villages
-
Telangana: జిల్లాలన్నీ 'ఉడా'లే..!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని కొన్ని గ్రామాలు మినహా.. రాష్ట్రమంతా వివిధ పట్టణాభివృద్ధి సంస్థ (యూడీఏ–ఉడా)ల పరిధిలోకి వెళ్లింది. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 9 ఉడాలు ఉండగా, తాజాగా వాటి పరిధిని రాష్ట్ర ప్రభుత్వం విస్తరించింది. దీంతోపాటు.. ములుగు జిల్లా, ఆసిఫాబాద్ జిల్లాలోని ఐదు మండలాలు, కొన్ని జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాలు మినహా ఇప్పటివరకు ఉడాలు లేని అన్ని జిల్లాలు కవర్ అయ్యేలా కొత్తగా మరో 19 ఉడాలను కూడా ఏర్పాటు చేసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 28 ఉడాలు ఏర్పాటైనట్టయ్యింది. ప్రతి పట్టణాభివృద్ధి సంస్థ పరిధిలోకి ఆ జిల్లాలోని మండలాల్లో ఉన్న దాదాపుగా అన్ని గ్రామాలు చేరాయి. రాష్ట్రంలో సుమారు 12 వేల గ్రామ పంచాయతీలు ఉండగా, దాదాపు 10 వేలకు పైగా గ్రామ పంచాయతీలు ఉడాల పరిధిలోకి రావడం గమనార్హం. ఇప్పటివరకు చుట్టుపక్కల గ్రామాలే ఉడాల పరిధిలో.. రాష్ట్రంలో హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) పరిధిలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు ఉన్నాయి. దీంతో పాటు వరంగల్, కరీంనగర్, వేములవాడ, సిద్దిపేట, ఖమ్మం, నిజామాబాద్, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలతో ఏర్పాటు చేసిన మొత్తం 9 పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో ఇప్పటివరకు చుట్టుపక్కలున్న గ్రామాలు మాత్రమే ఉండేవి. మిగతా గ్రామాలన్నీ డీటీసీపీ (డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్) పరిధిలోకి వచ్చేవి. దీంతో 800 చదరపు గజాల పైబడి నిర్మాణాలకు, గ్రామాల్లో సాగే లే అవుట్ల అనుమతులన్నీ డీటీసీపీ ద్వారానే తీసుకోవలసి వచ్చేది. ఇప్పుడు జిల్లాల పరిధి మొత్తానికి ఉడాలను విస్తరించడంతో లే అవుట్లతో పాటు 800 చదరపు గజాల నిర్మాణాల అనుమతులు కూడా ఆయా జిల్లాల్లో ఏర్పాటైన ఉడాల ద్వారానే పొందే అవకాశం లభించింది. జిల్లాల వారీగా మాస్టర్ ప్లాన్‌కు అవకాశం రాష్ట్రంలో ఇప్పటివరకు పట్టణాలకు కూడా సరైన మాస్టర్‌ప్లాన్ లేదు. ఉడాల ద్వారా మాస్టర్‌ప్లాన్ రూపకల్పనకు కొన్ని ప్రయత్నాలు గతంలో జరిగినా వివిధ కారణాల వల్ల కొలిక్కి రాలేదు. ఇప్పుడు జిల్లా పరిధినే యూనిట్‌గా పట్టణాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేయడంతో జిల్లా మొత్తానికి మాస్టర్‌ప్లాన్ రూపొందించే అవకాశం లభించినట్లయిందని పురపాలక శాఖ అధికారి ఒకరు తెలిపారు. అలాగే ఆయా మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీలతో పాటు మండల కేంద్రాల మాస్టర్ ప్లాన్లను కూడా ప్రత్యేకంగా రూపొందించే అవకాశం లభించింది. కేంద్ర నిధులు పెరిగేందుకు దోహదం గ్రామాల్లో సాగే పేదల గృహనిర్మాణ కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు పెరిగేందుకు కూడా ఉడాల ఏర్పాటు దోహదపడనుంది. ప్రతి పట్టణాభివృద్ధి సంస్థ పరిధిలోకి పట్టణాలు, కార్పొరేషన్లతో పాటు 10 నుంచి 15 మండలాల్లోని గ్రామాలు వస్తుండడంతో కేంద్రీకృతమైన అభివృద్ధికి ఆస్కారం లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. గ్రామ పంచాయతీల అధికారాలు యధాతథం! జిల్లా పరిధిని పూర్తిగా పట్టణాభివృద్ధి సంస్థ కిందికి తీసుకురావడంతో గ్రామ పంచాయతీల అధికారాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే పురపాలక శాఖ అధికారులు మాత్రం అలాంటిదేమీ ఉండబోదని అంటున్నారు. డీటీసీపీకి ఉన్న అనుమతుల అధికారం మాత్రమే పట్టణాభివృద్ధి సంస్థలకు దఖలు పడుతుందని స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం గ్రామాల్లో 800 చదరపు గజాల లోపు నిర్మాణాలకు అనుమతులు ఆయా పంచాయతీలే ఇస్తున్నాయి. ఆ విధానం భవిష్యత్తులో కూడా కొనసాగనుందని ప్రభుత్వం చెబుతోంది. గ్రామ పంచాయతీల అధికారాలు యథాతథం! జిల్లా పరిధిని పూర్తిగా పట్టణాభివృద్ధి సంస్థ కిందికి తీసుకురావడంతో గ్రామ పంచాయతీల అధికారాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే పురపాలక శాఖ అధికారులు మాత్రం అలాంటిదేమీ ఉండబోదని అంటున్నారు. డీటీసీపీకి ఉన్న అనుమతుల అధికారం మాత్రమే పట్టణాభివృద్ధి సంస్థలకు దఖలు పడుతుందని స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం గ్రామాల్లో 800 చదరపు గజాల లోపు నిర్మాణాలకు అనుమతులు ఆయా పంచాయతీలే ఇస్తున్నాయి. ఆ విధానం భవిష్యత్తులో కూడా కొనసాగనుందని ప్రభుత్వం చెబుతోంది. -
ఎక్కువ పొదుపు చేస్తుంది.. వ్యవసాయ కుటుంబాలే
దేశంలోని గ్రామాల్లో వ్యవసాయ కుటుంబాలే అత్యధికంగా పొదుపు చేస్తున్నాయి. మొత్తం పొదుపు చేస్తున్న కుటుంబాల్లో... 71% వ్యవసాయ కుటుంబాలే ఉన్నాయి. వ్యవసాయేతర కుటుంబాల్లో 58% మాత్రమే పొదుపు చేస్తున్నాయి. ఈ విషయాన్ని నాబార్డు వెల్లడించింది. 2021 జూలై నుంచి 2022 జూన్ (వ్యవసాయ సంవత్సరం) వరకు ఆల్–ఇండియా రూరల్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ సర్వేను నాబార్డుకు చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ ఎనాలిసిస్ అండ్ రీసెర్చ్ నిర్వహించింది. భారత్‌లోని గ్రామీణ జనాభా ఆర్థిక స్థితిగతులు, ఆర్థిక వ్యవస్థపై నాబార్డు చేసిన ఈ సర్వే ప్రకారం దేశంలో అత్యధిక శాతం గ్రామీణ కుటుంబాలు వాణిజ్య బ్యాంకుల్లోనే పొదుపు చేస్తున్నాయి. – సాక్షి, అమరావతి -
పట్టణాలతో సమానంగా గ్రామాలు
ఆంధ్రప్రదేశ్‌లో గత కొన్నేళ్లుగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతోంది. ముఖ్యంగా గత ఐదేళ్లలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమంతో గ్రామీణ ప్రజల జీవన విధానం మెరుగుపడింది. దీంతో రాష్ట్రంలో వినియోగదారుల వ్యయంలో పట్టణాలు, గ్రామాల ప్రజల మధ్య అంతరం తగ్గిపోతోంది. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలకు రహదారి సౌకర్యాలు పెరగడంతో అభివృద్ధిలో కూడా అంతరం తరిగిపోయి పట్టణాలతో గ్రామాలు పోటీపడుతున్నట్లు ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక వెల్లడిస్తోంది. వివిధ రాష్ట్రాల్లో గ్రామీణ, పట్టణాల మధ్య నెలవారీ తలసరి వినియోగ వ్యయం మధ్య అంతరాలను, అసమానతలను ఎస్బీఐ నివేదిక విశ్లేíÙంచింది. గ్రామీణ, పట్టణాల మధ్య నెలవారీ తలసరి వినియోగ వ్యయంలో తేడా ఆంధ్రప్రదేశ్‌లో భారీగా తగ్గినట్లు ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక పేర్కొంది. ఈ విషయంలో దేశంలో ఏపీ ఆరో స్థానంలో ఉన్నట్లు తెలిపింది.దీనివల్ల రాష్ట్రంలో గ్రామీణ, పట్టణాల మధ్య అసమానతలు భారీగా తగ్గినట్లు పేర్కొంది. దేశంలో 2009–10లో పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల మధ్య తలసరి వ్యయం వ్యత్యాసం 88.2 శాతం ఉండగా 2022–23 నాటికి 71.2 శాతానికి తగ్గినట్లు తెలిపింది. 2029–30 నాటికి ఇది 65.1 శాతానికి తగ్గుతుందని అంచనా వేసింది. – సాక్షి, అమరావతి దేవ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో నెలవారీ తలసరి వినియోగ వ్యయం రూ.6,459 ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో రూ. 3,773 ఉన్నట్లు వివరించింది. రాష్ట్రంలో 2022–23 నాటికి పట్టణాలు, గ్రామాల మధ్య నెలవారీ తలసరి వినియోగ వ్యయంలో అంతరం 39.3 శాతమేనని తెలిపింది. రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో నెలవారీ తలసరి వినియోగ వ్యయం రూ. రూ. 6,782 ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో రూ. 4,870 ఉన్నట్లు పేర్కొంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందడంతో పాటు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న దిగువ, మధ్య తరగతి జనాభా ఆదాయాలు మెరుగుపడటం వల్ల నెలవారీ తలసరి వ్యయంలో అంతరాలు భారీగా తగ్గినట్లు పేర్కొంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేద లబి్ధదారులకు వివిధ పథకాల ద్వారా నేరుగా నగదు బదిలీ చేయడంతో జీవన విధానంలో స్పష్టమైన మార్పు కనిపిస్తోందని నివేదిక వివరించింది. గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించడం వల్ల కూడా గ్రామీణ ప్రజల ఆదాయం పెరగడంతో పాటు నెలవారీ తలసరి వ్యయం పెరుగుతోందని తెలిపింది. దీంతో పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల మధ్య అంతరాలు తగ్గిపోతున్నాయని నివేదిక పేర్కొంది. రైతుల ఆదాయాన్ని పెంచేలా ప్రభుత్వం చర్యలు చేపట్టడం వల్ల కూడా గ్రామీణ జీవనం గణనీయంగా మెరుగుపడినట్లు నివేదిక తెలిపింది. 2011–12తో పోల్చి చూస్తే 2022–23లో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఏపీలో అసమానతలు గణనీయంగా తగ్గినట్లు నివేదిక పేర్కొంది. అదే ఛత్తీస్‌గఢ్, కేరళ, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో గ్రామీణ ప్రాంతాల్లో అసమానతలు పెరిగినట్లు నివేదిక తెలిపింది. అలాగే పట్టణ ప్రాంతాల్లో ఒడిశా, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో అసమనాతలు పెరగ్గా మిగిలిన అన్ని రాష్ట్రాల్లో అసమానతలు తగ్గినట్లు నివేదిక పేర్కొంది. -
పచ్చటి పల్లెలపై బాబు విషం
సాక్షి, అమరావతి: 14 ఏళ్లకు పైగా ముఖ్యమంత్రిగా పనిచేసినప్పటికీ, ఏనాడూ గ్రామాల అభివృద్ధికి, గ్రామీణుల సంక్షేమానికి చర్యలు చేపట్టని చంద్రబాబు.. నేడు వైఎస్ జగన్ హయాంలో గ్రామీణాభివృద్ధి జరగలేదనడం దయ్యాలు వేదాలు వల్లించినట్లే. ఎప్పుడూ కార్పొరేట్లు, పెత్తందారుల సంక్షేమం కోసం పనిచేసే చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రంలోనూ, విభజిత ఆంధ్రప్రదేశ్‌లోనూ సీఎంగా పనిచేసిన కాలంలో ఏనాడూ గ్రామాల అభివృద్ధికి కనీస ప్రయత్నం చేయలేదు. గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలు, వారికి కావాల్సిన సౌకర్యాలు, విద్య, వైద్యం గురించి కనీస ఆలోచనే చేయలేదు. గ్రామాలను సర్వనాశనం చేసిన చంద్రబాబే.. ఆ విషయాలన్నింటినీ దాచిపెట్టి, గ్రామాలను అభివృద్ధి చేసిన వైఎస్ జగన్ ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారు. చంద్రబాబు పాలనలో కుదేలైపోయిన గ్రామాలకు పునరుజ్జీవం కల్పించి, గ్రామ స్వరాజ్యం, గ్రామాభివృద్ధిని సాకారం చేసందే వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో గ్రామగ్రామంలో అభివృద్ధి జరిగింది. రైతులు, అక్కచెల్లెమ్మలకు వైఎస్ జగన్ అందించిన చేయూతతో ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయి. ప్రజల అవసరాలు, ప్రభుత్వ సేవలు, వైద్యం, విద్య అన్నీ గ్రామాల్లోనే అందుబాటులోకి వచ్చాయి. గ్రామ స్వరాజ్య నిర్మాణానికి చిత్తశుద్ధితో పనిచేసి ఫలితాలు చూపించి జగన్ దేశానికే ఆదర్శంగా నిలిచారు. » 2019కు ముందు రాష్టంలో 3 వేల గ్రామ పంచాయతీలకు కనీసం ఆఫీసు భవనాలు లేవని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. 2019లో వైఎస్ జగన్ సీఎంగా వచ్చాక ఆయన ప్రవేశపెట్టిన గ్రామ సచివాలయ, వలంటీర్ల వ్యవస్థలు ఓ విప్లవం. ప్రతి గ్రామస్తుడికీ, ప్రతి ఇంటికీ వలంటీర్లు సహకారం అందించేవారు. ఇంటి వద్దే పింఛన్లు పంపిణీ చేసే వారు. గ్రామ సచివాలయాల్లో 8 నుంచి 10 మంది శాశ్వత ప్రభుత్వ ఉద్యోగులు ప్రజా సేవలో నిమగ్నమయ్యారు. ప్రజలకు అత్యంత వేగంగా సేవలందించేలా కంప్యూటర్లు, ప్రింటర్లు సహా అత్యాధునిక సౌకర్యాలు కల్పించారు. వీటి ద్వారా కుగ్రామాల్లో ఉండే వారు కూడా ఊరు దాటి వెళ్లకుండా ప్రభుత్వ సేవలన్నింటినీ ఊర్లోనే అందుకొంటున్నారు. » ప్రతి గ్రామంలో హెల్త్ క్లినిక్‌లను జగన్ నిర్మించారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.1,726 కోట్లతో 8,299 హెల్త్ క్లినిక్‌లు నిరి్మస్తున్నారు. వీటిలో 14 రకాల పరీక్షలు చేస్తారు. వ్యాధుల నిర్ధారణకు ర్యాపిడ్ కిట్లు, 105 రకాల మందులు అందుబాటులో ఉంచారు. » విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పనిముట్లు, యంత్రాల కోసం రైతులు పడుతున్న అగచాట్లను దూరం చేసేందుకు వైఎస్ జగన్ ప్రతి గ్రామలో రైతు భరోసా కేంద్రం ఏర్పాటు చేశారు. వీటిలో పంట ఉత్పత్తుల ధరలు, వాతావరణ సమాచారం, తేమ కొలిచే యంత్రాలు, విత్తనాలు, భూసార పరీక్ష కిట్లు అందుబాటులోకి తెచ్చారు. వీటి ద్వారా రైతుల ఖర్చు, సమయం చాలా ఆదా అయ్యేవి. » నాడు–నేడు పథకంలో ప్రభుత్వ పాఠశాలలను కార్పోరేట్ సూళ్లకు దీటుగా తీర్చిదిద్దారు. అత్యా«ధునిక డిజిటల్ తరగతులు, డిజిటల్ ల్రైబరీతో పేదల పిల్లలకు అంతర్జాతీయ స్థాయి విద్యను చేరువ చేశారు. » వైఎస్ జగన్ ప్రోత్సాహంతో డ్వాక్రా మహిళలు స్వయం ఉపాధితో ఆర్థికంగా బలపడ్డారు. కుటుంబానికి చేదోడువాదోడుగా నిలుస్తున్నారు. రైతులకు కనీస మద్దతు ధర అందేలా వైఎస్ జగన్ ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టేవారు. మార్కెట్లో పంట ఉత్పత్తులు ధరలు పడిపోయినప్పుడు మార్కెట్ ఇంటర్వెన్షన్ ద్వారా కనీస మద్దతు ధరకు రైతుల వద్ద ప్రభుత్వమే కొనుగోలు చేసేది. దీని ద్వారా రైతు ఎప్పుడూ నష్టం చవిచూడలేదు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంట నష్టం జరిగినా వెంటనే జగన్ ప్రభుత్వం వారికి అండగా నిలిచేది. అదే సీజన్లో బీమా పరిహారం అందించేది. ఇదీ చంద్రబాబు పాలన.. చంద్రబాబు పాలనలో గ్రామీణ ప్రజల కష్టాలు దేవుడికే ఎరుక. పంచాయతీల నిధులు గ్రామాల వరకు వచ్చేవి కావు. కనీసం తాగు నీరూ దొరికేది కాదు. పాఠశాలలు అత్యంత దయనీయ స్థితిలో ఉండేవి. గ్రామీణ ప్రజలకు ఏ చిన్న పని కావాలన్నా మండల కేంద్రం లేదా జిల్లా కేంద్రానికి వెళ్లాల్సిందే. ఇచి్చన కాస్తంత పింఛనుకూ ఎంతగా ఏడిపించుకు తిన్నారో ప్రతి గ్రామీణుడికీ అనుభవమే. రెండు మూడు వేల జనాభా ఉన్న గ్రామాలకు కూడా కనీసం పంచాయతీ కార్యదర్శి కూడా ఉండేవారు కాదు. సమస్య చెప్పుకోవడానికి గ్రామ పంచాయతీ ఆఫీసు ఒక్క రోజూ తెరిచి ఉండేది కాదు. అప్పట్లో... ఊళ్లో ఎవరికన్నా కొత్తగా పింఛను కావాలన్నా, రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవాలన్నా ఏడాదికో, ఆరు నెలలకో జరిగే జన్మభూమి కార్యక్రమం కోసం ఎదురు చూడాల్సివచ్చేది. రుణాలు మాఫీ చేస్తానని చంద్రబాబు చేసిన మోసానికి అన్నదాతలు, అక్కచెల్లెమ్మలు ఆర్థికంగా కుదేలైపోయి, గ్రామాల్లో జీవన ప్రమాణాలు దారుణంగా పడిపోయాయి. వర్షాభావంతో పంటలు పండక, ప్రత్యామ్నాయం లేక ఊళ్లకు ఊళ్లే వలసపోయాయి. -
PMAY: గ్రామాల్లో మరో 2 కోట్ల ఇళ్లు
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి ఆవాస్ యోజన–గ్రామీణ్(పీఎంఏవై–జీ) పథకం కింద గ్రామాల్లో మరో రెండు కోట్ల ఇళ్లను నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు ప్రధాని మోదీ అధ్యక్షతన ఢిల్లీలో శుక్రవారం జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. 2024–25 నుంచి 2028–29కాలానికి గ్రామాల్లో పీఎం ఆవాస్‌యోజన అమలుపై గ్రామీణాభివృద్ధి శాఖ ఇచి్చన ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన–పట్టణ(పీఎంఏవై–యూ) పథకం కింద రూ.2.30 లక్షల కోట్ల సాయం అందించనున్నారు. ఉద్యానరంగంలో చీడపీడలు తగ్గించడం, మెరుగైన విత్తనాలను సృష్టించడం, పూలు, పండ్ల దిగుబడి పెంచడమే లక్ష్యంగా క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్(సీపీపీ)కి కేబినెట్ పచ్చజెండా ఊపింది. ఉద్యానరంగంలో విప్లవాత్మక మార్పుల కోసం రూ.1,765.67 కోట్లను కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది.ఆ ‘క్రీమీలేయర్’ రాజ్యాంగంలో లేదు ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లలో క్రీమీలేయర్ అమలుకు ఆస్కారం లేదని కేంద్రం వ్యాఖ్యానించింది. రాజ్యాంగంలో ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్ల అమలు విషయంలో క్రీమీలేయర్ నిబంధన లేదని స్పష్టంచేసింది. తాజాగా ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు సూచనల నేపథ్యంలో దీనిపై భేటీలో విస్తృతంగా చర్చ జరిగిందని మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. -
ఒడిశాలో భారీ వర్షాలు.. 18 గ్రామాలకు సంబంధాలు కట్
దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఒడిశాలో కుండపోత వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ నేపధ్యంలోనే కొండచరియలు విరిగిపడటంతో మల్కన్‌గిరి జిల్లాలోని 18 గ్రామాలకు ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. ఈ వివరాలను అధికారులు మీడియాకు తెలియజేశారు.మల్కన్‌గిరి జిల్లా కోరుకొండ బ్లాక్ పరిధిలోని బయపదర్ ఘాట్ రోడ్డులోని తుంబపదర్ గ్రామ సమీపంలో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో మల్కన్‌గిరి, కోరాపుట్‌లోని లమటాపుట్, నందాపూర్ ప్రాంతా నుంచి వాహనాల రాకపోకలపై ప్రభావం పడింది. ఉత్తర ఒడిశాలోని గంగా మైదానాల్లో అల్పపీడనం ప్రభావంతో జూలై 31 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) బులెటిన్‌లో పేర్కొంది. ఆదివారం(నేడు) మల్కన్‌గిరి, కోరాపుట్, నబరంగ్‌పూర్, బోలంగీర్, నువాపాడా, సోన్పూర్, ఝర్సుగూడ, సుందర్ఘర్, సంబల్పూర్, కియోంజర్, అంగుల్, డియోగర్, కలహండి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ కార్యాలయం తెలిపింది.ఆదివారం బంగాళాఖాతంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ఐఎండీ హెచ్చరించింది. సముద్రం అల్లకల్లోలంగా ఉండే అవకాశం ఉన్నందున మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని అధికారులు సూచించారు. బార్గఢ్, జార్సుగూడ, సుందర్ఘర్, నుపాడా, నబరంగ్‌పూర్‌లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. -
యూపీలో వరదలు.. 500 ఇళ్లలోకి సరయూ నీరు
ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకి జిల్లాలో సరయూ నది వరదల కారణంగా వందలాది గ్రామాలు నీట మునిగాయి. నది నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరింది. దీంతో సమీపంలోని గ్రామాల ప్రజలు వరదల బారిన పడ్డారు అప్రమత్తమైన అధికార యంత్రాంగం సహాయక చర్యలను ముమ్మరం చేసింది.వరద బాధితులకు ఆహారం, ఇతర నిత్యావసర వస్తువులను అధికారులు పంపిణీ చేస్తున్నారు. బారాబంకి డీఎం సత్యేంద్ర కుమార్, ఎస్పీ దినేష్ కుమార్ సింగ్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. నేపాల్‌లో కురుస్తున్న వర్షాల కారణంగా గత రెండు మూడు రోజులుగా సరయూ నది నీటిమట్టం ప్రమాద స్థాయి కంటే 20 సెంటీమీటర్ల మేర పెరిగిందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం 15 గ్రామాల్లోని 500 ఇళ్లలోకి నీరు చేరిందని డీఎం పేర్కొన్నారు. ఈ కుటుంబాలకు చెందిన వారు సహాయక శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. ఈ శిబిరాల్లో అధికారులు వైద్య సేవలను కూడా అందుబాటులో ఉంచారు. -
‘ఉపాధి’ నిధులను సద్వినియోగం చేసుకోవాలి
సాక్షి, అమరావతి: ఉపాధి హామీ పథకం నిధులను సద్వినియోగం చేసుకోవాలని.. ఇందులో భాగంగా గ్రామాల్లో పకడ్బందీగా సోషల్ ఆడిట్ చేపట్టాలని అధికారులను ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ ఆదేశించారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సోషల్ ఆడిట్ విభాగం అధికారులతో పవన్‌కళ్యాణ్ గురువారం తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఉపాధి హామీ పథకం సోషల్ ఆడిట్ జరిగే తీరును, పనుల పురోగతి, నిధులు దుర్వినియోగానికి సంబంధించిన కేసుల వివరాలను అధికారులు పవన్‌కు తెలిపారు. పవన్ మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకం నిధులను సద్వినియోగం చేసుకుంటేనే సత్ఫలితాలు వస్తాయన్నారు.ఈ విషయంలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. సోషల్ ఆడిట్ పక్కాగా జరగాలని.. గ్రామాల్లో ప్రొటోకాల్‌ను అనుసరించి సోషల్ ఆడిట్ సభలు నిర్వహించాలని ఆదేశించారు. ఉపాధి హామీ పథకం నిధులు దుర్వినియోగం కాకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. చిన్నారుల్లో సైన్స్ పట్ల అవగాహన పెంచాలిగ్రామీణ ప్రాంతాల్లోని చిన్నారులకు సైన్స్ పట్ల ఆసక్తిని పెంచే దిశగా చర్యలు చేపట్టాలని అధికారులను పవన్ కల్యాణ్ ఆదేశించారు. గురువారం విజయవాడలో సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖపై జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. వైజ్ఞానిక ప్రదర్శనలు గ్రామ స్థాయి నుంచి నిర్వహించాలన్నారు. రాజమండ్రి ఎస్ఆర్ఎస్సీ ప్రాంతీయ వైజ్ఞానిక కేంద్రం ప్రారంభానికి సిద్ధంగా ఉన్న విషయాన్ని అధికారులు పవన్‌కు తెలియజేయగా.. త్వరలో ప్రజలకు అందుబాటులోకి తెద్దామని పవన్ అన్నారు. కాగా, తనకు కేటాయించిన శాఖలపై వరుసగా సమీక్షలు నిర్వహించిన పవన్.. అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించడంతో పాటు రక్షిత మంచి నీటి సరఫరాపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆదేశించారు. తుపాన్ల నుంచి తీరాన్ని రక్షించే మడ అడవులపై చర్చించారు. -
విరిగిపడ్డ కొండచరియలు.. భారీగా ప్రాణనష్టం
పోర్ట్మోర్స్బీ: పపువా న్యూ గినియాలో ప్రకృతి ఆగ్రహించింది. రాజధాని పోర్ట్ మోర్స్బీకి 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎన్గా ప్రావిన్స్‌లో భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో వందల మంది ప్రాణాలు కోల్పోగా పదుల సంఖ్యలో పౌరులు గాయపడ్డారు. ఈ విషయాన్ని ఆస్ట్రేలియా అధికారిక మీడియా వెల్లడించింది. తెల్లవారుజామున 3 గంటలకు కొండచరియలు ఒక్కసారిగా విరిగి కింద ఉన్న ఆరు గ్రామాలపై పడ్డాయి. పెద్ద సైజు రాళ్లు పడి గ్రామాల్లోని చాలావరకు ఇళ్లు నేలమట్టమయ్యాయి. ప్రజలు నిద్రలో ఉన్నపుడు ఇళ్లపై పెద్ద సైజు కొండ రాళ్లు పడటంతో భారీగా ప్రాణనష్టం వాటిల్లింది. ఘటన జరిగిన తర్వాత స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు.కొండ రాళ్ల కింద శిథిలాలు భారీగా కూరుకుపోవడం వల్ల సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటి వరకు 100కు పైగా మృతదేహాలను వెలికితీశారు. కొండ రాళ్లు విరిగిపడిన గ్రామానికి పోలీసులు, సహాయక బృందాలు ఇంకా చేరుకోలేదని తెలుస్తోంది. మృతుల సంఖ్యపై న్యూగినియా ప్రభుత్వం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. -
గ్రామాల ఆగ్రహం.. ఓటింగ్‌కు దూరం
అహ్మదాబాద్: గుజరాత్‌లోని మూడు గ్రామాలకు చెందిన సుమారు వెయ్యి మంది ఓటర్లు మంగళవారం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఓటింగ్‌ను బహిష్కరించారు. అయితే అనేక ఇతర గ్రామాల్లోనూ ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చకపోవడంతో ఓటింగ్ ప్రక్రియకు పాక్షికంగా దూరంగా ఉన్నారని అధికారులు తెలిపారు.ప్రాథమిక సమాచారం మేరకు.. బరూచ్ జిల్లాలోని కేసర్ గ్రామం, సూరత్ జిల్లాలోని సనాధార, బనస్కాంత జిల్లాలోని భఖారీ ఓటర్లు ఓటింగ్‌ను పూర్తిగా బహిష్కరించగా, జునాగఢ్ జిల్లాలోని భట్గాం గ్రామం, బోడోలి, మహిసాగర్ జిల్లాలోని కుంజర గ్రామాలు పాక్షికంగా ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. సనాధార గ్రామం బార్డోలి లోక్‌సభ స్థానం పరిధిలోకి వస్తుంది. ఇక్కడ 320 మంది ఓటర్లు ఉన్నారు. ఎన్నికల సంఘం నివేదిక ప్రకారం.. స్థానిక ఎన్నికల అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు స్వయంగా వచ్చి అభ్యర్థించినా గ్రామస్తులు ఒక్క ఓటు కూడా వేయలేదు.పటాన్ పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే బఖ్రీ గ్రామంలోని దాదాపు 300 మంది ఓటర్లు తమ గ్రామ పంచాయతీ విభజనకు నిరసనగా సమిష్టిగా ఓటింగ్‌ను బహిష్కరించాలని నిర్ణయించుకున్నారు. అధికారులు ప్రయత్నించినప్పటికీ, గ్రామస్తులు తమ నిర్ణయం మార్చుకోలేదు. తెల్లవారుజాము నుంచే పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి చేసి వేచి చూసినా గ్రామస్తులు ఓటేయడానికి రాలేదు. బీజేపీ అభ్యర్థి భరత్‌సింగ్ దాభి స్వయంగా గ్రామానికి వెళ్లి అభ్యర్థించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.భరూచ్ జిల్లాలోని కేసర్ గ్రామంలో దాదాపు 350 మంది ఓటర్లు కూడా ఒక్క ఓటు కూడా వేయలేదు. ఇక్కడ ఓటర్లు ఎన్నికలను బహిష్కరించడం ఇదే తొలిసారి కాదు. నదిపై వంతెన నిర్మించాలని పలుమార్లు డిమాండ్ చేసినా ప్రభుత్వం నెరవేర్చకపోవడంతో గతంలో కూడా ఇలాగే చేశామని స్థానికులు తెలిపారు. గుజరాత్‌లోని మొత్తం 26 లోక్‌సభ స్థానాలకు గాను 25 స్థానాలకు మంగళవారం ఒకే దశలో పోలింగ్ జరిగింది. సూరత్ స్థానాన్ని బీజేపీ ఏకపక్షంగా గెలుచుకుంది. -
అడవుల్లో ఆరని మంటలు.. చల్లార్చే పనిలో 30 గ్రామాల ప్రజలు!
ఉత్తరాఖండ్‌లోని అడవుల్లో చెలరేగుతున్న మంటలు చల్లారడం లేదు. తాజాగా అల్మోరా జిల్లాలోని అడవిలో మంటలను ఆపేందుకు 30 గ్రామాల ప్రజలు నిరంతరం శ్రమిస్తున్నారు.7.5 హెక్టార్లలో విస్తరించి, జిల్లాకే మోడల్ ఫారెస్ట్‌గా పేరుగాంచిన శ్యాహీదేవి-శీతలఖేత్ అటవీప్రాంతాన్ని కాపాడటంతోపాటు తమ పొలాలు, గడ్డివాములను రక్షించుకునేందుకు ఆయా గ్రామాల్లోని ప్రజలంతా అటవీ ప్రాంతాన్ని చల్లార్చేపనిలో పడ్డారు. వీరు తమ తిండితిప్పలను కూడా అడవుల్లోనే కొనసాగిస్తున్నారు.2003 నుంచి శ్యాహీదేవి-శీతలఖేత్ అడవులను అభివృద్ధి చేసే కార్యక్రమం కొనసాగుతోంది. ఆరోగ్య శాఖకు చెందిన ఫార్మసిస్ట్ గజేంద్ర కుమార్ పాఠక్ ఆధ్వర్యంలో ‘సేవ్ జంగిల్’ పేరుతో 30 గ్రామాల ప్రజలు అటవీ శాఖ సహాయంతో ఓక్, బురాన్ష్, ఫాల్యంట్ తదితర జాతుల అడవులను అభివృద్ధి చేశారు.ప్రస్తుతం ఈ అడవుల్లో మంటలు చెలరేగుతుండటంతో గ్రామస్తులు పగలనక రాత్రనక మంటలను ఆర్పే పనిలో నిమగ్నమయ్యారు. అడవిలో మంటలు తాడిఖేట్లోని సుదూర గ్రామానికి చేరుకున్నాయి. తమ ఇళ్లు, పొలాలు, గడ్డివాముల గురించి ఆందోళన చెందుతున్న గ్రామస్తులు అటవీ మంటలను చల్లాచ్చే పనిలో తలమునకలవుతున్నారు. గ్రామస్తులు తీవ్రంగా శ్రమించి గ్రామంలోకి మంటలు వ్యాపించకుండా ఉండేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. -
చంద్రాయపాలెం వర్సెస్ బుగ్గపాడు వర్సెస్ రుద్రాక్షపల్లి..
ఖమ్మం: సత్తుపల్లి మండలం చంద్రాయపాలెంలో పోడు భూముల వివాదం శాంతిభద్రతల సమస్యగా మారింది. ఈ గ్రామంలో సర్వే నంబర్ 343 నుంచి 359 వరకు విస్తరించి ఉన్న 400 హెక్ట్టార్ల భూమిపై హక్కు కోసం స్థానిక, స్థానికేతర గిరిజనులు ఆదివారం గొడవ పడుతుండగా అడ్డుకునేందుకు వెళ్లిన సీఐ కిరణ్, సిబ్బందిపై దాడి చేసిన విష యం విదితమే. ఈ ఘటనతో ఏర్పాటుచేసిన పోలీ సు పికెట్ సోమవారం కూడా కొనసాగగా పోలీసులపై దాడిలో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొన్న గిరిజనులను గుర్తించి అరెస్ట్ చేస్తున్నారు. ఆదివారం రాత్రే 20మంది గిరిజన మహిళలను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈమేరకు ఐదు కేసులు నమోదు చేయగా, మద్దిశెట్టి సామేలు, కూరం మహేంద్రతో పాటు ఇంకొందరిపై కేసుల్లో హత్యాయత్నం సెక్షన్లు కూడా చేర్చినట్లు ఏసీపీ అనిశెట్టి రఘు తెలిపారు. ఇక సోమవారం మద్దిశెట్టి సామ్యేలు, మహేంద్ర సహా 26మందిని అరెస్ట్ చేయగా ఇప్పటివరకు 46మందిని అరెస్ట్ చేసినట్లయింది. 15 ఏళ్ల నుంచి.. చంద్రాయపాలెం గిరిజనులకు బుగ్గపాడు, రుద్రాక్షపల్లి, నాగుపల్లి గ్రామాల గిరిజనుల నడుమ ఈ భూమిపై 15 ఏళ్ల నుంచి వివాదం నడుస్తోంది. అయినా అటవీ, రెవెన్యూ శాఖ అధికారులు సమ స్య పరిష్కారానికి చొరవ తీసుకోకపోవడంతోనే గొడవ జఠిలమైంది. చంద్రాయపాలెం గిరిజనులతో కలిసి 400 హెక్టార్లతో వీఎస్ఎస్ – అటవీ శాఖ సంయుక్తంగాజామాయిల్ సాగు చేస్తుండగా సుమారు 9 హెక్టార్లలో జామాయిల్ కట్ చేసి తిరిగి ప్లాంటేషన్‌కు సిద్ధమవుతుండడంతో వివాదం తీవ్రమైంది. అటవీ శాఖ అధికారులు చంద్రాయపాలెం గిరిజనులను ముందుపెట్టి సమస్యను వారే తేల్చుకోవాలన్నట్లుగా వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. భూమిపై తమకే హక్కులు ఉన్నాయని చంద్రాయపాలెం గిరిజనులు వాదిస్తున్నారు. అయితే 1970 కంటే పూర్వం తమ తాతముత్తాతలు సాగు చేసినట్లు హక్కు పత్రాలు ఉన్నాయని స్థానికేతర గిరిజనులు చెబుతున్నారు. ఏదిఏమైనా రెండు శాఖల సమన్వయంతో పోడు వివాదం తీవ్రమైందని విమర్శలు వస్తున్నాయి. అధికారులు ఏమన్నారంటే.. చంద్రాయపాలెం 400 హెక్టర్ల భూమి ముమ్మాటీకి అటవీ శాఖదేనని రేంజర్ స్నేహలత తెలిపారు. వీఎస్ఎస్–అటవీ శాఖ సంయుక్త ఆధ్వర్యాన 9 హెక్టార్లలో జామాయిల్ కటింగ్ పూర్తయిందని, ఈసారి అటవీ శాఖ ఆధ్వర్యంలో మారుజాతి మొక్కలను పెంచేందుకు భూమి చదును చేశామన్నారు. ఈ విషయంలో చంద్రాయపాలెం గిరిజనులకు కానీ ఇతర ప్రాంత గిరిజనులకు సంబంధం లేదని స్పష్టం చేశారు. ఇదేవిషయమై సత్తుపల్లి తహసీల్దార్ యోగేశ్వరరావు స్పందిస్తూ చంద్రాయపాలెంలోని అటవీ భూమికి రెవెన్యూ శాఖతో ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. భూవివాదాలను అట వీ శాఖతో కలిసి పరిష్కరించుకోవాలే తప్ప జాయింట్ సర్వే నిర్వహించలేదని స్పష్టం చేశారు. ఇవి చదవండి: విషాదం: ఫార్చ్యూనర్ కోసం ‘కరిష్మా’కు భవిష్యత్తే లేకుండా చేశారు -
కార్ల కంపెనీల పల్లె‘టూర్’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా 2022–23లో 38,90,114 యూనిట్ల ప్యాసింజర్ వెహికల్స్ (పీవీ) రోడ్డెక్కాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 42 లక్షల యూనిట్లు అమ్ముడవుతాయని అంచనా. 2024–25లో ఈ విభాగం 3–5% వృద్ధి చెందుతుందని పరిశ్రమ భావిస్తోంది. అయితే మొ త్తం ప్యాసింజర్ వాహనాల అమ్మకాల్లో గ్రామీణ ప్రాంతాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. ప్రస్తుతం పీవీ సేల్స్‌లో గ్రామీణ ప్రాంతాల వాటా 33% గా ఉంది. మహమ్మారి కాలంలో పట్టణ ప్రాంతాల్లో పీవీ విక్రయాల్లో తిరోగమన వృద్ధి ఉన్నప్పటికీ.. గ్రామీణ ప్రాంతాలు దూసుకుపోవడం గమనార్హం. కలిసి వ చ్చే అంశం ఏమంటే రూరల్ ఏరియాల్లో రోడ్ నెట్ వర్క్ చాలా మెరుగైంది. వృద్ధి పరంగా పట్టణ ప్రాంతా లను కొన్నేళ్లుగా గ్రామీణ మార్కెట్లు వెనక్కి నెట్టాయి. ఈ అంశమే ఇప్పుడు తయారీ కంపెనీలకు రిటైల్ విషయంలో వ్యూహం మార్చుకోక తప్పడం లేదు. వృద్ధిలోనూ రూరల్ మార్కెట్లే.. అమ్మకాల వృద్ధిరేటు 2023–24 ఆర్థిక సంవత్సరంలో గ్రామీణ ప్రాంతాల్లో 11.7, పట్టణ ప్రాంతాల్లో 8% ఉండొచ్చని అంచనా. 2022–23లో గ్రామీణ భారతం 20 % దూసుకెళితే, పట్టణ మార్కెట్లు 16 శాతం వృద్ధి సాధించాయి. 2021–22లో అర్బన్ మార్కెట్లు 9% తిరోగమన వృద్ధి చెందితే, రూరల్ మార్కెట్లు 1.5% ఎగశాయి. 2018–19 నుంచి 2023–24 వరకు చూస్తే ఒక్క 2019–20లో మాత్రమే గ్రామీణ భారతం తిరోగమన వృద్ధి చెందింది. అర్బన్ మార్కెట్లు మాత్రం 2021–22 వరకు వరుసగా మూడు ఆర్థిక సంవత్సరాలు తిరోగమన బాట పట్టాయి. విస్మరించలేని గ్రామీణం.. గ్రామీణ ప్రాంతాలు విస్మరించలేని మార్కెట్లుగా అభివృద్ధి చెందాయని మారుతీ సుజుకీ చెబుతోంది. ఈ సంస్థకు 2018–19లో గ్రామీణ ప్రాంతాల వాటా 38 శాతం. ఇప్పుడు ఇది 45 శాతానికి ఎగబాకింది. దేశవ్యాప్తంగా 6,50,000 గ్రామాలు ఉన్నాయని, ఇందులో 4,10,000 గ్రామాల్లో కనీసం ఒక్క మారుతీ సుజుకీ కారైనా పరుగు తీస్తోందని కంపెనీ ధీమాగా చెబుతోంది. మిగిలిన గ్రామాలు వ్యాపార అవకాశాలు ఉన్నవేనని కంపెనీ అంటోంది. 2019–20తో పోలిస్తే టాటా మోటార్స్ గ్రామీణ ప్రాంతాల అమ్మకాలు అయిదు రెట్లు అధికం అయ్యాయి. మొత్తం విక్రయాల్లో రూరల్ వాటా ఇప్పుడు ఏకంగా 40 శాతానికి చేరిందని కంపెనీ వెల్లడించింది. వినియోగదార్లకు చేరువ అయ్యేందుకు సేల్స్, సరీ్వస్ వర్క్‌షాప్స్‌ను విస్తరించినట్టు తెలిపింది. పట్టణాలకు సమీపంలో 800 ఔట్లెట్లు నెలకొన్నాయని, ప్రత్యేకంగా ఇవి గ్రామీణ కస్టమర్లకు సేవలు అందిస్తున్నాయని వివరించింది. దేశవ్యాప్తంగా 135 అనుభవ్ వ్యాన్స్ (మొబైల్ షోరూమ్స్) పరిచయం చేశామని తెలిపింది. గ్రామాల్లో చిన్న కార్లు.. హ్యాచ్‌బ్యాక్స్‌కు గ్రామీణ మార్కెట్లలో విపరీత డిమాండ్ ఉంది. తొలిసారిగా కారు కొనే కస్టమర్లు ఇక్కడ అత్యధికం కూడా. ఎంట్రీ లెవెల్, మిడ్ లెవెల్ హ్యాచ్‌బ్యాక్ విక్రయాల్లో రూరల్ ఏరియాల వాటాయే అధికం. ప్రీమియం హ్యాచ్బ్యాక్స్ అధికంగా అర్బన్ ప్రాంతాల్లో రోడ్డెక్కుతున్నాయి. సెడాన్స్ విషయంలో ఇరు మార్కెట్లు చెరి సగం పంచుకున్నాయి. ఎస్‌యూవీల్లో అయితే అర్బన్దే హవా. ఇక గ్రామీణ మార్కెట్లకు విక్రయశాలలు, సర్వీసింగ్ కేంద్రాలను విస్తరించే విషయంలో కంపెనీలు డీలర్ పార్ట్నర్స్ను ప్రోత్సహిస్తున్నాయి. మానవ వనరుల సంఖ్య పెంచేందుకు సాయం చేస్తున్నాయి. టెస్ట్ డ్రైవ్ కోసం వాహనాలను సమకూరుస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ నెట్వర్క్ మెరుగుపడింది. దీంతో వినియోగదార్లకు చేరువ కావడంలో భాగంగా సేల్స్ నెట్వర్క్ పెంచేందుకు కసరత్తు చేస్తున్నట్టు మహీంద్రా తెలిపింది. రూరల్ మార్కెట్లలోనూ తమ ఎస్‌యూవీలకు డిమాండ్ కొనసాగుతోందని వెల్లడించింది. ప్రజలను ప్రభావితం చేసే సర్పంచ్ల వంటి ముఖ్యులతో కలిసి కంపెనీలు విభిన్న కార్యక్రమాలు చేస్తున్నాయి. -
గ్రామాల అభివృద్ధితోనే ‘వికసిత్ భారత్’
అహ్మదాబాద్: గ్రామాలకు సంబంధించిన ప్రతి అంశానికి కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. వివిధ పథకాలు, కార్యక్రమాల ద్వారా సన్నకారు రైతుల జీవితాలను మెరుగుపర్చడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. గ్రామీణ ఆర్థికాభివృద్ధితోనే ‘వికసిత్ భారత్’ లక్ష్యం నెరవేరుతుందని స్పష్టం చేశారు. దేశం పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందాలంటే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలని అన్నారు. గురువారం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో గుజరాత్ కో–ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్(జీసీఎంఎంఎఫ్) 50వ వార్షికోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగించారు. లక్ష మందికిపైగా రైతులు, పాడి పశువుల పెంపకందారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రఖ్యాత అమూల్ కంపెనీని నిర్వహిస్తున్న జీసీఎంఎంఎఫ్ని ప్రపంచంలో నంబర్ వన్ డెయిరీగా మార్చడానికి కృషి చేయాలని పాడి రైతులకు, భాగస్వామ్యపక్షాలకు మోదీ పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఈ సహకార సంఘం(అమూల్) ప్రపంచంలో ఎనిమిదో అతిపెద్ద డెయిరీ కంపెనీగా స్థానం దక్కించుకుందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా డెయిరీ రంగం ఏటా 2 శాతం వృద్ధి సాధిస్తుండగా, మన దేశంలో మాత్రం 6 శాతం వృద్ధిని సాధిస్తోందని హర్షం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా 10 వేల రైతు ఉత్పత్తి సంస్థలు(ఎఫ్‌పీఓ) ఏర్పాటు చేయాలని నిర్ణయించామని మోదీ చెప్పారు. ఇప్పటికే 8 వేల ఎఫ్పీఓలు అందుబాటులోకి వచ్చాయన్నారు. సన్నకారు రైతులను వ్యవసాయ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా, ఎగుమతిదారులుగా మార్చాలని సంకలి్పంచామని అన్నారు. అన్నదాతల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు, తీసుకొచి్చన పథకాలను ప్రస్తావించారు. రైతుల కోసం మైక్రో ఏటీఎంలు, గోబర్దన్ పథకం, ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రాలు తీసుకొచ్చామని గుర్తుచేశారు. ఇంధన దాతగా, ఎరువుల దాతగా రైతులు జంతు సంపదను వ్యాధుల బారి నుంచి కాపాడానికి రూ.15,000 కోట్లతో ఉచిత వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభించామని, ఇప్పటికే 60 కోట్ల టీకా డోసుల ఇచ్చామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. గ్రామాల్లో కిసాన్ సమృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేశామని, ఇక్కడ పంటలకు సంబంధించి రైతుల సమస్యలకు శాస్త్రీయ పరిష్కార మార్గాలు లభిస్తున్నాయని వివరించారు. సేంద్రీయ ఎరువుల తయారీలో రైతులకు సహకారం అందిస్తున్నామని చెప్పారు. బయో గ్యాస్ ప్లాంట్ల ఏర్పాటుకు సైతం తోడ్పాటు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. రైతులను ‘అన్నదాత’ నుంచి ఇంధన దాతగా, ఎరువుల దాతగా మార్చాలన్నదే ప్రభుత్వ అకాంక్ష అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం రైతుల సంక్షేమం విషయంలో తమ ప్రతిజ్ఞను నెరవేర్చడానికి కట్టుబడి ఉన్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. రైతులకు సంబంధించిన ప్రతి డిమాండ్‌ను నెరవేర్చడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. దేశంలో రైతన్నల బాగు కోసం ఇప్పటిదాకా ఎన్నో చర్యలు చేపట్టామని, చెరకు ధర పెంచడం కూడా అందులో ఒకటి అని తెలిపారు. దీనివల్ల కోట్లాది మంది చెరకు రైతులు ప్రయోజనం పొందుతారని పేర్కొన్నారు. కేంద్ర కేబినెట్ తాజాగా తీసుకున్న నిర్ణయాలను ప్రస్తావిస్తూ మోదీ గురువారం ‘ఎక్స్’లో పలు పోస్టు చేశారు. క్వింటాల్ చెరకు కనీస ధర(ఎఫ్ఆర్పీ)ను మరో రూ.25 చొప్పున పెంచుతూ మోదీ నేతృత్వంలో కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దీంతో క్వింటాల్ చెరకు కనీస ధర రూ.350కు చేరుకుంది. ఇదొక చరిత్రాత్మక నిర్ణయమని మోదీ అభివరి్ణంచారు. అంతరిక్ష రంగంలో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను(ఎఫ్‌డీఐ) అనుమతిస్తూ కేబినెట్ మరో నిర్ణయం తీసుకుందని గుర్తుచేశారు. గుర్రాలు, గాడిదలు, కంచర గాడిదలు ఒంటెలు వంటి జంతువుల సంతతి వృద్ధికి సంబంధించిన పరిశ్రమలు, వ్యక్తులకు 50 శాతం పెట్టుబడి రాయితీ మంజూరు చేస్తూ కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. నన్ను అవమానించడమే వారి ఎజెండా నవ్సారీ: సొంత రాష్ట్రం గుజరాత్లో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ గురువారం కాంగ్రెస్ పారీ్టపై విమర్శల బాణాలు వదిలారు. దక్షిణ గుజరాత్‌లోని నవ్సారీ పట్టణంలో ఒక ప్రజా కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ‘‘ మోదీ కులాన్ని ఎంత మంది కాంగ్రెస్ నేతలు దూషించారో మీరందరూ చూసే ఉంటారు. కానీ కాంగ్రెస్ వాళ్లకు తెలియని విషయం ఏంటంటే వాళ్లెంతగా నన్ను తిడతారో 400 లోక్‌సభ సీట్లు గెలవాలన్న మా సంకల్పం అంతగా బలపడుతుంది. దేశం కోసం కాంగ్రెస్‌కు ఎలాంటి ఎజెండా లేదు. నన్ను తిట్టడమే వారి ఎజెండా. దేశ భవిష్యత్తుపై వాళ్లకు ఎలాంటి చింతా లేదు. ఎంతగా మాపై బురద జల్లుతారో అంతగా ఆ బురదలో 370(సీట్లు) కమల పుష్పాలు విరబూస్తాయి’ అంటూ లోక్‌సభ ఎన్నికల్లో కనీసం 370 సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తంచేశారు. ‘‘వారసత్వ రాజకీయాల మాటకొస్తే కాంగ్రెస్‌ను మించినది మరోటి లేదు’ అని విమర్శించారు. ‘బంధుప్రీతి, అవినీతి, బుజ్జగింపు రాజకీయాలు చేసేవారికి దేశ ఘన వారసత్వ పరిరక్షణ చేతకాదు’ అని వ్యాఖ్యానించారు. 2 అణు విద్యుత్ రియాక్టర్లు జాతికి అంకితం సూరత్: నవ్సారిలో సభ అనంతరం ఆయన పొరుగునే సూరత్ జిల్లాలో ఉన్న కక్రాపర్కు చేరుకున్నారు. కక్రాపర్ అణు విద్యుత్ స్టేషన్ వద్ద ప్రధాని మోదీ రెండు అణు విద్యుత్ రియాక్టర్లను జాతికి అంకితం చేశారు. కక్రాపర్ ఆటమిక్ పవర్ స్టేషన్లో 700 మెగావాట్ల చొప్పున సామర్థ్యం కలిగిన 3, 4 యూనిట్లను న్యూక్టియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఎన్పీసీఐఎల్) రూ.22,500 కోట్లతో ఏర్పాటు చేసింది. దేశీయంగా రూపుదిద్దుకున్న అతిపెద్ద ప్రెస్సరైజ్డ్ హెవీ వాటర్ రియా క్టర్లు ఇవే కావడం విశేషం. ప్రధాని ఇక్కడి సీనియర్ శాస్త్రవేత్తలు, ఉన్నతాధికారులతో మాట్లాడారు. ఇక్కడ తయారైన విద్యుత్ గుజరాత్‌తోపాటు మహా రాష్ట్ర, గోవా, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, కేంద్రపాలిత ప్రాంతాలు దాద్రా నాగర్ హవేలీ, డామన్ డయ్యూలకు సరఫరా అవుతుంది. -
Fact Check: ఆర్బీకేలపై నిత్యం ఏడుపే
సాక్షి, అమరావతి: రైతుకు అడుగడుగునా అండగా నిలిచి, వారిని చేయిపట్టి నడిపించే లక్ష్యంతో రైతు భరోసా కేంద్రం (ఆర్బీకే) వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. విత్తు నుంచి విక్రయం వరకు రైతులకు అన్ని విధాలా అండగా నిలిచిన ఆర్బీకేలు దేశానికే ఆదర్శంగా నిలుస్తుంటే.. వాటి సేవలను రైతులకు దూరం చేయడమే లక్ష్యంగా ఈనాడు దినపత్రిక నిత్యం విషం కక్కుతోంది. ఏపల్లెకు వెళ్లినా సకల సౌకర్యాలతో ఆర్బీకేలు స్వాగతం పలుకుతుండడాన్ని.. రైతులు వీటి సేవలను కొనియాడుతుండడాన్ని ఓర్వలేక అదే పనిగా బురద జల్లే కార్యక్రమం చేపట్టింది. తాజాగా ‘రైతు సేవ వట్టిదే..భరోసా దక్కదే..!’ అంటూ అబద్ధాలు అచ్చేసింది. ఆరోపణ: వేధిస్తోన్న సిబ్బంది కొరత వాస్తవం: గ్రామ స్థాయిలో ఏర్పాటైన 10,778 ఆర్బీకేల్లో 14,323 మంది సిబ్బందితో పాటు 1,573 మంది ఎంపీఈవోలు సేవలందిస్తున్నారు. ప్రతీ ఆర్బీకేకు గ్రామ వలంటీర్‌తో పాటు బ్యాంకింగ్ కరస్పాండెంట్‌ను అనుసంధానం చేశారు. సిబ్బంది కొరతను అధిగమించేందుకు రేషనలైజేషన్ చేస్తున్నారు. పశుసంవర్ధక శాఖ పరిధిలో రేషనలైజేషన్ ప్రక్రియ పూర్తి చేయగా, 1896 మంది అవసరమని గుర్తించి ఆ పోస్టుల భర్తీ చేపట్టారు. ఇటీవలే ఫలితాలు విడుదల చేయగా, ఎంపికైన వారికి అపాయింట్మెంట్లు ఇస్తున్నారు. నెలకు రూ.12వేల వేతనంతో తాత్కాలిక సిబ్బంది(ఎంపీఈవో)ని రెండు దఫాలుగా నియమించి శాశ్వత ఉద్యోగాలు కల్పించారు. ఇప్పటి వరకు ఏ ఒక్కర్ని ప్రభుత్వం తొలగించిన దాఖలాలు లేవు. ఆరోపణ: లక్ష్యాల పేరిట సిబ్బందిపై ఒత్తిళ్లు వాస్తవం: వివక్షకు తావులేకుండా అడిగిన ప్రతీ రైతుకు సర్టిఫైడ్ సాగు ఉత్పాదకాల పంపిణీ, సాగులో సలహాలు, సూచనలు, ఈ–క్రాప్ బుకింగ్, సంక్షేమ పథకాల అమలు, ధాన్యంతో సహా ఇతర పంట ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారు. వీరిపై అదనపు బాధ్యతలు మోపకుండా స్వేచ్ఛగా, స్వచ్ఛందంగా పనిచేసుకునే వాతావరణాన్ని సృష్టించిందే తప్ప లక్ష్యాల పేరిట ఏ ఒక్కర్ని ఒత్తిడికి గురిచేసిన దాఖలాలు లేవు. అలా అని ఏ ఒక్క సిబ్బంది ఫిర్యాదు చేసిన ఘటనలు లేవు. సిబ్బందికి సచివాలయ శాఖ నుంచి సకాలంలో జీతభత్యాలు చెల్లిస్తున్నారు. మండల అధికారుల సిఫార్సుతో సెలవులు మంజూరు చేస్తున్నారు. రోజు మొత్తంలో ఏ సమయంలోనైనా హాజరు వేసే వెసులుబాటు కల్పించారు. సిబ్బంది అంతర్గత బదిలీలకు ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న 186 మందిని వారు కోరుకున్న చోటకు బదిలీ చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసారు. ఆరోపణ: అద్దె భవనాలే దిక్కు వాస్తవం: 526 గ్రామాల్లో సొంత భవనాలుండగా, 10,252 గ్రామాల్లో రూ.2,260 కోట్ల అంచనాతో కొత్త భవనాలను నిర్మిస్తున్నారు. ఇప్పటికే రూ.1090.23 కోట్లతో నిర్మించిన 4,554 ఆర్బీకే భవనాలను వ్యవసాయ శాఖకు అప్పగించారు. వీటిలో మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.357 కోట్లు ఖర్చు చేశారు. మిగిలిన వాటిని మార్చిలోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సాగు ఉత్పాదకాల బుకింగ్‌తో పాటు ఎప్పటికప్పుడు వాతావరణ, మార్కెట్ సమాచారం తెలుసుకునేందుకు వీలుగా 9,484 ఆర్బీకేల్లో కియోస్క్‌లను.. వీటి పనితీరు పర్యవేక్షణకు ప్రత్యేక డాష్‌బోర్డును ఏర్పాటు చేశారు. ఆరోపణ: అద్దెలు, బిల్లులు, ఇంటర్నెట్ చార్జీలేవీ? వాస్తవం: అద్దె భవనాల్లో ఉన్న 3,830 ఆర్బీకేలకు అద్దెల రూపంలో రూ.43 కోట్లు ఖర్చుచేయగా, వచ్చే మార్చి వరకు అద్దెల నిమిత్తం సర్దుబాటు చేసేందుకు మరో రూ.32.98 కోట్లు విడుదల చేశారు. ఇప్పటికే రూ.22.98 కోట్లు భవన యజమానుల ఖాతాలకు జమ చేశారు. మిగిలిన మొత్తం చెల్లించేందుకు ఏర్పాట్లు చేశారు. పెండింగ్‌లో ఉన్న విద్యుత్ బిల్లుల కోసం రూ.12 కోట్లు విడుదల చేయగా.. వచ్చే మార్చి వరకు బిల్లుల చెల్లింపునకు అవసరమయ్యే బడ్జెట్‌ను నేరుగా విద్యుత్ శాఖకే కేటాయించేలా ఉత్తర్వులిచ్చారు. స్టేషనరీ కోసం రూ.3 కోట్లు విడుదల చేయగా, స్టేషనరీ కోసం ఖర్చు చేసిన సిబ్బందికి నేరుగా రూ.53.48 లక్షలు జమ చేసారు. స్థానికంగా అందుబాటులో ఉన్న హైస్పీడ్ ఇంటర్నెట్ నెట్వర్క్ సదుపాయాన్ని సమకూర్చేందుకు రూ.23 కోట్లు విడుదల చేశారు. వైఎస్సార్ రైతు భరోసా మాస పత్రిక కోసం ఆర్బీకే స్థాయిలో అవగాహన కల్పించి ఔత్సాహిక రైతులు చందాదారులుగా చేర్చే‡ కార్యక్రమం చేపట్టారే తప్ప వీటి కోసం సిబ్బందికి ఎలాంటి టార్గెట్లు విధించలేదు. ఆరోపణ: ఆర్బీకేలకు ఆదరణ కరువు వాస్తవం: అదును దాటక ముందే.. సర్టిఫై చేసిన నాణ్యమైన సాగు ఉత్పాదకాలను బుక్ చేసుకున్న 24 గంటల్లోపే రైతులకు అందిస్తున్నారు. తొలి ఏడాది(2020–21) 1.07 లక్షల టన్నుల ఎరువుల విక్రయాలు జరగ్గా, 3వ ఏడాది (2022–23) 4 లక్షల టన్నులకు అమ్మకాలు చేరాయి. తొలి ఏడాదిలో 2.55 లక్షల మంది ఎరువులు తీసుకుంటే..గతేడాది 10.90 లక్షల మంది తీసుకున్నారు. 2023–24లో ఇప్పటివరకు 8.95లక్షల మంది రైతులు 3.89 లక్షల టన్నుల ఎరువులు తీసుకున్నారు. ఆర్బీకే ద్వారా అమ్మే ఎరువుల రవాణా, నిల్వ, అమ్మకానికి కావాల్సిన సదుపాయాల భారం పూర్తిగా ప్రభుత్వమే భరిస్తోంది. మరొక వైపు 34.27 లక్షల క్వింటాళ్ల విత్తనాలను రూ.1,040.39 కోట్ల రాయితీతో 58.74 లక్షల మంది రైతులకు, నాన్ సబ్సిడీ కేటగిరీ కింద రూ.13.90 కోట్ల విలువైన 1,784.47 క్వింటాళ్ల పత్తి, మిరప, సోయాబీన్ తదితర విత్తనాలను 44వేల మంది రైతులకు సరఫరా చేశారు. 2020–22 మధ్య 1.51 లక్షల మందికి రూ.14 కోట్ల విలువైన 1.36 లక్షల లీటర్ల పురుగు మందులను పంపిణీ చేయగా, ఈ ఏడాది ప్రస్తుత రబీలో ఇప్పటికే రూ.18.57లక్షల విలువైన 1657 లీటర్ల పురుగుల మందులను 6వేల మంది రైతులకు పంపిణీ చేశారు. ఆర్బీకేలు లాభాపేక్షతో కూడిన వాణిజ్య కేంద్రాలు కాదు. రైతులకు గ్రామస్థాయిలో ఏర్పాటైన సేవా కేంద్రాలన్న విషయాన్ని గుర్తించుకోవాలి. ఆర్బీకేల ద్వారా ఎరువులు, పురుగుల మందుల అమ్మకాలు వ్యాపారం కాదు..ఒక సదుపాయం మాత్రమే. కేంద్రంతో పాటు పలు రాష్ట్రాలు, ఇథియోపియా, బంగ్లాదేశ్, జర్మనీ, వియత్నాం వంటి విదేశీ ప్రతినిధుల బృందాలు ఆర్బీకే సేవలను శ్లాఘిస్తున్నాయి. అనతికాలంలోనే అవార్డులు, రివార్డులతో పాటు ప్రపంచ స్థాయి ఖ్యాతి గడించిన ఆర్బీకేలపై ఈనాడు విషం కక్కడం పట్ల రైతులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. -
‘గిరి’ రహదారులకు మోక్షం
మెళియాపుట్టి: ‘గిరి’ గ్రామాల రహదారుల కష్టాలకు ఎట్టకేలకు తెరపడింది. శ్రీకాకుళం జిల్లాలోని మెళియాపుట్టి మండలంలో ఉత్తరాంధ్రలోనే అత్యంత ఎత్తయిన గిరిజన గ్రామాలు ఉన్నాయి. వాటికి దశాబ్దాలుగా రహదారి సౌకర్యాలు లేవు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక సీఎం ఆదేశాల మేరకు ఎమ్మెల్యే రెడ్డి శాంతి ‘గడపగడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమం నిర్వహించి, గిరి శిఖర గ్రామాలను సందర్శించి వారి సమస్యలు, కష్టాలను తెలుసుకున్నారు. రహదారి కష్టాలు తీరితే అన్ని సౌకర్యాలు వారికి అందుతాయనే ఆలోచన చేసి, విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే కృషి ఫలితంగా ఉత్తరాంధ్రలోనే ఎత్తయిన గిరిశిఖర గ్రామమైన చందనగిరి గ్రామానికి (రూ.1.25 కోట్లతో 3.10 కి.మీ), హడ్డివాడ (రూ.1.75 కోట్లతో 2.3 కి.మీ), కేరాసింగి (రూ.92 లక్షలతో 1.5 కి.మీ), కేరాసింగిగూడ (రూ.1.5కోట్లతో 2.5 కి.మీ), మొత్తంగా రూ.5.42 కోట్లతో గిరి శిఖర గ్రామాలకు వెళ్లే రహదారి పనులకు నిధులు తీసుకువచ్చి పనులు సైతం వేగవంతం చేశారు. ప్రస్తుతం హడ్డివాడ గ్రామానికి రహదారి పూర్తి కాగా.. మిగిలిన గ్రామాలకు రహదారి పనులు చివరి దశలో ఉన్నాయి. గిరిజనులకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలోనే గౌరవం లభించిందని, పోడుపట్టాలు అందుకున్నామని, రైతుభరోసాతోపాటుగా అన్ని పథకాలు అందుతున్నాయని ఆయా గిరిజన గ్రామాల ప్రజలు చెబుతున్నారు. కిలోమీటర్ల మేర నడుచుకుంటూ కొండలపైనుంచి కిందికి దిగి, రేషన్ సరుకులు మోసుకుంటూ వెళ్లిన రోజులు మర్చిపోయేలా చేసి కొండలపైకి నేడు ట్రాక్టర్‌పై సరుకులు తీసుకెళ్లి పంపిణీ చేస్తున్నారు. కొద్దిరోజుల్లోనే రహదారి నిర్మాణాలు పూర్తిచేసి గిరిజనుల కష్టాలకు తెరదించనున్నట్లు స్థానిక ఎమ్మెల్యే రెడ్డి శాంతి తెలిపారు. గత తెలుగుదేశం పాలకులు గిరిజనులకు చేసిందేమీ లేకపోవడంతో జగన్మోహన్రెడ్డి ప్రజారంజక పాలనను చూసి ఓర్వలేక విమర్శలకే పరిమితమయ్యారు. ఆనందంగా ఉంది గడప గడపకూ వెళ్లిన సమయంలో రహదారులు చూసి బాధపడ్డాను. వారి గ్రామాలకు వెళ్లి కష్టాలను చూశాను. వారి బతుకులు బాగుచేయాలని ఆలోచించి జగనన్న దృష్టికి సమస్యను తీసుకువెళ్లాను. గిరిజనుల సమస్య అనగానే ముఖ్యమంత్రి వెంటనే స్పందించారు. రహదారుల మంజూరుతో ప్రస్తుతం గిరిజనుల కష్టాలు తీరనున్నందుకు సంతోషంగా ఉంది. ఎమ్మెల్యేగా వారికష్టాలు తీర్చడం చాలా ఆనందంగా ఉంది. గిరిజనాభివృద్ధికి పెద్దపీట వేసిన వ్యక్తి జగనన్న కాబట్టే ఇది సాధ్యమైంది. – రెడ్డి శాంతి, ఎమ్మెల్యే, పాతపట్నం మాటిచ్చారు.. నిలబెట్టుకున్నారు రహదారి కోసం ఎన్నో ఏళ్లు నిరీక్షించాం. ఎంతో మంది చుట్టూ తిరిగాం. కానీ మా స్థితి మారలేదు. మహిళా ఎమ్మెల్యే అయినా.. రెడ్డి శాంతమ్మ కాలినడకన మా గ్రామానికి వచ్చి ‘గడప గడపకూ కార్యక్రమం’ నిర్వహించారు. మా సమస్యలు చెప్పుకొన్నాం. అన్నీ చేస్తానని మాటిచ్చారు. రహదారి మంజూరు చేశారు. రోడ్డు పూర్తి కావడంతో మాకష్టాలు తీరాయి. సంతోషంగా ఉంది. – చందనగిరి పోలయ్య, హడ్డివాడ గ్రామం సంతోషంగా ఉంది జగనన్నను పాదయాత్రలో కలిసి గిరిజనుల కష్టాలను వివరించాను. అధికారంలోకి రాగానే న్యాయం చేస్తాన్నారు. ఎమ్మెల్యే దృష్టికి గిరిజనుల సమస్యలు తీసుకెళ్లా.. ఆమె స్పందించారు. కృషికి ఫలితం లభించింది. ఎంతోకాలంగా కొండప్రాంతాలకు సరైన రహదారులు లేక ఇబ్బందులు పడ్డాం. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో మా గిరిజనుల కష్టాలు తీరుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. జెడ్పీటీసీగానే కాకుండా నేను కూడా గిరిజనుల్లో ఒకడ్ని కావడం ఆనందంగా ఉంది. సీఎం జగన్, ఎమ్మెల్యే రెడ్డి శాంతికి రుణపడి ఉంటాను. – గూడ ఎండయ్య, జెడ్పీటీసీ సభ్యుడు, మెళియాపుట్టి మండలం -
తెలుగువారికి పెద్ద పండుగ అంటే సంక్రాంతే..!
తెలుగువారికి పెద్ద పండుగ అంటే సంక్రాంతే.రాత్రిపవలూ పండుగే. అదీ మూడు,నాలుగు రోజుల పాటు సాగుతుంది.అన్ని రకాల అభిరుచులవారికి, అన్ని వయస్సులవారికీ ఆనందాన్ని నింపే పండుగ సంక్రాంతి. నిజం చెప్పాలంటే? ఏ పండుగ శోభ చూడాలన్నా, పల్లెల్లోనే చూడాలి.మరీ ముఖ్యంగా సంక్రాంతి పల్లెసీమల పండుగ. పేరుకు మూడు రోజులైనా, ముక్కనుము వరకూ నాలుగురోజులపాటు అన్ని సీమల్లోనూ బోలెడు విందు వినోదాలు సందడి చేస్తాయి. సంక్రాంతి అంటే సంక్రమణం, అంటే మార్పు.మారడం అని అర్ధం. పల్లెటూర్లలో 'సంకురాత్తిరి' అని అంటారు.దాదాపు అన్ని మాండలీకాలలోనూ ఇదే మాట వినపడుతుంటుంది. పల్లెల్లో జీవించేవారికి,కనీసం బాల్యమైనా కొన్నేళ్లు పల్లెటూరులో గడిపినవారికి ఈ పండుగ బాగా అర్ధమవుతుంది. పట్టణాల్లో, నగరాల్లో,విదేశాల్లో జీవించేవారు సైతం పిల్లలను తీసుకొని తమ పల్లెలకు వెళ్ళడం సరదా. రవాణా సౌకర్యాలు బాగా పెరిగిన నేపథ్యంలో,ఈ సరదా ఈమధ్య బాగా పెరుగుతోంది. జనం రాకతో పల్లెలు నేడు కూడా కళకళలాడుతున్నాయి. ఇది మంచి పరిణామం. సూర్యుడు... మేషం మొదలైన 12రాశులలో క్రమంగా పూర్వ రాశి నుంచి ఉత్తర రాశిలోకి ప్రవేశించడం 'సంక్రాంతి'. సంవత్సరానికి 12సంక్రాంతులు ఉంటాయి. పుష్యమాసంలో,హేమంత రుతువులో చల్లగాలులు వీస్తూ, మంచు కురిసే వేళలలో సూర్యుడు మకరరాశిలోకి మారగానే వచ్చేది 'మకర సంక్రాంతి'. దీనికే అత్యంత ప్రాముఖ్యతనిచ్చి, పండుగలు జరుపుకుంటాం. సూర్యుడు ఉత్తరాయణ పథంలో అడుగు పెడతాడు.తెలుగువారితో పాటు తమిళులు ఈ పండుగను బాగా జరుపుకుంటారు. భోగి,సంక్రాంతి,కనుమ, ముక్కనుమగా నాలుగురోజుల పాటు జరుపుకుంటాం. కనుమ,ముక్కనుమను మాంసాహార ప్రియులకు గొప్ప వేడుకగా నిలుస్తుంది. రైతులకు పంట చేతికొచ్చే కాలమిది. కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర దొరికి, నాలుగు రూపాయలు మిగిలినప్పుడే రైతుకు నిజమైన పండుగ.గిట్టుబాటు ఎట్లా ఉన్నా? పంట చేతికి వచ్చిన అనందంతోనూ రైతు పండుగ చేసుకుంటాడు. ప్రతి రైతు కుటుంబంలో అనందం నింపడం ప్రభుత్వాల బాధ్యత. అది తీరేది ఎన్నడో?? "పండుగలు అందరి ఇంటికీ వస్తాయి,కానీ,ఎందుకో మా ఇంటికి రావు!" అన్నాడు ఒక పేద కవి. ప్రతి పౌరుడు అనందంగా జీవించిన ప్రతిరోజూ పండుగే. "గరీబీ హటావో " అనే నినాదాన్ని ఎన్నో ఏళ్ళ క్రితం అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ వినిపించారు. ఇప్పటికీ పేదరికం తగ్గకపోగా, డబ్బున్నవాడికి -లేనివాడికి మధ్య వ్యత్యాసం బాగా పెరిగిపోయింది.ఈ పరిణామం దేశ శాంతికి,సోదరత్వానికి మంచిది కాదు. కొనుగోలు శక్తి గతంలో కంటే నేడు కొందరిలో పెరిగినా,దారిద్ర్య రేఖకు దిగువనే ఇంకా చాలామంది వున్నారు. అందరి వైభవమే దేశ వైభవం. అది ఇప్పటికైనా గుర్తెరిగి పాలకులు నడుచుకోవాలి. ఈ పండుగ వేళల్లో నిత్యావసర ధరలు 50శాతం పెరిగాయనే వార్తలు వస్తున్నాయి.పేదవాడు, దిగువ,మధ్యతరగతి వాళ్లు పండుగ ఎట్లా జరుపుకుంటారు?సొంతఊర్లకు వెళ్లాలంటే బస్సులు, విమానాల టిక్కెట్ల ధరలు ఆకాశాన్ని అంటుతాయి. ప్రతి పండుగ సమయాల్లో ఇదే తీరు నడుస్తోంది. ఏలినవారు శుభాకాంక్షలు చెప్పడం కాదు,ఈ ధరలను నియంత్రణ చెయ్యాలి.ఈ చీకటి కోణాలు పక్కన పెట్టి,పండుగ వెలుగుల్లోకి వెళదాం. పల్లెసీమల్లో బుడబుక్కలవాళ్లు, పగటి వేషధారులు,వివిధ రూపాల్లో జానపద కళాకారులు చేసే హడావిడి అంతా ఇంతాకాదు. ముగ్గులు,గొబ్బెమ్మలతో వీధులు మెరిసిపోతూ ఉంటాయి. భోగి ముందు రోజు నుంచి రాత్రి వేళల్లో వేసే మంటల దగ్గర చలికాచుకోవడం గొప్ప అనుభూతి. రేగిపండ్ల శోభ చూచి తీరాల్సిందే. కోడి పందాలు,ఎడ్లబండ్ల పందాలు పోటాపోటీగా సాగుతాయి. కోడి పందాలకు పలనాడు ఒకప్పుడు చరిత్ర సృష్టించింది. యుద్ధాలే జరిగాయి.ఇప్పటికీ కోడి పందాలు జరుగుతూనే వున్నాయి.గోదావరి జిల్లాల్లో కొన్నేళ్ల నుంచి కోడి పందాలు బాగా పెరిగాయి.ఎద్దుల బండి పోటీలు పలనాడు,ప్రకాశం,రాయలసీమ జిల్లాల్లో ఒకప్పుడు చాలా బాగా జరిగేవి.'ఒంగోలు గిత్త 'కు ప్రపంచంలోనే ఎంతో ఖ్యాతి వచ్చింది. ఈ ఖ్యాతి తగ్గుముఖం పట్టిన కాలంలో నేడు మనం జీవిస్తున్నాం. ఉత్తరాయణ పుణ్యకాలంలో శారీరక పరిశ్రమకు, వ్యాయామానికి,ధ్యాన, యోగ సాధనకు చాలా అనువైన కాలం.ఉత్తరాయణాన్ని ఎంతో పుణ్యకాలంగా భారతీయులు భావిస్తారు.అందుకే,భీష్ముడు ఉత్తరాయణం ప్రవేశించిన తర్వాత ప్రాణాలు వదిలేశాడు. యోగ మార్గంలో ప్రాణాలను వదిలే సాధన ఇప్పటికీ ఉంది. ఇంతటి పుణ్యకాలంలో,వారి వారి శక్తి మేరకు దానధర్మాలు చేయడం చాలా మంచిది. మన భరతభూమిపై ఎన్నో ఏళ్ళ నుంచి ఈ సంస్కృతి ఉంది. కలియుగంలోని ప్రధాన ధర్మం దానం చేయడంగా పెద్దలు చెబుతారు. బొమ్మలకొలువులు, చెరుకుగడలు,పసుపుపారాణులు , తాంబూలాలు ఎటు చూచినా కనిపిస్తాయి. అరిసెలు,బొబ్బట్లు, జంతికలు,గారెలు,చక్కినాలు గురించి చెప్పక్కర్లేదు. గంగిరెద్దులు, డోలు సన్నాయిలు, డూడూ బసవన్నలు చేసే సందడి చూడాల్సిందే. తిరునామం తీర్చి, కాళ్లకు గజ్జెలు కట్టి,చేతిలో తాళం మోతలతో,హరిలో రంగ హరీ! అంటూ హరిదాసులు పాడుతూ నాట్యం చేస్తూ ఉంటే, పిల్లాజెల్లా తన్మయులైపోతారు. ఇటువంటి ఎన్నో వినోదాలు, ఆనంద దృశ్యాలు సంక్రాంతి పండుగ వేళల్లో కనువిందు, విన పసందు చేస్తాయి. జీవహింసగా భావించి కోడి పందాలపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఉత్తర భారతదేశంలో మకర్ సంక్రాంతి లేదా లోరీని జరుపుకుంటారు. ఆదిశంకరాచార్యుడు సంక్రాంతి నాడే సన్యాస దీక్ష తీసుకున్నారని చెబుతారు. వైష్ణవ భక్తులు ధనుర్మాస వ్రతాన్ని ఆచరించి, సంక్రాతి పండుగనాడు గోదాకళ్యాణం జరుపుకుని, వ్రతం సంపూర్ణమైనట్లుగా భావిస్తారు. అనాదిగా,పల్లెలు పునాదిగా జరుపుకుంటున్న సంక్రాంతి వేడుకలు ఆనందానికి, సాంస్కృతిక వైభవానికి ప్రతీకలు. అందరికీ భోగి, సంక్రాంతి,కనుమ శుభాకాంక్షలు. - మాశర్మ, సీనియర్ జర్నలిస్టు -
జగనన్న పాలనలో పల్లెకు పండగొచ్చింది
-
భారతదేశంలోని అత్యంత అందమైన గ్రామాలు చూసారా..? (ఫోటోలు)
-
మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం కోరిన ఎమ్మెల్యే కేటీఆర్..
రాజన్న సిరిసిల్ల: 'సిరిసిల్ల 2016లో అక్టోబర్‌లో జిల్లా కేంద్రంగా ఆవిర్భవించింది. అయితే సిరిసిల్ల పట్టణ జనాభా 83 వేల వరకు ఉంది. లక్ష జనాభా ఉంటే ద్వితీయశ్రేణి మున్సిపాలిటీల జాబితాలో చేరడం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి భారీగా నిధులు సమకూరి.. అభివృద్ధి చెందుతుందనే లక్ష్యంతో సిరిసిల్లలో ఏడు గ్రామాలను 2018లో విలీనం చేశారు. ఫలితంగా 33 వార్డులుగా ఉన్న సిరిసిల్ల మున్సిపాలిటీ 39 వార్డులుగా మారింది. అప్పటి మున్సిపల్‌శాఖ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారక రామారావు చొరవతోనే ఏడు గ్రామాలు మున్సిపల్లో కలిపారు.' - ‘సిరిసిల్ల పట్టణంలో విలీనమైన ఏడు గ్రామాలకు మినహాయింపునిస్తూ.. మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం చేసి, ప్రభుత్వానికి పంపండి. ఆ ఏడు గ్రామాలు సిరిసిల్ల నుంచి విడిపోయేందుకు సిద్ధంగా ఉన్నాయి. అందరితో చర్చించి మున్సిపల్ కౌన్సిల్ తీర్మానించి పంపితే ప్రభుత్వం పరిశీలిస్తుంది..’ అని సిరిసిల్ల ఎమ్మెల్యే, కేటీఆర్, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళకు మంగళవారం సూచించారు. - ‘రగుడు, చంద్రంపేట, ముష్టిపల్లి, చిన్నబోనాల, పెద్దబోనాల, పెద్దూరు, సర్దాపూర్ గ్రామాలను సిరిసిల్ల మున్సిపల్లో బలవంతంగా విలీనం చేశారు. మున్సిపల్ నుంచి వేరు చేసి గతంలో మాదిరిగా ఆ పల్లెలను గ్రామపంచాయతీలుగా ఉంచేలా కృషి చేస్తాను. మీ ఏడు గ్రామాల ప్రజల ముంగిట ప్రమాణం చేస్తున్నాను..’ అని నవంబరు 28న సిరిసిల్ల కాంగ్రెస్ అభ్యర్థి కేకే మహేందర్‌రెడ్డి బాండ్ పేపర్ రాసిచ్చారు. కోర్టుకెక్కిన పల్లెలు సిరిసిల్ల పట్టణంలో విలీనమైన ఏడు గ్రామాల తరఫున పెద్దూరు, సర్దాపూర్ వాసులు హైకోర్టును ఆశ్రయించారు. అప్పట్లో ఆయా గ్రామాల ప్రజలు సిరిసిల్లలో విలీనాన్ని వ్యతిరేకించారు. శ్రీపల్లెలను చంపేస్తారా.. పట్టణీకరణ పేరిట పంచాయతీలను పట్టణాల్లో కలిపేస్తార?శ్రీ అంటూ న్యాయస్థానం విలీన పల్లెల పిటిషన్లపై ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కానీ చివరికి ప్రభుత్వ వాదనతో ఏకీభవిస్తూ ఏడు గ్రామాల విలీనం పూర్తయింది. ఆ పల్లెల్లో పదేళ్ల వరకు ఎలాంటి ఆస్తిపన్నులు పెంచబోమని, వేగంగా అభివృద్ధి చేస్తామని విలీన సమయంలో ప్రభుత్వం స్పష్టం చేసింది. అభివృద్ధి అంతంతే..! సిరిసిల్లలో విలీనమైన ఆ ఏడు గ్రామాల్లో అభివృద్ధి పనులు గత ఐదేళ్లలో అంతంతమాత్రంగానే జరిగా యి. ఆయా గ్రామాల్లోని గ్రామపంచాయతీ భవనా లు వార్డు అభివృద్ధి కేంద్రాలుగా మారాయి. గ్రామపంచాయతీ రికార్డులను మున్సిపల్‌కు అప్పగించారు. ఆ పల్లెల్లో పనిచేసే సిబ్బందిని సైతం మున్సి పల్లో కలిపేశారు. కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో అమలుచేసే ఉపాధిహామీ పథకం ఆ ఏడు గ్రామాలకు దూరమైంది. మున్సిపల్ నుంచి విడదీసి ఏడు గ్రామాలతో సిరిసిల్ల అర్బన్ మండలాన్ని ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో ఆందోళనకు దిగారు. మొత్తంగా సిరిసిల్లలో విలీనమైన ఆ పల్లెల్లో ఒకరకమైన వ్యతిరేకభావం నెలకొంది. వేములవాడలో తెరపైకి డిమాండ్.. వేములవాడలోనూ ఇలాగే తిప్పాపూర్, అయ్యోరుపల్లె, కోనాయపల్లె, శాత్రాజుపల్లె, నాంపల్లి గ్రామాలను బలవంతంగా విలీనం చేశారు. ఆ గ్రామీణ ప్రజలు కూడా ప్రత్యేకంగా గ్రామాలుగా ఉండాలని కోరుకుంటున్నాయి. సిరిసిల్లలో విలీనబంధం వీడి తే.. అక్కడ కూడా ఇదే డిమాండ్ తెరపైకి వస్తుంది. కౌన్సిల్లో తీర్మానం జరిగేనా? సిరిసిల్ల మున్సిపల్ కౌన్సిల్లో విలీన గ్రామాలను వేరు చేస్తూ తీర్మానం జరుగుతుందా? అనే అనుమానాలు ఉన్నాయి. ఇప్పటికే మున్సిపల్లో కలి సిన గ్రామాల్లో రియల్ ఎస్టేట్ భూమ్ వచ్చింది. మళ్లీ ఆ గ్రామాలు పంచాయతీలుగా మారితే రియల్ ఎస్టేట్ పడిపోతుంది. పలువురు మున్సిపల్ కౌన్సిలర్లు ఆయా గ్రామాల్లో భూములపై పెట్టుబడులు పెట్టారు. విలీనబంధం విడిపోతే ఏడు గ్రా మాలు దూరమై సిరిసిల్ల పట్టణ జనాభా తగ్గిపోయి మున్సిపాలిటీకి రావాల్సిన ఆదాయం పడిపోతుంది. ఇలాంటి కారణాలతో కౌన్సిల్లో ఏకాభిప్రా యం సాధ్యమవుతుందా? అనే సందేహాలు ఉన్నా యి. ఒక వేళ కౌన్సిల్ తీర్మానం చేసినా.. ప్రభుత్వ స్థాయిలో ఆమోదం లభిస్తుందా? అనే అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు సిరిసిల్లలో విలీన గ్రామా ల అంశం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఇవి చదవండి: ఎన్నికల సంఘం కసరత్తులో.. సమరానికి ఇంకొంత సమయం! -
Telangana: మందు బాబులకు షాకింగ్ న్యూస్..
కరీంనగర్ క్రైం: పల్లె ప్రజలకు నిద్రలేని రాత్రులు గడిపేలా చేస్తున్న బెల్ట్‌షాపుల నిర్వహణకు ప్రభుత్వ కళ్లెం వేసేలా చర్యలకు ముందడుగు వేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా బెల్ట్‌షాపులు ఎత్తివేసేలా సర్కారు నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిసింది. జిల్లావ్యాప్తంగా సుమారుగా మూడువేల వరకు బెల్ట్షాపులుండగా రూ.కోట్లలో వ్యాపారం సాగుతోంది. పల్లెల్లో పదుల సంఖ్యలో కిరాణషాపులు, హోటళ్లలో బాహటంగానే దందా నడుస్తోంది. అక్రమంగా నిర్వహిస్తున్న బెల్ట్‌షాపులకు అడ్డుకట్ట వేయాల్సిన ఎకై ్సజ్ అధికారులు శ్రీమామూలుశ్రీగా తీసుకుంటూ ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మద్యానికి బానిసలుగా.. ► గ్రామాల్లో బెల్ట్‌షాపుల పేరిట మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఏ సమయంలోనైనా మద్యం అందుబాటులో ఉండడంతో కూలీలు మొదలుకుని రైతులు, ఇతర వ్యాపారాలు చేసుకునే వారు కష్టపడి సంపాదించిన దాంట్లో ఎక్కువశాతం తాగడానికే వెచ్చించడంతో కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. ► వైన్స్‌లు నిర్ణీత సమయాల్లో మూసివేస్తున్నా.. బెల్ట్‌షాపులకు నియంత్రణ లేకపోవడంతో యువత ఎక్కువశాతం బానిసలవుతున్నారని మహళల నుంచి ఆవేదన వ్యక్తమవుతోంది. దీనికి అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ► బెల్ట్‌షాపులను మూసివేయాలని పలుమార్లు మహిళలు, వివిధ సంఘాల నుంచి ఆందోళనలు, నిరసనలు వ్యక్తమైన నేపథ్యంలో బెల్ట్‌షాపులపై ఎకై ్సజ్‌శాఖ చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. బెల్ట్‌షాపులు నిర్వహించేవారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసేదిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ► అసెంబ్లీ ఎన్నికల సమయంలో పోలీసులు, ఎకై ్సజ్ అధికారులు అన్ని బెల్ట్‌షాపులు మూసివేయించారు. కోడ్ ముగియగానే మళ్లీ బెల్ట్‌షాపుల దందాలకు రెక్కలొచ్చాయి. జిల్లావ్యాప్తంగా పల్లెల్లో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. బెల్ట్‌షాపులకు సంబంధించిన అధికారుల మూముళ్ల విషయం వైన్స్ నిర్వాహకులే చూసుకుంటున్నట్లు తెలిసింది. ► రూరల్ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న అధికారులు కొందరు ఈ వ్యవహరాన్ని మామూలుగా తీసుకుంటున్నారని విమర్శలు ఉన్నాయి. పల్లెల్లో బెల్ట్‌షాపులు మూసివేసి వారికి సహకరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. -
సారూ..! మా గ్రామాలకు 'మహాలక్ష్మి' కరుణించేదెలా?
ఆదిలాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తూ ప్రతిష్టాత్మకంగా మహాలక్ష్మి పథకానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ప్రజా రవాణా వ్యవస్థను మహిళలకు మరింత అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఈ పథకం చాలామందికి చేరడం లేదు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ కలిపి మొత్తం 487 సర్వీసులున్నాయి. రోజుకు సుమారు లక్ష యాభై వేల మంది మహిళా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. అయితే ఉమ్మడి జిల్లాలోని ఎన్నో మారుమూల గ్రామాలకు నేటికీ బస్సు సౌకర్యం లేక ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సిన దుస్థితి. దీంతో వారిపై రవాణా భారం పడుతుంది. ప్రభుత్వం ఉచిత ప్రయాణ సౌకర్య పథకాన్ని ప్రవేశపెట్టినప్పటికీ ఎంతోమంది అతివలు ఈ అదృష్టానికి నోచుకోవడం లేదు. కారణాలు అనేకం.. ఆదాయం సరిగా రావడం లేదని ఉద్దేశంతో జిల్లాలోని పలు గ్రామాలకు ఆర్టీసీ బస్సులను నడపడం మానేసింది. కరోనా మహమ్మారి అనంతరం పెద్ద సంఖ్యలో పల్లెలకు బస్సులను నిలిపివేసిన ఆర్టీసీ..తిరిగి ఆయా రూట్లలో పునరుద్ధరించడంలో వెనకడుగు వేసింది. ఆదాయం సరిగా రావడం లేదని, రహదారి సౌకర్యం సరిగా లేదనే కారణాలతో బస్సులను పూర్తిస్థాయిలో నిలిపేయడం వలన పల్లె ప్రజానీకానికి ప్రజా రవాణా వ్యవస్థ దూరమవుతోంది. మండల, జిల్లా కేంద్రాలకు నిత్యం రాకపోకలు సాగించే మహిళలే పల్లె వెలుగు బస్సుల్లో అధికంగా ప్రయాణిస్తుంటారు. వారు బస్సు సౌకర్యం లేక ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రభుత్వం ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చిన నేపథ్యంలో అన్ని రూట్లకు బస్సులను నడిపితే పెద్ద సంఖ్యలో మహిళలకు ఈ పథకం లబ్ధి చేకూరుస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్టీసీ బస్సు వెళ్లని గ్రామాలెన్నో.. ► జిల్లాలోని 18 మండలాల్లో 556 గ్రామాలు ఉండగా, వీటిలో ఆర్టీసీ బస్సు వెళ్లని గ్రామాలు ఎన్నో ఉన్నాయి. ► సిరికొండ మండల కేంద్రానికే బస్సు లేకపోవడం గమనార్హం. అలాగే మండల పరిధిలో ఉన్న 52 గ్రామాలకు ఆర్టీసీ సౌకర్యం లేదు. ముఖ్యంగా విద్యార్థుల కోసం ఉదయం, సాయంత్రం సమయంలో బస్సులను ప్రత్యేకంగా నడిపేవారు. ప్రస్తుతం వాటిని నిలిపివేయడంతో ఆయా గ్రామాలవాసులు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ► ఇచ్చోడ మండలంలో 32 గ్రామాలు ఉండగా ఒక్క గ్రామానికి కూడా బస్సు వెళ్లని పరిస్థితి. ► బజార్హత్నూర్ మండలంలోని 64 గ్రామాలు ఉండగా ఇందులో 54 బస్సు సౌకర్యానికి దూరంగా ఉంటున్నాయి. ► తాంసి మండలంలోని తాంసి మండల కేంద్రం, గిరిగాం, అంబుగాం, అట్నం గూడా, భీంపూర్ మండలంలోని గొల్లఘాట్, గుబిడిపల్లి, గుంజాల గ్రామాలకు, జైనథ్ మండలంలోని మాకోడ,పిప్పల్ గావ్ గ్రామాలకు బస్సు సదుపాయం అందుబాటులో లేదు. ► నేరడిగొండ మండల కేంద్రం నుంచి గతంలో బొందిడి గ్రామం వరకూ ఓ సర్వీస్ నడిపేవారు. ప్రస్తుతం దానిని నిలిపివేయడంతో అటువైపుగా ఉన్న వడూరు, బొందిడి, భవా ని తండా, గంభీర్ తండా, దర్బా, దర్బాతండా సుర్దాపూర్, రేంగన్వాడి గ్రామాలకు వెళ్లే వారికి ప్రైవేట్ వాహనాలే దిక్కువుతున్నాయి. ► బేల మండలంలోని బాధి, హేటి, దేవో జిగూడ, భవానిగూడ, రాయిపూర్ తండా, దుబ్బగూడా వంటి పల్లెలకు బస్సు సౌకర్యం లేదు. అలాగే ఉట్నూరు, నార్నూరు, ఇంద్రవెల్లి, గాదిగూడ, తలమడుగు, బోథ్ మండలాల్లోనూ ఎన్నో గ్రామాల జనం ప్రజా రవాణా వ్యవస్థకు దూరమవుతున్నారు. బస్సు సౌకర్యం కల్పించాలి! సిరికొండలోని మండల పరిషత్ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా విధులు నిర్వర్తిస్తున్నాను. బస్సు సౌకర్యం లేక నేను ఇచ్చోడ నుంచి సిరికొండకు ప్రైవేట్ వాహనాల్లో రావాల్సి వస్తుంది. సమయానికి వాహనాలు లేక అప్పుడప్పుడు ఆలస్యమవుతుంది. ఇప్పటికై నా మండలానికి బస్సు సౌకర్యం కల్పించాలి. – ఉష, ఉపాధ్యాయురాలు, సిరికొండ మహాలక్ష్మి వర్తించట్లే..! మా గ్రామాలకు బస్సే రానప్పుడు మహాలక్ష్మి పథకం ఎట్ల వర్తిస్తది. పథకంతోని పైసలు లేకుండా ఎంత దూరమైనా పోవచ్చని చెప్తున్నరు. ఇట్లాంటి పథకం పెట్టినట్టు చాలామంది మహిళలకు తెల్వది. ఈ పథకం గురించి అందరికీ చెప్పుడే కాకుండా దీన్ని వాడుకునేలా ప్రచారం చేయాలి. – సంగీత, గిరిజాయి, బజార్హత్నూర్ బస్సు నడిపిస్తే మంచిగుంటది.. అప్పట్లో మా ఊరు సైడు బస్సు నడిచేది. ఇప్పుడు బంద్ అయింది. అప్పటినుంచి ఆటోలల్లనే నేరడిగొండకు పోతున్నం. ఇప్పుడు ఫ్రీగా బస్సులో పోవచ్చని చెబుతున్నరు. సార్లు మళ్లా మా ఊరికి బస్సు నడిపేట్లు చూస్తే మంచిగుంటది. – ఆడే పారు బాయి, రెంగన్వాడి, నేరడిగొండ అప్పుడే ఫాయిదా..! మా ఊరుకు సక్కగా రోడ్డు గాని బస్సు సౌకర్యం గాని లేదు. అసలు మాకు బస్సు ఫ్రీ చాలు అయిందనే విషయమే తెలవదు. ఫ్రీగా బస్సు ఎక్కాలంటే మా ఊరు నుంచి ఆటో ఎక్కి సోన్ కాస్ గ్రామం లేకపోతే బేల వరకు పో వాల్సి వస్తది. అక్కడ నుంచి వేరే దగ్గరికి పో వాలనుకుంటే ఫ్రీ బస్సు ఫాయిదా అవుతది. – తులబాయి, రాయ్‌పూర్ తండా, బేల ఇవి చదవండి: ఎంపీ సీటుపై ‘బండి’ ఫోకస్! -
ఇక పోలీసు అధికారుల పల్లె నిద్ర
సాక్షి, అమరావతి: మరికొద్ది నెలల్లో రాష్ట్రంలో సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అసాంఘిక శక్తుల ఆట కట్టించడానికి పోలీసు శాఖ సిద్ధమవుతోంది. శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా కార్యాచరణను మరింత వేగవంతం చేస్తోంది. ముఖ్యంగా సమస్యాత్మక గ్రామాలపై నిఘాను మరింత పటిష్టం చేయనుంది. అందుకోసం పోలీసు అధికారులు ‘పల్లె నిద్ర’ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఇందులో భాగంగా ఎస్సై స్థాయి నుంచి ఉన్నతాధికారుల వరకు రోజుకో పల్లెలో గ్రామ సభ నిర్వహించి గ్రామస్తులతో విస్తృతంగా చర్చిస్తారు. అలాగే ఆ గ్రామాల్లోని సమస్యలను కూడా తెలుసుకుంటారు. గ్రామంలో అసాంఘిక శక్తులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. గ్రామాలవారీగా డేటాను సేకరించి ప్రత్యేక యాప్‌లో నమోదు చేస్తారు. రాష్ట్రంలో ముందుగా చిత్తూరు జిల్లాలో పల్లె నిద్ర కార్యక్రమాన్ని పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టనున్నారు. ఇప్పటికే పోలీసు స్టేషన్ల వారీగా పల్లె నిద్రకు గ్రామాలను గుర్తించారు. చిత్తూరు జిల్లా తర్వాత రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అమలు చేయాలని భావిస్తున్నారు. పోలీసుస్టేషన్ల వారీగా పల్లెనిద్ర.. పోలీసుస్టేషన్ల వారీగా అధికారులు ‘పల్లె నిద్ర’ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలపట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని గ్రామస్తులకు వివరిస్తారు. జైలు నుంచి విడుదలై వచ్చినవారిపై ప్రత్యేక నిఘా పెట్టడంతోపాటు స్థానికేతరులపై కూడా ఓ కన్నేసి ఉంచుతారు. అనంతరం ఆ గ్రామంలోనే నిద్రిస్తారు. ముఖ్యంగా జిల్లాలవారీగా సమస్యాత్మక గ్రామాల జాబితాను రూపొందిస్తున్నారు. ఆ గ్రామాల్లో ఎస్పీ, అదనపు ఎస్పీ స్థాయి అధికారులు పల్లె నిద్ర చేపడతారు. తొలిగా కార్యక్రమం చేపట్టనున్న చిత్తూరు జిల్లాలో సాధారణ గ్రామాలు 1,169, సమస్యాత్మక గ్రామాలు 597 ఉన్నట్టుగా గుర్తించారు. నియోజకవర్గాలవారీగా అయితే చిత్తూరులో 48, జీడీ నెల్లూరులో 75, పూతలపట్టులో 74, పుంగనూరులో 123, పలమనేరులో 132, కుప్పంలో 76, నగరిలో 76 సమస్యాత్మక గ్రామాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వారానికి రెండు గ్రామాల చొప్పున పల్లె నిద్ర నిర్వహించాలని నిర్ణయించారు. యాప్ ద్వారా డేటా సేకరణ.. వివిధ కేటగిరీలుగా గ్రామాల వారీగా పోలీసు అధికారులు సమాచారాన్ని సేకరిస్తారు. ఆ డేటాను ప్రత్యేక యాప్‌లో నమోదు చేస్తారు. ఆ డేటా స్థానిక పోలీసు స్టేషన్ నుంచి జిల్లా ఎస్పీ కార్యాలయం వరకూ అందుబాటులో ఉంటుంది. శాంతిభద్రతల పరిరక్షణ కోసం చేపట్టాల్సిన ముందస్తు చర్యలు, ఏదైనా సమస్య తలెత్తినా, ఘటన జరిగినా వెంటనే స్పందించి కార్యాచరణకు ఉపక్రమించేందుకు ఈ డేటా ఉపయోగపడనుంది. శాంతిభద్రతల పరిరక్షణ.. అసాంఘిక శక్తుల కట్టడి.. అసాంఘిక శక్తులను కట్టడి చేయడంతోపాటు శాంతిభద్రతల పరిరక్షణ కోసమే ఈ పల్లె నిద్ర కార్యక్రమాన్ని రూపొందించాం. ఇందులో మొత్తం పోలీసు యంత్రాంగం భాగస్వామ్యమవుతుంది. ప్రతి గ్రామానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని అందుబాటులో ఉంచేందుకు ప్రత్యేక యాప్‌ను రూపొందించాం. దీంతో ప్రస్తుతం ఉన్న పోలీసు అధికారులకే కాదు.. తర్వాత బదిలీపై వచ్చే అధికారులకు కూడా డేటా ఉపయోగపడుతుంది. శాంతిభద్రతల పరిరక్షణ కోసం తగిన మార్గనిర్దేశం కూడా చేస్తాం. – రిశాంత్‌రెడ్డి, ఎస్పీ, చిత్తూరు జిల్లా -
అలిగిన గ్రామీణం.. ఎన్నికల బహిష్కరణ మంత్రం
Rajasthan elections 2023: ప్రస్తుతం దేశంలోని ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. వీటిలో మిజోరాం, ఛత్తీస్గడ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో ఇప్పటికే ఎన్నికలు పూర్తవ్వగా తెలంగాణలో నవంబర్ 30న పోలింగ్ జరగనుంది. ఐదేళ్లకు ఒక సారి వచ్చే ఎన్నికల ద్వారా తమకు నచ్చిన ప్రభుత్వాన్ని ఎన్నుకునే హక్కును రాజ్యాంగం ప్రసాదించింది. అయితే ప్రభుత్వాల ఉదాసీనత, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంతో విసుగు చెందిన పలు గ్రామాలు ఏకంగా ఎన్నికలనే బహిష్కరిస్తున్నాయి. శనివారం జరిగిన రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలను ఆ రాష్ట్రంలోని అనేక గ్రామాలు బహిష్కరించాయి. తాగునీటి సమస్యపై.. హనుమాన్‌గఢ్ జిల్లాలోని టిబ్బి తహసీల్ పరిధిలోని దౌలత్పురాలో తాగునీటి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు జిల్లా అదనపు కలెక్టర్ కపిల్ యాదవ్‌కు మెమోరాండం సమర్పించారు. గ్రౌండ్ లెవల్లో దెబ్బతిన్న వాటర్ ట్యాంక్, ఫిల్టర్లను పునర్నిర్మించకపోతే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయబోమని మెమోరాండంలో పేర్కొన్నారు. అలాగే శ్రీగంగానగర్ జిల్లాలోని సూరత్‌గఢ్ తహసీల్‌కు చెందిన తుక్రానా పంచాయతీ ఫరీద్సర్ గ్రామ ప్రజలు కూడా తాగునీటి సమస్యపై నిరసనగా ఓటింగ్‌ను బహిష్కరించాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ విషయాన్ని వారు సూరత్‌గఢ్ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ సందీప్ కుమార్‌కు మెమోరాండం ద్వారా తెలియజేశారు. ప్రజా ప్రతినిధులపై ఆగ్రహం రాష్ట్రంలో చాలా చోట్ల ప్రజా ప్రతినిధులపై ఆగ్రహంతో కూడిన వాతావరణం కనిపిస్తోంది. కొన్ని నెలల క్రితం భిల్వారా జిల్లా నుంచి తొలగించి షాపురా జిల్లాలో చేర్చిన ఎనిమిది గ్రామ పంచాయతీల ప్రజలు ఓటింగ్‌ను బహిష్కరించాలని నిర్ణయించారు. భిల్వారాను విభజించి షాపురా జిల్లాను ఏర్పాటు చేసినప్పుడు మండల్గర్ సబ్‌డివిజన్‌లోని 16 పంచాయతీలు షాపురా జిల్లాలో చేర్చారు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసనల తరువాత, ప్రభుత్వం వీటిలో ఎనిమిది పంచాయతీలను తిరిగి భిల్వారాలో చేర్చింది. మిగిలిన ఎనిమిది షాపురాలోనే ఉన్నాయి. దీంతో ఆ గ్రామాల ఓటింగ్‌ను బహిష్కరించాలని నిర్ణయించి రాజకీయ పార్టీల నేతలను గ్రామాల్లోకి రానివ్వకుండా పోస్టర్లు అంటించి నిరసనలు చేపట్టారు. ఏకంగా 50 గ్రామాలు ఇక జైసల్మేర్ జిల్లాలోని సోను గ్రామంలో గత రెండు నెలలుగా సమ్మె చేస్తున్న ట్రక్కు డ్రైవర్లకు సంఘీభావంగా 50 గ్రామాలు ఎన్నికల బహిష్కరణను ప్రకటించాయి. సోను గనుల నుంచి సున్నపురాయిని రవాణా చేయడానికి ఈ ప్రాంతంలో దాదాపు 400 ట్రక్కులు ఉన్నాయి. ట్రక్కు డ్రైవర్లు సరుకు రవాణా ఛార్జీలను టన్నుకు రూ.3 పెంచాలని కోరుతున్నారు. అయితే రాజస్థాన్ స్టేట్ మైన్స్ అండ్ మినరల్స్ లిమిటెడ్ కాంట్రాక్టర్ డిమాండ్‌ను అంగీకరించడానికి సిద్ధంగా లేరు. ఇప్పుడు సమీపంలోని 50 గ్రామాల ప్రజలు లారీ డ్రైవర్లకు మద్దతుగా నిలిచారు. సికార్ జిల్లాలోని నీమ్ కా థానా తహసీల్‌కు చెందిన లాడి కా బస్ గ్రామస్థులు తమ గ్రామ పంచాయతీని అజిత్‌గఢ్ పంచాయతీ సమితి నుంచి తొలగించి పటాన్ పంచాయతీ సమితిలో తిరిగి చేర్చాలని కోరుతూ ఎన్నికల బహిష్కరణ ప్రకటించారు. ఇప్పటి వరకు ఈ డిమాండ్‌ను లేవనెత్తుతూ గ్రామస్తులు ఆరుసార్లు ఎన్నికలను బహిష్కరించారు. రోడ్డు సమస్య.. ఝలావర్ జిల్లాలోని ఓద్పూర్ గ్రామస్థులు రాష్ట్ర రహదారికి సరైన రహదారిని అనుసంధానం చేయాలని డిమాండ్ చేస్తూ ఓటింగ్‌ను బహిష్కరించాలని నిర్ణయించారు. అదేవిధంగా కోటా జిల్లాలోని సంగోడ్ తహసీల్‌లోని లాడ్పురా రైతులు తమను చంబల్ నది నుంచి నీటిని వాడుకునేందుకు అనుమతించకపోవడంతో ఎన్నికలను బహిష్కరించారు. టోంక్ జిల్లాలోని డియోలి గ్రామస్తులు తమ రోడ్డును బాగు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు ప్రధాన మార్గాల్లో కాంక్రీట్ రోడ్లు నిర్మించకపోతే బహిష్కరిస్తామని టోంక్ జిల్లాలోని సీసోలా ప్రజలు హెచ్చరించారు. అదే విధంగా ధోల్పూర్ జిల్లా బసేరి అసెంబ్లీ నియోజకవర్గం చంద్రావళి గ్రామ ప్రజలు దశాబ్ద కాలంగా తమ గ్రామ రహదారికి మరమ్మతులు చేపట్టలేదని బహిష్కరించాలని నిర్ణయించారు. ఇక భిల్వారాలోని 43వ వార్డు ప్రజలు ఎన్నికల బహిష్కరణను ప్రకటించడమే కాకుండా రాజకీయ నేతలను తమ వార్డులోకి రాకుండా అడ్డుకున్నారు. రాజకీయ నేతలను హెచ్చరిస్తూ బ్యానర్లు ఏర్పాటు చేశారు. జైపూర్ జిల్లాలోని పాలావాలా జతన్ గ్రామస్థులు ఆ ప్రాంతంలోని ప్రజా ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎన్నికలను బహిష్కరించారు. ఒక్క ఓటరు కూడా పోలింగ్ బూత్‌వైపు కన్నెత్తి చూడలేదు. తమ గ్రామాన్ని సమీపంలోని తూంగా గ్రామంతో కలుపుతూ రోడ్డు వేయాలని పాలావాలా జతన్ గ్రామస్తులు అనేక ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడే కాదు.. గత ఏడు పర్యాయాలుగా ఈ గ్రామస్తులు ఎన్నికలను బహిష్కరిస్తూనే ఉన్నారు. -
మా ఊళ్లలో ఉండండి.. రూ.26 లక్షలు అందుకోండి: ఓ ప్రాంతం బంపరాఫర్!
విదేశాల్లో, ఏదైనా కొత్త ప్రాంతంలో నివాసం ఉండాలనుకుంటున్నారా? అయితే మీకు ఇటలీలోని ఓ ప్రాంతం బంపరాఫర్ ఇస్తోంది. ఇక్కడ నివాసముంటే చాలు సుమారు రూ.26 లక్షలు మీ సొంతమవుతాయి. అలా అని అదేదో సౌకర్యాలు లేని మారుమూల ప్రాంతం కాదు. సముద్ర తీరాన, సుందరమైన పర్వతాల అంచున ఉండే అందమైన ప్రాంతమది. ఇటలీలోని దక్షిణ కాలాబ్రియా (Calabria) ప్రాంతం డబ్బు సంపాదించాలనుకునే, కొత్త ప్రాంతాన్ని అన్వేషించాలనుకునే వ్యక్తులకు అద్భుతమైన అవకాశాన్ని అందిస్తోంది. అక్కడ నివసిస్తూ బిజినెస్ చేసి డబ్బు సంపాదించాలనుకునేవారికి ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది. అర్హతలు ఇవే.. కాలాబ్రియా అందిస్తున్న ఈ అవకాశాన్ని పొందాలంటే కొన్ని అర్హతలు తప్పనిసరిగా ఉండాలి. వాటిలో ముఖ్యమైనది వయసు 40 ఏళ్లలోపు ఉండాలి. ఇక అప్లికేషన్ ఆమోదం పొందిన 90 రోజులలోపు నివాసం ఉండటానికి సిద్ధంగా ఉండాలి. కాలాబ్రియా గురించి.. కాలాబ్రియా ప్రాంతాన్ని ఇటలీ "బొటనవేలు" గా పేర్కొంటారు. అందమైన సముద్ర తీరం, గంభీరమైన పర్వతాలకు ఈ ప్రాంతం ప్రసిద్ధి చెందింది. ఎందుకో ఇటీవల కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో జనాభా బాగా తగ్గిపోయింది. దీంతో స్థానిక కమ్యూనిటీలలో ఆందోళన నెలకొంది. ఈ సమస్యను పరిష్కరించడానికి కాలాబ్రియా ఈ అసాధారణ ప్రణాళికను ప్రారంభించింది. రూ. 26.48 లక్షల వరకూ ప్రోత్సాహకం ప్రణాళికలో భాగంగా కాలాబ్రియా ప్రాంతంలో నివాసం ఉంటూ స్థానిక ఆర్థిక వ్యవస్థకు దోహదపడే ఆసక్తి ఉన్న 40 ఏళ్లలోపు యువతకు మూడు సంవత్సరాల పాటు రూ. 26.48 లక్షల ఆర్థిక ప్రోత్సాహకాలను అందిస్తారు. ఇక్కడ రెస్టారెంట్లు, దుకాణాలు, హోటళ్లు వంటి బిజినెస్‌లను ప్రారంభించేందుకు స్థానిక అధికారులు ప్రోత్సహిస్తున్నారు. స్థానిక ఆర్థిక వ్యవస్థను పెంచడం, కమ్యూనిటీల్లో కొత్త జీవితాన్ని నింపడం ఈ కార్యక్రమం ప్రాథమిక లక్ష్యమని దీన్ని రూపొందించినవారిలో ఒకరైన జియాన్లూకా గాల్లో పేర్కొన్నారు. బడ్జెట్ కేటాయింపు ఈ ప్రాజెక్ట్ కోసం సుమారు 6.31 కోట్ల బడ్జెట్ కేటాయించారు. ఈ కార్యక్రమం రాబోయే వారాల్లో ప్రారంభమవుతుందని భావిస్తున్నారు. కాలాబ్రియా ప్రాంతంలోని 75 శాతానికి పైగా మునిసిపాలిటీలలో 5,000 కంటే జనాభా ఉన్నారు. ఈ విశిష్ట కార్యక్రమం యువ పారిశ్రామికవేత్తలకు కాలాబ్రియా ప్రాంత విశిష్టతను, సంస్కృతిని పరిచయం చేస్తూ ఆర్థిక సహాయాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకుంది.