Revenue growth
-
అగ్రోకెమికల్స్ ఆదాయంలో వృద్ధి
ముంబై: వ్యవసాయ రసాయనాల రంగం ఆదాయం భారత్‌లో 2025–26 ఆర్థిక సంవత్సరంలో 7–9 శాతం వృద్ధి చెందుతుందని రేటింగ్స్ ఏజెన్సీ క్రిసిల్ నివేదిక తెలిపింది. స్థిరంగా దేశీయ డిమాండ్, ఎగుమతుల పరిమాణంలో పునరుద్ధరణ ఇందుకు కారణమని వివరించింది. ‘ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమ స్వల్పంగా 5–6 శాతం వృద్ధిని సాధిస్తుంది. ఆపరేటింగ్ మార్జిన్లు కూడా నెమ్మదిగా కోలుకుంటున్నాయి. ఇవి 100 బేసిస్ పాయింట్లు పెరిగి 12–13 శాతానికి చేరాయి. ఇప్పటికీ కోవిడ్ ముందస్తు స్థాయి 15–16 శాతం కంటే ఇది తక్కువ. ఇది సంస్థలను మూలధన వ్యయం విషయంలో జాగ్రత్తగా ఉంచుతుంది. నగదు ప్రవాహాలు, బ్యాలెన్స్ షీట్లను స్థిరంగా నిర్వహించడానికి వర్కింగ్ క్యాపిటల్ నిర్వహణపై దృష్టి పెట్టేలా చేస్తుంది. ఈ రంగం మొత్తం ఆదాయంలో సగభాగాన్ని కలిగి ఉన్న ఎగుమతుల నుండి వచ్చే ఆదాయంలో మార్పు కనిపిస్తోంది. తక్కువ–ధర కలిగిన చైనా ఉత్పత్తులకు సంబంధించిన అదనపు నిల్వల సమస్యలను గ్లోబల్ సంస్థలు పరిష్కరించాయి. ఇప్పుడు వర్కింగ్ క్యాపిటల్‌ని మెరుగ్గా నిర్వహించడానికి పంటల సీజన్‌కు దగ్గరగా ఆర్డర్ చేస్తున్నాయి’ అని నివేదిక వివరించింది. ధరల ఒత్తిడి ఉన్నా.. ‘ఈ ఆర్థిక సంవత్సరంలో ఆరోగ్యకరమైన పరిమాణ వృద్ధిని ఆశిస్తున్నప్పటికీ, పోటీ ధర కలిగిన చైనీస్ ఉత్పత్తుల నుండి ధరల ఒత్తిళ్ల మధ్య రాబడి వృద్ధి 3–4 శాతం వద్ద స్వల్పంగా ఉంటుంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఈ ఒత్తిళ్లు తగ్గినందున రాబడి 7 శాతానికి పైగా మెరుగుపడవచ్చు. మంచి రుతుపవనాలు, తగినంత రిజర్వాయర్ల స్థాయిల కారణంగా ఈ ఆర్థిక సంవత్సరంలో దేశీయ ఆదాయం 8–9 శాతం పెరిగింది. తద్వారా వ్యవసాయ ఉత్పత్తిని పెంచుతున్నాయి. చైనాలో అధిక సరఫరా నుండి ధరల ఒత్తిడి ఉన్నా.. గత సంవత్సరం కంటే తీవ్రత తక్కువగా ఉన్నప్పటికీ, ఈ ట్రెండ్ కొనసాగుతుందని అంచనా. ఇన్వెంటరీ రైట్ ఆఫ్‌ల సంఘటనలు తగ్గుతాయి. ఈ రంగం యొక్క ఆపరేటింగ్ మార్జిన్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 12 శాతానికి, వచ్చే ఏడాది 13 శాతానికి కొద్దిగా మెరుగుపడుతుందని ఆశిస్తున్నాం. అధిక విక్రయాల పరిమాణం ఉన్నప్పటికీ కొనసాగుతున్న ధరల ఒత్తిడి ఈ వృద్ధిని పరిమితం చేస్తుంది’ అని క్రిసిల్ నివేదిక తెలిపింది. -
దుస్తుల ఎగుమతుల్లో 9–11 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతీయ దుస్తుల ఎగుమతిదారులు 9–11 శాతం ఆదాయ వృద్ధి నమోదు చేస్తారని ఇక్రా రేటింగ్స్ అంచనా వేస్తోంది. ప్రధాన మార్కెట్లలో నిల్వలు తగ్గిపోవడం, వివిధ దేశాలు భారత్ నుంచి కొనుగోళ్లను పెంచడం ఇందుకు కారణమని తెలిపింది. ‘భారతీయ దుస్తుల ఎగుమతులకు దీర్ఘకాలిక అవకాశాలు అనుకూలంగా ఉన్నాయి. రిటైల్ మార్కెట్లలో భారతీయ ఉత్పత్తులకు అంగీకారం, అభివృద్ధి చెందుతున్న వినియోగదారుల పోకడలు, ఉత్పత్తి–సంబంధిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకం, ఎగుమతి ప్రోత్సాహకాలు, యూకే, ఈయూతో ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందం ఇందుకు కారణం. అధిక రిటైల్ ఇన్వెంటరీ, కీలక మార్కెట్ల నుండి మందగించిన డిమాండ్, ఎర్ర సముద్ర సంక్షోభం, పొరుగు దేశాల నుండి పెరిగిన పోటీతో సహా సరఫరా సమస్యల కారణంగా గత ఆర్థిక సంవత్సరంలో ఎగుమతులు 2 శాతం క్షీణించాయి. మూలధన వ్యయాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం, 2025–26లో టర్నోవర్‌లో 5–8 శాతం మధ్య ఉండే అవకాశం ఉంది. స్థూల ఆర్థిక వాతావరణం ఒత్తిడి, భౌగోళిక రాజకీయ సమస్యల మధ్య కొన్ని కీలక మార్కెట్లలో డిమాండ్ అనిశ్చితి చుట్టూ సవాళ్లు కొనసాగుతున్నాయి. అధికం అవుతున్న కార్మిక వ్యయాలు, సరుకు రవాణా ఖర్చులు, ఇతర నిర్వహణ ఖర్చుల పెరుగుదలతో పరిశ్రమ యొక్క నిర్వహణ మార్జిన్లు 2024–25లో 30–50 బేసిస్ పాయింట్లు తగ్గుతాయని అంచనా. బంగ్లాదేశ్‌లో ఇటీవలి భౌగోళిక–రాజకీయ ఉద్రిక్తతల కారణంగా భారత్‌సహా పలు దేశాల్లో సామర్థ్యం జోడించే అవకాశం ఉంది. పీఎల్ఐ పథకం కింద తాజా సామర్థ్య జోడింపుల నుండి పొందే ప్రయోజనాలతో పాటు, పీఎం మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజియన్, అపారల్ స్కీమ్ ద్వారా మానవ నిర్మిత ఫైబర్ ఉత్పత్తిలో దేశ ఉనికిని బలోపేతం చేయడంతో.. ప్రపంచ దుస్తుల వ్యాపారంలో భారత్ దూసుకెళ్తుందని పరిశ్రమ భావిస్తోంది’ అని నివేదిక వివరించింది. -
హెచ్‌సీఎల్ టెక్ లాభం అప్
న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్ క్యూ2లో నికర లాభం 11 శాతం వృద్ధితో రూ. 4,235 కోట్లుగా నమోదైంది. ఇక సమీక్షాకాలంలో ఆదాయం 8 శాతం వృద్ధితో రూ. 26,672 కోట్ల నుంచి రూ. 28,862 కోట్లకు చేరింది. రెవెన్యూ వృద్ధితో పాటు లాభదాయకత కూడా మెరుగ్గా ఉందని సంస్థ సీఈవో సి. విజయ్ కుమార్ తెలిపారు. వార్షికంగా ఆదాయ వృద్ధి 3.5–5.0 శాతంగా ఉంటుందని హెచ్‌సీఎల్ టెక్ గైడెన్స్ ఇచి్చంది. క్యూ2లో 780 మంది ఉద్యోగులను తగ్గించుకోవడంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 2,18,621కి చేరింది. 2024–25 ఆరి్థక సంవత్సరానికి గాను రూ. 2 ముఖ విలువ గల ఒక్కో షేరుపై రూ. 12 చొప్పున కంపెనీ మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. సోమవారం బీఎస్ఈలో హెచ్‌సీఎల్ టెక్ షేరు స్వల్పంగా ఒక్క శాతం పెరిగి రూ. 1,856 వద్ద క్లోజయ్యింది. -
ఫ్యాషన్ రిటైలర్స్ 15% ఆదాయ వృద్ధి
న్యూఢిల్లీ: ఫ్యాషన్ రిటైలర్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 15 శాతం వరకు ఆదాయ వృద్ధిని నమోదు చేసే అవకాశం ఉంది. నెట్వర్క్ విస్తరణ ఇందుకు కారణమని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా నివేదిక వెల్లడించింది. ‘ద్రవ్యోల్బణం ఎదురుగాలులు ఉన్నప్పటికీ ఫ్యాషన్ రిటైలర్ల నెట్వర్క్ విస్తరణ 2024–25లో రాబడి పెరుగుదలకు తోడ్పడుతుంది. సర్వేలో పాలుపంచుకున్న కంపెనీల నిర్వహణ లాభాల మార్జిన్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 13–14 శాతం శ్రేణిలో ఉండే అవకాశం ఉంది. ఏప్రిల్–జూన్‌లో ఫ్యాషన్ రిటైలర్లు స్టోర్ నెట్వర్క్ విస్తరణ, కొత్త ఉత్పత్తుల శ్రేణిని ప్రవేశపెట్టడం ద్వారా 18 శాతం వృద్ధిని నమోదు చేశాయి. జూలై–సెపె్టంబర్ త్రైమాసికంలో ఈ రంగ కంపెనీలు మోస్తరు వృద్ధి నమోదు చేస్తాయి. పండుగ సీజన్లో ఆదాయ వృద్ధి పుంజుకునే అవకాశం ఉంది. దీని ఫలితంగా అంత క్రితంతో పోలిస్తే 2024–25లో ఆదాయం 14–15 శాతం పెరుగుతుందని అంచనా’ అని ఇక్రా తెలిపింది.పరిమితంగానే డిస్కౌంట్లు.. ‘చదరపు అడుగుకు సగటు అమ్మకాల్లో జూన్ త్రైమాసికంలో ప్రీమియం సెగ్మెంట్ 3 శాతం క్షీణించింది. అయినప్పటికీ వాల్యూ ఫ్యాషన్ విభాగాలు కొంత సానుకూల ప్రభావాన్ని చూపించాయి. ఈ విభాగం మహమ్మారి ముందస్తు స్థాయిని మొదటిసారి తాకింది. కొత్త స్టోర్స్ రాక, ప్రారంభించిన నూతన కేటగిరీల కోసం పెరిగిన ప్రకటనలు, ప్రమోషనల్ ఖర్చుల కారణంగా తగిన రాబడి కంటే తక్కువగా గతేడాదితో పోలిస్తే ఫ్యాషన్ రిటైలర్ల మార్జిన్లు స్థిరంగా ఉన్నాయి. 2023–24 రెండవ త్రైమాసికం నుండి డిస్కౌంట్లు పరిమితంగానే ఉన్నాయి. ఎందుకంటే కంపెనీలు తమ స్థూల మార్జిన్లను రక్షించుకోవడంపై దృష్టి సారిస్తున్నాయి. ముఖ్యంగా పండుగల సీజన్‌తో ప్రకటనలు, ప్రమోషన్లపై రిటైలర్లు దూకుడుగా ఖర్చు చేస్తూనే ఉన్నారు’ అని ఇక్రా నివేదిక వెల్లడించింది. -
12 శాతం వృద్ధి లక్ష్యం: డాలర్ ఇండస్ట్రీస్
హైదరాబాద్ , బిజినెస్ బ్యూరో: డాలర్ ఇండస్ట్రీస్ 2024–25లో 12% ఆదాయ వృద్ధి లక్ష్యంగా చేసుకుంది. 2023–24లో కంపెనీ రూ.506 కోట్ల టర్నోవర్‌పై రూ.90 కోట్ల నికరలాభం ఆర్జించింది. సంస్థ అమ్మకాల్లో దక్షిణాది రాష్ట్రాల వాటా 8 శాతంగా ఉందని ఎండీ వినోద్ కుమార్ గుప్తా మీడియాకు తెలిపారు. ‘సంస్థ మొత్తం అమ్మకాల్లో దక్షిణాది వాటాను 20 శాతానికి చేరుస్తాం. ఈ ప్రాంతంలో మూడేళ్లలో 50 ఔట్లెట్లను తెరుస్తాం’ అని అన్నారు. 2025 –26లో రూ.2,000 కోట్ల టర్నోవర్ సాధిస్తామని జేఎండీ బినయ్ కుమార్ గుప్తా తెలిపారు. బ్రాండెడ్ హొజైరీ రంగంలో కంపెనీ మార్కెట్ వాటా 15 శాతం. -
జువెలర్ల ఆదాయమూ ‘బంగారమే’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బంగారు ఆభరణాల రంగంలో ఉన్న వ్యవస్థీకృత రిటైలర్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 17–10 శాతం ఆదాయ వృద్ధి సాధించే అవకాశం ఉందని క్రిసిల్ రేటింగ్స్ నివేదిక వెల్లడించింది. పుత్తడి ధర పెరగడమే ఇందుకు కారణమని తెలిపింది. క్రిసిల్ నివేదిక ప్రకారం.. ఆభరణాల అమ్మకాల పరిమాణం 2023–24 మాదిరిగానే స్థిరంగా ఉంటుందని అంచనా. బంగారం ధరలు గణనీయంగా పెరగడం, నూతన ఔట్లెట్స్ జోడింపులు.. వెరశి అధిక సరుకు నిల్వల స్థాయిల కారణంగా రిటైలర్ల మూలధన అవసరాలు పెరగవచ్చు. సురక్షిత పెట్టుబడి.. ఆభరణాల మార్కెట్లో వ్యవస్థీకృత రంగం వాటా మూడింట ఒక వంతు కంటే కొంచెం ఎక్కువగా ఉంది. మిగిలిన వాటా అవ్యవస్థీకృత రంగం కైవసం చేసుకుంది. దేశీయంగా బంగారం ధర 2023–24లో 15 శాతం పెరిగి 2024 మార్చి చివరి నాటికి 10 గ్రాములకు రూ.67,000కి చేరుకుంది. ఏప్రిల్‌లో ధర రూ.73,000 స్థాయికి వెళ్లింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ సెంట్రల్ బ్యాంకులు, అలాగే భౌగోళిక రాజకీయ అనిశ్చితి మధ్య వినియోగదారులు చూసే సురక్షిత పెట్టుబడి ఎంపికలలో బంగారం ఒకటిగా నిలవడమే ధర పెరుగుదలకు కారణం. అధిక తగ్గింపులు.. బ్రాండింగ్, మార్కెటింగ్ వ్యయాన్ని పెంచడమే కాకుండా, అధిక బంగారం ధరల మధ్య వినియోగదారులను ఆకర్షించే ప్రయత్నంలో ఉత్పత్తి డిజైన్స్, ఆఫర్లను విస్తరించడం కొనసాగించినప్పటికీ, రిటైలర్లు కొనుగోలుదారులకు అధిక తగ్గింపులను అందించే అవకాశం ఉంది. అమ్మకాలు దూసుకెళ్లేందుకు గోల్డ్ ఎక్సే్ఛంజ్ ఆఫర్లను ప్రమోట్ చేయవచ్చు. ఫలితంగా మూడింట ఒకవంతు ఉన్న గోల్డ్ ఎక్సే్చంజ్ పథకాల వాటా గణనీయంగా పెరగనుంది. కస్టమర్ల ప్రాధాన్యతల్లో మార్పు రావడం, విక్రయ సంస్థలు ప్రథమ, ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరించడంతో వ్యవస్థీకృత రంగం వాటా వృద్ధి చెందనుంది. కాగా, పసిడి ధర దూసుకెళ్లిన నేపథ్యంలో తక్కువ క్యారట్ కలిగిన ఆభరణాలకు కస్టమర్లు మళ్లే అవకాశం ఉందని హీరావాలా జెమ్స్, జువెల్లర్స్ ఎండీ గౌతమ్ చవాన్ తెలిపారు.స్థిరంగా క్రెడిట్ ప్రొఫైల్స్..ఆరోగ్యకర బ్యాలెన్స్ షీట్స్ మద్దతుతో స్టోర్ విస్తరణలు మహమ్మారి తర్వాత బలమైన రెండంకెల వృద్ధిని సాధించాయి. స్థిర పరిమాణం కారణంగా 2024–25లో స్టోర్ల జోడింపు వేగం 10–12 శాతానికి తగ్గవచ్చు. పెరిగిన బంగారం ధరల ఫలితంగా ఈ ఆర్థిక సంవత్సరంలో ఎక్కువ ధరతో బంగారం నిల్వలు భర్తీ అవుతాయి. వర్కింగ్ క్యాపిటల్ రుణాలలో ఆశించిన పెరుగుదల ఉన్నప్పటికీ.. ఆరోగ్యకర రాబడి పెరుగుదల, తగిన లాభదాయకత కారణంగా బలంగా నగదు రాకతో వ్యవస్థీకృత బంగారు ఆభరణాల రిటైలర్ల క్రెడిట్ ప్రొఫైల్స్‌ను స్థిరంగా ఉంచుతున్నట్టు క్రిసిల్ వెల్లడించింది. -
ఔషధ సంస్థల ఆదాయ వృద్ధి 8–10 శాతం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయ ఔషధ రంగంలోని టాప్–25 సంస్థల ఆదాయ వృద్ధి వచ్చే ఆర్థిక సంవత్సరంలో 8–10 శాతానికి పరిమితం అయ్యే అవకాశం ఉందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేస్తోంది. ఇక్రా ప్రకారం.. భారతీయ మొత్తం ఔషధ పరిశ్రమలో 60 శాతం వాటా కలిగిన ఈ కంపెనీల ఆదాయం 2023–24 ఆర్థిక సంవత్సరంలో 13–14 శాతం పెరిగింది. 2023–24 నాటి అధిక అమ్మకాలను అనుసరించి 2024–25లో యుఎస్ 8–10 శాతం, యూరప్ మార్కెట్ల నుండి 7–9 శాతం ఆదాయ వృద్ధి నమోదుకు ఆస్కారం ఉంది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఇది యూఎస్ 18–20, యూరప్ 16–18 శాతం ఉండవచ్చు. దేశీయ మార్కెట్ 6–8 శాతం స్థిర వృద్ధిని చూడగలదు. అభివృద్ధి చెందుతున్న మార్కెట్లు 2024–25లో 8–10 శాతం, 2023–24లో 16–18 శాతం పెరుగుదలను నమోదు చేయవచ్చు. పెరిగిన కొత్త ఉత్పత్తులు.. 2023–24లో పెరిగిన కొత్త ఉత్పత్తుల విడుదల, ఎంపిక చేసిన చికిత్స విభాగాల్లో ఉత్పత్తి కొరత, సంక్లిష్ట జనరిక్స్ ఆరోగ్యకర పనితీరు యూఎస్ విపణిలో టాప్–25 భారతీయ కంపెనీల ఆదాయ వృద్ధికి కారణం. 2023–24 ఆర్థిక సంవత్సరంలో అధిక వృద్ధి ఉన్నప్పటికీ 2024–25లో వృద్ధి తగ్గుతుందని అంచనా. యుఎస్ మార్కెట్లో స్వల్ప ధరల ఒత్తిడి కొనసాగే అవకాశం ఉన్నప్పటికీ, భారతీయ ఫార్మా సంస్థలు యుఎస్ మార్కెట్లోని కాంప్లెక్స్ జెనరిక్స్ నుండి తమ ఆదాయాన్ని పెంచుకోవడంపై దృష్టి సారించాయి. గత సంవత్సరంలో భారతీయ ఔషధ సంస్థలకు యూఎస్ఎఫ్డీఏ జారీ చేసిన హెచ్చరిక లేఖలు, దిగుమతి హెచ్చరికల సంఖ్య పెరిగింది. దీంతో నూతన ఉత్పత్తుల విడుదలలో జాప్యానికి దారితీసింది. కన్సల్టెంట్లను నియమించుకోవడం, అదనపు వనరులను వినియోగించడం వంటి పరిష్కార చర్యలకు గణనీయంగా వ్యయ భారం పడుతోంది. తద్వారా లాభాల మార్జిన్లపై ప్రభావం చూపుతోంది. పొంచి ఉన్న ముప్పు.. కొనసాగుతున్న ఎర్ర సముద్ర సంక్షోభం ప్రస్తుతానికి భారతీయ ఔషధ కంపెనీలపై ప్రభావం చూపనప్పటికీ.. సరఫరా అంతరాయాలు, రవాణా వ్యయాల పెరుగుదల రూపంలో ఏదైనా ప్రతికూల ప్రభావం ఎదురైతే అవి కీలకంగా మారతాయి. ధరల పెరుగుదల కీలక ఆదాయ మార్గంగా ఉన్నందున జెనరిక్స్‌కు అనుకూలమైన ఏవైనా పరిణామాలు లేదా ముఖ్యమైన మందుల జాబితా (ఎన్ఎల్ఈఎం) కింద మరిన్ని ఉత్పత్తులను చేర్చినట్టయితే తయారీ సంస్థలకు నష్టాలు వాటిల్లే ముప్పు పొంచి ఉంది. -
ఐటీ ఆదాయాల్లో 3–5 శాతం వృద్ధి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగం వచ్చే ఆర్థిక సంవత్సరంలో 3–5 శాతం ఆదాయ వృద్ధి నమోదు చేస్తుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా రేటింగ్స్ తెలిపింది. ‘వృద్ధి వేగం పుంజుకునే వరకు ఈ రంగంలో నియామకాలు సమీప కాలంలో స్తబ్ధుగా ఉంటాయి. ఆదాయ వృద్ధిపై ఆందోళనల మధ్య కంపెనీల లాభదాయకత స్థితిస్థాపకంగా ఉంటుంది. 250 బిలియన్ డాలర్ల భారతీయ ఐటీ రంగానికి 2024–25లో నిర్వహణ లాభాల మార్జిన్లు 21–22 శాతానికి వస్తాయి. 2023–24 ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల్లో పరిశ్రమ కేవలం 2 శాతం ఆదాయ వృద్ధిని నమోదు చేసింది. వాస్తవానికి 3–5 శాతం ఆదాయ వృద్ధి ఉంటుందని పరిశ్రమ గతంలో అంచనా వేసింది. 2022–23 ఏప్రిల్–డిసెంబర్లో ఇది 9.2 శాతం సాధించింది. యూఎస్, యూరప్‌లోని కీలక మార్కెట్లలో స్థిర, స్థూల ఆర్థికపర ఎదురుగాలుల నేపథ్యంలో కార్పొరేట్ కంపెనీలు ఐటీపై తక్కువ వ్యయం చేయడంతో 2024–25లో కూడా స్వల్ప ఆదాయ వృద్ధి అంచనాలకు దారితీసింది’ అని తెలిపింది. సగటు అట్రిషన్ 12–13 శాతం.. ‘క్లిష్ట వ్యయాలు, వ్యయ నియంత్రణ ఒప్పందాలు కొనసాగనున్నాయి. ఇది భారతీయ ఐటీ సేవల కంపెనీల వృద్ధి అవకాశాలకు కొంతవరకు మద్దతునిస్తుంది. బలమైన ఆర్డర్ బుక్స్, వివిధ దశల్లో ఉన్న డీల్స్.. స్థూల ఆర్థికపర ఎదురుగాలులు తగ్గిన తర్వాత ఊపందుకుంటాయి. కార్పొరేట్ సంస్థలకు మహమ్మారి తర్వాత మొత్తం మూలధన కేటాయింపులకు టెక్ ఖర్చులు మరింత సమగ్రంగా మారాయి. నియామక కార్యకలాపాలు స్తబ్ధుగా ఉంటాయని అంచనా వేస్తున్నప్పటికీ అట్రిషన్ స్థాయిలు సమీప కాలంలో స్థిరపడతాయి. -
జోరందుకున్న కార్పొరేట్ ఆదాయాలు
ముంబై: దేశీ కార్పొరేట్ ఆదాయాలు ఈ ఆర్థిక సంవత్సరం(2023–24) రెండో త్రైమాసికంలో జోరందుకున్నట్లు రేటింగ్ దిగ్గజం క్రిసిల్ ఒక నివేదికలో పేర్కొంది. 8–10 శాతం మధ్య టర్నోవర్ పుంజుకుంటున్నట్లు తెలియజేసింది. ఈ బాటలో జులై–సెప్టెంబర్(క్యూ)లో లాభాల మార్జిన్లు సైతం మెరుగుపడుతున్నట్లు తెలియజేసింది. గత నాలుగు త్రైమాసికాలతో పోలిస్తే తొలిసారి దేశీ కంపెనీల ఆదాయాల్లో పటిష్ట వృద్ధి నమోదవుతున్నట్లు వెల్లడించింది. ఆటోమొబైల్స్, కన్స్ట్రక్షన్, ఐటీ రంగాలు టర్నోవర్‌లో వృద్ధికి దోహదపడుతున్నట్లు పేర్కొంది. వార్షిక ప్రాతిపదికన చూస్తే ఏప్రిల్–జూన్(క్యూ1)లో ఆదాయం 7 శాతం బలపడినట్లు ప్రస్తావించింది. బ్యాంకింగ్, చమురు రంగాలను మినహాయించి 300 కంపెనీలను తాజా నివేదికలో విశ్లేషించినట్లు క్రిసిల్ వెల్లడించింది. ఆటో, రిటైల్ జోరు నివేదిక ప్రకారం వినియోగదారు విచక్షణానుగుణ(కన్జూమర్ డిస్క్రెషనరీ) ప్రొడక్టులు, సర్వీసులవైపు దేశీ కార్పొరేట్ ఆదాయాల్లో వృద్ధి ప్రయాణించింది. ప్రధానంగా ఆటోమొబైల్, రిటైల్ రంగాలు ప్రధానపాత్ర పోషించగా.. నిర్మాణ సంబంధ విభాగాలు సైతం జత కలిశాయి. రహదారులు, రైల్వే శాఖల పెట్టుబడుల ముందస్తు కేటాయింపులలతో నిర్మాణ రంగ కంపెనీలు లబ్ది పొందినట్లు క్రిసిల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ అండ్ అనలిటిక్స్ రీసెర్చ్ డైరెక్టర్ అనికెట్ డాని పేర్కొన్నారు. అయితే వ్యవసాయ రంగంతో ముడిపడిన ఎరువులు, క్లోర్ ఆల్కలీస్, పెట్రోకెమికల్స్, కమోడిటీ కెమికల్స్, అల్యూమినియం తదితర ఇండస్ట్రియల్ కమోడిటీలు నీరసించకుంటే కార్పొరేట్ ఆదాయాలు మరింత జోరు చూపేవని నివేదిక అభిప్రాయపడింది. మొత్తం ఆదాయంలో 70 శాతానికి ప్రాతినిధ్యంవహించే 9 రంగాలు వృద్ధిని అందుకుంటున్నాయని వివరించింది. ఇక లాభాల విషయంలో నిర్వహణ లాభ మార్జిన్లు గతేడాది(2022–23) రెండో త్రైమాసికంలో నమోదైన 17.2 శాతంతో పోలిస్తే 20 శాతానికి మెరుగుపడినట్లు తెలియజేసింది. క్యూ1లో ఇవి 20.5 శాతంకాగా.. త్రైమాసికవారీగా స్వల్ప వెనకడుగు వేసినట్లు పేర్కొంది. పెరుగుతున్న ముడిచమురు ధరలు, వర్షాభావం వంటి అంశాలు ఈ ఏడాది ద్వితీయార్ధం(అక్టోబర్–మార్చి)లో గ్రామీ ణ ప్రాంతాల డిమాండును ప్రభావితం చేయవచ్చని అంచనా వేసింది. -
‘నిర్మాణ పరికరాల’ ఆదాయం 15 శాతం అప్
న్యూఢిల్లీ: దేశీయంగా నిర్మాణ పరికరాల రంగం ఆదాయం 2023–24 ఆర్థిక సంవత్సరంలో 14–15 శాతం మేర వృద్ధి చెందనుంది. మౌలికరంగంపై కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా దృష్టి పెడుతుండటం ఇందుకు దోహదపడనుంది. అలాగే, రియల్ ఎస్టేట్, మైనింగ్ రంగాల్లో కార్యకలాపాలు పుంజుకోవడం కూడా తోడ్పాటు అందించనుంది. క్రిసిల్ రేటింగ్స్ ఒక నివేదికలో ఈ మేరకు అంచనా వేసింది. ‘‘గత ఆర్థిక సంవత్సరంలో అధిక బేస్ (29 శాతం) ప్రాతిపదికన ఈ ఆర్థిక సంవత్సరంలో దేశీ నిర్మాణ పరికరాల రంగం ఆదాయం 14–15 శాతం మేర వృద్ధి చెందవచ్చు. నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్‌లైన్ (ఎన్ఐపీ)తో పాటు రహదారులు, మెట్రోలు, రైల్వేలు మొదలైన మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టడం ఇందుకు దోహదపడనుంది’’ అని క్రిసిల్ రేటింగ్స్ పేర్కొంది. సాధారణంగా నిర్మాణ పరికరాల వినియోగంలో రహదారుల వాటా 40 శాతం వరకు ఉంటుంది. రోడ్ల నిర్మాణం పనులు వేగవంతం అవుతుండటం పరిశ్రమ వృద్ధికి సహాయకరంగా ఉండనుంది. వంతెనలు.. విమానాశ్రయాలూ.. రియల్ ఎస్టేట్, మైనింగ్ రంగాలతో పాటు వంతెనలు, విమానాశ్రయాలు, మెట్రో కారిడార్లు మొదలైన వాటి కాంట్రాక్టర్ల నుంచి తయారీ సంస్థలకు ఆర్డర్లు బాగా ఉంటున్నాయని క్రిసిల్ రేటింగ్స్ డైరెక్టర్ పూనమ్ ఉపాధ్యాయ్ తెలిపారు. 2024 ఏప్రిల్ 1 నుంచి పరిశ్రమ స్టేజ్–వీ2 ఉద్గార ప్రమాణాలకు మళ్లనుండటం వల్ల పరికరాల ధరలు పెరగనుండటంతో ఈ ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో పరికరాలను ముందుగానే కొంత కొని పెట్టుకునే ధోరణులు కూడా కనిపించవచ్చని వివరించారు. పరిమాణంపరంగా చూస్తే గత ఆర్థిక సంవత్సరంలో 1.1 లక్షల యూనిట్ల అమ్మకాలు నమోదు కాగా .. ఈ ఆర్థిక సంవత్సరం ఆల్ టైమ్ గరిష్టంగా 1.2 లక్షల యూనిట్ల స్థాయిలో విక్రయాలు నమోదు కావచ్చని అంచనా వేస్తున్నట్లు నివేదిక పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం అమ్మకాల పరిమాణంలో ఎర్త్‌మూవింగ్ పరికరాల వాటా 70 శాతంగా, కాంక్రీట్ పరికరాల వాటా 22 శాతంగా ఉండగా.. మిగతాది మెటీరియల్ ప్రాసెసింగ్ పరికరాలది ఉన్నట్లు వివరించింది. -
పాత ఫోన్లకు పెరుగుతున్న డిమాండ్
న్యూఢిల్లీ: దేశంలో రీఫర్బిష్డ్ ఫోన్లు (పునరి్వనియోగ), ఎల్రక్టానిక్ ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతోంది. రానున్న పండుగల సీజన్లో గతేడాదితో పోలిస్తే ఈ విభాగం నుంచి ఆదాయం 18 శాతం వృద్ధి చెందుతుందని పరిశ్రమ అంచనా వేస్తోంది. దీంతో కొత్త ఫోన్ల విభాగంలో 7 శాతం వృద్ధిని పునరి్వనియోగ ఫోన్ల మార్కెట్ అధిగమించనుంది. క్యాషిఫై, రీఫిట్ గ్లోబల్ ఈ రెండూ రీఫర్బిష్డ్ ఫోన్లు, రీఫర్బిష్డ్ ఎల్రక్టానిక్ ఉత్పత్తులను విక్రయించే ప్రముఖ సంస్థలు కాగా, వచ్చే పండుగల సందర్భంగా అమ్మకాలు గణనీయంగా పెరుగుతాయనే అంచనాలతో ఉన్నాయి. ముఖ్యంగా ఖరీదైన రీఫర్బిష్డ్ ఫోన్లకు ఎక్కువ డిమాండ్ కనిపిస్తోంది. ‘‘మా ఆదాయం మూడు రెట్లు పెరుగుతుందని అంచనా వేస్తున్నాం. 2021–22 రికార్డు ఆదాయన్ని డిసెంబర్ నాటికే అధిగమించనున్నాం’’అని రీఫిట్ గ్లోబల్ సహ వ్యవస్థాపకుడు సాకేత్ సౌరవ్ తెలిపారు. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ప్రముఖ సంస్థలతో రిఫర్బిష్డ్ ఎలక్ట్రానిక్ ఉత్పత్తులకు సంబంధించి ఈ సంస్థకు ఒప్పందాలు ఉన్నాయి. యాపిల్, వన్‌ప్లస్ బ్రాండ్ల రీఫర్బిష్డ్ ఫోన్లకు పెద్ద పట్టణాల్లో మంచి ఆదరణ ఉన్నట్టు సౌరవ్ తెలిపారు. గత 8–10 నెలల్లో యాపిల్, వన్‌ప్లస్ నుంచి సరఫరాలు పెరిగినట్టు చెప్పారు. గతంలో ఈ రెండు బ్రాండ్లు మొత్తం అమ్మకాల్లో 3–3.5 శాతం వాటా కలిగి ఉండేవని, ఇప్పుడు 9–10 శాతానికి పెరిగినట్టు పేర్కొన్నారు. బలమైన అంచనాలు.. దేశంలో రీఫర్బిష్డ్ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల విక్రయాల్లో అగ్రగామి కంపెనీ క్యాషిఫై దీపావళి సందర్భంగా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించనున్నట్టు ప్రకటించింది. గతేడాదితో పోలిస్తే పండుగల సీజన్లో రెండింత విక్రయాలను అంచనా వేస్తున్నట్టు పేర్కొంది. ఓమ్నిచానల్ నమూనాను క్యాషిఫై అనుసరిస్తోంది. 2,000కు పైగా రిటైల్ స్టోర్లలోను ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకురానున్నట్టు సంస్థ సహ వ్యవస్థాపకుడు నకుల్ కుమార్ తెలిపారు. రీఫర్బిష్డ్ స్మార్ట్ వాచ్‌లు, ల్యాప్‌టాప్‌ల విభాగాలనూ ప్రవేశపెట్టనున్నట్టు చెప్పారు. యాపిల్, శామ్సంగ్, వన్‌ప్లస్ ఉత్పత్తులను రూ.18,000–22,000 శ్రేణిలో ఆన్లైన్, ఆఫ్‌లైన్ స్టోర్లలో అందబాటులో ఉంచనున్నట్టు తెలిపారు. రానున్న పండుగల సమయంలో రీఫర్బిష్డ్ విభాగం వార్షికంగా క్రితం ఏడాది ఇదే కాలంలోని గణాంకాలతో పోల్చి చూస్తే 18 శాతం వృద్ధి నమోదు కా>వచ్చని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ డైరెక్టర్ తరుణ్ పాఠక్ తెలిపారు. ఐఫోన్ 12, ఐఫోన్ 11, గెలాక్సీ ఎస్21ఎఫ్ఈ, గెలాక్సీ ఎస్21, రెడ్మీ నోట్ 10 తదితర ఉత్పత్తులు ఈ వృద్ధిని నడిపిస్తాయన్నారు. దేశీయంగా సరఫరా తక్కువగా ఉండడం రీఫర్బిష్డ్ విభాగంలో ఐఫోన్లకు డిమాండ్‌ను పెంచుతున్నట్టు చెప్పారు. -
హోమ్ టెక్స్టైల్ పరిశ్రమకు పునరుజ్జీవం
ముంబై: హోమ్ టెక్స్టైల్ పరిశ్రమ ఈ ఏడాది 7–9 శాతం మధ్య ఆదాయ వృద్ధిని నమోదు చేయనుంది. దేశీయంగా కాటన్ ధరలు తగ్గుముఖం పట్టడంతో అంతర్జాతీయంగా తిరిగి తన వాటాను పెంచుకుందని క్రిసిల్ రేటింగ్స్ తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో హోమ్ టెక్స్టైల్ కంపెనీల ఆదాయం 15 శాతం వరకు తగ్గడం గమనార్హం. పరిశ్రమ నిర్వహణ లాభం 1.5–2 శాతం వరకు మెరుగుపడి 14–14.5 శాతానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చేరుకోవచ్చని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేసింది. ముడి సరుకుల ధరలు తక్కువలో ఉండడం, నిర్వహణ పరమైన అనుకూలతలను పేర్కొంది. అయితే ఇప్పటికీ కరోనా ముందు నాటి కంటే తక్కువలోనే ఉన్నట్టు తెలిపింది. దీంతో పరిశ్రమ రుణ భారం స్థిరంగా కొనసాగొచ్చని అంచనా వేసింది. హోమ్ టెక్స్‌టైల్‌లో 40–45 శాతం మార్కెట్ వాటా కలిగిన 40 కంపెనీలను అధ్యయనం చేసిన తర్వాత క్రిసిల్ రేటింగ్స్ ఈ నివేదికను విడుదల చేసింది. ఎగుమతులు పెరుగుతాయి.. భారత హోమ్ టెక్స్టైల్స్ పరిశ్రమ మొత్తం ఆదాయంలో 70–75 శాతం ఎగుమతుల నుంచే వస్తోంది. ఇందులో యూఎస్ వాటా అధికంగా ఉంది. భారత ఎగుమతుల్లో సగం అమెరికాకే వెళుతుంటాయి. కాటన్ ధర క్యాండీకి గతేడాది మే నెలలో రూ.లక్షకు చేరుకోగా, అది ఇప్పుడు రూ.55,000కు తగ్గినట్టు క్రిసిల్ రేటింగ్స్ నివేదిక వెల్లడించింది. అమెరికాలో బడా రిటైల్ సంస్థల వద్ద నిల్వలు తగ్గిపోవడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత కంపెనీలకు ఆర్డర్ల రాక పెరుగుతుందని అంచనా వేసింది. అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలో సవాళ్లు నెమ్మదించడంతో గడిచిన కొన్ని నెలలుగా అమ్మకాలు క్రమంగా పెరుగుతున్నట్టు తెలిపింది. ‘‘దేశీయ ముడి సరుకులు ఇప్పుడు పోటీనిచ్చే స్థాయికి తగ్గాయి. అంతర్జాతీయ కొనుగోలు దారులు చైనా ప్లస్ వన్‌కు ప్రాధాన్యం ఇస్తుండడం, యూఎస్ రిటైలింగ్ సంస్థలు తిరిగి స్టాక్ పెంచుకునేందుకు ఆసక్తి చూపిస్తుండడడంతో ఆదాయం పుంజుకుంటుంది’’అని క్రిసిల్ రేటింగ్స్ సీనియర్ డైరెక్టర్ మోహిత్ మఖీజా తెలిపారు. దీనికి నిదర్శనంగా 2022లో భారత కంపెనీల వాటా 44 శాతం నుంచి తిరిగి 47 శాతానికి చేరుకోవడాన్ని ప్రస్తావించారు. 2021లో ఈ వాటా 48 శాతంగా ఉంది. -
ఐటీ రంగంలో తగ్గనున్న నియామకాలు
ముంబై: భారత ఐటీ కంపెనీల ఆదాయంలో వృద్ధి మరింత తగ్గి, మధ్య స్థాయి సింగిల్ డిజిట్‌కు (4–6) పరిమితం అవుతుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. ఈ రంగంలో అనిశ్చిత పరిస్థితులు కొనసాగుతున్నందున నియామకాలపై ప్రభావం పడుతుందని పేర్కొంది. దీంతో కంపెనీలు సమీప కాలంలో కొత్త నియామకాలను తక్కువకు పరిమితం చేసుకోవచ్చని తెలిపింది. 2022–23 ఆర్థిక సంవత్సరం చివరి రెండు త్రైమాసికాల్లో (2022 అక్టోబర్ నుంచి 2023 మార్చి వరకు) నికర నియామకాలు ప్రతికూలంగా ఉన్న విషయాన్ని ఇక్రా తన నివేదికలో ప్రస్తావించింది. ఐటీ కంపెనీల అసోసియేషన్ నాస్కామ్ మార్చిలో విడుదల చేసిన నివేదికను పరిశీలించినప్పుడు 2022–23లో వృద్ధి 8.4 శాతానికి తగ్గిపోయినట్టు తెలుస్తోంది. 2021–22లో ఇది 15 శాతంగా ఉండడం గమనార్హం. ఆర్డర్ బుక్, డీల్స్ బలంగానే ఉనప్పటికీ 2023–24లో ఆదాయం వృద్ధి 4–6 శాతం మించకపోవచ్చని ఇక్రా అంచనా వేసింది. ఈ రంగంలోని కంపెనీల పట్ల స్థిరమైన దృక్పథాన్ని కొనసాగిస్తున్నట్టు తెలిపింది. రుణాలకు సంబంధించి ఇవి మెరుగైన స్థితిలో ఉన్నట్టు అర్థం చేసుకోవచ్చు. అమెరికా, యూరప్‌లో స్థూల ఆర్థిక సమస్యలు ఉండడంతో గత రెండు త్రైమాసికాల్లో వృద్ధి ధోరణి తగ్గుముఖం పట్టినట్టు ఇక్రా తెలిపింది. భారత ఐటీ కంపెనీల ఆదాయంలో 90 శాతం యూఎస్, యూరప్ నుంచే వస్తున్న విషయాన్ని ప్రస్తావించింది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సేవలు, ఇన్సూరెన్స్ విభాగం నుంచే మూడింట ఒకటో వంతు ఆదాయం ఐటీ కంపెనీలకు వస్తుంటుంది. అమెరికాలో బ్యాంకింగ్ సంక్షోభం నేపథ్యంలో ఈ రంగాల నుంచి వచ్చే ఆదాయం తగ్గొచ్చని.. కస్టమర్లు నిర్ణయాలను జాప్యం చేయవచ్చని ఇక్రా తెలిపింది. మార్జిన్లు స్థిరం.. గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీల మార్జిన్లు 1.90 శాతం తగ్గి 22.9 శాతానికి పరిమితమైనట్టు ఇక్రా తెలిపింది. ఆదాయంలో వృద్ధి నిదానించినా, నిర్వహణ మార్జిన్లు ఇదే స్థాయిలో కొనసాగొచ్చని అంచనా వేసింది. ఐటీ రంగంలోని టాప్–5 కంపెనీలు గత ఆర్థిక సంవత్సరంలో 83,906 మందిని నియమించుకున్నట్టు ప్రస్తావించింది. స్థూల ఆర్థిక అనిశ్చితులు కొనసాగినంత కాలం నియామకాలు తక్కువగానే ఉండొచ్చని పేర్కొంది. -
పెయింట్స్ మార్కెట్ కలర్‌ఫుల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నిర్మాణం, రియల్టీ, వాహన తయారీ పరిశ్రమ నుండి ఆరోగ్యకర డిమాండ్ కొనసాగడంతో పెయింట్స్ రంగం 2023–24లో 10–12 శాతం ఆదాయ వృద్ధిని నమోదు చేస్తుందని క్రిసిల్ వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరంలో పెయింట్స్ పరిశ్రమ ఆదాయం 18 శాతం వృద్ధి చెందుతుందన్న అంచనాలు ఉన్నాయి. క్రిసిల్ తాజా నివేదిక ప్రకారం.. పరిమాణం పెంపు, నగదు లభ్యత కారణంగా కంపెనీలు ఆరోగ్యకరమైన బ్యాలెన్స్ షీట్లను నిర్వహించడానికి సహాయపడతాయి. మూలధనం పెరుగుతున్నప్పటికీ క్రెడిట్ ప్రొఫైల్స్‌ను మెరుగుపరుస్తుంది. 2022–24 మధ్య రూ.12,000 కోట్ల మూలధన వ్యయం చేయనున్నట్టు అయిదు టాప్ కంపెనీలు ప్రకటించాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అన్ని కంపెనీల ఉత్పత్తి సామర్థ్యం 420 కోట్ల లీటర్లు. ఇందులో టాప్–5 కంపెనీల వాటా 90 శాతం. కొత్తగా ఈ రంగంలోకి ప్రవేశించిన కంపెనీలు 140 కోట్ల లీటర్ల సామర్థ్యాన్ని జోడించనున్నాయి. క్రూడ్‌తో ముడిపడి.. 2022–23లో పెయింట్స్ ధర 6 శాతం పెరిగింది. నిర్వహణ లాభాలు దాదాపు 2022–23 మాదిరిగానే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 15–16 శాతం ఉండనున్నాయి. పెయింట్లలో వాడే కీలక ముడి పదార్థాలు క్రూడ్‌తో ముడిపడి ఉంటాయి. 2022 జూన్–జూలైలో క్రూడ్ బ్యారెల్ ధర 115 డాలర్లు పలికింది. ప్రస్తుతం ఈ ధర 85 డాలర్లకు పడిపోవడం నిర్వహణ లాభాలకు బూస్ట్నివ్వనుంది. అయితే డాలరుతో రూపాయి మారకం విలువ 2022–23లో రూ.80.2 నుంచి ప్రస్తుతం రూ.82 దాటింది. రూపాయి పతనం మార్జిన్లకు ముప్పుగా పరిణమిస్తుంది. పెయింట్స్ తయారీలో వాడే ముడి పదార్థాల అవసరాల్లో మూడింట ఒకవంతు దిగుమతులపైనే పరిశ్రమ ఆధారపడి ఉంది. ఇదీ పెయింట్స్ పరిశ్రమ.. భారత పెయింట్స్ పరిశ్రమ విలువ రూ.65,000 కోట్లు. ఇందులో డెకోరేటివ్ విభాగం వాటా ఏకంగా 80 శాతం ఉంది. జీడీపీతో పోలిస్తే పెయింట్స్ డిమాండ్ 1.6–2 రెట్లు వృద్ధి చెందుతోంది. పునర్నిర్మాణం, నిర్మాణం కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డెకోరేటివ్ పెయింట్స్ విభాగం 11–12 శాతం ఆదాయ వృద్ధికి ఆస్కారం ఉంది. బ్రాండెడ్ పెయింట్లకే భవిష్యత్ ఉందని టెక్నో పెయింట్స్ ఫౌండర్ ఆకూరి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇక మౌలిక వసతులపై ప్రభుత్వ వ్యయం, ఆటోమొబైల్ పరిశ్రమ నుంచి స్థిర డిమాండ్‌తో ఇండస్ట్రియల్ పెయింట్స్ విభాగం ఆదాయం 8–9 శాతం అధికం కానుంది. -
ఫ్యాంటసీ స్పోర్ట్స్ ఆదాయం 35 శాతం అప్
న్యూఢిల్లీ: ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2023 క్రికెట్ టోర్నమెంటు సీజన్లో ఫ్యాంటసీ స్పోర్ట్స్ విభాగం ఆదాయం రూ. 2,900–3,100 కోట్లకు చేరనుంది. గతేడాది సీజన్‌తో పోలిస్తే 30–35 శాతం పెరగనుంది. మార్కెట్ రీసెర్చ్ సంస్థ రెడ్‌సీర్ స్ట్రాటెజీ కన్సల్టెంట్స్ ఈ విషయాలు వెల్లడించింది. గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లపై 6.5–7 కోట్ల మంది యూజర్లు లావాదేవీలు జరపవచ్చని అంచనా వేసింది. గత 4–5 ఏళ్లుగా ఫ్యాంటసీ స్పోర్ట్స్ యూజర్ల సంఖ్య ఏటా 20% మేర పెరుగుతుండగా, ఈ ఏడాది 20–30% స్థాయిలో పెరగవచ్చని సంస్థ పార్ట్నర్ ఉజ్వల్ చౌదరి తెలిపారు. ప్రతి యూజరుపై ఆదాయం గత ఐపీఎల్ సీజన్లో రూ. 410గా ఉండగా ఈ సీజన్లో రూ. 440కి చేరవచ్చని పేర్కొన్నారు. మార్కెటింగ్‌పై గణనీయంగా ఖర్చు చేస్తుండటంతో ఫ్యాంటసీ స్పోర్ట్స్ ప్లాట్‌ఫామ్‌లపై అవగాహన పెరుగుతోందని చౌదరి చెప్పారు. ‘నిబంధనలు, జీఎస్టీపై స్పష్టత వచ్చింది. గూగుల్ కూడా తమ ప్లేస్టోర్‌లో ప్రయోగాత్మకంగా కొన్ని ఫ్యాంటసీ ప్లాట్‌ఫామ్‌లను అనుమతిస్తుండటం మరో సానుకూలాంశం. ఇవన్నీ కూడా భారత్‌లో ఈ స్పోర్ట్స్‌కు అనుకూలమైన పరిణామాలే‘ అని పేర్కొన్నారు. పైలట్ ప్రోగ్రాం కింద డ్రీమ్11, మై11సర్కిల్, ఎంపీఎల్ రమ్మీ, ఫ్యాంటసీ క్రికెట్ లాంటి కొన్ని ప్లాట్‌ఫామ్‌లను గూగుల్ తమ ప్లేస్టోర్‌లో అనుమతించింది. మార్చి 31తో ప్రారంభమైన ఐపీఎల్ 2023 క్రికెట్ టోర్నీ.. మే నెలాఖరు వరకు కొనసాగనుంది. రెడ్‌సీర్ గణాంకాల ప్రకారం.. ఏడాది మొత్తం మీద ఫ్యాంటసీ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లకు వచ్చే ఆదాయంలో ఐపీఎల్ సీజన్ వాటా 35–40% ఉంటుంది. -
ప్రైవేటు ఆస్పత్రుల ఆదాయం11% వృద్ధి
ముంబై: ప్రైవేటు దవాఖానాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23)తోపాటు, వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ (2023–24) 10–11 శాతం మేర ఆదాయంలో వృద్ధిని చూస్తాయని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేసింది. దేశీయంగా వైద్యం కోసం డిమాండ్ పెరగడానికి తోడు, వైద్యం కోసం వచ్చే పర్యాటకుల్లోనూ పెరుగుదల ఉందని క్రిసిల్ నివేదిక వెల్లడించింది. హాస్పిటళ్లలో బెడ్ల భర్తీ రేటు పెరుగుతుందని, ఒక్కో బెడ్ వారీ వచ్చే సగటు ఆదాయం అధిక స్థాయిలో కొనసాగుతుందని పేర్కొంది. 2021–22లో ప్రైవేటు ఆస్పత్రులు ఆల్‌టైమ్ గరిష్ట నిర్వహణ లాభాన్ని నమోదు చేశాయని.. కరోనా చికిత్సల మద్దతుతో నిర్వహణ లాభం 19 శాతంగా ఉందని తెలిపింది. కరోనా కాలంలో నిలిచిపోయిన సాధారణ చికిత్సల కోసం ముందుకు వచ్చే వారితో డిమాండ్ కొనసాగుతున్నట్టు వివరించింది. ‘‘కరోనా తర్వాత ఆరోగ్యం పట్ల అవగాహన పెరుగుతోంది. దీంతో వైద్య సేవలకు దేశీయంగా డిమాండ్‌కుతోడు వైద్య పర్యాటకం కూడా పుంజుకుంటోంది. పడకలు పెరిగినప్పటికీ, వాటి భర్తీ రేటు 60 శాతం స్థాయిలోనే (గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో ఉన్నట్టు) కొనసాగొచ్చు’’ అని క్రిసిల్ రేటింగ్స్ సీనియర్ డైరెక్టర్ అనుజ్ సేతి తెలిపారు. గత ఐదేళ్లలో కేవలం కరోనా మొద టి విడత లాక్డౌన్ కాలంలోనే ఆస్పత్రుల్లో పడకల భర్తీ రేటు 53 శాతానికి తగ్గినట్టు సేతి చెప్పారు. పెద్దగా రుణాలు అవసరం లేదు.. ప్రైవేటు ఆస్పత్రులకు మెరుగైన నగదు ప్రవాహాలు ఉన్నందున.. అవి చేపట్టే విస్తరణ ప్రణాళికల కోసం పెద్దగా రుణాలు తీసుకోవాల్సిన అవసరం లేదని క్రిసిల్ రేటింగ్స్ అభిప్రాయపడింది. దీంతో ఆస్పత్రుల రుణ భారం ఆరోగ్యకర స్థాయిలోనే ఉంటుందని, ఇది వాటి క్రెడిట్ రిస్క్ ప్రొఫైల్‌ను స్థిరంగా ఉంచుతుందని విశ్లేషించింది. బీమా అండతో నాణ్యమైన వైద్యం బీమా కవరేజీ పెరుగుతుండడం ఆస్పత్రులకూ కలిసొస్తోంది. నాణ్యమైన వైద్యాన్ని పొందేందుకు పాలసీదారులు ఆసక్తి చూపిస్తున్న అంశాన్ని క్రిసిల్ రేటింగ్స్ ప్రస్తావించింది. బీమా వల్ల నాణ్యమైన వైద్యం వారికి అందుబాటులోకి వచ్చినట్టుగా పేర్కొంది. భర్తీ అయిన ఒక్కో పడకపై ఆదాయం 2021–22లో 20 శాతం వృద్ధి చెందినట్టు తెలిపింది. కరోనాకి ముందు ప్రైవేటు ఆస్పత్రులకు వైద్య పర్యాటకుల రూపంలో 10–12 శాతం మేర ఆదాయం వచ్చేదని, నాటి స్థాయికి క్రమంగా> తిరిగి ఆస్పత్రులు చేరుకుంటున్నాయని క్రిసిల్ నివేదిక తెలిపింది. తక్కువ చికిత్సల వ్యయాలు, అధునాతన సదుపాయాలు, శిక్షణ పొందిన సిబ్బంది, విమానయాన సేవల అనుసంధానత పెరగడం అన్నవి వైద్య పర్యాటకం తిరిగి కరోనా ముందు నాటి స్థాయికి పుంజుకునేందుకు సానుకూలతలుగా వివరించింది. -
స్టార్టప్‌ల తీరు ‘పొంజి స్కీమ్’ మాదిరే!: నారాయణమూర్తి
ముంబై: స్టార్టప్‌లు కేవలం ఆదాయం పెంపుపైనే దృష్టి సారిస్తూ, లాభాల గురించి ఆలోచించకుండా.. అదే సమయంలో వాటి మార్కెట్ విలువను పెంచుకోవడం అన్నది పొంజి స్కీమ్ మాదిరేనని, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి పేర్కొన్నారు. అటువంటి వ్యవస్థ అభివృద్ధి చెందడంలో వెంచర్ క్యాపిటల్ ఫండ్స్, బోర్డు డైరెక్టర్ల పాత్రను తప్పుబట్టాలే కానీ, యువ పారిశ్రామికవేత్తలను కాదన్నారు. నాస్కామ్ నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా నారాయణమూర్తి మాట్లాడారు. దీర్ఘకాల ప్రయోజాల కోసం ఇన్ఫోసిస్ సైతం ఎన్నో కఠిన నిర్ణయాలు తీసుకున్నట్టు చెప్పారు. విషయాల పట్ల వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ పారదర్శకంగా, నిజాయితీగా మాట్లాడాలని కోరారు. నిధులు సమీకరించినప్పుడల్లా వ్యాల్యూషన్లను పెంచుకుంటూ పోవడం ప్రమాదకరమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఏదైనా ఘటన వల్ల ఎదురుదెబ్బ లేదా ప్రతికూలతలు ఎదురైతే కంపెనీ ధర అదే మాదిరి పడిపోయే ప్రమాదం ఉంటుందన్నారు. అంతర్జాతీయంగా ప్రతికూల స్థూల ఆర్థిక పరిస్థితుల ప్రభావం ఐటీ కంపెనీలపై ఏ మేరకు ఉంటుందనే దానిపై మాట్లాడుతూ.. కష్ట సమయాలు ఎదురైనప్పుడల్లా భారత ఐటీ కంపెనీలు లాభపడినట్టు చెప్పారు. చాట్ జీపీటీ వంటి ఏఐ ప్లాట్‌ఫామ్‌లతో భారత ఐటీ ఉద్యోగాలపై ప్రభావం ఉండదన్నారు. గతంలో తానూ ఈ తరహా ప్లాట్‌ఫామ్‌ల కోసం ప్రయత్నించినట్టు చెప్పారు. -
20 శాతం వృద్ధి: టాటా హిటాచీ
కోల్‌కత: నిర్మాణ రంగానికి అవసరమైన యంత్రాల తయారీలో ఉన్న టాటా హిటాచీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 15–20 శాతం ఆదాయ వృద్ధి లక్ష్యంగా చేసుకుంది. 2021–22లో కంపెనీ రూ.4,000 కోట్ల టర్నోవర్ సాధించింది. అధిక విలువ కలిగిన మైనింగ్ యంత్రాలకు డిమాండ్ నేపథ్యంలో.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అమ్మకాల పరిమాణం 10–12 శాతం అధికం కానుందని టాటా హిటాచీ ఎండీ సందీప్ సింగ్ తెలిపారు. ‘మౌలిక రంగం నుంచి డిమాండ్ వృద్ధి 12–15 శాతం ఉంది. మైనింగ్ విభాగం నుంచి ఇది 20–25 శాతానికి ఎగసింది. మొత్తం విక్రయాల్లో మైనింగ్ విభాగం యూనిట్ల పరంగా 8 శాతం సమకూరుస్తోంది. వచ్చే మూడేళ్లలో ఈ సెగ్మెంట్ వాటా 15 శాతానికి చేరనుంది. పొరుగు దేశాలు ఆర్థిక కారణాల వల్ల దిగుమతులను తగ్గించిన తర్వాత మధ్యప్రాచ్య, ఆఫ్రికా వంటి కొత్త భౌగోళిక ప్రాంతాలలో ఎగుమతులు పెరగడానికి కంపెనీ కృషి చేస్తోంది. ఎగుమతులు ప్రస్తుతం మొత్తం వ్యాపారంలో ఏడు శాతం వాటాను కలిగి ఉన్నాయి. వచ్చే మూడేళ్లలో ఎగుమతుల వాటా 10 శాతానికి చేరాల్సి ఉంది’ అని వివరించారు. జేవీలో హిటాచీకి 60 శాతం, టాటా కంపెనీకి 40 శాతం వాటా ఉంది. కర్నాటకలోని ధార్వాడ్, పశ్చిమ బెంగాల్‌లోని ఖరగ్‌పూర్‌లో కంపెనీకి ప్లాంట్లు ఉన్నాయి. -
యాపిల్ ఇండియా ఆదాయం రెట్టింపు
న్యూయార్క్: ఈ ఏడాది జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో టెక్ దిగ్గజం యాపిల్ ఆదాయం సుమారు 2 శాతం వృద్ధి చెంది రికార్డు స్థాయిలో 83 బిలియన్ డాలర్లకు చేరింది. భారత మార్కెట్లో ఆదాయం దాదాపు రెట్టింపైనట్లు సంస్థ వెల్లడించింది. ‘అమెరికా, యూరప్, ఆసియా పసిఫిక్‌లోని ఇతర మార్కెట్లలో జూన్ త్రైమాసికంలో ఆదాయం రికార్డు స్థాయిలో పెరిగింది. సంపన్న, వర్ధమాన మార్కెట్లలో గణనీయంగా వృద్ధి చెందింది. బ్రెజిల్, ఇండొనేషియా, వియత్నాలలో రెండంకెల స్థాయిలోనూ, భారత్‌లో రెట్టింపు స్థాయిలోనూ పెరిగింది‘ అని ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా యాపిల్ సీఈవో టిమ్ కుక్ తెలిపారు. రష్యా వ్యాపారం, స్థూల ఆర్థిక అంశాలపరంగా కొంత ప్రతికూల ప్రభావాలు పడినప్పటికీ సర్వీసుల విభాగం ఆదాయం 12 శాతం పెరిగి 19.6 బిలియన్ డాలర్లకు చేరినట్లు వివరించారు. ప్రతిభావంతులైన ఉద్యోగులను అట్టే పెట్టుకునేందుకు, కొత్త వారిని ఆకర్షించేందుకు కస్టమర్లు యాపిల్ ఉత్పత్తుల్లో ఇన్వెస్ట్ చేస్తున్నట్లు కుక్ తెలిపారు. భారత ఐటీ దిగ్గజం విప్రో ఇందుకు ఉదాహరణగా ఆయన చెప్పారు. అంతర్జాతీయంగా కొత్త గ్రాడ్యుయేట్లను రిక్రూట్ చేసుకోవడంలో ఇతర సంస్థలతో పోటీపడే క్రమంలో మాక్‌బుక్ ఎయిర్ వంటి అత్యుత్తమ పనితీరు కనపర్చే యాపిల్ ఉత్పత్తులపై విప్రో ఇన్వెస్ట్ చేస్తోందని కుక్ వివరించారు. -
ఆటో విడిభాగాల సంస్థలకు డిమాండ్ ఊతం
ముంబై: డిమాండ్ స్థిరంగా ఉండటం, సరఫరా వ్యవస్థపరమైన అడ్డంకులు తొలగిపోతుండటం తదితర అంశాలు ఆటో విడిభాగాల సంస్థలకు ఊరటనివ్వనున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వాటి ఆదాయాలు 8–10 శాతం మేర వృద్ధి చెందనున్నాయి. రేటింగ్ ఏజెన్సీ ఇక్రా ఒక ప్రకటనలో ఈ అంచనాలు వెల్లడించింది. దీని ప్రకారం 31 ఆటో విడిభాగాల కంపెనీలు గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం మీద రూ. 1,75,000 కోట్ల పైగా ఆదాయాలు ఆర్జించాయి. వార్షికంగా 23 శాతం వృద్ధి నమోదు చేశాయి. దేశీ ఒరిజినల్ ఎక్విప్మెంట్ తయారీ సంస్థలు (ఓఈఎం), రిప్లేస్మెంట్, ఎగుమతులు, కమోడిటీల ధరల పెరుగుదలను బదలాయించగలగడం తదితర అంశాలు ఇందుకు తోడ్పడ్డాయి. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో లో బేస్‌తో పోలిస్తే వృద్ధి అధిక స్థాయిలో నమోదైందని, అయినప్పటికీ పరిశ్రమ ఆదాయాలు తమ అంచనాలు మించాయని ఇక్రా పేర్కొంది. ఊహించిన దాని కన్నా ఎగుమతులు మెరుగ్గా ఉండటం, కమోడిటీల ధరలు.. రవాణా వ్యయాల పెరుగుదల భారాన్ని వినియోగదారులకు బదలాయించడం కంపెనీలకు కలిసొచ్చిందని వివరించింది. తగ్గిన మార్జిన్లు.. గత ఆర్థిక సంవత్సరంలో ఆదాయాలు పెరిగినప్పటికీ ముడి వస్తువుల ఖర్చులు, రవాణా వ్యయాల భారాన్ని ద్వితీయార్థంలో (అక్టోబర్–మార్చ్) కంపెనీలు పూర్తి స్థాయిలో, సకాలంలో బదలాయించలేకపోయాయని ఇక్రా తెలిపింది. దీనితో లాభాల మార్జిన్లపై ప్రభావం పడినట్లు పేర్కొంది. 31 ఆటో విడిభాగాల కంపెనీల నిర్వహణ మార్జిన్లు గత ఆర్థిక సంవత్సరంలో అయిదేళ్ల కనిష్ట స్థాయికి తగ్గాయని ఇక్రా తెలిపింది. సెమీకండక్టర్ కొరత సమస్యలు, ద్విచక్ర వాహనాలు .. ట్రాక్టర్లకు డిమాండ్ అంతంతమాత్రంగానే ఉండటం, అంతర్జాతీయ వ్యాపారాలపై భౌగోళికరాజకీయ పరిణామాల వంటి అంశాలు ఆదాయాల వృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపినట్లు పేర్కొంది. ‘30 కంపెనీల (ఒక పెద్ద ఆటో విడిభాగాల సరఫరా సంస్థ కాకుండా) నిర్వహణ మార్జిన్లు 10.6 శాతంగా నమోదయ్యాయి. వార్షికంగా చూస్తే ఇది 10 బేసిస్ పాయింట్లు, మా అంచనాలతో పోలిస్తే 40 బేసిస్ పాయింట్లు తక్కువ‘ అని ఇక్రా వైస్ ప్రెసిడెంట్ వినుతా ఎస్ తెలిపారు. సరఫరా వ్యవస్థపరమైన అనిశ్చితులు, ధరల పెరుగుదల భయాల కారణంగా ఆటో యాన్సిలరీలు గత ఆర్థిక సంవత్సరంలో తమ నిల్వలను భారీగా పెంచుకున్నాయని పేర్కొన్నారు. అంతక్రితం నాలుగేళ్లలో ఇదే అత్యధికమని వివరించారు. ద్వితీయ, తృతీయ శ్రేణి సంస్థల దగ్గర లిక్విడిటీ (నగదు లభ్యత) మెరుగ్గా ఉండటం సానుకూలాంశమని వినుత తెలిపారు. పీఎల్ఐ స్కీముతో దన్ను.. ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) స్కీముతో మధ్యకాలికంగా ఆటో యాన్సిలరీల విభాగంలో పెట్టుబడులకు ఊతం లభించగలదని ఇక్రా తెలిపింది. ఎలక్ట్రిక్ వాహనాల సెగ్మెంట్లో కొత్తగా మరిన్ని పెట్టుబడులు రాగలవని వివరించింది. ఇక పరిశ్రమకు రుణ అవసరాలు కూడా ఎక్కువగా ఉండకపోవచ్చని పేర్కొంది. ఆటో యాన్సిలరీల రుణాల భారం పరిస్థితి మెరుగ్గా ఉందనేందుకు సూచనగా చాలా మటుకు సంస్థలకు ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ రేటింగ్‌ను కొనసాగిస్తున్నట్లు ఇక్రా తెలిపింది. దీనితో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం .. ఆటో యాన్సిలరీలకు సానుకూలంగా ఉండగలదని అంచనా వేస్తున్నట్లు పేర్కొంది. -
వైద్య రంగ వృద్ధి మధ్యస్థం: ఇక్రా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వైద్య సేవల రంగ ఆదాయ వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మధ్యస్థంగా ఉండే అవకాశం ఉందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా వెల్లడించింది. ‘సామర్థ్యం పెంపు కారణంగా ఆక్యుపెన్సీ కొద్దిగా మితంగా ఉంటుందని అంచనా వేసినప్పటికీ.. ఒక్కో పడక ద్వారా సగటు ఆదాయం క్రమంగా పెరుగుతుంది. కీలక శస్త్ర చికిత్సల విభాగంలో వ్యవస్థీకృత సంస్థల మార్కెట్ వాటా పుంజుకుంది. విదేశీ రోగుల రాకతో మెట్రో నగరాల్లోని ఆసుపత్రుల్లో రద్దీ అధికం అయింది. దేశవ్యాప్తంగా పెద్ద సంస్థలు కొన్ని నూతన ఆసుపత్రుల ఏర్పాటు, మరికొన్ని ఇప్పటికే ఉన్న కేంద్రాల్లో పడకల సామర్థ్యం పెంచనున్నట్టు ఇటీవల వెల్లడించాయి. రెండు మూడేళ్లుగా కొత్త ఆసుపత్రుల నిర్మాణానికి బదులు ఉన్న కేంద్రాల్లో ఆదాయాల పెరుగుదలపై వైద్య పరిశ్రమ దృష్టిసారించింది.’ అని ఇక్రా వివరించింది. -
ఐటీ.. రికవరీ పటిష్టం
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీ ఐటీ పరిశ్రమ రికవరీ మరింత పటిష్టంగా ఉండగలదని, ఆదాయాలు 11 శాతం దాకా వృద్ధి నమోదు చేయవచ్చని రేటింగ్స్ ఏజెన్సీ క్రిసిల్ తెలిపింది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసులు.. బీమా (బీఎఫ్ఎస్ఐ), హెల్త్‌కేర్, రిటైల్, తయారీ తదితర రంగాల్లో డిజిటలీకరణ వేగవంతం కానుండటం, ఔట్సోర్సింగ్ వంటి అంశాలు రికవరీకి దోహదపడగలవని పేర్కొంది. పరిశ్రమ వృద్ధి అంశంపై విప్రో వ్యవస్థాపకుడు అజీం ప్రేమ్‌జీ కూడా రెండంకెల స్థాయిని అంచనా వేస్తుండటం గమనార్హం. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థల సమాఖ్య నాస్కామ్ గణాంకాల ప్రకారం ఐటీ సేవల పరిశ్రమ 2020–21లో 2.7 శాతం వృద్ధి చెంది 99 బిలియన్ డాలర్లకు చేరింది. ఈ–కామర్స్, బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ మొదలైన విభాగాలన్నీ కలిపితే 2.3 శాతం పెరిగి 194 బిలియన్ డాలర్లుగా నమోదైంది. డిజిటల్ డీల్స్ జూమ్.. కంపెనీల నిర్వహణ మార్జిన్లు మరింత మెరుగుపడటానికి లాభదాయకమైన డిజిటల్ ఒప్పందాలు ఉపయోగపడగలవని క్రిసిల్ తెలిపింది. ‘వ్యయాలను తగ్గించుకునేందుకు కస్టమర్లు ప్రయత్నిస్తున్నందున ఐటీ సేవల ఔట్సోర్సింగ్ అంతర్జాతీయంగా క్రమంగా పెరుగుతోంది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా రిమోట్ వర్కింగ్, ఈ–కామర్స్, ఆటోమేటెడ్ సేవలు వంటి విధానాలు పెరిగిన నేపథ్యంలో, డిజిటల్ సర్వీసుల వ్యాపారావకాశాలు మరింత పెరిగాయి‘ అని సంస్థ సీనియర్ డైరెక్టర్ అనుజ్ సేఠి తెలిపారు. 2020–21లో దేశీ సంస్థలు కుదుర్చుకున్న ఒప్పందాల పరిమాణం 20 శాతం పెరగ్గా.. ఇందులో సుమారు 80 శాతం వాటా డిజిటల్ డీల్స్‌దే ఉందని ఆయన పేర్కొన్నారు. క్రిసిల్ అంచనాల్లో మరికొన్ని.. ► ఐటీ సర్వీసుల ఆదాయంలో సుమారు 28 శాతం వాటా ఉండే బీఎఫ్ఎస్ఐ విభాగం .. ఈ ఆర్థిక సంవత్సరం 13–14 శాతం వృద్ధి నమోదు చేయనుంది. డిజిటల్ లావాదేవీలు, డేటా భద్రతరమైన జాగ్రత్తలు పెరుగుతుండటం ఇందుకు దోహదపడనున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో బీఎఫ్ఎస్ఐ వృద్ధి 9 శాతంగా నమోదైంది. ► ఐటీ ఆదాయాల్లో 30 శాతంగా ఉండే రిటైల్, తయారీ విభాగాలు ఈసారి కాస్త కోలుకుని 8–9 శాతం మేర వృద్ధి చెందవచ్చు. 2020–21లో ఇవి 2–3 శాతం క్షీణించాయి. ► కోవిడ్–19ని ఎదుర్కొనేందుకు మరింత వ్యయం చేస్తున్నందున హెల్త్‌కేర్ విభాగం వృద్ధి భారీగా 15–16 శాతం స్థాయిలో కొనసాగనుంది. ఐటీ సేవల ఆదాయంలో దీని వాటా 6 శాతం. ► ఆదాయ వృద్ధి మెరుగుపడినప్పటికీ 2020–21లో నమోదైన స్థాయికి మించి లాభదాయకత పెరగకపోవచ్చు. ప్రయాణాలు, అట్రిషన్ (ఉద్యోగుల వలసలు) తగ్గడం వంటి అంశాల కారణంగా నిర్వహణ మార్జిన్లు 2 శాతం మెరుగుపడి ఏడేళ్ల గరిష్టమైన 25 శాతానికి పెరిగాయి. అయితే, ఈసారి క్రమంగా వ్యాపారపరంగా సాధారణ పరిస్థితులు తిరిగొస్తున్నందున ఇవి తగ్గవచ్చని అంచనా. ► ఐటీ సర్వీసులకు కీలకమైన అమెరికా, యూరప్ మార్కెట్లలో కరోనా మహమ్మారి కొత్తగా మళ్లీ విజృంభించే అవకాశాలపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. రెండంకెల స్థాయిలో వృద్ధి: ప్రేమ్‌జీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరిశ్రమ రెండంకెల శాతం స్థాయిలో వృద్ధి నమోదు చేయగలదని ఐటీ దిగ్గజం విప్రో వ్యవస్థాపక చైర్మన్ అజీం ప్రేమ్‌జీ తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో కరోనా వైరస్‌పరమైన సవాళ్లు ఎదురైనప్పటికీ పరిశ్రమ 2–3 శాతం వృద్ధి చెందడంతో పాటు నికరంగా కొత్తగా 1.58 లక్షల ఉద్యోగాలను కల్పించిన నేపథ్యంలో ఈసారి అంతకన్నా మెరుగ్గా రాణించవచ్చని ఆయన పేర్కొన్నారు. బాంబే చార్టర్డ్ అకౌంటెంట్స్ సొసైటీ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ప్రేమ్‌జీ ఈ విషయాలు తెలిపారు. మహమ్మారి కట్టడికి లాక్డౌన్ అమలైన పరిస్థితుల్లో ఐటీ రంగం శరవేగంగా కొత్త మార్పులను ఆకళింపు చేసుకుని, యావత్ప్రపంచం ముందుకు సాగేందుకు తోడ్పడిందని ఆయన చెప్పారు. కరోనా వైరస్ వ్యాప్తి ప్రారంభమైన కొద్ది వారాల్లోనే కంపెనీలు.. వర్క్ ఫ్రం హోమ్ విధానానికి మారాయని, ఇప్పటికీ చాలా ప్రాజెక్టులకు సంబంధించి 90 శాతం దాకా సిబ్బంది ఇదే విధానంలో పనిచేస్తున్నారని ప్రేమ్‌జీ వివరించారు. కొంత మంది సిబ్బంది ఇంటి నుంచి, మరికొందరు ఆఫీసులోను పనిచేసే హైబ్రిడ్ విధానంతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయన్నారు. -
ప్రింట్ మీడియా ఆదాయంలో 35% వృద్ధి
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రింట్ మీడియా ఆదాయం 35 శాతం వృద్ధి చెందుతుందని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ అంచనా వేస్తోంది. కరోనా ముందస్తు కాలంతో పోలిస్తే 2021–22లో పరిశ్రమ ఆదాయం 75 శాతమే ఉంటుందని వెల్లడించింది. ‘2019–20లో ప్రింట్ మీడియా ఆదాయం రూ.31,000 కోట్లు. ఇందులో ప్రకటనల ద్వారా 70%, మిగిలినది చందాల (సబ్స్క్రిప్షన్స్) ద్వారా సమకూరింది. మహమ్మారి కారణంగా పరిశ్రమ ఆదాయం గత ఆర్థిక సంవత్సరంలో 40% పడిపోయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది రూ.24,000–25,000 కోట్లకు చేరవచ్చు. వ్యయ నియంత్రణ చర్యలు, కంటెంట్ డిజిటలైజేషన్‌తో లాభదాయకత 9–10 శాతానికి పునరుద్ధరించడానికి దారితీస్తుంది. ఆరు నెలలుగా న్యూస్‌ప్రింట్ ధరలు 20–30% అధికమైనప్పటికీ లాభం పెరుగుతుంది’ అని క్రిసిల్ తన నివేదిక ద్వారా తెలిపింది. ఆదాయాలు మెరుగుపడతాయి.. ఏప్రిల్–జూన్ కాలంలో ప్రకటన ఆదాయాలపై సెకండ్ వేవ్ ప్రభావం చూపింది. ఆర్థిక కార్యకలాపాలు పుంజుకున్నందున ప్రస్తుత త్రైమాసికం నుండి ప్రకటన ఆదాయాలు మెరుగవుతాయి. ఆంగ్లేతర వార్తా పత్రికలు సెకండ్ వేవ్‌లో కూడా చందా ఆదాయాన్ని నిలబెట్టుకోగలిగాయి. బలమైన మూలాలు కలిగి ఉండడమే ఇందుకు కారణం. కోవిడ్–19 ముందస్తు కాలంతో పోలిస్తే 2021–22లో సబ్స్క్రిప్షన్స్ ఆదాయ నష్టం 12–15 శాతానికి పరిమితం అవుతుంది. పాశ్చాత్య దేశాల మాదిరిగా కాకుండా తక్కువ ధర, నమ్మదగిన కంటెంట్‌ను అందించగల సామర్థ్యం, వార్తా పత్రికలను చదివే ప్రజల అలవాటు వంటి అంశాల కారణంగా భారత్‌లో ప్రింట్ మీడియా ప్రాచుర్యం పొందిందని క్రిసిల్ వెల్లడించింది. -
ఐటీలో కొత్తగా లక్ష ఉద్యోగాలు -నాస్కామ్
సాక్షి, హైదరాబాద్: ఐటీ పరిశ్రమ విభాగం సంస్థ నాస్కామ్ 2017-18 ఐటీ రిపోర్ట్ ను విడుదల చేసింది. వరుసగా రెండవ సంవత్సరం ఐటీ పరిశ్రమ వృద్ది ఫ్లాట్‌గా ఉందని, అయితే రాబోయే ఏడాదికి పరిస్థితి మెరుగ్గా ఉంటుందని తెలిపింది. వచ్చే ఏడాదికి ఐటీ ఎగుమతుల వృద్ధి రేటు 7-8శాతంగా ఉంటుందని అంచనా వేసింది. 2019 ఆర్థిక సంవత్సరానికి రెవెన్యూ 10-12 శాతం ఆదాయాన్ని అంచనా వేసినట్టు నాస్కామ్ అధ్యక్షుడు ఆర్ చంద్రశేఖర్ ప్రకటించారు. నాస్కామ్ రిపోర్ట్ ప్రకారం 30 శాతం వాటాతో 2017-18లో ఐటి సేవల మొత్తం ఆదాయంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న డిజిటల్ విభాగం నిలవగా ఇంజనీరింగ్, ఆర్ అండ్ డి 13 శాతం, వ్యాపార ప్రక్రియ నిర్వహణ 8 శాతంతో ఆ తరువాతి స్థానాల్లో ఉన్నాయి. వచ్చే ఏడాదిలో ఐటీ, ఐటీ సంబంధిత రంగాల్లో కొత్తగా లక్ష ఉద్యోగాలు వస్తాయనీ, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, ఇంటర్నెట్ అఫ్ థింగ్స్ ద్వారా ఇది సాధ్యమవుతుందని చెప్పింది. అయితే ఈ వృద్ధి అంచనా వేసిన దాని కంటే 50శాతం తక్కువని వెల్లడించింది. రాబోయే ఆర్థిక సంవత్సరంలో 7-9 శాతానికి పెరుగుతుందని అంచనా వేసింది. 2018-19 నాటికి 10-12 శాతం వృద్దితో 167 బిలియన్ డాలర్స్ ఆదాయం సాధించ వచ్చన్నారు. భారతదేశ మొత్తం ఎగుమతుల్లో 24శాతం ఐటీ ఎగుమతులే. డిజిటల్ బిజినెస్1.5-2శాతం వృద్ధిని నమోదు చేయనుండగా, దేశీయంగా ఇది రెండంకెల వృద్ధిని కొనసాగిస్తుందని చెప్పింది. కాగా గత జూన్‌లో నాస్కామ్ 2018 ఆర్థిక సంవత్సరానికి ఫ్లాట్ వృద్ధి రేటును అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సరం ఎగుమతులు ఆదాయాలు కేవలం 7.6 శాతం మాత్రమే పెరిగాయి. దేశీయ ఆదాయం 10-11 శాతం పెరిగింది. అయితే పరిస్థితి ఆశాజనకంగా ఉందనీ, ట్రెండ్ పాజిటివ్‌గానే ఉండటంతో మంచి వ్యాపార అవకాశాలు లభించనున్నాయని చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు. దీంతో స్టాక్మార్కెట్లో ఐటీ రంగ షేర్లు బాగా లాభపడుతున్నాయి. -
రాష్ట్రానికి రుణ పరిమితి పెంపు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి మరోసారి రుణ పరిమితి పెంపునకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఎఫ్ఆర్బీఎం (ద్రవ్య బాధ్యత, బడ్జెట్ నిర్వహణ చట్టం) పరిమితిని 3 శాతం నుంచి 3.5 శాతం మేరకు పెంచినట్లు కేంద్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలోనూ రాష్ట్ర ప్రభుత్వం అదనంగా రూ.3574 కోట్లు నికర అప్పులు తెచ్చుకునే వెసులుబాటు ఉంటుంది. 2017–18 ఆర్థిక సంవత్సరంలో ప్రస్తుతం ఉన్న ఎఫ్ఆర్బీఎం సీలింగ్ ప్రకారం వివిధ రుణ సంస్థల నుంచి రూ.21,445 కోట్లు అప్పులు తెచ్చుకునే వీలుంది. పెంచిన పరిమితితో ఈ సీలింగ్ రూ.25,019 కోట్లకు చేరుతుందని కేంద్రం జారీ చేసిన ఉత్తర్వుల్లో ప్రస్తావించింది. ఎఫ్ఆర్బీఎం చట్టం నిబంధనల ప్రకారం రాష్ట్రాలు స్థూల ఉత్పత్తి ఆదాయం (జీఎస్డీపీ)లో 3 శాతం మించి అప్పులు తెచ్చుకోవడానికి వీల్లేదు. కానీ భారీగా రెవిన్యూ, మిగులు ఆదాయమున్న రాష్ట్రాలకు ఎఫ్ఆర్బీఎం పరిమితిని సడలించే వెసులుబాటు ఇవ్వాలని 14వ ఆర్థిక సంఘం కేంద్రానికి సిఫారసు చేసింది. ఎఫ్ఆర్బీఎం పరిమితిని పెంచేందుకు ఆయా రాష్ట్రాల ఆర్థిక క్రమశిక్షణతో పాటు కీలకమైన మూడు అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. రెవిన్యూ మిగులు ఉండటం, రాష్ట్ర రెవిన్యూలో వడ్డీల చెల్లింపు పది శాతానికి మించకుండా ఉండటం, ఇప్పటికే తీసుకున్న అప్పులు సైతం జీఎస్డీపీలో 25 శాతం మించకూడదనే నిబంధనలను పొందుపరిచింది. ఈ మూడు అంశాల్లోనూ తెలంగాణ రాష్ట్రం 14వ ఆర్థిక సంఘం సూచించిన అర్హతలన్నీ సాధించిందని ఆర్థిక శాఖ వర్గాలు వెల్లడించాయి. వీటిని పరిగణనలోకి తీసుకున్న కేంద్రం గత ఏడాది ఎఫ్ఆర్బీఎం పరిమితిని 0.5 శాతం మేరకు పెంచింది. ఈ ఏడాది సైతం ఆదాయ వృద్ధి అదేతీరుగా కొనసాగటం, వడ్డీల చెల్లింపులు, అప్పులు నిబంధనలకు లోబడి ఉండటంతో కేంద్రం మరోసారి ఈ పరిమితిని సడలించింది.