special story
-
బందరు బంగారు తీగ
అసలు కన్నా వడ్డీ ముద్దు.. ఒరిజినల్ కన్నా ఇమిటేషన్ ఇంపు! అందుకే.. బంగారం మిన్నుకేసి మిడిసిపడుతుంటే.. మార్కెట్లో మెరుస్తూ రోల్డ్‌గోల్డ్ ఆభరణప్రియులను ఆకట్టుకుంటోంది! గోల్డ్ స్థానాన్ని ఆక్రమిస్తూ తన వన్నె పెంచుకుంటోంది! అలాంటి గిల్టునగలకు మేలిమి చిరునామా ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నం!! సామాన్యులతోపాటు ధనికులనూ ఆకర్షిస్తున్న మచిలీపట్నం రోల్డ్‌గోల్డ్ జ్యూల్రీపై ప్రత్యేక కథనం..ఎస్.పి. యూసుఫ్, సాక్షి, మచిలీపట్నం. మచిలీపట్నంలోని ఇమిటేషన్ జ్యూల్రీకి సారేపల్లి సాంబయ్య పోతపోశారు. రోజురోజుకు బంగారం ధర పెరిగిపోతున్న కారణంగా ప్రత్యామ్నాయం వైపు దృష్టిసారించారాయన. బంగారం, రాగి లోహాలతో ‘కట్టు’ పద్ధతి ద్వారా నగల తయారీని ప్రారంభించారు. తక్కువ ధరకే లభించడం, వన్నె తగ్గకుండా ఏళ్లపాటు మన్నడంతో నాడు అది లకలపూడి బంగారంగా పేరుపొందింది. తర్వాతర్వాత బంగారం, రాగితో కాకుండా వేరే మెటల్‌తో ముక్కు పుడక దగ్గర్నుంచి ఒడ్డాణం దాకా పలు రకాల నగలను పలు రకాల డిజైన్స్‌లో తయారుచేసి, బంగారు వర్ణం రేకుతో తాపడం పెట్టసాగారు. రోజువారీ ఉపయోగం నుంచి శుభకార్యాలు, ప్రత్యేక వేడుకల వరకు అన్ని సందర్భాలకు అవసరమయ్యే నగలను తయారుచేస్తారు. ట్రెండ్‌కి తగ్గ డిజైన్స్‌తో మెరుపులో అసలు బంగారానికే మాత్రం తీసిపోని ఈ గిల్టు నగలకు మార్కెట్లో డిమాండ్ కూడా పెరుగుతూ వస్తోంది. జీవం పోసిన వైఎస్సాఆర్వైఎస్ రాజశేఖర రెడ్డి సీమ్ అయ్యాక ఈ పరిశ్రమకు జీవం పోశారు. ఎమ్మెస్సెమ్ఈలో దీన్నో క్లస్టర్‌గా గుర్తించి, ఏపీఐఐసీ ద్వారా అభివృద్ధి చర్యలు చేపట్టారు. ఈ నగల పరిశ్రమల కోసం మచిలీపట్నంలో 48 ఎకరాల భూమిని కేటాయించి, జ్యూల్రీ పార్క్‌గా మలచారు. ప్రస్తుతం ఇక్కడ 236 పరిశ్రమలు న్నాయి. ప్రత్యక్షంగా మూడువేల మంది ఉపాధి పొందుతు న్నారు.ఈ జ్యూల్రీ తయారీ మచిలీ పట్నంతో పాటు పెడన, పామర్రు, అవనిగడ్డ వంటి 40కి పైగా గ్రామాల్లో విస్తరించడంతో సుమారు 30వేల మంది ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. ఈ రంగాన్ని ఆదుకునేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్ సబ్సిడీపై విద్యుత్‌ను అందించారు. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు సీఎమ్ అయ్యాక .. ఏడు రూపాయలున్న యూనిట్ ధరను రూ.3.25 పైసలకే ఇచ్చారు.దేశవిదేశాలకు బందరు బంగారు తీగమామూలు నగలే కాకుండా ఆలయాల్లోని విగ్రహాల కిరీటాలు తదితర సామాగ్రి, భరతనాట్యం, కూచిపూడి నాట్య ప్రదర్శనలకు అవసరమైన ఆహార్యంలోని హారాలు, ఒడ్డాణాలు, డ్రామా కంపెనీల ఆభరణాల సెట్లనూ తయారుచేస్తారిక్కడ. 2007లో రూ. 30 కోట్లున్న ఈ పరిశ్రమ టర్నోవర్ జ్యూల్రీ పార్క్ ఏర్పాటు తర్వాత పుంజుకుని, ఐఎస్ఓనూ పొందింది. ప్రస్తుతం దీని టర్నోవర్ రూ. 100 కోట్లకు పైమాటే! బందరు రోల్డ్‌గోల్డ్ నగలకు ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఒరిస్సా మొదలైన రాష్ట్రాల్లోనూ డిమాండ్ ఉంది. అంతేకాదు శ్రీలంక, మాల్దీవ్స్, , బంగ్లాదేశ్, మయన్మార్, అరబ్ కంట్రీస్కూ ఎగుమతి అవుతున్నాయి. ఈ ఇమిటేషన్ జ్యూల్రీలో కొన్నింటికి ఆరునెలల గ్యారంటీ ఇస్తారు. రంగుపోతే వాటిని మార్చుకోవచ్చు. స్కిల్ హబ్ కింద ఈ నగల తయారీలో ఉత్సాహవంతులకు మూడు నెలల ఉచిత శిక్షణను అందిస్తున్నారు.నాణ్యతకూ మారుపేరుమచిలీపట్నానికి చెందిన సారేపల్లి సాంబయ్య ఆలోచన ఇప్పుడు వేలాది మందికి ఉపాధిగా మారింది. బందరు బంగారు తీగ డిజైన్స్‌కే కాదు నాణ్యతకూ మారుపేరుగా నిలిచింది.∙పెద్దేటి వెంకటసుబ్బారావు, అధ్యక్షుడు, మచిలీపట్నం ఇమిటేషన్ జ్యూల్రీ పార్కు సంఘంవారసత్వాన్ని కాపాడ్డానికి..ఎంతో చరిత్ర ఉన్న మచిలీపట్నం ఇమిటేషన్ జ్యూల్రీ తయారీని తర్వాత తరాలకూ అందించడానికి ఆసక్తి ఉన్నవాళ్లకు ఉచితంగానే శిక్షణనిస్తున్నాం. దీనివల్ల ఎంతోమంది ఉపాధి పొందుతున్నారు. ∙అంకెం జితేంద్రకుమార్, కార్యదర్శి, మచిలీపట్నం ఇమిటేషన్ జ్యూల్రీ పార్కు సభ్యుల సంఘం. -
మనసున్న మారాజు.. జగనన్న
ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు వాటిని ఎదుర్కొనడానికి ప్రత్యేకమైన విజన్ వుండాలి.మొదటగా ప్రజల ప్రాణాలను కాపాడడానికి ప్రాధాన్యత ఇవ్వాలి..ఆ తర్వాత ఆస్తులను రక్షించాలి. అందుకోసం పాలకులు అధికార యంత్రాంగంలో స్ఫూర్తిని నింపి.. చిత్తశుద్ధితో పని చేయాలి. తన పాలనలో అదే పని చేశారు తాను ముఖ్యమంత్రిని మాత్రమే కాదు ప్రజాసేవకున్ని అని నిరూపించుకున్నారు వైఎస్ జగన్మోహన్రెడ్డి. మనసున్న నాయకునిగా అడుగులు వేశారు.కరోనా సమయంలో రాజీలేని పోరాటంప్రజలకు ఇచ్చిన హామీలనే కాదు ఇవ్వని హామీలను కూడా నెరవేర్చారు..కరోనాలాంటి మహా విపత్తు సమయంలో ఎక్కడా సంయమనం కోల్పోకుండా అడుగులు వేశారు. ప్రజల ప్రాణాలకు అత్యంత ప్రాధాన్యాత ఇచ్చి రాజీలేని పోరాట పటిమను ప్రదర్శించారు.ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా సమయంలో ప్రపంచవ్యాప్తంగా అన్ని వ్యవస్థలు అతలాకుతలమయ్యాయి..ఎప్పుడు ఏం జరుగుతుందో అనే భయాందోళనలు సర్వత్రా వ్యాపించాయి. కరోనా రోగంతో కొంతమంది..భయంతో అనేక మంది చిగురుటాకుల్లా రాలిపోయిన అత్యంత భయానకమైన రోజులవి..అలాంటి గడ్డు పరిస్థితుల్లో వైఎస్ జగన్మోహనరెడ్డి ఒక బాధ్యతగల ముఖ్యమంత్రిగానే కాదు.. మానవత్వం ఉన్న నాయకునిగా పని చేశారు. ఎప్పటికప్పుడు అధికారులతో, నిపుణులతో సమావేశమై పరిస్థితులను సమీక్షించి సరైన నిర్ణయాలు తీసుకున్నారు. ప్రజల్లో భయమనేది పోగొట్టారు..ఇంట్లో నుంచి జనం బయటకు రావాలంటేనే దడుసుకుంటున్న పరిస్థితుల్లో గ్రామవార్డు సచివాలయాలు, వాలంటీర్ల ద్వారా ఆయన చేయించిన సేవలను జనం ఎప్పటికీ మరిచిపోరు. నిత్యం ఫీవర్ సర్వేలు చేయించారు. వాటి ఫలితాల ఆధారంగా నిర్ణయాలు తీసుకొని కరోనా భూతాన్ని తరిమికొట్టారు. ప్రజలకు కావాల్సిన మందులు దగ్గర్నుంచి ఆహార పదార్ధాల వరకు అన్నిటినీ అందించారు. దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా జరగనంతగా సేవా కార్యక్రమాలు దాదాపు రెండేళ్లపాటు కరోనా సమయంలో చేసి చూపించారు.ఒక ప్రభుత్వ పెద్దగా తన కిందనున్న అధికారులకు ఆదేశాలు ఇచ్చి వదిలేయవచ్చు. కానీ మానవత్వం ఉన్న మనిషిగా స్పందించారు.మన ఇంట్లో వారే కష్టాల్లో ఉంటే మనం ఎలా స్పందిస్తామో అలా ఆయన పాలన సాగించారు. ఉచితంగానే కరోనా టెస్టులు చేయించటం దగ్గర్నుంచి...ప్రజలకు కావాల్సిన మందులను కూడా నేరుగా వారి ఇంటికి పంపించారు. పక్క రాష్ట్రాల్లో లక్షల రూపాయల ఖర్చయిన కరోనా చికిత్సలను ఆరోగ్యశ్రీలో చేర్పించి ఉచితంగానే చేయించారు. ఇది అప్పట్లో ఒక సంచలనాత్మకమైన నిర్ణయం.క్వారంటైన్ సెంటర్లలో వైద్యం చేయించుకుని ఇంటికి వెళ్లే సమయంలో వెయ్యి రూపాయల చొప్పున అందించటంతోపాటు, ప్రతి ఇంటికీ నెలకు రెండు సార్లు రేషన్ ను కూడా ఉచితంగా ఇప్పించారు. ఆంధ్రప్రదేశ్ లో జగన్ చేయిస్తున్న ఈ సేవా కార్యక్రమాలను చూసి ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగం, వ్యాపారాల కోసం వెళ్లిన వారు సైతం తిరిగి ఆంధ్రప్రదేశ్‌కే వచ్చారంటే పరిస్థితి ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. కరోనా సమయంలో జగన్ పాలనలో ఉన్నాం కాబట్టే మేము బతికి బట్ట కట్టాం అనే మాట చాలామంది నోట విన్నాం.వరద బాధితులకు కొండంత అండగా..వరద బాధితులను కాపాడటంలో వైఎస్ జగన్ ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. పరిస్థితులపై అధికారులతో సమీక్ష నిర్వహించటం దగ్గర్నుంచి బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించటం, వారికి కావాల్సిన అన్ని రకాల సౌకర్యాలు కల్పించటం వరకు అన్నీ దగ్గరుండి చూసుకున్నారు. వరదల సమయంలో వెంటనే ఆయా ప్రాంతాలకు వెళ్లి అధికారుల కాళ్లకు అడ్డం పడే పనిని జగన్ ఏనాడూ చేయలేదు. ముందుగా అధికారుల సహాయక కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇచ్చారు.వారికి ఎలాంటి ఆటంకాలు లేకుండా ఒక ప్రభుత్వ పెద్దగా పైనుంచి చూసుకునేవారు. అంతేకాదు.. వరద పూర్తిగా తగ్గుముఖం పట్టి, బాధితులు తిరిగి ఇంటికి వెళ్లే సమయంలో వారికి రెండు వేల రూపాయల చొప్పున ఇప్పించారు. వరద సహాయ చర్యలకు ఇబ్బంది వుండదని తెలుసుకున్న తర్వాతనే ఆయా ప్రాంతాల్లో పర్యటించారు. బాధితులతో కలిసి మాట్లాడేటప్పుడు తమకు ఏమీ ఇవ్వలేదన్న మాట వారి నుంచి రాకూడదని ముందుగానే అధికారులకు గట్టిగా చెప్పారు.అక్కడక్కడ ఆకస్మిక తనిఖీలు చేసి బాధితులతో మాట్లాడేవారు. ప్రభుత్వం ప్రకటించిన సాయమంతా అందిందా? అని నేరుగా బాధితులనే అడిగేవారు. అంతేకాదు.. మీ కలెక్టర్ కు ఎన్ని మార్కులు ఇవ్వవచ్చో మీరే చెప్పండని కూడా ప్రశ్నించేవారు.ప్రకృతి విపత్తుల సమయంలో జనంలోకి వెళ్లి, అందునా వరద బాధితుల దగ్గరకు వెళ్లి ప్రభుత్వ సాయం పూర్తిగా అందిందా? అని పాలకులు అడగడం ఒక విధంగా సాహసమే అవుతుంది. అయినాసరే ఆ విషయం తెలిసినా సరే వైఎస్ జగన్ వెనకడుగు వేయలేదు.తన ప్రభుత్వం చేసిన సహాయ కార్యక్రమాల మీద, తన అధికారుల మీద ఆయనకున్న నమ్మకం అలాంటిది.ప్రతి ఏటా కృష్ణా, గోదావరి వరదల సమయంలో ముంపు బాధితుల విషయంలో అత్యంత ఉదారంగా వ్యవహరించాలని వైఎస్ జగన్ తరచూ అధికారులతో చెప్పేవారు. మన సొంత మనుషులు ఆ బాధితుల్లో ఉంటే మనం ఎలా వ్యవహరిస్తామో అలా ఆలోచించండి అంటూ అధికారుల్లో స్ఫూర్తిని నింపి వారిలోని మానవత్వాన్ని బయటకు తీసేవారు. ఇదంతా కేవలం మనుషుల్ని ప్రేమిస్తేనే చేయగలం. ఆ ప్రేమ జగన్ లో పుష్కలం. ఆయన ఓదార్పు, పాదయాత్ర సమయాల్లోనేఅన్ని వర్గాల ప్రజల కష్టాలు, కన్నీళ్లను దగ్గరగా చూశారు. అందుకే పాలకునిగా ఎప్పటికప్పుడు సరైన నిర్ణయాలతో ప్రజల మనసులో జననేతగా పేరు సంపాదించుకున్నారు.కృష్ణలంక వాసుల కష్టాలు తీర్చిన నాయకుడుబుడమేరు వరదలు అనగానే బెజవాడ ప్రజలకు కంటి మీద కునుకు వుండదు. కృష్ణలంక వాసుల కష్టాలయితే పగవాడికి కూడా వద్దనేలాగా వుండేవి. కృష్ణానది పొంగితే అక్కడి వేలాది కుటుంబాల పరిస్థితి మరీ భయంకరం.. గతంలో ఆ ప్రాంత వాసులు ఎన్ని సార్లు మొరపెట్టుకున్నా చంద్రబాబు పట్టించుకోలేదు. కానీ వైఎస్ జగన్ సీఎం అయ్యాక వారధి మీదుగా వెళ్తుండగా కృష్ణలంక వాసుల కష్టాలు కనిపించాయి. ఇక అంతే.. ఆయన వెంటనే అధికారులను పిలిపించి నది ఒడ్డున రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు.రిటైనింగ్ వాల్ నిర్మించి మమ్మల్ని కాపాడంటూ ఏ ఒక్కరూ ఆయన్ను నేరుగా అడగకపోయినా రిటైనింగ్ వాల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. కళ్లారా వారి కష్టాలు చూశారు కాబట్టేఆయన ఆ పని మొదలుపెట్టారు. మొత్తం రూ.474 కోట్లు వ్యయం చేసి రెండున్నర కిలోమీటర్ల పొడవునా వాల్ నిర్మాణం చేపట్టారు.దీంతో సుమారు 80 వేల మందిని మొన్నటి వరదల నుంచి కాపాడటానికి వీలైంది.పన్నెండు లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చినా ఏ ఇబ్బందీ లేకుండా కృష్ణలంక ప్రాంత ప్రజలు ఇప్పుడు హ్యాపీగా ఉండగలుగుతున్నారు. ఇదంతా కేవలం మనసున్న నాయకుడు వైఎస్ జగన్ వలనే సాధ్యం అయింది. ఎవరూ అడగకుండా అన్ని వేల మందికి ఉపయోగపడే రిటైనింగ్ వాల్ నిర్మాణం చేసి ఆ ప్రాంత ప్రజల మనసుల్లో నిలిచారు వైఎస్ జగన్.ఐదేళ్ల వైఎస్ జగన్ పాలనలో ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు, పథకాలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. పదులసంఖ్యలో ప్రజాదరణ పథకాలు నిత్యం అమలయ్యేవి. దాంతో చాలావరకు అన్ని వర్గాల ప్రజల్లో ఒక భరోసా కనిపించింది. కీలక విద్య వైద్య వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక మార్పులు వచ్చాయి..అందుకే వైఎస్ జగన్ మనసున్న నాయకుడయ్యారు. శనివారం(డిసెంబర్ 21వ తేదీ) నాడు జననేత జగనన్న పుట్టినరోజు సందర్భంగా ఆయనకు ప్రజల తరఫున జన్మదిన శుభాకాంక్షలు.. -
World Meditation Day : మెరుగైన సమాజం కోసం
ప్రస్తుతంపై మనస్సును లగ్నం చేయడాన్ని ధ్యానం అనవచ్చు. ఇది చాలా ప్రాచీన కాలం నుంచి అనేక సంస్కృతుల్లో భాగంగా కొనసాగుతోంది. వ్యక్తి గత శ్రేయస్సు, మానసిక ఆరోగ్యానికి ఇది ఉపయోగ పడుతుంది. అయితే భారతీయ సంస్కృతిలో యోగా, ధ్యానం మిళితమై కనిపిస్తాయి. అందుకే మన ప్రాచీన గ్రంథాలు కానీ, శిల్పాలు కానీ ధ్యాన ముద్రను ప్రతిబింబిస్తూ ఉంటాయి.జూన్ 21వ తేదీని ప్రపంచ ధ్యాన దినోత్స వంగా జరపాలని ఐక్యరాజ్య సమితి (యూఎన్ఓ) నిర్ణయించడం ముదావహం. ధ్యానం యొక్క శక్తిని గుర్తించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. ధ్యానం మానసిక, భౌతిక శక్తి సామ ర్థ్యాలను వృద్ధి చేయడమే కాక మనస్సును ఒక విషయంపై లగ్నం చేయడానికి ఉపకరిస్తుంది. ఆధునిక కాలపు ఒత్తిడులను తట్టుకోవడానికి ధ్యానం ఇప్పుడు ప్రధాన సాధనం అయ్యింది. అలాగే వ్యక్తిగత ప్రయోజనాలకన్నా సామూ హిక శ్రేయస్సుకు ఇది దోహదం చేస్తుంది. దైనందిన జీవితంలో ధ్యానాన్ని ఒక భాగం చేసుకుంటే మానసిక ఒత్తిడుల నుంచి బయటపడవచ్చని నిపుణులు అంటున్నారు. యోగాకు ధ్యానాన్ని జోడిస్తే రక్తపోటు, స్థూల కాయం, ఆందోళన, నిద్రలేమి వంటి వాటి నుంచి బయటపడవచ్చు. అనా రోగ్యం నుంచి త్వరగా కోలుకోవడానికి ధ్యాన, యోగాలు ఎంతగానో ఉపయోగపడతాయంటున్నారు. మనస్సు– శరీరం మధ్య అవినాభావ సంబం«ధాన్ని మన ప్రాచీన యోగశాస్త్రం చెబుతుంది. కానీ ఆధునిక వైద్యులు మనస్సునూ, శరీరాన్నీ రెండు వేరువేరు విభాగాలుగా చూస్తున్నారు. అయితే ఇటీవలి కాలంలో ఈ ధోరణిలో కొంత మార్పు గమనించవచ్చు. ఆరోగ్యవంతమైన జనాభాను, సుస్థిరమైన ప్రపంచాన్ని సృష్టించడానికి ధ్యానం ఒక మార్గంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది.– జంగం పాండు; పరిశోధక విద్యార్థి, హైదరాబాద్(రేపు ప్రపంచ ధ్యాన దినోత్సవం) -
Christmas 2024 ప్రేమ పరిమళించిన చోట తర్కం అంతరిస్తుంది
ఈ భూమి మీద నడిచిన కారుణ్య మూర్తులైన బుద్ధుడు, మహావీరుడు జీసస్ వంటి వారు మానవీయతను ప్రబోధించి శాంతిస్థాపనకు, సమానత్వానికై అజరామరమైన ప్రేమ తత్వాన్ని ఈ లోకానికి బోధించారు. ప్రాక్ పశ్చిమ ప్రపంచంలో నుండి జీసస్ ఒక విభిన్నమైన నైసర్గిక భౌగోళిక పరిస్థితులు ఉన్న ఇశ్రాయేలులోని బెత్లెహాం నందు జన్మించాడు. అది తన చుట్టూ ఉన్న బాబిలోనియా, ఈజిప్ట్ గ్రీక్ దేశాల ఆధునిక, తాత్విక, వైజ్ఞానిక నాగరికతలు, సంస్కృతుల ప్రభావితం కలిగినది.మానవ జీవితంలో 14 సంవత్సరాల ప్రౌఢదశ ఒక ప్రత్యేకమైన శారీరక మానసిక పరిపక్వత గలిగే దశ ్ర΄ారంభం అవుతుంది. సరిగ్గా ఈ దశ మానవుడిని ప్రపంచానికి పరిచయం చేస్తుంది. అందుకే జోసెఫ్‌కు క్రీస్తు మానవునిగా 14వ తరంగా కన్య మరియకు జన్మించిన రోజే క్రిస్మస్.క్రీస్తు అత్యంత బాహ్యాంతర సౌందర్యమూర్తి, పరిపూర్ణుడు. నీసాటి వాడు నిన్ను కోపగించుకుంటే నువ్వు ప్రతిగా వారిని కోపగించుకోకు. మళ్ళీ వారిపై క్రోధం పెంచుకుంటే వారికి నువ్వు సహాయపడ్డవాడివి అవుతావు. నీ క్రోధం వాళ్లకు బలం, నీకు బలహీనత. అదే నువ్వు వారిని సహృదయంతో మందహాసంతో స్వీకరిస్తే వారు నిశ్చేష్టులవుతారు, అందుకే జీసస్ నువ్వు నీ శత్రువుని ప్రేమించు అని చెబుతాడు. అయితే ఇక్కడ శత్రువు కన్నా పొరుగువారిని ప్రేమించటమే కొంచెం కష్టం అయినా వారితో ప్రేమపూర్వకంగా మెలగాలి. నీలో ఉన్న అంతర్గత ప్రేమను ఒక ఆలింగనం ద్వారా బహిర్గతం చేయి. వారు ఈ పరిణామానికి తమ తార్కిక జ్ఞానాన్ని కోల్పోవాలి. అటువంటి ప్రేమలో తార్కిక విచక్షణ ఉండదు. కాబట్టి ప్రేమ పరిమళించిన చోట తర్కం అంతరిస్తుంది. ఇలాంటి ప్రేమ మార్గానికి పరాకాష్టే జీసస్ స్వరూపం.సరిగ్గా ఈ భావన కొనసాగింపే జీసస్లో మరో ఉదాత్త అంశం నిదర్శనమైనది. అదే ఒక చెంపపై కొడితే మరో చెంపను చూపించు అనటం. అప్పుడు మరో చెంపని చూపించటం వల్ల అవతలి వాడిని ఆలోచనలో పడేస్తుంది కానీ మొదట్లో ఈ విభిన్న ప్రతిస్పందన యూదు వంశస్థులకు అర్థం అవడానికి చాలా కాలం పట్టింది. అది వారి తర్కానికి అందని దృగ్విషయం, అదొక సందిగ్ధావస్థ. ఈ దశ ప్రేమకు ముందూ, ద్వేషభావానికి తర్వాత ఉంటుంది. ఇది సంఘంలో కొంత పరివర్తనకు నాంది పలికింది. వ్యవస్థలో నెలకొన్న అమానవీయ చేష్టలకు అమూల్యమైన మానవ ప్రాణం బలి కాకూడదని సంకల్పించాడు. అందుకే జీసస్ అత్యంత దయార్ద్ర మానవతామూర్తి గా వెలుగొందాడు. క్రీస్తుకు పూర్వం ప్రజలంతా మోసెస్ న్యాయమార్గాన్ని అనుసరిస్తే ఆ తదుపరి జీసస్ సర్వత్రా తన ప్రేమ మార్గాన్ని చూపాడు.జీసస్ ప్రేమస్వరూపుడు అనటం కాదు, జీసస్ స్వయంగా ఒక ప్రేమ స్వరూపుడు. ఇక్కడ జీసస్ వేరూ ప్రేమ వేరూ కాదు. అది అత్యంత అనిర్వచనీయం. ప్రేమ ఎప్పుడూ సత్యంలాగా భాషలో పలికేది కాదు అది కేవలం వ్యక్తీకరించేది. అందుకే యేసును శిలువ వేసే సమయంలో రోమ్ సైనికాధికారి పిలాట్ ఇదంతా నువ్వు ఎందుకు చేస్తున్నావు అని అడిగితే సత్యం కోసం చేస్తున్నానని సమాధానం ఇస్తాడు, అప్పుడు పిలాతు యేసును మళ్ళీ ప్రశ్నిస్తాడు సత్యం అంటే ఏంటి? అని– ఆ ప్రశ్నకు యేసు మౌనం వహిస్తాడు. ప్రేమ మౌనంగా వ్యక్తపరిచే భాష, ఈ అవ్యాజమైన ప్రేమతో సమస్త జనులారా మీరు నా వద్దకు రండి మిమ్ములను క్షమిస్తాను, ప్రేమిస్తాను అని ప్రేమతో సందేశాన్ని ఇచ్చాడు యేసు. అయితే యూదులు ఆ సత్యసాక్షిని సహృదయంతో అర్థం చేసుకోలేదు. కనుకనే శిలువపై ఏసుగా మరణించి క్రీస్తుగా పునర్జన్మ పొందిన మానవరూప దివ్య దైవత్వంగా పరిణామం చెందాడు. అందుకే సంఘం యథార్థవాదులందరినీ లోకవిరోధులుగానే చిత్రీకరిస్తుంది. అందుకు తార్కాణంగా ప్రముఖ గ్రీకు దార్శనికుడు సోక్రటీస్కు రాజ్యం విషం ఇచ్చి మరణశిక్షను విధించింది. అలాగే భారతీయ దార్శనికుల్లో విప్లవాత్మకమైన శాంతి, సత్య తత్వాన్ని అందించిన బుద్ధుని బోధలూ, బౌద్ధం భారతదేశం నుంచి తరిమి వేయబద్దాయి. అదేవిధంగా యూదుల ఆలోచనలను సరిదిద్దే ప్రయత్నంలో జీసస్ కృషి నిరర్థకమే అయింది. వారికి సత్యం, ప్రేమల తత్వం అర్థం కాలేదు. వారు జీసస్ సత్యమార్గాన్ని చేరుకోలేక అపవాదిగా మార్చి సిలువ వేశారు. ఈ దార్శనికులంతా వారి తాత్విక సందేశాలతో సమస్త జీవకారుణ్యతతో ఎటువంటి మారణాయుధాలు లేకుండా ఒక మనిషి మరో మనిషిపై గాని, ఒక జాతి మరో జాతిపైగానీ, ఒకరి భావజాలం మరొకరి భావజాలంపై గాని, సాంస్కృతిక దురాక్రమణలు కానీ, ధర్మం పేరిట యుద్ధాలు, రక్తపాతాలు గానీ సృష్టించలేదు. కేవలం ప్రకృతి ధర్మాలను వివరిస్తూ మనుషుల మధ్య సమతను, సమానత్వాన్ని, ప్రేమ పూర్వక ప్రవచనాలతో, వాత్సల్యపు వాక్యాలతో శాంతి సామ్రాజ్యాల స్థాపనకు ప్రాణత్యాగాలు చేశారు. అందుకు కావలసింది ద్వేషాన్ని, అహంకారాన్ని విడనాడటమే. ఇవి మనలో నుండి మనపైకి అధిరోహించి మనల్ని అథఃపాతాళానికి తొక్కేస్తాయి, కానీ మనమే అహంకారాన్ని అధోపాతాళానికి తొక్కిపెడితే మనం ఆకాశానికి ఎదుగుతాం.ప్రేమ మౌనంగా వ్యక్తపరిచే భాష, ఈ అవ్యాజమైన ప్రేమతో సమస్త జనులారా మీరు నా వద్దకు రండి మిమ్ములను క్షమిస్తాను, ప్రేమిస్తాను అని ప్రేమతో సందేశాన్ని ఇచ్చాడు యేసు. అయితే యూదులు ఆ సత్యసాక్షిని సహృదయంతో అర్థం చేసుకోలేదు. కనుకనే శిలువపై ఏసుగా మరణించి క్రీస్తుగా పునర్జన్మ పొందిన మానవరూప దివ్య దైవత్వంగా పరిణామం చెందాడు. - ప్రొ. చెరుకుపల్లి వంశీధర్ -
శోభితతో ప్రేమ గురించి తొలిసారి నోరు విప్పిన నాగ చైతన్య
అక్కినేని అందగాడు హీరో నాగ చైతన్య, హీరోయిన్ శోభితా ధూళిపాళ మూడుముళ్ల బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. పెళ్లయి పక్షం రోజులు గడుస్తున్నా ఇంకా పెళ్లి ముచ్చట్టుసోషల్మీడియాలో సందడి చేస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ లవ్బర్డ్స్ని ఇంటర్వ్యూ చేసి, వారి ప్రేమ ప్రయాణం గురించి ఆంగ్ల పత్రిక న్యూయార్క్ టైమ్స్ ఒక కథనాన్ని ప్రచురించింది. దీన్ని నాగచైతన్య రెండో భార్య శోభిత తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. అలాగే తెలుగు భాష ఔన్నత్యాన్ని గురించి కూడా కమెంట్ చేసింది. దీంతో న్యూయార్క్ టైమ్స్ కథనం వైరల్‌గా మారింది.ఈ ఇంటర్వ్యూలో నాగ చైతన్య చాలా విషయాలను పంచుకున్నాడు. ముఖ్యంగా శోభితతో తన ప్రేమ, ఆమెపై అభిమానాన్ని పెంచుకోవడానికి గల కారణాలను షేర్ చేశాడు. శోభిత నిజాయితీ తనకు బాగా నచ్చిందని కామెంట్ చేశాడు. తాను పుట్టింది హైదరాబాదులోనే అయినా పెరిగింది మొత్తం చెన్నైలోనే అనీ, అందుకే తనకు తెలుగు సరిగ్గా రాదని చెప్పుకొచ్చాడు. శోభిత తెలుగు, తనను ఆమెకు మరింత దగ్గరి చేసిందని వెల్లడించాడు. ఆమె స్వచ్ఛమైన తెలుగు, తనను మూలాల్లోకి తీసుకెళ్లిందని అదే ఆమెకు దగ్గరి చేసిందని తెలిపాడు. మాతృభాషలోని వెచ్చదనం తమ ఇద్దరి మధ్యా ప్రేమను చిగురింప చేసిందన్నాడు నాగ చైతన్య. View this post on Instagram A post shared by Sobhita (@sobhitad)శోభితా ప్రేమలో ఎలా పడ్డాడో వివరిస్తూ ఆమె‘మేడ్ ఇన్ హెవెన్ స్టార్' ఆమె మాటలు చాలా లోతుగా ఉంటాయి అంటూ భార్యను పొగడ్తల్లో ముంచెత్తాడు. ఆమె నిజాయితీతో తాను ప్రేమలో పడిపోయానని వెల్లడించాడు. శోభిత సోషల్‌మీడియా పోస్ట్‌లు ఆమె వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయి వాస్తవికతకు దగ్గరగా ఉంటాయి అని పేర్కొన్నాడు. అంతేకాదు ఆమె పోస్ట్ చేసే బ్లర్ ఫోటోలే తనకిష్టం, అంతేకానీ, గ్లామర్ కోసం, ప్రచారం కోసం పీఆర్ టీం చేసే ఫోటోలు కాదంటూ వ్యాఖ్యానించాడు. సినిమా షూటింగ్లో ఉండగానే రెండు నెలల్లో తన పెళ్లిని ప్లాన్ చేసుకున్నట్లు శోభితా ధూళిపాళ వెల్లడించింది. ఇద్దరమూ మాట్లాడుకుని, ప్రధానంగా చైతన్య కోరికమేరకు సన్నిహితుల సమక్షంలో చాలా సింపుల్‌గా, సంప్రదాయ బద్ధంగా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నామని చెప్పింది. తమ వివాహం ఆధ్మాత్మికంగా, దేవాలయం అంత పవిత్ర భావన కలిగిందంటూ తన పెళ్లి ముచ్చట్లను పంచుకుంది. దీంతో నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. కాగా డిసెంబర్ 4 న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో నాగ చైతన్య, శోభితా ధూళిపాళ వివాహం వైభంగా జరిగింది. అంతకుముందు ఆగష్టు 8న నిశ్చితార్థం వేడుకతో తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించారు. శోభితతో పెళ్లికిముందు టాలీవుడ్ హీరోయిన్ సమంతాను ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగచైతన్య , ఆ తర్వాత ఆమెకు విడాకులిచ్చిన సంగతి తెలిసిందే. -
వీడని మలబార్ పునుగు పిల్లి పొడుపు కథ!
బిల్డింగ్ చుట్టూ ఉన్న ఏనుగుల కందకంలో ఫారెస్ట్ గార్డ్ రాత్రి భోజనంలో మిగిలిపోగా పారేసిన కోడి ఎముకలను పటపటా నవులుతున్నాయి ఆ రెండు పెద్ద పునుగు పిల్లులు. అవి చిన్న భారత పునుగు పిల్లుల కంటే చాలా పెద్దగా ఉన్నట్టున్నాయి. మా శక్తివంతమైన లైట్లను మెరుగైన దృష్టికోణంతో చూడటానికి అవి మధ్య మధ్యలో వాటి వెనక కాళ్లపై నుంచుంటున్నాయి. మా అందరికి ఒకటే ఆలోచన వచ్చింది: మలబార్ పునుగు పిల్లి, ఎవరికీ అంతుచిక్కని పాలిచ్చే భారతీయ జంతువు. అవి పారిపోతాయేమోనన్న భయానికి మేము కెమెరా తీసుకు వచ్చే ప్రయత్నం చెయ్యలేదు. దానికి బదులుగా మేము చీకట్లోనే దాని లక్షణాలు గుర్తుంచుకోవడానికి ప్రయత్నించాము.దెగ్గర దెగ్గర ఆరు దశాబ్దాల క్రితం హై వేవీ మౌంటెన్స్ తెయ్యాకు ఎస్టేట్‌లోని తెయ్యాకు రైతు అయిన ఆంగస్ హటన్ మలబార్ పునుగు పిల్లి చాలా విరివిగా కనిపించే జంతువని వ్రాసి పెట్టారు., కానీ ఆయన చిన్న భారతీయ పునుగు పిల్లిని చూసి అలా పొరపాటు పడ్డారేమో అనేది ఒక ప్రఘాడ అనుమానం. 1939 కల్లా మలబార్ పునుగు పిల్లి అరుదై, అంతరించిపోవడానికి దెగ్గరగా ఉందేమోనని జంతు శాస్త్రవేత్తలు భయపడ్డారు. మేము ఎంతో ఉత్సాహంగా, రెండు మలబార్ పునుగువ పిల్లులని చూశామని సందర్శకుల పుస్తకంలో రాశాము.మలబార్ పునుగు పిల్లిని లోగోగా పెట్టుకున్న సెంటర్ ఫర్ వైల్డ్‌లైఫ్ స్టడీస్ సంస్థలో అజిత్ కుమార్ గారు మేము మలబార్ పునుగు పిల్లిని చూశామని విశ్వసించలేదు. చిన్న భారతీయ పునుగు పిల్లి ఎంతో విసతృతంగా రకరకాల నివాసాలలో, ఎత్తులలో, ఆక్షాంసాలలో, చాలా విభిన్న లక్షణాలు, శరీర ఆకృతి, పరిమాణాలు కలిగి ఉంటుందని ఆయన సూచించారు.ఒక జీవశాస్త్రవేత్త, మేము చూసిన పునుగు పిల్లికి సింహం వంటి జూలు ఉందా అని అడిగారు. కానీ మేము అది గమనించలేదు. మెడ పొడవునా మూడు చారలూ? అటువంటిదేదో చూశామని మేము అనుకున్నాం. దాని తోక చుట్టూ కట్లు గమనించామా అని ఇంకొకరు అడిగారు. ఏమో, అప్పుడు చాలా చీకటిగా ఉంది. వాటి తోక చివర నల్లగా ఉందా? దృరదృష్టవశాత్తు ఈ లక్షణాల కోసం చూడాలని మాకు తెలియలేదు.పాలిచ్చే చిన్న జంతువుల మీద నిపుణులైన నందిని రాజమణి మారియు దివ్య ముదప్పా, ఇంగ్లాండ్‌లో మారియు ఇండియాలో ఉన్న రకరకాల మ్యూసియంలలో భద్రపరచిన మలబార్ పునుగు పిల్లులకి సంబంధించిన ఆరు చార్మాలూ ఇంకా మూడు కాపలాలు పరీక్షించారు. అంతే కాక 1800లు మొదలుకుని పునుగు పిల్లుల మీద రాయబడ్డ ప్రతీదీ చదివేసారు.నివేదిక ప్రకారం మలబార్ పునుగు పిల్లి పడమర కానుముల లోతట్టు తీరప్రాంత అడవులలోని కర్వార్, ఉత్తర కర్ణాటక నుంచి కేరళలోని త్రివేండ్రమ్ వరకూ కనిపిస్తాయి. కొద్ది సార్లు అవి తిరుణలవెలి లోపల బిలిగిరి రంగస్వామి కోవెల వన్యప్రాణుల సంరక్షణ కేంద్రంలోనూ, హై వేవీ కొండలంలోనూ కనిపించాయి. కానీ అవి ఎక్కువగా కోజికోడ్ చుట్టుపక్కలే కనిపించాయి. ఆసియాలో మరి ఏ పునుగు పిల్లి ఇంత పరిమిత పరిధిలో ఉండదు.పేరుగాంచిన మలబార్ పునుగు పిల్లి యొక్క మస్క్ కోసం దాన్ని వేటడడం వల్ల అవి అరుదైపోయి ఉండడానికి అవకాశం ఉండవచ్చని నందిని, దివ్య ఒప్పుకున్నారు. కానీ, వేరే పునుగు పిల్లులు చక్కగా అభివృద్ధి చెందుతుంటే, ఈ జంతువు వాటి నివాసమైన అడవులను పొలాలుగా మారిస్తే తట్టుకోలేనంత సున్నితమైనవా?మ్యూసియం నమూనాలా మూలం సరిగా తెలియనందువల్ల, ఇంకా పాలిచ్చే జంతువుల నిపుణుల మధ్య బేధభిప్రాయాలవల్ల, మలబార్ పునుగు పిల్లి రూపం పట్లా, లక్షణాల పట్లా నిజమైన స్పష్టత లేదు. ఇది చాలదన్నట్టు దక్షిణ ఆసియాలోని పెద్ద-చుక్కల పునుగు పిల్లులు మారియు మలబార్ పునుగు పిల్లులు దెగ్గర దెగ్గర ఒకే పోలికలతో ఉంటాయి. ఈ విషయం ఒక విప్లవాత్మక ప్రత్యామ్నాయం సూచిస్తుంది: మలబార్ పునుగు పిల్లులు ఎన్నడూ ఉనికిలోనే లేవు!మందుల తయారిలో, సుగంధ ద్రవ్యాలా తయారిలో, ఇంకా పూజలలో ఉపయోగించే పునుగు పిల్లుల మస్క్ గ్రంధిలోని సివిటోన్ కోసం వేల ఏళ్లుగా ఇథియోపియా, దక్షిణ ఆసియా ఇంకా భారతదేశం మధ్య వ్యాపారం సాగుతోంది. ఈ రోజుకి కూడా మస్క్ తియ్యటంకోసం, ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతిలో చిన్న పునుగు పిల్లులను ఫార్మ్ లో పెంచుతారు. ఈ మధ్యకాలంలో అతి ఎక్కువగా మలబార్ పునుగు పిల్లి కనిపించిన స్థలమైన కోజికోడ్ పూర్వ కాలం నుంచీ పునుగు పిల్లుల వ్యాపార కేంద్రం. దక్షిణ ఆసియా నుంచి తెచ్చిన పెద్ద-చుక్కల పునుగు పిల్లులు చెర నుంచి తప్పించుకు పారిపోవడంతో అప్పుడప్పుడు అడవిలో పునుగు పిల్లులు కనిపించడానికి అవకాశం ఇచ్చివుంటుందా అని నందిని, దివ్య ఆలోచించారు. ఇదేమంత అసంభవం కాదు, ఎందుకంటే చిన్న భారత పునుగు పిల్లులు తప్పించుకుని మాడగాస్కర్, ఫిలిప్పీన్స్ మారియు ఇతర దక్షిణ ఆసియా దీవులలో వాటినవి స్థాపించుకున్నాయి. అందువల్ల మలబార్ పునుగు పిల్లి, పెద్ద- చుక్కల పునుగు పిల్లి కంటే పెద్ద ప్రత్యేకత కలిగిందేమి కాకపోవచ్చు అనడానికి ఎంతో అవకాశం ఉండీ. ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వడంలో జన్యు పరీక్ష ఇంకొక ముందంజ వేస్తుంది. అసల మలబార్ పునుగు పిల్లులు నిజమైనవేనా? కానీ పురాతన నమూనాల నుంచి తీసిన డిఎన్ఏ మరీ సిధిలం అయిపొయింది. అందువల్ల మలబార్ పునుగు పిల్లిని గురించిన పొడుపు కథ ఇంకా వీడలేదు.Author: జానకి లెనిన్Translator: రోహిణి చింతా -
నోరు మంచిదైతే, ఊరు మంచిదవుతుంది : ఖాళీ బిందె
ఓ గ్రామంలోని చేదబావి దగ్గర ఇద్దరు మహిళలు వాదులాడుకుంటూ ఉన్నారు. ఒక మహిళ గట్టి గట్టిగా అరుస్తోంది. మాటలు పడుతున్న స్త్రీ కన్నీళ్ళు పెట్టుకుంది.దారినపోతున్న ఓ పండితుడు అది గమనించాడు.గట్టిగా మాట్లాడుతున్న మహిళతో ‘‘ఇలా అరవడం మంచిది కాదు’’ అని చెప్పబోయాడు.‘‘నోరు ఉన్న వాళ్ళదే కదా రాజ్యం!’’ అని బదులిచ్చింది అరిచిన మహిళ.చిన్న నవ్వు నవ్వాడు ఆ పండితుడు.ఖాళీగా ఉన్న బిందెను చేంతాడు సహాయంతో బావిలోకి పంపమన్నాడు. ‘అదెంత పని’ అని అనుకున్న ఆమె ఖాళీబిందెను సరసరా బావిలోకి వదిలింది. బిందెలో నీళ్ళు చేరాక పైకి లాగమన్నాడు. శక్తిని ఉపయోగిస్తూ బిందెను లాగడం ప్రారంభించింది.‘‘ఎలా ఉంది?’’ అని ప్రశ్నించాడు పండితుడు.‘‘బిందెలో నీళ్ళు ఉన్నాయి కదా, కాబట్టి బరువుగా ఉంది. కష్టంగా లాగుతున్నాను’’ అని సమాధానమిచ్చింది.‘‘ఖాళీ బిందెని బావిలోకి వదిలినంత సులభంగా మనం ఎదుటివారిని ఎన్నో మాటలనవచ్చు. కానీ ఆ మాటలు ఎదుటి వారి మీద ఎంత ప్రభావం చూపిస్తాయో ఆలోచించాలి. నీళ్ళు చేరాక ఖాళీ బిందె ఎలా బరువయ్యిందో, అలాగే మన మాటలు చాలా మంది మనసుల్ని బరువుగా చేస్తుంది.ఒంటికి తగిలిన గాయాలను కొన్నాళ్ళకు మరుస్తామేమో కానీ, మనసుకు తగిలిన గాయాల్ని అంత సులభంగా మరువలేము. ఆపైన, మనం ఎప్పుడు వారికి కనిపించినా మనం మాట్లాడిన మాటలే వారికి గుర్తుకు వస్తాయి. వారి మనసు బాధగా మూలుగుతుంది. విరిగిన మనసు అంత సులభంగా అతకదని తెలుసుకో. ఆ తర్వాత మనం ఎంత ప్రయత్నించినా మనలోని మంచి వారికి కనిపించదు. అందుకే మనం మాట్లాడేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించి మాట్లాడాలి. మాటలు మన పెదాలు దాటితే అవి మన అధీనంలో ఉండవు. మాటలు అనడం తేలిక. మాటల పర్యవసానం చాలా భారం. దానికి ఎంతో మూల్యం చెల్లించాల్సి వస్తుంది. అంతేకాదు, మనుషుల్ని రాబట్టుకోవడం కష్టం, పోగొట్టుకోవడం సులభం’’ అని హితవు చెప్పాడు. నోరు మంచిదైతే ఊరు మంచిదని గుర్తించిన ఆ మహిళ, అక్కడే కన్నీళ్ళు పెట్టుకుని బాధపడుతున్న స్త్రీని క్షమాపణలు కోరింది. ఇద్దరూ కలిసి నవ్వుతూ చేద బావిలోని నీళ్ళను చేదుకున్నారు. – ఆర్.సి. కృష్ణస్వామి రాజు -
యూజీసీ సిఫార్సులు ఆచరణ సాధ్యమేనా?
సాక్షి, ఎడ్యుకేషన్: ఉన్నత విద్యలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రతిపాదించిన సంస్కరణలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. డిగ్రీ, పీజీలో ప్రవేశాలు మొదలు.. కోర్సుల వ్యవధి వరకు యూజీసీ సిఫార్సులు ఆచరణలోకి వస్తే ఉన్నత విద్యా రంగంలో కీలక మార్పులు చోటుచేసుకొంటాయి. అయితే ఈ సిఫార్సులపై నిపుణులు భిన్నంగా స్పందిస్తున్నారు. మన దేశ పరిస్థితులకు అనుగుణంగా ఈ మార్పులు సత్ఫలితాల నివ్వడానికి కనీసం పదేళ్ల సమయం పడుతుందని అంటు న్నారు. ఉన్నత విద్యలో సంస్కరణల కోసం ‘మినిమమ్ స్టాండర్డ్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఫర్ ద గ్రాంట్ ఆఫ్ అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ రెగ్యులేషన్స్–2024’ పేరుతో యూజీసీ ఈ నెల ఐదో తేదీన ముసాయిదాను విడుదల చేసింది. దీనిని అన్ని రాష్ట్రాలకు పంపి, ఈ నెల 23వ తేదీలోగా అభిప్రాయాలు తెలపాలని లేఖలు రాసింది. యూజీసీ సిఫార్సులపై అధ్యయనం చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఉన్నత విద్యామండలిని ఆదేశించింది. ఏటా రెండు సార్లు ప్రవేశం..యూజీసీ సిఫార్సుల్లో ముఖ్యమైనది.. బ్యాచిలర్, పీజీ స్థాయిలో ఏటా రెండు సార్లు (జూలై / ఆగస్ట్, జన వరి/ఫిబ్రవరి) ప్రవేశ ప్రక్రియ నిర్వహించటం. ఇది విద్యా ర్థులకు కొంత మేలు చేసే అంశమేనని విద్యావేత్తలు అంటున్నారు. వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణత పొందని.. సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారికి ఉన్నత విద్య అభ్యసించే విషయంలో సమయం వృథా కాకుండా ఈ ప్రతిపాదన మేలు చేస్తుందని చెబుతున్నారు. అయితే..ఈ ప్రతిపాదన అమలుచేయాలంటే ఫ్యాకల్టీ, ఇతర బోధన సదుపాయా లను రెట్టింపు చేయాల్సి ఉంటుందని అంటున్నారు. ఇప్ప టికిప్పుడు అది సాధ్యం కాకపోవచ్చని పేర్కొంటున్నారు. హెచ్‌ఈసీతో బీటెక్ చదవగలరా?యూజీసీ మరో సిఫార్సు.. అకడమిక్ నేపథ్యం ఏదైనా.. విద్యార్థులు ఉన్నత విద్యలో తమకు నచ్చిన కోర్సులో చేరే అవకాశం కల్పించడం. ఉదాహరణకు.. ఇంటర్మీడియెట్‌లో హెచ్ఈసీ చదివిన విద్యార్థి.. బీటెక్ ప్రవేశాలకు నిర్వహించే ఎంట్రన్స్‌లలో (జేఈఈ, ఈఏపీసెట్ తదితర) ఉత్తీర్ణత సాధించి బీటెక్‌లో చేరొచ్చు. దీనిపై వ్యతిరేక అభిప్రాయా లు వ్యక్తమవుతున్నాయి. ఆర్ట్స్, హ్యుమానిటీస్ విద్యా ర్థులు.. గణితం, సైన్స్, ఇంజనీరింగ్ సబ్జెక్ట్‌ల సమ్మేళనంగా ఉండే బీటెక్‌లో రాణించడం సాధ్యం కాదని అంటున్నారు. బహుళ ప్రవేశ, నిష్క్రమణ అవకాశంయూజీసీ ప్రతిపాదనల్లో మరో కీలకమైన అంశం బహుళ ప్రవేశ, నిష్క్రమణ (మల్టిపుల్ ఎంట్రీ, ఎగ్జిట్) విధానం. బ్యాచిలర్, పీజీ ప్రోగ్రామ్‌లలో చేరిన విద్యార్థులు తమకు నచ్చిన సమయంలో కోర్సు నుంచి వైదొలగే అవకాశం, ఆ తర్వాత మళ్లీ అదే కోర్సులో.. తదుపరి తరగతిలో ప్రవేశం పొందే అవకాశం కల్పించటం ఈ ప్రతిపాదన ముఖ్య ఉద్దేశం. కానీ.. ఇలాంటి విధానం ఫలితంగా విద్యార్థుల్లో ఉన్నత విద్య స్ఫూర్తి కొరవడే ప్రమాదం ఉందని, ఇది జాబ్ మార్కెట్‌పై ప్రభావం చూపుతుందని నిపుణులు అంటున్నారు. స్కిల్ కోర్సులు, అప్రెంటిస్షిప్స్ఉన్నత విద్యలో స్కిల్ కోర్సులను, అప్రెంటిస్షిప్స్ను సమీకృతం చేసేలా మరో ప్రతిపాదన చేశారు. బ్యాచిలర్ డిగ్రీలో మొత్తం క్రెడిట్స్‌లో 50 శాతం పూర్తి చేసుకున్న వారు.. మరో 50 శాతం క్రెడిట్స్ కోసం స్కిల్ కోర్సులను, అప్రెంటిస్‌షిప్‌ను, మల్టీ డిసిప్లినరీ సబ్జెక్ట్‌లను ఎంచుకోవచ్చని పేర్కొన్నారు. అయితే స్కిల్ కోర్సులను అందించే క్రమంలో.. రాష్ట్రాల స్థాయిలో యూనివర్సిటీలకు మౌలిక సదుపాయాల కొరత సమస్యగా మారుతుందని విద్యావేత్తలు పేర్కొంటున్నారు.ఒకే సమయంలో రెండు డిగ్రీలుఅకడమిక్ ఫ్లెక్సిబిలిటీ విధానంలో ఒకే సమయంలో రెండు డిగ్రీ ప్రోగ్రామ్స్‌ను అభ్యసించే విధానాన్ని కూడా యూజీసీ ప్రతిపాదించింది. విద్యార్థులు తాము చేరిన కోర్సు/విద్యా సంస్థతోపాటు మరో ఇన్స్టిట్యూట్లో లేదా మరో అభ్యసన విధానంలో అర్హత మేరకు మరేదైనా బ్యాచిలర్ లేదా పీజీ డిగ్రీలో చేరొచ్చు. అయితే ఈ ప్రతిపాదనలు ప్రస్తుతం మన విద్యా వ్యవస్థకు సరితూగేలా లేవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.రెండున్నరేళ్లకే బ్యాచిలర్ డిగ్రీరెండున్నరేళ్లకే డిగ్రీ పూర్తి చేసుకునేలా యూజీసీ ప్రతి పాదన చేసింది. యాక్సెలెరేటెడ్ డిగ్రీ ప్రోగామ్ పేరుతో ప్రతి విద్యా సంస్థలోని మొత్తం విద్యార్థుల్లో పది శాతం మందికి ఈ అవకాశం కల్పించాలని సూచించింది. నాలుగేళ్ల డిగ్రీ ప్రోగామ్స్ విషయంలో మూడేళ్లలో వాటిని పూర్తి చేసుకునే అవకాశం కల్పించాలి. కానీ యాక్సలెరేటెడ్ డిగ్రీ ప్రోగ్రామ్ విధానంలో.. టీచింగ్–లర్నింగ్ కోణంలో సమస్య ఉత్పన్నమవుతుందని, విద్యార్థులు ఒత్తిడికి గుర వుతారని నిపుణులు అంటున్నారు. బ్యాచిలర్ డిగ్రీని రెండున్నరేళ్లలో పూర్తి చేసుకునే అవకాశం కల్పించిన యూ జీసీ.. పీజీ విషయంలో మాత్రం మూడేళ్లు లేదా నాలుగేళ్ల డిగ్రీ పూర్తి చేసుకున్న వారినే అర్హులుగా నిర్దేశించాలని సూచించింది. దీంతో.. రెండున్నరేళ్లకు లేదా మూడేళ్లకే బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసుకున్న వారికి పీజీ ప్రవేశాల అర్హతపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.తక్షణ అమలు సాధ్యం కాదు..యూజీసీ ప్రతిపాదనలు, సిఫార్సులను తక్షణం అమలు చేసే పరిస్థితి ప్రస్తుతం మన దేశంలో లేదు. ఇవి పూర్తి స్థాయిలో అమలు కావాలంటే అయిదు నుంచి పదేళ్ల సమయం పట్టొచ్చు. ముఖ్యంగా ప్రభు త్వ విద్యా సంస్థలు ఈ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటాయి. ప్రైవేట్, డీమ్డ్ యూనివర్సిటీల్లో కొంత మేర వీటిని వెంటనే అమలు చేసే వీలుంది. – ప్రొఫెసర్. డి.ఎన్. రెడ్డి, యూజీసీ మాజీ సభ్యుడు, జేఎన్టీయూ మాజీ వీసీఆహ్వానించదగ్గ పరిణామంయూజీసీ తాజా సిఫార్సులను ఆహ్వానించదగ్గ పరిణామంగా చెప్పొచ్చు. విద్యార్థులు ఫ్లెక్సిబుల్ లర్నింగ్ విషయంలో అదనపు కసరత్తు చేయాల్సి ఉంటుంది. కొంత మానసిక ఒత్తిడిని కూడా తట్టుకునే సామర్థ్యం ఉండాలి. ఇందుకోసం అవసరమైన వనరులను ఉన్నత విద్యా సంస్థలు కల్పించాలి. – ప్రొఫెసర్. వి.ఎస్.రావు, ప్రొ వైస్ ఛాన్స్లర్ అడ్వయిజర్, ఎస్ఆర్ఎం యూనివర్సిటీదశల వారీగా అమలు చేయాలిగ్లోబలైజేషన్ నేపథ్యంలో ఈ సంస్కరణలు అవస రమే.. కానీ అమలు విషయంలో ఫ్యాకల్టీ కొరత సమస్యగా మారుతోంది. ఇప్పటికే స్కిల్ డెవలప్ మెంట్ కోణంలో పలు చర్యలు తీసుకుంటున్నాం. ఆర్ట్స్, హ్యుమానిటీస్ విద్యార్థులు ఫ్లెక్సిబుల్ లర్నింగ్ విధానంలో బీటెక్, సైన్స్ కోర్సుల్లో రాణించడం కష్టంగానే ఉంటుంది. – ప్రొఫెసర్. వి. బాలకిష్టారెడ్డి, చైర్మన్, తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి -
క్రేజీ.. డీజే..
అర్ధరాత్రి సమయం..చిమ్మ చీకట్లని. పట్ట పగలుగా మార్చే రంగురంగుల విద్యుత్ కాంతుల్లో.. ఓ వైపు ఛీర్స్‌తో హుషారు.. మరోవైపు చిందుల జోరు.. ఆ సమయంలో తోడు లేకుండా అమ్మాయిలు బయటకు వెళ్లడమే సరికాదని నొక్కి వక్కాణించే సంప్రదాయ వాదుల చెవులకు చిల్లులు పడే సంగీతంతో కదం తొక్కుతున్నారు ఆధునిక యువతులు. డీజేలుగా.. మేల్ డామినేషన్‌కు గండికొడుతూ శరవేగంగా ముందుకు దూసుకొస్తున్నారు. ‘మనసుకు నచ్చిన సంగీతం.. వయసుకు తగ్గ వినోదం.. మంచి ఫ్రెండ్స్. ఇన్ని అందించే రంగాన్ని వదిలేసి సాదా సీదా ఉద్యోగం ఎందుకు చేయాలి?’ అని ప్రశ్నింస్తున్నారు అఖిల. ఉద్యోగం అంటే మంచి ఆదాయం వస్తుంది కదా..అంటే..! ‘నేను ఎంచుకున్న కెరీర్లో అంతకన్నా ఎక్కువ సంపాదనే ఇప్పుడు వస్తుంది’ అంటూ స్పష్టం చేశారు. సాయంత్రం ఆరు దాకా అఖిల.. ఆరు దాటాక డీజే బ్లాక్.ఎవరూ డేర్ చేయని రోజుల్లోనే.. దాదాపు పదేళ్ల క్రితమే ఈ రంగంలోకి వచ్చారు లీనా. నగరంలోని సికింద్రాబాద్‌లో నివసించే ఈ సింథీ యువతి.. డిగ్రీ పూర్తి చేసి ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు కూడా చేశారు. అనంతరం కొన్ని షోస్ చేశారు.. చిన్న చిన్న ఉద్యోగాలు చేసి ఆ తర్వాత ఫుల్‌టైమ్ డీజేయింగ్ను ఎంచుకున్నారు. ‘ఏవీ మనసుకు నచ్చలేదు. అదే నా కెరీర్‌ను ఇటు మార్చింది’ అంటూ చెప్పారు డీజే లీనా. ఫ్రీలాన్స్ డీజేగా సిటీలోని సగం పైగా క్లబ్స్‌లో ఇప్పటికే తన మ్యూజిక్ వినిపించానంటున్న లీనా.. బాలీవుడ్ అంటే తనకు ప్రేమ అనీ, అందుకే ఆ సంగీతాన్ని ప్లే చేయడానికి తాను ఇష్టపడతానని అంటున్నారు. అమ్మాయిలు ఈ రంగంలోకి ఎక్కువగా రాకపోవడానికి కుటుంబ సభ్యుల నుంచి మద్దతు దొరకకపోవడమే కారణమంటున్నారు లీనా.. తాను కూడా అతి కష్టం మీద కుటుంబ సభ్యులను ఒప్పించగలిగానని చెబుతున్నారు.ట్రెడిషనల్ ఫ్యామిలీలో.. ట్రెండీగా.. ‘నేను ఇక్ఫాయ్లో బీబీఏ పూర్తి చేశాను. సొంతంగా బిజినెస్ చేయాలనేది నా ఆలోచన. అయితే చిన్నప్పటి నుంచీ డీజేయింగ్ అంటే ఇష్టం. ఫ్రెండ్స్‌తో క్లబ్స్‌కి వెళ్లినప్పుడు కేవలం డీజే మ్యూజిక్ కోసమే వెళ్లేదాన్ని’ అంటూ గుర్తు చేసుకున్నారు అఖిల. మహబూబ్ నగర్‌కు చెందిన ఓ పూర్తి సంప్రదాయ కుటుంబంలో పుట్టిన అఖిల.. 2018లో డీజే స్కూల్లో చేరాలని నిర్ణయించున్నారు. అప్పుడు ఇంట్లో వాళ్ల నుంచి చెప్పుకోదగ్గ ప్రతిఘటననే ఎదుర్కొన్నారు. ‘ఫ్యామిలీ వద్దు అన్నప్పటికీ మనసు మాటే విన్నాను. ఒక ప్రోగ్రామ్‌కి కేవలం రూ.1000తో ప్రారంభించి.. ఇప్పుడు అంతకు పదింతలు తీసుకునే స్థాయికి చేరాను’ అంటూ సగర్వంగా చెప్పారామె. అమ్మాయిల భద్రత విషయం గురించి మాట్లాడినప్పుడు.. ‘మా చుట్టూ బౌన్సర్స్ ఉంటారు. ఇప్పటిదాకా చిన్న చేదు అనుభవం కూడా నాకు ఎదురుకాలేదు’ అంటూ చెప్పారామె. భవిష్యత్తులోనూ డీజేగా కొనసాగుతానని, మరిన్ని టాప్ క్లబ్స్‌లో తన మ్యూజిక్‌ని వినిపిస్తానని బాలీవుడ్ ట్య్రాక్స్కి పేరొందిన ఈ డీజే బ్లాక్ చెబుతున్నారు.‘ఫ్లో లో.. ‘జో’రుగా.. ‘మా నాన్న వాళ్లది వరంగల్. అయితే నేను నార్త్‌లోనే పెరిగాను. ప్రస్తుతం సిటీలో సెటిలయ్యా’ అంటూ చెప్పారు ఫ్లోజో. డిగ్రీ పూర్తి చేశాక.. కొన్ని కార్పొరేట్ ఉద్యోగాలు చేశా. అయితే చిన్నప్పటి నుంచీ సంగీతం పై ఉన్న ఇష్టంతో డీజేసూ్కల్లో చేరి కోర్సు పూర్తి చేసి డీజేగా మారాను అంటూ చెప్పారు ఫ్లోజో. ప్రస్తుతం నగరంలో టాప్ డీజేల్లో ఒకరుగా ఉన్న ఈ అమ్మాయి తొలుత లిక్విడ్స్‌లో రెసిడెంట్ డీజేగా ప్లే చేశానని, కొంత కాలం తర్వాత ఫ్రీలాన్స్ డీజేగా మారి, పలు అవార్డ్స్ కూడా అందుకున్నానని వివరించారు. థాయ్‌ల్యాండ్ వంటి అంతర్జాతీయ వేదికలపైనా, గోవా వంటి పార్టీ సిటీల్లోనూ ప్లే చేశానంటున్న ఫ్లోజోకి తన పేరు స్టైలి‹Ùగా ఉండడంతో మార్చుకోవాల్సిన అవసరం రాలేదన్నారు. ఈ కెరీర్లో అటు ఆనందం, ఇటు ఆదాయం రెండూ బాగుంటాయంటున్న ఫ్లోజో.. ఆరేడేళ్లలోనే కారు, ఫ్లాట్ కొనగలిగానని సంతోషంగా చెప్పారు. ఇదీ చదవండి: గేలి చేసినచోటే గెలిచి చూపించిన మగువలు! -
కృంగి‘పోతున్న’ పండుటాకులు: చట్టం ఉందిగా అండగా!
కనిపెంచిన బిడ్డల్ని,కంటికి రెప్పలా కాపాడి, ఎన్నో కష్టాలకోర్చి వారిని పెంచి ప్రయోజకుల్ని చేస్తారు తల్లిదండ్రులు. కానీ రెక్కలు వచ్చిన బిడ్డలు కన్నతండ్రులను నిర్లక్ష్యం చేస్తున్నారు. మరికొందరు ఆస్తుల కోసం వేధింపులకు పాల్పడుతున్నారు. హృదయాల్ని కదిలించే ఇలాంటి ఉదంతాలపై స్పెషల్ స్టోరీ..వృద్ధాప్యంలో తల్లిదండ్రులను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కొందరు కుమారులు, కూతుళ్లు పట్టించుకోవడం లేదు.. ఆస్తుల కోసం వేధింపులకు గురిచేయడం, తిండి పెట్టకపోవడం, చేయి చేసుకోవడం, చివరకు చంపేందుకూ వెనకాడకపోవడం వంటి ఘటనలు కృంగిపోయేలా చేస్తున్నాయి.. రెక్కలు ముక్కలు చేసుకొని, పిల్లలను పెంచి, ప్రయోజకులను చేస్తే వృద్ధాప్యంలో పట్టెడన్నం పెట్టకుండా మనోవేదనకు గురి చేయడాన్ని తట్టుకోలేకపోతున్నారు. కొంతమంది ఇంటి నుంచి వెళ్లిపోతున్నారు.. మరికొందరు ఆత్మహత్య చేసుకుంటున్నారు.. ఇంకొందరు కలెక్టరేట్లలో ప్రజావాణిని, ఠాణాల్లో పోలీసులను ఆశ్రయిస్తున్నారు.. ఇటీవల ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వృద్ధుల మిస్సింగ్ కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.ఈమె పేరు గుర్రాల అంతమ్మ. మానకొండూరు మండలం కొండపల్కల. 9 ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా కొడుకు లక్ష్మారెడ్డి మాయమాటలు చెప్పి, ఏడెకరాలు రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. 2022లో తన భర్త మల్లారెడ్డి మరణించడంతో కొన్ని రోజుల తర్వాత ఇంటి నుంచి వెళ్లగొట్టాడని అంతమ్మ వాపోయింది. కూతురు వద్ద తలదాచుకుంటున్నానని కన్నీటిపర్యంతమైంది. మిగిలిన భూమిని కూడా రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు కుమారుడు ప్రయత్నిస్తున్నాడని తెలిపింది.ఈ చిత్రంలో కనిపిస్తున్నది చొప్పదండికి చెందిన ముత్యాల గోపాల్‌రెడ్డి, ఆయన భార్య. వీరికి ఇద్దరు కుమారులు రవీందర్‌రెడ్డి, సత్యనారాయణ, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. 20 ఎకరాల వ్యవసాయ భూమితో దర్జాగా బతికేవారు. పిల్లలను చదివించి, ప్రయోజకులను చేశారు. తీరా కుమారులు మాయమాటలు చెప్పి, భూమిని తమ పేరిట పట్టా చేసుకున్నారు. తర్వాత ఇంట్లో నుంచి గెంటేశారని, ఈ వయసులో తమకు ఇదేం దుస్థితి అంటూ ఆ దంపతులు కంటతడి పెడుతున్నారు.జగిత్యాల మున్సిపాలిటీలోని ఓ వార్డుకు చెందిన ఒక వృద్ధుడు కొడుకు పట్టించుకోకుండా ఇబ్బందులకు గురిచేస్తుండటంతో మానసికంగా కృంగిపోయాడు. ఇంటిని వదిలి వెళ్లిపోయాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని, విచారణ చేపడుతున్నారు.సిరిసిల్లకు చెందిన ఓ వృద్ధుడు కుమారుడు ఆస్తి రాయించుకొని, తర్వాత పట్టించుకోకపోవడంతోపాటు వేధింపులకు గురిచేస్తున్నాడని హెల్ప్ లైన్–14567కు ఫోన్ చేసి, ఫిర్యాదు చేశాడు. అధికారులు తొలుత కౌన్సెలింగ్ ఇచ్చినా అతనిలో మార్పు రాలేదు. దీంతో ఆర్డీవో ఆధ్వర్యంలో మెయింటెనెన్స్ ట్రిబ్యునల్ దృష్టికి తీసుకెళ్లారు. అక్కడ తండ్రికి, కుమారుడికి కౌన్సెలింగ్ ఇచ్చారు. చట్టంలోని నిబంధనలు, విధించే శిక్షల గురించి వివరించారు. తర్వాత కుమారుడి ప్రవర్తనలో మార్పు వచ్చింది.సుల్తానాబాద్ మున్సిపాలిటీలోని గొల్లపల్లిలో ఆస్తి వివాదం కారణంగా కొడుకు సింగరేణి రిటైర్డ్ కార్మికుడైన తన తండ్రి మధునయ్యను తోసేశాడు. అతను కిందపడి, మృతిచెందాడు.చట్టాలున్నాయి.. న్యాయం పొందొచ్చుపండుటాకులకు సొంత బిడ్డల నుంచే వేధింపులు, నిరాదరణ ఎదురవుతుండటంతో కేంద్రం 2007లో తల్లిదండ్రులు, వయోవృద్ధుల రక్షణ, పోషణ చట్టం తీసుకొచ్చింది. దీని ప్రకారం ఉమ్మడి ఏపీ ప్రభుత్వం 2011లో ఒక నియమావళి రూపొందించింది. 2019లో కేంద్రం వృద్ధుల సంక్షేమం మరింత మెరుగ్గా ఉండటానికి చట్టానికి సవరణలు చేసింది. వాటి ప్రకారం ప్రతీ రెవెన్యూ డివిజన్ స్థాయిలో ఒక ట్రిబ్యునల్ ఏర్పాటైంది. దానికి ఆర్డీవో లేదా సబ్ కలెక్టర్ స్థాయి అధికారి చైర్మన్‌గా, స్వచ్ఛంద సంస్థల నుంచి ఒకరు లేదా ఇద్దరు సభ్యులుగా ఉంటారు. బాధిత వృద్ధులకు ఉచితంగా వారి బిడ్డల నుంచి రక్షణ, పోషణ కల్పిస్తారు. బాధితులకు ఈ తీర్పు నచ్చకపోతే కలెక్టర్ చైర్మన్‌గా ఏర్పాటయ్యే అప్పీలేట్ ట్రిబ్యునల్‌ను 60 రోజుల్లో ఆశ్రయించి, అంతిమ న్యాయం పొందొచ్చు. ఆస్తిని తిరిగి పొందే హక్కునిరాదరణకు గురైనప్పుడు తమ బిడ్డలకు రాసిచ్చిన ఆస్తిని వృద్ధులు బేషరతుగా తిరిగి పొందే హక్కును చట్టంలో చేర్చారు. కేవలం గిఫ్ట్ డీడ్ చేసిన ఆస్తి మాత్రమే కాదు రిజిస్ట్రేషన్ చేసిన ఆస్తిని సైతం తిరిగి పొందొచ్చు. ప్రతీ నెల మెయింటెనెన్స్ రూ.10 వేల వరకు ఇప్పిస్తారు. ఇటీవల పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో ఓ వృద్ధుడికి కలెక్టర్ ఇలాగే న్యాయం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం కల్పించిన ఇటువంటి చట్టాలపై వృద్ధులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. కుమారులు నిర్లక్ష్యం చేస్తే టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ 14567 నంబర్‌కు ఫిర్యాదు చేయొచ్చు. లేదా నేరుగా ప్రతీ సోమవారం కలెక్టరేట్లో జరిగే ప్రజావాణిలో అధికారులకు విన్నవించుకోవచ్చు. కౌన్సెలింగ్ ఇచ్చి, పోషణ కింద ఆర్థికసాయం అందే ఏర్పాటు చేసి, పోలీసుల ద్వారా రక్షణ కల్పిస్తారు.వేధిస్తే కఠిన చర్యలు వృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వాలు చట్టాలు చేశాయి. వాటిపై ప్రతీ ఒక్కరు అవగాహన పెంచుకోవాలి. ఎవరి నుంచి ఏ విధమైన వేధింపులను ఎదుర్కొంటున్నా, ఎలాంటి సమాచారం కోసమైనా హెల్ప్‌లైన్ నంబర్లో సంప్రదించవచ్చు. వృద్ధులను వారి సంతానం ప్రేమతో చూడాలి. వేధింపులకు గురిచేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం.– శ్రీనివాస్, సీపీ రామగుండం -
విజనరీ ముసుగులో ఆర్ధిక అరాచకాలు
-
సమయం.. సుధారసమయం..
కాలం భగవత్స్వరూపం. ప్రాణుల్ని, జగత్తునూ నడిపించేదీ, హరించేదీ కాలమే. సృష్టి, స్థితి, వినాశం అనే ప్రధానమైన కార్యాలకు సాక్షీభూతంగా నిలిచేదీ కాలమే. అత్యంత బలవత్తరమైన కాలప్రభావాన్ని ఎవరూ అతిక్రమించలేరు. ఏ భౌతిక సాధనాలూ, ఆధ్యాత్మిక సాధనలూ కాలాన్ని బంధించలేవు. ‘‘పారే నదిలో ఈ క్షణం తాకిన నీటిని మరుక్షణం ఎలాగైతే తాకలేమో అలాగే గతించిన కాలాన్ని పట్టుకోలేం. అందుచేత కాలమహిమను ప్రతి ఒక్కరూ గుర్తించండి’’ అంటాడు చాణుక్యుడు. చాణుక్యుని వాక్యాలు ఎంతో అర్థవంతమైనవి.జీవితంలో ప్రతిక్షణం వెలకట్టలేనిదే. గడిచిపోయిన క్షణం మళ్ళీ తిరిగిరాదు. అందుకే, కాలాన్ని విధిగా పాటించడం, లేదా సమయపాలనకు కట్టుపడడం అనేది ప్రతివారికీ అత్యంత ముఖ్యమైన విధి. సమయపాలనకు సంబంధించి రకరకాల నిర్వచనాలు మనకు నిత్యమూ కనబడుతూ ఉంటాయి. సమయానికి మనం అనుకున్న పనిలో, విహితమైన తీరులో, ఏకాగ్ర చిత్తంతో నిమగ్నం కావడాన్నే సమయపాలన అని చెప్పుకోవచ్చు.ఏదైనా పనికోసం మనం సమయాన్ని కేటాయిస్తే, అది మనకు ఆ కార్య పరిపూర్ణతకు ఉపకరించి, సంతృప్తిని కలిగిస్తుంది. ఏదైనా ఉన్నతమైనలక్ష్యాన్ని సాధించడంకోసం సమయాన్ని కేటాయిస్తే, అది మనలో మేధాశక్తినీ పెంచడమే గాక, వ్యక్తిత్వాన్ని శిఖరాగ్రానికీ చేరుస్తుంది. అమేయమైన సారాన్ని నింపుకున్న పుస్తకాలను గానీ, గ్రంథాలను గానీ చదవడానికి సమయాన్ని కేటాయిస్తే, మనలో మనోవికాసం పెంపొందుతుంది. ఎప్పుడూ ఏదో ఒక పనిలోనే నిమగ్నం కాకుండా, ఒకింత నవ్వుకోవడానికి సమయాన్ని కేటాయిస్తే , అది మన జీవితాన్ని ఆహ్లాదమయం చేస్తుంది.కొంత సమయాన్ని పక్కవాడికి సహాయం చేయడానికి కేటాయిస్తే, అది మనకు ఆత్మానందాన్ని కలిగిస్తుంది. దైనందిన జీవితంలో వ్యాయామానికి సమయాన్ని కేటాయిస్తే, అది మనకు ఆరోగ్యప్రదాయినియై సంతసాన్ని కలిగిస్తుంది. సమయం విలువ ప్రతివారూ గుర్తెరగడం అత్యంత ముఖ్యమైన విషయం. ప్రత్యేకించి, పిల్లలకు సమయానికి తగినట్లుగా పనులు అలవాటు చేయడం తల్లితండ్రుల బాధ్యత. ముఖ్యంగా ఉదయాన నిద్రలేవడం నుంచీ, రాత్రి పడుకునే వరకు, వాళ్ళు ఏ సమయానికి ఏం చేయాలో తెలియజెప్పడం తప్పనిసరిగా చేయాలి. ముందు కొంత బద్ధకించినా, కొన్ని రోజులకు సమయం ప్రకారం పనులు చేయడం వారికి అలవాటుగా మారుతుంది. జీవితానికి ఉత్తమ బాటను పరుస్తుంది.‘‘ క్షణము గడిచిన దాని వెన్కకు మరల్పసాధ్యమే మానవున కిలాచక్రమందు‘ అంటారు శ్రీ జాషువ మహాకవి. ఒక్క మాటలో చెప్పాలంటే విశ్వవిఖ్యాతి గడించిన మహనీయులందరూ ఏరంగానికి చెందిన వారైనా కాలం విలువ బాగా తెలిసిన వారే సమయాన్ని సద్వినియోగపరచుకున్నవారే . కాలం అనేది మనం ఆపితే ఆగదు . కాబట్టి ఏ సమయంలో ఏపని చెయ్యాలో ఆ సమయం లో ఆపని చేస్తే సమయం సద్వినియోగపరిచినట్లే.ప్రపంచంలో గొప్పవాళ్ళయిన వ్యక్తులందరూ కాలం విలువ తెలిసిన వాళ్ళే. ప్రతీ క్షణాన్నీ సద్వినియోగం చేసినవాళ్ళే. స్వామి వివేకానంద యువతకు ఇచ్చిన సందేశం ఎంతో ప్రభాసమానంగా ఉంటుంది. ‘‘యువతీయువకుల్లారా.. మీరంతా మేల్కొనండి. లక్ష్య సాధనకోసం శ్రమించే క్రమంలో ప్రతి క్షణాన్నీ సద్వినియోగపరచండి. మీరు మండే నిప్పు కణికలు అని గమనించండి. మిమ్మల్ని వెనుకకు నెట్టే ఒకే ఒక్క గుణం సోమరితనం. కాబట్టి కాలం విలువ ఎరిగినవారై, బద్దకాన్ని వదలండి.’’ అంటూ పలికిన సందేశం అత్యంత విలువైనది. సమయం విలువను కాల రాచే మహమ్మారి లాంటి జాడ్యం సోమరితనం. సాధారణంగా మనసు సుఖాన్ని, బుద్ధి హితాన్ని కోరుకుంటాయి . పరీక్షలొస్తున్నాయి చదవడం వెంటనే ఆరంభించమని బుద్ధి చెబుతుంది . ఏమీ ఫరవాలేదు, పరీక్షలు బాగా దగ్గరకొచ్చాక చదవొచ్చని మనస్సు చెబుతుంది. మనం మనస్సు పలికిన మాటే వింటాం. బుద్ధి చెప్పింది ఏమాత్రం వినం. అందుకే ఎంతో అనర్థం జరుగుతోంది. కాలాన్ని ఉపయోగించుకుని తగిన రీతిలోసార్థకత్వాన్ని సాధించడం కష్టమైన పని ఏమాత్రం కాదు.జగత్ప్రసిద్ధమైన ఆపిల్ కంపెనీ సహవ్యవస్థాపకుడైన స్టీవ్ జాబ్స్ మాట్లాడుతూ, ‘‘నీ సమయం ఎంతో విలువైనది. ఆ సమయాన్ని వినియోగించి నీ జీవితాన్ని స్వర్గమయం చేసుకో. కాలాన్ని వ్యర్థం చేసుకుని, ఇంకొకరి జీవితంలో నీవు బతకకు’’ అంటారు. ఇందులో ఎంతో సందేశం ఉంది. కాలం విలువ తెలుసుకుని, ప్రగతినిసాధిస్తూ, ముందుకు సాగమని, ఇంకొకరితో తనను పోల్చుకోకుండా ధరిత్రిలో మరొక కొత్త చరిత్రను లిఖించమనే ప్రబోధమూ ఈ మాటల్లో దాగి ఉంది. – వెంకట్ గరికపాటి వ్యాఖ్యాన విశారద‘‘ప్రపంచంలో అతి విలువైన వస్తువులు రెండు.. మొదటిది సహనం, రెండోది కాలం.’’ అంటారు లియో టాల్స్టాయా. సృష్టిలో మనకు లభించే అత్యంత విలువైన సంపద కాలమే. కానీ అత్యంత దయనీయంగా నిత్యమూ మనం వృథా చేసేదీ కాలాన్నే..!!‘‘సమయం ప్రధానమైన విషయాల్లో ఒకటి కాదు. సమయమే అత్యంత ప్రశస్తమైన సంపద’’ అని యువత గ్రహిస్తే, వారి భవిత బంగరుబాట కావడం కష్టమైన విషయమేమీ కాదు. కాలానికి గాలం వేయడం కష్టమే. కానీ, దాని విలువను తెలుసుకుని, విహితమైన ఆలోచనకు ఆలవాలం చేసి, సద్వినియోగపరచిన ప్రతివ్యక్తీ చేయగలిగేది సుగతితో, ప్రగతితో కూడిన మహేంద్రజాలమే. -
Archa Mehta: ఎక్స్పరిమెంటలిస్ట్
సంజయ్ లీలా భన్సాలీ సినిమా అంటే ఫ్యాషన్ డిజైనర్లందరికీ పండుగ! ఆయన సినిమా విడుదల తర్వాత చిన్న చిన్న బోటీక్ ఓనర్స్ నుంచి టాప్ మోస్ట్ ఫ్యాషన్ డిజైనర్స్ దాకా అందరూ ఆ చిత్రం రిఫరెన్స్‌తో కొత్త కలెక్షన్స్‌ను విడుదల చేస్తారు. అలాంటిది కాస్ట్యూమ్ డిజైనర్‌గా, స్టయిలిస్ట్‌గా తొలి అవకాశమే సంజయ్ లీలా భన్సాలీ మూవీలో వస్తే.. అదృష్టమే అనుకుంటారు! అలాంటి చాన్స్ దక్కించుకున్న అదృష్టవంతురాలే ఇక్కడ పరిచయమవుతున్న స్టయిలిస్ట్ అర్చా మెహతా!అర్చా మెహతా స్వస్థలం ఢిల్లీ. కెరీర్ విషయంలో తండ్రి ఏం చెప్తే అదే అనుకొని, ఇంటర్ అయిపోగానే ఇంజినీరింగ్ కాలేజీలో చేరింది. కాలేజీ కల్చరల్ ప్రోగ్రామ్స్‌లో భాగమైన ర్యాంప్ వాక్‌లో పాల్గొన్నది. అప్పుడు గ్రహించింది తన అసలు ప్యాషన్ ఫ్యాషనే అని! ఆ విషయాన్ని తండ్రితోనూ చెప్పింది. కూతురి ఇష్టాన్ని గుర్తిస్తూ ఆయన వెంటనే అర్చాను ఇంజినీరింగ్ మాన్పించి, ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ కోసం లండన్ పంపించాడు. అక్కడ ఆమె ఫ్యాషన్ డిజైనింగ్‌తో పాటు స్టయిలింగ్ గురించి కూడా తెలుసుకుంది. కోర్స్ పూర్తవగానే అక్కడే సుప్రసిద్ధ ఫ్యాషన్ డిజైనర్ల దగ్గర ఇంటర్న్‌గా పనిచేసింది. తర్వాత ముంబై చేరింది. వెంటనే ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ చిత్రం ‘గోలియోంకీ రాస్లీలా రామ్‌లీలా’కి అసిస్టెంట్ స్టయిలిస్ట్, అసిస్టెంట్ కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేసే అవకాశం దొరికింది. అది పనిలో అనుభవాన్నే కాదు.. టాలీవుడ్లో ఎంట్రీనీ కల్పించింది. ‘హార్ట్ ఎటాక్’ మూవీలో అగ్రతారలకు స్టయిలిస్ట్‌గా! అందులో ఆమె కేవలం కాస్ట్యూమ్స్ మీదే కాదు స్కార్ఫ్‌లు, యాక్ససరీస్, ఆఖరకు పచ్చబొట్టు లాంటి వాటిపైనా దృష్టి పెట్టి స్టయిలింగ్ చేసింది. తక్కువ ఎక్స్‌పోజింగ్‌తో ట్రెండీ లుక్ ఇచ్చినందుకు హీరోయిన్స్ ఆదా శర్మ మెప్పును కూడా పొందింది. అప్పటి నుంచి అదే ఆమె సిగ్నేచర్ స్టయిలింగ్ అయింది. ఆ స్కిల్‌కి టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీస్ చాలామంది ఫిదా అయ్యారు. ఆ జాబితాలో కీర్తీ సురేశ్, మృణాల్ ఠాకుర్, కృతీ శెట్టీ, రాశీ ఖన్నా, కాజల్ అగర్వాల్, సంయుక్తా మీనన్, కళ్యాణీ ప్రియదర్శన్, కేథరిన్ త్రెసా, హన్సిక, మెహ్రీన్, ప్రణీత, దిశా పాట్నీ, నుస్రత్ భరూచా ఎట్సెట్రా ఉన్నారు. వాళ్లంతా అర్చాను తమ పర్సనల్ స్టయిలిస్ట్‌గా అపాయింట్ చేసుకున్నారు. ఈ హీరోయిన్స్‌కే కాదు శర్వానంద్, నితిన్ లాంటి హీరోలకూ ఆమె స్టయిలింగ్ చేస్తోంది. ∙దీపిక కొండి -
పొలిటికల్ ట్విస్టులతో దద్దరిల్లిపోతున్న మహారాష్ట్ర
-
ప్రతీదానికీ ఓ పద్ధతి ఉంటుంది కళ్ళు మూసుకుంటే సరిపోదు!!
అతను తన గురువుగారి ఆశ్రమంలో విడిగా ఏర్పాటు చేసిన ఓ పూరిపాకలో కూర్చుని స్థిరమైన మనసు కోసం తీవ్రంగా ప్రయత్నించ సాగాడు. ఎవరు చూడడానికి వచ్చినా అతను కళ్ళు తెరచి చూసేవాడు కాదు. ఎవరైనా వచ్చినట్టు అలికిడైనా సరే చూసేవాడు కాదు.అయితే ఒకరోజు గురువుగారు ఈ శిష్యుడిని చూడడానికి వెళ్ళారు. కానీ శిష్యుడు గురువుగారిని కూడా పట్టించుకోలేదు. అయినా గురువుగారు అక్కడి నుంచి కదలలేదు. పైగా ఆ పూరిపాక గుమ్మంలో ఓ ఇటుకరాయిని మరొక రాయిమీద పెట్టి అరగదీయడం మొదలుపెట్టాడు. అలా గీయడంతో పుట్టిన శబ్దాన్ని శిష్యుడు భరించలేకపోయాడు.అతను కళ్ళు తెరిచి అడిగాడు –‘‘మీరేం చేస్తున్నారు...తెలుస్తోందా...’’అని.గురువు చెప్పాడు – ‘‘ఇటుకను అద్దంగా మారుస్తున్నాను’’ అని.అప్పుడతను ‘‘ఇటుకను అద్దంగా మార్చడం సాధ్యమా... దానిని పిచ్చితనమంటారు... మరెంత అరగదీస్తే అంతగా అది అరిగి చివరికి ఇటుకరాయి జాడ కూడా కనిపించకుండా పోతుంది. అలాంటిది అద్దం ఎలా ఏర్పడుతుంది. కాస్త ఆపండి ఆలోచించండి... నన్ను నా మనసు మీద ఏకాగ్రత నిలుపు కోనివ్వండి’’ అని చెప్పాడు.అతని మాటలకు గురువుకు నవ్వొచ్చింది.‘‘అలాగైతే నువ్వేం చేస్తున్నావు... ఇటుకరాయి అద్దం కాలేని పక్షంలో మనసు ఎలా స్వచ్ఛమైన అద్దమవుతుందో చెప్పు. ముక్కు మూసుకుని కూర్చున్నంత మాత్రాన నిలకడ వచ్చేయదు. దానికో పద్ధతి ఉంది. అది తెలుసుకోకుండా ఎవరినీ చూడనని కళ్ళు గట్టిగా మూసుకుంటే సరిపోతుందని అనుకోవడం ఎంత అవివేకం?’’ అని ప్రశ్నించాడు గురువు. శిష్యుడు సిగ్గుతో తలవంచుకున్నాడు. – యామిజాల జగదీశ్ -
World Kindness Day 2024 : హృదయాన్ని కదిలించే వీడియోలు!
ప్రపంచ దయ దినోత్సవాన్ని (World Kindness Day ) ఏటా నవంబర్ 13న జరుపుకుంటారు. వ్యక్తులుగా ఒకరిపట్ల ఒకరు, తమ పట్ల , వారి చుట్టూ ఉన్న ప్రపంచం పట్ల దయ చూపేలా ప్రోత్సహించడం దీని ఉద్దేశం. మానవులుగా పుట్టినందుకు ప్రతి ఒక్కరూ, తోటివారితోపాటు ఈ ప్రకృతి, జంతువుల పట్ల ప్రేమతో, దయతో కృతజ్ఞతగా ఉండడంలోని ప్రాధాన్యతను గుర్తించే రోజు ప్రపంచ దయ దినోత్సవం. చుట్టూ ఉన్న సమాజం పట్ల దయతో ఉండటం మనుషులుగా మనందరి ప్రాథమిక లక్షణం,ప్రపంచ దయ దినోత్సవం: చరిత్రవరల్డ్ కైండ్‌నెస్ డేని 1998లో వరల్డ్ కైండ్‌నెస్ మూవ్మెంట్ ప్రారంభించింది. సామరస్య ప్రపంచాన్ని సృష్టించడంలో దయ యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచడం లక్ష్యం. 1997లో జపాన్ రాజధాని టోక్యోలో జరిగిన మొదటి ప్రపంచ దయ ఉద్యమ సదస్సు తర్వాత ప్రపంచ దయ ఉద్యమం ఏర్పడింది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో పలు వీడియోలు వైరల్‌గా మారాయి.మనసు అందరికీ ఉంటుందికానీ అది గొప్పగా కొందరికి మాత్రమే ఉంటుంది..❤️✨#WorldKindnessDay2024 pic.twitter.com/MwM1NRPexm— Do Something For 👉Better Society ✊ (@ChitraR09535143) November 13, 2024 It is called true happiness which gives peace to the heart and smile to the faces. In fact, the beauty of nature lies in its precious creations, animals and birds. Make your contribution in protecting nature, environment, animals, birds and creatures.#WorldKindnessDay2024 pic.twitter.com/kpXDNaRRZ8— Munesh Kumar Ghunawat (@GhunawatMunesh) November 13, 2024 -
ట్రంప్ గెలిచారు?.. మరి మనకేంటి?
-
నఖ శిఖం : క్యాన్సర్ మహమ్మారి
ఓ పరిమితి లేకుండా అనారోగ్యకరంగా, అసాధారణంగా పెరుగుతూ, తొలుత ఒక కణంతోనే క్యాన్సర్ తన ప్రస్థానాన్ని ప్రారంభిస్తుంది. ఎప్పటికప్పుడు రెట్టింపు అయ్యే ఈ ప్రక్రియలో 20వ సారి అది ఒక మిలియన్ కణాలుగా వృద్ధి చెందుతుంది. మిలియన్ కణాల సముదాయంగా పెరిగినప్పటికీ ఆ టైమ్‌లోనూ దాన్ని కనుక్కోవడం కష్టసాధ్యం. అదే 30వసారి రెట్టింపు అయ్యే సమయంలో అందులో బిలియన్ కణాలకు పైగా ఉంటాయి. అప్పుడు మాత్రమే అది ఓ గడ్డ (లంప్)లా రూపొంది గుర్తించడానికి వీలయ్యేలా ఉంటుంది. అంటే... చేత్తో గడ్డను తడిమి గుర్తించడానికి వీలయ్యే సమయానికి ఆ క్యాన్సర్ గడ్డలో బిలియన్ కణాలు... వందకోట్ల కణాలకు పైనే ఉంటాయి. ఇక 40వ సారి రెట్టింపయ్యాక అందులో ఒక ట్రిలియన్ కణాలుంటాయి. అప్పటికీ చికిత్స లభించక 42–43వ సారి రెట్టింపయినప్పుడు రోగి ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి వెళ్తాడు. అన్ని రెట్టింపులు కాకముందే... అంటే కేవలం 20వ సారి రెట్టింపయ్యే లోపు కనుక్కోగలిగితే...? క్యాన్సర్‌ను నయం చేసే అవకాశాలు చాలా ఎక్కువే. మరి ఆ దశలోనే క్యాన్సర్‌ను కనుక్కోవడం ఎలాగో తెలిపేదే ఈ కథనం. క్యాన్సర్ లక్షణాలు అవయవానికీ అవయవానికీ మారి΄ోతున్నప్పటికీ క్యాన్సర్ బాధితులందరికీలోనూ కొన్ని సాధారణ లక్షణాలు కనిపిస్తాయి. ఆరోగ్యవంతుల్లోనూ అప్పుడప్పుడూ ఆ లక్షణాలు కనిపించేవే కావడంతో వాటిని గుర్తించడం కష్టం.క్యాన్సర్‌ను గుర్తించేందుకు తోడ్పడే కొన్ని సాధారణ అంశాలు... ఆకలి తగ్గడం కారణం తెలియకుండా / ఏ కారణమూ లేకుండానే బరువు తగ్గడం ఎడతెరిపి లేకుండా దగ్గు లింఫ్ గ్లాండ్స్ (చంకల్లో, గజ్జల్లో, గొంతుదగ్గర) వాపు అవయవాలనుంచి రక్తస్రావం... (ఈ లక్షణం కొన్నిసార్లు కొన్ని అవయవాలలో మాత్రమే) ఒక్క చివరిది మినహా ఇక్కడ పేర్కొన్నవన్నీ చాలామందిలో ఏదో ఓ దశలో క్యాన్సర్ లేకపోయినప్పటికీ కనిపించే మామూలు లక్షణాలు. అందుకే ఈ లక్షణాలన్నీ తప్పనిసరిగా క్యాన్సర్‌వే కానక్కర్లేదు. కాబట్టి వీటిలో ఏదో ఒకటి కనిపించిన మాత్రాన ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ లక్షణాలకు అవవసరమైన తొలి చికిత్సలు తీసుకున్న తర్వాత కూడా, అవే పునరావృతమవుతుంటే ఒకసారి డాక్టర్ చేత పరీక్ష చేయించుకుని అది క్యాన్సర్ కాదని నిర్ధారణ చేసుకొన్న తర్వాతే నిశ్చింతగా ఉండాలి. తల నుంచి కాలి వేలి వరకు ఆయా అవయవాల్లో క్యాన్సర్ ఉంటే కనిపించేందుకు / తొలి దశలోనే గుర్తించేందుకు ఉపయోగపడే ప్రాథమిక లక్షణాలివి... బ్రెయిన్ క్యాన్సర్ : తలనొప్పి వస్తుంటుంది. అకస్మాత్తుగా మతిమరపు రావడం, కొన్ని సార్లు సామాజిక సభ్యత మరచి ప్రవర్తించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. మనిషి మెదడులో మాట్లాడటానికీ, దృష్టికీ, వినికిడికీ, కాళ్లూ, చేతుల కదలికల నియంత్రణకు... ఇలా వేర్వేరు ప్రతిచర్యలకు వేర్వేరు కేంద్రాలు (సెంటర్స్) ఉంటాయి. క్యాన్సర్ అభివృద్ధి చెందిన సెంటర్ దేనికి సంబంధించినదైతే ఆ అవయవం చచ్చుబడటం వంటి లక్షణాలూ కనిపిస్తాయి. ఇవీ ఆయా అవయవాలకు సంబంధించి తొలిదశలో క్యాన్సర్‌కు లక్షణాలు. తల భాగంలో: ఈ క్యాన్సర్స్ నోటిలో, దడవ మీద, నాలుక మీద లేదా చిగుర్లు (జింజివా) మీదా ఇలా తలభాగంలో ఎక్కడైనా రావచ్చు. ఆయా భాగాల్లో ఎరుపు, తెలుపు రంగుల ΄్యాచెస్ ఉన్నా, దీర్ఘకాలంగా మానని పుండు (సాధారణంగా నొప్పి లేని పుండు, కొన్ని సందర్భాల్లో నొప్పి ఉండవచ్చు కూడా) ఉంటే క్యాన్సర్ అయ్యేందుకు అవకాశం ఎక్కువ. అదే నాలుక మీద అయితే నాలుక కదలికలు తగ్గవచ్చు. నాలుక వెనక భాగంలో అయితే స్వరంలో మార్పు వస్తుంది. మరింత వెనకనయితే మింగడంలో ఇబ్బంది కలుగుతుంది. ఇక స్వరపేటిక ్ర΄ాంతంలో అయితే స్వరంలో మార్పు వస్తుంది. మెడ దగ్గర లింఫ్ గ్రంధుల వాపు కనిపిస్తుంది. గొంతు భాగంలో : దీన్ని ఓరో ఫ్యారింజియల్ భాగంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ గొంతులో ఏదో ఇరుక్కుని ఉన్న ఫీలింగ్ ఉంటుంది. అన్నవాహిక మొదటి భాగంలో అయితే మింగడం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఊపిరితిత్తులు : పొగతాగేవాళ్లలో ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ. ఇది ఉన్నవాళ్లలో దగ్గు, కళ్లె (స్ఫుటమ్)లో రక్తం పడటం వంటì లక్షణాలు కనిపిస్తాయి. ఎక్స్–రే, సీటీ స్కాన్ పరీక్ష ద్వారా దీన్ని తెలుసుకోవచ్చు.రొమ్ము క్యాన్సర్ : మహిళల్లో ఎక్కువగా కనిపించే ఈ రకం క్యాన్సర్‌లో... రొమ్ములో ఓ గడ్డ చేతికి తగలడం, రొమ్ము పరిమాణంలో మార్పు, రొమ్ము మీది చర్మం ముడతలు పడటం, రొమ్ము చివర (నిపుల్) నుంచి రక్తంతో కలిసిన స్రావం లాంటివి రొమ్ము క్యాన్సర్ లక్షణాలు.కడుపు (స్టమక్)లో: కడుపు (స్టమక్)లో మంట పుడుతున్నట్లుగా నొప్పి. పొట్టలో మంట. కొన్నిసార్లు పొట్టలో రక్తస్రావం అయినప్పుడు ఆ రక్తం వల్ల విసర్జన సమయంలో మలం నల్లగా కనిపిస్తుంది. రక్తస్రావం వల్ల రక్తహీనత (ఎనీమియా) కూడా కనిపించవచ్చు. దాంతో పాటు కొన్ని సార్లు కొద్దిగా తినగానే కడుపునిండిపోయిన ఫీలింగ్ ఉంటుంది.పేగుల్లో... మలమూత్ర విసర్జన అలవాట్లలో మార్పులు కనిపిస్తాయి.రెక్టమ్ క్యాన్సర్‌లో: మలద్వారం (రెక్టమ్) క్యాన్సర్ విషయంలోనూ మల విసర్జన తర్వాత కూడా ఇంకా లోపల మలం మిగిలే ఉందన్న ఫీలింగ్. దీనికో కారణం ఉంది. విసర్జించాల్సిన పదార్థం మామూలుగా మలద్వారం వద్దకు చేరగానే అక్కడి నాడులు స్పందించి అక్కడ మలం పేరుకుని ఉన్నట్లుగా మెదడుకు సమాచారమిస్తాయి. అప్పుడా పదార్థాల్ని విసర్జించాల్సిందిగా మెదడు ఆదేశాలిస్తుంది. కానీ విసర్జన తర్వాత కూడా అక్కడ క్యాన్సర్ ఓ గడ్డలా ఉండటంతో ఏదో మిగిలే ఉందన్న సమాచారాన్ని నాడులు మెదడుకు మళ్లీ మళ్లీ చేరవేస్తుంటాయి. దాంతో ఇంకా అక్కడేదో ఉందన్న ఫీలింగ్ కలుగుతుంటుంది. ఈ లక్షణంతో పాటు కొందరిలో బంక విరేచనాలు, రక్తంతో పాటు బంక పడటం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి.సర్విక్స్ క్యాన్సర్: దక్షిణ భారతదేశంలోని తీర్ర ప్రాంతాల్లోని మహిళల్లో అత్యధికంగా కనిపించే క్యాన్సర్ ఇది. రుతుస్రావం సమయంలో గాక మధ్యలోనూ రక్తం రావడం, రుతుస్రావం ఆగిపోయిన (మెనోపాజ్) మహిళల్లో అసాధారణంగా రక్తస్రావం కావడం, మహిళల్లో సెక్స్ తర్వాత రక్తస్రావం ( పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్), ఎరుపు, తెలుపు డిశ్చార్జ్ వంటివి దీని లక్షణాలు.ఒవేరియన్ క్యాన్సర్ : దాదాపు 50, 60 ఏళ్ల మహిళల్లో పొట్ట కింది భాగంలో నొప్పి రావడం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. సాధారణంగా ఈ భాగానికి క్యాన్సర్ వస్తే ఒక్కోసారి ఏ లక్షణాలూ కనిపించకుండానే ప్రమాదకరంగా పరిణమించవచ్చు.టెస్టిస్ క్యాన్సర్ : పురుషుల్లో వచ్చే ఈ క్యాన్సర్‌లో వృషణాల సైజ్ పెరగడం, దాన్ని హైడ్రోసిల్‌గా పొరబాటు పడటం వల్ల పెద్దగా సీరియస్‌గా తీసుకోకపోవడంతో అది సైజ్‌లో పెరిగి ప్రమాదకరంగా పరిణమించే అవకాశాలెక్కువ.ప్రొస్టేట్ క్యాన్సర్ : సాధారణంగా 50, 60 ఏళ్లు దాటిన పురుషుల్లో తరచూ కనిపించే క్యాన్సర్ ఇది. దాదాపు లక్షణాలేవీ పెద్దగా కనిపించకుండా వచ్చే ఈ క్యాన్సర్‌లో రాత్రివేళల్లో మూత్రవిసర్జనకు వెళ్లాల్సిన అవసరం ఎక్కువగా ఉండవచ్చు. పీఎస్ఏ అనే పరీక్ష ద్వారా దీన్ని తేలిగ్గా గుర్తించవచ్చు.కిడ్నీ అండ్ బ్లాడర్ క్యాన్సర్ : మూత్ర విసర్జన సమయంలో రక్తం కనిపించడం, మాటిమాటికీ మూత్రం రావడం మూత్రపిండాలు, మూత్రాశయ క్యాన్సర్లలో కనిపించే సాధారణ లక్షణం.బ్లడ్ క్యాన్సర్స్ : రక్తం కూడా ద్రవరూపంలో ఉండే కణజాలమే కాబట్టి... బ్లడ్ క్యాన్సర్ కూడా రావచ్చు. రక్తహీనత, చర్మం మీద పొడలా (పర్ప్యూరిక్ పాచెస్) రావడం, చిగుళ్లలోంచి రక్తం రావడం, బరువు తగ్గడం, జ్వరం రావడం వంటివి బ్లడ్ క్యాన్సర్ లక్షణాలు. లింఫ్ గ్లాండ్స్ అన్నవి బాహుమూలాల్లో, దవడల కింది భాగంలో మెడకు ఇరువైపులా, గజ్జల్లో ఉండే ఈ గ్రంథులకూ క్యాన్సర్ రావచ్చు. దాన్ని లింఫోమా అంటారు.స్కిన్ క్యాన్సర్: చర్మం క్యాన్సర్‌ను ఏ, బీ, సీ, డీ అనే నాలుగు లక్షణాలతో తేలిగ్గా గుర్తించవచ్చు. శరీరంపై ఏదైనా మచ్చ తాలూకు ఏ– అంటే... ఎసిమెట్రీ (అంటే మచ్చ సౌష్టవం మొదటికంటే మార్పు వచ్చినా, బీ– అంటే... బార్డర్ అంటే అంచులు మారడం, మందంగా మారడం జరిగినా, సీ– అంటే కలర్ రంగు మారినా, డీ అంటే డయామీటర్... అంటే వ్యాసం (సైజు) పెరిగినా దాన్ని చర్మం క్యాన్సర్ లక్షణాలుగా భావించవచ్చు.కొంతమందిలో తమ తాత తండ్రుల్లో, పిన్ని వంటి దగ్గరి సంబంధీకుల్లో క్యాన్సర్ ఉన్నప్పుడూ, అలాగే స్మోకింగ్, ఆల్కహాల్ వంటి అనారోగ్యకరమైన జీవనశైలి ఉన్నవారూ...ఇక జన్యుపరంగా అంటే... జీరోడెర్మా, న్యూరోఫైబ్రమాటోసిస్ వంటి వ్యాధులున్నవారిలో క్యాన్సర్ ముప్పు ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి హైరిస్క్ వ్యక్తులంతా మిగతావారికంటే మరింత అప్రమత్తంగా ఉంటూ, మరింత ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించాలి. గమనించాల్సిన అంశం ఏమిటంటే... ఇక్కడ ప్రస్తావించిన లక్షణాలన్నీ తప్పనిసరిగా క్యాన్సర్‌కు సంబంధించినవే కావచ్చేమోనని ఆందోళన వద్దు. తొలిదశలో తేలిగ్గా గుర్తిస్తే క్యాన్సర్ తగ్గుతుందన్న విషయం గుర్తుంచుకుని, ఏవైనా లక్షణాలు కనిపిస్తే ఆందోళన చెందకుండా ఒకసారి డాక్టర్ల సూచన మేరకు పరీక్షలు చేయించుకోవాలి. అది క్యాన్సర్ కాదని నిర్ధారణ చేసుకున్న తర్వాత నిశ్చింతగా ఉండాలి. -
స్నేక్ ఫ్రెండ్స్..
పాము అంటే ఎవరికి భయం ఉండదు చెప్పండి.. ఎక్కడైనా కనిపిస్తే చాలు భయంతో పరుగులు పెడుతుంటాం. ఇక ఇంట్లోకి వచి్చందంటే కథ వేరేలా ఉంటుంది. భయానికి చెమటలతో సగం తడిచిపోతుంటాం. ఇంకొందరైతే తెగ హడావుడి చేసి ఎలాగైనా చంపేయాలని చూస్తుంటారు. కానీ వీరు మాత్రం పాములు కనిపిస్తే చాలు ప్రేమగా వాటిని పట్టుకుంటారు. వాటికి ఎలాంటి హానీ కలగకుండా జాగ్రత్తగా తీసుకెళ్లి దగ్గర్లోని అడవుల్లో వదిలేస్తుంటారు. ఇంతకీ వాళ్లెవరా అని ఆలోచిస్తున్నారా? వాళ్లే ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్.. వీరి గురించి మరిన్ని విశేషాలు.. ఎవరి ఇంటికైనా పాములు వచ్చాయని ఫోన్ చేస్తే చాలు క్షణాల్లో వాలిపోయి.. పాములను చాలా జాగ్రత్తగా పట్టుకుని సురక్షిత ప్రాంతాల్లో వదిలిపెడతారు. ఏటా దాదాపు 10 వేల నుంచి 12 వేల వరకూ పాములను పట్టి.. వేరే ప్రాంతాల్లో విడిచిపెడుతున్నారు. ఇటు మనుషుల ప్రాణాలతో పాటు పాములను కూడా కాపాడుతూ రియల్ హీరోలుగా నిలుస్తున్నారు ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీ సభ్యులు. వర్షాకాలంలో ఎక్కువ..సాధారణంగా పాములు బొరియల్లో తలదాచుకుంటాయి. వర్షాకాలంలో ఆ బొరియల్లోకి వరద నీరు చేరుతుండటంతో బయటకు వస్తాయి. అప్పుడు ఎక్కడికి వెళ్లాలో తెలియక అప్పుడప్పుడూ ఇళ్లల్లోకి వస్తుంటాయి. అంతేకాకుండా నాళాల పక్కన ఉన్న ప్రాంతాల్లోని ఇళ్లల్లోకి కూడా పాములు చేరుతుంటాయి. అంతేకానీ మనకు ఎలాంటి హానీ తలపెట్టబోవని ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సంస్థ నిర్వాహకులు చెబుతున్నారు. వాటికి మనం హాని చేస్తున్నామని అనిపిస్తేనే అవి కాటేస్తాయని పేర్కొంటున్నారు. స్వచ్ఛందంగా సేవలు.. ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సంస్థను 1995లో రాజ్‌కుమార్ కానూరి స్థాపించారు. పాములు జీవవైవిధ్యానికి ఎంతో కీలకమని, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన చెబుతుండేవారు. ఒకరిద్దరితో ప్రారంభమైన ఈ సంస్థలో.. ఇప్పుడు ఏకంగా 150 మంది వలంటీర్లు ఉన్నారు. పాములపై ప్రేమ.. పాములను పట్టుకోవాలని ఆసక్తి ఉన్న ఉద్యోగులు, స్టూడెంట్స్ తమకు ఉన్న ఖాళీ సమయాల్లో స్నేక్ క్యాచింగ్ చేసేందుకు ముందుకు వస్తుంటారు. స్నేక్ క్యాచింగ్ అంటే ఆసక్తి ఉన్న వారు ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సంస్థను సంప్రదిస్తే.. వారికి 6 నెలల పాటు శిక్షణ ఇస్తున్నారు. ఎక్కడైనా పాము గురించి సమాచారం అందగానే దగ్గరలో ఉన్న వలంటీరు అక్కడికి వెళ్లి వాటిని రక్షిస్తారు. జీవ వైవిధ్యానికి ముఖ్యం.. ప్రకృతిలో అన్ని జీవులకూ సమాన హక్కులు ఉంటాయని, ఏ ప్రాణినీ చంపే అధికారం ఎవరికీ లేదని ఈ సంస్థ వాళ్లు చెబుతున్నారు. కాకపోతే పట్టణీకరణ కారణంగా భవన నిర్మాణ కార్యకలాపాలు పెరుగుతుండటంతో పాములు, ఇతర జంతువుల ఆవాసాలైన అడవులను నరికేస్తున్నారని, ఈ నేపథ్యంలో వాటికి ఆవాసం లేకపోవడంతో ఇళ్ల్లల్లోకి వస్తున్నాయని పేర్కొంటున్నారు. ఇక, పాములు జీవవైవిధ్యానికి, మనిషి జాతి మనుగడకు చాలా కీలకమని, వాటిని కాపాడుకుంటే భవిష్యత్తు తరాలు సుస్థిరంగా ఉంటాయని చెబుతున్నారు. ఆహార భద్రతలో కూడా పాములు కీలక పాత్ర పోషిస్తాయని సంస్థ ప్రతినిధులు అంటున్నారు. అందుకే పాములపై తాము పరిశోధనలు చేస్తున్నామని ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీ నిర్వాహకులు చెబుతున్నారు. ఇందుకోసం సంస్థలో పరిశోధనా విభాగం ఉందని, వాళ్లు ఎప్పటికప్పుడు కొత్త రకం పాముల గురించి పరిశోధనలు చేస్తుంటామని వివరించారు. ఈ విషయంలో అటవీ శాఖ, జూపార్కు అధికారులు తమకు ఎంతో మద్దతు ఇస్తుంటారని చెబుతున్నారు.అవగాహన అవసరం..పాములన్నీ విషపూరితం కాదు.. ఎవరికీ హాని చేయని పాములు కూడా ఉంటాయి. వాటిని చూసి అనవసరంగా భయపడి వాటిని చంపొద్దని ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ వలంటీర్లు చెబుతున్నారు. పాముల గురించి ప్రజల్లో మరింత అవగాహన రావాలనే ఉద్దేశంతో ఏటా దాదాపు 200 నుంచి 300 వరకూ అవగాహనా కార్యక్రమాలు చేస్తుంటామని వివరించారు. పాము కాటు వేసినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా అవగాహన కలి్పస్తుంటామని పేర్కొంటున్నారు. దీంతో పాటు అడవుల్లో అరుదైన జాతి పాములను కాపాడేందుకు తాము కృషి చేస్తున్నామని వివరించారు. ఔషధ గుణాలున్నాయంటూ కొన్ని పాములను అనవసరంగా చంపి, విదేశాలకు ఎగుమతి చేస్తుంటారని, ఇలాంటి వారి గురించి తమ దృష్టికి వస్తే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించి.. అక్రమ వ్యాపారాలకు అడ్డుకట్ట వేసేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఆ తృప్తి వేరు.. పాములు పట్టాలంటూ రోజూ చాలా మంది ఫోన్ చేస్తుంటారు. రెస్క్యూ చేసిన పాముల్లో దాదాపు 50 శాతం విషపూరితమే. కొన్నిసార్లు వాటిని పట్టే సమయంలో వలంటీర్లు కూడా ఇబ్బందులు పడుతుంటారు. ఎంతగా శిక్షణ తీసుకున్నా.. ఫీల్డ్‌లోకి వచ్చేసరికి కొన్ని సవాళ్లు ఉంటాయి. వాటిని అధిగమిస్తూ.. సమస్యలను ఎదుర్కొంటూ ముందుకు వెళ్తుంటాం. పాములను జాగ్రత్తగా పట్టుకున్న తర్వాత.. ఇంటి యజమానుల కళ్లల్లో కృతజ్ఞతాభావం మాకు ఎంతో సంతృప్తిని ఇస్తుంది. మేం చేస్తున్న పనిలో ఆ క్షణం తృప్తినిచ్చే క్షణం. – అవినాష్ విశ్వనాథం, జనరల్ సెక్రటరీ, ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీ -
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజేతను చేసే రహస్యం ఏంటి?
-
టాలీవుడ్ నే అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఏకైక స్టార్ ప్రభాస్
-
ధర్మ చక్రం: నాలుగు ఆశ్రమాలలో ఏది గొప్పది?
గృహస్థాశ్రమంలో నిత్యం జరిగే పంచ మహా యజ్ఞాలలో మూడవది – హోమోదైవో.. దేవ యజ్ఞం. వేదమంత్రాల పఠనంతో భగవంతుడిని ఉద్దేశించి హోమం చేస్తూ నైవేద్యాలను సమర్పించాలి – హుతో హోమః... అంటే యజ్ఞయాగాది క్రతువులు. మహాభారతంలో శాంతిపర్వంలో అంపశయ్యమీద పడుకుని భీష్మాచార్యుల వారంటారు..‘‘అసలు ధర్మానికంతటికీ ఇరుసువంటివాడు గృహస్థు... ఓ ధర్మరాజా! గృహస్థులేని నాడు ఈ సృష్టే లేదు. గృహస్థులేని నాడు ఈ ధర్మచక్రం తిరగనే తిరగదు.’’ అని. అగ్ని ద్వారా దేవతలకు హవిస్సును గృహస్థే ఇస్తాడు. ఇతర ఆశ్రమాల వాళ్ళు ఇవ్వరు. గృహస్థు ఇచ్చిన హవిస్సును దేవతలు తిని సంతుష్ఠులై వర్షం కురిపిస్తారు... ఎక్కడ..? గృహస్థు ఇంట్లోకాదు, ఆ ్ర΄ాంతమంతా కురిపిస్తారు. ‘‘అన్నద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః/ యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞ కర్మసముద్భవః... ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతీహ యః/ అఘాయురింద్రియారామో మోఘం పార్థ స జీవతి’’... అంటే ఇది ఒక చక్రం. తిరుగుతోంది. ప్రాణులు పుట్టాలి అంటే అన్నం (ఆహారం) తినాలి. అన్నసారం స్త్రీలో శోణితంగా, పురుషునిలో శుక్రంగా మారి రెండూ కలిసి సృష్టి జరగాలి. బిడ్డలు పుట్టాలి. దీనికంతటికీ మూలమైన అన్నం పుట్టాలంటే పంటలు పండాలి.. అంటే వర్షం పడాలి... వర్షం పడాలంటే... యజ్ఞం జరగాలి.అన్నం, నీరు ఎంత కాలం దొరుకుతాయో అంతకాలమే ధర్మం ఉంటుంది. వాటిలో మొదట నీరు. ఇవి దొరకనప్పుడు ఎన్ని ధర్మాలు, నీతులు, ప్రవచనాలు చెప్పినా వినేవారు కానీ, ΄ాటించేవారు కానీ లోకంలో ఉండరు. ధర్మం తప్పి΄ోతుంది. ‘ఆ΄ోవా ఇదగుం సర్వం...అమృతం వా ఆపః...’’ నీరు అమృతం. ్ర΄ాణులన్నీ ఆ నీటి మీదే ఆధారపడి ఉన్నాయి. అన్నం, నీరు కావాలంటే వర్షం పడాలి... అలా పడాలంటే యజ్ఞం చేయాలి. యజ్ఞ కర్మ సముద్భవమ్... కర్మ చేస్తే వస్తుంది. అదెవరు చేయాలి?... ఒక్క గృహస్థు మాత్రమే.. పక్కన ధర్మపత్నితో కూడుకుని ఉన్నవాడు మాత్రమే యజ్ఞాన్ని చేస్తాడు. అప్పుడు ఈ సృష్టి ఏర్పడుతుంది, నిలబడుతుంది, లయమవుతుంది. ప్రశాంతత కలుగుతుంది. అందరూ నిర్వర్తించాల్సిన ధర్మాన్ని అందరూ నిర్వర్తిస్తున్నారు. కాబట్టి ధర్మచక్రం సవ్యంగా తిరుగుతుంది.ఎంత సంపన్న కుటుంబంలో పుట్టిన వాడయినా తల్లిపా లమీద ఆధారపడాల్సిందే. తల్లి లేకపోతే సృష్టి లేదు. అలాగే గృహస్థాశ్రమం మిగిలిన అన్ని ఆశ్రమాలకు తల్లిలాంటిది. ఆ గృహస్థులేని నాడు మిగిలిన ఆశ్రమాల వాళ్ళకు భిక్ష లేనే లేదు... ఈ మాటలు నావి కావు.. మహాభారతంలో శాంతిపర్వంలో భీష్ముడు చెప్పినవి. రామాయణంలో అయోధ్యకాండలో భరతుడు కూడా ఇదే అంటాడు..‘‘అన్నయ్యా ! నీకు తెలుసు కదా! గార్హస్థ్యం శ్రేష్టమాశ్రమం... నాలుగు ఆశ్రమాలలో గృహస్థాశ్రమమే గొప్పది.’’ ‘హోమో దైవో బలిర్భౌతో...’’ హవిస్సు ద్వారా దేవతలకు అన్నం పెట్టిన గృహస్థుకు సమస్త భూతములు, ప్రాణులను కూడా పోషించే కర్తవ్యం ఉంది. భీష్ముడు మరో మాట కూడా చెప్పాడు... గృహస్థాశ్రమంలో ఉన్నవారు ఎప్పడూ సంసార లంపటంలో పడి ఉంటారు, వారు అగాధంలో పడి΄ోయారని అనుకుంటున్నావేమో ... గృహస్థుకు మోక్షం లేదని ఎవరన్నారు !!! దేవతలకు అన్నం పెడుతున్న గృహస్థుకు కూడా మోక్షం లభిస్తుంది.-చాగంటి కోటేశ్వరరావు -
అరచేతిలో వైకుంఠం.. అబద్ధానికి రెక్కలు.. దగా బాబు అరాచకాలు
-
మహా సంగ్రామంలో విజేతగా నిలిచేదెవరు ?
-
Valmiki Jayanti 2024 ఆది స్మరణీయుడు
జగదానంద కారకుడు, శరణాగత వత్సలుడు, సకల గుణాభిరాముడు, మూర్తీభవించిన ధర్మతేజం శ్రీరాముని దివ్యచరిత్రను, శ్రీరామ నామ మాధుర్యాన్ని మన కందించిన కవికోకిల, ఆది కవి వాల్మీకి మహర్షి చిరస్మరణీయుడు. శ్రీరాముని దివ్యచరితాన్ని కావ్య రూపంలో అందించమని ఆదేశించిన బ్రహ్మదేవుని ఆజ్ఞ మేరకు శ్రీరాముని కీర్తి పరిమళాలను ముల్లోకాల్లో గుబాళింప చేసిన వాల్మీకి మహర్షి శ్రీరామాయణ మహాకావ్యాన్ని అందించారు. రామాయణంలో మానవ ధర్మాలన్నిటి గురించి వాల్మీకి చక్కగా విశదపరచాడు. శిష్య ధర్మం, భ్రాతృధర్మం, రాజ ధర్మం, పుత్ర ధర్మం, భత్యు ధర్మం, ఇంకా పతివ్రతా ధర్మాలు, ప్రేమలూ, బంధాలు, శరణాగత వత్సలత, యుద్ధనీతి, రాజనీతి, ప్రజాభ్యుదయం, సత్యవాక్య పరిపాలన, ఉపాసనా రహస్యాలు, సంభాషణా చతురత, జీవితం విలువ, ధర్మాచరణ మున్నగు అనేక రకాల ఉపదేశాలున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే రామాయణ కావ్యంలో మంచి చెడుల గురించి చెప్పనిదంటూ ఏదీ లేదు. ఆధునిక సమాజంలో మనం ఉపయోగించే ప్రసార కౌశలాలు, కార్యనిర్వహణ కౌశలాలు, ప్రశాసనం, నగర, గ్రామీణ నిర్మాణ యోజన, సార్థకమైన వ్యూహరచనా నిర్మాణం, ఆంతరిక రక్షణా పద్ధతి, యుద్ధ వ్యూహరచన మొదలైనవాటికి రామాయణ రచన నిధి వంటిది.ఇంత విలువైన సత్యాలను చెప్పి, ఇంతటి మహత్తర కావ్యాన్ని అందించిన కవి వాల్మీకి మహర్షి సదావందనీయుడు. ప్రతి ఒక్కరూ రామాయణ కావ్యం చదివి అందులోని నీతిని అవలోకనం చేసుకుని, అందులో కొంతయినా ఆచరించ గలిగితే ఆ మహాకవి ఋణం తీర్చుకున్నట్లే.