Extra
-
ఫ్లాట్ నెం-420.. అదొక గేటెడ్ కమ్యూనిటీ..
‘మేడం.. టీ’ అంటూ కస్తూరికి టీ ఇచ్చింది వంటమనిషి. ‘థాంక్స్’ అన్నట్టుగా నవ్వుతూ ట్రేలోంచి టీ కప్ తీసుకుంది కస్తూరి. వంటమనిషి వంటింట్లోకి వెళ్లేవరకు ఆగి, టీ సిప్ చేస్తూ ‘మొత్తానికి మీకు బాగానే ఆసరా అయినట్టుంది కదండీ ఈమె?’ అంది కస్తూరి ఎదురుగా సింగిల్ సీటర్‌లో కూర్చున్న ఆ ఫ్లాట్ ఓనర్ మంగళతో. ‘బాగానే ఏంటండీ.. చాలా బాగా! అందుకు మీకే థాంక్స్ చెప్పాలి. అమ్మాయి డెలివరీకి వచ్చింది.. ఆమె అత్తగారు వాళ్లు, చుట్టాల హడావిడి.. నా ఒక్కదానితో అయ్యేనా అని టెన్షన్ పడ్డాను. కరెక్ట్ టైమ్‌లో ఆ దేవుడు పంపించినట్లే మీరు ఆమెను మా ఇంటికి పంపారు. తనకు రాని వంట, రాని పనంటూ లేదండీ బాబూ! మా అమ్మాయికైతే ఎంత నచ్చిందో! ఆయిల్ మసాజ్ దగ్గర్నుంచి , అమ్మాయికి తినాలనిపించినవన్నీ వండి పెట్టేవరకు పనంతా తన మీదే వేసేసుకుంటోంది. డెలివరీ అయ్యి తనింటికి వెళ్లేప్పుడు వంటమనిషిని తోడు తీసుకెళ్లిపోతానంటోందండీ అమ్మాయి’ అంటూ నిశ్చింతగా నవ్వింది మంగళ. ‘మీ అమ్మాయికి నచ్చితే మరింకేం అండీ.. బ్రహ్మాండం’ అంటూ టీ కప్ టీ పాయ్ మీద పెడుతూ వంటింటి వైపు చూసింది కస్తూరి. వంటమనిషీ కస్తూరిని చూసింది.అదొక గేటెడ్ కమ్యూనిటీ. మంగళ, కస్తూరి వాళ్లవి పక్కపక్క ఫ్లాట్లే! ఆ వంటమనిషిది బీదర్ అని, భర్తపోయి పుట్టెడు దుఃఖం, అంతకన్నా పుట్టెడు అప్పుల్లో మునిగిపోయిందని, వంటపని బాగా చేస్తుందంటూ ఆమెను కస్తూరి వాళ్ల పనమ్మాయి అన్నపూర్ణ తీసుకొచ్చింది. మంగళ అవసరాన్ని గ్రహించి, ఆమె మాతృభాష కూడా కన్నడ కావడంతో కన్నడ వంటమనిషైతే ఆమెకు చక్కగా సరిపోతుందని ఆ వంటమనిషిని మంగళ ఇంటికి పంపింది కస్తూరి. మంగళకు ఆ వంటమనిషి చురుకుదనం, పర్ఫెక్షన్, మర్యాద, మన్నన బాగా నచ్చాయి. అందుకే ఆమె త్వరగా మంగళకు ఆప్తురాలైపోయింది.ఒకరోజు.. ‘అమ్మా.. ఈ రోజు సాయంకాలం అన్నపూర్ణ వాళ్లతో కలసి బిర్లా మందిర్‌కి వెళ్లొస్తానమ్మా’ రిక్వెస్ట్ చేసింది వంటమనిషి.. దిండు గలీబులు మారుస్తూ. ‘వాళ్లతో ఎందుకూ? మన డ్రైవర్‌తో కార్లో పంపిస్తాలే’ చెప్పింది మంగళ తమ బెడ్రూమ్లోని స్విచ్ బోర్డ్‌లా కనిపిస్తున్న సీక్రెట్ సేఫ్ తెరిచి అందులో ఏవో డాక్యుమెంట్స్ సర్దుతూ! ‘అయ్యో కార్లో ఎందుకమ్మా.. చక్కగా అన్నపూర్ణ వాళ్లతో వెళ్తాలే! వాళ్లతో సరదాగా గడిపినట్టు ఉంటుంది’ అంది బెడ్ కిందున్న సొరుగులాగి కొత్త బెడ్‌షీట్ తీస్తూ! దాన్ని బయటకు తీయబోతుంటే బెడ్‌షీట్ పోగొకటి ఏదో స్క్రూకి తట్టినట్టయింది. షీట్ చిరగకుండా పోగును తెంపబోతుండగా గబగబా మంగళ వచ్చి వంటమనిషిని నెమ్మదిగా పక్కకు నెట్టి, సొరుగును లోపలికి తోసేసి, ‘ఆ బెడ్ షీట్ వద్దులే.. ఇంకోటి ఇస్తా’ అంటూ వార్డ్ రోబ్ దగ్గరకు వెళ్లింది. అయోమయంగా నిలబడిపోయింది వంటమనిషి.ఆమె మొహంలోని ఫీలింగ్‌ని ఇంకోలా అర్థం చేసుకున్న మంగళ కూతురు ‘తన ఫ్రెండ్స్‌తో పోతానంటోంది కదా.. పోనీలే మమ్మీ..’ అంటూ వంటమనిషి తరపున తల్లికి సిఫారసు చేసింది.‘సరే వెళ్లిరా..’ అంటూ వార్డ్‌రోబ్‌లోంచి తీసిన మరో బెడ్ షీట్‌ని వంటమనిషి చేతుల్లో పెట్టింది మంగళ. ఆరోజు సాయంకాలం అయిదింటికి అన్నపూర్ణ వాళ్లతో కలసి బయటకు వెళ్లింది వంటమనిషి. రాత్రి తొమ్మిది అయినా తిరిగిలేదు. కంగారు పడిపోయారు మంగళ కుటుంబ సభ్యులు. కస్తూరికి ఫోన్ చేసి అన్నపూర్ణ వివరం అడిగి, ల్యాండ్ లైన్ ఫోన్ రిసీవర్‌ను క్రెడిల్ చేసిందో లేదో ఆ ఫోన్ మోగింది. క్షణంలో లిఫ్ట్ చేసి ‘హలో.. ’ అంది మంగళ. ‘హలో అమ్మగారేనా..’ అంటూ మంగళ స్వరాన్ని నిర్ధారించుకుని, ‘అమ్మా.. బిర్లా మందిర్ దగ్గర మా చుట్టాలమ్మాయి కలిసింది.బలవంతపెడితే వాళ్లింటికి వచ్చానమ్మా! ఈ రాత్రికి ఉండిపొమ్మంటున్నారు. రేప్పొద్దున్నే వచ్చేస్తానమ్మా.. వాళ్లు దిగబెడతామంటున్నారు’ అంటూ వంటమనిషి ఠక్కున ఫోన్ పెట్టేసింది.. మంగళ ఏదో అడగబోయేంతలోనే! వంటమనిషి ఆ తీరు ఆమెకు కోపాన్ని తెప్పించింది. ‘చూశావుగా.. అందుకే పంపనన్నా..’ అంది కూతురితో అసహనంగా. ‘వాట్ హ్యాపెండ్?’ అడిగింది సోఫాలో పడుకుని ఏదో మ్యాగజీన్ చదువుతున్న కూతురు లేచి కూర్చుంటూ. ‘వాళ్ల చుట్టాలమ్మాయి కలిసిందట, వాళ్లింటికి వెళ్లిందట, రేపు ఉదయం వస్తుందట’ చెప్పింది మంగళ విసురుగా. ‘అబ్బా మమ్మీ.. వస్తుందిలే రేపు.. కూల్’ అని సర్దిచెప్పింది కూతురు. ‘అన్నీ కథలు.. అది నీ అలుసే తీసుకుంది’ హెచ్చు స్వరంతో అంటూ బెడ్రూమ్లోకి వెళ్లింది మంగళ. తెల్లవారి ఆరు గంటలు.. అది చలికాలం కావడం వల్ల ఇంకా చీకటిగానే ఉంది. మంగళ వాళ్ల ఫ్లాట్ కాలింగ్ బెల్ మోగింది. రెండుసార్లకు.. మంగళ వచ్చి తలుపు తీసింది. ఎదురుగా ఒక స్త్రీ, ఇద్దరు మగవాళ్లున్నారు. మంగళకేం అర్థంకాలేదు. ‘ఎవరు మీరు?’ అంది. ‘ఫ్రమ్ ఐటీ’ అంటూ ఐడీ కార్డ్స్ చూపిస్తూ లోపలికి వెళ్లారు. ఆ త్రీ బెడ్రూమ్ ఫ్లాట్‌లోని వంటిల్లు, రెండు బెడ్రూమ్స్ గోడల్లోని సీక్రెట్ సేఫ్స్, మంచం కింది సొరుగులోని సీక్రెట్ అరలను సోదా చేస్తే 70 తులాల బంగారం, ల్యాండ్ డాక్యుమెంట్స్, నాలుగు కోట్ల క్యాష్ బయటపడింది. అది ఒక ఆర్డీవో ఫ్లాట్. నంబర్ 420.అతని బ్లాక్ మనీ గురించి ఐటీ డిపార్ట్మెంట్కి టిప్ అందించింది కస్తూరే! ఆమె రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉద్యోగి. ఆమె సహకారంతోనే ఐటీ మహిళా ఉద్యోగి వంటమనిషిగా మంగళ వాళ్లింట్లోకి చేరింది. ఆ ఫ్లాట్‌ని కళ్లతోనే స్కాన్ చేసి, అన్నపూర్ణ ద్వారా డిపార్ట్మెంట్కి చేరవేసింది. అన్నపూర్ణకూ తెలియదు తాను ఏవో వివరాలను ఐటీ డిపార్ట్మెంట్కి మోస్తున్నట్లు వంటమనిషి, తన కొలీగ్ ఓ కోడ్ లాంగ్వేజ్ పెట్టుకుని అన్నపూర్ణ ద్వారా ఇన్ఫర్మేషన్ని షేర్ చేసుకున్నారు. సెర్చ్ వారంట్ సిద్ధమయ్యాక.. బిర్లామందిర్ మిషతో ఆ ఇంట్లోంచి బయటపడింది ఆ వంటమనిషి. కాయిన్ బాక్స్ ఫోన్స్ కాలం నాటి ఈ ఆపరేషన్ అప్పట్లో ఓ మోస్తరు సంచలనాన్ని సృష్టించింది. – శరాది -
డైనోసర్ ఎక్స్పీరియన్స్ అవ్వాలంటే.. ఇక్కడికి వెళ్లండి చాలు!
సాక్షి, సిటీబ్యూరో: నగర ప్రజలకు సరికొత్త అనుభూతులు అందించడానికి నెక్సస్ మాల్లో ‘డైనోసర్ ఎక్స్పీరియన్స్’ ఏర్పాటు చేశారు. ఈ నెల 17 నుంచి సెప్టెంబర్ 15 వరకు కొనసాగుతుంది. డైనోసార్ ప్రదర్శనలో డినో ఫాసిల్ మ్యూజియం, ఎత్తయిన డినో లింబ్, డైనోసార్ ఫుట్‌స్టెప్స్ ట్రయల్, ఆకట్టుకునే స్కెలిటన్ డిస్ప్లే ఉన్నాయి. మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 9 గంటల వరకు సందర్శకులకు అనుమతిస్తారు.బాలీవుడ్ నైట్.. 23న..సాక్షి సిటీబ్యూరో: ముంబైకి చెందిన ప్రముఖ లేడీ డీజే కర్మ.. లైవ్ దర్బూక పేరిట ప్రదర్శన ఇస్తున్నారు.నగరంలోని శ్రీనగర్‌కాలనీ రోడ్లో ఉన్న కమలాపురి కాలనీలోని విన్‌ఫ్లోరా రెసిడెన్సీ హోటల్లో శుక్రవారం రాత్రి 8.30 గంటల నుంచీ ఈ బాలీవుడ్ నైట్ ఈవెంట్ జరగనుంది. ఈ షోలో తనదైన శైలిలో విభిన్న రకాల ట్రాక్స్‌ను ఆమె కదం తొక్కించనున్నారు.డార్క్ కామెడీ షో.. 25న..సాక్షి, సిటీబ్యూరో: నగరవాసుల్ని ఇటీవల అమితంగా ఆకట్టుకుంటున్న వాటిలో కామెడీ షోలదే అగ్రస్థానం. ఈ నేపథ్యంలో మరో హాస్యభరిత కార్యక్రమం ఓన్లీ కామిక్స్ లెఫ్ట్ ఎలైవ్ పేరిట ఏ డేంజరస్ స్టాండప్ కామెడీ షో అనే ట్యాగ్ లైన్‌తో సిటీలో ఓ ఈవెంట్ నిర్వహిస్తున్నారు.జూబ్లీహిల్స్, ఫిల్మ్‌నగర్‌లోని ఎన్‌హ్యాన్స్ కేఫ్ అండ్ కన్ఫెక్షనరీలో ఈ నెల 25వ తేదీన రాత్రి 7గంటలకు ఈ కార్యక్రమం ఉంటుంది. -
ఒక హంతకుడి బాధితులు!
పదిహేనేళ్ల క్రితం మేము మా ఫార్మ్ హౌస్ లోకి మారే సమయానికి అక్కడే ఉన్న ఒక తాటి చెట్టుని గమనించాము. అది తన పక్కనే ఉన్నపెద్ద మర్రి చెట్టుతో సూర్యరశ్మి కోసం పోటీ పడుతూండటం చూసాము. పగటి పూట ఒక నల్లంచి పక్షి ఆ తాటి ఆకుల మధ్య కట్టుకున్న తన గూటిలోకి వెళ్ళివస్తూ కనిపించేది. సాయంత్రం ఎండిన తాటి ఆకుల మధ్య విశ్రమించిన గబ్బిలాలు ఆహారం కోసం బయటకు వస్తూ కనిపించేవి.తాటి కాయలు బాగా పండి, నలుపు రంగులోకి మారి మంచి వాసన వచ్చే సమయానికి పునుగు పిల్లులు వస్తుండేవి. అవి రాత్రి సమయాల్లో పండిన తాటి కాయలను తినడం కోసం చెట్లు ఎక్కి, ఎండిన తాటి ఆకులపైకి దూకుతూ శబ్దం చేసేవి. ఒకసారి తాటి కాయలను తిన్న తరువాత క్రింద పడేస్తుంటే, ఆ కాయలు నేలపై ఉండే ఎండుటాకులకు తగిలి రాత్రి నిశబ్దానికి భంగం కలిగించేవి. ఒక్కోసారి రెండు మూడు పునుగు పిల్లులు బిగ్గరగా అరుస్తూ పోట్లాడుకుంటుంటే ఆ శబ్దానికి నిద్రాభంగం అయిన నా భర్త రోమ్ నిద్రలేచి “నోర్మూసుకో” అని నా మీద అరిసి అటు తిరిగి చక్కగా గురకపెట్టేవాడు!మంచి ఎండాకాలంలో రాత్రి వేళలో వీచే గాలి, ఆ తాటి చెట్ల ఆకులను కదిలిస్తూ భయపెట్టే శబ్దాన్ని చేసేది. కొంతమంది ఈ శబ్దాలు దెయ్యాలు చేసేవని భ్రమపడుతుండేవారు. ఉదాహరణకు ఎప్పుడైనా అర్ధరాత్రి వేళల్లో మమ్మల్ని ఇంటి వద్ద దించటానికి వచ్చే టాక్సీ డ్రైవర్లు ఆ పరిసరాలను గమనించి "ఇలాంటి చోట్ల ఉండటానికి మీకు భయంగా లేదా!" అని ఎవరికి వినపడనంత మెల్లగా మమ్మల్నిఅడిగేవారు!కొన్నిదశాబ్దాల క్రితం కొన్ని తాటి చెట్లు వరుసగా మొలకెత్తి పెద్ద చెట్లు అయ్యాయి. కొన్నాళ్లకు ఒక మర్రి చెట్టు వాటిల్లోని ఒక తాటి చెట్టుపై మొలకెత్తి పరాన్నజీవిలా బ్రతకటం మొదలుపెట్టింది. తాటి చెట్లు ఎత్తుగా ఏపుగా పెరుగుతుంటే, వాటితో పాటు మర్రి చెట్టుకూడా తన కొమ్మలను వేర్లను విస్తరిస్తూ దారిలో అడ్డు ఉన్నవాటిని తినేసేడట్లు బలంగా ఎదగడం మొదలుపెట్టింది. కొన్నేళ్ళకు ఆ మర్రి చెట్టు ధాటికి దాదాపుగా అన్ని తాటి చెట్లు చనిపోగా ఒకే ఒక్క తాటి చెట్టు మిగిలింది!కొన్నేళ్లకు ఆ మిగిలిన ఒక్క తాటి చెట్టు కూడా తన తల భాగం వంగిపోయేసరికి, పాపం ఈ చెట్టు కూడా మర్రి చెట్టుతో చేసిన పోరాటంలో ఓడిపోయింది అని మాకు అర్ధమయింది! ఆఖరికి దాని తల భాగం రాలిపోయి కేవలం కాండం మాత్రం ఒకప్పటి చెట్టుకి గుర్తుగా మిగిలిపోయింది.ఇది జరిగిన కొద్ది నెలల్లోనే రెండు బంగారు వర్ణపు వడ్రంగి పిట్టలు చనిపోయిన తాటి చెట్టు మిగిలి ఉన్న కాండాన్ని గుర్తించి వాటిపై రంధ్రాలు చెయ్యడం మొదలుపెట్టాయి. చివరికి ఆ కాండం పైభాగాన ఒక రంధ్రం చేసి గూడు కట్టాయి. కొన్ని వారాలకు ఒక రోజు మాకు తొర్ర వద్ద తల్లితండ్రి తెచ్చే ఆహారం కోసం అసహనంతో ఎదురుచూస్తున్న రెండు వడ్రంగి పిట్టల పిల్లలు కనిపించాయి!పిల్లలు పెద్దవై ఎగిరిపోయాక ఆ వడ్రంగి పిట్టల కుటుంబం ఆ తొర్రను ఖాళీ చేసి వెళ్ళిపోయి అప్పుడప్పుడు కనిపిస్తుండేవి. ఒక రెండేళ్లకు మరికొన్ని పక్షులు ఆ తొర్రలో ఆవాసం ఏర్పరుచుకున్నాయి. కొన్ని రామచిలుకలు ఆ గూటి యజమానులైన వండ్రంగి పిట్టలను తరిమేసి ఆ తొర్రను పెద్దది చేసి, దానిని నివాసానికి అనుగుణంగా చేసుకునే సమయానికి రెండు గుడ్లగూబలు వచ్చి చేరాయి. ఆ రామ చిలుకలు కొన్నిరోజులపాటు ఆ తొర్ర వద్ద ఎంత గోల చేసినప్పటికీ ఆ గుడ్లగూబలు తొణకకుండా, బెణకకుండా ఆ తొర్రను ఆక్రమించేశాయి. చిలుకలు ఎంత కష్టపడ్డప్పటికీ ఆ గుడ్లగూబలను ఏమీ చేయలేకపోయాయి. ఆ గుడ్లగూబలు కాస్త సర్దుకునే సమయానికి ఒక నల్లంచి వచ్చి ఆ గుడ్లగూబలను ఎదో చేసి మొత్తానికి ఆ తొర్ర నుంచి తరిమేసింది. “హమ్మయ్య చివరికి ఒక పక్షి ఈ తొర్రను తన ఇల్లుగా చేసుకుంటుంది” అని మేము సంబరపడేలోపలే ఒక జత గోరింకలు వచ్చి ఆ నల్లంచిని తరిమేసి ఆ గూటిలో స్థిరపడిపోయాయి!ఆ గోరింకలు కొన్నేళ్లపాటు ఆ తాటి చెట్టు తొర్రలో నివసించాయి. పక్షులే కాకుండా ఆ చనిపోయిన చెట్టు కాండం మీద కొన్నిరకాల బల్లులు, కాళ్ళ జెర్రెలు నివసించేవి. కానీ ఒక రోజు ఆ చెట్టు కాండం పడిపోవడంతో ఆ జీవులన్నీ గూడు లేనివి అయిపోయాయి! అయినప్పటికీ ఆ క్రింద పడిపోయిన కాండం మట్టిలో కలిసిపోయే లోపల కొన్ని కప్పలకు, నీటి పాములకు, పెంకు పురుగులకు, చెద పురుగులకు, బల్లి గుడ్లకు ఆశ్రయమిచ్చింది. ఇదంతా జరిగేలోపల మన మర్రి చెట్టు మా వంటింటి వ్యర్ధాల నీటి వలన బలపడి ఐదారు రెట్లు పెరిగి మహా వృక్షమైపోయింది!--జానకి లెనిన్కృష్ణమూర్తి(ఫోటోలు)(చదవండి: మలేషియా ప్రధానికి స్పెషల్ మిల్లెట్ లంచ్..మెనూలో ఏం ఉన్నాయంటే..!) -
ట్వింకిల్... ట్వింకిల్... లిటిల్ స్టార్స్ జాగ్రత్త!
‘ఒంటరిగా వెళ్లవద్దు.. పార్కుకు, పాఠశాలకు, బీచ్‌కి, మరెక్కడికైనా... మేనమామ, బంధువు లేదా స్నేహితుడైనప్పటికీ.. ఏ వ్యక్తితోనూ ఒంటరిగా వెళ్లవద్దు. ఉదయం, సాయంత్రం మరీ ముఖ్యంగా రాత్రిపూట అస్సలు ఒంటరిగా వెళ్లవద్దు’ అంటూ... నలభై ఏళ్ల క్రితం తల్లి తన చిన్నతనంలో నేర్పించిన భద్రతా పాఠాలనే ఇన్నేళ్ల తర్వాత తన కూతురు నితారాకు కూడా బోధిస్తున్నట్లు గుర్తించానని ఇన్స్టాగ్రామ్ పేజీ ద్వారా నాటి బాలీవుడ్ నటి ట్వింకిల్ ఖన్నా చెప్పింది.కోల్‌కతాలోని ఆర్జికర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో యువ ట్రైనీ డాక్టర్‌పై జరిగిన దారుణ ఘటన అనంతరం తన కుమార్తెతో తాను ఈ విధంగా సంభాషణ జరిపినట్టు తెలిపింది. అమ్మాయిల భద్రతకు సంబంధించి ఆఫ్‌లైన్‌లో ఇలాంటి ప్రమాదకర స్థితి ఉంటే ఆన్లైన్ ముప్పు మరో విధమైన సమస్యలకు లోను చేస్తుంది. డిజిటల్లో ఆడపిల్లల భద్రతకు సంబంధించి పెద్దలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో నిపుణులేం చెబుతున్నారో తెలుసుకుందాం.నేటి డిజిటల్ యుగంలో అమ్మాయిల భద్రత బయటి ప్రదేశాలకు మించి విస్తరించింది. గతంలో అపరిచితుల నుంచి ప్రమాదం, రహదారి భద్రత, ఆట స్థలం ప్రమాదాలు.. ఈ ఆందోళనలు ఉండేవి. ఇప్పుడు ఇవి ఇలాగే కొనసాగుతుండగా డిజిటల్ యుగం మరో క్లిష్టమైన లేయర్‌ని ప్రవేశపెట్టింది.ఆన్ లైన్ ముప్పు..ఈ రోజుల్లో పిల్లలు ఆన్ లైన్ ప్రపంచంలోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. ఇక్కడ పిల్లలను కబళించేందుకు మోసగాళ్లు.. చాట్ రూమ్‌లు, సోషల్ మీడియా ల్యాట్ఫారమ్లు, గేమింగ్ కమ్యూనిటీలలో దాగి ఉంటున్నారు. ఆన్ లైన్ వస్త్రధారణ, దోపిడీ నుంచి వారిని రక్షించడానికి అప్రమత్తత, డిజిటల్ అక్షరాస్యత ప్రతి ఒక్కరికీ అవసరం.సైబర్ బెదిరింపులు..ఇంటర్నెట్ అనేది అపరిచితుల నుంచి బెదిరింపులను ్రపోత్సహిస్తుంది. సైబర్ బెదిరింపు పిల్లల మానసిక ఆరోగ్యానికి, ఆత్మగౌరవానికి ముప్పుగా మారుతుంది.అనుచితమైన కంటెంట్..కేవలం కొన్ని క్లిక్‌లతో, పిల్లలు వారి వయస్సుకు మించి అనుచితమైన కంటెంట్‌ను యాక్సెస్ చేయగలరు, ఇది వారి అభివృద్ధికి ఆటంకమే కాదు హాని కూడా కలిగించవచ్చు. రోడ్డు ప్రమాదాలు, గాయాలు, ప్రకృతి వైపరీత్యాలు పిల్లల భద్రతకు ముప్పును కలిగిస్తూనే ఉన్నాయి. అందువల్ల, ఆఫ్‌లైన్– ఆన్లైన్ నష్టాలను పరిష్కరించే భద్రతా విద్యకు సమతుల్య విధానం అవసరం.అవగాహన తప్పనిసరి..– భయాన్ని పెంచడం కంటే తెలివైన ఎంపికలు చేయడానికి వారిని శక్తిమంతం చేయడంపై దృష్టి పెట్టాలి.– తగిన పర్యవేక్షణ, మార్గదర్శకత్వాన్ని అందిస్తూనే పిల్లలు పరిపక్వం చెందుతున్నప్పుడు క్రమంగా మరింత స్వాతంత్య్రం పొందేందుకు అనుమతించాలి. – పిల్లలకు సమస్య పరిష్కార నైపుణ్యాలను నేర్పించాలి. నమ్మకం, పరస్పర గౌరవం ఉండే వాతావరణాన్ని సృష్టించాలి.– అధిక రక్షణ వారి అభివృద్ధికి ఆటంకం కలిగిస్తుంది. ఆందోళనను సృష్టిస్తుంది. వారు వారి తప్పుల నుండి నేర్చుకునేలా వయసుకి తగిన స్వేచ్ఛను, అవకాశాలను ఇవ్వాలి.– ఆన్ లైన్ బెదిరింపులను విస్మరించవద్దు. ప్రస్తుత ఆన్ లైన్ ట్రెండ్స్, ప్రమాదాల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. ఇంటర్నెట్ భద్రత గురించి మీ చుట్టూ ఉన్నవారితో మాట్లాడుతూ ఉండండి.– డిజిటల్ భద్రత అనేది కేవలం శారీరక శ్రేయస్సు కంటే ఎక్కువ. హద్దుల్లో ఉండటం, ఆరోగ్యకరమైన సంబంధాలు, అనుచితమైన ప్రవర్తనను ఎలా గుర్తించాలి, ప్రతిస్పందించాలనే దాని గురించి పిల్లలకు బోధించడం ద్వారా భావోద్వేగ భద్రతను పరిష్కరించాలి.డిజిటల్ పేరెంటింగ్ తప్పనిసరి..ఇంట్లో పిల్లలు సేఫ్‌గా ఉన్నారు అనుకుంటారు కానీ, నేటి రోజుల్లో బయట కన్నా డిజిటల్లోనే మరిన్ని ప్రమాదాల బారినపడుతున్నారు. నేరుగా కన్నా ఆన్లైన్లోనే చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్ ఎక్కువ జరుగుతుంది. డిజిటల్ మోసగాళ్లు టీనేజ్ అమ్మాయిలను ఆకర్షించి సరోగసి, ఆర్గాన్ ట్రేడింగ్ చేస్తున్నారు. కొత్తదనాన్ని ఆస్వాదించాలి అంటూ పిల్లలను హిప్నోటైజ్ చేస్తుంటారు. వారిని తప్పుదారి పట్టించి, వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు తీసుకోవడం.. ఆ తర్వాత బెదిరింపులకు పాల్పడటం... ఫలితంగా పిల్లలు భయాందోళనకు లోనవడం, ఆత్మహత్యలు చేసుకోవడం వంటివి జరుగుతున్నాయి.ఫోన్ లేదా ట్యాబ్ లేదా ఇతర గ్యాడ్జెట్స్‌లో పేరెంటల్ కంట్రోల్ ఉండేలా చూసుకోవాలి. ఫ్యామిలీ ఇ–మెయిల్ తప్పనిసరి. ఏ వయసువారికి ఎలాంటి ఆన్లైన్ గేమ్స్ బెటర్ అనేవి తెలుసుకోవాలి. ప్రమాదాల వంక పెట్టి పిల్లలను డిజిటల్ నుంచి దూరం చేయకుండా అవగాహన కల్పించడం అవసరం. సమస్య తలెత్తితే చైల్డ్ హెల్ప్‌లైన్: 1098, నేషనల్ కమిషన్ ఫర్ ్ర΄÷టెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (ఎన్సిపిసిఆర్), ఓసిఎస్ఎఇ (ఆన్లైన్ చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్ అండ్ ఎక్స్ల్యాయిటేషన్), పోక్సో, మినిస్ట్రీ ఆఫ్ ఉమన్ అండ్ చైల్డ్ రైట్స్ (ఎమ్డబ్ల్యూసీడీ),..లోనూ కేస్ ఫైల్ చేయచ్చు. – అనీల్ రాచమల్ల, సైబర్ సేఫ్టీ నిపుణులు, ఎండ్ నౌ ఫౌండేషన్ -
సేంద్రియ సేద్యంపై 21 రోజుల ఉచిత శిక్షణా శిబిరం..
సేంద్రియ/ప్రకృతి వ్యవసాయంలో ఇమిడి ఉండే అన్ని అంశాలతో పాటు పిజిఎస్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ విషయాలపై పూర్తిస్థాయి శిక్షణ పొందాలనుకునే తెలుగు వారికి ఇదొక గొప్ప అవకాశం. సేంద్రియ/ప్రకృతి సేద్యంలో అన్ని విషయాలతో పాటు పిజిఎస్ సర్టిఫికేషన్‌పై లోతైన అవగాహన కల్పించేందుకు 21 రోజుల పాటు తెలుగులో ఉచిత రెసిడెన్షియల్ శిక్షణా శిబిరం జరగనుంది. కేంద్ర వ్యవసాయ శాఖ అనుబంధ సంస్థ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్గానిక్/నేచురల్ ఫార్మింగ్ (ఎన్సిఓఎన్ఎఫ్) తోడ్పాటుతో సుస్థిర వ్యవసాయ కేంద్రం (సిఎస్ఎ), కృష్ణ సుధ అకాడమీ ఆఫ్ ఆగ్రోఎకాలజీ (కెఎస్ఎ) సెప్టెంబర్ 5 నుంచి ఉమ్మడిగా ఈ శిబిరాన్ని నిర్వహించనున్నాయి. ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త, సిఎస్ఎ, కెఎస్ఎల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డా. జీవీ రామాంజనేయులు ఆధ్వర్యంలో ఈ శిక్షణా శిబిరం జరగనుండటం విశేషం.విజయవాడకు 50 కిమీ దూరంలో ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట సమీపంలో శ్రీపద్మావతి వెంకటేశ్వర ఫౌండేషన్ నెలకొల్పిన కృష్ణ సుధ అకాడమీ ఆఫ్ ఆగ్రోఎకాలజీ ఆవరణలో ఈ శిబిరం జరగనుంది. 38 ఎకరాలలో అత్యాధునిక సేంద్రియ / ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై అంతర్జాతీయ స్థాయి పరిశోధనలు చేస్తూ ఆచణాత్మక శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాటైన కెఎస్ఎకు సుస్థిర వ్యవసాయ కేంద్రం నాలెడ్జ్ పార్టనర్‌గా వ్యవహరిస్తోంది. ఈ 21 రోజుల శిబిరంలో బోధన పూర్తిగా తెలుగులో ఉంటుంది. శిక్షణ, భోజన వసతులు ఉచితం. అభ్యర్థులు కనీసం ఇంటర్మీడియట్ చదివి ఉండాలి. 30 మందికి అవకాశం.సేంద్రియ/ప్రకృతి వ్యవసాయంలోను, సేంద్రియ ఆహారోత్పత్తుల వ్యాపారంలోను స్థానికంగా కీలక పాత్ర పోషించాలన్న ఆసక్తి, నిబద్ధత కలిగిన వారికి సంపూర్ణ అవగాహన కలిగించేందుకే ఈ శిబిరం నిర్వహిస్తున్నట్లు డా. రామాంజనేయులు వివరించారు. స్థానిక స్వయం సహాయక బృందాలు/ ఎఫ్పిఓలు / ఐసిఎస్/ ఆత్మ, పికెవివై, నామని గంగే లేదా ఏదైనా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల సేంద్రియ వ్యవసాయ పథకాలలో నమోదైన వారికి ్రపాధాన్యం ఉంటుందన్నారు. ఈ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి.. గూగుల్ ఫామ్‌లో వివరాలు పొందుపరచటం ద్వారా ఈనెల 26లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలకు.. 85002 83300. జుట్చఃఓటజీటజిn్చ uఛీజ్చిఅఛ్చిఛ్ఛీఝy.ౌటజముచ్చింతల్లో ‘సిరిధాన్యాలతో జీవన సిరి’ శిబిరం..రైతునేస్తం ఫౌండేషన్, స్వర్ణభారత్ ట్రస్ట్ సహకారంతో.. కర్షక సేవా కేంద్రం నిర్వహణలో హైదరాబాద్ సమీపంలో ముచ్చింతల్‌లోని స్వర్ణభారత్ ట్రస్ట్ ఆవరణలో ఈ నెల 24, 25, 26 తేదీల్లో సిరిధాన్యాలతో జీవన సిరి అనే అంశంపై ఆహార ఆరోగ్య నిపుణులు, పద్మశ్రీ పురస్కార గ్రహీత డా. ఖాదర్‌వలి, డా. సరళా ఖాదర్లచే ఆరోగ్య అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రైతునేస్తం ఫౌండేషన్ అధ్యక్షుడు డా. వై. వెంకటేశ్వరరావు తెలిపారు. 3 రోజులపాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో పాల్గొనదలచిన వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఇతర వివరాలకు.. 97053 83666, 70939 73999. -
నా ఉద్దేశంలో ఆ పండుగ అర్థం.. సుధామూర్తి పోస్ట్ వైరల్
రాజ్యసభ ఎంపీ సుధా మూర్తి రక్షా బంధన్ సందర్భంగా ఒక సందేశాన్ని పంచుకున్నారు. పండుగ వెనుక ఉన్న కథను షేర్ చేసుకున్నారు. ఇది సోషల్ మీడియాలో చర్చకు తెరతీసింది. అంతకు మించే రాఖీ పండుగకు సంబంధించిన కథలు ఉన్నాయంటూ పోస్టలు పెట్టారు. ఇంతకీ ఆమె షేర్ చేసుకున్న కథ ఏంటంటే.. రక్షా బంధన్ తనకు ఒక ముఖ్యమైన పండుగా అని చెప్పారు. ఇది ఒక సోదరికి ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఎల్లప్పుడూ నాకు సహాయం చేయాలని సూచించే రక్షయే ఈ చిన్న దారం అని అన్నారు. అందుకు సంబంధించిన గాథను కూడా చెప్పుకొచ్చారు. "మేవార్ రాజ్యపు కర్ణావతి తన రాజ్యం శత్రు రాజుల దాడికి గురై సంకట స్థితిలో ఉన్నప్పుడూ పొరుగున ఉన్న మొఘల్ చక్రవర్తి హుమాయున్‌కు ఒక చిన్న దారం పంపింది. ఇది తాను ఆపదలో ఉన్నాను, దయచేసి నన్ను మీ సోదరిగా పరిగణించి రక్షించండి అని ఆ దారం రూపంలో హుమాయున్ రాజుకి సందేశం పంపింది. అయితే హుమాయున్ ఆ దారం అర్థం ఏంటో అస్సలు తెలియదు. తన మంత్రుల ద్వారా అసలు విషయం తెలుసుకుని రక్షించేందుకు ఢిల్లీ పయనమయ్యాడు. అయితే సమయానికి హుమాయున్ చేరుకోలేకపోవడంతో కర్ణావతి మరణించింది." అని సుదామూర్తి పోస్ట్‌లో రాసుకొచ్చారు. అయితే వినయోగదారులు ఈ వ్యాఖ్యలతో విభేధించడమే గాక మహాభారత కాలంలోనే రక్షాబంధన్ గురించి ఉందంటూ నాటి ఘటనలను వివరించారు. శిశుపాలుడిని చంపడానికి సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తుండగా శ్రీకృష్ణుడి వేలుకి గాయమవ్వడం జరుగుతుంది.వెంటనే ద్రౌపది చీర కొంగు చింపి కట్టిందని, అందుకు ప్రత్యుపకారంగా కౌరవులు నిండు సభలో అవమానిస్తున్నప్పుడూ ద్రౌపదికి చీరలు ఇచ్చి కాపాడాడని అన్నారు. అలాగే బలిచక్రవర్తి పాతాళ రాజ్యాన్ని రక్షిస్తుండేవాడు. అతడు తన భక్తితో విష్ణువుని ప్రసన్నం చేసుకుని ఆయన్నే రాజ్యనికి కాపలాగా ఉంచాడు. అయితే లక్ష్మీదేవి ఈ విషయం తెలుసుకుని ఈ శ్రావణ పూర్ణిమ రోజున రాఖీ కట్టి తన భర్తను దక్కించుకుందని పురాణ వచనం అంటూ సుధామూర్తి పోస్ట్‌కి కౌంటర్ ఇస్తూ పోస్టులు పెట్టారు. కాగా, చిన్నప్పుడు తాను తెలుసుకున్న రాఖీ పండగ కథలను తెలియజేయాలనుకోవడమే తన ఉద్దేశమని సుధామూర్తి వివరణ ఇచ్చారు. (చదవండి: 'అమ్మ అపరాధం'ని అధిగమించి గొప్ప పారిశ్రామిక వేత్తగా..!) -
నల్లతామరకు విరుగుడు.. ఈ కుంకుడు ద్రావణం!
నల్గొండ జిల్లా చందంపేట మండలంపోలేపల్లి వాస్తవ్యులు లోకసాని పద్మారెడ్డి అనే మెట్ట ్రపాంత రైతు సాగు చేస్తున్న 12 ఎకరాల కుంకుడు తోట కొత్త ఆవిష్కరణలకు పురుడుపోసింది. మొదటిది... చెట్టుకు ఏడాదికి 400 కిలోల వరకు కుంకుడు కాయల దిగుబడినిచ్చే సరికొత్త రైతు వంగడం ఆవిష్కారమైంది. కుంకుడు ద్రావణం రెండోది.కుంకుడు కాయల పొడికి రెండు రకాల ఔషధ మొక్కల పొడిని చేర్చి.. ఆ పొడితో తయారు చేసిన ద్రావణం సేంద్రియ వ్యవసాయంలో సస్యరక్షణ కోసం వినియోగిస్తూ పద్మారెడ్డి, ఆయన మిత్రులైన కొందరు రైతులు చక్కటి ఫలితాలు సాధిస్తుండటం విశేషం. సేంద్రియ పురుగుమందుగా, శిలీంధ్రనాశనిగానే కాక పంట పెరుగుదలకు కూడా కుంకుడు ద్రావణం దోహదం చేస్తోందని ఆయన చెబుతున్నారు. పండ్ల తోటలు, వరి, కూరగాయలు తదిరత పంటల సేంద్రియ సాగులో ఉపయోడపడుతోందన్నారు.200 లీ. డ్రమ్ముకు 2 కిలోలు...2 కిలోల కుంకుడు పొడిని 200 లీటర్ల డ్రమ్ములో 2 గంటలు నానబెట్టి, పిసికి, వడకడితే సిద్ధమయ్యే ద్రావణాన్ని పంటలకు పిచికారీ చేసుకోవచ్చు. మళ్లీ నీరు కలపాల్సిన అవసరం లేదు. రెండేళ్లుగా తాము ప్రయోగాత్మకంగా ఈ ద్రావణాన్ని వాడుతున్నామని చెబుతూ.. ఎన్ని రోజులైనా నిల్వ ఉంచి వాడుకోవచ్చు అన్నారు.ఇంటిపంటలకు...లీటరు నీటికి 10 గ్రాముల కుంకుడు పొడిని కలిపిన ద్రావణం ఇంటిపంటలు/ మిద్దె తోటల రైతులకూ కుంకుడు పొడి ఎంతో ఉపయోగకరంగా ఉందని పద్మారెడ్డి తెలిపారు.వరిలో తెగుళ్లకు...కుంకుడు ద్రావణాన్ని ఆకుకూరలకు ఒక్కసారి చాలు. పంటలు ఏపుగా పెరగడానికి కూడా ఈ ద్రావణం దోహదపడుతుందని పద్మారెడ్డి తెలిపారు. బత్తాయి తదితర పండ్ల తోటలకు 30 రోజుల వ్యవధిలో వాడుకోవచ్చు. కూరగాయల సాగులో 15 రోజులకోసారి పిచికారీ చేయొచ్చు. వరి పంట కాలంలో 3 దఫాలు.. నాటేసిన 15–25 రోజులకు, 60 రోజులకు, 90 రోజులకు చల్లాలి. ఊస తెగులు/కాండం తొలిచే పురుగును ఈ ద్రావణం పూర్తిగా నివారిస్తుందని పద్మారెడ్డి స్వానుభవంగా చెప్పారు.మిరపలో నల్లతామరకు...మిరప రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న బ్లాక్ త్రిప్స్ (నల్లతామర)ను కూడా కుంకుడు ద్రావణం 70–80% నియంత్రిస్తున్నట్లు సేంద్రియ మిరప తోటలో రుజువైందని పద్మారెడ్డి చెబుతున్నారు. రసాయనిక పురుగుమందులు అసలు వాడకుండా కుంకుడు ద్రావణాన్ని ప్రతి 15 రోజులకోసారి పిచికారీ చేస్తే సేంద్రియ మిరప రైతులకు మంచి ఫలితాలు వస్తున్నాయన్నారు. గ్రోత్ ప్రమోటర్‌గా, ఫంగిసైడ్‌గా ఇది పనిచేస్తుందని, మిరపకాయలపై మచ్చలు కూడా రావని పద్మారెడ్డి(99481 11931) చెబుతున్నారు. -
రైతు బ్రాండ్.. ఈ నేరేడు జ్యూస్!
నేరేడు పండ్లు జూన్–జూలై మధ్య ఏడాదికి ఒక్క నెల రోజులు మాత్రమే వస్తాయి. చెట్లపై 90% పండిన నేరేడు కాయలను వ్యాపారులు కొని నగరాలు, పట్టణాలకు తీసుకెళ్లి విక్రయిస్తూ ఉంటారు. ఒక్క రోజు కోయక΄ోయినా పండ్లు 100% పండి΄ోతాయి. రవాణాకు పనికిరావు కాబట్టి వ్యాపారులు కొనరు. మరో రోజు కోయక΄ోతే రాలి మట్టిపాలవుతాయి. 100% పండిన పండ్లను వృథా కాకుండా ఇంటిపట్టునే జ్యూస్‌గా మార్చితే పండ్ల వృథాను అరికట్టినట్లవుతుంది. జ్యూస్ అమ్మకం ద్వారా మంచి ఆదాయం కూడా వస్తుందని ఆశించిన రైతు మారుతీ ప్రసాద్. 8 ఏళ్లు కష్టపడి నేరేడు జ్యూస్ తయారీకి అవసరమైన ప్రత్యేక టెక్నాలజీని విజయవంతంగా రూపొందించుకున్నారు.అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలం ఉద్దేహాళ్ గ్రామానికి చెందిన రైతు, మాజీ సర్పంచ్ పి. మారుతీ ప్రసాద్ ఇంటర్ వరకు చదువుకున్నారు. దానిమ్మ, ద్రాక్ష తదితర పంటల సాగుతో నష్టాల పాలైన నేపథ్యంలో వ్రేదావతి ఒడ్డున 4 ఎకరాల చౌడు భూమిని 15 ఏళ్ల క్రితం కొన్నారు. ప్రముఖ స్వచ్ఛంద సంస్థ ఆర్డీటీ సహకారంతో రెండెకరాల్లో 150 అల్లనేరేడు మొక్కలు 2009లో నాటారు. కాలక్రమంలో నేరేడు తోటల విస్తీర్ణం ఆ ్రపాంతంలో 400 ఎకరాలకు పెరిగి, మార్కెటింగ్ సమస్య వచ్చిపడింది.8 ఏళ్ల ప్రయోగాలు ఫలించిన వేళ..జూన్–జూలై మధ్య కేవలం నెల రోజుల్లోనే నేరేడు పండ్లన్నీ మార్కెట్లోకి వస్తాయి. వీటిని నిల్వ చేసుకొని నెమ్మదిగా అమ్ముకునే మౌలిక సదుపాయాలు రైతులకు లేవు. పూర్తిగా పండిన నేరేడు పండ్లతో జ్యూస్ తయారు చేయటం ద్వారా మార్కెటింగ్ సమస్యను అధిగమించవచ్చని మారుతీప్రసాద్ భావించారు. మైసూర్‌లోని సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సిఎఫ్టిఆర్ఐ) శాస్త్రవేత్తలను 8 ఏళ్ల క్రితం సంప్రదించారు. అయితే, వారు సూచించిన ్రపాసెసింగ్ పద్ధతి నేరేడుకు సరిపడలేదు. అయినా, ఆయన తన ప్రయత్నాలు మానలేదు.‘మామిడి నుంచి నేరేడు వరకు అన్ని రకాల పండ్ల రసాల తయారీకి వారి వద్ద ఒకటే ్రపాసెసింగ్ పద్ధతి ఉంది. సగం రసం, సగం పంచదార, ప్రిజర్వేటివ్‌లు తదితరాలు కలిపి జ్యూస్ తయారు చేయాలని వారు సూచించారు. అవేమీ కలపకుండా నేరేడు జ్యూస్ తయారు చేయాలన్నది నా ప్రయత్నం. ఈ క్రమంలో నేరేడు ్రపాసెసింగ్ పద్ధతి, నిల్వ పద్ధతి, బాట్లింగ్ పద్ధతితో పాటు యంత్రాలను నా అవసరాలకు తగినట్లు ఏయే మార్పులు చేసుకోవాలి అనేది స్వీయఅనుభవం ద్వారా తెలుసుకున్నాను. ఏవీ కలపకుండా కేవలం నేరేడు జ్యూస్ తయారు చేసి, ఏడాది పాటు నిల్వ ఉంచటంలో ఎట్టకేలకు విజయం సాధించాను..’ అని మారుతీప్రసాద్ ‘సాక్షి సాగుబడి’తో సంతోషంగా చె΄్పారు.నేరేడు గింజల పొడి8 ఏళ్ల స్వయంకృషి ఫలితమిది..గత ఏడాది సీజన్లో 5 టన్నుల నేరేడు జ్యూస్ తయారు చేసి విక్రయించాను. ఈ ఏడాది పదెకరాల తోటలో పండ్లను అదనంగా కొనుగోలు చేసి, 22 టన్నుల జ్యూస్ తయారు చేశా. జ్యూస్‌ను అన్నివిధాలా సంతృప్తికరమైన రీతిలో ఆరోగ్యదాయకంగా ఉత్పత్తి చేస్తున్నా. సిఎఫ్టిఆర్ఐ తోడ్పాటు తీసుకున్నా. వ్యయ ప్రయాసలకోర్చి 8 ఏళ్లుగా ఎన్నో ప్రయోగాలు చేసి ఎట్టకేలకు విజయం సాధించా. నాకు అవసరమైన విధంగా తగిన మార్పులు చేర్పులతో ప్రత్యేక ్రపాసెసింగ్ పద్ధతిని, ప్రత్యేక యంత్రాలను రూపొందించుకున్నా. పంచదార, రసాయనాలు, ప్రిజర్వేటివ్‌లు ఇతరత్రా ఏమీ కలపకుండా స్వచ్ఛమైన నేరేడు రసాన్ని ప్రజలకు అందిస్తున్నా. గర్భవతులు మాత్రం నేరేడు జ్యూస్ తాగకూడదు. ఇతరులు నీటిలో కలిపి తాగితే మంచిది. ఎందుకైనా మంచిది వైద్యుల సలహా మేరకు వాడమని కొనే వారికి సూచిస్తున్నా. – పి. మారుతీ ప్రసాద్ (97018 66028), ఉద్దేహాళ్, బొమ్మనహాళ్ మండలం, అనంతపురం జిల్లా2.5 కేజీలకు లీటరు జ్యూస్..తన ఇంటి దగ్గరే ్రపాసెసింగ్ యూనిట్‌ను ఆయన ఏర్పాటు చేసుకున్నారు. తన రెండెకరాల్లో నేరేడు పండ్లతో పాటు మరో 10 ఎకరాల తోటలో పండ్లను కొని జ్యూస్ తయారు చేస్తున్నారు. రెండున్నర కేజీల నేరేడు పండ్లతో లీటరు జ్యూస్ తయారు చేస్తున్నారు. మొదట్లో గింజలు తీసేసి గుజ్జుతో మాత్రమే జ్యూస్ తయారు చేశారు. గత ఏడాది నుంచి ప్రత్యేకంగా గింజతో పాటు మొత్తం పండ్లతో కూడా రెండు రకాలుగా జ్యూస్ తయారు చేస్తున్నారు. 200 ఎం.ఎల్. బాటిల్స్ లో ΄్యాక్ చేసి అమ్ముతున్నారు. గుజ్జు జ్యూస్ కన్నా ఇది కొంచెం వగరుగా ఉన్నా, మార్కెట్లో క్లిక్ అయ్యింది.హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి దూర్రపాంతాల నుంచి కూడా చాలా మంది షుగర్ వ్యాధిగ్రస్తులు నేరుగా కొనుగోలు చేస్తూ, సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని ఆయన తెలిపారు. ఈ జ్యూస్ తమకు బాగా ఉపయోగపడుతోందని షుగర్ పేషెంట్లు చెప్పటం మారుతీ ప్రసాద్‌కు కొండంత ధైర్యాన్నిచ్చింది. అందుకే ఈ ఏడాది ఎక్కువగా గింజలతో కూడిన జ్యూస్‌ను తయారు చేశారు. ఈ జ్యూస్‌ను నాణ్యతా పరీక్షల కోసం సిఎఫ్టిఆర్ఐకి పంపానన్నారు. గుజ్జుతో జ్యూస్ చేసిన తర్వాత మిగిలే గింజలను కూడా ఎండబెట్టి, ΄÷డి చేసి అమ్ముతున్నారు. ఈ ΄÷డిని గోరువెచ్చ నీటితో కలుపుకొని తాగొచ్చు. నీటితో మరిగించి టీ డికాక్షన్ చేసుకొని తాగొచ్చని ఆయన చెబుతున్నారు. ఒక ఉద్యాన యూనివర్సిటీ లేదా పరిశోధనా కేంద్రం చేయాల్సిన పరిశోధనను సడలని పట్టుదలతో కొనసాగించి విజయం సాధించినను రైతు మారుతీప్రసాద్ అసలు సిసలైన రైతు శాస్త్రవేత్త. – కె. వంశీనాథ్‌రెడ్డి, సాక్షి, బొమ్మనహాళ్, అనంతపురం జిల్లా -
ఇది కిచెన్‌లో ఉంటే.. టిఫిన్, లంచ్, డిన్నర్‌తో పాటు..
చాలామంది వేడివేడి రుచులను కోరుకుంటారు. కొన్నిసార్లు ఏదో కారణంతో ఆలస్యం అయినప్పుడు వంటకాల వేడి చల్లారిపోయి, తినాలన్న ఆసక్తి కోల్పోతారు. ఆ సమస్యను దూరం చేస్తుంది ఈ ఎలక్ట్రిక్ వార్మింగ్ ట్రే. ఇది కిచెన్ లో ఉంటే టిఫిన్, లంచ్, డిన్నర్‌తో పాటు స్నాక్స్ టైమ్‌లో కూడా వేడివేడి పదార్థాలనే అందుకోవచ్చు. అంతే కాకుండా, టీ, కాఫీ వంటి వేడి పానీయాలను ఫ్లాస్క్‌లో భద్రపరచుకోవాల్సిన పనిలేదు.పార్టీలు, ఫంక్షన్ల సమయంలో కూడా ఈ ట్రే ఉంటే, ఆరగించే రుచులు ఎప్పటికప్పుడు వేడివేడిగా పొగలు కక్కుతూ ఉంటాయి. కేవలం కొన్ని నిమిషాల ముందు ఈ ట్రే మీద వేడి చేయాలనుకున్న వంటకాలను, కాఫీ, టీ వంటి పానీయాలను ఉంచితే సరిపోతుంది. దీనిలో 216 డిగ్రీల ఫారెన్ హీట్ నుంచి 316 డిగ్రీల ఫారెన్ హీట్ వరకు త్రీ మోడ్స్ టెంపరేచర్ ఆప్షన్ ఉండటంతో, ఏది ఎంత వేడి కావాలో అంతే పెట్టుకునే వీలుంటుంది. దీనిపైన సిరామిక్ టేబుల్ వేర్, గ్లాస్ వేర్‌తో పాటు క్యాస్రోల్ మెటల్ కలిగిన ఏ పాత్రలోని ఆహార పదార్థాలనైనా, పానీయాలనైనా వేడి చేసుకోవచ్చు.శాండ్విచ్ అండ్ మోర్..ఈ రోజుల్లో ఇలాంటి ఒక మేకర్ ఇంట్లో ఉంటే, నచ్చిన అల్పాహారం, నచ్చిన చిరుతిళ్లను ఇట్టే సిద్ధం చేసుకోవచ్చు. మెల్ట్, టోస్ట్, ఫ్రై వంటి చాలా ఆప్షన్స్ ఇందులో ఉంటాయి. దీని మీద ఆమ్లెట్, పాన్ కేక్స్, కట్లెట్స్తో పాటు శాండ్విచ్, బర్గర్స్ వంటివీ రెడీ చేసుకోవచ్చు. ఇందులో మొత్తం ఏడు సెట్టింగ్స్ ఉంటాయి.దీన్ని ఓపెన్ చేసుకుని, రెండు వైపులా అధిక మోతాదులో ఆహారాన్ని వండుకోవచ్చు. లేదంటే ఫోల్డ్ చేసుకుని, ఒకేసారి నాలుగు శాండ్విచ్లను రెడీ చేసుకోవచ్చు. దీన్ని ఫోల్డ్ చేసుకున్నాక లాక్ చేసుకునే వీలు కూడా ఉంటుంది. దాంతో ఇందులోని పదార్థాలు వేగంగా బేక్ అవుతాయి. దీనిలోని నాణ్యమైన నాన్–స్టిక్ ప్లేట్ డివైస్‌కి అటాచ్ అయ్యే ఉంటుంది. దీన్ని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఈ మేకర్ని ఇతర ప్రదేశాలకు సులభంగా తీసుకెళ్లొచ్చు!టేబుల్‌టాప్ బార్బెక్యూ గ్రిల్..కుటుంబంతో లేదా స్నేహితులతో పిక్నిక్లకు, క్యాంపింగ్‌లకు వెళ్లినప్పుడు.. ఇలాంటి ఓ బార్బెక్యూ గ్రిల్‌ని వెంట తీసుకుని వెళ్తే, వేళకు క్రిస్పీ రుచులను అందుకోవచ్చు. ఇది బొగ్గులతో లేదా చెక్క ముక్కలతో పని చేస్తుంది. దీని అడుగున వాటిని వేసి, నిప్పు రాజేసి పైన గ్రిల్ అమర్చుకోవాలి. వెజ్ అయినా, నాన్ వెజ్ అయినా దీని మీద చాలా టేస్టీగా గ్రిల్ చేసుకోవచ్చు.పైగా దీనికి అదనంగా ఒక వుడెన్ ట్రే, ఫుడ్ స్టోరేజ్ ట్రే లభిస్తాయి. వుడెన్ ట్రే మీద వంట చేసుకునే ముందు ముక్కలు కట్ చేసుకోవచ్చు. ఇక స్టోరేజ్ ట్రేను వంట పూర్తి అయిన తర్వాత సర్వ్ చేసుకోవడానికి వినియోగించుకోవచ్చు. దీనికి ముందువైపు కదలకుండా లాక్ చేసుకునే వీలుండటంతో ఈ గ్రిల్‌ని సులభంగా ఎక్కడికైనా తీసుకుని వెళ్లొచ్చు. దీనికి ఇరువైపులా హ్యాండిల్స్ ఉండటంతో వంట అవుతున్న సమయంలో కూడా ఒకచోట నుంచి మరోచోటికి సులువుగా కదల్చవచ్చు. -
లోటస్ స్టేటస్! ఈ వైపు ఓ లుక్ వేయండి..
ఎక్కువ హంగామా లేకుండా ఇంటికి కళ తెచ్చేది పూల అలంకరణే! అలాగని రోజూ తాజా పువ్వులకు తూగలేం కదా! అందుకే ఈ లోటస్ ఫ్రేమ్ వైపు ఓ లుక్ వేయండి.. దాంతో ఇంటి అందాన్ని ద్విగుణీకృతం చేసుకోవచ్చు. ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని ఆహ్వానించవచ్చు!తామర పువ్వుల గుచ్ఛంతో ఉన్న ఫ్రేమ్స్, లోటస్ పెయింటింగ్‌ని లివింగ్ రూమ్ లేదా డైనింగ్ రూమ్‌లలో అలంకరించవచ్చు. వీటివల్ల ఆ ప్రాంతమంతా ప్రశాంతంగా అనిపిస్తుంది.సూర్యోదయం వెలుగులో అప్పుడే విచ్చుకుంటున్న తామర పువ్వుల అందం ఇంటి వాతావరణాన్ని వైబ్రెంట్‌గా మారుస్తుంది. గోవుతో కలసి ఉన్న తామర పువ్వుల వాల్ పేపర్స్‌ను పూజ గది, పార్టిషన్స్కు ఉపయోగించవచ్చు.హంగు, ఆర్భాటాలు అక్కర్లేదనుకునేవారు లోటస్ క్యాండిల్ ఏర్పాటుతో ఇంటి శోభను పెంచుకోవచ్చు.లోటస్ థీమ్‌తో ఉన్న కుషన్ కవర్స్‌ను ఎంచుకుంటే గదికి అలంకరణ.. మనసుకు ఆహ్లాదం చేకూరుతాయి.వందల రూపాయల నుంచి లభించే రకరకాల లోటస్ డిజైన్స్‌ను మీ అభిరుచికి తగ్గట్టు ఎంచుకుని, ఇలా డెకరేషన్లో భాగం చేసి ఇంటి స్టేటస్‌నే మార్చేసుకోవచ్చు! -
మిస్టరీ.. ఎపెస్ బందిపోట్లు!
అది 1987 అక్టోబర్ 30. అమెరికా, అలబామా రాష్ట్రంలో ఎపెస్ అనే పట్టణంలో ఉన్న చిన్న పోస్ట్ ఆఫీస్. మనియార్డర్లు, ఉత్తరాలు, స్టాంపులు తీసుకెళ్లేవారంతా ఒకరి తర్వాత ఒకరు వస్తున్నారు, వెళ్తున్నారు. ఆ బిజీలోనే ఉంది పోస్ట్‌మాస్టర్ డ్యూటీ చేస్తున్న ఒపాల్ జాన్సన్ అనే మహిళ. అది తన జీవితంలో అత్యంత భయంకరమైన రోజని ఆమెకు తెలియదు.ఉదయం 11 దాటింది. ఆఫీసులో ఎవరూ లేరు. ‘ఏదైనా తిందాం’ అనుకుంటూ బాక్స్ అందుకోబోయింది. ఇంతలో ఒక నల్లజాతీయుడు, ఒక తెల్లజాతీయుడు కలసి అక్కడికి వచ్చారు. ‘ఏం కావాలి?’ అన్నట్లుగా చూసింది వాళ్లవైపు ఒపాల్. వాళ్లు స్టాంపులు అడగడంతో ముందున్న డ్రా ఓపెన్ చేసి, వాళ్లు అడిగిన స్టాంప్స్ కోసం వెతకడం ప్రారంభించింది. ఇంతలో ఒకడు తుపాకీ బయటికి తీసి, ఆమెకు గురిపెట్టి ‘కదిలితే కాల్చేస్తా!’ అన్నాడు. ఊహించని పరిణామానికి ఆమె నిర్ఘాంతపోయింది.చేతులు పైకెత్తి, అయోమయంగా చూస్తూ ఉండిపోయింది. ఇంతలో మరొకడు కౌంటర్ ముందుకు వెళ్లి, డబ్బులు వెతకడం మొదలుపెట్టాడు. అయితే నల్లజాతీయుడు పోస్టాఫీసు కార్యకలాపాలపై పూర్తి అనుభవం ఉన్నవాడిలా ఏది ఎక్కడుంటుంది? ఎందులో ఎంత ఉంటుంది? అంతా తనతో వచ్చిన తెల్లజాతీయుడికి వివరిస్తున్నాడు. అతడు వాటన్నింటినీ తీసి బ్యాగ్‌లో వేసుకుంటున్నాడు. దోపిడీ జరుగుతోందని ఆమెకు అర్థమైంది. అరిస్తే ప్రాణాలకే ప్రమాదమని, తప్పించుకోవడానికి ఏదో అవకాశం దొరక్కపోతుందా అని దేవుడ్ని ప్రార్థించడం మొదలుపెట్టింది.పోస్టాఫీసులో దొరికిన నగదు, విలువైన స్టాంపులు ఇలా అన్నీ దోచేశారు. ఆ వెంటనే ‘ఈమెను ఏం చేద్దాం?’ అని చర్చించుకున్నారు. ‘ఈమె ఇక్కడే ఉంటే మనం వెళ్లేలోపు పోలీసులకు సమాచారం ఇచ్చే ప్రమాదం ఉంది. ఇక్కడ తుపాకీ తీస్తే అలర్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఈమెను కూడా మనతో పాటు తీసుకుని వెళ్దాం’ అన్నాడు నల్లజాతీయుడు తన తోటి దొంగతో.కాసేపటికి ఆ ఇద్దరూ ఒపాల్‌ని తుపాకీతోనే తోసుకుంటూ ఆమె కారు దాకా తీసుకెళ్లారు. ఆమెను బలవంతంగా కారు ఎక్కించారు. ఒకడు ఆమె పక్క సీట్లో కూర్చుని, ఆమెకు తుపాకీ గురిపెట్టే ఉంచాడు. ఇంతలో మరొకరు తమ కారుని ఒపాల్ కారుకి లింక్ చేసి, పరుగున వచ్చి ఒపాల్ కారులో వెనుక సీట్లో కూర్చున్నాడు. వెంటనే ‘హూ.. పోనీ’ అంటూ అరిచాడు నల్లజాతీయుడు. ఇక తనకు చావు తప్పదనుకున్న ఒపాల్ వణికిపోతూనే వారు ఎటు అంటే అటు కారుని ముందుకు పోనిచ్చింది.అయితే వారిద్దరూ ఆ చుట్టుపక్కల ప్రాంతాల గురించి చాలా బాగా తెలిసినట్లుగా చర్చించుకున్నారు. ‘అక్కడికి వెళ్తే తప్పించుకోవడం ఈజీ! అటు నుంచి అటు పారిపోవచ్చు సులభం!’ అంటూ చాలా ప్రదేశాల పేర్లు ఎంచుకున్నారు. చివరగా, ఆ రెండు కార్లు పట్టణానికి 3 మైళ్ల దూరంలో ఉన్న గాగన్ ్స సరస్సు సమీపంలోని రిమోట్ క్లియరింగ్ దగ్గర ఆగాయి. ఒపాల్‌ని మళ్లీ తుపాకీతో బెదిరించి, ఆమె కారులోనే డిక్కీలోకి ఎక్కించారు. ఆ సమయంలో తుపాకీ తెల్లజాతీయుడి చేతిలో ఉంది.అయితే నల్లజాతీయుడు ఆవేశంగా ‘ఆమెను చంపెయ్.. చంపెయ్.. వదిలిపెట్టొద్దు.. వదిలితే మనకే సమస్య’ అని తెల్లజాతీయుడి మీద పెద్దపెద్దగా అరిచాడు. అయితే తెల్లజాతీయుడు అందుకు అంగీకరించలేదు. ‘ఆమె వల్ల మనకేం సమస్య రాదు. చంపితేనే పోలీసులు మరింత వేగంగా మనల్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు’ అంటూ నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. కాసేపటికి ఇద్దరి చర్చలో తెల్లజాతీయుడి వాదనే గెలిచింది. ఒపాల్ ఊపిరి పీల్చుకుంది. అప్పటి దాకా వారి చర్చంతా వింటున్న ఒపాల్, తన మీదకు ఎప్పుడెప్పుడు బుల్లెట్లు దోసుకోస్తాయోనని చాలా భయపడింది. చివరికి తనని ప్రాణాలతోనే వదులుతున్నారని అర్థం చేసుకుంది. అయితే ఆమె చేతికున్న ఉంగరాలు, మెడలో గొలుసు, క్రెడిట్ కార్డులు అన్నీ లాగేసుకుని, ఆమెను ఆమె కారు డిక్కీలోనే లాక్ చేసి, వారు తమ కారులో పారిపోయారు.కొంత సమయానికి చుట్టూ నిశ్శబ్దాన్ని నిర్ధారించుకున్న ఒపాల్, లోపలే ఉన్న ఇనుప టైర్ సాయంతో డిక్కీని పగలగొట్టి బయటపడింది. అయితే డిక్కీ ఓపెన్ కావడానికి సుమారు గంటపైనే పట్టింది. మొత్తానికి ప్రాణాలు దక్కడంతో పోలిస్ స్టేషన్ కి తన కారులోనే వెళ్లి కంప్లైంట్ ఇచ్చింది. ఆమె చెప్పిన ఆనవాళ్లతో ఆ ఇద్దరు ఆగంతకుల రూపురేఖలను ఊహాచిత్రాలుగా గీయించారు పోలీసులు. వెంటనే విచారణ మొదలుపెట్టారు.అయితే దోపిడీ జరిగిన మరునాడే, దోపిడీకి పాల్పడిన నల్లజాతీయుడు ఒహాయోలో మరో నల్లజాతీయురాలితో కలసి తిరిగినట్లు కొందరు సాక్షులు చెప్పారు. మరోవైపు ఆ మహిళ చాలాచోట్ల ఒపాల్ క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించిందని తేలింది. కానీ ఒపాల్‌ని వణికించిన ఆ ఇద్దరు దొంగలు పోలీసులకు ఎప్పుడూ దొరకలేదు. 1995లో ఈ కథనాన్ని అన్సాల్వ్డ్ ఎపిసోడ్స్‌లో ప్లే చేశారు.2010లో ఒపాల్ అనారోగ్య సమస్యలతో మరణించింది. అయితే తెల్లజాతీయుడు కంటే నల్లజాతీయుడు సుమారు పదేళ్లు పెద్దవాడనేది ఒపాల్ అంచనా. ఒపాల్ చెప్పినదాని ప్రకారం నల్లజాతీయుడి ప్లాన్ తో ఆ దోపిడీ మొత్తం జరిగింది. అతడికి పోస్టాఫీసులో పనిచేసిన అనుభవం కచ్చితంగా ఉండే ఉంటుంది. ఈ ఘటన జరిగి సుమారు 36 ఏళ్లు దాటింది. ఆ ఇద్దరు ఎక్కడున్నారో, ఏమయ్యారో పోలీసులు ఇప్పటికీ కనిపెట్టేలేకపోయారు. దాంతో ఈ స్టోరీ ఇంకా మిస్టరీగానే మిగిలిపోయింది. – సంహిత నిమ్మన -
ఇమామ్ కజిన్ : ఓ సిటీలోని ఒక కాలనీలో..
ఓ సిటీలోని ఒక కాలనీలో.. ‘మేజ్..అరటి పళ్లూ..’ అంటూ పళ్ల బండి తోసుకుంటూ ఓ బంగ్లా ముందు నుంచి వెళ్తున్నాడో వ్యక్తి. ‘రేయ్.. ఈ ఏరియాల నిన్నెప్పుడు జూడ్లే! యేడి నుంచి ఒచ్చినవ్ బే?’ అంటూ ఆ బంగ్లా ముందున్న ఒక నడి వయసు వ్యక్తి బెదిరింపు స్వరంతో అడిగాడు. అతని పేరు శంకర్. ఆ బంగ్లా యజమాని అయిన మల్లేశ్‌కి కుడి భుజం లాంటివాడు. ఆ ప్రశ్నకు ఆ వ్యాపారి ఆ ఇంటి ముందు తన బండి ఆపి, తన పిల్లి గడ్డాన్ని సవరించుకుంటూ ‘నేను మార్కెట్ల పనిజేసే ఇమామ్ కజిన్‌ని భాయ్’ అని చెప్పాడు.బండిలోంచి ఓ పండును తీసుకుంటూ ‘ఏ మార్కెట్లయినా ఈ శంకర్‌కి పహచానత్ ఉంటది. నాకు దెల్వని ఇమామ్.. గాయన కజిన్ ఏడికెంచొచ్చె..’ అన్నాడు అరటి పండు తొక్కతీస్తూ! ‘నాది కరీంనగర్. కామ్‌కే లియే భాయ్‌కే పాస్ ఆయా. భాయ్ ఈ మేజ్ బండి ఇప్పిచ్చిండు’ చెప్పాడు ఇమామ్ కజిన్ అమాయకంగా. ‘అచ్ఛా..’ అని అరటి పండు తింటూ ఇమామ్ కజిన్‌ని ఇంకేదో అడగబోతుండగా.. అప్పుడే రాజ్‌దూత్ మీద ఎవరో ఆ ఇంటికి వచ్చేసరికి అరటి పండు తొక్కను అదే బండిలో విసిరేసి లోపలకు వెళ్లిపోయాడు శంకర్.పది రోజులు గడిచాయి..ఇమామ్ కజిన్ రోజూ ఆ కాలనీకి వస్తున్నాడు అరటి పండ్ల బేరానికి. కాలనీ అంతా తిరిగి మల్లేశ్ ఇంటి ముందున్న చెట్టు కిందే బండి పెట్టుకుంటున్నాడు చీకటి పడేవరకు. బంగ్లా యజమాని మల్లేశ్ ల్యాండ్ సెటిల్మెంట్లు, రియల్ ఎస్టేట్‌లో ఆరితేరినవాడు. వడ్డీ వ్యాపారి కూడా. ఆ పనుల్లో మల్లేశ్ సహాయార్థం బిజీ అయిపోయాడు శంకర్. ఇమామ్ని, అతని కజిన్‌ని పట్టించుకునే తీరికలో లేడు. ఆ పదిరోజుల్లో ఇమామ్ కజిన్.. ఆ బంగ్లా సెక్యురిటీ గార్డ్ లాంటివాడైన శ్రీశైలానికి అరటి పండ్లు ఇస్తూ, రిలీజైన సినిమాలు, చిరంజీవి డాన్స్‌లు, సంజయ్ దత్ యాక్షన్ గురించి మాట్లాడుతూ క్లోజ్ అయ్యాడు.ఆ దోస్తానా ఎక్కడిదాకా వెళ్లిందంటే రెండు రోజులకోసారి ఆ ఇద్దరూ బిర్యానీ, మందు పార్టీ చేసుకునేదాకా! అయితే తాను ముస్లిం ధర్మాన్ని నిష్ఠగా పాటిస్తాడు కాబట్టి మందు ముట్టనని ముందే శ్రీశైలంతో చెప్పాడు ఇమామ్ కజిన్. ‘దాందేముంది భయ్యా.. నేను మందు తాగుతా.. నువ్వు కూల్‌డ్రింక్ సప్పరియ్’ అంటూ ఇమామ్ వ్రతం చెడకుండా జాగ్రత్తపడ్డాడు శ్రీశైలం. ఆ ఫ్రెండ్షిప్ అక్కడితోనే ఆగలేదు.. ఇమామ్ కజిన్‌కి మల్లేశ్ ముఖ్యమైన అనుచరులనూ పరిచయం చేసే వరకు వెళ్లింది.తరచుగా వాళ్లనూ తమ పార్టీకి తీసుకొచ్చేవాడు శ్రీశైలం. తన సెన్స్ ఆఫ్ హ్యూమర్‌తో వాళ్లందరినీ ఆకట్టుకుంటూ వాళ్లకూ మాలిమయ్యాడు ఇమామ్ కజిన్. ఆ చనువుతో అతను తనకు కుదిరినప్పుడల్లా మల్లేశ్ ఇంటికి వెళ్లేవాడు వాళ్లను కలవడానికి. అలా ఇంకో పది రోజులు గడిచాయి. ఇప్పుడు అతను.. మల్లేశ్ ఇంటికి ఎన్ని ద్వారాలున్నాయి, ఆ ఇంట్లో ఏ మూల ఏం ఉంది.. మల్లేశ్ కుటుంబ సభ్యుల్లో ఎవరు ఏ గదిలో ఉంటారు లాంటి వివరాలన్నిటితో కళ్లు మూసుకుని ఆ ఇంటి నకలు గీసి చూపించగలడు!ఇరవై రెండో రోజు..రాత్రి ఇమామ్ కజిన్.. మల్లేశ్ అనుచరుల్లోని అతి విశ్వాసపాత్రులు, తన దోస్తులూ అయిన ఓ ఇద్దరికి దావత్ ఇచ్చాడు. తన భాయ్ ఇమామ్ తనకు పండ్ల దుకాణం పెట్టించబోతున్నాడనే ఖుష్ ఖబర్ను పంచుకుంటూ! ఆ అనుచరులిద్దరూ ఇమామ్ కజిన్‌ని గుండెకు హత్తుకున్నారు. అన్నేళ్ల నుంచి మల్లేశ్ ఇంట్లో ఉంటున్నా తమకు ఒరగని లాభాన్ని, చేస్తున్న చాకిరీని ఏకరువు పెట్టుకున్నారు. వచ్చిన నెలలోపే ఇమామ్ తన కజిన్‌కి దందా పెట్టివ్వడాన్ని పొగిడారు. అందుకు అర్హత సాధించిన ఇమామ్ కజిన్ నిజాయితీకి సలాం చేశారు. ఆ మత్తులో ఇంకా.. తమ బాస్ ఎలా సంపాదిస్తున్నాడో.. ఆ సంపదను దాచే ఆ ఇంట్లోని సీక్రెట్ ప్లేసెస్ ఏంటో డీటేయిల్డ్‌గా చెబుతూ మల్లేశ్ మీదున్న కసిని వెళ్లగక్కారు. అంతేకాదు ఆ రోజు ఉదయమే మల్లేశ్కున్న డెయిరీ ఫామ్‌లోని గడ్డివాముల్లో దాచిన డబ్బు సంగతీ చెప్పారు. నెమ్మదిగా కూల్‌డ్రింక్ సిప్ చేస్తూ విన్నాడు ఇమామ్ కజిన్!తెల్లవారి..ఆరు గంటలకు ఇన్కమ్ టాక్స్ సిబ్బంది ఆ సిటీలోని శంకర్ ఇల్లు సహా అతని స్థావరాలన్నిట్లోకి అడుగుపెట్టారు సెర్చ్ వారెంట్‌తో! ఇంటి గరాజ్లోని నేల మాళిగ, స్టోర్ రూమ్, డెయిరీ ఫామ్ గడ్డి వాములు.. అన్నిచోట్లా నాలుగు గంటల్లో.. లెక్క, పత్రాల్లేని ఆదాయం కొన్ని పదుల కోట్లలోనే దొరికింది. బంగారు ఆభరణాలు, బిస్కట్లు సహా!ఇమామ్ లేడు..ఇది దాదాపు 20 ఏళ్ల కిందటి సంగతి. మల్లేశ్ వాళ్ల కాలనీలోని ఒక గవర్నమెంట్ టీచర్ ఐటీ డిపార్ట్మెంట్కు అందించిన టిప్‌తో ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టింది డిపార్ట్మెంట్. మామూలుగా ఆ కాలనీ అంతా మల్లేశ్ మనుషులే కాపలా కాస్తుంటారు. సాదాసీదా వ్యక్తిగా వెళితే వివరాలు దొరికే ఆస్కారం లేదు. అందుకే ఇమామ్ అనే ప్రాతను సృష్టించి, అతని కజిన్‌గా పెట్టుడు పిల్లి గడ్డంతో, అరపటి పండ్ల వ్యాపారిగా మల్లేశ్ ఉంటున్న కాలనీలోకి ఎంటర్ అయ్యాడు ఆ ఉద్యోగి. 20 రోజుల్లోనే మల్లేశ్ అనుచరులు అతని గురించిన సీక్రెట్స్ అన్నీ కక్కడంతో ఆ ఆపరేషన్ అనుకున్నదాని కంటే ముందే అయిపోయింది. ఆ రోజు రెయిడ్ చేయకపోతే మరుసటి రోజు గడ్డివాముల్లో దాచిన డబ్బు బెంగళూరుకు రవాణా అయిపోయేది. అదీ ఆ రాత్రి పార్టీలోనే తెలియడంతో వెంటనే రాత్రికిరాత్రే సెర్చ్ వారెంట్ సిద్ధమైపోయింది. రెయిడ్ సక్సెస్ అయింది.(‘ద రెయిడ్’ అనే కొత్త శీర్షిక కింద.. ఓ వాస్తవ సంఘటనకు కాస్త ఫిక్షన్‌ను జోడించి రాసిన కథనం ఇది. అందుకే ఊరు పేరు ఇవ్వలేదు. వ్యక్తుల పేర్లు మార్చాం. ఇక నుంచి వారం వారం ఇక్కడ ఇలాంటి ఆసక్తికర కథనాన్ని చదవొచ్చు.) – శరాదిఇవి చదవండి: దయ్యాల పండుగ..! ఒక రకంగా ఇది..? -
ధైర్యసాహసాలు అనగానే మరో ఆలోచనే.. చమేలీ.. ఓ ధీశాలి!
ధైర్యసాహసాలు అనగానే ఇంకో ఆలోచన లేకుండా రాణీ రుద్రమ పేరే గుర్తొస్తుంది! అలాంటి ధీశాలి బస్తర్ ప్రాంత చరిత్రలోనూ కనిపిస్తుంది! ఆమె పేరే చమేలీదేవి! ఛత్తీస్‌గఢ్ సర్కారు ఇటీవలే ఆమె విగ్రహాన్ని చిత్రకూట్ జలపాతం దగ్గర ప్రతిష్ఠించింది. ఆ కథతో కాకతీయులకు, కాకతీయులతో మనకు చారిత్రక సంబంధం ఉంది కాబట్టి ఒకసారి బస్తర్ దాకా వెళ్లొద్దాం..తెలుగు నేలను పాలించిన రాజవంశాల్లో కాకతీయులకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ముఖ్యంగా రాణి రుద్రమ పురుషాధిక్యతను ఎదుర్కొంటూ మంచి ఏలికగా పేరు తెచ్చుకుంది. ఆమె తర్వాత పాలనా పగ్గాలు ప్రతాపరుద్రుడి చేతికి వచ్చాయి. అదే సమయంలో ఢిల్లీ సుల్తానులు, మహారాష్ట్ర దేవగిరి రాజుల దాడులు పెరిగాయి. ముందు జాగ్రత్తగా ప్రత్నామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిన పనిని తన తమ్ముడైన అన్నమదేవుడికి అప్పగించాడు ప్రతాపరుద్రుడు. ఆ బాధ్యతలో భాగంగా గోదావరి నది దాటి దండకారణ్యంలో కొత్త రాజ్యస్థాపనకు బయల్దేరాడు అన్నమదేవుడు. ఒక్కో రాజ్యాన్ని జయిస్తూ క్రీ.శ. 1323 కల్లా ఇంద్రావతి నదీ సమీపంలోని బర్సూర్ ప్రాంతానికి చేరుకున్నాడు.పరిచయం..ఆ ఇంద్రావతి నదీ తీర ప్రాంతాన్ని నాగవంశీయుడైన హరి చంద్రదేవ్ పాలిస్తున్నాడు. అతనికి చమేలీదేవి అనే కూతురు ఉంది. గొప్ప అందగత్తె. కళలతో పాటు రాజకీయ, రణతంత్రాలలో శిక్షణ పొందింది. తండ్రికి పాలనా వ్యవహరాల్లో సాయమందించేది. ఇంద్రావతి నదీ తీరాన్ని గెలవాలని నిర్ణయించుకున్న అన్నమదేవుడు దండకారణ్యాన్ని ఏలుతున్న హరి చంద్రదేవ్‌కు రాయబారం పంపాడు. యువరాణి చమేలీదేవిని తనకిచ్చి వివాహం జరిపించాలని, ఆ ఒప్పందానికి సమ్మతం తెలిపితే హరి చంద్రదేవ్‌ను రాజుగా కొనసాగిస్తామంటూ సందేశం పంపాడు.ఆత్మగౌరవం..కనీసం తన ఇష్టాయిష్టాలను తెలుసుకోకుండా ఏకపక్షంగా పెళ్లి ప్రతిపాదన తేవడాన్ని చమేలీదేవి వ్యతిరేకించింది. పెళ్లికి యుద్ధానికి లంకె పెట్టడాన్ని తప్పుపట్టింది. అన్నమదేవుడి ప్రతిపాదనను అంగీకరిస్తే నాగవంశీయుల ప్రతిష్ఠకు భంగమంటూ తేల్చి చెప్పింది. పెళ్లితో వచ్చే రాజ్యం, మర్యాదల కంటే యుద్ధంతో తేలే ఏ ఫలితమైనా మేలంటూ తండ్రిని ఒప్పించింది. యుద్ధరంగంలోనే అమీతుమీ తేల్చుకుందామంటూ అన్నమదేవుడికి ఘాటైన సమాధానం పంపింది.ఆత్మార్పణం..లోహండిగూడ వద్ద నాగవంశీయులు, కాకతీయల సైన్యానికి మధ్య హోరాహోరీ పోరు మొదలైంది. మహారాజు హరి చంద్రదేవ్‌కు తోడుగా యువరాణి చమేలీదేవి యుద్ధ క్షేత్రానికి చేరుకుంది. యుద్ధం మూడోరోజున తీవ్రంగా గాయపడిన హరి చంద్రదేవ్ మరణించాడు. ఆ మరుసటి రోజు కోటలో రాజు అంతిమ సంస్కారాలు నిర్వహిస్తుండగా వారిని వెంటాడుతూ వచ్చిన కాకతీయ సైన్యాలు కోటను చుట్టుముట్టాయి. తీవ్ర నిర్భంధం మధ్య తండ్రి అంత్యక్రియలను కొనసాగించిన చమేలీదేవీ చివరకు ఆత్మాహుతికి పాల్పడినట్టుగా చెబుతారు. చమేలీదేవి ప్రాణత్యాగంపై భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ అన్నమదేవుడికి ఎదురు నిలిచిన వైనం, ఆత్మాభిమానం, «ధైర్యసాహసాలు, రాజకీయ చతురతలపై మాత్రం ఏకాభిప్రాయం ఉంది. అందుకు బస్తర్ దసరా వేడుకల్లో నేటికీ కొనసాగుతున్న సంప్రదాయలే నిదర్శనం.ఆరాధనం..బస్తర్‌లో ఏటా దసరా వేడుకలను 75 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. బస్తర్ మహారాజు.. దంతేశ్వరి మాత దర్శనానికి వెళ్లే రథాన్ని మల్లెపూలతో అలంకరిస్తారు. ఈ పువ్వులను చమేలీదేవి ప్రతిరూపంగా కొలుస్తారు. రథం ఆలయానికి చేరిన తర్వాత స్థానికులు ఆ పువ్వులను తమ తలపాగాల్లో ధరిస్తారు గౌరవ సూచకంగా. అనంతరం వాటిని చిత్రకూట్ జలపాతానికి ఎగువ భాగంలో నిమజ్జనం చేస్తారు. అంతేకాదు ఇక్కడున్న అనేక గిరిజన తెగలు చమేలీదేవి ధైర్యసాహసాలు, ప్రాణత్యాగానికి గుర్తుగా కలశాల్లో దీపారాధన చేస్తారు. చమేలీదేవి మరణానికి కారణమైనందుకు ప్రాయశ్చిత్తంగా అన్నమదేవుడే ఈ సంప్రదాయాలకు చోటు కల్పించినట్టుగా చెబుతారు. ఏడువందల ఏళ్లకు పైగా ఈ ఆనవాయితీ కొనసాగుతూ వస్తోంది. ఇటీవలే.. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ఇండియా నయాగరాగా పేరొందిన చిత్రకూట్ (ఇంద్రావతి నది) జలపాతం దగ్గర యువరాణి చమేలీదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆమెను గౌరవించింది. – తాండ్ర కృష్ణ గోవింద్, సాక్షి, కొత్తగూడెం -
ముళ్లు లేని గులాబీలు.. కానీ..?
గులాబీలు అందంగా ఉన్నా, వాటి కొమ్మలకు ముళ్లు ఉంటాయి. ముళ్లు గుచ్చుకోకుండా మొక్క నుంచి గులాబీలు కోయడం కొంత కష్టమే! ఈ కష్టాన్ని తొలగించడానికి అంతర్జాతీయ శాస్త్రవేత్తలు ముందుకొచ్చి, ముళ్లులేని గులాబీలను సృష్టించే ప్రక్రియను కనుగొన్నారు. గులాబీలు సహా వివిధ మొక్కల్లో పూలు, కాయలు కాసే కొమ్మలకు ముళ్లు ఏర్పడటానికి కారణమైన జన్యువును కనుగొన్నారు.ఈ జన్యువుకు వారు ‘లోన్లీ గై’ (ఎల్ఓజీ) అని పేరు పెట్టారు. గులాబీలు సహా ఇరవై జాతుల మొక్కల్లో ముళ్లు ఏర్పడటానికి ఈ జన్యువే కారణమవుతోందని గుర్తించారు. అటవీ ప్రాంతాల్లో పెరిగే వంకాయలకు ముళ్లు ఉంటాయి. తోటలు, పొలాల్లో పెంచే వంకాయలకు ముళ్లు ఉండవు. అటవీ ప్రాంతాల్లోని వంకాయల నుంచి పొలాలు, తోటల్లో పెంచే వంకాయ జాతులు వేరుపడి వేలాది సంవత్సరాలు గడిచిపోయాయి.ఈ సుదీర్ఘకాలంలో సంభవించిన జన్యు ఉత్పరివర్తనల వల్ల పొలాలు, తోటల్లో పెంచే వంకాయల్లో ముళ్లు వాటంతట అవే అంతరించిపోయాయి. మరికొన్ని రకాల ముళ్ల మొక్కల్లోనూ వేరుపడిన జాతుల్లో ముళ్లు అంతరించాయి. కార్నెల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఇటీవల జన్యుమార్పిడి ద్వారా కొన్ని రకాల ఎడారి మొక్కల్లో ముళ్లను మాయం చేయగలిగారు. ఇదే పద్ధతిలో గులాబీలను కూడా ముళ్లు లేకుండా పూయించవచ్చని వారు చెబుతున్నారు. ముళ్లులేని గులాబీల సృష్టి కోసం చేయవలసిన జన్యుమార్పిడి పద్ధతిని వివరిస్తూ వారు సమర్పించిన పరిశోధన వివరాలను ఇటీవల ‘సైన్స్’ జర్నల్ ప్రచురించింది. కళకళలాడే పూలచెట్లతో పెరటి తోటలను పెంచుకునేవారికి ఇది శుభవార్తే! -
ది వార్ విత్ ఇన్! అడుగడుగునా అంతులేని ధైర్యం!
మల్టీప్లేయర్ ఆన్లైన్ రోల్–ప్లేయింగ్ గేమ్ ‘వరల్డ్ క్రాఫ్ట్: ది వార్ విత్ఇన్’ ఈ నెల 26న విడుదల కానుంది. ‘వరల్డ్ ఆఫ్ వార్‌క్రాఫ్ట్’కు ఎక్స్΄ాన్షన్ ప్యాక్‌గా వస్తున్న గేమ్ ఇది. 2004లో వచ్చిన ‘వరల్డ్ ఆఫ్ వార్‌క్రాఫ్ట్’లో ప్లేయర్ ‘క్యారెక్టర్ అవతార్’ను క్రియేట్ చేసి థర్ట్ లేదా ఫస్ట్–పర్సన్ వ్యూ నుంచి ఓపెన్ గేమ్ వరల్డ్‌ను ఎక్స్ప్లోర్ చేయాల్సి ఉంటుంది.ఇక ‘ది వార్ విత్ఇన్’ విషయానికి వస్తే... ఈ గేమ్‌లో ఖాజ్ అల్గార్ అనేది ప్రైమరీ సెట్టింగ్. ది ఇజెల్ ఆప్ డోర్న్, ది రింగింగ్ డీప్స్, హాలోఫాల్, అజి–కహెట్ అనే నాలుగు జోన్లుగా విభజించబడి ఉంటుంది.ఈ గేమ్‌లో ‘డైనమిక్ ఫ్లైయింగ్’ అనే ఫీచర్ ఉంది. న్యూ గేమ్స్‌ను ఎక్స్ప్లోర్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది.సిరీస్: వార్‌క్రాఫ్ట్;ప్లాట్‌ఫామ్: విండోస్, మ్యాక్వోఎస్;మోడ్: మల్టీప్లేయర్జానర్: ఎంఎంఆర్పీజీ (మాస్వ్లీ మల్టీప్లేయర్ ఆన్లైన్ రోల్–ప్లేయింగ్ గేమ్) -
Siddhita Mohanty: లాక్డౌన్ టైమ్ అనేది.. నాకు గోల్డెన్ టైమ్! ఎందుకంటే?
పిల్లల లోకంలో కార్టూన్లు, కార్టూన్ల లోకంలో పిల్లలు ఉంటారు. ఎంతోమంది పిల్లలలాగే సిద్ధిత మొహంతికి కార్టూన్లు అంటే బోలెడు ఇష్టం. ఆ ఇష్టం వినోదానికే పరిమితమై΄ోలేదు. సాంకేతిక విషయాలపై ఆసక్తికి దారి తీసింది. ఆ దారి తనను ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ దగ్గరికి తీసుకువెళ్లింది. బెంగళూరుకు చెందిన పదిహేనేళ్ల సిద్ధిత పదమూడేళ్ల వయసులోనే స్టార్టప్ మొదలు పెట్టేలా చేసింది..పదమూడు సంవత్సరాల వయసులో ‘బ్లూమ్ రిద్దీ సిద్ధీ’ స్టార్టప్‌కు శ్రీకారం చుట్టింది సిద్ధిత మొహంతి. గ్రాఫిక్ డిజైనింగ్, కంప్యూటర్ లిటరసీకి సంబంధించిన స్టార్టప్ ఇది. తల్లిదండ్రులు సిద్ధితకు లాప్టాప్ కొనివ్వడంతో అది తన ప్రయోగాలకు వేదిక అయింది. మొదట్లో యూట్యూబ్‌లో కార్టూన్ వీడియోలు మాత్రమే చూసేది. ఆ తరువాత ఆమె ఆసక్తి సాంకేతిక విషయాలపై మళ్లింది. డిజిటల్ డిజైన్ అనేది పాషన్‌గా మారింది. డిజిటల్ డిజైనింగ్ అనే కోర్సు ఉంటుందని తెలియని వయసులోనే సొంతంగా డిజైన్లు చేసి అందరూ ‘వావ్’ అనేలా చేసేది. బొమ్మలు గీయడంలోనూ సిద్ధితకు మంచి నైపుణ్యం ఉంది.బెంగళూరులోని సిద్ధిత చదివే ‘ఆర్చిడ్స్ ది ఇంటర్నేషనల్ స్కూల్’ బాగా ప్రోత్సహించింది. ‘లాక్డౌన్ టైమ్ అనేది నాకు గోల్డెన్ టైమ్’ అంటున్న సిద్ధిత ఆ ఖాళీ సమయాన్ని బాగా సద్వినియోగం చేసుకుంది. ‘నా గురించి నేను బాగా తెలుసుకోవడానికి, ఇంకా ఏం చేయవచ్చు అని ఆలోచించడానికి ఆ ఖాళీ సమయం నాకు ఉపయోగపడింది’ అంటుంది సిద్ధిత. తన స్కిల్స్‌ను మెరుగుపరుచుకోవడానికి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, లైఫ్ స్కిల్స్, వెబ్ డిజైన్, కోడింగ్, రొబోటిక్స్. పబ్లిక్ స్పీకింగ్, నేచురల్ లాంగ్వేజ్ప్రాసెసింగ్, స్పోకెన్ ఇంగ్లీష్....మొదలైన ఎన్నో కోర్సులు చేసింది. ఈ కోర్సులన్నీ పూర్తి చేసిన తరువాత ఏదైనా సాధించాలనే తపన సిద్ధితలో మొదలైంది.ఇప్పటి వరకు 50 యాప్స్, 1,000 త్రీడీ డిజైన్లు క్రియేట్ చేసింది. జాతీయ, అంతర్జాతీయ ఒలింపియాడ్స్‌లో పాల్గొంది. ఒక సమావేశంలో పాల్గొన్న సిద్ధితకు చిన్న వయసులోనే ఎంటర్ప్రెన్యూర్లుగా ప్రయాణంప్రారంభించిన ఎంతో మందితో మాట్లాడే అవకాశం వచ్చింది. వారి మాటల నుంచి స్ఫూర్తి ΄÷ంది తాను కూడా స్టార్టప్ మొదలు పెట్టింది. పదమూడేళ్ల వయసులో ‘గర్ల్ప్రాడిజీ ఆఫ్ ది ఇయర్’గా ఎంపికైంది. సాంకేతిక విషయాలలో ప్రతిభ చూపుతున్న సిద్ధితకు సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొనడం అంటే ఇష్టం. గ్రాఫిక్ డిజైనింగ్‌తో పాటు రచనలు చేయడం, కరాటే, క్రికెట్ అంటే సిద్ధితకు ఇష్టం. మెడిసిన్ చదవాలనేది ఆమె కల. ‘సూపర్ సిద్ధి’ పేరుతో పుస్తకం రాసే పనిలో ఉంది.ఎడోబ్ ఎక్స్‌ప్రెస్‌లో కొత్త ఫీచర్లు..ఎడోబ్ ఎక్స్‌ప్రెస్(ఎడ్యుకేషన్)లో జనరేట్ టెక్ట్స్ ఎఫెక్ట్, జనరేట్ ఇమేజ్, జనరేటివ్ ఫిల్లాంటి ఏఐ వపర్డ్ ఫీచర్లు ఉన్నాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులకు మరింత ఉపయోగపడే విధంగా ‘ఎడోబ్ ఎక్స్‌ప్రెస్’ను అప్డేట్ చేస్తున్నట్లు ప్రకటించింది ఎడోబ్. క్రియేటివిటికి ఉపయోగపడేలా ఈ ఏఐ ఫీచర్లను డిజైన్ చేశారు. వీటితో టెంప్లెట్లు, బ్రోచర్లు, ఫ్లైయర్స్, ఒరిజినల్ కలలింగ్ పేజీలు జననరేట్ చేయవచ్చు. విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని యానిమేషన్ ఫీచర్లు తీసుకురానుంది ఎడోబ్. -
ఏఐ గర్ల్‌ఫ్రెండ్స్.. వస్తున్నారహో!
‘నాకు ఒక్క గర్ల్‌ఫ్రెండ్ కూడా లేదు’ అని ఇక ముందు బాధపడనక్కర్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఏఐ గర్ల్‌ఫ్రెండ్ ట్రెండ్ నడుస్తోంది. ఈ గర్ల్‌ఫ్రెండ్స్‌తో హాయిగా సంభాషించవచ్చు. మనసులోని భావాలను పంచుకోవచ్చు. సలహాలు అడగవచ్చు. ఫొటోలు దిగవచ్చు. ప్రపంచవ్యాప్తంగా యువతలో ఎంతోమంది ఒంటరితనంలో బాధపడుతున్నారు. డిప్రెషన్ బారిన పడుతున్నారు. అలాంటి వారికి ఈ ఏఐ గర్ల్‌ఫ్రెండ్స్ స్నేహహస్తాన్ని చాస్తున్నాయి.‘నాకంటూ ఒకరు ఉన్నారు’ అని భరోసా ఇస్తున్నాయి. ఏఐ డేటింగ్, ఏఐ గర్ల్‌ఫ్రెండ్స్...లాంటి స్టార్టప్‌లు యూత్‌ను పలకరిస్తున్నాయి. ‘వోన్లీ ఫ్యాన్స్’ స్టార్టప్ ఇప్పటికే దూసుకుపోతుంది. ‘వేర్యాజ్’లోని సౌలభ్యం ఏమిటంటే యూజర్లు ఐడియల్ వర్చువల్ గర్ల్‌ఫ్రెండ్‌ను క్రియేట్ చేసుకోవచ్చు.ఏఐ గర్ల్‌ఫ్రెండ్ చాట్–బాట్‌తో మరో మనిషితో మాట్లాడుతున్నట్లే కృత్రిమ గర్ల్‌ఫ్రెండ్‌తో సహజమైన భాషలో మాట్లాడవచ్చు. అడ్వాన్స్డ్ మోడల్స్ ఆఫ్ ఏఐలో ‘ఏఐ గర్ల్‌ఫ్రెండ్ సిమ్యూలేటర్’ ఒకటి. దీనిలో త్రీడి టెక్నాలజీ, ఏఆర్, వర్చువల్ రియాలిటీ ఫీచర్లు ఉంటాయి. మోస్ట్ రియలిస్టిక్ ఎక్స్‌పీరియన్స్‌ను యూజర్లకు చేరువ చేయడం ఏఐ గర్ల్‌ఫ్రెండ్ చాట్–బాట్ లక్ష్యం. -
ఈ యానిమేటెడ్ కామెడీ సిరీస్.. జోకులేస్తూ..! జోస్యం చెబుతూ!!
‘ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించెదరు’ అంటూ ‘లవకుశ’ పాట గుర్తుకొచ్చినా సరే, ఊహించడం కష్టమేమీ కాదు అంటుంది ది సింప్సన్. ఆర్థిక, సామాజిక. సాంస్కృతిక... ఇలా పలురంగాలకు సంబంధించిన భవిష్యత్ పరిణామాలను ప్రసిద్ధ యానిమేషన్ సిరీస్ ‘ది సింప్సన్’ ఊహించింది. గతంలో ఊహించిన వాటిలో కొన్ని నిజం అయ్యాయి.‘ది సింప్సన్’ ఊహించిన వాటిలో కొన్ని నిజం కావడంతో ‘సింప్సన్’ మోడ్రన్ నోస్ట్రడామస్‌గా పేరు తెచ్చుకుంది. ఈ యానిమేటెడ్ కామెడీ సిరీస్ అమెరికన్ సాంస్కృతిక, సామాజిక పరిణామాలపై హాస్యంతో కూడిక వ్యాఖ్యానాలు చేయడమే కాదు జోస్యం కూడా చెబుతుంటుంది.2000 సంవత్సరంలో ప్రసారమైన 11వ సీజన్‌లోని 17వ ఎపిసోడ్లో లీసా సింప్సన్ యూఎస్ మొదటి మహిళా అధ్యక్షురాలిగా రికార్డ్ సృష్టిస్తుంది. ‘ఆ ప్రెసిడెంట్ ఎవరో కాదు కమలా హారిసే’ అంటున్నారు ఇప్పుడు చాలామంది. టీవీ సిరీస్‌లోని అమెరికా ప్రెసిడెంట్ కమలా హారిస్ ధరించే దుస్తులను పోలిన దుస్తులలో(ప్యాంట్స్యూట్) కనిపిస్తుంది. మెడలో ముత్యాల నెక్లస్...సేమ్ టు సేమ్! కమలా హారిస్‌ను అలనాడే డెమోక్రాట్ అభ్యర్థిగా ప్రిడిక్ట్ చేయడంపై ‘ది సింప్సన్’ షో రైటర్, ఎగ్జిక్యూటివ్ ్ర΄÷డ్యూసర్ ఏఐ జీన్ గర్వంగా ఫీలవుతూ ‘ది సింప్సన్స్ ప్రిడిక్షన్. ఐయామ్ ప్రౌడ్ టు బీ ఏ పార్ట్ ఆఫ్’ అంటూ పోస్ట్ చేశాడు. ‘ఈ పదవిని గతంలో ఒక రియల్ ఎస్టేట్ మొఘల్ నిర్వహించాడు’ అనే మాట ఈ ఎపిసోడ్లో వినిపిస్తుంది. గతంలో అమెరికా అ«ధ్యక్షుడిగా పని చేసిన డోనాల్డ్ ట్రంప్ రియల్ ఎస్టేట్ మొఘల్ కావడం గమనార్హం.‘ఇలా జరగనుంది’ అని సింప్సన్ వ్యంగ్యంగానో, సూచన్రపాయంగానో చెప్పిన విషయాలు కొన్ని నిజం అయ్యాయి. రియల్ ఎస్టేట్‌లో ఉన్న వారు అమెరికా అధ్యక్ష బరిలోకి వస్తారని, స్మార్ట్ వాచ్‌ల వినియోగం బాగా పెరుగుతుందని, ట్వంటీయత్ సెంచరి ఫాక్స్‌ను డిస్నీ కొనుగోలు చేస్తుందని, ఆర్థికవేత్త బెంగ్ ఆర్ హోమ్స్ట్రోమ్ నోబెల్ బహుమతి గెలుచుకుంటాడని...ఇలాంటి అంచనాలు నిజం అయ్యాయి. మరికొన్ని....– రిచర్డ్ బ్రాన్సన్ స్పేస్ ఫ్లైట్ (2021) ని 2015 సంవత్సరంలో సీజన్ 25, ఎపిసోడ్ 15లో ప్రిడిక్ట్ చేశారు.– జనవరి 6, 2021లో జరిగిన యూఎస్ క్యాపిటల్ అల్లర్లకు సంబంధించిన దృశ్యం 1996లో వచ్చిన సీజన్ 7, ఎపిసోడ్ 18 (ది డే ది వయోలెన్స్ డైడ్)లో కనిపిస్తుంది.– 2003లో జరిగిన ఒక లైవ్ పెర్ఫార్మెన్స్లో సిగ్ఫ్రీడ్, రాయ్ అనే మ్యాజిషియన్లపై పులి దాడి చేసింది. 1993లో ప్రసారమైన సీజన్ 5, ఎపిసోడ్ 10లో ఇలాంటి దృశ్యమే కనిపిస్తుంది.– యూఎస్ మెన్ కర్లింగ్ టీమ్ 2018లో వింటర్ ఒలింపిక్స్‌లో తొలిసారిగా బంగారు పతకాన్ని గెలుచుకుంది. ఈ విజయాన్ని సీజన్ 21, ఎపిసోడ్ 12లోనే ఊహించారు. -
వరలక్ష్మీ వ్రతం ప్రాశస్త్యం? ఈజీగా చేసుకోవాలంటే..?
శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున ఈ వ్రతాన్ని చేసుకోవడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఈ వ్రతం గురించి సాక్షాత్తూ పరమేశ్వరుడే పార్వతీదేవికి చెప్పినట్టు ‘స్కాంద పురాణం’ పేర్కొంటోంది. భక్తుల పాలిట వరాల కల్పవల్లి అయిన వరలక్ష్మి రూప, గుణ విశేషాలన్నీ శ్రీసూక్తంలో ప్రస్తావితమై ఉన్నాయి. స్త్రీలు దీర్ఘకాలం సుమంగళిగా ఉండేందుకు వరలక్ష్మీ వ్రతం ఆచరించడం తప్పనిసరి. లక్ష్మీదేవి సంపదలనిచ్చే తల్లి. సంపదలంటే కేవలం ధనం మాత్రమేకాదు. ధాన్య సంపద, పశు సంపద, గుణ సంపద, జ్ఞాన సంపద మొదలైనవి ఎన్నో ఉన్నాయి. ‘'వర'అంటే శ్రేష్ఠమైన అని అర్థం కూడా ఉంది.సిద్ధ లక్ష్మీ మోక్ష లక్ష్మీ జయలక్ష్మీ సరస్వతిశ్రీ లక్ష్మీ వరలక్ష్మీశ్చ ప్రసన్న మమ సర్వదాకార్యసిద్ధి, సంసారబంధ విమోచనం వల్ల సిద్ధించే మోక్షం, ఆటంకాలను అధిగమించి పొందే జయం, విద్య, సంపద, శ్రేష్టత... ఇవన్నీ వరలక్ష్మీ స్వరూపమైన సద్గుణాలు. ఆ గుణాలను పొందడానికి ఉద్దేశించినదే వరలక్ష్మీ వ్రతం. అంతటి విశిష్టమైన ఈ వ్రతాన్ని ఆచరించి, లక్ష్మీ అనుగ్రహాన్ని పొందడానికి తగిన ప్రవర్తన కలిగి ఉండాలని చారుమతి పాత్ర ద్వారా శ్రీ వరలక్ష్మీ వ్రతకథ చెబుతోంది. ఈ వ్రతం రోజు చదివే వరలక్ష్మీ కథలో.. సాక్షాత్తూ లక్ష్మీ దేవే కలలో సాక్షాత్కరించి, వ్రత విధానాన్ని వివరించడం.. గృహిణిగా చారుమతి ఆదర్శనీయతకు నిదర్శనం. నిస్వార్థత, తోటివారికి మేలు కలగాలనే మనస్తత్వం, ఎలాంటి భేదభావాలు లేకుండా అందరినీ కలుపుకొని పోయే సహృదయత కలిగిన వారినే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందని ఈ కథ తెలియజేస్తోంది. ఈ లక్షణాలను అందరూ అలవరచుకోవాలనే సందేశాన్ని ఇస్తోంది.పూజా విధానం..భక్తితో వేడుకుంటే వరాలందించే తల్లి వరలక్ష్మీ దేవి. ఈ వ్రతాన్నిఆచరించడానికి ఏ నిష్ఠలు, నియమాలు, మడులు అవసరం లేదు. నిశ్చలమైన భక్తి, ఏకాగ్రచిత్తం ఉంటే చాలు. వరలక్ష్మీవ్రతం ఎంతో మంగళకరమైంది. ఈ వ్రతాన్నిచేయడంవల్ల లక్ష్మీదేవి కృపాకటాక్షలు కలిగి ఐశ్వర్యం సిద్ధిస్తుంది. సకల శుభాలుకలుగుతాయి. స్త్రీలు దీర్ఘకాలం సుమంగళిగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరించడం తప్పనిసరి. లక్ష్మీదేవి సంపదలనిచ్చే తల్లి. సంపదలంటే కేవలం ధనం మాత్రమేకాదు. ధాన్య సంపద, పశు సంపద, గుణ సంపద, జ్ఞాన సంపద మొదలైనవి ఎన్నో ఉన్నాయి. ‘వర’ అంటే శ్రేష్ఠమైన అనే అర్థం కూడా ఉంది.శ్రావణమాసం రెండో శుక్రవారం వరలక్ష్మీ వ్రతం రోజున తెల్లవారుజామునే నిద్రలేచి, అభ్యంగన స్నానాన్ని ఆచరించాలి. ఇంటికి ఈశాన్య భాగంలో ఆవుపేడతో అలికి ముగ్గులు పెట్టి, మండపాన్ని ఏర్పాటుచేసుకోవాలి. ఇంటి ఆచారాన్ని బట్టి కలిశం ఏర్పాటు చేసుకుని పూజ చేసుకోవడం లేదా అమ్మవారి ఫొటో లేదా రూపును తెచ్చుకుని పూజించాలి. పూజాసామగ్రి, తోరాలు, అక్షతలు, పసుపు గణపతిని ముందుగానే సిద్ధం చేసుకుని ఉంచాలి.తోరం తయారు చేయు విధానం..తెల్లటి దారాన్ని ఐదు లేక తొమ్మిది పోగులు తీసుకుని దానికి పసుపు రాయాలి. ఆ దారానికి ఐదు లేక తొమ్మిది పూలు కట్టి ముడులు వేయాలి. అంటే ఐదు లేక తొమ్మిది పోగుల దారాన్ని ఉపయోగించి, ఐదు లేక తొమ్మిదో పువ్వులతో ఐదులేక తొమ్మిది ముడులతో తోరాలను తయారుచేసుకుని, పీఠం వద్ద ఉంచి పుష్పాలు, పసుపు, కుంకుమ, అక్షతలు వేసి, తోరాలను పూజించి ఉంచుకోవాలి. ఆవిధంగా తోరాలను తయారుచేసుకున్న తరువాత పూజకు సిద్ధంకావాలి.ఆ రోజు వీలుకాకపోతే..శ్రావణమాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతాన్నిఆచరించాలి. ఆ రోజున వీలుకాకపోతే తరువాత వచ్చే శుక్రవారాలలో కూడా ఈవ్రతాన్ని చేయకోవచ్చు. వరలక్ష్మీ వ్రతానికి ఆదిదేవతయైన లక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతికి కలలో సాక్షాత్కరించింది. సువాసినులందరూ చేసే ప్రాభవ వ్రతం. ‘శ్రీ వరలక్ష్మీ నమస్తు వసుప్రదే, సుప్రదే’ శుక్రవారం రోజున జరుపుకునే వరలక్ష్మీవ్రతంతో ధన, కనక, వస్తు,వాహనాది సమృద్ధులకు మూలం. శ్రావణ శుక్రవార వ్రతాలతో పాపాలు తొలిగి లక్ష్మీ ప్రసన్నత కలుగుతుంది.కేవలం వరాల కోసం కాదు..లక్ష్మీ పూజ అంటే కేవలం ధన, కనక, వస్తు రూపాలను అర్థించడానికి కాదు... భావ దారిద్య్రాన్ని తొలగించాలని ప్రార్థించడానికి. మంచి గుణాలు, సంపద, ఉత్సాహం, కళాకాంతులు, ఆనందం, శాంతం, పెద్దల పట్ల గౌరవం, సామరస్యం, మంచి మనస్తత్వం, లోకహితాన్ని కోరుకోవడం.. ఇవన్నీ లక్ష్మీప్రదమైన లక్షణాలు. వాటిని కోరుకుంటూ లక్ష్మీ పూజ చేసి ఆ తల్లి అనుగ్రహాన్ని పొందాలి.(చదవండి: అభిషేకప్రియుడైన శివుడికి చీపురు సమర్పించడం గురించి విన్నారా..?) -
అభిషేకప్రియుడైన శివుడికి చీపురు సమర్పించడం గురించి విన్నారా..?
అభిషేకప్రియుడైన ఆ మహాదేవునికి పాలు, నీళ్లతో అభిషేకించి తరిస్తాం. అంతేగాదు ఆయనకు ఎంతో ప్రీతీపాత్రమైన బిల్వపత్రాలతో పూజిస్తాం. అలాంటిది అక్కడ మాత్రం ప్రజలు అవేమీ కాకుండా ఇళ్లు ఊడ్చే చీపురులను సమర్పిస్తారట. ఇదేం వింత ఆచారం రా బాబు అనిపిస్తోంది కదూ..! ఇంతకీ అక్కడ ఇలా ఎందుకు చేస్తారు..? ఆ గుడి ఎక్కడ ఉంది తదితర విశేషాలేంటో చూద్దామా..!ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ జిల్లాలోని బిహాజోయ్ గ్రామంలో ఈ వింత శివాలయం ఉంది. ఇది పురాతన పాతాలేశ్వర్ శివాలయం. ఈ ఆలయంలో శివుడిని పూజించేటప్పుడు ప్రజలు దేవుడుకి చీపుర్లను సమర్పిస్తారట.ఈ పాతాళేశ్వరాలయం పట్ల భక్తులకు ప్రత్యేకమైన భక్తి ఉంటుంది. ఇక్కడ ప్రజలు పాలు, నీరు, పండ్లు అలాగే కర్రలతో కూడిన చీపురులను శివలింగంపై శివునికి సమర్పిస్తారు. ఈ ఆలయంలో శివునికి ఇలా చీపురు సమర్పిస్తే కోరుకున్న ప్రతి కోరిక త్వరగా నెరవేరుతుందని వారి ప్రగాఢ నమ్మకం. చీపురు సమర్పించగానే భోళాశంకరుడు వరాలు వెంటనే ఇచ్చేస్తాడనే నానుడి ప్రచారంలో ఉంది. అంతేగాదు ఇలా చీపురుని సమర్పిస్తే చర్మ సంబంధిత వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుందని భక్తులు నమ్ముతారట. ఈ శివాలయం ఆ ప్రాంతంలో బాగా ప్రసిద్ధి చెందింది. ఈ దేవాలయం సుమారు 150 సంవత్సరాల నాటిదని ఆలయ పూజారి తెలిపారు. పూర్వీకుల కాలం నుంచి అక్కడి ప్రజలు శివుడికి ఇలా చీపురులను సమర్పించే ఆచారం పాటిస్తున్నారని చెప్పారు ఆలయ పూజారి. అందుకోసం ప్రజలు ప్రతిరోజూ గంటల తరబడి క్యూలో నిలుచుంటారని చెప్పుకొచ్చారు. నిత్యం వదలాది మంది దర్శించుకోవడానికి వస్తుంటారని అన్నారు. ఈ గ్రామంలో భిఖారిదాస్ అనే వ్యాపారవేత్త నివసించేవాడని అతడు చాలా ధనవంతుడని చెబుతారు. కానీ., అతనికి పెద్ద చర్మ వ్యాధి వచ్చింది. ఒకరోజు ఈ వ్యాధికి చికిత్స పొందేందుకు వెళ్తుండగా అకస్మాత్తుగా దాహం వేసింది. అప్పుడు అతను నీరు త్రాగడానికి ఈ మహాదేవుని ఆలయానికి వచ్చి ఆలయాన్ని ఊడుస్తున్న మహంత్‌ను ఢీకొన్నాడు. ఆ తర్వాత ఎలాంటి చికిత్స లేకుండానే అతడి జబ్బు తగ్గిపోయింది. దీంతో సంతోషించిన సేథ్ మహంత్‌కు డబ్బు ఇవ్వడానికి ప్రయత్నించగా మహంత్ దానిని తీసుకునేందుకు నిరాకరించాడు. అందుకు బదులుగా అతను ఇక్కడ ఆలయాన్ని పునర్నిర్మించమని సేథ్‌ను కోరాడు. అప్పటి నుంచే ఈ ఆలయంలో చర్మవ్యాధి వచ్చిన వాళ్లంతా ఇక్కడ చీపురు సమర్పించాలని నమ్మకం ఏర్పడింది. ఇలా చేయడం వల్లే తమ కష్టాలు తీరిపోతాయని అక్కడ భక్తులు విశ్వసించడం విశేషం. అందుకే ఇప్పటికీ భక్తులు ఇక్కడికి వచ్చి చీపుర్లు సమర్పించుకునే ఆచారం కొనసాగుతోంది. ఏదీ ఏమైన కొన్ని పురాతన ఆలయాల్లో ఏర్పడే ఆచారాలు అత్యంత వింతగా ఉంటాయి. ఒక్కరితో మొదలైన నమ్మకం ఆచారంగా మారి బలంగా నమ్మే సంప్రదాయంగా మారిపోతుంది అనడానికి ఈ దేవాలయ కథే ఉదాహరణ. కొన్ని ఆచారాలు ఆరోగ్య రహస్యలతో మిళితమై ఉంటాయి కూడా. అందుకే కాబోలు మన సనాతన ధర్మం అత్యంత గొప్పది అని పదే పదే చెబుతుంటారు పండితులు.(చదవండి: వందేళ్లు బతకాలనుకుంటే..ఈ అలవాట్లు తప్పనిసరి అంటున్న పరిశోధకులు!) -
Tech Talk: ఏఐ చేతులెత్తేసిందా?!
ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) అంటే ఏ అద్భుతమైనా సాధ్యమే అనుకునేరోజుల్లో ఉన్నాం. చిత్రకళ పోటీల్లోకి కూడా కృత్రిమ మేధస్సు అడుగు పెట్టింది. అయితే అంత పెద్ద ‘ఏఐ’ కూడా చేతుల ముందు బిక్క చచ్చిపోతుంది. ఏఐ టూల్స్ చేతులను గీయడంలో తడబడుతున్నాయి. ఏఐ–జెనరేటెడ్ హ్యాండ్స్‌లో కొన్నిసార్లు తొమ్మిది వేళ్లు కనిపిస్తాయి. కొన్ని చిత్రాల్లో అయితే అరచేతితో సంబంధం లేకుండా కనిపిస్తాయి.‘హ్యాండ్స్’ విషయంలో ఏఐ ఎంత పూర్‌గా ఉందో చెప్పడానికి ఒక ఉదాహరణ డోనాల్డ్ ట్రంప్ అరెస్ట్‌కు సంబంధించిన ఫేక్ ఇమేజ్. ఈ ఏఐ–జనరేటెడ్ ఇమేజ్లోపోలీసు అధికారి చేయి ట్రంప్ శరీరంలో కలిసిపోయి కనిపిస్తుంది. నార్మల్ లుకింగ్ హ్యాండ్స్ విషయంలో ‘ఏఐ’ ఎందుకు తప్పటడుగు వేస్తుంది? అనే విషయానికి వస్తే... చేతులు అనేవి మానవ శరీరంలో చిన్న భాగాలు. వేరియబుల్‌గా ఉంటాయి. పిడికిలి బిగించడం, చేయి ఊపడం...మొదలైనవి చేయి ఎలా పనిచేస్తుందో చెప్పే దృశ్య వ్యత్యాసాలు. త్రీ–డైమెన్షనల్ వరల్డ్‌తో యాక్సెస్ లేని ‘ఏఐ’కి చేయి ఎలా కనిపిస్తుందో మాత్రమే తెలుసు. బొటన వేలు, పిడికిలి బిగించడం....మొదలైనవి ఏఐకి కష్టతరమైనవి.‘ఏఐకి చేయి అంటే చెయి మాత్రమే. అరచేయి, వేళ్లు, గోర్లు...ఇలాంటి వాటి గురించి దానికి తెలియదు. ఇప్పటి 2డీ ఇమేజ్ జనరేటర్లు హ్యాండ్స్‌కు సంబంధించిన త్రీ–డైమెన్షనల్ జామెట్రీని అర్థం చేసుకోలేపోతున్నాయి’ అంటున్నాడు యూనివర్శిటీ కాలేజీ లండన్‌లోని కంప్యూటర్ సైంటిస్ట్ పీటర్ బెంట్లీ. మరి ఈ సమస్యకు పరిష్కారం లేదా? జవాబు బెంట్లీ మాటల్లోనే... ‘భవిష్యత్‌లో ఈ సమస్యకు తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది. త్రీడీ జామెట్రీలపై శిక్షణ మొదలైంది. ప్రస్తుతం 2డీ ఇమేజ్‌కు సంబంధించిన ఫలితాలు సులభంగా అందుబాటులో ఉన్నాయి. తగినంత 3డీ డిజైన్ డేటాను పొందడానికి మాత్రం సమయం పడుతుంది’ -
‘ఆ వంద గ్రాములే’ అసలు ఒలింపిక్ మెడల్ బరువెంతో తెలుసా?
ఒలింపిక్స్‌లో చారిత్రాత్మక స్వర్ణాన్ని సాధించి రికార్డ్ విజయంతో చరిత్ర సృష్టింస్తుందనుకున్న మహిళా రెజ్లర్ వినేశ్ ఫోగట్‌పై అనూహ్యంగా అనర్హత వేటు పడటం యావద్దేశాన్ని దిగ్భ్రమకు గురి చేసింది. ఒలింపిక్స్ రెజ్లింగ్ ఫైనల్స్ కి ప్రవేశించిన తొలి భారతీయ మహిళగా, స్వర్ణం సాధించాలన్న ఆమె కల కలగానే మిగిలి పోయింది. ఒలింపిక్ పతకంలో ఐదో వంతు బరువు వినేశ్ ఫోగట్ ఆశల్నేకాదు, యావద్దేశ ఆకాంక్షల్ని కుప్పకూల్చింది.Gold medal awarded at the Paris Olympics.pic.twitter.com/dbqgXwPWCY— Figen (@TheFigen_) August 7, 2024 ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో వినేశ్ ఫోగట్ తొలి మహిళా ఒలింపిక్ ఛాంపియన్‌గా అవతరించే అవకాశాన్ని కోల్పోవడం క్రీడాభిమానులను తీవ్రంగా నిరాశపర్చింది. కేవలం 100 గ్రాముల అధిక బరువు ఉన్న కారణంగా అనర్హత వేటు పడింది. అయితే ఒలింపిక్ ఏయే పతకాలు ఎంతెంత బరువుంటాయి అనేది నెట్టింట చర్చకు దారి తీసింది. ఈ క్రమంలో 100-150 గ్రాముల బరువుండే లగ్జరీ వస్తువులు ఏంటో కూడా ఒకసారి చూద్దామా? ఐఫోన్ 15- 171 గ్రాములు కాగా ఒక కాటన్ టీ-షర్టు 100-150 గ్రాములు ఉంటుంది. ఒలింపిక్ పతకాలు, బరువుఒలింపిక్ గోల్డ్ మెడల్ బరువు - 556 గ్రాములుఒలింపిక్ సిల్వర్ మెడల్ బరువు- 550 గ్రాములుఒలింపిక్ కాంస్య మెడల్ బరువు - 450 గ్రాములువినేశ్ ఫోగట్ అనర్హతకు దారితీసిన కారణాలుమంగళవారం రాత్రి ఆమె రెండు కిలోల బరువు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. తొలి మూడు రౌండ్లలో ఆమె 2 కిలోల బరువు పెరిగింది.ఆమె రెండు కిలోలు అధిక బరువుతో ఉందని తెలిసినప్పుడు, ఆమె రాత్రంతా నిద్రపోలేదు , సైక్లింగ్ స్కిప్పింగ్ చేయడానికి జాగింగ్‌తో సహా ఆ రెండు కిలోగ్రాముల బరువును తగ్గించుకోవడానికి ఆమె సాధ్యమైనదంతా చేసింది. నీళ్లు కూడా తాగకపోవడంతో డీ హైడ్రేషన్‌కు కూడా గురైంది.బుధవారం ఉదయం తూకం వేయగా 100 గ్రాములు అధిక బరువుతో ఉన్నట్లు గుర్తించారు. ఆ సమయంలో భారత ప్రతినిధి బృందం 100-150 గ్రాముల బరువు తగ్గించుకోవడానికి మరికొంత సమయం ఇవ్వాలని కోరింది, కానీ ఫలితం లేకుండా పోయింది.Close up of an object that Neeraj Chopra will gift the country…. pic.twitter.com/0DBIK9frR5— Harsh Goenka (@hvgoenka) August 7, 2024 -
‘శవాలదిబ్బ’ : ఆ మారణహోమానికి 79 ఏళ్లు
హిరోషిమా, నాగసాకిలపై అణ్వస్త్ర దాడులు జరిగి నేటికి (ఆగష్టు 6, 2024) 79 ఏళ్లు. ప్రపంచాన్ని దిగ్భ్రాంతిలో ముంచేసిన తీరని విషాదం. జపాన్‌లో 1945 ఆగస్ట్‌లో జరిగిన అణు బాంబు పేలుళ్లతో హిరోషిమాలో లక్షా 40వేల మంది, నాగసాకిలో 74వేల మందిని బలి తీసుకున్న ఉదంతం. ప్రపంచంలోనే తొలి అణు బాంబు దాడిగా పేరొందిన ఈ దాడుల ధాటికి విలవిల్లాడిన జపాన్ శత్రు దేశాలకు లొంగిపోవడంతో 1945 ఆగస్ట్ 14న రెండో ప్రపంచ యుద్ధం ముగిసింది. హిరోషిమా డే సందర్భంగాఈ ఘటనకు సంబంధించిన కొన్ని ప్రత్యేక సంగతులు..!1945 ఆగష్టు 6న జపాన్‌లోని హిరోషిమా నగరంపై అమెరికా అణు బాంబు జారవిడిచింది. ఎనోలా గే అనే అమెరికన్ B-29 బాంబర్, జపాన్ నగరం హిరోషిమాపై "లిటిల్ బాయ్" అనే అణు బాంబును జారవిడిచింది. ఈ బాంబు పేలిన కాసేపట్లోనే 5 చ.కి.మీ. పరిధిలోని ప్రాంతం నాశనమైంది. 80 వేల మంది ప్రాణాలు కోల్పోగా, 35 వేల మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయాలు, రేడియన్ ప్రభావంతో వేలాదిమంది చనిపోయారు. మరో మూడు రోజులకు అంటే ఆగస్టు 9న నాగసాకి నగరంపై అమెరికా మరో భారీ అణుబాంబుతో దాడి చేసింది. హిరోషిమా అంటే జపనీస్ బాషలో విశాలమైన దీవి. దీవుల సమాహారమైన జపాన్‌లోని అతిపెద్ద దీవిలో ఉన్న పెద్ద నగరం హిరోషిమాపై యురేనియం-235తో తయారు చేసిన “లిటిల్ బాయ్”, నాగసాకిపై ప్లూటోనియంతో తయారుచేసిప “ఫ్యాట్ మ్యాన్” అనే అత్యంత పవర్‌పుల్ బాంబును ప్రయోగించింది.‘ఎనోలా గే’ అనే విమానం బరువు 9 వేల పౌండ్లు, పొడవు 10 అడుగులు. ఈ బాంబు నేలను తాకడానికి ముందే, 1750 అడుగుల ఎత్తులోనే పేలింది. ఈ దాడికి ముందు హిరోషిమా జనాభా దాదాపు 3.4 లక్షలు కాగా, తర్వాత అది 1.37 లక్షలకు పడిపోయిందంటే ఈ విధ్వంసాన్ని అర్థం చేసుకోవచ్చు. ప్రధానంగా జపాన్‌లో ఐదు నగరాలను ఎంచుకుంది. కోకురా, హిరోషిమా, యోకోహామా, నీగాటా ,క్యోటో. ఈ దాడులకు యునైటెడ్ కింగ్డమ్ సమ్మతించింది.ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, పురాతన రాజధాని పట్ల అప్పటి సెక్రటరీ ఆఫ్ వార్ హెన్రీ స్టిమ్సన్కు ఉన్న అభిమానం కారణంగా క్యోటో తప్పించుకుంది. దానికి బదులుగా, నాగసాకి నగరం బలైంది. ఈ బాంబు పేలుళ్లలో బతికి బయటపడిన వారిని హిబాకుషా అంటారు. పేలుళ్ల ప్రభావంతో ఏర్పడిన రేడియేషన్, విషవాయువులు ప్రభావంతో బాధితుల మానసిక వేదన, బాధలు వర్ణనాతీం. అణ్వాయుధాల వినాశకరమైన ప్రభావాన్ని కళ్లకు కట్టిన మారణహోమం.ఇపుడు అణుయుద్ధం జరిగితే రష్యా ఉక్రెయిన్ యుద్ధం, ఉత్తర, దక్షిణ అమెరికా ఘర్షణలు మధ్య ఇపుడు అణు యుద్ధం జరిగితే ఎంతమంది చనిపోవచ్చు? అనేది ప్రధానంగా వినిపించే ప్రశ్న. అణు సంఘర్షణ ప్రభావాలను అధ్యయనం చేస్తూ సంవత్సరాలు గడిపిన జర్నలిస్ట్ అన్నీ జాకబ్సెన్ అంచనాల ప్రకారం అణు యుద్ధం ప్రారంభమైన 72 నిమిషాల్లోనే దాదాపు ఐదు బిలియన్ల మంది ప్రజలు చనిపోతారు.రేడియేషన్ ప్రభావం అత్యంత దారుణంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే ఓజోన్ పొర చాలా దెబ్బతింది కనుక అణువిస్ఫోటనాలు జరిగితే ఊహకందని విధ్వంసమే. అణుయుద్ధం నుండి బతికిన వారికి ఆహారం లభించదు. ఆకలితో అలమటించి. పోషకాహార లోపంతో కృంగి కృశించి ప్రాణాలొదులుతారు. -
ఆమె గొంతుక.. మన గుండెల్లో..!
‘దయచేసి మమ్మల్ని రక్షించండి’ వణుకుతున్న గొంతుతో సహాయం కోసం నీతూ జోజో చేసిన ఆర్తనాదం కొందరి ప్రాణాలను రక్షించగలిగింది. వయనాడ్‌లో జూలై 30 వరదల సందర్భంగా సహాయం కోసం మొదట వచ్చిన ఫోన్ కాల్ నీతూ జోజోదే. ఆ కాల్ రికార్డ్ కావడంతో ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. తన కుటుంబమే కాదు ఇరుగు పొరుగు కుటుంబాలు కూడా సురక్షితంగా ఉండేలా ప్రయత్నిస్తున్న క్రమంలోప్రాణాలు కోల్పోయింది నీతూ జోజో...కేరళ వరదల (2018)పై గత సంవత్సరం వచ్చిన మలయాళ చిత్రం ‘2018’లో వరద బీభత్సం, చావుకు బతుకుకు మధ్య ఊగిసలాడిన బాధితుల దృశ్యాలు, వరద అనే అష్టదిగ్బంధనంలో కూరుకుపోయిన ఇండ్లు... ఒళ్లు జలదరింప చేసే దృశ్యాలెన్నో కనిపిస్తాయి. ఇప్పుడు వాటికి మించిన దృశ్యాలు వయనాడ్‌లో కనిపిస్తున్నాయి. ‘2018’ సినిమాలో ఇతరులను రక్షించాలని తపించిన వారిని ఉద్దేశించి ‘ఎవ్రీ వన్ ఈజ్ ఏ హీరో’ అనే పెద్ద అక్షరాలు తెరమీద కనిపిస్తాయి. అలాంటి ఒక హీరో నీతూ జోజో.నీతు వయనాడ్‌లోని మూపెన్స్ మెడికల్ కాలేజీలో నర్స్. ‘కొండచరియలు విరిగిపడ్డాయి. నేను ఇక్కడ పాఠశాల వెనకాల నివసిస్తున్నాను. దయచేసి మాకు సహాయం చేయడానికి ఎవరినైనా పంపగలరా. మీకు ఫోన్ చేయడానికి ముందు నేను చాలామందికి ఫోన్ చేశాను’ అంటూ వెప్పడి గ్రామం నుంచి మూపెన్ మెడికల్ కాలేజీకి ఫోన్ చేసింది నీతు.సిబ్బంది ఆమె నుంచి అన్ని వివరాలు అడిగి తెలుసుకొని సహాయ బృందాలు వస్తాయని భరోసా ఇచ్చారు. సమీపంలో నివసిస్తున్న ఏడు కుటుంబాలు తన ఇంట్లో ఆశ్రయం పొందారని, శిథిలాల మధ్య చిక్కుకుపోయిన తమ ఇంట్లోకి నీళ్లు వస్తున్నాయని ఫోన్లో చెప్పింది నీతు.‘ఆమె చాలా ఆందోళన, బాధతో ఫోన్ చేసింది. నేను వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాను. ఆసుపత్రి నుంచి మా అంబులెన్స్ నీతు ఉంటున్నప్రాంతానికి బయలుదేరింది’ అంటుంది మూపెన్స్ మెడికల్ కాలేజీ డీజీఎం షనవాస్ పల్లియాల్.అయితే చెట్లు విరిగిపడడంతో రోడ్డు బ్లాక్ అయింది. అంబులెన్స్ ముందుకు వెళ్లలేని పరిస్థితి. దీంతో నీతూకు ధైర్యం చెప్పడానికి అంబులెన్స్ డ్రైవర్, ఇతర సిబ్బంది నాన్‌స్టాప్‌గా ఫోన్లు చేస్తూనే ఉన్నారు. రెండోసారి కొండ చరియలు విరిగిపడిన తరువాత ఫోన్ కనెక్షన్ కట్ అయింది. రోడ్లు బ్లాక్ కావడం, చూరలమాల వంతెన కొట్టుకుపోవడం వల్ల సహాయ సిబ్బంది నీతూ దగ్గరకు చేరుకోలేకపోయారు. భర్త, బిడ్డ, అత్త , ఇరుగు పొరుగు వారుప్రాణాలతో బయటపడినప్పటికీ నీతూ చనిపోయింది.‘నేను నీతూకు ఫోన్ చేసినప్పుడు తాము మృత్యువు నుంచి తప్పించుకున్నామనే ధైర్యం ఆమె గొంతులో వినిపించింది. నీతూకు ధైర్యం ఇవ్వగలిగాం గానీ దురదృష్టవశాత్తు రక్షించలేకపోయాం’ అంటుంది షనవాస్ పల్లియాల్. ఆరోజు అర్ధరాత్రి దాటిన తరువాత... నెప్పడి గ్రామంలోని నీతు ఇంటిపై కొండచరియలు విరిగిపడ్డాయి. నీరు ఇంట్లోకి ప్రవేశించడంతో అప్రమత్తమైంది. ఇరుగు పొరుగు వారిని అలర్ట్ చేసింది. ఒకవైపు తమను రక్షించమని ఫోన్ చేస్తూనే, మరోవైపు తన ఇంటి వారిని, పొరుగువారిని సురక్షితప్రాంతానికి తీసుకువెళ్లడానికి రకరకాల ప్రయత్నాలు చేసింది.అయితే తెల్లవారుజామున నాలుగు గంటలప్రాంతంలో మరోసారి కొండచరియలు విరిగిపడడంతో మృత్యువు చెంతకు వచ్చింది. ఇక ఎంతమాత్రం తప్పించుకోలేని పరిస్థితి. నీతూతో పాటు ముగ్గురిప్రాణాలూ గాలిలో కలిసిపోయాయి.‘మా ఇంట్లో ఉంటే సురక్షితం అని మమ్మల్ని తీసుకువెళ్లడమే కాదు. మాకు ధైర్యం చెప్పింది. ఇలా అవుతుందని అనుకోలేదు’ అని నీతును గుర్తు తెచ్చుకుంటూ కళ్లనీళ్లు పెట్టుకుంది పొరుగింటి మహిళ.‘నీతూ ఫోన్ కాల్ ఇప్పటికీ చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంది. చిన్న చిన్న గాయాలతో బయటపడుతుంది అనుకున్నాం. దురదృష్టవశాత్తు ఆమెను నిర్జీవంగా చూడాల్సి వచ్చింది’ శోకతప్త హృదయంతో అంటుంది నీతూతో కలిసి మూపెన్స్ మెడికల్ కాలేజీలో పనిచేసిన ఉద్యోగి.బీభత్సాలు జరిగినప్పుడు తమప్రాణాలు అడ్డేసి ఇతరులప్రాణాలు కాపాడేవారు ఉంటారు. నీతు జోసెఫ్‌ను వయనాడ్ ప్రజలు తలుచుకుంటూనే ఉంటారు. -
వయనాడ్ విలయం : గుండెల్ని పిండేస్తున్నమహిళ ఫోన్ రికార్డింగ్
కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటన మారణహోమానికి దారి తీసింది. వరుసగా ఏడో రోజుకూడా ఈ ప్రకృతి విలయానికి సంబంధించిన అనేక హృదయ విదారక దృశ్యాలు, కథనాలు ఒక్కొక్కటీ వెలుగులోకి వస్తున్నాయి. ఈ సమయంలో తొలి విపత్తు కాల్ చేసిన మహిళ కాల్ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వయనాడ్‌లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో పని చేసే మహిళ ఫోన్ కాల్, ప్రాణాలను కాపాడుకునేందుకు ఆమె పడ్డ తపన పలువురి గుండెల్ని పిండేస్తోంది.వివరాలను పరిశీలిస్తే..జూలై 30న జిల్లాలోని మెప్పాడి సమీపంలోని కొండ ప్రాంతాలలో భారీ కొండచరియలు విరిగిపడటంతో నీతూ జోజో అనే మహిళ తొలుత స్పందించారు. తాము ఇబ్బందుల్లో ఉన్నాం, ప్రాణాలకే ప్రమాదం.. రక్షించండి! అంటూ కాల్ చేశారు. డాక్టర్ మూపెన్స్ మెడికల్ కాలేజీ సిబ్బందికి కాల్ రికార్డింగ్‌లో నీతూ, "చూరల్మల వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. మేం పాఠశాల వెనుక ఉంటున్నాం, దయచేసి మాకు సహాయం చేయడానికి మీరు ఎవరినైనా పంపగలరా?" అని చాలా ఆందోళనతో వేడుకున్నారు. ఇంటిచుట్టూ నీరే ఉందని తెలిపారు. అంతేకాదు తమతోపాటు ఏడు కుటుంబాలవారు తన ఇంట్లో ఆశ్రయం పొందారని తెలిపింది. అయితే తాము దారిలో ఉన్నామని, కంగారు పడొద్దని రెస్క్యూ టీమ్‌లు తమ ఆమెకు ధైర్యం చెప్పాయి. కానీ వారు వెళ్లేసరికే ఆలస్యం జరిగిపోయింది. మంగళవారం తెల్లవారుజామున 1 గంట. రాత్రికి రాత్రే దూసుకొచ్చిన నదీ ప్రళయఘోష బెడ్రూంకి చేరడంతో ఆమెకు మెలకువ వచ్చింది. చూరల్‌మలలోని హైస్కూల్ రోడ్డులోని ఆమె ఇంట్లోకి నీళ్లొచ్చాయి. ఎటు చూసిన కొట్టుకొస్తున్న వాహనాలు, కుప్పకూలిన శిథిలాలు, మట్టి,బురద భయంకరంగా కనిపించాయి. మెప్పాడిలోని డాక్టర్ మూపెన్స్ మెడికల్ కాలేజీలో ఫ్రంట్ ఆఫీస్‌లో పనిచేసే నీతులో ఆందోళన మొదలైంది. వెంటనే తన భర్త జోజో జోసెఫ్‌ను నిద్ర లేపారు. ఇంతలోనే సమీపంలోని ఏడు కుటుంబాల ఇళ్లు కూడా కొట్టుకుపోయాయి. వారికి కొండపైకి ఎత్తైన ఆమె ఇంట్లో ఆశ్రయం ఇచ్చారు. దీంతో 1.30 గంటలకు ఆసుపత్రికి ఫోన్ చేసింది. మళ్లీ 2.18 గంటలకు ఆమె మళ్లీ తన ఆసుపత్రికి ఫోన్ చేసింది. కొన్ని నిమిషాలకే ఆమె ఇంట్లోని వంటగది కొట్టుకుపోయింది. నీతూ మాత్రం సాయం కోసం ఎదురుచూస్తూ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. ఆమె భర్త జోజో, వారి ఐదేళ్ల కుమారుడు, మిగిలిన రెండు గదుల్లో ఉన్న జోజో తల్లిదండ్రులు క్షేమంగా ఉన్నారు. అంబులెన్స్ డ్రైవర్, మరొక సిబ్బంది ఆమెతో నిరంతరం ఫోన్లో టచ్‌లో ఉన్నారు కానీ, చెట్లు నేలకొరగడంతో రోడ్డు మార్గం స్థంభించిపోయింది. దీంతో రక్షణ బృందాలు చేరుకోలేకపోయాయి. వీళ్లు వెళుతున్న క్రమంలోనే రెండో కొండచరియలు విరిగిపడటంతో కనెక్షన్ పూర్తిగా తెగిపోయింది. చూరల్మల వంతెన కొట్టుకు పోయింది. అంబులెన్స్‌లు, ఇతర రెస్క్యూ సిబ్బంది నీతు వద్దకు చేరుకోలేకపోయింది. ఐదు రోజుల తర్వాత నీతు మృతదేహం చలియార్లో లభ్యమైంది. నీతు ధరించిన ఆభరణాలను బట్టి బంధువులు ఆమెను గుర్తించారు.కాగా జూలై 30న వాయనాడ్‌లో భారీ కొండచరియలు విరిగిపడటంతో 360 మందికి పైగా మరణించారు ప్రాణాలతో బయటపడిన వారి ఆచూకీ కోసం అధునాతన రాడార్లు, డ్రోన్లు, భారీ యంత్రాలను ద్వారా రెస్క్యూ బృందాలు రక్షణ చర్యలను వేగవంతం చేశాయి.