vijay goel
-
11 నుంచి పార్లమెంటు
న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలు డిసెంబర్ 11 నుంచి వచ్చే ఏడాది జనవరి 8 వరకూ జరగనున్నాయి. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ(సీసీపీఏ) సిఫార్సు చేసిందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి విజయ్ గోయెల్ చెప్పారు. డిసెంబర్ 11 నుంచి 2019, జనవరి 8 వరకు పార్లమెంటు సమావేశాలు జరపాలని నిర్ణయించినట్లు తెలిపారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా కేరళ, ఈశాన్య రాష్ట్రాల ఎంపీలు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు వీలుగా సమావేశాల మధ్యలో వారం రోజుల విరామం ఇస్తామన్నారు. మొత్తంమీద 20 రోజుల పాటు పార్లమెంటు జరుగుతుందన్నారు. ఈ సమావేశాలు ఫలప్రదమయ్యేందుకు వీలుగా సహకరించాలని అన్ని రాజకీయ పక్షాలను కోరుతున్నామన్నారు. కాగా, ఈ శీతాకాల సమావేశాల్లో ట్రిపుల్ తలాక్ బిల్లును రాజ్యసభలో ఆమోదింపజేసుకోవాలని కేంద్రం భావిస్తోంది. అలాగే భారత వైద్య మండలి సవరణ బిల్లు, కంపెనీల చట్టం సవరణ బిల్లు ఆర్డినెన్సులను ఆమోదింపజేసుకోవాలన్న కృతనిశ్చయంతో మోదీ ప్రభుత్వం ఉంది. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్తాన్, మిజోరం, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడనున్న డిసెంబర్ 11నే పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానుండటం గమనార్హం. -
‘ఆయనలాంటి స్నేహితులు బీజేపీకి అవసరం’
సాక్షి, న్యూఢిల్లీ : 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)తో కలిసి ఎన్నికల్లో పోటీచేసేందుకు కాంగ్రెస్ పార్టీ మంతనాలు చేస్తోందని వార్తలు ప్రచారం అవుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ కూడా ఆప్ అసంతృప్త ఎమ్మెల్యేలను మచ్చిక చేసుకునే ప్రయత్నం మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే ఆప్ బహిష్కృత ఎమ్మెల్యే, ఢిల్లీ మాజీ మంత్రి కపిల్ మిశ్రాను ఉద్దేశించి కేంద్ర మంత్రి విజయ్ గోయల్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘కపిల్ మిశ్రా వంటి స్నేహితుడి అవసరం బీజేపీకి ఉంది. ఆయన కోసం బీజేపీ ద్వారాలు ఎల్లప్పుడూ తెరచుకునే ఉంటాయని’ గోయల్ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా..‘ఆప్ నేతలతో విభేదాలు వచ్చినప్పటి నుంచి మేము ఆయన రాక కోసం ఎదురుచూస్తున్నాం. అయితే బీజేపీలో చేరాలా వద్దా అన్నదానిపై ఆయన నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని’ గోయల్ పేర్కొన్నారు. 2019 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మే 30న బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ప్రారంభించిన ‘సంపర్క్ ఫర్ సమర్థన్’ (మద్ధతు కోరే కార్యక్రమం)లో భాగంగా నిర్వహిస్తున్న కార్యక్రమంలో పాల్గొన్న గోయల్.. కపిల్ మిశ్రాపై ప్రశంసలు కురిపించారు. ‘పాజిటివ్ ఆటిట్యూడ్‌కు కపిల్ మిశ్రా ఒక ప్రతీక లాంటివారు. సామాజిక సేవ పట్ల ఆయనకున్న అంకిత భావం అమోఘం’ అంటూ గోయల్ ప్రశంసించారు. కాగా తూర్పు ఢిల్లీ మేయర్‌గా పనిచేసిన కపిల్ మిశ్రా తల్లి అన్నపూర్ణ మిశ్రా బీజేపీ సీనియర్ నేతగా రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు. కారావాల్ నగర్ ఎమ్మెల్యే అయిన కపిల్ మిశ్రా గత కొంత కాలంగా ఆప్ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉంటూ.. ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై మిశ్రా పలుమార్లు విమర్శలు, ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. -
'భవిష్యత్ మన మహిళా క్రికెట్‌దే'
న్యూఢిల్లీ:భవిష్యత్తులో భారత మహిళా క్రికెట్ అద్భుతాల్ని సాధించడం ఖాయమంటున్నారు కేంద్ర క్రీడల శాఖ మంత్రి విజయ్ గోయల్. మహిళల వన్డే వరల్డ్ కప్ లో రన్నరప్ గా నిలిచిన భారత్ ను మంత్రి గోయల్ అభినందించారు. మహిళా భారత క్రికెట్ జట్టు కొత్త ఎత్తుల్ని అధిరోహించే సమయం ఎంతో దూరంలో లేదని గోయల్ పేర్కొన్నారు. 'వన్డే వరల్డ్ కప్ లో భారతమాత కూతుళ్లు అద్భుత ప్రదర్శన చేశారు. ఫైనల్లో ఓడినా యావత్ భారతావని హృదయాలను వారు గెలుచుకున్నారు. మన మహిళలు తుదిపోరుకు చేరిన క్రమం అద్వితీయం. తుదిపోరులో పోరాడి ఓడారు.. అయినా అభిమానాన్ని సంపాదించుకున్నారు. ఇది భారత మహిళా క్రికెట్ ను ముందుకు తీసుకెళ్లడానికి దోహదం చేస్తుంది. మన మహిళలకు ఘనస్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం' అని గోయల్ పేర్కొన్నారు. ఆదివారం ఇంగ్లండ్ తో జరిగిన వరల్డ్ కప్ టైటిల్ పోరులో భారత మహిళలు 9 పరుగుల తేడాతో ఓటమి పాలయ్యారు. -
పతకం గెలిచేందుకు మంచి అవకాశం
♦ ప్రపంచ చాంపియన్‌షిప్‌పై శ్రీకాంత్ ♦ గురుశిష్యుల్ని సత్కరించిన క్రీడల మంత్రి గోయెల్ సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పతకం గెలిచేందుకు భారత షట్లర్లకు మంచి అవకాశాలున్నాయని కిడాంబి శ్రీకాంత్ అన్నాడు. గ్లాస్గోలో జరిగే ఈ టోర్నీలో భారత్ నుంచి శ్రీకాంత్, సాయిప్రణీత్, అజయ్ జయరామ్ అర్హత సాధించారు. స్కాట్లాండ్లో ఆగస్టు 21 నుంచి 27 వరకు ఈ చాంపియన్‌షిప్ జరగనుంది. ఇండోనేసియా, ఆస్ట్రేలియా ఓపెన్‌లో టైటిల్స్ నెగ్గిన శ్రీకాంత్, కోచ్ గోపీచంద్‌లను కేంద్ర క్రీడల మంత్రి విజయ్ గోయెల్ శనివారం తన నివాసంలో సత్కరించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ ‘ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పతకం గ్యారంటీ అని చెప్పను. కానీ భారత ఆటగాళ్లు బాగా ఆడుతున్నారు. మ్యాచ్ జరిగే రోజు 100 శాతం రాణిస్తే గెలుపు మాత్రం మనదే. అప్పుడు పతకాన్నీ ఆశించవచ్చు’ అని అన్నాడు. మంత్రి గోయెల్ మాట్లాడుతూ... ‘శ్రీకాంత్ జాతి గర్వించే విజయాలు సాధించాడు. కోచ్ గోపీచంద్ దేశం గర్వపడే క్రీడాకారులను తయారు చేస్తున్నారు. వీళ్లతో పాటు ప్రతిభ గల ఆటగాళ్లకు మా సహకారం ఎప్పుడూ ఉంటుంది. వాళ్లకు 24 గంటలు మా శాఖ అందుబాటులో ఉంటుంది’ అని అన్నారు. ‘సాయ్’, క్రీడాశాఖ తమకు ఎల్లప్పుడూ అండగా నిలిచిందని గోపీచంద్ పేర్కొన్నారు. -
పీసీబీతో బీసీసీఐ భేటీ అనవసరం
కేంద్ర క్రీడలమంత్రి విజయ్ గోయెల్ న్యూఢిల్లీ: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)తో భవిష్యత్‌లో బీసీసీఐ సమావేశం కావాల్సిన అవసరం లేదని కేంద్ర క్రీడల మంత్రి విజయ్ గోయెల్ అన్నారు. ‘ద్వైపాక్షిక సిరీస్‌లకు ప్రభుత్వ ఆమోదం తప్పనిసరి. దీనిపై కేంద్రం వైఖరి స్పష్టమైంది. సరిహద్దు వెంట ఉగ్రవాద కార్యకలాపాలు ఆగితేనే ఆటలని తేల్చిచెప్పింది. ఇలాంటి నేపథ్యంలో ఇరు బోర్డులు సమావేశం కావాల్సిన అవసరం ఏముంది’ అని గోయెల్ అన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో క్రీడాభివృద్ధికి అవసరమైన చర్యలు చేపట్టామని ఆయన చెప్పారు. మిజోరం ముఖ్యమంత్రి లాల్ తన్హావ్లాను ఆయన నివాసంలో కలుసుకున్న గోయెల్ ఫుట్‌బాల్ ఫీల్డ్ కోసం ఇప్పటికే రూ.4.5 కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. -
బీసీసీఐకి విజయ్ గోయల్ హెచ్చరిక!
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకున్న తరువాతే పాకిస్తాన్ క్రికెట్ బోర్డుతో ద్వైపాక్షిక సిరీస్ గురించి చర్చించాలని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ)ను క్రీడాశాఖ మంత్రి విజయ్ గోయల్ హెచ్చరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఉగ్రవాదానికి ఊతమిస్తున్న పాకిస్తాన్ తో క్రికెట్ జరగడం అనేది చాలా కష్టమని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల పాకిస్తాన్ తో ద్వైపాక్షిక సిరీస్ ఆడటానికి భారత్ ఎటువంటి విముఖత వ్యక్తం చేయడం లేదని బీసీసీఐ సెక్రటరీ అమితాబ్ స్పష్టం చేసిన నేపథ్యంలో మంత్రి గోయల్ స్పందించారు. ఒకవేళ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) చర్చలు జరిపే ఉద్దేశం ఉంటే ముందుగా కేంద్రం అనుమతి తీసుకోవాలని గోయల్ వార్నింగ్ ఇచ్చారు. 'పాకిస్తాన్ తో సిరీస్ కు సంబంధించి బీసీసీఐ ఎటువంటి ముందడుగు వేయాలనుకున్నా గవర్నమెంట్ తో మాట్లాడటం మంచిది. పాకిస్తాన్ తో ద్వైపాక్షిక సిరీస్ అనేది ఇప్పట్లో చాలా కష్టం. ఉగ్రవాదం-క్రికెట్ అనేవి ఒకే తాటిపై పయనించలేవు కదా. కశ్మీర్ లో ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్నది పాకిస్తానే. మరొకవైపు భారత సరిహద్దుల్లో కూడా పాక్ ఉగ్రవాద దాడులకు పాల్పడుతుంది. ఇటువంటి తరుణంలో పాకిస్తాన్ తో ద్వైపాక్షిక సిరీస్ జరిగే ప్రసక్తే ఉండదు'అని విజయ్ గోయల్ పేర్కొన్నారు. పాక్ ఉగ్రవాదాన్ని ఆపేవరకూ వారితో ఎటువంటి క్రీడాసంబంధాలు ఉండవని ఆయన మరోసారి తెగేసి చెప్పారు. దాంతో చాంపియన్స్ ట్రోఫీలో పాక్ తో .చర్చలు జరపాలనుకున్న బీసీసీఐకి ఆదిలోనే చుక్కెదురైనట్లయ్యింది. -
'వారికి ప్రొ కబడ్డీ ఆహ్వానం లేదు'
కరాచీ: ఉగ్రవాదానికి పాకిస్తాన్ ఊతమిచ్చినంత కాలం ఆ దేశంతో క్రీడా సంబంధాలు ఉండవని భారత క్రీడాశాఖ మంత్రి విజయ్ గోయల్ మరొకసారి స్పష్టం చేశారు. వచ్చే నెల్లో భారత్ లో ప్రొ కబడ్డీ లీగ్ ఐదో సీజన్ ఆరంభం కానున్న నేపథ్యంలో గోయల్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇప్పటికే పలు ఫ్రాంచైజీలు పాకిస్తాన్ ఆటగాళ్లను ఎంపిక చేసిన క్రమంలో వారికి ఎటువంటి ఆహ్వానం లేదని కుండబద్దలు కొట్టారు. ' ఉగ్రవాదాన్ని పోషిస్తున్న పాకిస్తాన్ దాన్ని ఆపేంత వరకూ వారితో క్రీడా సంబంధాలు సాగించే ప్రసక్తే లేదు. దానిలో భాగంగానే జూన్ 25 నుంచి ఆరంభమయ్యే ప్రొ కబడ్డీకి సైతం పాకిస్తాన్ ఆటగాళ్లకు ఎటువంటి ఆహ్వానం లేదు. ఒకవేళ ఎంపిక చేసిన పాక్ ఆటగాళ్లు ఇక్కడకు వచ్చినా ఆడే అవకాశం ఉండదు. పాకిస్తాన్ ఆటగాళ్లు ప్రొ కబడ్డీ లీగ్ లో ఆడాలంటే భారత ప్రభుత్వం అనుమతి తప్పనిసరి. అసలు ప్రస్తుత పరిస్థితుల్లో పాకిస్తాన్ తో క్రీడా సంబంధాలు సాధ్యం కావు'అని గోయల్ తెలిపారు. -
'అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన కేసీఆర్'
డబుల్ బెడ్రూమ్ పథకం భేష్: విజయ్ గోయల్ సిద్దిపేట: తెలంగాణ సర్కార్ అమలు చేస్తున్న డబుల్ బెడ్రూమ్ పథకం అందరికీ ఆదర్శంగా ఉందని, పేదలకు ఉపయోగపడే చక్కని పథకాన్ని అమలుచేస్తున్న సర్కార్‌ను అభినందిస్తున్నట్లు కేంద్ర మంత్రి విజయ్ గోయల్ చెప్పారు. కేంద్ర మంత్రి గోయల్ మంగళవారం సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలో పర్యటించారు. కేంద్ర మంత్రికి ఎర్రవల్లి సర్పంచ్ ఘన స్వాగతం పలికారు. మర్కుర్ మండలం ఎర్రవల్లి గ్రామంలో ఆయన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు చక్కగా ఉన్నాయని, ఈ పథకం దేశానికే ఆదర్శంగా ఉందని గోయల్ చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారన్నారు. ఈ పథకంపై ప్రధాని మోదీతో చర్చించి దేశ వ్యాప్తంగా అమలయ్యేలా చూస్తామని పేర్కొన్నారు. పెద్ద నోట్ల రద్దుపై ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించినందుకు సీఎం కేసీఆర్ కు విజయ్ గోయల్ కృతజ్ఞతలు తెలిపారు. -
హైదరాబాద్‌లో ప్రాంతీయ క్రీడల కేంద్రం
కేంద్ర మంత్రి విజయ్ గోయల్ సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో ప్రాంతీ య క్రీడల కేంద్రం (రీజినల్ స్పోర్ట్స్ సెంట ర్) ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి విజయ్ గోయల్ ప్రకటించారు. ప్రభుత్వం స్థలం కేటాయిస్తే పనులు చకచకా పూర్తి చేస్తామని చెప్పారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా హైదరాబాద్‌కు వచ్చిన మంత్రి సోమవారం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్‌ను కలిశారు. హైదరాబాద్‌లో ప్రాంతీయ క్రీడల కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, అవసరమైన స్థలాన్ని కేటాయించేందుకు సిద్ధమని ఈ సందర్భంగా మంత్రిని కేసీఆర్ కోరారు. సానుకూలంగా స్పందించిన గోయల్.. క్రీడల కేంద్రం ఏర్పా టుకు హామీ ఇచ్చారు. వరంగల్, లక్న వరంను మంగళవారం సందర్శిస్తానని చెప్పారు. ఎర్రవల్లి, నర్సన్నపేటలో డబుల్ బెడ్రూం ఇళ్లను కూడా పరిశీలిస్తానని తెలిపారు. నగరంలోని సర్దార్ వల్లభాయ్ జాతీయ పోలీస్ అకాడమీలో ‘శక్తిమాన్’ 35వ ఆలిండియా పోలీస్ ఎక్వెస్ట్రెస్ చాంపి యన్ షిప్ పోటీలను సోమవారం గోయల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ.. శాంతి భద్రతల పరిరక్షణలో అశ్వక దళాల పాత్ర కీలకమని.. రామాయణం, మహాభారత కాలం నుంచే వాటి పాత్ర ఎనలేనిదన్నారు. అకాడమీ డైరెక్టర్ బహు గుణ మాట్లాడుతూ.. ‘శక్తిమాన్’ పోటీల్లో 18 బృందాలు, 460 మంది రైడర్లు, 290 గుర్రాలు పాల్గొంటున్నాయని తెలిపారు. -
బీసీసీఐ వ్యవహారంతో సంబంధం లేదు
హైదరాబాద్: భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) వ్యవహారంతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని కేంద్ర మంత్రి విజయ్ గోయల్ అన్నారు. బీసీసీఐ అధ్యక్ష, కార్యదర్శులు అనురాగ్ ఠాకూర్, అజయ్ షిర్కేలను తొలగిస్తూ సోమవారం సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పుపై స్పందించడం సరికాదని అభిప్రాయపడ్డారు. నేషనల్ పోలీస్ అకాడమీలో ఆలిండియా పోలీస్ ఎక్విస్ట్రెయిన్ చాంపియన్ షిప్, మౌంటెడ్ పోలీస్ డ్యూటీ మీట్‌ను ఆయన ప్రారంభించారు. దేశవ్యాప్తంగా క్రీడా సంఘాలను గాడిలో పెట్టేందుకు వాటి పనితీరుపై ఓ కమిటీ వేశామని మంత్రి తెలిపారు. ఆ కమిటీ తన బాధ్యతలను నిర్వర్తిస్తుందని చెప్పారు. నేషనల్ పోలీస్ అకాడమీకి చీఫ్ గెస్ట్‌గా రావడం సంతోషంగా ఉందని అన్నారు. నిర్మించడం కంటే నిర్వహణ ముఖ్యమని మాజీ ప్రధాని వాజ్‌పేయి చెప్పేవారని, మంచి నిర్వహణకు నేషనల్ పోలీస్ అకాడమీ ఉదాహరణగా నిలుస్తుందని ప్రశంసించారు. ఐఏఎస్, ఐపీఎస్‌లు కావాలని చాలా మంది కలలు కంటారని, కొంతమంది మాత్రమే ఆ గమ్యాన్ని చేరుకుంటారని విజయ్ గోయల్ అన్నారు. -
పారాలింపిక్స్ విజేతలకు పద్మ అవార్డులు!
న్యూఢిల్లీ: రియో పారాలింపిక్స్‌లో పతకాలు సాధించిన అథ్లెట్ల పేర్లను ప్రతిష్టాత్మక పద్మ పురస్కారాల కోసం ప్రతిపాదించనున్నారు. ‘పారాలింపిక్స్ విజేతలను మేం గౌరవించదలుచుకున్నాం. అందుకే పద్మ పురస్కారాల కోసం వారి పేర్లను హోం మంత్రిత్వ శాఖకు పంపించనున్నాం’ అని కేంద్ర క్రీడా శాఖ మంత్రి విజయ్ గోయల్ పేర్కొన్నారు. ఈ పోటీల్లో తంగవేలు, దేవేంద్రలకు స్వర్ణాలు, దీపా మలిక్ రజతం, వరుణ్ కాంస్యం సాధించిన విషయం తెలిసిందే. -
స్వదేశానికి తంగం
పీఎం అభినందనలు అమ్మకు కృతజ్ఞతలు రియో పారాలింపిక్స్‌లో మెరిసిన తమిళ తంగం(బంగారం) గురువారం స్వదేశంలో అడుగు పెట్టాడు. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ నుంచి అభినందనలు అందుకున్న తంగం తమిళనాడులోకి అడుగు పెట్టనున్నాడు. సాక్షి, చెన్నై :రియో పారాలింపిక్స్ హైజంప్ విభాగంలో మారియప్పన్ తంగ వేలు బంగారం కైవశం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సమాచారం తమిళనాట ఆనందోత్సాల్ని నింపాయి. సేలం జిల్లా ఓమలూరు సమీపంలోని పెరియవడగం పట్టి గ్రామంలో పేదరిక కుటుంబంలో జన్మించిన మారియప్పన్ ప్రస్తుతం తమిళనాట రియల్ హీరోగా, తంగ మారిగా అవతరించి ఉన్నాడు. తమిళనాడుకు , స్వస్థలానికి గౌరవాన్ని తీసుకొచ్చిన ఈ తంగమారిని ఘనంగా ఆహ్వానించేందుకు సేలం పెరియవడగం పట్టిలో ఏర్పాట్లు చేసి ఉన్నారు. ఎప్పుడెప్పుడు తమ వాడు స్వస్థలానికి వస్తాడో అన్న ఎదురు చూపుల్లో అక్కడి యువత ఉన్నారు. ఆ మేరకు గురువారం ఉదయం రియో నుంచి స్వదేశంలోకి ఈ తంగం అడుగు పెట్టాడు. ఢిల్లీ విమానాశ్రయంలో కేంద్ర క్రీడల శాఖ మంత్రి విజయ్ గోయల్ నేతృత్వంలో ఘన స్వాగతమే లభించింది. రియోలో పతకాలు సాధించిన ఇతర క్రీడా కారులతో కలిసి ఢిల్లీలో ప్రస్తుతం మారియప్పన్ ఉన్నాడు. సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీని కలిసి అభినందనలు అందుకున్నాడు. ఈసందర్భంగా తమిళ మీడియాతో మారియప్పన్ మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీకి , సీఎం జయలలితకు కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. అమ్మ జయలలిత క్రీడాకారుల్ని ప్రోత్సహిస్తున్నారని, ఆమె సహకారం మరువలేనిదని వ్యాఖ్యానించాడు. తాను బంగారం సాధించడం కోచ్‌కు మహదానందంగా ఉందని, ఆయన ఇచ్చిన శిక్షణతో మున్ముందు మరిన్ని పతకాల సాధన, 2020లో జపాన్ టోకియలో జరిగే ఒలింపిక్స్‌లో బంగారం లక్ష్యంగా ముందుకు సాగుతానని పేర్కొన్నాడు. ఇక, మారియప్పన్ స్వస్థలానికి ఎప్పుడు వస్తాడన్న సమాచారం సక్రమంగా అందక, అక్కడి వారు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. శుక్రవారం ఇక్కడికి వచ్చే అవకాశాలు ఉండొచ్చని లేదా, బెంగళూరులో ఓ రోజు ఉండి శనివారం రావొచ్చంటూ పెరియవడగం పట్టి యువత ఎదురు చూపుల్లో ఉన్నారు. కాగా, మారియప్పన్‌ను ప్రశంసలతో ముంచెత్తిన కేంద్ర మంత్రి విజయ్ గోయల్ తమిళనాడు ప్రభుత్వాన్ని అభినందించారు. క్రీడాకారుల్ని ప్రోత్సహించే విధంగా సీఎం జయలలిత తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ, ఇలాంటి ప్రోత్సాహంతో మరెందరో క్రీడాకారులు తమ ప్రతిభను చాటగలరని పేర్కొన్నారు. -
గోపీ అకాడమీలు అద్భుతం
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పుల్లెల గోపీచంద్ అకాడమీలు అద్భుతమని కేంద్ర క్రీడాశాఖ మంత్రి విజయ్ గోయెల్ కితాబిచ్చారు. శనివారం ఆయన గోపీచంద్‌కు చెందిన రెండు బ్యాడ్మింటన్ అకాడమీలను సందర్శించారు. అక్కడి కోర్టులు, ఆటగాళ్లకు ఏర్పాటు చేసిన సదుపాయాలను క్షుణ్ణంగా పరిశీలించిన ఆయన బ్యాడ్మింటన్ నేర్చుకునేందుకు ఈ అకాడమీలు చక్కని వేదికలన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు ఏమాత్రం తీసిపోని విధంగా అకాడమీలను తీర్చిదిద్దిన గోపీచంద్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. ఇలాంటి అకాడమీలు మరిన్ని ఉంటే భారత క్రీడల ముఖచిత్రమే మారుతుందని అభినందించారు. ‘20 మంది గోపీలాంటివారుంటే మరెంతో మంది సింధులొస్తారు. దేశ క్రీడారంగం అభివృద్ధికి ఈ అకాడమీలు ఎంతగానో దోహదం చేస్తాయి’ అని మంత్రి గోయెల్ అన్నారు. అకాడమీలను సమర్థంగా నిర్వహిస్తున్న గోపీచంద్ భార్య లక్ష్మి, తల్లి సుబ్బరావమ్మలను ఆయన అభినందించారు. అనంతరం తెలంగాణ స్పోర్ట్స్ జర్నలిస్టుల సంఘం (టీఎస్‌జేఏ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న విజయ్ గోయెల్... గోపీచంద్‌ను ఘనంగా సన్మానించారు. తర్వాత టీఎస్‌జేఏ ప్రతినిధులు రాజీవ్ ఖేల్ రత్నా అవార్డీ పి.వి.సింధు, ద్రోణాచార్య అవార్డీ నాగపురి రమేశ్‌లను సత్కరించారు. -
పారా అథ్లెట్లకూ ‘ఖేల్ రత్న’
• వచ్చే ఏడాది నుంచి అమలు • కేంద్ర క్రీడల మంత్రి వెల్లడి సాక్షి, హైదరాబాద్: దేశ అత్యున్నత క్రీడాపురస్కారమైన ‘రాజీవ్ ఖేల్త్న్ర’ అవార్డును ఇకపై పారాఅథ్లెట్లకూ అందజేస్తామని కేంద్ర క్రీడాశాఖ మంత్రి విజయ్ గోయెల్ వెల్లడించారు. నగరంలోని గోపీచంద్ అకాడమీకి విచ్చేసిన ఆయన ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఏడాది నుంచి ఈ అవార్డు కోసం పారాలింపియన్ల పేర్లను పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. రియో ఒలింపిక్స్‌పై సమీక్ష జరిపారా? అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ... ‘కేంద్రం క్రీడలపై ప్రత్యేక దృష్టి సారించింది. దీర్ఘకాలిక ప్రయోజనాలే లక్ష్యంగా మా ప్రభుత్వం పనిచేస్తుంది. ఇందులో భాగంగా త్వరలోనే కొత్త మార్గదర్శనంతో క్రీడలను ముందుకు తీసుకెళతాం. దీనిపై శ్రద్దపెట్టిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు’ అని మంత్రి గోయెల్ అన్నారు. రియో ఒలింపిక్స్ ముగియగానే భారత క్రీడలపై లోతైన అధ్యయనం అవసరమని భావించినట్లు ఆయన చెప్పారు. -
మన మంత్రిగారే అసలైన గోల్డ్ మెడలిస్ట్..
న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్ ముగిసి మన క్రీడాకారులు రెండు పతకాలతో స్వదేశం చేరినా, కేంద్ర క్రీడాశాఖ మంత్రి విజయ్ గోయల్ మాత్రం వారు సాధించిన ఘనతలను గుర్తు పెట్టుకోవడంలో తడబాటును కొనసాగిస్తూనే ఉన్నారు. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు రజత పతకం, మహిళా రెజ్లర్ సాక్షి మాలిక్ కాంస్య పతకాలు సాధిస్తే.. వారు రియో గోల్డ్ మెడలిస్ట్లు అంటూ విజయ్ గోయల్ ట్వీట్ చేయడంపై నెటిజన్లు జోకుల వర్షం కురిపిస్తున్నారు. వీవీ సింధూ, సాక్షి మాలిక్, దీపా కర్మాకర్లు ప్రధాని నరేంద్ర మోదీని కలిసే క్రమంలో వారు రియో గోల్డ్ మెడలిస్ట్లు అంటూ విజయ్ గోయల్ ట్వీట్ చేయడం విమర్శలకు తావిచ్చింది. ఆ పతకాల కోసం విజయ్ గోయల్‌ను రియోకు పంపుదామా?అంటూ ఒకరు విమర్శించగా, ఆ మంత్రి గారే అసలు సిసలైన గోల్డ్ మెడలిస్ట్ అంటూ మరొకరు ట్వీట్ చేశారు. కామెడీ షోలో కపిల్ శర్మకు విజయ్ గోయల్ సరైన పోటీ అంటూ మరొకరు ట్వీట్ చేశారు. మరోవైపు మహిళా జిమ్నాస్ దీపా కర్మాకర్ పేరును కూడా విజయ్ గోయల్ తప్పుగా పేర్కొనడం చర్చనీయాంశమైంది. దీపా కర్మాకర్‌ను 'దీపా కర్మనాకర్'అంటూ సంబోధించడం, అథ్లెట్లు ద్యుతీ చంద్ ఫోటోకు బదులు మరొ అథ్లెట్ స్రబాణి నందా ఫోటోను పోస్ట్ చేయడంలో విజయ్ గోయల్ ఇబ్బంది పడ్డారు. అయితే విజయ్ గోయల్ మాత్రం తన తప్పును సరిదిద్దుకునే క్రమంలో వివరణ ఇచ్చారు. 'ఒక్కోసారి నాలుక తడబడి పొరపాట్లు జరగడం సాధారణం దీన్ని ప్రజలు ఏదో పెద్ద విషయంగా చిత్రీకరించాల్సిన అవసరం లేదు. ఎవరికి తెలుసు. వచ్చే ఒలింపిక్స్‌లో వారు స్వర్ణ పతకాలు సాధిస్తారేమో' అని విజయ్ గోయల్ పేర్కొనడం కొసమెరుపు. Mr. Vijay Goel, is this sleeping or slipping!! https://t.co/0bG0l9kF0B — Biswatosh Sinha (@biswatosh) 28 August 2016 Vijay Goel is the real gold medalist Vijay Goel will give strong competition to Kapil Sharma in hosting a comedy show. #welcometocomedynightswithvijaygoel — Nick Turrim (@mhanthung) 28 August 2016 -
సింధు, సాక్షి.. గోల్డ్ మెడళ్లు సాధించారా?
-
ఆ విషయంలో వేరే ఆప్షనే లేదు : కేంద్ర మంత్రి
ఒలింపిక్స్‌లో పాల్గొననున్న ఆటగాళ్ల స్థానంలో మరొకరికి అవకాశం ఇచ్చేది లేదని క్రీడాశాఖ మంత్రి విజయ్ గోయల్ స్పష్టంచేశారు. యాంటీ డోపింగ్ ప్యానెల్ నిషేధించిన ఆటగాళ్ల స్థానంలో వేరొకరికి చాన్స్ ఇవ్వడం లాంటివి ఉండవని ఆయన అభిప్రాయపడ్డారు. రియోకు అర్హత సాధించిన ఓ ప్లేయర్ ఎవరైనా డోపింగ్ టెస్టులో విఫలమైతే ఈ విషయంలో వేరే ఆప్షన్ ఉండదని మంత్రి గోయల్ పేర్కొన్నారు. ఒకవేళ ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన ప్లేయర్ తీవ్ర అస్వస్థతకు లోనైన ప్రత్యేక సందర్భాలలో మాత్రమే రీప్లేస్మెంట్ గురించి ఆలోచిస్తారని చెప్పారు. ప్రత్యేకంగా పర్మిషన్ తీసుకుని ఇతర ఆటగాడిని రియోకు పంపిస్తే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలపారు. మరోవైపు నర్సింగ్ యాదవ్ స్థానంలో పురుషుల ఫ్రీస్టయిల్ 74 కేజీల విభాగంలో భారత్ నుంచి ప్రవీణ్ రాణా బరిలోకి దిగనున్నాడని ప్రచారంలో ఉంది. భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) యునెటైడ్ వరల్డ్ రెజ్లింగ్‌కు ఈ విషయంపై సమాచారం అందించింది. -
బాధ్యతలు తీసుకున్న గోయెల్
న్యూఢిల్లీ: కేంద్ర క్రీడా శాఖ మంత్రిగా విజయ్ గోయెల్ బుధవారం బాధ్యతలు తీసుకున్నారు. కేంద్ర మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా గోయెల్‌కు క్రీడా మంత్రిత్వశాఖను కేటాయించారు. ఈయన వాజ్‌పేయి హయాంలోనూ క్రీడా శాఖ మంత్రిగా పనిచేశారు. రియోలో భారతీయ భోజనం భారత ఆటగాళ్ల కోరిక మేరకు రియోలో అథ్లెట్లందరికీ భారతీయ వంటకాలను అందిస్తారని క్రీడా మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ‘రియో గేమ్స్ అధికారిక ఫుడ్ మెనూలో భారతీయ వంటకాలను భాగం చేసినట్లు రియో ఒలింపిక్స్ ఆర్గనైజర్స్ నుంచి స్పష్టత వచ్చింది. ఈ మెగా ఈవెంట్ పూర్తయ్యేవరకు క్రీడా గ్రామంలో భారతీయ భోజనం అందుబాటులో ఉంటుంది’ అని క్రీడా మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజీవ్ యాదవ్ స్పష్టం చేశారు. -
బీజేపీ ఎంపీకి జరిమానా
న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వం అమలు చేస్తున్న సరి-బేసి ట్రాఫిక్ నిబంధనను బీజేపీ ఎంపీ విజయ్ గోయెల్ ఉద్దేశ్యపూర్వకంగా ఉల్లంఘించారు. ట్రాఫిక్ పోలీసులు ఆయనకు 2 వేల రూపాయల జరిమానాను విధించారు. ఆప్ సర్కార్ రాజకీయ ఎత్తుగడకు నిరసనగా సరి-బేసి నిబంధనను ఉల్లంఘిస్తానని సోమవారం ఉదయం విజయ్ గోయెల్ చెప్పారు. ఢిల్లీ రవాణ శాఖ మంత్రి గోపాల్ రాయ్.. ఆయనకు రోజా పూలు ఇచ్చి నిర్ణయాన్ని మార్చుకోవాల్సిందిగా కోరినా మెత్తబడలేదు. సరి-బేసి నిబంధనకు తాను వ్యతిరేకంగా కాదని, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రాజకీయ ప్రయోజనం కోసం అవలంభిస్తున్న వైఖరికి వ్యతిరేకమని గోయెల్ స్పష్టం చేశారు. సరి-బేసి నిబంధన ఉల్లంఘించినవారికి వేసే 2 వేల జరిమానా చాలా ఎక్కువని, దీన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు. -
సీఎం.. ప్రకటనల పులి
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటనల పులిగా మారిపోయారని బీజేపీ విమర్శించింది. ఆ పార్టీ ఢిల్లీ శాఖ అధ్యక్షుడు విజయ్‌గోయల్ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. అలవికాని హామీలు ఇవ్వడం.. వాటిని నెరవేర్చలేకపోవడం.. కేజ్రీవాల్ కు అలవాటేనని ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చిన ఇన్నాళ్ల తర్వాత కూడా అనధికార కాలనీల గురించి, రేషన్ కార్డులు, అవినీతిపై ఆయన ఎందుకు మాట్లాడటంలేదని విమర్శించారు. ఆప్ ప్రభుత్వం ప్రకటనలు చేయడంపై చూపుతున్న శ్రద్ధ.. వాటి అమలుపై చూపడంలేదన్నారు. కొత్త పథకాలను ప్రకటించడం ద్వారా తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి కేర్రూ.వాల్ యత్నిస్తున్నారని గోయల్ విమర్శించారు. న గరవాసులు ఆప్ సర్కార్ పాలనపై సంతృప్తిగా ఉన్నారా.. అనే అంశంపై రాష్ట్ర పార్టీ సర్వే నిర్వహించనుందని చెప్పారు. జన్‌లోక్‌పాల్‌పై ఆయన మాట్లాడుతూ అది రాజ్యాంగబద్ధమా..కాదా అనే విషయం తమ పార్టీ నిర్ణయిస్తుందన్నారు. అది రాజ్యాంగబద్ధం కాకపోతే బీజేపీ మద్దతు ఇవ్వడం కష్టమేనని తేల్చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్‌కు జన్‌లోక్‌పాల్ బిల్లుపై సీఎం కేర్రూ.వాల్ రాసిన లేఖలో వాడిన భాష ఆక్షేపణీయమని గోయల్ అన్నారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వ్యక్తిపై అటువంటి వ్యాఖ్యలు చేయడం గర్హనీయం. వారికి ఎల్జీ తీరుపై ఏమైనా అనుమానాలుంటే రాష్ట్రపతిని కలిసి విన్నవించుకోవాలే తప్ప అటువంటి ప్రకటనలు చేయడం తగదన్నారు. ‘మీరు రాజ్యాంగాన్ని గౌరవించకపోతే.. ప్రజలు మిమ్మల్ని గౌరవించడం మానేస్తారు..’ అని ఆప్ నాయకులను గోయల్ హెచ్చరించారు. అనుమతితో పనేలేదు నగరంలో చిన్న చిన్న స్థలాలు కలిగిన యజమానులకు శుభవార్త. 100 చదరపు మీటర్ల స్థలం కలిగిన వారు నిర్మాణ పనులను చేపట్టేందుకు ఇక పై ఆయా కార్పొరేషన్లనుంచి అనుమతి పొందరనవసరమే లేదు. బీజేపీ నేతృత్వంలోని నగరపాలక సంస్థలు శనివారం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి. బీజేపీ టికెట్‌పై గెలుపొం దిన మూడు కార్పొరేషన్లకు చెందిన కార్పొరేటర్లు ఈ సమావేశంలో పాల్గొని పైవిధం గా నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు విజయ్‌గోయల్ వెల్లడించారు. ఈ సమావేశం అనంతరం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ నిర్మాణాలకు సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్ నిబంధనలను పాటిస్తామంటూ సంబంధిత అధికారులకు ఓ అఫిడవిట్ సమర్పిస్తే సరిపోతుందన్నారు. ఆ తర్వాత వారికి ఎటువంటి ఇబ్బందులూ ఎదురుకావన్నారు. 40 లక్షలమంది నివసించే అనధికార కాలనీల్లో కౌన్సిలర్లు తమ నిధులను వెచ్చించేందుకు అనుమతించకపోవడంపైనా ఈ సమావేశంలో చర్చ జరిగిందన్నారు. ఈ కాలనీల్లో కౌన్సిలర్లు తమ నిధులను వెచ్చించేం దు కు అనుమతించకుండా అభివృద్ధిని ఢిల్లీ ప్రభుత్వం అడ్డుకోవడంపైనా వారంతా చర్చించారన్నారు. అనధికార కాలనీల్లో కౌన్సిలర్లు నిధులను వెచ్చించి అభివృద్ధి పనులు చేపట్టేందుకు అనుమతించకపోతే హైకోర్టు ఎదుట ధర్నాకు దిగుతామని ఆయనహెచ్చరించారు. ఈ అంశాన్ని ఎల్రూ. దృష్టికి తీసుకెళతామన్నారు. అనధికార కాలనీల్లో పారిశుధ్య పనులను పర్యవేక్షించేందుకుగాను తమ పార్టీ కార్యాలయంలో త్వరలో ఓ హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కాలనీల్లో పారిశుధ్యానికి అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కార్పొరేటర్లకు ఆయన సూచించారు. ఎన్డీఎంసీ, ఎస్డీఎంసీ, ఈడీఎంసీల ఏకీకరణకు సంబంధించి ఎమ్మెల్యే నంద్ కిషోర్గార్గ్ నేతృత్వంలోని కమిటీని ఏర్పాటు చేశామని, సదరు కమిటీ తమకు సలహాలు, సూచనలు ఇస్తుందన్నామన్నారు. ‘ఏక్ నోట్-కమల్ పర్ ఓట్’ పేరిట కార్పొరేటర్లు తమ తమ పరిధిలోని అన్ని ఇళ్లకూ వెళ్లి యజమానులను కలుస్తారన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీకే ఓటు వేయాలని వారంతా ఈ సందర్భంగా కోరతారన్నారు. -
బీజేపీ ధర్నా
సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వం విద్యుత్ చార్జీల పెంపును అడ్డుకోలేకపోయినందుకు నిరసనగా ఢిల్లీ బీజేపీ శనివారం ప్రదర్శన నిర్వహించింది. అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వం ప్రభుత్వాన్ని నడపడంలో విఫలమైందని, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల్లో దేనినీ అధికారంలోకి వచ్చాక నెరవేర్చలేకపోయిందని విమర్శించింది. ఈ నిరసన ప్రదర్శనకు నేతృత్వం వహించిన ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు విజయ్ గోయల్ ఈ సందర్భంగా మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన తరువాత ధరల పెరుగుదలను నియంత్రిస్తామని ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్) ప్రకటించిందని, కరెంటు చార్జీలు తగ్గడానికి బదులు ఎనమిది శాతం పెంచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీటిచార్జీలు సైతం పది శాతం పెరిగాయని విజయ్‌గోయల్ అన్నారు. విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కమ్‌లు) విద్యుత్ చార్జీలను తగ్గించకపోగా, పది గంటలు విద్యుత్ కోతలు విధిస్తామని హెచ్చరించాయని ఆయన చెప్పారు. ఆప్ సర్కారు విద్యుత్ చార్జీలను తగ్గించకపోగా, విద్యుత్ కోతలను కూడా ఆపలేకపోయిందని ఈ సీనియర్ నేత మండిపడ్డారు. డిస్కమ్‌ల ఆడిటింగ్‌ను కొనసాగిస్తూనే, సరఫరా సంబంధిత సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేట్టుగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందుకోసం డిస్కమ్‌లతో చర్చలు జరపాలని విజయ్ గోయల్ అన్నారు. నీరు, విద్యుత్ ప్రజలకు అందించడంలో విఫలమైన సర్కారు తక్షణం గద్దెదిగాలని బీజేపీ నేత హర్షవర్ధన్ అన్నారు. -
37 మంది ఏకగ్రీవం.. రాజ్యసభకు పవార్, దిగ్విజయ్, వోరా
రాజ్యసభకు పవార్, దిగ్విజయ్, వోరా న్యూఢిల్లీ: రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో వివిధ రాష్ట్రాల నుంచి 37 మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు శుక్రవారం ముగియడంతో ఏకగ్రీవంగా ఎన్నికైన వారి పేర్లను ప్రకటించారు. వీరిలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) చీఫ్, కేంద్ర మంత్రి శరద్ పవార్, కాంగ్రెస్ నేతలు మోతీలాల్ వోరా, దిగ్విజయ్ సింగ్, మురళీ దేవ్రా, కేంద్ర మాజీ మంత్రి కుమారి సెల్జా, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(ఆర్పీఐ) నేత రాందాస్ అథవాలే తదితరులు ఉన్నారు. అథవాలేకు బీజేపీ మద్దతిచ్చింది. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయొద్దని నిర్ణయించుకున్న పవార్ మహారాష్ట్ర నుంచి, ఢిల్లీ బీజేపీ శాఖ అధ్యక్షుడు విజయ్ గోయెల్ రాజస్థాన్ నుంచి ఎన్నికయ్యారు. పదేళ్లుగా పోటీ రాజకీయాలకు దూరంగా ఉన్న దిగ్విజయ్ మధ్యప్రదేశ్ నుంచి ఎన్నికయ్యారు. రాజ్యసభలో భర్తీ చేయాల్సిన మిగిలిన 18 స్థానాలకు ఈ నెల 7న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 6, పశ్చిమ బెంగాల్లో 5, ఒడిశాలో 4, అస్సాంలో 3 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటికి పోటీ పడుతున్న ప్రముఖుల్లో సంజయ్ సిన్హ్(కాంగ్రెస్), మిథున్ చక్రవర్తి(తృణమూల్ కాంగ్రెస్), తదితరులు ఉన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి ఏకగ్రీవంగా ఎన్నికైన వారి వివరాలు.. మహారాష్ట్ర: మురళీ దేవరా, హుసేన్ దల్వాయ్(కాంగ్రెస్), శరద్ పవార్, మజీద్ మీనన్(ఎన్సీపీ), రాజ్‌కుమార్ దూత్(శివసేన), సంజయ్ కాకడే(స్వతంత్ర అభ్యర్థి), రాందాస్ అథవాలే(ఆర్పీఐ) రాజస్థాన్: విజయ్ గోయెల్, రామ్ నారాయణ్ దూడీ, నారాయణ్ పచారియా(బీజేపీ) బీహార్: రామ్‌నాథ్ ఠాకూర్, హరివంశ్, కకాశా ప్రవీణ్(జేడీయూ. వీరు రాజ్యసభకు ఎన్నికవడం ఇదే తొలిసారి), సీపీ ఠాకూర్, ఆర్కే సిన్హా(బీజేపీ) తమిళనాడు: ఎల్ శశికళ పుష్ప, విజిలా సత్యనాథ్, ముత్తుకురుప్పన్, ఏకే సెల్వరాజ్(అన్నాడీఎంకే), తిరుచ్చి శివ(డీఎంకే), టీకే రంగరాజన్(సీపీఎం) మధ్యప్రదేశ్: దిగ్విజయ్ సింగ్(కాంగ్రెస్), ప్రభాత్ ఝా, సత్యనారాయణ్ జతియా(బీజేపీ) ఛత్తీస్‌గఢ్: మోతీలాల్ వోరా(కాంగ్రెస్), రణవిజయ్ ప్రతాప్ సింగ్ జుదేవ్(బీజేపీ) హర్యానా: కుమారి సెల్జా(కాంగ్రెస్), రామ్‌కుమార్ కశ్యప్(ఇండియన్ నేషనల్ లోక్‌దళ్) గుజరాత్: మధుసూదన్ మిస్త్రీ(కాంగ్రెస్), శంభుప్రసాద్ తుండియా, చునీభాయ్ గోహిల్, లాల్సిన్హ్ వడోదియా(బీజేపీ.. ముగ్గురూ రాజ్యసభకు ఎన్నికవడం ఇదే తొలిసారి). జార్ఖండ్: ప్రేమ్‌చంద్ గుప్తా(ఆర్జేడీ), పరిమళ్ నథ్వానీ(స్వతంత్ర అభ్యర్థి) మణిపూర్: అబ్దుల్ సలామ్(కాంగ్రెస్), మేఘాలయ: వాన్సుక్ సయీమ్(కాంగ్రెస్), హిమాచల్‌ప్రదేశ్: విప్లవ్ ఠాకూర్(కాంగ్రెస్) -
ఏడుస్థానాలూ ఏకగ్రీవమే?
ముంబై: రాష్ట్రంలోని ఏడు రాజ్యసభ స్థానాల నుంచి బరిలోకి దిగిన అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎంపికయ్యే అవకాశముంది. శరద్‌పవార్, మజిద్మీనన్, (ఎన్సీపీ), మిలింద్ దేవరా, హుస్సేన్ దల్వాయి (కాంగ్రెస్), రాజ్‌కుమార్ ధూత్ (శివసేన), సంజయ్కాకడే (స్వతంత్ర)లతోపాటు బీజేపీ, శివసేనల మద్దతుతో ఆర్పీఐ నాయకుడు రాందాస్ అథవాలే తమ తమ నామినేషన్లను దాఖలుచేశారు. నామినేషన్ల దాఖలుకు తుదిగడువు మంగళవారంతో ముగిసిపోయింది. నామినేషన్లను బుధవారం పరిశీలిస్తారు. కాగా నామినేషన్ల ఉపసంహరణకు తుదిగడువు ఈ నెల 31వ తేదీ. -
ఆమ్ ఆద్మీ కాదు ఖాస్ ఆద్మీ పార్టీ
సాక్షి, న్యూఢిల్లీ: చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటూ మహిళా వ్యతిరేక, ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న ఆప్ సర్కార్ ఆమ్ ఆద్మీ పార్టీ కాదని ఖాస్ ఆద్మీ పార్టీగా మారిందని బీజేపీ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ఆప్ సర్కార్ విధానాలను ఎండగట్టేందుకు ఈనెల 24న మొత్తం 14 జిల్లాల్లో ఆందోళనలు నిర్వహించాలని నిర్ణయించినట్టు బీజేపీ నగరశాఖ అధ్యక్షుడు విజయ్ గోయల్ వెల్లడించారు. బుధవారం పండిత్పంత్ మార్గ్‌లోని స్థానిక పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌తో సహా ఆప్ మంత్రులు, ఆప్ కార్యకర్తల తీరుతో రెండు రోజులపాటు ఢిల్లీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులపై అవినీతి కేసులు పెట్టకపోవడంతోనే కేజ్రీవాల్ సర్కార్‌కు మద్దతు కొనసాగిస్తోందని ఆరోపించారు. బీజేపీ శుక్రవారం నిర్వహించనున్న ధర్నాలో కొన్ని అంశాలను ప్రధానంగా ప్రస్తావించనుంది. దీనిలో ఆప్-కాంగ్రెస్ మధ్య ఉన్న చీకటి ఒప్పదం, రెండు రోజులపాటు ధర్నాతో ఆప్నాయకులు ప్రజలకు కలిగించిన ఇబ్బందులు ప్రధానంగా విమర్శించాలని నిర్ణయించారు. ఆప్ తన హామీల అమలులోనూ విఫలమైన తీరును ఎండగడతామని గోయల్ తెలిపారు. రిపబ్లిక్‌డే ఏర్పాట్లకు ఆటంకం కలిగించిన ఆప్ భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తామన్నారు. -
కాంగ్రెస్‌తో ఆప్ కుమ్మక్కు
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ప్రభుత్వం కాంగ్రెస్ కనుసన్నల్లో నడుస్తోందని ఆ పార్టీ ఎమ్మెల్యే వినోద్ కుమార్ బిన్నీ మాటలను ఆసరాగా చేసుకొని బీజేపీ కేజ్రీవాల్‌పై విమర్శల దాడిని పెంచింది. అవినీతి విషయంలో కాంగ్రెస్‌తో కుమ్మక్కయి ఢిల్లీ ప్రజలను మోసం చేస్తున్నారని తాము ఎప్పటి నుంచో చెబుతున్నామని, ఇప్పుడు బిన్నీ మాటలతో అవి నిజమని తేలిందని ఢిల్లీ బీజేపీ ప్రదేశ్ అధ్యక్షుడు విజయ్ గోయల్ అన్నారు. అవినీతిని ఊడ్చేస్తామంటూ ఎన్నికలకు ముందు ఊదరగొట్టిన ఆప్, ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదని ఆయన గురువారం మీడియాకు తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలపై కూడా దర్యాప్తునకు సిద్ధపడకపోవడం ఆ పార్టీ కాంగ్రెస్‌తో కుమ్మక్కయిందన్న దానికి నిదర్శనమన్నారు. షీలా కుమారుడు సందీప్ దీక్షిత్‌కు కేజ్రీవాల్‌తో మంచి సాన్నిహిత్యం ఉందని బిన్నీ చేసిన వ్యాఖ్యలు వారి లోపాయికారీ ఒప్పందాన్ని బయటపెట్టాయన్నారు. ‘కామన్వెల్త్ గేమ్స్‌లో భారీ అవినీతి జరిగిందని ఆరోపణలు వచ్చినా, కనీసం ఇప్పుడు ఈ విషయాన్ని ఆప్ పట్టించుకోవడం లేదు. దీనర్థం అవినీతితో ఆప్ పార్టీ రాజీకి వచ్చిందని తెలుస్తోంద’ని గోయల్ విమర్శించారు. రానున్న రోజుల్లో షీలాపై ఆప్ చేసిన ఆరోపణలను వెనక్కి తీసుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదని ఎద్దేవా చేశారు. ఆప్‌తో ఒరిగేదేమీ లేదని ఢిల్లీవాసులు తెలుసుకున్నారని, మోసపోయామని గ్రహించారని గోయల్ తెలిపారు. ఈ రోజు ఆ పార్టీ ఎమ్మెల్యేనే వారి నిర్ణయాలపై విమర్శలు చేస్తున్నారన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు టికెట్లు కేటాయించిన నలుగురు అభ్యర్థులే ఇప్పుడు లోక్‌సభ వ్యవహారాలను చూసుకుంటున్నారని తెలిపారు. ప్రజలతో చర్చించిన తర్వాతే నిర్ణయాలు తీసుకుంటున్నామని మోసగిస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం కేజ్రీవాల్ అహంకార పాలన నడుస్తోందని ఘాటైన విమర్శలు చేశారు. గతేడాది ఓ అవినీతి కేసులో సాక్ష్యాన్ని లేకుండా చేశారని ప్రత్యేక సీబీఐ కోర్టు మంత్రి సోమనాథ్ భారతిని ప్రశ్నించినా, కేజ్రీవాల్ పట్టించుకోకుండా వెనకేసుకొస్తున్నారని మండిపడ్డారు. న్యాయశాఖ మంత్రి పదవి నుంచి సోమనాథ్‌ను ఈ నెల 26లోపు తప్పించకపోతే నిరవధిక ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. ఢిల్లీ ప్రజల అవసరాలను పట్టించుకోకుండా వచ్చే లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆప్ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందని మండిపడ్డారు.