Editorial
-
చేయాల్సింది చాలావుంది!
ప్యారిస్ వేసవి విశ్వక్రీడా సంరంభం ముగిసింది. దాదాపు 850 పతకాలు విజేతలను వరించిన ఈ 2024 ఒలింపిక్స్‌లో 10 ప్రపంచ రికార్డులు, 32 ఒలింపిక్ రికార్డులతో సహా మొత్తం 42 రికార్డులు బద్దలయ్యాయి. మరి, భారత్ సాధించినదేమిటి అన్నప్పుడే ఆశ నిరాశలు దోబూచులాడతాయి. 117 మంది అథ్లెట్లతో, 16 క్రీడాంశాల్లో పోటీపడుతూ భారత ఒలింపిక్ బృందం ఎన్నో ఆశలతో విశ్వ వేదికపై అడుగుపెట్టింది. ఈసారి రెండంకెల్లో పతకాలు సాధిస్తామనే ఆకాంక్షను బలంగా వెలి బుచ్చింది. తీరా ఒలింపిక్స్ ముగిసేవేళకు అరడజను పతకాలతోనే (5 కాంస్యం, 1 రజతం) తృప్తి పడాల్సి వచ్చింది. గడచిన 2020 టోక్యో ఒలింపిక్స్‌లో సాధించిన 7 పతకాల అత్యుత్తమ ప్రదర్శనతో పోలిస్తే... ఇది ఒకటి తక్కువే. ఈ సంరంభంలో మొత్తం 84 దేశాలు పాల్గొంటే, ప్రపంచంలో అత్యధికంగా 145 కోట్ల జనాభా గల మన దేశం పతకాల పట్టికలో 71వ స్థానంలో నిలిచింది. మన పతకాలు, జనాభా నిష్పత్తి చూస్తే, ప్రతి 25 కోట్ల మందికి ఒక్క పతకం వచ్చిందన్న మాట. ‘ఖేలో ఇండియా’ పేరిట కోట్లు ఖర్చుచేస్తున్నామంటున్న పాలకులు ఆత్మశోధనకు దిగాల్సిన అంశమిది.ఫ్రాన్స్‌లో రాజకీయ సంక్షోభం, పొంచివున్న దాడుల పట్ల భద్రతా సిబ్బంది భయం, ఫ్రెంచ్ ప్రజానీకంలో పెద్దగా ఉత్సాహం లేకపోవడం... వీటన్నిటి మధ్య ప్యారిస్ ఒలింపిక్స్ సరిగ్గా జరుగు తాయో జరగవో అని అందరూ అనుమానపడ్డారు. అన్నిటినీ అధిగమించి ఈ విశ్వ క్రీడోత్సవం విజయవంతంగా ముగిసింది. పైగా, అస్తుబిస్తుగా ఉన్న ఫ్రెంచ్ ఆర్థిక వ్యవస్థకు ఇప్పుడు అత్యవ సరమైన కొత్త ఉత్సాహమూ నింపింది. క్రితంసారి కోవిడ్ మూలంగా టోక్యోలో ప్రేక్షకులు లేకుండానే పోటీలు నిర్వహించిన నేపథ్యంలో ఈసారి స్పాన్సర్లు, బ్రాడ్కాస్టర్ల నుంచి అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీకి ఒత్తిడి ఉంది. నిర్వాహకులు మొత్తం ప్యారిస్ను ఓపెన్–ఎయిర్ ఒలింపిక్ క్రీడాంగణంగా మార్చేసి, అందరూ ఆహ్వానితులే అనడంతో ఊహించని రీతిలో ఇది దిగ్విజయమైంది. పోటీల్లో పాల్గొన్న ఒకరిద్దరు క్రీడాకారుల జెండర్ అంశం, భారత రెజ్లర్ వినేశ్ ఫోగట్ అనర్హత వ్యవహారం లాంటివి మినహా ఈ ప్యారిస్ ఒలింపిక్స్ అతిగా వివాదాస్పదం కాలేదనే చెప్పాలి. ఉక్రెయిన్, గాజా లాంటి భౌగోళిక రాజకీయ అంశాలు, అలాగే అమెరికాలో ఎన్నికల వేడి, బ్రిటన్‌లో అల్లర్లు, బంగ్లాదేశ్‌లో సంక్షోభం లాంటివి పతాక శీర్షికలను ఆక్రమించేసరికి ఒలింపిక్స్ వివాదాలు వెనుకపట్టు పట్టాయనీ ఒప్పుకోక తప్పదు. ప్యారిస్ వేసవి ఒలింపిక్స్‌కు తెర పడింది కానీ, ఈ ఆగస్ట్ 28 నుంచి అక్కడే పారా ఒలింపిక్స్–2024 జరగనుంది. తదుపరి 2028 వేసవి ఒలింపిక్స్‌కు లాస్ ఏంజెల్స్ సిద్ధమవుతోంది. కేవలం రెండే పతకాలు సాధించిన 2016 నాటి రియో ఒలింపిక్స్‌తో పోలిస్తే, భారత్ మెరుగైన మాట నిజమే. అథ్లెటిక్స్, వెయిట్ లిఫ్టింగ్, మహిళా బ్యాడ్మింటన్‌లో వెనుకబడినా టేబుల్ టెన్నిస్, షూటింగ్లలో కాస్త ముందంజ వేశామన్నదీ కాదనలేం. ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించి, ఆ ఘనత సాధించిన తొలి భారతీయ షూటర్‌గా 22 ఏళ్ళ మనూ భాకర్ చరిత్ర సృష్టించారు. గోల్‌కీపర్ శ్రీజేశ్ సహా హాకీ బృందమంతా సర్వశక్తులూ ఒడ్డి, వరుసగా రెండో ఒలింపిక్స్‌లోనూ పతకం సాధించింది. ఇక ఈ ఒలింపిక్స్‌లో ఊరించి చేజారిన పతకాలూ చాలా ఉన్నాయి. భారత మల్లయోధురాలు వినేశ్ ఫోగట్ సంచలన విజయాలు నమోదు చేసినా, వంద గ్రాముల అధిక బరువు రూపంలో దురదృష్టం వెన్నాడకపోతే స్వర్ణం, లేదంటే కనీసం రజతం మన ఖాతాలో ఉండేవి. షట్లర్ లక్ష్యసేన్, అలాగే 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటర్ అర్జున్ బబుతా సహా కనీసం 6 సందర్భాల్లో మనవాళ్ళు ఆఖరి క్షణంలో నాలుగో స్థానానికి పరిమితమ య్యారు. లేదంటే పతకాల పట్టికలో మన దేశం మరింత ఎగబాకేదే. పతకాలు, విజయాల మాటెలా ఉన్నా, మన మార్కెటింగ్ విపణికి కొన్ని కొత్త ముఖాలు దొరికాయి. గాయాల నుంచి ఫీనిక్స్ పక్షిలా లేచిన నీరజ్ చోప్రా, పీవీ సింధుల మొదలు నిలకడగా ఏళ్ళ తరబడి ఆడిన శ్రీజేశ్, రెండు పతకాల విజేత మనూ భాకర్, బ్యాడ్మింటన్ క్రేజ్ లక్ష్యసేన్ దాకా పలువురు బ్రాండ్లకు ప్రీతిపాత్రులయ్యారు. కానీ ఇది సరిపోతుందా? ఆర్చరీ, బాక్సింగ్ సహా పలు అంశాల్లో నిరాశాజనక ప్రదర్శన మాటే మిటి? మిశ్రమ భావోద్వేగాలు రేగుతున్నది అందుకే. ఇప్పటికైనా మన ప్రాధాన్యాలను సరి చేసుకో వాలి. అత్యధిక జనాభా గల దేశంగా ప్రతిభకు కొదవ లేదు. ప్రతిభావంతుల్ని గుర్తించి, ప్రోత్సహించి, సరైన రీతిలో తీర్చిదిద్దడమే కరవు. మనకొచ్చిన 6 పతకాల్లో 4 దేశ విస్తీర్ణంలో 1.4 శాతమే ఉండే హర్యానా సంపాదించి పెట్టినవే. అంటే, మొత్తం పతకాల్లో హర్యానా ఒక్కదాని వాటా 66 శాతం. మరి, మిగతా దేశం సంగతి ఏమిటి? అక్కడి పరిస్థితులేమిటి? ప్రపంచంలోని అగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థ మనదని జబ్బలు చరుచుకుంటున్న పాలకులు ఇవాళ్టికీ క్రీడలకు సరైన రీతిలో వస తులు, వనరులు ఇవ్వట్లేదు. పేరొచ్చాక సాయం చేస్తే సరిపోదు. క్షేత్రస్థాయిలో ఆటగాళ్ళకు నారు పోసి, నీరు పెట్టాలి. మన క్రీడా సంఘాలు, ప్రాధికార సంస్థలు రాజకీయ నేతల గుప్పెట్లో ఇరుక్కుపోవడం పెను విషాదం. పతకాలకై పోరాడాల్సిన ఆటగాళ్ళు లైంగిక వేధింపులు సహా అనేక సమస్యలపై రోడ్డెక్కి పోరాడాల్సిన పరిస్థితిని కల్పించడం మన ప్రభుత్వాల తప్పు కాదా? క్రీడా సంస్కృతిని పెంచి పోషించడానికి బదులు రాజకీయాల క్రీనీడలో ఆటను భ్రష్టు పట్టిస్తే, పతకాలు వచ్చేదెట్లా? అంతర్జాతీయ స్థాయిలో విజయానికి దూరదృష్టి, సరైన వ్యూహం, నిరంతరం పెట్టుబడి, స్పష్టమైన క్రీడా విధానం రాష్ట్ర స్థాయి నుంచే కీలకం. ఆ దిశగా ఆలోచించాలే తప్ప దాహమేసినప్పుడు బావి తవ్వితే కష్టం. అందుకే, 1900 తర్వాత నూటపాతికేళ్ళలో ఒలింపిక్స్‌లో ఇది మన రెండో అత్యుత్తమ ప్రదర్శన. ఇకనైనా అపూర్వ క్రీడాదేశంగా మనం అవతరించాలంటే, పాలకులు చేయాల్సింది చాలా ఉంది. -
దేశ‘భుక్తి’ గేయం
ఎప్పటి గురజాడ! ఎప్పటి దేశభక్తి గీతం! నూటపాతికేళ్ళ క్రితం నాటి ఆ గీతం ఇన్ని కోట్ల తెలుగుప్రజల పెదాలపై ఎన్ని కోట్ల సార్లు నర్తించి ఉంటుంది! ‘దేశమును ప్రేమించుమన్నా’ అని చెప్పే ఆ గీతం నిత్యస్మరణనే కాదు, నిరంతరాచరణను ఉద్బోధించడం లేదా? అది కాలభేదాలను దాటి నూతనత్వాన్ని తెచ్చుకునే సముజ్వలపాఠం కాదా? దాని సారమూ, సందేశమూ జాతి జనులలో ఇప్పటికైనా ఇంకాయా? మనదేశం లాంటి జనతంత్ర వ్యవస్థలో రాజకీయ, ఆర్థిక, సామాజికాది అన్ని రంగాలకూ ఎప్పటికీ దిశానిర్దేశం చేసే మహిమాన్విత మంత్రం ఆ గీతం! అరవై అయిదు పంక్తుల ఆ గీతంలో మనకు ఎంత చటుక్కున గుర్తొస్తాయో, అంతే అలవోకగా మరచిపోయే పంక్తులు రెండే; అవి, ‘దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్’! ఆ కవితాహారంలో అవే మణిపూసలైన మహావాక్యాలు. దేశాన్ని మట్టిగానూ, భూభాగంగానూ చూడడమే పరిపాటి కాగా, మనుషులుగా గుర్తించిన గురజాడ తన కాలానికి ఎన్నో మన్వంతరాలు ముందున్నాడు. దేశమంటే మనుషులని ఎలుగెత్తి చాటడంలో వేల సంవత్సరాల వెనక్కీ వెళ్లగలిగిన విలక్షణ క్రాంతదర్శి ఆయన. దేశమూ, రాజ్యమూ అనే భావనే అంకురించని గణసమాజంలో అస్తిత్వానికి మనిషే మణిదీపమూ, కొలమానమూనూ... గురజాడ గీతోపదేశానికి పూర్తి వ్యతిరేకదిశలో నేటి మన ప్రజాస్వామికగమనం సాగుతున్న వైనాన్ని ఆ గీతంలోని ప్రతి చరణమూ ఛెళ్ళున చరచి చెబుతుంది. వొట్టి మాటలు కట్టిపెట్టి, గట్టి మేలు తలపెట్టమంటాడాయన. మంచి గతమున కొంచెమే, మందగించక ముందుకడుగేయమంటాడు. వ్యర్థకలహం వద్దనీ, కత్తి వైరం కాల్చమనీ హితవు చెబుతాడు. దేశాభిమానపు గొప్పలు మానేసి జనానికి నికరంగా పనికొచ్చేది చేసి చూపమంటాడు. దేశస్థులంతా చెట్టపట్టాలు వేసుకు నడవాలనీ, అన్ని జాతులూ, మతాలూ అన్నదమ్ముల్లా మెలగాలనీ సందేశిస్తాడు. మతం వేరైనా మనసులొకటై మనుషులుండాలంటాడు. దేశమనే దొడ్డవృక్షం ప్రేమలనే పూలెత్తాలనీ, ఆ చెట్టు మూలం నరుల చెమటతో తడిసి ధనమనే పంట పండించాలనీ స్వప్నిస్తాడు... మరో రెండురోజుల్లో 78వ స్వాతంత్య్ర దినోత్సవానికి ముస్తాబవుతున్న భారత జనతంత్ర ప్రస్థానం గురజాడ చూపిన జాడకు ఏ కొంచెమైనా దగ్గరగా ఉందా? వొట్టి మాటల వరదలో గట్టి మేలు గడ్డిపరక అయింది. మంచి అంతా గతంలోనే ఉందని చెప్పి జనాన్ని వెనకడుగు పట్టించడమే రాజకీయమైంది. దేశం వ్యర్థకలహాలు, కత్తివైరాలతో సంకుల సమరాంగణమైంది. జనాన్ని చీల్చి పాలించడమే అధికార పరమపదానికి సోపానమైంది. దేశమనే దొడ్డవృక్షం ప్రేమలనే పూలెత్తడం లేదు; వైర, విద్వేషాల విరితావులు వీస్తోంది. ఆ చెట్టు మూలం మనుషుల చెమటతో తడిసి ధనమనే పంట పండించాలన్న కవి ఆశాభావం, ఇప్పటికీ గట్టిగా వేటుపడని నిరుద్యోగపు జడలమర్రి కింద నిలువునా సమాధి అయే ఉంది. దేశమంటే మనుషులనే కాదు, ఆ మనుషులకు ఏది అత్యవసరమో గురజాడ ఉద్ఘాటిస్తాడు. తిండి కలిగితె కండ కలదోయ్, కండగలవాడేను మనిషోయని, మనిషిని నిర్వచిస్తాడు; ఈసురోమని మనుషులుంటే దేశమేగతి బాగుపడుతుందంటాడు; మనిషి సంపూర్ణ జవసత్త్వాలతో హుందాగా శిరసెత్తుకు జీవిస్తూ దేశాభివృద్ధిలో భాగస్వామి అవడానికీ, తిండిపుష్టికీ ఉన్న అన్యోన్య సంబంధాన్ని ఆనాడే నొక్కిచెబుతాడు. అటువంటిది, యావత్ప్రజలకూ పుష్టికరమైన ఆహారాన్ని సమకూర్చే లక్ష్యానికి ఇప్పటికీ యోజనాల దూరంలోనే ఉన్నాం. పోషకాహార లోపంతో ఉసూరుమంటున్న ప్రపంచ బాలల్లో 50 శాతం భారత్‌లోనే ఉన్నారనీ, కేవలం పదిశాతం మందికే పోషకాహారం అందుతోందనీ గణాంకాలు చెబుతున్నాయి. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే–5 ప్రకారం, అయిదేళ్ళ లోపు వయసు పిల్లల్లో శారీరకమైన ఎదుగుదల లోపించినవారు 35 శాతానికి పైగా, బలహీనులు దాదాపు 20 శాతమూ ఉన్నారు. రక్తహీనతను ఎదుర్కొంటున్న పురుషులు, మహిళలు, పిల్లల శాతం గరిష్ఠంగా 67 నుంచి కనిష్ఠంగా 25 వరకూ ఉంది. 2023 లెక్కల ప్రకారమే మన దేశంలో 74 శాతం మందికి ఆరోగ్యకరమైన ఆహారం అందుబాటులో లేదు. ప్రపంచ ఆకలి సూచిలో భారత్ స్థానం ఆందోళన గొలుపుతూ 28.7 దగ్గర ఉంది. భారత్ త్వరలోనే 5 ట్రిలియన్ల ఆర్థికత అవుతుందనీ, ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థికతలలో మూడవది కాబోతోందనీ పాలకులు అరచేతి స్వర్గాలు ఆవిష్కరిస్తుంటే అసలు నిజాలు ఇలా నిలువునా వెక్కిరిస్తున్నాయి. ఇప్పటికీ దేశ జనాభాలో సగానికి పైగా, 81 కోట్లమంది నెలకు అయిదు కిలోల రేషన్ పైనే ఆధారపడుతున్నారు. ఈ మాత్రానికీ నోచుకోని వలస, అసంఘటిత రంగ శ్రామికులు 8 కోట్లమంది ఉన్నారు. జనాభా లెక్కల సేకరణ సకాలంలో జరిగి ఉంటే ఈ సంఖ్య ఇంకా పెరిగేదంటున్నారు. కోవిడ్ దరిమిలా వీరిని కూడా ఆహార భద్రతా చట్టం కిందికి తేవాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలు బేఖాతరయ్యాయి. పైగా తాజా బడ్జెట్లో ఆహార సబ్సిడీపై ఇంకా కోత పడింది. పోషకాహార లోపం వల్ల భారత్ తన స్థూల జాతీయోత్పత్తిలో ఏకంగా 4 శాతం నష్టపోతోంది. తిండికి, కండకు, మనిషికి; దేశాభివృద్ధిలో మనిషి పాత్రకు ఉన్న అన్యోన్యాన్ని ఆనాడే చెప్పిన గురజాడది ఎంత గొప్ప ముందుచూపు! దేశభక్తిని, దేశభుక్తితో మేళవించిన గురజాడ గీతం అంతర్జాతీయ గీతమే కాగలిగినదైనా రాష్ట్రీయ గీతం కూడా కాకపోవడం విషాదం కాదూ!? -
ఇది రాజ్యాంగంపై దాడే!
ఆకతాయిల పని కాదది. పథకం ప్రకారమే జరిగింది. ప్రభుత్వ పెద్దల ప్రోద్బలంతోనే జరిగింది. అదేదో చాటుమాటు ప్రాంతం కాదు. నిర్జన ప్రదేశం కాదు. విజయవాడ నడిగడ్డ. నగరంలోనే ఏక్ నంబర్ బిజినెస్ రాస్తా. బందర్ రోడ్. రాత్రి తొమ్మిది గంటల వేళ ఆ రోడ్డు మీద ప్రవహించే రణగొణ పీక్ స్థాయిలో ఉంటుంది. అటువంటి సమయంలో అంబేడ్కర్ స్మృతివనం లోకి కొందరు వ్యక్తులు ‘పనిముట్ల’తో ప్రవేశించి, సందర్శకు లను వెళ్లగొట్టి, లైట్లార్పేసి దాడికి తెగబడ్డారంటే... ఈ దాడికి స్వయానా పోలీసు యంత్రాంగమే కాపు కాసిందంటే... అధికార పీఠం అండదండలు లేవని ఎలా అనుకోగలం? అందుకే ఈ దాడి రాజ్య ప్రేరేపితం.మీడియా ప్రతినిధులతోపాటు పలువురు పురజనులు హుటాహుటిన అక్కడికి చేరుకోకపోతే ఆ దాడి ఎంతదూరం వెళ్లేదో? టాప్ ప్రయారిటీ టాస్క్‌గా అక్కడున్న మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి పేరును తొలగించగలిగారు. ఇంకా ముందు కెళ్లడం జనం రాకతో కుదరలేదు. స్మృతి వనంలోకి దొంగల్లా ప్రవేశించి, లైట్లార్పేసి దాడికి తెగబడుతున్న వైనంపై సమా చారం అందించినా వెంటనే పోలీసులు స్పందించకపోవడం ఏమిటి? ప్రతిపక్ష నాయకుడి పేరునే కదా తొలగించింది... విగ్రహంపై దాడి జరగలేదు కదా అనే సన్నాయి నొక్కులు పాలక పార్టీ తైనాతీల నోటి వెంట వినబడుతున్నాయి. ఈ లెక్కన ప్రతిపక్షాలకు చెందిన వారి ఇళ్లల్లో అక్రమంగా ప్రవేశించి దొంగతనం చేసినా ఫరవాలేదన్న మాట. పోలీసులు రక్షణ కూడా కల్పిస్తారేమో! నంద్యాల జిలాల్లో ఒక వైసీపీ కార్యకకర్తను పబ్లిగ్గా తెగనరుకుతుంటే ఆ హంతకులకు రక్షణగా పోలీసులు నిలబడిన వైపరీత్యాన్ని కూడా ఈ వారమే చూడవలసి వచ్చింది. ఏపీలో కొత్త రాజ్యాంగం అమల్లోకి వచ్చిందా? డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ రూపొందించిన భారత రాజ్యాంగ అంతస్సారం... సర్వమానవ సమతావాదం. ఈ సిద్ధాంతానికీ ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని పాలిస్తున్న ఎన్డీఏ కూటమి భావజాలానికీ అస్సలు పొసగదు. కూటమి పెద్దన్న భారతీయ జనతా పార్టీకి ఏ మాత్రం గిట్టదు. బీజేపీ తోలుబొమ్మను ఆడించే తెర వెనుక ఆరెస్సెస్‌కు అంబేడ్కర్ రాజ్యాంగాన్ని మార్చే యాలన్నది చిరకాల వాంఛ. భారత రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26న రాజ్యాంగ సభ ఆమోదించింది. నాలుగు రోజుల్లోనే (నవంబర్ 30) ఆరెస్సెస్ అధికార పత్రిక ‘ఆర్గనైజర్’ దాన్ని ఆడిపోసుకోవడం మొదలుపెట్టింది.భారత రాజ్యాంగంలో భారతీయతే లేదని ‘ఆర్గనైజర్’ దుయ్యబట్టింది. ప్రాచీన గ్రీకు నగర రాజ్యాలైన స్పార్టాకు లైకర్గస్లాగా, ఏథెన్స్కు సోలాన్ లాగా భారత్‌కు మనువు ఉండగా, ఆయన రూపొందించిన మనుస్మృతి ఉండగా ఈ రాజ్యాంగమెందుకని ‘ఆర్గనైజర్’ ప్రశ్నించింది. ఈ మనుధర్మ శాస్త్రం ఎటువంటిదో తెలిసిందే కదా! అసమానతలతో కూడిన కుల వ్యవస్థను సమర్థించిన శాస్త్రం. దళితులనైతే వర్ణవ్యవస్థకు ఆవల బహిష్కృతులుగా, అస్పృశ్యులుగా పరిగణించిన న్యాయ సంహిత ఇది. స్త్రీలకు స్వాతంత్య్రం అవసరం లేదని కూడా మనుస్మృతి అభిప్రాయపడింది. ‘పితా రక్షతి కౌమారే, భర్తా రక్షతి యౌవనే, రక్షంతి స్థవిరే పుత్రా, న స్త్రీ స్వాతంత్య్ర మర్హతి’ (బాల్యంలో తండ్రి, యవ్వనంలో భర్త, వృద్ధాప్యంలో కుమా రుని రక్షణలో ఉండాలి. స్త్రీలకు స్వతంత్రత అవసరం లేదు)... ఇదీ మనుస్మృతి!ఇటువంటి మనుధర్మ సంహిత భారత రాజ్యాంగంగా ఉండాలని ఒక్క ‘ఆర్గనైజర్’ మాత్రమే కోరుకోలేదు. ఆరెస్సెస్ సిద్ధాంతవేత్తగా ప్రసిద్ధుడైన గురు గోల్వాల్కర్ (బంచ్ ఆఫ్ థాట్స్), ఆరెస్సెస్‌కు ప్రాతఃస్మరణీయుడైన వినాయక్‌రావు దామోదర్ సావర్కర్లు కూడా వివిధ సందర్భాల్లో అభిలషించారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తొలి రోజుల్లోనే కాదు, ఆ తర్వాతి కాలంలో కూడా ఆరెస్సెస్ అభిప్రాయం మారలేదని ప్రముఖ కన్నడ రచయిత దేవనూర్ మహాదేవ ఆరెస్సెస్‌పై రాసిన ఒక చిన్న పుస్తకంలో నిరూపించారు. ఆ సంస్థ 1993 జనవరిలో విడుదల చేసిన శ్వేతపత్రంలో భారత రాజ్యాంగాన్ని ‘విదేశీ భావాలతో కూడిన హిందూ వ్యతిరేక సంహిత’గా అభిశంసించారని మహాదేవ రాశారు.ఆరెస్సెస్ అనే సంస్థ ప్రస్తుతం మూడు అంతర్లీన లక్ష్యాల కోసం పనిచేస్తున్నదని మహాదేవ వివరించారు. భారతదేశ ఫెడ రల్ స్వభావానికి విరుద్ధంగా కేంద్రీకృత అధికార స్థాపన మొదటి లక్ష్యం. ఇక రెండవది – మనుధర్మ శాస్త్రం ప్రబోధించిన వర్ణాశ్రమ ధర్మం. అసమానతలతో కూడిన కుల వ్యవస్థను కాపాడటం – సమాజంపై ఆర్యుల ఆధిపత్యాన్ని రుద్దడం మూడవది. ఆర్యులంటే ఎవరు? వర్ణాశ్రమంలో వారి స్థానాలేమిటి? తదితర అంశాలపై వివరణలు అవసరం కాకపోవచ్చు. ఇదిగో ఈ మూడు లక్ష్యాల సాధనలో భాగంగానే కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం పాఠ్య పుస్తకాల సిలబస్ సవరణ, మతాంతీకరణ వ్యతిరేక బిల్లును తేవడం తదితర చర్యలు చేపట్టిందని మహాదేవ అభియోగం.స్థూలంగా మనుషులంతా సమానం కాదని మనుధర్మ శాస్త్రం అభిప్రాయపడుతుంది. మనుషుల్లో కొందరు ఉత్తమ జాతులవారు, కొందరు నీచ జాతులవారు. ఈ నీచ జాతుల వారు ఉత్తమ జాతులను సేవిస్తూ జీవించాలి. అన్ని జాతుల్లోనూ పురుషుల స్థాయి ఎక్కువ. స్త్రీల స్థాయి తక్కువ. పురుషుల అడుగుజాడల్లో వారి పాదధూళిని తలదాల్చుతూ స్త్రీలు మనుగడ సాగించాలి. ఇటువంటి మనువాద తుప్పు భావాలను చీల్చి చెండాడుతూ మనుషులంతా ఒక్కటేనని చాటిచెప్పిన నవీన ధర్మ శాస్త్రం అంబేడ్కర్ విరచిత భారత రాజ్యాంగం. ఇటువంటి రాజ్యాంగంతో మనువాదులు రాజీపడటం అంత సులభసాధ్య మేమీ కాదు. అందుకే గడిచిన డెబ్బయ్ ఐదేళ్లుగా ఈ రాజ్యాంగంపై, దాన్ని రచించిన బాబాసాహెబ్‌పై వివిధ రూపాల్లో దాడులు జరుగుతూనే ఉన్నాయి. రాజకీయ రంగంలో మనువాదుల ప్రాబల్యం కారణంగానే రాజ్యాంగాన్ని తు.చ. తప్పకుండా అమలు చేయడం ఇప్పటి దాకా సాధ్యం కాలేదు.ఎన్టీఆర్ స్థానంలో చంద్రబాబు నాయకత్వం మొదలైన దగ్గర నుంచీ తెలుగుదేశం పార్టీలో వచ్చిన భావజాల మార్పు దాన్ని బీజేపీకి సహజ మిత్రపక్షంగా మార్చింది. కాకుల్ని కొట్టి గద్దలకు వేయడం ఆ పార్టీ ఆర్థిక సిద్ధాంతంగా మారింది. ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో నిజాం షుగర్స్, ఆంధ్ర పేపర్, ఆల్విన్, రిపబ్లిక్ ఫోర్జ్ తదితర 56 ప్రభుత్వ రంగ సంస్థలను చంద్రబాబు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టడమో, మూసివేయడమో చేశారు. ప్రైవేట్ వ్యక్తులు బాగా బలిస్తే... వారి దగ్గర నుంచి జారిపడే చిల్లరతో పేదలు బతికేస్తారనే ట్రికిల్‌డౌన్ ఆర్థిక సిద్ధాంతం చంద్రబాబుది. భారత రాజ్యాంగం కోరుకున్న పేదల సాధికారతతో ఈ ఆర్థిక సిద్ధాంతా నికి సాపత్యం కుదరదు.పేద వర్గాల ప్రజలకు నాణ్యమైన విద్యనూ, వైద్యాన్నీ ఆయన అందనీయలేదు. కనీస వైద్య సేవలు కూడా ఉచితంగా అందడానికి వీల్లేదని యూజర్ ఛార్జీలను ప్రవేశపెట్టిన ఘనత కూడా ఆయనదే! వరస కరువుకాటకాలతో, నకిలీ ఎరువులు, పురుగుల మందుల వాడకంతో చితికిపోయిన రైతాంగానికి ఉచిత విద్యుత్ ఇవ్వడానికి వీల్లేదని ఆయన చెప్పిన పాఠాలు ఎప్పటికీ తెలుగు ప్రజలు మరిచిపోరు. విభజిత రాష్ట్ర ముఖ్య మంత్రిగా కూడా ఈ ఆర్థిక విధానాలకే ఆయన కట్టుబడి ఉన్నారు. ఆర్థిక రంగంలోనే కాదు, సామాజిక రంగంలోనూ ఆయన భావజాలానికీ, మనుస్మృతికీ మధ్యన పెద్దగా తేడాలుండవు. తన కులతత్వ ఆలోచనలు, పురుషాహంకార అభిప్రాయా లను దాచుకోవడం కూడా ఆయనకు సాధ్యపడలేదు. విభజిత రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే బీసీల తోకలు కత్తిరిస్తానని ఆయన బహిరంగంగానే బెదిరించారు. ‘ఎస్సీ కులాల్లో పుట్టా లని ఎవరు కోరుకుంటార’ని ప్రెస్‌మీట్‌లోనే ఈసడించు కున్నారు. ‘న్యాయస్థానాల్లో జడ్జీ పదవులకు బీసీలు పనికిరారం’టూ కేంద్రానికి లేఖలు రాశారు. ‘కోడలు మగపిల్లాడిని కంటానంటే అత్త వద్దంటుందా’ అని తన మనువాద భావాలను బయటపెట్టుకున్నారు.ఈ మనువాద రాజకీయాలకు పూర్తి భిన్నంగా గడిచిన ఐదేళ్ల జగన్మోహన్రెడ్డి పరిపాలన సాగింది. భారత రాజ్యాంగ లక్ష్యాల సాధన ఆశయంగా, సుస్థిర అభివృద్ధి ధ్యేయంగా సాగిన ఆయన ఐదేళ్ల పరిపాలన దేశం ముందు ఒక ఆదర్శ నమూనాను ఆవిష్కరించింది. ఈ నమూనాపై జరిగిన విద్వేషపూరిత విష ప్రచారం బహుశా ప్రపంచంలోని ఏ దేశంలో కూడా ఎప్పుడూ జరిగి ఉండదు. సమాజంలోని పేదవర్గాల సంక్షే మానికీ, మధ్య తరగతి కలల సాకారానికీ, మహిళల సాధికా రతకూ మనువాద సంపన్న వర్గాలు మనస్ఫూర్తిగా సహకరించవు. ఈ వర్గాలను చంద్రబాబు ఏకం చేసుకున్నారు. వారి వద్ద నున్న సకల అస్త్ర శస్త్రాలు, హంగు ఆర్భాటాలతో యుద్ధానికి దిగారు. విద్వేషపు విషవాయువులతో కార్పెట్ బాంబింగ్ చేశారు. ఒక్కో నియోజకవర్గం ఒక్కో భోపాల్ మాదిరిగా విష వాయువులతో ఉక్కిరి బిక్కిరైంది.విష ప్రచారాన్ని కొంతమందైనా నమ్మి ఉండవచ్చు. అరచేతిలో చూపెట్టిన వైకుంఠానికి మరికొంతమంది మోస పోయి ఉండవచ్చు. వోట్ ఫర్ డెమోక్రసీ (వీఎఫ్‌డీ), అసోసి యేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) సంస్థలు బల్లగుద్ది చెబుతున్నట్టుగా ఈవీఎమ్లలో మాయాజాలం జరిగి ఉండ వచ్చు. ఈ మాయాజాలంలో దేశంలోనే అత్యధికంగా యాభై లక్షల ఓట్లు ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నట్టు వీఎఫ్‌డీ వాదిస్తున్నది. కారణమేదైనా చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. అలవాటు ప్రకారం చేతిలోని వైకుంఠాన్ని చెట్టెక్కించారు. ముసుగు చీల్చు కొని మనువాదం బయటకొచ్చింది.మహిళా సాధికారతపై దాడి జరిగింది. ‘అమ్మ ఒడి’, ‘చేయూత’ వగైరా పథకాలు ఆగిపోయాయి. పేద విద్యార్థుల నాణ్యమైన చదువుపై దాడి జరిగింది. జగనన్న విద్యా కానుక, మధ్యాహ్న భోజనం, రీయింబర్స్మెంట్, వసతి దీవెన తదితర కార్యక్రమాలు పట్టాలు తప్పాయి. ‘ఫ్యామిలీ డాక్టర్’ మాయ మయ్యాడు. ‘ఆరోగ్యశ్రీ’నీ నీరుకార్చారు. పాలనా వికేంద్రీకర ణకు చాపచుట్టారు. వలంటీర్ వ్యవస్థ మాయమైంది. ఆర్బీకేల సేవలు ఆవిరయ్యాయి. విత్తనాల కోసం ఐదేళ్ల తర్వాత రైతులు మళ్లీ క్యూలైన్లలో రోజుల తరబడి నిలబడుతున్నారు. జగన్ మోహన్‌రెడ్డి ప్రారంభించిన ప్రభుత్వ వైద్యశాలలపై ప్రైవేటీ కరణ కత్తి వేలాడుతున్నది. కనీవినీ ఎరుగని రీతిలో రాష్ట్ర రహదారులపై సైతం టోల్ వసూలుకు రంగం సిద్ధమైంది. రాజ్యాంగ లక్ష్యాలపై వరసగా దాడులు జరుగుతున్నాయి. అంబే డ్కర్ స్మృతివనంపై జరిగిన దాడిని ఒక ప్రతీకాత్మక దాడిగానే పరిగణించాలి. విజయవాడ నడిబొడ్డున ఆకాశమెత్తు అంబేడ్క రుడి మహాశిల్పాన్ని జగన్మోహన్రెడ్డి ఏర్పాటు చేశారు. ఇది ఆంధ్రా మనువాదుల్లో కడుపు మంటకు కారణమైంది. నలభ య్యేళ్ల నాటి కారంచేడు కండకావరం తిమ్మిరి ఇంకా వదల్లేదు. జగన్మోహన్రెడ్డి పేరును తొలగించి కొంత ఆనందాన్ని పొంది ఉండవచ్చు. ముందు ముందు మరిన్ని దాడులు జరగవచ్చు. ఆ దాడుల అసలు లక్ష్యం – భారత రాజ్యాంగం మాత్రమే!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
నిజమైన విజేతవు నీవే బంగారం!
క్రీడలే జీవితంగా భావించే వారు తమ జీవితకాలంలో కనీసం ఒక్కసారైనా ఒలింపి క్స్‌లో పతకం సాధించాలని కోరుకొంటారు. పతకం కోసం అహరహం శ్రమిస్తూ సంవ త్సరాల తరబడి సాధన చేస్తూ ఉంటారు. అయితే... గెలుపు, ఓటమితో సంబంధం లేని ఓ సాంకేతిక కారణంతో స్వర్ణపతకం చేజారితే... కనీసం రజత పతకమైనా దక్కకుంటే అంతకుమించిన విషాదం మరొకటి ఉండదు. ప్రస్తుత ప్యారిస్ ఒలింపిక్స్ మహిళల కుస్తీ 50 కిలోల విభాగంలో భారత మల్లయోధురాలు వినేశ్ పోగట్‌కు అదే పరిస్థితి ఎదు రయ్యింది. వంద గ్రాముల అదనపు బరువు కొండంత దురదృష్టాన్ని, గుండెబరువును మిగిల్చింది.ఒలింపిక్స్‌లో పతకం మినహా ప్రపంచ కుస్తీలోని అన్ని రకాల పోటీలలో పతకాలు సాధించిన ఘనత వినేశ్‌కు ఉంది. 49 కిలోలు, 50 కిలోలు, 53 కిలోల విభాగాలలో పాల్గొంటూ చెప్పుకోదగ్గ విజయాలు, ఎన్నో పతకాలు సాధించిన ఘనత ఉంది. ఆసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్, ప్రపంచ పోటీలలో సైతం స్వర్ణ, కాంస్య పతకాలు సాధించిన వినేశ్‌కు ఒలింపిక్స్ పతకం మాత్రం గత పుష్కరకాలంగా అందని ద్రాక్షలా ఉంటూ వచ్చింది.2016 రియో ఒలింపిక్స్‌లో పాల్గొంటూ గాయంతో వైదొలిగిన వినేశ్ 2020 టోక్యో ఒలింపి క్స్‌లో మాత్రం స్థాయికి తగ్గట్టుగా రాణించలేకపోయింది. ఇక 2024 ప్యారిస్ ఒలింపిక్స్ ప్రారంభానికి కొద్దిమాసాల ముందు వినేశ్ న్యాయం కోసంముందుగా రోడ్లు, ఆ తరువాత న్యాయస్థానాల మెట్లు ఎక్కి పోరాడాల్సి వచ్చింది.అంతర్జాతీయ కుస్తీ పోటీలలో పాల్గొంటూ, దేశానికి పతకాలతో ఖ్యాతి తెస్తున్న ఏడుగురు మహిళా వస్తాదులపై బీజెపీ మాజీ ఎంపీ, జాతీయ కుస్తీ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్, ఆయన పరివారం లైంగిక వేధింపులకు పాల్పడటానికి నిరసనగా భజరంగ్ పూనియా, సాక్షి మాలిక్ లాంటి దిగ్గజ వస్తాదులతో కలసి వినేశ్ గొప్ప పోరాటమే చేసింది. చివరకు ఢిల్లీ పోలీసుల కాఠిన్యాన్ని రుచి చూడాల్సి వచ్చింది. న్యాయస్థానాల జోక్యంతో బ్రిజ్ భూషణ్ అధ్యక్షపదవిని వీడక తప్పలేదు.మొక్కవోని దీక్షతో, మోకాలి శస్త్ర చికిత్సను సైతం భరించి, పోరాడి ప్యారిస్ ఒలింపిక్స్ 50 కిలోల విభాగంలో పాల్గొనటానికి అర్హత సంపాదించింది. 53 కిలోల విభాగంలో తనకు అవకాశం లేకపోడంతో యాభై కిలోల విభాగంలో పాల్గొనటం కోసం బరువు తగ్గించుకొని మరీ ప్యారిస్‌లో అడుగుపెట్టింది. మహిళా కుస్తీ 50 కిలోల విభాగం పోటీల తొలిరోజున 50 కిలోల బరువుతోనే జపాన్, ఉక్రెయిన్, క్యూబా బాక్సర్లను చిత్తు చేయడం ద్వారా ఫైనల్లో అడుగు పెట్టింది. వినేశ్ ఫైనల్స్ చేరడంతో బంగారు పతకం ఖాయమనే శతకోటి భారత క్రీడాభిమానులు ఆశ పడ్డారు. కానీ జరిగింది వేరు. అంతర్జాతీయ కుస్తీ సమాఖ్య నిబంధనల ప్రకారం పోటీలు జరిగే ప్రతి రోజూ వివిధ విభాగాలలో పోటీకి దిగే వస్తాదుల బరువును చూసిన తరువాతే పోటీకి అనుమతిస్తారు. అయితే...పోటీల తొలిరోజున 50 కిలోల బరువున్న వినేశ్... స్వర్ణపతం కోసం పోటీపడే రోజున మాత్రం 100 గ్రాముల బరువు అదనంగా ఉండడంతో అనర్హత వేటు వేశారు. బరువును నియంత్రించుకోడం కోసం ఫైనల్‌కు ముందురోజు రాత్రి వినేశ్, ఆమె శిక్షకులు చేయని ప్రయత్నం అంటూ ఏమీలేదు. తెల్లవార్లూ నడకతో, సైక్లింగ్ చేస్తూ, విపరీతమైన వేడితో ఉండే ఆవిరి గదిలో వినేశ్ గడిపింది. చివరకు బరువు తగ్గించుకోవటం కోసం శిరోజాలను సైతం కత్తిరించుకొన్నా ప్రయోజనం లేకపోయింది. వంద గ్రాముల అదనపు బరువు కారణంగా బంగారు పతకం కోసం పోటీ పడే అవకాశాన్ని కోల్పోడంతో పాటు... కనీసం రజత పత కానికి సైతం నోచుకోలేకపోయింది. అదనపు బరువు నిబంధన కారణంగా వినేశ్‌కు బంగారు పతకం పోరులో పాల్గొనే అవకాశాన్ని నిరాకరించడం గుండె కోతను మిగిల్చింది. వినేశ్తో పాటు కోట్లాది క్రీడాభి మానులు, యావత్ భారతజాతి తల్లడిల్లిపోయింది.అదనంగా ఉన్న 100 గ్రాముల బరువే తనకు ఒలింపిక్స్ పతకం సాధించే అవకాశం లేకుండా చేయటాన్ని జీర్ణించుకోలేని వినేశ్ అర్ధంతరంగా రిటై ర్మెంట్ ప్రకటించింది. వినేశ్‌కు న్యాయం చేయాలంటూ అంతర్జాతీయ ఒలింపిక్స్ సంఘానికి భారత కుస్తీ సమాఖ్య అప్పీలు చేసింది. ఫైనల్ బరిలో దిగకుండానే సర్వం కోల్పోయిన వినేశ్‌కు కనీసం రజత పతకమైనా ఇవ్వాలంటూ మొరపెట్టుకొన్నారు. రజత పతకాలు ఇద్దరికీ ఇచ్చినా ఇబ్బంది రాదని అంటున్నారు.వినేశ్‌కు ప్రధాని, కేంద్ర క్రీడామంత్రి; భారత ఒలింపిక్స్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉషతో పాటు పలు వురు క్రీడాదిగ్గజాలు, సింధు లాంటి ఒలింపియన్లు అండగా నిలిచారు.ప్రతిభకు, బరువుకు సంబంధం ఏంటని పలు వురు నిపుణులు, ప్రముఖులు ప్రశ్నిస్తున్నారు. 100 గ్రాముల అదనపు బరువుతో ప్రత్యర్థికి జరిగే నష్టమేంటని నిలదీస్తున్నారు. హార్మోనుల అసమతౌల్యత వల్ల మహిళల బరువు తరచూ మారిపోతూ ఉంటుందని, ఈ అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకొని మినహా యింపు ఇవ్వాలంటూ సూచిస్తున్నారు.భారత ఒలింపిక్స్ సంఘం మొరను అంతర్జా తీయ ఒలింపిక్స్ సంఘం ఆలకించినా... ఆలకించ కున్నా, కనీసం రజత పతకం ఇచ్చినా, ఇవ్వకున్నా... నిజమైన విజేతగా కోట్లాది మంది క్రీడాభిమానుల గుండెల్లో వినేశ్ పోగట్ నిలిచిపోతుంది.వ్యాసకర్త సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ మొబైల్: 84668 64969 -
దారికొచ్చిన ఎన్డీయే సర్కారు!
అలవాటైన పద్ధతిలో వివాదాస్పద వక్ఫ్ (సవరణ) బిల్లును గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన ఎన్డీయే ప్రభుత్వానికి కాసేపటికే తత్వం బోధపడినట్టుంది. విపక్షాల నుంచి ప్రతిఘటన ఎదురుకావటంతో దాన్ని సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి పంపటానికి అంగీకరించింది. కారణమేదైనా అభ్యంతరాలు వ్యక్తమైనప్పుడు జేపీసీకి లేదా సెలెక్ట్ కమిటీకి పంపటం పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఒక సంప్రదాయం. కానీ ఎన్డీయే అధికారంలోకి వచ్చాక కేవలం రెండు సంద ర్భాల్లో మాత్రమే పాటించింది. పదేళ్లనాడు గద్దెనెక్కగానే అంతకు కొన్ని నెలలముందు అమల్లోకొచ్చిన భూసేకరణ చట్టం పీకనొక్కుతూ ఆదరా బాదరాగా ఆర్డినెన్స్ తీసుకురావటం ఎవరూ మరిచిపోరు. విపక్షాలు అభ్యంతరం చెబుతున్నా ఆనాడు చెవికెక్కలేదు. ఆర్డినెన్స్ మురిగి పోయిన రెండుసార్లూ దానికి ప్రాణప్రతిష్ఠ చేస్తూ తిరిగి ఆర్డినెన్సులు తీసుకొచ్చారు. రాజ్యసభలోగండం గడిచేలా లేదని గ్రహించాక ఇక దాని జోలికి పోరాదని నిర్ణయించుకున్నారు. అటుపై సాగు చట్టాల విషయంలోనూ రైతులనుంచి ఇలాంటి పరాభవమే ఎదురయ్యాక వాటినీ ఉపసంహరించుకున్నారు. ఐపీసీ, సాక్ష్యాధారాల చట్టం, సీఆర్పీసీ స్థానంలో వచ్చిన కొత్త చట్టాల తాలూకు బిల్లులపై కూడా సంబంధిత వర్గాలను సరిగా సంప్రదించలేదు. ఎన్డీయే ఏలుబడి మొదలయ్యాక చోటుచేసుకున్న వేర్వేరు ఉదంతాల పర్యవసానంగా ముస్లిం సమాజంలో ఒక రకమైన అభద్రతాభావం ఏర్పడిన నేపథ్యంలో ఈ వివాదాస్పద చర్యకు కేంద్రం ఎందుకు సిద్ధపడిందో తెలియదు. బిల్లు ముస్లింలకు వ్యతిరేకం కాదని ఎన్డీయే భాగస్వామ్య పక్షం జేడీ(యూ) నేత, కేంద్రమంత్రి రాజీవ్ రంజన్ సింగ్ అంటున్నారు. ఇది పారదర్శకత తీసుకొస్తుందని కూడా ఆయన సెలవిచ్చారు. మంచిదే. మరి ఆ వర్గంతో సంప్రదింపులు జరిగిందెక్కడ? ముస్లిం సమాజానికున్న అభ్యంతరాల సంగతలా వుంచి రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలకు సైతం ఇది ఎసరు పెడుతోంది. రాజ్యాంగంలోని ఏడో షెడ్యూల్ ప్రకారం భూమి రాష్ట్రాల జాబితాలోనిది.వక్ఫ్ ఆస్తిపై కేంద్ర పెత్తనాన్ని అనుమతించటంద్వారా దాన్ని కాస్తా తాజా బిల్లు నీరుగారుస్తోంది. కనుక ముస్లిం సమాజంతో మాత్రమేకాదు...రాష్ట్రాలతో కూడా సంప్రదించాల్సిన అవసరం లేదా? హరియాణా, మహారాష్ట్ర అసెంబ్లీలకు జరగబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే ఈ బిల్లు తెచ్చారని లోక్‌సభలో విపక్షాలు చేసిన విమర్శలు కాదని చెప్పటానికి ప్రభుత్వం దగ్గర జవాబు లేదు. తన చర్య వెనక సదుద్దేశం ఉందనుకున్నప్పుడూ, బిల్లుపై ఉన్నవన్నీ అపోహలే అని భావించి నప్పుడూ తగిన సమయం తీసుకుని సంబంధిత వర్గాలతో చర్చించటానికేమైంది? ఒకవేళ వచ్చే అసెంబ్లీ ఎన్నికలు దృష్టిలో పెట్టుకునే హడావిడిగా బిల్లు తీసుకొచ్చి వుంటే అంతకన్నా తెలివి తక్కువతనం ఉండదు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఆ మాదిరి ఎత్తుగడలను జనం ఏవగించు కున్నారని బీజేపీకి అర్థమయ్యే వుండాలి.సవరణ బిల్లు ద్వారా తీసుకొచ్చిన 44 సవరణల పర్యవసానంగా వక్ఫ్ బోర్డుల అధికారాలకు కత్తెరపడుతుందని, ప్రభుత్వ నియంత్రణ పెరుగుతుందని కనబడుతూనేవుంది. అరుదైన సంద ర్భాల్లో తప్ప కలెక్టర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటారని ఎవరూ అనుకోరు. ఫలానా ప్రార్థనాస్థలం శతాబ్దాలక్రితం తమదేనంటూ ఆందోళనలు చేయటం, దానికి ప్రభుత్వాలు వత్తాసు పలుకుతుండటం అక్కడక్కడ కనబడుతూనేవుంది. ఇంతకాలం వక్ఫ్ ట్రిబ్యున ళ్లకు ఉండే అధికారం కాస్తా కలెక్టర్లకు ఇవ్వాలని బిల్లు ప్రతిపాదిస్తోంది.బోర్డుల్లో ముస్లిమేతరులను సభ్యులుగా నియమించటం, ఆస్తిని విరాళంగా ఇవ్వటంపై ఆంక్షలు సంశయం కలిగించేవే. మతపరమైన, ధార్మికపరమైన కార్యకలాపాల నిర్వహణ కోసం వచ్చిన ఆస్తుల్ని పర్యవేక్షించటానికి ఏర్పడిన బోర్డుల్లో వేరే మత విశ్వాసాలున్నవారిని నియమించటం ఏరకంగా చూసినా సరికాదన్న ఇంగిత జ్ఞానం ఉండొద్దా? అసలు ఒకసారి బోర్డు దేన్నయినా వక్ఫ్ ఆస్తిగా ప్రకటిస్తే దాన్ని మార్చటం అసాధ్యమన్న ప్రచారం కూడా తప్పు. ఫలానా ఆస్తి బోర్డుదనుకుంటే సంబంధిత వర్గాలకు నోటీసులిచ్చి వారి వాదనలు పరిశీలించాకే నిర్ణయం తీసుకోవాలని ప్రస్తుత చట్టంలోని సెక్షన్40 చెబుతోంది. అటు తర్వాత వక్ఫ్ ట్రిబ్యునల్‌దే తుది నిర్ణయం. పైగా విరాళమిచ్చిన దాత కచ్చితంగా ఇస్లాంను పాటించే వ్యక్తే అయివుండాలని, దానంగా వచ్చే ఆస్తి కుటుంబవారసత్వ ఆస్తి కాకూడదని చట్టం నిర్దేశిస్తోంది. ఇప్పటికే ఇన్ని కట్టుదిట్టమైన నిబంధనలుండగా అందుకు భిన్నంగా ప్రచారం చేయటం సబబేనా? ఈ పరిస్థితుల్లో బిల్లు చట్టమైతే వక్ఫ్ ఆస్తుల చుట్టూ వివాదాలు ముసురుకుంటాయనుకునే అవకాశం లేదా? సంకీర్ణంలోని జేడీ(యూ), ఎల్జేపీలు బిల్లుకు మద్దతు పలకగా సభలో టీడీపీ సంకటస్థితిలో పడిన వైనం స్పష్టంగా కనబడింది. ఆ బిల్లుకు మద్దతిస్తుందట...కానీ జేపీసీకి ‘పంపితే’ వ్యతిరే కించబోదట! ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో పుట్టుకొచ్చిన బాబు రెండు కళ్ల సిద్ధాంతం ఇంకా సజీవంగా ఉందన్నమాట! టీడీపీది చిత్రమైన వాదన. అలా పంపనట్టయితే వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదించబోమని చెప్పడానికి నోరెందుకు రాలేదు? ఒకపక్క బిల్లు చట్టమైతే పారదర్శకత ఏర్పడుతుందన్న ప్రభుత్వ వాదనను సమర్థిస్తూనే తమ సెక్యులర్ వేషానికి భంగం కలగకుండా ఆడిన ఈ డ్రామా రక్తి కట్టలేదు. జాతీయ మీడియా దీన్ని గమనించింది. మొత్తానికి సవరణ బిల్లు జేపీసీకి వెళ్లటం శుభ పరిణామం. ఎన్డీయే సర్కారు ఈ సంప్రదాయాన్ని మున్ముందు కూడా పాటించటం ఉత్తమం. -
గూగుల్‌పై కన్నెర్ర!
అతిథిగా వచ్చి అడిగినవన్నీ గుక్క తిప్పుకోకుండా చెబుతున్న సిద్ధుణ్ణి చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనయిన ప్రవరాఖ్యుడు ‘సృష్టికర్త బ్రహ్మకైనా నేర్వశక్యంగాని ఇన్ని సంగతులు తమరికెలా సాధ్య మయ్యాయ’ని ఎంతో వినయంగా అడుగుతాడు ‘మనుచరిత్ర’ కావ్యంలో. ఈ ఆధునాతన యుగంలో ఆ సిద్ధుణ్ణి మించిపోయి, అడిగిన అరక్షణంలో అన్నిటినీ గూగుల్ ఏకరువు పెడుతోంది. అసలు గూగుల్ లేకపోతే మనకు చాలా విషయాలు తెలిసేవికాదని, మన జ్ఞానానికి ఎన్నో పరిమితులుండేవని ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది విశ్వసిస్తారు. అంతటి గూగుల్‌పై అమెరికా ఫెడరల్ న్యాయ స్థానం రూపంలో పిడుగుపడింది. ఈ సంస్థ గుత్తాధిపత్య పోకడలు పోతోందని న్యాయ స్థానం తీర్పునిచ్చింది. పోటీదారులందరికీ సమానావకాశాలు ఉండితీరాలన్న స్వేచ్ఛా మార్కెట్ సూత్రాలకు తిలోదకాలిచ్చి, చట్ట ఉల్లంఘనలకు పాల్పడి వక్రమార్గంలో లాభార్జనకు పాల్పడుతున్నదని తేల్చి చెప్పింది. సంస్థపై ఏ చర్యలు తీసుకోవాలన్నది న్యాయస్థానం ఇంకా చెప్పలేదు. అయితే దాన్ని భిన్న సంస్థలుగా విభజించాలని ఆదేశించటంతో సహా ఎలాంటి చర్యలనైనా సూచించే అవకాశం ఉంది. అసలు ఒక టెక్ దిగ్గజంగా, మహాసంస్థగా వెలిగిపోతున్న గూగుల్ ఏడెనిమిదేళ్ల క్రితం ఒక పెద్ద కార్పొరేట్ సంస్థ ‘ఆల్ఫాబెట్’లో ఒదిగి చిన్నబోయింది. ఇప్పటికే అమెజాన్, మెటా, యాపిల్ వగైరా భారీ కార్పొరేట్ కంపెనీలపై నడుస్తున్న వ్యాజ్యాలకు తాజా తీర్పు ప్రమాణంగా మారుతుందన్నది గుత్తాధిపత్య నిరోధక చట్టాల నిపుణులంటున్న మాట. నిజానికి మైక్రోసాఫ్ట్‌పై 2000 సంవత్సరంలో వెలువడిన యాంటీట్రస్ట్ తీర్పు ప్రస్తుత గూగుల్ కేసును ప్రభావితం చేసింది. ఈ కేసు పరిష్కారానికి ఏం చేయాలన్న అంశంపై ప్రభుత్వమూ, గూగుల్ మాట్లాడుకోవాలని, వచ్చే నెల 6 నాటికి నిర్ణయం తెలపాలని న్యాయమూర్తి చెప్పారు. ఈ తీర్పుపై గూగుల్ ఎటూ అప్పీల్‌కి పోతుంది.గూగుల్‌పై వచ్చిన ఆరోపణలు కొట్టివేయదగ్గవి కాదు. తన సెర్చ్ ఇంజన్‌ను సెల్ఫోన్లలో, బ్రౌజర్లలో అమర్చేలా యాపిల్‌తో సహా అనేక స్మార్ట్ ఫోన్ కంపెనీలకూ, బ్రౌజర్ కంపెనీలకూ గూగుల్ ఒక్క 2021లోనే 2,600 కోట్ల డాలర్లు చెల్లించిందని, ఇందువల్ల ఇతర సంస్థలు భారీగా నష్టపోయాయని ఆ అభియోగాల సారాంశం. ఒక అంచనా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా వినియోగ దారుల్లో 90 శాతం మంది గూగుల్ సెర్చ్ ఇంజన్‌పైనే ఆధారపడుతున్నారు. అయితే వినియోగదారులను తాము నియంత్రించటమో, నిర్బంధించటమో చేయటం లేదని... ఎందులో మెరుగైన ఫలితా లొస్తాయో తేల్చుకుని స్వచ్ఛంగా తమను ఎంచుకుంటున్నారని గూగుల్ వాదించింది. వర్తమానంలో ఇంటర్నెట్ తెరిచాక సాగే అత్యంత ప్రధాన వ్యాపకం శోధించటమే. అయితే సెల్‌ఫోన్ తయారీ దార్లకూ, బ్రౌజర్ కంపెనీలకూ భారీ చెల్లింపులు చేసి గూగుల్ సెర్చ్ ఇంజన్‌ను చేర్చాక వాటిని వినియోగించేవారికి అంతకన్నా గత్యంతరం ఏముంటుందని న్యాయమూర్తి వేసిన ప్రశ్న సహేతుక మైనది. నిజానికి గూగుల్‌తోపాటు బింజ్‌తో సహా డజను వరకూ సెర్చ్ ఇంజన్ సంస్థలున్నాయి. కానీ అనేక ఏళ్లుగా గూగుల్ తెరచాటుగా సాగిస్తున్న గుత్తాధిపత్యం పర్యవసానంగా వాటికంత ప్రాధాన్యం లేకుండా పోయింది. ఆసక్తికరమైన విషయాన్నీ, అవసరమైన సమాచారాన్నీ సేకరించటానికి వినియోగదారుల్లో అత్యధికులు యధాలాపంగా ఆధారపడేది గూగులే. దాంతో పోలిస్తే వ్యక్తిగత గోప్యత మొదలుకొని అనేక అంశాల్లో ఇతర సంస్థల తీరు ఎంతో మెరుగ్గా ఉన్నదని టెక్ నిపుణులు చెబుతున్న మాట. వినియోగదారులు ఎలాంటి అంశాల గురించి ఆరా తీస్తున్నారన్న డేటా అత్యంత కీలకమైనది. ఈ క్రమంలో వినియోగదారుల ఇష్టానిష్టాలూ... వారి అలవాట్లు, ఆసక్తులకు సంబంధించిన సమాచారం వివిధ ఉత్పాదక సంస్థలకు చాలా అవసరం. వినియోగదారులకు తెలియకుండా ఈ వివరాలన్నీ గూగుల్ అమ్ముకుంటున్నదని చాన్నాళ్లుగా వినబడుతోంది. దాంతోపాటు ఈ రంగంలో గుత్తాధిపత్యం ఉండటాన్ని ఆసరా చేసుకుని వాణిజ్య ప్రకటనకర్తలు చెల్లించే రుసుమును అపారంగా పెంచుతోంది. వివిధ విషయాలూ, పదాలూ ఆధారంగా సెర్చ్ ఇంజన్లకు వినియోగించే క్రమసూత్రాలు (అల్గారిథమ్స్) ఏమిటన్నది గూగుల్ అత్యంత రహస్యంగా ఉంచుతోంది. అమెరికాలో దాఖలైన ఈ కేసులో ఆసక్తికరమైన అంశం ఉంది. మున్ముందు ఎన్నో సంస్థల భవితవ్యాన్ని ప్రభావితం చేసే ఈ కేసులో వ్యాజ్యాన్ని ఎదుర్కొన్న గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ మాదిరే తీర్పునిచ్చిన న్యాయమూర్తి అమిత్ మెహతా కూడా భారతీయుడే. యాంటీట్రస్ట్ చట్టం నిజానికి 19వ శతాబ్దం నాటిది. పారిశ్రామికరంగం భిన్నరంగాల్లో ఎదగటానికి గుత్తాధిపత్యం పెను అవరోధమని భావించి అప్పట్లో యాంటీట్రస్ట్ చట్టాన్ని తీసుకొచ్చారు. 1970లలో ఐబీఎం మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్లు, ఆ తర్వాత 1990లలో మైక్రోసాఫ్ట్ ఆపరేటింగ్ వ్యవస్థ పైనా ఇలాంటి వ్యాజ్యాలే పడ్డాయి. అవి భారీగా పరిహారాలు చెల్లించుకున్నాయి. మెయిన్‌ఫ్రేమ్ మార్కెట్ ఇప్పుడు దాదాపు లేదు. గూగుల్ రాకతో మైక్రోసాఫ్ట్ గుత్తాధిపత్యం కూడా అంతరించింది. అలాగే ప్రాసెసర్ల మార్కెట్లో వెలుగులీనిన ఇంటెల్ ప్రభ కూడా మరోపక్క క్షీణిస్తోంది. మారిన పరిస్థితులను అందిపుచ్చుకోలేకపోవటం, కొత్త రంగాలకు విస్తరించటానికి బద్ధకించటం లాంటివి వీటి వర్తమాన అవస్థకు ప్రధానంగా చెప్పుకోవాల్సిన కొన్ని కారణాలు. గూగుల్ వ్యవహారాన్ని కూడా మార్కెట్ శక్తులకే వదిలేస్తే కాగల కార్యం అవే తీరుస్తాయనీ, గత కాలపు చట్టాలతో నియంత్రించటం వ్యర్థమనీ వాదించేవారికి కూడా కొదవ లేదు. అయితే నియంత్రణ వ్యవస్థలు లేకపోతే కొత్త సంస్థల ఆవిర్భావం సాధ్యమేనా? ఏది ఏమైనా తాజా తీర్పు పర్యవసానాలు ప్రపంచవ్యాప్తంగా ఉంటాయన్నది వాస్తవం. -
చెదిరిన స్వప్నం
భారత్ బంగారు కల నెరవేరడానికి మరికొన్ని గంటల దూరంలో మాత్రమే ఉన్నామని మన క్రీడాభిమానులు ఉత్కంఠతో వేచిచూస్తున్న వేళ హఠాత్తుగా అంతా తలకిందులైంది. రెజ్లింగ్‌లో ఒకేరోజు దిగ్గజ క్రీడాకారిణులనదగ్గ ముగ్గురిని అవలీలగా జయించి, చరిత్ర సృష్టించి బుధవారం పతాక శీర్షికలకెక్కిన మన రెజ్లింగ్ స్టార్ వినేశ్ ఫోగాట్‌పై చివరాఖరిలో అనర్హత వేటు పడింది.అంతర్జాతీయ క్రీడలు బహు చిత్రమైనవి. ఎవరి అంచనాలకూ అందనివి. ప్రపంచ శిఖరాగ్రంపై ఎవరినైనా ప్రతిష్ఠించగలవు... అధఃపాతాళానికి తొక్కి నిరాశా నిస్పృహల్లో కూరుకుపోయేలా కూడా చేయగలవు. కేవలం 24 గంటల వ్యవధిలో పరస్పర విరుద్ధమైన ఈ రెండు అనుభవాలనూ వినేశ్ చవిచూడాల్సివచ్చింది. క్రీడారంగంలో దేశాల మధ్య ఆరోగ్యకరమైన పోటీని పెంచటానికీ.., స్ఫూర్తి రగల్చడానికీ ఉద్దేశించిన ఇలాంటి సందర్భాల్లో ముందంజలో నిలిచి మాతృదేశానికి మరిచిపోలేని విజయాన్నందించాలని క్రీడాకారులంతా తపిస్తారు. తమ తమ నైపుణ్యాలకు పదునుపెట్టుకుంటారు. నిజానికి ఇలాంటి వారందరికీ వినేశ్ తలమానికమైనది. ప్రధాని చెప్పినట్టు సవాళ్లకు ఎదు రొడ్డి పోరాడే స్వభావం ఆమెది. ఒక్క రెజ్లింగ్‌లో మాత్రమే కాదు... దశాబ్దాలుగా దేశ క్రీడా రంగాన్ని పట్టిపీడిస్తున్న లింగ వివక్షపైనా, లైంగిక వేధింపులపైనా సివంగిలా తిరగబడిన చరిత్ర ఆమెది. తోటి క్రీడాకారిణులకు ఎదురవుతున్న లైంగిక హింసపై నిరుడు దాదాపు నెలన్నరపాటు ఢిల్లీ వీధుల్లో పోరాడి... అరెస్టులూ, అవమానాలూ, లాఠీ దెబ్బలూ, చంపేస్తామన్న బెదిరింపులూ సహిస్తూ భరిస్తూ మొక్కవోని ఉక్కు సంకల్పాన్ని ప్రదర్శించింది. ఆటల బరిలోనే కాదు... తేడా వస్తే అధికార మదంపైనా పోరాడతానన్న సందేశం పంపింది. ఒక దశలో ఇతర క్రీడాకారులతోపాటు తనకొచ్చిన అవార్డులన్నీ వెనక్కివ్వాలని, పతకాలను గంగానదిలో పడేయాలని నిర్ణయించుకుంది. ఏ రంగంలోనైనా మహిళలు రాణించడమంటే అంత సులువేం కాదు. గడప లోపలే కాదు, వెలుపల సైతం అడుగడుగడుగునా అవరోధాలూ, అడ్డంకులూ ఉంటాయి. క్రీడారంగంలో ఇవి మరిన్ని రెట్లు అధికం. సమస్యలను ఎదుర్కొనటంతో పాటు అవి కలిగించే భావోద్వేగాలను అధిగమించి, గాయపడిన మనసును ఓదార్చుకుంటూ తాను ఎంచుకున్న క్రీడాంశంలో ఏకాగ్రత సాధించి నైపుణ్యాన్ని పెంచుకోవాలి. ఎంత కష్టం! కానీ వినేశ్ దృఢంగా నిలబడింది. తనేమిటో నిరూపించుకుంది. కనుకనే ప్రస్తుత ఒలింపిక్ చాంపియన్, ఏకంగా మూడుసార్లు ప్రపంచ చాంపియన్ అయిన జపాన్ క్రీడాకారిణి సుసాకి యుయుపై 3–2 తేడాతో గెలిచి ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యాల్లో ముంచింది. బరిలో ఇంతవరకూ ఓటమే చవిచూడని నంబర్ వన్ యుయు నిజానికి ఈ పోరులో అందరి ఫేవరెట్. అటుపై ప్రతిభావంతులుగా పేరొందిన ఉక్రెయిన్, క్యూబా క్రీడా దిగ్గజాలను కూడా వినేశ్ సునాయాసంగా అధిగమించింది. బుధవారం అమెరికా క్రీడాకారిణి సారా హిల్డెర్బ్రాంట్తో తలపడబోతున్న తరుణంలో ఉండాల్సిన 50 కిలోల బరువు కంటే కేవలం వందగ్రాములు అధికంగా ఉందన్న కారణంతో వినేశ్‌ను అనర్హురాలిగా ప్రకటించటం దురదృష్ట కరం. గతంలోనూ ఆమెకు బరిలో సమస్యలు తప్పలేదు. వరసగా 2016, 2020 ఒలింపిక్స్ పోటీల్లో బరి నుంచి నిష్క్రమించాల్సి వచ్చిన వినేశ్‌పై ఎవరికీ పెద్దగా అంచనాల్లేవు. అసలు 2016లో మోకాలి గాయం అయ్యాక ఇక ఆమె క్రీడలకు స్వస్తి చెప్పక తప్పదని అనుకున్నారు. దానికి తోడు నిరుడు గాయానికి శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చింది. నిరసనోద్యమం సరేసరి. వీటన్నిటినీ అధిగమించి ఆమె మ్యాట్పైకొచ్చింది. అచిరకాలంలోనే అద్భుతంగా రాణించింది. మంగళవారం నాటి ఆటను చూసినవారంతా ఫైనల్లో ఆమె స్వర్ణం చేజిక్కించుకోవటం ఖాయమని అనుకుంటుండగా ఊహించని విపరిణామమిది. ఒలింపిక్స్ చరిత్రలో భారతీయ క్రీడాకారులకు ఎన్నడూ ఎదురు కాని అనుభవమిది.వినేశ్ అనర్హత వెనక కుట్ర కోణం ఉండొచ్చని, ఆమెను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన బృందం అలసత్వాన్ని ప్రదర్శించిందని సామాజిక మాధ్యమాల్లో ఆరోపణలు గుప్పుమంటున్నాయి. కుట్రకోణం వెలికితీయాలంటూ లోక్‌సభలో విపక్షం వాకౌట్ కూడా చేసింది. అయితే మన ఒలింపిక్ అసోసియేషన్ ఆమె బరువు తగ్గడానికి ముందురోజు రాత్రంతా ఏమేం చేయాల్సి వచ్చిందో ఏకరువు పెడుతోంది. ఆ మాటెలావున్నా ఒలింపిక్స్‌లో అనుసరించే నిబంధనలు అత్యంత కఠినమైనవవి. యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ నిబంధనల్లోని 11వ అధికరణ ప్రకారం నిర్దిష్టమైన బరువు దాటితే క్రీడాకారులను అనుమతించే ప్రసక్తే లేదంటున్నారు. మంగళవారం ఇటలీ క్రీడాకారిణి లియుజీకి కూడా ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. ఈ నిబంధనలపై ఇప్పటికి రెండుసార్లు ఒలింపిక్స్ అనుభవం గల వినేశ్‌కు గానీ, నిరంతరం అదే పనిలో ఉండే మన బృందానికి గానీ అవగాహన లేకపోవటం ఆశ్చర్యకరమే. ఈ విషయంలో వినేశ్‌ను ఎవరైనా పక్క దోవ పట్టించి వుంటారా అనేది ఆమె చెబితే గానీ తెలిసే అవకాశం లేదు. ఆటపైనే సర్వశక్తులూ ఒడ్డాల్సిన క్రీడాకారులకు ఇతరేతర సమస్యలు ఎదురుకావటం విచారించదగ్గ విషయం. వినేశ్‌కు నిరుడు చేదు అనుభవాలు ఎదురుకాకపోతే కుట్ర ఆరోపణలు వచ్చి ఉండేవే కాదు. మొత్తానికి మన దేశానికి తలమానికమనదగ్గ క్రీడాకారులను ఎలా గౌరవించుకోవాలో, ఎంత అపురూపంగా చూసు కోవాలో తాజా ఉదంతం తెలియజెబుతోంది. దీన్నుంచి గుణపాఠం నేర్వగలిగితేనే అంతర్జాతీయ క్రీడా యవనికపై మనం తళుకులీనగలమని గ్రహించాలి. రాజకీయ సంకెళ్ల నుంచి క్రీడా వ్యవస్థలను విముక్తం చేయాలి. -
విషప్రచారపు కోరల్లో...
చేతిలోని కత్తిని మంచికి వాడవచ్చు, చేయాలనుకుంటే చెడు కూడా చేయవచ్చు. మరి, ప్రపంచాన్ని చేతిలోకి తీసుకొచ్చిన స్మార్ట్ఫోన్నీ, అందులోని సోషల్ మీడియా వేదికల్నీ ఇప్పుడు మనం దేనికి వాడుతున్నట్టు? దాని దుర్వినియోగం, విషప్రచారం తాలూకు విపరిణామాల ఫలితం యునైటెడ్ కింగ్డమ్ (యూకే) ప్రత్యక్షంగా అనుభవిస్తోంది. అస్తవ్యస్తమైన ఆర్థిక వ్యవస్థ, విభిన్న వర్గాల మధ్య అనుమానాలు సహా ఇప్పటికే అనేక సమస్యలతో సతమతమవుతున్న బ్రిటన్ సోషల్ మీడియా సాక్షిగా తీవ్రతర మితవాద బృందాల అసత్య ప్రచారం వల్ల అల్లర్లు, దహనాలతో అట్టుడుకుతోంది. మనసును కదిలించే ముగ్గురు పసిపిల్లల పాశవిక హత్య కారణంగా వారం క్రితం మొదలైన ఈ హింసాత్మక నిరసనల్ని అదుపు చేయడానికి పాలనా యంత్రాంగం కిందా మీదా అవుతోంది. చివరకు యూకేలో ‘అంతర్యుద్ధం అనివార్యం’ అంటూ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళు దుందు డుకు వ్యాఖ్యలు చేస్తుంటే, బ్రిటన్ కొత్త ప్రధాని కీర్ స్టార్మర్ ఖండించాల్సిన పరిస్థితి. ఇటీవలే పగ్గాలు పట్టిన లేబర్ పార్టీ ప్రభుత్వానికి తాజా పరిణామాలు సవాలుగా మారాయి. ఇంగ్లండ్ వాయవ్య ప్రాంతంలోని సౌత్‌పోర్ట్‌లో జూలై 29న ఓ డ్యాన్స్ క్లాస్‌లో ముక్కుపచ్చలారని ముగ్గురు చిన్నారులపై ఓ ఆగంతకుడు కత్తితో దాడి చేసి చంపిన దారుణ సంఘటన చివరకు దేశమంతటా కార్చిచ్చుకు దారి తీయడం నమ్మశక్యం కాని నిజం. దాడి చేసిన వ్యక్తి వలసదారు, మైనారిటీ మతస్థుడు, గత ఏడాదే ఒక చిన్న పడవలో బ్రిటన్‌లో ప్రవేశించాడు అంటూ అంతర్జాలంలో అసత్యాలు ప్రచారమయ్యాయి. అదే అదనుగా వలసదారులకూ, ముస్లిమ్‌లకూ వ్యతిరేకంగా నిరస నలు చేయాలంటూ తీవ్రతర మితవాద బృందాలు సామాజిక మాధ్యమ వేదికలైన ‘ఎక్స్’ వగైరాల్లో పిలుపునిచ్చాయి. నిజానికి, పిల్లలపై కత్తి దాడికి పాల్పడింది ముస్లిమ్ వలసదారు కాదనీ, రువాండాకు చెందిన తల్లితండ్రులకు జన్మించిన ఓ 17 ఏళ్ళ క్రైస్తవ టీనేజర్ అనీ అధికారులు గుర్తించారు. ఆ పసిపాపల్ని చంపడమే కాక, గతంలోనూ కనీసం పదిసార్లు ఆ కుర్రాడు హత్యాయత్నాలకు పాల్పడి నట్టు పోలీసులు గుర్తించారు. అరెస్టు కూడా చేశారు. అయితే, నిజం ఇంటి గడప దాటే లోపల అబద్ధం ఊరంతా షికారు చేసింది. హంతకుడి గురించి పుకార్లు, విద్వేష నిరసనల పిలుపులు విస్తృతంగా విషాన్ని విరజిమ్మాయి. సోషల్‌మీడియా లోని వివాదాస్పద ఇన్ఫ్లుయెన్సర్ల తప్పుడు కథనాలతో మసీదులు, శరణార్థులకు నీడనిచ్చిన హోటళ్ళే లక్ష్యంగా దాడులు సాగాయి. చివరకు గడచిన దశాబ్ద కాలం పైచిలుకుగా యునైటెడ్ కింగ్డమ్ (యూకే)లో ఎన్నడెరుగని స్థాయిలో అల్లర్లు, దహనకాండ, లూటీలకు ఆజ్యం పోశాయి. జూలై 30 నుంచి దేశవ్యాప్తంగా సాగుతున్న ఘర్షణల్లో ఇప్పటికి కనీసం 400 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయినా పరిస్థితులు చక్కబడలేదు. చివరకు లండన్‌లోని భారత హైకమిషన్ సైతం బ్రిటన్‌కు వచ్చే భారత జాతీయులు జాగ్రత్తగా ఉండాలని మంగళవారం సూచనలు జారీ చేయాల్సి వచ్చింది. నైజీరియా, మలేసియా, ఇండొనేషియా సహా పలు దేశాలు అదే పని చేశాయి. ప్రపంచమంతటా సత్వర సమాచార, వ్యాఖ్యా ప్రసారానికి ఉపయోగపడాల్సిన వాట్సప్ మొదలు ‘ఎక్స్’ దాకా సోషల్ మీడియా వేదికలన్నీ తుంటరుల చేతిలో అదుపు లేని ఆయుధాలుగా మారడం విషాదం. వాటిలోని విద్వేషపూరిత అసత్యాలు, రెచ్చేగొట్టే మాటలకు ఎవరు, ఎక్కడ, ఎలా అడ్డుకట్ట వేయగలరో అర్థం కాని పరిస్థితి. బ్రిటన్‌లో సాంకేతిక శాఖ మంత్రి సైతం గూగుల్, ఎక్స్, టిక్‌టాక్, మెటా సంస్థల ప్రతినిధులతో సమావేశమై, అసత్య సమాచారం వ్యాపించకుండా ఆపడంలో ఆ సంస్థల బాధ్యతను మరోసారి నొక్కిచెప్పాల్సి వచ్చింది. అసలు అలాంటి అంశాలను తొలగించే బాధ్యత, భారం ఆ యా సోషల్ మీడియా సంస్థలదేనని బ్రిటన్ సర్కార్ కొంత కాలంగా ఒత్తిడి పెట్టాలని చూస్తోంది. తాజా ఘర్షణలతో ప్రభుత్వం ఆగి, తన వంతుగా తానూ బాధ్యత తీసుకోక తప్పదు. నిజానికి, ‘బ్రెగ్జిట్’ తర్వాత నుంచి బ్రిటీషు సమాజం నిలువునా చీలిపోయింది. ఈ చీలిక లకు మునుపటి కన్జర్వేటివ్ పార్టీ ప్రభుత్వాలు హ్రస్వ దృష్టితో అనుసరించిన విధానాలు తోడయ్యే సరికి పెను ప్రభావం పడింది. అన్నీ కలసి తాజా దాడులుగా విస్ఫోటించాయి.ఈ హింసను అదుపు చేసి, శాంతిభద్రతల్ని పునరుద్ధరించడం స్టార్మర్ సర్కారుకు సవాలే. కానీ, తీవ్రతర మితవాదులు రేపుతున్న విద్వేషం, విదేశీయుల పట్ల వైముఖ్యానికి కళ్ళెం వేయడం అసలు సిసలు ఛాలెంజ్. మొత్తం వచ్చిన ఓట్ల రీత్యా బ్రిటన్ తాజా ఎన్నికల్లో తీవ్రతర మితవాద రాజకీయ పార్టీ ‘రిఫార్మ్ యూకే’ మూడోస్థానంలో నిలిచింది. అంటే, దేశంలోని రాజకీయ, ఆర్థిక అనిశ్చితుల మధ్య దానికి ఆ మేరకు మద్దతుందన్న మాట. అదే సమయంలో పాలనలో మార్పు కోరిన జనం బ్రిటన్ పునర్నిర్మాణ వాగ్దానం చూసి స్టార్మర్‌కు ఓటేశారు. పాత పాలన సమస్యలకు తోడు ప్రస్తుత పరిస్థితుల్లో వలసలు, మితవాద జనాకర్షక విధానాల లాంటి సంక్లిష్ట అంశాలపై ఆయన ఆచితూచి అడుగేయక తప్పదు. చరిత్రలో వలసరాజ్య పాలనకు పేరొందిన బ్రిటన్‌లో ఇప్పుడు వలసదారులపై రచ్చ రేగడమే వైచిత్రి. పొట్ట చేతబట్టుకొని శరణు కోరి వచ్చినవారినే అన్నిటికీ కారణమని నిందించడం, అకారణ శత్రుత్వం వహించడం బ్రిటన్‌కు శోభనివ్వదు. అసత్య కథనాల పట్ల జనచైతన్యంతో పాటు జనజీవన స్రవంతిలో వలసజీవులు కలిసిపోయే విధానాలకు ప్రభుత్వం ప్రాధాన్యమివ్వడం ముఖ్యం. వాటివల్లే అపోహలు, ప్రతికూలభావాలు పోతాయి. విధ్వంసకారులపై కఠిన చర్యలు తీసు కుంటూనే సరైన నాయకత్వం, సహానుభూతితో వ్యవహరించాలి. మతవైరాలకు తావివ్వక న్యాయం, సమానత్వానికి నిలబడడమే ఇప్పుడు బ్రిటన్ మరింత పటిష్ఠంగా ముందుకు నడవడానికి మార్గం. -
సంక్షుభిత బంగాళం
భయపడినంతా అయింది. బంగ్లాదేశ్ రాజకీయ సంక్షోభంలో కూరుకుపోయింది. హింసాత్మకంగా మారిన విద్యార్థుల నిరసనలు, వెల్లువెత్తుతున్న ప్రజాగ్రహం మధ్య అవామీ లీగ్ పార్టీ సారథి షేక్ హసీనా ప్రధానిగా రాజీనామా చేసి, సైనిక విమానంలో దేశం విడిచిపోవాల్సి వచ్చింది. పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా సాగిన 1971 నాటి బంగ్లాదేశ్ స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొన్నవారి కుటుంబ సభ్యు లకు ప్రభుత్వోద్యోగాల్లో 30 శాతం రిజర్వేషన్లు కల్పించిన వివాదాస్పద కోటా విధానంపై మొదలైన రచ్చ చివరకు ఇంతకు దారి తీసింది. జూలైలో ఢాకా యూనివర్సిటీలో ఆరంభమైన విద్యార్థుల నిరసన ప్రదర్శనలు ఇంతలు అంతలై, ఘర్షణలకు దారి తీశాయి. గత నెలలోనూ, అలాగే ఈ ఆదివారమూ కలిపి 300 మందికి పైగా అమాయకుల ప్రాణాలు పోవడంతో బంగ్లాలో పరిస్థితులు వేగంగా మారాయి. గత నెలలో సుప్రీమ్ కోర్ట్ జోక్యం చేసుకొని, అన్నీ కలిపి 56 శాతమున్న రిజర్వేషన్లను 7 శాతానికి తగ్గించినప్పుడు నిరసనలు తగ్గి, ప్రశాంతత నెలకొంటుందని భావించారు. అప్పటికి కాస్త ఆగినట్టనిపించినా, మృతుల కుటుంబాలకు న్యాయం పేరిట మళ్ళీ నిరసనలు రేగాయి. ప్రభుత్వ అనుకూల, ప్రతికూల వర్గాల మధ్య మళ్ళీ రేగిన ఘర్షణల్లో ఒక్క ఆదివారమే 100 మంది దాకా చనిపోవడం, విద్యార్థుల ‘చలో ఢాకా’ ప్రదర్శన నేపథ్యంలో అగ్నిపర్వతం బద్దలైంది. క్షేత్రస్థాయిలో ప్రజల మనోభావాలను గుర్తించకుండా, నిరంకుశంగా వ్యవహరిస్తే ఎంతటి పాపు లర్ నేతకైనా ఎలాంటి దురవస్థ తలెత్తుతుందో సోమవారం నాటి దృశ్యాలు కళ్ళకు కట్టాయి. దేశ వ్యాప్త కర్ఫ్యూ, ఇంటర్నెట్ సేవల సస్పెన్షన్ విధించినా ఢాకాలో రోడ్ల నిండా జనం, ప్రధాని నివా సాన్ని వారు చుట్టుముట్టిన తీరు, హసీనా రాజీనామా, విలాసవంతమైన ఆమె నివాసంలోకి జనం చొచ్చుకుపోయి లూటీ సాగించిన తీరు చూస్తుంటే... సరిగ్గా రెండేళ్ళ క్రితం 2022 జూలైలో శ్రీలంకలో అధ్యక్షుడు రాజపక్సేకు ఎదురైన ఘటనలు గుర్తుకొస్తాయి. దేశాలు, ప్రజలు వేరైనా, రెండు ఘటనల్లోనూ నిరంకుశ పాలన, అవినీతి, ఆశ్రిత పక్షపాతాలే ఇంతటి జనాగ్రహానికి కారణమయ్యా యని మరిచిపోరాదు. అయితే, బంగ్లాలో రెచ్చిపోయిన జనం ప్రధాని నివాసంలోకే కాక, ఆఖరికి దేశ పార్లమెంట్‌లోకి చొరబడి యథేచ్ఛగా ప్రవర్తించడం విస్మయం కలిగిస్తుంది. షేక్ హసీనా తండ్రి, బంగ్లాదేశ్ జాతిపిత అయిన ముజిబుర్ రెహమాన్ విగ్రహాన్ని సైతం ధ్వంసం చేయడం, బంగబంధు మ్యూజియమ్‌ను తగలబెట్టడం, అధికార అవామీ లీగ్ ఆఫీసులకూ – పోలీస్ స్టేషన్లకూ – ప్రభుత్వ ఆఫీసులకూ నిప్పు పెట్టడం ప్రజాస్వామ్య వాదులకు ఆవేదన, ఆందోళన కలిగించక మానవు. అయిదు దశాబ్దాల స్వతంత్ర బంగాళం ఇటీవలెన్నడూ చూడని హింస, రాజకీయ సంక్షోభం ఇది. ఒక రకంగా ఇది అయిదుసార్లు బంగ్లా ప్రధానిగా వ్యవహరించిన 76 ఏళ్ళ హసీనా స్వయంకృతం. 2009 జనవరి నుంచి పదహారేళ్ళుగా నిర్విరామంగా అధికారంలో ఉన్న ఈ ఉక్కుమహిళ అనేక సంక్షోభాలనూ, హత్యాయత్నాలనూ దాటి వచ్చి, దేశాన్ని ఆర్థికంగా పైకి తెచ్చిన మాట నిజమే. ఒక దశలో ఇస్లామిక్ ప్రపంచంలో ప్రజాస్వామ్య, లౌకికవాదాలకు నమూనాగా తెచ్చుకున్న పేరూ పెద్దదే. కానీ, ప్రతిపక్ష నేతల్ని జైలులో పెట్టి, విమర్శకులను దేశద్రోహులుగా చిత్రించి, చట్టంతో పని లేకుండా ప్రత్యర్థుల్ని అడ్డు తొలగించుకుంటూ వచ్చి అభిమానుల్లో సైతం అప్రతిష్ఠ తెచ్చుకున్నారు. కోవిడ్ అనంతర పరిస్థితులు, రష్యా – ఉక్రెయిన్ యుద్ధంతో ఆర్థిక వ్యవస్థ అల్లకల్లోలమైంది. పెరిగిన ధరలు, పెచ్చుమీరిన నిరుద్యోగం, అణచివేతలతో అన్ని వర్గాల్లో అసంతృప్తి పేరుకుంది. పైగా, గడచిన రెండు తడవలుగా బంగ్లా ఎన్నికలు పరిహాసప్రాయమయ్యాయి. ముఖ్యంగా ఈ ఏటి జన వరి ఎన్నికలు వట్టి రిగ్గింగ్ అనే ఆరోపణలూ వచ్చాయి. ఇప్పుడామె రాజీనామాతో రోడ్డు మీద కొచ్చి ఆడామగా ఆనందిస్తున్న తీరు చూస్తే మార్పుకై జనం ఎంతగా మొహం వాచారో అర్థమవుతుంది. హసీనా రాజీనామాతో ప్రస్తుతం బంగ్లాదేశ్ సైన్యం కనుసన్నల్లోకి వెళ్ళింది. రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆర్మీ ఛీఫ్ సమావేశమైనట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుత ఆందోళనలకు అడ్డుకట్ట వేసి పరిస్థితిని చక్కదిద్దుతామనీ, త్వరలోనే తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటవుతుందనీ ఆర్మీ ఛీఫ్ ప్రకటించారు. అయితే, అది అంత సులభమేనా? దేశమంతా అల్లకల్లోలంగా ఉంది. పాలనా యంత్రాంగం పూర్తిగా పడకేసింది. సాక్షాత్తూ సైన్యం ఎదుటే ప్రదర్శకులు రెచ్చిపోతున్న దృశ్యాలూ కనిపించాయి. గత వారం నిషేధానికి గురైన జమాతే ఇస్లామీ వర్గీయులు సహా ఇంతకాలం అణచివేతకు గురైన ప్రతిపక్షాల మద్దతుదారులూ రోడ్డెక్కడంతో నిరసనకారుల్లో అందరూ విద్యార్థులే అనుకోలేం. అనూహ్య విధ్వంసం చూస్తుంటే, అసాంఘిక శక్తులు చేరాయన్న అనుమానాలూ వినిపిస్తున్నాయి. బంగ్లాదేశ్ పరిణామాలు భారత్‌పై చూపే ప్రభావమూ ఎక్కువే. కొన్నేళ్ళుగా భారత అనుకూల హసీనా ఏలుబడి మనకు కలిసొచ్చింది. ఇప్పుడిక ప్రతికూల పార్టీలు అక్కడ అధికారంలోకి వస్తే చిక్కులు తప్పవు. మళ్ళీ ఒకప్పటిలా సరిహద్దులో తీవ్రవాద సంస్థల పీడ పెరుగుతుంది. అవి అక్కడ తిష్ఠ వేసి, మన ఈశాన్య రాష్ట్రాల్లో సమస్యలు సృష్టిస్తాయి. చొరబాట్లూ ఎక్కువవుతాయి. కోటీ 30 లక్షల మంది హిందువులున్న బంగ్లాలో భారత మైనారిటీల భద్రత ప్రశ్నార్థకమవుతుంది. హసీనా ఉండగానే వారి పైన దాడులు తప్పలేదు. ఇక, ఛాందసవాద, ప్రతికూల శక్తులు గద్దెనెక్కితే పరిస్థితి ఎలా ఉంటుందో? అలాగే, ఢాకా దృశ్యాలను చూస్తే, ఇదే అదనుగా తీవ్రవాద శక్తులు విజృంభించ కుండా బంగ్లా సమాజం అప్రమత్తం కావాలనిపిస్తోంది. ముందుగా శాంతిభద్రతలు నెలకొనడం అవసరం. ఎలాంటి సర్కారుతో సాగాలి, మళ్ళీ ఎన్నికలు లాంటివన్నీ ఆ తర్వాతే! అది పూర్తిగా ఆ దేశ అంతర్గత వ్యవహారం, ప్రజాభీష్టం. ఏమైనా రానున్నరోజులు బంగ్లాకే కాదు భారత్‌కూ కీలకం. -
నిద్రారాక్షసం
కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర లేకుండా రోజుల తరబడి గడపడం అసాధ్యం. బొందిలో ప్రాణం నిలిచి ఉండాలంటే, ఈ రెండూ తప్పనిసరి. తిండి, నిద్ర మనుషులకే కాదు, జంతువులకూ అవసరమే! జంతువులకు నిద్ర ముంచుకొచ్చినప్పుడు నిద్రపోవడమే తెలుసు గాని, నిద్ర గురించి ఆలోచించడం తెలీదు. మనం మనుషులం. జంతువులతో పోల్చుకుంటే జ్ఞానులం. ‘ఆహార నిద్రా భయ మైథునాని/ సామాన్య మేతత్పశుభిర్నరాణాం/ జ్ఞానం హి తేషా మధికో విశేషో/ జ్ఞానేన హీన్యా పశుభిస్సమానాః’ అని పూర్వకవి సంస్కృతంలో పలికాడు. ఆహార నిద్రా భయ మైథునాలు మనుషులకు, జంతువులకు సమానమే! మిగిలిన జంతు సమూహం నుంచి మనిషిని వేరు చేసే లక్షణం జ్ఞానం మాత్రమే! జ్ఞానమే గనుక లేకుంటే, మనుషులకు, జంతువులకు తేడా ఏమీ ఉండదు.అందువల్ల జంతువుల కంటే జ్ఞానులైన మనుషులకు నానా విషయాలలో అవసర పరిజ్ఞానమూ అనవసర పరిజ్ఞానమూ సహజ లక్షణం. అందులో భాగంగానే మనుషులకు నిద్ర గురించిన పరిజ్ఞానం ఉండటం అంతే సహజం. నిద్ర ఎప్పుడు రావడం సహజమో, ఎంతసేపు నిద్రపోవాలో, సుఖనిద్రకు ఎలాంటి పరిసరాలు, పరిస్థితులు అనుకూలిస్తాయో మనుషులకు బాగా తెలుసు. బహుశా, ఈ జ్ఞానభారం వల్లనే నిద్రలేమి సమస్యలు కూడా మనుషుల్లోనే ఎక్కువ. ‘ఆకలి రుచి ఎరుగదు, నిద్ర సుఖమెరుగదు’ అని మనకో నానుడి ఉంది. కొంత వరకు ఆ మాట నిజమే కావచ్చు గాని, సర్వసుఖాలు అందుబాటులో ఉన్నా, కంటి నిండా కునుకు లేక తిప్పలు పడే మనుషులు ప్రపంచమంతటా లెక్కకు మిక్కిలిగా ఉన్నారు. ‘నిద్ర మంచిది, మరణం మెరుగైనది; అయితే, అత్యుత్తమమైనదేదీ ఇంకా పుట్టలేదు’ అని జర్మన్ కవి, రచయిత హేన్రిక్ హేనీ అన్నాడు. మరణాన్ని మనవాళ్లు శాశ్వతనిద్రగా అభివర్ణిస్తారు. శాశ్వతనిద్రలోకి జారుకునేలోగా మనిషికి జీవనయాత్ర తప్పదు. జీవనయాత్ర సజావుగా సాగడానికి ప్రతిరోజూ తగినంత నిద్ర అవసరం. ప్రశాంతమైన నిద్రతోనే మనశ్శరీరాలు జవజీవాలను పుంజుకుంటాయి. దైనందిన నిత్య నైమిత్తిక కార్యకలాపాలకు సంసిద్ధమవుతాయి. రోజంతా పనిచేసి అలసి సొలసిన శరీరానికి విశ్రాంతి, మనసుకు ప్రశాంతత అవసరం. ఈ రెండూ నిద్రతోనే దొరుకుతాయి. అయితే, సంక్లిష్టమయమైన ఆధునిక జీవనశైలి మనుషులను నిద్రకు దూరం చేస్తోంది. ‘కునుకు పడితె మనసు కాస్త కుదుట పడతది/ కుదుట పడ్డ మనసు తీపి కలలు కంటది’ అన్నాడు మనసుకవి ఆత్రేయ. మనసుకు కుదురు లేనప్పుడు పట్టేది చెదురు మదురు నిద్రే! చెదురు మదురు నిద్రలో తీపికలలు కాదు, పీడకలలు వస్తాయి. ‘కంటికి నిద్రవచ్చునె? సుఖంబగునె రతికేళి? జిహ్వకున్/ వంటక మిందునే? యితర వైభవముల్ పదివేలు మానసం/బంటునె? మానుషంబుగల యట్టి మనుష్యున కెట్టివానికిన్/ గంటకుడైన శాత్రవుడొకండు తనంతటి వాడు గల్గినన్’ అన్నాడు శ్రీనాథుడు. ఈ పద్యం ‘కాశీఖండం’లోనిది. ఇది వింధ్యుడి స్వగతం. వింధ్యుడికి సమ ఉజ్జీ మేరువు. సూర్యుడు మేరువు చుట్టూ ప్రదక్షిణంగా పయనిస్తాడు. దేవతలు మేరుపర్వతాన్నే గౌరవిస్తారు. మేరువు కన్నా తానేమీ తక్కువ కాకున్నా, తనకు దక్కని గౌరవం మేరువుకు దక్కడం పట్ల అసూయతో రగిలిపోయే వింధ్యుడి కంటికి కునుకు పట్టకపోవడం సహజమే కదా! పురాణాల్లో మేరువు, వింధ్య పర్వతాలే అయినా, శ్రీనాథుడు రాసిన ఈ పద్యం మాత్రం మానవ ప్రవృత్తులకు అద్దం పడుతుంది. నిద్రను కరవు చేసే అనేకానేక కారణాల్లో సమ ఉజ్జీ అయిన ప్రత్యర్థితో తలెత్తే స్పర్థ కూడా ఒకటి.నిద్ర పట్ల అవగాహన మనుషులకు ప్రాచీనకాలం నుంచి ఉండేది. నిద్రకు భంగం కలిగించే అంశాలు, ప్రశాంతమైన నిద్ర ఆవశ్యకతను నాటి మానవులు బాగానే గుర్తించారు. ప్రాచీన నాగరికతలలో నిద్రను దేవతగా ఆరాధించేవారు. కావ్య పురాణేతిహాసాల్లో నిద్ర ప్రస్తావన విరివిగా కనిపిస్తుంది. రామాయణంలో కుంభకర్ణుడి నిద్ర, ఊర్మిళాదేవి నిద్ర సుదీర్ఘకాల నిద్రలకు ఉదాహరణలు. ఆకలి దప్పులను, నిద్రను జయించడానికి విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు బల అతిబల విద్యలను ఉపదేశించిన ఉదంతం కూడా రామాయణంలో ఉంది. అరణ్యవాస కాలంలోను, లంకలో రామరావణ యుద్ధకాలంలోను బల అతిబల విద్యలు లక్ష్మణుడికి బాగా అక్కరకు వచ్చాయి. అరణ్యవాసానికి వెళ్లినది మొదలుకొని, రావణ సంహారం తర్వాత శ్రీరామ పట్టాభిషేకం వరకు లక్ష్మణుడు నిద్రపోలేదు. అంతకాలమూ అతడి అర్ధాంగి ఊర్మిళ నిద్రపోతూనే ఉంది. సరిగా రామ పట్టాభిషేకం జరుగుతుండగా, లక్ష్మణుడికి నిద్ర ముంచుకొచ్చి రెప్పలు మూతబడ్డాయి. అప్పుడు తన అవస్థకు తానే నవ్వుకున్నాడు లక్ష్మణుడు. పట్టాభిషేక సమయంలో లక్ష్మణుడు నవ్విన నవ్వును అక్కడ ఉన్న ప్రముఖుల్లో ఒక్కొక్కరు ఒక్కోలా అర్థం చేసుకున్నారు. అదంతా వేరే కథ. పురాణాల ప్రకారం నిద్రకు దూరంగా ఎక్కువకాలం గడిపిన రికార్డు లక్ష్మణుడిదే! అయితే, నూయెన్ న్యోక్ మై కిమ్ అనే యాభయ్యేళ్ల వియత్నాం మహిళ గడచిన ముప్పయ్యేళ్లుగా కనీసం నిమిషమైనా నిద్రపోలేదట! ఇన్నాళ్లుగా నిద్రపోకున్నా, ఆమె ఆరోగ్యంగా ఉండటం చూసి వైద్యులు సైతం విస్తుపోతున్నారు. ఈ నిద్రలేని నీలాంబరి ఉదంతం ఒక నిద్రారాక్షసం. -
పశ్చిమాసియా ఓ మందు పాతర!
పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇజ్రాయెల్‌పై దాడికి ఇరాన్ సన్నాహాలు చేస్తున్నట్టు తాజా వార్తలు సూచిస్తున్నాయి. పశ్చిమాసియాలో తిష్ఠవేసి ఉన్న అమెరికా సైన్యాలు కూడా ఇజ్రాయెల్‌కు రక్షణగా నిలవడానికి మోహరింపు మొదలుపెట్టాయి. ఇరాన్లో ఆ దేశపు అతిథిగా ఉన్న సమయంలో హమాస్ రాజకీయ విభాగపు నేతను హతం చేయడం ద్వారా ఇజ్రాయెల్ పెద్ద సవాల్నే విసిరింది. గత అక్టోబర్ మాసంలో ఇజ్రాయెల్ పౌరులపై దాడి చేసిన హమాస్ దుస్సాహసం కంటే ఈ చర్య తక్కువదేమీ కాదు. ఇది ఇరాన్‌కు విసిరిన సవాల్! ఇజ్జత్ కా సవాల్‌గా ఈ చర్యను ఇరాన్ పరిగణించకుండా ఉంటుందని భావించలేము.ఇజ్రాయెల్ పాల్పడిన దుశ్చర్యకు కఠిన శిక్ష తప్పదనీ, ప్రతీకారం తీర్చుకుంటామనీ ఇరాన్ సుప్రీమ్ లీడర్ ఆయతుల్లా ఖమేనీ ఇప్పటికే ప్రకటించారు. ఇరాన్ యుద్ధంలో పాల్గొనడమంటే పశ్చిమాసియాలోని పలు ఉగ్రవాద సంస్థలు కూడా దాని వెన్నంటి ఉన్నట్టే! హమాస్‌తో పాటు లెబనాన్‌లో హెజ్బుల్లా, ఇరాక్, సిరియాల్లోని షియా మిలిషియాలు, యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులు కూడా యుద్ధంలో పాల్గొంటారు. హౌతీ తిరుగుబాటుదారుల తడాఖా ఏమిటో ఇప్పటికే ప్రపంచ వాణిజ్యం చవిచూసింది.గాజాపై ఇజ్రాయెల్ ప్రారంభించిన ప్రతీకార దాడుల తర్వాత ఇరాన్ ఆదేశాల మేరకు యెమెన్‌లో హౌతీ తిరుగుబాటుదారులు రెచ్చిపోయారు. యూరప్ – ఆసియా దేశాల మధ్య జరిగే నౌకా వ్యాపారంలో సింహభాగం సూయెజ్ కెనాల్ ద్వారానే జరుగుతుంది. ఇది ప్రపంచ నౌకా వాణిజ్యంలో 30 శాతం. విలువ లక్ష కోట్ల డాలర్లు. యూరప్ వాణిజ్య నౌకలు మధ్యధరా సముద్రం నుంచి సూయెజ్ కెనాల్ ద్వారా ఎర్ర సముద్రంలోకి ప్రవేశించి ‘ఆఫ్రికా కొమ్ము’ (హార్న్ ఆఫ్ ఆఫ్రికా)గా పిలుచుకునే సోమాలీ ద్వీపకల్పానికి – అరబ్ ద్వీపకల్పానికి మధ్యనున్న సన్నని దారిగుండా బంగాళాఖాతంలోకీ, అక్కడి నుంచి హిందూ మహాసముద్రంలోకీ ప్రవేశిస్తాయి. అరబ్ ద్వీపకల్పానికి బంగాళాఖాతపు అంచున ఉన్న దేశం యెమెన్. యెమెన్‌లోని షియా తిరుగుబాటుదారులనే ‘హౌతీ’లుగా పిలుస్తున్నారు. హౌతీల దాడులకు భయపడి సూయజ్ నౌకా వాణిజ్యంలో 90 శాతం ఆగిపోయింది. యూరప్ నుంచి అట్లాంటిక్ సముద్రం ద్వారా ఆఫ్రికా ఖండపు ‘కేప్ ఆఫ్ గుడ్ హోప్’ అంచును చుట్టి హిందూ మహాసముద్రంలోకి ప్రవేశించడానికి ఈ నౌకలకు రెండు వారాల అదనపు సమయం పట్టింది. భారీగా అదనపు వ్యయాన్ని భరించాల్సి వచ్చింది. వాణిజ్యాల్లోని అదనపు భారాన్ని అంతిమంగా మోయాల్సింది వినియోగదారులైన ప్రజలే! హౌతీల దాడుల ప్రభావం 50 దేశాల నౌకా వాణిజ్యంపై పడిందని గత జనవరిలోనే వైట్‌హౌస్ ప్రకటించింది.ఇరాన్ – ఇజ్రాయెల్‌ల మధ్యన నిజంగానే యుద్ధం ప్రారంభమైతే దాని విధ్వంసకర ప్రభావాన్ని మొత్తం ప్రపంచమే ఎదుర్కోవలసి వస్తుంది. ఇక ఆ ప్రాంతపు సంక్షోభం గురించి చెప్పవలసిన అవసరమే లేదు. ఇజ్రాయెల్ జరిపిన గాజా దాడుల్లోనే 40 వేలమంది చనిపోయారు. పుష్కర కాలం కింద ప్రారంభమైన సిరియా అంతర్యుద్ధంలో ఇప్పటివరకు నాలుగు లక్షలమంది ప్రాణాలు పోగొట్టుకున్నట్టు అంచనా. తీవ్రమైన మానవతా హననాన్ని ఈ ప్రాంతం చవిచూసింది. ఉన్న ఊరు విడిచిపోయినవారూ, కన్నబిడ్డల్ని అనాథల్ని చేసినవారూ లక్షల సంఖ్యలో ఉన్నారు. ఒక దశలో మధ్యధరా సముద్రపు అలల మీద శవాలు తేలియాడిన విషాద సన్నివేశాలను కూడా ప్రపంచం చూసింది. ఇక ఆర్థిక వ్యవస్థల విధ్వంసం, లక్షలాది ప్రజలు శరణార్థులుగా వలస వెళ్లడాలు యుద్ధ దేశాల్లో షరా మామూలే!పశ్చిమాసియా సంక్షోభంతో కానీ, దాని కారణాలతోగానీ ఎటువంటి సంబంధం లేని భారతదేశం కూడా యుద్ధం ప్రారంభమైతే తీవ్ర సంకట పరిస్థితిని ఎదుర్కోవలసి వస్తుంది. హమాస్ నాయకుడు ఇస్మాయెల్ హనియా హత్య జరిగి మూడు రోజులు గడిచినా భారతదేశం నుంచి ఖండన మండనల వంటి అధికారిక ప్రకటనలేమీ రాలేదు. ‘వ్యూహాత్మక నిశ్శబ్దాన్ని’ పాటిస్తున్నామనుకోవాలి. నిజంగా కూడా భారత్ పరిస్థితి అటువంటిదే! రెండు దేశాలతో మనకు మంచి సంబంధాలున్నాయి. అంతకు మించి రెండు దేశాలతో అవసరాలు కూడా ఉన్నాయి.ఇరాన్‌తో భారత స్నేహ సంబంధాలు తరతరాల నాటివి. ఇరాన్ మీద అమెరికా ఆంక్షలు విధించిన సమయంలో మిత్రదేశంగా మనం బాసటగా నిలబడనప్పటికీ ‘చాబహార్ పోర్టు’ నిర్మాణ బాధ్యతలను మనకే అప్పగించి సౌహార్దం చాటుకున్న దేశం ఇరాన్. ఇటీవలి కాలంలో ఇజ్రాయెల్‌తో కూడా భారత్ బంధం బాగా బలపడింది. భద్రత, మిలిటరీ వంటి అంశాల్లో రెండు దేశాల మధ్య స్నేహ ఒడంబడికలున్నాయి. భారతదేశ ఇంధన అవసరాల్లో అత్యధిక భాగం పశ్చిమాసియానే తీరుస్తున్నది. ఈ ప్రాంతంలోని దాదాపు అన్ని దేశాలతోనూ భారత్‌కు దౌత్య సంబంధాలున్నాయి.కొన్ని లక్షలమంది భారతీయులు ఈ దేశాల్లో ఉపాధి పొందుతున్నారు. ఏటా మూడు లక్షల కోట్ల రూపాయలకు పైగా ఈ ప్రవాసులు భారత్‌కు పంపిస్తున్నారు. ప్రవాసుల భద్రత పట్ల కూడా భారత్‌కు ఆందోళన ఉంటుంది. ఇటీవలనే యూఏఈ, జోర్డాన్, గ్రీస్‌లతో కలిసి ‘ఇండియా – మిడిల్ ఈస్ట్ – యూరోప్ ఎకనామిక్ కారిడార్’ను కూడా భారత్ ప్రారంభించింది. ఉద్రిక్తతల కారణంగా ఈ నడవా ఇంకా నడకను మొదలుపెట్టలేకపోయింది. ఇజ్రాయెల్, యూఏఈ, అమెరికాలతో కలిసి ఏర్పాటు చేసుకున్న ‘ఐ టూ – యూ టూ’ ప్లాన్ పరిస్థితి కూడా ఇంతే!ప్రచ్ఛన్న యుద్ధకాలం నాటి రెండు ధ్రువాల ప్రపంచంలో ఏ దేశమైనా ఏదో ఓ కూటమి వైపు మొగ్గవలసిన పరిస్థితులుండేవి. అలీన దేశాలకు కూడా మినహాయింపు లేదు. ఇప్పుడున్న పరిస్థితులను ఏకధ్రువ ప్రపంచంగా కూడా పిలువలేము. ఇది దేశాల మధ్య కీలక భాగస్వామ్యాల యుగం. భౌగోళిక – రాజకీయ, భౌగోళిక – ఆర్థిక అవసరాలను బట్టి ప్రాంతీయంగానూ, ఖండాంతర స్థాయుల్లోనూ ఈ వ్యూహాత్మక లేదా కీలక భాగస్వామ్య కూటములు ఏర్పాటవుతున్నాయి. ఇటువంటి భాగస్వామ్యాలు పశ్చిమాసియా దేశాలతో కూడా భారత్‌కున్నాయి. ప్రపంచంలోని మరే ఇతర ప్రాంతంలో తలెత్తే సంక్షోభం కంటే కూడా పశ్చిమాసియా సంక్షోభమే భారత్‌పై ఎక్కువ ప్రభావాన్ని చూపుతుంది. ఈ ప్రాంతంలో జరిగే యుద్ధం భారత్‌కు నిజంగా పీడకలే! కానీ, ఒక దేశపు దుశ్చర్యను ఖండించలేని స్థితిలో ఉన్న భారత్ యుద్ధాన్ని ఆపగలదని ఆశించలేము.ఇజ్రాయెల్... అమెరికా మాట వింటుంది. రష్యా – చైనాల మాటను ఇరాన్ వినే అవకాశం ఉంది. ఈ మూడు దేశాలు కలిసి సంయుక్తంగా యుద్ధాన్ని నివారించేందుకు పూనుకుంటాయా? అది సాధ్యమయ్యే పనేనా? అసలు యుద్ధం జరగకూడదని ఈ మూడు దేశాలు కోరుకుంటున్నాయా అనేది ముఖ్యమైన ప్రశ్న. యుద్ధం జరిగితే రష్యాకు పోయేదేమీ ఉండకపోవచ్చు. ఇరాన్, సిరియాలు మిత్ర దేశాలు. వాటికి కావలసిన ఆయుధాలను నూటికి నూరు శాతం రష్యానే ఎగుమతి చేస్తున్నది. ఇప్పటికే ఆయుధ ఎగుమతులు తగ్గిపోయిన రష్యాకు ఇదో ఊరటే! కోల్పోయిన ఒకనాటి ప్రాధాన్యత మళ్లీ ఆ ప్రాంతంలో దక్కడం కంటే కావల్సిందేముంది! ఉక్రెయిన్‌కు అండగా నిలబడిన అమెరికాకు పశ్చిమాసియాలో పాఠం చెప్పే అవకాశం వస్తే ఎందుకు వదులుకుంటుంది?దేశాల మధ్య ఉద్రిక్తతలు, వైషమ్యాలు ఉండే పరిస్థితులపై చైనా, అమెరికాలకు అభ్యంతరాలు ఉండకపోవచ్చు. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో అవి యుద్ధాన్ని కోరుకోకపోవచ్చు. అమెరికాకు ఈ ప్రాంతంలో సైన్యం ఉన్నది. సైనిక స్థావరాలున్నాయి. ఇజ్రాయెల్ వంటి బలమైన శిష్య దేశాలు, సౌదీ వంటి మిత్ర దేశాలున్నాయి. వాటితో ప్రయోజనాలున్నాయి. ఇక్కడ యథాతథ స్థితి కొనసాగడం అమెరికాకు అవసరం. ఇక్కడి బలాబలాల సమతూకం చెదిరితే ప్రపంచవ్యాప్తంగా దాని ప్రభావం పడుతుంది.యుద్ధమే జరిగితే ఇజ్రాయెల్‌కు అండగా నిలవక తప్పని స్థితి అమెరికాది. ఒకవేళ అలా నిలబడకపోయినట్టయితే ప్రపంచవ్యాప్తంగా అమెరికా కుదుర్చుకున్న వ్యూహాత్మక ఒప్పందాలు, ముఖ్యంగా చైనాకు వ్యతిరేకంగా ఇండో – పసిఫిక్‌లో కుదిరిన ఒప్పందాల్లో భాగస్వాములు అమెరికాను విశ్వసించకపోయే అవకాశం ఉంటుంది. సొంత దేశంలోని యూదు లాబీ అభీష్టానికి వ్యతిరేకంగా రాజకీయ నిర్ణయాలు అమెరికా తీసుకోగలదా అన్నది కూడా సందేహమే. కనుక యుద్ధంలో అమెరికా పాత్ర ఉంటుంది.ఇజ్రాయెల్‌తో పాటు సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, జోర్డాన్, ఖతార్ తదితర దేశాలు పశ్చిమాసియాలో అమెరికాకు సన్నిహితంగా ఉంటాయి. ఈ దేశాలతో అమెరికాకు బలమైన వాణిజ్య, సహకార సంబంధాలున్నాయి. యుద్ధం ఇజ్రాయెల్ వర్సెస్ అరబ్ ఘర్షణగా మారితే ఈ మిత్రదేశాలకు కొంత ఇబ్బందికరంగా పరిణమించవచ్చు. గాజాపై ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా ఈ మధ్యకాలంలో అమెరికా విద్యార్థులు పెద్ద ఎత్తున గళం విప్పుతున్నారు. కాన్వొకేషన్ కార్యక్రమాలను పాలస్తీనా అనుకూల నినాదాలతో హోరెత్తించారు. దేశంలోని యూదు లాబీకి దీటుగా వ్యతిరేక శక్తులు కూడా బలపడుతున్న సూచనల నేపథ్యంలో ఈ యుద్ధం అధికార పార్టీ డెమోక్రట్ల పుట్టిని ఎన్నికల్లో ముంచినా ముంచవచ్చు.ఏ రకంగా ఆలోచించినా యుద్ధ నివారణే అమెరికాకు ప్రస్తుత అవసరం. అందుకు ఇరాన్‌ను నియంత్రించవలసిన అవసరం ఉన్నది. రష్యా సహకారంతో చైనా ఈ పని చేయాలని అమెరికా కోరిక. చైనాకు ‘బెల్ట్ అండ్ రోడ్ ఇన్షియేటివ్’లో భాగమైన మౌలిక వసతుల ప్రాజెక్టులపై ఈ దేశాల్లో ఒప్పందాలున్నాయి. పశ్చిమాసియా యుద్ధం ఆర్థిక కారణాల రీత్యా చైనాకు కూడా ఆమోదయోగ్యం కాదని అమెరికా అంచనా. పశ్చిమాసియా సంక్షోభంలో అమెరికా కూరుకొనిపోయినట్లయితే ఇండో – పసిఫిక్‌లో తమను దిగ్బంధం చేసే ప్రయత్నాలు వెనుకడుగు వేస్తాయని చైనా దౌత్య నిపుణులు అంచనా వేసుకుంటే ఆశ్చర్యపడవలసిన పనిలేదు. ఇస్మాయెల్ హనియా హత్యను కూడా చైనా గట్టిగానే ఖండించింది. ఈ కోణంలో చూసినప్పుడు యుద్ధ నివారణకు చైనా చొరవ చూపే అవకాశాలు చాలా తక్కువ.పెత్తందారీ దేశాల ఎత్తుగడలు ఏ రకంగా ఉన్నా పశ్చిమాసియా ఇప్పుడు పేలడానికి సిద్ధంగా ఉన్న ఒక మందుపాతర లాగా కనిపిస్తున్నది. పర్షియా, మెసపుటోమియా, ఫొనీషియన్, ఈజిప్టు నైలునదీ నాగరికతలు విలసిల్లిన చారిత్రక ధన్యభూమి ఇప్పుడు దగ్ధగీతాన్ని వినిపిస్తున్నది. ప్రపంచ జనాభాలో పశ్చిమాసియా వాటా రెండున్నర శాతం దాటదు. కానీ 30 శాతం ఆయుధాలను దిగుమతి చేసుకుంటున్న ప్రాంతం ఇదే! సగటున తొమ్మిది శాతం జీడీపీని ఈ దేశాలు ఆయుధాల కోసం తగలేస్తున్నాయి. రష్యా మార్కెట్ ఇరాన్, సిరియాలు మాత్రమే! మిగతా మార్కెటంతా అమెరికాదే! ఈ దేశాలు ఆయుధాల మీద ఏటా వెచ్చిస్తున్న ఐదు లక్షల కోట్ల రూపాయల్లో భీముని వాటా అమెరికాదే. ఒకపక్క తుపాకులు చేరవేస్తూ, ‘కాల్చుకోకండి ప్లీజ్... జస్ట్ ఆడుకోండి’ అంటే కుదురుతుందా? అందుకే అమెరికా శాంతి ప్రబోధాలకు పెద్దగా విలువ ఉండదు.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
పారదర్శకతే సరైన మార్గం
-
పారదర్శకతే సరైన మార్గం
యాదృచ్ఛికమే కావొచ్చుగానీ... జాతీయ స్థాయి పోటీ పరీక్షల ప్రశ్నపత్రాలు వరసపెట్టి లీక్ అవుతున్న తరుణంలోనే ట్రెయినీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేడ్కర్ ఎంపిక వ్యవహారం బద్దలై యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ)పై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శిగా పనిచేసి నాలుగేళ్ల క్రితం రిటైరైన ప్రీతి సుదాన్కు సంస్థ సారథ్యం అప్పగించారు. ఆమె యూపీఎస్సీని చక్కదిద్దుతారన్న నమ్మకం అందరిలోవుంది.సాధారణంగా ప్రశ్నపత్రాల లీక్ ఉదంతాలు చోటుచేసుకున్నప్పుడల్లా యూపీఎస్సీని అందరూ ఉదాహరణగా చూపేవారు. దాన్ని చూసి నేర్చుకోవాలని హితవు పలికేవారు. అలాగని యూసీఎస్సీపై అడపా దడపా ఆరోపణలు లేకపోలేదు. ముఖ్యంగా అంగవైకల్యం ఉన్నట్టు చూపటం, తప్పుడు ఆదాయ ధ్రువీకరణ పత్రాలు దాఖలుచేయటం వంటి మార్గాల్లో అనర్హులు సివిల్ సర్వీసులకు ఎంపికవు తున్నారన్న ఆరోపణలు అధికం. ఫలితాల ప్రకటనలో ఎడతెగని జాప్యం సరేసరి. అయితే వీటికిసంతృప్తికరమైన సంజాయిషీలు రాలేదు. పరీక్ష నిర్వహణ మాటెలావున్నా ధ్రువీకరణ పత్రాల తనిఖీకి ఆ సంస్థ పకడ్బందీ విధానాలు పాటించడం లేదన్న విమర్శలున్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో క్రమంలో పొరపాట్లు చోటుచేసుకునే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. వెనువెంటనే ఆరా తీసి సరిదిద్దుకుంటే అవి పునరావృతమయ్యే అవకాశాలు ఉండవు. విమర్శలు, ఆరోపణలు వచ్చిన ప్రతిసారీ తక్షణం స్పందించే లక్షణం ఉండాలంటే జవాబుదారీతనం, పారదర్శకత తప్పని సరి. అవి లోపించాయన్నదే యూపీఎస్సీపై ప్రధాన ఫిర్యాదు. ఒకపక్క అభ్యర్థులకు నైతిక విలువల గురించి ప్రశ్నపత్రం ఇస్తూ అలాంటి విలువలు సంస్థలో కిందినుంచి పైవరకూ ఉండటంపై ప్రత్యేక శ్రద్ధ అవసరమని గుర్తించకపోతే అంతిమంగా న ష్టం కలిగేది సంస్థకే. పూజ గురించిన వివాదాలు సామాజిక మాధ్యమాల్లో బయటికొచ్చాక ఇప్పటికే సర్వీసులో చేరిన కొందరిపై ఆరోపణలు వెల్లు వెత్తాయి. కాళ్లకు సంబంధించి అంగ వైకల్యం ఉన్నట్టు చూపి ఉద్యోగం పొందారంటూ ఒక అధికారి వీడియో బయటికొచ్చింది. అందులో ఆయన నిక్షేపంగా ఉండటమేగాక సైక్లింగ్, రన్నింగ్ చేస్తున్నట్టు కనబడుతోంది. ఆయన నిజంగానే అలాంటి తప్పుడు పత్రంతో చేరారా లేక ఆ అధికారిపై బురద జల్లారా అనేది తెలియదు. తక్షణం స్పందించే విధానం రూపొందించుకుంటే తప్పుడు ఆరోపణలు చేసినవారిపై చర్య తీసుకునే వీలుంటుంది. లేదా సంబంధిత అధికారినుంచి సంజాయిషీ కోరే అవ కాశం ఉంటుంది. రెండూ లేకపోతే ఎవరికి తోచినవిధంగా వారు అనుకునే పరిస్థితి ఏర్పడుతుంది. యూపీఎస్సీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న మనోజ్ సోనీ రాజీనామా ఉదంతంలో కూడా సక్రమంగా వ్యవహరించలేదు. నిరుడు మే 16న చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన సోనీ అయిదేళ్ల కాల వ్యవధికి చాలా చాలా ముందే ఎందుకు తప్పుకున్నారు? చూసేవారికి స్పష్టంగా పూజ ఎంపిక వ్యవహారం తక్షణ కారణంగా కనబడుతుంది. కానీ ఆ సంస్థ అదేం కాదంటోంది. ‘వ్యక్తిగత కార ణాలే’ అని సంజాయిషీ ఇస్తోంది. అటు కేంద్రం సైతం ఏమీ మాట్లాడదు. దీనివల్ల ప్రజల్లో అనుమా నాలు తలెత్తితే... మొత్తంగా అది సంస్థ ప్రతిష్ఠను దెబ్బతీయదా? అభ్యర్థులు తాము బాగా రాసినా అక్కడేదో జరిగిందన్న అపోహలుపడే పరిస్థితి తలెత్తదా? అసలు ఇలాంటివి జరుగుతున్నాయన్న నమ్మకాలు బలపడితే అభ్యర్థులు ఆత్మవిశ్వాసంతో పరీక్షలకూ, ఆ తర్వాత ఇంటర్వ్యూలకూ హాజరు కాగలరా? నూతన సారథి ఈ అంశాలపై ఆలోచన చేయాలి. పూజ ఉదంతంలో కోల్పోయిన విశ్వసనీయతను పెంపొందించుకోవటానికి ఏమేం చర్యలు అవసరమన ్న పరిశీలన చేయాలి. అభ్యర్థుల మదింపు విషయంలో అనుసరించే విధానాల గురించి... ముఖ్యంగా వారి జవాబుపత్రాల దిద్దుబాటుకూ, ఆ తర్వాత జరిగే ఇంటర్వ్యూలో అభ్యర్థులిచ్చే జవాబుల ద్వారా వారి శక్తియుక్తు లనూ, సామర్థ్యాన్ని నిర్ధారించే పద్ధతులకూ ఎలాంటి ప్రమాణాలు పాటిస్తారో తెలపాలి. చదువుల్లో, సమస్యలను విశ్లేషించే సామర్థ్యంలో మెరికల్లా ఉండటం, సమాజంలో అపరిష్కృతంగా మిగిలిపోతున్న అంశాల విషయంలో ఏదో ఒకటి చేయాలన్న తపన, తాపత్రయంఉండటం, నాయకత్వ లక్షణాలు ప్రదర్శించటం సివిల్ సర్వీసుల అభ్యర్థులకు అవసరమని చాలా మంది చెబుతారు. నిజానికి ఈ సర్వీసుల్లో పనిచేసేవారి జీతభత్యాలకు అనేక రెట్లు అధికంగా సాఫ్ట్వేర్ రంగంలో లేదా వ్యాపారాల్లో మునిగితేలేవారు సంపాదిస్తారు. అందుకే ఎంతో అంకిత భావం ఉండేవారు మాత్రమే ఇటువైపు వస్తారు. కానీ అలాంటివారికి యూపీఎస్సీ ధోరణి నిరాశ కలిగించదా? నీతిగా, నిజాయితీగా పాలించటం చేతకాని పాలకుల ఏలుబడిలో పనిచేయాల్సి వచ్చి నప్పుడు సర్వీసులో కొత్తగా చేరిన యువ అధికారులు ఎంతో నిరాశా నిస్పృహలకు లోనవుతున్నారు. అసలు యూపీఎస్సీయే నిర్లక్ష్యం లోనికో, నిర్లిప్తత లోనికో జారుకుంటే ఎవరిని నిందించాలి? పూజా ఖేడ్కర్‌కు సంబంధించి ఇంకా దోష నిర్ధారణ జరగలేదు. ప్రస్తుతం ఆమె కేవలం నిందితురాలు మాత్రమే. పునః శిక్షణకు రావాలన్న సూచనను బేఖాతరు చేయటంతో ఇప్పటికే యూపీఎస్సీ ఆమె ఎంపికను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. మరోపక్క పోలీసులూ, యూపీఎస్సీ నియమించిన కమిటీ ఆమె సమర్పించిన ధ్రువీకరణ పత్రాలపై ఆరా తీస్తున్నారు. ఆమె ముందస్తు బెయిల్ దరఖాస్తును న్యాయస్థానం తిరస్కరించింది. ఈ పరిణామంతో ఆమె దుబాయ్‌కి పరారీ అయ్యారన్న కథనాలు కూడా మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఈ ఉదంతంలోనైనా జరిగిందేమిటో వివరిస్తే, ఇది పునరావృతం కాకుండా తీసుకున్న చర్యలేమిటో చెబితే యూపీఎస్సీపై విశ్వసనీయత పెరుగుతుంది. దాని ప్రతిష్ఠ నిలబడుతుంది. -
విస్తరిస్తున్న యుద్ధమేఘాలు
ఇజ్రాయెల్ – హమాస్‌ల మధ్య యుద్ధం ఆగి, గాజా ప్రాంతంలో శాంతి నెలకొంటుందని నిన్నటి దాకా ఉన్న కొద్దిపాటి ఆశ ఇప్పుడు ఆవిరైపోయినట్టు అనిపిస్తోంది. హమాస్ సీనియర్ నేత ఇస్మాయిల్ హనియేను ఇరాన్ రాజధాని టెహరాన్‌లో బుధవారం గుట్టుచప్పుడు కాకుండా చంపిన తీరు ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. హనియేను చంపింది తామేనని ఇజ్రాయెల్ ప్రకటించలేదు కానీ, ఆయన చనిపోవాలని ఇజ్రాయెలీల కన్నా ఎక్కువగా మరెవరూ కోరుకోరన్నది నిజం. మరోపక్క ఆ హత్యకు కొద్ది గంటల ముందే మంగళవారం లెబనాన్ రాజధాని బీరుట్లో ఇరాన్‌కు మిత్రపక్షమైన హెజ్బొల్లా తీవ్రవాద గ్రూపు సీనియర్ మిలటరీ కమాండర్ ఫాద్ షుక్ర్ ప్రాణాలు గాలిలో కలిశాయి. గత వారం (ఆక్రమిత) గోలన్ హైట్స్‌లో రాకెట్ దాడితో 12 మంది పిల్లల్ని పొట్టనబెట్టుకున్న ఆయనను మాత్రం అడ్డు తొలగించినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. అలా ఆ దేశ శత్రువులకు రెండు రోజుల్లో రెండు ఎదురుదెబ్బలు తగిలాయి. ఇజ్రాయెల్ ఒప్పుదల మాటెలా ఉన్నా... ఇరాన్ నూతన అధ్యక్షుడి పదవీ స్వీకారోత్సవానికి హనియే వచ్చివుండగా జరిగిన ఈ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ అధినాయకుడు అయతొల్లా ఖొమేనీ గర్జించారు. ప్రతిగా ఎవరు రెచ్చగొట్టే చర్యలకు దిగినా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ హెచ్చరించారు. వెరసి, వ్యవహారం ఇజ్రాయెల్ – ఇరాన్‌ల మధ్య నేరు ఘర్షణకు దారి తీస్తోంది. మొత్తం గాజా కథ మరో ప్రమాదకరమైన మలుపు తిరిగింది.అసలే సంక్లిష్టంగా ఉన్న పశ్చిమాసియా సంక్షోభం కాస్తా హనియే హత్యోదంతంతో మరింత సంక్లిష్టంగా మారింది. ఇజ్రాయెల్ – హమాస్ యుద్ధానికి పరిష్కారం కనుగొనాలని చేస్తున్న శాంతి ప్రయత్నాలకు తాజా ఘటన విఘాతం కల్పించింది. ఇరుపక్షాల మధ్య రాజీ కుదర్చడానికి చర్చలు జరుగుతున్నప్పుడు... ఒక పక్షం వాళ్ళు మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న వ్యక్తినే చంపేస్తే ఇక మధ్యవర్తి త్వం ఏం సఫలమవుతుంది? రాజీ కుదర్చడానికి ప్రయత్నిస్తున్న ఖతార్ పక్షాన ఆ దేశ ప్రధాని సరిగ్గా ఆ మాటే అన్నారు. ఆ మాటలు పరిస్థితికి అద్దం పడుతున్నాయి. హనియేపై యుద్ధ నేరాలున్న మాట, అతనిపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్ ఇటీవలే వారెంట్ జారీ చేసిన మాట నిజమే. కానీ, హమాస్ గ్రూపులో మిలటరీ నేత యాహ్యా సిన్వర్ సహా ఇతర పిడివాదులతో పోలిస్తే రాజీ చర్చల విషయంలో రాజకీయ విభాగ నేత హనియే కొంతవరకు ఆచరణవాది అంటారు. ఇప్పుడు ఆయనే హత్యకు గురయ్యాడు గనక కథ మొదటికి వచ్చింది. కాల్పుల విరమణ, బందీల విడుదల ఒప్పందం కుదిరినంత మాత్రాన ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు చల్లబడతాయని గ్యారెంటీ లేదు కానీ, అసలు ఒప్పందమే లేకపోతే ఉద్రిక్తతలు తగ్గే అవకాశమే లేదు. మొత్తంగా ఈ ఘటన ఆ ప్రాంత సుస్థిరతనే దెబ్బ తీస్తూ, గాజా యుద్ధాన్ని చివరకు పెను ప్రాంతీయ ఘర్షణ స్థాయికి తీసుకెళుతోంది. అతిథిగా వచ్చిన మిత్రపక్షీయుణ్ణి భద్రత ఎక్కువగా ఉండే సమయంలోనే సొంతగడ్డపై, స్వకీయ గూఢచర్య వైఫల్యంతో పోగొట్టుకోవడం ఇరాన్‌కు తీరని తలవంపులే. ఖొమేనీ గర్జించినట్టు ఇరాన్ దీనికి బదులు తీర్చుకోవచ్చు. అదే జరిగితే ఇజ్రాయెల్ ప్రతిచర్యా తప్పదు. నిజానికి, ఆ మధ్య ఏప్రి ల్లో డెమాస్కస్‌లోని ఇరాన్ ఎంబసీలో తమ జనరల్స్ ఇద్దరిని హత్య చేసినప్పుడు ఇరాన్ తొలి సారిగా నేరుగా ఇజ్రాయెల్‌పై సైనిక దాడి జరిపింది. వందలాది క్షిపణులు ప్రయోగించింది. అదృష్టవశాత్తూ అప్పట్లో అది పూర్తిస్థాయి ప్రాంతీయ యుద్ధంగా పరిణమించలేదు. ప్రతిసారీ అలా ఆగుతుందనుకోలేం.తాజా ఘటనలతో యెమెన్ నుంచి హౌతీలు ఎర్రసముద్రంలో దాడులు ఇబ్బడి ముబ్బడి చేస్తారు. హెజ్బొల్లా సైతం ఇజ్రాయెల్‌ను చూస్తూ ఊరుకోదు. అసలు నిరుడు అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ గ్రూపు చేసిన దుర్మార్గమైన దాడి ఇక్కడికి తెచ్చింది. అప్పటి నుంచి మధ్యప్రాచ్యంలో పూర్తిస్థాయి యుద్ధం తప్పదనే భయాందోళనలు చెలరేగుతూనే ఉన్నాయి. చిత్రం ఏమిటంటే, ఏ పక్షమూ ఆ రకమైన యుద్ధం కోరుకోవడం లేదు కానీ, తమ చర్యలతో ఎప్పటి కప్పుడు కయ్యానికి కాలుదువ్వుతూనే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో మధ్యప్రాచ్యంలో ప్రాంతీయ యుద్ధం తీవ్రతరమయ్యే ముప్పు తప్పాలంటే ముందు గాజాలో కాల్పుల విరమణ జరగాలి.అయితే, వరస చూస్తుంటే హమాస్‌పై పూర్తి విజయమే లక్ష్యమన్న నెతన్యాహూ మాటలనే ఇజ్రాయెల్ ఆచరిస్తోందని అనిపిస్తోంది. పది నెలలుగా సాగుతున్న యుద్ధంలో ఒక్క గాజాలోనే ఇప్పటికి 40 వేల మంది చనిపోయారు. ఇలాగే ముందుకు సాగితే యుద్ధం ఇతర ప్రాంతాలకూ విస్తరించి, మరింత ప్రాణనష్టం తప్పదు. మానవీయ సంక్షోభమూ ఆగదు. హనియే హత్యతో హమాస్ తల లేని మొండెమైంది. పగ తీర్చుకోవాలన్న ఇజ్రాయెల్ పంతం నెరవేరింది. ఇకనైనా ఆ దేశం ప్రతీకార మార్గం వీడి, రాజీ బాటను అనుసరించాలి. శాంతికి కట్టుబడ్డ మన దేశానికి సైతం ఆ ప్రాంతంలో యుద్ధంతో భారీ నష్టమే. అక్కడ 89 లక్షల మంది మన వలస కార్మికులున్నారు. పైగా, శాంతి, సుస్థిరత లేకుంటే నిరుడు ఢిల్లీ జీ–20 సదస్సులో ప్రకటించిన ‘ఇండియా– మిడిల్ ఈస్ట్ – యూరప్ ఎకనామిక్ కారిడార్’ (ఐఎంఈసీ) లాంటివి పట్టాలెక్కవు. ఇజ్రాయెల్, పాలెస్తీనాలు రెంటికీ మిత్రదేశంగా ఇరుపక్షాలనూ తిరిగి రాజీ చర్చలకు కూర్చోబెట్టేందుకు ప్రయత్నించాలి. అధ్యక్ష ఎన్నికలతో తీరిక లేని అమెరికా సహా ఇతర దేశాలన్నీ ఒత్తిడి తెచ్చి అయినా సరే రెండువైపులవారినీ అందుకు ఒప్పించాలి. పశ్చిమాసియాలో శాంతి పునరుద్ధరణకు చిత్తశుద్ధితో నడుం బిగించాలి. ఎందుకంటే, ఏ యుద్ధంలోనూ విజేతలుండరు. ప్రతిసారీ ప్రజలు పరాజితులుగానే మిగులుతారు. -
ప్రకృతి శాపమా? మన పాపమా?
దేవతల రాజ్యంగా పేరుబడ్డ కేరళలోని సుందరమైన వయనాడ్ ప్రకృతి ఆగ్రహానికి గురై శ్మశాన స్థలిగా మారిన దృశ్యాలు చూస్తుంటే ఎవరికైనా భావోద్వేగం కలగకమానదు. జూలై 29 సోమవారం అర్ధరాత్రి దాటాక రెండు గంటల ప్రాంతంలో అందరూ ఆదమరిచి నిద్రిస్తున్న వేళ భారీ వాన, ఉరుము లేని పిడుగులా వరుసగా భారీయెత్తున కొండచరియలు విరిగి మీద పడడంతో కేరళ ఉత్తర ప్రాంతంలోని ఆ జిల్లా చిగురుటాకులా వణికిపోయింది. కళ్ళుపొడుచుకున్నా కనిపించని చీకటిలో, ఏం జరుగుతోందో తెలిసే లోపల ఇళ్ళు కూలిపోయాయి. నిలువెత్తు బురదలో మునిగి, గ్రామాలు తుడిచి పెట్టుకుపోయాయి. ఘటనాస్థలి నుంచి కొన్ని పదుల కిలోమీటర్ల వరకు మనుషులు కొట్టుకు పోయి, ఛిద్రమైన దేహాలతో శవాలై తేలారు. మృతుల సంఖ్య 150 దాటి అంతకంతకూ పెరుగు తున్న వేళ ఇటీవల కొన్నేళ్ళుగా కేరళలో ఆకస్మిక వరదలు, భూపతనాలు పెరిగిపోవడం పట్ల చర్చ మొదలైంది. ఈ విలయంలో ప్రకృతి శాపమెంత? పాలకుల పాపమెంత? గమనిస్తే... గత ఏడేళ్ళలో దేశంలో అత్యధికంగా కొండచరియలు విరిగిపడింది కేరళలోనే! 2015 నుంచి 2022 మధ్య దేశవ్యాప్తంగా 3,782 ఘటనలు జరిగితే, వాటిలో 59.2 శాతం ఘటనలు ఒక్క మలయాళ సీమలోనే సంభవించాయి. 1961 – 2016 మధ్యతో పోలిస్తే, ఇప్పుడు ఏటా ఇలాంటి దుర్ఘటనలు, ప్రాణనష్టం అనూహ్యంగా పెరగడానికి అనేక కారణాలున్నాయి. ప్రకృతితో పాటు మనం కూడా దీనికి కారణమేనని నిపుణులు, శాస్త్రవేత్తలు తేల్చారు. ప్రపంచవ్యాప్తంగా వాతావర ణంలో వస్తున్న మార్పులూ దానికి వచ్చి చేరాయి. వాతావరణ మార్పుల వల్ల కేరళపై కమ్ముకుంటున్న క్యుములోనింబస్ మేఘాలు హఠాత్తుగా భారీ వర్షాలు కురిపిస్తున్నాయి. అసలు కేరళలో దాదాపు సగం... భౌగోళికంగా 20 డిగ్రీలకు మించిన ఏటవాలు భూముల ప్రాంతం. అందువల్ల నేలకోత, కొండచరియలు విరిగిపడడం ఎక్కువే! దానికి తోడు కొండరాళ్ళను పట్టి ఉంచే మట్టి వదు లుగా మారి, ముప్పు పెరుగుతోంది. వాలుభూముల్లో భారీగా వానలు వస్తే, పై మట్టి బాగా వదు లైపోయి, కొండచరియలు పతనమై ప్రాణాంతకమవుతాయి. వయనాడ్‌లో ఇప్పుడు జరిగింది అదే!వయనాడ్ జిల్లాలో చిన్న పట్నమైన ముండక్కాయ్ లాంటి వాటి పరిస్థితి మరీ ఘోరం. కొండ చరియలు విరిగిపడిన ఘటనల నుంచి గత నాలుగు దశాబ్దాల్లో రెండుసార్లు (1984లో, 2019లో) ప్రాణనష్టం, ఆస్తినష్టంతో బయటపడ్డ ఆ పట్నం తాజా విలయంలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. దాన్ని బట్టి తాజా విలయం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. 400 మందికి పైగా మరణానికి కారణమైన 2018 నాటి కేరళ వరదల తర్వాత అత్యంత దురదృష్టకరమైన విపత్తు ఇది. నిజానికి, తుపానులు, అధిక వర్షపాతం, భూకంపం లాంటి ప్రకృతి విపత్తులకు సంబంధించి ప్రమాద హెచ్చరిక వ్యవస్థలు ఎవరికైనా కీలకం. అనేక ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలోఅందుకు అత్యాధునిక వ్యవస్థలు ఉన్నాయని కేంద్ర సర్కారు చెబుతోంది. అంతెందుకు... అధిక వర్ష పాతం గురించి కేరళను అప్రమత్తం చేస్తూ, వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడడానికి వారం రోజుల ముందే జూలై 23న ముందస్తు హెచ్చరిక చేశామంటోంది. కేరళ సర్కార్ మాత్రం ప్రమాద స్థాయి తక్కువైన ఆరెంజ్ ఎలర్ట్ మాత్రమే తమకు అందిందని అంటోంది.రాజకీయాలు, పరస్పర నిందారోపణలు పక్కనపెడితే... కేరళ సహా పడమటి కనుమలు వ్యాపించిన ప్రాంతమంతటా ఇలాంటి ప్రమాదాలు పొంచివున్నాయని కొన్నేళ్ళుగా నిపుణులు గగ్గోలు పెడుతున్నారు. 2011లోనే కేంద్రం పడమటి కనుమల పరిరక్షణకై పర్యావరణవేత్త మాధవ్ గాడ్గిల్ సారథ్యంలో నిపుణుల కమిటీ వేసింది. అరుదైన జీవజాలానికి ఆవాసమైన దట్టమైన అరణ్యా లున్నందు వల్ల గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, గోవా, కేరళలకు విస్తరించిన పడమటి కనుమల్లో 75 శాతం మేర ప్రాంతాన్ని పర్యావరణరీత్యా సున్నితమైనదిగా ప్రకటించాలని కమిటీ సిఫార్సు చేసింది. గాడ్గిల్ కమిటీ నివేదిక ఇచ్చి 13 ఏళ్ళవుతున్నా కేరళ సహా ప్రభుత్వాలేవీ ఆ సిఫార్సుల్ని పాటించలేదు. అదేమంటే, సిఫార్సులు కఠినంగా ఉన్నాయనీ, అభివృద్ధికీ, జీవనోపాధికీ నష్టం చేస్తాయనీ సాకులు చెబుతున్నాయి. పైగా, అభివృద్ధి రేసులో పడి కొండల్ని తొలిచి, భారీ నిర్మాణాలకు దిగాయి. జలవిద్యుత్ కేంద్రాలు చేపట్టాయి. కేరళలో హోటళ్ళు, టూరిస్ట్ రిసార్ట్లు, అక్రమ తవ్వకాలకైతేఅంతే లేదు. సున్నిత పర్యావరణ ప్రాంతాల్లోని ఈ తప్పుడు అభివృద్ధి నమూనాను ఇకనైనా మార్చు కోకపోతే కష్టం. కేరళ, తమిళనాడు, కర్ణాటక – మూడు రాష్ట్రాలకూ కూడలిలో వయనాడ్ అందమైన పర్యాటక ప్రాంతమన్నది నిజమే. దేశదేశాల నుంచి వచ్చే పర్యాటకులకు అనువుగా వసతులు పెంచి, పర్యా టక ఆర్థిక వ్యవస్థను పెంపొందించాలన్న ఆకాంక్షా సహజమే. కానీ, పర్యావరణ రీత్యా అత్యంత సున్నితమైన ప్రాంతంలో ఇష్టారీతిన నిర్మాణాలు చేపట్టి, యథేచ్ఛగా ప్రకృతి విధ్వంసం సాగిస్తే అది మొదటికే మోసమన్న ఇంగితం లేకుంటే ఎలా? ప్రకృతితో సహజీవనం మరిచి, ఇటు చట్టబద్ధంగానూ, అటు చట్టవిరుద్ధంగానూ గనుల తవ్వకాలను అనుమతిస్తే అన్ని రకాలుగా విలయమే తప్ప వికాసం జరుగుతుందా? మనుషుల భద్రత కన్నా మాయదారి వ్యాపారం ఎక్కువా? అందుకే, ఒక్క మాటలో వయనాడ్ విలయం కేవలం ప్రకృతి సృష్టించినది కాదు. మనుషుల దురాశకు ఫలితం. అభి వృద్ధి పేరిట మనం సాగిస్తున్న ప్రకృతి వినాశనం తాలూకు విపరిణామం. మనిషి తన పరిధి, పరి మితి గుర్తెరిగి ప్రవర్తించకపోతే, మనుగడకే ముప్పని చెప్పే నిష్ఠురసత్యం. బాధ్యులమైన అందరం ఇకనైనా కళ్ళు తెరవాలి. ప్రకృతి పునరుజ్జీవనానికి ఆగి ఆలోచించాలి. వయనాడ్ నేర్పే పాఠం అదే! -
కోచింగ్ కోళ్ళఫారాలు
వ్యవస్థల్ని నడిపే వ్యక్తులు చేయాల్సిన పని చేయకపోతే... విషాదం ఎలా ఉంటుందో చెప్పడానికి శనివారం సాయంత్రం ఢిల్లీలోని ఓ ప్రసిద్ధ ఐఏఎస్ కోచింగ్ సెంటర్లో జరిగిన ఘటనే ఉదాహరణ. నిబంధనలకు విరుద్ధంగా ఎనిమిది అడుగుల లోతు బేస్మెంట్లో నడుపుతున్న స్టడీ సెంటర్లోకి పైపులు పగిలి నీళ్ళు వెల్లువెత్తినప్పుడు, జలదిగ్బంధంలో ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు పోగొట్టు కున్న తీరు కన్నీరు తెప్పిస్తుంది. పూర్తిస్థాయి ఈ మానవ తప్పిదానికి ముగ్గురు చనిపోయారని అధికారికంగా చెబుతున్నా, సంఖ్య అంతకన్నా ఎక్కువే ఉంటుందట. పది పన్నెండు మంది కనిపించట్లేదట. కొద్దిరోజుల క్రితం పొంగిపొర్లిన వర్షపునీటి వీధిలో విద్యుదాఘాతంతో ఒక ఐఏఎస్ కోచింగ్ విద్యార్థి మరణించినప్పుడే వ్యవస్థ మేల్కొని ఉండాల్సింది. దురదృష్టవశాత్తూ అది జరగలేదు. ఇప్పుడీ తాజా ఘటనతో దేశమంతా ఉలిక్కిపడింది. గమనిస్తే, క్రిక్కిరిసిన అభ్యర్థులతో కోళ్ళఫారాలుగా మారిన కోచింగ్ సెంటర్లు, కిందికి వేలాడుతున్న కరెంట్ తీగలు, వర్షం పడితే చాలు వీధుల్లో కాలువలు కట్టే నీళ్ళు, అధ్వాన్నమైన డ్రైనేజ్ వ్యవస్థ, అవినీతికి పాల్పడి అన్నిటినీ వదిలేసిన అధికార యంత్రాంగం... అలా ఇది సామూహిక వైఫల్యం. సమష్టిగా అందరూ చేసిన పాపం. ఒకరిద్దరు అధికారుల సస్పెన్షన్, యజమానుల లాంటి పెద్ద చేపల్ని వదిలేసి చిరుద్యోగుల అరెస్ట్, ఘటనకు దారి తీసిన కారణాలు – నివారణ చర్యలపై నివేదికకు కేంద్ర హోమ్‌శాఖ ప్రత్యేక ప్యానెల్ ఏర్పాటు లాంటివి చకచకా జరిగాయి. కానీ, పోయిన ఆ ప్రతిభావంతుల ప్రాణాలు తిరిగొస్తాయా? వారిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లితండ్రుల గర్భశోకం తీరుస్తాయా? శనివారం నుంచి విద్యార్థులు బైఠాయించి, శాంతియుత నిరసన తెలియజేస్తుంటే ప్రభుత్వాలు వారికి తగిన హామీనిచ్చి సాంత్వన పరచలేకపోవడం మరో వైఫల్యం.ఢిల్లీలో వేర్వేరు ప్రాంతాలకు విస్తరిస్తున్న ఈ విద్యార్థి నిరసనల వద్ద ప్రచారం కోసం కాసేపు కనిపించిపోతున్న టీచర్లు, పరస్పర నేరారోపణలు చేసుకుంటున్న రాజకీయ నేతలను చూస్తుంటే వెగటు పుట్టక మానదు. ప్రజలెన్నుకున్న ఢిల్లీ ‘ఆప్’ సర్కార్‌పై కేంద్రం పనుపున లెఫ్టినెంట్ గవర్నర్, ఆయన తైనాతీ అధికారుల పెత్తనం ఒక తప్పయితే... క్షేత్రస్థాయిలో లేకున్నా జైలు నుంచే రోజువారీ పాలన సాగిస్తానంటున్న ఢిల్లీ సీఎం మొండి వైఖరి మరో తప్పు. శిక్ష, నష్టం మాత్రం ఢిల్లీలో ప్రజలకు, పరిపాలనకు పడుతోంది.ఢిల్లీలో పుట్టగొడుగుల్లా వెలిసిన కోచింగ్ కేంద్రాల్లో ప్రమాదాలు జరగడం ఇదేమీ తొలిసారి కాదు. ఏడాది క్రితం కూడా ఢిల్లీ ఉత్తర ప్రాంతంలోని ఓ కేంద్రంలో అగ్నిప్రమాదం సంభవించింది. 61 మంది విద్యార్థులు గాయపడ్డారు. అప్పుడూ ఇలాగే జనాగ్రహం పెల్లుబికింది. సదరు కేంద్రం పర్మిట్ లేకుండా అక్రమంగా నడుస్తున్నట్టు అప్పట్లో అగ్నిమాపక శాఖ ప్రకటించింది. ఢిల్లీలో 600 దాకా కోచింగ్ సెంటర్లుంటే, వాటిలో 67కే అనుమతులున్నాయట. కఠిన చర్యలు తీసుకుంటామంటూ పాలకులు అప్పుడూ చెప్పారు, ఇప్పుడూ చెబుతున్నారు. కానీ, చేసింది శూన్యం. నిజానికి, 2021 నాటి ఢిల్లీ మాస్టర్ ప్లాన్, అలాగే 2016 నాటి యూనిఫైడ్ బిల్డింగ్ బైలాస్ భవనాల సెల్లార్ల వినియోగంపై స్పష్టమైన నిబంధనలు విధించాయి. అయినా సరే బేస్మెంట్లలో కోచింగ్ కేంద్రాలు, వాటి లైబ్రరీలు, జిమ్‌లు, షాపులు నడుస్తూనే ఉన్నాయి. హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా అనేక ప్రధాన నగరాల్లో, పట్టణాల్లో ఇలాంటి పొంచివున్న ప్రమాదాలు అనేకం. ఏ క్షణమైనా ఏదైనా జరగవచ్చని తెలిసినా, ఈ ఉల్లంఘనలపై అన్నిచోట్లా పాలకులది ఓ గుడ్డిదర్బారే! వాహనాల పార్కింగ్, స్టోర్ రూమ్ కోసం ఉద్దేశించిన సెల్లార్లను ఇలా చట్టవ్యతిరేకంగా స్టడీ సెంటర్లుగా వాడుతూ, వందల విద్యార్థుల్ని కూర్చోబెడుతున్న వైనం పట్ల చాలాకాలంగా ఫిర్యాదులు వస్తున్నాయి. నెల క్రితం కూడా సాక్షాత్తూ ఓ విద్యార్థే ఈ సెల్లార్ల నియమోల్లంఘనపై ఢిల్లీ నగరపాలక సంస్థకు ఫిర్యాదు చేశారు. ‘‘పెను ప్రమాదం సంభవించవచ్చు’’ అని భవిష్యద్వాణిలా హెచ్చరించారు. అయినా పట్టించుకున్న నాథుడు లేడు. తక్కువ వసతులు, కనీస ఖర్చుతో ఎక్కువ సంపాదించాలన్న కోచింగ్ సెంటర్ల అత్యాశ తెలియనిది కాదు. సక్సెస్ రేటు, సెలక్టయిన వారి సంఖ్య లాంటి వివరాలు ప్రకటనల్లో ఇవ్వరాదని నిబంధనలున్నా, వాటినవి గాలికొదిలేస్తున్న వైనమూ నిత్యం చూస్తున్నదే. తప్పుడు గొప్పలు చెప్పుకొని ఆకర్షించే జిమ్మిక్కులూ తెలిసినవే. వందలాది విద్యార్థుల్ని ఒకే గదిలో కుక్కుతున్న వీటికి అడ్డూ ఆపూ లేదు. నియంత్రిత ఆర్థిక వ్యవస్థకు భిన్నమైన ఈ విద్యావ్యాపారపు మార్కెట్ ఎకానమీని అడ్డుకోలేకున్నా అమాయకుల ధన, ప్రాణాలకు నష్టం వాటిల్లకుండా నిబంధనలతో అదుపు చేయడం పాలకులు తలుచుకుంటే కష్టం కాదు. ఆ చిత్తశుద్ధి లేకనే సమస్య! తాజా ఘటన పార్లమెంట్లో చర్చ దాకా వెళ్ళడంతో నగరపాలక సంస్థ హడావిడిగా డజనుకు పైగా చట్టవిరుద్ధ కోచింగ్ సెంటర్లకు సీలు వేసింది. మరో అరడజను పేరున్న సంస్థల బేస్మెంట్లకు తాళాలు బిగించింది. స్థలాలను ఆక్రమించి, వరద నీటి కాల్వలపై అక్రమంగా కట్టిన నిర్మాణాలపై బుల్డోజర్ల ప్రయోగం మొదలుపెట్టింది. నిజానికిది నిరంతరం సాగాల్సిన ప్రక్రియ. మూడు విలువైన ప్రాణాలు పోయాక నడుం కట్టడమే విషాదం. కోచింగ్, దాని అనుబంధ వ్యాపారం కోట్లలో సాగుతూ, వేలాది విద్యార్థుల భవిష్యత్తు ముడిపడి ఉన్నా, కనీస రక్షణ, వసతులు ప్రభుత్వపరంగా కల్పించలేకపోవడం పాలకుల హ్రస్వదృష్టికి తార్కాణం. పైగా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణ మంత్రాన్ని నిత్యం పఠిస్తూ, వికసిత భారత గాథను లిఖించాలని చూస్తున్న పాలకులకిది శోభనివ్వదు. సరైన పట్టణ ప్రణాళిక లేకుండా కాంక్రీట్ కీకారణ్యాల్ని ప్రోత్సహిస్తే ప్రయోజనమూ లేదు. ఢిల్లీ ఘటనలు పునరావృతం కాకముందే కేంద్రం, రాష్ట్రాలు నిద్ర లేవాలి. -
అపనమ్మకంతో అభివృద్ధి ఎలా?
వికసిత భారత్ లక్ష్యమనీ, అందుకు వికసిత రాష్ట్రాలు కీలకమనీ కేంద్రం మాట. అందుకు అవరోధంగా రాజకీయంగా వివక్ష కొనసాగుతోందని రాష్ట్రాల ఆరోపణ. అందుకే, రాష్ట్రాల అభివృద్ధి, నిధుల కేటాయింపునకు కీలకమైన నీతి ఆయోగ్ సమావేశంలో బహిష్కరణల పర్వం కొనసాగడం ఆశ్చర్యం అనిపించదు. ప్రధాని మోదీ అధ్యక్షతన శనివారం సాగిన నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ 9వ భేటీకి ఒకటీ రెండు కాదు... ఏకంగా పది ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల ప్రతినిధులు గైర్హాజరయ్యారు. గత వారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన 2024–25 కేంద్ర బడ్జెట్లో తమ రాష్ట్రాల్లో ప్రాజెక్ట్‌లకు తగినన్ని నిధులు కేటాయించలేదంటూ తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల సీఎంలు భేటీని బహిష్కరిస్తే, పశ్చిమ బెంగాల్ పక్షాన హాజరైన ఏకైక ప్రతిపక్ష పాలిత సీఎం మమతా బెనర్జీ సైతం మాట్లాడనివ్వకుండా మైకు ఆపేశారంటూ సమావేశం నుంచి వాకౌట్ చేశారు. అనుకున్నట్టే ఆ భేటీ కేంద్రం, రాష్ట్రాల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. నీతి ఆయోగ్ ప్రాథమిక లక్ష్యాలు, పనితీరు పైన చర్చకు పురిగొల్పింది. కేంద్ర, రాష్ట్రాలు పరస్పర నిందారోపణలు మాని, నిజమైన సమాఖ్య స్ఫూర్తిని పాటించాల్సిన అవసరాన్ని గుర్తుచేసింది. ఈ నీతి ఆయోగ్ వ్యవస్థ ఎన్డీఏ తెచ్చిపెట్టినదే. తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడు 2014లో కేంద్ర ప్రణాళికా సంఘం స్థానంలో దీన్ని ప్రవేశపెట్టారు. అలా 2015 జనవరి నుంచి ఇది అమలులోకి వచ్చింది. ప్రణాళికా సంఘమైతే పైన కేంద్రం నుంచి రాష్ట్రాలకు ఏకపక్షంగా విధాన నిర్ణయాలు బట్వాడా చేస్తుందనీ, దానికి బదులు కింది అందరినీ కలుపుకొనిపోతూ, రాష్ట్రాల ఆలోచనలకు పెద్దపీట వేసేందుకు ఉపకరిస్తుందనే ఉద్దేశంతో నీతి ఆయోగ్‌ను పెట్టారంటారు. కానీ, ఆచరణలో అందుకు విరుద్ధంగా జరుగుతోందన్నది ప్రధాన విమర్శ. వరుసగా మూడోసారి ఎన్డీఏ సర్కారు ఏర్పడిన తర్వాత ఈ జూలై 16న నీతి ఆయోగ్ మేధావి బృందాన్ని ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. ప్రధానమంత్రి మోదీ ఛైర్‌పర్సన్‌గా ఉండే ఈ బృందంలో నలుగురు పూర్తికాలిక సభ్యులతో పాటు, ఎన్డీఏలో భాగస్వాములైన బీజేపీ, దాని మిత్రపక్షాలకు చెందిన 15 మంది కేంద్ర మంత్రుల్ని ఎక్స్–అఫిషియో సభ్యులుగా చేర్చింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోమ్ మంత్రి అమిత్‌షా తదితరులు అందులో సభ్యులే. ఒకప్పటి ప్రణాళికా సంఘంలోనూ లోపాలున్నా... గ్రాంట్ల విషయంలో గతంలో రాష్ట్రాలతోసంప్రతింపులకు వీలుండేది. కానీ, ఇప్పుడు గ్రాంట్లపై ఆర్థికశాఖదే సర్వంసహాధికారం. ప్రణాళికా సంఘం ఉసురు తీసి వచ్చిన నీతి ఆయోగ్ కేవలం సలహా సంఘమైపోయింది. ఎంతసేపటికీ రాష్ట్రాల స్థానాన్ని మదింపు చేయడానికి కీలకమైన సూచికల సృష్టి మీదే దృష్టి పెడుతోంది. రాష్ట్రాలకూ, ఇతర సంస్థలకూ వనరుల పంపిణీ, కేటాయింపులు జరిపే అధికారం లేని వట్టి ఉత్సవ విగ్రహమైంది. వెరసి, కేంద్ర సర్కార్ జేబుసంస్థగా, పాలకుల అభీష్టానికి తలాడించే సవాలక్ష ఏజెన్సీల్లో ఒకటిగా దాన్ని మార్చేశారు. చివరకు ‘సహకార సమాఖ్య’ విధానానికి బాటలు వేస్తుందంటూ తెచ్చిన వ్యవస్థ అనూహ్యంగా ‘పోటాపోటీ సమాఖ్య’ పద్ధతికి దారి తీసింది. చివరకు మేధావి బృందపు పాత్ర ఏమిటన్న దానిపైనా ప్రశ్నలు తలెత్తాయి. వాటికీ సరైన జవాబు లేదు. అపనమ్మకం పెరిగితే వ్యవస్థలో చిక్కులు తప్పవని నీతి ఆయోగ్ భేటీ మరోసారి తేటతెల్లం చేసింది.అభివృద్ధికి సంబంధించిన వైఖరుల్లో పరస్పరం తేడాలున్నా, ప్రధానంగా భౌతిక ప్రాథమిక వసతుల నిర్మాణంపైనే అధికంగా ఖర్చు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ భావనకు సరిపోలేలా రాష్ట్రాలు కృషి చేయాలంటూ నీతి ఆయోగ్ తాజా భేటీలో 20 రాష్ట్రాలు, 6 కేంద్ర పాలిత ప్రాంతాల ప్రతి నిధుల్ని ఉద్దేశించి ప్రధాని నొక్కిచెప్పారు. ఆర్థిక కార్యకలాపాలు చురుకుగా సాగాలంటే ప్రాథమిక వసతుల నిర్మాణం ప్రాధమ్యాంశమని కేంద్రం ఆలోచన. అందుకే, జాతీయ అభివృద్ధి లక్ష్యాల సాధనకు కేంద్రంతో రాష్ట్రాలు చేతులు కలిపి అటు వసతులకూ, ఇటు సంక్షేమానికీ వనరులు అందు కోవాలని ప్రధాని అంటున్నారు. అయితే, రాష్ట్రాల స్థానిక అవసరాలు, ప్రాధాన్యాలు ఎక్కడికక్కడ వేర్వేరు కాబట్టి, చెప్పినంత సులభం కాదది! పైగా, రాష్ట్రాలన్నిటికీ పెద్దపీటనే మాటకు భిన్నంగా ఆచరణలో పాలకపక్షం తమ ప్రభుత్వాలు ఉన్నచోటనే ప్రేమ చూపిస్తోందనే విమర్శ ఉండనే ఉంది.కేంద్ర బడ్జెట్‌ను సైతం అదే సరళిలో రాజకీయమయం చేశారని ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు ఆరోపి స్తున్నాయి. తమిళనాట చెన్నై మెట్రో రైల్, కేరళలో విళింజమ్ పోర్ట్ సహా పలు కీలక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్‌లకు నిధులివ్వలేదని ఎత్తిచూపుతున్నాయి. ఈ అనుమానాలు, ఆరోపణలకు సంతృప్తికరమైన సమాధానాలు కేంద్రం వద్ద లేవు. అదే సమయంలో తాగునీరు, విద్యుచ్ఛక్తి, ఆరోగ్యం, పాఠశాల విద్య తదితర అంశాలే అజెండాగా సాగిన ఓ భేటీని బహిష్కరించడం వల్ల రాష్ట్రాలకూ, ప్రజానీకానికే నష్టం. ఆ సంగతి రాష్ట్రాలు గుర్తించాలి. బహిష్కరణను తప్పుబడుతున్న కేంద్ర పెద్దలు కూడా పరి స్థితి ఇంత దాకా ఎందుకు వచ్చిందో ఆత్మపరిశీలన చేసుకోవాలి. నీతి ఆయోగ్‌ను రద్దు చేసి, మునుపటి ప్రణాళికా సంఘమే మళ్ళీ తేవాలనే వాదన వినిపిస్తున్న వేళ వ్యవస్థాగతంగానూ, పని తీరులోనూ పాతుకున్న లోపాలను తక్షణం సవరించాలి. నిధులను సక్రమంగా, సమానంగా పంచ డంలో కేంద్ర ఆర్థిక మంత్రి, బడ్జెట్లు విఫలమవుతున్న తీరును మాటలతో కొట్టిపారేస్తే సరిపోదు. పెద్దన్నగా అన్ని రాష్ట్రాలనూ కలుపుకొనిపోతేనే వికసిత భారత లక్ష్యం సిద్ధిస్తుంది. పన్నుల రూపంలో భారీగా కేంద్రానికి చేయందిస్తున్న ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలూ ఇదే భారతావనిలో భాగమని గుర్తిస్తేనే అది కుదురుతుంది. అందుకు రాజకీయాలను మించిన విశాల దృష్టి అవసరం. -
లెదరు బ్యాగూ... బ్రీఫు కేసూ...
ప్రభుత్వాలు మొదలుకొని సామాన్యుల వరకూ ఈ రోజున చాలా విరివిగా వాడుతున్న మాట, ‘బడ్జెట్’. వ్యక్తిగత స్థాయిలో గృహస్థు, లేదా గృహిణి ఎప్పటికప్పుడు జమా, ఖర్చులు బేరీజు వేసుకుంటూ ఒడుపుగా సంసారాన్ని నడపడం కూడా బడ్జెట్ కూర్పు లాంటిదే. ప్రభుత్వాల స్థాయిలో అయితే ఏడాది కాలానికి సరిపోయే ఆదాయ, వ్యయాల ప్రణాళికకు పెద్ద ఎత్తున కసరత్తు జరుగుతుంది. అది యావద్దేశ ప్రజల జీవన స్థితిగతులతో ముడిపడి ఉంటుంది కనుక అన్ని వర్గాలవారూ దానికోసం చకోరపక్షులవుతారు. తీరా వచ్చాక ఆశాభంగాలూ ఉంటాయి, ఆశోద్దీపనలూ ఉంటాయి. ఆ విధంగా బడ్జెట్ ఆర్థికాంశాల కూర్పే కాదు; ఆశ నిరాశల కలగలుపు కూడా! కిందటి వారమే కేంద్రం స్థాయిలో మరో బడ్జెట్ సమర్పణ ముగిసింది కానీ, దానిపై చర్చ కొనసాగుతూనే ఉంది. బడ్జెట్ అనే మాట ఎలా పుట్టిందో తెలుసుకోవడమూ ఆసక్తిదాయకమే. లాటిన్లో తోలుసంచీని ‘బుల్గా’ అనేవారు. ఆ మాటే ఫ్రెంచిలో ‘బూజ్’, ‘బగెట్’ అయింది. వాటినుంచే ‘బడ్జెట్’ పుట్టి 15వ శతాబ్ది నుంచి ప్రచారంలోకి వచ్చింది. ఆదాయ, వ్యయాల ముందస్తు ప్రకటన అనే అర్థంలో ఈ మాటను మొదటిసారి 1733లో ఉపయోగించారట. కోశాగార మంత్రి తన ద్రవ్య ప్రణాళికను ఉంచుకునే తోలుసంచీ ‘బడ్జెట్’ అనే మాటను ప్రపంచానికి అందించింది. ఈ రోజున విరివిగా వాడే ‘వాలెట్’, ‘పౌచ్’లు కూడా బడ్జెట్ అనే తోలుసంచీకి లఘురూపాలే. 14వ శతాబ్ది నుంచి వాడుకలో ఉన్న ‘వాలెట్’కు వస్తువులను చుట్టబెట్టేదని అర్థం. ఇది ‘వెల్’ అనే ప్రోటో–ఇండో–యూరోపియన్ మూలం నుంచి వచ్చింది. విశేషమేమిటంటే, సంస్కృతంలో ‘వలతే’, ‘వలయం’ అనే మాటల మూలాలు కూడా ‘వెల్’లోనే ఉన్నాయని భాషావేత్తలు అంటారు. ‘పౌచ్’ అనే మాటే రకరకాల రూపాల మీదుగా ‘ప్యాకెట్’ అయింది. బడ్జెట్ అనబడే తోలుసంచే బడ్జెట్ రోజున నేటి ఆర్థికమంత్రులు చేతుల్లో బ్రీఫ్ కేస్‌గా మారిన సంగతిని ఊహించడం కష్టం కాదు. బడ్జెట్ వివరాల గోప్యతకు సంకేతంగా కూడా దానిని తీసుకోవచ్చు. ఆధునిక కాలంలో మన దేశంలో బడ్జెట్ సంప్రదాయం 1860లో మొదలైందనీ, నాటి బ్రిటిష్ ప్రభుత్వంలో భారత ఆర్థికమంత్రిగా ఉన్న జేమ్స్ విల్సన్ దానికి నాంది పలికారనీ చరిత్ర చెబుతోంది. స్వతంత్ర భారతంలో తొలి బడ్జెట్ సమర్పకులు ఆర్.కె.షణ్ముగం చెట్టి కాగా, బడ్జెట్‌కు నేటి రూపూ, రేఖా కల్పించిన ఆర్థిక పండితుడు పి.సి.మహలనోబిస్. అయితే, చరిత్ర కాలానికి వెళితే, మౌర్యుల కాలంలోనే ఒక ఏడాదికి సరిపోయే బడ్జెట్‌నూ, గణాంకాలనూ కూర్చేవారని చరిత్ర నిపుణులంటారు. ఆ కాలానికే చెందిన కౌటిల్యుని అర్థశాస్త్రం దానికి ఆధారం. కాకపోతే, అప్పట్లో ఏడాదికి 354 రోజులు. గురుపూర్ణిమగా చెప్పుకునే ఆషాఢ పూర్ణిమ నుంచి సంవత్సరాన్ని లెక్కించేవారు. నేటి బడ్జెట్ తరహా కూర్పే ఇంచుమించుగా అర్థశాస్త్రంలోనూ కనిపిస్తుంది. అర్థమంటే డబ్బు కనుక అర్థశాస్త్రం కేవలం ఆర్థిక విషయాలే చెబుతుందనుకుంటారు కానీ, కౌటిల్యుని ఉద్దేశంలో అర్థమంటే, మనుషుల జీవన విధానానికీ, వారు నివసించే భూమికీ చెందిన అన్ని విషయాలనూ చెప్పేదని– ప్రసిద్ధ సంçస్కృత పండితుడు, అర్థశాస్త్ర వ్యాఖ్యాత పుల్లెల శ్రీరామచంద్రుడు అంటారు. అర్థశాస్త్రం ప్రకారం నాటి బడ్జెట్ సంవత్సరాన్ని ‘రాజవర్షం’ అనేవారు. నేటి ఆర్థికమంత్రిని పోలిన అధికారిని ‘సమాహర్త’ అనేవారు. ఏయే ఆదాయ వనరు నుంచి ఎంత ఆదాయం రావాలో నిర్ణయించడం, ఆదాయం పెంచడం, ఖర్చు తగ్గించడం అతని బాధ్యత. ‘ఆయముఖాలు’ అనే పేరుతో ఆదాయాన్ని వర్గీకరించేవారు. ఆదాయమిచ్చే వస్తువును ‘ఆయశరీర’ మనేవారు. నగరం, జనపదం, గనులు, సేద్యపు నీటి వనరులు, అడవులు, పశువుల పెంపకం, వర్తక మార్గాలు, వ్యవసాయం, సుంకాలు, జరిమానాలు, తూనికలు, కొలతలు, ప్రవేశానుమతులు (పాస్‌పోర్ట్‌లు), మద్యం, దారం, నెయ్యి, ఉప్పు, ఖనిజాలు, రంగురాళ్ళు, బంగారపు పని, కళారంగం, ఆలయాలనే కాక; ఆ కాలపు రీతి రివాజులను బట్టి వేశ్యావృత్తిని, జూదాన్ని కూడా ఆదాయ మార్గంగానే చూసేవారు. వీటిలో ఒక్కోదానికీ పర్యవేక్షణాధికారి ఉండేవాడు. మతపరమైన తంతులు, సాయుధ దళాలు, ఆయుధాలు, గిడ్డంగులు, కర్మాగారాలు, కార్మికులు, రాజప్రాసాద నిర్వహణ ప్రభుత్వం ఖర్చు కిందికి వచ్చేవి. రాజుకు వ్యక్తిగత సంపద ఉండేది కానీ, రాచకుటుంబంలోని మిగతా సభ్యులకు జీతాలు చెల్లించేవారు. అయితే, ఆదాయం చాలావరకు వస్తురూపంలో ఉండేది కనుక గిడ్డంగులలో భద్రపరిచేవారు. గిడ్డంగులపై అధికారిని ‘సన్నిధాత్రి’ అనేవారు. ఇంకా విశేషమేమిటంటే, నేటి కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వ్యవస్థ లాంటిదే అప్పుడూ విడిగా ఉండేది. ఆదాయవ్యయ పత్రాలనూ, లెక్కలనూ తనిఖీ చేసే ఆ విభాగాధికారిని ‘అక్షపటలాధ్యక్షుడ’నేవారు. ఇప్పుడున్నట్టు ఆదాయం పన్ను, కార్పొరేట్ పన్ను, పరోక్ష పన్నులు, వడ్డీ రాయితీ వంటివీ; సాధారణ సేవలు, సామాజిక సేవలు, ఆర్థిక సేవల వంటి వర్గీకరణలూ; సంక్షేమ స్పృహా అప్పుడూ ఉండేవి. కాకపోతే ఇప్పటిలా అభివృద్ధి కేంద్రితమైన ఆలోచనలు అర్థశాస్త్రంలో లేవని పండితులంటారు. కాలానుగుణమైన తేడాలను అలా ఉంచితే, ‘‘ప్రజాహితమే రాజు హితం, ప్రజలకు ప్రియమైనదే రాజుకూ ప్రియమైనది కావా’’లనే అర్థశాస్త్ర నిర్దేశం త్రికాల ప్రభుత్వాలకూ వర్తించే తిరుగులేని సూత్రం. -
బాధ్యత లేని ‘బోగస్’ గెలుపు!
కష్టపడి సంపాదించిన వాడికే డబ్బు విలువ తెలుస్తుందంటారు. విలువ తెలుసు కనుక దానిపట్ల బాధ్యత కూడా పెరుగుతుంది. దొంగ సొత్తుకూ, అక్రమ సంపాదనకూ ఈ సూత్రం వర్తించదు. డబ్బు సంపాదనే కాదు, విజయ సాధన కూడా ఇంతే. అది ఎన్నికల విజయమైనా మరే రకమైన విజయమైనా సరే. పోరాడి గెలిచిన వాడికి తనకు దక్కిన విజయం పట్ల గౌరవం ఉంటుంది. విజయ హేతువుల పట్ల వినమ్రత ఉంటుంది. బాధ్యత ఉంటుంది. అన్ని రంగాల్లోనూ దొడ్డిదారి విజయాలు కూడా ఉంటాయి. ఎన్నికల్లో కూడా ఉంటాయి. పరోక్ష ఎన్నికల్లో ఇటువంటి దొడ్డిదారి విజయాల వికటాట్టహాసం మనకు తెలియనిది కాదు. కానీ ఇప్పుడు ప్రత్యక్ష ఎన్నికల్లో ప్రజల తీర్పును ‘దొంగిలించడమ’నే సరికొత్త సాంకేతిక ప్రక్రియ రంగప్రవేశం చేసింది. ఈ పరిణామం పట్ల మనదేశంలోని మేధావుల్లో, ప్రజాస్వామ్య వాదుల్లో, అభ్యుదయ శక్తుల్లో ఆందోళన మొదలైంది. ఇటువంటి ఆందోళనే మహారాష్ట్రలోని కొంతమందిని ఒక దగ్గరకు చేర్చింది. వోట్ ఫర్ డెమోక్రసీ (వీఎఫ్‌డీ) అనే వేదిక తయారైంది.వీఎఫ్‌డీ అనే వేదికపైకి కొందరు వ్యక్తులతోపాటు కొన్ని సంస్థలు కూడా చేరుకున్నాయి. దేశంలో జరిగిన మొన్నటి సాధారణ ఎన్నికల ఫలితాలు చాలామందిని ఆశ్చర్యానికి గురిచేశాయి. ఈ వేదిక కూడా మినహాయింపు కాదు. కానీ వీఎఫ్‌డీ మాత్రం ఆశ్చర్యంలోనే మునకేసి ఉండకుండా ఒక ముందడుగు వేసింది. ఎన్నికల ప్రక్రియను ఆసాంతం అధ్యయనం చేసి ఒక 225 పేజీల నివేదికను ఈమధ్యనే ఆ సంస్థ విడుదల చేసింది. ఈ నివేదికలో పొందుపరిచిన పలు అంశాలు దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. మన ప్రజాస్వామ్య ప్రక్రియ పవిత్రతను సహేతుకంగా శంకిస్తున్నాయి.ఈవీఎమ్‌ల పనితీరుపైనా, పారదర్శకతపైనా అనుమానాలు, అభ్యంతరాలు పాతవే. వీడీఎఫ్ కేవలం సందేహాలకు మాత్రమే పరిమితం కాకుండా పోలింగ్ సందర్భంగా, కౌంటింగ్ సందర్భంగా జరిగిన అవకతవకలను ఎత్తిచూపింది. ఎన్నికల ప్రక్రియకు ముందు ఎన్నికల సంఘంలో జరిగిన అసాధారణ మార్పులను ఎండగట్టింది. ప్రక్రియ ముగిసేవరకూ ఎన్నికల సంఘం అవలంభించిన ఏకపక్ష ధోరణిని నిర్ధారించింది. ఫలితాల ప్రకటనలోని అసమంజసత్వాన్ని వెలికి తీసింది.సాధారణంగా పోలింగ్ ముగిసిన అనంతరం సాయంత్రం ఏడు లేదా ఎనినిమిది గంటలకల్లా పోలింగ్ శాతాలను ఎన్నికల సంఘం ప్రకటించడం రివాజు. ఎక్కడైనా కొన్ని బూత్‌లలో పోలింగ్ ఆలస్యంగా జరిగితే అవి కూడా కలుపుకొని రాత్రి ఆలస్యంగా గానీ, అరుదుగా మరుసటిరోజు గానీ తుది పోలింగ్ శాతాన్ని ఈసీ ప్రకటిస్తూ వస్తున్నది. ఈ పెరిగిన ఓటింగ్ శాతం గతంలో ఎన్నడూ కూడా ఒక శాతాన్ని మించిన అనుభవాలు లేవు. ఈసారి మాత్రం ఏడు దశల పోలింగ్‌లోనూ అసాధారణ పెరుగుదల నమోదైంది. కనిష్ఠంగా 3.2 శాతం నుంచి గరిష్ఠంగా 6.32 శాతం వరకు పెరుగుదల ఈ ఏడు దశల్లో కనిపించింది.గరిష్ఠంగా నాలుగో దశ పోలింగ్‌లో 6.32 శాతం పెరుగుదల నమోదైంది. ఈ దశలోనే పోలింగ్ జరుపుకున్న ఆంధ్రప్రదేశ్‌లో 12.54 శాతం, ఒడిశాలో 12.48 శాతం పెరుగుదల కనిపించడంపై వీఎఫ్‌డీ విస్మయం వ్యక్తం చేసింది. మన చెవుల్లో పెద్దపెద్ద తామర పువ్వులుంటే తప్ప ఈసీ చేసిన ఈ దారుణమైన ఓటింగ్ పెంపును నమ్మడం కష్టం. పోలింగ్ ముగిసిన నాలుగు రోజుల తర్వాత, తుది పోలింగ్ శాతాన్ని ప్రకటించడం మరింత విభ్రాంతిని కలిగించే విషయం. ఇంత అసాధారణ స్థాయిలో పోలింగ్ శాతాల పెరుగుదలపై వచ్చిన సందేహాలకు ఇప్పటివరకు ఎన్నికల సంఘం సరైన వివరణ ఇవ్వలేదనే సంగతిని దృష్టిలో ఉంచుకోవాలి.ఈవీఎమ్‌ల ట్యాంపరింగ్ జరిగితేనో, లేక పోలింగ్ జరిగిన ఈవీఎమ్‌ల బదులు కౌంటింగ్‌లో కొత్త మిషన్లు వచ్చి చేరితేనో తప్ప ఈ అసాధారణ పెరుగుదల సాధ్యంకాదని వీఎఫ్‌డీ అభిప్రాయపడింది. కనుక ఈ పెరిగిన ఓట్లను బోగస్ ఓట్లుగా అది పరిగణించింది. ఈవీఎమ్లలో ఏదో ఇంద్రజాలం జరిగిందనడానికి మరో దృష్టాంతాన్ని కూడా వీఎఫ్‌డీ నిర్ధారించింది. తుది ప్రకటన చేసిన పోలైన ఓట్లకూ, కౌంట్ చేసిన ఓట్లకూ మధ్య భారీ వ్యత్యాసాలు కనిపించాయి. కొన్నిచోట్ల కౌంట్ చేసిన ఓట్లు పెరిగాయి. మరికొన్ని చోట్ల తగ్గాయి. ఇదెలా సాధ్యమవుతుంది? ఆంధ్రప్రదేశ్‌లోని తొమ్మిది లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో 3,500 నుంచి 6,500 వరకు ఓట్లు కౌంటింగ్ సమయానికల్లా తగ్గిపోయాయి. ఇటువంటి నియోజకవర్గాలు దేశవ్యాప్తంగా 174 ఉన్నాయని వీఎఫ్‌డీ తెలియజేసింది.వీఎఫ్‌డీ సంస్థ బోగస్‌గా పరిగణించిన ఓట్ల కంటే తక్కువ తేడాతో ఎన్డీఏ గెలిచిన సీట్లను వాస్తవానికి ప్రతిపక్షాలు గెలవాల్సిన సీట్లుగా వర్గీకరించారు. రాష్ట్రాలవారీగా పెరిగిన బోగస్ ఓట్ల మొత్తాన్ని ఆ రాష్ట్రంలోని లోక్‌సభ నియోజకవర్గాలకు సమానంగా విభజించిన అనంతరం ఆ సంఖ్య కంటే తక్కువ తేడాతో ఓడిపోయిన సమీప ప్రత్యర్థిని అసలైన విజేతగా వీఎఫ్‌డీ లెక్కకట్టింది. ఈ లెక్కన 79 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఎన్డీఏ కూటమి ఓడిపోవాల్సింది.వీఎఫ్‌డీ గణిత సమీకరణం ప్రకారం ఒడిశాలో బీజేడీ, ఆంధ్రలో వైసీపీ అధికారంలోకి వచ్చి ఉండాలి. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం పోలైన ఓట్లలో 49 లక్షల పైచిలుకు ఓట్లను బోగస్‌గా ఆ సంస్థ పరిగణించింది. ఆ ఓట్లను మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాల మధ్య సమంగా పంచితే ఇరవై ఎనిమిదవేలవుతుంది. అంతకంటే తక్కువ తేడాతో వైసీపీ ఓడిపోయిన నియోజకవర్గాల సంఖ్య 77. గెలిచిన 11 వీటికి జత చేస్తే మొత్తం 88. అంటే సింపుల్ మెజారిటీ.వీఎఫ్‌డీ సంస్థ ఆషామాషీగా బోగస్ ఓట్ల సంఖ్యను నిర్ధారించలేదు. అనుమానించడానికి హేతుబద్ధమైన అనేక ఉదంతాలను అది ఉదహరించింది. షెడ్యూల్ ప్రకటనకు కొద్దిరోజుల ముందే అరుణ్ గోయల్ అనే కమిషనర్ ఎందుకు తప్పుకున్నారని ప్రశ్నించింది. షెడ్యూల్ ప్రకటనకు ఒకరోజు ముందు కమిషనర్లుగా ఇద్దరు అధికారులు చేరారు. వీరిలో ఒక అధికారి పూర్వాశ్రమంలో అమిత్‌షా దగ్గర అధికారిగా పని చేశారనీ, మరొక అధికారి ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్ ధామి వద్ద పనిచేశారని ఆ సంస్థ వెల్లడించింది.పోలింగ్ ముగిసిన వెంటనే పార్టీ ఏజెంట్లకు ఇవ్వాల్సిన 17–సి ఫామ్‌లను ఎంతమంది ఏజెంట్లకు ఇచ్చారో తెలపగలరా అని ఆ సంస్థ సవాల్ చేసింది. ఈవీఎమ్‌ల వారీగా ఫామ్ 17–సీ లలో నమోదు చేసిన ఓటింగ్ వివరాలు కౌంటింగ్‌లో లెక్కించిన ఓట్లతో సరిపోల్చడానికి ఒక స్వతంత్ర అధ్యయనం జరగవలసిన అవసరం ఉన్నదని వీఎఫ్‌డీ అభిప్రాయపడింది.ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించినంతవరకు ఈ బోగస్ ఓట్ల బాగోతం ఒక భాగం మాత్రమే. తొలి అంకం వేరే ఉన్నది. కూటమి నేతలు – యెల్లో మీడియా సంయుక్తంగా సాగించిన విష ప్రచారం, కూటమి ఇచ్చిన మోసపూరితమైన హామీలు ఈ భాగం. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై ఏపీలో కూటమి చేసింది దుష్ప్రచారమేనని మొన్నటి యూనియన్ బడ్జెట్‌తో తేలిపోయింది. ఏపీలో ప్రారంభించిన ఈ సంస్కరణ దేశమంతటా జరగాలని కేంద్రం కోరుతున్నది. అందుకోసం రాష్ట్రాలకు ప్రోత్సాహకాలను కూడా ప్రకటించింది.జగన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని, రాష్ట్రం దివాళా తీసిందని, శ్రీలంకలా మారిందని రాసిన రాతలకూ, కూసిన కూతలకూ అంతే లేదు. మొన్న యూనియన్ బడ్జెట్‌కు ముందురోజు ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే జగన్ ప్రభుత్వ ఆర్థిక క్రమశిక్షణను కొనియాడటంతో యెల్లో కూటమి ముఖాన కళ్లాపి చల్లినట్టయింది. రాష్ట్రానికి 14 లక్షల కోట్ల అప్పు ఉన్నదని ఎన్నికల ముందు ఊదరగొట్టిన చంద్రబాబు మొన్నటి అసెంబ్లీ సమావేశాల్లో 10 లక్షల కోట్లని గవర్నర్ చేత చెప్పించారు. ఈ కుప్పిగంతులనూ, శ్వేతపత్రాల తప్పుడు తంతులనూ చీల్చి చెండాడుతూ వైసీపీ అధ్యక్షుడు ప్రెస్‌మీట్ పెడితే సమాధానం చెప్పడానికి ఇప్పటిదాకా ఏ యెల్లో మేధావీ ముందుకు రాకపోవడం గమనార్హం.ఇసుక మీద నసిగిన వాగుడెంత?... రాజేసిన రాద్ధాంతమెంత? అప్పుడే మరిచిపోతామా? ఇసుక ధరలు అప్పటికంటే ఇప్పుడే ఎక్కువయ్యాయని ఊరూవాడా గగ్గోలు పెడుతున్నది. ఈ పబ్లిక్ టాక్‌ను అడ్రస్ చేయడానికి ఒక్క సర్కారీ సిపాయి కూడా ఇంతవరకు సాహసించలేదు. లిక్కర్ పాలసీ మీద వెళ్లగక్కిన ప్రచారం సంగతి సరేసరి. ఇప్పటివరకైతే అదే పాలసీ కొనసాగుతున్నది. దీన్నే కొనసాగిస్తారో, లేదంటే బెత్తెడు దూరానికో బెల్టు షాపు సుగంధాలు వెదజల్లిన తమ పాతకాలపు పాత పాలసీకి వెళ్తారో వేచి చూడాలి.విషప్రచారాల ప్రస్తావనలోకి వెళ్తే దానికి అంతూదరీ ఉండదు. ఇక మోసపూరిత హామీల సంగతి మరో మహేంద్రజాల అధ్యాయం. ఉన్న సంక్షేమ పథకాలను కొనసాగించడంతోపాటు సూపర్ సిక్స్ పేరుతో ఒక షట్సూత్ర వాగ్దాన మాలను ఓటర్ల మెడలో వేశారు. యువకులందరికీ నెలకు 3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. బడికెళ్లే ప్రతి విద్యార్థికీ ఏడాదికి 15 వేల రూపాయలిస్తామన్నారు. ప్రతి రైతుకూ ఏటా 20 వేల ఆర్థిక సాయమన్నారు. 19 నుంచి 59 సంవత్సరాల మధ్యనున్న ప్రతి మహిళకు నెలకు 1500 అందజేస్తామన్నారు. ప్రతి ఇంటికి ఏటా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితమన్నారు. ప్రతి మహిళకూ ఉచిత బస్సు ప్రయాణమని నమ్మబలికారు.ఇప్పటివరకు ఇందులో ఒక్కటి కూడా ప్రారంభం కాలేదు. ఎప్పుడు ప్రారంభిస్తారో కూడా తెలియదు. ఇది షట్సూత్ర హామీ కాదు షడయంత్ర ప్రయోగమని తేలడానికి ఎంతోకాలం పట్టలేదు. సాక్షాత్తూ శాసనసభలోనే స్వయంగా ముఖ్యమంత్రే ‘సూపర్ సిక్స్’ తూచ్ అని ప్రకటించారు. పైగా ఇది సాధ్యంకాదనే విషయాన్ని ప్రజల్లో ప్రచారం చేయాలని కూడా ఎమ్మెల్యేలను కోరారు. విష ప్రచారంతో, తప్పుడు హామీలతో ఓట్లడగడం కూడా ఓట్లను దొంగిలించడం కిందే లెక్క. వంచన కిందే లెక్క. రెండు రకాలుగా చోరీ చేసిన ఓట్లతోనే గద్దెనెక్కారు కనుక వారికి ప్రజల పట్ల బాధ్యత లేదనే విషయాన్ని వారే నిరూపించుకుంటున్నారు.బాధ్యతల నుంచి తప్పుకోవడానికీ, హామీల అమలుకోసం జనం వీధుల్లోకి రాకుండా ఉండటానికే రెడ్‌బుక్ వ్యూహాన్ని అమలు చేస్తున్నారని ఇప్పటికే ప్రజలకు అర్థమైంది. శాసనసభలో విపక్ష నేతపై సభానాయకుడు వాడుతున్న భాష, వేస్తున్న నిందలు చాలా దిగజారిన స్థాయిలో ఉంటున్నాయి. హామీలు అమలుచేయపోతే ఎక్కడ తిరుగుబాటు వస్తుందోనన్న భయం ఆయన్ను వెంటాడుతున్నట్టు కనిపిస్తున్నది. ‘ఒక్క వేలు చూపి ఒరులను నిందించ వెక్కిరించు నిన్ను మూడు వేళ్లు’ అనే తెలుగు నానుడిని ఆయన గుర్తు చేసుకుంటే మేలు.చంద్రబాబుకు కాళ్లు కడిగి కన్యాదానం చేసిన మామగారు ఎన్టీ రామారావు ఆయన గురించి ఏమన్నారో గుర్తు చేసుకుందామా? ‘‘చంద్రబాబు దుర్మార్గుడు... మేకవన్నె పులి, గాడ్సేనే మించినవాడు, అభినవ ఔరంగజేబు, అతడో మిడత. మూర్తీభవించిన పదవీకాంక్షాపరుడు, ప్రజాస్వామ్య హంతకుడు, కుట్రకు కొలువైనవాడు, గూడుపుఠాణీకే గురువు, మోసానికి మూలస్తంభం, గుండెల్లో చిచ్చుపెట్టినవాడు, గొడ్డుకన్నా హీనం, చీమల పుట్టలో పాములా చేరినవాడు... తమ్ముళ్లారా! చెల్లెళ్లారా! ఇదిగో మీ అన్నగా చెబుతున్నాను.’’ ఇవన్నీ ఎన్టీఆర్ డైలాగులే. ఆన్ రికార్డ్!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
ఆర్టీఐని బతకనివ్వరా?!
విధాన నిర్ణయాలపై అనవసర గోప్యత పాటించటం, నిజాలు రాబట్టే ప్రయత్నాలకు పాతరేయటం ప్రజాస్వామ్యానికి చేటు తెస్తుంది. సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) పుట్టి దాదాపు రెండు దశాబ్దాలు గడిచింది. లోటుపాట్లు సరిదిద్దుకుంటూ మరింత పదునెక్కాల్సిన ఆ చట్టం కాస్తా ప్రభుత్వాల పుణ్యమా అని నానాటికీ నీరుగారుతోంది. తాజాగా ఆ చట్టం తమకు వర్తించదంటూ జవాబిచ్చి మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆ జాబితాలో చేరింది. షోపూర్ జిల్లా కునోలో ఉన్న వన్యప్రాణి సంరక్షణకేంద్రం, మాందసార్ జిల్లాలో నెలకొల్పబోయే మరో వన్యప్రాణి సంరక్షణ కేంద్రాల గురించి, ముఖ్యంగా చిరుతల సంరక్షణకు తీసుకుంటున్న చర్యల గురించి సమాచారం కావాలంటూ అడిగిన సమాచార హక్కు కార్యకర్త అజయ్ దూబేకు కళ్లు తిరిగి కింద పడేలా ప్రభుత్వ అటవీ విభాగం సమాధానమిచ్చింది.అలాంటి సమాచారం వెల్లడిస్తే దేశ భద్రతకూ, సార్వభౌమత్వానికీ ముప్పు ఏర్పడుతుందట. దేశ సమగ్రత, వ్యూహాత్మక, ఆర్థిక ప్రయోజనాలు దెబ్బతింటాయట. వేరే దేశంతో సంబంధాలు కూడా దెబ్బతినవచ్చట. కాబట్టి చట్టంలోని సెక్షన్ 8(1)(ఏ) ప్రకారం ఇవ్వడం కుదర దట. ఒక చిరుత కూన కాలికి కట్టు కట్టినట్టున్న ఫొటో చూసి మొన్న ఫిబ్రవరిలో పులుల జాతీయ సంరక్షణ ప్రాధికార సంస్థకు దూబే ఫిర్యాదు చేశాడు. ఎట్టకేలకు అటవీశాఖ స్పందించింది. కానీ ఆ సమాచారం వెల్లడిస్తే మిన్ను విరిగి మీదపడుతుందన్న స్థాయిలో సమాధానమిచ్చింది. ప్రభుత్వాల పనితీరుపై అవధుల్లేని సమాచారం పౌరులకు లభ్యమైనప్పుడే ప్రజాస్వామ్యానికి పునాదిగా భావించే స్వేచ్ఛ, సమానత్వాలు సాధించుకోవటం, వాటిని కాపాడుకోవటం సాధ్యమవు తుందని జగజ్జేత అలెగ్జాండర్‌కు గురువైన గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్ చెబుతాడు. అరిస్టాటిల్ క్రీస్తు పూర్వం రెండో శతాబ్దినాటివాడు. సమాచారం ఇవ్వటానికి ససేమిరా అంటున్న మన ప్రభుత్వాలు మానసికంగా తాము ఏకాలంలో ఉండిపోయామో తెలుసుకోవటం ఉత్తమం. ఇప్పుడే కాదు... 2005లో ఆర్టీఐ చట్టాన్ని తీసుకొచ్చినప్పుడే దేశభద్రత పేరు చెప్పి 22 సంస్థలకు మినహాయింపు ఇచ్చి దాని స్ఫూర్తిని దెబ్బతీశారు. తర్వాత కాలంలో ఆ జాబితా పెరుగుతూ పోయింది. ఆర్టీఐ పరిధి లోకి రాబోమని వాదించే వ్యవస్థలు, విభాగాలు ఎక్కువవుతున్నాయి. రాజకీయ పార్టీలు మొదలు కొని న్యాయవ్యవస్థ వరకూ ఇందులో ఎవరూ తక్కువ తినలేదు. పారదర్శకత తమవల్ల కాదని అందరికందరూ నిర్మొహమాటంగా చెబుతున్నారు. అసలు ఏ సమాచారమైనా కోరితే 30 రోజుల్లో దాన్ని అందజేయాలని ఆర్టీఐ నిబంధనలు నిర్దేశిస్తున్నాయి. అది ఎక్కడా అమలవుతున్న దాఖలా లేదు. అప్పీల్ కోసం వెళ్తే అక్కడ మరో కథ. చాలా రాష్ట్రాల్లో సమాచార కమిషనర్లు, ఇతర సిబ్బంది తగినంతమంది ఉండటం లేదు. కొన్నిచోట్ల ప్రధాన కమిషనర్ల జాడలేదు. అయిదేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ల, కమిషనర్ల పదవీకాలం, వారి జీతభత్యాలు, సర్వీసు నిబంధనలు రూపొందించే నిర్ణయాధికారాన్ని తన చేతుల్లోకి తీసుకుంటూ ఆర్టీఐకి సవర ణలు తెచ్చింది. ఈ సవరణలు సహజంగానే సమాచార కమిషన్ వ్యవస్థల స్వయంప్రతిపత్తిని దెబ్బ తీశాయి. పార్లమెంటులో తగిన సంఖ్యాబలం ఉన్నది కనుక చట్ట సవరణలకు సులభంగానే ఆమోదం లభించింది. కానీ సంబంధిత వర్గాలతో మాట్లాడాకే ఆ సవరణలు తీసుకురావాలన్న కనీస సంప్రదాయాన్ని పాలకులు విస్మరించారు. పౌరులు ప్రధానంగా ప్రభుత్వాల నుంచే సమాచారం రాబట్టాలని కోరుకుంటారు. ఆ ప్రభుత్వమే రకరకాల ప్రయత్నాలతో దానికి అడ్డుపుల్లలు వేయ దల్చుకుంటే ఇక ఆ చట్టం ఉండి ప్రయోజనమేమిటి? ఆర్టీఐ తీసుకొచ్చిన ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగే తర్వాత కాలంలో దాన్ని ‘మితిమీరి’ వినియోగిస్తున్నారంటూ మండిపడ్డారు. పార్టీలకు అతీతంగా పాలకులందరిదీ ఇదే బాణీ. పాలనలో పారదర్శకత కోసం, ప్రభుత్వాలకు జవాబుదారీతనం పెంచటం కోసం వచ్చిన చట్టం హద్దులు దాటుతున్నదని పాలకులతోపాటు ఉన్నతాధికార గణం కూడా విశ్వసిస్తోంది. ఆర్టీఐని వమ్ము చేయటానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. కనుకనే సమాచారం కోరినవారి ఆనుపానులు క్షణాల్లో అవతలివారికి వెళ్తున్నాయి. సమాచార హక్కు ఉద్యమకారుల ప్రాణాలు గాల్లో దీపాలవుతున్నాయి. ఇప్పటివరకూ వందమందికి పైగా కార్యకర్తలను దుండగులు హత్యచేశారు. ఈ ఏడాది మొదట్లో ఎలక్టోరల్ బాండ్స్ కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు పౌరుల సమాచార హక్కు ప్రాధాన్యతనూ, ప్రజాస్వామ్యంలో అది పోషించే కీలకపాత్రనూ తెలియజెప్పింది. రాజ్యాంగదత్తమైన ప్రాథమిక హక్కుల్లో దాన్నొకటిగా గుర్తించింది. ఏదైనా చట్టం వచ్చిన ప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకునే వారున్నట్టే దుర్వినియోగం చేద్దామనీ, స్వప్రయోజనాలు సాధించు కుందామనీ ప్రయత్నించేవారు ఉంటారు. అంతమాత్రంచేత ఆ చట్టాన్ని నీరుగార్చ కూడదు. కార్గిల్ అమర జవాన్ల కుటుంబాలకు ఉద్దేశించిన ఆదర్శ్ హౌసింగ్ సొసైటీలోకి రాజకీయ నేతలు, ఉన్నతాధికారులు చొరబడి ఫ్లాట్లు కొట్టేసిన వైనం ఆర్టీఐ చట్టం లేకపోయివుంటే బయటి కొచ్చేదే కాదు. అలాగే మధ్యప్రదేశ్‌లో వ్యాపమ్ కుంభకోణం, పశ్చిమ బెంగాల్లో టీచర్ రిక్రూట్ మెంట్ల అక్రమాలు ఎప్పటికీ వెలుగుచూసేవి కాదు. వ్యక్తులుగా ఎవరైనా దుర్వినియోగానికి పాల్పడితే శిక్షించే విధంగా నిబంధనలు తెస్తే తప్పులేదు. కానీ ఆ సాకుతో మొత్తం చట్టాన్నే నీరుగార్చాలని చూడటం, దేశ భద్రత పేరు చెప్పి అందరినీ బెదరగొట్టడం ప్రమాదకరమైన పోకడ. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యాన్నీ, జవాబుదారీతనాన్నీ దెబ్బతీస్తాయి. నిరంకుశత్వానికి బాటలు పరుస్తాయి. -
పునః సమీక్ష జరగాలి!
కొద్దివారాలుగా కొనసాగుతున్న వివాదం కీలక ఘట్టానికి చేరుకుంది. దేశవ్యాప్తంగా వైద్యవిద్యా కళాశాలల్లో ప్రవేశం కోసం ఏటా జరిపే జాతీయస్థాయి పరీక్ష ‘నీట్’లో అక్రమాలు జరిగాయన్న అంశంపై విచారణ చేస్తున్న దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నపత్రాల లీకైనమాట నిజమంటూనే, వ్యవస్థీకృతంగా భారీస్థాయిలో లీకులు జరగనందున పునఃపరీక్ష జరపాల్సిన అవసరం లేదని తేల్చే సింది. ‘నీట్’ వివాదంతో నెలన్నరగా నిద్ర లేని రాత్రులు గడుపుతున్న విద్యార్థులకూ, వారి తల్లితండ్రులకూ ఇది ఒకింత ఊరట, మరింత స్పష్టత. అభ్యర్థుల మానసిక ఒత్తిడిని దృష్టిలో ఉంచుకొని, దాదాపు 23 లక్షల మందికి పైగా హాజరైన పరీక్షను మళ్ళీ నిర్వహించాలని అనుకోకపోవడం మంచిదే. అయితే పేపర్ లీకులు, ఒకదాని బదులు మరొక ప్రశ్నపత్రం ఇవ్వడం, ఒకరి బదులు మరొకరు పరీక్షలు రాయడం, నిర్ణీత కేంద్రాల నుంచి మునుపెన్నడూ లేనంత మంది టాపర్లుగా అవతరించడం – ఇలా ‘నీట్’ నిర్వహణలో ఈసారి వివిధ స్థాయుల్లో జరిగిన అవకతవకలు అనేకం. వీటన్నిటితో వ్యవస్థపై ఏర్పడ్డ అపనమ్మకాన్ని తొలగించడం ఎలా అన్నది ఇప్పుడు అతి పెద్ద ప్రశ్న. మొదట అసలు లోపాలు లేవని వాదించి, ఆనక తప్పుల్ని అంగీకరించినా కీలక చర్యలు చేపట్ట డానికి కార్యనిర్వాహక వ్యవస్థ వెనకాడడం చూశాం. చివరకు న్యాయవ్యవస్థ జోక్యంతో ప్రక్షాళన అవసరమనే అంశం చర్చకు వచ్చింది. సుప్రీమ్‌కోర్ట్ ఆదేశాలతో ‘జాతీయ పరీక్షా సంస్థ’ (ఎన్టీఏ) ‘నీట్’ పరీక్షా ఫలితాలను సవరించి, గురువారం ప్రకటించాల్సి వచ్చింది. భౌతికశాస్త్రంలో ఒక ప్రశ్నకు రెండు జవాబులూ సరైనవేనంటూ విద్యార్థులకు ఈ ఏటి పరీక్షలో గ్రేస్ మార్కులు కలిపిన ఘనత ‘నీట్’ది. అత్యధిక సంఖ్యలో టాపర్లు రావడానికీ అదే కారణమైంది. సదరు వివాదాస్పద ప్రశ్నకు సరైన జవాబు ఒకటేనంటూ సుప్రీమ్ జోక్యం తర్వాత ఐఐటీ – ఢిల్లీ నిపుణుల సంఘం ఖరారు చేసింది. దాంతో అయిదేసి మార్కులు కోతపడి, దాదాపు 4.2 లక్షల మంది విద్యార్థుల మార్కులు మారాయి. జూన్ 4న తొలుత ఫలితాలు ప్రకటించినప్పుడు టాప్ స్కోరర్ల సంఖ్య 61 కాగా, ఇప్పుడీ వివాదాలు, విచారణలు, మార్పుల తర్వాత అది 17కు తగ్గింది. మార్కులు, దరి మిలా ర్యాంకుల్లో మార్పులతో తాజా జాబితాను ఎన్టీఏ విడుదల చేయాల్సి వచ్చింది. పునఃపరీక్షఉండదని కోర్ట్ తేల్చేయడంతో, సవరించిన ర్యాంకుల్ని బట్టి ఇప్పుడిక ప్రవేశాలు జరVýæనున్నాయి. ఎంబీబీఎస్ చదువు కోసం పెట్టిన ఈ దేశవ్యాప్త ‘నీట్ – యూజీ’ పరీక్షలు లోపభూయిష్ఠమనీ, మరీ ముఖ్యంగా స్థానిక విద్యార్థుల అవకాశాలకు హానికరమనీ రాష్ట్రాలు గగ్గోలు పెడుతున్నాయి. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమైన ‘నీట్’ వద్దంటూ తమిళనాడు కొన్నేళ్ళుగా పోరాడుతుంటే, పశ్చిమ బెంగాల్ సైతం బుధవారం గొంతు కలిపింది. తాజాగా కర్ణాటక అసెంబ్లీ సైతం ‘నీట్’ వద్దని గురువారం బిల్లును ఆమోదించింది. సొంతంగా రాష్ట్రస్థాయి మెడికల్ ఎంట్రన్ టెస్ట్ పెడతామంటూ తీర్మానించింది. అది చట్టపరంగా సాధ్యమేనా, కేంద్రం, సుప్రీమ్ కోర్ట్ ఏమంటాయన్నది పక్కన పెడితే, ‘నీట్’ పట్ల పెరుగుతున్న అపనమ్మకం, రాష్ట్రాల్లో అసంతృప్తికి ఇది నిదర్శనం. అసలు ఒకప్పుడు ఎక్కడికక్కడ రాష్ట్రస్థాయి ప్రవేశపరీక్షలే ఉండేవి. దేశంలో వైద్యవిద్య చదవదలచిన పిల్లలు ప్రతి రాష్ట్రంలో పరీక్షలు రాసే ఈ శ్రమ, ఖర్చును తప్పించడం కోసం జాతీయస్థాయిలో అందరికీ ఒకే పరీక్ష ‘నీట్’ను ప్రవేశపెట్టారు. మంచి ఆలోచనగా మొదలైనా, ఆచరణలో అది అవకతవకలకు ఆస్కారమిస్తూ, విద్యార్థుల్ని మరింత ఒత్తిడికి గురి చేసేదిగా మారడమే విషాదం. మళ్ళీ పరీక్ష జరపనక్కర లేదని సుప్రీమ్ ప్రకటించింది కానీ, అసలు తప్పులేమీ జరగలేదని మాత్రం అనలేదని గుర్తించాలి. ఇప్పటికైతే పాట్నా, హజారీబాగ్ – ఈ రెండుచోట్లా పేపర్ లీకైనట్టు కోర్టు నిర్ధరించింది. అలాగే, మరిన్ని వివరాలు తవ్వి తీసేందుకు సీబీఐ దర్యాప్తు కొనసాగుతుందనీ స్పష్టం చేసింది. విద్యార్థుల కౌన్సిలింగ్ వగైరా కొనసాగించవచ్చని అనుమతిస్తూనే, భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు ఎదురవకుండా, పరీక్షల నిర్వహణ మరింత మెరుగ్గా ఎలా నిర్వహించాలన్న దానిపై మార్గదర్శకాలు రానున్నట్టు పేర్కొంది. అభ్యర్థుల బంగారు భవిష్యత్తు ఆధారపడిన పరీక్ష లపై ఎన్టీఏలో నిర్లక్ష్యం ఎంతగా పేరుకుందో ఇటీవలి ‘నీట్’, యూజీసీ– నెట్ వివాదాలే నిదర్శనం. పరీక్షా కేంద్రాల ఎంపిక మొదలు కీలకమైన పనిని బిడ్డింగ్‌లో అవుట్ సోర్సింగ్‌కు అప్పగించడం దాకా లోపాలు అనేకం. అసలు ముందుగా ఎన్టీఏను ప్రక్షాళన చేయాలంటున్నది అందుకే. ‘నీట్’ సంగతే తీసుకున్నా పెన్ను– పేపర్ల విధానం నుంచి కంప్యూటర్ ఆధారిత ఆఫ్‌లైన్ పరీక్షకు మారాలని నిపుణుల మాట. ‘జేఈఈ’లో లాగా రెండంచెల పరీక్షా విధానం ఉండాలనే సూచనా వినిపిస్తోంది. సంపూర్ణ అధ్యయనం, సమగ్ర చర్చతో తగిన చర్యలు చేపట్టడం ఇక భవిష్యత్ కార్యాచరణ కావాలి. అసలు ఇవాళ దేశంలో అనేకచోట్ల చదువుల్లో పరీక్షా పత్రాల మొదలు పోటీపరీక్షల ప్రశ్నపత్నాల వరకు అన్నీ విపణిలో యథేచ్ఛగా లభిస్తున్న దుఃస్థితి. ఈ లీకుల జాడ్యాన్ని అరికట్టకపోతే ప్రతిభకు పట్టం అనే మాటకు అర్థం లేకుండా పోతుంది. రకరకాల పేపర్ లీకులతో తరచూ వార్తల్లో నిలుస్తున్న బిహార్ సైతం ఎట్టకేలకు లీకు వీరులను కఠినంగా శిక్షించేందుకు ప్రభుత్వ పరీక్షల (అక్రమాల నిరోధక) బిల్లును అసెంబ్లీలో బుధవారం ఆమోదించింది. అన్నిచోట్లా ఇలాంటి కఠిన చట్టాలు అవస రమే. అయితే, అమలులో చిత్తశుద్ధి, అంతకన్నా ముందు ఆ చట్టాల దాకా పరిస్థితిని రానివ్వ కుండా లీకులకు అడ్డుకట్ట వేయడం ముఖ్యం. ‘నీట్’ పునర్నిర్వహణకు కోర్టు ఆదేశించకున్నా, తప్పులు జరిగాయని తేటతెల్లమైంది గనక మన పరీక్షా వ్యవస్థలు, విధానాలపై పునఃసమీక్ష, ప్రక్షాళనకు దిగాలి. అదీ పారదర్శకంగా జరగాలి. ‘నీట్’ లీకువీరులకు కఠిన శిక్షతో అందుకు శ్రీకారం చుట్టాలి. -
నెత్తుటి పాలనపై రణభేరి!
‘వెయ్యిమంది పాలకుల నిరంకుశాధికారం కూడా ఒక వ్యక్తిమాత్రుడి హేతువు ముందు దూదిపింజెలా కొట్టుకుపోతుంద’ంటాడు ఇటాలియన్ ఖగోళ శాస్త్రవేత్త గెలీలియో గెలీలి. ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన క్షణం నుంచి గూండా మూకల్ని మందలుగా వదుల్తూ హత్యలూ, విధ్వంసాలతో ప్రజానీకాన్ని భయభ్రాంతులకు గురిచేస్తున్న టీడీపీ నేతృత్వంలోని అధికార ఎన్డీయే కూటమికి ఈ జ్ఞానం తలకెక్కే సమయం ఆసన్నమైంది. దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాకు వివిధ జాతీయ పార్టీల నాయకులు హాజరై మద్దతు తెలపడం, హింసాకాండపై ప్రదర్శించిన వీడియోనూ, ఛాయా చిత్రాలనూ చూసి దిగ్భ్రాంతి చెందటం దీన్నే చాటుతోంది. ఏపీలో ఇంత దారుణమైన పరిస్థితులున్నాయని ఇన్నాళ్లుగా తెలియదని సమాజ్‌వాదీ, ఉద్ధవ్ శివసేన, ఆప్, తృణమూల్, ఐయూఎంఎల్, అన్నా డీఎంకే, వీసీకే పార్టీల నేతలు ప్రకటించారు. ఒకటా రెండా... గత యాభై రోజులుగా రాష్ట్రంలో చిత్తూరు మొదలుకొని శ్రీకాకుళం వరకూ ఏదోమూల పాలకపక్ష మూకలు మారణహోమాన్ని సృష్టిస్తున్నాయి. నడిరోడ్లపై పట్టపగలు హత్యలకు పాల్పడుతున్నాయి. కత్తులు, కొడవళ్లు, గొడ్డళ్లు, రాళ్లతో ఇళ్లపైకి పోయి వీరంగం వేస్తున్నాయి. బుల్డోజర్లతో నివాసగృహాలను నేలమట్టం చేస్తున్నాయి. ఇంతవరకూ 36 మంది ప్రాణాలను పొట్టనబెట్టుకున్నాయి. 300 మందిపై హత్యాయత్నాలు, మొత్తంగా వెయ్యికి పైగా దాడులు జరిగాయి. వీరి ఆగడాలు తట్టుకోలేక దాదాపు 4,000 మంది స్వస్థలాలు విడిచిపోయారు. 30 మంది వరకూ బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఈ ముఠాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రిగా కూడా బాధ్యతలు వెలగబెడుతున్న ఆయన పుత్రరత్నం లోకేశ్ వెనకుండి ప్రోత్సహిస్తుంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నిమ్మకు నీరెత్తినట్టు మిగిలిపోయారు. పశ్చిమ బెంగాల్ వంటిచోట్ల జరిగిన స్వల్ప స్థాయి సంఘటనలకే కేంద్ర బలగాలను పంపి హడావిడి చేసిన కేంద్రం ఆంధ్రప్రదేశ్‌లో సాగుతున్న అరాచకాలను చూసీచూడనట్టు వదిలేసింది. ఎన్డీయే వంచనా శిల్పం ఎంతటిదో చెప్పటానికి మంగళవారం నాటి ఉదంతాలు తార్కాణం. పార్లమెంటులో బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ పల్లెసీమల్లో, పట్టణాల్లో భూ యాజమాన్య హక్కులను నిర్ధారించాలని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్రాలకు సూచించారు. ఇంచుమించు అదే సమయంలో ఆ కూటమి నేతృత్వంలోనే ఉన్న ఏపీ ప్రభుత్వం గతంలో జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన భూహక్కు చట్టాన్ని రద్దు చేస్తూ బిల్లు ప్రవేశపెట్టింది. అంతకుముందు ఎన్నికల ప్రచారఘట్టంలో సైతం ఈ చట్టంపై టీడీపీ, జనసేన అధినేతలు అవాకులూ చవాకులూ మాట్లాడుతుంటే బీజేపీ గుడ్లప్పగించి చూస్తూ ఉండిపోయింది. రాజకీయాల్లో కనీస నైతిక విలువలు పాటించాలన్న స్పృహలేని ఇలాంటి పార్టీలు పాలన చేజిక్కించుకోవటం మన ప్రజాస్వామ్య ప్రారబ్ధం. ‘సూపర్ సిక్స్’ పేరుతో ప్రజానీకాన్ని వంచించి, ఎన్నికల సంఘాన్ని చెప్పుచేతల్లో పెట్టుకుని సాధించిన గెలుపును చూసి బలుపని భ్రమపడుతున్న కూటమి నేతలు ఇంతవరకూ వాగ్దానాల అమలు ఊసెత్తడం లేదు. వాటి సంగతేం చేయాలో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఫలితాలు వెలువడుతుండగానే ప్రారంభమైన దాడులను కొనసాగించి జనం దృష్టి మళ్లించకపోతే తమకు రాజకీయ మనుగడ లేదన్న నిర్ణయానికొచ్చి ఈ రాక్షసకాండకు తెరలేపారు. వినుకొండలో పట్టపగలు అందరూ చూస్తుండగా టీడీపీ కార్యకర్త జిలానీ వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్త రషీద్‌ను కత్తితో నరికి చంపితే కనీసం ప్రాథమిక దర్యాప్తు కూడా జరపకుండా పల్నాడు జిల్లా ఎస్పీ వ్యక్తిగత కక్షలే ఈ హత్యకు కారణమని ప్రకటించారు. ఇలాంటి అధికారుల కారణంగానే మారణాయుధాలతో రౌడీ మూకలు రెచ్చిపోతున్నాయి. ఈ హింసాత్మక వాతావరణం పర్యవసానంగానే పసిపిల్లలు మొదలుకొని అనేకమందిపై అత్యాచారాలు సాగుతున్నాయి. హత్యలు జరుగుతున్నాయి. ఆడ పిల్లలపై ఎవరు అకృత్యాలకు పాల్పడినా వెంటనే వచ్చి వాలతానని, దుండగులను పట్టి బంధి స్తామని ఎన్నికల ప్రచార సమయంలో పెద్ద కబుర్లు చెప్పిన పవన్ పత్తాలేరు. దాడులకు, హత్యలకు పాల్పడుతుంటే సాధారణ ప్రజానీకం భయపడి వాగ్దానాలపై తమను నిలదీయటానికి సాహసించరని కూటమి పాలకులు భ్రమపడుతున్నట్టుంది. ఢిల్లీ ధర్నాలో సమాజ్ వాదీ పార్టీ నాయకుడు అఖిలేశ్ యాదవ్ చెప్పినట్టు బుల్డోజర్ పాలన ఎల్లకాలం సాగదు. యూపీలో ఈ తరహా పాలనే సాగిస్తున్న యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వానికి మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లో జనం గట్టిగా బుద్ధి చెప్పారు. కాస్తయినా ఇంగితజ్ఞానం ఉంటే గతం కన్నా తాము మెరుగైన పాలన అందిస్తున్నామని నిరూపించుకోవటానికి కృషి చేయాలి. సకాలంలో హామీలు నెరవేర్చి ప్రజల మన్ననలు పొందాలి. కానీ జరుగుతున్నదంతా అందుకు భిన్నం. బడులు తెరిచి నెల్లాళ్లయినా ఇంతవరకూ ‘అమ్మకు వందనం’ లేదు. సాగుబడి మొదలై నెల కావస్తున్నా‘రైతు భరోసా’ జాడలేదు. నిరుద్యోగులకు నెలకు రూ. 3,000, మహిళలకు నెలకు రూ. 1,500,ఇంటింటికీ మూడు ఉచిత సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కబుర్లు ఎటు పోయాయో తెలియదు. తెల్లారిలేస్తే మారణకాండే పాలకులకు నిత్యకృత్యమైంది. ఇలాంటి ప్రభుత్వానికి కనీసం ఒక్కరోజైనా అధికారంలో కొనసాగే నైతిక హక్కుంటుందా? కేంద్రం కళ్లు తెరవాలి. ఈ అరాచకానికి అడ్డుకట్ట వేయాలి. ఉపేక్షిస్తే సర్వోన్నత న్యాయస్థానంతో చెప్పించుకునే స్థితి వస్తుందని గుర్తించాలి. -
రైతులకు ‘అమృతం’ ఇవ్వడం మరిచిన కేంద్రం
రైతుల ఆదాయం రెట్టింపు చేసే లక్ష్యం గురించి కేంద్ర ‘అమృత్ కాల్’ బడ్జెట్లో ఎటువంటి ప్రస్తావనా లేదు. వాతావరణ ప్రతికూల ప్రభావాల సవాళ్ల నేపథ్యంలో వ్యవసాయ రంగానికి ‘ఒక కొత్త దారి’ అవసరమని తెలిసినప్పటికీ, ఆ దిశగా అడుగులు పడలేదు. ప్రకృతి వ్యవసాయం వైపు కోటి మంది రైతులను మళ్ళిస్తామని ఆర్థిక మంత్రి చెప్పినా దానికి జరిపిన కేటాయింపులు ఏ మూలకూ రావు.వ్యవసాయ అభివృద్ధి బాగా ఉన్నది, ఆహార ఉత్పత్తి పెరుగుతున్నది అని కేంద్రప్రభుత్వం ప్రకటన చేసింది. కానీ రైతుల ఆదాయం గురించీ, దానిని రెట్టింపు చేసే లక్ష్యం గురించీ, ఈ మధ్య కాలంలో రైతులు ఎదుర్కొంటున్న ఆర్థిక నష్టాల గురించీ అటు ఆర్థిక సర్వేలోగానీ, ఇటు కేంద్ర బడ్జెట్లోగానీ ఎటువంటి ప్రస్తావనా చేయకపోగా, వారి సమస్య పరిష్కారానికి తగిన స్పందన కనబరచలేదు.భారత వ్యవసాయం మంచి పనితీరును కనబరిచిందనీ, అయితే భూతాపం పెరుగుతున్న నేపథ్యంలో ప్రకృతిలో సంభవిస్తున్న వాతావరణ ప్రతికూల ప్రభావాలు, పెరుగుతున్న పంట ఖర్చులు వంటి కొన్ని సవాళ్ల నేపథ్యంలో ఈ రంగానికి ‘ఒక కొత్త దారి’ అవసరమని జనవరి 31న పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2022–23 ఆర్థిక సర్వే తెలిపింది. 2023–24 ఆర్థిక సర్వే కూడా ఇంచుమించు ఇదే మాట చెప్పింది. అయినా 2024–25 సంవత్సరం బడ్జెట్లో కేటాయింపులు పాత బాటనే పట్టినాయి. ఎన్నికల నుంచి అధికార భారతీయ జనతా పార్టీ పాఠాలు నేర్చుకోలేదు. ప్రైవేటీకరణ, దిగుమతులు, విదేశీ విధానాల విషయాల్లో పాతబాటనే సాగుతోంది. మారుతున్న వాతావరణం వ్యవసాయంపై ప్రతికూల ప్రభావం చూపుతోందని చెప్పిన నివేదిక, ఆహార ఉత్పత్తి పెరిగింది అని చెబుతున్నది. ఈ వైరుద్ధ్యం మీద ఉన్నశంక తీర్చే ప్రయత్నం ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం చేయలేదు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వరదలు, అకాల వర్షాలు ఒక వైపు నష్టపరుస్తుంటే పంటల దిగుబడి ఎట్లా పెరుగుతున్నది? ప్రధానంగా, రైతుల ఆర్థిక పరిస్థితి మీద అంచనా మాత్రం చేయలేదు. బడ్జెట్ కేటాయింపులలో గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి కొత్త ఆలోచన విధానం ఏదీ కనపడటం లేదు. కేంద్ర ఆర్థిక మంత్రి తన ప్రసంగంలో 9 ప్రాధాన్యాలను ప్రస్తావించారు. అందులో మొట్టమొదటిది, వ్యవసాయంలో దిగుబడి పెంచడం, వ్యవసాయాన్ని దృఢంగా సవాళ్ళను ఎదుర్కొనే విధంగా తయారు చేయటం. అయితే, ఎట్లా సాధిస్తారు? బడ్జెట్లో కేటాయింపులతో ఇది సాధ్యమయ్యే పని కాదు. ప్రకృతి వ్యవసాయానికి కోటి మంది రైతులను మారుస్తామని తన ప్రసంగంలో ఆర్థిక మంత్రి చెప్పినా వాస్తవానికి ఇది కొత్త పథకం కాదు. 2023–24లో దానికి ఇచ్చింది రూ.459 కోట్లు మాత్రమే. ఈసారి అది కూడా తగ్గించి రూ.365.64 కోట్లు ఇచ్చారు. 2023–24లో ప్రకృతి వ్యవసాయానికి సవరించిన బడ్జెట్ రూ.100 కోట్లు మాత్రమే. ప్రకృతి వ్యవసాయం కాకుండా పంటల దిగుబడిని పెంచడానికి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్న ఉపాయం ఏది?వ్యవసాయానికి ఒక కొత్త దారి అవసరమని పదే పదే ఆర్థిక సర్వేలు చెప్పినా, వ్యవసాయ బడ్జెట్లో ఆ దిశగా ఆలోచన చేయలేదు. వ్యవసాయానికి కేటాయింపులు తగ్గించారు. 2022–23లో రూ.1,24,000 కోట్లుగా ఉన్న వ్యవసాయ కేటాయింపులు 2023– 24లో రూ.1,15,531.79 కోట్లకు తగ్గాయి. ఇది 7 శాతం తగ్గింపు. 2024–25లో వ్యవసాయ పరిశోధనలకు పెద్ద పీట వేస్తామని ఆర్థిక మంత్రి ప్రకటించినా పరిశోధనలకు ఇచ్చినవి మొత్తం రూ.9,941 కోట్లు మాత్రమే. ప్రకటించిన స్థాయిలో కేటాయింపులు లేవు. 2022–23లో ఇదే పద్దుకు ఇచ్చినవి రూ. 8,513.62 కోట్లు. 2023–24లో ఇచ్చినవి రూ.9,504 కోట్లు. పశుగణ అభివృద్ధికి, మత్స్య రంగానికి కలిపి రూ.7,137 కోట్లు ఈసారి ఇచ్చారు. అంతకుముందు సంవత్సరాలలో వరుసగా కేటాయించింది రూ.6576.62 కోట్లు, రూ.5,956.70 కోట్లు. నిధులు పెరిగినట్లు కనిపిస్తున్నప్పటికీ ఈ రంగాల అభివృద్ధిని నిలువరిస్తున్న మౌలిక అంశాల మీద దృష్టి పెట్టలేదు. వ్యవసాయ శాఖ ఆఫీసు ఖర్చులు 167 శాతం పెంచిన ప్రభుత్వం, ప్రధాన మంత్రి పంటల బీమా పథకానికి 13 శాతం కోత విధించింది. ఈసారి ఇచ్చింది కేవలం రూ.13,625 కోట్లు మాత్రమే. ప్రకృతి వైపరీత్యాలు పెరుగుతున్న నేపథ్యంలో, నకిలీ విత్తనాల బారినపడి, రైతులకు పంట నష్టం పెరుగుతుంటే ఆదుకునే ఒకే ఒక్క బీమా పథకాన్ని ఇంకా విస్తృతం చేయాల్సి ఉండగా తగ్గించడం శోచనీయం.కొత్త ఉపాధి కల్పన పథకం ప్రవేశపెట్టి రూ.10 వేల కోట్లు బడ్జెట్ కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. నెలవారీ జీతం తీసుకునే యువతకు (సంవత్సరానికి రూ.లక్ష వరకు) కొంత భృతి చెల్లించే ఈ పథకం లక్ష్యం అంతుబట్టకుండా ఉన్నది. గ్రామీణ భారతంలో ఉన్న ఉపాధికి, దాని రక్షణకు కేటాయింపులు చేయడం లేదు. ఈ పథకం కేవలం పారిశ్రామిక ఉత్పత్తి రంగాలకు రాయితీగా ఇస్తునట్టు కనబడుతున్నది. శ్రామిక శక్తికి అవసరమైన వసతుల కల్పనకు, సంక్షేమానికి, ఉద్యోగ రక్షణకు కాకుండా ఫ్యాక్టరీలలో ఉపాధికి ఈ రాయితీ ఇవ్వడం అంటే ఆ యా కంపెనీలకు ఇవ్వడమే! పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల శ్రామికుల ఉత్పాదకత శక్తి పడిపోతున్నది. ఆహార ద్రవ్యోల్బణం వల్ల సరి అయిన పరిమాణంలో పౌష్టిక ఆహారం శ్రామిక కుటుంబాలకు అందడం లేదు. ఈ సమస్యలను కేంద్ర ప్రభుత్వం గుర్తించకపోవటం దురదృష్టకరం. పర్యావరణానికి దోహదపడే చేతివృత్తుల ఉపాధికి ఈ పథకం ఇచ్చివుంటే బాగుండేది.వివిధ మార్గాల ద్వారా 2024–25లో కేంద్రం ఆశిస్తున్న ఆదాయం రూ. 46,80,115 కోట్లు. పోయిన సంవత్సరం మీద రాబోయే సంవత్సరంలో పెరిగిన కేంద్ర ప్రభుత్వ ఆదాయం రూ.2,50,000 కోట్లు. కానీ పెరిగిన ఈ ఆదాయాన్ని గ్రామీణ ప్రాంతాల మీద పెట్టడం లేదు. కరోనా లాంటి కష్టకాలంలో ఉపాధి ఇచ్చి ఆదుకున్న వ్యవసాయానికి కాకుండా ఇతర రంగాలకు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సంసిద్ధమైంది. కేంద్ర ప్రభుత్వం మీద అప్పుల భారం పెరుగుతున్నది. 2022–23 నాటికే ఇది రూ.1,54,78,987 కోట్లకు చేరింది. మౌలిక సదుపాయాల మీద పెట్టుబడులకు రూ. 11 లక్షల కోట్లు ప్రకటించింది ప్రభుత్వం. ఇది ఆశ్చర్యం కలిగించకమానదు. అభివృద్ధి అందరికీ కాకుండా కొందరికే పోతున్నది అని నివేదికలు చెబుతున్నప్పటికీ, అభివృద్ధి తీరులో మార్పులకు కేంద్ర ప్రభుత్వ సిద్ధంగా లేదు. వేల కోట్ల పెట్టుబడులతో నిర్మించే రోడ్లు, వంతెనలు వగైరా మౌలిక వసతులు నాసిరకం నిర్మాణం వల్ల, లేదా ప్రకృతి వైపరీత్యాల వల్ల కూలిపోతుంటే పరిస్థితిని సమీక్షించకుండా, సమస్య లోతులను గుర్తించకుండా పదే పదే ఈ రకమైన పెట్టుబడుల మీద ప్రజా ధనం వెచ్చించడం వృథా ప్రయాసే అవుతుంది.డా‘‘ దొంతి నరసింహారెడ్డి వ్యాసకర్త వ్యవసాయ రంగ నిపుణులు -
మలుపు తిప్పిన నిష్క్రమణ
అందరూ అనుమానిస్తున్నట్టే జరిగింది. చెప్పాలంటే అనివార్యమైనదే అయింది. మరో నాలుగు నెలల్లో అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు ఉన్నాయనగా రెండోసారి ఆ పదవికి ఎన్నికయ్యేందుకు చేస్తున్న ప్రచారం నుంచి డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత దేశాధ్యక్షుడు జో బైడెన్ పక్కకు తప్పుకున్నారు. వైట్‌హౌస్ పీఠానికి రేసు నుంచి వైదొలగుతున్నట్టు ఆదివారం ఆయన ఆకస్మికంగా చేసిన ప్రకటన ఒక విధంగా సంచలనమే. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఒక పార్టీ అభ్యర్థి ఇలా అర్ధంతరంగా బరిలో నుంచి వైదొలగిన ఘటన మునుపెన్నడూ జరగనిదే. అలాగని కొద్ది వారాలుగా అమెరికాలో జరుగుతున్న పరిణామాల రీత్యా బైడెన్ ప్రకటన మరీ అనూహ్యమేమీ కాదు. ఎన్నికల్లో పోటీ పడకున్నా, పదవీకాలం పూర్తయ్యే వరకు దేశాధ్యక్షుడిగా బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తానని ప్రకటించిన ఆయన తన స్థానంలో పార్టీ అభ్యర్థిగా కమలా హ్యారిస్ పేరు ప్రస్తావించడం, ఆమె అభ్యర్థిత్వాన్ని తోటి డెమోక్రాట్లు బలపరుస్తుండడంతో అమెరికా ఎన్నికల కథ ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. ఇటీవలే ప్రత్యర్థి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్న ఘటనతో అన్నీ ప్రతికూలంగా కనిపిస్తున్న వేళ డెమోక్రాటిక్ పార్టీకి ఇది కొత్త ఊపిరి పోస్తోంది. మళ్ళీ ఆశలు చిగురింపజేస్తోంది. ఇరవై తొమ్మిదేళ్ళ వయసులో జో బైడెన్ జాతీయస్థాయి రాజకీయ జీవితం ప్రారంభించారు. రిపబ్లికన్ సెనెటర్‌ను ఓడించడం ద్వారా 1972లో ఆయన కెరీర్ మొదలైంది. సరిగ్గా 52 ఏళ్ళ తర్వాత అమెరికా చరిత్రలో అత్యంత పెద్ద వయసు అధ్యక్షుడైన ఆయన యుద్ధం చేయకుండానే అస్త్రసన్యాసం చేయాల్సి వచ్చింది. నెలన్నర క్రితం కూడా బరిలో నుంచి తప్పుకొనేది లేదని బల్లగుద్ది చెప్పిన బైడెన్ ఇప్పుడిలాంటి నిర్ణయం తీసుకున్నారంటే... ఒక రకంగా అది ఆయన స్వయంకృతం. మరోరకంగా క్షేత్రస్థాయి పరిస్థితుల పట్ల పెరిగిన అవగాహన అని చెప్పక తప్పదు. ఆయనలో ఈ ప్రాప్తకాలజ్ఞతకు చాలా కారణాలే దోహదపడ్డాయి. ట్రంప్‌తో తొలి చర్చలోనే తడబడడం దగ్గర నుంచి నడకలో, నడతలో, మాటలో మార్పు తెచ్చిన వయోభారం, అభ్యర్థిని మార్చాలంటూ సొంత పార్టీ వారి నుంచే కొంతకాలంగా పెరుగుతున్న ఒత్తిడి వరకు ఇలా అనేకం అందులో ఉన్నాయి. అలాగే, ఆరునూరైనా సరే ముందనుకున్నదే చేసి తీరాలన్న మంకుపట్టు కన్నా రాజకీయాల్లో పట్టువిడుపులు ముఖ్యమనీ, కళ్ళెదుటి వాస్తవాలను బట్టి విజయం కోసం ఆట తీరు మార్చడం కీలకమనీ డెమోక్రాటిక్ పార్టీ అర్థం చేసుకుంది. అందుకే, బైడెన్ పోటీ ఉపసంహరణ నిర్ణయం తీసుకుంది. దీన్ని స్వాగతించాల్సిందే తప్ప తప్పుబట్టడానికి లేదు. ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన పదవికి డెమోక్రాటిక్ అభ్యర్థిగా బరిలో దిగేందుకు 59 ఏళ్ళ కమలా హ్యారిస్ ఇప్పుడు ముందు వరుసలో ఉన్నారు. భారతీయ మూలాలున్న ఈ లాయర్ మొదట అటార్నీ జనరల్‌గా ఎదిగి, ఆ పైన సెనెటరయ్యారు. నిజానికి, అమెరికా ఉపాధ్యక్ష పదవిని చేపట్టిన తొలి మహిళ, తొలి నల్లజాతి అమెరికన్, తొలి దక్షిణాసియా అమెరికన్ ఆమే! ఉపాధ్యక్షు రాలిగా ఆమె అద్భుతాలు చేయకపోయినా, చిందరవందరైన డెమోక్రాటిక్ పార్టీని మళ్ళీ చక్కదిద్ది గాడిన పెట్టగలరని ఆశ. ఇప్పుడు ఆమె ముందున్న అసలు సవాలదే. ఆమెను అభ్యర్థిగా ప్రకటించడానికి డెమోక్రాట్లు జాగు చేయకపోవచ్చు. అదే జరిగాక... ఎంతైనా స్త్రీ అనీ, ఆమె జాతి ఫలానా అనీ ప్రత్యర్థి ట్రంప్ బృందం ప్రచార దాడులు ప్రారంభించడం ఖాయం. అయితే, గతంలో ఇలానే బరాక్ ఒబామాపై ప్రచారాలు సాగినా, అవేవీ ఓటర్లు పట్టించుకోలేదు. అధ్యక్షుడిగా ఆయన రెండు సార్లు గెలిచారన్నది గమనార్హం. ధాటిగా మాట్లాడుతూ, ప్రచారం చేసే సత్తా ఉన్న కమల ఎన్నికల్లో అద్భుతం చేసినా ఆశ్చర్యం లేదు. ఒకవేళ ట్రంప్‌కు అడ్డుకట్ట వేయలేకున్నా, కనీసం ఆయన తలతిక్క నిర్ణయాలు తీసుకొనే వీలు లేని రీతిలో అమెరికన్ కాంగ్రెస్ ఎన్నికయ్యేలా చేయగలరని విశ్లేషణ. పునర్వైభవం కోసం డెమోక్రాట్లు అంతా ఏకమవుతున్న వేళ సొంత నియోజకవర్గమంటూ లేని కమల ముందుగా భాగస్వాముల్ని, సమర్థకుల్ని, సహాయకుల్ని, అనుభవజ్ఞులూ – ప్రతిభావంతులైన బృందాన్నీ సమకూర్చుకోవాలి. కీలక రాష్ట్రాల్లో వారే ఆమెకు అండ. నిజానికి, పరిస్థితులు చూస్తుంటే ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు అమెరికా ఎన్నికల ప్రజాస్వామ్యాన్ని నాయకత్వ కొరత పీడిస్తున్నట్టుంది. ఇటు డెమోక్రాట్లు, అటు రిపబ్లికన్లు – ఇరు పక్షాల్లోనూ ప్రజాదరణతో పాటు నేర్పు, ఓర్పున్న సమర్థులైన నాయకులెవరూ కనిపించడం లేదు. ఎవరూ రెండుసార్లకు మించి దేశాధ్యక్ష పదవిని చేపట్టరాదన్న అమెరికా రాజ్యాంగం ఒబామా లాంటి వారి పునఃప్రతిష్ఠకు అడ్డంకిగా మారింది. అది లోటే అయినా, ఆ నిబంధనలోని విస్తృత ప్రజాస్వామ్యస్ఫూర్తి, దూరాలోచన అర్థం చేసుకోదగినవే. అనుభవం లేనంత మాత్రాన అధ్యక్షబాధ్యతల్లో విఫలమవుతారనీ లేదు. మునుపటి అధ్యక్షులు చాలామంది అందుకు ఉదాహరణ. నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటే, ఏ కొత్త బాధ్యతా కష్టం కాదు. పైగా, ట్రంప్‌కు మళ్ళీ పట్టం కట్టడానికి సుతరామూ ఇష్టం లేని అమెరికన్లకు ఇప్పుడు కమల మినహా ప్రత్యామ్నాయం లేదు. అదీ ఆమెకు కలిసిరావచ్చు. అయితే, హత్యాయత్నం తర్వాత పిడికిలి పైకెత్తి, పోరాటానికి నినదించి హీరో స్థాయికి పెరిగిన ట్రంప్ ప్రాచుర్యాన్ని తక్కువగా అంచనా వేయలేం. యువ ఓటర్లను ఆకర్షించడం కోసం ఉపాధ్యక్ష పదవికి 39 ఏళ్ళ జె.డి. వాన్స్‌ను ఎంపిక చేసుకొని ట్రంప్ మంచి ఎత్తుగడే వేశారు. మొత్తానికి, రోజులు గడుస్తున్నకొద్దీ అమెరికా ఎన్నికలు మరింత ఆసక్తికరంగా మారడం ఖాయమనిపిస్తోంది. ఎందుకంటే, అయిపోయిందనుకున్న ఆట అసలు ఇప్పుడే మొదలైంది! -
దాశరథి స్మృతి
పూపరిమళాన్ని వెదజల్లే అగ్నిశిఖలాంటివాడు దాశరథి. చైత్రరథాలను తోలుతూనే, అభ్యుధయ పంథా సాగాడు. ఋతురాగాలను వర్ణిస్తూనే, ‘నిరుపేదవాని నెత్తురు చుక్కలో’ విప్లవాలను కాంచాడు. ‘అంగారమూ శృంగారమూ’ సమపాళ్లలో మేళవించివున్న సుకుమారుడు. ఆకాశమంత ఎదిగిన వామనుడు. స్నానం చేసి మడి కట్టుకున్నాక, సంస్కృతంలో తప్ప తెలుగులో మాట్లాడని సనాతన సంప్రదాయ కుటుంబంలో జన్మించిన దాశరథి– పన్నీటివంటి తెలుగునూ, పసందైన ఉర్దూ గజళ్లనూ ప్రేమించాడు. ‘ఏది కాకతి? ఎవతి రుద్రమ?/ ఎవడు రాయలు? ఎవడు సింగన?/ అన్ని నేనే, అంత నేనే/ వెలుగు నేనే, తెలుగు నేనే’ అని సగర్వంగా ప్రకటించాడు. ఒకప్పటి వరంగల్ జిల్లాలో భాగమైన ఖమ్మంలోని చిన గూడూరులో 1925 జూలై 22న జన్మించిన దాశరథి కృష్ణమాచార్య శతజయంతి సంవత్సరం నేటి నుంచి మొదలవుతుంది.దొరలు, దేశ్ముఖులు, జమీందారులు, జాగీర్దార్ల గుప్పిట సాగుభూములన్నీ ఉన్న రోజుల్లో; ఎర్రకోటపై నిజాం పతాకం ఎగురవేస్తాననీ, బంగాళాఖాతంలో నిజాం కాళ్లు కడుగుతాననీ కాశిం రజ్వీ బీరాలు పలుకుతున్న కాలంలో; హైదరాబాద్ రాష్ట్రాన్ని ఇండియన్ యూనియన్ లో కలపడం కోసం తొలుత కమ్యూనిస్టుగానూ, అటుపై స్టేట్ కాంగ్రెస్వాడిగానూ పోరాట పిడికిలి బిగించిన యోధుడు దాశరథి. ‘మధ్యయుగాల రాచరికపు బలా’న్నే తన కవితకు ప్రేరణగా మలుచుకుని సింహగర్జన చేసిన మహాకవి దాశరథి. ‘ఓ నిజాము పిశాచమా! కానరాడు/ నిన్ను బోలినరాజు మాకెన్నడేని/ తీగెలను తెంపి అగ్నిలో దింపినావు/ నా తెలంగాణ కోటిరత్నాల వీణ’ అని నినదించిన ‘అగ్నిధార’ దాశరథి. 1947 ప్రాంతంలో నిజాం పోలీసులు బంధించి తొలుత వరంగల్ సెంట్రల్ జైలుకూ, అనంతరం నిజామాబాద్ జైలుకూ ఆయన్ని తరలించారు. ముక్కిన బియ్యం, ఉడకని అన్నం వల్ల అనారోగ్యానికి గురైనా కవితా కన్యకను విడిచిపెట్టలేదు. కలం కాగితాలు దొరక్కపోయినా జైలు గోడల మీద బొగ్గుతో కవిత్వం రాయడం మానలేదు. తోటి ఖైదీలు పదే పదే చదువుతూ వాటిని కంఠస్థం చేసేవాళ్లు. ‘దగాకోరు బటాచోరు రజాకారు పోషకుడవు/ ఊళ్లకూళ్లు అగ్గిపెట్టి ఇళ్లన్నీ కొల్లగొట్టి... పెద్దరికం చేస్తావా మూడు కోట్ల చేతులు నీ/ మేడను పడదోస్తాయి...’ అంటూ ‘ఇదేమాట పదేపదే’ హెచ్చరించాడు.తెలంగాణను కలవరించిన ‘కవిసింహం’ దాశరథి. తెలంగాణ అనే మాటతో మరింకే కవీ ముడిపడనంతగా ముడిపడిన ‘అభ్యుదయ కవిసమ్రాట్’ దాశరథి. ‘కలిపి వేయుము నా తెలంగాణ తల్లి/ మూడు కోటుల నొక్కటే ముడి బిగించి’ అని కోరాడు. ‘తెలంగాణము రైతుదే/ ముసలి నక్కకు రాచరికమ్ము దక్కునే’ అని ప్రశ్నించాడు. ‘నేనురా తెలంగాణ నిగళాలు తెగగొట్టి ఆకాశమంత ఎత్తర్చినానూ’ అని ఘోషించాడు. ‘తెలంగాణమున గడ్డిపోచయును సంధించెను కృపాణమ్ము’ అని కీర్తించాడు. ‘మూగవోయిన కోటి తమ్ముల గళాల/ పాట పలికించి కవిరాజసమ్ము కూర్చి/ నా కలానకు బలమిచ్చి నడపినట్టి/ నా తెలంగాణ కోటిరత్నాల వీణ’ అని పలికాడు. ‘నాడు నేడును తెలగాణ మోడలేదు’ అని ఎలుగెత్తాడు. 1952లో స్థాపించిన ‘తెలంగాణ రచయితల సంఘం’కు మొదటి అధ్యక్షుడిగా వ్యవహరించాడు. అయినప్పటికీ ‘మహాంధ్ర సౌభాగ్య గీతి’ని చివరిదాకా ఆలపించాడు. ‘సమగ్రాంధ్ర దీపావళి సమైక్యాంధ్ర దీపావళి’ని జరుపుకొన్నాడు. సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆస్థాన కవిగా వ్యవహరించాడు.ఆంధ్ర నటుల నోట తెలంగాణ మాట ఇప్పుడు కమ్మగా వినిపిస్తున్నదంటే, ఆంధ్ర దర్శకులు తెలంగాణ పలుకుబడిని తమది కానిదని భావించడం లేదంటే– దాశరథి, ఇంకా అలాంటి ఎందరో తెలంగాణ రచయితలు, అటుపై జరిగిన తెలంగాణ ప్రత్యేక ఉద్యమాలు కారణం. దాశరథి లాంటివాళ్లు రెండు రకాల యుద్ధాలు చేశారు. ఉర్దూమయమైన హైదరాబాద్ రాష్ట్రంలో తెలుగు మాట్లాడటం కోసం ఒకటి, అది ‘తౌరక్యాంధ్రము’ అని ఈసడించే ఆంధ్రులతో మరొకటి! అయినా దాశరథి తాను రాసిన సినిమా పాటల్లో తెలంగాణ ‘తహజీబ్’ను ‘ఖుషీ ఖుషీగా’ చాటాడు. నిషాలనూ, హుషారులనూ మజామజాగా పాడాడు. అంతేనా? ‘ఏ దివిలో విరిసిన పారిజాతమో ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో’; ‘నా కంటిపాపలో నిలిచిపోరా నీ వెంట లోకాల గెలవనీరా’ అంటూ సాటి తెలుగు సినీ గేయరచయితలకు దీటుగా నిలిచాడు.భద్రాద్రి శ్రీరామచంద్రుని సేవలో తరించి దాశరథి అనే ఇంటిపేరును స్థిరం చేసుకున్నదని చెప్పే వంశం వాళ్లది. తమ్ముడు దాశరథి రంగాచార్య కూడా అంతే గట్టివాడైనప్పటికీ మనకు దాశరథి అంటే దాశరథి కృష్ణమాచార్యే. ‘మహాంధ్రోదయం’, ‘పునర్నవం’, ‘కవితాపుష్పకం’, ‘అమృతాభిషేకం’, ‘రుద్రవీణ’, ‘తిమిరంతో సమరం’ వంటి కవితా సంపుటాలు; ‘మహాశిల్పి జక్కన్న’ అనే చారిత్రక నవల;‘యాత్రాస్మృతి’ పేరిట వచన సొగసును తెలిపే ఆత్మకథ వెలువరించాడు. రేడియోలో పనిచేస్తూ లలిత గీతాలు, రేడియో నాటకాలు వినిపించాడు. భక్త రామదాసు మాదిరిగానే ‘దాశరథీ కరుణాపయోనిధీ’ మకుటంతో ‘అభినవ దాశరథీ శతకం’ రచించాడు. చక్కటి గాలిబ్ గీతాలను సరళ సుందరమైన తెలుగులోకి అనువదించాడు. ‘నాదు గుండె గాయము కుట్టు సూదికంట/ అశ్రుజలధార దారమై అవతరించె’ అంటూ గాలిబ్ ఉర్దూ ఆత్మను తెలుగు శరీరంలోకి ప్రవేశపెట్టాడు. ‘రోజూ కనబడే నక్షత్రాల్లోనే/ రోజూ కనబడని కొత్తదనం చూసి/ రోజూ పొందని ఆనందానుభూతి/ పొందడం అంటేనే కవిత్వం’ అని చెప్పిన సౌందర్యారాధకుడు దాశరథి 1987 నవంబర్ 5న అరవై రెండేళ్లకు గురుపూర్ణిమ నాడు పరమపదించాడు.