intipanta
-
పెరటితోటలో పేనుబంకను వదిలించేదెలా?
మీ గార్డెన్లో పేనుబంక (అఫిడ్స్)ను నియంత్రించటం ఒక సవాలుతో కూడుకున్న పని. కానీ, పేనుబంక పురుగులను అదుపు చేయటానికి అనేక ప్రభావవంతమైన మార్గాలు ఉన్నాయి. మీరు అనుసరించగల కొన్ని సూచనలు:1. మీ మొక్కలను క్రమం తప్పకుండా తనిఖీ చేయండిముడుచుకున్న ఆకులపై అంటుకునే పదార్థం లేదా స్టెమ్ లేదా ఆకులపై పేనుబంక సోకుతున్న సంకేతాలు ఏమైనా ఉన్నాయేమో గమనించటం కోసం మీ మొక్కలను తరచుగా తనిఖీ చేయండి. 2. వేపనూనె వాడండి వేప నూనె అఫిడ్స్‌ను నియంత్రిండానికి వాడే సహజమైన పురుగుమందు. లేబుల్ సూచనల ప్రకారం వేప నూనెను నీటితో కలిపి పేనుబంక సోకిన మొక్కలపై పిచికారీ చేయండి. 3.సబ్బు నీరు స్ప్రే చేయండిపేనుబంకను నియంత్రించడానికి తేలికపాటి డిష్ సోప్‌ను నీటిలోకలిపి ప్రభావిత మొక్కలపై స్ప్రే చేయవచ్చు.4. గార్లిక్ స్ప్రే ఉపయోగించండివెల్లుల్లి సహజ క్రిమిసంహారక లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది పేనుబంకను నియంత్రించడంలో సహాయ పడుతుంది. వెల్లుల్లి రసాన్ని నీటితో కలపండి. ప్రభావిత మొక్కలపై పీచికారీ చేయండి.5. ప్రయోజనకరమైన కీటకాలులేడీబగ్స్, లేస్వింగ్, పరాన్నజీవి కందిరీగలు వంటి ప్రయోజనకరమైన కీటకాలు పేనుబంకను వేటాడతాయి. అఫిడ్స్ పురుగుల సంతతిని నియంత్రించడానికి మీ గార్డెన్ లో ఈ కీటకాలు పెరిగేలా చూసుకోండి.6. తోట పరిశుభ్రత పాటించండికలుపు మొక్కలను తొలగించండి. తెగులు సోకిన మొక్కలను తీసి దూరంగా పారవేయండి. పురుగుల ముట్టడిని నివారించడానికి ఎక్కువ ఎరువులు వేయకుండా ఉండండి.7. స్క్రీన్లు, రో కవర్లను ఉపయోగించండిఅఫిడ్స్ మీ మొక్కలను ఆశించకుండా నిరోధించడానికి ఫైన్–మెష్ స్క్రీన్లు లేదా ఫైన్–వెటెడ్ రో కవర్లను ఉపయోగించండి.8.జీవ నియంత్రణపేనుబంకను తినే పక్షులు, సాలె పురుగులు వంటి సహజ మాంసాహారులను ప్రోత్సహించటం ద్వారా జీవ నియంత్రణకు అవకాశం కల్పించండి.9. పర్యవేక్షించండి, పునరావృతం చేయండి మీ గార్డెన్లో మొక్కలను క్రమం తప్పకుండా పర్యవేక్షించండి. పేనుబంకను సమర్థవంతంగా అరికట్టే నియంత్రణ చర్యలను అవసరాన్ని బట్టి పునరావృతం చేయండి.– హేపీ గార్డెనర్స్ అడ్మిన్ టీం -
డ్రాగన్ తోట : ఉపాయం ఉండాలేగానీ, నెలకు రూ.లక్ష ఈజీగా
ఉపాయం ఉండాలే గాని ఉద్యోగ విరమణ తర్వాత కూడా ఉత్సాహంగా మరో వృత్తిని చేపట్టి మంచి ఆదాయం పొందవచ్చనటానికి కేరళకు చెందిన ఓ విశ్రాంత ఉపాధ్యాయిని కృషే నిదర్శనం. కొల్లం పట్టణానికి చెందిన రెమాభాయ్ ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేసి రెండేళ్ల క్రితం ఉద్యోగ విరమణ చేసిన తర్వాత సాయిల్ లెస్ పద్ధతిలో తమ ఇంటిపైనే డ్రాగన్ ఫ్రూట్ సాగు చేయటం ప్రారంభించారు. ప్లాస్టిక్ డ్రమ్ముల్లో హైడ్రోపోనిక్ పద్ధతిలో డ్రాగన్ పండ్లను సాగు చేస్తున్నారు. నెలకు 500 కిలోల డ్రాగన్ ఫ్రూట్స్ దిగుబడి వస్తోంది. కిలో రూ. 200కు విక్రయిస్తూ నెలకు రూ. లక్ష వరకు ఆదాయం పొందుతున్నారు. ఏడాదికి 3 నెలలే డ్రాగన్ ఫ్రూట్ సీజన్ ఉంటుంది. రిటైరైన కొద్ది రోజులకే ఆమె తల్లి వృద్ధాప్యంతో మృతి చెందారు. ఆ వేదనలో నుంచి బయటపడటం కోసం ఏదైనా వ్యాపకం పెట్టుకోవాలనుకున్నారు. విదేశీ పండైన డ్రాగన్ సాగును ఇంటిపైనే ప్రారంభించారామె. నేలపైన పెంచడానికి ఇంటి దగ్గర ఖాళీ స్థలం లేదు. అందుకే మేడపై రెండొందల లీటర్ల బ్యారళ్లు 50 పెట్టి, వాటిల్లో వంద డ్రాగన్ మొక్కల్ని పెంచుతున్నారు. మట్టి మోసుకెళ్లి ఇంటిపైన పెట్టటం నాకు కష్టం అనిపించి సాయిల్ లెస్ పద్ధతిని ఎంచుకున్నానని రమాభాయ్ అంటున్నారు. కొన్ని రెడ్, కొన్ని ఎల్లో రకం డ్రాగన్ రకాలను నాటారు. ఎక్కువైన నీరు బయటకు పోవటానికి బ్యారెల్‌కు అడుగున బెజ్జం పెట్టి.. అందులో ఆకులు, రంపపు పొడి, వరి గడ్డి ముక్కలు, బ్యారెల్‌కు 3 కిలోల చొప్పున కం΄ోస్టు ఎరువును దొంతర్లుగా వేశారు. వంద గ్రాముల బోన్ మీల్ కూడా కలిపి, మొక్కలు నాటారు. ఎండాకులు, కూరగాయ వ్యర్థాలు, చేపలు, రొయ్యల వ్యర్థాలు, ఆల్చిప్పలతో సొంతంగా తయారు చేసుకునే ద్రవరూప ఎరువులను మొక్కలకు ఆమె అప్పుడప్పుడూ ఇస్తున్నారు. దీంతో మొక్కలు పోషకలోపాల్లేకుండా ఆరోగ్యంగా పెరిగి మంచి దిగుబడినిస్తున్నాయని రమాభాయ్ సంతృప్తిని వ్యక్తం చేశారు.‘ఏదైనా కంటెయినర్లో కిలో చేపలు, రొయ్యలు, పీతల డొప్పలకు కిలో బెల్లంతో పాటు బొప్పాయి పండ్ల తొక్కలు కలపాలి. ఎండ తగలకుండా నీడన ఉంచి అప్పుడప్పుడూ కలియదిప్పుతూ ఉంటే.. 90 రోజులకు సేంద్రియ ద్రావణం సిద్ధమవుతుంది. ఇది కాల్షియం, ఫాస్ఫరస్‌ను పుష్కలంగా అందిస్తుంది. ఆ బలంతో డ్రాగన్ మొక్కలు చక్కగా కాస్తున్నాయి’ అన్నారు రమాభాయ్. జెసిస్ వరల్డ్ పేరిట యూట్యూబ్ ఛానల్‌ను కూడా ఆమె ప్రారంభించారు. సీజన్లో మా ఇంటిపైన 200–300 డ్రాగన్ పూలు కనువిందు చేస్తుంటే నా వయసు 60 నుంచి 20కి తగ్గిపోతుంది. బాధలన్నీ మర్చిపోతున్నా అంటున్నారామె సంతోషంగా! -
ఇంటి రూఫ్.. మొక్కలు సేఫ్..!
సాక్షి, సిటీబ్యూరో: టెర్రస్‌గార్డెన్.. హైదరాబాద్ నగరంలోని నివాసాల నుంచి పల్లెల వరకూ ఇప్పుడు ఇదే ట్రెండింగ్. పెరుగుతున్న కాలుష్యం ప్రజలను ప్రకృతి ఒడికి చేరువయ్యేలా చేస్తోంది. ఓ వైపు ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం కోసం.. మరోవైపు ఆహ్లాదకరమైన వాతావరణం కోసం ప్రతి ఒక్కరూ తమ నివాసాల్లో మొక్కలు పెంచుతున్నారు. నగరంలో స్థలాభావం కారణంగా మిద్దెలపై మొక్కలు పెంచడం వైపు ఆసక్తి చూపిస్తున్నారు. దీనికితోడు గ్రీన్ సిటీస్, గ్రీన్ హౌస్ అనే కాన్సెప్‌్టతో ఇప్పటికే అత్యాధునిక సౌకర్యాలతో బిల్డింగ్ డిజైన్లు వెలుస్తున్నాయి. దీంతో నగర వాసుల, ప్రకృతి ప్రేమికుల నివాసాలు పచ్చదనానికి ఆవాసాలుగా మారుతున్నాయి. అపార్ట్మెంట్, కాంప్లెక్స్‌ల నిర్వాహకుల నుంచి ఇండివీడ్యువల్ ఇళ్ల వరకూ గ్రీనరీకి ప్రధాన్యతనిస్తున్నారు.ఆరోగ్యం వెంట.. ఇంటి పంట..ఇటీవలి కాలంలో నగరంలో అధిక శాతం మంది భవనాలపై, టెర్రస్‌లో తమ సొంత కూరగాయలను ఆర్గానిక్ పద్ధతుల్లో పెంచేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇది వారికి ఆరోగ్యకరమైన తాజా ఉత్పత్తులను అందించడమే కాదు.. సొంతంగా పండించుకుంటున్నామనే గొప్ప సంతృప్తిని కూడా అందిస్తుంది. టెర్రస్ గార్డెన్ కేవలం పచ్చదనాన్ని పంచడం మాత్రమే కాకుండా ఆయా కమ్యూనిటీలు నిర్వహించుకునే ఈవెంట్లకు అద్భుతమైన అనువైన ప్రదేశంగా మారాయి. పండుగల నుంచీ బార్బెక్యూల దాకా వేడుకలుగా జరుపుకోడానికి ఇవి వేదికలవుతున్నాయి. నగర జీవితంలో హడావిడి నుంచి తప్పించుకోడానికి నివాసితులకు వీలు కల్పిస్తోంది. మిద్దెతోట.. పచ్చని బాట..నగరంలో స్థల పరిమితులు ఉండటంతో, స్థలాభావం ఉన్నప్పటికీ పచ్చదనానికి పట్టం కట్టాలని ఆరాటపడుతున్న వారికి.. అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లలోని టెర్రస్ గార్డెన్లు పరిష్కారాన్ని అందిస్తున్నాయి. నగరంలో అపార్ట్మెంట్, కాంప్లెక్సుల్లో టెర్రస్ గార్డెన్లు ప్రాచుర్యం పొందుతున్నాయి. ఒకప్పుడు భవనాల పైకప్పులపై ఖాళీగా ఉన్న స్థలాలు ఇప్పుడు పచ్చని ప్రదేశాలుగా మారి నగరవాసుల అభిరుచుల వైవిధ్యానికి నిదర్శనాలుగా మారుతున్నాయి.పచ్చని వాతావరణాన్ని అందించడమే కాకుండా కార్బన్ డయాక్సైడ్ను గ్రహించి గాలిలోకి ఆక్సీజన్‌ను విడుదల చేయడం ద్వారా మిద్దె తోటలు గాలి నాణ్యతను మెరుగుపరుస్తాయి. అంతేకాదు కూరగాయలు, మూలికలు, పండ్లను సైతం పెంచడానికి అనేక మార్గాలను అన్వేíÙస్తున్నారు ప్రకృతి ప్రేమికులు. ఇలా పర్యావరణానికి రక్షణగా నిలవడం.. తద్వారా ఆరోగ్యకరమైన ఆహారం తినడానికి అలవాటుపడుతున్నారు నగరవాసులు.రసాయనాల నుంచి విముక్తికి..‘పురుగుమందులు లేని సేంద్రీయ కూరగాయలకు పెరుగుతున్న డిమాండ్‌తో, తమ సొంత పెరట్లలో లేదా టెర్రస్లలో కూరగాయలు, పండ్లను పండించడం వైపు చాలా మంది ఆకర్షితులవుతున్నారు. అలాగే ఇంటి ఖర్చులో పొదుపు మార్గాలను అందిస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కనీసం 45,000 మంది టెర్రస్‌పై తోటలను పెంచేందుకు మా ప్రచారం తోడ్పడింది’ అని శ్రీనివాస్ చెప్పారు. హరిత ఉద్యాన వనాలను మెరుగుపరచడానికి కావాల్సిన విత్తనాలు, మాధ్యమాలు విడిభాగాలను కొనుగోలు చేయడానికి నిపుణుల సలహాలను పొందడంతో పాటు అన్ని రకాల సహకారం అందిస్తామని చెప్పారాయన.సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్..ఆన్లైన్ వేదికగా మిద్దె తోటల పెంపకంపై చర్చోపచర్చలు, గ్రూపులు ఊపందుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే నగరానికి చెందిన సీనియర్ న్యాయవాది ఉద్యానవన ప్రియుడు శ్రీనివాస్ హర్కరా ‘సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్’ స్థాపించారు. ఇప్పుడు ఇది అత్యధిక సంఖ్యలో నిపుణులు, సభ్యులను కలిగిన గ్రూప్స్‌లో ఒకటి. అటువంటి 16 గ్రూప్స్‌తో దాదాపు 25 వేల మంది సభ్యులతో టెర్రస్ గార్డెన్ హవా నడుస్తోంది. రూఫ్ గార్డెనింగ్, ఆర్గానిక్ కూరగాయలు, పండ్లను పండించడానికి సంబంధించిన అన్ని పరిష్కారాల కోసం వన్ స్టాప్ ప్లాట్‌ఫారమ్‌గా మారింది.గోడల నుంచి.. ఎలివేషన్స్ వరకూ..పచ్చదనం కోసం నగరవాసుల్లో పెరుగుతున్న ఆరాటం గోడల నుంచి ఎలివేషన్స్ వరకూ గతంలో ఉపయోగించని ప్రదేశాలను సైతం మొక్కలతో నింపేలా చేస్తోంది. ఈ క్రమంలోనే రూఫ్ గార్డెనింగ్, టెర్రస్, రూఫ్‌టాప్, పాటియో, బాల్కనీ, పోర్చ్, వరండా, సన్డెక్ వంటి ప్రదేశాల్లో మొక్కలు పెంచేస్తున్నారు. దీంతోపాటు హ్యాంగింగ్ గార్డెనింగ్ కూడా ప్రాచుర్యం పొందుతోంది.. బాల్కనీల్లో వైర్లు, బుట్టలు, కుండీలు వంటివి వేలాడదీస్తూ తీగ మొక్కలను పెంచుతున్నారు. తద్వారా ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం కూడా లభిస్తోంది.గ్రాండ్.. గార్డెన్ ట్రీట్స్..ఇంటి మిద్దెలు, టెర్రస్ గార్డెన్స్ ఇటీవలి కాలంలో గ్రాండ్ ట్రీట్స్కి వేదికలు అవుతున్నాయి. కుటుంబ సభ్యులు, స్నేహితులు, కమ్యూనిటీ మిత్రులు, ఆఫీస్ కొలీగ్స్‌తో కలిసి వీకెండ్స్, ఇతర ప్రత్యేక ఈవెంట్స్‌లో ట్రీట్స్ ఇచ్చుకోడానికి వీలుగా రూపుదిద్దుకుంటున్నాయి. అవుట్డోర్ సీటింగ్‌కు అనుగుణంగా బెంచ్‌లు, కురీ్చలు, ఊయల వంటివి ఏర్పాటు చేసుకుంటున్నారు. రట్టన్, వెదురు, కలప, లోహాలు మొదలైన వాటి నుండి ఆల్–వెదర్ ఫరి్నచర్ శ్రేణిలో రూఫ్ గార్డెన్స్ నిర్మాణమవుతున్నాయి.70 వేలకు పైగా సభ్యులు..నగరంలో టెర్రస్ గార్డెన్స్ ట్రెండ్ బాగా పెరుగుతోంది. ప్రస్తుతం మా సంస్థ ఆధ్వర్యంలో 26 గ్రూప్స్ ఉండగా, తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా దాదాపు 70వేల మందికిపైగా సభ్యులున్నారు. పర్యావరణ హితంగా, నగర వాతావరణాన్ని కాలుష్యం నుంచి కాపాడేందుకు ఈ ట్రెండ్‌ని మరింతగా ప్రోత్సహించాలి. నగరం కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న మా సంస్థ కృషికి ఇటీవలే కేంద్ర ప్రభుత్వం నుంచి గుర్తింపు వచి్చంది. – శ్రీనివాస్, వ్యవస్థాపకులు, సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్.. (సీటీజీ)ఇవి చదవండి: ఆయిల్, గ్యాస్ బ్లాకుల కోసం పోటాపోటీ -
ఇంటిపంటలతో సంపూర్ణ ఆరోగ్యం.. మనమే పండించుకుందాం
ఇంటికి పంటే అందం, ఆరోగ్యం! మొన్నటి వరకు మండిన ఎండల ప్రతాపానికి కూరగాయల దిగుబడి తగ్గి, మార్కెట్లో తీవ్ర కొరత ఏర్పడింది. ఫలితంగా కూరగాయల ధరలు మండిపోతున్నాయి. వాటిల్లోనూ నాణ్యత లోపించింది. మూడు వారాలకు పైగా అదనంగా కొనసాగిన హీట్ వేవ్, వడగాడ్పుల పుణ్యమా అని కూరగాయల సాగు దెబ్బతిన్నది. అననుకూల వాతావరణంలో కూరగాయ పంటలు విత్తలేకపోవడంతో సరఫరా తగ్గిపోయింది. దీంతో ప్రజలకు, ముఖ్యంగా నగరవాసులకు కూరగాయలు కొనాలంటే చుక్కలు కనపడుతున్నాయి. ఇప్పటికైనా వర్షాలొచ్చాయి కాబట్టి సేంద్రియ ఇంటి పంటలు సాగు చేసుకోవటం మేలు. సొంతిల్లు ఉన్న వారు మార్కెట్‌పై ఆధారపడకుండా.. ఆరోగ్యదాయకమైన కూరగాయలను టెర్రస్(ఇంటి పైకప్పు)ల మీద పెంచుకోవటం ఉత్తమం. ఎత్తుమడుల్లో లేదా కంటెయినర్లలో ఏ కాలమైనా కూరగాయలు సాగు చేసుకోవచ్చంటున్నారు ఇంటిపంట సాగుదారులు.. కూరగాయలు మనమే పండించుకుందాం మెడిసిన్‌లో సీటు వచ్చినా ప్రకృతి మీద ఉన్న ప్రేమతో మక్కువతో అగ్రికల్చర్ కోర్సులో చేరాను. సహాయ సంచాలకురాలిగా వ్యవసాయ శాఖలో పనిచేస్తూ ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జిహెచ్ఎంసి) చందానగర్‌లో ప్రాజెక్ట్ ఆఫీసర్‌గా ఉన్నాను. నా కుటుంబాన్ని విషపూరితమైన పంటల నుంచి నాకు చేతనైనంత వరకు కాపాడాలని నిర్ణయించుకొని ఇంటిపైన కూరగాయల తోటను ప్రారంభించాను. మనం మన పిల్లలకి ఎంత ఆస్తి ఇచ్చాం అనేది కాదు ముఖ్యం. ఎంత ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అందించామనేది ముఖ్యం. 2014 అక్టోబర్‌లో నా మిద్దె తోటలో తొలి బీజం అంకురించింది. నవంబర్‌లో పంట పురుడు పోసుకుంది. డిసెంబర్లో వజ్రాల్లాంటి పిల్లలను.. అదేనండి పంటని.. నా చేతికి అందించింది. అప్పుడు అరవై కుండీలతో మొదలైన మిద్దె తోట సాగు ఇప్పటివరకు ఆగలేదు. ఏ విధమైన అలుపు గానీ, విసుగు గానీ లేదు. ఆనందకరమైన, ఆరోగ్యకరమైన జీవన విధానం అనుసరిస్తున్నాం. ఇప్పుడు నా తోట 600 కుండీలతో నాలుగు అంతస్తులలో అలరారుతోంది. ప్రకృతి సమతుల్యతను మన వికృత చేష్టలతో మనమే చెడగొట్టుకున్నాం. అందుకని ఇప్పటికైనా నగరవాసులమైన మనం మనకు కావాల్సిన ఆకుకూరలను, కూరగాయలను, పండ్లను సాధ్యమైనంత వరకు మనమే పండించుకోవడం ఉత్తమం. ఇంకెందుకు ఆలస్యం మొదలెడదామా? మనమందరం మిద్దె తోటలను పెంచుకోవాలి. ఉల్లిపాయ తప్పితే మిగతా ఏ కూరగాయలకూ మార్కెట్‌కి వెళ్ళను. మీరు నమ్మినా నమ్మకున్నా 365 రోజుల్లో ఏనాడూ నేను కూరగాయలను బయట కొనటం లేదు. – ఓ.వి.ఎస్.ఉషారాణి (81217 96299), సేంద్రియ ఇంటిపంటల సాగుదారు, వ్యవసాయ సహాయ సంచాలకులు, జీహెచ్ఎంసీ చందానగర్ సర్కిల్ ప్రాజెక్ట్ ఆఫీసర్,హైదరాబాద్. సేంద్రియ ఇంటిపంటల్లో సంపూర్ణ ఆరోగ్యం టికి చేయి తినడానికి ఎంత దగ్గరగా అనుకూలంగా ఉంటుందో.. ఇంట్లో వంట చేయడానికి పంట కూడా అంత దగ్గరగా అందుబాటులో ఉండాలి. తాజా కూరగాయలు, పండ్లు ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ పండించుకొని తినడం ఆరోగ్యానికి ఎంతో ఉపయోగం. తాజా కూరగాయలు, పండ్లు తింటే శరీరానికి కావలసిన యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. నలిగిన లేదా పగిలిన కణాల నుంచి సెల్యులోజ్ అనే ఎంజైము విడుదలవుతుంది. ఇలా కణజాల వ్యవస్థ ధ్వసమై మనకు మేలు చేసే యాంటీ ఆక్సిడెంట్లు కాస్తా హానికరమైన యాసిడ్లు (ఆమ్లాలు)గా రూపాంతరం చెందుతాయి. మార్కెట్లో లభించే చాలా వరకు కూరగాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు యాసిడ్లుగా మారే ప్రక్రియకు లోనయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. అందువల్ల గ్యాస్, అసిడిటీ, అల్సర్లు వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి, ఇంటిపట్టున/ఇంటికి దగ్గర్లో పండ్లు, కూరగాయలు పండించుకొని తాజాగా తినాలి. సేంద్రియ ఇంటి పంటల్లో సంపూర్ణ ఆరోగ్య ప్రాప్తిరస్తు. – డా. జి. శ్యాంసుందర్ రెడ్డి (99082 24649), సేంద్రియ ఇంటిపంటల నిపుణుడు మిద్దె తోటలో అన్నీ పండించుకోవచ్చు పూల మొక్కలు చాలా ఏళ్లుగా పెంచుతున్నా కూరగాయల సాగుపై పెద్దగా అవగాహన లేదు. ‘సాక్షి’ పేపర్లో ‘ఇంటిపంట’ ఆర్టికల్స్ చదివి అందరూ ఎలా చేస్తున్నారో తెలుసుకున్నా. మిద్దె పైన మొదలు పెట్టి, కనీసం ఆకుకూరల వరకైనా పెంచుకుందాం అని అనుకున్నాను. 2017లో ఐదారు గ్రోబాగ్స్ తెచ్చి ఆకుకూరల సాగు మొదలు పెట్టాను. ఇంటిపంట ఫేస్బుక్ గ్రూప్‌లో చేరి కొన్ని విషయాలు తెలుసుకున్నాను. తర్వాత తుమ్మేటి రఘోత్తమరెడ్డి సూచనలు ఉపకరించాయి. 2019 జూన్ నుంచి పట్టుదలగా కూరగాయ మొక్కలను మిద్దె పైనే పెంచుతున్నాను. ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. మొక్కలకు తగిన పోషకాలు ఇస్తే మిద్దె తోటలో కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు అన్ని రకాలను ఎలాంటి రసాయనాలు వాడకుండా మనమే పండించుకోవచ్చు. మన పంట మనమే తినవచ్చు. ఆరోగ్యం చేకూరుతుంది. డాక్టర్, మందుల ఖర్చులు తగ్గుతాయి. నగరంలో అందరూ మిద్దె తోటలు సాగు చేస్తే వాతావరణ కాలుష్యం తగ్గుతుంది. ఇతర ఆలోచనలు లేకుండా మనసు ప్రశాంతంగా ఉంటుంది. – లత కృష్ణమూర్తి (94418 03407), మిద్దె తోటల సాగుదారు, హైదరాబాద్ – పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ -
తక్కువ స్థలంలో ఎక్కువ కూరగాయలు.. ఇంటిపంట ఇలా వేసుకోండి
ఇరవై రెండేళ్ల మందిసా మటేంజ్వా స్వస్థలం.. దక్షిణ ఆఫ్రికా, క్వాజూలూ–నటాల్ రాష్ట్రంలోని ఎంపాంగని అనే పట్టణం. రెండేళ్ల క్రితం.. యూనివర్సిటీ ఆఫ్ ద ఫ్రీ స్టేట్‌లో బీఎస్సీ పూర్తిచేసింది. అందులో అగ్రికల్చర్ కూడా ఒక సబ్జెక్ట్. డిగ్రీ అయ్యాక ఏదో ఒక ఉద్యోగం వెతుక్కుంటున్న క్రమంలో మిస్టర్ ప్రైస్ ఫౌండేషన్ ఆఫర్ చేస్తున్న ‘హేండ్పిక్’ అర్బన్ అగ్రికల్చర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ గురించి తెలిసి జాయినైంది. డర్బన్ నగరంలో అర్బన్ అగ్రికల్చర్ శిక్షణ కేంద్రంలో ఇంటర్న్‌గా చేరింది. 12 నెలల ఆ శిక్షణ మందిసా జీవితాన్ని అనూహ్యమైన మలుపు తిప్పింది. ప్రస్తుతం ఆమె డర్బన్ నగరంలోని కామతేంజ్వా అర్బన్ ఫామ్‌కి యజమాని కమ్ మేనేజర్. కాప్సికం, ఫ్రిల్లీ, బటర్ లెట్యూస్, బేబీ పాలకూర, తులసి, పచ్చిమిర్చి, పుదీనా, పార్ల్సీ, ఉల్లికాడలు వంటి కూరగాయలు, ఔషధ మొక్కల్ని సాగు చేసి నగరవాసులకు విక్రయిస్తూ మంచి ఆదాయం పొందుతోంది. ఓ యువ గ్రాడ్యుయేట్ సుశిక్షితురాలైన అర్బన్ అగ్రిప్రెన్యూర్‌గా మారింది. సాధికారతకు పవర్ ఇది. మిస్టర్ ప్రైస్ ఫౌండేషన్ గత మూడేళ్లలో మందిసా సహా 24 మంది గ్రాడ్యుయేట్లను ‘హాండ్పిక్’ ప్రోగ్రామ్‌లో భాగంగా స్వతంత్ర అర్బన్ ఫార్మర్స్‌గా మార్చింది. సుస్థిర సాగు పద్ధతులను నేర్పించటం ద్వారా ఆరోగ్యదాయకమైన కూరగాయలు, ఔషధ మొక్కల్ని నగరాల్లో, నగర పరిసర ప్రాంతాల్లో స్థానికంగానే పండించుకొని తినటం అలవాటు చేయటమే మిస్టర్ ప్రైస్ ఫౌండేషన్ లక్ష్యం. ఆఫ్రికన్ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు గృహస్థులకు, నగరవాసులకు కూడా హైడ్రోపోనిక్స్ పద్ధతిలో పంటల సాగును ఈ ఫౌండేషన్ నేర్పిస్తోంది. తక్కువ స్థలంలో, తక్కువ నీటితో ఎక్కువ పంటలు పండించటం కోసం కొబ్బరి పొట్టు ఎరువులో ద్రవరూప ఎరువులను వాడే పద్ధతిని ఇది ప్రాచుర్యంలోకి తెస్తోంది. ఒక్కో కుండీకి పంటను బట్టి 4–6 మొక్కలు చొప్పున, నిలువుగా ఒకదాని కింద మరొకటి 4 కుండీలు ఉండేలా హైడ్రోపోనిక్ వర్టికల్ టవర్లను ఉపయోగిస్తోంది. 16 నుంచి 24 మొక్కల్ని మనిషి నిలబడేంత చోటులోనే పండించటం ఈ టవర్ల ప్రత్యేకత. ఈ టవర్లకు ‘ఆఫ్రికన్ గ్రోయర్’ అని పేరు పెట్టారు. మిస్టర్ ప్రైస్ ఫౌండేషన్ అనేక చోట్ల అర్బన్ అగ్రికల్చర్ శిక్షణ కేంద్రాలను నిర్వహిస్తోంది. కేప్‌టౌన్ నగరంలోని లాంగా ప్రాంతంలో కొద్ది నెలల క్రితం ఒక సిటీ రూఫ్‌టాప్ ఫామ్ ప్రారంభమైంది. రీడిఫైన్ ప్రాపర్టీస్ అనే రిటైల్ వాణిజ్య సంస్థతో కలసి కెనిల్వర్త్ సెంటర్ పేరిట ఈ ఫామ్‌ను మిస్టర్ ప్రైస్ ఫౌండేషన్ ఏర్పాటు చేసింది. ఈ స్థలాన్ని ఉచితంగా రీడిఫైన్ ప్రాపర్టీస్ ఇచ్చింది. ఈ హైడ్రోపోనిక్ ఫామ్‌లో పండించే కూరగాయలు అమ్మగా వచ్చే ఆదాయం ఫౌండేషన్ కార్యకలాపాలకే వినియోగిస్తున్నారు. రీడిఫైన్ ప్రాపర్టీస్ చీఫ్ సస్టెయినబిలిటీ ఆఫీసర్ అనెలిసా కెకె.. ‘యువత నిరుద్యోగ సమస్యకు అర్థవంతమైన, దీర్ఘకాలిక సుస్థిర పరిష్కారాన్ని వెతకాలని ప్రయత్నిస్తున్నాం. పనిలో పనిగా స్థానిక ప్రజలకు ఆరోగ్యదాయకమైన ఆహారాన్ని అందుబాటులోకి తేవాలన్నది మా ఉద్దేశం. యువత ఉపాధికి, పర్యావరణానికి, ప్రజారోగ్యానికి ఏ విధంగా తోడ్పాటునందించవచ్చో తెలియజెప్పడానికి రిటైల్ వాణిజ్య భవన సముదాయాల యజమానులు ఒక ఉదాహరణగా నిలవాలన్నదే మా ప్రయత్నం’ అంటున్నారు. మిస్టర్ ప్రైస్ ఫౌండేషన్ అర్బన్ అగ్రికల్చర్ కృషికి పలు సంస్థలు తోడ్పాటునందిస్తున్నాయి. మిస్టర్ ప్రైస్ ఫౌండేషన్ హేండ్పిక్ ప్రోగ్రామ్ నిర్వాహకుడు డేవిడ్ చర్చ్మన్ ‘రసాయనిక వ్యవసాయ పద్ధతులకు భిన్నమైన సుస్థిర వ్యవసాయ పద్ధతులను స్థానికులకు అలవాటు చేయటం, స్థానికంగానే కూరగాయలు, ఔషధమొక్కల ఉత్పత్తిని పెంపొందించడటం లక్ష్యంగా పనిచేస్తున్నాం. మా వద్ద శిక్షణ పొందిన వారి సుసంపన్నమైన అనుభవాలను నగరాల్లో జరిగే వివిధ సభలు, సమవేశాల్లో వారితోనే చెప్పిస్తూ ప్రజల్లో చైతన్యం తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం. సంతృప్తికరమైన ఫలితాలే వస్తున్నాయి’ అంటూ వివరించారు. – పంతంగి రాంబాబు prambabu.35@gmail.com -
Omaha City: ఇంటి పంటలకు నెలవు
ఒమాహా నగరఒమాహా.. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఒకటైన నెబ్రాస్కాలోని ముఖ్య నగరం. ఇక్కడ సేంద్రియ ఇంటి పంటల ఉద్యమం తామర తంపరగా విస్తరించింది. నగరంలో ఎటు చూసినా చిన్న చిన్న కమ్యూనిటీ కిచెన్ గార్డెన్స్ ఉంటాయి. అక్కడక్కడా విస్తారమైన అర్బన్ గార్డెన్లు కనిపిస్తాయి. సుమారు 5 లక్షల జనాభా గల ఒమాహాలో ఆఫ్రికన్ అమెరికన్లు(12%), ఆసియన్లు(5%) సహా వివిధ జాతులవారుంటారు. వారంతా తమవైన సంప్రదాయ సేంద్రియ ఇంటిపంటల సాగు ద్వారా కమ్యూనిటీలను పోషించుకునే పనిలో వున్నారు అంటే అతిశయోక్తి లేదు. నగరంలోని ఖాళీ స్థలాల్లో పంటలు పండించేందుకు 2014లో ఒమాహా ప్లానింగ్ డిపార్ట్మెంట్ అనుమతించిన తర్వాత కమ్యూనిటీ గార్డెన్ల సంఖ్య 58కి పెరిగింది. ఖాళీ స్థలాలను ఆకర్షణీయమైన హరిత ప్రదేశాలుగా మార్చారు. ఆహార లభ్యత సమస్యలతో బాధపడుతున్న వారి కోసం కూరగాయలు, ఆకుకూరలను పెంచుతున్నారు. కమ్యూనిటీ గార్డెన్లు కిరాణా దుకాణాలకు ఎప్పుడూ చూసి ఎరుగని దేశీయ ఆహారోత్పత్తులను అందిస్తూండటం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అలనాటి విక్టరీ గార్డెన్స్ మాదిరిగా.. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఒమాహాలో ‘విక్టరీ గార్డెన్స్’ ఉండేవని మేరీ కార్పెంటర్ తన బాల్య జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ‘కూరగాయలు, పండ్లు పెంచుకునే పెరటి తోట ప్రతి ఒక్కరికీ ఉండేది. ఆస్పరాగస్, బంగాళదుంపలు, టొమాటోలు, బ్లాక్ రాస్ బేర్రీస్, ద్రాక్ష వంటివన్నీ యుద్ధ కాలంలో పండించుకొని తినే వాళ్ళం. తరువాతి కాలంలో కిరాణా దుకాణాల్లో సంవత్సరం పొడవునా అన్నీ అమ్మటంతో ఆ తోటలు చాలా వరకు అదృశ్యమయ్యాయి. 80 ఏళ్ల తర్వాత మళ్లీ పెరటి తోటలు కొత్తగా వెలుస్తున్నాయి.. మంచిదే’ అన్నారు మేరీ హ్యాపీగా. తమదైన తాజా ఆహారంపై ఆసక్తి ఒమాహా ‘ఆధునిక అర్బన్ అగ్రికల్చర్ గురు’గా చెప్పదగిన వ్యక్తి జాన్ పోర్టర్. నెబ్రాస్కా ఎక్స్టెన్షన్ ఆఫీస్‌లో విద్యాధికారి. ఆరోగ్యదాయకమైన ఆహారాన్ని స్థానికంగా పెంచుకోవాల్సిన ఆవశ్యకత గురించి, ఆ ఉద్యమం వెనుక ఉన్న కథపై ఆసక్తిని కల్పించినందున నగరంలో తోటలు విస్తరిస్తున్నాయన్నారు. కోవిడ్ మహమ్మారి దాన్ని మరింత పెంచింది. అన్నింటికంటే, తమదైన తాజా ఆహారం తినాలన్న ఆకాంక్ష ఇందుకు మూలం అన్నారు జాన్. సిటీ స్ప్రౌట్స్‌లో తొలి అడుగులు.. సిటీ స్ప్రౌట్స్ ఒమాహాలో సేంద్రియ ఇంటి పంటల సాగును అలవాటు చేసిన స్వచ్ఛంద సంస్థల్లో ముఖ్యమైనది. ఇప్పుడు ఈ సంస్థ 45 చిన్నపాటి గార్డెన్ ప్లాట్లను నిర్వహిస్తోంది. ఉత్తర ఒమాహాలోని డెకాటూర్ అర్బన్ ఫార్మ్‌లో పండ్ల చెట్లు, బెర్రీ పొదలను భారీ సంఖ్యలో పెంచుతోంది. కమ్యూనిటీ గార్డెన్స్, అర్బన్ ఫామ్‌ల మధ్య వ్యత్యాసం గురించి చెబుతూ సిటీ స్ప్రౌట్స్ మేనేజర్ షానన్ కైలర్ .. ‘నిర్దిష్ట కమ్యూనిటీ కోసం తరచుగా ఎత్తైన మడుల్లో కూరగాయలను పండించేది కమ్యూనిటీ గార్డెన్. అర్బన్ వ్యవస్థ క్షేత్రం కూరగాయలు, పండ్లను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేస్తుంది. సిటీ స్ప్రౌట్స్ ప్రతిరోజూ వందలాది స్థానిక కుటుంబాలకు తాజా ఆహారాన్ని ఉచితంగా అందిస్తుంది. తాజా ఆహారాన్ని అందించటానికి అర్బన్ ఫారమ్స్ నిజంగా చక్కని మార్గం’ అంటారు. నాన్సీ విలియమ్స్ ‘నో మోర్ ఎంప్టీ పాట్స్’ను ద్వారా ఆహార స్వయం సమృద్ధి కోసం కృషి చేస్తున్నారు. ‘పాప్–అప్ ఒయాసిస్’ గార్డెన్.. దేశీయ వంగడాలు సాగయ్యే కమ్యూనిటీ గార్డెన్. గత దశాబ్దంలో ఒమాహాలో ఉద్భవించిన డజన్ల కొద్దీ కొత్త కమ్యూనిటీ గార్డెన్లలో ఇదొకటి. హార్టికల్చరిస్ట్ నాన్సీ స్కాట్ తదితరులు అందులో పంటలు పండిస్తున్నారు. గస్ వాన్ రోన్న్ ‘ఒమాహా పెర్మాకల్చర్’ను స్థాపించి ఒమాహాలోని ఆడమ్స్ పార్క్ పరిసరాల్లోని ఖాళీ స్థలాలను ఆర్గానిక్ గార్డెన్స్‌గా మార్చారు. (క్లిక్ చేయండి: నెలకు లక్ష జీతం.. సాఫ్ట్వేర్ వదిలి ‘సాగు’లోకి..) – పంతంగి రాంబాబు prambabu.35@gmail.com -
Cuba: పట్టణ సేంద్రియ వ్యవసాయంతో వినూత్న పరిష్కారం..
క్యూబా.. నగర, పట్టణ ప్రాంతాల్లో సేంద్రియ ఇంటిపంటల సాగు సంస్కృతికి ప్రపంచంలోనే అతి పెద్ద ఉదాహరణగా నిలిచింది. 70% క్యూబా ప్రజలు అర్బన్ ప్రాంతాల్లో నివాసం ఉంటారు. దేశానికి కావాల్సిన ఆహారంలో 50% ఇప్పుడు సేంద్రియ ఇంటిపంటలే అందిస్తున్నాయి. స్థానిక సహజ వనరులతో ఆరోగ్యదాయకమైన పంటలు పండించుకుంటూ ఆహార సార్వభౌమత్వాన్ని నిలబెట్టుకోగలమని క్యూబా ప్రజలు ప్రపంచానికి చాటుతున్నారు. సోవియట్ యూనియన్ పతనానికంటే ముందు వరకు క్యూబా.. పెట్రోల్, డీజిల్‌తోపాటు 60%పైగా ఆహారోత్పత్తుల్ని, రసాయనిక ఎరువులు, పురుగుమందులను సైతం ఆ దేశం నుంచే దిగుమతి చేసుకుంటూండేది. పొగాకు, చక్కెర తదితరాలను ఎగుమతి చేస్తూ ఆహారోత్పత్తుల్ని దిగుమతి చేసుకుంటూ ఉండేది. ఆ దశలో సోవియట్ పతనం(1990–91)తో కథ అడ్డం తిరిగింది. అమెరికా కఠిన ఆంక్షల నేపథ్యంలో సోషలిస్టు దేశమైన క్యూబా అనివార్యంగా ఆహారోత్పత్తిలో స్వావలంబన దిశగా అడుగేయాల్సి వచ్చింది. క్యూబా ఆకలితో అలమటించిన కష్టకాలం అది. ఈ సంక్షోభాన్ని అధిగమించే క్రమంలో క్యూబా సమాజం ఉద్యమ స్ఫూర్తిని చాటింది. నగరాలు, పట్టణాల్లో ఖాళీ స్థలాలన్నీ సేంద్రియ పొలాలుగా మారిపోయాయి. అర్బన్ ప్రజలు సైతం తమ ఇళ్ల పరిసరాల్లోనే సీరియస్‌గా సేంద్రియ ఇంటిపంటల సాగు చేపట్టారు. గ్రామీణ రైతులు కూడా పొలాల్లో ఎగుమతుల కోసం చెరకు, పొగాకు వంటి వాణిజ్య పంటల సాగు తగ్గించి ఆహార పంటల సాగు వైపు దృష్టి సారించారు. సగం కంటే తక్కువ రసాయనాలతోనే రెండు రెట్లు ఎక్కువ ఆహారాన్ని ఉత్పత్తి చేయవలసి వచ్చింది. డీజిల్ లేక ట్రాక్టర్లు మూలనపడ్డాయి. పూర్తిగా ఎద్దులతోనే వ్యవసాయం చేయాల్సి వచ్చింది. అటువంటి సంక్షోభం నుంచి ‘పట్టణ సేంద్రియ వ్యవసాయం’ వినూత్న పరిష్కారాన్ని ఆవిష్కరించింది. నగర/పట్టణ ప్రాంతాల్లో స్థానిక సేంద్రియ వనరులతోనే జీవవైవిధ్య వ్యవసాయ సూత్రాల ఆధారంగా సేద్యం సాధ్యమేనని రుజువైంది. నగరాలు, పట్టణాల్లో ఖాళీ స్థలాలన్నీ సేంద్రియ క్షేత్రాలుగా మారాయి. అక్కడ వీటిని ‘ఆర్గానోపోనికోస్’ అని పిలుస్తున్నారు. ‘సమీకృత సస్య రక్షణ, పంటల మార్పిడి, కంపోస్టు తయారీ, భూసార పరిరక్షణ చర్యలు పెద్ద ఎత్తున అమలయ్యాయి. అడుగు ఎత్తున మడులను నిర్మించి, డ్రిప్‌తో పంటలు సాగు చేశారు. వర్మి కంపోస్టు, పశువుల ఎరువు, జీవన ఎరువులతో పాటు 25% మట్టిని కలిపి మట్టి మిశ్రమాన్ని తయారు చేసి ఈ ఎత్తు మడుల్లో పంటల సాగుకు వినియోగిస్తున్నారు. ఇలా అమలు చేసిన పర్మాకల్చర్, వర్మికల్చర్ తదితర సాంకేతికతలనే ఇప్పుడు క్యూబా ఇతర దేశాలకు అందిస్తోంద’ని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది స్టడీ ఆఫ్ క్యూబా అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ స్టీఫెన్ విల్కిన్సన్ చెప్పారు. 1993లో క్యూబా వ్యవసాయ మంత్రిత్వ శాఖలో ప్రపంచంలోనే తొట్టతొలి పట్టణ వ్యవసాయ విభాగం ఏర్పాటైంది. నగరాలు, పట్ణణాల్లో పంటల సాగుకు ఆసక్తి చూపిన కుటుంబానికి లేదా చిన్న సమూహానికి ఎకరం పావు (0.5 హెక్టారు) చొప్పున ప్రభుత్వం స్థలం కేటాయించింది. వాళ్లు తమకు అవసరమైన కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు పండించుకొని తింటూ.. మిగిలినవి ఇతరులకు అమ్ముతుంటారు. ఈ ప్లాట్లు కాకుండా.. నగరం మధ్యలో, పరిసరాల్లో 5–10 ఎకరాల విస్తీర్ణంలో డజన్ల కొద్దీ పెద్దస్థాయి సేంద్రియ క్షేత్రాలు (ఆర్గానోపోనికోలు) ఏర్పాటయ్యాయి. సహకార సంఘాలే వీటిని నిర్వహిస్తున్నాయి. బచ్చలి కూర, పాలకూర, టమాటాలు, మిరియాలు, గుమ్మడికాయలు, బత్తాయిలు, ఔషధ మొక్కలు, అనేక ఇతర పంటలను భారీ పరిమాణంలో పండించి తక్కువ ధరకు ప్రత్యేక దుకాణాల్లో సహకార సంఘాలు విక్రయిస్తూ ఉంటాయి. హవానా నగరంలో దేశాధినేత కార్యాలయానికి అతి దగ్గర్లోనే 3 హెక్టార్లలో ‘ఆర్గానోపోనికో ప్లాజా’ క్యూబా ఆహార సార్వభౌమత్వాన్ని చాటుతూ ఉంటుంది. 1995 నాటికే క్యూబా రాజధాని నగరం హవానాలో ఇలాంటి 25,000 సేంద్రియ తోటలు వెలిశాయి. 2020 నాటికి వీటి సంఖ్య 30 వేలకు చేరింది. ఆ విధంగా క్యూబా సమాజం తనపై విరుచుకుపడిన ఆంక్షలను, ఆకలిని అర్బన్ అగ్రికల్చర్ ద్వారా జయించింది. (క్లిక్ చేయండి: అర్బన్ ఫుడ్ హీరో మజెదా బేగం!) – పంతంగి రాంబాబు prambabu.35@gmail.com -
అర్బన్ ఫుడ్ హీరో మజెదా బేగం!
కోవిడ్ మహమ్మారి సృష్టించిన ఆహార, ఆదాయ కొరత సమస్యల నుంచి బయటపడటానికి బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో పేద కుటుంబాలకు.. ఐరాసకు చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్.ఎ.ఓ.) కొత్త బతుకు బాట చూపింది. అందుబాటులో ఉన్న స్థలాల్లో మెరుగైన పద్ధతుల్లో సేంద్రియ కూరగాయల సాగు నేర్పించింది. ఎక్కడో మారుమూల గ్రామాల్లో వ్యవసాయక కుటుంబాల్లో పుట్టి పొట్ట చేతపట్టుకొని నగరాలకొచ్చి స్థిరపడిన పేదలకు స్వీడన్ నిధులతో ఎఫ్.ఎ.ఓ. అర్బన్ గార్డెనింగ్‌లో ఇచ్చిన శిక్షణ వారికి కొత్త భరోసా ఇస్తోంది. దీంతో 2.2 కోట్ల జనాభాతో కాంక్రీటు నివాసాలతో కిటకిటలాడే ఢాకా నగరం అంతటా కోవిడ్ కష్టకాలంలో సేంద్రియ కూరగాయ తోటలు వెలిశాయి. ఇవి పేదలకు సేంద్రియ ఆహారాన్ని రుచి చూపించాయి! ‘సేంద్రియ ఎరువులు ఎలా తయారు చేసుకోవాలో, ఎలా ఉపయోగించాలో, నా కుటుంబం కోసం సేంద్రియ కూరగాయలను ఎలా పండించాలో శిక్షణకు హాజరైన తర్వాత నాకు తెలిసింది’ అని మజెదా బేగం ఆనందంగా చెబుతోంది. ఢాకాలో నివాసం ఉండే పేద కుటుంబాల్లో ఆమె కుటుంబం ఒకటి. భర్త, ఐదుగురు పిల్లలతో కలసి రెక్కల కష్టం మీద మజెదా బేగం కుటుంబాన్ని లాక్కొస్తుంటుంది. కోవిడ్ విరుచుకుపడే సమయానికి టీ స్టాల్ నడుపుకుంటూ, చిన్నా చితకా వస్తువులు అమ్ముతూ, మురికివాడలో జీవనం సాగించేవారు. టీ స్టాల్ ప్రారంభించిన తర్వాత జీవన పరిస్థితులు అంతకుముందుకన్నా మెరుగుపడినప్పటికీ, వచ్చే ఆదాయం కుటుంబానికి పూర్తిగా సరిపోయేది కాదు. ఐదుగురు పిల్లలకు మరింత మెరుగైన పోషకాహారాన్ని అందించడం ఎలాగూ సాధ్యపడదు. అయితే, ఆహార వ్యవసాయ సంస్థ తోడ్పాటు వల్ల మజెదా ఏర్పాటు చేసుకున్న అర్బన్ కిచెన్ గార్డెన్ ఈ కొరత తీర్చింది. అసంఘటిత రంగంలో ఆహార, ఆర్థిక అభద్రత మధ్య జీవనం సాగించే అనేక మందిలాగే మజెదా కుటుంబాన్ని కూడా కోవిడ్ దారుణంగా దెబ్బ తీసింది. లాక్డౌన్ వల్ల జీవనాధారమైన టీ స్టాల్‌ను మూసివేయవలసి వచ్చినప్పుడు మజెదా చేతిలో డబ్బేమీ లేదు. పనులు దొరకడం కష్టమైపోయింది. పైగా, ఆమె భర్త తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. ఆ విధంగా ఏడుగురితో కూడిన కుటుంబానికి ఆమే జీవనాధారమైంది. అయినా, ఆమె నిరాశ పడకుండా ధైర్యంగా నిలబడింది. వ్యవసాయం అంటే ఆమెకు బాల్యం నుంచి ఉన్న ఇష్టం ఇప్పుడు ఉపయోగపడింది. ఇళ్లకు దగ్గర్లో అందుబాటులో ఉన్న స్థలాల్లో సేంద్రియ కూరగాయలు పండించటం, కుటుంబం తినగా మిగిలిన కూరగాయలను అమ్మి ఆదాయం పొందటంలో పేద మహిళలకు ఎఫ్.ఎ.ఓ. శిక్షణ ఇచ్చింది. దీంతో, ఢాకా నగరం మధ్యలో ఇళ్ల వెనుక స్థలాలు, ఖాళీ స్థలాల్లో, నదీ తీర ప్రాంతాల్లో ఆర్గానిక్ కిచెన్ గార్డెన్లు వెలిశాయి. మజెదా కూడా కూరగాయల సాగు చేపట్టింది. ‘సేంద్రియ ఎరువులు ఎలా తయారు చేయాలో, చీడపీడల్ని ఎలా అదుపులో ఉంచాలో అంతకుముందు నాకు తెలీదు. కానీ ఇప్పుడు వాటిని ఎలా ఉపయోగించాలో, నా కుటుంబం కోసం సేంద్రియ కూరగాయలను ఎలా పండించాలో ఇప్పుడు తెలిసింది. ఇప్పటికైనా రైతును కావడం గొప్ప అదృష్టం’ అంటోంది మజెదా సంతృప్తితో. పురుగుమందులు వాడకుండా తమ కళ్ల ముందే ఆమె పండించే కూరగాయలకు స్థానికంగా చాలా డిమాండ్ ఉంది. కూరగాయల తోట ద్వారా తన కుటుంబ అవసరాలు పోను నెలకు 1500 టాకాల (సుమారు రూ. 2 వేలు) ఆదాయం పొందుతోంది మజెదా. ఐదుగురు బిడ్డలున్నా ఎన్నడూ లేనిది ఇప్పుడు ఒక బిడ్డను ఆమె బడికి పంపగలుగుతోంది. కష్టకాలంలో తన కుటుంబానికి అండగా నిలవగలిగినందుకు తనకు చాలా గర్వంగా ఉందని మజెదా పట్టలేని సంతోషంతో చెబుతోంది. ప్రపంచ ఆహార దినోత్సవం–2022 సందర్భంగా ఎఫ్.ఎ.ఓ. ఆమెను ‘ఫుడ్ హీరో’గా గుర్తించి గౌరవించింది అందుకే! (క్లిక్ చేయండి: నేచర్ అర్బైన్.. అతిపెద్ద రూఫ్‌టాప్ పొలం!) – పంతంగి రాంబాబు prambabu.35@gmail.com -
ప్రజా ఉద్యమంలా ఇంటిపంట
పట్టణ ప్రాంతాల్లో పెరుగుతున్న కాలుష్యం, ఆహారం లో పురుగు మందుల అవశేషాలు ఎరుగుతున్న నేపధ్యం లో 2011లో ‘సాక్షి’ దినపత్రిక, సుస్థిర వ్యవసాయ కేంద్రం, హార్టీకల్చర్ సొసైటీలు కలిసి హైదరాబాద్ నగరంలో ఇంటిలోనే, వున్న స్థలం లోనే కొన్ని కూరగాయలు పండించుకోవటం, ఇంటిలో ఉండే జీవ వ్యర్ధాల్ని కంపోస్ట్‌గా మార్చి వాడుకోవటం వాడుకోవటంపై కొన్ని శిక్షణలు, అనుభవాలు పంచుకోవటానికి ఒక వేదిక గా ‘ఇంటిపంట’ ప్రారంభించటం జరిగింది. ప్రతి వారం రెండు రోజులు సాక్షి పత్రికలో వ్యాసాలు, అనుభవాలు పంచుకోవటం, హైదరాబాద్ నగరం ఏదో ఒక ప్రాంతంలో ఒక సాయంత్రం దీనిపై శిక్షణ ఏర్పాటు చేయటం వలన వేల మంది ఇందులో పలు పంచుకునే అవకాశం కలిగింది. మా ఇంటితో పాటు నగరంలో చాలా ఇళ్లు ఇంటిపంటల ప్రదర్శన శాలలుగా మారాయి. ఉద్యానవన శాఖ, సుస్థిర వ్యవసాయ కేంద్రం ఇంకా అనేక సంస్థలు తమ ఆఫీస్‌పైన కూడా కూరగాయలు పండించటం, భారతీయ విద్యా భవన్‌లాంటి స్కూళ్లలో కూడా పిల్లలతో ఇలాంటి ప్రయత్నాలు చేయటం జరిగింది. హైదరాబాద్‌లోని అనేక కార్పొరేట్ సంస్థల్లోను, స్వచ్ఛంద సంస్థలలోను ఈ శిక్షణలు ఏర్పాటు చేయటం, ప్రదర్శనలు ఏర్పాటు చేయటం జరిగింది. కొన్ని అపోహలు, సమస్యలు.. పరిష్కారాలు చాలా మందికి ఇంటిపైన పంటలు పెంచుకోవటానికి కుండీలు కాని, బెడ్స్ కాని ఏర్పాటు చేసుకుంటే బరువుకి ఇంటికి ఏమవుతుంది అని భయపడుతుంటారు. కుండీలు/ బెడ్స్‌లో సగానికంటే ఎక్కువ భాగం కంపోస్ట్, పావు వంతు కోకోపిట్ (కొబ్బరి పొట్టు) కలుపుకుంటే బరువు తగ్గుతుంది, నీటిని పట్టి ఉంచే గుణం పెరుగుతుంది, అలాగే మట్టి గట్టిపడే సమస్య తగ్గుతుంది. నీరు పెట్టటం వలన ఇంటి పై కప్పు పాడయ్యే అవకాశం వుంటుంది అని చాలా మంది అనుమానాలు వ్యక్తం చేస్తుంటారు. మనం కావలిసినంత మేరకే నీరు పెట్టుకోవాలి, నీరు కొద్దిగా బయటకు వచ్చినా పెద్ద సమస్య ఉండదు. సీజన్లో పండే కూరగాయలు, ఆకుకూరలు కలిపి ఈ కుండీలు/ కంటైనర్లు/ బెడ్స్ పైన పండించుకోవచ్చు. ‘ఇంటిపంట’తో వచ్చిన అనుభవాలతో ‘బడి పంట’ కూడా ప్రారంభించటం జరిగింది. చిన్న స్కూల్లో పిల్లలు నేర్చుకోవటానికి ఉపయోగపడే వాటి నుంచి, మధ్యాహ్న భోజన అవసరాలు తీరేలా, హాస్టల్ అవసరాలు తీరేలా ఈ బడి తోటలు డిజైన్ చేయటం జరిగింది. తెలంగాణ లో ఇప్పుడు కొన్ని రెసిడెన్సియల్ స్కూల్లో ఈ మోడల్స్ ఏర్పాటు చేయటం జరిగింది. అలాగే, ఇంటిపంట సాగులో భాగస్వాములు అయిన అనేక మంది అనేక మోడల్స్ ఏర్పాటు చేయటం, విత్తనాల సేకరణ, పంచుకోవటం చేయటం చేసారు. ఒక సంవత్సరంలోనే 10 వేల మందికి పైగా ఇంటిపంటలు ఏర్పాటు చేసుకున్నారంటే ఈ కార్యక్రమం ప్రభావం ఎంత వున్నది అన్నది అర్ధం చేసుకోవచ్చు. ఇప్పటికి అనేక పేర్లతో, అనేక వాట్సప్ గ్రూప్‌లలో, ఫేస్బుక్ గ్రూప్‌లలో ఇంటిపంటలు పండించుకునే వారు తమ తమ అనుభవాలు పంచుకోవటం, ఇతరుల నుంచి నేర్చుకోవటం చేస్తున్నారు. చిన్న స్థలాన్ని కూడా సమర్ధవంతంగా ఇంటి ఆహారం పండించుకోవటానికి ఎలా వాడుకోవచ్చు అని అర్ధం చేసుకోవటంతో పాటు రెండు కీలకమైన అంశాలు ఈ శిక్షణలో భాగస్వామ్యం అయ్యాయి. ఒకటి, ఇంటి వ్యర్ధాల్ని బయట పడేసి పర్యావరణాన్ని పాడు చేసే కంటే, ఇంటిలో, అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లలో, కాలనీలలోనే కంపోస్ట్ చేసుకునే పద్దతులు, రెండు, ఇంటిపై, చుట్టూ పడిన వాన నీటిని ఫిల్టర్ చేసుకొని మరల వాడుకోవటానికి ప్రయత్నం చేయటం. ఈ మూడు పద్ధతులు కాని ప్రతి ఇంటిలో పాటిస్తే నగరంలో మనం చూస్తున్న చెత్త, వర్షం రాగానే జలమయం అవుతున్న రోడ్ల సమస్యలు చాలా మటుకు తగ్గిపోతాయి. ఇందుకు ప్రతి కాలనీ/అపార్ట్మెంట్ వేల్ఫేర్ కమిటీ, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రయత్నాలు చేయాలి. ఒక చిన్న ఆలోచన, చిన్న ప్రయత్నం ఒక ప్రజా ఉద్యమంగా ఎలా తాయారు అవుతుంది అన్న దానికి మన ‘ఇంటిపంట’ ఒక ఉదాహరణ. ‘సాక్షి’ దిన పత్రిక ఆ తర్వాత చేసిన ‘సాగుబడి’ ప్రయత్నం కూడా తెలుగు రాష్ట్రాల్లో ప్రకృతి వ్యవసాయ ప్రోత్సాహానికి తోడ్పడింది. ఇలాంటి అనేక ప్రయత్నాలు ‘సాక్షి’ చేయాలని, హైదరాబాద్ నగర వాసులు ఇలాంటి ప్రయత్నాలలో భాగస్వాములు కావాలని కోరుకుంటూ అందరికీ అభినందనలతో పాటు ఇలాంటి ప్రయత్నాలకి మా వంతు సహకారం ఇస్తామని మరల, ఒకసారి ఇలాంటి ప్రయత్నం అందరం చేయాలనీ ఆశిస్తున్నాం. – డాక్టర్ జీ వీ రామాంజనేయులు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సుస్థిర వ్యవసాయ కేంద్రం (90006 99702) -
పదేళ్ల మన ‘ఇంటిపంట’
సేంద్రియ ఇంటిపంటల సాగులో ఆధునిక పద్ధతులను తెలుగునాట విస్తృతంగా వ్యాప్తిలోకి తెచ్చిన కాలమ్ ‘ఇంటిపంట’. మేడలపై కుండీల్లో, మడుల్లో పంటలు పండించి తినటం అయ్యేపనేనా అని మొదట్లో సందేహించినా.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోని నగరాలు, పట్టణాలే కాదు గ్రామాల్లో కూడా పెరట్లోనో, ఇంటి ముందున్న కొద్ది పాటి స్థలంలోనో, మేడ మీదనో ఎవరికి తోచిన విధంగా వారు లక్షలాది మంది సాగు చేస్తూ ఆనందిస్తున్నారు. దేశ, విదేశాల్లో సేంద్రియ ఇంటిపంటల సాగు విశేషాలతో పాఠకులను ఆరోగ్యదాయకమైన ఆచరణ వైపు పురిగొల్పిన ‘సాక్షి’ దినపత్రికలోని ‘ఇంటిపంట’ తెలుగు పత్రికా రంగంలో ఓ ట్రెండ్‌సెట్టర్. మార్కెట్లో అమ్ముతున్న కూరగాయలు, ఆకుకూరల్లో రసాయనాల అవశేషాల వల్ల ప్రజారోగ్యానికి వాటిల్లుతున్న నష్టాన్ని గురించి ‘కాయగూరల్లో కాలకూటం’ శీర్షికన కథనాన్ని ‘సాక్షి’ ప్రచురించింది.. కథనం రాశాం. అంతటితో మన బాధ్యత తీరింది అని అంతటితో సరిపెట్టుకొని ఉంటే.. ‘ఇంటిపంట’ కాలమ్ 2011 జనవరి 21న ప్రారంభమయ్యేదే కాదు! అప్పట్లో వారానికి రెండు రోజులు ప్రచురితమైన ‘ఇంటిపంట’ కథనాలు పెద్ద సంచలనమే రేపాయంటే అతిశయోక్తి ఎంత మాత్రమూ కాదు. సీన్ కట్ చేస్తే.. సరిగ్గా పదేళ్ల తర్వాత.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది మంది సేంద్రియ ఇంటిపంటలను ఎంతో మక్కువతో సాగు చేస్తున్నారు. టెర్రస్ మీద కిచెన్ గార్డెన్ కలిగి ఉండటం ఆరోగ్యదాయకమే కాదు ఇప్పుడు అదొక స్టేటస్ సింబల్‌గా మారిపోయింది అంటారు మిద్దె తోట నిపుణులు తుమ్మేటి రఘోత్తమరెడ్డి. దాదాపు అన్ని పత్రికలు, టీవీ ఛానల్స్ ఈ ట్రెండ్‌ను అనుసరిస్తున్నాయి. సోషల్ మీడియా సంగతి అయితే ఇక చెప్పనక్కరలేదు. రఘోత్తమరెడ్డి వంటి వారు ఫేస్బుక్లో అనుదినం రాస్తూ ఉంటే.. తమ టెర్రస్‌లపై ఇంటిపంటల సాగు అనుభవాలను ప్రజలకు ప్రభావశీలంగా అందించడానికి ఏకంగా సొంత యూట్యూబ్ ఛానళ్లనే ప్రారంభించారు కొందరు సీనియర్ కిచెన్ గార్డెనర్లు! హైదరాబాద్‌కు చెందిన పినాక పద్మ, లత, నూర్జహాన్, శాంతి ధీరజ్.., వైజాగ్‌కు చెందిన ఉషా గజపతిరాజు.. ఈ కోవలోని వారే! ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం రైతులందరినీ ప్రకృతి/సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లించటమే. అందుకు చాలా ఏళ్లు పట్టవచ్చు. అయితే, అప్పటి వరకు ఆగకుండా ఇప్పటికిప్పుడు ప్రజలు (ముఖ్యంగా నగరాలు, పట్టణాల్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న వారు) తమ ఆరోగ్యం కోసం తాము చేయదగినదేమైనా ఉందా?? ఈ ప్రశ్నే ‘ఇంటిపంట’ కాలమ్ పుట్టుకకు దోహదం చేసింది. ఏ మాత్రం అవకాశం ఉన్నా ఈ రోజే సేంద్రియ ఇంటిపంటల సాగు ప్రారంభించండి అంటూ ప్రోత్సహించి.. దారి దీపం అయ్యింది ‘ఇంటిపంట’. కరోనా, ఏలూరు హెల్త్ ఎమర్జెన్సీ నేపథ్యంలో సేంద్రియ ఇంటిపంటల సాగు ఎంత అవసరమో కాదు.. కాదు.. ఎంతటి ప్రాణావసరమో ప్రతి ఒక్కరికీ బోధపడింది! వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్న ‘సాక్షి’ మీడియా గ్రూప్ చైర్పర్సన్ వైఎస్ భారతి రెడ్డి గారికి, అనుదినం వెనుక ఉండి నడిపిస్తున్న సంపాదకులు వర్ధెల్లి మురళి గారికి, ‘ఇంటిపంట’, ‘సాగుబడి’ భావనలకు ఊపిర్లూదిన అప్పటి ‘సాక్షి’ ఎడిటోరియల్ డైరెక్టర్ సజ్జల రామకృష్ణారెడ్డి గారికి.. ఈ మహాయజ్ఞంలో నన్ను ‘కలం’ధారిగా చేసినందుకు వేన వేల వందనాలు!! – పంతంగి రాంబాబు, ఇంటిపంట / సాగుబడి డెస్క్ -
హైడ్రోపోనిక్ సాగు సులువే!
ఏపీలోని కర్నూల్‌కు చెందిన సోమేశుల సుబ్బలక్ష్మి బాటనీ లెక్చరర్. పాతికేళ్లుగా చేస్తున్న ఉద్యోగం మానేసి.. తక్కువ ఖర్చుతో ఇంట్లోనే ఆకుకూరలు, కూరగాయలను హైడ్రోపోనిక్ పద్ధతిలో సాగు చేసుకునే హోమ్ కిట్లను రూపొందించారు. వీటిలో ఉపయోగించే పోషకాల మిశ్రమాలను మార్కెట్లో లభించే ధరలో సగానికే అందుబాటులోకి తెస్తున్నారు. వీరి కృషిని ప్రోత్సహిస్తూ తిరుపతిలోని వ్యవసాయ పరిశోధనా స్థానం రూ. 4 లక్షల గ్రాంటును మంజూరు చేయటం విశేషం. భర్త డా. మైకేల్ డేవిడ్ ప్రోత్సాహంతో ఏడాదిన్నర క్రితం శుద్ధ గ్రీన్స్ అనే స్టార్టప్‌ను స్థాపించారు సుబ్బలక్ష్మి. అపార్ట్మెంట్లలో నివసించే మధ్యతరగతి కుటుంబాలకు అనువైన ౖహైడ్రోపోనిక్ హోమ్ కిట్లను రూపొందించారు. బాల్కనీలో, కారిడార్లలో, గ్రిల్‌కు, ఇంటి ముందు, ఇంటిపైన అమర్చుకోవచ్చని సుబ్బలక్ష్మి తెలిపారు. తమ అపార్ట్మెంట్ భవనం టెర్రస్ పైన 700 చదరపు అడుగులలో ఇనుప చువ్వలతో పందిరి వేసి దానిపై ఇన్సెక్ట్ నెట్ వేసి.. అందులో హైడ్రోపోనిక్ పద్ధతిలో ఆకుకూరలు సాగు చేస్తున్నారు. తాము తినటంతోపాటు ఇతరులకూ వంద గ్రాములు రూ. పదికి అమ్ముతున్నారు. కుండీలు, మడుల్లో కన్నా హైడ్రోపోనిక్ పద్ధతిలో 15 రోజులు ముందుగానే ఆకుకూరలు కోతకు వస్తాయని సుబ్బలక్ష్మి తెలిపారు. ప్రోట్రేలలో కొబ్బరి పొట్టు నింపి, ఆకుకూరల విత్తనాలు వేసి 21 రోజులు పెంచుతారు. ఆ తర్వాత మొక్కలను పీవీసీ పైపులతో తయారైన ఎన్.ఎఫ్.టి. ఛానల్స్‌లో పెడతారు. ఆ పైపులలో నిరంతరం పోషకాలతో కూడిన నీరు సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. ఇలా పెట్టిన పాలకూర, కొత్తిమీర, ఎర్రతోటకూర, సిరికూర, గోంగూర, గంగవాయిలి, పుదీన తదితర పంటలు 20–25 రోజుల్లో ఆకుకూరలు కోతకు వస్తున్నాయని ఆమె తెలిపారు. ఆకుకూరలు, మొక్కలు పెరగడానికి 16 మూలకాలు కావాలి. అందులో కార్బన్, ఆక్సిజన్, హైడ్రోజన్ మొక్కలు వాతావరణంలో నుంచి తీసుకుంటాయి. మితగా 13 రకాలతోపాటు కొన్ని రకాల జీవన ఎరువులను తాము తగిన మోతాదులో కలిపి రెండు రకాల పొడులు, ద్రావణాల రూపంలో ఇస్తున్నామని ఆమె తెలిపారు. బయట దొరికే వాటితో పోల్చితే సగం ధరకు తాము వీటిని వినియోగదారులకు అందిస్తున్నామన్నారు. 90, 48, 32, 24 మొక్కలు పెంచుకోవడానికి వీలయ్యే హైడ్రోపోనిక్ హోమ్ కిట్లతోపాటు పోషక మిశ్రమాలను ఇస్తున్నామన్నారు. వీటిని అనేక నగరాలతోపాటు విదేశాలకూ ఎగుమతి చేస్తున్నామన్నారు. బక్కెట్లో 4–5 రోజులకోసారి నీటిని, పోషకాలను తగు మాత్రంగా కలుపుతూ ఉంటే ఆకుకూరలను సులువుగా పండించుకోవచ్చని సుబ్బలక్ష్మి తెలిపారు. కొంచెం అవగాహన పెంచుకుంటే సాధారణ గృహిణులు సైతం ఆకుకూరలు, టమాటా, మిరపకాయలు కూడా ఇలా సులువుగా, ఆరోగ్యదాయకంగా పండించుకోవచ్చని సుబ్బలక్ష్మి(86391 03060) చెబుతున్నారు. -
మనసు మెచ్చిన పని!
రోణంకి రచన విశాఖపట్నం నగరంలో పుట్టి పెరిగినప్పటికీ వ్యవసాయం అంటే చిన్నప్పటి నుంచే మక్కువ. నాన్న మోహనరావు వ్యవసాయ కుటుంబం నుంచే వచ్చారు. ఊరెళ్లినప్పుడల్లా పొలానికి రచన తప్పకుండా వెళ్లి వ్యవసాయం గురించి గమనిస్తూ పెరిగింది. ఎమ్మెస్సీ బయోటెక్నాలజీ పూర్తి చేసి హైదరాబాద్‌లో ఓ మంచి కంపెనీలో ఉద్యోగంలో చేరారు. ♦ ఎందుకో గాని సంతృప్తిగా అనిపించలేదు. ఉద్యోగానికి బై చెప్పి.. తిరిగి వైజాగ్ వచ్చేశారు. రచన ఇక అక్కడ ఏ ఉద్యోగంలోనూ చేరలేదు.. మనసుకు నచ్చే పని చేయాలని నిర్ణయించుకున్నారు. ఇంటిపైనే కూరగాయల సాగు మొదలు పెట్టారు, సుమారు రెండేళ్ల క్రితం. ♦ విశాఖ పీఎంపాలెంలో నివసిస్తున్న రచన తొలుత 10 కుండీల్లో ఆకుకూరలు పెంచడం ప్రారంభించారు. వాళ్లు ఉంటున్న అపార్ట్మెంట్.. 5 అంతస్థుల భవనం. లిఫ్ట్ లేదు. మట్టి, సేంద్రియ ఎరువు కొని తెచ్చి తండ్రితో కలిసి స్వయంగా మేడపైకి మోసుకుంటూ వెళ్లి మొక్కల పెంపకం ప్రారంభించారు. నగర శివార్లలో ఉన్న పశువుల కొట్టాం నుంచి ఆవుపేడ ఎరువును కొనుగోలు చేసి, మట్టిలో కలిపి కుండీలు, మడుల్లో వినియోగిస్తున్నారు. వంటింటి వ్యర్థాలను ఏ రోజుకారోజు కుండీలు, మడుల్లో వేస్తున్నారు. నెలకోసారి వర్మీ కంపోస్టు కొంచెం కొంచెం మొక్కలకు వేస్తున్నారు. జీవామృతం కూడా ఇక మీదట వాడాలనుకుంటున్నానని తెలిపారామె. ♦ రెండేళ్ల క్రితమే మొదలు పెట్టినా ఏడాది క్రితం నుంచి పూర్తిస్థాయిలో సేంద్రియ ఇంటిపంటలపై దృష్టి కేంద్రీకరించానన్నారు. వంగ, మిరప, మొక్కజొన్నతో పాటు వేరుశనగ వంటి పంటలు కూడా పండిస్తున్నారు. కొద్ది నెలల క్రితం కొన్ని కుండీల్లో రాగులు కూడా పండించారు. జామ తదితర పండ్ల మొక్కలను సైతం నాటారు. ♦ ఎత్తు తక్కువలో ఉండే సిల్పాలిన్ మడిలో మొక్కల్ని పెంపుడు కుక్క తవ్వి పాడు చేస్తోందని ఓ ఉపాయం ఆలోచించారు రచన. టెర్రస్ మీద కొద్ది అడుగుల ఎత్తులో కట్టెలతో మంచె లాగా కట్టి.. దానిపైన సిల్పాలిన్ బెడ్‌ను ఏర్పాటు చేశారు. అందులో గోంగూర, తోటకూర తదితర ఆకుకూరలు పెంచుతున్నారు. వీటితో పాటు టమాటా, మిరప నారు కూడా పోశారు. మొక్కలు పెరిగిన తర్వాత పీకి కుండీల్లో నాటుతానన్నారు. ♦ దేశవాళీ కూరగాయలతోపాటు నలుపు, పసుపు రంగు టమాటాలు, పర్పుల్ బీన్స్ వంటి విదేశీ రకాలను కూడా సాగు చేయటం తనకు ఇష్టమన్నారు. కోవిడ్ మహమ్మారి వ్యాపిస్తున్న నేపథ్యంలో సేంద్రియ ఇంటిపంటలపై మరింత శ్రద్ధ పెరిగిందన్నారు. తమ టెర్రస్ గార్డెన్లో పండించే కూరగాయలు, ఆకుకూరలతో సుమారు 50% మేరకు ఇంటి అవసరాలు తీరుతున్నాయని.. తాను ఇంకా చాలా మెలకువలు నేర్చుకోవాల్సి ఉందని, మరింత ఎక్కువ పంటలు ఏడాది పొడవునా కొరతలేకుండా పండించాలన్నది తన అభిమతమని రచన అంటున్నారు. – కరుకోల గోపీ కిశోర్ రాజా, సాక్షి, విశాఖపట్నంఫోటోలు: ఎమ్డీ నవాజ్ రైతు కష్టం తెలుస్తుందని.. మా ఇంటిపైన పండిస్తున్న పంటలను చూసి స్నేహితులు చాలా మంది అభినందిస్తున్నారు. అందుకే ఈ పంటలపై అందరికీ అవగాహన కల్పించాలని భావించాను. ఇందుకోసం సోషల్ మీడియాని వేదికగా ఎంచుకున్నాను. నా ఇన్స్టాగ్రామ్ పేజ్‌లో మా మేడపై పండుతున్న కూరగాయల ఫోటోల్ని షేర్ చేశాను. అందరూ అభినందిస్తున్నారు. కొంతమంది తాము కూడా ఇంటిపంటల సాగు ప్రారంభిస్తామని మెసేజ్ చేస్తున్నప్పుడు చాలా ఆనందమనిపించింది. నా ఏజ్ ఉన్న వారిలో చాలా మందికి పంటలు పండించేందుకు రైతులు ఎంత కష్టపడతారనే విషయం తెలీదు. ఇలా స్వయంగా ప్రారంభిస్తే.. రైతు కష్టం తెలుస్తుందని నా ఉద్దేశం. మొక్కల వెరైటీలు.. ఇంకా ఎక్కువ పెంచేందుకు ప్రయత్నిస్తున్నాను. – రోణంకి రచన, విశాఖపట్నం ఇన్స్టాగ్రామ్:@organic.blooms -
ఇంటిపట్టునే సేంద్రియ కూరగాయలు, చేపల సాగు!
- చేపల విసర్జితాలతో కూడిన నీటితోనే పంటల సాగు - మట్టి లేకుండా బేబీ చిప్స్‌లో పంటల సాగు గుప్పెడు మట్టి లేకుండా.. చిటికెడు ఎరువు వే యకుండా, పురుగు మందులను పిచికారీ చేయకుండా ఒకేచోట.. సేంద్రియ పద్ధతుల్లో అటు చేపలు, ఇటు ఆకుకూరలు, కూరగాయలను పండించడాన్ని ‘ఆక్వాపోనిక్స్’ అంటారు. ట్యాంకులో చేపలు, పక్కనే కుండీల్లో కూరగాయ పంటలు పండిస్తూ.. చేపల విసర్జితాలతో కూడిన పోషక జలాన్ని కుండీల్లో మొక్కలకు అందిస్తే.. వేరే ఎరువులు అవసరం లేకుండానే పంటలూ పండుతాయి. ఇదే ఆక్వాపోనిక్స్ పద్ధతి. ఈ పద్ధతిలో ఇంటిపట్టునే సేంద్రియ చేపలు, సేంద్రియ ఇంటిపంటలను సాగు చేస్తున్నాడో వికలాంగ యువకుడు.. అందె జాన్ రాబర్ట్సన్ పోలియో బాధితుడు. చిన్నతనంలోనే పోలియోసోకి ఎడమకాలు చచ్బుబడినా చేతి కర్రలే ఊతంగా నడవడమే కాకుండా.. ఆత్మవిశ్వాసంతో ఆక్వాపోనిక్స్ పద్ధతిలో సేంద్రియ ఇంటిపంటలు పండిస్తున్నాడు. ప్రకాశం జిల్లా చీరాల మండలం ఈపురుపాలెం ఆయన స్వగ్రామం. రాబర్ట్సన్ 2014 నవంబర్‌లో ఆక్వాపోనిక్స్ సాగుకు శ్రీకారం చుట్టారు. తొలుత 5 అడుగుల వెడల్పు, 10 అడుగుల పొడవు, 6 అడుగుల ఎత్తు గల ప్లాస్టిక్ ట్యాంక్‌ను ఏర్పాటు చేసి నీటితో నింపారు. అందులో తిలాపియా, జలలు, మట్టగుడిసె, చేదుపక్కెలు వంటి 150 చేపపిల్లలను ఈ ట్యాంక్‌లో వదిలారు. వీటి విసర్జితాల ద్వారా ట్యాంకులో నీరు పోషక జలంగా మారుతుంది. ఈ నీటిని మోటార్ ద్వారా నిలువుగా సగానికి కోసిన ప్లాస్టిక్ డ్రమ్ముల్లో సాగవుతున్న కూరగాయలు, పండ్ల మొక్కలకు అందిస్తున్నారు. చేపల విసర్జితాల ద్వారా విడుదలైన నత్రజని, భాస్వరం వంటి పోషకాలతోనే ఈ పంటలు పండుతున్నాయి. మట్టికి బదులు బేబీ చిప్స్.. ఈ విధానంలో ఇంటిపంటల సాగులో మట్టిని వాడరు. మొక్కల పెంపకానికి 250 లీటర్ల నీరుపట్టే ప్లాస్టిక్ డ్రమ్ములను వాడుతున్నారు. ఒక్కో డ్రమ్మును నిలువుగా రెండు చీలికలు చేసి.. క్రషర్ నుంచి తెచ్చిన సన్న కంకర (బేబీ చిప్స్)తో నింపారు. కంకరలో రెండు అంగుళాల లోతులో నారు లేదా విత్తనాలు నాటుతారు. చేపల ట్యాంక్ నుంచి మొక్కలకు నీటిని అందించేందుకు ప్లాస్టిక్ పైపులను అమర్చారు. నీరు మొక్కలను పెంచే డబ్బాల్లోకి వచ్చేందుకు, తిరిగి చేపల తొట్టెలోకి వెళ్లేందుకు ప్లాస్టిక్ పైపులను అమర్చారు. ఇంటిపంటలకు వీటి ద్వారా రోజూ 10 గంటల పాటు పోషక జలం నిరంతరాయంగా సరఫరా అవుతుంది. నీటిని సరఫరా చేసేందుకు మోటార్‌ను, విద్యుత్ కోసం సౌరఫలకాలను ఏర్పాటు చేసుకున్నారు. ఆక్వాపోనిక్స్ సాగు వ్యవస్థను ఏర్పాటు చేయడానికి మొత్తం రూ. 2 లక్షల ఖర్చయిందని, తన సోదరుడు, స్నేహితుల తోడ్పాటుతో ఏర్పాటు చేశానని రాబర్ట్సన్ తెలిపారు. కుటుంబానికి సరిపడా కూరగాయలు, చేపల సాగు గోంగూర, తోటకూర, పుదీనా వంటి ఆకుకూరలను, బీర, సొర, కాక ర, బెండ, వంగ వంటి కాయగూరలను, బొప్పాయి వంటి పండ్ల మొక్కలను రాబర్ట్సన్ సాగు చేస్తున్నారు. ప్రస్తుతం ఆరుగురు సభ్యులు గల తమ కుటుంబానికి సరిపడా కూరగాయలను పండిస్తున్నారు. చేపలను తమ ఇంటి అవసరాలకు విడతకు పట్టుబడి చేస్తారు. ఏడాదిన్నరలో విడతకు 15 కిలోల చొప్పున 5 సార్లు చేపల దిగుబడి వచ్చింది. ప్రతి రెండు నెలలకోసారి చేపల తొట్టెను ఖాళీ చేసి, కొత్త నీటితో నింపుతారు. చేపలకు, మొక్కలకు ప్రత్యేకంగా ఎటువంటి ఎరువులు, పురుగుమందులు వాడాల్సిన అవసరం లేదని రాబర్ట్సన్ చెబుతున్నాడు. ఎలాంటి రసాయనాలు వేయకుండా పండిస్తున్న ఉత్పత్తులు కావటంతో తమకూ కావాలని కొందరు అడుగుతున్నారు. ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తే.. దీన్ని మరింత విస్తరించి ఉపాధి మార్గంగా మార్చుకుంటానని రాబర్ట్సన్ (99497 19220) అంటున్నారు. వినూత్నమైన స్వయం ఉపాధి మార్గాన్ని ఎంపిక చేసుకున్న రాబర్ట్‌సన్‌కు జేజేలు! - గుర్నాధం, సాక్షి, చీరాల టౌన్, ప్రకాశం జిల్లా -
చెక్క పిరమిడ్ ఇంటిపంటల కల్పవల్లి!
- తక్కువ స్థలంలోనే పలు రకాల మొక్కల పెంపకం - అన్ని రకాల మొక్కల పెంపకానికి అనుకూలం తక్కువ స్థలంలోనే వివిధ రకాల ఆకుకూరలు, కాయగూర మొక్కలను కలిపి ఎక్కువ సంఖ్యలో పెంచుకునేందుకు అనువైన బహుళ ప్రయోజనాలు గల చెక్క పిరమిడ్ (మల్టీ ప్లాంటర్)ను విజయనగరం జిల్లా కొత్తవలస గ్రామానికి చెందిన కర్రి రాంబాబు (95508 18297) రూపొందించారు. ఇందులో ఒకేసారి 200-300 మొక్కలను పెంచవచ్చు. దీని తయారీలో అంగుళం మందం గల చెక్కలను రాంబాబు వాడారు. దీని తయారీకి రూ. 500 ఖర్చయింది. మొత్తం ఐదు అరలుగా దీన్ని రూపొందించారు. అట్టడుగున ఉన్న అర 4 అడుగుల పొడవు వెడల్పుతో ఉంటుంది. తర్వాత నిర్మించే ప్రతి అరను 4 అంగుళాల చొప్పున తగ్గించుకుంటూ వచ్చారు. ఆఖరు అర అడుగు పొడవు అడుగు వెడల్పు ఉంటుంది. ముందుగా ఇంటిపై గచ్చు బండను ఏర్పాటు చేసి వర్మికంపోస్టు, కోకోపిట్ల మిశ్రమాన్ని వేసుకోవాలి. దానిపై చెక్క పిరమిడ్‌ను ఉంచాలి. వేర్లు తక్కువగా పెరిగే కొత్తిమీర, పాలకూర వంటి ఆకుకూరల విత్తనాలను కింది అరల్లోను, ఎక్కువ వేరు వ్యవస్థ ఉండి ఎత్తు పెరిగే బెండ, వంగ విత్తనాలను పై రెండు అరల్లోను వేసుకోవాలి. స్థలం ఎక్కువగా ఉండటం వల్ల వేర్లు ఎక్కువ దూరం విస్తరించి మొక్క పోషకాలను గ్రహిస్తుంది. దృఢంగా పెరిగి మంచి ఫలసాయాన్నిస్తాయి. వివిధ రకాల మొక్కలు కలిపి పెంచటం వల్ల చీడపీడల ఉధృతి తగ్గుతుంది. బెండ, మిరప, వంగ వంటి మొక్కల నీడన ఆకుకూరల పెరుగుదల బావుంటుంది. నీటిని పొదుపు చేయవచ్చు. 10 లీటర్ల ప్లాస్టిక్ డబ్బాలో నీరుపోసి డ్రిప్పు ద్వారా రోజంతా నీటిని సరఫరా చేయవచ్చు. ఇందులో సాగు చేసిన బెండ, వంగ, మిరప వంటి చెట్లు రెండు నుంచి మూడేళ్ల పాటు దిగుబడినిస్తాయి. స్థలం కలిసి వస్తుంది. కుండీలకయ్యే ఖర్చు ఆదా అవుతుంది. ఇంటిపంటలు పెంచేవారు తమకు కావాలసిన కొలతలోను ఈ చెక్క పిరమిడ్లను తయారు చేసుకోవచ్చు. - ఇంటిపంట డెస్క్ -
ఇంటితోట కూరల రుచి ఎంతో ఇష్టం!
ప్రకృతితో మమేకమవ్వాలనే ఆకాంక్ష చాలా మందికి ఉంటుంది. కానీ, ఆ ఆకాంక్షకు కార్యరూపం ఇవ్వగలిగేది కొందరే. అటువంటి కోవలోని వారే డాక్టర్ కొండా శ్రీదేవి. హైదరాబాద్ కృష్ణనగర్‌లో సొంత ఆసుపత్రిలో గైనకాలజిస్టుగా బిజీగా ఉండే ఆమె తన ఆసుపత్రి మేడ మీద ప్రత్యేక శ్రద్ధతో గార్డెన్ ఏర్పాటు చేసుకున్నారు. ఇనుప మెట్లను ఏర్పాటు చేసి వాటిపై ప్లాస్టిక్ కుండీలను అమర్చారు. పూలమొక్కలతోపాటు సేంద్రియ పద్ధతుల్లో అనేక రకాల ఆకుకూరలు, కూరగాయలను పదేళ్లుగా పండిస్తున్నానని డా. శ్రీదేవి తెలిపారు. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం కొంత సేపు మొక్కల పనిలో గడుపుతానన్నారు. పెద్ద కుండీలో దానిమ్మ చెట్టు ఫలాలనిస్తోంది. ఎక్కువ కుండీల్లో వంగ, మిరప, టమాటా పండిస్తున్నారు. ఎత్తు తక్కువగా ఉండే వెడల్పాటి మట్టి కుండీలో కొత్తిమీర, పాలకూర సాగు చేస్తున్నారు. ఈ సీజన్ ప్రారంభంలో తెలంగాణ రాష్ట్ర ఉద్యాన శాఖ సబ్సిడీపై రూ. 3 వేలకు అందిస్తున్న ఇంటిపంటల కిట్‌ను కొనుగోలు చేశారు. వారు ఇచ్చిన సిల్పాలిన్ బెడ్స్‌లో టమాటాతోపాటు చిక్కుడు, గోరుచిక్కుడు, బెండ విత్తారు. మట్టిలో పశువుల ఎరువు కొంచెం కలిపిన మట్టి మిశ్రమం వాడుతున్నానని, నెలకోసారి ప్రతి కుండీకీ కొద్ది మొత్తంలో వర్మీ కంపోస్టు వాడుతున్నానని ఆమె తెలిపారు. మొక్కలతో సంభాషిస్తూ వాటి బాగోగులు చూసే పనిలో నిమగ్నమైతే రోజంతా పనిచేసిన అలసట ఇట్టే మాయమవుతుందన్నారు. మొక్కలు మరింత ఏపుగా పెరగడం కోసం, చీడపీడల నివారణకు కంపోస్టు టీని, ట్రైకెడోర్మా విరిడి ద్రావణాన్ని కూడా వాడాలనుకుంటున్నానని డా. శ్రీదేవి తెలిపారు. తాను పండించుకున్న వంకాయలు, టమాటాల రుచి తనకెంతో ఇష్టమని ఆమె సంతృప్తిగా చెప్పారు. నగరవాసుల ఆరోగ్యదాయకమైన జీవనానికి సేంద్రియ ఇంటిపంటల సాగు చాలా అవసరమని అంటున్న డా. శ్రీదేవి ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ (రిటైర్డ్) సంగెం చంద్రమౌళి కుమార్తె. వివరాలకు 98495 66009 నంబరులో ఆయనను సంప్రదించవచ్చు. - ఇంటిపంట డెస్క్ (intipanta@sakshi.com) ఫొటోలు: రాంపురి లావణ్యకుమార్ -
హైదరాబాద్‌వాసులకు సబ్సిడీపై ‘ఇంటిపంట’ కిట్లు
హైదరాబాద్ - సికింద్రాబాద్ జంట నగరాల్లో నివాసం ఉంటూ మేడలపైన, పెరట్లో సేంద్రియ ఇంటిపంటలు సాగు చేయదలచుకునే వారిని ప్రోత్సహించడానికి తెలంగాణ రాష్ట్ర ఉద్యాన శాఖ 50 శాతం సబ్సిడీపై కిట్లను ఈ ఏడాది కూడా అందిస్తున్నది. సిల్పాలిన్ బెడ్స్ 4, విత్తనాలు, స్ప్రేయర్, పరికరాలు, వేపనూనె, వేపపిండి, క్రీపర్ మెష్ తదితరాలను సబ్సిడీ పోను రూ. 2 వేలకు ఇస్తున్నారు. పశువుల ఎరువు కలిపిన మట్టి మిశ్రమం బస్తాలు కూడా కావాలంటే మరో రూ. వెయ్యి చెల్లించాల్సి ఉంటుంది. వివరాలకు.. హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్‌లోని ఉద్యాన అధికారిణి అరుణను 837 444 9458 నంబరులో సంప్రదించవచ్చు. ఇంటిపంటల సాగుకు బెడ్ల నిర్మాణం ఇలా... కొత్తగా ఇంటిపంటలు సాగు చేయాలనుకునే వారికి తొలుత అనేక సందేహాలు తలెత్తటం సహజం. ముఖ్యంగా మొక్కలను పెంచేందుకు అవసరమైన బెడ్ల నిర్మాణంలో మరిన్ని జాగ్రత్తలు అవసరం. ఒక్కసారి నిర్మిస్తే శాశ్వతంగా ఉండేవి కాబట్టి ఆకారం, కొలతలు తెలుసుకొని అవసరాలకు అనుగుణంగా ప్రణాళికా బద్ధంగా నిర్మించుకోవటమే ఉత్తమం. అయితే వీటి గురించి తెలుసుకునేందుకు సమయం వెచ్చించి వేరే ప్రదేశాలకు వెళ్లి పరిశీలించటం అందరికి సాధ్యం కాకపోవచ్చు. అలాంటి వారికి అనుభవజ్ఞుల సలహాలు ఎంతగానో ఉపకరిస్తాయి. కొత్తగా ఇంటిపంటలను పెంచేవారికి సహకరించేందుకు సీనియర్ ఇంటిపంటల సాగుదారు తుమ్మేటి రఘోత్తమరెడ్డి ముందుకొచ్చారు. రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ మండలం నారపల్లిలో ఆధునీకరించిన తన రూఫ్‌గార్డెన్ ఫోటోలను ఫేస్బుక్లో ఉంచుతున్నారు. ఈ ఫోటోలను చూపితే తాపీ మేస్త్రీలకు అవగాహన వస్తుంది. చిన్న చిన్న మార్పులతో కావలసిన విధంగా బెడ్లు నిర్మించుకుని ఇంటిపంటలను సాగు చేసుకోవచ్చు. ఇంకా సందేహాలుంటే రఘోత్తమ్‌రెడ్డి (90001 84107) ని సంప్రదించవచ్చు. కరీంనగర్‌కు చెందిన రమేష్ సూదం (99492 93068) గారి ఇంటిపైన సిమెంటుతో బెడ్లు నిర్మిస్తున్నారు. సమీప ప్రాంతాల వారు అవగాహన కోసం ఆ ఇంటిపంటలను వెళ్లి చూడవచ్చు. -
‘ఉపాధి మార్గంగా ఇంటిపంటల సాగు’పై రెండు రోజుల ఉచిత శిక్షణా శిబిరం!
మేడలపై ఖాళీ స్థలాల్లో సేంద్రియ ఇంటిపంటల సాగు కేవలం ఒక వ్యాపకం కాదు. ప్రపంచవ్యాప్తంగా పట్టణాలు, నగరాల్లో వేగంగా విస్తరిస్తున్న సేంద్రియ ఆహారోత్పత్తి ఉద్యమం కూడా. అయితే, ఇంటిపంటల ఆవశ్యకతను గుర్తించిన వారందరూ వాటిని నిపుణుల సహాయం లేకుండా తమకు తామే ఏర్పాటు చేసుకోలేరు. అందువల్ల పట్టణాలు, నగరాల్లో మేడలపై ఇంటిపంటల మడుల నిర్మాణం, కుండీల ఏర్పాటు అనేది ఒకానొక చక్కని ఉపాధిమార్గంగా మారింది. ఈ ఉపాధి మార్గాన్ని అనుసరించదలచిన వారికి సీనియర్ ఇంటిపంటల సాగుదారు, ప్రముఖ రచయిత తుమ్మేటి రఘోత్తమరెడ్డి రెండు రోజుల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. గత ఆరేళ్లుగా తమ కుటుంబానికి అవసరమైనంత మేరకు ఆకుకూరలు, కూరగాయలు, కొన్ని రకాల పండ్లను ఆయన మేడపైనే పండించుకుంటున్న సంగతి తెలిసిందే. రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ మండలం నారపల్లిలోని తమ మేడపైనే ఈ నెల 24, 25 తేదీల్లో ఆయన శిక్షణ ఇవ్వనున్నారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి (16 కి.మీ.) సిటీబస్‌లో 45 నిమిషాల్లో నారపల్లి చేరుకోవచ్చు. అభ్యర్థులు వసతి, భోజన సదుపాయాలను ఎవరికి వారే చూసుకోవాలి. శిక్షణ పొందదలచిన వారు ముందే విధిగా పేర్లు నమోదు చేయించుకోవాలి. రఘోత్తమరెడ్డిని 90001 84107 నంబరులో సంప్రదించవచ్చు. వరిలో ఎద పద్ధతి.. దిగుబడిలో మేటి.. కాలవకింది మాగాణి భూములకు నీరు ఎప్పుడు అందుతుందో తెలియని పరిస్థితుల్లో దమ్ము చేసి నాట్లు వేయటం రైతుకు నష్టదాయకంగా మారింది. నీటి కోసం ఎదురు చూసి ఆలస్యంగా వరి సాగు మొదలుపెట్టటం వల్ల రెండో పంట సాగు కష్టమవుతోంది. ఎద పద్ధతిలో వరిసాగు ద్వారా ఈ పరిస్థితులను అధిగమించవచ్చు. వరిలో నాట్లువేసే పద్ధతి, విత్తనాలు ఎదజల్లే పద్ధతుల్లో రెండింటి మధ్యా దిగుబడుల్లో తే డా లేదని అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ అధ్యయనంలో తేలింది. పైగా నాట్లు వేయటం కన్నా.. ఎద పద్ధతిలో సాగు చేస్తే ఎకరాకు రూ. 4-5 వేలు ఖర్చు తగ్గుతుంది. 40 బస్తాల దిగుబడి వస్తుంది. రెండో పంటగా సాగు చేసే పెసర, మినుము, మొక్కజొన్న వంటి పంటలను సకాలంలో విత్తుకోవచ్చు. ఎదబెట్టి వరి సాగు చేసే విధానం కేవలం కోస్తా జిల్లాల రైతులకే కాక, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లోను అనుసరణీయమైన విధానమేనని ఫలితాలు రుజువు చేస్తున్నాయి. అకాల వర్షాలు లేదా తొలకరి వర్షాల్లో పొడి దుక్కి చేసుకోవాలి. నాలుగు సాళ్లు దున్నిన తర్వాత విత్తనం వేయాలి. విత్తుకొనేందుకు విత్తన గొర్రును ఉపయోగించాలి. ఈ పద్ధతిలో ఎకరాకు 10-15 కిలోల విత్తనం సరిపోతుంది. రైతుకు శ్రమ.. ఖర్చు తగ్గుతుంది.. కాలవ నీరు ఆలస్యమయ్యే అవకాశం ఉండటంతో వరి విత్తనాలను ఎదజల్లే పద్ధతిని అనుసరించాలని సూచిస్తున్నాం. ఎదజల్లే పద్ధతిని గుంటూరు జిల్లాలో తొలుత నాలుగు వేల ఎకరాల్లో అనుసరించారు. అధికారుల కృషితో అనేక జిల్లాల్లో లక్షల ఎకరాలకు విస్తరించింది. నాట్లు ఆలస్యమై దిగుబడి తగ్గుంతుందనే భయం లేదు. రైతుకు శ్రమ, ఖర్చు తగ్గుతుంది. - డాక్టర్ కోటపాటి గురవారెడ్డి (98494 84398), ‘ క్లైమా అడాప్ట్’ పథకం, సమన్వయకర్త, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, లాంఫాం, గుంటూరు -
ఇంటిపైన పంటలు!
విశాఖపట్నం ఎంవీపీ కాలనీలో తన పిన్నిగారి ఇంట్లో నివసిస్తున్న ఎరకరాజు శివరామకృష్ణర రాజు అర్బన్ ఫార్మర్‌గా మారారు. వృత్తి రీత్యా వ్యాపారి అయిన ఆయన ఇంటిపంటల పెంపకాన్ని ప్రవృత్తిగా మార్చుకున్నారు. సేంద్రియ ఇంటిపంటలను సాగు చేస్తూ ఆరోగ్యకరమైన ఆహారాన్ని తమ కుటుంబ సభ్యులకు అందిస్తున్నారు. టైపైన 300కు పైగా కుండీల్లో గత ఐదు నెలలుగా సేంద్రియ ఇంటిపంటలు పెంచుతున్నారు. వేసవి ఎండల నుంచి మొక్కలను కాపాడుకునేందుకు రూ. 10 వేలు ఖర్చు చేసి షేడ్‌నెట్‌ను ఏర్పాటు చేశారు. బచ్చలి, పాలకూర, చుక్కకూర, తోటకూర, మెంతికూర వంటి ఆకుకూరలు, వంగ, బెండ, చిక్కుడు, పచ్చిమిర్చి వంటి కాయగూరలు, బీర, కాకర పెంచుతున్నారు. తీగజాతి మొక్కలకు ఆసరా కోసం వెదురు కర్రలు, ఇనుప తీగతో పందిర్లు ఏర్పాటు చేశారు. కొబ్బరిపొట్టు 5 కిలోలు, వేపపిండి రెండున్నర కిలోలు, మట్టి రెండున్నర కిలోలు, వేపపిండి 300గ్రా॥చొప్పున కలిపిన మిశ్రమాన్ని మొక్కల పెంపకంలో వాడుతున్నారు. విత్తనాలను నేరుగా కుండీల్లో విత్తకుండా ప్లాస్టిక్ ట్రేలలో విత్తి 2 వారాల నారును కుండీల్లో నాటుతారు. చీడపీడలను నివారించేందుకు లీటరు నీటికి 5 ఎం. ఎల్. వేపనూనెను కలిపి వారానికోసారి మొక్కలపై పిచికారీ చేస్తున్నారు. పోషకాలను అందించేందుకు లీ. జీవామృతాన్ని 15 లీ. నీటికి కలిపి 10 రోజులకోసారి పిచికారీ చేస్తున్నారు. ఇంటిపంటల పెంపకంతో రసాయన అవశేషాలు లేని కూరగాయలు లభిస్తాయి ఇంటికి పచ్చదనం, చల్లదనం.. వంటి బోలెడు లాభాలున్నాయి. ఈ ప్రయోజనాలతో పోల్చితే వాటి పెంపకం కోసం పడుతున్న శ్రమ చాలా తక్కువ’ అంటారు రామకృష్ణంరాజు (94919 70546). రామకృష్ణం రాజు స్ఫూర్తితో కొందరు స్నేహితులు వారి ఇళ్లపైనా ఇంటిపంటల సాగును ప్రారంభించటం విశేషం. - బొల్లం కోటేశ్వరరావు, సాక్షి, విశాఖపట్నం -
మేడపైన కూరగాయల వనం..
ఆ ఉమ్మడి కుటుంబానికి వరం! తిరుపతి పట్టణంలోని ఆ ఉమ్మడి కుటుంబం సేంద్రియ ఇంటిపంటల సాగును నెత్తిన పెట్టుకుంది. తోడికోడళ్లు చేయీ చేయీ కలిపి తమ తీరిక సమయాన్ని వెచ్చించి చాలా ఏళ్లుగా ఇంటిపంటలు పండిస్తున్నారు. కుటుంబ సభ్యులకు ఆరోగ్యకరమైన తాజా కూరగాయలు, ఆకుకూరలు, కొన్ని పండ్లను స్వయంకృషితో పండిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. తిరుపతిలోని రైల్వే కాలనీలో మట్లూరు మునికృష్ణారెడ్డి కుటుంబం చాలా ఏళ్లుగా నివాసం ఉంటున్నది. 10 మంది ఉన్న చక్కని ఉమ్మడి కుటుంబం వారిది. కలిసి ఉంటే కలదు సుఖం అని చాటిచెబుతున్న ఆ కుటుంబం చాలా ఏళ్లుగా సేంద్రియ ఇంటిపంటలు పండించుకోవడం విశేషం. సుమారు 15 ఏళ్ల క్రితం పెద్ద కోడలు మట్లూరు ఇందిరమ్మ మేడ మీద ఇంటిపంటల పెంపకానికి ముందుచూపుతో శ్రీకారం చుట్టారు. ఇందిరమ్మకు తోడికోడలు భాగ్యమ్మ వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. తీరిక సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ వారు తమ మేడపైనే కుటుంబానికి సరిపడా కూరగాయలు, ఆకుకూరలతోపాటు కొన్ని రకాల పండ్లను కూడా సాగు చేస్తున్నారు. అన్ని పనులూ తామే చూసుకుంటున్నారు. వంగ, మునగ, సొర, వంటి కాయగూరలు..కాకర, బీర వంటి తీగజాతి కూరగాయలు.. తోటకూర, బచ్చలికూర వంటి ఆకుకూరలు.. దానిమ్మ, బత్తాయి, నిమ్మ, జామ, సపోట, సీతాఫలం, అరటి వంటి పండ్ల మొక్కలను వారు ప్రత్యేక శ్రద్ధతో పెంచుతున్నారు. దీని కోసం రూ. 30 వేలు ఖర్చు చేసి ఇంటిపైనే సిమెంట్ తొట్టెలు నిర్మించారు. 40కు పైగా ప్లాస్టిక్ కుండీలను ఉపయోగిస్తున్నారు. తీగజాతి పాదుల కోసం కర్రలతో ఒక వైపున పందిళ్లు వేయించారు. మొక్కలు పెంచేందుకు చివికిన ఆవు పేడ ఎరువు, ఎర్రమట్టి మిశ్రమాన్ని వాడుతున్నారు. ప్రతి నాలుగు నెలలకోసారి కుండీలు, తొట్టెల్లో నుంచి పావు వంతు మట్టి తీసి, కొత్త మట్టి మిశ్రమాన్ని నింపుతుంటారు. ఇలా చేయడం వల్ల మొక్కల పెరుగుదల బాగుందంటున్నారు. వేప పిండి, టీ డికాషన్, వంటింటి వ్యర్థాలు, రాలిన ఆకులు, కొద్దిపాటి ఆవుపేడను కలిపి కుళ్లబెట్టి మొక్కలకు ఎరువుగా అందిస్తున్నారు. 5 మి.లీ. వేపనూనెను లీటరు నీటికి కలిపి మొక్కలపై పిచికారీ చేసి పేనుబంకను, పిండినల్లిని నివారిస్తున్నారు. వంటనూనె రాసిన పసుపు పచ్చని అట్టలను వేలాడ గట్టి రసం పీల్చే పురుగుల బెడదను నివారిస్తున్నారు. 15 రోజులకోసారి జీవామృతాన్ని మొక్కలపై పిచికారీ చేస్తున్నారు. ప్లాస్టిక్ పైపులు ఏర్పాటు చేసి మొక్కల మొదళ్ల వద్ద నీరు పడేలా వాటికి రంధ్రాలు ఏర్పాటు చేసి, నీటిని పొదుపుగా వాడుతున్నారు. - పి. సుబ్రమణ్యం, తిరుపతి కల్చరల్ రోజుకో గంట కేటాయిస్తే చాలు.. పెరుగుతున్న ఖర్చుతో భవిష్యత్తులో ఇబ్బంది తప్పదన్న ముందుచూపుతోనే 15 ఏళ్ల క్రితమే ఆకుకూరలతో మేడపై ఇంటి పంటల సాగు ప్రారంభించాము. తోడికోడళ్లు ఇద్దరమూ రోజుకో గంట సమయం కేటాయిస్తున్నాం. సేంద్రియ పద్ధతుల్లో ఆరోగ్యదాయకమైన కూరగాయలు, పండ్లను కుటుంబ సభ్యులకు తాజాగా అందించగలుగుతున్నాం. ఈ వ్యాపకం మా కుటుంబానికి ఆరోగ్యంతోపాటు ఎంతో సంతోషాన్ని, ఆహ్లాదాన్ని కూడా కలిగిస్తోంది. - మట్లూరు ఇందిరమ్మ (98496 80857), రైల్వే కాలనీ, తిరుపతి -
వారంలో 5 రోజులు ‘ఇంటి’ కూరలే!
చిన్నప్పటి నుంచి మొక్కల పెంపకంపై ఉన్న ఆసక్తి ఆమెను ఇంటిపంటల వైపు దృష్టి మళ్లించేందుకు పురికొల్పింది. మేడపైన ఉన్న కొద్ది పాటి స్థలాన్ని పొందికగా ఉపయోగించుకొని 20 రకాలకు పైగా ఇంటిపంటలను సాగు చే స్తున్నారు రాయకంటి లీలారవి. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని కమలానగర్ కాలనీలో స్వగృహంలో నివసిస్తూ.. గత రెండేళ్లుగా గృహిణిగా తనకున్న ఖాళీ సమయాన్ని ఇంటిపంటలకు వెచ్చిస్తున్నారు. నలుగురు కుటుంబ సభ్యులు గల తమ కుటుంబానికి వారానికి ఐదు రోజులకు సరిపడా సేంద్రియ కాయగూరలు, ఆకుకూరలు తమ ఇంటిపైనే పండిస్తున్నారు. 350కు పైగా మట్టి, సిమెంట్ కుండీల్లో కాయగూరలు, ఆకుకూరలు, పూల మొక్కలు పెంచుతున్నారు. వంగ, టమాట, చెట్టు చిక్కుడు, మిరప, సొర, బీర, కాకర, దోస వంటి కూరగాయలతోపాటు పుదీనా, కొత్తిమీర, తోటకూర, బచ్చలి వంటి ఆకుకూరలు పెంచుతున్నారు. మొక్కలను పెంచేందుకు రెండు పాళ్లు ఎర్రమట్టి, ఒక పాలు మాగిన ఆవు పేడ, కొంచెం ఇసుక, వేపపిండి కలిపిన మట్టి మిశ్రమాన్ని వాడుతున్నారు. కుండీ అడుగున రంధ్రాలు పూడిపోకుండా ఉండేందుకు ముందు రెండంగుళాల మందాన గులక రాళ్లు వేసి ఆపైన మట్టి మిశ్రమం నింపుతారు. ఈ మట్టి మిశ్రమాన్ని రెండేళ్లకోసారి పూర్తిగా మార్చేస్తానని ఆమె తెలిపారు. వంటింటి వ్యర్థాలు, గంజి, బియ్యం కడిగిన నీళ్లను మొక్కల పోషణకు వివిధ రకాలుగా ఉపయోగిస్తున్నారు. ఆవు పిడకల బూడిదకు.. వేపాకు పిండి, పసుపు కలిపి మొక్కలపై చల్లి, చీడపీడలను నివారిస్తున్నారు. పూల మొక్కలు, కూరగాయ మొక్కలను కొన్ని కుండీల్లో కలిపి వేశారు. దీని వల్ల తక్కువ కుండీల్లోనే ఎక్కువ దిగుబడి పొందవచ్చంటున్నారావిడ. తీగ జాతి కూరలు పాకేందుకు రెయిలింగ్‌కు ప్లాస్టిక్ వైర్లు కట్టి పందిళ్లు ఏర్పాటు చేశారు. ‘ఆరోగ్యకరమైన కూరలను ఇంటిపట్టునే పెంచుకోవటం సంతృప్తినిస్తోంది. ఆ కూరల రుచిని కుటుంబ సభ్యులు మెచ్చుకుంటుంటే ఎంతో సంతోషంగా ఉంది’ అంటున్నారు లీలారవి (99498 94433). -
కుండీ కిందే నీరు!
(ఇంటి పంట) ఆసక్తితో ఇంటిపంటల సాగు ప్రారంభించినా ఉరుకులు, పరుగుల జీవితంలో ప్రతి రోజూ మొక్కలకు నీటిని అందించటం కొంచెం ప్రయాసతో కూడిన పనే. నేల మీద పెరిగే మొక్కల కన్నా కుండీల్లోని మొక్కలు త్వరగా బెట్టకు వస్తాయి. ఈ సమస్యకు పరిష్కారంగా విశాఖపట్నంలోని విశాలాక్షి నగర్‌కు చెందిన గంటి వెంకటేష్ (99482 72715) కుండీల కిందే నీటిని నిల్వ ఉంచి, నీటిని అవసరం మేరకు మొక్కలు ఉపయోగించుకునేలా వేర్వేరు పద్ధతుల్లో ‘సెల్ఫ్ వాటరింగ్ పాట్స్’ను తయారు చేసుకొని వాడుతున్నారు. 200 కుండీల్లో ఇంటిపంటలు పెంచుతున్న వెంకటేష్ తక్కువ ఖర్చుతోనే ఇంటిపంటల సాగు సాధ్యమేనంటున్నారు. ఈ కుండీల్లో నీటిని నింపితే వారం రోజుల వరకు ఇబ్బంది ఉండదు. ఈ పద్ధతి వల్ల ఇంటిపంటల్లో కలుపు సమస్య తీరిందన్నారు. సెల్ఫ్ వాటరింగ్ పాట్ తయారీ ఇలా.. మొదటి పద్ధతి: ఈ పద్ధతిలో మొక్క ఉన్న కుండీతో పాటు నీటిని నిల్వ (రిజర్వాయర్ కుండీ) చేసేందుకు మరో కుండీని తీసుకోవాలి. మొక్క పెట్టదలచిన కుండీ అడుగున రెండంగుళాల కైవారంలో రంధ్రం చేసి.. అందులో నుంచి చిన్న ప్లాస్టిక్ బాటిల్ లేదా ప్లాస్టిక్ గ్లాస్‌ను కిందికి వచ్చేలా అమర్చాలి. దీన్ని కోకోపిట్, మట్టి మిశ్రమంతో నింపి.. బాటిల్ లేదా గ్లాస్ చుట్టూ చిన్న, చిన్న రంధ్రాలు పెట్టాలి. ఈ రంధ్రాల నుంచి గ్లాసులోని మట్టి మిశ్రమానికి కేశాకర్షక శక్త్తి (కాపిల్లరీ ఫోర్స్) ద్వారా తగుమాత్రంగా నీటి తేమ నిరంతరం అందుతూ ఉంటుంది. అడుగున ఉన్న రిజర్వాయర్ కుండీలో నీరు అయిపోయినప్పుడు.. పీవీసీ పైపు ద్వారా నీటిని పోస్తే చాలు. రిజర్వాయర్ కుండీలో నీటి పరిమాణం తెలుసుకోవటానికి కుండీకి సగం ఎత్తులో చిన్న రంధ్రం చేయాలి. మనం నీరు నింపుతుండగా నీటిమట్టం ఆ స్థాయికి వచ్చినప్పుడు, వర్షం ఎక్కువగా కురిసినప్పుడు అదనపు నీరు ఆ రంధ్రం ద్వారా బయటకు పోతుంది. రెండో పద్ధతి: వాడేసిన మినరల్ వాటర్ (20 లీటర్ల) క్యాన్లు తక్కువ ధరకు లభిస్తాయి. ఈ క్యాన్లను అడ్డంగా కోసి.. అడుగు భాగాన్ని రిజర్వాయర్ కుండీగా వాడొచ్చు. పై భాగంలో నుంచి ప్లాస్టిక్ గ్లాసు (చుట్టూ చిన్న బెజ్జాలు పెట్టాలి)ను కిందికి వచ్చేలా అమర్చి.. ఆ తర్వాత మట్టి మిశ్రమంతో నింపి మొక్క నాటుకోవచ్చు. మూడో పద్ధతి: రిజర్వాయర్ కుండీగా పెద్ద కుండీకి బదులుగా.. గట్టిగా ఉండే చిన్న ప్లాస్టిక్ కంటెయినర్‌ను ఇలా వాడొచ్చు. - దండేల కృష్ణ, సాగుబడి డెస్క్ గడ్డి వృథాను అరికట్టే ఐడియా! జీవాలకు మేపే గడ్డి వృథా పోకుండా చూసుకోవడం ముఖ్యం. గడ్డి వృథా పోకుండా మేపడానికి ఇదొక మార్గం. ప్లాస్టిక్ డ్రమ్ముకు గుండ్రంగా బెజ్జాలు పెట్టి.. అందులో ముక్కలు చేసిన గడ్డి వేస్తే గడ్డిని తొక్కి పాడుచేయకుండా మేకలు ఎంచక్కా తింటాయి. సూక్ష్మ సేద్యంలో సరికొత్త ఆలోచన... (రింగ్ డ్రిప్) -
ఇంటిపంటల సాగు.. ఇతరులకూ తోడ్పాటు!
ఇంటిపంటల సాగులోని సౌలభ్యాన్ని చె న్నై ఐనవరానికి చెందిన వీరలక్ష్మి సూక్ష్మంగా గ్రహించారు. ఆమె భర్త శివకుమార్ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ కంపెనీ నడుపుతున్నారు. వీరలక్ష్మి ఇంటిపనులను పూర్తిచేసిన తరువాతి మిగిలిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ సేంద్రియ పద్ధతుల్లో ఇంటిపంటలు సాగు చేస్తున్నారు. అంతేకాదు మరో 20 కుటుంబాలకు ఇంటిపంటను నేర్పించారు. వారానికి ఒక రోజు వారిళ్లకు వెళ్లి పంటలను పర్యవేక్షిస్తూ.. తగిన సలహాలు సూచనలు ఇస్తున్నారు. టమోటా, మిరప కాయలు, పొట్లకాయ, నిమ్మకాయ, ముల్లంగి, గుమ్మడికాయ, కొత్తిమీరి, ఆకుకూరలను నాలుగేళ్లుగా తమ మేడపైనే పండిస్తున్నారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడరు. వర్మీ కంపోస్టు, పంచగవ్యలను వినియోగిస్తున్నారు. పంచగవ్యను ఇంటి దగ్గర తానే తయారు చేసుకుంటున్నారు. వాతావరణానికి అనుకూలంగా పంటలను రొటేషన్ చేయడం ద్వారా అన్ని నెలల్లో వివిధ రకాల కాయగూరలు, ఆకుకూరలను అందుబాటులో ఉంచుకుంటున్నారు. వంటింటి వ్యర్థాలను కంపోస్టుగా మార్చి మొక్కలు ఏపుగా పెరిగేందుకు వినియోగిస్తున్నారు. మంచి వ్యాయామం..! ‘మిద్దెపైన మొక్కలను పెంచడం వల్ల సేంద్రియ కూరలతోపాటు వ్యాయామమూ లభిస్తుంది. ఇల్లు చల్లగా ఉంటుంది. మానసిక వత్తిడి దూరమవుతుంది. స్నేహితులు, బంధువులను కూడా ప్రోత్సహించి టై కిచెన్ గార్డెన్స్ పెట్టించడం, అప్పుడప్పుడూ వెళ్లి వాటి బాగోగులు చూడటం సంతృప్తిగా ఉంది’ అన్నారు వీరలక్ష్మి. - సాక్షి ప్రతినిథి, చెన్నై దేశీ విత్తన సంబరం విజయవాడలో జూలై 12-13 తేదీల్లో దేశీ / సంప్రదాయ విత్తన సంబరం జరగనుంది. ఆటోనగర్ గేటు సమీపంలోని ఎగ్జిబిషన్ సొసైటీ హాల్లో రైతుల మధ్య తమిళనాడు తరహాలో సంప్రదాయ విత్తన మార్పిడి జరుగుతుందని హరిత భారతి ట్రస్టు బాధ్యులు తెలిపారు. ప్రవేశం ఉచితం. వివరాలకు.. 81065 66828, 0866 2550688 నంబర్లలో సంప్రదించవచ్చు. అర్బన్ పర్మాకల్చర్‌లో శిక్షణ పట్టణ ప్రాంతాల్లో సేంద్రియ పద్ధతుల్లో ఇంటిపంటల సాగుపై హైదరాబాద్‌లో ఆగస్టు 15, 16 తేదీల్లో అర్బన్ పర్మాకల్చర్ సదస్సు జరగనుంది. ‘గార్డెన్స్ అఫ్ అబండెన్స్’ బృందం ఆధ్వర్యంలో నిపుణులు శిక్షణ ఇస్తారు. వివరాలకు.. 99514 52345 నంబరులో సంప్రదించవచ్చు. మీ అభిప్రాయాలు, ప్రశ్నలు, సూచనలు పంపవలసిన చిరునామా: ఎడిటర్, సాక్షి (సాగుబడి), సాక్షి టవర్స,6-3-249/1, రోడ్డు నం.1, బంజారాహిల్స్, హైదరాబాద్- 500 034 saagubadi@sakshi.com -
‘ఇంటిపంట’ల ఉద్యమానికి ప్రోత్సాహం
తెలంగాణ ఉద్యాన శాఖ ఇన్చార్జ్ కమిషనర్ వెంకట్రామ్రెడ్డి సాక్షి, హైదరాబాద్: ‘సాక్షి’ దినపత్రిక చొరవతో మూడేళ్ల క్రితం ప్రారంభమైన ‘ఇంటిపంట’ల ఉద్యమం ఆరోగ్యదాయక ఆహారోత్పత్తి దిశగా జరిగిన మంచి ప్రయత్నమని, దీనికి మరింత తోడ్పాటునందించడానికి సిద్ధంగా ఉన్నామని తెలంగాణ ఉద్యాన శాఖ ఇన్చార్జి కమిషనర్ వెంకట్రామ్రెడ్డి చెప్పారు. శనివారం హైదరాబాద్ నాంపల్లిలోని హార్టికల్చర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో సేంద్రియ ఇంటిపంటలపై శిక్షణా శిబిరంలో ఆయన ప్రసంగించారు. ఇకపై ప్రతి 15 రోజులకొకసారి సేంద్రియ ఇంటిపంటల సాగుపై శిక్షణా శిబిరం నిర్వహిస్తామన్నారు. సామగ్రి, మట్టిమిశ్రమం, సేంద్రియ కూరగాయ విత్తనాలతో కూడిన కిట్లను 2015-16లో కూడా పంపిణీ చేస్తామని తెలిపారు. పౌరులందరూ ఇంటిపంటల సైన్యంగా తయారుకావాలని పిలుపునిచ్చారు. ఇరవైశాతంఖర్చుతోనే పాలిహౌస్‌లను నిర్మిం చుకొని దేశవాళీ విత్తనాలతో సులభంగా ప్రకృతి సేద్యం చేసే పద్ధతులపై నగరవాసులకు, రైతులకు విస్తృతంగా శిక్షణా శిబిరాలు నిర్వహించనున్నామని శ్రీశ్రీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ సెన్సైస్ అండ్ టెక్నాలజీ ట్రస్ట్ (బెంగళూరు)కు చెందిన ప్రకృతి వ్యవసాయ నిపుణుడు డా. బండి ప్రభాకర్‌రావు చెప్పారు. -
సేంద్రియ ఇంటిపంటలపై 25నశిక్షణ
తెలంగాణ రాష్ట్ర ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 25(శనివారం)న ఉ.10 గంటలకు రసాయనాల్లేకుండా ఇంటిపంటల సాగుపై శిక్షణా కార్యక్రమం జరగనుంది. వేదిక : రెడ్‌హిల్స్‌లోని హార్టీకల్చర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వక్త : ప్రభాకర్‌రావు, శ్రీశ్రీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రి సెన్సైస్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు : ఉద్యాన అధికారిణి అరుణ - 83744 49458 ,ఉద్యాన అధికారి పద్మనాభ - 83744 50023 -
కలుపు మందుతో కేన్సర్ !
గ్లైఫొసేట్.. ఇది అత్యంత ప్రభావశీలి అయిన కలుపు మందు. ప్రపంచంలో వాడుకలో ఉన్న కలుపునాశిని రసాయనాల్లోకెల్లా అగ్రగామి. దీన్ని వాడని దేశం లేదు. ఇది మన దేశంలోనూ విరివిగా వాడుతున్న కలుపు మందు కూడా. ఇది సురక్షితమైన కలుపు మందుగా పరిగణించబడినది. ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ దీన్ని కేన్సర్ కారకంగా గుర్తించడంతో ప్రపంచవ్యాప్తంగా కలకలం మొదలైంది. నెదర్లాండ్స్ దీనిపై వెంటనే నిషేధం విధించింది. మరికొన్ని దేశాలు ఇదే బాటను అనుసరించే దిశగా పయనిస్తున్నాయంటున్నారు డాక్టర్ గున్నంరెడ్డి శ్యామసుందర్ రెడ్డి. వ్యవసాయంలో కూలీల కొరత ముంచుకొస్తున్నకొద్దీ గ్లైఫొసేట్ గడ్డి మందు వాడకం బాగా పెరిగింది. గ్లైఫొసేట్ అంతర్వాహక చర్య కలిగిన ప్రభావశీలమైన కలుపు నాశక రసాయనం. ఈ కలుపు మందు చెట్టు మీద పడిన వెంటనే మొక్కల శిఖర భాగాలకు.. అంటే నేలలోని పీచు వేళ్ల నుంచి, చిటారు కొమ్మల చిగుళ్ల దాకా చేరుతుంది. చెట్టుకు అత్యంత ఆవశ్యకమైన అమైనో ఆమ్లాల తయారీని అడ్డుకొని కొన్ని రోజులకు పూర్తిగా చంపేస్తుంది. గ్లైఫొసేట్.. మోన్శాంటో ఉత్పత్తి 1974లో మోన్శాంటో కంపెనీ రౌండప్ అనే పేరుతో మార్కెట్లోకి విడుదల చేసిన నాటి నుంచి, గత నాలుగు దశాబ్దాలుగా దీని వాడకం ప్రపంచవ్యాప్తంగా అప్రతిహతంగా పెరుగుతూ వచ్చింది. దశాబ్దం క్రితం దీనిపై పేటెంట్కూ కాలం చెల్లింది. అప్పటి నుంచి చాలా కంపెనీలు గ్లైఫొసేట్‌ను తయారు చేసి, విరివిగా మార్కెట్ చేస్తున్నాయి. అత్యంత సురక్షితమైనదిగా పరిగణింపబడిన ఈ కలుపు నాశిని మీద మోన్శాంటో ‘రౌండప్-రెడీ’ పేరుతో జన్యుమార్పిడి పంటలను తయారు చేస్తోంది. ఇప్పటికే అమెరికా తదితర దేశాలలో ‘రౌండప్-రెడీ’ మొక్కజొన్న, సోయా చిక్కుడు, పత్తి వంగడాలు విస్తారంగా సాగువుతున్నాయి. ఈ పంటల్లో గ్లైఫొసేట్‌ను విధిగా వాడవలసి ఉంటుంది. కేన్సర్ కారకం.. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) తాజాగా గ్లైఫొసేట్‌ను కేన్సర్ కారకంగా పరిగణించి, ప్రమాదకర రసాయనాల జాబితాలో చేర్చింది. అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ)కి చెందిన డా. యాంటోనీ శాంసెల్, డా. స్టీఫెన్ సెనెఫ్లు గ్లైఫొసేట్ మానవ శరీరానికి పరోక్షంగా, దీర్ఘకాలంలో ప్రాణాంతకమైనదిగా నిరూపించారు. గ్లైఫొసేట్ నిలువరించే ఈపీఎస్పీ సింథేస్ అనే ఎంజైమ్ మనుషుల్లోను, జంతువుల్లోనూ ఉండదు కనుక ఇది మనుషులకు ఏ విధంగానూ హానికరంగా కాదని, దీన్ని నిరూపించడానికి మోన్శాంటో ప్రతినిధులు రౌండప్‌ను తాగి చూపించిన సందర్భాలు అనేకం. కానీ, మొక్కలకు, సూక్ష్మజీవులకు ఈ ఎంజైమ్ అత్యంత ఆవశ్యకమైనది. ఉపయుక్త సూక్ష్మజీవులకు తీవ్రహాని గ్లైఫొసేట్ అవశేషాలున్న ఆహారాన్ని తినడం వల్ల మానవ జీర్ణవ్యవస్థతో ముడిపడి ఉన్న కోటానుకోట్ల ఉపయుక్త సూక్ష్మజీవులు నాశనమవుతాయని ఎంఐటీ శాస్త్రవేత్తలు తేల్చారు. ఈ సూక్ష్మజీవులు మనం తినే ఆహారాన్ని జీర్ణం చేయడంలోను, జీర్ణమైన ఆహారాన్ని శరీరం గ్రహించడంలోను, ఆహారంలోని విషకారకాలను నిర్మూలించడంలోను, వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడంలోను ప్రముఖపాత్రను పోషిస్తాయి. ఈ సూక్ష్మజీవులు జీర్ణవ్యవస్థలో నశించడం వల్ల స్వయం ఛేదక వ్యాధులు(ఆటో ఇమ్యూన్ డిసీజెస్) ప్రేరేపితమవుతాయి. స్వయం ఛేదకం అంటే.. దేహాన్ని పరిరక్షించాల్సిన తెల్ల రక్త కణాలు విచక్షణ కోల్పోయి.. తన సొంత కణజాలంపైనే దాడి చేసి నష్టపరుస్తాయి. తత్ఫలితంగా కడుపులో మంట, పేగుల్లో పుండ్లు, ఊబకాయం, మధుమేహం, హృద్రోగాలు, వంధ్యత్వం, కేన్సర్, ఆటిజం, అల్జీమర్స్, డిప్రెషన్ వంటి ఎన్నో రోగాలకు గ్లైఫొసేట్ పరోక్షంగా కారణభూతమవుతోందని ఎంఐటీ శాస్త్రవేత్తలు సూత్రీకరించారు. అమెరికా వంటి దేశాల్లో గోధుమ పంటను సులభంగా యంత్రాలతో నూర్పిడి చేయడానికి కోతకు కొద్ది రోజుల ముందు గ్లైఫొసేట్‌ను పిచికారీ చేస్తుంటారు. అదేవిధంగా పత్తి పంటలో కూడా యంత్రాలతో పత్తి తీతకు ముందు ఆకును రాల్చడానికి గ్లైఫొసేట్‌ను పిచికారీ చేస్తారు. తత్ఫలితంగా గోధుమ ఉత్పత్తులు శరీరంలోని ఉపయుక్త సూక్ష్మజీవులకు ఏవిధంగా హానికలిగిస్తాయో, గ్లైఫొసేట్ అవశేషాలున్న నూలు వస్త్రాలు కూడా చర్మానికి మేలుచేసే సూక్ష్మజీవులకు కూడా అదేవిధంగా హాని చేస్తాయి. రైతుల ఉసురు తీస్తున్న గ్లైఫొసేట్ భారతదేశం, మధ్య అమెరికా, శ్రీలంకలలో అంతుపట్టని కిడ్నీ వ్యాధుల బారిన పడి వేల మంది రైతులు మరణిస్తున్నారు. శ్రీలంక శాస్త్రవేత్త డా. చన్న జయంసుమన పరిశోధనల్లో తేలిన విషయమేమిటంటే.. అంతుపట్టని కిడ్నీ వ్యాధి ప్రబలంగా ఉన్న ప్రదేశాల్లోని బావుల్లో నీటిలో గ్లైఫొసేట్, భారలోహాలు అధిక మోతాదులో ఉన్నాయి. గ్లైఫొసేట్, భారలోహాలతో కలిసి కిడ్నీలను నాశనం చేయగలదని సూత్రీకరించారు. ఖచ్చితంగా నిర్థారణ కాకున్నా ముందుజాగ్రత్త చర్యగా శ్రీలంక, ఎల్‌సాల్విడార్ దేశాలు గత సంవత్సరం గ్లైఫొసేట్‌ను నిషేధించాయి. శ్రీకాకుళంలోని ఉద్ధానం పరిసరాల్లో 2007 నుంచి ఇప్పటి వరకు 1500 మందికి పైగా అంతుపట్టని కిడ్నీ వ్యాధులతో మరణించారు. కిం కర్తవ్యం? మన రైతులు ఉద్యాన పంటల్లో గ్లైఫొసేట్ కలుపు మందును విరివిగా వాడుతున్నారు. మన పంట పొలాల్లోని సూక్ష్మజీవరాశులు దుంపనాశనమై పోతున్నాయి. గ్లైఫొసేట్ పిచికారీ చేసేటప్పుడు వెలువడే తుంపరలు చెట్లు, మొక్కల ఆకులపై పడి వేల ఎకరాల్లో ఉద్యాన తోటలు క్రమక్రమంగా క్షీణించి ఎండిపోతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లైఫొసేట్ కేన్సర్ కారకమని ప్రకటించిన నేపథ్యంలో.. నెదర్లాండ్స్ యుద్ధప్రాతిపదికన గ్లైఫొసేట్‌పై నిషేధం విధించింది. ఫ్రాన్స్ తదితర ఐరోపా దేశాలు నిషేధానికి సన్నద్ధమవుతున్నాయి. మన దేశం కూడా దీనిపై అధ్యయనాలు విస్తృత పరచి, వాస్తవాలను రైతులు, ప్రజలముందుంచాలి. ఈ బాధ్యత మన వ్యవసాయ శాస్త్రవేత్తలు, వైద్యనిపుణుల భుజస్కందాలపై ఉంది. ప్రభుత్వం నిష్పక్షపాతంగా విధానపరమైన నిర్ణయం తీసుకొని, చిత్తశుద్ధితో అమలుపరచాలి. (వ్యాసకర్త వ్యవసాయ నిపుణుడు. ఐఐఐటీ, హైదరాబాద్ shyam.reddy@iiit.ac.in)