Rainy season
-
వర్షాకాలంలో ఆకుకూరలు తినవచ్చా..?
ఆకుకూరలు తినడం ఆరోగ్యానికి చాలా మంచిదని వైద్యులు చెబుతుంటారు. ముఖ్యంగా కళ్లకు చాలా మంచిదని అంటారు. అలాంటి ఆకుకూరలను వర్షాకాలంలో మాత్రం తీసుకోవద్దని సూచిస్తుంటారు. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుండే ఈ ఆకుకూరలను వర్షాకాలంలో ఎందుకు తీసుకోకూడదు..?. నిపుణులు ఏమంటున్నారంటే..ఈ వర్షాకాలంలో ఆకుకూరలు బురద బురదగా ఉంటాయి. పైగా గాల్లో ఉండే తేమ కారణంగా వైరస్, బ్యాక్టీరియా ఆకులను ఆశ్రయించి ఉంటుంది. చెప్పాలంటే ఈ టైంలో వాటి సంతానోత్పత్తిని అభివృద్ధి చేసే ప్రదేశంగా ఆకుకూరలను మారుస్తుంది. మనం ఈ కాలంలో వీటిని గనుక సరిగా క్లీనింగ్ చేయకుండా తీసుకుంటే ఫుడ్ పాయిజనింగ్ అవ్వడం, డయేరియా, ఇతర ప్రేగు సంబంధిత సమస్యలను ఎదుర్కొనవల్సి ఉంటుందని పోషకాహార నిపుణురాలు అమిత గాద్రే చెబుతున్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అలా అని ఈ సీజన్లో ఆకుకూరలకు దూరంగా ఉండాల్సిన పనికూడా లేదని అంటున్నారు పోషకాహార నిపుణురాలు అమిత. హాయిగా ఈ కాలంలో కూడా ఆకుకూరలు తినొచ్చుని చెబుతున్నారు. అయితే ఈ క్రింది జాగ్రత్తలు పాటించినట్లియితే బేషుగ్గా తినవచ్చని అంటున్నారు పోషకాహార నిపుణులు. ఈ వర్షాకాలంలో ఆకుకూరలను సరిగ్గా కడగడం ఎలా అంటే..ఆకుకూరలు కొనుగోలు చేసిన వెంటనే తాజా ఆకులను వేరు చేయాలి. తర్వాత నిస్తేజంగా ఉన్న వాటిని శుభ్రం చేసి, బాగానే ఉన్నాయనిపిస్తే వినియోగించాలి. ఆ తర్వాత ఆకులన్నింటిని ఒక్కోక్కటిగా ఓపికతో క్లీన్ చేయాలి. వాటిని పొడి క్లాత్‌పై వేసి చక్కగా ఆరబెట్టండి.వండటానికి ముందు ఆకుకూరలను చక్కగా ఉప్పు వేసిన వేడినీటిలో 30 సెకన్లపాటు ఉంచి వడకట్టండి. ఆ తర్వాత వెంటనే ఐస్ వాటర్‌లో వేసి చక్కగా వండుకోండి. ఇలా చేస్తే ఎలాంటి సమస్య ఉండదు. ఈ జాగ్రత్తలు తీసుకోకుండా వండినట్లయితే పలు అనారోగ్య సమస్యలు ఫేస్ చేయాల్సిందేనని చెబుతున్నారు పోషకాహార నిపుణులు.(చదవండి: డెంటిస్ట్‌పై ఏకంగా రూ. 11 కోట్లు దావా! సర్జరీ టైంలో..) -
వర్షాకాలం..వ్యాధుల కాలం..వీటి బారినపడకూడదంటే..!
సూర్యుడి భగభగలు నుంచి తొలకరి జల్లులతో వర్షాకాలం సమీపించి చల్లదనంతో సేదతీరేలా చేస్తుంది. కానీ ఇది ఎంత చల్లగా ఆహ్లాదంగా ఉన్నా..ఈ తేమకు ఒక్కసారిగా సీజనల్ వ్యాధులు విజృంభిస్తాయి. ముఖ్యంగా జలుబు, ఫ్లూ వంటి వ్యాధులతో ఉక్కిరిబిక్కిరి అవుతారు ప్రజలు. వీటిని ఎలా ఎదుర్కోవాలి?, ఈ వ్యాధుల బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది తదితరాల గురించి సవివరంగా తెలుసుకుందాం.!వాతావరణ మార్పుల కారణంగా రోజురోజుకి ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. ఈ సీజన్లో సాధారణ వ్యాధులు పెరుగుతాయి. ఉష్ణోగ్రతల్లో తీవ్రమైన హెచ్చుతగ్గులు శరీరాన్ని బ్యాక్టీరియా, వైరల్ దాడికి గురి చేస్తాయి. ఈ కారణంగా చాలా సమస్యలు వస్తాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.జలుబు, జ్వరం..ఈ వర్షాకాలంలో సాధారణంగా వచ్చే సమస్యల్లో జలుబు, జ్వరం సర్వ సాధారణం. వైరల్ ఇన్ఫెక్షన్లకి ఇవి సాధారణ రూపం. కాబట్టి, వీటి కారణంగా ఎక్కువగా చాలా మంది జలుబు, జ్వరంతో బాధపడుతుంటారు. అసలు సమస్య వచ్చిన వెంటనే డాక్టర్ని సంప్రదించాలి.దోమలు..రుతుపవనాలు వచ్చాయంటే చాలు మలేరియా వచ్చిట్లే. వర్షం పడినప్పుడు నీరు ఎక్కడపడితే అక్కడ నిలిచిపోతుంది. దీని వల్ల దోమలు పెరుగుతాయి. దోమల వల్ల మలేరియా, డెంగ్యూ వంటి జ్వరాలు వస్తాయి.డెంగ్యూ..డెంగ్యూ జ్వరం పెద్ద సమస్యే. ప్రాణాంతకంగా మారింది. ఇది డెంగ్యూ వైరస్ కారణంగా వచ్చినప్పటికీ, క్యారియర్ దోమ, కాబట్టి, దోమ కాటు నుంచి రక్షించుకోవచ్చు.కలరా..కలరా అనేది కలుషిత నీటి ద్వారా వచ్చే సమస్య. ఇది జీర్ణాశయ సమస్యలు, అతిసారం, డీహైడ్రేషన్ వంటి సమస్యలు వస్తాయి. అందువల్ల, కాచి చల్లార్చిన నీటిని తాగడం వల్ల చాలా మంచిది.టైఫాయిడ్..టైఫాయిడ్ ఫీవర్ కూడా కలుషిత ఆహారం, నీటి కారణంగా వస్తుంది. ఇది సాల్మొనెల్లా టైఫీ వల్ల వచ్చే మరో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. సరైన పరిశుభ్రత, పారిశుద్ధ్యాన్ని పాటించడం, పరిశుభ్రత పాటించడం వల్ల సమస్యని దూరం చేయొచ్చు.హెపటైటిస్..కాలేయానికి ఇన్ఫెక్షన్ సోకడం, కలుషితాహారం, నీటి వల్ల హెపటైటిస్ ఎ సమస్య వస్తుంది. ఈ సమస్య లక్షణాలు జ్వరం, వాంతులు, దద్దుర్లు మొదలైనవి వస్తాయి. సరైన పరిశుభ్రతను పాటించడం ముఖ్యం.తీసుకోవాల్సిన జాగ్రత్తలు..వర్షాకాలంలో వాతావరణంలో ఉండే తేమ వలన ఎక్కువగా జలుబు, నోస్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు మాస్క్ ధరించి దీని బారి నుంచి సులభంగా తప్పించుకోవచ్చు అని నిపుణులు చెబుతున్నారు. దాంతో పాటు వేడి నీళ్లతో ఆవిరి పట్టడం వల్ల కొంత ఉపశమనం లభిస్తుందన్నారు. ఇక గొంతు నొప్పి రాకుండా ఉండేందుకు కొన్ని ఆహారపు అలవాట్లను మార్చుకోవడంతో పాటు అయిల్ ఫుడ్‌ని దూరంగా పెట్టాలని సూచించారు. ఆహారం తిన్న వెంటనే నోటిని శుభ్రంగా కడుక్కోవాలని, ఉప్పు నీటిని వాడితే మంచి ఫలితం ఉంటుందన్నారు. కొన్ని చిన్నపాటి జాగ్రత్తలతో వర్షాకాలంలో వచ్చే వ్యాధుల భారీ నుండి తప్పించుకోవచ్చు. అంతేగాదు వర్షాకాలంలో ఎక్కువగా ఆరోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి, ముందు నుంచి ఈ క్రింది జాగ్రత్తలు తీసుకోవాలి.పోషకాహారం తీసుకోవాలి.ఇమ్యూనిటీని పెంచే ఫుడ్స్ తీసుకోవాలి.కాచి చల్లార్చిన నీటిని తాగాలి.దోమలు పెరగకుండా చుట్టూ ఉన్న పరిసరాలను క్లీన్ చేసుకోవాలి.దోమలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.వీటితో పాటు సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవాలి.అల్లం, వెల్లుల్లిని ఆహారంలో చేర్చుకోవాలి.గమనిక: ఈ కథనం కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పాటించే ముందు వ్యక్తిగత నిపుణులు లేదా వైద్యుల సలహాల మేరకు పాటించటం ఉత్తమం. (చదవండి: ఏకంగా 172 సార్లు పాము కాటుకి గురయ్యాడు..దీంతో అతడి రక్తం..! -
వర్షాకాలంలో ఈ పప్పు ధాన్యాలు తింటున్నారా..?
సూర్యుడి భగభగలు నుంచి చల్లటి తొలకరి చినుకులతో వాతావరణమంతా ఒక్కసారిగా చల్లగా మారిపోయింది. ఇక ఎప్పుడు ముసురుపట్టి వర్షం పడుతుందో తెలియక ఇబ్బందులు పడుతుంటాం. ఓ పక్క వంటిట్లో వస్తువులు నిల్వ చేసుకోవడం కష్టమంటే, మరోవైపు వర్షాలకు బ్యాక్టీరయి, వైరస్‌లతో సీజనల్ ఫ్లూ జ్వరాలు ఊపందుకుంటాయి. ఇలాంటి వర్షాకాలంలో అందుకు తగ్గట్టు మనం తీసుకునే ఆహారం విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకుంటే పలు రకాల సమస్యల నుంచి బయటపడొచ్చు. ముఖ్యంగా పప్పుధాన్యాలు ఆరోగ్యానికి మంచిదని తినేస్తుంటాం. కానీ ఈ వర్షాకాలంలో ఇలాంటివి అస్సలు తీసుకోకూడదని హెచ్చరిస్తున్నారు నిపుణులు. కారణాలేంటో సవివరంగా చూద్దాం. పప్పుధాన్యాలు ఆరోగ్యకరమైనవే అయినా వర్షాకాలంలో మాత్రం ఇలాంటి పప్పులకు దూరంగానే ఉండాలి. ఎందకంటే వాతావరణంలోని తేమ శరీరంలోని జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతుంది. గ్యాస్, ఉబ్బరం, ఆమ్లత్వం వంటి సమస్యలకు దారితీస్తుంది. ముఖ్యంగా బీన్స్, కాయధాన్యాలు, చిక్పీస్, బఠానీలు వంటి పప్పుధాన్యాలకు దూరంగా ఉండాలి. సెనగపప్పు..సెనగపప్పులో ప్రోటీన్, ఫైబర్, మినరల్స్ ఉంటాయి. ఇవి అజీర్ణం, అపానవాయువుకి దారితీస్తుంది. సెనగపప్పు బరువు నిర్వహణలో, కొలస్ట్రాల్‌ను నియంత్రించడం తోపాటు మొత్తం జీర్ణ ఆరోగ్యానికి తోడ్పడుతుంది. మసూర్ పప్పు లేదా ఎర్ర పప్పువాటిలో ప్రొటీన్, ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, విటమిన్లు సీ, బీలు ఉన్నాయి. అయినప్పటికీ దీనిలో ఉండే రాఫినోస్, స్టాకియోస్ వంటి చక్కెరలు జీర్ణం కావడం కష్టమవ్వడం వల్ల ఇది అపానవాయువుకు కారణమవుతుంది.మినపప్పు..ఎముకల ఆరోగ్యానికి మద్దతునిస్తుంది, శక్తిని పెంచుతుంది. ఇది పొట్టపై భారంగా ఉంటుంది. జీర్ణంమవడం కష్టమవుతుంది. ఇది తేమతో కూడిన వాతావరణంలో అసౌకర్యం, ఉబ్బరానికి దారితీస్తుంది.తినకూడని ఇతర ఆహారపదార్థాలు..వేయించిన ఆహారాలు..వర్షాకాలంలో రోజూ వేయించిన ఆహారాన్ని తినకుండా ఉండటం చాలా అవసరం. ఇది జీర్ణక్రియను నెమ్మదిస్తుంది. ఫలితంగా ఆ ఒత్తిడి కాలేయంపై ఏర్పడుతుంది. పచ్చి ఆకుకూరలు..సలాడ్లు ఆరోగ్యకరమైనవే అయినప్పటికీ ఈ కాలంలో వాటిని నివారించడం ఉత్తమం. ఆకుల్లో తరుచుగా వ్యాధికారక కీటకాలు ఉంటాయి. వాటిని తొలగించడం కష్టం. అందువల్ల వాటిని బాగా శుభ్రం చేసుకుని తినడం లేదా దూరంగా ఉండటం మంచిది. (చదవండి: -
వానల్లో వార్మ్‌గా, బ్రైట్‌గా.. ఉండాలంటే ఇలా చేయండి..
మాన్సూన్ సీజన్ స్టార్ట్ అయింది! వానజల్లులు మనసుకు ఆహ్లాదాన్నిస్తాయి కానీ ఇంటి వాతావరణాన్ని గ్లూమీగా మార్చేస్తాయి. మనసుతో ఇల్లూ పోటీపడాలంటే ఇంటీరియర్ బ్రైట్‌గా ఉండాల్సిందే! అందుకే..ఇంట్లో రంగు రంగుల వాల్ ఆర్ట్, కళాత్మక వస్తువులు, కుండీలు, క్యాండిల్ హోల్డర్లు.. వంటి ఉపకరణాలను చేర్చండి. గదిలోని ఒక గోడను బ్రైట్ కలర్‌తో పెయింట్ చేయండి. దీంతో ఆ స్థలం సజీవంగా మారిపోతుంది. లేదంటే కంటికింపైన వాల్‌పేపర్‌ను అతికించినా సరే! కుషన్ కవర్లు, కర్టెన్లూ డార్క్ కలర్స్వే ఎంచుకోండి.వర్షాకాలం తేమ ఎక్కువ కాబట్టి వుడెన్ కాకుండా ఫైబర్, మైక్రో ఫైబర్ ఫర్నీచర్‌ను తెచ్చుకోండి. దీపాలతో వెలుగుకే పరిమితం కాదు. గాలినీ శుద్ధి చేస్తాయి. వెచ్చదనాన్నీ అందిస్తాయి. అయితే సువాసనలు వెదజల్లే క్యాండిల్స్‌ను వెలిగిస్తే చుట్టూ ఉన్న వాతావరణం మరింత ప్లెసెంట్ మారుతుంది. çపుస్తక ప్రియులు ఒక ఫైబర్ బుక్ షెల్ఫ్‌ను కిటికీలకు దగ్గరగా అమర్చుకోవచ్చు. చినుకుల సొగసును ఆస్వాదిస్తూ, నచ్చిన పుస్తకం చదువుకుంటూ, వేడి వేడి తేనీటిని సేవించవచ్చు. ఇలా మీ సృజనకూ పని చెప్పి.. మాన్సూన్లో మీ ఇంటిని ఇంకింత అందంగా మలుచుకోవచ్చు.ఇవి చదవండి: ఒకప్పుడు ఇది మాఫియా డెన్.. కానీ ఇప్పుడిది? -
సీజనల్ వ్యాధుల కట్టడికి చర్యలు తీసుకోండి
సాక్షి, అమరావతి: వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా కట్టడి చేసేందుకు సమగ్ర ప్రణాళికను అధికారులు సిద్ధం చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఏటా వర్షాకాలంలో వాతావరణం మారే సమయంలో వచ్చే వ్యాధులు గ్రామీణుల జీవన ప్రమాణాలను దెబ్బతీస్తున్నాయన్నారు. తాగునీటి కాలుష్యం మూలంగానే అతిసార వ్యాధి, విష జ్వరాలు లాంటివి ప్రబలుతున్నాయని చెప్పారు. పరిశుభ్రమైన తాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇటీవలæ కాకినాడ జిల్లా కొమ్మనపల్లి, బెండపూడి, గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్ జిల్లాల్లో అతిసార ప్రబలిన నేపథ్యంలో శుక్రవారం శాసనసభ సమావేశ మందిరంలో అత్యవసరంగా పంచాయతీరాజ్, గ్రామీణ నీటిసరఫరా, పురపాలక, వైద్య, ఆరోగ్య శాఖల ఉన్నతాధికారులతో పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు.ఇందులో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ కూడా పాల్గొన్నారు. నీరు కలుషితమైన చోట నీటి సరఫరా ఆపేసి తగు చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులను పవన్ ఆదేశించారు.కార్యాచరణ సిద్ధం చేయాలిపైపులైన్ల తనిఖీ ఎప్పటికప్పుడు జరిగేలా చొరవ తీసుకోవాలని, మరమ్మతులు అవసరమైతే తక్షణమే చేయాలని మంత్రులు ఆదేశించారు. ప్రజలందరికీ స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు శక్తివంచన లేకుండా పనిచేయాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రక్షిత మంచినీటి సరఫరా విషయంలో ఏ మాత్రం అశ్రద్ధ తగదని, ట్యాంకులను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. సీజనల్ వ్యాధులు, అంటు వ్యాధులను అరికట్టేందుకు పంచాయతీరాజ్, పురపాలక, వైద్య ఆరోగ్యశాఖ కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. కాగా, కేంద్రం నుంచి స్థానిక సంస్థలకు వచ్చే 15వ ఆర్థిక సంఘం నిధులు, స్థానిక సంస్థలకు వివిధ పన్నుల రూపంలో వచ్చే ఆదాయ వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. అతిసార వ్యాధి నియంత్రణ, వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జూలై 1 నుంచి ఆగస్టు 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ తెలిపారు.ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో ఆయన సంబంధిత శాఖల అధికారులు, జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, మహిళా, శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి జయలక్మి తదితరులు పాల్గొన్నారు. -
గుర్తుందా..!? వానల కోసం పిల్లుల ఊరేగింపు.. ఈసారీ వింతగా..
వానలు కురవడం ఆలస్యమైతే కప్పల పెళ్లిళ్లు జరిపించడం మనవాళ్లకు తెలిసిన ఆచారం. వానలు కురవడం ఆలస్యమై, కరవు దాపురించే పరిస్థితులు ఎదురైతే పిల్లుల ఊరేగింపు జరపడం కంబోడియా, థాయ్‌లాండ్, మయాన్మార్, వియత్నాం తదితర ఆగ్నేయాసియా దేశాలలో చిరకాలంగా కొనసాగుతున్న ఆచారం. ఇవన్నీ ప్రధానంగా వ్యవసాయాధారిత దేశాలే! ఈ దేశాలలో వరి ప్రధానమైన పంట.వరి బాగా పండాలంటే వర్షాలు కీలకం. వర్షాలు సకాలంలో కురవకుంటే, దేవతల ప్రీతి కోసం ఇక్కడి జనాలు ఊరూరా పిల్లుల ఊరేగింపు జరుపుతారు. వానల కోసం పిల్లుల ఊరేగింపు జరిపే ఈ వేడుకను ‘హే న్యాంగ్ మ్యావ్’ అంటారు. ఆడపిల్లులను, ముఖ్యంగా నల్లపిల్లులను, ప్రస్ఫుటమైన నల్లని మచ్చలు ఉన్న పిల్లులను ఎంపిక చేసుకుని, వాటిని వెదురు బుట్టల్లో కూర్చుండబెట్టి ఊళ్లోని ప్రతి ఇంటి వద్ద ఆగుతూ ఊరేగింపు జరుపుతారు.ఈ ఊరేగింపులో ఉపయోగించడానికి సయామీస్ జాతికి చెందిన పిల్లులు శ్రేష్ఠమైనవని భావిస్తారు. అసలు పిల్లులతో పాటు బుట్టల్లో పిల్లుల బొమ్మలను కూడా పెట్టి జనాలు ఊరేగింపులో పాల్గొంటారు. ఆడపిల్లుల ‘మ్యావ్’ రావాలకు వానదేవుడు కరుణిస్తాడని జనాల నమ్మకం. పిల్లుల ఊరేగింపులో ఊళ్లలోని పిల్లా పెద్దా ఉత్సాహంగా పాల్గొంటారు. సంప్రదాయ వాద్యాలను వాయిస్తూ, పాటలు పాడుతూ ఊరంతా తిరుగుతారు. ఊరేగింపు తర్వాత ప్రార్థనలు జరిపి, సామూహికంగా విందు భోజనాలు చేస్తారు.ఇవి చదవండి: ఈ గొడుగు ఖరీదు వింటే.. వ్హా.. అంటూ నోరెల్లబెట్టాల్సిందే!! -
ఇవీ.. వానాకాలం జాతరలు! ‘త్షెచు’ అంటే అర్థమేంటో తెలుసా?
హిమాలయాలకు చేరువలో ఉన్న భూటాన్‌లో ఏటా పలు పండుగలు, వేడుకలు జరుగుతుంటాయి. ఈ దేశంలో ఎక్కువ మంది బౌద్ధమతానికి చెందిన వారే అయినా, వారు తమ వేడుకలను పురాతన సంప్రదాయాల ప్రకారం నేటికీ జరుపుకుంటూ ఉండటం విశేషం. ఏటా వేసవి ముగిసి వానాకాలం వచ్చే రోజుల్లో వానాకాలానికి స్వాగతం పలుకుతూ ఇక్కడ జరుపుకొనే రెండు వేర్వేరు జాతరలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి.వీటిలో మొదటిది ‘నిమాలుంగ్ త్షెచు’. ‘త్షెచు’ అంటే జాతర అని అర్థం. భూటాన్ నడిబొడ్డు ఉన్న నిమాలుంగ్ బౌద్ధ ఆరామంలో ఈ వేడుకలను ఘనంగా మూడురోజుల పాటు జరుపుకొంటారు. ఈ ఏడాది జూన్ 14 నుంచి 16 వరకు జరుగుతున్న ఈ వేడుకల్లో ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొంటున్నారు. ఈ జాతరలో సంప్రదాయ నృత్య గానాలతో కోలాహలంగా నిమాలుంగ్ బౌద్ధారమం వరకు ఊరేగింపులు జరుపుతారు. తర్వాత ఆలయంలో ప్రార్థనలు జరిపి, బౌద్ధ గురువుల ఆశీస్సులు తీసుకుంటారు.ఇదేకాలంలో జరుపుకొనే రెండో జాతర ‘కుర్జే త్షెచు’. ఇది భూటాన్‌లోని కుర్జే పట్టణంలోని కుర్జే బౌద్ధారామంలో ఏటా జూన్ 16న జరుగుతుంది. కుర్జేలోని బౌద్ధారామాన్ని భూటాన్ బౌద్ధులు పవిత్ర క్షేత్రంగా భావిస్తారు. భూటాన్‌లో బౌద్ధమతాన్ని ప్రచారం చేసిన తొలిగురువు పద్మసంభవుడు ఇక్కడ ఎనిమిదో శతాబ్ది ప్రాంతంలో ఆశ్రమం ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన తనువు చాలించిన తర్వాత ఇక్కడ ఆయన భౌతికకాయం ముద్రను రాతిపై శిల్పంగా చెక్కారు.‘కుర్’ అంటే శరీరం, ‘జే’ అంటే ముద్ర. గురువు శరీర ముద్రను రాతిపై చెక్కి శాశ్వతంగా పదిలపరచడం వల్ల ఈ ప్రదేశానికి కుర్జే అనే పేరు వచ్చింది. ఇక్కడ ప్రస్తుతం ఉన్న ఆరామాన్ని పదిహేడో శతాబ్దిలో నిర్మించారు. ‘కుర్జే త్షెచు’ జాతరలో జనాలు రకరకాల కొయ్య ముసుగులు ధరించి సంప్రదాయ నృత్య గానాలతో ఊరేగింపు నిర్వహిస్తారు. తర్వాత ఆలయం వద్ద ప్రార్థనలు జరుపుతారు. కొయ్యముసుగులు ధరించి ఊరేగింపు జరపడం వల్ల వానాకాలంలో మంచివానలు కురుస్తాయని, తమ పంటలకు దుష్టశక్తుల బెడద ఉండదని నమ్ముతారు.ఇవి చదవండి: వానా.. వానా.. వల్లప్పా! -
వానా.. వానా.. వల్లప్పా!
వేసవిలోని మండుటెండలు మనుషులను మలమలలాడించిన తర్వాత కురిసే వాన చినుకులు ఇచ్చే ఊరట చెప్పనలవి కాదు. ఈసారి వేసవిలో ఎండలు ఇదివరకు ఎన్నడూ కని విని ఎరుగని రీతిలో మండిపడ్డాయి. ఉష్ణోగ్రతలు ఊహాతీతంగా పెరిగినా, మొత్తానికి ఈసారి రుతుపవనాలు సకాలంలోనే మన దేశంలోకి అడుగుపెట్టాయి. గత మే చివరివారంలో అండమాన్‌ను తాకిన రుతుపవనాలు అవరోధాలేవీ లేకుండా సజావుగా తెలుగు రాష్ట్రాల్లోకి చేరుకున్నాయి.ఈసారి రెండు రోజుల ముందుగానే– జూన్ 2 నాటికే రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్‌ను తాకాయి. జూన్ 4 నాటికి తెలంగాణలో ప్రవేశించాయి. భారత్ వంటి వ్యవసాయాధారిత దేశాలకు వానల రాకడ ఒక వేడుక. సజావుగా వానలు కురిస్తేనే పంటలు సుభిక్షంగా పండుతాయి. వానాకాలం ప్రకృతిలో జీవం నింపుతుంది. నెర్రెలు వారిన నేలలో పచ్చదనాన్ని నింపుతుంది. జీవరాశి మనుగడకు ఊతమిస్తుంది. ఇప్పటికే వానాకాలం మొదలైన తరుణంలో కొన్ని వానాకాలం ముచ్చట్లు చెప్పుకుందాం.ప్రపంచంలోని ఉష్ణమండల దేశాలన్నింటికీ వానాకాలం ఉంటుంది. ఉత్తరార్ధ గోళంలోని ఉష్ణమండల దేశాలన్నింటిలోనూ కొద్దిరోజులు అటు ఇటుగా జూన్, జూలై నెలల్లో వానాకాలం మొదలవుతుంది. ఇక్కడ వానలు మొదలైన ఆరునెలలకు దక్షిణార్ధ గోళంలోని ఉష్ణమండల దేశాలకు వానాకాలం మొదలవుతుంది. రుతుపవనాల ప్రభావంతో ఈ దేశాల్లో ఏటా వానాకాలం వస్తుంది. నైరుతి రుతుపవనాల రాకతో మన దేశంలో మాత్రమే కాకుండా శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్, మయాన్మార్ తదితర దేశాల్లో వర్షాకాలం వస్తుంది.ఈ దేశాల్లో వర్షాకాలం జూన్ నుంచి సెప్టెంబర్ వరకు కొనసాగుతుంది. దాదాపు ఇదేకాలంలో రుతుపవనాల ప్రభావంతో ఉత్తర, మధ్య, దక్షిణ అమెరికా దేశాల్లోను; పశ్చిమ, ఆగ్నేయ, దక్షిణాఫ్రికా దేశాల్లోను; తూర్పు, ఆగ్నేయాసియా దేశాల్లోను వానాకాలం మొదలవుతుంది. మన దేశంలో వానాకాలం సాధారణంగా జూన్ నుంచి సెప్టెంబర్ వరకు కొనసాగుతుంది. అయితే, కొన్నిచోట్ల వానాకాలం ఏప్రిల్ నుంచి మొదలై నవంబర్ వరకు సుదీర్ఘంగా కొనసాగుతుంది.గొడుగులకు పని మొదలు..వానాకాలం వచ్చిందంటే గొడుగులకు పని మొదలవుతుంది. గొడుగులతో పాటు రెయిన్ కోట్లు, గమ్ బూట్లు వంటివి అవసరమవుతాయి. వానాకాలంలో వానలు కురవడం సహజమే గాని, ఏ రోజు ఎప్పుడు ఏ స్థాయిలో వాన కురుస్తుందో చెప్పలేం. అందువల్ల బయటకు వెళ్లేటప్పుడు గొడుగులను, రెయిన్ కోట్లను వెంట తీసుకుపోవడం మంచిది. కార్లలో షికార్లు చేసేవారికి వీటితో పెద్దగా పని ఉండకపోవచ్చు గాని, పాదచారులకు గొడుగులు, ద్విచక్ర వాహనాల మీద ప్రయాణించేవారికి రెయిన్కోట్లు వానాకాలంలో కనీస అవసరాలు.గొడుగులు, రెయిన్ కోట్లలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫ్యాషన్లు వస్తున్నాయి. వింత వింత గొడుగులు, రెయిన్ కోట్లు అందుబాటులోకి వస్తున్నాయి. చిన్న చిన్న చిరుజల్లుల నుంచి గొడుగులు కాపాడగలవు గాని, భారీ వర్షాల్లో బయటకు వెళ్లాల్సి వస్తే మాత్రం రెయిన్ కోట్లు వేసుకోక తప్పదు. ఈసారి రుతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా వర్షపాతం సాధారణ స్థాయి కంటే కాసింత ఎక్కువగానే నమోదు కావచ్చని భారత వాతావరణ శాఖ అంచనాను ప్రకటించడంతో గొడుగులు, రెయిన్కోట్లు వంటి వానాకాలం వస్తువుల తయారీదారులు, అమ్మకందారులు తమ వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయనే ఆశాభావంతో ఉన్నారు.ప్రపంచవ్యాప్తంగా గొడుగులు, రెయిన్ కోట్లు తదితర వానాకాలం వస్తువుల మార్కెట్ 2022 నాటికి 3.80 బిలియన్ డాలర్ల (రూ.31,731 కోట్లు) మేరకు ఉంది. ఈ మార్కెట్లో సగటున 5.4 శాతం వార్షిక వృద్ధి నమోదవుతోంది. ఆ లెక్కన 2032 నాటికి వానాకాలం వస్తువుల మార్కెట్ 6.40 బిలియన్ డాలర్లకు (రూ.53,442 కోట్లు) చేరుకోగలదని అంతర్జాతీయ మార్కెట్ విశ్లేషణ సంస్థ ‘బ్రెయినీ ఇన్సైట్స్’ అంచనా.వానలతో లాభాలు..వానాకాలం తగిన వానలు కురిస్తేనే వ్యవసాయం బాగుంటుంది. పంటల దిగుబడులు బాగుంటాయి. దేశం సుభిక్షంగా ఉంటుంది. వ్యవసాయంపైనే ఆధారపడి మనుగడ సాగించే రైతులు, వ్యవసాయ కార్మికులకు జీవనాధారం ఉంటుంది. వర్షాలు పుష్కలంగా కురిస్తేనే జలాశయాలు నీటితో నిండుగా ఉంటాయి. భూగర్భ జలాలు అడుగంటిపోకుండా ఉంటాయి. ప్రజలకు నీటిఎద్దడి బాధ తప్పుతుంది. వానాకాలంలో తగినంత కురిసే వానలు ఆర్థిక రంగానికి ఊతమిస్తాయి.మన దేశంలో దాదాపు 60 శాతం జనాభా వ్యవసాయంపైన, వ్యవసాయాధారిత రంగాలపైన ఆధారపడి జీవనోపాధి పొందుతున్నారు. మన స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిలో వ్యవసాయానిది కీలక పాత్ర. భారతీయ స్టేట్‌బ్యాంకు పరిశోధన నివేదిక ప్రకారం మన జీడీపీలో 2018–19 నాటికి 14.2 శాతంగా ఉన్న వ్యవసాయం వాటా 2022–23 నాటికి 18.8 శాతానికి పెరిగింది. ఈసారి వానాకాలంలో పుష్కలంగా వానలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనాను ప్రకటించిన నేపథ్యంలో మన జీడీపీలో వ్యవసాయం వాటా మరో 3 శాతం వరకు పెరగవచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.వరి, గోధుమలు, మొక్కజొన్న, చెరకు వంటి ఆహార పంటలకు, పత్తి వంటి వాణిజ్య పంటలకు పుష్కలమైన వానలే కీలకం. వానాకాలంలో మంచి వానలు కురిస్తే విద్యుత్తు కోతల బెడద కూడా తగ్గుతుంది. మన దేశం ఎక్కువగా జలవిద్యుత్తుపైనే ఆధారపడుతోంది. బొగ్గుతో పనిచేసే థర్మల్ విద్యుత్ కేంద్రాలు లేని ప్రాంతాల్లో జలవిద్యుత్తు ద్వారానే విద్యుత్ సరఫరా ఉంటోంది. తగిన వానలు కురవని ఏడాదుల్లో ఈ ప్రాంతాలకు విద్యుత్ సరఫరాకు ఇబ్బందులు తప్పవు.వాతావరణ మార్పులూ, వర్షాలూ..ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న వాతావరణ మార్పులు, ముఖ్యంగా భూతాపోన్నతి వర్షాకాలంపై కూడా ప్రభావం చూపుతోంది. దీనివల్ల వాతావరణంలో తీవ్రమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వేసవిలో వడగాల్పులు, అకాల వర్షాలు, వరదలు, తుఫానులు, కరవు కాటకాల వంటివన్నీ వాతావరణంలో చోటు చేసుకుంటున్న ప్రతికూల మార్పుల ఫలితమేనని ‘ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్’ (ఐపీసీసీ) నిపుణులు చెబుతున్నారు.వాతావరణంలోని ప్రతికూల మార్పుల ప్రభావం ఇప్పటికే మన దేశం అంతటా కనిపిస్తోంది. ఈ ప్రభావం కారణంగానే ఇటీవలి వేసవిలో పలుచోట్ల రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వాతావరణ మార్పుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా పలుచోట్ల అతివృష్టి, అనావృష్టి పరిస్థితులు తలెత్తడం, పంటనష్టాలు, కరవు కాటకాలు, విద్యుత్ సరఫరాకు అంతరాయాలు వంటి విపత్తులు తరచుగా తలెత్తుతున్నాయి. సకాలంలో తగిన వానలు కురిస్తేనే పలు దేశాల్లోని పరిస్థితులు చక్కబడతాయి.వాతావరణ పరిస్థితులు మరింతగా దిగజారకుండా ఉండటానికి ప్రపంచ దేశాలన్నీ సమష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా కర్బన ఉద్గారాలను కట్టడి చేయడం, పునర్వినియోగ ఇంధనాలను ప్రజలకు అందుబాటులోకి తేవడం, అడవుల నరికివేతను అరికట్టడంతో పాటు విరివిగా మొక్కలు నాటడం వంటి చర్యలను చేపట్టాల్సి ఉంది.వానాకాలం కాలక్షేపాలు..వాతావరణం పొడిగా ఉన్నప్పుడు బయట తిరిగినంత సులువుగా వాన కురుస్తున్నప్పుడు తిరగలేం. తప్పనిసరి పనుల మీద బయటకు వెళ్లాల్సి వస్తే తప్ప వానల్లో ఎవరూ బయటకు రారు. చిరుజల్లులు కురిసేటప్పుడు సరదాగా తడవడానికి కొందరు ఇష్టపడతారు గాని, రోజంతా తెరిపిలేని వాన కురుస్తుంటే మాత్రం ఇల్లు విడిచి బయటకు అడుగుపెట్టడానికి వెనుకాడుతారు.వాన కురుస్తున్నప్పుడు ఇంటి అరుగు మీద కూర్చుని, వీథిలో ప్రవహించే వాన నీటిలో కాగితపు పడవలను విడిచిపెట్టడం చిన్న పిల్లలకు సరదా కాలక్షేపం.. కొందరు ఉత్సాహవంతులు వానాకాలంలో కొండ ప్రాంతాలకు వెళ్లి ట్రెకింగ్, పచ్చని అడవులు, చక్కని సముద్ర తీరాల్లో నేచర్ వాకింగ్ వంటివి చేస్తుంటారు. ఇంకొందరు వాన కురుస్తున్నప్పుడు నదుల్లో సరదాగా బోటు షికార్లకు వెళుతుంటారు. వాన కురుస్తున్నప్పుడు చెరువులు, కాలువల ఒడ్డున చేరి చేపలను వేటాడటం కొందరికి సరదా.అందమైన వాన దృశ్యాలను, వానాకాలంలో ఆకాశంలో కనిపించే హరివిల్లు అందాలను కెమెరాలో బంధించడం కొందరికి ఇష్టమైన కాలక్షేపం. వానాకాలంలో జలపాతాలు ఉద్ధృతంగా ఉరకలేస్తుంటాయి. వాన కురిసేటప్పుడు జలపాతాలను చూడటానికి చాలామంది ఇష్టపడతారు. వాన కురుస్తున్న సమయంలో ఎక్కువ మంది వేడివేడి పకోడీలు, కాల్చిన మొక్కజొన్న కండెలు వంటి చిరుతిళ్లు తినడానికి ఇష్టపడతారు. తెరిపి లేని వానలు కురిసేటప్పుడు రోజుల తరబడి కదలకుండా ఇంట్లోనే కూర్చుని గడిపే కంటే కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుని, ఇలాంటి సరదా కాలక్షేపాలతో వానాకాలాన్ని చక్కగా ఆస్వాదించవచ్చు.రెయిన్‌కోట్ ఫ్యాషన్లు..ఆధునిక రెయిన్కోట్లు పంతొమ్మిదో శతాబ్దంలో అందుబాటులోకి వచ్చాయి. స్కాటిష్ రసాయనిక శాస్త్రవేత్త చాల్స్ మాకింటోష్ తొలిసారిగా 1824లో పూర్తిస్థాయి వాటర్‌ప్రూఫ్ రెయిన్‌కోటును రూపొందించాడు. రెండు పొరల వస్త్రాల మధ్య నాఫ్తాతో శుద్ధిచేసిన రబ్బరును కూర్చి తొలి రెయిన్‌కోటును తయారు చేశాడు. తర్వాత నీటిని పీల్చుకోని విధంగా ఉన్నిని రసాయనాలతో శుద్ధిచేసి రూపొందించిన వస్త్రంతో రెయిన్కోట్లు తయారు చేయడం 1853 నుంచి మొదలైంది.ఇరవయ్యో శతాబ్ది ప్రారంభంలో సెలోఫెన్, పీవీసీ వంటి ప్లాస్టిక్ పదార్థాలతో రెయిన్కోట్ల తయారీ ప్రారంభమైంది. వానలో శరీరం తడవకుండా కాపాడటానికే రెయిన్కోట్లను రూపొందించినా అనతికాలంలోనే వీటిలోనూ ఫ్యాషన్లు మొదలయ్యాయి. అమెరికా, చైనా తదితర దేశాల్లో రెయిన్కోట్లు ఫ్యాషన్ మార్కెట్లో తమదైన ముద్ర వేస్తున్నప్పటికీ, భారత్‌లో మాత్రం రెయిన్కోట్లలో ఫ్యాషన్ ధోరణి కొంత తక్కువే! వానలో తల, ఒళ్లు తడవకుండా ఉంటే చాలు అనే ధోరణిలోనే మన ప్రజలు రెయిన్కోట్లను కొనుగోలు చేస్తారు.మన దేశంలో తరచుగా వానలు కురిసేది కూడా మూడు నాలుగు నెలలు మాత్రమే! అందుకే మన ఫ్యాషన్ డిజైనర్లు కూడా రెయిన్కోట్ల డిజైనింగ్‌ను పెద్దగా పట్టించుకోవడం లేదు. ముంబై, కోల్‌కతా, ఢిల్లీ వంటి నగరాల్లోని పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్‌లో మాత్రం విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఫ్యాషన్ రెయిన్కోట్లు దొరుకుతాయి.వానాకాలం కష్టాలు..వానాకాలంలో వీథులన్నీ బురదమయంగా మారుతాయి. రోడ్లు సరిగా లేని చోట్ల గోతుల్లో నీరు నిలిచిపోయి ఉంటుంది. మ్యాన్‌హోల్ మూతలు ఊడిపోయి, డ్రైనేజీ నీరు రోడ్ల మీద ప్రవహిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో రోడ్ల మీద నడవడం, వాహనాలు నడపడం కష్టంగా మారుతుంది. మురుగునీటి ప్రవాహాలకు పక్కనే పానీపూరీలు, పకోడీలు, మొక్కజొన్న కండెలు అమ్మే బడ్డీలు ఉంటాయి. పగలు ఈగల బెడద, రాత్రి దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. వీటి వల్ల రోగాల బెడద పెరుగుతుంది.వానాకాలంలో జలుబు, దగ్గు, జ్వరాలు సర్వసాధారణం. ఇవి కాకుండా ఎక్కువగా కలరా, డయేరియా, టైఫాయిడ్, హెపటైటిస్, డెంగీ, చికున్ గున్యా, మలేరియా సహా పలు రకాల వైరల్ జ్వరాలు, కళ్ల ఇన్ఫెక్షన్లు, ఫంగల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వ్యాపిస్తాయి. వానాకాలంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా, వ్యాధుల బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే వానాకాలంలో ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుకోవచ్చు.వేడి వేడి చిరుతిళ్ల మీద ఎంత మోజు ఉన్నా, వానాకాలంలో ఆరుబయట తినకపోవడమే మంచిది. రోడ్డు పక్కన మురికినీటి ప్రవాహాలకు దగ్గరగా బళ్లల్లో అమ్మే బజ్జీలు, పకోడీలు, పానీపూరీలు, చాట్లు వంటి చిరుతిళ్లు తింటే అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్లే!వానాకాలంలో నీటి కాలుష్యం ఎక్కువగా జరిగే అవకాశాలు ఉంటాయి. చిట్లిన మంచినీటి పైపుల్లోకి డ్రైనేజీ నీరు చేరి, ఇళ్లల్లోని కొళాయిల ద్వారా కలుషితమైన నీరు వస్తుంది. నీటిని వడగట్టి, కాచి చల్లార్చి తాగడం మంచిది. తాగునీటి విషయంలో జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈ కాలంలో వచ్చే చాలా ఆరోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చు.వానాకాలంలో ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఇంట్లో దుమ్ము, ధూళి, బూజులు పేరుకోకుండా చూసుకోవాలి. వానజల్లు ఇంట్లోకి చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇల్లు అపరిశుభ్రంగా, తడి తడిగా ఉన్నట్లయితే ఈగలు, దోమలు సహా క్రిమికీటకాల బెడద పెరిగి, ఇంటిల్లిపాది రోగాల బారిన పడే ప్రమాదం ఉంటుంది. కాబట్టి కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే, ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వానాకాలాన్ని ఆస్వాదించవచ్చు. -
పొదల్లో బుస్.. బుస్
రాయవరం: వర్షాకాలం వచ్చిందంటే చాలు పాముల బెడద ఎక్కువవుతోంది. వాతావరణంలో వేడి తగ్గి భూమి చల్లబడిన సమయంలో విష పురుగులు సహజంగా బయటకు వస్తుంటాయి. ఇలా బయటకు వచ్చిన విషసర్పాలు, పురుగులు రాళ్ల గుట్టలు, దట్టమైన పొదల మాటున ఉంటాయి. పొదలు, అపరిశుభ్రంగా ఉన్న ప్రాంతాల్లో పాములు ఎక్కువగా సంచరిస్తుంటాయి. అలాగే పొలాల్లోని గడ్డివాములు, గట్ల వెంబడి తిరుగుతుంటాయి. ఇళ్ల పరిసరాలు, పొలాల్లోనూ సంచరించే విష సర్పాలు, తేళ్లు, ఇతర విష కీటకాలతో ప్రమాదం పొంచి ఉంది. వీటి బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. నాగుపాము, కట్లపాము, పొడపాము, రక్తపింజర వంటి వాటివల్లే ప్రమాదం అఽధికంగా ఉంటుంది. సాధారణంగా 50 శాతం పైగా పాముల వల్ల ఎటువంటి ప్రమాదం ఉండదని వైద్యులు చెబుతున్నారు.రైతన్నా.. జాగ్రత్త అవసరంపొలం గట్ల వెంబడి వెళ్లేటప్పుడు కర్ర చప్పుడు చేస్తూ నడవడం మంచిది. రాత్రి పూట పొలాలకు నీరు కట్టడానికి వెళ్లేటప్పుడు టార్చిలైట్లు తీసుకు వెళ్లాలి. ధాన్యపు గాదెలు, గడ్డివాములు ఉండే చోట ఎలుకలు, తడిగా ఉంటే కప్పలు తిరుగుతాయి. వాటిని ఆహారంగా తీసుకునేందుకు పాములు చేరతాయి. అలాగే తేళ్లు, జెర్రెలు వంటి ప్రమాదకర ప్రాణులు సంచరించే అవకాశముంది. ఎక్కువగా పాములు పొదలు, గోడల వారగా చేరతాయి. ప్రజలు చీకట్లో బయటకు వెళ్తే తప్పనిసరిగా చెప్పులు వేసుకోవాలి.విషసర్పాల కాటు లక్షణాలువిషసర్పం కాటు వేసిన ప్రదేశంలో పాము కోరల గాయం స్పష్టంగా కనిపిస్తుంది. నొప్పి తీవ్రంగా ఉంటుంది. నొప్పి క్రమంగా పైకి వ్యాపిస్తూ తిమ్మిరిగా అనిపిస్తుంది. పాక్షిక పక్షవాతం కారణంగా నాలుక మందమైనట్లు, గొంతు కండరాలు బిగుసుకున్నట్లు గొంతులో ఏమీ దిగని పరిస్థితి తలెత్తవచ్చు. చొంగ కారవచ్చు. కళ్లు మగతగా, శరీరం మత్తుగా ఉండి స్పృహ కోల్పోవచ్చు. నాగుపాము అత్యంత ప్రమాదకరం. ఇది కాటువేస్తే 15 నిమిషాల్లో విషం ఎక్కుతుంది. ఈ పాము విషం ప్రధానంగా నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. ఎవరినైనా పాము కరిస్తే అది విష సర్పమో కాదో గుర్తించే ప్రయత్నం చేయాలి. దానివల్ల చికిత్స కచ్చితంగా చేసేందుకు వీలవుతుంది. పాము కాటుకు గురైన వ్యక్తిని ఆస్పత్రికి తరలించి వైద్యం అందించాలి. నాటు వైద్యం, మంత్రాల జోలికి వెళ్లరాదు. పాముకాటుకు గురైన వారు ఆందోళన చెందితే గుండెపోటు వచ్చే అవకాశముంది.జిల్లాలో పరిస్థితి ఇదీడాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 2022 ఏప్రిల్ నుంచి 2023 జూన్ వరకూ 191 మందికి పాము కాటుకు గురయ్యారు. 2022 జూలైలో అధికంగా 25 మంది, నవంబరులో 24 మంది పాముకాటు బారిన పడ్డారు. 2022 ఏప్రిల్ నుంచి 2023 జూన్ వరకూ 154 మంది పురుషులు, 37 మంది మహిళలు పాముకాటుకు గురైనట్లు వైద్య ఆరోగ్య శాఖ గణాంకాలు తెలియజేస్తున్నాయి. 2023 జూన్ నుంచి ఇప్పటి వరకూ 227 మంది పాటుకాటుకు గురయ్యారు. ఈ బాధితులకు జిల్లా ఆసుపత్రితో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, అర్బన్ హెల్త్సెంటర్లు, ఏరియా ఆసుపత్రుల్లో యాంటీ స్నేక్ వీనమ్ మందులు అందుబాటులో ఉంచారు. బాధితులకు ఉచితంగా మందులు వేస్తున్నారు.వైద్యం ఆలస్యం కారాదుపాముకాటు వేసిన వారికి ధైర్యం చెప్పి, వెంటనే వైద్యం అందించేందుకు ప్రయత్నించాలి. ముందుగా ప్రథమ చికిత్స చేయాలి. కట్ల, నాగుపాములు కాటువేస్తే నాడీ వ్యవస్థపై ప్రభావం చూపి బాధితుడు కోమాలోకి వెళ్లే అవకాశముంది. పాముకాటు వేయగానే నిర్లక్ష్యం చేయకుండా సాధ్యమైనంత త్వరగా ప్రథమ చికిత్స చేయించి, ఆసుపత్రిలో చేర్చాలి.–వి.అనిరుథ్, పీహెచ్సీ వైద్యాధికారి, రాయవరంఆసుపత్రుల్లో ఉచితంగా మందులుజిల్లాలోని అన్ని ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలు, అర్బన్ హెల్త్ సెంటర్లలో యాంటీ స్నేక్ వీనమ్ (పాము కాటు మందులు) అందుబాటులో ఉన్నాయి. మందుల కొరత ఏర్పడితే ఆసుపత్రి అభివృద్ధి కమిటీల ద్వారా మందులు కొనుగోలు చేసుకోవచ్చు. జిల్లాలో ఎక్కడా కొరత లేదు.–దుర్గారావుదొర, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి, అమలాపురం -
వర్షాకాలంలో అప్రమత్తంగా ఉండండి
సాక్షి, హైదరాబాద్: వర్షాకాలం ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యుత్ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క ఆదేశించారు. వర్షాలు, ఈదురుగాలుల మూలంగా చెట్లు విరిగిపోవడం, స్తంభాలు కూలిపోవడం, విద్యుత్ తీగలు ఊడిప డటం లాంటి ఘటనలు జరుగుతుంటాయని, క్షేత్రస్థాయి సిబ్బంది అప్రమత్తంగా ఉండి సమస్య వచి్చన వెంటనే స్పందించాలని సూచించారు. శని వారం సచివాలయంలో ఆయన విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ‘ప్రజలు, పరిశ్రమలకు అవసరమైన విద్యుత్ అందుబాటులో ఉంది.సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు చేపట్టండి. లైన్స్ క్లియరెన్స్ (ఎల్సీ) విషయంలో జాగ్రత్త వహించాలి. ఒకేసారి పలు ప్రాంతాల్లో ఎల్సీలు ఇవ్వొద్దు. ఎల్సీ తీసుకునే సమయంలో స్థానిక వినియోగదారులకు ముందస్తు సమాచారం ఇవ్వండి. వర్షాకాలంలో కరెంటు సరఫరా, మరమ్మతులు, పునరుద్ధరణ విషయంలో ఇంధన శాఖ ప్రధాన కార్యదర్శి నుంచి క్షేత్రస్థాయిలోని లైన్మెన్ వరకు అప్రమత్తంగా ఉండాలి. నిరంతరం సమీక్షలు నిర్వహించడంతో పాటు ఎప్పటికప్పుడు సమాచారం చేరవేసుకోండి’అని భట్టి ఈ సమీక్షలో సూచించారు. ఈ సమావేశంలో ఇంధన శాఖ ప్రధాన కార్యదర్శి ఎస్.ఎం.ఎ.రిజ్వి, ఎస్పీడీసీఎల్ ఎండీ ముషారఫ్ అలీ, ట్రాన్స్‌కో జేఎండీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అమరుల ఆశయాలకు అనుగుణంగా ప్రజాపాలన.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలు జరుపుకుంటున్న సందర్భంగా రాష్ట్ర ప్రజలకు భట్టి విక్రమార్క శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, ఆలోచనల మేరకు యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ ప్రజల చిరకాల కోరికను నెరవేర్చారని శనివారం ఒక ప్రకటనలో ఆయన తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ రాష్ట్ర సాధన ఆశయాలు, ఆకాంక్షలు పదేళ్లుగా ఆచరణకు నోచుకోలేదని విమర్శించారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం పాలన మొదలయ్యాక ప్రజలు స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటున్నారని తెలిపారు. -
కర్నూలులో వజ్రాల వేట
సాక్షి ప్రతినిధి, కర్నూలు: కర్నూలు, అనంతపురం జిల్లాల సరిహద్దుల్లో వజ్రాల నిక్షేపాలు ఉన్నాయనే విషయాన్ని జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) గుర్తించింది. కర్నూలు జిల్లా తుగ్గలి, మద్దికెర మండలాల్లోని తుగ్గలి, జొన్నగిరి, పగిడిరాయి, కొత్తపల్లి, పెరవలి, అగ్రహారం, హంప, యడవలి, మద్దికెరతోపాటు అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలంలోని గంజికుంట, తట్రకల్లు, రాగులపాడు, పొట్టిపాడు, కమలపాడు, గూళపాళ్యం, ఎన్ఎంపీ తండా గ్రామాల్లో తరచూ వజ్రాలు లభ్యమవుతున్నాయి. ఈ ప్రాంతంలోని భూమి పొరల్లో కింబర్లైట్ పైప్‌లైన్ ఉందని గనులు భూగర్భ శాఖ నిర్ధారించింది. ఈ నేపథ్యంలోనే తొలకరి జల్లులు కురిసే జూన్‌లో తుగ్గలి, మద్దికెర మండలాల్లో వజ్రాల అన్వేషణ కొన్నేళ్లుగా ముమ్మరంగా సాగుతోంది. ఈ ఏడాది మే మొదటి వారంలోనే వర్షాలు కురిశాయి. ఆ వెంటనే వజ్రాన్వేషణ మొదలైంది. ఈ ప్రాంతంలోని పొలాలన్నీ జనంతోనే నిండిపోయాయి. కర్నూలు, నంద్యాలతో పాటు అనంతపురం, కడప, చిత్తూరు, గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి వజ్రాన్వేషకులు తరలివచ్చారు. ఒక్కొక్కరు వారం, పది, పదిహేను రోజులపాటు ఇక్కడే మకాం వేస్తున్నారు. ఓ వైపు వజ్రాల కోసం జనాలు పొలాల్లో తిరుగుతుంటే.. వజ్రాన్వేషకులు తిరగడం వల్ల పొలం గట్టిబారి వ్యవసాయానికి ఇబ్బందిగా ఉంటోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు రైతులు తమ పొలాల్లోకి ఎవరూ రావొద్దని విజ్ఞప్తి బోర్డులు తగిలిస్తున్నారు.ఇతర దేశాలతో పోలిస్తే నాణ్యమైన వజ్రాలువజ్రాల మైనింగ్ కోసం వజ్రకరూర్‌లో వజ్రాల ప్రక్రమణ కేంద్రాన్ని 1969లో ఏర్పాటు చేశారు. వజ్రాన్వేషణపై ఇది పెద్దగా దృష్టి సారించలేదు. ఆ తర్వాత ఓ ఆస్ట్రేలియన్ కంపెనీ వచ్చి కొద్దికాలం పాటు సర్వే చేసి తిరిగి వెళ్లింది. ఆఫ్రికాతో పాటు చాలా దేశాలతో పోలిస్తే ఇక్కడి వజ్రాలు చాలా నాణ్యమైనవి, విలువైనవి. అందుకే వీటి వెలికితీతపై ప్రత్యేక దృష్టి సారిస్తే ప్రయోజనకరంగా ఉంటుందని పలువురు కోరుతున్నారు.వజ్రాలు ఎలా లభ్యమవుతాయంటే..మన దేశంలో డైమండ్ మైనింగ్ మధ్యప్రదేశ్‌లోని పన్నాలో ఉంది. అక్కడ భూమిలోని రాళ్లను తవ్వితీసి వజ్రాల తయారీ ప్రక్రియ చేపడతారు. వజ్రకరూర్, తుగ్గలి, జొన్నగిరి ప్రాంతాల్లోని భూగర్భంలో 150 మీటర్ల లోతున వజ్రాలు ఉంటాయి. భూమిలో వాతావరణ మార్పులు జరిగినప్పుడు అవి బయటకు వస్తాయి. ఆ తర్వాత వెదరింగ్ (వికోశీకరణ) వల్ల అంటే ఎండకు ఎండి, వర్షానికి తడిసి పగిలిపోతాయి. వర్షాలు, వరదలు వచ్చినపుడు ఆ రాళ్ల ముక్కలు పొలాల్లో అక్కడక్కడా దొరుకుతుంటాయి. వాగులు, వంకల ద్వారా కూడా వజ్రాలు నీటిలో కొట్టుకుని ఇతర ప్రాంతాలకు చేరతాయి. అలా చెల్లాచెదురైన వజ్రాలే ఇప్పుడు కర్నూలు, అనంతపురం జిల్లాల్లో లభిస్తున్నాయి.‘సీమ’లో ఏజెంట్ల తిష్టవర్షాకాలం వస్తే జనాలు ఎలా తరలివస్తారో.. వజ్రాల వ్యాపారులు కూడా గుత్తి, గుంతకల్లు, జొన్నగిరి, పెరవలిలో మకాం వేసి వజ్రాల కొనుగోలుకు ప్రయత్నిస్తారు. ఇందుకోసం వజ్రాలు లభ్యమయ్యే గ్రామాల్లో ఏజెంట్లను సైతం నియమించుకుంటున్నారు. వజ్రం దొరికిందనే సమాచారం వస్తే ఏజెంట్లు వాలిపోతారు. వజ్రం దొరికిన వారిని వ్యాపారుల వద్దకు తీసుకెళ్లి రేటు కుదురుస్తారు. వజ్రం విలువైనదైతే వ్యాపారులే వారి వద్దకు వెళ్తారు. వ్యాపారుల మధ్య పోటీ పెరిగితే బహిరంగ వేలం వేస్తారు. వజ్రం నాణ్యత (క్యారెట్)ను బట్టి రూ.20 వేల నుంచి రూ.20 లక్షల వరకు కొనుగోలు చేస్తారు. జిల్లా చరిత్రలో 2022లో లభించిన 30 క్యారెట్ల వజ్రమే అత్యంత విలువైంది. ఈ ఏడాది ఇప్పటికే 9 వజ్రాలు లభ్యమయ్యాయి. గతేడాది సరైన వర్షాలు లేవు. అయినప్పటికీ 18 వజ్రాలు దొరికాయి. ఇక్కడ వజ్రాలను స్థానిక వ్యాపారులకే విక్రయిస్తారు. ఇక్కడి వ్యాపారులు అంత నమ్మకం సాధించారు. చెప్పిన ధర చెప్పినట్టు ఇస్తారు. అదే ప్రభుత్వ అధికారులకు సమాచారం ఇస్తే దానిని స్వాధీనం చేసుకుని పైసా కూడా ఇవ్వరనే అభిప్రాయంతో వారు అధికారులకు చెప్పకుండా విక్రయిస్తారు.విదేశాల్లో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలుఆఫ్రికా, అంగోలా, కాంగోతో పాటు చాలా దేశాల్లో ఇదే తరహాలో వజ్రాలు లభిస్తాయి. వాటిని అల్యూవియల్ డైమండ్స్ అంటారు. అక్కడ ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తుంది. వజ్రాలు లభించిన వారు నేరుగా ఆ కేంద్రానికి వచ్చి చూపిస్తారు. వజ్రాల నాణ్యత ఆధారంగా కొంత మొత్తం చెల్లిస్తారు. వజ్రాలను లీగల్‌గా ప్రభుత్వం ప్రక్రియను పూర్తి చేసి విక్రయిస్తుంది. కర్నూలు జిల్లాలో ఏటా సగటున 50–60 వజ్రాలు లభిస్తున్నాయి. అలాగే వజ్రకరూరు ప్రాంతంలో కూడా ఏటా 30–40 వజ్రాలు లభిస్తాయి. అంటే ఈ రెండు జిల్లాల్లో ఏటా వంద వజ్రాలు లభిస్తున్నాయి. మైనింగ్ చేస్తే రూ.వందల కోట్ల విలువైన సంపద ప్రభుత్వానికి లభించే అవకాశం ఉంది.ఈ ఏడాది లభ్యమైన వజ్రాల వివరాలు👉 ఈ నెల 8న చెన్నంపల్లిలో రూ.3.96 లక్షల విలువ చేసే వజ్రం లభించింది.👉 మే 20న రామాపురంలో రూ.50 వేల విలువైప వజ్రం దొరికింది.👉 మే 21న మద్దికెర మండలం మదనంతపురంలో రూ.6.50 లక్షల విలువైన వజ్రం లభ్యమైంది.👉 మే 22న ఇదే గ్రామంలో దొరికిన వజ్రాన్ని రూ.18 లక్షలు, 10 తులాల బంగారం చెల్లించి వ్యాపారి కొనుగోలు చేశారు.👉 మే 23న జొన్నగిరిలో రూ.15 వేలు, పగిడిరాయిలో రూ.12 వేల విలువ చేసే వజ్రాలు లభించాయి. 👉 మే 24న జొన్నగిరిలో దొరికిన వజ్రాన్ని రూ.6.20 లక్షలు నగదు, 5 తులాల బంగారం ఇచ్చి కొనుగోలు చేశారు.👉 మే 25న జొన్నగిరిలో దొరికిన వజ్రాన్ని రూ.1.20 లక్షల నగదు, జత కమ్మలు ఇచ్చి కొనుగోలు చేశారు.👉 తాజాగా తుగ్గలి మండలం గుండాలతండాకు చెందిన వ్యక్తికి మంగళవారం ఓ వజ్రం లభ్యమైంది. స్థానిక వజ్రాల వ్యాపారి రూ.లక్ష నగదు, అర తులం బంగారం ఇచ్చి దానిని కొనుగోలు చేశారు.ఐదోసారి వచ్చావానొస్తే మా ఊరోళ్లంతా రైలెక్కి గుత్తిలో దిగి జొన్నగిరికి వస్తాం. నేను ఇక్కడికి ఐదేళ్ల నుంచి వస్తున్నా. వచ్చి వారమైంది. ఐదేళ్లలో ఒక్క వజ్రం కూడా దొరకలేదు. తిండీ తిప్పలకు ఇబ్బందిగా ఉంది. మాతో పాటు వచ్చిన కొంతమందికి వజ్రాలు దొరుకుతున్నాయి. మాకు ఆశ చావక వెతుకుతున్నాం.– ఈరయ్య, రామాపురం, వినుకొండ, పల్నాడు జిల్లా వజ్రాన్ని గుర్తు పడతాంమాది కలికిరి. హైదరాబాద్‌లోని స్నేహితుడు, నేను కలిసి మూడు రోజుల క్రితం ఇక్కడికి వచ్చాం. దొరికితే వజ్రం. లేదంటే కాలక్షేపంగా ఉంటుందని వచ్చాం. మేం బంగారం నగలు తయారు చేస్తాం. వజ్రం ఎలా ఉంటుందో సులువుగా గుర్తుపడతాం.– రామాంజులాచారి, కలికిరి, అన్నమయ్య జిల్లాఒక చిన్న వజ్రం దొరికినా చాలుమా ఊళ్లో పనుల్లేవు. వజ్రాలు దొరికాయని పేపర్లు, టీవీల్లో వచ్చింది. ఖాళీగా ఉండలేక ఇక్కడికి వచ్చాం. నాతో పాటు మా ఊరోళ్లు పదిమంది వచ్చారు. వజ్రాలు వెతుకుతున్నాం. కొన్ని రాళ్లు మెరుస్తున్నాయి. అవి వజ్రాలు కాదంటున్నారు. కొద్దిరోజులు చూస్తాం. చిన్న వజ్రం దొరికినా కష్టం తీరకపోతుందా అనే ఆశతో చూస్తున్నాం.– లక్ష్మక్క, గార్లదిన్నె మండలం, అనంతపురం జిల్లా -
దోమలతో జాగ్రత్త.. డెంగీ, మలేరియాతో జనం ఇబ్బందులు
వాతావరణ మార్పులతో జిల్లాలో ఒక్కసారిగా విషజ్వరాలు ప్రబలుతున్నాయి. కురుస్తున్న వర్షాల కారణంగా జనం సీజనల్ వ్యాధుల బారిన పడుతున్నారు. డయేరియా, వైరల్ జ్వరాలు సోకుతున్నాయి. పల్లె, పట్టణాలనే తేడా లేకుండా పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది. దీంతో దోమలు వృద్ధి చెందుతున్నాయి. ఈ ప్రభావం ప్రజారోగ్యంపై పడింది. దీంతో ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. రానున్న రోజుల్లో మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. జిల్లా ప్రధాన ఆసుపత్రిలో పేరు నమోదుకు జనం బారులు తీరుతున్నారు. ఇందులో చాలా మంది దగ్గు, జ్వరం, జలుబు, ఒళ్లు నొప్పులతో వచ్చినవారే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పారిశుధ్య నిర్వహణ లోపం కారణంగా విషజ్వరాలు ప్రబలుతున్నాయి. ఈనెలలో కురిసిన వర్షాల కారణంగా ఒక్కసారిగా వైరల్ కేసులు పెరిగాయి. జిల్లా ఆసుపత్రితో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అర్బన్ హెల్త్ సెంటర్లు, జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆస్పత్రులు రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. చాలా మంది ఆస్పత్రులకు వెళ్లలేక మంచాన పడుతున్నారు. వైద్యారోగ్యశాఖ అప్రమత్తం సీజనల్ వ్యాధులు ప్రబలుతుండడంతో వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. జిల్లాలో ఇంటింటి జ్వర సర్వే ప్రారంభించారు. విష జ్వరాలు, వ్యాధులపై అవగాహన కల్పిస్తున్నారు. ప్రతీ శుక్రవారం డ్రై డే పాటించేలా చర్యలు చేపడతున్నారు. ముఖ్యంగా డయేరియా, వైరల్ ఫీవర్లతో ఆసుపత్రికి ఎక్కువ మంది రోగులు వస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇళ్లు, పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలని వైద్యులు సూచిస్తున్నారు. డ్రమ్ములు, పాత టైర్లు వంటి వాటిలో నీరు నిల్వ ఉంటే అందులో దోమలు వృద్ధి చెంది డెంగీ, మలేరియా ప్రబలి విష జ్వరాలు పెరిగే అవకాశం ఉంది. దుర్శేడ్‌లో ఒకరికి డెంగీ కరీంనగర్ మండలం దుర్శేడ్‌లో డెంగీ కేసు నమోదు కావడంతో అధికారులు సోమవారం నియంత్రణ చర్యలు చేపట్టారు. దుర్శేడ్‌కు చెందిన కాశిపాక అర్జున్ హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ ఫుడ్ డెలివరీ సంస్ధలో పనిచేస్తున్నాడు. రెండురోజులక్రితం జ్వ రం రావడంతో దుర్శేడ్‌కు వచ్చిన అర్జున్ ఆది వారం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యపరీక్షలు చేయించుకోగా డెంగీగా వైద్యులు గుర్తించి చికిత్స అందిస్తున్నారు. ఎంపీడీవో జగన్మోహన్రెడ్డి, సర్పంచు గాజుల వెంకటమ్మ, ఉపసర్పంచు సుంకిశాల సంపత్‌రావు, వార్డుసభ్యుడు అశోక్, ఏఎన్ఎం పద్మ, ఆశావర్కర్లు అనిత, లక్ష్మి తదితరులు అర్జున్ ఇంటిని సందర్శించారు. కుటుంబసభ్యుల వివరాలు సేకరించారు. ఇంటి పరిసరాలను పంచాయతీ సిబ్బందితో శుభ్రం చేయించి బ్లీచింగ్ చల్లారు. అనంతరం చామనపల్లి పీహెచ్సీ ఆధ్వర్యంలో వైద్యసిబ్బంది సమీపంలోని నివాస గృహాల్లోని వ్యక్తులకు వైద్యపరీక్షలు చేశారు. అందుబాటులో వైద్యులు, మందులు వ్యాధులు ప్రబలుతుండడంతో జిల్లా ఆసుపత్రిలో మందులు, వైద్యులను ఎల్లవేళలా అందుబాటులో ఉంచుతున్నాం. పేషెంట్లు ఏ సమయంలో వచ్చినా చికిత్స అందించేలా అన్ని ఏర్పాట్లు చేశారు. ఎక్కువగా వైరల్ ఫీవర్లు, డయేరియా బారిన పడుతున్నారు. చాలా మంది ఓపీ చూపించుకొని మందులు తీసుకెళ్తున్నారు. వారి ఆరోగ్య పరిస్థితిని బట్టి ఆసుపత్రిలో అడ్మిట్ చేసుకొని చికిత్స అందిస్తున్నాం. – డాక్టర్ కృష్ణప్రసాద్, ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ -
విధ్వంసంతో ఆస్తులే కాదు, ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోతాయి
వాతావరణంలో గత కొన్నాళ్లుగా వచ్చిన మార్పుల వల్ల, కుంభవృష్టి, క్లౌడ్ బరస్ట్ లాంటివి సాధారణం అయిపోయాయి. విస్తారంగా.. అంటే అనేక చోట్ల కురవాల్సిన వర్షం ఒకే చోట కురిస్తే ?అదీ.. కేవలం కొద్దిసేపట్లో, నాలుగైదు రోజుల్లోనే ఏడాదంతా పడాల్సిన వర్షమంతా పడితే? వాగులు, వంకలు నిండిపోతాయి. కొండచరియలు విరిగిపడతాయి. నదులు పొంగి పొర్లుతాయి. గత నెల రోజులుగా దేశంలోని అనేక ప్రాంతాల్లో, ముఖ్యంగా హిమాచల్‌ప్రదేశ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర లాంటి చోట్ల వర్షాలు సృష్టించిన విధ్వంసం అంతాఇంతా కాదు. దీని వల్ల వేల కోట్ల ఆస్తుల నష్టంతో పాటు వందల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ► జులై, ఆగస్టు,సెప్టెంబర్ నెలల్లో విహారయాత్రలు, తీర్థయాత్రలు పెట్టుకోవద్దు. ముఖ్యంగా కొండ ప్రాంతాలకు పోవద్దు. చార్ధామ్, అమర్నాథ్ యాత్రలు చేయాలనుకునేవారు వర్షాకాలానికి ముందే ప్లాన్ చేసుకోండి. ► పొంగి ప్రవహిస్తున్న బ్రిడ్జిలు, కల్వర్ట్లు మొదలైన వాటిపై పయనించొద్దు. ప్రవహించే నీటి గతిశక్తిని తక్కువ అంచనా వేయొద్దు. నీరు వాహనంలోకి ప్రవేశిస్తే దాని బరువు పెరిగి, మునిగిపోతుంది. ► అనేక రాష్ట్రాల్లో రోడ్లు, వంతెనలు, డ్యాంల నిర్వహణ ఏమాత్రం బాగా లేదు. ఇప్పటికే అనేకం శిథిలావస్థకు చేరుకున్నాయి. దిగువ తట్టు ప్రాంతాల్లో ఉన్నవారు క్షేమంగా ఉండాలంటే, చెరువు కట్టలు, బ్యాములు సరిగా నిర్వహించేలా ప్రజాప్రతినిశులపై ఒత్తిడి తీసుకురండి. ఎందుకంటే.. అథిదులు ఇంటికొచ్చాక పంట పండించలేము కదా, అలాగే వర్షకాలంలో మేలుకుంటే సరిపోదు, డ్యాములు, బ్రిడ్జిలు లాంటి నిర్వహణ ఏడాది పొడవునా జరగాలి. ► ముఖ్యంగా ఏప్రిల్, మే నెలలో వీటి స్థితిపై స్ర్టక్చరల్ ఆడిటింగ్ జరగాలి. అవి ధృడంగా ఉన్నాయని ఇంజనీర్లు సర్టిఫై చేయాలి. లేకపోతే వానాకాలంలో నిద్రలోనే జలసమాధి అయ్యే ప్రమాదం పొంచి ఉంటుంది ► నదుల్లోకి దిగొద్దు. మీరు దిగినప్పుడు నీరు తక్కువ ఉండొచ్చు. కానీ ఎగువ ప్రాంతంలో డ్యాం తెరవడం, భారీ వర్షం లాంటి కారణాల వల్ల క్షణాల్లో నీటి ప్రవాహం పెరిగి ఉపద్రవం సంభవించవచ్చు. ► కొండమార్గాల్లో అంటే, ఘాట్రూట్లలో వర్షాకాలంలో ప్రయాణాలు వద్దు. భారీ వర్షాలు కురిసినప్పుడు పెద్ద ఎత్తున కొండచరియలు విరిగిపడతాయి. ఒక పెద్ద బండరాయి క్షణాల్లో కిందకు వచ్చి అక్కడ పయనిస్తున్న వాహనాన్ని లోపలికి తీసుకొని వెళ్లిపోతుంది. తస్మాత్ జాగ్రత్త. ►ఎక్కడో కొండప్రాంతాల్లో కాదు.మహానగరాల్లో జలప్రళయం సాధారణం అయిపోయింది. చెరువులు కుంటలు ఉన్న ప్రాంతాల్లో నివాసాలు ఏర్పరుచుకోవద్దు . స్మార్ట్ ఫోనుల్లో కంపాస్ అనేది ఉంటుంది . అందులో చెక్ చేసుకొంటే మీరున్న ప్రాంతం ఎత్తు ఎంతో , ఇట్టే తెలిసిపోతుంది . ► రాబోయే రోజుల్లో జలప్రళయాలు సాధారణం అయిపోతాయి. ప్రభుత్వాలు కూడా లోతట్టు ప్రాంతాలను గుర్తించి అవి నివాస యోగ్యం కావని ముందే హెచ్చరికలు జారీ చెయ్యాలి. ఇంట్లోకి నీళ్లు ప్రవేశిస్తే ఇంట్లోని సామాగ్రి మొత్తం పాడై వేలల్లో నష్టం జరుగుతుంది. పాములు, తేళ్లు, మొసళ్లు వంటివి ఇంట్లోకి వస్తే ప్రాణానికే ప్రమాదం. ► చెట్లు నాటడం, వన సంరక్షణ, డ్రైనేజీ వ్యవస్థలు, బ్రిడ్జిలు ఇతరత్రా మౌలిక సదుపాయాల నిర్వహణ ప్రభుత్వాలు బాధ్యత . వాటిని ఆయా ప్రభుత్వాల దయాదాక్షిణ్యాలకు వదలకుండా ఏటా ఇంత అని టార్గెట్ పెట్టి ఆ లక్ష్యాన్ని అందుకోవడం తప్పని సరి చేస్తూ పార్లమెంట్ చట్టం తేవాలి . లక్ష్యాన్ని అందుకొని ప్రభుత్వాల పై రాజ్యాంగ పరమయిన చర్యలు ఉండాలి . ► అహ నా పెళ్ళంట సినిమా లో కోట శ్రీనివాస్ రావు క్యారెక్టర్ " నా కేంటి .. నా కేంటి " అంటుంటుంది . మనం పడవ లో పయనిస్తున్నాము . దానికి చిల్లు పడితే అందరం పోతాము . మనం బతకాలంటే మంది కూడా బతకాలి అనే ఇంగిత జ్ఞానం ప్రజల్లో రావాలి. ఆలా కాకపోతే ఒక వర్షాకాలం రాత్రికి రాత్రే ఒక భారీ డ్యాం పగిలి ఒక పెద్ద నగరం, అనేక గ్రామాలు కొట్టుకొని పోయే ప్రమాదం ఉంది. -వాసిరెడ్డి అమర్ నాథ్, మానసిక నిపుణులు, విద్యావేత్త -
అల్పపీడనం బలహీనపడడంతో రాష్ట్రంలో ఉక్కపోత
-
వర్షాల్లోనూ పెట్టుబడులకు రక్షణ
ఎకానమీ, పెట్టుబడుల విశ్లేషణలకు సంబంధించి నిశితంగా పరిశీలించే అంశాల్లో రుతుపవనాలు, ‘‘సాధారణ’’ వర్షపాతం గణాంకాలు కూడా ఉంటాయి. నైరుతి రుతుపవనాలతో జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో వర్షాల సీజన్ ప్రారంభమవుతుంది. ఇటు ఖరీఫ్, అటు రబీ రెండు పంటలకు అవసరమయ్యే మొత్తం నీటి వనరుల్లో దాదాపు 75 శాతం భాగాన్ని ఇవి అందిస్తాయి. ఖరీఫ్ పంటల సీజన్ జూలై నుంచి అక్టోబర్ వరకు, రబీ పంటల సీజన్ అక్టోబర్ నుంచి మార్చి వరకు ఉంటుంది. నైరుతి రుతుపవనాలు ఖరీఫ్ పంటలపై నేరుగా ప్రభావం చూపడమే కాకుండా.. తదుపరి రబీ పంటల కోసం వినియోగించే నీరుని రిజర్వాయర్లు, చెరువులు మొదలైన వాటిల్లో నిల్వ చేసుకునేంతగా వర్షాలనిస్తాయి. ఇలాంటి వర్షాలు అటు పంటలపైనే కాదు మన పెట్టుబడుల పోర్ట్‌ఫోలియోనూ ప్రభావితం చేస్తాయి. ఎలాగంటే... ద్రవ్యోల్బణం: వ్యవసాయోత్పత్తిపై వర్షాల ప్రభావం ప్రత్యక్షంగా ఉంటుంది. బియ్యం, సోయాబీన్, చెరకు, నూనెగింజలు మొదలైన వాటి దిగుబడిని వర్షం ప్రభావితం చేస్తుంది. వర్షాభావం వల్ల పంటలు సరిగ్గా పండక.. ఆహార ద్రవ్యోల్బణం పెరుగుతుంది. ముడి వస్తువుల ధరలు : తృణ ధాన్యాలు, పప్పు ధాన్యాలు, ఇతరత్రా పంటలతో వివిధ పరిశ్రమలకు అవసరమైన ముడి వస్తువులు సమకూరుతాయి. వ్యవసాయోత్పత్తి ప్రభావం అటు ముడి వస్తువుల రేట్లపైనా పడుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్, సెంటిమెంటు: రుతుపవనాలు సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్, సెంటిమెంటుపై ప్రభావం చూపుతాయి. తత్ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లో వినియోగంపై ఆధారపడే కంపెనీల ధరలు, రంగాలపైనా మీద ప్రభావం పడుతుంది. ఎఫ్ఎంసీజీ, ఆటోమొబైల్ (ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాలు), ఎరువులు, క్రిమిసంహారకాలు వంటి రంగాలు వీటిలో ఉంటాయి. ఇన్వెస్టర్లు ఏం చేయొచ్చు.. అగ్రి–ఎకానమీకి, మార్కెట్ సెంటిమెంటుకి రుతుపవనాలు ముఖ్యమే అయినప్పటికీ.. గత కొన్నేళ్లుగా మొత్తం మీద ఎకానమీపై వాటి ప్రభావం గణనీయంగా తగ్గింది. స్టాక్ మార్కెట్ కదలికలను ఏ ఒక్క అంశమో ప్రభావితం చేయలేవు. ఎఫ్ఐఐ పెట్టుబడులు, వడ్డీ రేట్లు, కార్పొరేట్ ఫలితాలు, భౌగోళికరాజకీయాంశాలు, రుతుపవనాలు మొదలైనవన్నీ ప్రభావం చూపుతాయి. కాబట్టి వర్షపాతం గురించి అంచనాలు వేసుకోవడం, వాటిని బట్టి స్పందించడం కాకుండా.. ఇన్వెస్టర్లు సరైన ఆర్థిక ప్రణాళికలను వేసుకుని దానికి కట్టుబడి ఉండటం ముఖ్యం. ఆర్థిక ప్రణాళికలను తయారు చేసుకోవడంలో సహాయం అవసరమైతే ఫైనాన్షియల్ అడ్వైజరును సంప్రదించడం శ్రేయస్కరం. -
వర్షాకాలంలో ఇలా చేస్తే బిస్కెట్లు క్రిస్పీగా ఉంటాయి..
వర్షాకాలంలో కూడా బిస్కెట్లు మెత్తగా అవకుండా కరకరలాడాలంటే ఇలా చేసి చూడండి... ప్లాస్టిక్, అల్యమినియం డబ్బాలు, గాజు పాత్రల్లో బిస్కెట్లు, కుకీలను నిల్వచేయాలి. గాలిచొరబడకుండా పెడితే ఎక్కువ రోజులపాటు క్రిస్పీగా ఉంటాయి. డబ్బాల్లో నిల్వచేసేటప్పుడు అడుగు భాగంలో రెండుమూడు వరుసల్లో టిష్యపేపర్లు వేసి తరువాత బిస్కట్లు పెట్టాలి. బిస్కట్లపైన మరో రెండు వరుసల్లో టిష్యపేపర్లు వేసి పైన బిస్కెట్లు పెట్టాలి. ఇలా నిండుగా పెట్టి గాలిచొరబడకుండా మూత పెట్టాలి. జిప్‌లాక్ పౌచ్‌లలో నిల్వచేస్తే కూడా కుకీలు తాజాగా ఉంటాయి. గాలిచొరబడని డబ్బాలు, జిప్‌లాక్ పౌచ్‌లను రిఫ్రిజిరేటర్లో పెడితే మరిన్ని రోజులు బిస్కెట్లు తాజాగా ఉంటాయి. అనుకోకుండా సరిగా నిల్వచేయనప్పుడు మెత్తబడిన కుకీలను అవెన్ లేదా ఎయిర్‌ఫ్రైయర్‌లో పదినిమిషాలు వేడిచేస్తే మళ్లీ క్రిస్పీగా మారతాయి. వీటిని కూడా నిల్వ చేసుకోవచ్చు. -
పది లక్షల ఎకరాలు మునక
సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాలతో వానాకాలం పంటలు వరద ముంపునకు గురయ్యాయి. మొలక దశలో ఉన్న వివిధ పంటలు దెబ్బతిన్నాయి. 10.76లక్షల ఎకరాల్లో నేరుగా నీటి ముంపునకు గురికాగా, మరో 4 లక్షల ఎకరాలు అధిక వర్షాల తాకిడితో మొలక స్థాయిలో ఉన్న పంటలు, వరి నార్లకు నష్టం జరిగింది. ఇలా 16 లక్షలకు పైగా ఎకరాలపై వర్షాల ప్రభావం పడిందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. నాట్లు వేసిన నిజామాబాద్, కామారెడ్డి, ఖమ్మం, సూర్యాపేట, వరంగల్, హనుమకొండ,ములుగు, భద్రాద్రి కొత్తగూడెం తదితర జిల్లాల్లో వరి పొలాలు నీట మునిగి చెరువులను తలపిస్తున్నాయి.ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్ సమీప ప్రాంతాల్లో గత 20 రోజుల క్రితం వేసిన వరి నాట్లు నీటమునిగాయి. సూర్యాపేట జిల్లా కిష్టాపురం, మౌగిలాయకోట, శాంతినగర్, లక్కవరం, గోండ్రియాల, కొత్తగూడెం తదితర గ్రామాల్లో కూడా వరి నాట్లు ముంపునకు గురయ్యాయి. ఖమ్మం జిల్లాలోని జక్కపల్లి, సిద్దెపల్లి, రామచంద్రపురం, పైనంపల్లి, బుద్దారం తదితర గ్రామాల్లో పంటలపై కూడా వరద ప్రభావం పడింది. ఆదిలాబాద్ , ఆసిఫాబాద్, నిజామాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాలతో పాటు భద్రాద్రి జిల్లా చర్ల, వాజేడు, వెంకటాపురం తదితర ప్రాంతాల్లో పంటలకు తీవ్రంగా నష్టం జరిగింది. గోదావరి నది రెండు వైపులా ఉప్పొంగి కిలోమీటరు నుంచి రెండు కిలోమీటర్ల మేర పంటలను ముంచెత్తుకుంటూ పారింది. అనేక ప్రాంతాల్లో ఒక్క పంట కూడా పనికి వచ్చే పరిస్థితి లేదని క్షేత్రస్థాయి అధికారులు అంటున్నారు. పత్తిపై అధిక ప్రభావం ఈ సీజన్లో ఇప్పటివరకు 40.73లక్షల ఎకరాల్లో పత్తి సాగయ్యింది. కాగా వర్షాల ప్రభావం ఎక్కువగా ఈ పంటపైనే పడినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రధానంగా ఆదిలాబాద్, మంచిర్యా ల, కరీంనగర్, హనుమకొండ, వరంగల్, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో పత్తి పంటపై తీవ్ర ప్రభావం పడింది. తాజాగా వేసి న పత్తి విత్తనాలు వర్షాలకు మొలకెత్త కుండానే భూమిలోనే మురిగిపోయాయి. ఇక మొలక స్థాయి లో ఉన్న పత్తి నీటిలో మునిగి దెబ్బతింది. వరినాట్లు కూడా నీట మునిగాయి. ఇప్పటివరకు 15.63లక్షల ఎకరాల్లో వరినాట్లు పడగా.. వీటిలో 5లక్షలకు పైగా ఎకరాల్లో నీరు చేరిందని అధికా రులు చెబుతున్నారు. వరి నార్లు మొత్తం దెబ్బతిన్నాయని, మళ్లీ నార్లు పోసుకోవాల్సిందేనని రైతు లు అంటున్నారు. ఇక సోయాబీన్ సాగు ఇప్పటివరకు 4.14లక్షల ఎకరాల్లో సాగు చేయగా.. ఆదిలా బాద్ జిల్లాలో ఈ పంటపై ఎక్కువ ప్రభావం పడినట్లు తెలుస్తోంది. పొలాలను ముంచేసిన గుర్రపుడెక్క భూదాన్‌పోచంపల్లి: భారీ వర్షాలతో యాదాద్రి భువనగిరి జిల్లాలోని పోచంపల్లి చెరువు నిండి అలుగుపోస్తోంది. ఈ చెరువులోని గుర్రపు డెక్క కూడా కొట్టుకువచ్చి వరి పొలాలను కమ్మేసింది. దీనితో పోచంపల్లిలో 30ఎకరాలు, పిలాయిపల్లిలో 2ఎకరాల వరికి నష్టం జరిగింది. -
ఇది మెడలో వేసుకుంటే అలెర్జీలకు చెక్!..ధర ఎంతంటే..
వాతావరణం మారినప్పుడు, గాలిలో కాలుష్యం ఎక్కువగా ఉన్నప్పుడు చాలామందికి అలర్జీ బాధలు తప్పవు. అలర్జీలు తీవ్రమైతే కొందరికి ఉబ్బసం కూడా మొదలవుతుంది. అలెర్జీలకు, ఉబ్బసానికి ఇప్పటి వరకు మందులు, ఇన్హేలర్లే గతి. అలెర్జీలకు పరిష్కారంగా ఎస్టోనియాకు చెందిన ‘రెస్పిరే’ కంపెనీ ఇటీవల మెడలో తొడుక్కునేందుకు వీలైన ‘ఏ ప్లస్ వేర్’ పేరుతో అలెర్జీ ఫిల్టర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇది మెడలో తొడుక్కున్నట్లయితే, గాలిలోని అలెర్జీకి కారణమయ్యే కణాలేవీ దీనిని దాటి ముక్కులోకి చొరబడలేవు. ఇందులోని హెపా ఫిల్టర్లు అలెర్జీలకు దారితీసే సూక్షా్మతి సూక్ష్మకణాలను సైతం ఇట్టే లోపలకు పీల్చేసుకుని, గాలిని శుభ్రం చేస్తాయి. ఇది రీచార్జబుల్ బ్యాటరీ సాయంతో పనిచేస్తుంది. ఇది చార్జ్ కావడానికి గంటన్నర సమయం పడుతుంది. పూర్తిగా చార్జ్ అయ్యాక ఎనిమిది గంటల సేపు నిరంతరాయంగా పనిచేస్తుంది. దీని ధర 119 యూరోలు (రూ.10,795). దీనిని వాడటం మొదలుపెడితే అలెర్జీల కోసం మందులు వాడాల్సిన అవసరం దాదాపుగా ఉండదు. -
వర్షాకాలంలో పెరుగు తింటున్నారా? ఇది తెలుసుకోవాల్సిందే
వర్షాకాలంలో అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఆరోగ్యకరమైన అలవాట్లను పాటించడం ఎంతో ముఖ్యం.ఈ క్రమంలో వర్షాకాలంలో చాలామంది తమ డైట్‌ను కూడా మార్చుకుంటుంటారు. ఇక ప్రతిరోజు మనం తినే పాలు, పెరుగు, మజ్జిగ,నెయ్యి వంటివి ఆరోగ్యానికి మంచివే అయినప్పటికీ వాటిని ఎప్పుడు పడితే అప్పుడు తినడం మంచిది కాదంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ఈ వర్షాకాలంలో పెరుగు వినియోగానికి కాస్త దూరంగా ఉండాలంటున్నారు. దీనికి కారణం ఏంటి? వర్షకాలంలో పెరుగు తినడం మంచిదా? కాదా? అన్నది ఈ స్టోరీలో తెలుసుకుందాం.. వర్షాకాలంలో ఆరోగ్యంపై జాగ్రత్త తీసుకోవడం చాలా అవసరం. లేదంటే ఈ సీజన్లో జలుబు, ఫ్లూ వంటి వ్యాధుల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే కొన్ని పదార్థాలకు దూరంగా ఉండటమే మంచిదంటున్నారు నిపుణులు. ఆ లిస్ట్‌లో పెరుగు కూడా ఉంది. చాలామందికి భోజనం చివర్లో పెరుగు లేకపోతే ఏదో వెలితిగా ఫీల్ అవుతుంటారు. అయితే ఈ సీజన్లో పెరుగు తినడం వల్ల శ్వాస సంబంధిత సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. వర్షకాలంలో తేమ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో పెరుగు తినడం వల్ల కఫం ఏర్పడుతుంది. దీని వల్ల గొంతు నొప్పి, కీళ్ల నొప్పి వంటి సమస్యలు కూడా వస్తాయి. అందుకే ఈ సీజన్లో ఒకవేళ పెరుగు తినాలనుకున్నా మధ్యాహ్న భోజనంలో తింటే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. పెరుగులోని ప్రోబయాటిక్స్ జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తుంది. కానీ పెరుగు తినాలనుకుంటే మాత్రం కొన్ని జాగ్రత్తలు పాటించాలని, ముఖ్యంగా క్వాంటిటీని తగ్గించాల్సి ఉంటుంది. ముఖ్యంగా జలుబు, అలెర్జీ ఉన్నవారు వర్షాకాలంలో పెరుగు తినకపోవడమే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. -
వర్షాకాలం: పకోడీలు, బజ్జీలు ఇలా చేస్తే క్రిస్పీగా..
పకోడీలు, బజ్జీలు క్రిస్పీగా రావాలంటే... పిండిని కలిపేటప్పుడు ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి.∙ అరగంట ముందే పిండిని చల్లని నీటితో కలిపి పక్కన పెట్టుకోవాలి. పకోడీలు, బజ్జీలను నూనెలో వేసి డీప్‌ఫ్రై చేసేటప్పుడు పదేపదే తిప్పకూడదు. ఎక్కువగా తిప్పితే మెత్తగా మారతాయి. అవసరాన్ని బట్టి అప్పుడప్పుడు మాత్రమే తిప్పుతూ ఫ్రైచేయాలి. పచ్చిమిర్చి, పాలకూర, వంకాయ, అరటికాయ, బంగాళ దుంప వంటివాటితో బజ్జీలు వేసేముందు శుభ్రంగా కడిగి, కాటన్ గుడ్డతో తడిలేకుండా తుడిచి ఫ్యాన్ గాలికింద ఆరబెట్టాలి. తరువాత పిండిలో ముంచితే ముక్కలకు పిండి చక్కగా అంటుకుని బజ్జీలు క్రిస్పీగా, క్రంచీగా వస్తాయి. కిచెన్ టిప్స్ ఊరగాయలను నిల్వచేసుకునే చిన్న జాడీలను పొడిగా ఆరబెట్టిన తరువాత, వేడివేడి నూనెను జాడీలోపల రాయాలి. తరువాత ఊరగాయ పెడితే బూజు పట్టదు. రోజూ మూతతీసి వాడుతున్నప్పటికి పచ్చడి ఎక్కువరోజుల పాటు నిల్వ ఉంటుంది. -
వర్షాకాలంలో విటమిన్-డి తీసుకోవడం ఎలా? సప్లిమెంట్స్ తీసుకోవచ్చా?
మన శరీరానికి అత్యంత అవసరమైన విటమిన్లలో విటమిన్-డి ఒకటి. దీన్ని ‘సన్‌షైన్’ విటమిన్ అని కూడా పిలుస్తారు. శరీరీనాకి కాల్షియం అందించడంలో విటమిన్-డి ఎంతో ముఖ్యమైనది. ఇది మన ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుంది. మన రోగ నిరోధక వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. శరీరానికి సరైన మోతాదులో విటమిన్-డి లభించకపోతే ఎముకలు బలహీనపడటం వంటి సమస్యలు తలెత్తుతాయి. సప్లిమెంట్స్ కంటే సూర్యకాంతిలో విటమిన్-డి సమృద్దిగా దొరుకుతుంది. మరి ఈ వర్షాకాలంలో విటమిన్-డిని ఏ విధంగా తీసుకోవాలి? ఈ స్టోరీలో చూసేద్దాం. ►భారతీయుల్లో ప్రతి నలుగురిలో ముగ్గురు విటమిన్-డి లోపంతో బాధపడుతున్నారు. ఇటీవల ఓ సర్వేలో దాదాపు 76 శాతం మంది విటమిన్-డి లోపంతో బాధపడుతున్నారని తేలింది. ముఖ్యంగా 25ఏళ్ల కంటే తక్కువ వయసున్న వారు ఎక్కువగా విటమిన్-డి లోపంతో బాధపడుతున్నట్లు తేలింది. విటమిన్-డి పొందాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ప్రతిరోజూ గుడ్డు తీసుకోవాలి. గుడ్డులోని పచ్చసోనలో విటమిన్-డి ఉంటుంది. పాలలో విటమిన్-డితో పాటు పోషకాలు అధికంగా ఉంటాయి. రోజూ పాలు తీసుకోవడం అలవాటు చేసుకోవాలి పుట్టగొడుగులు తినడం వల్ల విటమిన్-డి లోపాన్ని అధిగమించవచ్చు. ప్రతిరోజూ ఆహారంలో చేపలు ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా సాల్మన్, ట్యూనా వంటి చేపలు తినాలి నారింజలో విటమిన్-సితో పాటు విటమని్-డి కూడా ఉంటుంది. దీనివల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఆకుకూరలు, సోయా పాలు ప్రతిరోజూ ఆహారంలో భాగం చేసుకోవాలి. విటమిన్-డి ఎంత మొత్తం తీసుకోవాలి ఆరోగ్యకరమైన ఎముకలు, కాల్షియం, మెటబాలిజం మెయింటేన్ చేయాలంటే తగిన మోతాదులో విటమిన్-డి అవసరం. పిల్లలు, యుక్తవయస్సు వాళ్ళు 600 IU లేదా 15 మైక్రోగ్రాములు తీసుకోవాలి. 70 ఏళ్లు పైబడిన వారిలో 800 ఐయూ (20 ఎంసీజీ) అవసరం. ఇక గర్భిణీలు, పాలిచ్చే మహిళలకి కూడా 600 IU లేదా 15 మైక్రో గ్రాముల విటమిన్ డి అవసరం. సప్లిమెంట్ల రూపంలో తీసుకునే వాళ్ళు వైద్యుల సిఫార్సు మేరకు వారానికి ఒకటి మాత్రమే తీసుకోవాలి. -
Interior Designs: వర్షాకాలం.. ఇంటి మేకోవర్ మార్చేయండి ఇలా
మండే ఎండల నుంచి చినుకుల చిత్తడిలోకి వాతావరణం మారిపోయింది. ఇంటి మేకోవర్నూ మర్చాల్సిన సమయం వచ్చింది. సో.. వానాకాలంలో మీ ఇల్లు ఆహ్లాదంగా ఉండేందుకు ఇంటీరియర్ డిజైనర్స్ ఇచ్చే సూచనలు కొన్ని... ► బయట వాతావరణం డల్‌గా ఉంటుంది కాబట్టి బ్రైట్‌గా ఉండే ఫర్నిషింగ్ ఎంచుకోవాలి. అంటే, దిండ్లు, కర్టెన్లు, రగ్గులు వంటివాటిని ముదరు రంగుల్లో తీసుకుంటే ఇంటి వాతావరణం ఉల్లాసంగా.. ఉత్తేజంగా ఉంటుంది. ► ఈ కాలం వుడెన్ ఫర్నిచర్‌తో జాగ్రత్తగా ఉండాలి. ఏ కొద్దిగా తడిసినా, తేమ చేరుకున్నా సమస్యలు తలెత్తుతాయి. అందుకని వానా కాలం.. ఇంట్లో వీలైనంత వరకు వుడెన్ ఫర్నిచర్‌ను తగ్గిస్తే మంచిది. ► రుతుపవనాలు మనల్ని ఇంట్లోనే ఉండిపోయేలా చేస్తాయి. వేడి వేడి కాఫీ లేదా టీ తాగుతూ కిటికీలోంచి వర్షాన్ని చూస్తూ ఆస్వాదించాలనుకునేవారు.. ఇంట్లో నచ్చిన కార్నర్ ప్లేస్‌ను ఎంచుకొని.. పుస్తకాలను అమర్చుకోవడానికి ఒక షెల్ఫ్‌ను ఏర్పాటు చేసుకోండి. ఈ సీజన్ ఉన్నంత వరకు వేడి వేడి కాఫీ లేదా టీతో అటు బయటి వాతావరణాన్నీ.. ఇటు ఇష్టమైన పుస్తకంలోని అంతకన్నా ఇష్టమైన పంక్తులనూ ఆస్వాదించవచ్చు! ► వెచ్చగా, బ్రైట్‌గా ఉండే లైటింగ్‌ను ఏర్పాటు చేసుకోవాలి. అందుకు ఎల్ఈడీ బల్బులు, ఫెయిరీ లైట్లను ఉపయోగించుకోవచ్చు. కాంతి పెరగాలంటే ల్యాంప్ షేడ్స్, ఫ్లోర్ లేదా టేబుల్ ల్యాంప్లనూ ఎంచుకోవచ్చు. ► గోడలకు వాల్ పేపర్ లేదా వాల్ ఆర్ట్‌తో ప్రయోగాలు చేయవచ్చు. దీని వల్ల గ్లూమీగా ఉండే వాతావరణం ఒక్కసారి ఆసక్తిగా మారిపోతుంది. ► తేమ ఎక్కువ ఉండే రోజులు కాబట్టి.. ఒకరకమైన తడి వాసన ఇల్లంతా వ్యాపిస్తుంది. సువాసన గల కొవ్వొత్తులను ఉంచాలి. లేదా సిట్రస్, లావెండర్ వంటి సువాసనలతో కూడిన ఎసెన్షియల్ ఆయిల్ డిఫ్యూజర్‌లను ఉపయోగించాలి. తాజా వాసన కోసం వార్డ్ రోబ్లలో ఎండిన పువ్వులు లేదా సుగంధ మూలికలతో నింపిన సాషేలను వేలాడదీయాలి. ► సువాసనలు గల కొవ్వొత్తులను లివింగ్ రూమ్.. దాని పక్కనే ఉన్న గదుల మధ్యలో ఉంచినట్లయితే అవి మరింత ఆహ్లాదంగా మార్చేస్తాయి. -
వర్షాకాలమే కదా.. మొక్కలకు నీళ్లు పోయాలా?
వర్షాలు పడుతున్నాయి కదా ఇంక మొక్కలకు నీళ్లు పోయనవసరంలేదని కొంతమంది అనుకుంటారు. కానీ వర్షాల్లో కూడా కొన్నిరకాల మొక్కలకు నీళ్లు పోస్తేనే గార్డెన్ పచ్చగా కళకళలాడుతుంది. అందుకు ఇవే కారణాలు... ♦సాధారణంగా మొక్కలకు వర్షాకాలంలో సహజసిద్ధంగా నీళ్లు అందుతాయి. కానీ, కుండీల్లో ఉన్న మట్టి తేమను ఎక్కువ కాలం పట్టి ఉంచలేకపోతే, మొక్కలు త్వరగా ఎండిపోతాయి. అందువల్ల ఎప్పటికప్పుడు తేమను చూసుకుని మొక్కలకు నీళ్లు పోయాలి. ♦కుండీల్లో పెరుగుతోన్న కొన్ని రకాల మొక్కలు చాలా పొడవుగా ఉంటాయి. దట్టంగా ఉన్న ఆకులు, కొమ్మలు కూడా వెడల్పుగా విస్తరించి చినుకులను అడ్డుకుంటాయి. ♦ వర్షం చినుకులు కొమ్మలపై పడి పక్కకు జారిపోతాయి. దీనివల్ల వేర్లకు సరిగా నీరు అందదు. అందువల్ల గుబురుగా ఉన్న కుండీ మొక్కలకు తప్పని సరిగా నీళ్లుపోయాలి. -
నైరుతి వాన.. 30శాతం లోటే! 23 జిల్లాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు కలవరపెడుతున్నాయి. వానాకాలం మొదలై దాదాపు నెలన్నర కావొస్తున్నా, నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించి మూడు వారాలు దాటినా ఎక్కడా సరైన వర్షపాతం నమోదు కాలేదు. జూన్‌లో వానల జాడే లేక పోగా.. జూలైలో అక్కడక్కడా చిరుజల్లులు, మోస్తరు వానలు మాత్రమే కురుస్తున్నాయి. భారీ వర్షాల ఊసే లేదు. దీనితో పంటల సాగుకు అదును దాటిపోతుండగా.. సీజన్‌పై ఆధారపడ్డ ఇతర రంగాలు కూడా వర్షాల కోసం ఎదురు చూస్తున్నాయి. గత మూడేళ్లుగా సమృద్ధిగా వానలు పడ్డాయని.. కానీ ఈసారి ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావం నెలకొందని, ఇది కరువు తరహా పరిస్థితులకు సంకేతమని వాతావరణ నిపుణులు చెప్తున్నారు. దీనితో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలోని మెజారిటీ జిల్లాల్లో లోటు వర్షపాతమే నమోదైన నేపథ్యంలో ప్రత్యామ్నాయ చర్యలపై దృష్టి సారించింది. వ్యవసాయం,సాగునీటితోపాటు పలు ఇతర శాఖలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తోంది. ఇప్పటికే రెండు దఫాలుగా భేటీ అయిన వివిధ శాఖల ఉన్నతాధికారులు.. కరువు పరిస్థితులు ఏర్పడితే ఎదుర్కొనేందుకు ఏం చేయాలన్నదానిపై కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే 30శాతం లోటు సాధారణంగా మే నెలాఖరు లేదా జూన్ తొలివారంలో రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయి. కానీ ఈసారి జూన్ మూడో వారంలో రాష్ట్రాన్ని తాకాయి. మూడు రోజుల్లోనే రాష్ట్రమంతటా విస్తరించడంతో.. వానలు ఆశాజనకంగా ఉంటాయని తొలుత భావించినా, తర్వాత ఆ ఆశలు సన్నగిల్లాయి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉత్తర ప్రాంత జిల్లాల్లో కొన్నిచోట్ల మోస్తరు వానలు పడగా.. మిగతా ప్రాంతాల్లో అడపాదడపా తేలికపాటి వానలు మాత్రమే కురుస్తున్నాయి. మొత్తంగా రాష్ట్రంలో తీవ్ర స్థాయిలో లోటు ఉంది. రాష్ట్రంలో సాధారణంగా నైరుతి సీజన్లో ఇప్పటివరకు(జూలై 10వ తేదీ వరకు) సగటున 19.19 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. ఈసారి 13.49 సెంటీమీటర్ల మేర మాత్రమే కురిసింది. అంటే 30శాతం లోటు ఉంది. ఇందులోనూ కొన్ని జిల్లాల్లో తీవ్రమైన లోటు ఉంది. కొనసాగుతున్న లోటు.. జూన్ నెలలో రాష్ట్రంలో సగటున 12.93 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా... కేవలం 7.20 సెంటీమీటర్లు అంటే 55.68 శాతమే వర్షం మాత్రమే కురిసింది. జూలైలో ఇప్పటివరకు 6.29 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది సాధారణమే అయినా.. ఇప్పట్లో వానలు పడే అవకాశాలు కనిపించకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. తొలకరి వానలతో సాగు మొదలుపెట్టిన రైతులు ఆందోళనలో పడ్డారు. తీవ్ర వర్షాభావ పరిస్థితులు రాష్ట్రంలోని మెజార్టీ జిల్లాల్లో వర్షాలు ఆశించినంతగా లేవు. 23 జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులే కనిపిస్తున్నాయి. నిర్మల్, సంగారెడ్డి, సిద్దిపేట, జనగాం, మెదక్, రంగారెడ్డి, వికారాబాద్, నాగర్‌కర్నూల్, నల్లగొండ, నారాయణపేట జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ గణాంకాలు చెప్తున్నాయి. అయితే ఈ జిల్లాల్లోనూ కొన్నిప్రాంతాలకే వానలు పరిమితం అయ్యాయని అధికారులు చెప్తున్నారు. మిగతా 23 జిల్లాల్లో లోటు, అత్యంత లోటు వర్షపాతమే ఉన్నట్టు వివరిస్తున్నారు. ప్రత్యామ్నాయాలపై కసరత్తు లోటు వర్షపాతం కొనసాగితే ఏర్పడే పరిస్థితులను ఎదుర్కొనేందుకు వ్యవసాయ శాఖ కసరత్తు మొదలుపెట్టింది. ఉన్నతాధికారులు వివిధ రంగాలు, అంశాల వారీగా పడే ప్రభావం, తీసుకోవాల్సిన చర్యలు, ప్రత్యామ్నాయాలతో ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఈ నెలాఖరు నాటికి పరిస్థితులను పూర్తిగా అంచనా వేసి, అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందని అధికారులు తెలిపారు. -
వానకు తడిచిన బట్టల నుంచి వాసన రాకుండా ఇలా చేయండి..
ఇంటిప్స్ ►వానాకాలంలో బట్టలను ఉతికాక కర్పూరం కలిపిన నీటిలో జాడించడం వల్ల దుస్తుల నుంచి దుర్వాసన రాకుండా ఉంటుంది. ► ఆరీ ఆరని దుస్తులను ఇస్త్రీ చేసినా అదోవిధమైన వాసన వస్తాయి. అందువల్ల దుస్తులు పూర్తిగా ఆరిన తర్వాతనే ఐరన్ చేయాలి. ► అల్మారాలో బట్టలను పెట్టేముందు అక్కడక్కడ కొన్ని కర్పూరం బిళ్లలు ఉంచాలి. దీనివల్ల చిమటల వంటి కీటకాలు చేరకుండా ఉంటాయి. అంతేకాకుండా బట్టల్లో దుర్వాసన తొలగితుంది.