Editorial
-
రాష్ట్రపతి పాలనే శరణ్యం!
‘‘మేం అధికారంలోకి వస్తున్నాం, రాగానే ‘అకౌంట్స్’ సెటిల్ చేస్తాం. ఒక ఆరు నెలలపాటు మాలో కొందరం ఇదే పని మీద ఉంటాం. అందరి అకౌంట్లూ సెటిల్ చేస్తాం’’. ఎన్నికలకు ముందు ఒక తెలుగుదేశం నాయకురాలు టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పిన మాటలివి. ఇప్పుడా నాయకురాలు హోం మంత్రిగా పని చేస్తున్నారు.తెలుగుదేశం పార్టీ యువనేత అనేక సభల్లో తన చేతుల్లోని ‘రెడ్ బుక్’ను ప్రజలకు చూపెట్టారు. ఈ ‘రెడ్ బుక్’లో ప్రత్యర్థుల పేర్లను రాసుకుంటున్నాననీ, అధికారంలోకి రాగానే వారి సంగతి తేల్చేస్తాననీ హెచ్చరికలు జారీ చేశారు. తమ మాట వినని అధికారులకు కూడా ఈ హెచ్చరికలు వర్తిస్తాయనే బెదిరించే ప్రయత్నం చేశారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ఆంధ్రప్రదేశ్ అంతటా యువనేత, ‘రెడ్ బుక్’ బొమ్మలతో కూడిన హోర్డింగులు ప్రత్యక్షమయ్యాయి. ఆ యువనేత ఇప్పుడు క్యాబినెట్లో ఉన్నారు. కీలక నిర్ణయాలన్నీ ఆయనే తీసుకుంటున్నారని సమాచారం. ఈ రెండు ఉదాహరణలు మచ్చుకు మాత్రమే! తెలుగుదేశం ప్రభుత్వం కక్షపూరిత పాలనా విధానానికి దిగజారిందని చెప్పడానికి ఇటువంటి డజన్లకొద్దీ ఉదాహరణలు ఇవ్వవచ్చు. రాజ్యాంగ వ్యవస్థల్లోని అతి ప్రధాన విభాగమైన ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ బాహాటంగానే రాజ్యాంగేతర పాలనా పద్ధతులను ఎంచుకుంటున్నది. పర్యవసానాలు జనజీవితాన్ని భయ కంపితం చేస్తున్నాయి.అధికార పార్టీ కక్షలకూ, కార్పణ్యాలకూ ఆరు వారాల స్వల్పకాలంలోనే 32 మంది వైసీపీ అభిమానులు హతమైనట్టు వార్తలందుతున్నాయి. వినుకొండలోని ఒక ప్రధానమైన సెంటర్లో వేలాది మంది ప్రజల సమక్షంలో వైసీపీ కార్యకర్త రషీద్‌ను నరికి చంపిన దృశ్యం రాష్ట్ర ప్రజలకు దిగ్భ్రాంతిని కలిగించింది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులకు అద్దం పట్టింది. వైసీపీకి అనుకూలంగా ఉండే ఒక దళిత మహిళా రైతును తెలుగుదేశం కార్యకర్త అత్యంత పాశవికంగా ట్రాక్టర్‌తో తొక్కించి చంపిన దారుణం జరిగిన వారం రోజుల్లోనే రషీద్ దారుణ హత్య జరగడం రాష్ట్ర ప్రజలను కలవరపరుస్తున్నది.వైసీపీ కార్యకర్తలూ, అభిమానులపై ఈ ఆరు వారాల్లో 305 హత్యాయత్నాలు జరిగినట్టు వివరాలు అందుతున్నాయి. తిరువూరులో ఒక మునిసిపల్ కౌన్సిలర్‌నే రోడ్లపై పరుగెత్తిస్తూ కత్తులతో పొడిచిన వీడియో చిత్రం కూడా కలకలం సృష్టించింది. అధికార పార్టీ నాయకుల బెదిరింపులకు భయపడి 35 మంది ఆత్మహత్యలు చేసుకున్నట్టు వైసీపీ చెబుతున్నది. దాదాపు నాలుగు వేల కుటుంబాలు సొంత ఊరును వదిలి దూరంగా శరణార్థుల మాదిరిగా తలదాచుకుంటున్నాయి.వైసీపీ పార్లమెంట్ సభ్యుడు, లోక్‌సభలో ఆ పార్టీ నాయకుడైన మిథున్‌రెడ్డిపై దాడి చేశారు. ఆయన సొంత నియోజక వర్గంలో మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంట్లో కూర్చుని మాట్లాడుతున్న సందర్భంలో పథకం ప్రకారం రౌడీ మూకల్ని తరలించి రాళ్ల దాడి చేశారు. ఎంపీ వాహనంతో సహా డజనుకు పైగా వాహనాలకు నిప్పుపెట్టారు. 560 కుటుంబాల ఆస్తులను అధికార పార్టీ మూకలు ధ్వంసం చేశాయి. పరిపాలనా వికేంద్రీకరణకు ఆయువుపట్టు వంటి గ్రామ సచివాలయాలు, ఆర్బీకే సెంటర్లపై వందల సంఖ్యలో దాడులు జరిగాయి. వైఎస్ జగన్ ఆనవాళ్లు కనిపించకూడదన్న కక్షతో వేలాది శిలాఫలకాలను పగుల గొట్టారు.జరిగిన సంఘటనలనూ, వాటి తీవ్రతనూ గమనంలోకి తీసుకుంటే ఈ ఆరు వారాల కాలాన్ని ‘బీభత్స పాలన’ (reign of terror) గా పరిగణించాలి. ఈ నేపథ్యంలోనే నిన్న రషీద్ కుటుంబ పరామర్శకు వెళ్లిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మాట్లాడిన మాటలను అర్థం చేసుకోవాలి. రాష్ట్రంలో శాంతిభద్రతలకు తీవ్ర భంగం వాటిల్లిన నేపథ్యంలో రాష్ట్రపతి పాలన విధించాలని ఆయన డిమాండ్ చేశారు. బెంగాల్, తమిళనాడుల్లో ఎన్నికల తర్వాత బీజేపీ కార్యకర్తలపై జరిగిన స్వల్ప దాడులకే ఆ రాష్ట్రాలకు కేంద్ర బలగాలను పంపిన మోదీ సర్కార్ ఆంధ్రప్రదేశ్‌లోని తమ కూటమి ప్రభుత్వం బీభత్సపాలన చేస్తున్నా మిన్నకుండటం ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనం.ఒకపక్క తెలుగునాట మెజారిటీ మీడియా సంస్థలపై తెలుగుదేశం అనుకూలవర్గ గుత్తాధిపత్యం కొనసాగుతున్నది. మరోపక్క కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ భాగస్వామి. ఈ పరిస్థితుల్లో దేశంలో ఉన్న ప్రజాస్వామ్య మద్దతుదారులందరి దృష్టికీ జరుగుతున్న ఆగడాలను తీసుకురావడం కోసం ఈ బుధవారం ఢిల్లీలో ధర్నా చేయాలని వైసీపీ సంకల్పించింది. రాష్ట్రపతి పాలన అంశాన్ని గత కేంద్ర ప్రభుత్వాలు ఒక రాజకీయ ఆయుధంగా వాడుకున్నందు వల్ల దానిపై ప్రజాస్వామికవాదుల్లో భిన్నాభిప్రాయాలు నెలకొని ఉన్నాయి. ఈ కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో నెలకొని ఉన్న యథార్థ పరిస్థితులను జాతీయ స్థాయికి తీసుకొని వెళ్లడం వైసీపీకి అవసరం.భారత రాజ్యాంగం ఆర్టికల్ 355 ప్రకారం ‘విదేశీ దాడుల నుంచీ, అంతర్గత కల్లోలం నుంచీ రాష్ట్రాలను కాపాడే బాధ్యత యూనియన్ ప్రభుత్వానిదే. ఆ రాష్ట్రాల్లో రాజ్యాంగబద్ధమైన పాలన కొనసాగేలా చూడటం కూడా కేంద్రం బాధ్యత’. ఈ ఆర్టికల్‌ను మరింత విశదీకరిస్తే ‘రాజ్యాంగ సూత్రాలకు అనుగుణంగానే రాష్ట్రాల ప్రభుత్వాలు పరిపాలించాలి. రాష్ట్రంలోని ప్రతి పౌరుడికీ భద్రత కల్పించడంతోపాటు, అతని ఆత్మగౌరవానికి భంగం కలగకుండా చూడటం కూడా రాష్ట్ర ప్రభుత్వం విధి’. రాష్ట్రాల్లో రాజ్యాంగబద్ధమైన పరిపాలన జరగడం కోసం అవసరాన్ని బట్టి రాష్ట్రపతి పాలన విధించే విశేషాధికారాన్ని ఆర్టికల్ 356 ద్వారా రాష్ట్రపతికి రాజ్యాంగం కట్టబెట్టింది.రాష్ట్రాల్లో రాజ్యాంగ సూత్రాలకు అనుగుణంగా పరిపాలించడం కుదరని పరిస్థితులు ఏర్పడినట్లయితే ఆర్టికల్ 356 (1) ప్రకారం రాష్ట్రపతి పాలన విధించవచ్చు. ఆంధప్రదేశ్‌లో ఇప్పుడు శాంతిభద్రతల పరిస్థితికి ఏర్పడిన విఘాతం సాధారణమైనది కాదు. జరుగుతున్నవి చెదురుమదురు సంఘటనలు అసలే కావు. సీనియర్ జర్నలిస్టు కృష్ణంరాజు లెక్కగట్టిన వివరాల ప్రకారం శుక్రవారం నాటికే రోజుకు సగటున 130 హింసాత్మక సంఘటనలు జరిగాయి. నెలరోజుల్లో 22 మంది మహిళలు అత్యాచారాలకు గురయ్యారు. ఇందులో నలుగురిని చంపేశారు. అభం శుభం తెలియని చిన్నారులను కూడా చిదిమేశారు. ఒక బాలిక చనిపోయిందని చెబుతున్న పోలీసు యంత్రాంగం ఆమె శవాన్ని కూడా రెండు వారాలు దాటినా గుర్తించలేక పోయింది.‘ఎస్ఆర్ బొమ్మై వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా’ కేసులో రాష్ట్రపతి పాలనపై సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పును చెప్పింది. రాజకీయ కారణాలతో ఎడాపెడా రాష్ట్రపతి పాలన విధించే సంప్రదాయాలకు చెక్ పెడుతూనే, ఏయే సందర్భాల్లో విధించడం సమర్థనీయమో కూడా రాజ్యాంగ విస్తృత ధర్మాసనం తీర్పు (1994) చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వ చర్యలు రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధంగా ఉంటే రాష్ట్రపతి పాలన విధించవచ్చని అభిప్రాయపడింది. ఉదాహరణకు సెక్యులరిజం అనే అంశం రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగం. రాష్ట్ర ప్రభుత్వ చర్యలు సెక్యులరిజాన్ని బలహీనపరిచేవిగా ఉంటే ఆ రాష్ట్ర పరిస్థితులు 356వ అధికరణంలో పేర్కొన్నట్టుగా ఉన్నాయనే భావించాలి.రాజ్యాంగ పీఠికను రాజ్యాంగ మౌలిక స్వరూపానికి గుర్తుగా భావిస్తారు. ప్రజాస్వామ్యం, సెక్యులరిజంతోపాటు ప్రజలందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం – ఆలోచనా, భావప్రకటన, విశ్వాసం, ఆరాధనా స్వేచ్ఛ – అవకాశాల్లో, హోదాల్లో సమానత్వం – వ్యక్తిగత గౌరవం వంటి అంశాలకు కూడా పీఠిక ప్రాధాన్యమిచ్చింది. ఇందులో దేనికి భంగం కలిగినా రాజ్యాంగ మౌలిక స్వరూపంపై జరిగిన దాడిగానే పరిగణించాలి. భిన్నమైన రాజకీయ అభిప్రాయాలు కలిగి ఉండటాన్ని ప్రస్తుత ఏపీ ప్రభుత్వం నేరంగా పరిగణిస్తున్నది. ప్రతిపక్ష కార్యకర్తలను మోకాళ్లపై కూర్చోబెట్టి చేతులు జోడింపజేసి అధికారపక్షీయులు తమ నాయకునికి జైకొట్టించుకుంటున్నారు. ఇటువంటి వీడియోలు అసంఖ్యాకంగా యూట్యూబ్‌లో కనిపిస్తున్నాయి. ఈ చర్యలు అనైతికమే కాదు రాజ్యాంగ విరుద్ధం కూడా!రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్దేశపూర్వకంగా రాజ్యాంగ విరుద్ధ చర్యలకు పాల్పడడం, హింసను రెచ్చగొట్టడం కూడా రాష్ట్రపతి పాలన విధించడానికి అనువైన చర్యలుగా బొమ్మై కేసులోనే సుప్రీంకోర్టు తేల్చింది. ఉద్దేశపూర్వకంగానే తమ ప్రత్యర్థులపై దాడులు చేస్తామని, ‘అకౌంట్లు’ సెటిల్ చేస్తామని ఎన్నికల ముందునుంచే తెలుగుదేశం నాయకులు బహిరంగంగా చెబుతున్నారు. ప్రత్యర్థులపై కక్ష సాధించడమే ధ్యేయంగా ‘ఉద్దేశపూర్వకంగా’ రెడ్‌బుక్ హోర్డింగులను రాష్ట్రవ్యాపితంగా నెలకొల్పి, తమ పార్టీ కార్యకర్తల హింసాప్రవృత్తిని రెచ్చగొడుతున్నారు.రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తన రాజ్యాంగ విధులను, బాధ్యతలను విస్మరించడం కూడా రాష్ట్రపతి పాలనకు దారితీయాల్సిన పరిస్థితిగానే సర్వోన్నత న్యాయస్థానం పరిగణించింది. ఈ నలభై రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఐదువేల పైచిలుకు హింసాయుత ఘటనల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తన రాజ్యాంగ బాధ్యతలను విస్మరించింది. ఏ సందర్భంలోనూ పోలీసు యంత్రాంగం స్పందించకపోవడానికి వెనుకనున్న కారణం – రాష్ట్ర ప్రభుత్వ మౌఖిక ఆదేశాలే! ఎంపీ మిథున్‌రెడ్డిని తన నియోజకవర్గంలో పర్యటించకుండా రౌడీ మూకలు అడ్డుకున్న సందర్భంలో గానీ, వినుకొండ నడిబజారులో రషీద్‌ను తెగనరుకుతున్న సందర్భంలో గానీ పోలీసులు ప్రేక్షకపాత్రనే పోషించారు.ఈ హింసాకాండ – నరమేధం ఆరు మాసాలపాటు కొనసాగిస్తామని ఆ పార్టీ నాయకులు చెప్పుకొస్తున్నారు. ఇక ఉపేక్షించడం క్షంతవ్యం కాదు. తన కూటమి భాగస్వామ్య పక్షం పట్ల మోదీ ప్రభుత్వం ఒలకబోస్తున్న ధృతరాష్ట్ర ప్రేమకు వారు కూడా మూల్యం చెల్లించవలసి ఉంటుంది. ఈ ఆటవిక పాలనను ఇంకా కొనసాగించడం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక అవసరంగా మారింది. తమ పార్టీ ఇచ్చిన అలవికాని హామీలను అమలు చేయడం సాధ్యం కాదు. ప్రశ్నించడానికి ప్రతిపక్షాలు, ప్రజలు భయపడాలి. అందుకోసం ఈ బీభత్స పాలన కొనసాగాలి. రేపటి బడ్జెట్లో తమ ’సూపర్ సిక్స్’ హామీల అమలుకు అదనంగా లక్ష కోట్ల పైచిలుకు కావాలి. అందువల్ల పూర్తి బడ్జెట్‌ను మరోసారి వాయిదా వేసి, మళ్లీ ‘ఓట్ ఆన్ అకౌంట్’ పెట్టే అవకాశాలను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. అదే జరిగితే ఇది కూడా అసాధారణ చర్యే!వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
స్తంభించిన ప్రపంచం!
మైక్రోసాఫ్ట్ విండోస్ మొండికేయటంతో శుక్రవారం ఒక్కసారిగా అంతా అస్తవ్యస్తమైన తీరు ఐటీపై ప్రపంచం ఎంతగా ఆధారపడిందో కళ్లకు కట్టింది. అమెరికా, యూరప్, ఆస్ట్రేలియాలతోపాటు మన దేశంలోనూ అనేక సేవలకు అంతరాయం ఏర్పడింది. మ్యాక్, లైనెక్స్ ఆధారిత సేవలు యథావిధిగా పనిచేశాయి. 1872లో ఆంగ్ల రచయిత శామ్యూల్ బట్లర్ యంత్రాలకు సొంతంగా ఆలోచించే, తిరిగి తమంత తాము చేయగలిగే సామర్థ్యం వస్తే ఎలావుంటుందో చూపుతూ ఎరెవాన్ అనే వ్యంగ్య నవల రాశాడు. అది మరీ అతిగావుందని సమకాలికుల నుంచి విమర్శలొచ్చాయి. బహుశా ప్రపంచంలో అదే తొలి సైన్స్ ఫిక్షన్. ఆ కోవలో తర్వాత చాలా వచ్చాయి. సైబర్ దాడులు జరిగితే ప్రపంచం ఏమవుతుందన్న ఇతివృత్తాలతో చలనచిత్రాలు, టీవీ సీరియళ్లు వచ్చాయి. కానీ మైక్రోసాఫ్ట్ విండో స్కు సైబర్ నేరగాళ్లనుంచి కాకుండా అలాంటివారినుంచి రక్షిస్తామని చెప్పే ఒక సైబర్ సెక్యూరిటీ సంస్థ రూపొందించిన సాఫ్ట్‌వేర్‌వల్ల సమస్యలు తలెత్తి ఇంత పని జరగటం ఒక వైచిత్రి. మైక్రోసాఫ్ట్‌కు సైబర్ సెక్యూరిటీ సేవలందించే క్రౌడ్‌స్ట్రయిక్ అనే అమెరికా సంస్థ తాను రూపొందించిన యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్‌ను నవీకరించి కొత్తది విడుదల చేయగానే సమస్య తలెత్తిందంటున్నారు. దీంతో మైక్రోసాఫ్ట్ రూపొందించిన ఇన్‌ట్యూన్, వన్‌నోట్, షేర్‌పాయింట్, మైక్రోసాఫ్ట్ డిఫెండర్ వంటి అనేక యాప్‌లు నిరర్థకమయ్యాయి. ఒక్కొక్కటే మళ్లీ పునరుద్ధరిస్తున్నట్టు సంస్థ ప్రకటించింది. అయితే ఈలోగా అనేక దేశాల్లో కంప్యూటర్లు ఆగిపోయాయి. రైళ్లు, విమానయాన సేవలు నిలిచి పోవటం మొదలుకొని దుకాణాల్లో చెల్లింపుల ప్రక్రియ వరకూ అన్నిటికన్నీ స్తంభించిపోయాయి. చాలాచోట్ల వాణిజ్య, వ్యాపార లావాదేవీలూ, బ్యాంకింగ్, ఆరోగ్య సేవలూ, వార్తా ప్రసారాలూ, పోలీసు వ్యవస్థలూ, మెట్రో సర్వీసులూ, స్టాక్ ఎక్స్ఛేంజ్లూ నిలిచిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది సంస్థల్లో వినియోగించే టీమ్స్ సాఫ్ట్వేర్ సైతం ఆగిపోయింది. విమానాల్లో బోర్డింగ్ పాస్‌లు చేతితో రాసి ఇవ్వటం అందరూ మరిచి దాదాపు మూడు దశాబ్దాలవుతోంది. తాజా సమస్య అదెలా వుంటుందో ఈ తరానికి రుచి చూపింది.సమాచార సాంకేతికతలు వర్తమాన యుగంలో జీవితాన్ని వేగవంతం చేశాయి. కొన్ని శతాబ్దాలు ఇలాంటివేమీ లేకుండానే ప్రపంచం మనుగడ సాగించిందన్న సంగతినే మరిచేలా చేశాయి. అర చేతిలో ప్రపంచం మొత్తం ఇమిడిపోయింది. ఖండాంతరాల్లోని మారుమూల దేశాల్లోనివారితో సైతం ఎక్కడున్నవారైనా మాట్లాడగలిగే వెసులుబాటు అందుబాటులోకొచ్చింది. మనుష్య సంచారం అసాధ్యమనుకున్న చోటకు సైతం డ్రోన్లు వెళ్తున్నాయి. సాధారణ పనులు మొదలుకొని ప్రమాదం పొంచివుండే కార్యాలవరకూ రోబోలు చేస్తున్నాయి. సంక్లిష్ట సమస్యలకు చిటికెలో పరిష్కారం లభిస్తోంది. అందువల్ల ఉత్పాదకత పెరిగింది. చాలా తక్కువ వ్యవధిలో ఎక్కువ పని చేయగలిగే సామర్థ్యం మనుషుల సొంతమైంది. కావలసిన సమాచారం కోసం గూగుల్‌ని ఆశ్రయించేవారే నిమి షానికి 63 లక్షలమంది ఉన్నారంటే పరిస్థితేమిటో అర్థమవుతుంది. ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా సగటు ఆయుఃప్రమాణం 52.5 సంవత్సరాలైతే ఆరోగ్యరంగ సాంకేతికతలవల్ల అది ప్రస్తుతం 72 సంవత్సరాలని ఐక్యరాజ్యసమితి నిరుడు ప్రకటించింది. సమాచార సాంకేతికతలు అనేకచోట్ల మనిషి అవసరాన్ని తగ్గించాయి. అందువల్ల కొందరి ఉద్యోగావకాశాలకు ముప్పు వచ్చిన మాట కూడా వాస్తవం. కానీ ఇదివరకెన్నడూ వినని అనేక రకాల కొత్త అవకాశాలు లభించాయి. వచ్చే ఏడాదికల్లా ప్రపంచవ్యాప్తంగా ఈ సాంకేతికతల్లో 9 కోట్ల 70 లక్షల ఉద్యోగావకాశాలుంటాయని ఒక అంచనా. అయితే ఈ సాంకేతికతల వల్ల సాంఘిక జీవనం అస్తవ్యస్తమవుతున్నదని, మనిషి ఏకాకి అవుతున్నాడని, పర్యవసానంగా సమాజంలో అమానవీయత విస్తరించిందని, వ్యక్తి గోప్యతకు ముప్పు ఏర్పడిందని, పౌరుల జీవితాల్లోకి రాజ్యం చొరబాటు ఊహకందనంత పెరిగిందని కనబడు తూనేవుంది. తప్పుడు సమాచారం వ్యాప్తిచేసి లాభపడే శక్తులున్నట్టే, దానివల్ల నష్టపోతున్నవారూ అధికంగానే ఉన్నారు. ఈ సాంకేతికతల అభివృద్ధి పరుగులో పర్యావరణానికి కలుగుతున్న హాని గురించి ఎవరూ పట్టించుకోవటం లేదు. పారిశ్రామికీకరణ తర్వాత భవిష్యత్తు స్పృహ కొరవడి అడవుల, ఇతరేతర సహజ సంపదల విధ్వంసం, పర్యవసానంగా ప్రకృతి వైపరీత్యాలు క్రమేపీ పెరిగాయనుకుంటే ఐటీ అభివృద్ధి దీన్ని మరింత వేగవంతం చేసింది. పర్యావరణ అనుకూల సుస్థిరాభివృద్ధి వైపు దృష్టి సారించాలన్న వినతులు అరణ్యరోదనే అవుతున్నాయి. పాతికేళ్ల క్రితం వై2కె సమస్యతో ప్రపంచం తలకిందులవుతుందన్న ప్రచారం జరిగింది. ఈ సమస్య పరిష్కారానికి వేల కోట్లు ఖర్చుచేయటం తప్పనిసరన్న అంచనాలు వచ్చాయి. తీరా చాలా సులభంగానే దానికి పరిష్కారం దొరికింది. నిజానికి ఆ రోజుల్లో కంప్యూటర్ల వాడకం, వాటిపై ఆధారపడటం ఇప్పటితో పోలిస్తే తక్కువనే చెప్పాలి. కానీ తరచు సైబర్ దాడులతో తల్లడిల్లే సమా చార సాంకేతిక ప్రపంచంలో తాజా ఉదంతం ఒక పెద్ద కుదుపు. అప్రమత్తంగా లేకపోతే, విడుదల చేసేముందు ఒకటికి పదిసార్లు పరీక్షించి చూసుకోనట్టయితే ఒక సాఫ్ట్వేర్ ఎంతటి ఉత్పాతం సృష్టించగలదో తాజా ఉదంతం ఒక హెచ్చరిక. ఇంతవరకైతే ఫర్యాలేదు. కానీ దాదాపు అన్ని దేశాల రక్షణ వ్యవస్థలూ ఐటీతో ముడిపడివున్న వర్తమానంలో పొరపాటున సాఫ్ట్వేర్ లోపంతో కంప్యూటర్లు తప్పుగా అర్థం చేసుకుంటే పెనుముప్పు ఏర్పడుతుంది. ఏం జరిగిందో తెలుసుకునేలోపే మారణా యుధాలు భూగోళాన్ని వల్లకాడు చేస్తాయి. ఆ విషయంలో అప్రమత్తత అవసరం. -
సొంతగూటి సమస్యలు!
సాగినంత కాలం మనంతటి వాళ్ళు మరొకరు లేరనుకోవడం సహజమే. సాగనప్పుడు కూడా సమైక్యంగా నిలిచి, సవాళ్ళను ఎదుర్కొన్నప్పుడే సత్తా తెలుస్తుంది. రాజకీయంగా, చట్టసభల్లో సంఖ్యాపరంగా కీలకమైన ఉత్తరప్రదేశ్ (యూపీ)లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కొన్నేళ్ళుగా తిరుగు లేకుండా సాగింది. ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో ఎదురుదెబ్బలు తగిలేవరకు అత్యంత పటిష్ఠంగా కనిపించిన ఆ పార్టీ రాష్ట్రశాఖలో ఒక్కసారిగా ఇప్పుడు లుకలుకలు బయటకొస్తున్నాయి. ఎదురు లేని నేతగా గుర్తింపు తెచ్చుకున్న యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాటలకు మొదటిసారిగా సొంత పార్టీలోనే అసమ్మతి స్వరాలు వినిపిస్తున్నాయి. స్వయానా ఉపముఖ్యమంత్రే గొంతు పెంచడం, మంగళవారం ఢిల్లీ వెళ్ళి తమ పార్టీ జాతీయ అధ్యక్షుడితో సమావేశం కావడం, పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కూడా దేశ రాజధానికి చేరి పార్టీ అధ్యక్షుడితో – ప్రధానితో విడివిడిగా భేటీ అవడం... ఈ పరిణామాలన్నీ పార్టీలో అంతా సవ్యంగా లేదని తేటతెల్లం చేస్తున్నాయి. యూపీలో 10 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు త్వరలో రానున్న వేళ పార్టీలో అందరినీ మళ్ళీ ఒక్క తాటి మీదకు తీసుకురావడం ఇప్పుడు అధిష్ఠానానికి తలనొప్పిగా తయారైంది. లక్నోలో పార్టీ రాష్ట్రశాఖ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఆదివారం మాట్లాడుతూ... ఓట్ల బదలీ, మితిమీరిన ఆత్మవిశ్వాసం వల్ల ఎన్నికల్లో యూపీలో బీజేపీ విజయావకాశాలు దెబ్బతిన్నాయని యోగి వ్యాఖ్యానించారు. దాంతో ఇప్పుడీ తేనెతుట్టె కదిలింది. తర్వాత డిప్యూటీ సీఎం కేశవ్‌ప్రసాద్ మౌర్య ప్రసంగిస్తూ, ‘ప్రభుత్వం కన్నా పార్టీ పెద్దది. పార్టీ కన్నా ఎవరూ పెద్ద కాదు’ అనేశారు. కర్రు కాల్చి వాత పెట్టిన ఈ మాటలతో రచ్చ రాజుకుంది. ఒకప్పుడు మోదీకి శిష్యవారసుడిగా పేరుబడ్డ యోగికి ఇలాంటి పరిస్థితి ఎదురవడం చిత్రమే. అయితే, అది స్వయంకృతమే. ఇటీవలి ఎన్నికల్లో కమలనాథులకు లోక్‌సభలో కావాల్సిన మెజారిటీ రాకపోవడానికి ప్రధాన కారణం – యూపీ నిరాశపరచడమే అన్నది బహిరంగ రహస్యం. 2019లో రాష్ట్రంలోని 80 సీట్లకు గాను 62 గెల్చుకున్న ఆ పార్టీ ఈసారి 33కే పరిమితమైంది. ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ – కాంగ్రెస్ కూటమి 43 గెలిచి దూసుకొచ్చింది. చివరకు రామమందిరం నిర్మించామంటూ ఊరూవాడా గొప్పలు చెప్పుకున్నా, అయోధ్య నెలకొన్న ఫైజాబాద్‌లోనూ బీజేపీ ఓడిపోయింది. మోదీ సైతం వారణాసిలో గతంలో 4.79 లక్షల ఓట్ల మెజారిటీతో నెగ్గితే, ఈసారి 1.52 లక్షల ఓట్ల తేడాతోనే బయటపడ్డారు. ఇవన్నీ యోగి ప్రతిష్ఠను దెబ్బతీసినవే. ఇప్పటి దాకా సాగిన ఆయన ఒంటెద్దుపోకడను ఇరుకునపెట్టినవే.చివరకు మిత్రపక్షాల గొంతులు సైతం పైకి లేస్తున్నాయి. ‘బుల్డోజర్లు ప్రయోగిస్తే ఓట్లెలా వస్తాయి? ఉద్యోగ నియామకాల్లో ఓబీసీలు, ఎస్సీ, ఎస్టీల పట్ల దుర్విచక్షణ చూపడం పెద్ద తప్పు! అసలు మొన్న లోక్‌సభ ఎన్నికల్లో మాకు బీజేపీ నుంచి సహకారం లభించనే లేదు’ – ఇలా యూపీలో మిత్రపక్ష నేతలే యోగి సర్కార్‌ను తప్పు పడుతుండడం గమనార్హం. మొత్తం మీద సొంత గూటిలో సమస్యలు పెరుగుతున్నాయనేది వాస్తవం. రాష్ట్రంలో పరిస్థితి పూర్తిగా చేయి దాటక ముందే బీజేపీ కేంద్ర నాయకత్వం జోక్యం చేసుకొని, కీలక నిర్ణయం తీసుకోవాలంటూ సాక్షాత్తూ ఆ పార్టీ ఎమ్మెల్యేలే బాహాటంగా అంటున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. పదవి నుంచి యోగిని పక్కకు తప్పించవచ్చనే చర్చ సైతం రాజకీయ వర్గాల్లో మొదలైంది. దేశంలోనే అత్యంత పాపులర్ సీఎంగా నిన్న మొన్నటి సర్వేల్లోనూ ఉన్న మనిషిని పక్కనపెట్టడం పార్టీకి అంత తేలిక కాదు.ఏమంత తెలివైన పనీ కాదు. కాకపోతే, ఇది కచ్చితంగా బీజేపీ ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన సమయం. కీలక మంత్రులతో సహా అంతా గత హయాంకు కొనసాగింపు కేంద్ర సర్కారనే భావన కల్పిస్తున్న ఆ పార్టీ... ఎన్నికల్లో ఎదురుదెబ్బకు కారణాలు లోతుగా అధ్యయనం చేసుకోకపోతే చిక్కే!పెన్షన్ అంశం, పార్టీ కార్యకర్తల్లో పెరిగిన అసంతృప్తి, గత ఆరేళ్ళలో పదే పదే పేపర్ లీకులు, ప్రభుత్వోద్యోగాల స్థానంలో కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీ, అగ్నివీర్ల అంశం, రాజ్‌పుత్‌ల ఆగ్రహం, రాజ్యాంగాన్ని మార్చేస్తామన్న పార్టీ నేతల ప్రకటనలు – ఇలా అనేకం యూపీలో ఎదురుగాలి వీచేలా చేశాయని పార్టీ అంతర్గత నివేదిక. మరోపక్క కరడుగట్టిన బీజేపీ భక్త ఓటరు గణం చెక్కు చెదరకున్నా – దేశాభివృద్ధికి మోదీయే దిక్కని భావించినవారు, లబ్ధిదారులు, మోదీ ఆకర్షితుల్లో తరుగుదల కాషాయధ్వజుల జోరుకు పగ్గాలు వేసినట్టు స్వతంత్ర విశ్లేషకుల మాట. ఎవరి మాట ఏదైనా అంతా సవ్యంగా ఉంది, అసలేమీ జరగలేదన్నట్టుగా ఉష్ట్రపక్షిలా వ్యవహరిస్తే నష్టం బీజేపీకే! ఎన్నికల్లో తలబొప్పి కట్టిందని ముందు గుర్తించాలి. నిత్యం కార్యకర్తలతో చర్చిస్తూ, క్షేత్రస్థాయి స్పందన తీసుకుంటూ, నిరంతరం ఎన్నికల ధోరణిలోనే ఉంటుందని పేరున్న బీజేపీ మళ్ళీ మూలా ల్లోకి వెళ్ళాలి. మోదీ నామమే తారకమంత్రమన్న మూర్ఖత్వం మాని, కళ్ళు తెరిచి ప్రజాక్షేత్రంలోని చేదు నిజాలను విశ్లేషించాలి. పార్టీలో పరస్పర నిందారోపణల్ని మించిన మార్గమేదో అన్వేషించాలి. ముందు రోగం కనిపెడితేనే తర్వాత సరైన మందు కొనిపెట్టగలరు. బీజేపీ అధిష్ఠానం తొందర పడాల్సింది అందుకే. ఇటీవల దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్ని కల్లో 10 స్థానాల్లో ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమే గెలిచింది. అధికారపక్ష వ్యతిరేకత కనిపించడమే కాక, బీజేపీ ఓటు షేర్ తగ్గడం ఆ పార్టీకి పారాహుషార్ హెచ్చరికే. యూపీలో తాజా విజయాలతో సమాజ్‌వాదీ – కాంగ్రెస్ కూటమి సమధికోత్సాహంతో అడుగులు వేస్తోంది. ఇప్పుడు గనక బీజేపీ దిద్దుబాటు చర్యలతో, సొంత ఇంటిని చక్కబెట్టుకోకుంటే, ప్రతిపక్షం కీలకమైన యూపీలో మరింత విస్తరిస్తుంది. అప్పుడిక కమలనాథులు ఏం చేసినా చేతులు కాలాక ఆకులు పట్టుకోవడమే! -
జనశక్తి... శ్రమయుక్తి...
సగం నీళ్ళున్న గాజు గ్లాసును చూసి... సగం నిండుగా ఉందని ఆశావహ దృక్పథం అవలంబించవచ్చు. సగం ఖాళీయే అని నిరాశ పడనూవచ్చని మనస్తత్వ శాస్త్రవేత్తలు చెబుతారు. ప్రపంచ జనాభా గురించి, అందులోనూ భారత జనాభా పొంగు కుంగుల గురించి తాజాగా వెల్లడైన లెక్కల్ని చూసినప్పుడు సరిగ్గా ఇలాగే ఎవరి ఆలోచనలు, అంచనాలు వారివి. ఐక్యరాజ్యసమితి (ఐరాస) గత వారం విడుదల చేసిన ‘ప్రపంచ జనాభా దృశ్యం’ (డబ్ల్యూపీపీ) నివేదికలోని సమాచారం విస్తృత చర్చనీయాంశమైంది అందుకే! ప్రాథమికంగా ఈ నివేదిక ప్రపంచ జనసంఖ్య ఎలా మారనున్నదీ అంచనా వేసి, వివిధ ప్రాంతాలు, దేశాలపై దాని ప్రభావం ఎలా ఉండనుందో భవిష్యత్ దర్శనం చేస్తోంది. ప్రపంచ జనాభా గణనీయంగా పెరగనుందనీ, 2080ల నాటికి 1000 కోట్లు దాటుతుందనీ నివేదిక అంచనా. ఆ తరువాత నుంచి మొత్తం మీద జనాభా క్రమంగా తగ్గుతుందట. అలాగే, ఇప్పటికే ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశమని పేరుబడ్డ మన భారత్ గురించి కూడా ఈ నివేదిక కీలక అంచనాలు కట్టింది. ఫలితంగా ఈ నివేదిక ఆసక్తి రేపి, ఆలోచనలు పెంచుతోంది.అసలు 2011 తర్వాత మనం దేశంలో అధికారిక జనగణన జరగనే లేదు. దశాబ్దానికి ఒకసారి జరిపే కీలకమైన ఈ ప్రక్రియ నిజానికి 2021లోనే జరగాల్సి ఉంది. కరోనా కాలంలో ఈ బృహత్తర ప్రయత్నాన్ని ప్రభుత్వం పక్కనపెట్టింది. ఆ మహమ్మారి కథ ముగిసిన ఇన్నేళ్ళ తరువాత కూడా ఎందుకనో దానికి మోక్షం కలగనే లేదు. దేశ జనాభా స్థితిగతులపై స్పష్టమైన అవగాహన కల్పించి, పాలకులకూ, సంక్షేమ పథకాలకూ ఒక దిక్సూచిగా నిలవగలిగిన జనగణనపై ప్రభుత్వం ఎందుకనో ఇప్పటికీ ఉదాసీనత చూపుతోంది. ఈ పరిస్థితుల్లో ఐరాస వెలువరించిన ప్రతిష్ఠాత్మక డబ్ల్యూపీపీ నివేదిక మనకు మార్గదర్శి. లింగ, వయో భేదాల వారీగా వచ్చే 2100 వరకు భారత జనాభా ఎలా ఉండవచ్చనే అంచనాలను ఈ నివేదిక వివరంగా పేర్కొంది. జనసంఖ్యా సంబంధమైన సమాచారంలో ఈ ఐరాస నివేదిక ప్రపంచంలోనే అత్యంత ప్రామాణికమైనది కాబట్టి, సరిగ్గా ఉపయోగించు కుంటే భవిష్యత్ వ్యూహ రచన విషయంలో మన పాలకులకు ఇది బాగా పనికొస్తుంది. అధికారిక లెక్కలు లేకపోయినా, గడచిన 2023 జనవరి – జూలై నెలల మధ్యలోనే ప్రపంచంలోకెల్లా అత్యధిక జనాభా గల దేశంగా భారత్ అవతరించినట్టు వార్తలొచ్చాయి. గత వారపు ఐరాస లెక్క ప్రకారం ప్రస్తుతం మన దేశ జనాభా 145 కోట్లు. సమీప భవిష్యత్తులోనూ జనసంఖ్య విషయంలో చైనా కన్నా భారతే ముందుండనుంది. 2060లలో కానీ భారత జనాభాలో తగ్గుదల మొదలు కాదు. పెరుగుతున్న ఈ జనాభా తీరుతెన్నులు, మంచీచెడుల పట్ల సహజంగానే రకరకాల విశ్లేషణలు, వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. జనాభాతో పాటు పెరిగే కనీస అవసరాలను తీర్చడం అంత సులభమేమీ కాదన్నది నిజమే. అలాగని అధిక జనాభా అన్ని విధాలా నష్టమని అతిగా భయ పడాల్సిన అవసరమూ లేదు. అందుబాటులో ఉండే ఈ మానవ వనరులను సవ్యంగా వినియోగించుకోగలిగితే, ఏ దేశానికైనా దాని జనసంఖ్య అయాచిత వరమే అవుతుంది. ఐరాస నివేదిక ప్రకారం 2060ల వరకు, అంటే వచ్చే నాలుగు దశాబ్దాల పాటు భారత్‌కు అధిక జనాభా తప్పదు. దాన్ని సానుకూలంగా మార్చుకొని, ఎలా దేశాభివృద్ధికి సాధనం చేసుకోవాలన్నది కీలకం.పనిచేసే వయసు జనాభా భారత్‌లో ప్రస్తుతం 86 కోట్లుంది. 2049 వరకు ఈ సంఖ్య పెరు గుతూ పోయి, అప్పటికి వంద కోట్లు దాటుతుందట. 2047 కల్లా అభివృద్ధి చెందిన దేశంగా అవత రించాలని సంకల్పం చెబుతున్న మన పాలకులు నివేదికలోని ఈ అంచనాపై లోతుగా దృష్టి పెట్టాలి. పనిచేసే వయసులోని ఈ వంద కోట్ల మందిని ఎంత నిపుణులుగా తీర్చిదిద్దుతామన్నదాన్ని బట్టి దేశ పురోగతి ఉంటుంది. ఇటీవల గుజరాత్లో 10 ఉద్యోగాలకు 1,800 మంది – ముంబయ్‌లో 2 వేల ఉద్యోగాలకు 22 వేల మంది హాజరవడం, తొక్కిసలాట జరగడం దేశంలోని నిరుద్యోగ తీవ్రతకు మచ్చుతునక.‡ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం సమకాలీన అవసరాలకు తగ్గ నైపుణ్యాభివృద్ధిని కల్పించి, యువజనులను సరైన ఉపాధి మార్గంలో నడపడం ముఖ్యం. అలా చేయగలిగితే ఆర్థిక ముఖచిత్రమే మారిపోతుంది. లేదంటే ఇదే జనశక్తి ఆర్థిక, రాజకీయ అస్థిరతకు కారణమవుతుంది. ప్రపంచం సంగతికొస్తే రాగల దశాబ్దాల్లో సోమాలియా, రిపబ్లిక్ ఆఫ్ కాంగో సహా ప్రధానంగా ఆఫ్రికా ప్రాంతంలో జనాభా పెరగనుంది. విలువైన సహజ వనరులకు అవి నెలవైనందున భౌగోళిక రాజకీయ ప్రాబల్యం కోసం ఘర్షణలు తలెత్తవచ్చు. మన దాయాది పాకిస్తాన్ సైతం దాదాపు 39 కోట్ల జనాభాతో అమెరికాను సైతం దాటి, ప్రపంచ జనాభాలో మూడో స్థానంతో కీలకంగా మారనుంది. ఐరాస నివేదికలో మరో కీలకాంశం – ప్రపంచ జనాభా పతాక స్థాయికి చేరడానికి రెండు దశాబ్దాల ముందే 2060ల నుంచి భారత జనాభా తగ్గడం మొదలుపెడుతుంది. అదే సమయంలో పనిచేసే వయసులోని వారి సంఖ్య 2050 నుంచే తగ్గిపోనుంది. పనిచేసే వయసు (15నుంచి 65 ఏళ్ళు) కన్నా తక్కువ గానీ, ఎక్కువ గానీ ఉంటూ ఇతరులపై ఆధారపడేవారి నిష్పత్తి 2040 నుంచే పెరగనుంది. అంటే, నేటి యువశక్తి నైపుణ్యాలనూ, ఆర్జన మార్గాలనూ భవిష్యత్ అవసరాలకూ, ఆధారపడేవారికీ సరిపడేలా తీర్చిదిద్దడం ముఖ్యం. వృత్తివిద్యా శిక్షణ, అప్రెంటిస్ షిప్‌లతో మన చదువుల్ని కొంత పుంతలు తొక్కించాలి. లేదంటే, ఆధారపడేవారి సంఖ్య పెరిగాక చిక్కులు తప్పవు. ఏమైనా, రాగల మూడు దశాబ్దాలు ఇటు జనశక్తి, అటు శ్రమయుక్తితో సంఖ్యాపర మైన సానుకూలత మనదే. వాటితో ముడిపడ్డ చిక్కుల్ని ఎదుర్కొంటూ, ఈ శక్తిని సమర్థంగా వినియోగించుకోవడమే సవాలు. అందులో తడబడితే... అక్షరాలా ‘అమృతకాలం’ దాటిపోయినట్టే! -
అంతులేని అనిశ్చితి!
అయిదేళ్ళలో అయిదో ప్రధానమంత్రి వచ్చారు. పొరుగున నేపాల్‌లో నెలకొన్న రాజకీయ అనిశ్చితికి ఇదే దర్పణం. అనుభవజ్ఞుడైన కమ్యూనిస్టు రాజకీయ నేత ఖడ్గ ప్రసాద్ (కె.పి) శర్మ ఓలీ నూతన ప్రధానిగా సోమవారం ప్రమాణస్వీకారం చేయడంతో... కష్టాల్లో ఉన్న తమ దేశానికి మంచి రోజులు రావచ్చేమో అని నేపాలీయులు ఆశగా చూస్తున్నారు. దేశంలోకి పెట్టుబడులు, దరిమిలా కొత్తగా ఉద్యోగాలొస్తాయని నిరీక్షిస్తున్నారు. అయితే ఓలీకి ఇది కత్తి మీద సామే. 2018లో లాగా ఆయనేమీ శక్తిమంతమైన కమ్యూనిస్ట్ ప్రభుత్వానికి సారథ్యం వహించట్లేదు. ఇప్పుడాయన సంకీర్ణ ప్రభుత్వ సారథి. పైగా, సంకీర్ణంలో ఆయన పార్టీ మైనారిటీ. అది మరో బలహీనత. సైద్ధాంతికంగా పరస్పర విరుద్ధ భావాలున్న నేపాలీ కాంగ్రెస్ (ఎన్సీ), కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్–యూనిఫైడ్ మార్క్సిస్ట్ లెనినిస్ట్ (సీపీఎన్–యూఎంఎల్)లు రెండూ 2027లో ఎన్నికల వరకు ప్రధాని పదవిని సమాన కాలం పంచుకోవాలన్న అవగాహనతో అనైతికంగా జట్టు కట్టాయి. ఇది ఏ మేరకు ఫలిస్తుందో తెలీదు. అది నేపాల్ సమస్యనుకున్నా, చైనా అనుకూల ఓలీ గద్దెనెక్కడం భారత్‌కు ఇబ్బందికరమే! నేపాల్‌లో 239 ఏళ్ళ రాచరికాన్ని 2008లో రద్దు చేశారు. అదేమి శాపమో రాజరిక వ్యవస్థ రద్దయి రిపబ్లిక్‌గా మారినప్పటి నుంచి దేశం రాజకీయ అస్థిరతను ఎదుర్కొంటూనే ఉంది. ఇప్పటికి 13 ప్రభుత్వాలు మారాయి. ఏణ్ణర్ధ కాలంలో నాలుగుసార్లు సభలో బలపరీక్షను తట్టుకొని బయట పడ్డ ప్రధాని, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ – మావోయిస్ట్ సెంటర్ (సీపీఎన్–ఎంసీ) నేత పుష్ప కమల్ దహల్ ప్రచండ శుక్రవారం జూలై 12న మాత్రం ఓడిపోయారు. అధికార సంకీర్ణ భాగస్వామి అయిన మితవాద సీపీఎన్– యూఎంఎల్ మద్దతు ఉపసంహరణతో ఆయనకు ఓటమి తప్పలేదు. 72 ఏళ్ళ ఓలీ నాయకత్వంలో కొత్త సంకీర్ణ సర్కార్ గద్దెనెక్కింది. ఇప్పుడొచ్చింది 14వ ప్రభుత్వం. ప్రధాని పదవి ఓలీకి కొత్త కాదు. ఆయన పగ్గాలు పట్టడం ఇది నాలుగోసారి. ఏ ప్రభుత్వం వచ్చినా నేపాల్‌లో వెంటాడే పాత సమస్యలు ఓలీకీ తప్పవు. మరో రెండు నెలల్లో పార్లమెంట్లో మెజారిటీ నిరూపించుకోవాల్సిన ఆయన పరస్పర విరుద్ధ సిద్ధాంతాలతో నిండిన కూటమితో ప్రభుత్వాన్ని ఎలా నడపగలరో చూడాలి. ప్రచండ ప్రభుత్వాన్ని కూల్చి, కొత్త కూటమి కట్టి దేశంలోని రెండు పెద్ద పార్టీలు ఎన్సీ, యూఎంఎల్ సాహసమే చేశాయి. సుపరిపాలన, రాజకీయ సుస్థిరతలో ఈ సంకీర్ణం విఫలమైతే అది మొత్తం రాజ్యాంగం, వ్యవస్థల వైఫల్యమేనని ప్రజలు భావించే ప్రమాదం ఉంది. నిజానికి, ప్రపంచంలోని అత్యంత నిరుపేద దేశాల్లో నేపాల్ ఒకటి. రాజకీయ అనిశ్చితి కారణంగా అక్కడ పెట్టుబడులు పెట్టేవారు కరవయ్యారు. ఫలితంగా ఆర్థికాభివృద్ధి కుంటుపడింది. లక్షలాది యువకులు ఉద్యోగం, ఉపాధి నిమిత్తం మలేసియా, దక్షిణ కొరియా, మధ్యప్రాచ్యం దారి పట్టారు. పరిస్థితి ఎంతదాకా వెళ్ళిందంటే, గద్దెనెక్కిన ప్రభుత్వాలేవీ దేశాభివృద్ధికి ఇచ్చిన హామీలను నెరవేర్చ లేదు గనక మళ్ళీ రాచరికాన్నే పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ జనం అడపాదడపా నిరసన ప్రదర్శనలు కూడా చేశారు. భారత్‌తో పాటు పొరుగున ఉన్న మరో పెద్ద దేశం చైనా సైతం నేపాల్ లోని రాజకీయ పరిణామాలను ఆది నుంచి ఆసక్తిగా గమనిస్తూ వస్తున్నాయి. ఈ హిమాలయ దేశాభి వృద్ధికి ఆర్థిక సాయం అందించి, ప్రాథమిక వసతి సౌకర్యాలలో పెట్టుబడులు పెట్టడం ద్వారా ఈ ప్రాంత భౌగోళిక రాజకీయాల్లో ప్రాబల్యం సంపాదించాలని సహజంగానే ఢిల్లీ, బీజింగ్‌ల యత్నం. భౌగోళికంగా భారత, చైనాల మధ్య చిక్కుకుపోయిన నేపాల్‌కు మొదటి నుంచి మనతో స్నేహ సంబంధాలు ఎక్కువే. కానీ గత దశాబ్ద కాలంలో ఆ పరిస్థితి మారుతూ వచ్చింది. కమ్యూనిస్ట్ నేత ఓలీ తొలివిడత నేపాల్ ప్రధానిగా వ్యవహరించినప్పుడు 2015–16లో చైనాతో ప్రయాణ, సరుకు రవాణామార్గ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఫలితంగా, నేపాల్ విదేశీ వాణిజ్యంపై అప్పటి దాకా భారత్‌కు ఉన్న ఆధిపత్యానికి తెర పడింది. తాజాగా పడిపోయిన ప్రచండ సర్కార్ సైతం చైనా వైపు మొగ్గింది. నిన్న గాక మొన్న పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొనే ముందు ఆయన నేపాల్‌తో చైనాను కలిపే రైలు మార్గానికి పచ్చజెండా ఊపడం గమనార్హం. ఇది అనేక వందల కోట్ల డాలర్లతో డ్రాగన్ చేపట్టిన ప్రతిష్ఠాత్మక బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్ (బీఆర్ఐ) ప్రాజెక్ట్స్ కింద కొస్తుంది. దీంతో నేపాల్ – చైనా సరిహద్దు వెంట వసతులు పెరుగుతాయని పైకి అంటున్న మాట. నిజానికి సరిహద్దులో చైనాకు పట్టు పెంచే ఈ చర్య భారత్‌కు తలనొప్పి!అసలు బీఆర్ఐ ప్రాజెక్టుల వెనక చైనా వ్యూహం వేరు. చిన్న చిన్న దేశాలకు పెద్దయెత్తున అప్పులిస్తూ, ఋణ దౌత్యం ద్వారా ఆ యా ప్రాంతాల్లో భౌగోళిక రాజకీయాల్లో పైచేయి సాధించడం డ్రాగన్ ఎత్తుగడ. అందుకే, ప్రపంచ దేశాలు దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీర్ఘకాలంలో ఈ ప్రాజెక్ట్‌లు సంబంధిత చిన్నదేశాలకు భరించలేని భారమవుతాయి. చివరకు ఆ దేశాలు చైనా మాటకు తలూపాల్సి వస్తుంది. గతంలో చైనా ఇలాగే శ్రీలంకలో హంబన్‌తోట పోర్ట్‌కు ఋణమిచ్చింది. బాకీలు తీర్చడంలో విఫలమైన సింహళం చివరకు బాకీకి బదులు ఈక్విటీలిచ్చి, 2017లో ఆ పోర్ట్‌ను 99 ఏళ్ళ లీజుకు చైనాకు అప్పగించింది. ఇలాంటి కారణాల వల్లే బీఆర్ఐ పట్ల ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలున్నాయి. అలాగే బీఆర్ఐ కింద చైనా–పాక్ ఆర్థిక నడవా ప్రాజెక్ట్ అంటూ పాక్ ఆక్రమిత కశ్మీర్ గుండా దాన్ని చేపట్టడాన్ని భారత్ నిరసించింది. ఇప్పుడు భారత్ కన్నా చైనాకు మరింత సన్నిహితుడైన ఓలీ వల్ల నేపాల్ కూడా చైనా గుప్పిట్లోకి జారిపోవచ్చు. మనం తక్షణమే అప్రమత్తం కావాలి. మనతో సన్నిహిత సంబంధాలు కీలకమని ఓలీ గుర్తించేలా చేయాలి. ఓలీ సంకీర్ణంలో అధిక సంఖ్యాబలమున్న ఎన్సీ చిరకాలంగా భారత అనుకూల పార్టీ కావడం ఉన్నంతలో కొంత ఊరట. -
మారకుంటే... ముప్పు
రక్తసిక్త అమెరికా రాజకీయ చరిత్రలో కొత్త పేజీ అది. అమెరికా దేశాధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా నేడో రేపో అధికారికంగా ఖరారవుతారని భావిస్తున్న మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌పై పెన్సిల్వేనియా రాష్ట్రంలోని బట్లర్ వద్ద శనివారం జరిగిన కాల్పులు, హత్యాయత్నంతో అగ్రరాజ్యమే కాదు... యావత్ ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఓ ఎన్నికల ర్యాలీలో చేసిన ఈ దాడిలో దుండగుడి తుపాకీ తూటా ట్రంప్ కుడి చెవి పైభాగాన్ని రాసుకుంటూ, రక్తగాయం చేసి పోయింది. నిఘా వర్గాల భద్రతా వైఫల్యాన్ని బట్టబయలు చేసిన ఈ ఘటనలో అదృష్టవశాత్తూ ఆయన బయట పడ్డారు. ఎన్నికల బరిలో ట్రంప్‌కు ప్రధాన పోటీదారైన ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ సహా ప్రపంచ దేశాల నేతలందరూ ఈ దాడిని ఖండించారు. దాడికి పాల్పడిన ఇరవై ఏళ్ళ వ్యక్తిని భద్రతా దళాలు మట్టుబెట్టారన్న మాటే కానీ, ఈ దుశ్చర్య వెనుక అసలు కారణాలు లోతైన దర్యాప్తులో గానీ వెలికిరావు. తాజా దాడి ఘటనతో అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయావకాశాలు పెరుగుతాయని ఓ అంచనా. అది నిజం కావచ్చు. కానీ, అంతకన్నా కీలకమైనది ఇంకోటుంది. ప్రపంచంలోని అతి ప్రాచీన ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకొనే నేలపై ఆ స్ఫూర్తి వెనకపట్టు పట్టి, హింసాకాండ చెలరేగుతోంది. అమెరికా సమాజమే కాదు... ప్రపంచమంతా ఆందోళన చెందాల్సిన విషయమిది. అమెరికాలో నేతలపై దాడులు, హత్యాయత్నాలు ఇదే తొలిసారి కాదు. గతంలో అబ్రహామ్ లింకన్, జాన్ ఎఫ్. కెనడీ సహా నలుగురు దేశాధ్యక్షులు దుండగుల దుశ్చర్యలకు బలయ్యారు. రీగన్, థియోడర్ రూజ్వెల్ట్ లాంటి వాళ్ళు ప్రాణాలతో బయటపడ్డారు. అయితే, తాజా ఘటన జనంలో మునుపెన్నడూ లేని రీతిలో పేరుకున్న అణిచిపెట్టుకున్న ఆగ్రహానికీ, చీలికకూ ప్రతీకగా కనిపిస్తోంది. ఇంకా చెప్పాలంటే, ట్రంప్‌పై హత్యాయత్న ఘటన జరిగిన కొద్ది గంటల తరువాత కూడా అమెరికాలో రాజకీయ భాష రెచ్చగొట్టే విధంగా సాగడం విషాదం. ఘటన జరిగిన మూడు గంటలకే రక్తసిక్తమైన ట్రంప్ పిడికిలి బిగించిన ఫోటోలతో టీషర్ట్లు ఆన్లైన్లో అమ్మకానికి వచ్చేశాయి. ఈ జగడాలమారి వైఖరిని చూస్తుంటే, అగ్రరాజ్యంలో నేతలు పాఠాలు నేర్చుకున్నట్టు లేదు. విలువలు మరచిన మాటల దాడితో వేడెక్కుతున్న ఎన్నికల వాతావరణంలో ప్రజల్లో తీవ్రమైన ఇష్టానిష్టాలు ప్రబలి, పరిస్థితి ఎక్కడి దాకా పోయే ప్రమాదం ఉందో చెప్పడానికి ట్రంప్‌పై దాడి తార్కాణం. ఎన్నికలను యుద్ధంలా, రక్తం చిందించైనా సరే గెలవడమే పరమావధిగా భావించడం అతి పెద్ద తప్పు. ఇది అమెరికాయే కాక ప్రజాస్వామ్య దేశాలన్నీ విస్మరించలేని పాఠం. ఈ పాపంలో అన్ని పార్టీలకూ భాగం ఉంది. అనేక జాతులు, తెగలతో కూడిన అమెరికా రాజకీయ వ్యవస్థలో విభేదాలు సహజమే. కానీ, ట్రంప్ మళ్ళీ పగ్గాలు చేపడితే అది అమెరికాకు విలయమేనంటూ డెమొక్రాట్లు ప్రచారం సాగిస్తూ వచ్చారు. రిపబ్లికన్లు, ట్రంప్ సైతం సైద్ధాంతికంగా దిగజారుడుతనంలో తక్కువ తినలేదు. అమెరికాలో ప్రజాస్వామ్య ప్రభుత్వానికి ప్రతీకగా దేశ చట్టసభకు పీఠమైన యూఎస్ క్యాపిటల్ భవనాన్ని చుట్టుముట్టి, 2021 జనవరి 6న ట్రంప్ అనుకూల మూకలు యథేచ్ఛగా వ్యవహరించినప్పుడే ప్రజాస్వామ్య సౌధంలో ప్రమాద ఘంటికలు మోగాయి. తాజా హత్యాయత్నానికి డెమోక్రాట్లు, బైడెన్ల ప్రచార ధోరణే కారణంటూ ట్రంప్ సహచరులు విరుచుకుపడుతున్నారు. ఒక్కమాటలో... అగ్రరాజ్యమనీ, భూతల స్వర్గమనీ అనుకొనే అమెరికాలో పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. పెరుగుతున్న హింసాత్మక ధోరణులు, పార్టీల వారీగా నిలువునా చీలిపోయిన జనం, ఆగని రాజకీయ హింస అక్కడి సమాజాన్ని పట్టి పీడిస్తున్నాయి. ఆ దేశంలో తుపాకీ సంస్కృతి పెను సర్పమై బుసలు కొడుతోంది. అమెరికాలో తుపాకీలు బజారులో అతి సులభంగా కొనుక్కోవచ్చన్నది జగమెరిగిన సత్యం. అమెరికా రాజ్యాంగ ప్రకారం ఆత్మరక్షణార్థం ఆయుధాలు కలిగివుండే హక్కు పౌరులకుంది. అమెరికా వయోజనుల్లో ప్రతి పది మందిలో నలుగురింట్లో తుపాకులున్నాయి. చిత్రమేమిటంటే, 2023 జూన్ నాటి ప్యూ రిసెర్చ్ సెంటర్ సర్వే ప్రకారం తుపాకీ చేతిలో ఉంటే చట్టాన్ని పాటించే పౌరులుగా తమను తాము కాపాడుకోవచ్చని నూటికి 49 మంది అమెరికన్లు భావిస్తున్నారు. మరోమాటలో అమెరికన్ సమాజానికి దేశ శాంతి భద్రతలపై అంతటి అపనమ్మకం ఉందను కోవచ్చు. మరి, పౌరుల చేతిలోని ఈ ఆయుధాలు తప్పులు చేసేవారి చేతుల్లో పడితే పరిస్థితి ఏమిటన్నది ప్రశ్న. దేశంలో పాఠశాలలు, వాణిజ్యభవన సముదాయాల్లో విచక్షణారహితమైన కాల్పుల ఘటనల నుంచి తాజా హత్యాయత్నం దాకా అనేక సంఘటనలే అందుకు సమాధానాలు. తుపాకీలపై నియంత్రణలున్నంత మాత్రాన ఈ ఘటనలు జరగవని కాదు కానీ, లేనప్పుడు జరిగే అవకాశాలు ఇంకా ఎక్కువని ప్రత్యేకించి చెప్పనక్కర లేదు. ప్రస్తుతం అమెరికా ముందు, ఆ దేశ రాజకీయ నేతలు, పార్టీలు, ప్రజల ముందు ఓ పెను సవాలుంది. అంతకంతకూ దిగజారుతున్న పరిస్థితులు, పేట్రేగుతున్న రాజకీయ విద్వేషం, హింస లకు అడ్డుకట్ట వేయాల్సింది వారే. అన్ని పక్షాలూ కళ్ళు తెరిచి, ఈ పతనాన్ని నివారించాలి. అతివాదాన్ని నిరసించాలి. ఎన్నికల ప్రచారంలో పరస్పర గౌరవంతో సైద్ధాంతిక చర్చలే అనుసరణీయ మార్గమన్న తమ మౌలిక సూత్రాలనే మళ్ళీ ఆశ్రయించాలి. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదనీ, ఎన్నికలొక్కటే సామాజిక, రాజకీయ సమస్యలన్నిటికీ పరిష్కారమని ఓటర్లు తమ తీర్పు ద్వారా మరోసారి చాటాలి. అలా కాక, ఇలాంటి ఘటనల్ని వాటంగా చేసుకొని ఎవరికి వారు మరింత రెచ్చగొట్టుడు ధోరణికి దిగితే కష్టం. అది ప్రజాస్వామ్య వ్యవస్థకే పెను ప్రమాదం. -
ముసుగు మనుషులు
‘సుగుణం మేలిముసుగు, దుర్గుణం దొంగముసుగు’ అన్నాడు ఫ్రెంచ్ రచయిత, రాజనీతిజ్ఞుడు విక్టర్ హ్యూగో. ‘కరోనా’ కాలంలో మనుషులందరికీ ముసుగులు అనివార్యంగా మారాయి. మహమ్మారి కాలంలో మూతిని, ముక్కును కప్పి ఉంచే ముసుగులు లేకుంటే మాయదారి మహమ్మారి రోగం మరెందరిని మట్టుబెట్టేదో! ముసుగులు పలు రకాలు. అన్నింటినీ ఒకే గాటన కట్టేయలేం. పిడుక్కీ బియ్యానికీ ఒకటే మంత్రం కుదరదు కదా! అనివార్యంగా ధరించే ముసుగులు కొన్ని, మతాచారాల కారణంగా ధరించే ముసుగులు ఇంకొన్ని– ఇవి ప్రమాదకరమైన ముసుగులు కాదు. ఇలాంటి ముసుగుల చాటున ఉన్న మనుషులను గుర్తించడమూ అంత కష్టం కాదు.అయితే, వచ్చే చిక్కంతా దేవతా వస్త్రాల్లాంటి ముసుగులతో మన మధ్య తిరుగుతుండే మనుషులతోనే! కనిపించని ముసుగులు ధరించే మనుషుల బతుకుల్లో లెక్కలేనన్ని లొసుగులు ఉంటాయి. వాటిని దాచుకోవడానికే ముఖాలకు దేవతావస్త్రాల ముసుగులను ధరిస్తుంటారు. అలాంటివారు మన మధ్య ఉంటూ, మనతోనే సంచరిస్తుంటారు. మనం పనిచేసే కార్యాలయాల్లో, మనం నివసించే కాలనీల్లో ఉంటారు. ముసుగులకు చిరునవ్వులు అతికించుకుని మనల్ని పలకరిస్తుంటారు కూడా! వాళ్లను ముసుగులతో తప్ప ముఖాలతో గుర్తుపట్టలేని పరిస్థితికి చేరుకుం టాం. వాళ్ల అసలు ముఖాలను పోల్చుకునే సరికి కనిపించని ఊబిలో కూరుకుపోయి ఉంటాం.గాంభీర్యం చాలా గొప్పగా ఉంటుంది గాని, చాలా సందర్భాల్లో అది పిరికిపందలు ధరించే ముసుగు. అలాగే, పలు సందర్భాల్లో భూతదయా ప్రదర్శనలు క్రౌర్యానికి ముసుగు; బహిరంగ వితరణ విన్యాసాలు లుబ్ధబుద్ధులకు ముసుగు; నిరంతర నీతి ప్రవచనాలు అలవిమాలిన అవినీతి పనులకు ముసుగు; సర్వసంగ పరిత్యాగ వేషాలు సంపన్న వైభోగాలకు ముసుగు– ఇలా చెప్పుకుంటూ పోతే ముసుగుల జాబితా కొండవీటి చేంతాడు కంటే పొడవుగా తయారవుతుంది. ‘ఒక్క బంగారు ముసుగు అన్ని వైకల్యాలనూ కప్పిపుచ్చుతుంది’ అన్నాడు ఇంగ్లిష్ నాటక రచయిత థామస్ డెకర్. బంగారు ముసుగులు తొడుక్కోవడం అందరికీ సాధ్యమయ్యే పని కాదు. అందుకని తెలివిమంతులు దేవతా వస్త్రాల ముసుగులలో తమ తమ లొసుగులను కప్పిపుచ్చుకుంటూ, నిక్షేపంగా సమాజంలో పెద్దమనుషులుగా చలామణీ అయిపోతుంటారు. ఇలాంటి పెద్దమనుషుల అసలు ముఖాలేవో గుర్తించడం దుస్సాధ్యం. ముసుగుల మాటునున్న ముఖాలను గుర్తించేలోపే అమాయకులు కాటుకు గురైపోతారు. సాధారణంగా ముసుగులు నాటకాది ప్రదర్శనల వేషధారణలో భాగంగా ఉంటాయి. ఇటీవలి కాలంలో ముసుగులూ వేషాలూ దైనందిన జీవితంలో నిత్యకృత్యాలుగా మారిపోయాయి.అతి వినయం ధూర్త లక్షణానికి ముసుగు. ‘వదనం పద్మదళాకారం వచశ్చందన శీతలం/ హృదయం కర్తరీ తుల్యం, అతి వినయం ధూర్త లక్షణం’ అని మనకో సుభాషిత శ్లోకం ఉంది. అలాగే, ‘జటిలో ముండీ లుంభిత కేశః/ కాషాయాంబర బహుకృత వేష/ పశ్యన్నిపిచ న పశ్యతి మూఢో/ ఉదర నిమిత్తం బహుకృత వేషం’ అన్నాడు ఆదిశంకరుడు. పైన ఉదహరించిన సుభాషిత శ్లోకాన్ని, ఆదిశంకరుడి శ్లోకాన్ని గమనిస్తే, ముసుగులూ వేషాలూ ఆనాటి నుంచే ఉన్నట్లు అర్థమవుతుంది. కాకుంటే, అప్పటివి సత్తెకాలపు ముసుగులు. అతి తెలివిని ప్రదర్శించబోయిన అమాయకపు వేషాలు. ప్రధానంగా వాటి ప్రయోజనం ఉదర నిమిత్తానికే పరిమితమై ఉండేది. కేవలం ఉదర నిమిత్తం వేసుకునే ముసుగులూ వేషాల వల్ల ఎంతో కొంత వినోదమే తప్ప సమాజానికి పెద్దగా చేటు ఏమీ ఉండదు. అయినా, ఆనాటి సమాజంలోని ప్రాజ్ఞులు ముసుగులనూ, వేషాలనూ నిరసించేవారు. అలాంటివారి నిరసనల వల్ల ముసుగులూ వేషాలూ శ్రుతి మించకుండా ఉండేవి. అప్పట్లో ముసుగులకూ వేషాలకూ పెద్దగా ప్రచారం ఉండేది కాదు. అంతగా జనాదరణ ఉండేది కాదు. సినిమాలు వచ్చాక చిత్రవిచిత్ర వేషాలకు ప్రచారమూ పెరిగింది. నాటకాలు, సినిమాలు మాత్రమే వినోద సాధనాలుగా ఉన్న కాలంలో నటీనటులు మాత్రమే పాత్రోచిత వేషాలు వేసేవారు. సమాజంలో పెద్దమనుషుల ముసుగులో ఉండే వేషధారులు అక్కడక్కడా మాత్రమే ఉండేవారు. ఇక స్మార్ట్ఫోన్లు చేతిలోకి వచ్చాక మనుషులంతా వేషధారులుగా మారిపోయిన పరిస్థితి దాపురించింది. కృత్రిమ మేధ తోడయ్యాక మనుషుల అసలు ముఖాలను పోల్చుకోవడమే కష్టమయ్యే పరిస్థితి వాటిల్లింది. ఇప్పుడు నటీనటులే కాదు, వారికి పోటీగా దేశాధినేతలు కూడా యథాశక్తిగా దేవతావస్త్రాల ముసుగులను తొడుక్కుని, రకరకాల వేషాలతో నవరసాభినయ చాతుర్యంతో జనాలను విస్మయంలో ముంచెత్తుతున్నారు.‘స్మార్ట్’ వేషాల సంగతి ఒక ఎత్తయితే, ఇప్పుడు చైనాలో సిలికాన్ ముసుగులు అందుబాటులోకి వచ్చాయి. ఇవి అలాంటిలాంటివి కావు, అల్ట్రా రియలిస్టిక్ ముసుగులు. ఒక నలభయ్యేళ్ల వ్యక్తి ఒక వృద్ధుడి ముఖాన్ని పోలిన సిలికాన్ ముసుగు వేసుకుని నేరాలకు పాల్పడిన సంగతి బయటపడటంతో కలకలం మొదలైంది. సిలికాన్ ముసుగుల చట్టబద్ధతపై కూడా చర్చ మొదలైంది. అయినా, ఎంత సిలికాన్ ముసుగులైతే మాత్రం అవేమైనా దేవతా వస్త్రాల ముసుగులా? అసలు ముఖాలను ఎంతకాలం దాచగలవు పాపం?! -
హామీల అమలెప్పుడు ‘నెల’రాజా!
ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికీ అత్యంత జనాదరణ కలిగిన నాయకుడు జగన్మోహన్రెడ్డి అనే విషయం చంద్రబాబుకూ, ఆయన కొలువు కూటమికీ స్పష్టంగా తెలుసు. మొన్నటి ఎన్నికల ఫలితాలను ఎంత శాతం మేరకు ట్యాంపరింగ్ చేశారన్న రహస్యం కూడా వారికి మాత్రమే తెలుసు. అలవికాని హామీలతో తాము ఓటర్ల చెవుల్లో పెట్టిన పొద్దుతిరుగుడు పువ్వులు తమ వైపే తిరిగి ప్రశ్నించే సమయం ఆసన్నమైంది. ఆ దృష్టిని మళ్లించాలి. జనంలో జగన్‌కున్న ప్రతిష్ఠను తగ్గించాలి. ఇది వారి తక్షణ కర్తవ్యం.మంత్రిమండలి ప్రమాణ స్వీకారం చేసి నెలరోజులు దాటింది. చేసిన వాగ్దానాల అమలు సంగతి దేవుడెరుగు. మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను ఫలానా తేదీల వారీగా అమలు చేయబోతున్నామనే షెడ్యూల్‌కు కూడా జనం నోచుకోలేదు. ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించగానే సంతకం చేసిన ‘మెగా డీఎస్సీ’ ఫైలుతో ఫుట్‌బాల్ ఆడుతున్నారు. అందుతున్న సూచనలను బట్టి ఈ సంవత్సరాంతానికి కూడా ఆ పరీక్షలు పూర్తయ్యే అవకాశం లేదు. వచ్చే సంవత్సరం ఏప్రిల్ నాటికి పదవీ విరమణ చేయబోయే వారిని దృష్టిలో పెట్టుకొని ఆ సమయానికల్లా డీఎస్సీ నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.ఈ విద్యా సంవత్సరానికే భర్తీ అయ్యే విధంగా జగన్ ప్రభుత్వం 6,100 పోస్టులతో ప్రకటించిన డీఎస్సీని చాపచుట్టేసి, వచ్చే సంవత్సరం ఖాళీ అయ్యే పోస్టులను కూడా కలిపి దానికి ‘మెగా డీఎస్సీ’ అనే ముద్ర వేసి వచ్చే సంవత్సరమే భర్తీ చేయబోతున్నారన్నమాట. ఈ సంవత్సరమే కొలువుల్లో చేరవలసిన 6,100 మంది ఉపాధ్యాయ ఔత్సాహికుల నోళ్లల్లో ఆ విధంగా మట్టికొట్టారు. సర్కార్‌వారి తొలి అడుగే చీటింగ్!పెంచిన పెన్షన్లను తొలి మాసం నుంచే ఇస్తున్నట్టు భారీ ఆర్భాటం చేశారు. అంతకు ముందు ఇళ్లకు వెళ్లి లబ్ధిదారుల చేతిలో పెన్షన్ డబ్బులు పెట్టి వచ్చే సంప్రదాయాన్ని కొనసాగిస్తామన్నారు. కానీ ఆచరణ అందుకు విరుద్ధంగా జరిగింది. చాలామందిని గ్రామ సచివాలయాలకు పిలిపించి క్యూలైన్లో కూర్చోబెట్టుకున్నారు. కొన్నిచోట్ల స్థానిక తెలుగుదేశం నాయకుల ఇళ్లల్లోనే కార్యక్రమాన్ని జరిపించారు. ప్రతిచోటా మెడలో పార్టీ జెండాలు కప్పుకొని హడావిడి చేశారు. కొన్నిచోట్ల జనసేన జెండాలకూ, తెలుగుదేశం జెండాలకూ మధ్య క్రెడిట్ వార్ జరిగింది.పెన్షన్ల పంపిణీ అనే కార్యక్రమం గడిచిన ఐదేళ్లూ ఎలా జరిగింది? ఎప్పుడైనా రాజకీయ జోక్యం మాట విన్నామా? ఎక్కడైనా జెండాలు, కండువాలు కనిపించాయా? కుల మత రాజకీయ వర్గ లింగ భేదం లేకుండా లబ్ధిదారుల ఎంపిక జరిగింది. ఒకటో తేదీ సూర్యోదయం వేళకే ప్రతి ఇంటి గుమ్మానికీ వలంటీర్లు చేరుకొని పెన్షన్ సొమ్ములు అందజేశారు. ఎక్కడా రాజకీయం లేదు. కేవలం ప్రభుత్వ కార్యక్రమంగానే జరిగింది. లబ్ధిదారుల ఎంపికలోగానీ, పెన్షన్ల పంపిణీలో గానీ వైసీపీ కార్యకర్తలు జోక్యం చేసుకోలేదు. నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తి అంటే ఇదే కదా! ప్రభుత్వాలు పని చేయవలసిన తీరు ఇదే కదా!కొత్త సర్కారు వారి తొలి మాసం నిర్వాకంలోనే రాజకీయం గజ్జెలు కట్టుకొని దూకింది. తమ పార్టీ వారు కాదన్న కారణంతో చాలాచోట్ల పంపిణీ చేయలేదన్న ఆరోపణలు వచ్చాయి. ఈ ధోరణి ఇంకెంతదూరం వెళ్తుందో రానున్న రోజుల్లో పూర్తిగా అర్థమవుతుంది. పోనీ, మేనిఫెస్టోలో చెప్పినట్టుగా పెన్షన్ కార్యక్రమాన్ని సంపూర్ణంగా అమలు చేశారా? బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనారిటీలకు యాభయ్యేళ్లకు పెన్షన్ వర్తింపజేస్తామన్నారు! మొదటి నెలలోనే ఇవ్వడం కుదరకపోవచ్చు. కనీసం ఏ నెలలో, ఏ సంవత్సరంలో అమలు చేస్తారన్న ప్రకటనైనా రావాలి కదా! ఆ ముహూర్తం కోసం లక్షలాదిమంది ఎదురు చూస్తున్నారు.‘సూపర్ సిక్స్’ పేరుతో తెలుగుదేశం పార్టీ ఆరు మాసాలపాటు ఊదరగొట్టిన ఆరు హామీలనైనా వెంటనే అమలు చేయడం ప్రారంభించి ఉంటే... మిగిలిన మేనిఫెస్టోపై జనం నమ్మకం పెట్టుకునే అవకాశం ఉండేది. కనీసం వాటికి సంబంధించిన షెడ్యూల్ కూడా ఈ నెల రోజుల్లో విడుదల కాకపోవడం ఆందోళన కలిగిస్తున్నది. 20 లక్షల ఉద్యోగాలన్నారు, షెడ్యూల్ ప్లీజ్! నిరుద్యోగులందరికీ మూడు వేల రూపాయల నెలసరి భృతి అన్నారు. ఎప్పటి నుంచి? కనీసం ఒక ప్రకటన వచ్చినా వారికి కొంత ఊరట లభిస్తుంది.ప్రతి బిడ్డా తప్పనిసరిగా బడికి వెళ్లాలనీ, మంచి చదువు అభ్యసించాలన్న లక్ష్యంతో జగన్మోహన్రెడ్డి ‘అమ్మ ఒడి’ అనే ఒక వినూత్న కార్యక్రమాన్ని అమలు చేశారు. పిల్లల్ని బడికి పంపే విధంగా ప్రోత్సహించడం కోసం బడి వయసు పిల్లలున్న ప్రతి తల్లికీ ఏటా 15 వేల రూపాయలను అందజేశారు. ఈ కార్యక్రమం సత్ఫలితాలను ఇచ్చింది. ‘ఒక్క పదిహేను వేలే ఇవ్వడం ఏమిటి, మేము అధికారంలోకి వస్తే ఇంట్లో ఎందరు పిల్లలుంటే అన్ని పదిహేను వేలు ఇస్తామ’ని కూటమి టముకు వేసింది. ‘సూపర్ సిక్స్’లో రెండో కార్యక్రమంగా దాన్ని నమోదు చేసింది. సుమారు కోటిమంది పిల్లలు ఆశతో ఎదురు చూస్తున్నారు.పసిపిల్లల్ని ఆశపెట్టి మోసగించడం మహాపాపం. తేదీలు త్వరగా ప్రకటించండి. పుణ్యకాలం గడిచిపోతున్నది.వ్యవసాయ సీజన్ ప్రారంభానికి ముందే వైఎస్ జగన్ ప్రభుత్వం ‘రైతు భరోసా’ పేరుతో రైతుకు పెట్టుబడి ఖర్చును అందజేసేది. ఈ సాయాన్ని తాము 20 వేల రూపాయలకు పెంచుతామని మేనిఫెస్టోలో మూడో సిక్సర్ కొట్టారు. వ్యవసాయ సీజన్ ప్రారంభమైంది. అప్పుడే మృగశిర, ఆరుద్ర కార్తెలు ముగిసి పునర్వసు నడుస్తున్నది. సర్కారు సాయం చినుకులు ఎప్పుడు రాలుతాయో చెప్పే నాథుడు కనిపించడం లేదు. పందొమ్మిదో యేడు నుంచి యాభై తొమ్మిదేళ్ల వరకు ప్రతి మహిళకూ నెలకు పదిహేను వందలు అందజేస్తామని ‘సూపర్ సిక్స్’లో పేర్కొన్నారు.ఈ వయసులో ఉన్న మహిళల సంఖ్య సుమారు ఒక కోటీ ఎనభై లక్షలని అంచనా. వచ్చే నెల శ్రావణమాసం. శుభ దినాలు. ఆడపడుచులు ఆశతో ఎదురుచూస్తున్నారు. ఉచిత బస్సు ప్రయాణం గురించి ఇంకెప్పుడు చెబుతారని అడుగుతున్నారు. ఉచితంగా ఇచ్చే మూడు సిలిండర్లను ఏయే నెలల్లో ఇవ్వబోతున్నారో తెలుసుకోగోరుతున్నారు. ఈ నిరీక్షణంతా కూటమి వాగ్ధానాల్లో పెద్దపీట వేసిన ‘సూపర్ సిక్స్’ గురించే! చేంతాడు పొడవు మేనిఫెస్టో గురించిన ప్రస్తావన ఇంకా మిగిలే ఉంది.ఎన్నికలకు ముందు అన్ని రాష్ట్రాలూ, కేంద్ర ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లను ఆమోదించుకున్నాయి. ఈ నెలలో పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టవలసి ఉన్నది. ఈ నేపథ్యంలోనే మేనిఫెస్టో హామీల అమలుకు సంబంధించిన షెడ్యూల్ ప్రకటనకు ప్రాధాన్యం ఉన్నది. ఎందుకంటే వాటికి అవసరమైన కేటాయింపులను ఈ బడ్జెట్లో ప్రతిపాదించాలి. అటువంటి ప్రతిపాదనలకు చోటు దక్కనట్టయితే మేనిఫెస్టో అమలు అటకెక్కినట్టే! మరో ఏడాదిపాటు మాట్లాడే అవకాశం ఉండదు. ‘సూపర్ సిక్స్’ హామీలు, పెంచిన పెన్షన్ల అమలుకు మాత్రమే అదనంగా ఏటా లక్ష కోట్లకు పైగా నిధుల అవసరం ఉన్నదని ఒక అంచనా.గతంలో అమలులో ఉన్న పథకాలను యథావిధిగా అమలు చేస్తూనే (పెన్షన్లు, అమ్మ ఒడి మినహా) అదనంగా లక్ష కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది. అంత సొమ్మును అదనంగా ఎలా సమీకరించబోతున్నారో తేలవలసి ఉన్నది. వారి మాటల్లోనే చెప్పాలంటే, అడ్డగోలుగా అప్పులు చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని శ్రీలంకకు అమ్మమ్మగా మారుస్తారో, అమల్లో ఉన్న పథకాలకు అంటకత్తెర వేసి ఇచ్చిన హామీలను అటకెక్కిస్తారో పూర్తిస్థాయి బడ్జెట్లో తేలిపోతుంది. చంద్రబాబు ‘సంపద సృష్టి’ కార్యక్రమం ఇంకా ప్రారంభం కాలేదు. ఎప్పుడవుతుందో తెలియదు! అమరావతి నిర్మాణంతో సంపద సృష్టించడం అంటే మెజీషియన్ టోపీలోంచి పిల్లిని బయటకు తీయడం లాంటిదేనని ఆర్థిక నిపుణుల అభిప్రాయం.ఈ నేపథ్యంలో మేనిఫెస్టో హామీలు, సంక్షేమ పథకాల కొనసాగింపు తదితర అంశాల నుంచి జనం దృష్టిని మళ్లించే రాజకీయ టక్కుటమారాలే చంద్రబాబు సర్కార్ ముందున్న ప్రత్యామ్నాయమన్న అభిప్రాయం బలపడుతున్నది. అందువల్లనే ‘రెడ్ బుక్’ ఎజెండాగానే గడిచిన నెలరోజుల పరిపాలన జరిగింది. రాజకీయ ప్రత్యర్థులపై వెయ్యికి పైగా దాడులు, విధ్వంసాలు ఈ స్వల్పకాలంలో జరిగాయి. అనేకమందిపై కేసులు పెట్టారు. మేనిఫెస్టో అమలు గురించి అడిగే సాహసం ఎవరూ చేయకూడదు. అందుకోసమని రెడ్‌బుక్ టెర్రర్ను అమలుచేస్తున్నారు. సాక్షాత్తూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ముద్దాయిగా చేరుస్తూ ఒక దిక్కుమాలిన కేసును కూడా నమోదు చేశారు. మూడేళ్ల కింద సుప్రీంకోర్టు కొట్టివేసిన కేసును మళ్లీ నమోదు చేసి మాజీ ముఖ్యమంత్రిని, ఇద్దరు ఐపీఎస్ అధికారులను, ఒక ప్రభుత్వ డాక్టర్‌ను ముద్దాయిలుగా చేర్చడం ఎంత తెంపరితనమో అర్థం చేసుకోవచ్చు. నిన్నటిదాకా ముఖ్యమంత్రిగా వ్యవహరించిన వ్యక్తిపైనే కేసు పెడితే ప్రశ్నించే గొంతులు వణికిపోతాయని సర్కార్ పెద్దలు భావిస్తే అంతకన్నా అవివేకం ఉండదు. మేనిఫెస్టో హామీలు, ‘సూపర్ సిక్స్’ వాగ్దానాలు బడ్జెట్ పరీక్షను పాస్ కావలసిందే! లేకపోతే నిలదీసే గళాలు వేలల్లో, లక్షల్లో ఉండవు. కోట్ల గొంతుకలు విచ్చుకుంటాయి. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
విజ్ఞత మరిచిన నాటో!
వ్యక్తిగా ఒక్కరు తీసుకునే నిర్ణయం కంటే సమష్టి నిర్ణయమే ఎప్పుడూ సరైందని పెద్దలు చెబుతారు. కానీ వాషింగ్టన్లో మూడు రోజులపాటు జరిగిన నాటో 75 ఏళ్ల వార్షికోత్సవాల్లో దేశాధినేతలు మాట్లాడిన తీరు చూసినా, చివరిలో ప్రకటించిన డిక్లరేషన్ గమనించినా పరిణతికన్నా పరమ మూర్ఖత్వమే కనబడుతుంది. మూడో ప్రపంచ యుద్ధం దిశగా ప్రపంచ దేశాలను కదిలించే ప్రయత్నం దర్శనమిస్తుంది. రష్యా దురాక్రమణపై పోరాడుతున్న ఉక్రెయిన్‌కు వచ్చే ఏడాదిలోగా సైనిక సాయం రూపంలో కనీసం 4,000 కోట్ల యూరోలు అందజేయాలని నాటో సంకల్పించింది. అంటే రెండున్నరేళ్లుగా వేలాదిమంది మరణాలకూ, కోట్లాది డాలర్ల ఆస్తుల విధ్వంసానికీ కారణమైన ఆ యుద్ధాన్ని మరింత ఎగదోస్తూ పోతారన్నమాట! ఇంకా విడ్డూరమేమంటే నెదర్లాండ్స్ భూభాగంలో ఎఫ్–16 యుద్ధ విమానాలను మోహరించి రష్యాపై దాడులకు ఉక్రెయిన్ను పురిగొల్పుతారు. అంతేకాదు... ఎన్నడూ లేనివిధంగా తొలిసారి చైనాపై నాటో నిప్పులు చెరిగింది. దురాక్రమణ యుద్ధం కొనసాగించేందుకు రష్యాకు దన్నూ, ధైర్యమూ ఇస్తున్నది చైనాయేనని డిక్లరేషన్ ఆరోపించింది. నాటో ఎప్పుడూ చైనా జోలికి పోలేదు. అయిదేళ్లుగా చైనా వ్యవహారశైలిపై ఆందోళన వ్యక్తం చేస్తున్న మాట వాస్తవం. అది కూడా చాలా మర్యాదైన, మృదువైన పదాలతోనే! ఇప్పుడేమైంది? నాటో కొత్త రాగం వెనకున్న కారణమేమిటి?నిజానికి నాటో సదస్సులో ఈసారి జో బైడెన్ ఆరోగ్యం, ఉక్రెయిన్ యుద్ధం, గాజాలో ఇజ్రాయెల్ మారణకాండ ప్రస్తావనకొస్తాయని అందరూ ఆశించారు. అమెరికా అధ్యక్ష పదవి రేసులో బైడెన్ ఆరోగ్యం ప్రధాన అంశంగా మారింది. ఆయన కొనసాగితే ఓటమి ఖాయమని డెమాక్రాట్లు నిర్ణయానికొచ్చారు. సర్వేలు సైతం రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ బలపడుతున్న వైనాన్ని ఏకరువు పెడుతున్నాయి. అందుకే నాటో స్వరం మారిందని విశ్లేషకుల ఆరోపణ. ట్రంప్ వస్తే నాటో ఉనికే ప్రశ్నార్థకం కావటం ఖాయం. ఉక్రెయిన్ భవిష్యత్తు అనిశ్చితం. గాజాలో ఇజ్రాయెల్ మారణకాండ వల్ల ఇంతవరకూ 1,86,000 మంది పౌరులు మరణించారని లాన్సెట్ నివేదిక అంచనా. ఈ నేపథ్యంలో ఆ యుద్ధాన్ని నివారించటంపై నాటో దృష్టి పెడుతుందని అందరూ అంచనా వేయగా, తీరా దాని గురి చైనా వైపు మళ్లింది! మరోపక్క భారత్‌లో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెటీ... ఘర్షణల సమయంలో ‘వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి’ ఉండదంటూ పరోక్షంగా మనల్ని హెచ్చరించారు. ‘అవసర సమయాల్లో’ భారత్, అమెరికాలు సమష్టిగా పనిచేయాల్సి వుంటుందని చెప్పారు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటనపై లోపాయికారీగా మన అధికారుల వద్ద అమెరికా అసంతృప్తి వ్యక్తంచేసినట్టు కథనాలొచ్చాయి. గార్సెటీ దాన్నే బహిరంగంగా చెప్పారు. రెండేళ్లక్రితం తాను చెప్పిందేమిటో అమెరికాకు గుర్తుందా? ఉక్రెయిన్‌కు చేయూతగా పోలాండ్ నుంచి మిగ్–29 యుద్ధ విమానాలను రంగంలోకి దించటానికి గ్రీన్‌సిగ్నల్ ఇస్తామని 2022 మార్చిలో అమెరికా విదేశాంగమంత్రి బ్లింకెన్ చేసిన ప్రకటనను అమెరికా రక్షణ శాఖ తప్పుబట్టింది. ఇందువల్ల రష్యా తీవ్రంగా ప్రతిస్పందించే ప్రమాదం వుంటుందని పెంటగాన్ ప్రతినిధి జాన్ కిర్బీ హెచ్చరించారు. ఆ సమయంలోనే జో బైడెన్ సైతం ఉక్రెయిన్ గగనతలంపై నాటో నో ఫ్లైజోన్ విధించాలన్న ప్రతిపాదనను కొట్టిపడేశారు. దాన్ని అమలు చేయటానికి నాటో నేరుగా యుద్ధరంగంలోకి దిగాల్సివస్తుందని చెప్పారు. మూడో ప్రపంచ యుద్ధం ప్రారంభించాలని అమెరికా భావించటం లేదని అన్నారు. ఆఖరికి నాటోలో ప్రధాన భాగస్వాములైన జర్మనీ, ఫ్రాన్స్ సైతం అదే ఉద్దేశంతో ఉన్నాయి. నిరుడు ఫిబ్రవరిలో ఒక విందు సందర్భంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి జర్మనీ చాన్సలర్ ఓలోఫ్ షుల్జ్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమానియేల్ మేక్రాన్‌లు హితవు చెప్పారు. ‘ఈ యుద్ధంలో మీరు ఓడిపోబోతున్నారు. కనుక రష్యాతో చర్చలకు సిద్ధపడి సంధి చేసుకోవటం అత్యుత్తమం’ అని సలహా ఇచ్చారు. హిట్లర్ కాలంలో జర్మనీ తమ దేశాన్ని దురాక్రమించినా ఆ తర్వాత జర్మనీ, ఫ్రాన్స్‌లు రెండూ పాత వైరాన్ని మరిచిపోయిన సంగతిని గుర్తుచేశారు. ‘నువ్వు గొప్ప యుద్ధ వీరుడివే కావొచ్చుగానీ... ఈ వైరంలో రాజనీతిజ్ఞత అవసరం.నొప్పి కలిగించినా కష్టమైన నిర్ణయం తీసుకోవటానికి సిద్ధపడాలి’ అని జెలెన్స్కీకి మేక్రాన్ హితబోధ చేశారు. అవన్నీ ఏమైనట్టు? నాటో పుట్టిననాటి నుంచి దాన్ని కొనసాగించటానికి అమెరికా సాకులు వెదుకుతూనే వుంది. సోవియెట్ యూనియన్ పెను భూతమనీ, అది యూరప్‌ను కబళించబోతున్నదనీ ఊదరగొట్టి ఏర్పరిచిన నాటో ఉనికిని కాపాడేందుకు పడరాని పాట్లు పడుతోంది. 1989లో పనామా పాలకుడు నొరీగా, 1999లో సెర్బియా పాలకుడు స్లోబోదన్ మైలోసెవిక్, 2003లో ఇరాక్ అధినేత సద్దాం హుస్సేన్‌లు ప్రపంచాన్ని కబళించటానికి సిద్ధంగావున్న హిట్లర్లుగా చిత్రీకరించి ఆ దేశాలపై అమెరికా, నాటో దళాలు విరుచుకుపడి గుల్లచేశాయి. లక్షలాదిమంది అమాయక పౌరులు బలయ్యారు. ఇన్నాళ్లకు నాటోకు యూరప్‌లో పుతిన్ రూపంలో శత్రువు ‘తారసపడ్డాడు’. ఆ లంపటంలోకి ప్రపంచ దేశాలన్నిటినీ దించి లోకరక్షకుడిగా ఆవిర్భవించాలని అమెరికా తలపోస్తున్నట్టు కనబడుతోంది. రష్యా అణ్వాయుధాల ప్రయోగానికి దిగదని అమెరికా, నాటోలు నమ్ముతున్నట్టున్నాయి. ఇలాంటి తప్పుడు సూత్రీకరణలతో, అసంబద్ధ అంచనాలతో ప్రపంచాన్ని యుద్ధంలోకి నెడితే ఊహకందని పర్యవసానాలు ఏర్పడే ప్రమాదముంది. అగ్రరాజ్యాలు విజ్ఞతతో మెలిగి ఉక్రెయిన్, రష్యాల మధ్య సంధికి ప్రయత్నించాలి. ఆ మేరకు ప్రపంచ ప్రజానీకం ఒత్తిడి తేవాలి. -
పిల్లల భవితకు పెద్ద పరీక్ష!
సంస్కరణ అనుకొని తెచ్చినది తీరా సమస్యగా మారడమంటే ఇదే. వైద్యవిద్యా కోర్సుల్లో ప్రవేశం కోసం పదకొండేళ్ళ క్రితం అప్పటి యూపీఏ సర్కార్ తెచ్చిన జాతీయస్థాయి ప్రవేశపరీక్ష ‘నీట్’ వ్యవహారం చూస్తుంటే అదే అనిపిస్తోంది. పేపర్ లీకులు, ఇతర అక్రమాలు సహా అనేక వివాదాలు ముసురుకున్న తాజా ‘నీట్ – యూజీ 2024’ వ్యవహారమే అందుకు ప్రత్యక్ష సాక్ష్యం. అవకతవకలకు ఆలవాలమైన జాతీయ పరీక్షా ఏజెన్సీ (ఎన్టీఏ) – కొత్తగా పరీక్ష నిర్వహించాలని కోరుతున్న అభ్యర్థులు – అందుకు ససేమిరా అంటున్న కేంద్రం – సత్వర నిర్ణయానికి బదులు సన్నాయి నొక్కులు నొక్కుతున్న సుప్రీమ్ కోర్ట్... వీటన్నిటి మధ్య నీట్ ఓ అంతులేని కథ. మళ్ళీ పరీక్ష జరపాలని డిమాండ్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై తదుపరి విచారణను జూలై 18కి వాయిదా వేస్తున్నట్టు సుప్రీమ్ గురువారం ప్రకటించడంతో ఈ సీరియల్‌కు సశేషం కార్డు పడింది. ఈసారి వైద్యవిద్యలో ప్రవేశాలు ఆశించిన 24 లక్షలమందితో పాటు అర్హత సంపాదించిన 13 లక్షలమంది పరిస్థితి అగమ్య గోచరమైంది. లీక్ కథ బయటకొచ్చి ఇన్ని వారాలైనా, పునఃపరీక్ష మినహా మరో మార్గం కనబడట్లేదు. ఒకపక్క కోర్ట్ నిర్ణయం జాప్యమవుతుండగా... మరోపక్క రీ–టెస్ట్‌పై సంబంధిత పక్షాల్లో భిన్నాభిప్రాయాలున్నాయి. నిజానికి, ఉత్తరాదిన కొన్ని కేంద్రాల్లో ప్రశ్నపత్రం లీక్ సహా అనేక అక్రమాలు జరిగినట్టు ఇప్పటికే మీడియాలో బాహాటంగా వెల్లడైంది. సాక్షాత్తూ సుప్రీమ్ సైతం లీకేజీ నిజమేనని అభిప్రాయపడింది. కాకపోతే, వ్యవస్థీకృతంగా లీక్ జరిగిందా, ఏ మేరకు ఎలా జరిగింది, భవిష్యత్తులో కట్టుదిట్టంగా పరీక్షల నిర్వహణకు ఎలాంటి చర్యలు తీసుకోనున్నారన్న వివరాలు ఇవ్వాలంటూ కేంద్రాన్నీ, ఎన్టీఏనూ జూలై 8న ఆదేశించింది. అందుకు జవాబిచ్చే క్రమంలో కేంద్ర సర్కార్ పాత పరీక్ష రద్దు చేసి కొత్త పరీక్ష పెట్టడం హేతుబద్ధం కాదు పొమ్మంటోంది. అదేమంటే, విస్తృత స్థాయిలో అవకతవకలు జరిగాయనడానికి ఆధారాలు లేవంటూ ఐఐటీ – మద్రాస్ తాజాగా ఇచ్చిన సమగ్ర నివేదికను వత్తాసు తెచ్చుకుంటోంది. సహజంగానే ఎన్టీఏ సైతం కేంద్ర సర్కార్ వాదననే సమర్థిస్తోంది. పైగా, నీట్ ప్రశ్నపత్రం సామాజిక మాధ్యమాల్లో లీకైనట్టు వచ్చిన వీడియోనే ఫేక్ అనేసింది.ఏ విషయంలోనైనా అనుమానాలు రాకూడదు. వస్తే సమూలంగా నివృత్తి చేయాలి. అంతేకానీ అనుమానం పెనుభూతమైన వేళ... పాలకులు, ప్రభుత్వ సంస్థలు భీష్మించుకు కూర్చుంటే ఎలా? పైగా, లక్షలాది విద్యార్థుల భవితతో, వారి కుటుంబాల మానసిక ఆరోగ్యంతో ముడిపడిన అంశాన్ని వారి దృక్కోణం నుంచి సానుభూతితో చూడకపోవడం మరీ ఘోరం. నీట్ ఫలితాల్లో ఏవైనా నగరాల్లో, కేంద్రాల్లో పెద్దయెత్తున విద్యార్థులకు అనుచిత లబ్ధి చేకూరిందా అని తేల్చడం కోసం ఉన్నత విద్యాశాఖ అభ్యర్థన మేరకు ఐఐటీ– మద్రాస్ డేటా ఎనాలసిస్ చేసింది. మంచిదే! 2023, 2024ల్లోని టాప్ లక్షా నలభై వేల ర్యాంకులను ఈ ఎనాలసిస్‌లో భాగంగా విశ్లేషించారట. ఎక్కడా ఏ అక్రమం జరగలేదనీ, టాప్ ర్యాంకులు అన్ని నగరాలకూ విస్తరించాయనీ ఐఐటీ మాట. ఇక్కడే తిరకాసుంది. ప్రత్యేకించి ఈ ఏటి పరీక్షలో కొన్ని కేంద్రాల్లో చేతులు మారిన డబ్బులు, ముందస్తు లీకులు, డబ్బులిచ్చిన పిల్లలకు జవాబుల ప్రత్యేక శిక్షణ జరిగినట్టు ఆరోపణలున్నాయి. ఆ నిర్ణీత కేసులు వదిలేసి సర్వసాధారణంగా నీట్ నిర్వహణలో అక్రమాలే లేవంటూ క్లీన్చిట్ ఇస్తే సరిపోతుందా? గోధ్రా, పాట్నా లాంటి కొన్ని కేంద్రాలకే లీక్ పరిమితమైందన్న ఎన్టీఏ వాదన సరైనది కాదు. భౌగోళిక సరిహద్దుల్ని చెరిపేసిన సోషల్ మీడియా శకంలో ఒకచోట లీకైన పేపర్ అక్కడికే ఆగుతుందనుకోవడం అజ్ఞానం. పైగా రాజస్థాన్, ఢిల్లీ, జార్ఖండ్, బెంగాల్లోనూ లీకువీరుల అరెస్టులే నిదర్శనం. సీబీఐ దర్యాప్తును బట్టి దోషులైన అభ్యర్థులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్టీఏ హామీ ఇస్తోంది. అక్రమ ర్యాంకర్లపై చర్యలు సరే... వాళ్ళ నేరం వల్ల దేశవ్యాప్తంగా ఇబ్బంది పడి, ర్యాంకుల్లో వెనకబడ్డ లక్షలాది విద్యార్థుల మాటేమిటి? వారికి న్యాయం చేసేదెట్లా? ఇకపై పేపర్, పెన్ను వాడే ఓఎంఆర్ విధానం వదిలి కంప్యూటర్ ఆధారిత పరీక్షకు మారతారట. ప్రైవేట్ ఏజెన్సీలపై అతిగా ఆధారపడే ఆ పరీక్షలూ అంత నిర్దుష్టమేమీ కాదని ఎన్టీఏనే నిర్వహించే యూజీసీ నెట్ పరీక్ష రద్దుతో ఇటీవలే తేలిపోయింది. ఈ పరిస్థితుల్లో పరీక్షా విధానమే కాదు, ఎన్టీఏ సహా వ్యవస్థనే సమూలంగా ప్రక్షాళించడం అవసరం. రీ–టెస్ట్ పెట్టాలా వద్దా అన్న చర్చ కన్నా అది ఇంకా కీలకం. నిజానికి, ప్రతిభకు పెద్ద పీట వేయడానికి ఉద్దేశించిన పరీక్షా వ్యవస్థలు లోపభూయిష్ఠంగా మారుతున్న తీరు విచారకరం. చదువులు, ప్రవేశ పరీక్షల మొదలు ఉద్యోగాల పోటీ పరీక్షల దాకా అన్నిటి మీదా నీలినీడలే. ప్రశ్నపత్రాల లీకుల దగ్గర నుంచి జవాబు పత్రాల మూల్యాంకనంలో లోటుపాట్ల దాకా ప్రతి స్థాయిలోనూ నిత్యం వివాదమే. గత 7 ఏళ్ళలో, 15 రాష్ట్రాల్లో 70 లీకులతో 1.4 కోట్లమంది బాధితులే. వెరసి పరీక్షల ప్రాథమిక లక్ష్యమే దెబ్బతింటోంది. ఆగి, ఆలోచించాల్సిన తరుణమిది. మన పరీక్షల విధానం, వాటి ప్రాథమిక లక్ష్యం, ప్రయోజనాలపైన మథనం జరపాల్సి ఉంది. జ్ఞాపకశక్తిని పరీక్షించే పద్ధతుల నుంచి పక్కకు వచ్చి, జ్ఞానాన్ని పరిశీలించే మార్గాల వైపు ఇప్పటికైనా మన పరీక్షా వ్యవస్థలు మళ్ళాల్సి ఉంది. ప్రతి పరీక్షనూ వ్యాపారంగా మారుస్తూ, తప్పుడు మార్గాలు వెతుకుతున్న చీడపురుగుల్ని ఏరివేసేందుకు ప్రభుత్వాలు ఉపక్రమించాలి. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ల నుంచి పాఠశాల బోర్డ్ దాకా పబ్లిక్ పరీక్షల్లో అక్రమాల నిరోధానికి జూన్ 21 నుంచి పార్లమెంట్ ఓ కొత్త చట్టం తెచ్చింది. అది ఏ మేరకు అవతవకల్ని అరికడుతుందో చూడాలి. ఏమైనా, పరీక్ష జ్ఞానానికి గీటురాయిగా ఉండాలే కానీ, ప్రతిసారీ పిల్లలకు శిక్షగా మారితేనే కష్టం. -
సత్వర చర్యలే రక్ష!
మంచుకొండల సీమ మళ్ళీ నెత్తురోడుతోంది. జమ్మూ– కశ్మీర్‌లోని కఠువా జిల్లా మాచేడీలో భారత సైనిక గస్తీ బృందంపై సాయుధ తీవ్రవాదుల దాడి సహా 48 గంటల్లో నాలుగు ఘటనలు జరగడమే అందుకు తాజా సాక్ష్యం. కఠువా ఘటనలో ఒక జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్‌తో సహా అయిదుగురు సైనిక సిబ్బంది, ఆ వెంటనే మరో ఘటనలో మరో ఇద్దరు అసువులు బాయడం పెరుగుతున్న ప్రమాదాన్ని సూచిస్తోంది. సాధారణ తీవ్రవాదులు కాక సుశిక్షితులైన సాయుధ మూక కఠువా దుశ్చర్యకు పాల్పడడం సమస్య కొత్త లోతుల్ని చెబుతోంది. ఈ ఏడాది ఇంతవరకు జమ్మూలో ఇలాంటి ప్రధాన ఘటనలే అరడజనుకు పైగా సంభవించాయి. చిన్నాచితకా వాటి సంగతి సరేసరి. ఒక్క జూన్‌లోనే నాలుగు తీవ్రవాద దాడుల్లో, రెండు రోజుల్లో 9 మంది మరణించారు. ప్రభుత్వ వ్యూహాల వైఫల్యం, పాలకులు కశ్మీర్‌పై దృష్టి పెట్టి జమ్మూను తేలికగా తీసుకోవడం... ఏదైతేనేం తీవ్రవాదులు తమ కార్యాచరణను కశ్మీర్ లోయ నుంచి జమ్మూకు బదలాయించారు. అలా తీవ్రవాదానికి ఇప్పుడు రాజౌరీ – పూంఛ్ ప్రాంతం కొత్త కేంద్రమైంది. సుప్రీమ్ కోర్ట్ ఆదేశం మేరకు సెప్టెంబర్ 30లోగా రాష్ట్రంలో ఎన్నికలు జరపాల్సి ఉన్నందున తీవ్రవాదానికి ముకుతాడు వేయడం తక్షణావసరం.పాతికేళ్ళ క్రితం తీవ్రవాదానికి అడ్డా అయినా, అనంతరం ప్రభుత్వ చర్యలు, స్థానికుల సహకారంతో గత రెండు దశాబ్దాలుగా ప్రశాంతంగా ఉన్న జమ్మూ ఇప్పుడు మళ్ళీ అగ్నిగుండం కావడం విషాదం. గమనిస్తే, ముష్కర దాడులతో జమ్మూలో బలైన సామాన్యులు, భద్రతా సిబ్బంది సంఖ్య గత ఏడాది జనవరి నుంచి ఇప్పటికి రెట్టింపయింది. తీవ్రవాద కేంద్రం మారిందడానికి ఇది స్పష్టమైన సూచిక. 2023 డిసెంబర్లో రాజౌరీ ఘటనలో నలుగురు సైనికులను కోల్పోయాం. తరవాత కుల్గామ్ ఎన్కౌంటర్లో మరో ఇద్దరు. ఇలా కొద్ది నెలల్లోనే సాహస జవాన్లను పలువురిని పోగొట్టుకోవడం విచారకరం. ప్రతి ప్రాణం విలువైనదే. అందులోనూ వీర సైనికుల ప్రాణత్యాగం వెల కట్టలేనిది. గత నెలలో వరుస ఘటనలతో తీవ్రవాదులు తెగబడ్డారు. జూన్ 9న పర్యాటకుల బస్సుపై దాడిలో 9మంది మరణించిన ఘటన, అది మరువక ముందే జూన్ 26న దోడాలో ఘటన... ఇవన్నీ అస్థిరతను సృష్టించాలని చూస్తున్న అదృశ్య శక్తుల విజృంభణకు సంకేతాలు. కశ్మీర్లో లోక్‌సభ ఎన్నికల్లో ఎన్నో ఏళ్ళ తర్వాత జనం ఉత్సాహంగా పాల్గొనడంతో, అసెంబ్లీ ఎన్నిక లకు పాలకులు సన్నద్ధమవుతున్నారు. దానికి అడ్డం కొట్టడానికే తాజా ఉగ్ర దుశ్చర్యలని విశ్లేషణ. ఢిల్లీలో మోదీ సర్కార్ మూడోసారి కొలువు తీరినరోజే తీవ్రవాదులు పేట్రేగడం యాదృచ్ఛికం కాదు. ఈ మొత్తం వ్యవహారంలో దాయాది పాకిస్తాన్ పాత్రను విస్మరించలేం. భద్రత, విదేశాంగ విధానంలో తీవ్రవాదాన్ని క్రియాశీలంగా, అదే సమయంలో దొంగచాటు సాధనంగా చేసుకోవడం ఆ దేశం ఆది నుంచీ చేస్తున్నదే. ఆర్థికంగా కష్టాల్లో పడి, అంతర్జాతీయంగా ప్రతిష్ఠ తగ్గినా సరిహద్దులో అది తన కుటిల బుద్ధిని వదులుకోవట్లేదు. స్థానికులను ముందుంచి, తాను వెనుక నుంచి కథ నడిపే వ్యూహాన్ని జమ్మూలో అనుసరిస్తోంది. నిజానికి, జమ్మూ – కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిన 370వ అధికరణాన్ని రద్దు చేశాక కేంద్రం ఉక్కుపాదంతో వ్యవహరించింది. రద్దు అనంతరం సైతం అంతా సవ్యంగా ఉందని చెప్పడం, చూపడంలో మోదీ సర్కార్ బిజీగా ఉంది. దానికి తగ్గట్టే 2017 – 2022 మధ్య చొరబాటుదారుల సంఖ్య 53 నుంచి 14కి తగ్గిందనీ, దుశ్చర్యలు 228 నుంచి 125కి దిగివచ్చాయనీ హోమ్ శాఖ లెక్క. కానీ, పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. క్షేత్రస్థాయి పరిస్థితులు సజావుగా లేవనీ, వాటిని పాలకులు పట్టించుకోవట్లేదనీ ప్రతిపక్షాలు ఆరోపి స్తున్నది అందుకే. ఆ మాటకొస్తే, పెద్ద నోట్ల రద్దు మొదలు 370వ అధికరణం ఎత్తివేత దాకా తమ ప్రతి చర్యా తీవ్రవాదాన్ని తుదముట్టించేదే అని పాలకులు చెప్పినా అది వాస్తవరూపం దాల్చలేదు. పైగా, వర్షాకాలం కావడంతో సరిహద్దు వెంట పాక్ ప్రేరేపిత తీవ్రవాదుల చొరబాట్లు సులభమవుతాయి. ప్రస్తుతం ఏటా భారీగా సాగే సంక్లిష్టమైన అమరనాథ్ యాత్రాకాలం కూడా! హిమలింగాన్ని దర్శించడానికి యాత్రికుల రద్దీ ఉండే ఈ సమయంలో మాటు వేసి కాటు వేయాలనీ, అంతర్జాతీయంగా అందరి దృష్టిని ఆకర్షించాలనీ ముష్కరులు ఎత్తుగడ వేస్తారు. ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలి. మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలి. లేదంటే, తదుపరి పరిణామాలకు చింతించి ప్రయోజనం ఉండదు. వచ్చేవారం బడ్జెట్ సమావేశాలు సైతం ప్రారంభమవుతున్నందున ప్రభుత్వం జాగు చేయరాదు. చేపడుతున్న చర్యలపై స్వచ్ఛందంగా సవివరమైన ప్రకటన చేయాలి.పాక్‌తో నియంత్రణ రేఖ వెంట కాల్పుల విరమణ కొనసాగుతున్నా, చైనాతో గల్వాన్ లోయ ఘర్షణల తర్వాత మన బలగాలు ఆ సరిహద్దులో వాస్తవాధీన రేఖ వెంట మోహరించాల్సి వచ్చింది. ఫలితంగా కశ్మీర్‌తో పోలిస్తే సైనిక బలగాలు తక్కువగా ఉన్న జమ్మూ తీవ్రవాదులకు వాటంగా మారింది. కశ్మీర్ లోయలో కాస్తంత ఊపిరి పీల్చుకొనే లోగా ఇక్కడకు విస్తరించిన ఈ ముప్పును ఆదిలోనే అడ్డుకోవాలి. దేశ భద్రతపై రాజకీయాల కన్నా రాజీ లేని ధోరణి ముఖ్యమని అధికార, ప్రతిపక్షాలన్నీ బాధ్యతతో ప్రవర్తించాలి. పాలకులు గత పదేళ్ళ తమ హయాంలో అంతా సుభిక్షంగా, సుదృఢంగా మారిపోయిందనే ప్రగల్భాలు మాని, కార్యాచరణకు దిగాలి. భద్రతాదళాల పెంపు ఒక్కటే సమస్యకు పరిష్కారం కాదని అర్థం చేసుకోవాలి. సమస్యను సమగ్రంగా దర్శించి, తీవ్ర వాదం వైపు స్థానికులు ఆకర్షితులు కాకుండా ఉండేందుకు శుష్క వాగ్దానాలకు మించిన భరోసా కల్పించాలి. అప్పుడే ఈ భూతాన్ని అడ్డుకోగలుగుతాం. భారత్‌తో వాణిజ్యం, శాంతి కోరుతున్నట్టు చెబుతున్న పాక్ సైతం తీవ్రవాదానికి అండదండలు మానాలి. లేదంటే గుణపాఠం తప్పదు. -
భారత్–రష్యా సాన్నిహిత్యం
దౌత్య ప్రపంచంలో ఏదీ యాదృచ్ఛికంగా జరగదు. పర్యటనలైనా, ప్రసంగాలైనా, సమావేశాలైనా, ఒప్పందాలైనా– దేశాల ప్రయోజనాలతో ముడిపడివుంటాయి. సమయం, సందర్భం తప్పనిసరిగా ఉంటాయి. తమ ఆలోచనలేమిటో నిక్కచ్చిగా చెప్పడం కూడా వీటి ఉద్దేశం కావొచ్చు. ప్రధాని మోదీ మూడోసారి అధికార పగ్గాలు చేపట్టాక తన తొలి విదేశీ పర్యటన కోసం ఇరుగు పొరుగు దేశాలను సందర్శించే ఆనవాయితీని పక్కనబెట్టి రష్యాను ఎంచుకున్నారు. రెండు రోజుల ఆ పర్యటన మంగళ వారం ముగియబోతుండగా అమెరికా ప్రాపకంతో 75 ఏళ్ల క్రితం ఆవిర్భవించిన సైనిక కూటమి నాటో వజ్రోత్సవాలు వాషింగ్టన్లో మొదలయ్యాయి. ఇవి మూడురోజులపాటు సాగుతాయి. రష్యా పూర్వరూపమైన సోవియెట్ యూనియన్‌కు వ్యతిరేకంగా నాటో ప్రారంభమైంది. కనుక మోదీ రష్యా పర్యటన సహజంగానే అమెరికాకు కంటగింపుగా ఉండొచ్చు. ఈ పర్యటన ‘శాంతి ప్రయత్నాలకు’ తీవ్ర విఘాతం కలిగిస్తుందని ఇప్పటికే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వ్యాఖ్యానించారు. పైగా అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాధినేత అత్యంత క్రూరుడైన నేరగాణ్ణి హత్తుకోవటం ఏమిటని విమర్శించారు. జెలెన్స్కీ చెబుతున్న శాంతి ప్రయత్నాలేమిటో ప్రపంచంలో ఎవరికీ తెలియదు. తెలిసిందల్లా రష్యాను ఎదుర్కొనటానికి యుద్ధం మొదలైననాటి నుంచీ ఉక్రెయిన్‌కు అమెరికా, పాశ్చాత్య దేశాలు ఎడాపెడా ఆయుధాలు, డబ్బు సరఫరా చేయటం. అందువల్లే ఆ ఘర్షణ ఎడతెగకుండా సాగుతోంది. ఇందులో శాంతి ప్రసక్తి ఎక్కుడుందో అర్థంకాదు. రష్యా సాగిస్తున్న దురాక్రమణ యుద్ధాన్ని ఖండించాల్సిందే. కానీ ఇందులో ఉక్రెయిన్ బాధ్యత కూడా ఉంది. దాని సంగతలావుంచితే భారత–రష్యా 22వ వార్షిక శిఖరాగ్ర సమావేశం కోసం ప్రధానంగా మోదీ రష్యా వెళ్లారు. ఈ సందర్భంగా వివిధ ఒప్పందాలు కూడా కుదిరాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్, మోదీకి తమ అత్యున్నత పౌర పురస్కారాన్ని కూడా అందజేశారు. అయితే మంగళవారం ఉక్రెయిన్ రాజధాని కియూవ్‌లో ఒక ఆసుపత్రిపై జరిగిన క్షిపణి దాడిలో 37 మంది చనిపోయిన ఉదంతాన్ని ఖండించటానికి మోదీ వెనకాడలేదు. రష్యాతో మనకున్న మైత్రి ఈనాటిది కాదు. ఆ మైత్రికి ఏడు దశాబ్దాల చరిత్ర ఉంది. మోదీ అన్నట్టు రష్యా అన్ని కాలాల్లోనూ దృఢంగా మన వెనక నిలబడింది. స్నేహ హస్తం అందించింది. 1971లో పాకిస్తాన్‌తో మనకు యుద్ధం వచ్చినప్పుడు అన్నివిధాలా ఆదుకుంది. ఆ యుద్ధంలో మనం సాధించిన విజయంలో సోవియెట్ పాత్ర కీలకమైనది. మన అమ్ములపొదిలో ఉన్న రక్షణ పరికరాల్లో అత్యధిక భాగం ఆ దేశం నుంచి దిగుమతి చేసుకున్నవే. ఇది కేవలం కొనుగోలుదారు– అమ్మకందారు సంబంధం కాదు. పరిశోధన, అభివృద్ధితో మొదలెట్టి ఉమ్మడి ఉత్పత్తుల వరకూ ఇరు దేశాలూ సహకరించుకుంటున్నాయి. మనకున్న రెండు విమానవాహక నౌకల్లో ఒకటి రష్యానుంచి వచ్చినదే. ఇంకా ఎస్–400 గగనతల రక్షణ క్షిపణి వ్యవస్థ, మిగ్–29, ఎస్‌యూ–30 ఎంకెఐ యుద్ధ విమానాలు, సైనిక హెలికాప్టర్లు, ఏకే–203 రైఫిళ్లు, బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణులు తదితరాలున్నాయి. ఇవిగాక తన టీ–90 శతఘ్నుల ఉత్పత్తికి మనకు అనుమతులిచ్చింది. విడి భాగాల దగ్గర్నుంచి నూతన పరిశోధనల వరకూ మన రక్షణ వ్యవస్థ పూర్తిగా రష్యాతో ముడిపడివుంది. అణు విద్యుత్ కర్మాగారాల స్థాపన, నిర్వహణలో తోడ్పడుతోంది. ఇరవై అయిదేళ్ల క్రితం మనకు అమెరికాతో కూడా సత్సంబంధాలు ఏర్పడ్డాయి. అమెరికా, ఫ్రాన్స్, ఇజ్రాయెల్ తదితర దేశాల నుంచి కూడా మనం రక్షణ పరికరాలు కొనుగోలు చేస్తున్నాం. మనను రష్యాకు దూరం చేయాలని ఆది నుంచీ అమెరికా ప్రయత్నిస్తోంది. ఉక్రెయిన్ యుద్ధం మొదలయ్యాకైతే ఇది మరింతగా పెరిగింది. ఐక్యరాజ్యసమితి, భద్రతామండలి వంటి అంతర్జాతీయ సంస్థల్ని బేఖాతరుచేసి ఘర్షణలు నివారించే పేరుమీద అమెరికా ఒక పక్షాన్ని సమర్థించటం, అవతలిపక్షంతో ఎవరూ సాన్నిహిత్యం నెరపకూడదని ఫర్మానా జారీచేయటం ఆశ్చర్యకరం. వాస్తవా ధీన రేఖ వద్ద చైనాతో మనకు అయిదేళ్లుగా లడాయి నడుస్తోంది. ఆ దేశంతో ఘర్షణలు వస్తే మనకు రష్యా నుంచి రక్షణ పరికరాలు, విడిభాగాలు అత్యవసరమవుతాయి. అంతేకాదు... రక్షణ సాంకేతి కతలు చైనాకు పోకుండా చూడటం మనకు ముఖ్యం. ఇలాంటి పరిస్థితుల్లో అన్ని ప్రయోజనాలూ వదులుకుని తాను చెప్పినట్టల్లా నడుచుకోవాలని అమెరికా భావించటం ఎంతమాత్రం సరికాదు. పాకిస్తాన్‌తో మనకున్న సమస్యల విషయంలో ఏనాడూ అమెరికా సానుభూతిగా లేదు. కంటితుడుపు చర్యలు తీసుకోవటం, ఏదో వంకన ఆ దేశానికి సైనిక, ఆర్థిక సాయం అందించటం అమెరికాకు రివాజుగా మారింది. మనం మాత్రం తన ఫర్మానాలు పాటించాలని ఆ దేశం ఆశిస్తుంది. ఉక్రెయిన్ యుద్ధం మొదలయ్యాక రష్యా నుంచి ముడి చమురు దిగుమతి వద్దన్న అమెరికా ఒత్తిడిని కాదని, రోజుకు 21 లక్షల బ్యారెళ్ల చొప్పున దిగుమతి చేసుకుంటున్నాం. చౌకగా లభించే ఆ ముడి చమురు వల్ల మనం లాభపడటం మాట అటుంచి ప్రపంచ చమురు మార్కెట్ స్థిరత్వం సాధించింది. వర్తమాన సంక్లిష్ట పరిస్థితుల్లో రష్యాతో సాన్నిహిత్యం ఇబ్బందికరమే అయినా, దేశ ప్రయోజనాల రీత్యా దాన్ని కొనసాగించాలనుకున్న మన దేశ వైఖరి మెచ్చదగినది. ఏదేమైనా రెండు దేశాల మధ్య ఉండే ద్వైపాక్షిక సంబంధాలను మూడో దేశం ప్రభావితం చేయాలనుకోవటం, వాటిని తెంచుకోవాలని ఒత్తిడి తీసుకురావటం మంచి సంప్రదాయం కాదు. తన పర్యటన ద్వారా అమెరికాకు ఈ సంగతిని స్పష్టం చేసిన ప్రధాని మోదీ చర్య ప్రశంసించదగ్గది. -
ఫ్రాన్స్ గమ్యం ఎటు?
అన్ని అంచనాలనూ తలకిందులు చేస్తూ ఆదివారం రెండో రౌండ్ ఎన్నికల్లో వోటర్లు ఇచ్చిన తీర్పు పర్యవసానంగా ఫ్రాన్స్‌లో సందిగ్ధత నెలకొంది. తొలి రౌండులో స్పష్టంగా మితవాదం వైపు మొగ్గినట్టు కనిపించిన వోటర్లు హఠాత్తుగా దారి మార్చి ఇతర పక్షాలను తలకెత్తుకున్న వైనం బహుశా దేశ చరిత్రలో కనీవినీ ఎరుగనిది. 577 మంది సభ్యులుండే దిగువసభ ‘అసెంబ్లీ నేషనల్’లో ప్రభుత్వం ఏర్పాటుచేసే పక్షానికి కనీసం 289 స్థానాలు రావాలి. కానీ తాజా ఫలితాల తర్వాత వామపక్ష న్యూ పాపులర్ ఫ్రంట్ 182 (తొలి రౌండ్లో రెండో స్థానం) సీట్లతో అగ్రభాగాన ఉండగా అధ్యక్షుడు ఇమ్మానియెల్ మేక్రాన్‌కు చెందిన ఎన్సెంబుల్కు 168 (తొలి రౌండ్లో మూడోస్థానం) వచ్చాయి. తొలి రౌండ్లో 32 శాతం వోట్లు సాధించుకుని అధికార పీఠానికి చేరువగా వెళ్లినట్టు కనబడిన తీవ్ర మితవాద పక్షం నేషనల్ ర్యాలీ (ఆర్ఎన్) రెండో రౌండ్లో సీట్లపరంగా 143తో మూడో స్థానానికి పరిమితమైంది. ఆర్ఎన్ పార్టీ తొలి రౌండ్లో అగ్రభాగాన ఉండటంతో ఇతర పక్షాల వోటర్లు అప్రమత్తమయ్యారు. మితవాద పక్షానికి పాలనాపగ్గాలు దక్కనీయరాదన్న కృతనిశ్చయంతో అటు మధ్యేవాద పక్షానికీ, ఇటు వామపక్షానికీ వోటేశారు. తొలి దశలో 65 శాతం, రెండో దశలో 63 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 1981 తర్వాత ఈ స్థాయి వోటింగ్ ఎప్పుడూ లేదు. ఆర్ఎన్ గెలుపు ఖాయమని తేలినచోట్ల వామపక్ష కూటమి, మధ్యేవాద కూటమి అభ్యర్థులు స్వచ్ఛందంగా పోటీ నుంచి వైదొలగి ముఖాముఖి పోటీకి మార్గం సుగమం చేశారు. కనీసం 200 స్థానాల్లో బహుముఖ పోటీ బెడద తప్పింది. దీని ప్రభావం ఎంతగా ఉందంటే... ఫ్రాన్స్ పశ్చిమ ప్రాంతం లా సార్ద్లోని అయిదు స్థానాల్లో ఆర్ఎన్ తొలి రౌండ్లో నాలుగు స్థానాల్లో ముందంజలో ఉంది. తీరా ముఖాముఖి పోటీలో ఆ పార్టీకి ఒక్కటీ దక్కలేదు.రాజకీయ అస్థిరత ఫ్రాన్స్‌కు కొత్తగాదు. 1946–’58 మధ్య పన్నెండేళ్లలో ఆ దేశం 22 ప్రభుత్వాలను చూసింది. అయితే అది రెండో ప్రపంచ యుద్ధం ముగిసి ప్రచ్ఛన్న యుద్ధ దశ మొదలైన తొలినాళ్ల కాలం. భవిష్యత్తులో మరెప్పుడూ దేశం సంకీర్ణాల జోలికి పోకుండా నాటి ఫ్రాన్స్ అధ్యక్షుడు చార్లెస్ డీగాల్ నూతన రాజ్యాంగాన్ని రూపొందించారు. ఇప్పటికీ అదే అమల్లోవుంది. ఎన్నికల్లో భిన్నపక్షాలు కూటమిగా పోటీ చేయటం, నెగ్గితే కలిసి ప్రభుత్వం ఏర్పాటుచేయటం ఫ్రాన్స్‌లో సాధారణమే. కానీ కూటమిలో అధిక స్థానాలొచ్చిన పార్టీయే తన విధానాలకు అనుగుణంగా ప్రభుత్వాన్ని నడుపుతుంది. ఇప్పుడు ఏర్పడిన పరిస్థితి భిన్నమైనది. ఒక పార్టీగా అత్యధిక స్థానాలు గెల్చుకున్నది ఆర్ఎన్ ఒక్కటే. చిత్రమేమంటే అటు ఆర్ఎన్లోనూ, ఇటు న్యూ పాపులర్ ఫ్రంట్‌లోనూ మేక్రాన్‌పై తీవ్ర వ్యతిరేకత ఉంది. ప్రభుత్వ విధానాలను ప్రభావితం చేయలేని స్థితిలో పాలనలో పాలుపంచుకోవటం వృథా అని ఇరుపక్షాల నేతలూ భావిస్తున్నారు. ఫ్రాన్స్ ప్రజల్లో మేక్రాన్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉంది. ఆయన పార్టీతో కలిస్తే ఆ చీడ తమకూ అంటుతుందన్న భయాందోళనలు ఇరుపక్షాల్లోనూ ఉన్నాయి. అందుకే విస్తృత మధ్యేవాద కూటమిని ఏర్పాటు చేయాలన్న మేక్రాన్ ప్రయత్నం ఫలించకపోవచ్చన్నది విశ్లేషకుల మాట. ఈనెల 26న ప్యారిస్ ప్రధాన వేదికగా ప్రపంచ క్రీడా సంరంభం ఒలింపిక్స్ ఘట్టం ప్రారంభం కాబోతోంది. 16 నగరాల్లో ఆగస్టు 11 వరకూ వివిధ ఈవెంట్లు జరగబోతున్నాయి. ఈ దశలో దేశంలో రాజకీయ అస్థిరత అలుముకుంటే ఎలాగన్న ఆందోళన అన్ని పక్షాల్లోనూ ఉంది. తమ కూటమికి అత్యధిక స్థానాలొచ్చాయి గనుక ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని ఇప్పటికే వామపక్ష అన్బౌడ్ నేత జీన్ లక్ మెలింకోన్ కోరుతున్నారు. మితవాద ఆర్ఎన్ పార్టీని రానీయకూడదన్న పట్టుదలతో సోషలిస్టులు, వివిధ వామపక్షాలూ కలిసి కూటమిగా ఏర్పడ్డాయి తప్ప వాటి మధ్య లుకలుకలు తక్కువేమీ కాదు. అన్బౌడ్ పార్టీ భావసారూప్య పక్షాలన్నిటినీ ఒక గొడుగు కిందకు తెచ్చిందన్న మాటేగానీ ఆ పార్టీకి తలొగ్గి ఇతర పక్షాలు పనిచేస్తాయా అన్నది సందేహమే. సుస్థిర ప్రభుత్వాన్ని అందించలేకపోతే మళ్లీ ఎన్నికలకు వెళ్లకతప్పదు. అదే జరిగితే వామపక్ష కూటమికి ఇప్పుడు దక్కిన ఆదరణ ఆవిరయ్యే ప్రమాదం, ఆర్ఎన్ మరింత పుంజుకునే అవకాశం ఉంటాయి. మెలింకోన్ తీరుపై సొంత పార్టీలోనే వ్యతిరేకత ఉంది. ఆయన దుందుడుకు విధానాలు ఇంటా బయటా సమస్యాత్మకం కావొచ్చని, ముఖ్యంగా యూరప్ యూనియన్ (ఈయూ)తో పేచీలు తేవచ్చునని భయాందోళనలున్నాయి. ఈయూలో జర్మనీ తర్వాత రెండో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ ఫ్రాన్స్‌దే. నాజీల దురాక్రమణతో సంక్షోభాన్నెదుర్కొన్న ఫ్రాన్స్‌లో మితవాదపక్షానికి ఆది నుంచీ ఆదరణ లేదు. కానీ ఆర్ఎన్ అధినేత మెరిన్ లీ పెన్ తెలివిగా జాత్యహంకారం, యూదు వ్యతిరేకత వంటి అంశాల్లో పార్టీ విధానాలను సవరించుకున్నారు. విద్వేష ప్రసంగాలతో తరచు జైలుపాలైన తన తండ్రి మెరీ లీపెన్‌ను పార్టీ నుంచి సాగనంపారు. గాజాలో ఇజ్రాయెల్ దురాక్రమణ యుద్ధాన్ని కూడా వెనకేసుకొచ్చారు. ఫ్రాన్స్ రాజ్యాంగంలోని 12వ అధికరణం కింద కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు నిర్దిష్ట వ్యవధంటూ లేదు. అలాగని దీర్ఘకాలం ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని కొనసాగనిస్తే అది మేక్రాన్‌కు రాజకీయంగా తీవ్ర నష్టం తీసుకొస్తుంది. మొత్తానికి మూడు పక్షాల్లోనూ ఎవరూ మరొకరితో కలవడానికి ఇష్టపడని వర్తమాన పరిస్థితుల్లో మేక్రాన్ ఏం చేస్తారన్న ఉత్కంఠ అందరిలోనూ ఉంది. ఏ ప్రభుత్వం ఏర్పడినా అవిశ్వాస తీర్మాన గండం తప్పదు. మెడపై మితవాద బెడద వేలాడుతున్న తరుణంలో చివరకు ఫ్రాన్స్ గమ్యం ఏమిటన్నది మిలియన్ యూరోల ప్రశ్న! -
నూరేళ్ల గురుదత్
‘నువ్వు కమ్యూనిస్టువా?’... ‘కాదు. కార్టూనిస్టుని’.... ‘నీకు మంచి జీవితం తెలియక ఈ దిక్కుమాలిన కొంపను ఇల్లు అనుకుంటున్నావు’... ‘దాన్దేముంది... మీకు ఫుట్‌పాత్‌ల మీద బతుకుతున్న లక్షల మంది గురించి తెలియదు. నేను వాళ్ల కంటే మెరుగే’... ‘నువ్వు నౌకరువి! గుర్తుంచుకో’... ‘నౌకర్నైతే? తల ఎత్తి మాట్లాడకూడదా?’... గురుదత్ సినిమాల్లోని డైలాగ్స్ ఇవి. దేశానికి స్వతంత్రం వచ్చి గొప్ప జీవితాన్ని వాగ్దానం చేశాక కూడా, ఎక్కడా ఆ వాగ్దానం నెరవేరే దారులు లేక, ఉద్యోగ ఉపాధులు లేక, పేదరికం పీడిస్తూ, మనుషుల్లో స్వార్థం, రాక్షసత్వం దద్దరిల్లుతున్న కాలంలో ‘ఇన్సాన్ కా నహీ కహీ నామ్ ఔర్ నిషాన్’ అనిపించిన ఒక భావుకుడు, దయార్ద్ర హృదయుడు, ఎదుటి వారి కళ్లల్లో నాలుగు కన్నీటి చుక్కలు చూడగానే సొమ్మసిల్లే దుర్బల మానసిక స్వరూపుడు గురుదత్ వచ్చి ఆడిన కళాత్మక నిష్ఠూరమే అతడి సినిమాలు. స్వతంత్రం వచ్చిన పదేళ్లకు ‘ప్యాసా’ తీసి ‘జిన్హే నాజ్ హై హింద్ పర్ ఓ కహా హై’ అని ప్రశ్నించాడు. స్వతంత్రం వచ్చిన 75 ఏళ్ల తర్వాత కూడా ఏదో ఒక పాదధూళి దొరికితే కష్టాల నుంచి బయట పడదామనుకునే∙కోట్లాది నిరుపేదలను చూసి నేటికీ అనవలసిందే కదా– ‘దేశాన్ని చూసి గర్వపడే పెద్దలారా... మీరెక్కడ?’కలకత్తాలో బాల్యం గడిపిన గురుదత్ ఇంటెదురు ఖాళీ జాగాలో జరిగే తిరునాళ్లలోని పేద కళాకారుల ఆటపాటలతో స్ఫూర్తి పొందాడు. అతనూ డాన్స్ చేస్తే ఆ సుకుమార రూపం అద్భుతంగా మెలికలు తిరిగేది. డాన్స్ అతణ్ణి నాటి ప్రఖ్యాత డాన్సర్ ఉదయ్‌శంకర్ దగ్గరకు చేర్చింది. ఆ తర్వాత పూణేకు! అక్కడ ప్రభాత్ థియేటర్లో డాన్స్‌మాస్టర్‌గా, అసిస్టెంట్ డైరెక్టర్‌గా అన్నింటికీ మించి దేవ్ ఆనంద్ స్నేహితుడిగా దారి మొదలెట్టాడు. బెంగాల్ పురోగామి ధోరణి, చదివిన పుస్తకాలతో ఏర్పరుచుకున్న బౌద్ధిక విమర్శ కళలో ఏం చెప్పాలో తెలిపాయి. అయితే సినిమా వ్యాపారకళ. వ్యాపారాన్నీ, కళనూ, ఆదర్శాన్నీ కలిపి నడిపించడం కష్టమైన పని. కాని ఆ పనిని గొప్పగా చేయగలిగిన జీనియస్ గురుదత్. అతనికి ముందు సినిమాల్లో డైలాగ్ ఉంది. గురుదత్ వచ్చి... ఆ డైలాగ్ చెప్పే సందర్భంలో తెర కవిత్వాన్ని చిందడం చూపగలిగాడు. అతనికి ముందు సినిమాల్లో వెలుతురూ చీకటీ ఉంది. గురుదత్ వచ్చి... వెలుగునీడల గాఢ పెనవేతను తెరపై నిలిపాడు. అతనికి ముందు సినిమాల్లో పాత్రలున్నాయి. గురుదత్ వచ్చి ఆ పాత్రల ప్రాంతం, మాట, నడత నిక్కచ్చి చేశాడు. ‘ఆర్ పార్’ (1954)తో ఈ ముద్ర మొదలైంది. ‘మిస్టర్ అండ్ మిసెస్ 55’ (1955), ‘ప్యాసా’ (1957), ‘కాగజ్ కే ఫూల్’ (1959), ‘చౌద్వీ కా చాంద్’ (1960), ‘సాహిబ్ బీబీ ఔర్ గులామ్’ (1962)ల వరకూ ఇదే ధోరణి కొనసాగింది. గాయని షంషాద్ బేగం అంది– ‘ఏ సినిమా తీసినా నిజాయితీతో తీశాడు. తప్పుడుతనంతో ఒక్కటీ తీయలేదు’.‘ప్యాసా’ క్లయిమాక్స్‌లో కవి పాత్రలో ఉన్న గురుదత్ పునరుత్థానం చెందుతాడు. సినిమాలో అతడు మరణించాడని జనం భావించాకే గుర్తింపు పొందుతాడు. నిజజీవితంలో కూడా అదే జరిగింది. పెద్ద హీరోల, దర్శకుల సినిమాల మధ్యలో... గురుదత్ జీవించి ఉండగా పేరు రాలేదు. మరణించాక కూడా రాలేదు. 1980లలో విదేశాలలో అతడి సినిమాలు ప్రదర్శింపబడి ప్రశంసలు దక్కాకే గురుదత్ పేరుకు ఉన్న మసి తొలిగింది. రాజ్‌కపూర్ ‘కాగజ్ కే ఫూల్’ చూసి ‘ఇది కాలం కంటే ముందే తీశాడు. రాబోయే తరాలే దీనిని పూజిస్తాయి’ అన్నాడు. అదే జరిగింది. నేడా సినిమా ప్రపంచంలోని ఎనిమిది యూనివర్సిటీల్లో పాఠ్యాంశంగా ఉంది.‘80 శాతం నటన నటీనటుల కళ్లతోనే పూర్తవుతుంది. మనం మనిషి కళ్లల్లో చూస్తాం. నటన కూడా అక్కడే తెలియాలి’ అనేవాడు గురుదత్. అతని సినిమాల్లో టైట్ క్లోజప్స్, కళ్లు చేసే అభినయం పాత్రలను ప్రేక్షకులతో కనెక్ట్ చేస్తాయి. తీయబోయే పాట ఎలా ఉంటుందో ముందే తెలుసు కనుక రికార్డింగ్ సమయంలో ఆశా భోంస్లే ఎదురుగా నిలబడి గురుదత్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉంటే ఆమె వాటికి తగినట్టుగా ఒయ్యారాలు పోతూ పాడిందట. ‘భవరా బడా నాదాన్ హై’ వినండి తెలుస్తుంది. గురుదత్ మన తెలుగు వహీదా రెహమాన్‌ను స్టార్‌ని చేశాడు. బద్రుద్దీన్ అనే బస్ కండక్టర్ని జానీవాకర్ అనే స్టార్ కమెడియన్ని చేశాడు. ఎస్.డి.బర్మన్, ఓపి నయ్యర్లతో సాహిర్ లుధియాన్వీ, మజ్రూ సుల్తాన్‌పురి, కైఫీ ఆజ్మీలతో అత్యుత్తమమైన పాటలను ఇచ్చాడు. సినిమాటోగ్రాఫర్ వి.కె.మూర్తి, రచయిత అబ్రార్ అల్వీల గొప్పతనం చాటాడు.వసంత కుమార్ పడుకోన్ అలియాస్ గురుదత్ జూలై 9, 1925న జన్మించి కేవలం 39 సంవత్సరాలు జీవించాడు. 14 ఏళ్ల కెరీర్లో గొప్ప గొప్ప క్లాసిక్స్ తీశాడు. గాయని గీతాదత్ను వివాహం చేసుకుని, వహీదా రెహమాన్ సాన్నిహిత్యం కోరి ఛిద్ర గృహజీవనం సాగించాడు. కాగితపు పూలకే అందలం దక్కే సంఘనీతికి కలత చెంది అర్ధంతరంగా జీవితం నుంచి నిష్క్రమించాడు. రేపటి నుంచి అతని శత జయంతి సంవత్సరం మొదలు. ‘ప్యాసా’ క్లయిమాక్స్‌లో ‘మనిషి నుంచి మనిషితనాన్ని లాక్కునే సమాజం మీదే నా ఫిర్యాదు’ అంటాడు గురుదత్. ఆ ఫిర్యాదు అవసరం మరింతగా పెరిగిన రోజులివి. గురుదత్ను పునర్ దర్శించాల్సిన సందర్భం. అవును. మెడలో ముళ్లహారం పడినా ముందుకేగా నడక.హమ్నెతో జబ్ కలియా మాంగీ కాంటోంకా హార్ మిలాజానే ఓ కైసే లోగ్ థే జిన్ కే ప్యార్ కో ప్యార్ మిలా... -
స్వరం మార్చిన బ్రిటన్!
జనాభాపరంగా చూస్తే బ్రిటన్ దేశం ఇంచుమించుగా మన కర్ణాటక రాష్ట్రంతో సమానం. కానీ ఒకప్పుడు రవి అస్తమించనంత మేర విశాల భూభాగాలను తన సింహాసన ఛత్ర ఛాయలోకి తెచ్చుకున్న దేశం బ్రిటన్. ఈ ఘనత (?) న భూతో న భవిష్యతి. భారతదేశ చరిత్రలో మహా సామ్రాజ్యాలను స్థాపించిన మౌర్య, మొఘల్ చక్రవర్తుల ఆధీనంలోని భూఖండాల కంటే బ్రిటిష్ సామ్రాజ్యం తొమ్మిది, పది రెట్లు పెద్దది. అంతేకాకుండా బ్రిటిష్ వాళ్లు మనదేశాన్ని కూడా రెండు శతాబ్దాలు పాలించి పీడించి దేశ సంస్కృతిపై బలమైన ముద్రనే వేశారు. కనుక బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికలపై భారతీయులు ఆసక్తి చూపడం చాలా సహజం.పైపెచ్చు నిన్నటి దాకా ప్రధానిగా ఉన్న రిషి సునాక్ భారతీయ మూలాలున్న వ్యక్తి. భారత జాతీయతనూ, హిందూ మతాన్నీ పర్యాయపదాలుగా మార్చుకున్న మన ఎగువ మధ్యతరగతి శిష్ట వర్గాలకు సునాక్ మరింత ప్రీతిపాత్రుడు. ఆయన కుటుంబం టెన్ డౌనింగ్ స్ట్రీట్ వాకిట్లో దీపావళి కాకరపువ్వొత్తులు కాలిస్తే మనవాళ్లు పులకించిపోవడం కూడా తాజా జ్ఞాపకమే! మన ‘ఇన్ఫోసిస్’ నారాయణమూర్తి, ఆయన సతీమణి – మోటివేషనల్ స్పీకర్ హోదాలో రాజ్యసభలో అడుగుపెట్టిన సుధామూర్తిల ఏకైక అల్లుడు. అందువల్ల సునాక్ మళ్లీ ప్రధాని అవుతాడా లేదా అనే ఉత్కంఠ భారతీయులకు ఉండటంలో ఆశ్చర్యం లేదు.సునాక్ ప్రాతినిధ్యం వహిస్తున్న కన్సర్వేటివ్ పార్టీ దారుణంగా ఓడిపోయింది. అయితే ఆయన మాత్రం తన నియోజకవర్గం నుంచి పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. భారతీయ మూలాలున్న వ్యక్తులు 29 మంది ఈ ఎన్నికల్లో గెలుపొందారు. సునాక్ మళ్లీ ప్రధాని కానందుకు బాధపడే భారతీయులెవరైనా ఉంటే వారికి ఈ సంఖ్య పెద్ద ఊరట. ఇటీవల జరిగిన ఇండియన్ పార్లమెంట్ దిగువ సభ ఎన్నికల్లో గెలిచిన ముస్లిం అభ్యర్థుల కంటే బ్రిటన్ దిగువ సభకు ఎక్కువమంది భారతీయులు ఎన్నికయ్యారు.భారతదేశంతో సంబంధాల విషయంలో కన్సర్వేటివ్, లేబర్ పార్టీల మధ్యనున్న ప్రధాన తేడా కశ్మీర్ అంశంపైనే! ఈ అంశంపై రెఫరెండం జరగాలన్నది లేబర్ పార్టీ పాత విధానం. అయితే ఇప్పుడు అది పెద్దగా పట్టింపులకు పోవడం లేదంటున్నారు. అట్లాగే సునాక్ హయాంలో రెండు దేశాల మధ్య చర్చకు వచ్చిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) పట్ల కొత్త ప్రధాని కెయిర్ స్టార్మర్ కూడా ఆసక్తిగానే ఉన్నట్టు సమాచారం. సునాక్ ప్రధాని కాలేదన్న లోటును ఎక్కువమంది భారతీయ సంతతివారు ఎన్నికల్లో గెలిచి భర్తీ చేశారు. కనుక భారత్‌కు సంబంధించినంత వరకు బ్రిటన్‌లో జరిగిన అధికార బదిలీ ఎటువంటి మార్పులకూ దారితీయకపోవచ్చు.స్టార్మర్ గెలుపు ఇండియా విషయంలో యథాతథ స్థితి కొనసాగింపే కావచ్చు. కానీ ప్రపంచ రాజకీయ వేదికపై ఓ పెద్ద మార్పు. ఒక గొప్ప ఊరట. మితవాద (రైటిస్టు) భావాల ఉప్పెన పాన్ అట్లాంటిక్ దేశాల రాజకీయాలను కుదిపేస్తున్న తరుణంలో ఒక మధ్యేవాద – వామపక్షంగా గుర్తింపు పొందిన లేబర్ పార్టీ బ్రిటన్‌లో ఆ ఉప్పెనను తట్టుకొని నిలవడం, భారీ విజయాన్ని నమోదు చేయడం విశేషంగానే చెప్పుకోవాలి. ఈమధ్యనే జరిగిన యూరోపియన్ యూనియన్ పార్లమెంట్ ఎన్నికల్లో మితవాద పార్టీలు వాటి తఢాఖాను చూపెట్టాయి. ఇటలీ, నెదర్లాండ్స్ ఎన్నికల్లో మితవాద శక్తులు విజయం సాధించాయి. ఫాసిస్టు నేత బెనిటో ముస్సోలినికి అసలు సిసలైన సైద్ధాంతిక వారసురాలు జోర్జా మెలోని ఇటలీ అధ్యక్షురాలయ్యారు. ఇండియన్ రైటిస్టు నాయకుడు మోడీతో సెల్ఫీలు దిగి ‘మెలోడీ’ పేరుతో ఆమె ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే!ఈ ఏడాది చివర్లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రపంచ మితవాద శక్తులకు సూపర్ బాస్ లాంటి డోనాల్డ్ ట్రంప్ విజయం దాదాపు ఖాయంగా కనిపిస్తున్నది. బ్రిటన్ ఎన్నికల్లో కరుడుగట్టిన మితవాద నాయకుడు నైజెల్ ఫరాజ్ నేతృత్వంలోని ‘రిఫార్మ్ యూకే’ పార్టీ ఎన్నడూ లేని విధంగా 14 శాతం ఓట్లను సాధించింది. ఎన్నో దండయాత్రల తర్వాత ఫరాజ్ పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. ఆ వెంటనే ఫరాజ్‌ను డొనాల్డ్ ట్రంప్ అభినందనల్లో ముంచెత్తడాన్ని చూస్తుంటే ప్రపంచవ్యాప్తంగా మితవాద శక్తుల ఐక్యత అల్లుకుంటున్న సంగతి బోధపడుతుంది. ట్రంప్‌కు అనుకూలంగా మన ప్రధానమంత్రి ఎన్నికల ప్రచారం చేసిపెట్టిన వైనాన్ని కూడా ఈ కోణంలోంచే చూడాలి. ఫ్రాన్స్‌లో కూడా ఒక మితవాద సునామీ వేగంగా సన్నద్ధమవుతున్న సూచనలు వెలువడుతున్నాయి. మెలైన్ లీపెన్ నాయకత్వంలోని ఆర్ఎన్ (నేషనల్ ర్యాలీ) అనే పార్టీ అనూహ్యంగా బలం పుంజుకుంటున్నది. ఆమె గతంలో మూడుసార్లు ఫ్రెంచి అధ్యక్ష పదవికి పోటీచేసి ఓడిపోయారు. యూరోపియన్ పార్లమెంట్ ఎన్నికల్లో 32 శాతం ఓట్లు సాధించి లీపెన్ పార్టీ అధ్యక్షుడు... మేక్రాన్ అలయెన్స్‌ను మూడో స్థానానికి నెట్టివేశారు. దీంతో అప్రమత్తమైన మేక్రాన్ పార్లమెంట్ ఎన్నికలకు ఇంకో మూడేళ్ల గడువు ఉన్నప్పటికీ మధ్యంతర ఎన్నికలకు వెళ్లారు. ఈ ఎన్నికలు రెండు దశల్లో జరుగుతాయి.జూన్ 30న తొలి రౌండ్ జరిగింది. మితవాద ఆర్ఎన్ పార్టీకి 34 శాతం ఓట్లు వచ్చాయి. వామపక్ష కూటమి న్యూ పాపులర్ ఫ్రంట్ 28 శాతం ఓట్లను సాధించింది. మేక్రాన్ నాయకత్వంలోని మధ్యేవాద కూటమికి 21 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. మొదటి రౌండ్ ఎన్నికల్లో 12.5 శాతం (ఎనిమిదో వంతు) ఓట్ల కంటే తక్కువ వచ్చిన వాళ్లను తొలగిస్తారు. ఈ ఆదివారం నాడు రెండో రౌండ్ పోలింగ్ జరుగుతున్నది. తొలి రౌండ్లో ప్రజానాడిని గమనించిన మధ్యేవాద – వామపక్ష కూటములు ఈ ఎన్నికల్లో ఏకమయ్యాయి. ఓట్ల బదిలీ జరిగి మితవాద శక్తులను ఈ కూటమి ఓడిస్తుందా, లేదా అన్న సంగతి తేలిపోనున్నది. ఒకవేళ ఆర్ఎన్ పార్టీయే పైచేయి సాధిస్తే మేక్రాన్ అధ్యక్ష పాలనకు ఒడుదొడుకులు తప్పవు.మేక్రాన్ అధ్యక్ష పదవికి ఇంకో మూడేళ్ల గడువున్నది. సాంకేతికంగా చూస్తే ఆయన తప్పుకోవలసిన అవసరం ఉండదు. మిగిలిన యూరప్ దేశాలతో పోలిస్తే ద్రవ్యోల్బణ ప్రభావాన్ని తగ్గించడంలో మేక్రాన్ సాపేక్షంగా విజయం సాధించినట్టే లెక్క. రాజకీయంగా కూడా మేక్రాన్ మధ్యేవాద మితవాదే (రైట్ ఆఫ్ ది సెంటర్). ఆసియా, ఆఫ్రికా దేశాల నుంచి కొనసాగుతున్న వలసలను నిరోధించడంలో ప్రభుత్వాధినేతలు విఫలమవడం పట్ల యూరప్ ప్రజల్లో అసహనం వ్యక్తమవుతున్నది. అన్ని దేశాల్లోనూ నిరుద్యోగం, ద్రవ్యోల్బణం కవల పిల్లల్లా పెరుగుతున్నాయి. ఈ ఆర్థిక కారణాలు మితవాద రాజకీయ శక్తులకు ఆక్సిజన్ మాదిరిగా పనిచేస్తున్నాయి.వలసల పట్ల స్థానిక ప్రజల్లో పెరుగుతున్న అసహనాన్ని తగ్గించడానికి రిషి సునాక్ కొంత ప్రయత్నం చేశారు. అక్రమ వలసదారులను గుర్తించి, వారిని మధ్య ఆఫ్రికాలోని రువాండా దేశానికి తరలించి, పునరావాస ఏర్పాట్లు చేయాలని భావించారు. ఈ మేరకు రువాండాతో బ్రిటన్‌కు ఒప్పందం కూడా కుదిరింది కానీ ఎందుకనో అది కార్యరూపం దాల్చలేదు. యూరప్ దేశాలు ఎదుర్కొంటున్న సవాలక్ష సమస్యలకు వలసలే కారణమనే వాదాన్ని కూడా పలువురు వ్యతిరేకిస్తున్నారు. కొన్ని తరాల ముందే వలస వచ్చి ఆ యా దేశాల ఆర్థిక, సాంస్కృతిక అభ్యున్నతిలో భాగస్వాములైన వారిపై కూడా వివక్షాపూరిత దృక్కులు ప్రసరిస్తున్నాయనే ఆందోళన వ్యక్తమవుతున్నది.ప్రస్తుతం జరుగుతున్న ఫుట్‌బాల్ యూరో కప్ పోటీల ప్రారంభం ముందు ఫ్రాన్స్ స్టార్ ఆటగాడు కిలియన్ బప్పే చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ‘‘మితవాద రాజకీయ భావాలు అధికారపు వాకిట్లోకి వచ్చి కూర్చున్నాయి. మా విలువల్నీ, మనోభావాల్నీ గౌరవించని దేశం తరఫున ఆడేందుకు మేం సిద్ధంగా లేము’’. ఆఫ్రో – యూరోపియన్ల మనోభావాలను ఆయన బలంగా వెళ్లగక్కారు. అక్రమ వలసదారులు వస్తున్నారని యూరప్ ప్రజలు నిందిస్తున్న దేశాలన్నీ ఒకప్పుడు యూరప్ దేశాల వలసలే! వంద నుంచి రెండొందల ఏళ్లపాటు యూరోపియన్లు ఈ దేశాల వనరుల్ని యథేచ్ఛగా దోపిడీ చేశారు. ఆ దేశాల ఆర్థిక మూలుగల్ని పీల్చి పిప్పి చేశారు. ఫలితంగా వలస దేశాల అభివృద్ధి చరిత్ర శతాబ్దాల పర్యంతం ఘనీభవించిపోయింది. వలస దేశాల సంపదతోనే యూరప్ దేశాలు చాలా కాలంపాటు వైభవోజ్జ్వల అధ్యాయాలను లిఖించుకున్నాయి. ఇప్పుడు ఈ దేశాల్లోకి వలస వస్తున్న ప్రజలకు ప్రతీకారం తీర్చుకునే ఉద్దేశం లేదు. పొట్టకూటి కోసం వారు వస్తున్నారు. ప్రతిభకు తగిన గుర్తింపు కోసం వస్తున్నారు. ఉన్నత విద్య కోసం, అవకాశాల కోసం వారు వస్తున్నారు. వలసలపై యూరప్ దేశాల మితవాదుల వైఖరి ఇట్లా వుంటే... అమెరికా మితవాదుల ధోరణి మరింత ఆశ్చర్యకరంగా ఉన్నది. అమెరికా నిర్మాణానికి వలసలే పునాది. అక్కడి భూమి పుత్రుడెవరు మిగిలారు అమెరికాలో! వాళ్లందరినీ యూరప్ వలసదారులు ఎప్పుడో వేటాడి నిర్మూలించారు. యూరప్ దేశాల ఆశాజీవులు, ఆఫ్రికా నుంచి బంధించి తెచ్చిన బానిసల సహాయంతో పెరిగిన అమెరికా ఒక వలసదారుల దేశం. వలసలకు కేరాఫ్ అడ్రస్. ఆ దేశంలోని ట్రంపిస్టులు కూడా వలసలకు వ్యతిరేకంగా మాట్లాడటం న్యూయార్క్ నగరంలోని స్వేచ్ఛా ప్రతిమ పాదపీఠిక మీద చెక్కిన ఎమ్మా లాజరస్ కవితా పంక్తుల స్ఫూర్తికి విరుద్ధం. ఆ స్వేచ్ఛా ప్రతిమ వలస జీవులను రారమ్మని పిలుస్తున్నట్టుగా ఆ కవితా పంక్తులు ఉంటాయి. ‘‘డస్సిపోయిన మీ జనాలనూ, మీ నిరుపేదలనూ, / స్వేచ్ఛా వాయువులు పీల్చేందుకు తహతహలాడుతున్న మీ సకల కూటములనూ, / మీ తీరాలలో కిక్కిరిసిన తిరస్కృతులనూ, / నిరాశ్రయులనూ, తుపానుల్లో చిక్కుకుపోయిన అభాగ్యులనూ నా దరికి పంపండి. / బంగారు ద్వారం పక్కన దారిదీపాన్ని పైకెత్తి నిలుచున్నాను.’’ – (తెలుగు అనువాదం).మితవాద శక్తుల ప్రభంజనం నేపథ్యంలో బ్రిటన్‌లో లేబర్ పార్టీ గెలుపునకు చాలా ప్రాధాన్యం ఉన్నది. ప్రపంచవ్యాపితంగా వున్న మితవాద రాజకీయ పక్షాలన్నిటికీ మతవాద, జాతివాద సారూప్యతలే కాకుండా ఆర్థిక విధానాల సారూప్యతలు కూడా ఉన్నాయి. కొంతమందే సంపద సృష్టించి, దాన్ని వారే సొంతం చేసుకునే ఆర్థిక కార్యక్రమం వారిది. బ్రిటన్ కొత్త ప్రధాని కెయిర్ స్టార్మర్ భిన్నమైన గళాన్ని ఎన్నికలకు ముందే వినిపించారు. కార్మిక వర్గం కోసం సంపద సృష్టించాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజలందరికీ నాణ్యమైన విద్య, వైద్య సేవలను ప్రధాన ఎజెండాగా ప్రకటించారు. న్యాయమైన ఈ ఎజెండాకు బ్రిటన్ ప్రజలు జైకొట్టడం ఆహ్వానించదగిన పరిణామం. వలసదారుడిని ప్రధానిగా చేసిన పార్టీని శిక్షించడానికే ప్రజలు లేబర్ పార్టీని గెలిపించారని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. ఇది బ్రిటన్ ప్రజల విజ్ఞతనూ, చైతన్యాన్నీ శంకించడమే!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
చైనా తీరు మారాలి!
ఆవిర్భవించిన నాటి లక్ష్యాలు విడిచి చాన్నాళ్లుగా దారీ తెన్నూ లేకుండా మిగిలిపోయిన షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) రెండు రోజుల శిఖరాగ్ర సదస్సు కజఖ్‌స్తాన్‌లోని ఆస్తానాలో గురువారం ముగిసింది. ఈ సదస్సువల్ల ఇతరత్రా పెద్ద ప్రయోజనం లేకపోవచ్చుగానీ మనతోవున్న సరిహద్దు సమస్యను నాలుగేళ్లుగా దాటవేస్తున్న చైనాతో మన విదేశాంగమంత్రి జైశంకర్ భేటీ కావటం ఉన్నంతలో జరిగిన మేలు. వాస్తవానికి ఈ సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కావాల్సివుండగా ఆయన బదులు విదేశాంగ మంత్రి వెళ్లారు. ప్రధాని ప్రసంగాన్ని చదివి వినిపించారు. మోదీ గైర్హాజరు ఆ సంస్థనుంచి భారత్ దూరం జరగటానికి సంకేతమనీ, అమెరికా ఒత్తిడే ఇందుకు కారణమనీ చైనా అనుకూల మీడియా ప్రచారం చేసుకుంది. నిరుడు భారత్ ఆధ్వర్యంలో ఆన్లైన్లో ఎస్సీఓ శిఖరాగ్ర సదస్సు జరిగినప్పుడు కూడా ఇలాంటి భాష్యాలే చెప్పారు. చైనాతో నేరుగా సమావేశం కావటం ఇష్టం లేకే ఈ లాంఛనం పూర్తిచేసిందని ఆ భాష్యాల సారాంశం. నిజమే... ప్రపంచంలో 40 శాతం జనాభాతో, ప్రపంచ జీడీపీలో 23 లక్షల కోట్ల మేర వాటాతో ఉన్న దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎస్సీఓను విస్మరించటం మంచిది కాదు. కానీ ఆ సంస్థ ఆరంభ కాలంనాటి లక్ష్యాలను గుర్తుంచుకుందా? వాటికి అనుగుణంగా పనిచేస్తున్నదా అంటే లేదనే చెప్పాలి. వర్తక, వాణిజ్యాల్లో దాని ముద్ర లేకపోలేదు. అయితే ఆ సంస్థ పరిధిలోని ప్రాంతాల్లో ఉగ్రవాదం, మాదకద్రవ్యాల రవాణా వగైరా పోకడల గురించి అది సక్రమంగా పట్టించుకుంటున్న దాఖలాలు లేవు. మోదీ ప్రసంగంలో ఈ సమస్యలే ప్రధానంగా ప్రస్తావనకొచ్చాయి. 1996లో షాంఘై ఫైవ్‌గా ఏర్పడ్డ బృందంలో చైనా, రష్యా, కజఖ్‌స్తాన్, కిర్గిజిస్తాన్, తజికిస్తాన్లున్నాయి. 1991లో సోవియెట్ యూనియన్ కుప్పకూలాక ఆ ప్రాంతంలో తెగల ఘర్షణలు పెచ్చుమీరటంతో భద్రతాపరమైన సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడానికి ఈ బృందం ఆవిర్భవించింది. అంతర్జాతీయ సంస్థగా మలచాలన్న లక్ష్యంతో 2001లో దీన్ని ఎస్సీఓగా మార్చారు. మన దేశానికి సభ్యత్వం ఇవ్వాలన్న రష్యా ప్రతిపాదనను అంగీకరిస్తూనే 2017లో తనకు అనుకూలంగా ఉన్న పాకిస్తాన్‌ను ఇందులో చేర్చింది చైనాయే. కానీ ఉగ్రవాదులకు సాయం చేస్తున్నట్టు వెల్లడై అనేకసార్లు అంతర్జాతీయ ఆర్థిక సంస్థల అభిశంసనకు గురైన పాక్‌ను దారి మార్చుకోవాలని చెప్పటంలో చైనా విఫలమైంది. అలాగే పాకిస్తాన్లో తలదాచుకున్న ఉగ్రవాదుల జాబితాను మన ప్రతిపాదన పర్యవసానంగా భద్రతామండలి చర్యలు తీసుకుంటున్న తరుణంలో చైనా గండికొట్టింది. సరిగదా తన బెల్ట్ అండ్ రోడ్ ఇన్షియేటివ్ (బీఆర్ఐ)ను పాకిస్తాన్ అధీనంలోవున్న ఆక్రమిత కశ్మీర్ గుండా వెళ్లేలా రూపొందించింది. అందుకే 2018లో ఎస్సీఓలో బీఆర్‌ఐను అందరూ అంగీకరించినా మన దేశం వ్యతిరేకించాల్సి వచ్చింది. నిరుడు జరిగిన ఆన్లైన్ సదస్సులో కూడా మన దేశం బీఆర్ఐ గురించిన పేరా తొలగిస్తే తప్ప ఉమ్మడి ప్రకటనపై సంతకం చేసేది లేదని చెప్పింది.ఆ సంగతలావుంచి ఎస్సీఓను అమెరికా, పాశ్చాత్య దేశాల నేతృత్వంలోని సంస్థలకు దీటుగా తీర్చిదిద్దాలనుకుంటున్న చైనా అందుకు అనుగుణమైన నడవడి కనబరచవద్దా? వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వద్ద భారీగా సైన్యాన్ని మోహరించి దురాక్రమణకు పాల్పడినప్పుడు ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరాయి. 2020లో ఘర్షణలు చెలరేగాక భారత్, చైనాల సైనికాధికారుల స్థాయిలో 20 సార్లు, దౌత్యస్థాయిలో 13 రౌండ్లు చర్చలు జరిగాక ప్యాంగాంగ్ సో సహా అయిదు చోట్ల ఇరు దేశాల సైన్యాలూ వెనక్కి తగ్గటానికి అంగీకరించాయి. తూర్పు లద్దాఖ్‌లోని ప్రాంతాల్లో పరిస్థితి మారలేదు. దీన్ని పక్కనబెట్టి ఇరు దేశాల సంబంధాలూ సాధారణ స్థితికి తీసుకురావాలని చైనా కోరుతోంది. కానీ అక్కడ 2020 ఏప్రిల్ నాటి స్థితికి చైనా సిద్ధపడితేనే అది అసాధ్యమన్నది మన దేశం వాదన. మన సరిహద్దుకు సమీపంగా ఈ నాలుగేళ్లలో చైనా 600 ‘సంపన్న గ్రామాల’ను నిర్మించింది. మన దేశం కూడా అరుణాచల్‌లో 60 గ్రామాలు నిర్మిస్తోంది. మున్ముందు అరుణాచల్, హిమాచల్, లద్దాఖ్, ఉత్తరాఖండ్, సిక్కింలలో ఇలాంటివి 3,000 గ్రామాలు నిర్మించాలన్నది మన దేశం లక్ష్యం. ఇదిగాక అమెరికన్ కాంగ్రెస్ ప్రతినిధి బృందం దలైలామాను కలవడానికి మన దేశం అంగీకరించటం, దక్షిణ చైనా సముద్రంలో చైనాతో ఫిలిప్పీన్స్‌కు వచ్చిన తగాదాలో ఫిలిప్పీన్స్‌ను సమర్థించటం చైనాకు కంటగింపుగా ఉంది. అటు చైనా మనతో స్నేహసంబంధాలున్న హిందూ మహాసముద్ర ప్రాంత దేశాలను దువ్వుతూ మనకు వ్యతిరేకంగా కూడగడుతోంది. ఈ నేపథ్యంలో ఎల్ఏసీ సమస్యపై భారత్‌తో చర్చించి, దాన్ని త్వరగా పరిష్కరించుకోవాలన్న జ్ఞానం చైనాకు ఉండాలి. అసలు ఎల్ఏసీ మ్యాప్‌లను ఇచ్చిపుచ్చుకుందామన్న మన ప్రతిపాదనకే అది జవాబివ్వటం లేదు. ఆ పని చేస్తే తన పాపం బద్దలవుతుందని దాని భయం. వర్తక వాణిజ్యాలు ముమ్మరంగా పెరిగేలా, కట్టుదిట్టమైన భద్రత ఉండేలా ఎస్సీఓను తీర్చిదిద్దుతామని మాటల్లో చెబుతూనే అతి పెద్ద మార్కెట్‌గా ఉన్న భారత్‌ను విస్మరించటం ఏ రకంగా చూసినా చైనాకు తోడ్పడదు. పొరుగుతో సఖ్యతకు రాలేని దేశం ఇటువంటి సంస్థల అభ్యున్నతికి ఏమాత్రం పాటుపడగలదన్న ప్రశ్నలు అందరిలోనూ తలెత్తుతాయి. అందువల్లే మళ్లీ చర్చల పునరుద్ధరణకు చైనా చొరవ తీసుకోవాలి. చైనా విదేశాంగమంత్రి వాంగ్ యీ, జైశంకర్‌ల మధ్య జరిగిన భేటీ ఆ దిశగా తోడ్పడితే మంచిదే. సమస్య పరిష్కారానికి ఇరు దేశాలూ చిత్తశుద్ధితో ప్రయత్నించి సఫలమైతేనే ఎస్సీఓ వంటి సంస్థల నిజమైన లక్ష్యాలు నెరవేరతాయి. -
రచ్చ కాదు... చర్చ కావాలి!
కొత్త సభ కొలువు తీరిందన్న మాటే కానీ, పార్లమెంట్లో పాత దృశ్యాలే పునరావృతమయ్యాయి. 18వ లోక్‌సభ ఏర్పడ్డాక జరిగిన తొలి పార్లమెంట్ సమావేశాలు సభ్యుల ప్రమాణ స్వీకారం, రాష్ట్ర పతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానానికే పరిమితమయ్యాయి. కానీ, నేతలెవరు మాట్లాడుతున్నా... వెనుక నుంచి అవే అరుపులు, గందరగోళ పరిస్థితులు, రన్నింగ్ కామెంటరీలు, సభాపతితో వాగ్వాదాలు, చివరకు వాకౌట్లు తప్పలేదు. సర్వసాధారణంగా ఏకగ్రీవం గానో, లేదంటే అధికార – ప్రతిపక్షాల మధ్య పోటీతోనో జరగాల్సిన లోక్‌సభ స్పీకర్ ఎన్నిక సంప్రదాయానికి భిన్నంగా ఈసారి మూజువాణి ఓటుతో సాగింది. ఇక, ప్రతిపక్షాలకు కేటాయించాల్సిన లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ పదవిని తద్భిన్నంగా గత అయిదేళ్ళుగా ఖాళీగా అట్టిపెట్టేసిన అధికార బీజేపీ, ఈసారి కూడా ఆ పదవిని వారికి వదిలిపెట్టే పెద్దమనసు చేస్తున్నట్టు లేదు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వ సారథిగా తన మిత్రపక్షాలకు ఆ పదవిని కట్టబెట్టాలని బీజేపీ చూస్తున్నట్టు వస్తున్న కథనాలే అందుకు నిదర్శనం. ఇక, సభానాయకుడికీ, ప్రతిపక్ష నేతకూ మధ్య పొసగని పరిస్థితి సరేసరి. వెరసి లోక్‌సభలో మంగళవారం, రాజ్యసభలో బుధవారం ముగిసిన తొలి సమావేశాలు అసంతృప్తినే మిగిల్చాయి. ఈ పాపంలో అధికార, ప్రతిపక్షాలు రెంటికీ సమాన భాగస్వామ్యం ఉంది. కొద్ది నెలలుగా పూర్తి స్థాయి ఎన్నికల ప్రచారంలో మునిగితేలిన పార్టీలు ఇప్పటికీ ఆ మానసిక స్థితి నుంచి బయట పడినట్టు లేవు. ఎన్నికల ముగిసి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా పార్లమెంట్ సాక్షిగా ఇరుపక్షాలూ పరస్పరం ఎన్నికల ప్రచార తరహా ఆరోపణల పర్వం కొనసాగించడం దురదృష్టం. ప్రతిపక్ష నాయకుడిగా తొలిసారిగా బాధ్యతలు చేపట్టిన రాహుల్ గాంధీ తన ప్రథమ ప్రసంగంలోనే ప్రభుత్వంపై నిశిత విమర్శలతో దూకుడు ప్రదర్శించారు. ఇతర ప్రతిపక్ష నేతలు సైతం శక్తిమంత మైన ప్రసంగాలే చేశారు. కాబట్టి వారికి తగినంత సమయం ఇవ్వలేదన్న ప్రసక్తే లేదు. రాహుల్ ఉద్వేగభరితంగా మాట్లాడుతూ మార్కులు సంపాదించినా, సరైన గణాంకాలతో సమస్యల్ని నిర్దిష్టంగా ప్రస్తావించలేకపోయారు. అగ్నివీర్ లాంటి అంశాల్లో ఆయన లెక్కలు తప్పు చెప్పారు. మరోపక్క ప్రధాని లోక్‌సభలో మాట్లాడుతున్నంత సేపూ ప్రతిపక్షాలు నినాదాలు హోరెత్తించాయే తప్ప, హుందాతనం పాటించలేదు. రాహుల్ సైతం సభలో సభ్యుల్ని రెచ్చిపొమ్మన్నట్టు ప్రేరేపించడం సైతం ఏ మాత్రం సమర్థనీయం కాదు.రాహుల్‌ది పిల్లతనం, కాంగ్రెస్ పరాన్నజీవి లాంటి రాజకీయ విమర్శలు గుప్పించిన మోదీ కూడా తక్కువేమీ తినలేదు. ఎంతసేపటికీ పాత ఎమర్జెన్సీ గాయాన్ని గుర్తు చేసి, కాంగ్రెస్‌ను తప్పు బట్టడానికి ప్రయత్నించారు. లేదంటే గడచిన తమ పదేళ్ళ ప్రస్థానాన్ని గుణగాన సంకీర్తన చేశారు. అంతేతప్ప లోక్‌సభలో చేసిన రెండున్నర గంటల సుదీర్ఘ ప్రసంగంలో ప్రతిపక్షాలు ప్రస్తావించిన, దేశాన్ని పీడిస్తున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కార్యాచరణ ఏమిటన్నది మాత్రం చెప్పలేదు. చెప్పాలనుకోలేదు. సంక్షుభిత మణిపుర్లో ఏడాదిగా ఒక్కసారైన పర్యటించని మోదీ సదరు ఈశాన్య రాష్ట్రంలో పరిస్థితులు మెరుగుపడ్డాయంటూ రాజ్యసభలో అసత్యాలాపన చేయడం మరీ విడ్డూరం. ఒక్కమాటలో... ఈసారి సొంత మెజారిటీ తగ్గి, కూటమి ప్రభుత్వం నడుపుతున్న మోదీ ఇప్పటికీ గత రెండుసార్లు తిరుగులేని మెజారిటీతో సాగిన బీజేపీ ప్రభుత్వ ఆధిపత్య ధోరణినే ప్రదర్శిస్తు న్నారు. ప్రభుత్వ పెద్దగా, అనుభవజ్ఞుడిగా ప్రతిపక్షాలను సైతం కలుపుకొని పోవాలన్న ఆలోచన చేయట్లేదు. పట్టువిడుపులు చూపట్లేదు. దాంతో ఇరుపక్షాలకూ మధ్య రాజీ కుదిరేలా కనిపించట్లేదు.అందరూ కలిసి నాటకీయ చర్యలు, వ్యాఖ్యలతో పార్లమెంట్‌ను (రణ) రంగస్థలిగా మార్చేశా రన్నది చేదు నిజం. అధికార, ప్రతిపక్ష నేతలు అంశాల వారీగా చర్చిస్తే, విభేదిస్తే ఫరవాలేదు కానీ, నిత్యం ఉప్పు నిప్పుగా ఉంటే పార్లమెంట్ నడిచేదెట్లా? మళ్ళీ జనం ముందుకు వెళ్ళడానికి మరో అయిదేళ్ళుండగా, రేపే ఎన్నికలన్నట్టు రాజకీయ విమర్శల్లో మునిగితేలితే లాభమేంటి? నీట్ పరీక్ష, నిరుద్యోగం, ఈ అయిదేళ్ళలో సాగాల్సిన నియోజక వర్గ పునర్విభజన, ఇప్పటికే చాలా ఆలస్యమైపోయిన జనగణన లాంటి అనేక తక్షణ, దీర్ఘకాలిక అంశాలు చర్చకు మిగిలే ఉన్నాయి. అలాంటి వాటిపై దృష్టి పెట్టాలి. కీలకమైన బిల్లుల ఆమోదానికి లోక్‌సభలో టీడీపీ, జేడీయూల పైన, రాజ్యసభలో బిజూ జనతాదళ్ సైతం దూరమైనందున ఇతరులపైన ఆధారపడాల్సిన మోదీ 3.0 ఆభిజాత్యం వదులుకోకపోతే కష్టం. ఘర్షణ, విద్వేషం మరింత పెరిగిపోవడాని కన్నా ముందే నేతలు ఆత్మపరిశీలన చేసుకోవాలి. దేశ శ్రేయస్సు కోసం హుందా చర్చకు తెర తీయాలి.బడ్జెట్ కోసం జూలై మూడో వారంలో పార్లమెంట్ తిరిగి సమావేశం కానుంది. అప్పుడైనా అధికార, ప్రతిపక్షాలు తమ వైఖరి మార్చుకోవాలి. ఇరుపక్షాలూ విజ్ఞతతో వ్యవహరించాలి. ప్రతిపక్ష వాదనకు చెవి ఒగ్గాల్సిన బాధ్యత పాలకులకు తప్పనిసరిగా ఉంది. అదే సమయంలో– ప్రజలిచ్చిన మెజారిటీతో గద్దెనెక్కి, చెప్పే అధికారం చేజిక్కించుకున్న పాలకుల మాటలను ప్రతిపక్షాలూ సావధానంగా విని తీరాలి. ఎవరు ఎవరిని మాట్లాడనివ్వబోమన్నా, వినిపించుకోబోమన్నా అది ప్రజాస్వామ్యం కాదు. ప్రజాక్షేమానికి అసలు పనికిరాదు. అనేక అంశాలపై పరస్పర భిన్నమైన అభిప్రాయాలు సహజంగానే ఉంటాయి. కానీ పార్లమెంట్లో జరగాల్సింది అర్థవంతమైన చర్చే తప్ప అనవసర రాద్ధాంతం కాదు. ప్రజాస్వామ్య దేవాలయంగా, అత్యున్నత నిర్ణాయక వేదికగా పార్లమెంట్‌కు ఉన్న ప్రతిష్ఠకు భంగం కలిగేలా ప్రవర్తిస్తే అది అందరికీ నష్టం. గత పదేళ్ళుగా చట్ట సభల్లో అంతకంతకూ పెరిగిపోతున్న ఇలాంటి ప్రవర్తన ఇలాగే కొనసాగితే, మొదటికే మోసం వస్తుంది. ప్రజాసమస్యలపై చర్చించాల్సిన చట్టసభల సమావేశాలకు ప్రయోజనం లేకుండా పోతుంది. -
ఘోరం... నేరం...
మానవ బలహీనతను సొమ్ము చేసుకోవడానికి నమ్మకాన్ని వాటంగా మార్చుకోవడం చరిత్రలో తరచూ కనిపించేదే. ఎవరికీ ఏ ఇబ్బందీ కలగనంత వరకేమో కానీ... ప్రజల అమాయకత్వాన్ని స్వార్థానికి వాడుకుంటున్నప్పుడు, ఆ ప్రక్రియ ఆఖరికి ప్రాణాంతకంగానూ మారినప్పుడు చూస్తూ సహించలేం. సమకాలీన సమాజంలో అలాంటి అనుభవాల్ని భరించలేం. ఉత్తరప్రదేశ్‌లోని హాథ్రస్ జిల్లా ఫూల్రాయ్ వద్ద మంగళవారం జరిగిన ధార్మిక సభ, అక్కడ తొక్కిసలాటను చూసినప్పుడు అదే అనిపిస్తుంది. 121 మంది అమాయక భక్తులు మరణించిన హాథ్రస్ ఘటన ఘోర విషాదం. పాదధూళితో, పంపులో నీళ్ళతో సమస్త సమస్యలూ పరిష్కారమవుతాయని అమాయక ప్రజల్ని నమ్మిస్తున్న ఓ పెద్ద మనిషి తప్పిదానికి అమాయక ప్రజల ప్రాణాలు గాలిలో కలిశాయి. పాలకులు ఎప్పటి లానే సంతాపాలు తెలిపారు. నష్టపరిహారాలు ప్రకటించారు. సిట్ దర్యాప్తుకూ ఆదేశించారు. కానీ, తరచూ జరుగుతున్న ఇలాంటి దుర్ఘటనల్ని నివారించాల్సిన బాధ్యత లేదా? ప్రమాదవేళ తూతూ మంత్రంగా స్పందించి, ఆనక నివారణ చర్యలపై నిమ్మకు నీరెత్తినట్టుంటే సరిపోతుందా? తాజా హాథ్రస్ ఘటనకు కేంద్రబిందువైన స్వయం ప్రకటిత దైవదూత నారాయణ్ సాకార్ హరి అలియాస్ భోలే బాబా కథ సుదీర్ఘమైనదే. ఆయన అసలు పేరు సూరజ్ పాల్. ఆధ్యాత్మిక గురువుగా మారక ముందు యూపీ పోలీసుల స్థానిక ఇంటెలిజెన్స్ విభాగంలో సాధారణ హెడ్ కానిస్టేబుల్. ఉద్యోగంలో ఉండగానే తాను ఆధ్యాత్మికత వైపు మొగ్గాననీ, అందుకే 1990లలో చేస్తున్న ఉద్యోగం మానేసి దైవమార్గం పట్టాననీ ఆయన కథనం. ఉత్తరప్రదేశ్‌లో ఓ చిన్న గ్రామంలో రైతు కుటుంబంలో పుట్టిన ఆయన చలువ కళ్ళద్దాలు, శ్వేత వస్త్రధారణతో పేరు, పలుకుబడి గల బాబాగా అవతరించడం ఆశ్చర్యమే. ఇవాళ యూపీ, రాజస్థాన్, ఢిల్లీ, హర్యానా తదితర ప్రధాన హిందీ రాష్ట్రాల్లో ఆయనకు లక్షలాది భక్తులు పోగుబడడం మరింత ఆశ్చర్యం కలిగిస్తుంది. చనిపోయిన బిడ్డను బ్రతికిస్తానంటూ 23 ఏళ్ళ క్రితం శ్మశానంలో గందరగోళం చేయడం మొదలు లైంగిక అత్యాచార ఆరోపణల దాకా ఈ బాబాపై అనేక కేసులున్నాయి. నాలుగేళ్ళ క్రితం 2020 జనవరిలో షాజహాన్‌పుర్‌లో ఈయన సత్సంగంలోనే ప్రసాద వితరణ వేళ మంటలు చెలరేగి, తొక్కిసలాట జరిగింది. సమయానికి అగ్నిమాపక దళం రావడంతో పెను ప్రమాదం తప్పింది. కానీ, దోవ కూడా సరిగ్గా లేని తాజా హాథ్రస్ ఘటనాస్థలిలో కనీసం అంబులెన్స్ లాంటివైనా లేకపోవడం ఘోరం, నేరం.హాథ్రస్ ఘటనపై కఠిన చర్యలు చేపడతామని యూపీ సీఎం గర్జించారు కానీ, ఈ దుర్ఘటనపై దాఖలు చేసిన ఎఫ్ఐఆర్లో అసలు భోలే బాబా పేరే పెట్టలేదు. ఇక, ఇంత భారీ దుర్ఘటన జరిగాక సదరు బాబా ఎవరికీ కనిపించకుండా పరారీలో ఉన్నారు. హాథ్రస్ ఘటన అత్యాశకూ, అపరిమిత నిర్లక్ష్యానికీ ప్రతీక. ఈ ఘటనలో తిలా పాపం తలా పిడికెడు. సత్సంగమంటూ 80 వేల మందికే అనుమతి తీసుకొన్నా, రెండున్నర లక్షల మందికి పైగా జనాన్ని అనుమతించడం ఎవరి తప్పు? తగినన్ని ప్రవేశ, నిష్క్రమణ మార్గాలైనా లేకుండా అంత భారీ ఆధ్యాత్మిక సభ జరిపిన నిర్వాహకులను ఏమనాలి? ‘నా పాదధూళి ఇంటికి తీసుకెళ్ళి సమస్యల్లో ఉన్నవారికి రాస్తే అన్నీ చక్కబడతాయి’ అని అమాయకుల బలహీనతతో ఆడుకొని, ఇంత ఘోరానికి కారకుడైన మహానుభావుణ్ణి ఏం చేయాలి? ఇంత జరిగాక కూడా ఆయన తన వకీలు ద్వారా ఈ దుర్ఘటన వెనుక అసాంఘిక శక్తుల కుట్ర ఉందంటూ నెపం నెట్టేసే పని చేస్తుంటే పాలకులు ఏం చేస్తున్నట్టు? హాథ్రస్ ఘటన లాంటివి మనకు కొత్త కాదు. గతంలోనూ ఇలాంటివి అనేకం జరిగాయి. 2005లో మహారాష్ట్రలోని వాయిలో మంధరాదేవి గుడి వద్ద తొక్కిసలాటలో 340 మందికి పైగా చనిపోయారు. 2008లో రాజస్థాన్‌లో చాముండా దేవి ఆలయం వద్ద కనీసం 250 మంది, హిమాచల్ ప్రదేశ్‌లోని నైనాదేవి గుడి వద్ద 162 మంది తొక్కిసలాటల్లోనే దుర్మణం పాలయ్యారు. చరిత్ర పుటల్లో వెనక్కి వెళితే, 70 ఏళ్ళ క్రితం 1954లో స్వాతంత్య్రానంతరం జరిగిన తొలి కుంభమేళాలో అలహా బాద్‌లో జరిగిన తొక్కిసలాటలో 800 మంది ప్రాణాలు కోల్పోవడం గుండెల్ని మెలిపెట్టే విషాదం. రద్దీని నియంత్రించే వ్యవస్థలు లేకపోవడం, భారీగా జనం తరలివచ్చే సందర్భాలకు తగ్గట్టు ముందస్తు ప్రణాళికా రచన చేయకపోవడం, సామాన్యుల నియంత్రణే కష్టంగా ఉండే సమయంలో వీఐపీల తాకిడి ఎక్కువై యంత్రాంగమంతా వారి సేవల్లో తరించడం లాంటి లోపాలు ఆనాటి నుంచి ఈనాటి వరకు కొనసాగుతూనే ఉన్నాయి. అది మరింత విషాదం. భారతదేశంలో నూటికి 79 తొక్కిసలాటలు ధార్మిక సమ్మేళనాలు, తీర్థయాత్రల్లో జరుగుతున్నవేనని 2013లో ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్లో ప్రచురితమైన ఓ అధ్యయనం తేల్చింది. పైపెచ్చు, మన దేశంలో అనేక ఆలయాలు కొండల పైన, నదీ తీరాల్లో, ప్రయాణానికి సంక్లిష్టమైన ఇతర ప్రాంతాల్లో నెలకొన్నందున తొక్కిసలాటల ముప్పు ఎక్కువ. ఇక గ్రామీణ ప్రాంతాల్లో ధార్మిక సమ్మేళనాలు నిర్వహిస్తుంటే వేలు, లక్షల్లో జనం రాకతో ఆ ప్రాంతాలు క్రిక్కిరిసి పోతున్నాయి. అలాంటి చోట్ల ప్రాథమిక వసతులే కాదు... కనీసం సరైన ప్రవేశ మార్గాలు, అత్యవసర పరిస్థితుల్లో నిష్క్రమణ మార్గాలు సైతం ఉండట్లేదు. ఇవన్నీ ప్రమాదాలకు కారణాలే. వీటిని నివారించాలంటే జనసమ్మర్దాన్ని నియంత్రించే యంత్రాంగం కీలక పాత్ర పోషించాలి. 2014లోనే జాతీయ విపత్తుల ప్రాధికార సంస్థ జనసమ్మర్ద నియంత్రణపై మార్గదర్శకాలు ఇచ్చింది. కానీ, అవి ఎక్కడా అమలైనట్టు లేవు. తరచూ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజా ఘటనతోనైనా పాలకులు నిద్ర లేస్తారా? ఓట్ల రాజకీయాల్ని వదిలేసి, మూఢనమ్మకాలు ప్రోత్సహించేవారికి ముకుతాడు వేస్తారా? -
అంతా సిద్ధమేనా?
భారత న్యాయశాస్త్ర చరిత్రలో మొన్న జూలై 1న ఒక కొత్త అధ్యాయం మొదలైంది. బ్రిటీషు కాలం నాటి నేర చట్టాల స్థానంలో మూడు కొత్త చట్టాలను మోదీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం అమలులోకి తెచ్చింది. భారత శిక్షాస్మృతి– 1860, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్– 1973, భారతీయ సాక్ష్యాల చట్టం – 1872... ఈ మూడింటి బదులు ‘భారతీయ న్యాయ సంహిత’, ‘భారతీయ నాగరిక్ సురక్షా సంహిత’, ‘భారతీయ సాక్ష్య అధినియమ్’లు సోమవారం నుంచి ఆచరణలోకి వచ్చాయి. అయితే, న్యాయకోవిదుల మొదలు సాధారణ కక్షిదారుల వరకు ఈ కొత్త చట్టాలపై భిన్న స్వరాలు వినిపిస్తున్నారు. నేరన్యాయవ్యవస్థను ఆధునికీకరించడంలో ఈ కొత్త చట్టాలు గణనీయమైన ముందడుగు అని కొందరు ప్రశంసిస్తుంటే, మరికొందరు పాతవాటికి పైపై మెరుగులు దిద్ది, అమానుషంగా మార్చారని విమర్శిస్తున్నారు. పోలీస్స్టేషన్ల నుంచి కోర్టుల దాకా అన్నిటా పనితీరును మార్చేసి, సామాన్యులపై పెను ప్రభావం చూపే ఈ శాసనాలపైనే ఇప్పుడు దేశమంతటా చర్చ సాగుతోంది. కొత్త నేర చట్టాల వ్యవహారం సహజంగానే అధికార బీజేపీకీ, ప్రతిపక్ష కాంగ్రెస్‌కూ మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. వలసవాద పాలన తాలూకు అవశేషాలను వదిలించుకొనే ఈ ప్రయత్నం దేశపురోగతికీ, స్థితిస్థాపకతకూ ప్రతీక అన్నది బీజేపీ మాట. కాంగ్రెస్ మాత్రం గడచిన ప్రభుత్వ హయాంలో పార్లమెంట్లో ఏకంగా 146 మంది ప్రతిపక్ష సభ్యులు సస్పెండైన వేళ, కేవలం మూజువాణి ఓటుతో బలవంతాన ఈ చట్టాలకు ఆమోదముద్ర వేశారనీ, పార్లమెంటరీ వ్యవస్థలో ఈ రకమైన ‘బుల్డోజర్ న్యాయాన్ని’ తమ ప్రతిపక్ష కూటమి సహించబోదనీ పేర్కొంది. శతాబ్ద కాలానికి ముందెప్పుడో బ్రిటీషు హయాంలో చేసిన చట్టాలు శిక్షల మీద ప్రధానంగా దృష్టి పెడుతుంటే, ఈ కొత్త చట్టాలు మటుకు అందరికీ న్యాయం, హక్కుల పరిరక్షణకు ప్రాధాన్యమిస్తాయనేది అధికార పక్షం కథనం. కానీ, ఆ మాటలతో ప్రతిపక్షాలే కాదు... చివరకు పలువురు న్యాయశాస్త్ర నిపుణులు సైతం విభేదిస్తుండడం గమనార్హం. ఇంకా చెప్పాలంటే, సరికొత్త శాసనాలు దుర్వినియోగమయ్యే ప్రమాదం ఎంతైనా ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిజానికి, మారుతున్న సమాజ పరిస్థితులు, అవసరాలకు తగ్గట్టుగా పాతకాలపు చట్టాలను మార్చాలన్న ఆలోచన మంచిదే. ప్రస్తుతం విచారణలోని ఖైదీలు లెక్కకు మిక్కిలిగా జైళ్ళలో మగ్గిపోతున్నారు. అసంఖ్యాకంగా బాధితులు న్యాయం కోసం ఏళ్ళ తరబడి నిరీక్షిస్తున్నారు. లక్షల కొద్దీ కేసులు కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో నేర న్యాయవ్యవస్థలో సంస్కరణలు అత్యవసరం. అయితే, అందుకు గడచిన మోదీ సర్కార్ హడావిడిగా అనుసరించిన పద్ధతి, తగిన చర్చకు తావివ్వకుండా పార్లమెంట్లో చూపిన ఆధిపత్యం, చేసిన మంచి సూచనల్నీ – చెప్పిన అభ్యంతరాలను సైతం పట్టించుకోని తెంపరితనంతోనే అసలు చిక్కంతా! అసలు 2020 జూలైలోనే కేంద్ర హోమ్ శాఖ ఏర్పాటు చేసిన నిపుణుల సంఘం వైవాహిక అత్యాచారం మొదలు కారుణ్య మరణాన్ని చట్టబద్ధం చేయడం, రాజద్రోహ నేరంపై పునస్సమీక్ష లాంటి అనేక అంశాలపై పౌరులకు వివరమైన ప్రశ్నావళిని జారీ చేసింది. అయితే, కరోనా కాలంలోనే సంప్రతింపుల ప్రక్రియలో అధిక భాగం జరిగింది. అడిగిన, ఆశించిన భారీ మార్పులేమీ లేకుండానే కొత్త చట్టాలు వచ్చేశాయి. ఎఫ్ఐఆర్ నమోదుకు ముందు ఏకంగా 14 రోజుల పాటు పోలీసు అధికారి ప్రాథమిక దర్యాప్తు చేయవచ్చనడం, పోలీసు కస్టడీ కాలవ్యవధిని 15 రోజుల నుంచి అనేక వారాలు పెంచేయడం, చేతులకు బేడీలు సహా కొన్ని అంశాల్లో పోలీసులకు అపరిమిత అధికారాలు కట్టబెట్టడం లాంటివి ఇప్పటికే వివాదాస్పదమయ్యాయి. అలాగని కొత్త చట్టాల్లో ఏ మంచీ లేదనలేం. కొన్ని ముందడుగులు పడ్డాయి. కొన్ని రకాల నేరాల్లో శిక్షకు ప్రత్యామ్నాయంగా సామాజిక సేవ చేయడాన్ని ప్రవేశపెట్టారు. అలాగే, వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా విచారణలకూ వీలు కల్పించారు. త్వరితగతిన విచారణలు పూర్తయ్యేలా నిర్ణీత కాలవ్యవధులను నిర్ణయించడం మరో మంచి ప్రయత్నం. అయితే, చట్టాలకు అన్ని ప్రాంతాలకు అర్థమయ్యే ఇంగ్లీష్ పేర్లు పెట్టనే లేదు. ప్రాంతీయ భాషల్లో అనువాదం పూర్తి కానేలేదు. రాష్ట్రాలు స్థానికంగా అవసరమైన మార్పులు చేసుకోవచ్చంటున్నా, చిక్కులున్నాయి.ఏమైనా, కొత్త చట్టాల అమలు సైతం సవాలే. దశాబ్దాలుగా అలవాటైపోయిన సెక్షన్లు, చట్టాలను ఒక్కసారిగా మార్చేయడం ఇతర సమస్యలు తెచ్చింది. ఏ నేరానికి ఏ సెక్షన్ ఎంతమేరకు వర్తిస్తుందో ఇప్పటికిప్పుడు చటుక్కున అర్థం కాని పరిస్థితి. పోలీసు, న్యాయ వ్యవస్థలు కొత్త పద్ధతులకు ఏ మేరకు సుశిక్షితమైనదీ చెప్పలేం. అన్నీ అర్థమై, అలవాటయ్యే వరకు చట్టాల అమలు సంస్థలు, జడ్జీలు, లాయర్ల నుంచి కక్షిదారుల వరకు అందరికీ గందరగోళమే. అలాగే జూలై 1కి ముందు కేసులను పాత చట్టాలతో, ఆ తరువాతి కేసులను కొత్త చట్టాలతో విచారించాల్సి ఉంటుంది. ఇప్పటికీ లక్షల కొద్దీ పాత కేసులు పెండింగ్‌లో ఉన్నందున చాలాకాలం రెండు రకాల చట్టాలనూ అనుసరించాల్సి వస్తుంది. ఇది మరో పెద్ద చిక్కు. అలాగే, ఏ చట్టాలైనా వ్యక్తిగత స్వేచ్ఛ, పౌరహక్కులకు అండగా నిలిస్తేనే వాటికి విలువ. కొత్త చట్టాలపై ఆ విషయంలోనూ అనేక అనుమానాలున్నాయి. కాబట్టి వీటిపై పార్లమెంట్‌లోనే కాదు... పౌర సమాజంలోనూ విస్తృత చర్చ జరగనివ్వాలి. ఆ స్వరాలకు పాలకులు చెవి ఒగ్గాలి. లోపాలను సరిచేయాలి. వ్యవస్థలో సంస్కరణ ఒక్కరోజులో, ఒక్కసారిగా జరిగేది కాదని గుర్తించి, మార్పులు చేర్పులతో సాగాలి. అందుకిది మొదటి అడుగు అవ్వాలి. -
భారీ విజయం... భావి ప్రయాణం...
శనివారం రాత్రి పొద్దుపోయాక... అద్భుతమే జరిగింది. గతంలో అనేకసార్లు ఊరించి ఉసూరుమనిపించినట్టే ఈసారీ ఫలితం అటూ ఇటూగా ఉంటుందేమోనని భయపడుతున్న క్రీడాభిమానుల సందేహాలు తుదిఘట్టంలో పటాపంచలయ్యాయి. పదిహేడేళ్ళ సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది. భారత క్రికెట్ జట్టు విజయపతాకం ఎగరేసింది. పొట్టి క్రికెట్ విధానంలో తొలి ప్రపంచ కప్‌ను 2007లో గెలిచిన భారత జట్టు... మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత తొమ్మిదో ప్రపంచ కప్‌ను అందుకుంది. మరెక్కడా లేనంత భారీగా, హంగులూ ఆర్భాటాలతో ఆకర్షణీయంగా, అత్యంత సంపన్నంగా టీ20 లీగ్‌ను జరిపే భారత్ మరోసారి ఆ ఫార్మట్‌లో జగజ్జేతగా నిలిచింది. జూన్ 29న వెస్టిండీస్‌లోని బార్బడోస్‌లో ఆఖరు దాకా ఉత్కంఠగా సాగిన ఐసీసీ టీ20 వరల్డ్ కప్– 2024 ఫైనల్లో దక్షిణాఫ్రికాపై 7 పరుగుల తేడాతో భారత జట్టు సాధించిన విజయం చిరకాలం గుర్తుండిపోతుంది. అమెరికా, వెస్టిండీస్‌లు సంయుక్తంగా ఆతిథ్యమివ్వగా, న్యూయార్క్‌లో కొత్తగా వెలసిన స్టేడియమ్ మొదలు వివిధ కరేబియన్ దీవుల్లో సాగిన ఈ వరల్డ్ కప్ కొత్త ఉత్తేజం తెచ్చింది. చివరకు కప్ గెలుపుతో కోచ్‌గా ద్రావిడ్‌కూ, టీ20ల నుంచి రోహిత్ శర్మ, కోహ్లీ, రవీంద్ర జడేజాలకూ తీయటి వీడ్కోలు దక్కింది.గతంలో ఎన్నో విజయాలు సాధించినా... ఫార్మట్ ఏదైనప్పటికీ ప్రపంచ కప్ విజేతగా నిలవడమనేది ఎప్పుడూ ప్రత్యేకమే. 1983లో తొలిసారిగా కపిల్‌దేవ్ సారథ్యంలోని భారత జట్టు వన్డేలలో వరల్డ్ కప్ సాధించినప్పటి నుంచి సామాన్య ప్రజానీకంలో సైతం క్రికెట్ పట్ల, ప్రపంచ కప్ పట్ల పెరిగిన ఆకర్షణ అంతా ఇంతా కాదు. ఆ తర్వాత 20 ఓవర్ల పొట్టి క్రికెట్ వచ్చాక, 2007లో మహేంద్ర సింగ్ ధోనీ సేన తొలి టీ20 వరల్డ్ కప్ మనం దక్కించుకోవడంతో ఇక ఆకాశమే హద్దయింది. 2011లో మరోసారి వన్డేల్లో వరల్డ్ కప్ కైవసం చేసుకున్నాం. లెక్కలు తీస్తే... మనం టీ20 వరల్డ్ కప్ గెలిచి 17 ఏళ్ళయితే, అసలు ఏదో ఒక ఫార్మట్‌లో ప్రపంచ కప్ గెలిచి 13 ఏళ్ళవుతోంది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నిర్వహించే ఏదో ఒక టోర్నీలో విజేతగా నిలిచి, స్వదేశానికి ట్రోఫీ పట్టుకొచ్చి కూడా కనీసం 11 ఏళ్ళవుతోంది. 2013లో ఇంగ్లండ్‌లో ‘ఛాంపియన్స్ ట్రోఫీ’ తర్వాత ఐసీసీ పోటీల్లో మనకు మళ్ళీ ట్రోఫీలు దక్కలేదు. ఇన్నాళ్ళకు ఆ కొరత తీరింది. కొన్నేళ్ళుగా విజయావకాశాలు పుష్కలంగా ఉన్న ఫేవరెట్‌గా భారత క్రికెట్ జట్టు రకరకాల టోర్నీలలో బరిలోకి దిగుతోంది. కానీ, ప్రతిసారీ ఏదో ఒక దశలో విఫలమవుతోంది. కోచ్ ద్రావిడ్, కెప్టెన్ రోహిత్‌ల జోడీ సంగతికే వస్తే, ‘వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్స్’లో జట్టును ఫైనల్ దాకా తీసుకెళ్ళినా ఫలితం దక్కలేదు. చివరకు ఏడు నెలల క్రితం గత నవంబర్‌లో జరిగిన 2023 వన్డే వరల్డ్ కప్ లోనూ మంచి ఫామ్‌లో ఉన్న భారత జట్టు ఆఖరి ఘట్టంలో అహ్మదాబాద్‌లో తడబడింది. ఆ రెండుసార్లూ ఆస్ట్రేలియా చేతిలో ఓడింది. ఈ తాజా టీ20 వరల్డ్ కప్‌లో సైతం మొదటి నుంచి ఓటమి ఎరుగకుండా దూసుకువచ్చిన మన జట్టు శనివారం నాటి ఫైనల్లో ఒక దశలో ఓటమి అంచుల దాకా వెళ్ళిపోయింది. ప్రత్యర్థి సౌతాఫ్రికా జట్టు 30 బంతుల్లో 30 పరుగులే చేయాలి. పైగా 6 వికెట్లున్నాయి. ఆ పరిస్థితుల్లో బుమ్రా కట్టుదిట్టమైన బౌలింగ్, ఆల్‌రౌండర్ హార్దిక్‌పాండ్యా తెలివైన ఆట తీరు, బౌండరీ దాటుతున్న బంతిని అద్భుతంగా ఒడిసి పట్టుకొని ప్రత్యర్థి బ్యాట్స్‌మన్‌ను అవుట్ చేసిన సూర్యకుమార్ యాదవ్ ఫీల్డింగ్ మ్యాచ్ దిశను మార్చేశాయి. ఎట్టకేలకు సమష్టి స్ఫూర్తితో ఓటమి కోరల నుంచి కూడా విజయాన్ని అందుకొనే కళలో భారత్ ఆరితేరింది. జట్టు అవసరాలకు తగ్గట్టు భిన్నమైన ఆట శైలిని ఆటగాళ్ళు అవలంబించడం నేర్చుకున్నారు. పోయిన పాత ఫామ్‌ను మళ్ళీ అత్యవసరమైన ఫైనల్లో అందుకొని, అవతల వికెట్లు పడిపోతున్నా తడబడకుండా పిచ్ వద్ద పాతుకుపోయి, కోహ్లీ 76 పరుగులు చేసిన తీరు అందుకు మచ్చుతునక. రోహిత్ శర్మ సారథ్యం, అక్సర్ పటేల్ లాంటి ఆల్‌రౌండర్ల ప్రదర్శన, కీలకమైన ఫైనల్లో ప్రమాదకరంగా మారిన క్లాసెన్, డేవిడ్ మిల్లర్ లాంటి బ్యాట్స్మన్లను ఔట్ చేసిన యువ సీమర్ అర్ష్‌దీప్ సింగ్ పరిణతి... ఇలా అన్నీ కలిస్తేనే ఈ ప్రపంచ విజేత పట్టం. దేశంలోనే అత్యంత ప్రీతిపాత్రమైన ఆట... అందులోనూ వరల్డ్‌కప్ విజయం... అర్ధరాత్రి దాటినా సరే దేశమంతటా జనం వీధుల్లోకి వచ్చి మరీ ఆనందోత్సాహాలతో సంబరాలు జరుపుకొన్నది అందుకే! మన దేశంలోనే కాదు... దేశదేశాల్లో పెరుగుతున్న భారత క్రికెట్ క్రీడాభిమానులకూ ఇది పండుగ వాతావరణం తెచ్చింది. ఒక్కమాటలో, మన దేశం ఇప్పుడు క్రికెట్ సూపర్‌పవర్. ఒకప్పుడు 1970లు – 80లలో బలమైన బ్యాటింగ్, బౌలింగ్ సేనతో వీరవిహారం చేసిన వెస్టిండీస్ జట్టుతో ఇప్పుడు భారత్ ఆటగాళ్ళను విశ్లేషకులు పోలుస్తున్నారంటే ఆశ్చర్యం లేదు. మరి ఇక్కడ నుంచి మన క్రికెట్ ప్రయాణం ఎలా ముందుకు సాగనుందన్నది ఇక కీలకం. కోచ్ ద్రావిడ్ మొదలు కీలక ఆటగాళ్ళ దాకా పలువురి రిటైర్మెంట్తో ఒక శకం ముగిసింది. ప్రతిభావంతులైన యువ ఆటగాళ్ళపై గతంలో పెట్టుబడి పెడితేనే ఇప్పుడీ ఫలితాలు వచ్చాయని మర్చిపోరాదు. భవిష్యత్తే లక్ష్యంగా జట్టుకు కొత్త రక్తాన్ని ఎక్కించాలి. కొత్తగా కోచ్ బాధ్యతలు చేపట్టనున్న గౌతమ్ గంభీర్ ఖాళీ అవుతున్న కీలక స్థానాల భర్తీపై దృష్టి పెట్టాలి. మ్యాచ్‌లు ఆడకున్నా ఈ వరల్డ్‌కప్ జట్టులో భాగమైన యశస్వీ జైస్వాల్ సహా పలువురు ప్రతిభావంతుల్ని ఏరి, ఇకపై మరింత సానబెట్టాలి. కొద్ది నెలల్లోనే 2025లో పాకిస్తాన్లో జరిగే ఛాంపియన్స్ట్రోఫీ నాటికి సర్వసన్నద్ధం కావాలి. ఆ పునర్నిర్మాణానికి తాజా విజయం ఓ బలమైన పునాది. -
చదువుల తొలకరి
వర్షరుతువు ఊరికే రాదు, చదువుల ఋతువును వెంటబెట్టుకుని వస్తుంది. వేసవి కర్ఫ్యూ నుంచి బయటపడి ఆడా, మగా పిల్లలు గుంపులుగా, అనేక రంగుల పూదోటల్లా వీథుల్లోకి ప్రవహించే దృశ్యం– దేహానికి తొలకరి లానే చూపులకు చందనమవుతుంది. పుస్తకాల బరువుతో బుడిబుడి అడుగుల బాలసరస్వతుల నవ్వుల తళతళలు, మాటల గలగలలు పరిసరాలకు సరికొత్త బాల్యశోభనిస్తాయి. చదువుల నిచ్చెన మీద పిల్లలూ, వాళ్లపై పెట్టుకున్న ఆశల నిచ్చెనపై కన్నవారూ ఏకకాలంలో కొత్తమెట్టు ఎక్కడం ఎల్లెడలా కనిపిస్తుంది. చదువుల చరిత్రనే రాస్తే, అది మెరుపులు; మంచి చెడుల మలుపుల మీదుగా సాగిపోతుంది. ప్రాచీనకాలంలో ఋష్యాశ్రమాలే విద్యాలయాలు. అధికార, ధనబలాలలో తేడాలున్న క్షత్రియుల పిల్లలూ, బ్రాహ్మణుల పిల్లలూ కలసి చదువుకునేవారు. అలా చదువుకున్న ద్రుపద, ద్రోణాచార్యుల మధ్య ఆ తర్వాత వచ్చిన అంతస్తుల తారతమ్యాలు శత్రుత్వానికి దారితీసి మహాభారతంలో కొన్ని కీలక పరిణామాలకు కారణమయ్యాయి. వేటకొచ్చిన రాజులు పరివారాన్ని దూరంగా విడిచి పాదచారులై వెళ్ళి గౌరవప్రపత్తులతో ఋషిని దర్శించుకోవడం గురించి వింటాం. అలాంటి గురుస్థానం చిరుస్థానమై బతకలేని బడిపంతుల స్థాయికి కుదించుకోవడమూ చూశాం. అయితే, నాటి చదువుల వ్యవస్థలోని ఏ కాస్త వెలుగునూ హరించే చీకట్లూ లెక్కలేనన్నే. కొన్ని చదువుల్ని సార్వత్రికం చేయకపోవడం ఒకటైతే; చదువుల్లో ఎక్కువ, తక్కువ తేడాలు ఇంకొకటి. ‘కమ్మరి కొలిమీ, కుమ్మరి చక్రం, జాలరి పగ్గం, సాలెల మగ్గం, శరీరకష్టం స్ఫురింపజేసే గొడ్డలి, రంపం, కొడవలి, నాగలి, సహస్రవృత్తుల సమస్త చిహ్నా’లలో వేటికవే చదువుల తల్లి సిగ పువ్వులన్నది నేటి అవగాహన. సాధారణ విద్యపై సాంకేతిక విద్యది పైచేయి కావడం చూస్తూనే ఉన్నాం. అలా కాలక్రమంలో చదువుల నిర్వచనమూ, ప్రయోజనమూ కూడా మారిపోయాయి. హిరణ్యకశిపుడు రాక్షసుడే అనుకున్నా చదువుల ప్రయోజనం గురించి ఆనాటి అవగాహనతోనే మాట్లాడతాడు. ‘చదవనివాడు అజ్ఞాని అవుతాడు, చదివితే సదసద్వివేచన కలుగుతుంది’ అని కొడుకు ప్రహ్లాదుడితో అంటాడు. ‘సదసద్వివేచన’ అనే మాటకు ఎన్ని అర్థాలైనా చెప్పుకోవచ్చు. మంచి చెడుల వివేచన ఒక అర్థమైతే; పారలౌకికంగా సత్యాసత్యాలు, నిత్యానిత్యాలనేవి మరికొన్ని. చదువుకుని వచ్చి ప్రహ్లాదుడు తండ్రికి చెప్పిన సమాధానమూ దానికి దీటుగానే ఉంటుంది. ‘ధర్మార్థాలతో సహా ముఖ్యశాస్త్రాలనే కాదు, చదువులలోని మర్మమంతా చదివేశా’నంటాడు. చదువులలోని మర్మమంటే అతని ఉద్దేశం – భక్తి, ఆధ్యాత్మికతలనే! ఆనాడు చదువంటే కేవలం ఉద్యోగానికి ఓ అర్హత కాదు; బ్రహ్మచర్యం, గృహస్థం,వానప్రస్థం, సన్యాసమనే నాలుగు ఆశ్రమాల మీదుగా సాగాల్సిన జీవనయానంలో తొలి అంకం. నాడు రాజాస్థానాల్లో గణకులు, వ్రాయసకాండ్ర వంటి ఉద్యోగాలున్నా వాటి అందుబాటు పరిమితం. దాచుకున్న ధనమూ; పురుషుడికి రూపమూ, కీర్తీ, భోగమూ కలిగించేదీ, విదేశబంధువూ, విశిష్ట దైవమూ, రాజపూజితమూ అంటూ ఏనుగు లక్ష్మణకవి చేసిన అభివర్ణన అన్ని విద్యలకూ వర్తించేదే అయినా పెద్ద పీట వేదశాస్త్రాలదే. ఈ విద్యార్థతలున్నవారు ‘సర్టిఫికెట్’ పుచ్చుకుని ఉద్యోగం వేటలో పడాల్సిన అవసరమే లేదు; గుర్తింపు, గౌరవం, మడిమాన్యాలు అన్నీ వాళ్ళ దగ్గరికే వచ్చేవి. భాషలో అపర శేషువూ; యజ్ఞయాగాదుల్లో, వేదాధ్యాపనలో మునిగితేలేవాడే అయినా సంపన్నుడు కనుక; రాజులేమైనా ఇవ్వబోతే సాలగ్రామాన్ని సైతం పుచ్చుకోడానికి నిరాకరించే ‘మనుచరిత్ర’లోని ప్రవరాఖ్యుడూ కనిపిస్తాడు. వేదాలకు గాదెగా, శాస్త్రాలకు పుట్టిల్లుగా, కళాకలాపాల రచ్చగా తెనాలి రామకృష్ణుడు తన ‘పాండురంగ మాహాత్మ్యం’లో పరిచయం చేసిన సభాపతి అనే ఆయన పశు శిశు దాసీజనం కలిగిన ధనికుడు; ఆపైన వడ్డీవ్యాపారం, సేద్యం కూడా చేస్తూ రాజు దగ్గరికి రాకపోకలు సాగిస్తూ ఉంటాడు. తన పేరును నేతిబీరను చేస్తూ చెడు తిరుగుళ్లు మరిగిన నిగమశర్మ ఇతని కొడుకే! ఈ పండితపుత్రుడు ఆగమవాదాల్లో నోరువిప్పడు కానీ విటుల వివాదాలను తీర్చడంలో మాత్రం మహా చురుకని– కవి చురక. బ్రిటిష్ ఏలుబడిలో డిగ్రీ చదువులొచ్చి ఉద్యోగంతో లంకె పడ్డాయి. స్వతంత్ర భారతంలో ఆ లంకె ఇంకా బిగిసింది తప్ప సడలలేదు. అదే సమయంలో దాదాపు అన్ని చదువులూ సార్వత్రికమై మేలూ చేశాయి. సంధిదశలో రెంటికీ చెడ్డ రేవళ్ళను గిరీశం, వెంకటేశం పాత్రల ద్వారా గురజాడ ‘కన్యాశుల్కం’లో బొమ్మ కట్టారు. నాలుగు ఇంగ్లీష్ ముక్కలు నేర్చి రికామీగా తిరిగేవాడు గిరీశమైతే, ‘మీ వల్ల నాకు ఒచ్చిందల్లా చుట్ట కాల్చడం ఒక్కటే. పాఠం చెప్పమంటే ఎప్పుడూ కబుర్లు చెప్పడమే’ నని వాపోయినవాడు వెంకటేశం. ఇంగ్లీషు చదువులు కుదురుకొని చదువు బడులు సమాజాన్ని చదువుకునే బడులుగా మారుతున్న వైనాన్ని కొడవటిగంటి కుటుంబరావు ‘చదువు’ నవలలో అద్భుతంగా చిత్రిస్తారు. చదువుల సారమైన సదసద్వివేచన అడుగంటి చదువు వ్యాపారమై వందలాది కోచింగ్ సెంటర్లను, వేలాది చీటింగ్ తుంటర్లను సృష్టించింది. నీతి తప్పిన ‘నీట్’ ద్రోహంతో కొత్త విద్యాసంవత్సరం మొదలవడం ఈ దుఃస్థితికి ప్రతీకాత్మక అభివ్యక్తి. నిఖిలదేశం హర్షించే మంచికాలం రహించాలని చదువులమ్మను కోరుకుందాం. -
ఇది సరైన సందేశమేనా?
‘మరణం నా చివరి చరణం కాదు’ అంటాడు విప్లవ కవి అలిశెట్టి ప్రభాకర్. నిజమే, ప్రభావశీలమైన వ్యక్తులు మరణానంతరం కూడా జీవించే ఉంటారు. వారి ప్రభావ స్థాయిని బట్టి సంవత్సరాలు, దశాబ్దాలు, శతాబ్దాల పర్యంతం కూడా. ప్రభావశీలతలో పాజిటివ్ కోణం ఒక్కటే చూడాలా? నెగెటివ్ ప్రభావానికి కూడా ఈ సూత్రం వర్తిస్తుందా? మానవ చరిత్రపై అడాల్ఫ్ హిట్లర్ చేసిన రక్తాక్షర సంతకం కూడా తక్కువ ప్రభావాన్ని చూపలేదు కదా! అతడు కూడా మనకు ప్రాతఃస్మరణీయుడవుతాడా?నిజానికి ఇందులో సమస్య ఏమీ లేదు. సందేహాతీతమైన సదాచారాలు మనకు ఉన్నాయి. సమాజం మేలు కోరిన వారు, ప్రజల మంచి కోసం పోరాడినవారు, మంచితనాన్ని పెంచినవారిని స్మరించుకునే సంప్రదాయం మనకున్నది. స్మారకాలు నిర్మించుకునే అలవాటు కూడా ఉన్నది. వారి జీవితాల్లోంచి సమాజం పాఠాలు నేర్చుకోవాలనే కాంక్షతో వారినలా తమ జ్ఞాపకాల్లో శాశ్వతంగా నిలబెట్టుకుంటారు. చెడుమార్గంలో పయనించి ప్రభావం కలిగించిన వారిని... అధ్యయనం కోసం మాత్రమే చరిత్ర పుటల్లోకి ఎక్కించాలి. వారికి మరణమే చివరి చరణం కావాలి. ఆ ప్రభావం ఆదర్శం కాకూడదు.కానీ, దురదృష్టవశాత్తు మారుతున్న కాలం వింత పోకడలు పోతున్నది. అభివృద్ధికి అర్థం మారుతున్నది. విజయ గాథలకు కొత్త నిర్వచనాలు చేరుతున్నాయి. గొప్పతనం అనే మాటకు తాత్పర్యం మారింది. ఎవరు బాగా సంపాదిస్తారో వారే మహానుభావులు అనే భావన బలపడుతున్నది. వారు ఏ మార్గంలో సంపాదించారన్న పట్టింపేమీ కనిపించడం లేదు. గమ్యం మాత్రమే కాదు, గమ్యాన్ని చేరే మార్గం కూడా పవిత్రంగా ఉండాలన్న గాంధీ బోధనను ఒక చాదస్తం కింద జమకట్టవలసిన పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. గాడ్సే వారసులకు గౌరవ మర్యాదలు లభిస్తున్న కాలంలోకి ప్రవేశించాము కదా!పారిశ్రామికాభివృద్ధిలో జాతి ప్రగతిని దర్శించిన జేఆర్డీ టాటా వంటి ఉన్నతస్థాయి పారిశ్రామికవేత్తలు కూడా మనకు ఉన్నారు. అటువంటి వారు చనిపోయినప్పుడు కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకొని అధికారిక సంస్మరణ సభలు నిర్వహించినట్టు గుర్తు లేదు. అటువంటి అదృష్టం మన తెలుగువాడైన చెరుకూరి రామోజీరావుకు దక్కింది. తెలుగు రాష్ట్రాల్లో ‘ఈనాడు’కున్నంత పేరు ఆయనకూ ఉన్నది. బాగా సంపాదించారు. చిట్‌ఫండ్స్‌తో ప్రారంభమై మీడియాకు విస్తరించారు. మీడియా దన్నుతో సాటి చిట్‌ఫండ్ కంపెనీలను చావబాది, వాటిని దివాళా తీయించారు. ఫలితంగా ఆయన ‘మార్గదర్శి చిట్‌ఫండ్స్’ దినదిన ప్రవర్ధమానమైంది.చిట్‌ఫండ్స్‌కు తోడుగా ‘ఫైనాన్షియర్స్’ పేరుతో మరో జంట కంపెనీ తెరిచారు. రెండు చేతులా ప్రజాధనాన్ని స్వీకరించారు. మీడియాను విస్తరింపజేశారు. ఫిలిం సిటీ పేరుతో ఓ మాహిష్మతీ రాజ్యాన్ని స్థాపించేశారు. ఈలోగా మీడియాను వాడుకొని ప్రభుత్వాలను మార్చారు. ‘పత్రికొక్కటి ఉన్న పదివేల సైన్యంబు’ అన్నారు నార్ల వెంకటేశ్వరరావు. ఆ వాక్యాన్ని చెరుకూరి వారు వ్యాపారపరంగా ఆలోచించారు. పదివేల సైన్యంబును ప్రయోగిస్తూ వచ్చారు. మొదట కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ పదివేల సైన్యం పొగబాంబులు పేల్చింది. ఫలితంగా ఎన్టీ రామారావు గద్దెనెక్కారు. రామోజీరావు వ్యాపారపు అడుగులకు మడుగులొత్తడానికి రామారావు నిరాకరించారు. క్రుద్ధుడైన రామోజీ వృద్ధుడైన రామారావుపైకి తన పదివేల సైన్యాన్ని అదిలించారు. ఎన్టీఆర్ గద్దె దిగి చంద్రబాబు గద్దెనెక్కారు. మనోవేదనతో ఐదు మాసాల్లోపే ఎన్టీఆర్ చనిపోయారు. రామోజీరావు పట్ల కృతజ్ఞతాపూర్వకంగా చంద్రబాబు ఆయనకు శుక్రాచార్యులవారి హోదా కల్పించారు.పత్రికా రచన రంగానికి సంబంధించి రామోజీకి పలు ప్రతిష్ఠాత్మక అవార్డులు లభించాయి. ‘ఈనాడు’ ఎడిటర్ హోదాతో ఆయన ఎడిటర్స్ గిల్డ్ అధ్యక్షుడుగా కూడా పని చేశారు. కానీ ఆయన వృత్తిపరంగా జర్నలిస్టు కాదు. నాన్ జర్నలిస్ట్ ఎడిటర్‌గా ఆయన పలు రికార్డుల్ని బద్దలు కొట్టారు. ఏకవాక్య రచన కూడా లేకుండా ఏకబిగిన దశాబ్దాల తరబడి ప్రధాన సంపాదకుడిగా కొనసాగిన ఘనతను ఆయన్నుంచి ఎవరూ లాక్కోలేరు. 1974లో విశాఖపట్నం నుంచి ‘ఈనాడు’ పత్రిక ప్రారంభమయ్యే నాటికి అప్పటికే ఉన్న రెండు పెద్ద పత్రికలు పాత మూసలోనే మునకేసి ఉన్నాయి. ఈ స్థితిలో కొంత ఆధునికతను జోడిస్తూ, ప్రజల అవసరాలను గమనిస్తూ, వారికి అర్థమయ్యే సరళమైన భాషను వినియోగిస్తూ ‘ఈనాడు’ ముందుకొచ్చింది. ఈ మార్పులకు మూల పురుషుడు ‘ఈనాడు’ తొలి ఎడిటర్ అన్నే భవానీ కోటేశ్వర ప్రసాద్ ఉరఫ్ ఏబీకే ప్రసాద్ అనే తెలుగుజాతి అగ్రశ్రేణి పాత్రికేయుడు.‘ఈనాడు’ హైదరాబాద్ ఎడిషన్ ప్రారంభమైన కొద్ది కాలానికే ఏబీకే ప్రసాద్‌ను బయటకు పంపించారన్నది ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. తర్వాత కాలంలో రామోజీరావే స్వయంగా ప్రధాన సంపాదకులయ్యారు. ఏబీకే నెలకొల్పిన పత్రికా ప్రమాణాల స్థానాన్ని క్రమంగా రామోజీ వ్యాపార సూత్రాలు ఆక్రమించాయి. ఈ వ్యాపార సూత్రాలు కూడా పత్రిక విస్తృతిలో వాటి పాత్రను పోషించాయి. ఆ రోజుల్లో ‘స్కైలాబ్’ పేరుతో అమెరికా నెలకొల్పిన ఒక అంతరిక్ష కేంద్రానికి ఆయుష్షు మూడింది. అది ముక్కచెక్కలై భూమ్మీద పడిపోయే సందర్భాన్ని ‘ఈనాడు’ వినియోగించుకున్నది. అది రేపోమాపో పడిపోనున్నదనీ, దాంతో భూమి బద్దలైపోతుందని, ఇవే మనకు చివరి రోజులనీ ఊరూరా ప్రచారం జరగడంలో ‘ఈనాడు’ గొప్ప పాత్రనే పోషించింది. ఆ విధంగా గ్రామీణ ప్రజల్లోకి కూడా చొచ్చుకొనిపోగలిగింది.పత్రికకు ఉండవలసిన నిష్పాక్షికత అనే లక్షణాన్ని ఈ యాభయ్యేళ్ల ప్రయాణంలో మొదటి ఐదారేళ్లు ‘ఈనాడు’ పాటించిందేమో! ఎనభయ్యో దశకం ప్రారంభంలోనే నిష్పాక్షికతకు నిప్పు పెట్టేసింది. గడిచిన నాలుగున్నర దశాబ్దాలుగా దాని పాత్రికేయమంతా ఏకపక్షా రచనా వ్యాసంగమే! నాణేనికి ఉండే రెండో కోణాన్ని తెలుగు ప్రజలు చూడకుండా ‘ఈనాడు’ దాచిపెట్టింది. పోటీగా మరో పత్రిక ఎదగకుండా దాని ఆర్థిక మూలాలను దెబ్బకొట్టే రామోజీ ఎత్తుగడలన్నీ తెలుగు ప్రజల అనుభవంలో ఉన్నవే. ‘ఉదయం’ పత్రిక అకాల అస్తమయానికి ఈ ఎత్తుగడలే కారణం. ‘వార్త’ను నిర్వీర్యం చేయడానికి కూడా అది ప్రయత్నాలు చేసింది. ఒక్క ‘సాక్షి’ ముందు మాత్రం దాని మంత్రాంగం పారలేదు. ఫలితంగా గత పదహారేళ్లుగా తెలుగు ప్రజలకు వార్తాంశాల రెండో కోణం ఆవిష్కృతమైంది. దశాబ్దాల తరబడి తెలుగు ప్రజలకు నిష్పాక్షిక సమాచార హక్కును దక్కకుండా చేసినందుకుగాను ఆయన్ను అక్షర సూర్యుడుగా భృత్య మీడియా బహువిధాలుగా శ్లాఘించింది. ప్రభుత్వం వారి సంస్మరణ సభలో వక్తలందరూ నోరారా కొనియాడారు.ఇక రామోజీరావు తన వ్యాపార సామ్రాజ్య స్థాపనలో అనుసరించిన పద్ధతులూ, నియమోల్లంఘనలూ, చట్టవిరుద్ధ వ్యవహారాలూ ఆమోదయోగ్యమైనవేనా? భవిష్యత్తు తరాల వారికి వాటిని బోధించవచ్చునా? ఈ అంశాలపై విస్తృతమైన చర్చ జరగవలసి ఉన్నది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ పేరుతో ఆయన చేసిన డిపాజిట్ల సేకరణ చట్ట విరుద్ధమైనదని స్వయంగా ఆర్బీఐ ప్రకటించింది. ఆయన కూడా అది తప్పేనని ఒప్పుకున్నందువల్లనే ఆ సంస్థను మూసేస్తున్నట్టు ప్రకటించారు. ఆయన ఎవరెవరి దగ్గర డిపాజిట్లు వసూలు చేశారో, ఎవరెవరికి తిరిగి చెల్లించారో తెలియజేస్తూ ఒక జాబితాను సమర్పించాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. సుప్రీం ఆదేశాన్ని ఆయన పాటించలేదు.కేంద్ర చిట్‌ఫండ్స్ చట్టాన్ని ఉల్లంఘిస్తూ రామోజీరావు ఆర్థిక నేరాలకు పాల్పడ్డారు. చిట్‌ఫండ్ సంస్థలు డిపాజిట్లు స్వీకరించడం నిషిద్ధం. కానీ మార్గదర్శి ఆ చట్టాన్ని ఉల్లంఘించి డిపాజిట్లు సేకరించింది. ఆ డిపాజిట్లను నిబంధనలకు విరుద్ధంగా షేర్ మార్కెట్లో, మ్యూచువల్ ఫండ్స్‌లో, తమ సొంత కంపెనీల్లో పెట్టుబడులుగా పెట్టింది. లేని చందాదారులను ఉన్నట్టుగా చూపిస్తూ ఘోస్ట్ చిట్టీలు నడుపుతూ మనీలాండరింగ్ నేరానికి పాల్పడినట్టు ఇటీవల జరిగిన సోదాల్లో బయటపడింది. కేంద్ర దర్యాపు సంస్థలు జోక్యం చేసుకోవలసిన పరిణామాలివి.ఇక రామోజీ ఫిలింసిటీ ఒక అక్రమాల పుట్ట. ఇక్కడ జరిగిన నియమోల్లంఘనలు నూటొక్క రకాలు. ఇందులో ప్రభుత్వ భూముల ఆక్రమణ ఉన్నది. పప్పుబెల్లాలు పంచి అసైన్డ్ భూములు కొనుగోలు చేసిన నేరం ఉన్నది. తరతరాల నాటి రహదారులనే కబ్జా చేసి కాంపౌండ్ వాల్ చుట్టుకున్న దాదాగిరి ఉన్నది. మాతృభూమిలో వైద్యసేవలు చేయడానికి వచ్చిన ఒక ఎన్ఆర్ఐ డాక్టర్‌ను బెదిరించి 200 ఎకరాల భూమిని కారుచౌకగా కొట్టేసిన దాష్టీకం ఉన్నది. భూపరిమితి చట్టాన్ని వెంట్రుక సమానంగా జమకట్టిన లెక్కలేని తెంపరితనం ఈ ఫిలింసిటీ కథలో దాగున్నది.ఎటువంటి అనుమతుల్లేకుండా ఫిలిం సిటీలో నిర్మించిన 147 భవనాలు హెచ్ఎమ్డీఏ అధికారాన్ని తొడగొట్టి సవాల్ చేస్తున్నాయి. చెరువులను చెరపట్టి వాటిలోకి ప్రవాహాలను మోసుకెళ్లే కాల్వలను రహదారులుగా మార్చుకున్న ఫిలింసిటీ రుబాబు ముంగిట... ‘వాల్టా’ చట్టం చేతులు ముడుచుకొని సిగ్గుతో తలవంచి నిలబడింది. రామోజీ వ్యాపార సామ్రాజ్య విస్తరణ వెనుక ఇంత తతంగం ఉన్నది. ఇది రేఖామాత్రపు ప్రస్తావన మాత్రమే! ఈ ‘సక్సెస్’ స్టోరీ రాబోయే తరాలకు ఆదర్శనీయమైనదేనా? రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సంస్మరణ సభ జరపడం సమర్థనీయమేనా? అమరావతిలో శిలా విగ్రహం, ఒక రహదారికి పేరు, స్మారక ఘాట్ల స్థాపన ఎటువంటి స్ఫూర్తిని ఉద్దీపింపజేస్తాయి. ‘భారతరత్న’ బిరుదాన్ని ఆయనకు సంపాదించిపెడతామని ముఖ్యమంత్రి చేసిన వాగ్దానం సరైన సందేశాన్నే సమాజంలోకి పంపిస్తుందా?వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
తొలి రౌండ్ ట్రంప్‌దేనా!
లాంఛనంగానైనా కరచాలనాల్లేవు. మర్యాదకైనా చిరునవ్వుల్లేవు. అసలు ఒకరివైపు ఒకరు చూసుకున్న క్షణాలే లేవు. శుక్రవారం దాదాపు 90 నిమిషాలపాటు సాగిన అమెరికా అధ్యక్ష అభ్యర్థుల తొలి సంవాదం అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌లపై ఇప్పటికే ప్రజానీకంలో పాతుకుపోయిన అభిప్రాయాలను మరింత దృఢపరిచింది. బైడెన్ తన విజయాలను ఘనంగా చాటలేరు. ట్రంప్ కన్నార్పకుండా అబద్ధాలు వల్లించటం మానుకోలేరు. వృద్ధాప్య ఛాయలు తనలో మచ్చుకైనా లేవని చాటేందుకు 81 యేళ్ల బైడెన్ తాపత్రయపడితే... న్యాయస్థానం తనను అపరాధిగా నిర్ధారించినా ఆత్మవిశ్వాసం మచ్చుకైనా సడల్లేదన్న అభిప్రాయం కలిగించేందుకు 78 యేళ్ల ట్రంప్ తంటాలుపడ్డారు. చిత్రమేమంటే – ఈ అంశాల్లో ఇద్దరికిద్దరూ విఫలమయ్యారు. బైడెన్‌కి ఇప్పటికే ఉన్న పాయింట్లు ఇంకా తగ్గగా... ట్రంప్ కాస్త మెరుగుపడిన మాట నిజమే అయినా అనుకున్నంతగా లేదు. 1960లో అధ్యక్ష పదవికి పోటీపడిన జాన్ ఎఫ్ కెనెడీ, రిచర్డ్ నిక్సన్లతో ప్రారంభమైన ఈ సంవాదం ఇంత పేలవంగా సాగిన సందర్భాలు ఎప్పుడూ లేవన్నది విశ్లేషకుల మాట. వచ్చే సెప్టెంబర్ 10న జరగబోయే రెండో సంవాదం సమయానికైనా బైడెన్ మెరుగుపడతారో లేదోనన్న దిగులు డెమాక్రటిక్ పార్టీని నిలువెల్లా వణికిస్తుండగా, రిపబ్లికన్ పార్టీ మాత్రం కులాసాగా సేదతీరుతోంది. బైడెన్ వంటి బలహీనుడు ప్రత్యర్థిగా ఉన్నప్పుడు ఇక చింత ఎందుకన్నది దాని భావన కావొచ్చు. ట్రంప్‌ను మించిన గెలుపు గుర్రం లేదని ఆ పార్టీ ఎప్పుడో నిర్ణయానికొచ్చింది. అధ్యక్ష అభ్యర్థుల సంవాదంలో మన మాదిరిగా అరుపులూ, కేకలూ ఉండవు. ఎదురుగా జేజేలుకొట్టే అభిమానులూ ఉండరు. ఒకరి ప్రసంగాల్లోకి ఒకరు చొరబడే సంస్కృతి కూడా లేదు. ప్రత్యర్థి చెప్పింది పూర్తిగా విని దీటైన, సహేతుకమైన జవాబు చెప్పగలిగినవారికి మద్దతు పెరుగుతుంది. కానీ ఇద్దరికీ అది పట్టలేదు. అడిగిన ప్రశ్నల్ని దాటేసే ట్రంప్ తీరు బుల్డోజర్ని మరపిస్తే, బైడెన్‌కు మాట పెగలడమే కష్టమైనట్టు కనబడింది. ట్రంప్ సంధించిన ప్రశ్నలకు జవాబివ్వటంతో మొదలుపెట్టినా... హఠాత్తుగా సంబంధంలేని మరో అంశంలోకి వెళ్లి బైడెన్ అయోమయంలో పడిన సందర్భాలు అనేకం. ట్రంప్‌లో గతానికి మించిన మూర్ఖత్వం మూర్తీభవించివున్నదని, ఆయన్ను ఎన్నుకుంటే దేశం ప్రమాదంలో పడుతుందని చెప్పటం బైడెన్ ఉద్దేశం. కానీ అది సమర్థవంతంగా చెప్పలేకపోయారు. 2020 నాటి సంవాదం స్థాయిలోనైనా మాట్లాడలేకపోయారు. తన హయాంలోని వైఫల్యాలను కప్పిపుచ్చటమేకాదు... బైడెన్ విజయాలను మరుగుపరచటంలో ట్రంప్ విజయం సాధించారు.వేరే దేశాల ఎన్నికలు ఎవరికీ పెద్దగా పట్టవు. కానీ ప్రపంచాన్నే శాసించే అమెరికాలో జరిగే ప్రతిదాన్నీ జాగ్రత్తగా గమనిస్తారు. యూరప్ ఖండం మొదలుకొని ఉత్తర కొరియా వరకూ అందరూ ఆసక్తి కనబరుస్తారు. సహజంగానే ఉక్రెయిన్‌లో రష్యా... గాజాలో ఇజ్రాయెల్ సాగిస్తున్న దురాక్రమణ యుద్ధాలూ, నాటోతో సంబంధాలూ, ప్రపంచంలో అమెరికా పరువు ప్రతిష్ఠలూ చర్చకొచ్చాయి. అలాగే దేశ ఆర్థిక వ్యవస్థ, వలసలు, ద్రవ్యోల్బణం, అబార్షన్లు సైతం ప్రధాన భాగం ఆక్రమించాయి. పుతిన్‌ను ప్రోత్సహించింది నువ్వంటే నువ్వని పరస్పరం ఆరోపణలు చేసుకోవటం ఆసక్తి కలిగించే అంశం. యూరప్ దేశాలు నాటో వ్యయంలో తమ వాటా చెల్లించకపోతే సంస్థనే మూసేస్తానని ట్రంప్ బెదిరించటం పరోక్షంగా పుతిన్‌ను సమర్థించినట్టేనని బైడెన్ వాదించగా... అసలు ఉక్రెయిన్‌పై దాడికి పురిగొల్పిందే బైడెన్ అని ట్రంప్ ఎదురు దాడి చేయటం గమనించదగ్గది. అఫ్గాన్ నుంచి వైదొలగే క్రమంలో జరిగిన భంగపాటే పుతిన్‌కు ధైర్యాన్నిచ్చిందని ఆయన దబాయించారు. ఉక్రెయిన్‌కు నిధుల వరద పారిస్తూపోతే ప్రజలను మరింత కుంగదీస్తుందన్నది ట్రంప్ వాదన. అయితే ఇజ్రాయెల్ విషయంలో ఇద్దరిదీ ఒకే మాట! కాకపోతే ఆ దేశానికి అన్నివిధాలా మద్దతిస్తున్నామని బైడెన్ అంటే... అదింకా సరిపోదన్నది ట్రంప్ ప్రత్యుత్తరం. యూదు వోటర్లు గణనీయంగా ఉండటంవల్లే ఇలా ఒకరిని మించి ఒకరు ప్రేమ ఒలకబోశారు. పైగా బైడెన్ పాలస్తీనీయుడిగా మారారని ట్రంప్ ఆరోపించారు. బైడెన్ మెతకదనం ఆసరా చేసుకుని వేరే దేశాల ప్రభుత్వాలు జైళ్లు, పిచ్చాసుపత్రులు ఖాళీ చేయించి అందరినీ అమెరికా పంపుతున్నారనడంలోని అంతరార్థం శ్వేత జాతి వోటర్లను ప్రసన్నం చేసుకునేందుకే! దేశంలో ద్రవ్యోల్బణం క్రమేపీ తగ్గుతున్నా అల్పాదాయ, మధ్యాదాయ వర్గాలను ఇంకా వేధిస్తూనే వుంది. అయితే మాంద్యం బెడద తొలగింది. ఉపాధి అవకాశాలు పెరిగాయి. ధరలూ తగ్గాయి. కానీ వీటిని బైడెన్ గట్టిగా చెప్పలేకపోగా, కార్మికవర్గం సమస్యల్లో ఉందన్న ట్రంప్ వాదనతో ఏకీభవించారు. ట్రంప్ హయాంలో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిన వైనాన్ని అందరికీ గుర్తు చేయటంలో బైడెన్ విజయం సాధించారు. అబార్షన్‌కు వాడే మాత్రకు తాను వ్యతిరేకం కాదని ట్రంప్ చెప్పక తప్పలేదు. ఇది మహిళల ఘనవిజయం. ప్రత్యర్థితో గంటన్నరపాటు వాగ్యుద్ధానికి తలపడినప్పుడు ఏదో ఒక సమయంలో ఓటమి ఎదురయ్యే పరిస్థితి రావొచ్చు. కానీ తొలి పది నిమిషాలూ నిబ్బరంగా లేనివారు ఓటమి నుంచి తప్పించుకోలేరంటారు. సంవాదంలో బైడెన్‌కు అదే జరిగింది. ఆయన ప్రసంగం తడబాట్లతో మొదలైంది. చాలాసార్లు సణుగుడుగా మిగిలిపోయింది. ట్రంప్ అడుగుతున్నప్పుడు నోరు తెరుచుకుని ఉండటం కూడా వీక్షకులను నిర్ఘాంతపరిచింది. మొత్తానికి తొలి రౌండ్లో ట్రంప్‌దే పైచేయి. -
‘పెండింగ్’కు మంచి దోవ!
న్యాయస్థానాల్లో పెండింగ్ కేసుల గురించి ఎవరికీ తెలియనిది కాదు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేసినవారు గతంలో చాలాసార్లు మాట్లాడారు. రిటైరయ్యే రోజున కూడా ఆ మాట చెప్పి నిష్క్రమించేవారు. తమ పదవీకాలంలో పెండింగ్ బెడదను సాధ్యమైనంత తగ్గించేందుకు పలు విధానాలు అమలు పరిచేవారు. న్యాయమూర్తుల సంఖ్య పెంచాలంటూ ప్రధానికి బహిరంగ వినతులు చేసినవారు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ మరో అసాధారణ నిర్ణయం తీసుకున్నారు. ఈ శనివారం నుంచి వరసగా ఆరురోజులపాటు ప్రత్యేక లోక్ అదాలత్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. గతంలో సుప్రీంకోర్టులో లోక్ అదాలత్‌లు జరగకపోలేదు. కానీ ఎప్పుడో ఒకసారి జరిగే ఈ అదాలత్లకు పెద్దగా స్పందన ఉండేది కాదు. అందువల్లే ఈసారి వరసగా ఆరురోజులపాటు సాగించాలని ఆయన భావించారు. ఈ కార్యక్రమంలో పదివేల కేసుల్ని పరిష్కరించాలన్నది ఆయన లక్ష్యం. పైగా ఈ కేసుల పరిష్కారానికి లిటిగెంట్లకు పైసా ఖర్చుండదు. వీటిల్లో కార్మిక చట్టాలు, అద్దె, సేవలు, పరిహారం, కుటుంబ తగాదాలు, సాధారణ సివిల్ తగాదాలు, వినియోగదారుల కేసులు ఉంటాయి. జస్టిస్ చంద్రచూడ్ చెబుతున్న ప్రకారం సుప్రీంకోర్టులో ప్రస్తుతం 66,059 సివిల్ కేసులూ, 18,049 క్రిమినల్ కేసులూ ఉన్నాయి. రెండూ లెక్కేస్తే 84 వేల పైమాటే. ఇవిగాక వివిధ హైకోర్టుల్లో 44,03,152 సివిల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని జాతీయ జ్యుడీషియల్ డేటా గ్రిడ్ చెబుతోంది. క్రిమినల్ కేసుల సంఖ్య 17,55,946. మొత్తంగా చూస్తే దాదాపు 62 లక్షలు! హైకోర్టుల్లో ఏడాదిగా పెండింగ్‌లో ఉన్నవి పది లక్షల సివిల్ కేసులు. ఇవిగాక సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో రోజూ దాఖలయ్యే కేసులు, అప్పీళ్లు, కింది కోర్టుల్లో పెండింగ్ పడిన కోట్లాది కేసులు అదనం.న్యాయవ్యవస్థ పుట్టిన నాటినుంచీ అవతలి పక్షాన్ని కోర్టుకీడ్చి ఇరుకున పెట్టాలన్న యావ కక్షిదారులకు సహజంగా ఏర్పడివుంటుంది. రాచరికాల్లో ఇంత చేటు సాహసం ఉండేది కాదు. తప్పనిసరైతే తప్ప, తనవైపే న్యాయం ఉందన్న ధీమా ఉంటే తప్ప ఫిర్యాదు చేయడానికి జంకేవారు. తేడా వస్తే తల తీస్తారన్న భయమే అందుకు కారణం కావొచ్చు. చిత్రమేమంటే వర్తమాన కాలంలో ప్రభుత్వాలే పెద్ద లిటిగెంట్లుగా మారాయి. అసమ్మతి ప్రకటించేవారిపై ఎడాపెడా కుట్ర కేసులు బనాయించటం, ఇతరత్రా కేసుల్లో ఇరికించటం ఇప్పటికీ సాగుతూనే వుంది. ప్రభుత్వాలు అడ్డగోలు నిర్ణయాలు తీసుకోవటం ఒకపక్క, ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వాలను కోర్టుకీడ్చటం మరోపక్క సమాంతరంగా సాగుతుంటాయి. వలస పాలకుల నాటి చట్టాలనే ఇప్పటికీ నెత్తిన పెట్టుకోవటం, అవకతవకలు జరగలేదని తెలిసికూడా అధికార మదంతో వ్యతిరేకులను అక్రమ కేసుల్లో ఇరికించటం మితిమీరుతోంది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వాల పుణ్యమా అని యూపీ నుంచి ఏపీ దాకా బుల్డోజర్లు నడిపించే సంస్కృతి పెరిగింది. ప్రత్యర్థి పక్షాలకు చెందినవారి ఇళ్లపై, కార్యాలయాలపై దాడులు సరేసరి. సహజంగానే ఇలాంటి కేసులన్నీ న్యాయస్థానాలకు ఎక్కక తప్పదు. దానికితోడు పొలాలు, స్థలాలు, ఇళ్లు వగైరా స్థిరాస్తుల వారసత్వ హక్కుల కోసం దాయాదులు, తామే న్యాయమైన హక్కుదారులమంటూ వచ్చే కక్షిదారులు లెక్కలేనంతమంది. ఎన్డీఏ సర్కారు ఈమధ్య కాలం చెల్లిన చట్టాల్లో కొన్నిటిని రద్దుచేయటంతోపాటు ఐపీసీ, సీపీసీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్ చట్టం స్థానాల్లో కొత్త చట్టాలు తీసుకొచ్చింది. అవి ఏమేరకు మార్పు తీసుకురాగలవో ఆచరణ తర్వాతగానీ తెలియదు. నీతి ఆయోగ్ మార్గదర్శకాలకు అనుగుణంగా నిరుడు ఏపీలో జగన్ సర్కారు తీసుకొచ్చిన ల్యాండ్ టైట్లింగ్ చట్టం కూడా వినూత్నమైనది. 130 ఏళ్ల తర్వాత దేశంలో తొలిసారిగా తీసుకొచ్చిన ఈ చట్టం ఉద్దేశం నిజమైన హక్కుదారులను గుర్తించి వారి హక్కులు కాపాడటం, అనవసర వ్యాజ్యాలు నిరోధించటం. అధికార యావతో ప్రత్యర్థులు ఎన్నికల్లో వక్ర భాష్యాలు చెప్పి ప్రజలను పక్కదోవ పట్టించారు. చివరకు ఎన్డీఏ సర్కారు దాన్ని రద్దుచేస్తోంది. లోక్ అదాలత్‌ల పనితీరు భిన్నమైనది. ఇందులో సామరస్య పరిష్కారానికి ఇరుపక్షాలనూ ప్రోత్సహిస్తారు. ప్రధాన న్యాయమూర్తి నియమించిన న్యాయనిపుణులు ఆ కేసులో ఉన్న సమస్యను న్యాయమూర్తులకూ, లిటిగెంట్లకూ వివరిస్తారు. పిటిషనర్లు నేరుగా న్యాయమూర్తులతో మాట్లాడే అవకాశం కూడా ఇస్తున్నారు. జస్టిస్ చంద్రచూడ్ తీసుకొచ్చిన మరో మార్పేమిటంటే... పిటిషనర్లు దీనికోసం ఢిల్లీ వరకూ వెళ్లనవసరం లేదు. వారికి హైకోర్టుల్లో వీడియో కాన్ఫరెన్సింగ్ సదుపాయం కల్పిస్తున్నారు. ఇది పెండింగ్ కేసులకు న్యాయవ్యవస్థ నుంచి వచ్చిన ఒక సృజనాత్మక పరిష్కారం. ఇప్పుడు తమ వంతుగా ఏం చేయవచ్చునో ప్రభుత్వాలు ఆలోచించాలి. ఎప్పటికప్పుడు న్యాయమూర్తుల ఖాళీలు భర్తీచేయటం తక్షణావసరం. వేరే దేశాలతో పోలిస్తే జనాభాకూ, న్యాయమూర్తుల సంఖ్యకూ మధ్య నిష్పత్తి మన దేశంలో చాలా అధికం. అలాగే చట్టాలు చేసేముందు వాటి పర్యవసానంగా ఎన్ని వ్యాజ్యాలు కోర్టు మెట్లెక్కే అవకాశమున్నదో ప్రభుత్వాలు అంచనా వేసుకోవాలి. చెక్ బౌన్స్ కేసులు ఇందుకు ఉదాహరణ. గతంలో సివిల్ తగదాగా ఉన్నదాన్ని శిక్షార్హమైన నేరంగా మార్చారు. దీనివల్ల అసంఖ్యాకంగా కేసులు పెరిగాయి. పెండింగ్ కేసులు తగ్గించటం కోసం సెలవు రోజుల్లోనూ పనిచేయక తప్పడం లేదని ఆ మధ్య ఒక న్యాయమూర్తి వాపోయారు. సుప్రీంకోర్టు తీసుకున్న తాజా చొరవకు ప్రభుత్వాల వివేకం కూడా తోడైతే ఈ సంక్లిష్ట సమస్యకు సులభంగా పరిష్కారం దొరుకుతుంది. -
ఎన్నాళ్లీ తీస్తా వివాదం!
నదీజలాల విషయంలో ఆచితూచి అడుగేయకపోతే ఆ నీళ్లల్లోనే నిప్పులు పుట్టుకొస్తాయి. అంతర్గతంగా ప్రాంతాల మధ్యనే తరచు చిచ్చు రేపే నదీజలాలు... పొరుగునున్న దేశంతో పంచుకోవాల్సి వచ్చినప్పుడు సమస్యగా మారటంలో వింతేమీ లేదు. ఈమధ్యే బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా మన దేశాన్ని సందర్శించారు. ఈ పర్యటనలో రెండు దేశాలమధ్యా పలు ద్వైపాక్షిక ఒప్పందాలు కుదరటంతోపాటు తీస్తా నదీజలాల పంపకంపై చర్చలు జరపాలనీ, ఫరక్కా జలాలపై తాజా ఒప్పందం కుదుర్చుకోవాలనీ ఇరు దేశాధినేతలూ నిర్ణయించారు. సరిగ్గా ఇదే ఇప్పుడు వివాదాన్ని రగిల్చింది. నదీజలాల విషయంలో ఉభయులకూ అంగీకారయోగ్యమైన పరిష్కారం కోసం కృషిచేయాలని భారత్, బంగ్లాదేశ్‌లు నిర్ణయించుకున్నాయని మంగళవారం ఢాకాలో హసీనా ప్రకటించిన వెంటనే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చురుగ్గా స్పందించారు. ఈ అంశంలో తమను ఎందుకు సంప్రదించలేదంటూ కేంద్రంపై భగ్గుమన్నారు. ఇది సరికాదని అభ్యంతరం చెబుతూ ఆమె మోదీకి లేఖ రాశారు. మమత ఇలా స్పందించటం ఇది మొదటిసారేమీ కాదు. ప్రజానీకానికి గుక్కెడు నీళ్లందించాలన్నా, పచ్చటి పైర్లతో పొలాలు కళకళలాడాలన్నా బంగ్లాదేశ్‌కు ఈ నదీజలాలపై భారత్‌తో ఒప్పందం కుదరటం, ప్రాజెక్టు నిర్మాణం పూర్తికావటం ఎంతో అవసరం. 2011లో కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు తీస్తాపై ఒప్పందం దాదాపు ఖరారైంది. కానీ ఆ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న తృణమూల్ అధినేత మమత అలకబూనటంతో అది ఆఖరు నిమిషంలో ఆగిపోయింది. రాజకీయంగా యూపీఏకు ఉన్న పరిమితులేమిటో, మమత స్వభావమేమిటో తెలిసిన హసీనా దానిపై పట్టుబట్టకుండా ఉండిపోయారు. ఈ నేపథ్యం తెలిసినందువల్లే ప్రధాని నరేంద్ర మోదీ 2015లో బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లినప్పుడు తన ప్రతినిధి బృందంలో ఆమెను కూడా చేర్చారు. ఒప్పందం కుదరకపోవటం వల్ల తమ దేశానికి ఎదురవుతున్న సమస్యలను హసీనా ఆమెకు వివరించగా, రాష్ట్రంలో తనకెదురయ్యే ప్రతిబంధకాలను మమత తెలిపారని కథనాలు వచ్చాయి. ఆ తర్వాత కాలంలో తీస్తా ప్రాజెక్టు గురించి బంగ్లాదేశ్ ప్రస్తావించకపోలేదు. కానీ బెంగాల్ అభ్యంతరాలు ఎప్పటిలాగే ఉండటం ఈ సమస్యకు శాపంగా మారింది. నిజానికి చారిత్రకంగా, సాంస్కృతికంగా పశ్చిమబెంగాల్, బంగ్లాదేశ్ ఎంతో సన్నిహితమైనవి. దేశంలో జాతీయవాదం అంతకంతకు విస్తరించటానికి ఈ ప్రాంతమే కారణమని భావించిన బ్రిటిష్ వలసపాలకులు 1905లో బెంగాల్ విభజన చట్టం తీసుకొచ్చినప్పుడు నిరసనలు పెల్లుబికాయి. చివరకు 1911లో దాన్ని రద్దు చేసుకోవాల్సి వచ్చింది. అయితే ఆ ప్రయత్నం హిందూ ముస్లింల మధ్య పొరపొచ్చాలను పెంచింది. స్వాతంత్య్రానంతరం దేశ విభజన జరిగినప్పుడు అది పాకిస్తాన్లో భాగంగా మారింది. పాకిస్తాన్ చెరలో తమ అస్తిత్వాన్ని కోల్పోతున్న తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్‌గా ఆవిర్భవించటానికి 1971లో మన దేశం అందించిన తోడ్పాటును బంగ్లా ప్రజలు ఇప్పటికీ గుర్తుపెట్టుకుంటారు. కానీ బంగ్లాదేశ్ తన సమస్యలను వాయిదా వేస్తూ పోలేదు. తమ రాష్ట్రానికి అన్యాయం జరగకుండా బంగ్లా చిరకాల ఆకాంక్ష నెరవేర్చటం ఎలాగో మమతా బెనర్జీ ఆలోచించాలి. అవసరమైతే ఒక మెట్టు దిగేందుకు కూడా సిద్ధపడాలి. గంగానదిపై బెంగాల్లో నిర్మించిన ఫరక్కా బరాజ్ నుంచి బంగ్లాకు నదీజలాలు అందించటంపై 1996లో 30 ఏళ్లకు ఒప్పందం కుదిరింది.అది మరో రెండేళ్లలో పూర్తికావాల్సి వుంది. కనుక దానిపై కొత్తగా ఒప్పందం అవసరం. 1996లో తమకిచ్చిన హామీలను నెరవేర్చని కేంద్రం ఇప్పుడు మరోసారి తీస్తా, గంగా జలాలపై బంగ్లాతో చర్చించిందని మమత ఆరోపణ. అయితే అప్పుడూ ఇప్పుడూ కూడా బెంగాల్‌తో చర్చిస్తూనే ఉన్నామన్నది కేంద్రం జవాబు. 1996లో ఆ రాష్ట్ర ప్రతినిధిగా ఉన్న నీటిపారుదల శాఖ ప్రతినిధితో మాట్లాడారనీ, నిరుడు జూలై 24న కూడా ఫరక్కా జలాల అంశంపై ఏర్పడిన కమిటీలో బెంగాల్ నీటిపారుదల రంగం నిపుణుడు పాల్గొన్నారనీ కేంద్రం చెబుతోంది. మొన్న 14న ఆ కమిటీ నివేదిక కూడా సమర్పించిందని వివరించింది. అయితే ఇదంతా కేంద్ర ప్రభుత్వం అనధికారికంగా చేసిందే తప్ప విధానపరమైన చర్చలు కాదని మమత సర్కారు జవాబు. తమ అధికారులు కేవలం కేంద్రం అడిగిన సాంకేతిక వివరాలు మాత్రమే అందించారని తెలిపింది. దక్షిణాసియాపైనా, మరీ ముఖ్యంగా ఈ ప్రాంత దేశాలతో భారత్‌కున్న సంబంధాలపైనా చైనా ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇలాంటి సమయంలో పట్టుదలకు పోయి నదీజలాలపై వివాదం రాజేయటం మంచిది కాదు. తీస్తా ప్రాజెక్టుపై అటు చైనా, ఇటు భారత్ ప్రతిపాదనలిచ్చాయనీ, ఎవరి ప్రతిపాదన బాగుందో చూసి నిర్ణయిస్తామనీ మంగళవారం హసీనా తెలిపారు. ఇది ఒక రకంగా భారత్ ముందుకు రాకపోతే చైనావైపు చూస్తామని చెప్పటమే. ఎగుమతుల ద్వారా బంగ్లా సమకూర్చుకుంటున్న ఆదాయంలో 80 శాతం వాటావున్న దుస్తుల తయారీ ముడిసరుకంతా చైనాయే సరఫరా చేస్తోంది. పైగా బంగ్లా వాణిజ్యంలో చైనా అతి పెద్ద భాగస్వామి. ఇలాంటి పరిస్థితుల్లో జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని బెంగాల్ వ్యవహరించాలి. విదేశాంగ విధాన నిర్ణయాలపై రాష్ట్రాల ప్రమేయం ఉండటం మంచిదికాదు. అదే సమయంలో బెంగాల్ ప్రయోజనాలు కాపాడటం కేంద్రం బాధ్యత. గత హామీలు నెరవేర్చలేకపోతే కారణాలేమిటో తెలుసుకుని వాటిని సరిదిద్దాలి. చిరకాల సమస్య అయిన తీస్తా వివాదంపై బెంగాల్‌ను ఒప్పించి బంగ్లా ఆకాంక్ష నెరవేర్చటం ఎలాగో కేంద్రం ఆలోచించాలి.