Jyotirmayam
-
వాసుదేవుడు
వసుదేవుడి కుమారుడు వాసుదేవుడు. ‘వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనం, దేవకీ పరమా నందం, కృష్ణం వందే జగద్గురుం’ అని కృష్ణాష్టకం. ఈ అర్థం ప్రకారం ద్వాపర యుగంలో దేవకీ పుత్రు డుగా అవతరించి యశోదానంద వర్ధనుడుగా వర్ధిల్లిన శ్రీకృష్ణుడే వాసుదేవుడు. సర్వమూ వాసుదేవుడే అని అనుభూతి పూర్వ కంగా, అపరోక్షంగా స్వానుభూతిపూర్వకంగా గ్రహిం చగలిగిన మహాత్ములే జ్ఞానులు, ఇలాంటివారు చాలా అరుదు అంటుంది భగవద్గీత. సర్వమూ వాసు దేవుడే అన్నప్పుడు ఆ వాసుదేవుడు అన్న మాటకు వసుదేవుడి కుమారుడు అని పరిమితమైన అర్థం చెప్పటంలో పూర్తి సామంజస్యం కనిపించదంటారు కొందరు. త్రికాలాతీతుడూ, గుణాతీతుడూ, సర్వ వ్యాపీ, ఆది మధ్యాంత రహితుడూ అయిన పరమా త్మను ఒక్క అవతారానికే వర్తింపజేసి వసుదేవ సుతు డుగా మాత్రం పిలవటం ఎలా పొసగుతుంది అని వారి సందేహం. విష్ణు సహస్రనామంలో ‘వాసుదేవ’ అనే నామం మూడుసార్లు వస్తుంది. ఒకే నామాన్ని ఒకే అర్థంలో రెండు మూడుసార్లు వాడటం సంప్రదాయం కాదు. కనుక విష్ణు సహస్ర నామభాష్యం చెప్పిన ఆది శంకరా చార్యులు వాసుదేవ నామానికి మూడు రకాల వివరణలు చెప్పారు. సర్వ జగత్తును ‘వసనం’ లేక ‘వాసనం’, లేక, ఆచ్ఛాదనం చేసి ఆక్రమించి ఉండేవాడు ‘వాసుడు’ . ‘దివ్’ అనే ధాతువుకు క్రీడించటం, విజయేచ్ఛ కలిగి ఉండటం, నియంత్రిం చటం, ప్రకాశించటం అని అర్థాలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ చేసే వాడిని ‘దేవుడు’ అంటారు. ‘వాసుడు’ అయిన ‘దేవుడు’ వాసుదేవుడు. అంటే, చరాచర విశ్వాన్ని సూర్యకిరణాల ద్వారా సూర్యుడు కప్పినట్టు సర్వత్రా ఆక్రమించి, వ్యాపించి ఉండేవాడు అని. రెండవ చోట, వాసుదేవ నామానికి వసుదేవుడి పుత్రుడు అనే అర్థం చెప్పారు. మూడవ చోట, మాయ చేత జగత్తును ఆచ్ఛాదన చేసి ఆవరించి ఉండేవాడు అని అర్థం చెప్పుకోవచ్చన్నారు. భాగవతంలో పౌండ్రక వాసుదేవుడనే విచిత్ర మైన పాత్ర కనిపిస్తుంది. ఈయన కరూశ దేశానికి రాజు. గొప్ప అజ్ఞాని. రంగస్థలం మీద నటుడిలా శ్రీకృష్ణుడి వేషభాషలనూ, చిహ్నాలనూ అనుకరించే వాడు. పీతాంబరం కట్టి , గరుడ ధ్వజం ఎత్తించుకొని, శంఖ-చక్ర- ఖడ్గ- గదా- శార్గ-శ్రీవత్స- కౌస్తుభ- వనమాలాది చిహ్నాలను అనుకరించేవాడు. మూర్ఖు లైన తన ఆశ్రీతులు చేసే ముఖ స్తుతులు నమ్మి, ఆయన శ్రీకృష్ణుడికి తన దూత ద్వారా ఒక హెచ్చరిక పంపుతాడు, ‘అసలైన వాసుదేవుడిని నేను. నువ్వు నా పేరూ చిహ్నాలూ ధరించి తిరుగుతున్నావు. వెంటనే నువ్వు వాటిని వదిలి నా శరణు వేడుకో. లేదంటే నాతో యుద్ధానికి సిద్ధపడు!’ అని. వసుదేవ పుత్రుడు ఆ పౌండ్రక వాసుదేవుడిని యుద్ధంలో వధిస్తాడు. వైర భావంతోైనైనా కృష్ణుడిని నిరంతరం స్మరిస్తూ అను కరిస్తూ జీవించిన కారణంగానూ, కృష్ణుడి చేతనే స్వయంగా హతుడైన కారణంగానూ పౌండ్రక వాసు దేవుడు, అన్ని బంధాలూ వదిలించుకొని ఆ వాసు దేవుడిలోనే లీనమయ్యాడు. - ఎం. మారుతి శాస్త్రి -
నిజమైన దానం
జ్యోతిర్మయం చాలాసార్లు మెహర్బాబా నిస్వార్థ సేవ గురించి, ఇతరులకు సేవ చెయ్యటం గురించి, తన సుఖం చూసుకోకుండా, ఇతరులను సుఖపెట్టడం గురించి చెబుతుండేవారు. అయితే, ఇతరులకు సహాయం చెయ్యడం అనేది అంత తేలికయిన విషయం కాదు. ఏవిధంగా తెలిసి ఉండాలో నీకు తెలిసి ఉండాలి. గుళ్లదగ్గర అడుక్కునే వాళ్లు కనిపిస్తూ ఉంటారు. వాళ్లకు ఏమైనా దానం ఇద్దామని నీకు అనిపించ వచ్చు. కాని ఇచ్చేముందు ఎవరికి ఇవ్వాలో తెలి యాలి. దానం ఇవ్వటం అంటే జేబులో చెయ్యి పెట్టి డబ్బు తీసి అడుక్కునేవానికి ఇవ్వడం మాత్రమే అను కుంటే పొరపాటు. అడుక్కునేవానికి అలా ఇచ్చావే అనుకుందాం. అప్పుడు నీవు ఇచ్చిన డబ్బుతో మద్యం తాగి ఇంటికి వెళ్లి వాళ్లను కొడితే అప్పుడు నీ దానం ఎవరికి ఉపయోగపడింది? నీవు ఎవరికి సహాయం చేసినట్టు? అందుకనే, బీదలకు సహాయం చేసేటప్పుడు, ఆ బీదలు నిజంగా బీదలు అవునో కాదో ముందు నిర్ధారించుకోవల సిందిగా మెహర్బాబా తన శిష్యు లకు గట్టిగా చెప్పేవారు. వీధిపక్క జోలె పట్టుకుని చేతులు చాచిన ప్రతివాడిని బీదవాడని అనుకోవడా నికి వీల్లేదు. ఒకప్పుడు బాగా బతికి, తరువాత చితికి పోయిన కుటుంబాలు ఉంటాయి. వారు కటిక బీదరి కంలోనూ, ఆత్మగౌరవాన్ని చంపుకోలేరు. వారు బయ టకు వచ్చి అడుక్కోలేరు. అలాంటివారే సహాయం పొందటానికి నిజంగా అర్హులు. అలాంటివారికి కూడా మనం ఆలోచించి సహాయం చెయ్యాలి. గుడ్డిగా చెయ్యకూడదు. ఆ చేసే సహాయం ఎలా చెయ్యాలి అంటే, ఆ సహాయం వాళ్లని వాళ్ల కష్టాల్లో సమయానికి ఆదుకోవాలి. దానం చేసిన ప్రతిసారీ నేను సహాయం చేశాను, నేనో మంచిపని చేశాను అని నీకు అనిపించి నీలో గర్వం, అహంకారం పెరిగితే, అది నీకు మంచి చెయ్యదు. అహంకారంతో ఎప్పుడైతే నీవు సహాయం చేస్తావో, అప్పుడే సహాయం పొందేవాని అహంకారం కూడా నీ అహంకారానికి స్పందిస్తుంది. దానం తీసు కున్నవాడు, దానం ఇచ్చినవానికి రుణపడిపోయానని అనుకుంటాడు. ఆ భారం అతడిని కుంగదీస్తుంది. ఫలితంగా, అతడు దానం ఇచ్చినవాడి నుంచి దూ రంగా జరుగుతాడు. నీవు ఎవరికి సాయం చేసినా, అది నీకు నీవు చేసుకున్నట్లుగా ఎప్పుడనుకుంటావో, అప్పుడు అది నిజమైన సాయం అవుతుంది. గొప్ప కోసం, పేరుకోసం చేసేది దానం అనిపించుకోదు. నీ కుడిచేయి చేసిన సాయం, నీ ఎడం చేయికి తెలియకూడదు. నీవు చేసిన దానం అప్పుడే మరిచి పోవాలి. సహాయం పొందినవాడు నిన్ను ఎల్లప్పుడు గుర్తుపెట్టుకోవాలి. నీకు కృతజ్ఞుడిగా ఉండాలి అను కుంటే, నీకు నిరాశ మిగులుతుంది. అంతిమంగా మెహర్బాబా చెప్పేది ఏమంటే, చేసేది నేను కాదు. భగవంతుడు నా చేత ఈ సాయం చేయిస్తున్నాడని నీవు భావించినప్పుడు, అది ఉత్తమోత్తమంగా సహా యం చేయడం అవుతుంది. - దీవి సుబ్బారావు -
వైర భక్తి
జ్యోతిర్మయం ఆదిశంకరులు మోక్షాన్ని తెచ్చిపెట్టే సాధనాల్లో భక్తికే పెద్దపీట వేశారు. ఆ భక్తి తొమ్మిది విధాలుగా ఉంటుం ది అని మన పెద్దలు చెప్తారు. శ్రవణం, కీర్తనం, స్మర ణం, పాదసేవనం, అర్చనం, వందనం, ధ్యానం, సఖ్యం, ఆత్మనివేదనం అనేవి ఆ తొమ్మిది విధాలు. వీటి లో స్మరణం చాలా ప్రత్యేకమైనది, విశేషమైనది. స్మర ణం అంటే తలంపు, జ్ఞప్తి. భగవంతుణ్ణి గురించి నిరం తరం తలపోస్తూ ఉండటం, విడువకుండా జ్ఞాపకం పెట్టుకోవటం. భగవంతుణ్ణి ఇట్లా జ్ఞాపకం పెట్టుకోవ టం ప్రేమతో కావచ్చు, ద్వేషం తో కావచ్చు, కోపంతో కావ చ్చు, విరోధంతో కావచ్చు. ఏ విధంగా భగవంతుని, ఎల్లప్పు డు తలచుకొంటున్నావు? అన్నది ముఖ్యం కాదు. తలచు కోవటం ముఖ్యం. ఎవరైనా భగవంతునితో వైరం పెట్టుకొని, ద్వేషించి, ఎల్లప్పుడు తలచుకొంటూ ఉంటే, ఆ తలంపే అతడిని భగవం తుని దగ్గరకు జేరుస్తుంది. దీనిపై భాగవతం తృతీయ స్కంధంలో ఆసక్తికరమైన వృత్తాంతం ఒకటి ఉన్నది. శ్రీ మహావిష్ణువు దర్శనార్థం వైకుంఠం వచ్చిన మహర్షులు సనక సనందనాదులను విష్ణువు అంతః పుర ద్వార పాలకులైన జయవిజయులు అడ్డగించి భూలోకంలో పుట్టేలా ఘోర శాపం పొందుతారు. విష్ణుమూర్తి విషయం తెలుసుకొని, శాపవిమోచనంగా వాళ్లతో ఇలా అంటాడు, ‘‘జయ విజయులు భూలోకం లో అసురులుగా జన్మిస్తారు. దేవతలకు, మనుష్యులకు కీడు కలుగజేస్తూ, నాకు విరోధులుగా ఉంటారు. యుద్ధంలో నన్ను ఎదుర్కొని, నా చేతిలో చనిపోతారు. అలా చనిపోయి, త్వరలోనే నా సన్నిధికి వస్తారు’’. విష్ణువు ఇంకోమాట అంటాడు, ‘‘వైరంతో అయినా సరే, ఎవరు నన్ను మనస్సులో తలచు కొంటూ, నన్ను చూస్తూ చనిపోతారో, వారు నన్నే పొందుతారు’’. అయితే ఇక్కడ ఎవరికైనా ఒక ధర్మసందేహం రావచ్చు. భగవంతుణ్ణి ప్రేమించి, సేవ చేసిన వానికం టే, భగవంతుణ్ణి ద్వేషించి, విరోధం పెట్టుకొన్న వాడే త్వరగా మోక్షానికి వెళ్తాడు? అదెట్లా సంభవం? అంటే భాగవతమే దానికి సమాధానం చెబుతుంది. వైరం వల్ల భగవంతుని యెడల తన్మయత్వం కలిగినట్లు, మరి దేనివల్లా కలుగదు అని. మనం ఎవరినైనా ద్వేషించినప్పుడు, ప్రేమించినప్పటికంటే, ఎక్కువ సార్లు, ఎక్కువ తీవ్రతతో అతడిని జ్ఞప్తికి తెచ్చుకొం టాము. ఒక మనిషి మీద అత్యంత ద్వేషం, విరోధం కలిగినప్పుడు, నీవు అన్నింటినీ మరచిపోయి, నిన్ను నీవే మరచిపోయి, ఎవరినైతే ద్వేషిస్తున్నావో, అతడిని గురించే ఆలోచిస్తూ ఉంటావు. ప్రేమలో కూడా తలచుకోవటం ఉంటుంది కాని, ద్వేషంలో ఉన్నంత తీవ్రంగా, నిరంతరాయంగా ఉండదు. హిరణ్యాక్ష హిరణ్యకశిపులు మొదలైన వాళ్లు ఎందుకు త్వరగా మోక్షాన్ని పొందారు అంటే, వాళ్లు భగవంతుడితో విరోధం పెట్టుకొని, ద్వేషించి, బతుకంతా ప్రతిక్షణం ఆ భగవంతుని ధ్యాసలోనే గడిపారు కాబట్టీ. - దీవి సుబ్బారావు -
గీతోపదేశం
జ్యోతిర్మయం సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ నోటి నుంచి వెలువడిన భగవద్గీత పంచమవేదంగా, భారతామృత సర్వస్వం గా వినుతికెక్కింది. శ్రీకృష్ణస్వామి అర్జునుణ్ణి ఒక కారణంగా పెట్టుకుని లోకానికి అంతటికీ చేసిన గీతో పదేశం మానవులందరి దైనందిన జీవితాన్ని సంస్క రించడానికి ఉద్దేశించినది. భగవద్గీత అంటే ఒక మత గ్రంథం కాదు. అది అభిమత గ్రంథం. చదవా లనే జిజ్ఞాస కలవారందరికీ ఒక కరదీపిక. అధర్మాన్ని తుంచడానికీ, ధర్మాన్ని స్థాపించడానికీ ఉద్యుక్తుడు కావలసిన క్షణంలో అర్జునుడు కర్తవ్యతా విమూఢు డైనప్పుడు పరమాత్ముడు బోధించినదే గీత. ఇది భౌతిక జీవనమార్గం నుంచి ఆధ్యాత్మిక మార్గం వైపు నడిపించే గ్రంథమే. అందులో సందేహం లేదు. అయితే ఎంతటి ఆధ్యాత్మికతను ఉపదేశిస్తుం దో, అంతకు మించి దైనందిన జీవితాన్ని ఎట్లా సమర్థ వంతంగా సాగించుకోవాలో కూడా ప్రబోధిస్తున్నది. జీవితాన్ని ఒక నందనవనంగా చేసుకోవడం ఎలాగో చెప్పే మహోన్నత వాక్య సముదాయం భగవద్గీత. సుఖ దుఃఖాలనూ, జయాపజయాలనూ, లాభ నష్టాలనూ, శీతోష్ణాలను సహించడానికి అవసరమైన మానసిక సంసిద్ధతను గీతోపదేశం ద్వారా పొంద వచ్చు. జ్ఞానంతో సమానమైన పవిత్ర సాధనం ప్రపం చంలో మరొకటి లేనే లేదనీ, ఇట్టి పరమ పవిత్ర జ్ఞానం శ్రద్ధావంతులకే అబ్బుతుంది- ‘న హి జ్ఞానేన సదృ శం పవిత్రమిహ విద్యతే’, ‘శ్రద్ధావాన్ లభతే జ్ఞానమ్’ అని భగవద్గీత చెబుతోంది. ప్రశాంతమైన మనసు లేని వానికి సుఖాలు ఎలా లభిస్తాయి? అవిచ్ఛిన్నమైన ఆనందానుభూతి ఎలా సంభవిస్తుంది? అని ప్రశ్నించి, కామక్రోధాలు రెండూ రజోగుణం వల్ల ఉద్భవించినవేనని పేర్కొంటున్నది. అవే మన చేత ఘోర పాపాలను చేయిస్తాయనీ, జ్ఞాని అయినవాడు వాటినే ముఖ్య శత్రువులుగా భావించా లని చెబుతోంది. ‘కామ ఏషః క్రోధ ఏషః రజోగుణ సముద్భవః మహాశనో మహాపాప్మా విద్ధ్యేనమిహ వైరిణమ్’ అని గీత ఉపదేశిస్తున్నది. విద్యా ఉద్యోగ వ్యాపార సేవా రంగాల వారికి వయసుతో నిమిత్తం లేకుండా స్త్రీ పురుష, ప్రాంత కుల భేదం లేకుండా ప్రతి తరానికీ చెందిన విశ్వమానవ శ్రేయస్సుకు ఉపకరించే ప్రధానోపదేశమే భగవద్గీత. మహాత్మా గాంధీ తనకు ఎదురైన ప్రతి సమస్యకు భగవద్గీత నుంచే నివారణోపాయాన్ని పొందానని పేర్కొన్నారు. నేర్వదగిన శాస్త్రాలు లెక్కకు అందనన్ని ఉన్నాయి. అభ్యసించవలసిన విద్యలు ఎన్నో ఉన్నాయి. కాని మనిషి ఆయుర్దాయం పరిమితం. అందులో కలి గే విఘ్నాలు ఎన్నెన్నో! హంస పాలనూ నీళ్లనూ వేరు చేసి, నీరు వదలి పాలను స్వీకరించినట్టు సర్వోపనిష త్సారం, సర్వశాస్త్ర సంగ్రహం అయిన గీతోపదేశాన్ని ఉపదేశాత్మకంగా పరిశోధనాబుద్ధితో స్వీకరిద్దాం. ఈ మానవ జన్మను చరితార్థం చేసుకుందాం. సముద్రాల శఠగోపాచార్యులు -
శరీరత్రయం
జ్యోతిర్మయం ప్రతి జీవికి స్థూల సూక్ష్మ కారణ దేహాలనే మూడు శరీ రాలు ఉన్నాయి. పంచజ్ఞానేంద్రియాలతో, పంచకర్మేం ద్రియాలతో, కంటికి స్పష్టంగా కనిపించే, అస్థి మాంస మజ్జ రక్తమయ శరీరమే స్థూల శరీరం. సంకల్ప వికల్పాలతో మనస్సుగా, నిశ్చయాత్మక మైన బుద్ధిగా, స్మరణమాత్రమైన చిత్తంగా, భోగించే అహమ్గా, కంటికి కనిపించకపోయినా, నిరంతరం అనుభూతమయ్యే, ఆంతరిక శరీరమే సూక్ష్మ శరీరం. స్థూల శరీరమే నేను, సూక్ష్మ శరీరమే నేను, అన్న భ్రాం తికి కారణమైన మూలాజ్ఞానమే కారణ శరీరం. అం దరూ స్థూల శరీరాన్ని, కొందరే సూక్ష్మ శరీరాన్ని, మరి కొందరే కారణ శరీరాన్ని పరికిస్తూ ఉంటారు. స్థూల శరీరాన్ని అందంగా ఆరోగ్యంగా ఆకర్షణీయంగా ఉం చుకోవాలని అధికులు ఆరాటపడు తూనే ఉంటారు. స్థూల శరీరానికి నిత్యం స్నానం చేయిస్తూ ఉంటారు. నిర్మాలిన్య సాధ నాల్ని సౌందర్య సాధనాల్ని పరిమళ ద్రవ్యాల్ని వాడు తూనే ఉంటారు. వైద్యుల్ని ఆరోగ్యానికై సంప్రదిస్తూనే ఉంటారు. ఈ స్థూల శరీరానికి నిత్యం స్నానం చేయించక పోతే, అది మాలిన్యంతో దుర్గంధ భరితం అవుతుంది. అట్టి వారిని చూసి సభ్యసమాజం ముక్కు మూసుకుం టుంది. స్థూల శరీరానికి ఎలా మాలిన్యాలు ఉన్నాయో, అలానే సూక్ష్మ శరీరానికీ కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనే మాలిన్యాలు ఉన్నాయి. కానీ సూక్ష్మ శరీ రాన్ని మాలిన్య రహితంగా వినిర్మలంగా ఉంచుకోవా లని ఆరాటపడే వారు చాలా అరుదు. సూక్ష్మశరీర నిరంతర పరిశీలనమే ఆ నిర్మాలి న్యానికి తొలి సాధనం. అంతరంగంలో కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలనే దుర్గంధాలు పేరుకుం టున్నాయని ప్రథమంగా గుర్తించాలి. గుర్తించిన వెం టనే భగవన్నామ స్మరణంతో భగవత్ ధ్యానంతో భగ వత్ చింతనతో ఆ సూక్ష్మ శరీరానికి స్నానం చేయించి, దుర్గంధాల్ని నివారించాలి. అలా చేయకపోతే, సూక్ష్మ శరీరం దుర్గంధ భరిత మవుతుంది. సాధు సజ్జనులు ఇలాంటి సూక్ష్మ శరీ రాన్ని చూసి ముక్కు మూసుకుంటారు. మనం మన సూక్ష్మ శరీరానికి స్నానం చేయించకుండా, ఎన్నాళ్ల నుంచి ఎన్నేళ్ల నుంచి ఎన్ని జన్మల నుంచి దుర్గంధ భరి తం చేశామో, పరిశీలించాలి. అలా పరిశీలించి, తప్పి దాన్ని తెలుసుకొని, వెంటనే సూక్ష్మ శరీర అభ్యంగన స్నానానికి సమాయత్తం కావాలి. అనుదినం ఆమరణ పర్యంతం ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూనే ఉండాలి. అలా సూక్ష్మ శరీరాన్ని శుభ్రంగా వినిర్మలంగా ఉంచుకోగలిగితే, మూలాజ్ఞానమనే కారణ శరీరం కూడా జ్ఞానమయమవుతుంది. దేహ భ్రాంతి జీవభ్రాం తి అనే అవిద్య నశిస్తుంది. ఆత్మ నిష,్ఠ జ్ఞాన నిష్ఠ సిద్ధి స్తుంది. జీవితమే వినిర్మలమవుతుంది. కనుక స్థూల శరీరంతో పాటు సూక్ష్మ శరీర పారిశుద్ధ్యానికీ, తక్షణమే ప్రాధాన్యాన్ని ఇద్దాం. శరీరత్రయ శుద్ధికి సంకల్పిద్దాం. ఈ పుడమిని స్వర్గధామం చేద్దాం. నరజాతికి నారా యణ తత్వాన్ని ప్రబోధిద్దాం. పరమాత్ముని -
అగస్త్యుడు
జ్యోతిర్మయం చెట్లు కాసే తీయని పళ్లలా, నదులు మోసుకొచ్చే చల్ల ని నీళ్లలా, సజ్జనుల సంపదలన్నీ పరోపకారం కోసమే. జనావాసాలకు దూరంగా కొండల్లో, కోనల్లో, ఆశ్రమా లలో నిరాడంబరంగా జీవిస్తూ తపస్సు చేసుకొనే మహర్షుల తపోబలం కూడా లోకోపకారం కోసమే. ఉదాహరణగా అగస్త్య మహర్షి అద్భుత చరిత్రను చూపవచ్చు. వాతాపీ, ఇల్వలుడూ అనే రాక్షస సోదరులు కామరూపులు. అరణ్యమార్గంలో వెళ్లే బ్రాహ్మణులను భోజనం మిషతో ఆకర్షించి తెచ్చేవారు. వాతాపి మేక రూపం ధరించితే, ఇల్వలుడు ఆ మేక మాంసం బ్రాహ్మణులకు వడ్డించేవాడు. భోజనమైన తర వాత ఇల్వలుడు ‘వాతాపీ, ఇక బయటకు రా!’ అని కేక వేయ గానే వాతాపి బ్రాహ్మణుడి పొట్ట చీల్చుకొని బయటకు వచ్చేవాడు. ఇలా వాళ్లు ఎందరో బ్రాహ్మణులను చంపారు. వాళ్ల దుర్మార్గం అణచేందు కు, ఒకనాడు అగస్త్యుడు వాళ్ల అతిథిగా వెళ్లాడు. తన కు వడ్డించిన వాతాపిని జీర్ణం చేసేసుకొన్నాడు. భోజ నం తర్వాత, ఇల్వలుడు ఎంత అరిచినా లాభం లేకపో యింది. ‘జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం’ అని అగస్త్యుడు పొట్ట నిమురుకోటంతో వాతాపి కథ ముగిసింది. కాలకేయ గణాలు అనే రాక్షసులు పగలంతా కన బడకుండా సముద్రంలో దాక్కొని, రాత్రి వేళల్లో తప స్వుల మీద పడి చంపేస్తూ ఉండేవాళ్లు. దేవతలు అగ స్త్యుడిని ప్రార్థిస్తే, ఆయన సముద్రాన్నంతా ఆపోశన పట్టి చుక్క మిగలకుండా తాగేశాడు. కాలకేయ గణా లకు దాక్కొనేందుకు చోటు మిగలలేదు. దాంతో దేవ తలు వాళ్లను సంహరించగలిగారని పురాణ గాథ. వనవాసం చేస్తున్న శ్రీరాముడు అగస్త్యాశ్రమం దర్శించి మహర్షిని సేవించాడు. అగస్త్యుడు రాముడికి వైష్ణవ ధనుస్సు, అక్షయ తూణీరం, దివ్య ఖడ్గాలు బహూకరించి, సమీపంలో ఉన్న పంచవటిలో కుటీరం కట్టుకొని నివాసం చేయమని సూచన చేశాడు. అనం తరం, రామరావణ యుద్ధంలో అగస్త్యుడు రణరంగా నికి వెళ్లి రాముడికి శుభదాయకమైన ఆదిత్య హృద యాన్ని బోధించి ఉత్సాహపరిచాడు. ఇంద్ర పదవి పొంది కళ్లు నెత్తికెక్కి సప్తర్షులను పల్లకీ బోయీలుగా నియమించిన నహుషుడిని క్షణకాలంలో కొండచిలు వగా మార్చి కళ్లు తెరిపించింది అగస్త్యుడే. వింధ్య పర్వతం అహంకరించి మితిలేకుండా పెరిగిపోతుంటే, దేవతల ప్రార్థన మేరకు అగస్త్యుడు తనకు ప్రాణంతో సమానమైన కాశీ క్షేత్రాన్ని వదిలి దక్షిణా పథానికి బయలుదేరాడు. ఆయనకు కొండెక్కే శ్రమ కలగకూడదని వింధ్య పర్వతం వినమ్రతతో ఒంగక తప్పలేదు. ‘నాయనా, నేను తిరిగి వచ్చేవరకు ఇలాగే ఉండు!’ అని ఆదేశించి అగస్త్యుడు ముందుకు సాగాడు. ఆయన తిరిగి వెళ్లకనే పోవటంతో వింధ్య ఔద్ధత్యం శాశ్వతంగా అణగారిపోయింది. ఇలాంటి పరోపకార పరాయణులైన మహనీయుల స్ఫూర్తి దా యకమైన చరిత్రలు మానవాళికి నిత్యస్మరణీయాలు. ఎం. మారుతిశాస్త్రి -
ప్రేమ స్వరూపి
జ్యోతిర్మయం లోకంలోని సమస్తమైన సమస్యలకు ‘ప్రేమ’యే పరి ష్కారమన్నట్లుగా జిడ్డు కృష్ణమూర్తి రాసిన పుస్తకాలు చూసి 1970 ప్రాంతంలో ఆయన బోధపట్ల నాకు కొంత విముఖత్వం ఏర్పడింది. అందుకు కారణం ఆయన ‘ప్రేమ’ అనే పదాన్ని ఎలా వాడుతున్నాడో నాకు అర్థం కాకపోవడం; అటు తర్వాత కొంత కాలానికి గానీ, కృష్ణమూర్తి గారు ‘ప్రేమ’ అనే పదాన్ని ఎలా వాడుకున్నారో అర్థం కాలేదు. 1943 ప్రాంతంలో ఓ పాశ్చాత్య గ్రంథ కర్త, కృష్ణ మూర్తితో ‘ప్రేమ విషయంలో మీ వైఖరి ఏమిటో వివరి స్తారా?’ అని అడిగినప్పుడు, వ్యక్తిగతమైన ప్రేమ అనేది నాకు లేదనే చెప్పవచ్చు. నేనె వరితో కలిసి ఉన్నాననే విష యం అప్రస్తుతం- సొంత తమ్ముడితోనైనా, లేక పూర్తిగా పరాయి మనిషితోనైనా అయి ఉండవచ్చు. ప్రేమానుభూతి నాతో సతతమూ ఉంటూనే ఉంటుంది. నన్ను కలిసిన వారెవరికైనా, ఆ అనుభూతి ప్రసరించకుండా అడ్డుకోలేను’ అన్నాడు. అసలు ఈ ప్రపంచంలో తనని తారసిల్లిన ఏ మనిషినీ తాను అసహ్యించుకున్న సందర్భం కానీ, అతడికేమైనా తనకు నిమిత్తం లేదనుకున్న పరిస్థితి గానీ, ఎన్నడూ ఉదయించలేదా అని మరికాస్త తరచి ప్రశ్నించినప్పుడు, ‘నాకు అయిష్టమైన వాళ్లంటూ ఎవరూ ఉండరండీ. నా ప్రేమను వేరొకరి యెడల చూపించడం నేను కాదు, అని మీరు గ్రహించడం లేదా? నేనేమీ చేస్తూ ఉన్నా, ప్రేమ అలా ఉంటూనే ఉం టుంది; నా చర్మం రంగులాగానే. అందులో మార్పు కానీ, హెచ్చు తగ్గులు కానీ ఉండవు. అందువల్ల నాకు ‘నిమిత్తం లేని వారుగా’ మీరు భావిస్తున్నవారు, ‘నేను ఖాతరు చేయనక్కరలేనివారుగా మీరు భావిస్త్తున్న వారు, నా చుట్టూ మూగి ఉన్నా, ఆ ‘ప్రేమ’ అట్లాగే ఉంటుంది. కానీ నాకీ ‘ఐక్యతాభావం’ కేవలం మానవులతోనే కాదు. వృక్షాలతోనూ, చుట్టూ ఉన్న ప్రపంచంతోనూ, ఈ భావమే ఉంటుంది. భౌతికమైన భేదభావరూపాల గురించి కాదు, నే ప్రస్తావిస్తున్నది. వాస్తవం గురించి మాట్లాడుతున్నాను’ అన్నారు. మరో సందర్భంలో ‘ప్రేమ’ను నిర్వచిస్తూ ‘అసూ యతో కానీ, మమకారంతో కానీ, ప్రేమ కలిసి ఉండ జాలదు. అందువల్ల ఏది ‘ప్రేమ’ కాదో తేల్చుకుంటే, అప్పుడది ‘ప్రేమ’ అవుతుంది. ప్రేమ అంటే ఏమిటి? అని నేనడగాల్సిన పని లేదు. ప్రేమకానిదంతా వదిలించుకుంటే, ప్రేమే మిగులుతుంది’ అన్నాడు. మరో సందర్భంలో ‘ప్రేమ అంటే నా అర్థం, మదిలో ‘వేరు చేయకుండా’ ఉండే గుణమని! అంటే మనిషికీ మనిషికీ జాతి మత కుల ఆర్థిక సామాజిక తారతమ్యాలు పరిగణించకుండా వారిని ఒకటిగా చూడడం. ఈ ప్రపంచంలో యాంత్రికమైన సమస్యలన్నిటికీ యాంత్రిక పరిష్కారాలు ఉంటాయి కానీ మానవ సంబంధమైన సమస్యలన్నిటినీ, కృష్ణమూర్తి గారు చెప్పే ‘ప్రేమ’ (వేరు భావం లేకపోవడం) ఒక్కటే పరిష్కరించగలదు. - నీలంరాజు లక్ష్మీప్రసాద్ -
మెచ్చుకోలు
జ్యోతిర్మయం ఏ రంగంలోనైనా అంతో ఇంతో ప్రతిభ ఉన్న ప్రతి వాడూ తన ప్రతిభను లోకం మెచ్చుకోవాలని ఆశిస్తాడు. కవికీ, కళాకారుడికీ ఆ మెచ్చుకోలు సాటి కళా కారుల నుంచి వస్తే మరీ ఆనందం. మెచ్చుకోలు వాళ ్లకు ఎంత ఆనందం ఇస్తుందో, తిరస్కారం అంతకంటే ఎక్కువ హృదయ వేదన కలిగిస్తుంది. అలాంటి వేద నలో తమ కావ్యాలు తామే నిప్పులో పారేసిన వాళ్లూ, ఆత్మహత్యలు చేసుకొన్న వాళ్లూ చరిత్రలో ఎందరో ఉన్నారు. ఆశ్చర్యమేమిటంటే, మహాకవులుగా చరి త్రలో నిలిచిన చాలా మందికి, తమ జీవిత కాలంలో తమ సమకాలికుల చేత హృద యపూర్వకంగా ‘సెభాష్’ అని పించుకోవటం తీరని కోరిక గానే మిగిలిపోయింది. కాళిదా సు అంతటి మహాకవి కాళీమా త ప్రసాదాన్నీ, రాజ సత్కారాన్నీ అయితే పొందాడు కానీ, తన సమకాలికుడైన దిగ్నా గుడి వంటి వాళ్ల వెటకారాలూ, హేళనలూ తప్పించు కోలేకపోయాడు. అందుకే, ‘రసజ్ఞులారా, పురాతనమై నదంతా మహత్తరమైనదని నెత్తిన పెట్టుకొని, నాలాం టి నవీనులు రాసిందంతా నిస్సారమని భావించకం డి’ అని మొరపెట్టుకొన్నాడు. బాణభట్టు తన కావ్యం తన సమకాలిక విమర్శకులకు నచ్చలేదని బాధపడి, దాన్ని నిప్పులో గిరవాటు వేశాడట. చాలా వరకు కాలి పోగా, దుఃఖావేశం తగ్గిన తరవాత కొడుకు సహాయం తో దాన్ని మళ్లీ మొత్తం తిరగరాసుకొన్నాడట. భవభూతి కూడా సమకాలికుల విమర్శల బాధి తుడే. ‘అయ్యా, లోకంలో నా కావ్యం చూసి పెదవి విరి చే వాళ్లు ఉంటే ఉండచ్చుగాక. వాళ్ల జ్ఞానమూ పాం డిత్యమూ వాళ్లవి. నేను రాసేది వాళ్ల కోసం కాదు. ఈ అనంత కాలచక్రంలో, ఈ విశాల విశ్వంలో నాలాంటి మనోధర్మం కలవాడు మరొకడు పుట్టకనూ పోడు, నా కావ్యంవల్ల ప్రయోజనం పొందకనూ పోడు!’’ అన్నాడు. నిజానికి, ఒక మహానుభావుడి కళాఖండానికి, అతని సమకాలికుడై అదే రంగంలో ఉన్న మరో మహానుభావుడు బహిరంగంగా ‘ఆహా, ఓహో’ అని వివిధ కారణాల వల్ల ‘పెద్ద’ మనిషి తరహా మెచ్చుకోలు ప్రకటించవచ్చు గాని, పూర్తిగా, హృదయపూర్వకంగా ప్రశంసించటం కష్టమే. దీనికి చాలా కారణాలు. మాన వ సహజమైన స్పర్థ, సంకుచితత్వం ఒక కారణం. దోష రహితం అని ప్రశంసించదగ్గ కళాఖండాలు చాలా చాలా అరుదు కావడం మరొక కారణం. అభి రుచులు భిన్నంగా ఉండటం ఇంకో కారణం. రాసు కొన్న కవికి తన కవిత్వం పట్ల ఉండే మమత్వం, విమ ర్శకులకు ఉండకపోవటం మరో కారణం. పైగా, మని షికి తన ముందు తిరుగుతున్న సాటి మనిషిని మహాక విగా కళాకారుడిగా గుర్తించటం, తేలిక కాదు. ‘ఏ గతి రచియించిరేని సమకాలము వారలు మెచ్చరే గదా!’ అని చేమకూర వెంకట కవిరాజు, తన కావ్యంలో వసంతాన్ని వర్ణిస్తూ శ్లేషిస్తాడు. అయితే నిజమైన ప్రతిభ ఊరికే పోదు. స్పర్థవల్ల సమకాలికులు మెచ్చలేకపోయినా, తరవాతి కాలం లోనైనా గుర్తింపు వచ్చి తీరుతుంది. అందుకే గొప్ప కవులూ, కళాకారులూ మరణానంతరం కూడా, జరామరణాలు లేని కీర్తికాయాలతో చిరకాలం నిలిచి ఉంటారు. ఎం.మారుతిశాస్త్రి -
చిత్రానికి నమస్సులు
జ్యోతిర్మయం ‘శ్రీరామకృష్ణ పరమహంస చిత్రాన్ని లిఖిస్తానంటూ ఒక గొప్ప చిత్రకారుడు ఆయన వద్దకొచ్చాడు’ అని ఓ ఉదంతం చెప్తాడు శ్రీరజనీష్. పరమహంస అను మతించాడు. చిత్రకారుడు చిత్రాన్ని తయారు చేసిన తర్వాత, దానిని శ్రీరామకృష్ణ వద్దకు తెచ్చాడు. అది ఉదయం వేళ. చిత్రకారుడు రామకృష్ణుల చిత్రాన్ని ఆయన ముందుపెట్టాడు. రామకృష్ణ దానిని చూసి, ఆ తైలవర్ణ చిత్రపాదాలకు నమస్కరించాడు! చిత్రకారు డు, అక్కడ కూచోనున్న శిష్యులు, తదితరులు అంద రూ విస్మయులైనారు. చిత్రకారుడు రామకృష్ణునితో ‘అయ్యా, నాకు జ్ఞానయోగుల విషయం ఆట్టే తెలియదను కోండి. కానీ ఈ చిత్రం సాక్షా త్తు మీ చిత్రమే. దాని పాదాలకే మీరు నమస్కరించడం చాలా ఆశ్చర్యంగా ఉంది’ అన్నారు. అందుకు రామకృష్ణుడు సమాధానం చెప్తూ, ‘నువ్వు చిత్రం గీస్తున్నప్పుడు సమాధిలో ఉన్నాను. అందుచేత ఇది కేవలం నా చిత్రమే కాదు; ‘సమాధి’ చిత్రం కూడాను. నేను ప్రధా నం కాదు. అక్కడ చిత్రంలోని ఆ సమాధి స్థితి ప్రధానం. నా ముందుకు ‘సమాధి స్థితిని’ తీసుకొస్తే - అది ఎవరి సమాధి స్థితి అవనీ.. దానికి మొక్కకుండా ఉండలేను. లోకమంతా నన్ను ఉన్మాదిగా భావించి నా, సమాధిస్థితిని గౌరవించకుండా ఉండలేను. చిత్రంలో నా ఆత్మవికాసాన్ని ప్రదర్శించగలిగావు. నా హృదయంలోని శాంతిని ఆ చిత్రంలో ప్రస్ఫుటంగా చూపించావు. నువు ధన్యుడివి’ అన్నాడు. గౌతమబుద్ధుడు, తన పూర్వ జన్మల్లోని ఒక జన్మలో, ఓ మహాజ్ఞాని వద్దకు వెళ్లాడు. ఆయన్ని ఎన్నో ప్రశ్నలు అడగడానికి ఆత్రపడుతున్నాడు. కానీ ఆ మహా జ్ఞాని వద్దకు వెళ్లేసరికి, అతడి ప్రశ్నలన్నీ మాయ మయ్యాయి. వంగి, పాదాభివందనం చేశాడు. కానీ తాను గౌరవంతో నమస్కరించి లేచి నుంచు నేసరికి, ఆ మహాజ్ఞానే తన పాదాలు ముట్టుకొని నమస్కరిం చడం చూసి దిగ్భ్రాంతి చెందాడు. ‘ఏం చేస్తున్నారండీ? మీరు ఆత్మసాక్షాత్కారమొందినవారు. ఇక నేనో? ప్రాథమిక దశలో ఉన్నవాణ్ణి. నాకేమనాలో తోచడం లేదు.’ జ్ఞాని నవ్వాడు. ‘ఆశ్చర్యపోకు. నేను స్పృశిం చింది నీ కాళ్లను కాదు. నేను నీ భవిష్యత్తుకు అభివం దనం చేస్తున్నాను. నిన్న, నేను మేల్కొన్న వాణ్ణికాదు; రేపటికి నువు మేలుకుంటావు. మనిద్దరికీ ఉన్న తేడా ఏమిటి? అదీకాక నీవొక మహాజ్ఞానిగా విరాజిల్లగల వని, నీ భవిష్యత్తును చూడగలిగాను. కోట్లాది జనులు నిన్ను అనుసరిస్తారు’ అన్నాడు. అరుణాచలరమణుడి దృష్టిలో, ప్రపంచంలో అజ్ఞానులు అంటూ ఎవరూ లేరు. తానూ ఒకప్పుడు పదిహేడేళ్ల వయసులో అజ్ఞానే. ఒక్క ‘మరణా నుభవంతో’ తన భవిష్యత్తు మారిపోయింది. జ్ఞాన మార్గం తొక్కాడు. తపస్సు చేశాడు. లోనుండి మహాజ్ఞానం పుట్టుకొచ్చింది. ప్రతి మానవుడి భవిష్యత్తు ఇదే. అంత వరకూ మానవునిగా జన్మిస్తూనే ఉంటాడు. - నీలంరాజు లక్ష్మీప్రసాద్ -
జై వీరహనుమాన్
జ్యోతిర్మయం హిందీ సాహిత్య గగనంలో చంద్రునిగా కీర్తినం దుకున్న భక్త కవి తులసీదాస్ రచించిన ‘హనుమాన్ చాలీసా’ హనుమంతుని సమగ్ర స్వరూపాన్నీ మహా త్మ్యాన్నీ అభివర్ణిస్తుంది. ఈ చాలీసా యావత్ భార తీయ భక్తజనుల నాల్కలపై నర్తిస్తుందనడం అతి శయోక్తి కాదు. ఈ చాలీసా ఆరంభంలోనే హనుమంతుని ‘జ్ఞాన గుణసాగర’ అని సంబోధించింది. హనుమంతుని జ్ఞానం అంతులేని సాగరం వంటిదని అర్థం. ఆ జ్ఞాన మే ముల్లోకాల్ని జాగృతం చేస్తుందని చెప్తూ ‘తిహులోక ఉజాగర’ అని జ్ఞాన స్వరూపమైన పరబ్రహ్మగా ఈ స్తోత్రరాజం కీర్తించింది. ఆ జ్ఞానమే దేహాత్మబుద్ధి జీవా త్మబుద్ధితో కూడిన కుమతిని తొలగించి ఆత్మబుద్ధి అనే సుమతిని కలిగిస్తుందని ధ్రువీకరిస్తూ ‘కుమతినివార సుమతికే సంగీ’ అని ఆ కపీశుణ్ణి శ్లాఘించింది. సాగరోల్లంఘన చేసి లంకలో హనుమంతుడు ప్రదర్శించిన ధైర్యాన్నీ పరాక్రమాన్నీ సమయోచిత చాతుర్యాన్నీ ఈ చాలీసా వేనోళ్ల శ్లాఘించింది. హను మంతుడు ‘రామకాజకరివేకో ఆతుర’ రామకార్య నిర్వ హణలో మహా ఆత్రుత కలవాడు అని వివరించింది. లంకలో హనుమంతుడు, సీతకు కాపలా కాచే రాక్షస స్త్రీలు ఎక్కడ తన రాకను గమనిస్తారో అని, అత్యంత సూక్ష్మరూపాన్ని ధరించి ‘సూక్ష్మ రూపధరి సియహి దిఖావ’ సీతా దేవికి కనిపించాడు అన్నది చాలీసా. పిదప హనుమంతుడు బృహద్రూ పాన్ని ధరించి లంకాదహనం చేసిన ఘట్టాన్ని వర్ణిస్తూ ‘వికట రూపధరి లంక జరావా’ అన్నాడు తులసీదాస్. పిమ్మట ‘భీమరూపధరి అసుర సంహారే’ భీకర రూపాన్ని ధరించి హనుమ అసురుల్ని మట్టుబెట్టాడని చెప్పి, ఇలా హనుమ ‘రామచంద్రకే కాజ సంవారే’ రాముని కార్యాన్ని చక్కబెట్టాడని, తులసీదాసు హనుమ పరాక్రమాన్ని కీర్తించాడు. హనుమంతుని భక్త రక్షణా దృఢ వ్రతాన్ని అభివ ర్ణిస్తూ తులసీదాసు ‘సుబసుఖలహై తుమార్హరీ శరనా, తుమ రక్షక కాహూకో డరనా’ ఓ హనుమా! నిన్ను శర ణుజొచ్చితే సర్వసుఖాలు సంప్రాప్తిస్తాయి. అసలు నీ రక్షణలో భయానికి తావే లేదు అని అన్నాడు. ‘భూతపి శాచ నికట నహి ఆవై, మహావీర జబ నామ సునావై’ ఓ హనుమా! నీ నామస్మరణంచే, దుష్టశక్తులు దరిచేరవు అని హనుమన్నామ ప్రాశస్త్యాన్ని వర్ణించాడు. ‘సాధు సంతకే తుమ రఖవారే’- ఓ హనుమా! నీవు సాధు రక్షకుడవు అని అంటూ, ‘జన్మ జన్మకే దుఃఖ బిసరావై’- జన్మజన్మల జీవుని వేదనను తొల గించే ముక్తి ప్రదాత అని హనుమ మహాత్మ్యాన్ని కీర్తిం చాడు తులసీదాస్. ‘జో యహ పఢై హనుమాన్ చాలీసా, హొయసిద్ధి సాఖీ గౌరీసా’ హనుమాన్ చాలీసాను నిత్యం పారా యణ చేస్తే, జీవన్ముక్తి ప్రాప్తిస్తుందని, అందుకు పార్వ తీ పరమేశ్వరులే సాక్షులని తులసీదాస్ అభయమి చ్చాడు. హనుమాన్ చాలీసాను పారాయణ చేస్తూ సిద్ధిని పొందుదాం. పరమాత్ముని -
సౌశీల్యవంతుడు
జ్యోతిర్మయం పుట్టుకచేత, విద్యా సంపదల చేత గొప్పతనం ఉన్నప్ప టికీ తక్కువ వారితో అరమరిక లేకుండా కలసి ఉండ టాన్ని సౌశీల్యం అని అంటారు. ఇట్టి సౌశీల్యవంతు లలో అగ్రగణ్యుడు శ్రీరామచంద్రుడు. ఇతడు క్షత్రియ వంశంలో జన్మించినా వేదవేదాంగాల్లో, ధనుర్వేదాది ఉపవిద్యల్లో నిష్ణాతుడైనా, చక్రవర్తి కుమారుడైనా, అష్టై శ్వర్యములు కలవాడైనా తనకు ఏ మాత్రం సరిజోడుగా నిలువలేని ముగ్గురితో ఎటువంటి అరమరిక లేకుండా కలసియుండేవాడు. ముగ్గురిలో మొదటివాడు పడవ నడుపుకొనే పల్లె వాడైన గుహుడు. గుహుణ్ణి శ్రీరామచంద్రుడు ఆత్మస ముడైన సఖుడని భావించాడు. అడవిలో నివసించే గుహుడు తనకు ఎదురుగా వచ్చి స్వాగ తం పలికినం దుకు శ్రీరామచంద్రుడు ఎంత గానో పొంగిపోయాడు. రెండవవాడు సుగ్రీవుడు. ఇత డు మానవజాతికి చెందినవాడే కాడు. ఒక చెట్టు నుండి మరొక చెట్టు మీదకు దూకే, గంతులు వేసే వానరజాతికి చెందినవాడు. అట్టి సుగ్రీవుణ్ణి శ్రీరామ చంద్రుడు తనకు సంరక్షకుడుగా, సుఖదుఃఖానుభ వాలలో తోడుగా నిలిచే ఆప్తునిగా భావించెను. మూడవవాడు మానవ స్వభావానికి విరుద్ధమైన రాక్షసజాతికి చెందిన వాడు. శ్రీరామచంద్రుని భార్య యైన సీతాదేవిని అపహరించిన రావణాసురునికి స్వయంగా తమ్ముడైన విభీషణుడు. సుగ్రీవాదులు విభీ షణుణ్ణి నమ్మవద్దని సూచించినప్పుడు, ఈ విభీషణుడే గాక స్వయంగా రావణాసురుడు మిత్రభావంతో వచ్చి నా అతణ్ణి కూడా క్షమించి రక్షిస్తాను అని తెలిపిన మహనీయుడు శ్రీరామచంద్రుడు. అందరితో కలసిమెలసి ఉండటమే కాకుండా తనకు సంబంధించిన వారికి గాని, తన రాజ్యంలోని ప్రజలకు గాని ఎవరికి ఏ కష్టం వచ్చినా కష్టాలలో ఉన్న వారి కంటే శ్రీరామచంద్రుడే ఎక్కువగా బాధను పొం దేవాడు. వారి కష్టాలు తొలగునట్లుగా సహాయం చేసే వాడు అని వాల్మీకి రామాయణంలో ప్రస్తావించారు.. తనకు ఆప్తులైన సుగ్రీవునికి, విభీషణునికి రాజ్య పట్టాభిషేకం చేసిన పిమ్మటనే తనకు రాజ్య పట్టాభి షేకం జరుగుటకు రాముడు అంగీకరించాడు. తన రాజ్యంలోని ప్రజలకు సంబంధించి ఎవరిం ట్లో ఏ శుభకార్యం జరిగినా, శుభకార్యం జరుపుకునే వారికంటే తానే ఎక్కువగా ఆనందిస్తూ వారికి విరి విగా కానుకలను బహుమానంగా ఇచ్చేవాడు అని శ్రీరామచంద్రుని ఔదార్యాన్ని వాల్మీకి మహర్షి శ్రీమ ద్రామాయణంలో వర్ణించాడు. మహర్షులు కోరకముందే వారి యజ్ఞయాగాది వైదిక కార్యక్రమాలకు రక్షణ ఏర్పాటు చేయవలసి ఉం ది కానీ అట్లుగాక వారు వచ్చి కోరిన మీదట వారి రక్ష ణకు తాను సిద్ధపడితిని కదా అని శ్రీరామచంద్రుడు ఎంతగానో సిగ్గుపడ్డాడు. అవతార పురుషుడైనా, అద్భుత శక్తియుక్తులు, ప్రజ్ఞాపాటవాలు మెండుగా నిండుగా కలిగియున్నా, ‘ఆత్మానం మానుషం వన్యే’ అని పేర్కొని తనను ఒక సామాన్య మానవునిగానే భావించుకున్న సౌశీల్యవం తుడు, సచ్చరితుడు శ్రీరామ చంద్రుడు. అట్టి మహనీ యుని ఆదర్శంగా గ్రహిద్దాం. సముద్రాల శఠగోపాచార్యులు -
అనసూయత్వం
జ్యోతిర్మయం అనసూయత్వం అంటే అసూయలేమితనం. ఇది ఆధ్యాత్మిక విషయాల జిజ్ఞాస ఉన్న వారికి అవసర మైన సద్గుణం. ఈర్ష్య, అసూయ అనే పదాలు రెండూ లోక వ్యవహారంలో దాదాపు ఒకటే అర్థంలో వాడు తుంటాం కాని ఆ రెంటికీ మధ్య కొంత భేదం ఉంది. ఈర్ష్య అంటే ఉడుకుబోతుతనం. మరొకడు పచ్చగా ఉంటే, ప్రగతి సాధిస్తే, బాగుపడితే చూసి ఓర్వలేని గుణం. ఈర్ష్యాళువు బాధ తనకేదో లేదని గాదు, ఎదుటి వాడికేదో ఉందని. ఇది అవగుణాలన్నిటిలోనూ నికృష్టమైనదని వేరే చెప్పక్కర్లేదు. ఈర్ష్యాళువు ఎప్పుడూ ఏడుస్తూ ఉండే ఆరు రకాల దుఃఖ భాగుల్లో మొట్ట మొదటి తరగతి. ‘అయ్యా, నాకు తిండి లేదు, డబ్బు లేదు, లేదా, మరొకటి లేదు’ అని ఏడ్చే వాడి బాధ, ఆ లేనిదేమిటో వీలయితే ఇచ్చి పోగొట్టవచ్చు. ‘నా ఏడుపు నా దగ్గర లేని వాటి గురించి కాదు. ఎదుటి వాడి దగ్గర ఏవేవో ఉన్నాయని’ అని దుఃఖించే వారి దుఃఖం ఆ భగవంతుడు కూడా తీర్చలేడు, తీర్చడు! దుర్యోధనుడి బాధ తను సుఖపడ టం లేదనీ, తనకున్నది చాలదనీ కాదు. పాండవులు సుఖపడుతున్నారనీ, నలుగురూ వాళ్ల ధర్మ వర్తననీ, పరాక్రమాన్నీ, సద్గుణాలనూ మెచ్చుకొంటున్నారనీ. పాండవులు ఎంత అగచాట్ల పాలయితే దుర్యోధనుడి కళ్లు అంత చల్లబడతాయి. ఆ లక్షణమే అతనికి సర్వ భ్రష్టత్వం కలిగించి వంశ నాశనానికి దారితీసింది. అసూయ కూడా ఈర్ష్యకు అక్కో చెల్లెలో అయ్యే అవగుణమే. ఈర్ష్యకు మరో రూపం. ఎవరివైనా, గోరంత దోషాలు కనిపిస్తే వాటిని కొండంతలుగా చూసి సంతోషించే గుణం. అవీ దొరకకపోతే, వితండ వాదమన్నా చేసి ఎదుటి వాడి సద్గుణాలే దోషాలుగా చూపాలనే అతురతా, అత్యుత్సాహం, ఆపుకోలేని తపనా! ఇదొక నకారాత్మకమైన మానసిక వికారం. ఇతరుల గుణాలలో దోషాలు వెలికి తీయటం అని అసూయకు పారిభాషిక నిర్వచనం ఉంది. సజ్జనులు ఎక్కడైనా, ఎవరిలోనయినా సద్గుణాల కోసం, మంచి కోసం చూస్తారు. చిటికెడంత మంచి ఎదుటి వాడిలో కనిపిస్తే, దాన్ని గ్రహించి, గుర్తించి, గౌరవిస్తారు. భర్తృహరి భాషలో చెప్పాలంటే, పర గుణ పరమాణువులను పర్వతీకరించి, నలుసంత మం చిని కొండంతగా చూపటం సజ్జనుల లక్షణం. అసూ యాగ్రస్తులు ఇందుకు సరిగ్గా వ్యతిరేకం. నిరంతరం దోషాల కోసమే వెతుకుతారు. తెల్లబట్టలు వేసుకొన్న వాడు కనిపిస్తే, అతడి మీద ఎలాగయినా తక్షణం బురదజల్లి వేద్దాం అని తాపత్రయపడుతుంటారు. నా దుస్తుల కంటే ఎదుటి వాడి దుస్తులు తెల్లగా ఎందు కుండాలి అని కాబోలు. అసూయ ఏ రూపంలోనైనా అసూయాగ్రస్తుడికే ఎక్కువ హాని చేస్తుంది. ఇది వేరుపురుగులా మనిషి ఇతర సద్గుణాలను కూడా తొలిచి డొల్ల చేస్తుంది అంటారు శ్రీ విద్య ప్రకాశానంద గిరిస్వామి వారు. రామాయణం పాటగా గానం చేస్తూ, లవకు శులు, ‘ధర్మార్థ కామ సహితమైన ఈ దివ్య కథను అసూయ వీడి వినండి’ అని ప్రార్థిస్తారు. పరుల తప్పు లెన్ను వారు ఆ సమయాన్ని తమ తప్పులు గుర్తించి, వదిలేయటానికి కేటాయించుకొంటే ఉపయోగం. ఎం. మారుతిశాస్త్రి -
చావుపుట్టుకలు లేనిది
జ్యోతిర్మయం టోజూ అనే జెన్ మాస్టర్ తన జీవితం పొడుగూతా మౌనంగా ఉండేవాడట. మన సంప్రదాయంలో కూడా దక్షిణాదిలో మౌనస్వామి అనే ఆయన ఉండే వాడు. ఆయన మాట్లాడకుండానే ఆశ్రమ జీవితం గడుపుతుండేవాడు. ఈ జెన్ మాస్టర్ విషయంలో కూడా ఇతడు చిన్నప్పుడే మౌనం వహించనారం భించినందువల్ల, ఇతడికి మాటలు రావేమో అని అనుకునేవారు. కానీ పిల్లవాడు ఎంత తెలివిగా ఉండేవాడంటే, ఇతడు మూగకాదనీ, మౌనం పాటిస్తున్నాడని కనుగొన్నారు. బహుశా ఏ పూర్వ జన్మలోనో మౌనంగా బతకాలని తీర్మా నించుకొని, దానిని ఈ జన్మలో వ్రతరూపంగా ఆచరిస్తున్నా డేమోనని అంటుండేవారు. తాను చనిపోయే రోజున, మొదటిసారిగానూ, ఆఖరిసారిగానూ నాలుగు మాటలు పలికాడు. మరణిస్తానన్న పొద్దున తన అనుచరులను అందరినీ ఒక చోట చేర్చాడు. మామూ లుగా అతడేమీ మాట్లాడకపోయినా, వారందరి అనుభవమేమిటంటే, అతడు ‘దేనినో’ జీవిస్తున్నాడని నమ్మేవారు. ఆ జీవిస్తున్న పదార్థం వారందరికీ అత్యంత ముఖ్యమైనది. అందువల్ల అతడ్ని అంటిపె ట్టుకు తిరుగుతుండేవారు. వారంతా టోజు చుట్టూ పర్యవేక్షించి ఉండేవారు. అతడి నిశ్శబ్ద భావప్రసా రానికి గురవుతూ ఉండిపోయేవారు. వారిలో చాలా మంది ఆ కారణంగా పరివర్తన చెందారు. వారందరితో అతడు ‘ఇవాళ సూర్యాస్తమ యానికి నేను మరణిస్తాను. ఇదే నా ప్రథమ మరియు ఆఖరి ప్రకటన’ అన్నాడు. అప్పుడు అతడి అనుచరుల్లో ఒకరు ‘మీరు మాట్లాడగలిగి ఉన్నప్పుడు, జీవితమంతా మౌనంగా ఎందుకుండిపోయారు?’ అని అడిగాడు. ‘జీవితంలో అన్నీ అనిశ్చితమైనవే. మరణం ఒక్కటే నిశ్చయంగా సంభవిస్తుంది. నేను నిశ్చితమైన దానిని గురించే మాట్లాడాలని నిశ్చయించుకున్నాను’ అన్నాడు. ఈ మాటల గురించి శ్రీరజనీష్ వ్యాఖ్యానిస్తూ ‘జీవితానికి రెండు ధ్రువాలుంటాయి. పుట్టటం సకారాత్మక ధ్రువమైతే, మరణం నకారాత్మకధ్రువం. నకారాత్మకధ్రువాన్ని లేకుండా చేయలేం. అయస్కాం తం ఎంత పొడుగుపాటిదైనా, రెండు ధ్రువాలూ తప్పవు. పుట్టావంటే, మరణించక తప్పదు. కానీ పుట్టేట టువంటి ఈ ‘అహం’ వెనకాల, పుట్టనటువంటిది ప్రవహిస్తూనే ఉంది. నువ్వు ఆ పుట్టనిదానిని చూసి అనుభూతి పొందగలిగావంటే, మరణించే భయం తొలిగిపోతుంది. మరణ భయాన్ని మరేరకంగానూ తొలగించలేవు. మరణం నిశ్చయం. పుట్టింది ‘అహం’ కాబట్టి, అహంతో అమృతత్వం సాధించలేవు. అహం యొక్క ప్రారంభం వెనక్కు చూస్తే, అంటే ఈ కెరటం వెనుక ఉన్న సముద్రాన్ని చూస్తే, మనిషి అమృతత్వాన్ని సాధిస్తాడు. ఆ ‘అహంపుట్టక ముందున్నది’ ఏనాడూ పుట్టలేదు, ఏనాడూ చావలేదు. ఇలా పుట్టినటువంటిదానిని మనిషి తెలుసుకున్న వరకు, దాని అనుభూతి చెందేవరకు, మనిషి మరణాన్ని దాటలేడు, అమృతత్వాన్ని అందుకోలేడు. - నీలంరాజు లక్ష్మీప్రసాద్ -
శాంతచిత్తులు
జ్యోతిర్మయం అంతరింద్రియాలను జయించడాన్ని శమమని, బాహ్యేంద్రియాలను నిగ్రహించడాన్ని దమమని అంటారు. సంసార బంధంలో చిక్కుకున్న వారు తెలు సుకోవలసిన తత్త్వజ్ఞానాన్ని ప్రబోధించి, వారు ఆచరిం చవలసిన వాటిని తెలియజెప్పేవారిని సద్గురువులని లేదా సదాచార్యులని వ్యవహరిస్తారు. కారణజన్ములైన సద్గురువులు వైదిక-ధార్మిక- సంప్రదాయిక జ్ఞానాన్ని, ఆచరణను కలిగి ఉంటారు. ధార్మిక చింతనతో జీవనయానాన్ని కొనసాగిస్తూ ఉంటారు. బాహ్యేంద్రియాలను తమ వశంలో ఉంచు కుంటూ వైరాగ్య సంపత్తిని కలిగివుంటూ వారు దాం తులుగా పేరొందుతారు. మనుష్యుల బంధ మోక్షా లకు, అనేక విధాలైన సంకల్ప వికల్పాలకు కారణమై నిలిచే మనస్సును సదాచార్యులు తమ అధీనంలో ఉంచుకొని శాంతులుగా కీర్తి పొందుతారు. తత్త్వజ్ఞానులైన సద్గురువుల తేజస్సు సంసార చక్రంలో చిక్కుకున్నవారి పాపాలను నశింపజేస్తుంది. అయితే వారి తేజస్సు సూర్యకాంతి వలె తీక్షణమైనది కాదు. మనం ప్రచండ భానుణ్ణి చూడలేము. సూర్య తాపాన్ని భరించలేము. కాని సద్గురువుల తేజస్సును దర్శించగలము. వారి ప్రసన్నమైన చూపులకు పాత్రు లం కాగలుగుతాము. మహర్షుల వంటి స్వభావం, స్వరూపం, గుణ సముదాయం కలి గిన సదాచార్యుల సన్నిధిలో పర స్పరం విరుద్ధ భావాలు కలిగిన వారు కూడా కలసి మెలసి ఉండ గలుగుతారు. వేదవ్యాస, కణ్వాది మహర్షుల యొక్క ఆశ్రమా లలో సహజవైరం కలిగిన మృగ-పశుపక్ష్యాదులు తమ లోని వైరభావాన్ని, ఉద్రేకాన్ని కోల్పోయి శాంతస్వభా వాన్ని కలిగియున్నట్లే, రజస్తమాలను అణచివేసి స్త్వగుణభూషితులై, శాంతచిత్తులై, లోకహిత పరాయ ణులై ప్రవర్తించే సదాచార్యుల సాంగత్య లాభాన్ని పొందిన వారు కూడా తమలోని ఉద్రేకాన్ని, విరుద్ధ భావాలను కోల్పోయి ప్రశాంతంగా జీవనాన్ని కొనసాగించగలుగుతారు. వేదవ్యాసమహర్షి శాంత స్వభావాన్ని, సహజ వైరం గలవారిలోని ఉద్రేకాలను తొలగించి ప్రశాంత తను నెలకొల్పే చాతుర్యాన్ని వర్ణించేటువంటి ‘‘మధురై రవశాని లంభయన్నపి తిర్యంచి శమం నిరీక్షితైః / పరితః పటుబిభ్రదేనసాం దహనం ధామని లోకన క్షమమ్’’ అనే కిరాతార్జునీయ శ్లోక సారాంశము శం కర భగవత్పాదులు, రామానుజాచార్యులు వంటి జగదాచార్యులు ఎందరెందరికో వర్తిస్తుంది. శాంతచిత్తులైన మహర్షులకు, మునీశ్వరులకు సంసారుల వలె ప్రియాప్రియములు ఉండవు. శాంత చిత్తులై శీతోష్ణ సుఖదుఃఖాలను సహించగలుగుతారు. సమచిత్తులై వ్యవహరిస్తారు. అట్టి మహనీయుల శాంతచిత్తం నేటి తరానికేగాక అన్ని తరాల వారికీ ఆదర్శప్రాయమైనట్టిది, అనుసరణీయమైనట్టిది. కాబ ట్టి మనం కూడా యథాశక్తి మన చిత్తాన్ని ప్రశాంతం గా ఉంచుకొనే ప్రయత్నం చేద్దాం. సముద్రాల శఠగోపాచార్యులు -
మహాదాత
జ్యోతిర్మయం ఒకానొక కోటీశ్వరుడు ప్రతి సంవత్సరం వ్యాపారం లో తనకొచ్చిన లాభాలలో నాలుగో వంతన్నా దాన ధర్మాలకు ఖర్చు చేసేవాడు. అందరూ తనను దాన కర్ణుడు అని ప్రశంసిస్తూ ఉంటే ఆయనకు అదొక తృప్తి గా ఉండేది. చనిపోయిన తరవాత కోటీశ్వరుడు స్వర్గం చేరాడు. కానీ అక్కడ కొద్ది కాలం మాత్రం గడిపిన తర వాత, యమదూతలు తనని నరకానికి తీసుకువెళ్లటం అతడికి బాధతో పాటు ఆశ్చర్యాన్ని కలిగింది. నరకా నికి వెళుతూనే, చిత్రగుప్తుడితో వాదం పెట్టుకొన్నాడు. ‘అయ్యా! ఇన్ని దానధర్మాలు చేసిన నన్ను నరకానికి పంపడ మేమిటి? మీ లెక్కలో ఏదో పొరపాటు జరిగింది. దాన్ని సరిచేయించండి’ అని. చిత్రగుప్తుడు కోటీశ్వరుడికి పరిస్థితి వివరించాడు: ‘నాయ నా, పొరపాటేమీ లేదు. నీకు నీ దానధర్మాల వల్ల చాలా పుణ్యం రావలసిన మాట నిజ మే. కానీ, నువ్వు దానం కోసం నీ దగ్గరకు వచ్చిన వాళ్ల ను చులకనగా చూసి, ఒకటికి పదిసార్లు నీ చుట్టూ తిప్పించుకొన్న తరవాతే నువ్వు చేసే దానమేదో చేసేవా డివి. ఆ కారణంగా, నీకు రావలసిన పుణ్యంలో నాలు గోవంతు చేతులారా నువ్వే పోగొట్టుకొన్నావు! ఆ తర వాత, ‘నేను అంత దానం చేశానూ, ఇంత దానం చేశానూ’ అని పదే పదే ప్రతిచోటా సందర్భం ఉన్నా లేకపోయినా ఆత్మస్తుతి చేసుకొని మరో నాలుగో వం తు పుణ్యం పోగొట్టుకున్నావు!’ ‘అయినా, కనీసం ఆ మిగతా సగం పుణ్యమన్నా నాకు దక్కాలి గదా?’ అన్నాడు కోటీశ్వరుడు. ‘దక్కేదే, కానీ దాన గ్రహీతల చేత నువ్వు చేయించుకొన్న సత్కా రాలూ, సన్మానాలు, స్తుతులు, స్తోత్రాలూ వగైరాలకూ నీ పేరు ఉండాలని బలవంతం చేసి, నువ్వు సంపాదిం చిన పుణ్యంలో మిగిలిన భాగం కూడా అప్పుడే ఖర్చు చేసేసుకొన్నావు! కనక నీకు రావలసిన పుణ్యంలో స్వల్పమైన భాగమే నీ ఖాతాలో చేరింది’ అన్నాడు చిత్ర గుప్తుడు. ‘అదేమిటి? నా డబ్బుతో కట్టించిన ఆశ్రమా లకు నా పేరు పెట్టమంటే తప్పా? నా సొమ్ము దానం చేసినప్పుడు నేను దానం చేశానని చెప్పుకొంటే పాప మా?’ ఆక్రోశంతో ప్రశ్నించాడు కోటీశ్వరుడు. ‘అక్కడే చాలా మందిలా నువ్వూ పొరబడుతున్నా వు నాయనా! భూమి మీద నువ్వు జన్మ ఎత్తినప్పుడు నీ దగ్గర నువ్వు తెచ్చుకొన్న ద్రవ్యమంటూ ఒక్కపైసా లేదు. నీ జీవిత కాలంలో కొన్ని కోట్ల రూపాయలు నీ చేతికి వచ్చాయి. కానీ ఆ జీవిత కాలం ముగిసిన తర్వా త సంక్రమించినదాన్లో ఒక పైసా కూడా మళ్లీ నీతో తెచ్చుకోలేకపోయావు. ఇక అది నీ సొమ్ము ఎలాగ యింది చెప్పు? సృష్టిలో ఉన్న ఐశ్వర్యాలూ, వనరులూ అన్నీ భగవంతుడివే. నీ కర్మ ఫలం వల్ల, ఆయన తన మహదైశ్వర్యంలో కొద్దిపాటి భాగం కొంతసేపు నీ చేతి లో ఉంచాడు. ఆ ధనంలో కొంత భాగం నువ్వు ఆయ న మెచ్చే దానధర్మాల కోసం వాడిన మాట నిజమే! ఆ మాత్రానికే నీకు ఎంతో పుణ్యం రావలసింది. కానీ ఆ పుణ్యమేదో అప్పటికప్పుడే పేరు కోసం, కీర్తి కోసం, అహం కోసం ఖర్చు పెట్టేసుకొన్నావు. మిగిలిన అతి స్వల్ప భాగం నువ్వు చేసిన కొద్ది కాలపు స్వర్గవాసంతో చెల్లు అయిపోయింది’ అని చిత్రగుప్తుడు చెప్పేసరికి కోటీశ్వరుడు కొయ్యబారి పోయాడు. ఎం. మారుతిశాస్త్రి -
క్షమాగుణం
జ్యోతిర్మయం క్షమా అనేది ఒక విశిష్ట గుణం. శారీరకంగా, మానసి కంగా ఇతరులు ఎంతగా బాధించినా తిరిగి ఇతరు లను కోపగించకుండా, వధించకుండా కన్నెర్ర జేయ కుండా ఉండే స్థితిని క్షమ అంటారు. ఓర్పు ఉన్న వారిని క్షమాగుణ సంపన్నులు అని వ్యవహరిస్తారు. విశిష్టమైనరీతిలో సకల ప్రాణివర్గాన్ని సహనంతో ఎల్ల ప్పుడూ ధరించునట్టి భూమాత క్షమాగుణ సంపన్ను లలో అగ్రగణ్యురాలు. భూదేవికి క్షమ అనే సార్థక నామధేయం కూడా ఉన్నది. రావణాసురుని ఆజ్ఞకు బద్ధులై రాక్షస స్త్రీలు తనను అశోకవనంలో ఎంతగా హిం సించినా సీతాదేవి ఓర్పుతో భరించినది. అంతేకాకుండా రావణవధ తర్వాత హనుమం తుడు రాక్షస స్త్రీలను వధించు టకు సిద్ధపడినా ఆమె అందుకు అంగీకరించకుండా తన క్షమాగుణాన్ని చాటుకున్నది. క్షణకాలం కూడా శ్రీహరి యొక్క వియోగాన్ని భరించలేని శ్రీమహాలక్ష్మి ఆయన వక్షః స్థలంలో నిత్యనివాసాన్ని ఏర్పరచుకొని శ్రీమహావిష్ణువుకు ఉండే క్షమను మరింతగా వృద్ధిపర చాలని భావించినది. అనేక శుభగుణములకు నిల యుడైన శ్రీహరి తనను ఆశ్రయించిన వారిలోని దోషా లను చూడడు. వారు చేసిన అపరాధములను క్షమి స్తాడు. తన క్షమాగుణవైభవాన్ని చాటుతూ వారిని అక్కున చేర్చుకుంటాడు. అనన్య భావనతో తనను ఆశ్రయించిన వారిలో దోషాలున్ననూ వారిని క్షమిస్తాను’ అని భగవద్గీతలో శ్రీకృష్ణపరమాత్మయే స్వయంగా పేర్కొన్నాడు. ‘ఓ స్వామీ! నీవు రామావతార సమయంలో సహించలేని మహాపాపాన్ని చేసిన కాకాసురుణ్ణి కూడా క్షమించి రక్షించావు. అట్లాగే కృష్ణావతారంలో కూడా వరుసగా మూడు జన్మల నుండి నీ పట్ల ఘోర అపరాధాలను చేస్తున్న శిశుపాలునికి మోక్షాన్ని అనుగ్రహించావు. ఆశ్చర్యాన్ని కలిగించే రీతిలో ప్రకాశించే నీ క్షమా గుణానికి పాత్రం కాని దోషం అంటూ ఏదీ ఉండదు. మా సమస్త అపరాధాలను క్షమించగలవాడవు నీవే’ అని యామునాచార్యులు స్తోత్రరత్నంలో పరమాత్మను ప్రస్తుతించారు. కొన్ని వేల బ్రహ్మ కల్పముల కాలంలో పూర్తిగా అనుభవించినా తీరనంతటి మహా పాతకాలను మాన వుడు ఒక అర క్షణంలోనే చేస్తున్నాడు. అలాంటి పాపా లను విడవకుండా ప్రతి జన్మలో ప్రతిక్షణం చేస్తూ జీవిం చేవాణ్ణి ఎవరు క్షమిస్తారయ్యా! మహా పాపాత్ముడు తన మనసు మార్చుకొని ఇక పాపాలు చేయను అని మనసు మార్చుకొని క్షమించమని వేడుకుంటే వెంటనే నీ మనసు కరిగి క్షమిస్తున్నావు. స్వామీ నీ హృదయం చాలా విశాలమైనది అని పరమాత్మ క్షమాగుణ వైభ వాన్ని కూరేశులు కీర్తించారు. వేదాచార్య భట్టర్ అనే వారు శ్రీరంగనాథుని క్షమాగుణాన్ని స్తుతిస్తూ 16 శ్లో కాలతో క్షమాషోడని అనే స్తోత్రాన్ని రచించారు. మనం కూడా క్షమాగుణాన్ని అలవర్చుకుంటే వివాదాలు ఘర్షణలు తగ్గుతాయి. ప్రశాంతంగా, సుఖసంతో షాలతో జీవించే అవకాశం కూడా కలుగుతుంది. - సముద్రాల శఠగోపాచార్యులు -
ఛాందోగ్య ఉపనిషత్
జ్యోతిర్మయం ఛాందోగ్య ఉపనిషత్ సామవేదానికి సంబంధించి నది. తాత్విక సిద్ధాంతాన్ని ఊరికే చెప్పకుండా చిన్న చిన్న కథలను జోడించి చెప్పటం చాలా ఉపనిషత్తుల్లో కనిపిస్తుంది. ఈ విషయంలో ఛాందోగ్య ఉపనిషత్తులో ఉన్నన్ని కథలు మరేదాంట్లోనూ లేవు. వాటిల్లో రెండు కథలు ముఖ్యంగా చెప్పుకోదగ్గవి. ఒకప్పుడు సత్యకాముడు అనే కుర్రవాడు తన తల్లిని అడిగాడు. ‘అమ్మా! నేను గురువుగారి దగ్గర ఉండి చదువుకుందామనుకుంటున్నాను. నా గోత్రమే మిటి? అందుకు సమాధానంగా ఆమె అన్నది. ‘నాయ నా నీ గోత్రమేమిటో నాకు తెలియదు. నేను వయసులో ఉండగా పరిచారికగా ఉన్నాను. ఆ కాలంలో నిన్ను నేను కన్నాను. అదట్లా అవటం వల్ల నీ గోత్రం ఏమిటో నేను తెలుసుకోలేకపోయాను. అయినా గాని, నా పేరు జబాల. నీ పేరు సత్యకాముడు. కాబట్టి నిన్ను నీవు ‘సత్యకామ జాబాల’ అని చెప్పుకో’. ఆ కుర్రవాడు హారిద్రుమత గౌత ముని వద్దకు వెళ్లి ‘అయ్యా! మీ దగ్గర చదువుకోవాలని ఉంది. అనుమతి స్తారా? అని అడిగాడు. గౌతముడు, ‘ముందు నీ గోత్రం ఏమిటో చెప్పు’ అన్నాడు. ‘అయ్యా! నా గోత్రం ఏమిటో నాకు తెలియదు. నా తల్లిని అడిగితే ఇలా చెప్పింది’ అని చెప్పి చివరగా అన్నాడు ‘అందు వల్ల నేను సత్యకామ జాబాలిని’. అది విన్న గురువు గారు అన్నారు. ‘నిన్ను నేను శిష్యుడుగా అంగీకరిస్తు న్నాను. ఎందుకంటే నీవు సత్యం నుండి వైదొలగలేదు’. రెండో కథ: ఒకప్పుడు జానశృతి అనే రాజు ఉండే వాడు. అతడు ఎన్నో దానాలు చేశాడు. ఎందరికో ఆకలి తీర్చాడు. ఉండటానికి సత్రాలు కట్టించాడు. అతను అనుకొంటూ ఉండేవాడు, ‘అంతటా జనం నన్ను గురించే గొప్పగా చెప్పుకుంటారు’. ఓ రాత్రివేళ కొన్ని హంసలు పైన ఎగురుతూ వెళ్లాయి. వాటిల్లో ఒక హంస ఇంకో హంసతో అన్నది. ‘ఈ జానశృతి కీర్తి అనే తేజస్సు పట్టపగలు వెలిగినట్లు వెలుగుతోంది. దగ్గరగా బోకు, కాలిపోతావు’. ఆ ఇం కో హంస అన్నది, ‘‘ఇతను ఏమైనా బండి తోలుకొని జీవించే రైక్వుడా, అంతగా పొగుడుతున్నావు?’’ జాన శృతి ఈ మాటలు విన్నాడు. బండి తోలే రైక్వుడు ఎక్కడ ఉంటాడో తెలుసుకు రమ్మని సేవకుణ్ణి పురమాయిం చాడు. సేవకుడు వెతికాడు కాని రైక్వుడు ఎక్కడ ఉం డేదీ కనిపెట్టలేకపోయాడు. జానశృతి చెప్పాడు, ‘బ్రహ్మ జ్ఞానిని ఎక్కడ వెతకాలో అక్కడ వెతుకు! సేవకుడు ఈ సారి వెతగ్గా రైక్వుడు బండి కింద కూర్చొని ఒంటి మీద పొక్కులు గోక్కుంటూ కనిపించాడు. జానశృతి చాలినన్ని బహుమతులు గురుదక్షిణగా పట్టుకెళ్లి, ప్రతిగా తాను కోరుకున్న బ్రహ్మజ్ఞానాన్ని బండి రైక్వుడి నుండి పొందినాడు. రెండు కథల్లోను పైకి కనిపించే అర్థం అంతము ఖ్యమైనది కాదు. అంతరార్థమే అసలు తెలుసుకోవల సింది. నాలుగు మహావాక్యాల్లో ఒకటైన ‘తత్త్వ మసి’ ఈ ఉపనిషత్తులోంచే గ్రహించబడింది. దీవి సుబ్బారావు -
శ్రుతిసారం
జ్యోతిర్మయం ‘అంతా మిథ్య తలంచి చూడ’... లోతుగా పరిశీలించి చూస్తే, ఈ లౌకికమైన జగత్తంతా మిథ్యే. ఇందులో మనం దక్కుతాయని ఆశిస్తున్న ఆనందాలూ మిథ్యే. ఈ భోగాలూ మిథ్యే. ఈ విషయం తెలిసినప్పటికీ నరులు ‘నేనూ నా సంతానం, నా సంసారం, నా సంపద, నా ఇల్లూ వాకిలీ’ అనే మోహంలో కొట్టుమి ట్టాడుతూ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటారే కానీ, పర మార్థమైన దైవాన్ని ధ్యానింపరు కదా అని ధూర్జటి మహాకవి వాపోయాడు కాళహస్తీశ్వర శతకంలో. ‘తద్యథా ఇహ కర్మచితః లోక క్షీయతే ఏవం ఏవ అముత్ర పుణ్యచితః లోకః క్షీయతే’ ఈ లోకంలో వ్యవసాయం, వాణిజ్యం సేవ మొదలైన కర్మల వల్ల సంపాదించుకున్న భోగాలు కాలక్రమంలో ఎలా గతించిపోతాయి. అలానే అగ్నిహోత్రాది కర్మల వల్ల సాధించుకున్న స్వర్గాది ఫలాలూ, చేసుకున్న పుణ్యం నశించగానే నశిస్తాయి, కనుక వాటి పట్ల వైరాగ్యాన్ని పెంచుకోవాలి అన్నది శ్రుతిమాత. ఈ లోకంలోని ఆనందానుభవం ఎలా అనిత్యమో, పరలోకంలోని స్వర్గాది సౌఖ్యాల ఆనందానుభవమూ అలానే అనిత్యం అన్నది శ్రుతి తాత్పర్యం. ఈ లోకాలు కేవలం అవిచార రమణీయమే. లలితా పరమేశ్వరి సహస్ర నామాల్లో ‘మిథ్యా జగదధిష్ఠానా’ అన్నది ఒక నామం. ఈ నామానికి విశేషమైన అర్థం ఉన్నది. అమ్మవారు ఈ మిథ్యా జగత్తుకు అధిష్ఠాన స్వరూపం అన్నది ఈ నామ తాత్పర్యం. మసక చీకట్లో తాడు పాములా అనిపిస్తుంది. భ్రాంతి గొల్పుతుంది. అలా ఈ మిథ్యా జగత్తుకు అమ్మవారు అధిష్ఠానం, ఆధారం. వాస్తవమైన తాడు ఉండబట్టి మిథ్య అయిన సర్పం తాత్కాలికంగా ఆభాసిస్తోంది. ఉన్నట్లు అనిపిస్తుంది. భ్రాంతి తొలగితే మిథ్యా సర్పం మటు మాయమై, వాస్తవమైన తాడే మిగులుతుంది. అదే విధంగా అజ్ఞానంలో ఉన్నంత కాలం ఈ జగత్తు, జగత్తులోని సుఖ దుఃఖాలు, జన్మ మృత్యువులూ, సత్యంగా గోచరిస్తాయి. అజ్ఞానం తొలగితే జగత్తు పట్ల సత్యత్వ భావన అదృశ్యమవుతుంది. అధిష్ఠాన మైన అమ్మవారే గోచరిస్తుంది. బ్రహ్మ సత్యం జగత్తు మిథ్య అన్న పారమార్థిక సత్యం సుదృఢం అవుతుంది. అప్పుడంతా అద్వైతమే. జగత్తు పారమార్థిక సత్యం కాదన్నదే శ్రుతి సారం. లలిత నామ సహస్రం బోధ అదే. ధూర్జటి పల్కుల తాత్పర్యం అదే. ఈ జగత్తుకు సంబంధించిన అసత్వాన్ని తెలుసుకొని, నేను కర్తను భోక్తను కాను అన్న పరమార్థాన్ని గ్రహించి, ఈ వ్యావహారిక జగత్తులో, ఫలాల్ని ఆశించకుండా, నీ కర్తవ్యాన్ని నువ్వు నిత్యం నిర్వహించాలన్నదే గీతాసారం. కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన’ నీకు అధికారం కర్మల్లోనే, ఫలాల్లో కాదు, అన్నది గీతా తాత్పర్యం. గీతా సారాన్ని గ్రహించి, ఉపనిషత్ బోధను స్వీక రించి, నిష్కామ కర్మను చేబట్టి, మన జీవితాన్ని సార్థ కం చేసుకుందాం. పరమాత్ముని -
ప్రేమభక్తిని కనుగొనాలి
జ్యోతిర్మయం ‘రుషులు, సాధుపుంగవులు వారి జీవితంలో భక్తిని అత్యంత ప్రధానంగా ఎందుకు ఎంచుతారు?’ అని సాధు వాస్వానీని ఎవరో అడిగారు. ఆయన సమాధా నమిది- భక్తి, మానవ పరిణామాన్ని వేగిరపరుస్తుంది. భక్తి, ప్రధానంగా ప్రేమభక్తి, కృష్ణుడు, బుద్ధుడు, క్రీస్తు వంటి మహా ఆత్మలతో మనల్ని జతపరుస్తుంది. అందు వల్ల ఆ మహా ఆత్మ కంపనలు ఈ ఆత్మకు అను సంధానమైతే ఆ ప్రభావం, ఆ ప్రేరణ మన ఆత్మ మీద ఉంటాయి. ఆ విధంగా మెల్లిమెల్లిగా, భక్తి ద్వారా ఆ భగవంతుడిలోనే ఐక్యమవుతావు. మనిషి పుట్టింది భక్తిప్రేమను కనుగొని ఆచరించ డానికే. అది వారినీ, వీరినీ చూసి అనుకరించేది కాదు. స్వయంగా ఆ ప్రేమభక్తిని కనుగొన్న వానికే ఆత్మ నివేదిక జరుగుతుంది. అందులో నుంచి పుట్టుకొచ్చిన భక్తే స్వచ్ఛ మైంది. భక్తిలో శ్రవణ కీర్తనాదులు జోడించవచ్చు. కానీ ఆత్మ నివేద నతో కూడిన భక్తి ఉన్నప్పుడే వాటికి విలువ. వేదాలలో ఉపాసనా శబ్దం, పురాణాల్లో భక్తి శబ్దం వాడారు. ఈ రెండూ దాదాపు ఒకటే. భక్తి అంటే ప్రేమ, ఉపాసన అంటే సామీప్యం. ఎక్కడ ప్రేమ జనిం చిందో అక్కడ ఆ వస్తువు చెంతగా కూర్చోవాలి అనుకో వడం సహజం. దైవానికి దగ్గరగా జరగడం సంభవిస్తుంది. భక్తి ద్వారానే భగవంతుడు, అతడి చర్యలు కొద్ది కొద్దిగా అర్థమవుతాయి. శాస్త్రాలతోనే భగవల్లీలు అర్థ మవడం కష్టం. శాస్త్రాలు పఠించిన వారు పాండిత్యం కలిగి ఉంటారే కానీ భగవత్ ప్రేమ కలిగి ఉండరు. భగవత్ లీల అర్థం కానందువల్ల ‘ఉన్నది ఉన్నట్లు’ స్థితి ని ప్రేమించగలిగి ఉండరు. భగవంతుడు అనేది ఎదు రుగా, సిద్ధంగా కనిపిస్తున్నది. దీనిని అర్థం చేసుకోగ లిగిన వారికి, భగవంతుడు సవ్యంగానే పాలిస్తున్నాడు అనీ, న్యాయంగానే వ్యవహరిస్తున్నాడనీ గోచరిస్తుంది. భక్తుడు భగవంతుణ్ణి ప్రశ్నించకుండా తనకు ప్రాప్తించిన దానితో తృప్తి పడి, భగవత్ ప్రేమను కొన సాగిస్తాడు. ఇక్కడొక విచిత్రమేమంటే, భక్తుడు భగ వంతుడికి అధీనుడై బ్రతుకు సాగిస్తూ ఉంటే, భగ వంతుడు తరచూ భక్తాధీనుడవుతాడు. భక్తుడు రాజు అయినా, దరిద్రుడైనా -ఎక్కడ భక్తి ఉంటే, అక్కడ భగ వంతుడు ఉంటాడు. అవసరానికి అద్భుత కృత్యాలు చేస్తాడు. భగవంతుడు సృష్టినంతా కాపాడుతుంటాడు - లయ కార్యమూ సాగిపోతూనే ఉంటుంది. కానీ భక్తుల మీద ప్రత్యేక శ్రద్ధ. సతీ సక్కుబాయిని పండరీపురం పంపించడానికి ఆమె స్థానంలో అత్తగారింట్లో ఉండి పోయాడు. భక్తులు కాని వారి ఎడల ఆయనకు దయ లేక కాదు; కానీ వారి కర్మఫలాన్ని వారు అనుభవిం చక తప్పదు. మనిషి జీవితానికి భక్తి ద్వారా తప్పితే ముక్తి లేదు. ఎన్ని విషయాల వెంబడిబడి తిరిగినా, భక్తి సాధిం చనిదే ఈ జీవితం ఫలవంతం కాదు. భగవంతుడి వైపు మళ్లేంత వరకూ, మనిషి విశ్వా త్మ అయ్యేంతవరకూ పుడుతూనే ఉండాలి. ఆ శుభప రిణామానికి, భక్తి శీఘ్రతర మార్గం- అంటున్నాడు సాధు వాస్వానీ. నీలంరాజు లక్ష్మీప్రసాద్ -
బిల్వ పత్రం
జ్యోతిర్మయం ఎందుకో గానీ, బిల్వ పత్రానికి బోళా శంకరుడి పూజ కీ చాలా సన్నిహిత సంబంధం! బిల్వ వృక్షం (మారేడు చెట్టు) అంటేనే వృక్ష రూపంలో ఉన్న పరమశివుడు అని పురాణాలు చెప్తున్నాయి. మూడు విభూతి రేఖలు నుదుటి మీద ధరించకుండా, రుద్రాక్ష మాల లేకుం డా, బిల్వ పత్రం లేకుండా సంప్రదాయం తెలిసిన పండితులు శంకరుడిని పూజించరు! అంటుంది శివ పురాణం. బిల్వ వృక్ష దర్శనం, స్పర్శన మాత్రం చేతనే పాపక్షయం అవుతుందనీ, బిల్వ వృక్షాన్ని పూజలతో, చందనాది ద్రవ్యాలతో పూజిస్తే వంశాభివృద్ధి కలుగుతుందనీ శ్రద్ధాళువుల నమ్మకం. మారేడు చెట్టు కనిపించినప్పుడు, దాని ఆకులు కోసి, వాటితోనే ఆ వృక్షాన్ని పూజించినా పుణ్యమే అంటారు. నిజానికి మారేడు చెట్టు చాలా సాధారణమైన వృక్షంగానే కంటికి కనిపిస్తుంది. మర్రి,, రావి చెట్ల లాగా మహావృక్షమూ కాదు. చెప్పుకోదగ్గ అందమైన పూలూ కనబడవు. తియ్యటి రుచికరమైన ఫలాలూ కావు. పోనీ అరుదైన వృక్షమా అంటే అదీ కాదు, ఆసి యా ఖండంలో దాదాపు అన్ని ప్రాంతాలలోనూ, అన్ని శీతోష్ణస్థితులు తట్టుకొని పెరిగే చెట్టు, నిరాడంబరతా, సాదాతనం, శీతోష్ణాలను ఓర్చుకోగల సహనం మొద లైన లక్షణాలలో మహాదేవుడికీ మారేడు చెట్టును శివా లయాలలో, దేవీ మందిరాల ప్రాంగణాలలో తప్పక పెంచుతారు. సాధారణంగా ఈ చెట్టును ఇళ్లలో పెం చరు. మారేడు ఆకులకూ, ఫలాలకూ ఓషధీ లక్షణాలు న్నాయని, కఫ వాత సంబంధమైన దోషాలను ఇవి నివారిస్తాయనీ ఆయుర్వేద వైద్యవేత్తలు అంటారు. బిల్వ పత్రాలు మూడు దళాల రూపంగా ఉండ టం ఒక విశేషం అని చెప్పవచ్చు. ఆ త్రిదళ రూపం వల్ల వీటిని సత్వ రజస్తమోగుణాలకూ, సృష్టి స్థితి లయా లకూ, అకార ఉకార మకార సంయోగమైన ఓంకా రానికీ, శివుడి త్రినేత్రాలకు, ఆయన త్రిశూలానికి ప్రతీకలుగా భావించుతారు. త్రిదళం, త్రిగుణాకారం, త్రినేత్రం చ, త్రియాయుధం, / త్రిజన్మ పాప సంహారం, ఏక బిల్వం శివార్పణం అంటూ ఆరంభమౌతుంది. మారేడు దళాల ప్రశస్తిని ఉగ్గడిస్తూ చెప్పిన బిల్వా ష్టకం. ఇలా ఒక వృక్ష జాతి ప్రాశస్త్యాన్ని గురించి చెప్పే అష్టకం మారేడు గురించి తప్ప, మరే చెట్టు గురించీ కనబడదు. వినాయక చవితి పూజలో వాడే పత్రిలో కూడా బిల్వ పత్రాలు భాగమే. తులసి, బిల్వ, నిర్గుండీ (వావి లి), అపామార్గ (ఉత్తరేణి) కపిత్థక (వెలగ), శమీ (జమ్మి), ఆమలక (ఉసిరిక), దూర్వా (గరిక) పత్రాల ను అష్ట బిల్వాలుగా పేర్కొనే పరిగణన కూడా ఒకటి ఉంది. ‘మారేడు దళాన్ని శివ లింగానికి తాకిస్తే, ఆ స్పర్శ వల్ల కలిగిన స్పందనల ప్రభావం ఆ దళంలో చాలా సేపు నిలిచి ఉంటుంది. అలాంటి మారేడు దళం మీరు రోజంతా మీ జేబులో, హృదయానికి దగ్గరగా ఉంచుకొని చూడండి. అది మీ శారీరక స్థితినీ, మానసిక స్థితినీ కూడా ఆరోగ్యంగా, ఆహ్లాదంగా ఉంచుతుంది’ అంటారు సద్గురు జగ్గీ వాసుదేవ్. ఎం. మారుతిశాస్త్రి -
రాధ అనన్యభక్తి
జ్యోతిర్మయం ఓ ధనిక దంపతుల కథ చెప్తాడు సాధు వాస్వానీ. వారిద్దరికీ ఒకరి ఎడల మరొకరికి గొప్ప ప్రేమ. ఇద్దరూ ఒక స్టీమర్లో ప్రయాణిస్తుండగా నీటిలో మునిగింది. భార్యాభర్తలిద్దరూ వేర్వేరు గ్రామాలకు చేరారు. భార్య ఎంతగానో దుఃఖించింది. భర్త విచార గ్రస్తుడై భార్యకై వెతకనారంభించాడు. ఓ రాత్రి భర్తకు వచ్చిన స్వప్నంలో తన భార్య కని పించాలంటే ఉత్తరం వైపు వెళ్లమని సూచన వచ్చింది. ఆ సూచనను అనుసరించి ఒక గ్రామానికి వెళితే, ఊరి వారు ఆ ఊరికి కొత్తగా వచ్చిన స్త్రీని గురించి చెప్పు కుంటున్నారు. ఆవిడ నివసిస్తున్నట్లు చెప్పిన గుడిసె వద్దకు వెళ్లి ఆ భర్త తలుపు తట్టాడు. పేరు పెట్టి పిలిచే సరికి, భర్త కంఠ స్వరాన్ని గుర్తుపట్టి, ఆమె వెంటనే తలుపు తీసి అతడితో మళ్లీ ఏకమయింది. ‘భగవంతుడు మనందరికీ శాశ్వతమైన భర్త. మన హృదయ కవాటాన్ని సతతం తట్టుతూనే ఉంటా డు. కానీ మనం లేచి, ఆ తలుపు తీయాలని అను కోము. మనమందరం వేరుపడి బతుకుతుంటాం. ప్రేమ కొద్దీ కార్చే కన్నీరు, అతడికై మనం పడే తహ తహ ఒక్కటే భగవంతుడికి దగ్గర తోవ.’ అని గద్గద స్వరంతో చెప్పేవారు వాస్వానీ. సాధు వాస్వానీ జీవితమంతా ఈ ప్రేమ మార్గాన్ని బోధించారు. ‘చిన్ని కృష్ణుడికి జ్వర మొచ్చింది’ అనే కథ అదే. ఏమందూ ఆ జ్వరాన్ని తగ్గించలేకపోయింది. ఆందోళన చెందిన యశోద ‘కృష్ణా! నీ జ్వరమేమిటో అంతుబట్ట టం లేదు. ఇది ఎట్లా తగ్గుతుందో, త్రిలోకాల పాలకు డివైన నీవే చెప్పాలి’ అని వేడుకున్నది. ‘నన్ను అమితం గా ప్రేమించే భక్త శిఖామణి పాదధూళి నా నుదురుకు రాస్తే, తగ్గిపోతుంది’ అన్నాడు కృష్ణుడు. ఊరినిండా కృష్ణుని ప్రేమించే గోపికలు ఉన్నారు. యశోద ఒక గోపిక ఇంటికి వెళ్లింది. ఆ గోపిక ‘ప్రాణ మైనా ఇస్తాను కానీ, పాదధూళి భగవంతుడి నుదు రుకు రాయడానికి ఇచ్చేటంతటి పాపం చేయలేను. అలాంటి వారు నేరుగా నరకానికి వెళ్తారు’ అంటుం ది. ఎవరి వద్దకు వెళ్లినా ఇలాంటి సమాధానాలే. చివ రకు యశోద, రాధ వద్దకు వెళుతుంది. రాధ, ఉత్సా హంగా ‘నాకున్నదంతా ఆ కృష్ణుడిదే. నా తల తీసు కున్నా సరే, పాదధూళి తీసుకున్నా సరే’ అంటుంది, ఆ మహా ప్రేమికురాలు. ఆశ్చర్యపోయిన యశోద, ‘రాధా! ఈ పాదధూళి ఇచ్చిన వారు నరకానికి వెళతారని శాస్త్రాల్లో ఉంది’. అంటుంది. అయినా రాధ ‘నా కృష్ణుడికై నన్ను ఏ నర కంలోకి తోసినా సంతోషంగా వెళ్తానమ్మా. నా పాద ధూళి తీసుకువెళ్లి, కృష్ణుడికి జ్వరం తగ్గించు’ అంది. యశోద పాదధూళి తీసుకొని బయలు దేరు తుంది. బాలకృష్ణుడప్పటికే లేచి, అల్లరిలో నిమగ్నమై ఉన్నాడు. జ్వరం కేవలం ‘లీల’ అయి ఉండాలి. ఆనాటి నుండి, కృష్ణుడికి రాధ అంత ప్రియమైన మనిషి ఎందు కయిందని ప్రశ్నించిన వారు లేరు. నీలంరాజు లక్ష్మీప్రసాద్ -
జనన మరణాలు
జ్యోతిర్మయం జనన మరణాలు అనేవి సర్వప్రాణులకు సహజములే. పుట్టిన ప్రతివాడు ఎప్పుడో ఒకప్పుడు గిట్టక మానడు. మరణించిన వానికి కూడా పుట్టుక తప్పదు. ఈ జనన మరణాలు అనేవి వదిలించుకుంటే వదిలేవి కావు. అట్టి జనన మరణాలను గూర్చి దుఃఖించుట తగదని శ్రీకృష్ణపరమాత్మ అర్జునుడికి ‘‘జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మమృతస్యచ తస్మాదపరిహార్యే ర్థే నత్వం శోచితుమర్హసి॥ చేసిన ఉపదేశం అన్ని కాలాలకు అన్ని ప్రాంతా లకు చెందిన వ్యక్తులందరికీ వర్తించేదే. ‘‘ఈ దేహాలన్నీ నశించేవే (అంతవంత ఇమే దోహాః). మానవుడు చినిగిన బట్టలను వదిలిపెట్టి, కొత్త బట్టలను ధరించినట్లు జీవుడు పాతబడినట్టి శరీరాలను వదిలి, నూతన శరీరాలను ధరిస్తాడు’’ అందుకే పండితులైన వారు ప్రాణాలు పోయిన వారి గురించి కాని, ప్రాణాలతో ఉండి సమస్య లతో సతమతమయ్యే వారిని గురించి కాని దుఃఖిం చరు అని శ్రీకృష్ణపరమాత్మ అర్జునునికి చేసిన ఉప దేశం అర్జునుడి వలె ప్రతినిత్యం పలు సందర్భాలలో దీనులై, బలహీనులై కర్తవ్య నిర్వహణ చేయలేక సంభ్ర మకు, మోహానికి గురైన వారందరికీ మార్గ నిర్దే శకంగా నిలుస్తుంది. వాలి మరణాన్ని సహించలేక దుఃఖిస్తున్న తార కు, హనుమంతుడు కర్తవ్యోపదేశం చేస్తూ ‘‘ప్రాణుల జనన మరణాలు అనిశ్చితాలు. ఈ విషయం బుద్ధి మంతురాలవు అయిన నీకు తెలియనిది కాదు. నీవం టి బుద్ధిమంతులు అనిశ్చితాలైన విషయాలను గురించి విచారించకుండా శుభకార్యాలను ఎంపిక చేసుకొని, అట్టి వాటిని నెరవేర్చుటకై ప్రయత్నించాలి.’’ ‘‘జానాస్యనియతామేవం భూతానామాగతింగతిమ్ తస్మాచ్ఛుభంహి కర్తవ్యం పండితేనైవ లౌకికమ్॥ అని హనుమంతుడు తారకు చేసిన ఉపదేశం సకల మానవాళికి శిరోధార్యమై నిలుస్తుంది. ప్రతి జీవుడి శరీరంలో బాల్యం, యౌవనం, ముసలితనం అనేవి ఎట్లా సహజమైనవో అట్లే ఒక శరీరాన్ని వదిలి మరో శరీరాన్ని పొందడం కూడా సహజకృత్యమే. సర్వ సహజాలైన ఈ జనన మరణాల విషయంలో మోహా నికి గురికాకుండా ఉండేది ధీరుడొక్కడే. అట్లాంటి ధీరస్వభావాన్ని మానవులందరూ అల వరచుకొనవలసిన అవసరం ఎంతైనా ఉంది. పుట్టిన ప్రతివారికి అనివార్యమైన మరణం గురించి పరితపిం చడం, దుఃఖంతో చిక్కిశల్యం కావటం తగదనే తత్త్వా న్ని గుర్తించగలగాలి. ఈ అశాశ్వతమైన దేహాన్ని శాశ్వ తమైన, పునరావృత్తి రహితమైన పరమానందభరి తమైన మోక్షసాధనకై వినియోగించాలి ‘‘అశాశ్వతేన దేహేన సాధనీయంహి శాశ్వతమ్’’ కాబట్టి, అశాశ్వత మైన ఈ మానవ దేహం సహకారంతో శాశ్వతమైన మోక్షాన్ని పొందాలి. అప్పుడే పూర్వపుణ్యం వల్ల లభిం చిన ఈ మానవ జన్మకు సార్థకత చేకూరుతుందనే పరమ సత్యాన్ని మన మనస్సులో బలంగా నాటుకునే ప్రయత్నం చేద్దాం. సముద్రాల శఠగోపాచార్యులు -
ప్రేమోపాసన
జ్యోతిర్మయం నంద వ్రజంలో ఒక గోపిక కొత్త ఇల్లు కట్టుకుంది. గృహ ప్రవేశానికి ఎందరో బంధువులు, ఆత్మీయులు వచ్చారు. వీళ్లేకాక ఆ గోపికకు ఎంతో ప్రియమైన ఒక ఇష్టసఖి కూడా బహుదూరం నుండి వచ్చింది. గృహ ప్రవేశానంతరం వాళ్లిద్దరూ యమునా నదీ స్నానానికి వెళ్లారు. జలకాలాడుతూ ఇష్టసఖి గోపికతో ‘చెలీ! నంద వ్రజంలో నివసించే మీరంతా ఎంతో అదృష్టవం తులు. శ్రీకృష్ణునితో రాసలీలలో పాల్గొనే మహద వకాశం మీకు ప్రాప్తించింది. అవునా!’ అని అన్నది. ‘నిజమే నేమో’ అన్నది గోపిక. ‘చెలీ రాసలీల జరిగిన ఆ ఒక్క రాత్రి ఆరు నెలల సాధా రణ రాత్రులతో సమానం అని అంటారు కదా! అంత సుదీర్ఘ కాలంలో శ్రీకృష్ణుడు ఎన్నిమార్లు తన బాహువల్లరిలో నిన్ను లాలించాడో చెప్పవా?’ అని అడిగింది కుతూహలంగా ఇష్టసఖి. గోపిక విలాసంగా నవ్వుతూ ‘సఖీ! రాసలీల తరగతి కాదు కదా, లెక్కల్నీ ఎక్కాల్నీ వల్లించటానికి! అది ఒక దుకాణం కాదు కదా, లెక్కలు సరిచూసుకోవ టానికి! శ్రీకృష్ణ ప్రేమ గణాంకాలకు అందేది కాదు. అది ఒక అలౌకికమైన దివ్య రసానుభూతి. స్వామి సన్నిధికి చేరగానే నాకు శరీర సృ్పహ నశించింది. అంతరంగం అంతరించిపోయింది. నా అహంభావం లీనమైపోయింది. నేను నేనుగా మిగలలేదు. ఇంక మిగిలింది పరమానందస్ఫూర్తియే! సత్చిత్ ఆనంద స్వరూపమే!’ అని అన్నది పరవశంగా. ‘అదృష్టవంతురాలివే చెలీ! ఆ దశకు చేరటానికి నువ్వు ఎంత జపాన్ని చేశావో? ఎన్ని వ్రతాల్ని అనుష్టిం చావో? ఎన్ని సత్కర్మల్ని చేశావో కదా!’ అని అన్నది ఇష్టసఖి. ‘సఖీ! నేనింత జపించాను, అంత ధ్యానిం చాను, ఇన్ని వ్రతాల్ని చేశాను అన్న లెక్కల్లో అహం ఉం టుంది. అహం ఉన్నంత కాలం స్వామి దక్కడు. స్వామి విరహంలో ఎంత జ్వలించిపోయావు? సన్నిధికై ఎంతగా తపించావన్నదే ప్రధానం!’ అన్నది గోపిక. యమునా నదీ తీరంలోని చెట్ల పొదల్లో కూర్చొని ఒక సాధకుడు ఎంతో కాలంగా కృష్ణ మంత్రాన్ని జపిస్తున్నాడు. జప సంఖ్య కొన్ని కోట్లు దాటింది. శరీరం శుష్కించిందే కానీ, కృష్ణ దర్శనం కాలేదు. ఆ సాధకునికి ఆ కాంతల సంభాషణ వినిపించింది. వెంటనే ఆ సాధకుడు తన తప్పు తెలుసుకొని, జపమాలను యమునలోకి విసిరివేశాడు. ప్రేమోపాస నకు ఉద్యుక్తుడైనాడు. చేతిలో మాల ప్రధానం కాదు. చిత్తంలో ప్రేమ జ్వాల ప్రధానం. భగవంతుణ్ణి ప్రేమించాలి. విరహంలో జ్వలించాలి. హృదయం ద్రవించాలి. అశ్రువులు స్రవించాలి. ఈ సంసార క్లేశం నుండి జన్మ మృత్యు పరంపర నుండి ముక్తి పొందాలని పరితపించాలి. మహదానంద స్వరూపులం కావాలని, ప్రేమ స్వరూపులం కావాలని ధ్యానించాలి. అదే వినిర్మల భక్తి. కనుక మనం కూడా వినిర్మల భక్తులమై ప్రేమోపాసకులమై సాధనను కొనసాగిద్దాం. ప్రేమ స్వరూపుడైన స్వామి దర్శనాన్ని పొందుదాం. ప్రేమ స్వరూపులమై నిలిచిపోదాం! పరమాత్ముని -
శ్వేతాశ్వతర ఉపనిషత్
జ్యోతిర్మయం శ్వేతాశ్వతర మహర్షి తన శిష్యులకు బోధించిన ఆధ్యాత్మ విద్య, ఆయన పేరు మీదనే ఉపనిషత్తుగా ప్రచారంలోకి వచ్చింది. కృష్ణ యజుర్వేదానికి చెందిన దీనిలో ఆరు అధ్యాయాలు, 113 మంత్రాలు ఉన్నవి. పరబ్రహ్మతత్వానికి సంబంధించిన ముఖ్యమైన ఎన్నో విషయాలను ఇందులో ప్రస్తావించారు. ఏ విషయం చెప్పినా సాధికారికంగానూ, విస్పష్టంగానూ, ఉపమా నాలతో సహా కవితాత్మకంగానూ చెప్పటం ఈ ఉపనిషత్తు ప్రత్యేకత. ఒకటో అధ్యాయంలో మహర్షి చెబుతాడు, ప్రతి మనిషిలోనూ పరమాత్మ అంతర్భూతమై ఉన్నాడు అని. ఎలాగు అంటే, నువ్వులలో నూనెలాగా, పెరుగులో వెన్నలాగా, భూమి లోపలి నదుల్లో నీళ్లులాగా, కట్టెలో నిప్పులాగా ఉన్నాడట. రెండో అధ్యాయంలో యోగాన్ని గురించిన ప్రస్తా వన ఉంటుంది. జ్ఞానకర్మ భక్తి రాజయోగాల గురిం చి, ప్రాణాయామం దాని సాధన గురించి వివరంగా చెప్పటం జరిగిం ది. 19.9.1893న వివేకానందుడు చికాగో నగరంలో ప్రసంగిస్తూ బ్రహ్మ సాక్షాత్కారం ప్రతి ఒక్కరి జన్మ హక్కు అని చెబుతాడు. ఆ సందర్భంలోనే శృణ్వంతు విశ్వే అమృతస్య పుత్రాః’ అని ఎలుగెత్తి చాటుతాడు. ఆ మంత్రం ఈ అధ్యాయంలోదే. మూడవ అధ్యాయంలో సగుణ బ్రహ్మ ఉపాసన, నిర్గుణ బ్రహ్మ ఉపాసన, రెండింటిని వివరించారు.. సగుణోపాసన ద్వారా నిర్గుణ బ్రహ్మమును జేరుకోవ చ్చునని ఉపనిషత్తు బోధిస్తుంది. ఈ అధ్యాయంలోనే రుద్రుడు, శివుడు మొదలైన దేవతల పేర్లు కనిపి స్తాయి. నాల్గవ అధ్యాయంలో పరబ్రహ్మతత్వాన్ని తెలియ జేశారు. పరమ పురుషుణ్ణి సాక్షాత్కరించుకొన్న విధం బహు రమ్యంగా వర్ణిస్తాడు. ఋషి, త్వంస్త్రీ, త్వం పుమా న్, నీవు స్త్రీవి, నీవు పురుషుడవు. నీవు యువకుడవు, యువతివి కూడా. కర్రపుచ్చుకొని తడబడుతూ పోయే ముదుసలివి కూడా నీవే అంటాడు. నీలం పతంగో, నీలవర్ణపు సీతాకోక చిలుక, ఎర్రని కన్నులతో ఉన్న పచ్చని చిలుక మెరుపును దాచుకొన్న మేఘం. ఇవన్నీ ఆ పరమ పురుషుడేనట. ‘ఏష దేవో విశ్వకర్మా’ అనే మంత్రం ఈ అధ్యాయంలోనే వస్తుంది. ఐదవ అధ్యాయంలో జీవాత్మ లక్షణం వివరించ టం జరిగింది. జీవాత్మ ములుగర్ర మొనలాగా, వెంట్రు క యొక్క నూరవ భాగంలో నూరవ భాగమంత సూ క్ష్మమట. అయినా అది అనంతత్వాన్ని పొందగలదట. చివరిది ఆరవది అయిన అధ్యాయంలో భగవం తుని మహిమను వివరించారు. విశ్వాన్ని చక్రంతో పోల్చటం ఇందులో కనిపిస్తుంది. భగవంతుని ధ్యానం చేత సాక్షాత్కరించుకోవాలి అనీ, ఒక్కడే అయిన భగ వంతుడు అన్ని జీవుల్లోనూ ఉన్నాడు అనీ ఉపదేశిస్తాడు ఉపనిషత్ కర్త అయిన శ్వేతాశ్వతర మహర్షి. ఇట్లా శ్వే తాశ్వతర ఉపనిషత్తు సర్వ ఉపనిషత్ సారంగా, వివిధ దృక్కోణాల సమన్వయ రూపంగా విలసిల్లుతోంది. దీవి సుబ్బారావు -
అన్నీ సన్మార్గాలే!
జ్యోతిర్మయం ‘దేహాత్మ బుద్ధ్యా దాసోహం, జీవాత్మ బుద్ధ్యా త్వదం శకః, ఆత్మబుద్ధ్యా త్వమేవాహం, స్థూలదేహమే నేను అన్న భావనలో ఉన్నప్పుడు నేను నీ దాసుణ్ణి, సూక్ష్మ శరీరమే నేను అన్న జీవభావనలో ఉన్నప్పుడు నేను నీ అంశను, అలా కాక ఈ స్థూల సూక్ష్మ శరీరాలకు అతీతమైన ఆత్మస్వరూపుణ్ణే నేను అన్న దశలో నీవే నేను నేనే నీవు’ అని ఆంజనేయస్వామి శ్రీరామునితో అన్నాడట. ఆంజనేయస్వామి అన్నమాటల్లోని మూడు విభాగాల్లో, వరుసగా ద్వైత విశిష్టాద్వైత, అద్వైత మతాలు ప్రతిబింబిస్తున్నాయి. జీవాత్మ పరమాత్మ పరిపూర్ణంగా భిన్నులే. భక్తితో కూడిన భగవత్ ఉపాసన ద్వారా జీవుడు ముక్తిని పొందాలి. ముక్తిలో కూడా తారతమ్యాలు ఉన్నాయి అన్నది ద్వైత సిద్ధాంతం. ఈ మతంలో జగత్తు సత్యం. బ్రహ్మ సగుణ మూర్తి. అనేక జీవులతో కూడిన ఈ జగత్తు పరబ్రహ్మ శరీ రమే అయినందువల్ల, జగత్తు కం తటికీ పరబ్రహ్మ అంతరాత్మ అయి నందువల్ల, జీవబ్రహ్మలకు అభేదం ఉంది. కానీ జీవ బ్రహ్మలకు స్వరూప ఐక్యం లేనందువల్ల, భేదమూ ఉంది అన్నది విశిష్టాద్వైతం. భక్తి ప్రపత్తుల ద్వారా జీవాత్మ ముక్తిని పొందాలి. ముక్తిలో తారతమ్యాలు లేవు. శుద్ధ సత్వమయమైన వైకుంఠంలో భగవత్ సన్నిధియే ముక్తి. ఈ సిద్ధాంతంలో కూడా పరబ్రహ్మ సాకార స్వరూపుడే. జీవాత్మకూ పరమాత్మకూ పూర్తి అభేదమే, అంటూ జీవబ్రహ్మ్యైన్ని చాటుతుంది అద్వై తం. జీవభ్రాంతికి అవిద్యే కారణం. అవిద్యా నాశమే ముక్తి అంటుంది అద్వైతం. ఈ సిద్ధాంతంలో జగత్తు మిథ్య, పరబ్రహ్మ నిరాకార స్వరూపుడు. ద్వైత సిద్ధాంత ప్రవర్తకుడు మధ్వాచార్యులు. విశిష్టాద్వైత సిద్ధాంత ప్రవర్తకుడు రామానుజాచా ర్యులు. అద్వైత సిద్ధాంత ప్రవర్తకుడు శంకరాచా ర్యులు. ఈ ముగ్గురూ దివ్యదర్శనులే. దైవ స్వరూపులే. త్రిమతాచార్యులు మువ్వురూ దివ్య దర్శనులే అయినప్పటికీ, వారు భిన్న అభిప్రాయాన్ని ఎందుకు కలిగి ఉన్నారు? భగవత్ స్వరూప నిర్ధారణలో, సాధనా విధానాల్లో, ఆఖరికి ముక్తిలో కూడా భిన్నా భిప్రాయాల్ని ఎందుకు కలిగి ఉన్నారు? అన్నది ప్రశ్న. భగవత్ సాధన చేసే సాధకులకు విభిన్న అభిరు చులు ఉంటాయి. ఇష్టాయిష్టాలు ఉంటాయి. ఇష్టమైన మార్గంలోనే వారు పురోగతిని సాధించగలుగుతారు. ఇష్టంలోనే కష్టాన్ని సహించగల సహిష్ణుత ఉంటుంది. అందుకనే త్రిమతాచార్యులే కాక, ఇంకా అనేక ప్రవర్త కులు లోకం ముందు అనేక మార్గాల్ని ఉంచారు. అనేక సిద్ధాంతాలను ప్రతిపాదించారు. సాధకులు తమ ఇష్టానుసారం సాధనా మార్గాన్ని ఎంచుకొని సాఫల్యాన్ని పొందాలన్నదే వారి అభిమతం. అదే వారి మతం. అదే సర్వసమ్మతం. మార్గాలు వేరైనా నదులన్నీ సాగరాన్నే చేరేటట్లు, సాధనా మార్గాలు వేరయినా చివరకు చేరేది భగవత్ సన్నిధికే. మార్గాలు అన్నీ సన్మార్గాలే. కనుక ఏ మార్గా న్ని అయినా పట్టుకుందాం. పట్టిన మార్గంలో మాత్రం పట్టువదలం అన్నదే మన మతం కావాలి. పరమాత్ముని