ్ మేచెస్ చాలా ప్రొఫెషనల్‌గా సాగుతాయి. స్పాన్సర్‌షిప్‌లతో ముడిపడిన వ్యవహారం. లైవ్ టెలికాస్ట్ ఉంటుంది కనుక రిఫరీలు తప్పులు చేయడానికి లేదు. ‘టోర్నమెంట్ సాగుతున్నన్ని రోజులు మేము ఉదయాన్నే మా ఫిట్నెస్ను నిరూపించుకోవాలి. ఆ తర్వాత ముందు రోజు ఆటను అవలోకించాలి. ఆ రోజు జరిగే ఆటను అంచనా వేయాలి. అప్పుడు మేము మేచ్‌కు రెడీ అవుతాం’ అంటుంది సంధ్య. ప్రతి మేచ్‌కు ఒక మెయిన్ రిఫరీ, ఇద్దరు అంపైర్లు, ఇద్దరు లైన్ రిఫరీలు, ఇద్దరు అసిస్టెంట్ రిఫరీలు ఉంటారు. మెయిన్ రిఫరీగా వీరిని అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది సంధ్యకు. ‘మేచ్లలో సిగ్నల్స్‌ను సాధన చేస్తాం మేము. అలాగే ఒక్కోసారి ఆటగాళ్లు పాయింట్స్ కోసం వాదనకు దిగుతారు. వారికి మా నిర్ణయం సరైనదే అని చెప్పాల్సి వస్తుంది. వారు ఆగ్రహంలో ఉంటారు. మేము స్థిమితంగా మాట్లాడాలి. మేము కూడా కోప్పడితే అంతా రసాభాస అవుతుంది’ అంటుంది సంధ్య. మారుతున్న కాలానికి మారుతున్న మహిళా క్రీడా ప్రతినిధి సంధ్య. -
Pro Kabaddi League: ఈనెల 22 నుంచి ప్రొ కబడ్డీ లీగ్
బెంగళూరు: కబడ్డీ కూతకు రంగం సిద్ధమైంది. ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఈ నెల 22 నుంచి బెంగళూరులో జరగనుంది. ఎనిమిదో సీజన్ మొత్తానికి ఇదే నగరం వేదిక కానుండటం మరో విశేషం. కరోనా కొత్త వేరియంట్ల కలకలం, ఈ ఏడాది ఐపీఎల్ అనుభవాల దృష్ట్యా మ్యాచ్‌లకు ప్రేక్షకులను అనుమతించడం లేదు. డిసెంబర్ 22న తొలి మ్యాచ్‌లో యు ముంబాతో బెంగళూరు బుల్స్ తలపడనుంది. అదే రోజు తెలుగు టైటాన్స్‌తో తమిళ్ తలైవాస్, డిఫెండింగ్ చాంపియన్ బెంగాల్ వారియర్స్‌తో యూపీ యోధ పోటీ పడతాయి. కరోనా మహమ్మారి పడగ విప్పటంతో గతేడాది ప్రొ కబడ్డీ లీగ్ రద్దయింది. చదవండి: Ind Vs SA 2021- Virat Kohli: వారం రోజుల్లో తేలననున్న కోహ్లి భవితవ్యం.. కొనసాగిస్తారా? లేదంటే! -
డిసెంబర్లో ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్) 2021 ప్రారంభం
ముంబై: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఎనిమిదో సీజన్ డిసెంబర్ 22 నుంచి మొదలుకానుంది. అయితే మ్యాచ్‌లను తిలకించేందుకు ప్రేక్షకుల్ని అనుమతించడం లేదు. కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో ఆటగాళ్లు, ఇతర సిబ్బంది ఆరోగ్య భద్రత దృష్ట్యా ఎనిమిదో సీజన్ ఒకే ఒక వేదికలో నిర్వహిస్తున్నారు. మ్యాచ్‌లన్నీ బెంగళూరులోనే నిర్వహిస్తామని లీగ్ కమిషనర్, మశాల్ స్పోర్ట్స్ సీఈఓ అనుపమ్ గోస్వామి తెలిపారు. గతేడాది వైరస్ భయాందోళనల నేపథ్యంలో ఈవెంట్‌ను రద్దు చేశారు. పీకేఎల్–7 చివరిసారిగా 2019లో జరగ్గా బెంగాల్ వారియర్స్ జట్టు విజేతగా నిలిచింది. -
Pro Kabaddi League: 59 మంది ఆటగాళ్ల కొనసాగింపు
Pro Kabaddi League: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్ – సీజన్ 8) కోసం 59 మంది ఆటగాళ్లను ఆయా ఫ్రాంచైజీలు అట్టి పెట్టుకున్నాయని టోర్నీ ఆర్గనైజర్ మషాల్ స్పోర్ట్స్ శుక్రవారం ప్రకటించింది. ‘మొత్తం మూడు కేటగిరీల్లో 59 మందిని రిటెయిన్ చేసుకున్నారు. ఎలైట్ రిటెయిన్ ప్లేయర్ల (ఈఆర్పీ) గ్రూపులో ఉన్న 22 మందిని, రిటెయిన్ యంగ్ ప్లేయర్ల (ఆర్‌వైపీ) జాబితాలోని ఆరు మందిని, న్యూ యంగ్ ప్లేయర్ల (ఎన్వైపీ)లో 31 మందిని జట్లు అట్టిపెట్టుకున్నాయి’ అని మషాల్ స్పోర్ట్స్ పేర్కొంది. కొనసాగింపు దక్కని ఆటగాళ్లు, ఇతర ప్లేయర్ల ఎంపిక కోసం వేలం ప్రక్రియ నిర్వహిస్తామని తెలిపింది. ముంబైలో ఈ నెల 29 నుంచి 31 వరకు మూడు రోజుల పాటు ఆటగాళ్ల వేలం జరుగుతుంది. డిఫెండింగ్ చాంపియన్ బెంగాల్ వారియర్స్ తమ కెప్టెన్ మణిందర్ సింగ్‌తో పాటు స్టార్ ఆటగాడు మొహమ్మద్ ఇస్మాయిల్ నబీబ„Š (ఇరాన్)ను అట్టిపెట్టుకుంది. అలాగే బెంగళూరు బుల్స్ పవన్ కుమార్ షెరావత్‌ను, దబంగ్ ఢిల్లీ కేసీ నవీన్ కుమార్‌ను రిటెయిన్ చేసుకుంది. అనుభవజ్ఞుడైన ఫజల్ అత్రాచలిని యు ముంబా, పర్వేశ్, సునీల్‌లను గుజరాత్ జెయింట్స్, వికాస్ ఖండోలాను హరియాణా స్టీలర్స్, నితీశ్‌ను యూపీ యోధ జట్లు అట్టిపెట్టుకున్నాయి. కరోనా మహమ్మారి వల్ల గతేడాది ప్రొ కబడ్డీ లీగ్ జరగలేదు. -
తీరు మారని టైటాన్స్
గ్రేటర్ నోయిడా: ఇప్పటికే డజను ఓటములతో పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉన్న తెలుగు టైటాన్స్... తాజాగా మరో ఓటమితో ఆ స్థానాన్ని మెరుగు పరుచుకునే అవకాశాన్ని కూడా కోల్పోయింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో టైటాన్స్ 38–48తో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ చేతిలో చిత్తయింది. సిద్దార్థ్ దేశాయ్ 13 పాయింట్ల ప్రదర్శన ప్రత్యర్థి రైడర్లు సోను (17 పాయింట్లు), రోహిత్ గులియా (9 పాయింట్లు) ముందు చిన్నదైంది. టైటాన్స్‌కు సీజన్లో ఒక్క మ్యాచ్ మాత్రమే మిగిలి ఉండగా... దానిని గెలిచి పాయింట్ల పట్టికలో ప్రస్తుతం ఉన్న స్థానాన్ని కాపాడుకుంటుందో లేక చిట్ట చివరి స్థానానికి పడిపోతుందో చూడాలి. మరో మ్యాచ్‌లో తమిళ్ తలైవాస్ 35–33తో జైపూర్ పింక్ పాంథర్స్‌పై నెగ్గింది. అజిత్‌కుమార్ సూపర్‘టెన్’తో జట్టుకు విజయాన్ని అందించాడు నేడు ప్రొ కబడ్డీ లీగ్‌లో విశ్రాంతి దినం. బుధవారం జరిగే మ్యాచ్‌ల్లో బెంగాల్ వారియర్స్‌తో తమిళ్ తలైవాస్; యూపీ యోధతో తెలుగు టైటాన్స్ తలపడతాయి.