seed distribution
-
ఆలూ.. సబ్సిడీ ఇస్తే మేలు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఆలూ రైతులపై విత్తన భారం పడుతోంది. ఉత్తరాది రాష్ట్రాల్లో వ్యాపారులు విత్తనాల ధరలను అమాంతం పెంచడంతో ఈ పంట సాగుచేసే రైతులకు సాగు ఖర్చు తడిసిమోపెడవుతోంది. గతంలో క్వింటాలుకు రూ.2 వేల నుంచి రూ.2,400 వరకు ఉన్న ఆలు విత్తనం ఇప్పుడు ఏకంగా రూ.3,500 దాటింది. క్వింటాలుపై సుమారు రూ.వెయ్యికిపైగా ధర పెరిగింది. ఎకరానికి కనీసం 7 నుంచి 8 క్వింటాళ్ల విత్తనం అవసరం. దీంతో ఈ పంట సాగుచేసే రైతులకు విత్తన దశలోనే సాగు ఖర్చు రూ.8 వేలు పెరుగుతుండటంతో రైతులు లబోదిబోమంటున్నారు. అసలే ఎక్కువ పెట్టుబడితో కూడిన పంట కావడం, దీనికి తోడు విత్తన భారం పెరగడంతో ఆలురైతుల పరిస్థితి మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా తయారైంది. తెరపైకి సబ్సిడీ సీడ్ డిమాండ్ పెరిగిన ఆలూ విత్తన ధరలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సబ్సిడీపై విత్తనాన్ని సరఫరా చేయాలనే డిమాండ్ తెరపైకి వస్తోంది. గతంలో రెండుసార్లు ఈ విత్తనాలను ప్రభుత్వం సరఫరా చేసింది. ఎనిమిదేళ్ల క్రితం సబ్సిడీపై ప్రభుత్వం ఉద్యానవనశాఖ ద్వారా రైతులకు పంపిణీ చేసిందని, ఈసారి కూడా సబ్సిడీ విత్తన పంపిణీని పునరుద్ధరించాలని ఆలూ రైతులు కోరుతున్నారు.పంజాబ్ నుంచి కొనుగోలు.. ఏటా రైతులు పంజాబ్‌లోని జలంధర్, యూపీలోని ఆగ్రా నుంచి విత్తనం కొనుగోలు చేసి తెచ్చుకుంటారు. పెద్ద రైతులైతే స్వయంగా అక్కడి వెళ్లి కొనుగోలు చేసి లారీల్లో తెచ్చుకుంటారు. చిన్న, సన్నకారు రైతులు మాత్రం దళారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఉంది. గతేడాదితో పోలిస్తే ఆలూ విత్తన వ్యాపారులు ధరను అమాంతం పెంచారు. దీంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈసారి ఆలుగడ్డల ధర కాస్త ఆశాజనకంగా ఉందని భావించిన రైతులకు విత్తన రూపంలో మాత్రం భారం తప్పడం లేదు. ఏటా రైతులు సెపె్టంబర్ చివరి వారం నుంచి ఆలూను విత్తుకోవడం ప్రారంభిస్తారు. ఈ విత్తనాల కోసం రైతులు ఇప్పుడు ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్తున్నారు. రాష్ట్రంలో ఐదు వేల ఎకరాల్లో సాగు రాష్ట్రంలో ఆలుగడ్డలు అత్యధికగా సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌తో పాటు, వికారాబాద్, రంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో సాగు చేస్తుంటారు. రాష్ట్రవ్యాప్తంగా ఐదు వేల ఎకరాల్లో ఈ పంట సాగవుతున్నట్లు ఉద్యానవనశాఖ అధికారుల అంచనా. ఇక్కడి నేలతో పాటు, వాతావరణం అనుకూలంగా ఉండటంతో దీన్ని రైతులు సాగు చేస్తున్నారు. చలి ఎక్కువగా ఉండే ప్రదేశాలు కావడంతో ఈ పంటకు మంచి దిగుబడి వస్తుంది.విత్తనాన్ని సబ్సిడీపై అందించాలి ఆలూ విత్తనం రేటు పెరిగినందున ప్రభు త్వం సబ్సిడీపై రైతులకు అందించాలి. గతేడాది ఆలూ విత్తనం క్వింటాల్ రూ.2,400 – రూ.2,600 ఉండగా, ఈ ఏడాది క్వింటాల్‌కు రూ.3 వేలు – రూ.3,500 పలుకుతోంది. కాబట్టి ప్రభుత్వం సబ్సిడీపై విత్తనాన్ని అందిస్తే బాగుంటుంది. – దిలీప్‌కుమార్, రైతు, అత్నూర్ఆలూ సాగు ఖర్చు పెరిగింది ఆలుగడ్డ విత్తనం ధర భారీగా పెంచారు. విత్తన ఖర్చు ఎకరానికి 8 వేల వరకు అదనంగా అవుతోంది. గతంలో మాదిరిగా ఆలూ విత్తనాన్ని సబ్సిడీపై సరఫరా చేసి ఆదుకోవాలి. కొన్నేళ్ల క్రితం ఆలూ విత్తనం సబ్సిడీపై ఇచ్చేవారు. దీన్ని పునరుద్ధరిస్తే రైతులకు మేలు జరుగుతుంది. – ఎం.ఏసురత్నం, ఆలూ రైతు, మాచిరెడ్డిపల్లి, సంగారెడ్డి జిల్లాసబ్సిడీ విత్తన సరఫరా పథకం లేదు ప్రస్తుతం సబ్సిడీ విత్తనం సరఫరా చేయడం లేదు. గతంలో సబ్సిడీ విత్తనాలు సరఫరా చేసినట్లు నాకు తెలియదు. ఉద్యానవనశాఖ కిందకు వచ్చే ఈ పంటకు సబ్సిడీ వర్తించదు. ఒకవేళ సబ్సిడీ కిందకు చేరిస్తే రైతులకు సబ్సిడీ విత్తనం సరఫరా చేయడం వీలవుతుంది. – సోమేశ్వర్రావు, డిప్యూటీ డైరెక్టర్, హారి్టకల్చర్ -
విత్తనాల పంపిణీ హుళక్కే
సాక్షి, అమరావతి: రైతుభరోసా కేంద్రాల (ఆర్బీకేల) ద్వారా సర్టిఫై చేసిన నాణ్యమైన నాన్‌సబ్సిడీ విత్తనాల పంపిణీకి ప్రభుత్వం మంగళం పాడేసింది. పురుగుమందుల సరఫరా ఇక ఉండబోదని తేల్చి చెప్పింది. ఏటా సబ్సిడీ విత్తనాలతో పాటు నాన్‌సబ్సిడీ విత్తనాలు, పురుగుమందులను కూడా ఆర్బీకేల ద్వారా గ్రామస్థాయిలో రైతులకు అందుబాటులో ఉంచేవారు. రైతుల డిమాండ్ మేరకు.. నాన్‌సబ్సిడీగా వారు కోరుకున్న కంపెనీల విత్తనాలు, పురుగుమందులను బుక్ చేసుకున్న 24 గంటల్లో నేరుగా వారి ముంగిటకు సరఫరా చేసేవారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆర్బీకేల ద్వారా వీటి పంపిణీ అవసరం లేదని స్పష్టం చేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గతంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలోని వైఎస్సార్సీపీ ప్రభుత్వం రైతులు విత్తనాలు, పురుగుమందుల కోసం ఇబ్బందులు పడకూడదని రైతుభరోసా కేంద్రాల్లో నాన్‌సబ్సిడీ కింద వాటిని అందుబాటులో ఉంచింది. నిఘా చాలంటున్న ప్రభుత్వం గత సీజన్ నుంచి నాన్‌సబ్సిడీ విత్తనాల పంపిణీతో పాటు పురుగుమందుల సరఫరాను నోడల్ ఏజెన్సీగా ఏపీ సీడ్స్‌ను నియమించారు. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా విత్తన, పురుగుమందుల కంపెనీలతో అవగాహన ఒప్పందం కోసం ఏర్పాట్లు చేశారు. ఇంతలో ప్రభుత్వం మారింది. కూటమి ప్రభుత్వ అనుమతి కోసం అధికారులు ప్రతిపాదనలు పంపారు. నాన్‌సబ్సిడీ విత్తనాలు, పురుగుమందుల పంపిణీ బాధ్యత ప్రభుత్వానిది కాదని, ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచనవసరం లేదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. మార్కెట్లోకి వచ్చే విత్తనాలు, పురుగుమందులపై నిఘా పెడితే సరిపోతుందని చెప్పినట్లు అధికారులు తెలిపారు. దీంతో డిమాండ్ ఉన్న కంపెనీల విత్తనాలు, పురుగుమందుల బ్లాక్ మార్కెటింగ్ పెరుగుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో నకిలీలు, బ్లాక్ మార్కెట్‌కు చెక్పూర్వం నాణ్యమైన విత్తనం దొరక్క మిరప, పత్తి రైతులు నకిలీల బారినపడి ఏటా రూ.వేలకోట్ల విలువైన పెట్టుబడి, ఉత్పత్తి నష్టాలను చవిచూసేవారు. పైగా డిమాండ్ ఉన్న కంపెనీల విత్తనాలకు కృత్రిమ కొరత సృష్టించి ఎమ్మార్పీకి మించి అమ్మేవారు. రైతులు బ్లాక్ మార్కెట్లో రెట్టింపు ధరలకు కొనుగోలు చేసి ఆర్థికంగా నష్టపోయేవారు. నకిలీ విత్తన విక్రయదారులతో పాటు బ్లాక్ మార్కెట్‌కు చెక్ పెట్టేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం డిమాండ్ ఉన్న కంపెనీలకు చెందిన విత్తనాలతోపాటు పురుగుమందులను నాన్‌సబ్సిడీగా ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచేది. దీంతో రైతులకు అవి ఎమ్మార్పీకే లభించేవి. ఇందుకోసం ఏటా సీజన్‌కు ముందే విత్తన కంపెనీలతో ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ, పురుగుమందుల కంపెనీలతో ఏపీ ఆగ్రోస్ అవగాహన ఒప్పందాలు చేసుకునేవి. ఇలా వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 305.43 క్వింటాళ్ల నాన్‌సబ్సిడీ విత్తనాలను రైతులు ఆర్బీకేల్లో కొనుగోలు చేశారు. రూ.14.25 కోట్ల విలువైన 1,39,443 లీటర్ల పురుగుమందులను 1.57 లక్షలమంది రైతులు ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేశారు. -
జోరుగా విత్తన పంపిణీ
సాక్షి, అమరావతి: నైరుతి వచ్చేసింది. తొలకరి మొదలైంది. ఖరీఫ్ సాగు ఊపందుకుంటోంది. ఎన్నికల కోడ్ కారణంగా ఈసారి కాస్త ఆలశ్యంగా ప్రారంభమైన విత్తనాల పంపిణీ ఇప్పుడు జోరందుకుంటోంది. ఇప్పటికే పచ్చిరొట్ట విత్తనాలతో పాటు వేరుశనగ విత్తనాల పంపిణీ జోరుగా సాగుతోంది. గిరిజన జిల్లాల్లో వరి విత్తన పంపిణీ ప్రారంభమైంది. ఈ నెల 15 వ తేదీ నుంచి మిగిలిన జిల్లాల్లో వరి, ఇతర విత్తనాల పంపిణీకి ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ, వ్యవసాయ శాఖ ఏర్పాట్లు చేస్తున్నాయి. సీజన్ ఏదైనా స్థానిక లభ్యతనుబట్టి సాగు విస్తీర్ణంలో 30 శాతం విత్తనాన్ని సబ్సిడీపై రైతులకు అందిస్తుంటారు.సబ్సిడీ విత్తనం కోసం చంద్రబాబు ప్రభుత్వ హయాంలో పడరాని పాట్లు పడేవారు. రోజుల తరబడి బారులు తీరి ఎదురు చూసేవారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితి మారింది. గడిచిన ఐదేళ్లుగా సీజన్‌కు ముందుగానే నాణ్యమైన, సర్టిఫై చేసిన విత్తనాన్ని ఆర్బీకేల ద్వారా గ్రామాల్లోనే అందించడంతో రైతుల కష్టాలకు తెరపడింది. ఈ ఏడాది ఖరీఫ్‌లో 85.65 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యంగా నిర్దేశించారు. ప్రధానంగా 39.07 లక్షల ఎకరాల్లో వరి, 14.80 లక్షల ఎకరాల్లో వేరుశనగ, 14.67 లక్షల ఎకరాల్లో పత్తి, 8.35 లక్షల ఎకరాల్లో అపరాలు సాగు చేయనున్నారు. ఖరీఫ్ సీజన్ కోసం 6,31,742 క్వింటాళ్ల విత్తనం అవసరం కాగా, 6,50,160 క్వింటాళ్లు అందుబాటులో ఉంది.2.99 లక్షల క్వింటాళ్ల వేరుశనగ విత్తనాన్ని 40 శాతం సబ్సిడీతో అందిస్తున్నారు. పెసర, మినుము, కంది విత్తనాలను 30 శాతం సబ్సిడీపై ఇస్తున్నారు. చిరుధాన్యాల సాగును ప్రోత్సహించేందుకు కొర్ర, రాగి, అండుకొర్రలు వంటి విత్తనాలను 50 శాతం రాయితీపై సరఫరా చేస్తున్నారు. జాతీయ ఆహార ధాన్యాల భద్రత పథకం అమలవుతున్న జిల్లాల్లో కిలోకి రూ.10 చొప్పున, ఇతర జిల్లాల్లో కిలోకి రూ.5 చొప్పున రాయితీతో వరి విత్తనాలు సరఫరా చేస్తున్నారు. ఏజెన్సీ జిల్లాల్లో మాత్రం 90 శాతం సబ్సిడీపై వరితో సహా అన్ని రకాల విత్తనాలను పంపిణీ చేస్తున్నారు. వీటిలో ఇప్పటికే 3,15,928 క్వింటాళ్ల విత్తనాన్ని ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచారు. 48,177 క్వింటాళ్ల పచ్చిరొట్ట, 2 లక్షల క్వింటాళ్ల వేరుశనగ, 67,617 క్వింటాళ్ల వరి, 84 క్వింటాళ్ల చిరుధాన్యాలు, కందులు, మినుములు, 50 క్వింటాళ్ల పెసర, రాజ్మా, నువ్వులు విత్తనాలను సిద్ధం చేశారు.విత్తనం కోసం 3.76 లక్షల మంది రైతులు నమోదుఆర్బీకేల ద్వారా విత్తనాలు కావాల్సిన రైతుల వివరాలను అన్ని జిల్లాల్లో నమోదు చేస్తున్నారు. ఇప్పటివరకు 2,46,997 క్వింటాళ్ల విత్తనాల కోసం 3,75,583 మంది రైతులు ఆర్బీకేల్లో వివరాలు నమోదు చేసుకున్నారు. ఇప్పటివరకు 40 వేల క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలు, 1,04,200 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాల పంపిణీ పూర్తయింది.సరిపడా విత్తన నిల్వలుగతేడాది మాదిరిగానే సర్టిఫై చేసిన నాణ్యమైన, ధ్రువీకరించిన విత్తనాన్ని ఆర్బీకేల ద్వారా పంపిణీ చేస్తున్నాం. ఇప్పటికే పచ్చిరొట్టతో పాటు వేరుశనగ విత్తనం పంపిణీ జోరుగా సాగుతోంది. మిగిలిన విత్తనాలను జూన్ 15వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నాం.– ఎం.శివప్రసాద్, ఎండీ, ఏపీ విత్తనాభివృద్ధి సంస్థఏజెన్సీలో 7వేల క్వింటాళ్ల పంపిణీగిరిజన ప్రాంతాల్లో గతంలో ఏటా 2, 3 వేల క్వింటాళ్లకు మించి విత్తనాలను పంపిణీ చేయలేదు. ఈసారి రికార్డు స్థాయిలో 90 శాతం సబ్సిడీ విత్తనాల పంపిణీ జరుగుతోంది. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఈ ఏడాది 7 వేల క్వింటాళ్ల విత్తనాన్ని సిద్ధం చేశారు. డిమాండ్‌ను బట్టి మరింత పెంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
మూడేళ్లుగా ముందుకుసాగని పథకం.. విత్తనోత్పత్తికి అంతరాయం!
రైతుల్లో స్వయం ప్రతిపత్తిని పెంపొందించడానికి ఉద్దేశించిన గ్రామ విత్తనోత్పత్తి పథకానికి మంగళం పాడినట్లే కనపడుతోంది. 50శాతం సబ్సిడీపై రైతుకు ఫౌండేషన్ సీడ్ (మూల విత్తనం) అందించి నాణ్యమైన విత్తనాలు రైతులే ఉత్పత్తి చేసుకునే అవకాశం ఇక లేకుండా పోయింది. మూడేళ్లుగా ఈ పథకం ఊసే లేకపోవడంతో రైతులు నిరాశ చెందుతున్నారు. వానాకాలానికి సంబంధించి 5.80లక్షలు ఎకరాల్లో పంటలు సాగవుతుంటాయి. ఇందులో వరి, పత్తి, మొక్కజొన్న, కంది తదితర పంటలు ఉంటాయి. యాసంగికి సంబంధించిన వివిధ రకాల పంటలు 3.5లక్షల ఎకరాలకుపైగా సాగులోకి వస్తుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో రైతులందరికీ నాణ్యమైన విత్తనం అందించడం ప్రభుత్వానికి కష్టతరంగా మారుతోంది. ఈ దుస్థితిని నివారించి రైతుల్లో స్వయం ప్రతిపత్తిని పెంపొందించడానికి గతంలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో విత్తనోత్పత్తి పథకాన్ని అమలు చేశారు. సిద్దిపేట జిల్లాను విత్తన హబ్‌గా తయారు చేయాలనే సంకల్పంతో పనిచేశారు. ప్రతిసారి ఏదో పంటను ఎంచుకొని ఈ పథకం అమలు చేసేవారు. ఏటా జిల్లాలోని పలు గ్రామాల్లో వానాకాలానికి సంబంధించి వరి, కంది, మొక్కజొన్న, యాసంగిలో శనగ పంటల్లో విత్తనోత్పత్తి చేసేవారు. దీని ద్వారా రైతులకు 50శాతం సబ్సిడీపై మూల విత్తనం అందిస్తారు. పరిశోధనా స్థానాల నుంచి నేరుగా వచ్చే వీటి వల్ల విత్తనోత్పత్తికి అవకాశముంటుంది. విత్తనాలు అందించిన తర్వాత వ్యవసాయశాఖ విత్తనం వేసింది మొదలు.. పంట చేతికొచ్చేసరికి మూడుసార్లు శిక్షణ అందించి నాణ్యమైన విత్తన ఉత్పత్తికి బాటలు వేసేవారు. ఉత్పత్తిగా వచ్చిన విత్తనాలను రైతులే స్వయంగా తెలిసిన రైతులకు అమ్ముకోవడం, లేదా ప్రభుత్వమే విత్తన కంపెనీలతో అగ్రిమెంట్ చేయించి మార్కెటింగ్ చేసేవారు. కొంత కాలం ఈ పథకం సత్ఫలితాలనిచ్చింది. క్రమేపి ఈ విధానం వల్ల ఆశించిన ఫలితాలు రాక మొగ్గుబడిగా సాగింది. రైతులు ఉత్పత్తి చేసిన విత్తనాలు నాణ్యాత ప్రమాణాలు కలిగి ఉన్నాయా? లేదా అనే విషయం తెలియక కొనుగోలు చేయడానికి చుట్టు పక్కల గ్రామాల రైతులు ఆసక్తి చూపలేదు. కంపెనీలతో అగ్రిమెంట్ చేయించే విషయంలో వ్యవసాయ శాఖ చొరవ చూపలేదు. మరీ మూడేళ్ల నుంచి అయితే పథకం ఊసే కరువైంది. ఫలితంగా ఆసక్తి ఉన్న రైతులకు ఫౌండేషన్ సీడ్‌ను కూడా అందలేదు. దీనిని బట్టి చూస్తే ఈ పథకానికి నిధులు విడుదల చేయడానికి ప్రభుత్వం పెద్దగా ఆసక్తి చూపడం లేదు. కొత్త ప్రభుత్వం చొరవపైనే ఆశలు.. కొత్త ప్రభుత్వం చొరవ చూపితేనే ఈ గ్రామ విత్తనోత్పత్తి పథకం సమర్థవంతంగా అమలయ్యే అవకాశముంది. ప్రధానంగా రైతులకు నాణ్యమైన విత్తన సబ్సిడీతోపాటు ఎరువులు, క్రిమిసంహారకాలను సబ్సిడీపై అందించాల్సి ఉంది. దీంతోపాటు రైతులు ఉత్పత్తి చేసే విత్తనాలను రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ కొనుగోలు చేసేలా రైతులకు ఒప్పందం కుదిరిస్తే.. రైతుల ఉత్పత్తులకు మంచి ధర లభించి భారీ ప్రయోజనం జరిగే అవకాశముంది. ఇవేకాకుండా ఆత్మకమిటీల పనితీరు మెరుగుపరచడం, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ (ఎన్ఎఫ్ఎస్ఎం) పథకాలను సైతం పునరుద్ధరించాల్సి ఉంది. ఇవి చదవండి: కృష్ణా బోర్డు ప్రాజెక్టుల నిర్వహణకు ఏపీ,తెలంగాణ అంగీకారం! -
80 శాతం సబ్సిడీపై విత్తనాలు
సాక్షి, అమరావతి: ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో అధిక వర్షాలు, వర్షాభావ పరిస్థితులతో ఇబ్బంది పడుతున్న రైతులను అన్ని రకాలుగా ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 80 శాతం సబ్సిడీపై విత్తన పంపిణీకి శ్రీకారం చుట్టింది. 30 వేల క్వింటాళ్ల వరి విత్తనాలతో పాటు లక్ష క్వింటాళ్ల అపరాలు, చిరుధాన్యాల విత్తనాలను సిద్ధం చేసింది. అధిక వర్షాలతో నారుమడులు, నాట్లు దెబ్బతిన్న కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల రైతులకు వరి విత్తనాలు పంపిణీ చేస్తోంది. అలాగే రాయలసీమలో అపరాలు, చిరుధాన్యాల విత్తనాలను అందిస్తోంది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.98.92 కోట్లు ఖర్చు చేస్తోంది. 5.14 లక్షల క్వింటాళ్లు పంపిణీ ఖరీఫ్ సీజన్లో 89.37 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేయాలనే లక్ష్యంతో వ్యవసాయ శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందుకోసం 5.73 లక్షల క్వింటాళ్ల విత్తనాన్ని సమకూర్చుకుంది. ఇందులో భాగంగా 7.32 లక్షల మంది రైతులకు 5.14 లక్షల క్వింటాళ్ల సబ్సిడీ విత్తనాన్ని సీజన్‌కు ముందుగానే ఆర్బీకేల ద్వారా పంపిణీ చేసింది. అయితే ఊహించని రీతిలో జూన్‌లో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. జూలైలో కురిసిన వర్షాలతో కాస్త ఊపిరిపీల్చుకున్నప్పటికీ ఆగస్టులో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు కాస్త ఇబ్బందికరంగా మారాయి. సీజన్లో ఇప్పటివరకు 341.10 మిల్లీమీటర్ల వర్షపాతం కురవాల్సి ఉండగా, 261.60 మి.మీ. మాత్రమే కురిసింది. కృష్ణా జిల్లాలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైంది. అయితే.. అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలతో పాటు పల్నాడు, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాల్లో 20–59 శాతం మధ్య లోటు వర్షపాతం రికార్డైంది. మిగిలిన జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా రాయలసీమలో సుమారు 132 మండలాల్లో బెట్ట పరిస్థితులు నెలకొన్నట్టుగా గుర్తించారు. దీంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు అక్కడ ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక అమలుకు అధికారులు శ్రీకారం చుట్టారు. రైతులు ఇబ్బంది పడకుండా.. గతంలో వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పుడు రైతుల నుంచి వచ్చిన డిమాండ్ మేరకు రాయలసీమలో ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక కింద ఉలవలు, అలసందలు, పెసలు, మినుములు, జొన్నలు, సజ్జలు, కొర్రలు, రాగుల విత్తనాలను అందించారు. ఇలా 2018–19 సీజన్లో 63,052 క్వింటాళ్లు, 2019–20 సీజన్లో 57,320 క్వింటాళ్ల విత్తనాలను పంపిణీ చేశారు. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఏ ఒక్క రైతూ విత్తనం కోసం ఇబ్బందిపడకుండా.. గతంలో ఎన్నడూ లేనివిధంగా లక్ష క్వింటాళ్ల అపరాలు, చిరుధాన్యాల విత్తనాలను ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ సిద్ధం చేసింది. మరోవైపు అధిక వర్షాలతో పంటలు దెబ్బతిన్న జిల్లాల్లో రైతుల కోసం తక్కువ కాలపరిమితి కలిగిన ఎంటీయూ–1121, ఎంటీయూ–1153, బీపీటీ–5204, ఎన్‌ఎల్‌ఆర్– 34449, ఎంటీయూ–1010 రకాలకు చెందిన 30 వేల క్వింటాళ్ల వరి విత్తనాన్ని ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచారు. ఆర్బీకేల ద్వారా విత్తన పంపిణీ కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల్లో అధిక వర్షాలు, వరదల ప్రభావిత ప్రాంతాల్లో రైతులకు వరి విత్తనాలను ఆర్బీకేల ద్వారా పంపిణీ చేస్తున్నారు. ఇప్పటికే కృష్ణాలో 1,221 క్వింటాళ్లు, ఎన్టీఆర్ జిల్లాలో 278 క్వింటాళ్లు, ఏలూరు జిల్లాలో 24 క్వింటాళ్ల విత్తనాన్ని రైతులకు పంపిణీ చేశారు. వర్షాభావ పరిస్థితులు నెలకొన్న రాయలసీమలో కూడా అపరాలు, చిరుధాన్యాల విత్తనాల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లాలో 25,750 క్వింటాళ్లు, అనంతపురం జిల్లాలో 14,650 క్వింటాళ్లు, అన్నమయ్య జిల్లాలో 11,500 క్వింటాళ్లు, చిత్తూరు జిల్లాలో 6 వేల క్వింటాళ్లు, వైఎస్సార్ జిల్లాలో 670 క్వింటాళ్లు, తిరుపతి, ప్రకాశం జిల్లాల్లో 250 క్వింటాళ్ల చొప్పున ఆర్బీకేల్లో విత్తనాలు అందుబాటులో ఉంచారు. ఉలవలు, అలసందలకు 85–90 రోజులు, కొర్రలకు 80–85 రోజులు, మినుములకు 70–75 రోజులు, పెసలకు 65–75 రోజుల పంట కాలం ఉంటుంది. కాస్త వర్షాలు కురిస్తే విత్తుకోవాలని రైతులు ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోకపోతే మళ్లీ నాట్లు వేసే వాడిని కాదు.. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో నేను 20 ఎకరాల్లో ఎంటీయూ–1318 రకం వరి వేశా. వర్షాలు, వరదలతో నాట్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఎకరాకు రూ.8 వేలు నష్టపోయా. ఆర్బీకే ద్వారా ఎంటీయూ 1121 రకం 4.5 క్వింటాళ్ల విత్తనాన్ని 80 శాతం సబ్సిడీపై ప్రభుత్వం అందించింది. సబ్సిడీపోనూ రూ.3,402 మాత్రమే చెల్లించాను. ప్రభుత్వం ఆదుకోకపోతే మళ్లీ నాట్లు వేసే వాడిని కాదు. గతంలో ఇంత వేగంగా స్పందించిన ప్రభుత్వాలు లేవు. – చలమలశెట్టి రామ్మోహన్ రావు, మోటూరు, గుడివాడ మండలం, కృష్ణా జిల్లా ప్రభుత్వం ఆదుకుంది 3.5 ఎకరాలు సొంతంగా, 2 ఎకరాలు కౌలుకు సాగు చేస్తున్నా. ఖరీఫ్‌లో వరి సాగు చేస్తే జూలైలో కురిసిన కుండపోత వర్షాలతో నారుమళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో ఎకరాకు రూ.7 వేలకు పైగా నష్టం వాటిల్లింది. ఏం చేయాలో పాలుపోలేదు. ఖరీప్ సాగుకు దూరంగా ఉండాలని భావించా. ప్రభుత్వం 80 శాతం సబ్సిడీపై కోరుకున్న విత్తనం ఆర్బీకే ద్వారా అందించి ఆదుకుంది. ఆ విత్తనంతో నాట్లు వేసుకున్నాం. గతంలో ఎప్పుడూ ఇలా అదును దాటక ముందే 80 శాతం సబ్సిడీపై విత్తనం సరఫరా చేసిన దాఖలాలు లేవు. సీఎం వైఎస్ జగన్‌కు రుణపడి ఉంటాం. – యెరగాని వీరరాఘవులు, దిరుసువల్లి గ్రామం, పెడన మండలం, కృష్ణా జిల్లా -
Fact Check: వాస్తవాలు తెలిసి కూడా ‘ఈనాడు’ అబద్ధాలు
సాక్షి, అమరావతి: తొలకరి వర్షాలు కాస్త ఆలశ్యం కావడంతో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక అమలుకు చర్యలు చేపట్టింది. రైతుల డిమాండ్ల మేరకు 80 శాతం రాయితీపై వారు కోరుకున్న విత్తనాల పంపిణీకి ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలో రైతులకు జరుగుతున్న మేలు చూసి రామోజీకి కడుపులో మంట మొదలైంది. ‘ఎండ మండి.. మొలక ఎండుతోంది’ అంటూ రైతులను గందరగోళ పర్చేలా ఈనాడు ఓ కథనాన్ని అచ్చేసింది. సత్యదూరమైన ఆరోపణలు చేసింది. వాస్తవాలేమిటో ఒక్కసారి పరిశీలిద్దాం. ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక రూపకల్పన ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో (జూన్ నెలలో) ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. దీంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేకంగా వ్యవసాయంపై సమీక్షించారు. ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక రూపకల్పనపై ఆదేశాలు జారీ చేశారు. ఆర్బీకే, మండల స్థాయి వ్యవసాయ సలహా మండళ్ల ద్వారా గ్రామ స్థాయిలో సమావేశాలు నిర్వహించారు. స్థానికంగా నెలకొన్న పరిస్థితులు, లోటు వర్షపాతం నమోదైన ప్రాంతాల్లో రైతుల నుంచి సేకరించిన అభిప్రాయాల మేరకు ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికలను రూపొందించారు. లోటు వర్షపాతం కారణంగా బెట్ట పరిస్థితులున్న ఏడు జిల్లాల్లో 80 శాతం రాయితీపై విత్తనాల పంపిణీకి ఏర్పాట్లు చేశారు. అవసరమైన చోట లేట్ ఖరీఫ్ కింద రైతులు ఇతర పంటలను సాగు చేసేందుకు అవసరమైన సలహాలు, సూచనలు అందించారు. అనంతపురం, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు, ప్రకాశం, సత్యసాయి, వైఎస్సార్ జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న మండలాల్లో ఆర్బీకేల ద్వారా విత్తన సరఫరాకు ఏర్పాట్లు చేశారు. రైతుల నుంచి వచ్చిన డిమాండ్ మేరకు మినుము 400 క్వింటాళ్లు, పెసర 3,200 క్వింటాళ్లు, కంది 1,000 క్వింటాళ్లు, ఉలవలు 53,000 క్వింటాళ్లు, అలసందలు 1,900 క్వింటాళ్లు, కొర్రలు 500 క్వింటాళ్లు చొప్పున మొత్తం 60 వేల క్వింటాళ్ళ విత్తనాలను సిద్ధం చేశారు. సాధారణంగా ఖరీఫ్ సీజన్లో వర్షాభావ పరిస్థితులు నెలకొంటే ప్రత్యామ్నాయ పంటలకు మారడానికి రైతులు ఆగస్టు చివరి వారం వరకు వేచి చూస్తుంటారు. ఈలోగా ఆశించిన స్థాయిలో వర్షాలు కురిస్తే సంప్రదాయ పంటలను సాగు చేస్తారు. లేదంటే ప్రత్యామ్నాయ పంటలు వేస్తారు. రైతులకు నష్టం కలగకుండా ప్రభుత్వం ముందస్తుగానే ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక అమలు చేస్తోంది. ఆర్బీకేల్లో నమోదు చేసుకున్న రైతులకు ఈ నెల 20 నుంచి ప్రత్యామ్నాయ పంటల విత్తనాలను పంపిణీ చేయనుంది. రైతులకు శిక్షణ మరో వైపు ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో నిలదొక్కుకొని మంచి దిగుబడులు సాధించేందుకు పాటించాల్సిన యాజమాన్య పద్ధతులపై రైతులకు అధికారులు, శాస్త్రవేత్తలతో ప్రభుత్వం శిక్షణ ఇస్తోంది. ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసే రైతులకు కూడా ఎన్జీ రంగా వ్యవసాయ, డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలతో పంటల ప్రణాళికల అమలులో తీసుకోవల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తోంది. ఆ 4 జిల్లాల్లో విత్తన పంపిణీకి శ్రీకారం జూలై నెలలో అధిక వర్షాలతో పంటలు దెబ్బ తిని మళ్లీ పంట వేసుకునేందుకు సిద్ధపడిన రైతులను ఆర్బీకేల ద్వారా గుర్తించారు. వారి జాబితాలను ఆర్బీకేల్లో ప్రదర్శిస్తున్నారు. ఇంకా ఎవరైనా ముందుకొస్తే వారి పేర్లను కూడా నమోదు చేసేందుకు అవకాశం కల్పించారు. వారు కోరుకున్న విత్తనాన్ని 80 శాతం రాయితీ పంపిణీ చేస్తోంది. కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అధిక వర్షాల వల్ల పంటలు దెబ్బతిన్న ప్రాంతాల్లో రైతుల కోసం 2,804 క్వింటాళ్ల వరి విత్తనాలను అవసరమని గుర్తించారు. ఇప్పటి వరకు 895 క్వింటాళ్ల విత్తనాన్ని ఆర్బీకేల్లో సిద్ధం చేయగా, 773 క్వింటాళ్ల విత్తనాన్ని రైతులకు పంపిణీ చేశారు. -
ఏపీలో ఆర్బీకేల ద్వారా విత్తనాల పంపిణీ.. రైతుల్లో ఆనందం
-
కాడి కట్టి, మేడి పట్టి అరకలు.. ఉరకలు
సాక్షి, అమరావతి: సహకరిస్తున్న ప్రకృతితోపాటు ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటుతో దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత మేడి పట్టి ముందస్తు ఏరువాకకు అన్నదాతలు ఉత్సాహంతో ఉరకలు వేస్తున్నారు. కేరళపై విస్తరించిన నైరుతి పవనాలు మరో ఐదు రోజుల్లో రాష్ట్రాన్ని తాకనున్నాయని వాతావరణ శాఖ ప్రకటించడంతో కాడెద్దులతో అన్నదాతలు ముందస్తుకు సన్నద్ధమయ్యారు. ఈసారి వాతావరణం బాగా అనుకూలించి ముందస్తుగా రుతు పవనాల రాకతో వేగంగా స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం విత్తనాల నుంచి ఎరువుల దాకా సర్వం సిద్ధం చేసి ఇప్పటికే రైతన్నలకు అందుబాటులో ఉంచింది. ముందస్తు ఖరీఫ్ సాగు కోసం రాష్ట్రవ్యాప్తంగా వేరుశనగ విత్తనాల పంపిణీ జోరుగా సాగుతుండగా నేటి నుంచి వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల ద్వారా వరితోపాటు ఇతర పంటల విత్తనాల పంపిణీ ప్రారంభం కానుంది. తొలిసారిగా ఆర్బీకేల్లో పత్తి, మిరప, మొక్కజొన్న, కూరగాయల విత్తనాల పంపిణీ మొదలవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థన మేరకు ముందస్తు ఖరీఫ్‌కు అనుగుణంగా ఎరువులను కేటాయించేందుకు కేంద్రం అంగీకరించడంతో జూన్–జూలై నెలల్లో డిమాండ్‌కు సరిపడా నిల్వ చేసేలా వ్యవసాయ శాఖ చర్యలు చేపట్టింది. మరోవైపు సాగునీటి ప్రణాళికకు అనుగుణంగా గోదావరి డెల్టాకు నేడు నీటిని విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాట్లు చేసింది. ఎరువులు.. విత్తనాలు గత ఖరీఫ్‌లో రాష్ట్రంలో 15.34 లక్షల టన్నుల ఎరువులను వినియోగించగా ఈసారి 19.02 లక్షల టన్నుల ఎరువులు అవసరమని అంచనా వేశారు. రబీలో మిగిలిన నిల్వలతో పాటు ప్రభుత్వ అభ్యర్థన మేరకు ఏప్రిల్, మేలో కేంద్రం 3.47 లక్షల టన్నులను కేటాయించడంతో 7.69 లక్షల టన్నుల ఎరువులున్నాయి. ఇందులో 1.21 లక్షల టన్నుల ఎరువుల విక్రయాలు జరగడంతో 6.48 లక్షల టన్నులను క్షేత్రస్థాయిలో సిద్ధం చేశారు. వీటిలో 1.50 లక్షల టన్నుల ఎరువులను ఆర్బీకేల్లో నిల్వ చేశారు. తొలిసారిగా ఆర్బీకేల ద్వారా పత్తి, మిరప, మొక్కజొన్న, కూరగాయల విత్తనాల పంపిణీకి శ్రీకారం చుడుతున్నారు. వీటి కోసం ఇప్పటికే 23 కంపెనీలతో ప్రభుత్వం ఎంవోయూ చేసుకుంది. తొలుత తూర్పు, పశ్చిమ డెల్టాలో గోదావరి తూర్పు డెల్టా కింద 2 లక్షలు, సెంట్రల్ డెల్టా పరిధిలో 1.7 లక్షల ఎకరాలు, వెస్ట్రన్ డెల్టా పరిధిలో 4.3 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. తొలుత ఉభయ గోదావరి, ఏలూరు, కాకినాడ, కోనసీమ జిల్లాల పరిధిలో 6.3 లక్షలకు పైగా ఎకరాల్లో ఖరీఫ్ సాగు ప్రారంభం కానుంది. సెంట్రల్ డెల్టా పరిధిలో కోనసీమతో పాటు పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోని శివారు ప్రాంతాలకు నీరందేందుకు కనీసం 15 రోజులు పడుతుంది. నీటి విడుదలతో ముందుగా రాజమహేంద్రవరం, మండపేట, రాయవరం, రామచంద్రాపురం, కొవ్వూరు, నిడదవోలు, మార్టేరు, పెనుగొండ తదితర ప్రాంతాల్లో నారుమళ్లు పోసుకునేందుకు రైతులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కాలువలకు విడుదలయ్యే నీటిని సద్వినియోగం చేసుకునేలా ఆర్బీకేల ద్వారా రైతులను చైతన్యం చేస్తున్నారు. ► ఖరీఫ్‌లో 95.23 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యం ► ఈసారి ఖరీఫ్‌లో 95.23 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యంగా నిర్దేశించారు. ప్రధానంగా 40.76 లక్షల ఎకరాల్లో వరి, 18.26 లక్షల ఎకరాల్లో వేరుశనగ, 15,97 లక్షల ఎకరాల్లో పత్తి, 8.88 లక్షల ఎకరాల్లో అపరాలు 3.94 లక్షల ఎకరాల్లో మిరప, 2.95 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేయనున్నారు. ► ఖరీఫ్ కోసం 6,16,664 క్వింటాళ్ల విత్తనాన్ని సిద్ధం చేశారు. 29,417 క్వింటాళ్ల విత్తనాలను 90 శాతం సబ్సిడీతో ఇవ్వనుండగా 5,87,247 క్వింటాళ్ల విత్తనాన్ని 25 నుంచి 50 శాతం సబ్సిడీపై అందించనున్నారు. ► ఆర్బీకేల్లో 94,542 క్వింటాళ్ల పచ్చి ట్ట విత్తనాల పిణీ జోరుగా జరుగుతోంది. మరో వైపు 3,29,688 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలను అందచేయాలని లక్ష్యంగా నిర్దేశించుకోగా ఇప్పటివరకు 1,73,635 క్వింటాళ్ల విత్తనాన్ని ఆర్బీకేల్లో సిద్ధం చేశారు. ఇప్పటివరకు 1,25,318 క్వింటాళ్ల విత్తనాల కోసం రైతులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ► వరి సహా ఇతర పంటలకు సంబంధించి 1,92,433 క్వింటాళ్ల విత్తనాలను బుధవారం నుంచి పంపిణీ చేయనున్నారు. ఇందులో 1,72,234 క్వింటాళ్ల వరి విత్తనాలతో పాటు ఇతర పంటలకు సంబంధించినవి ఉన్నాయి. వెంటనే నారుమళ్లు పోస్తాం.. మూడు దశాబ్దాలుగా వ్యవసాయం చేస్తున్నా 20 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నా. నీటి విడుదలలో ఆలస్యం వల్ల ఏటా కోతకొచ్చే సమయంలో ప్రకృతి వైపరీత్యాలతో దిగుబడులు తగ్గుతున్నాయి. గతేడాది వర్షాలు, తుపాన్ల వల్ల ఎకరాకు 30 బస్తాలకు మించి రాలేదు. ఈఏడాది ప్రభుత్వం జూన్ 1నే డెల్టాకు నీరిస్తుండడం చాలా సంతోషంగా ఉంది. వెంటనే నారుమళ్లు పోసి నాట్లు వేసుకుంటా. ఈసారి స్వర్ణతో పాటు ఎంటీయూ 1318, పీఎల్ 1100 రకాలు సాగు చేస్తా. –సంకురాత్రి సుబ్బారావు, ఉండ్రాజవరం, ఏలూరు జిల్లా వ్యవసాయానికి మంచిరోజులు వ్యవసాయానికి నిజంగా మంచిరోజులొచ్చాయి. ముందుగా సాగునీరు ఇవ్వాలని కోనసీమలో గతంలో రైతులంతా లక్ష ఎకరాల్లో సాగు సమ్మె చేశారు. నాటి డిమాండ్ నేడు సాకారమైంది. ప్రభుత్వం ముందస్తుగా సాగు నీరివ్వడం నిజంగా రైతులకు వరం లాంటిది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నీటి వృథాను అరికట్టి సాగు చేపట్టాలి. –కొవ్వూరి త్రినాథ్‌రెడ్డి, రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి, వైఎస్సార్సీపీ రైతు విభాగం రైతులకెంతో మేలు ముందస్తు ఖరీఫ్ వల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత కాలువలకు ప్రభుత్వం ముందుగా నీటిని విడుదల చేస్తోంది. ఈ అవకాశాన్ని రైతులు వినియోగించుకుని అదును దాటిపోకుండా ఖరీఫ్ సాగు చేపట్టాలి. –జున్నూరి రామారావు(బాబి) రైతు, ఏపీ వ్యవసాయ కమిషన్ సభ్యుడు అదునులో సాగుతో అదనపు దిగుబడి ‘నాకు 59 సెంట్ల సొంత భూమి ఉంది. మరో 5 ఎకరాలు కౌలుకు చేస్తున్నా. గతేడాది అకాల వర్షాలు, తుపాన్ల వల్ల దిగుబడి తగ్గింది. ఈసారి జూన్ 1వ తేదీనే డెల్టాకు నీరిస్తుండటంతో బుధవారమే నారుమడి పోస్తున్నా. అదునులో సాగు చేపడుతుండటంతో ఎకరాకు కనీసం 40 బస్తాల దిగుబడి వస్తుందని ఆశిస్తున్నా. ముందుగా నీళ్లిస్తున్న ప్రభుత్వానికి రైతులు రుణపడి ఉంటారు’ – కె.శ్రీనివాసరెడ్డి, పసలపూడి, రాయవరం మండలం, కోనసీమ జిల్లా -
అన్ని విత్తనాలు ఇంటి ముంగిట్లో..
ఇది కర్నూలు జిల్లా పత్తికొండ మండలం కోతిరాళ్ల గ్రామం. గత ఏడాది విత్తనాల కోసం రైతులు తీవ్ర ఇక్కట్లు పడిన గ్రామాల్లో ఇదొకటి. ఈ ఏడాది ఆ పరిస్థితి లేదు. విత్తనాల కోసం రైతులు ముందుగానే రైతు భరోసా కేంద్రానికి వెళ్లారు. కోవిడ్19 నిబంధనలకు అనుగుణంగా లైన్లో నిల్చున్నారు. వాళ్ల డాక్యుమెంట్లు చూపించారు. ఏ విత్తనం కావాలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.48 గంటల్లో విత్తనాలు పొందారు. ఇది అనంతపురం జిల్లా హిందూపురం మండలం చలివెందల. మారుమూల గ్రామం కావడంతో వేరుశనగ విత్తనం వస్తుందో లేదోనని ఎప్పుడూ బెంగ ఉండేది. ఈ ఏడాది ఎక్కడా భారీ క్యూలు లేవు. కుర్చీల్లో కూర్చోబెట్టి..వరుసగా పిలిచి.. మరీ విత్తన కాయల్ని ఇచ్చి పంపారు. సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 13 జిల్లాల్లోని ఆయా గ్రామాల్లో రైతులకు వారు ఉంటున్న ఊళ్లోనే విత్తనాలు అందుతున్నాయి. గతానికి భిన్నంగా వేరుశనగ సహా ఏ విత్తనం కోసం క్యూలలో ఎగశ్వాస, దిగశ్వాసతో నిలబడిన ఆనవాళ్లు లేవు. వడదెబ్బతో తల్లడిల్లిన ఘటనలు లేవు. చద్ది మూటతో తెల్లవారుజామునే వెళ్లి లైన్లో నిల్చొని తన వంతు వస్తుందో రాదో అనే ఆందోళన అసలే లేదు. తోపులాటలు లేవు. లాఠీచార్జీలు లేవు. అధికారులో, మాఫియా ముఠాలో ఇచ్చే నాసి రకం విత్తనాలు తెచ్చుకోవాల్సిన పని లేదు. నాణ్యత లేకపోతే తిరిగి ఇచ్చి మంచిది ఇమ్మని అడిగే హక్కు వచ్చింది. అదీ వేరెక్కడో కాదు. సాక్షాత్తు తన ఊళ్లోనే. తన పంచాయతీలోనే.. ఏడాదిలో ఎంత మార్పో. రైతు భరోసా కేంద్రాల వల్లే సాధ్యం తూర్పు గోదావరి జిల్లా అనపర్తికి చెందిన రైతు శ్రీనివాస రెడ్డి చెప్పే దాని ప్రకారం రైతు భరోసా కేంద్రాల వల్లే ఇది సాధ్యమైంది. ‘మాకు కావాల్సిన వరి వంగడాల కోసం పాస్ పుస్తకం, ఆధార్ కార్డు తీసుకుని ఆర్బీకేకి వెళ్లి గ్రామ వ్యవసాయ సహాయకునికి ఇచ్చి నమోదు చేయించాం. 48 గంటల తర్వాత వెళ్లి విత్తనాలు తెచ్చుకున్నాం. ఊళ్లోనే విత్తనాన్ని తీసుకోవడం వల్ల రవాణా ఖర్చులు తగ్గాయి. అన్నింటికి మించి శ్రమ తగ్గింది. ఇంతకు ముందు ఇలా ఉండేది కాదు. ఎక్కడో మార్కెట్ యార్డులో పెడితే అక్కడకు వెళ్లి తెచ్చుకోవాల్సి వచ్చేది’ అని చెప్పారు. అనంతపురం జిల్లా బొమ్మేపర్తి మండలం డి.వెంకటరాయుడిదీ ఇదే కథనం. తనకు నాణ్యత లేని విత్తనాలు వచ్చాయని ఫిర్యాదు చేస్తే తిరిగి మంచివి ఇచ్చి వెళ్లారని చెప్పారాయన. ఇంతకు ముందు విత్తనం బాగా లేదంటే మా ఖర్మానికి పడి ఏడ్చే వాళ్లమన్నాడు. 18న ప్రారంభిస్తే 31కి 88 శాతం పూర్తి.. ఇంతకు ముందు ఐదారు రోజులైనా మీడియాలో వార్తలు, కనీసం ఇద్దరు ముగ్గురైనా బలి కానిదే విత్తన పంపిణీ ముగిసేది కాదు. ఈ ఏడాది అలాంటి ఘటనలే లేవు. మే నెల 18న 8.43 లక్షల క్వింటాళ్ల విత్తన పంపిణీ ప్రారంభిస్తే ఎటువంటి అలికిడి లేకుండానే 31వ తేదీ నాటికి 88 శాతం పూర్తయిందంటే అధికారులే విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్ సీజన్లో ఎక్కువ గందరగోళం జరిగే వేరుశనగ విత్తనాల పంపిణీ పూర్తి సజావుగా సాగిపోయిందని వ్యవసాయ శాఖ కమిషనర్ హెచ్.అరుణ్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. గత ఏడాది 4,42,339 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాన్ని సిద్ధం చేసుకుని 3,96,659 మంది రైతులకు 4,04,744 క్వింటాళ్లను పంపిణీ చేశారు. ఈ ఏడాది 5,07,598 క్వింటాళ్ల విత్తనాల సరఫరాకు ప్రణాళిక సిద్ధం చేశారు. విత్తనం కోసం 5,71,549 మంది 4,49,180 క్వింటాళ్లకు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అందులో మే నెల 31నాటికి 4,95,013 మంది రైతులకు 3,94,991 క్వింటాళ్ల కాయల్ని పంపిణీ చేశారు. అంటే మొత్తం రిజిస్ట్రేషన్ చేయించుకున్న రైతుల్లో వీరు 88 శాతం. గ్రామ స్థాయి విత్తన పంపిణీతో ప్రయోజనాలెన్నో.. – అనంతపురం జిల్లాలో 2,70,913 మంది, చిత్తూరులో 1,51,950 మంది, వైఎస్సార్ కడపలో 30,450 మంది, కర్నూలు జిల్లాలో 41,466 మంది, విజయనగరం జిల్లాలో 234 మంది రైతులు వేరుశనగ విత్తనాన్ని తీసుకున్నారు. ఇంకా ఎవరికైనా విత్తనం కావాలంటే జూన్ 7 వరకు రైతు భరోసా కేంద్రాలలో డబ్బు చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. – రాష్ట్రంలోని 9 జిల్లాలలో 13 రకాల వరి వంగడాలకు 3,67,393 మంది రైతులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. వీరికి 2,28,732 క్వింటాళ్ల వరి వంగడాలు కావాల్సి ఉంది. వీరిలో ఇప్పటి వరకు 93,397 మంది రైతులకు 48,061 క్వింటాళ్లను సరఫరా చేశారు. మిగతా వారికి ఒకట్రెండు రోజుల్లో పంపిణీ చేస్తారు. వరి వంగడాలు కావాల్సిన వారు కూడా ఈనెల 7 వరకు రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. – గతంలో గ్రామాల వారీగా షెడ్యూల్ వేసి మండల స్థాయిలో పంపిణీ చేసేవారు. దీంతో ఇబ్బందులు వచ్చేవి. ఇప్పుడా పరిస్థితి లేదు. గ్రామ స్థాయి పంపిణీతో పాత ఇబ్బందులు తొలగిపోయాయి. గతంతో పోలిస్తే విత్తనాల నమోదు, పంపిణీ నేరుగా గ్రామాల్లోనే జరగడం వల్ల రైతులకు శ్రమ, ప్రయాణ, సరఫరా ఖర్చులు తగ్గాయి. – మండలానికి వెళ్లలేని వృద్ధులు, వికలాంగులు గతంలో రాయితీ విత్తనాన్ని పొందే వారు కాదు. ఇప్పుడా పరిస్థితి తప్పింది. గతంలో నాణ్యతా ప్రమాణాల పట్టింపు లేదు. ఇప్పుడు నాణ్యత లేకుంటే విత్తనాన్ని తిరిగి ఇవ్వొచ్చు. అధికారులకు ఫిర్యాదు చేసి మంచివి తెప్పించుకోవచ్చు. – గతంలో సామాజిక తనిఖీ ఉండేది కాదు. ఇప్పుడు అనర్హులు ఎవరైనా విత్తనాన్ని తీసుకుంటున్నారని తెలిస్తే వ్యవసాయాధికారులకు ఫిర్యాదు చేసి చర్య తీసుకోమని కోరవచ్చు. మధ్యవర్తులు, బ్రోకర్లకు తావు లేదు. గ్రామ స్వరాజ్యమంటే ఇదే కదా.. ఈ ఏడాది విత్తనాన్ని గ్రామాల్లోనే సీజన్‌కు ముందే ప్రారంభించి పూర్తి చేశాం. ఇంతకు మించి గ్రామ స్వరాజ్యం ఏమి ఉంటుంది? ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గ్రామాల్లో రైతు రాజ్యాన్ని ఏర్పాటు చేస్తున్నారు. రైతులందరూ సంతోషంగా ఉన్నారు. – కురసాల కన్నబాబు, వ్యవసాయ శాఖ మంత్రి ఆర్బీకేలతో వ్యవసాయ విప్లవం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించిన రైతు భరోసా కేంద్రాలతో రాష్ట్రంలో వ్యవసాయ విప్లవం మొదలైంది. దళారులు, మధ్యవర్తుల మాటే లేకుండా చేశాం. ముందుగా పేర్లను నమోదు చేసుకోవడం వల్ల అసలు సాగుదార్లు ఎవరో తేలింది. దీనివల్ల దుబారాను అరికట్టగలిగాం. – హెచ్.అరుణ్ కుమార్, వ్యవసాయ శాఖ కమిషనర్ దూరాభారం తగ్గింది వెల్దుర్తి మండల కేంద్రం నుంచి మా గ్రామం దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో కొండ అంచున ఉంది. బస్సు సౌకర్యం లేదు. ప్రతి ఏడాది ప్రభుత్వం అందించే విత్తనాల కోసం మండల కేంద్రానికి వెళ్లడానికి తీవ్రంగా ఇబ్బందులు పడేవాళ్లం. విత్తనం పొందేందుకు కనీసం మూడు రోజులైనా పట్టేది. పొలం పనులు మానుకోవాల్సి వచ్చేది. గతంలో ఏనాడూ లేని విధంగా ఇలా మే నెలలోనే విత్తనాలు ఇచ్చింది లేదు. వానలు పడినప్పుడే ఇస్తుండ్రి. ఈ సారి మా ఊరి పంచాయతీ (శ్రీరంగాపురం సచివాలయం..అర కిలోమీటర్ దూరం)లోనే రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం. వారం కిందటే 120 కేజీల వేరుశనగ విత్తనకాయలు తీసుకున్నా. అదనపు ఖర్చులేదు, సమయం వృథా కాలేదు. దూరాభారం తగ్గింది. ఇప్పటికే వాటిని ఒలిచి విత్తనాలు సిద్ధం చేసుకున్నాం. రేపో మాపో పదునైన వాన పడితే విత్తనాలేసేందుకు సిద్ధంగా ఉన్నాం. – ఎం.ఎల్లరాముడు, లక్షుంపల్లె, వెల్దుర్తి మండలం, కర్నూలు జిల్లా వ్యయ ప్రయాసలు తొలిగాయి ఈసారి ప్రభుత్వం ఊళ్లోనే విత్తనాలు ఇచ్చి మంచి పని చేసింది. ఇంతకుముందు సబ్సిడీ విత్తనాలు తీసుకోవడం పెద్ద ఇబ్బందిగా ఉండేది. గ్రామం నుంచి వాహనాన్ని బాడుగకు తీసుకుని పోయి..డోన్ మార్కెట్ యార్డులో తెచ్చుకునేవాళ్లం. విత్తనాలు చేతికి అందేందుకు మూడు, నాలుగు రోజులు కూడా పట్టేది. ఈసారి మాత్రం ఎలాంటి ఇబ్బందులూ లేకుండా గ్రామంలోని రైతు భరోసా కేంద్రం ద్వారా అందజేశారు. వ్యయప్రయాసలు తొలగడమే కాకుండా, సకాలంలో విత్తనాలు వేసుకునే అవకాశం కల్పించిన సీఎం జగన్‌కు ధన్యవాదాలు. – బి.రమణయ్య, వలసల గ్రామం, డోన్ మండలం, కర్నూలు జిల్లా -
గ్రామస్థాయిలో విత్తన పంపిణీ ఘనత సీఎం జగన్‌దే
కాకినాడ రూరల్: రాష్ట్రంలో తొలిసారిగా గ్రామస్థాయిలో విత్తన పంపిణీని ప్రారంభించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని తన క్యాంప్ కార్యాలయం వద్ద రైతులకు రాయితీపై వరి, పచ్చిరొట్ట విత్తనాల పంపిణీని ఎంపీ వంగా గీతతో కలిసి ఆయన శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ, మొదటిసారిగా రైతుల నుంచి విత్తనాలు కొనుగోలు చేసి, వాటిని శుద్ధి చేసి అందిస్తున్నామని చెప్పారు. ఈ ప్రభుత్వం రైతులకు అండగా ముందుకు సాగుతుందన్నారు. లాక్డౌన్ వంటి క్లిష్ట పరిస్థితుల్లో రైతులు నష్టపోకుండా వివిధ కార్యక్రమాలు చేపట్టి ఆదుకుంటున్నారన్నారు. ఈనెల 30న రైతు భరోసా కేంద్రాలను ప్రారంభిస్తున్నామన్నారు. వీటి ద్వారా రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులను అందుబాటులో ఉంచుతామని, దీంతోపాటు సాగులో మెళకువలను తెలుసుకోవచ్చని వివరించారు. పచ్చిరొట్ట విత్తనాలకు 50 శాతం, వరి విత్తనాలకు కేజీకి రూ.5 చొప్పున రాయితీ అందిస్తున్నామన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో 780 క్వింటాళ్ల పచ్చిరొట్ట, 11,580 క్వింటాళ్ల వరి విత్తనాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఎంపీ వంగా గీత మాట్లాడుతూ, రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించడంలో రాజీ లేదన్నారు. -
ఊరునుమారుద్దాం
ఎవరైనా గ్రామంలోకి అడుగుపెడితే గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, విలేజ్ క్లినిక్, ఇంగ్లిష్‌లో బోధించే పాఠశాల, వచ్చే ఏడాది నుంచి జనతా బజార్ ఇవన్నీ కనిపిస్తాయి. చరిత్రలో ఎప్పుడూ కూడా గ్రామాల మీద ఇంతగా దృష్టి పెట్టలేదు. మొత్తం గ్రామాల రూపు రేఖలు మారుస్తున్నాం. సాక్షి, అమరావతి: గ్రామ స్థాయిలో రైతులకు అవసరమైన విత్తనాల పంపిణీతో చారిత్రక మార్పులకు శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఈ నెల 18న విత్తన పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి, ఏపీ చరిత్రలో మొదటి సారిగా రైతుల వద్దకే విత్తన పంపిణీని తీసుకెళ్లామని చెప్పారు. వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు గ్రామ స్వరూపాన్నే మార్చి.. విప్లవాత్మక మార్పులు తీసుకువస్తాయని తెలిపారు. స్పందన కార్యక్రమంలో మంగళవారం ఆయన జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలతో తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల క్యాలెండర్, ఖరీఫ్ సీజన్‌కు సన్నద్ధత, జాతీయ ఉపాధి హామీ పథకం, ఆర్బీకేలు, వైఎస్సార్ గ్రామ క్లినిక్స్, గ్రామ సచివాలయాలు, తాగునీరు.. వేసవిలో కార్యాచరణ ప్రణాళిక, పాఠశాలల్లో నాడు – నేడు, పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ, ఇసుక, మద్యంలో అక్రమాల నివారణ, జిల్లాకు ముగ్గురు జేసీలు, వారి విధులు తదితర అంశాలపై అధికార యంత్రాంగానికి మార్గ నిర్దేశం చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఖరీఫ్ సన్నద్ధత ► రైతు భరోసా కింద మే నెలలో దాదాపు రూ.2,800 కోట్లు ఇచ్చాం. అంతకు ముందు వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్ కింద ఏప్రిల్ నెలలో రూ.875 కోట్లు ఇచ్చాం. మొత్తంగా రూ.3,675 కోట్ల రూపాయలు ఇచ్చాం. ఖరీఫ్ సన్నద్ధతలో భాగంగా మొట్ట మొదటి అడుగుగా మే 15న ఈ డబ్బులు ఇచ్చాం. ► మే 18న విత్తన పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఏపీ చరిత్రలో మొదటి సారిగా గ్రామ స్థాయిలో విత్తనాలను పంపిణీ చేశాం. 8.43 లక్షల క్వింటాళ్ల విత్తనాలను గ్రామాల్లో అందుబాటులో పెట్టాం. వరి, వేరు శనగ తదితర విత్తనాలను జిల్లాలకు పంపించాం. ఈ కార్యక్రమాన్ని కలెక్టర్లు పర్యవేక్షించాలి. ► ఉదయం 6 నుంచి 10 గంటల వరకు.. సాయంత్రం 4 నుంచి రాత్రి 7 గంటల వరకు విత్తన పంపిణీ కార్యక్రమం కొనసాగాలి. ఇందువల్ల రైతులకు ఎండ తీవ్రత ఉండదు. ► జూన్ 1 నుంచి ఆర్బీకేల ద్వారా గ్రామాల్లో ఎరువుల పంపిణీకి చర్యలు తీసుకోవాలి. రైతులకు ఎరువులు ఏ మేరకు అవసరమో ముందుగానే గుర్తించాలి. గ్రామ సచివాలయాల స్థాయికి కూడా ఈ సమాచారం వెళ్లాలి. ► 11 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు ఇప్పటికే సిద్ధం చేశాం. మీ మీ జిల్లాల్లో ఎరువులకు సంబంధించి నిల్వలపై పర్యవేక్షించాలని కలెక్టర్లకు చెబుతున్నా. ప్రతి జిల్లాల్లో బఫర్ స్టాక్ ఉండాల్సిన అవసరం ఉంది. రైల్వే స్టేషన్లలో ర్యాక్ మూవ్మెంట్పైనా కూడా కలెక్టర్లు దృష్టి పెట్టాలి. కంటైన్మెంట్ జోన్ల వల్ల కొన్ని రకాల సమస్యలు వస్తున్నాయి. వాటిని కూడా అధిగమించేలా చూడాలి. అడ్వైజరీ బోర్డు సమావేశాలు తప్పనిసరి ► ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు సమావేశమై నీళ్ల విడుదలకు సంబంధించి కార్యాచరణ రూపొందించాలి. జిల్లా, మండల స్థాయిలో అగ్రికల్చర్ అడ్వైజరీ బోర్డులను వెంటనే ఏర్పాటు చేయాలి. బుధవారానికి ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు వస్తాయి. ► ఆర్బీకే ద్వారా ఆ ఊళ్లో ఎలాంటి పంటలు వేయాలి? ఎలాంటి పంటలు వేస్తే ధరలు వస్తాయి? మార్కెటింగ్ ఉంటుంది? అన్నదానిపై అడ్వైజరీ బోర్డులు సలహాలు ఇస్తాయి. ► రైతులకు రుణాలు అందేలా.. జిల్లా బ్యాంకర్ల సమావేశాలను కలెక్టర్లు వెంటనే నిర్వహించాలి. ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి రుణాలు అందించాలి. రైతు భరోసాకు సంబంధించిన మొత్తాన్ని బ్యాంకులు జమ చేసుకోలేని ఖాతాల్లో వేశాం. వాళ్లు జమ చేసుకోకుండా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లదే. విలేజ్ క్లినిక్స్‌కు స్థలాలు గుర్తించాలి ► గ్రామ, వార్డు సచివాలయాల్లో వైఎస్సార్ క్లినిక్స్, ఆర్బీకేల భవనాల నిర్మాణానికి స్థలాల గుర్తింపుపై కలెక్టర్లు దృష్టి పెట్టాలి. వీటిపై రోజూ సమీక్ష నిర్వహించాలి. ► జూన్ 15 నాటికి స్థలాల గుర్తింపు పూర్తి కావాలి. ప్రతి గ్రామ సచివాలయంలో ఉన్న ఇంజినీరింగ్ అసిస్టెంట్‌ను ఇందుకు పూర్తిగా వినియోగించుకోండి. తాగు నీటి ఎద్దడి నివారణకు చర్యలు ► రెండు మూడు రోజుల్లో తాగునీటి సమస్యలను తీర్చడంపై దృష్టి పెట్టాలి. ఎక్కడా కూడా తాగునీరు దొరకలేదనే మాట రాకూడదు. 3,021 ఆవాసాలకు 14,861 ట్యాంకర్ల ట్రిప్పుల ద్వారా నీటిని అందిస్తున్నారు. చిత్తూరు, అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో పశువులకు కూడా తాగునీరు అందిస్తున్నారు. 403 బోర్ వెల్స్ కూడా పని చేస్తున్నాయి. ► పట్టణ ప్రాంతాల్లో 120 చోట్ల తాగునీటి కొరతను తీర్చడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఈ పనులన్నింటినీ కలెక్టర్లు పర్యవేక్షించాలి. తాగునీటికి కొరత ఉందనే మాట రాకూడదు. ఈ సమస్యపై ప్రతి రోజూ దృష్టి పెట్టాలి. ఇసుక, మద్యం అక్రమాలపై దృష్టి ► వర్షాకాలం వచ్చేలోగా కావాల్సిన ఇసుకను అందుబాటులో ఉంచాలి. తప్పనిసరిగా నిల్వలు పెంచాలి. ఇందుకు సంబంధించి ప్రత్యేక జేసీని కూడా పెట్టాం. ఇసుక, మద్యం అక్రమ రవాణాలను అడ్డుకోవాలి. ► మద్యం అక్రమాలకు చెక్ చెప్పడానికి యువ ఐపీఎస్ అధికారులను పెట్టాం. తొలిసారిగా మనం ఈ బాధ్యతలను పోలీసు విభాగానికి అప్పగించాం. ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పేరుతో విభాగాన్ని ఏర్పాటు చేశాం. అక్రమంగా మద్యం తయారు కావడం, అక్రమంగా రవాణా చేయడం ఎక్కడా కనిపించకూడదు. ► ఎస్పీలు కూడా దీనిపై దృష్టి పెట్టాలి. అక్రమ ఇసుక, మద్యం వెనుక ఎవరున్నా కూడా ఖాతరు చేయడకూడదు. సీసీ కెమెరాలు పూర్తి స్థాయిలో పని చేసేలా చూడండి. చెక్‌పోస్టులు కూడా సరైన విధంగా పనిచేయాలి. ఇవన్నీ సక్రమంగా పని చేయించాల్సిన బాధ్యత జేసీలదే. ► మద్యం వినియోగాన్ని బాగా తగ్గించే కార్యక్రమాలు చేపడుతున్నాం. అధికారంలోకి వచ్చిన వెంటనే లిక్కర్ రేట్లు పెంచాం. మద్యం దుకాణాల సంఖ్య తగ్గించాం. బెల్టుషాపులు, పర్మిట్ రూంలు ఎత్తివేశాం. మద్యం అమ్మే వేళలు కూడా తగ్గించాం. ఇంకా రేట్లు పెంచి.. ఇంకా దుకాణాలు తగ్గించి.. వినియోగాన్ని బాగా తగ్గించాం. ఇళ్ల స్థలాల పట్టాలు ► మే 31లోగా భూ సేకరణ, ప్లాట్లను సిద్ధం చేయడం తదితర అన్ని పనులు కూడా పూర్తి కావాలి. 99 శాతం భూ సేకరణ పూర్తయ్యింది. 90.8 శాతం లే అవుట్ల పని, మార్కింగ్ 80.09 శాతం పూర్తయ్యింది. 12,66,253 మంది లబ్ధిదారులకు లాటరీ కూడా పూర్తయ్యింది. ► మే 31లోగా మిగిలిన పనులన్నీ పూర్తి కావాలి. ఇల్లు లేని నిరుపేద ఉండకూడదు. అర్హత ఉండీ ఇంటి స్థలం ఇవ్వలేదనే మాట రాకూడదు. ఎవరైనా మిగిలిపోతే వారి నుంచి దరఖాస్తులు తీసుకోవడానికి మే 21 వరకు సమయం ఇచ్చాం. మే 30 కల్లా వెరిఫికేషన్ పూర్తి కావాలి. ► ఇళ్ల పట్టాలకు సంబంధించి తుది జాబితా జూన్ 7న ప్రకటించాలి. అదనంగా వచ్చిన దరఖాస్తులకు సంబంధించి ల్యాండ్ సమీకరణ, అభివృద్ధి జూన్ 30 నాటికి పూర్తి కావాలి. ఇప్పటి వరకు ఇళ్ల పట్టాల కోసం రూ.4,436.47 కోట్లు విడుదల చేశాం. పద్ధతి ప్రకారం అన్నీ జరిగేట్టుగా చూడాలని కలెక్టర్లను కోరుతున్నా. జిల్లాకు ముగ్గురు జేసీలు ► ప్రతి జిల్లాకు జేసీ –1, జేసీ–2, జేసీ–3 ఉన్నారు. ఒక జేసీకి రైతు భరోసా, రెవిన్యూ.. రెండో జేసీకి గ్రామ, వార్డు సచివాలయాలు, అభివృద్ధి కార్యక్రమాలు అప్పగించాం. మూడో జేసీకి ఆసరా, సంక్షేమ కార్యక్రమాల బాధ్యత ఇచ్చాం. గ్రామ, వార్డు సచివాలయాలు చూసే జేసీ చాలా కీలకం. మనం నిర్దేశించిన సమయంలోగా గ్రామ, వార్డు సచివాలయాల్లో సేవలు అందించాల్సి ఉంటుంది. ► పారదర్శకంగా.. సంతృప్త స్థాయిలో పథకాలు అందిస్తున్నాం. విలేజ్ క్లినిక్స్‌లో 24 గంటలూ ఏఎన్ఎం అందుబాటులో ఉంటారు. ఆశా కార్యకర్తలకు అదే రిపోర్టింగ్ పాయింట్ అవుతుంది. ► గ్రామాల స్వరూపాన్ని మార్చడంలో రైతు భరోసా కేంద్రాలు కీలక పాత్ర వహిస్తాయి. రైతులు ఉత్పత్తి చేసిన దాంట్లో కనీసం 30 శాతం స్థానిక మార్కెటింగ్ అవకాశాలు కల్పించడానికి జనతా బజార్లను ఏర్పాటు చేస్తున్నాం. ► జేసీలందరి పనితీరుపై మేము నిరంతరం పర్యవేక్షిస్తాం. మీరంతా యువ ఐఏఎస్ అధికారులు. మీరు బాగా పని చేస్తే.. మంచి ఎలివేషన్ పొందుతారు. నాకు ఓటు వేయని వారు అయినా పర్వాలేదు.. అర్హత ఉంటే పథకాలు అందాలని చెబుతున్నాం. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి నాని, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్‌తో పాటు, వివిధ శాఖల ఉన్నతా«ధికారులు పాల్గొన్నారు. వలస కూలీలందరికీ ఉపాధి కల్పించాలి ► కేంద్ర ప్రభుత్వం అదనంగా రూ.40 వేల కోట్లను ఉపాధి హామీ కోసం కేటాయించింది. చాలా మంది కూలీలు వివిధ రాష్ట్రాల నుంచి వెనక్కి వచ్చేశారు. వీరందరికీ కూడా బాగా పనులు కల్పించాలి. వలస కూలీలందరికీ జాబ్ కార్డులు ఇవ్వాలి. ► ఉపాధి హామీ పనులకు హాజరవుతున్న కూలీల సంఖ్యను ఇప్పుడు ఉన్న దానికంటే రెట్టింపు చేయాల్సి ఉంది. విత్తన పంపిణీలో సాంకేతిక సమస్యలు లేకుండా చూసుకోండి. జిల్లాల్లో ఎక్కడా నకిలీ విత్తనాలు, పురుగు మందులు కనిపించకూడదు. కల్తీ విత్తనాలు, నకిలీ పురుగు మందులు కారణంగా నష్టపోతున్నామనే మాట వినిపించకూడదు. ఈ విషయంలో అధికారులు దూకుడుగా ఉండాలని కోరుతున్నా. కలెక్టర్లు, ఎస్పీలు సీరియస్‌గా తీసుకోవాలి. మద్యం నియంత్రణ కోసం చాలా చర్యలు తీసుకున్నాం. పక్క రాష్ట్రాల్లో మద్యాన్ని ఎలా తాగించాలని చూస్తున్నారు. మనం మద్యాన్ని ఎలా తగ్గించాలని ఆలోచిస్తున్నాం. లిక్కర్, శాండ్ మీద కొందరు యువ ఐపీఎస్‌లను పెట్టాం. నిజాయితీగా పని చేయాలి. తప్పు చేస్తే ఎవరైనా సరే ఉపేక్షించాల్సిన పని లేదు. దీన్ని ఎలా డీల్ చేస్తామన్న విషయం మీద రాష్ట్రం, దేశం మనవైపు చూస్తున్నాయి. 30న రైతు భరోసా కేంద్రాలు ప్రారంభం ఈ నెల 30వ తేదీన 10,541 రైతు భరోసా కేంద్రాలను మనం ప్రారంభించబోతున్నాం. అందులో కరెంటు సౌకర్యం, ఇంటర్నెట్ కనెక్షన్ ఉండేలా చూసుకోవాలి. ఈ నెల 27న రైతు భరోసా కేంద్రాలపై డ్రైరన్ నిర్వహించాలి. ఆర్బీకేలకు ప్రత్యేకంగా జేసీని నియమించాం. ► గ్రామంలో ఒక రైతుకు గిట్టుబాటు ధర రాకపోతే.. అదే గ్రామ స్థాయిలో ఉన్న అగ్రికల్చర్ అసిస్టెంట్ మార్కెట్ ఇంటెలిజెన్స్.. ప్రతిరోజూ పంపిస్తారు. దీన్ని పరిగణనలోకి తీసుకుని.. రూ.3 వేల కోట్ల ధరల స్థిరీకరణ నిధి ద్వారా మార్కెటింగ్ శాఖ యాక్టివ్ అవుతుంది. ఆర్బీకేలను చూస్తున్న జేసీ, మార్కెటింగ్ శాఖ అధికారులు.. కలెక్టర్ మార్గదర్శకాలతో రైతుకు గిట్టుబాటు ధర అందించేలా చర్యలు తీసుకుంటారు. ► ఆర్బీకేల ద్వారా ఇ క్రాపింగ్ జరుగుతుంది. నాణ్యతతో కూడిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు ఆర్బీకేల ద్వారా లభ్యం అవుతాయి. ► ఆధార్ సీడింగ్ కారణంగా రైతు భరోసా డబ్బులు అందని 4 శాతం రైతులకు సంబంధించిన సమస్యలను వెంటనే పరిష్కరించాలి. ఈ నెల 30న 10,541 రైతు భరోసా కేంద్రాలను మనం ప్రారంభించబోతున్నాం. అందులో కరెంటు సౌకర్యం, ఇంటర్నెట్ కనెక్షన్ ఉండేలా చూసుకోవాలి. ఈ నెల 27న రైతు భరోసా కేంద్రాలపై డ్రై రన్ నిర్వహించాలి. ఆర్బీకేలకు ప్రత్యేకంగా జేసీని నియమించాం. ప్రతి జిల్లాకు జేసీ –1, జేసీ–2, జేసీ–3 ఉన్నారు. ఒక జేసీకి రైతు భరోసా, రెవిన్యూ.. రెండో జేసీకి గ్రామ, వార్డు సచివాలయాలు, అభివృద్ధి కార్యక్రమాలు అప్పగించాం. మూడో జేసీకి ఆసరా, సంక్షేమ కార్యక్రమాల బాధ్యత ఇచ్చాం. గ్రామ, వార్డు సచివాలయాలు చూసే జేసీ చాలా కీలకం. మనం నిర్దేశించిన సమయంలోగా గ్రామ, వార్డు సచివాలయాల్లో సేవలందించాలి. కేంద్ర ప్రభుత్వం అదనంగా రూ.40 వేల కోట్లను ఉపాధి హామీ కోసం కేటాయించింది. చాలా మంది కూలీలు వివిధ రాష్ట్రాల నుంచి వెనక్కి వచ్చేశారు. వీరందరికీ కూడా బాగా పనులు కల్పించాలి. వలస కూలీలందరికీ జాబ్ కార్డులు ఇవ్వాలి. రెండు మూడు రోజుల్లో తాగునీటి సమస్యలను తీర్చడంపై దృష్టి పెట్టాలి. ఎక్కడా కూడా తాగునీరు దొరకలేదనే మాట రాకూడదు. అవసరమైన చోట ట్యాంకర్ల ట్రిప్పుల ద్వారా నీటిని అందిస్తున్నారు. గతంలో విత్తనాల కోసం పడిగాపులు కాసే పరిస్థితి ఉండేది. మండు టెండలో పెద్ద క్యూలో రైతులు నిలబడేవారు. అలాంటి పరిస్థితుల నుంచి ప్రతి రైతుకూ టోకెన్లు ఇచ్చి గ్రామ స్థాయిలోనే పంపిణీ చేసే స్థాయికి తీసుకొచ్చాం. ఎక్కడా గుమిగూడాల్సిన అవసరం లేదు. రైతులకు కూపన్లు ఇచ్చే వ్యవస్థను కలెక్టర్లు పర్యవేక్షించాలి. -
విత్తన పంపిణీకి 30 రోజులు
జిల్లాకు కేటాయించింది 4.01 లక్షల క్వింటాళ్లు నెల రోజుల్లో 3.20 లక్షల క్వింటాళ్లే పంపిణీ మరో మూడు రోజుల్లో ముగియనున్న గడువు అనంతపురం అగ్రికల్చర్ : సబ్సిడీ విత్తన వేరుశనగ పంపిణీ 30 రోజులు పూర్తి చేసుకుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా నెల రోజులవుతున్నా జిల్లాకు కేటాయించిన 4.01 లక్షల క్వింటాళ్లలో 3.20 లక్షల క్వింటాళ్లు మాత్రమే రైతులకు పంపిణీ చేశారు. బయోమెట్రిక్, సర్వర్ మొరాయింపుతో విత్తన పంపిణీ మందకొడిగా సాగుతోంది. గతంలో విడతకు మూడు రోజులు చొప్పున మూడు విడతల్లో 3 నుంచి 4 లక్షల క్వింటాళ్లు పంపిణీ చేసిన దాఖలాలు ఉన్నాయి. ఈ ఏడాది రైతుల చేతిలో చిల్లిగవ్వ లేకపోవడం, వరుస పంట నష్టాలతో వేరుశనగ సాగుకు ఆసక్తి చూపించకపోవడం, పెద్ద ఎత్తున నాసిరకం విత్తనం సరఫరా కావడం తదితర కారణాలతో విత్తన పంపిణీ కేంద్రాలు బోసిపోతున్నాయి. చాలా చోట్ల నాసిరకం కాయలు బహిర్గతమైనా ఇప్పటివరకు ఎవరిపైనా చర్యలు తీసుకున్న దాఖలాలు లేకపోవడం విశేషం. జిల్లాకు చేరిన విత్తనకాయలు ఎలాగైనా రైతులకు పంపిణీ చేయాలనే ఆలోచనతో మే 24న ప్రారంభమైన నాటి నుంచి నెలల తరబడి ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇదే సందర్భంలో కొన్ని మండలాల్లో కొందరు దళారులు రంగప్రవేశం చేసి రైతులను సమీకరించి వారి చేతిలో చిల్లర పెట్టి విత్తనకాయలు పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. బహుధాన్యపు కిట్ల పంపిణీనూ అరొకరే.. యాప్ సరిగా పనిచేయకపోవడంతో మొదటి పది రోజులు కందులు, బహుధాన్యపు కిట్ల పంపిణీకి అంతరాయం ఏర్పడింది. ఆ తర్వాత కూడా వాటిపై రైతులు అనాసక్తి ప్రదర్శిస్తున్నారు. నాణ్యత లేని కందులు, ఇతర చిరు ధాన్యాల విత్తనాల కిట్లు కూడా తీసుకునేందుకు వెనుకాడుతున్నారు. దీంతో మొదట ఐదు లక్షల కిట్లు ఇస్తామని చెప్పగా తర్వాత మూడు లక్షల కిట్లు ఇస్తామన్నారు. తొలుత రైతుకు ఒక కిట్ అన్నారు.. తర్వాత ఐదు వరకు కిట్లు ఇస్తామని ప్రకటించారు. అయినా అనుకున్న విధంగా పంపిణీ కాకపోవడం విశేషం. ఒకటో తేదీతో ముగియనున్న విత్తన పంపిణీ! విత్తన పంపిణీ కార్యక్రమాన్ని జూలై ఒకటో తేదీ ముగించాలని అధికారులు సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఇంకా తీసుకోని రైతులు ఈ నెల 29, 30, జూలై 1వ తేదీల్లో ఉపయోగించుకోవాలని వ్యవసాయశాఖ అధికారులు సూచిస్తున్నారు. కాగా 30వ రోజు బుధవారం జిల్లా వ్యాప్తంగా 561 మంది రైతులకు 648 క్వింటాళ్లు పంపిణీ చేసినట్లు వ్యవసాయశాఖ జేడీ పీవీ శ్రీరామమూర్తి తెలిపారు. 18,655 మంది రైతులకు 2,130 క్వింటాళ్లు కందులు, 39,298 మంది రైతులకు 71,100 బహుధాన్యపు కిట్లు పంపిణీ చేశామని తెలిపారు. గురువారం కూడా ఏఓ కార్యాలయంలో విత్తన పంపిణీ కొనసాగుతుందన్నారు. ఇపుడు కొత్తగా జిప్సం, జింక్‌సల్ఫేట్, బోరాన్ లాంటి సూక్ష్మపోషకాలు (మైక్రో న్యూట్రియంట్స్) ఉచితంగా ఇస్తామని ప్రకటించారు. అయితే భూసార పరీక్ష పత్రాల్లో సల్ఫర్ తక్కువగా ఉన్నట్లు సిఫారసు చేసిన రైతులకు ఉచితంగా ఇస్తామని ప్రకటించినా రైతులు ముందుకు రావడం లేదు. పత్రాలు ఇచ్చిన అధికారులు అందులో ఎలాంటి పోషకాలు ఉన్నాయి, ఏ రకం పోషకాలు ఎంత వాడాలనే అంశాల గురించి కనీస అవగాహన కల్పించకపోవడంతో భూసార పరీక్ష పత్రాలు అలంకార ప్రాయంగా ఉన్నట్లు చెబుతున్నారు. -
నేటి నుంచి మూడో విడత విత్తన పంపిణీ
- 15న వేరుశనగ పంపిణీ ముగిసే అవకాశం - కొనసాగనున్న విత్తన కందులు, బహుధాన్యపు కిట్ల పంపిణీ అనంతపురం అగ్రికల్చర్ : జిల్లా వ్యాప్తంగా 63 మండలాల్లో సోమవారం నుంచి మూడో విడత విత్తన వేరుశనగ పంపిణీ కొనసాగుతుందని వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. జిల్లాకు 4.01 లక్షల క్వింటాళ్ల వేరుశనగ, 5 లక్షల కిట్లు బహుధాన్యపు విత్తనాలు, 6 వేల క్వింటాళ్లు మేర విత్తన కందులు కేటాయించిన విషయం తెలిసిందే. గతనెల 24 నుంచి విత్తన పంపిణీ ప్రారంభమైంది. పది రోజుల పాటు చేపట్టిన తొలి విడతలో 1,46,272 మంది రైతులకు 1,69,327 క్వింటాళ్లు పంపిణీ చేశారు. రెండో విడతగా ఈనెల 5 నుంచి 9వ తేదీ వరకు 72,174 మంది రైతులకు 84,166 క్వింటాళ్లు పంపిణీ జరిగింది. మొత్తం 2,18,446 మంది రైతులకు 2,53,493 క్వింటాళ్లు పంపిణీ చేశారు. కేటాయింపుల మేరకు ఇంకా 1.48 లక్షల క్వింటాళ్లు పంపిణీ చేయాల్సి ఉంది. ఇప్పటిదాకా 6,762 మంది రైతులకు 695 క్వింటాళ్లు కందులు పంపిణీ చేయగా, ఇంకా 53,000 క్వింటాళ్ల కందులు ఇవ్వాల్సి ఉంది. ఇప్పటి వరకు 27,852 బహుధాన్యపు కిట్లు పంపిణీ చేశారు. ఇంకా 4.72 లక్షల కిట్ల పంపిణీ ఎప్పుడో తెలియడం లేదు. రైతుల నుంచి స్పందన అంతంతమాత్రమే : ముందస్తు ప్రణాళిక ఉన్నా పంపిణీలో సర్వర్ సమస్యలు, యాప్‌లో సాంకేతిక సమస్యలు రావడం, సకాలంలో కిట్లు తయారు చేయకపోవడంతో కొంత అంతరాయం ఏర్పడింది. అనుకున్న విధంగా విత్తనాల పంపిణీ జరగలేదని తెలుస్తోంది. సోమవారం నుంచి మూడో విడత చేపట్టనున్నారు. అయితే పంపిణీకి రైతుల నుంచి స్పందన అంతంత మాత్రంగానే ఉండటం, రోజుకు 100, 200 క్వింటాళ్ల వేరుశనగ పంపిణీ కోసం పదుల సంఖ్యలో అధికారులు, సిబ్బంది కౌంటర్లలో ఉండటం కనిపిస్తుండటంతో విత్తన పంపిణీని సాధ్యమైనంత త్వరగా ముగించాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో ఈనెల 15న తుది గడువుగా ప్రకటించి సాధ్యమైనంత ఎక్కువ మంది రైతులకు విత్తనం ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. మూడు విడతల్లో 3 నుంచి 3.20 లక్షల క్వింటాళ్లు పంపిణీ కావచ్చని అంచనా వేస్తున్నారు. కౌంటర్లు క్లోజ్ చేసిన తర్వాత మండల వ్యవసాయాధికారుల కార్యాలయాల్లోనే విత్తన కందులు, బహుధాన్యపు విత్తనాల కిట్లు పంపిణీ కొనసాగించే అవకాశం కనిపిస్తోంది. -
కాగితాలకే పరిమితమా?
- చిరు, నవధాన్యాలంటూ రెండేళ్లుగా ఊరిస్తున్న వ్యవసాయ శాఖ - ఆచరణలో మాత్రం వైఫల్యం - కొరవడిన ప్రచారం, ప్రోత్సాహం - వేరుశనగకే మొగ్గు చూపుతున్న రైతులు - 1960–80 మధ్య కాలంలో నవధాన్యాలదే హవా అనంతపురం అగ్రికల్చర్ : చిరుధాన్యాలు, తృణధాన్యాలు, నవధ్యానాలు, బహుధాన్యాలు, పప్పుధాన్యాలు... ఈ పేర్లు గత రెండు, మూడేళ్లుగా బాగానే విన్పిస్తున్నాయి. లక్షల హెక్టార్లలో ఈ పంటలను సాగులోకి తెస్తామని వ్యవసాయ శాఖ ప్రతియేటా ప్రచార ఆర్భాటం చేస్తోంది. ఆచరణలో మాత్రం ఘోరంగా విఫలమవుతోంది. ఏక పంట విధానానికి స్వస్తి చెబుతూ పంటల్లో వైవిధ్యం ఉండేలా ప్రణాళికలు రూపొందించామని ఖరీఫ్ సమయంలో ప్రకటనలు చేయడం.. చివరికి చేతులెత్తేయడం పరిపాటిగా మారింది. వేరుశనగ పంట విస్తీర్ణాన్ని బాగా తగ్గించి ఆ స్థానంలో జొన్న, సజ్జ, రాగి, కొర్ర, మొక్కజొన్న, కంది, ఆముదం, పత్తి, పొద్దుతిరుగుడు, అలసంద, పెసర, మినుము పంటల విస్తీర్ణం బాగా పెరిగేలా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం సాధ్యం కావడం లేదు. ఈ ఖరీఫ్‌లో సాగుకు సమయం ఆసన్నమైనా వ్యవసాయశాఖ దగ్గర సరైన విత్తన ప్రణాళిక కూడా లేకపోవడం గమనార్హం. నవధాన్యపు కిట్లు అంటూ కంటితుడుపుగా ఏడు రకాల విత్తనాలు కలిపి ఐదు కిలోల చొప్పున ఇస్తున్నారు. ఈ కిట్లలో విత్తన నాణ్యతపైనా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సర్టిఫైడ్ సీడ్ కాకుండా మామూలు విత్తనాలు అందులో ప్యాక్ చేశారని రైతులు చెబుతున్నారు. కిట్లు కూడా సకాలంలో సిద్ధం చేయకపోవడంతో పంపిణీ మందకొడిగా సాగుతోంది. ఈ సీజన్లో ఐదు లక్షల కిట్లు ఇస్తామని చెప్పారు. ఇందులో ఇప్పటికీ 25 వేల కిట్లకు మించి పంపిణీ చేయలేదు. బలం, బలహీనత వేరుశనగే.. 2012, 2013 సంవత్సరాల్లో జిల్లాలో పర్యటించిన భారత వ్యవసాయ పరిశోధన సంస్థ (ఐసీఏఆర్) హైపవర్ టెక్నికల్ కమిటీ జిల్లా రైతుల బలం, బలహీనత వేరుశనగ పంటేనని గుర్తించింది. వేరుశనగ విస్తీర్ణాన్ని బాగా తగ్గించి.. దాని స్థానంలో చిరుధాన్యాలు, పప్పుధాన్యపు పంటల సాగు బాగా పెంచితే కానీ వ్యవసాయం లాభసాటి కాదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సిఫారసు చేసింది. నాలుగేళ్లు అవుతున్నా ఆ దిశగా అడుగులు మాత్రం పడటం లేదు. గతంలో ఈ పంటలదే హవా జిల్లా వ్యవసాయ చరిత్రను తిరగేస్తే.. గతంలో పంటల వైవిధ్యం స్పష్టంగా ఉండేది. నాలుగు నుంచి పది రకాల పంటలు పండించేవారు. తీవ్ర కరువులు ఏర్పడినా తిండి గింజలకు సమస్య ఉండేది కాదు. హరిత విప్లవం నేపథ్యంలో జిల్లా వ్యవసాయ రూపురేఖలు మారిపోయాయి. చిరుధాన్యాలు, నవధాన్యపు పంటలకు స్థానం లేకుండా పోయింది. వాటి స్థానంలో వాణిజ్య పంటగా వేరుశనగ వచ్చింది. వర్షాభావ పరిస్థితుల కారణంగా పదేళ్ల ఒకసారి కూడా వేరుశనగ పండే పరిస్థితి లేదు. 1960కు ముందు నుంచి 1985 వరకు జిల్లాలో చిరుధాన్యపు పంటలదే రాజ్యం. ఆరికలు, సామలు, జొన్నలు, రాగులు, కొర్రలు, సజ్జ తదితర పంటలు బాగా పండించేవారు. 1961–62 సీజన్లో ఈ రకం పంటలు ఏకంగా 5.55 లక్షల హెక్టార్లలో సాగయ్యాయి. అప్పట్లో వేరుశనగ 1.94 లక్షల హెక్టార్లకు మాత్రమే పరిమితమైంది. పప్పుధాన్యాలు కూడా 1.10 లక్షల హెక్టార్లలో పండించారు. వరి కూడా 50 వేల హెక్టార్లకు పైగా వేసినట్లు లెక్కలు చెబుతున్నాయి. 1971–72లో చిరుధాన్యపు పంటల విస్తీర్ణం 4.01 లక్షల హెక్టార్లు కాగా.. వేరుశనగ 2.55 లక్షల హెక్టార్లలో వేశారు. 1980 దశకం వరకు వరి, వేరుశనగ, చిరుధాన్యాలు, పప్పుధాన్యపు పంటల సాగులో సమతుల్యత బాగా కనిపించింది. ఆ తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 1991–92 సంవత్సరంలో చిరుధాన్యపు పంటలు కేవలం 60 వేల హెక్టార్లకు పరిమితమయ్యాయి. ఇదే తరుణంలో వేరుశనగ ఒక్కసారిగా 7.35 లక్షల హెక్టార్లకు ఎగబాకింది. ఇక 2001–02లో చిరుధాన్యపు పంటలు 30 వేల హెక్టార్లకు పడిపోగా.. వేరుశనగ 7.80 లక్షల హెక్టార్లకు చేరుకుంది. 2010–11 విషయానికొస్తే చిరుధాన్యపు పంటలు 20 వేల హెక్టార్లకు మాత్రమే పరిమితం కాగా.. వేరుశనగ 8.34 లక్షల హెక్టార్లకు పెరిగింది. గత నాలుగైదేళ్లుగా వేరుశనగ విస్తీర్ణం కాస్త తగ్గినా.. దాని స్థానంలో చిరు, నవధాన్యపు పంటల విస్తీర్ణం పెరగకపోవడం గమనార్హం. 2015 ఖరీఫ్‌లో కొంత పెరిగినట్లు కనిపించినా తెగుళ్లు ఆశించి పంటలను దెబ్బతీయడంతో 2016లో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. వర్షాభావ పరిస్థితుల కారణంగా పంటల సాగు విస్తీర్ణం కూడా బాగా తగ్గినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఐదారేళ్ల కిందటి వరకు ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం 9 నుంచి 9.50 లక్షల హెక్టార్లుగా ఉండేది. ఆ తర్వాత 8 నుంచి 8.20 లక్షల హెక్టార్లకు పరిమితమైంది. -
ముందుకు సాగని విత్తనాల పంపిణీ
–మొరాయిస్తున్న సర్వర్ కర్నూలు(అగ్రికల్చర్): సర్వర్‌పై ఒత్తడి పెరగడంతో విత్తనాల పంపిణీ ముందుకు సాగడం లేదు. ఎన్టీఆర్ భరోస పింఛన్ల పంపిణీ, నేషనల్ ఇన్ఫర్మ్యాటిక్ సెంటర్(ఎన్ఐసీ).. సబ్సిడీపై విత్తనాల పంపిణీ.. వీటన్నింటికీ సర్వర్ ఒక్కటే. దీంతో నాలుగైదు రోజులుగా సర్వర్ మొండికేస్తోంది. జిల్లాకు వేరుశనగ 60,600 క్వింటాళ్లు కేటాయించారు. అయితే మండలాలకు 50,600 క్వింటాళ్లు కేటాయించి 10 వేల క్వింటాళ్లు బఫర్‌లో పెట్టారు. డిమాండ్ ఉన్న మండలాలకు అదనంగా ఇవ్వాలనేది బఫర్ ఉద్దేశం. ఇప్పటి వరకు వేరుశనగ 26,919 క్వింటాళ్లు పొజిషన్ చేశారు. సోమవారం సాయంత్రం నాటికి 17,820 క్వింటాళ్లు పంపిణీ అయ్యాయి. కందులు 628 క్వింటాళ్లు, దయంచ 1,288 క్వింటాళ్లు, పిల్లి పెసర 33 క్వింటాళ్లు పంపిణీ అయ్యాయి. -
మోసపుచ్చడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య
– నాసిరకం వేరుశనగతో రైతు నోట్లో మట్టికొడుతున్నారు – విత్తన పరిశీలనలో సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్ విమర్శ అనంతపురం అగ్రికల్చర్ : మోసం చేయడం సీఎం చంద్రబాబుకు వెన్నతోపెట్టిన విద్య అని సీపీఐ జిల్లా కార్యదర్శి డి.జగదీష్ విమర్శించారు. పార్టీ నాయకులతో కలిసి శుక్రవారం స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డులో జరుగుతున్న విత్తన పంపిణీ, విత్తన నాణ్యతను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు చెప్పింది చేతల్లో చూపే వ్యక్తి కాదన్నారు. ఇప్పటివరకు ఎటువంటి సన్నాహాలు చేయకుండానే ఇన్‌పుట్‌సబ్సిడీ, బీమా జూన్ 2 నుంచి 8లోగా రైతులకు పంపిణీ చేస్తామని ప్రకటించడమే అందుకు నిదర్శనమన్నారు. వేరుశనగ కాయలు చూస్తే విత్తడానికేనా లేక కమిషన్, దళారుల కోసమా అని అనుమానం వస్తోందన్నారు. నాసిరకం, బొటికలు, రాళ్లలో నిండిన కాయలు చాలా దారుణంగా ఉన్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. నాణ్యమైన విత్తనం 50 శాతం సబ్సిడీతో ఇవ్వాలని, నాలుగు బస్తాలు కాకుండా రైతుకు అవసరమైనన్నీ ఇవ్వాలని, ఇన్పుట్, బీమా పరిహారం తక్షణం అందజేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆ పార్టీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు సి.మల్లికార్జున, నాయకులు శింగనమల గోపాల్, బుక్కరాయసముద్రం నారాయణస్వామి, రామక్రిష్ణ, లక్ష్మీనారాయణరెడ్డి, సుధాకర్, శివయ్య, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. -
తొలిరోజు వెలవెల
- 58 మండలాల్లో విత్తన వేరుశనగ పంపిణీ - రైతులు రాకపోవడంతో బోసిపోయిన కౌంటర్లు - 2,335 క్వింటాళ్లు మాత్రమే విక్రయం - 5 మండలాలకు చేరని విత్తనకాయలు - కళ్యాణదుర్గంలో ‘అధికార’ జోక్యంతో పంపిణీ నిలిపివేత అనంతపురం సెంట్రల్ : ప్రభుత్వం రాయితీపై పంపిణీ చేస్తున్న విత్తన వేరుశనగ కొనుగోలుకు రైతులు తొలిరోజు పెద్దగా ఆసక్తి చూపలేదు. మొత్తం 58 మండలాల్లో పంపిణీ చేపట్టగా.. 2,335 క్వింటాళ్ల విత్తనకాయలు మాత్రమే తీసుకెళ్లారు. కరువు ప్రభావంతో రైతుల చేతుల్లో చిల్లిగవ్వ లేకపోవడంతో వేరుశనగ కొనుగోలుకు ముందుకు రాలేదు. బుధవారం రాయదుర్గంలో రాష్ట్ర మార్కెటింగ్‌శాఖ మంత్రి ఆదినారాయణరెడ్డి, సమాచారశాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు విత్తన పంపిణీ ప్రారంభించారు. మిగిలిన నియోజకవర్గాల్లో ఆయా ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా పంపిణీ మొదలుపెట్టారు. విత్తన పంపిణీపై వ్యవసాయ శాఖ వద్ద ముందస్తు ప్రణాళికలు లేవన్న విషయం కొట్టొచ్చినట్లు కన్పించింది. ఇతర కార్యక్రమాల నిమిత్తం మంగళవారం జిల్లాకు వచ్చిన ఇన్చార్జ్ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చేతుల మీదుగా కళ్యాణదుర్గంలో లాంఛనంగా ప్రారంభించిన అధికారులు.. రాత్రికి రాత్రే ధరలు ఖరారు చేసి బుధవారం నుంచి జిల్లా వ్యాప్తంగా పంపిణీ మొదలుపెట్టారు. దీంతో పంపిణీ విషయం చాలామంది రైతులకు చేరలేదు. కొంతమందికి చేరినా చేతిలో డబ్బు లేక విత్తనం తీసుకోవడానికి రాలేదు. ఫలితంగా జిల్లా వ్యాప్తంగా అన్ని విత్తన పంపిణీ కేంద్రాలు వెలవెలబోయాయి. అరకొరగా వచ్చిన రైతులు ప్రశాంతంగా విత్తనకాయలు తీసుకొని వెళ్లారు. ఒక్కో రైతుకు గరిష్టంగా నాలుగు బస్తాల చొప్పున అందించారు. తొలిరోజు 2,132 మంది రైతులు వేరుశనగ కొనుగోలు చేశారు. అధికార పార్టీ నేతలు చెప్పిన ఏజెన్సీలకు పంపిణీ బాధ్యతలు కట్టబెట్టలేదనే ఉద్దేశంతో కళ్యాణదుర్గం నియోజకవర్గంలో విత్తన పంపిణీ నిలుపుదల చేయించారు. దీంతో ఆయా మండలాల్లో విత్తన పంపిణీ కేంద్రాల వద్దకు వచ్చిన రైతులు నిరాశతో వెనుదిరిగారు. కనగానపల్లిలో పంపిణీని బంద్ నేపథ్యంలో వామపక్ష నాయకులు అడ్డుకున్నారు. బుక్కరాయసముద్రంలో పరిశీలనకు వచ్చిన అనంతపురం ఆర్డీఓ మలోలను వామపక్ష నాయకులు ఘెరావ్ చేశారు. ముందస్తు ప్రణాళికల్లో వ్యవసాయ శాఖ విఫలం వ్యవసాయ శాఖ ప్రణాళికాలోపం వల్ల మండల స్టాకు పాయింట్లకు సరిపడా విత్తనకాయలు చేరలేదు. ధర్మవరం, తాడిమర్రి, బత్తలపల్లి, వజ్రకరూరు, తనకల్లు మండలాలకు ఇప్పటికీ బస్తా కూడా విత్తనకాయలు అందలేదు. మిగిలిన వాటికీ అరకొరగానే చేరాయి. జిల్లాకు 4.59 లక్షల క్వింటాళ్ల విత్తన కాయలు అవసరం. ఇప్పటి వరకూ 1.80 లక్షల క్వింటాళ్లు మాత్రమే చేరాయి. అధికారులు మాత్రం 3.79 లక్షల క్వింటాళ్లు సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు.అయితే.. ఆ మేరకు స్టాకు పాయింట్లకు చేరలేదు. హడావుడిగా నిర్ణయించడంతో పాటు రైతుల వద్ద సమయానికి డబ్బు సమకూరకపోవడంతో తొలిరోజు పెద్దగా రాలేదు. రెండు, మూడురోజుల్లో విత్తన పంపిణీ పుంజుకునే అవకాశముంది. బుధవారం పంపిణీ మొదలుకాని ఐదు మండలాల్లో గురువారం నుంచి ప్రారంభిస్తున్నట్లు వ్యవసాయ సంయుక్త సంచాలకుడు (జేడీఏ) శ్రీరామమూర్తి తెలిపారు. అన్ని మండలాలకు సరిపడా విత్తనకాయలు అందుబాటులో ఉన్నాయని, రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. -
విత్తన పంపిణీలోనూ.. అధికార పెత్తనం
– పంపిణీ బాధ్యతల కోసం జోరుగా పైరవీలు – పలు మండలాల్లో ‘తముళ్ల’ మధ్యనే పోటీ అనంతపురం అగ్రికల్చర్ : విత్తన వేరుశనగ పంపిణీలోనూ రాజకీయ పెత్తనం ఎక్కువవుతోంది. బయోమెట్రిక్ పద్ధతిలో విత్తన పంపిణీ కోసం ఓ వైపు వ్యవసాయశాఖ ఏర్పాట్లు చేస్తుండగా మరోవైపు పంపిణీ బాధ్యతలు దక్కించుకునేందుకు అధికార పార్టీ నేతలు పైరవీలు చేస్తున్నారు. ఈసారి నాలుగు బస్తాలు ఇవ్వనున్నట్లు ఇటీవల మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో విత్తన కేటాయింపులు 3.50 లక్షల నుంచి 4.01 లక్షల క్వింటాళ్లకు పెరిగాయి. ఏపీ సీడ్స్, ఆయిల్‌ఫెడ్, మార్క్‌ఫెడ్‌తో పాటు వాసన్ అనే ఎన్జీవో ద్వారా విత్తనకాయ సేకరిస్తున్నారు. ఇప్పటికే 3.20 లక్షల క్వింటాళ్లు వివిధ ప్రాంతాల్లో ఉన్న స్టాక్ పాయింట్లకు చేర్చారు. ప్రభుత్వం నుంచి విత్తన ధరలు, రాయితీలు ఖరారు కాగానే పంపిణీ తేదీలు ప్రకటించే అవకాశం ఉంది. ఎలాగైనా ఈనెలాఖరు నాటికి మొదటి విడత పంపిణీ పూర్తిచేయాలని భావిస్తున్నారు. ఇప్పటివరకు బాగానే ఉన్నా... మండలాల్లో పంపిణీ చేసే బాధ్యతలు తమకే ఇవ్వాలంటూ అధికార పార్టీకి చెందిన నేతల మధ్య పోటీ నెలకొన్నట్లు తెలుస్తోంది. ఒక క్వింటాపై రూ.50 కమిషన్ ఉండటంతో ఎక్కువ కేటాయింపులు కలిగిన మండలాలు దక్కించుకునేందుకు మంత్రులు, ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ వ్యవసాయశాఖ, సేకరణ సంస్థల అధికారులపై ఒత్తిళ్లు చేయిస్తున్నారు. 10 వేల క్వింటాళ్లు కలిగిన మండలాల్లో వంద శాతం పంపిణీ జరిగితే రూ.5 లక్షల వరకు కమిషన్ వస్తుంది. అందులో అన్ని రకాల ఖర్చులు సగం పోయినా సగమైనా మిగులుతుంది. ఖర్చులు తగ్గించుకుంటే 70 శాతం వరకు కమిషన్ రూపంలో మిగులుతుందనే ఆలోచనతో పైరవీలు జోరుగా సాగుతున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేలదే హవా గతంలో చాలా వరకు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (పీఏసీఎస్), జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్), రైతు సేవా కేంద్రాలు (ఆగ్రోస్) ఎక్కువగా పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సారి వాటిని చాలా వరకు పక్కన పెట్టేశారు. అంతో ఇంతో కమీషన్ వస్తుందనే ఆశతో తెలుగు తమ్ముళ్లు రంగంలో దిగడంతో నువ్వా...నేనా...? అన్నట్లు వారి మధ్యనే చాలా చోట్ల పోటీ ఏర్పడింది. పంపిణీ చేయడానికి వీలుగా ఎలాంటి అనుభవం లేకున్నా ఇప్పటికిపుడు సీడ్ లైసెన్స్ పొందేందుకు ఎగబడుతున్నారు. తమ వారికి అవకాశం కల్పించాలంటూ కీలక నేతలు సిఫారసు చేస్తుండటంతో వ్యవసాయశాఖ అధికారులు, ఏజెన్సీలకు చెందిన అధికారులు ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. గతేడాది పంపిణీ చేసిన విత్తన వేరుశనగకు సంబంధించి ప్రభుత్వానికి చెల్లించాల్సిన సొమ్ము దాదాపు రూ.1 కోటి వరకు తమ్ముళ్లు కట్టకుండా దర్జాగా తిరుగుతున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో చోటామోటా నేతలు పంపిణీ బాధ్యతలు దక్కించుకునే యత్నాల్లో ఉన్నాయి. ఆయా నియోజక వర్గాల్లో ఎమ్మెల్యేలదే సర్వాధికారంగా సాగుతున్నట్లు సమాచారం. వారు చెప్పిందే వేదంగా అధికార యంత్రాంగం కూడా ముందుకు సాగుతోందన్న విమర్శలున్నాయి. -
‘విత్తన దీక్ష’పై కదిలిన సర్కారు
అధికారుల వైఫల్యంపై మంత్రి పోచారం ఆగ్రహం సాక్షి, కామారెడ్డి: విత్తన కష్టాలపై ‘సాక్షి’ మెయిన్ ఎడిషన్‌లో ఆదివారం ప్రచురితమైన ‘విత్తన దీక్ష’ కథనం సర్కారును కదిలించింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి సోమవారం కామారెడ్డి జిల్లా కలెక్టర్ సత్యనారాయణతో పాటు జిల్లా వ్యవసాయ శాఖ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. పంపిణీలో వ్యవసాయ శాఖ అధికారుల వైఫల్యంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం. జుక్కల్ నియోజకవర్గంలోని మద్నూర్, బిచ్కుంద మండలాల్లో విత్తనాల కోసం రైతుల ఇబ్బందులపై ‘సాక్షి’ ఆదివారం కథనం ప్రచురించిన విషయం తెలిసిందే.. మంత్రి ఆదేశాలతో జేడీఏతో పాటు ఇతర అధికారులు సోమవారం మద్నూర్, బిచ్కుందలకు వెళ్లి రైతులతో మాట్లాడారు. రైతులకు అవసరమైనన్ని విత్తనాలను అందిస్తామని హామీ ఇచ్చారు. మద్నూర్‌లో అదనంగా ఐదు కౌంటర్లను ఏర్పాటు చేయించారు. దీంతో సోమవారం విత్తనాల పంపిణీ ప్రశాంతంగా సాగింది. (చదవండి : విత్తన దీక్ష) రైతులకు సరిపడా విత్తనాలందిస్తాం.. రబీలో సాగుకు అవసరమైన విత్తనాలను అందించడానికి ఏర్పాట్లు చేశామని కలెక్టర్ సత్యనారాయణ తెలిపారు. అయితే అధికారుల నిర్లక్ష్యం వల్ల సమస్యలు తలెత్తాయన్నారు. ఆదివారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. విత్తనాల పంపిణీలో జరిగిన లోపాలపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. -
దివాలా సొసైటీలకే ఇవ్వాలా..?
- వాటికి ఎరువులు, విత్తనాల పంపిణీ బాధ్యతపై విమర్శలు - 906 సహకార సొసైటీలకుగాను 400 నష్టాల అంచుల్లోనే - వ్యవసాయశాఖ నిర్ణయంతో రైతులకు తప్పని కష్టాలు సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది ప్రాథమిక సహకార సొసైటీ(ప్యాక్స్)ల ద్వారా విత్తనాలు, ఎరువులను రైతులకు సరఫరా చేయాలని రాష్ట్రవ్యవసాయ శాఖ నిర్ణయించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అనేక సహకార సొసైటీలు దివాలా అంచున ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం వల్ల రైతులకు తీవ్ర విఘాతం కలిగిస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో మొత్తం 906 సొసైటీలుండగా వాటిల్లో 400 సొసైటీలు నష్టాల్లో ఉన్నాయని, సరైన నిర్వహణ లేక కొన్ని కునారిల్లుతున్నాయని, ఇలాంటి స్థితిలో వాటికి విత్తనాలు, ఎరువులను విక్రయించే బాధ్యత ఇస్తే సమస్యలు తప్పవంటున్నారు. గతంలో అనేక సొసైటీలు ఇలా మార్క్‌ఫెడ్ నుంచి ఎరువులు తీసుకొని డబ్బులు చెల్లించలేదని చెబుతున్నారు. 50 శాతం సబ్సిడీపై...: మండల కేంద్రాల నుంచి కాకుండా గ్రామాల్లో ఉండే సహకార సొసైటీల ద్వారానే విత్తనాలు, ఎరువులను సరఫరా చేయాలని వ్యవసాయశాఖ నిర్ణయించిన సంగతి తెలిసిందే. సహకార సొసైటీల ద్వారానైతే రైతులకు ఎరువులు, విత్తనాలు సకాలంలో చేరతాయనేది వ్యవసాయ, సహకార శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఉద్దేశం. ఈ ఏడాది మొత్తం 7.5 లక్షల విత్తనాలను 50 శాతం సబ్సిడీపై అందజేయాలని సర్కారు నిర్ణయించింది. వాటి విలువ రూ.412 కోట్లు. రైతులకు సబ్సిడీ పోను సర్కారు స్వయం గా రూ. 206 కోట్లు భరించనుంది. 2.5 లక్షల క్వింటాళ్ల వరి, 3.75 లక్షల క్వింటాళ్ల సోయాబీన్, 77 వేల క్వింటాళ్ల వేరుశనగ, 70 వేల మొక్కజొన్న, 80 వేల క్వింటాళ్ల శనగ విత్తనాలను సరఫరా చేస్తాయి. అలాగే 17.47 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను కేంద్రం రాష్ట్రానికి కేటాయించింది. బ్యాంకు గ్యారంటీ ఉన్నా... సొసైటీలకు ప్రభుత్వం కేటాయించే విత్తనాలు, ఎరువుల విలువ మేరకు సహకార బ్యాంకులు ప్రభుత్వానికి గ్యారంటీ ఇస్తాయి. బ్యాంకు గ్యారంటీ ఉన్నా నష్టాల బాటలో ఉన్న 400 సొసైటీలు విత్తనాలు, ఎరువులు తీసుకొని ఏ మేరకు వెన క్కు తిరిగి చెల్లిస్తాయన్న ప్రశ్న అధికారుల ను వేధిస్తోంది. అవి చేతులెత్తేస్తే సహకార బ్యాంకులు కుప్పకూలిపోతాయంటున్నారు. గతేడాది మార్క్‌ఫెడ్‌కు కొన్ని సొసైటీలు రూ. 3 కోట్లు బకాయిలు చెల్లించకపోవడంతో న్యాయ పోరాటానికి దిగాల్సి వచ్చిందని ఒక అధికారి వ్యాఖ్యానించారు. -
రెండో విడత లేనట్లే!
అనంతపురం అగ్రికల్చర్ : జిల్లా రైతులకు విత్తన వేరుశనగ కష్టాలు తప్పేలా కనిపించడం లేదు. వర్షాలు పడుతుండటంతో విత్తుకునేందుకు అన్ని మండలాల్లో రైతులు సిద్ధంగా ఉన్నా విత్తనకొరత వల్ల సమస్య నెలకొంది. ప్రభుత్వం రాయితీ విత్తనం అరకొరగా ఇచ్చి రైతులను మీ తిప్పలు మీరు పడండి అన్నట్లు వదిలేస్తోంది. గతంలో 5 నుంచి 5.50 లక్షల క్వింటాళ్లు అవలీలగా పంపిణీ చేసిన దాఖలాలు ఉన్నా ఈ ఏడాది కేటాయించిన 3.28 లక్షల క్వింటాళ్లు కూడా అందించలేని పరిస్థితి. రాయితీ విత్తనంపై నమ్మకం పెట్టుకున్న రైతుల ఆశలు అడియాశలయ్యాయి. మొదటి విడత విత్తన పంపిణీలోనే విత్తన కొరత ఏర్పడటంతో పంపిణీ కార్యక్రమం ప్రసహనంగా మారింది. కమిషనరేట్ అధికారులు రెండు విడతలుగా జిల్లాలో మకాం వేసినా, జిల్లా కలెక్టర్ ప్రత్యేకశ్రద్ధ తీసుకుని రోజువారీ సమీక్ష చేసినా, వ్యవసాయశాఖ జేడీ నిత్యం దృష్టి సారించినా ప్రయోజనం లేకపోయింది. కనీసం ఒక్క మండలంలో కూడా తగినంత విత్తన నిల్వలు పెట్టకపోవడంతో రైతులు ఆందోళనకు దిగారు. గతంలో మే నెలాఖరు నాటికి తొలివిడత పంపిణీ చేసి, జూన్‌లో మరో రెండు విడతలు... పంపిణీ చేసేవారు. ఈసారి మాత్రం ముందస్తు అంటూ రచించిన ప్రణాళికలన్నీ బెడిసికొట్టడంతో మొదటి విడత పంపిణీలోనే గందరగోళం నెలకొంది. రోజు మార్చి రోజు పంపిణీ చేయాల్సివున్నా ఈ సారి 3, 5 తేదీల్లో అలా జరిగినా మూడో క్లస్టర్ గ్రామాల రైతులకు మాత్రం 14న పంపిణీ చేశారు. అందులోనూ విఫలమయ్యారు. 38 వేల క్వింటాళ్లు తక్కువ రావడంతో వచ్చిన రైతులకు కూపన్లు ఇచ్చి పంపారు. ఈనెల 18వ తేదీ లోగా కూపన్లు పొందిన రైతులందరికీ విత్తనకాయ ఇస్తామని జిల్లా యంత్రాంగం స్పష్టమైన హామీ ఇచ్చింది. ఎంతవరకు నెరవేరుతుందనేది మరికొన్ని గంటల్లోనే తెలుస్తుంది. ఇలా మొదటి విడత పంపిణీ పూర్తి చేయడానికి అష్టకష్టాలు పడుతున్న జిల్లా యంత్రాంగం ఇక రెండో విడత, మూడో విడత పంపిణీ చేస్తుందంటే నమ్మశక్యంగా లేదని ఆ శాఖ అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. విత్తనం పంపిణీ చేయలేమనే విషయం తెలియడంతో రైతుల దృష్టి మళ్లించేందుకు ఎత్తుగడలు వేస్తున్నారు. విత్తుకునేందుకు జూన్ సమయం కాదని, జూలై నెల మంచి అనుకూలమని ప్రకటనలు గుప్పిస్తున్నారు. విత్తుకు సమయం ఉన్నందున రైతులు విత్తనం కోసం ఆందోళన వద్దంటున్నారు. రెండు, మూడో విడత విత్తన పంపిణీ ఉంటుందని మాత్రం స్పష్టంగా చెప్పని పరిస్థితి నెలకొంది. అంతేకాకుండా రైతులే నేరుగా సొంతంగా కొనుగోలు చేస్తే వారి ఖాతాల్లోకి సబ్సిడీ జమ చేస్తామని కొత్త ఎత్తుగడ వేశారు. దానికి సంబంధించి అధికారికంగా తమకు ఉత్తర్వులు రాలేదని వ్యవసాయశాఖ చెబుతుండటం విశేషం. అర్థాంతరంగా కొత్త పంపిణీ విధానం అమలులోకి రావడం కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాకు కేటాయించిన 3.28 లక్షల క్వింటాళ్లలో ప్రస్తుతానికి 1.85 లక్షల క్వింటాళ్లు తెప్పించి రైతులకు అందజేశారు. ఎన్ని క్వింటాళ్లు పంపిణీ చేశారనే వివరాలు చెప్పడానికి అధికారులు నిరాకరిస్తున్నారు. జేడీఏ వర్గాలు ఒక లెక్క చెబుతుండగా కలెక్టర్ మరో లెక్క చెబుతున్నారు. మరో పక్క వ్యవసాయశాఖ కమిషనరేట్ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి 2.28 లక్షల క్వింటాళ్లు పంపిణీ చేశామని చెప్పడం విశేషం. -
అన్నదాత ఆగ్రహం
ఆదోని : వేరుశనగ విత్తనం కోసం గురువారం రైతులు ఆదోని పట్టణంలో రాస్తారోకో నిర్వహించారు. సబ్ డివిజన్ పరిధిలోని మూడు వందల మందికి పైగా రైతులు స్థానిక వ్యవసాయ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే విత్తనాలు లేవనే సమాధానంతో తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. వేరుశనగ విత్తనం సరఫరాలో ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ రోడ్డెక్కారు. రైతు సంఘం నాయకులు వెంకటేశ్వర్లు, ఈరన్న, మహానందరెడ్డి, రామాంజినేయులు, వైఎస్ఆర్సీపీ జెడ్పీటీసీ సభ్యుడు ఆనందు వీరికి మద్దతు పలికారు. సర్కిల్ వద్ద కొందరు రోడ్డుపై బైఠాయించగా మరి కొందరు రాస్తారోకోకు దిగారు. సకాలంలో విత్తనం సరఫరా చేయని అధికారులు డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినదించారు. ట్రాఫిక్ స్తంబించిపోవడంతో వన్ టౌన్ పోలీసులు వచ్చి.. ఎన్నికల కోడ్ అమలులో ఉందని, ఆందోళన విరమించాలని కోరారు. తమ ఆవేదనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నామని.. జైలుకు పంపాలనుకుంటే పంపండి అంటూ ఎస్ఐ రామయ్యతో రైతులు వాగ్వాదానికి దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఎస్ఐ వెంటనే ఏడీఏ చెంగలరాయుడితో ఫోన్లో మాట్లాడగా.. జేడీఏ వస్తున్నారని చెప్పడంతో పోలీసులు రైతులను ఏడీఏ కార్యాలయాలనికి తీసుకు వెళ్లారు. అయితే అక్కడ జేడీఏ లేకపోవడంతో కార్యాలయం ఎదుట రైతులు ైబె ఠాయించారు. టూ టౌన్ ఎస్ఐ ఇంతి యాజ్ బాషా, సిబ్బంది వచ్చి ఆందోళన కారులకు నచ్చచెప్పే ప్రయత్నం చేస్తుండగా జేడీఏ ఠాగూర్‌నాయక్ అక్కడి వచ్చారు. ఆయనను చుట్టుముట్టి రైతులు నిలదీశారు. సోమవారం జిల్లాకు దాదాపు వెయ్యి క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు సరఫరా అవుతాయని, ఇందులో ఐదు వందల క్వింటాళ్లు ఆదోనికి కేటాయిస్తామని ఆయన హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విమరించారు. విత్తన పంపిణీలో నిర్లక్ష్యాన్ని సహించం ఆదోని అర్బన్: సబ్సిడీ విత్తన పంపిణీలో నిర్లక్ష్యాన్ని ఎట్టిపరస్థితుల్లో సహించేది లేదని వ్యవసాయ అధికారులను కలెక్టర్ విజయమోహన్ హెచ్చరించారు. గురువారం సాయంత్రం ఆయన ఆదోనిలోని విత్తన పంపిణీ కేంద్రాన్ని పరిశీలించారు. ఆదోనిలో విత్తన పంపిణీ అస్తవ్యస్తంగా ఉందని దీనిపై అధికారులు పట్టించుకోకుండా ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక నుంచి విత్తన పంపిణీ విషయంలో నిర్లక్ష్యం జరగకుండా చూడాలని జేడీఏ ఠాగూర్ నాయక్‌కు సూచించారు. రోజూ విత్తన పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించాలని తహశీల్దార్ శ్రీనివాసరావును ఆదేశించారు. గోదాములో ఉన్న ఎరువులను తనిఖీ చేశారు. -
సమస్యలు అనంతం
ఎండల తీవ్రతకు అల్లాడుతున్న జనం గ్రామాల్లో జాడలేని వైద్య శిబిరాలు ఉపాధి పనుల వద్ద నీడ కరువు అతీగతీ లేని విత్తన పంపిణీ నేడు జెడ్పీ సర్వసభ్య సమావేశం అనంతపురం సెంట్రల్ : జిల్లా ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. వరుస కరువులతో పంటలు పండలేదు. తాగేందుకూ గుక్కెడు నీరు దొరకడం లేదు. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను పాలకులు అటకెక్కించారు. కరువు జిల్లాను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది. గ్రామాల్లో ప్రజలు ఉండలేని పరిస్థితి దాపురిస్తోంది. సోమవారం జిల్లా పరిషత్ సాధారణ సర్వసభ్యసమావేశం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా సమస్యలపై ‘సాక్షి’ ఫోకస్... కొన్ని రోజులుగా భానుడు ఉగ్రరూపాన్ని చూపుతున్నాడు. ఆదివారం శింగనమలలో రికార్డు స్థాయిలో 44.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. యల్లనూరు 42.3 డిగ్రీలు, అనంతపురం, గార్లదిన్నె 42.2 డిగ్రీలు, తాడిమర్రిలో 42 డిగ్రీలు నమోదయ్యాయి. ఎండ వేడిమికి తోడు వడగాలులు వీస్తుండడంతో పలువురు చనిపోయారు. ఎండ వల్ల కలిగే ప్రమాదంపై ప్రజలను అప్రమత్తం చేయాల్సిన వైద్య,ఆరోగ్యశాఖ నిద్రమత్తులో జోగుతోంది. కనీసం గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్న ధ్యాస కూడా ఆ శాఖ అధికారులకు లేదు. జిల్లాలో కూలీలకు గత్యంతరం లేక ఉపాధి పనులకు వెళుతున్నారు. పనులు జరిగే ప్రదేశంలో కూలీలకు ఏమాత్రమూ మౌలిక సదుపాయాలు కల్పించడం లేదు. నీడ కోసం షామియానాలు లేవు. మంచినీరు సరఫరా చేయడం లేదు. గతంలో పంపిణీ చేసిన షామియానాలన్నీ ఎప్పడో పక్కదారి పట్టాయి. ముంగారు కాలం ముంచుకొస్తున్నా వ్యవసాయశాఖ అధికారుల్లో చలనం లేదు. ఖరీఫ్‌లో 3.28 లక్షల విత్తన వేరుశనగ అవసరం కాగా.. ఇప్పటి వరకూ 10 వేల క్వింటాళ్లు మాత్రమే జిల్లాకు చేరాయి. వేరుశనగతో పాటు అంతర పంటలుగా సాగు చేసే కంది, ఆముదంతో పాటు ప్రత్యామ్నాయ విత్తనాల పంపిణీపై కసరత్తు ప్రారంభించలేదు. రైతు, డ్వాక్రా రుణమాఫీలు గందరగోళంగా మారాయి. లక్ష మందికి పైగా రైతులు రుణమాఫీకి నోచుకోలేదు. జిల్లా వ్యాప్తంగా అన్ని ఆర్డీఓ కార్యాలయాల్లో, కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన రుణమాఫీ ఫిర్యాదుల స్వీకరణ కౌంటర్లు కిటకిటలాడుతున్నాయి. డ్వాక్రా రుణమాఫీదీ ఇదే పరిస్థితి. తొలుత సభ్యురాలికి రూ.10 వేలు అన్న ప్రభుత్వం ప్రస్తుతం మూడు విడతల్లో రూ. 3 వేల చొప్పున మంజూరు చేస్తోంది. ఈ మొత్తం కూడా వాడుకోవడానికి వీల్లేదని మెలిక పెట్టడంతో మహిళలు తీవ్రంగా మండిపడుతున్నారు. జిల్లాలో తాగునీటి ఎద్దడి జఠిలమవుతోంది. 300 గ్రామాలకు పైగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ట్యాంకర్లతో నీటిని సరఫరా చేయాలని ప్రభుత్వం నిధులు విడుదల చేసినా... ఎక్కువశాతం పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలున్నాయి.మండల స్థాయిలో రాజకీయ జోక్యం ఎక్కువ కావడంతో అధికారులు పారదర్శకంగా పనిచేయలేకపోతున్నారు. ప్రజా సంక్షేమం కోసం గతంలో జెడ్పీలో అనేక తీర్మానాలు చేశారు. పండ్ల తోటల సాగుకు 10 ఎకరాల వరకూ అవకాశం కల్పించాలని, శాశ్వత కరువు జిల్లాగా గుర్తించాలని, రూ. 100 కోట్ల ప్యాకేజీ ప్రకటించాలని, తదితర తీర్మానాలు చేశారు. ఇందులో ఏ ఒక్కటీ ఆచరణకు నోచుకోలేదు. -
నేల తల్లికి ప్రణమిల్లుతున్న కేరళ!
2015ను అంతర్జాతీయ భూముల పరిరక్షణ సంవత్సరంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేరళ రాష్ట్రం భూసార పరిరక్షణ, ప్రజారోగ్య పరిరక్షణ లక్ష్యంతో ముందడుగేస్తోంది. దశలవారీగా సేంద్రియ వ్యవసాయ రాష్ట్రంగా అవతరించనుంది. ఇప్పటికే 96% కూరగాయలు రసాయనాలు వాడకుండానే పండిస్తున్నారని వ్యవసాయ మంత్రి కేపీ మోహనన్ ఇటీవల చెప్పారు. యువహృదయాల్లో సేంద్రియ సేద్య బీజాలు నాటేందుకు రెండేళ్లుగా కూరగాయ విత్తనాల పంపిణీ సత్ఫలితాలనిచ్చింది. తొలుత 20 పంచాయతీలను ఏప్రిల్ నాటికి సేంద్రియ సేద్య ప్రాంతంగా ప్రకటించడం.. 100 సేంద్రియ ఉత్పత్తుల సేకరణ కేంద్రాలు ప్రారంభించడం.. 2016 నుంచి దశలవారీగా రసాయనిక ఎరువుల వాడకాన్ని నిషేధించడం.. ఇవీ కేరళ ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాలు. -
విత్తన పంపిణీ జాప్యంపై రైతన్న ఆగ్రహం
రోడ్డుపై బైఠాయించిన వైనం ఓ వర్గానికి సహకరిస్తున్నారనే విమర్శలు పాకాల : వేరుశెనగ విత్తనాల పంపిణీలో అధికారుల జాప్యంపై ఆగ్రహించిన వందలాది మంది రైతులు పాకాలలోని మార్కెట్ యార్డు కార్యాలయం ముందు రోడ్డుపై శనివారం సాయంత్రం బైఠాయించి ధర్నాకు దిగారు. ఖరీఫ్ ప్రారంభమై రెండు వారాలు గడుస్తున్నా సకాలంలో విత్తనాలు పంపిణీ చేయకపోగా, అలస్యంగా వచ్చిన విత్తనాలను సైతం ఇవ్వకపోవడంతో రైతులు ఆగ్రహానికి గురయ్యారు. విత్తన పంపిణీ కార్యక్రమాన్ని పాకాల సింగిల్ విండో అధ్యక్షుడు ఎన్.మునీశ్వర రెడ్డి తన కార్యాలయంలో శుక్రవారం ప్రారంభించిన సంగతి తెలిసిందే.. విత్తన పంపిణీ విషయం తెలుసుకున్న మండలంలోని వందలాది మంది రైతులు శనివారం ఉదయం ఎనిమిది గంటలకే మార్కెట్ యార్డు అవరణకు చేరుకున్నారు. మధ్యాహ్నం వరకు విత్తనాలు పంపిణీ చేశారు. అనంతరం ఒంటిగంట ప్రాంతంలో భోజనానికి వెళ్లిన అధికారులు సాయంత్రం అవుతున్నా రాకపోవడంతో రైతులు ఆగ్రహించారు. ఒక్కరోజు కూడా గడవకనే అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో పాకాల-తిరుపతి రహదారిపై బైఠాయించారు. విషయం తెలుసుకున్న మండల వ్యవసాయ అధికారి హరిత, సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. రైతులు వాగ్వాదానికి దిగడంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న పాకాల పోలీసులు, సింగిల్ విండో కార్యదర్శి మురళి జోక్యం చేసుకుని రైతులకు నచ్చచెప్పి ఎంత సమయమైనా విత్తనాలు అందరికీ అందజేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఓ వర్గానికే సహకరిస్తున్నారు.. అధికార పార్టీకి చెందిన వారికే ప్రాధాన్యం ఇస్తున్నారని పలువురు రైతులు ఆరోపించారు. అందుకోసమే ఓ లోడ్ విత్తనాలను సింగిల్ విండో కార్యాలయం వద్ద దించుకుని వారి అనుచరులకు పంపిణీ చేస్తున్నారని మిగిలిన వారిని మార్కెట్ యార్డు వద్దకు రమ్మని చెప్పి ఇబ్బందులకు గురి చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై అధికారులను సైతం నిల దీశారు. అలాంటిదేమీ లేదని, అందరికీ విత్తనాలు పంపిణీ చే స్తున్నామని అధికారులు తెలిపారు.