sai baba
-
ప్రొఫెసర్ సాయిబాబా కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: విద్యావేత్త, మానవ హక్కుల కార్యకర్త, కవి, రచయితగా గుర్తింపు పొందిన ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా (54) శనివారం రాత్రి కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. జీర్ణకోశ సంబంధిత సమస్యతో గత నెల 19న నిమ్స్‌లో చేరారు. నిమ్స్ డైరెక్టర్, గ్యాస్ట్రోఎంట్రాలజీ విభాగం అధిపతి డాక్టర్ బీరప్ప పర్యవేక్షణలో మెట్టు రంగారెడ్డి స్పెషల్ వార్డులో చికిత్స పొందుతున్న ఆయన ఇన్ఫెక్షన్కు గురయ్యారు. చికిత్సతో ఆరోగ్యం మెరుగుపడుతోందని అనుకుంటుండగా ఇతర సమస్యలు తలెత్తడంతో పరిస్థితి విషమించింది. శనివారం రాత్రి 8.36 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ప్రకటించారు.ఆయనకు భార్య వసంత, కుమార్తె మంజీరా ఉన్నారు. సోమవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో ఆస్పత్రి నుంచి మౌలాలి జవహర్‌నగర్‌లో ఉన్న శ్రీనివాస హైట్స్‌లోని స్వగృహానికి సాయిబాబా పార్థివ దేహాన్ని తరలించనున్నారు. అంతకుముందు గన్‌పార్క్ వద్ద ఆయన భౌతికకాయాన్ని కొద్ది సమయం ఉంచుతామని కుటుంబ సభ్యులు చెప్పారు.బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు నివాళులర్పించిన తర్వాత మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభమయ్యే అంతిమయాత్ర 4 గంటలకు గాంధీ మెడికల్ కాలేజీకి చేరుతుందని, సాయిబాబా కోరిక మేరకు ఆయన పారి్థవ దేహాన్ని గాంధీ ఆస్పత్రికి దానం చేయనున్నామని తెలిపారు. ఇప్పటికే ఆయన తన నేత్రాలను ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రికి దానం చేశారు. అమలాపురం నుంచి హస్తిన దాకా.. ఆంధ్రప్రదేశ్‌లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఓ పేద రైతు కుటుంబంలో జన్మించిన నాగ సాయిబాబాకు ఐదేళ్ల వయస్సులోనే పోలియోతో రెండుకాళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. అప్పటినుంచి ఆయన వీల్‌చైర్‌కే పరిమితం అయ్యారు. అయినప్పటికీ స్థానికంగానే గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. హైదరాబాద్ యూనివర్సిటీ నుంచి పీజీ పట్టా పొందారు. 2013లో పీహెచ్డీ పూర్తి చేశారు. ఢిల్లీ యూనివర్సిటీ అనుబంధ కాలేజీ రామ్‌లాల్ ఆనంద్ కళాశాలలో ఇంగ్లిష్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. అయితే మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై 2014లో సాయిబాబాను మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో 2021 ఫిబ్రవరిలో ఆయనను పదవి నుంచి తొలగించారు. పదేళ్లు అండా సెల్లో జైలు శిక్ష సాయిబాబా అరెస్టు అనంతరం కేసును విచారించిన గడ్చిరోలి జిల్లా సెషన్స్ కోర్టు 2017లో సాయిబాబాకు జీవిత ఖైదు విధించింది. ఈ తీర్పుపై సాయిబాబా బాంబే హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. బాంబే హైకోర్టు 2022లో ఆయనపై కేసును కొట్టివేసింది. కానీ మహారాష్ట్ర ప్రభుత్వం ఈ తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దీంతో సుప్రీంకోర్టు సాయిబాబా విడుదలపై స్టే విధించింది. ఈ కేసును తిరిగి విచారించాలని బాంబే హైకోర్టును ఆదేశించింది. బాంబే హైకోర్టు సాయిబాబా నిర్దోషి అని మళ్లీ తీర్పు ఇవ్వడంతో ఈ ఏడాది మార్చిలో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. దీనికి ముందు నాగ్‌పూర్ సెంట్రల్ జైల్లోని అండా సెల్లో పదేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించారు. జైల్లో ఉండగానే సాయిబాబా తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఎట్టకేలకు జైలు నుంచి విడుదలైనా అనారోగ్య సమస్యలు కొనసాగడంతో కోలుకోలేకపోయారు. సాయిబాబా మరణవార్త తెలుసుకున్న పలువురు ప్రముఖులు, ప్రజా సంఘాల నేతలు సంతాపం ప్రకటించారు. నిమ్స్ మార్చురీలో ఉన్న ఆయన భౌతిక కాయాన్ని ఆదివారం పలువురు సందర్శించి నివాళులరి్పంచారు. ప్రభుత్వమే బాధ్యత వహించాలి: హరగోపాల్ ప్రొఫెసర్ సాయిబాబాకు నిర్బంధ వ్యతిరేక వేదిక కనీ్వనర్ ప్రొఫెసర్ జి.హరగోపాల్, కో–కన్వీనర్లు ప్రొఫెసర్ జి.లక్ష్మణ్, రాఘవాచారి, కె.రవిచందర్‌లు జోహార్లు అరి్పంచారు. సాయిబాబా రాజ్యం కక్షపూరిత చర్యలకు బలైపోయారని, ఆయన మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.జైల్లో మగ్గిపోవడమే కారణం అక్రమ కేసులతో అన్యాయంగా జైలుకు వెళ్లి అక్కడే మగ్గిపోయారు. ఎట్టకేలకు ప్రభుత్వ నిర్బంధాన్ని ఛేదించుకొని బయటకు వచ్చారు. మళ్లీ ప్రజల కోసమే పనిచేయాలనుకున్నారు. కానీ జైల్లో చుట్టుముట్టిన అనారోగ్యం నుంచి కోలుకోలేక పోయారు. చిన్న ఆపరేషన్ చేసినా శరీరం తట్టుకోలేని పరిస్థితి ఏర్పడింది. నిమ్స్‌లో చికిత్స విజయవంతం అయినా తర్వాత తలెత్తిన ఇబ్బందులతో కన్నుమూశారు. – సాయిబాబా భార్య వసంత, కుమార్తె మంజీరా‘హింసల కొలిమిలో పదేళ్లు’ తప్పుడు కేసుల కారణంగా పదేళ్లు నాగ్‌పూర్ సెంట్రల్ జైల్లో చిత్ర హింసల కొలిమిలో మగ్గిపోయానని ప్రొఫెసర్ సాయిబాబా ఈ ఏడాది ఆగస్టు 23న హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో వాపోయారు. తన నిర్బంధం, అందుకు కారణాలు, తొమ్మిదేళ్ల జైలు జీవితంలో పడిన కష్టాలు, జైళ్లలో అంతర్గత రాజకీయాలు ఇలా అనేక అంశాలపై ఆయన సుదీర్ఘంగా మాట్లాడారు.‘జైలు జీవితం అంతా చీకటి రోజులు. పదేళ్ల తర్వాత తెలంగాణలో స్వేచ్ఛగా మాట్లాడుతున్నా. రాజ్యహింస నుంచి ఆదివాసీయులను కాపాడేందుకు ప్రయత్నించడం, ఆపరేషన్ గ్రీన్ హంట్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేయడమే నా అరెస్టుకు ప్రధాన కారణం. జైల్లో నాకు సరైన వైద్యం అందించలేదు. పదేళ్లలో కొన్నిసార్లు మాత్రమే ఆసుపత్రికి తీసుకెళ్లారు. సరైన వైద్యం లేక నా ఎడమచేయి కూడా పడిపోయింది. పోలియో తప్ప ఏ ఇతర వ్యాధి లేని నేను 21 రకాల జబ్బుల బారినపడ్డా..’ అని చెబుతూ సాయిబాబా భావోద్వేగానికి లోనయ్యారు. బాల్యమంతా అమలాపురంలోనే.. డిగ్రీ వరకూ ఇక్కడే చదివిన సాయిబాబాఅమలాపురం టౌన్: మానవ హక్కుల కార్యకర్త, విద్యావేత్త, కవి, రచయిత ప్రొఫెసర్ గోకరకొండ నాగ సాయిబాబా బాల్యం, డిగ్రీ వరకు విద్యాభ్యాసమంతా అమలాపురంతో పాటు పరిసర గ్రామాల్లోనే సాగింది. సాయిబాబా కుటుంబం దాదాపు 40 ఏళ్ల కిందట అమలాపురాన్ని విడిచి హైదరాబాద్‌కు వెళ్లగా.. అమలాపురం, నల్లమిల్లి, సన్నవిల్లి తదితర గ్రామాల్లో ఆయనకుఎంతో మంది స్నేహితులు, బంధువులు ఉన్నారు. ప్రొఫెసర్ సాయిబాబా మరణవార్త తెలియగానే వారంతా కన్నీరుమున్నీరయ్యారు. నల్లమిల్లి నుంచి ఢిల్లీకి.. సాయిబాబా స్వగ్రామం అమలాపురం రూరల్ మండలంలోని నల్లమిల్లి. ఆయన తండ్రి సత్యనారాయణమూర్తి ఒక సన్నకారు రైతు. తల్లి సూర్యావతి గృహిణి. వారికి ఇద్దరు సంతానం. పెద్ద కుమారుడు సాయిబాబా, రెండో కుమారుడు రామదేవ్. సాయిబాబాకు ఐదేళ్ల వయసులో పోలియో సోకి రెండు కాళ్లూ చచ్చుబడిపోయాయి. వీల్‌చైర్‌కే పరిమితమైనా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో పట్టువీడకుండా నల్లమిల్లిలో ప్రాథమిక విద్యనభ్యసించారు. తొలుత తమ అమ్మమ్మ ఊరు ఉప్పలగుప్తం మండలం సన్నవిల్లిలో వారి కుటుంబం ఉండేది. ఆ తర్వాత అమలాపురంలోని అద్దె ఇంట్లోకి మారారు. అక్కడే సాయిబాబా.. ఉన్నత పాఠశాల విద్య పూర్తి చేశారు. అనంతరం వారి కుటుంబం అమలాపురంలోని గాం««దీనగర్‌లో ఇల్లు నిరి్మంచుకుంది. సాయిబాబా ఇంటరీ్మడియెట్, డిగ్రీ చదువు అమలాపురం ఎస్కేబీఆర్ కాలేజీలోనే సాగింది. డిగ్రీ చదువుతున్న సమయంలోనే సాయిబాబా వామపక్ష రాజకీయాల వైపు ఆకర్షితులయ్యారు. తల్లిదండ్రుల మృతితో సాయిబాబా, ఆయన సోదరుడు రామదేవ్ హైదరాబాద్ వెళ్లి స్థిరపడ్డారు. అన్యాయాన్ని సహించడు.. చిన్నతనం నుంచే సాయిబాబా ప్రశి్నంచేతత్వంతో ఉండేవాడు. అన్యాయాన్ని సహించేవాడు కాదు. నాకు కజిన్ అయిన సాయిబాబా మరణించాడని తెలిసి ఎంతో బాధపడ్డా. – గోకరకొండ గంగాజలం, విశ్రాంత బ్యాంక్ ఉద్యోగి, ఉప్పలగుప్తం నిరాధార ఆరోపణలతో హింసించారు మానవ హక్కుల వేదిక నాయకుడిగా, కవిగా, ప్రొఫెసర్‌గా సాయిబాబు ప్రజలు, విద్యార్థుల ఉన్నతి కోసం ఎంతో కృషి చేశారు. దివ్యాంగుడైన వ్యక్తి.. ప్రభుత్వానికి ఎలా హాని తలపెడతారనే ఆలోచన లేకుండా కేంద్రం తొమ్మిదేళ్ల పాటు జైల్లో హింసించింది. లేకపోతే ఆయన మరిన్ని సంవత్సరాలు జీవించేవారు. పరోక్షంగా ఆయన మరణానికి ప్రభుత్వానిదే బాధ్యత. – నామాడి శ్రీధర్, మానవ హక్కుల వేదిక రాష్ట్ర నాయకుడు, అంబాజీపేటసీపీఎం, సీపీఐ సంతాపంసాక్షి, అమరావతి: ప్రముఖ విద్యావేత్త, పౌర హక్కులనేత ప్రొఫెసర్ జి.ఎన్. సాయిబాబా మృతిపట్ల సీపీఎం, సీపీఐ రాష్ట్ర కమిటీ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశాయి. ఈ మేరకు ఆ పార్టీల రాష్ట్ర కార్యదర్శులు వి.శ్రీనివాసరావు, కె.రామకృష్ణ ఆదివారం వేర్వేరు ప్రకటనలు విడుదల చేశారు. సాయిబాబా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
ఆలస్యంగా దక్కిన న్యాయం
మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణతో చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) కింద అరెస్టయిన ఢిల్లీ విశ్వవిద్యాలయ అధ్యాపకుడు ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా పదేళ్ల సుదీర్ఘ కారాగారవాసం నుంచి గురువారం నిర్దోషిగా విడుదలయ్యారు. ఇదే అభియోగాలతో ఆయనతోపాటు అరెస్టయిన మరో అయిదుగురికి కూడా విముక్తి లభించింది. ఒకరు విచారణ సమ యంలో మరణించారు. అభియోగాలను రుజువు చేయటంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని చెబు తూనే, అసలు తగిన అనుమతులు లేకుండా సాగించిన ఈ కేసు చెల్లుబాటు కాదని బొంబాయి హైకోర్టు నాగపూర్ ధర్మాసనం వ్యాఖ్యానించటం మన నేర న్యాయవ్యవస్థ పనితీరును పట్టిచూపుతోంది. యూఏపీఏ కింద ప్రాసిక్యూషన్ చర్యలు ప్రారంభించాలంటే నిబంధనల ప్రకారం ఉన్నతాధికారుల ముందస్తు అనుమతులు తప్పనిసరి. నిందితులపై పకడ్బందీ సాక్ష్యాధారాలున్నాయని వారు విశ్వసించాకే ప్రాసిక్యూషన్‌కు అనుమతించాలి. కానీ ఈ కేసులో ప్రొఫెసర్ సాయిబాబాను 2014లో అరెస్టు చేయగా ఏడాది తర్వాతగానీ అనుమతులు రాలేదు. ఇతర నిందితులు వాస్తవానికి 2013లోనే అరెస్టయ్యారు. ఈ సంగతి పట్టని మహారాష్ట్రలోని గఢ్చిరోలి సెషన్స్ కోర్టు కేసును పరిగణనలోకి తీసుకుని ఈలోగా ఒక సాక్షిని కూడా విచారించింది! చివరకు 2017లో వీరిని దోషులుగా పేర్కొంటూ యావజ్జీవ శిక్ష విధించింది. అటు ప్రభుత్వ యంత్రాంగం సరే... ఇటు న్యాయవ్యవస్థ సైతం ఇంత యాంత్రికంగా పనిచేయటం సరైందేనా? బొంబాయి హైకోర్టు 2022లో ఈ అవక తవకలను గుర్తించి కేసు కొట్టేసింది. కానీ ఆ వెంటనే సుప్రీంకోర్టు ధర్మాసనం మహారాష్ట్ర అప్పీల్‌ను స్వీకరించి బొంబాయి హైకోర్టు తీర్పును నిలుపుదల చేయటం, తిరిగి దీన్ని విచారించాలంటూ ఆదేశాలు జారీచేయటంవల్ల సాయిబాబా తదితరులకు స్వేచ్ఛ లభించటానికి మరికొన్ని నెలలు పట్టింది. ఇలా కనీస సాక్ష్యాధారాలు కొరవడిన, ముందస్తు అనుమతులు తీసుకోని కేసులో నింది తులను పదేళ్లపాటు జైలు గోడలమధ్య బంధించి వుంచారంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఇది వ్యవస్థల సమష్టి వైఫల్యం కాదా? ఇందుకు జవాబుదారీతనం వహించాల్సిందెవరు? తెలుగు రాష్ట్రాల్లోనే కాదు... ఈయూ కమిషన్, అమెరికన్ కాంగ్రెస్, ఐక్యరాజ్యసమితి మానవహక్కుల విభా గంలో ఈ కేసు ప్రస్తావనకొచ్చింది. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియాల్లోని వివిధ సంస్థల వరకూ అందరికందరూ ఇది అన్యాయంగా బనాయించిన కేసు అనీ, వెంటనే ఉపసంహరించుకోవాలనీ డిమాండ్ చేస్తూ వచ్చారు. టీఆర్ఎస్ సభ్యుడు కె. కేశవరావు 2015లో జీరో అవర్‌లో దీన్ని రాజ్య సభలో ప్రస్తావించే ప్రయత్నం చేశారు. అప్పటి కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు లేఖ కూడా రాశారు. అయినా ప్రయోజనం లేకపోయింది. కనీసం కేసు తేలేవరకూ నిందితులను బెయిల్‌పై విడుదల చేసివుంటే కొంతలో కొంతైనా న్యాయం చేసినట్టయ్యేది. బెయిల్ అనేది హక్కు, తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే జైలుకు పంపాలన్నది మౌలిక న్యాయసూత్రం. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఈమధ్యకాలంలో కూడా పదే పదే ఈ సంగతిని గుర్తుచేస్తున్నారు. అయినా ఆచరణకొచ్చేసరికి జరిగేది వేరుగా వుంటోంది. నిందితులు హింసాత్మక కార్యకలాపాల్లో పాల్గొన్నారని ప్రాసిక్యూషన్ ఆరోపించలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపట్ల విరోధభావాన్ని వ్యాప్తిచేసేందుకు కుట్రపన్నారని తెలిపింది. ఆ విషయంలో సమర్పించిన ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, ఇతర పత్రాలువంటి సాక్ష్యాధారాలు అత్యంత బలహీనమైన వని బొంబాయి హైకోర్టు వ్యాఖ్యానించింది. ఏదైనా వెబ్సైట్ నుంచి వీడియోలు, ఇతర సమాచారం డౌన్లోడ్ చేసుకోవటం దానికదే నేరమెలా అవుతుందన్నది ధర్మాసనం సందేహం. ఫలానా ఉగ్ర వాద చర్యకూ, దానికీ సంబంధం వున్నదని నిరూపిస్తే తప్ప ఆ సాక్ష్యానికి ఎలాంటి విలువా వుండ దని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. ప్రొఫెసర్ సాయిబాబా అభిప్రాయాలు ఎవరికీ తెలియ నివి కాదు. ఆయన వృత్తిరీత్యా ఇంగ్లిష్ అధ్యాపకుడు. కవి, రచయిత కూడా. ఆదివాసీ ప్రాంతాల్లో సహజవనరులను బహుళజాతి కంపెనీలకు కట్టబెట్టడాన్ని వ్యతిరేకిస్తూ తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో రచనలు చేశారు. అరెస్టయిన సమయానికి విప్లవ ప్రజాస్వామిక వేదిక (ఆర్డీఎఫ్) బాధ్యుడు. ఆయన హింసాత్మక కార్యకలాపాల్లో పాలుపంచుకుంటే, విధ్వంసానికి పాల్పడితే చట్టప్రకారం చర్యలు తీసుకోవచ్చు. కానీ 90 శాతం అంగవైకల్యం వున్న సాయిబాబా మరొకరి సాయం లేనిదే తన పని తాను చేసుకోవటం కూడా అసాధ్యం. బయటకు వెళ్లాలంటే చక్రాల కుర్చీ తప్పనిసరి. అటు వంటి వ్యక్తిని ఉగ్రవాదిగా జమకట్టడం సబబేనా? కేవలం అసమ్మతిని వ్యక్తం చేయటమే ఒక మనిషిని పదేళ్లపాటు జైల్లోకి నెట్టడానికి కారణం కావటం మనం నమ్మే ప్రజాస్వామిక విలువలను ప్రశ్నార్థకం చేస్తోంది. ఉగ్రవాద చర్యలు సమాజ క్షేమానికి ముప్పుగా పరిణమిస్తాయనటంలో సందేహం లేదు. అటువంటివారిని అదుపు చేయాలంటే యూఏపీఏ వంటి కఠిన చట్టాల అవసరం వుందని ప్రభుత్వాలు భావిస్తే తప్పుబట్టనవసరం లేదు. కానీ మన రాజ్యాంగమే అనుమతించిన సహేతుకమైన అసమ్మతిపై లేనిపోని ముద్రలేసి దాన్ని తుంచివేయాలనుకోవటం, భావప్రకటనా స్వేచ్ఛకు సంకెళ్లు వేయాలనుకోవటం ఏరకంగా చూసినా సబబు కాదు. ఇప్పుడు సాయిబాబా కోల్పోయిన విలువైన పదేళ్ల కాలాన్ని ప్రభుత్వం వెనక్కివ్వలేదు. కనీసం ఉద్యోగమైనా చేసుకోనివ్వాలి. ఇతర క్రిమినల్ కేసుల మాట అటుంచి యూఏపీఏ వంటి దారుణ చట్టాలకింద అరెస్టయి నిర్దోషులుగా తేలినవారికైనా తగిన పరిహారం చెల్లిస్తే కాస్తయినా ఉపశమనం ఇచ్చినట్టవుతుంది. పాలకులు ఆలోచించాలి. -
దేవుడా.. ఆ డబ్బంతా నాకిచ్చెయ్.. జగ్గూభాయ్ ట్వీట్ వైరల్
ఒకప్పడు హీరోగా రాణించిన జగపతి బాబు..ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా ఫుల్ బిజీగా ఉన్నాడు. లెజెండ్ తర్వాత బ్యాక్ టు బ్యాక్ బడా ప్రాజెక్టుల్లో నటిస్తూ తన క్రేజ్‌ను రోజు రోజుకీ పెంచుకుంటూ ముందుకెళ్లిపోతున్నాడు. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే వెబ్‌సిరీస్‌లపై దృష్టిపెడుతున్నారు. ఇటీవలే ‘పరంపర’ అనే వెబ్‌సిరీస్‌లో నటించారు. ప్రస్తుతం జగపతి బాబు సలార్ తో పాటు ఎన్టీఆర్ 30వ చిత్రంలో కూడా నటిస్తున్నాడు. (చదవండి: ముంబైలో సీనియర్ స్టార్స్ సందడి.. ఫోటోలు వైరల్) జగపతి బాబు సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో మాత్రం సందడి చేస్తూనే ఉంటాడు. ఎప్పుడూ ఏదో ఒక పోస్ట్ వేస్తుంటాడు. కొటేషన్లు షేర్ చేస్తుంటాడు. వేధాంతం వల్లిస్తుంటాడు. తాజాగా జగపతి బాబు.. సాయిబాబాకు పూజ చేస్తున్న వీడియోని షేర్ చేస్తూ.. ‘దేవుడా.. అందరూ నా దగ్గర ఉందనుకుంటున్న డబ్బు నాకిచ్చెయ్.. చెప్పలేక చస్తున్నా’ అంటూ ట్వీట్ చేశాడు. జగ్గూభాయ్ చేసిన ఈ ఫన్నీ ట్విట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘ముందుగా మీ దగ్గర ఉన్న డబ్బు నాకు ట్రాన్స్ఫర్ చేయండి.. ఆ తర్వాత దేవుడు మీకు పంపిస్తాడు’, నీ కోరిక ఈ దేవుడి దగ్గర నెరవేరదు.. ‘లక్ష్మీదేవి లేదా కుభేరుడిని పూజిస్తే.. నీ కోరిక నెరవేరుతుంది’ అంటూ నెటిజన్స్ ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు. Devuddaa...Andharu naa daggara undhanukuntuna dabbu naaku iccheyi...cheppaleka Chastuna. pic.twitter.com/mGpe9D4Ty5 — Jaggu Bhai (@IamJagguBhai) November 13, 2022 -
తెలుగు రాష్ట్రాల్లో గురు పౌర్ణమి వేడుకలు (ఫొటోలు)
-
‘సబ్కాసాయి’ మూవీ ట్రైలర్ విడుదల చేసిన మేకర్స్
అనేక మంది జీవితాలను స్పృశించి, సుసంపన్నం చేసిన భారతదేశ వ్యాప్తంగా పూజించే సాధువు - సాయిబాబా జీవిత చరిత్ర ఆధారంగా సబ్కాసాయి సిరీస్ తెరకెక్కింది. ఎమ్ఎక్స్ ప్లేయర్ ఒరిజినల్ సిరీస్ ఈ మూవీ ట్రైలర్‌ను ఈరోజు విడుదల చేసింది. భారతదేశంలో గొప్ప సూఫీ సద్గురువు - సాయి బాబా. మతం పేరిట విద్వేషాన్ని వ్యాప్తి చేయడంపై సైన్స్, మెడిసిన్‌ను విశ్వసించే వారి నుండి ఎదురైన వ్యతిరేకత, భారతదేశ స్వాతంత్య్ర సమరయోధులకు ఆయన ఇచ్చిన మద్దతు వరకు మొత్తం ఆంశాల ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. ఆయన అభిప్రాయాల వృత్తాంతం, వితంతు పునర్వివాహం, మతాంతర వివాహాలను అంగీకరించడంపై ఆయన ఉదారమైన విశ్వాసం అనేక ప్రతిఘటనలను ఎదుర్కొన్న ప్రతి అంశాలను ఈ మూవీలో చూపించనున్నారు. దత్తత శిశువుగా మొదలుకుని యుక్తవయస్సులో ఎదుర్కొన్న అనేక కష్టనష్టాల నుంచి మొదలైన ఆయన ప్రయాణం, ‘షిర్డీ సద్గురువు’గా భారత స్వాతంత్య్ర సంగ్రామ పోరాటంతో పాటు ప్లేగు వంటి అంటువ్యాధులు ప్రభలిన చారిత్రక సంఘటనలలో ఆయన ప్రమేయాన్ని ఇందులో అందంగా వివరించారు. రాజ్ అర్జున్ ప్రధాన పాత్రలో నటించిన ఈ 10 ఎపిసోడ్ల ఈ పౌరాణిక సిరీస్‌కు అజిత్ భైరవాకర్ దర్శకత్వం వహించారు. షిర్డీలో జన్మించిన దర్శకుడు అజిత్ భైరవాకర్ ఈ సిరీస్ ట్రైలర్ గురించి మాట్లాడుతూ.. ‘ఈ సిరీస్‌లో, సాయిబాబ ఎదుర్కొన్న నిజ జీవిత సవాళ్లతో పాటు, ఇప్పుడు పూజించబడుతున్న దేవునిగా కాకుండా సాయిబాబాను ఒక మానవమాత్రునిగా చిత్రీకరించడానికి మేము ప్రయత్నించాము. బాబా ప్రగతిశీల ఆలోచనలు, మొత్తం మానవజాతి పట్ల ఆయనకున్న కరుణ, వాత్సల్యం, ఆయన గురించి మనకు అంతగా తెలియని కథలు ఈ కథనంలో సజీవంగా తీసుకురావడానికి ప్రయత్నించాము. అన్ని మతాల ప్రజల నుండి కూడా ఆయనకు అత్యధికసంఖ్యలో ఉన్న భక్తుల దృగ్విషయాన్ని తెలియజేయడానికి కూడా ఈ సిరీస్ ప్రయత్నిస్తుంది’ అని పేర్కొన్నారు. కాగా తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఈ సీరిస్ ఎమ్ఎక్స్ ప్లేయర్లో ఉచితంగా ప్రసారం అవుతుంది. -
ప్రొఫెసర్ సాయిబాబాకు మాతృవియోగం
సాక్షి, హైదరాబాద్: పౌరహక్కుల నేత, జైలులో యావజ్జీవశిక్ష అనుభవిస్తున్న ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా తల్లి గోకరకొండ సూర్యావతి(75) శనివారమిక్కడ కన్నుమూశారు. కొంతకాలంగా కేన్సర్‌తో బాధపడుతున్న ఆమె నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయినట్లు చిన్న కుమారుడు రాందేవ్ తెలిపారు. బంజారాహిల్స్‌లోని శ్మశానవాటికలో అంత్యక్రియలు జరిగాయి. వీక్షణం ఎడిటర్ ఎన్.వేణుగోపాల్, పీవోడబ్ల్యూ అధ్యక్షురాలు వి.సంధ్య, విరసం సభ్యులు రాము, అమరుల బంధుమిత్రుల సంఘం ప్రతినిధి భవానీ తదితరులు అంత్యక్రియలకు హాజరై నివాళులర్పించారు. ఇద్దరు కొడుకుల్లో పెద్దవాడైన సాయిబాబా ఉ.పా. చట్టం కింద నాగ్‌పూర్ సెంట్రల్ జైల్లో యావజ్జీవశిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. సూర్యావతి కూతురు భవానీ మావోయిస్టు పార్టీలో పనిచేసి 20 ఏళ్ల క్రితమే ఎన్కౌంటర్లో చనిపోయారు. కేన్సర్‌తో బాధపడుతున్న తన తల్లిని చివరిసారిగా చూసేందుకు అవకాశం ఇవ్వాలని సాయిబాబా ఇటీవల ప్రభుత్వాన్ని కోరారు. పెరోల్‌గానీ, బెయిల్ గానీ ఇవ్వాలని న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు. అయినా ఆయనకు ఆ అవకాశం లభించలేదు. 90 శాతం వైకల్యం, అనారోగ్యంతో యావజ్జీవశిక్ష అనుభవిస్తున్న తన కొడుకును కూడా ఆమె చివరిసారిగా చూసుకోలేకపోయారు. ఎదురుచూపులే మిగిలాయి.... సూర్యావతి కుటుంబం మొదటి నుంచి ప్రజాఉద్యమాలకే అంకితమైంది. ఆమె బిడ్డలందరూ ప్రజాసంఘాలోన్లే పనిచేసేవారు. బిడ్డ మావోయిస్టు పార్టీలో పనిచేసినంత కాలం ఆమె రాక కోసం సూర్యావతి ఎదురు చూసేవారు. చివరకు ఆ కూతురు విగతజీవిగానే ఇల్లు చేరింది. కొడుకు విడుదల కోసం చివరి క్షణం వరకు ఆమె ఎదురుచూస్తూనే ఉండిపోయారు. ఎన్నో నిద్రలేనిరాత్రులు గడిపిన ఆ తల్లి చివరకు కేన్సర్ బారిన పడ్డారు. మరోవైపు జైల్లో తీవ్ర అనారోగ్యంతో ఉన్న సాయిబాబా తన తల్లికి కేన్సర్ అని తెలిసి తల్లడిల్లిపోయారు. ఒక్కసారైనా అమ్మను చూడాలని ఎంతో ఆరాటపడ్డారు. -
మేధావుల విడుదలకు పోరాడాలి: హరగోపాల్
హైదరాబాద్: ప్రజాస్వామ్య మేధావులు వరవరరావు, సాయిబాబా సహా 11 మంది విడుదల కోసం మేధావులు, విద్యావంతులు, ప్రజా సంఘాలు రాజీ లేని పోరాటం చేయాలని ప్రొఫెసర్ హరగోపాల్ పిలుపునిచ్చారు. ఉద్యమించే హక్కుపై అప్రకటిత ఎమర్జెన్సీ (1975 జూన్ 25 ఎమర్జెన్సీ విధించిన సందర్భంగా), ఉపా చట్టాన్ని రద్దు చేయడం, ప్రజాస్వామికవాదుల అక్రమ నిర్బంధాలకు వ్యతిరేకంగా రాజకీయ ఖైదీల విడుదల కోసం పౌరహక్కుల సంఘం, టీఎస్, ఏపీ ప్రజాస్వామిక హక్కుల సంఘాల సమన్వయ సంస్థల ఆధ్వర్యంలో ఆదివారం ఇందిరాపార్కు వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పీడిత ప్రజలు విముక్తి చెంది సమసమాజం రావాలని కోరుకుంటూ ఉన్నతమైన విలువల కోసం పోరాడుతున్న మేధావులను జైళ్లలో పెట్టి వారి గొంతు నొక్కేస్తున్నారని ఆరోపించారు. సాయిబాబా, వరవరరావు తదితరులపై ఏ నేరాలూ లేవని.. ఆయుధాలతో చర్యను నిషేధించారే కానీ మావోయిస్టు రాజకీయాలను కాదన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి కృషి చేస్తుండటం వల్లే వరవరరావు సహా 11 మందిని జైలులో పెట్టారని ఆరోపించారు. అనారోగ్యంతో నిస్సహాయ స్థితిలో ఉన్న సాయిబాబా మావోయిస్టు కార్యాకలాపాలను అమలు చేస్తాడా? అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి రాజ్యాంగంపై గౌరవం లేదన్నారు. ఈ కార్యక్రమంలో పౌరహక్కుల సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్, వీక్షణం సంపాదకులు వేణుగోపాల్, ప్రొఫెసర్ ఖాసీం, బహుజన ప్రతిఘటన వేదిక నాయకుడు సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. -
సాయి చేసిన మంత్రోపదేశం!
సాయి చరిత్రని ఎంతగా విన్నా, ఎంతగా చదివినా– ఇంకా ఇంకా వినాలీ ఇంకా ఇంకా తెలుసుకోవాలీ అనే అనిపిస్తుంది తప్ప– ఇక చాల్లే! అని అనిపించనే అనిపించదు. ఒట్టిగా నీటిని ఎన్నింటినో తాగలేం! అదే మరి ద్రాక్షరసం పంచదార ఖర్జూరరసం.. ఇలా కలిపిన పానీయమైతేనో.. మరికాస్త మరికాస్త.. అంటూ తాగమూ? అలా ఒట్టి నీళ్లలో మధురపదార్థాలు కలిసి రుచికరంగా మారి పానీయమైనట్లుగా, సాయి యదార్థకథలో సాయి మంత్ర మనన(తపశ్శక్తి) శక్తి చేరి ఉన్న కారణంగా ఈ చరిత్రని ఎంతకాలం విన్నా చదివినా విసుగు రాదు, చాలు అనిపించదు. ఈ నేపథ్యంలో మసీదులో జరిగిన ఓ వింత సంఘటనని తెలుసుకుందాం! వృద్ధురాలి ఆమరణ నిరాహార దీక్ష దేశ్‌ముఖ్ అనే ఇంటి పేరు కల ఓ ఇల్లాలు ‘రాధాబాయ్’ అనే ఆమె తన స్నేహితురాళ్లతో కావాలని షిర్డీ దర్శనం కోసం వచ్చింది. ఆమె అతి వృద్ధురాలు. అందుకే కొంతమందిని తోడు చేసుకుని కూడా వచ్చిందామె. షిర్డీకొచ్చాక అక్కడి భక్తులూ– వాళ్ల భక్తి పారవశ్యం– ఆ భజనలూ.. సాయి దర్శనం కోసం ఆ భక్తులంతా నిరీక్షిస్తూ కనిపిస్తూ, దర్శనం కాగానే– చెట్టుకి నీరు పోసిన మరుక్షణంలో ఆ చెట్టు ఆకులు ఎలా విస్తరిస్తాయో అలా వెలిగిపోతున్న ముఖాలతో కనిపిస్తున్న తీరూ– మళ్లీ ఆ భక్తులే దర్శనానంతరం తిరిగి వెళ్లిపోతూ– ‘మళ్లీ ఎన్నాళ్లకి దర్శనమౌతుందో అనే నిరాశతో ఎదురుచూపుతో ఆనందాశ్రువులని పెట్టుకుంటూ ఉన్నవిధానమూ’.... ఆమెని మరింత ఉత్సాహపరిచాయి. వరుసలో తన వంతురాగానే సాయి ముఖంలోనికి, చూస్తూ చెప్పలేని భక్తి పారవశ్యాన్ని పొంది తన శిరసుని సాయి పాదాల మీద పెట్టి తన్మయత్వాన్ని పొందింది. వర్షం వస్తూన్న కొద్దీ తనలోకి ప్రవాహపు నీరు వస్తున్న కొద్దీ ఎలా ఓ చెరువు తనకున్న పూర్వపు నీటిమట్టాన్ని క్రమక్రమంగా పెంచుకుంటూ వెళ్తుందో, అలాగే ఆ రాధాబాయ్లో భక్తిభావం మరింత పెరిగిపెరిగి పోసాగింది. ప్రారంభంలో పదిమందీ వెళ్తున్నారు కదాని వాళ్లతో బయల్దేరింది. తోవ నిండుగా అటూ ఇటూ ఉన్న భక్తులూ వాళ్ల అనుభవాలూ విని మరింత ఆత్రుతతో షిర్డీని ఎప్పుడెప్పుడు చేరుతామా? అనే ఉత్సాహంతో ఊగిపోయింది. షిర్డీకొచ్చాక ఆ ఆత్రుతా ఎదురుచూపూ ఉత్సాహం... ఇలా అన్నీ కలిసి, సాయి ఆశ్రమంగాని ఏదైనా ఉంటే అక్కడే తన శేషజీవితాన్ని గడపాలనే నిర్ణయానికొచ్చేసింది. ఇక భక్తుల వరుసలో కదులుతూ సాయిని దర్శించడం తన శిరసుతో ఆయన పాదాలని స్పృశించడం ఎప్పుడైతే జరిగిందో దాంతో ఆమెకి మరో ఆలోచన ఎవరెవరి సంస్కారాన్ని బట్టి వాళ్లవాళ్లకి కలుగుతూ ఉండడాన్ని గమనిస్తూ ఉంటాం. మళ్లీ కొంతసేపో లేదా కొంత కాలమో అయ్యేసరికి పాలమీద నీళ్లు చల్లగా ఆ పొంగు తగ్గిపోయినట్లుగా– కుటుంబం బాధ్యతా అపరిష్కృత సమస్యలూ... వంటివి గుర్తుకి రాగానే మళ్లీ మామూలైపోతూ ఉండటం సర్వసాధారణం. అయితే ఈమె మాత్రం అలాంటి తాత్కాలిక భావానికి గురైనది కానేకాదు. వయసు పెద్దది కావడం, కుటుంబానికి సంబంధించిన జంజాటం లేకపోవడం, ఎక్కడో ఓ చోట నిరామయంగా జీవిస్తూ దైవం పిలిస్తే చాలు వెళ్లిపోదామనుకునే ఆలోచనతో ఉండటం కారణంగా ఆ శేషజీవిత నివాసాన్ని షిర్డీకే అంకితం చేయాలని భావించింది. ఆ ఊహతోనే మళ్లీ మసీదులో సాయి దర్శనానికని బయల్దేరింది. అంతలోనే సాయి మరోప్రదేశానికి వెళ్తున్నారనీ దర్శనం సాధ్యం కాదనీ తెలిసి వెనక్కొచ్చేసింది. దాంతో ఆమెతో మరింతయింది భక్తి భావం. ధర్శసూత్రాల్లో ఓ మాట ఉంది. ‘పునర్విశ్లేష భీరుత్వం పరమా భక్తి రుచ్యతే’– అని. చక్కగా కలిసి ఉన్న ఆత్మీయంగా ఉన్న ఏ ఇద్దరో ఏదో కారణంగా గాని తాత్కాలికంగా దూరదూరంగా ఉండాల్సొచ్చి ఉండి– మళ్లీ ఎప్పుడు కలుసుకుంటామో? అనే తీరు నిరుత్సాహం ఎదురుచూపుల కలయికతో గాని విడిపోతే దాన్ని ‘పరమభక్తి’ అంటారని పై వాక్యానికర్థం. త్యాగరాజస్వామి ప్రతి నిత్యం పూజ ముగించి, అప్పటికప్పుడు భక్త్యావేశంతో వచ్చిన కీర్తనలని పాడి సీతారామచంద్రప్రభువుకి విన్నవించుకుని ఇంటి నుండి బయటికి వెళ్లిపోబోతూ ‘రామా! నన్ను విడువవుగా! వెంటనే దర్శనానికి రప్పించుకుంటావుగా!’ అని చిరుకన్నీళ్లతో వెళ్తూ ఉండేవాడట. ఆ స్థాయి భక్తీ తన్మయత్వమూ లేని తన కుటుంబ సభ్యులకి మాత్రం శ్రమించిన రైతు ధాన్యాన్ని పండించి, ఆ ధ్యాన్యాన్ని మళ్లీ పొలంలో చల్లుతూంటే – తెలియనివాడు ఎలా ఈ రైతుకి పిచ్చి పట్టిందేమో! అనుకుంటాడో, తిరిగి పంటకోసం ధాన్యాన్ని విత్తనాలుగా చల్లుతున్నాడనే ఆలోచనకే రాలేకపోతాడో అలా త్యాగరాజుని గురించి కుటుంబసభ్యులు అనుకుంటూ ఉండేవారు. చిత్రమేమంటే నిజమైన వ్యక్తి–ఏకాగ్రత దృష్టి ఉన్నవాడు ఇలాంటి వారెవరినీ పట్టించుకోడు, తన పనిలోనే తానుండిపోతాడు. సరిగ్గా అలాగే ఈ వృద్ధురాలైన రాధాబాయ్ కూడా శేషజీవితాన్ని సాయి నామస్మరణలోనే గడిపెయ్యాలని దృఢమైన నిర్ణయానికొచ్చేసింది. ఈమెతో వచ్చిన అందరూ ఒకరొకరుగా వెళ్లిపోయినా, ఈమె మాత్రం అక్కడే ఉండిపోయింది. సాయినామాన్ని జపించుకుంటూ షిర్డీలో ఉన్న ఆమెకి మరో గట్టి ఆలోచన వచ్చింది తన భక్తి ఏకాగ్రత కారణంగా ‘సాయి వద్ద ఓ మంత్రాన్ని ఉపదేశంగా తీసుకుంటేనో?..’ అని. ఇదంతా తాత్కాలిక ఆవేశంతో చేసుకుంటున్న నిర్ణయం కానేకాదు. దాంతో ఆమె సాయిని దర్శించాలనీ మంత్రోపదేశానికి ప్రార్థించాలనీ మంత్రాన్ని పొందాక షిర్డీలోనే ఉంటూ శరీరాన్ని విడిచెయ్యాలని నిశ్చయించుకుని ప్రతినిత్యం మసీదుకి వెళ్లి దర్శనానికి ప్రయత్నిస్తూ ఉండేది. అదేం చిత్రమో కానీ ఎన్నిమార్లు ప్రయత్నించినా సాయి ఎంతో దూరంలో ఉండటం, లేదా భక్తులంతా చుట్టు ముట్టి ఉండటం, పూజల్లో రద్దీగా ఉండటం, సమీపించి మంత్రోపదేశం గురించి అడుగుదామనేలోగా సాయి బయల్దేరి ఎక్కడికో వెళ్తూ ఉండటం.. ఇలాగే జరిగింది అన్ని సార్లూ కూడా. ఆమరణ నిరశన దీక్ష ఇన్నిమార్లు ఇన్ని విధాలుగా ప్రయత్నించిన ఆమెకి– పట్టుదలతో కాదు, నిరాశతో కూడిన అసహనం– వచ్చేసింది. దాంతో మసీదు మందు ఆమరణ(మరణించేంతవరకూ, నిర్+అశన= తిండి తినకుండా ఉండే నియమం కల దీక్ష– ఓ పవిత్ర వ్రతం) నిరశన దీక్ష చేయాలనే నిశ్చయానికొచ్చింది. అంతే! ఓ దర్భాసనం నేల మీద పరుచుకుని, దాని మీద కూర్చుని సాయినామాన్నే జపిస్తూ కూచుండిపోయింది. మొదటిరోజులో మొదటి పూట ఎవరూ అంత పట్టించుకోలేదు గాని, రెండవపూట మాత్రం ఆమె అందరినీ తన చిత్రమైన ఈ నిరశనదీక్షాచేష్టతో ఆకర్షించడంతో అందరూ గమనించసాగారు ఆమెని. ‘శరీరమాద్యం ఖలు సాధనమ్’ అంటుంది ధర్మశాస్త్రం. ఎంతటి దీక్షని ఉపవాసాన్ని యాగాన్ని యజ్ఞాన్ని హోమాన్ని వ్రతాన్ని చేయదలిచినా ఈ శరీరం నిలబడేందుకు కావాలసినంత ఆహారాన్ని (అన్నానికి బదులుగా, అన్నం కంటే తక్కువ పరిమాణంలో, అనేక పర్యాయాలు కాకుండా రెండు పూటలు మాత్రమే, అది కూడా శరీర ఆరోగ్యస్థితిని గమనించుకుంటూ) తీసుకోవాల్సిందే! అని పై వాక్యానికర్థం. ‘నిరాహారో భవేదేకః ప్రత్యామ్నాయ విధానతః’ –ఆహారం అనేదాన్ని ఆరోగ్యభంగం కాకుండానూ శరీరం నీరసంతో లేకుండా నిలబడేంతగానూ తీసుకోవాలని పై వాక్యానికర్థం వైద్యశాస్త్రపరంగా. ఈ వృద్ధురాలు మాత్రం కొద్ది మూర్ఖతతో అన్నాన్ని కనీసం నీటినీ కూడా తీసుకోవడం మానేసింది. భక్తుల్లో అర్ధభక్తిపరులుంటారు కొందరు. అటు సాయి మీద విశేషమైన భక్తితోనూ ఉంటారు– ఇలాంటివేమైనా దైవానికి (ఇక్కడ సాయి విషయంలో) ఏదైనా ఇలాంటి వ్యతిరేకత జరుగుతూ ఉంటే.. ఏం జరుగబోతోంది’ అన్నట్లు వీలైనన్ని ఎక్కువమార్లు పరిశీలిస్తూ పరామర్శిస్తూ ఉంటారు విషయాన్ని. అందుకే వీళ్లు అర్ధభక్తులు. నిజమైన భక్తిపరులుంటారు. వాళ్లు మాత్రం ఈ తీరు దీక్ష ఎలా దీక్షే అనిపించుకోదో, ఇలా చేయడం ఎందుకు సరికాదో చెప్పి, ఆ తీరు వ్యక్తులకి అర్థమై వాళ్లంతట వాళ్లే మానేలా చేస్తారు. ఇలా ఉండే భక్తులు ఆమెతో స్పష్టంగా చక్కని అవగాహనతో అనుభవంతో చెప్ప ప్రారంభించారు. ‘అమ్మా! నువ్వా వృద్ధురాలివి. శరీరంలో ఉండే అవయవాలన్నీ క్రమంగా బలక్షీణతకి గురయ్యే స్థితిలో ఉన్నదానివి. ఆ కారణంగా నీ వాళ్లెవరి దగ్గరో అక్కడుండటం సబబు. పోనీ! భక్తిపూర్వకమైన మనసుతో ఇక్కడి కొచ్చావు. మంచిదే! దర్శనాన్ని పొందావు. మాక్కూడా అప్పుడప్పుడు అసాధ్యమవుతూ ఉండే తీరులో నీ నుదుటిని ఆయన పాదాల మీద ఉంచి నమస్కరించుకున్నావు. ఎంతో అదృష్టం నీకు లభించింది. ఈ వయసులో– నీ వాళ్లెవరూ లేని ఈ స్థలంలో కనీసం నీకంటూ పరిచితులెవరూ కూడా మసీదులో లేని కారణంగా వాళ్ల వెంట నీ అసలు ప్రదేశానికి వెళ్లిపోవడం మంచిది. పైగా ఇక్కడికొచ్చే సందర్భంలో లేని ఆలోచన, నీకు ఇక్కడికొచ్చాక వచ్చిందనేది సుస్పష్టం కదా! ఈ అభిప్రాయాన్ని నువ్వు నీ ఇంటికెళ్లి చెప్పిన పక్షంలో నీ అభిప్రాయాన్ని గౌరవిస్తూ వాళ్లు కూడా నీకు తగిన ఏర్పాట్లని నీకిక్కడ చేసే ఆలోచనతో ఓ మనిషిని తోడుగా ఉంచేవారేమో? సరే! ఇదంతా అలా ఉంచితే.. మాకు తెలిసి సాయి ఎవ్వరికీ ఏనాడూ మంత్రాన్ని ఉపదేశించిన జాడ లేదు. ఆయనకాయన అల్లా మంత్రాన్ని జపించుకుంటూ ఉండడాన్నే గమనిస్తున్నాం. ‘ఏమైనా సాయి నీకు మంత్రోపదేశాన్ని చేస్తే తప్ప దీక్షని విరమించనంటూ చెప్తూ భక్తులందర్నీ నువ్వు ఆయోమయానికి గురి చేస్తూ ఉంటే, మా అంతట మేమే స్వయంగా వచ్చి చెప్తున్నాం! సాయి ఏ ఒక్కరికీ మంత్రోపదేశాన్ని చేయలేదు– చేయడు– చేయబోడు. చివరికి అభాసుపాలు కాకుండానూ, నీ పెద్దరికానికి తగినట్లూనూ ఈ (మొండి) పట్టుదల పట్టకుండా ఈ దీక్షని విరమించవలసింది’ అని. ఆమె వీరి మాటల్ని వింటూ కూడా మౌనంగానే ఉండి వీళ్లని అసలు పట్టించుకోనేలేదు. చూస్తూ ఉండగానే 3 రోజులయ్యాయి. ఆమె మరింతగా క్షీణించింది. ఎప్పుడైనా ఆమెకి ఏదైనా జరుగుతుందేమో? అనే భయం కలగజేస్తోంది అందరికీ ఆమె శారీరక స్థితి. వెంటనే శ్యామా, సాయి వద్దకి వెళ్లి పాదాభివందనం చేసి నేల మీదే కూర్చుని సాయితో వృద్ధురాలి గురించీ ఆమె శారీరకస్థితిని గురించీ వివరించి ‘సాయి భగవాన్! నీకంతా ప్రశాంతంగా కనిపించవచ్చు. మాకు మాత్రం గుండెల్లో మేఘాలు గర్జిస్తూన్నట్లే ఉంది ఆమె విషయం. జరగరానిదేదైనా జరిగితే మసీదుకీ నీకూ మాకూ...’ అంటూ తన కంఠం గద్గదమైపోగా మౌనంగా ఉండిపోయాడు మాట రాక. సాయి ఒక్కసారి శూన్యంలోకి చూసి ‘శ్యామా! ఆమెని పిలిపించు!’ అన్నాడు. తన ఆశ నెరవేరుతోందనే అభిప్రాయంతో ఆమె అంత నీరసంలోనూ కూడా చెంగుచెంగున సాయిని చేరి పాదాభివందనం చేసి ఆయన ముందు కూర్చుంది. సాయి చెప్పడం ప్రారంభించాడు. ‘తల్లీ! అని సంబోధించి.. ఆమె కళ్లలోకి సూటిగా చూస్తూ... ‘అమ్మా! నిన్ను ఓ స్త్రీగా భావించి ఇలా పిలవడం లేదు.. నిజంగా నేను నీ బిడ్డణ్ణి. నా అదృష్టమేమంటే ఎందరో తల్లుల బిడ్డణ్ణి నేను. ‘భవతీ భిక్షాం దేహి!’ అని అడిగితే అమ్మ పెడుతుందంటారు. అయితే ఈ పిలుపే అవసరం లేకుండా వాళ్లంతట వాళ్లే అంటే ఆ అందరు అమ్మలే నాకు బిచ్చాన్ని ఏదో బిచ్చంలా కాకుండా నా జోలెలో వేస్తూంటే బతికే పకీరుని. ఎక్కడైనా బిడ్డడు బాధని అనుభవిస్తూ ఉంటే తల్లి వాడి కన్నీళ్లని తుడిచి ఓదారుస్తుంది. నువ్వేమిటమ్మా? ఆత్మహత్య దిశగా ఈ నిరశన దీక్షకి దిగావు? మంత్రోపదేశం కావాలంటున్నావట! నాకో గురువుండేవాడు. ఆయన్ని 12 సంవత్సరాల పాటు సేవించాను. సరిగ్గా నీలాగే మంత్రోపదేశం చేయవలసిందని ప్రార్థించాను. ఆయన తనకి 2 పైసలు కావాలన్నాడు. మంత్రం వస్తోంది కదా అని ఇచ్చాను. ఆయన నన్ను చూస్తూ ఈ రెండు పైసలూ ఏమిటో తెలుసా? శ్రద్ధా సబూరి(సహనం) అన్నాడు. ఆ క్షణంలో నాకర్థం కాలేదు కానీ.. ఓ రోజు పాటు నాలో నేను తర్కించుకున్నాక తెలిసింది – ఒక పని పట్ల శ్రద్ధగా తిరిగి ప్రారంభించి పూర్తి చేసి తీరాలనే సబూరీ (సహనం) అనేది ఉంటే జీవితానికి చాలు అని. ఆయన శ్రద్ధా సబూరీ అనే ఈ రెండూ తన ఉపదేశాలన్నాడు. తల్లి తాబేలు సముద్రపు ఒడ్డున ఉండే తన పిల్లలైన తాబేళ్లని ఏనాడూ చూడలేదు. చూసినా ఏవి తన పిల్లలో అన్ని వేల తాబేళ్లలో గుర్తుపట్టలేదు కూడా. అయినా భగవంతుడెంత గొప్పవాడంటే.. ఆ తల్లి తాబేలు తన పిల్లల్ని అలా ఒక్కసారి గుండెనిండుగా తలుచుకోగానే ఆ పిల్లలైన తాబేళ్లన్నీ తల్లిని తలుచుకుంటాయి. కడుపులు నిండిపోయిన ఆనందంతో నడిచేస్తాయి. ఈదులాడుతాయి. అలా నా మీద నీకు అంతటి ఇష్టమే ఉంటే నన్ను తలుచుకో కన్నతల్లీ! ఇంతకీ విశేషమేమంటే ఈ మాటల్ని చెప్పిన నా గురువు ఏ మంత్రాన్నీ నాకే ఉపదేశించలేదు. ఆయన అడుగుజాడల్లో నడవాల్సిన నేను– నాకే మంత్రం లేనప్పుడు ఎలా ఉపదేశం చేయగలనమ్మా? దయచేసి బిడ్డణ్ణి కనిపెట్టమ్మా!’ అన్నాడు. ఆమె కళ్ల వెంట ధారాపాతంగా కన్నీరు రాసాగింది. ‘సాయీ! అంటూ ఆయన పాదాలమీద పడి ‘తప్పైపోయింది’ అంటూ వినమ్రంగా మెట్లు దిగిపోయి తన ఊరికి వెళ్లింది. పైవారం– విరిగిన ఇటుక చెప్పిన విశేషం. -
సాయి వాణి యదార్థ భవిష్యవాణే
ఎన్ని అవయవాలు మన శరీరంలో దాగి ఉన్నా.. మనం ఎవరమో, ఎలాంటి లక్షణాలు కలవాళ్లమో ఎదుటివాళ్లకి తెలియపరచుకునేందుకు లేదా తెలిసేందుకు అదే విధంగా ఆ ఎదుటివాళ్లని గురించిన ఓ అవగాహన మనకి కలిగేందుకూ ప్రధానంగా సహకరించేది నోరు మాత్రమే. ఆ నోటి నుంచి వెలువడే మాట ప్రకారమే కార్యకలాపాలన్నీ సాగుతాయి.అయితే ఈ మాటని సంస్కృత భాషలో ‘వాక్కు’ అంటారు. ఆ వాక్కుని వినగానే దాని నుంచి వచ్చే భావాన్ని ‘అర్థం’ అంటారు. ఈ వాక్కు, అర్థం అనే రెండింటి గురించీ అలాగే రెండింటి మధ్య ఉండే సంబంధం కొద్దిపాటిగా తెలిస్తే తప్ప ఈ వ్యాసం, తద్వారా సాయితత్త్వం మనకి తెలియదు. కాబట్టి క్లుప్తంగా తెలుసుకోవలసిందే. లౌకికానాం హి సాధూనా మర్థం వాగనువర్తతేఋషీణాం పునరాద్యానాం వాచ మర్ధోను ధావతిఇది మహాకవి చెప్పిన మాట.లౌకికులమైన మనం ఏదైనా మాట్లాడాలనుకున్నప్పుడు, అది ఏ విధంగా ఎదుటివాడికి అర్థాన్నియ్యాలో, ఎలా బోధపడాలో దాన్నంతా ముందుగా మనం ఆలోచించి, అనుకుని, అదే అర్థం వచ్చేలా దానికి సరిపోయిన మాటల్ని (వాక్కు) ఒకచోట చేర్చి ఆ మాటలనే మాట్లాడతాం.‘అయం ఘటః’ ఇది ఓ కుండ అని ఈ మాటకి అర్థం. ‘నల్లగా ఉన్నదీ, ఏదో ఓ వస్తువుని దానిలో ఉంచుకునేందుకు వీలైనదీ, మట్టితో చేయబడినదీ అయిన ఇది కుండ’ అని ఇంత అర్థాన్ని లోపల అనుకుని దానికి సరిపడిన ఘటం (కుండ) అనే వాక్కుని అంటాం. ఇది మనకి అనుభవంలో తెలిసిన విషయం– నిత్యవ్యవహారంలో సాగుతున్న అంశం కూడా.అదే మరి ఋషులుగానీ మాట్లాడవలసివస్తే.. వాళ్లు మనలా అర్థాన్ని లోపల కుదుర్చుకుని, దానికి సరిపడ్డా వాక్కులని (మాటల్ని) కూర్చుకుని మాట్లాడరట. వాళ్లు ముందుగా వాక్కుని (మాటని) అనేస్తారు. ఆ మీదట ఆ వాక్కుని బట్టి అర్థం ఏర్పడుతుందట. కద్దిగా వివరించుకుంటే.. ఓ ఋషి ఓ వ్యక్తిని ‘త్వం రాక్షసో భవ!’ నువ్వు రాక్షసుడివి అయిపోదువుగాక! అని అన్నట్లయితే, ఆ ఋషి ఈ వ్యక్తిని చూసి ముందుగా ఈ అర్థాన్ని లోపల అనుకుని దానికి సరిపోయినట్లుగా వాక్కులని అనడమన్నమాట. కడుపు మండిన ఆవేదనతో ఈ వాక్కులని అనగానే ఎదుటివ్యక్తిలో రాక్షస లక్షణాలు(కోరలూ, కొమ్ములూ మిడిగుడ్లూ, భయంకర వికృతదేహం, తుమ్మముళ్లు వంటి రోమాలూ, వికటాట్టహాసం...) అలా చూస్తూ ఉండగానే ఒకటికొకటిగా ప్రవేశిస్తూ క్షణాల్లో రాక్షసుడిగా అతడు కనిపించేస్తాడన్నమాట. ఇలాంటి సంఘటనలని మనం నిత్యం అనేక పురాణకథల్లో వింటూనే ఉంటాం కదా!సాయి చరిత్రతో ఏమిటి సంబంధం?ఇదేదో వినడానికి బాగానే ఉంది గానీ.. దీనికీ– సాయి చరిత్రకీ సంబంధమేమిటి? అని అనిపిస్తుంది కదా! ఏ ఋషులైతే రాబోయే సంఘటనలని తమ తపశ్శక్తితో ముందుకు ముందే దర్శించగలరో అలాంటి శక్తే సాయికి కూడా ఉందనే విషయాన్ని సాక్ష్యాధారాలతో నిరూపించడానికీ, అలా నిరూపించి సాయి తపశ్శక్తి స్థాయి ఎంతటిదో తెలియజేయడానికీనూ.ఈ తీరుగా నిరూపించని పక్షంలో– సాయికి రాబోయే కాలంలో ఏం జరగబోతోందో ఎలా తెలుసు? అని ఎవరైనా అడిగితే – ఆయన దేవుడు గదా! ఆయనకి తెలియనిదేముంటుంది? అని టక్కున సమాధానం చెప్పేస్తారు. ఇంకాస్త లోతుకి దిగి అవతలి వ్యక్తి ‘ఆయనే గనుక దేవుడయ్యుంటే ఎవరికీ కనిపించకుండా ఉండాలిగా!? తన దైవమహిమతో ఎవరికీ అసలు కష్టాలే రాకుండా చేసేయొచ్చు కదా!? అయినా కాలకృత్యాలు చేస్తుండే ఎవరూ దైవం కానేకాడంటూ మీ పురాణాలే చెప్పాయిగా!?’ అంటూ ప్రశ్నిస్తే సమాధానాన్ని చెప్పలేక – అలా మాట్లాడితే కళ్లుపోతాయి! అయినా ఇలాంటి దుర్విమర్శలని విన్నా కూడా పాపమే! అంటూ వెళ్లిపోతూ కనిపిస్తారు ఎందరో భక్తులు. ప్రతి పనికీ ఒక హేతువు ఉండి తీరుతుంది. ఆ దృష్టితో దాదాపుగా ఎవరూ ఆలోచించరు. సాయి నిజానికి మనిషే అయినా ఆ అతీంద్రియ శక్తి ఎలా వచ్చింది అనే ధోరణితో ఆలోచిస్తేనూ, ఆ అతీంద్రియశక్తికి సంబంధించిన సాక్ష్యాలని తెలుసుకుంటేనూ ఆయన ఎలా అందరికంటే ఉన్నతస్థితిని సాధించగలిగాడో మనకి అర్థమవుతుంది. దాంతో సాయి గురించి చేసే దుర్విమర్శలనీ, అలాగే వ్యతిరేక ప్రచారాలనీ తిప్పికొట్టగలగడమే కాక, హేతుబద్ధమైన సమాధానాలని చెప్పి సాయికున్న గొప్పదనాన్ని ధైర్యంగా నిరూపించగలం. అందుకే సాయికున్న అతీంద్రియశక్తి ఎలా ఆయనకి లభించిందో మనం తప్పక తెలుసుకుని ఉండాల్సిందే! ఈ దృష్టితో పరిశీలిస్తున్నాం కాబట్టి ముందుగా ఆయనకున్న అతీంద్రియ శక్తిని నిరూపించే ఒకటి రెండు సంఘటనలని వివరించుకుని, ఆ శక్తి లభించడం వెనకున్న కారణాన్ని తెలుసుకుందాం! ఆగవయ్యా బాబూ! ఆగు!! సాయి తన మసీదుకి ఎవరొచ్చినా జాతి, మత, కుల, స్త్రీ, పురుష, ముసలి, యువక, వితంతు భేదాలని వేటినీ పరిగణించకుండా అందరినీ – భోజనం చేసి మాత్రమే వెళ్లండి – అని చెప్పేవాడు. దాదాపుగా భోజన సమయానికి వచ్చి ‘రైలు వెళ్లిపోతుంది... అవతల పనుంది...’ అంటూ ఎవరైనా వెళ్లినట్లయితే అనుకున్న రైలు దాటిపోవడం లేదా ఆలస్యం కావడం కారణంగా ఇటు భోజనం అటు ప్రయాణమనే రెండూ సాగక కచ్చితంగా ఇబ్బందికి గురవుతూ ఉండేవారు భక్తులు. ఇది ఏ ఒక్కరికో కలిగిన అనుభవం కాదు. అందుకే సాయి మాటని వింటే దాన్ని ఓ ఆదేశంగానే భావించే వారు తప్ప ఎవరూ ధిక్కరించి వెళ్తూ ఉండేవారు కానే కాదు. అందరినీ ఉద్దేశించి చెప్పే మాట కంటే ప్రత్యేకంగా ఎవరితోనైనా సరే ఏదైనా చెప్తే ఇక ఆ మాటకి పర్యవసానం మరింత తీవ్రంగా ఉండేది. పాటిల్ తాత్యాకోతే అనే సాయి సన్నిహిత భక్తుడు వారం వారం జరిగే సంతకి వస్తూ ఉండేవాడు. ఆ వచ్చినప్పుడు సాయిని దర్శించి షిర్డీకి 3 మైళ్ల దూరంలోని కోపర్గావ్ సంతకి వెళ్తూండేవాడు. అలా ఒకసారొచ్చి వీధిలోనే టాంగాని నిలిపి సాయి వద్ద కొచ్చి పాదాభివందనం చేసి తాను వెళ్లడానికి అనుమతినీయవలసిందని సాయిని కోరాడు. సాయి చిరునవ్వు నవ్వుతూ – ‘ఎందుకలా తొందరపడుతూ టాంగాని కూడా అక్కడే నిలిపి.. వచ్చీ రాగానే వెళ్లిపోతావెందుకు? కాస్త ఆగవయ్యా బాబూ! ఆగు! ఒక్క నిముషం ఉండు! సంతదేముంది? ఎక్కడికీ పోదు! తర్వాత వెళ్దువుగానీ ఆగు! ‘ఇప్పుడు మాత్రం నువ్వు షిర్డీని దాటి ఊరు బయటికెళ్లకు!’ అని ఇంత వివరంగా అన్నాడు అతనితో. అయినా పాటిల్ తొందరని తన ముఖంలో చూపిస్తూ మళ్లీ ఓ నమస్కారాన్ని చేసి – తప్పనిసరిగా వెళ్లాల్సిందే! – అనే నిర్ణయంతో మసీదుమెట్లని దిగుతూ ఉంటే సాయి గమనించాడు. ‘సరే! తొందరగా వెళ్లాలంటున్నావుగా! శ్యామాని నీ వెంట తీసుకెళ్లు. ఒంటరిగా ప్రయాణం చెయ్యకు!’ అని మళ్లీ అన్నాడు సాయి. అలా రెండుమార్లు సాయి వద్దేవద్దని చెప్పడంలోని ఆంతర్యం పాటిల్‌కి అర్థం కాలేదు. సాయి కూడా వివరించి చెప్పనూ లేదు.సాయి మాటని ఓ ఆజ్ఞగా భావించే శ్యామా ఈ పాటిల్‌తో బయలుదేరడానికి సిద్ధపడుతూ ఉంటే.. అంత అవసరమేముంది? వద్దులే! అన్నట్లు చేసంజ్ఞ చేసి చెప్తూ తానొక్కడే బయలుదేరాడు కోపర్గావ్ అనే సంత జరిగే ప్రదేశానికి. టాంగాకున్న రెండు గుర్రాల్లో ఒక దాన్ని ఈ మధ్యే కొన్నాడు. దానికి వేగంగా పరిగెత్తి తన శక్తిని చూపించుకోవాలనే అత్యుత్సాహం తప్ప మరేదీ తెలియదు. టాంగాని అదిలించగానే బయలుదేరాయి గుర్రాలు.తీవ్రమైన వేగంతో గుర్రాలు పరుగెత్తడం ప్రారంభించాయి. ఎత్తుపల్లాల గురించి పాటిల్ పగ్గాలు లాగి వేగాన్ని తగ్గించాడు. మళ్లీ ఆ పల్లాన్ని దాటాక చురుగ్గా లాగవలసిందని సూచించడం కోసం గుర్రాలు రెండింటినీ తన చేతి కొరడాతో పెద్ద దెబ్బ తగులకుండా కొట్టాడు. మొదటి గుర్రానికి ‘కొరడా – దానితో కొడతారు’ అనే జ్ఞానముంది గానీ.. ఈ కొత్తగా వచ్చిన రెండో గుర్రానికి ఆ ఆలోచన లేదు– అదే ప్రథమానుభవం కావడంతో. అంతకుముందు రెండు మూడు సంతలకి వెళ్లిన కారణంగా ఆ తోవ ఈ రెండో గుర్రానికి తెలిసి అదే మార్గంలో వెళ్తున్నా – ఈ కొరడా దెబ్బ తనకి మొదటిసారి అయ్యేసరికి విపరీతమైన వేగంతో పరిగెట్టేది కాస్తా ఒక్కసారిగా మోకాళ్ల మీద కూచుండిపోయింది. దాంతో టాంగా మొత్తం ఓ పక్కకి ఒరిగిపోయింది. అకస్మాత్తుగా జరిగిన సంఘటన అయిన కారణంగా పాటిల్‌కి నడుము విరిగినట్లే అనిపించింది. ఏం జరిగిందో అర్థం కావడానికి రెండు మూడు నిమిషాలు పట్టింది.మెల్లగా టాంగాని దిగాడు పాటిల్. ఇక ఎవరూ తనకి గుర్తు రాలేదు. సాయి మాటలే చెవిలో వినపడసాగాయి. ‘ఆగవయ్యా బాబూ ఆగు!... పోనీ నీతో శ్యామాని కూడా తీసుకెళ్లుతోడుగా! ఒంటరిగా మాత్రం వెళ్లకు! ఊరుదాటి బయటికి వెళ్లకు!’ అనేవే. పాటిల్‌కి సాయి మాటల్లోని అర్థం, భావార్థం, తాత్పర్యం కూడా స్పష్టంగా తెలిసినట్లయింది. తానే తనలో చిరునవ్వు నవ్వుకున్నాడు– సాయిని గురించి తెలిసి కూడా ఇలా ఎందుకు చేశానా? అని. వెంటనే సాయినామస్మరణని అనేక పర్యాయాలు చేసుకుని, సంతపని చేసుకుని కృతజ్ఞతలని సాయికి మనసులోనే తెలియజేసుకుంటూ ఆ ప్రదేశాన్ని వీడి వెళ్లిపోయాడు. ఇదేమిటి? మళ్లీ చేశానా?ఈ సంఘటన జరిగి కొంతకాలం అయిపోయింది. మళ్లీ ఇదే పాటిల్ షిర్డీకి సమీపంలో ఉన్న ‘కొల్లార్’ అనే గ్రామానికి టాంగా మీద బయలుదేరాడు. మార్గం మధ్యలో ఉన్న షిర్డీకి వెళ్లి మసీదులో ఉన్న సాయిని దర్శించి పాదాభివందనం చేసి సాయి ఆజ్ఞ కోసం కళ్లలోకి చూస్తూ – ‘దేవా! ఇలా వెళ్లి అలా తిరిగొచ్చేస్తాను’ అన్నాడు నోరు తెరిచి. సాయి ఆ పాటిల్‌ని చూస్తూ ‘వెళ్లు అనలేదు, వెళ్లద్దు అని కూడా అనలేదు. వెళ్లద్దని కిందటిసారిలా అనలేదు. ‘అంతే కాకుండా మరొకరిని తోడుగా తీసుకెళ్లు అదీ కాక ఊరిని దాటి వెళ్లద్దు’ వంటి మాటలేమీ అనలేదు. దాంతో పాటిల్ దాన్ని సాయి వ్యతిరేకత అలాగే సాయి ఆజ్ఞా అనే రెండు లేనట్లుగా భావిస్తూ బయల్దేరాడు పూర్వంలాగానే. పూర్వపు టాంగా కాదిది. ఇది దానికంటే చిన్నది. అంతేకాక తేలికైనది కూడా. గుర్రాలు మాత్రం బలిష్ఠంగా ఉన్నవి. యవ్వనంలో కూడా ఉన్నవీ అయిన కారణంగానూ, టాంగా తమకి సరిపోయిన బలంగా ఉన్నది కాకపోయిన కారణంగానూ వేగంగా లాగుతూ పరిగెత్తసాగాయి. రెండింటికి రెండూ పోటీపడుతూ గోతులు, గొçప్పులు, చిన్న చిన్న నీటి కాలవలూ వచ్చినా కూడా లెక్కచేయకుండా పరిగెత్తేయడంతో పాటు వేగాన్ని తగ్గించడం కూడా లేకుండా సాగిపోతూ సాగిపోతూ పెద్ద గోతిలో కూలబడిపోబోయి ఓ క్షణంలో పక్కకి తిరిగి మార్గం పక్కన ఉన్న తుమ్మచెట్టుని గుద్దుకుని ఆగిపోయాయి. తుమ్మ చెట్టు విరిగిందంటే గుర్రాల వేగాన్ని లెక్కించుకోవచ్చు. టాంగా కూడా బాగా దెబ్బతింది. అక్కడి నుండి తిరిగి పాటిల్ తన గ్రామాన్ని చేరడానికి çపడ్డ శ్రమ ఇంతా అంతా కాదు.తన నడుం విరక్కుండా, కాళ్లూ చేతులూ ఇతర భాగాలకీ ఏ దెబ్బలూ తగలకుండా సాయిౖ దేవుడే రక్షించాలనే దృఢవిశ్వాసం కలిగిన పాటిల్ ఇక ఎప్పుడూ సాయి ఆజ్ఞని పాటించి తీరాల్సిందే! అని దృఢనిశ్చయానికి వచ్చేశాడు. సాయి మాట్లాడిన ప్రతి మాటనీ బాగా విశ్లేషించుకుని స్పష్టంగా అర్థం చేసుకున్నాకనే ఏ పనినైనా చేయాలని నిశ్చయించేసుకున్నాడు. అప్పుడనుకున్నాడు పాటిల్– ఇదేమిటి? ఒక్కసారి బుద్ధొచ్చాక కూడా మళ్లీ ఇదే తప్పు చేశానా? అని.మరొక్క సంఘటనఒకసారి ఒక ఆంగ్లేయుడు సాయి దర్శనానికొచ్చాడు. ఒకరి నుంచి సిఫారసు ఉత్తరం కూడా తీసుకొచ్చి బాబాను దర్శించుకోవాలనుకుంటున్నానని చెప్పాడు అక్కడి వారితో. వారంతా అన్నారు ‘సాయి అనుమతీ, ఆజ్ఞా లేనిదే మసీదు మెట్లని ఎక్కనేలేవు’ అని. మూడు మార్లు తీవ్ర ప్రయత్నం చేసినా సాయి అనుమతినీయలేదు.3 రోజుల పాటు ఓ గుడారాన్ని వేసుకున్నా అతనికి సాయి అనుమతి లభించనే లేదు. ఇక నిరాశతో ఇంటికి వెళ్లిపోదామనుకున్న వేళ – మెట్లు దిగి వెళ్తున్న సాయి దర్శనం అతనికి లభించింది. అనుమతిని కోరాడు సాయిని. – ‘అంత తొందరెందుకు? రేపు వెళ్లచ్చు కదా!’ అన్నాడు సాయి అతనితో. అయినా అతను ‘‘4 రోజుల పాటు ఉన్నాను. దర్శనం కూడా అయ్యింది. ఇంకా దేనికి ఉండటం?’’ అనుకుంటూ బయల్దేరబోతుంటే– భక్తులందరూ సాయి అనుమతిని పొందాకే వెళ్లడం మంచిదని ఏకగ్రీవంగా చెప్తూ ఒకటి రెండు దుస్సంఘటనలని వివరించి చెప్పారు కూడా! అయినా అతడు విరమించలేదు ప్రయాణాన్ని.ఆ ఆంగ్లేయుడు టాంగాని ఎక్కి వెళ్తూ ఉంటే గుర్రాలు మొదట్లో మెల్లగానే ప్రయాణించసాగాయి. తర్వాత వేగాన్ని పుంజుకున్నాయి. అలా వెళ్తూన్నప్పుడు ఓ వ్యక్తి సైకిలు మీద గుర్రాలకి అడ్డంగా మార్గాన్ని దాటుతూ వేగంగా వెళ్లిపోయాడు. ఎప్పుడూ అలాంటి రాకని ఎరుగని గుర్రాలు ఒక్కసారిగా బెదిరిపోయాయి. దాంతో టాంగా అదుపు తప్పింది. ఆంగ్లేయుడు నేలమీద పడిపోయాడు. లేచే సత్తువ లేకపోయింది. ఎవరో సహాయపడి మొత్తానికి అతడ్ని అతను కోరిన చోటుకి పంపారు. ఆసుపత్రిలో పడి కొంతకాలం పాటు చికిత్స చేయించుకున్నాడు కూడా.అప్పుడు అతనికి అర్థమైంది – సాయి వాక్కుకి ఉన్న శక్తి ఏమిటో!ఎక్కడిది ఈ శక్తి?‘మననాత్ త్రాయతే ఇతి మంత్రః’ ఏ దైవనామాన్నయితే నిరంతరం మననం చేస్తారో ఆ కారణంగా అలా మననం చేసిన వ్యక్తికి ఓ శక్తి వచ్చి చేరుతుంది. ఆ శక్తి ఆ తీరుగా మననం చేసిన వ్యక్తి మాటలోకి వెడుతుంది. దాంతో ఆ వ్యక్తికి జరగబోయే సంఘటనతో పాటూ తాను ఏదంటే అదే జరిగే అతీంద్రియశక్తి అబ్బుతుంది. అందుకే అలాంటి వ్యక్తులు మనలా కాక ఆచి తూచి మాట్లాడుతూ ఉంటారు.సాయి నిరంతరం ‘అల్లాహ్ హో మల్లిక్!’ అనే నామాన్నే ఒకప్పుడు 12 ఏళ్ల పాటు నేలమాళిగలో, ఆ మీదట వేపచెట్టు కింద, ఆ తర్వాత అడవిలో, ఆ తర్వాత కూడా ఎప్పుడూ విరామం దొరికితే అప్పుడు మననం చేస్తూ ఉండటంతో ఆ శక్తి వాక్కుకొచ్చింది. అదీ నిజమైన కారణం– అదే యథార్థ కారణం.పైవారం సాయి మసీదులో కనిపించే హిందూ సంప్రదాయాలు (సాయిలో సన్యాసధర్మం మసీదులో హైందవ ధర్మం).– సశేషం - డా. మైలవరపు శ్రీనివాసరావు -
సాయి బోధ సుధ
ఎందరికో ఓ పెద్ద ధర్మసందేహం.. సాయి ఓ మహమ్మదీయుడు కదా! ఆయన నిత్యం జపించే మంత్రం ‘అల్లాహ్ హో మాలిక్!’ అనేదే కదా! అని. అలాగే హిందూ ధర్మంలో ఉండే ఆచారవ్యవహారాలని వేటినీ పాటించే లక్షణం లేనివాడు కదా! పైగా హిందూ ధర్మంలో ఏ పూజాపురస్కారాలూ ముఖ్యమైన పర్వదినాలూ వస్తే ఏ ఉపవాసపద్ధతిని అవశ్యం పాటిస్తారో, ఆ ఉపవాసవిధికి ఆయన పూర్తి వ్యతిరేకి కావడమే కాకుండా, ఇతరుల్ని కూడా ఉపవాసవిధానం సరికాదని బోధించే వ్యక్తి కూడా కదా! హైందవవిధానంలో స్త్రీలు అశుచి(నెలసరి) గా ఉండే మూడురాత్రుల పాటూ ఇంట్లో ఉన్న దైవమందిరం వైపు కూడా కనీసం చూడనే చూడకుండా దైవానికి అడ్డుగా అంటే మనకి ఆయన కనబడకుండా ఓ పరదాని వేసేస్తారు కదా! అలాంటిది ఆయన సంప్రదాయాన్ని కాదంటూ స్త్రీలు నెలకి నెలరోజులూ దర్శనానికి రావచ్చునంటారెందుకని? అలాగే ఎవరైనా దురదృష్టవశాత్తూ మరణించినట్లయితే ఆ మరణించిన వ్యక్తితో మనకుండే బాంధవ్యపు దగ్గర – దూరపు తనాలని బట్టి – ఇన్ని రోజుల పాటు ఆశౌచాన్ని(మైల) పాటించాలనే నియమముంటే దాన్ని కూడా ఆయన పరిగణనలోకి తీసుకోకుండా ఎప్పుడైనా సరే దర్శనానికి దోషం లేనే లేదంటూ ఎలా చెప్తారు? అని ఈ తీరుగా అనేక సందేహాలు వెలిబుచ్చుతుంటారు ఎందరో. సాయి తన భక్తులందరూ ప్రశాంతంగా కూర్చున్న వేళ సాయికి సమయం ఉందని అనిపించిన వేళ ‘సాయినాథా! ఏదైనా చెప్పవూ?’ అని అడిగితే కొద్దిగా అర్థం చేసుకుందామనే దృష్టితో ఉన్న 15 సంవత్సరాల పిల్లవాని నుండి ఎంతటి వయసు వారికైనా బాగా అర్థమయ్యేలా వేదాంతాన్ని తన ఆత్మసంతృప్తికి మాత్రమే చెప్పుకుంటూ ఉండేవారు. ఏనాడూ ఏ భక్తుడినీ, భక్తురాలినీ విని తీరవలసిందే! అని నిర్బంధిస్తూ ఉండేవారు కానే కాదు. ఇంతకీ ఆయన చేసిన వేదాంతబోధని(మరాఠీ భాషలో ఉన్న ఓవీలనే పేరున్న ఛందోబద్ధగేయాల్లో ఎలా ఉందో) గమనిద్దాం! సాయి చెప్పడం ప్రారంభించాడు ఇలా. మనిషి – మరణం భక్తులారా! ప్రతిరోజూ ఉదయం అలా చూస్తూ ఉండగానే సాయంత్రం కొద్దిసేపటికి రాత్రీ అయిపోయి ఒకరోజు గడిచిపోతూ ఉంటుంది. కొన్నాళ్లయ్యాక అప్పుడే సంవత్సరం అయిపోయిందా? చిత్రంగా ఉందే! అనిపిస్తుంది కదా! అలాగే మనిషి జీవితం కూడా సగం నిద్రలో పోతుంది. 12 ఏండ్లు బాల్యంలో గడిచిపోతుంది. వృద్ధాప్యం (+65 ఏళ్లు) సంసారపు ఎత్తుపల్లాల ఆలోచనలతో ముసలితనం రోగాలూ రొప్పులతో వెళ్లిపోతుంది. ఈ మధ్యలో ఉండే కాలంలో యవ్వనమంతా భార్యపట్ల ఆసక్తి వినోదం, విహారం, విలాసం..తో గడిచిపోతుంది. ఇదే విధంగా కుక్కలు, పందులు, పశు పక్ష్యాదులూ కూడా జీవనాన్ని గడిపేస్తున్నాయి కదా! అయితే బతికే కాలంలో హెచ్చుతగ్గులుండచ్చు గాని జీవనవ్యవస్థ ఇదే కదా! మరి నరజన్మకున్న గొప్పదనమేమిటి?\కొలిమిలో మంటని మండించడానికున్న తిత్తులు కూడా గాలిని పీల్చి విడుస్తాయి. వాటిలాగే మనం కూడా ఉచ్ఛ్వాస నిశ్వాసాలని చేస్తూ ఉంటే మనకీ వాటికీ తేడా ఏముంది? ఏముంటుంది? ప్రతి వ్యక్తీ మరణ భయంతోనే జీవిస్తూ ఉంటాడు. తన తల్లిదండ్రులు పోయిన సందర్భంలో తానే చితికి నిప్పంటించి ఉండి కూడా తనకి మరణమే లేదన్నట్లుగా ధైర్యంగా ఉంటాడు. అదే నిజమైన మాయ అనే తెర. ఒక్క మాటలో చెప్పాలంటే మరణం లేకుండా ఉండేవరాన్ని కోరి, దైవం ద్వారా ఆ వరాన్ని పొంది కూడా మరణించారుగా కొందరు. (హిరణ్యకశిపుడు రావణుడు..) అంతదాకా ఎందుకు? మార్కండేయుడ్ని చిరంజీవి అంటారు. శివుని కారణంగా మరణాన్ని జయించి చిరంజీవి అయ్యాడు. ఆయన కూడా 14 కల్పాలు దాటాక మరణిస్తున్నాడా లేదా? ఇదంతా ఎందుకు ఈ ఫకీరు చెప్తున్నట్లు? అనుకోవచ్చు మీరు. మరి ఇంత అశాశ్వతం అనిత్యం పైగా మరణధర్మం కలిగిన ఈ శరీరాన్ని ఏ పశువులానో, పక్షిలానో, మృగంలానో విడిచేస్తే నరజన్మ గొప్పదనమేముంది? గమనించండి. అందుకే మహాత్ముల పుణ్యకథలని వింటూ వాళ్లని స్మరిస్తూ – ఏ పుణ్యాత్ముడివల్లనో ఉపదేశించబడిన మంత్రాన్ని మననం చేసుకుంటూ సాధన మార్గంలోనికి వెళ్తే అలా గడిపిన కాలం మాత్రమే సార్థకమవుతుంది. ఇలాంటి భావం ఎవరికైతే కలుగుతుందో అతని జన్మ సఫలమైనట్లే. మనిషి –తానూ తన కుటుంబం సంతానం అభివృద్ధి ఐశ్వర్యం సంపాదన... ఇదే ధోరణిలో వెళ్తూ తన ఆయుష్యాన్ని వ్యయం చేసేసుకుంటున్నాడు. చేపలు పట్టేవాడు వలని వేసి బలంగా లాగినట్టు కాలమనేది మనిషి ప్రాణాలని లాగేస్తుంది. ఆ మరణసమయంలో మనిషి వలలో పడ్డ చేపకి తనకి గాలి ఆడక ఎగిరెగిరి పడేటట్టు విలవిలా తన్నుకుంటూ మరణిస్తాడు. ఆ సమయంలో ఈ పొలాలు, భూములు, ఇళ్లు, వ్యాపారాలు.. ఏవీ గుర్తుకురావు. చచ్చిపోయాక సాధన చేయడం అసాధ్యం కదా! కాబట్టి బతికుండగానే మంత్రాన్ని మననం చేస్తూ ఆ సాధన క్రమంలో నడిచే ప్రయత్నాన్ని చేయండి. ‘ఈ జన్మకేదో ఇలా అయిపోయాను గానీ, పై జన్మలో పుట్టుకనుండీ సాధన మార్గంలోనే జీవించదలిచాను’ అనుకోవడం వట్టి మూర్ఖత్వం. ఎందుకంటే రాబోయే జన్మలో – నువ్వు నరజన్మ ఎత్తడం కష్టమట. దాన్లో కూడా పురుషునిగా పుట్టడం మరింత దుర్లభమట. (తనతో పాటు భార్యాపుత్రుల్ని పోషించే సమర్థత కలిగి ఉండటం) ఆ పురుషజన్మలో కూడా విప్రునిగా (బ్రాహ్మణునిగా) జన్మనెత్తడం ఇంకా అనూహ్యమైన విషయమట. (పుట్టుకతో అందరూ శూద్రులేనట. ఉపనయన సంస్కారం కారణంగా ద్విజుడు అవుతాడట. ఆ సంస్కారం ఏ వేదవిద్యని అభ్యసించే అర్హతని పొందడానికో అలాంటి వేదవిద్యని పొందడం చేత విప్రుడు అవుతాడట. జన్మనాజాయతే శూద్రః – సంస్కారా ద్ప్విజ ఉచ్యతే– విద్యయా యాతి విప్రత్వమ్) అలాంటి విప్రజన్మలో అతనికే గాని వైదుష్యం (ఇతరుల సందేహాలని ప్రమాణబద్ధంగా తీర్చగలిగిన పాండిత్యశక్తి) ఉంటే ఇక అతని జన్మధన్యమట’ అని. (జంతూనాం నరజన్మ దుర్లఛ–మతః పుంస్త్వం– తతో విప్రతా–తస్మా ద్వైదికమార్గధర్మపరతా– విద్వత్వమస్మాత్పరమ్– అనేది ప్రమాణశ్లోకం).ఎవరు నేను? ఎలా వచ్చాను? దేనికొచ్చాను? ఏమిటి నా లక్ష్యం? ఏం సాధించాలి? అని ఇలా ఆలోచించగల శక్తి, బుద్ధి, పశువులకి, పక్షులకి, మృగాలకి క్రిమి కీటకాలకీ ఉందా? లేదుగదా! అందుకే నరజన్మ నెత్తినవాడే ఆలోచించాలి. గారడీవాడు తాను చేయబోయే ఇంద్రజాలవిద్యలోని ఆనందాన్ని గ్రహించి సంతోషించగలవాళ్ల ముందే ఆ విద్యని ప్రదర్శిస్తాడు తప్ప, దాన్ని ఆనందించలేని వాళ్ల ముందు – కనీసం తాను ఇంద్రజాలికుడ్ని అనే విషయాన్ని కూడా చెప్పడు. అవునా? కాదా? అలాగే భగవంతుడు కూడా ప్రాణులనెన్నిటినో ఎన్ని జాతుల వాటినో సృష్టించి ఆశ్చర్యపడి దిగులు చెంది– తాను సృష్టించిన సూర్య చంద్ర నక్షత్ర గ్రహ విశ్వ అంతరాళ విశేషాలని గ్రహించగలిగిన మానవజాతిని సృష్టించాలనే తపనతో ఈ నరజాతిని సృష్టించాడు. ఇంటిలో తండ్రి తన పిల్లలు దేన్ని తింటే పుష్టిగా పెరుగుతారో గమనించి ఆ తినే పదార్థాలని తెచ్చినట్టుగా భగవంతుడు కూడా నరజాతిని అంత ఇష్టంతో సృష్టించాడు. సృష్టించడమే కాదు. అంత ఇష్టమైన ఈ జాతిలో తానూ ఒకడుగా పుట్టాలని నిర్ణయించుకుని మన మధ్యే తిరుగుతూ – ఆయన్ని గుర్తించగలిగిన వారికి దైవంగా కనిపిస్తున్నాడు. కొద్ది పెద్ద భాషలో చెప్తాను. కాలిలో ముల్లు గనుక గుచ్చుకుంటే ఏం చేస్తున్నాం? మరో బలమైన ముల్లును తెచ్చి ఈ లోతుగా గుచ్చుకున్న ముల్లుని తీసి, ఈ ముల్లునీ ఆ ముల్లునీ కూడా మరెవరికీ గుచ్చుకోకుండా ఉండేలా దూరంగా పడేస్తున్నాం కదా! జ్ఞానంతో అజ్ఞానాన్ని తొలగించాలి. ఆ మీదట ఈ జ్ఞానాలకీ, అజ్ఞానానికీ కూడా అతీతుడైన స్థితికి వెళ్లిపోగలిగాలి. ఇదే ఈ జన్మకి సార్థకత.దీపాన్ని వెలిగిస్తాం. ప్రమిదని తెచ్చి దానిలో నూనెని పోసి వత్తిని వేసి ఆ వత్తి నూనెతో తడిపాక వత్తికి నిప్పుని అంటించి దీపంగా చేసి ఆ ప్రకాశంలో అన్నింటినీ చూడగలుగుతున్నాం. రాగం(బంధువులు మిత్రులు ఆప్తులు శ్రేయోభిలాషులు... అనే ఈ తీరు అనురాగాలు..) అనే నూనె మొత్తం అయిపోవాలి జీవితమనే ప్రమిదలో. ఈ జ్ఞానదీపం వెలుగుతూ ఉంటే అజ్ఞానమనే చీకటి పూర్తిగా తొలగిపోవాలి. నేనూ నాదీ అనే ఆ తీరు అహంకార మమకారాలుగా కనిపించే వత్తి కాలిపోయి బూడిదగా మారిపోవాలి. అప్పుడు నిజమైన జ్ఞానం వ్యక్తికి కలుగుతుంది.సముద్రంలో ఉన్న నీరంతా ఉప్పదనంతో నిండిందే. అది సూర్యకిరణాల ద్వారా పీల్చుకోబడుతూ మేఘంగా రూపు దిద్దుకుంటుంది. ఎంత నీరు పీల్చబడిందో అంత మాత్రమే వర్షించడం లేదు. పైగా ఏ ఉప్పునీటిని పీల్చిందో అలాంటి ఉప్పు నీటినే విడవడం లేదు. అలాగే మనం గాని సరైన గురువుని ఆశ్రయిస్తే ఆయన మనకి జ్ఞానబోధని చేసి మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి – మనం ఊహించలేనంత విజ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. అలాంటి జ్ఞానాన్ని బోధించే మహానుభావులకి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం సరైన కాలాల్లో చక్కటి భోజనాల మీద దృష్టీ.. సరైన సౌకర్యాలున్న చోట పడకా–మంచి వస్త్రాలతో తిరగాలనే బుద్ధీ. కీర్తి ప్రతిష్టలని ఎలా పొందాలి? అనే తపనా ఉండనే ఉండవు. తపస్సు చేసుకుంటూ ఉండే వ్యక్తి ఎంత ఆడంబరంగా అట్టహాసంగా మనకి కనిపిస్తూ ఉంటే ఆ వ్యక్తి అంత స్థాయిలో అధముడని లెక్కించి తీరాల్సిందే. ఎక్కడెక్కడికో వెళ్లి ఆ మహానుభావులిచ్చే ప్రవచనాలూ పురాణకథలూ ద్వారా తెలుసుకోలేని ఎన్నెన్నో విశేషాలని మనం మహాత్ములని సేవిస్తూ వారివారి ఆచరణలని గమనిస్తూ తెలుసుకోగలం. జ్ఞానమనేది నిజానికి నిశ్శబ్దం ఉపదేశమే. వేలకొలదీ ఉన్న నక్షత్రాలు ఇయ్యలేని కాంతిని ఒక్క చంద్రుడూ, అతనికి మించిన కాంతిని సూర్యుడూ ఇయ్యగలుగుతున్నారు. అలాగే పురాణపఠనం ద్వారా పొందలేని అమోఘజ్ఞానాన్ని గురుసేవ ద్వారా పొందవీలుంది. ఎందరు అమ్మలో! ఈ ప్రపంచంలో కనిపించే దైవాన్ని ‘తల్లి’ అంది ధర్మగ్రంథం మీ అందరికీ ఒక్కొక్క తల్లి ఉంది. ఆమె మాత్రమే మీ పోషణని గమనిస్తూ ఉంటుంది. దురదృష్టవశాత్తూ ఆ తల్లి గతించిన వారుంటే అలాంటి వారికి ఆమె కూడా లేనట్లే కదా! అయితే నా అదృష్టం ఎంతదో తెలుసా? ఏ మాత్రపు అభిమానమూ సిగ్గూ లేకుండా భుజానికి ఓ జోలె చేతిలో ఓ డబ్బా పట్టుకుని ‘అమ్మా!’ భాకరీ ఒకటి పెట్టమ్మా! అని ప్రతి ఇంటి ముందూ నిలబడి అడుగుతూ ఎందరు అమ్మల్నో కలిగినవాడ్ని. అమ్మ ఎప్పుడూ తన సంతానం ఆకలి గురించే భయపడుతూ ఉంటుంది కదా! అందుకే ఆ ఇంటి ముందు నా పిలుపు వినబడగానే ఈ ఇంటి ఇల్లాలు పళ్లెంతో భిక్ష తెచ్చి నాకియ్యడానికి సిద్ధంగా ఉంటుంది. ఉంటోంది. ఇన్నాళ్ల పాటు భిక్షాటనకి వెళుతున్నా ఏ అమ్మ కూడా ‘చెయ్యి ఖాళీ లేదు – పైకెళ్లు’ అననే లేదంటే నన్ను సృష్టించిన ‘అల్లాహ్’ కి నేనెంత రుణపడి ఉన్నాను? ఎన్ని కృతజ్ఞతలని సమర్పించవలసి ఉన్నాను. నువ్వు ఫకీరువి కదా! నీ ఒక్కడి వ్యవహారం నువ్వు చూసుకో! ఇన్ని ఇళ్లకెందుకొస్తావని గాని, పైగా ఒక్కో రోజున గరిష్టంగా 12 మార్లు భిక్షాటన కెందుకొస్తావని గాని ఏ తల్లీ అడగలేదు. పిల్లవాడు ఎన్ని మార్లు ‘తిండి’ అని అడిగితే అన్ని మార్లు విసుక్కోకుండా వాడి కడుపు చూస్తూ పెట్టేది తల్లే కదా! అలాంటి తల్లుల్నిచ్చిన ఆ భగవంతుడు నా పట్ల ఎంత దయ చూపుతున్నాడో కదా! యజ్ఞాలు 5 శాస్త్రం తెలిసిన పెద్దలూ, పండితులూ అయితే వీటిని పంచమహాయజ్ఞాలంటారు. మొదటిది బ్రహ్మయజ్ఞం. మన ప్రాచీనులు మనకి అందించిన వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు ఇంకా ఎన్నో ధార్మికగ్రంథాలున్నాయే వాటిని కేవలం పారాయణ చేస్తే చాలు బ్రహ్మయజ్ఞాన్ని చేసినట్లే. గీత అనే గ్రంథం ఉపనిషత్తులు సారాంశం (ఉపనిషత్సు.. అని ఉంటుంది భగవద్గీత ప్రతి అధ్యాయం చివరా) కాబట్టి కనీసం రోజుకొక్క శ్లోకాన్ని చదివినా చాలుగా బ్రహ్మయజ్ఞాన్ని ముగించగలుగుతారుగా! అందుకే నేను శ్యామాకి గీతనీ విష్ణుసహస్రనామాన్నీ ఇచ్చి చదువుతూ ఉండమన్నాను. రోజూ మసీదులో ఎవరో ఒకరు గీత, భాగవతం, ఉపనిషత్తులు.. ఇలా చదువుతూనే ఉంటారు. ఏ భాషవాళ్లు ఆ భాషలో చదవడం తప్పు కాదు. చదవబడేది అదే కాదా? అనేదే ముఖ్యం.ఇక రెండవది దేవ యజ్ఞం. హోమాన్ని చేస్తూ ఇంత చక్కని జీవితాన్ని ఇచ్చినందుకు ఆనందంతో దేవతలకి ఆహుతులని సమర్పించడం దేవయజ్ఞం. ధునిలో కనిపించేది అదే కదా! ఇక మూడవది పితృయజ్ఞం. బాలా కాకా కడూన, వజేయాంచ్యా కడూద, సాహెబ్ జోగ్ భా ఊ సాహెబ్ దీక్షిత్, బాలా సాహెబ్ భాటే.. ఇలా ఎందరో పితరులకి ఈ యజ్ఞాన్ని చేస్తూనే వస్తున్నారు కదా! హైందవధర్మం ప్రకారం నువ్వులూ నీళ్లతో తర్పణాలని ఇస్తూ వస్తున్నారు కదా అది కూడా మసీదులో! అందుక్కాదూ ఈ మసీదుకి వస్తే చింతలన్నీ తొలగిపోతూ ఉంటాయి! నాల్గవది భూతయజ్ఞం. ‘భూ’ అంటే జీవించి ఉన్నదని అర్థం. అంటే ప్రాణంతో ఉన్నదని భావం. వచ్చిన భిక్షాన్నాన్ని కుక్కలు, పందులు, ఎలుకలు.. ఎన్ని తినడం లేదు? భిక్షాపాత్రపైన మూతని కూడా ఉంచేది ఇందుక్కాదూ? మన ఇంట్లో మన ఒకళ్లం తినేసి ప్రపంచంలోని అందరి కడుపు నిండిపోయిందనుకోవడం సిగ్గుచేటైన విషయం కాదూ! ఒకప్పటి రోజుల్లో ప్రతి గృహస్థు కూడా తాను తినబోయే ముందు కాకికి ఓ అన్నం ముద్దని వీధి గోడ మీద పెట్టి ఆ మీదటే తింటూ ఉండేవాడు. ఇలాంటి సంప్రదాయాలని బతకనియ్యాలి. ఇదే శాస్త్ర పరిభాషలోనైతే భూతయజ్ఞమవుతుంది.ఐదవది మనుష్యయజ్ఞం. కేవలం తానూ తన కుటుంబం మాత్రమే భోజనాన్ని ఆరగించడం కాకుండా తోటి మనుషులకి అన్నం విషయంలో తిండి దొరక్క ఆర్తితో ఉన్నవాళ్లకి భోజనాన్ని తమతో కలిపి తినేలా చేయడం దీని లక్ష్యం. సత్రాల్లో జరుగుతూ ఉండేది ఇదే. ఈ భోజనాన్ని పెట్టడమనేది నిస్సా్వర్థంగానే జరగాలి తప్ప ‘భోజనానికి ఇంత!’ అనే తీరుగా సొమ్ముని తీసుకుని పెట్టడం సరికాదు. ఒక చేలో ముప్ఫై నలభై పశువులు మేస్తూ ఉంటే.. ఓ చెట్టుకున్న పళ్లని ఓ కొన్ని చిలుకలు ముక్కులతో పొడుస్తూ తింటూ ఉంటేనూ, ఓ బియ్యపు రవ్వలోని చిన్న చిన్న అణువుల్ని చీమలు తినడానికి ప్రయత్నిస్తూ ఉంటేనూ ఆ దృశ్యం ఎంత హృదయరంజకంగా ఉంటుందో అలా మనం తినబోతూ పదిమందిని కలుపుకుని తింటున్నా ఆ దృశ్యం భగవంతుని కంటపడితే ఎంత ఆశీర్వచనం ఆయనది మనమీద ఉంటుందో ఊహించలేం!ఇలా ఐదు యజ్ఞాలనీ మనం సామూహికంగా నిర్వహించిన రోజున భగవంతుని కృప ఎల్లవేళలా మన మీద ఉంటుంది. అన్నింటినీ ఒక్కడే చేయాలని దీనర్థం కాదు. అందరం కలిసి చేయాలనేది దీని ఉద్దేశ్యం అంటూ ఆ రోజు బోధని ముగించాడు సాయి.పైవారం – సాయి మాటకి తిరుగులేదు! కారణం??? – సశేషం -
దాస్యభక్తితో తరించిన ధన్యులు
ఎర్రని ఎండ. వయసు అరవై యేళ్లుండొచ్చు. మరాఠా దేశపు స్త్రీల వస్త్రధారణతో నిదానంగా వస్తోందామె. కుడి చేత్తో తన తల మీద బుట్టని పట్టుకుని కనిపిస్తోంది. ఆ బుట్ట పడిపోకుండా తల మీద ఒక తుండుతో (తువ్వాలు) చుట్టచుట్టిన చుట్టకుదురు ఆ బుట్ట కింద ఉంది. ఆ వెదురు బుట్టలో ఒక మంచి నీళ్ల లోటా (కూజా లాంటి రాగి పాత్ర) ఆ పక్కనే కాయగూరలతో వండిన ఓ కూర, దానిపక్కన భాకరీలు(రొట్టెలు, ఈ రోజుల్లో బేకరీ అని పిలుస్తున్నది ఇదే). ఇన్నిటినీ ఎంత కప్పుదామని ప్రయత్నించినా గాలికి ఎగిరిపోతూ ఉన్న తెల్లని వస్త్రం.తల నుండి వస్తున్న స్వేదంతో అటు ఇటు చెంపలు రెండూ దాదాపుగా తడిసిపోయాయి. నుదుటి నుండి కారుతున్న స్వేదానికి పెద్దగా గుండ్రంగా పెట్టిన కుంకుమ జారిపోతూ ఎర్రటి నీళ్లని ముక్కు మీదుగా విడుస్తోంది. గడ్డం మీద త్రిభుజాకారంలో మూడు చుక్కల పచ్చబొట్టుతో ఆమె అలా వస్తోంది. ఆమె ఎంత దూరం నడిచిందో.. ఎలాంటి మార్గంలో నడిచి వస్తోందో తెలియజేస్తూ కంపలతో, పొదలతో, ఎగుడుదిగుడులతో, చూపు సాగినంత దూరపు పొడుగుతో సన్నని పుంత మార్గం కనిపిస్తోంది. ‘ఉష్’మని ఓ మారు నిట్టూర్పు విడుస్తూ ఆమె తన నడకని ఆపి చెట్టు కింద ఉన్న చిన్న రాతి మీద అలా కూర్చుంటూ.. బుట్టని కిందికి దింపి ఆ తలగుడ్డతో ముఖాన్ని తుడుచుకుంటోంది. కానీ.. చూపుని మాత్రం ఎడమవైపుకీ, ముందువైపుకీ, కుడివైపుకీ ప్రసరింపజేస్తూ నిశితంగా చూస్తోంది. ఎవరో తనకి కనిపించవలసి ఉన్నారన్నట్టుగా. నెమలి తాననుకున్న గోడనో చెట్టునో ఎక్కి మధురకంఠ ధ్వనితో క్రీంకారాన్ని చేసినట్టుగా.. తల్లి పక్షి తన పిల్లలకి ఆహారాన్ని తేగలిగాననే ఆనందంతో పిల్లలకి తన రాకని సూచిస్తూ ఆనందంతో అరిచినట్టుగా.. ‘సాయినాథా!’ అని పెద్దగా రెండుమార్లు ఎలుగెత్తి పిలిచింది.అదంతా ఓ అడవి. ఎవరు పలుకుతారు? ఎందుకు పలుకుతారు? నిస్పృహతో మళ్లీ శక్తినంతా కూడగట్టుకుని మళ్లీ పిలిచింది. ‘సాయినాథ్!’ అని. ఏ ప్రతిధ్వనీ లేదు. కొద్దిపాటి నిరుత్సాహంతో ముందు వైపు రెండుపక్కలనీ చూసి ఒక్కమారు వెనుకవైపు కూడా చూద్దామనే ఉద్దేశంతో లేచి నిలబడి వెనుదిరిగింది. అంతే! కొద్ది దూరంలో ఓ పెద్ద గంగరావి చెట్టు. దట్టంగా నీడనిచ్చే చెట్టు అది. దానికింద చదరంగా ఉన్న పరిశుభ్రమైన నేల. అక్కడ కూర్చుని కళ్లు మూసుకుని తపోధ్యానముద్రలో సాయినాథుడు ఆమెకి కనిపించాడు. ‘మూడు మార్లు పిలిచినా, తన పిలుపు వినిపించేంత దూరంలోనే సాయి ఉన్నా పలకడేమిటి?’ అనే వ్యతిరేక భావమే ఆమెకి లేదు.తల్లి ఆవు కనిపిస్తే లేగదూడ ఎలా చెంగుచెంగున దూక్కుంటూ తల్లి వద్దకి వెళ్లిపోతుందో, మండు వేసవిలో అల్లంత దూరంలో చెరువు కనిపిస్తే ఎలా పాంథుడు వేగంగా అక్కడికి వెళ్లిపోతాడో.. అలా ఆమె వెంటనే ఆ తల చుట్టని నెత్తి మీద పెట్టుకుని వెదురుచుట్టని, ఆ పైన పెట్టుకుని, సాయినాథుని దగ్గరికి వెళ్లిపోయింది చరచరా అడుగులేసుకుంటూవెళ్లీ వెళ్లడంతోటే ఆమె బుట్టని దింపి, ఆయన పాదాల మీద తన తలనుంచి భక్తిపూర్వకంగా నమస్కరించింది. సాయినాథుడు తపస్సుని వీడి, కళ్లు తెరిచి ఆమెని చూశాడు. ఈమె కూడా ఆయనని భక్తి పారవశ్యంతో దర్శించింది. మౌన సంభాషణం ఆ ఇద్దరూ మౌనంగా కళ్లతోనే మాట్లాడుకోసాగారు. సాయి ఆమెని చూస్తూ! ‘అమ్మా! నేనా ఓ ఫకీరుని. ఎవరూ నావాళ్లంటూ లేనివాడ్ని. ఏ రోజు ఈ అడవిలో ఎక్కడుంటానో, ఎంతసేపుంటానో నాకే తెలియదు.ఆ ఊరి నుండి ఇన్ని కోసుల దూరం నడిచి ఎందుకమ్మా ఇంత శ్రమ నీకు? పోనీ ఒక రోజా రెండ్రోజులా? ఎంతో కాలం నుండి ఎందుకమ్మా ఈ శారీరక శ్రమ? అయినా ఏ సాయంత్రానికో పోనీ నీ దగ్గరకే రమ్మంటే నా జోలెతో, డబ్బాతో రాకపోయానా?’ అని ఆయన కళ్లతో పలకరించాడు.ఆమె కూడా ఆనందబాష్పాలని విడుస్తూ! ‘సాయినాథా! నువ్వే మాకు (మా కుటుంబానికి) తల్లివి. తండ్రివి. గురువువి. దైవానివీ! నీకు నైవేద్యం పెట్టకుండా మేం ఎలా తినేది? అయినా నువ్వు కనిపిస్తే చాలు ఆ శారీరకశ్రమ, మార్గాయాసం మొత్తం అలా గాలికి మేఘం చెదిరిపోయినట్టుగా అయిపోతుంది. ఇన్నాళ్ల నుండీ వస్తున్నాను కదా! ఎండైనా, వానైనా, చలైనా, మంచైనా నువ్వు నాకు కనిపిస్తూనే ఉన్నావు గాని కనిపించని ఒక్క రోజుందా? భక్తితో మేం ప్రార్థిస్తే అనుగ్రహిస్తావు కాబట్టే ఈ తపనంతా!’ అన్నట్టు చూసింది.ఆ చదరపునేల మీద చక్కగా విస్తరిని వేసింది. 3 భాకరీలని పెట్టింది. పాత్రలోని కూరని వడ్డించింది. పక్కనే మంచినీటి లోటాని పెట్టింది. ఆయన రెండు మాత్రమే తిని లేవబోతూ ఉంటే కొసరికొసరి తినిపించింది. ఇది ఈ రోజునే కాదు. ఏ రోజూ ఇదే సాగుతుంది ఆ ఇద్దరి మధ్యా. సాయి లేచి వెళ్తూ ఉంటే ఆమె మౌనంగా ఆయన్ని అనుసరించింది. ఎంతో దూరం నడిచాక ఊరొచ్చింది. సాయి ఉండే మసీదొచ్చింది. ఆయన లోపలికి వెళ్లిపోయాక ఆమె తన ఇంటికొచ్చింది. ఆమె పేరు బాయిజాబాయ్. ఆమెకి ఎప్పుడైనా చిన్న శారీరకమైన నలతగాని వస్తే ఆమె భర్త వచ్చి సాయిని వెదికి, రొట్టెల్ని తినిపించి మరీ ఇంటికి వెళ్లడమే తప్ప, ఏనాడూ సాయికి నైవేద్యాన్ని సమర్పించని రోజు లేనే లేదు ఆ ఇద్దరికీ.ఓ రోజు సాయి నోరు తెరిచి అడగనే అడిగాడు ఆమెని– ‘అమ్మా! నేను నీకు ఏం చేయగలననీ.. ఏం చేస్తాననీ.. ఈ శ్రమని ఇంతగా పడుతున్నావు? నా బుద్ధికి ఎటు తోస్తే అటుపోయే ఫకీరుని కదా! ఫలాని చోటున నేనుంటానని చెప్తే నువ్వు రావడంలో అర్థముంది గానీ, ఈ అగమ్య, అనూహ్య గమనం (వెళ్లరాని వెళ్లలేని ఊహకి అందని చోటుకి పోవడం) కల నాకు ఈ ఆహారాన్ని తేవడాన్ని ఎవరు చూసినా, విన్నా ఎంత అపహాస్యంగా ఉంటుంది? నేను చక్రవర్తితో సమాన భోగాలు కలవాడ్ని. మహా ఐశ్వర్యవంతుడ్ని. నన్ను ఈ లోకానికి పంపిన నా అల్లా నాకు తిండి లేకుండా చేస్తాడా? వద్దమ్మా! నా తిండి నేను చూసుకుంటాను. ఎందుకు రావడం?’ అని. ఆమె దుఃఖబాష్పాలని విడుస్తూ ‘సాయీశ్వరా! నువ్వు తిననిదే నేనెలా తినేది?’ అంది హృదయపూర్వకంగా. ఇక ఒప్పుకోక తప్పలేదు సాయికి.ఆ రోజు రాత్రి మసీదులో పడుకుని తీవ్రంగా ఆలోచించి ‘ఆ తపస్సునేదో ఈ మసీదులోనే చేసుకుంటూ ఉంటే ఆమెకీ, కుటుంబానికీ శ్రమ లేకుండా చేయగలుగుతాను’ అనుకుంటూ గ్రామంలోనే ఉండసాగాడు. బాయిజాబాయ్ అక్కడికే భాకరీలని తీసుకెళ్తూ, తినిపిస్తూ ఉండేది. సాయినాథుడు అన్నాడు గదా! –‘అమ్మా! రుణగ్రస్తుడ్ని కావడం ఇష్టంలేదమ్మా! నీ పుత్రుడైన తాత్యా యోగక్షేమాలని నిరంతరం నేనే చూసుకుంటూ ఉంటాను’ అని. దాంతో ఆమెకి చెప్పలేని సంతోషం కలిగింది. ఆమెకీ ఆమె కుటుంబం మొత్తానికీ దైవమంటూ మరొకడు లేడు. అంతా సాయినాథుడే! అంతటి తాదాత్మ్య స్థితిలో ఆమె దాస్యాన్ని చేస్తూ ఉండేది. లోకంలో దాస్యమనగానే – గురువులకి కాళ్లు పట్టడం, మడమలు నొక్కడం, నూనెని ఒంటికి పట్టించి మర్దన చేయడం, నలుగు పెట్టి, కుంకుడు పులుసుతో తలస్నానాన్ని చేయించడం.. వంటి ఇవన్నీ గుర్తుకొస్తుంటాయి సాధారణంగా. నిజానికి దాస్యమంటే అది కానేకాదు. దాస్యమంటే...?‘దాసస్య భావః దాస్యమ్’ అంటుంది సంస్కృత వ్యాకరణం. కొద్దిగా దీన్ని వివరించుకోవాలి. ‘దాస్యాన్ని చేసేవాడు’ అనే అర్థంలో ‘సేవకుడు భృత్యుడు దాసుడు దూత కార్మికుడు’ అని ఇన్ని పదాలున్నాయి గానీ వేటి అర్థం వాటిదే.సేవకుడు అంటే ఏ పనికోసం (సేవ) మనం అతడ్ని నియమించుకున్నామో ఆ పనిని మాత్రమే నిత్యం చేసే లక్షణమున్నవాడని అర్థం. తోటపనికి నియమించుకుంటే ‘ఉద్యానవన సేవకుడు’.... ఇలా అన్నమాట.ఇక భృత్యుడంటే మరో అర్థముంది. ‘నెలసరి జీతాన్ని (భృతి) తీసుకుంటూ పని చేసేలక్షణమున్నవాడు’ అని అర్థం. ‘భృpŠ‡ఛరణ్’ అనే ధాతువు మీద ఏర్పడిన పదం అది కాబట్టి భృత్యుడంటే తన కుటుంబాన్ని పోషించుకునేందుకు జీతాన్ని తీసుకుని పని చేసే వాడవుతాడన్నమాట.పైన చెప్పుకున్న సేవకుడు కూడా జీతాన్ని తీసుకుంటూనే పని చేస్తున్నాడు కాబట్టి ఈ భృత్యుడూ సేవకుడూ ఒకరే అవుతారు కదా! అనుకోకూడదు. సేవకుడు అంటే తనకి ఏ పనిలో నైపుణ్యముందో ఉదాహరణకి పూలతో మాలల్ని కట్టడం, మట్టితో కుండల్ని చేయడం, వాటికి రంగులని అద్ది అందమైన అరివాణపు కుండలుగా అందించడం, పందిళ్లని నిర్మించడం, తాటాకులని విసనకర్రలుగాచేయడం... వంటివి – ఆ సేవని (పనిని) భగవంతుని విషయంలో కృతజ్ఞతని ఘటిస్తూ చేసేవాడన్నమాట. అందుకే ఇప్పటికీ ‘ఆ సేవ మాది, ఈ సేవ వాళ్లది’ అనే మాటలు వినబడుతూఉంటాయి. ఆ తనకి నైపుణ్యమున్న సేవ(కర్మ–పని)ని మాత్రమే చేసేవాడు సేవకుడు. ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో గుడిని శుభ్రం చేయడం, ప్రతి రెండేళ్లకీ గుడికి రంగులు వేయడం, రథాన్ని లాగేవ్యయాన్ని భరించడం వంటివాటిని సేవలుగానే భావిస్తూ, ఉచితంగా, వంశవంశపారంపర్యంగా చేస్తున్నవాళ్లెందరో ఉన్నారు. సరే! ఆ మీదటి వాడు ‘దూత’ ‘స్యాత్సందేశహరో దూతః’ దైవానికి ఫలాన రోజు నుండి ఫలాన రోజు వరకూ ఉత్సవాలు సాగుతాయంటూ ఈ ఊరూ పొరుగూళ్లలో కూడా ఆ వార్తని చాటింపువేసే పనిని చేసేవాడు.అతనికి కొత్తమాటని చేర్చి చెప్పే హక్కు లేదు. ఇతడూ భృత్యుడే. కొంత పారితోషికాన్ని తీసుకుని ఆ పనిని చేసేవాడే.కార్మికుడనేది చివరిమాట. ‘కర్మ కరోతీతి కార్మికః’ ఏ పని బడితే ఆ పనిని చేయడానికి సిద్ధంగా ఉండేవాడని దానర్థం ఇతడూ భృత్యుడే.ఇదంతా ఎందుకంటే ‘దాసుడు’ అనే మాటకున్న గట్టి దనాన్నీ లోతునీ అర్థం చేసుకునేందుకు అర్థం చేసేందుకున్నూ. ఏం అపేక్షించకుండా ఆ చెప్పబడిన పనిని నిస్వార్థంగా తనంత తాను ప్రాణాలకి తెగించి కూడా చేయడానికి సిద్ధమయ్యేవాడు దానుడు. ఆంజనేయుడు దాసలక్షణం కలవాడు. సీతమ్మ గానీ రాముడు గానీ తనకి బంధువులు మిత్రులు ఆప్తులు కానేకాదు. అయితే ఎక్కడెక్కడో ఆ దంపతులు వేర్వేరు స్థలాల్లో ఉంటూ ఒకరినొకరు నిరంతరం స్మరించుకుంటూ ఎప్పటికైనా కలుసుకుంటామనే మనో ధైర్యంతో జీవిస్తున్నారనే బుద్ధితో ఆ ఇద్దరినీ ఒకచోటికి నిస్వార్థంగా చేరాలనే పవిత్రాశతో కార్యానికి నడుం బిగించిన ఆంజనేయుడు ‘దాసుడు’. అంతేకాదు. 24 వేల శ్లోకాల శ్రీమద్రామాయణంలో రావణవధ అయ్యాక పట్టాభిషేకం జరిగే వేళ కూడా నేనే ఆ ఇద్దరినీ కలిపినవాడినంటూ ఒక్క మాటని ఎవరితోనూ అని ఉండలేదు. అంత గుప్తంగా నిస్వార్థంగా సేవ చేసేవాడ్ని దాసుడనాలంది శాస్త్రం. బాయిజాబాయ్ సాయికథలో కూడా బాయిజాబాయ్ ఏనాడూ తానిలా చేస్తున్నానని గానీ, ఇంత దూరం అడవిలో సాయి ఎక్కడుంటాడో తెలియని చోటుకి వెళ్తున్నానని గాని, రోజూ భాకరీనీ కూరనీ తానే తీసుకెళ్తున్నానని గాని ఎప్పుడూ ఎక్కడా ప్రకటించనూ లేదు. ప్రతిఫలంగా సాయినాథుని నుండి దేన్నీ ఆశించి ఉండనూ లేదు... తీసుకోనూ లేదు. అదీ దాస్యలక్షణమంటే.మరో విశేషం కూడా ఇక్కడుంది. ఏదో తనకున్న దాస్యభక్తితో తానొక్కతే ఆ నిత్యకృత్యాన్ని చేస్తూ ఉండటం కాకుండా సాయినాథుని గొప్పదనాన్ని తన భర్తకీ సంతానమైన తాత్యాకి కూడా చెప్పి తాను చేస్తున్న దాస్యానికి అడ్డుపడకుండానూ ప్రోత్సహించేలాగునా కూడా చేయడమనేది నిజమైన దాస్యభక్తికి ఉదాహరణం. ఆంజనేయుడు కూడా శ్రీమద్రామాయణంలో తనని మింగడానికి సిద్ధపడుతున్న సురమతో రాముని కథని సూక్ష్మంగా చెప్పి ఆ ఇద్దరినీ కలపడం చేస్తే నీకూ మంచి జరుగుతుందన్నాడు. అంతేకాదు. ఆ ఇద్దరూ కలిసిన పక్షంలో తానే స్వయంగా ఆ సురమకి ఆహారంగా కూడా అవుతానన్నాడు(సత్యం ప్రతి శృణోమి తే!) ఆ మాటని ఒట్టుగా భావించవలసిందన్నాడు కూడా. ఎవరో తెలియని ఆ ఇద్దరి ఏకత్వం కోసం తన ప్రాణాల్ని పణంగా పెట్టడమనేది నిజమైన దాస్యభక్తి కాదూ మరీ! ఇంత దాస్యాన్ని సాయిపట్ల చూపింది బాయిజాబాయ్ ప్రతిరోజూ అనేక క్రూరజంతువులుండ వీలైన అడవికి ఒంటరిగా వెళ్తూ.కాలం మారాక బుద్ధులు చెదిరాక ‘దాస్యం’ అంటే వెట్టి చాకిరీగా భావిస్తున్నారు. అది సరికాదు. తాత్యాబాజాయ్ ఆమె భర్తా ఇలా తాము చేయగలిగిన ఆ శక్తికి తగినట్లు సాయికి ఆహారాన్ని సమర్పించుకుంటూ ఒకరి వెనుక ఒకరు కన్ను మూస్తే సాయి పెద్దపెట్టున రోదిస్తూ తానొక్కడే మసీదులోకి వెళ్లిపోయి తననెవరూ చూడటానికి అనుమతించడం లేదన్నట్లు పరదాని (కర్టెన్) వేసేసుకున్నాడు.ఆ మరుసటి రోజునుండే తల్లిదండ్రుల బాటలో పయనిస్తూ తాత్యా ఆ ఆహార సమర్పణాన్ని చేస్తూ వచ్చాడు. ఇప్పటికి కూడా గ్రామాల్లో దైవానికి అటూ ఇటూ నిలబడి కాగడాలని ఉత్సవాలకాలంలో పట్టడమనేది ఒక వంశానికి మాత్రమే చెంది ఉండి కనిపిస్తూ ఉంటుంది. అయితే నేడు మాత్రం ఇది వంశపారం పర్య హక్కుకల ఉద్యోగంగా మారి ఆ దాస్యం దానిలో అర్థం మొత్తమంతా గాలికి కొట్టుకుపోయింది. సరే! దాస స్వీకారం బాయిజాబాయ్ ఇలా తనని సేవిస్తూ ఉండేది కాగా, భాగోజీ అనే భక్తుడు నిరంతరం సాయికి గొడుగుని పడుతూ ఉండేవాడు. ‘భాగోజీ! ఎంతదూరం నేను వెళ్తూ ఉంటే అంతదూరమూ ఇలా పట్టడం ఎందుకు? శ్రమని మానెయ్’ అన్నప్పటికీ విడిచేవాడు కాదు. ఇంతవరకూ సరే.దురదృష్టవశాత్తూ భాగోజీకి కుష్టు వ్యాధి సోకింది. చీముతో రక్తంతో తెల్లని అదో దుర్వాసన ద్రవంతో అతని కాళ్ల వేళ్లూ చేతి వేళ్లూ చూడ్డానికి జుగుప్సాకరంగా ఉండేవి. భాగోజీకి మాత్రం సాయికి దాస్యాన్ని చేయాలనే తపన గట్టిగా ఉండేది కాని ఈ వ్యాధి కారణంగా సాయి సమీపానికి వెళ్లే సాహసాన్ని చేయలేదు. వెంటనే సాయి కబురు చేసి భాగోజీని పిలిచి ‘ఏమయింది? నీ పని నువ్వు కానీ!’ అన్నట్లు చూశాడు. అంతే!సాయి లెండీ తోటకి రావడమేమిటి? సాయికి ఒకసారి ధునిలో ఎగసిపడుతున్న మంటకి చేయికాలితే (ఒక పాప రక్షణకోసం అలా జరిగింది. ఆ కథ మరోసారి) ఆ చేతి కట్లని విప్పి నూనె రాసి మర్దన చేసి ఆకు పసరు వేసి చేతిపై పూసి మళ్లీ కట్టుని కడుతూ ఉండేవాడు. ఇక్కడ భాగోజీ దాస్యభక్తి కంటే దారుణమైన కుష్టు వ్యాధి పీడితుడ్ని దాసునిగా పరిగణిస్తూ అతని దాస్యభక్తిని తాను స్వీకరించడం ఎంత గొప్ప! అలా సాయి దాస్య సేవలోనే తరించాడు భాగోజీ. అంతటి గొప్పది దాస్యభక్తి. అంత గొప్పవాళ్లు తరించిన ఆ ఇద్దరు భక్తులూను. పైవారం – సాయి చేసి వేదాంతబోధ! (సాయికి తెలిసిన హిందూ సంప్రదాయాలు) - డా. మైలవరపు శ్రీనివాసరావు -
సాయి సన్నిధిలో శరీరత్యాగం చేసిన ముభక్తులు
ఎందరో మన హిందూధర్మం ప్రకారం కాశీ నగరానికి కేవలం శరీరాన్ని చాలించెయ్యాలనే అభిప్రాయంతో వెళ్లడాన్ని గమనిస్తూ ఉంటాం. దానికి కారణం ‘కాశ్యాంతు మరణాన్ముక్తిః’ అని కనిపించే ప్రసిద్ధ ఋషివాక్యం మాత్రమే. అయితే ఈ సందర్భంలో ఆ వాక్యానికి కొంత వివరణ ఇచ్చుకోవలసి ఉంది.‘కాశ్యామ్+తు– కాశీనగరంలో మాత్రమే ముక్తిః – ముక్తి లభించడమనేదిమరణాత్ తు– మరణించడం వల్ల మాత్రమే లభిస్తుంది’ అని ఈ ఋషి వాక్యానికి అర్థం. మరి ఇదే నిజమైన ప్రమాణవాక్యమైతే కాశీనగరంలో ఎప్పటి నుండో ఉంటూ మరణించే ఎందరికో మోక్షమనేది అయాచితంగానూ, అదృష్టకారణంగానూ లభించేసినట్లే కదా! అనిపిస్తుంది మనకు. దానర్థం అది కాదు. అందుకే వ్యాఖ్యానాన్ని చదివీ లేదా వినీ అర్థం చేసుకోవాలని పెద్దలంటుంటారు. కాశీలో ముక్తి లభించాలంటే దానికి ఓ పద్ధతిని చెప్పారు ఋషులు.యదృచ్ఛాలాభ సంతుష్టః – అని. మనకిక్కడ ఇంట్లో ఏ తీరు సౌకర్యాలున్నాయో అలాంటి అన్ని సౌకర్యాలూ అక్కడ కూడా లభించేలా చేసుకుని కాశీలో ఉంటూ మరణానికి ఎదురు చూసినా, ఒకవేళ మరణించినా కూడా ముక్తిరాదట. యదృచ్ఛాలాభ సంతుష్టః – ఏది దొరికితే ఎప్పుడు దొరికితే– ఎలా దొరికితే– ఎంత దొరికితే– దాంతో సంతోషపడుతూ ఈ శరీరమనేదాన్ని – అవయవాలన్నింటినీ దాచుకునేందుకు పుట్టుకతో వచ్చిన ఓ సంచిగా భావిస్తూ – లెక్క చెయ్యకుండా దాని కోరికలకి ప్రాధాన్యాన్నీయకుండా జీవించే/జీవించగలిగే తనంతో ఉంటే, దాన్ని (మరణ)కాశీనివాసం అంటారు. అలా తనంత తానుగా ఎవరి శరీరం ఆ వ్యక్తిని విడిచి వెళ్లిపోతుందో.. అదుగో అలాంటి మరణం కాశీలో జరిగిన పక్షంలో ముక్తి లభిస్తుందని దానర్థం. అలా కాక ఇంటిలో ఉన్న సౌకర్యాలన్నింటినీ అనుభవిస్తూ.. రుచికరమైన భోజనాలని చేస్తూ.. ప్రతి పనికీ దాసీజనాన్ని ఏర్పాటు చేసుకుని కాశీలో ఉన్నా, ఏదో కారణంగా మరణించినా అది కేవలం స్థలం మార్పు కిందికొస్తుంది తప్ప ‘కాశీవాసం’ అనే మాటకి సంబంధించిన ఏర్పాటు కిందికి రాదు. అలా మరణిస్తే కూడా ముక్తి రానేరాదు. అయితే కాశీలో ఉన్న పుణ్యఫలం మాత్రమే లభిస్తుందనేది యదార్థం. అది కూడా విశ్వనాథునిసేవ చేసుకున్న పక్షంలో మాత్రమే. చావు ఎన్ని తీరులు? ‘శరీరత్యాగం చేసి ముక్తిని పొందిన భక్తులు’ అనే ఈ శీర్షిక మరింత అర్థం కావాలంటేనూ, సాయి దగ్గరికొచ్చిన వాళ్లు కొన ఊపిరితో ఉన్నా సాయి మహత్యం కారణంగా బతికి బట్ట కట్టాలి కానీ అలా దిక్కు లేని వాళ్లలా చనిపోవడమా? అనే తీరు దుర్విమర్శకి సమాధానం తెలియాలంటేనూ ‘చావు’ అనేది ఎన్ని విధాలుగా ఉంటుందని లెక్కించారో వాటిలో ఏ తీరు ఈ ‘శరీర త్యాగం’ అనేది దేని కిందికి వస్తుందో తెలియాల్సిందే వివరంగా. 1. చచ్చిపోయాడు – ఇది మొదటి మాట. శరీరంలో ఉండే ఏ అవయవమో లేక అవయవాల సమూహమో తన పనుల్ని తాము చెయ్యలేని కారణంగా చచ్చుపడిపోతే (నిష్క్రియాపరత్వం అంటారు సంస్కృతంలో) ఆ తీరుగా చచ్చుబడిపోవడం వల్ల ఈ లోకం నుండి పోతే అతడ్ని చచ్చు బడిపోయాడు కాబట్టి చచ్చిపోయారంటారు. ఇది ముక్తికి ఏ మాత్రమూ అవకాశమీయని మరణం. 2. చనిపోయాడు – ‘చని’ అనే మాటకి ‘వెళ్లిపోవడం కారణంగా’ అని అర్థం. శరీరాన్ని చైతన్యవంతంగా ఉండేలా చేయగల వాయువు పేరు ‘ప్రాణం’ దాన్నే ప్రాణవాయువని పిలుస్తాం. అలాంటి ప్రాణవాయువు’ చని – శరీరం నుండి వెళ్లిపోవడం కారణంగా పోవడం – ఈ వ్యక్తి చైతన్యం ఈ లోకం నుండి బయటికి పోవడమేదుందో’ అది చనిపోవడం అవుతుంది. కాబట్టి ఈ లోఅర్థం తెలిసిన పెద్దలు ‘చని పోయాడు’ అనే అనేవారు గాని ‘చనిపోయాడు’ అని ఒక్కమాటలో అంటూ ఉండేవారు కాదు. కాలక్రమంలో ఉచ్చారణ విధానం మారినా ఉచ్చరించవలసిన తీరు మాత్రం ‘చచ్చి పోయాడు’ ‘చని పోయాడు’ అనేదే. అయితే ఈ తీరు చావు కూడా ముక్తికి ఏ మాత్రపు అవకాశాన్నీ ఇవ్వనే ఇవ్వలేదు. 3. పంచత్వం పొందాడు – పృథ్వి, అప్, తేజస్, వాయు, ఆకాశమనే పేరిట పంచభూతాలున్నాయి బ్రహ్మాండంలో.. ఈ పిండాండం (శరీరం)లో కూడా మజ్జమాంసమనే పేరిట పృథ్విభూతం, జలశాతం పేరిట అప్ భూతం, ఎంత వేడి పదార్థాన్ని తిన్నా ఎంత చల్లటి పదార్థాన్ని గాని నీటిని గాని తాగినా అటూ ఇటూ పెరుగు తరుగులు లేకుండా ఒకే తీరుగా ఉండే తేజోభూతం, పంచప్రధాన వాయువులూ అలాగే పంచ అప్రధానవాయువులతో అంటే మొత్తం దశవిధ వాయువులతో ఉండే వాయుభూతం, కనిపించకుండా ఉంటూ అనుక్షణం తన ప్రకారమే నడిచేలా మనని చేస్తూ ఉండే మనసు అనే ఆకాశభూతం ఉన్నాయి. ఈ పిండాండంలోని పంచభూతాలు ఆ బ్రహ్మాండంలోని పంచభూతాల్లోనూ కలిసి పోవడమేదుందో దాన్ని పంచత్వం పొందడం’ అంటారు. ఇది ఒక విధంగా ఆరోగ్యవంతుని మరణంగా గుర్తింపబడుతుంది. అయితే ఈ తీరు మరణం కూడా ముక్తికి ఏ మాత్రపు అవకాశాన్ని ఇవ్వలేదు. 4. నిర్యాణం– నిర్+యానమ్ అని పదవిభాగం. నిర్గతం యానం యేన తత్ నిర్యాణమ్. ఈ ప్రదేశం నుండి మరో ప్రదేశానికి వెళ్లడం కోసం ప్రస్తుతప్రదేశాన్ని ఖాళీ చెయ్యడాన్ని నిర్+యానమ్ (వ్యాకరణసూత్రం ప్రకారం నిర్యాణమ్) అవుతుంది. భాగవతంలో ప్రారంభంలో ‘శ్రీకృష్ణ నిర్యాణఘట్టః’ అని కనిపిస్తుంది. అంటే ‘వైకుంఠానికి వెళ్లేందుకోసం ఈ భూలోకం నుండి బయలుదేరడం’ అని అర్థమన్నమాట. ఈ పదాన్ని భగవంతుని స్థాయి వారికి మాత్రమే వాడాలి. భగవంతునికి ముక్తిని గురించి చెప్పే పదాల్లో చాలా బరువు అర్థం కలదన్నమాట. దీన్ని సాయికి వాడటం దోషం కాబోదు. 5. కీర్తిశేషుడు– సాధారణంగా ఏ వ్యక్తి అయినా మరణించాక అతని గురించిన మాటలు కొంతకాలం అయ్యేసరికి కాలగర్భంలో కలిసిపోతాయి. అలా కాక ఆయనని గురించి నిరంతరం చెప్పుకునే రీతిలో ఎవరైనా తమ జీవితాన్ని గడిపి, ఈ లోకం నుండి వెళ్లిపోయినట్లయితే అలాంటి వారిని కీర్తి– తమ కీర్తినీ ప్రతిష్ఠనీ, శేషులు– ఈ లోకంలో మనందరికీ మార్గదర్శకత్వం కోసం మిగిల్చి వెళ్లినవారు’ అని అనాలన్నారు. సాయి స్థాయి ఇలాంటిది కాదు. ఎంతెంతో ఉన్నతమైనది. ఇక కీర్తిశేషులయిన వారు తమదైన పాండిత్య–సంగీత– నృత్య–అభినయ.. ఇలా అభికళల్లో దేనిలోనైనా విశేషకీర్తిని సంపాదించి దాన్ని లోకానికి విడిచి వెళ్లినవారు అవుతారు కాబట్టి ఈ అనుకున్న కళల ద్వారా వారికి ముక్తి లభించితీరాలనే నియమమేమీ లేదు. కాబట్టి ఈ కీర్తి శేష విధానానికీ ముక్తిని పొందడానికీ సంబంధం లేదు. 6. పరమపద ప్రాప్తి– ఈ లోకంలో ఓ స్థానాన్ని సంపాదించడమనేది ‘భూపదప్రాప్తి’ కిందికొస్తుంది. ఈ స్థానం కంటే గొప్పదనే అర్థంలో ఆ లోకాన్ని ‘పరమ–పదం’ అన్నారు. అలాంటి పరమపదాన్ని – ‘ప్రాప్తి–పొందడం’ అనేది ఏదుందో దాన్ని పరమపదప్రాప్తి అన్నారు. ఓ త్యాగరాజు ఓ అన్నమయ్య.. ఇలాంటి వారంతా మరో ధ్యాస ధ్యానం లేకుండా ఈ లోకానికి వచ్చికూడా ఆ లోకం గూర్చిన ధ్యాసతోనే ఉంటూ ఆ పరమపదాన్నే పొందాలనే ధ్యేయంతో జీవితాన్ని గడిపారు కాబట్టి ‘పరమపద ప్రాప్తి’ అనే పదం వారికి చెందినది తప్పక అవుతుంది. అంతటి పరమపదాన్ని పొందడమనేది ముక్తికి సాక్ష్యం కాబట్టి ఆ స్థాయి మహానుభావులకి వాడాల్సిన పదం ‘పరమపదప్రాప్తి’ అని. 7, శరీరత్యాగం – ఈ వివరణల క్రమంలో వచ్చే పదమే ‘శరీరత్యాగ’మనేది. ఈ శరీరాన్ని ఓ బరువైన పదార్థంగానూ, ముక్తిని పొందడానికి అభ్యంతరాన్ని కలిగించే పదార్థంగానూ (నిరంతరం కష్టాలనీ సుఖాలనీ కామ క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనీ కలిగిస్తూ దృష్టిని భగవంతుని మీద కేంద్రీకరించకుండా ఉండేలా చేస్తూ మధ్యమధ్యలో అనారోగ్యం మొదలైన వాటితో) మనసుని బాధపెడుతూ ఉండే ఓ వస్తువుగానూ భావించే లక్షణమున్నవాళ్లు యోగులు. వాళ్లు ఈ శరీరాన్ని ఎప్పుడు త్యజించి (విడిచేసి) ఎప్పుడెప్పుడు ఆ పైలోకానికి వెళ్లిపోదామా అనే ఒకే ఒక్క ఆలోచనతో కనిపించేవాళ్లు చేయగలిగిన పని ‘శరీరత్యాగం’ శరీరాన్ని త్యజించడమే కదా: అనే దృష్టితో ఆత్మహత్యని చేసుకోవడం, శరీరాన్ని దాడికి గురి చేసుకోవడం.. వంటివన్నీ ‘శరీరత్యాగం’ కిందికి రావు. ఈ శరీరమే, తనని ధరించిన వ్యక్తి తనకి చేస్తున్న తక్కువదనానికీ, అవమానాలకీ తట్టుకోలేక, ఎప్పుడెప్పుడు విడిచేద్దామా? అనుకుంటూ ఈ శరీరం వెళ్లిపోడానికి సిద్ధమై కనిస్తూ ఉంటుందో, అలా వ్యక్తిని విడిచేసి వెళ్లిపోతుందో దాన్ని ‘శరీరత్యాగం’ అంటారు. ఎవరైనా ఒక వ్యక్తికి సహాయకునిగా మరో వ్యక్తి అనుసరిస్తూ వెళ్తూ ఉంటే ప్రతిక్షణ మూ ఆ వ్యక్తి ఈ సహాయకుడ్ని నిందిస్తూ చీత్కారం చేస్తూ అవమానిస్తూ ఉంటే ఎలా ఆ సహాయకుడు ఈ శరీరాన్ని ధరించిన వ్యక్తి నిరంతరం ఆ శరీరపు పాలననీ, పోషణనీ చూడకుండా ఉంటే ఆ శరీరం ఎలా ఈ వ్యక్తిని త్యజిస్తుందో, అప్పుడే శరీరధారి ఎలా ఆనందపడతాడో దాన్ని ‘శరీరత్యాగం’ అని పిలుస్తారు.భాగవతంలో ‘రంతిదేవుడు’ ఇలా చేశాడు. 48 రోజుల నిరాహార దీక్షతో భగవద్ధ్యానాన్నే చేస్తూ గడుపుతూ చివరి రోజున ఆహారాన్ని తీసుకోబోతుంటే.. యాచకుడు కావాలనికోరితే, సగం అన్నాన్ని ఇచ్చి మళ్లీ తినబోతూ ఉంటే, మళ్లీ ఇంద్రుడే మారు రూపంలో యాచనకి రాగా ఆ మిగిలింది కూడా ఇచ్చేస్తే, ఆ మిగిలిన మంచి నీటినే తాగబోతూ ఉంటే మళ్లీ ఒకరొచ్చి అడగ్గానే నేను స్వీకరించబోయే పదార్థం మరొకరి ప్రాణాన్ని నిలుపుతుందన్నప్పుడు ఈ శరీరమెందుకు? అంటూ శరీరత్యాగాన్ని చేసి ముక్తిని పొంది ముక్తుడయ్యాడు.అలాగే శ్రీమద్రామాయణంలో శరభంగుడనే మహర్షి కూడా రామదర్శనం కోసమే శరీరాన్ని నిలిపి ఉంచుకుని రాముడ్ని దర్శించి తానప్పటివరకూ చేసిన తపశ్శక్తిని స్వయంగా రామునికి ధారపోసి ఆయన సమక్షంలోనే శరీరత్యాగాన్ని చేసి ముక్తుడయ్యాడు.సాయిని గూర్చిన కథ అని ప్రారంభించి ఎటెటో వెళ్లిపోతున్నామనుకోకూడదు. సాయి సమక్షంలో ముక్తులైన ఆ మహనీయులు కూడా ఇలా శరీరత్యాగాన్ని చేసిన స్థాయి కలవాళ్లే అని తెలుసుకోవడం కోసం నిరూపించడం కోసం ఇంతా చెప్పాల్సి వచ్చింది. సరే! ఇంతకీ అలా ముక్తులైన ఇద్దర్ని గురించి తెలుసుకుందాం! బాలారామ్ (మాన్కర్) భార్య పోయిన బాలారామ్(మాన్కర్) సాయికి పరోక్షంగా భక్తునిగా ఉండేవాడు. ఎలాగైనా షిర్డీలోనే సాయి సన్నిధిలో ఉంటూ శరీరత్యాగాన్ని చేయాలనే గట్టి పట్టుదలతో సాయి దర్శనానికి వెళ్లాడు. సాయి బాలారామ్ని బాగా పరిశీలించి 12 రూపాయలనిస్తూ – ఇక్కడ ఉండద్దు. ‘మచ్ఛింద్రగడ్’ అనే ప్రదేశానికి పోయి రోజూ మూడు మార్లు ధ్యానాన్ని చేసుకో! ఫో!’ అన్నాడు. బాలారాంకి అక్కడికి వెళ్లడమనేది సుతరామూ ఇష్టం లేకున్నా ఆ గురువాక్యాన్ని ధిక్కరించడం ఇష్టంలేకా, తను షిర్డీలోనే సాయి సన్నిధిలోనే శరీరాన్ని విడవాలి ఉన్నప్పుడు విరోధించడం సరికాదనీ ‘మచ్ఛింద్రగఢ్’కి వెళ్లాడు అక్కడి విశాలప్రకృతీ పరిశుభ్రమైన నీరూ గాలీ.. అంతా భౌతికంగా నచ్చింది బాలారాంకి. దాంతో కావాలసినంత సేపు ధ్యానాన్ని చేసుకోగలుగుతూ పరమానందపడసాగాడు. ఓ రోజు ధ్యానంలో సాయి స్వయంగా దర్శనమిచ్చి ‘బాలారామ్! నిన్నెందుకు ఇక్కడికి పంపానో తెలిసిందా? ధ్యానమనే మొదటి మెట్టుని ఎక్కలేనిదే నీ శరీరత్యాగమనే స్థితికి ఎగబాకలేవు. షిర్డీలో నన్ను నువ్వు చూసిన దృష్టికీ, నేడు నీలో కనిపిస్తున్న అంతర్ దృష్టికీ చక్కని భేదం ఉంది. ఆ భేదం కూడా పరిణత స్థితిలో ఉంది. దైవం సర్వత్రా ఉంటాడనే స్థిరనిశ్చయం నీకు ఒకప్పుడు లేదు కాబట్టే అయిష్టంగా మచ్ఛింద్రగఢ్కి వెళ్లావు. ఇప్పుడు నీకు అర్థమవుతోంది. ‘దైవం సర్వత్ర అన్నింటా అన్ని కాలాల్లో ఉంటాడు– ఉన్నాడు’ అని. సాయి చెప్పి అంతర్ధానమయినట్లు అనిపించింది. ఇది పరోక్షానుభవం. కొంతకాలానికి బాలారాం తన ప్రదేశానికంటూ బయల్దేరగానే ఎవరో ఒక పల్లెటూరి వ్యక్తి లంగోటీతోనూ కంబళి కప్పుకునీ ఇతని వద్దకొచ్చి – ఇదిగో నీ ఊరికి టికెట్టు. నేను ప్రయాణం విరమించుకున్నాను. నువ్వు టికెట్టుని ఈ జన సమ్మర్దంలో తీసుకోలేకపోతున్నావుగా! అంటూ గబగబా దాన్ని అందిచ్చి వెళ్లిపోయాడు. ఎంతవెతికినా అతను కనిపించలేదు. ఇది అపరోక్షానుభవం.దాంతో షిర్డీకి పోయి తీరాలనే బలమైన ఆశ కలిగిన బాలారాం షిర్డీలోనే ఉంటూ సాయికి సేవ చేస్తూ... ఆయన మాటలని తు.చ. తప్పకుండా చేశాడు. సాయి అతని నిర్వా్యజసేవని మెచ్చుకునేవాడు.అపరిమిత భక్తికి ఆనందపడుతూ ఉండేవాడు. అనన్యభక్తి (సాయి తప్ప మరో లోకం దైవం లేదు)తో సేవ చేస్తూ ముక్తిని పొందిన భక్తునిగా లెక్కింపబడ్డాడు. తాత్యా సాహెబ్ నూల్కర్ ఏ మాత్రమూ యోగులూ, ధ్యానపరులూ, సన్యాసులూ, ఫకీరులూ... అంటే విశ్వాసం లేని తాత్యా సాహెబ్ నూల్కర్ అనే న్యాయాధిపతి పండరిపురంలో ఉద్యోగరీత్యా ఉంటూ ఉండేవాడు. అక్కడే కింద ఉద్యోగిగా పని చేసే నానా(సాహెబ్) ఈయనకి సాయిలీలలని నిరంతరం చెప్తూ షిర్డీకి వెళ్లాలనే సంకల్పం కలిగేలా చేసాడు తాత్యాకి. ఇంకా పట్టుదల పోని తాత్యా – షిర్డీలో తనకొక బ్రాహ్మణ వంటవాడు కావాలనీ, నాగపూరు కమలా ఫలాలు సాయికి బహూకరించదలిచిన కారణంగా అవి కూడా దొరికితేనే షిర్డీ వస్తానన్నాడు.ఆశ్చర్యం! వంటవాడూ నూరు కమలా ఫలాలు రెండ్రోజుల్లోనే దొరికాయి. వెంటనే షిర్డీకి వెళ్లి సాయిని దర్శించబోతే.. సాయి తాత్యాని చూస్తూనే కోపాన్ని ప్రదర్శించాడు న్యాయాధిపతి అని తెలిసినా కూడా. తాత్యా మాత్రం ఏ మాత్రమూ తొందరపడకుండా ప్రతినిత్యమూ దర్శానానికే వెళ్తూ క్రమక్రమంగా సాయిపట్ల చెప్పలేని భక్తి కలవాడయిపోయాడు. ఎందరో భక్తులు వచ్చి వెళ్తున్నా అయస్కాంతాన్ని గట్టిగా పట్టుకుని విడదీయరాని విధంగా అతుక్కుపోయిన భక్తితో తాత్యా నిరంతరం సాయి సేవలోనే ఉండిపోసాగాడు.యోగులూ, ఫకీరులూ.. ఇలా ఎవరినీ నమ్మని తాత్యా అలా సాయి సేవలోనే జీవితం మొత్తాన్ని గడుపుతూ తనదైన ఉద్యోగస్థలాన్ని గానీ పవిత్ర పండరీపుర క్షేత్రాన్ని గానీ దర్శించకుండా ఆ ఆలోచన కూడా లేకుండా సాయి సన్నిధిలోనే శరీరత్యాగం చేసి ముక్తుడయ్యాడు. సాయి తాత్యా శవాన్ని చూస్తూ భోరున ఏడుస్తూ... ‘తాత్యా! నా కంటే ముందే వెళ్లిపోయావా?’ అని అందరితోనూ చెప్పుకుని విలపించాడు. వీళ్లు శరీరత్యాగం చేసి ముక్తులైనవాళ్లు అంటే. పైవారం – బాబాకి నిస్వార్థ సేవ చేసి ఆ ధాన్యంతో తరించిన భక్తులు. – సశేషం -
సాయి చెప్పిన స్వీయకథ
బంగారపు నగని ఎలా సరైన పెట్టెలోనే భద్రపరుస్తారో గొప్పవిలువైన మంత్రాన్ని ఎలా శక్తి సంపూర్ణంగా నిండిన రోజున మాత్రమే ఎలా ఉపదేశిస్తారో అలా ఈ పాదుకాప్రతిష్ఠని ఎప్పుడు చేయవలసిందిగా సెలవునిస్తావో చెప్పవలసిందని సాయిని అడగ్గానే ఆయన – ‘శ్రావణపూర్ణిమనాడు సరిగ్గా 11 గంటలకు’ అని ఆజ్ఞాపించారు.సరిగ్గా 11 గంటలకి ప్రతిష్ఠ చేసేందుకు వీలుగా దీక్షిత్ తన శిరసు మీద ఆ పవిత్రపాదుకలని పెట్టుకుని పవిత్రమైన ఖండోబా మందిరం నుండి బయలుదేరగానే భక్తుల సాయినామస్మరణతో దిక్కులు మార్మోగిపోసాగాయి.శివుడు పరశురామునికి యుద్ధవిద్యని నేర్పుతూ ఉన్న కాలంలో శంకరుని చేతిలో ఉన్న గొడ్డలికి సంబంధించిన ఓ ఇనుపముక్క నేలనపడింది. దాన్ని శివుడు ఓ అయఃఖండాన్ని (ఇనుపముక్కని) పరశురామునికే ఇచ్చేశాడు ఈ సంఘటనకి గుర్తుగా.అలాఇనుపముక్క తెగిపడ్డ గొడ్డలి కల ఆ శంకరుణ్ణి ‘ఖండపరశుడు’ అని అప్పటినుండే పిలిచారు. ఆ ఖండపరశుణ్ణే మరాఠీ భాషలో ’ఖండోబా’ అని పిలుస్తారు. అంతటి శివశక్తి నిండిన గ్రామదేవతాశక్తికూడా నిండిన (శంకరుడు అర్థనారీశ్వరుడు కదా!) ఆ ఆలయం నుండి పాదుకలని ద్వారకామాయికి తెచ్చారు ఊరేగింపుగా.సాయి వద్దకి ఆ పాదుకలు రాగానే ఆయన తన చేతితో వాటిని స్పృశించి (తన తపశ్శక్తిని ఆ పాదుకలలోనికి ప్రవహింపజేయడానికి సంకేతం అది) ఇవి శ్రీహరి పాదాలు. దైవచరణాలు.. అన్నాడు.మేళతాళాలతో భజన కీర్తనలతో బాజా భజంత్రీలతో అగరు «ధూపాలతో చందనపు నీటి చల్లులతో కర్పూరపు హారతులతో ఆ ప్రదేశం వర్ణించడానికి వీల్లేనంత గొప్పదిగా అనిపించింది అందరికీ.(శాలివాహన శకం 1834 – క్రీ.శ 1912)ఇప్పటికీ గురుశుక్రవారాల్లో విశేషార్చనలు సాగుతూంటాయి పాదుకలకి. ప్రతి రోజూ అర్చన – ఊదీ వితరణ (భస్మప్రసాదం) ఉంటూనే ఉంటుంది. పాదుకల్లో ఉన్న శక్తి అనుభవపూర్వకంగానే తెలుసుకోవాలి తప్ప చెప్తే అర్థమయ్యేది కానే కాదు. ‘ఏదైనా తినడానికి పెట్టనామ్మా?’ అని సంతానం గనుక అడిగితే – ‘అయ్యో! వాళ్లు అడిగే దాకా వాళ్ల ఆకలిని చూడలేకపోయా’ అనే ఒకింత బాధతోనూ, ఇంకా నయం! నేను ఇంట్లో ఉండగానే అడిగారు’ అనే మరింత ఆనందంతోనూ ప్రతి తల్లీ ఎలా వాళ్లకిష్టమైన తినుబండారాన్ని చేసి కడుపునింపుతుందో, అలా సాయికి కూడా మసీదు నిండుగా భక్తులుండి – ఏదైనా చెప్పవూ సాయీ! అనడిగితే చెప్పలేని ఆనందం ఆయనకి. ఇదీ అదీ చెప్పచ్చూ చెప్పకూడదూ ఇది సమ్మానం, అది అవమానకర సంఘటన అనుకోకుండా తట్టిన విశేషాలని యథార్థంగా జరిగిన వాటిని కళ్లకి కట్టినట్టుగా చెప్పేస్తాడాయన. అందరికీ సాయంటే ఇష్టం ఇందుకే. సాయికి కూడా వాళ్లంటే వాత్సల్యం, అభిమానం అందుకే! అలా సాయే చెప్పిన తన కథని అనుకుందాం! నాలుగే మార్గాలు ఓ సారి మేం ఓ నలుగురం మాత్రం– అసలు ఈ సృష్టేమిటి? బ్రహ్మపదార్థమేమిటి? బ్రహ్మజ్ఞానమేమిటి? ఈ రహస్యాన్ని స్వయంగా సాధించేసి – దీని గురించిన ఏ అవగాహన లేని ఎందరికో చాలా తేలికగా అర్థమయ్యేలా వాళ్ల వాళ్ల అనుభవానికి వచ్చేసేలా చేసేద్దాం! మనుకుంటూ బయల్దేరి ఓ నిర్జన (ఏ జనమూ ఉండని) వనానికి వెళ్లిపోయాం.ఈ తోవలో నలుగురం నాలుగు మార్గాలని – ఆ బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకోవడం కోసం ఎన్నుకున్నాం! మొదటివాడు – ఎవరో మనని ఉద్ధరిస్తారనుకోవడం శుద్ధభ్రమ. కాలయాపన(కాలక్షేపం) మాత్రమే. మోక్షం కోసం ఎవరినో ఆశ్రయించడం కంటే మనని మనమే ఉద్ధరించుకోగల ప్రయత్నాన్ని ప్రారంభిస్తే చాలు మనం ఉద్ధరింపబడతాం! ఇదే నిజమైన మార్గమంటూ కృష్ణుడు కూడా భగవద్గీతలో చెప్పాడు కదా!(ఉద్ధరే దాత్మనాత్మానమ్) అన్నాడు.వెంటనే రెండవవాడు – అసలు అన్నింటికీ కారణం మననందరినీ మంచివైపుకీ చెడువైపుకీ నడిపిస్తూ ఏ మాత్రమూ కనిపించని మనసు మాత్రమే. కాబట్టి మంచిపనికీ (సంకల్పానికీ) ద్రోహం, వంచన, అసత్యం, దర్పం... (వికల్పానికీ) లాంటి వాటిని చేయడానికీ మూలం మనసు మాత్రమే కదా! మూలం అవుతోంది. దాన్ని కాస్తా స్వాధీనం చేసుకోగలిగితే – పులిని బంధించేసిన పక్షంలో అడవి కూడా మన సొంతిల్లులాగా ఎలా తిరగడానికి సాధ్యమైపోతుందో ఆ కారణంగా మనఃస్వాధీనం సరైనదన్నాడు. ఈ ఇద్దరిదీ విన్న మూడవవాడు – ఈ కనిపించే చెట్టూ పుట్టా పదార్థం కాస్తా ప్రళయం వచ్చినప్పుడు మొత్తం ప్ర+లయం(ఒకదానిలో లీనం) అయిపోతుందో ఆ కారణంగా ఇదంతా అనిత్యం. ముగ్గులేసేవాడు ఓ మంచి బొమ్మనిగీస్తాడు. పెద్ద గాలొచ్చినా వానొచ్చినా లేక వానికి వాడే చెరిపేసినా అంత రాజుగారూ కోటా ఏనుగులూ రాజధాని.. అంతా హుష్కాకీయే కదా! అందుచేత ఈ ప్రపంచాన్ని నిత్యంగా భావించకుండా ఎప్పుడో ఒకప్పుడు పోయేవాళ్లమే– అనే నిర్వేదంతో వైరాగ్యంతో ఉంటే చాలు మోక్షం బ్రహ్మజ్ఞానం సిద్ధిస్తుందన్నాడు.నాల్గవవాడు – పుస్తకాలని చదివీ లోకజ్ఞానాన్ని దానికి మేళవించీ కాలాన్ని వెచ్చిస్తూ అనుభవాన్ని గడిస్తూ నిత్యం దైవాన్ని గూర్చిన అనుష్ఠానాన్ని (జపం ధ్యానం ఉపాసన తపస్సు అర్చన అభిషేకం...) గనుక చేస్తూ ఉంటే బ్రహ్మజ్ఞానం మోక్షం మనకి తప్పక లభిస్తుంది. ఎలా ఒక సుందరభవనంలోనికి ప్రవేశించాలంటే ఆ భవనానికి సంబంధించిన తాళపు చెవి అవసరమో, అలాంటివాడవుతూ ఉపాయాలని బోధించగల గురువుని ఎన్నుకోవడం అతిముఖ్యం. ఆయనంటూ మనకి దొరికాక ఈ శరీరాన్ని మనసునీ దాన్ని అదుపు చేయగల బుద్ధినీ ఆ గురువుకి ‘శరణాగతి’ విధానంతో సమర్పించేసుకుని – ఆయన మార్గదర్శకత్వంలో నడుస్తూ వెళ్లే చాలు – మోక్షం దానంతటదే సిద్ధిస్తుందన్నాడు. ఇలా గురువుని ఆశ్రయించినప్పుడు మాత్రం ఆయన మీద స్థిరమైన విశ్వాసం, దానికి తోడుగా ఓపిక (సహనం) అనేవి అవసరమని కూడా చెప్పాడు. అయితే ‘ఆ గురువు వివాదరహితుడూ ధనాభిలాషీమాయావీ... వంటివాడనే విమర్శలకి గురైనవాడేమో గమనించుకుని అలా కానివాడైన పక్షంలోనే అతడ్ని ఆశ్రయించాలని కూడా చెప్పాడు. ఇలానే తర్కవితర్కాలు చేసుకుంటూ మొత్తానికి ఆ వనంలో తిరగడం ప్రారంభించాం బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకోవాలనే అన్వేషణలో మహానుభావులకీ కనిపించిన ఏదైనా దివ్యమార్గం మహాపురుషదర్శనం ఆత్మజ్ఞానం కలుగుతుందేమోనని అడుగు మీద అడుగేసుకుంటూ ఆగకుండా తిరుగుతూనే ఉంటే క్రమంగా మేం వనం నుండి కీకారణ్యంలోకి వెళ్లిపోయాం. ‘ఇలాంటి ప్రదేశాల్లోనే దివ్యపురుషుల దర్శనమవుతుందనుకుంటూ నలుగురం వెళ్తున్నామన్నమాటే గాని ఆకలీ దప్పికా కారణంగానూ శారీరకశ్రమ కారణంగానూ ఓపిక పూర్తిగా నశించింది. నిర్వేదస్థితిలో ఉన్నా బలాన్ని కూడగట్టుకుని వెళ్తున్నాం.‘ఎవరు మీరు? ఎక్కడి కెళ్తున్నారు? ఏం కావాలని వెదుకుతున్నారు? తోవ తప్పారా? తోవ చెప్పనా?’ అంటూ ఓ వంజరి (అడవిలో తిరుగుతూ పక్షుల్ని కొట్టి జీవిస్తూ ఉండే వ్యక్తి) అడిగాడు నలుగుర్నీ. మా అంతటి జ్ఞానం లేని అతనికి మా ధ్యేయం చెప్పడమెందుకని భావించి మళ్లీ ముందుకే ఆశానిరాశలతో సాగిపోబోతుంటే – ‘దట్టమైన అడవి ఇది. ఇక్కడైతే నేనున్నా గాని ఆ మీదట మీకు దారీ తెన్నూ చెప్పేవాడు కూడా ఉండడు. పైగా ఎండ మండిపోతోంది. శోషవచ్చి పడిపోతే... ఆలోచించుకోండి! కొంతసేపు కనీసం విశ్రాంతైనా తీసుకోండి. నీళ్లుతాగి మీకు కావలసిందేమిటో వెతుక్కునే ప్రయత్నం చేసుకోండి’ అంటూ తాను చెప్పవలసింది చెప్పాడు. మా నలుగురికీ మాకు మేమే సాధించుకోగలమనే అహంకారముంది కదా! మీరు సమాధానం కూడా చెప్పకుండా మరింతగా ఓపిక కూడగట్టుకుని తిరుగుతూ తిరుగుతూ మళ్లీ అతని కంటనే పడ్డాం! అతను ఈసారి ఓ నవ్వు నవ్వి– ‘భగవంతుని సంకల్పం లేనిదే దేనికోసం వెతకాలో తెలియదు. ఎక్కడ వెతకాలో కూడా తెలియదు. తిండిలేని ఈ నీరసశరీరంతో దాహంలో నాలుక పిడచగడుతున్న నోటితో ఇంకా ఇంకా తీవ్రత పెరుగుతున్న ఎండలో ఏం తిరుగుతారు? పైగా తెలిసి ఉన్న చోటుకి కాదుగా మీరు వెళ్తున్నది! అంటూ అందరికీ సరిపడిన అన్నాన్ని తినండన్నాడు. మిగిలిన ముగ్గురూ మాత్రం దాని వైపుకి చూడను కూడా చూడకుండా వెళ్లిపోయారు. నాకు మాత్రం ఆలోచనలు రాసాగాయి. అన్నం పరబ్రహ్మస్వరూపం కదా! అదీ కాక విష్ణువుకున్న పేర్లలో అన్నమే అనేది ఒకపేరు ఆయనకి. అంతేకాక ‘అన్నాద’ (అన్నాన్ని తింటూండేవాడు) అని కూడా ఆయన పేరే కదా! (అన్నమన్నాద పవ చ. సాయికి గీత శ్రీవిష్ణు సహస్రనామాలూ వచ్చుననే విషయం నాలుగైదు సంఘటనల్లో స్పష్టంగా తెలుస్తుంది. వాటిలో ఇదొకటి) స్వార్థం లేకుండా , మా ఆకలిదప్పికలని గమనించి ఓ తల్లిలా పిలిచి అన్నాన్ని పెడుతూ ఉంటే ఇటు ఆధ్యాత్మికంగానైతే హరిని తిరస్కరించినట్లూ అటు లౌకికంగానైతే ఆతిథేయుడ్ని (ఆతిథ్యం ఇచ్చేవాడు) అవమానించినట్లూను అని భావించి అతనిచ్చిన నీరు తాగి ఆహారాన్నితిన్నాను. అది శిక్ష అనిపించలేదు అలా ఆకలి దప్పికలని అతను తీర్చాడో లేదో వెంటనే ఇద్దరు కనిపించారు హఠాత్తుగా నన్ను ఎక్కడికో తీసుకెడతామన్నట్టుగా చేతిని పట్టుకుని వెళ్తూ అప్పటికప్పుడు ప్రత్యక్షమైన గురుమహారాజ్కి అప్పగించారు. గురుమహారాజ్ అంటే అన్ని సందేహాలనీ తీర్చేయగల శక్తిమంతుడని అర్థం. గంభీరకంఠస్వరంతో.. ‘ఎందుకొచ్చారు మీ నలుగురూ? ఏం కావాలనుకున్నారు? వెదుకులాటæ ఎంత వరకొచ్చింది?’ అని అడిగాడు. నాకు చాలా ఆశ్చర్యమనిపించింది. ఆయనకాయనే అన్ని విషయాలనీ దాదాపుగా చెప్పేసేస్తూంటే! నేను మొత్తం చరిత్రని వివరించాను. అంతా తనకి తెలుసున్నట్లుగా విన్నాడాయన. అందుకే ఆశ్చర్యపడలేదు. మమ్మల్ని గురించి వ్యతిరేకధోరణితో మాట్లాడలేదు.‘సరే! నా మాటని తు. చ. తప్పకుండా పాటిస్తావా? నీ వెతుకులాట ముగిసేలా చేసి నీ ప్రయత్నాన్ని సఫలం చేస్తాను. ఇది నీ అంగీకారమైతే నాతోరా!’ అంటూ తన వెంట నన్ను తీసుకువెళ్లిపోయాడు కొంతదూరానికి. అక్కడ నా చేతులూ కాళ్లూ కట్టేసి పెద్దలోతైన బావి నాకు కిందుగా ఉండేలా చేస్తూ నన్ను నూతి గిలక (కప్పీ – నిలువుగా ఉంటూ గుండ్రంగా తిరిగే చక్రం) మీదుగా నన్ను కట్టిన తాడుని ఓ చెట్టు కొమ్మకి తాను కాస్తా నాకు అతని ముఖం కనిపించకుండా ఉండేలా అటు తిరిగి కూర్చున్నాడు.కాసేపయ్యాక అతనంతట అతనే తిరిగొచ్చి! ఎలా ఉన్నావు? ఏమనిపిస్తోంది? అంటూ నా శరీరాన్ని కన్నతల్లిలా ప్రేమ అనురాగ వాత్సల్యాలతో నిమిరి ఒడ్డుకి తెచ్చి కట్లు విప్పాడు.నిజానికి నాకు మాత్రం అదొక శిక్షలా అనిపించలేదు. అలా వేలాడుతున్నంత సేపు ఆ గురుమహారాజ్ మీద మాత్రమే దృష్టి అంతా. అతని రాకమీదనే మనసంతా. అలా కట్టువిప్పాక ఆయన పాదాలమీద పడుతూ ఉంటే నాకు అనిపించింది. తల్లిపక్షి ఎలా తన పిల్లని లోకం కనిపించకుండా రెక్కల్లో దాచి పక్షిబాల్యంలో రక్షిస్తుందో, కోతి ఎలా తన పిల్లని పడకుండా చూసుకుంటూ చెట్లూ గోడలూ ఇంటి మీది నుండి మరో ఇల్లూ దూక్కుంటూ వెళ్తుందో ఆవు ఎలా అప్పుడే పుట్టిన దూడని తన నాలుగుకాళ్ల మధ్యా నిలచెట్టుకుని గర్భవతి అయిన తనకి ఓపిక లేకున్నా ఎలా రక్షించుకుంటుందో... అలాగ. శరీరమంతా పులకలెత్తింది. మనసంతా ఆనందంతో నిండిపోయింది. ఏం కావాలి? అప్పుడు గురుమహారాజ్ నా ఒళ్లంతా నిమురుతూ... ‘నాన్నా! (ప్రేమపూర్వకమైన పిలుపు) నీకేం కావాలని ఆ సమయంలో అనిపించింది? ఆ కాలంలో దేని మీద నీ బుద్ధి నిలిచిపోయింది? ఏం చేస్తూ ఉండిపోయావు?’ అని అడిగాడు. ఆనందాశ్రువులు అలా రాలుతూ ఉండగా చెప్పాను – ‘గురూత్తమా! నాకెవరూ మరొకరు దిక్కులేరు. ఈ గురుమహారాజ్ మాత్రమే నాకు దిక్కు. ఆయనొచ్చి కట్లువిప్పితే చాలు. ప్రాణం నిలుస్తుంది. బతికి బట్టకడతాను. అయినా నా శరీరం మొత్తం ఆయనదే! అనుకుంటూ నిన్నే ధ్యానిస్తూ ఉండిపోయాను’ అన్నాను. అవి హృదయంలో నుండి వచ్చిన మాటలు కాబట్టి గురుమహారాజ్ కూడా ఆ మాటల్ని నమ్మాడు. ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరు మాట్లాడినా అవి నాలుక చివరి నుండి వచ్చిన మాటలా? కాదా? అనే విషయం స్పష్టంగా తెలిసిపోతూ ఉంటుంది. ఆ స్థాయిలో కూడా అబద్ధాన్నే మాట్లాడుతూ ఉంటే ముఖం అంటే కళ్లు మాత్రం నిజాన్ని కక్కేస్తాయి చూపుల ద్వారా. అంతే! గురువు వెంట మూగవాడిగా నడుస్తూ కదిలిపోయాను ఆయన అడుగులో అడుగువేసుకుంటూ. గురువుల్ని గుర్తించండి! భక్తులారా! నన్ను ఆ గురుమహారాజ్ గారి వద్దకి తీసుకెళ్లిన ఇద్దరూ నా తల్లిదండ్రులకి సంకేతమన్నమాట. తల్లీ తండ్రీ అనే వాళ్ల కర్తవ్యమేమంటే తమ సంతానాన్ని సరైన గురువు వద్దకి చేర్చడమే. ఇక ఆ గురువు కర్తవ్యమేమంటే ఈ శిష్యుడ్ని తన పుత్రునితో సమానంగా చూసుకుంటూ ఉండటమే. బంగారాన్నైనా సరే మంటలో వేసి కొద్దిపాటి రాగిని కలపకుండా సుత్తితో కొట్టకుండా ఉన్న పక్షంలో అలాగే గరుకుగా ఉండే ఆకురాతితో గీరకుండా అవసరమైతే సానపట్టకుండా అనుకున్న నగగా మారగలుగుతోందా? మదించిన ఏనుగునైనా సరే తోవలో గోతిలో పడేలా చేయకుండా, ఓ వారం రోజుల పాటు తిండి పెట్టకుండా ఉంటే అది మావటివాని మాట వింటుందా? అలాగే గురువు కూడా కొన్ని పరీక్షలకి గురి చేస్తాడు శిష్యుడ్ని. కేవలం అతడ్ని ఓ ప్రయోజకుడిగా చేయాలనేదే అతని లోనిభావం. పండితులుంటారు లోకంలో. వాళ్లది విజ్ఞాన గర్వం. అంత చదువుకున్నాను. ఇంత చదువుకున్నాననే అహంకార భావం. అంతే కాక ఒకరు చెప్పిందాన్ని ఎలా ఖండించి అవతలివాడ్ని ఓడిద్దామా? అనే కండవాతి తప్పు. ఈ తీరు గురుత్వం వాళ్లలో ఉండదు. వాళ్లకి నచ్చదు. అవసరం కూడా లేదు వాళ్లకి. ఇక మరికొందరుంటారు గురువులు. ఎంతమటుక్కు మహిమల్ని ప్రదర్శించి బేలతనపు భక్తుల్ని నమ్మించడం సొమ్ము కాజేయడం శరీరం నిండుగా బంగారాన్ని ధరించి ఆకర్షించడం... వంటివి వారి లక్షణాలు. పొద్దుటి నుండి రాత్రి నిద్రించబోయే వరకూ ధనసంపాదనకి సంబంధించిన మార్గాలనీ ఉపాయాలనీ దైవం వంకతో చేస్తూ శిష్యవిత్తాలని (శిష్యులసొమ్ముని) అపహరించడమే వాళ్ల లక్ష్యం. ఇలాంటి వారిని సేవిస్తే పవిత్రమైన విలువైన సమయమంతా గడిచిపోయి ఏ తీరు సాధనా లేకుండా శరీరం కాస్తా మరణిస్తుంది. అప్పుడు చింతించే వీలు కూడా ఉండదు. ‘కాబట్టి గురువు మందలించినా అరిచినా తిట్టినా రౌద్రంతో కనిపించినా అదంతా శిష్యుడ్ని తోవలోనికి తేవడానికి మాత్రమే అనే దృష్టితోనే సుమా!’ అని ఓ క్షణం ఆలోచనా దృష్టిని మరల్చిగాని చూసుకుంటే నిజగురువులెవరో.. అధర్మ, అసత్య, వంచన గురువులెవరో..ఇట్టే బోధపడిపోతుంది. కోయిలా కాకీ గుడ్డు దశలో ఒకలానే ఉంటాయి. గుడ్డు పగిలి పిల్ల బయటికొచ్చాక గొంతు విప్పితే చాలు ఆ కంఠస్వరంతో కాకీ కోకిలల తేడా మనకి ఎవరూ చెప్పనక్కర్లేకుండా అర్థమైపోతుంది.గురువుకి శిష్యుల మనసునీ బుద్ధినీ ఆకర్షించగల సత్యధర్మప్రవర్తన ఉండాలి తప్ప వస్త్రాలంకారాలు కాదు ప్రధానం. ఆ అరణ్యంలో అన్నాన్ని ఆ ‘వంజరి’ పెట్టినట్టుగా మీ శిష్యులు అన్నాన్ని (వరి, గోధుమలు, జొన్నలు, రాగులు..) పెడితే చాలు అదే గురువుకి పంచభక్ష్యపరమాన్నాలు కాగలగాలి. గురువుకి శిష్యులే నిజమైన సంతానం కాబట్టి వాళ్లలో ఎవరికి రోగం వచ్చినా గురువే వైద్యుడు కావాలి. వాళ్లలో ఎవరికి సంసారంలో సమస్య వచ్చినా గురువే దాన్ని పరిష్కరించే న్యాయాధిపతి కావాలి. వాళ్లలో ఎవరికి ఆకలి దప్పిక పేదతనం, దారిద్య్రం, ఆత్మహత్యా ఆలోచనం... వంటివొచ్చినా కచ్చితంగా వాటికి నివారణని చేయవలసిన బాధ్యత గురువుదే. అలా చేయగల ఉండగల శక్తీ ఇష్టం తగిన సమయం ఉన్నప్పుడు మాత్రమే ‘గురువు’గా తనకి తాను ఉండగలనని అనుకోవాలి. భక్తులు కూడా అలాంటి వాడ్నే గురువుగా (ఎంతో పరీక్ష చేశాక) ఎన్నుకోవాలి.ఎలా ఆవుదూడని ఓ వంద ఆవుల మందలోకి పంపినా అన్ని ఆవుల్నీ దాటుకుంటూ తన తల్లి పొదుగులో మాత్రమే తలని పెట్టి కుడుచుకుంటుందో అదే మరి గేదె, మేక.. వంటివాటికి ఈ నిర్ణయశక్తి లేదో అలా గురువుగా ఒకరినంటూ ఎంచుకున్నాక అలాగే వారివద్దనే కొనసాగిపోవాలి తప్ప– వస్త్రాలని మార్చినట్లు గురువుల్ని కూడా మార్చుకుంటూపోతే చివరికి ఎవరి మీదా గురి కుదరక చుక్కాని లేని నావలా జీవితం మొత్తం ఎటుకో ఎటుకో వెళ్లిపోతుంది. ఒక జీవితం మొత్తం శూన్యం అయిపోతుంది. – సశేషం డా. మైలవరపు శ్రీనివాసరావు -
నిన్ను నువ్వు నమ్ముకో!
సావిత్రీబాయి టెండూల్కర్, రఘునాథ్ టెండూల్కర్ల కుమారుడు బాబూ టెండూల్కర్. బాబు వైద్య విద్య రెండవ సంవత్సరం చదువుతుండగా జ్యోతిషులు అతని జాతక చక్రాన్ని చూశారు. ఆ సంవత్సరం గ్రహాలు అనుకూలంగా లేవని, ఎంత చదివినా ప్రయోజనం ఉండదని జ్యోతిషులు పెదవి విరిచారు. మరుసటి ఏడాది కష్టపడి చదవనవసరం లేకుండానే పరీక్షలో ఉత్తీర్ణుడవుతాడని కూడా చెప్పారు. బాబు దిగాలు పడ్డాడు. అప్పట్నుంచి చదవడం మానేసి నిర్లిప్తంగా గడపడం మొదలు పెట్టాడు. కుమారుని వాలకం చూసి సావిత్రీబాయి కలత చెందింది. ఆమె తల్లి మనసు తల్లడిల్లింది. రఘునాథ్ కూడా కొడుకుని చూసి బెంగపెట్టుకున్నాడు. సావిత్రీబాయి ఎన్నో విధాల బాబుకు నచ్చజెప్పచూసి విఫలమైంది. కష్టంలోనూ. సుఖంలోనూ తమ వెన్నంటి ఉండే బాబా వద్దకు వెళ్లింది. కొడుకు పరిస్థితి బాబాకు చెప్పుకుని కంటతడి పెట్టుకుంది. బాబా హృదయం ద్రవించింది. ‘జాతకాలు, జన్మకుండలి పట్టించుకోవద్దు. సాముద్రికాన్ని చూడవద్దు. నాపై విశ్వాసం ఉంచి బుద్ధిగా చదువుకోమను. ఈ సంవత్సరమే అతను పరీక్ష ఉత్తీర్ణుడవుతాడు’ అని బాబా అభయం ఇచ్చారు. సావిత్రీబాయి ఇంటికి తిరిగి వెళ్లి బాబా చెప్పిన మాటలు బాబుకి చెప్పింది. బాబా ఇచ్చిన అభయంతో బాబు ఆత్మవిశ్వాసాన్ని నింపుకున్నాడు. శ్రద్ధగా చదివాడు. పరీక్షలు బాగా రాశాడు. ఉత్తీర్ణత కూడా సాధించాడు. బాబాపై ఉంచిన విశ్వాసమే బాబును గట్టున పడేసింది. బాబాపై మన విశ్వాసం చెదిరిపోనిదే అయితే మనం సాధించలేనిది ఏమీ లేదు. ‘‘నిన్ను నువ్వు నమ్ముకో. నీలోని భగవంతుడిని నమ్ముకో’’ అనేది బాబా ఉపదేశం. భగవంతుడి కృపను పొందడానికి, సాయిపథంలో నడవడానికి విశ్వాసమే తొలిమెట్టు. గురువులు, ఇష్టదైవాల గురించి చదివి వదిలేయడం కాదు, వారు చెప్పిన దానిని ఆచరించాలి. అదే మనం వారిపై చూపే నిజమైన నమ్మకం. – డా.కుమార్ అన్నవరపు -
చికాగోలో ఘనంగా సాయి మహా సమాధి వందేళ్ల వేడుకలు
చికాగో: సాయి మహా సమాధి అయి వందేళ్లు పూర్తయిన సందర్భంగా ఏడాది మొత్తం ‘శతాబ్ధి సోహాల’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని యూఎస్ సాయి సంస్థాన్ నిర్ణయించింది. ఈ సందర్బంగా చికాగోలోని సాయిబాబా మందిరంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రత్యేకంగా పూజలు నిర్వహించడంతోపాటు, రథయాత్ర, వంద నదుల నుంచి సేకరించిన పవిత్ర జలాలతో బాబాకు అభిషేకం నిర్వహించారు. అక్టోబర్ 18 నుంచి 20వ తేదీ వరకు జరిగిన ఈ వేడుకల్లో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాయిబాబా చెప్పిన సూక్తులను, సాయి మహాత్యం గురించి నిర్వహకులు భక్తులకు వివరించారు. శతాబ్ది సోహాలలో భాగంగా ఆధ్యాత్మికత, అన్నదానం, పిల్లలకు ప్రేమ, సంస్కృతికై ఆరాధన, అవసరమున్న వారికి సహాయపడటం వంటి ఐదు నినాదాలతో ముందుకు సాగనున్నారు. సాయి మందిరంలో నిర్వహించిన వేడుకల్లో భాగంగా పలు ఆరాధన కార్యక్రమాలు చేపట్టారు. పిల్లలు ఆలయంలో వంద పుష్పపు మొక్కలు నాటారు. అభిషేకం ఆత్మశుద్ధి, పుష్పాభిషేకం, ముక్తాభిషేకం, బిక్షా జోలితో పాటు దసరా వేడుకలు కూడా జరిపారు. శ్రీ సాయిసచ్ఛరితం విశిష్టతను తెలిపేలా భక్తులు పలు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. -
సమాధి నుండే నా మానుష శరీరం మాట్లాడుతుంది
మనసును జయించు. నీ ఆలోచనలు నీ అధీనమవుతాయి. శాంతిని జయించు. అహంకారం నీకు తల వంచుతుంది. అహంకారాన్ని జయించు, అహం నీకు అధీనమవుతుంది. అహాన్ని జయించు. భగవంతుడు నీకు వశుడవుతాడు.భగవంతుడు ఎవరికి ఎంతివ్వాలో అంతే ఇస్తాడు. మనకున్న అర్హతను బట్టే మనకు దక్కేది ఉంటుంది. మన వైఖరిని బట్టే కష్టసుఖాలు కలుగుతాయి. అంతే తప్ప వాటినెవరూ సృష్టించరు. నా లీలన్ని చదివి నీవు ఆశ్చర్యం చెందాలన్నది నా అభిమతం కాదు. వాటిని చిత్తశుద్ధితో ఆలోచించాలన్నదే నా సంకల్పం. నువ్వు చేసే ప్రతి పనికీ సాక్షీభూతుడిని నేనే. -
బాబా చేసే చిత్రవిచిత్రాలు అంతరార్థాలు
యోగుల విషయంలో ఒక్కొక్కరిది ఒక్కో తీరు విధానం. భక్తులైనవారికి ఆ తాదాత్మ్యబుద్ధి(ఎలాగైనా ఆ దర్శించుకుంటున్న యోగియందే బుద్ధి కలిగి ఆయన దృష్టిలోనే ఆలోచించగలిగిన తనం) గాని ఉన్న పక్షంలో తప్పక కొంత కాలానికి అర్థమౌతారు ఆ మహనీయులు. నిజాన్ని నిజంగా మాట్లాడుకుంటే భక్తులకి సహనం తక్కువ. ‘ఫలానావారి దగ్గరికి వెళ్లాను. దర్శించాను. వారం తిరక్కుండా ఈ మంచి జరిగింది...’ అనే ఈ తీరు లాభదృష్టి వారిది తప్ప మహనీయుల ద్వారా తెలుసుకోదగ్గ గొప్పదనాలేమిటనే తీరు ఆలోచన నూటికి తొంభైమందికి ఉండదనేది నూటికి నూరు పాళ్లు నిజం. అందుకే తమదైన దృష్టితో ఆలోచిస్తూ భక్తులు ‘ఫలానా స్వాములవారు ఇలా.. ఫలానా వారు అలా..’ అంటూ లో–దృష్టి లేకుండా నోరు పడేసుకుంటూ ఉంటారు. అలాంటి నిందలకి సాయి కూడా దూరంగా లేడు. ఆయన్ని ‘కోపిష్ఠి అనీ, ఎప్పుడేం చేస్తాడో అర్థం కానీయనివాడనీ, ఒకసారి గొప్పగా చూస్తూ మరోసారి తొక్కి వేస్తాడనీ..’ ఇలా మాట్లాడుతూ ఉండేవారు ఆయన ఉన్నతత్వం గురించి తెలుసుకుందామని కనీసం ప్రయత్నించనివారూ కొంతకాలం ప్రయత్నించి అర్థం చేసుకోలేనివారున్నూ. ఏదో అయిపోతుంది..! డాక్టరు పండిత్ అనే ఆయన సాయి మీది సంపూర్ణ భక్తివిశ్వాసాలతో సాయిదర్శనానికి వచ్చారు. సరిగ్గా అదే సమయానికి సాయి పూజకోసం అన్ని ఏర్పాట్లూ అయిపోయాయి. పూజా సామగ్రితో దాదాభట్ అనే భక్తుడు మసీదుకి వచ్చాడు. అతడు వెళ్తుంటే డాక్టర్ పండిత్ కూడా ఆయన వెంట సాయి వద్దకి అప్రయత్నంగా వెళ్లిపోయాడు.సాయి నుదుటికి ప్రతిరోజూ ఖండోబా అనే గ్రామదేవత ఆలయపూజారి మహల్సాపతి మాత్రమే చందనాన్ని త్రిపుండ్రాకారంలో (మూడు అడ్డగీతల రూపంలో) రాస్తూ ఉండేవాడు. దాదాభట్ సాయిపాదాల మీద పుష్పాలని వేయడం వంటివన్నీ ముగించి అలా ఉన్నంతలో అక్కడి సంప్రదాయం, పూజావిధానం గురించిన అవగాహన ఏ మాత్రమూ లేని డాక్టర్ పండిత్ వెంటనే ఆ పూజాద్రవ్యాలన్నీ ఉన్న పళ్లెంలో కన్పిస్తున్న చందనాన్ని స్వయంగా తీసి సాయి నుదుటిమీద త్రిపుండ్రాకారంలో రాసాడు. భక్తులంతా బెంబేలు పడిపోసాగారు. మహల్సాపతి తప్ప మరెవరూ ఆ పనిని చేయడానికి సాయి ఏనాడూ అంగీకరించడే! పైగా ఎవరైనా రాయబోతే అభ్యంతరాన్ని కూడా చెప్తూండేవాడే! అంతటి సాయి ఇలా చిన్నపిల్లవాని నుదుటికి తల్లి బొట్టుని పెడుతూ ఉంటే చక్కగా బుద్ధిగా పెట్టించుకున్నట్టు సాయి ఇలా మౌనంగా, ఇష్టంగా అంగీకరించడమేమిటి? అని అందరూ తమలో తాము అనుకోసాగారు. సాయి విషయంలో ఎవరికైనా లోపల అనుకోవడం మాత్రమే ఉంటుంది తప్ప, ధైర్యంగా నిలిచి అడిగే శక్తి ఉండదు. దానికి కారణం సాయి ఎక్కడా లో–అర్థం లేకుండా ఏ చేష్టనీ చేసి ఉండలేదు. చేయడు కాబట్టి.. ఎవరినీ ఆ చేష్టకారణంగా నొచ్చుకునేలా చేసి ఉండే తీరు మనస్తత్వం కలవాడు కాడు కాబట్టీ. ఆ పూట పూజంతా అయిపోయింది సవ్యంగా సక్రమంగా.ఆనాటి సాయంత్రం పూజాపళ్లెరాన్ని సాయివద్దకి ఉదయం తీసుకుని వెళ్లిన దాదాభట్టే సాయికి నమస్కరించి వినయంతో సాయీ! ఓ విషయాన్ని మనవి చేసుకోవచ్చా?’ అని అడిగి అనుమతినిచ్చినట్లుగా సాయి చిరునవ్వు నవ్వడంతో ‘ఉదయం డాక్టర్ పండిత్ తమ నుదుటన చందనాన్ని త్రిపుండ్రాకారంలో రాస్తూంటే మీరు మౌనంగానే ఉన్నారే! ఎప్పుడూ మహల్సాపతిని మాత్రమే అంగీకరిస్తూ మేం ఎవరం వచ్చినా తిరస్కరిస్తుంటే మీరు ఆ చందనలేపనాన్ని అలా ఎందుకు అంగీకరించారు?’ అని కొంత భయంతో కొంత ధైర్యంతో అడిగాడు.నిదానమైన కంఠస్వరంతో సాయి ఇలా అన్నాడు. ‘‘దాదాభట్టూ! అసలు విషయాన్ని విను. డాక్టర్ పండిత్ భక్తుడన్నమాట నిజమే. అయితే ఆయన కులవిధానం ప్రకారం బ్రాహ్మణుడు. అంతేకాదు. ఇంట్లో చక్కని సంప్రదాయాన్ని పాటించే బ్రాహ్మణుడే తప్ప కేవలం జాతికి మాత్రమే బ్రాహ్మణునిగా కన్పించే ఏ కొందరివంటి వాడో కాడు. నేను నన్ను గమనించుకుని చూస్తే, ఏ పూజలకి అతిముఖ్యమైనది ఉపవసించడమనే దాన్ని బ్రాహ్మణులు పాటిస్తారో ఆ ఉపవాసవిధిని పాటించని వాణ్ణి.. ఉపవాసం అక్కరలేదని ఆ విధానాన్ని నిరసించేవాణ్ని కూడా. రోజూ ఉదయకాలంలోనే నిద్రలేచి స్నానమైతే తప్ప ఏ నిత్యదైనందిన కార్యక్రమాల్లోకి దిగనివారు బ్రాహ్మణులో, ఆ కార్యక్రమాల్లో ప్రారంభ కార్యక్రమం దైవపూజో ఆ విధానాన్ని కచ్చితంగా పాటించే జాతి వారిది. ఒక్కో సందర్భంలో స్నానాన్ని కూడా చేయని రోజులుంటాయి నా జీవితంలో. వాళ్ల జీవితాల్లో కుటుంబాల్లో స్త్రీలు అశుచిగా ఉండే మూడురోజులూ పైగా ఆ పైరోజును కూడా అశుచిగానే ఉన్నట్లు లెక్కిస్తూ 4 వరోజు ఉదయం స్నానాన్ని ముగించినా వంటావార్పు కార్యక్రమంలో భాగస్వాములు కానేకారు, అంతే కాక ఎవరైనా దురదృష్టవశాత్తూ మరణిస్తే వారి పేరిట బాంధవ్యపు దగ్గరి దూరం తనాల లెక్క ప్రకారం ఇన్ని రోజులు, అన్ని రోజులు అంటూ అన్ని రోజులపాటు మైలుని (అంటు లేదా అశుచి) పాటించే లక్షణం వారిది.ఇలాంటి విధానం లేనేలేదు. ఎవరైనా మరణించిన సందర్భంలో మా ముసల్మానులలో. స్త్రీలకి సంబంధించిన విషయం నాకు అవసరం లేనిది కదా!ఇలా ఎన్ని విధాల పరిశీలించుకున్నా డాక్టర్ పండితానికి నాకూ ఎన్నో వ్యత్యాసాలున్నాయి. అయితే డాక్టరు పండిత్ నా వద్దకి వస్తూనే కేవలం ఆ ముఖంలో భక్తి తత్పరతని కన్పింపజేస్తూ వచ్చాడే తప్ప లోపల ఏ విధమైన బెరుకుతనమూ అతనిలో లేనే లేదు. బ్రాహ్మణుడినే ఆ ముసల్మానునికి సేవ చేయడమా? మైలపడిపోనా? ఈ తీరు ధోరణే అతనిలో లేదు.మన శరీరంలోని అతి ముఖ్యమైన అవయవం – లోదృష్టితో అంతరాంతర విశేషాలని గమనించగలిగిన అవయవమూ కన్ను మాత్రమే. ఆ కారణంగా ఆ కన్ను తనలో దాగిన ఆంతర్యాన్ని బయటపెట్టకుండా ఉండనే లేదు. ఏదో ఒక దృక్కోణంలో వచ్చిన వ్యక్తి లో–దృష్టి ఏమైయుంటుందనే స్పష్టతని ఇచ్చి తీరుతుంది. ఆ దృష్టితో చూస్తే డాక్టరు పండితుని దృష్టి కేవలం భక్తి తత్పరతే తప్ప మరొక్కటి అందులో కన్పడనేలేదు. ఏదో ఓ సద్బ్రాహ్మణుడొచ్చి నానుదుటికి చందనాన్ని రాస్తే దాన్ని గమనించి మీరంతా నన్ను మరింత గొప్పవానిగా భావించాలనే ఆలోచనా ఊహా నాకు కలలో కూడా లేవు. ఉండవు కూడా. అతనిలో నాకు నచ్చింది కేవలం నిష్కల్మష భక్తి మాత్రమే ఉండటం. ఈ నిజాన్ని మనకి తెలియజేప్పేందుకు భగవంతుడు కూడా ఏదో ఒకే ఒక్క కులాన్ని లక్ష్యంగా చేసుకుని తాను జన్మించడం కాకుండా రామచంద్రునిగా క్షత్రియకులంలో కృష్ణమూర్తిగా గోపకులంలో యాదవునిగా..... ఇలా ఉద్భవించి కన్పిస్తాడు.చందనాన్ని రాయవలసిందని నేను అతణ్ణి ఆదేశించడం గానీ మరెవ్వరు గానీ సూచించనూ లేదు. అతనంత అతనే స్వయంగా చందనాన్ని చేతికి తీసుకుని నా నుదుటికి అందునా త్రిపుండ్రాకారంలో రాసాడంటే అది కూడా మానసిక నిష్కల్మషాభావానికి సాక్ష్యంగానే నేను భావిస్తున్నాను.ఈ తీరు తారతమ్య (ఎక్కువ తక్కువ అనే భేదం) భావాలని తొలగించుకోగలిగినప్పుడే భగవంతుని సమత్వాన్ని (అందరి విషయంలోనూ ఒకేలా ఉండగలిగిన తనాన్ని) దర్శించగలం! అందుకే ఆయనకున్న పేర్లలో ఒకటి ‘సమదర్శనః’ అనేది. ఒక్కోసారి....! అవును! నన్నొక్కసారి గమనిస్తూ నా వింత చేష్టలని దర్శిస్తూ భక్తులంతా తలకిందులైపోతూ ఉంటారు. అలా ఉండడాన్ని నేను గమనిస్తూనే ఉంటాను. మరి గమనిస్తూ ఉండి కూడా అలా ఎందుకు ప్రవర్తించాలి? అనేది భక్తుల ఆలోచన. ఇదే తెలుసుకోవాల్సిన రహస్యం.అనేక జాతులు, మతాలు, కులాలు, స్త్రీ, పురుష, బాల, వృద్ధ, వితంతు అనేక వృత్తిదారులైన వాళ్లు ఇక్కడికి వారివారి సహజ జన్మసంస్కారాలతో వస్తూంటే వారందరినీ ఒకే మార్గంలో నడిపించాలంటే కావలసింది ఏకత్వమార్గం. అగ్నిలో పచ్చని, తెల్లని, నల్లని, ఎర్రని... మృదువైన, కఠినమైన... ఎండిన, తడిగా ఉన్న, లోహరూపంగా ఉన్న, శరీర రూపంలో ఉన్న, ఏ పదార్థం పడినా.. అన్నీ అగ్ని రూపంలోనే అయిపోయి చివరికి ఒకేతీరు భస్మం ఎలా వస్తోందో అదే తీరుగా మీ అందరిలోని భిన్నత్వమూ పోయి ఏకత్వమే రావాలి. అందుకే ఈ తపనంతా!కొందరిచేత చందనాన్ని రాయనీయడనీ, కొందరికి మాత్రమే ఆ అవకాశాన్నిస్తాడనీ అనుకోవద్దు! ఆ డాక్టర్ పండిత్ హృదయం సంపూర్ణ నిష్కల్మషమయంగా ఉంది కాబట్టే నా లో–అభిప్రాయాన్ని తాను అడిగి తెలుసుకున్నట్టుగా ఆ చందనాన్ని ఏ బొట్టు పెట్టడం మాదిరిగా చుక్కబొట్టు పెట్టడం కాకుండానూ, కేవలం త్రిపుండ్రాకారంలోనూ మాత్రమే పెట్టడం జరిగింది! ఇది నిజంగా ఆశ్చర్యకరం కాదూ!ఎక్కడినుండో పడిన వర్షం చుక్కచుక్కగా పడి చిన్న సెలయేరుగా మారి, ఆ సెలయేళ్లన్నీ ఓ నదిగా మారి, ఆ నదులన్నీ సముద్రం వైపుకి వేగంగా పరుగెత్తుకుని వచ్చి సముద్రంలో కలుస్తూ సముద్రానికున్న లోతుతనాన్నీ, సముద్రానికున్న ఉప్పదనాన్నీ, సముద్రానికున్న కెరటపుతనాన్నీ, సముద్రానికున్న సుడిగుండాల పద్ధతినీ, అనుక్షణం ఒడ్డుకొచ్చి వెనక్కి వెళ్లే లక్షణాన్నీ అంటే నదికి వీటిలో ఏ ఒక్క విధానమూ లేకున్న తనాలని కలిగి ఉన్న సముద్రంలో ఐక్యమైపోతూ ఉంటే వద్దువద్దని సముద్రం అంటోందా? అందా? నేను కూడా నా భక్తుల అసమానతలని తొలగించాలని ప్రయత్నించేవాడినే తప్ప ‘నా మాటే సాగాలి’ అని భావించే నిరంకుశుణ్ణి కాను. ఏదో తీవ్రమైన ఆనందం ఉత్సాహంతో అనుకున్న క్షణంలో ఏదో పెద్ద భవంతిని నిర్మించాలని భక్తులంతా అనుకున్న వేళ అది సరికాని సమయమని స్పష్టంగా తెలిసిన నేను –వారి ఉత్సాహాన్ని మరింతగా ప్రోత్సహిస్తూ పని మొత్తం పూర్తయిపోయేలా చేసి ఆ మీదట ఏవైనా తేడాలు ఉపద్రవాలూ జరిగితే ‘‘చెబుదామనే అనుకున్నానుగానీ మీ ఉత్సాహాన్ని చల్లార్చడం ఇష్టం లేక ఊరుకున్నాను’’ అని అంటే అది ఎంత ద్రోహం?? ఎంత అపచారం???నా మాటలు అప్పుడప్పుడు మీకు కఠినంగానూ పెళుసుగానూ అనిపించవచ్చు. వాటికి నేనేమీ పశ్చాత్తాపపడను. మరాఠా భాషలో ‘ఓవీ’లనే పేరిట (తెలుగులో కందం తేటగీతి పద్యాల్లా.. సంస్కృతంలో శార్దూలం మత్తేభం పద్యాల్లాగా.. ఆంగ్లంలో సానెట్స్.....) ఛందస్సులో ఒకటుంది. తెల్లబడాలనే ఉద్దేశంతో పిల్లవాడు జిల్లేడు పాలని ఒంటికి రాసుకోబోతుంటే... ఏముందో చూద్దామని పిల్లవాడు పాముల పుట్టలోకి చేతిని దూర్చబోతుంటే... చురకత్తి పదునుతో గోళ్లని తెంచుకుందామని పిల్లవాడు ప్రయత్నించబోతుంటే.. ఏ తల్లైనా ‘ఎంత ప్రయోజకుడు నా పుత్రుడు? అనుకుంటుందా? లేక చెళ్లున చెంపమీద ఒకటి వేస్తుందా?’ అని ఆ ఓవీకి అర్థం. అదే నా లక్షణం. లక్ష్యం కూడా.అల్లాహ్ అక్బర్ ఈ విధానాన్ని సరైనదని అంగీకరించాడూ అంగీకరిస్తున్నాడూ కాబట్టే ఇంత చిత్రవిచిత్ర విధానాలనీ చేష్టలనీ ప్రదర్శిస్తున్నా (నాకు తెలియని భావోద్వేగ స్థితిలోనే సుమా!) మీరంతా ఇక్కడే ఉంటూ లేదా ఎక్కడి నుండో వస్తూ అదే భక్తి తత్పరతలని చూపిస్తున్నారు.ఒక్కటి మాత్రం సత్యం.వర్షం వస్తోందనో ఎండ వేడిమి బాగా ఉందనో అలాంటి ఉద్దేశంతో బాటసారి, ఆ చెట్టు నీడని కాసేపు తలదాచుకున్నప్పుడు ఇంకా వర్షం కురుస్తోందనీ మీద పడుతున్నాయి చినుకులని అనిపించినా, చెట్టునీడ ఈ ఎండకి సరిపోలేదని అనిపించినా వెంటనే చెట్టుని విడిచిపోతాడు తప్ప చెట్టు ఆ బాటసారిని ప్రార్థించదు ఇక్కడే ఉండవలసిందని. ముగింపుగా మరోమాటని వినండి. ‘మీరు వెళ్లి ఆ డాక్టర్ పండితుడిని ‘నువ్వు ఎవరూ చెప్పకుండా ఆ చందనాన్ని అలాగే త్రిపుండ్రాకారంగా రాయాలని ఎందుకనుకున్నావు?’ అని అడగండి. అతడి దృష్టి నా దృష్టి ఆ సమయంలో ఒకేలా ప్రసరించింది కాబట్టి అతడు చెప్పేదాన్ని విని నిర్ణయించుకోండి’ అని ముగించాడు సాయి.భక్తుల్లో ఏ ఒక్కరూ ఆ సాహసాన్ని అవినయమౌతుందనే భావనతో ప్రశ్నించలేదు గానీ, దాదాభట్ మాత్రం డాక్టర్ని అడిగితే ఆయన స్పష్టంగా చెప్పాడు – ‘అప్పటివరకూ ఏదో భక్తునిగా వెళ్లాలని భావించాను గానీ ఆ సమయంలో నాకు సాయి సాక్షాత్తు నా జీవిత మార్గదర్శకుడైన గురువు’ అని అనిపించింది. అందుకే అప్రయత్నంగా ఆయన హృదయంలోనుండి ప్రసరించిన ఆ ఆజ్ఞకి అనుగుణంగా కాబోలు ఆ చందనాన్ని అలా త్రిపుండ్రాకారంలో నుదుటన రాశాను. ఈ అవకాశాన్ని ఎవరికీ సాయి ఇవ్వడనిగానీ, అందుకే మీరు (దాదాభట్) రాసి ఉండలేదని గానీ నాకు తెలియనే తెలియదు’ అన్నాడు.సాయి ప్రతి చేష్టలోనూ ఓ అంతరార్థం ఉండే ఉంటుంది. వాటి గురించి తెలుసుకోనంతకాలం ఆ చేష్టలన్నీ ఏవో ఏవోలా అనిపిస్తూ ఉండవచ్చు. కానీ అర్థం తెలిసాక, లో–అర్థం అనుభవానికొచ్చాక ‘బాబాయే మా జీవితమార్గదర్శకుడు’ అనే స్థాయి భక్తులమై తీరుతాం నూటికి నూరుపాళ్లూ ఇది నిస్సందేహమైన విషయం.భక్తులే కాక పంచభూతాలు కూడా సాయి అధీనంలో ఉంటాయా? ఎప్పుడు ఎక్కడ? చూద్దాం! – సశేషం డా. మైలవరపు శ్రీనివాసరావు -
చీకటి బ్యారక్‌లలో మగ్గుతున్న జైలు జీవితాలు
జైళ్లు రక్షణ గృహాలనీ, శిక్షా గృహాలు కావనీ, ఖైదీల పట్ల గౌరవ మర్యాదలతో సిబ్బంది ప్రవర్తించాలనీ, సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో చెప్పింది. ఇన్ని చట్టాలున్నా..ఏవీ కూడా ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాకు వర్తించవా అనేది నా మనసును ఎప్పటి నుంచో తొలుస్తున్న ప్రశ్న. ఆయన పరిస్థితి ప్రత్యేకమైనది. 90 శాతం వైకల్యంతో పాటు ఎన్నో ఇతర తీవ్రమైన అనారోగ్య సమస్యలు కూడా ఆయన్ను సుదీర్ఘకాలంగా వేధిస్తున్నాయి. అన్ని వ్యాధులతో, కదల్లేని స్థితిలో ఉన్న నిస్సహాయుడైన ఇలాంటి ఖైదీ ఉండాల్సినది ఆసుపత్రిలో, వైద్యుల పర్యవేక్షణలో. కానీ సాయిబాబాని ఉంచింది నాగ్‌పూర్ జైల్లో గాలీ వెలుతురూ సోకని అండా సెల్ అనే చీకటి గుహలో. అగ్నిధార పుస్తకంలో దాశరథి రంగా చార్యులు నిజామాబాదు జైలు జీవితం అనుభవానికి ఇచ్చిన అక్షర రూపం ‘ఇట వసంతము లేదు....’ అనే సుప్రసిద్ధ పద్యం. నా గదిలో ఓ మూలకు పడి ఉన్న ఈ ఖండకావ్యాన్ని ఈ మధ్యనే మరో సారి చేతిలోకి తీసుకొని పుటలను తిర గేస్తుంటే.. అవి నన్ను నా గతంలోకి, అప్పటి నా జైలు జీవితం వైపుకు తీసు కుపోయాయి. చీకటి బ్యారక్‌లలో మగ్గి పోయిన మేరీ టేలర్, జూలియస్ ఫ్యూజిక్, నెల్సన్ మండేలాను గుర్తు చేశాయి. అండా సెల్లో కుంగిపోతున్న ప్రొఫెసర్ సాయి బాబాను యాదిజేశాయి. అయితే నేను వాళ్లంత గొప్పవాణ్ణి, త్యాగశీలిని కాదు గానీ ఈ సందర్భంగా వాళ్లను గుర్తు చేసు కుంటూ జైళ్ల చట్టాలపై ఓ చర్చ చేయడానికి అవకాశం దొరికింది. 1991లో నా మీద టాడా కేసు పెట్టి ముషీరాబాద్ జైల్లో పెట్టారు. (ఇప్పటి గాంధీ ఆసుపత్రి) మావోయిస్టు ఉద్యమకా రుణ్ణి, పైగా జర్నలిస్టులను కాబట్టి సాధారణ బ్యారక్‌లో ఖైదీలతో కలిసి ఉంటే వారిని చెడగొట్టి, ఉద్యమం వైపుకు మలుపుతాననే ఆలోచనతో నన్ను అత్యంత ప్రమాదకర నేరస్తునిగా ముద్రవేసి చీకటి బ్యారక్‌లోకి పంపారు. గాలి, వెలుతురు సోకని చీకటి గది అది. ఓ నీళ్ల కుండ ఉండేది. చేతి సైగతో తడిమి కుండలోని నీళ్లు తాగాల్సి వచ్చేది. 15 రోజులకు ఒక్కసారి జాలి ములాఖత్ ఇచ్చే వాళ్లు. వందల మంది ఖైదీల బంధువులను ఒక్కసారే వదిలేవారు. ఇరుకైన చిన్న ప్రదేశం జనం తోసుకుంటూ వచ్చేవాళ్లు. ఎవరు ఏం మాట్లాడుతున్నారో అర్థం అయ్యేది కాదు.. నేను జైలుకు వెళ్లేటప్ప టికి సుజాత (నా భార్య) నిండు గర్భిణి. పొత్తికడుపును జాగ్ర త్తగా దాచుకుంటూ జనం, తనూ ఒకతై ఆయాసపడుకుంటూ ములాఖత్‌కు వచ్చేది. మా ఇద్దరి మధ్య 10 ఫీట్ల ఇనుపజాలి అడ్డంగా ఉండేది. ఆమె కన్నీళ్లు తప్ప నాకు ఇంకేమీ కనిపించేది కాదు, వినిపించేది కాదు. చాలామంది విప్లవ ఖైదీలు ఈ పరిస్థితిని అనుభవించారు. ‘జాలి ములాఖత్’ తొలగించాలనే డిమాండ్‌ను మావోయిస్టు పార్టీ బలంగా రాజ్యం ముందు ఉంచింది. జైలుశిక్ష పడినంత మాత్రాన వారికి పౌరహక్కులు లేకుండా పోవు . కానీ మన జైలు చట్టాలు1836 నాటి బ్రిటిష్ ఏలుబడిలో అరువు తెచ్చుకున్న చట్టాలు.. 1877లో కారాగార చట్ట రూప కల్పన ప్రారంభమయింది. స్వాతంత్య్ర కాంక్షతో ఉద్యమించిన వాళ్లను జైళ్లలోనే కుక్కి చంపాలనే రాజ్య హింసను మనసులో పెట్టుకొని చేసిన చట్టాలవి. కారాగారాలను శిక్షాలయాలుగా తీర్చి దిద్దారు. బ్రిటిష్ వారి ఏలుబడిలోనే 1894లో ప్రిజన్స్యాక్టు అమ లులోకి వచ్చిన తరువాత 2012 వరకు వివిధ జైలు సంస్కరణ కమిటీలు ఖైదీలకూ పౌర హక్కులు ఉన్నాయని తేల్చిచెప్పాయి. జైళ్లు రక్షణ గృహాలనీ, శిక్షా గృహాలు కావనీ, వారికి ఉచిత, న్యాయ సహాయం అందచేయటం సర్కారు బాధ్యత అనీ, ఖైదీల పట్ల గౌరవ మర్యాదలతో సిబ్బంది ప్రవర్తించాలనీ జైళ్లల్లో సంస్కరణ పర్వానికి మానవతా విలువలు జోడించాలనీ (రతీరామ్ కేసు 2012) సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో చెప్పింది. ఖైదీలందరికీ పౌరహక్కులు లభిస్తాయని చల్లా రామకృష్ణారెడ్డి కేసు (2000)లో సుప్రీం ప్రకటించగా, మానవహక్కుల కొనసాగింపునకు జైలు గోడలు అడ్డంకి కారాదనీ, రాజ్యాంగం ప్రసాదించిన సమానతా హక్కు, వాక్ స్వాతంత్య్రం, జీవించే హక్కు ఖైదీలకు సైతం నిరా టంకంగా వర్తిస్తాయని జస్టిస్ చిన్నపరెడ్డి 1983లో స్పష్టం చేశారు. ఇన్ని చట్టాలున్నా.. ఏవీ కూడా ప్రొఫెసర్ సాయిబాబాకు వర్తించవా అనేది నా మనసును ఎప్పటి నుంచో తొలుస్తున్న ప్రశ్న. సాయిబాబా పరిస్థితి ప్రత్యేకమైనది. 90 శాతం వైకల్యంతో పాటు ఎన్నో ఇతర తీవ్రమైన అనారోగ్య సమస్యలు కూడా ఆయన్ను సుదీర్ఘకాలంగా వేధిస్తున్నాయి. సాయిబాబా గత 15 ఏళ్లుగా హైబీపీతో బాధపడుతున్నారు. పోలీసుల విచారణలో ఒక చేయి పూర్తిగా పనిచేయని స్థితికి వచ్చింది. గుండె కండరాలకు సంబం ధించిన వ్యాధి.. గాల్ బ్లాడర్‌లో రాళ్ల సమస్య తీవ్రంగా ఉంది. అన్ని వ్యాధులతో, కదల్లేని స్థితిలో ఉన్న నిస్సహాయుణ్ణి గాలీ వెలు తురూ సోకని అండాసెల్ అనే చీకటి గదిలో ఉంచడంతో ఒక్కొక్క అవయవం ఆగిపోతోంది. ఇలాంటి ఖైదీ ఉండాల్సినది ఆసుప త్రిలో, వైద్యుల పర్యవేక్షణలో. కానీ సాయిబాబాని ఉంచింది అండా సెల్ అనే చీకటి గుహలో. మన ౖజైళ్ల చట్టంలోని 37, 38, 39 సెక్షన్ల ప్రకారం జైలు అధికారులు ఖైదీలకు అనారోగ్య సమ స్యలు ఏర్పడినప్పుడు వారిని వెంటనే జైలు లోని ఆసుపత్రికి తర లించాలి. ఇంకా అదనపు వైద్య సహాయం అవసరమైన పుడు ప్రత్యేక సదుపాయాలు కలిగిన బయటి ఆసుపత్రుల్లో అవసర మైన వైద్య సహకారం అందించాలి. నిర్బంధంలో ఉన్నప్పుడు అతను ఆరోగ్యంగా ఉండేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ఇక్కడో సంఘటన గుర్తు చేయాలి. ఎన్సీఆర్బి (నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో) రికార్డుల ప్రకారం విచారణ పూర్తికాని 2.52 లక్షల మంది నిందితుల్లో 55 శాతం మంది ముస్లింలు, దళితులు, గిరిజనులే. 2010 నుంచి 2014 వరకు 25 శాతం నిందితులు ఏడాదికి మించి జైలులో విచారణ పేరుతో మగ్గిపోవలసి వచ్చింది. 2014లో ప్రతి 10 మంది ఖైదీల్లో ఏడుగురు విచారణ ఖైదీలుగానే ఉన్నట్టు వెల్లడయింది.. దేశంలోని 1,402 జైళ్లు 5 లక్షల మంది ఖైదీలతో కిక్కిరిసి ఉంటున్నాయి. జార్ఖండ్‌లో 27 జైళ్లు, ఛత్తీస్‌గఢ్‌లో 28 జైళ్లు ఉన్నాయి. ఇక్కడ 7,550 మంది ఖైదీ లకన్నా ఎక్కువ మంది ఉంటే నరకమే .. కానీ ప్రస్తుతం జార్ఖండ్ జైళ్లలో 20 వేల మంది, ఛత్తీస్‌ఘడ్ జైళ్లలో 17,662 మంది వరకు ఖైదీలున్నారు. దేశం మొత్తం మీద జైళ్లలో ఆక్యుపెన్సీ సరాసరిగా 114.4 శాతం మించకూడదు. దీన్ని బట్టి దేశంలో ఏ జైలులో లేని ఆక్యుపెన్సీ శాతం ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్‌లోనే ఉండడం గమనార్హం. అటువంటి జార్ఖండ్ జైలులో ఒక విచారణ ఖైదీ మాలతి. ఆమె మావోయిస్టు పార్టీ జార్ఖండ్ రాష్ట్ర కార్యదర్శి రవిశర్మ జీవిత భాగస్వామి. ఆమె కూడ పార్టీ మహిళా విభాగంలో పని చేస్తు న్నారు. నరక కూపం లాంటి అక్కడి జైల్లో ఉండలేక తనను తెలం గాణ జైలుకు మార్చాలంటూ దాదాపు ఆరేళ్ల్ల కిందట దరఖాస్తు పెట్టుకుంది. ఆమె అభ్యర్థన ఎవరికీ పట్టలేదు. గత ఏడాది నేను అంచనా పద్దుల కమిటీ చైర్మన్ హోదాలో జైళ్ల శాఖపై సమీక్షా సమావేశం పెట్టినప్పుడు ఆమె లేఖ నా దృష్టికి వచ్చింది. ఆ లేఖపై మీరు ఎందుకు స్పందించలేదని జైలు అధికారులను అడి గితే నాకు సరైన సమాధానం దొరకలేదు. మొత్తానికి ఎలాగోలా కసరత్తు చేస్తే ఆమెను ఇప్పుడు తెలంగాణ జైలుకు మార్చారు. కానీ మాలతి లాంటి ఎంతమంది అర్జీలు బుట్టదాఖలయ్యాయో తల్చుకుంటే హృదయం ద్రవిస్తోంది. సోలిపేట రామలింగారెడ్డి, వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు, దుబ్బాక శాసన సభ్యులు మొబైల్ : 94403 80141 -
షిర్డీలో గోడపై సాయిబాబా ఆకృతి
సాక్షి, ముంబై: షిర్డీలోని ద్వారకా మాయిలోని ఓ గోడపై బుధవారం అర్ధరాత్రి సాయిబాబా ఆకృతి (చిత్రం) కన్పించదని ఓ భక్తుడు తెలపడంతో షిర్టీ పరిసరాల్లో ఒక్కసారిగా రద్దీ పెరిగింది. సుమారు మూడు గంటలపాటు సాయిబాబా చిత్రం కన్పించిందని స్థానికులు చెబుతున్నారు. సాయిబాబా దర్శనమిచ్చిన ద్వారకామాయిలోని గోడను తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున షిర్డీకి చేరుకున్నారు. అయితే ఇలాంటిదేమి ఉండదని కొందరు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా మరోవైపు షిర్డీ సాయిబాబా సంస్థాన్ మాత్రం ఈ విషయంపై అధికారికంగా ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. -
సాయి చెంతకు కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు షిర్డీ యాత్రకు వెళ్లనున్నారు. బేగంపేట విమానశ్రయం నుంచి కేసీఆర్ ప్రత్యేక విమానంలో షిర్డీకి వెళ్తారు. శుక్రవార తెల్లవారుజామున సాయి బాబాని దర్శించుకుంటారు. ఫెడరల్ ఫ్రంట్ నేపథ్యంలో కేసీఆర్ షిర్డీ యాత్ర ప్రాధాన్యత సంతరించుకుంది. -
సాయం చేయి.. సమానంగా చూడు
సాక్షి, హైదరాబాద్: షిరిడీ సాయిబాబా.. ఎందరికో ఆధ్యాత్మిక గురువు.. మరెందరికో దైవం! మనిషి తనను తాను తెలుసుకునేందుకు, దైవత్వం గురించి అర్థం చేసుకునేందుకు ఆధ్యాత్మికత ఒక మార్గం. సాయిబాబా మహా సమాధి అయి వందేళ్లు అయిన సందర్భంగా.. సాయితత్వం ఏమిటి? ఆయన బోధనలు ఎవరి కోసం తదితర అంశాలపై ‘సాక్షి’ ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సాయి గ్లోబల్ మూవ్మెంట్ సూత్రధారి చంద్రభాను శతపతిని కలిసింది. ఆయన హైదరాబాద్ వచ్చిన సందర్భంగా మాట్లాడింది. ఆ వివరాలివీ.. షిరిడీ సాయిబాబా మహా సమాధి అయి వందేళ్లు అయింది. దాని ప్రాముఖ్యతను వివరించగలరా? సాధారణ పరిభాషలో ఒక వ్యక్తి తన శరీరాన్ని వదలడాన్ని మృత్యువు అంటాం. శరీరం సమాధిలో కప్పబడితే అతడు సమాధి అయ్యారు అంటాం. కానీ ఆధ్యాత్మిక రంగానికి వస్తే.. వేదాంతం ప్రకారం భౌతిక ఉనికి అన్న పరిమితిని దాటి సూక్ష్మ శరీరంతో కొనసాగించగలిగే వారు తమ శరీరాన్ని వదిలివేయడాన్ని మహా సమాధి అంటాం. సాధారణ వ్యక్తి మరణిస్తే అతడు మళ్లీ రాడన్న బెంగతో బాధపడే వాళ్లు ఉంటారు. షిరిడీ సాయి వంటి వారు శరీరాన్ని వదిలినా తమ సూక్ష్మ శరీరంతో ఉంటారు. వారు నిత్యం దేవుడితో మమేకమవుతుంటారు. ఇది వారిని అనుసరించే వారు ఆనందించే విషయం. మరణానికి ముందు.. తర్వాత అన్న హిందూ ఆధ్యాత్మిక వాదం తాలూకూ సైన్స్ ఇదే. ఈ నేపథ్యంలోనే షిరిడీ సాయి మహా సమాధి పొంది వందేళ్లయిన సందర్భాన్ని చూడాల్సి ఉంటుంది. షిరిడీ సాయి తత్వం ఏమిటి? భక్తులు అనుసరించాల్సిన మార్గం ఎలా ఉండాలి? సాయి అన్న పదం వేర్వేరు అర్థాలను సూచిస్తుంది. సాయి అంటే భగవంతుడు.. పాలకుడు.. రక్షకుడు.. తండ్రి. మీ ప్రాపంచిక, ఆధ్యాత్మిక అవసరాలు ఎవరైతే తీరుస్తారో వారు ఆధ్యాత్మిక పురుషులవుతారు. ప్రాపంచిక అవసరాలు మన అవసరాలకు తగ్గట్టుగా ఉండాలి కానీ.. ఆశలకు తగ్గట్టు కాదు. ఆధ్యాత్మిక గురువులు అందరూ దీన్నే ఆచరించారు. షిరిడీ సాయి తత్వం మొత్తం ఆధ్యాత్మిక స్థాయిలో మానవులందరూ ఇతరులకు సాయం చేసేలా, మార్గదర్శనం చేసేలా ఎదగాలని చెబుతుంది. అందరినీ సమానంగా చూడాలని చెబుతుంది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్లు సమాజంలో ధర్మం గతి తప్పినప్పుడు అంటే సమాజపు కట్టుబాట్లను అనుసరించని.. లేదా ఆ కట్టుబాట్లు ఆయా కాలపు సమాజాలకు పనికిరాకుండా పోయిన సందర్భాల్లో వాటిని మార్చాలి. లేదంటే ప్రకృతి స్వయంగా వాటికి అడ్డుకట్ట వేస్తుంది. ఇటీవల షిరిడీ సాయిబాబాపై అనేక వివాదాలు ఏర్పడ్డాయి. మీరేమంటారు? చరిత్రను చదివితే షిరిడీ సాయి బాబా ఉన్నప్పుడు ఈ వివాదాలు లేవని స్పష్టమవుతుంది. వందేళ్ల తర్వాత ప్రజలకు వారివైన ఆలోచనలు ఏర్పడ్డాయి. బాబాతో అనుబంధం ఉన్న వారి అనుభవాలు గమనిస్తే వివాదాలేవీ కనిపించవు. సాయి తత్వంతో మీ ప్రయాణం ఎలా మొదలైంది? సాయిబాబాపై తీసిన ఒక సినిమా చూసిన తర్వాత ఆయన గురించి తెలుసుకోవాలని అనుకున్నా. చదివిన కొద్దీ ఆయన వ్యక్తిత్వం నచ్చింది. అతడి దయాగుణం.. కులమతాలకు అతీతంగా అందరినీ ఆదరించడం.. అందరికీ అతడు ఆదరణీయుడు కావడం... ఆయన గొప్పతనానికి కొన్ని నిదర్శనాలు. సమాజంలో అసంతృప్తి ఎక్కువైందన్న వాదనలున్నాయి. నిర్మాణాత్మక చర్చకు తావు లేకుండా పోతోంది. దీనిపై బాబా సూచించే మార్గం ఏమిటి? ఇదో సామాజిక, రాజకీయ పరిస్థితికి సంబంధించిన ప్రశ్న. తన జీవితం మొత్తం సాయి చెప్పింది ఒక్కటే.. ఓపికతో ఉండ మని. సమాజం ఎప్పుడు ఒకే రీతిలో ఓపికతో లేదు. హెచ్చు తగ్గులున్నాయి. ఇంతకంటే ఎక్కువగా ఈ అంశంపై వ్యాఖ్యానించడం సరికాదు. మీరు నమ్మే సత్యం? మంచితనానికి మించిన దైవత్వం లేదన్నది నేను నమ్మే అంశంహేతువాదం, ఆధ్యాత్మిక వాదాల్లో మనిషి ఏది ముందు ఆచరించాలి? రెండూ వేర్వేరు కాదు. హేతువాదం అంటే ఆధునిక శాస్త్రం సృష్టించిన వ్యవస్థ. పరిక రాలు, పద్ధతులు అభివృద్ధి చేయడం తర్కబద్ధంగా ఆలోచించడం వంటివన్నీ ఇందు లో ఉంటాయి. ఆధ్యాత్మికతకు ఇవేవీ అవసరం లేదని అనుకుంటారు. ప్రాథమికం గా ఈ ఆలోచనే తప్పు. ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించే వారు తమ శక్తులన్నిం టినీ కేంద్రీకరించి.. తమ ఉనికి, దేవుడి గురించి ఆలోచనలు చేస్తుంటారు. పూర్వం యజ్ఞాలు, హోమాల ద్వారా దేవుడి గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తే.. ఆధునిక యుగంలో మనిషి సైన్స్ ద్వారా పదిమందికి ఉపయోగపడే పనిచేస్తున్నాడు. సామాజిక అభ్యున్నతి కోసం జీవితాలను అంకితం చేసిన శాస్త్రవేత్తలు కూడా దేవుడిని అన్వేషిస్తున్న వారిగానే చూడాలి. బాబా భక్తులకు మీరిచ్చే సందేశం? సాయిబాబా భక్తులకు అందాల్సిన సందేశం వారికి ఎప్పుడో అందింది. ఒక భక్తుడిగా నాకేం తెలుసో.. వారికీ అది తెలుసు. -
సాయిబాబా ఆలయంలో వింత వెలుగు!
బెంగళూరు : మైసూరు జిల్లా హుణసూరిలోని శ్రీ సాయిబాబా ఆలయంలో అద్భుతం చోటుచేసుకుంది. ఆలయంలోకి ప్రవేశించిన సూర్య కిరణాలు అచ్చు సాయి బాబా ఆకారం కనిపించిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. సోమవారం మధ్యాహ్నం ఆలయంలోకి సూర్య కిరణాలు ప్రవేశిస్తున్న సమయంలో ఆవి సాయి ఆకృతిలో ఉండటంతో భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ దృశ్యాలు మొత్తం అక్కడి సీసీ టీవీలో రికార్డు అయ్యాయి. మంగళవారం ఆలయ పూజారి సీసీ కెమెరాలను పరిశీలించగా ఈ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. సూర్య కిరణాల నడుమ సాయి నడిచి వచ్చినట్లు దృశ్యాలు అందులో ఉన్నాయి. అదే సమయంలో ఓ భక్తుడు బాబా సన్నిధిలో పూజ కూడా నిర్వహిస్తున్న దృశ్యం కూడా అందులో ఉంది. దీంతో పెద్ద సంఖ్యలో సాయి దర్శించుకోవడానికి భక్తులు ఆలయానికి వస్తున్నారు. -
ఆ ఆలయం హుండీ నిండా.. పెద్దనోట్ల కట్టలు!
సాక్షి, ముంబై: పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో దేవుళ్ల హుండీకీ డిమాండ్ పెరిగిపోయినట్టు కనిపిస్తోంది. చాలామంది భక్తులు రద్దైన రూ. 500, రూ. వెయ్యి నోట్లను హుండీలో కానుకలుగా సమర్పిస్తున్నారు. దీంతో అన్నీ ఆలయాల హుండీలు పాత నోట్ల కట్టలతో కళకళలాడుతున్నాయి. తాజాగా షిర్డీ సాయిబాబా ఆలయానికీ పాతనోట్ల రూపంలో కానుకలు వెల్లువెత్తాయి. గత మూడు రోజుల్లో షిరిడీ హూండీలలో భక్తులు రూ. 1.50 కోట్ల కానుకలుగా సాయిబాబాకు సమర్పించగా, వీటిలో ఏకంగా రూ. 1.07 కోట్లు రద్దైన రూ. 500, 1000 నోట్లే కావడం విశేషం. షిర్డీ సాయిసంస్థాన్ పెద్ద నోట్లను స్వీకరించడం లేదని ప్రకటించినప్పటికీ అనేకమంది భక్తులు పాత నోట్లనే హుండీలో వేస్తున్నారు. రానున్న రోజుల్లోనూ మరిన్ని పాత నోట్లు హుండీలలో దర్శనమిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఇలా జరగకుండా ఉండేందుకు మరాఠ్వాడాలోని అనేక మందిరాల్లో ఉన్న హుండీలను సీల్ చేసేశారు. మరోవైపు ఆలయ హుండీలలో సమర్పించే కానుకలకు లెక్క చెప్పాల్సిన అవసరం లేదని కేంద్రం పేర్కొన్న సంగతి తెలిసిందే. -
రెండు ఆలయాల్లో చోరీ
చింతకొమ్మదిన్నె: మండలంలోని గంగమ్మతోపు ఆవరణలోని సాయిబాబా, వీరభద్రస్వాముల ఆలయాల్లో శనివారం అర్ధరాత్రి హుండీల్లోని నగదును దుండగులు చోరీ చేశారు. సాయిబాబా ఆలయానికి ఉన్న తలుపుల గడియకు ఉన్న తాళాన్ని పగులగొట్టి హుండీని బయటికి ఎత్తుకెళ్లారు. హుండీ తాళాలు పగులగొట్టి నగదు దోచుకెళ్లారు. అలాగే సమీపంలోని వీరభద్రస్వామి ఆలయంలో ఉన్న పురాతన హుండీ తాళాలను పగులగొట్టి అందులోని సొమ్మును కాజేసినట్లు ఆలయ ధర్మకర్తలు చిన్న ఓబన్న, లింగారెడ్డి పేర్కొన్నారు. రెండు ఆలయాల్లో రూ. 50 వేలు దోచికెళ్లినట్లు తెలుస్తోంది. ఈ విషయమై ఆదివారం సీకే దిన్నె పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, ఏఎస్ఐ దస్తగిరి ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. -
రౌడీ కామెడీ
పవన్‌కల్యాణ్‌గారు మా అందర్నీ ఇంటికి పిలిచి భోజనాలు పెట్టిన రోజుని జీవితంలో మేం మరచిపోలేం. సాధారణంగా ఒంటిగంటకు భోజనం చేసే ఆయన.. రెండింటి వరకూ తినకుండా వెయిట్ చేశారు. ‘ఈ రోజు మీరు నా అతిథులు’ అని చెప్పి స్వయంగా ఆయనే ప్లేట్స్ ఇచ్చి వడ్డించారు. భోజనాలు పూర్తయిన తర్వాత రెండు గంటల పాటు మాతో మాట్లాడారు. బస్ ఎక్కితే చేసేది ఇదే.. పిక్నిక్లో చేసేది ఇదే.. ఏం తోచకపోతే చేసేదీ ఇదే.. భరించలేని ధ్వని.. కానీ, తెలిసిన రాగం.. మేనత్త కావొచ్చు.. కోడలు కావొచ్చు.. కూతురు కావొచ్చు.. బావగారు కావొచ్చు.. ఎవరు పాడినా చప్పట్లు కొడతారు. కానీ, రౌడీలు పాడారండీ... ఆ అంత్యాక్షరికి చిందులు వేశాం. ఈ రౌడీల వెనకాల ఎన్ని ‘ఢీ’లు... ‘సాక్షి’కి ఎక్స్‌క్లూజివ్. రోజ్ రోజ్ రోజ్ రోజ్ రోజా పువ్వా... - ఆంజనేయులు మాది తణుకు. చిన్నప్పుడు చదువుకోవడం మానేసి సినిమాలు చూసేవాణ్ణి. స్టేజీల మీద డ్యాన్స్ చేస్తూ మిమిక్రీ చేసేవాణ్ణి. కామెడీ ఆర్టిస్టుగా చేయాలని ఉండేది. అవకాశాలు వెతుక్కుందామని నా భార్యను తీసుకుని హైదరాబాద్ వచ్చేశాను. ఫిల్మ్‌నగర్ ఆఫీసుల చుట్టూ తిరిగేవాణ్ణి. బస్సుల్లో తిరగాలంటే టికెట్లకే బోల్డంత డబ్బు అయిపోతుంది. నా జేబులు ఎప్పుడూ ఖాళీయే. అందుకే స్టూడియోలు ఎంత దూరమైనా నడ్చుకుంటూ వెళ్లేవాణ్ణి. కృష్ణానగర్‌లో ఓ రేకుల గదిలో ఉండేవాణ్ణి. అద్దె 75 రూపాయలు. తినడానికి, అద్దె కట్టడానికి డబ్బులుండేవి కాదు. వేషాల కోసం ఎదురు చూస్తే కష్టం అని, కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్లో చేరాను. రోజుకి వంద రూపాయలు ఇచ్చేవారు. నెలకి ఓ పది రోజులు పని ఉండేది. ఒక్కోసారి ఆ పని కూడా దొరికేది కాదు. ఈ గ్యాప్‌లో నటుడిగా అవకాశాల కోసం తిరిగేవాణ్ణి. కాస్ట్యూమ్ వర్క్ చేస్తూనే చాలా సినిమాల్లో వెనక అటూ ఇటూ తిరిగే క్యారెక్టర్లు చేశాను. బాబు పుట్టడంతో ఫ్యామిలీ గడవడం కష్టమైంది. ఆ తర్వాత రెండో బాబు కూడా పుట్టాడు. షూటింగ్ ఉంటే నేనక్కడ తినేవాణ్ణి. ఇంట్లో మా ఆవిడ, పిల్లల పరిస్థితి దారుణంగా ఉండేది. పిల్లలకు పాలు కొనలేని పరిస్థితి. ఊరెళ్లిపోయి పొలం పనులు చేసుకుందామనుకున్నా. ‘ఇక్కడే ఉందాం... నేనూ పని చేస్తా’ అని మా ఆవిడ ఇళ్ల పనులు చేయడం మొదలుపెట్టింది. నాలుగేళ్ల క్రితం వరకూ తను పనులు చేసింది. డ్యాన్స్ అంటే ఇష్టం ఉండటంతో సినిమాల్లో నటిస్తూ, డ్యాన్సర్‌గానూ చేస్తుండేవాణ్ణి. ఇప్పటివరకూ పలు సినిమాల్లో నటించా. మా పెదబాబు కంప్యూటర్ ఇంజినీరింగ్ చేశాడు. ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు. గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నిస్తున్నాడు. చినబాబు డిగ్రీ ఫైనలియర్లో ఉండగా యాక్సిడెంట్లో మరణించాడు. జీవితాంతం వెంటాడే బాధ ఏదైనా ఉందంటే అది మా అబ్బాయి మరణమే. ‘గబ్బర్ సింగ్’ తర్వాత ఆర్థిక కష్టాలు తప్పాయి. అవకాశాలు పెరిగాయి. ఆదాయం పెరిగింది. ఇప్పుడు ఏ సినిమా చేసినా రోజుకి పదివేలు ఇస్తున్నారు. నేను రాజశేఖర్‌గారి దగ్గర పనిచేశా. ‘గబ్బర్ సింగ్’లో ఆయన్ని ఇమిటేట్ చేస్తూ, చేసిన ‘రోజ్ రోజ్ రోజ్ రోజ్ రోజా పువ్వా..’ చూసి.. ‘నాకన్నా నువ్వే బాగా చేశావ్’ అన్నారు. ఇప్పుడో ఇల్లు కొనుకున్నాను. పెద్దబ్బాయి పెళ్లి కూడా కుదిరింది. వచ్చే ఏడాది చేయాలనుకుంటున్నాం. మల్లె తీగెకు పందిరి వోలె... - రమేశ్ మాది హైదరాబాద్ పాతబస్తీ. పదో తరగతి వరకూ చదువుకున్నా. నా ముఖం చూసి ఎవరూ ఉద్యోగం ఇవ్వలేదు. అప్పుడు సినిమాలపై ఆసక్తి లేదు. రామ్‌గోపాల్ వర్మగారి దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేసే మహేశ్ అన్న మా ఇంటి దగ్గర ఉండేవారు. ఆయనే నన్ను ఇండస్ట్రీకి తీసుకొచ్చారు. ‘షాక్’ సినిమా అప్పుడు హీరోయిన్‌కి బాడీగార్డుగా చేశా. మోహన్‌బాబుగారితో పాటు పలువురి దగ్గర బాడీగార్డుగా పనిచేశా. ‘ఢీ’ నుంచి యాక్టింగ్ మొదలైంది. పదేళ్ల పాటు మెయిన్ విలన్ వెనక రౌడీ క్యారెక్టర్లు చేశాను. నెలలో పది రోజులు షూటింగ్ ఉండేది. ‘గబ్బర్ సింగ్’తో లైమ్‌లైట్‌లోకి వచ్చా. ఆ సినిమాలో చేసిన ‘మల్లె తీగెకు పందిరి వోలె..’ పాట చూసి, నారాయణమూర్తిగారు మెచ్చుకున్నారు. బాడీగార్డుగా పనిచేసినప్పుడు ‘ఇప్పటిదాక కుర్సీలో కూసున్నాం. ఏ రోజైనా క్యార్‌వ్యాన్ ఎక్కాలి మనం. కష్టపడి ఆ స్టేజికి రావాలి’ అనుకున్నా. ‘గబ్బర్ సింగ్’ తర్వాత కొన్ని చిన్న సినిమాలకు, టీవీ షోలకు క్యార్‌వ్యాన్ ఇచ్చారు. నా ఆశ నెరవేరింది. నాది లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్. మేనమామ కూతుర్ని చేసుకున్నా. మామ ఇంట్లో వాళ్లందరూ ‘షూటింగులకు పోతే ఏమొస్తది’ అన్నారు. బంధువులు కూడా చాలా మాటలన్నారు. దాంతో పిల్లనివ్వడానికి మామవాళ్లు భయపడ్డారు. నా మరదలే ఒప్పించింది. ‘గబ్బర్ సింగ్’ తర్వాత ‘వాడు మావాడే’ అని గర్వంగా చెబుతున్నారు. ప్రేక్షకులు కూడా ‘గబ్బర్ సింగ్’ విడుదలకు ముందు మా బ్యాచ్ దగ్గరకి రావడానికి భయపడేవారు. ఇప్పుడు ‘అన్నా.. ఓ సెల్ఫీ’ అంటున్నారు. చిన్నపిల్లల్లో మాకు ఫ్యాన్స్ ఎక్కువ. ఇండస్ట్రీకి రాకముందు టూ వీలర్ ఫైనాన్స్ కలెక్షన్, సెటిల్మెంట్లు చేసేవాణ్ణి. నాతో తిరగొద్దని మా ఫ్రెండ్స్ వాళ్లింట్లో గొడవ చేసేవారు. ‘గబ్బర్ సింగ్’ తర్వాత ‘మా అబ్బాయిని కూడా తీసుకు వెళ్లొచ్చు కదా’ అంటున్నారు. హరీశ్ శంకర్ సర్ ‘గబ్బర్ సింగ్’లోనే కాదు.. ‘రామయ్యా వస్తావయ్యా’, ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ సినిమాల్లో పెద్ద క్యారెక్టర్లు ఇచ్చారు. ఆయన ప్రతి సినిమాలోనూ నేనుంటా. ఇప్పుడు చాన్సులు బాగానే ఉన్నాయి. జలక్ దిక్లాజా... - రెమ్సన్ రాజు మాది చార్మినార్ దగ్గర యాకుత్‌పుర. పదో తరగతి ఫెయిలయ్యా. జిమ్‌కు వెళ్లడం.. ఫ్రెండ్స్‌తో తిరగడం.. ఇవే పనులు. మా చిన్నమ్మ కొడుక్కి ఇండస్ట్రీతో టచ్ ఉంది. ‘గొడవలు, గట్రా ఎందుకురా.. నాతో రా, నిన్ను సినిమాల్లో తీసుకుంటారు’ అన్నాడు. ‘ఊకో అన్నా.. నన్నెవరు తీసుకుంటారు’ అన్నాను. రాధాకృష్ణ అనే సార్‌తో కలిసి ‘చక్రం’ షూటింగ్ చూడ్డానికి వెళ్లా. కృష్ణవంశీగారు చూసి, రౌడీ బ్యాచ్‌లో ఒకడిగా తీసుకున్నారు. నన్ను ఇండస్ట్రీకి తీసుకొచ్చిన ప్రసాద్ అన్న వాళ్లింటి పక్కన ఓ అమ్మాయి ఉండేది. నేను అమ్మాయిలతో అస్సలు మాట్లాడేవాణ్ణి కాదు. దాంతో సతాయిద్దామని ఫోన్ చేసి, మా అన్నయ్యవాళ్లు ఆ అమ్మాయికి ఇచ్చారు. ‘మీరు సినిమాల్లో చేస్తారు కదా. నేను మీకు పెద్ద ఫ్యాన్. నెట్లో మీ నంబర్ తీసుకున్నా’ అని చెప్పింది. ‘చిన్న చిన్న రౌడీ క్యారెక్టర్లు చేస్తా. నా నంబర్ నెట్లో పెట్టేంత సీన్ లేదు. ఫోన్ పెట్టు’ అన్నాను. మళ్లీ తెల్లారి ఫోన్ చేసి అవే మాటలు. ‘ఓవర్ యాక్షన్ చేయకు’ అని తిట్టా. ఆ తర్వాత మెల్లగా ఫ్రెండ్ అయ్యింది. ఆ టైమ్‌లోనే ఆ అమ్మాయికి వేరే అబ్బాయితో నిశ్చితార్థం జరిగింది. ‘అతను పైసల్.. అని వేధిస్తున్నాడు. ఇంట్లోవాళ్లు బాధపడతారని ఒప్పుకున్నా. నాకతను నచ్చలేదు’ అంది. ఆ అమ్మాయికో లవర్ ఉందని ఆ అబ్బాయికి చెప్పించా. నిశ్చితార్థం జరిగిపోయింది కాబట్టి, వెనక్కి తగ్గేది లేదని పెద్దలన్నారు. దాంతో ‘నేనంటే నీకు ఇష్టమేనా? ఇష్టమైతే పెళ్లి చేసుకుందాం’ అంది. ‘ఎప్పుడో ఇష్టం’ అన్నాను. మేం పెళ్లి చేసుకున్నాం. ‘గబ్బర్ సింగ్’ బ్యాచ్ అందరూ వాళ్ల వాళ్ల ఇళ్లలో ‘నాలుగు రోజులు అవుట్ డోర్ షూటింగ్ ఉంది’ అని చెప్పి మాతో వచ్చేశారు. గొడవలు జరిగాయి. మన సంతోషం కోసం ఆలోచించి.. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులందర్నీ కష్టపెట్టడం తప్పని అర్థమైంది. ఇప్పుడంతా కాంప్రమైజ్ అయింది. ఇప్పుడెవరైనా లవ్ మ్యారేజ్ అంటే నేను వద్దని చెప్తా. మా పెళ్లయి ఆరేళ్లయింది. మాకు ఇద్దరు అబ్బాయిలు. ‘గబ్బర్ సింగ్’ 50వ రోజున బాబు పుట్టాడు. వాడికి ‘గబ్బర్ సింగ్’ అనే నిక్‌నేమ్ పెట్టాను. ఆ సినిమాలో చేసిన ‘జలక్ దిక్లాజా..’ పాట నన్ను చాలా పాపులర్ చేసింది. ప్రస్తుతం నా పొజిషన్ ఫర్వాలేదు. సినిమాలు చేస్తున్నాను. పెద్ద సినిమాలకు పదివేలు ఇస్తున్నారు. చిన్న సినిమావాళ్ల రిక్వెస్ట్‌ను బట్టి తీసుకుంటున్నా. నన్ను కొట్టకురో bతిట్టకురో.... - సాయిబాబా మాది సికింద్రాబాద్. ఒకటి, మూడు తరగతులు నాలుగుసార్లు, రెండో తరగతి రెండుసార్లు ఫెయిలయ్యా. స్కూల్లో ఇంటర్వెల్‌కి గోడ దూకి 47 బస్ ఎక్కి అపోలో దగ్గరకు వచ్చేవాణ్ణి. నడుచుకుంటూ నానక్‌రామ్‌గూడా వెళ్లి కృష్ణగారి ‘మాయలోడు’ షూటింగ్ చూసేవాణ్ణి. ఓసారి గోడ దూకుతుంటే మేడమ్ పట్టుకున్నారు. ‘నీ కొడుకు చదువుకు పనికిరాడు. బస్తాలు మోయడానికి పనికొస్తాడు’ అని నాన్నకు చెప్పారు. ఓ రోజు కోపం వచ్చి పేపర్లు రౌండ్‌గా ఉండ చుట్టి మేడమ్‌ను కొట్టా. పోలీస్ స్టేషన్లో కంప్లయింట్ ఇచ్చి, సస్పెండ్ చేశారు. ఆల్ఫా హోటల్ పక్కన పెట్రోల్ పంపులో జాడూ కొడుతూ, టైర్లలో గాలి పడుతూ ఓ ఏడాది చేశా. తర్వాత అక్కడే హెల్పర్‌గా, క్యాషియర్‌గా చేశా. ఓనర్‌కి నాపై నమ్మకం పెరగడంతో మేనేజర్ని చేశారు. మోహన్‌బాబుగారి దగ్గర పనిచేసే రాజుతో పరిచయమైంది. నాకు షూటింగులంటే ఇష్టం. పెట్రోల్ పంపులో పనిచేస్తూనే.. మోహన్‌బాబుగారి ఆడియో ఫంక్షన్స్, ఇంకేవి జరిగినా రాజు వెనకుండి ఆయన పనులు చేసేవాణ్ణి. హైట్, బాడీ బాగుందని ‘శివశంకర్’లో చిన్న వేషం ఇచ్చారు. ఓ నెల రోజులు సెలవు పెట్టేశా. ఓనర్ నన్ను పెట్రోల్ పంపు నుండి వెళ్లగొట్టారు. చేసేదేం లేక సినిమాల్లో కంటిన్యూ అయిపోయా. చిన్నప్పుడు అమ్మాయిలంటే చాలా సిగ్గు. బోనాలు, గణేశ్ చతుర్థి, అయ్యప్ప పూజలు చేయడంతో ఓ అమ్మాయి నన్ను ఇష్టపడింది. ఓ పేపర్‌పై లవ్ సింబల్ వేసి నా పేరు, తన పేరూ రాిసి పంపింది. నాకు చదవడం రాదు. ఇంకో పిల్లగాడితో చదివించుకున్నా. తర్వాత ‘ప్రేమదేశం’ పాటల క్యాసెట్ అడిగి మళ్లీ సేమ్ లవ్ సింబల్, పేర్లు రాసి పంపింది. కాస్ట్ ఫీలింగ్‌తో మా ఇంట్లోవాళ్లు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోలేదు. ‘ఆ అమ్మాయిని చేసుకుంటే, ఇద్దరు సిస్టర్స్‌కి సంబంధాలు రావు’ అని భయపెట్టారు. వేరే అమ్మాయితో పెళ్లి చేశారు. నేనంటే ఆ అమ్మాయికీ, తనంటే నాకూ ఇష్టం లేదు. పెళ్లైన నెలకు ఆ అమ్మాయిని ప్రేమించిన అబ్బాయి గ్రీటింగులు పంపించడం స్టార్ట్ చేశాడు. గొడవలు మొదలయ్యాయి. ఏడాది తిరక్కుండానే విడాకులు ఇచ్చేశా. ఆ తర్వాత మా అమ్మే, నేను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోమ్మంది. అలాగే చేసుకున్నా. మాకు ముగ్గురు పాపలు. ‘గబ్బర్ సింగ్’లో చేసిన ‘నన్ను కొట్టకురో.. తిట్టకురో..’ పాట నాకు మంచి పేరు తెచ్చింది. మా నాన్న సినిమాలు బాగా చూసేవారు. ‘నువ్ మంచి హైట్ ఉన్నావ్‌గా, సినిమాల్లో ట్రై చేయ్’ అని నాన్న చెప్పేవారు. నేను పెట్రోల్ పంపులో జాబ్ చేస్తున్నప్పుడే నాన్న చనిపోయారు. ఆయన ముగ్గురు అక్కలకు పెళ్లి చేస్తే, నేను ఇద్దరు చెల్లెళ్లకు పెళ్లి చేశా. నా డెవలప్మెంట్ చూడకుండా నాన్న చనిపోయారని నా బాధ. అమ్మా చూడాలి నిన్నూ నాన్నను చూడాలి - ప్రవీణ్ మాది హైదరాబాద్ ఉప్పుగూడా రైల్వే స్టేషన్ దగ్గర. రామ్‌కోఠిలోని ఓ షాపులో టూ వీలర్ ఫైనాన్స్ కలెక్షన్ చేసేవాణ్ణి. హీరో రవితేజగారి బాడీగార్డ్ కుమార్ అన్న నాకు తెలుసు. ‘పోకిరి’ షూటింగ్‌కి వస్తావా? అన్నారు. సరే.. అన్నా. షూటింగ్ అంటే 9 గంటలకు జాబ్‌కు వెళ్లడమే అనుకుని పడుకున్నా. తెల్లారక ముందు వచ్చి నిద్రలేపారు. ‘ఇప్పుడేం షూటింగ్ అన్నా. నేను రాను పో’ అని చెప్పా. ‘ఆరింటికే షూటింగ్ స్పాట్’లో ఉండాలని చెప్పి తీసుకువెళ్ళారు. విలన్స్ బ్యాచ్‌లో గన్ పట్టుకుని నిలబడమన్నారు. నేను నవ్వుతున్నా. ‘సీరియస్‌గా ఉండాలమ్మా’ అని చెప్పారు. ఆ తర్వాత ‘ఆట’ చేశా. అప్పట్నుంచి సినిమాల్లో కంటిన్యూ అవుతున్నా. విలన్స్ బ్యాచ్‌లో ఉండేవాణ్ణి. షూటింగ్ లేదంటే కలెక్షన్ చేసేవాణ్ణి. ఓ టైమ్‌లో జాబ్ మానేశాను. కానీ, నెలలో పది రోజులు షూటింగ్ ఉంటే 20 రోజులు ఖాళీగా ఉండేవాణ్ణి. ఇబ్బంది అవుతోందని మళ్లీ కలెక్షన్ జాబ్ షురూ చేశా. మొదట్లో ఇంట్లోవాళ్లు సినిమాలు వద్దన్నారు. ‘ఏం చేస్తున్నావ్ రా’ అని తిట్టేవాళ్లు. ‘గబ్బర్ సింగ్’ తర్వాత హ్యాపీగా ఫీలయ్యారు. థియేటర్లో సినిమా చూసిన తర్వాత వాళ్లు ఫుల్ ఖుషీ. ‘గబ్బర్ సింగ్’లో అంత్యాక్షరి ఎపిసోడ్‌కి, ‘అమ్మా చూడాలి.. నిన్నూ నాన్నను చూడాలి..’ పాటలో నా యాక్టింగ్‌కు అంత మంచి పేరొస్తుందని ఊహించలేదు. సినిమా విడుదలైన రోజున ఫైనాన్స్ కలెక్షన్ చేస్తుంటే... ‘అరే, ‘గబ్బర్ సింగ్’లో మంచిగా చేశావ్’ అని చాలామంది ఫోన్లు చేశారు. నాకింకా పెళ్లి కాలేదు. మా అన్నకు పెళ్లైన తర్వాత నాదే. మొదట్లో మనల్ని చూసి ఎవరు లవ్ చేయలే. అందరూ భయపడుతుండే. ‘గబ్బర్ సింగ్’ తర్వాత చాలామంది ఫోన్లు చేసి ‘మీరంటే ఇష్టం’ అని టార్చర్ చేశారు. నాకు భయమైంది. ‘నాకు ఇసువంటివి నచ్చవ్. వద్దు’ అని చెప్పా. అవన్నీ పట్టించుకోలేదు. అంతకు ముందు మా మామవాళ్లు పిల్లను ఇవ్వడానికి వెనకాడారు. ఇప్పుడు ‘మా బిడ్డను చేసుకో..’ అని అడుగుతున్నారు. ఇంట్లో అమ్మానాన్నలు ఏ అమ్మాయిని పెళ్లి చేసుకోమంటే.. తనని చేసుకుంటా. ఒకప్పుడు ఎవడైనా ఏమైనా అంటే.. గొడవపడుతుండే. ఇప్పుడు ‘ఓయ్.. గిట్లరా. ఓ ఫొటో దిగుదాం’ అనడిగినా గమ్మునుంటున్నా. - ‘సాక్షి’ సినిమా డెస్క్