salmon arokhyaraj
-
రావత్ అవుట్.. మిశ్రాపై సీఎస్ సీరియస్
♦ రాయితీల కుంభకోణంలో కీలక మలుపు ♦ పరిశ్రమలశాఖ కొత్త కమిషనర్‌గా సాల్మన్ ♦ మిశ్రాను వివరణ కోరిన చీఫ్ సెక్రటరీ సాక్షి, హైదరాబాద్: పరిశ్రమల శాఖ కొత్త కార్యదర్శిగా సాల్మన్ ఆరోఖ్యరాజ్‌ను ప్రభుత్వం నియమించింది. ఈ పోస్టులో ఉన్న షంషేర్‌సింగ్ రావత్‌ను తప్పించారు. పారిశ్రామిక రాయితీల వ్యవహారంలో అవకతవకలు వెలుగుచూసిన నేపథ్యంలో జరిగిన ఈ నిర్ణయం సర్వత్రా చర్చనీయాంశమైంది. రూ.2,045 కోట్ల రాయితీల్లో దాదాపు రూ.100 కోట్ల మేర పక్కదారి పట్టినట్టు ఆరోపణలు వచ్చాయి. వీటిలో ఇప్పటి వరకూ రూ.10 కోట్లు గుర్తించారు. పరిశ్రమల శాఖ కమిషనరేట్‌లో పనిచేస్తున్న అధికారి ఇండస్ట్రీస్ డెరైక్టర్ పేరుతో షాడో అకౌంట్ తెరిచారు.దారిమళ్లిన రాయితీలు ఇదే అకౌంట్‌కు రావడంతో విజిలెన్స్ విభాగం ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. అధికార పార్టీలోని కొంతమంది ముడుపులు తీసుకుని, అడ్డగోలుగా రాయితీలు ఇచ్చినట్టు విమర్శలొచ్చాయి. ఫలితంగా ప్రభుత్వాధినేతకు రూ.కోట్లను పారిశ్రామిక వేత్తలు ముట్టజెప్పినట్టు ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో లేని పరిశ్రమలకు, అర్హతలేని యూనిట్లకు రాయితీలు ఇవ్వడం విచారణలో వెలుగుచూసింది. దీనిపై గురువారం లోక్‌సత్తా పార్టీ నేతలు సీఎస్‌కు ఫిర్యాదు చేశారు. ఈ తంతు వెనుక పరిశ్రమల శాఖలో పనిచేస్తున్న ఉన్నతాధికారులకు ప్రమేయం ఉందని, సీబీఐ విచారణ జరపాలని కోరారు. ఈ నేపథ్యంలో రావత్ బదిలీ కావడం, ఆయనకు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా వెయిటింగ్లో పెట్టడం గమనార్హం. ఇదిలా ఉంటే, పరిశ్రమల శాఖ డెరైక్టర్ కార్తికేయ మిశ్రాను ఈ గోల్‌మాల్‌పై సీఎస్ శుక్రవారం వివరణ కోరినట్టు సమాచారం. -
భూ బకాసురులు
జిల్లాలో వేలాది ఎకరాలు ఆక్రమణ న్యాయస్థానాల్లో 900 భూవివాదాల కేసులు రికార్డులు ట్యాంపరింగ్ జరిగినట్టు అనుమానం సబ్రిజిస్ట్రార్ల పాత్రపై విచారణ వచ్చే వారం ‘రెవెన్యూ’ ప్రత్యేక సమావేశం విశాఖ రూరల్: ప్రభుత్వ భూముల సర్వేలో అ నేక అక్రమాలు బయటపడుతున్నాయి. వేలాది ఎకరాలు అన్యాక్రాంతమైనట్లు ఉన్నతాధికారు ల పరిశీలనలో వెల్లడైంది. రూ.వేల కోట్లు విలువైన భూములకు సంబంధించిన వివాదాలు న్యాయస్థానాల్లో నలుగుతున్నాయి. ఇప్పటి వరకు దాదాపు 900 భూ వివాదాల కేసులు జిల్లా, హైకోర్టులో ఏళ్ల తరబడి నడుస్తున్నట్లు లెక్కతేలాయి. వీటిలో చాలా కేసులకు సంబంధించి రికార్డులు ట్యాంపరింగ్ జరిగినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీటన్నింటిపై వచ్చే వారంలో సమీక్షించే అవకాశాలు కనిపిస్తున్నాయి. నెల రోజులుగా జిల్లాలో ప్రభుత్వ భూ ముల సర్వే జరుగుతోంది. ప్రభుత్వ భూము లు, ఇతర శాఖలకు కేటాయించినవి, ఆక్రమణకు గురైనవి, కోర్టు వివాదాల్లో ఉన్నవి.. ఇలా నాలుగు కేటగిరీల కింద సర్వే చేపడుతున్నారు. కోర్టు వివాదాల్లో 900 కేసులు కోర్టు వివాదాల్లో ఉన్న భూముల వ్యవహారాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్, జేసీ ప్రవీణ్‌కుమార్‌లు విస్తుపోయారు. ఏళ్ల తరబడి న్యాయస్థానాల్లో కేసులు నలుగుతున్నా వాటి పరిష్కారానికి కనీస చర్యలు లేవన్న విషయాన్ని గుర్తించారు. దాదాపు 900 కేసులు జిల్లా కోర్టు, హైకోర్టుల్లో ఉన్నట్టు లెక్క తేల్చారు. దసపల్లా లేఅవుట్, క్లోవర్ అసోసియేట్స్, డచ లేఅవుట్, కిర్లంపూడి లేఅవుట్, నడుపూర్, తాజాగా సర్వే నెంబర్ 152 ఇలా విశాఖ పరిధిలోనే కాకుండా గ్రామీణ ప్రాం తాల్లో కూడా కోట్లు విలువైన వేలాది ఎకరాల భూ వివాదాలు కోర్టుల్లో ఉన్నాయి. వీటిలో చాలా వరకు తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించ డం, పక్క సర్వే నంబర్లతో భూములు కొట్టేయడానికి ప్రయత్నించడం, భూములు ఆక్రమించి రిజిస్ట్రేషన్లు చేయించుకోవడం.. ఇలా అనేక అవకతవకలు జరిగినట్లు తెలుస్తోంది. వివాదాల్లో ఉన్న చాలా భూములకు సంబంధించి అక్రమాలు జరిగినట్లు రికార్డుల ద్వారా స్పష్టం గా తెలుస్తున్నా.. వాటిని సక్రమంగా కోర్టుకు సమర్పించడం లేదు. ఫలితంగా కేసులు కోర్టుల్లో దీర్ఘకాలంగా నడుస్తూనే ఉన్నాయి. అధికారులు పాత్రపై అనుమానాలు చాలా భూముల కేసుల్లో రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అధికారుల పాత్ర ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. భూముల రికార్డులు ట్యాంపరింగ్ జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నా యి. తాజాగా సర్వే నెంబర్ 152/4 వ్యవహార మే నిదర్శనం. నడుపూర్‌లో పక్క భూముల సర్వే నంబర్‌తో కోట్లు విలువ చేసే భూములు కాజేయడానికి ప్రైవేటు వ్యక్తులు కోర్టులో కేసు వేశారు. తప్పుడు సర్వే నంబర్ వేసిన విషయా న్ని కోర్టుకు విన్నవిస్తే కేసు వేగంగా పరిష్కారమవుతుంది. అయినప్పటికీ అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఇలా చాలా వివాదాలకు సంబంధించి రెవెన్యూ సిబ్బంది సక్రమం గా స్పందించ డం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సిబ్బందే ప్రైవేటు వ్యక్తులతో చేతులు కలిపి ఈ అక్రమాలకు సహకరిస్తున్నారన్న వా ర్తలు వినిపిస్తున్నాయి. కొన్ని చోట్ల ప్రభుత్వ భూములకు రిజిస్ట్రేషన్లు కూడా జరిగిపోయా యి. రికార్డుల్లో ప్రభుత్వ భూమి అని ఉన్నప్పటికీ రిజిస్ట్రేషన్లు ఎలా చేపట్టారన్న విషయంపై ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. వీటిపై విచారణకు సైతం ఆదేశాలు జారీ చేశారు. మొత్తం కేసుల విషయాలన్నింటిపై వచ్చే వారంలో ప్రత్యేక సమావేశం నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. -
భూమాయపై సీరియస్
ప్రయివేట్ వ్యక్తుల చేతుల్లో ప్రభుత్వ భూములు రెవెన్యూ సిబ్బంది పాత్రే కీలకం అక్రమాలపై కలెక్టర ఆగ్రహం ఇప్పటికే ముగ్గురిపై వేటు మరో ఇద్దరిపై చర్యలకు రంగం సిద్ధం విశాఖ రూరల్ : కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూములు ప్రయివేట్ వ్యక్తుల చేతుల్లో చిక్కుకుపోయాయి. రెవెన్యూ సిబ్బంది మాయాజాలంతో రికార్డులు తారుమారవుతున్నాయి. ఇటీవల అధికారులు ప్రభుత్వ భూములను సర్వే చేయడంతో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఒక్కో వ్యవహారం బయటకు వస్తోంది. ఈ అక్రమాలపై కలెక్టర్ సీరియస్‌గా ఉన్నారు. బాధ్యతలపై క్రిమినల్ కేసులు నమోదుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. ప్రభుత్వ భూములను ప్రయివేట్ వ్యక్తులకు కట్టబెట్టడం.. ఉన్నతాధికారుల ఆదేశాలతో వాటిని వెనక్కి తీసుకుంటున్నట్టు బోర్డులు పెట్టడం.. ఆ వ్యక్తులతో కోర్టుల్లో కేసులు వేయించడం.. ఇలా రెవెన్యూ సిబ్బంది కీలక పాత్రే పోషించినట్టు తెలిసింది. రికార్డులను ట్యాంపర్ చేయడం, న్యాయస్థానాలకు సక్రమమైన సమాచారం ఇవ్వకపోవడం, చివరకు కేసును నీరుగార్చేలా చేసి బడాబాబులకు సహకరించి లక్షల రూపాయలు వెనకేసుకున్న విషయాలు వెలుగుచూడడంతో రెవెన్యూలో కలకలం మొదలయింది. నడుపూరు, కొమ్మాది, పరదేశిపాలెం ప్రాంతాల్లో భూ అక్రమాలపై కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్, జాయింట్ కలెక్టర్ ప్రవీణ్‌కుమార్‌లు సీరియస్‌గా ఉన్నారు. దీనిపై ఇప్పటికే ముగ్గురు సిబ్బందిపై చర్యలు తీసుకున్నారు. ఈ వ్యవహారంలో కొంత మంది అధికారుల పాత్ర కూడా ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమవుతుండడంతో ఆ దిశగా విచారణ చేపడుతున్నారు. ఇందులో భాగంగా పరదేశిపాలెం, కొమ్మాదిలో భూములను జాయింట్ కలెక్టర్ పరిశీలించారు. 152 సర్వే నంబర్ భూములకు సంబంధించి హైకోర్టులో కేసు ఉన్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ భూములను అధికారులు వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించినా న్యాయస్థానంలో కేసు ఉండడంతో దానికి సంబంధించి పూర్వాపరాలు పరిశీలించాలని రెవెన్యూ అధికారులు నిర్ణయించారు. దీనిపై సంబంధిత తహశీల్దార్ రెండు రోజుల్లో నోటీసులు జారీ చేయనున్నారు. రికార్డుల ట్యాంపరింగ్‌పై అనుమానాలు రికార్డుల ట్యాంపర్ చేసే విషయంలో సిబ్బంది సిద్ధహస్తులు. వందల సంఖ్యలో రికార్డులు ట్యాంపర్ చేసిన సందర్భాలు అనేకం బయటపడ్డాయి. ప్రసుత్తం ఈ భూముల వ్యవహారంలో కూడా రికార్డులు ట్యాంపర్ అయి ఉంటాయని అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ రద్దు చేసిన కేటాయింపులను రెండు నెలల్లో కొత్త వారికి కట్టబెట్టడం వెనుక ఉన్నతాధికారుల హస్తం కూడా ఉన్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెవెన్యూ హస్తం! జిల్లాలో ప్రస్తుతం 1500 ఎకరాలు అన్యాక్రాంతమైనట్టు అధికారులు గుర్తించారు. ఇందులో వెయ్యి ఎకరాల భూములకు సంబంధించిన వివాదాలు న్యాయస్థానాల్లో నలుగుతున్నట్టు గుర్తించారు. స్టీల్‌ప్లాంట్, మధురవాడ, కొమ్మాది, భీమిలి ప్రాంతాల్లో కొన్ని భూ వివాదాలకు సంబంధించి కోర్టులకు సక్రమమైన సమాచారం అందించడం లేదన్న విషయాన్ని గమనించారు. వీటిలో కొన్ని భూములకు సంబంధించి రిజిస్ట్రేషన్లు కూడా జరిగిపోయాయి. వాటన్నింటిపై నెల రోజుల్లో విచారణ జరిపించాలని కలెక్టర్ నిర్ణయించారు. ఈ భూ సర్వేలను కూడా నెల రోజుల్లో పూర్తి చేసి సమగ్ర నివేదికను తయారు చేయాలని భావిస్తున్నారు. అనంతరం కోర్టు కేసుల్లో ఉన్న భూములకు సంబంధించి పూర్తి వివరాలను పరిశీలించి వాటిపై న్యాయ సలహాలు తీసుకొని కోర్టులో కేసులు వీలైనంత త్వరగా పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆలోచన చేస్తున్నారు. ఈ అక్రమాలతో సంబంధమున్న రెవెన్యూ, సబ్రిజిస్ట్రార్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయడానికి సిద్ధమవుతున్నట్టు సమాచారం. -
లాంఛనమే..
జెడ్పీ చైర్‌పర్సన్‌గా లాలం భవాని వైస్ చైర్మన్‌గా కొట్యాడ అప్పారావు నేడు ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు విశాఖ రూరల్ : రెండేళ్ల తరువాత జిల్లా పరిషత్ పీఠంపై పాలకవర్గం కొలువుతీరనుంది. సుదీర్ఘకాలంగా సాగుతున్న ప్రత్యేకాధికారుల పాలనకు తెరపడనుంది. శనివారం జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఎన్నిక జరగనుంది. ఇందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలో 39 జెడ్పీటీసీ స్థానాలకు ఏప్రిల్ 6, 11 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరిగాయి. ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ 15 స్థానాల్లో విజయం సాధించగా, టీడీపీ 24 జెడ్పీటీసీలను గెలుచుకొని జిల్లా పరిషత్ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుంది. రాంబిల్లి మండలం నుంచి గెలిచిన లాలం భవాని చైర్పర్సన్ అభ్యర్థినిగా ఎన్నికలకు ముందే టీడీపీ ప్రకటించింది. వైస్‌చైర్మన్ అభ్యర్థిగా అనంతగిరి మండలం జెడ్పీటీసీ కొట్యాడ అప్పారావు పేరును ఖరారు చేశారు. దీంతో వీరి ఎన్నిక లాంచనం కానుంది. ఏర్పాట్లు పూర్తి : చైర్పర్సన్, వైస్‌చైర్మన్ ఎన్నికకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు జిల్లా పరిషత్‌సమావేశ మందిరంలో ఈ ఎన్నిక జరగనుంది. దీనికి హాజరుకావాలంటూ జిల్లా కలెక్టర్, ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి సాల్మన్ ఆరోఖ్యరాజ్ గెలిచిన అభ్యర్థులతో పాటు సంబంధిత ఎమ్మెల్యేలు, ఎంపీలకు నోటీసులు జారీ చేశారు. శనివారం ఉదయం 10 గంటల లోపు కో-ఆప్షన్ సభ్యులుగా బరిలో ఉండే వారు నామినేషన్లు సమర్పించాలి. వీరు తప్పనిసరిగా మైనా ర్టీ ధ్రువపత్రం సమర్పించాలి. ఉదయం 10 నుంచి 12 వరకు నామినేషన్లు పరిశీలన, మధ్యాహ్నం ఒంటి గంటలోపు నామినేషన్ల ఉప సంహరణకు అవకాశముంటుంది. ఒంటిగంటకు కో-ఆప్షన్ సభ్యుల ప్రమా ణ స్వీకరం జరుగుతుంది. అనంతరం 3 గంటలకు జెడ్పీ సమావేశ మందిరంలో 39 జెడ్పీటీసీ సభ్యులతో సమావేశం జరుగుతుంది. ఒక వరుస మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు, మరో వరుస జెడ్పీటీసీ సభ్యులకు ఏర్పాటు చేశారు. చేతులు ఎత్తే విధానంలో ఈ ఎన్నిక మధ్యాహ్నం 3 గంటలకు జరుగుతుంది. చైర్‌పర్సన్‌గా ఎన్నికైన అభ్యర్థి ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ైవె స్చైర్పర్సన్ ఎన్నిక ఉంటుంది. ఈ ఎన్నికలకు పార్టీలు విప్‌ను జారీ చేయనున్నాయి. -
ప్రభుత్వ భూములకు రక్షణ
బంజర్, పోరంబోకు భూముల వద్ద బోర్డుల ఏర్పాటు రెవెన్యూ అధికారులకు కలెక్టర్ ఆదేశం విశాఖ రూరల్ : ప్రభుత్వ భూములకు రక్షణ కల్పించాలని కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మం దిరంలో రెవెన్యూ అధికారులతో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహిం చారు. ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురికాకుండా, రక్షణ కల్పించాలని చెప్పి ఏడాది అవుతున్నా కొన్ని మండలాల్లో సర్వేలు నిర్వహించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రెవెన్యూ అధికారులు జాబ్ చార్ట్ విధిగా నిర్వర్తించాలని చెప్పారు. గ్రా మాల్లోని బంజర, పోరంబోకు భూములను గుర్తించి, అక్కడ ప్రభు త్వ భూమి అని బోర్డులు పెట్టాలని సూచించారు. ఆర్ఐలు గ్రామాలను సందర్శించాలి ప్రతీ నెలా ఆర్ఐలు గ్రామాలను సందర్శించి ఆక్రమణలపై పీరియాడికల్ రిపోర్టును పంపించాలని చెప్పారు. భూ ఆక్రమణలకు సంబంధించి పేపర్లలోను, నేరుగా ఫిర్యాదు వస్తే తప్పా ఆర్ఐలు ముందుగా గుర్తించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. లేఅవుట్లకు సంబంధించి ప్రభుత్వానికి రావాల్సిన పన్నులను వసూలు చేయాలన్నారు. మండలాల వారీగా ప్రస్తుతం ఉన్నవి, కొత్తగా వేసిన లేఅవుట్ల సంబంధించి వివరాలను ఈ నెల 15లోగా సమర్పించాలని ఆదేశించారు. ‘భూ’ ఫిర్యాదులే ఎక్కువ ప్రజావాణి, డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమానికి భూ తగాదాలు, పట్టాదారు పాస్‌పుస్తకాలు తదితర సమస్యలపై పదే పదే ఫిర్యాదులు వస్తున్నాయని జేసీ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. తహశీల్దార్ల కార్యాలయాల్లో ఉన్న ఫిర్యాదులను పరిశీలించి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. సర్కారు భూముల రక్షణకు సర్వే పూర్తి చేసి అడంగల్ అప్ డేట్ చేయాలని సూచించారు. జమాబంది, నీటి తీరువా వసూళ్లలో నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వ భూముల ఆక్రమణకు సంబంధించిన వివరాలు ఈనెల 17లోగా సమర్పించాలని ఆదేశించారు. గ్రామాల్లో ప్రభుత్వ భూములను గుర్తించినపుడు వీఆర్వో వద్ద సర్టిఫికెట్ తీసుకోవాలని చెప్పారు. సమావేశంలో ఏజేసీ వై.నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. -
పక్కాగా ‘పరిషత్’
జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ ఎన్నికల ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష విశాఖ రూరల్: మండల, జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్షులు, కో-ఆప్టెడ్ సభ్యుల ఎన్నికలను జూలై 4,5 తేదీల్లో సజావుగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. ఆదివారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జెడ్పీ, ఎంపీటీసీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించినందుకు అధికారులను అభినందించారు. అదే విధంగా అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలకు కూడా అందరూ సమన్వయంతో పనిచేయాలన్నారు. ఏమైనా సందేహాలు, సమస్యలు వస్తే వెంటనే నివృత్తి చేసుకోవాలని సూచించారు. ప్రాదేశిక నియోజకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం అనంతరం కో-ఆప్టెడ్ సభ్యుల ఎన్నికలు, ఆ తరువాత అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు జరపాలన్నారు. సమావేశానికి ఓటు హక్కు కలిగిన సభ్యుల్లో సగం మంది హాజరైనప్పుడు మాత్రమే కోరం సరిపోయినట్టు భావించి సమావేశాన్ని నిర్వహించాలన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలను కూడా ఆహ్వానించాలన్నారు. జెడ్పీ సీఈవో మహేశ్వరరెడ్డి, డీడీ శ్రీనివాసన్ పాల్గొన్నారు. -
52 మంది తహశీల్దార్లకు పోస్టింగ్‌లు
విశాఖ రూరల్, న్యూస్‌లైన్: జిల్లాలో భారీ స్థాయిలో 52 మంది తహశీల్దార్లకు పోస్టింగ్‌లు లభించాయి. ఎన్నికలకు ముందు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని 43 మంది తహశీల్దార్లకు స్థాన చలనాలు కలిగాయి. ప్రస్తుతం ఎన్నికల ముగియడంతో వారందరినీ తిరిగి యథాస్థానాల్లో కొనసాగించేందుకు సీసీఎల్ఏ అనుమతులు మంజూరు చేసింది. దీంతో పక్క జిల్లాలకు బదిలీపై వెళ్లిన వారు తిరిగి విశాఖ జిల్లాకు వచ్చారు. వారిలో చాలా మంది పాత స్థానాలే కేటాయించినప్పటికీ కొందరికి మాత్రం కాస్త మార్పులు చే శారు. ఆ మేరకు కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. విశాఖ రూరల్ తహశీల్దార్‌గా ఉన్న రవీంద్రనాథ్ను నాతవరం మండలం తహశీల్దార్‌గా బదిలీ చేశారు. అక్కడ విధులు నిర్వర్తిస్తున్న వి.వి.రమణను విశాఖ రూరల్‌కు కేటాయించారు. అప్పట్లో కలెక్టరేట్లో సి-సెక్షన్ సూపరింటెండెంట్‌గా పనిచేసిన జ్ఞానవేణిని వుడాలో స్పెషల్ తహశీల్దార్‌గా నియమించారు. ఇటీవలే త హశీల్దార్గా పదోన్నతి వచ్చిన రామలక్ష్మిని సి-సెక్షన్‌కు వేశారు. పాయక రావుపేటకు తహశీల్దార్‌గా పనిచేసిన లింగయ్య సస్పెండ్ కావడంతో ఆ స్థానంలో హైదరాబాద్‌లో హైకోర్టులో లైజన్ ఆఫీసర్‌గా పనిచేసి జిల్లాకు వచ్చిన సుమతిభాయిని నియమించారు. మిగిలిన వారందరికీ గతంలో ఏయే స్థానాల్లో పనిచేశారో అవే స్థానాలు కల్పించారు. నర్సీపట్నం తహశీల్దార్‌గా పనిచేసిన కళావతి సస్పెండ్ కావడంతో ఆ పోస్టును ఖాళీగా ఉంది. -
సమస్యాత్మక గ్రామాలపై దృష్టి
వ్యాధులపై అవగాహన కల్పించాలి ఆస్పత్రి అభివృద్ధి నిధులు వినియోగించాలి కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ పాడేరు, న్యూస్‌లైన్: ఎపిడమిక్ దృష్ట్యా వ్యాధులు విజృంభిస్తున్నందున వైద్యఆరోగ్య,మలేరియాశాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ ఆదేశించారు. బుధవారం పాడేరు ఐటీడీఏ కార్యాలయంలో ఎస్పీహెచ్వోలు,వైద్యులు, మలేరియాశాఖల అధికారులతో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ గత అనుభవాల దృష్ట్యా అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. మలేరియా రోగులను గుర్తించాలని, వారు సక్రమంగా మందులు వేసుకునేలా వైద్యసిబ్బంది పర్యవేక్షించాలన్నారు. ముందుగా ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ వర్కర్లు, స్వయం సహాయక సంఘాల సభ్యులతో సమావేశమై ఎపిడమిక్‌లో వచ్చే వ్యాధులు, నివారణ చర్యలపై గిరిజనులకు అవగాహన కల్పించాలన్నారు. దోమ తెరల వినియోగం, దోమల నివారణ మందు పిచికారీ, పారిశుధ్యం తదితర అంశాలపై ఆరా తీయాలన్నారు. హైరిస్క్ గ్రామాలలో వ్యాధులు రాకుండా వైద్యాధికారులు నిరంతరం తనిఖీ చేయాలన్నారు. వ్యాధులు సంక్రమించకుండా నివారణ చర్యలు తీసుకోవలసిన బాధ్యత వారిపైనే ఉందన్నారు. వైద్యాధికారులు రూపొందించిన కార్యాచరణ ప్రణాళికను పూర్తిగా పరిశీలించి సక్రమంగా అమలు చేయాలన్నారు. వైద్యసిబ్బంది, ఆశ కార్యకర్తల వద్ద పూర్తిస్థాయిలో మందులు నిల్వ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. పాడేరు ఐటీడీఏ పీవో వి.వినయ్‌చంద్ మాట్లాడుతూ ఆస్పత్రి అభివృద్ధి నిధులతో పీహెచ్‌సీలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. దుప్పట్లు, కర్టెన్లు కొనుగోలు చేయాలని, ఆస్పత్రి అభివృద్ధికోసం మంజూరు చేసిన నిధులను సక్రమంగా ఖర్చు చేయాలన్నారు. ఎస్పీహెచ్ఓలు తమ పరిధిలోని పీహెచ్సీలలో మంచినీటి సదుపాయాల కల్పనకు ప్రతిపాదనలు శుక్రవారం తనకు అందజేయాలన్నారు. గ్రామ ఆరోగ్య, పారిశుధ్య నిధులను వినియోగించి గ్రామాల్లో పారిశుధ్య పనుల చేయాలన్నారు. దోమల మందు పిచికారీ పనులపై వైద్యాధికారులకు పూర్తిస్థాయి అవగాహన ఉండాలన్నారు. సమావేశంలో ఆర్డీవో జి.రాజకుమారి, ఏపీవో పీవీఎస్ నాయుడు, డీఎంహెచ్‌వో శ్యామల, డీఎంవో ప్రసాదరావు, డీసీహెచ్ఎస్ నాయక్, 11 మండలాల ఎస్పీహెచ్వోలు, వైద్యాధికారులు పాల్గొన్నారు. -
ఆగస్టు 8న అమెరికాకు
ఉన్నత చదువులకు కలెక్టర్ ఏడాది పాటు అక్కడే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనుమతి విశాఖ రూరల్, న్యూస్‌లైన్: కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ విదేశీ ప్రయాణం దాదాపుగా ఖరారైంది. ఆగస్టు 8న ఢిల్లీ నుంచి న్యూయార్క్‌కు టికెట్ సిద్ధమైంది. ఉన్నత చదువుల కోసం ఆయన ఏడాది పాటు సెలవుపై యూఎస్ వెళ్లనున్నారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా అనుమతులు లభించాయి. యూఎస్‌లో యూనివర్సిటీ ఆఫ్ మిన్నెసోటాలో మాస్టర్స్ ఆఫ్ పబ్లిక్ అఫైర్స్ చేయడానికి వెళ్లనున్నారు. అన్ని అనుమతులు వచ్చినప్పటికీ యూనివర్సిటీలో అడ్మిషన్ తేదీ ఇంకా ఖరారు కాలేదు. టికెట్ మాత్రం ఆగస్టు 8కి బ్లాక్ చేశారు. యూనివర్సిటీ నుంచి అడ్మిషన్ ఖరారైన వెంటనే వెళతారు. భవిష్యత్తులో ఉన్నత పదవులు, కీలక బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించేందుకు కలెక్టర్ ఈ కోర్సు చేస్తున్నట్టు తెలిసింది. అప్పటి వరకు ఆయన కలెక్టర్‌గా కొనసాగుతారా? లేదా, ఆయన స్థానంలో జిల్లాకు కొత్త కలెక్టర్ వస్తారన్న విషయంపై ఇంకా స్పష్టత లేదు. రాష్ట్ర విభజన నేపథ్యంలో రోస్టర్ పద్ధతిన రెండు రాష్ట్రాలకు ఐఏఎస్‌ల కేటాయింపులు జరగనున్నాయి. సీమాంధ్ర జిల్లాలకు చెందిన ఐఏఎస్‌లకు ఇక్కడే పోస్టింగ్‌లు లభించనుండగా, ఇతర రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్‌కు క్యాడర్‌గా వచ్చిన ఐఏఎస్‌లకు రోస్టర్ ప్రకారం తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలకు పంపిణీ చేయనున్నా రు. ఆ కేటాయింపులు జరిగేంత వరకు జిల్లాకు కొత్త కలెక్టర్ ఎవరన్న విషయంపై స్పష్టత రాదు. సీమాంధ్రకు చెందిన ఐఏఎస్‌లు కొంత మంది అప్పుడే విశాఖ కలెక్టర్‌గా పోస్టింగ్ కోసం ప్రయత్నాలను ప్రారంభించారు. -
కలెక్టర్ త్వరలో రిలీవ్!
ఉన్నత చదువుల కోసం విదేశాలకు.. 25న సీఎస్‌ను కలవనున్న ఆరోఖ్యరాజ్ విశాఖ రూరల్, న్యూస్‌లైన్: కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ త్వరలో రిలీవ్ కానున్నారు. ఉన్నత చదువుల కోసం సెలవుపై విదేశాలకు వెళ్లనున్నారు. ఇందు కోసం ఈ నెల 25న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతిని కలవనున్నారు. సీఎస్ అనుమతి ఇస్తే కొద్ది రోజుల్లోనే విధుల నుంచి రిలీవై ఇన్చార్జి కలెక్టర్‌గా జాయింట్ కలెక్టర్ ప్రవీణ్‌కుమార్‌కు బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో ఉన్నత చదువుల కోసం సెలవు కావాలని ఎన్నికలకు మూడు నెలల ముందే కేంద్రానికి ఆయన లేఖ రాశారు. అప్పుడే అనుమతి లభించినా సార్వత్రిక ఎన్నికలు ఉన్నందున రిలీవ్ కాలేకపోయారు. ప్రస్తుతం ఎన్నికలు ముగియడంతో సెలవుపై వెళ్లాలని కలెక్టర్ భావిస్తున్నారు. రిలీవ్కి అనుమతి కోసం ఈ నెల 25న కలెక్టర్ సీఎస్‌ను కలవనున్నట్టు తెలిసింది. ప్రస్తుతం పదోన్నతులు, బదిలీలపై నిషేధం ఉంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యేంత వరకు బదిలీలు జరిగే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో కలెక్టర్ రిలీవ్‌కు అనుమతి లభిస్తుందా? లేదా అనే విషయం ఈ నెల 25 తర్వాత తేలనుంది. ఒకవేళ అనుమతి రానిపక్షంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాతే ఆయన విధుల నుంచి రిలీవ్‌కానున్నారు. -
కలెక్టర్ త్వరలో రిలీవ్!
ఉన్నత చదువుల కోసం విదేశాలకు.. 25న సీఎస్‌ను కలవనున్న ఆరోఖ్యరాజ్ విశాఖ రూరల్, న్యూస్‌లైన్: కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ త్వరలో రిలీవ్ కానున్నారు. ఉన్నత చదువుల కోసం సెలవుపై విదేశాలకు వెళ్లనున్నారు. ఇందు కోసం ఈ నెల 25న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతిని కలవనున్నారు. సీఎస్ అనుమతి ఇస్తే కొద్ది రోజుల్లోనే విధుల నుంచి రిలీవై ఇన్చార్జి కలెక్టర్‌గా జాయింట్ కలెక్టర్ ప్రవీణ్‌కుమార్‌కు బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో ఉన్నత చదువుల కోసం సెలవు కావాలని ఎన్నికలకు మూడు నెలల ముందే కేంద్రానికి ఆయన లేఖ రాశారు. అప్పుడే అనుమతి లభించినా సార్వత్రిక ఎన్నికలు ఉన్నందున రిలీవ్ కాలేకపోయారు. ప్రస్తుతం ఎన్నికలు ముగియడంతో సెలవుపై వెళ్లాలని కలెక్టర్ భావిస్తున్నారు. రిలీవ్కి అనుమతి కోసం ఈ నెల 25న కలెక్టర్ సీఎస్‌ను కలవనున్నట్టు తెలిసింది. ప్రస్తుతం పదోన్నతులు, బదిలీలపై నిషేధం ఉంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యేంత వరకు బదిలీలు జరిగే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో కలెక్టర్ రిలీవ్‌కు అనుమతి లభిస్తుందా? లేదా అనే విషయం ఈ నెల 25 తర్వాత తేలనుంది. ఒకవేళ అనుమతి రానిపక్షంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాతే ఆయన విధుల నుంచి రిలీవ్‌కానున్నారు. -
ఎన్నికలకు సర్వం సిద్ధం
జిల్లాలో 3614 పోలింగ్ కేంద్రాలు పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు సమస్యాత్మక {పాంతాలపై ప్రత్యేక దృష్టి విశాఖ రూరల్, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ వెల్లడించారు. జిల్లాలో 3 లోక్‌సభ, 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈ నెల 7న జరగనున్న పోలింగ్, 16వ తేదీన జరిగే ఓట్ల లెక్కింపునకు సంబంధించి చేపడుతున్న చర్యలను ఆదివారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆయన విలేకరులకు వివరించారు. మొత్తం 3614 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, 10,260 బ్యాలెట్ యూనిట్లు, 7980 కంట్రోల్ యూనిట్లు సిద్ధం చేశామని చెప్పారు. విశాఖ లోక్‌సభ స్థానానికి 22 మంది అభ్యర్థులు పోటీపడుతుండడంతో ఇక్కడ 2 బ్యాలెట్ యూనిట్లు పెట్టాల్సి ఉందన్నారు. అలాగే విశాఖ-తూర్పులో 21 మంది, గాజువాకలో 17 మంది అభ్యర్థులు పోటీలో ఉండడంతో ఇక్కడ కూడా రెండేసి ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. జిల్లాలో మొత్తం 33,46,639 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నట్లు తెలిపారు. ఎన్నికల విధులకు 3967 మంది పీవో, 3967 మంది ఏపీవో, 16,366 మంది ఓపీవోలను నియమించామని చెప్పారు. పాడేరు, అరకుకు సంబంధించి ఉద యం 7 నుంచి సాయంత్రం 4 వరకు మాత్రమే పోలింగ్ జరుగుతుందని, మిగిలిన నియోజకవర్గాల్లో సాయంత్రం 6 వరకు ఓటింగ్ ఉంటుందని తెలిపారు. భారీ బందోబస్తు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు వీలుగా గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ బి.శివధర్‌రెడ్డి, జిల్లా ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ తెలిపారు. 26 కంపెనీలు సీఏపీఎఫ్, 10 ప్లటూన్లు ఏపీఎస్పీతో పాటు ఏఎస్పీ నుంచి హోమ్‌గార్డుల వరకు మొత్తం 7100 మందిని వినియోగిస్తున్నట్లు వెల్లడించారు. జిల్లాలో మొత్తం 12,056 మందిపై బైండోవర్ కేసులు పెట్టామన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద బీఎస్ఎఫ్, సీఏపీఎఫ్, సివిల్ పోలీసులతో మూడంచెల భద్రత ఉంటుందన్నారు. ఈ నెల 5వ తేదీ సాయంత్రం 6 గంటల తరువాత ఇతర ప్రాంతాల రాజకీయ నాయకులు జిల్లా నుంచి వెళ్లిపోవాలని సూచించారు. ఈ సమావేశంలో జేసీ ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు. -
విజయ శంఖం
విజయమ్మకు అడుగడుగునా నీరాజనం కదలివచ్చిన అభిమాన తరంగం విశాఖ లోక్‌సభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు ఆకట్టుకున్న షర్మిల ప్రసంగం జన కడలి పొంగింది.. ప్రేమాభిమానాలతో పోటెత్తింది.. తమతో ఆత్మీయతను పంచుకునేందుకు, తమ భవిష్యత్తుకు భరోసా కల్పించేందుకు తరలివచ్చిన మహానేత సతీమణి విజయమ్మకు నీరాజనమెత్తింది. మండు వేసవిలో మంచు పూల వానలాంటి మాతృమూర్తి మాటలతో పులకించినజన కోటి ‘మీ వెంటే ఉంటా’మంటూ నినదించింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ గురువారం మధ్యాహ్నం విశాఖ లోక్‌సభకు ఆ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. విశాఖ రూరల్, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల సందడి గురువారం హోరెత్తిం ది. నామినేషన్ల ఘట్టానికి ఇంకా ఒక రోజు మాత్రమే గడువుంది. శుక్రవారం గుడ్‌ఫ్రైడే సెలవు రోజు కావడంతో నామినేషన్లు స్వీకరించరు. కేవలం శనివారం మా త్రమే గడువుంది. దీంతో గురువారం భారీ గా అన్ని పార్టీల అభ్యర్థులతో పాటు స్వ తంత్రులు నామినేషన్లు దాఖలు చేశారు. విశాఖ పార్లమెంట్ నియోజక వర్గానికి ఆరుగురు, అనకాపల్లికి ఇద్దరు, అరకుకు ఆరుగురు నామినేషన్లు వేశారు. 15 అసెం బ్లీ నియోజక వర్గాలకు 54 మంది 85 నామినేషన్లు సమర్పించారు. అట్టహాసంగా విజయమ్మ నామినేషన్ వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్.విజయలక్ష్మి(విజయమ్మ) విశాఖపార్లమెం ట్ నియోజక వర్గానికి రెండు సెట్ల నామినే షన్లన్లు కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్‌కు సమర్పిం చారు. జగదాంబ జంక్షన్ నుంచి ర్యాలీకి వచ్చిన ఆమెకు వేలసంఖ్యలో పార్టీకార్యకర్తలు, అభిమా నులు అడుగడుగునా నీరాజనాలు పలికారు. ప్ర జల కోలాహలం మధ్య కలెక్టరేట్‌కు చేరుకొని నామినేషన్ వేశారు. మానం ఆంజనేయులు(సీపీఐ), కె.రామం(ఆప్), ఆరేటి ఉమా మహేశ్వరరావు(స్వతంత్ర), జె.తారక రామారావు(స్వతం త్ర) నామినేషన్లు వేశారు. అనకాపల్లి లోక్‌సభకు ఎస్.లీలా ప్రసన్నకుమారి (పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా), తోట అప్పారావు(స్వతంత్ర), అరకు పార్లమెంట్‌కు వైఎస్సార్సీపీ అభ్యర్థి కొత్తపల్లి గీత, జి.సంధ్యారాణి(టీడీపీ), మిడియం బాబూరావు(సీపీఎం),కిషోర్‌చంద్రదేవ్ (కాంగ్రెస్), రామిరెడ్డి(స్వతంత్ర), కె.బాలుదొర(స్వతంత్ర) నామినేషన్లు దాఖలు చేశారు. అసెంబ్లీ స్థానాలకు 54 మంది.. విశాఖ పశ్చిమ నియోజకవర్గానికి బి.రామన్(లోక్‌సత్తా), యలమంచిలి సెగ్మెంట్‌కు వైఎస్సార్సీపీ అభ్యర్థి ప్రగడ నాగేశ్వరరావు, డమ్మీగా ప్రగడ భవానీ, పాడేరుకు ఎం.వీర వెంకట వరప్రసాద్(టీడీపీ), ఎస్.లోవరాజు(జై సమైక్యాం ధ్ర), మాడుగులకు వైఎస్సార్సీపీ అభ్యర్థి బూడి ముత్యాలనాయుడు, డమ్మీగా ఈర్లి అనూరాధ, ఎస్.టి.జి.విజయలక్ష్మి(స్వతంత్ర) నామినేషన్ వేశారు. పాయకరావుపేటకు వి.కృష్ణ స్వరూప్(దళిత బహుజన పార్టీ), వి.అనిత(టీడీపీ), విశాఖ ఉత్తరానికి భారతి వెంకటేశ్వరి గుంటూరు(కాంగ్రెస్), జి.వి.నరసింహారావు (కాంగ్రెస్) 2, పి.విష్ణుకుమార్‌రాజు(బీజేపీ), జి.వెంకటసుబ్బారావు, గాజువాకకు పి.పద్మ(స్వతంత్ర), జోసెఫ్ స్టాలిన్ అప్పారి, కె.శ్రీలక్ష్మి(స్వతంత్ర) , జె.శ్రీదేవి (లోక్‌సత్తా), గుడివాడ కృష్ణమోహన్ (స్వతంత్ర), పల్లాశ్రీనివాసరావు(టీడీపీ), పల్లా కార్తీక్(టీడీపీ డమ్మీ) నామినేషన్ సమర్పించా రు. నర్సీపట్నానికి ఎన్.శ్రీనివాసరావు(సీపీఐ), పి.రమేష్(స్వతంత్ర), కె.సూర్యనాగేంద్ర మహేశ్వరరావు(స్వతంత్ర), భీమిలికి సకురు అనిత(స్వతంత్ర), చెన్నాదాస్(కాంగ్రెస్), బి.గోపాలరావు(స్వతంత్ర), చోడవరానికి వైఎస్సార్సీపీ అభ్యర్థి కరణం ధర్మశ్రీ, కె.ఎస్.ఎన్.ఎస్.రాజు(టీడీపీ), కె.శంకరరావు(కాంగ్రెస్), విశాఖ దక్షిణానికి ద్రోణంరాజు శ్రీనివాసరావు(కాంగ్రెస్), వాసుపల్లి ఉషారాణి(టీడీపీ డమ్మీ), చింతపల్లి పోతురాజు(జై సమైక్యాంధ్ర పార్టీ), ఇమాం మొహయుద్దీన్ అహ్మద్(స్వతంత్ర), షేక్ బషీర్ అహ్మద్(స్వతంత్ర), చంద్రమౌళి పట్నాయకుని(లోక్‌సత్తా), కె.రామ్‌కుమార్(స్వతంత్ర) నామినేషన్లు వేశారు. అరకులోయ నియోజక వర్గానికి వైఎస్సార్సీపీ అభ్యర్థి కిడారి సర్వేశ్వరరావు, శెట్టి గంగాధరస్వామి(కాంగ్రెస్), పి.రంజిత్‌కుమార్(స్వతంత్ర), మటం మల్లేశ్వరపడాల్(కాంగ్రెస్), విశాఖ తూర్పుకు అవసరాల భగవానులు(ఉత్తరాంధ్ర రాష్ట్రీయ సమితి), ప్రభాగౌడ్(కాంగ్రెస్), వెలగపూడి రామకృష్ణబాబు(టీడీపీ), వెలగపూడి సుజన (టీడీపీ డమ్మీ), అనకాపల్లికి పీలా గోవింద సత్యనారాయణ(టీడీపీ), సిహెచ్.సతీష్(స్వతంత్ర), వి.నూకరాజు(లోక్‌సత్తా), సూరిశెట్టి నానాజీ(పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా), కె.సురేష్(స్వతంత్ర), కె.సన్యాసిరావు(స్వతంత్ర), కె.శ్రీనివాసరావు(స్వతంత్ర) నామినేషన్లు సమర్పించారు. -
ఎన్నికలకు సర్వం సిద్ధం
విశాఖ రూరల్, న్యూస్‌లైన్: సాధారణ ఎన్నికలను సమర్ధంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ తెలిపారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎన్నికల ఏర్పాట్లు గురించి విలేకరులకు వివరించారు. ఈ నెల 19 వరకు నామినేషన్ల స్వీకరణ, 21న వాటి పరిశీలన, 23న ఉపసంహరణ ఉంటుందని వెల్లడించారు. మే 7వ తేదీ ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్ ఉంటుందని, ఇందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అరకు, పాడేరు నియోజకవర్గానికి మాత్రమే ఉదయం 7 నుంచి సాయంత్రం 4 వరకు మాత్రమే ఓటింగ్ జరుగుతుందని స్పష్టం చేశారు. ఓటర్ల సంఖ్య పెరగడంతో కొత్తగా 103 అనుబంధ పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. ఎన్నికల నిర్వహణకు రూ.29 కోట్లు అవసరమని ప్రతిపాదనలు పంపామని, ప్రస్తుతం రూ.6 కోట్లు మంజూరైనట్టు చెప్పారు. 24 నుంచి ఓటరు స్లిప్పులు పంపిణీ జిల్లాలో కొత్తగా 1.45 లక్షల మంది ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నట్లు కలెక్టర్ తెలిపారు. వీటి పరిశీలన వేగంగా జరుగుతోందని, మరో 15 వేలు మాత్రమే ఇంకా పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఈ నెల 15లోగా వాటి పరిశీలన కూడా పూర్తి చేసి 19వ తేదీ నాటికి ఓటరు జాబితాను రూపొందిస్తామని చెప్పారు. ఈ నెల 24వ తేదీ నుంచి బూత్ లెవెల్ ఆఫీసర్లు ఇంటింటికీ వచ్చి ఫొటో ఓటరు స్లిప్పులను పంపిణీ చేస్తారని పేర్కొన్నారు. ఆ స్లిప్పును చూపించి ఎన్నికల్లో ఓటు వేయవచ్చని స్పష్టం చేశారు. ఓటరు జాబితాలో పేరు ఉండి ఎన్నికల గుర్తింపు కార్డు లేనప్పటికీ ఎన్నికల సంఘం నిర్దేశించిన గుర్తింపులలో ఏదో ఒకటి చూపించి ఓటు వేయవచ్చని సూచించారు. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారందరికీ స్మార్ట్ ఓటరు కార్డులు వస్తాయని, ఎన్నికల సంఘం జిల్లాకు పంపించిన వెంటనే బీఎల్వో ద్వారా పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. పాత ఓటరు గుర్తింపు కార్డులు ఉన్న వారు కలర్ కార్డు కావాలంటే మీ-సేవా కేంద్రాల్లో రూ.25 చెల్లించి పొందవచ్చని తెలిపారు. ఓటుపై అవగాహన ఈ సాధారణ ఎన్నికల్లో ఓటింగ్ శాతం 85 నుంచి 90 శాతం జరిగేలా ఓటు వినియోగంపై ప్రజల్లో చైతన్యానికి స్వీప్ కార్యాక్రమం ద్వారా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం 6 గంటలకు ఆర్కే బీచ్ నుంచి పార్క్ హోటల్ వరకు బీచ్ వాక్ ఫర్ ఓట్ పేరుతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అలాగే సినిమా థియేటర్లలో ప్రదర్శనలు, ప్రధాన ప్రాంతాల్లో హోర్డింగ్‌లు, ఏజెన్సీ సంతల్లో కళాజాత కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. ఈ ఎన్నికలను నిజాయితీగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామని, ఇందుకు పార్టీలు, ప్రజలు సహకరించాని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, డీఆర్వో ఎం.వెంకటేశ్వరావు, జెడ్పీ సీఈఓ మహేశ్వరరెడ్డి, డీఆర్డీఏ పీడీ సత్యసాయి శ్రీనివాస్ పాల్గొన్నారు. -
సార్వత్రిక భేరి
విడుదలైన నోటిఫికేషన్ తొలిరోజు ఏడు నామినేషన్లు నేడు, రేపు సెలవు మళ్లీ మంగళవారమే ఛాన్స్ విస్తృత బందోబస్తు విశాఖ రూరల్, న్యూస్‌లైన్: ఎన్నికల మహా సంగ్రామానికి తెరలేచింది. సాధారణ ఎన్నికల నామినేషన్ల ఘట్టం ప్రారంభమైంది. జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ శనివారం ఉదయం 11 గంటలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు. దీంతో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మొదలైంది. తొలి రోజు విశాఖ పార్లమెంట్ స్థానానికి ముగ్గురు స్వతంత్రులు, 4 అసెంబ్లీ నియోజకవర్గాలకు నలుగురు అభ్యర్థులు నామినేషన్లు వేశారు. వాస్తవానికి నామినేషన్ల స్వీకరణకు ఈ నెల 19వ తేదీ వరకు గడువున్నప్పటికీ ఈ నెల 13, 14, 18వ తేదీలు సెలవులు కావడంతో కేవలం అయిదు రోజులు మాత్రమే నామినేషన్లను స్వీకరించనున్నారు. నోటిఫికేషన్ వెలువడిన 15 నిమిషాలకు విశాఖ ఎంపీ స్థానానికి ఒక స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ వేశారు. రోణంకి చలపతిరావు ఎటువంటి హడావుడి లేకుండా వచ్చి జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌కు నామినేషన్‌ను సమర్పించారు. తణుకు దివాకర్, గేదెల కృష్ణారావులు స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు. విశాఖ-తూర్పు నియోజకవర్గానికి సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా పార్టీ నుంచి సంతానం గోవిందరాజులు తన అనుచురులతో ర్యాలీగా కలెక్టరేట్‌కు వచ్చారు. విశాఖ-తూర్పు నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి, అదనపు జాయింట్ కలెక్టర్ వై.నరసింహారావుకు నామినేషన్ పత్రాన్ని సమర్పించారు. సూర్యాబాగ్ ప్రాంతంలో ఉన్న జీవీఎంసీ జోన్-3 కార్యాలయంలో ఏర్పాటు చేసిన విశాఖ-దక్షిణ నియోజకవర్గం ఆర్ఓ కార్యాలయంలో స్వతంత్ర అభ్యర్థిగా అమ్ములోజు రామ్మోహనరావు, అనకాపల్లికి పూసర్లరాజా, అరకుకు ఎల్.బి.వెంకటరావులు స్వతంత్రులుగా నామినేషన్లు వేశారు. బందోబస్తు : రిటర్నింగ్ కార్యాలయాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధానంగా జిల్లా కలెక్టరేట్ వద్ద కూడా భారీగా పోలీసులను మోహరించారు. ఆర్ఓ కార్యాలయాలకు వంద మీటర్లులోపే అభ్యర్థుల అనుచరులను, వాహనాలను నిలిపివేస్తున్నారు. అభ్యర్థితో పాటు మరో నలుగురిని మాత్రమే నామినేషన్ సమర్పణ కు ఆర్ఓ కార్యాలయానికి పంపిస్తున్నారు. జిల్లా కలెక్టరేట్ వద్ద గేటు బయట వరకు మాత్రమే ర్యాలీలను అనుమతిస్తున్నారు. లోపలకు కేవలం ఒక వాహనం, అయిదుగురిని మాత్రమే అనుమతించారు. ఆదివారం, సోమవారం సెలవు రోజులు కావడంతో మంగళవారం తిరిగి నామినేషన్ల సందడి ఉండనుంది. -
అభ్యర్థులూ గుర్తుంచుకోండి..!
విశాఖ రూరల్, న్యూస్‌లైన్ : స్థానిక ఎన్నికలు శుక్రవారంతో ముగియనున్నాయి. శనివారం నుంచి సార్వత్రిక ఎన్నికల హడావుడి ప్రారంభం కానుంది. ఈ నెల 12న సాధారణ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ ఈ నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నారు. ఆ రోజు నుంచే నామినేషన్లు స్వీకరిస్తారు. 19వ తేదీ వరకు నామినేషన్లను సమర్పించవచ్చు. 13వ తేదీ ఆదివారం, 14 అంబేద్కర్ జయంతి, 18 గుడ్‌ఫ్రైడే సెలవు దినాలు కావడంతో కేవలం మిగిలిన అయిదు రోజులు మాత్రమే స్వీకరిస్తారు. నామినేషన్ ఫారాలు ఇప్పటికే జిల్లాకు చేరుకున్నాయి. వాటిని నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారుల కార్యాలయాలకు పంపిణీ చేశారు. జిల్లాలో ఉన్న 15 అసెంబ్లీ, 3 లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్నాయి. ఒక్కో సెగ్మెంట్‌కు ఒక్కో రిటర్నింగ్ అధికారిని నియమించారు. ఎన్నికలకు పోటీ చేసే అభ్యర్థులు ఆయా రిటర్నింగ్ అధికారులకే నామినేషన్లు సమర్పించాలి. ఈ విషయంలో అభ్యర్థులు జాగ్రత్తలు వహించకపోతే తిరస్కరణకు గురై ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కోల్పోవాల్సి ఉంటుందని జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ తెలిపారు. నామినేషన పత్రాలు ఆయా ఆర్వో కార్యాలయాల్లో తీసుకుని, ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు దాఖలు చేయవచ్చు ఒక్కో అభ్యర్థి గరిష్టంగా నాలుగు సెట్లు వరకు నామినేషన్లు వేసే అవకాశముంది. సక్రమంగా ఉన్న ఒక సెట్ నామినేషన్ వేసినా సరిపోతుంది. గుర్తింపు పొందిన పార్టీలు(ఉదా:బీజేపీ, కాంగ్రెస్,టీడీపీ,టీఆర్ఎస్) అభ్యర్థికి ఒక ప్రపోజర్ ఉంటే సరిపోతుంది. అభ్యర్థికి ఎక్కడైనా ఓటు హక్కు కలిగి ఉండవచ్చు. ఒక చోట ఓటు ఉండి, మరో నియోజకవర్గం నుంచి పోటీ చేసే వారు ఓటు హక్కు కలిగిన ప్రాంతంలో ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్(ఈఆర్ఓ) నుంచి ధృవీకరణ పత్రం తీసుకొని నామినేషన్‌తో పాటు సమర్పించాలి. అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించే ప్రపోజర్‌కు మాత్రం ఆ అభ్యర్థి పోటీ చేసే నియోజకవర్గంలో ఓటరై ఉండాలి. గుర్తింపు లేని రిజిస్టర్డ్ పార్టీల అభ్యర్థులకు(ఉదా. వైఎస్ఆర్సీపీ, జై సమైక్యాంధ్ర పార్టీలు) మాత్రం 10 మంది ప్రపోజర్లు సంతకం చేయాల్సి ఉంటుంది. స్వతంత్ర అభ్యర్థులకు కూడా ఇంతే సంఖ్యలో ప్రపోజర్లు ఉండాలి. అయితే రిటర్నింగ్ అధికారుల కార్యాలయానికి 100 మీటర్ల దూరంలో అభ్యర్థుల అనుచరులను, వాహనాలను నిలిపివేస్తారు. మూడు వాహనాలను, అభ్యర్థితో పాటు మరో నలుగురు ప్రపోజర్లను కార్యాలయంలోకి అనుమతిస్తారు. ముందుగానే అభ్యర్థులు తమ 10 మంది ప్రపోజర్లతో నామినేషన్ పత్రాలను సంతకాలు చేయించాలి. ఒకవేళ ఎవరైనా ప్రపోజర్స్ సంతకం చేయకుండా వేలిముద్ర వేయాల్సి వస్తే అటువంటి వారు రిటర్నింగ్ అధికారి సమక్షంలోనే ముద్ర వేయాలి. లోక్‌సభకు పోటీ చేసే అభ్యర్థి రూ.25 వేలు, శాసనసభకు పోటీ చేసే అభ్యర్థి రూ.10 వేలు డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 50 శాతం చెల్లిస్తే సరిపోతుంది. వారు కులధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలి. నామినేషన్ పత్రంతో పాటు ప్రధానమైన ఫారం-26 అఫిడవిట్‌ను అభ్యర్థులు సమర్పించాలి. ఇందులో ప్రతీ కాలమ్‌ను అభ్యర్థులు నింపాల్సి ఉంటుంది. అఫిడవిట్లో వ్యక్తిగత వివరాలు ఈ అఫిడవిట్‌ను రూ.10 స్టాంప్‌తో నోటరీ చేయించాలి. ఇందులో అభ్యర్థుల వ్యక్తిగత వివరాలు, కుటుంబ, ఆస్తులు, కేసులు, ప్రభుత్వ సంస్థలకు బకాయిలు, ఇలా అన్ని వివరాలు పొందుపర్చాలి. ఒకవేళ అభ్యర్థికి సంబంధించిన కాలమ్‌లు ఉన్నప్పటికీ వాటిని ఖాళీగా లేదా గీత పెట్టి వదిలేయకూడదు. అలాంటి కాలమ్‌లో నిల్ అని గాని, నాట్ అప్లికబుల్ అని గాని, నాట్ నోన్ అని గాని రాయాలి. కొంత మంది అభ్యర్థులకు అసలు పేరుతో పాటు మరో పేరు కూడా ఉంటుంది. అటువంటి వారు ఈవీఎంలో పేరును ఏ విధంగా రాయోలో నామినేషన్‌ను సమర్పించిన సమయంలోనే రిటర్నింగ్ అధికారికి తెలియజేయాలి. దాని ప్రకారమే ఈవీఎంలో పేరును, గుర్తును ముద్రిస్తారు. గుర్తింపు పొందిన జాతీయ పార్టీల అభ్యర్థుల పేర్లును బట్టి తెలుగు అక్షరమాల ప్రకారం ఈవీఎంలో ముందు స్థానాలను కేటాయిస్తారు. తరువాత రాష్ట్ర పార్టీ, అనంతరం గుర్తింపు లేని రిజిస్టర్ పార్టీల వారిని చేరుస్తారు. పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు పార్టీల గుర్తింపు పత్రాలు లేకుండానే ముందు నామినేషన్లు సమర్పించినప్పటికీ 19వ తేదీ మధ్యాహ్నం 3 గంటలులోగా పార్టీల ‘ఎ’, ‘బి’ ఫారాలు సమర్పించాలి. అలాకాని పక్షంలో స్వతంత్ర అభ్యర్థులుగా పరిగణిస్తారు. నామినేషన్ సమర్పణ తరువాత అందులో పేర్కొన్న అంశాలన్నీ సత్యమేనని రిటర్నింగ్ అధికారి అభ్యర్థితో ప్రతిజ్ఞ చేయిస్తారు. ఇందుకు సంబంధించిన సర్టిఫికేషన్‌ను కూడా అందజేస్తారు. ఎన్నికల ఏజెంట్‌ను నియమించుకొనే వారు అప్పుడే దరఖాస్తు ఇవ్వవచ్చు. అభ్యర్థివి 2, సంబంధిత ఏజెంట్‌వి 2 పాస్‌పోర్టు సైజు ఫొటోలు ఇవ్వాలి. అలాగే నామినేషన్ల సమర్పించిన తరువాత రిటర్నింగ్ అధికారి అభ్యర్థికి రెండు సర్క్యులర్లు అందజేస్తారు. వ్యయ పుస్తకాలు మూడు, రోజువారీ క్యాష్ బుక్, రోజువారి బ్యాంకు బుక్, రోజు వారి ఖర్చుల వివరాలకు సంబంధించి పుస్తకాలు అందజేస్తారు. -
మోగనున్న ‘సార్వత్రిక’ నగారా
12 నుంచి నామినేషన్ల స్వీకరణ 21న పరిశీలన 23న ఉపసంహరణ నిర్వహణపై అధికారులతో కలెక్టర్ సమీక్ష విశాఖ రూరల్, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ఈ నెల 12వ తేదీ నుంచి ప్రారంభమవుతున్న దృష్ట్యా రిటర్నింగ్ అధికారులు భారత ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అనుసరించి పగడ్బంధీగా విధులు నిర్వర్తించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ సూచించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆర్వోలతో సమావేశమయ్యారు. అభ్యర్థుల నామినేషన్లు,వాటి పరిశీలన, ఉపసంహరణ, ఇతర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 12 నుంచి 19వ తేదీ వరకు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారన్నారు. సెలవు రోజులైన ఈ నెల 13, 14, 18 తేదీల్లో నామినేషన్లను స్వీకరించరాదన్నారు. ఈ నెల 21న నామినేషన్ల పరిశీలన, 23న ఉపసంహరణ ఉంటుందని వివరించారు. రిటర్నింగ్ అధికారులు ప్రతీ నియోజకవర్గానికి పోలింగ్ స్టేషన్ల వారీగా ఓటరు జాబితాను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్, వీడియోగ్రఫీ విధిగా చేపట్టాలని ఆదేశించారు. అభ్యర్థులు వేసే నామినేషన్ల పత్రాలను జాగ్రత్తగా పరిశీలించి ఎక్కడైనా ఖాళీలు వదిలితే వారికి చెప్పి రాయించాలన్నారు. నామినేషన్లు వేసే అభ్యర్థులు పార్లమెంట్ స్థానానికి రూ.25 వేలు, అసెంబ్లీ స్థానానికి రూ.10 వేలు చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు అందులో 50 శాతం చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించారు. అభ్యర్థులు సమర్పించే కులధ్రువీకరణ పత్రాలను జాగ్రత్తగా పరిశీలించాలన్నారు. ఎన్నికలకు పోటీ చేసే అభ్యర్థుల వయస్సు 25 ఏళ్లు పూర్తయి ఉండాలన్నారు. సమావేశంలో జేసీ ప్రవీణ్‌కుమార్, ఐటీడీఏ పీవో వినయ్‌చంద్, డీఆర్వో ఎం.వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నికలకు సమాయత్తం
కలెక్టర్లతో ప్రధాన ఎన్నికల కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్ ఎన్నికల నిర్వహణకు సిద్ధం కావాలని సూచన సర్వసన్నద్ధమన్న కలెక్టర్, పోలీసు ఉన్నతాధికారులు విశాఖ రూరల్, న్యూస్‌లైన్ : ఎన్నికల నిర్వహణకు సర్వసన్నద్ధంగా ఉన్నామని కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ పేర్కొన్నా రు. ప్రధాన ఎన్నికల కమిషనర్ బన్వర్‌లాల్ సోమవారం సా యంత్రం జిల్లా కలెక్టర్లతో ఎన్నికల ఏర్పాట్లపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సుమారు నాలుగున్నర గంటల పాటు సాగిన ఈ కాన్ఫరెన్స్‌లో ఎన్నికల కమిషనర్ అడిగిన ప్రశ్నలకు కలెక్టర్‌తో పాటు నగర పోలీస్ కమిషనర్ శివధర్‌రెడ్డి, ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ సమాధానాలిచ్చారు. ఎన్నికల ప్రక్రియను మొత్తం వీడియో తీయించాలని, పోలింగ్ స్టేషన్లలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలని, పోలింగ్ అధికారు లు, సిబ్బంది నియామకం, ఎన్నికల ని యమావళి అమలుకు ప్రత్యేక బృందాల ఏర్పాటు, ఎన్నికల వ్యవ పరిశీలకుల ని యామకం వంటి అంశాలకు సంబంధిం చి కమిషనర్ జిల్లా కలెక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు జిల్లాలో తహశీల్దార్లను బదిలీ జరిగిందని, నోడల్ అధికారుల నియామకం పూర్తయిందని కలెక్టర్ చెప్పారు. పోలీస్ అధికారుల బదిలీలు, నియామకాలు, హెలికాప్టర్ల అవసరం, స్పీడ్బోట్ల ఆవశ్యకత, శాటిలైట్ ఫోన్స్, పోలీస్ సిబ్బంది చేరవేత వంటి అంశాలను సీపీ, ఎస్పీలు వివరించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, పాడే రు ఐటీడీఏ పీఓ వినయ్‌చంద్, ఏఎస్పీలు దామోదర్, కిశోర్, డీఆర్వో ఎం.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ నోడల్ అధికారులతో తన చాంబర్లో సమావేశమై ఎన్నికల ముందస్తు ఏర్పాట్లపై సమీక్షించారు. -
12 సొసైటీలకు నేడు పోలింగ్
130 డెరైక్టర్ స్థానాలకు ఓటింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభం రేపు అధ్యక్షుల ఎన్నిక విశాఖ రూరల్, న్యూస్‌లైన్: జిల్లాలో 12 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు(పీఏసీఎస్) ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు చేశారు. 12 సంఘాల్లో 130 డెరైక్టర్ స్థానాలకు సోమవారం పోలింగ్ నిర్వహిస్తున్నారు. జిల్లాలో ఉన్న 98 పీఏసీఎస్‌లకు 2012లో ఎన్నికలు జరిగాయి. 15 సంఘాలకు వివిధ కారణాల వల్ల అప్పట్లో నామినేషన్లు స్వీకరించలేదు. నక్కపల్లి సొసైటీ ఎన్నికను ప్రభుత్వం ముందే నిలిపివేసింది. కోర్టు కేసులు కారణంగా కొత్తపాలెం, మధురవాడ సొసైటీల ఎన్నికలు ఆగిపోయాయి. ఇప్పటికీ ఈ రెండింటి కేసు కొలిక్కి రాలేదు. దీంతో 13 సంఘాల ఎన్నికలకు సంబంధించి ఇటీవల జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ నోటిఫికేషన్ విడుదల చేశారు. గతంలో 13 సంఘాలకు ఏ స్థాయిలో ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయిందో అక్కడి నుంచే ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దాని ప్రకారం నక్కపల్లి పీఏసీఎస్‌కు గత నెల 28 నోటిఫికేషన్ ఇచ్చారు. ఇది ఏకగ్రీవమైంది. దీంతో అరకు, పెందుర్తి, లంకెలపాలెం, గౌరీ(అనకాపల్లి), తుమ్మపాలెం(అనకాపల్లి), సబ్బవరం, శొంఠ్యాం, బుచ్చయ్యపేట, కె.కోటపాడు, రాయపురాజుపేట(చోడవరం), లక్కవరం(చోడవరం) చోద్యం(గొలుగొండ) సొసైటీలకు సోమవారం ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 2 వరకు పోలింగ్ నిర్వహిస్తారు. వాస్తవానికి 11 సంఘాల్లో ఒక్కోదానికి 13 డెరైక్టర్ స్థానాలు ఉండగా అరకుకు 9 ఉన్నాయి. దీని ప్రకారం మొత్తం 152 డెరైక్టర్ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా వీటిలో 22 ఏకగ్రీవమయ్యాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 29,755 ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. సాయంత్రం 4.30లోగా లెక్కింపు పూర్తవుతుంది. 11వ తేదీన అధ్యక్ష ఎన్నికలు నిర్వహిస్తారు. -
ఇందిరమ్మకు యాక్షన్ ప్లాన్
ఫిబ్రవరి నెలాఖరులోగా 13,606 పూర్తికి లక్ష్యం రచ్చబండలో మంజూరైన ఇళ్లను కూడా గ్రౌండింగ్‌కు చర్యలు త్వరలో హౌసింగ్, బ్యాంక్, రెవెన్యూ అధికారులతో కలెక్టర్ ప్రత్యేక సమావేశం విశాఖ రూరల్, న్యూస్‌లైన్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి. శాఖల మధ్య సమన్వయలోపంతో లబ్ధిదారులను ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వేల సంఖ్యలో ఇళ్లు నిర్మాణ దశలోనే ఉన్నాయి. ఏళ్ల క్రితం మంజూరైన గృహాలు ఇప్పటికీ పునాదులకు కూడా నోచుకోలేదు. దీంతో వచ్చే నెలాఖరులోగా నిర్మాణ దశలో ఉన్న వాటిని పూర్తి చేసేందుకు కార్యాచరణ రూపొందించాలని కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ నిర్ణయించారు. త్వరలోనే గృహ నిర్మాణ శాఖ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి ఈ విషయంపై లక్ష్యాలను నిర్ధేశించనున్నారు. జిల్లాలో ఇందిరమ్మ పథకంలో భాగంగా 2006 నుంచి ఇప్పటి వరకు 3,78,440 గృహాలు మంజూరయ్యాయి. వీటిలో 3,11,870 ఇళ్ల నిర్మాణాలను చేపట్టారు. ఇంకా 66,570 గృహాల నిర్మాణాలను ప్రారంభించాల్సి ఉంది. ఇప్పటి వరకు 2,73,966 నిర్మాణాలు పూర్తయ్యాయి. సమన్వయ లోపమే సమస్య శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో ‘ఇందిరమ్మ’ లక్ష్యాలను సాధించలేకపోతున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఇళ్లను గ్రౌండ్ చేయాలంటే తప్పని సరిగా రెవెన్యూ అధికారులు ల్యాండ్ పొజిషన్ సర్టిఫికేట్ (ఎల్పీసీ) ఇవ్వాల్సి ఉంది. అయితే ఎల్పీసీ మంజూరు విషయంలో తీవ్రజాప్యం జరుగుతున్న కారణంగా నిర్మాణాలను ప్రారంభించలేకపోతున్నామని హౌసింగ్ అధికారులు చెబుతున్నారు. అలాగే బ్యాంకు ఖాతాలకు సంబంధించి సమస్యలు కూడా ఉండడంతో మరింత జాప్యం జరుగుతోందని పేర్కొంటున్నారు. ఈ విషయాన్ని గ్రహించిన కలెక్టర్ బ్యాంకర్లు, రెవెన్యూ, హౌసింగ్ అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. ప్రధానంగా ఎల్పీసీల సమస్య పరిష్కారంపై చర్యలు తీసుకోనున్నారు. అలాగే హౌసింగ్ కార్యాలయంలో కూడా ఎల్పీసీల విషయంలో రెవెన్యూ అధికారులతో మంగళవారం చర్చించనున్నారు. పూర్తయ్యేదెప్పుడు? జిల్లాలో ప్రస్తుతం 37,904 గృహాలు నిర్మాణంలో ఉన్నాయి. వీటిలో బేస్మెంట్ పూర్తయినవి 15,229, బేస్మెంట్ స్థాయిలో 3,647, లింటల్ స్థాయి పూర్తయినవి 5,422, రూఫ్ స్థాయిలో 13,606 ఉన్నాయి. ఫిబ్రవరి నెలాఖరులోగా ముందుగా రూఫ్ స్థాయిలో ఉన్న వాటినైనా పూర్తి చేసేందుకు కలెక్టర్ కార్యాచరణ రూపొందించనున్నారు. అలాగే ఏజెన్సీలో 8 వేల ఇళ్లు పెండింగ్‌లో ఉన్నాయి. వాటికి ఆస్బెస్టాస్ రేకులు అందుబాటులో లేకపోవడంతో నిర్మాణాలలో జాప్యం జరుగుతోంది. ఆ విషయాన్ని కలెక్టర్ హౌసింగ్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. వీటితో పాటు రచ్చబండలో వచ్చిన దరఖాస్తుదారులకు మంజూరైన 34,523 గృహాలను కూడా వీలైనంత త్వరగా గ్రౌండింగ్ చేసేందుకు కలెక్టర్ హౌసింగ్ అధికారులకు లక్ష్యాలను నిర్ధేశించనున్నారు. -
13 సొసైటీలకు ఎన్నికలు
వచ్చే నెల 10న నిర్వహణ నోటిఫికేషన్ జారీ చేసిన కలెక్టర్ విశాఖ రూరల్, న్యూస్‌లైన్: జిల్లాలో గతంలో నిలిచిపోయిన 13 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(పీఏసీఎస్) ఎన్నికలకు ఆదివారం జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఫిబ్రవరి 10న వీటికి పోలింగ్ నిర్వహిస్తారు. జిల్లాలోని 98 పీఏసీఎస్‌లకు 2012లో ఎన్నికలు జరిగాయి. ఇందులో నక్కపల్లి సొసైటీ ఎన్నికను నామినేషన్ల స్వీకరణకు ముందే నిలిపివేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అలాగే ఎన్నికకు ముందు రోజున మరో 12 సొసైటీల పోలింగ్‌ను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అప్పట్లో నిలిచిపోయిన 13 సంఘాల ఎన్నికకు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జిల్లా కలెక్టర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఏ స్థాయిలో ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయిందో అక్కడి నుంచే పూర్తి చేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పే ర్కొంది. దీంతో నక్కపల్లికి పీఏసీఎస్‌కు మాత్రం ఈ నెల 28 ఎన్నిక నోటిఫికేషన్ వెలువడుతుంది. 31న నామినేషన్ల స్వీకరణ, ఫిబ్రవరి 1న పరిశీలన, 2న ఉపసంహరణ ఉంటాయి. దీంతో పాటు మిగిలిన 12 పీఏసీఎస్‌లకు మాత్రం ఫిబ్రవరి 10న పోలింగ్ జరుగుతుంది. అదే రోజు ఓట్ల లెక్కింపు ఉం టుంది. అరకు, పెందుర్తి, లంకెలపాలెం,గౌరీ(అనకాపల్లి), తుమ్మపాలెం, సబ్బవరం, శొంఠ్యాం,బుచ్చెయ్యపేట,కె.కోటపాడు,రాయపురాజుపేట,లక్కవరం, నక్కపల్లి, చోద్యం సొసైటీలకు ఎన్నికలు నిర్వహిస్తారు. -
తల్లీ బిడ్డలకు‘ఆరోగ్య రాజ్యం’!
మాతా శిశు మరణాల్లో హై రిస్క్ జిల్లాగా విశాఖ తల్లీ, పిల్లల కోసం ప్రత్యేక బ్లాకుకు కలెక్టర్ ప్రతిపాదనలు ఈఎన్టీ ఆస్పత్రి ఎదురుగా స్థలం గుర్తింపు వారంలోగా ప్రభుత్వానికి నివేదిక విశాఖ రూరల్, న్యూస్‌లైన్: జిల్లాలో పెరుగుతున్న మాతాశిశు మరణాల సంఖ్య కలవరపెడుతోంది. ఏటా ప్రసవ సమయాల్లోనే వందల సంఖ్యలో తల్లీ, బిడ్డల ప్రాణాలు పోతున్నాయి. రవాణా వ్యవస్థ మెరుగైనా జిల్లాలో ఇంకా ఇళ్ల వద్దే వేల సంఖ్యలో ప్రసవాలు జరుగుతున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం కొత్తపుంతలు తొక్కుతున్న ఈ కాలంలో గర్భిణులకు మెరుగైన వైద్య సదుపాయం, పోషకాహారం అందక మరణాలు సంభవిస్తున్నాయి. రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత అభివృద్ధి చెందిన నగరంగా గుర్తింపు పొందిన విశాఖ.. మాతా శిశు మరణాల్లో కూడా హైరిస్క్ జిల్లాగా గుర్తింపు పొందడం ఇక్కడి పరిస్థితికి నిదర్శనం. జిల్లాలో కేజీహెచ్, విక్టోరియా వంటి ప్రభుత్వాస్పత్రులు ఉన్నా అవి ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. అవసరమైన నిధులు విడుదల చేయకపోవడంతో వీటిలో పూర్తి స్థాయి వైద్య సదుపాయాలు అందుబాటులో లేవు. దీంతో జాతీయ గ్రామీణ ఆరోగ్య పథకం(ఎన్ఆర్హెచ్ఎం) కింద కేంద్ర నిధులతో అత్యాధునిక వైద్య సదుపాయాలతో ఇంటిగ్రేటెడ్ మదర్ అండ్ చైల్డ్ హెల్త్(ఐఎంసీహెచ్) బ్లాక్ నిర్మాణానికి కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో తగ్గుతున్న ప్రసవాలు జిల్లాలో ప్రతి నెలా సుమారు ఆరు వేల ప్రసవాలు జరుగుతున్నాయి. ఇందులో 3 వేలు నగరంలో, మరో 3 వేలు గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. కేజీహెచ్, విక్టోరియా ప్రభుత్వాస్పత్రుల్లో నెలకు 1100 నుంచి 1200 మధ్య ప్రసవాలు జరుగుతున్నాయి. విక్టోరియా ఆస్పత్రి కాలుష్య వాతావరణంలో ఉండడంతో ఇక్కడ ప్రసవాలు.. తల్లీ, బిడ్డల ఆరోగ్యంపై ప్రభావం చూపే ప్రమాదముందని వైద్యులే చెబుతున్నారు. రోజుకు 15 నుంచి 20 వరకు డెలివరీలు జరిగే ఈ ఆస్పత్రిలో ఒకే ఒక్క స్కానింగ్ మెషిన్ ఉంది. ముందు వచ్చిన 25 మంది గర్భిణులకు మాత్రమే స్కానింగ్ తీస్తున్నారు. దీంతో స్కానింగ్ కోసం అర్ధరాత్రి నుంచి గర్భిణులు ఇబ్బందులు పడుతూ లైన్లలో ఉండాల్సి వస్తోంది. పుట్టిన పసికందులకు ఎటువంటి వైద్య సేవలు అవసరమున్నా వారిని కేజీహెచ్‌కే పంపిస్తున్నారు. కేజీహెచ్‌లో కూడా అత్యాధునిక వైద్య సదుపాయాలు అందుబాటులో లేకపోవడంతో ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాల శాతం ఏ మాత్రం పెరగడం లేదు. తగ్గని గృహ ప్రసవాలు జిల్లాలో ప్రభుత్వాస్పత్రులు, డిస్పెన్సరీలతో పాటు ప్రయివేట్ ఆస్పత్రులు కూడా అందుబాటులో ఉన్నాయి. కానీ ఇప్పటికీ వందల సంఖ్యలో ఇళ్ల వద్దే ప్రసవాలు జరుగుతున్నాయి. దీంతో మాతా శిశు మరణాల సంఖ్య కూడా విపరీతంగా ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. మాతా శిశు మరణాల్లో విశాఖ హై రిస్క్ జిల్లాగా రీప్రొడక్టివ్, మెటర్నల్, నియోనాటల్ అండ్ చైల్డ్ హెల్త్(ఆర్ఎంఎన్సీహెచ్) సంస్థ ఇప్పటికే ప్రకటించింది. ఐఎంసీహెచ్కు ప్రతిపాదనలు జిల్లాలో మాతా శిశు మరణాల సంఖ్యను తగ్గించడంతో పాటు ప్రభుత్వాస్ప్రతుల్లో ప్రసవాల శాతం పెరిగేందుకు గల అవకాశాలపై కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ దృష్టి సారించారు. -
నేడు వీఆర్వో, వీఆర్ఏ నోటిఫికేషన్
=ఫిబ్రవరి 2న రాత పరీక్షలు =20న ఫలితాలు విడుదల =కలెక్టర్ ఆరోఖ్యరాజ్ వెల్లడి విశాఖ రూరల్, న్యూస్‌లైన్: వీఆర్వో, వీఆర్ఏ నియామక నోటిఫికేషన్ శ నివారం జారీ చేయనున్నట్టు జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ తెలిపారు. కలెక్టరేట్లో శుక్రవారం సాయంత్రం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జనవరి 12లోగా ఫీజు చెల్లించి, 13లోగా ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. 19 నుంచి హాల్ టికెట్లను వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఫిబ్రవరి 2న ఉదయం వీఆర్వోలకు, మధ్యాహ్నం వీఆర్ఏలకు రాత పరీక్షలు ఉంటాయని వెల్లడించారు. అదే నెల 4న ప్రాథమిక కీ, 10న తుది కీ వెలువడుతుందని చెప్పారు. 20న పరీక్షా ఫలితాలు ప్రకటించి, 26 నుంచి ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు జారీ చేస్తామని స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రాలను నగరంలోనే ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ఇప్పటికే 50 కేంద్రాలు గుర్తించామన్నారు. అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉంటే డివిజన్ ప్రధాన కేంద్రాల్లో నిర్వహించేందుకు ప్రతిపాదిస్తామన్నారు. పూర్తి వివరాల కోసం 1800-4250-0002 హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేయవచ్చు లేదా http://ccla.cgg.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చని సూచించారు. -
లెహర్‌పై అప్రమత్తం
=కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ =అందుబాటులో టోల్‌ఫ్రీ నంబర్ 1800-4250-0002 విశాఖ రూరల్, న్యూస్‌లైన్: లెహర్ తుపాను నేపథ్యంలో జిల్లాలో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ప్రత్యేకాధికారులను జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్లో అన్ని మండలాల ప్రత్యేకాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేకాధికారులు మండల కేంద్రాల్లోనే ఉండాలని సూచించారు. తుపాను తీరం దాటే సమయంలో గంటకు సుమారు 150 నుంచి 200 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచవచ్చని, రెండు మీటర్ల ఎత్తు వరకు సముద్రపు అలలు ఎగసిపడవచ్చని చెప్పారు. గుడిసెలు, పెంకుటిళ్లు, నానిన గోడలతో ఉన్న ఇళ్లను గుర్తించి వాటిలో నివసించేవారిని పునరావాస కేంద్రాలకు తరలించాలని చెప్పారు. పునరావాస కేంద్రాలకు జనరేటర్ సౌకర్యం కల్పించాలని, ప్రజలను తరలించడానికి ఆర్టీసీ లేదా స్కూల్ బస్సులను వాడాలని కోరారు. నేవీ, ఆర్మీ, కోస్ట్‌గార్డ్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. అన్ని మండలాల్లో వీఆర్వోలు గ్రామాలకు వెళ్లి ప్రజలను అప్రమత్తం చేయాలని తెలిపారు. స్థానికంగా ఉండే పోలీసులు, అగ్నిమాపక సిబ్బందితో చర్చించి ఎటువంటి విపత్కర పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కోరారు. గ్రామాల్లో హాస్టల్లో పిల్లల రక్షణ ఏర్పాట్లు, భోజన, మంచినీటి ఏర్పాట్లు ముందుగానే చేసుకోవాలని సూచించారు. శారద, వరాహ, తాండవ రిజర్వాయర్ల పరిసరాల లోతట్టు గ్రామాల ప్రజలను అవసరమైతే ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జేసీ ప్రవీణ్‌కుమార్, ఏజేసీ నరసింహారావు, నర్సీపట్నం సబ్‌కలెక్టర్ శ్వేత తవతియా, డీఆర్వో వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
పాపం బాధరాజు!
=అధికారులు పట్టించుకోలేదని ఫిర్యాదు =డయల్ యువర్ కలెక్టర్‌కు ఫోన్ =రచ్చబండకు అధికారులను పంపిన కలెక్టర్ విశాఖపట్నం, సాక్షి ప్రతినిధి : కొన్నాళ్లుగా ముఖ్యమంత్రి తనను పట్టించుకోలేదంటూ బహిరంగంగా బాధ పడుతున్న మంత్రి బాలరాజుకు మరో కష్టం వచ్చింది. ఇప్పుడు తనను అధికారులూ పట్టించుకోవడం లేదంటూ సాక్షాత్తూ కలెక్టరుకే మొరపెట్టుకోవలసిన దుస్థితి దాపురించింది. ప్రజలు తమ సమస్యలు మంత్రులకు చెప్పుకోవడం సాధారణమే.. రాష్ట్ర మంత్రే తన దుస్థితిని కలెక్టర్‌కు ఫోన్లో చెప్పుకుంటే? ఇప్పుడు బాలరాజు అలాగే చె ప్పుకోవలసి వచ్చింది. మంత్రి హోదాలో తాను నిర్వహిస్తున్న రచ్చబండకు జిల్లా అధికారులు రావడం లేదని సోమవారం డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమానికి ఒక పౌరుడిలా ల్యాండ్ ఫోన్‌కు డయల్ చేసి ఫిర్యాదు చేయడం తన పరిస్థితికి దర్పణం పడుతోంది. అధికార వర్గాల్లో కలకలం రేపుతోంది. జిల్లాలోని కాంగ్రెస్ వర్గ రాజకీయాల నేపథ్యంలో మంత్రి బాలరాజుకు కొంతకాలంగా సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డితో విబేధాలేర్పడ్డాయి. ఈ వ్యవహారం బహిరంగ రహస్యం కావడంతో జిల్లా అధికారులు సైతం మంత్రి గంటా శ్రీనివాసరావుకు ఇచ్చినంత ప్రాధాన్యత బాలరాజుకు ఇవ్వడం లేదు. దీనిపై బాలరాజు అనేక సార్లు అధికారులపై బహిరంగంగానే తన అసంతృప్తి వె ళ్లగక్కారు. ఇటీవల చోడవరంలో నిర్వహించిన రచ్చబండ సభలో తన శాఖ అంశాలున్నా సీఎం కార్యాలయం నుంచి తనకు ఆహ్వానం అందలేదని బాలరాజు బహిరంగ విమర్శలు చేశారు. సీఎం డెరైక్షన్ మేరకే జిల్లా అధికారులు సైతం తనను పెద్దగా లెక్కచేయలేదని ఆయన లోలోన మధన పడుతున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి బాలరాజు తన నియోజకవర్గం పాడేరులో నిర్వహిస్తున్న రచ్చబండ సభలకు జిల్లాస్థాయి అధికారులెవరూ హాజరు కావడం లేదనే ప్రచారం జరుగుతోంది. సోమవారం కొయ్యూరు మండలం రేవళ్ల పంచాయతీలో రచ్చబండ సభ నిర్వహించనున్నట్లు మంత్రి సంబంధిత జిల్లా అధికారులందరికీ సమాచారం పంపించారు. ఉదయం ఆయన రచ్చబండ సభకు వెళ్లేటప్పటికి తాను పిలిచిన అధికారులు లేకపోవడంతో ఆయనకు చిర్రెత్తుకొచ్చింది. వెంటనే కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ మొబైల్‌కు ఫోన్ చేశారు. అప్పటికే ఆయన ప్రజాసమస్యలు వినేందుకు డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమంలో ఉండటంతో మొబైల్ లిఫ్ట్ చేయలేదు. దీంతో మంత్రి బాలరాజు ల్యాండ్ ఫోన్ నుంచి డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమానికి ఫోన్ చేశారు. కలెక్టర్ హలో అనగానే అవతలి నుంచి ‘ కలెక్టర్ గారూ నేను మంత్రి బాలరాజును మాట్లాడుతున్నాను’ అనే మాట వినగానే కలెక్టర్ ఆశ్చర్య పోయారు. తాను నిర్వహిస్తున్న రచ్చబండ కార్యక్రమానికి జిల్లా అధికారులు హాజరు కాలేదని, తాను ముందుగా సమాచారం అందించినా రాక పోతే ప్రజల సమస్యలు ఎలా పరిష్కరించాలని బాలరాజు ఆవేదన చెందారు. అధికారులు తనను కావాలని అవమానిస్తున్నట్లుందని మంత్రి నిష్టూరపోవడంతో కలెక్టర్ కలుగచేసుకుని అలాంటిదేమీ లేదని వెంటనే జిల్లా అధికారులను పంపుతానని సమాధానం ఇచ్చారు. ఆ తర్వాత మంత్రి కోరిన జిల్లా అధికారులను రచ్చబండ సభకు పంపారు. స్వయానా మంత్రే కలెక్టర్‌కు ఫోన్ చేసి అధికారులు తన మాట వినడం లేదని చెప్పుకోవడం అధికార వర్గాల్లోను, రాజకీయ పార్టీల్లోను చర్చనీయాంశమైంది. కొందరైతే పాపం బాలరాజు అని జోకులేసుకున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో వీడియో కాన్ఫరెన్స్ ఉన్నందువల్లే ముఖ్యమైన జిల్లా అధికారులు ఉండిపోయారనీ, మంత్రి ఫోన్ చేసి చెప్పడంతో వెంటనే వారిని రచ్చబండకు పంపానని కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ ‘సాక్షి ప్రతినిధికి’ చెప్పారు.