sami kyandhra
-
ప్రిపరేషన్ పదింతలు
మరో నెలరోజుల్లో టెన్త్ పరీక్షలు పక్కాగా వంద రోజుల ప్రణాళిక {పిపరేటరీ ఫలితాలపై చర్యలు-డీఈవో సాక్షి, విశాఖపట్నం : పది పరీక్షలు ముంచుకొస్తున్నాయి. మరో నెల రోజులు మాత్రమే మిగిలున్నాయి. విద్యార్థులు పుస్తకాలతో.. ఉపాధ్యాయులు పునఃశ్చరణ తరగతుల్లో బిజీగా ఉన్నారు. సమైక్యాంధ్ర సమ్మె ప్రభావం ఫలితాలపై పడకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. కనీసం గతేడాది కంటే మెరుగైన ఫలితాలు సాధించేలా ప్రణాళికలు అమలు చేస్తున్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు డీఈవో పర్యవేక్షణలో వంద రోజుల ప్రణాళిక సమర్థవంతంగా అమలవుతోంది. ఇప్పటికే 65 రోజులు గడిచిపోయాయి. అదనపు తరగతులు.. పరీక్షలు ఎంతగా సెలవురోజులు, ఆదివారాలు పనిచేస్తున్నా.. సిలబస్ పూర్తి చేశామనిపించుకున్నారు తప్ప, పూర్తి స్థాయిలో టెన్త్ విద్యార్థులకు న్యాయం చేయలేకపోయారన్నది నిర్వివాదాంశం. అందుకే రోజూ ఉదయం, సాయంత్రం అదనపు తరగతులు కొనసాగిస్తున్నారు. కొన్ని చోట్ల నిర్లక్ష్యంగా ఉన్న ఉపాధ్యాయులకు జిల్లా విద్యాశాఖాధికారి బి.లింగేశ్వరరెడ్డి, ఉప విద్యాశాఖాధికారి సి.వి.రేణుక ఆకస్మిక తనిఖీలతో దడ పుట్టిస్తున్నారు. ఇప్పటికే సుమారు 20 మందికి మెమోలిచ్చారు. ఇందులో ఐదుగురు ప్రధానోపాధ్యాయులు కూడా ఉన్నారు. ఎప్పటికప్పుడు పర్యవేక్షణలో భాగంగా ఎంఈవోలను కూడా అప్రమత్తం చేశారు. రోజూ కనీసం రెండు ఉన్నత పాఠశాలల్ని తనిఖీ చేయాలన్న ఆదేశాలున్నాయి. ప్రస్తుతం ప్రిపరేటరీ పరీక్షలు జరుగుతున్నాయి. శుక్రవారంతో ఈ పరీక్షలు ముగియనున్నాయి. వీటి ఫలితాల ఆధారంగా మరోసారి ఏబీసీడీ గ్రేడ్లు విభజించి, సీ,డీ గ్రేడ్లవారిపై అదనపు శ్రద్ధ చూపనున్నారు. గ్రేడ్ దాటాల్సిందే! : ప్రిపరేటరీ పరీక్షల్లో విద్యార్థుల ఫలితాల ఆధారంగా విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్న ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోనున్నట్టు జిల్లా విద్యాశాఖాధికారి బి.లింగేశ్వరరెడ్డి తెలిపారు. గురువారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ వంద రోజుల ప్రణాళికలో భాగంగా గతంలోనే విద్యార్థుల గ్రేడ్లను నిర్ణయించి, అదనపు శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించామన్నారు. అయినప్పటికీ ప్రిపరేటరీ పరీక్షల్లో మార్పు కనిపించకపోతే క్షమించేది లేదని హెచ్చరించారు. త్వరలో జరిగే హోప్ ఎగ్జామ్స్ నాటికి డి గ్రేడ్ విద్యార్థులు కనిష్ట స్థాయికి చేరుకోవాలన్న లక్ష్యంగా ప్రధానోపాధ్యాయులు, సంబంధిత సబ్జెక్టు టీచర్లు కృషి చేయాలని సూచించారు. డి గ్రేడ్ విద్యార్థులకు ప్రధానాంశాలు, తరచూ వచ్చే ప్రశ్నలపై ఎక్కువగా తర్ఫీదిచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రిపరేటరీ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచినవారిని 10కి 10 గ్రేడ్ పాయింట్లు సాధించేలా ప్రత్యేక శిక్షణివ్వాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనన్నారు. -
సీకే అడుగులెటు?
రేపు అనుచరులతోసమావేశం 21న భవిష్య కార్యాచరణ ప్రకటన చిత్తూరు (అర్బన్), న్యూస్‌లైన్: చిత్తూరు (కాంగ్రెస్ పార్టీ) ఎమ్మెల్యే సీకే.బాబు రాజకీయంగా ఎలాంటి అడుగులేస్తారన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఇదే విషయమై ఆయన తన అనుచరులతో శుక్రవారం సమావేశం కానున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును లోక్‌సభలో ఆమోదించడాన్ని నిరసిస్తూ సీకే.బాబు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు రాజీనామా పత్రాన్ని మంగళవారం సాయంత్రం ఫ్యాక్స్ ద్వారా పంపించారు. ఓట్లు, సీట్ల కోసం తెలుగుజాతిని రెండుగా చీల్చడాన్ని నిరసిస్తూ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. ఉద్యమంలో ఇలా.. తెలంగాణ ఏర్పాటుకు కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరిస్తూ గత ఏడాది జూలై 30న ప్రకటన చేసింది. అదే రోజు రాత్రి సీకే.బాబు రోడ్డుపైకి వచ్చి సమైక్యాంధ్రకు మద్దతుగా నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఏడు రోజులు నగరంలో ఆమరణ నిరహారదీక్ష చేపట్టారు. సమైక్యాంధ్రకు మద్దతుగా చిత్తూరు నుంచి వందలాది మందితో తిరుమలకు పాదయాత్ర చేశారు. జిల్లాలో ఉద్యోగ సంఘ, ఎన్జీవో నేతలు సమైక్యరాష్ట్ర పరిరక్షణ వేదిక పేరిట ఫోరం ఏర్పాటు చేశారు. దీనికి జిల్లా అధ్యక్షుడిగా సీకే.బాబును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అప్పటి నుంచి రెండు నెలలు చిత్తూరులో సమై క్య ఉద్యమం సాగింది. రాష్ట్రం విడిపోతే తన ఎమ్మెల్యే పదవిని ఏ మాత్రం లెక్కచేయబోనని సీకే అప్పట్లోనే ప్రకటించారు. రేపు సమాలోచన? ఎమ్మెల్యే పదవికి రాజీనామా వరకే సీకే.బాబు ప్రస్తుతానికి పరిమితమయ్యారు. కాంగ్రెస్ లో కొనసాగుతారా లేదా అన్న దానిపై ప్రకటన చేయలేదు. వ్యక్తిగత పనులపై ఉన్న ఆయన శుక్రవారం తన అనుచరులతో సమాలోచన సమావేశం ఏర్పా టు చేయనున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. కాంగ్రెస్ లో కొనసాగడమా, వేరే పార్టీ లో చేరడమా? స్వతంత్ర అభ్యర్థిగా సమైక్య నినాదంతో ప్రజ ల్లోకి వెళ్లడమా అనే విషయంపై ఆ రోజు స్పష్టత రానుంది. ఈ నెల 21న సీకే.బాబు తన రాజ కీయ భవిష్య కార్యాచరణను ప్రకటించే అవకాశాలున్నాయి. -
ఇంత నిర్లక్ష్యమా..!
= ఏడు లక్షల మంది ఉద్యోగులు సమ్మె చేసినా పట్టించుకోని కేంద్రం = తెలంగాణ బిల్లును సీమాంధ్ర ఎమ్మెల్యేలు వ్యతిరేకించాలి = 24న సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో సమావేశం = తెలంగాణలో 65 శాతం మంది సమైక్యాంధ్రకు మద్దతు = ఏపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు బెంగళూరు, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర కోసం 66 రోజుల పాటు ఏడు లక్షల మంది ఉద్యోగులు సమ్మె చేసినా కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం స్పందించ లేదని ఏపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు దుయ్యబట్టారు. సమైక్యాంధ్రకు పలు పార్టీల మద్దతు కోరే ప్రయత్నాల్లో భాగంగా జేడీఎస్ అధ్యక్షుడు, మాజీ ప్రధాని దేవెగౌడను కలవడానికి బుధవారం ఆయనిక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటుపై శాసన సభ ముసాయిదా బిల్లు వచ్చినప్పుడు సీమాంధ్రలోని 13 జిల్లాల శాసన సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించాలని కోరారు. ఈ నెల 24న సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. తదుపరి ఉద్యమ స్వరూపంపై చర్చిస్తామన్నారు. తెలంగాణలో 65 శాతం మంది సమైక్యాంధ్రకు మద్దతు తెలుపుతున్నారని తెలిపారు. అన్ని రాష్ట్రాల్లో విభజన వాదం ఊపందుకుంటుంది : చలసాని శ్రీనివాస్ ఆంధ్ర మేధావుల సంఘం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్రం తెలంగాణను ఏర్పాటు చేస్తే ఇతర రాష్ట్రాల్లో కూడా విభజన వాదం ఊపందుకుంటుందని హెచ్చరించారు. కర్ణాటకలో ఎప్పటి నుంచో కూర్గ్ ల్యాండ్‌ను ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఉందని గుర్తు చేశారు. కనుక కన్నడ సోదరులు సమైక్య వాదానికి మద్దతు పలకడం ద్వారా విభజనకు తాము వ్యతిరేకులమని తేటతెల్లం చేయాలని కోరారు. జీతాలు తీసుకోకుండా... సీమాంధ్రలో 66 రోజుల పాటు రూ. 2,700 కోట్ల జీతాలు తీసుకోకుండా అన్ని శాఖల ఉద్యోగులు ఉద్యమాలు చేశారని ఏపీ రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వర్లు గుర్తు చేశారు. సీమాంధ్రలోని ప్రజలు పూర్తి స్థాయిలో తమ ఉద్యమానికి మద్దుతు తెలిపారని అన్నారు. డిసెంబరులో పార్లమెంట్ సమావేశాలు జరిగే సమయంలో కొన్ని వేల మంది ఢిల్లీ వెళ్లి నిరసనలు వ్యక్తం చేయనున్నారని వెల్లడించారు. ప్రజలు మనోభావాలను దెబ్బ తీసే విధంగా కేంద్ర వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎడతెగని కావేరి జగడం తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య ఇప్పటికీ కావేరి చిచ్చు రగులుతూనే ఉందని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి గంగప్ప తెలిపారు. కావేరి నీటి పంపంకంపై ఏర్పాటు చేసిన కమిటీలో పని చేశానని అన్నారు. రెండు రాష్ట్రాల ప్రజలు దీనిపై ఇంకా ఆందోళనలు చేస్తూనే ఉన్నారని గుర్తు చేశారు. తెలంగాణ ఆవిర్భవిస్తే తెలుగు వారి మధ్య చిచ్చు రగిలే అవకాశాలు లేకపోలేదని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో ఏపీ ప్రైవేట్ విద్యా సంస్థల అధ్యక్షుడు చిరంజీవి రెడ్డి, కర్ణాటక తెలుగు ప్రజా సమితి అధ్యక్షుడు బొందు రామస్వామి, సీపీ బ్రౌన్ సేవా సమితి అధ్యక్షుడు ఇడమకంటి లక్ష్మీ రెడ్డి, ప్రవాసాంధ్ర ప్రముఖులు బాబు రాజేంద్ర కుమార్, శివకుమార్, ముఖర్జీ, గురవయ్య, ప్రతాప్, హలసూరు విజయ కుమారి, కోటేశ్వరి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
జాతీయ రహదారులపై వైఎస్సార్సీపీ శ్రేణుల ఆందోళన
=జాతీయ రహదారులపై వైఎస్సార్సీపీ శ్రేణుల ఆందోళన =గంటల తరబడి నిలిచిపోయిన వాహనాలు =పలువురు నాయకుల అరెస్టు, విడుదల =నేడూ కొనసాగింపు సాక్షి, విశాఖపట్నం: సమైక్యాంధ్ర నినాదాలతో జాతీయ రహదారులు హోరెత్తాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ఆందోళనతో రహదారు లు స్తంభించాయి. గంటలపాటు వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. గ్రామీణ, ఏజె న్సీ ప్రాంతాల్లో చాలా చోట్ల ఉదయం 5 గంట ల నుంచే ఆందోళనలు ప్రారంభమయ్యాయి. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పిలుపుమేర కు పార్టీ శ్రేణులు నియోజకవర్గాల వారీ జాతీయ రహదారుల దిగ్బంధం కార్యక్రమాన్ని బుధవారం చేపట్టాయి. ఉదయం నుంచే పదులు.. వందల సంఖ్యలో పార్టీ నేతలు, శ్రేణులు జాతీయరహదారులపైకి చేరుకున్నాయి. జై సమైక్యాంధ్ర.. జైజై జగన్ అన్న నినా దాలతో మిన్నంటించాయి. పాడేరులో ఉద యం 5 గంటల నుంచే పార్టీ శ్రేణులు ఆందోళ నకు దిగడంతో వారపు సంతకు వెళ్లే వాహనా లు గంటలతరబడి నిలిచిపోయాయి. మాడు గుల నియోజకవర్గంలోని కె.కోటపాడులో రోడ్డుకు అడ్డంగా ట్రాక్టర్లను నిలిపి వాహనాల రాకపోకల్ని అడ్డుకున్నారు. నర్సీపట్నంలో రోడ్డుకు అడ్డంగా చెట్లను నరికి రహదారుల్ని దిగ్బంధించారు. గురువారం కూడా రహదా రుల దిగ్బంధం కొనసాగనుంది. పాయకరావుపేట నియోజకవర్గ పరిధిలో పార్టీ జిల్లా కన్వీనర్ చొక్కాకుల వెంకటరావు, నియోజకవర్గ సమన్వయకర్త చెంగల వెంకటరావు ఆధ్వర్యంలో జాతీయ రహదారిని గంటన్నరకు పైగా దిగ్బంధిం చారు. పోలీసులు రంగం ప్రవేశం చేసి చెంగలను పక్కకు లాక్కెళ్లి ఆందోళనను భగ్నం చేశారు. అనకాపల్లి నియోజకవర్గంలో పార్టీ నేత కొణతాల లక్ష్మీనారాయణ (పెదబాబు) ఆధ్వర్యంలో కొణతాల క్యాంప్ కార్యాలయం నుంచి ద్విచక్ర వాహనాలతో పట్టణ మెయిన్‌రోడ్డు మీదుగా పూడిమడక బైపాస్ కూడలి వరకు ర్యాలీ నిర్వహించి జాతీయ రహదారిని దిగ్బంధించారు. రహదారిపై బైఠాయించారు. చోడవరం నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త బలిరెడ్డి సత్యారావు ఆధ్వర్యంలో జాతీయ రహదారిని దిగ్బంధించారు. బలిరెడ్డి సత్యారావు, పి.వి.ఎస్.ఎన్.రాజుతోపాటు 26 మందిని పోలీసులు అరెస్టు చేసి, సాయంత్రం విడుదల చేశారు. యలమంచిలి నియోజకవర్గ పరిధిలో పార్టీ సమన్వయకర్తలు ప్రగడ నాగేశ్వరరావు కొక్కిరాపల్లి జంక్షన్ వద్ద, బొడ్డేడ ప్రసాద్ మునగపాకలో రిక్షాస్టాండ్ వద్ద ప్రధాన రహదారిని దిగ్బంధించారు. ఆటోలు, రిక్షాలతో ర్యాలీగా వచ్చి కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. నర్సీపట్నం నియోజకవర్గ పరిధిలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త పెట్ల ఉమాశంకర్‌గణేష్ ఆధ్వర్యంలో రహదారుల దిగ్బంధం జరిగింది. రోడ్డుకు అడ్డంగా చెట్లువేసి వాహనాల రాకపోకల్ని స్తంభింపజేశారు. సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు కొనసాగుతోన్న రిలే దీక్షల శిబిరం వద్ద వం టావార్పు కార్యక్రమం నిర్వహించారు. ఈ ఆందోళన కార్యక్రమాల్లో పార్టీ జిల్లా కన్వీనర్ చొక్కాకుల వెంకటరావు పాల్గొన్నారు. మాడుగుల నియోజకవర్గ పరిధిలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలు పూడి మంగపతిరావు, బూడి ముత్యాలనాయుడు ఆధ్వర్యంలో రోడ్ల దిగ్బంధం జరిగింది. కె.కోట పాడులో ప్రధాన రోడ్లకు అడ్డంగా ట్రాక్టర్లను, ఆటోలను, వ్యాన్లను నిలిపి ఉదయం ఆరు గంటల నుంచే రాకపోకల్ని స్తంభింపజేశారు. సమన్వయకర్తలతోపాటు మరో నలుగురు కార్యకర్తల్ని పోలీసులు అరెస్టు చేశారు. అరకు నియోజకవర్గ పరిధిలో పార్టీ సమన్వయకర్తలు కుంభా రవిబాబు ఆధ్వర్యంలో వైఎస్సార్ జంక్షన్ వద్ద రహదారిని దిగ్బం ధించారు. పోలీసులు 15 మందిని అరెస్టు చేశారు. కిడారి సర్వేశ్వరరావు, దొన్ను దొర ఆధ్వర్యంలో అరకులోయ గ్రీన్ వ్యాలీ జంక్షన్‌ను దిగ్బంధించారు. అరకు-పాడేరు ప్రధాన రహదారిపై ఐదు గంటలపాటు వాహనాలు నిలిచిపోయాయి. పాడేరు నియోజకవర్గ పరిధిలో ముగ్గురు సమన్వయకర్తలు సత్యవాణి, కాంతమ్మ, ఈశ్వరి కలిసి చెక్‌పోస్టు వద్ద ప్రధాన రహదారిని దిగ్బంధించారు. చింతపల్లి, జీకే వీధి, కొయ్యూరు మండల నేతలు హనుమాన్ జంక్షన్, జీకే వీధి ప్రధాన రోడ్లను దిగ్బంధించారు. -
వైఎస్సార్ సీపీ ‘సమైక్య’ పోరు
= వైఎస్సార్ సీపీ ‘సమైక్య’ పోరు = కిలోమీటర్ల మేర స్తంభించిన ట్రాఫిక్ =రోడ్లపైనే వంటావార్పు..ఆటాపాట = 97 మంది నేతల అరెస్టు, విడుదల సమైక్యమే అజెండాగా ముందుకెళుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బుధవారం రహదారుల దిగ్బంధంతో హోరెత్తించింది. జిల్లా మీదుగా వెళుతున్న జాతీయ రహదారులన్నీ పార్టీ శ్రేణులు, సమైక్యవాదుల నినాదాలతో మార్మోగాయి. జిల్లావ్యాప్తంగా ఆయా నియోజకవర్గాల సమన్వయకర్తల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాల్లో ప్రజలు సైతం స్వచ్ఛందంగా పాల్గొని సమైక్యానికి జైకొట్టారు. సాక్షి, విజయవాడ : సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం జిల్లావ్యాప్తంగా రహదారుల దిగ్బంధం పెద్దఎత్తున జరిగింది. ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. రహదారులన్నీ సమైక్య నినాదాలతో హోరెత్తిపోయాయి. అన్ని మండలాల్లోనూ జరిగిన ఈ కార్యక్రమానికి ప్రజామద్దతు వెల్లువెత్తింది. ఈ సందర్భంగా 97 మంది నేతలను పోలీసులు అరెస్టు చేశారు. జగ్గయ్యపేట నియోజకవర్గంలో పార్టీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను ఆధ్వర్యంలో దిగ్బంధం భారీగా జరిగింది. గరికపాడు, చిల్లకల్లు, గట్టుభీమవరం, వత్సవాయి, ముళ్లపాడు క్రాస్‌రోడ్ వద్ద గల జాతీయ రహదారులను నాయకులు, కార్యకర్తలు, సమైక్యవాదులు దిగ్బంధించారు. గరికపాడు వద్ద నిర్వహించిన ఆందోళనలో ఉదయభాను మాట్లాడుతూ.. సమైక్యాంధ్రకు మద్దతు ఇవ్వకుండా తప్పించుకుని తిరుగుతున్న సీమాంధ్ర కేంద్ర మంత్రులు కాంగ్రెస్ అధిష్ఠానానికి ప్యాకేజీ తొత్తులుగా మారారని ఎద్దేవా చేశారు. తాము చేస్తున్నది ప్రజా ఉద్యమమని, ఎవ రూ అడ్డుకోలేరని చెప్పారు. ఈ సందర్భంగా రహదారిపైనే వంటావార్పు చేశారు. శాంతి యుతంగా ఆందోళన చేస్తున్న ఉదయభానును పోలీసులు తీసుకువెళ్లి జీపు ఎక్కించారు. కార్యకర్తలు, నాయకులు ఆయనను విడుదల చేయాలంటూ జీపునకు అడ్డంగా కూర్చుని నినాదాలు చేశారు. దాదాపు అర్ధగంటపాటు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎట్టకేలకు ఉదయభానుతో సహా 40 మందిని అరెస్టు చేసి పేట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. తర్వాత వారిని వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. అవనిగడ్డ నియోజకవర్గంలోని అవనిగడ్డ మండలం పులిగడ్డ, చల్లపల్లిలో జాతీయ రహదారుల దిగ్బంధం జరిగింది. సమన్వయకర్త సింహాద్రి రమేష్‌బాబు ఆధ్వర్యంలో పులిగడ్డ చౌరస్తాలో 216 జాతీయ రహదారిని దిగ్బంధించారు. నందిగామ జాతీయ రహదారిపై ఆందోళన చేస్తున్న సమన్వయకర్త డాక్టర్ మొండితోక జగన్మోహనరావు సహా నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. అనాసాగరం బైపాస్ వద్ద వందలాది మంది నాయకులు, కార్యకర్తలతో రోడ్ల దిగ్బంధ కార్యక్రమం నిర్వహించారు. కంచికచర్ల చెరువుకట్ట సమీప బైపాస్, పెనుగంచిప్రోలు మండల పరిధిలో ముండ్లపాడు క్రాస్‌రోడ్స్ వద్ద రహదారుల దిగ్బంధం జరిగింది. గన్నవరం నియోజకవర్గంలోని హనుమాన్‌జంక్షన్‌లో పార్టీ బందరు పార్లమెంట్ ఇన్చార్జి కుక్కల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు పేర్ని నాని, కొడాలి నాని, గన్నవరం, పెడన నియోజకవర్గాల సమన్వయకర్తలు డాక్టర్ దుట్టా రామచంద్రరావు, ఉప్పాల రామ్‌ప్రసాద్‌ల నేతృత్వంలో పెద్దఎత్తున తరలివచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు నాలుగు రోడ్ల జంక్షన్‌ను దిగ్బంధం చేశారు. మైలవరం నియోజకవర్గంలో సమన్వయకర్త జ్యేష్ఠ రమేష్‌బాబు ఆధ్వర్యంలో మార్కెట్ యార్డు వద్ద విజయవాడ-భద్రాచలం జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా చేశారు. ఇబ్రహీంపట్నంలో మరో సమన్వయకర్త జోగి రమేష్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నూజివీడులో ఉదయం ఆరు గంటలకే నాయకులు రహదారులను దిగ్బంధించడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచి పోయాయి. సమన్వయకర్త మేకా వెంకట ప్రతాప్‌అప్పారావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. పెనమలూరులో రోడ్ల దిగ్బంధం సమన్వయకర్త తాతినేని పద్మావతి ఆధ్వర్యంలో జరిగింది. తిరువూరు హైవేపై సమన్వయకర్త వల్లభాయ్ ఆధ్వర్యంలో రోడ్డును దిగ్బంధించారు. గుడివాడ నియోజకవర్గం నందివాడ మండలం జనార్దనపురం వద్ద సమన్వయకర్త కొడాలి నాని ఆధ్వర్యంలో వందలాది మంది హైవేను దిగ్బంధించారు. పామర్రు నియోజకవర్గంలో సమన్వయకర్త ఉప్పులేటి కల్పన ఆధ్వర్యంలో రోడ్డును దిగ్బంధించి వంటావార్పు నిర్వహించారు. కైకలూరులో సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో హైవేను వందలాది మంది దిగ్బంధించారు. బెజవాడలో.. విజయవాడలో పార్టీ నగర కన్వీనర్ జలీల్‌ఖాన్ ఆధ్వర్యంలో భవానీపురం స్వాతి థియేటర్ వద్ద మానవహారం చేసి రోడ్డును దిగ్బం ధించారు. సెంట్రల్, తూర్పు నియోజకవర్గాల సమన్వయకర్తలు పి.గౌతమ్‌రెడ్డి, వంగవీటి రాధాకృష్ణ ఆధ్వర్యంలో రహదారి దిగ్బంధనాలు జరిగాయి. -
బాణసంచా ధరలు తారాజువ్వలే..
=నిరుటితో పోలిస్తే 20శాతం పెరుగుదల =తగ్గిన హోల్‌సేల్ అమ్మకాలు =కనిపించని దీపావళి సందడి విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : బాణసంచా ధరలు తారాజువ్వల్లా నింగికెగశాయి. సామాన్యులకు భారంగా మారాయి. నిరుటితో పోల్చితే అన్నిరకాల మందుగుండు సామాగ్రి ధరలు 20 శాతం పెరిగాయి. వరదలు, సమైక్య ఉద్యమం ప్రభావంతో జనం వద్ద డబ్బు లేదని గ్రహించిన హోల్‌సేల్ వ్యాపారులు స్టాక్‌ను గణనీయంగా తగ్గించారు. ఈ ఏడాది వాతావరణం కూడా అనుకూలించే పరిస్థితి లేదని వ్యాపారులు భావిస్తున్నారు. నిరుటి కంటే ఈ ఏడాది హోల్‌సేల్ వ్యాపారం కూడా తగ్గినట్లు చెబుతున్నారు. టపాసుల ధరలను టోకు వర్తకులు 10 శాతం పెంచారు. చిల్లర వర్తకులు మరో 10 శాతం పెంచి వసూలు చేస్తున్నారు. ఏటా నగరంలోని మార్కెట్లో దాదాపు 120 రకాల టపాసులు విక్రయానికి ఉంచేవారు. ఈసారి 90 రకాలే అందుబాటులో ఉన్నాయి. దుకాణాల కేటాయింపు, అనుమతుల జారీ ప్రక్రియలో మామూళ్లు దండుకుంటున్న అధికారులు ధరలు నియంత్రణను గాలికి వదిలేస్తున్నారు. ఈసారి బాణసంచా కొనటమంటే చేతులు కాల్చుకోవటమేగా మారింది. బాణసంచాను స్టాండర్డ్, నాన్ స్టాండర్డ్‌గా విభజించి డిస్కౌంట్లుపేరుతో టోకు వ్యాపారులు దగా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. స్టాండర్డ్ వెరైటీపై 30 శాతం, నాన్ స్టాండర్డ్పై 70 నుంచి 80 శాతం డిస్కౌంట్లు ప్రకటిస్తున్నారు. టోకు, చిల్లర వ్యాపారులు కుమ్మక్కై నాన్ స్టాండర్డ్ ప్యాకెట్లపై స్టాండర్డ్ లేబుల్స్ అంటించి జనాన్ని దోచేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఏటా జిల్లాలో రూ. 25 కోట్ల నుంచి రూ. 30కోట్ల మేర వ్యాపారం జరుగుతుంది. 2012లో నగరంలో 130 షాపుల్లో రూ.5కోట్లు, జిల్లాలోని ఇతర ప్రాంతాల్లోని దాదాపు 350 షాపుల్లో రూ. 25 కోట్లకు మించి వ్యాపారం జరిగినట్లు అంచనా. ఈ ఏడాది ఇప్పటికే వ్యాపారులు అమ్మకాలు ప్రారంభించారు. దీపావళికి ముసురు భయం... ఇదిలా ఉండగా ఈ సంవత్సరం వ్యాపారులకు ముసరు భయం పట్టుకుంది. దీపావళికి ముసురు పడితే సరకు కొనుగోళ్లు జరుగుతాయో లేదోననే ఆందోళనలో ఉన్నారు. ఏటా దీపావళికి వారం ముందునుంచే పట్టణాలు, పల్లెల్లో బాంబుల మోత వినిపించేది. ఈ సంవత్సరం పండగ సమీపిస్తున్నా బాణసంచా వెలుగులు కనపడటం లేదు. -
ప్రాజెక్టు ‘కనికట్టు’!
సాక్షి ప్రతినిధి, అనంతపురం: సమైక్యాంధ్ర పోరాటానికి చుక్కానిలా నిలుస్తోన్న అనంతపురం జిల్లాలో ఉద్యమాన్ని నీరుగార్చేందుకు కిరణ్ సర్కారు కుట్ర పన్నుతోందా? ఉద్యమంలో కీలక భూమిక పోషిస్తోన్న రైతులను కనికట్టు చేసేందుకు పూనుకుందా? సేద్యాన్ని లాభసాటిగా మార్చేందుకు ఉద్దేశించిన ‘ప్రాజెక్టు అనంత’కు నిధులు మంజూరు చేయడం మాట పక్కన పెట్టి.. అమలు కోసమంటూ రిటైర్డు ఐఏఎస్ అధికారి చంద్రమౌళిని ప్రత్యేకాధికారిగా నియమించడం అందులో భాగమేనా?.. ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం చెబుతున్నారు వ్యవసాయ శాఖ అధికారులు, సమైక్యవాదులు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ), యూపీఏ పక్షాలు జూలై 30న తీర్మానం చేసిన తక్షణమే ‘అనంత’లో సమైక్యాంధ్ర ఉద్యమం పురుడుపోసుకున్న విషయం విదితమే. ఈ ఉద్యమం దావానంలా సీమాంధ్ర అంతటా వ్యాపించింది. ఉద్యమానికి ‘అనంత’ మార్గనిర్దేశనం చేస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లాలో ఉద్యమాన్ని నీరుగార్చేందుకు కిరణ్ సర్కారు పూనుకుంది. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు సమ్మెను తాత్కాలికంగా విరమించినా.. జిల్లాలో మాత్రం ఉద్యమ వేడి ఏమాత్రమూ తగ్గలేదు. రైతులు, కూలీలు, ఇతర అన్ని వర్గాల ప్రజలు ఉద్యమానికి దన్నుగా నిలుస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర నిఘా సంస్థలు కూడా ఇదే అంశాన్ని స్పష్టీకరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రైతులు, వ్యవసాయ కూలీలను కూడా ఉద్యమం నుంచి తప్పించడానికి ప్రభుత్వం ఉత్తుత్తి తాయిలాలను ఎరగా వేస్తోంది. ‘ప్రాజెక్టు అనంత’ అమలు కోసం ప్రత్యేకాధికారిగా రిటైర్డు ఐఏఎస్ చంద్రమౌళిని హడావుడిగా నియమించడమే ఇందుకు నిదర్శనం. నిధుల్లేని ‘ప్రాజెక్టు అనంత’ దుర్భిక్ష ‘అనంత’లో సేద్యాన్ని లాభసాటిగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థన మేరకు కేంద్రం వ్యవసాయ శాస్త్రవేత్తలతో ఓ అత్యున్నత సాంకేతిక కమిటీని నియమించింది. ఈ కమిటీ రెండు పర్యాయాలు జిల్లాలో పర్యటించి... ఓ నివేదికను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు అందించింది. ఈ నివేదిక అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లా అధికార యంత్రాంగం ఓ ప్రణాళిక రూపొందించింది. ఈ ప్రణాళిక పేరును ‘ప్రాజెక్టు అనంత’గా పెట్టారు. ఈ ప్రాజెక్టు అమలుకు రూ.7,676 కోట్లు అవసరమని జిల్లా అధికారులు తేల్చారు. కానీ.. ఆ మేరకు నిధులు మంజూరు చేయలేమని రాష్ట్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. చేసేదిలేక రాష్ట్ర రెవెన్యూమంత్రి ఎన్.రఘువీరారెడ్డి కేంద్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్‌సింగ్ అహ్లూవాలియాను కలిసి.. ‘ప్రాజెక్టు అనంత’కు నిధులు కేటాయించాలని కోరారు. అందుకు అహ్లూవాలియా అంగీకరించలేదు. దాంతో శాఖాపరంగా మంజూరయ్యే నిధులను ‘ప్రాజెక్టు అనంత’కు మళ్లించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. వ్యవసాయ, ఉద్యాన, సూక్ష్మనీటిపారుదల, పశుసంవర్ధక, పట్టు, మత్స్యశాఖలకు శాఖాపరంగా ఐదేళ్లలో రూ.4,387 కోట్లు మంజూరవుతాయని లెక్కకట్టిన సర్కారు.. తక్కిన రూ.3,282 కోట్లను సమీకరించే ప్రయత్నాలు చేస్తామని తెలిపింది. అయితే.. శాఖాపరంగా మంజూరయ్యే నిధులను మళ్లించలేమంటూ అధికారులు ఇప్పటికే సర్కారుకు తెగేసి చెప్పారు. అమలుకు ప్రత్యేకాధికారా? ‘ప్రాజెక్టు అనంత’ అమలు కోసమంటూ రిటైర్డు ఐఏఎస్ అధికారి చంద్రమౌళిని ప్రత్యేకాధికారిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులను సమన్వయపరచి.. ‘ప్రాజెక్టు అనంత’ను అమలు చేసే బాధ్యతను అప్పగించింది. అసలు నిధులే లేని ప్రాజెక్టు అమలుకు ఏకంగా రిటైర్డు ఐఏఎస్ అధికారిని ప్రత్యేకాధికారిగా నియమించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సమైక్యాంధ్ర ఉద్యమంలో అగ్రపథాన సాగుతోన్న ‘అనంత’ రైతన్నలను, వ్యవసాయ కూలీలను దారి మళ్లించేందుకే ఈ రకమైన ఎత్తుగడలు వేసినట్లు వ్యవసాయశాఖ అధికారులు స్పష్టీకరిస్తున్నారు. లేని తాయిలాలను ఎరగా వేసి.. ఉద్యమాన్ని నీరుగార్చాలన్న లక్ష్యంతోనే కిరణ్ సర్కారు ఈ వ్యూహం రచించినట్లు సమైక్యవాదులు మండిపడుతున్నారు. నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ‘ప్రాజెక్టు అనంత’ అమలుకు తక్షణమే నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. -
జోరువానలోనూ సమైక్య హోరు
సాక్షి, విజయవాడ : తలకిందులుగా తపస్సుచేసి అయినా రాష్ట్రాన్ని కాపాడుకుంటామంటూ నాగాయలంకలో గురువారం జేఏసీ, లయన్స్‌క్లబ్ ఆధ్వర్యంలో వినూత్న నిరసన తెలిపారు. పలువురు తలకిందులుగా నిలబడి జైసమైక్యాంధ్ర, తెలంగాణ వద్దు-సమైక్యాంధ్రముద్దు అంటూ నినాదాలు చేశారు. విజయవాడలో ఇరిగేషన్ కార్యాలయం వద్ద జోరువానలో ఎన్జీవోలు, ఇరిగేషన్ ఉద్యోగులు భోజనవిరామ సమయంలో ధర్నా చేశారు. కైకలూరు వెలంపేటకు చెందిన మహిళా కార్యకర్తలు రిలే దీక్షల్లో కూర్చున్నారు. నందివాడ మండలం టెలిఫోన్ నగర్లో ఉపాధ్యాయుల దీక్షలు కొనసాగుతున్నాయి. ఉపాధ్యాయుల జేఏసీ ఆధ్వర్యంలో పామర్రు హైస్కూల్ విరామ సమయంలో ఉపాధ్యాయులు ధర్నా చేశారు. తిరువూరులో సమైక్యాంధ్ర కోరుతూ వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో రిలేదీక్షలు 21వ రోజు కొనసాగాయి. చల్లపల్లిలో 76వరోజుకు దీక్షలు చేరాయి. చల్లపల్లి మండలంలోని మాజేరుకు చెందిన మహిళలు దీక్ష చేశారు. అవనిగడ్డలో 63వరోజు చేరుకున్నాయి. అవనిగడ్డలో గ్రామీణ యువజన వికాస సమితి అధ్యక్షుడు మండలి వెంకట్రామ్ యూత్‌కు చెందిన వేకనూరు యువకులు దీక్ష చేశారు. వైఎస్సార్సీపీ యూత్ ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా మైలవరంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. యూత్ మండల కన్వీన ర్ చామల సీతారామిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త జ్యేష్ఠ రమేష్‌బాబు, వివిధ మండలాల కన్వీనర్లు, నాయకులు. కార్యకర్తలు పాల్గొన్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా మైలవరంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టి, పాఠశాలల ముందు రాష్ట్ర విభజనకు నిరసనగా నినాదాలు చేశారు. ఆగిరిపల్లిలో జేఏసీ ఆధ్వర్యంలో 32వ రోజూ రిలే నిరహార దీక్షలు జోరువానలో కొనసాగాయి.పామర్రు ఏపీఎన్జీవో సంఘం పిలుపు మేరకు . పామర్రు కంచర్ల రామారావు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు మధ్నాహ్న భోజన విరామ సమయంలో సమైక్యాంధ్ర కోసం నినాదాలు చేశారు. చిన్నగాంధీబొమ్మ సెంటరులో జేఏసీ ఆధ్వర్యంలోని రిలేదీక్ష శిబిరాన్ని విశాలాంధ్రమహాసభ రాష్ట్రఅధ్యక్షుడు నల్లమోతు చక్రవర్తి సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ శిబిరంలో పట్టణంలోని శారదా డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థులు, త్రివిధ, కుమార్, విజేత ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులు దీక్షలో కూర్చున్నారు. సెయింట్‌జోన్స్ కళాశాలకు చెందిన విద్యార్థులు చిన్నగాంధీబొమ్మ సెంటరులో వర్షం పడుతున్నా గొడుగులు వేసుకుని నిరసన ప్రదర్శన నిర్వహించారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో స్థానిక జంక్షన్‌రోడ్డులో నిర్వహిస్తున్న రిలేనిరాహార దీక్షలు 59వ రోజుకు చేరాయి. పట్టణంలోని బాపునగర్‌కు చెందిన కార్యకర్తలు దీక్షలో కూర్చున్నారు. ఏపీఎన్జీవోల అధ్వర్యంలో మైలవరం పంచాయతీ కార్యాలయం ఎదుట మధ్యాహ్న భోజన విరామ సమయంలో సమైక్యాంధ్రకు మద్దతుగా నిరసన కార్యక్రమం చేపట్టారు. మైలవరం నియోజక వర్గ సమన్వయ కర్త జోగిరమేష్ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం రింగుసెంటర్లో వైఎస్సార్ సీపీ యూత్ నాయకులు, కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఏపీ ఎన్జీవో రాష్ట్ర నాయకులు అశోక్‌బాబు పిలుపు మేరకు కలెక్టరేట్ వద్ద మధ్యాహ్నభోజన సమయంలో నిరసన వ్యక్తం చేశారు. నందివాడ మండలంలోని టెలిఫోన్ నగర్ కాలనీలోని సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలేదీక్షలు గురువారంతో 54వ రోజుకు చేరుకున్నాయి. అరిపిరాల గ్రామానికి చెందిన రైతులు దీక్షలో కూర్చున్నారు. -
తరగని ఉద్యమ స్ఫూర్తి
=ఎన్జీవోలు సమ్మె విరమించినా కొనసాగిన సమైక్య పోరు =వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఆందోళనలు =ఉద్యమంలోనే వివిధ వర్గాలు అదే స్ఫూర్తి.. సమైక్యాంధ్ర ఆకాంక్ష.. జిల్లాలో కొనసాగుతోంది. ఎన్జీవోలు సమ్మె విరమించి విధుల్లోకి వెళ్లినా వివిధ వర్గాల ప్రజలు, వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు కొనసాగించారు. నూజివీడులో, కైకలూరులో విద్యార్థులు భారీ స్థాయిలో మానవహారాలు నిర్మించారు. విభజన నిర్ణయం వెనక్కి తీసుకోవాలని నినాదాలు చేశారు. సాక్షి, విజయవాడ : ఏపీ ఎన్జీవోలు సమ్మె విరమించినా జిల్లాలో సమైక్య ఉద్యమ స్ఫూర్తి తగ్గలేదు. జిల్లా వ్యాప్తంగా సమైక్య ఆందోళనలు కొనసాగాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, వివిధ వర్గాల ప్రజల ఆధ్వర్యంలో జిల్లాలో పలు ప్రాంతాలలో నిరసన కార్యక్రమాలు జరిగాయి. సమైక్య సమ్మె ఆపేది లేదని వైద్యులు స్పష్టం చేశారు. ప్రభుత్వాస్పత్రిలో అవుట్ పేషెంట్ల సేవలతో పాటు, ఆపరేషన్లు, వైద్య విద్యార్థులకు బోధనా తరగతులను శుక్రవారం కూడా బహిష్కరించారు. ఆపరేషన్లు సైతం నిలిచిపోవడంతో పోస్ట్ ఆపరేటివ్ వార్డుతో పాటు, ఐసీయూలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. మినిస్టీరియల్ సిబ్బంది మాత్రం విధుల్లో చేరారు. గుడివాడ నెహ్రూచౌక్ సెంటర్లో జేఏసీ ఆధ్వర్యంలో దీక్షలు కొనసాగుతున్నాయి. కలిదిండి సెంటరులో ఇందిరా కాలనీకి చెందిన మహిళలు రిలే దీక్షలో చేపట్టారు. కలిదిండి సెంటరులో ఆంటోనీ దిష్టిబొమ్మను దహనం చేసి సోనియా, పురందేశ్వరి డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు. వివేకానంద, సుగుణ జూనియర్ కళాశాల విద్యార్థులు మానవాహారం నిర్వహించారు. కైకలూరు తాలూకా సెంటర్లో జేఏసీ ఆధ్వర్యంలో దీక్షలు 66వ రోజుకు చేరాయి. రిటైర్డు ఉద్యోగులు రిలే దీక్షల్లో కూర్చున్నారు. మండవల్లిలో కానుకొల్లు గ్రామస్తులు రిలే దీక్షల్లో పాల్గొన్నారు. ముదినేపల్లిలో మండల జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న దీక్షలు 33వ రోజుకు చేరాయి. ఉయ్యూరు సెంటర్లో విద్యార్థులు, జేఏసీ నాయకులు నల్ల జెండాలతో నిరసన ప్రదర్శన చేపట్టి, ధర్నా నిర్వహించారు. పెడనలో విజయానంద డిగ్రీ కళాశాల విద్యార్థులు, మున్సిపల్ శానిటరీ వర్కర్లు ఒకరోజు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. నూజివీడులో పోరు ఉధృతం నూజివీడులో రాజకీయేతర జేఏసీ నాయకులు సమైక్య పోరు ఉధృతం చేశారు. చిన్నగాంధీబొమ్మ సెంటరులో నిర్వహిస్తున్న రిలేదీక్షల శిబిరం యథావిధిగా కొనసాగింది. జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దీక్షలు 72వ రోజుకు చేరాయి. ముఠావర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో హమాలీలు ఈ దీక్షలో కూర్చున్నారు. శారదా విద్యాసంస్థల, కళాశాల విద్యార్థులు పట్టణంలో ర్యాలీ నిర్వహించి చిన్నగాంధీబొమ్మ సెంటరులో నిరసన ప్రదర్శన జరిపారు. విజయవాడలో తెలుగుదేశం నేతలు ఎన్టీఆర్ సర్కిల్ వద్ద క్షవరం చేస్తూ నిరసన, రాస్తారోకో చేశారు. జగ్గయ్యపేట పట్టణంలో జేఏసీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు జరిగాయి. ఇందులో టీడీపీ ఎస్టీ సెల్ నాయకులు పాల్గొన్నారు. చల్లపల్లిలో జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలు 70వ రోజుకు చేరాయి. మండల పరిధిలోని చింతలమడకు చెందిన రైతులు దీక్షలు చేశారు. కోడూరులో బాలభాను జూనియర్ కళాశాల విద్యార్థులు దీక్ష చేపట్టారు. నాగాయలంకలో జేఏసీ, లయన్స్‌క్లబ్ ఆధ్వర్యంలో సీఐటీయూ, ట్రాక్టర్ మెకానిక్ సంఘం నాయకులు దీక్షలో కూర్చున్నారు. అవనిగడ్డలో జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక ఇండోర్ స్టేడియం వద్ద నిర్వహిస్తున్న రిలే దీక్షలు శుక్రవారం నాటికి 58వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షల్లో ఏకలవ్య సంఘ నాయకులు పాల్గొన్నారు. టెలిఫోన్ నగర్ కాలనీలోని సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలేదీక్షలు శుక్రవారంతో 48వ రోజుకు చేరుకున్నాయి. దీక్షలో శంకరంపాడు గ్రామానికి చెందిన రైతులు కూర్చున్నారు. విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో హనుమాన్‌జంక్షన్‌లో శుక్రవారం కేంద్ర ప్రభుత్వ రంగ కార్యాలయాల బంద్ నిర్వహించారు. బ్యాంకులు, పోస్టాఫీసు, టెలిఫోన్ ఎక్ఛేంజీలను విద్యార్థులు మూయించారు. కైకలూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు 73వ రోజుకు చేరాయి. పట్టణానికి చెందిన మహిళా కార్యకర్తలు 20 మంది రిలే దీక్షల్లో కూర్చున్నారు. ముదినేపల్లి మండల సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే దీక్షలు 33వ రోజుకు చేరాయి. ముదినేపల్లికి చెందిన మహిళలు దీక్షలో కూర్చున్నారు. -
చిత్తశుద్ధి లేని కేంద్ర మంత్రులు
=తలో మాటతో ప్రజలను మభ్యపెడుతున్నారు =రాజీనామా చేయకుండానే టీడీపీ డ్రామాలు =తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ధ్వజం సాక్షి, తిరుపతి: సమైక్య రాష్ట్రంపై సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులకు చిత్తశుద్ధి లేదని, పదవీ కాంక్షతో అధిష్టానం అడుగులకు మడుగులు ఒత్తుతున్నారని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి విమర్శించారు. తుడా కార్యాలయం వద్ద పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహారదీక్షలో బుధవారం ఆయన పాల్గొన్నారు. అనంతరం ఉప్పు విక్రయిస్తూ విభజన ప్రక్రియకు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ విభజన వ్యవహారంపై సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు తలో మాట మాట్లాడుతూ ప్రజల ను మభ్యపెడుతున్నారని తెలిపారు. తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలు రాజీనామాలు చేసినట్లు డ్రామాలు ఆడుతున్నారని అన్నారు. రాష్ట్ర విభజన జరిగితే ఉప్పు అమ్ముకుని బతకాల్సిందేనని పేర్కొన్నారు. కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు మంచి నీరు దొరకని పరిస్థితి తలెత్తుతుందన్నారు. సముద్ర జలాలతో ఉప్పు తయారు చేసుకుని బతకాల్సి వస్తుందని తెలిపారు. మంచినీరు లేక వరిచేలను ఉప్పు కయ్యలుగా మార్చుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. విద్యావంతులు చేతివృత్తులు, కుల వృత్తులు చేసుకుని జీవించాల్సి వస్తుందని తెలిపారు. హైదరాబాద్ నగరాన్ని తెలంగాణ రాష్ట్రంలో కలిపితే సీమాంధ్ర యువత ఉద్యోగావకాశాలు కోల్పోతుందని చెప్పారు. సమైక్యాం ధ్ర కోరుకుంటున్న ఏకైక పార్టీ వైఎస్సార్ సీపీ మాత్రమేనన్నారు. పార్టీ నాయకుడు పులుగోరు ప్రభాకర్‌రెడ్డి మాట్లాడారు. ఈ సమావేశంలో నగర కన్వీనర్ పాలగిరి ప్రతాప్‌రెడ్డి, మహిళా కన్వీనర్ కుసుమ, బీసీ సెల్ సభ్యుడు పుల్లయ్య, ఎస్సీ సెల్ కన్వీనర్ రాజేంద్ర, ఎస్కే.బాబు, అమరనాథరెడ్డి, చెంచయ్య యాదవ్, తొండమనాటి వెంకటేష్, పునీత, శాంతారెడ్డి, పుష్పాచౌదరి, గౌరి, హర్ష, అగర్వాల్, తిరుమలయ్య తదితరులు పాల్గొన్నారు. -
అ‘టెన్’షన్
నర్సీపట్నం, న్యూస్‌లైన్ : ఉవ్వెత్తున ఎగసిన సమైక్యాంధ్ర ఉద్యమం పర్యవసానంగా విద్యా సంబంధ కార్యక్రమాలు స్తంభించిపోయాయి. సెప్టెంబర్ నెలాఖరు నుంచి ఉపాధ్యాయులంతా సమ్మెలో పాల్గొనడంతో ప్రభుత్వ పాఠశాలలు దాదాపుగా మూతపడ్డాయి. దాంతో 30రోజుల పాటు అన్ని తరగతులతో పాటు టెన్త్ విద్యార్థులు సైతం పాఠశాలలకు దూరం కావాల్సి వచ్చింది. అనుకున్న సమయానికి కోర్సులు పూర్తికాకపోవడంతో క్వార్టర్లీ పరీక్షల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్రస్తుతం ఉపాధ్యాయులంతా సమ్మెకు స్వస్తి చెప్పి విధుల్లోకి చేరడంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదువును గాడిన పడేయడానికి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. చకచకా కోర్సులు పూర్తి చేయించే అంశంపై దృష్టి సారించారు. ఎప్పటి మాదిరిగా అనుకున్న సమయానికి పాఠాలన్నీ పూర్తి చేయించి, విద్యార్థుల చేత పునశ్చరణ చేయించి, పబ్లిక్ పరీక్షలకు వారిని సన్నద్ధం చేసేలా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదివే పదోతరగతి రెగ్యులర్ విద్యార్థులు సుమారుగా 60వేల మం ది వరకు ఉంటారు. వీరిలో సుమారుగా 40వేల మంది విద్యార్థులు ప్రభు త్వ పాఠశాలల్లోనే చదువుతున్నారు. నెల రోజుల పాటు వీరికి పాఠాలు జరగలేదు. దాంతో తక్కువ సమయంలో ఎక్కువ సిలబస్‌ను పూర్తి చేయాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై పడింది. ఇందుకోసం సంక్రాంతి సెలవులలతో పాటు ఆదివారాలు సైతం పాఠశాలలు నిర్వహించేందుకు అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. ఉపాధ్యాయులు కూడా ముందుకు వచ్చారు. అంతా కలసి పదో తరగతి కోర్సులను జనవరి 15కల్లా పూర్తిచేయాలని లక్ష్యం గా పెట్టుకున్నారు. ఇది క్షేత్రస్థాయిలో ఎలా అమలవుతున్నదీ ప్రత్యేక బృం దాల పర్యవేక్షణలో పరిశీలించాలని నిర్ణయించారు. దీనిపై ఇన్చార్జి డీఈ వో లింగేశ్వరరెడ్డి మాట్లాడుతూ కోర్సులను వీలైనంత తొందర్లో పూర్తిచేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. పూర్తయిన కోర్సులను బట్టి క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ పరీక్షలు నిర్వహిస్తామని తెలియజేశారు. -
వేతనాల జీవో జాప్యమేనా?
= న్యాయశాఖ పరిశీలనకు ఫైలు = సీఎం హామీ అమలయ్యేనా = సమైక్య సమ్మెలో పాల్గొన్న ఉపాధ్యాయుల్లో ఆందోళన మచిలీపట్నం, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర కోసం సమ్మె చేసిన ఉపాధ్యాయులను ప్రభుత్వం చిక్కుల్లో పడవేసే ధోరణిలో వ్యవహరిస్తోందనే ఆరోపణలు వినవస్తున్నాయి. సమ్మె కాలానికి వేతనం చెల్లించే విషయంలో అనేక కొర్రీలు పెడుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమం జరిగిన సమయంలో అక్కడి ఉపాధ్యాయుంతా ఒకేరోజు సమ్మెలోకి వచ్చి, ఒకేరోజు సమ్మె విరమించటంతో 151 జీవో ప్రకారం ప్రభుత్వం వారికి వేతనాలు చెల్లించింది. సీమాంధ్రలో ఉపాధ్యాయులు విడతల వారీగా సమ్మెలో పాల్గొనటంతో ఏ ప్రాతిపదికన వేతనాలు చెల్లించాలనే అంశంపై విద్యాశాఖ డెరైక్టర్ న్యాయశాఖకు లేఖ రాసినట్లు సమాచారం. ముఖ్యమంత్రి, ఉపాధ్యాయ జేఏసీ నాయకుల మధ్య జరిగిన సమావేశంలో సమ్మె కాలంలో కోల్పోయిన పని దినాలను భర్తీ చేస్తామనే ఒప్పందం జరిగినట్లు ఉపాధ్యాయులు చెబుతున్నారు. జీవో విడుదలయ్యేవరకూ ఆగాల్సిందే! సమైక్యాంధ్రకు మద్దతుగా ఆగస్టు 22 నుంచి అక్టోబరు 10 వరకు ఉపాధ్యాయులు సమ్మెలో పాల్గొన్నారు. వీరిలో మూడొంతుల మంది సమ్మెలో పాల్గొనగా ఒక వంతు పాఠశాలలకు హాజరయ్యారు. ఆగస్టు 22 నుంచి అక్టోబరు 10 వరకు సమ్మె జరపగా సెలవు దినాలు పోను పనిదినాలు 33 రోజులుగా ఉన్నాయి. ఆయా రోజులకు గాను ప్రభుత్వం వేతనాలు చెల్లించేందుకు ప్రత్యేక జీవోను విడుదల చేయాల్సి ఉంది. ఈ జీవో విడుదలకు న్యాయశాఖ అనుమతి కావాల్సి ఉండటంతో ఇప్పట్లో ఉపాధ్యాయుల వేతనాలు చెల్లించేందుకు ఉత్తర్వులు జారీ కావనే భయం ఉపాధ్యాయులను వెంటాడుతోంది. దీనికి కారణం లేకపోలేదు. ఆగస్టు 22 నుంచి కొంతమంది, ఆగస్టు 27 నుంచి మరికొందరు, సెప్టెంబరు 3 నుంచి అలాగే 11 నుంచి ఇంకొందరు ఉపాధ్యాయులు సమ్మెలోకి వచ్చి అక్టోబరు 10 వరకు ఉద్యమంలో కొనసాగారు. వీరిలో కొంతమంది అక్టోబరు ఒకటో తేదీనే సమ్మెబాట వీడి విధులకు హాజరయ్యారు. ఇలా విడతలవారీగా ఉపాధ్యాయులు సమ్మెలో పాల్గొనటం, సమ్మె విరమించటం వల్ల వీరికి సమ్మె కాలంలో వేతనం ఎలా చెల్లించాలనే అంశంపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. మరిన్ని సందేహాలు... ఉపాధ్యాయులు విడతలవారీగా సమ్మెలోకి రావటం, విరమించటంతో వారికి సీఎం ఇచ్చిన హామీ అమలు నేపథ్యంలో మరిన్ని సందేహాలు ఎదురవుతున్నాయి. ఒక పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు ఉంటే ఒకరు సమ్మెలో పాల్గొనగా మరొకరు పాఠశాలను నడిపారు. పాఠశాల తెరిచి ఉండటంతో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేశారు. ఉపాధ్యాయులు సమ్మె విరమించే సమయంలో సమ్మె జరిగిన 33 రోజులను రానున్న రోజుల్లో భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఒక ఉపాధ్యాయుడు పనిచేసి మరొకరు సమ్మెలోకి వెళితే ఆ పాఠశాల మళ్లీ 33 రోజులు ఎలా పనిచేస్తుందనే ప్రశ్న ఉదయిస్తోంది. అనుకోని పరిస్థితుల్లో 33 రోజులు పాఠశాలను అదనంగా పెడితే పాఠశాలకు వచ్చిన విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అమలు చేస్తారా, దీనికి ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుందా అన్నది తేలాల్సి ఉంది. సమ్మె కాలంలో విధినిర్వహణలో పాల్గొన్న ఉపాధ్యాయులు మళ్లీ పనిచేయాలా అనే ప్రశ్న కూడా వస్తోంది. 177 జీవో ప్రకారం ఉపాధ్యాయులు సమ్మె చేయడానికి వీలు లేదని.. నో వర్క్, నో పే అమలులో ఉంటుందని గతంలో హైకోర్టు స్పష్టం చేసినట్లు టీచర్లు చెబుతున్నారు. సమైక్యాంధ్ర కోసం 33 రోజుల పని దినాల్లో ఉపాధ్యాయులు సమ్మె చేస్తే వారికి వేతనం చెల్లించేందుకు ప్రత్యేక జీవో విడుదల చేయాలని ముఖ్యమంత్రి విద్యాశాఖ డెరైక్టర్‌కు సూచన చేయటం, ఈ అంశంపై వారు న్యాయశాఖ వివరణ కోరటంతో ప్రత్యేక జీవో విడుదల ఆలస్యమైందనే వాదన వినిపిస్తోంది. న్యాయశాఖ ఈ అంశంపై పరిశీలన చేసిన అనంతరం సాధారణ పరిపాలనా విభాగానికి ఈ ఫైలు వెళ్లి ఆమోదం పొందిన తరువాతే ఉపాధ్యాయులకు వేతనాలు చెల్లించే అంశం కొలిక్కివచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. 2012 ఫిబ్రవరి 28న దేశవ్యాప్తంగా జరిగిన సమ్మెలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఆ ఒక్క రోజుకు సమ్మెలో పాల్గొన్న ఉపాధ్యాయులకు ఇంతవరకు వేతనం చెల్లించలేదు. దీని కారణంగా ఉపాధ్యాయులకు రావాల్సిన ఇంక్రిమెంట్లు, పే ఫిక్సేషన్ తదితర అంశాలన్నీ పెండింగ్‌లోనే ఉంచారు. ఒక్కరోజు సమ్మె చేస్తేనే ఇన్ని ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో 33 రోజుల సమ్మె కాలానికి ఉపాధ్యాయులకు వేతనం ఎలా చెల్లిస్తారు, దానికి సంబంధించి జీవో ఎలా విడుదల చేస్తారనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. సమ్మె విరమించేవరకు బుజ్జగించిన పాలకులు వేతనాలు చెల్లించే జీవో విడుదల విషయంలో ఎలా వ్యవహరిస్తారోనని ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. -
సమైక్యమే శ్వాసగా..
= పండగరోజూ ఉద్యమం = సమైక్యాంధ్ర ఆకాంక్ష చాటిన జిల్లావాసులు = విభజన నిర్ణయం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ = కొనసాగిన రిలేదీక్షలు జిల్లాలో విజయదశమి రోజూ సమైక్యాంధ్ర ఉద్యమం ఆగలేదు. సమైక్యవాదులు దసరా పండగనాడూ నిరసన కార్యక్రమాలు కొనసాగించి సమైక్యాంధ్ర ఆకాంక్షను చాటిచెప్పారు. రాష్ట్ర సమైక్యతను కాంక్షిస్తూ గొంతెత్తి నినదించారు. ప్రజలు రోడ్లపైకి వచ్చి తమ సమైక్య స్ఫూర్తిని చాటారు. జిల్లా వ్యాప్తంగా నిరాహారదీక్షలు, నిరసనలు కొనసాగాయి. సాక్షి, విజయవాడ : సమైక్యాంధ్ర ఉద్యమం జిల్లాలో దసరా పండగ రోజైన ఆదివారమూ కొనసాగింది. రాష్ట్రం సమైక్యంగా ఉండాలంటూ సమైక్యవాదులు నినాదాలు చేశారు. నిరాహారదీక్షలు, నిరసనలతో విభజన నిర్ణయంపై వ్యతిరేకత వ్యక్తం చేశారు. సమైక్యాంధ్ర ఆకాంక్షను చాటిచెప్పారు. మైలవరంలో ఎన్జీఓల ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు ఆదివారం 48వ రోజుకు చేరాయి. గుడివాడ నెహ్రూచౌక్ సెంటర్లో సమైక్యాంధ్ర కోరుతూ జేఏసీ ఆధ్వర్యంలో దీక్షలు కొనసాగుతున్నాయి. మల్లాయిపాలెం గ్రామైక్య మహిళలు దీక్షల్లో పాల్గొన్నారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ ఉద్యోగుల దీక్షలు కొనసాగుతున్నాయి. నందివాడ మండలం టెలిఫోన్ నగర్లో సమైక్యాంధ్ర కోరుతూ దీక్షలు కొనసాగాయి. సమైక్యం కోసం ప్రత్యేక పూజలు... రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుతూ కురుమద్దాలి శ్రీచెన్నకేశవస్వామి ఆలయంలో వైఎస్సార్ సీపీ నాయకురాలు ఉప్పులేటి కల్పన ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు. తిరువూరులో వైఎస్సార్సీపీ రిలేదీక్షలు 12వ రోజుకు చేరాయి. పార్టీ మండల, పట్టణ కన్వీనర్లు శీలం నాగనర్సిరెడ్డి, చలమాల సత్యనారాయణ ఆధ్వర్యంలో తిరువూరు తంగీళ్లబీడుకు చెందిన పార్టీ కార్యకర్తలు, పలువురు మహిళలు దీక్షలో పాల్గొన్నారు. పలువురు కార్యకర్తలు రిలేదీక్ష నిర్వహించారు. సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కంకిపాడు సబ్‌రిజిస్ట్రారు కార్యాలయం ఎదుట చేపట్టిన రిలే దీక్షలు 59వ రోజుకు చేరుకున్నాయి. దీక్షల్లో ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొన్నారు. కంకిపాడు సినిమాహాలు సెంటరులో జాతీయ రహదారిపై సమైక్యవాదులు రాస్తారోకో చేశారు. ఆర్టీసీ విద్యాధరపురం గ్యారేజీ కార్మికులకు తుమ్మల ఆంజనేయులు చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో నిత్యావసరాలు అందజేశారు. ఒంటికాలిపై నిలబడి... పామర్రు నాలుగు రోడ్ల కూడలిలో ఒంటికాలిపై నిలబడి సమైక్యవాదులు తమ నిరసన తెలిపారు. తొలుత ఏపీఎన్జీవో, జేఏసీ నాయకులు సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేస్తూ ప్రదర్శన నిర్వహించారు. పెదపారుపూడిలో ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే దీక్షలు ఆదివారం 51వ రోజుకు చేరాయి. గుడివాడ-కంకిపాడు రహదారి పక్కన మొక్కలు నాటి తమ నిరసన తెలిపారు. నూజివీడులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేస్తున్న రిలే దీక్షలు 48వ రోజుకు చేరాయి. ముసునూరు మండలం చింతలవల్లికి చెందిన పార్టీ నాయకులు రిలేదీక్షలో కూర్చున్నారు. ఈ దీక్షలను సమన్వయకర్త మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ప్రారంభించారు. పెడన పట్టణంలో మహాత్మాగాంధీ షాపింగ్ కాంప్లెక్స్‌లో పట్టణ ఐక్య కార్యాచరణ కమిటీ సభ్యులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. దిగ్విజయ్‌సింగ్ దిష్టిబొమ్మ దహనం... కలిదిండి సెంటరులో సమైక్యాంధ్రకు మద్దతుగా డ్వాక్రా మహిళలు రిలే దీక్ష చేశారు. అనంతరం కలిదిండి సెంటరులో దిగ్విజయ్‌సింగ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ముదినేపల్లి మండల సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు 28వ రోజుకు చేరాయి. ముదినేపల్లి అంగన్వాడీ సెక్టార్‌కు చెందిన కార్యకర్తలు దీక్షలో కూర్చున్నారు. అవనిగడ్డ నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలు కొనసాగుతున్నాయి. చల్లపల్లి జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలు 65వ రోజుకు చేరాయి. మోపిదేవి శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం ఎదురుగా చేపట్టిన రిలేనిరాహార దీక్షలు 42వ రోజుకు చేరాయి. ఈ దీక్షలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త సింహాద్రి రమేష్‌బాబు మద్దతు ప్రకటించారు. నాగాయలంకలో జేఏసీ, లయన్స్‌క్లబ్ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలు 47వ రోజుకు చేరుకున్నాయి. వక్కపట్లవారిపాలెం, బ్రహ్మానందపురం దళితవాడలకు చెందిన బాబూ జగ్జీవన్‌రామ్ యువజన సంఘం ఆధ్వర్యంలో దళితులు దీక్ష చేశారు. -
రోడ్డెక్కిన ప్రగతి రథ చక్రాలు
అనంతపురం అర్బన్, న్యూస్‌లైన్ : ఆర్టీసీ రథ చక్రాలు రోడ్డెక్కాయి. సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం సమ్మెబాట పట్టిన ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలం కావడంతో శనివారం నుంచి విధుల్లో చేరారు. జిల్లాలోని 12 డిపోల్లో ఉదయం 5.30 గంటల నుంచే బస్సులు తిరిగాయి. 74 రోజుల సమ్మె తర్వాత కార్మికులు రెట్టించిన ఉత్సాహంతో విధుల్లో కనిపించారు. అనంతపురంలో సీటీఎం మధుసూదన్, డీఎం రమణ నేతృత్వంలో బస్సుల కండీషన్‌ను చెక్ చేసి పంపించారు. బస్సుల కండీషన్ గురించి మెకానికల్ ఫోర్మన్ నారాయణస్వామిని అడిగి తెలుసుకున్నారు. అనంతపురం డిపో నుంచి మధ్యాహ్నం 12 గంటల సమయంలో 74 సర్వీసులు పంపాల్సి ఉండగా, 69 సర్వీసులను అందుబాటులోకి తెచ్చారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించారన్న సమాచారం తెలియగానే ప్రయాణికులు పెద్ద సంఖ్యలో బస్టాండ్‌కు చేరుకున్నారు. రెండున్నర నెలలపాటు కళావిహీనంగా ఉన్న బస్టాండ్ ఆవరణం ప్రయాణికుల రాకతో సందడిగా కనిపించింది. బస్టాండ్, డిపోను తనిఖీ చేసిన ఆర్ఎం అనంతపురం ఆర్టీసీ బస్టాండ్, డిపోను ఆర్ఎం జి.వెంకటేశ్వర రావు తనిఖీ చేశారు. డిప్యూటీ సీటీఎం మధుసూదన్, సీఐ వినయ్‌కుమార్, రాజవర్ధన్‌రెడ్డి నేతృత్వంలో ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది కలుగుకుండా ఏర్పాట్లు చేశారు. పాయింట్లలో సకాలంలో బస్సులు ఉంచేలా చర్యలు తీసుకున్నారు. ఆర్ఎం మాట్లాడుతూ రెండు నెలలుగా బస్సులు తిరగగపోవడం కండీషన్‌పై ప్రభావం ఉంటుందన్నారు. ఉదయం నుంచి 70 శాతం బస్సులను తిప్పామన్నారు. పూర్తిస్థాయిలో బస్సులు తిప్పేందుకు మరో మూడు రోజుల సమయం పడుతుందన్నారు. ఆర్టీసీ విలీనంపై సంబరాలు ఏపీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు రంగం సిద్ధమవడంతో కార్మికులు సంబరాలు చేసుకున్నారు. శనివారం అనంతపురం డిపో ఆవరణలో కార్మికులు యూనియన్లకతీతంగా బాణాసంచ పేల్చి ఆనందాన్ని పంచుకున్నారు. అనంతరం అధికారులు, కార్మికులు స్వీట్లు పంచుకున్నారు. కొంత మంది కార్మికులు నృత్యాలు చేశారు. జై సమైక్యాంధ్ర...జైజై సమైక్యాంధ్ర అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆర్టీసీ జేఏసీ నాయకులు ఖాన్, వీఎన్ రెడ్డి, సీఎన్ రెడ్డి, మాట్లాడుతూ ప్రభుత్వం ఆర్టీసీ విలీన ప్రక్రియను వంద రోజుల్లో పూర్తి చేయాలని కోరారు. సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం ఉద్యమాన్ని కొనసాగిస్తామన్నారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు ఆర్పీ రావు, వాసుదేవరెడ్డి, కొండయ్య, శ్రీనివాస్‌రెడ్డి, గోపాల్, రవీందర్, చెన్నారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘రాజీనామాలు చేయకపోతే సాంఘిక బహిష్కరణ’
చల్లపల్లి, న్యూస్‌లైన్ :సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం సీమాంధ్ర ప్రాంత కాంగ్రెస్ ఎంపీలు తమ పదవులకు రాజీనామాలు చేసి రాజకీయ సంక్షోభం సృష్టించాలని మాజీ అడ్వకేట్ జనరల్, సీమాంధ్ర న్యాయవాదుల జేఏసీ చైర్మన్ సీవీ మోహనరెడ్డి డిమాండ్ చేశారు. రాజీనామాలు చేయకపోతే వారిని సాంఘిక బహిష్కరణ చేయాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. అవనిగడ్డ బార్ అసోసియేషన్ సభ్యులు ఈ నెల ఐదో తేదీ నుంచి చేపట్టిన సమైక్యాంధ్ర పరిరక్షణ చైతన్య పాదయాత్ర ముగింపు కార్యక్రమం శనివారం రాత్రి స్థానిక ప్రధాన సెంటరులో సీనియర్ న్యాయవాది, బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు మత్తి వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. ఈ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మోహనరెడ్డి మాట్లాడుతూ సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ఎంపీలు దొంగల్లా తిరుగుతున్నారని విమర్శించారు. టీ-నోట్‌ను కేంద్ర క్యాబినెట్ ఆమోదించినంత మాత్రాన సరిపోదని, రాజ్యాంగపరంగా మరింత ప్రక్రియ జరగాల్సి ఉందని చెప్పారు. ఉద్యమంలో రైతులు, విద్యార్థులు భాగస్వాములైతేనే మరింత తీవ్రరూపం దాల్చుతుందన్నారు. శాంతియుతంగా ఉద్యమాలు చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ఉద్యమం హింసాత్మకంగా మారితేనే కేంద్రం కళ్లు తెరుస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. సాగునీటి సమస్యను ఎలా పరిష్కరిస్తారు? రాష్ట్ర విభజన జరిగితే సాగునీటి సమస్యను ఎలా పరిష్కరిస్తారో స్పష్టం చేయాలని మోహనరెడ్డి నిలదీశారు. కావేరీ జలాల సమస్య యాభయ్యేళ్లుగా రగులుతున్నా తాత్కాలిక పరిష్కారాలు చూపారే తప్ప శాశ్వతంగా పరిష్కరించకపోవడాన్ని గుర్తుచేశారు. ఈ సభలో ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ ఉపాధ్యక్షుడు కె.చిదంబరం, బార్ కౌన్సిల్ సభ్యులు కె.రవీంద్రకుమార్, జి.రామారావు, హైకోర్టు న్యాయవాది ఎంవీఎస్ ప్రసాద్, సన్‌ఫ్లవర్ విద్యాసంస్థల అధినేత ఎండీవీఎస్ఆర్ పున్నంరాజు, కేసీపీ సీఈవో జీ వెంకటేశ్వరరావు, బందరు, చల్లపల్లి జేఏసీ నేతలు బీ ప్రసాద్, దాసి సీతారామరాజు, అవనిగడ్డ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సనకా విజయగోపాలకృష్ణ, జెడ్పీ మాజీ ఉపాధ్యక్షుడు జీవీ రామకృష్ణ తదితరులు ప్రసంగించారు. -
వాడి తగ్గని ఉద్యమం
= వాడవాడలా ఆందోళనలు = కొనసాగిన వైఎస్సార్సీపీ, జేఏసీల దీక్షలు = ఉద్యమోధృతికి న్యాయవాదుల జేఏసీ పిలుపు సమైక్య సమ్మె విరమించి పలువురు విధుల్లోకి వెళ్లినా.. ఉద్యమ వేడి తగ్గలేదు. జిల్లా అంతటా ఎన్జీవోల జేఏసీ, వైఎస్సార్సీపీ, వివిధ వర్గాలు రోడ్లపైకొచ్చి సమైక్యాంధ్ర పరిరక్షణే లక్ష్యంగా ఉద్యమాన్ని ఉధృతంగా కొనసాగిస్తున్నారు. విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. సాక్షి, విజయవాడ : సమైక్యం కోసం జిల్లావ్యాప్తంగా ఆందోళనలు ఉధృతంగా కొనసాగుతున్నాయి. అసెంబ్లీకి విభజన బిల్లు వస్తే దానికి వ్యతిరేకంగా ఓటేస్తామని ఎమ్మెల్యేల నుంచి హామీ తీసుకునే కార్యక్రమం విజయవాడలో ఉద్రిక్తత కు దారితీసింది. ఎమ్మెల్యే యలమంచిలి రవి జేఏసీ సభలో వీరంగం సృష్టించారు. దీంతో పరిస్థితి తీవ్రంగా మారింది. మంత్రి పార్థసారథి కలుగజేసుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది. సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు జిల్లాలో ఆ పార్టీ కార్యకర్తలు, నేతల ఆధ్వర్యంలో కార్యక్రమాలు కొనసాగాయి. కైకలూరు వైఎస్సార్ సీపీ కార్యాలయం వద్ద పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో రిలే దీక్షలు శనివారం 67వ రోజుకు చేరాయి. హనుమాన్‌జంక్షన్‌లో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ దుట్టా రామచంద్రరావు ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగాయి. గన్నవరంలో పార్టీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు జరిగాయి. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నూజివీడులోని జంక్షన్‌రోడ్డులో నిర్వహిస్తున్న రిలేదీక్షలు 47వ రోజుకు చేరాయి. ఈ దీక్షలను వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ప్రారంభించారు. తిరువూరులో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలేదీక్షలు 11వ రోజుకు చేరాయి. తిరువూరు మండల, పట్టణ పార్టీ కన్వీనర్లు శీలం నాగనర్శిరెడ్డి, చలమాల సత్యనారాయణల ఆధ్వర్యంలో బోసు సెంటర్లో ఏర్పాటుచేసిన శిబిరంలో పలువురు నాయకులు రిలేదీక్షలు చేపట్టారు. జేఏసీ ఆధ్వర్యంలో దివిసీమలో చేపట్టిన దీక్షలు కొనసాగుతున్నాయి. నాగాయలంకలో రహదారులను దిగ్బంధించి వంటావార్పు చేశారు. రోడ్డుపైనే భోజనాలు చేశారు. చల్లపల్లిలో చేపట్టిన దీక్షలు 64వ రోజుకు చేరాయి. ముగిసిన న్యాయవాదుల యాత్ర... అవనిగడ్డ కోర్టుకు చెందిన న్యాయవాదుల సమైక్యాంధ్ర ైచైతన్యయాత్ర శనివారంతో ముగిసింది. ఈ సందర్భంగా చల్లపల్లిలో బహిరంగసభ నిర్వహించి, ఉద్యమంలో రైతులు, విద్యార్థులు చురుగ్గా పాల్గొనాలని, ఆందోళనలు తీవ్రతరం చేయాలని పిలుపునిచ్చారు. అవనిగడ్డలో చేపట్టిన దీక్షలు 52వ రోజుకు చేరాయి. ఘంటసాల, మోపిదేవి, కోడూరులో చేపట్టిన దీక్షలు కొనసాగుతున్నాయి. పామర్రు ఐకేపీ మహిళలు శనివారం రిలేదీక్షలలో పాల్గొన్నారు. అడ్డాడ అరవింద స్కూల్, జుఝవరం ఉషోదయ స్కూలు విద్యార్థులు నాలుగురోడ్ల కూడలిలో మానవహారంగా ఏర్పడి ట్రాఫిక్ స్తంభింపచేశారు. గుడివాడ నెహ్రూచౌక్ సెంటర్లో సమైక్యాంధ్రకు మద్దతుగా దీక్షలు కొనసాగాయి. జేఏసీ, మున్సిపల్ ఉద్యోగులు దీక్షలు నిర్వహించారు. గుడ్లవల్లేరులో సమైక్యాంధ్రను కాంక్షిస్తూ రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. శనివారం నాటి దీక్షలలో స్వశక్తి సంఘాల మహిళలు పాల్గొన్నారు. జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలు, వత్సవాయి మండలాల పరిధిలో సమైక్యాంధ్ర కోసం రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. పట్టణంలోని మున్సిపల్ కూడలి సమీపంలో జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దీక్షా శిబిరంలో ముస్లిం మైనార్టీలు కూర్చున్నారు. చంద్రబాబు దీక్షకు మద్దతుగా మైలవరంలో టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే దీక్షలు శనివారం ఆరో రోజుకు చేరుకున్నాయి. ఎన్జీఓల ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా నిర్వహిస్తున్న రిలే దీక్షలు 47వ రోజూ కొనసాగుతున్నాయి. కొండపల్లిలో నిర్వహిస్తున్న రిలే దీక్షలు శనివారం 17వ రోజుకు చేరుకున్నాయి. ఎట్టకేలకు 72 రోజుల ఉద్యమం తర్వాత జిల్లాలో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. -
విభజన సెగ
సాక్షి,విశాఖపట్నం: తెలంగాణ నోట్‌ను ఆమోదిస్తూ కేంద్రమంత్రివర్గం నిర్ణయానికి వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ 72గంటల బంద్‌కు పిలుపుతో పార్టీశ్రేణులు గ్రామగ్రామాన ఉద్యమించాయి. జిల్లాలో శుక్రవారం బంద్ విజయవంతమైంది. ఆందోళనలు ఆకాశాన్నంటాయి. రాస్తారోకోలతో దిక్కులుపిక్కటిల్లాయి. అంతటా ఆగ్రహజ్వాలలు ఎగసిపడ్డాయి. జిల్లాలో పల్లెలన్నీ కదిలాయి. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా కదం తొక్కాయి. రెండునెలలకుపైగా దీక్షలు,ఆందోళనలు చేస్తోన్న ఉద్యోగ,ఉపాధ్యాయ,విద్యార్థి జేఏసీలు కూడా ఉద్యమాన్ని ఉధృతం చేశాయి. సమైక్య ఛాంపియన్‌గా నిలిచిన వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలోనూ ఎక్కడికక్కడ నిరసన ప్రదర్శనలు జరిగాయి. ప్రజలు,దుకాణదారులు,హోటళ్లు,సినిమాహాళ్ల యాజమాన్యాలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. ప్రతి నియోజకవర్గంలోనూ ఉద్యమకారులు,వైఎస్సార్సీపీ నేతలు విభజనకు వ్యతిరేకంగా ఆందోళనలతో ఎక్కడికక్క నిరసనలు మిన్నంటాయి. నర్సీపట్నం,పాడేరులలోని మంత్రి బాలరాజు ఇళ్లను ఆర్టీసీ,ఉద్యోగ సంఘాల జేఏసీలు ముట్టడించాయి. ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేశాయి. నర్సీపట్నంలో వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఉమాశంకర్ గణేష్ ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ చేపట్టి అబీద్ సెంటర్లో మానవహారం నిర్వహించారు. గొలుగొండలో రహదారులను దిగ్బంధించారు. ఎస్బీఐ కార్యాలయానికి బయట తాళాలు వేసి లోపల విధులు నిర్వహిస్తుండడంతో కిటికీ అద్దాలు పగులగొట్టి ఆందోళనకారులు మూయించివేశారు. ఎమ్మెల్యే ఫ్లెక్సీలను ధ్వంసం చేసినవారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాకవరపాలెంలో రోడ్డుకు అడ్డంగా తాళ్లు కట్టి ద్విచక్రవాహనాలు కూడా వెళ్లకుండా అడ్డుకున్నారు. ఏజెన్సీలో బంద్ విజయవంతమైంది. పాడేరు డివిజన్లోని అన్ని మండలాల్లోనూ సమైక్యవాదులు వాహనాలను అడ్డుకున్నారు. మండల కేంద్రాల్లోని దుకాణాలు,వ్యాపార సంస్థలను స్వచ్ఛందంగా మూసివేశారు. వైఎస్సార్ సీపీ అరకు నియోజకవర్గ సమన్వయకర్తలు డాక్టర్ కుంబా రవిబాబు, కిడారి సర్వేశ్వరరావు, దొన్నుదొర, పాడేరు నియోజకవర్గ సమన్వయకర్తలు వంజంగి కాంతమ్మ, సీకరి సత్యవాణి, గిడ్డి ఈశ్వరిలతో పాటు నాయకులు, కార్యకర్తలు పాడేరు, అరకులోయల్లో ర్యాలీలు నిర్వహించారు. యలమంచిలిలోనూ సంపూర్ణబంద్ జరిగింది. ఇక్కడికి సమీపంలోని కొక్కిరాపల్లిలో ఉద్యమకారులు రైల్‌రోకో చేపట్టారు. సమైక్యవాదులు ఎమ్మెల్యే కన్నబాబు కారును అడ్డుకున్నారు. చోడవరంలో నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ సమన్వయకర్త బలిరెడ్డి సత్యారావు ఆధ్వర్యంలో ఆందోళనలు జరిగాయి. ఆయనతోపాటు పార్టీ జిల్లా కన్వీనర్ చొక్కాకుల వెంకట్రావు దీక్ష శిబిరాలను సందర్శించి సంఘీభావం తెలిపారు. మాడుగుల నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ సమన్వయకర్తలు పూడి మంగపతిరావు,బూడి ముత్యాల నాయుడు రిలే దీక్షలుప్రారంభించారు. అనకాపల్లిలో కొణతాల సమైక్యాంధ్ర పరిరక్షణ దీక్షలు,జేఏసీ దీక్షలకు సంఘీభావం ప్రకటించారు. వాణిజ్యకేంద్రమైన పట్టణంలో బంద్‌తో అంతా బోసిపోయింది. ఉద్యమకారులు జాతీయ రహదారిని ఎక్కడికక్కడ దిగ్బంధించారు. అరకులో ఏపీ ఎన్జీవోల రైల్‌రోకో ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. సినిమాహాళ్లు,బ్యాంకులు మూతపడ్డాయి. అరకులోయ, అనంతగిరి ప్రాంతాల్లో పర్యాటకులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పాయకరావుపేటలో వైఎస్సార్సీపీ,జేఏసీలు జాతీయరహదారిని దిగ్బంధించాయి. సమై క్యవాదులు గంగిరెద్దుకు సోనియా బొమ్మకట్టి ఊరేగించారు. నక్కపల్లిలో డీసీసీబీ మాజీ డెరైక్టర్ వీసం రామకృష్ణ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై ర్యాలీ నిర్వహించారు. చెంగల వెంకట్రావు ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు సూర్యమహల్ సెంటర్ నుంచి జాతీయ రహదారి వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు. -
దసరా ఢమాల్
విశాఖ రూరల్, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర ఉద్యమ ప్రభావం జిల్లాపై తీవ్రంగా చూపుతోంది. చిన్న దుకాణాల నుంచి షాపింగ్ మాల్స్ వరకు అన్నింటికి పెద్ద దెబ్బ తగిలింది. వ్యాపారులకు రౌ. కోట్లలో నష్టం వాటిల్లుతోంది. రెండు నెలలుగా జరుగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమం వల్ల పండగల నెలల్లో కూడా వ్యాపారాలు వెలవెలబోతున్నాయి. ఉద్యోగులకు జీతాలు లేకపోవడంతో వారి కుటుంబ పోషణ కష్టంగా మారింది. రోజూ నిరసనలు, ఆందోళనలు, బంద్‌లు ప్రభావం ప్రైవేటు ఉద్యోగులపై కూడా పడింది. దీంతో జిల్లాలో దసరా పండగ సందడి కనిపించడం లేదు. సాధారణంగా ఏటా దసరాకు రెండు వారాల ముందు నుంచే పండగ వాతావరణం కనిపిస్తుంటుంది. విశాఖతోపాటు జిల్లాలోని ప్రధాన జంక్షన్లు, షాపింగ్ మాల్స్ కొనుగోలుదారులతో కళకళలాడుతుండేవి. కానీ ఈ ఏడాది మాత్రం అటువంటి పరిస్థితులు లేవు. పండగకు పది రోజులే ఉన్నప్పటికీ షాపింగ్ సందడి లేకుండా పోయింది. వెయ్యి కోట్లు లావాదేవీలకు దెబ్బ ఉద్యమాల కారణంగా జిల్లాలో రూ.వెయ్యి కోట్లు లావాదేవీలకు దెబ్బ తగిలినట్టు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ఏటా దసరా పండగ సమయంలో ప్రధానంగా బంగారం, వస్త్ర, గృహోపకరణాల వ్యాపారం రూ.కోట్లలో జరుగుతుంది. రెండు వారాల్లో రూ.వెయ్యి కోట్లు మేర వ్యాపారం జరుగుతుందన్నది వ్యాపారుల అంచనా. కానీ ఈ ఏడాది మాత్రం 50 శాతం కూడా వ్యాపారాలు జరిగే అవకాశాలు కనిపించడం లేదు. జిల్లాలో సుమారుగా 35 వేల మంది ఉద్యోగులకు జీతాలు లేకపోవడంతో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఏటా మాదిరిగా ఈసారి మాత్రం ఆర్భాటంగా పండగను చేసుకొనే పరిస్థితులు లేవని చెబుతున్నారు. ప్రయివేట్ ఉద్యోగులు కూడా ఈ ఏడాది ఆర్భాటాలకు దూరంగా ఉంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో జిల్లాలో వ్యాపారాలు పూర్తిగా తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. రూ.కోట్లలో నష్టాలు వాటిల్లుతున్నా సమైక్యాంధ్ర ఉద్యమంలో వ్యాపారులు కూడా పాల్గొంటున్నారు. అసోసియేషన్ల వారీగా వస్త్ర, బంగారం, చిల్లర వర్తకులు, ఇలా అన్ని రకాల వ్యాపారులు బంద్‌లు నిర్వహిస్తున్నారు. దీంతో పెద్దగా వ్యాపారాలు జరగడం లేదు. జిల్లాలో ప్రతి చోటా ఉద్యమాలు జరుగుతుండడంతో ప్రజలు కూడా షాపింగ్‌లపై పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. పడిపోయిన పసిడి అమ్మకాలు జిల్లా వ్యాప్తంగా ఉన్న బంగారు, వెండి దుకాణాల్లో రోజుకు రూ.50 కోట్లకుపైగా అమ్మకాలు జరుగుతుంటాయి. కానీ ఉద్యమాల కారణంగా వ్యాపారాలు బాగా పడిపోయిన్నట్లు చెబుతున్నారు. పెళ్లిళ్ల సీజన్ సమయంలో బంగారం వ్యాపారులు సమ్మె చేయడం, ప్రస్తుతం సీజన్ లేకపోవడంతో రూ.100 కోట్లు వరకు అమ్మకాలు నిలిచిపోయాయని వర్తకులు చెబుతున్నారు. అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన బ్రాండెడ్ బంగారు దుకాణాలపై ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. రోజుకు ఆరేడు కోట్ల రూపాయలకుపైగా నష్టం వాటిల్లుతోందని ఈ రంగంపై ఆధారపడిన వారు అంచనా వేస్తున్నారు. వెలవెలబోతున్న వస్త్ర వ్యాపారం జిల్లాలో వస్త్ర వ్యాపారం కూడా డీలాపడింది. జిల్లా వ్యాప్తంగా సుమారు 5 వేలకుపైగా వస్త్ర వ్యాపార దుకాణాలున్నాయి. భారీ షాపింగ్ మాల్స్ సైతం ఉన్నాయి. రోజుకు రూ.5 కోట్లు వరకు అమ్మకాలు జరుగుతుంటాయి. దసరా సమయంలో రెట్టింపు వ్యాపారాలు జరుగుతాయి. ప్రస్తుతం కనీస వ్యాపారం కూడా జరగడం లేదు. దసరా దగ్గర పడుతున్నా ఇప్పటికీ వ్యాపారాలు పుంజుకోవడం లేదు. సాధారణంగా దసరా పండగకు రెండు వారాల ముందు నుంచే అన్ని షాపులు ఆఫర్లు ఇస్తుంటాయి. కానీ ఈ ఏడాది ఇప్పటి వరకు భారీ స్థాయిలో ఆఫర్లు గానీ, సందడి గాని లేదు. అమ్మకాలు అంతంత మాత్రంగానే జరుగుతుండడంతో వ్యాపారులు కూడా ఆర్భాటాల ఖర్చును తగ్గించుకోవాలన్న భావనలో ఉన్నారు. దసరాకు ఇంకా పది రోజులు సమయం ఉండడంతో వ్యాపారాలు పుంజుకోవచ్చని వ్యాపారులు ఆశాభావంతో ఉన్నారు. -
ప్రజా సంక్షేమమే జగన్ లక్ష్యం
సాక్షి, తిరుపతి: ప్రజాసంక్షేమమే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి లక్ష్యమని ఆ పార్టీ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి పేర్కొన్నారు. జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపుమేరకు ఆయన రెండు రోజుల నిరాహారదీక్షకు కూర్చు న్నారు. ఆయన మాట్లాడుతూ జైలు నుంచి జగన్మోహన్రెడ్డి విడుదలైనప్పటినుంచి ప్రజల మధ్య గడపుతున్నారని అన్నారు. సమైక్యాంధ్ర కోసం ఈ నెలలో పార్టీ చేపట్టాల్సిన కార్యక్రమాల కార్యాచరణను ప్రకటించారని తెలిపారు. రాష్ట్ర విభజన ప్రకటన వెలువడిన వెంటనే తమ పార్టీ ఎమ్మెల్యేలు పదవులకు రాజీనామా చేశారని అన్నారు. వీరి చర్యను టీడీపీ నేతలు విమర్శించడం హాస్యాస్పదంగా ఉందని తెలిపారు. 38 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉన్న చంద్రబా బు ఆలోచనలు మాత్రం పాతాళంలో ఉన్నాయని ఎద్దేవా చేశారు. మాజీ ఐఏఎస్ అధికారి వరప్రసాదరావు మాట్లాడుతూ విభజన జరిగితే సీమాంధ్ర తీవ్రంగా నష్టపోతుందని అన్నారు. చంద్రబా బు కాంగ్రెస్‌తో రహస్య పొత్తు పెట్టుకున్నారని తెలిపారు. తిరుపతి ఎమ్మెల్యే నిత్యం ప్రజల మధ్య గడుపుతున్నారని అన్నారు. పులుగోరు ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ ఆంధ్రలో జన్మించిన వాడేనని అన్నారు. కాంగ్రెస్ నాయకుడు హనుమంతరావు ప్రజల చేత దెబ్బలు తిన్న నాయకుడని తెలిపారు. సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు సమైక్యాంధ్ర కోసం ఎటువంటి ప్రయత్నాలు చేయడం లేదన్నారు. కాంగ్రెసు నాయకుడు సబ్బంహరి స్వప్రయోజనాల కోసం, వైఎస్సార్ కాంగ్రెస్‌పై వ్యాఖ్యలు చేస్తున్నారని తెలిపారు. పార్టీ నాయకుడు ఎస్కే.బాబు వ్యాఖ్యాతగా వ్యవహరించిన కార్యక్రమంలో పార్టీ నగర కన్వీనర్ పాలగిరి ప్రతాప్‌రెడ్డి, మహిళా కన్వీనర్ కుసుమ, బీసీ కమిటీ సభ్యులు ఎల్లయ్య, కట్టా జయరాంయాదవ్, సింగిల్ విండో మాజీ సభ్యుడు రామచంద్రారెడ్డి, ఆర్టీసీ జేఏసీ నాయకుడు చంద్రయ్య, పార్టీ నాయకులు మణ్యం చంద్రశేఖర్‌రెడ్డి, తొండమనాటి వెంకటేష్, కొమ్ము చెంచయ్య యాదవ్, చందూరాయల్, న్యాయవాది చంద్రశేఖర్, తిరుమలయ్య, వెంకటముని, నాగిరెడ్డి, ముద్రనారాయణ, శాంతారెడ్డి, గీత, సుశీలమ్మ, గీతారెడ్డి, ప్రమీల, గౌరి పాల్గొన్నారు. -
సంక్షోభంలో టెక్స్టైల్
సాక్షి, బెంగళూరు: సమైక్యాంధ్ర నినాదంతో రెండు నెలలుగా ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతున్న సమ్మె ఇక్కడి టెక్స్టైల్ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. బెంగళూరు చుట్టు పక్కల ఉన్న గార్మెంట్ ఫ్యాక్టరీలకు వచ్చే ఆర్డర్లు కూడా గణనీయంగా తగ్గిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ను విభజించడానికి సీడబ్ల్యుసీలో తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకిస్తూ రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాల్లో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి నిరసన కార్యక్రమాలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సమ్మె ప్రభావం కర్ణాటకలోని వివిధ ప్రాంతాలతో పాటు ముఖ్యంగా బెంగళూరు కేంద్రంగా నడుస్తున్న టెక్స్టైల్ రంగంపై కూడా పడింది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, కడప జిల్లాల్లోని కదిరి, పులివెందుల, అనంతపురం జిల్లా కేంద్రం, హిందూపురం తదితర ప్రాంతాలకు చెందిన వస్త్ర వ్యాపారులు బెంగళూరులో హోల్‌సేల్ ధరలకు వస్త్రాలు కొనుగోలు చేసి అక్కడి వారాంతపు సంతల్లో, చిన్నచిన్న దుకాణాల్లో రీటైల్‌గా అమ్ముతుంటారు. ఇక కదిరిలోని వస్త్ర వ్యాపారులైతే వారానికి ఒకసారి బెంగళూరుకు వచ్చి ఇక్కడి గాంధీనగర్, కమర్షియల్ స్ట్రీట్ తదితర చోట్ల దుస్తులను కొనుగోలు చేసి తీసుకెళుతుంటారు. అయితే సమ్మె కారణంగా కదిరి, పులివెందుల, హిందూపురం, అనంతపురం జిల్లాకేంద్రం ప్రాంతాల్లోని దుకాణాలు వుూతపడటం వల్ల బెంగళూరులోని హోల్‌సేల్ మార్కెట్లో దుస్తులు కొనుగోలు బాగా తగ్గిపోయింది. దీంతో బెంగళూరులోని హోల్‌సేల్ వస్త్ర వ్యాపారులకు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే వ్యాపార వాటాలో కోత పడింది. ఇక సమ్మె ప్రభావం మొదట్లో ఇక్కడి గార్మెంట్ ఫ్యాక్టరీలపై అంతగా పడకున్నా ఇప్పుడిప్పుడే ఆ తీవ్రత పెరుగుతోంది. ఇక్కడి గార్మెంట్ ఫ్యాక్టరీలకు వచ్చే ఆర్డర్లలో రాయలసీమ జిల్లాలతో పాటు విజయవాడ, విశాఖపట్టణం తదితర ప్రాంతాల వాటా ఎక్కువగా ఉంది. అయితే సమైక్యాంధ్ర సమ్మె కారణంగా ఆయా ప్రాంతాల్లో వ్యాపారాలు స్తంభించడంతో ఇక్కడి గార్మెంట్ యూనిట్లకు ఆర్డర్ల సంఖ్య బాగా తగ్గుతోంది. రవాణా వ్యవస్థ స్తంభించడమూ కారణమే... సమ్మె ప్రభావం టెక్స్టైల్ రంగంపై పడటానికి రవాణా వ్యవస్థ స్తంభించడం కూడా ఒక కారణమనే వాదన వినిపిస్తోంది. చిరు వ్యాపారులు తాము కొనుగోలు చేసిన దుస్తుల రవాణాకు సాధారణంగా కేఎస్ ఆర్టీసీ, ఏపీఎస్ ఆర్టీసీ బస్సులనే వాడుతుంటారు. అయితే రెండు నెలలుగా ఇక్కడి కేఎస్ ఆర్టీసీ, ఏపీఎస్ ఆర్టీసీ బస్సులు ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్లడం లేదు. కొనుగోలు చేసిన వస్త్రాల రవాణాకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతుండటం కూడా టెక్స్టైల్ రంగంపై ప్రభావం చూపడానికి మరో కారణం. ఈ విషయంపై హోల్‌సేల్ వస్త్రవ్యాపారి సయ్యద్ ఖురేషి సాక్షితో మాట్లాడుతూ.... ‘సమైక్యాంధ్ర కోసం జరుగుతున్న సమ్మె వల్ల ఇక్కడి నుంచి ఏపీఎస్, కేఎస్ ఆర్టీసీ బస్సులు ఆంధ్రవైపు వెళ్లడం లేదు. చిరు వస్త్రవ్యాపారులకు ప్రైవేటు వాహనాల్లో రవాణా చేసే స్తోమత ఉండదు. అందువల్ల కూడా వారు ఇక్కడ దుస్తులను కొలుగోలు చేయడం నిలిపివేశారు’ అని తెలిపారు. కాగా, ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలకు బస్సులు న డపక పోవడంతో ఈ రెండు నెలల్లో కేఎస్ ఆర్టీసీ రోజుకు సగటున రూ.40 లక్షల ఆదాయం కోల్పోవడంతో మొత్తం రూ.24 కోట్ల ఆయానికి గండి పడింది. ఇక బెంగళూరు నుంచి ఏపీకి బస్సులను నడుపుతున్న ఏపీఎస్ ఆర్టీసీ కూడా రూ.6 కోట్ల ఆదాయాన్ని కోల్పోయింది. -
ఉద్యమానికి కొత్త ఊపు
చోడవరం,న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర ఉద్యమాన్ని గ్రామస్థాయి నుంచి ఉధృతం చేయడానికి క్రమశిక్షణతో అంతా పనిచేయాలని అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గం వైఎస్సార్సీపీ పరిశీలకుడు జ్యోతుల నెహ్రూ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. జిల్లాస్థాయి విస్తృత సమావేశం చోడవరం లో ఆదివారం జరిగింది. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వందలాదిమంది నాయకులు, కార్యకర్తలతో పట్టణంలో సం దడి సంతరించుకుంది. ఉత్తరాంధ్ర జిల్లాల రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త సుజయ్‌కృష్ణ రంగారావు తొలుత మహానేత వైఎస్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పిం చారు. జిల్లా కన్వీనర్ చొక్కాకుల వెంకట్రావు అధ్యక్షతన జరి గిన కార్యక్రమంలో జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ టీడీపీ, కాంగ్రెస్ నాయకులు ప్రాంతాల వారీగా పూటకో విధంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలన్న లక్ష్యంతో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్యమానికి శ్రీకారం చుట్టారన్నారు. ఉద్యమం మరిం త ఉధృతానికి ఈనెల రెండో తేదీ నుంచి నియోజకవర్గాలు, మండలాల వారీగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిరసనలు, దీక్షలు చేపట్టాలని పిలుపునిచ్చారన్నారు. మంత్రి గంటా శ్రీనివాసరావు రాజీనామా డ్రామాతీరు సిగ్గుచేటుగా ఉందని విమర్శించారు. చంద్రబాబునాయుడు రెండు కళ్ల సిద్ధాంతో వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. పోలవరం ప్రాజెక్టు విశాఖజిల్లాకు ఎంతో అవసరమని, దీనిని పరిరక్షించుకోవడానికి రాష్ట్రం సమైక్యంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. సమావేశం పరిశీలకుడు పుచ్చా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ఇందిరాగాంధీ రాష్ట్రాల సమైక్యం కోసం పోరాడితే,స్వార్థ రాజకీయంతో సోనియా గాంధీ ఆంధ్రప్రదేశ్ విభజనకు చర్యలు చేపట్టారన్నారు. కేంద్రపాలకమండలి సభ్యుడు కుంభా రవిబాబు మాట్లాడుతూ వైఎస్ రాష్ట్రాన్ని అభివృద్ధిచేసి సమైక్యంగా ఉంచితే టీడీపీ, కాంగ్రెస్, బీజేపీలు రాష్ర్ట ప్రజలతో ఆటలాడుతూ విభజనకు పూనుకున్నాయని విమర్శించారు. సమైక్యాంధ్ర కోసం అంతా సమిష్టిగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు నెలరోజుల పోరాటానికి ప్రణాళిక రూపొందించారు. అన్ని నియోజకవర్గాల్లో ఆందోళనలు, దీక్షలు గురించి విస్తృతంగా చర్చించారు. సమావేశంలో నియోజకవర్గాల సమన్వయకర్తలు బోకం శ్రీనివాసరావు, చెంగల వెంకట్రావు, పూడి మంగపతిరావు, బూడిముత్యాలనాయుడు, వంజంగి కాంతమ్మ, ప్రగడ నాగేశ్వరరావు, బొడ్డేడ ప్రసాద్, పెట్ల ఉమాశంకరగణేష్, కోరాడ రాజబాబు, గిడ్డి ఈశ్వరి, సీకరి సత్యవేణి, జిల్లా మహిళా విభాగం కన్వీనర్ పీలా వెంకటలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే మిలట్రీనాయుడు, మాజీమంత్రి ఎం. బాలరాజు, పార్టీ నాయకులు పీలా ఉమారాణి, నాయకులు డాక్టర్ బండారు సత్యనారాయణ, పీవీఎస్ఎన్ రాజు, కాండ్రేగుల జగదీష్, పీవీజే కుమార్, నీలం శారద, తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రాన్ని విభజిస్తే వందేళ్లు వెనక్కే..
రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సమైక్యవాదులు ఆందోళనలు ఉధృతంగా కొనసాగిస్తున్నారు. మానవహారాలు, వంటావార్పులు, వినూత్న నిరసనలు 61వ రోజూ జిల్లా అంతటా కొనసాగాయి. 13 జిల్లాల రవాణా ఉద్యోగుల జేఏసీ విజయవాడలో సమావేశమై ఉద్యమాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించింది. సాక్షి, విజయవాడ : రాష్ట్రాన్ని విడదీస్తే అభివృద్ధి వందేళ్లు వెనక్కి పోతుందని, సీడబ్ల్యూసీ తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని సమైక్యవాదులు డిమాండ్ చేశారు. సమైక్యంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. సమైక్యాంధ్ర ఉద్యమం 61వ రోజైన ఆదివారం కూడా జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. మైలవరంలో సహస్ర సకల జనుల నిరాహార దీక్ష నిర్వహించారు. ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని తమ నిరసన తెలిపారు. విజయవాడలో 13 జిల్లాల రవాణా జేఏసీ సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఉద్యమాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించారు. జగ్గయ్యపేటలో జేఏసీ ఆధ్వర్యంలో దీక్షలో కూర్చున్న ముస్లింలకు వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను సతీమణి విమలాభాను మద్దతు తెలిపారు. ఉద్యోగ జేఏసీ నాయకులు చెప్పులు కుట్టి రాష్ట్ర విభజన నిర్ణయంపై తమ నిరసన వ్యక్తం చేశారు. విడదీస్తే వలసలే.. కైకలూరు జేఏసీ నాయకులు తెలంగాణ విడదీస్తే వలసలు ఏ విధంగా ఉంటాయనే చూపించడానికి తట్టా బుట్టలతో ప్రదర్శన చేశారు. తిరువూరులో గీతకార్మికులు ప్రదర్శన జరిపారు. గన్నవరంలో బ్రాహ్మణ పరిషత్ ఆధ్వర్యంలో గోపూజ, రిలే దీక్షలు చేశారు. గుడివాడ నెహ్రూచౌక్ సెంటర్లో కాపుసేవాసమితి నాయకులు దీక్షల్లో పాల్గొన్నారు. పామర్రు నాలుగు రోడ్ల కూడలిలో జాతీయ రహదారిపై జై సమైక్యాంధ్ర అంటూ రంగులతో అలంకరించి ఉపాధ్యాయులు నిరసనలు తెలిపారు. రైతులు ట్రాక్టర్లతో ప్రదర్శన నిర్వహించి ట్రాఫిక్‌ను స్తంభింపజేశారు. స్థానిక కొబ్బరితోటలోని మహిళలు ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. కోలవెన్నులో సమైక్యవాదులు అర్ధనగ్న ప్రదర్శన చేశారు. కృత్తివెన్నులో జేఏసీ నాయకులు డప్పులు కొడుతూ ఈ దరువు ఢిల్లీ పెద్దల తలుపులు తెరవాలని ఆకాంక్షిస్తూ నిరసన తెలిపారు. పెడన జేఏసీ ఆధ్వర్యంలో వస్త్ర వ్యాపార సంఘాల నాయకులు రిలే దీక్ష చేపట్టారు. కృత్తివెన్ను జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే దీక్షా శిబిరాన్ని వైఎస్సార్సీపీ రైతువిభాగం రాష్ట్ర కన్వీనర్ ఎంవీఎస్ నాగిరెడ్డి సందర్శించి సంఘీభావం తెలిపారు. కంచికచర్లలో ఏపీ ఎన్జీవోలు, ఉపాధ్యాయులు, ఆర్టీసీ ఉద్యోగులు సంయుక్తంగా మండల పరిషత్ కార్యాలయం ఎదురుగా ఉన్న ఇందిరాగాంధీ బొమ్మ వద్ద మాక్ అసెంబ్లీ నిర్వహించారు. చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో పెద్ద గాంధీబొమ్మ సెంటర్లో ఒకరోజు రిలేదీక్ష చేశారు. చల్లపల్లి మండలం వక్కలగడ్డ విద్యార్థులు చిన్నగాంధీబొమ్మ సెంటర్లో డప్పు వాయిద్యం, విన్యాసాలతో వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. మోపిదేవిలో శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి ఆలయం ఎదుట ప్రధాన జాతీయ రహదారిపై గొర్రెల మందతో నిరసన తెలిపారు. రైల్వేస్టేషన్ రోడ్డులో గల సీఎస్ఐ క్రైస్ట్ చర్చి సభ్యులు రోడ్డుపైనే సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. సునీతా టవర్స్ రెసిడెన్సీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 72 గంటల రిలేదీక్షలు ముగిశాయి. మచిలీపట్నం కోనేరుసెంటర్‌లో అధ్యాపకులు, ఉపాధ్యాయులు, కంప్యూటర్ సెంటర్ల నిర్వాహకులు దీక్షలో పాల్గొన్నారు. నందిగామలో పూలు, టీ విక్రయిస్తూ వైఎస్సార్ సీపీ నేతలు నిరసన తెలిపారు. సోనియాకు నీవైనా చెప్పంటూ ముస్లిం యువకులు ఇందిరమ్మ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. -
ఒకే తాటిపై ఉద్యమిద్దాం
తిరుపతి(మంగళం), న్యూస్‌లైన్: టీటీడీ ఉద్యోగ సంఘాలన్నీ వర్గాలను ప క్కనపెట్టి ఒకే తాటిపైకి వచ్చి సమైక్యాంధ్ర కోసం ఉద్యమించాలని టీటీడీ రిటైర్డ్ టెంపుల్ డెప్యూటీ ఈవో ఆర్.ప్రభాకరరెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం తిరుపతిలోని టీటీడీ మాధవం సముదాయంలో టీటీడీ ఉద్యోగ సంఘాల నాయకులు సమావేశం జరిగింది. ప్రభాకరరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరిగితే సీమాంధ్రలోని ఆరుకోట్ల మంది పరిస్థితి అధోగతిపాలవుతుందని తెలిపారు. టెంపుల్ డెప్యూటీ ఈవో చిన్నంగారి రమణ మాట్లాడుతూ ప్రపంచ దేశాల్లోనే టీటీడీకి ప్రత్యేక గుర్తింపు ఉందని, సమైక్యాంధ్ర కోసం టీటీడీ ఉద్యోగ సంఘాలన్నీ కలసికట్టుగా పోరాడితే రాష్ట్ర విభజనే ఉండదని అన్నారు. విభజన జరిగితే సీమాంధ్ర ప్రజలకు తాగు, సాగునీరు ఉండదని, ఉన్నత విద్యను అభ్యసించిన యువతకు ఉద్యోగావకాశాలు లేక కూలి పనులు చేసుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. భావితరాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని టీటీడీ ఉద్యోగులు సమైక్యాంధ్ర కోసం ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఉద్యమాలు చేసేటప్పుడు శ్రీవారి భక్తులకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. టీటీడీలోని సమస్యలపైనా ఇలాగే కలసికట్టుగా పోరాడాలని టీటీడీ ఉద్యోగ సంఘాల నాయకులు కోరారు. రాష్ట్ర సమైక్యత కోసం టీటీడీ ఉద్యోగ సమైక్యాంధ్ర జేఏసీ కన్వీనర్‌గా ఆర్.ప్రభాకరరెడ్డిని ఉద్యోగ సంఘాల నాయకులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో అడిషనల్ సీవీఎస్వో శివకుమార్‌రెడ్డి, టీటీడీ పీఆర్వో రవి, శ్రీనివాసం ఏఈవో లక్ష్మీనారాయణయాదవ్, ఈఈ వెంకటేశ్వర్లు, టీటీడీ ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
ఉవ్వెత్తున గర్జన
చోడవరం, న్యూస్‌లైన్: నడినెత్తిన భానుడు మండిస్తున్నా సమైక్య పోరాట స్ఫూర్తి అవధుల్లేని ఉత్సాహాన్నిచ్చింది... ప్రభుత్వ అనుచిత నిర్ణయం ఆవేదన కలిగిస్తున్నా ఉద్యమ దీక్ష ఉత్తేజాన్ని ఇనుమడింపజేసింది. కష్టాలు వేధిస్తున్నా, సమస్యలు బాధిస్తున్నా సమరోత్సాహం ప్రజానీకాన్ని పురోగమింపజేసింది. చోడవరంలో బుధవారం జరిగిన లక్ష గళ గర్జన సభలో ఈ ఆవేశం అడుగడుగునా కనిపించింది. జనం అణువణువునా సమైక్యభావం ఉప్పొంగిపోయింది. ప్రతి గొంతులో సమర నినాదం మార్మోగిపోయింది. వేలాది మంది చేసిన సింహనాదంతో చోడవరం పట్టణం హోరెత్తింది. ఉద్యమంతో మమేకం ఎండ మండిపోతున్న లెక్క చేయకుండా కార్మికులు, కర్షకులు, రైతు కూలీలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు సమైక్య ఉద్యమానికి అండగా కదిలారు. సభ లో పాల్గొనడానికి మేమంటేమేమని ముందుకొచ్చారు. విద్యార్థులు, కళాకారులు రకరకాల సాం స్కృతిక ప్రదర్శనలతో ఉద్యమావేశాన్ని రగిలిం చారు. చేతుల్లో సమైక్య జెండాలు రెపరెపలాడుతూ ఉంటే అంతా హైస్కూల్ మైదానానికి తర లి వచ్చారు. మేళ తాళాలతో, ఎడ్ల బళ్ల ర్యాలీలతో, ప్లకార్డుల ప్రదర్శనలతో సమైక్య దీక్షను చాటిచెప్పారు. సభావేదికకు వచ్చే దారులన్నీ జనసమూహంతో నిండిపోగా, స్టేడియంలో జనం కిటకిటలాడారు. విజ్ఞాన్, చలపతి, రవి, ఆడమ్స్, మహతి, ఉషోదయ, రవీంద్రభారతి, ఫోర్ ఎస్, గాయత్రి, తదితర పాఠశాలలు, కళాశాల విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. జన చైతన్య మండలి జజ్జనకరి జనారే నృత్య గీతాలాపన సమైక్య వాదులను రంజింపచేసింది. ‘ అమ్మా సోనియమ్మా.. మా ఇండియాకు వచ్చిన ఇటలీ బొమ్మా..’ అనే జానపదగీతం అందరినీ ఉర్రూతలూగించింది. ఇటీవలి కాలంలో ఎప్పుడూ లేని విధంగా ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు మించినా, గొంతు తడారి పోతున్నా ఉత్సాహం ఆద్యంతం కొనసాగింది. మధ్యాహ్నం రెండు గంటలు దాటినా గ్రౌండులో జనం కదలకుండా నిలబడి సమైక్యాంధ్రకు సమర్ధనగా నినదిస్తూ ఉంటే ఆ దీక్ష అద్వితీయమనిపించింది. జన ప్రవాహం : సభకు చోడవరం నుంచి, పరిసర మండలాల నుంచి ప్రజానీకం వాహనాలపైన, పాదయాత్రలతో కెరటాల్లా తరలివచ్చారు. అడుగడుగునా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలకు హృదయ పూర్వకంగా స్పందించారు. రైతులు, కూలీలు పొలం పనులను మానుకుని ఉద్యమ సభకు హాజరయ్యారు. -
సకలం బంద్
సాక్షి, నెల్లూరు: సమైక్యాంధ్ర కోసం ఎన్జీఓల పిలుపు మేరకు మంగళవారం జిల్లాలో బంద్ విజయవంతమైంది. రోడ్లు నిర్మానుష్యమయ్యాయి. విద్యా సంస్థలు, దుకాణాలు, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు స్వచ్ఛందంగా మూసివేశారు. జేఏసీ నేతలు ఉదయం నుంచే రోడ్లమీదకు వచ్చి బంద్‌ను పర్యవేక్షించారు. జాతీయ రహదారిపై రాస్తారోకోలు నిర్వహించి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. నగరంలో బైక్ ర్యాలీ, మానవహారం నిర్వహించారు. సాధారణ జన జీవనం స్తంభించింది. సమైక్యాంధ్ర జెండాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. జిల్లాలో 56వ రోజు సమైక్యాంధ్ర ఉద్యమం కొనసాగింది. బంద్‌కు రెవెన్యూ అసోసియేషన్ నాయకులు సంఘీభావం తెలుపుతూ కలెక్టరేట్ నుంచి బైపాస్ రోడ్డు వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. నూర్‌బాషా దూదేకుల సంఘం వారు గాంధీబొమ్మ సెంటర్లో దూది ఏకుతూ వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. మాజీ కార్పొరేటర్ ఆనం జయకుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో కొండాయపాళెం గేటు నుంచి ఆత్మకూరు బస్టాండ్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో ఈ నెల 26 నుంచి బస్సు యాత్ర నిర్వహించనున్నట్టు ఏజేసీ పెంచలరెడ్డి తెలిపారు. నగరంలో ఎన్జీఓల ఆధ్వర్యంలో అయ్యప్పగుడి ఎదుట రాస్తారోకో నిర్వహించారు. వెంకటగిరి నియోజక వర్గంలోని డక్కిలి, సైదాపురం మండలాల్లో ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. నాయీ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో సైదాపురంలో మంగళవాయిద్యాలతో ర్యాలీ నిర్వహించారు. ఆత్మకూరులో జేఏసీ ఆధ్వర్యంలో బస్టాండ్ సెంటర్లో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఎన్జీఓ, ఉపాధ్యాయ, ఉద్యోగ కార్మిక జేఏసీ ఆధ్వర్యంలో బంద్ పాటించారు. ఎన్జీఓ ఆధ్వర్యంలో పట్టణంలో పొట్టి శ్రీరాములు విగ్రహం నుంచి నెల్లూరుపాళెం సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. కలిగిరిలో జేఏసీ ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. దుత్తలూరులో బంద్ నిర్వహించి ప్రైవేటు వాహనాలను నిలిపివేసి రాష్ట్ర విభజనకు నిరసనగా సమైక్యవాదులు నినాదాలు చేశారు. సీతారామపురంలో జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న దీక్షలో చిన్నారులు పాల్గొన్నారు. గూడూరులో సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. దుకాణదారులు దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేసి బంద్ పాటించారు. జేఏసీ నాయకులు బ్యాం కులను మూయించారు. మోటారు సైకిళ్లపై తిరుగుతూ జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. అర్ధనగ్నం గా మోకాళ్లపై నిలుచుని నిరసన వ్యక్తం చేశారు. జర్నలిస్టులు రాస్తారోకో నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ కోట, వాకాడు, చిట్టమూరు మండలాల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో కోటలో రిలే నిరాహారదీక్షలు కొనసాగాయి. వంటావార్పు నిర్వహించి సామూహిక భోజనాలు చేశారు. పొదలకూరులో సమైక్యవాదులు తలపెట్టిన బంద్ విజయవంతం అయ్యింది. నాయీబ్రాహ్మణులు ప్రదర్శన నిర్వహించారు. తహశీల్దార్, ఎంపీడీఓ, ఎంఈఓలు సంఘీభావం తెలి పారు. మనుబోలులో బంద్ పాటిం చారు. సమైక్య విద్యార్థి జేఏసీ, వైఎస్సార్ సీపీ కార్యకర్తల ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై ప్రదర్శన, రాస్తారోకో నిర్వహించారు. సూళ్లూరుపేటలో 46వ రోజు రిలే నిరాహాదీక్షలు కొనసాగాయి. శ్రీహరికోటలోని జిల్లా పరిషత్ హైస్కూల్ ఉపాధాయులు దీక్షలో పాల్గొన్నారు. పట్టణంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో సంపూర్ణంగా బంద్ నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, స్కూళ్లు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను మూయించారు. పట్టణంలోని మోటార్ మెకానిక్‌లు మోటార్‌సైకిళ్లతో, డ్రైవర్ సంఘం ఆధ్యర్యంలో కార్లతో ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. తడ జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహణతో పాటు బంద్ పాటించి జాతీయరహదారిపై రాస్తారోకో నిర్వహించారు. నాయుడుపేట జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు కొనసాగుతున్నాయి. అన్ని వ్యాపార సంఘాలు సంఘీభావంగా ప్రదర్శన నిర్వహించాయి. బుచ్చిరెడ్డిపాళెంలో వైఎస్సార్ విగ్రహ కూడలి వద్ద జేఏసీ నాయకులు వంటావార్పు నిర్వహించారు. దీంతో భారీ సంఖ్యలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కోవూరు ఎన్జీఓ హోంలో ఎమ్మార్పీఎస్ నాయకుల దీక్షలు సాగుతున్నాయి. లేగుంటపాడులో యువకుల నిరాహార దీక్ష చేపట్టారు. కావలిలో చేపట్టిన బంద్ ప్రశాంతంగా ముగిసింది. ప్రభుత్వ ఉద్యోగ జేఏసీ, ఆర్టీసీ జేఏసీ, సమైక్యాంధ్ర జేఏసీల ఆధ్వర్యంలో బంద్‌ను పర్యవేక్షించారు. నియోజకవర్గంలోని బోగోలు, దగదర్తి, అల్లూరు మండలాల్లో కూడా బంద్ ప్రభావం కనిపించింది.