problem of drinking water
-
మీ తప్పుల వల్లే కరువు తిప్పలు
సాక్షి, హైదరాబాద్: గత పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పిదాలపై బతకాలని తాము అనుకోవడం లేదని రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. ‘బీఆర్ఎస్ హయాంలో తలసరి ఆదాయం పెరిగిందని గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ ప్రజల మధ్య ఆర్థిక అంతరాలు పెరిగాయన్న విషయాన్ని మరుగున పెట్టారు. సింగరేణిలో రూ.30 వేల కోట్ల ఆదాయం వచ్చే బొగ్గు గనులకు సంబంధించిన పెండింగ్ అంశాలను పదేళ్లయినా తేల్చలేదు. వర్షాలు వాళ్లున్నప్పుడే పడలేదు. వచ్చిన వర్షాన్ని ఒడి సి పట్టుకోవడంలో విఫలమయ్యారు. కాళేశ్వ రం ప్రాజెక్టు కుంగిపోయినట్టు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెపితే గోదావరి నీటిని అవసరం లేకపోయినా కిందకు వదిలేశారు. కృష్ణాలో నీటి నిల్వల సంగతి తెలిసి కూడా కేవలం ఓట్ల కోసం, కాల్వల్లో నీటిని చూసి జనం ఓట్లేస్తారనే ఉద్దేశంతో పంటలు లేకపోయినా నీటిని సముద్రంలోకి వదిలేశారు. ఇప్పుడు కరువొచ్చిందని అంటున్నారు. రూ. 43 వేల కోట్లు పెట్టి ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ వ్యవస్థ ఈ కరువులో ఏం చేస్తున్న ట్టు? ఇవన్నీ ఎవరి తప్పులు? తప్పులన్నీ మీవైపే ఉన్నాయి..’అంటూ భట్టి ధ్వజమెత్తా రు. శుక్రవారం హైదరాబాద్‌లోని దేశోద్ధారక భవన్లో తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే) ఆధ్వర్యంలో ‘విద్యుత్–తాగునీరు–ఆర్థికం’అంశాలపై నిర్వ హించిన మీడియాతో ముఖాముఖి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అప్పులు, వడ్డీల కింద రూ.26,374 కోట్లు చెల్లించాం ‘రైతుబంధు కింద గత ప్రభుత్వం రూ.7 వేల కోట్లు దాచిపెడితే మేమేదో ఖర్చు పెట్టినట్టు గా ప్రచారం చేస్తున్నారు. కానీ రాష్ట్రంలో మేము అధికారం చేపట్టేనాటికి రూ.3,960 కోట్ల లోటు బడ్జెట్ ఉంది. ఆ పరిస్థితి నుంచి ప్రతి రూపాయి పోగేస్తూ అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేసే ప్రయత్నం చేస్తు న్నాం. సీఎం రేవంత్‌రెడ్డితో సహా మంత్రులందరం 24 గంటలూ కష్టపడుతూ ఓ తపస్సు లా పనిచేస్తున్నాం. రాష్ట్రంలో సంపదను సృష్టించి పేదలందరికీ పంచాలన్నదే మా ఆలోచన. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం చేసిన అప్పుల అసలు, వడ్డీల కింద రూ.26,374 కోట్లు తిరిగి చెల్లించాం. రైతుబంధు కింద రూ.5,575 కోట్లు, ఆరీ్టసీకి రూ.1,120 కోట్లు, వ్యవసాయ విద్యుత్ సబ్సిడీల కోసం రూ.3,924 కోట్లు, గృహజ్యోతి కోసం రూ.200 కోట్లు, గ్యాస్ సబ్సిడీ కోసం రూ.80 కోట్లు, బియ్యం సబ్సిడీల కింద రూ.1,147 కోట్లు, రైతు బీమా ప్రీమియం కోసం రూ.734 కోట్లు చెల్లించాం. ఉద్యోగుల వేతనాలు, విద్యార్థులకు డైట్ చార్జీలు, మధ్యాహ్న భోజన పథకం అమలు, అంగన్వాడీలు, హోంగార్డులకు వేతనాలు, డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాలు... ఇలా మొత్తం రూ.66,507 కోట్లు ఖర్చు పెట్టాం. దీనిపై ఎవరితోనైనా, ఎక్కడైనా చర్చించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం..’అని భట్టి సవాల్ చేశారు. విద్యుత్‌కు అంతరాయమే తప్ప కోతల్లేవు ‘విద్యుత్‌పై ప్రత్యేకంగా దృష్టి సారించి పనిచేస్తున్నాం. గత పదేళ్లలో ఎన్నడూ లేని విధంగా 15,673 మెగావాట్ల పీక్ డిమాండ్ వచ్చినా చిన్న కోత లేకుండా నిరంతర విద్యుత్ ఇస్తున్నాం. ఎప్పుడైనా ఎక్కడైనా కరెంటు పోతే అది అంతరాయం మాత్రమే. నిర్వహణ పనుల కోసం ఆపేస్తున్నదే తప్ప కోత కాదు. 2031–32 సంవత్సరం వరకు 29 వేల నుంచి 30వేల మెగావాట్ల వరకు పీక్ డిమాండ్ వచ్చినా అందుకు తగిన కార్యాచరణ మా వద్ద ఉంది..’అని డిప్యూటీ సీఎం తెలిపారు. తాగునీటికి ఇబ్బంది లేకుండా చర్యలు ‘గతంలో ఎన్నడూ లేని విధంగా ఎండలు మండిపోతున్నా తాగునీటికి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకున్నాం. రాష్ట్రంలో ఎ క్కడా నీటి సమస్య రానివ్వబోం. త్వరితగతి న పూర్తయ్యే సాగునీటి ప్రాజెక్టులకు నిధు లు కేటాయిస్తాం. తుమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తులో అంబేడ్కర్ ప్రాణహిత–చేవెళ్ల ప్రాజె క్టు నిర్మిస్తాం. రైతు రుణమాఫీ తప్పకుండా చేస్తాం. ఎన్నికల తర్వాత దీనిపై స్పష్టమైన ప్ర కటన ఉంటుంది..’అని భట్టి తెలిపారు. 10 లక్షల కోట్లు ప్రభుత్వ అకౌంట్లలోకి రాలేదు గత పదేళ్లలో రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.10 లక్షల కోట్లు వచ్చాయన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలను భట్టి ఖండించారు. ‘కేంద్రం నుంచి రూ.10 లక్షల కోట్లు వచ్చాయని ఒక పెద్దమనిషి చెపుతున్నాడు. రూ.10 లక్షల కోట్ల మాట అటుంచితే తెలంగాణపై బీజేపీకి కనీస ప్రేమ ఉన్నా లక్ష కోట్ల రూపాయల నష్టం జరిగేది కాదు. నాడు చేవెళ్ల–ప్రాణహిత ప్రాజెక్టు కోసం మహారాష్ట్ర కోల్పోయే 3 వేల ఎకరాల భూమి విషయంలో వారిని ఒప్పించి పరిహారం ఇచ్చి ఉంటే నేడు కాళేశ్వరం ప్రాజెక్టే వచ్చేది కాదు. కేంద్రం నుంచి మనకు రావాల్సిన వాటా కింద వచ్చింది రూ.3,70,235 కోట్లు మాత్రమే. మరి ఆయన చెపుతున్నట్టు మిగిలినవి ఎక్కడ ఇచ్చారో తెలియదు. ప్రభుత్వ అకౌంట్లలోకి అయితే రాలేదు. బీజేపీ ఇచ్చిన రూ.10 లక్షల కోట్లు, బీఆర్ఎస్ చేసిన రూ.7 లక్షల కోట్ల అప్పు ఏమయ్యాయో, ఆ రెండు పారీ్టలు ఏం సాధించాయో?’వారే సమాధానం చెప్పాలి..’అని భట్టి వ్యాఖ్యానించారు. మా ప్రభుత్వం ఐదేళ్లూ ఉంటుంది మాజీ సీఎం కేసీఆర్ గురువారం చేసిన వ్యాఖ్యలపై మాట్లాడుతూ..‘ప్రభుత్వాన్ని అస్థిరత పాలు చేసే ప్రయత్నాలు తెలంగాణ సమాజానికే నష్టం కలిగిస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం చాలా బలంగా ఉంది. తలకిందులుగా తపస్సు చేసినా, ఎన్ని పిల్లేరు గంతులు వేసినా మా ప్రభుత్వానికి వచ్చే ఢోకా లేదు. ఐదేళ్ల పాటు నిశి్చంతగా ఉంటుంది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తుంది..’అని డిప్యూటీ సీఎం చెప్పారు. ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, టీయూడబ్ల్యూజే అధ్యక్షుడు విరాహత్ అలీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో తాగునీటి కష్టాలను శాశ్వతంగా తొలగించేలా వాటర్ గ్రిడ్ పథకాన్ని హైబ్రిడ్ యాన్యుటీ పద్ధ్దతిలో చేపట్టేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధంచేసింది. ► హైబ్రిడ్ యాన్యుటీ పద్ధ్దతి అంటే.. కాంట్రాక్టరుకు నిర్మాణ వ్యయంలో నామమాత్రం మొత్తాన్ని ఇప్పుడు చెల్లించి మిగిలింది సాధారణ బ్యాంకు వడ్డీతోగానీ అంతకంటే తక్కువ వడ్డీరేటుతో లెక్కకట్టి 10–12 ఏళ్ల పాటు చెల్లించడం. ► రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి ఇబ్బందులు లేకుండా చేయడంతోపాటు పారిశ్రామిక అవసరాలకు కూడా అవసరమైన నీటిని అందించేందుకు వీలుగా భారీ వాటర్ గ్రిడ్‌కు రాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన చేసింది. ► కొన్ని ప్రాంతాల్లో భూగర్భ జలాల అధిక వినియోగాన్ని తగ్గించేందుకు ప్రత్యామ్నాయ వ్యవస్థగా ఈ వాటర్ గ్రిడ్ పథకాన్ని ప్రభుత్వం తలపెట్టింది. అంతేకాక, ఫ్లోరైడ్ వంటి సమస్యను పరిష్కరించడంతోపాటు తీర ప్రాంతాల్లోని భూగర్భ జలాలు ఉప్పునీరు కాకుండా కాపాడినట్లవుతుందని అధికారులు భావిస్తున్నారు. తొలుత ఆరు జిల్లాల్లో.. రోజూ ఒక మనిషికి పట్టణ ప్రాంతాల్లో 135 లీటర్లు, గ్రామీణ ప్రాంతాల్లో వంద లీటర్లు, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో 150 లీటర్ల నీటిని అందించేలా ప్రతిపాదనలు సిద్ధంచేశారు. ప్రాజెక్టు వ్యయంలో 30 శాతం మేర కాంట్రాక్టర్లకు పనులు చేపట్టే సమయంలో, మిగిలిన 70 శాతం నిధులను 12 ఏళ్ల పాటు విడతల వారీగా చెల్లించాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. తొలి విడతలో భాగంగా తీవ్ర మంచినీటి ఎద్దడి ఎదుర్కొంటున్న ప్రాంతాలతో కలిపి మొత్తం ఆరు జిల్లాల్లో ప్రాజెక్టు పనులను చేపట్టనున్నారు. ఏటా 90 టీఎంసీలు అవసరం – వాటర్ గ్రిడ్‌లో భాగంగా ప్రతి ఇంటికీ మంచినీటి కుళాయి అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. మొత్తం 30 ఏళ్ల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దడంతోపాటు ఎలాంటి మార్పులు లేకుండా వినియోగించుకునేలా వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్‌ను రూపొందించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికీ ఏడాది పొడవునా నీటి సరఫరాకు 90 టీఎంసీల నీరు అవసరం కాగా నీటి వనరుల కోసం 52 రిజర్వాయర్లను గుర్తించారు. రూ.12,308 కోట్లతో తొలిదశ – శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో సురక్షిత నీరు లేకపోవడంవల్ల కిడ్నీ వ్యాధులు అత్యధికంగా నమోదవుతున్నాయన్న అంశానికి ప్రాధాన్యత ఇస్తూ ఈ ప్రాంతంలో వాటర్ గ్రిడ్ ద్వారా మంచినీటిని అందించనున్నారు. – జీవనది గోదావరి చెంతనే ప్రవహిస్తున్నా.. ఆక్వా సాగుతో సముద్రతీర ప్రాంతాల భూగర్భ జలాలు కలుషితమైపోయాయి. దీంతో మంచినీటి కోసం తపిస్తున్న ఉభయగోదావరి జిల్లాల్లోని పలు ప్రాంతాలను కూడా వాటర్ గ్రిడ్ ద్వారా ఆదుకోనున్నారు. – ఇక.. ప్రకాశం జిల్లాలోని కనిగిరి ప్రాంతం, వైఎస్సార్ కడప జిల్లాలోని పులివెందుల ప్రాంతాల్లో ప్రతి ఏటా వందలాది గ్రామాల్లో మంచినీరు దొరకని పరిస్థితి. దీంతో ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చించి ఆయా గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తోంది. దీనికి శాశ్వతంగా చెక్ పెట్టాలని సర్కారు భావిస్తోంది. – అలాగే, గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో సున్నపు రాయి నిక్షేపాలు, ఫ్లోరైడ్ కారణంగా ఎన్నో ఏళ్లుగా ప్రజలను వేధిస్తున్న తాగునీటి కష్టాలకు కూడా ప్రాధాన్యత ఇచ్చారు. ఈ నేపథ్యంలో.. మంచినీటి సమస్యకు శాశ్వతంగా పరిష్కరించేందుకు తొలి విడతలో ఈ ప్రాంతాలను వాటర్ గ్రిడ్‌లో ఎంపిక చేశారు. తొలి విడత పనులకు రూ.12,308 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. ఉద్దానంలో 100 శాతం ప్రభుత్వ నిధులతో.. – రాష్ట్రమంతటా వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టును హైబ్రీడ్ యాన్యుటీ విధానంలో చేపట్టాలని నిర్ణయించినా ఉద్దానం ప్రాంతంలో సురక్షిత నీరు అందుబాటులో లేక పెద్దఎత్తున నమోదవుతున్న కిడ్నీ జబ్బులను దృష్టిలో ఉంచుకుని ఇక్కడ మాత్రం వంద శాతం రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పనులు పూర్తిచేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించినట్లు గ్రామీణ మంచినీటి సరఫరా విభాగం అధికారులు తెలిపారు. మొదలైన టెండర్ల ప్రక్రియ తొలి విడత వాటర్‌గ్రిడ్ పనులను సాధ్యమైనంత త్వరగా ప్రారంభించాలని ఇటీవల జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇందుకు అనుగుణంగా అధికారులు ఇప్పటికే టెండర్ల ప్రక్రియను ప్రాథమికంగా మొదలు పెట్టారు. తొలి విడతలో ఆరు జిల్లాలో ఆరు ప్యాకేజీల వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు నిర్మాణ పనులను హైబ్రీడ్ యాన్యుటీ విధానంలో చేపట్టడంపై ఆంధ్రప్రదేశ్ తాగునీటి సరఫరా కార్పొరేషన్ అధికారులు ఈఓఐ (ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రస్టŠట్) నోటిఫికేషన్ జారీచేశారు. కాంట్రాక్టర్లు తమ ఆసక్తిని తెలియజేసేందుకు ఏప్రిల్ 22వ తేదీ వరకు గడువు ఉంది. 16లోగా జ్యుడీషియల్ ప్రివ్యూకు వివరాలు వాటర్ గ్రిడ్ పనులకు టెండర్లు నిర్వహించేందుకు తొలుత జ్యుడీషియల్ ప్రివ్యూకు ఈనెల 16లోగా వివరాలు పంపాలని నిర్ణయించారు. జ్యుడీషియల్ ప్రివ్యూ నుంచి అనుమతి రాగానే జూన్ మొదటి వారం కల్లా టెండర్లు నిర్వహించి ఆ తర్వాత పనులను ప్రారంభించేందుకు ఏపీ తాగునీటి సరఫరా కార్పొరేషన్ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. -
‘మిషన్’ పనులు ముమ్మరం
► కడెంలో చకచకా సాగుతున్న మిషన్ భగీరథ పనులు ► తెలంగాణలోనే అన్నింటికన్నా ముందు కడెం : జిల్లాలో సాగునీటి రంగంలో పెద్దదైన ప్రాజెక్టు కడెంలో ఉంది. పక్కనే ప్రాజెక్టున్నప్పటికీ తాగునీటి సమస్య ఉన్న గ్రామాలు కూడా బాగానే ఉన్నాయి. దీంతో ప్రభుత్వం కడెం ప్రాజెక్టు వద్ద రు.280 కోట్లతో ఒక భారీ స్థాయిలో వాటర్ గ్రిడ్(మిషన్ భగీరథ) పథకాన్ని చేపట్టారు. ఈ పథకం కింద కడెం, జన్నారం, ఖానాపూర్ మండలాలకు పూర్తి స్థాయిలో అన్ని గ్రామాలకు ప్రతీ రోజు శుద్ధజలాన్ని అందించనున్నారు. అయితే ఈ నిధులతో మొదటి దశ కింద రు.30 కోట్లతో కడెం ప్రాజెక్టు మధ్య జలాశయంలో ఇంటెక్బావి నిర్మాణం, ఒడ్డు నుంచి 80 మీటర్ల దూరంలో నున్న ఇంటెక్ బావి వరకు ఫుట్ బ్రిడ్జిని నిర్మించారు. రెండో దశలో రు.250 కోట్లతో స్థానిక విశ్రాంతి భవనం వెనుగ గల రెండున్నర ఎకరాల విస్తీర్ణంలో ఫిల్టర్ బెడ్‌ను నిర్మించనున్నారు. ఈ నిధులతో ఇక్కడ ఫిల్టర్ బెడ్, వాటర్ ట్రీట్మెంటు ప్లాంటు, సంపు నిల్వ సామర్థ్యం 23లక్షల లీటర్లు కాగా మొత్తం ప్లాంటు సామర్థ్యం 2కోట్ల 30లక్షల లీటర్ల సామర్థ్యం(23ఎంఎల్డీ)గలది ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణలోనే మొదటగా. . . మొదటి దశలో పనులను హైద్రాబాదుకు చెందిన ‘ మెగా నిర్మాణ సంస్థ ’ఆద్వర్యంలో వాటర్ గ్రిడ్ పనులు కొద్దినెలలుగా ముమ్మరంగా జరుగుతున్నాయి. మొదటి దశలో చేపట్టిన పనుల్లో ఇంటేక్ వెల్ పనులు చాలా వేగంగా నిర్వహించారు. దీంతో రాష్ట్రంలో ఉన్న మిగతా 18 బావుల్లో కెల్ల కడెంలోని ఇంటేక్ వెల్ పనులే పూర్తి దశకు చేరాయి. అన్ని బావుల్లో కెల్ల స్లాబ్ వరకు నిర్మించింది రాష్ట్రంలోనే ఇది మొదటిది. బావి నిర్మాణ పనులు పూర్తి దశకు చేరటంతో వారం రోజుల నుంచి ఫిల్టర్ బెడ్ పనులు ప్రారంభించారు. పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. కడెం ప్రాజెక్టు వద్ద నిర్మించతలపెట్టిన మిషన్ భగీరథ పథకం ద్వారా నియోజకవర్గంలోని కడెం,ఖానాపూర్,జన్నారం మండలాలకు చెందిన 293 గ్రామాలకు ప్రతీరోజు ఇక శుద్ధజలాన్ని ఉచితంగానే అందించనున్నారు. కడెం మండలంలో 103 గ్రామాలు,ఖానాపూర్ మండలంలో 111 గ్రామాలు,జన్నారం మండలంలో 79 గ్రామాలకు కలిపి ఈ నీరందించనున్నారు. రెండో దశలో పైపు లైను నిర్మాణ పనులు ఇంకా ప్రారంభం కాలేదు. వాటిని కొద్దిరోజుల్లోనే మొదలుపెట్టనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ భారీ ప్రాజెక్టు పనులు అనుకున్నట్లు అన్నీ సకాలంలో జరిగితే ఈ మూడు మండలాల ప్రజలు ఇక నీటి చింతను వీడాల్సిందే. సకాలంలో పూర్తి చేస్తాం కడెం ప్రాజెక్టు వద్ద చేపట్టిన మిషన్ భగీరథ పనులు ప్రస్తుతం వేగంగా జరుగుతున్నాయి. నాణ్యతా ప్రమాణాలతో పనులు చేయిస్తున్నాం. పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం. పనులను సకాలంలో పూర్తి చేస్తాం. డిసెంబరు నెలాఖరు వరకు పూర్తి చేసి కొన్ని గ్రామాలకైనా నీరందించాలనుకుంటున్నాం. - వెంకటపతి, డీఈ, మిషన్‌భగీరథ, కడెం -
నీటి సమస్య తీర్చాలని మహిళల ధర్నా
ఖానాపూర్ : మండలంలోని మస్కాపూర్ గ్రామంలోని 7వ వార్డు పరిధిలో తాగునీటి సమస్య తీర్చాలని డిమాండ్ చేస్తూ మహిళలు ఖాళీ బిందెలతో శుక్రవారం ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. గ్రామంలోని పోచమ్మగల్లికాలనీలో తాగునీరు లేక ప్రజలంతా గ్రామశివారులోని వ్యవసాయ పంటపొలం నుంచి తెచ్చుకోవాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సర్పంచుకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. ట్యాంకర్ ద్వారా నీరు సరఫరా చేస్తున్నామని అధికారుల మాటలు పత్రిక ప్రకటనలకే పరిమితమయ్యాయన్నారు. మెట్పల్లి రహదారిపై మహిళలు రాస్తారోకో చేస్తున్న సమయంలో తహసీల్దార్ అటువైపుగా రావడంతో అడ్డుకొని నీటి సమస్య తీర్చాలంటూ నినాదాలు చేశారు. కాగా గంటసేపట్లో తాగునీరు వస్తుందని ఈ విషయమై తాను ఇప్పుడే ఎంపీడీవోతో ఫోన్లో మాట్లాడడని తహసీల్దార్ న రేందర్ చెప్పడంతో గ్రామస్తులు రాస్తారోకో విరమించారు. అనంతరం అక్కడి నుంచి తహసీల్దార్ కార్యాలయం, మండల పరిషత్ కార్యాలయాలకు వెళ్లి అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. గ్రామంలో ఇంకుడుగుంతలు, వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించినా నేటికి బిల్లులు అందడం లేదని ఎంపీడీవో రాధకు ఫిర్యాదు చేశారు. త్వరలో బిల్లులు అందేలా చూస్తామని గ్రామస్తులు తెలిపారు. రాస్తారోకో చేస్తున్న మహిళలకు కాంగ్రెస్ నాయకుడు జహిర్, బీజేపీ నాయకుడు పిట్టల భూమన్న మద్దతుగా బైఠాయించారు. కార్యక్రమంలో గ్రామస్తులు భీమన్న, సాజిద్, లక్ష్మణ్, భీమవ్వ, గంగవ్వ, లక్ష్మి, నిరోశ తదితరులు పాల్గొన్నారు. -
కరువు ప్రాంతంగా ప్రకటించడంలో ప్రభుత్వం విఫలం
ఉట్నూర్ రూరల్ : కరువు కోరల్లో చిక్కుకున్న ఆదిలాబాద్ జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించడంలో ప్రభుత్వం విఫలమైందని, అప్పులు తీరక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే ప్రభుత్వం జిల్లా వైపు దృష్టి సారించకపోవడం విడ్డూరంగా ఉందని ప్రజా సంఘాల నాయకులు నేతావత్ రాందాస్, తెలంగాణ ప్రజా ఫ్రంట్ జిల్లా నాయకులు బానోత్ రామారావులు ఆరోపించారు. బుధవారం స్థానిక ప్రెస్‌భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. జిల్లాలో పంటలు సరిగా పండక కొద్దో గొప్పో పండిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించకపోవడం దారుణమన్నారు. జిల్లాలో తాగునీటి సమస్య, గ్రామాలకు సరైన రోడ్డు సౌకర్యం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. స్వరాష్ర్ట సాధన కోసం అసువులు బాసిన అమరవీరులకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ కోసం 1200 మంది అమరులైతే కేవలం 485 మంది కుటుంబాలకే సహాయం చేసిందని, మిగితా వారి కుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. 1969 ఉద్యమం అమరులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నేతావత్ రాజేందర్, సీహెచ్ రాము, కచ్కడ్ తాతేరావు తదితరులు పాల్గొన్నారు. -
తడారి.. ఎడారి!
కృష్ణాపై తెలంగాణ ప్రాజెక్టులతో జిల్లాకు ఇబ్బందే 2.4 లక్షల ఎకరాలు సాగుకు దూరమయ్యే అవకాశం తెలుగు గంగకు నీరు నిలిచిపోవచ్చు హంద్రీ-నీవాతో కుప్పానికీ నీరు కరువు బాబు నిర్లక్ష్యం వల్లే ఈ దుస్థితి తెలంగాణ ప్రభుత్వం కృష్ణా నదిపై చేపట్టనున్న ప్రాజెక్టులతో జిల్లా కరువు కోరల్లో చిక్కుకోనుంది. తాగునీటి సమస్య మరింత తీవ్రం కానుంది. నీరు ప్రజల సంపద.. అన్ని వర్గాలకు అందేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. కానీ చంద్రబాబు సర్కారు చేతగానితనం వల్లే తెలంగాణ ప్రభుత్వం కృష్ణా నదిపై ప్రాజెక్టులు నిర్మించడానికి పూనుకుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ప్రాజెక్టుల వల్ల జిల్లా ఎడారిగా మారే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. హంద్రీ-నీవా, గాలేరు-నగరి ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన నిర్మించి, జిల్లాను సస్యశ్యామలం చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి ఇప్పుడు మౌనం వహిస్తుండటం పలు అనుమానాలకు దారితీస్తోంది. చిత్తూరు: తాగు, సాగునీటి కోసం జిల్లా ప్రజలు ఇప్పటికే భూగర్భ జలాలపై ఆధారపడుతున్నారు. ఈ నేపథ్యంలో భూగర్భ జలాల నీటి మట్టం రోజురోజుకీ తగ్గిపోతోంది. పదేళ్ల క్రితం 200 అడుగుల్లో పుష్కలంగా నీరుండేది. ఇపుడు వెయ్యి అడుగులు తవ్వినా నీరు దొరకని పరిస్థితి. ముందు చూపుతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి హంద్రీ-నీవా, గాలేరు నగరి ప్రాజెక్టులకు అధిక నిధులు కేటాయించారు. ఆయన మరణం తరువాత ఆ రెండు ప్రాజెక్టుల పనులు నత్తనడకన సాగుతున్నాయి. వైఎస్ పోరాటం వల్లే తెలుగుగంగ ప్రాజెక్టును అప్పట్లో చెన్నై తాగునీటి కోసమే డిజైన్ చేశారు. దీన్ని అప్పటి ప్రతిపక్షనేత వైఎస్.రాజశేఖరరెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. రాయలసీమ నీటి అవసరాలను తీర్చిన తరువాతనే మిగతా వాటిని ఆలోచించి పంపిణీ చేయలని డిమాండ్ చేశారు. దీంతో ఎన్టీ రామారావు ప్రభుత్వం దిగొచ్చింది. అప్పటికప్పుడే డిజైన్ మార్చి కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు తాగు నీటిని అందించే ప్రాజెక్టుగా రూపొందించారు. ప్రస్తుతం తిరుమల, తిరుపతి, రేణిగుంటతో పాటు పలు ప్రాంతాలకు తాగునీటి అవసరాలు తీర్చే వనరుగా మారింది. దిండి, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలతో చిత్తూరు ఎడారే తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న దిండి, రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులతో చిత్తూరు జిల్లా ఎడారిగా మారే అవకాశం ఉంది. జిల్లాకు ప్రధాన నీటి వనరు తెలుగుగంగ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టుకు పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ నుంచి నీటిని సరఫరా చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు నుంచి నీరు తోడుకోవాలంటే శ్రీశైలం ప్రాజెక్టులో తప్పనిసరిగా 854 అడుగుల నీరు ఉండాలి. తెలంగాణ ప్రభుత్వం క్లష్ణా నదిపై దిండి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులు నిర్మించి 830 అడుగుల్లోనే నీరు తోడుకోవడానికి ప్రయత్నిస్తోంది. దీనివల్ల జిల్లాలో 1,03,000 ఎకరాలకు నీరందిచే గాలేరు, నగరి ప్రాజెక్టు, తిరుపతి, తిరుమల, మరికొన్ని పట్టణాలకు నీరందించే తెలుగు గంగకు నీరు వచ్చే అవకాశం ఉండదు. హంద్రీ-నీవా హుళక్క హంద్రీ-నీవా వల్ల జిల్లాలో సుమారు 1,36000 ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉంది. సీఎం నియోజకవర్గం కుప్పం తాగునీటి సమస్య తీరే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు వల్ల జిల్లాలో 4లక్షల మందికి నీరు అందించవచ్చు. ఇంత విలువైన ప్రాజెక్టుకు తెలంగాణ ప్రాజెక్టుల వల్ల నీరు అందకుండా పోయే అవకాశం ఉంది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పేరుతో 90 టీఎంసీలు, దిండి ప్రాజెక్టు పేరుతో మరో 30 టీఎంసీల నీటిని ఎత్తిపోసేం దుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దీనివల్ల హంద్రీ-నీవా ప్రాజెక్టు ద్వారా చిత్తూరు జిల్లాకు చుక్కనీరు వచ్చే అవకాశం ఉండదు. రాయలసీమ క్షేమం కోసమే జగన్ దీక్ష తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టులు చేపడితే రాయలసీమలోని అన్ని జిల్లాలు కరువుతో అల్లాడిపోతాయి. తాగునీటి సమస్య పెద్ద ఎత్తున ఏర్పడుతుంది. దీన్ని దృష్టిలో ఉం చుకొనే వైఎస్సార్సీపీ అధ్యక్షుడు మూడు రోజుల పాటు కర్నూలులో దీక్ష చేపట్టారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. -
నమ్మి ఓట్లు వేస్తే మోసం చేస్తారా?
ఎంపీపీని నిలదీసిన సీకరి మహిళలు పెదబయలు: మిమ్మల్ని నమ్మి ఓట్లు వేస్తే గెలిచి పార్టీ పిరాయింపుతో మమ్మల్ని మోసం చేస్తారా అంటూ స్థానిక మండల పరిషత్ అధ్యక్షుడు సల్లంగి ఉమామహేశ్వరరావును సీకరి గ్రామ మహిళలు నిలదీశారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి, ఆయన తనయుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డిపై అభిమానంతో మిమ్మల్ని గెలిపిస్తే డబ్బుకు ఆశపడి పార్టీని వీడి మా మనోభావాలను దెబ్బతీశారని మండిపడ్డారు. ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. కరువు, తాగునీటి సమస్య పరిష్కారంపై వైఎస్సార్ సీపీ సోమవారం చేపట్టిన ర్యాలీలో భాగంగా స్థానిక మండల పరిషత్ అధ్యక్షుడు సల్లంగి ఉమామహేశ్వరరావును మహిళలు నిలదీశారు. ఖంగుతున్న ఎంపీపీ నాకంటే పెద్ద కేడర్ ఉన్న ఎమ్మెల్యే వెళ్లడంతో అతని వెంట వెళ్లినట్టు చెప్పారు. మా గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి రెండేళ్లుగా ఎటువంటి పనులు చేపట్టలేదని, ప్రస్తుతం అధికార పార్టీకి వెళ్లినందున మరింత అభివృద్ధి పనులు చేపట్టాలని, లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యురాలు గంగాభవాని, సందడి కొండబాబాబు, మాజీ ఎంపీపీ సూర్యనారాయణ, సీకరి, సీతగుంట గ్రామ మహిళలు పాల్గొన్నారు. -
తళి బరిలో స్వతంత్ర అభ్యర్థి
డెంకణీకోట: 30 ఏళ్లుగా తళి నియోజకవర్గం అభివృద్దికి నోచుకోలేదు. తళి ప్రాంతంలో కళాశాలలేదు. వైద్యసదుపాయం అంతంత మాత్రం. గ్రామీణ ప్రాంతాలకు రోడ్లు సరిగ్గాలేవు. గుల్లట్టి, వరదేగౌడరదొడ్డి, కొడగరై తదితర గ్రామాల ప్రజలకు బస్సు వసతులు లేదు. నిరుద్యోగ సమస్య తీవ్ర రూపం దాల్చిందని తళి నియోజకవర్గంలో కర్మాగారాలు స్థాపించాలని, తాగునీటి కోసం ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇన్నేళ్లుగా ఇక్కడ శాసనసభ్యులు పట్టించుకోలేదు. వెనుకబడిన తళి ప్రాంతం అభివృద్దికి కృషి చేస్తానని తళి నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న హరి తెలిపారు. ఆదివారం గెండగానపల్లిలో తన మద్దతుదారులతో భారీ సమావేశాన్ని నిర్వహించారు. తనకు ప్రజలు ఓటు వేసి ఆదరించాలని కోరారు. నియోజకవర్గంలో పర్యటించానని ప్రజలు తనను పోటీ చేయవలసిందిగా కోరడంతో ఈ నిర్ణయం తీసుకొన్నానని తెలిపారు. నియోజకవర్గంలో చిరంజీవి, మెగాకుటుంబం అభిమానుల మద్దతుతో తన కార్యాచరణ రూపొందించామని హరి తెలిపారు. డీఎండీకే పార్టీలో టికెట్ ఆశించి రాకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా నిలబడినట్లు తెలిపారు. ఈ సమావేశంలో 300 మందికిపైగా మెగాస్టార్ చిరంజీవి, పవన్‌కళ్యాణ్ అభిమానులు పాల్గొన్నారు.ఈ సమావేశంలో డీఎండీకే కార్యకర్తలు ఎక్కువ మంది పాల్గొనలేదు. చిరంజీవి అభిమాన సంఘాల నాయకులు కెలమంగలం, డెంకణీకోట, తళి, బెణ్ణంగూరు, జెక్కేరి ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున తరలివచ్చారు. చిరంజీవి అభిమానులు కే.కేశవమూర్తి, శ్రీనివాసన్, వేణుగోపాల్, సంపంగిరామయ్య, వెంకటేశ్, మునిరాజు, మాదేవప్ప తదితరులు పాల్గొన్నారు. తెలుగు నటుల ఫ్యాన్స్హవా! హొసూరు: తెలుగు చలన చిత్ర నటుల అభిమానులు వారి సంఘాల ఆధ్వర్యంలో తళి రాజకీయం చక్రం తిప్పుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి, మెగా ఫ్యామిలీ అభిమాన సంఘాలు తళిలో స్వతంత్ర అభ్యర్థిని నిలిపారు. డీఎండీకే పార్టీ జిల్లా కార్మిక శాఖ ఉపాధ్యక్షుడిగా ఉన్న హరి తళి నియోజకవర్గంలో డీఎండీకే పార్టీలో టికెట్ ఆశించారు. డీఎండీకే కూటమిలో తళి నియోజకవర్గాన్ని సీపీఐకి కేటాయించడంతో టికెట్ ఆశించిన హరి మనస్తాపం చెందారు. చిరంజీవి, మెగాఫ్యామిలి అభిమాన సంఘాలు హరి అసంతృప్తిని రాజేసి స్వతంత్ర అభ్యర్థిగా తళి నియోజకవర్గంలో బరిలో దించారు. ఆదివారం హరి ఏర్పాటు చేసిన మద్దతుదారుల సమావేశంలో 400 మంది పాల్గొన్నారు. వీరిలో 300 మంది చిరంజీవి మెగాఫ్యామిలీ అభిమాన సంఘాల సభ్యులే. చిరంజీవి అభిమానులకు ప్రత్యేకంగా అంటూ వక్తలు ప్రసంగిస్తున్నప్పుడు ఒక్కటే కేరింతలు. సభలో చిరంజీవి సినిమా డైలాగులే. ఒక్కొక్క అభిమాని, ముగ్గురిని ఆ ముగ్గురు మరో ముగ్గురిని తయారు చేసి స్వతంత్ర అభ్యర్థికి ఓటు వేయించాలని హర్షధ్వానాల మద్య ఫ్రకటించారు. వేదికపై చిరంజీవి, ఆయన ఫ్యామిలీ నటుల ఫొటోలు వేసుకొన్నారు. సినీ అభిమాన సంఘాలతో తళిలో రాజకీయ ప్రభావం వేడెక్కుతుందా అని ఇక్కడి రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. -
ఓరుగల్లు..గొల్లు గొల్లు
రుద్రమ కోటలో కరువు తాండవం ♦ వానల్లేక సాగు ఆగం ♦ రైతుకు చేరని కరువు సాయం.. ♦ వేతనాలు లేని ‘ఉపాధి’ ♦ మేతలేక మూగజీవాల అమ్మకం మన్సాన్పల్లి... వరంగల్ జిల్లా జనగామ నియోజకవర్గం బచ్చన్నపేట మండలంలోని ఓ ఊరు. 260 కుటుంబాలు ఉంటాయి. కరువు కాటేయడంతో ఈ ఊరి నుంచి ఏకంగా 100 కుటుంబాలు హైదరాబాద్‌కు వలస వెళ్లాయి! ఊళ్లో పంటలు లేవు. ఉపాధి పనుల డబ్బులు రావడంలేదు. ఊరికి ఆదరువుగా ఉండే ఊట చెరువు ఎండిపోయింది. రబీ తుడుచుపెట్టుకుపోయింది. గుక్కెడు తాగునీటికి ఈ పల్లె అల్లాడుతోంది.. ....ఇది ఒక్క మన్సాన్పల్లి పరిస్థితి కాదు! వరంగల్ జిల్లాలోని వందల ఊళ్లలో ఇప్పుడు ఇదే గోస. దుర్భర కరువుతో పంటలు పోయి, ఉపాధి లేక జనం అవస్థ పడుతున్నారు. పశుగ్రాసం లేక గొడ్డూగోదా సంతకు చేరుతున్నాయి. భూగర్భ జలాలు పాతాళానికి పడిపోవడంతో బోర్లన్నీ ఎత్తిపోతున్నాయి. అటు గుక్కెడు నీటికోసం వన్యప్రాణులూ అల్లాడుతున్నాయి. జిల్లాలో కరువుపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. - పిన్నింటి గోపాల్, సాక్షి ప్రతినిధి, వరంగల్ వేతనాలు లేని ఉపాధి... దుర్భర కరువుతో వ్యవసాయం నాశనమైపోయింది. రైతులకు, వ్యవసాయంపై ఆధారపడిన కూలీలకు పనులు దొరకడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో గతంలో కంటే ఎక్కువగా ఉపాధి పనులు చేయించాల్సిన అధికారులు ఆ స్థాయిలో ప్రణాళిక రూపొందించలేదు. ఆలస్యంగా స్పందించి ఇప్పుడు చర్యలు తీసుకుంటున్నారు. కొన్ని మండలాల్లో ఉపాధి పనులు జోరుగానే సాగుతున్నా.. కూలీలకు వేతనాలు ఇవ్వడం లేదు. రోజువారీ కూలి దొరకని వారికి పని కల్పించి మూడు రోజుల్లోపు చెల్లించే లక్ష్యంతో మొదలైన పథకం అభాసుపాలవుతోంది. 60 రోజులు దాటినా కూలీలకు చెల్లింపులు చేయడం లేదు. పనులు చేసిన వారు నెలలుగా కూలి డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి తరువాత నిధులు రాలేదు. అధికారులు కూలీలకు డబ్బులు చెల్లించలేదు. ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు మొత్తం 6.03 లక్షల మంది కూలీలకు జిల్లా అధికారులు రూ.32.82 కోట్లు చెల్లింపులు చేయాల్సి ఉంది. ఏడు వారాలుగా పైసలు ఇత్తలేరు పనులు చేసి ఏడు వారాలు అయితాంది. ఇంతవరకు పైసలిత్తలేరు. ఇల్లు గడవడం శాన ఇ బ్బంది అయితాంది. సార్లను అడిగితే పై నుంచి ఇంక పైసలు రాలేదని చెబుతుండ్రు. పనిజేసిన పైసలియ్యకుంటే మేమెట్ల బతకాలే. - బైరి సునీత, ఉపాధి కూలీ,గూడూరు, పాలకుర్తి మండలం తాగునీళ్లకు గోసగోస వరంగల్ జిల్లాలోని అన్ని ప్రాంతాల్లోనూ తాగునీటి కష్టాలు తీవ్రమవుతున్నాయి. జిల్లాలో మొత్తం 2403 ఆవాసాలు ఉన్నాయి. గ్రామీణ తాగునీటి సరఫరా(ఆర్డబ్ల్యూఎస్) విభాగం నివేదిక ప్రకారమే జిల్లా వ్యాప్తంగా 18 గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. ఈ ఊళ్లలో నీరు దొరక్కపోవడంతో సమీప గ్రామాల నుంచి ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నారు. అరుునా ఆ నీరు సరిపోక ఈ గ్రామాల్లోని ప్రజలు నీటి కోసం అల్లాడిపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా 970 ఆవాసాల్లో తాగునీటి సమస్య ఉంది. ఈ గ్రామాల్లో 1603 ప్రైవేటు బోర్లను అద్దెకు తీసుకుని తాగునీటిని సరఫరా చేస్తున్నారు. ముఖ్యంగా జనగామ నియోజకవర్గంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. బచ్చన్నపేట మండలం కొన్నె శివారు బీసీ కాలనీలో మూడు బోర్లలో రెండు పూర్తిగా ఎండిపోయాయి. ఒక్క బోరుతో గంటకో బిందె నింపుకుంటూ మహిళలు అరిగోస పడుతున్నారు. కొన్నెకు ఆనుకుని లింగంపల్లి, కొడవటూరు అంకుషాపూర్ గ్రామాల్లోనూ ఇదే పరిస్థితులు ఉన్నాయి. మరోవైపు జీవనదిగా పేరున్న గోదావరి ఎండిపోయింది. ముల్లకట్ట బ్రిడ్జి ప్రాంతాల్లో చుక్క నీరు లేకుండా గోదావరి ఎడారిని తలపిస్తోంది. గోదారిలో నీళ్లు లేకపోవడంతో సమీపంలోని అటవీ గ్రామాల ప్రజలు తాగునీటి కోసం కష్టాలు పడుతున్నారు. చెలమలతో దాహం తీర్చుకుంటున్నారు. రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత రెండో అతిపెద్ద నగరంగా ఉన్న గ్రేటర్ వరంగల్‌లో రెండు రోజులకు ఓసారి తాగునీరు సరఫరా చేస్తున్నారు. గ్రేటర్ వరంగల్‌లో కొత్తగా విలీనమైన విలీన గ్రామాల్లో ట్యాంకర్లతో మంచినీటిని సరఫరా చేస్తున్నారు. విలీన గ్రామాల్లో ఉన్న మూడు డీఫ్లోరైడ్ రిజర్వాయర్లు పూర్తిగా ఎండిపోయాయి. 15 విలీన గ్రామాల్లో బోర్లను అద్దెకు తీసుకొని తాగునీటి సరఫరా చేస్తున్నారు. మున్నేరు నది పూర్తిగా ఎండిపోతుండడంతో మహబూబాబాద్‌కు నీటి కష్టాలు ముంచుకొస్తున్నాయి. గడ్డికీ గడ్డు కాలం... వరుసగా రెండో ఏడాది కరువు మూగజీవాలకు శాపంగా మారింది. పంటల్లో వచ్చిన నష్టాలతో ఇప్పటికే రైతులు కుదేలయ్యారు. పశువులకు మేత కోసం డబ్బులు ఖర్చు చేసే పరిస్థితి లేదు. పశుసంపద పరంగా తెలంగాణలో వరంగల్ జిల్లా రెండో స్థానంలో ఉంది. జిల్లా వ్యాప్తంగా 16.27 లక్షల పశువులు ఉన్నాయి. పశువుల కోసం 14.80 లక్షల టన్నుల పశుగ్రాసం అవసరం ఉంటుంది. ఎక్కువ పంటలు నష్టపోవడంతో జిల్లా వ్యాప్తంగా 14.15 లక్షల టన్నుల పశుగ్రాసం మాత్రమే అందుబాటులో ఉందని పశుసంవర్థక శాఖ చెబుతోంది. 65 వేల టన్నుల పశుగ్రాసం కొరత ఉంది. జిల్లా వ్యాప్తంగా పశుగ్రాసం సమస్య ఉంది. కరువు ప్రాంతాలుగా ప్రకటించిన 11 కరువు మండలాల్లోనూ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. కరువు మండలాల్లో ఒక్కో మండలానికి 500 మంది రైతులను ఎంపిక చేసి పశుదాణను 50 శాతం సబ్సిడీపై అందించాల్సి ఉండగా ఇప్పటికీ ఆ మేరకు చర్యలు తీసుకోవడం లేదు. ఒక్కో రైతుకు 100 కిలోల పశుదాణాను సబ్సిడీపై అందించాల్సి ఉన్నా పశుసంవర్థక శాఖ పట్టించుకోవడం లేదు. దీంతో పశువులను సాకే పరిస్థితి లేక రైతులు అమ్ముకుంటున్నారు. ఆసరా ఆలస్యం... పేదలకు ఆసరాగా నిలిచేందుకు ప్రభుత్వం ఇచ్చే సామాజిక పింఛన్ల డబ్బులు ప్రతి నెలా అందడం లేదు. కొన్ని మండలాల్లో రెండు నెలలకోసారి ఇస్తున్నారు. ఎక్కువ మండలాల్లో నెలలో సగం రోజులు గడచిన తర్వాతే పంపిణీ చేస్తున్నారు. ఎలాంటి పనులూ లేకపోవడంతో సామాజిక పింఛన్ల డబ్బులు ఆసరాగా ఉంటాయని లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు. అధికారులు మాత్రం తమకు తోచినప్పుడు పింఛన్ల మొత్తం పం పిణీ చేస్తున్నారు. మహబూబాబాద్ మండలంలోని 20 గ్రామాల్లో ఆసరా పింఛన్లు ప్రతి నెలా ఆలస్యంగానే అందుతున్నాయి. ఒక్కోసారి మూడు నెలలకోసారి ఇస్తున్నారు. ఏ నెల పింఛన్ ఆనెల ఇస్తలేరు పింఛన్ల డబ్బులు పెంచినందుకు ఇబ్బంది లేకుండ ఉంటాంది. ఇప్పుడిప్పుడు కొంత ఇబ్బంది అయితాంది. ఏ నెల పింఛన్లు ఆ నెల ఇత్తలేరు. రెండుమూడు నెలలకోసారి ఇస్తాన్రు. - బానోత్ సోటీ, రజాలీపేట, మహబూబాబాద్ మండలం జలం పాతాళానికి.. జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. గతంలో ఎప్పుడూ లేనంత లోతుకు చేరాయి. భూగర్భ నీటి వనరుల శాఖ నివేదిక ప్రకారం మార్చి ఆఖరులోనే 11.97 మీటర్ల లోతులో నీళ్లు ఉన్నాయి. రఘునాథపల్లి మండలంలో దారుణంగా 43.84 మీటర్ల లోతులోకి భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. మే నెలలో ఈ పరిస్థితి మరింత దుర్భరంగా మారనుంది. రామప్ప, లక్నవరం, పాకాల, మల్లూరు మధ్యతరహా ప్రాజెక్టులోనే కొంత వరకు నీళ్లు ఉన్నాయి. వరంగల్ జిల్లాలో 5839 చిన్న నీటి వనరుల చెరువులున్నాయి. ఈ చెరువుల కింద 2,55,187 ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రస్తుతం 763 చెరువుల్లోనే కొద్దిశాతం నీరు ఉన్నట్లు సాగునీటి శాఖ నివేదిక చెబుతోంది. చెరువులు ఎండిపోవడంతో చేపలు చనిపోతున్నాయి. దీంతో మత్స్యకారులు భారీగా నష్టపోతున్నారు. కేసముద్రం మండలం కోరుకొండపల్లి చెరువులో తక్కువగా నీళ్లు ఉన్నాయి. ఎండ తీవ్రతకు నీళ్లు వేడెక్కడంతో చెరువులోని దాదాపు రెండు టన్నుల చేపలు చనిపోయాయి. చేపలు చనిపోవడంతో చెరువు లీజుదారుడు, మత్స్యకార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది. ఇదే ఊరికి చెందిన మంగి ఉప్పలయ్య చెరువును లీజుకు తీసుకుని రూ.2 లక్షలు ఖర్చు చేసి నాలుగున్నర లక్షల చేపపిల్లను వానాకాలం ఆరంభంలో చెరువులో వేశాడు. ఎండ వేడికి చేపలు చనిపోవడంతో భారీగా నష్టపోయాడు. రైతన్నకు సాయమేది? వరంగల్ జిల్లాలో మొత్తం 51 మండలాలు ఉన్నాయి. 11 మండలాలను కరువు మండలాలుగా ప్రభుత్వం ప్రకటించింది. బచ్చన్నపేట, చేర్యాల, జనగామ, మద్దూరు, నర్మెట, స్టేషన్‌ఘన్‌పూర్, లింగాలఘణపురం, ధర్మసాగర్, రఘునాథపల్లి, జఫర్‌గఢ్, నర్సింహులపేట మండలాల్లో దుర్భరమైన కరువు నెలకొంది. 79,364 రైతులకు చెందిన 42,333 హెక్టార్లలో పంటలు నష్టపోయాయి. పంట నష్టపోయిన రైతులకు రూ.28.78 కోట్ల పెట్టుబడి రాయితీగా ఇవ్వాల్సి ఉంది. ఖరీఫ్‌లో నష్టపోయిన పంటల పరిహారం... రబీ ముగిసినా ఇంకా రాలేదు. పంటలు పోయి, పెట్టుబడి నష్టపోయి రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. ఎండిన పంటలు కరువు కారణంగా వరంగల్ జిల్లాలో రబీ విస్తీర్ణం బాగా తగ్గింది. గత ఏడాదితో పోల్చితే అన్ని పంటలూ తక్కువ విస్తీర్ణంలోనే సాగయ్యాయి. రబీలో వరంగల్ జిల్లా సాధారణ సాగు విస్తీర్ణం 1,57,211 హెక్టార్లు. గత ఏడాది 1,27,371 హెక్టార్లలో పంటలు సాగు చేశారు. గత ఏడాది కంటే దుర్భర కరువు రావడంతో ఈ ఏడాది 1,10,706 హెక్టార్లలోనే పంటలు సాగయ్యాయి. ఈ పంటల్లోనూ 30 శాతానికిపైగా ఎండిపోయాయి. పర్యాటకులు లేరు... చారిత్రక కట్టడాలతో రాష్ట్రంలోనే ఉత్తమ పర్యాటక కేంద్రంగా ఉన్న వరంగల్ జిల్లాకు నిత్యం పర్యాటకులు వస్తుండేవారు. ఎండల తీవ్రతతో పర్యాటకుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఎక్కువ మంది పర్యాటకులు వచ్చే రామప్ప ఆలయానికి వచ్చే వారే లేకుండాపోయారు. 20 రోజులుగా రామప్ప ఆలయానికి పర్యాటకుల తాకిడి పూర్తిగా తగ్గిపోయింది. గతంలో దూర ప్రాంతాల నుండి ప్రైవేటు వాహనాల్లో తరలివచ్చి రామప్ప ఆలయంతో పాటు సరస్సు అందాలను తిలకించి సరస్సులో బోటు షికారు చేస్తూ సందడి చేసేవారు. 36 అడుగుల నీటిమట్టం గల రామప్ప సరస్సులో ప్రస్తుతం 11 అడుగుల నీరు మాత్రమే ఉండడంతో సరస్సు వైపు కూడా కన్నెత్తి చూసే వారే కరువయ్యారు. రోజుకు వందలాది సంఖ్యలో రామప్పకు వచ్చి రామలింగేశ్వరున్ని దర్శించుకునే భక్తులు ప్రస్తుతం 10 గంటల లోపు మాత్రమే పదుల సంఖ్యలో వచ్చి వెళుతున్నారు. అయ్యో అడవి ప్రాణులు... వేసవిలో అధికారులు వన్యప్రాణుల సంరక్షణ చర్యలు చేపట్టకపోవడంతో జంతువులు నీటి కోసం అల్లాడుతున్నాయి. తాడ్వాయి అటవీ సంరక్షణ రేంజ్ పరిధిలోని తాడ్వాయి, మేడారం సెక్షన్ పరిధిలోని దుప్పులు, మెకాలు, కానూజులు, కొండగొర్రెలు, కొండముంచులు, అడవి దున్నలు, ఎలుగుబంట్లు. తదితర జంతువులు వందల సంఖ్యలో ఉన్నాయి. జంతువులు సంచరించే ప్రాంతాల్లో పదేళ్ల క్రితం ఎనిమిది నీటి తొట్లను నిర్మించారు. వేసవి కాలంలో ఈ తొట్లలో అధికారులు నీరు తీసుకువచ్చి పోయాల్సి ఉంది. అధికారులు ఈ పనులు చేయకపోవడంతో అడవి జంతువులు నీటి కోసం గోస పడుతున్నాయి. నెమళ్లు, ఇతర చిన్న జంతువులు చనిపోతున్నాయి. తాగునీటి ఇబ్బందులు లేవు కరువు నేపథ్యంలో తాగునీటి సమస్యను అధిమించేందుకు అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నాం. ప్రతి మండలానికి ప్రత్యేకంగా కార్యాచరణ రూపొందించాం. జిల్లాలో ఏక్కడా తాగునీటికి ఇబ్బందులు లేకుండా చేశాం. 18 గ్రామాలకు దగ్గరి ప్రాంతాల నుంచి ట్యాంకర్లతో తాగునీటిని సరఫరా చేస్తున్నారు. 970 ఆవాసాల్లో 1603 ప్రైవేటు బోర్లను అద్దెకు తీసుకుని తాగునీటిని సరఫరా చేస్తున్నారు. తాగునీటి సరఫరా కోసం రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కోసం ప్రత్యేకంగా రూ.17.27 కోట్లను కేటాయించింది. విపత్తు సహాయ నిధి(సీఆర్ఎఫ్) నుంచి రాష్ట్ర ప్రభుత్వం రూ.2.59 కోట్లను విడుదల చేసింది. పేదలకు ఉపాధి కల్పించేందుకు రూ.300 కోట్లతో ప్రణాళిక రూపొందించాం. పెండింగ్‌లో ఉన్న నిధులు విడుదలయ్యాయి. కూలీలకు చేరుతున్నాయి. అన్ని గ్రామాల్లో ఉపాధి కల్పించేందుకు 29 రకాల పనులు చేయిస్తున్నాం. శాశ్వతంగా ఉపయోగపడే పనులు చేపట్టేందుకు 100 గ్రామాలను ఎంపిక చేశాం. - వాకాటి కరుణ, వరంగల్ జిల్లా కలెక్టర్ నాలుగు రోజులకోసారి ట్యాంకర్ కాలనీలో మంచి నీరు దొరకడం లేదు. ఉన్న బోరు ఎత్తిపోయింది. డబ్బా నీరు నిండాలంటే చుక్కలు కనిపిస్తున్నాయి. నాలుగు రోజుల కోసారి ట్యాంకర్‌తో నీటి సరఫరా చేస్తున్నారు. సగం కాలనీకి సరిపోవడం లేదు. నీళ్లు దొరక్క గొడవలు జరుగుతున్నయి. రాత్రి పన్నెండు గంటల వరకు ట్యాంకు వద్దనే ఉంటున్నం. పొద్దుగాలనే లేచి క్యాన్లను క్యూలో పెడుతున్నాం. నీళ్ల కోసం గంటల తరబడి నిలబడితే ఎండదెబ్బ తగిలి అనారోగ్యానికి గురవుతున్నాం. ప్రభుత్వం రోజూ ట్యాంకర్ నీటిని సరఫరా చేయాలని కోరుతున్నం. - పుప్పాల లక్ష్మి, కొన్నె, బచ్చన్నపేట మండలం నెలరోజుల్లో ఆరు బోర్లు వేసిన మూడెకరాల తరిపొలంలో మిరప, టమాటా పంటలను సాగు చేసిన. సబ్సిడీ డ్రిప్ కోసం దరఖాస్తు చేసుకుంటే మంజూరీ చేయలేదు. పంటలు ఎండిపోతుంటే తట్టుకోలేక పోయిన. రూ.30 వేలు పెట్టి డ్రిప్‌ను కొనుగోలు చేసిన. బోర్లు ఎండిపోయినయి. దొరికినకాడల్లా అప్పులు తెచ్చా. ఈ నెల రోజుల్లోనే లక్ష రూపాయలు ఖర్చు చేసి ఆరు బోర్లు వేసిన. అన్నీ పోయినయ్. ఆరు సీజన్లుగా ఎవుసంలో బస్తా వడ్లు ఇంటికి వచ్చిన దాఖలాలు లేవు. ఇల్లు గడిచేందుకు నా కుమారుడు పెళ్లిళ్లకు వంటలు చేసేందుకు పోతున్నడు. నేను ఉపాధి పనికి పోతున్న. ఆరు వారాలుగా ఉపాధి కూలీ పైసలు ఇస్తలేరు. ఇట్లయితే పూట గడిచేది ఎట్లా? - ఎండీ కరీం, మన్సాన్పల్లి, బచ్చన్నపేట మండలం కోళ్లు విలవిల... ఎండల తీవ్రతకు కోళ్ల పరిశ్రమ కుదేలవుతోంది. ఎండకు తట్టుకోలేక భారీ సంఖ్యలో కోళ్లు చనిపోతున్నాయి. వరంగల్ జిల్లాలో 1600 కోళ్ల ఫారాలు ఉన్నాయి. 15 లక్షల లేయర్ కోళ్లు ఉన్నాయి. ప్రతి రోజు సగటున 40 వేల బ్రాయిలర్ కోళ్ల విక్రయాలు జరుగుతుంటాయి. ఎండలు తీవ్రమవడంతో కోళ్లు ఎక్కువగా చనిపోతున్నాయి. వేడికి కోళ్ల ఉత్పత్తులు తగ్గుతున్నాయి. వేడి నుంచి ఉపశమనం కోసం కోళ్ల ఫారాలపై పది నిమిషాలకోసారి నీళ్లు చల్లాల్సి ఉంటుంది. వడగాడ్పుల నుండి రక్షణ కల్పించేందుకు కోళ్ళ ఫారాల చుట్టుపక్కల జనుపనార సంచులను కడుతున్నారు. నిరంతరం ఈ సంచులపైకి నీటిని వదిలి కోళ్ళఫారం లోపలి ఉష్ణోగ్రతలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయినా కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. కరువుపై కలం వేదన కన్ను పొడుచుకున్న కసికెడు నీళ్లురాకా కాశేగడ్డి మొలిచిన దిగుడుబావులు గుండె తడి ఆరి చేలనాలు కల్పి తడపలేక చెమ్మగిల్లిన చెరువులు కాలం కలసిరాక పొలం నొసటిమీద సెలవుపత్రం చె క్కుతున్న రైతు ఊరి మెడమీద కత్తిలా ఊగులాడుతున్న కరువు గరికపూల రేకులు గాలికి రాలిపడుతున్నంత తేలికగా ఖాళీ అవుతోంది ఊరు.. - (కొండి మల్లారెడ్డి) -
ఆంత్రాక్స్‌పై ఆందోళన వద్దు
► 19 మంది రోగులకు నిర్ధారణ కాని ఆంత్రాక్స్ ► దిల్లీ, గ్వాలియర్ బృందాలతో సమగ్ర పరీక్షలు ► ఐటీడీఏ పీవో ఎం.హరినారాయణన్ హుకుంపేట: విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న 18 మంది గిరిజనులకు ఇంకా ఆంత్రాక్స్ నిర్ధారణ కాలేదని, గిరిజనులు ఎలాంటి ఆందోళన చెందవద్దని ఐటీడీఏ పీవో ఎం.హరినారాయణన్ సూచించారు. మండలంలోని పాతకోట పంచాయితీ పనసపుట్టు గ్రామాన్ని శుక్రవారం సబ్ కలెక్టర్ శివశంకర్‌తో కలసి సందర్శించారు. ఈ సందర్భంగా పీవో గిరిజనులతో మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ కేజీహెచ్‌లోని చికిత్స పొందుతున్న 18 మంది గిరిజనులకు మెరుగైన వైద్యసేవలు కల్పిస్తున్నారని, వ్యాధి నిర్ధారణకు ప్రత్యేక వైద్య బృందాలు కూడా కేజీహెచ్‌కు వచ్చాయన్నారు. వారందరికి పూర్తిగా నయమయైన తరువాతే గ్రామానికి రప్పిస్తామని పీవో తెలిపారు. ఏజెన్సీలోని మృతి చెందిన పశువులను తినే అలవాటు ఉంటే గిరిజనులు మార్చుకోవాలని, విద్యావంతులైన యువకులు మృతి చెందిన పశుమాంసం తినకుండా గ్రామస్తులను చైతన్యవంతం చేయాలని కోరారు. దోమల నివారణ మందు పిచికారీ పనులు తప్పనిసరిగా ఇంటా బైటా చల్లించాలని తద్వారా మలేరియా బారి నుంచి ఇంటిల్లపాదిని కాపాడాల్సిన అవసరం ఇంటి ఇల్లాలిపైనే ఉందని చెప్పారు. గ్రామంలో పశువులు చనిపోతే పశువైద్యులకు సమాచారం అందించాలని ఆయన సూచించారు. వైద్యాధికారులు, పశువైద్యులు ఇచ్చే సూచనలు, సలహాలను తప్పనిసరిగా పాటించాలన్నారు. పనసపుట్టుకు పీవో వరాలు గ్రామంలోని సమస్యలపై పీవో ఆరా తీయగా రోడ్డు, తాగునీటి సమస్యలను వివరించారు. తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని గిరిజనులు చెప్పడంతో పది రోజుల్లోగా గ్రామంలో బోరు బావి నిర్మిస్తామన్నారు. పనసపుట్టు నుంచి పెదగరువు వరకు రోడ్డు నిర్మాణానికి ఇంజనీరింగ్ అధికారులతో సర్వే జరిపిస్తామన్నారు. పాలెం గ్రామస్తులు గ్రామానికి తాగునీరు రాకుండా అడ్డుకుంటున్నారని చెప్పడంతో ఈ గ్రామంలో గ్రామసభ నిర్వహించి గిరిజనులకు అవగాహన కల్పించాలని తహశీల్దార్, ఈఓపీఆర్డీలను పీవో ఆదేశించారు. మృతి చెందిన పశువులకు నష్టపరిహారం ఇవ్వాలని గ్రామస్తులు కోరగా పీవో సానుకూలంగా స్పందించారు. గిరిజన యువత నైపుణ్యరంగంలో తామందిస్తున్న శిక్షణ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకొని ఉపాధి పొందాలన్నారు. సబ్ కలెక్టర్ శివ శంకర్ మాట్లాడుతూ ఆంత్రాక్స్ అంటువ్యాధి కాదని, గిరిజనులు ఎలాంటి భయాందోళనలు చెందవద్దన్నారు. ఆహారపు అలవాట్లలో మార్పులు వచ్చిన నాడే వ్యాధులకు దూరమవుతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పశు సంవర్థకశాఖ ఏడీ కిశోర్, డిప్యుటీ డీఎంహెచ్‌వో పార్ధసారథి, ఉప వైద్యాధికారి అనూష, పశువైద్యాధికారి సునీల్‌కుమార్, సర్పంచ్ కె.లింగమ్మ తదితరులు పాల్గొన్నారు. -
నీటి కష్టం తీరేదెన్నడో?
కోట్లు కుమ్మరిస్తున్నా తాత్కాలిక ఉపశమనమే నత్తనడకన హంద్రీ-నీవా కానరాని ఎన్టీఆర్ సుజల స్రవంతి శాశ్వత పరిష్కారానికి చొరవ చూపని ప్రభుత్వం జిల్లాలో తాగునీటి సమస్య రోజురోజుకూ తీవ్రమవుతోంది. అయితే ప్రభుత్వం మాత్రం శాశ్వత పరిష్కారానికి చొరవ చూపడం లేదు. హంద్రీ-నీవా పూర్తిచేసి నీళ్లు తెస్తామంటూ నేతలు ఊదరగొడుతున్నా, భూసేకరణ అడ్డంకులే తొలగని ఈ ప్రాజెక్టు ఇప్పట్లో పూర్తయ్యేలా కనిపించడం లేదు. ఇక కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో ప్రారంభమైన కండలేరు నీటి పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టింది. ఇదిలా ఉండగా, నెలకు రూ.7 కోట్లు వెచ్చించి 2400 గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. కాగా, ఇందులో సగం నిధులు అధికార పార్టీ నేతల జేబుల్లోకి చేరుతున్నాయనే ఆరోపణలున్నాయి. చిత్తూరు: జిల్లాలో నీటి ఎద్దడికి ప్రభుత్వం శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకోవడం లేదు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో దాదాపు రూ.300 కోట్లు ఖర్చుచేసినట్లు చెబుతున్నా.. ఆ మేరకు నీటి కష్టాలు మాత్రం తీరడం లేదు. జిల్లావ్యాప్తంగా 18,848 చేతిపంపులతో పాటు 2,181 డెరైక్ట్ పంపింగ్ స్కీమ్స్, 439 మినీ పీడబ్ల్యూఎస్, 6,039 పీడబ్ల్యూఎస్, 5 సీపీడబ్ల్యూఎస్ పథకాలున్నా.. తీవ్ర వర్షాభావంతో వీటిలో సగం కూడా పనిచేయకుండా నిలిచిపోయాయి. దాదాపు 2,400 గ్రామాలకు ప్రభుత్వమే ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాల్సి వచ్చింది. ఇందుకోసం నెలకు రూ.7 కోట్ల వరకు వెచ్చించారు. 2014 జూన్ మొదలు 2015 నవంబర్ వరకు నీటి సమస్య తీవ్రరూపం దాల్చింది. 2014 ఏప్రిల్ నుంచి 2015 నవంబర్ నాటికే ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాకు ప్రభుత్వం రూ.73.77 కోట్ల నిధులు వెచ్చించినట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇవికాక తాగునీటి పథకాల మరమ్మతులు, కొత్త బోరుబావుల తవ్వకం, మోటార్ల ఏర్పాటు తదితర వాటికి రూ.150 నుంచి 200 కోట్లు ఖర్చు పెట్టినట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. మొత్తంగా బాబు రెండేళ్ల పాలనలో జిల్లాలో తాగునీటి కోసం రూ.300 కోట్లకు పైగా వ్యయం చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వానికి తప్పుడు లెక్కలు చూపి ఈ నిధుల్లో చాలామేరకు అధికార పార్టీ నాయకులు స్వాహా చేసినట్టు సమాచారం. హంద్రీ-నీవా పూర్తి చేసి ఏడాదిలోనే నీళ్లిస్తానని చంద్రబాబు పదే పదే చెప్పినా అది ఇప్పట్లో జరిగేలా కనిపించడం లేదు. హంద్రీ-నీవాకు భూసేకరణ అడ్డంకులే ఇంకా తొలగలేదు. ఇక ఎన్టీఆర్ సుజల పథకం ద్వారా ప్రతి గ్రామానికి మంచినీరు ఇస్తానని బాబు హామీ ఇచ్చినా ఆ హామీ గంగలో కలిసింది. జిల్లాలో 100 గ్రామాల్లో కూడా ఈ పథకం అమలు కావడం లేదు. నవంబర్‌లో వర్షాలు కురవకపోతే జిల్లాలో తాగునీటి సమస్య ఊహించడమే కష్టంగా ఉండేది. నీటిని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలన్నా నీరు దొరికే పరిస్థితి కనిపించేది కాదు. కండలేరు పథకాన్ని పక్కన పెట్టిన బాబు జిల్లా ప్రజలకు తాగునీరు అందించేందుకు మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి హయాంలో రూ.7,390 కోట్లతో కండలేరు తాగునీటి పథకానికి రూపకల్పన చేశారు. జిల్లావ్యాప్తంగా రూ.5,990 కోట్లు వెచ్చించి 52 మండలాల పరిధిలో 8,468 గ్రామాలకు తాగునీరందించాలనేది లక్ష్యం. మొదటి ఫేజ్‌లో జిల్లాలోని తిరుపతి, తిరుమల, చిత్తూరు, మదనపల్లి, పీలేరు,పలమనేరు, పుంగనూరు మండలాల పరిధిలోని గ్రామాలకు తాగునీరందించాల్సి ఉంది. ఈ నీటిపథకం కోసం కండలేరు నుంచి చిత్తూరు జిల్లాలోని కలవకుంట ఎన్టీఆర్ జలాశయం వరకు 168 కిలోమీటర్ల మేర కాలువ తవ్వి రేణిగుంట వద్ద 420 ఎంఎల్డీ సామర్థ్యంతో నీటిశుద్ధి కేంద్రం నిర్మించాలని నిర్ణయించారు. రెండేళ్లలో ఈ పథకాన్ని పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తాగునీటి పథకం పనులు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రపదేశ్(ఇన్‌క్యాప్)కు అప్పగించారు. తొలివిడతలో రూ. 4,300 కోట్ల పనులు 12 ప్యాకేజీలుగా విభజించి టెండర్లు కూడా పిలిచారు. ఇందుకోసం ఇన్‌క్యాప్ కాంట్రాక్టర్లకు అడ్వాన్సుల కింద రూ.40 కోట్లు చెల్లించింది. ఈ పథకం కోసం కండలేరు జలాశయం నుంచి 6.61 టీఎంసీ నీటిని కేటాయిస్తూ అప్పట్లో కిరణ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రంలో నీటి కేటాయింపులు ఎలా ఉన్నా కృష్ణాజలాలు తమిళనాడుకు ఇవ్వాలన్న ఒప్పందం నేపథ్యంలో కండలేరులో నిత్యం నీళ్లు నిలువ ఉంటాయి. భవిష్యత్తులో నీటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలన్న ఉద్దేశ్యంతోనే కిరణ్ సర్కార్ ఈ పథకానికి రూపకల్పన చేసింది. దీనిపై నెల్లూరు జిల్లాలో వ్యతిరేకత వచ్చినా తాగునీటి సమస్య పరిష్కారం కోసమంటూ అప్పట్లో కిరణకుమార్రెడ్డి ఆ జిల్లా నేతలకు నచ్చజెప్పి ఒప్పించారు. ఈ పథకం వల్ల వేలాది గ్రామాలకు తాగునీరు అందించే అవకాశమున్నా పథకాన్ని పూర్తి చేస్తే కమీషన్లు రాకపోగా గత ప్రభుత్వానికి పేరు వస్తుందన్న అక్కసుతో చంద్రబాబు ఈ పథకాన్ని రద్దు చేశారు. భవిష్యత్తులో నీటి కష్టాలను దృష్టిలో ఉంచుకుని ఇప్పటికైనా ప్రభుత్వం తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారానికి కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు. -
సమస్యలు వినిపించేనా?
నేడు జెడ్పీ సర్వసభ్య సమావేశం ► ప్రజాసమస్యలు చర్చకు వచ్చేనా? ► కరువు కోరల్లో పాలమూరు ► గ్రామాల్లో తీవ్రమైన నీటి ఎద్దడి ► గ్రాసం లేక కబేళాలకు పశువులు ► విపక్షసభ్యులు జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): జిల్లాలో కరువు విలయతాండవం చేస్తోంది.. గ్రామాలు, పట్టణాల్లో తాగునీటి సమస్య సామాన్యులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మేత కోసం మూగజీవాలు అల్లాడుతున్నాయి. తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా పంటలు ఎండిపోయి రైతులు దిక్కుతోచనిస్థితిలో పడ్డారు. ఈ ఏడాది సరైన వర్షాల్లేక కృష్ణా, తుంగభద్ర నదులు ఎండిపోయాయి. ఇలాంటి దారుణ పరిస్థితుల్లో ప్రభుత్వం జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించింది. కరువు సహాయకచర్యలు చేపట్టాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు సీజనల్ వ్యాధులతో ఆస్పత్రుల పాలవుతున్నారు.. ఇలా అనేక సమస్యలతో జిల్లా ప్రజలు సతమతమవుతున్నారు. ఈ పరిస్థితుల్లో బుధవారం జరిగే జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం సమస్యల పరిష్కారం కోసం ఏ మేరకు దిశానిర్దేశం చేస్తుందని ప్రజలు ఆశతో ఎదురుచూస్తున్నారు. కరువుపై నిలదీయనున్న ప్రతిపక్షాలు జిల్లాలో కరువు పరిస్థితులు తీవ్రంగా అలుముకున్నాయని ప్రతిపక్ష జెడ్పీటీసీ సభ్యులు చెబుతున్నారు. కరువుపై జెడ్పీ సర్వసభ్య సమావేశంలో పాలకపక్షాన్ని నిలదీస్తామని కాంగ్రెస్ జెడ్పీటీసీ సభ్యుడు లక్ష్మికాంత్‌రెడ్డి చెప్పారు. జిల్లా ప్రజలు దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో చేసిన ఏ తీర్మానాల్లో ఏ ఒక్కటి కూడా ఇప్పటివరకు అమలుకు నోచుకోలేదని ఆరోపిస్తున్నారు. గ్రామాలు, మండలాల్లో అధికారులు ప్రజాసమస్యలపై స్పందించడం లేదని ఈ అంశంపై సభలో చర్చించేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. ఎంపీపీ కార్యాలయాల్లో జెడ్పీటీలకు ప్రత్యేక చాంబర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు జెడ్పీ సర్వసభ్య సమావేశాలు తీర్మానించినా ఎక్కడా అమలుకాలేదని పలువురు జెడ్పీటీసీ సభ్యులు ఆరోపిస్తున్నారు. నేడు జరిగే జెడ్పీ సర్వసభ్య సమావేశంలో ప్రజాసమస్యలపై చర్చించాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. గత సమావేశాల తీరిది.. ప్రస్తుత జెడ్పీ పాలకమండలి 2014 జులై 5న కొలువుదీరింది. ఇప్పటివరకు 8సార్లు సర్వసభ్య సమావేశాలు జరిగాయి. ఈనెల 20న మరోసారి సమావేశం జరగనుంది. గతేడాది ఏప్రిల్ 7న జరిగిన సమావేశంలో ప్రొటోకాల్ వివాదం, జూరాల- పాకాల పథకానికి నిధుల కేటాయింపుపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తంచేశారు. ప్రభుత్వ అధికార కార్యక్రమాలకు అధికారులు తమను ఆహ్వానించడం లేదని అధికార, ప్రతిపక్షాల జెడ్పీటీసీలు సభ్యులు వాకౌట్ చేశారు. తమకు ప్రత్యేకగదిని కేటాయించాలని ఎంపీపీలు డిమాండ్ చేస్తున్నారు. గత మే 23వ తేదీన ప్రత్యేకంగా జెడ్పీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సారి కేవలం రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఎలా నిర్వహించాలనే అంశంపైనే చర్చించారు. సెప్టెంబర్ 4న జరిగిన సమావేశం రసాభాసగా మారింది. జనవరి 4న జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే గువ్వల బాల్‌రాజు, కాంగ్రెస్ ఎంపీపీల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ఈ సమావేశంలో గొడవతోనే సరిపోయింది. జెడ్పీ నిధులను ఎమ్మెల్యేలకు కేటాయించొద్దని జెడ్పీటీసీలు, ఆ నిధులను తమకు కేటాయించాలని ఎంపీపీలు.. ఇలా అనే డిమాండ్లతో సభ గందరగోళంగా మారింది. ఆర్డబ్ల్యూఎస్, డ్వామ్యాపై చర్చించే అవకాశం నేడు జరిగే జెడ్పీ సర్వసభ్య సమావేశంలో ప్రధానంగా తాగునీటి సరఫరా, ఉపాధిహామీ పథకాలపైనే చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎండాకాలంలో గ్రామాల్లో మంచినీటి కొరత తీవ్రంగా ఉంది. దీంతోపాటు గ్రామాల్లో ఉపాధి హామీ పనులు చేపట్టాలనే ప్రతిపక్షాలు చర్చకు పట్టుబట్టే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. గత సమావేశంలో కూడా ఆర్డబ్ల్యూఎస్ శాఖపైనే ప్రధానంగా చర్చ జరిగింది. అప్పట్లో తాగునీటి ఎద్దడి నివారణకు ప్రభుత్వం రూ.100కోట్లు మంజూరుచేసిందని మంత్రి ప్రకటించారు. ఆ చర్యలు ఎంతవరకు వచ్చాయని ప్రశ్నించేందుకు సభ్యులు సిద్ధమవుతున్నారు. జిల్లాలో తాగునీటి ఎద్దడిని నివారించేందుకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు స్పష్టమవుతోంది. ఎజెండాలు సమర్పించని 19 శాఖలు జెడ్పీ సర్వసభ్య సమావేశానికి 19శాఖలు తమ శాఖలో చేపట్టిన పూర్తి వివరాలను ఎజెండాలో సమర్పించలేదు. మొత్తం 64 శాఖలకు గాను 19శాఖలు ఇవ్వలేదు. మత్స్యశాఖ, వికలాంగుల సంక్షేమశాఖ, సివిల్‌సప్లయి, పశుసంవర్థక శాఖ, ఇరిగేషన్‌శాఖ వారు తమ ప్రగతి సమాచారాన్ని జెడ్పీ ఎజెండాకు సమర్పించలేదు. నివేదిక సమర్పించని శాఖలను ఎందుకు ప్రశ్నించడం లేదని జెడ్పీటీసీలు నిలదీస్తున్నారు. ఈ సారైన నివేదికలను సమర్పించని శాఖలను ప్రశ్నిస్తారా? లేదా? అన్నది వేచిచూడాల్సి ఉంది. -
నిధుల కొరత లేదు
తాగునీటి ఎద్దడిని నివారించండి మండల కమిటీలు అప్రమత్తంగా ఉండాలి {Oపెవేట్ బోర్లు అద్దెకు తీసుకోండి నగరానికి రెండు రోజుల్లో గోదావరి జలాలు తీసుకురావాలి పశుగ్రాసంపై దృష్టి సారించాలి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధికారులతో సమీక్ష సమావేశం హన్మకొండ : తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధికారులను ఆదేశించారు. మంగళవారం హన్మకొండలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నియోజకవర్గ, మండల ప్రత్యేకాధికారులు, ఎంపీడీఓలు, తహశీల్దార్లు, గ్రామీణ నీటి సరఫరా విభాగం ఇంజనీర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో కడియం శ్రీహరి మాట్లాడుతూ నిధుల కొరత లేదని, ప్రభుత్వం తాగునీటికి ఎంతైనా వెచ్చిస్తుందన్నారు. తాగునీటి సమస్యపై మండల కమిటీలు అప్రమత్తంగా ఉండాలని, ప్రతివారం మండల స్థాయి కమిటీ సమావేశమై తాగు నీటి పరిస్థితిని సమీక్షించాలన్నారు. గ్రామాల్లో బోర్లు అద్దెకు తీ సుకునే ముందు ఆ బోర్లలో నీటి లభ్యతను అం చనా వేసుకోవాలన్నారు. వరంగల్ నగరంలో నీటి ఎద్దడి ఏర్పడకుండా చూడాలని నగర పాల క సంస్థ అధికారులను ఆదేశించారు. దేవాదుల ద్వారా గోదావరి నీటిని పంపింగ్ చేయడానికి ప్రభుత్వం ప్రత్యేకంగానిధులు మంజూరు చేసిం దన్నారు. ఈ పనులు పూర్తి కాకపోవడం పట్ల కడియం అసహనం వ్యక్తం చేశారు. రెండు రోజు ల్లో పనులు పూర్తి చేసి గోదావరి నీటిని నగరాని కి తీసుకురావాలని మేయర్ నరేందర్, కమిషన ర్ సర్ఫరాజ్ అహ్మద్‌ను ఆదేశించారు. విలీన గ్రా మాలకు ట్యాంకర్ల ద్వారా గానీ, ప్రైవేట్ బోర్లను అద్దెకు తీసుకొని గానీ నీటిని సరఫరా చేయూల ని ఆయన సూచించారు. నగరంలో చలి వేంద్రా లు పెద్దఎత్తున ఏర్పాటు చేయాలని కమిషనర్ ను ఆదేశించారు. 40 చలి వేంద్రాలు ఏర్పాటు చేశామని కమిషనర్ సర్ఫరాజ్ చెప్పారు. తాగునీటికి కొరత లేదని, అధికారులు ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని కడియం సూచించారు. ఉపాధిహామీ పనులు, పశుగ్రాసం పైనా ప్రతీ వారం సమీక్షించించాలని, పశుగ్రాసానికి ఇబ్బంది కలుగుకుండా చర్యలు తీసుకోవాలన్నారు. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ఆజ్మీర చందులాల్ మాట్లాడుతూ తాగునీటి సరఫరా పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ మాట్లాడుతూ గతంలో అద్దెకు తీసుకున్న బోర్ల బకాయిలు చెల్లించామన్నారు. తాగునీటిపై నియోజకవర్గం ప్రత్యేకాధికారులు సమీక్ష జరుపాలని, సమస్య ఎక్కడుందో అధికారులు తెలుసుకోవాలన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంపై అధికారుల్లో ఇంత నిర్లక్షం పనికి రాదని, పరిస్థితి ఇంత అధ్వాన్నంగా ఉంటే పదేళ్ళయినా జిల్లాలో మరుగుదొడ్ల నిర్మాణ ం పూర్తికాదని మందలించారు. ప్రజాప్రతినిధులతో మాట్లాడి గ్రామాలను ఎంపిక చేసి మరుగుదొడ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ఆదేశించారు. వరంగల్ మహానగర పాలక సంస్ణ మేయర్ నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ నగరంలో తాగునీటిపై ఇప్పటికే ఐదు సార్లు సమీక్షించామని, లీకేజీలు లేకుండా మరమ్మతులు చేశామన్నారు. సీఎం కేసీఆర్, ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆదేశాల మేరకు గోదావరి నీటిని దేవాదుల ద్వారా పంపింగ్ చేసి నగరానికి రెండురోజుల్లో నీరు అందిస్తామని చెప్పారు. విలీన గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నామన్నారు. ఈ సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ, ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్, జెడ్పీ సీఈఓ అనిల్‌కుమార్‌రెడ్డి, ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్ఈ రాంచంద్, వ్యవసాయ శాఖ జిల్లా సంయుక్త సంచాలకుడు బి.గంగారాం, డీఆర్డీఏ పీడీ వెంకట్‌రెడ్డి, డ్వామా పీడీ శేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. -
తాగునీటి సమస్య పరిష్కారంలో విఫలం
ప్రభుత్వానికి వ్యతిరేకంగా జలమండలి కార్యాలయం వద్ద టీ టీడీపీ ధర్నా హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో తాగునీటి సమస్య పరిష్కారంలో... కరువు నివారణ చర్యలు చేపట్టడంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని టీడీపీ ఆరోపించింది. తాగునీటి సమస్యపై మంగళవారం టీడీపీ ఆధ్వర్యంలో జలమండలి కార్యాలయం వద్ద నాయకులు, కార్యకర్తలు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసులు పలువురిని అరెస్టు చేసి గాంధీనగర్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. పోలీసు స్టేషన్ ఆవరణలో తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు, పెద్దిరెడ్డి, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, ఎం.పి. మల్లారెడ్డి, మహిళా అధ్యక్షురాలు శోభ, వీరేందర్ గౌడ్ తదితరులు మాట్లాడారు. ఓ వైపు తెలంగాణ ప్రజలు తాగునీటి కోసం అల్లాడుతుంటే కరువుతో సతమతమవుతుంటే .. సీఎం కేసీఆర్, మంత్రులు రిసార్ట్స్, ఫామ్‌హౌస్‌లలో శిక్షణ తరగతుల పేరిట కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. నీటి సమస్య పరిష్కారం కోసం ప్రజల పక్షాన టీడీపీ ఆందోళన చేస్తుంటే సీఎం కేసీఆర్ పోలీసులతో అరెస్టులు చేయించి, ఉద్యమాన్ని అణచివేయాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. తక్షణమే తెలంగాణ ప్రభుత్వం నీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకొవాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అరవింద్ గౌడ్, మేకల సారంగపాణి, ఎం.ఎన్. శ్రీనివాస్‌రావు, నర్సిరెడ్డి, కృపానందం, ఆర్. మహేందర్, ఎం. రవికుమార్‌లతో పాటు నగర నలుమూలల నుంచి అనేకమంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
చెప్పను.. చేసి చూపిస్తా
► జమ్మికుంటను అద్దంలా మారుస్తా ► మంత్రి ఈటల రాజేందర్ జమ్మికుంట : ఏమి చేస్తానో చెప్పను.. 2017 వరకు చేసి చూపిస్తా.. అంటూ ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ అన్నారు. జమ్మికుంటలో సీసీరోడ్లు, ఆబాదిలో వంతెనను ఆదివారం ప్రారంభించిన సందర్భంలో పైవిధంగా మాట్లాడారు. ఇటీవల తాను ఖమ్మంకు వెళ్లగా అక్కడి రోడ్లను చూసి ఆశ్చర్యపోయూనన్నారు. ఖమ్మం రోడ్లలా జమ్మికుంట-హుజూరాబాద్ ఫోర్‌లేన్ రోడ్డును అద్దంలా మారుస్తానన్నారు. జమ్మికుంట నుంచి వీణవంక , కోరపల్లి, ఇల్లందకుంట రోడ్లను ఫోర్‌లేన్‌గా మారుస్తానని హామీ ఇచ్చారు. రోడ్ల విస్తరణలో జమ్మికుంటలో కొన్ని ఇళ్లు పోతాయని బాధితులు సహకరించాలని కోరారు. సీసీరోడ్లు, డ్రెరుునేజీలు, తాగునీటి సమస్యపై ఇక నుంచి దరఖాస్తులు ఇచ్చే అవకాశం ఇవ్వనని.. అన్నింటిని పరిష్కరిస్తానన్నారు. జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాల అభివృద్ధికి రూ.7కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో ఫర్నీచర్ కోసం రూ.2కోట్లు కేటారుుంచామని, జూన్ వరకు వస్తాయన్నారు. నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగాల కోసమే ఎదురుచూడకుండా ప్రైవేట్ రంగంలోనే అనేక ఉద్యోగావకాలున్నాయన్నారు. నగరపంచాయతీ చైర్మన్ పొడేటి రామస్వామి, ఎంపీపీ లత, వైస్‌చైర్మన్ బచ్చు శివశంకర్, నగర పంచాయతీ కమిషనర్ చింత శ్రీకాంత్, తహసీల్దార్ రజనీ, కౌన్సిలర్లు శీలం శ్రీనివాస్, దొడ్డె లక్ష్మి, చందా రాజు, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు ఎక్కటి సంజీవరెడ్డి, పొనగంటి మల్లయ్య, రావికంటి రాజు పాల్గొన్నారు. -
పార్టీలు కాదు.. అభివృద్ధే ముఖ్యం
రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి బాలానగర్ : ఏ పార్టీలో ఉన్నామన్నదికాదు అభివృద్ధి ఎంత చేశామన్నదే ముఖ్యమని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. ఆదివారం నందారం గ్రామ శివారులోని గుట్టపై నూతనంగా నిర్మాణం చేసిన శ్రీ రామలింగేశ్వరస్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో ఆయన అతిథిగా పాల్గొన్నారు. వేదపండితులు మంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అక్కడ జరుగుతున్న హోమంలో పాల్గొన్న మంత్రి అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. గ్రామస్తులందరు కలిసికట్టుగా ఆలయాన్ని నిర్మించుకున్నట్లే గ్రామాభివృద్ధికి పార్టీలు పక్కన పెట్టి కలిసి రావాలన్నారు. తాగునీటి సమస్యను పూర్తిగా పరిష్కరించేందుకు దేశంలో ఎక్కడా లేనివిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వాటర్‌గ్రీడ్ పథకాన్ని అమల్లోకి తెచ్చారని, రాబోయో రోజుల్లో మహిళలు బిందెలు పట్టుకుని బయటికి వెళ్లాల్సిన అవసరముండదన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ హరిత, వైస్ ఎంపీపీ లింగ్యానాయక్, నాయకులు వెంకట్‌చారి, కర్ణంశ్రీను, జగన్నాయక్, వెంకటయ్య, వాల్యానాయక్, శ్రీశైలం యాదవ్, నర్సింలు, బచ్చిరెడ్డి పాల్గొన్నారు. దుర్గామాతకు మంత్రి లక్ష్మారెడ్డి పూజలు జడ్చర్ల టౌన్ : పెద్ద ఆదిరాల గ్రామపంచాయతీ పరిధిలోని వాయిలగడ్డ తండాలో ఆదివారం దుర్గామాత, సేవాలాల్ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు వైభవంగా జరిగాయి. ధ్వజారోహణం, విగ్రహా ప్రతిష్ఠ, ప్రాణప్రతిష్ట కార్యక్రమాల్లో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సి. ల క్ష్మారెడ్డి పాల్గొని దుర్గామాతకు ప్రత్యేకపూజలు చేశారు. అనంతరం గిరిజనులు దుర్గామాత, సేవాలాల్ నామస్మరణాన్ని జపించారు. గిరిజనుల గురువు బోజ్యనాయక్ ఆధ్వర్యంలో జరిగిన పూజల్లో ఎంపీపీ లక్ష్మిశంకర్నాయక్, జెడ్పీటీసీ జయప్రద, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బి.శివకుమార్, నాయకులు శ్రీకాంత్, శ్రీను, రవి, వీరస్వామి, శ్రీను పాల్గొన్నారు. -
టీడీపీ పాలనలో అభివృద్ధి శూన్యం
కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి మద్దికెర : ప్రస్తుత టీడీపీ పాలనలో రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి శూన్యమని కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి విమర్శించారు. శనివారం మద్దికెరలో మాజీ సర్పంచ్ కొత్తపేట వెంకటేశ్వరరెడ్డి స్వగృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో డిప్యూటీ సీఎం ఉన్నా ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదన్నారు. ప్రజలు నిత్యం సమస్యలతో అల్లాడిపోతున్నారని ఆరోపించారు. వేదావతి, గుండ్రేవుల ప్రాజెక్టులు పూర్తి చేస్తే జిల్లాలోని అన్ని గ్రామాల్లో సాగు, తాగునీటి సమస్య పూర్తిగా పరిష్కారమవుతుందన్నారు. కానీ అందుకు విరుద్దంగా అధికార పార్టీ నాయకులు నీటిని, ఇసుకను అమ్ముకుంటూ జేబులు నింపుకుంటున్నారన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను టీడీపీ విస్మరించిదన్నారు. రైతులు, పొదుపు మహిళలకు రుణమాఫీ, అందరికి ఇళ్లు తదితర హామీలను ఇచ్చిన టీడీపీ వాటి అమలు మరిచిపోయిందని పేర్కొన్నారు. కేంద్రప్రభుత్వం కూడా ప్రజలకు మాయమాటలు చెప్పి మోసం చేస్తోందన్నారు. వచ్చే ఎన్నికల్లో తాను కాంగ్రెస్ పార్టీ తరఫునే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. కాగా గ్రామాల్లో ప్రజలు తాగునీటి సమస్యతో అల్లాడుతున్నారని పార్టీ మండల నాయకులు కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. కలెక్టర్‌తో చర్చించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. కాంగ్రెస్ నాయకులు లక్కసాగరం లక్ష్మీరెడ్డి, ప్రమోద్‌కుమార్‌రెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, సర్పంచ్ సుధాకర్, ఉపసర్పంచ్ నాగేశ్వరరెడ్డి పాల్గొన్నారు. -
నీళ్లివ్వండి.. మహాప్రభో!
► నీటిని విడుదల చేయాలని కోయిల్‌సాగర్ ► రైతుల ఆందోళనచేతికందే దశలో వరి ► సాగునీటిని విడుదల చే స్తే తాగునీటి సమస్య తీరుతుందని ఆశ ► నేడు మరోసారి రైతుల ఆందోళన దేవరకద్ర: చేతికొచ్చిన పంటలు కళ్లముందే ఎండిపోతున్నాయి.. బోరుబావులు ఎండిపోవడంతో తాగునీళ్లు మూగజీవాలు గోదరిల్లుతున్నాయి.. చెంతనే నీళ్లున్నా వాడుకోలేని దుస్థితిచూసి రైతుల గుండెలు మండిపోతున్నాయి.. అధికారులు, ప్రజాప్రతినిధులకు సమస్యను చెప్పినా పట్టించుకోవడం లేదని ఆందోళనబాట పడుతున్నారు. ఈ క్రమంలో వారంరోజులు క్రితం రైతు లు కోయిల్‌సాగర్ ప్రాజెక్టును ముట్టడించి, షట్టర్లను బద్దలుకొట్టి నీటిని విడుదల చేశారు. రైతులు నీటికోసం యుద్ధవాతావరణం సృష్టించడంతో పోలీసులు రంగప్రవేశం చేసి గేట్లను మూయించారు. అయితే నీటిని వదిలే ప్రసక్తేలేదని జిల్లా ఉన్నతాధికారులు తేల్చిచెప్పడంతో మరోసారి ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ప్రాజెక్టు కింద దేవరకద్ర, చిన్నచింతకుంట, ధన్వాడ మండలాల పరిధిలో 12వేల ఎకరాల ఆయకట్టు ఉండగా, రబీ సీజన్లో ఐదువేల ఎకరాల్లో వరిపంటలు సాగుచేశారు. సీజన్‌కు ముందుగానే అధికారులు రబీ కింద వరి పంటలు వేయొద్దని సూచించినా ప్రాజెక్టుకు సమీపంలో ఉన్న గ్రామాల రైతులు బోరుబావులపై ఆధారపడి వరిపైరును వేశారు. తీరా పంట పొట్టదశలోకి చేరుకున్నాక నీటివనరులు ఎండిపోయాయి.చేతికందేదశలో ఉన్న పంటలను కాపాడుకునేందుకు కోయిల్‌సాగర్ నీటిని విడుదల చేయాలని కోరుతూ వచ్చారు. కాల్వల ద్వారా నీటిని వదిలితే ఉన్న దశలో పంటల గట్టెక్కే అవకాశం ఉంది. కొంతనీరు వాగులో ప్రవహించి సమీపగ్రామాలకు తాగునీటి గోస ఉండదని రైతులు చెబుతున్నారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 12 అడుగుల మేర నీరు ఉండగా.. రెండు తడులకు వదిలితే నాలుగు అడుగుల నీరు వినియోగమవుతోంది. మిగ తా 8 అడుగుల నీటిని పాలమూరు పట్టణానికి ఈ రెండునెలల పాటు అందించవచ్చు. జిల్లాకేంద్రం కోసం.. కోయిల్‌సాగర్ రిజర్వాయర్ నుంచి జిల్లాకేంద్రానికి తాగునీటిని అందిస్తున్నారు. రామన్‌పాడ్ తాగునీటి పథకం ద్వారా అందిస్తున్న నీరు ఇప్పటికే తగ్గిపోయింది. ప్రస్తుతం కోయిల్‌సాగర్ ఒక్కటే ఆధారం. భూగర్భజలాలు తగ్గినందున వచ్చే రెండు నెలలకు నీళ్లను సరఫరా చేసేందుకు అధికారులు కాపాడుతూ వస్తున్నారు. రబీ పంటలకు నీళ్లను విడుదల చేస్తే మున్ముందు సమస్య తలెత్తే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. -
తాగునీటి సమస్యను తక్షణమే పరిష్కరించండి
వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి డిమాండ్ పలాస: టెక్కలి డివిజన్లోని టెక్కలి, పలాస, ఇచ్ఛాపురం నియోజక వర్గాల్లో తీవ్ర నీటి ఎద్దడి నెలకొని ఉందని, ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యను తక్షణమే పరిష్కరించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి డిమాండ్ చేశారు. ఆదివారం కాశీబుగ్గ వచ్చిన ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నీటి ఎద్దడి నివారణకు జలాశయాలను అభివృద్ధి చేయాలని, ఇందుకు అవసరమైన నిధులు విడుదల చేయాలన్నారు. ప్రజలకు తాగునీరు సరఫరా సక్రమంగా జరిగితే రోగాల కు దూరంగా ఉంటారన్నారు. సురక్షిత నీరు లభించకపోవడం వల్లే ఉద్దానం ప్రాంతంలో ప్రజలు కిడ్నీ వ్యాధులకు గురవుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు. ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కరించాల్సిన జిల్లా అధికారులు తమ విధులు సక్రమంగా నిర్వహించలేకపోతున్నారని చెప్పారు. జిల్లాలో అధికారుల కొరత కూడా చాలా ఎక్కువగా ఉందని తెలిపారు. 20 శాఖల్లో అధికారుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, అధికారులు ఏ కారణంగా దీర్ఘకాలిక సెలవులు పెట్టి వెళ్లిపోతున్నారని ఆమె ప్రశ్నించారు. ఉచిత ఇసుక బూటకం ప్రజలకు ఉచితంగా ఇసుకను ఇస్తామని ప్రభుత్వం చెప్పిందని, అదంతా ఒట్టి బూటకమన్నారు. తెలుగుదేశం నాయకులు, ప్రజాప్రతినిధులు, మంత్రులు వేల కోట్ల రూపాయల ఇసుకును తినేస్తున్నారని దుయ్యబట్టారు. ఇసుక అక్రమ నిల్వలు ఉంచుకొని కృత్రిమ కొరత సృష్టించి అధిక రేట్లకు విక్రయిస్తున్నారని ఆమె ఆరోపించారు. శాసన సభలో ఒక మహిళా ఎమ్మెల్యే అని కనీసం గౌరవించకూండా ఆర్కే రోజాను శాసన సభలోకి అడుగుపెట్టనీయకుండా అడ్డుకుంటున్నారని, ఇది అప్రజాస్వామికమన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే, పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త జుత్తు జగన్నాయకులు, మాజీ ఎంపీపీ బత్తిన హేమేశ్వరరావు, మున్సిపల్ కౌన్సిలర్ బోర కృష్ణారావు, రాపాక శేషగిరి, జుత్తు కూర్మారావు, జోగ కృష్ణారావు, గొలుసు శేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
నీటి ఎద్దడి నివారణకు రూ.13.06 కోట్లు
మంత్రి పల్లె రఘునాథరెడ్డి పుట్టపర్తి టౌన్: వేసవిలో జిల్లాలో నీటి ఎద్దడి నివారణ చర్యలకు ప్రభుత్వం రూ.13.06 కోట్లు మంజూరయ్యాయని సమాచార, ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం నగర పంచాయతీ కార్యాలయంలో కౌన్సిలర్లతో తాగునీటి సమస్యపై చర్చించారు. మంత్రి మాట్లాడుతూ అవసరమైన పైపులైన్లు, ట్రాన్స్ఫార్మర్లు వెంటనే ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను అదేశించారు. జిల్లాలో 13 మండలాలకు చెందిన 41 గ్రామాల్లో తీవ్ర నీటి ఎద్దడి నెలకొందన్నారు. ఆ గ్రామాల్లో ఎద్దడి నివారణకు ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తామన్నారు. నగర పంచాయతీలో స్వచ్ఛభారత్ కింద మంజూరైన మరుగుదొడ్ల నిర్మాణంలో అవినీతి చోటు చేసుకుందని అరోపణలు వినిపిస్తున్నాయని,ఎవరినీ వదిలే ప్రసక్తేలేదన్నారు.త్వరలో పుట్టపర్తిలో సత్యసాయి విమానాశ్రయం కేంద్రంగా ఏవియేషన్ అకాడమీని ప్రారంభిస్తామని,అనుబంధంగా పలు విమానయాన సంస్థలు పరిశ్రమలు ఏర్పాటుకు ముందుకు వస్తున్నాయన్నారు. -
సుజలం .. దుర్లభం
నాణ్యత ప్రమాణాలు పాటించని వాటర్ ప్లాంట్లు కలుషితమవుతున్న మినరల్ వాటర్ రోగాల బారిన పడుతున్న ప్రజలు స్వార్థం మానవ విలువలను మింగేస్తోంది..ఏం కొనాలన్నా..ఏం తినాలన్నా కల్తీమయమై భయపెడుతున్నారుు.. తినే నూనె బొట్టులోనూ, తాగే నీటి చుక్కలోనూ నాణ్యత ప్రమాణాలు లోపిస్తున్నాయి.. అధికారుల అలసత్వం ఒకవైపు.. అలవిగాని దురాశ మరోవైపు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి.. చిలకలూరిపేట : ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో అన్ని చోట్లా తాగునీటి సమస్య తలెత్తింది. దీంతో ప్రజలు, అధికారులు ప్రత్యామ్నాయ జల వనరులపై దృష్టి కేంద్రీకరించారు. చిలకలూరిపేట మున్సిపాలిటీ పరిధిలో ఎప్పుడూ లేని విధంగా ఓగేరువాగు నీటిని ప్రజలకు సరఫరా చేసి విమర్శల పాలయ్యారు. ఒక వైపు ప్రైవేటు వ్యక్తులు విచ్చలవిడిగా మినరల్ వాటర్ పేరుతో కొత్త దోపిడీకి తెరతీశారు. లాభార్జనే ధ్యేయంగా నీటి వ్యాపారం.. గ్రామీణ ప్రాంతల్లో అనుమతులు తీసుకొని వాటర్ ప్లాంట్ పెట్టాలంటే కనీసం రూ. 40 నుంచి 50 లక్షలు ఖర్చవుతుంది. అదే పట్టణ ప్రాంతాల్లో కోటిపైనే. ప్లాంట్ ఏర్పాటుకు 22 అంశాల్లో ప్రాధాన్యమివ్వాలి. నీటి నాణ్యతను పరిశీలించేందుకు ల్యాబ్, అందులో బీఎస్సీ కెమిస్ట్రీ వ్యక్తిని, మైక్రోబయాలజీ ల్యాబ్, ఎమ్మెస్సీ బయాలజీ వ్యక్తిని నియమించాలి. వాటర్ బాటిల్స్ నింపే ప్రాంతంలోనూ, ల్యాబ్‌లోనూ ఏసీ సౌకర్యం కల్పించాలి. పూర్తి స్థాయిలో పరిశుభ్రత పాటించాలి. ప్రస్తుతం నెలకొల్పుతున్న ప్లాంట్లలో ఇవేమీ పాటించడం లేదు. దీంతో ప్రజారోగ్యం అందోళనలో పడింది. నీరు శుద్ధి చేయకపోతే డయేరియా, కామెర్లు వచ్చే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నీటి శుద్ది కోసం మోతాదు మించి క్లోరిన్ వాడితే ప్రాణాంతకరమైన క్యాన్సర్ సోకే అవకాశం ఉందని చెబుతున్నారు. నిరుపయోగంగా మారిన నీటి పరీక్షల కిట్లు అర్డబ్ల్యూఎస్ అధికారులు ప్రతి ఏటా పరీక్షలు నిర్వహించి తాగటానికి నీరు పనికి వస్తుందా లేదా అని నిర్ధారిస్తారు. ప్రస్తుతం సిబ్బంది కొరతతో ఈ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. మూడేళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం పంచాయతీల్లో తాగునీటి పరీక్షలు నిర్వహించడానికి కిట్స్ పంపిణీ చేశారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోకపోవటంతో ఇవి మూలన పడ్డాయి. తిరి ప్రస్తుతం ఫీల్ట్ టెస్టింగ్ కిట్స్ పేరుతో పంచాయతీలకు మళ్లీ అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇవి వంద సార్లు ఉపయోగపడతాయి. ఈ కిట్స్ ద్వారా చెరువులు, ఇతర నీటి వనరుల్లో నీటి పరీక్షలు నిర్వహించవచ్చు. పరీక్షలు క్రమం తప్పకుండా నిర్వహించడానికి పంచాయతీ కార్యదర్శి, పాఠశాల సైన్సు ఉపాధ్యాయుడు, అంగన్వాడీ, వెలుగు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసి శిక్షణ ఇవ్వనున్నారు. కుళాయి నీళ్లే భేష్.. మినరల్ వాటర్ పేరుతో సరఫరా అవుతున్న నీటికన్నా శుద్ధి చేసిన కుళాయి నీళ్లే సురక్షితమని నిపుణులు సూచిస్తున్నారు. ప్రభుత్వ పరంగా సరఫరా చేసే నీటిలో రంగు, మట్టి శాతం, ఫ్లోరైడ్, క్లోరైడ్ ప్రమాణాల మేర ఉంటాయి. మినరల్ వాటర్ పేరుతో చలామణి అవుతున్న నీటిలో ఇవి ఉండవు. ఉదాహరణ లీటర్ నీటిలో 0.6 మిల్లీగ్రాముల ఫ్లోరైడ్ ఉండాలి. దీంతో ఎముకలు పటిష్టమవుతారుు. శుద్ధి చేసిన నీటిలో 0.1 మిల్లీగ్రాముల మేర మాత్రమే ఫ్లోరైడ్ ఉంటుంది. దీంతో ఎముకలు పటిష్టత కోల్పోతారుు. -
జలయోగం
164 గ్రామాలకు తీరనున్న దాహార్తి నీటి సరఫరాకు జలమండలి సిద్ధం వ్యయ భారం పంచాయతీలదే తొలివిడతగా ముందుకొచ్చి బోడుప్పల్, పుప్పాల్‌గూడ, మణికొండ సిటీబ్యూరో: శివారు గ్రామాలకు త్వరలో తాగునీటి సమస్య నుంచి విముక్తి లభించనుంది. జీహెచ్ఎంసీ సరిహద్దుకు ఆనుకొని... ఔటర్ రింగ్ రోడ్డు పరిధి లోపల ఉన్న గ్రామ పంచాయతీలకు మంచినీటి సరఫరాకు జలమండలి సూత్రప్రాయంగా అంగీకరించింది. ఔటర్‌కు లోపల ఉన్న పంచాయతీల పరిధిలో సుమారు 164 గ్రామాలు ఉన్నట్లు బోర్డు అంచనా వేస్తోంది. ఈ పంచాయతీలు నేరుగా జలమండలిని సంప్రదిస్తే... వ్యయ అంచనాలను ఇంజినీర్లు సిద్ధం చేస్తారని తెలిపింది. ఈ మొత్తాన్ని పూర్తిగా పంచాయతీలే భరించాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. తొలివిడతగా పుప్పాల్‌గూడ, మణికొండ, బోడుప్పల్ పంచాయతీలు తమను సంప్రదించాయని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో తలసరి నీటి వినియోగానికి రోజుకు 100 లీటర్ల (ఎల్పీసీడీ) వంతున సరఫరా చేయాలని నిర్దేశిస్తూ గతంలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఉత్తర్వులిచ్చినట్లు తెలిపారు. ఈ పంచాయతీలకు జలకళ జలమండలి అంచనా ప్రకారం జీహెచ్ఎంసీకి ఆవల.. ఔటర్‌రింగ్ రోడ్డుకు లోపల ఉన్న గ్రామాల్లో కొన్ని... పోశెట్టిగూడ, రషీద్‌గూడ, బహదూర్‌గూడ, లక్ష్మీతాండా, సాతంరాయి, శంషాబాద్, సిద్దాంతి, బసురేగడి, గ్యానాపూర్, గుండ్లపోచంపల్లి, లక్ష్మీనగర్, మైసమ్మగూడ, బోడుప్పల్, చెంగిచెర్ల, చౌదరిగూడ, మక్తా.మహేశ్వరం మండలంలోని 4 పంచాయతీలు, సరూర్ నగర్లో 6, హయత్‌నగర్‌లో 11, రాజేంద్ర నగర్లో 16, మేడ్చల్‌లో 2, ఘట్కేసర్లో 15, కీసర మండలంలో 9, శామీర్‌పేట్ పరిధిలో 9, కుత్బుల్లాపూర్‌లో 9, ఇబ్రహీంపట్నంలో వివిధ పంచాయతీలు ఉన్నట్లు జలమండలి అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. కృష్ణా, గోదావరి పథకాలతో... ప్రస్తుతం జలమండలి పరిధిలో 8.64 లక్షల నల్లాలకు రోజువారీగా 365 మిలియన్ గ్యాలన్ల నీటిని జలమండలి సరఫరా చేస్తోంది. ఈ ఏడాది అక్టోబరు నాటికి కృష్ణా మూడోదశ, గోదావరి మంచినీటి పథకం మొదటి దశల ద్వారా అదనంగా మరో 262 మిలియన్ గ్యాలన్లు నగరానికి తరలిరానున్నాయి. పంచాయతీలు ముందుకొస్తే ఈ నీటిని సరఫరా చేసే అవకాశం ఉంటుందని జలమండలి వర్గాలు తెలిపాయి. నిధులే కీలకం... ఔటర్‌కు లోపల ఉన్న గ్రామాల పరిధిలో ఇంటింటికీ నీటి పంపిణీకి అవసరమైన పైప్‌లైన్ నెట్వర్క్, ఓవర్‌హెడ్‌ట్యాంక్, మంచినీటి స్టోరేజి రిజర్వాయర్లను సొంతంగా ఏర్పాటు చేసుకోవాలంటే రూ.వందల కోట్లు అవసరం. ఈ మొత్తాన్ని పంచాయతీలు భరిస్తాయా? లేదా ప్రభుత్వం గ్రాంటుగా మంజూరు చేస్తుందా? అన్న విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. ఇందులో కొన్ని పంచాయతీలు ఆర్థికంగా పరిపుష్టంగా ఉండి నిధుల వ్యయానికి సిద్ధంగా ఉన్నాయి.మరికొన్ని నిధుల లేమితో కునారిల్లుతుండడం గమనార్హం. ప్రభుత్వ నిర్ణయంపైనే గ్రామ ఈ పంచాయతీల దాహార్తి తీరే అంశం ఆధారపడి ఉంది. -
15లోపు తాగునీటి విడుదల
- డ్రిప్ ఇరిగేషన్‌కు ప్రాధాన్యం ఇవ్వండి - కరువు ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధం - సమీక్షా సమావేశంలో మంత్రి ప్రత్తిపాటి గుంటూరు వెస్ట్ : జిల్లాలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలని, ఈనెల 15వ తేదీలోపు తాగునీటి కోసం సాగర్ జలాలను విడుదల చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో డ్రిప్ ఇరిగేషన్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి సూచించారు. జిల్లా పరిషత్ కార్యాలయంలోని సమావేశపు మందిరంలో శుక్రవారం వ్యవసాయం, వర్షాభావ పరిస్థితులు, తాగు, సాగునీరు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై మంత్రి ఆయా శాఖల అధికారులతో సమీక్ష జరిపారు. నరసరావుపేట, చిలకలూరిపేట, సత్తెనపల్లి తదితర ప్రాంతాలలో ఈనెలాఖరు నాటికి తాగునీటి ఎద్దడి ఏర్పడే అవకాశం ఉందని సంబంధిత అధికారులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పటికీ గత ఏడాది కంటే అదనంగా పంటలు సాగుచేస్తున్నట్లు వ్యవసాయ శాఖ జేడీ శ్రీధర్ వెల్లడించారు. సబ్సిడీపై గిరిరాజ్ ఆవులను అందజేయనున్నట్లు పశుసంవర్థక శాఖాధికారి దామోదరంనాయుడు వెల్లడించారు. జిల్లాలోని వివిధ గ్రామాలలో తాగునీటి ఎద్దడి కారణంగా 83 ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నట్లు ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్ఈ గోపాలకృష్ణ మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి పుల్లారావు మాట్లాడుతూ జూన్,జూలైలో కురిసిన వర్షాల వల్ల ప్రస్తుతం పంటలకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. వర్షాభావ పరిస్థితులు వల్ల ఎక్కడైనా పంటలు ఎండిపోయే పరిస్థితులు నెలకొంటే ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. దాణా, పసుగ్రాసం కొరత రాకుండా చూడాలని కోరారు. ప్రకృతి వైపరీత్యాలను, వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కంది, ఉల్లి పంటలను, డ్రిప్ ఇరిగేషన్, ఉద్యానవన పంటలను ప్రోత్సహించాలని మంత్రి సూచించారు. మాచర్ల, గురజాలలో రైతుబజార్లను ఏర్పాటు చేయాలని గురజాల ఆర్డీఓను ఆదేశించారు. కరువు పరిస్థితులు తలెత్తితే తీసుకోవాల్సిన చర్యలపై కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామని మంత్రి పుల్లారావు తెలిపారు. ఈ సమావేశంలో జెడ్పీ ఛైర్పర్సన్ షేక్ జానీమూన్, కలెక్టర్ కాంతిలాల్‌దండే, జేసీ-2 ముంగా వెంకటేశ్వరరావు, వైస్ చైర్మన్ వి.పూర్ణచంద్రరావు, సీఈఓ బి.సుబ్బారావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
పట్నంలో నీటి గోస!
మొత్తం నగరాలు, పట్టణాలు.. 67 18 నగరాలు, పట్టణాల్లో రోజూ సరఫరా 28 చోట్ల రెండు రోజులకోసారి నీళ్లు 13 పట్టణాల్లో మూడు రోజులకు ఒకసారి 5 చోట్ల నాలుగు రోజులకోసారి 3 పట్టణాల్లో ఏడు రోజులకోసారి సరఫరా పట్టణాల్లో తాగునీటి పథకాల సామర్థ్యం, తగ్గుదల, సరఫరా వివరాలు పథకాల గరిష్ట సామర్థ్యం : 747 ఎంఎల్డీ ప్రస్తుత సరఫరా సామర్థ్యం : 459 ఎంఎల్డీ (61.5 శాతం) తరుగుదల : 287 ఎంఎల్డీ (38.5 శాతం) రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల్లో తాగునీటి తీవ్ర కటకట తాగునీటి సరఫరాలో 30-60 శాతం తరుగుదల రాష్ట్రంలో పురజనుల గొంతెండుతోంది.. దాహం దాహం అంటూ పట్టణవాసులు అల్లాడిపోతున్నారు.. గుక్కెడు నీటి కోసం అష్టకష్టాలు పడుతున్నారు. ఎండలు ముదరడంతో నగరాలు, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య మరింత పెరిగింది. వేసవిలో నీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలతో సిద్ధం కాకపోవడంతో పరిస్థితి మరింత దుర్భరంగా మారుతోంది. నిధులు లేక నగర, పురపాలక సంస్థలు తాగునీటి సరఫరా చేయలేక చేతులెత్తేస్తున్నాయి. దీంతో వందల కోట్లు కుమ్మరించి నిర్మించిన నీటి సరఫరా పథకాలు నిరుపయోగంగా మారిపోయాయి. మరోవైపు... ప్రైవేటు నీటి శుద్ధి కేంద్రాలు కోట్లాది రూపాయల దందాకు తెరలేపాయి. - సాక్షి, హైదరాబాద్ ‘కొత్త’ సమస్యలు నగరాలు, పట్టణాల పరిధిలోని 26.85 శాతం ప్రాంతాలకు అసలు నీటిసరఫరా వ్యవస్థే లేదు. ప్రధానంగా శివారు ప్రాంతాలు, 25 కొత్త నగర పంచాయతీల్లో ఈ పరిస్థితి ఉంది. నల్లగొండ జిల్లా దేవరకొండలో ఆరు రోజులకోసారి నీటి సరఫరా జరుగుతోంది. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో సైతం 4 రోజులకోసారి నీళ్లు ఇస్తున్నారు. కోరుట్ల, మెట్పల్లి, హుస్నాబాద్, వేములవాడ, హుజూరాబాద్, మధిర, దేవరకొండ, బడంగ్‌పేట, ఐజ, కల్వకుర్తి, నాగర్‌కర్నూల్, షాద్‌నగర్ పట్టణాల పరిధిలోని 50 శాతానికిపైగా ప్రాంతాలకు నీటి సరఫరా వ్యవస్థే లేదు. ట్యాంకర్ల ద్వారా సరఫరాకు ప్రభుత్వం సకాలంలో నిధులు విడుదల చేయలేకపోయింది. నీటిని విడుదల చేస్తేనే.. నీటి నిల్వలు తగ్గిపోవడంతో పట్టణాల్లో సరఫరా క్లిష్టంగా మారింది. పలుచోట్ల తక్షణమే సంబంధిత ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేయాల్సి ఉంది. ఖమ్మం-పాలేరు రిజర్వాయర్ నుంచి మునేరుకు నీటిని విడుదల చేయాలి. జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి పట్టణాలకు నీరందించడం కోసం ఎస్సారెస్పీ నుంచి కాకతీయ కాల్వ ద్వారా ఎస్ఎస్ ట్యాంకులు, వెంకటరావుపేట చెరువుకు నీళ్లు వదలాల్సి ఉంది. సగం మందికి దాహమే! నీటి సరఫరా నాణ్యత ప్రమాణాల ప్రకారం పట్టణ ప్రాంతాల్లో సగటున ఒకరికి రోజుకు 140 లీటర్ల (ఎల్పీసీడీ) నీటిని సరఫరా చేయాల్సి ఉండగా.. రాష్ట్రంలో 40 నుంచి 100 లీటర్లలోపు మాత్రమే సరఫరా అవుతున్నాయి. సాధారణ పరిస్థితిలో ఒక రోజులో 43.11 శాతం జనాభాకే తాగునీరు అందుతోంది. భూగర్భ జలాలు అడుగంటిపోవడం, వేసవి నిల్వ ట్యాంకుల్లో నీటిమట్టాలు తరిగిపోవడంతో.. ఈ పరిస్థితి తలెత్తింది. రాష్ట్రంలోని 67 పట్టణాల్లో నీటి సరఫరా పరిస్థితి ఇలా ఉంది.. ►18 పట్టణాల్లో నీటి సరఫరా 44 -100 ఎల్పీసీడీలు ఉండగా.. వేసవి ప్రభావంతో 30 శాతం తగ్గిపోయింది. ► 28 పట్టణాల్లో 8-56 ఎల్పీసీడీల మధ్య ఉన్న సరఫరా ప్రస్తుతం 40 శాతం తగ్గింది. ► 13 చోట్ల మూడు రోజులకోసారి 5-49 ఎల్పీసీడీలుగా ఉన్న సరఫరా.. ఇప్పుడు సగానికి పడిపోయింది. ► 5 పట్టణాల్లో నాలుగు రోజులకోసారి 11-17 ఎల్పీసీడీల నీటిని సరఫరా చేసేవారు. కానీ గత మూడు నెలల్లో సరఫరా 60 శాతం తగ్గింది. ► మిగతా 3 చోట్ల వారానికోసారి మాత్రమే సరఫరా చేస్తున్నారు. ‘నీరు’గారిన పథకాలు రాష్ట్రంలోని పట్టణ తాగునీటి పథకాల ‘సరఫరా సామర్థ్యం’ దాదాపు 40 శాతం తగ్గిపోయింది. సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని 67 నగరాలు, పట్టణాలకు తాగునీటిని సరఫరా చేసే పథకాల పనితీరుపై ఇంజనీరింగ్ నిపుణులతో చేయించిన సమగ్ర సర్వేలోనే ఈ విషయం బయటపడింది. తుప్పుపట్టిన ప్రధాన పైప్లైన్లు, లికేజీలు, శిథిలమైన ఓవర్‌హెడ్ ట్యాంకులు, మొరాయిస్తున్న పంపింగ్ స్టేషన్లతో నీటి పథకాలు సరిగా పనిచేయడం లేదు. ఈ పథకాలన్నీ తిరిగి పూర్తి సామర్థ్యాన్ని సంతరించుకోవాలంటే ఏకంగా రూ.624.33 కోట్లతో మరమ్మతులు చేయాల్సి ఉందని ప్రజారోగ్య, ఇంజనీరింగ్ విభాగం తేల్చింది. -
వేసవిలో తాగునీటి గండం
►మార్చి నెలాఖరుకు సుంకేసుల ఖాళీ ►ఏప్రిల్ నుంచి కర్నూలు నగరానికి పొంచి ఉన్న తాగునీటి సమస్య ►ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటేనే తీరనున్న దాహం ►సుంకేసుల రిజర్వాయర్‌లో ప్రస్తుతం ఒక టీఎంసీ నీరు కర్నూలు(అర్బన్) : కర్నూలు నగరానికి తీవ్ర తాగునీటి గండం పొంచి వుందా? అనే ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రస్తుతం సుంకేసులలో ఉన్న ఒక టీఎంసీ నీరు మార్చి 31 నాటికి ఖాళీ కానుంది. దీంతో ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి నగర ప్రజల గొంతు ఎండనుంది. ప్రతి ఏడాది వేసవిలో నగర ప్రజల దాహార్తిని సుంకేసుల జలాశయం తీరుస్తూ వస్తోంది. అయితే ప్రస్తుతం కేసీ కెనాల్‌కు టీబీ డ్యామ్ నుంచి మన వాటా కోటాలో కోత పడడం.. సుంకేసుల జలాశయంలోని నీటిని ఇటు కర్నూలు, అటు మహబూబ్‌నగర్ (పాలమూరు) జిల్లాల ప్రజలు వాడుకోవాల్సిన పరిస్థితులు ఉండడంతో వేసవిలో నగర ప్రజలు తీవ్ర మంచి నీటి ఎద్దడిని ఎదుర్కోనున్నారు. తాగునీటి అవసరాల దృష్ట్యా సుంకేసుల జలాశయంలో ఒక టీఎంసీ నీటిని నిల్వ వుంచుకొని మార్చి నెల ఒకటో తేదీ నుంచి కర్నూలు నగర ప్రజల తాగునీటి అవసరాలకు రోజుకు 200 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ సోమవారం జరిగిన సమావేశంలో నీటి పారుదల శాఖ అధికారులను ఆదేశించారు. అయితే సుంకేసులలో నిల్వ వుంచి నీటిని పాలమూరు జిల్లాలోని వివిధ గ్రామాల ప్రజలు కూడా రోజుకు 450 నుంచి 500 క్యూసెక్కుల నీటిని వాడుకునే అవకాశం వుంది. ఆయా ప్రాంతాల్లో 18 మంచి నీటి సరఫరా పథకాలు, దాదాపు 3 వేల పంప్ సెట్లు వున్నాయి. వీటికి ప్రతి రోజు నీటిని వాడుకునే అవకాశం వుంది. ఈ లెక్కన కర్నూలు నగరానికి రోజుకు 200 క్యూసెక్కులు, పాలమూరు జిల్లాకు 450 నుంచి 500 క్యూసెక్కులు వాడుకుంటే సుంకేసులలో నిల్వ వున్న ఒక టీఎంసీ నీరు మార్చి నెలాఖరు వరకు మాత్రమే ఉపయోగించుకునే వీలుంది. మిగిలిన ఏప్రిల్, మే నెలల్లో నగర ప్రజల దాహార్తి తీర్చే వారెవరనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. జూన్‌లో తొలకరి వర్షాలు కురిసేంతవరకు ప్రజలు తాగునీటికి అల్లాడాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటేనే.. సుంకేసుల జలాశయం నీటిని వాడుకుంటూనే.. మరో వైపు నగర ప్రజల దాహార్తిని తీర్చేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించకుంటే తీవ్రమైన కష్టాలను ఎదుర్కొవాల్సి వస్తుందని నీటి పారుదల శాఖ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. హంద్రీనీవా నీటితో గాజులదిన్నె ప్రాజెక్టును నింపి ఆ నీటిని కర్నూలుకు మళ్లిస్తే కొంత వరకు ఉపశమనం వుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ప్రస్తుతం అరకొరగానే హంద్రీనీవా నీటిని జీడీపీకి వదులుతున్నారని, అలా కాకుండా డ్యామ్‌ను పూర్తిగా నింపాలన్నారు. నగర ప్రజలకు రోజుకు 71.76 ఎంఎల్ అవసరం.. నగరంలోని దాదాపు 5 లక్షల జనాభాకు ప్రస్తుతం 71.76 మిలియన్ లీటర్ల (ఎంఎల్) నీరు అవసరముంది. వేసవిలో నీటి అసవరాలు మరింత పెరగనున్నాయి. అయితే ప్రస్తుతం 67 ఎంఎల్ నీటిని మాత్రమే సరఫరా చేస్తున్నారు. నగర పాలక సంస్థ పరిధిలో 85 శాతం ప్రాంతాల ప్రజలకు రోజుకు రెండు నుంచి మూడు గంటలు, మిగిలిన 15 శాతం ప్రాంతాల ప్రజలకు రోజు విడిచి రోజు నీటిని అందిస్తున్నట్లు నగర పాలక అధికారులు చెబుతున్నారు. రానున్న వేసవిలో తాగునీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు గాజులదిన్నె నీటిపై ఆధారపడాల్సి వస్తుందనే అభిప్రాయాన్ని నగర పాలక నీటి సరఫరా విభాగం అధికారులు వ్యక్తం చేస్తున్నారు.