sakshi sahityam
-
పాతికేళ్ల బ్రౌన్ కేంద్రం
సి.పి.బ్రౌన్ (1798–1884) సుమారు 1827లో కడపలోని ఎర్రముక్కలపల్లెలో 15 ఎకరాల తోటను, ఓ పెద్ద బంగళాను వెయ్యి వరహాలకు (3500 రూపాయలకు) కొని రెండేళ్లపాటు ఆ భవనంలోనే వుండి సంస్కృతాంధ్ర పండితుల్ని సమకూర్చుకుని, తెలుగు కావ్య సముద్ధరణకు కంకణబద్దులయ్యారు. ఆ జిల్లావాడే అయిన అయోధ్యాపురం కృష్ణారెడ్డి(1800–44) ఆజమాయిషీలో ఆ పండిత కూటమి, కార్యాలయం ‘బ్రౌన్ కాలీజా’గా పేరు మోసింది. పరిశోధక సాహసి బంగోరె(బండి గోపాలరెడ్డి) మాటల్లో చెప్పాలంటే, సి.పి.బ్రౌన్ ‘‘నిలవనీడ లేకుండా పోయిన తెలుగు కావ్యసరస్వతిని ఆహ్వానించి, తన బంగళాలో వొక సాహిత్య పర్ణశాల యేర్పరచి, ఆ వాగ్దేవి నిండు ముత్తయిదువులాగా నడయాడేలా’’ చేశారు. 20 సెంట్ల ప్రదేశంలో ఎర్రముక్కలపల్లెలో స్థాపించబడి, రెండు మూడు దశాబ్దాలపాటు సరస్వతీ నిలయంగా విరాజిల్లిన బ్రౌన్ కాలేజీ నేడు సి.పి.బ్రౌన్ భాషా పరిశోధనా కేంద్రంగా యోగి వేమన విశ్వవిద్యాలయం ఆశ్రయంలో వెలుగు జిలుగులు నింపుతోంది. బ్రౌనుకు నమ్మకస్తుడైన చెలికాడైన అయోధ్యాపురం కృష్ణారెడ్డి అకాలమరణం తర్వాత ‘బ్రౌన్ కాలీజా’ గతి ఏమైందో, 1855లో బ్రౌన్ స్వదేశానికి వెళ్లేదాకా వుండిందో లేదో ఆ పెరుమాళ్లకే ఎరుక! బ్రౌన్ దొర బంగళా, తోట ప్రాంతాన్ని కడప కోర్టువారు వేలం వేయగా కడపలో పేరు మోసిన చార్టర్డ్ అకౌంటెంట్ సి.ఆర్.కృష్ణస్వామి రెండు వేల రూపాయలకు కొన్నారు. అప్పటికే శిథిలమై ఉండిన ఆ బంగళా కాలక్రమంలో మరింత శిథిలం కాగా, 1987లో సి.ఆర్.కృష్ణస్వామి సుపుత్రులు సి.కె.సంపత్‌కుమార్, కడప కలెక్టర్ జంధ్యాల హరినారాయణ నేతృత్వంలో, జానమద్ది హనుమచ్ఛాస్త్రి సారథ్యంలో ఏర్పడిన సి.పి.బ్రౌన్ మెమోరియల్ ట్రస్టుకు ధారాదత్తం చేశారు. హరినారాయణ గ్రామీణ క్రాంతి పథకం కింద మూడున్నర లక్షల మ్యాచింగ్ నిధి విడుదల చేసి, 1987 జనవరి 22వ తేదీన సి.పి.బ్రౌన్ స్మారక భవన నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేయగా సరస్వతీపుత్ర పుట్టపర్తి నారాయణాచార్యులు సభాధ్యక్షులుగా ఆశీర్వదించారు. ‘ఇంటికొక పువ్వయితే, దేవుడికో దండం’ అని పెద్దల మాట. మధ్యప్రదేశ్ బస్తర్‌లోని ఓ తెలుగుబిడ్డ డి.వి.ప్రసాద్ లాంటి సామాన్యుడు 10 రూపాయలు పంపగా, ఎంతోమంది వదాన్యులు వేలాది రూపాయలు సంతోషంగా గుమ్మరించారు. కడప కలెక్టర్లు పలు తడవలుగా నిధులు ఇచ్చారు. 1995 నవంబర్ 29న అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సి.పి.బ్రౌన్ స్మారక గ్రంథాలయ భవనాన్ని ప్రారంభించారు. గ్రంథాలయమేమో ప్రారంభమయింది. మరి పుస్తకాలో? పోతేపల్లి వెంకన్న శ్రేష్ఠి 2500, బిరుదురాజు రామరాజు 2800, కోడూరి పుల్లారెడ్డి, ఇంకా ఎందరో మహానుభావులు ఎంతో విలువైన తెలుగు, ఇంగ్లిష్, హిందీ, సంస్కృతం, కన్నడ పుస్తకాల్ని కానుకగా ఇచ్చారు. 1998 నవంబర్ 14, 15 తేదీల్లో బ్రౌన్ ద్విశత జయంతి మహోత్సవం జరిగింది. సి.నారాయణరెడ్డి ఆ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 2003లో రాజ్యసభ సభ్యుడిగా పది లక్షలు మంజూరు చేశారు. గ్రంథాలయ సమితి వారు రెండవ అంతస్థు భవనానికి సినారె పరిశోధన కేంద్రం అని నామకరణం చేసి ఆయన ఔదార్యానికి కృతజ్ఞతలు ప్రకటించుకొన్నారు. అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర రెడ్డి 2005 జనవరి 27న గ్రంథాలయాన్ని సందర్శించి, నిర్వహణకు 15 లక్షల గ్రాంటు మంజూరు చేయడమే కాకుండా, దాన్ని శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయానికి అప్పగించేలా ఆజ్ఞ జారీ చేశారు. అదే సంవత్సరం అక్టోబర్ 1 నుంచి గ్రంథాలయం పరిశోధనా కేంద్రంగా రూపొందింది. 2006 నవంబర్ 1 నుంచి యోగి వేమన విశ్వవిద్యాలయానికి అనుబంధ సంస్థగా మారింది. సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రంలోని గ్రంథాలయంలో మెకంజీ కైఫియత్తుల 42 సంపుటాల జిరాక్స్ ప్రతులు, బ్రౌన్ లేఖల 17 సంపుటాల నకళ్లు ఉన్నాయి. 66 వేలకు పైగా వివిధ భాషల పుస్తకాలు ఉన్నాయి. మూడువేల పత్రికల ప్రత్యేక సంచికలు, తెలుగు ఎంఫిల్, పీహెచ్డీ సిద్ధాంత గ్రంథాలు వందల సంఖ్యలో ఉన్నాయి. ఈ కేంద్రం తరఫున మెకంజీ కడప జిల్లా కైఫియత్తుల 7 సంపుటాల్ని, బ్రౌన్పై రెండు వ్యాస సంకలనాల్ని, నన్నెచోడుడు, నాచన సోమన, అన్నమాచార్యులు, అల్లసాని పెద్దన మొదలైన రాయలసీమ ప్రాచీన కవులపై వ్యాససంకలనాల్ని ప్రచురించారు. నెలనెలా సాహిత్య ప్రసంగాల్ని ఏర్పాటు చేసి, వాటిని కాలక్రమంలో ముద్రిస్తూవున్నారు. మూల మల్లికార్జునరెడ్డి సారథ్యంలో రజత జయంతి సందర్భంలో కడపజిల్లా సర్వస్వం, రజత జయంతి ప్రత్యేక సంచిక, తాళ్లపాక తిమ్మక్క వ్యాససంకలనం వగైరా విడుదల కానున్నాయి. సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం పరిశోధకుల పాలిట కల్పవృక్షమై వర్ధిల్లుగాక! - ఘట్టమరాజు 9964082076 -
కవిత బాలేకపోతే...
లక్నోలో 1938లో జవహర్లాల్ నెహ్రూ ఏర్పాటు చేసిన నేషనల్ హెరాల్డ్ ఆంగ్ల దినపత్రికకు 1946 నుంచీ సుమారు మూడు దశాబ్దాల పాటు తెలుగువాడైన పాత్రికేయ శిరోమణి మానికొండ చలపతిరావు సంపాదకుడిగా వ్యవహరించారు. నిష్పక్షపాతంగా వ్యవహరించి పాత్రికేయ విలువలకు పట్టం కట్టేవారు. ఒకసారి ఏమైందంటే నెహ్రూ కుమార్తె ఇందిరాగాంధీ విద్యార్థి దశలో ఉన్నప్పుడు ఓ ఆంగ్ల కవితను రాసి, ప్రచురించాలని ఎడిటర్ మానికొండ(ఎం.సి.)ను కోరింది. అందుకు ఆయన, ‘‘అమ్మా! నువ్వు ఉత్సాహంగా ఈ కవితను రాశావు. సంతోషమే. అయితే మరికొన్నాళ్లు సాధన చేయాల్సిన అవసరం ఉంది’’ అని జవాబిచ్చారు. పత్రికా ప్రమాణాల దృష్ట్యా కవితను ప్రచురించలేనని సున్నితంగా చిరునవ్వుతో చెప్పారు. ఇందిర కూడా నిరాశ చెందకుండా ఎడిటర్ క్యాబిన్ నుంచి నిష్క్రమించారు. - వాండ్రంగి కొండలరావు -
కనిపించని గుంతలు
నవల : ది హోల్ రచయిత్రి : హిరోకో ఓయమడా జపనీస్ నుంచి ఆంగ్లానువాదం : డేవిడ్ బాయ్డ్ ప్రచురణ : న్యూ డైరెక్షన్స్: 2020 చుట్టూ ఉండే సాధారణ వస్తువులు సైతం ప్రతీకలుగా, ఫాంటసీ కలగలసిన అద్భుతాలుగా, మళ్లీ అవే అధివాస్తవికంగా రూపం మార్చుకుంటూ– అలాంటి రూపాంతరాలు ప్రత్యేకించి కొట్టొచ్చినట్టు కనబడకుండా సాగుతూ అబ్బురపరుస్తుంది ఈ నవలిక. 2013లో జపాన్‌లోని అకుతాగవా ప్రైజ్ సంపాదించుకున్న రచయిత్రి హిరోకో ఓయమడా రాసిన ‘ది హోల్’ నవల ఆంగ్లానువాదం ఈ సంవత్సరమే విడుదలయింది. నవలలో జరుగుతున్నవి మామూలు విషయాలుగా జమకట్టి ఉపేక్షించే అవకాశాన్ని ఈ రచన ఎక్కడా ఇవ్వదు– అలా వదిలేస్తున్నామేమో అన్న ఉలికిపాటుని తప్ప. ముప్పై ఏళ్ల ఆసా తన టెంపరరీ ఉద్యోగాన్ని వదిలిపెట్టి, భర్త బదిలీ కారణంగా అతనితో వేరే ఊరు వెళ్లాల్సి వస్తుంది. ప్రస్తుత ఉద్యోగంలో ఉన్నది బొటాబొటీ సంపాదనే అయినప్పటికీ, దాన్ని వదిలిపెట్టాలంటే కొంత సందేహం. కాకపోతే, వెళ్తున్నది భర్త సొంతవూరికి కాబట్టీ, అక్కడ వాళ్లకి రెండు ఇళ్లున్నాయి కాబట్టీ, వీళ్లు ఒక ఇంట్లో అద్దె ఇవ్వకుండా ఉండవచ్చని అత్తగారు చెబుతుంది. అక్కడికి చేరుకున్నాక గృహిణిగా ఆసా జీవితం ప్రారంభమౌతుంది. అత్తగారు కూడా ఉద్యోగినే. తన పనుల్లో బిజీగా ఉండే మామగారు కనిపించడం కూడా అరుదే. మానసిక స్థిమితం లేని తాతగారు ఉన్నా, ఆయనకున్న చెముడు వల్ల ఆయనతో సంభాషించే వీలూ లేదు. ఒంటరితనం, వేసవి వేడి తాలూకు ఉక్కపోత, చుట్టుపక్కల భరించలేని కీచురాళ్ల రొద (‘‘అసలేదో కీచురాయి నా ఒంట్లోనే ఉన్నట్టుంది’’), ఏమీ తోచని ఖాళీ ఆమె జీవితాన్ని ఆక్రమించుకుంటాయి. ఎక్కడికి వెళ్లాలన్నా దూరాలు, సొంత కారు లేదు. జీవితం రసహీనంగా సాగుతున్న తరుణంలో ఒకరోజున అత్తగారు చెప్పిన పనిమీద స్టోర్‌కి వెళ్లిన ఆసా, ఒక వింతజంతువుని రోడ్డుమీద చూసి, ఆసక్తితో దాన్ని అనుసరిస్తూ వెళ్లి, ఒక గోతిలో పడుతుంది (‘‘ఇదేదో సరీగ్గా నా సైజుకి తవ్విన గొయ్యిలాగుంది!’’). ఆ ప్రాంతంలోనే ఉండే ఒక మహిళ సాయంతో దాన్నుంచి బయటపడుతుంది. ఈ సంఘటన దగ్గర మలుపు తిరిగే కథ ఆసా పరంగా కల్పన, వాస్తవికత, అధివాస్తవికతల మధ్య సాగుతూ ఉంటుంది. తన పరిశోధనల్లో ఇంటి వెనకాల నివాసం ఉంటున్న భర్త సోదరుడి గురించిన సమాచారం; స్టోర్స్‌కి వెళ్లినప్పుడు అక్కడ ఆడుకుంటూ కనిపించిన పిల్లలు; స్టోర్స్‌కి వెళ్లే దారికి సమాంతరంగా ఉన్న నది ఒడ్డున ఆడుకుంటున్న పిల్లలు; రోడ్డుకీ, నదికీ మధ్య ఉన్న వాలులో పెరిగిన రెల్లు మాటున దాగివున్న గుంతలు; అత్తగారి ఇంట్లో ఉన్న ఫొటోలో భర్త నానమ్మ పోలికల్లో అత్తగారు ఉండటం – ఇవన్నీ కొన్ని నిజాలుగా, కొన్ని ఊహలుగా, మరికొన్ని భ్రాంతులుగా ఆవిష్కారం అవుతున్నా– అంతర్లీనంగా ఉన్నది మాత్రం కరిగిపోతున్న అస్తిత్వం పట్ల ఆసాలో కలుగుతున్న సంచలనం. ‘‘ఇక్కడ ప్రతి సంవత్సరపు ప్రతి రుతువులోనూ ఇలాంటి పరిస్థితే ఉంటుందా? ఇలాంటి వేడి, ఉక్కపోతే ఉంటుందా?’’అన్న మీమాంసకి లోనయిన ఆసా, తాతగారి మరణానంతరం అంతకుముందు వెళ్లిన స్టోర్స్‌లోనే చిన్న ఉద్యోగాన్ని సంపాదించుకుంటుంది. కానీ నిజానికి అక్కడ ఆమె అంతకుముందు చూసిన పిల్లలు ఎవరూ లేరు. అడపాదడపా వచ్చేది కేవలం ముసలివాళ్లేనని ఆ స్టోర్స్ మేనేజర్ అంటుంది. ‘‘మనకి కావాల్సింది మాత్రమే మనం చూస్తాం’’ అని నవలలో ఒక పాత్ర చెప్పినట్టు, తన జీవితంలో లోపించిన దానిని మాత్రమే ఆసా ఊహించుకుంటూ ఉంది. పేరు తెలియని ఏదో జంతువు (సమాజం) చూపించిన మార్గాన్ని అనుసరిస్తే, చివరికి ఆసా పడింది సంసారకూపంలో. అస్థిమితానికి గురిచేస్తున్న వేసవితాపం తనలోని ఉక్కపోత. సమాజ ధిక్కరణ చేస్తే జరిగే ఫలితానికి ఉదాహరణ వెలివేయబడ్డ భర్త సోదరుడు. చిన్నపిల్లలు నెరవేరని కోరికలు. దూరంగా నది దగ్గర కోలాహలం అవతలివాళ్లు ఆనందోత్సాహాలతో ఉన్నారనుకునే ఇవతలివాళ్ల భ్రాంతి. వీటన్నింటినీ అంతర్గతంగా ఓ స్వరం (కీచురాళ్లు) మనకి వినిపించడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఆ హెచ్చరికల్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పే రచన ఇది! - ఎ.వి.రమణమూర్తి -
కవిత్వం అదృశ్యమైంది
దేవిప్రియ(15 ఆగస్టు 1949 – 21 నవంబర్ 2020) కవిత్వం ధారాళంగా రావాలంటాడేమిటీ? అప్రయత్నంగా అసంకల్పితంగా రాకపోతే ప్రక్కన పడేస్తాడట కదా. ఏ రెండు కవితలూ ఒక్కలా రాయని కవి మళ్లీ ఎందుకొస్తాడు? ఈయన పరచిన కవిత్వమంతా ఈయన స్వప్నాలంట. నడుస్తున్నప్పుడు తన కలల మీద ఆలోచనల మీద నడుస్తున్నామని కనికరంతో గుర్తుంచుకోమంటున్నాడు. అమ్మచెట్టు, నీటిపుట్ట, గాలిరంగు, దేవిప్రియ ఏమిటీ మాటలు? ఇంతకుముందు లేవేం? పుట్టకముందు లేనిమాట నిజమే. పెట్టి పుట్టిన తర్వాత కూడా పుట్టనట్టుంటాయేం. ఎప్పటికప్పుడు ఆ క్షణానే పుట్టినట్టుంటాయేం. వెన్వెంటనే అదృశ్యమైపోతాయేం. కవిత్వమా అది? రుచి గల పదార్థం అంటే మళ్లీ నోట్లో పెట్టుకునే లోగా నాలుక మీద ఆ రుచి మిగలకపోవడమట కదా! కవిత్వం కూడా అంతేనా? అందుకేనా కవి అదృశ్యమయ్యాడు! మళ్లీ వస్తాడా? రాడు రాడు. సృజన రెండు సార్లు జరగదు. ఏ రెండు కవితలూ ఒక్కలా రాయని కవి మళ్లీ ఎందుకొస్తాడు? వెళ్లిపోయాడు. నీటిపుట్టో గాలిరంగో తీస్తామా? అంత ప్రేమగా ఇచ్చినందుకు ఒక్కసారీ చదవలేదని బెంగ పడతాం. దుఃఖం కలుగుతుంది. చదువుతుంటే ఒక్కో కవిత ఒక్కో రంగులో ఉంటుంది. అన్నీ శుభ్రమైన దుస్తుల్లో ఉంటాయి. ఎంత పేదరాలైనా బిచ్చగాడైనా సరే కొత్త బట్టలు కట్టుకోవలసిందే. ముచ్చటపడో మూడ్‌లోకి వెళ్లో కవిత్వానుభవాన్ని వివరించుదామని ఫోన్ చేస్తే అది రెండో సారో మూడో సారో అని తేలుతుంది. అంతకుముందు ఏం పంచుకున్నామో తెలీదు. కొత్త అనుభూతి నెమ్మదిగా తడుముతుంది. మళ్లీ తడుపుతుంది. అది ఏటిని నిట్టనిలువునా నిలబెడుతుంది. ఏనుగుని తొండం మీద నడిపిస్తుంది. ఎవరూ చేయలేనిది ఇంకొకటి కూడా చేస్తుంది. గాలికి రంగులేస్తుంది. కందం రాసినవాడే కవి కదా. అందంగా మధురస నిష్యందంగా పఠితృహృదయ సంస్పందంగా ఒక వంద రచించినందుకే మహాకవిని ఆకాశానికెత్తేశాం కదా, అంతకు శతాబ్దాల ముందు ధారాళమైన నీతులు నోరూరగ చవులుపుట్ట నుడివినందుకు శతకకారుణ్ణి బట్టీయం పెడుతున్నాం కదా, మరి కరువొచ్చిన కాలంలో అరవై నిండాయి నాకు అతి తేలికగా చొరబడి గడచిన యేళ్లలో ఇరవైగా మారగలన ఇన్షా అల్లాహ్ అని సరళంగా అలవోకగా రాసినందుకు కొన్ని అయినా మననం చెయ్యకపోతే ఎట్లా? కవిత్వం ధారాళంగా రావాలంటాడేమిటీ? అప్రయత్నంగా అసంకల్పితంగా రాకపోతే ప్రక్కన పడేస్తాడట కదా. కవిత్వాన్ని చెక్కిన దాఖలా ఒక్కటీ లేదంటలే ! It's not something that can be chiseled and sharpened later అంటాడా? సరే సరే! కవిత్వం బాసింపట్టు వేసుక్కూచుని ఒకటికి పదిసార్లు వెనుకా ముందూ చూసుకుంటూ ఒక ప్రారంభం ఒక ముగింపూ పెట్టుకుని ఒక ప్రణాళిక ప్రకారం మన కవిత్వం రాస్తే దాన్ని పట్టుకుని పది మంది కవులు తయారవ్వాలనుకుంటున్నాం కానీ, ఇదేమిటీ, ఈయన పద్ధతి చూస్తే వంద మంది కవిత్వం రాయడం మానేసేటట్టున్నారే! ఎట్లబ్బా? అవునూ, ఈయనది మన గుంటూరేగా, మరి డబ్ల్యూ.బి.ఈట్స్‌తో పోల్చుకుంటున్నాడు చూడండి. సదరు ఈట్స్ లాగా ఈయన పరచిన కవిత్వమంతా ఈయన స్వప్నాలంట. నడుస్తున్నప్పుడు తన కలల మీద ఆలోచనల మీద నడుస్తున్నామని కనికరంతో గుర్తుంచుకోమంటున్నాడు. ఈయనతో మహాకష్టం వచ్చిపడింది. మనం కవిత్వం మీద మన పాదముద్రలు బలంగా పడాలనుకుంటున్నాం కదా? కుదరదా? తను కవి, రచయిత, జర్నలిస్టుల్లో ఎవరో తేల్చమని మనల్నే అడుగుతున్నాడు. తన రాజకీయం ఏమిటో గుర్తుతెచ్చుకోమంటున్నాడు. మన కాలపు మహా వాగ్గేయకారుణ్ణి ప్రజా యుద్ధనౌక అన్నదెవరో, మాభూమి, రంగుల కల చిత్రాల వెనుక కలం బలం ఎవరిదో, ప్రాసక్రీడల రన్నింగ్ కామెంటేటర్ ఎవరో, అధ్యక్షా మన్నించమన్నదెవరో, మన పూర్ణమ్మను ఇంగ్లిషులోకి తీసుకెళ్లిందెవరో చూడమంటున్నాడు. తనను తాను పరిచయం చేసుకోలేననీ తన రచనలే తనను పరిచయం చెయ్యాలనీ అంటున్నాడు. అవన్నీ చూసి ఇంత వైవిధ్యం చూపిన కవి తెలుగులో ఇతను కాక ఇంకొక్కడే ఉన్నాడని చాలా మంది అంటున్నారు. ఆయనతో అనంతమైన ఆత్మచరిత్రాత్మ చరిత్రాత్మక నవలని ఈయనే రాయించాడంటున్నారు. మనమెందుకు కాదంటాం? 1987 లోనా? యానాంలో కవిమిత్రుడి పెళ్లి. కవిసమ్మేళనం. పథేర్ పాంచాలి చూసి, ప్రేమ్‌చంద్ గోదాన్ చదివిన దుఃఖంంలో రాసిన ‘ఊరు పొమ్మంటుంది’ కవితను చదివి వేదిక దిగివస్తుంటే పలకరించి ‘కరెంటు తీగల మీద వరుసగా కూర్చున్న పిట్టలు – బట్టలారేయడానికి తగిలించిన క్లిప్పుల్లా ఉన్నాయ’నే వ్యక్తీకరణ ‘అర్బన్ ఎక్స్ప్రెషన్ కదా! గ్రామీణ వాతావరణంలో ఎట్లా ఇముడుతుందీ?’ అని ప్రశ్నించినప్పటినుంచి కదా కవిత్వావరణలోకి తెలివితేటలు ప్రవేశించ కూడదనీ, అనుభవిస్తేనే కవిత్వాన్ని పలవరించాలనీ తెలుసుకున్నదీ, మసులుకున్నదీ! ఇద్దరూ కలిసి ఒంటరిగా సాగిన సహచరి మరణం ఆమె లేని ప్రపంచం నిండా ఆమెనే నింపేసింది. కవి బాధ ప్రపంచానికి బాధ అయిన మరో సందర్భం అది. అది తెరలుగా పొరలుగా కమ్ముకుని ఒక పత్రికలో కవిత్వమై వచ్చింది. అది చదివి జీట, yౌuట ఞ్ఛౌఝ జ్చిటఛీజీట్చpp్ఛ్చట్ఛఛీ అని కదా అన్నాను. వివరించమన్నప్పుడు కవి తన అనుభవాన్ని లేదా అనుభూతిని ఇతరులచేత అనుభవింప చెయ్యడానికి కవిత్వం రాస్తాడు. అందుకు భాష, వ్యక్తీకరణ మీడియంగా ఉపయోగపడతాయి. ఎంత బాగా తన స్థితిని మాటల ద్వారా బట్వాడా చెయ్యగలడో ఉద్దేశ్యం అంత నెరవేరినట్టవుతుంది. అది నూటికి నూరు పాళ్లూ ్టట్చnటఝజ్టీ అయినప్పుడు ఆ కవిత అవసరం తీరిపోయి అదృశ్యమైపోతుంది’ అని వివరించి నపుడు ‘ఇది ఎక్కడైనా రాయకూడదా?’ అని కదా అన్నారు. రాశానా? నిజానికి ఆమె వెళ్లిపోయినప్పుడే మనకు తెలియకుండా ఆయన కూడా వెళ్లిపోయాడు.ఇప్పుడు తెలిసి వెళ్లిపోయాడు. -
ప్రశాంత సుందరి
ఆర్.శాంతసుందరి(8 ఏప్రిల్ 1947 – 11 నవంబర్ 2020) చాన్నాళ్ల క్రిందట కేవలం వరూధిని గారిని, శాంతసుందరి గారిని మొదటిసారి కలవడానికే తెనాలిలో ఒక సమావేశానికి వెళ్ళాను. అప్పటికే ఆవిడ కేవలం కొడవటిగంటి కుటుంబరావు గారి అమ్మాయి కాదు. మంచి అనువాదకురాలు. నిజం చెప్పొద్దూ, నేను నాకెంతో ఇష్టమైన కుటుంబరావు గారి భార్యనీ, కూతురునీ కలవాలనే ఉద్దేశంతోనే వెళ్ళాను. ఆ విషయం వాళ్ళిద్దరితో అన్నాను. మిమ్మల్ని చూస్తే కుటుంబరావు గారిని చూసినట్లే వుంది అన్నాను కూడా. శాంత నవ్వేశారు. ఆవిడ అలా ఎప్పుడూ నవ్వుతూ వుంటారని తరువాత అర్థమైంది. ఆవిడ ప్రశాంతసుందరి. హాస్యప్రియ. సమయపాలన, క్రమశిక్షణ, బాధ్యత, ప్రేమల కలబోత. ఈ విషయాలన్నీ ఆవిడతో నా పదిహేనేళ్ల స్నేహంలో అర్థమయ్యాయి. ఆ తెనాలి సభ పరిచయం స్నేహం కావడానికి ఎక్కువ కాలం పట్టలేదు. నా స్నేహం కుటుంబరావు అమ్మాయితో కాదు శాంతతోనే. ఆవిడకి తన మాతృభాష అయిన తెలుగులో వున్నంత అభినివేశం, అభిమానం హిందీ పట్ల కూడా వున్నాయి. అందుకే అటు నుంచి ఇటూ, ఇటు నుంచి అటూ అలవోకగా అనువాదాలు చేశారు. వృద్ధురాలైన తల్లిని చూసుకుంటూ, ఇంటిని నిర్వహించుకుంటూ, స్నేహాలు కాపాడుకుంటూ, అనుకున్న సమయానికి పబ్లిషర్స్‌కి అనువాదం అందిస్తూ ఒక్క నిమిషం కాలం వృ«థా కాకుండా జీవించిన ఆవిడ ఇలా అర్ధంతరంగా వెళ్ళిపోవడం ఆమెను ఇష్టపడే వారికి కష్టమే. ఆమె ప్రయాణంలో ఆమె సహచరుడు గణేశ్వరరావు గారి సహకారం గొప్పది. వాళ్ళది స్నేహమయ సహజీవనం. ఆమె జబ్బుపడిన ఈ కొద్ది కాలంలో వాళ్ళ అమ్మాయి వచ్చేవరకూ ఆయన ఒక్కరే కాచుకున్నారు. ఆమె భౌతిక నిష్క్రమణను ఆయన ఎలా తట్టుకుంటారా అని బెంగ. శాంత తెలుగు నుంచి హిందీకి చేసిన ‘కాలుతున్న పూలతోట’ (సలీం రచన)కు కేంద్ర మానవ హక్కుల సంఘం ప్రథమ బహుమతి ఇచ్చింది. అలాగే భారతీయ అనువాద్ పరిషత్ ‘డాక్టర్ గార్గీ గుప్త ద్వివాగీశ్ పురస్కార్’తో సత్కరించింది. ‘ఇంట్లో ప్రేమచంద్’ హిందీ నుంచి చేసిన తెలుగు అనువాదానికి కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం లభించింది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అనువాద పురస్కారం కూడా అందుకున్నారు. ‘బేబీ హాల్దార్’ హిందీ నుంచి తెలుగులోకి అనువదించారు. తెలుగు రచయిత్రుల కథల సంకలనం, కవితల సంకలనం కూడా హిందీలోకి తెచ్చారు. అనేక మంది కవుల కవిత్వాన్ని, ముఖ్యంగా శివారెడ్డి, పాపినేని శివశంకర్, ఎన్.గోపి కవిత్వం హిందీలోకి అనువదించారు. ఆమె అనువాదాలు అందరికీ అర్థమయ్యేలాగా అలతి పదాలతో చదవచక్కగా వుంటాయని అంతా ఒప్పుకుంటారు. శాంత తమిళం నుంచి వైరముత్తు కవితలు కూడా తెలుగు చేశారు. ఏదైనా రచన తనకు నచ్చితేనూ, ఆలోచనా విధానం పాఠకులకు ఎంతో కొంత ప్రయోజనం వుంటేనే అనువాదం చేస్తానని చెప్పారు. శాంత సుందరి ఇంగ్లిష్ నుంచి చాలా అనువాదాలు చేశారు. అవన్నీ బహుళ జనాదరణ పొందిన పుస్తకాలు. ఎక్కువమంది చదివిన ‘హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్’ లాంటి డేల్ కార్నిగీ వ్యక్తిత్వ వికాస పుస్తకాలు, ‘ఫైవ్ పాయింట్ సమ్ వన్’ లాంటి చేతన్ భగత్ నవలలు, పలువురి ప్రశంసలు పొందిన ఆనంద్ నీలకంఠన్ ‘అసురుడు’, ‘అజేయుడు’ వంటి పుస్తకాలే కాక ప్రపంచ ప్రశంస పొందిన ‘సేపియ’(యువల్ నోవా హరారీ) కూడా తెలుగు పాఠకులకు కానుక చేశారు. ఆ పుస్తకం సీక్వెల్‌ను అనువాదం చేస్తూవుండగా కేన్సర్ వ్యాధికి ఆమె మెదడు మీద అసూయ కలిగింది. ‘ఇక చాల్లే కలం ముయ్’ అని కసిరేసింది. అసూయ పుట్టదా మరి! హిందీ నుంచి తెలుగులోకి, తెలుగు నుంచి హిందీలోకి, ఇంగ్లిష్ నుంచి తెలుగులోకి మొత్తం 75 పుస్తకాలు అనువాదం చేస్తే! భర్త గణేశ్వరరావు సహకారం గురించి చెబుతూ, ఆయన తన ఎడిటర్, క్రిటిక్ కూడా అనీ, మార్పు, చేర్పులపై చర్చించుకునే వాళ్ళమనీ, ఆయన సలహా సహకారం లేనిదే నేను ఇంత చేయగలిగే దాన్ని కాను అంటారు చాలా నిజాయితీగా. ఆమె ముక్కుసూటి మనిషి. తనకు నచ్చనిది మొహమాటానికి అసలు ఒప్పుకోరు.ఎంత మృదువుగా వుంటారో అంత పట్టుదలగా కూడా వుంటారు. శత వర్షాలకు చేరువగా వస్తున్న వరూధిని గారు, దశాబ్దాల సహజీవనం తరువాత ఈ ఎడబాటును తట్టుకోవలసిన గణేశ్వరరావు గారు కంటి ముందు మెదులుతూ వుంటే ఇంత హఠాత్తుగా నిష్క్రమించడం ఏం బాగుంది శాంత గారూ? -పి.సత్యవతి 9848142742 -
అయినా పేషెంటునే!
పత్రికా సంపాదకులు నార్ల వేంకటేశ్వరరావు గంభీర స్వభావులన్న సంగతి చాలామందికి తెలుసు. కానీ సంభాషణా చతురులనీ, హాస్య కుశలురనీ తెలిసినవాళ్లు కొద్దిమందే. నార్ల వారి ఉత్తరాల్లో ఆయన హాస్య చమత్కారాలు మబ్బుల చాటున మెరుపుతీగల్లాగా మెరిసిపోతుంటాయి. 1981లో ఆయన సీతజోస్యం నాటకానికి కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి లభించింది. నేను ఆ పుస్తకం గురించి వ్యాసం రాస్తున్నాననీ, వారి జీవిత రచనా విశేషాలు తెలపమని ప్రార్థిస్తూ వారికి ఓ ఉత్తరం రాశాను. మరుటపాలో ఓ చిన్న ఇంగ్లిష్ పుస్తకంతో పాటు ఓ టైపు చేయబడ్డ ఉత్తరం వచ్చింది. నార్ల ఇలా రాశారు: ‘‘నాకు ఐదుమంది కొడుకులు. ఐదుగురూ డాక్టర్లే. ఐదుమంది కోడళ్లు కూడాడాక్టర్లే. వీళ్లంతా విదేశాల్లో స్థిరపడ్డారు. నా ముగ్గురు కుమార్తెలూ, అల్లుళ్లూ డాక్టర్లే. ఒక్క కూతురూ, అల్లుడు మాత్రమే ఇక్కడ వున్నారు. మరి నాకేమో రెండు విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేశాయి. మా కుటుంబంలో నా భార్య తప్ప మిగతావారంతా డాక్టర్లే. ఆమెకు కూడా ఏ విశ్వవిద్యాలయమైనా గౌరవ డాక్టరేట్ ఇస్తే బావుంటుంది. అప్పుడు మా ఇంట్లో అందరూ డాక్టర్లే అవుతారు. కాని ఇంతమంది డాక్టర్లున్నా నేనెప్పుడూ పేషెంటునే. తల నుంచి కాలు దాకా నేనో రోగాల పుట్ట.’’ నార్ల వారి అరుదైన చమత్కార మాటలివి. -పినాకిని -
మసిబారిన పసితనం
నవల : షగ్గీ బెయిన్ రచన : డగ్లాస్ స్టువర్ట్ ప్రచురణ : గ్రోవ్; 2020 డగ్లాస్ స్టువర్ట్ రాసిన తొలినవల ‘షగ్గీ బెయిన్’ బుకర్ ప్రైజ్‌కి షార్ట్‌లిస్ట్ కావడం వెనకాల తొమ్మిది వందల పేజీల మొదటి డ్రాఫ్ట్మీద పన్నెండేళ్లపాటు కృషి చేసిన శ్రమ ఉంది. కొంతవరకూ ఆటోబయోగ్రఫికల్ నవల కూడా కావడంతో నవలలోని వేదన– బరువునీ, వాస్తవికతనీ, మనసుని కదిలించగల శక్తినీ సంతరించుకుంది. యు.కె.లోని స్కాట్లాండ్ నేపథ్యంలో గత శతాబ్దపు ఎనభ య్యవ దశకంలో సాగే నవలలో కొన్ని చారిత్రకాంశాలు కూడా కలగలిసిపోయి ఉన్నాయి. మార్గరెట్ థాచర్ అవలంబించిన ఆర్థిక విధానాల వల్ల పరిశ్రమలు దెబ్బతిని కార్మికులు ఉపాధి కోల్పోయి పేదరికంలోకి కూరుకుపోవడం, నిరుద్యోగులై వారిలో చాలామంది వ్యసనాలకి బానిసలైపోవడం, కొంతమంది ఆడవాళ్లు కూడా మద్యానికి బానిసలైపోయి కుటుంబాలు వీధిన పడటం నవలలో సమాంతరంగా కనిపించే అంశాలు. 1981లో కథ ప్రారంభమయ్యేనాటికి ఆగ్నెస్‌కి మూడు పదుల పైన వయసు, ఎలిజబెత్ టేలర్‌కి ఉన్నంత అందచందాలు ఉన్నాయి. మొదటి వివాహంలోని యాంత్రికతని భరించలేక, ట్యాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తున్న షగ్తో వచ్చేసి, తల్లిదండ్రుల ఇంట్లో కాపురం పెట్టిన ఆగ్నెస్‌కి ద్వితీయ వివాహంలో ఐదేళ్ల షగ్గీ బెయిన్తో బాటు, మొదటి వివాహంలో పుట్టిన కొడుకు లీక్, కూతురు కేథరిన్ సంతానం. స్వతహాగా అందగాడైన భర్త పలు అక్రమ సంబంధాలని పెట్టుకోవడం, చివరికి తన స్నేహితురాళ్లతోనే బాహాటంగా తిరుగుతూండటం వాళ్ల సంసారం బీటలు వారడానికీ, ఆగ్నెస్ తాగుడుకి బానిస కావడానికీ కారణమవుతుంది. ఈ స్థితిని చక్కదిద్దడానికా అన్నట్టు, షగ్ తన సంసారాన్ని ఊరికి దూరంగా ఉన్న బొగ్గు గనుల కాలనీకి మారుస్తాడు. ఈ స్వతంత్ర జీవనంవల్ల తన కాపురం మెరుగవుతుందనుకున్న ఆగ్నెస్ ఆశపడుతుంటే, షగ్కి ఉన్న ఆలోచనలు మాత్రం వేరు. అదే రోజున తన సామానుతో షగ్ బయటికి వెళ్లిపోతాడు. మూతపడిన బొగ్గుగనికి అనుబంధంగా ఉన్న ఆ కాలనీలో పేదరికం, వ్యసనాలు రాజ్యమేలుతుంటాయి. ప్రభుత్వం ఇచ్చే బొటాబొటీ భృతితోనే సంసారాన్ని నడపాల్సిన పరిస్థితుల్లో సైతం ఆగ్నెస్ తన బలహీనతలోకి మరింత కూరుకుపోతుంటుంది. అవకాశం కోసం పొంచివుండే ‘అంకుల్స్’ మద్యం ఎరతో ఆగ్నెస్ని వాడుకుంటూంటారు. యుక్తవయసొచ్చిన కూతురు కేథరిన్ వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని పెళ్లిచేసుకుని ఆఫ్రికాకి వెళ్లిపోతుంది. ఆర్ట్ క్లాసులకి వెళుతుండే కొడుకు లీక్ ఇంటి పరిస్థితులని భరించలేక సాధ్యమైనంతవరకూ ఇంటికి దూరంగా ఉంటూంటాడు. తల్లి సంరక్షణ కోసం వయసుకి మించిన బాధ్యతని తలకెత్తుకోవాల్సి వచ్చిన షగ్గీ బెయిన్‌కి ఇంకో వ్యక్తిగత సమస్య కూడా ఎదురవుతుంది: తనలో శారీరకంగా వస్తున్న స్త్రీ లక్షణాల వల్ల కలుగుతున్న గందరగోళం, ఎదురవుతున్న అవహేళనలు. నలభై యేళ్ల క్రితం సమాజంలో ఇలాంటి సమస్య పట్ల ఎలాంటి చిన్నచూపు ఉండేదో ఊహించవచ్చు. మధ్యలో తాగుడు వదిలేయాలని ప్రయత్నించి, ఉద్యోగాన్ని కూడా సంపాదించుకున్న ఆగ్నెస్ స్థిరచిత్తంతో సంవత్సరం పాటు ఉండగలుగుతుంది కానీ, అప్పుడు పరిచయమైన యూజీన్ అనే వ్యక్తి వల్ల మళ్లీ అదే బిలంలోకి జారిపోతుంది. కాలం గడుస్తున్నా వ్యసనం నుంచి బయటపడలేని ఆగ్నెస్, తనున్న లైంగికతా చట్రాన్ని దాటుకోలేని షగ్గీ– ఇద్దరూ భౌతికమైన సమస్యలతో బాధపడుతున్నవారే; ఇద్దరూ ఆ సమస్యలు çసృష్టిస్తున్న మానసిక వైకల్యాలకి లోనవుతున్నవారే; ఇద్దరూ వాటి నుంచి బయటపడి సమాజం శాసించే ‘నార్మాలిటీ’ అందుకుందామని ప్రయత్నిస్తున్నవారే. కానీ, గమ్యాన్ని చేరుకోవడమే ఇద్దరికీ కష్టంగా ఉంది. ఆ దూరాన్ని దాటడానికి ఇద్దరూ చేసిన ప్రయాణం, నిలుపుకున్న పరస్పర ప్రేమాభిమానాల మీదుగా మిగతా కథ నడిచి, ఊహించగలిగిందే అయినా మలుపు దగ్గర ఆగిపోతుంది. నవలలో విరివిగా కనిపించే స్కాటిష్ మాండలీకం ఎక్కడా ఇబ్బంది కలిగించదు కానీ, ఒకే తరహా సన్నివేశాలు పునరావృతమవడం వల్ల నవల ప్రభావం స్వల్పంగా పలచబడినట్టనిపిస్తుంది. స్వీయచరిత్రాంశాలు ఉన్న కారణంగా బహుశా అది అనివార్యం కావొచ్చేమో కానీ, నిడివి విషయంలో(448 పేజీలు) మరింత జాగ్రత్త వహించి కుదించివుంటే, పఠనానుభూతి మరింత గాఢంగా ఉండేది! - ఎ.వి.రమణమూర్తి -
వచన రచన విశిష్టత
ఇప్పటి వచన శైలి తరచుగ నీరసముగను నిష్ప్రౌఢముగ నున్నది కాని మిగుల సంతుష్టికరముగ నుండలేదు. ఇంకను బలిష్టమై, ధారాళమై, పౌరుషయుక్తమై, ప్రాణదురంధరమైన శైలి బయలుదేరలేదు. క్రమ క్రమముగ బయలుదేరగలదు. పది పద్యములు సులభముగ వ్రాయవచ్చునుగాని యొక పంక్తి వచనము సుష్టుగ వ్రాయుట కష్టము. పూర్వము సంస్కృతముననేమి యిప్పుడైన నాంధ్రముననేమి వచన ప్రబంధములు మిక్కిలి తక్కువగ నున్నవి. వచనమును వ్రాయువాడు వట్టి తెలివితక్కువవాడని సాధారణ జనాభిప్రాయమై యున్నది. కవితామణి కోటీరమును ధరించుట కర్హుడు కానివాడే యీ కట్టెలమోపు మోయదగిన వాడని జనుల నమ్మకము. ఆడుది తాను మిగుల రూపవతి యని లోకులనుకొనుట కెంత యాత్రపడునో, పురుషుడు తాను మిగుల బుద్ధిమంతుడని జనులనుకొనుట కంత కంటె నెక్కువ యాత్రపడును. అగరు నూనెల మెఱుగులు, నద్దము నెదుటి తిరుగులు, నాభరణముల హొరంగులు, మొగము పొడుముల తెఱగులు, కన్ను త్రిప్పుల వెరగులు మొదలగు సౌందర్య కళా సంపాదన సామగ్రి యాడుది యెంత యాచరించిన నంత యామెకే నష్టము. ఆపత్కాలములో నసురక్షణముకై పనికిరాదగు ధన మాస్యాళీక శోభకై సబ్బుబిళ్లల క్రింద నరిగి నురుగై కరగిపోవును. పోనిండు. అందువలన నితరుల కేమి నష్టము. వంగని ముంగురుల వంచుటకై కాగిదములనో, కారులనో యుపయోగించి పడరాని పాటుల నామె పడనిండు. ముంగురులు వంగకున్నను నలుగురి నవ్వులాటచే నామె తలయే వంగనిండు. అందువలన నితరుల కేమినష్టము! కాని బుద్ధిమంతుడని యనిపించు కొనదలచిన పురుషుడు వాజ్మయమున జేయు ప్రయత్నమట్టిది కాదు. బాహ్య ప్రపంచ జ్ఞానము లేక యాంతర ప్రపంచ జ్ఞానమంతకంటె లేక కవిత్వ మనగనేమో మొదలే యెఱుగక యతి ప్రాస బద్ధమైనదే కవిత్వమని నిశ్చయ పఱచుకొని పామర జనులనెట్లో యొకట్లు రంజింప జేయుటయే ప్రధానోద్దేశముగ జేసికొని యే పాడు ప్రబంధమో యే పాటల నాటకమో ప్రపంచమున నాతడు మెల్లగ జారవిడుచుట తోడనే – ఇంక భాషకు గల్గు ముప్పెంతో జెప్పదరమా? దేశమునకు గల్గు నపకీర్తి యెంతయో నిర్వచింప దరమా? జాతికి గల్గు నగుబాటెంతో చెప్ప వశమా? వాఙ్మయమున కింతకంటె పాషాణ ప్రయోగము మరియేది యుండగలదు! అతడు కవి శిఖామణియని యంతకుదగిన విమర్శకులు కొందఱాతనిని స్తుతుల జేయుచు నాతని యష్టావక్ర శిశువు నభినందింపగనే జనులంద ఱాతని దారినే యవలంబింతురు. ఆతనికంటె లఘుతరముగ బ్రకృతిని బహిరంగముగ దల బగులగొట్టి చంపుదురు. ఇక నెక్కడ జూచిన గవితాగళ బంధములే. ప్రపంచ జ్ఞాన జలద జంఝా మారుతములే. ప్రకృతి కాంతా శిరఃకృతకములే! ఇట్టి గ్రంథములు శీఘ్రముగ నశించిపోక నిలుచునా? నశించును – అట్లే నశింపకుండు నెడల నర ప్రకృతి యట్టె వానర ప్రకృతి లోనికి దిగిపోయి యదియట్టె చతుష్పాత కృతిలోనికి జారిపోయి యదియట్టె యవయవ శూన్య పిండ ప్రకృతి లోనికి గరిగిపోయి జగత్తు వికాస శూన్యమగు ప్రప్రథమావస్థలోనికి వచ్చియుండదా? అట్టి యుపద్రవ మేల సిద్ధింపగలదు. అందుచే నట్టి గ్రంథములు నశించును. కాని చేయదగినంత యపకృతి చేసిన పిదప గదా? ఎల్లకాల మేకీడైన నుట్టి గట్టుకొని యూగులాడునా? కవులు కానివారు కవితను జెప్పినందువలన గలుగు పుట్టిమునుక యిది! కవితా కాలము గడచిపోయినది. ఇప్పుడైన నట్టి యున్మాదము గలవాడు లక్షకుగోటి కెవ్వడైన నుండిన నతడు కవితాగానము చేయవచ్చును. అంతేకాని కవిత్వమున ఘనత యున్నదని యాసించి యందుకై ప్రయత్నించు జనుల సందర్భ గ్రంథముల çసృజించి యకాలపు వెఱులై ప్రకృతి కాపత్తు తెచ్చి పెట్టుట న్యాయమా! మనుజుడగు వాడు తన యభిప్రాయములకు గర్త కర్మ క్రియలు గల సందర్భములగు సహేతుకములగు వాక్యములతో వెల్లడించుట యుచితము. అది యత్యావశ్యకము గూడను. అందుచేత వచన రచన యెక్కువ యుపయోగకారి కాదా? ప్రపంచ మందున్న మహానాగరక దేశము లందెల్లడ వచన గ్రంథములే హద్దు లేకుండ వృద్ధి యగుచున్నవి. కవితాభివృద్ధికి ననాగరకత కెట్టి సంబంధమో గద్యాభివృద్ధికి నాగరకత కట్టి సంబంధము. కావున గాలానుసరణముగ గద్య గ్రంథములే మిక్కిలి యభివృద్ధి నొందవలసినది. అట్లు వానిసంఖ్య యభివృద్ధి నొందుచున్నదా? లేదని చెప్పుటకు లజ్జ పడక తప్పదు. ఎందుచేత? వచన గ్రంథకర్త వట్టి శుంఠయను వెఱి< లోకము నావరించి యున్నది. వచన రచన వలనే కాని భాష యభివృద్ధి నొందదు. దేశమున్నత దశకు రాదు. మనుజులు జ్ఞానయుక్తులు కారు. శాస్త్రములు వ్యాపింపవు. సత్యము ప్రబలదు. అట్టి వచన రచనను మనవారడుగు దొక్కినారు. దాని ననుసరించిన వానిని దీసివేత మనుజుని క్రింద బరిగణించుచున్నారు. కుక్కమూతి పిందె పండితునిగ భావించి త్రుంచివైచు చున్నారు. అట్లు త్రుంపకున్న దల్లిచెట్టు నశించునని యాందోళన పడుచున్నారు. వెలుగుచున్న దీపము నార్పుచున్నారు. వెనుకకు నడుచుచున్నారు. ఇట్లున్నను గాల మాహాత్మ్యముచే కొన్ని వచన గ్రంథములు బయలుదేరక పోలేదు. అవి చాల భాగము నవలలై యున్నవి. వానిలో నితర భాషల నుండి యాంగ్రీకృతములైనవి కొన్ని యున్నవి. ఇప్పటి వచన శైలి తరచుగ నీరసముగను నిష్ప్రౌఢముగ నున్నది కాని మిగుల సంతుష్టికరముగ నుండలేదు. ఇంకను బలిష్టమై, ధారాళమై, పౌరుషయుక్తమై, ప్రాణధురంధరమైన శైలి బయలుదేరలేదు. క్రమ క్రమముగ బయలుదేరగలదు. పది పద్యములు సులభముగ వ్రాయవచ్చునుగాని యొక పంక్తి వచనము సుష్టుగ వ్రాయుట కష్టము. సందర్భ శుద్ధియు, హేతు కల్పనమును, కార్యకారణ సంబంధ జ్ఞానమును గలవాడే కాని యుత్తమ వచన గ్రంథమును వ్రాయజాలడు. అట్టి శక్తులను వన్నెబెట్టి యభివృద్ధి పరచుట యందు గణితము కంటే గద్య రచనయే యెక్కువ శక్తి కలదియై యున్నది. ఉత్తమ వచన గ్రంథము లింక విరివిగ బయలుదేరుట యావశ్యకమై యున్నది. అట్టిలోపమును దీర్చుటకు బుద్ధిమంతులు ప్రయత్నింతురు గాక. పానుగంటి లక్ష్మీనరసింహారావు ‘వచన రచన’ ఇది. అరసున్నాలు తీయడం మినహా య«థాతథ ప్రచురణ. ‘కవిశేఖర’ పానుగంటి (11 ఫిబ్రవరి 1865 – 1 జనవరి 1940) తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలోని సీతానగరంలో జన్మించారు. బి.ఎ. చదివారు. ‘ఏ ఉద్యోగంలో ప్రవేశించినా తనని పోషించే ప్రభువుకంటే తను చాలా ఎక్కువవాడనని అనుకోవడమే కాకుండా యజమానికి కూడా ఆ భావం కలిగేటట్లు చేసేవారు.’ అందువల్ల ఎన్నోచోట్ల దివానుగా పనిచేశారు, మానేశారు. యువకుడిగా ఆయన్ని షేక్స్పియర్ ప్రభావితం చేశారు. ఆయనన్ని నాటకాలు రాయాలనుకొని 30 నాటకాలు రాశారు. రామాయణాన్ని పాదుకా పట్టాభిషేకము, విజయ రాఘవము, వనవాస రాఘవము, కల్యాణ రాఘవము పేర్లతో నాలుగు నాటకాలుగా రాశారు. రాధాకృష్ణ, కంఠాభరణం, మణిమాల, విప్రనారాయణ చరిత్రము ఆయన ఇతర నాటకాలు. కథావల్లరి, కథాలహరి, హాస్యవల్లరి, విమర్శాదర్శవిమర్శాదర్శము, ప్రకీర్ణోపన్యాసములు ఇతర రచనలు. తెలుగులో పుష్టి కలిగిన వచనం రాసిన కొద్దిమంది రచయితల్లో పానుగంటి ఒకరు. ఆయన ‘సాక్షి వ్యాసాలు’ తెలుగులో వచ్చిన గొప్ప పుస్తకాల్లో ఒకటి. అందులోని తొలి వ్యాసం 1913లో అచ్చయింది. అయితే, ‘నా కీర్తిని ఎప్పటికైననూ నిలుపునది నా నాటకములే. ఎడమ చేతితో వ్రాసి పాఱవైచిన సాక్షి వ్యాసములు కావు’ అని పానుగంటి అనడం గమనార్హం. -
ఒక చిదంబర రహస్యం నందనార్
వర్తమానాన్నే కాదు గతాన్ని కూడా చూపించగలిగే అద్దం సాహిత్యం. చూశాక అనుభవాల విభిన్న దృక్పథంతో వాటిని మళ్లీ మళ్లీ దర్శిస్తుంటాం, మరొక అర్థ నిర్ణయమేదో చేయబోతాం. తమిళ శైవ సాహిత్యంలో అలా చూడబడ్దవాడు నందనార్. క్రీ.శ. 660 నుండి 840 మధ్యవాడు. అరవై ముగ్గురు నాయనార్లలో 18వ నాయనార్. నాయనార్లలో ఒకే ఒక్క దళితుడు నందనార్. అసలు పేరు ఎవరికీ తెలియదు. అణకువ, సహనం, నిజాయితీ, పవిత్రత మూర్తీభవించిన పరమ శివభక్తుడు. శివ దర్శనం తప్పకుండా చేసుకుంటానన్న ‘రేపు’ మీద నమ్మకం, అతన్ని చివరి వరకూ నడిపించింది. నందనార్, తంజావూరు జిల్లాలోని, కొల్లిదం నదీతీరాన ఉన్న ఆదనూరులో జన్మించాడు. డోలు, ఢంకా, మృదంగం లాంటి సంగీత వాయిద్యాలకు పనికొచ్చే, పశువుల చర్మాన్ని సమకూర్చి ఆ వాయిద్యాలను తయారుచేసే వారిని పరయర్లు అంటారు. భిన్నమైన వ్యక్తిత్వం కలవాడైనా, తన కులస్థుల్లో కలిసిపోయేవాడు. పహారా కాయడం, దండోరా వేయడం, చచ్చిన పశువుల్ని పారేయడం మొదలైనవన్నీ చేసేవాడు. ఆ కులంవారు ఆరాధించే కాళి, కాట్టేరి, ముణియాణ్డి, కురుప్పన్, చాముండి లాంటి దేవతలున్నా, బాల్యం నుండీ శివుడే అతనికి ఆరాధ్య దైవం. ఏ కాస్త సమయం దొరికినా శివాలయం ముందు ఏకాంతంగా నిలుచొని, శివగానం చేసుకుంటూ నర్తించేవాడు. ఒక అగ్రకుల భూస్వామి దగ్గర పాలేరుగా పనిచేసేవాడు. ఒక రోజు తానున్న తిరుపుంగూరులోని ఇంటికి కొన్ని మైళ్ల దూరంలో ఉన్న శివలోకనాథార్ కోవెలలోని శివుని చూద్దామని వెళ్లాడు. దళితుడు కావడాన మందిరంలోనికి ప్రవేశం లభించలేదు. బయటనుండైనా శివుని చూద్దామన్న కోరిక తీరనివ్వకుండా, పెద్ద నంది విగ్రహం అడ్డుగా ఉంది. అతని ఆరాటం చూసి ఈశ్వరానుగ్రహంతో అది పక్కవాటుగా జరగడంతో, శివుని దర్శనమయింది. అలా పక్కకు జరిగినట్టుగానే ఇప్పటికీ ఆ నంది విగ్రహం ఉండటం విశేషం. ఆ ఆనందంలో గుడి ప్రాంతమంతా తిరుగుతుంటే, ఆ పరిసరాల్లో కూలిపోయే దశలో ఉన్న పాడుపడ్డ గుడిచెరువు కనిపించింది. దానిని పునర్నిర్మించాలన్న తలంపుతో ఒక్కడే పునరుద్ధరణ పనులు మొదలుపెట్టాడు. నందనార్ సేవకు మెచ్చి ప్రభువు వినాయకుని పంపి, ఆ పని జయప్రదంగా పూర్తి చేయించాడని అనుకుంటారు. ఆదనూరుకు తిరిగొచ్చి, ఎన్ని శివాలయాలు దర్శిస్తూ ఉన్నా, దక్షిణ కాశీగా పిలవబడే చిదంబరంలోని తిల్లయి నటరాజభంగిమలోని శివుడ్ని చూడాలన్న కోరిక ఎక్కువ కావడం మొదలయింది. దళితుడుగా అది సాధ్యం కాదని తెలిసినా, ‘నాలై పోవెన్ (రేపు వెళతాను)’ అని తోటివారికి చెప్పుకుంటూ రోజులు గడిపేవాడు. అందుకని అతని పేరు ‘తిరు నాలై పోవార్ (రేపు వెళ్లే వాడు)’ అని పిలిచేవారు. అక్కడకు పోయేందుకు భూస్వామిని అనుమతి అడుగుతూనే ఉండేవాడు. భూస్వామి ఏదో ఒక నెపంతో అనుమతి నిరాకరిస్తూ పోయేవాడు. ప్రతీ రోజు అలా చేయలేక, రాత్రికి రాత్రి 250 ఎకరాల పొలంలో నారు నాటగలుగుతే ఒప్పుకుంటానని ఒకరోజు వాగ్దానం చేశాడు. మర్నాటికి 250 ఎకరాల పొలం నాటబడి ఉంది. చివరకు నందనార్ చిదంబరం పొలిమేరల్లోకి వెళ్లగలిగాడు గాని, ప్రవేశం లభించలేదు. దళితుడుగా జన్మించడమే నేరం కావడం అతన్ని మానసికంగా వేధించింది. గుండెలు బాదుకుంటూ రోదిస్తూ గుడి బయట రాత్రులూ పగలూ గడిపాడు. ప్రభువు కలిగించిన ఏర్పాటుగా గుడిలోకి ప్రవేశం కల్పించగలిగాయి. కానీ అగ్ని సంస్కారం పేర శుద్ధి చేసుకునే అగ్నిగుండం గుండా లోనికి పోవడానికి అనుమతిచ్చారు. ఆ మంటల్లో నుండి ఒక పవిత్ర పూజారిలా బయటపడ్డ నందనార్, గర్భగుడిలోని స్వామి సన్నిధికి చేరిన వెంటనే అంతర్ధానమై పోయాడని పెరియ పురాణం చెబుతుంది. లోనికి పోకుండానే ఆ మంటల్లో అతను ఆహుతి అయిపోయి ఉంటాడని మరో కథనం. చిదంబరం నటరాజ మందిరం స్థల పురాణంలో నందనార్ ప్రస్తావన ప్రముఖంగా ఉంది. ప్రముఖ కవి సుందరార్ ప్రస్తావించిన శైవ మునుల జాబితాలో నందనార్ పేరు కూడా ఉంది. రాతలో అతనివి ఏవీ లేవు, అయినా గొప్ప శివ భక్తుడుగా స్థానాన్ని సంపాదించుకున్నాడు. నందనార్‌ని ప్రశంసించిన వారిలో నారాయణ గురు, మహాత్మా గాంధీ, స్వామీ శివానంద, అంబేద్కర్ లాంటి వారు ఎందరో ఉన్నారు. 1910లో స్వామి సహజానంద చిదంబరంలోనే నందనార్ మఠాన్ని అతని గుర్తుగా స్థాపించారు. చోళ రాజుల తోడ్పాటు నాయనార్లకు పుష్కలంగా లభించింది. వారి పాలనలోనే దేవాలయాల కట్టడాలు ఎక్కువగా మొదలయాయి. రెండవ కులోత్తుంగ చోళుని దగ్గర మంత్రిగా పనిచేసిన 12వ శతాబ్దపు శెక్కిళార్ ముని అరవైముగ్గురు నాయనార్ల జీవిత చరిత్రలను మూడువందల సంవత్సరాల తరువాత సేకరించి, పెరియ పురాణం పేరన నమోదు చేశాడు. తమిళుల ముఖ్య గ్రంథమైన తేవారంలో, పన్నెండవ సంకలనంగా దానిని చేర్చాక అదే సంపూర్ణ తమిళ శైవ సిద్ధాంతంగా, తిరుముఱై పేర రూపుదిద్దుకుంది. పెరియ పురాణంలో నందనార్ చరిత్ర కూడా ఉంది. అయితే సంగీత సరస్వతి త్యాగరాజు సన్నిహితుడు, స్వాతంత్య్ర యోధుడు, 19వ శతాబ్దపు గోపాలకృష్ణ భారతియార్ 1861లో రాసి ప్రచురించిన ‘నందనార్ చరిత్రం’ మూలంగా తమిళ జనసమూహానికి నందనార్ మరోకోణం పరిచయమైంది. భారతియార్ కూడా తంజావూరు జిల్లా వాడే కావడం, అతడి కథనం పెరియ పురాణంలోని కథకు భిన్నంగా ఉండటంతో, ఆ జిల్లా వాసుల, అగ్రకులాల ఆగ్రహానికి గురికాక తప్పలేదు. యజమాని దురాగతాల్ని సహించలేని, బానిస కార్మికుడుగా నందనార్‌ని అతను చూపించాడు. అయినా శివభక్తిలో ఏవిధమైన లోటూ నందనార్ రానియ్యలేదని, ఒక ఆసక్తికరమైన హరికథా కాలక్షేపంలా నందనార్ కథని తీర్చిదిద్దటంతో, దానిపట్ల విమర్శలకు దీటుగా ప్రశంసలతో తమిళ ప్రజలు దానిని ఆదరించారు. హరికథ రూపంలో ఉండటాన ఉండటాన హరికథ భాగవతార్లందరూ దానిని బాగా వ్యాప్తిలోకి తెచ్చారు. 1917లో ‘నందన్’ పేరు మీద గోపాలసామి, ఆరావముద అయ్యంగార్లు రాసిన నవల కూడా వచ్చింది. అదికూడా శెక్కిళార్ కథనానికి భిన్నంగానే వచ్చింది. శ్రీలంకలో కూడా అణగారిన వర్గాలకు దేవాలయంలోకి ప్రవేశం లేదు. అక్కడి అభ్యుదయ రచయిత మురుగయ్యన్ 1969లో రాసిన సంగీత పద్య నాటకం ‘గోపురం ప్రవేశద్వారం’లో నందనార్ కథని మరో రూపంలో చూపించాడు. తంజావూరు జిల్లాలోని కీలవేణ్మణి గ్రామంలో, హరిజన కూలీలు న్యాయమైన వారి జీతాలు అడిగినందుకు ప్రతిగా, భూస్వామి 25 డిసంబర్ 1968న, 44 మంది హరిజనుల్ని సజీవ దహనం చేసిన ఘటనతో ఉత్తేజితమై 1978లో ఇందిరా పార్థసారథి ‘నందన్ కథ’ ఆధునిక నాటకం తన స్వీయ గూఢార్థాలతో మరీ భిన్నంగా రాసి మెప్పించాడు. నందనార్ శివునితో ఐక్యమయి పోవడం అన్నది నిజానికి తెలివిగా అమలుపరిచిన ఒక పన్నాగం అని, సృజనాత్మక రచయితగా అతను ఊహించి రాసిన మొదటి సంచలనాత్మక కథనం అది. 1982లో తిరునల్వేలి జిల్లా మీనాక్షీపురం హరిజన కాలనీలోని వారిని ఇతర మతంలోకి చేర్పించిన సందర్భంలో మతకలహాలు చెలరేగాయి. ఆ సందర్భంగా కూడా జయప్రకాశం ‘విల్లు పాట’ పేరుమీద ఒక ప్రదర్శన ఏర్పాటు చేశాడు. పరిశోధించబడ్డ నందనార్ కథగా అది 1984లో ప్రచురించబడింది. సమకాలీన సామాజిక సమస్యలా ఉండి, అది జనరంజకమైన జానపద వినోద కార్యక్రమంలా అందరూ స్వీకరించారు. తమిళ కథా ప్రపంచంలో ప్రముఖుడు పుదిమిపిత్తన్, ‘కొత్త నమందన్’ పేరున 1948కి ముందే కథ రాశారు. ఒకప్పటి గొప్ప చలనచిత్ర హాస్యనటుడు కలైవాణర్గా అందరికీ తెలిసిన ఎన్.ఎస్.క్రిష్ణణ్ కూడా ఒక నవల నందనార్ ఇతివృత్తంతో రాశాడు. ఆ నవల రాకముందే 1933 నుండి పది సంవత్సరాలలోపే, వివిధ నటులతో, వేరువేరు సంఘటనలతో మూడు చలన చిత్రాలు 1933, 1935, 1942లలో నందనార్ కథ నేపథ్యంతో వచ్చాయి. పన్నెండువందల సంవత్సరాల క్రితపు నందనార్ జీవితం మరణం విషయంలో ఏదో చిదంబర రహస్యం దాగి ఉందన్న ఆసక్తిని, అప్పటికీ ఇప్పటికీ మారని పరిస్థితులు పెంపొందిస్తూనే ఉన్నాయి. ఆ కారణంగా 8వ శతాబ్దం నుండీ ఇప్పటివరకూ అనేక విధాలుగా కవులు, రచయితలు, సంగీతకారులు, నాటకకర్తలు వారిదైన దృష్టికోణాలతో, నందనార్‌ని తిరిగి తిరిగి సృష్టిస్తూనే ఉన్నారు. అంతకుముందరి కథనంలో ఎదో సందేహాన్ని తీర్చేందుకు చేసే ప్రయత్నాలే నందనార్‌ని చిత్రించడంలో ఎక్కువ. అందరి ముఖ్యమైన సందేహాలు ఇవి – 1. నందనార్ ఎదురుతిరిగే వ్యక్తి కాడా? 2.శివలోకనాథార్ గుడి చెరువుని తానే తిరిగి పునర్నిర్మించాడా లేక అది అతనికి శిక్షగా చేయించిన పనా? 3. అగ్నిగుండంలోకి ప్రవేశించాలని అతనిని ఒప్పించారా లేక ఒత్తిడి చేసి తీసుకు వెళ్లారా? 4.అగ్నిగుండం నుండి బయటపడి అంతర్ధానమయాడా లేక అగ్నిగుండంలో మరణించాడా? వర్తమానంలో గతం ఉంది. ఆ నేపథ్యం వర్తమానాన్ని మరింత బాగా అర్థం చేసుకొందుకు పనికొస్తుంది. జరిగిన తప్పులు పునరావృతం కాకుండా చూసుకుందుకు, గతాన్ని చరిత్ర కాగడా ప్రకాశింపజేసి చూపిస్తుంది. - ముకుంద రామారావు -
గతానుగతికం
ముప్పై మూడేళ్ల కిమ్ జియాంగ్ ఓరోజు పొద్దున్నే లేచాక, వాళ్ల అమ్మలాగా ప్రవర్తించడం మొదలుపెడుతుంది. ఇది కాస్త తగ్గిందనుకున్నాక, కొన్ని సంవత్సరాల క్రితం మరణించిన చిన్నప్పటి స్కూల్ స్నేహితురాల్లాగా ప్రవర్తించడం మొదలుపెడుతుంది. జియాంగ్కి తన శరీరంలో తను ఇమడలేని ఉక్కపోత ఎక్కువై, రూపాంతరావసరం ముందుకొస్తోందనేది డాక్టర్ చెప్పిన కారణం. కానీ ఇదిలా జరగడానికి స్త్రీగా జియాంగ్కి ముప్పై మూడేళ్ల గతం, అది సృష్టించిన కారణాలున్నాయి. దక్షిణ కొరియాలో సాధారణమైన కుటుంబంలో రెండో అమ్మాయిగా పుట్టిన జియాంగ్కి చిన్ననాటినుంచే లింగవివక్ష అంటే ఏమిటో తెలుసు. ఇంట్లో తల్లిదండ్రులు తమ్ముడిని చూసుకునే పద్ధతిలోనూ, స్కూల్లో మగపిల్లలు వేధించే విధానాల్లోనూ, వాటిని టీచర్లు చూసీచూడకుండా ఊరుకోవడాల్లోనూ, జీవితాలతో రాజీపడి చదువులు మానేసి తమ్ముడిని చదివించడం కోసం అక్కాచెల్లెళ్లు అనారోగ్యకరమైన పరిస్థితుల్లో కార్మికులుగా పనిచేయటంలోనూ– లోకవ్యవహారాల పట్ల అవగాహన కలుగుతూ వచ్చింది. వ్యవస్థీకృతమైన వివక్షనీ, పురుషాధిపత్యాలనీ అంగీకరించడం స్త్రీల జీవితాలలోకి అసంకల్పితంగానే ప్రవేశిస్తూ వచ్చింది. కుటుంబ పరిస్థితులు కాస్త మెరుగయ్యాక, కాలేజీ చదువు పూర్తిచేసుకుని ఉద్యోగాల్లోకి అడుగుపెడదామన్నా అదే వివక్ష (‘‘ఆడవాళ్లని ప్రత్యేకంగా చూడనక్కర్లేదు. సమానంగా చూస్తే చాలు’’). అభ్యర్థుల ఎంపిక, వేతనాలు(కొరియాలో మగవాళ్లకిచ్చే జీతాల్లో కేవలం అరవైమూడు శాతం మాత్రమే ఆడవాళ్లకిస్తారు) పదోన్నతులలోనూ అదే వివక్ష. మాటర్నిటీ సెలవుల మీద వెళ్తారనీ, చాలామంది తర్వాత ఉద్యోగాలు మానేస్తారనీ వీళ్లని ఉద్యోగాల్లో ప్రమోషన్లకి కూడా పరిశీలించరు (‘‘ఆడవాళ్లు ఉద్యోగాల్లో ఎందుకుండరూ అంటే, ఉండటం అసాధ్యమయ్యేలా మీరు చేస్తారు కాబట్టి.’’). ఉద్యోగం చేస్తున్నప్పుడే పెళ్లిచేసుకున్న జియాంగ్ కొన్నేళ్లకి అమ్మాయిని ప్రసవించాక, చివరికి అదే జరిగింది. అత్తామామలో, అమ్మానాన్నలో సహాయం అందించగల పరిస్థితులు లేనందువల్ల జియాంగ్ ఉద్యోగం మానేయాల్సి వచ్చింది.‘‘ఎప్పుడో ఏదో పొందటం కోసం ఇప్పుడున్నదాన్ని ఎందుకు త్యాగం చేయాలి?’’అన్నది జియాంగ్ అంతర్వాణి అయినప్పటికీ, మరో ప్రత్యామ్నాయం లేదు. పిల్లని చూసుకోవడం, ఇంటి బాగోగులూ వంటావార్పులతోనే జీవితం గడిచిపోతూ ఉంటుంది. పిల్లని డేకేర్‌కి పంపించినప్పటికీ, సగటున మిగిలే ఖాళీ సమయం రోజుకి మూడు గంటలు! భర్త అర్థం చేసుకోగలడన్నది ఒక్కటే జియాంగ్కి ఊరట. కానీ, దానివల్ల ప్రత్యేకించి ఏ ప్రయోజనమూ లేదు– ఎందుకంటే, అతనికి ఏపనీ చేయడం రాదు. కాన్సర్లకీ, గుండెలకీ అధునాతనమైన పద్ధతుల్లో వైద్యమందించే ఈరోజుల్లో నెలసరి సమయాల కడుపునొప్పులకి మందు కనిపెట్టలేకపోయారు. ఎందుకంటే, ‘‘మందులతో కలుషితం కాని గర్భాశయాలు కావాలి వీళ్లకి– పచ్చటి అరణ్యాలలోని స్వచ్ఛమైన పచ్చికబయళ్లలాగా,’’ అంటుందొక పాత్ర. చిన్న తలనొప్పి వస్తేనే వెంటనే మాత్రలు వేసుకునేవాళ్లు, ఆడవాళ్లు మాత్రం ప్రసూతి వేదనలన్నీ మాతృత్వమనే అపురూపమైన హోదాని పొందడం కోసం ఆనందంగా భరించాలని సలహాలిస్తుంటారు. స్తీల సమస్యల పట్ల జియాంగ్ పడుతున్న వేదనగా సాగే కిమ్ జియాంగ్, బార్న్ 1982 నవల ఫెమినిస్ట్ సిద్ధాంత చర్చలతో విసిగించదు. కథకి ఎంచుకున్న అంశాలూ, సంఘటనలూ (ప్లాట్) దానికి ఒక కారణమైతే, క్లినికల్ స్టయిల్లో ఉద్వేగరహితంగా కథనం చేసిన తీరు మరో కారణం. రచయిత్రి చో నామ్ జూ 2016లో రాసిన ఈ తొలి నవల పదిలక్షల కాపీలకి పైగా అమ్ముడుపోయి సృష్టించిన సంచలనం అంతాయింతా కాదు. ఫెమినిస్ట్ భావజాలాలపట్ల సానుభూతితో ఈ నవలని సమర్థిస్తున్నవారిని ట్రోల్ చేసినవారి సంఖ్య అధికంగా ఉందంటే, ఆర్థిక ప్రగతిలో చాలా ముందున్న దక్షిణ కొరియా భావజాలాల విషయంలో మాత్రం ఎక్కడో పాతరోజుల్లోనే ఉండిపోయిందన్నది విదితమౌతుంది. గత సంవత్సరం ఈ నవల ఆధారంగా కొరియన్ సినిమా రాగా, నవలకి జేమీ చాంగ్ చేసిన ఇంగ్లీష్ అనువాదం ఈ సంవత్సరమే విడుదలయింది. ఇది కేవలం దక్షిణ కొరియాకి మాత్రమే పరిమితమైన కథ కాదు. మన ఇళ్లల్లో, మన చుట్టుపక్కల కుటుంబాల్లో ఈ కథలు కనిపిస్తూనే ఉంటాయి. స్త్రీలకి సమానావకాశాలు కల్పించడానికి పురుషాధిక్యపు భావజాలాల ప్రపంచం ప్రత్యేక దృష్టిని సారించకపోతే సార్వజనీనమైన ఇలాంటి కథలు సార్వకాలికం అయ్యే ప్రమాదం ఉంది. - ఎ.వి.రమణమూర్తి నవల : కిమ్ జియాంగ్, బర్న్ 1982 రచన : చో నామ్ జూ మూలం ప్రచురణ : 2016 కొరియన్ నుంచి ఇంగ్లిష్ అనువాదం : జేమీ చాంగ్ ప్రచురణ: లివ్రైట్ ; 2020 -
కబుర్లే మానవాసక్తి
మానవజాతి పరిణామ క్రమ చరిత్రను చెప్పే పుస్తకం ‘సేపియన్స్’. 2011లో హీబ్రూలో వెలువడి 2014 లో ఇంగ్లిషులోకి అనువాదమైన ఈ పుస్తక రచయిత ఇజ్రాయిల్‌కు చెందిన యువల్ నోఆ హరారీ. దీన్ని తెలుగులోకి ఆర్.శాంతసుందరి అనువదించారు. డెబ్బై వేల ఏళ్ల క్రితం ఆధునిక సేపియన్లు (‘తెలివైన’ మనుషులు) కొత్తగా భాషా నైపుణ్యం సాధించారనీ, ఇది గంటలకొద్దీ సన్నిహితులతో ఉబుసుపోని కబుర్లు చెప్పుకునేందుకు దోహదం చేసిందనీ, ఈ సాన్నిహిత్యం కోసమే మనుషులు పరిమిత సమూహాలుగా బతికారనీ అంటారు. సమూహంలోని మనుషుల సంఖ్య పెరిగితే సాన్నిహిత్యం తగ్గిపోతుంది. ‘‘ఈ కబుర్లు చెప్పుకోవటం అనే సిద్ధాంతం హాస్యంగా అనిపించవచ్చు, కానీ ఎన్నో అధ్యయనాలు దీన్ని సమర్థిస్తున్నాయి. ఈనాటికీ ఎక్కువశాతం మానవ వ్యక్తీకరణ ఈమెయిల్ ద్వారా అయినా, ఫోన్ ద్వారా అయినా లేక వార్తాపత్రికల్లో కాలమ్‌ల ద్వారా అయినా– అది పోచికోలు కబుర్లే. అది మనకి ఎంత సహజంగా అలవడిందంటే అసలు భాష పుట్టిందే ఇందుకా అనిపిస్తుంది. చరిత్ర పాఠాలు చెప్పే ప్రొఫెసర్లు భోజన సమయంలో కలుసుకున్నప్పుడు మొదటి ప్రపంచయుద్ధం గురించి మాట్లాడుకుంటారనీ, అణు శాస్త్రవేత్తలు సమావేశాలకి హాజరైనప్పుడు విరామ సమయంలో కాఫీ తాగుతూ క్వార్క్(ఉపకణం)ల గురించి మాట్లాడుకుంటారనీ అనుకుంటున్నారా? ఎప్పుడైనా అలా జరగవచ్చు. కానీ సాధారణంగా వాళ్లు వేరే స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకున్న మొగుణ్ణి పట్టుకున్న మరో ప్రొఫెసర్ గురించో, శాఖాధిపతికీ, డీన్కీ మధ్య జరుగుతున్న గొడవ గురించో, లేక ప్రయోగాలు చేసేందుకు ఇచ్చిన డబ్బుతో ఖరీదైన కారు కొనుక్కున్న తమ తోటి ఉద్యోగి గురించో పోచికోలు కబుర్లు చెప్పుకుంటారు. ఈ కబుర్లు సామాన్యంగా ఎవరో చేసిన తప్పులూ, నేరాల గురించే సాగుతాయి.’’ -
నార్లవారి ఉత్తరాలు
సాహిత్యవేత్తల జీవితంలోని వెలుగు నీడలు, నిర్వేద నిశ్శబ్దాలు ఏ విధంగా వాళ్ల రచనల్ని, వ్యక్తిత్వాల్ని ప్రభావితం చేశాయో అవగతం చేసుకోవాలంటే వాళ్ల లేఖలు దోహదం చేస్తాయి. ప్రముఖ పత్రికా సంపాదకులు, చింతనాశీలి నార్ల వేంకటేశ్వరరావు హితులకు, సన్నిహితులకు, సామాన్య పాఠకులకు ఎన్నెన్ని లేఖలు రాసివుంటారో ఎవరి కెరుక? ఆయన కర్ణాటకలో వుండే ఓ కన్నడ రచయితకు, ప్రబుద్ధ పాఠకుడికి రాసిన వుత్తరాల సంకలనం ‘నార్లవారి ఉత్తరాలు’. ఇది 1986లో వెలువడింది. ఈ లేఖల్ని సంకలనం చేసి, ప్రచురించిన వ్యక్తి హరిహరప్రియగా కన్నడ సాహిత్య క్షేత్రంలో పేరుమోసిన సాతవల్లి వేంకట విశ్వనాథ. 1973 మార్చి 23న రాసిన మొట్టమొదటి లేఖ, 1984 ఫిబ్రవరి 21న రాసిన చిట్టచివరి ఉత్తరం– 11 ఏళ్ల అవధిలో రాసిన మొత్తం 57 జాబులు ఇందులో సంకలింపబడ్డాయి. వీటిల్లో ఒకటి హరిహరప్రియ తండ్రి సాతవల్లి శంకర రామశాస్త్రికి రాసింది. అన్నీ ఇంగ్లిషులో రాసిన ఉత్తరాలు. సర్వదా అపరిచితుడైన హరిహరప్రియ అడిగిన వెంటనే వి.ఆర్.నార్ల ‘మాటామంతీ’, ‘పిచ్చాపాటీ’ సంకలనాల్నుంచి కొన్ని వ్యాసాల్ని కన్నడీకరించేందుకు ఎలాంటి షరతులూ విధించకుండా అనుమతిచ్చారు– తన మొదటి ఉత్తరంలోనే. హైదరాబాద్‌కు రావడం తటస్థిస్తే తమ ఇంటికి వచ్చి భోజనం చేసి, కొన్ని గంటలు ఆషామాషీ గడిపితే మీ గురించి తెలుసుకొనే అవకాశం కలుగుతుందని ఎలాంటి భేషజాలు లేకుండా ఆత్మీయత ప్రదర్శించారు రెండో జాబులో. హరిహరప్రియ నార్లవారి అనుమతిపై జాబాలి నాటకాన్ని కన్నడంలోకి అనువదించేటప్పుడు దాన్లోని చివరి పంక్తుల్ని తిరగరాస్తే బాగుంటుందని సూచిస్తే, ఆయన సంతోషంగా మార్పు చేస్తూ, అనువాదకునికి కృతజ్ఞతలు చెప్పారు. నార్లవారి వ్యక్తిత్వంలో మాటలు పెళుసుతనం వ్యక్తమైనా, మనస్సులోని మెత్తదనం ఆయన ఈ లేఖలో కనిపిస్తుంది. గురుగంభీరులుగా భావింపబడే నార్లలో సౌజన్యం, సంస్కారం, సహృదయత ఈ లేఖల ద్వారా తెలుసుకోగలుగుతాం. జాబాలి కన్నడ అనువాదం ఆవిష్కరణ సభలో ఒకరు ఘాటుగా విమర్శించినప్పుడు హరిహరప్రియకు తన అభిప్రాయాన్ని ఇలా తెలియజేస్తారు: ‘‘ఒక రచన గురించి ఎవరైనా భిన్నాభిప్రాయం ప్రకటిస్తే, ఖండిస్తే దాన్ని స్వాగతించాలి. కాని ఒక రచన పట్ల నిర్లక్ష్యం ప్రదర్శిస్తే మాత్రం సహించకూడదు’’ (లేఖ–25). అయితే ఇదే నార్ల సమయమూ, సందర్భమూ గమనించి విమర్శకులు తమ అభిప్రాయాన్ని వెల్లడించాలంటారు. తన ‘సీత జోస్యం’ నాటకానికి కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి ప్రకటించినప్పుడు అకాడమీ ద్వైమాస పత్రిక ‘ఇండియన్ లిటరేచర్’లో ఆ పత్రిక సంహాయ సంపాదకుడు డి.ఎస్.రావు (ఈయనా తెలుగువారే) కటువుగా విమర్శించడంతో నార్ల ఆ బహుమతి తీసుకోనని మొరాయించారు. అకాడమీయే పురస్కరించి, తన పత్రికలోనే విమర్శించడం సబబు కాదన్నారు. విమర్శను వ్యతిరేకించ లేదు, విమర్శించిన సందర్భాన్ని వ్యతిరేకించారు. నార్ల రోగాల పుట్ట. తన ఉత్తరాల్లో పదేపదే ఈ విషయాన్ని ప్రస్తావించారు. శారీరక క్లేశానికి తోడు దేశ రాజకీయ పరిస్థితులు, తన పూర్వ సహోద్యోగులు, వర్తమాన శత్రువుల వల్ల మానసిక అశాంతికి దూరమై వున్నానని 1981లో రాశారు. ‘‘ఇది(‘ఖద్దరు సంస్కృతి’) అసత్యం, మోసం, నీచత్వం, డబ్బు, అధికారం కోసం ప్రాకులాడే తత్వం, అన్ని విధాల నైతిక పతనానికి ప్రాతినిధ్యం వహిస్తుంది.’’ 1984 ఫిబ్రవరి 21 నాటి చివరి లేఖలో ‘‘నాకిప్పుడు 76 ఏళ్లు. నేను మరెంత కాలమో జీవించను. నేను మరణించిన తర్వాత నా ఉత్తరాల్ని మీరేమైనా చేసుకోవచ్చు’’ అని రాశారు. సూటిగా, వాడిగా రాసే, మాట్లాడే ఆ మనిషి సరిగ్గా ఏడాది తర్వాత 1985 మార్చ్ 13న హైదరాబాద్‌లో చివరి శ్వాస వదిలారు. - ఘట్టమరాజు -
సాహిత్య సంచారం
బార్సిలోనాకి చెందిన అరవై యేళ్ల మాక్ నిర్మాణ వ్యాపారం కుప్పకూలిపోయింది. కొడుకులు వాళ్ల వాళ్ల జీవితాల్లో స్థిరపడి ఉన్నారు; భార్య ఫర్నిచర్ వ్యాపారంలో బిజీగా ఉంది. ఖాళీ సమయాన్ని ఎలా వెచ్చించాలా అని ఆలోచించిన మాక్ ఒక పుస్తకం రాయాలనుకుంటాడు. తన మరణానంతరం బయటపడి, అసంపూర్ణ రచనలా అనిపించే సంపూర్ణమైన రచన ఒకటి చేసిపెట్టుకోవాలని అతని ఉద్దేశం. అప్పటివరకూ చదువరిగానే తప్ప రచనానుభవం లేని మాక్కి సాహిత్యం పట్ల అభిప్రాయాలైతే ఉన్నాయి. సాహిత్యం మళ్లీ మళ్లీ పునరావృతమయ్యే ఒకే విశేషమనీ, సమస్యకి కారణాలు అన్వేషించే ప్రయాణాలే వివిధ రచనలుగా వెలువడుతున్నాయనేది అతని సిద్ధాంతం. రిపిటిషన్ అనేది సాహిత్యపు మౌలిక సూత్రం అన్నది అతని స్థిరాభిప్రాయం. ఈ ప్రయత్నాల్లో అతనుండగా, పొరుగున ఉండే సాంచెజ్ అనే ప్రముఖ రచయితని కలవడం తటస్థిస్తుంది. ఈ రచయిత తొలినాళ్లల్లో వ్యసనాలకి బానిసగా ఉన్నప్పుడు ‘వాల్టర్స్ ప్రాబ్లమ్’ అనే పది గొలుసు కథలున్న నవల రాసాడు. వాల్టర్ అనే వెంట్రిలాక్విస్ట్ కోల్పోయిన తన గొంతుని తిరిగిపొందడం, వివిధ రచయితల గొంతుల్లో ఆత్మకథని వినిపించడం నవల సారాంశం. సాంచెజ్ చేసింది మంచి ప్రయత్నమే కానీ, అప్పటికి అతనున్న మైకపు స్థితుల్లో ఒక్కోకథలో అర్థంలేని కొన్ని పేరాలు రాసుకుంటూ పోయాడు. ఇప్పుడా పుస్తకం కాపీలు ఎక్కడా దొరక్కపోవడం అతనికి కొంత ఊరట. మాక్ ఈ పుస్తకాన్ని కొన్నేళ్ల క్రితం సగం చదివి పక్కన పడేసాడు. సాహిత్యం ఎలానూ పునరావృతమయ్యేదే కాబట్టి దీన్నే తిరగరాసేస్తే సరిపోతుంది కదా అనుకుంటాడు. ఇప్పుడా పుస్తకాన్ని మాక్ మళ్లీ చదువుతుంటే, రచయిత సొంతగొంతుని సాధించడం కోసం చేసే ప్రతీకాత్మక ప్రయత్నంగా కథ అర్థమవుతూ పాత్రలు బాగా పరిచయమున్న వ్యక్తుల్లా అనిపిస్తారు. ఎంత సుపరిచితంగా అంటే– పుస్తకం మధ్యలో అతని భార్య పేరు శీర్షికగా ఒక కథ ఉంది! మాక్ కేవలం చదువరి అని మాత్రమే చెబితే చాలా తక్కువ చెప్పినట్టు. అతను చేసిన సాహిత్య శోధన అంతాయింతా కాదు. పుస్తకాలలోని వాక్యాలనీ, ఎపిగ్రాఫ్లనీ ఉదహరించగలిగినంత అపారమైన సాహిత్య పరిచయం ఉంది. ఈ పాండిత్యం నేపథ్యంగా తను సృష్టించబోతున్న నవలావరణంలోకి పూర్తిగా కూరుకుపోతున్న సమయంలోనే భార్య, సాంచెజ్ల మధ్య ఏదైనా సంబంధం ఉందా అన్న అనుమానం కలిగాక అప్పటివరకూ సాహిత్య శిఖరాలని అందుకోవలని ప్రయత్నిస్తున్న మాక్, భ్రాంతుల లోతుల్లోకి జారిపోవడం ప్రారంభిస్తాడు. హెమింగ్వే అన్నట్టుగా ‘‘నో, ఐ కాన్ట్. ఐ యామ్ డన్ విత్ ఇట్,’’ లాంటి ఆత్మహత్యని ప్రేరేపించే వాక్యాలు మనసులో మెదులుతుంటాయి. కథకుడిగా మాక్ చెప్పినవన్నీ పూర్తి సత్యాలు కావనీ, కొన్ని అబద్ధాలూ ఉన్నాయనీ నెమ్మదిగా విశదమవుతూంటుంది. సాహిత్య నిర్మాణ యత్నంలో తనకు తానే సమస్య అయిపోయిన మాక్ రాసిన డైరీయే‘మాక్స్ ప్రాబ్లమ్’ నవల. ఇది కేవలం కథకోసం ఒకటిరెండు రోజుల్లో చదవాల్సిన నవల కాదు. రచయిత బెర్నార్డ్ మాలాముడ్ని మాక్ ఉదహరించినట్టుగా– ఠీజ్చ్టి’టn్ఛ్ఠ్ట జీటn’్ట ్టజ్ఛి ఞౌజీn్ట. ఈ నవల ఒక అరుదైన సాహిత్య పరామర్శ, ప్రశంసాత్మక విమర్శ. ఎన్నో కథల గురించీ, పుస్తకాల గురించీ, రచయితల గురించీ, ప్రహసనాల గురించీ, సినిమాల గురించీ మాక్ వివరణలు, వాటిల్లోనుంచి కొటేషన్లూ ఈ రెండువందల పేజీల నవలలో విస్తృతంగా పరుచుకునుంటాయి. ఉదహరించిన రచనలతోబాటుగా ఈ నవలని చదవగలిగితే అది మరోస్థాయి పఠనానుభవం. పాఠకుడికి కొత్తదారుల్ని చూపించి ప్రోత్సహించే ఈ మెటాఫిక్షనల్ నవల హాస్యంతోపాటుగా మెటాఫిజికల్ ఆలోచనలనీ అందిస్తుంది. ఎన్‌రికె విలా–మాతాస్ స్పెయిన్‌కి చెందిన ప్రముఖ రచయిత. నవలలో సాంచెజ్ రాసినట్టుగా చెప్పిన ‘వాల్టర్స్ ప్రాబ్లమ్’ నిజానికి ఈ రచయితే 1988లో రాసిన నవల. ఈ ఆధార నవల ఇంగ్లిష్‌లోకి అనువాదం అయితే కనక– హెమింగ్వే, బోర్హెస్, రేమండ్ కార్వర్, జాన్ చీవర్, జీన్ రీస్ లాంటి ప్రముఖ రచయితల గొంతులని విలా–మాతాస్ అనుకరించిన పద్ధతి తెలుసుకునే వీలుంటుంది. మార్గరెట్ జల్ కోస్టా, సోఫీ హ్యూస్ ద్వయం చేసిన ‘మాక్స్ ప్రాబ్లమ్’ ఇంగ్లిష్ అనువాదం సాఫీగానూ, ఫిలసాఫికల్గానూ సాగిపోతుంది. - ఎ.వి. రమణమూర్తి నవల : మాక్స్ ప్రాబ్లెమ్ (లేదా) మాక్ అండ్ హిజ్ ప్రాబ్లెమ్ రచయిత : ఎన్‌రికె విలా–మాతాస్ స్పానిష్‌లో ప్రచురణ: 2017 ఇంగ్లిష్ : మార్గరెట్ జల్ కోస్టా, సోఫీ హ్యూస్ ప్రచురణ : న్యూ డైరెక్షన్స్, 2019 -
ప్రజల మనిషికి బహువచనమే లోపలి మనిషి
ఏ సాహిత్య ప్రక్రియ అయినా శూన్యం నుంచి రాదు. అది చరిత్ర నుంచి ప్రేరణ పొందుతూనే, వర్తమానంతో ప్రభావితమవుతూ ఉంటుంది. ఇందుకు గొప్ప ఉదాహరణ పీవీ నరసింహారావు ‘లోపలి మనిషి’ నవల (ఆంగ్లంలో ‘ది ఇన్సైడర్’, తెలుగు ‘లోపలి మనిషి’, అనువాదం: కల్లూరి భాస్కరం). గాఢమైన జీవితానుభవం, ఇతివృత్తంగా స్వీకరించిన చారిత్రక ఘటనల నుంచి ఉన్మీలనమైన తాత్త్విక కాంతిధార వెంటాడుతూ ఉంటే పీవీ ఈ నవల రాసి సాంత్వన పొందారనిపిస్తుంది. రాజకీయ సంస్థ పరిధిలో ఆయన లోపలి మనిషి. రాజకీయ వంచనతో, విలువల శైథిల్యంతో జాతి కన్న కల భగ్నమైపోతుంటే నిరసన గళం విప్పిన ప్రజల మనిషి కూడా. శతాబ్దాల పరాయి పాలన నుంచి విముక్తం కావడానికి ఎన్నో స్రవంతులనూ, పంథాలనూ కలుపుకుని పోరాడి గెలిచిన ఒక పురాతన జాతి తొలి అడుగులే తడబడుతుంటే, సంకెళ్లు తెగిపడ్డాయన్న స్పృహ లుప్తమై, కొత్త చరిత్ర నిర్మాణం వైపు కాకుండా, మళ్లీ బానిసత్వ చిహ్నాలను ముద్రించుకోవడానికి తహతహలాడుతూ ఉంటే సహించలేని లోపలి మనిషి, వాటి గురించి ప్రజల మనిషి చేత పలికించడమే ఈ నవల విశిష్ట శైలి. స్వేచ్ఛాభారతంలోనూ దగా పడుతున్న ప్రజల తరఫున వకాల్తా పుచ్చుకున్న లోపలి మనిషి, ప్రజల మనిషికి బహువచనంలా వినిపిస్తాడు. లోపలి మనిషి పీవీ. ప్రజల మనిషి ఆనంద్, ఈ నవలానాయకుడు. ఆగస్ట్ 15, 1947 అనే ఆ ఒక్క తేదీతో సమాన చారిత్రక ప్రాధాన్యమున్న తేదీగా మరొకదానికి పట్టం కట్టడం అసాధ్యం. అదే, అఫ్రోజాబాద్ సంస్థానమైతే ‘1948’ కాలచక్రంలోని ఒకానొక సంవత్సరం కాదు, కొత్త ఉషోదయం. ఈ ఉషస్సుకు ముందుటి అంధకారంలోనే ‘లోపలి మనిషి’ ప్రస్థానం ఆరంభమవుతుంది. భారతదేశమంతటా గాంధీజీ అహింసా సిద్ధాంతంతో భారత జాతీయ కాంగ్రెస్ పరాయి పాలన పునాదులు కదిలిస్తున్నది. అఫ్రోజాబాద్ సముద్రంలో దీవిలా మిగిలింది (562 స్వదేశీ సంస్థానాలలో ఒకటైన హైదరాబాద్‌కు రచయిత పెట్టిన పేరు). అక్కడ నవాబు ప్రపంచ కోటీశ్వరుడు. కానీ ఒంటి నిండా గుడ్డ ఉన్న పౌరులు అతి తక్కువ. వార్తాపత్రిక, రేడియో నిషిద్ధం. అయినా కాంగ్రెస్ ఉద్యమ ప్రభావమే కాదు, ఆయుధాన్ని నమ్మిన తీవ్ర జాతీయోద్యమ సెగ సైతం సంస్థానంలోకి ప్రవేశించింది. హఫీజ్ అనే విప్లవకారుడు అందించిన విప్లవ సాహిత్యం, భగత్‌సింగ్ తండ్రికి రాసిన చరిత్రాత్మక లేఖ ఆనంద్‌ను అప్పటికే నిజాం మీద ఆరంభమైన సాయుధపోరు వైపు అడుగులు వేయించాయి. స్వతంత్ర భారతంలో తొలిపొద్దు సందేశం– దేశానికి స్వాతంత్య్రం, దేశ విభజన ఏకకాలంలో జరిగాయనే. ఆపై గాంధీజీ హత్య. తరువాత గొడ్డలి పిడి తత్త్వాన్ని గుర్తు చేస్తూ కశ్మీర్ కోసం పాకిస్తాన్ మొదటి దాడి. నలభై ఆరుశాతం భూభాగంలో విస్తరించి ఉన్న సంస్థానాల విలీనంతో విశాల భారత ఆవిష్కరణ... వరుసగా జరిగాయి. తరువాత– తొలి సార్వత్రిక ఎన్నికలు. ‘టికెట్లు కోరుకునేవారిలో చాలామందిని ఆకర్షించేది అధికారమే కానీ, మరొకటి కాదని సాధారణ పరిశీలకులకు సైతం తెలిసిన వాస్తవం’(పే 98) అనతికాలంలోనే ఆవిర్భవించింది. పాతికేళ్ల స్వతంత్ర భారత ఉత్థానపతనాల మీద వ్యాఖ్య ఈ నవల. అందులో ఎన్నికలకి ఇచ్చిన స్థానం చాలా పెద్దది. ఎన్నికలలో రచయిత మహా పతనమే చూశారు. దేని పతనం? ప్రజాస్వామ్య పతనం. ‘దేశ పరిపాలన విషయంలో ప్రజాభిమతాన్ని ప్రతిబింబించడమనే వాస్తవిక ప్రయోజనాన్ని క్రమంగా ఎన్నికలు కోల్పోతూ వస్తున్నాయ’ (పే. 324)ని నిర్ధారణకొస్తాడతడు. దేశంలో సగం ఉన్న మహిళ ఎన్నికలలో పోటీ చేయాలంటే, మొదట జాతీయ కాంగ్రెస్ శల్యపరీక్షలో, ‘నా పడకగదిలోంచి ఆమె నడవనప్పుడు ఎన్నికల్లో కూడా ముందుకు సాగలేదు’ (పే. 221) అని చెప్పే పరిశీలకుల దగ్గర ఎలా నెగ్గాలి? లాల్‌బహదూర్ శాస్త్రి వంటి ఉన్నత వ్యక్తిత్వం కలిగిన నాయకుడు కలగచేసుకోవడంతో పరిశీలకుడు అప్పటికి (ఆనంద్ సన్నిహితురాలు అరుణ టికెట్టు రగడ) ఓడిపోయాడు. ప్రథమ ప్రధాని నెహ్రూ గురించీ, వ్యక్తిత్వం గురించీ ఇంతటి సమదృష్టితో పరిశీలించిన రచన మరొకటి ఉండదేమో! నెహ్రూ అంటే ఒక మహావృక్షం. అలీనవాదం, మిశ్రమ ఆర్థికత, సోషలిజం, ప్రభుత్వ రంగం, పంచవర్ష ప్రణాళికలు, నిరాయుధీకరణ, అకాడమీల స్థాపన, ఫెడరలిజం, సెక్యులరిజం – ఆ మహావృక్షం శాఖలే. అయినా, ‘నెహ్రూ అనే దేవత లక్షల మంది దెయ్యాలున్న పార్టీకి నాయకత్వం వహిస్తున్నాడన్నదే’ (పే 284) ఆనాటి అభిప్రాయం. నెహ్రూ ఆదర్శాలకీ, సమకాలిక సమాజానికీ మధ్య ఇంత దూరం! ‘ఎంతో తలపండిన రాజకీయవాదులు కూడా అలీన విధానాన్ని తేలికగా జీర్ణించుకోలేకపోయారు’ (పే 343). సోషలిజం నెహ్రూ స్వప్నం. కానీ అది వేదికలకీ, ఉపన్యాసాలకీ పరిమితం కావాలన్నదే కాంగ్రెస్ పెద్దల అభిమతం. లౌకికవాదం విషయంలో నెహ్రూ ఏకాకి. ‘భారతదేశంలో జాతీయవాది అనదగిన ఏకైక ముస్లిం ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ’ (పే 400) అని ఆయన వ్యతిరేకులు ఎత్తి పొడిచేవారు. 1962 నాటి చైనా యుద్ధంలో భారత్ ఓటమి దరిమిలా ఆయన తన ఈ పాత ప్రపంచం నుంచి తనను తానే బలవంతంగా బయటకు తెచ్చుకున్నారు. ఇక్కడ ఆనంద్ ఆరోపణ ఏమిటి? ‘నెహ్రూ మహాత్మా గాంధీని, ఆయన ఆదర్శాలను ముందుకు సాగించినట్టు నెహ్రూను, నెహ్రూ ఆదర్శాలను సాగించేవారు ఒక్కరూ లేరు’ (పే 386). ఆఖరికి నెహ్రూ కుమార్తె ఇందిరా గాంధీ కూడా అందుకు మినహాయింపు కాదన్నదే అతడి నిశ్చితాభిప్రాయం. ఇందిర పాత్ర చిత్రణ దగ్గర పీవీలోని స్వరాజ్య సమరయోధుడు, స్వతంత్ర భారత రాజకీయాల ప్రత్యక్ష సాక్షి మరింత కఠినంగా మారిపోవడం గమనిస్తాం. 1969 నాటి రాష్ట్రపతి ఎన్నిక, అందులో ఇందిర పాత్ర (పార్టీ సమావేశంలో నీలం సంజీవరెడ్డి అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించి, లోపాయికారిగా ఉపరాష్ట్రపతి వివి గిరిని అభ్యర్థిగా నిలిపి గెలిపించారు, దానికి అంతరాత్మ ప్రబోధం అని పేరు పెట్టారు) భారతీయులు రెండుగా చీలిపోయారన్న అపోహకు బీజం వేశాయని (ప్రపంచం దృష్టిలో, ముఖ్యంగా పాక్ దృష్టిలో) ఆనంద్ అభిప్రాయపడతాడు. ఆమె హయాంలో సాగిన అసమ్మతి రాజకీయాలు, ముఖ్యమంత్రుల మార్పు దేశ ప్రతిష్టకే భంగకరమని ఆనంద్ బాధ. ‘ఎంతో గొప్పవాడైన తన తండ్రిని కూడా జనం మరచిపోయేంత ఘనకీర్తిని సంపాదించాలన్న తపనతో ఆమె వేగిపోతోంది’ (పే 454) అనుకుంటాడు లోపలి మనిషి. తన తరువాత ఈ వైభవం కొడుకు సంజయ్‌కి సంక్రమించాలన్న తపననూ ఆమెలో గమనిస్తాడు. భూమి సమస్య; ప్రాధాన్యం, రాష్ట్రాల పునర్విభజన,రాజభరణాల రద్దు, బ్యాంకుల జాతీయకరణ, భారత జాతీయ కాంగ్రెస్‌కు కాంగ్రెస్ (ఐ) అనే ‘తోక’, పత్రికారంగం పతనం, నక్సల్బరీ, పాక్, చైనా సంబంధాలు, కామరాజ్ పథకం, హిందూ ముస్లిం సమస్య .... ఇలా నవలలో ఆనంద్ చేత లోపలి మనిషి మాట్లాడించిన చారిత్రకాంశాల జాబితా విస్తారమైనది. ఆ జాబితా స్వతంత్ర భారతదేశ చరిత్ర పుటలలోని ప్రతి అధ్యాయపు ఛాయే. చరిత్రకు ఛాయ సాహిత్యమే. ‘లోపలి మనిషి’ నవలాకారుడు సాహిత్యం లోతులు తెలిసినవారు. బహుభాషా పండితుడు. అందుకే పత్రికారంగం, భాషా వివాదాలు ఆయన దృష్టిపథం నుంచి తప్పించుకోలేదు. స్కూప్, స్పెషల్ కరస్పాండెంట్లు, కొసన ప్రశ్నార్థకం ఉన్న శీర్షికలతో వెలువడే వార్తలు, అవి సృష్టించే కృతక వాతావరణం వంటి అంశాలను పీవీ చిత్రించారు. నెహ్రూ వారసులెవరు అంటూ డజన్ల కొద్దీ పుస్తకాలు వెలువడుతుంటే, కొన్ని ప్రమాదకర సమస్యలు దేశంలో ఉద్యమ రూపంలో వీధులకెక్కాయి. అవి ప్రాంతీయమైనవి, భాషాపరమైనవి, మతపరమైనవి. నిజానికి అంతా రాజకీయమే. అస్సాం సాహిత్య సభ 1959లో వారి భాషను అధికార భాషగా ప్రకటించాలని కోరింది. అక్కడ బెంగాలీ మాట్లాడేవారు ఉన్నారు. ఇది హింసాత్మకమైంది. ఇంతకంటే దారుణం– తమిళనాడు హిందీ వ్యతిరేకాందోళన. ‘తమిళతల్లి’ కోసం ఆత్మాహుతులు జరిగిపోతున్న కాలం. ఒక మంత్రి ఇంట జరిగిన పెళ్లిలో ఉత్తర భారత నర్తకుడు బిర్జూ మహరాజ్ కార్యక్రమం ఏర్పాటయిందని తెలిసి తెలుగుప్రాంతం నుంచి వెళ్లిన ఆనంద్ తదితర నేతలు కంగుతిన్నారు. ఈ హిందీ వ్యతిరేకోద్యమ ఘట్టానికి కొసమెరుపు– ఎంపీ అయిన ఓ హిందీ వ్యతిరేకోద్యమ నేత ఆనంద్‌కు పరిచయం. ఒక విమానాశ్రయంలో ఇద్దరూ తారసపడ్డారు. తమిళ ఎంపీ వెంట కొడుకు ఉన్నాడు. వారి మధ్య సంభాషణ ఇది. ‘మీకు తెలుసో లేదో, మావాడు ఢిల్లీలో చదువుతున్నాడు. హిందీలో వీడిక్లాసులో ఎప్పుడూ వీడే ఫస్టు’ అన్నాడు ఎంపీ. ‘మీకు హిందీ రాదు. పైగా ఆ భాషకు వ్యతిరేకం. ఎప్పుడూ ఆందోళన చేస్తూనే ఉంటారు’ విస్మయంతో అడిగాడు ఆనంద్. ఇందుకు మరింత విస్మయం కలిగించే జవాబు, ‘చూడండి, అవి రాజకీయాలు...’ (పే. 321). సమాఖ్య వ్యవస్థలో కేంద్రం బలహీనంగా ఉందన్న అభిప్రాయం బలపడినప్పుడూ, తమను పట్టించుకునే వెసులుబాటు ఢిల్లీకి లేదు కాబోలునని వెనుకబడిన ప్రాంతాల ప్రజలు నిరాశ పడినప్పుడు నక్సలిజం వంటి సమస్యలు అనివార్యమనే పీవీ చెబుతారు. ‘భూస్వామ్య వ్యవస్థ వైఫల్యాలను మీ పార్టీ (కాంగ్రెస్) వాడుకుంటే, ఇప్పుడు నక్సలైట్లు మీ విధానంలోని వైఫల్యాలను వాడుకుంటున్నారు. అవి మరింత కొట్టొచ్చినట్టు కనిపించే వైఫల్యాలు’ అని బలరాం అనే పాత్ర (భూస్వామి) వ్యక్తం చేసిన అభిప్రాయంలో ప్రతిబింబించేది ఇదే. భూమి సమస్యకు కొనసాగింపుగానే పీవీ నక్సల్ సమస్యను చూశారు. అయినా ఆయన దృష్టిలో భారతీయతకు ఆకృతిని ఇచ్చినదే భూమి. సోషలిజం కాంగ్రెస్ పార్టీ నినాదం. కానీ భూసంస్కరణలు తేవడానికి ముఖ్యమంత్రి అయిన తరువాత ఆనంద్ చేసిన ప్రయత్నం భంగపడింది. చివరికి అది అతడి పదవిని బలిగొన్నది(వాస్తవంలో ఇందుకు బలిపశువైనవారు పీవీయే). ఇదే ఈ నవలకు ముగింపు. ‘లోపలి మనిషి’ పీవీ ఆత్మకథాత్మక నవలగా చెబుతున్నారు. కానీ ఇది నాటి ఎందరో విజ్ఞుల ఆత్మావలోకనం. దానికి అక్షరరూపం ఇచ్చినవారు దాదాపు పీవీ ఒక్కరే. ఎంతటి చరిత్రపురుషులనైనా దేవుళ్లుగా ప్రతిష్టించవద్దంటుందీ నవల. చరిత్రను మింగే స్థాయిలో చరిత్ర పురుషులను ఆరాధించకూడదని ఘోషిస్తుంది. - డా‘‘ గోపరాజు నారాయణరావు -
గన్‌పౌడర్ భోజనం
రచయిత, విమర్శకుడు వల్లంపాటి వెంకటసుబ్బయ్య హైదరాబాద్‌లోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లిష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్‌లో కొంతకాలం ఉండి చదువుకున్నారు. ఆ సంస్థను ఆయన హైదరాబాద్ మధ్యలో లండన్ అనేవారు. ఆయనకు అక్కడి తిండి తీరు నచ్చలేదు. ఒకనాడు వంటవాళ్లను అడిగి మిరప్పొడి, ఉప్పు తెప్పించుకుని అందులో నూనె కలుపుకుని దానితో అన్నం తింటున్నారు. ఒక మహిళ అది గమనించి, ఏమిటి తింటున్నావు అని అడిగింది. ఈయన గర్వంగా గన్ పౌడర్ అన్నారట. అది తిని ఎట్లా బతుకుతావు అని ఆమె ఆశ్చర్యంగా అడిగింది. అది లేకుంటే నేను బతకలేను అని ఈయన జవాబు! అక్కడి వాతావరణం నుంచి బయటపడాలని ఆయన పక్కనే ఉన్న మా ఉస్మానియా బి హాస్టల్‌కు వచ్చేవారు. ఒక సారి భోజనానికి కూడా ఉండిపోయారు. ఆ సంగతి విన్న ఆ మహిళ ఈజ్ ఇట్ నాట్ నాయిసీ దేర్ (అక్కడంతా గోలగా లేదా) అని అడిగింది. నో, ఇట్ ఈజ్ వెరీ లైవ్ లీ (లేదు, అక్కడ చాలా జీవవంతంగా అంది) అని జవాబిచ్చారు. ఈ సంగతులు ఆయనే మాతో చెప్పారు. గోపాలం కె. బి. -
విలువైన వ్యాస పెన్నిధి
కడపలోని సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం రాయలసీమకు చెందిన ప్రాచీన తెలుగు కవుల్ని నేటితరం వారికి పరిచయం చేయాలని ఓ ప్రణాళిక వేసుకుంది. కుమార సంభవం కావ్యకర్త ‘నన్నెచోడుడు’ ఈ ప్రణాళిక ఫలమే. మూల మల్లికార్జున రెడ్డి సంపాదకత్వంలో వెలువడిన ఈ పుస్తకంలో ఏడు వ్యాసాలున్నాయి. మహాపండితుడు నడకుదుటి వీరరాజు పంతులు రాసిన ‘కవిరాజ శిఖామణి కావ్య విశేషములు’ ఈ సంకలనంలోని మొదటి వ్యాసం. కావ్యావతారికలో ఇష్టదేవతా ప్రార్థన, గురుస్తుతి, పూర్వకవి ప్రశంస, కుకవి నింద మొదలైన విషయాల్ని ప్రస్తావించి నన్నెచోడుడు తర్వాతి కవులకు మార్గదర్శి అయ్యారని వీరరాజు పంతులు అన్నారు. కుమార సంభవంలోని కొన్ని పదాల్ని కందుకూరి వీరేశలింగం అన్యదేశ్యాలుగా భావించటం పొరపాటనీ, అవి మూలద్రావిడ భాషా పదాలే అనీ నిరూపించారు. ఆయన వాడిన ‘అప్రతీత పదములు’ అన్నమాట సరికాదనీ, అవి ఆ కవి కాలంలో వ్యవహారంలో వుండి, తర్వాతి కాలంలో కనుమరుగయ్యాయనీ చెప్పారు. ఆయన చర్చించిన ‘శబ్ద పరికర సంపత్తి’ భాగం భాషాశాస్త్రరీత్యా ఎంతో విలువైనది. 1926 నాటి ఈ అమూల్య వ్యాసం ఈ గ్రంథానికి పెన్నిధి. నన్నయ్యకు నన్నోచోడుడు నూరేండ్ల తర్వాతివాడని సోపపత్తికంగా నిరూపించారు వేటూరి ఆనందమూర్తి. చిలుకూరి పాపయ్య శాస్త్రి తమ ‘నన్నెచోడుని వర్ణనా నైపుణ్యము’లో సంస్కృత కవుల వర్ణనల్లో రసదృష్టి ప్రధానమైతే, తెలుగు కవుల వర్ణనల్లో ఆలంకారికత, చాతుర్యం, వైదగ్ధ్యం ప్రాముఖ్యాన్ని వహిస్తాయని చెప్పారు. నన్నెచోడుని కావ్యం అనల్ప కల్పనాశక్తి, అపూర్వ వర్ణనాయుక్తులు సుందర సంగమమనీ; మనస్తత్వ నిరూపణలో తిక్కన, సూరనలకు నన్నెచోడుడు మార్గదర్శకుడనీ అన్నారు సి.నారాయణ రెడ్డి. నన్నెచోడుని వర్ణనల్లోని వన్నెచిన్నెల్ని తమ వ్యాసంలో చక్కగా ప్రదర్శించారు వి.రాజేశ్వరి. రతీమన్మధుల సంవాదంలోని మనస్తత్వ చిత్రణలోని సూక్ష్మతల్ని నిరూపించారు. నన్నెచోడుని అష్టాదశ వర్ణనల్లోని ప్రగల్భతను ప్రస్తుతించారు ఆరుద్ర. కవి గడుసుదనాన్నీ, గమ్మత్తుల్నీ సోదాహరణంగా పేర్కొన్నారు. కుమారసంభవాన్ని తొలిసారిగా (మొదటి సంపుటం 1908, రెండవ సంపుటం 1914) ప్రచురించిన మానవల్లి రామకృష్ణ కవి వ్యాసం, కుమారసంభవం గురించి పరిశోధన చేసిన వేదం వెంకట్రాయశాస్త్రి, అమరేశం రాజేశ్వరశర్మ, తిమ్మావఝల కోదండరామయ్య గార్ల వ్యాసాలు సంకలింపబడివుంటే ఈ గ్రంథం సమగ్రతతో శోభిల్లివుండేది. ఘట్టమరాజు నన్నెచోడుడు (విమర్శ వ్యాసాలు) పేజీలు: 152; వెల: 100 ప్రధాన సంపాదకుడు: ఆచార్య కె.చంద్రయ్య ప్రతులకు: సభ్య కార్యదర్శి మరియు రిజిస్ట్రార్, సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం, యోగి వేమన విశ్వవిద్యాలయం, 1–1254, యర్రముక్క పల్లె, కడప–516004. ఫోన్: 08562–255517 -
మెక్సికో స్త్రీల ఆర్తధ్వనులు
మెక్సికోలోని లామటోసా అనే చిన్న ఊర్లోని ఓ పంటకాలువ. దాని ఒడ్డున జీర్ణావస్థలో నీళ్లల్లో తేలుతూ ఉన్న మంత్రగత్తె శవాన్ని చూశారు అయిదుగురు పిల్లలు. మంత్రగత్తెని ఎవరు, ఎందుకు చంపారు? చేతబడులు చేస్తుందనీ మంత్రతంత్రాలను ప్రయోగిస్తుందనీ నమ్మే లామటోసా ఊరి ప్రజలకి మంత్రగత్తె అంటే భయమే కాదు, కొద్దిపాటి అసహ్యం కూడా. ఆ ఊరి స్త్రీలు మాత్రం తమ మానసిక, శారీరక సమస్యలను మూలికలూ మంత్రాలతో నయం చేసుకోవటానికి ఎవరికంటా పడకుండా రహస్యంగా ఆమె దగ్గరకు వెళ్తూ ఉంటారు. ఎంతోమంది గల్లంతైపోయిన ఒక తుఫాను రాత్రి అనంతరం ఆ మంత్రగత్తె చనిపోయిందనుకుని, ఆమె కూతుర్నే మంత్రగత్తె అనడం మొదలుపెడతారు ఊరి జనం. వాళ్ల ఇంట్లో ఒక మూసేసిన గది ఉందనీ, అందులో బంగారు నాణాలున్నాయనీ ప్రజల అనుమానం. లూయిస్మీ, యేసేనియా అదే ఊరిలో తమ అమ్మమ్మ దగ్గర పెరుగుతుంటారు. చిన్నతనంలోనే మద్యం, డ్రగ్స్ లాంటి దురలవాట్లకు బానిసైన లూయిస్మీ బాధ్యతారాహిత్యం గురించి తెలిసిన యేసేనియాకి, మంత్రగత్తెని అతనే చంపాడేమో అన్న అనుమానం వస్తుంది. జరిగిన కథేమిటంటే– పెంపుడు తండ్రి వల్ల గర్భవతై ఆత్మహత్య చేసుకోవాలనుకున్న పదమూడేళ్ల నోర్మా గతం గురించి తెలియని లూయిస్మీ ఆమెని భార్యగా స్వీకరిస్తాడు. అత్తగారి సలహా మేరకు అబార్షన్‌కి ఒప్పుకున్న నోర్మా, మంత్రగత్తె ఇచ్చిన పసర్లు మింగి ఆరోగ్యం విషమించి ఆస్పత్రి పాలౌతుంది. లూయిస్మీ ఉగ్రుడైపోయి తన స్నేహితుడితో కలిసి మంత్రగత్తె ఇంటిని దోచేద్దామని వెళ్లగా, అక్కడ డబ్బేమీ దొరకకపోగా ఊహించని పరిస్థితులలో స్నేహితులిద్దరూ మంత్రగత్తెని చంపి శవాన్ని కాలవలో పడేసి పారిపోతారు. మంత్రగత్తె చనిపోయిందన్న విషయం తెలుసుకున్న ఊరిజనం నిధి కోసం ఆ ఇంటిమీద పడతారు. అందరికంటే ముందుగానే ఆ డబ్బుకోసం అక్కడికి చేరుకున్న పోలీసులు మూసేసిన గదిని హడావుడిగా పగలగొట్టినప్పుడు తెలిసిన కొత్త నిజాలేమిటి? చివరికి మిగిలిందేమిటి? అది నవల ముగింపు. హరికేన్ సీజన్ – తుఫానులాగా కమ్మేసే ఈ నవల ప్రపంచ పాఠకులనుంచి ప్రత్యేకమైన ప్రశంసలను పొందుతోంది. ప్రముఖ లాటిన్ అమెరికన్ రచయిత్రి ఫెర్నాండా మెల్చోర్ రాసిన స్పానిష్ నవలల్లో ఇంగ్లీషులోకి తొలిసారిగా అనువదింపబడి, బుకర్ ఇంటర్నేషనల్ అవార్డ్‌కి షార్ట్‌లిస్ట్ అయిన ఈ నవలని సోఫీ హ్యూస్ అనువదించారు. థర్డ్ పర్సన్ నెరేషన్‌తో కథనం పాత్రలు, కాలాల మీదుగా సాగుతూ మంత్రగత్తె చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఫుల్‌స్టాపులు లేని పొడుగైన వాక్యాలు జ్వరప్రకంపనాలుగా సాగుతూ పాత్రల జీవితాల్లోకి చదువరిని లాగేస్తాయి. చాప్టరంత పేరాగ్రాఫు ఒక్కోసారి పేజీల కొద్దీ సాగిపోయినా కథనంలో వేగం తగ్గదు; విసుగు పుట్టించదు. పేదరికంతో పాటు డ్రగ్స్, మద్యం, విశృంఖల శృంగారం, హోమోసెక్సువాలిటీ గురించి నవలలో వినిపించే పచ్చిదనం నగిషీలు చెక్కని వాస్తవం. స్పానిష్ భాషలో లావాలా ఎగజిమ్మిన క్రోధం, అశ్లీలత, హింస, తిట్లని ధ్వనింప చేయటానికి ఇంగ్లీష్ భాషలోని వివిధ మాండలికాలతో ఎంతో శ్రమించాల్సి వచ్చిందని అంటారు అనువాదకురాలు. జీవితాలలో ఉన్న హింసలకీ విషాదాలకీ అతీతంగా పాత్రలు చూపించే ప్రేమ కరుణ నవలకి విడిగా కనిపించని చోదకశక్తి. శవాలను ఖననం చేసేటప్పుడు వాటితో ప్రేమగా మాట్లాడటం తన బాధ్యత అనుకునే కాపరి, శవాలను పూడుస్తూ మాట్లాడే ముగింపు వాక్యాలు, ‘‘ఈ చీకట్లు ఇలా ఉండిపోవు. దూరంగా నక్షత్రంలా కనబడుతున్న వెలుగును చూశావా? ఆ వెలుగు దగ్గరకే నువ్వు వెళ్తోంది. వెతల కలుగులోంచి ఆ వెలుగులోకి వెళ్లే దారి ఇదే!’’ అనటం ముగిసిన ఆ జీవితాలకి ఆఖరి ఓదార్పు. మెక్సికోలో కనిపించే పేదరికం, లింగవివక్ష, ఫెమీసైడ్ (స్త్రీలు కాబట్టి చంపేయడం), మాఫియా, డ్రగ్స్, వ్యభిచారం, నిరక్షరాస్యతలతో మగ్గిపోతూ మార్పుకోసం ఎదురుచూసే జీవితాల్లోకి వెలుగు వచ్చేదెప్పుడనీ, వారు శ్వాసించే హింసకు నిజమైన అంతమెప్పుడనీ ఉగ్రస్వరంతో వేసిన ప్రశ్నే ఈ నవల. పద్మప్రియ నవల: హరికేన్ సీజన్ రచయిత్రి: ఫెర్నాండా మెల్చోర్ స్పానిష్ నుంచి ఇంగ్లిష్: సోఫీ హ్యూస్ మూల నవల ప్రచురణ: 2017 -
రెండు వేల ఏళ్ల లంచావతారం
ఒక పరీక్షార్థం వచ్చే పరీక్షకునికి కానీ, అవతలి పార్టీవారి పక్షాన వచ్చే దూతకు కానీ లంచం ఇచ్చి తమ వైపు తిప్పుకునే అలవాటు కనీసం 13వ శతాబ్దం నాటికే ఉందని దీన్ని బట్టి నిక్కచ్చిగా తెలుస్తూ ఉంది. ఇక లంచం ఇచ్చే పద్ధతి నన్నయ నాటికి అంటే 11 వ శతాబ్దికి కూడా ఉందని చెప్పవచ్చు. ఇదే విషయం సంస్కృత భారతంలో కూడా వర్ణితమైన కారణంగా కనీసం రెండు వేల సంవత్సరాల నాడే ఈ పద్ధతి ఉందని చెప్పవచ్చు. మాజీ ప్రధాని విశ్వనాథ ప్రతాపసింగ్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చేసిన మొదటి ప్రసంగంలోనే ‘‘లంచం అనేది భారత దేశంలో ఒక జీవన విధానం అయింది’’ అని చెప్పాడు. లంచం అనే పదానికి చాలా పర్యాయ పదాలు పుట్టాయి. ‘టేబుల్ కింద చేయి’, ‘చేయి తడపడం’, ‘గీతం’, ‘పై సంపాదన’, ఇలా చాలా వ్యక్తీకరణలలో మన భాషలో ఇది నిలబడింది. ‘లంచం లేనిదే మంచం ఎక్కడట’ అనే సామెత కూడా వచ్చింది. ఈ లంచం అనే పదం తెలుగు భాషలోనికి ఎప్పుడు చేరింది అని పరిశీలించివచ్చు. లంచం ఇవ్వడం అనే ఘట్టం ఆదికావ్యం మహాభారతంలోనే కనిపిస్తుంది. నన్నయ ఆది పర్వంలో అస్తీకుడి కథలో ఇది కనిపిస్తుంది. వారం రోజులలో తక్షకుడు అనే సర్పం కరవడం వల్ల నువ్వు మరణిస్తావని పరీక్షిత్తును శృంగి శపిస్తాడు. పరీక్షిన్మహారాజు పెద్ద ఒంటి స్తంభం మేడ కట్టుకొని దాని చుట్టూ కింద మంట పెట్టించి ఏ పామూ పైకి రాకుండా రాజవైద్యులను పెట్టుకొని ఉన్నాడు. కాశ్యపుడు అనే బ్రాహ్మణుడు ఎంతటి విషాన్నైనా హరించి చనిపోయిన వారిని కూడా బతికిస్తాడని చెప్పగా ఆయనను కూడా పిలిపించమని భూరి దక్షిణలు ఇస్తామని పిలిపిస్తారు. రాజును బతికిస్తే ధనంతో పాటు ఇతర బహుమతులు వస్తాయని హస్తినాపురానికి బయలుదేరాడు కాశ్యపుడు. తక్షకుడు అడవి మార్గంలో వస్తూ కాశ్యపుని మార్గమధ్యంలోనే ఆపుతాడు. ‘నేను రాజును అతనికి ఉన్న శాపం ప్రకారం చంపబోతున్నాను. నేను ఏ ప్రాణినైనా చంపగలిగిన శక్తి ఉన్నవాడిని. నువ్వు రాజును ఎలా తిరిగి బ్రతికించగలవు?’ అని అడుగుతాడు. ‘నాకూ అంతటి శక్తి ఉంది. నేను ఏ విష ప్రభావాన్నయినా విరగ దీసి, తిరిగి బతికించగలను’ అని చెబుతాడు కాశ్యపుడు. ‘అయితే ఈ వృక్షాన్ని నేను కాటువేసి చంపుతాను, తిరిగి దీన్ని బతికించు, దానితో నీ శక్తి తెలుస్తుంది’ అంటాడు తక్షకుడు. అని ఒక పెద్ద వటవృక్షాన్ని కాటు వేస్తాడు. అది క్షణాలలో భస్మీపటలం అవుతుంది. వెంటనే కాశ్యపుడు ఒక మంత్రాన్ని పఠించి, తిరిగి దాన్ని బతికిస్తాడు. చెట్టు తిరిగి ఫల పుష్పాలతో ఎప్పటిలాగా బతికింది. తక్షకుడు ఆశ్చర్యపోయాడు. ఇతను రాజును తిరిగి బతికించగలడు అనే నమ్మకం వచ్చి, రాజు ఇచ్చే ధనాన్ని నేనే ఇస్తాను; నీవు వెనక్కు వెళ్ళి పో అంటాడు. దానికి కాశ్యపుడు అంగీకరించడు. రాజు ఇచ్చే ధనంకన్నా రెట్టింపు ఇస్తానని చెప్పి, తిరిగి ఇంటికి పోయటట్లు చేస్తాడు తక్షకుడు. తెలుగు సాహిత్యంలో లంచం ఇచ్చి పని చేయించుకున్న ఘట్టం మొదటి సారిగా వర్ణించబడింది ఇదే. ఇక్కడ లంచం అనే పదం వాడలేదు కాని ఈ విషయాన్ని స్పష్టంగా వర్ణించాడు నన్నయ. అయితే ఇది 11వ శతాబ్దంలోనే ఉంది అని అనుకోనక్కరలేదు. ఇదే కథ వ్యాసుని సంస్కృత మహాభారతంలో కూడా ఇదే విధంగా ఉంది(ఆది పర్వం 43వ అధ్యాయం). సూక్తాంకర్ సంశోధించిన వ్యాసభారతం భండార్కర్ ప్రతిలో ఈ వర్ణన యథాతథంగా ఉంది. కాశ్యపుడు తన పనికోసం బయలు దేరితే తక్షకుడు తన పని కావడానికి అవరోధంగా ఉన్న కాశ్యపుని తప్పించడానికి లంచం ఇచ్చాడని స్పష్టంగా చెప్పబడుతూ ఉంది. అయితే తెలుగు భారతంలో కానీ, సంస్కృత భారతంలో కానీ దీన్ని ధనం అన్నారే కాని లంచం అనలేదు. కాని ఇక్కడ జరిగింది లంచమే. (కాశ్యప ఉవాచ: ధనార్థీ యాంయహం తత్ర తన్మే దేహి భుజంగమ! తతోహం వినివర్తిష్యే స్వాపతేయం ప్రగృహ్య వై!!) ఇదే తెలుగు మహాభారతంలో లంచం అనే పదాన్ని స్పష్టంగా వర్ణించిన ఘట్టం తిక్కన రచన అయిన ఉద్యోగపర్వంలో ఉంది. అజ్ఞాత వాసం ముగిసిన తర్వాత పాండవులు ఒక దూతని కౌరవుల దగ్గరికి పంపుతారు. ధృతరాష్ట్రుడు సమాధానం అతనికి చెప్పకుండా తాము కూడా ఒక దూతని పంపించి మా అభిప్రాయం చెబుతాము అని అంటాడు. తర్వాత సంజయ రాయబారం జరుగుతుంది. ధృతరాష్ట్రుడు రాజ్యం ఇస్తామని చెప్పకుండా మీరు అక్కడే ఉపప్లావ్యంలో సుఖంగా ఉండండి అని చెప్పి పంపిస్తాడు. ఆ తర్వాత కృష్ణుడు పాండవ దూతగా వస్తున్నాడు అని తెలిసిన తర్వాత విదురుడు «ధృతరాష్ట్రుని కడకు వచ్చి మంతనాలు చేస్తాడు. స్వాగత ఏర్పాట్లు ఏం చేయాలో మంత్రి అయిన విదురునికి చెబుతూ– కం‘‘ వివిధ మణిమయ రథంబులు, జవనాశ్వంబులును, భద్రసామజములు ర త్న విభూషణములు దాసీ నివహంబులు జాల గృష్ణునికి నేనిత్తున్ (ఉద్యో. 3–157 పద్యం) ఇవన్నీ ఇద్దాము అంటాడు ధృతరాష్ట్రుడు. ఇంకా చాలా ఇవ్వాలి, పెద్ద ఉత్సవం చేయాలి అని నాలుగు పద్యాలలో వచనంలో కూడా చెబుతాడు. ఇదంతా విని విదురుడు, మహారాజా ఇప్పుడు కూడా మీరు సరిగ్గా ఆలోచించడం లేదు; వచ్చే దూతను ప్రీతుని చేయడానికి ఈ పనులు అన్నీ చేయడం ఎందుకు? దీని బదులు పాండవులకు కనీసం ఐదూళ్ళు ఇస్తే సరిపోతుంది కదా అని అంటాడు (పద్యం 158). తర్వాత ఒక పద్యంలో విదురుడు చెప్పిన మాటలని తిక్కన సూటిగా వర్ణిస్తూ దూతకి లంచం ఇస్తావా అని అంటాడు. ఉ‘‘ నీతలపేను గంటి నొక నేర్పున శౌరికి లంచ మిచ్చి సం ప్రీతుని జేసి కార్యగతి భేదము సేయగ జూచె దింత బే లైతి గదే సుమేరు సదృశార్థము జూచియు బార్థు బాయునే యాతడు క్రీడిభక్తియును నచ్యుతు పెంపును నీవెఱుంగవే. అతనికి అర్జునుడు అతి ప్రేమాస్పదుడైనవాడు కాబట్టి అచ్యుతుడు అతడు, నీ ఆలోచనలు మానుకో అని చెబుతాడు విదురుడు. ఒక పరీక్షార్థం వచ్చే పరీక్షకునికి కానీ, అవతలి పార్టీవారి పక్షాన వచ్చే దూతకు కానీ లంచం ఇచ్చి తమ వైపు తిప్పుకునే అలవాటు కనీసం 13వ శతాబ్దం నాటికే ఉందని దీన్ని బట్టి నిక్కచ్చిగా తెలుస్తూ ఉంది. ఇక లంచం ఇచ్చే పద్ధతి నన్నయ నాటికి అంటే 11 వ శతాబ్దికి కూడా ఉందని చెప్పవచ్చు. ఇదే విషయం సంస్కృత భారతంలో కూడా వర్ణితమైన కారణంగా కనీసం రెండు వేల సంవత్సరాల నాడే ఈ పద్ధతి ఉందని చెప్పవచ్చు. పైన చెప్పిన ఉద్యోగ పర్వ ఘట్టం వ్యాస భారతంలో కూడా ఇదే పద్ధతిలో వర్ణితం అయింది. లంచం అనే మాటకు ‘ఉత్కోచ’ అనే పదమే సాహిత్యంలో వాడారు. మోనియర్ విలియమ్స్ సంస్కృత–ఇంగ్లీషు నిఘంటువులో ‘ఉత్కోచ’ అంటే bటజీb్ఛ అనే అర్థాన్నే ఇచ్చింది. ధనం ఇచ్చి ఏమి ఇచ్చినా కృష్ణుని పొందలేవు, అర్జునునితో ఆయన బంధాన్ని విడదీయలేవు అని ధృతరాష్ట్రునికి చెప్పి ఐదు గ్రామాలనైనా ఇవ్వు అని అంటాడు. (ఉద్యోగపర్వం: 87–10, 11). లంచం అనే మాట ప్రాచీన తెలుగు సాహిత్యంలో ఇంకా చాలా చోట్ల వినియుక్తమైంది. శ్రీనాథుడు భీమేశ్వర పురాణంలో ఈ మాటని వాడాడు. శా‘‘ కాంచీకంకణ తారహర ఘటికా గ్రైవేయ భూషావళుల్ లంచంబిత్తురు దూతికా తతికి లీల బెండపూడన్ననిన్ బంచాస్తోప్రము తారతార కవయం ప్రార్థించి లోలపలన్ పంచారామములందు బల్వెల పురిం ఫ్రౌఢేందు బింబాననల్ (ఆ. 1–77) అని శార్దూల పద్యంలో వర్ణిస్తాడు. ఇక్కడ ముఖ్యమైన విషయమేమంటే లంచం అనే మాట ప్రాస స్థానంలో ఉంది. పదిహేనో శతాబ్దంలో లంచం అనే మాటకు సంబంధించిన ఉనికికి ఇది తిరుగలేని సాక్ష్యం. శ్రీనాథుడు 15వ శతాబ్దం వాడు. భాగవతంలో కూడా లంచం అనే మాట ఉంది. పంచమ స్కందంలో శుకయోగి పరీక్షిత్తుకు నరక లోకాన్ని వర్ణించి చెప్పే ఘట్టంలో వివిధ శిక్షలను గురించి వర్ణిస్తూ చాలా పద్యాలు రాస్తూ ఒక సీసపద్యంలో– ‘‘లంచంబు గొని సాక్షి వంచించి యనృతంబు బలికెడు పాపాత్ము బట్టి కట్టి యంత మానక వీచియను నరకమందు శతయోజనోన్నత శైల శిఖరమున దలక్రిందుగా నునిచి యదోముఖంబుగ బడదొబ్బిన...’’ (పంచమ స్కందం –154) అని స్పష్టంగా వర్ణించాడు పోతన మహాకవి. దొబ్బిన అనే మాట కూడా వాడాడు. అంతే కాదు, లంచం తిని దొంగ సాక్ష్యం చెప్పే విషయం కూడా ఇక్కడ రికార్డు అయింది. పోతనామాత్యుడు కూడా 15వ శతాబ్ది వాడు. శ్రీనాథునికి సమకాలికుడు. ఓరుగల్లు ప్రాంతంలో కాకతీయుల పాలనలో కూడా లంచం తీసుకొని దొంగ సాక్ష్యాలు చెప్పే స్థితి ఉందని దీన్ని బట్టి తెలుస్తుంది. ఇక కుచేలోపాఖ్యానంలో కూడా కృష్ణుని భవనానికి పోయినప్పుడు అక్కడ ద్వారాల దగ్గర ఉండే కాపలా వారికి ఒకటో రెండే పణాలు ఇవ్వాలన్నా కూడా లేవే అని కుచేలుడు అనుకుంటాడని పోతన వర్ణించాడు. (దశమ. 972). ఇక్కడ ద్వారపాలకులకు ఇచ్చేదాన్ని పరిదానం అని అన్నాడు. ‘లంచపంచములు’ అనే జంటపదాల్ని కూడా కావ్యాలలో వాడారు. కువలయాశ్వ చరిత్రలో, పరమయోగి విలాసం అనే ద్విపద కావ్యంలోనూ లంచపంచములు అనే ప్రయోగాలున్నాయి. ఈ తర్వాతి కాలంలో కూడా లంచం అనేమాట ప్రయోగం అయింది. దశకుమార చరిత్ర (దుగ్గన), కేయూరబాహు చరిత్ర (మంచెన) లలో లంచమువెట్టు అనే ప్రయోగం ఉంది. ఈ సాహిత్య గ్రంథాలలోని సాక్ష్యాలను బట్టి నాటి సామాజిక జీవనం ఎలా ఉండేది అనే విషయం కూడా మనకు బాగా అవగతం అవుతూ ఉంది. పురాణపాత్రలే లంచం ఇవ్వడం తీసుకోవడం ఇవ్వజూపి పనులు చేయించుకునే తీరు గమనించాలి. మధ్యయుగాలలో లంచంతో దొంగ సాక్ష్యాలు చెప్పించే విషయం కూడా గమనించాలి. ఆ కాలం నుండీ నేటి దాకా దీని విశ్వరూపాన్ని అవగాహన చేసుకోవడానికి దీని చరిత్రను తెలుసుకోవడానికి ఈ సాహిత్య ఆకరాలు పనికి వస్తాయి. ప్రొ‘‘ పులికొండ సుబ్బాచారి -
నిలబడే ఇవ్వాలి
ఒకసారి మార్క్ ట్వేన్ ఉపన్యాసాలు ఇస్తూ ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు. అట్లా ఒక కొత్త ఊరికి వెళ్ళాడు. అక్కడ గడ్డం గీయించుకోవడానికి మంగలి షాపులోకి వెళ్ళాడు. మాటల సందర్భంలో తాను ఆ ఊరికి రావడం మొదటిసారి అని కూడా చెప్పాడు. మంచి దినాన వచ్చావు, ఇవాళ మార్క్ ట్వేన్ ఉపన్యాసం ఉంది. వెళ్లాలి అనుకుంటున్నావా? అని అడిగాడు, మంగలి. వెళ్లక తప్పదు, అన్నాడు మనవాడు. మరి టికెట్ కొన్నావా? అని అడిగాడు, అతను. లేదు, అన్నాడు ట్వేన్. అయితే ఉపన్యాసం సాంతం నిలబడి ఉండక తప్పదు, హెచ్చరించాడు అతను. మామూలుగా అంతే. ఎప్పుడు ఉపన్యాసం ఇచ్చినా నేను నిలబడే ఉంటాను, జవాబిచ్చాడు ట్వేన్. -డా.కె.బి.గోపాలం -
ఆట ఆడించేది ఎవరు?
ఇరవైకి పైగా నవలలు రాసిన బ్రిటిష్ రచయిత్రి సారా పిన్‌బరో తాజా సైకలాజికల్ థ్రిల్లర్ ‘డెడ్ టు హర్’ ఫిబ్రవరిలో విలియమ్ మారో ప్రచురణ సంస్థ ద్వారా విడుదలయింది. మూడేళ్ల క్రితం ఆమె రాసిన ‘బిహైండ్ హర్ ఐస్’ స్థాయికి తగ్గకుండా, కేవలం థ్రిల్లర్ నవలకి ఉండే సాధారణాంశాలే కాకుండా ఆర్థిక స్థితిగతుల్నీ, మానవ బలహీనతల్నీ, ప్రేమకి సంబంధించిన వివిధ వర్ణాలనీ ఈ నవలలో పొందుపరచడం విశేషం. మనం ఆడే ఆటల్ని ఆడించే మహాశక్తి నిజానికి ఇంకేదో ఉంటుందని అందరూ అంటారు కానీ, ఈ నవలలో ఆ మహాశక్తి రూపం కొంత భిన్నంగా ఉంటుంది; ఆశ్చర్యాన్నీ కలిగిస్తుంది. కథలోకి వెళ్తే– చాలా ఏళ్ల క్రితం కొడుకునీ, ఈ మధ్యనే భార్యనీ కోల్పోయిన దాదాపు డెబ్భై ఏళ్ల విలియమ్ అనే సంపన్నుడి సంస్థలో జేసన్ భాగస్వామి. జేసన్ భార్యనుంచి అతని దృష్టి మరల్చి, అతన్ని విడాకులకి ప్రోత్సహించి, మర్సీ అతన్ని పెళ్లి చేసుకుంటుంది. వీళ్ల కాపురం బానే సాగుతున్న సమయంలో, వ్యాపార లావాదేవీల నుంచి బ్రేక్ కావాలని విలియమ్ ఒక సంవత్సరం పాటు యూరప్ అంతా తిరిగివస్తానని వెళ్లి, ఆరునెలల్లోనే ఇంగ్లండ్‌లో కెయీషా అనే ఇరవై రెండేళ్ల మెరుపుతీగని పెళ్లిచేసుకుని తిరిగివస్తాడు. అప్పటివరకూ కమ్యూనిటీలో అందమైన పిన్నవయస్కురాలి హోదాని అనుభవిస్తున్న ముప్పై అయిదేళ్ల మర్సీలో ఒక చిన్న అసూయ మొదలవుతుంది. దీనికి తోడు, జేసన్ చూపులు కెయీషాని పరిశీలించే పద్ధతి అనుమానాన్ని పుట్టిస్తుంది; జేసన్ అర్ధరాత్రి లేచి మాట్లాడే కాల్స్, పంపే మెసేజెస్ ఆ పెనుభూతాన్ని స్థిరపరుస్తాయి. మర్సీ, కెయీషా– ఇద్దరూ రెండో భార్యలే. ఇద్దరూ బీద నేపథ్యం గలవారే. ఇద్దరూ స్టేటస్ కోసం ఈ పెళ్లిళ్లు చేసుకున్నవారే. కానీ, అన్ని విషయాల్లోనూ కెయీషాదే పైచేయిగా ఉందిప్పుడు. విలియమ్ కంపెనీని తను కొనేసే ఉద్దేశంతో ఉన్న జేసన్, కెయీషాతో భార్యని స్నేహంగా ఉండమంటాడు. పుండు మీద కారం చల్లినట్టవుతుంది మర్సీకి. చివరికి మర్సీకి కెయీషా స్నేహితురాలు అవుతుంది. కానీ, విచిత్రమైన పరిస్థితుల్లోకి ఆ స్నేహం విస్తరిస్తుంది. ‘‘ఇతరులు మనగురించి ఇలా అనుకుంటారేమో అని మనం భయపడుతూ ఉండేది నిజంగా మనం మనగురించి అలా అనుకునేదే!’’ అని కెయీషా మర్సీకి ఆలంబన అవుతుంది. ఆ స్నేహపు సన్నిహితత్వంలో మరిన్ని విషయాలు తెలుస్తాయి. విలియమ్ తొందరగా చచ్చిపోతే బాగుండునని కెయీషా ఎదురుచూస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక్కడినుంచి కథ ఊహించినదానికి విరుద్ధంగా విచిత్రమైన మలుపులు తిరుగుతూ, మంత్రతంత్రాలూ, వూడూలు లాంటి పక్కదోవ పట్టించే విషయాలతో సాగుతూ, ఊహించని ఘట్టాలకి చేరుతూ ఉంటుంది. ముళ్లు బిగుసుకుపోయిన పరిస్థితుల్లో మర్సీ చాలా పరిశోధన చేసి చాలా ఆశ్చర్యకరమైన సంగతులు తెలుసుకుంటుంది. ఈ ఆట రహస్యం మొత్తం తన గుప్పిట్లో ఉందనుకుంటున్న సమయంలో, ఆ ఆటలో తన పాత్ర ఏమిటో తెలుసుకునే పరిస్థితి వస్తుంది! ముందే చెప్పినట్టు, ఈ నవల కేవలం థ్రిల్స్‌కి మాత్రమే పరిమితం కాకుండా, చేరుకున్న ప్రతి దశా ఎన్ని ఇతర విషయాల మీద ఆధారపడి ఉంటుందో చూపిస్తూ ఉంటుంది. స్వచ్ఛమైన స్నేహం ఎలా ఉంటుందో ఒకవైపూ, డబ్బాశ అంటుకున్న స్నేహం ఎలా ఉంటుందో మరో వైపూ చూపిస్తుంది. ప్రేమల్లో రకాలనీ, గాఢతల్నీ, పలచబారటాల్నీ చూపిస్తుంది. నవల మొదటి సగం కొంచెం నిదానంగా సాగినట్టు అనిపించినా, చకచకా నడిచే రెండో భాగానికి అది సరైన పునాదులు వేస్తుంది. అన్నీ మన అధీనంలో ఉన్నాయని ధీమాగా ఉండేవాళ్లు నిజానికి ఎలా పరాధీనంగా ఉండివుండే అవకాశం ఉందో చూపించిన తీరు మాత్రం నవల చదివి ఆశ్చర్యపడాల్సిన విషయం! (నవల: డెడ్ టు హర్, రచయిత్రి: సారా పిన్‌బరో, విడుదల: 2020 ఫిబ్రవరి) -ఎ.వి. రమణమూర్తి -
కలం చెప్పిన వైరస్ కథలు
రవి గాంచనిది కవి గాంచును అంటారు. ఇవాళ ప్రభుత్వాలు ఊహించనది, ఒకప్పుడు రచయితలు ఊహించారు. సాహిత్యంలో సైన్సు ఫిక్షన్ ఒక భాగం. కొందరు రచయితలు తమ కాలం కంటే ముందుకెళ్లి మానవాళికి రాబోయే ప్రమాదాలను తమ రచనల్లో ఆవిష్కరించారు. ఇప్పుడు కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో ‘వైరస్’ల ప్రమాదఘంటికలు మోగించిన పుస్తకాలను కొన్నింటిని పరిశీలిద్దాం. గతంలో మానవాళి మీద చాలా వైరస్‌లే వచ్చాయి. ఇప్పుడు వచ్చిన వైరస్ ప్రపంచాన్నే లాక్డౌన్ చేయించింది. దీని వ్యాప్తి తెలియకుండానే, అప్రయత్నంగానే జరుగుతుండటం ఒక కారణం. దీనికి ఇంకా మందు కనిపెట్టలేకపోవడం మరో కారణం. ఈ వ్యాధి సోకినవారు, సోకినవారి ద్వారా మరొకరికి సోకే సమయాలు కనిపెట్టలేకపోవడం ఇందులో అత్యంత ప్రమాదకరమైన విషయం. రచయితలు మనుషులకు వచ్చే సమస్యలను తమ కథాంశాలుగా చేసుకున్నట్టే ఈ ‘వైరస్’లను కూడా తమ కథాంశాలు చేసుకున్నారు. వాటి కథాకమామీషు ఒకసారి చూద్దాం. నాన్ ఫిక్షన్ ►వైరస్ చరిత్ర, శాస్త్ర సమాచారం, ఎలా వ్యాపిస్తుందో తెలుసుకోవాలంటే మనకు అందుబాటులో ఉన్న మొదటి పుస్తకం ‘అండ్ ద బ్యాండ్ ప్లెయిడ్ ఆన్’. రచయిత రాండీ షిల్ట్స్. 1987లో మొదటిసారిగా ఎయిడ్స్ విజృంభణ మొదలైనప్పుడు, దానిని ప్రజలింకా జోక్ స్థాయిలో చూస్తున్నప్పుడు అమెరికా జర్నలిస్ట్ రాండీ ఆ వైరస్ గురించి ఈ పుస్తకంలో రాశాడు. ఇలాంటి వైరస్లు ప్రబలినప్పుడు ప్రభుత్వాలు వాటిని ఎలా నిరోధించలేకపోతాయో చెప్పాడు. ►1854లో లండన్ జనాభాను బలి తీసుకున్న కలరా గురించి రచయిత స్టీవెన్ జాన్సన్ రాసిన పుస్తకం ‘ద ఘోస్ట్ మాప్’. కలరా మహమ్మారి తర్వాత సైన్స్ పరిశోధనల్లోనూ, నగర నగర నిర్మాణ శాస్త్రంలోనూ పెనుమార్పులు వచ్చాయి. ►ఎబోలా గురించి తెలిసిందే. ప్రపంచాన్ని గడగడలాడించిన వైరస్ అది. దీని గురించి రచయిత రిచర్డ్ ప్రెస్టన్ ‘ద హాట్ జోన్’ అనే పుస్తకం రాశాడు. ఎబోలా వైరస్ పుట్టుక, వ్యాప్తిని హారర్ నవలలోలాగా వర్ణించాడు రచయిత. ఆఫ్రికా వర్షారణ్యాలలో ఆవిర్భవించి అనతికాలంలోనే దేశదేశాలకూ పాకిన వ్యాధి అది. ఎబోలా ఒక పీడకల. పునరావృతం కాదని చెప్పలేం. ►1918 నాటి ఇన్‌ఫ్లూయెంజా మహమ్మారి గురించి రచయిత్రి జినా కోలటా రాసిన పుస్తకం ‘ఫ్లూ’. ఈ ఫ్లూనే స్పానిష్ ఫ్లూ అని అంటారు. మొదటి ప్రపంచ యుద్ధంలో మరణించిన వాళ్ల కన్నా రెట్టింపు జనాభాను ఈ ఫ్లూ కబళించింది. ఒక్క అమెరికాలోనే అయిదు లక్షల మంది మరణించారు. ఇది ప్రపంచాన్ని మరోసారి చుట్టి వస్తుందేమోనని శాస్త్రజ్ఞులు భయపడుతూనే ఉన్నారు అంటుంది అమెరికా పాత్రికేయురాలు కోలటా. ►గత అయిదు లక్షల ఏళ్లుగా మానవజాతిని శాసించిన మలేరియా గురించిన కథనం ‘ద ఫీవర్’. 2010లో వచ్చిన ఈ పుస్తకం పూర్తి పేరు ‘ద ఫీవర్: హౌ మలేరియా హాజ్ రూల్డ్ మేన్‌కైండ్ ఫర్ 5,00,000 ఇయర్స్’. రచయిత్రి సోనియా షా. మన జీవన విధాతగా దోమ ఎలా మారిందో ఈ పుస్తకం చెబుతుంది. సోనియా, భారతీయ మూలాలున్న అమెరికా పాత్రికేయురాలు. ►అమెరికా చరిత్రకారిణి బార్బరా టక్మాన్ ‘ప్లేగ్’ గురించి రాసిన 1978నాటి ‘ఎ డిస్టంట్ మిరర్: ద కలమిటిస్ ఫోర్టీన్త్ సెంచరీ’ ఫ్రతిష్టాత్మక పురస్కారం పొందిన శాస్త్ర గ్రంథం. 14వ శతాబ్దంలో యుద్ధం, మతోన్మాదం వంటి భౌతిక పరిస్థితులు ప్లేగు వ్యాపించడానికి ఎలా కారణమయ్యాయో ఈ పుస్తకం చెబుతంది. ►ఆటలమ్మ (స్మాల్‌పాక్స్) కూడా ఒక మహమ్మరి. 18వ శతాబ్దపు ఉత్తరార్థంలో ఉత్తర అమెరికాను గడగడలాడించిన ఆ వ్యాధి ఆ దేశ చరిత్రనే మార్చివేసింది. ఆటలమ్మ గురించి ఆ రోజుల్లో ఎన్నెన్ని కథలు ప్రచారంలో ఉండేవో. ఎలిజబెత్ ఎఫెన్ రాసిన ‘పాక్స్ అమెరికానా’ అద్భుతమైన కథనంతో పాఠకులను కట్టిపడేస్తుంది. ఫిక్షన్ కొందరికి నాన్ఫిక్షన్ ఆసక్తికరంగా ఉండకపోవచ్చు. ప్రస్తుతం ఉన్న ‘తప్పనిసరి తీరిక సమయం’ లో కథల లోకంలో విహరిద్దామనుకుంటే ‘వైరస్’ కథాంశంగా గల కొన్ని నవలలనైనా చదవండి. ►ఈ జాబితాలో మొదట చెప్పుకోవలసింది హోసె సారమాగో (నోబెల్ బహుమతి పొందిన పోర్చుగీస్ రచయిత) రాసిన 1995 నాటి నవల ‘బ్లైండ్నెస్’. కథాకాలం 1990. ఒక వ్యక్తి టాక్సీలోంచి దిగబోతూ అకస్మాత్తుగా అంధుడైపోతాడు. ఆ తర్వాత టాక్సీ డ్రైవర్ కూడా అంధుడైపోతాడు. క్రమంగా అందరూ అంధులుగా మారిపోతుంటారు. ఇక్కడ అంధత్వం ఒక వైరస్ కావచ్చు, ఒక ప్రతీక కూడా కావచ్చు. ►ఫ్రెంచ్ రచయిత ఆల్బర్ట్ కామూ రాసిన ‘ద ప్లేగ్’ చాలామంది చదివే ఉంటారు. ఇరవయ్యవ శతాబ్దంలో మహమ్మారుల గురించి వచ్చిన అన్ని నవలలకూ ‘బైబిల్’ లాంటిదిది. అల్జీరియాలోని ఓరాన్‌లో వచ్చిన ప్లేగు గురించే రాసినప్పటికీ ‘ప్రజలలో ఫాసిస్టు భావజాలం దాగివున్నంత కాలం దీన్నెవరూ ఆపలేరు’ అంటాడు కామూ. ఈజిప్షియన్లు, గ్రీకులు, ఫిన్నిష్‌లు, హిందువులు– అందరూ మహమ్మారుల కోసం దేవతలను సృష్టించుకున్నారు. ‘పాండోరా’ తన వద్ద ఉన్న పెట్టె తెరిస్తే అందులో నుంచి బయటికొచ్చి మహమ్మారులు లోకమంతా వ్యాపించాయని కథ ఉంది కదా. ► 14వ శతాబ్దానికి చెందిన ఇటాలియన్ రచయిత బొకాషియో రచించిన ‘ద డెకామెరాన్’ చాలా ప్రసిద్ధ నవల. ‘బ్లాక్‌డెత్’ అనబడే ప్లేగు నేపథ్యంలో పాత్రలు చెప్పుకునే జ్ఞాపకాలే ఈ నవల. వ్యంగ్యం హాస్యం కూడా ఉంటాయి గాని శృంగారానికే యివి ప్రసిద్ధి. అదే శతాబ్దానికి చెందిన ఇంగ్లిష్ కవి జాఫ్రీ ఛాసర్ రాసిన ‘ద కాంటర్బరీ టేల్స్’ నేపథ్యం కూడా ప్లేగే. ఈ కథల ద్వారా పాత్రలు ఒకరినొకరు ధైర్యం చెప్పుకుంటాయి. ►‘రాబిన్సన్ క్రూసో’ రచయిత డేనియల్ డెఫో 1722లో ‘ఎ జర్నల్ ఆఫ్ ద ప్లేగ్ ఇయర్’ ప్రచురించాడు. 1995లో లండన్‌లో వేలాదిమందిని బలిగొన్న బుబోనిక్ (ఈగల ద్వారా వ్యాపించే) ప్లేగ్‌ను అత్యంత వాస్తవికంగా చిత్రించిన కథనం యిది. ►ఇక 1985లో నోబెల్ గ్రహీత గేబ్రియల్ గార్షియా మార్కెజ్ ప్రచురించిన ‘లవ్ ఇన్ ద టైమ్ ఆఫ్ కలరా’ చాలా ప్రసిద్ధం. ఇది ఒక ప్రేమకథ. స్పానిష్‌లో ‘కలరా’ అన్న పదానికి ‘కోపం’ అనే అర్థం కూడా ఉంది. మహమ్మారులను కట్టడి చెయ్యడానికి డాక్టర్లున్నారు. మన లోపలి కోపం, ద్వేషాగ్నులను ప్రేమ మాత్రమే ఆపగలదు అంటాడు మార్కెజ్. ►2006లో వచ్చిన నవల ‘ద రోడ్’. రచయిత కార్మాక్ మెకార్తీ. మానవజాతి చివరిదశలో సమాజం, నాగరికత, వ్యక్తి సంబంధాలు ఎలా పతనమవుతాయో అత్యంత భయానకంగా చిత్రిస్తుంది. ఈ నవల ధైర్యం ఉన్న గుండెలకే. ఈ అమెరికన్ రచయిత దీనికిగానూ పులిట్జర్ ప్రైజ్ గెలుచుకున్నారు. ఈ నవల 2009లో ఇదేపేరుతో సినిమాగా వచ్చింది. పుస్తక పఠనం మానసిక స్థయిర్యాన్ని పెంచుతుంది. అవగాహనను కల్పిస్తుంది. కనుక ఈ పుస్తకాలు చదవుదాం. లేదా నచ్చిన పుస్తకాలు చదువుదాం. -ముక్తవరం పార్థసారథి -
బహుమతులు
ఆంధ్రా షేక్స్పియర్గా, అభినవ కాళిదాసుగా ఎనలేని గుర్తింపు పొందిన సాక్షి వ్యాసాల రచయిత పానుగంటి లక్ష్మీనరసింహారావు చక్కటి హాస్యప్రియులు. ఆయన జీవిత చరమాంకంలో జరిగిన ఉదంతం ఇది. ఆ సమయంలో వృద్ధాప్య సమస్యలు ఆయన్ని వెంటాడుతున్నాయి. అలాంటి రోజుల్లో– ఓ సాహిత్య సమాజం వారు పానుగంటి వారికి భారీఎత్తున సత్కారం చేశారు. సభకు అధ్యక్షత వహించిన ఆ సమాజ నిర్వాహకుడు, చంద్రునికో నూలుపోగులా పానుగంటి వారికి బహుమతులు అందజేస్తున్నామని ఉత్సాహంతో ప్రకటించారు. దానికి పానుగంటి స్పందిస్తూ, ‘ఉన్న ఒక్క మతి పోయింది. దానికే ఇబ్బంది పడుతుంటే నాకు బహుమతులేల?’ అనేసరికి సభ కరతాళ ధ్వనులతో మార్మోగింది. - వాండ్రంగి కొండలరావు -
అరబిక్ సాహిత్యంలో ధ్రువతార
నాగీబ్ మహఫూజ్ (1911–2006) ఈజిప్ట్ దేశానికి చెందిన రచయిత. 22 సంవత్సరాల వయసులోనే రాయడం మొదలుపెట్టాడు. మొదట్లో దేశభక్తితో కైరో గురించి మూడు చారిత్రక నవలలు రాశాడు. నిజానికి భాషా సాహిత్యం చదువుకోవాలి అనుకున్న మహఫూజ్ పెద్దల బలవంతం వల్ల సామాజిక శాస్త్రం చదవవలసి వచ్చింది. ప్రభుత్వ ఉద్యోగం సంపాదించుకున్నాడు. గుమస్తాగా చేరిన అతను చివరకు తమ దేశపు సాంస్కృతిక శాఖకు సలహాదారుగా రిటైర్ అయ్యాడు. 70 ఏళ్ల రచనా వ్యాసంగంలో 34 నవలలు రాశాడు. 350 దాకా కథలు రాశాడు. చాలా సినిమాలకు స్క్రిప్టు రాశాడు. ఈజిప్టులోనూ, మొత్తం అరబ్బు ప్రపంచంలోనూ ఈయన రచనలు ఆధునిక క్లాసిక్స్‌గా గుర్తింపబడ్డాయి. ఆయన రచనల ఆధారంగానే ప్రస్తుత కాలపు అరబిక్ సాహిత్యం నిలబడిందని చెప్పవచ్చు. 1988లో మహఫూజ్ కు నోబెల్ బహుమతి ఇచ్చారు. ‘అరబిక్ సాహిత్యంలో నవల అన్నది 20వ శతాబ్దంలోనే మొదలైంది. అంటే ఇంచుమించు నాగిబ్ మహఫూజ్తోనే మొదలయింది అనవచ్చు. అంతకుముందు ఒకరిద్దరు మాత్రమే రచయితలు ఉన్నారు. మహఫూజ్ ఈ రచనా ధోరణిని ప్రామాణికంగా మార్చాడు’ అని ఈ సందర్భంగా స్వీడిష్ అకాడమీ వ్యాఖ్యానించింది. మొదట్లో చారిత్రక, పౌరాణిక నవలలు రాసిన మహఫూజ్ సమాజాన్ని బాగా పరిశీలించడం నేర్చుకున్నాడు. త్వరలోనే తన రచనా పద్ధతి మార్చుకున్నాడు. నవలలు, కథలు అన్నింటిలోనూ తన చుట్టూ కనిపించే మనుషులు, మనస్తత్వాలు, ప్రదేశాలు మొదలైన వాటి గురించి సూటిగా రాయడం మొదలు పెట్టాడు. ఆయన నవలలు చదువుతుంటే ఒక విచిత్రమైన పరిచిత ధోరణి కనపడుతుంది. మధ్య తరగతి మనుషులు, వాళ్ల మామూలు వాతావరణం కూడా కళ్ళకు కట్టినట్లు కనబడుతుంది. ఖాన్ అల్ ఖలీలీ, మిదాఖ్ అలీ లాంటి నవలలు అన్నీ ఈ ధోరణిలోనే సాగుతాయి. సన్నివేశాలలో మనం ఉన్నామన్న భావన కలుగుతుంది. మామూలు మనుషుల సాయంతో అతను ప్రపంచం మొత్తం గురించి చెపుతాడు. సంప్రదాయంలో పాతుకుపోయిన అరబ్ సమాజానికి, ముఖ్యంగా రచయితలకు సమకాలీన సమాజం మీద ప్రగతి మార్గంలో చర్చించడం, పాలకులకు ధిక్కార స్వరం వినిపించడం నేర్పిన రచయిత మహఫూజ్. సల్మాన్ రష్దీ విషయంగా ఇతను అనుసరించిన ధోరణి అప్పటికే అతని రచనలతో విసిగిన ఛాందసవాదులకు నచ్చలేదు. మహఫూజ్ మీద హత్యా ప్రయత్నం జరిగింది. దేశంలోని పరిస్థితులను విమర్శిస్తూ వ్యాసాలు మాత్రమే కాక, అదే అంశంతో కథలు, నవలలు కూడా రాశాడు. చివరికి ఇతడిని రాజకీయాల గురించి రాస్తాడు, అనే దాకా పరిస్థితి వచ్చింది. మహఫూజ్ సుమారు 94 సంవత్సరాలు బతికాడు. మరణానంతరం కూడా ఆయన రచనలు అయిదు అచ్చయ్యాయి. వాటిలో ద క్వార్టర్ అన్నది మరీ ప్రత్యేకమైన రచన. అది 18 చిన్న కథానికల సంకలనం. 1994లో అచ్చు కావాలి అని మహఫూజ్ దాన్ని దాచుకున్నాడు. కానీ ఆ పని జరగలేదు. అరబ్ భాషలోనే ఆ రచన అతని మరణం తరువాత అచ్చయింది. - డాక్టర్ కె.బి.గోపాలం -
జీవిత చిత్రంలో ఖాళీలు
నవల : ఇన్‌డెలికసీ రచన : అమీనా కెయిన్ ‘‘మళ్లీ ఒంటరితనం– వింతగా ఉందిప్పుడు. నా మధ్యాహ్నాలన్నీ నాక్కావలసిన దానికంటే ఎక్కువ విస్తారంగా ఉన్నాయి. నాతో నాకు కావలసినంత ఏకాంత సమయం, తోడుగా ఉన్న రచనాన్వేషణలో నాలో నన్ను కనుక్కుంటూ నేను...’’ మనిషి తన చేతనతో మమేకమవడానికీ, తన అస్తిత్వాన్ని గుర్తెరగడానికీ చేసే ప్రయత్నాన్నీ, ప్రయాణాన్నీ ఒక కవితాత్మక కథగా చెప్పగలగటం అమెరికన్ రచయిత్రి అమీనా కెయిన్ రాసిన తొలి నవల ‘ఇన్‌డెలికసీ’లో సాధించడం చూస్తాం. గత నెలలోఎఫ్.ఎస్.జి. ద్వారా ప్రచురింపబడిందీ పుస్తకం. ఒక మ్యూజియమ్‌లోని ఆర్ట్ గాలరీలో పెయింటింగ్స్, గదులూ శుభ్రం చేసే చిరుద్యోగి విటోరియా. గతకాలాల ఇరుకుదనాన్ని పట్టించుకోకుండా, ఉన్నంతలో ఒంటరిగా ధైర్యంగా హాయిగా బ్రతుకుతున్న వ్యక్తి. ఉద్యోగమూ, సంపాదనా తృప్తినివ్వకపోయినా జీవితంలోని స్వేచ్ఛని ఆస్వాదిస్తూ ఉంటుంది. రచయిత్రి కావాలన్న కోరికకు డబ్బూ సమయమూ రెండూ కరువైనా, ప్రతిరోజూ చూసినవాటి గురించి రాసుకుంటూ ఏనాటికైనా ఒక పుస్తకం ప్రచురించాలన్న ఆశతో ఉంటుంది. ఇంతలో, ఆర్ట్ గాలరీ చూడటానికి వచ్చిన ఒక సంపన్నుడు విటోరియాని పెళ్లిచేసుకుంటాడు. వివాహమైన తరవాత విటోరియాకి ప్రేమగా చూసుకునే భర్తతో పాటు తనకంటూ గదీ, రాసుకోవటానికి సమయం, స్వేచ్ఛ దొరుకుతాయి. ఈత కొట్టడం, బాలెరీనాలు చూడటం నేర్చుకోవటం వగైరాలు చేస్తూంటుందామె. కళల పట్ల ఆసక్తీ, తనకేం కావాలో తెలుసుకోవాలన్న తపనా, చూసిన విషయాల గురించి రాసే అలవాటూ ఆమెని వదిలిపెట్టవు. ఇవన్నీ ఉన్నప్పటికీ, ఏదో అసంతృప్తికి లోనవుతుంటుంది. రచయిత్రులంటేనే చిన్నచూపు ఉన్న భర్తకు తన రాతలపట్ల కూడా గౌరవం లేదని ఆమెకు తెలుసు. దీనికితోడు ఇంటి మెయిడ్ అయిన సొలాంజ్తో ఆమెకు సఖ్యత ఏర్పడదు. తనకున్న తపనకు ఇంటి బాధ్యతలు, భర్త స్నేహితులూ, వాళ్లతో పార్టీలూ అడ్డుగా ఉన్నట్టు అనిపిస్తుంది ఆమెకు. ఇవన్నీ అర్థం చేసుకోని భర్త వల్ల విటోరియా ఒంటరితనానికి గురై, సంసార జీవితానికి కూడా దూరంగా ఉంటూ, భర్తనుంచి విడిపోవాలని అనుకుంటుంది. విడిపోయినా, మళ్లీ ఉద్యోగం చేసే అవసరం లేకుండా ఉంటే బావుండునని అనుకుంటున్నప్పుడే, భర్తకూ సొలాంజ్కూ మధ్య ఉన్న సంబంధం బయటపడుతుంది. వారి బంధానికి పరోక్షంగా కారణం తనే అయినా, భర్తనుంచి విడిపోవడానికే సుముఖత చూపిస్తుంది. మళ్లీ ఒంటరి జీవితం– కానీ, ఈసారి చాలినంత డబ్బు, రాసుకునే తీరికా, ఇతర బాధ్యతలేమీ లేని జీవితం మొదలవడంతో కథ ముగుస్తుంది. విటోరియా ఉద్యోగస్తురాలైనప్పుడూ, వివాహమైనప్పుడూ, భర్తనుంచి విడిపోయిన తరువాతా– ఎప్పూడూ తనదైన పద్ధతిలోనే స్వేచ్ఛామార్గంలో ప్రయాణిస్తూ ఉంటుంది. పెయింటింగ్స్ పరిశీలించటం, వాటిలో తన ఆలోచనలనూ ఆశలనూ వెతుక్కోవడం విటోరియాకి ఇష్టమైన వ్యాపకం. ‘‘నేను మ్యూజియంలో పనిచేస్తున్నప్పుడు ఒకోసారి కిటికీలోంచి బయటకి చూస్తూ నిలబడిపోయేదాన్ని. కిటికీ అద్దాల్లో నా వెనక ఉన్న పెయింటింగ్స్ ప్రతిఫలించేవి– నాతో సహా. వాటితోపాటు నన్నలా చూసుకోవటం ప్రత్యేకంగా అనిపించేది. ఇంకోలా ఎలా ఉండాలో నేర్చుకుంటున్నట్టు, నన్ను నేను సరికొత్తగా చూసుకుంటున్నట్టు,’’ అంటుంది విటోరియా. పెయింటింగ్స్‌లో చిత్రంతో బాటు పక్కనే ఉన్న ఖాళీలూ, ఆ ఖాళీలను నింపిన వర్ణాలు కూడా ఏదో చెప్తున్నట్టే తోచేదామెకు. విటోరియా జీవిత చిత్రంలో పెయింటింగ్స్ ఒక వర్ణంలా కలిసిపోతే, రచనా జీవితంలోని పదాలు అంతరంగపుటావిష్కరణలు. తనలో ఉన్న అసంపూర్ణతల గురించి విటోరియాకి స్పృహ లేకపోలేదు. ఏకపక్షపు నిర్ణయాలతో భర్తని దూరం చేసుకోవడం, వివాహం అక్కర్లేకపోయినా దాన్నుంచి వచ్చే భరణాన్ని మాత్రం ఆశించడం లాంటివి విటోరియాని మరీ ఎక్కువగా ఆదర్శవంతం చేయకుండా, సగటు వ్యక్తి స్థాయిలో నిలిపే వాస్తవ ప్రయత్నం చేస్తుంది నవల. సౌజన్యం కొంతమేరకు కొరవడిన పాత్రతో నవలకి ‘ఇన్‌డెలికసీ’ అన్న పేరూ, వ్యక్తిత్వపు ఛాయల సమతూకం సాధించిందన్న పేరుకి నవలా ఒకదానికొకటి సరిపోయాయి! - పద్మప్రియ -
ఇదేమీ ప్రపంచానికి అంతం కాదు
ప్రతి చర్యా, ఏమాత్రం ప్రత్యేకత లేనిది కూడా ఒక కొత్త విలువను సంతరించుకుంది. నాకు తెలుసు, ఈ త్యాగం అవసరమేననీ, వివిధ స్థాయిల్లో ఇది మంచికే దారితీస్తుందనీ. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితి అంతా దాటిపోయాక, మనం ప్రాథమికంగా దుర్బలులమనీ మన చర్యలకు పర్యవసానాలుంటాయనీ మనం మరచిపోనప్పుడు మాత్రమే. ‘‘మీకు వీలైతే ఇంట్లోనే ఉండండి’’ వాళ్ళు మొదట్లో చెప్పిందిదే. నేను ఉండగలిగాను. ఇంటినుండే ఒక చిన్న ప్రచురణ సంస్థని నడుపుతున్నాను కాబట్టి ఇంట్లోనే ఎక్కువ సమయం గడుపుతాను. నేనేం భయపడలేదు. నేనిది చేయగలనని నాకు నేనే చెప్పుకున్నాను. ఇది దేన్నీ మార్చదు. తర్వాత ఆ సలహా ఒక ఆజ్ఞ అయింది. ‘ఇంట్లోనే ఉండండి!’ అని వాళ్ళు చెప్పారు. మొత్తం మారిపోయింది. ఇంటిబయటేదో జంతువు వేటకోసం తిరుగుతున్నట్లుగా మేం జీవిస్తున్నాం. ఎప్పుడది వేటలో అలసిపోయి వెనుతిరిగిపోతుందో ఎవరికీ తెలియదు. ప్రపంచం నలుమూలల నుండి వచ్చే పర్యాటకులతో ఎప్పుడూ రద్దీగా ఉండే మా ప్రియమైన ఫ్లోరెన్స్ నగర వీధులు ఇప్పుడు పూర్తి ఖాళీగా ఉన్నాయి. ఈ హఠాత్ నిశ్శబ్దానికి ఖంగుతిన్న పావురాలు, గువ్వపిట్టలు, కారునల్లని కాకులు, నమ్మలేనట్టుగా ఒకదాన్నొకటి చూసుకుంటున్నాయి. వసంతకాలం వస్తోంది కాని, దాన్ని ఆస్వాదించే స్థితిలో లేమని మాకు తెలుసు. పార్కులో నడవడమో స్నేహితులింటికి వెళ్ళిరావడమో వంటి ఇంతకుముందు పెద్దగా విలువనివ్వని పనులన్నీ ఇప్పుడు మాకందుబాటులో లేనంతటి విలాసవంతమైనవిగా తోస్తున్నాయి. నిజానికిది సమావేశాలను స్వాగతించే సమయం; కానీ మనం ఒకరికొకరు దూరంగా ఉండాలనీ, దగ్గరగా వచ్చేవారిపట్ల మరింత జాగ్రత్తగా ఉండాలనీ చెప్తున్నారు. ఇదంతా ఎప్పుడు ముగుస్తుందో, మనం మళ్ళీ సురక్షితంగా ఉన్నామని భావించేందుకూ, చెంప మీద ముద్దుపెట్టుకొని ఒకరినొకరం పలకరించుకోవడానికీ ఎంత సమయం పడుతుందో? ఇంట్లో ఉండటం విసుగు పుట్టిస్తోందంటూ మనం గులుగుతున్నప్పుడు నిరాశ్రయులైన జనమంతా ఎక్కడికి వెళ్ళుంటారు? రోజురోజుకీ ఎంతగా మరింతగా బిగిసిపోతున్నట్టు అనిపిస్తున్నప్పటికీ కనీసం మాకు ఇల్లంటూ ఒకటుంది. ఆ వారానికవసరమైన ఆహార పదార్థాల్ని పక్కకు తీస్తూ నాతో నేనే చెప్పుకున్నాను: సూపర్ మార్కెట్ల వంటి రద్దీగా ఉండే ప్రదేశాల్లో ఎంత తక్కువ సమయం గడిపితే అంతమంచిదని, ఎట్టి పరిస్థితులలోనూ కుటుంబం నించి ఒక్క సమయంలో ఒక్క సభ్యుడు మాత్రమే ఆహార పదార్థాలను కొనేందుకు అనుమతించబడాలని, అలా వెళ్ళేవారు తాము బయటకు వచ్చిన కారణాన్ని తెలిపే పత్రాన్ని తప్పకుండా తమతో తీసుకెళ్లాలనీ, ఆ కారణం తప్పుగా తేలితే వారిపై చర్యలు తప్పవనీ. మేమేమీ యుద్ధకాలంలో జీవించడంలేదు, మాకు అవసరమైనవన్నీ– ఆహారం, ఆటవిడుపులు, పుస్తకాలు, సంగీతం, ప్రపంచంలోని ఇతర ప్రాంతాలతో కమ్యూనికేట్ చేయడానికి సాంకేతిక పరిజ్ఞానం– ఉన్నాయి. కానీ గత కొన్ని రోజులుగా నేను చెవుల్లో ఏదో బయ్యిమంటున్న శబ్దంతో మేల్కొంటున్నాను. నిద్రలేస్తాను, కాఫీ తాగుతాను, కంప్యూటర్ వద్ద కూర్చుంటాను, నా భర్తతో పిచ్చాపాటీ మాట్లాడతాను, లంచ్ తయారు చేస్తాను, ఇంకాస్త ఎక్కువ పని చేస్తాను, రాత్రి భోజనం ముగిస్తాను– ఇన్ని వేళల్లోనూ ఆ బయ్యిమనే శబ్దం అలాగే ఉంటుంది– నేనింకా చూడగలిగిన తాకగలిగిన వాటిని నా నుంచి వేరుచేసే ఒక సన్నని తెరలాగా. నాకోసమని నిర్దేశించిన ఒక నిర్దిష్ట ప్రణాళికను అమలు చేస్తున్న మరమనిషిని నేను. నా మనస్సు ఒక క్రొత్త, చలనం లేని శరీరంతో – మాకిప్పుడు ఇంట్లోంచి బయటకొచ్చి ఇంటికి మరీ దూరంపోకుండా ఒంటరిగా నడిచేందుకు అనుమతి ఉంది – తాను ఒకప్పుడు చేసిన పనులేవీ ఇప్పుడు చేయలేని స్థితిలోవున్న ఒక శరీరంతో– సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఇది ఒంటరితనం, నాలో నేననుకున్నాను. రేపటి గురించిన అనిశ్చితి. ఆక్సిజన్ లేకపోవడం. వాస్తవమేమిటంటే, ఈ శ్మశాన నిశ్శబ్దంలో –నగర ధ్వనులు సద్దుమణిగిపోయాయి, శాన్తా క్రోచె కొట్టే గంటలు మాత్రమే నా రోజులను వినిపిస్తాయి – ఇప్పుడు మనం మన ఆలోచనల పూర్తి బరువును అనుభూతి చెందుతున్నాము. ‘నాకింక వేరే మార్గం లేదు, నేను నిన్ను ఆపవలసి వచ్చింది’ అని చెప్తోన్న ఒక స్వరం నా వెనుకనేవుంది. ఇదీ దాటిపోతుంది, కానీ దీన్ని మర్చిపోవద్దు. అందువల్లనే నేను అనారోగ్యం వల్లనో, ఆర్థిక సంక్షోభం వల్లనో, నిర్దేశిత సూచనలను కోల్పోవడం ద్వారా కలిగే భయంవల్లనో మరణించను. ఆ స్వరం నిజమే చెప్తుందని నాకు తెలుసు, ఈ త్యాగం అవసరమేననీ, వివిధ స్థాయిల్లో ఇది మంచికే దారితీస్తుందనీ. అదెలాగంటే, ఇప్పుడున్న పరిస్థితి అంతా దాటిపోయాక, మనం ప్రాథమికంగా దుర్బలులమనీ మన చర్యలకు పర్యవసానాలుంటాయనీ మనం మరచిపోనప్పుడు మాత్రమే. బహుశా నేను అదృష్టవంతురాలినవడం వల్లనే నేనిలా మాట్లాడుతున్నాను: మొదటి సంగతి, నాకో ఇల్లుంది. రోజంతా నా డెస్క్ ముందు కూర్చొని ప్రచురించాల్సిన కథలను అధ్యయనం చేస్తాను. ఇది నా పని. కథలు. ఇప్పటికే నేను వాటిని చదివే విధానానికి ఈ వైరస్ సోకింది. రాబోయే సంవత్సరంలో, నా పాఠకులు ఈ అఘాతాన్నుండి కోలుకొని ముందుకు సాగిపోవడం అవసరమయినప్పుడు, ఏ కథలు ప్రచురించాలో అది నాకు చెప్పింది. శుభ్రమైన లినెన్ వస్త్రాన్ని అసాధరణమైన జాగ్రత్తతో శ్రద్ధగా మడతపెడుతూ – ఇదేమీ ప్రపంచానికి అంతం కాదు– అనుకున్నాను. ఎందుకంటే ఇది మరొక ఊహించని పరిణామం: ప్రతి చర్యా, ఏమాత్రం ప్రత్యేకత లేనిది కూడా ఒక కొత్త విలువను సంతరించుకుంది. నేను పిల్లికి ఇచ్చే ప్రతి కౌగిలింతనీ నాకు నేను ఇచ్చుకుంటాను. ప్రతి శుభరాత్రి సందేశాన్నీ కూడా ఇప్పటికే మనం జీవిస్తున్న పీడకలల రాత్రిలాంటిది కాకూడదనే హృదయపూర్వకమైన ఆశతోనే చెప్పుకుంటాను. తెల్లవారుఝామున కొన్నిసార్లు నా కళ్ళింకా మూసుకునీ, శరీరం విశ్రాంతిగా, మనసు అప్పటికే అలసిపోయీ ఉన్నప్పుడు, వైరస్ మనకు నేర్పిస్తున్న ఈ కొత్త నెమ్మదితనం బాగుందనీ, సహనానికి సంబంధించిన ఈ పాఠం కూడా ఆరోగ్యకరంగా ఉందనీ అనుకుంటాను. అంతకుముందున్న – మన ఊపిరి తీసేసి, మనల్ని ఎన్నడూ దేన్నీ ఆస్వాదించనివ్వని – ఆ వెర్రి బలం – ఆ శక్తంతా ఇప్పుడు సోషల్ మీడియాలోకి ప్రవహించి, మనల్ని మాటలు కలబోసుకునేలా, ఒకరినొకరు హెచ్చరించుకునేలా, సంఘీభావాన్ని తెలుపుకునేలాంటి శక్తిగా రూపాంతరం చెందింది. మనం ఒకరిలోనొకరిగా చుట్టుకుపోయాం. ఈ నిశ్శబ్దం కేవలం ఒక అద్దంలా మారకుండా ఆపేందుకు మనం శబ్దాలు చేద్దాం. వైరస్ మనల్ని ఒంటరులం కావాలని కోరుకునివుంటే, అందుకో కారణం ఉంది. మన జీవనశైలిని ఎలా మారాల్సివుందో ప్రతిబింబించేలా మనం ఎందుకు నిశ్శబ్దంగా ఉంటూ, నిశ్శబ్దాన్ని హత్తుకోగూడదూ? ఇంట్లోనే ఉండండి, పుస్తకం చదవండి! ప్రతిఒక్కరూ ఇలా ఎలుగెత్తి చెప్తారు. కానీ, తమ స్వంత గుర్తింపునూ అభిరుచులనూ వేరెవరిపైననో రుద్దడానికి చేసే మరో ప్రయత్నంలా అనిపిస్తూండే ఈ సూచనల అరుపుల మధ్యనుంచి నాకు ఏ పుస్తకం అవసరమో తెలుసుకోవడం ఎలా? నేను చేసే పనిని పరిగణనలోకి తీసుకుని ఒక నిబిడాశ్చర్యంతో ఇలా చెప్తున్నాను, ఈసారి కేవలం పుస్తకాలు సరిపోవు. మీ చుట్టూ ఉన్న ప్రపంచం కంపించిపోతూన్నప్పుడు చదవడంపై దృష్టి పెట్టడం అంత సులభం కాదు. బహుశా మార్పుకు మనం పూర్తిగా అలవాటుపడిన తర్వాత తిరిగి మనకు అవసరమైన ప్రశాంతతను కనుక్కోగలుగుతాము. కాని ఇదింకా ప్రారంభమే. మనకు ఉపశమనం కలిగించేందుకు సంగీతమే ఇప్పటి అవసరం. అహంభావం ఇంకా పుష్కలంగానే ఉంది, కానీ ఇక్కడ కూడా మనకు నేర్పేందుకు వైరస్‌కు ఒక పాఠం ఉంది. తగిన కారణం లేకుండా ఇంట్లోంచి బయటకు వెళ్ళేవారెవరైనా ఇప్పుడు తమ పొరుగువారిని కేవలం దగ్గుతోనే చంపేసే ప్రమాదం ఉంది. కొంతమంది భయపడతారు, స్పృహలోకి వస్తారు– లేదా శిక్ష పడుతుందని భయపడతారు. ఇంకొందరిలో మాత్రం చలనముండదు. అయితే మనిషి ఎప్పుడూ మనిషే. అదంతా మరో కథ. నేను నా తల్లిదండ్రులను చూసి ఇప్పటికి నెలలు గడిచాయి. వారు ఇప్పటికీ నేను పుట్టిపెరిగిన మార్షెలోని పెసారో నగరంలోనే నివసిస్తున్నారు. అంటువ్యాధి అత్యధికంగా ఉన్న ప్రాంతాలలో అదీ ఒకటి. కాని మనం ఒక్క రోజులో ఇప్పుడు మాట్లాడుతున్నన్ని సార్లు ఇంతకుముందెన్నడూ మాట్లాడి ఎరుగం. వారికి 70 సంవత్సరాల వయసు. ఇలాంటివి అనుభవంలోకి వస్తాయని వారెన్నడూ ఊహించలేదు. ‘నేనేం భయపడటంలేదు,’ అంది మా అమ్మ రాత్రి నాతో. ‘నేను చలించని తేనెటీగలా ఉన్నాను, కాని నేను భయపడను.’ చలించని తేనెటీగ! అయితే అదన్నమాట నా తలలో ఉన్న బయ్యిమనే శబ్దం. నేనింకా పాత నేనుగానే ఉన్నాను, పరిస్థితులకు అనుగుణంగా గట్టిపడకుండా. కానీ అలా ఉండే ప్రయత్నంచేస్తే ఎలా ఉంటుంది?