Srikakulam
-
●కదం తొక్కిన వీఓఏలు
● యాప్‌ల భారం తగ్గించి.. రాజకీయ వేధింపులు ఆపాలంటూ ధర్నా శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పరిధిలో గ్రామస్థాయిలో మహిళా సంఘాల బలోపేతానికి పనిచేస్తున్న గ్రామ సంఘం సహాయకులు (వీఓఏ–సీఎఫ్)లు సమస్యల పరిష్కారం కోరుతూ కదం తొక్కారు. కూటమి ప్రభుత్వం వచ్చాకర పనిభారం, రాజకీయ వేధింపులు, గౌరవ వేతనాల విడుదలలో జాప్యం, పాత జీవోలు తీసుకొచ్చి ఇబ్బందులకు గురిచేయడం వంటి విధానాలు అనుసరిస్తున్న సర్కారుపై ధ్వజమెత్తారు. ఈ మేరకు సీఐటీయూతో కలిసి వీఓఏ సంఘాల నాయకులు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా ఏపీ వెలుగు వీఓఏల ఉద్యోగుల సంఘం జిల్లా గౌరవాధ్యక్షులు అల్లు మహాలక్ష్మి, సీఐటీయూ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సీహెచ్ అమ్మన్నాయుడు, పి.తేజేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షులు కె.నాగమణి, యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.ప్రభావతి, జి.అసిరినాయుడులు మాట్లాడుతూ వెలుగు వీఓఏలకు మూడేళ్ల కాలపరిమితి సర్క్యులర్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఐదునెలల బకాయి వేతనాలు చెల్లించాలని కోరారు. ఇటీవల రాష్ట్ర గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సర్క్యులర్‌ను అమలు చేసేందుకు, రాజకీయ కక్ష సాధించేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. యాప్‌ల భారం పెంచుతున్నారని వాపోయారు. అనంతరం కలెక్టర్ స్వప్నికల్ దినకర్ పుండ్కర్‌కు వినతిపత్రం అందించారు. -
తనిఖీలు ముమ్మరం
ఇచ్ఛాపురం: ఆంధ్ర– ఒడిశా సరిహద్దు ప్రాంతం గుండా నిషేధిత పదార్థాలు అక్రమ రవాణా జరగకుండా చెక్‌పోస్టులలో నిరంతరం తనిఖీలు చేపట్టాలని ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి పోలీసులకు ఆదేశించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా బుధవారం ఇచ్ఛాపురం టౌన్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలని, తరచూ ప్రమాదాలు జరిగే బ్లాక్స్పాట్లలో హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని సిబ్బందికి సూచించారు. గంజాయి నియంత్రణకు సంకల్పం పేరిట ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. అనంతరం పురుషోత్తపురం చెక్‌పోస్టును పరిశీలించి సిబ్బందికి సూచనలిచ్చారు. కార్యక్రమంలో కాశీబుగ్గ డీఎస్పీ వి.వెంకట అప్పారావు, సీఐ మీసాల చిన్నంనాయు డు, ఎస్సై చిన్నంనాయుడు పాల్గొన్నారు. బాలల హక్కులు పరిరక్షిద్దాం శ్రీకాకుళం అర్బన్: బాలల హక్కుల పరిరక్షణకు కృషి చేద్దామని మహిళా, శిశు సంక్షేమ సాధికారత జిల్లా అధికారి బి.శాంతిశ్రీ అన్నా రు. బుధవారం బాలల హక్కుల వారోత్సవాలలో భాగంగా శ్రీకాకుళం ప్రభుత్వ మహిళా కళాశాల నుంచి సూర్యమహల్ కూడలి వరకు బాల, బాలికలు చేపట్టిన ర్యాలీని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నవంబర్ 14న బాలల దినోత్సవం, 20న అంతర్జాతీయ బాలల దినోత్సవం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. శ్రీకాకుళం డీఎస్పీ సీహెచ్ వివేకానంద మాట్లాడుతూ మానవ హక్కులు, బాలల హక్కుల చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. కార్యక్రమంలో డీపీఆర్ఓ కె.చెన్నకేశవరావు, కె.వి.రమణ తదితరులు పాల్గొన్నారు. -
బెంతొరియాల సమస్యలు పరిష్కరించండి
● శాసన మండలిలో ఎమ్మెల్సీ నర్తు రామారావు కంచిలి: ఇచ్ఛాపురం నియోజకవర్గంలోని కంచిలి, ఇచ్ఛాపురం, కవిటి మండలాల్లో ఉంటున్న 25 వేల మంది బెంతొరియా సామాజిక వర్గానికి చెందిన ప్రజల సమస్యలను పరిష్కరించాలని శ్రీకాకుళం జిల్లా స్థానిక సంస్థల శాసన మండలి సభ్యుడు నర్తు రామారావు కోరారు. శాసన మండలి బడ్జెట్ సమావేశాల్లో స్పెషల్ మెన్షన్ అవర్‌లో ఈ అంశాన్ని బుధవారం ఆయన ప్రస్తావించారు. బ్రిటిష్ కాలం నుంచి ఎస్టీలుగా గుర్తింపు పొందిన బెంతొరియాలు ప్రస్తుతం సామాజికవర్గ సమస్యతో సతమతమవుతున్నారని పేర్కొన్నారు. వీరంతా ఏ కులానికి చెందినవారో, ఏ ప్రాంతానికి చెందినవారో అనేది గుర్తింపు లేకపోవడం బాధాకరమన్నారు. 1973 నుంచి 76 వరకు, 1981 నుంచి 88 వరకు, 1999 నుంచి 2003 వరకు ఆయా ప్రభుత్వాలు బెంతొరియాలను ఎస్టీలుగా గుర్తించాయని, ఆ సర్టిఫికెట్లతో చాలా మంది ప్రభుత్వ ఉద్యోగాల్లో కొలువుదీరారని తెలిపారు. కానీ ప్రస్తుతం బెంతొరియాలకు సర్టిఫికె ట్లు మంజూరు చేయడం లేదని, దీంతో ఇచ్ఛాపురం నియోజకవర్గంలోని చాలా మంది విద్యార్థులు తమ ఉన్నత చదువులకు ఇబ్బందులు పడుతున్నా రని సభ దృష్టికి తీసుకొచ్చారు. సుమారు పాతిక వేల మంది సమస్యకు పరిష్కారమయ్యే మార్గాన్ని ఈ చట్టసభ ద్వారా చూపించాలని విన్నవించారు. 380 రోజులుగా బెంతొరియా పౌరులు కవిటి మండల కేంద్రంలో రిలే దీక్షలు చేస్తున్నారని తెలిపారు. -
● పల్లె రహదారుల్లో యూజర్ చార్జీల బాదుడు ● టోల్గేట్ల మాదిరిగా గ్రామీణ రోడ్లపైనా వసూలు ● ప్రైవేటు వ్యక్తులకు నిర్వహణ అప్పగింత ● జిల్లాలో మూడు రాష్ట్ర హైవేల్లో కొత్తగా టోల్‌ప్లాజాలు ● గుంతలు పూడ్చడానికి తప్పదంటున్న సీఎం చంద్రబాబు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : సంపద సృష్టిస్తా.. అని ఎన్నికల్లో చంద్రబాబు చెబుతుంటే ప్రజలు నమ్మారు. ఆయన దగ్గర ప్రత్యేక ప్లాన్లు ఉన్నాయేమో అని అనుకున్నారు. తనకున్న అనుభవంతో సంపద సృష్టిస్తారేమో అని భావించారు. కానీ, రోజుల గడుస్తున్న కొద్దీ జనాలకు అర్థమవుతోంది. చంద్రబాబు సంపద సృష్టించడమంటే ప్రజలపై భారం మోపడమని.. తన దగ్గర ప్రత్యేక మంత్రదండం లేదని, ప్రజల నుంచి వసూలు చేసి, ఖర్చు పెట్టడమే సంపద సృష్టి అని అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు పెంచనని, అవసరమైతే తగ్గిస్తామని చెప్పి ట్రూ అప్, సర్దుబాటు పేరుతో విద్యుత్ చార్జీలు పెంచేశారు. ఇప్పుడు రోడ్లు అభివృద్ధి చేయాలంటే యూజర్ చార్జీలు వసూలు చేయకతప్పదని చంద్రబాబు తన మనసులో మాట తాజాగా బయటపెట్టేశారు. పీపీపీ మోడల్ పేరిట బాదుడు.. రోడ్లు అభివృద్ధి చేయడానికి నిధుల్లేవని చెప్పి పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యం(పీపీపీ) మోడల్‌ను ప్రోత్సహిస్తున్నారు. ప్రైవేటు వ్యక్తులకు రోడ్ల అభివృద్ధిని అప్పగించి, వారికే ఆ రోడ్లపై యూజర్ చార్జీల రూపంలో టోల్ వసూలు చేసే బాధ్యతను కట్టబెడుతున్నారు. అంటే, ఇప్పటివరకు జాతీయ రహదారులపైన ఉంటే టోల్‌ప్లాజాలు పల్లె రోడ్లపై కూడా ఏర్పాటు కానున్నాయి. ఇక, ఆ రోడ్ల మీదుగా వెళ్లే ప్రతీ ఒక్కరూ టోల్ కట్టాల్సిందే. గ్రామాల నుంచి గ్రామాలకు వెళ్లాలన్నా చెల్లింపు తప్పనిసరి కానుంది. రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో రోడ్లు భవనాల శాఖ పరిధిలో 27 రహదారులను గుర్తించి.. ఆయా రోడ్లను ప్రైవేటు భాగస్వామ్యంతో మరమ్మతులు, అభివృద్ధి చేస్తూ.. ఆయా రహదారుల్లో కొత్తగా టోల్‌ప్లాజాలను ఏర్పాటు చేసేందుకు అడుగులు వేస్తున్నారు. అందులో మన జిల్లాకు సంబంధించి మూడు రహదారులు ఉన్నాయి. ప్రతిపాదిత చిలకపాలెం– రామభద్రపురం స్టేట్ హైవే మూడుచోట్ల కొత్త టోల్ ప్లాజాలు.. ●జిల్లాలో చైన్నె–కోల్‌కతా జాతీయ రహదారి (ఎన్‌హెచ్16), నరసన్నపేట–పర్లాఖిమిడి (ఎన్‌హెచ్ 326ఎ)జాతీయ రహదారుల్లో ఇప్పటికే టోల్‌ప్లాజాలు నడుస్తున్నాయి. ●అంతరాష్ట్ర సర్వీసులు వెళ్లే ప్రధాన సరిహద్దు మార్గాలు కావడంతో ఇక్కడ రహదారుల విస్తరణ నేపథ్యంలో టోల్ వసూళ్లు కొన్నేళ్ల నుంచి జరుగుతున్నాయి. ●అయితే ఎన్నడూ లేని విధంగా పొరుగు జిల్లాల సరిహద్దు ప్రాంతాలకు అనుసంధానంగా ఉన్న ఆర్అండ్బీ శాఖ పరిధిలోని మూడు రాష్ట్ర రహదారుల్లో కూడా టోల్‌ప్లాజాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ●జిల్లాలో చిలకపాలెం–రాజాం–రామభద్రపురం (130.20 కి.మీ) రోడ్డు, కళింగపట్నం–శ్రీకాకుళం– పార్వతీపురం (సీఎస్పీ రోడ్డు 113.30 కి.మీ) రోడ్డు, గార–అలికాం– బత్తిలి (84.80 కి.మీ) రోడ్లను ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చి యూజర్ చార్జీలను వసూలు చేయనుంది. వాస్తవానికి ఈ మూడు రోడ్ల పరిధిలో వందలాది గ్రామాలు, పదుల సంఖ్యలో పట్టణ ప్రాంతాలున్నాయి. ●గతంలో విశాఖపట్నం, ఇచ్ఛాపురం, పర్లాఖిమిడి వెళ్తేనే టోల్ బాదుడుండేది.. ఇప్పుడు జిల్లాలో సరిహద్దు ప్రాంతాలకు వెళ్లాలన్నా.. రాజాం, పాలకొండ, గార, కళింగపట్నం, హిరమండలం, కొత్తూరు, బత్తిలి తదితర ప్రాంతాలకు వెళ్లాలన్నా టోల్ బాదుడు తప్పదు. గతమంతా దుష్ప్రచారం.. ప్రతిపక్షంలో ఉన్నంతకాలం ఎక్కడా రోడ్లు బాగోలేవంటూ ఊదరగొట్టిన చంద్రబాబు అండ్‌కో ఇప్పుడవే రోడ్లు చూపించి, వాటిని అభివృద్ధి చేయాలంటూ ప్రజల జేబులకు చిల్లులు పెట్టేందుకు అడుగులు వేస్తున్నారు. ప్రభుత్వ నిధులతో రోడ్లు వేయకుండా ప్రైవేటు వ్యక్తులకు బాధ్యతలు అప్పగించి, వారికే టోల్ వసూలు చేసే అధికారం కట్టబెడితే కచ్చితంగా లక్షలాది మందిపై టోల్ భారం పడుతుంది. ఈ టోల్‌ప్లాజాల్లో కార్లు, జీపులతో పాటు ఆర్టీసీ బస్సుల నుంచి కూడా టోల్ వసూళ్లు చేస్తారు. ఇప్పటికే నాలుగు చక్రాల వాహనాల్లో కార్లకు రూ.150 వరకు, లారీలకు రూ.250, బస్సులకు కూడా ప్రత్యేక రేట్లతో వివిధ టోల్ ప్లాజాల వద్ద వసూలు చేస్తున్నారు. ఇదే విధానంతో కొత్త టోల్ వసూళ్లు బాధ్యతలు ప్రైవేటు వ్యక్తుల చేతికి వెళ్లనున్నాయి. ఇదే జరిగితే దారి దోపిడీ తప్పదు. అంతేకాకుండా రవాణా చార్జీలపై కూడా ప్రభావం పడనుంది. ఆర్టీసీ చార్జీలు, రవాణా (కార్గో) చార్జీలను పెంచేందుకు అవకాశం ఉంటుంది. -
ధాన్యం కొనుగోలుకు సన్నద్ధం
నరసన్నపేట: ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణకు సిబ్బంది సన్నద్ధం కావాలని సివిల్ సప్లయ్ డీఎం శ్రీనివాసరావు అన్నారు. బుధవారం నరసన్నపేట మండల పరిషత్ కార్యాలయంలో కొనుగోలు కేంద్రాల సిబ్బంది, రైతు సేవా కేంద్రాల వీఏఏలు, వీఆర్వోలకు శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యంలో 17 శాతం పైబడి తేమ శాతం ఉండకూడదన్నారు. వాహనానికి జీపీఎస్ ఉంటేనే మిల్లుకు తరలించాలన్నారు. గోనె సంచులు, కలాశీల ఖర్చులు రైతుల ఖతాలకే జమ చేస్తామని స్పష్టం చేశారు. సమావేశంలో ఎంపీడీఓ బి.మధుసూదనరావు, వ్యవసాయాధికారి కె.సునీత, సివిల్ సప్లయ్ డీటీ రామకృష్ణ పాల్గొన్నారు. -
స్పెషల్ బీఎడ్ స్పాట్ అడ్మిషన్లకు ఏడు దరఖాస్తులు
ఎచ్చెర్ల క్యాంపస్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్న స్పెషల్ బీఎడ్ (మెంటల్లీ రిటార్డ్)లో ఎడ్‌సెట్ –2024 కౌన్సె లింగ్ అనంతరం మిగిలిన ఏడు సీట్లకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహించగా ఏడుగురు దరఖాస్తు చేసుకున్నారు. అర్హత పరిశీలించి ప్రవేశాలు కల్పించనున్నట్లు కోర్సు కో–ఆర్డినేటర్ స్వామినాయుడు బుధవారం తెలిపారు. 22న బొల్లినేని మెడిస్కిల్స్‌లో జాబ్‌మేళా శ్రీకాకుళం రూరల్: మండలంలోని రాగోలు జెమ్స్ ఆస్పత్రి, బొల్లినేని మెడిస్కిల్స్‌లో ఫైజర్ హెల్త్‌కేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఉద్యోగాలకు ఈ నెల 22న జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సీహెచ్ నాగేశ్వరరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2023–24 సంవత్సరాల్లో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన 18 నుంచి 20 ఏళ్లలోపు విద్యార్థినులు అర్హులని పేర్కొన్నారు. ఎంపికై నవారికి ఉచిత వసతి, భోజన సదుపాయాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఎంపికై న వారికి నెలకు రూ.13,500 వేతనం అందుతుందని, అనకాపల్లి జిల్లా పరవాడలో పనిచేయాల్సి ఉంటుందన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఉదయం 8.30 గంటలకు ప్రారంభమయ్యే జాబ్‌మేళాకు ధ్రువపత్రాలతో హాజరుకావాలని, పూర్తి వివరాలకు 7680945357, 7995013422 నంబర్లను సంప్రదించవచ్చని పేర్కొన్నారు. అలరించిన సంగీత కచేరి శ్రీకాకుళం కల్చరల్: కచ్చపి కళాక్షేత్రం ఆధ్వర్యంలో నగరంలోని బాపూజీ కళామందిర్లో బుధవారం నిర్వహించిన గాత్ర కచేరి ఆద్యంతం అలరించింది. మృదంగ రత్నాకర వి.కమలాకరరావు, శ్రీపాద పినాకపాణిలను స్మరించుకుంటు మల్లాది సోదరులు శ్రీరాం ప్రసాద్, రవికుమార్‌లు పలు కీర్తనలను వీనుల విందుగా గానం చేశారు. కార్యక్రమంలో సభ్యులు శ్రీరామచంద్రమూర్తి, ఇప్పిలి శంకరశర్మ, పులఖండం శ్రీనివాసరావు, పి.జగన్మోహనరావు, బగ్గామ్ ధనుజయ్ పట్నాయక్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. మద్యం మత్తులో పురుగు మందు తాగి వ్యక్తి మృతి బూర్జ: మండలంలోని సింగన్నపాలేం గ్రామానికి చెందిన పొగిరి అప్పలనాయడు (48) పురుగు మందు తాగి మంగళవారం రాత్రి మృతి చెందాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. మృతుడు అప్పలనాయుడు సోమవారం రాత్రి 9 గంటల సమయంలో తన సొంత వ్యవసాయ పొలం నిమిత్తం తెచ్చిన పురుగు మందును మద్యం అనుకొని తాగేశాడు. దీంతో అపస్మారక స్థితిలో ఉన్న ఆయనను ఆరా తీయగా పురుగు మందు సేవించినట్లు తెలపడంతో కుటుంబ సభ్యులు వెంటనే 108 వాహ నం సాయంతో శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యం పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందాడు. మృతుడు తల్లి పొగిరి అప్పలనర్సమ్మ బుధవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసుస్టేషన్ ఎస్ఐ ఎం.ప్రవళ్లిక కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తు న్నారు. మృతుడికి భార్యా వనజాక్షి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రిమ్స్‌లో పోస్టుమార్టం అనంతరం, మృతదేహానికి కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
ఇరువర్గాల కొట్లాట
వజ్రపుకొత్తూరు/కాశీబుగ్గ: వజ్రపుకొత్తూరు మండలం కొమరల్తాడ గ్రామంలో ఆస్తి విషయమై బుధవారం ఇరువర్గాల మధ్య కోట్లాట చోటుచేసుకుంది. ఇదే మండలంలోని బెండి గ్రామానికి చెందిన రెల్ల హేమలత బుధవారం కొమరల్తాడ పొలంలో వరికోత కోస్తున్న దూగాన సాంబమూర్తి, దూగాన తానేశ్వరరావులను అడ్డుకుంది. దీంతో ఇరువురూ హేమలతపై దాడి చేశారు. ఈ ముగ్గురూ ఒకే కుటుంబానికి చెందిన వారే. వివాహాలు అనంతరం తల్లిదండ్రులు కుమార్తె వద్ద ఉండటం, ఆలనాపాలనా చూడటంతో తండ్రి తన భూమిని కుమార్తె హేమలతకు రాసిచ్చారు. ఇందుకు అన్నదమ్ములు అంగీకరించలేదు. ఈ క్రమంలోనే వరికోతలు ప్రారంభించడంతో అడ్డుకోవడానికి వచ్చిన చెల్లితో అన్నదమ్ములు వాగ్వాదానికి దిగారు. అనంతరం దాడులు చేసుకున్నారు. క్షతగాత్రులను టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించి వైద్యసేవలు అందించారు. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు వజ్రపుకొత్తూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రెడ్డిక సంఘాన్ని బలోపేతం చేద్దాం
ఇచ్ఛాపురం/రూరల్: ఆంధ్రా, ఒడిశా రాష్ట్రాల్లో ఉన్న రెడ్డిక సంఘాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేద్దామని రెడ్డిక సంఘం తీర్మానించింది. బుధవారం ఇచ్ఛాపురంలో శ్రీకాకుళం–పూరీ–గంజాం జిల్లాల రెడ్డిక మహాజన పురోభివృద్ధి సంఘం ప్రతినిధులు నిర్వహించిన సమావేశంలో పలు అంశాలను ప్రస్తావించారు. ఉభయ రాష్ట్రాల రెడ్డిక సంఘం ఏర్పాటు చేసి 2025కు వందేళ్లు పూర్తవుతున్న సందర్భంగా వచ్చే ఏడాది మేలో సంఘ చరిత్ర, ఐక్యత, కట్టుబాట్లు ఉట్టిపడేటట్లు వేడుకలను నిర్వహించేందుకు సంఘ ప్రతినిధులు ఆమోదించారు. కార్యక్రమంలో సీడాప్ మాజీ చైర్మన్ సాడి శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, ఎంపీపీ పైలా దేవదాసురెడ్డి, మాజీ ఎంపీపీలు కారంగి మోహనరావు, దక్కత ఢిల్లీరావు, చాట్ల తులసీదాసురెడ్డి, ఆశి చిరంజీవులు, ఉప్పాడ రాజారెడ్డి, దక్కత కృష్ణమూర్తిరెడ్డి, బుడ్డేపు కామేష్‌రెడ్డి, పిలక యాదవరెడ్డి, నియోజకవర్గ రెడ్డిక కుల పెద్దలు పాల్గొన్నారు. -
కోటి దీపోత్సవానికి ఏర్పాట్లు
అందరికీ మంచి జరగాలి ఈశ్వరుని దయ అందరిపై ఉండాలని, అందరికీ మంచి జరగాలని ఈ ఉత్సవం నిర్వహిస్తున్నాం. కోటీ దీపోత్సవంలో పాల్గొనే భక్తులకు ఉచితంగా సామగ్రి అందిస్తున్నాం. రుద్రాభిషేకాలకు సామాగ్రిని మేమే ఏర్పాటు చేస్తున్నాం. – ముక్కాల కొండబాబు, ఆలయ ధర్మకర్త ● 108 శివలింగాలకు రుద్రాభిషేకాలు శ్రీకాకుళం కల్చరల్: నగరంలోని పీఎస్ఎన్ఎంహెచ్ స్కూల్ వెనుకనున్న ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఈనెల 25వ తేదీన కార్తీక నాల్గో సోమవారం పురస్కరించుకొని కోటి దీపోత్సవాన్ని నిర్వహించనున్నారు. దీనికోసం పుణ్యపు వీధిలోని సీతారామచంద్రమూర్తి సహిత సువర్చలా అభయాంజనేయస్వామి ఆలయం ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. కార్యక్రమంలో 10 వేల మంది భక్తులు పాల్గొనే అవకాశం ఉన్నట్లు అంచనా. 108 శివలింగాలకు అభిషేకాలు కార్యక్రమంలో భాగంగా 108 శివలింగాలకు 108 మంది దంపతులచే సామూహిక మహన్యాస పూర్వక రుద్రాభిషేకాలు చేయిస్తారు. దీనికోసం వేదిక ఏర్పాటు చేసి 108 శివలింగాలను ఏర్పాటు చేస్తున్నారు. అభిషేక సామగ్రిని నిర్వాహకులు అందజేస్తారు. ఉచితంగానే... కోటి దీపోత్సవంలో పాల్గొనేవారికి ఎటువంటి ప్రవేశ రుసుము తీసుకోవడం లేదు. అక్కడికి హాజరయ్యేవారికి వత్తి, ప్రమిద, నూనెను వారే సరఫరా చేస్తున్నారు. దీనికోసం 365 కట్టల వత్తులను, 30 వేల ప్రమిదలను సిద్ధం చేశారు. దీపాల మధ్య 5 అడుగుల దూరం ఏర్పాటు చేశారు. బారికేడ్లు ఏర్పాటు ఈ ఉత్సవానికి హాజరయ్యే భక్తులకు అసౌకర్యాలు కలుగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. దీపారాధన గ్యాలరీ, వీవీఐపీ గ్యాలరీలు ఏర్పాటు చేస్తున్నారు. భక్తుల మధ్య దూరం ఏర్పాటు చేసి దీపాల ప్రమిదలు పెట్టుకునేందుకు పచ్చి ఇటుకలను సిద్ధం చేస్తున్నారు. 10 వేల మంది కూర్చునేవిధంగా బారికేడ్లు, టార్పాలిన్లు తీసుకొచ్చారు. హాజరయ్యే వీవీఐపీలకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం 300 కుర్చీలు సిద్ధం చేశారు. -
గంజాయి అక్రమ రవాణాలో..
శ్రీకాకుళం క్రైమ్: జిల్లాలో గంజాయి సాగు లేకపోయినా క్రయవిక్రయాలకు, అక్రమ రవాణాకు మాత్రం అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ఎదురుగా పోలీసులున్నా సరే.. వారిని దాటించి తప్పించుకుపోవడమో.. లేదంటే వారి వాహనాన్ని ఢీకొట్టి పరారు కావడమో వంటి ఘటనలు జరుగుతున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. తమ కాలేజీ గ్రౌండ్లో పాడుబడిన వసతిగృహ భవనంలో యువత గంజాయి వంటి అసాంఘిక కార్య కలాపాల్లో పాల్గొంటున్నారని, దృష్టి పెట్టండంటూ ఓ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ ఇటీవల ఎస్పీ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. శాంతిభద్రతల విషయంలో తలనొప్పిగా ఉన్న కాశీబుగ్గ డివిజన్ కేంద్రంలో ఇద్దరు బాలికలపై మత్తులో ఉన్న యువకులు లైంగిక దాడికి పాల్పడటం విదితమే. జిల్లా కేంద్రంలో ఇటీవల పదుల సంఖ్యలో మత్తుకు బానిసైన యువకులను, మైనర్లను పోలీసులు జల్లెడ వేసి పట్టుకున్నారు. ఈ ఘటనలు బట్టి చూస్తే జిల్లాలో అధిక సంఖ్యలో యువత గంజాయికి బానిసలుగా మారారన్నది తేటతెల్లమవుతోంది. ఒక్క ఏడాదిలో 39 కేసులు.. ఈ ఏడాది సుమారు 39 గంజాయి కేసుల్లో 113 మంది అరెస్టయ్యారు. 1137 కిలోలకు పైగా గంజాయి పట్టుబడింది. గత రెండు నెలలుగా చూస్తే 20కు పైగా కేసుల్లో సుమారు 880 కిలోలు అక్రమ రవాణాలో దొరికింది. ఇక పోలీసుల కన్నుగప్పి దాటినది ఎంతుంటుందో అర్థం చేసుకోవచ్చు. గతంలో ఒడిశా గార బంద నుంచి పలాస హైవేపైకి వచ్చిన ఓ కంటైనర్ లారీలో భారీస్థాయిలో గంజాయి తరలిస్తున్న సమాచారం మేరకు వేకువజామున అడ్డుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులను ఢీకొట్టి వెళ్లిపోయారు. విశాఖలో ఆ లారీ పట్టుబడింది. ఇటీవల ఒడిశా నుంచి పాతపట్నం జాడుపల్లి మీదుగా భారీగా గంజాయి తరలిస్తూ పోలీసులకు కనిపించడంతో ఓ యువకున్ని ఢీకొట్టి గంజాయి ఉన్న బొలెరోను వదిలి ఒడిశా ముఠా పరారైన సంగతి తెలిసిందే. యువత బలవ్వాల్సిందేనా..? జిల్లాలో గంజాయి సాగు సంగతి పక్కన పెడితే.. పక్క రాష్ట్రం ఒడిశా నుంచి రెండు ప్రధాన చెక్‌పోస్టులు(పురుషోత్తపురం, పాతపట్నం) దాటి అక్రమంగా రవాణా అవుతోంది. దీంతో యువత బానిసలుగా మారుతున్నారు. సకాలంలో గంజాయి ప్యాకెట్లు దొరక్కపోతే టైర్లకు అంటించే గమ్‌ను కవర్లలో పెట్టి గంజాయిలా పీల్చే స్థితికి దిగజారిపోయారు. ఈ క్రమంలోనే నేరాలు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. కొందరు ఒడిశా వ్యాపారులు ఇచ్చే కమీషన్ కోసం అదే గంజాయి సరఫరా చేయడం, క్రయ విక్రయాల్లో పాల్గొనడం చేస్తూ బంగారు భవితను నాశనం చేసుకుంటున్నారు. దాడులు జరుపుతున్నా.. పోలీసులు విస్తృతంగా దాడులు జరుపుతున్నా గంజాయి జిల్లాలోకి రాకుండా మాత్రం అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. డ్రోన్ సర్వేలు, కైనెన్ డాగ్స్ పరిశీలన చేయడంతో పాటు తరచూ యువతకు అవగాహన సదస్సులు నిర్వహిస్తే కొంత ఫలితం ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఒడిశాలో సాగు.. జిల్లా మీదుగా ఇతర రాష్ట్రాలకు తరలింపు ఈ క్రమంలోనే మత్తుకు బానిసలుగా మారుతున్న జిల్లా యువత ఒడిశా కేంద్రంగా.. తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్(సూరత్).. తరలించే ప్రాంతమేదైనా ఒడిశానే కేంద్రం. సరిహద్దు చెక్‌పోస్టులు దాటి సిక్కోలు హైవేనే మార్గం. క్రయ విక్రయాలు జరిపేవారు, సేవించేవారు మన జిల్లావారే పట్టుబడుతున్నా ‘సరుకు’ అందించే మూలాలన్నీ ఒడిశావే. మన పోలీసుల రికార్డుల్లో 56 మంది పరారీలో ఉన్నట్లు తెలిసిందే. వీరిలో పదిమందిని ఇటీవల పట్టుకున్నారు. మిగిలిన 46 మంది ఒడిశా (అధికంగా), మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడు తదితర ఇతర రాష్ట్ర ముఠాలకు చెందిన వారే. -
విజయాన్ని సాధించి..
వైకల్యాన్ని ఎదిరించి.. శ్రీకాకుళం పాతబస్టాండ్: పట్టుదల, ప్రోత్సాహం ఉంటే వైకల్యం అడ్డుకాదనే విషయాన్ని ఎంతోమంది నిరూపించారని, అన్ని రంగాల్లో విభిన్న ప్రతిభావంతులు రాణించాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వరరావు ఆకాంక్షించారు. డిసెంబరు 3న జరగనున్న ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం పురస్కరించుకుని జిల్లా స్థాయి విభిన్న ప్రతిభావంతుల క్రీడా పోటీలను శ్రీకాకుళంలోని ఆర్అండ్బీ (డచ్) భవనం వద్ద బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైకల్యంతో బాధపడకుండా క్రీడల్లోనూ రాణించాలన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ పీడీ బి.శాంతిశ్రీ మాట్లాడుతూ నవంబరు 1 నుంచి 30 వరకు అంతర్జాతీయ దత్తత మాసోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా బాలల సంరక్షణ అధికారి రమణ మాట్లాడుతూ చట్టబద్ధమైన పిల్లల దత్తతపై అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడీ కవిత మాట్లాడుతూ డిసెంబరు 3న నిర్వహించనున్న ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం నాడు విజేతలకు బహుమతులు అందజేస్తామని ప్రకటించారు. అనంతరం నడక, షాట్‌ఫుట్, డిస్కస్ త్రో, చెస్, పాటల పోటీలు, కేరమ్స్, క్రికెట్, జావెలెన్ త్రో, ట్రై సైకిళ్లు తదితర పోటీల్లో విభిన్న ప్రతిభావంతులు ఉత్సాహంగా పాల్గొని ప్రతిభ కనబరిచారు. కార్యక్రమంలో ఆర్డీఓ కె.సాయి ప్రత్యూష, డీఆర్డీఏ పీడీ కిరణ్‌కుమార్, డ్వామా పీడీ సుధాకర్, సీపీఓ లక్ష్మీప్రసన్న, సెట్‌శ్రీ సీఈఓ ప్రసాదరావు, నైపుణ్యాభివద్థి అధికారి సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు. సహాయకురాలితో కలిసి పరుగు పందెంలో పాల్గొన్న అంధ బాలిక ఉత్సాహంగా విభిన్న ప్రతిభావంతుల పోటీలు జిల్లా నలుమూలల నుంచి హాజరైన బాలబాలికలు -
అడిషనల్ కమాండెంట్ డీఎస్పీగా నాగేశ్వరరెడ్డి
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లా అడిషనల్ కమాండెంట్ ఫస్ట్ బెటాలియన్ డీఎస్పీగా జి.నాగేశ్వరరెడ్డిని నియమిస్తూ బుధవారం డీజీపీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు విడుదలయ్యాయి. ఈయన ప్రస్తుతం వెయిటింగ్ డీఎస్పీగా కొనసాగుతున్నారు. పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వాలి శ్రీకాకుళం పాతబస్టాండ్: ఆహారం, తాగునీరు పరిశుభ్రంగా ఉంటే వ్యాధులు దరి చేరవని డీఆర్డీఏ పీడీ కిరణ్‌కుమార్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని డీఆర్డీఏ సమావేశ మందిరంలో ‘ఎన్.ఆర్.ఎల్.ఎం – ఆహారం, పౌష్టికాహారం, ఆరోగ్యం, పరిశుభ్రత’ అనే అంశంపై గ్రామీణ నీటి సరఫరా శాఖ, డీఆర్డీఏలు సంయుక్తంగా శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీ మాట్లాడుతూ ఆరుబయట మల, మూత్ర విసర్జన మానుకోవాలన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాస్టర్ ట్రైనర్లు ధనలక్ష్మి, టి.పార్వతి, బి.మల్లేశ్వరరావు, ఆర్డబ్ల్యూఎస్ సిబ్బంది డి.దాలినాయుడు, ఎస్.మురళీమోహన్, అమ్మాజీరావు, ఏరియా కో–ఆర్డినేటర్లు, ఏపీడీలు, సీసీలు పాల్గొన్నారు. వృత్తి విద్య కోర్సులో ఉచిత శిక్షణ ఎచ్చెర్ల క్యాంపస్: ఎచ్చెర్ల మండల కేంద్రంలోని యూనియన్ బ్యాంక్ శిక్షణ కేంద్రంలో వృత్తి విద్య కోర్సులు టైలరింగ్, కంప్యూటర్ అకౌంటెన్సీలో 30 రోజుల శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డైరెక్టర్ కల్లూరి శ్రీనివాసరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. శిక్షణలో ఉచిత వసతి, భోజన సౌకర్యాలు కల్పిస్తామని పేర్కొన్నారు. 19 నుంచి 45 ఏళ్ల మధ్య వయసుగల మహిళలు అర్హులని తెలిపారు. ఈ నెల 30లోపు దరఖాస్తు చేసుకోవాలని, డిసెంబర్ 2 నుంచి కోర్సు ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. వివరాలకు 79933 40407, 95534 10809 నంబర్లను సంప్రదించాలని కోరారు. -
బంగారం చోరీపై కేసు నమోదు
ఎచ్చెర్ల క్యాంపస్: ఎచ్చెర్ల మండలంలోని ఫరీదుపేట గ్రామానికి చెందిన పైడి అనసూయ ఫిర్యాదు మేరకు పోలీసులు బంగారం చోరీపై బుధవారం కేసు నమోదు చేశారు. టైలరింగ్‌లో గత కొంతకాలంగా అనసూయ శిక్షణ ఇస్తోంది. కొందరు మహిళలు శిక్షణ నిమిత్తం ఇంటికి వచ్చి నేర్చుకుంటున్నారు. అయితే కట్టుపని నేర్చుకుంటున్న వారిని విడిచిపెట్టి బయటకు వెళ్లి, తిరిగి ఇంటికి వచ్చి రాత్రి సమయంలో చూడగా బీరువాలో బంగారం ఆరు తులాలు పోయినట్లు గుర్తించింది. బీరువా తాళాలు సైతం పైన పెట్టటంతో తేలిగ్గా చోరి జరిగింది. శిక్షణ తీసుకుంటున్న వారిలో కొందరిని అనుమానిస్తూ పోలీసులకు బుధవారం ఫిర్యాదు చేసింది. సంఘటన అక్టోబర్ 15న జరిగింది. స్థానికంగా సమస్య పరిష్కారం అవుతుందని ఎదురుచూసిన బాధితురాలు చివరకు పోలీసులను సంప్రదించింది. విచారణ ప్రారంభించినట్లు ఎస్ఐ వి.సందీప్‌కుమార్ తెలిపారు. -
అబ్బే అంతా తూచ్..!
రీసర్వే అనంతరం అందజేత వేట నిషేధ భృతిని రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ప్రత్యేక కార్యక్రమం ద్వారా అందజేయనుంది. అయితే అర్హు ల జాబితాలో అనర్హుల ఏరివేత కోసం 6 స్టెప్స్ వెరిఫికేషన్‌ను చేపడుతోంది. ఈ రీసర్వే అనంతరం అర్హులందరికీ భృతిని అందజేస్తారు. ఇప్పటికే సుమారుగా 12,340 మంది అర్హులుగా గుర్తించి నివేదించాం. – పీవీ శ్రీనివాసరావు, డీడీ, మత్స్యశాఖ వేట లేదు.. భృతి అందలేదు నిరసన తప్పదు మత్స్యకారులపై కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. వేట నిషే దం పూర్తయ్యి ఆరు నెలలు దాటిపోయినా.. ఇంతవరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. పైగా ఇప్పుడు అర్హుల గుర్తింపు కోసం రీసర్వే చేయాలంటూ తప్పించుకుంటోంది. ఈ పరిహా రాన్ని రూ.20 వేలుకు పెంచి ఇస్తామన్నారు. ఈనెలాఖరు నాటికి అర్హులందరికీ భృతి చెల్లించకపోతే.. జిల్లా కేంద్రంలో భారీగా నిరసనలు చేపడతాం. – కోనాడ నర్సింగరావు, జిల్లా మత్య్సకార సహకార సంఘ అధ్యక్షుడు అరసవల్లి: సముద్రపు వేట ఆధారిత గంగపుత్రులకు దక్కాల్సిన వేట నిషేధ భృతిపై కూడా కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. ప్రతీఏటా ఏప్రిల్ 14వ తేదీ నుంచి జూన్ 14 వరకు నిబంధనల మేరకు అమలవుతున్న నిషేధ సమయం పూర్తయ్యి ఆరు నెలలు గడుస్తున్నా భృతి మాట ఎత్తడం లేదు. గత ప్రభుత్వంలో వరుసగా ఐదేళ్లు పాటు ఒక్కో మత్స్యకారుడికి ఏటా రూ.10 వేల చొప్పున భృతిని అందజేసిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం కంటే, తాము అధికారంలోకి వస్తే ఆ భృతిని రూ.20 వేలకు పెంచి ఇస్తామని ప్రకటించిన కూటమి ప్రభుత్వం ఆ హామీ నుంచి ఎలాగైనా తప్పించుకునేలా కప్పదాట్లు, కుంటి సాకులు వెదుకుతోంది. ఈక్రమంలో అర్హుల జాబితాను గుర్తించేందుకు మరోసారి సర్వే చేయాలని నిర్ణయించింది. ఇదే సాకుతో గత ఆరునెలల నుంచి భృతి ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతోంది. తాజాగా ఈ భృతిని ఈనెల 21న ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా చెల్లించలేమంటూ ఏకంగా శాసనసభలో సంబంధిత మంత్రి అచ్చెన్నాయుడు చేసిన ప్రకటనతో మత్స్యకారులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇక భృతి వచ్చే ఆశలు నీరు గార్చారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాడు.. నేడు సముద్రంలోకి వేటకు వెళ్లే మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో ఉపాధి కోసం భృతిని ప్రభుత్వాలు అందజేస్తున్నాయి. టీడీపీ అధికారంలో ఉన్న 2014 నుంచి 2019 వరకు ఒక్కొక్కరికీ రూ.4 వేల చొప్పున భృతిని చెల్లించారు. అయితే వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 నుంచి ఐదు విడతల్లో ఒక్కొక్కరికీ రూ.10 వేల చొప్పున ఏకంగా రూ.70 కోట్లకు పైగా భృతిని అందజేసి సంక్షేమ పాలను అందజేసింది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. మళ్లీ అధికారంలోకి వచ్చిన టీడీపీ ఈ భృతిని రూ.20 వేలకు పెంచుతూ అందజేస్తామని ఎన్నికల సమయంలో ప్రకటించింది. అయితే ఇప్పటికే సమయం దాటినా ఇంకా అందించకుండా కుంటిసాకులు చెబుతోంది. ఇదిలావుంటే తాజా సర్వే అనంతర సమాచారం ప్రకారం 15,200 మందికి రూ.20 వేల చొప్పున ఈ ఒక్క జిల్లాలోనే మొత్తం రూ.30.40 కోట్లను ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. దీనిపై జిల్లాలో మత్స్యకారులు ఆశలు పెట్టుకున్నారు. అయితే ఈ సంఖ్యను రీసర్వే పేరిట కుదించేలా కూటమి సర్కార్ కుట్రలు చేస్తోందని తెలుస్తోంది. 3 వేల మందికి ఎసరు..? జిల్లాలో 11 మండలాల పరిధిలో తీరప్రాంత మత్స్యకారులు వేటపై జీవనాన్ని సాగిస్తున్నారు. ప్రతిఏటా 15వేలకు పైగా మత్స్యకారులు వేట నిషేధ కాలంలో ఇంటికే పరిమితమయ్యేవారు. ఈక్రమంలో అధికారులు ఆయా ప్రాంతాల్లో ప్రత్యక్ష సర్వే ద్వారా అర్హులను గుర్తించి వారికి పరిహారాన్ని ఆన్లైన్ ద్వారా అందజేయాల్సి ఉంది. ఇందుకోసం మత్స్యశాఖ అధికారులు సర్వేను చేపట్టి 15,200 మంది అర్హులుగా గుర్తించారు. అయితే కూటమి ప్రభుత్వం దీనిపై మళ్లీ సర్వే చేసేలా చర్యలకు రాష్ట్ర మత్స్యశాఖా మంత్రి కె.అచ్చెన్నాయుడు ఆదేశించారు. దీంతో ఇప్పుడా సంఖ్య 12,340 మందికి మాత్రమే పరిమితం కానుందని సమాచారం. సిక్స్ స్టెప్స్ వెరిఫికేషన్ ప్రక్రియలో భాగంగా చాలామందిని అర్హత నుంచి తప్పించినట్లుగా ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో ఈసారి సుమారు మూడు వేల మందికి ఈ భృతి దక్కే పరిస్థితులు కనిపించడం లేదు. ఇంకా ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కూటమి ప్రభుత్వం కుట్రలతో ఆ మూడు వేల మందికి ఎసరు పెట్టినట్లైంది. గత ప్రభుత్వం అందజేసిన భృతి ఏడాది లబ్ధిదారులు భృతి జమ 2019–20 13,388 రూ.13.38 కోట్లు 2020–21 14,289 రూ.14.28 కోట్లు 2021–22 13,612 రూ.13.61 కోట్లు 2022–23 14,043 రూ.14.04 కోట్లు 2023–24 15,281 రూ.15.28 కోట్లు -
జూడో పోటీలకు వర్సిటీ క్రీడాకారిణులు
ఎచ్చెర్ల క్యాంపస్: మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్‌లోని ఎల్ఎన్సీటీ విశ్వ విద్యాలయంలో ఈనెల 22వ తేదీ నుంచి 25వ తేదీ వరకు సౌత్ వెస్ట్ అంతర విశ్వ విద్యాలయాల జూడో పోటీలు జరగనున్నాయి. ఈ పోటీల్లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం తరుపున క్రీడాకారిణులు సీహెచ్ సాయికుమారి (శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల), వి.కావ్య (శ్రీకాకుళం ప్రభుత్వ మహిళల డిగ్రీ కళాశాల) పాల్గొంటున్నారు. వీరిని వర్సిటీలో ప్రత్యేకంగా వీసీ రజిని, రిజిస్ట్రార్ సుజాత బుధవారం అభినందించారు. క్రీడల్లో సత్తా చూపి వర్సిటీకి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. హ్యాండ్‌బాల్ పోటీలకు పిల్లలవలస విద్యార్థి పొందూరు: మండలంలోని పిల్లలవలస జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థి గురుగుబెల్లి సోమశేఖర్ జాతీయ స్థాయి హ్యాండ్‌బాల్ పోటీలకు ఎంపికయ్యాడు. ఈనెల 25వ తేదీ నుంచి 29 వరకు ఛత్తీస్‌గఢ్‌లోని మాష్కండ్లో 68వ జాతీయస్థాయి స్కూల్‌గేమ్స్ జరగనున్నాయి. ఈ పోటీల్లో అండర్–14 విభాగంలో సోమశేఖర్ పాల్గోనున్నాడు. దీంతో విద్యార్థికి అవసరమైన ఖర్చుల కోసం సర్పంచ్ బి.పోలినాయుడు, ఉప సర్పంచ్ జి.కృష్ణమూర్తి ఆర్థిక సాయం అందించారు. విద్యార్థికి హెచ్ఎం కాసులబాబు, పీడీ జి.రాజశేఖర్‌రావు, ఉపాధ్యాయులు, ప్రజలు అభినందించారు. సాఫ్ట్‌బాల్ పోటీలకు తాడివలస విద్యార్థులు పొందూరు: ఈనెల 22వ తేదీ నుంచి 23 వరకు రెండు రోజులు పాటు జరగనున్న అండర్–14 రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు తాడివలస ఉన్నత పాఠశాల విద్యార్థులు ముగ్గురు ఎంపికై నట్లు ఆ పాఠశాల హెచ్ఎం బల్ల కంటయ్య బుధవారం తెలిపారు. వాకముల్లు నిత్యశ్రీ, తొగరాపు భార్గవి, సుందరాపల్లి విజయరాజులు ఎంపికయ్యారని చెప్పారు. సర్పంచ్ తమ్మినైన మణెమ్మ, ఎంపీటీసీ సువ్వారి దివ్య తదితరులు హర్షం వ్యక్తం చేశారు. జాతీయ స్విమ్మింగ్ పోటీలకు ఇద్దరు ఎంపిక శ్రీకాకుళం న్యూకాలనీ: రాజ్‌కోట్ వేదికగా జరగనున్న జాతీయస్థాయి స్కూల్‌గేమ్స్ స్విమ్మింగ్ పోటీలకు జిల్లాకు చెందిన ఇద్దరు క్రీడాకారులు దీక్షా బెహర, పైడి హర్షిత ఎంపికై నట్టు డీఎస్ఏ స్విమ్మింగ్ కోచ్ డి.మురళీధర్ బుధవారం తెలిపారు. ఇటీవల నరసారావుపేటలో జరిగిన రాష్ట్రపోటీల్లో వీరిద్దరూ పతకాలతో రాణించడంతో జాతీయ పోటీలకు ఎంపికై నట్టు చెప్పారు. -
కె.ఎల్.ఎన్ే.పటలో భారీ చోరీ
● 16 తులాల బంగారం, 200 గ్రాముల వెండి మాయం జలుమూరు: మండలంలోని జోనంకి పంచాయతీ కేఎల్ఎన్పేటలో భారీ చోరీ జరిగింది. దొంగలు ఇంట్లోకి చొరబడి బంగారం, వెండి ఆభరణాలు పట్టుకుపోయారు. బాధితురాలు సనపల లక్ష్మి తెలిపిన వివరాల ప్రకారం.. లక్ష్మి తన భర్త నాగరాజు చైన్నెలో ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తుండటంతో 20 రోజుల క్రితం అక్కడికి వెళ్లింది. తిరిగి మంగళవారం ఉదయం ఇంటికి వచ్చి చూసేసరికి గేటు తాళం విరగ్గొట్టి ఉంది. లోపలికి వెళ్లి చూడగా రెండు బీరువాలు తెరిచి దుస్తులు చిందర వందరగా పడేసి ఉన్నాయి. అందులో దాచిన సుమారు 16 తులాల బంగారం, 800 గ్రాముల వెండి ఆభరణాలు పోయినట్లు గుర్తించింది. హోం థియేటర్ సైతం దొంగలు ఎత్తుకెళ్లిపోయారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఏడు తులాల పోయినట్లు ఫిర్యాదు ఇవ్వమన్నారని, రశీదులు తెస్తేనే 16 తులాలు పోయినట్లు కేసు నమోదు చేస్తామంటున్నారని ఆమె వాపోయింది. తమ అత్తమామల నుంచి వచ్చిన బంగారం కొంత, కుమార్తె రజస్వల ఫంక్షన్‌కు మరికొంత బంగారం వచ్చిందని, వీటన్నంటికి రశీదులు ఎలా తెస్తానని ఆవేదన వ్యక్తం చేసింది. ఇదిలా ఉండగా.. సమాచారం అందుకున్న శ్రీకాకుళం క్లూస్ టీమ్, నరసన్నపేట సీఐ కె.శ్రీనివాసరావు, జలుమూరు ఎస్ఐ అశోక్‌బాబు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బీరువాలను పరిశీలిస్తున్న పోలీసులు -
చిరుద్యోగులకు శిక్ష
రాజకీయ కక్ష.. ● చిరుద్యోగులపై కొనసాగుతున్న వేధింపులు ● తాత్కాలిక, దినసరి,అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగిస్తున్న కూటమి ప్రభుత్వం ● ప్రస్తుతం ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్ల వంతు ● మంత్రి అచ్చెన్న నియోజకవర్గంలో అత్యధికంగా తొలగింపు ● వందలాది మందిని తొలగించేందుకు రంగం సిద్ధం సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: అధికార పక్ష నాయకులు పెంచుకున్న రాజకీయ కక్ష.. చిరుద్యోగుల పాలిట శిక్షగా మారుతోంది. ఇంటికో ఉద్యోగమని ఊదరగొట్టిన కూటమి నాయకులు ఇప్పుడు ఉన్న ఉద్యోగులను తీసేస్తున్నారు. ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామన్న కూటమి ప్రభుత్వం, ఇప్పుడా హామీని గాలికొదిలేసి ఇప్పటికే పనిచేస్తున్న ఉద్యోగుల జీవితాలను ఛిద్రం చేస్తోంది. దశల వారీగా తొలగింపు కార్యాచరణ అమలు చేస్తున్నారు. తొలుత మధ్యాహ్న భోజన కార్మికులపై పడ్డారు. ఆ తర్వాత రేషన్ డిపో డీలర్లు, యూనివర్సిటీ ఉద్యోగులపై వేటు వేశారు. గ్రామ సమాఖ్య సహాయకులు(వీఎఓ), వైద్య ఆరోగ్యశాఖలోని చిరుద్యోగులు, దేవాలయాల్లో పనిచేసే తాత్కాలిక ఉద్యోగుల్ని వదలేదు. ఇప్పుడు ఫీల్డ్ అసిస్టెంట్లపైనా, 108,104 ఉద్యోగులపై పడ్డారు. ఉద్యోగుల ఉపాధి తీసే పనిలో నిమగ్నమయ్యారు. ఫీల్డ్ అసిస్టెంట్ల మెడపై తొలగింపు కత్తి.. అధికారంలోకి వస్తే ఏడాదికి 4లక్షలు చొప్పున ఐదేళ్లలో 20లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం అఽధికారంలోకి వచ్చాక ఉన్న ఉద్యోగాల్ని పీకేస్తోంది. చంద్రబాబు అండ్‌కో చెప్పిన మేరకై తే జిల్లాలో నిరుద్యోగులుగా ఉన్న 7లక్షల 28వేల 910మందికి ఉద్యోగాలు కల్పించాలి. ఈ లోపు వారికి నెలకి రూ. 3వేలు చొప్పున నిరుద్యోగ భృతి అందించాలి. ఆ విషయాన్ని పక్కన పెట్టి ఇప్పుడు ఎక్కడెక్కడ కానివారు చిరు ఉద్యోగులుగా ఉన్నారో గుర్తించి వారందరినీ ఏరివేసేందుకు కంకణం కట్టుకున్నారు. ఎక్కడైతే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులున్నారో వారందర్నీ తీసేస్తున్నారు. ప్రస్తుతం ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ల మెడపై తొలగింపు కత్తి పెట్టారు. ఇప్పటికే జిల్లాలో 41మందిని తీసేశారు. మరో 60మందిని తీసేసేందుకు రంగం సిద్ధం చేశారు. మున్ముందు మరింత మందిని తొలగించాలని చూస్తున్నారు. తప్పుడు అభియోగాలు మోపి, కూటమి నాయకుల సిఫార్సుల మేరకు అధికారులు తొలగిస్తున్నారు. అత్యధికంగా మంత్రి అచ్చెన్నాయుడు నియోజకవర్గంలో నిర్ధాక్షిణ్యంగా తొలగిస్తున్నారు ఇక్కడ ఒక్కచోటే 21మందిని తొలగించారు. చాంతాడంత జాబితా.. ● కూటమి నాయకుల రాజకీయ కక్షలకు, వేధింపులకు చిరుద్యోగులు బలైపోతున్నారు. చిన్నపాటి ఉద్యోగంతో కుటుంబాలను పోషించుకుంటున్న వారందరినీ తీసేస్తే తప్ప ప్రస్తుత పాలకుల కడుపు చల్లారడం లేదు. ● 2014–19లో ఏ రకంగానైతే డ్వామా, డీఆర్డీఎ, హౌసింగ్, వ్యవసాయ శాఖలో పనిచేసిన అవుట్ సోర్సింగ్, తాత్కాలిక ఉద్యోగులను తొలగించారో అదే రకంగా ప్రస్తుతం వ్యవహరిస్తున్నారు. ● ఇసుక, మద్యం దోపిడీ, భూకబ్జాలు, కాంట్రాక్ట్ అక్రమాలే కాదు చిరుద్యోగుల తొలగింపు కూడా పునరావృతం చేస్తున్నారు. ● వలంటీర్ వ్యవస్థను ఆపేయడంతో జిల్లాలో ఇప్పటికే 15,328 మంది రోడ్డున పడ్డారు. తాము అధికారంలోకి వస్తే రూ. 10వేలు జీతం ఇస్తామని చెప్పిన చంద్రబాబు అండ్‌కో ఇప్పుడీ వ్యవస్థనే ప్రశ్నార్థకం చేసింది. ● కూటమి ప్రభుత్వం వచ్చాక జిల్లాలో 90మంది మధ్యాహ్న భోజ నం కార్మికులను, 40మంది ఆయాలను తొలగించారు. మరో వంద మందిని తొలగించేందుకు ప్ర యత్నాలు జరుగుతున్నాయి. అధికార పార్టీ కి అనుకూలంగా లేని వారందరినీ తొలగించి, వారి ప్లేస్‌లో పచ్చ కండువాలు కప్పుకున్న వారిని వేసుకునేందుకు ప్లాన్ చేశారు. ● ప్రభుత్వ జీఓ ఆధారంగా 12 మంది వర్సిటీలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులను తొలగించారు. గతంలో నియమించిన 34 ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించాలని చూస్తున్నారు. ● రాజకీయ కక్షతో శ్రీకాకుళం నగర పా లక సంస్థలో శానిటరీ మేసీ్త్రలను తొలగించారు. ● 108, 104ఉద్యోగుల మెడపై కూడా కత్తి పెట్టారు. కాంట్రాక్ట్ డ్రైవర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్ల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ● రేషన్ డీలర్లపైనా కన్నేశారు. ఇప్పుడున్న డీలర్లను తొలగించి వారి స్థానంలో తమ వాళ్లను వేసుకోవడానికి మండలాల వారీగా జాబితాలు తయారు చేసి, అధికారులకు ఇచ్చారు. ఒకేసారి తీసేస్తే రచ్చ అయిపోతుందని దశల వారీగా తొలగింపు కార్యాచరణ అమలు చేస్తున్నారు. ఇప్పటికే తొలగించిన వారి సంఖ్య డబుల్ డిజిట్లో ఉంది. ● అరసవిల్లి సూర్యనారాయణస్వామి దేవాలయంలో గత కొన్నేళ్లుగా పనిచేస్తున్న 48మంది దినసరి ఉద్యోగుల పరిస్థితి అయోమయంగా తయారైంది. పొమ్మనకుండా పొగ బెట్టినట్టు జీతాలు ఇవ్వకుండా గాలికొదిలేశారు. ఉచితంగా సేవ చేయాలనుకుంటే రండి లేదంటే ఉండిపోండి అని అధికారులు ఇప్పటికే సెలవిచ్చారు. -
రాబంధువులు
రీచుల్లో సాక్షి టాస్క్‌ఫోర్స్: ఇసుక రీచులపై రా‘బంధువులు’ వాలుతున్నాయి. ర్యాంపుల్లో కాసుల వేట జరుగుతుండడంతో అధికార పక్ష నేతల బంధువులు ఎక్కడెక్కడి నుంచో వచ్చి వాలిపోతున్నారు. నిర్మాణ రంగం కుదేలు కాకుండా ఉండేందుకు వీలుగా జిల్లాలో కొన్ని ఇసుక ర్యాంపులను లారీలకు లోడ్ చేసేందుకు అనుమతులు ఇచ్చారు. ఇందులో మండల పరిధిలోని గోపాలపెంట ఇసుక ర్యాంపు ఒకటి. దీన్ని ఎమ్మెల్యే బంధువులకే కట్టబెట్టారు. స్థానిక టీడీపీ కార్యకర్తలే అంతా చూస్తున్నారు. దీంతో తమకు అడ్డు లేదనుకొని ఇష్టానుసారంగా నిబంధనలు పక్కన పెట్టి ర్యాంపు నిర్వహిస్తున్నారు. అంతటా నిబంధనల ఉల్లంఘనే.. గోపాలపెంట ర్యాంపులో అడుగడుగునా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. ఇక్కడ వాల్టా చట్టాన్ని పట్టించుకోవడం లేదు. నదిలో ఇసుక లోడింగ్ మనుషుల ద్వారా చేయాలని ప్రభుత్వం చూచిస్తే యంత్రాలు వినియోగిస్తున్నారు. ఇక్కడ మూడు జేసీబీలు పనిచేస్తున్నాయి. రోజూ 23 ట్రాక్టర్లు వినియోగించి ఇసుకను డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. ఒక్కో ట్రాక్టరు రోజుకు 10 లోడ్లు వేస్తుంది. వీరికి ఒక్కో లోడుకు రూ. 270 చెల్లిస్తున్నారు. నదిలోనికి ఇతరులు ఎవరూ వెళ్లకుండా ఎక్కడికక్కడ టీడీపీ కార్యకర్తలు కాపలా కాస్తున్నారు. ర్యాంపు వద్ద సీసీ కెమెరాలు లేకపోవడంతో వారు ఆడిందే ఆట పాడిందే పాటగా సాగిపోతోంది. స్వయంగా ఎమ్మెల్యే బంధువులే ర్యాంపు నిర్వహిస్తుడంటంతో అధికారులు ఇటువైపు చూడనైనా చూడడం లేదు. లారీలతో పాటు ట్రాక్టర్లు తిరగడం వల్ల రోడ్డుపై ధూళి ఎగసిపడుతోంది. కనీసం వాటరింగ్ అయినా చేయడం లేదని గోపాలపెంట, పోతయ్యవలసలకు చెందిన పలు కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పగలూ రాత్రి.. గోపాలపెంటలో ఇసుక ర్యాంపును అక్టోబరు 17న కలెక్టర్ ప్రారంభించారు. 24 వ తేదీ నుంచి అధికారికంగా ర్యాంపు నడుస్తోంది. సోమవారం నాటికి అధికారికంగా 78 లారీల ఇసుకను మాత్రమే విక్రయించారు. సెలవు రోజులు పోనూ ర్యాంపు పనిచేసిన రోజుల్లో సరాసరిన రోజుకు 6 లారీలు చొప్పున విక్రయాలు చేశారు. అయితే అనధికారికంగా వందల లోడ్లు తరలాయి. రాత్రి సమయాల్లో ఇసుక ర్యాంపు నిర్వహణకు అనుమతి లేకపోగా టీడీపీ కార్యకర్తలే అంతా తామై ఇసుకను రోజుకు పదుల సంఖ్యలో తరలిస్తున్నారు. అలాగే లారీల్లో పరిమితికి మించి లోడింగ్ చేస్తూ అదనపు ఇసుకకు వేరే రేటు తీసుకుంటున్నారు. ఉదాహరణకు పగలు కూడా ఒక లారీ 12 టన్నులకు డీడీ తీస్తే 20 టన్నుల వరకూ లోడింగ్ చేసి డబ్బులు అదనంగా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటలు వరకూ సచివాలయ సిబ్బందికి డ్యూటీలు వేశారు. వీరు వెళ్లిన తర్వాత వ్యవహారం అంతా గుట్టుచప్పుడు కాకుండా జరుగుతుంది. అధికారులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. తనిఖీలు చేయడం లేదు. మరో మూడు ర్యాంపుల స్వాధీనానికి ప్రయత్నాలు మండలంలో మడపాం, కొబగాం వెంకటాపురం, ఉప్పరిపేట వద్ద మరో మూడు ర్యాంపులను ప్రభుత్వం మంజూరు చేయనుంది. ఈ మేరకు జిల్లా ఇసుక కమిటీ షీల్డు టెండర్లును ఆహ్వానిస్తూ ఒక ప్రకటన చేసింది. వీటిని కూడా ఎమ్మెల్యే బంధువులు చేజిక్కించుకుని అందిన మేరకు లాగేయడానికి చూస్తున్నారు. స్వయానా ఎమ్మెల్యే భార్య బంధువులు రంగ ప్రవేశం చేసి పావులు కదుపుతున్నారు. నియోజకవర్గంలో ఇసుక వ్యాపారం అంతా తమ కనుసన్నల్లోనే జరిగే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో మండలంలోని టీడీపీ కేడరు, జనసేన కేడరు గుర్రుగా ఉన్నట్లు సమాచారం. గోపాలపెంట ఇసుక ర్యాంపులో యథేచ్ఛగా నిబంధనల ఉల్లంఘన పట్టించుకోని అధికారులు ర్యాంపు నిర్వాహకులు టీడీపీ కార్యకర్తలు, ఎమ్మెల్యే బంధువులే అన్ని ర్యాంపులు చేజిక్కించుకోవడానికి చక్రం తిప్పుతున్న ఎమ్మెల్యే బంధువులు -
బైక్ ఢీకొని ఉపాధ్యాయుడికి గాయాలు
మెళియాపుట్టి: మండల కేంద్రం మెళియాపుట్టికి చెందిన ఉపాధ్యాయుడు (గొట్ట హైస్కూల్ హిందీ పండిట్) బత్తుల సోమేశ్వరరావు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఎస్సై రమేష్‌బాబు తెలిపిన వివరాల మేరకు.. సోమేశ్వరరావు సోమవారం రాత్రి బహిర్భూమికని పలాస–పూండి రహదారి దాటుతుండగా ఒడిశా రాష్ట్రం భిన్నాళ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మద్యం సేవించి వేగంగా ఢీకొన్నాడు. తీవ్రంగా గాయపడిన సోమేశ్వరరావును కుటుంబసభ్యులు 108 వాహనం ద్వారా టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించి, అక్కడినుంచి శ్రీకాకుళం రిమ్స్‌లో చేర్పించారు. మెరుగైన చికిత్స కోసం ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 22న జాబ్‌మేళా శ్రీకాకుళం పాతబస్టాండ్: ముత్తూట్ మైక్రోఫిన్ సంస్థలో ఉద్యోగాలకు ఈ నెల 22న ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు డీఆర్డీఏ పీడీ కిరణ్‌కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్టీసీ కాంప్లెక్స్ వెనక నెహ్రూ యువ కేంద్రంలో ఉదయం 9 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ఇంటర్వ్యూలు జరుగుతాయని పేర్కొన్నారు. రిలేషన్షిప్ ఆఫీసర్ పోస్టులకు ఇంటర్మీడియట్, బ్రాంచ్ క్రెడిట్ మేనేజర్ పోస్టులకు బీకాం/ఎంబీఏ అర్హత ఉండాలని తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలోనే పనిచేయాల్సి ఉంటుందన్నారు. 18 నుంచి 28 ఏళ్ల వయసు గల అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గలవారు హాజరుకావాలన్నారు. -
బీఎడ్ రెండో సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం
ఎచ్చెర్ల క్యాంపస్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం పరిధిలోని బీఎడ్ రెండో సెమిస్టర్ పరీక్షలు మంగళవారం ప్రారంభమయ్యా యి. మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వ విద్యాలయం ఆర్ట్స్ కళాశాల, ఇంజినీరింగ్ కాలేజ్, రాజాం జీసీఎస్ఆర్, పాలకొండ డిగ్రీ కళాశాల, టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పలా స ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 22వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. 901 మంది పరీక్షకు హాజరయ్యారు. పరీక్షల నిర్వహణను ఎగ్జామినేషన్స్ డీన్ ఎస్.ఉదయ్‌భాస్కర్ పర్యవేక్షిస్తున్నారు. జాతీయ స్విమ్మింగ్ పోటీలకు ఇద్దరు ఎంపిక శ్రీకాకుళం న్యూకాలనీ: జాతీయ స్థాయి స్కూల్‌గేమ్స్ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్–2024 పోటీలకు జిల్లాకు చెందిన బుడుమూరు స్పందన, దుప్పల సాయిగీతికలు ఎంపికయ్యారు. ఈ పోటీలు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో గుజరాత్‌లోని రాజ్‌కోట్ వేదికగా ఈనెల 24 నుంచి 30 వరకు జరగనున్నాయి. 200 మీటర్ల ఫ్రీ స్టైల్లో స్పందన, 400మీటర్ల ఫ్రీ స్టైల్, 200మీటర్ల బటర్ ఫ్లై విభాగంలో జాతీయ పోటీల్లో ప్రాతినిధ్యం వహించనున్నట్టు జిల్లా స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ అధ్యక్షులు, డీఈఓ డాక్టర్ తిరుమల చైతన్య, కార్యదర్శి బడి వెంకటరమణ తెలిపారు. వీరిని తీర్చిదిద్దుతున్న స్విమ్మింగ్ కోచ్ ఎస్కె సుభాన్, అసిస్టెంట్ కోచ్ కిశోర్‌లను ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. ఆదిత్యుని హుండీ ఆదాయం రూ.68.85లక్షలు అరసవల్లి: ఆరోగ్య ప్రదాత సూర్యనారాయణ స్వామి ఆలయంలో హుండీ కానుకల ద్వారా రూ.68,85,700 మేరకు ఆదాయం లభించిందని ఆలయ ఈఓ వై.భద్రాజీ పేర్కొన్నారు. మంగళవారం ఆలయ అనివెట్టి మండపంలో నిర్వహించిన హుండీ కానుకల లెక్కింపులో నగదు రూపంలో రూ.67,09,160 చిల్లర రూపంలో రూ.1,76,540 లభించినట్టు తెలిపారు. ఈ ఏడాది ఆగస్టు 27 నుంచి ఈనెల 19వ తేదీవరకు 84 రోజులకుగాను హుండీల ద్వారా ఇంత మొత్తంలో ఆలయానికి ఆదా యం లభించిందన్నారు. అలాగే 25 గ్రాముల బంగారం, కేజీ 600 గ్రాముల వెండి వస్తువులు మొక్కుబడి రూపంలో లభించాయని భద్రాజీ తెలియజేశారు. కార్యక్రమాల్లో ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ, సూపరింటెండెంట్ కనకరాజు, సీనియర్ అసిస్టెంట్ జీవీబీఎస్ రవికుమార్, ఆమదాలవలస ఈఓ తమ్మినేని రవి పర్యవేక్షించారు. ఎన్నికల హామీలను వెంటనే అమలు చేయాలి పలాస: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తెలుగుదేశం ప్రభుత్వ కూటమి భాగపక్షాలు వెంటనే అమలు చేయాలని అఖిల భారత రైతుకూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వంకల మాధవరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు పలాస సూదికొండ కాలనీలోని ఆ పార్టీ కార్యాలయంలో ఆయన మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రైతుల ఖాతాల్లో తక్షణమే రూ.20వేలు జమచేయాలని కోరారు. కౌలు రైతులకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేయాలన్నారు. జీడి మామిడిపంటకు కూడా బీమా రుసుం ప్రభుత్వమే చెల్లించాలని కోరారు. సమావేశంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు జుత్తు వీరాస్వామి, బంగ్లాకుమార్, సవర సోమేశ్వరరావు, సంతోష్, వెంకటేష్, రామారావు తదితరులు పాల్గొన్నారు. -
బాహుదా, వంశధార నదులను అనుసంధానించండి
● శాసన మండలిలో ఎమ్మెల్సీ నర్తు కవిటి: శ్రీకాకుళం జిల్లాకు శివారు నియోజకవర్గమైన ఇచ్ఛాపురానికి సాగు, తాగునీరు అందించేందుకు ప్రభుత్వం సత్వర చర్యలు చేపట్టాలని ఎమ్మెల్సీ నర్తు రామారావు కోరారు. శాసనమండలిలో మంగళవారం స్పెషల్ మెన్షన్ పీరియడ్‌లో మండలిలో ఎమ్మెల్సీ ఈ అంశంపై మాట్లాడారు. జిల్లాలో అపారమైన వనరులు ఉన్నాయని, వాటిని వినియోగించుకుంటే సస్యశ్యామలం అవుతుందని చెప్పారు. ఒకప్పుడు కొబ్బరి, జీడి మామిడి పంటలు, పచ్చని పైరుతో ఉద్దానం కళకళలాడేదని, ఇప్పుడు చీడపీడలు, ప్రకృతి వైపరీత్యాలు ఆందోళనకు గురిచేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలోని వంశధార నదీ జలాలను నేరేడు బేరేజీ నుంచి ఇచ్ఛాపురం నియోజకవర్గంలోని బాహుదా నదికి అనుసంధానం చేయడం ద్వారా ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని తెలిపారు. -
మెళియాపుట్టి కేంద్రంగా ఐటీడీఏ ఏర్పాటుచేయాలి
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): శ్రీకాకుళం జిల్లాలో మెళియాపుట్టి కేంద్రంగా ఐటీడీఏను ఏర్పాటు చేయాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాబ యోగి డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం శ్రీకాకుళం అంబేడ్కర్ కూడలి వద్ద నిరసన తెలియజేసి అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వాబయోగి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో జిల్లాలో గిరిజనులకు న్యాయం చేసేలా మెళియాపుట్టిలో ఐటీడీఏ ఏర్పాటుకు తీర్మానం చేయాలని కోరారు. సీతంపేట ఐటీడీఏ పార్వతీపురం మన్యం జిల్లాకు తరలిపోవడంతో వివిధ పనుల కోసం వ్యయప్రయాసలు పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై జిల్లా విభజన సమయంలోనే కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చామని, ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం నాయకులు కూడా తమ ప్రభుత్వం వచ్చాక మెళియాపుట్టి కేంద్రంగా ఐటీడీఏ ఏర్పాటు చేస్తామని బహిరంగ ప్రకటనలు చేశారని గుర్తుచేశారు. చంద్రబాబు సైతం ప్రతిపక్ష నేత హోదాలో పాతపట్నం బహిరంగ సభలో శ్రీకాకుళం జిల్లాకు ఐటీడీఏ ఏర్పాటు చేసి ఆదివాసీల అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారని పేర్కొన్నారు. తక్షణమే ఐటీడీఏ ఏర్పాటుచేయకుంటే ఆదివాసీ ఉద్యమాలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ మెళియాపుట్టి మండల అధ్యక్షుడు గణేష్, బూర్జ మండల అధ్యక్షుడు సవర శోభన్, సవర కృష్ణ, సారవకోట మండల అధ్యక్షుడు భాస్కరరావు, దీనబందిపురం సర్పంచ్ వెంకటేష్, సభ్యులు ఈశ్వరరావు, లచ్చుమయ్య, హరీష్ పాల్గొన్నారు. -
విద్యుత్ చార్జీల పెంపు తగదు
అరసవల్లి: విద్యుత్ చార్జీలు పెంచేది లేదంటూ గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు అమాంతం చార్జీలను పెంచేసిందని వామపక్ష నేతలు దుయ్యబట్టారు. స్మార్ట్ మీటర్లు అమర్చడాన్ని తక్షణమే నిలిపివేయాలంటూ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం జిల్లా కేంద్రంలోని విద్యుత్ సర్కిల్ కార్యాలయం వద్ద సీపీఐ, సీపీఎం కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ, సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావులు మాట్లాడుతూ పాపం పాలకులదైతే.. శిక్ష ప్రజలకా అంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోపే రెండు సార్లు చార్జీల పెంపును అమలు చేస్తుండటంపై మండిపడ్డారు. జనాగ్రహం ఇప్పటికే బయటకొచ్చేస్తుందని, పాలకులు చార్జీల పెంపుపై పునరాలోచించి నిర్ణయం తీసుకోకపోతే.. తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. అనంతరం ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బి.హరీష్, ఎవైఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
ఆటకట్టు
బైక్ చోరీ గ్యాంగ్ పట్టుబడిన ద్విచక్రవాహనాలను పరిశీలిస్తున్న ఎస్పీ మహేశ్వరరెడ్డి. చిత్రంలో డీఎస్పీ వివేకానందశ్రీకాకుళం క్రైమ్ : గత రెండేళ్లుగా బైక్‌చోరీలకు పాల్పడుతున్న గ్యాంగ్‌ను ఆమదాలవలస పోలీసు లు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 15.5 లక్షల విలువైన 20 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. బైక్ చోరీలే కాక బ్యాటరీలు, ల్యాప్‌టాప్‌లు, మొబైళ్లు, వైన్‌షాపు రోబరీల్లో నిందితులైన ఆరుగురిని అరెస్టు చేశారు. ఈ నేరాలతో సంబంధమున్న మరో వ్యక్తి గంజాయి కేసులో ఇప్పటికే జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. మంగళవారం సాయంత్రం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి పత్రికా విలేకరుల సమావేశంలో ఈ మేరకు వివరాలు వెల్లడించారు. గత నెల 5వ తేదీ రాత్రి ఆమదాలవలసకు చెందిన ప్రైవేటు ఉద్యోగి కరణం శ్రీనివాసరావు తన ఇంటి ముందు పార్క్ చేసిన ద్విచక్రవాహనాన్ని గు ర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారంటూ పోలీసు లకు ఫిర్యాదు చేశారు. డీఎస్పీ వివేకానంద పర్యవేక్షణలో రంగంలోకి దిగిన ఆమదాలవలస సీఐ సత్యనారాయణ, ఎస్ఐ కె.వెంకటేష్‌లు తమ సిబ్బందితో కలసి దర్యాప్తు కొనసాగించారు. విచారణ కొనసాగించగా.. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం వెంకయ్యపాలెం గ్రామానికి చెందిన మైలపల్లి అర్జునరావు (37) దివ్యాంగుడు కావడం, ఏ పనిచేయక ఆర్థిక ఇబ్బందుల్లో ఉండేవాడు. ఇతనికి ఆమదాలవలస కండ్రపేటకు చెందిన కారుణ్య జగదీష్, పలాస మండలం అంబుసోలికి చెందిన జడ్యాడ సోమేశ్వరరావు (21), విజయనగరం జిల్లా కొమరాడ మండలం కొట్టు గ్రామానికి చెందిన సప్ప హరీష్ (21), ఆమదాలవలస మెట్టెక్కివలసకు చెందిన మదాసు ధనుష్ (19)లు పరిచయమయ్యారు. పథక రచన చేశారిలా.. అర్జునరావు వీరందరికి ఖర్చులకు డబ్బులివ్వడమే కాక ఉండటానికి గది అద్దెకిచ్చి రాత్రి పూట బైక్, ఇతర చోరీలు ఎలా చేయాలన్న దానిపై ప్రణాళిక రూపొందించేవాడు. దొరికిన బైక్‌లను ఏపీలో అమ్మితే సమస్య అని, ఒడిశాలో అమ్మితే పోలీసులకు దొరికే అవకాశముండదని ఒడిశా గజపతి జిల్లా మినిగాన్కు చెందిన తన మిత్రుడు దారపు శేషగిరి (42) అతని బంధువైన ఏరుపల్లి బాలాజీ (తురకపేట)ల సాయంతో అమ్మేవారు. పట్టుబడ్డారిలా.. ఈ క్రమంలో మంగళవారం ఉదయం 11 గంటలకు ఆమదాలవలస మున్సిపాలిటీ గేట్ స్కూల్ కూడలి వద్ద ఎస్ఐ వెంకటేష్, తమ సిబ్బందితో కలిసి నిందితులను పట్టుకున్నారు. పట్టుబడిన నిందితుల్లో జడ్యాడ సోమేశ్వరరావుపై విజయనగరం బొబ్బిలిలో మూడు, కాశీబుగ్గ, ఆమదాలవలసల్లో ఒక్కొక్కటి చొప్పున పాత కేసు లుండగా సప్ప హరీష్‌పై బొబ్బి లిలో మూడున్నాయి. ఈ ఏడాది ఎన్డీపీఎస్ (గంజాయి) కేసులో అంపోలులో జైలుశిక్ష అనుభవిస్తున్న కారుణ్య జగదీష్‌పై బొబ్బిలిలో మూడు, ఆమదాలవలసల్లో నాలుగు కేసులుండటం విశేషం. -
సాయి డెంటల్ కళాశాల విద్యార్థుల ప్రతిభ
శ్రీకాకుళం రూరల్: ఎన్టీఆర్ వైద్యవిశ్వవిద్యాలయం 2023–24 బ్యాచ్‌కు సంబంధించి నిర్వహించిన దంత వైద్య పరీక్షల్లో శ్రీకాకుళం పరిధిలోని పాత్రునివలస వద్ద ఉన్న సాయిడెంటల్ కళాశాల విద్యార్థులు 92 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు కళాశాల యాజమాన్యం డీఎన్‌రెడ్డి, డాక్టర్ టి.బి.వి.జి.రాజు, ప్రిన్సిపాల్ డాక్టర్ కృష్ణప్రసాద్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం విద్యార్థులను అభినందించారు. ఇందులో 11 మంది విద్యార్థులు డిస్టింక్షన్లో పాసైనట్లు తెలిపారు. విద్యార్థుల పట్టుదల, అధ్యాపకుల బోధన, ల్యాబ్‌లు, వైద్య సదుపాయాలు బాగా ఉండటంతో ఈ ఫలితాలు సాధించగలిగామని చెప్పారు. భవిష్యత్తులో నూటికి నూరుశాతం ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తామన్నారు.