Editorial
-
బుల్డోజర్ సంస్కృతికి కళ్లెం!
గత కొన్నేళ్లుగా బుల్డోజర్లతో చెలరేగుతున్న రాష్ట్ర ప్రభుత్వాలకు సర్వోన్నత న్యాయస్థానం చీవాట్లు పెట్టడం ఆçహ్వానించదగ్గ పరిణామం. ఈ చీడను వదల్చడానికి ఏం చేయాలో ప్రతిపాదనలివ్వాలంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించటంతోపాటు వాటి ఆధారంగా దేశవ్యాప్తంగా అమల య్యేలా ప్రామాణిక మార్గదర్శకాలను రూపొందిస్తామని కూడా తెలిపింది. ఎక్కడైనా అడ్డదారులు పనికిరావు. పైగా చట్టబద్ధ పాలనకు ఆ ధోరణులు చేటు తెస్తాయి. కంచే చేను మేసినట్టు పాలకులే తోడేళ్లయితే ఇక సాధారణ పౌరులకు రక్షణ ఎక్కడుంటుంది? దేశంలో ఈ విష సంస్కృతికి బీజం వేసినవారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. ఆయన్ను చూసి మొదట మధ్యప్రదేశ్ ప్రభుత్వం, ఆనక రాజస్థాన్‌లోని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం, మహారాష్ట్రలో ఆనాటి శివసేన–కాంగ్రెస్–ఎన్సీపీల కూటమి ప్రభుత్వం ఇష్టానుసారం చెలరేగి అనుమానితులుగా నిందితులుగా ఉన్నవారి ఇళ్లు, దుకాణాలు నేలమట్టం చేశాయి. హైదరాబాద్‌లో నీటి వనరులకు సమీపంలో, డ్రెయినేజిలకు అడ్డంగా ఉన్న నిర్మాణాలను కూల్చేయటానికి ‘హైడ్రా’ ఏర్పాటైంది. తెలంగాణలోని ఒకటి రెండు జిల్లాల్లో కూడా అధికారులు కూల్చివేతలు సాగించారు.తమకు కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా కూల్చేశారన్న ఫిర్యాదులొచ్చాయి. ఈవీఎం సర్కారుగా అందరితో ఛీకొట్టించు కుంటున్న ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్డీయే ప్రభుత్వం అధికారం వచ్చిరాగానే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలను కూల్చేయాలని చూసింది. హత్యలు, హత్యాయత్నాలు సరేసరి. తమకు ఓటేయ లేదన్న కక్షతో పేదజనం ఇళ్లపై బుల్డోజర్లు నడిపింది. ఈ దుశ్చర్యలో ఒక మాజీ సైనికుడి ఇల్లు సైతం నేలకూలింది. ఏ చట్ట నిబంధనల ప్రకారం ప్రభుత్వాలు ఈ హేయమైన పనులకు పాల్పడు తున్నాయి? హత్యలతోనూ, బుల్డోజర్లతోనూ ప్రజానీకంలో భయోత్పాతం సృష్టించి ఎల్లకాలమూ అధికారంలో కొనసాగవచ్చని పాలకులు భావిస్తున్నట్టు కనబడుతోంది.దీన్ని సాగనీయకూడదు. బుల్డోజర్ మార్క్ అకృత్యాలపై సుప్రీంకోర్టు ధర్మాసనం ఎంత ఆగ్రహం వ్యక్తం చేసిందంటే... ‘నిందితులు, అనుమానితులని ముద్రపడిన వారి విషయంలో మాత్రమే కాదు. ఆఖరికి నేరస్తులుగా నిర్ధారణ అయి శిక్షపడినవారి విషయంలో సైతం చట్ట నిబంధనల ప్రకారమే వ్యవహరించి తీరాలి’ అని నిర్దేశించింది. చట్టబద్ధ పాలన ఎంతటి గురుతర బాధ్యతో చెప్పడానికి ఇది చాలదా? గోవధ కేసులో నిందితుడనో, అనుమానితుడనో భావించిన వ్యక్తిపై కక్ష తీర్చుకోవటానికి ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ వంటిచోట్ల ఇళ్లు, దుకాణాలూ నేలమట్టం చేసిన సందర్భాలు అనేకానేకం. ఈ పని చేశాక ఆ ఇల్లు లేదా దుకాణం నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిందనో, అక్రమంగా ఆక్రమించుకుని కట్టారనో, ఎప్పుడో నోటీసులు జారీచేశామనో అధికారులు సాకులు చెబుతున్నారు. అధికారుల్లో కొందరు ప్రబుద్ధులు ఏదో ఘనకార్యం చేశామన్నట్టు విందులు కూడా చేసుకుంటు న్నారు. బాధితులు అవతలి మతస్తులైనప్పుడు కొందరు బాగా అయిందనుకుంటున్నారు. ఇది ప్రమాదకరమైన పోకడ. సమాజంలో ప్రతీకారేచ్ఛను పెంచి పోషించే దుశ్చర్య. ఇప్పుడున్న నాగరిక సమాజం ఎన్నో దశలను దాటుకుని, అందరికీ ఆమోదయోగ్యమైన ఒక వ్యవస్థను ఏర్పర్చుకుంది.తప్పుడు వాగ్దానాలతోనో, కండబలంతోనో, ఈవీఎంలను ఏమార్చటం ద్వారానో అధికారాన్ని కైవసం చేసుకుని కేవలం అయిదేళ్లపాటు అధికారంలో ఉండటానికి వచ్చిన రాజకీయపక్షాలు ఎన్నో అగడ్తలను దాటుకుని వచ్చిన ఒక ప్రజాస్వామిక అమరికను ధ్వంసం చేయటాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సాగనీయ కూడదు. నిజానికి ఈ విషయంలో ఎంతో ఆలస్యం జరిగింది. ఎవరో న్యాయస్థానానికి ఫిర్యాదు చేయాలని, పిటిషన్ దాఖలయ్యాక నోటీసులు జారీచేసి చర్యలకు ఉపక్రమించవచ్చని అనుకోవటంవల్ల ఇలాంటి దుశ్చర్యలూ, వాటి దుష్పరిణామాలు సాగి పోతున్నాయి. ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పోతున్నాయి. న్యాయస్థానాలు మీడియా కథనాలనే పిటిషన్లుగా స్వీకరించి ప్రభుత్వాలను దారికి తెచ్చినసందర్భాలున్నాయి. ఆ క్రియాశీలత మళ్లీ అమల్లోకి రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటేఅందరూ న్యాయస్థానాలను ఆశ్రయించలేరు. వారికి ఆ స్థోమత ఉండకపోవచ్చు. కనుకనే న్యాయస్థానాలు తమంత తాము పట్టించుకోక తప్పదు. ప్రామాణికమైన మార్గదర్శకాలురూపొందించాలన్న సుప్రీంకోర్టు ధర్మాసనం నిర్ణయం హర్షించదగ్గదే. కానీ చర్మం మందం ప్రభుత్వాలు వీటికి తలొగ్గుతాయా? ఆమధ్య ఢిల్లీ హైకోర్టు అక్కడి అధికారులకు చేసిన సూచనలు ఈ సందర్భంగా గమనించదగ్గవి.వేకువజామునగానీ, సాయంసంధ్యా సమయం ముగిశాకగానీ ఎట్టి పరిస్థితుల్లోనూ బుల్డోజర్లు ప్రయోగించరాదని తెలిపింది. ముందుగా తగిన నోటీసులిచ్చి ప్రత్యామ్నాయ ఆవాసం చూపించేవరకూ అసలు కూల్చివేతలుండకూడదని చెప్పింది. కానీ ఆ తర్వాత కూడా అధికారులు దారికొచ్చిన దాఖలాలు లేవు. అందువల్లే మార్గదర్శకాలు రూపొందించేటపుడు కేవలం ఎలాంటి నిబంధనలు పాటించాలో చెప్పడం మాత్రమేకాక అసలు కూల గొట్టాల్సినంత ఆవశ్యకత ఎందుకేర్పడిందో నమోదుచేసే ఏర్పాటుండాలి. అధికారులకు జవాబు దారీతనాన్ని నిర్ణయించాలి. ప్రక్రియ సరిగా పాటించని సందర్భాల్లో కోర్టు ధిక్కార నేరంకింద కఠిన చర్యలుంటాయని చెప్పాలి. రాజకీయ కక్షతో, దురుద్దేశాలతో విధ్వంసానికి పూనుకున్న ఉదంతాల్లో వెంటవెంటనే చర్యలుండేలా చూడాలి. అన్నిటికన్నా ముఖ్యం– సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చే తీర్పులు, సూచనల స్ఫూర్తి కింది కోర్టులకు సైతం అందాలి. అలా అయినప్పుడే చట్టబద్ధ పాలనకు మార్గం ఏర్పడుతుంది. -
ఏది ధర్మం? దేనికి రక్షణ?
చట్టం విరుద్ధం కానంత వరకు ఎవరేమి చేయాలో, ఎవరేం తినాలో చెప్పడానికి వేరొకరికి ఏమి హక్కు ఉంటుంది? కొద్దిరోజుల వ్యవధిలో హర్యానాలో వరసగా జరిగిన రెండు విచక్షణా రహిత హత్యలు ఆ మౌలిక ప్రశ్ననే మరోమారు ముందుకు తెచ్చాయి. ధర్మం పేరిట విద్వేషాన్ని నింపుకొని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకొంటున్న స్వయం ప్రకటిత గోరక్షకులతో దేశానికున్న ముప్పును గుర్తుచేశాయి. పన్నెండో తరగతి చదువుతున్న 19 ఏళ్ళ టీనేజ్ కుర్రాడు ఆర్యన్ మిశ్రా హర్యానాలోని ఆగస్ట్ 24న మిత్రులతో కలసి కారులో వస్తుండగా, గోమాంసం రవాణా చేస్తున్నాడనే అనుమానంతో సాయుధ మూకలు 50 కిలోమీటర్ల దూరం ఛేజ్ చేసి మరీ, ఫరీదాబాద్ వద్ద అతణ్ణి కాల్చి చంపిన ఘటన అమానుషం. అలాగే, గొడ్డుమాంసం తింటున్నాడనే అనుమానంతో ఆగస్ట్ 27న చర్ఖీ దాద్రీ వద్ద 26 ఏళ్ళ వలస కార్మికుడు సబీర్ మాలిక్‌ను కొందరు సోకాల్డ్ ధర్మపరిరక్షకులు కొట్టి చంపిన తీరు నిర్ఘాంతపరుస్తోంది. సాక్షాత్తూ హర్యానా సీఎం సైతం ‘సెంటిమెంట్లు దెబ్బతింటే, ఎవరినైనా ఎలా ఆపగల’మంటూ బాధ్యతారహితంగా వ్యాఖ్యానించడం దీనికి పరాకాష్ఠ. ఇలాంటి పాలక వర్గాల భావజాలం కారణంగానే దాదాపు దశాబ్ద కాలంగా దేశంలో గోరక్షణ పేరిట హింస సాధారణమైపోయింది. సోమవారం మహారాష్ట్రలో ఓ రైలులో పశుమాంసం తీసుకెళు తున్న ఓ వృద్ధుడిపై మూకదాడి అందుకు మచ్చుతునక. అయితే, తాజా దాడులు మైనారిటీలపై హింస పెచ్చరిల్లుతున్న వైనాన్ని పట్టిచూపడమే కాక, ఈ మతపరమైన అసహనంపై విస్తృత చర్చను లేవనెత్తాయి. ఫరీదాబాద్ ఘటనలో చనిపోయింది అమాయక హిందువంటూ రచ్చ చేస్తున్న వాళ్ళు ఆ పోయిన ప్రాణాలు ముస్లిమ్వైనా ఇలాగే స్పందిస్తారా అన్నది ధర్మసందేహం. అప్పుడే ఇలా స్పందించి ఉంటే, దేశంలో అసలు గోరక్షణ పేరిట పరిస్థితులు ఇంత దూరం వచ్చేవి కావేమో! ప్రధాని మోదీ సైతం పశువుల వ్యాపారులపై, పశు మాంసం తినేవారిపై దాడులను గతంలో ఖండించక పోలేదు. కానీ, నోరొకటి మాట్లాడుతుంటే నొసలొకటి చెబుతున్నట్టుగా... అధికార బీజేపీ ఊదరగొ డుతున్న హిందూ జాతీయవాదం గోరక్షణ పేరిట దాడుల్ని పెంచిపోషించిందన్నది నిష్ఠురసత్యం. ఆర్యన్ ఘటనపై నిరసనలు వెల్లువెత్తే సరికి, ప్రభుత్వం సైతం దిద్దుబాటు చర్యలకు దిగకతప్పలేదు. ఛాందసవాద గోరక్షకుల జాబితా సిద్ధం చేస్తున్నట్టు పోలీసులు గురువారం ప్రకటించారు. గతంలోకి వెళితే, 2012– 2018 మధ్య కాలంలో గోరక్షణ పేరిట దేశవ్యాప్తంగా 120 దాకా హింసాత్మక ఘటనలు నమోదయ్యాయి. ఆ హింసలో 45 మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పుడు కూడా అత్యధిక ఘటనలు ఉత్తర ప్రదేశ్‌లోనే జరగడం గమనార్హం. గడచిన ఏడెనిమిదేళ్ళుగా ఉత్తర ప్రదేశ్‌లోనే కాక హర్యానా, బిహార్, రాజస్థాన్, జార్ఖండ్ తదితర అనేక ఉత్తరాది రాష్ట్రాల్లో గోసంర క్షకుల పేరిట హింస పెచ్చరిల్లుతూ వస్తోంది. ఈ ‘గోరక్షక ముఠాల’ దాడులు భారత రాజ్యాంగ మౌలిక సూత్రాలనే దెబ్బతీస్తున్నాయి. నిజానికి, 19వ శతాబ్దం ద్వితీయార్ధం నుంచే మన దేశంలో గోహత్యపై చర్చ, అడపాదడపా హింస సాగుతూనే వచ్చాయి. ‘హిందువేతరులపై హిందూ ధర్మాన్ని రుద్ద కూడద’ని దేశ విభజన సందర్భంగా సాక్షాత్తూ గాంధీ సైతం నొక్కిచెప్పాల్సి వచ్చింది. భారతదేశం లౌకికవాద గణతంత్ర రాజ్యమనే స్ఫూర్తిని నిలబెట్టడం కోసం రాజ్యాంగ ముసాయిదా రూపకల్పన సంఘం సైతం గోరక్షణను తమ డ్రాఫ్టులో చేర్చలేదు. గోరక్షణను ప్రాథ మిక హక్కుగా చేర్చాలన్న వాదనను తోసిపుచ్చి, దాన్ని ఆదేశిక సూత్రాల్లోనే చేర్చారని చరిత్ర. భారత ప్రజాస్వామ్య సౌధాన్ని నిర్మించిన మన పెద్దలు వివేకంతో వ్యవహరించి, మెజారిటీ ప్రజల ఒత్తిడికి తలొగ్గలేదు. భావోద్వేగభరిత ధార్మిక అంశాల కన్నా దేశంలోని లౌకికవాద చట్టాన్ని సమున్నతమని చేతలతో చాటారు. హిందూ ధర్మంలో గోవును పవిత్రమైనదిగా పూజిస్తాం. తప్పు లేదు. మరి, అదే ధర్మం మనిషిలో దేవుణ్ణి చూడమన్న మాటను గౌరవించవద్దా? దాదాపు 24 రాష్ట్రాల్లో గోవుల అక్రమ అమ్మకం, వధను నిషేధిస్తూ రకరకాల నియంత్రణలున్నాయి. కానీ, వీటిని అడ్డం పెట్టుకొని కొన్ని అతివాద బృందాలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని, హత్యలకు పాల్పడడం, మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టి, విద్వేషాలు పెంచడం సహిద్దామా? భరిద్దామా? ఈ రకమైన హిందూ జాతీయవాదంతో దేశం ఎటు పోతుంది? దేశంలోని 20 కోట్ల పైగా ముస్లిమ్‌లను వేరుగా చూస్తూ, ఈ సమాజంలో తాము మరింత మైనారిటీలుగా మిగిలిపోయామనే భావన కల్పించడం సామాజిక సమైక్యతను దెబ్బతీయదా? అది పొరుగున పొంచిన శత్రువులకు ఊతం కాదా?సంఘమంటేనే విభిన్న వర్గాలు, భావాలు, సంస్కృతులు, అలవాట్ల సమ్మేళనమనే ప్రాథమిక అంశాన్ని అందరూ గుర్తెరిగేలా చేయాలి. వైమనస్యాలు పెంచి సామరస్యాన్ని దెబ్బతీస్తే మొదటికే మోసం. అందులోనూ మూగజీవాల్ని అడ్డం పెట్టుకొని ప్రదర్శిస్తున్న మతోన్మాదం రాజకీయ ప్రేరేపి తమైనది కావడం పెను ప్రమాదఘంటిక. రాజ్యాంగ నైతికతకే విఘాతం కలిగిస్తున్న ఈ చర్యలతో చివరకు సత్ పౌరులనూ, అమాయకులనూ హింసించడం మరింత విషాదం. సుప్రీమ్ కోర్ట్ సైతం ఈ రకమైన హింసను సహించరాదని పదే పదే ఆదేశించినా, పాలకవర్గ రాజకీయాలకు ఆశ్రితులైన దోషులు తప్పించుకుంటూనే ఉన్నారు. స్థానిక నేతలుగా ఎదిగి, చట్టసభల్లో స్థానం సంపాదించు కొని, ప్రజాస్వామ్య విలువల్ని పరిహాసప్రాయం చేస్తున్నారు. పశువుల్ని కాపాడే మిషతో మనిషే మృగంగా మారుతున్న ఈ ధోరణికి ఇకనైనా పాలకులు అడ్డుకట్ట వేయాలి. తాత్కాలిక రాజకీయ ప్రయోజనాలకై దీన్ని ఇలాగే వదిలిస్తే ఆఖరికి ఆవుల రక్షణ పేరిట ఆటవిక రాజ్యం నెలకొంటుంది. -
చట్టాలు చేస్తే చాలా?
దేశాన్ని కదిలించిన ‘అభయ’ ఉదంతం దెబ్బతో బెంగాల్ కొత్త కఠిన చట్టంతో ముందుకొచ్చింది. అత్యాచార దోషులకు ఏకంగా మరణశిక్ష వేయాలంటూ మమతా బెనర్జీ సర్కార్ అత్యాచార నిరోధక బిల్లు ‘అపరాజిత’ను తీసుకొచ్చింది. కోల్‌కతాలో రాష్ట్ర ప్రభుత్వ సారథ్యంలోని ఆర్జీ కర్ ఆస్పత్రిలో ట్రైనీ మహిళా డాక్టర్ ఒకరిని గత నెలలో దారుణంగా రేప్ చేసి, చంపేసిన ఘటనతో రెండు రోజులు ప్రత్యేకంగా సమావేశమైన బెంగాల్ అసెంబ్లీ మంగళవారం ఏకగ్రీవంగా ఈ బిల్లును ఆమోదించింది. దర్యాప్తును వేగవంతం చేసి, బాధితులకు సత్వరమే న్యాయాన్ని అందించి, దోషులకు కఠిన శిక్షలు విధించడానికే ఈ కొత్త బిల్లు తెచ్చామని సర్కార్ చెబుతోంది. బాధిత మహిళల బిల్లు గనక ప్రతిపక్షాలన్నీ కాదనే ధైర్యం చేయలేక తలూపుతూనే, మమత రాజీనామా డిమాండ్‌ను విడవకుండా వినిపిస్తున్నాయి. రాష్ట్రపతి ఆమోదం పొందితే కానీ బిల్లు చట్టం కాదు గనక, బాధ్యత కేంద్రం మీదకు నెట్టేసి రాజకీయంగా మార్కులు సంపాదించే పనిలో మమత ముందడుగు వేస్తున్నారు. అత్యాచారాలు, లైంగిక నేరాల నుంచి మహిళలు, పిల్లలకు మరింత రక్షణ కల్పించే విధంగా చేపట్టిన ‘అపరాజిత మహిళా, శిశు రక్షణ బిల్లు–2024’లో మమత సర్కార్ పలు కొత్త అంశాలను పొందుపరిచింది. 21 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసేందుకు వీలుగా అపరాజిత టాస్క్‌ఫోర్స్ పేరిట ప్రత్యేక పోలీసు బలగాన్ని ఏర్పాటు చేస్తుందీ బిల్లు. కేంద్రం ఇటీవల తెచ్చిన కొత్త న్యాయచట్టాలు భారతీయ న్యాయసంహిత (బీఎన్ఎస్), భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్ఎస్ఎస్), అలాగే పోక్సో చట్టంలోని అంశాలను మించినవి కొన్ని ‘అపరాజిత’లో ఉన్నాయి. పోక్సో కింద 3 నుంచి 5 ఏళ్ళ జైలుశిక్ష, జరిమానా విధించేందుకే వీలుండగా, ఈ సరికొత్త బెంగాల్ అత్యాచార నిరోధక బిల్లు కింద 7 నుంచి పదేళ్ళ శిక్ష తప్పదు. పోక్సో కింద బాధిత చిన్నారి సాక్ష్యాన్ని 30 రోజులలోగా రికార్డ్ చేసి, ఏడాది లోగా విచారణ పూర్తి చేయవచ్చు. అపరాజిత మాత్రం వారం రోజుల్లోనే సాక్ష్యం రికార్డు చేయడం, నెల రోజుల్లో ప్రత్యేక కోర్ట్ విచారణ పూర్తి తప్పనిసరి చేసింది. బాధిత కుటుంబాలకు సత్వర న్యాయం అందించేందుకు ఈ బిల్లు ఉపయుక్తమే. అలాగే, అత్యాచార దోషులకు పెరోల్ సైతం లేని యావజ్జీవ కారాగారవాస శిక్ష తప్పదు. రేప్, లేదా గ్యాంగ్‌రేప్ ద్వారా బాధితుల మరణానికో, జీవచ్ఛవంగా మారడానికో కారణమైన దోషులకు ఉరిశిక్ష విధింపు కూడా కోపోద్రిక్త ప్రజానీకానికి కొంత ఊరట. అలా బీఎన్ఎస్, బీఎన్ఎస్ఎస్లకు మించి కఠినంగా ఈ కొత్త బిల్లును తీర్చిదిద్దడం నేరగాళ్ళకు సింహస్వప్నమే. అందుకే, అపరాజిత బిల్లును కనీవినీ ఎరుగని ప్రయత్నంగా పేర్కొంటూ, ‘‘దేశానికి మార్గదర్శి బెంగాల్’’ అనే హ్యాష్‌ట్యాగ్ ఇప్పుడు సోషల్ మీడియా వేదికల్లో ట్రెండ్ అవుతోంది. మహిళలపై నేరాలను ఏ మాత్రం సహించని వ్యక్తిగా, నాయకురాలిగా దీదీని చూపించే ప్రయత్నమూ జరుగుతోంది. కానీ, అదే సమయంలో దిగజారు తున్న ప్రతిష్ఠను నిలబెట్టుకొనేందుకే ఆమె ఈ బిల్లు తెచ్చారనే విమర్శలూ వినిపిస్తున్నాయి. అభిప్రా యాలు, అనివార్యతలు ఏమైనా... స్త్రీలు, పిల్లల రక్షణకంటూ చేసే ఏ సర్కారీ కొత్త ప్రయత్నాన్ని తీసిపారేయాల్సిన పని లేదు. ప్రతి చర్యనూ స్వాగతించాల్సిందే. నిజానికి, మహిళల రక్షణ నిమిత్తం 2019లోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చరిత్రాత్మకమైన ‘దిశ’ చట్టాన్ని తీసుకొచ్చింది. 2020లో మహారాష్ట్ర సైతం అత్యాచార బాధిత స్త్రీల పక్షాన నిలుస్తూ, దోషులకు కఠినశిక్షలతో ‘శక్తి’ బిల్లు పాస్ చేసింది. శాంతిభద్రతలే కాదు... సాధారణ ప్రజాపరిరక్షణ రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతే గనక స్థానికంగా ఇలాంటి కట్టుదిట్టమైన శాసన నిర్మాణాన్ని తప్పు పట్టలేం. కానీ, ఈ చట్టాలన్నీ గవర్నర్ వద్దో, లేదంటే ఆపైన రాష్ట్రపతి వద్దో ఆఖరి ఆమోదముద్ర కోసం నేటికీ ఎదురుచూస్తూనే ఉండడం విషాదం. తాజా అపరాజితకూ ఆ గతి తప్పకపోవచ్చు. రాష్ట్రస్థాయిలో చేస్తున్న ఈ తరహా చట్టాలకు ఆమోదం తెలపడానికి ఢిల్లీ గద్దె మీది పెద్దలకు అభ్యంతరం ఎందుకో అర్థం కాదు. మహిళా పరిరక్షకులమనే ఘనత తమకే దక్కాలన్న రాజకీయాలే తప్ప, ఇతరేతర కారణాలూ కనబడడం లేదు. దేశానికి అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిన మహిళా రెజ్లర్లు సైతం తమపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయంటూ వీధికెక్కి పోరాడినా, చీమ కుట్టినట్టయినా లేని పాలకుల నుంచి ఇంకేం ఆశించగలం? ఆ మాటకొస్తే స్త్రీలకు అండగా తామున్నామని ఢిల్లీ పెద్దలు ఆచరణలో నమ్మకం కలిగించలేకపోవడం కూడా రాష్ట్రాల్లో కొత్త చట్టాలకు కారణమని విస్మరించలేం. కఠిన చట్టాలు చేయడం మంచిదే కానీ, కేవలం చట్టాల రూపకల్పనతో లక్ష్యం నెరవేరుతుందా అన్నది బేతాళప్రశ్న. కొన్ని లోటుపాట్లున్నా పాత చట్టాల మొదలు పుష్కరకాలం క్రితపు ‘నిర్భయ’ చట్టం దాకా మన దగ్గర చట్టాలకు కొదవ లేదు. అమలులో చిత్తశుద్ధి లోపమే సమస్య. అపరిచితు లొచ్చి అత్యాచారం జరిపేలా అభద్ర వాతావరణం, అసమర్థ గస్తీ, అధ్వాన్న దర్యాప్తు నెలకొన్నాయంటే ఆ తప్పు పాలకులదేగా! అదే సమయంలో సామాజికంగా, సాంస్కృతికంగా మనుషుల మానసిక కాలుష్యానికి కారణమై, నేరాలకు ప్రేరేపిస్తున్న అంశాలను అరికట్టేందుకు నిజాయతీగా మనందరం చేస్తున్నదేమిటో ఆలోచించుకోవాలి. ఆత్మపరిశీలనా చేసుకోవాలి. ప్రతిపక్ష పాలిత కోల్ కతాలో ‘అభయ’ జరిగిందని బీజేపీ, అధికార బీజేపీ పాలిత హాథ్రస్, ఉన్నావ్‌లలో జరిగిందేమిటని విపక్షాలు పరస్పర దూషణలు చేసుకోవడం వల్ల ప్రజలకు ఒరిగేదేమీ లేదు. రాజకీయంగా పైచేయికై పోరాడే కన్నా సురక్షితమైన పాఠశాలలు, పనిప్రదేశాలు, సత్వరం స్పందించే రక్షక వ్యవస్థ లాంటి ప్రాథమిక అంశాలపై దృష్టి పెడితే అందరికీ మంచిది. అది లేకపోవడమే అసలు సమస్య. -
మళ్ళీ మంటలు
మూడు నెలలుగా కాస్తంత ప్రశాంతత నెలకొన్నట్టుందనుకొనే లోగా కథ మళ్ళీ మొదటి కొచ్చింది. మణిపుర్లో శాంతి మూణ్ణాళ్ళ ముచ్చటే అయింది. కల్లోలిత ఈశాన్య రాష్ట్రంలో మెయితీల ప్రాబల్య మున్న కొన్ని ప్రాంతాల్లో ఆది, సోమవారాల్లో మునుపెన్నడూ లేని డ్రోన్ దాడులతో దేశం ఉలిక్కి పడింది. ఇప్పటి దాకా భావిస్తున్నట్టు ఇది కేవలం రెండు వర్గాల మధ్య జాతి, మతఘర్షణలే అనుకోవడానికి వీల్లేదని తేలిపోయింది. ముందుగా వేసుకున్న ఒక పథకం ప్రకారం, వ్యవస్థీకృతంగా సాగిస్తున్న యుద్ధనేరాల స్థాయికి దాడులు చేరిపోయాయి. మణిపుర్లో ఘర్షణలు తగ్గిపోయాయంటూ ప్రధాని మోదీ చెప్పిన మాటల్లో పస లేదని క్షేత్రస్థాయి సంఘటనలతో స్పష్టమైంది. పైగా భారత భూభాగం లోపలే, సాక్షాత్తూ దేశ పౌరులపైనే ఇలా సైనిక వ్యూహంతో డ్రోన్ దాడులు మొత్తం ఈ ప్రాంతాన్నే భయంలోకి నెట్టి, అస్థిరపరచే కుట్రగా కనిపిస్తోంది. మయన్మార్‌లో జుంటాపై ప్రజాస్వామ్య అనుకూల వేర్పాటువాదులు సాగించే ఈ యుద్ధతంత్రం ఇక్కడ దర్శన మివ్వడం సరిహద్దుల ఆవల ప్రమేయాన్ని చూపుతోంది. ఇది ఆందోళనకరమైన పరిణామం. అత్యాధునిక సాంకేతిక జ్ఞానంతో కూడిన డ్రోన్ల ద్వారా తీవ్రవాదులు రాకెట్ చోదిత గ్రెనేడ్లను ప్రయోగించడంతో ఆదివారం పలువురు గాయపడ్డారు. సోమవారం సైతం మరో గ్రామంపై ఇదే పద్ధతిలో డ్రోన్ దాడులు జరిగాయి. మణిపుర్లో హింస కొంతకాలం నుంచి ఉన్నదే అయినా, ఇలా పౌరులపై డ్రోన్లతో బాంబులు జారవిడవడం ఇదే తొలిసారి. అదీ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్‌సింగ్‌కు వ్యతిరేకంగా గిరిజనుల ఆధిక్యం ఉన్న కొన్ని జిల్లాల్లో కుకీ – జో వర్గాలు నిరసన ప్రదర్శనలు జరి పిన మర్నాడే ఈ ఘటనలు జరగడం గమనార్హం. యుద్ధాల్లో వాడే ఇలాంటి వ్యూహాలను ఇలా అనూహ్యంగా అందరిపై ప్రయోగించి, ఉద్రిక్తతల్ని పెంచినది కుకీలే అన్నది పోలీసుల ఆరోపణ. అదెలా ఉన్నా, ఇది మన నిఘా సంస్థల వైఫల్యానికీ, తీవ్రవాదుల కట్టడిలో మన భద్రతాదళాల వైఫల్యానికీ మచ్చుతునక. పరిస్థితి తీవ్రతను గుర్తించిన ప్రభుత్వం మణిపుర్లో జరిగిన డ్రోన్ దాడులను నిశితంగా అధ్యయనం చేసేందుకు ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. తీవ్ర వాదులు ఎలాంటి డ్రోన్లను వాడారన్నది మొదలు పలు అంశాలను ఈ కమిటీ నిశితంగా పరిశీలించనుంది. భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకుండా నివారించేందుకు ఎలాంటి చర్యలు చేపట్టా లన్న దానిపై నివేదిక సమర్పించనుంది. అయితే గతేడాది మేలో మొదలైన హింసాకాండ చివరకు ఈ స్థాయికి చేరిందంటే, ఇప్పటికీ చల్లారలేదంటే తప్పు ఎక్కడున్నట్టు? ఉద్రిక్తతల్ని చల్లార్చి, విభేదాలు సమసిపోయేలా చూడడంలో స్థానిక పాలనా యంత్రాంగం ఇన్ని నెలలుగా విఫలమైందన్న మాట. కొండ ప్రాంతాలకూ, లోయ ప్రాంతాలకూ మధ్య బఫర్ జోన్లు పెట్టి, భద్రతాదళాల మోహరింపుతో శాశ్వతంగా శాంతి భద్రతల్ని కాపాడగలమని పాలకులు భావిస్తే పిచ్చితనం.అసమర్థ పాలనతో పాటు అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి బీరేన్‌సింగ్ మాత్రం కుర్చీ పట్టుకొని వేలాడుతూ, ఆ మధ్య కూడా గొప్పలు చెప్పారు. తాము నియమించిన శాంతిదూతలు గణనీయమైన పురోగతి సాధించారనీ, ఆరు నెలల్లో శాంతి తిరిగి నెలకొంటుందనీ ఊదరగొట్టారు. ఆ మాటలన్నీ నీటిమూటలేనని తాజా ఘటనలు ఋజువు చేశాయి. పైపెచ్చు, తాజాగా ఆధునిక సాంకేతికత సాయంతో, అత్యాధునిక ఆయుధాలతో సాగుతున్న దాడులను బట్టి చూస్తే, కొన్ని వర్గాలకు దేశం వెలుపల నుంచి అన్ని రకాల వనరులు అందుతున్నట్టు అనుమానం బలపడుతోంది. దేశ సమగ్రత, సార్వభౌమత్వానికే ముప్పుగా పరిణమించే ఇలాంటి పరిస్థితుల్లో పాలకులు కుంభకర్ణ నిద్ర పోతే పెను ప్రమాదం. శతాబ్దాలుగా అనేక సంక్షోభాలను ఎదుర్కొని, తమ మట్టినీ, మనుగడనూ కాపాడుకొన్న చరిత్ర మణిపుర్ ప్రజలది. అలాంటి ప్రాంతాన్ని పేరుకు మాత్రమే భారత్‌లో భూభాగంగా చూడక, ఆ ప్రాంత ప్రజల బాగోగులు, అక్కడి శాంతి సుస్థిరతలు తాము పట్టించుకుంటామని పాలకులు నిరూపించుకోవాల్సిన సమయమిది. 2023 నుంచి కుకీలు, మెయితీల మధ్య ఘర్షణలతో ఈశాన్య రాష్ట్రం అట్టుడుకుతోంది. ఎక్కడ ఏ వర్గం ప్రాబల్యం ఎక్కువగా ఉంటే, అక్కడ అది ఆ వర్గపు అడ్డాగా ఇప్పటికే మణిపుర్ అనేక జోన్లుగా అనధికారంగా చీలిపోయింది. ఇంటిలోని ఈ గుండెల మీద కుంపటి చాలదన్నట్టు, ఆ పక్కనే మన దేశానికి సరిహద్దులు సైతం అంతే ఉద్రిక్తంగా తయారయ్యాయి. జుంటాకూ, తిరుగు బాటుదారులకు మధ్య ఘర్షణలతో మయన్మార్ రగులుతోంది. ఇటీవలి రాజకీయ సంక్షోభంతో పొరుగున బంగ్లాదేశ్‌తో వ్యవహారం అస్తుబిస్తుగా ఉంది. ఈ గందరగోళ భూభౌగోళిక వాతావరణం మణిపుర్ వ్యవహారాన్ని మరింత సున్నితంగా మార్చేస్తోంది. అంతా బాగానే ఉందనడం మాని, ఇప్పటికైనా బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్ తాము అనుసరిస్తున్న ధోరణిని పునస్సమీక్షించుకోవాలి. మణిపుర్ మరో యుద్ధభూమిగా మిగిలిపోకూడదనుకుంటే, మన పాలకులకు కావాల్సింది రాజకీయ దృఢసంకల్పం, చిత్తశుద్ధి. దేశ అంతర్గత భద్రతకే ముప్పు వాటిల్లే ప్రమాదాన్ని గమనించి, తక్షణ నష్టనివారణ చర్యలు చేపట్టాలి. ఏ ఒక్క వర్గానికో కొమ్ము కాయడం మాని, పెద్దన్న తరహాలో అన్ని వర్గాల ప్రజల మధ్య స్నేహ సౌహార్దాలు నెలకొనేలా నిజాయతీగా కృషి చేయాలి. సంబంధిత వర్గాలన్నిటితో రాజకీయ చర్చలు సాగించాలి. ఘర్షణల్ని పెంచిపోషిస్తున్న అంతర్లీన అంశాలను గుర్తించి, వాటిని ముందుగా పరిష్కరించాలి. తాత్కాలిక సర్దుబాటు కాక శాశ్వత శాంతిస్థాపనకై చర్చించాలి. ఇప్పటికైనా పాలకులు వివేకాన్ని చూపగలిగితే, మణిపుర్‌ను మంటల్లో నుంచి బయటపడేయవచ్చు. లేదంటే దేశమంతటికీ కష్టం, నష్టం. -
మార్పు మేలు చేస్తుందా?
కొన్ని నిర్ణయాలంతే! అధికారపక్షం స్వాగతిస్తుంటుంది, ప్రతిపక్షాలు విమర్శిస్తుంటాయి. హర్యానా అసెంబ్లీ ఎన్నికల తేదీని అక్టోబర్ 1 నుంచి 5కు మారుస్తూ భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకున్న నిర్ణయం విషయంలోనూ అదే జరిగింది. సెలవుల వల్ల ఓటింగ్ తగ్గకూడదనే భావనతో సరైన నిర్ణయం తీసుకున్నారంటూ అధికారంలో ఉన్న బీజేపీ, ఉనికి కోసం పోరాడుతున్న ప్రతిపక్షం ‘ఇండియన్ నేషనల్ లోక్‌దళ్’ హర్షం వ్యక్తం చేశాయి. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ మాత్రం ఇదంతా ఓటమి భయంతో ప్రచారం గడువు పెంచుకొనేందుకు బీజేపీ ఆడిస్తున్న తేదీ మార్పు నాటకం అంటోంది. ఈ నెల 18 నుంచి అక్టోబర్ మొదటి వారంలోగా సాగే ఈ విడత అసెంబ్లీ ఎన్నికల్లో హర్యానాతో పాటు జమ్మూ కశ్మీర్‌లోనూ పోలింగ్ జరగనుంది. ఒక్కో రాష్ట్రం ఒక్కోలా దృష్టిని ఆకర్షిస్తున్నా, హర్యానాలో అధికార బీజేపీకి ఎదురుగాలి వీస్తున్న నేపథ్యంలో తేదీ మార్పు కథ ఆసక్తి రేపుతోంది. వ్యవసాయ రంగంలో సంక్షోభం, రైతుల నిరసనలు – డిమాండ్లపై ప్రభుత్వ వ్యవహారశైలి, పారిశ్రామికీకరణలో హర్యానా వెనుకబాటు, అంతకంతకూ పెరుగుతున్న నిరుద్యోగం, మహిళా రెజ్లర్ల ఆందోళన, వివాదాస్పద అగ్నిపథ్ పథకం లాంటి అనేక అంశాలు హర్యానాలో బీజేపీకి ఎదురుగాలి వీచేలా చేస్తున్నాయి. వర్గపోరుతో సతమతమవుతున్నప్పటికీ కాంగ్రెస్ కొంత ముందంజలో ఉందని కథనం. ఈ పరిస్థితుల్లో పోలింగ్ తేదీ మార్పు ప్రశ్నలు లేవనెత్తింది. అసోజ్ అమావాస్య పుణ్యతిథి ఉన్నందున ఓటింగ్ తేదీని మార్చాలని ఆలిండియా బిష్ణోయ్ మహాసభ అభ్యర్థనలు చేసిందనీ, వాటిని దృష్టిలో ఉంచుకొనే ఈ మార్పు చేపట్టామనీ ఎన్నికల సంఘం చెబుతోంది. కేంద్రంలోని అధికార బీజేపీ చెప్పినట్టు ఎన్నికల సంఘం నడుచుకుంటోందనీ, హర్యానాలో విజయంపై అనుమానాలు ఉన్నందున పోలింగ్‌కు మరింత గడువు కోసమే బీజేపీ ఈ తేదీ మార్పు చేయించిందనీ ప్రతిపక్షాల ఆరోపణ. సహజంగానే కౌంటింగ్ తేదీ మారింది. ఇప్పుడు హర్యానాతో పాటు జమ్మూ – కశ్మీర్ అసెంబ్లీ ఓట్ల లెక్కింపు అక్టోబర్ 4న కాక 8న జరగనుంది. నిజానికి, సాంస్కృతిక, ధార్మిక ఉత్సవాలకు అడ్డు రాకుండా పోలింగ్ తేదీలను మార్చడమనేది కొత్తేమీ కాదు. ఎన్నికల సంఘం గతంలోనూ ఆ పని చేసింది. గురు రవిదాస్ జయంతికి భక్తులు వారణాసికి వెళతారనే కారణంతో 2022లో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్ని వారం పాటు వాయిదా వేశారు. అదే ఏడాది మణిపుర్లో సైతం క్రైస్తవుల ఆదివారం ప్రార్థనల రీత్యా ఎన్నికల తేదీని మార్చారు. ఇక, నిరుడు 2023లో దేవుథని ఏకాదశి రోజున రాష్ట్రంలో సామూహిక వివాహాలు జరుగుతాయి గనక రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలను ఆ రోజు నుంచి మార్చారు. ఇటీవలే కాదు... పుష్కరకాలం క్రితం 2012లోనూ బారావఫాత్ (మిలాద్ ఉన్ నబీ) కారణంగా ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల తేదీని మార్చారన్నది గమనార్హం. తాజాగా హర్యానాలో తేదీ మార్పునకు మరో కారణమూ ఉందని అధికార వర్గాలంటున్నాయి. ముందుగా ప్రకటించిన పోలింగ్ తేదీ ప్రకారమైతే... సెప్టెంబర్ 30వ తేదీ ఒక్క రోజు గనక సెలవు పెడితే, ఆ రాష్ట్రంలో వరుసగా ఆరు రోజులు సెలవులు వచ్చే పరిస్థితి. దానివల్ల పలువురు సెలవు పెట్టి, ఓటింగ్‌కు దూరంగా ఊళ్ళకు వెళ్ళే ప్రమాదం ఉంది. కొత్త పోలింగ్ తేదీతో ఆ అలసత్వాన్ని తప్పించి, ఓటింగ్ శాతాన్ని పెంచవచ్చనేది అధికారుల కథనం. మరీ ఇన్ని తెలిసిన ఎన్నికల సంఘం ముందుగానే ఈ అంశాలన్నీ ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదన్నది ప్రశ్న. ఎన్నికల తేదీలను ఖరారు చేస్తున్నప్పుడే ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకొని కసరత్తు చేయాల్సిన బాధ్యత దానికి ఉంది. హర్యానాలో ఆ పని ఎందుకు చేయలేకపోయిందో ఈసీ జవాబు చెప్పాలి. అసలు రాజ్యాంగబద్ధ సంస్థ అయినప్పటికీ ఎన్నికల సంఘాన్ని తమ చేతిలో సాధనంగా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలు వాడుకుంటున్నాయన్న విమర్శ చాలా కాలంగా ఉన్నదే. ఆ ఆరోపణలు అంతకంతకూ పెరుగుతుండడమే విషాదం. పైగా, ఈ ఏడాది ప్రథమార్ధంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలు, కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల సంఘం వ్యవహారశైలి పైన, ఈవీఎంల పని తీరు పైన తీవ్రమైన ఆరోపణలు రావడం తెలిసిందే. ఇప్పటికీ వాటికి సంతృప్తికరమైన సమాధానం ఇవ్వని ఈసీ ఇప్పుడిలా వ్యవహరించడం లేనిపోని అనుమానాల్ని మరింత పెంచుతోంది. వ్యవస్థలు పారదర్శకంగా లేవని తేటతెల్లమవుతున్న పరిస్థితి ఆందోళన రేపుతోంది.ఇలాంటి పరిస్థితుల్లో నరం లేని నాలుకతో మాట్లాడే పార్టీల పాపం కూడా లేకపోలేదు. ప్రస్తుతం హర్యానా విషయంలో చెరొకవైపు నిలబడ్డ బీజేపీ, కాంగ్రెస్‌లు రెండూ... రెండేళ్ళ క్రితం ‘ఆమ్ ఆద్మీ పార్టీ’ (ఆప్) నుంచి గట్టిపోటీ ఉన్న పంజాబ్ ఎన్నికల వేళ మాత్రం ఒకే తాటి మీద నిలవడం విచిత్రం. అప్పట్లో గురు రవిదాస్ జయంతి గనక పోలింగ్ తేదీని మార్చాలంటూ రెండు పార్టీలూ కోరాయి. ఎన్నికల సంఘం ఆ కోరికను మన్నించింది. కానీ, పోలింగ్‌ను వాయిదా వేయించినంత మాత్రాన ఫలితం మారలేదు. ఆ పార్టీలకేమీ కలసి రాలేదు. ఆప్ ప్రభంజనంలో అవి కొట్టుకుపోయాయి. ఎన్నికల బరిలో పరిస్థితులు పోటాపోటీగా ఉన్న సందర్భంలో నాలుగు రోజులు అదనంగా ప్రచారానికి లభించడం కీలకమే. కానీ, ఎవరిని గద్దె దింపాలి, ఎవరిని పీఠమెక్కించాలన్న అంశంపై ప్రజలు ముందే ఓ స్పష్టమైన నిర్ణయానికి వచ్చి ఉంటారు. ఒకవేళ ఉద్దేశపూర్వకంగా పోలింగ్ తేదీని నాలుగైదు రోజులు అటో ఇటో మార్చినా ఫలితం ఉంటుందనుకోవడం పిచ్చి భ్రమ. అప్పుడు పంజాబ్‌కైనా, ఇప్పుడు హర్యానాకైనా అదే వర్తిస్తుంది. ఈ తర్కాన్ని మార్చిపోయి దింపుడు కళ్ళం ఆశతో ఉంటే ఉపయోగం లేదని గుర్తించాలి. కారణమేమైనప్పటికీ తేదీ మార్పు వల్ల ఓటింగ్ శాతమంటూ పెరిగితే ప్రజాస్వామ్యానికి మంచిదే. కానీ, అది ఏ పార్టీకి ఉపకరిస్తుందన్నదే బేతాళప్రశ్న. -
కలాపోసన
‘ఆ.. మడిసన్నాక కూసింత కలాపోసన ఉండాలయ్యా! ఉత్తికే తిని తొంగుంటే మడిసికీ గొడ్డుకీ తేడా ఏటుంటది?’– ‘ముత్యాలముగ్గు’ సినిమాలో కాంట్రాక్టరు పాత్రధారి రావు గోపాలరావు పలికిన అమృతవాక్కులివి. ముళ్లపూడి వెంకటరమణ కలం నుంచి తూటాల్లా వెలువడిన మాటలివి. తెలుగునాట అమిత జనాదరణ పొందిన పది సినిమా డైలాగుల జాబితాను ఎవరైనా రూపొందిస్తే, ఈ డైలాగుకు అందులో తప్పకుండా చోటు దక్కి తీరుతుంది. నిజమే! ఊరకే తిని తొంగున్నట్లయితే, మనిషికీ గొడ్డుకూ ఏమాత్రం తేడా ఉండదు. గొడ్డుకు లేని బుద్ధి మనిషికి ఉంది. మనిషిని ఇతర జంతుతతి నుంచి వేరు చేసేది ఆలోచనా శక్తి మాత్రమే! ఆలోచనకు పదునుపెట్టే సాధనం సృజనాత్మకత. మనిషిలోని సృజనాత్మకతకు ఫలితాలే కళలు.కొందరికి జన్మతః కళాభినివేశం ఉంటుంది. అలాంటివారు సునాయాసంగా కళలను కైవసం చేసుకోగలుగుతారు. ఇంకొందరు అభిరుచితో సాధన చేసి కళల్లో రాణిస్తారు. అభినివేశం, సాధన లేకున్నా, చాలామంది కళలను ఆస్వాదిస్తారు. కలిగిన ఆసాములు కళలను ఆదరిస్తారు. కళలు అరవై నాలుగు అని వాత్సా్యయనుడు చెప్పాడు. వీటిలో చిత్రలేఖనం, శిల్పం, సంగీతం, నృత్యం, కవిత్వం అనే అయిదు కళలూ లలితకళలుగా గుర్తింపు పొందాయి.లలితకళలు మనుషుల భావోద్వేగాల అభివ్యక్తికి అందమైన సాధనాలు. మనుషులు తమ ఆలోచనలను, ఆనంద విషాదాది భావోద్వేగాలను; తమ కాల్పనిక ఊహాజగత్తులోని విశేషాలను, తమ సృజనాత్మకతను ఇతరులతో పంచుకోవడానికి కళలను ప్రదర్శిస్తారు. పురాతన నాగరికతలు ఊపిరి పోసుకోక మునుపటి నుంచే మనుషులు కళల ద్వారా తమ ఉద్వేగాలను చాటుకోవడం మొదలుపెట్టారు. మాటలాడటం ఇంకా నేర్చుకోని ఆనాటి మానవులు బొమ్మల ద్వారా తమ ఆలోచనలను వెల్లడించేవారు. పాతరాతి యుగం మానవులు రాతిగుహల గోడల మీద చిత్రించిన చిత్రాలే ఇందుకు ఆనవాళ్లు. నాగరికతలు మొదలైన నాటి నుంచి నేటి వరకు కళలకు– ముఖ్యంగా లలితకళలకు జనాదరణ ఉంది. కళలు ఏవైనా సరే, వాటి ప్రయోజనం ఒక్కటే – ఆత్మప్రక్షాళన. ‘దైనందిన జీవితంలో మన ఆత్మలపై పేరుకున్న ధూళిని శుభ్రం చేయడమే కళ ప్రయోజనం’ అంటాడు ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారుడు పికాసో. కళలు భావోద్వేగాల ప్రసారమాధ్యమాలు మాత్రమే కాదు, ఆత్మప్రక్షాళనకు ఉపకరించే సాధనాలు కూడా! కళలు మనుషుల జీవితాలను సౌందర్యభరితం చేస్తాయి. కళలు విలువలు నేర్పుతాయి. దైనందిన జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లతో అలజడికి గురైన మనసుకు సాంత్వన నిస్తాయి. కళలు జీవితాన్ని చైతన్యవంతం చేస్తాయి. ఇంతేకాదు, కళలు సామాజిక అన్యాయాలను ఎత్తి చూపుతాయి. ఆలోచన రేకెత్తిస్తాయి. ఆత్మవిమర్శ దిశగా మనుషులను ప్రేరేపి స్తాయి. కళలు సమాజాన్ని మరింత నాగరికంగా, ఉన్నతంగా తీర్చిదిద్దుతాయి. సమాజంలోని రకరకాల సంస్కృతులకు చెందిన సమూహాల గుండెచప్పుడును వినిపిస్తాయి. కళలు సామాజిక మార్పులకు ఉత్ప్రేరకాలుగా పనిచేస్తాయి.‘కళ చాలా విశాలమైనది. మనుషుల తెలివి చాలా ఇరుకైనది’ అంటాడు ఇంగ్లిష్ కవి అలెగ్జాండర్ పోప్. ప్రపంచం తీరుతెన్నులను చూస్తుంటే, ఆయన మాట నిజమేననిపిస్తుంది. సామాజిక మార్పులకు ఉత్ప్రేరకాలుగా పనికొచ్చే లక్షణం కళలకు ఎంతో కొంత ఉన్నమాట వాస్తవమే అయినా, ప్రపంచవ్యాప్తంగా కళాకారులు అసంఖ్యాకంగా కళాసృజన కొనసాగిస్తూ వస్తున్నా, ఈ ప్రపంచం మారాల్సిన పద్ధతిలో ఇంకా మారలేదు. మనుషుల కురచ బుద్ధులు కూడా మారలేదు. బహుశా, జనాభాలోని అత్యధికులు కళలను ఒంటబట్టించుకోకపోవడమే ఇందుకు కారణం కావచ్చు. కళలకు ఆదరణలేని దేశాలు నిరంతరం అలజడులు, అశాంతితో అలమటించే పరిస్థితులను చూస్తూనే ఉన్నాయి. అఫ్గానిస్తాన్‌లోని తాలిబన్ నాయకులు సంగీత ప్రదర్శనలపై నిషేధాజ్ఞలు విధించారు. అక్కడి పరిస్థితులు మనకు తెలియనివి కావు. చిత్రకళా ప్రదర్శనలపై నానా రకాల ఆంక్షలు ఉన్న ఉత్తర కొరియా పరిస్థితులు కూడా మనకు తెలిసినవే! స్వేచ్ఛ లేనిచోట కళలకు ఊపిరాడదు. ఇక స్వేచ్ఛే ఊపిరిగా బతికే కళాకారుల పరిస్థితి ఆంక్షలున్న చోట ఎలా ఉంటుందో వేరే చెప్పనక్కర్లేదు. నియంతృత్వ దేశాల్లో మాత్రమే కాదు, ప్రజాస్వామ్య దేశాలుగా చెప్పుకుంటున్న చాలా దేశాల్లోనూ కళాకారులు పూర్తి స్వేచ్ఛను అనుభవిస్తున్న పరిస్థితులు లేవు.కళలన్నీ కళాకారుల ఆత్మావిష్కరణలే! అందుకే, ‘అన్ని కళలూ కళాకారుల ఆత్మకథలే! ముత్యం ఆల్చిప్ప ఆత్మకథ’ అంటాడు ఇటాలియన్ దర్శకుడు ఫెడెరికో ఫెలినీ. ఆంక్షలు లేనిచోట మాత్రమే కళాకారుల ఆత్మావిష్కరణకు అవకాశాలు అపరిమితంగా ఉంటాయి. కాల ప్రవాహంలో ప్రపంచంలోని మిగిలిన మార్పులతో పాటే కళలు కూడా మారుతూ వస్తున్నాయి. కళల్లో ప్రాచీన కళ, ఆధునిక కళ అనేవి కాలానికి సంబంధించిన కొండగుర్తులు మాత్రమే! కళల అస్తిత్వం నిరంతరం.స్వేచ్ఛలేని పరిస్థితుల వల్ల కొన్నిచోట్ల, ఆధునిక జీవనశైలిలోని తీరిక దొరకని పరిస్థితుల వల్ల కొన్నిచోట్ల మనుషులు కళలకు దూరమవుతున్నారు. దొరికే కొద్దిపాటి తీరిక సమయాన్ని టీవీ, స్మార్ట్‌ఫోన్ వంటివి అందించే యాంత్రిక వినోదంతో సరిపెట్టుకుంటున్నారు. ఫలితంగా మానసిక సమస్యలతో సతమతమవుతున్నారు. అయితే, కళాస్వాదన, కళా సాధనల వల్ల మనుషుల్లో మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని ఇటీవల బ్రిటిష్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. మరందుకే మడిసన్నాక కూసింత కలాపోసన ఉండాల! లేకపోతే బతుకులు గొడ్డుదేరిపోవూ! -
ఇదొక నిశ్శబ్ద విధ్వంసం!
విశాఖ నగరం సమీపంలోని భీమ్లీలో అదొక ప్రభుత్వ పాఠశాల. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ శుక్రవారం నాడు ఆ బడిని సందర్శించారు. ఓ తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులను పలకరించారు. ‘మీరు ముందుగా ఏ భాషలో మాట్లాడుకుంటారు... తెలుగులోనా, ఇంగ్లీషులోనా?’ అని అడి గారు. అక్కడున్న విద్యార్థినులు తడుముకోకుండా ‘ఇంగ్లీషు లోనే’ అని సమాధానమిచ్చారు. ఇంగ్లీష్ నేర్చుకోవడం ఆసక్తి కరంగా ఉన్నదని కూడా వారు చెప్పారు. ప్రభుత్వ బడుల్లో చదువుకుంటున్న పేద వర్గాల పిల్లల గుండెల్లో గూడు కట్టుకున్న ఆకాంక్షలకు ఈ ఘటన అద్దం పట్టింది.అంతకు ముందు రోజు గిడుగు రామమూర్తి పంతులు జయంతి సభ విజయవాడలో జరిగింది. ఆ సభలో రాష్ట్ర ముఖ్య మంత్రి, ఉప ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఆ సభలో మాట్లాడిన ముఖ్యమంత్రి తెలుగు భాషతోనే జీవితమని మరోసారి చెప్పు కొచ్చారు. జీతం కోసం ఇంగ్లీషు కూడా నేర్పిస్తామని తన ఉభయ భాషాభిమానాన్ని కూడా వెల్లడించారు. ఇక్కడ ప్రజలు అర్థం చేసుకోవలసిన ధర్మ సూక్ష్మం ఒకటున్నది. జీతం కోసం నేర్చుకునే ఇంగ్లీష్ ప్రైవేట్ స్కూళ్లకు, ‘జీవితం’ కోసం నేర్చుకునే తెలుగు ప్రభుత్వ స్కూళ్లకు ప్రత్యేకం.తొంభై శాతానికి పైగా ప్రైవేట్ స్కూళ్లలో ఇంగ్లీషు మీడి యమే ఉంటుందన్న సంగతి జగమెరిగిన సత్యమే! కనుక తెలుగు భాషను రక్షించి పోషించవలసిన బాధ్యత ప్రభుత్వ బడుల్లో చదువుకునే పిల్లలది, కష్టజీవులైన వారి తల్లిదండ్రులది. మనకు స్వతంత్రం వచ్చిన దగ్గర్నుంచీ ఈ బాధ్యతను వారు తమ భుజాల మీద మోస్తూనే వస్తున్నారు. మన తెలుగు జాతి లోని సంపన్న శ్రేణివారు, ఉన్నతోద్యోగులు, క్రీమీ లేయర్‌లోని ఓ పదిమంది కూడిన ప్రతిచోట ఏ భాషలో మాట్లాడుకుంటారు? నిస్సందేహంగా ఇంగ్లీషులోనే! వారు ఇంగ్లీషులోనే పలక రించుకుంటారు. ఇంగ్లీషులోనే తుమ్ముతారు, ఇంగ్లీషులోనే దగ్గు తారు. తెలుగు భాషా సంస్కృతులను రక్షించవలసిన అవస రాన్ని సామాన్య ప్రజలకు వారే గుర్తు చేస్తుంటారు.కొద్దిమంది పండితుల చేతుల్లోనే బందీ ఆయిన తెలుగు సాహిత్యాన్ని విముక్తం చేసి సామాన్య ప్రజలకు అర్థమయ్యే వ్యవహారిక భాషలో రచనలు జరగాలని ఉద్యమించి గెలిచిన యోధుడు గిడుగు రామమూర్తి పంతులు. ఆయన నుంచి తీసు కోవలసిన స్ఫూర్తి ఏమిటి? ఉన్నత స్థానాలను అధిరోహించే అవకాశాలను కల్పిస్తున్న ఇంగ్లీషు మీడియాన్ని సంపన్న శ్రేణికే పరిమితం చేయకుండా సమస్త ప్రజలకు అందుబాటులోకి తేవాలని చెప్పడం కాదా? అటువంటి సంకల్పమే గదా పంతులు గారికి ఇవ్వదగిన నిజమైన నివాళి!మనకు కొంతమంది స్వయం ప్రకటిత తెలుగు పెద్ద లున్నారు. వృద్ధనారీ పతివ్రతల వంటివారు. తెలుగు మీడియంలోనే చదువుకోవాలని పదేపదే గుర్తు చేస్తుంటారు. ఆ పిలుపు ప్రభుత్వ బడులకూ, బడుగు వర్గాలకే వర్తిస్తుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ వర్గాలను ఉత్తేజితం చేయడం కోసం తమ జీవితమే వారికొక సందేశమని చెబుతారు. తెలుగులోనే చదువుకోవడం వల్ల తాము దిగ్గజాలుగా ఎదిగామనీ, ‘మీరు కూడా తెలుగులోనే చదవండి, మా అంతటివారు అవుతార’ని ఊదరగొడుతుంటారు. అసలు పరభాషా మాధ్యమంలో చదువుకున్నంత మాత్రాన మాతృభాష అంతరించిపోతుందనే వాదనే నిర్హేతుకమైనది. సురవరం ప్రతాపరెడ్డి, దాశరథి సోదరులు, పీవీ నరసింహారావు, కాళోజి నారాయణరావు, డాక్టర్ సి. నారాయణరెడ్డి, వట్టికోట ఆళ్వార్ స్వామి తదితరు లంతా ఉర్దూ మీడియంలో చదివి తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసినవారే. మన తాజా తెలుగు పెద్దలతో పోల్చితే మహాదిగ్గజాలే.ఇదొక్క ఇంగ్లీషు మీడియం గొడవ మాత్రమే కాదు. నాణ్యమైన విద్య, సరైన వసతులు, పర్యవేక్షణ, బోధనా పద్ధతులు... వగైరాలన్నింటిలోనూ ప్రభుత్వ పాఠశాలల ప్రమా ణాలు పడిపోతూ వస్తున్నాయి. గత మూడు దశాబ్దాలుగా ఈ పరిణామం వేగవంతమైంది. ఇందుకు ప్రధాన కారణం మన పాలకులు. పేద, మధ్యతరగతి పిల్లలకు ఉచితంగా నాణ్యమైన విద్యను అందించడానికి పెట్టుబడి పెట్టడం మన ‘సంస్కరణోత్తర’ రాజకీయ వేత్తలకు ఇష్టంలేదు. ఈ కేట గిరీలో ముందు వరసన నిలిచిన రాజకీయవేత్త చంద్రబాబు. విద్య, వైద్యం మాత్రమే కాదు... ప్రజలకు ఏదీ ఉచితంగా ఇవ్వకూడదనే ఫిలాసఫీ ఆయనది. ‘మనసులో మాట’ అనే పేరుతో ఆయన రచించిన పుస్తకం నిండా ఈ ఫిలాసఫీయే ఉంటుంది. ఐదేళ్లకు పూర్వం విభజిత రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన ఈ తత్వధారను వారబోస్తూనే వచ్చారు. ‘ఉచిత విద్యను అందించడం ప్రభుత్వ బాధ్యత కాదు, ప్రభుత్వ స్కూళ్లలో సదుపాయాలుండవు. డబ్బులున్న వాళ్లు ప్రయివేటు స్కూళ్లలో చదువుకోండి. అక్కడ ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. అన్నీ బాగుంటాయ’ని ఆయన ఉద్బోధించేవారు.వైఎస్ జగన్ ప్రభుత్వం విద్యా సంస్కరణలు ప్రారంభించిన తర్వాత చంద్రబాబుతో పాటు ఆయన మీడియా కూడా విమర్శల వర్షం కురిపిస్తూనే వచ్చింది. ఒకేసారి ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడితే పిల్లలకు అర్థం కాకుండా పోతుందని గగ్గోలు పెట్టారు. కానీ, బైలింగ్వల్ పాఠ్యపుస్తకాల ప్రయోగంతో ఈ సమస్యను ప్రభుత్వం అవలీలగా అధిగమించిందని విద్యా రంగ నిపుణులు పలువురు కొనియాడారు. చంద్రబాబు ప్రభుత్వం రాగానే ప్రభుత్వ స్కూళ్ల వైభవం అంతరించిపోతుందన్న అంచనా ప్రజల్లో చాలామందికి ముందే ఉన్నది. కనుకనే ఈ సంవత్సరం పెద్ద ఎత్తున ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులు టీసీలు తీసుకుని ప్రైవేట్ బడుల్లో చేరిపోయారు. పూర్తి వివరాలు రాలేదు గానీ, ఈ సంఖ్య మూడు లక్షలకు పైగానే ఉండొచ్చని అంచనా.ప్రజలు ఊహించినట్టుగానే చంద్రబాబు ప్రభుత్వం సర్కారు బళ్లపై దాడిని ప్రారంభించింది. ‘అమ్మ ఒడి’ ఇవ్వలేదు. ‘వసతి దీవెన’ లేదు, ‘విద్యా కానుక’ లేదు. ‘మధ్యాహ్న భోజనం’, ‘గోరు ముద్దలు’ గాడి తప్పాయి. ఇంగ్లీష్ ప్రమాణాలు పెంచేందుకు ఉద్దేశించిన ‘టోఫెల్’ పరీక్షను తొలగించారు. వెయ్యి స్కూళ్లల్లో అమలవుతున్న సీబీఎస్ఈ సిలబస్‌ను ఎత్తేశారు. ఉచితంగా లభించాల్సిన అంతర్జాతీయ స్థాయి ఐబీ సిలబస్‌ను అటకెక్కించారు. కార్పొరేట్ స్కూళ్లకు మేలు చేయడం కోసమే ఇటువంటి చర్యలు చేపడుతున్నారనే ఆరోపణలు బలపడుతున్నాయి. నేడో రేపో ఇంగ్లీష్ మీడియానికి కూడా వీడ్కోలు చెప్పనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే విద్యామంత్రి లోకేశ్‌కు విశాఖ బాలికలు తమ గుండెచప్పుడును వినిపించారు.పేద ప్రజానీకం బిడ్డలకు కూడా అత్యున్నత ప్రమాణాలు కలిగిన నాణ్యమైన విద్య అందాలన్న లక్ష్యంతో జగన్ ప్రభుత్వం విద్యా సమీక్షా కేంద్రాల (వీఎస్కే)ను ఏర్పాటు చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలు, విద్యార్థులు – ఉపాధ్యాయుల హాజరు, మధ్యాహ్న భోజనం నిర్వహణ, స్టూడెంట్ కిట్స్ పంపిణీ, ట్యాబులు, ఐఎఫ్‌పీల నిర్వహణ వగైరా అంశాలపై నిరంతర పర్యవేక్షణ చేయడం ఈ వీఎస్‌కేల పని. ఇప్పుడా పనులేవీ వీఎస్‌కేలు చేయవలసిన అవసరం లేదని ప్రభుత్వం ఆదేశించింది. ఈ ఒక్క ఉదాహరణ చాలు, ప్రభుత్వ విద్యా వ్యవస్థను ఈ ప్రభుత్వం ఏం చేయనున్నదో తెలుసుకోవడానికి!ప్రభుత్వ హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలల నిర్వహణ తీరుతెన్నులపై ఈ ఒక్క నెల రోజుల్లోనే డజన్‌కు పైగా విషాదకర వార్తలు వెలువడ్డాయి. నూజివీడు ట్రిపుల్ ఐటీలో చదువుతున్న విద్యార్థుల్లో 566 మంది కేవలం మూడు రోజుల్లోనే ఆస్పత్రి పాలయ్యారు. జ్వరం, కడుపునొప్పి, విరేచనాలు, వాంతులతో ఆ విద్యార్థులు తల్లడిల్లారు. విజయనగరంలోని ఓ ఆశ్రమ విద్యార్థులు 21 మంది ఆస్పత్రి పాలయ్యారు. శ్రీకాకుళం జిల్లాలో ఓ కేజీబీవీలో 20 మంది వాంతులు, విరేచనాలతో ఆస్పత్రిలో చేరారు. ప్రభుత్వ హాస్టళ్లలో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థుల ఆరోగ్యంపై ఈ ప్రభుత్వానికి ఎంత శ్రద్ధ ఉన్నదో ఈ సంఘటనలు చూస్తే అర్థమవుతుంది. మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి అధికారి వరకు సంక్షేమ హాస్టల్స్‌ను నిరంతరం తనిఖీ చేసేలా ఒక ప్రత్యేక కార్య క్రమాన్ని జగన్ ప్రభుత్వం తయారు చేసింది. ఆ కార్యక్రమాన్ని చాప చుట్టేసిన ఫలితమే ఈ నెల రోజుల్లో జరిగిన దుర్ఘటనలు. హాస్టల్స్‌లో వుండే విద్యార్థుల వసతి, వైద్య సౌకర్యాలపై జీవో నెంబర్ 46 కింద గత ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను రూపొందించింది. ఉద్దేశపూర్వకంగానే కూటమి ప్రభుత్వం ఆ మార్గదర్శకాలను విస్మరించింది. ఎందుకంటే పేద ప్రజలకు నాణ్యమైన విద్య అనేది ఈ ప్రభుత్వం ఎజెండా కాదు. ఉచితంగా ఉత్తమ విద్యను అంద జేయడం ఈ ప్రభుత్వ ఫిలాసఫీ కాదు. అది జగన్ ప్రభుత్వ ఫిలాసఫీ, జగన్ ప్రభుత్వం ఎజెండా. పేద వర్గాల ప్రజలను సాధికార శక్తులుగా మలచడానికి జగన్ ప్రభుత్వం ప్రారంభించిన నాణ్యమైన ఉచిత విద్యపై కూటమి సర్కార్ దాడిని ప్రారంభించింది. నిశ్చబ్దంగా ఒక మహా విధ్వంసానికి శ్రీకారం చుట్టింది. జగన్ ప్రభుత్వం విద్యారంగంలో నిశ్శబ్ద విప్లవాన్ని ప్రారంభిస్తే, బాబు సర్కార్ అదే రంగంలో నిశ్శబ్ద విధ్వంసాన్ని మొదలుపెట్టింది.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
అంతరిక్షంలో పైపైకి...
అంతరిక్ష రంగంలో మన శాస్త్రవేత్తలు సాధిస్తున్న విజయపరంపర వాణిజ్యపరంగా కాసుల వర్షం కురిపించటం కొత్తేం కాదు. అంతరిక్షంలో మనకన్నా చాలాముందే అనేక విజయాలు నమోదు చేసుకున్న దేశాలకు సైతం ఈ విషయంలో మన ఇస్రో సంస్థ దీటుగా నిలిచిన వైనం కూడా పాత కథే. మరోసారి దీన్ని అంతర్జాతీయ అంతరిక్ష సలహా సంస్థ నోవాస్పేస్ నివేదిక ధ్రువపరిచింది. గత పదేళ్లలో అంతరిక్ష రంగంలో భారత్ కొచ్చిన ఆదాయం 6,300 కోట్ల డాలర్లని నివేదిక తెలిపింది.అంటే మన జీడీపీ వృద్ధిలో ఇస్రో పాత్ర ఎనలేనిదన్న మాట. ఈ రంగం నానాటికీ విస్తరిస్తోంది. అవసరాలు పెరుగుతున్న కారణంగా అవకాశాలు కూడా ఊహకందని రీతిలో విస్తరిస్తున్నాయి. మన అంతరిక్ష రంగంలో ప్రత్యక్షంగా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో 96,000 మంది సిబ్బంది పనిచేస్తుండగా... మొత్తంగా లక్షలాదిమంది ఉపాధి పొందుతున్నారు. రానున్న కాలంలో ప్రైవేటు రంగ పెట్టు బడులు మరింతగా పెరిగే అవకాశాలున్నాయన్న అంచనాలను గమనిస్తే మున్ముందు ఉద్యోగావ కాశాలు ఏ స్థాయిలో ఉండబోతున్నాయో ఊహించవచ్చు. అంతరిక్ష రంగంలో ప్రైవేటు పెట్టుబడు లను పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిరుడు నిర్ణయించింది. పర్యవసానంగా 2020లో 54 స్టార్టప్లుండగా ఇప్పుడవి 200కు చేరుకున్నాయి. మన దేశం మాత్రమే కాదు... లాభదాయకమని తేలడంతో పలు దేశాలు సైతం అంతరిక్ష రంగ పెట్టుబడులపై శ్రద్ధ పెడుతున్నాయి. ఆ రంగాన్ని విస్తరించ టానికి కృషి చేస్తున్నాయి. వచ్చే పదేళ్లలో ప్రపంచ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ 18 లక్షల కోట్ల డాలర్లకు చేరవచ్చని ఆమధ్య వరల్డ్ ఎకనామిక్ ఫోరం లెక్కేసింది. పెట్టుబడుల రీత్యా మన అంతరిక్ష రంగం ప్రస్తుతం ఎనిమిదో స్థానంలో ఉంది. అంతిమంగా అతి పెద్ద విజయం సాధించటానికి ముందు తప్పులు దొర్లటం అతి సహజమనీ, ఏ విజయానికైనా ఇలాంటి చరిత్రే ఉంటుందనీ ప్రముఖ అణు శాస్త్రవేత్త నీల్స్ బోర్ ఎప్పుడో చెప్పారు. మన అంతరిక్ష రంగం కూడా ఎన్నో ఆటుపోట్లు చవిచూసింది. 1975లో ఆర్యభట్ట ఉప గ్రహ ప్రయోగం తర్వాత మన అంతరిక్ష కార్యక్రమం పట్టాలెక్కడానికి పదేళ్లు పట్టిందంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఏ సమస్య అయినా అత్యంత క్లిష్టమైనదని చెప్పడానికి రాకెట్ సైన్స్‌తో పోలుస్తుంటారు. ఒక రాకెట్ అంతరిక్షంలోకి దూసుకుపోవాలన్నా, నిర్దిష్ట కక్ష్యలో ఉపగ్రహాన్ని ఉంచాలన్నా ఎన్నో సూక్ష్మ అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. సాంకేతికంగా రాకెట్‌లోని వ్యవస్థలూ, ఉప వ్యవస్థలూ ఒకదానితో ఒకటి సమన్వయం చేసుకోవాలి. చిన్న లోపమైనా చోటుచేసుకోకూడదు. ఒక ఉపగ్రహాన్ని పంపటానికే ఇంత సంక్లిష్ట ప్రక్రియ అవసరం కాగా, ఒకేసారి బహుళ ఉపగ్రహాలను ప్రయోగించటం అంటే మాటలు కాదు. ఇస్రో ఇలాంటి విన్యాసాలను అవలీలగా పూర్తి చేయగలిగిందంటే దాని వెనకున్న దశాబ్దాల కృషి సామాన్యమైనది కాదు. పైగా అగ్రరాజ్యాలు ఉపగ్రహాలనుపంపటానికి వసూలు చేసే సొమ్ముతో పోలిస్తే ఇస్రో ధర ఎంతో చవక. అందువల్లే అనేక దేశాలు తమ ఉపగ్రహాల ప్రయోగానికి ఇస్రోను ఎన్నుకుంటున్నాయి. వేరే అంతరిక్ష ప్రయోగ సంస్థలతో పోలిస్తే ఇస్రో చేసే వ్యయం అతి తక్కువ. మన దేశం గత దశాబ్దంలో 1,300 కోట్ల డాలర్లు వ్యయం చేయగా 6,300 కోట్ల డాలర్ల ఆదాయం రావటం ఇందుకే. 2014లో ఈ ఆదాయం కేవలం 3,800 కోట్ల డాలర్లని గుర్తుపెట్టుకుంటే మనవాళ్లు సాధించిన ఘనతేమిటో అర్థమవుతుంది. అంతరిక్ష పరిజ్ఞానం మన నిత్య జీవితంతో అనేక రకాలుగా పెనవేసుకుపోయింది. టెలికాంరంగం ప్రస్తుతం 6జీ వైపుగా అడుగులేస్తున్నదంటే అది మన ఉపగ్రహాల సమర్థత వల్లనే. రిసోర్స్ శాట్, కార్టోశాట్ వంటివి పంట భూమి స్వభావం, మట్టిలో తేమ శాతం, పంటల తీరుతెన్నులు తది తర అంశాల్లో ఎప్పటికప్పుడు రైతుకు అవసరమైన సమాచారాన్ని అందిస్తున్నాయి. వారు తగిన ప్రణాళికలు రూపొందించుకునేందుకు, సరైన నిర్ణయాలు తీసుకునేందుకు తోడ్పడి సాగు దిగుబడిని పెంచటానికి దోహదం చేస్తున్నాయి. ప్రకృతి వైపరీత్యాల సమయంలో అప్రమత్తం చేయటానికి, ఏదైనా అనుకోని దుర్ఘటన సంభవిస్తే తక్షణం సహాయ సిబ్బంది రంగంలోకి దిగటానికి ఉపగ్రహాలు సమాచారమిస్తున్నాయి. నిత్యం దేశంలో 8 లక్షలమంది మత్స్యకారులు ఈ ఉపగ్రహాలు అందించే సమాచారంతో లబ్ధి పొందుతున్నారు. పట్టణప్రాంత ప్రణాళికలకూ, మౌలిక సదుపాయాల పర్య వేక్షణకూ ఇస్రో పంపిన ఉపగ్రహాల సమాచారం ఉపయోగపడుతోంది. ఇస్రో అంతరిక్ష రంగ కార్య కలాపాలను రానున్నకాలంలో మరింత విస్తృతం చేయదల్చుకుంది. ప్రపంచ అంతరిక్ష రంగ ఆర్థిక వ్యవస్థలో ఇస్రో వాటా ప్రస్తుతం 2 శాతం. దీన్ని 2034 నాటికి 10 శాతానికి పెంచాలన్నది ఇస్రో లక్ష్యం. అంతరిక్ష సాంకేతికతల్లో స్వావలంబన సాధించే దిశగా ఇప్పటికే అనేక చర్యలకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం ఉపగ్రహాలకు అవసరమైన హార్డ్‌వేర్ కోసం విదేశాలపై ఆధారపడవలసి వస్తున్నది. ఆ విషయంలో సాగుతున్న పరిశోధన, అభివృద్ధి పర్యవసానంగా ఇప్పటికే ఎన్నో కొత్త సాంకేతికతలు అందుబాటులోకొచ్చాయి. అయితే అంతరిక్షంలో ఆధిపత్యాన్ని సాధించి అందరినీ శాసించేందుకు ఇప్పటికే అమెరికా తన ప్రయత్నాలు తాను చేస్తోంది. తనకు అనుకూలంగా అంతర్జాతీయ అంతరిక్ష న్యాయనిబంధనలు రూపొందేలా పావులు కదుపుతోంది. కనుక మనం అప్రమత్తంగా ఉండటం, అందుకు తగిన వ్యూహ రచన చేయటం ముఖ్యం. ఇస్రో ఏర్పడిన ఈ అర్థ శతాబ్దపు కాలంలో ఆ సంస్థ చేసిన కృషి అసాధా రణమైనదీ, అనుపమానమైనదీ. దాన్ని మరింత విస్తృతపరుచుకుంటేనే గగనవీధుల్లో విజయపరంపర నిరంతరం సాగుతుంది. -
శాంతియత్నాలు ఆపొద్దు!
రష్యా–ఉక్రెయిన్ యుద్ధం పరిసమాప్తికి భిన్న మార్గాల్లో జరుగుతున్న ప్రయత్నాలు కాస్తా ఆ రెండు పక్షాల మొండి వైఖరులతో స్తంభించినట్టే కనబడుతోంది. రష్యాపై మరిన్ని దాడులు జరిపితే అది చర్చలకు సిద్ధపడుతుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ భావిస్తుండగా... దాన్ని పూర్తిగా లొంగ దీసుకునే వరకూ యుద్ధం ఆపే ప్రసక్తి లేదని రష్యా అధ్యక్షుడు పుతిన్ అధికార ప్రతినిధి తాజాగా తేల్చిచెప్పారు. యుద్ధం మొదలయ్యాక రెండు దేశాలతోనూ ఐక్యరాజ్యసమితితోపాటు భిన్న సంస్థలూ, దేశాలూ చర్చలు సాగిస్తూనే ఉన్నాయి. కానీ ఎవరికి వారు అంతిమ విజయం తమదేనన్న భ్రమల్లో బతుకున్నంత కాలం సమస్య తెగదు. అలాగని ఏదో మేరకు సమస్యలు పరిష్కారమవుతున్నాయన్నది వాస్తవం. ఉదాహరణకు హోరాహోరీ సమరం సాగుతున్నప్పుడు రెండేళ్ల క్రితం ఉక్రెయిన్ నుంచి ఆహారధాన్యాలు, ఎరువులు, పొద్దుతిరుగుడు నూనె ఉత్పత్తుల ఎగుమతులు నిలిచి పోగా ఐక్యరాజ్యసమితి చొరవ తీసుకుని రష్యా, ఉక్రెయిన్లతో మాట్లాడి సమస్యను పరిష్కరించింది. అప్పటికి యుద్ధం మొదలై ఆర్నెల్లు దాటింది. ఫలితంగా నిరుడు జూలై నాటికి దాదాపు మూడు న్నర కోట్ల టన్నుల ఆహారధాన్యాలు ఎగుమతయ్యాయి. ప్రపంచానికి ఆహార సంక్షోభం తప్పింది. ఇటీవలే ఈ రెండు దేశాల మధ్యా యుద్ధ ఖైదీల మార్పిడి కూడా జరిగింది. ఇరువైపులా చెరో 115 మంది సైనికులకూ చెర తప్పింది. తెర వెనక తుర్కియే సంక్షోభ నివారణకు ప్రయత్నిస్తుండగా ప్రధాని మోదీ అటు రష్యా, ఇటు ఉక్రెయిన్ సందర్శించి ఇరు దేశాల అధినేతలతోనూ మాట్లాడారు. వచ్చే నెలలో ఐక్యరాజ్యసమితి సమావేశాలకు వెళ్లినప్పుడు ఆయన మరోసారి జెలెన్స్కీని కలవ బోతున్నారు. అలాగే అక్టోబర్‌లో బ్రిక్స్ సమావేశాల కోసం రష్యా వెళ్లబోతున్నారు. మోదీ ఉక్రెయిన్ వెళ్లినందుకు పుతిన్ కినుక వహించినట్టే, అంతక్రితం రష్యా వెళ్లినందుకు జెలెన్స్కీ నిష్ఠూరాలాడారు. ఇప్పటికైతే ఉక్రెయిన్ ఒకవైపు నువ్వా నేనా అన్నట్టు రష్యాతో తలపడుతున్నా... డ్రోన్లతో, బాంబులతో నిత్యం దాడులు చేస్తున్నా చర్చల ప్రస్తావన తరచు తీసుకొస్తోంది. రష్యా చర్చలకు వచ్చి తీరుతుందని జెలెన్స్కీ ఇటీవల అన్నారు. అయితే ఇదంతా ఊహలపై నిర్మించుకున్న అంచనా. నిరంతర దాడులతో రష్యాకు గత్యంతరం లేని స్థితి కల్పిస్తే... ఆ దేశం చర్చలకు మొగ్గుచూపుతుందన్నది ఈ అంచనా సారాంశం. నిజానికి నాటో దేశాలు నిరంతరం సరఫరా చేస్తున్న మారణా యుధాలతో, యుద్ధ విమానాలతో ఉక్రెయిన్ దాదాపు మూడేళ్లుగా తలపడుతూనే ఉంది. పర్యవనసానంగా గతంలో కోల్పోయిన కొన్ని నగరాలను అది స్వాధీనం చేసుకుంది కూడా! కానీ రష్యా ప్రతిదాడులతో అవి ఎన్నాళ్లుంటాయో, ఎప్పుడు జారుకుంటాయో తెలియని స్థితి ఉంది. అత్యుత్సాహంతో ఉక్రెయిన్‌కు అత్యాధునిక ఆయుధాలను, ఎఫ్–16 యుద్ధ విమానాలను తరలించిన అమెరికా నెలలు గడుస్తున్నా వాటి వినియోగానికి ఇంతవరకూ అనుమతినివ్వనే లేదు. ఉదాహరణకు ఉపరితలం నుంచి ప్రయోగించే సైనిక వ్యూహాత్మక క్షిపణి వ్యవస్థ (ఏటీఏసీఎం) 300 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని అవలీలగా ఛేదిస్తుంది. బ్రిటన్–ఫ్రాన్స్ సంయుక్తంగా రూపొందించిన స్టార్మ్ షాడో 250 కిలోమీటర్ల దూరంలోని దేన్నయినా ధ్వంసం చేస్తుంది. ఈ రకం క్షిపణుల్ని గగనతలం నుంచి ప్రయోగిస్తారు. మరోపక్క జర్మనీ తయారీ టారస్ క్షిపణి కూడా ఇటువంటిదే. పైగా ఇది అమెరికా తయారీ క్షిపణిని మించి శక్తిమంతమైంది. 500 కిలోమీటర్లకు మించిన దూరంలోని లక్ష్యాన్ని గురిచూసి కొడుతుంది. ఇవన్నీ ఇంచుమించు ఏడాదిగా ఉక్రెయిన్ సైనిక స్థావరాల్లో పడివున్నాయి. ఎందుకైనా మంచిదని కాబోలు అమెరికా తన ఎఫ్–16లను నేరుగా ఉక్రెయిన్‌కు ఇవ్వకుండా నెదర్లాండ్స్, డెన్మార్క్‌లకు పంపి వారి ద్వారా సరఫరా చేసింది. వీటి వినియోగానికి ఉక్రెయిన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని బ్రిటన్, ఫ్రాన్స్ పట్టుబడుతుండగా అమెరికాతోపాటు జర్మనీ కూడా ఆ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అదే జరిగితే యుద్ధ తీవ్రత మరింత పెరిగి, రష్యా ఎంతకైనా తెగించే పరిస్థితి ఏర్పడొచ్చునని అమెరికా, జర్మనీ ఆందోళన పడుతున్నాయి. తన భూభాగంలోకి చొచ్చుకొచ్చి ఉక్రెయిన్ డ్రోన్ దాడులు చేస్తున్నా రష్యా నిర్లిప్తంగా ఉండిపోతుండగా ఈ అనవసర భయాలేమిటన్నది బ్రిటన్, ఫ్రాన్స్‌ల వాదన. కానీ ఒకసారంటూ ఎఫ్16లు వచ్చి పడితే, అత్యాధునిక క్షిపణులు విధ్వంసం సృష్టిస్తే రష్యా ఇలాగే ఉంటుందనుకోవద్దని పెంటగాన్ హెచ్చరిస్తోంది. తప్పనిసరైతే ఉక్రెయిన్ సరిహద్దుల ఆవల ఉన్న రష్యా స్థావరాలను లక్ష్యంగా చేసుకోమంటున్నది. ఈమధ్య క్రిమియాపై దాడికి అనుమతించింది. కానీ కూటమి మధ్య ఏకాభిప్రాయం కుదిరితే తప్ప రష్యా నగరాల జోలికి పోవద్దని చెబుతోంది. అంతగా భయపడితే అసలు ఇలాంటి ఆయుధాలు, యుద్ధ విమానాలు తరలించటం దేనికి? అవేమైనా ఎగ్జిబిషన్‌కు పనికొచ్చే వస్తువులా? వాటిని చూసి రష్యా ‘పాహిమాం’ అంటూ పాదాక్రాంతమవుతుందని అమెరికా నిజంగానే భావించిందా? యుద్ధం ఏళ్లతరబడి నిరంతరం కొనసాగుతుంటే ఎప్పుడో ఒకప్పుడు పరిస్థితి చేజారే ప్రమాదం ఉంటుంది. కనుక అమెరికా, పాశ్చాత్య దేశాలు వివేకంతో మెలగాలి. యుద్ధ విరమణకు సకల యత్నాలూ చేయాలి. దాడులతో ఒత్తిడి తెస్తే రష్యా దారికొస్తుందనుకుంటున్న ఉక్రెయిన్‌కు తత్వం బోధపడాలంటే ముందు అమెరికా సక్రమంగా ఆలోచించటం నేర్చుకోవాలి. ఉక్రెయిన్–రష్యా ఘర్షణ, గాజాలో ఇజ్రాయెల్ ఊచకోతలు ఆగనంతవరకూ ప్రపంచం సంక్షోభం అంచున ఉన్నట్టే లెక్క. అందుకే ప్రపంచ దేశాలు అప్రమత్తం కావాలి. శాంతి నెలకొల్పడానికి ప్రయత్నిస్తూనే ఉండాలి. -
కటకటాల్లో టెలిగ్రామ్ చీఫ్
ఆయనేమీ అమెరికా సైనికుల అకృత్యాలను ఆన్లైన్లో రచ్చకీడ్చిన జులియన్ అసాంజ్ కాదు. దేశదేశాల్లోని కోట్లాదిమంది పౌరులపై నిఘా ఉంచుతున్న అమెరికా జాతీయ భద్రతా సంస్థ (ఎన్ఎస్ఏ) తీరుతెన్నులను బట్టబయలు చేసి రష్యాలో తలదాచుకుంటున్న ఎడ్వర్డ్ స్నోడెన్ కాదు. ఆయన వేలాది కోట్ల డాలర్ల విలువైన అతి పెద్ద మెసేజింగ్ సంస్థ టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు, సీఈఓ పావెల్ ద్యురోవ్. రెండు రోజుల క్రితం ఫ్రాన్స్ పోలీసులు పారిస్‌లో ఆయన్ను అరెస్టు చేసి నిర్బంధించారని తెలియగానే ట్విటర్, టెస్లా సంస్థల అధిపతి ఎలాన్ మస్క్ ఖండించారు. పావెల్ విడు దల కోసం ట్విటర్ వేదికగా ‘ఫ్రీ పావెల్’ ఉద్యమాన్ని ప్రారంభించారు. ప్రపంచాధినేతల్లో ఎంతో పలుకుబడిగల మస్క్ గతంలో ఎప్పుడూ ఇలాంటి వివాదాల జోలికిపోలేదు. ఆరు నూరైనా... ఎలాంటి పర్యవసానాలూ, పరిణామాలూ ఎదురైనా పౌరుల భావప్రకటనా స్వేచ్ఛ ఉండితీరాలని వాదించటంలో పావెల్‌కి ఎవరూ సాటిరారు. నిజానికి అది వివాదాస్పదం కావటంతోనే అతను జైలుపాలయ్యాడు. కారణాలు వెల్లడి కాకపోయినా పసివాళ్లతో రూపొందించిన బూతుచిత్రాల పంపిణీకీ, మాదకద్రవ్య ముఠాల కార్యకలాపాలకూ, ఉగ్రవాద కార్యకలాపాలకూ, అక్రమమార్గాల్లో ద్రవ్య చలామణీకీ టెలిగ్రామ్ అవకాశమిస్తోందన్నది చాన్నాళ్లుగా ఉంటున్న అభియోగాల సారాంశం. భావప్రకటనా స్వేచ్ఛకు ఏమేరకు హద్దులుండాలి... దానివల్ల ఎదురయ్యే దుష్పరిణామాలకు బాధ్యులెవరు... ఈ విషయంలో ప్రభుత్వాల ప్రమేయాన్ని ఎంతవరకూ అనుమతించాలి వంటి ప్రశ్నలు ఎప్పటినుంచో అందరినీ వేధిస్తున్నాయి. ఇప్పుడు పావెల్ అరెస్టుతో అవి మరింత ప్రము ఖంగా చర్చకొస్తున్నాయి. పావెల్ రష్యా పౌరుడని పేరునిబట్టి ఎవరైనా గుర్తుపడతారు. అయితే ప్రస్తుతం ఆయనకు ఫ్రాన్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) దేశాల పౌరసత్వం ఉంది. అసమ్మతిని అణిచేయటంలో సిద్ధహస్తుడైన రష్యా అధ్యక్షుడు పుతిన్ చాన్నాళ్లుగా అతన్ని బంధించాలని ప్రయత్నిస్తున్నారు. పావెల్‌ను అప్పగించాలని, కనీసం మాట్లాడటానికి అనుమతించాలని తాజాగా ఫ్రాన్స్‌ను రష్యా డిమాండ్ చేస్తోంది. 2011లో రష్యా నిర్వహించిన ఎన్నికలు పూర్తిగా బోగస్ అంటూ బయ ల్దేరిన ‘మంచు విప్లవం’ (స్నో రివల్యూషన్) దేశం నలుమూలలా విస్తరించటానికి పావెల్ దోహద పడ్డాడు. ఆ క్రమంలో ఏర్పడిన మెసేజింగ్ యాప్ కాస్తా తర్వాతకాలంలో టెలిగ్రామ్‌గా రూపుదిద్దు కుంది. పావెల్ ఉక్రెయిన్‌లో రష్యా దురాక్రమణను ఖండించే అభిప్రాయాలకు చోటిచ్చాడు.అంతేకాదు... ఇజ్రాయెల్ గాజాలో సాగిస్తున్న అకృత్యాలను బట్టబయలు చేసే వీడియోలను వెల్లడించేందుకు అనుమతించాడు. ఇతర దిగ్గజ సంస్థలు మొహం చాటేసిన ఈ అకృత్యాలు టెలి గ్రామ్ లేకపోతే బాహ్య ప్రపంచానికి బహుశా తెలిసేవి కాదు. వాట్సాప్ వంటి ఇతర సంస్థలకు లేని వెసులుబాటు– రెండు లక్షలమందితో గ్రూప్ నిర్వహించటం– టెలిగ్రామ్లోనే సాధ్యం. అయితే ఇందువల్ల అనర్థాలు తలెత్తటం కూడా వాస్తవం. ఆమధ్య పారిస్, బెర్లిన్ నగరాల్లో పేలుళ్లకు, దాడులకు ఉగ్రవాద సంస్థ ఐఎస్ టెలిగ్రామ్ యాప్‌ను వాడుకుంది. ఆ తర్వాత సంస్థ సాంకేతిక సిబ్బంది దాన్ని కట్టడిచేశారు. ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు చోటీయని వ్యవస్థ ఏర్పర్చు కోవాలని, నేరగాళ్ల ఆనుపానులు ఎప్పటికప్పుడు తమకు అందించాలని అనేక దేశాలు టెలిగ్రామ్‌ను కోరుతున్నాయి. యూరప్ దేశాలు ఈయూ డిజిటల్ సర్వీసుల చట్టాన్ని రెండేళ్ల క్రితం తీసు కొచ్చాయి. పర్యవసానంగా చాలా మాధ్యమ సంస్థలు దారికొచ్చాయి. కృత్రిమ మేధ (ఏఐ) ఆధా రంగా ‘అవాంఛిత’ సందేశాలను జల్లెడ పడుతున్నాయి. వాటిని నిలిపేస్తున్నాయి. అయితే సమస్యే మంటే... ఈ వంకన అనేక మాధ్యమాలు సహేతుకమైన అసమ్మతికి కూడా తలుపులు వేస్తున్నాయి. నియంతలకు వంత పాడుతున్నాయి. కొన్ని సంస్థలైతే సంకేత నిక్షిప్త సందేశాల(ఎన్క్రిప్షన్)కు అవకాశమున్నదని పైకి చెబుతూ తమ వినియోగదారుల ఆనుపానులు తెలుసుకోవటానికి ప్రభు త్వాలకు అవకాశమిస్తున్నాయి. కానీ టెలిగ్రామ్ లొంగటం లేదు. ప్రతి దేశంలోనూ స్థానిక చట్టాల లొసుగులను వాడుకుని బయటపడుతోంది. అలాగని తన వేదికపై వినియోగదారులు పరస్పరం పంపుకునే సందేశాలు టెలిగ్రామ్‌కు తెలియక కాదు. వాటిని అవసరమనుకున్నప్పుడల్లా చూస్తోంది. భావప్రకటనా స్వేచ్ఛకూ, బాధ్యతకూ మధ్య సన్నని విభజన రేఖ ఉంటుంది. స్వేచ్ఛ మాటున వదంతులు సృష్టించటం, అల్లర్లకు ఆజ్యం పోయటం ఎవరు చేసినా తప్పే అవుతుంది. అలాంటి వారు చట్టం ముందు తలవంచాల్సిందే. ఆ మధ్య గోరక్షణ పేరుతో బృందాలు ఏర్పడి వ్యక్తులను కొట్టిచంపిన ఉదంతాలు పెరిగాక సందేశాల పంపిణీపై వాట్సాప్ అనేక పరిమితులు విధించింది. మన దేశంలో టెలిగ్రామ్‌కు 50 లక్షలమంది చందాదారులున్నారు. మాదకద్రవ్యాలు, జూదం, బెది రించి డబ్బులు గుంజుకోవటం వంటి కార్యకలాపాలకు అది వేదిక వుతున్నదని మన ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఇటీవల నీట్ ప్రశ్నపత్రాల లీకు పుణ్యం టెలిగ్రామ్దే. కేంద్ర హోంశాఖ నేతృత్వంలోని ఇండియన్ సైబర్ క్రైం కో–ఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ) ఆ వ్యవహారాలపై దృష్టి సారించింది. ఇది ఒక కొలిక్కి వస్తే టెలిగ్రామ్ నిషేధానికి కూడా గురికావొచ్చన్నది విశ్లేషకుల అంచనా. ఏదేమైనా తనవల్ల సమాజానికి నష్టం కలుగుతున్నదని గ్రహించాక టెలిగ్రామ్ బాధ్యత గుర్తెరగవలసింది. కనీసం ఆ పని ఇప్పుడైనా జరగాలి. అదే సమయంలో ఆ వంకన ప్రభుత్వాలు సహేతుక విమర్శ లకూ, అసమ్మతికీ పాతరేయకుండా చూడటం ప్రజాస్వామికవాదుల కర్తవ్యం. -
మాయరోగం... మరోసారి!
అవును... మళ్ళీ మరో మాయరోగం బయటకొచ్చింది. డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో మంకీపాక్స్ (ఎంపాక్స్) తాజాగా విజృంభించింది. స్వీడన్ నుంచి పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ దాకా అనేక ప్రాంతాలకు విస్తరించింది. ఫలితంగా, ప్రపంచం మరోసారి ఉలిక్కిపడింది. దీన్ని ఆందోళన చెందా ల్సిన అంతర్జాతీయ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా రెండేళ్ళలోనే రెండోసారి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రకటించాల్సొచ్చింది. భారత్ సైతం ఎయిర్‌పోర్ట్‌లు, ఆస్పత్రుల్ని అప్రమత్తం చేసి, కాంగో సహా మధ్య ఆఫ్రికా దేశాల నుంచి వస్తున్న ప్రయాణికుల ఆరోగ్యంపై కన్నేసింది. మాస్కుల ధారణ, చేతుల పరిశుభ్రత, గుంపుల్లో తిరగకపోవడం లాంటి ముందుజాగ్రత్తలే శ్రీరామ రక్ష అని మంకీపాక్స్ మరోసారి గుర్తుతెచ్చింది. తరచూ తలెత్తుతున్న ఈ వైరస్ల రీత్యా ఔషధ పరి శోధన, ఆరోగ్య వసతుల కల్పనపై మరింత పెట్టుబడి పెట్టాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పింది. ప్రపంచంపై ఎంపాక్స్ పంజా విసరడం ఇప్పటికిది మూడోసారి. అసలు 15 నెలల పైచిలుకు క్రితం ఇది ఇక ఆందోళన చెందాల్సినది కాదని డబ్ల్యూహెచ్ఓ తేల్చింది. తీరా ఇటీవల కొద్ది వారాలుగా వైరస్ పునర్ విజృంభణతో ఆగస్ట్ 14న మరోసారి అత్యవసర పరిస్థితిని ప్రకటించాల్సి వచ్చింది. దీనికి కారణం లేకపోలేదు.2023 సెప్టెంబర్ నుంచి కేసులు పెరుగుతున్నాయి. పైగా గతంలో 2022–23లో ప్రపంచాన్ని చుట్టుముట్టినప్పటితో పోలిస్తే, ఈసారి జన్యుపరంగా విభిన్నమైన వైరస్ (క్లాడ్ 1బి వేరియంట్) దీనికి కారణమవుతోంది. ఈ సాంక్రమిక వ్యాధి గతంలో ఒకరి నుంచి మరొకరికి లైంగిక సంపర్కం ద్వారానే వ్యాపించేది. కొత్త వేరియంట్ ఇప్పుడు రోగితో స్పర్శ, దగ్గరగా మాట్లాడడం, రోగి వాడిన దుస్తులు, దుప్పట్లు వాడడం ద్వారా కూడా వ్యాపిస్తున్నట్టు నిపుణుల మాట. మరణాల రేటూ మునుపటి కన్నా పెరిగింది. ఈ ఒక్క ఏడాదే 116కి పైగా దేశాల్లో 15,600కి పైగా కేసులు నమోదయ్యాయి. 500 పైచిలుకు మంది ప్రాణాలు కోల్పోయారు. ఆఫ్రికాలో నిరుటితో పోలిస్తే ఇప్పుడు మరణాలు 160 శాతం పెరిగాయి. ప్రపంచంలో దాదాపు 70 లక్షల మందికి పైగా మరణానికి కారణమైన కోవిడ్ లానే మంకీపాక్స్‌కూ జనం భయపడుతున్నది అందుకే!ఏడాది ౖక్రితం అత్యవసర పరిస్థితిని ఎత్తివేసినప్పుడే ఎంపాక్స్‌పై దీర్ఘకాలిక నిఘా, నియంత్రణ ప్రణాళికలు అవసరమని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. ఈ వ్యాధి సాంక్రమిక రోగ విజ్ఞానంపై ఇంకా పూర్తిగా అవగాహన లేదంటూ ప్రజారోగ్య నిపుణులు, వైరస్ శాస్త్రవేత్తలు సైతం హెచ్చరించారు. అయినా సరే ఈ రోగాన్ని కనిపెట్టే పరీక్షల్ని మెరుగుపరచడం, టీకాలు – యాంటీ వైరల్ మందులకు సంబంధించి క్లినికల్ పరీక్షలపై దృష్టి పెట్టడం, టీకాల తయారీని విస్తరించడం లాంటి చర్యలేవీ ఆచరణలో పెట్టలేదు. ఈ అంతర్జాతీయ నిర్లక్ష్యమే ఇప్పుడు శాపమైంది. ఇవాళ్టికీ మంకీపాక్స్‌కు టీకాల సరఫరా పరిమితం. నియంత్రణకు కోటి డోసుల అవసరం ఉంటే, 2.1 లక్షల డోసులే తక్షణం అందుబాటులో ఉన్నాయట. డోసులు దానం చేస్తామని యూరోపియన్ యూనియన్, అమెరికాలు వాగ్దానం చేశాయి కానీ, వ్యాక్సిన్లపై ఇప్పటికీ కొన్ని అధికాదాయ దేశాల గుత్తాధిపత్యమే సాగుతోంది. అత్యవసరంలో ఉన్న అనేక దేశాలకు అది పెద్ద దెబ్బ. ఆఫ్రికాలో అవసరమున్నా యూరోపియన్ దేశాల్లోనే టీకాలను మోహరించడమే అందుకు ఉదాహరణ. కోవిడ్ కాలంలో లానే ఇప్పుడూ పేదదేశాలకు సాంకేతికత బదలాయింపు జరగట్లేదు. టీకాలకై పెనగులాట తప్పట్లేదు. మహమ్మా రుల కట్టడికి ఒక సమానత్వ ఒప్పందంపై ప్రపంచ దేశాలు విఫలమైతే దెబ్బతినేది ప్రజారోగ్యమే!మన దేశంలోనూ ఈ ఏడాది మంకీపాక్స్ కేసులు బయటపడ్డాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులేవీ లేవనీ, మన దగ్గర ఇది పెద్దయెత్తున రాకపోవచ్చనీ అంచనా. అయినా అప్రమత్తత తప్పదు. కేంద్రం ఇప్పటికే ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిపి, చర్యలు ప్రారంభించింది. రోగ నిర్ధారణ వసతు లతో పాటు, ఆరోగ్య బృందాల్లో అవగాహన పెంచే ప్రయత్నం చేస్తోంది. అక్కడితో ఆగకుండా ప్రజల్లో చైతన్యం కల్పించాలి. రాష్ట్రాలతో అన్ని రకాల కీలక సమాచారాన్ని పంచుకోవాలి. నిజానికి, ఇలాంటి వైరస్ల విజృంభణ వేళ వ్యవహరించాల్సిన తీరుపై కోవిడ్ విలువైన పాఠాలే నేర్పింది. ఇన్ఫెక్షన్ నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలి. అలాగే, కేసుల వివరాలను సమగ్రంగా నమోదు చేయాలి. ప్రాథమిక అంశాలే అనిపించినా, ఇవే అతి ముఖ్యం. కోవిడ్‌లో లాగా కాక ఈసారైనా రోగ నిర్ధారణ కిట్లు, టీకాలు వర్ధమాన దేశాలకు సక్రమంగా చేరితేనే ఉపయోగం. సరిహద్దులు దాటి సులభంగా విస్తరించే ఇలాంటి మాయదారి రోగాలను కట్టడి చేయాలంటే అన్నిచోట్లా సమస్థాయిలో ప్రయత్నాలు జరగడం కీలకం. వ్యాధి సోకిన, సోకే అవకాశం ఉన్న వర్గాలన్నిటికీ టీకాలు అందుబాటులో ఉంచి, సంరక్షణ చేపట్టేలా ఆర్థిక, విధానపరమైన అండదండలు కావాలి. సత్వర, కీలక చర్యలు చేపట్టడమే ముఖ్యమనేది కోవిడ్ నేర్పింది. అందులోనూ ఇలాంటి మాయరోగాలకు ముకుతాడు వేయాలంటే, తొలి 100 రోజుల్లోని ఆచరణే అతి ముఖ్యం. ఎప్పటికప్పుడు స్వరూప స్వభావాల్ని మార్చుకుంటున్న ఎంపాక్స్ ఆఫ్రికా సమస్య, కేసులు బయట పడ్డ కొన్ని దేశాల తలనొప్పి అనుకుంటే పొరపాటు. ఇది ప్రపంచానికే ముప్పు అని ముందు గుర్తించాలి. ‘ఇది మరో కరోనా కాదు’ అంటూ డబ్ల్యూహెచ్ఓ అంటున్నా, వైరస్ విజృంభణ ధోరణులు భయపెడుతున్నాయి. టీకాలు, చికిత్సలు లేకుండా ఆఫ్రికా దేశాలను వాటి ఖర్మానికి వదిలేయడం దుస్సహం. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలూ సమన్వయంతో కట్టడికి కృషి చేయాలి. అత్యవసర ఆరోగ్య పరిస్థితి అని ప్రకటించడంలోని అసలు ఉద్దేశం అదే! జంతుజాల వైరస్లు పదే పదే ఎందుకు తలెత్తుతున్నాయో దృష్టి పెట్టాల్సి ఉంది. విస్మరిస్తే మనకే కష్టం, నష్టం. పారాహుషార్! -
ఎట్టకేలకు ఒక కదలిక
రథం కదులుతోంది. ఎప్పుడో జరగాల్సిన పనిలో ఇప్పటికైనా అడుగులు ముందుకు పడుతున్నాయి. దేశంలో జనాభా లెక్కల పని ఎట్టకేలకు మరికొద్ది రోజుల్లోనే సెప్టెంబర్‌లో ఆరంభ మవుతోంది. ఆ మేరకు ఇటీవల వెలువడ్డ సమాచారం పెద్ద ఊరట. ప్రతి పదేళ్ళకు ఒకసారి జరగాల్సిన ఈ జనగణన యజ్ఞం నిజానికి 2021లోనే జరగాల్సి ఉంది. కోవిడ్ సహా అనేక సాకులతో ప్రభుత్వం సాచివేత ధోరణి ప్రదర్శిస్తూ వచ్చింది. అయితే, భారత్ లాంటి వర్ధమాన దేశానికి జనగణన మినహా ప్రత్యామ్నాయ మార్గాలలో ఆ స్థాయి సమాచారం అందుబాటులో లేదు. ఉన్నా అది అంత నమ్మదగినదీ కాదు. అందుకే జనాభా పరంగా, సామాజిక – ఆర్థికపరంగా దేశ సమగ్ర స్వరూపాన్ని ఆవిష్కరించడానికి కొన్ని దశాబ్దాలుగా జనగణన అత్యంత కీలకమైనది.అలాంటి జనగణన ప్రక్రియ ఇప్పుడు మళ్ళీ పట్టాలెక్కుతోంది. వచ్చే నెల (సెప్టెంబర్)లో ఆరంభ మయ్యే ఈ ప్రక్రియ పూర్తి కావడానికి దాదాపు ఏణ్ణర్ధ కాలం పడుతుందని ప్రభుత్వం మాట. జనగణన అనేది పలువురు పొరబడుతున్నట్టు కేవలం గణాంకాల సేకరణ కాదు. అది సుపరి పాలనకు మూలస్తంభం. దేశం ఎదుర్కొనే సామాజిక, ఆర్థిక సవాళ్ళకు పరిష్కారాలు కనుగొనేందుకు మార్గదర్శి. పట్టణీకరణ, ప్రాథమిక వసతుల అభివృద్ధి మొదలు సాంఘిక సంక్షేమం, ఆర్థిక ప్రణాళిక వరకు ప్రతి అంశం పైనా సరైన విధాన నిర్ణయాలకు ఈ సమాచారమే కీలకం. నిజానికి, జనాభా లెక్కల సేకరణలో కేంద్ర సర్కార్ చేసిన సుదీర్ఘ జాప్యం చాలాకాలంగా విమర్శలకు గురవుతోంది. ప్రైవేట్వారే కాదు... సర్కారీ ఆర్థిక నిపుణులు సైతం విమర్శకుల్లో ఉండడం గమనార్హం. పాత జనాభా లెక్కల ఆధారంగానే ఇప్పటికీ ఆరోగ్యం, ఆర్థిక అంశాలు, చివరకు ద్రవ్యోల్బణం రేటు, ఉపాధి లెక్కల లాంటివన్నీ గణిస్తూ ఉండడం వల్ల కచ్చితత్వం లోపిస్తోంది. డేటా లోపంతో కనీసం 15 కీలక అంశాలపై దుష్ప్రభావం పడింది. అదే ఈ నిపుణులందరి బాధ. పుష్కర కాలం క్రితపు లెక్కలపై ఆధారపడే సరికి అంతా లోపభూయిష్టమైంది. దాదాపు 10 కోట్ల మంది పౌర సరఫరా వ్యవస్థకు వెలుపలే ఆహారభద్రత లేకుండా మిగిలిపోయారు. ఇళ్ళు, శ్రామికుల సంఖ్య ఆధారంగా రాష్ట్రాలకు కేంద్రం కేటాయించే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులపైనా దెబ్బ పడింది. చివరకు నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్ వారి సర్వేల నాణ్యత కూడా దెబ్బతింది. అంతెందుకు... జనాభాలో చైనాను భారత్ దాటేసి, ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా అవతరించినట్టు ఐరాస నివేదిక గత ఏడాది ప్రకటించింది. దాన్ని ఖరారు చేయడానికో, కాదనడానికో, ఆ జనాభా లెక్కకు అనుగణంగా అవసరమైన చర్యలు చేపట్టాడానికో కూడా మన వద్ద నిర్దుష్టమైన గణాంకాలు లేని పరిస్థితి. అలాంటి లోపాలన్నీ సరిదిద్దుకోవడానికి ఇప్పుడిది సదవకాశం. అదే సమయంలో జనగణనలో భాగంగా మన జనాభా తాలూకు కులగణన కూడా చేయడం అత్యవసరం. దేశంలోని ప్రధాన పార్టీలన్నీ కోరుతున్నది అదే. తద్వారా జనసంఖ్యలో ఏ సామాజిక వర్గం వంతు ఎంత, ఏయే వర్గాల స్థితిగతులు ఏమిటి, ఏ వర్గాలు ఎంతగా వెనకబడి ఉన్నాయి తదితర భోగట్టా తేటతెల్లమవుతుంది. కులాలు, ఉపకులాలతో పాటు వర్తమానంలో కనుమరుగైపోతున్న ఆశ్రిత కులాల లెక్కలూ వెలికివస్తాయి. వెనుకబడిన వర్గాలకు చేయూతనిచ్చేలా పాలకులు పాలసీలు చేయడానికీ వీలవుతుంది. ప్రణాళిక, పాలన, చట్టాల రూపకల్పన సహా అనేక ప్రభుత్వ కార్యక్రమాలపై సమీక్షకూ, నిర్వహణకూ ఈ సమాచారమంతా ఉపకరిస్తుంది. తాజా జనగణన రాజకీయంగానూ ప్రధానమే. దేశంలోని అన్ని స్థాయుల చట్టసభలలో నియో జక వర్గాల పునర్విభజన, రిజర్వేషన్‌కు ఈ కొత్త లెక్కలే ఆధారమవుతాయి. అంటే, అసెంబ్లీ, పార్ల మెంట్ స్థానాల సంఖ్య మారిపోనుంది. ఈ లెక్కన దక్షిణాదితో పోలిస్తే జనాభా నియంత్రణ అంతగా లేని ఉత్తరాదిలో మరిన్ని చట్టసభా స్థానాలు వస్తాయి. ఫలితంగా అధికార సమీకరణాలూ మారి పోతాయి. ఇంతటి ముఖ్యమైనది కాబట్టే... ఇలాంటి అధికారిక గణాంక వ్యవస్థను ప్రభుత్వ, రాజ కీయ జోక్యాలకు వీలైనంత దూరంగా ఉంచడం శ్రేయస్కరం. మారిన కాలానికి అనుగుణంగా కొత్త జనగణన రూపురేఖలూ మారుతున్నాయట. ప్రధానంగా డిజిటల్ పద్ధతిలో, అదీ స్వీయ నమోదు పద్ధతిలో జనగణన సాగనుంది. గతంలో స్త్రీ, పురుషుల వివరాలనే దఖలు పరిస్తే, ఇప్పుడు తొలి సారిగా ట్రాన్స్జెండర్ల వివరాలనూ ప్రత్యేకంగా నమోదు చేయనున్నారు. అలాగే, ఎస్సీ, ఎస్టీలే కాక ‘ఇతర వెనుకబడిన వర్గాలు’ అంటూ వివరాలు విడిగా నింపనున్నారట. ఏమైతేనేం, ఇన్నేళ్ళ తరువాతైనా జనాభా లెక్కల ప్రక్రియను మళ్ళీ చేపట్టడం హర్షణీయం. అతి ముఖ్యమైన బృహత్ యజ్ఞాన్ని ఇక నుంచైనా ఎప్పటికప్పుడు నిర్ణీత సమయానికే నిర్వహించడం అత్యవసరం. తద్వారానే కచ్చితమైన డేటా దేశంలో పాలనా యంత్రాంగానికి అందుబాటులోకి వస్తుంది. 2026 మార్చి కల్లా ఈ జనగణన ఫలితాలను సమర్పించేందుకు కేంద్ర శాఖలు ఇప్పటికే నిర్ణీత కాలవ్యవధి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయి. దీంతో, 2011 నుంచి అప్పటి దాకా... అంటే 15 ఏళ్ళ కాలవ్యవధిలోని సమాచారం చేతిలోకి వస్తుంది. అయితే, ఈసారి జరిగిన జాప్యం నుంచి పాఠాలు నేర్చుకోవాలి. దేశం ముందుకు సాగడానికి దాని సమూహ స్వరూప స్వభావాలు దానికైనా తెలిసి ఉండడం ముఖ్యం. అలాంటి సమాచార సేకరణ, వినియోగంలో అంతరాయాలు రాకుండా జాగ్రత్తపడాలి. ఊహించని ఆటంకాలు ఎదురైనా ఇబ్బంది పడకుండా ఉండేలా జనాభాపై సమగ్ర సమాచారం అందించే కట్టుదిట్టమైన వ్యవస్థలను సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి ప్రయత్నాలు జరగడానికి ఇదే తరుణం. -
కృత్రిమ సంక్షిప్తం
పుస్తకం మొత్తం చదవనక్కరలేకుండా కేవలం అట్టల వెనుక ఉన్నది చదివి కూడా ‘సమీక్ష’ రాయొచ్చునని... సాహిత్య ప్రపంచంలో ఒక జోక్. చదవడానికి బద్దకించడం అనేది సర్వ మానవ సమస్య. మన సినిమా రూపొందుతున్నది దీని ఆధారంగానే కాబట్టి దీన్నొకసారి చదవమని ‘ఎ కాక్ అండ్ బుల్ స్టోరీ’లో సినిమా నటుడి పాత్రధారికి దర్శకుడి పాత్రధారి ఒక పుస్తకం ఇస్తాడు. ఆ నూరు పేజీల భారీ పుస్తకాన్ని చదవలేక, అందులోని సారాంశం ఏమిటో తన భార్యను చెప్పమంటాడు నటుడు. అలాంటివాళ్ల కోసమే కాబోలు, పుస్తకాలు సంక్షిప్తంగా రావడం మొదలైంది.కాలం తెచ్చిన మార్పుల్లో వేగం ఒకటి. దేనిమీదా ఎక్కువసేపు ఎవరూ నిలబడటం లేదనేది అందరూ అంగీకరిస్తున్న మాట. ప్రయాణ సాధనాలు పెరిగి జీవితం వేగవంతం కావడానికీ, పాఠకులు చదవడం తగ్గిపోవడానికీ సంబంధం ఉంది. ఆ పెరిగిన వేగానికి తగినట్టుగా పాఠకులను శ్రోతలుగా మార్చడానికి ఆడియో బుక్స్ మార్కెట్ ప్రయత్నించింది. గంటల తరబడి ఉండే నవలలు యథాతథంగా రికార్డు చేస్తే ఖర్చుతో పాటు అసలుకే మోసం రావొచ్చు. అలా పుట్టినవే అబ్రిడ్జ్డ్ ఆడియో బుక్స్. హెలెన్ కెల్లెర్, ఎడ్గార్ అలెన్ పో, డైలాన్ థామస్ లాంటివారి రచనలు అమెరికాలో తొలుదొలుత ఆడియో బుక్స్‌గా వచ్చాయి. అలాగే అచ్చు పుస్తకాలు ఎన్నో కుదించుకుని అందుబాటులోకి వచ్చాయి. అలా కుదించడం వల్ల కొత్త పాఠకులు సాహిత్యంలో అందుబాటులోకి వచ్చారు. ఉదాహరణకు ఇలా వచ్చిన ‘ఏడు తరాలు’, ‘గాన్ విత్ ద విండ్’ లాంటి నవలల అనువాదాలు తెలుగులో ఎంతో ఆదరణ పొందాయి. ఎన్నో మేలిమి రచనలను ‘పీకాక్ క్లాసిక్స్’ ప్రత్యేకించి సంక్షిప్తంగా తెలుగులోకి అనువదింపజేసి ప్రచురించింది. సచిత్ర బొమ్మల భారతం, సచిత్ర బొమ్మల రామాయణం లాంటి పుస్తకాలు మనకు తెలియనివి కాదు. పిల్లల కోసం, పిల్లలంత ఓపిక మాత్రమే ఉన్న పెద్దల కోసం ఎన్నో పుస్తకాలు ఇలా పొట్టిరూపాల్లో వచ్చాయి.పుస్తకాలను సంక్షిప్తం చేయడం దానికదే ఒక ఎడిటింగ్ స్కిల్. సారం చెడకుండా, టోన్ మారకుండా, ‘అనవసర’ వివరాలు లేకుండా కుదించడం చిన్న విషయమేమీ కాదు. రచయిత ఒక పదం వాడటానికి ఎంతగా ఆలోచిస్తాడో, దాన్ని తొలగించడానికి సంక్షిప్తకుడు అంతే గింజుకుంటాడు. అలాంటి రంగంలోకి కృత్రిమ మేధ జొరబడటమే ఇప్పుడు సాహిత్య లోకంలో సంచలనమైంది. ఐఫోన్, ఐప్యాడ్ యూజర్ల కోసం జూలై నుంచి కొత్త ఏఐ యాప్ ‘మాజిబుక్’ అందుబాటులోకి వచ్చింది. ఆంగ్ల క్లాసిక్ రచనలను కుదించడం ఈ యాప్ ప్రత్యేకత. మాబీ డిక్, ఎ టేల్ ఆఫ్ టు సిటీస్, ద కౌంట్ ఆఫ్ మాంటె క్రిస్టో, క్రైమ్ అండ్ పనిష్మెంట్, డ్రాకులా, రాబిన్సన్ క్రూసో, ద త్రీ మస్కటీర్స్, ద పిక్చర్ ఆఫ్ డోరియన్ గ్రే, ద గ్రేట్ గాట్స్బీ లాంటి రచనలు ఇందులో ఉన్నాయి. ఇందులో అత్యధికం తెలుగులోకి అనువాదమైనవే. ఉదాహరణకు చార్లెస్ డికెన్స్ రాసిన ‘ఎ టేల్ ఆఫ్ టు సిటీస్’ ప్రారంభ వాక్యాలు ఉద్విగ్నభరితంగా ఉంటాయి. ‘ఇట్ వాజ్ ద బెస్ట్ ఆఫ్ టైమ్స్, ఇట్ వాజ్ ద వరస్ట్ ఆఫ్ టైమ్స్.’ (‘అది ఒక వైభవోజ్వల మహాయుగం, వల్లకాటి అధ్వాన్న శకం’; రెండు మహానగరాలు– తెన్నేటి సూరి అనువాదం.) వీటిని, ‘ఇట్ వాజ్ ఎ టైమ్ వెన్ థింగ్స్ వర్ వెరీ గుడ్ అండ్ వెరీ బ్యాడ్’ (‘అదొక చాలా మంచి చాలా చెడ్డల కాలం’) అని ఏఐ కుదించిందని విమర్శకులు ఎత్తిపొడుస్తున్నారు. సంక్లిష్టమైన వాక్య సంచయనానికి లోనుకావడం బౌద్ధిక వృద్ధికి కీలకం అంటారు యూనివర్సిటీ ఆఫ్ బఫెలోకు చెందిన లింగ్విస్టిక్స్ ప్రొఫెసర్ కసాండ్రా జాకబ్స్. రచయితలు తమ పదాలను ఉద్దేశపూర్వకంగా ఎంచుకుంటారనీ, ఏఐ సరళీకృతం చేయడంలో అవి నష్టపోతామనీ ఆమె చెబుతారు. కథకు సంబంధించిన అసలైన అంతరార్థం పోయి, అది తప్పుడు భావనకు దారితీయవచ్చని హెచ్చరిస్తారు. మరో రకమైన విమర్శ భాషకు సంబంధించినది. పొలిటికల్ కరెక్ట్‌నెస్, తటస్థ మాటల వాడుక పెరుగుతున్న నేపథ్యంలో, అలాగే శిక్షణ పొందివుండే ఏఐ ‘సహజంగానే’ రచనలోని అసలు మాటల స్థానంలో బోలు మాటలు చేర్చవచ్చు. కొన్నింటిని వివాదాస్పదమైన అంశాలుగా అది చూడవచ్చు. దాంతో రచనలోని భావోద్వేగ తీవ్రతకు తీవ్రనష్టం వాటిల్లుతుంది. అయితే, ‘పుస్తకాలను, వాటి ఆలోచనలను ప్రజాస్వామీకరించడమే’ తమ మిషన్ అని మాజిబుక్ సమర్థించుకుంటోంది. ఆంగ్లం నేర్చుకుంటున్నవారు, పిల్లలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ఇంకా డిస్లెక్సియా, తీవ్ర ఏడీహెచ్‌డీ ఉన్నవారికి ఇవి ఉపకరిస్తాయని చెబుతోంది.‘రోబో’ సినిమాలో ‘చిట్టి రోబో’ వందల పుస్తకాలను ఇట్టే స్కాన్ చేయగలుగుతాడు. పుస్తకాలు చదవాలి అనుకుంటూనే చదవలేకపోయే అందరి కల అది. తలగడగా పెట్టుకుంటే వాటికవే అక్షరాలు తలలోకి వెళ్లిపోతే బాగుంటుందని చిన్నతనంలో అనుకోనివాళ్లెవరు? అదంతా ‘కృత్రిమ’ ప్రపంచం. సహజ ప్రపంచంలో మనమే చదువుకోవాలి. సహజంగా చదవలేనప్పుడే కృత్రిమ సాయం అవసరం అవుతుంది. అయితే, రామాయణాన్ని ఆసాంతం చదవనూవచ్చు. కట్టె కొట్టె తెచ్చె అనేలా విషయమేమిటో తెలుసుకోనూవచ్చు. కానీ విషయం ఏమిటి అని తెలుసుకోవడంలో అసలు విషయం మొత్తం రాదనేది రసజ్ఞులందరికీ తెలుసు. విందు భోజనం విందు భోజనమే, రుచి చూడటం రుచి చూడటమే! ఏది కావాలి అనేది మన మేధో కడుపును బట్టి నిర్ణయించుకోవడమే. కానీ ఓసారంటూ రుచి చూడటం కూడా విందు భోజనానికి ఉపక్రమించేలా చేస్తుందేమో! కాకపోతే ఆ రుచి ఆ విందుకు దీటుగా ఉండాలి. -
‘భూత్’ బంగ్లా సర్కార్!
మాజీ ముఖ్యమంత్రిని భూతంతో పోల్చారు చంద్ర బాబు. ఆ భూతం మళ్లీ వస్తా వస్తా అంటున్నదనీ, దాన్ని భూస్థాపితం చేయాలంటూ చెలరేగిపోయారు. ఇంకా కిందకు జారి మాట్లాడారు. మొన్నటిదాకా ముఖ్యమంత్రిగా పనిచేసి, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి హోదాతో ఉన్న వ్యక్తిని భూతంతో పోల్చితే అవే హోదాలు ఇంకా ఎక్కువకాలం అనుభవించిన తాను ఏమవుతారు? భూతమా... దయ్యమా? ఆయనీమధ్య తాను ’95 మోడల్ ముఖ్యమంత్రినని పదేపదే చెప్పుకుంటున్నారు. ఆ 95 మోడల్ అంటే నిజంగా జనాన్ని పీల్చి పిప్పిచేసిన దయ్యాలమర్రి పాలనే! ప్రజలకు ఉచితంగా ఏదీ ఇవ్వకూడదంటూ నీతి శతకాలు రచించిన పాలకుడే నైన్టీ ఫైవ్ మోడల్. ధర్మాస్పత్రిలో జ్వరం బిళ్లకు సైతం యూజర్ ఛార్జీలు వసూలు చేసిన చేటుకాలమే 95 టూ 2004. ఆ తొమ్మిదేళ్ల కాలం ఉమ్మడి రాష్ట్ర రైతాంగ చరిత్రలో ఒక భీతావహ అధ్యాయం. నాగేటి చాళ్లలో క్షుద్ర విత్తనాలు మొలకెత్తిన కాలం. చేలల్లో చావు కంకులు విరగ్గాసిన కాలం. వేలాది రైతన్నలు ఉరికొయ్యలకు వేలాడిన రోజులు. 95 మోడల్‌కు వ్యవసాయం ఓ దండగమారి పని. అందువల్లనే ఆ మోడల్ అమలు చేసిన విధానాలు వ్యవసాయ రంగంలో విధ్వంసాన్ని సృష్టించాయి.’95 మోడల్‌నని చెప్పుకోవడమే కాదు, ఆ దారిలో ఇప్పుడు కూడా పయనిస్తున్నారు! ఐదేళ్ల తర్వాత రాష్ట్రంలో ఎరువుల కోసం రైతుల క్యూలైన్లు కన్పిస్తు న్నాయి. ‘అమూల్’ రంగప్రవేశంతో అధికాదాయం సంపాదించిన పాడి రైతుల నోట్లో అప్పుడే మట్టిపడింది. ‘అమూల్’ను రంగం నుంచి తప్పిస్తున్నారు. పోటీ లేక పోవడంతో హెరిటేజ్ తదితర సంస్థలు సేకరణ ధరను తగ్గిస్తున్నాయి.దేశంలోని ప్రస్తుత సీనియర్ మోస్ట్ రాజకీయవేత్తల్లో ఆయన ఒకరు. ముఖ్యమంత్రిగా ఇప్పుడు ఫోర్–ఓ (4.0) వెర్షన్. పదిహేనేళ్లపాటు మాజీ ముఖ్యమంత్రి అనే ట్యాగ్‌లైన్‌తో తిరిగారు. ఇంతటి అనుభవశాలి ఎందుకో కలవరపడుతున్నారు. అభద్రతా భావంతో తత్తరపాటుకు గురవుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి పేరు వింటేనే ఆయన సర్వేంద్రియాలు సంక్షో భానికి లోనవుతున్నవి. విజ్ఞత విలుప్తమైపోతున్నది. ఆయన జనంలోకి వెళితే ఈయన జ్వరపీడితుడవుతున్నారు. ఆ వేడికి భాష మరిగిపోతున్నది.విశాఖ సమీపంలో జరిగిన ఫార్మా కంపెనీ దుర్ఘటన సంద ర్భాన్నే తీసుకుందాము. బాధిత కుటుంబాలను ఓదార్చడానికి మాజీ ముఖ్యమంత్రి అక్కడికి వెళ్లారు. చికిత్స పొందుతున్న ప్రతి ఒక్కరినీ అనునయించి ధైర్యం చెప్పారు. అండగా నిలబడతానని భరోసా ఇచ్చారు. ఆయన రాకను పురస్కరించుకొని వేలాది జనం అక్కడ గుమిగూడారు. ఈ పరిణామం ముఖ్యమంత్రికి ఆగ్రహం తెప్పించింది. ఆ తర్వాత కాసేపటికి జరిగిన ఒక గ్రామ సభలో ఆయన మాటలు అదుపు తప్పాయి.మాజీ ముఖ్యమంత్రిని భూతంతో పోల్చారు. ఆ భూతం మళ్లీ వస్తా వస్తా అంటున్నదనీ, దాన్ని భూస్థాపితం చేయా లంటూ చెలరేగిపోయారు. ఇంకా కిందకు జారి మాట్లాడారు. మొన్నటిదాకా ముఖ్యమంత్రిగా పనిచేసి, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి హోదాతో ఉన్న వ్యక్తిని భూతంతో పోల్చితే అవే హోదాలు ఇంకా ఎక్కువకాలం అనుభవించిన తాను ఏమవు తారు? భూతమా... దయ్యమా? ఆయనీమధ్య తాను ’95 మోడల్ ముఖ్యమంత్రినని పదేపదే చెప్పుకుంటున్నారు. ఆ 95 మోడల్ అంటే నిజంగా జనాన్ని పీల్చి పిప్పిచేసిన దయ్యాలమర్రి పాలనే!ప్రజలకు ఉచితంగా ఏదీ ఇవ్వకూడదంటూ నీతి శతకాలు రచించిన పాలకుడే నైన్టీ ఫైవ్ మోడల్. ధర్మాస్పత్రిలో జ్వరం బిళ్లకు సైతం యూజర్ ఛార్జీలు వసూలు చేసిన చేటుకాలమే 95 టూ 2004. ఆ తొమ్మిదేళ్ల కాలం ఉమ్మడి రాష్ట్ర రైతాంగ చరిత్రలో ఒక భీతావహ అధ్యాయం. నాగేటి చాళ్లలో క్షుద్ర విత్తనాలు మొల కెత్తిన కాలం. చేలల్లో చావు కంకులు విరగ్గాసిన కాలం. వేలాది రైతన్నలు ఉరికొయ్యలకు వేలాడిన రోజులు. 95 మోడల్‌కు వ్యవసాయం ఓ దండగమారి పని. అందువల్లనే ఆ మోడల్ అమలు చేసిన విధానాలు వ్యవసాయ రంగంలో విధ్వంసాన్ని సృష్టించాయి.’95 మోడల్‌నని చెప్పుకోవడమే కాదు, ఆ దారిలో ఇప్పుడు కూడా పయనిస్తున్నారు! ఐదేళ్ల తర్వాత రాష్ట్రంలో ఎరువుల కోసం రైతుల క్యూలైన్లు కన్పిస్తున్నాయి. ‘అమూల్’ రంగప్రవేశంతో అధికాదాయం సంపాదించిన పాడి రైతుల నోట్లో అప్పుడే మట్టిపడింది. ‘అమూల్’ను రంగం నుంచి తప్పిస్తున్నారు. పోటీ లేకపోవడంతో హెరిటేజ్ తదితర సంస్థలు సేకరణ ధరను తగ్గిస్తున్నాయి. రెండున్నర మాసాల్లోనే ‘95 మోడల్’ చూపెట్టిన చిన్న ఝలక్ మాత్రమే ఇది. ముందున్నది అసలైన నిజరూప దర్శనం.పేదలకు ఉచితంగా ఏదీ ఇవ్వకూడదు, ప్రైవేట్ గద్దలకు మాత్రం సమస్త వనరులను దోచిపెట్టాలన్నది ఆ మోడల్ నిత్యం జపించే తిరుమంత్రం. అందుకే ‘అమ్మ ఒడి’ ఆగిపోయింది. అందుకే ‘రైతు భరోసా’ ఆగిపోయింది. ‘విద్యా దీవెన’, ‘విద్యా కానుక’లు ఆగిపోయాయి. పంటల బీమా, మత్స్యకార భరోసా వెనక్కు మళ్లాయి. ఇంటి దగ్గర దర్జాగా పెన్షన్లు తీసు కున్న అవ్వాతాతలను నాయకుల ఇళ్ల ముందు నిలబెట్టుకుంటున్నారు. నిరుపేదల బిడ్డలు సైతం సంపన్న శ్రేణితో సమానంగా అంతర్జాతీయ స్థాయి విద్యను అభ్యసించడానికి అంది వచ్చిన అవకాశాన్ని ఈ ’95 మోడల్ వచ్చీరాగానే తన్ని తగలేసింది. ఐబీ సిలబస్‌ను అటకెక్కించారు. ఇంగ్లిషు మీడియం ఉపసంహరణకు రంగం సిద్ధమైంది.పేదలు, బలహీనవర్గాలు, మహిళల సాధికారత కోసం కార్యక్రమాలు చేపట్టినందుకే మాజీ ముఖ్యమంత్రిని మన ‘95 మోడల్’ భూతంగా పరిగణిస్తున్నది. ఈ ధోరణి కొత్త కాదు. పేద ప్రజల పక్షాన నినదించిన ప్రతి గొంతుకనూ దయ్యాలు, భూతాల గొంతుకగా బ్రాండింగ్ చేయడం, దుష్ప్రచారానికి ఒడి గట్టడం శతాబ్దాలకు పూర్వమే ప్రారంభమైంది. 1848లో కార్ల్ మార్క్స్ ప్రచురించిన కమ్యూనిస్టు మేనిఫెస్టో ‘యూరోప్‌ను కమ్యూనిస్టు భూతం వెంటాడుతున్నది’ అనే వాక్యంతో ప్రారంభమైంది. కమ్యూనిస్టు భావజాలాన్ని భూతంగా భావించే నాటి పాలక ప్రతిపక్ష పార్టీలకు హెచ్చరికగా మార్క్స్ ఈ వాక్యాన్ని రాశారు.ఇప్పుడూ అంతే! ఐదేళ్ల కాలంలో రెండు లక్షల డెబ్బయ్ వేల కోట్ల ప్రజా ధనాన్ని ప్రజల అకౌంట్లలోకే బదిలీ చేసి అణ గారిన జీవితాలనూ, వాటితోపాటు ఆర్థిక వ్యవస్థను కూడా ఉద్దీపింపజేసిన దార్శనిక పాలనను భూతాల పరిపాలనగా ప్రచారం చేస్తున్నారు. వైద్యాన్ని ప్రజల ప్రాథమిక హక్కుగా గుర్తిస్తూ, ప్రజా వైద్య విధానాన్ని రూపొందించిన ప్రభుత్వానిది భూతాల పాలనట! దాన్నిప్పుడు ప్రైవేట్ పెట్టు బడికి తాకట్టు పెట్టడానికి చేస్తున్న ప్రయత్నాలు ప్రగతిశీలమట! దయ్యాలు వేదాలు వల్లించడమంటే అచ్చంగా ఇదే కదా! ఈ ముఖ్యమంత్రి ఇప్పుడు అదే పని చేస్తున్నారు.ఏ ప్రభుత్వం ఎవరి ప్రయోజనాల కోసం పనిచేసిందనే అంశంపై చర్చ జరపడం ఒక భాగం. ఎవరిది ప్రజాస్వామ్య రాజ కీయమో, ఎవరిది దయ్యాలు – భూతాల రాజకీయమో తేల్చడా నికి ఇంకో చర్చ కూడా ఉన్నది. వారు ఏ రకంగా అధికారంలోకి వచ్చారన్నది పరిశీలించడానికి ఈ చర్చ జరగాలి. ఈ ముఖ్యమంత్రి తొలి రౌండ్లో ఏవిధంగా అధికారంలోకి వచ్చారన్నది జగమెరిగిన వెన్నుపోటు కథ. పార్టీ ఆయన స్థాపించినది కాదు. ఎమ్మెల్యేలను గెలిపించిందీ ఆయన కాదు. వదంతులను ప్రచారం చేసి, ఎమ్మెల్యేలను ‘వైస్రాయ్’లో నిర్బంధించి, మీడియాతో కుమ్మక్కయి, రాజ్యాంగ వ్యవస్థలను మచ్చిక చేసు కుని దొడ్డిదారిన అధికార పీఠమెక్కారు. మాజీ ముఖ్యమంత్రి రాజకీయ ప్రస్థానం ఇందుకు పూర్తిగా భిన్నమైన ప్రయాణం. ఆయనే స్వయంగా పార్టీని నిర్మించుకున్నారు. ఇందుకు భారీ మూల్యాన్ని ఆయన చెల్లించుకోవలసి వచ్చింది.అయినా తలొగ్గ కుండా జనంలోకి వెళ్లారు. అలవికాని వాగ్దానాలను చేయడానికి నిరాకరించి కోరి ఓటమిని తెచ్చుకున్నారు. ప్రతిపక్షంలో ఐదేళ్లు గట్టిగా నిలబడి ఒంటరి పోరాటంతోనే ముఖ్యమంత్రి అయ్యారు. భూతం ఎవరు? రాచబాటలో వచ్చినవారా? దొడ్డి దారిన ప్రవేశించిన వారా?ప్రస్తుత ముఖ్యమంత్రి ఈ సంవత్సరం జరిగిన ఎన్నికల్లో నాలుగో దఫా ఎలా అధికారంలోకి వచ్చారు? పెంపుడు మీడియాను ఉసిగొలిపి పాత ప్రభుత్వంపై అవాకులు చెవాకులు ప్రచారం చేశారు. సరిపోలేదు. కాళ్లావేళ్లా పడి ఎన్డీఏ కూటమిలో చేరారు. ఎన్నికల సంఘాన్ని అదుపులో పెట్టుకున్నారు. ఇది కూడా సరిపోలేదని స్వతంత్ర పరిశోధకులు, సంస్థలు బల్లగుద్ది చెబుతున్నాయి. పోలింగ్ జరిగిన రోజు రాత్రి 8 గంటలకు ఆంధ్రప్రదేశ్‌లో 68 శాతానికి పైగా ఓట్లు పోలైనట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది.ఆ తర్వాత తీరిగ్గా నాలుగు రోజుల సమయం తీసుకొని 81 శాతం పోలైనట్టు ప్రకటించింది. ఇది అసాధార ణమని ‘ఓట్ ఫర్ డెమోక్రసీ’ (వీఎఫ్‌డీ) అనే సంస్థ వాదిస్తున్నది. గతంలో ఎన్నడూ ఈ తేడా ఒక శాతం కన్నా అధికంగా ఉండేది కాదు. ఈసారి ఏపీలో అది 12.5 శాతంగా నమోదైంది. ఈవీ ఎమ్ల మాయాజాలమే ఈ అధిక ఓట్ల నమోదుకు ప్రధాన కార ణమని వీఎఫ్‌డీ ఆరోపిస్తున్నది. ఎన్డీఏ మౌత్‌పీస్‌గా పనిచేసే ఓ జాతీయ చానల్ కూడా నిన్న ప్రసారం చేసిన ఒక సర్వే వివరాల్లో చంద్రబాబుకు 44 శాతం ప్రజల మద్దతున్నట్టు తేల్చింది. కూటమికి పడిన 56 శాతం ఓట్లలో ఇది 12 శాతం కోత. వీఎఫ్‌డీ చెబుతున్న అక్రమ ఓట్లకు ఈ నంబర్ సరిపోతున్నది.వీఎఫ్‌డీ ఈ వ్యవహారంపై ఒక సమగ్రమైన రిపోర్టును విడుదల చేసి, నెలరోజులు దాటినా ఇప్పటివరకూ ఎన్నికలసంఘం స్పందించలేదు. ఈ కృత్రిమ అధిక ఓట్ల నమోదు కార ణంగా కేంద్రంలోనూ, ఏపీ, ఒడిషాల్లోనూ గెలవాల్సిన పక్షాలు ఓడిపోయాయి. పోలింగ్ శాతంపై కొన్ని రోజుల తర్వాత చేసిన తుది ప్రకటనకూ, లెక్కించిన ఓట్లకూ కూడా తేడాలున్నాయి. సుమారు 390 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఈ తేడాలున్నాయని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) వెల్లడించింది. కొన్ని నియోజకవర్గాల్లో లెక్కించిన ఓట్లు పోలయినట్టు ప్రకటించిన ఓట్ల కంటే తక్కువున్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో ఎక్కువున్నాయి. ఇదెలా సాధ్యం? ఎలక్ట్రానిక్ వోటింగ్ మిషన్లలో దయ్యాలు, భూతాలు దూరితేనే సాధ్యమవుతుంది.ఆ దయ్యాలూ, భూతాలు ఎట్లా దూరాయన్న రహస్యం విజేతలకు మాత్రమే తెలుస్తుంది.వారికి అనుబంధంగా పని చేసిన ఎన్నికల సంఘానికి మాత్రమే తెలుస్తుంది. దేశవ్యాప్తంగా ఈ అంశంపై పలువురు మేధావులు గొంతెత్తి మాట్లాడారు. చర్చోపచర్చలు జరుగుతున్నాయి. అయినా ఎన్నికల సంఘం మాత్రం నోరు విప్పలేదు. పైపెచ్చు, అనుమానం ఉన్న నియో జకవర్గాల్లో 5 శాతం వీవీ ప్యాట్లను లెక్కించాలని సుప్రీంకోర్టు చెప్పిన విషయంపై కూడా ఈసీ వక్రభాష్యాలు చెబుతున్నది. ఈవీఎమ్‌లపై అధికారికంగా ఫిర్యాదులు చేసిన అభ్యర్థులను ఉపసంహరించుకోవాలని ఒత్తిడి తేవడం కూడా పలు అను మానాలకు తావిచ్చింది. ఏపీలో ఎన్డీఏ కూటమి కూడా ఈఅంశంపై నోటికి తాళం వేసుకున్నది. కచ్చితంగా ఏదో జరిగిందన్నది అఖిలాంధ్ర ప్రజల నిశ్చితాభిప్రాయం. ఎన్నికల హామీల నుంచి, ఈవీఎమ్‌ల బాగోతం నుంచి పక్కదారి పట్టించే ప్రయత్నాల్లో కూటమి పెద్దల మాటలూ, చేతలు అదుపు తప్పుతున్నాయి. రాజకీయ ప్రత్యర్థిని భూస్థాపితం చేసి పైకి రాకుండా కాంక్రీట్ పోయాలనే పైశాచిక ఆలోచనలు చెలరేగు తున్నాయి.vardhelli1959@gmail.comవర్దెల్లిమురళి -
వినూత్న విదేశాంగ విధానం
నలుగురు నడిచిన బాటలో నడవటం, సంప్రదాయంగా వస్తున్న విధానాలను అనుసరించటం శ్రేయస్కరమని చాలామంది అనుకొనేదే. కొత్త ప్రయోగాలకు దిగితే ఏం వికటిస్తుందోనన్న సంశయమే ఇందుకు కారణం. ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించిన తాజా యూరోప్ పర్యటన మన విదేశాంగ విధానం కొత్త మలుపు తిరిగిన వైనాన్ని వెల్లడించింది. ఇది మంచిదా, కాదా అన్నది మున్ముందు తేలుతుంది. అయితే తాము ఎవరికీ దగ్గరా కాదు... దూరమూ కాదని అటు రష్యాకూ, ఇటు పాశ్చాత్య దేశాలకూ మనం చెప్పినట్టయింది. ఒక రకంగా ఇది ప్రచ్ఛన్న యుద్ధ దశలో మన దేశం అనుసరించిన అలీన విధానాన్ని గుర్తుకుతెస్తుంది. మోదీ రెండు రోజులు పోలెండ్‌లో పర్యటించారు. అధ్యక్షుడు ఆంద్రెజ్ దుదాతో సమావేశమయ్యారు శుక్రవారం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో చర్చలు జరిపారు. ఇవి రివాజులో భాగంగా సాగిన పర్యటనలు కాదు. మన దేశ ప్రధాని ఒకరు పోలెండ్‌ను సందర్శించటం గత నలభై అయిదేళ్లలో ఇదే తొలిసారి. 1955లో అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, 1967లో ఇందిరా గాంధీ, 1979లో మొరార్జీ దేశాయ్ ఆ దేశంలో పర్యటించారు. కానీ అప్పటికది సోవియెట్ యూనియన్ ఛత్రచ్ఛాయలో ఏర్పడ్డ వార్సా సైనిక కూటమిలో భాగం. అయితే, 1991లో సోవియెట్ యూనియన్ కుప్పకూలడానికి చాలా ముందే పోలెండ్ బాట మార్చింది. సోవియెట్‌కు వ్యతిరేకంగా ఏర్పడిన నాటో కూటమి దేశాలకు చేరువైంది. 1999లో నాటోలో చేరింది. 2004లో యూరొపియన్ యూనియన్ (ఈయూ)లో భాగమైంది. ఆ తర్వాత మరెప్పుడూ మన ప్రధానులు ఆ దేశాన్ని సందర్శించ లేదు. ఇక సోవియెట్‌లో ఒకప్పుడు భాగమైన ఉక్రెయిన్ 26 ఏళ్ల క్రితం స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది. పాశ్చాత్య దేశాల సలహాతో తన అణ్వస్త్రాలను స్వచ్ఛందంగా వదులుకుంది. భిన్న సందర్భాల్లో వాటి మనోభావాలకు తగినట్టు తన విధానాలను తీర్చిదిద్దుకుంది. వాజపేయి హయాంలో మన దేశం నిర్వహించిన అణు పరీక్షలను వ్యతిరేకిస్తూ ప్రకటనలు చేసింది. మన కశ్మీర్ విధానాన్ని ఖండిస్తూ వచ్చింది. పాకిస్తాన్‌కు శతఘ్నులు విక్రయించింది. రెండు దేశాల మధ్య ఉండే ద్వైపాక్షిక సంబంధాలు మూడో దేశానికి వ్యతిరేకమని భావించటం మూర్ఖత్వమే అవుతుంది. అలాంటి మూర్ఖత్వాన్ని ఈమధ్య అమెరికాతో పాటు ఉక్రెయిన్ కూడా ప్రదర్శించింది. జూలై రెండో వారంలో మోదీ రష్యాలో పర్యటించినప్పుడు జెలెన్స్కీ ట్విటర్ వేదికగా భారత్‌ను విమర్శించారు. నెత్తురంటిన పుతిన్‌తో ఎలా కరచాలనం చేస్తారని మోదీని ప్రశ్నించారు. ప్రపంచంలోనే అత్యంత క్రూరుడైన నేరగాడిని హత్తుకోవటం విచారకరమన్నారు. ఆ సమయంలో మోదీ తమ దేశంలో ఉన్నారన్న సంగతిని కూడా విస్మరించి కియూవ్‌లో పిల్లల ఆస్పత్రిపై రష్యా బలగాలు దాడి చేసిన మాట వాస్తవమే. అయితే ఆ ఉదంతాన్ని పుతిన్ సమక్షంలోనే మోదీ ఖండించారు. అయినా జెలెన్స్కీకి అది సరిపోలేదు. తాము రష్యాతో యుద్ధం చేస్తున్నాం గనుక ప్రపంచమంతా దాన్ని దూరం పెట్టాలన్న వైఖరిని ప్రదర్శించారు. ఇది తెలివితక్కువతనం. భారత్–రష్యా సంబంధాల సంగతే తీసుకుంటే రష్యా అనేక కారణాల వల్ల పాకిస్తాన్‌కు ఆయుధ విక్రయంపై ఉన్న ఆంక్షలను పదేళ్లక్రితం సడలించింది. దూరశ్రేణి క్షిపణులు, ఇతర రక్షణ పరికరాలు అందజేసింది. ఎంఐ–26 సైనిక రవాణా హెలికాప్టర్లను సమకూర్చుకోవటానికి సాయం అందజేసింది. మనకు ఆయుధాలు, ఇతర రక్షణ పరికరాలు విక్రయించినప్పుడల్లా సమతూకం పాటించే నెపంతో పాకిస్తాన్‌కు కూడా అమ్మకాలు సాగించటం రష్యా నేర్చుకుంది. చైనాతో దాని సంబంధాలు సరేసరి. ఇలా మనకు బద్ధ వ్యతిరేకమైన రెండు దేశాలతో రష్యా సంబంధాలు నెరపుతున్నప్పుడు మనం మాత్రం తమతోనే ఉండాలని అటు రష్యా, ఇటు ఉక్రెయిన్ కోరుకోవటం అర్థరహితం.రష్యా – ఉక్రెయిన్ల మధ్య మూడేళ్లుగా సాగుతున్న యుద్ధాన్ని ఆపటానికి ఒక తటస్థ దేశంగా భారత్ కృషి చేయాలని చాలా దేశాలు ఆశపడుతున్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణను మన దేశం ఖండించలేదు. రష్యాను విమర్శిస్తూ తీసుకొచ్చిన తీర్మానాలపై వోటింగ్ సమయంలో మన దేశం గైర్హాజరైంది. అయితే యుద్ధ క్షేత్రంలో కాక చర్చలతో, దౌత్యంతో మాత్రమే ఏ సమస్యకైనా పరిష్కారం లభిస్తుందని వివిధ అంతర్జాతీయ వేదికలపై మోదీ ఈ మూడేళ్లుగా చెబుతూ వచ్చారు. ఇరు దేశాలూ చర్చలకు సిద్ధపడాలని పిలుపునిచ్చారు. సరిగ్గా నాటో 75 యేళ్ల ఉత్సవాల సందర్భంలో రష్యా పర్యటనను ఎంచుకున్నందుకు అమెరికా ఆగ్రహించింది. అయితే ఎడతెగకుండా సాగుతున్న ఈ యుద్ధానికి ముగింపు పలకడమెలా అన్నది దానికి బోధపడటం లేదు. తన మద్దతుతో, పాశ్చాత్య దేశాల సహకారంతో 3, 4 నెలల్లో రష్యాను ఉక్రెయిన్ అవలీలగా జయిస్తుందన్న భ్రమ మొదట్లో అమెరికాకు ఉంది. కానీ రోజులు గడిచేకొద్దీ అది కొడిగట్టింది. నిరుడు ఫిబ్రవరిలో శాంతి సాధన పేరుతో చైనా ఒక ప్రతిపాదన చేసింది. కానీ అందులో రష్యావైపే మొగ్గు కనబడుతోందన్న విమర్శలొచ్చాయి. పైపెచ్చు చైనా అధికారిక మీడియా మొదటి నుంచీ రష్యాను వెనకేసుకొస్తోంది. ఇలాంటి సమయంలో భారత్ దౌత్యంపై ఆశలేర్పడటం సహజం. అయితే పరస్పరం తలపడుతున్న వైరి పక్షాలు మానసికంగా చర్చలకు సిద్ధపడితే తప్ప ఎవరి ప్రయత్నాలైనా ఫలించే అవకాశాలుండవు. ముఖ్యంగా ఈ యుద్ధంలోని నిరర్థకతను రష్యాతో పాటు అమెరికా, యూరొప్ దేశాలు గుర్తించాల్సివుంది. ఆ తర్వాతే ఉక్రెయిన్ దూకుడు తగ్గుతుంది. ఆ మాటెలావున్నా మోదీ పర్యటన మన విదేశాంగ విధానానికి కొత్త బాట పరిచింది. -
మనిషితనం మాయమైందా?
సమాజం సహించలేని కొన్ని ఘటనలు ఆవేదన కలిగిస్తాయి. ఆగ్రహం రప్పిస్తాయి. చట్టాలెన్ని ఉన్నా ఆగకుండా సాగుతున్న అకృత్యాలపై ఏమీ చేయలేమా అన్న ఆక్రోశం రగిలిస్తాయి. కోల్‌కతా వైద్యశిక్షణార్థి ‘అభయ’ ఘటన నుంచి దేశం ఇంకా తేరుకోక ముందే, మహారాష్ట్రలోని థానే జిల్లా బద్లాపూర్‌లో పసిపిల్లల పాఠశాలలో నాలుగేళ్ళ వయసు చిన్నారులు ఇద్దరిపై పాఠశాల పనివాడి అమానుష కృత్యం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ ఘటన వివరాలు వింటుంటేనే మనసు వికలమవుతుంది. ప్రజా నిరసనల రీత్యా మహారాష్ట్ర సర్కార్ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది సరే, పిల్లలకు బడిలోనే భద్రత లేకపోతే ప్రతి ఒక్కరికీ విద్యాహక్కు గురించి చర్చిస్తే ఏమి లాభమన్న బొంబాయి హైకోర్ట్ తాజా వ్యాఖ్యలు నిష్ఠురమైనా నిజమే. ఇప్పుడిక ప్రతి స్కూలులో నెలరోజుల్లోగా సీసీ టీవీ కెమెరాలు పెట్టాలి, వారంలో మూడుసార్లైనా ఆ ఫుటేజ్‌ను పరిశీలించాలి లాంటి సర్కారీ ఆదేశాలు షరా మామూలే. కానీ, కోల్‌కతా నుంచి బద్లాపూర్ దాకా అన్నిచోట్లా రాజ్యవ్యవస్థ చేతిలో ప్రజావిశ్వాసం కుప్పకూలడం సమకాలీన భారత విషాదం. పసిపిల్లలపై అకృత్యం జరిగితే, ఆ తల్లితండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి సహకరించడానికి బదులు సదరు ‘ఆదర్శ విద్యాలయం’ ఘటనను కప్పిపుచ్చేందుకు ప్రయత్నించడం విషాదం. విద్యాబుద్ధుల కోసం బడికి పిల్లల్ని పంపి, వారు అక్కడ భద్రంగా ఉంటారని భావించే కన్నవారికి ఇది భరించలేని కష్టం. పైగా, ఫిర్యాదు దాఖలుకు వారిని 11 గంటల పైగా వేచి ఉండేలా చేయడం దేనికి సంకేతం? ఇలాంటి ఘటనల్లో పాఠశాల వారినీ బాధ్యుల్ని చేస్తూ, ‘పోక్సో’ చట్టం కింద కేసు కట్టాలి. ఆ కనీస బాధ్యతను సైతం పోలీసులు విస్మరించడం క్షమించరాని దుర్మార్గం. చివరకు బొంబాయి హైకోర్ట్ ఆ లోపాన్ని ఎత్తిచూపాల్సి వచ్చింది. ‘అభయ’ ఘటనలోనూ అచ్చంగా ఇలాంటివే జరిగాయి. ఇలాంటి ఆటవిక చర్యలు ఎక్కడ జరిగినా జెండాలకు అతీతంగా రాజకీయ పక్షాలన్నీ ముక్తకంఠంతో ఖండించాల్సి ఉండగా, స్వీయ రాజకీయలబ్ధికై ప్రయత్నించడం సిగ్గుచేటు. కోల్‌కతా ఘటనపై రచ్చ చేసే పార్టీ బద్లాపూర్పై నోరు మెదపదు. త్వరలో ఎన్నికలు జరగనున్న మహారాష్ట్రలోని బద్లాపూర్పై హంగామా చేసేవారు కోల్‌కతా ఘటనపై కంటితుడుపుకే పరిమితమవుతారు. రాజ్యాంగబద్ధ హోదాలోని బెంగాల్ గవర్నర్ టీవీ డిబేట్లలో కూర్చొని రాష్ట్ర సర్కార్‌ను దూషిస్తూ ఇంటర్వ్యూలిస్తుంటే ఏమనుకోవాలి? సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన ఘటనలపైనా నిజాయతీ వదిలేసి నీచ రాజకీయాలు చేస్తే దేశం ఏటు పోతుంది?ఉవ్వెత్తున ఎగసిపడ్డ భారీ నిరసనల నేపథ్యంలో కోల్‌కతా అంశంపై సుప్రీమ్ కోర్ట్, బద్లాపూర్ ఘటనపై బొంబాయి హైకోర్ట్ తమకు తాము స్వచ్ఛందంగా విచారణ చేపట్టడమే ఒకింత ఊరట. న్యాయవ్యవస్థ పట్ల సామాన్యుల్లో మినుకు మినుకుమంటున్న ఆశాదీపానికి కోర్టు చొరవ ఒక చిన్న కాపుదల. ఇవాళ దేశంలో రోజూ 90 అత్యాచారాలు జరుగుతున్నాయి. ఆనక హత్య చేసి, అడ్డు తొల గించడాలూ పెరిగిపోతున్నాయి. నోరు విప్పి చెప్పుకోలేని వారి పట్ల నీచప్రవర్తనలూ పెచ్చరిల్లుతున్నాయి. మన మధ్యే మామూలు వ్యక్తుల్లా తిరుగుతున్న మానవ మృగాలను నిరోధించడం కఠిన సమస్యే. అయితే, మనసుంటే మార్గాలుంటాయి. మహిళలు, పిల్లల కోసం ‘మినీ – పోలీస్ స్టేషన్ల’ను ఏర్పాటు చేయాలని మహారాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ సంఘం లాంటివి సిఫార్సు చేస్తున్నాయి. సుప్రీమ్ కోర్ట్ గురువారం బెంగాల్ సర్కార్‌కు ముక్కచీవాట్లు పెట్టిన నేపథ్యంలో సీఎం మమత సైతం తీవ్రతను అంగీకరించారు. అత్యాచార నేరాలపై అత్యంత కఠిన చట్టాలు చేయాలనీ, ఇలాంటి కేసుల్ని 15 రోజుల్లో పరిష్కరించేలా ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు పెట్టాలనీ ప్రధానిని కోరారు. అంతకన్నా ముందు సమాజంగా మనం ఆత్మశోధన చేసుకోవాలి. 2012 నాటి ‘నిర్భయ’ ఘటన తర్వాత కఠినచట్టాలు చేసినా పరిస్థితులు మారలేదంటే లోపం ఎక్కడున్నట్టు? వావివరుసలు లేవు, వయసులో చిన్నాపెద్దా విచక్షణ లేదు, చట్టం పట్ల భయభక్తులు అసలే లేవు. ఇలా ఉచ్చం నీచం మరిచి, చివరకు చిన్నారులపైనా మనుషులు మృగాలుగా మారడానికి దారి తీస్తున్న సాంఘిక, మానసిక పరిస్థితుల్ని లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. మన వెనకాలే ఊడలు దిగుతున్న ఈ వికృత ధోరణిని పెంచి పోషిస్తున్న మన వినోద, వినిమయ సంస్కృతులు, వైయక్తిక ప్రవర్తనల్ని సమీక్షించుకోవాల్సి ఉంది. ఈ భూతాన్ని ఆపేదెలా అని సత్వరమే ఆలోచించాల్సి ఉంది. ఇప్పటికీ ఆడవాళ్ళను ఆటవస్తువులుగా చూసే సామాజిక వైఖరి, మగవాళ్ళు ఏం చేసినా చెల్లుతుందనే ఆధిపత్య భావజాలం లాంటి అనేక అంశాల్లో మనం మారాల్సి ఉంది. కోర్టుల చొరవ, ఆదేశాలతో రానున్న రోజుల్లో కోల్‌కతా కేసు, బద్లాపూర్ కేసులు త్వరితగతినే తేలితే తేలవచ్చు. నిందితులకు కఠిన శిక్షలూ ఖాయం కావచ్చు. కానీ, దేశవ్యాప్తంగా సంచలనమైన ఈ ఒకటి రెండు కేసుల్లోనే కాదు... వెలుగులోకి రాని వందల ఘటనలకు మూలకారణమైన మౌలిక అంశాలపై మనం ఎప్పటికి కళ్ళు తెరుస్తాం? సాక్షాత్తూ శిష్యులపై రేప్‌తో 20 ఏళ్ళ జైలుశిక్ష అనుభవిస్తున్న డేరా బాబాకు హర్యానాలో ఎన్నికల వేళ పదేపదే పెరోల్ ఇస్తూ పోతుంటాం. గత నాలుగేళ్ళలో 234 రోజులు ఆయన జైలు బయటే ఉన్నారు. మైనర్ బాలిక రేప్ కేసులో జీవిత ఖైదులో ఉన్న మరో బాబా ఆశారామ్ బాపూను ఆయుర్వేద చికిత్సకై తాజాగా బయటకు వదులుతాం. అన్ని వ్యవస్థలనూ నీరుగార్చి, అధికారం సహా అనేక బలహీనతలతో పాలకులు చేసే ఈ పాపాలన్నీ శాపాలు కాక మరేమవుతాయి? జనం మూడోకన్ను తెరవాల్సిన సమయం వచ్చింది. -
సుప్రీమ్ ‘అభయ’మ్!
హేయమైన కోల్‌కతా హత్యాచార ఘటనపై సర్వోన్నత న్యాయస్థానం స్వచ్ఛందంగా జోక్యం చేసుకోవడం వ్యవస్థలపై సడలుతున్న నమ్మకాన్ని కాస్త నిలబెట్టింది. విధినిర్వహణలోని వైద్యశిక్షణార్థి జీవితాన్ని చిదిమేసిన ఆగస్ట్ 9 నాటి ఉదంతంతో వైద్యసేవకుల భద్రత, ఇతర అంశాలకు సంబంధించి సిఫార్సులు చేసేందుకు నేషనల్ టాస్క్‌ఫోర్స్ (ఎన్టీఎఫ్)ను సుప్రీమ్ కోర్టు మంగళవారం ఏర్పాటు చేసింది. సంతృప్తి చెందక జాతీయస్థాయిలో జూనియర్ డాక్టర్లు నిరసనలు కొనసాగిస్తున్నా అసలంటూ రోగాన్ని గుర్తించి, మందు కనుగొనే ప్రయత్నమైనా జరుగుతున్నందుకు సంతోషించాలి. ప్రముఖ డాక్టర్ల సారథ్యంలోని ఈ టాస్క్‌ఫోర్స్ మహిళలు సురక్షితంగా పని చేసేందుకు చేపట్టాల్సిన సమూల సంస్కరణలపై సిఫార్సులు చేయనుంది. కోర్ట్ ఆదేశించినట్టు మూడు వారాల్లో మధ్యంతర నివేదిక, రెండు నెలల్లో తుది నివేదిక సమర్పించాల్సి ఉంది. దేశంలో నూటికి 80 ప్రజారోగ్య వసతుల్లో నిర్ణీత ప్రమాణాలైనా లేవని జాతీయ హెల్త్ మిషనే చెబుతోంది. ఈ పరిస్థితుల్లో పనిప్రదేశంలో సురక్షిత వాతావరణ కల్పనకు ఒక విధాన ఏర్పాటుకు జాతీయ వైద్యసంఘం గత వారమే వైద్యకళాశాలలకూ, ఆస్పత్రులకూ నోటీసిచ్చింది. వైద్యులకు విశ్రాంతి గదులు, నిఘాకు సీసీ టీవీలు కరవైన మన ఆరోగ్య వ్యవస్థకు ఇప్పుడు టాస్క్‌ఫోర్స్ సిఫా ర్సుల చికిత్స చేయాల్సి ఉంది. ఇదిలా ఉండగానే ఆడవాళ్ళు నైట్‌డ్యూటీలలో లేకుండా చూడాలని బెంగాల్ సర్కార్, ఒకవేళ డ్యూటీలో ఆడవాళ్ళుంటే వారికి తోడుండేలా చూడాలని కేంద్ర సర్కార్ సూచనలివ్వడం విడ్డూరం. శ్రామిక శక్తిలో మహిళా భాగస్వామ్యం తక్కువున్న దేశంలో దాన్ని మరింత తగ్గించే ఇలాంటి ఆదేశాలు తిరోగమన «ఆలోచనా ధోరణికి అద్దం పడుతున్నాయి.కోల్‌కతా ‘అభయ’ ఘటన, చర్యల్లో ప్రభుత్వ యంత్రాంగం చేతగానితనంపై దేశమంతటా ప్రజాగ్రహం పెల్లుబుకుతుంటే... పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ యంత్రాంగం దృష్టి అంతా విమర్శకుల నోళ్ళు మూయించడంపై ఉండడం విషాదం. నిరసనకారులపై ‘రాజ్యాధికారం’ ప్రయోగించే కన్నా దేశవ్యాప్తంగా లోలోపలి భావోద్వేగాలు బయటపడుతున్న వేళ వారితో మరింత సున్నితంగా వ్యవహరించాలని సాక్షాత్తూ సుప్రీమ్ కోర్ట్ హితవు చెప్పాల్సి వచ్చింది. అదే సమయంలో – ఘటన జరిగిన ఆర్జీ కార్ ఆస్పత్రికి అప్పట్లో ప్రిన్సిపాల్‌గా వ్యవహరించిన వ్యక్తిపై తీవ్రమైన ఆరోపణలున్నా ప్రభుత్వ పెద్దలు ఆయనను కాపాడాలని చూడడం నీచం. సదరు వ్యక్తి మానవ అక్రమ రవాణాకూ, బలవంతపు వసూళ్ళకూ పాల్పడినట్టు ఆయన మాజీ సహచరులే ఆరోపిస్తున్నారు. ఇక, ఆస్పత్రిలో సాగిన అవినీతి, అక్రమాలపై కథనాలైతే కొల్లలు. అటు సీబీఐ దర్యాప్తు, ఇటు సుప్రీమ్ సొంత చొరవతో కేసులో ఇంకెన్ని లోతైన అంశాలు బయటపెడతాయో తెలీదు. ఇక, తాజాగా ఆసుపత్రికి భద్రతగా సీఐఎస్ఎఫ్ దళాల పహారా పెట్టాల్సి రావడం పోగొట్టుకున్న నమ్మకానికి పరాకాష్ఠ.అసలు మన దేశంలో ప్రతి వంద మంది డాక్టర్లలో 75 మంది సాధారణంగా రోగులు, వారి బంధువుల నుంచి ఏదో ఒక విధమైన హింస, దాడులను ఎదుర్కొన్నవారే. అమెరికాలో ఆ సంఖ్య 47 శాతమే. ఇలాంటి అనేక కారణాల రీత్యానే రెండేళ్ళ క్రితం 2022లో ప్రవేశపెట్టిన ‘ఆరోగ్య వృత్తి నిపుణులు, సంస్థలపై హింసా నిరోధక బిల్లు’ను తక్షణం ఆమోదించి, అమలు చేయాలన్న డిమాండ్ పెరుగుతోంది. నిజానికి, 2007 నుంచి మన దేశంలో మెడికల్ ప్రొటెక్షన్ యాక్ట్ (ఎంపీఏ) ఉంది. 23 రాష్ట్రాలు దాన్ని తమదైన రూపంలో అమలు చేస్తున్నాయి. ఆరోగ్య సేవకుల భద్రత నిమిత్తం అలా ఇప్పటికే చట్టాలున్నా ఎంత సమర్థంగా పనిచేస్తున్నాయన్నది వేరే కథ. పైగా, ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకం శిక్ష. అంతటా ఒకే విధమైన నమూనా చట్టం అమలయ్యేలా చూడాల్సి ఉంది. అయితే, కేవలం చట్టాలతో పరిస్థితి చక్కబడుతుందనీ, దాడుల నుంచి వైద్యులను కాపాడగల మనీ అనుకోవడం కూడా పొరపాటే. ప్రజారోగ్య సేవకుల భద్రత అనేది దీర్ఘకాలిక ప్రణాళికతో సాగాల్సిన ప్రభుత్వ విధానం. మున్ముందుగా ఉన్నతమైన వైద్యవృత్తికీ, వైద్యులకూ సమాజంలో గౌరవం ఇనుమడించే వాతావరణం పెంపొందించాలి. రోగులకు ప్రాణదాతలై రాత్రీ పగలూ లేకుండా శ్రమించే వైద్యులకు జీతభత్యాలే కాదు... మెరుగైన పని పరిస్థితులు కల్పించడం కనీస బాధ్యత. ఆరోగ్య రంగానికి నిధుల పెంపుతో పాటు ‘అభయ’ లాంటివారు 36 గంటలు ఆపకుండా పని చేయాల్సిన అవస్థ తప్పించేలా తగినంతమంది వైద్య సిబ్బందిని తీసుకోవాలి. ప్రభుత్వాలు, వైద్య సంస్థలు సమష్టిగా దీని మీద దృష్టి పెట్టాలి. సుప్రీమ్ చెప్పినట్టు ఆస్పత్రుల్లో లైంగిక వేధింపుల నిరో ధక చట్టం (పోష్) వర్తిస్తుందని గుర్తించాలి. ఇవాళ్టికీ జూనియర్ డాక్టర్లు అమానవీయ పరిస్థితుల్లో పనిచేయాల్సి వస్తున్న తీరును గుర్తించి, ముందు అక్కడ నుంచే మార్పు మొదలుపెట్టాలి. కోల్‌కతా ఘటనపై ఆందోళన ఆగక ముందే, మహారాష్ట్రలోని బద్లాపూర్‌లో బడిలో చదువుకుంటున్న ఇద్దరు కిండర్‌గార్టెన్ చిన్నారుల్ని కాపలాదారు రూపంలోని ఓ మానవ మృగం కాటేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. కుళ్ళిన వ్యవస్థలోని విలువల పతనాన్ని మరోమారు నగ్నంగా నిలబె ట్టింది. ఈ వరుస ఘటనలు ఆందోళనతో పాటు సత్వర కార్యాచరణ అవసరాన్ని పెంచుతున్నాయి. ‘బాగా చదువుకోవాలి. బంగారు పతకం సాధించాలి. పెద్ద ఆసుపత్రుల్లో పనిచేయాలి. అమ్మా నాన్నల్ని బాగా చూసుకోవాలి’ అంటూ డైరీలో ఆఖరిరోజున సైతం రాసుకున్న ఓ మధ్యతరగతి అమ్మాయి కలల్ని చిదిమేసిన వ్యక్తులను కఠినంగా శిక్షించాల్సిందే. ఈ ఘటనలకు మూలకారణమవుతున్న వ్యవస్థాగత లోపాల్ని సరిదిద్దాల్సిందే! సుప్రీమ్ తీసుకున్న చొరవ, పాలకుల చర్యలు అందుకు దోహదపడితేనే అభం శుభం తెలియని ‘అభయ’లెందరికో ఆత్మశాంతి. -
బయటపడ్డ బహిరంగ రహస్యం
ప్రపంచమంతా మలయాళ సినిమాలను పొగుడుతూ, తాజా జాతీయ అవార్డుల్లోనూ దేశమంతటిలోకీ ఉత్తమ సినిమాగా మలయాళ చిత్రమే నిలిచిన పరిస్థితుల్లో... ఆ పరిశ్రమలో పైకి కనిపిస్తున్న మంచితో పాటు కనిపించని దుర్లక్షణాలూ అనేకం ఉన్నాయని బహిర్గతమైంది. మలయాళ సినీ పరిశ్రమలో మహిళల స్థితిగతులపై కేరళ ప్రభుత్వం 2017 జూలైలో వేసిన హేమ కమిటీ నివేదిక బయటకు రావడంతో తేనెతుట్టె కదిలింది. నాలుగేళ్ళ పైచిలుకుగా కేరళ ప్రభుత్వం గుట్టుగానే అట్టి పెట్టిన ఈ నివేదిక న్యాయస్థానంలో, రాష్ట్ర సమాచార కమిషన్‌లో అనేక పోరాటాల అనంతరం సోమవారం బాహ్యప్రపంచానికి అందుబాటులోకి వచ్చింది. సున్నిత సమాచారం, వ్యక్తుల వివరాల పేజీలను మినహాయించి బయటకొచ్చిన మిగతా నివేదిక అంశాలపై దేశవ్యాప్త చర్చ రేగుతోంది. ఏడెనిమిదేళ్ళ క్రితమే అంతర్జాతీయంగా ‘మీ టూ’ ఉద్యమం, ఆపైన భారత సినీరంగంలోనూ ‘క్యాస్టింగ్ కౌచ్’ వివాదాలు, ఆడవాళ్ళు పని కావాలంటే లైంగిక లబ్ధి కలిగించేలా ‘కమిట్మెంట్’ ఇచ్చి, ‘కాంప్రమైజ్’ కావాల్సి వస్తోందనే ఆరోపణలు చూశాం. అయినా సరే... మలయాళ నటులు, పరిశ్రమ నిపుణుల్ని పలువురిని ఇంటర్వ్యూ చేసి హేమ కమిటీ వెల్లడించిన అంశాలు నివ్వెర పరుస్తున్నాయి. సెట్లో స్త్రీలపై లైంగిక వేధింపులు, తాగివచ్చి వారు బస చేసిన గది తలుపులు కొట్టడాలు, 10–15 మంది శక్తిమంతమైన లాబీ గుప్పెట్లో మలయాళ చిత్రసీమ లాంటి సంగతులను కమిటీ కుండబద్దలు కొట్టింది. కోల్‌కతాలో విధినిర్వహణలో డాక్టర్‌పై హత్యాచార ఘటనతో అట్టుడుకుతున్న దేశంలో సినీరంగ స్త్రీల పరిస్థితీ ఏమంత భిన్నంగా లేదని తేలిపోయింది.అత్యంత సంచలన అంశాలేమీ బయటపెట్టకుండా కమిటీ పెద్దమనిషి తరహాలో నివేదికను ఇచ్చిందనే అధిక్షేపణలూ లేకపోలేదు. ఆ మాటెలా ఉన్నా పరిశ్రమలోని అవాంఛనీయ ధోరణుల్ని బయటపెట్టి, ప్రజాక్షేత్రంలో వాటిపై చర్చ లేవనెత్తడంలో విజయం సాధించింది. స్టెనోగ్రాఫర్ కానీ, కనీస ఇతర సౌకర్యాలు కానీ లేకున్నా సరే, అనేక అవరోధాలను అధిగమించి మరీ ఈ కమిటీ 233 పేజీల నివేదిక సిద్ధం చేసింది. నివేదికలో బలాబలాలు ఏమైనప్పటికీ, సినీసీమలోని చీకటి కోణంపై దర్యాప్తు జరిపి ఇలాంటి నివేదిక ఒకటి వెలువడడం దేశంలో ఇదే తొలిసారి. నిజానికి, అనివార్య పరిస్థితుల్లోనే ప్రభుత్వం ఈ సంఘాన్ని వేయాల్సి వచ్చింది. ఓ ప్రముఖ నటిని కిడ్నాప్ చేసి, హీరో దిలీప్ కదులుతున్న కారులో జరిపిన లైంగిక అత్యాచారంతో 2017 ఫిబ్రవరిలో మలయాళ చిత్రసీమ అట్టుడికింది. రాష్ట్రమంతా నిరసనలు, ‘ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్’ బృందం డిమాండ్ల మేరకు కేరళ సర్కార్ రిటైర్డ్ హైకోర్ట్ జడ్జి కె. హేమ సారథ్యంలో త్రిసభ్య సంఘం వేయక తప్పలేదు. తెలుగు టి శారద కూడా అందులో మెంబరే! ఆ కమిటీ 2019 డిసెంబర్ 31కే తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఉద్యమకారులు పదే పదే అభ్యర్థించినా, సినిమావాళ్ళ ప్రైవసీకి భంగమంటూ సర్కార్ ఇన్నేళ్ళుగా ఆ నివేదికను తొక్కిపెట్టింది. అదేమంటే, అది న్యాయవిచారణ సంఘం కాదు గనక నివేదిక బయటపెట్టాల్సిన బాధ్యత లేదు పొమ్మంది. నివేదిక విడుదలను ఆపాలన్న ఓ నటి అభ్యర్థనను సైతం హైకోర్ట్ తాజాగా తోసిపుచ్చడంతో... చివరకు నివేదిక బహిర్గతమైంది. తళుకుబెళుకుల సినీరంగానికి అంచున... సహజంగానే అనేక బలహీనతల నీలి నీడలు పరుచుకొని ఉంటాయని ప్రపంచానికి తెలుసు. అది ఒక్క మలయాళ సినీసీమకే పరిమితం కాదు. అందం, ఆనందం, ఆర్థిక ప్రయోజనం, పదుగురిలో పాపులారిటీ, పలుకుబడి పోగుబడినందున అన్ని భాషల సినీ రంగాల్లోనూ ఉన్నదే! కాకపోతే, తొందరపడి ఎవరూ బాహాటంగా ప్రస్తావించని చేదు నిజమది. లైంగిక వేధింపులు సహా ఆవేదన కలిగించే అనుభవాలు అనేకమున్నా, ఆడవాళ్ళు ఆ మాట బయటకు చెప్పరు. చెబితే పరిశ్రమలో అప్రకటిత నిషేధం సహా ఇంకా అనేక ఇతర వేధింపులు తప్పని దుఃస్థితి. ఆది నుంచి ఈ రుగ్మతలు ఉన్నవే. ‘సినీరంగంలో స్త్రీలు నిత్యం ఎదుర్కొంటున్న భూతం లైంగిక వేధింపులు’ అని కమిటీ తెగేసి చెప్పడంతో మేడిపండు పగిలింది. మన యావత్ భారతీయ సినీ రంగానికి ఇది ఒక మేలుకొలుపు. అన్ని భాషల్లోనూ కలల వ్యాపారంలో కొనసాగుతున్న పితృస్వామ్య భావజాలం, లైంగిక దుర్విచక్షణ, వేతన వ్యత్యాసాలు సహా అనేక అవలక్షణాలపై మనకు చెంపపెట్టు. చిత్రం ఏమిటంటే, ప్రైవేట్ పరిశ్రమల్లో పని పరిస్థితులకు సైతం ప్రభుత్వ షరతులు, చట్టాలు వర్తిస్తాయి. ఎప్పుడో సినీరంగాన్ని ఒక పరిశ్రమగా గుర్తించినట్టు కేంద్ర సర్కార్ ప్రకటించినా దాని వల్ల ఒనగూడిన ప్రయోజనాలేవో అర్థం కాదు. కళ, వ్యాపారపు కల కలగలిసిన సృజనశీల పరిశ్రమకు చట్టాలు చేయడం అంత సులభం కాకపోవచ్చు. కానీ, మగవారితో సమానంగా ఆడవారికి వేతనం మాట దేవుడెరుగు... మరుగుదొడ్లు, దుస్తులు మార్చుకొనే మరుగు స్థలాల లాంటి కనీస వసతులైనా కల్పించలేమా? సమ్మతితో పని లేకుండా ఆడవారితో ఎలాగైనా ప్రవర్తించవచ్చని భావిస్తున్న పని ప్రదేశంలో తగినంత బాధ్యత, భద్రత పెంపొందించేలా చేయలేమా? సమాజంగా మనం, సర్కారుగా పాలకులు సినీ పరిశ్రమపై ఆలోచించాల్సిన ఇలాంటి అంశాలు అనేకం. ఎప్పటి నుంచో ప్రత్యేక సినిమా విధానం తెస్తామని ఊరిస్తున్న కేరళ సర్కార్ సినీసీమలో వేతన ఒప్పందాలు, భద్రత అమలుకు సంబంధించి హేమ కమిటీ సిఫార్సులపై ఇకనైనా దృష్టి పెట్టాలి. పనిచేయడానికి ఒకమ్మాయి ఇంటి గడప దాటి వచ్చిందంటే సర్వం సమర్పించడానికి సిద్ధమైనట్టేనని చూసే పురుషాహంకార దృష్టి ఇకనైనా మారాలి. అన్ని పనిప్రదేశాల లానే సినీ రంగంలోనూ స్త్రీలకు సురక్షితమైన, భద్రమైన వాతావరణం కల్పించడం అంతర్జాతీయ స్థాయికి ఎదిగామని భుజాలు ఎగరేస్తున్న మన సినీ పరిశ్రమ కనీస బాధ్యత. -
లంకలో ఎన్నికల సందడి
చాన్నాళ్లుగా అందరూ ఎదురుచూస్తున్న శ్రీలంక అధ్యక్ష ఎన్నికల ప్రక్రియలో మరో అడుగు ముందుకు పడింది. వచ్చే నెల 21న జరగబోతున్న ఎన్నికల్లో 39 మంది అభ్యర్థులు ఖరారయ్యారు. శ్రీలంక దివాలా తీసి ఎంతటి విపత్కర పరిస్థితులో చిక్కుకున్నదో అందరికీ తెలుసు. 2022లో అధ్యక్ష భవనంపై, పార్లమెంటుపై ప్రజానీకం దాడి చేయటంతో అప్పటి అధ్యక్షుడు గొటబయ రాజపక్స, ఆయన కుటుంబ పరివారం దేశం విడిచి పరారయ్యారు. అంతకు మూడేళ్ల ముందు జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో గొటబయ, ఆ తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ప్రధానిగా ఆయన సోదరుడు మహిందా రాజపక్స తిరుగులేని మెజారిటీతో ఎన్నికయ్యారు. ఈమధ్య బంగ్లాదేశ్‌లో అచ్చం ఇలాంటి ఘటనలే జరిగి ప్రధాని షేక్ హసీనాకు పదవీభ్రష్టత్వం తప్పలేదు. రెండేళ్లనాటి శ్రీలంక పరిణామాలు చూశాకైనా ఆమె జాగ్రత్తగా అడుగులు వేసివుంటే ఇలా జరిగేది కాదు. శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్థులుగా ఉన్నవారు తమ గతాన్ని మాత్రమే కాదు... బంగ్లాదేశ్ వర్తమానాన్ని కూడా గమనంలోకి తీసుకోవాల్సివుంటుంది. ఏవో సాకులు చెప్పి ఎన్నికలు వాయిదా వేసే సంస్కృతి శ్రీలంకలో ఏనాటి నుంచో కొనసాగు తోంది. ప్రస్తుత అధ్యక్షుడు రనిల్ విక్రమసింఘే ప్రధానిగా ఉన్నప్పుడు 2017లో ప్రొవిన్షియల్ కౌన్సిళ్ల ఎన్నికలను వాయిదా వేశారు. అప్పటికి ఏడేళ్ల నుంచి ఇదే వరస. చిత్రమేమంటే 2022లో అంతగా జనాగ్రహం చవిచూశాక కూడా దేశంలో ఎన్నాళ్ల నుంచో మూలనపడివున్న స్థానిక సంస్థల ఎన్నికలను నిధులు లేవన్న కారణంతో విక్రమసింఘే వాయిదా వేశారు. నిజానికి అధ్యక్ష ఎన్నికలు సైతం ఈ మాదిరే ‘వాయిదా’ తోవన పోతాయని చాలామంది అనుకున్నారు. వెంటనే ఎన్నికలు జరపాలంటూ వివిధ వర్గాలనుంచి నిరుడు డిమాండ్ వచ్చింది. కానీ దేశం ఇంకా ఆర్థికంగా కోలుకోలేదన్న కారణాన్ని చూపి వాయిదా వేశారు. మొత్తానికి ఎన్నికల కోలాహలం మొదలైంది.రెండున్నర దశాబ్దాల తర్వాత మొదటిసారిగా రాజపక్స కుటుంబం హవా లేకుండా ఎన్నికలు జరగబోతున్నాయి. తన కుటుంబం కోల్పోయిన పరువు ప్రతిష్ఠలను పునరుద్ధరించటమే ధ్యేయంగా మాజీ ప్రధాని మహిందా రాజపక్స తనయుడు 38యేళ్ల నామల్ రాజపక్స శ్రీలంక పొదుజన పెరమున(ఎస్ఎల్పీపీ) తరఫున పోటీ చేస్తున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు రనిల్ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఆయన అయిదు దశాబ్దాలు యునైటెడ్ నేషనల్ పార్టీ (యూఎన్‌పీ) నాయకుడిగావున్నా స్వతంత్రుడిగా నిలబడ్డారు. గతంలో యూఎన్‌పీని చీల్చి సమగి జన బల వేగయ (ఎస్‌జేబీ) పార్టీని స్థాపించి ప్రస్తుతం పార్లమెంటులో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సజిత్ ప్రేమదాస కూడా అధ్యక్ష స్థానానికి పోటీపడుతున్నారు. అయితే ఇతరుల కన్నా వామపక్ష అనుకూల నేషనల్ పీపుల్స్ పవర్ పార్టీ (ఎన్పీపీ) అధినేత అనూర కుమార దిస్సానాయకే విజయావకాశాలు ఎక్కువని లంకలో ప్రధాన సర్వే సంస్థ ఇనిస్టిట్యూట్ ఫర్ హెల్త్ పాలసీ (ఐహెచ్పీ) చెబుతోంది. అదే నిజమైతే దేశ రాజకీయాలు కొత్త మలుపు తిరగటం ఖాయం. మొదటి నుంచీ ఎస్ఎల్పీపీ, యూఎన్ పీలే ప్రధాన పక్షాలుగా పోటీపడుతున్నాయి. కానీ 2020 పార్లమెంటు ఎన్నికలకు ముందు సజిత్ ప్రేమదాస నిష్క్రమించాక ఆ పార్టీ దయనీయ స్థితిలో పడిపోయింది. ఆ ఎన్నికల్లో యూఎన్పీకి దక్కింది కేవలం ఒక్క స్థానం మాత్రమే. దశాబ్దాలుగా అనుసరించిన విధానాల వల్ల దేశం ఆర్థికంగా చాలా గడ్డు స్థితిలో పడిందన్నది వాస్తవం. ముఖ్యంగా రాజపక్స సోదరుల హయాంలో తమిళ టైగర్లను అణిచేయటానికి సాయం చేసిన దగ్గర్నుంచి చైనా పలుకుబడి విస్తరించింది. ఆ తర్వాత మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆర్థికసాయం అందించే నెపంతో అది భారీయెత్తున అప్పులిచ్చింది. క్రికెట్ స్టేడియం, విమానాశ్రయం, హంబన్‌తోటా నౌకాశ్రయం వంటివన్నీ చైనా నిర్మాణరంగ నిపుణుల నేతృత్వంలో కళ్లు చెదిరే రీతిలో నిర్మించారు. కానీ వీటి బకాయిలు తీర్చడానికొచ్చేసరికి అంతా తారుమారైంది. చివరకు హంబన్‌తోటాలో అనుకున్న రీతిలో కార్యకలాపాలు పుంజుకోకపోవటంతో దాన్ని చైనాకే 99 యేళ్ల లీజుకు ఇవ్వాల్సివచ్చింది. దేశాన్ని చైనాకు తాకట్టు పెడుతున్నారని విపక్షాలు చేసిన ఆరోపణలన్నీ రాజపక్స సోదరులు తీసుకొచ్చిన మెజారిటీవాదం, దేశభద్రత వగైరా అంశాలతో కొట్టుకు పోయాయి. కానీ మూడేళ్లకే ప్రజలకు తత్వం బోధపడి తిరుగుబాటు చేశారు. 2022లో దేశం దివాలా తీశాక అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) దాదాపు 300 కోట్ల డాలర్ల రుణం ఇచ్చింది. అయితే ఆర్థిక రంగంలో పెనుమార్పులు తీసుకురావాలన్న షరతు విధించింది. వ్యవస్థాగత సర్దు బాట్ల పేరుతో ఆ ప్రక్రియ ప్రస్తుతం అమలవుతోంది కూడా. కనుక ఎన్నికల అనంతరం విజేత ఎవ రైనా ఈ ప్రక్రియను కొనసాగించాల్సిందే. ప్రస్తుత అభ్యర్థుల్లో ఎన్పీపీ అధినేత అనూర కుమార దిస్సానాయకే ఒక్కరే అవినీతి మరక అంటని నేత. కావడానికి వామపక్ష అనుకూల సంస్థే అయినా సింహళ జాతీయవాదాన్ని ప్రవచించే జనతా విముక్తి పెరుమున రాజకీయ విభాగమే ఎన్పీపీ. ఒకపక్క తన పూర్వపు ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలని చూసే చైనా... మొదటి నుంచీ లంకకు అన్ని విధాలా తోడ్పడుతున్న భారత్ ఈ ఎన్నికల సరళిని జాగ్రత్తగా గమనిస్తున్నాయి. ఇప్పటికే బంగ్లాలో భారత్ అనుకూల నేత హసీనా పదవి కోల్పోయారు. ఇదే అదనుగా లంకలో మళ్లీ తన హవా కొనసాగించాలని చైనా చూస్తోంది. అయితే చైనా వల్లే అప్పుల ఊబిలో కూరుకుని నిండా మునిగిన లంకలో అదంత సులభం కాదు. ఏదేమైనా జనామోదంతో ఏర్పడే ప్రభుత్వం వల్లే శ్రీలంక ప్రస్తుత కష్టాలు తీరతాయి. -
దేవుణ్ణి చూసిన వాడు
‘వానలో కలిసిన చీకటి ఆకాశం నుంచి నల్లటి విషంలా కారుతోంది’ అని మొదలవుతుంది తిలక్ ‘దేవుణ్ణి చూసిన వాడు’ కథ. ఆ రాత్రి వానలో ఉలిక్కిపడి లేచిన గవరయ్యకు పెరటి వసారాలో ఏదో మూలుగు. ఏమిటది? లాంతరు తీసుకుని బయటకి వచ్చాడు. హోరుగాలి... భీకర వర్షం... మూలుగుతూ పడి ఉన్న ప్రాణి. లాంతరు ఎత్తి చూసి దిమ్మెరపోయాడు. భార్య. తనను వదిలిపెట్టి వెళ్లిన భార్య. ‘గవరయ్య భార్య లేచిపోయిందట’ అని ఊరంతా గేలి చేయడానికి కారణమైన స్త్రీ. మోసపోయి, నిండు గర్భంతో, నొప్పులు పడుతూ, మొహం చెల్లక వసారాలో పడి ఉంది. దూరంగా మెరుపు మెరిసింది. చెవులు చిల్లులుపడేలా పిడుగు. కాన్పు జరిగిపోయింది. కేర్‌మని– చేతుల్లోకి తీసుకోగానే సముదాయింపు పొందిన ఆ పసికూన గవరయ్యతో బంధమేసింది. క్షణం ఆలోచించలేదు అతడు. ఆమెను, ఆమె కన్న తనది కాని బిడ్డను లోపలికి తీసుకెళ్లాడు. మరుసటి రోజు ఊరిపెద్దలు ‘లేచిపోయిందాన్ని ఏలుకుంటావా’ అని వస్తే గవరయ్య ఏం చేశాడు? కత్తి పట్టుకు వచ్చి ‘అడ్డు పడినవాళ్లను అడ్డంగా నరుకుతాను’ అన్నాడు. అతడు మనిషి. దేవుడు. మానవత్వంలో దేవుడిని చూసినవాడు.మధురాంతకం రాజారాం ‘కొండారెడ్డి కూతురు’ అనే కథ రాశారు. ఫ్యాక్షనిస్టు కొండారెడ్డి కూతురు ప్రేమ వివాహం చేసుకుంది. పారిపోయి బతుకుతోంది. చాన్నాళ్ల తర్వాత ఊరి మనుషులు చూడటానికి వచ్చారు. తన మనుషులు. తన తండ్రి దగ్గర పని చేసే మనుషులు. కొండారెడ్డి కూతురు ఎంతో సంతోషపడింది. మర్యాదలు చేసింది. వారి చేసంచుల్లో చాటుగా ఉన్న ఆయుధాలు చూసి అంతలోనే నిశ్చేష్టురాలైంది. తనను, భర్తను చంపుతారన్నమాట. తండ్రి పంపించాడన్న మాట. కాని ఇంటికి వచ్చిన అతిథులను అవమానించవచ్చా? వారి కోసం ఏమిటేమిటో వండింది. కొసరి కొసరి వడ్డించింది. ఊరి ముచ్చట్లు అడిగి చెప్పించుకుంది. ఆ రాత్రి తనకు ఆఖరు రాత్రి. హాలులో కుర్చీ వేసుకుని భర్త గదికి కాపలా కూర్చుంది. వాళ్లు వస్తారు. తనని చంపుతారు. కొండారెడ్డికి పుట్టినందుకు తాను చస్తుంది. కాని భర్తను చంపడానికి వీల్లేదంటుంది. వాళ్లు వచ్చారు. నీడల్లా నిలబడ్డారు. చంపుతారనుకుంటే కాళ్ల మీద పడ్డారు. ‘అమ్మా మేమెందుకొచ్చామో తెలిసీ అన్నం పెట్టావు. చెడ్డ పనులు చేసే రోజు మీ అమ్మ ముఖం చూడకుండా తప్పుకునేవాళ్లం. చూస్తే చేయలేమని. ఇవాళ నీ ముఖం చూస్తూ నిన్నెలా చంపుతా మమ్మా’... ఏడుస్తూ కాళ్లు కడుగుతున్నారు. ఆమె మనిషే. దేవత కాకపోవచ్చు. కాని మానవీయత ఉన్న మనిషి వదనంలో దైవత్వం ఉంటుంది.‘మనందరం దేవుళ్లమే’ అంటాడు ‘సత్యమే శివం’లో కమలహాసన్. ‘సృష్టీ విలయం రెండూ మన చేతుల్లోనే’ అంటాడు ‘సెపియెన్స్’ పుస్తక రచయిత హరారి. ‘నేటి మనిషి రెండు విషయాల వల్ల మనిషి గుణాన్ని కోల్పోయే ప్రమాదంలో పడ్డాడు. ఒకటి ప్రకృతి విధ్వంసం– రెండు సాంకేతికతను పెంచి తాను మరుగుజ్జుగా మారడం’ అంటాడు హరారి. ప్రకృతికి ఎడంగా జరిగే కొద్ది, పరిసరాల్లో సిమెంటు పెరిగే కొద్ది, నాలుగు గోడల నుంచి నాలుగు గోడలకు అతని దినచర్య మారేకొద్ది సహజమైన మానవ స్పందనలు మొద్దుబారక తప్పదు. పెట్ డాగ్స్ సమక్షంలో అతడు పొందగలుగుతున్నది కొద్దిగా ఓదార్పే. పల్లెలో ప్రకృతిలో ఉన్నప్పుడు గొడ్డూ గోదా, మేకా ఉడుతా, కాకీ పిచుకా అన్నీ అతని స్పందనలను సజీవంగా ఉంచేవి. ‘ఎలా ఉన్నావు?’ నుంచి ‘ఎంత సంపాదిస్తున్నావు?’ను దాటి ‘ఏం కొన్నావు?’కు వచ్చేసరికి అతనిలో మొదలైంది పతనం.‘లాభం’ అనే మాట కనిపించని దారాలతో ఆడించే మాయావి. మనిషిని ఎంత ఓడిస్తే లాభం అంత గెలుస్తుంది. అంతేకాదు ‘మనిషి మీద నమ్మకం పోయింది’ అనే మాటను పుట్టించడం లాభాపేక్ష గల పెట్టుబడిదారీ వ్యవస్థ ప్రాథమిక అవసరం. మనిషి మీద నమ్మకం పోయేలా... వాణ్ణి అది వస్తుగత, స్వార్థపరమైన, సంపద లాలసలో కూరుకుపోయేలా చేస్తుంది. లాభపడాలంటే, సుఖపడాలంటే చేయవలసింది మానవత్వాన్ని త్యాగం చేయడమే. అది పోగానే వాడు కుటుంబంతో, స్నేహితులతో, సమాజంతో, ప్రకృతితో, మానవాళితో ఎంత దారుణంగా అయినా వ్యవహరించవచ్చు. ‘మనిషి మీద నమ్మకం పోయేలా’ చేస్తే పెట్టుబడిదారీ వ్యవస్థకు మరో లాభం ఏమిటంటే... ఏ మనిషీ మరో మనిషితో కలవడు. సమూహంగా మారడు. తిరుగుబాటు చేయడు. నలుగురు బాగుపడి కోట్ల మంది మలమలమాడే వ్యవస్థకు ఢోకా రానివ్వడు. అందుకే పెట్టుబడిదారీ వ్యవస్థ ‘యుద్ధం’ అనే ముద్దుబిడ్డను పదేపదే కంటూ ఉంటుంది. యుద్ధం మానవత్వానికి అతి పెద్ద విరుగుడు. అయితే మనిషి ఇలాగే ఉంటాడా? ఏ రచయితో అన్నట్టు ‘రగిలిస్తే రాజుకునే మహాఅగ్ని మానవత్వం’. కోల్‌కతా నిరసనల్లో ఇవాళ అదే చూస్తున్నాం. యుగాలుగా... చితి పెట్టిన ప్రతిసారీ బూడిద నుంచి మానవత్వం తిరిగి జనిస్తూనే ఉంది. కాకుంటే అందుకు కావల్సిన రెక్కలు సాహిత్యమే ఇస్తుందని గ్రహించాలి. తల్లిదండ్రులూ..! మీ పిల్లల్ని ఇంజనీర్లు, డాక్టర్లు, కలెక్టర్లు తప్పకుండా చేయండి. కాని నాలుగు మంచి పుస్తకాలు చదివించి మొదట మనిషిని చేయండి. ఏ విటమిన్ లేమికి ఏం తినాలి సరే... మానవత్వ లేమి ఉందేమో కనిపెట్టి విరుగుడుగా ఒక పుస్తకం చేతిలో పెట్టండి. ఎక్కడ పుస్తకాలు ఉంటాయో అక్కడ మానవత్వపు ఆవరణం ఏర్పడుతుంది. అదే దేవుడు తిరుగాడే తావు. ప్రపంచ మానవత్వ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఏ వాస్తవాలు దాచడానికి?
లక్షలాది మంది భారతీయ మహిళల లాగే, నేను ఆగ్రహంతో రగిలిపోయాను, విచారంతో కుంగిపోయాను. ఒక యువతిని తన పని ప్రదేశంలో బహుశా ఆమెకు తెలిసిన పురుషులే క్రూరంగా హింసించి చంపారనే ఆలోచన నన్ను వెంటాడుతోంది. కోల్‌కతా యువ వైద్యు రాలిపై లైంగిక దాడి ఘటనలో, ఆమె శవం గురించి ఇప్పుడు మనకు తెలిసిన భయానక వివరాలను నేను చెప్పలేను. అర్ధనగ్నంగా కనిపించింది. ఆమె కాళ్లు విరిగిపోయాయి. ఆమె జననాంగాలు, రెండు కళ్ల నుంచి విపరీతంగా రక్తస్రావం అయ్యింది. తల నుంచి పాదాల వరకు రక్త సిక్త గాయాలయ్యాయి. ఈ సాక్ష్యం సామూహిక అత్యాచారం అని వైద్యులు నమ్ముతున్నారు. తన కుమార్తె మృతదేహాన్ని చూడటానికి మూడు గంటలు వేచిచూడాల్సి వచ్చిన తండ్రి ఈ వివరాలను పంచుకున్నారు. ఆ తండ్రిగా మిమ్మల్ని ఊహించుకోండి. అది మీ బిడ్డ గురించి మీకు ఉన్న చివరి జ్ఞాపకం అని ఆలోచించండి.కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ఘటన, సంస్థా గతంగా స్త్రీల పట్ల ఉన్న ద్వేషానికీ, దుర్మార్గానికీ భయంకరమైన ఉదాహరణ. అత్యాచారం తర్వాత ఏమి జరిగిందనేది మరింత అసహ్యకరమైనది. జరిగిన ఘటనను కప్పిపుచ్చే ప్రయత్నాలు నేరాన్ని మరింతగా పెంచాయి.ఈ కేసును అర్థం చేసుకోవాలంటే, మనం వైద్య కళాశాల ప్రిన్సిపల్, ఇప్పుడు తొలగించబడిన సందీప్ ఘోష్ అనే వ్యక్తి గురించి మాట్లాడాలి. మొదట, మెడికల్ కాలేజీ అధిపతిగా, దాడి జరగడానికి ఆయనే జవాబుదారీగా ఉంటాడు. ప్రత్యేకించి ఇది బయటి వ్యక్తి చేసిన పని కాదనీ, కాలేజీ లోపలి వారు చేసిన పనేననీ వైద్యులు చెబుతున్నారు. 36 గంటల షిఫ్ట్ ముగించు కున్న తర్వాత బాధితురాలు విశ్రాంతి తీసుకుంటున్న సెమినార్ హాల్ ఎక్కడ ఉందో బయటి వ్యక్తికి తెలిసే అవకాశం లేదని వైద్యులు సూచిస్తున్నారు. లైంగిక దాడికి, హత్యకు గురైన రాత్రి బాధితురాలి కారును కూడా ధ్వంసం చేశారని నిరసన తెలిపిన వైద్యులు చెబుతున్నారు.ఆమెకు ఏదో తెలిసివుండటం వల్ల ఆమె నోటిని శాశ్వతంగా మూసివేశారా? సందీప్ ఘోష్ మొదట తన వ్యాఖ్యలలో ఆమెను నిందించాడు. ఆ రాత్రి సమయంలో సెమినార్ హాల్లో ఆమె ఉండటాన్ని తప్పు పట్టాడు. ఆ నిర్లిప్తత సరిపోనట్లు, ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ అధికారులు ఆమె కుటుంబానికి తమ కుమార్తె ఆత్మహత్యతో చనిపోయిందని చెప్పారు. ఇది ఏ మాత్రం ఆమోదయోగ్యం కాని నయవంచన. అసలు ఆమె కుటుంబంతో ఘోష్ వ్యక్తిగతంగా ఎందుకు సమాచారం పంచుకోలేదు? పైగా మౌనంగా ఉండేందుకు పోలీసులు తమకు డబ్బు ఇవ్వజూపారని కుటుంబ సభ్యులు వైద్యులకు తెలిపారు.దిగ్భ్రాంతికరమైన విషయం ఏమిటంటే, యువ వైద్యురాలు తన కుమార్తె లాంటిదని ఆయన ఆ తర్వాత పేర్కొన్నప్పటికీ,ఈ అంశంపై ఘోష్ కనీసం ఫిర్యాదు కూడా చేయలేదు. వెంటనే ఆయన పోలీసులను ఎందుకు పిలిపించలేదు? కోల్‌కతా హైకోర్టు కూడా ఇప్పుడు ఆయన ప్రవర్తనపై ఈ ప్రశ్ననే లేవ నెత్తింది.ఈ విచిత్రమైన ప్రతిస్పందనలు సాక్ష్యాలను తారుమారు చేశాయనే అనుమానాలను మరింతగా పెంచాయి. నేరం జరిగిన స్థలానికి చాలా సమీపంలో సాధారణ నిర్మాణపని, మరమ్మత్తు పనులు జరుగుతున్నట్లు చూపించే వీడియో కనిపించింది. ఫోరె న్సిక్స్ కోసం ఆ ప్రాంతాన్ని రింగ్ ఫెన్స్ చేయాలని ఘోష్ అను కోలేదా? తన మొత్తం ఆలోచన అంతా సాక్ష్యం ఎట్టి పరిస్థితు ల్లోనూ దొరకకూడదనే కోణంలో ఉండిందా?ఇంత దారుణ ఘటన నేపథ్యంలో ఘోష్‌ను కనీసం పదవి నుండి తొలగిస్తారని మీరు అనుకుంటారు. బదులుగా ఏమి జరిగిందో ఊహించండి. ఆయన మరొక మెడికల్ కాలేజీకి అధిపతిగా బదిలీ చేయబడ్డారు. అయితే ఈ కలకత్తా నేషనల్ మెడికల్ కాలేజ్ విద్యార్థులు ఆయన కార్యాలయానికి తాళం వేసి ఉంచడమే కాకుండా, అతగాడి కొత్త మాయవేషాలను ప్రారంభించడానికి అనుమతించబోమని తేల్చి చెప్పారు. రాజీనామా చేసిన కొన్ని గంటల్లోనే ఆయనకు మరో ఉద్యోగం ఎందు కిచ్చారు? అంతే కాదు, ఇద్దరు తృణమూల్ కాంగ్రెస్ రాజకీయ నాయకులు... ఒక శాసనసభ్యుడు, ఒక మంత్రి... విద్యార్థులతో మాట్లాడటానికి కలకత్తా నేషనల్ మెడికల్ కాలేజీకి వచ్చి ఘోష్‌కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలను నిలిపివేయమని కోరినట్లు పశ్చిమ బెంగాల్ మీడియా నివేదించింది.ఘోష్‌ను అంత శక్తిమంతంగా మార్చింది ఏమిటి? ఆయన గతంలో వివాదాల మధ్యనే మూడుసార్లు బదిలీ చేయబడ్డాడు. విద్యార్థులు, వైద్యులు ఆయన్ని ఒక విధమైన స్థానిక మాఫియాగా పేర్కొంటారు. ఎట్టకేలకు అతడిని హైకోర్టు తొలగించింది. అతని పక్షాన వాదించడానికి ప్రభుత్వ న్యాయవాదిని ఎందుకు పంపారని న్యాయస్థానం ప్రశ్నించింది. దీనికి సంబంధించి ఇతర ప్రశ్నలు కూడా పెరుగుతున్నాయి. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ వద్ద నిరసన తెలుపుతున్న వైద్యులపై దాడికి దుండగులను ఎవరు పంపారు?బాధితురాలి పట్ల వ్యవహరించిన విధంగానే తమపై కూడా అత్యాచారం చేస్తామని ఆకతాయిలు బెదిరించారని నర్సింగ్ సిబ్బంది నాతో అన్నారు. పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయా రనీ, దీంతో తమను తామే రక్షించుకోవలసి వచ్చిందనీ నేను మాట్లాడిన యువ మహిళా వైద్యులు చెప్పారు. ఆకతాయిలు ఎమర్జెన్సీ గదిని ధ్వంసం చేయడంతో సహా కనుచూపు మేరలో ఉన్నవన్నీ ధ్వంసం చేయడాన్ని వాళ్లు చూశారు. బోల్తా పడిన ఆంబులెన్స్‌ని చూశారు. హాస్టల్లోకి ప్రవేశించడానికి పురుషులు పైపులు, గోడల మీదుగా పైకి ఎగబాకటం చూశారు.ఈ ఆకతాయిలు ఎవరనేది బయటపడినప్పటికీ, ఈ దాడి ఘటనలో పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. వృత్తిపర మైన కలల కోసం స్త్రీలు వెయ్యిమంది రాక్షసులతో యుద్ధం చేయాల్సి ఉంటుంది. వారి పని ప్రదేశం కూడా సురక్షితంగా లేక పోతే, ఉద్యోగాల్లో చేరేలా అది మహిళలకు ప్రేరణనివ్వలేదు.బర్ఖా దత్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
ఎట్టకేలకు కశ్మీర్ ఎన్నికలు
పదేళ్లుగా అసెంబ్లీ ఎన్నికలూ...దాదాపు ఆరేళ్లనుంచి ప్రజా ప్రభుత్వం జాడా లేని జమ్మూ–కశ్మీర్లో ఎట్టకేలకు అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. వచ్చే నెల 18, 25, అక్టోబర్ 1 తేదీల్లో మూడు దఫాలుగా ఈ ఎన్నికలుంటాయని ఎన్నికల సంఘం(ఈసీ) శుక్రవారం ప్రకటించింది. ఈ సెప్టెంబర్ 30లోగా అక్కడ ఎన్నికలు నిర్వహించి తీరాలని సుప్రీంకోర్టు నిరుడు డిసెంబర్లో ఇచ్చిన ఆదేశాల పర్యవసానంగా ఈ ప్రకటన తప్పలేదు. జమ్మూ–కశ్మీర్ ఆఖరి దశ ఎన్నికలతోపాటే... అంటే అక్టో బర్ 1న హరియాణా అసెంబ్లీకి కూడా ఎన్నికలుంటాయి. రెండుచోట్లా ఎన్నికల ఫలితాలు అక్టోబర్ 4న వెల్లడవుతాయి. హరియాణాతోపాటే నవంబర్ నెలాఖరుకు గడువు ముగుస్తున్న మహారాష్ట్ర అసెంబ్లీకి కూడా ఎన్నికలుంటాయని అందరూ భావించారు. జార్ఖండ్ అసెంబ్లీ పదవీ కాలం వచ్చే జనవరితో పూర్తవుతుంది. కానీ మహారాష్ట్రలో గణేశ్ చతుర్థి, దీపావళి కారణంగా ఆ ఎన్నికలు విడిగా నిర్వహిస్తామని ఈసీ చెబుతోంది. కశ్మీర్లో ఎన్నికల ప్రకటనకు కొన్ని గంటలముందు భారీ స్థాయిలో పోలీసు ఉన్నతాధికారుల బదిలీలు జరVýæటం యాదృచ్ఛికం కాదు. విపక్షంలో ఉండగా కశ్మీర్ పరిణామాలపై ఒంటికాలిపై లేచిన బీజేపీకి అధికారం వచ్చిన తొలినాళ్లనుంచీ అదొక అంతుచిక్కని పజిల్‌గా మారిందన్నది వాస్తవం. గవర్నర్ పాలన వచ్చినా, ఆ రాష్ట్రానికి స్వయంప్రతిపత్తినిచ్చే 370 అధికరణను రద్దుచేసి రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు– జమ్మూ–కశ్మీర్, లద్దాఖ్‌లుగా విభజించి లెఫ్టినెంట్ గవర్నర్‌ను నియమించినా ఆశించిన స్థాయిలో ప్రశాంతత ఏర్పడలేదు. కశ్మీర్ లోయ ఎంతో కొంత నయం. అంతక్రితం పెద్దగా ఉగ్రవాద ఘటనల జాడలేని జమ్మూ ప్రాంతంలో ఆ ఉదంతాలు పెరిగాయి.21 మంది జవాన్లు ఉగ్రవాదుల తుపాకి గుళ్లకు బలయ్యారు. నిరుడు ఎన్డీయే కూటమి మూడోసారి అధికారంలోకొచ్చాక ఇంతవరకూ 17 సార్లు భద్రతా బలగాలపై ఉగ్రవాద దాడులు జరిగాయి. ఈ ఘటనల్లో 18మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈమధ్య ఆ రాష్ట్రానికి వెళ్లినప్పుడు జనం మార్పు కోరుకోవటంతోపాటు ఆ మార్పులో భాగస్వాములయ్యేందుకు ఉవ్విళ్లూరుతున్న వైనం కళ్లబడిందని ప్రధాన ఎన్నికల కమిష నర్ రాజీవ్ కుమార్ అన్నారు. వారు బుల్లెట్లకన్నా బ్యాలెట్లే కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ఎక్కడి ప్రజలైనా బుల్లెట్లు కోరుకోరు. తమ జీవనం సజావుగా సాగాలనీ, కనీస అవసరాలు తీరా లనీ కాంక్షిస్తారు. అది అసాధ్యమైనప్పుడే ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది.దాన్ని ఏ శక్తులు ఎలా ఉపయోగించుకుంటాయన్నది వేరే విషయం. ఆయనన్నట్టు మొన్న లోక్‌సభ ఎన్నికల్లో జమ్మూ– కశ్మీర్, లద్దాఖ్‌లలో జనం బారులు తీరిన మాట వాస్తవం. కానీ అంతక్రితం కూడా ఇదే పరిస్థితి. అది రాష్ట్రంగా ఉన్నప్పుడు 2014 నవంబర్, డిసెంబర్ నెలల్లో చివరిగా ఎన్నికలు నిర్వహించారు. ఆ ఎన్ని కలప్పుడు సైతం ఉగ్రవాదుల బెదిరింపులు, వేర్పాటువాదుల ఎన్నికల బహిష్కరణ పిలుపు బేఖా తరు చేసి వోటర్లంతా పోలింగ్ కేంద్రాల ముందు క్యూ కట్టారు. కానీ వారికి దక్కిందేమిటి? ఎవరికీ మెజారిటీ రాని స్థితిలో మూడు నెలల పాటు గవర్నర్ పాలన తప్పలేదు. ఆ తర్వాత ఊహించని రీతిలో పీడీపీ–బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైనా అది ముచ్చటగా మూడేళ్లు కూడా నడవలేదు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత జమ్మూ–కశ్మీర్ అసెంబ్లీలో స్థానాల సంఖ్య 83 నుంచి 90కి పెరిగింది. జమ్మూ ప్రాంతానికి ఆరు, కశ్మీర్‌కు ఒకటి అదనంగా వచ్చాయి. దీనికితోడు పాక్ ఆక్ర మిత కశ్మీర్ ప్రాంతానికి 24 స్థానాలున్నాయి. మొత్తంగా అసెంబ్లీ స్థానాలు 107 నుంచి 114కు పెరి గాయి. ఈమధ్య జరిగిన లోక్‌సభ ఎన్నికల సరళి గమనిస్తే 24.36 శాతం ఓట్లతో బీజేపీ ముందంజలో ఉండగా, 22.3 శాతంతో నేషనల్ కాన్ఫరెన్స్ రెండోస్థానంలో ఉంది.కాంగ్రెస్‌కు 19.38శాతం, పీడీపీకి 8.48 శాతం ఓట్లు లభించాయి. బీజేపీ, నేషనల్ కాన్ఫరెన్స్‌లు చెరో రెండు సీట్లూ గెల్చుకున్నాయి. యూఏపీఏ కింద అరెస్టయిన పాత్రికేయుడు ఇంజనీర్ రషీద్ జైల్లోవుంటూ బారా ముల్లా స్థానంనుంచి ఇండిపెండెంట్‌గా గెలిచారు. మొత్తానికి ప్రస్తుతం తనకు అనుకూల వాతా వరణం ఉన్నదని బీజేపీ విశ్వసిస్తోంది. తాజా ఎన్నికల ప్రకటనకు అది కూడా కారణం కావొచ్చు. హరియాణాలో ఈసారి ఒంటరి పోరుకు సిద్ధపడుతున్న బీజేపీకి పరిస్థితి ఆశాజనకంగా లేదు. 2014లో 90 స్థానాలున్న అసెంబ్లీలో 47 స్థానాలు గెల్చుకుని సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ... 2019లో 40తో సరిపెట్టుకుంది. ఆ ఎన్నికల్లో పది సీట్లు గెల్చుకున్న దుష్యంత్ చౌతాలాతో కూటమి కట్టి పాలించింది. అయితే ఆ పార్టీ మూణ్ణెల్లక్రితం మద్దతు ఉపసంహరించుకోగా దిన దినగండంగా నెట్టుకోస్తోంది. ఈసారి స్పష్టమైన మెజారిటీతో అధికారం ఖాయమని కాంగ్రెస్ అను కుంటున్నా అదంత సులభం కాదని విశ్లేషకుల అంచనా. అంతర్గత పోరును అదుపు చేసుకుని, విప క్షాలతో కలిస్తేనే బీజేపీని నిలువరించటం వీలవుతుందని వారంటున్నారు. కొత్తగా ఏర్పడే ప్రభుత్వా లెలా ఉంటాయన్న సంగతి పక్కనబెడితే... ముందు ఎన్నికలకు విశ్వసనీయత తీసుకురాటం ఎలా గన్నది ఈసీ పరిశీలించాలి. మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో 140 స్థానాల్లో పోలైన వోట్లకన్నా లెక్కించిన ఓట్లు అయిదు కోట్లు అధికమని వోట్ ఫర్ డెమాక్రసీ (వీఎఫ్‌డీ) బయటపెట్టింది. ఇక ఆంధ్రప్రదేశ్‌లో ఈ అధిక వోట్లు 47 లక్షలు. పర్యవసానంగా ఇతర రాష్ట్రాల మాటెలావున్నా ఏపీలో కూటమి సర్కా రుకు ఈవీఎం ప్రభుత్వమన్న ముద్రపడింది. పైగా కొన్నిచోట్ల సీల్ చేసిన ఈవీఎంల బ్యాటరీచార్జింగ్ పెరిగిన వైనం కూడా వెల్లడైంది. ఇంత అస్తవ్యస్తంగా నిర్వహణ ఉంటే ఇలాంటి ఎన్నికలను ఎవరైనా విశ్వసించగలరా? ఎన్నికల సంఘం ఆలోచించాలి. -
మళ్లీ తెరపైకి పౌరస్మృతి
వరసగా మూడోసారి గద్దెనెక్కిన తర్వాత ఎర్రకోట బురుజులపై నుంచి చేసిన తొలి ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ కీలకమైన అంశాలు ప్రస్తావించారు. అందులో ప్రధానమైనది ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ). ఇప్పుడున్న ‘మతతత్వ పౌరస్మృతి’ స్థానంలో ‘సెక్యులర్ పౌరస్మృతి’ రావా ల్సిన అవసరం ఉందన్నది మోదీ నిశ్చితాభిప్రాయం. నిజానికి ఇదేమీ కొత్త కాదు. ఇంతక్రితం సైతం పలు సందర్భాల్లో యూసీసీ గురించి ఆయన మాట్లాడారు. నిరుడు జూన్‌లో మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో జరిగిన బీజేపీ కార్యకర్తల సదస్సులో దీనిపై ఆయన గొంతెత్తారు. ఆ మాటకొస్తే పూర్వపు జనసంఘ్ నుంచీ బీజేపీ దీన్ని తరచూ చెబుతోంది. కనుక ఇందులో కొత్త ఏమున్నదని అనిపించవచ్చు. అయితే గతంలో ప్రస్తావించటానికీ, ఇప్పుడు మాట్లాడటానికీ మధ్య మౌలికంగా వ్యత్యాస ముంది. గత పదేళ్ల నుంచి ఆయన ఎన్డీయే ప్రభుత్వానికి సారథ్యం వహిస్తున్నా బీజేపీకి సొంతంగానే పాలించగల సత్తా ఉండేది. ఇప్పుడు కూటమి పక్షాలపై ఆధారపడక తప్పనిస్థితి వచ్చింది. ప్రధాని తాజా ప్రసంగంలో ఇంకా అవినీతి, మహిళల భద్రత, ఒకే దేశం–ఒకేసారి ఎన్నికలు వంటివి కూడా చోటుచేసుకున్నాయి. నిజానికి ఎర్రకోట బురుజు ప్రసంగం లాంఛనమైన అర్థంలో విధాన ప్రకట నేమీ కాదు. కానీ రాగల అయిదేళ్ల కాలంలో కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం చేయదల్చుకున్నదేమి టన్న విషయంలో ఆయన స్పష్టతతో ఉన్నారని అర్థం చేసుకోవచ్చు. మనం పూర్తి స్థాయి సెక్యులర్ దేశంగా మనుగడ సాగించాలని తొలి ప్రధాని నెహ్రూ మొదలు కొని స్వాతంత్య్రోద్యమ నాయకులందరూ భావించారు. యూసీసీ గురించి రాజ్యాంగ నిర్ణాయక సభలో లోతైన చర్చే జరిగింది. రాజ్యాంగసభ అధ్యక్షుడు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సైతం యూసీసీ ఉండితీరాలని కోరుకున్నారు. సభ్యుల్లో కొందరు వ్యతిరేకిస్తే... అనుకూలంగా మాట్లాడినవారిలో సైతం కొందరు ఇది అనువైన సమయం కాదన్నారు. ఎందుకంటే అప్పుడున్న పరిస్థితులు భిన్నమై నవి. దేశ విభజన సమయంలో ఇరుపక్కలా మతోన్మాదులు చెలరేగిపోయారు. నెత్తురుటేర్లు పారించారు. పరస్పర అవిశ్వాసం, అపనమ్మకం ప్రబలటంతో ఇళ్లూ, వాకిళ్లూ, ఆస్తులూ అన్నీ వదిలి లక్షల కుటుంబాలు ఇటునుంచి అటు... అటునుంచి ఇటూ వలసబాట పట్టారు. అదే సమయంలో పాకి స్తాన్ ఆవిర్భావానికి కారకుడైన మహమ్మద్ అలీ జిన్నా మరింత రెచ్చగొట్టే ప్రకటన చేశారు. భారత్‌లో ముస్లింలకు మనుగడ ఉండబోదని, వారిని అన్ని విధాలా అణిచేస్తారని దాని సారాంశం. అలాంటి సమయంలో యూసీసీని తీసుకొస్తే అనవసర అపోహలు బయల్దేరి పరిస్థితి మరింత జటిలమవుతుందని అందరూ అనుకున్నారు. అందువల్లే హక్కుల్లో భాగం కావాల్సిన యూసీసీ కాస్తా 44వ అధికరణ కింద ఆదేశిక సూత్రాల్లో చేరింది. ఆ సూత్రాలన్నీ ప్రభుత్వాలు నెరవేర్చాల్సిన అంశాలు. అయినా ఇతర అధికరణాల అమలు కోసం వెళ్లినట్టుగా కోర్టుకు పోయి వాటి అమలుకు ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరటం సాధ్యం కాదు. అందువల్లే సుప్రీంకోర్టు వివిధ తీర్పుల్లో యూసీసీని తీసుకురావలసిన అవసరాన్ని పాలకులకు గుర్తుచేసి ఊరుకుంది. చిత్రమేమంటే పర స్పర పూరకాలు కావలసిన హక్కులూ, ఆదేశిక సూత్రాలూ కొన్ని సందర్భాల్లో విభేదించుకుంటాయి. ఉదాహరణకు 25 నుంచి 28వ అధికరణ వరకూ పౌరులకుండే మత స్వేచ్ఛ గురించి మాట్లాడ తాయి. ఆదేశిక సూత్రాల్లో ఒకటైన యూసీసీపై చట్టం తెస్తే సహజంగానే అది మత స్వేచ్ఛను హరించినట్టవుతుంది. కనుక ఈ రెండింటి మధ్యా సమన్వయం సాధించాలి. గతంలో చాలా సందర్భాల్లో ఇలా చేయకతప్పలేదు. ‘రాజ్యాంగ మౌలిక స్వరూపం’ ప్రభావితం కాని రీతిలో ఆ పని చేయాలి. ఆ సంగతలా ఉంచి యూసీసీ తీసుకురాదల్చుకుంటే ఇస్లామ్‌ను అనుసరించేవారికి మాత్రమే కాదు... హిందూ, క్రైస్తవ, పార్సీ మతస్థులపైనా ప్రభావం పడుతుంది. కొంత హెచ్చుతగ్గులు ఉండొచ్చుగానీ దాదాపు అన్ని మతాలూ స్త్రీల విషయంలో వివక్షాపూరితంగానే ఉన్నాయి.ముఖ్యంగా వ్యక్తిగత (పర్సనల్) చట్టాలకొచ్చేసరికి ఇది బాహాటంగా కనబడుతుంది. వీటి మూలాలు వందలు, వేల ఏళ్ల నుంచి పరంపరగా వస్తూవున్న సంప్రదాయాల్లో ఉండటం, మారు తున్న కాలానికి అనుగుణంగా సవరించుకోవటానికి సిద్ధపడకపోవటం సమస్య. వివాహం, విడా కులు, పునర్వివాహం, వారసత్వం, ఆస్తి హక్కు, బహుభార్యాత్వం వంటి అంశాల్లో స్త్రీలకు వివక్ష ఎదురవుతోంది. అయితే రాజ్యాంగం హామీ ఇచ్చిన లింగసమానత్వం లేని పక్షంలో అలాంటి చట్టా లను సుప్రీంకోర్టు కొట్టివేసిన సందర్భాలున్నాయి. పార్శీల్లో అన్య మతస్థుణ్ణి పెళ్లాడిన మహిళలకు వారసత్వ ఆస్తిలో భాగం ఇవ్వరు. పార్శీ పురుషుడికి అది వర్తించదు. అన్ని అంశాలనూ సవివరంగా చర్చించేందుకూ... అన్ని మతాచారాల వివక్షను తొలగించటానికీ సిద్ధపడుతున్నారన్న అభిప్రాయం కలిగిస్తే యూసీసీ రూపకల్పన సమస్యేమీ కాదు. దానికి ముందు మైనారిటీల విశ్వాసం పొందాలి. కోల్‌కతాలో ఇటీవల మహిళా జూనియర్ డాక్టర్‌పై అత్యాచారం, హత్య నేపథ్యంలో మహిళల భద్రత అంశాన్ని మోదీ ప్రస్తావించారు. ఇక భారత్‌లో అవినీతి పెచ్చుమీరిందని గణాంకాలు వెల్లడి స్తున్న నేపథ్యంలో కఠినంగా ఉంటామన్న సంకేతాలిచ్చారు. కానీ అలాంటి ఆరోపణలున్న నేతలు బీజేపీలోనో, దాని మిత్రపక్షంగానో ఉన్నప్పుడూ... వారిపై కేసుల దర్యాప్తు మందగిస్తున్నప్పుడూ దీన్ని జనం ఎంతవరకూ విశ్వసించగలరన్నది ఆలోచించుకోవాలి. మొత్తానికి యూసీసీ అంశాన్ని ప్రధాని మరోసారి తెరపైకి తెచ్చారు. ఈ విషయంలో దేశవ్యాప్తంగా ఎటువంటి స్పందన వస్తుందో, ఎన్డీయే కూటమిలోని ఇతర పక్షాల వైఖరి ఏ విధంగా ఉంటుందో మున్ముందు తెలుస్తుంది. -
మీడియా స్వేచ్ఛకు కళ్లెమా!
వక్ఫ్ బిల్లుపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) ఏర్పాటు చేయకతప్పని పక్షం రోజుల్లోనే ప్రస్తుతం భిన్నవర్గాల పరిశీలనలో ఉన్నదని చెబుతున్న బ్రాడ్‌కాస్టింగ్ సర్వీసెస్ రెగ్యులేషన్ బిల్లు ముసాయిదాను కేంద్రంలోని ఎన్డీయే సర్కారు వెనక్కి తీసుకుంది. కారణమేదైనా ఇది ఆహ్వానించ దగ్గ పరిణామం. ఈ బిల్లు తొలి ముసాయిదా నిరుడు నవంబర్‌లో విడుదల చేయగా దానిపై వచ్చిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నామని చెబుతూ గత నెల రెండో ముసాయిదా తీసుకొచ్చారు. తాజాగా దాన్ని కూడా వెనక్కి తీసుకున్నారు. వచ్చే అక్టోబర్ 15 వరకూ ముసా యిదా బిల్లుపై సంప్రదింపుల ప్రక్రియ కొనసాగుతుందని ప్రభుత్వం చెబుతోంది. బహుశా శీతా కాల సమావేశాలనాటికి దీనికి తుదిరూపం ఇవ్వాలన్నది పాలకుల ఉద్దేశం కావొచ్చు. డిజిటల్ మీడియా ప్రస్తుతం ఊహకందని రీతిలో విస్తరించింది. 1959లో ప్రయోగాత్మకంగా ఢిల్లీలో ప్రారంభించిన టెలివిజన్ ప్రసారసేవలు 80వ దశకం చివరినాటికి కొత్త పుంతలు తొక్కాయి. స్టార్ టీవీ, ఎంటీవీ, బీబీసీ, సీఎన్ఎన్ వగైరాలు జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. ప్రస్తుతం యూట్యూబ్, ఫేస్బుక్, ట్విటర్వంటి సామాజిక మాధ్యమాలతోపాటు ఓటీటీలు వచ్చాయి. వాట్సాప్, టెలిగ్రామ్ వంటివి సరేసరి. అన్నింటా మంచీ చెడూ ఉన్నట్టే వీటివల్ల కూడా సమస్యలు ఎదురువుతూ ఉండొచ్చు. అవి దుష్పరిణామాలకు దారితీయటం నిజమే కావొచ్చు. అందుకు తగిన చట్టాలు తీసుకు రావటం కూడా తప్పేమీ కాదు. కానీ ఈ మాధ్యమాలను నియంత్రించే పేరిట భావప్రకటనా స్వేచ్ఛకు కళ్లెం వేయాలనుకోవటం, అసమ్మతిని అణిచేయాలనుకోవటం ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. బ్రాడ్‌కాస్టింగ్ సర్వీసెస్ రెగ్యులేషన్ ముసాయిదా బిల్లు చేస్తున్నది అదే. గతంలో కేబుల్ రంగం హవా నడిచినప్పుడు వీక్షకులకు ఇష్టం ఉన్నా లేకున్నా అనేక చానెళ్లు వచ్చిపడేవి. వర్తమానంలో అలా కాదు. ఏం చూడాలో, వద్దో నిర్ణయించుకునే స్వేచ్ఛ వీక్షకులకు ఉంటుంది. పార్టీలకు అమ్ముడుపోయిన చానెళ్లు వాస్తవాలను వక్రీకరిస్తున్నారని అర్థమయ్యాక జనం వాటిని చూడటం మానుకుంటున్నారు. ఆన్లైన్లో ప్రత్యామ్నాయాలను వెదుక్కుంటున్నారు. తమకు నచ్చిన, తాము తెలుసుకోవాలనుకుంటున్న విషయం ఉన్నదనుకుంటేనే ఆన్లైన్లో లభ్య మయ్యే వీడియోలను వీక్షిస్తారు. వార్తా విశ్లేషణలను చదువుతారు. ఒక అంశంపై ఎవరెవరి అభిప్రా యాలు ఎలావున్నాయో తెలుసుకుంటారు. ఈ క్రమంలో సహజంగానే ప్రజలను పక్కదోవపట్టించేవాళ్లు ఉంటారు. అశ్లీలతనూ, దుర్భాషలనూ గుప్పించేవారుంటారు. తప్పుడు కథనాలను ప్రసారం చేసేవారూ ఉంటారు. అలాంటివారిపై తగిన చర్యలు తీసుకోవటాన్ని ఎవరూ కాదనరు. కానీ నిజాయితీగా అభిప్రాయాలు వ్యక్తీకరించేవారిని కూడా వారితో సమంచేసి శిక్షించే ధోరణి ఎంతవరకూ సబబు? అత్యధిక వీక్షకుల్ని రాబట్టుకుంటున్న ఆన్లైన్ మాధ్యమాలకు సైతం ముసా యిదాలో ఏముందో అధికారికంగా తెలియదు. అనేకానేక ఆన్లైన్ చానెళ్లు, ఇతర ప్రచురణ మాధ్య మాలూ సభ్యులుగా ఉన్న డిజిపబ్ వంటి స్వయంనియంత్రణ సంస్థలకే ఈ ముసాయిదాపై ప్రభుత్వం నుంచి ఎలాంటి వర్తమానమూ లేదు. మరి కేంద్రం ఇంతవరకూ సాగించామంటున్న సంప్రదింపులు ఎవరితో జరిగినట్టు? రెండు మూడు ఓటీటీ యాజమాన్యాలనో, కార్పొరేట్ రంగ ఆధిపత్యంలో సాగుతున్న ఇతర మాధ్యమాలనో, తాము నిపుణులుగా భావించేవారినో సంప్రదిస్తే సరిపోతుందా? సాగు చట్టాల విషయంలోనూ లక్షలాదిమంది రైతులతో, వేలాది సంఘాలతో చర్చించామని అప్పట్లో ప్రభుత్వం చెప్పింది. చివరకు ఏమైంది? రైతులు పట్టుదలగా పోరాడాక వెనక్కు తీసుకోకతప్పలేదు. సమస్యేమంటే...ట్విటర్లో లక్షల్లో అనుయాయులున్న రాజకీయ నాయకులు మొదలుకొని ధ్రువ్రాఠివంటి పాపులర్ యూట్యూబర్ల వరకూ... ఎంతో నిబద్ధతతో సీనియర్ జర్నలిస్టులు నడిపే మాధ్యమాలవరకూ అందరినీ ముసాయిదా బిల్లు ఒకే గాటన కడు తోంది. ఆఖరికి పత్రికలూ, చానెళ్లూ అనుబంధంగా నడుపుతున్న డిజిటల్ మాధ్యమాలు సైతం ఈ పరిధిలోకొస్తాయి. పైగా ఈ కార్యకలాపాలు క్రిమినల్ చట్టాల పరిధిలోకి కూడా వెళ్లి అనేక కేసులు దాఖలవుతాయి. అరెస్టయితే బెయిల్ దుర్లభమవుతుంది. తటస్థంగా విశ్లేషణలందిస్తూ వేలల్లోనో, లక్షల్లోనో వీక్షకుల్ని సంపాదించుకుంటున్న వ్యక్తులు కూడా ఈ బిల్లు చట్టమైతే అనేకానేక పత్రాలు దాఖలుచేయాల్సివస్తుంది. అంతేకాదు...ఒక గ్రీవెన్స్ అధికారిని నియమించుకోవటం, స్వీయ మదింపు కమిటీని ఏర్పాటుచేసుకోవటం తప్పనిసరవుతుంది. ఈ వ్యయాన్నంతా వీక్షకులనుంచి వసూలు చేయటం సాధ్యమేనా? అసలు వచ్చే ఆదాయం ఎంత? పైగా తప్పుడు కథనాలు ప్రసారం చేశారనుకుంటే వారెంట్ లేకుండా దాడులు చేసి పరికరాలను స్వాధీనం చేసుకునే అధికారం ప్రభు త్వాలకు వస్తుందంటున్నారు.ఇందిరాగాంధీ హయాంలో ఎమర్జెన్సీ విధించి విపక్షాలను జైళ్లలో కుక్కి అసమ్మతిని అణి చేశారని బీజేపీ తరచు చెబుతుంటుంది. రాజ్యాంగాన్ని హత్య చేసిన రోజుగా ప్రతియేటా జూన్ 25ను పాటించాలని కూడా పిలుపునిచ్చింది. అలాంటి పార్టీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఈ ముసాయిదాను తీసుకురావటం, దాన్ని బహిరంగపరచకపోవటం వింత కాదా? మన పొరుగు నున్న బంగ్లాదేశ్‌లో హసీనా హయాంలో ఇలాంటి చట్టాన్నే తీసుకొచ్చారు. కానీ అక్కడ నిరసన వెల్లువ ఆగిందా? తమ నిర్ణయాలపై సామాన్యులు ఏమనుకుంటున్నారో, వారిలోవున్న అసంతృప్తి ఏమిటో తెలుసుకోవటానికి డిజిటల్ మీడియా తోడ్పడుతుంది. అది పాలకులకే మంచిది. మీడియా స్వేచ్ఛకు గొడ్డలిపెట్టయిన ఇలాంటి ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవటం ఉత్తమం. -
సీబీఐ దర్యాప్తే సరైంది!
దేశవ్యాప్తంగా వైద్యవర్గాల్లో తీవ్ర ఆగ్రహావేశాలు రగిల్చిన కోల్‌కతా వైద్య కళాశాల అనుబంధ ఆస్పత్రి ఉదంతంపై సీబీఐ దర్యాప్తునకు కోల్‌కతా హైకోర్టు మంగళవారం ఆదేశాలివ్వటం అన్ని విధాలా సబబైనది. జూనియర్ డాక్టర్‌గా పనిచేస్తున్న పీజీ విద్యార్థిని మొన్న శుక్రవారం వేకువ జామున ఒక దుండగుడి అఘాయిత్యానికి బలైంది. ఈ కేసు విషయంలో గత అయిదురోజులుగా పోలీసులు వ్యవహరిస్తున్న తీరు ప్రజల్లో సందేహాలు తీర్చకపోగా... మరిన్ని అనుమానాలకు తావిచ్చింది. దుండగుడిని అరెస్టు చేశామంటున్న పోలీసుల ప్రకటనపై అటు మెడికో కుటుంబ సభ్యులు, ఇటు వైద్య విద్యార్థులు, సిబ్బంది సంతృప్తి చెందలేదు. హత్య, అత్యాచారం ఉదంతంలో కచ్చితంగా ఇతరుల ప్రమేయం ఉందని మొత్తుకున్నారు. కానీ పోలీసులు పట్టనట్టే ఉన్నారు. అసలు ఆస్పత్రి పాలకవర్గం, లేదా ప్రిన్సిపాల్ ఇంతవరకూ ఈ ఉదంతంలో ఫిర్యాదు దాఖలు చేయలేదు. కనీసం వారిని పిలిచి ప్రశ్నించినవారూ లేరు. ఆరు రోజుల్లో... అంటే వచ్చే ఆదివారంలోగా నిగ్గు తేల్చకపోతే కేసును సీబీఐకి అప్పగిస్తానని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హెచ్చ రించారు. కానీ హైకోర్టు భిన్నంగా ఆలోచించింది. ఇందులో జాప్యం జరిగినకొద్దీ సాక్ష్యాధారాలు మాయమవుతాయని, దోషులు తప్పించుకునే అవకాశం ఉన్నదని భావించింది.కొన్ని నేరాలు సమాజాన్ని తీవ్రంగా కలచివేస్తాయి. మనుషులుగా అసలు మన ఉనికిపైనే సందేహం రేకెత్తిస్తాయి. సరిగ్గా పన్నెండేళ్ల క్రితం దేశరాజధాని ఢిల్లీలో చోటుచేసుకున్న నిర్భయ ఉదంతం అటువంటిదే! ప్రజలంతా ఉద్యమించిన పర్యవసానంగా ఆ విషయంలో నాటి కేంద్ర ప్రభుత్వం చురుగ్గా కదిలి కఠినమైన చట్టాన్ని తీసుకొచ్చింది. నేరగాళ్లకు ఉరితో సహా కఠినశిక్షలు అమలుచేసింది. కానీ ఆ తర్వాత కూడా నేరాలు తగ్గలేదు. దీనికి కారణం కేవలం ప్రభుత్వాల అలసత్వం మాత్రమే! నేరగాళ్లను వెనువెంటనే శిక్షించేలా పకడ్బందీ దర్యాప్తు జరగకపోవటం అన్ని చోట్లా కనబడుతోంది. కేవలం చట్టాలు మాత్రమే సరిపోవనీ, వాటిపై అవగాహన కల్పించి, ఆపత్కాలంలో మహిళలు తక్షణం ఆశ్రయించే సదుపాయం అమల్లోకి తేవాలని ప్రభుత్వాలు అను కోలేదు. తెలంగాణలో షీ టీమ్స్ అయినా, ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన దిశ యాప్, దిశ చట్టమైనా మహిళలకు ఎంతో తోడ్పాటుగా నిలిచాయి. ముఖ్యంగా ఏపీలో దిశ యాప్ వల్ల నేరాలను నివారించిన సందర్భాలు కూడా ఉన్నాయి. కోల్‌కతా ఆస్పత్రిలో ఉన్న అస్తవ్యస్త పరిస్థితి ఆశ్చర్యం కలిగిస్తుంది. ఒకపక్క దేశవ్యాప్తంగా లైంగిక నేరాలు పెరిగాయని తెలుస్తూనే ఉన్నా మహిళా సిబ్బంది భద్రతకూ, రక్షణకూ ఆస్పత్రి ఎలాంటి చర్యలూ తీసుకోలేదని అక్కడి పరిస్థితులు చూస్తే అర్థమవుతోంది. నేరగాడు సంజయ్ రాయ్ పోలీస్ వలంటీర్‌గా ఉంటూ ఆస్పత్రిలో ఎక్కడికైనా యథేచ్ఛగా వెళ్తాడని అందరూ చెబుతున్న మాట. ఆఖరికి మహిళా వైద్య సిబ్బంది విశ్రాంతి తీసుకునే ప్రాంతానికి కూడా నిశిరాత్రి అతగాడు వెళ్లగలిగాడంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఆ జూనియర్ డాక్టర్ 36 గంటలు అవిశ్రాంతంగా రోగులకు సేవలందించి అలసి నిదిరిస్తున్న వేళ నేరగాడు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని తోటి సిబ్బంది అంటున్నారు. ప్రకృతి వైపరీత్యాలు, ప్రమాదాలు జరిగినప్పుడు సేవలందించటానికి నమోదు చేసుకున్న నేరగాడికి ఆస్పత్రిలో సంచరించే స్వేచ్ఛ ఎవరిచ్చారో తేలాల్సివుంది. గర్భిణి అయిన భార్యను హింసించిన ఉదంతంలో వచ్చిన ఫిర్యాదుపై రెండేళ్లుగా పోలీసులు పట్టించుకోలేదంటే అతగాడి పలుకుబడిని అంచనావేయొచ్చు. అప్పుడే చర్య తీసుకుంటే ఈ ఘోరం జరిగేదా? తమ కుటుంబాల్లో వైద్య అవస రాలున్నప్పుడల్లా ఆస్పత్రిలో అన్నీ అందేలా చూస్తున్నాడన్న ఏకైక కారణంతో పోలీసులు అతడిని చూసీచూడనట్టు వదిలేశారని చాలామంది చెబుతున్న మాట. తాము తీసుకున్న వలంటీర్ల నడవడి ఎలావుంటున్నదో, వారిని కొనసాగించాలో లేదో సమీక్షించుకునే సంస్కృతి లేకపోవటం ఎటువంటి ఘోరాలకూ, నేరాలకూ దారితీస్తుందో అంచనా వేయలేనంత స్థితిలో పోలీసులుండటం ఆశ్చర్య కరం. నిజానికి లోతైన దర్యాప్తు జరిగితే తమ లోపాలు కూడా బయటపడతాయన్న ఏకైక కారణంతోనే గత అయిదురోజులుగా కోల్‌కతా పోలీసులు దర్యాప్తు డ్రామా కొనసాగిస్తున్నారనుకోవాలి. చదువు పూర్తయ్యాక ఇతర రంగాల్లో వెనువెంటనే స్థిరపడే అవకాశం ఉన్నా దాన్ని కాదనుకుని పలువురు విద్యార్థులు ఎన్నో సవాళ్లతో కూడిన, దీర్ఘకాలం పట్టే వైద్యవిద్యకు మొగ్గుచూపుతారు. సమాజం పట్లా, మనుషుల పట్లా ఎంతో సేవాభావం, ప్రేమ ఉంటే తప్ప ఇది సాధ్యంకాదు. కానీ అలాంటివారికి ఆ రంగంలో సరైన గౌరవ మర్యాదలు లభిస్తున్నాయా? వారి భద్రతకు సక్రమమైన చర్యలు తీసుకుంటున్నారా? ఈ విషయంలో జూనియర్ డాక్టర్లు తరచు చెప్పే అంశాలు అంత సంతృప్తికరంగా లేవు. వారి శ్రమకు తగ్గ వేతనాలు అందవు. అవి కూడా నిర్దిష్ట సమయానికి రాని దుఃస్థితి చాలాచోట్ల ఉంటున్నది. వేళకాని వేళల్లో సైతం అవిశ్రాంతంగా పనిచేసేవారికి కనీసం కాసే పయినా భద్రంగా నిద్రపోయే సౌకర్యం ఆస్పత్రి పాలకవర్గం కల్పించలేకపోయిందంటే, ఆ విష యంలో సీనియర్లు శ్రద్ధ పెట్టలేదంటే ఏమనుకోవాలి? పెత్తనం చలాయించటానికి ఉబలాటపడే వారు తాము కూడా ఒకప్పుడు జూనియర్లమనీ, వారిని కంటికి రెప్పలా చూసుకోవాలనీ భావించక పోవటం విషాదం. సహ సిబ్బంది పట్లా, వారి దురవస్థలపట్లా సహానుభూతి లేనివారి వల్లే ఇలాంటి దురంతాలు చోటు చేసుకుంటున్నాయి. కోల్‌కతా ఆస్పత్రి ఉదంతమైనా అటువంటి వారి కళ్లు తెరిపించాలి. వైద్యసిబ్బంది రక్షణకూ, భద్రతకూ దేశవ్యాప్తంగా పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలి.