Urjit Patel
-
కీలక పోస్టులోకి ఆర్బీఐ మాజీ గవర్నర్ ! బ్రిటానియాకు గుడ్‌బై
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్‌గా పని చేసిన ఊర్జిత్ పటేల్‌కి కీలక పదవి దక్కింది. ఊర్జిత్ పటేల్‌ను ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌గా నియమించింది. ఏఐఐబీ వ్యవస్థాపక దేశాల్లో భారత్ కూడా ఉంది. వైస్ ప్రెసిడెంట్ షియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం చైనా రాజధాని బీజింగ్‌లో ఉంది. చైనా తర్వాత రెండో అత్యధిక ఓటింగ్ వాటాతో ఆసియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు(ఏఐఐబీ)లో భారత్ వ్యవస్థాపక సభ్యదేశంగా ఉంది. ఏఐఐబీకి చైనా మాజీ ఆర్థిక శాఖ వైస్ మినిస్టర్ జిన్ లికున్ నాయకత్వం వహిస్తున్నారు. ఫిబ్రవరి 1న ఊర్జిత్ పటేల్ ఈ బ్యాంకు వైస్ ప్రెసిడెంట్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. దీంతో బ్రిటానియా కంపెనీలో ఉన్న పదవులకు ఆయన శనివారం రాజీనామా సమర్పించారు. రిజర్వ్ బ్యాంక్‌కి 24వ గవర్నర్‌గా ఊర్జిత్ పటేల్ సేవలు అందించారు. ఆయన గవర్నర్‌గా ఉన్న సమయంలోనే పెద్ద నోట్ల రద్దు నిర్ణయం జరిగింది. ఆ తర్వాత ప్రభుత్వ పెద్దలతో పొసగపోవడంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామ ఆర్బీఐ గవర్నర్ బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత ఆయన బ్రిటానియా సంస్థలో ఇండిపెండెంట్ డైరెక్టర్ కమ్ నాన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా కొనసాగుతున్నారు. గత నెలలోనే ఊర్జిత్ను వైస్ ప్రెసిడెంట్ నియామక నిర్ణయాన్ని ఏఊఊబీ వెల్లడించింది. గత రెండు వారాలుగా ఈ విషయంపై మౌనంగా ఉన్న ఊర్జిత్ పటేల్.. చివరకు బ్రిటానియాకు తగు సమయం కేటాయించలేకపోతున్నందున రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. చదవండి: ఏఐఐబీ ఉపాధ్యక్షుడిగా ఆర్బీఐ మాజీ గవర్నర్..! -
ఏఐఐబీ ఉపాధ్యక్షుడిగా ఆర్బీఐ మాజీ గవర్నర్..!
న్యూఢిల్లీ: ఆర్బీఐ మాజీ గవర్నర్ ఉర్జిత్ పటేల్‌ను బీజింగ్ కేంద్రంగా పనిచేసే ఆసియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు(ఏఐఐబీ) ఉపాధ్యక్షుడిగా నియమించినట్లు బ్యాంకు వర్గాలు ఆదివారం తెలిపాయి. చైనా తర్వాత రెండో అత్యధిక ఓటింగ్ వాటాతో ఆసియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు(ఏఐఐబీ)లో భారత్ వ్యవస్థాపక సభ్యదేశంగా ఉంది. ఏఐఐబీకి చైనా మాజీ ఆర్థిక శాఖ వైస్ మినిస్టర్ జిన్ లికున్ నాయకత్వం వహిస్తున్నారు. 58 ఏళ్ల పటేల్ మూడేళ్ల పదవీకాలం గల ఏఐఐబీ ఐదుగురు ఉపాధ్యక్షుల్లో ఒకరుగా ఉంటారు. వచ్చే నెలలో ఆయన తన పదవిలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఏఐఐబీలో వైస్ ప్రెసిడెంట్ పదవి చేపట్టిన డిజె పాండియన్ తర్వాత ఆయన బాధ్యతలు చేపట్టనున్నట్లు ఏఐఐబీ వర్గాలు పీటీఐకి తెలిపాయి. గతంలో గుజరాత్ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన పాండియన్ ఈ నెల చివర్లో భారతదేశానికి తిరిగి రానున్నారు.సెప్టెంబర్ 5, 2016న రఘురామ్ రాజన్ తరువాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) 24వ గవర్నర్‌గా ఉర్జిత్ పటేల్ బాధ్యతలు చేపట్టారు. డిసెంబర్ 2018లో "వ్యక్తిగత కారణాల వల్ల" పటేల్ రాజీనామా చేశారు. సెప్టెంబర్ 6, 2016న బాధ్యతలు చేపట్టడానికి ముందు అతను రఘురామ్ రాజన్ ఆధ్వర్యంలో ఆర్బీఐలో ద్రవ్య విధాన విభాగాన్ని పర్యవేక్షిస్తున్న డిప్యూటీ గవర్నర్‌గా ఉన్నారు. పటేల్ గతంలో అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్), బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ & రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి ప్రముఖ ఇతర సంస్థలతో కలిసి పనిచేశారు. ఏఐఐబీ నుంచి 28 ప్రాజెక్టులకు 6.8 బిలియన్ డాలర్లు రుణం తీసుకుంది. అతిపెద్ద లబ్ధిదారుగా అవతరించిన భారతదేశానికి ఏఐఐబీ పటేల్ పోస్టింగ్ ముఖ్యమైనది అని పాండియన్ శనివారం తన వీడ్కోలు సమయంలో తెలిపారు. (చదవండి: ఎలక్ట్రిక్ వాహన కొనుగోలుదారులకు 2022లో పండగే..!) -
బ్యాంకులపై ‘మొండి’బండ!
ముంబై: భారత్ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకుల (ఎస్సీబీ) మొండి బకాయిల తీవ్రత మరింత పెరిగే అవకాశాలు స్పష్టమైపోయాయి. 2021 మార్చి నాటికి మొత్తం అన్ని బ్యాంకుల రుణాల్లో స్థూల మొండి బకాయిలు (జీఎన్‌పీఏ) 12.5 శాతానికి పెరిగే అవకాశం ఉందని శుక్రవారంనాడు విడుదల చేసిన ద్వైవార్షిక ఆర్థిక వ్యవహారాల స్థిరత్వ నివేదిక (ఎఫ్ఎస్ఆర్)లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. ఆర్థిక అనిశ్చిత పరిస్థితి మరింత విషమిస్తే, ఈ రేటు ఏకంగా 14.7 శాతానికీ పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయని విశ్లేషించింది. 2020 మార్చి నాటికి మొత్తం బ్యాంకింగ్ జీఎన్‌పీఏ రేటు కేవలం 8.5 శాతంగా ఉన్న విషయం గమనార్హం. ఆర్థికాంశాలకు సంబంధించి ఆర్బీఐ తాజా నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు... ► పలు క్షేత్ర స్థాయి ఆర్థిక అంశాల ప్రాతిపదికన బ్యాంకింగ్ తాజా పరిస్థితిని అధ్యయనం చేయడం జరిగింది. ఇందులో ఆర్థిక వ్యవస్థ (జీడీపీ) వృద్ధిరేటు, జీడీపీలో ద్రవ్యలోటు నిష్పత్తి, వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం వంటివి ఉన్నాయి. ► మార్చి నుంచి ఆగస్టు వరకూ రుణాల చెల్లింపులపై మారటోరియం అమలవుతోంది. ఈ మారటోరియం ప్రభావం బ్యాంకింగ్‌పై ఏ స్థాయిలో ఉంటుందన్న విషయం ఇంకా అస్పష్టంగా ఉంది. దీని గురించి ఇప్పుడే చెప్పడం కష్టం. ► ఒక్క ప్రభుత్వ రంగ బ్యాంకుల విషయానికి వస్తే– జీఎన్‌పీఏ నిష్పత్తి 2021 మార్చి నాటికి 15.2 శాతానికి చేరే వీలుంది. 2020 మార్చిలో ఈ రేటు 11.3 శాతం. ► ప్రైవేటు బ్యాంకుల విషయంలో ఈ రేటు 4.2 శాతం నుంచి 7.3 శాతానికి చేరవచ్చు. ► విదేశీ బ్యాంకుల విషయంలో జీఎన్‌పీఏల నిష్పత్తి 2.3 శాతం నుంచి 3.9 శాతానికి పెరగవచ్చు. ► ఇక కనీస పెట్టుబడుల నిష్పత్తి (క్యాపిటల్ అడిక్వసీ రేషియో –సీఆర్ఏఆర్) 2020 మార్చిలో 14.6 శాతం ఉంటే, 2021 మార్చి నాటికి 13.3 శాతానికి తగ్గే వీలుంది. పరిస్థితి మరింత విషమిస్తే, ఈ రేటు 11.8 శాతానికీ పడిపోయే వీలుంది. కనీస పెట్టుబడుల నిష్పత్తిని కొనసాగించడంలో ఐదు బ్యాంకులు పూర్తిగా విఫలం కావచ్చు. ► నిజానికి 2018–19 తో పోల్చితే 2019–20 లో బ్యాంకింగ్ లాభదాయక నిష్పత్తులు బాగున్నాయి. అయితే 2019–20 ఒక్క ద్వితీయార్ధాన్ని పరిశీలిస్తే ఈ నిష్పత్తులు తగ్గాయి. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం లాభదాయక నిష్పత్తులు ఏ స్థాయిలో పడిపోయే అవకాశం ఉందో అర్థం చేసుకోవచ్చు. ► ఒకపక్క తగ్గుతున్న డిపాజిట్లు, మరోపక్క మొండిబకాయిల భారం వెరసి బ్యాంకింగ్ లిక్విడిటీ (ద్రవ్య లభ్యత) సమస్యలనూ ఎదుర్కొనే వీలుంది. ► ఇక ఆర్థిక అంశాల విషయానికి వస్తే, కరోనా మహమ్మారి సవాళ్లు ఎంతకాలం కొనసాగుతాయో చెప్పలేని పరిస్థితి. లాక్డౌన్ ఇంకా పూర్తిస్థాయిలో ఎత్తివేయని పరిస్థితీ ఉంది. ఈ నేపథ్యంలో 2020–21 ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వ్యవస్థ తిరోగమన ఇబ్బందులే ఉంటాయని భావిస్తున్నాం. భారత ఆర్థిక మూలాలు పటిష్టం: శక్తికాంత్ దాస్ కోవిడ్–19 నేపథ్యంలోనూ దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉంది. ప్రభుత్వంతోపాటు ఫైనాన్షియల్ రెగ్యులేటర్లు తీసుకుంటున్న చర్యల వల్ల ఆర్థిక రంగంపై కరోనా ప్రభావాన్ని తగ్గించగలిగాయి. వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులు, వినియోగదారులు... ఇలా అందరికీ విశ్వాసం సన్నగిల్లకుండా చూడాలంటే ఫైనాన్షియల్ రంగంలో స్థిరత్వం అవసరం. ఈ స్థిరత్వం చెక్కుచెదరకుండా చూడడంపై మేము అధిక దృష్టి సారిస్తున్నాం. బ్యాంకింగ్ విషయానికి వస్తే, ఇబ్బందులను తట్టుకోగలిగిన స్థాయికి ఎదగాల్సిఉంది. ఇందుకు తగిన యంత్రాంగం సమాయత్తం కావాలి. మూలధనాన్ని తగిన స్థాయిల్లో నిలుపుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. రుణాల మంజూరీ విషయాల్లో మితిమీరిన అతి జాగ్రత్తలూ మంచిదికాదు. ఇలాంటి ధోరణీ ప్రతికూలతలకు దారితీస్తుంది. లాక్డౌన్ సమయాల్లోనూ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వంటి దేశీయ రంగాలు కొన్ని చక్కటి పనితీరునే ప్రదర్శించాయి. భారత్ ఆర్థిక వ్యవస్థలో మొత్తంగా రికవరీ జాడలు కనిపిస్తున్నాయి. ఇక అంతర్జాతీయంగా ఆర్థిక వ్యవస్థలు పటిష్టంగా ఉండడానికి అన్ని దేశాల ప్రభుత్వాలు, కేంద్ర బ్యాంకులు ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. దివాలా చట్టం నిర్వీర్య యత్నం వల్లే కేంద్రంతో విభేదించా: ఉర్జిత్ ఆర్బీఐ గవర్నర్ బాధ్యతల నుంచి 2018 డిసెంబర్లో మధ్యంతరంగా వైదొలగిన ఉర్జిత్ పటేల్ ఎట్టకేలకు ఇందుకు కారణాన్ని వెల్లడించారు. దివాలా చట్టం నిర్వీర్యానికి మోదీ ప్రభుత్వ ప్రయత్నాలే కేంద్రంతో విభేదాలకు కారణమని శుక్రవారం ఆవిష్కరించిన తన పుస్తకంలో పేర్కొన్నారు. రీపేమెంట్లను ఆలస్యం చేస్తున్న డిఫాల్టర్లను తక్షణం డిఫాల్టర్లుగా వర్గీకరించాలని, అలాంటి వ్యక్తులు దివాలా చర్యల సందర్భంగా తిరిగి తమ కంపెనీలను బైబ్యాక్ చేయకుండా నిరోధించాలని బ్యాంకింగ్‌కు సూచిస్తూ ఆర్బీఐ జారీ చేసిన 2018 ఫిబ్రవరి సర్క్యులర్ మొత్తం వివాదానికి కేంద్ర బిందువైందని తెలిపారు. అయితే దీనిని చట్టరూపంలో తీసుకురావడానికి కేంద్రం నిరుత్సాహాన్ని ప్రదర్శించిందని సూచించారు. -
మొండి బాకీలపై ఉర్జిత్ పటేల్ పుస్తకం
ముంబై: బ్యాంకింగ్ మొండి బాకీల సమస్యపై రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ ఉర్జిత్ పటేల్ రాసిన పుస్తకం ఈ నెలాఖరులో విడుదల కానుంది. దీన్ని ప్రచురించిన హార్పర్‌కోలిన్స్ ఇండియా ఈ విషయం వెల్లడించింది. ‘ఓవర్‌డ్రాఫ్ట్– భారత్‌లో పొదుపు చేసే వర్గాలను కాపాడటం’ పేరిట పటేల్ ఈ పుస్తకం రాశారు. ఎన్పీఏలు పేరుకుపోవడానికి కారణాలు, పరిస్థితి చక్కదిద్దడానికి ఆర్బీఐ గవర్నర్ హోదాలో పటేల్ చేసిన ప్రయత్నాలు తదితర అంశాలను ఇందులో పొందుపర్చారు. ఆయన పదవీకాలంలోనే పెద్ద నోట్ల రద్దు అమలైంది. అయితే, కొన్ని అంశాలపై ప్రభుత్వంతో విభేదాల నేపథ్యంలో 2018 డిసెంబర్లో ఆయన అనూహ్యంగా పదవికి రాజీనామా చేశారు. కానీ, ఇటీవలే ఎన్ఐపీఎఫ్పీ చైర్మన్‌గా గత నెలలో నియమితులయ్యారు. -
కీలక పదవిని చేపట్టనున్న ఉర్జిత్ పటేల్
సాక్షి, న్యూఢిల్లీ : రిజర్వ్ బ్యాంక్ ఇండియా(ఆర్బీఐ) మాజీ గవర్నర్ ఉర్జిత్ పటేల్ దేశ ప్రధాన ఆర్థిక థింక్ ట్యాంక్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ (ఎన్ఐపీఎఫ్పీ)కి చైర్మన్‌గా నియమితు లయ్యారు. నాలుగేళ్ల పాటు బాధ్యతలను నిర్వహిస్తారని ఎన్ఐపీఎఫ్పీ ఒక ప్రకటనలో తెలిపింది. ఆర్బీఐ గవర్నర్‌గా పదవీ విరమణ చేసిన దాదాపు 18 నెలల తరువాత మరో ఆర్థిక సంస్థ కీలక బాధ్యతలను చేపట్టడం విశేషం. దాదాపు ఆరేళ్లపాటు ఎన్ఐపీఎఫ్పీకి అధ్యక్షత వహించిన విజయ్ లక్ష్మణ్ కేల్కర్ స్థానంలో జూన్ 22, 2020 నుంచి ఉర్జిత్ పటేల్ బాధ్యతలను స్వీకరించనున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ విజయ్ కేల్కర్ చేసిన విశేష కృషికి ఎన్ఐపీఎఫ్పీ ప్రశంసలు కురిపించింది. ఆయన సేవలను కొనియాడుతూ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. కాగా ఆర్బీఐ గవర్నర్ గా పదవీకాలం ముగియకముందే డిసెంబర్ 10, 2018న ఉర్జిత్ పదవికి రాజీనామా చేశారు. తన మూడేళ్ల పదవీకాలం 2019 సెప్టెంబర్‌లో ముగిసేలోపే వ్యక్తిగత కారణాల పేరుతో పదవి నుంచి ఆయన వైదొలగిన సంగతి తెలిసిందే. -
ఆర్బీఐ ముందే మేల్కొని ఉండాల్సింది
ముంబై: దేశ బ్యాంకింగ్ రంగంలో ప్రస్తుతం నెలకొన్న భారీ మొండి బకాయిల (ఎన్పీఏలు) సమస్య వెనుక బ్యాంకులు, ప్రభుత్వంతో పాటు భారతీయ రిజర్వు బ్యాంకు వైఫల్యం కూడా ఉందని ఆర్బీఐ మాజీ గవర్నర్ ఉర్జిత్ పటేల్ అంగీకరించారు. బ్యాంకులు పెద్ద మొత్తాల్లో రుణాలను ఇచ్చేశాయని, ఈ విషయంలో ప్రభుత్వం సైతం తన పాత్రను సమర్థంగా పోషించలేకపోయిందని చెప్పారాయన. ‘‘ఆఖరుకు ఆర్బీఐ అయినా ముందుగా స్పందించి ఉండాల్సింది’’ అన్నారాయన. ప్రభుత్వంతో విభేదాల కారణంగా గతేడాది డిసెంబర్ 10న ఆర్బీఐ గవర్నర్ పదవికి ఉర్జిత్ పటేల్ గుడ్‌బై చెప్పి వెళ్లిపోయారు. ఆ తర్వాత తొలిసారిగా, స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో భారత బ్యాంకింగ్ రంగంలో నెలకొన్న ఆందోళనకరమైన అంశాలపై ఉర్జిత్ పటేల్ మాట్లాడారు. ‘‘ప్రస్తుత మూలధన నిధులు కూడా ఎక్కువ చేసి చూపించినవే. భారీ ఒత్తిళ్లను ఎదుర్కొనేందుకు ఇవి సరిపోవు. అసలు ఇలాంటి పరిస్థితికి ఎలా వచ్చామో తెలుసా? 2014కు ముందు అన్ని పక్షాలూ తమ పాత్రలను సమర్థంగా నిర్వహించడంలో విఫలమయ్యాయి. బ్యాంకులు, నియంత్రణ సంస్థ (ఆర్బీఐ), ప్రభుత్వం కూడా’’ అని ఉర్జిత్ పటేల్ స్పష్టంచేశారు. 2014 తర్వాత కేంద్రంలో ప్రభుత్వం మారడం, ఆర్బీఐ గవర్నరు హోదాలో రఘురామ్ రాజన్ బ్యాంకుల ఆస్తుల నాణ్యతను మదింపు చేయడంతో భారీ స్థాయిలో ఎన్పీఏల పుట్ట బయటపడిన విషయం తెలిసిందే. రఘురామ్ రాజన్ హయాం నుంచి పటేల్ ఆర్బీఐలో వివిధ హోదాల్లో మొత్తం ఐదేళ్లకు పైగా పనిచేశారు. సమస్యను కార్పెట్ కింద చుట్టేయడం ఫలితాన్నివ్వదని, భవిష్యత్తులో రుణ వితరణ సమర్థవంతంగా ఉండాలని పటేల్ అభిప్రాయపడ్డారు. ఎన్బీఎఫ్సీ ఆస్తులను సైతం సమీక్షించాలి ఆర్థిక వ్యవస్థతో అంతర్గతంగా అనుసంధానమై ఉన్న దృష్ట్యా ఎన్‌బీఎఫ్‌సీల ఆస్తుల నాణ్యతను సమీక్షించడం తప్పనిసరి అని ఉర్జిత్ పటేల్ ఉద్ఘాటించారు. సామాజిక రంగ అవసరాలు, క్యాపిటల్ మార్కెట్ల నుంచి నిధులు సమీకరించుకోలేకపోవడం వంటి అంశాల వల్ల ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ప్రభుత్వ వాటా పెరిగిందని చెప్పారు. ద్రవ్య పరమైన ఒత్తిళ్లు ఉన్నప్పటికీ ప్రభుత్వం నుంచి నిధుల సాయం పెరిగినట్టు తెలిపారు. ఇక ప్రభుత్వ రంగ బ్యాంకుల మధ్య స్థిరీకరణకు బలవంతం చేయడంపైనా పటేల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. బలహీన బ్యాంకులను విలీనం చేసుకునే బ్యాంకుల విలువ హరించుకుపోతుందన్నారు. ఎల్ఐసీతో కొనుగోలు చేయించిన ఐడీబీఐ బ్యాంకును చాలా సమస్యాత్మక బ్యాంకుగా అభివర్ణించారు. బ్యాంకులకు అడ్డంకులు తొలగాలి: రఘురామ్ రాజన్ న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులకు (పీఎస్బీ) కొన్ని అడ్డంకులు ఉన్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ పేర్కొన్నారు. ఈ అడ్డంకులు తొలగితే, ఆయా బ్యాంకులు మరింత సమర్థవంతంగా పనిచేయగలుగుతాయని ఆయన పేర్కొన్నారు. ప్రత్యేకించి ప్రభుత్వపరమైన నియంత్రణలు కొంత తగ్గాల్సి ఉందని రాజన్ అభిప్రాయపడ్డారు. అయితే మెజారిటీ వాటాలు ప్రభుత్వానికి ఉన్నంతవరకూ ఇది సాధ్యం కాదనీ అభిప్రాయపడ్డారు. ప్రైవేటీకరణే అన్నింటికీ మందన్న అభిప్రాయం కొన్ని చోట్ల నుంచి వ్యక్తమవుతున్నప్పటికీ, కేవలం ఇదే సరైనదని భావించకూడదన్నారు. తనకు తెలిసి కొన్ని ప్రైవేటు రంగ బ్యాంకుల నిర్వహణ కూడా పేలవంగానే ఉందని అన్నారు. తక్కువ నైపుణ్యం అవసరమైన ఉద్యోగాలకు ప్రైవేటు రంగంకన్నా ఎక్కువగాను .. సీనియర్ మేనేజ్మెంట్ స్థాయిల్లో ఉన్న ఉద్యోగులకు తక్కువగాను వేతనాలు చెల్లిస్తుండటం, ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాలను తూచా తప్పకుండా అనుమతించాల్సిన పరిస్థితులు ఉండటం వంటివి పీఎస్‌బీల పనితీరుపై ప్రభావం చూపుతున్నాయని ఆయన తెలిపారు. ‘ప్రస్తుత ఆర్థిక వ్యవస్థకు కావాల్సింది ఏమిటి?‘ అన్న ఒక పుస్తకంలో ఈ మేరకు రాజన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆర్థిక వేత్తలు అభిజిత్ బెనర్జీ, గీతా గోపీనాథ్, మిహిర్ ఎస్ శర్మ కూడా ఈ పుస్తకంలో తమ విశ్లేషణలు చేశారు. -
పార్లమెంటులో ‘బిజినెస్’
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పనితీరు పట్ల అసంతృప్తి లేదని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ పేర్కొన్నారు. లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిస్తూ ఈ విషయం చెప్పారు. ‘‘ఇటీవలి కాలంలో ఆర్బీఐ పర్యవేక్షణ, నియంత్రణ గణనీయంగా మెరుగుపడింది. పటిష్టమయ్యింది’’ అంటూ ఇటీవల అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) ఇచ్చిన ఒక నివేదికను కూడా ఆర్థికమంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఆర్బీఐ నియంత్రణలో ఉన్న రూ.9 లక్షల కోట్లకు పైగా నిధుల్లో భారీ మొత్తాన్ని ప్రభుత్వం కోరుతోందని, దిద్దుబాటు చర్యల చట్రంలో ఉన్న 11 బ్యాంకుల్లో కొన్నింటిపై నియంత్రణలు ఎత్తివేయాలని ఒత్తిడితెస్తోందని వస్తున్న వార్తల నేపథ్యంలో ఈ నెలారంభంలో ఆర్బీఐ గవర్నర్‌గా ఉర్జిత్ పటేల్ రాజీనామా చేయటం తెలిసిందే. కొత్త గవర్నర్‌గా శక్తికాంతదాస్ నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో జైట్లీ తాజా సమాధానమిచ్చారు. -
35,540 దిగువన డౌన్‌ట్రెండ్
మూడు ఉత్తరాది రాష్ట్రాల్లో ఎన్డీఏ ఓటమిచెందడం, రిజర్వుబ్యాంక్ గవర్నర్ ఉర్జిత్పటేల్ రాజీనామా, ప్రపంచ మార్కెట్లలో అమ్మకాలు వంటి పలు ప్రతికూలాంశాల నడుమ వరుసగా ఏడురోజులపాటు పెద్ద ర్యాలీ జరిపిన భారత్ మార్కెట్...శుక్రవారం అంతర్జాతీయ ట్రెండ్‌కు తలొగ్గింది. అమెరికా మార్కెట్లయితే ఊపిరి పీల్చుకోకుండా పడుతున్నాయి. జపాన్‌లో సైతం ఇదే తంతు. గత శుక్రవారం అమెరికా మార్కెట్లో ట్రేడింగ్ పరిమాణం రెట్టింపయ్యింది. అక్కడ ఇదే ట్రెండ్ కొనసాగితే ఇండియాతో సహా ప్రపంచ ఈక్విటీ మార్కెట్లన్నీ తీవ్రమైన బేర్కక్ష్యలోకి మళ్లే ప్రమాదం వుంటుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. డిసెంబర్ రెండోవారం నుంచి విదేశీ, స్వదేశీ ఫండ్స్ మన మార్కెట్లో తీసుకున్న భారీ లాంగ్ పొజిషన్లను జనవరికి రోలోవర్ చేస్తారా లేదా వారి పొజిషన్లను పూర్తిగా ఆఫ్‌లోడ్ చేస్తారా అనే అంశం ఇక్కడ కీలకం. సెన్సెక్స్ సాంకేతికాలు... డిసెంబర్ 21తో ముగిసిన వారంలో గత మార్కెట్ పంచాంగంలో ప్రస్తావించిన 35,800 మద్దతును పరిరక్షించుకుని వేగంగా 36,555 గరిష్టస్థాయివరకూ పెరిగిన బీఎస్ఈ సెన్సెక్స్ శుక్రవారం భారీ పతనాన్ని చవిచూసి 35,695 కనిష్టస్థాయికి పడిపోయింది. చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 221 పాయింట్ల నష్టంతో 35,742 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం సెన్సెక్స్‌కు 200 రోజుల చలనసగటు రేఖ (200 డీఎంఏ) కదులుతున్న 35,540 పాయింట్ల స్థాయి కీలకం. ఈ స్థాయి దిగువన సోమవారం గ్యాప్‌డౌన్‌తో మార్కెట్ మొదలైతే వేగంగా 35,445 పాయింట్ల స్థాయికి పడిపోవొచ్చు. ఈ లోపున 50 డీఎంఏ రేఖ చలిస్తున్న 35,175 పాయింట్ల వరకూ సెన్సెక్స్‌కు సాంకేతిక మద్దతు ఏదీ లేదు. ఈ లోపున ముగిస్తే 34,420 పాయింట్ల స్థాయిని పరీక్షించవచ్చు. ఈ వారం తొలి మద్దతుస్థాయిని పరిరక్షించుకోగలిగితే 36,050 పాయింట్ల వరకూ పెరగవచ్చు. అటుపైన 36,200 పాయింట్ల స్థాయిని అందుకునే వీలుంటుంది. ఆపైన ముగింపు..సెన్సెక్స్‌ను 36,480 పాయింట్ల స్థాయికి చేర్చవచ్చు. 10,765 దిగువన నిఫ్టీ బలహీనం గతవారం ప్రథమార్ధంలో 10,985 పాయింట్ల వరకూ పెరిగిన ఎన్ఎస్ఈ నిఫ్టీ ద్వితీయార్థంలో 10,738 పాయింట్ల స్థాయికి పతనమయ్యింది. చివరకు అంతక్రితంవారంకంటే 51 పాయింట్ల లాభంతో 10,754 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 200 డీఎంఏ రేఖ 10,765 పాయింట్ల వద్ద కదులుతున్నది. ఈ రేఖ ఎగువకు గత నెలరోజుల్లో రెండోదఫా నిఫ్టీ చేరినప్పటికీ, ఈ రెండు సందర్భాల్లో ఆపైన నిలదొక్కుకోలేకపోయింది. ఈ కీలక స్థాయి దిగువన నిఫ్టీ తిరిగి డౌన్‌ట్రెండ్‌లోకి జారుకునే ప్రమాదం వుంది. ఈ స్థాయి దిగువన సోమవారం నిఫ్టీ మొదలైతే వేగంగా 10,650 పాయింట్ల స్థాయికి తగ్గవచ్చు. ఆ లోపున 50 డీఎంఏ రేఖ సంచరిస్తున్న 10,565 పాయింట్ల వద్దకు పతనం కావచ్చు. ఈ స్థాయిని సైతం కోల్పోతే 10,330 పాయింట్ల వరకూ క్షీణత కొనసాగవచ్చు. ఈ వారం నిఫ్టీ 10,765 పాయింట్ల స్థాయి ఎగువన స్థిరపడితే 10,820 వరకూ పెరగవచ్చు. అటుపై 10,880 పాయింట్ల స్థాయిని అందుకోవచ్చు. ఆపైన కీలక అవరోధస్థాయి 10,965 పాయింట్లు. -
భార్య, భర్తల అనుబంధంలా ఉండాలి
రిజర్వ్ బ్యాంక్, ప్రభుత్వం మధ్య సంబంధాలు భార్య, భర్తల మధ్య అనుబంధంలాగా ఉండాలని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అభిప్రాయపడ్డారు. ఏవైనా భేదాభిప్రాయాలు వస్తే.. ఇరు పక్షాలు సామరస్యంగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్రం, ఆర్బీఐ మధ్య విభేదాలతో ఉర్జిత్ పటేల్ ఆర్బీఐ గవర్నర్ పదవికి రాజీనామా చేశారన్న విమర్శల నేపథ్యంలో మన్మోహన్ సింగ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ’చేంజింగ్ ఇండియా’ పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మన్మోహన్ సింగ్ ఈ విషయాలు చెప్పారు. ఆర్బీఐ స్వయంప్రతిపత్తిని, స్వతంత్రతను గౌరవించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఇటు కేంద్రంతో కలిసి పనిచేస్తూనే అటు పటిష్టంగా, స్వతంత్రంగా కూడా పనిచేసేలా ఉండాలని చెప్పారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో ఏర్పాటైన కొత్త ప్రభుత్వాల రైతు రుణ మాఫీ పథకాలపై స్పందిస్తూ.. ఎన్నికల మేనిఫెస్టోలో హామీలిచ్చిన పక్షంలో తప్పక నెరవేర్చాల్సి ఉంటుందన్నారు. -
ఉర్జిత్ రాజీనామా కోరలేదు..
న్యూఢిల్లీ: ఆర్బీఐ గవర్నర్ పదవికి రాజీనామా చేయాలని ఉర్జిత్ పటేల్‌ను ప్రభుత్వం కోరలేదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. జవహర్లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ ప్రధానులుగా ఉన్న సమయంలోను, యశ్వంత్ సిన్హా ఆర్థిక మంత్రిగా పనిచేసిన సమయంలోనూ సెంట్రల్ బ్యాంకు గవర్నర్ల రాజీనామాలను జైట్లీ ప్రస్తావించారు. వివిధ రంగాల్లో నెలకొన్న నిధుల కొరత (లిక్విడిటీ సమస్య), ఇతర అంశాలను ఆర్బీఐ పరిష్కరించాలని మాత్రం తాము కోరామని చెప్పారు. దాన్ని సమర్థించుకున్నారు కూడా. ప్రభుత్వంతో పలు అంశాలపై విభేదాలతో ఉర్జిత్ పటేల్ ఆర్బీఐ గవర్నర్ పదవికి ఈ నెల 11న రాజీనామా చేయటం తెలిసిందే. ప్రభుత్వ ఒత్తిడులే దీనికి దారితీసినట్టు ప్రతిపక్షాలు, ఆర్థికవేత్తల నుంచి మోదీ సర్కారు విమర్శలను కూడా ఎదుర్కొంది. దీనిపై ఓ టీవీ చానల్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా జైట్లీ స్పందించారు. ప్రభుత్వానికి ఆందోళన కలిగిస్తున్న పలు అంశాలపై చర్చ కోసం ఆర్బీఐ గవర్నర్‌కు కేంద్రం ఆదేశించే నిబంధనను ప్రభుత్వం ఉపయోగించిన విషయాన్ని ప్రస్తావించారు. ‘‘ఆ తర్వాత రెండు బోర్డు సమావేశాలూ సుహృద్భావపూర్వకంగా జరిగాయి. మూడు నాలుగు అంశాలపై నిర్ణయం జరిగింది. కొన్నింటిపై మాత్రం నిర్ణయం తీసుకోలేదు. ఆర్బీఐ వద్దనున్న రూ.9 లక్షల కోట్లకు పైగా నిధుల్లో కొంత మేర తగ్గించుకునే విషయాన్ని నిపుణుల కమిటీ మరికొన్ని రోజుల్లో తేల్చనుంది’’ అని జైట్లీ వివరించారు. ఈ అంశాలను పరిష్కరించాలని కోర డం ఆర్బీఐ స్వతంత్రత విషయంలో జోక్యం చేసుకోవడంగా పేర్కొనడాన్ని ఆయన తప్పుబట్టారు. ఆర్బీఐ వద్దే అధిక నిధులు ‘‘ప్రపంచ వ్యాప్తంగా చాలా వరకు సెంట్రల్ బ్యాంకులు స్థూల ఆస్తుల్లో 8 శాతాన్నే రిజర్వ్‌లుగా అమలు చేస్తున్నాయి. సంప్రదాయ దేశాల్లో ఇది 13– 14 శాతంగా ఉంది. కానీ, ఆర్బీఐ మాత్రం 28 శాతాన్ని రిజర్వ్‌లుగా కొనసాగిస్తోంది. 2013లో రూ.1.4 లక్షల కోట్లను ఆర్బీఐ అదనంగా ఇవ్వాలని నాటి ప్రభుత్వం కోరింది. కానీ, దీన్ని ఆర్బీఐపై స్వారీ చేయడమని ఎవరూ మాట్లాడలేదు’’ అని జైట్లీ గుర్తుచేశారు. ఆర్బీఐ వద్ద మిగులు నిధులను విడుదల చేస్తే వాటితో ప్రభుత్వరంగ బ్యాంకులకు నిధుల సాయంతోపాటు, పేద ప్రజల సంక్షేమ పథకాలకు వినియోగించే అవకాశం ఉందన్నారు. అంతేకానీ, ఈ నిధులు ద్రవ్యలోటు భర్తీకి, ప్రభుత్వ ఖర్చులకు అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా ప్రభుత్వం ద్రవ్యలోటు లక్ష్యాన్ని కొనసాగిస్తుందని చెప్పారు. ఆర్బీఐ గవర్నర్లుగా పనిచేసిన రఘురామ్ రాజన్, ఉర్జిత్ పటేల్ ఇద్దరితోనూ తనకు సత్సంబంధాలు ఉన్నాయని, పదవుల నుంచి తప్పుకున్న తర్వాత కూడా వారితో అవే స్థాయి సంబంధాలు కొనసాగుతున్నాయని జైట్లీ చెప్పారు. ఐబీసీ, పరిష్కార పథకాల విలీనం తర్వాత రుణ భారంతో ఉన్న కంపెనీల విషయంలో పరిష్కారం కోసం అనుసరిస్తున్న దివాలా అండ్ బ్యాంక్రప్టసీ కోడ్ (ఐబీసీ), ఇతర పరిష్కార పథకాలను ఒక్కటి చేయడాన్ని భవిష్యత్తులో పరిశీలిస్తామని జెట్లీ చెప్పారు. ‘‘పరిష్కారం కోసం పెద్ద ఎత్తున కంపెనీలు ఎన్సీఎల్టీ ముందుకొస్తున్నాయి. వచ్చే కొన్ని సంవత్సరాల్లో ఈ రద్దీ తగ్గి.. వ్యాపారాలు సాధారణ స్థితికి వస్తే అప్పుడు పునరాలోచిస్తాం. నిజాయతీతో కూడిన రుణదాత, రుణ గ్రహీత అనుబంధం ఐబీసీ కారణంగా ఎర్పడాల్సి ఉంది. అప్పుడే ఐబీసీ, ఇతర పథకాలను ఒక్కటి చేయడమన్న పరిస్థితి ఏదురవుతుంది’’ అని ఆర్థిక మంత్రి వివరించారు. రుణ బకాయిల పరిష్కారం, పునరుద్ధరణకు సంబంధించి ఆర్బీఐ పథకాలతో పెద్దగా ఫలితాలు రాలేదన్నారు. ఆర్బీఐ అందరితో కలిసే పనిచేయాలి... నియంత్రణ సంస్థలకు స్వయం ప్రతిపత్తి ఉన్నప్పటికీ.. ఎవ్వరితో కలవకుండా ఒంటరిగా పనిచేయడం కుదరదని, అందరితో చర్చించే నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని పరోక్షంగా ఆర్బీఐని ఉద్దేశించి జైట్లీ వ్యాఖ్యానించారు. ఆర్థిక వ్యవస్థకు కీలకమైన లిక్విడిటీ మొదలుకుని రుణ వితరణ దాకా పలు విషయాల్లో ఆర్బీఐని చర్చలకు రప్పించేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేసిందని చెప్పారాయన. ఆర్బీఐ, ప్రభుత్వం మధ్య సంబంధాలెప్పుడూ దెబ్బతినలేదని, ప్రధాని నరేంద్ర మోదీ సహా అన్ని స్థాయిల్లోనూ సమావేశాలు సామరస్యంగానే సాగేవని తెలియజేశారు. నిర్దిష్టంగా ఆర్బీఐని ప్రస్తావించకుండా .. నియంత్రణ సంస్థలన్నీ సంబంధిత వర్గాలందరితో చర్చించాల్సిన అవసరం ఉంటుందని, అప్పుడే మార్కెట్ మనోభావాలు తెలుస్తాయని అభిప్రాయపడ్డారు. ఆర్బీఐ గవర్నర్ పదవి నుంచి తప్పుకోవడానికి కొన్నాళ్ల ముందు నుంచి సంక్షోభంలో ఉన్న ఎన్బీఎఫ్సీలు వంటి పరిశ్రమ వర్గాలను కలిసేందుకు ఉర్జిత్ పటేల్ నిరాకరించారన్న వార్తల నేపథ్యంలో జైట్లీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఆర్బీఐని దారికి తెచ్చుకునేందుకు గతంలో ఏ ప్రభుత్వమూ ప్రయోగించని ఆర్బీఐ చట్టంలోని వివాదాస్పద సెక్షన్ 7ని కూడా మోదీ సర్కార్ ప్రయోగించడం తెలిసిందే. -
రిజర్వ్ బ్యాంకుకే ‘కన్నం’ వేస్తున్నారు!
సాక్షి, న్యూఢిల్లీ : అంతర్జాతీయ ఆయిల్ మార్కెట్లో ధరలు తగ్గుముఖం పట్టినప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ ఇంకా అస్తవ్యస్తంగా అగమ్యగోచరంగానే ఉంది. కొత్త ఉద్యోగాల మాట దేవుడెరుగు. ఖాళీ అవుతున్న ఉద్యోగాలే భర్తీ కావడం లేదు. దేశ ఆర్థిక వ్యవస్థకు ఆయువు పట్టయిన చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి. జాతీయ స్థూల ఉత్పత్తిలో (జీడీపీ) ఆర్థిక ద్రవ్యలోటు 3.3 శాతాన్ని మించరాదంటూ కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ ఇప్పటికీ అది 3.6 శాతానికి చేరుకుంది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి అది మరింత పెరిగే ప్రమాదం ఉంది. పరోక్ష పన్నుల వసూళ్లు లక్షిత వసూళ్లకు అంతనంత దూరంలోనే ఉన్నాయి. ఇక జీఎస్టీ వసూళ్లలో లక్ష్యాన్ని అందుకోవాలంటే ఈ డిసెంబర్ నెల నుంచి 2019, మార్చి నెల వరకు 45 శాతం వసూళ్లు జరగాలి. లక్షిత జీఎస్టీ వసూళ్లలో గత ఎనిమిది నెలల్లో జరిగిన వసూళ్లు 55 శాతం అన్నమాట. ఈ నాలుగు నెలల్లో మిగతా 45 శాతం వసూళ్లు చేయడం దాదాపు అసాధ్యం. దేశంలోని 11 భారత ప్రభుత్వరంగ బ్యాంకులు పూర్తిగా దివాలా తీశాయి. వాస్తవానికి వీటిని ఎప్పుడో మూసివేయాలి. కానీ 2017, ఏప్రిల్ ఒకటవ తేదీన తీసుకొచ్చిన ‘ప్రాప్ట్ కరెక్టివ్ ఆక్షన్ (పీఏసీ)’ కింద ఈ బ్యాంకులను నెట్టుకొస్తున్నారు. బ్యాంకింగ్ రంగంలో పేరుకుపోయిన 12 లక్షల కోట్ల రూపాయల మొండి బకాయిల్లో 90 శాతం బకాయిలు ప్రభుత్వరంగ బ్యాంకులవే. ఇప్పటికే కొన్ని ప్రభుత్వరంగ బ్యాంకులను విలీనం చేసినా, నూతన సిబ్బంది నియామకాలను నిలిపివేసినా పరిస్థితి మెరుగుపడలేదు. రుణాల మాఫీ కోసం, సరైన గిట్టుబాటు ధరల కోసం దేశవ్యాప్తంగా రైతులు ఆందోళన చేసినప్పటికీ, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కూడా రైతుల రుణాల మాఫీకి మోదీ ప్రభుత్వం సాహసించలేకపోయిందంటే దేశ ఆర్థిక పరిస్థితి ఎంత దయనీయంగా లేదా దారణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సరిగ్గా ఇలాంటి పరిస్థితుల్లోనే వచ్చే ఏడాది, అంటే 2019, మేలోగా సార్వత్రిక ఎన్నికలు వస్తున్నాయి. ఇప్పటి వరకు మార్కెట్కుగానీ, వినియోగదారుడికిగానీ నగదు కొరత రాలేదు. దేశ ఆర్థిక పరిస్థితి ఇలాగే ఉంటే సరిగ్గా ఎన్నికల సమయానికి నగదు కొరత పరిస్థితి కూడా వస్తుంది. అందుకనే నరేంద్ర మోదీ ప్రభుత్వం భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) రిజర్వ్ నిధుల మీద కన్నేసింది. రిజర్వ్ బ్యాంక్ వద్ద రిజర్వ్ నిధులు 9.6 లక్షల కోట్ల రూపాయలు ఉండగా, ఆపధర్మ నిధి కింద 3.6 లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి. ఏ ప్రభుత్వానికి ఇవ్వలేదు దేశంలోని బంగారం, ఫారెక్స్ నిల్వలు పడిపోయినప్పుడల్లా వాటి నిర్దేశిత స్థాయిని కొనసాగించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఈ రిజర్వ్ నిధులను విడుదల చేస్తుంది. ఇక ఆపధర్మ నిధిని అనుకోకుండా భవిష్యత్తులో వచ్చే అవసరాల కోసం వాడాలని ఏర్పాటు చేసుకొంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక 1949లో రిజర్వ్ బ్యాంకును జాతీయం చేయగా, ఈ ఆపధర్మ నిధిని 1950లో ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కేంద్రంలో ఎన్నో ప్రభుత్వాలు మారినా ఏ ప్రభుత్వం కూడా ఆపధర్మ నిధులను అడగలేదు. ఆర్బీఐ ఇవ్వలేదు. ఉర్జిత్ పటేల్‌పై అదే ఒత్తిడి ఆర్బీఐ ఆపధర్మ నిధి నుంచి మూడు లక్షల కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వానికి అప్పగించాల్సిందిగా నరేంద్ర మోదీ ప్రభుత్వం గతకొంత కాలం నుంచి మొన్నటివరకు ఆర్బీఐ గవర్నర్‌గా ఉన్న ఉర్జిత్ పటేల్‌పై ఒత్తిడి చేస్తూ వచ్చింది. తమ మాట వినకపోతే ఆర్బీఐ చట్టంలోని ఏడో షెడ్యూల్ కింద ప్రభుత్వం స్వయంగా జోక్యం చేసుకోవాల్సి వస్తుందని కూడా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, ఉర్జిత్‌కు హెచ్చరిక కూడా చేశారు. ఆర్బీఐ స్వయం ప్రతిపత్తిని రక్షించడం కోసం గతంలో ఏ ప్రభుత్వం ఈ షెడ్యూల్‌ను ఉపయోగించలేదు. ఈ నేపథ్యంలో ఆర్బీఐ బోర్డు సభ్యులు రెండు, మూడు సార్లు సమావేశమై ప్రభుత్వ ప్రతిపాదన గురించి చర్చించారు. ప్రభుత్వానికి సానుకూలంగా నిర్ణయం తీసుకోలేకపోయారు. ఈ నేపథ్యంలోనే ఉర్జిత్ పటేల్ తన పదవికి రాజీనామా చేశారు. కాకపోతే వ్యక్తిగత కారణాలపై రాజీనామా చేస్తున్నానని చెప్పుకున్నారు. మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ పదవీ కాలాన్ని పొడిగించకుండా ఉర్జిత్ పటేల్‌ను కోరి తెచ్చుకున్నందుకు ఆయనకు ఆ మాత్రం కృతజ్ఞత ఉండాల్సిందే. కానీ రెండు లక్షల కోట్ల రూపాయలను ప్రభుత్వానికి ఇచ్చేంత కృతజ్ఞత చూపలేకపోయారు. ఓ ఆర్థిక నిపుణుడిగా దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో ఆయనకు తెలుసు కనుక. కొత్త గవర్నర్ శక్తికాంత దాస్ ఎవరు? ఉర్జిత్ పటేల్ రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో 25వ గవర్నర్‌గా శక్తికాంత దాస్‌ను తీసుకొచ్చారు. ఆయన రఘురామ్ రాజన్, ఉర్జిత్ పటేల్‌లాగా ఆర్థికవేత్త కాదు. కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా పనిచేసిన ఐఏఎస్ ఆఫీసర్. ప్రస్తుత 15వ ఆర్థిక సంఘంలో సభ్యుడిగా కూడా కొనసాగుతున్నారు. ఆర్బీఐ గవర్నర్‌గా ఐఏఎస్ ఆఫీసర్‌ను నియమించడం ఇదే కొత్తకాదు. గతంలో 14 మంది ఐఏఎస్–ఐసీఎస్ ఆఫీసర్లు పనిచేశారు. వారిలో ఎక్కువమంది ఆర్థిక వేత్తలే. 1990లో ఎస్. వెంకటరామన్ తర్వాత చదువురీత్యా ఆర్థిక వేత్తకానీ వ్యక్తిని తీసుకరావడం ఇదే మొదటిసారి. కొత్త గవర్నర్ ప్రభుత్వం మాట వింటారా? అక్షరాలా వింటారు. ఎందుకంటే పెద్ద నోట్లను రద్దు చేయడం వల్ల ఏర్పడిన సంక్షోభంలో ఎప్పటికప్పుడు కేంద్ర ఆర్థిక కార్యదర్శిగా మీడియా ముందుకు వచ్చి ప్రభుత్వ నిర్ణయాలన్నింటినీ అడుగడుగున సమర్థిస్తూ వచ్చిందీ ఈ శక్తికాంత దాసే. అయినా ఆయన ఇప్పటికీ పెద్ద నోట్లను రద్దు చేయడం తప్పుకాదంటారు. అసలేం అవుతుంది ? మోదీ ప్రభుత్వం ఇప్పుడు ఆర్బీఐని దేవురించాల్సిన పరిస్థితి రావడానికి ప్రధాన కారణం పెద్ద నోట్ల రద్దు, ఆ తర్వాత తెచ్చిన జీఎస్టీనే. ఈ విషయాన్ని మోదీ ప్రభుత్వం ఎప్పటికీ అంగీకరించదు. పెద్ద నోట్ల రద్దు సందర్భంగా మోదీ పక్షాన నిలిచిన శక్తికాంత దాస్, ఇప్పుడు కూడా ఆయన పక్షానే నిలిచి సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రెండు, మూడు రోజుల్లోనే ఈ నిర్ణయం వెలువడవచ్చు! ఆ నిర్ణయం వల్ల 2019 సార్వత్రిక ఎన్నికల్లో మోదీ పార్టీ గట్టెక్కవచ్చు. కానీ ఐదేళ్లకాలంలోనే జింబాబ్వే, అర్జెంటీనా, వెనిజులాలో తలెత్తిన ఆర్థిక, సామాజిక, రాజకీయ సంక్షోభాలు భారత్‌కు కూడా తప్పకపోవచ్చు. ఆ మూడు దేశాల్లో ఆర్థిక వ్యవస్థను సరిదిద్దేందుకు ప్రభుత్వాలు సెంట్రల్ బ్యాంకులను (మన రిజర్వ్ బ్యాంక్‌కు సమానం) స్వాధీనం చేసుకున్న పర్యవసానంగా సామాజిక, రాజకీయ సంక్షోభాలు తలెత్తాయి. -
మొండి బకాయిలు వసూలు కావు... జాగ్రత్త
న్యూఢిల్లీ: ఉర్జిత్ పటేల్ ఆకస్మిక రాజీనామా... ఆర్బీఐ విధానాల ప్రాధాన్యతల విషయంలో ఉన్న రిస్క్‌ను తెలియజేస్తోందని రేటింగ్ సంస్థ ఫిచ్ పేర్కొంది. కేంద్ర బ్యాంకులో ప్రభుత్వ జోక్యం పెరగడాన్ని ఇది తెలియజేస్తోందని, మొండి బకాయిల పరిష్కారానికి ఆర్బీఐ చేస్తున్న ప్రయత్నాలకు దీనివల్ల విఘాతం కలుగుతుందని అభిప్రాయపడింది. పటేల్ రాజీనామా కారణంగా ఏర్పడే సమస్యలన్నవి కొత్తగా వచ్చిన శక్తికాంత దాస్ సారథ్యంలో తీసుకునే నిర్ణయాల ఆధారంగా తేటతెల్లం అవుతాయని పేర్కొంది. ‘‘వృద్ధిని వేగవంతం చేయాలంటూ ప్రభుత్వం నుంచి ఎంతో కాలంగా వచ్చిన ఒత్తిళ్ల తర్వాతే ఆర్బీఐ గవర్నర్ రాజీనామా చేయడం జరిగింది. ఇది ఆర్బీఐ విధాన ప్రాధాన్యతల రిస్క్‌ను తెలియజేస్తోంది. మొండి బకాయిల పరిష్కారానికి ఆర్బీఐ చేపడుతున్న చర్యలు దీర్ఘకాలంలో బ్యాంకింగ్ రంగ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ద్రవ్యోల్బణం నియంత్రణకు కట్టుబడి ఉండటం అన్నది మరింత స్థిరమైన స్థూల ఆర్థిక వాతావరణానికి కారణం అవుతుంది. ఆర్బీఐలో ప్రభుత్వ జోక్యం పెరిగితే అది ప్రగతికి విఘాతం కలిగిస్తుంది’’ అని ఫిచ్ వివరించింది. దీర్ఘకాలంగా ఉన్న ఎన్పీఏల పరిష్కారానికి తీసుకుంటున్న చర్యల విషయంలో వెనక్కి తగ్గితే అది ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని పేర్కొంది. వచ్చే ఏడాది సాధారణ ఎన్నికల దృష్ట్యా ఆర్బీఐ విధానాలను మరింత ప్రోత్సహించడం ప్రభుత్వానికి రాజకీయ ప్రోత్సాహకం అవుతుందని అభిప్రాయపడింది. -
ఆర్బీఐకి ‘శక్తి’ కాంత్!
న్యూఢిల్లీ : బ్యాంకింగ్ నియంత్రణ సంస్థ– రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) 25వ గవర్నర్‌గా శక్తికాంత దాస్ నియమితులయ్యారు. ఆర్థిక వ్యవహారాల్లో అపార అనుభవం ఉన్న ఈ 1980 బ్యాచ్ ఐఏఎస్ అధికారి... ఇప్పటిదాకా ఆర్థిక రంగానికి సంబంధించిన పలు కీలక పదవులు నిర్వహించారు. తమిళనాడు కేడర్‌కు చెందిన ఈ ఐఏఎస్ అధికారి స్వరాష్ట్రం ఒడిశా. ఆ రాష్ట్రం నుంచి తొలిసారి ఈ బాధ్యతలు చేపడుతున్నది కూడా ఈయనే. పెద్ద నోట్ల రద్దు, వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వంటి వ్యవహారాల్లో ఆరంభంలో ఎదురైన పలు సవాళ్లను అధిగమించడంలో కీలక పాత్ర పోషించారు. వ్యక్తిగత కారణాలతో గవర్నర్ బాధ్యతలకు రాజీనామా చేస్తున్నట్లు ఉర్జిత్ పటేల్ ప్రకటించిన మరుసటి రోజే కేంద్రం ఈ కీలక పదవికి 61 సంవత్సరాల దాస్ పేరును ప్రకటించడం గమనార్హం. మూడేళ్లు ఆయన ఈ బాధ్యతల్లో కొనసాగుతారని అధికారిక ఉత్తర్వుల్లో ప్రభుత్వం తెలియజేసింది. నిజానికి ఒక బ్యూరోక్రాట్‌కు సెంట్రల్ బ్యాంక్ చీఫ్ బాధ్యతలు అప్పగించటం ఐదేళ్లలో ఇదే తొలిసారి. అంతకు ముందు ఐఏఎస్ అధికారి దువ్వూరి సుబ్బారావు ఈ బాధ్యతలు నిర్వహించారు. ఆయన తరవాత మూడేళ్లపాటు రఘురామ్ రాజన్, రెండేళ్లకు పైగా ఉర్జిత్ పటేల్ ఈ పదవిలో కొనసాగటం తెలిసిందే. ‘తాత్కాలికం’ అంచనాలకు భిన్నంగా... నిజానికి పటేల్ రాజీనామా నేపథ్యంలో– ఈ బాధ్యతలకు తాత్కాలికంగా ఎవరో ఒకరిని నియమిస్తారని అంతా భావించారు. అయితే ఇందుకు భిన్నంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని నియామక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ దాస్‌ను మూడేళ్ల కాలానికి ఎంచుకోవడం గమనార్హం. డాక్టర్ ఉర్జిత్ పటేల్ రాజీనామాను కేంద్రం ఆమోదించిందని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ట్వీట్ చేసిన కొద్ది గంటల్లోనే తాజా నియామకానికి సంబంధించిన ప్రకటన వెలువడింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి శక్తికాంత దాస్‌కు విశేష అనుభవం ఉందని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి ఎ.ఎస్.ఝా పేర్కొన్నారు. ఐఏఎస్ నుంచి ఆర్బీఐ గవర్నర్ వరకూ... దాస్ 1980 బ్యాచ్ తమిళనాడు కేడర్ ఐఏఎస్ అధికారి. నార్త్‌బ్లాక్‌లో నిర్వహించిన బాధ్యతల్లో పరిపూర్ణత ఆయనను మింట్ స్ట్రీట్ వరకూ నడిపించిందని చెప్పవచ్చు. 38 సంవత్సరాల కెరీర్లో ప్రతి సందర్భంలోనూ శక్తికాంత దాస్... వివాద రహిత ధోరణి కలిగిన వ్యక్తిగా, కీలక అంశాల్లో ఏకాభిప్రాయ సాధనలో విజయం సాధించే నేర్పరిగా ప్రత్యేకత సాధించారు. 2017 మేలో ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శిగా పదవీ విరమణ చేశారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ వంటి అంశాలు సహా భారత ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొన్న ఆటుపోట్లను పరిష్కరించటంలో కీలక పాత్రను పోషించారు. ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా బాధ్యతల నుంచి తప్పుకొన్న తర్వాత... భారత్‌లో జీ–20 సమావేశాల నిర్వహణ బాధ్యతలను కేంద్రం ఆయనకు అప్పగించింది. 15వ ఆర్థిక సంఘం సభ్యుడిగా కూడా ఆయన నియమితులయ్యారు. ఢిల్లీలోని ప్రతిష్టాత్మక సెయింట్ స్టీఫెన్స్ కళాశాల నుంచి చరిత్రలో పట్టభద్రులయిన శక్తికాంత దాస్... 2008లో పి.చిదంబరం ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, తొలిసారి ఆర్థిక శాఖ జాయింట్ సెక్రటరీగా నియమితులయ్యారు. తదుపరి 2014 మధ్యలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో అధికారం చేపట్టాక ఆర్థిక మంత్రిత్వ శాఖలో ఆయన కీలక బాధ్యతలు ప్రారంభమయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం రెవెన్యూ శాఖ పగ్గాలను ఆయనకు అప్పగించింది. అటు తర్వాత ఆర్బీఐ, ద్రవ్య పరపతి విధానంతో ప్రత్యక్ష సంబంధాలు నెరపే ఆర్థిక వ్యవహారాల శాఖ బాధ్యతలు చేపట్టారు. కేంద్ర బడ్జెట్ రూపకల్పనల్లో పలు సంవత్సరాలు ఆయన ముఖ్య భూమిక వహించారు. ఈ నియామకం హర్షణీయం ఆర్బీఐ చీఫ్‌గా శక్తికాంత్‌దాస్ నియామకం హర్షణీయం. అంతర్జాతీయంగా, దేశీయంగా ఆర్థిక వ్యవహారాల్లో అపార అనుభవం ఉన్న వ్యక్తి నియామకం ఆర్బీఐ ప్రతిష్టను ఇనుమడింపజేస్తుందని భావిస్తున్నాం. కీలక కూడలిలో ఉన్న భారత్ ఆర్థిక వ్యవస్థకు తాజా నియామకం లాభిస్తుందని విశ్వసిస్తున్నాం. – రాకేశ్ షా, ఫిక్కీ ప్రెసిడెంట్ ఫైనాన్షియల్ మార్కెట్లకు ప్రయోజనం ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. ఈ నియామకం ఫైనాన్షియల్ మార్కెట్లకు ఎంతో ప్రయోజనాన్ని కల్పిస్తుంది. ద్రవ్య, వాణిజ్య పరమైన అంశాల్లో దాస్‌కు విశేష అనుభవం ఉండడమే దీనికి కారణం. దేశీయ, అంతర్జాతీయ ఆర్థిక విధానాల రూపకల్పనలోనూ ఈ నియామకం సానుకూల ఫలితాన్ని ఇస్తుందని ఆశిస్తున్నాం. – రజనీష్ కుమార్, ఎస్బీఐ చైర్మన్ గొప్ప నిర్ణయం దాస్‌కు నా శుభాకాంక్షలు. ఆయన నాకు కళాశాల రోజుల నుంచీ తెలుసు. అత్యంత ప్రతిభా పాటవాలు కలిగిన, పరిపక్వత కలిగిన అధికారి ఆయన. గొప్ప టీమ్ లీడర్. ఏకాభిప్రాయ సాధనలో ఆయనకు ఆయనే సాటి. ఆర్థికాభివృద్ధిలో, ఆర్బీఐ స్వతంత్య్రత, ప్రతిష్టలను కాపాడ్డంలో ఆయన కీలక పాత్ర పోషిస్తారు. – అమితాబ్‌కాంత్, నీతీ ఆయోగ్ సీఈఓ లిక్విడిటీ సమస్యల పరిష్కారం కొత్త గవర్నర్ దాస్ లిక్విడిటీ (ద్రవ్య లభ్యత) సమస్యలను పరిష్కరిస్తారన్న విశ్వాసం ఉంది. పరిశ్రమల సెంటిమెంట్‌కు ఈ నియామకం బలాన్నిస్తుంది. దాస్ అపార ఆర్థిక అనుభవం కలిగినవారు. పలు వ్యవహారాల సున్నిత పరిష్కారానికి, స్థిరత్వానికి ఆయన నియామకం దోహదపడుతుంది. బ్యాంకింగ్, నాన్–బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగాల్లో లిక్విడిటీ సమస్యలు తొలగిపోతాయని భావిస్తున్నాం. – రాకేష్ భారతీ మిట్టల్, సీఐఐ ప్రెసిడెంట్ 14న బోర్డ్ భేటీ యథాతథం ఈ నెల 14వ తేదీన యథాతథంగానే ఆర్బీఐ బోర్డ్ సమావేశం జరుగుతుందని ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ స్పష్టం చేశారు. ఆర్బీఐలో దిద్దుబాటు చర్యల చట్రంలో ఉన్న 11 బ్యాంకుల్లో కొన్నింటికి సడలింపులు వంటి కీలక అంశాలపై 14 మంది బోర్డ్ సభ్యులు ఈ భేటీలో చర్చిస్తారు. దాస్ నియామకాన్ని తప్పుపట్టిన ఆర్థికవేత్త అభిజిత్ ముఖర్జీ .. రిటైర్డ్ బ్యూరోక్రాట్ శక్తికాంత్ దాస్‌ను ఆర్బీఐ గవర్నర్‌గా ప్రభుత్వం నియమించడాన్ని ప్రముఖ ఆర్థిక వేత్త, మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) ప్రొఫెసర్ అభిజిత్ ముఖర్జీ తప్పుపట్టారు. దీనివల్ల కీలకమైన ప్రభుత్వ సంస్థల్లో గవర్నెన్స్‌పరమైన అంశాలపై సందేహాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. విశ్వసనీయతను పునరుద్ధరించాలి ఉర్జిత్ పటేల్ స్థానంలో నియమితులైన వ్యక్తి అత్యున్నత సంస్థ విశ్వసనీయతను, స్వతంత్రతను పునరుద్ధరించాలి. రాజీనామా చేయాల్సిన తప్పనిసరి పరిస్థితుల్లోనే ఉర్జిత్ పటేల్ ఆ నిర్ణయాన్ని తీసుకున్నట్లు కనబడుతోంది. పటేల్ రాజీనామా నేపథ్యంలో– ఈ అంశంపై కేంద్రం కూడా ఆత్మావలోకన చేసుకోవాలి. జోక్యం ఏ స్థాయిలో అవసరం, పరిమితులేమిటి? వంటి అంశాల్లో కేంద్రం పరిపక్వత కలిగి ఉంటుందని విశ్వసిస్తున్నా. – దువ్వూరి సుబ్బారావు, ఆర్బీఐ మాజీ గవర్నర్ -
ఉర్జిత్ బాంబు : దలాల్‌స్ట్రీట్ ఢమాల్
సాక్షి, ముంబై: దేశీయ స్టాకమార్కెట్లు సెన్సెక్స్ 713, నిఫ్టీ 205 పతనమైన కీలక సూచీలు మంగళవారం మరింత కుదేలయ్యాయి. మంగళవారం అదే ధోరణిని కొనసాగిస్తూ సెన్సెక్స్ 350, పాయింట్లు, నిఫ్టీ 127 పాయింట్లు పతనమై ట్రేడ్ అవుతున్నాయి. ఒకవైపు అంతర్జాతీయ పరిణామాలు, మరోవైపు దేశంలో అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు. దీనికి తోడు దేశ కేంద్ర బ్యాంకులో చోటు చేసుకున్న దిగ్భ్రాంతికర పరిణామం వెరసి దలాల్ స్ట్రీట్‌లో అమ్మకాల సెగ రేగింది. ఆర్బీఐ స్వయం ప్రతిపత్తి, ప్రభుత్వ పెత్తనమంటూ భారీ బాంబు పేల్చిన ఆర్బీఐ గవర్నర్ డా. ఉర్జిత్ పటేల్ నిశ్శబ్ద నిష్క్రమణ ఇన్వెస్టర్లును భారీగా నిరాశపర్చింది. దాదాపు అన్ని రంగాలూ నష్టాల్లోనే. అటు దేశీయ రుపాయి కరెన్సీ కూడా భారీ నష్టాలతో ప్రారంభమైంది. డాలరుమారకంలో ఏకంగా రూపాయికిపైగా పతనమైన 72.35 స్థాయి వద్ద ట్రేడ్ అవుతోంది. మరోవైపు రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ఘడ్, మిజోరం, తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉత్కంఠ రేపుతోంది. -
నేటి నుంచి పార్లమెంటు సమావేశాలు
న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలకు సర్వం సిద్ధమైంది. నేటి నుంచి వచ్చే ఏడాది జనవరి 8 వరకూ ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా మంగళవారం వెలువడనున్న నేపథ్యంలో సమావేశాలు వాడీవేడిగా సాగనున్నాయి. ఈ సమావేశాల్లో ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ రాజీనామా, సీబీఐలో అంతర్గత కుమ్ములాటలు, రఫేల్ ఒప్పందంపై కేంద్రాన్ని ఇరుకున పెట్టేందుకు విపక్షాలు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. అయోధ్యలో రామాలయం నిర్మాణంపై మిత్రపక్షం శివసేన నుంచే బీజేపీకి ఇబ్బందులు ఎదురుకానున్నాయి. మరోవైపు అగస్టా కుంభకోణం కేసులో మధ్యవర్తి మిషెల్‌ను దుబాయ్ నుంచి భారత్‌కు తీసుకురావడం, విజయ్‌మాల్యా అప్పగింతపై బ్రిటన్ కోర్టు తీర్పును ఈ సమావేశాల్లో ఎన్డీయే ప్రధా న అస్త్రంగా వాడుకోనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ట్రిపుల్ తలాక్, నేషనల్ కమిషన్ ఫర్ హోమియోపతి తదితర 45 కీలక బిల్లులను ఈ సమావేశాల్లోనే ఆమోదింపజేసుకోవాలని కేంద్రం కృతనిశ్చయంతో ఉంది. -
ఉర్జిత్ నిష్క్రమణ!
‘‘మేం డేగలమూ కాదు, పావురాళ్లమూ కాదు... గుడ్లగూబలం. అది జ్ఞానానికీ, వివేకానికీ చిహ్న మని మీకు తెలుసు కదా’’ అని నాలుగేళ్లక్రితం ఒక సందర్భంలో రిజర్వ్‌బ్యాంక్(ఆర్బీఐ) గవర్నర్ ఉర్జిత్ పటేల్ చమత్కరించారు. అప్పటికాయన డిప్యూటీ గవర్నర్‌గా ఉంటున్నారు. గుడ్లగూబ ఇంటిపై వాలినా, దాని అరుపు వినబడినా అరిష్టమని కొందరి నమ్మకం. దాని సంగతలా ఉంచి ఎన్డీఏ ప్రభుత్వానికి తనపై ఎలాంటి అభిప్రాయముందో గ్రహించుకుని ఉర్జిత్ పటేల్ సోమవారం గవర్నర్ పదవినుంచి వైదొలగారు. ‘వ్యక్తిగత కారణాలతో’ నిష్క్రమిస్తున్నట్టు ఆయన ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ మొదలుకొని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ, రిజర్వ్‌బ్యాంక్ డైరెక్టర్ల బోర్డు సభ్యుడు గురుమూర్తి వరకూ ఆర్బీఐ గవర్నర్‌గా ఆయన అందించిన సేవలను, ఆయన నిజాయితీని, నిపుణతను ప్రస్తుతిస్తూ ట్వీట్లు చేశారు. ఇంతగా ప్రశంసలందుకున్నారు గనుక పదవుల నుంచి తప్పుకుంటున్న కొందరు రాస్తున్నట్టు గవర్నర్‌గా తన అనుభవాలను ఆయన మున్ముందు గ్రంథస్తం చేస్తారో లేదో చూడాల్సి ఉంది. ఈమధ్య కాలంలో ఉర్జిత్కూ, కేంద్రానికీ మధ్య అభిప్రాయ భేదాలు తారస్థాయికెళ్లడం, అవి ఎప్పుడూ లేని విధంగా మీడియాలో ప్రము ఖంగా రావడం సంచలనం కలిగించింది. గత నెల 19న రిజర్వ్‌బ్యాంక్ డైరెక్టర్ల బోర్డు తొమ్మిది గంటల సుదీర్ఘ సమావేశం జరిపినప్పుడు అందులో ఏ నిర్ణయాలు వెలువడతాయోనని పరిశ్రమ వర్గాలు, ఆర్థికరంగ నిపుణులు ఉత్కంఠతో ఎదురుచూశారు. ఆ సమావేశంలో కేంద్రం తాడో పేడో తేల్చుకుంటుందని, అసాధారణమైన రీతిలో ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 7ను ఉపయోగించి బ్యాంకు వ్యవహారాలను తన పరిధిలోకి తెచ్చుకుంటుందని ఊహాగానాలు వెలువడ్డాయి. అదే జరిగితే ప్రమాదకర పరిణామాలు ఏర్పడే అవకాశం ఉన్నదని కొందరు నిపుణులు భావించారు. కానీ అందుకు భిన్నంగా ఆ సమావేశం సుఖాంతమైంది. ఎడాపెడా రుణాలిచ్చి వాటిని వసూలు చేయలేని స్థితిలో పడిన బ్యాంకులు కొత్త రుణాలు మంజూరు చేయకుండా విధించిన ఆంక్షల్ని సడలించే అంశాన్ని పరిశీలించడానికి ఆర్బీఐ ఈ సమావేశంలో అంగీకరించింది. ఆ ఆంక్షల వల్ల సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల(ఎంఎస్ఎంఈ)కు రుణలభ్యత అసాధ్యమవుతోంది. ఇది ఉత్పాదకతపైనా, ఉపాధి అవకాశాలపైనా ప్రభావం చూపుతున్నదని కేంద్రం భావించింది. అలాగే ఆర్బీఐ దగ్గరున్న 9.69 లక్షల కోట్ల మూలధనంలో కొంత మొత్తాన్ని సామాజిక సంక్షేమ పథకాల అమలుకు వీలుగా తనకు బదలాయించాలని కేంద్రం భావించింది. అయితే ఆర్బీఐ దగ్గర తగి నంతగా ద్రవ్య నిల్వలుంటేనే దానిపై అందరికీ విశ్వసనీయత ఏర్పడుతుందన్నది ఉర్జిత్ మనో గతం. ఇక చెల్లింపుల వ్యవహారాల పర్యవేక్షణను రిజర్వ్‌బ్యాంకు పరిధి నుంచి తప్పించి దానికోసం ఒక స్వతంత్ర బోర్డు ఏర్పాటు చేయాలని కేంద్రం భావించగా, ఆర్బీఐ అది సరికాదని బహిరం గంగానే అసమ్మతిని ప్రకటించింది. రిజర్వ్‌బ్యాంకుకూ, కేంద్రానికీ మధ్య ఘర్షణ మన దేశంలో కొత్తగాదు. ఆ రెండూ రెండు వేర్వేరు అస్తిత్వాలు గలవి. కనుక వాటి వాటి కర్తవ్య నిర్వహణలో విభేదాలు తలెత్తడం సహజం. నిజానికిది అవసరం. విభేదాలు చర్చలకు దారితీస్తాయి. ఆ చర్చలు పరస్పర అవగాహనకు దారులు పరుస్తాయి. చివరకు ఏకాభిప్రాయానికి దోహదపడతాయి. దేశంలో ఒక పటిష్టమైన ఆర్థిక వ్యవస్థ ఏర్పడటానికి ఇదంతా అవసరం. తన మాటే చెల్లుబడి కావాలని ఎవరికి వారనుకుంటే అది అంతిమంగా ఆ వ్యవస్థను బలహీనపరుస్తుంది. ఆర్బీఐ, కేంద్రం మధ్య సంబంధాలు అత్యంత సంక్లిష్టమైనవి. వాటిని నేర్పుగా నిర్వహించడం, ఆర్థికరంగంలో వైఫల్యాలు ఎదురుకాకుండా చూడటం కత్తిమీది సాము వంటిది. ఆర్బీఐ గవర్నర్‌గా ఉన్నకాలంలో వై. వేణుగోపాలరెడ్డి చేసిన ఒక వ్యాఖ్య ఈ సందర్భంలో గుర్తుంచుకోవాలి. ‘‘అవును నేను స్వతంత్రుణ్ణే. ఆర్బీఐ స్వతంత్ర ప్రతిపత్తిగల సంస్థే. నేను కేంద్ర ఆర్థికమంత్రి అనుమతి తీసుకున్నాక ఈ సంగతి చెబుతున్నాను’’ అని ఆయన వ్యంగ్యంగా చెప్పారు. తాము చెప్పినట్టల్లా వినే గవర్నర్ ఉండాలని కేంద్రం ఎంతగా వాంఛించినా అది చివరకు ఎటు దారితీస్తుందో దానికి తెలియనిది కాదు. అలాంటి ఆర్బీఐపై అంతర్జాతీయంగా విశ్వసనీయత ఉండదు. దాని పనితీరుపై, సామర్థ్యంపై నమ్మకం కుదరదు. అదే సమయంలో ఆర్బీఐ సర్వస్వతంత్రంగా వ్యవహరిస్తానంటే ప్రజాస్వామ్యంలో చెల్లదు. ఈ పరిస్థితి ఉండరాదని భావించింది ఉర్జిత్పటేలే. ఆర్బీఐ నిర్ణయాల్లో కేంద్రం మనోగతం కూడా చెల్లుబా టయ్యే విధంగా ఆరుగురు సభ్యులుండే ద్రవ్య విధాన కమిటీ(ఎంపీసీ)కి డిప్యూటీ గవర్నర్‌గా ఉన్నప్పుడు ఆయనే రూపకల్పన చేశారు. దానికి వడ్డీరేట్ల పెంపు, తగ్గింపు మొదలుకొని నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్ఆర్) వరకూ పలు అంశాలను సమీక్షించి నిర్ణయించే అధికారం ఉంది. అంతక్రితం ఈ అధికారం కేవలం గవర్నర్‌కి మాత్రమే ఉండేది. అలాంటి ఉర్జిత్‌కు కూడా కేంద్ర ప్రభుత్వంతో భిన్నాభిప్రాయాలు ఏర్పడటం, అవి బజారున పడటం అనారోగ్య వాతావరణానికి చిహ్నం. ముఖ్యంగా బోర్డు సభ్యులు కొందరు ఆర్బీఐ తీరుపై బాహాటంగా చేసిన వ్యాఖ్యలు సరికాదు. పెద్దనోట్ల రద్దు సమయంలో ఉర్జిత్ దృఢంగా వ్యవహ రించలేదని కొందరు అభిప్రాయపడినా ద్రవ్యోల్బణం కట్టడి మొదలుకొని రుణాల ఎగవేత ధోర ణులను అరికట్టడం వరకూ పలు అంశాలపై ఆయన కఠినంగా ఉన్నారు. యాక్సిస్ బ్యాంకు, యెస్ బ్యాంక్, కోటక్ మహీంద్ర వంటి ప్రైవేటు బ్యాంకుల విషయంలో ఆయన దృఢంగా వ్యవ హరించారు. అయితే ప్రభుత్వ రంగ బ్యాంకులపై కేంద్ర నియంత్రణ కూడా ఉన్నందువల్ల కావొచ్చు... ఆయన మాట పెద్దగా చెల్లుబాటు కాలేదు. ఏదేమైనా ఆర్బీఐ స్వతంత్రతను కాపా డటంలో ఉర్జిత్ పాత్ర ఎన్నదగినది. తదుపరి గవర్నర్ ఈ వారసత్వాన్ని కొనసాగిస్తారా లేదా అన్నది మున్ముందు చూడాల్సి ఉంది. -
ఉర్జిత్ పటేల్ రాజీనామా.. మిస్ యూ అన్న మోదీ!
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) గవర్నర్ ఉర్జిత్ పటేల్ సోమవారం అనూహ్యంగా రాజీనామా చేశారు. గత కొద్దిరోజులుగా దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన కీలక విధాన నిర్ణయాలపై కేంద్ర ప్రభుత్వంతో ఢీ అంటే ఢీ అనే రీతిలో తలపడుతూ వస్తున్న ఆయన రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించడం.. పలువురిని ఆశ్చర్య పరుస్తోంది. వ్యక్తిగత కారణాలతోనే ఆర్బీఐ గవర్నర్ పదవి నుంచి తక్షణమే వైదొలుగుతున్నానని ఆయన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ఆర్బీఐ గవర్నర్‌గా పనిచేసినందుకు గర్విస్తున్నానని పేర్కొన్న ఉర్జిత్.. పదవీకాలంలో తనకు సహకరించిన ఉద్యోగులు, ఆర్బీఐ డైరెక్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు. 2016 నుంచి ఆర్బీఐ గవర్నర్‌గా కొనసాగుతున్న ఉర్జిత్ పటేల్ తన పదవీకాలం కన్నా చాలాముందే రాజీనామా చేశారు. 2019 సెప్టెంబర్ వరకు ఆయన పదవీకాలం ఉంది. ఉర్జిత్ పటేల్ హయాంలోనే పెద్దనోట్ల రద్దు వంటి తీవ్రమైన నిర్ణయాలను మోదీ సర్కారు తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే, గతకొంతకాలంగా విధాన నిర్ణయాల విషయంలో కేంద్రంతో ఉర్జిత్ పటేల్ విబేధిస్తున్న సంగతి తెలిసిందే. తాను చెప్పినట్టు వినకుండా ఉర్జిత్ స్వతంత్రంగా వ్యవహరిస్తుండటం.. కేంద్రాన్ని తీవ్ర అసంతృప్తికి గురిచేస్తోంది. ఆర్థిక వ్యవస్థపరంగా దేశం ఒకింత క్లిష్టసమయంలో ఉన్నప్పుడు ఆయన రాజీనామా చేయడం రాజకీయంగా దుమారం రేపే అవకాశముంది. ఉర్జిత్ రాజీనామాను అస్త్రంగా చేసుకొని.. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రతిపక్షాలు కేంద్రాన్ని ఇరకాటంలోకి నెట్టే అవకాశముందని తెలుస్తోంది. వుయ్ మిస్ యూ: ప్రధాని మోదీ ఉర్జిత్ పటేల్ రాజీనామాపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ట్విట్టర్లో స్పందించారు. ‘వృత్తిపరంగా ఉర్జిత్ పటేల్ తిరుగులేని నిబద్ధత కలిగిన వ్యక్తి. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌గా, గవర్నర్‌గా ఆయన ఆరేళ్లు దేశానికి సేవలందించారు. గొప్ప వారసత్వాన్ని ఆయన అందించారు. ఆయనను మేం మిస్సవుతున్నాం’ అంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేయగా.. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌గా, గవర్నర్‌గా ఉర్జిత్ అందించిన సేవలను ప్రభుత్వం ఎంతో గౌరవంతో కొనియాడుతోందని, ఆయన మరింతకాలం ప్రజాసేవలో ఉండాలని తాను కోరుకుంటున్నట్టు అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. దేశంలోని ఎంతో విలువైన వ్యవస్థలన్నింటినీ మోదీ ప్రభుత్వం వరుసగా ధ్వంసం చేస్తోందని, అందుకు తాజా నిదర్శనమే ఉర్జిత్ రాజీనామా అని కాంగ్రెస్ నేతలు అహ్మద్ పటేల్, రణ్‌దీప్‌సింగ్ సుర్జేవాలా మండిపడ్డారు. -
ఎక్కడి రేట్లు అక్కడే..!
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పరపతి విధాన సమీక్షలో యథాతథస్థితిని కొనసాగించే అవకాశం ఉందని ఎక్కువ మంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఒకపక్క ఆర్థిక వృద్ధి మందగించడం, ద్రవ్యోల్బణం శాంతించినప్పటికీ... ఈ నెల 5న ప్రకటించనున్న పాలసీ నిర్ణయంలో కీలక రేట్లలో ఎలాంటి మార్పులూ ఉండకపోవచ్చని వారు భావిస్తున్నారు. వరుసగా రెండు పాలసీల్లో రెపో రేటును పెంచిన ఆర్బీఐ గత సమీక్ష(అక్టోబర్)లో మాత్రం రేట్లను పెంచకుండా అందరికీ షాకిచ్చిన సంగతి తెలిసిందే. డాలరుతో రూపాయి మారకం విలువ పాతాళానికి పడిపోవడం, అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు భగ్గుమనడంతో అక్టోబర్‌లో బ్యాంకర్లు, నిపుణులు ఆర్బీఐ రెపో రేటును పెంచొచ్చని అంచనా వేశారు. అయితే, దీనికి భిన్నంగా ఆర్బీఐ వ్యవహరించడం గమనార్హం. ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) ఈ నెల 3 నుంచి 5 వరకూ మూడు రోజుల పాటు సమీక్ష నిర్వహించనుంది. 5న నిర్ణయాన్ని ప్రకటిస్తారు. ప్రస్తుతం రెపో రేటు (బ్యాంకులు తీసుకునే స్వల్పకాలిక రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీ రేటు) 6.5 శాతంగా ఉంది. రివర్స్ రెపో(ఆర్బీఐ వద్ద ఉంచే నగదుపై బ్యాంకులకు లభించే వడ్డీ) 6.25 శాతంగా కొనసాగుతోంది. ఇక సీఆర్ఆర్(నగదు నిల్వల నిష్పత్తి– బ్యాంకులు తమ డిపాజిట్ నిల్వల్లో ఆర్బీఐ వద్ద కచ్చితంగా ఉంచాల్సిన పరిమాణం–దీనిపై ఎలాంటి వడ్డీ లభించదు) 4 శాతం వద్ద ఉంది. రూపాయి రివర్స్‌గేర్... అక్టోబర్‌లో సమీక్ష నాటికి డాలరుతో రూపాయి మారకం విలువ 72–73 రికార్డు కనిష్టానికి పడిపోయిన సంగతి తెలిసిందే. ఆతర్వాత 74.5 స్థాయికి కూడా క్షీణించి వేగంగా కోలుకుంది. ప్రస్తుతం మళ్లీ కీలకమైన 70 ఎగువకు రికవరీ అయింది. మరోపక్క, అంతర్జాతీయంగా ముడిచమురు ధర (బ్రెంట్ క్రూడ్) 85 డాలర్ల నుంచి ఇప్పుడు ఏకంగా 60 డాలర్ల కిందికి దిగొచ్చింది. ఈ రెండు అంశాలూ ఆర్బీఐ రేట్ల పెంపు ఆలోచనలను పక్కనబెట్టేలా చేస్తాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇదిలాఉంటే.. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం(2018–19, క్యూ2)లో స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి రేటు కాస్త మందగించి 7.1 శాతానికి పరిమితమైంది. తొలి త్రైమాసికం(క్యూ1)లో వృద్ధి రేటు 8.2 శాతానికి ఎగబాకిన సంగతి తెలిసిందే. గతేడాది క్యూ2లో వృద్ధి రేటు 6.3 శాతంగా ఉంది. ఇక రిటైల్ ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో 3.31%కి దిగొచ్చింది. ఇది ఏడాది కనిష్ట స్థాయి కూడా. ప్రధానంగా ఆహారోత్పత్తుల ధరలు తగ్గడం దీనికి కారణం. ఈ ఏడాది సెప్టెంబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం రేటు 3.7 శాతం. ఎవరేమంటున్నారంటే... ఆర్బీఐ ఈ నెల 5న ప్రకటించనున్న పరపతి విధాన సమీక్ష నిర్ణయంలో కీలక రేట్లను యథాతథంగానే కొనసాగించవచ్చని కోటక్ రీసెర్చ్ అభిప్రాయపడింది. ‘గత సమీక్షలో ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థం రిటైల్ ద్రవ్యోల్బణం 3.9–4.5 శాతంగా ఉండొచ్చని, అదేవిధంగా వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో 4.8 శాతంగా ఉంటుందని ఆర్బీఐ అంచనా వేసింది. అయితే, ఆహార ధరలు భారీగా దిగిరావడంతో ద్వితీయార్ధంతో 2.9–4.3 శాతం, వచ్చే ఏడాది తొలి క్వార్టర్లో 4.5 శాతం స్థాయిలో రిటైల్ ద్రవ్యోల్బణం ఉండొచ్చని మేం భావిస్తున్నాం. మరోపక్క, గత కొద్ది నెలలుగా భగ్గుమన్న పెట్రో ధరలు.. శాంతించడం కూడా ద్రవ్యోల్బణం దిగొచ్చేందుకు తోడ్పడుతుంది’ అని కోటక్ రీసెర్చ్ పేర్కొంది. ఈ ఆర్థిక సంవత్సరం పూర్తి కాలానికి జీడీపీ వృద్ధిరేటు 7.3 శాతంగా ఉండొచ్చని.. ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ చీఫ్ ఎకనమిస్ట్ దేవేంద్ర కుమార్ పంత్ అంచనా వేశారు. ఈ తరుణంలో పాలసీలో ఆర్బీఐ రెపో రేటులో మార్పులూ చేయకపోచ్చని ఆయన వ్యాఖ్యానించారు. -
భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంది
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ మూలాలు చాలా బలంగా ఉన్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) గవర్నర్ ఉర్జిత్ పటేల్ తెలిపారు. పెద్ద నోట్ల రద్దువల్ల ఆర్థిక వ్యవస్థపై ఏర్పడ్డ ప్రభావం తాత్కాలికమేనని ఆయన అన్నారు. ఢిల్లీలో మంగళవారం కాంగ్రెస్ నేత వీరప్ప మొయిలీ నేతృత్వంలోని 31 మంది సభ్యులున్న పార్లమెంటరీ స్థాయీ సంఘం(ఆర్థికాంశాలు) ముందు హాజరైన ఉర్జిత్ పటేల్.. ఎంపీలు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఈ సందర్భంగా దేశ ఆర్థిక వ్యవస్థతో పాటు అంతర్జాతీయ పరిస్థితులపై ఆయన ప్రజెంటేషన్ సమర్పించారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గుతుండటం భారత ఆర్థిక వ్యవస్థకు లాభిస్తుందని తెలిపారు. 2016, నవంబర్ 8న పెద్దనోట్లను రద్దు చేసిన తర్వాత బ్యాంకుల రుణ పరపతి 15 శాతం పెరిగిందన్నారు. అంతేకాకుండా ద్రవ్యోల్బణం సైతం 4 శాతం దిగువకు వచ్చిందని గుర్తుచేశారు. అయితే ఆర్బీఐ చట్టంలోని సెక్షన్–7ను తొలగించాలన్న ప్రతిపాదన, నిరర్ధక ఆస్తులు, ఆర్బీఐ స్వతంత్రత, తదితర విషయాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు పటేల్ సమాధానాలు దాటవేశారు. ఈ నేపథ్యంలో పలు ప్రశ్నలకు ఉర్జిత్ సమాధానం ఇవ్వకపోవడంతో, వీటన్నింటిపై మరో 10–15 రోజుల్లో రాతపూర్వకంగా జవాబివ్వాలని పార్లమెంటరీ స్థాయీ సంఘం కోరింది. -
పార్లమెంటరీ కమిటీ ఎదుట ఆర్బీఐ గవర్నర్
సాక్షి, న్యూఢిల్లీ : నోట్ల రద్దు, బ్యాంకుల్లో మొండి బకాయిల (ఎన్పీఏ)పై వివరణ ఇచ్చేందుకు ఆర్బీఐ గవర్నర్ ఊర్జిత్ పటేల్ మంగళవారం ఆర్థిక వ్యవహారాలపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఎదుట హాజరయ్యారు. సమావేశంలో సభ్యులు లేవనెత్తిన అంశాలపై ఆయన పదిరోజుల్లో లిఖితపూర్వకంగా బదులిస్తారు. పార్లమెంటరీ కమిటీ సభ్యులతో సంప్రదింపుల సందర్భంగా ఆర్బీఐ గవర్నర్ ఊర్జిత్ పటేల్ ముడిచమురు ధరలు, భారత ఆర్థిక వ్యవస్థపై వాటి ప్రభావం గురించి చర్చించినట్టు సమాచారం. నోట్ల రద్దు, బ్యాంకుల్లో ఎన్పీఏల పరిస్థితి పర్యవసానాలపై సభ్యులు ఆర్బీఐ గవర్నర్‌ను ప్రశ్నించారు. మాజీ కేంద్ర మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత వీరప్ప మొయిలీ ఆధ్వర్యంలో 31 మంది సభ్యులున్న ఈ కమిటీలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సభ్యులుగా ఉన్నారు. కాగా ఆర్బీఐ నిర్వహణ వ్యవహరాల్లో ఇటీవల కేంద్ర జోక్యం పెరిగిందన్న విమర్శల నేపథ్యంలో సెక్షన్ 7ను ప్రయోగించారనే ప్రచారంపై పార్లమెంటరీ కమిటీ ఊర్జిత్ పటేల్‌ను ప్రశ్నించినట్టు సమాచారం. -
ఆర్బీఐ బోర్డు సమావేశంలో కీలక నిర్ణయాలు
ముంబై: కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ మధ్య దాదాపు కీలక అంశాలన్నిటి మధ్యా సయోధ్య కుదిరింది. సున్నితమైన పలు అంశాలకు సంబంధించి ప్రభుత్వం, ఆర్బీఐ మధ్య భిన్నాభిప్రాయాలు నెలకొనడంతో... సోమవారం ఆర్బీఐ బోర్డు సమావేశం తొమ్మిది గంటలకు పైగా వీటన్నింటిపై చర్చించింది. ‘‘సుహృద్భావ పూర్వక వాతావరణంలో ఈ సమావేశం జరిగింది. చాలా అంశాలు స్నేహపూర్వక రీతిలో పరిష్కారం అయ్యాయి’’ అని బోర్డు సభ్యుడొకరు తెలిపారు. తదుపరి ఆర్బీఐ బోర్డు సమావేశం డిసెంబర్ 14న జరుగుతుందని బోర్డు సభ్యుడు సచిన్ చతుర్వేది తెలియజేశారు. వివిధ అంశాలకు సంబంధించి ఏం నిర్ణయం తీసుకున్నారంటే... 1. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈ రంగానికి) ఇచ్చిన రుణాల్లో, మొండి బకాయిలుగా మారిన వాటిని పునరుద్ధరించాలని కేంద్రం కోరుతోంది. ఇందుకోసం ఓ పథకాన్ని పరిశీలించే బాధ్యతను నిపుణుల కమిటీకి ఆర్బీఐ బోర్డు అప్పగించింది. 2. ఆర్బీఐ వద్ద భారీగా ఉన్న రూ.9.69 లక్షల కోట్ల నగదు నిల్వల నుంచి కొంత భాగాన్ని బదలాయించాలని కేంద్ర ప్రభుత్వం కొన్నాళ్లుగా ఒత్తిడి తెస్తోంది. దీనిపై అసలు ఆర్బీఐ వద్ద వాస్తవంగా ఎంత మేర మిగులు నిల్వలు ఉండాలి? మిగులు నిల్వలను కేంద్ర ప్రభుత్వానికి బదలాయించడానికి సంబంధించిన ‘ఎకనమిక్ క్యాపిటల్ ఫ్రేమ్‌వర్క్’ ఎలా ఉండాలి? అనేది నిర్ణయించేందుకు ఓ ఉన్నత స్థాయి నిపుణుల ప్యానెల్‌ను ఏర్పాటు చేయాలని ఆర్బీఐ బోర్డు నిర్ణయించింది. 3. ప్రభుత్వరంగంలోని 21 బ్యాంకులకు గాను 11 బ్యాంకులను ఆర్బీఐ నిక్కచ్చయిన దిద్దుబాటు కార్యాచరణ (పీసీఏ) పరిధిలోకి తీసుకొచ్చి, వాటి పట్ల కఠినంగా వ్యవహరిస్తోంది. దీంతో ఇవి కొత్త రుణాలివ్వడానికి అవకాశం లేక సమస్యలను ఎదుర్కొంటున్నాయి. వీటి విషయంలో నిబంధనలను సరళించాలని కేంద్రం డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్బీఐకి చెందిన ఆర్థిక పర్యవేక్షక బోర్డు పీసీఏ పరిధిలోకి వచ్చిన బ్యాంకులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిశీలించాలన్న నిర్ణయానికి ఆర్బీఐ బోర్డు వచ్చింది. ఇదీ... ఆర్బీఐ ప్రకటన ‘‘ఎకనమిక్ క్యాపిటల్ ఫ్రేమ్‌వర్క్‌ను పరిశీలించేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని బోర్డు నిర్ణయించింది. ఇందులో సభ్యులు, నిబంధనలను ప్రభుత్వం, ఆర్బీఐ ఉమ్మడిగా నిర్ణయిస్తాయి. ఇక రూ.25 కోట్ల వరకు ఎంఎస్ఎంఈల మొండి బకాయిలను పునరుద్ధరించే పథకాన్ని పరిశీలించాలని కూడా నిర్ణయించడం జరిగింది’’ అని ఆర్బీఐ తన ప్రకటనలో తెలియజేసింది. ఆర్థిక స్థిరత్వం కోసం ఈ తరహా చర్యలు అవసరమని పేర్కొంది. ప్రభుత్వ నామినీ డైరెక్టర్లు అయిన ఆర్థిక వ్యహారాల కార్యదర్శి సుభాష్‌చంద్ర గార్గ్, ఆర్థిక సేవల కార్యదర్శి రాజీవ్‌కుమార్‌తోపాటు స్వతంత్ర డైరెక్టర్ ఎస్ గురుమూర్తి ఆర్బీఐ క్యాపిటల్ బేస్‌ను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తక్కువ ఉండాలని వాదించారు. ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్, ఆర్బీఐ నుంచి ఇతర సభ్యులతో ప్రభుత్వ నామినీలు, గురుమూర్తి ముఖాముఖిగా అంశాలపై చర్చించారు. ఆర్బీఐ బోర్డులో 10 మంది ఇండిపెండెంట్ డైరెక్టర్లలో టాటాసన్స్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ సహా ఎక్కువ మంది ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఘర్షణ లేదు... ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వం మధ్య ఎటువంటి ఘర్షణ లేదని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తేల్చిచెప్పారు. కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్‌గాంధీ, మీడియానే దీన్ని చిత్రీకరిస్తున్నాయన్నారు. ఎంతో ముఖ్య సంస్థ అయిన సెంట్రల్ బ్యాంక్‌కు దేశం పట్ల ఉన్న బాధ్యతలపై ఆర్బీఐ బోర్డు సభ్యుల మధ్య చర్చ జరగడం అభ్యంతరకరమేమీ కాదన్నారు. రిజర్వ్ బ్యాంక్ నుంచి ప్రభుత్వం రూపాయి కూడా ఆశించడం లేదని ఇప్పటికే స్పష్టం చేసినట్టు ఆయన గుర్తు చేశారు. ఆర్బీఐ స్వతంత్రతను కేంద్రం గుర్తించింది: చిదంబరం ఆర్బీఐ స్వతంత్రతను కేంద్రం అసమ్మతంగా అయినా ఒప్పుకుందంటూ, దీని పట్ల కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఓ అడుగు వెనక్కు తగ్గడాన్ని ఆహ్వానించారు. ‘‘కేంద్రం ప్రమాదకరమైన ధోరణితో ఉందన్న విషయాన్ని స్వతంత్ర డైరెక్టర్లు అర్థం చేసుకుని ఉంటారు. అందుకే ఆర్బీఐకి సూచన ఇవ్వడానికి మించి ముందుకు వెళ్లలేదు’’అని చిదంబరం పేర్కొన్నారు. సాంకేతిక కమిటీ మిగులు నిల్వలను పరిశీలించడం వల్ల వచ్చిన నష్టమేమీ లేదన్నారు. దీనివల్ల ఆర్బీఐ మిగులు నిల్వలు కనీసం 2019 వరకు అయినా సురక్షితంగా ఉంటాయంటూ, పరోక్షంగా మరో ఆరు నెలల్లో సాధారణ ఎన్నికలను గుర్తు చేశారు. ఆర్బీఐ నుంచి వ్యవస్థలోకి మరో రూ.8,000 కోట్లు 22న ప్రభుత్వ సెక్యూరిటీల కొనుగోలు ముంబై: వ్యవస్థలో నగదు లభ్యతను పెంచే చర్యలో భాగంగా ఈ నెల 22న ఆర్బీఐ ప్రభుత్వ సెక్యూరిటీలను కొనుగోలు చేయనుంది. తద్వారా రూ.8,000 కోట్లను అందుబాటులోకి తీసుకురానుంది. నగదు లభ్యత పరిస్థితులను సమీక్షించిన అనంతరం ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ (ఓఎంవో) ద్వారా ఈ నెల 22న రూ.8,000 కోట్ల మేర ప్రభుత్వ సెక్యూరిటీల కొనుగోలుకు నిర్ణయించినట్టు ఆర్బీఐ తన ప్రకటనలో తెలిపింది. ఐఎల్ఎఫ్ఎస్ సంక్షోభం తర్వాత లిక్విడిటీ సమస్య నెలకొన్న విషయం తెలిసిందే. దీన్ని సులభతరం చేసేందుకు ఆర్బీఐ ఓఎంవో మార్గాన్ని ఆశ్రయించింది. ఒకవేళ వ్యవస్థలో నగదు లభ్యత అధికమైన సమయాల్లో ఆర్బీఐ తిరిగి ఇవే సెక్యూరిటీలను విక్రయించడం ద్వారా తగ్గిస్తుంది. -
ఆర్బీఐ vs కేంద్రం
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంతో పలు అంశాలపై విభేదాలు నెలకొన్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ బోర్డు కీలక సమావేశం సోమవారం జరగనుంది. ఇందులో ఇరుపక్షాలు ఆమోదయోగ్యమైన పరిష్కారమార్గం కనుగొనేందుకే ప్రాధాన్యం ఇవ్వనున్నప్పటికీ.. భేటీ కొంత వాడి, వేడిగా జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. వివాదాస్పద పీసీఏ నిబంధనలు, చిన్న సంస్థలకు రుణాల మంజూరు తదితర వివాదాస్పద అంశాలపై ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ టీమ్‌పై ఆర్థిక శాఖ నామినీలు, కొంతమంది స్వతంత్ర డైరెక్టర్లు అస్త్రాలు సంధించవచ్చని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. పటేల్ రాజీనామా చేయాలంటూ కొన్ని వర్గాల నుంచి డిమాండ్ వస్తున్నప్పటికీ.. ఒత్తిళ్లకు ఆయన లొంగకపోవచ్చని వివరించాయి. తాము అమలు చేస్తున్న విధానాలను మరింత గట్టిగా సమ ర్థించుకునే ప్రయత్నమే చేయొచ్చని పేర్కొన్నాయి. గవర్నర్ ఉర్జిత్ పటేల్ సారథ్యంలోని ఆర్బీఐ సెంట్రల్ బోర్డులో ప్రస్తుతం 18 మంది సభ్యులు ఉన్నారు. ఈ సంఖ్య 21 దాకా పెంచుకోవచ్చు. ప్రస్తుత బోర్డులో ఆర్బీఐ గవర్నర్‌తో పాటు నలుగురు డిప్యూటీలు ఫుల్ టైమ్ అధికారిక డైరెక్టర్లుగా ఉండగా, 13 మందిని కేంద్ర ప్రభుత్వం నామినేట్ చేసింది. వీరిలో ఆర్థిక శాఖకు చెందిన అధికారులు ఇద్దరు ఉన్నారు. సత్వర దిద్దుబాటు చర్యల (పీసీఏ) కఠిన నిబంధనలు, చిన్న తరహా సంస్థలకు రుణాల మంజూరీ నిబంధనల సడలింపు వంటి విషయాల్లో నెలకొన్న విభేదాలను తొలగించుకునేలా ఒక ఆమోదయోగ్యమైన పరిష్కారమార్గాన్ని రూపొందించాలని ఇరుపక్షాలు భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. పీసీఏకి సంబంధించి ఈ సమావేశంలో కాకపోయినా మరికొన్ని వారాల్లో తగు పరిష్కారమార్గం కనుగొనే అవకాశం ఉన్నట్లు వివరించాయి. వివాదాస్పద అంశాలివీ.. వీటిని సడలించిన పక్షంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే పలు బ్యాంకులకు కొంత వెసులుబాటు లభిస్తుంది. ప్రభుత్వ రంగంలో 21 బ్యాంకులు ఉండగా, వీటిలో 11 బ్యాంకులు ప్రస్తుతం పీసీఏ కింద ఆంక్షలు ఎదుర్కొంటున్నాయి. రిస్కులెక్కువగా ఉన్న అసెట్స్‌కి, మూలధనానికి మధ్య నిష్పత్తి తగ్గినా, నికర నిరర్ధక ఆస్తులు పెరిగినా, అసెట్స్‌పై రాబడులు భారీగా తగ్గినా పీసీఏ నిబంధనలు అమల్లోకి వస్తాయి. అయితే, పీసీఏని ప్రయోగించడానికి అంతర్జాతీయంగా సెంట్రల్ బ్యాంకులు .. క్యాపిటల్ అడెక్వసీ రేషియోని మాత్రమే ప్రామాణికంగా తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయంగా రిజర్వ్ బ్యాంక్ కూడా ఇదే విధానాన్ని అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది. ఇక చిన్న, మధ్య తరహా సంస్థలకు రుణాల మంజూరీలో కొంత సడలింపునివ్వడం, లిక్విడిటీ కొరతను ఎదుర్కొంటున్న నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలకు ద్రవ్య లభ్యత మెరుగుపడేలా వ్యవస్థలో మరింత నిధులను అందుబాటులోకి తేవడం వంటివి ఆర్బీఐ చేపట్టాలని కేంద్రం భావిస్తోంది. కానీ ఈ రంగాల సంస్థలకు రిస్కులు ఎక్కువగా పొంచి ఉన్నాయనే భావనతో ఆర్బీఐ దీన్ని విభేదిస్తోంది. రెండు పక్షాలు ఇందుకు సంబంధించి బహిరంగంగానే తమ మధ్య విభేదాలను బైటపెట్టాయి. సెంట్రల్ బ్యాంక్ స్వయం ప్రతిపత్తిని గౌరవించకపోతే ఎకానమీకి పెను విపత్తు తప్పదంటూ ఆర్బీఐ డిçప్యూటీ గవర్నర్ విరాల్ ఆచార్య వ్యాఖ్యానించడం దీనికి ఆజ్యం పోసింది. ఇలాంటి పరిస్థితుల్లో రిజర్వ్ బ్యాంక్‌ను దారికి తెచ్చుకునేందుకు గతంలో ఎన్నడూ ప్రయోగించని ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 7ని ప్రయోగించడంపై కేంద్ర ఆర్థిక సమాలోచనలు కూడా జరపడం మరింత వివాదాస్పదమైంది. అటు ఆర్బీఐలో కేంద్రం నామినేట్ చేసిన ఎస్ గురుమూర్తి సైతం కేంద్ర ప్రభుత్వ వాదనలను వెనకేసుకొస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంతో రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ కలిసి పనిచేయాలని లేదా రాజీనామా చేసి తప్పుకోవాలని ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ స్వదేశీ జాగరణ్ మంచ్ కో–కన్వీనర్ అశ్వనీ మహాజన్ వ్యాఖ్యానించారు. ఆర్బీఐని కేంద్రం గుప్పిట్లో పెట్టుకోవాలనుకుంటోంది! రిజర్వ్ బ్యాంక్ వద్ద ఉన్న రూ. 9 లక్షల కోట్ల నిధులపై అజమాయిషీని దక్కించుకునేందుకు ఆర్బీఐని తన చెప్పుచేతల్లోకి తెచ్చుకోవాలని కేంద్రం ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి పి చిదంబరం ఆరోపించారు. ఈ నేపథ్యంలో సోమవారం నాటి ఆర్బీఐ బోర్డు భేటీ ఘర్షణాత్మకంగానే ఉండవచ్చని మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్లో పేర్కొన్నారు. రిజర్వ్ బ్యాంక్ వద్ద రూ. 9.59 లక్షల కోట్ల నిల్వలు ఉన్నాయి. ద్రవ్య లోటు తదితర సమస్యల పరిష్కారం కోసం వీటిలో కనీసం మూడో వంతు నిధులైనా (సుమారు రూ. 3.6 లక్షల కోట్లు) తమకు ఇవ్వాలంటూ ఆర్బీఐపై కేంద్రం ఒత్తిడి తెస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, అలాంటి ప్రతిపాదనేదీ లేదంటూ కేంద్రం కొట్టిపారేసింది. ఈ నేపథ్యంలోనే ఆర్బీఐ బోర్డు భేటీ, చిదంబరం వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
ఆర్బీఐకు స్వతంత్రత అవసరం
ముంబై: ఆర్బీఐ స్వయంప్రతిపత్తికి ప్రముఖ పారిశ్రామికవేత్త రాహుల్ బజాజ్ బాసటగా నిలిచారు. కేంద్ర ప్రభుత్వం ఇంత వరకూ ఉపయోగించని సెక్షన్ 7 ద్వారా తన నిర్ణయాలను ఆర్బీఐపై రుద్దే ప్రయత్నం చేయరాదని ఆయన సూచించారు. ఈ నెల 19న జరిగే ఆర్బీఐ భేటీ సందర్భంగా ఆర్బీఐ, ప్రభుత్వం తమ మధ్య దూరాన్ని తొలగించుకుంటాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఒకవేళ సెక్షన్ 7ను ప్రభుత్వం ప్రయోగిస్తే, గవర్నర్ ఉర్జిత్ పటేల్‌కు రాజీనామా చేయడం తప్ప మరో మార్గం లేదన్నారు. ‘‘ప్రభుత్వం తన నిర్ణయాలకే కట్టుబడి ఉంటే విషయం వెడెక్కుతుంది. ఆర్బీఐ లేదా ఉర్జిత్ పటేల్ కూడా తమ వాదనకే కట్టుబడి ఉంటే, ప్రభుత్వం సెక్షన్ 7ను ప్రయోగించినట్టయితే... పటేల్ రాజీనామా చేస్తారని అనుకుంటున్నా’’ అని రాహుల్ బజాజ్ పేర్కొన్నారు. గురువారం ముంబైలో జమ్నాలాల్ బజాజ్ అవార్డుల కార్యక్రమం సందర్భంగా మీడియాతో తన అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రభుత్వం–ఆర్బీఐ మధ్య వివాదం మంచిది కాదు ఆర్బీఐ బోర్డు సభ్యుడు ఎస్ గురుమూర్తి న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం, సెంట్రల్ బ్యాంకు మధ్య వివాదం మంచిది కాదని ఆర్బీఐ బోర్డు సభ్యుడు ఎస్ గురుమూర్తి అన్నారు. పలు అంశాలపై ఇటీవల కేంద్రం, ఆర్బీఐ మధ్య పొరపొచ్చాలు వచ్చిన నేపథ్యంలో గురుమూర్తి వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ... మొండి బకాయిల విషయంలో ప్రొవిజన్లకు సంబంధించి కఠిన నిబంధనలను బ్యాంకులపై రుద్దడం వల్ల బ్యాంకింగ్ రంగంలో సమస్యలకు దారితీస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. బేసెల్ క్యాపిటల్ అడెక్వెసీ నిబంధనల్లో పేర్కొన్న పరిధికి మించి భారత్ వెళ్లకూడదన్నారు. -
ఆర్బీఐ డీఫాల్టర్లను ఎందుకు వెల్లడించడం లేదు?
సాక్షి, న్యూఢిల్లీ : బ్యాంకులకు ఉద్దేశపూర్వకంగా వేల కోట్ల రూపాయలను ఎగ్గొట్టిన బడా బాబుల పేర్లును వెల్లడించాల్సిందిగా కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) ఎన్నిసార్లు ఆదేశించినా, ఈ విషయంలోనే సుప్రీం కోర్టు తీవ్రంగా మందలించినప్పటికీ భారతీయ రిజర్వ్ బ్యాంక్ పదే పదే ఒకే మాట చెబుతూ వస్తోంది. దేశం, బ్యాంకుల ఆర్థిక ప్రయోజనాలను దష్టిలో పెట్టుకొని ఆ సమాచారాన్ని వెల్లడించలేక పోతున్నామంటూ పాడిందే పాటగా పాడుతూ వస్తోంది. 2015 నుంచి ఆర్బీఐ తంతూ ఇదే. చివరకు విసిగిపోయిన కేంద్ర సమాచార కమిషన్ ఇదే విషయమై ఆర్బీఐకి షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఈ నోటీసుకు స్పందించిన ఆర్బీఐ సమాధానం ఇవ్వడానికి నవంబర్ 26వ తేదీ వరకు గడువు కావాలని సీఐసీని కోరింది. గడువు కావడానికి కారణం ఏమిటో సులభంగానే ఊహించవచ్చు. చీఫ్ సమాచార కమిషనర్ సతీష్ ఆచార్యులు నవంబర్ 20వ తేదీన పదవీ విరమణ చేస్తున్నారు. బ్యాంకుల నుంచి భారీ ఎత్తున రుణాలు తీసుకొని ఉద్దేశ పూర్వకంగానే ఎగ్గొడుతున్న డీఫాల్టర్ల పేర్లను వెల్లడించాల్సిందిగా సతీష్ ఆచార్యులు పట్టుబడుతుండడంతో ఆయన పోయే వరకు నిరీక్షిద్దామనే వైఖరితో ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ వ్యవహిరిస్తున్నట్లు కనిపిస్తోంది. ఆ స్థానంలో వచ్చే కొత్తవారిని ఏదో విధంగా మేనేజ్ చేసుకోవచ్చన్నది ఆయన ఆలోచనగా కనిపిస్తోంది. కొన్ని బడా బ్యాంకులు ఇప్పటికే తమ వెబ్సైట్లలో డీ ఫాల్టర్లయిన బడా బాబుల పేర్లను వెల్లడించాయని ఆదివారం నాడు ఎన్డీటీవీ ఓ కథనాన్ని ప్రచురించింది. సమాచార హక్కు కింద ఆర్బీఐని సీఐసీ కోరుతున్న సమాచారం ఇప్పటికే బ్యాంకుల వెబ్సైట్లలో ఉన్నాయని ఆ వార్తా కథనం పేర్కొంది. ఈ సమాచారం బయటకు రావడంతో ఆర్బీఐ చెబుతున్నట్లుగా లేదా భయపడుతున్నట్లుగా దేశ ఆర్థిక వ్యవస్థగానీ, బ్యాంకుల ఆర్థిక పరిస్థితిగానీ దెబ్బ తినే సూచనలుగానీ, అల్లకల్లోలం అలికిడిగానీ కనిపించడం లేదే! డీఫాల్టర్ల సమాచారాన్ని వెల్లడించాల్సిన విధి ఆర్బీఐదని 2015లోనే సుప్రీం కోర్టు స్పష్టంగా ప్రకటించినప్పటికీ ఇప్పటి వరకు ఆర్బీఐలో చలనం లేదు. ‘స్వచ్ఛమైన, పారదర్శకమైన పద్ధతిలో చాలా ఆర్థిక సంస్థలు తమ లావా దేవీలను నిర్వహించడం లేదన్నది మాకు బలమైన అనుమానం. వాటితో సంఘటితమైన ఆర్బీఐ, వాటి లావాదేవీలను ప్రజల దష్టికి రాకుండా కప్పి పుచ్చుతోంది. అది భావ్యం కాదు. అగౌర వ్యాపార లావాదేవీలను నిర్వహిస్తున్న ప్రభుత్వరంగ బ్యాంకులపై కఠిన చర్యలు తీసుకోవడం ఆర్బీఐ విధి’ అంటూ సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. ప్రభుత్వం మాటలను పెడ చెవిన పెడితే రాజ్యాంగంలోని ఏడవ షెడ్యూల్ కింద జోక్యం చేసుకోవాల్సి వస్తుందని ఇటీవల ఆర్బీఐని తీవ్రంగా హెచ్చరించిన కేంద్ర ప్రభుత్వం బడా డీఫాల్టర్ల పేర్లను వెల్లడించాల్సిందిగా ఈ మూడేళ్లలో ఒక్కసారి కూడా ఎందుకు ఆర్బీఐని ఆదేశించలేదు? ఆ బడా డీఫాల్టర్లే ఎన్నికల సమయంలో అధికార పార్టీకి భారీగా విరాళాలు ఇస్తున్న వారే అవడం వల్లనా?! -
ప్రధానితో ఆర్బీఐ గవర్నర్ భేటీ
న్యూఢిల్లీ: కేంద్రంతో వివాదాస్పద అంశాలను పరిష్కరించుకునే దిశగా రిజర్వ్ బ్యాంక్ ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ గత వారం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయినట్లు తెలుస్తోంది. ఈ నెల 9న న్యూఢిల్లీ వచ్చిన ఉర్జిత్ పటేల్.. ప్రధాని కార్యాలయంలో పలువురు సీనియర్ అధికారులతో సమావేశం అయినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. వీటిలో కొన్నింటిలో ప్రధాని కూడా పాల్గొన్నట్లు వివరించాయి. ఈ చర్చల నేపథ్యంలో చిన్న, మధ్య తరహా సంస్థలకు రుణాలివ్వడానికి సంబంధించి ఆర్బీఐ ప్రత్యేక విధానమేదైనా రూపొందించే అవకాశమున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయని తెలిపాయి. అయితే, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థల (ఎన్బీఎఫ్సీ) లిక్విడిటీ సమస్యలు తీర్చడం, రిజర్వ్ బ్యాంక్ దగ్గరున్న మిగులు నిధుల్లో గణనీయ భాగాన్ని ప్రభుత్వానికి బదలాయించడం వంటి అంశాలపై ఏదైనా అంగీకారం కుదిరిందా లేదా అన్నది తెలియరాలేదు. ఈ నెల 19న రిజర్వ్ బ్యాంక్ బోర్డు కీలక సమావేశం జరగనున్న నేపథ్యంలో తాజా భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.