Wrestler Sushil Kumar
-
‘చార్జ్‌షీట్’లో సుశీల్ పేరు
న్యూఢిల్లీ: భారత స్టార్ రెజ్లర్, రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత సుశీల్ కుమార్‌ను మరింతగా ఇబ్బందుల్లోకి నెట్టే పరిణామం! దాదాపు ఏడాదిన్నర క్రితం రెజ్లర్ సాగర్ ధన్కర్ హత్య కేసులో నిందితుడిగా ఉన్న సుశీల్ పేరును ఢిల్లీ పోలీసులు తాజాగా చార్జ్ షీట్లో చేర్చారు. సుశీల్‌తో పాటు మరో 17 మంది పేర్లు ఇందులో ఉన్నాయి. ఇకపై చార్జ్‌షీట్‌కు అనుగుణంగా పూర్తి స్థాయిలో కేసుకు సంబంధించి కోర్టులో విచారణ సాగనుంది. 2021 మే 4 ఛత్ర్శాల్ స్టేడియంలో సాగర్‌పై దాడి జరగ్గా, తీవ్రంగా గాయపడిన అతను ఆ తర్వాత మృతి చెందాడు. గత ఏడాది మే 23న అరెస్టయిన సుశీల్ ఇంకా తీహార్ జైలులోనే ఉన్నాడు. -
Sushil Kumar Bail Petition: క్రూరంగా హింసించి చంపారు.. బెయిల్ ఇవ్వకండి
Wrestler Sushil Kumar Bail Plea Opposed: సాగర్ ధనకర్ రాణా అనే యువ రెజ్లర్ హత్య కేసులో నిందితుడు, ఒలింపిక్స్ పతక విజేత సుశీల్ కుమార్ బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైంది. అడిషనల్ సెషన్స్ జడ్జి శివాజీ ఆనంద్.. సుశీల్ కుమార్‌కు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించారు. సాగర్‌ను అడవి పందిని వేటాడినట్లు వేటాడి క్రూరంగా హింసించి చంపారని బాధితుడి తరఫు న్యాయవాది, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అతుల్ కుమార్ శ్రీ వాస్తవ కోర్టుకు తెలిపారు. మరోవైపు సుశీల్ కుమార్ తరపు లాయర్ తన క్లయింట్‌ను కావాలనే కేసులో ఇరికించారని, మృతుడి మరణ వాంగ్మూలాన్ని 40 రోజులు ఆలస్యంగా కోర్టుకు సమర్పించారని వాదించారు. ఈ కేసులో మొత్తం 13 మందిపై ఐపీసీ 302, 307, 147 సెక్షన్ల కింద ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. కాగా, మే 4న ఢిల్లీలోని ఛత్రాసాల్ స్టేడియం వద్ద 23 ఏళ్ల సాగర్ ధనకర్ రాణాను హత్య చేసిన కేసులో సుశీల్ కుమార్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. సుశీల్.. 2008, 2012 విశ్వక్రీడల్లో కాంస్యం, రజత పతకాలు సాధించాడు. చదవండి: క్రికెట్ జట్టు వాహనంలో చోరీ.. లబోదిబోమంటున్న ఆసీస్ క్రికెటర్ -
బెయిల్‌కు దరఖాస్తు చేసుకున్న ఒలింపిక్స్ పతక విజేత
Wrestler Sushil Kumar Seeks Bail In Murder Case: సాగర్ రాణా అనే యువ రెజ్లర్ హత్య కేసులో ఒలింపిక్స్ పతక విజేత సుశీల్ కుమార్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. సోమవారం ఢిల్లీలోని రోహిణి కోర్టులో అతని తరపు న్యాయవాది బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు పోలీసులు తప్పుడు కేసులో ఇరికించారని సుశీల్ తన పిటిషన్లో ప్రస్తావించారు. అడిషనల్ సెషన్స్ జడ్జి శివాజీ ఆనంద్ రేపు ఈ పిటిషన్‌ను విచారించనున్నారు. కాగా, ఢిల్లీలోని ఛత్రాసాల్ స్టేడియం వద్ద 23 ఏళ్ల సాగర్ రాణాను హత్య చేసిన కేసులో సుశీల్ కుమార్‌ను ఢిల్లీ పోలీసులు మే 23న అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. సుశీల్.. 2008, 2012 విశ్వక్రీడల్లో కాంస్యం, రజత పతకాలు సాధించాడు. చదవండి: ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌పై రోహిత్ శర్మ సంచలన వ్యాఖ్యలు -
జైల్లో టీవీ పెట్టించండి..రెజ్లింగ్ అప్డేట్స్ తెలుసుకోవాలి
న్యూఢిల్లీ: హత్య కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉంటున్న రెజ్లర్ సుశీల్ కుమార్.. తన సెల్లో టీవీ పెట్టించాలని జైలు అధికారులను డిమాండ్ చేశాడు. ఇటీవలే తనకు ప్రత్యేకమైన ఆహారం ఇవ్వాలని కోరిన ఆయన..తాజా మరో గొంతెమ్మ కోరిక కోరాడు. వార్తలు చూడటానికి, అలాగే రెజ్లింగ్‌లో అప్డేట్స్ తెలుసుకోవడానికి తనకు తప్పనిసరిగా టీవీ కావాలని జైలు అధికారులకు రాసిన ఓ లేఖలో పేర్కొన్నాడు. రెండుసార్లు ఒలింపిక్ మెడల్స్‌ను సాధించిన సుశీల్.. రెజ్లర్ సాగర్ రానా హత్య కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సుశీల్.. తీహార్‌లోని జైల్ నంబర్ 2లో సాధారణ ఖైదీగా ఉంటున్నాడు. జైలు నిబంధనల సాధారణ ఖైదీలకు న్యూస్ పేపర్స్ మాత్రమే ఇస్తారు. అయితే సుశీల్.. తనను విఐపీ ఖైదీగా పరిగణించి, ప్రత్యేక ఆహారం, టీవీతో పాటు మరిన్ని ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని అధికారులను కోరుతున్నాడు.ఈ విషయమై గతంలో పిటిషన్ దాఖలు చేయగా కోర్టు దాన్ని కొట్టి వేసింది. హత్యారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి ఈ సదుపాయాలు కల్పించడం కుదరదని ఘాటుగా బదులిచ్చింది. -
సుశీల్ సాబ్.. ఎక్ ఫొటో ప్లీజ్!
న్యూఢిల్లీ: ప్రియ శిష్యుడు సాగర్ ధన్కర్ను హత్య చేసిన కేసులో అరెస్టయిన రెజ్లర్ సుశీల్ కుమార్.. మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. హత్య కేసులో సుశీల్ నిందితుడిగా ఉన్నాడనే సంగతి పక్కనపెట్టి.. ఢిల్లీ పోలీసులు ఆ మాజీ ఒలింపిక్ మెడలిస్ట్‌తో ఫొటోలు దిగారు. ఇందుకు సంబంధించిన ఓ ఫొటో నేషనల్ మీడియా హౌజ్‌ల ద్వారా వైరల్ కావడంతో దుమారం మొదలైంది. మాస్క్‌లు లేవు, సోషల్ డిస్టెన్స్ లేదు. పైగా సుశీల్ సహా అందరూ ముఖంలో చిరునవ్వుతో ఫొజులిచ్చారు. ఆ ఫొటో తీసింది కూడా ఓ పోలీస్ అధికారే కావడం విశేషం. అయితే ఇది తాజా ఫొటోనేనా? లేక కరోనా విజృంభణ తర్వాత ఎప్పుడైనా తీశారా? తీస్తే ఎక్కడ తీశారు? అనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఈలోపు ఈ ఫొటో మీడియా హౌజ్‌ల ద్వారా జనం, అధికారుల దృష్టికి చేరింది. దీంతో ఆ అధికారుల అభిమానంపై మండిపడుతున్నారు. సిగ్గులేకుండా ఇలాంటి డ్యూటీ చేస్తున్నారా? అంటూ విరుచుకుపడుతున్నారు. మరోవైపు ఈ వ్యవహారంపై ప్రజలతో సహా ఉన్నతాధికారులు మండిపడుతున్నారు. అతనిప్పుడు స్పోర్ట్స్ సెలబ్రిటీ కాదని.. ఓ హత్యకేసులో నేరస్థుడనే విషయాన్ని పోలీసులు గుర్తుంచుకోవాలని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నాడు. జైలు ప్రాంగణంలో.. అదీ ఓ నేరస్తుడితో ఫొటోలు దిగిన వాళ్లపై చర్యలు తీసుకోవాలని పోలీస్ అసోషియేషన్ ఫోరమ్‌కు లేఖ రాయనున్నట్లు ఆయన వెల్లడించారు. చదవండి: సుశీల్ గురించి సాగర్ పేరెంట్స్ ఏమన్నారంటే.. ఢిల్లీలోని ఛత్రసాల్ స్టేడియం వద్ద మే 4న సాగర్‌తో పాటు అతని స్నేహితులు సోను, అమిత్ కుమార్‌పై సుశీల్ కుమార్, అతని స్నేహితులు దాడి చేసినట్లు ఆరోపణలున్నాయి. ఈ ఘటనలో సాగర్ అక్కడికక్కడే మృతి చెందాడు. దాడి అనంతరం మూడు వారాలపాటు పరారీలో ఉన్న సుశీల్‌ను, సహ నిందితుడు అజయ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. బెయిల్ కోసం దరఖాస్తు చేయగా కోర్టు తిరస్కరించింది. ఆపై భద్రతా కారణాలతో సుశీల్‌ను తిహార్ జైలు-2కు తరలించారు. ఇక ఇదే కేసులో సుశీల్ జూడో కోచ్‌ను సైతం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. చదవండి: సాగర్ హత్య, ఆ రాత్రి ఏంజరిగిందంటే.. -
Wrestler Sushil Kumar: తీహార్ జైలుకు తరలింపు..
న్యూఢిల్లీ: రెజ్లర్ సాగర్ ధంకర్ హత్య కేసులో అరెస్టయిన ఒలింపిక్ పతక విజేత సుశీల్ కుమార్‌ను మండోలి జైలు నుంచి తీహార్ జైలుకు తరలించారు. సుశీల్‌కుమార్‌తో పాటు అతని సహచరుడు అజయ్‌ను మే 23న ఢిల్లీ స్పెషల్ పోలీసులు దేశ రాజధానిలోని ముండ్కా ప్రాంతంలో అరెస్టు చేశారు. అయితే, భద్రతా కారణాలతో సుశీల్‌ను తిహార్ జైలు-2కు తరలించినట్లు తెలుస్తోంది. కాగా, జైలు అధికారులు మాత్రం సాధారణ ప్రక్రియలో భాగంగానే తరలింపు జరిగిందని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే, ఢిల్లీలోని ఛత్రసాల్ స్టేడియం వద్ద మే 4న సాగర్‌తో పాటు అతని స్నేహితులు సోను, అమిత్ కుమార్‌పై సుశీల్ కుమార్, అతని స్నేహితులు దాడి చేసినట్లు ఆరోపణలున్నాయి. తీవ్ర గాయాలు కావడంతో సాగర్ అక్కడికక్కడే మృతి చెందిన విషయం తెలిసిందే. దాడి అనంతరం పరారీలో ఉన్న సుశీల్ కుమార్‌తో పాటు సహ నిందితుడు అజయ్ కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వీరు బెయిల్ కోసం దరఖాస్తు చేయగా కోర్టు తిరస్కరించింది. ఇదే కేసులో సుశీల్ జూడో కోచ్‌ను సైతం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. చదవండి: WTC 2021-23: టీమిండియా షెడ్యూల్ ఖరారు.. ఇంగ్లండ్ సిరీస్‌తో షురూ -
రెజ్లర్ హత్య కేసు: సుశీల్ కుమార్ జూడోకోచ్ అరెస్ట్
ఢిల్లీ: జూనియర్ రెజ్లర్ సాగర్ రాణా హత్యకేసు మరో మలుపు తీసుకుంది. హత్య కేసుతో జూడో కోచ్ సుభాష్‌కు సంబంధాలు ఉన్నట్లు తేలడంతో ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు బుధవారం ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. కాగా ఒలింపియన్ సుశీల్ కుమార్‌కు సుభాస్ జూడోకోచ్‌గా వ్యవహరించారు. ఇప్పటికే సాగర్ రాణా హత్య కేసులో సుశీల్ కుమార్‌తో పాటు అతని సన్నిహితులు పోలీసుల కస్టడీలో ఉన్నారు. ఇటీవలే సుశీల్ కస్టడీని జూన్ 25 వరకు పొడిగిస్తున్నట్లు ఢిల్లీ మెట్రోపాలిటన్ కోర్టు మేజిస్ట్రేట్ రితికా జైన్ ఆదేశించారు. తొమ్మిది రోజుల కస్టడీ ముగిసిన తర్వాత పోలీసులు సుశీల్‌ను శుక్రవారం కోర్టులో హాజరు పర్చగా అతనికి ఎలాంటి ఊరట లభించలేదు. రెజ్లర్ హత్యకు సంబంధించి పోలీసులు సుశీల్ సహా మొత్తం పది మందిని ఇప్పటి వరకు అరెస్ట్ చేశారు. కాగా ఢిల్లీలోని ఛత్రసాల్ స్టేడియంలో మే4 వ తేదీన సాగర్ రాణా దారుణ హత్యకు గురయ్యాడు. సుశీల్, సాగర్ వర్గీయుల మధ్య జరిగిన ఘర్షణలో సాగర్ హత్యకు గురైనట్లు తేలింది. చదవండి: రెజ్లర్ హత్యకేసు: సుశీల్ కుమార్ రిమాండ్ పొడిగింపు -
రెజ్లర్ హత్యకేసు: సుశీల్ కస్టడీ పొడిగింపు
న్యూఢిల్లీ: యువ రెజ్లర్ సాగర్ రాణా హత్య కేసులో నిందితుడిగా ఉన్న భారత మేటి రెజ్లర్ సుశీల్ కుమార్ జ్యుడీషియల్ కస్టడీ కొనసాగనుంది. అతని కస్టడీని జూన్ 25 వరకు పొడిగిస్తున్నట్లు ఢిల్లీ మెట్రోపాలిటన్ కోర్టు మేజిస్ట్రేట్ రితికా జైన్ ఆదేశించారు. తొమ్మిది రోజుల కస్టడీ ముగిసిన తర్వాత పోలీసులు సుశీల్‌ను శుక్రవారం కోర్టులో హాజరు పర్చగా అతనికి ఎలాంటి ఊరట లభించలేదు. రెజ్లర్ హత్యకు సంబంధించి పోలీసులు సుశీల్ సహా మొత్తం పది మందిని ఇప్పటి వరకు అరెస్ట్ చేశారు. -
డబ్బులు ఇవ్వమన్నందుకు సుశీల్ నన్ను చితకబాదాడు
ముంబై: జూనియర్ రెజ్లర్ సాగర్ రాణా హత్య కేసులో నిందితుడిగా ఉన్న సుశీల్ కుమార్ మెడకు మరో కేసు మెడకు చుట్టుకునేలా ఉంది. ఇప్పటికే మర్డర్ కేసులో అరెస్టైన సుశీల్‌కు ఢిల్లీ రోహిణి కోర్టు శనివారం మరో నాలుగు రోజల రిమాండ్ పొడిగించింది. తాజాగా సుశీల్ కుమార్ ఒక కిరాణా షాప్ ఓనర్‌ను బెదిరించడంతో పాటు అతనిపై దాడికి దిగి దౌర్జన్యానికి పాల్పడినట్లు సతీశ్ యాదవ్ ఇండియా టుడే ఇంటర్య్వూలో తెలిపారు. సతీష్ యాదవ్ మాట్లాడుతూ.. '' నేను 18 సంవత్సరాలుగా ఛత్రసాల్ స్టేడియానికి సరుకులు అందిస్తున్నా. సుశీల్ మామ సత్పాల్ సింగ్ ఛత్రసాల్ స్టేడియంలో కోచ్‌గా ఉన్న సమయంలో నాకు అతనితో మంచి అనుబంధం ఉంది. ఆ అనుబంధం కారణంగా తక్కువ ధరకే సరుకులు అందిస్తుండేవాడిని. కాగా గతేడాది లాక్డౌన్ సమయంలో స్డేడియానికి కోచ్‌గా ఉన్న బీరేంద్ర సరుకుల అందించాలని కోరాడు. అతని ఆర్డర్‌పై నేను రేషన్ అందించాను. అయితే బీరేంద్ర ట్రాన్స్ఫర్ కావడం... అతని స్థానంలో కొత్త కోచ్ వచ్చాడు. నాకు రావాల్సిన రూ. 4 లక్షలు ఇవ్వాలని ఛత్రసాల్ కొత్త కోచ్ అశోక్‌ను అడిగాను. ఒకరోజు అశోక్ నన్ను పిలిచి డబ్బు చెల్లిస్తానని బిల్లులు తీసుకున్నాడు. మరునాడు ధర్మ అనే వ్యక్తి వచ్చి సుశీల్ కుమార్ మిమ్మల్ని పిలుస్తున్నారని చెప్పి వెళ్లాడు. డబ్బు ఇస్తారనే ఆశతో అక్కడికి వెళ్లిన నాకు సుశీల్ డబ్బు ఇవ్వనని చెప్పడంతో అతని కాళ్ల మీద పడి మీరు డబ్బు ఇవ్వకపోతే ఇక్కడే చచ్చిపోతా అని అన్నాను. దానికి సుశీల్ ''అవునా.. ఇక్కడే చచ్చిపోతావా.. అయితే చావు'' అంటూ తన అనుచరులను పిలిచి ఇష్టం వచ్చినట్లు కొట్టించి దౌర్జన్యం చేశాడు. మళ్లీ కనిపిస్తే చంపేస్తానని బెదరించడంతో భయంతో ఇంటికి వెళ్లిపోయాను.'' అని చెప్పుకొచ్చాడు. కాగా సతీష్ యాదవ్ తనపై దాడి చేసిన సుశీల్ బృందంపై గత సెప్టెంబర్‌లో ఫిర్యాదు ఇచ్చినా పోలీసులు పట్టించుకోలేదు. తాజాగా సుశీల్ హత్య కేసులో అరెస్ట్ అయిన విషయం తెలుసుకున్న సతీష్ యాదవ్ తనపై దాడికి దిగిన సుశీల్‌పై మరోసారి ఫిర్యాదు చేస్తానని తెలిపాడు. చదవండి: రెజ్లర్ హత్యకేసు: సుశీల్ కుమార్ రిమాండ్ పొడిగింపు -
రెజ్లర్ హత్యకేసు: సుశీల్ కుమార్ రిమాండ్ పొడిగింపు
ఢిల్లీ: జూనియర్ రెజ్లర్ సాగర్ రాణా హత్యకేసులో నిందితుడిగా ఉన్న ఒలింపియన్.. రెజ్లర్ సుశీల్ కుమార్‌కు మరో నాలుగు రోజుల రిమాండ్ పొడిగిస్తున్నట్లు ఢిల్లీ రోహిణి కోర్టు శనివారం తెలిపింది. కాగా ఢిల్లీ పోలీసులు సుశీల్‌ను విచారించేందుకు ఏడు రోజుల కస్టడీకి కోరగా.. కోర్టు నాలుగు రోజలు మాత్రమే పొడిగించింది. సుశీల్‌తో పాటు మరో నిందితుడిగా ఉన్న అజయ్‌కి ప్రతీరోజు వైద్య పరీక్షలు నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. కాగా మే 23న కోర్టులో హాజరుపరిచిన సుశీల్‌కు ఆరు రోజుల రిమాండ్ విధించింది. నేటితో ఆ గడువు పూర్తి కావడంతో కోర్టు మరోసారి రిమాండ్‌ను పొడిగించినట్లు స్పష్టం చేసింది. కాగా ఢిల్లీలోని ఛత్రసాల్ స్టేడియంలో మే4 వ తేదీన సాగర్ రాణా దారుణ హత్యకు గురయ్యాడు. సుశీల్, సాగర్ వర్గీయుల మధ్య జరిగిన ఘర్షణలో సాగర్ హత్యకు గురైనట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో తేల్చారు. అప్పటినుంచి అజ్థాతంలోకి వెళ్లిపోయిన సుశీల్ కుమార్‌ను పంజాబ్‌లోని జలంధర్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా రెజ్లర్ సుశీల్ కుమార్ హాకీ స్టిక్‌తో సాగర్ రాణాపై దాడికి పాల్పడినట్లుగా రిలీజైన వీడియో వైరల్‌గా మారింది. చదవండి: Wrestler Sushil Kumar: సుశీల్ హాకీ స్టిక్‌తో... -
Wrestler Sushil Kumar: ఆ రాత్రి ఏం జరిగింది?
‘రెండు వర్గాల మధ్య ఘర్షణను అడ్డుకునేందుకు మధ్యవర్తిగా మాత్రమే నేను అక్కడకు వెళ్లాను’... పోలీసుల విచారణ సందర్భంగా సుశీల్ కుమార్ ఇచ్చిన వాంగ్మూలం ఇది. అయితే అతను చెబుతున్న మాటల్లో నిజమెంత...? విచారణ సమయంలో పలుమార్లు మాట మార్చిన సుశీల్‌లో ఆ తడబాటు ఎందుకు...? ఇప్పుడు పోలీసులు ఇవన్నీ తేల్చే పనిలో పడ్డారు. సుశీల్ అరెస్ట్ అనంతరం ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ తమ పనిలో మరింత వేగం పెంచగా... స్వయంకృతంతో జైల్లో స్టార్ ఒలింపియన్ రెజ్లర్ కుమిలిపోతుండటం క్రీడా విషాదం. న్యూఢిల్లీ: యువ రెజ్లర్ సాగర్ రాణా హత్య కేసులో ఢిల్లీ పోలీసులు చురుగ్గా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రధాన నిందితుడిగా ఉన్న సుశీల్ కుమార్‌తో కలిసి మంగళవారం పోలీసులు ఘటన జరిగిన ఛత్రశాల్ స్టేడియం వద్దకు వెళ్లారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అక్కడే ఉండి ‘సీన్ రీకన్స్ట్రక్షన్’ ద్వారా మే 4 రాత్రి ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేశారు. ‘ఘటన జరిగిన రోజు అతను ఎక్కడ ఉన్నాడు. ఏం చేశాడని ప్రశ్నించాం. అనంతరం సుశీల్ దాక్కునేందుకు సహకరించిన సన్నిహితులు, మిత్రుల వివరాలు కూడా అడిగాం. మేం అన్ని కోణాల్లో విచారించి నిజాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం’ అని పోలీస్ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఛత్రశాల్ స్టేడియంతో పాటు వివాదానికి కారణమైన మోడల్ హౌస్‌లోని ఫ్లాట్‌కు, షాలిమార్ బాగ్‌లో సుశీల్ నివాసం ఉంటున్న చోటుకు కూడా అతడిని పోలీసులు తీసుకెళ్లి పలు వివరాలు సేకరించారు. ‘ఆ రోజు రాత్రి సుశీల్‌తో ఎవరెవరు ఉన్నారో తెలుసుకుంటున్నాం. అతను సాగర్‌ను కొడుతున్నట్లుగా వచ్చిన వీడియోపై మరింత స్పష్టత కోసం ప్రయత్నిస్తున్నాం’ అని అధికారులు చెప్పారు. పొంతన లేని జవాబులు మంగళవారం కూడా నాలుగు గంటలపాటు సుశీల్‌ను పోలీసులు ప్రశ్నించారు. ఈ క్రమంలో అతను భిన్నమైన సమాధానాలు ఇచ్చినట్లు తెలిసింది. పోలీసులు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు. ‘విచారణ సందర్భంగా ఒకసారి సాగర్, సోనూలను తాను అక్కడకు లాక్కు రాలేదని, తగవు తీర్చేందుకు మాత్రమే వెళ్లానని అతను మాతో చెప్పాడు. మరోసారి దీని గురించే చెబుతూ తాను సాగర్‌ను కాస్త బెదిరించి భయపెట్టాలని మాత్రమే భావించానని కూడా చెప్పాడు. దీన్ని బట్టి చూస్తే అతని జవాబుల్లో తేడా స్పష్టంగా కనిపిస్తోంది. సహజంగానే ఆందోళన గా ఉన్న సుశీల్ పదే పదే మాట మార్చాడు. గొడవ జరిగాక కూడా తాను ఛత్రశాల్ స్టేడియం లోనే ఉన్నానని, మరుసటి రోజు సాగర్ చనిపోయాడని తెలిశాకే పారిపోయానని మాతో చెప్పాడు’ అని క్రైమ్ బ్రాంచ్ అధికారి ఒకరు వెల్లడించారు. అంతటి పహిల్వాన్ కూడా జైలు గోడల మధ్య కన్నీళ్లు కార్చినట్లు ఆయన చెప్పారు. ‘లాకప్‌లో పెట్టగానే సుశీల్ ఏడ్చేశాడు. రాత్రంతా మెలకువతోనే ఉండి పలుమార్లు కన్నీళ్లు పెట్టుకున్న అతను ఏమీ తినేందుకు ఇష్టపడలేదు’ అని కూడా ఆయన వివరించారు. ‘పద్మశ్రీ’ వెనక్కి తీసుకుంటారా... హత్య కేసులో నిందితుడిగా ఉన్న సుశీల్‌కు 2011 లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పౌర పురస్కారం ‘పద్మశ్రీ’ని వెనక్కి తీసుకునే విషయంలో చర్చ సాగుతోంది. గతంలో ఇలాంటి ఆరోపణలు ఏ అవార్డీపై రాలేదు కాబట్టి దీని విషయంలో ప్రభు త్వం ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని భావి స్తోంది. అవార్డు నిబంధనల్లో ఇలా వెనక్కి తీసుకునే విషయంలో ఎలాంటి స్పష్టమైన సూచనలు లేకపోయినా... అవార్డు గ్రహీతలు నైతికపరంగా ఉన్నతంగా ఉండాలనే కోణంలో భారత రాష్ట్రపతి కి మాత్రం అవార్డును రద్దు చేసే అధికారం ఉంది. నార్నర్త్ రైల్వేస్ సస్పెన్షన్ వేటు ఊహించినట్లుగానే నార్తర్న్ రైల్వే సుశీల్‌ను సస్పెండ్ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. సీనియర్ కమర్షియల్ మేనేజర్‌గా అతను పని చేస్తున్నాడు. ‘సుశీల్‌పై క్రిమినల్ కేసు నమోదు కావడంతోపాటు 48 గంటలకు మించి అతను పోలీస్ కస్టడీలో ఉన్నాడు. నిబంధనల ప్రకారం తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు సుశీల్‌ను సస్పెండ్ చేస్తున్నాం’ అని నార్తర్న్ రైల్వేస్ అధికారికంగా ప్రకటించింది. కాంట్రాక్ట్ ఖతమ్! మరోవైపు సుశీల్‌ను భారత రెజ్లింగ్ సమాఖ్య కాంట్రాక్ట్ జాబితా నుంచి తొలగించే అవకాశం ఉంది. తాజా ఘటనకంటే మ్యాట్‌పై అతని ప్రదర్శన కారణంగానే సుశీల్ కాంట్రాక్ట్ కోల్పోనున్నాడు. 2019లో ‘ఎ’ గ్రేడ్ కాంట్రాక్ట్ (ఏడాదికి రూ. 30 లక్షలు) దక్కిన అనంతరం సుశీల్ ఆ తర్వాత ఆటలో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాడు. 2018 ఆసియా క్రీడల్లో విఫలమైన సుశీల్... 2019 ప్రపంచ చాంపియన్‌షిప్ తొలి రౌండ్లోనే ఓడిపోయాడు. ఆ తర్వాత అతను ఏ టోర్నమెంట్లోనూ పాల్గొనలేదు. గ్యాంగ్స్టర్లతో సంబంధాలపై కూడా.. మరోవైపు సుశీల్‌కు, జైల్లో ఉన్న గ్యాంగ్‌స్టర్ నీరజ్ బవానాకు మధ్య ఉన్న సంబంధాలపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. సుశీల్‌తో కలిసి దాడికి పాల్పడిన వారంతా బవానా మనుషులే అని భావిస్తున్న పోలీసులు ఈ కేసులో మరో ఏడుగురిని అనుమానితులుగా గుర్తించారు. ఘటనా స్థలం వద్ద దొరికిన ఒక స్కార్పియో ఎస్యూవీ వాహనం బవానా సన్నిహితుడిదేనని తేలింది. అన్నింటికిమించి కొన్నాళ్ల క్రితం వచ్చిన ఒక బెదిరింపు కేసులో కూడా సుశీల్ పాత్ర ఉన్నట్లు అనుమానిస్తున్నారు. మరో గ్యాంగ్‌స్టర్ కాలా జఠేడితో సంబంధాలు బాగున్న సమయంలో ఇది జరిగింది. ఒక కేబుల్ ఆపరేటర్‌ను రూ. కోటి కోసం బెదిరించడం వెనక సుశీల్ హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ శివార్లలోని టోల్ గేట్లపై కూడా తమ పట్టు ఉంచుకునేందుకు జఠేడితో కలిసి సుశీల్ ప్రయత్నించినట్లు చెబుతున్నారు. -
Wrestler Sushil Kumar: ఉద్యోగం కూడా పాయే..
న్యూఢిల్లీ: సాగర్ రాణా అనే యువ రెజ్లర్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొంటున్న 2008 బీజింగ్ ఒలింపిక్ కాంస్య పతక విజేత సుశీల్ కుమార్‌ను ఇటీవలే ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాజాగా ఇదే కేసుకు సంబంధించి అతన్ని రైల్వే ఉద్యోగం నుంచి తొలగించాలని ఉత్తర రైల్వే నిర్ణయించినట్లు ఆ శాఖ ప్రతినిధి తెలిపారు. ప్రస్తుతం సుశీల్ కుమార్ ఉత్తర రైల్వేస్ లో ఆఫీసర్ ఆన్ డ్యూటీగా విధులు నిర్వహిస్తున్నాడు. హత్య కేసుకు సంబంధించిన రిపోర్టు ఢిల్లీ ప్రభుత్వం నుంచి రైల్వే బోర్డుకు అందిన నేపథ్యంలో అతనిపై త్వరితగతిన చర్యలు తీసుకుంటామని ఉత్తర రైల్వే సీపీఆర్వో దీపక్ కుమార్ పీటీఐకి తెలిపారు. రెండు రోజుల్లో సుశీల్ కుమార్‌ను సస్పెండ్ చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేస్తామని ఆయన వెల్లడించారు. కాగా, నెల రోజుల క్రితం ఛత్రసాల్ స్టేడియంలో సాగర్ అనే యువకుడిపై సుశీల్ కుమార్ దాడి చేశాడు. ఈ దాడిలో సాగర్ మరణించడంతో అతనిపై ఐపీసీ 302 సెక్షన్ కింద హత్యానేరం కేసు నమోదైంది. -
అతన్ని ఉరి తీయండి: సాగర్ పేరెంట్స్
న్యూఢిల్లీ: సాగర్ రాణా మృతికి కారణమైన రెజ్లర్ సుశీల్ కుమార్‌ను ఎట్టకేలకు పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే రాజకీయ పలుకుబడిని ఉపయోగించి సుశీల్ బయటకు వచ్చే అవకాశం ఉందని ఆరోపిస్తూ.. అతన్ని ఉరి తీయాలని సాగర్ రాణా తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ‘‘నా కొడుకును చంపిన వ్యక్తి ఒక మెంటర్‌గా ఉండడానికి అర్హుడు కాదు. అతనికి దక్కిన గౌరవాన్ని, పతకాల్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. క్రిమినల్స్‌తో లింకులు ఉన్నాయి. రాజకీయ పలుకుబడితో బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తాడు. విచారణ నిష్పక్షపాతంగా జరగాలని కోరుకుంటున్నాం. కాబట్టి, కోర్టు ఎంక్వయిరీ జరిపిస్తే... దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశాలు ఉండవు’’ అని సాగర్ పేరెంట్స్ కోరుతున్నారు. కాగా, రెండుసార్లు గోల్డ్ మెడల్ సాధించిన సుశీల్ కుమార్, ఇరవై మూడేళ్ల ట్రైనీ రెజ్లర్ సాగర్ రాణా(23)ను అనుచరుల సాయంతో చంపిన విషయం తెలిసిందే. ఈ కేసులో సుశీల్‌పై లుక్ అవుట్ నోటీసులు జారీ కావడంతో పాటు ఆచూకీ చెప్పినవాళ్లకు లక్ష రూపాయల ప్రైజ్ మనీ కూడా ప్రకటించారు. చివరికి పంతొమ్మిది రోజుల తర్వాత ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్, సుశీల్‌తో పాటు అజయ్ అనే సహ నిందితుడ్ని ఆదివారం ఉదయం అరెస్ట్ చేశారు. నిందితులకు ఆరురోజుల రిమాండ్ విధించడంతో పోలీస్ కస్టడీకి తరలించారు. -
హత్య కేసు: రెజ్లర్ సుశీల్ కుమార్ అరెస్ట్
చంఢీఘర్: జూనియర్ రెజ్లర్ సాగర్ రాణా హత్య కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒలింపియన్.. సీనియర్ రెజ్లర్ సుశీల్ కుమార్‌ను శనివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పంజాబ్‌లో సుశీల్ ఉన్నట్లు సమాచారం అందుకున్న ఢిల్లీ పోలీసులు అతనితో పాటు మరో అనుమానితుడు అజయ్ కుమార్‌ను అరెస్ట్ చేశారు. సాగర్ రాణా హత్య కేసులో విచారించేందుకు పోలీసులు వారిద్దరిని ట్రాన్సిట్ వారంట్‌పై ఢిల్లీకి తీసుకు వస్తున్నారు. కాగా ఢిల్లీలోని ఛత్రసాల్ స్టేడియంలో మే4 వ తేదీన సాగర్ రాణా దారుణ హత్యకు గురయ్యాడు. సుశీల్, సాగర్ వర్గీయుల మధ్య జరిగిన ఘర్షణలో సాగర్ హత్యకు గురైనట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో తేల్చారు. అప్పటినుంచి అజ్థాతంలోకి వెళ్లిపోయిన సుశీల్ కుమార్‌ను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. పోలీసులకు దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్న రెజ్లర్ సుశీల్ కుమార్‌పై లక్ష రూపాయలు, సహచరుడు అజయ్‌పై రూ.50 వేల రివార్డును కూడా ప్రకటించారు. దీంతోపాటు గతవారం సుశీల్ కుమార్ అప్పీల్ చేసుకున్న ముందస్తు బెయిల్ పిటీషన్‌ను ఢిల్లీ రోహిణి కోర్టు కొట్టివేసింది. రెండురోజుల క్రితం పరారీలో ఉన్న సుశీల్ తన కారులో ఉత్తర్ ప్రదేశ్‌లోని మీరట్ టోల్ ప్లాజా కెమెరాలకు చిక్కిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీని ఆధారంగా చేసుకొని సుశీల్ కోసం వేట కొనసాగించిన ఢిల్లీ పోలీసులు ఎట్టకేలకు పంజాబ్‌లో అతన్ని అరెస్ట్ చేశారు. చదవండి: ఆ కారులో ఉన్నది రెజ్లర్ సుశీల్ కుమారేనా? Sushil Kumar: ఆచూకీ చెబితే రూ.1 లక్ష! -
ఆ కారులో ఉన్నది రెజ్లర్ సుశీల్ కుమారేనా?
లక్నో: రెజ్లర్ సాగర్ రాణా హత్య కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒలింపియన్.. రెజ్లర్ సుశీల్ కుమార్ కొంతకాలంగా పరారీలో ఉన్న సంగతి తెలిసిందే. పోలీసులకు దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్న సుశీల్ ఆచూకీ చెప్పినవారికి రూ. లక్ష బహుమతి కూడా ప్రకటించారు. కాగా తాజాగా సుశీల్ కుమార్ కారులో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఉత్తర్ ప్రదేశ్‌లోని మీరట్ టోల్‌ప్లాజా వద్ద కారులో డ్రైవర్ పక్కన ముందుసీట్లో సుశీల్ కుమార్ ఉన్నట్లు అక్కడి కెమెరాల్లో రికార్డైంది. అయితే అతను మాస్క్ పెట్టుకోవడంతో సుశీల్ కుమార్ ..అవునా కాదా? అని ఢిల్లీ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫోటోలు మే 6న అక్కడి కెమెరాల్లో రికార్డు కావడం.. సాగర్ రాణా హత్య జరిగిన రెండు రోజులకు సుశీల్ కారులో ఉండడం పలు అనుమానాలకు తావిస్తుంది. ఈ నేపథ్యంలో సుశీల్ ఉన్న కారును ట్రేస్ చేసే పనిలో ఉన్న పోలీసులు అతన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాగా మే 4న ఛత్రశాల్ స్టేడియం ముందు రెండు వర్గాలు కొట్టుకున్న ఘటనలో జాతీయ మాజీ జూనియర్ చాంపియన్ సాగర్ రాణా మరణించగా... సుశీల్‌పై ఆరోపణలు రావడంతో అతను అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. కాగా సుశీల్ కుమార్‌కు ఢిల్లీ కోర్టులోనూ చుక్కెదురైంది. రెండు వారాలుగా పరారీలో ఉన్న అతనికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. అరెస్ట్ నుంచి తప్పించుకునే ప్రయత్నంలో తనకు బెయిల్ ఇవ్వాలంటూ సోమవారం స్థానిక రోహిణి కోర్టులో సుశీల్ పిటిషన్ దాఖలు చేయగా... మంగళవారం అతని విజ్ఞప్తిని అడిషనల్ సెషన్స్ జడ్జి జగదీశ్ కుమార్ కొట్టి పారేశారు. ఘటనలో ప్రధాన కుట్రదారుడిగా సుశీల్‌పై ఉన్న అభియోగాలు తీవ్రమైనవవి న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. చదవండి: రెజ్లర్ సుశీల్‌కు చుక్కెదురు.. ముందస్తు బెయిల్ కొట్టివేత Sushil Kumar: ఆచూకీ చెబితే రూ.1 లక్ష! -
రెజ్లర్ సుశీల్‌కు చుక్కెదురు.. ముందస్తు బెయిల్ కొట్టివేత
న్యూఢిల్లీ: యువ రెజ్లర్ సాగర్ రాణా హత్య కేసులో నిందితుడిగా ఉన్న భారత రెజ్లింగ్ స్టార్ సుశీల్ కుమార్‌కు కోర్టులోనూ చుక్కెదురైంది. గత రెండు వారాలుగా పరారీలో ఉన్న అతనికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. అరెస్ట్ నుంచి తప్పించుకునే ప్రయత్నంలో తనకు బెయిల్ ఇవ్వాలంటూ సోమవారం స్థానిక రోహిణి కోర్టులో సుశీల్ పిటిషన్ దాఖలు చేయగా... మంగళవారం అతని విజ్ఞప్తిని అడిషనల్ సెషన్స్ జడ్జి జగదీశ్ కుమార్ కొట్టి పారేశారు. ఘటనలో ప్రధాన కుట్రదారుడిగా సుశీల్‌పై ఉన్న అభియోగాలు తీవ్రమైనవవి న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. మే 4న ఛత్రశాల్ స్టేడియం ముందు రెండు వర్గాలు కొట్టుకున్న ఘటనలో జాతీయ మాజీ జూనియర్ చాంపియన్ సాగర్ రాణా మరణించగా... సుశీల్‌పై ఆరోపణలు రావడంతో అతను అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. 37 ఏళ్ల సుశీల్ భారత్ తరఫున 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో కాంస్యం, 2012 లండన్ ఒలింపిక్స్‌లో రజతం... 2010 ప్రపంచ చాంపియన్ షిప్లో స్వర్ణం... 2010 ఢిల్లీ, 2014 గ్లాస్గో, 2018 గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్‌లలో స్వర్ణం... 2006 దోహా ఆసియా క్రీడల్లో కాంస్యం సాధించాడు. దర్యాప్తునకు సహకరిస్తాం... బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుశీల్ తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లుథ్రా హాజరయ్యారు. ‘సదరు ఘటనతో నాకు ఎలాంటి సంబంధం లేదు. దర్యాప్తు మొత్తం నాకు వ్యతిరేకంగా పక్షపాత ధోరణిలో సాగుతోంది. విచారణ ముగిసేవరకు నేను సహకరించి వాస్తవాలు ఏమిటో చెబుతా. బాధితుల స్టేట్మెంట్లు ఇప్పటికే రికార్డు చేశారు. ఘటన జరిగిన స్థలం వద్ద నాకు సంబంధించిన ఎలాంటి వస్తువులు లభ్యం కాలేదు. అక్కడ జరిగినట్లుగా చెబుతున్న కాల్పులతో కూడా నాకు ఎలాంటి సంబంధం లేదు. పోలీసులకు లభించిన తుపాకీ, వాహనం నావి కావు. ఇలాంటి స్థితిలో నన్ను కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించాల్సిన అవసరం లేదు’ అని సుశీల్ తన బెయిల్ పిటిషన్లో పేర్కొన్నాడు. గొడవ సమయంలో అక్కడే ఉన్న సోనూ అనే వ్యక్తి రౌడీషీటర్ అని... తనతో విభేదాలు ఉన్న సోనూ నుంచి సుశీల్‌కు హాని జరిగే అవకాశం కూడా ఉందని లుథ్రా వాదించారు. సాక్ష్యాలు బలంగా ఉన్నాయి... అయితే నిందితుడి తరఫు వాదనతో అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అతుల్ శ్రీవాత్సవ విభేదించారు. ‘సుశీల్‌కు వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాలు ఉన్నాయి. చేతిలో కర్రతో అతడు కొడుతున్న దృశ్యాలు వీడియోలో కనిపిస్తున్నాయి. మొత్తం ఘటనలో అతనే ప్రధాన నిందితుడు. దాడి చేయడంలో అతనిదే కీలకపాత్ర. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నిపుణులు కూడా నేరం చేయడంలో సుశీల్ చురుగ్గా పాల్గొన్నాడని నిర్ధారించారు. కేసులో వాస్తవాలు వెలికితీయాలంటే సుశీల్‌ను కస్టడీలోకి తీసుకొని విచారించడం తప్పనిసరి. అతను దేశం విడిచి వెళ్లి పారిపోకుండా ఇప్పటికే పాస్‌పోర్ట్‌ను కూడా స్వాధీనం చేసుకున్నాం’ అని వాదించారు. దీనిని అంగీకరిస్తూ న్యాయమూర్తి బెయిల్ తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. ‘విచారణ ఇంకా కొనసాగుతోంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో కొందరు ఇంకా అరెస్టు కాలేదు. సుశీల్‌పై ఇప్పటికే నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారంట్ జారీ అయింది. ఇలాంటి స్థితిలో ముందస్తు బెయిల్ కుదరదు’ అని స్పష్టం చేశారు. ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ పోలీసులు 302 (హత్య) సహా ఐపీసీ, ఆయుధాల చట్టంలోని 11 వేర్వేరు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.ముందస్తు బెయిల్ కుదరదు చదవండి: Sushil Kumar: ఆచూకీ చెబితే రూ.1 లక్ష! -
Sushil Kumar: ఆచూకీ చెబితే రూ.1 లక్ష!
న్యూఢిల్లీ: భారత స్టార్ రెజ్లర్, రెండు సార్లు ఒలింపిక్ పతక విజేత సుశీల్ కుమార్ ఆచూకీ తెలుసుకునే ప్రయత్నాలను ఢిల్లీ పోలీసులు మరింత ముమ్మరం చేశారు. యువ రెజ్లర్ సాగర్ రాణా హత్యకు సంబంధించి నిందితుల్లో ఒకడిగా ఉన్న సుశీల్ కుమార్ ఈ నెల 4 నుంచి పరారీలో ఉన్నాడు. సుశీల్ సన్నిహితులను విచారించడంతో పాటు అతడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో సుశీల్ ఆచూకీ తెలిపినవారికి రూ. 1 లక్ష బహుమతిగా అందిస్తామని తాజాగా పోలీసులు ప్రకటించారు. సుశీల్ సహచరుడు అజయ్ ఆచూకీ తెలిపినవారికి కూడా రూ. 50 వేలు అందిస్తామని వెల్లడించారు. నిందితుల్లో ఒకడైన ప్రిన్స్ దలాల్ ఫోన్లో షూట్ చేసిన వీడియో రికార్డింగ్‌లో సుశీల్ కూడా కొందరిని కొట్టడం స్పష్టంగా కనిపించింది. ప్రస్తుతానికి పోలీసుల వద్ద ఉన్న కీలక ఆధారం కూడా ఇదే. -
సుశీల్‌పై నాన్ బెయిలబుల్ వారంట్ జారీ
న్యూఢిల్లీ: యువ రెజ్లర్ సాగర్ రాణా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ... గత పదకొండు రోజులుగా అజ్ఞాతంలో ఉన్న భారత స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్‌తోపాటు ఈ కేసుతో సంబంధం ఉన్న మరో ఆరుగురిపై ఢిల్లీ కోర్టు నాన్‌బెయిలబుల్ వారంట్లను జారీ చేసింది. మే 4వ తేదీ రాత్రి ఢిల్లీలోని ఛత్రశాల్ స్టేడియం ఆవరణలో జరిగిన గొడవలో 23 ఏళ్ల యువ రెజ్లర్ సాగర్ రాణా ధన్కడ్, అతని ఇద్దరు మిత్రులు తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ సాగర్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన తర్వాత కనిపించకుండా పోయిన సుశీల్ ఆచూకీ కోసం ఢిల్లీ పోలీసులు గత సోమవారం ‘లుక్ అవుట్’ నోటీసులు జారీ చేశారు. సుశీల్ ఫోన్ కూడా స్విచాఫ్ చేయడంతో పోలీసులు అతని ఆనవాళ్లు కనిపెట్టడంలో విఫలమయ్యారు. హరిద్వార్‌లోని విఖ్యాత యోగా గురువుకు చెందిన ఆశ్రమంలో సుశీల్ తలదాచుకున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ‘ఎఫ్ఐఆర్ నమోదు చేశాక సుశీల్‌కు నోటీసులు జారీ చేశాం. కానీ అతను స్పందించలేదు. సుశీల్ ఫోన్ కూడా స్విచాఫ్ చేసి ఉంది. సుశీల్ మిత్రుల ఇంటిపై కూడా దాడులు నిర్వహించినా ఎలాంటి సమాచారం లభించలేదు. దాంతో సుశీల్ ఆచూకీ చెప్పినవారికి తగిన రివార్డు కూడా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. ఈ కేసులో బాధితుల నుంచి తీసుకున్న స్టేట్మెంట్స్లో అందరూ సుశీల్ పేరు చెప్పారు. ఈ కేసుతో సంబంధం ఉన్న సుశీల్ అనుచరుడు అజయ్ ప్రభుత్వ వ్యాయామ విద్యా ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. అజయ్‌పై డిపార్ట్మెంటల్ చర్య తీసుకోవాలని ఢిల్లీ ప్రభుత్వానికి లేఖ రాశాం’ అని ఢిల్లీకి చెందిన ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. 37 ఏళ్ల సుశీల్ 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో కాంస్యం, 2012 లండన్ ఒలింపిక్స్‌లో రజతం సాధించాడు. ఒలింపిక్స్ చరిత్రలో రెండు వ్యక్తిగత పతకాలు సాధించిన ఏకైక భారత క్రీడాకారుడిగా గుర్తింపు పొందాడు. వరుసగా మూడు కామన్వెల్త్ గేమ్స్‌లో (2010, 2014, 2018) స్వర్ణ పతకాలు నెగ్గిన సుశీల్ 2010లో సీనియర్ విభాగంలో ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన ఏకైక భారత రెజ్లర్ కావడం విశేషం. ప్రాణాలు తీసేంత తప్పేం చేశాడు... నా కొడుకు సాగర్ ఛత్రశాల్ స్టేడియంలో ఎనిమిదేళ్లుగా శిక్షణ తీసుకుంటున్నాడు. 2017 ఆసియా, ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్‌లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. సుశీల్‌ను, అతని మామ సత్పాల్ సింగ్‌ను సాగర్ ఎంతో ఆరాధించేవాడు. సాగర్ తప్పు చేసి ఉంటే అతడిని నాలుగు చెంప దెబ్బలు కొట్టాల్సింది. లేదంటే ఛత్ర శాల్ స్టేడియం నుంచి బయటకు పంపించాల్సింది. ప్రాణాలు తీసేంత తప్పు పని నా కొడుకు చేశాడా? ఈ కేసుతో సంబంధం ఉన్న వారు చాలా పెద్ద వ్యక్తులు. ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులు నాకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. వారు తమ మాట నిలబెట్టుకుంటారని ఆశిస్తున్నాను. –అశోక్ (సాగర్ తండ్రి), ఢిల్లీ పోలీసు హెడ్‌కానిస్టేబుల్ -
రెజ్లర్ సుశీల్ కుమార్‌పై కేసు
న్యూఢిల్లీ: భారత మేటి రెజ్లర్ సుశీల్ కుమార్‌పై కేసు నమోదైంది. సుశీల్‌కు చెందిన ఛత్రశాల్ స్టేడియం లోపల మంగళవారం రాత్రి జరిగిన గొడవలో 23 ఏళ్ల సాగర్ అనే రెజ్లర్ మృతి చెందాడు. దాంతో ఈ కేసుకు సంబంధించి 37 ఏళ్ల సుశీల్ కుమార్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఢిల్లీ సీనియర్ పోలీసు ఆఫీసర్ కుమార్ తెలిపారు. సుశీల్ ప్రస్తుతం అందుబాటులో లేడని, అతని కోసం గాలిస్తున్నామని కుమార్ తెలిపారు. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో కాంస్యం, 2012 లండన్ ఒలింపిక్స్‌లో రజతం గెలిచిన సుశీల్ కుమార్ ఒలింపిక్స్ చరిత్రలో భారత్ తరఫున రెండు వ్యక్తిగత పతకాలు గెలిచిన ఏకైక క్రీడాకారుడిగా గుర్తింపు పొందాడు. -
Sushil Kumar: పరారీలో ఇండియన్ స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్?!
న్యూఢిల్లీ : ఢిల్లీలో దారుణం దారుణ హత్య జరిగింది. ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో 24 ఏళ్ల రెజ్లర్ మరణించారు. అయితే బాధితుడి మృతిలో ఇండియన్ స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ గురిక్బాల్ సింగ్ సిద్ధూ మాట్లాడుతూ.. ''మోడల్ టౌన్ ప్రాంతానికి చెందిన ఛత్రపాల్ స్టేడియం సమీపంలో ఇండియన్ రెజ్లర్ సుశీల్ కుమార్‌కు చెందిన ఇంట్లో సాగర్, అమిత్ కుమార్, ప్రిన్స్ దలాల్ ఉంటున్నారు. ఇల్లు ఖాళీ చేసే విషయమై, ఇరువర్గాల మధ్య సుమారు 4 గంటల పాటు ఘర్షణ జరిగినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. ఈ క్రమంలో, తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఛత్రసల్ స్టేడియం సమీపంలో ఇద్దరు వ్యక్తులు తుపాకీతో ఇతరులపై కాల్పులు జరిపినట్లు పోలీస్ కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందింది. దీంతో ఘటనస్థలానికి చేరుకున్న మోడల్ స్టేషన్ పోలీసులు ఘటనా స్థలంలో సాగర్ కుమార్ విగత జీవిగా పడి ఉన్నాడు. అతడిని ఢిల్లీ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ కుమారుడిగా గుర్తించారు. ఇక ఈ ఘటనలో సోను మహల్ (35), అమిత్ కుమార్ (27) గాయపడ్డారు. ఈ క్రమంలో ప్రిన్స్ దలాల్ (24) అనే యువకుడిని అరెస్ట్ చేసి.. పార్క్ చేసిన ఓ వాహనంలో బుల్లెట్లు లోడ్ చేసిన గన్ ను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. సుశీల్ కుమార్ పై ఎఫ్ఐఆర్ ఈ ఘటనలో సుశీల్ కుమార్ హస్తం ఉందని తేలడంతో అతనిపై ఎఫైఆర్ నమోదైందని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ గురిక్బాల్ సింగ్ సిద్ధూ చెప్పారు. కేసు దర్యాప్తు భాగంగా సుశీల్ కుమార్ కోసం వాళ్ల ఇంట్లో సోదాలు చేశాం. అక్కడ సుశీల్ కుమార్ లేడు. పోలీసులు బృందాలుగా విడిపోయి సుశీల్ కుమార్ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు తెలిపారు. చదవండి: Wrestler Sushil Kumar: సుశీల్‌కు మొండిచేయి -
Wrestler Sushil Kumar: సుశీల్‌కు మొండిచేయి
న్యూఢిల్లీ: ఒలింపిక్స్ క్రీడల చరిత్రలో రెండు వ్యక్తిగత పతకాలు సాధించిన ఏకైక భారత క్రీడాకారుడు, స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ మూడో ఒలింపిక్ పతకం సాధించాలనుకున్న ఆశలు ఆవిరయ్యాయి. టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించేందుకు చివరి టోర్నమెంట్ అయిన వరల్డ్ ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీలో పాల్గొనే భారత ఫ్రీస్టయిల్ రెజ్లింగ్ జట్టును గురువారం ప్రకటించారు. ఈ టోర్నీ మే 6 నుంచి 9 వరకు బల్గేరియా రాజధాని సోఫియాలో జరుగుతుంది. ► 74 కేజీల విభాగంలో భారత్ తరఫున ఆసియా మాజీ చాంపియన్ అమిత్ ధన్కర్ బరిలోకి దిగనున్నాడు. మార్చి 16న నిర్వహించిన సెలక్షన్ ట్రయల్స్ టోర్నీకి పూర్తిస్థాయి ఫిట్నెస్ లేని కారణంగా సుశీల్ కుమార్ దూరంగా ఉన్నాడు. ఆ ట్రయల్స్ టోర్నీలో 74 కేజీల విభాగంలో సందీప్ సింగ్ మాన్ విజేతగా నిలువగా... అమిత్ ధన్కర్ రన్నరప్‌గా నిలిచాడు. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) నిబంధనల ప్రకారం ఒలింపిక్ బెర్త్ సాధించిన రెజ్లరే ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తాడు. చివరి క్వాలిఫయింగ్ టోర్నీకి సుశీల్ ఎంపిక కాకపోవడంతో అతనికి టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశం లేకుండా పోయింది. 37 ఏళ్ల సుశీల్ కుమార్ 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో కాంస్యం (66 కేజీలు), 2012 లండన్ ఒలింపిక్స్‌లో రజత పతకం (66 కేజీలు) సాధించాడు. 2016 రియో ఒలింపిక్స్‌లో సుశీల్‌కు పోటీపడే అవకాశం రాలేదు. ‘ప్రస్తుత కరోనా కల్లోల పరిస్థితుల్లో ప్రాణాలతో ఉండటమే ముఖ్యం. జట్టు ఎంపిక గురించి నేను డబ్ల్యూఎఫ్ఐతో ఇంకా మాట్లాడలేదు. త్వరలోనే ఈ విషయంపై వారితో చర్చిస్తాను’ అని సుశీల్ వ్యాఖ్యానించాడు. ► ట్రయల్స్ టోర్నీ విజేతగా నిలిచిన సందీప్ సింగ్‌ను కజకిస్తాన్‌లో జరిగిన ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీకి, ఆసియా చాంపియన్‌షిప్ పోటీలకు ఎంపిక చేశారు. అయితే ఈ రెండు టోర్నీలలో సందీప్ సింగ్ విఫలమయ్యాడు. దాంతో వరల్డ్ ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీ కోసం సందీప్ సింగ్‌ను పక్కనబెట్టి సెలక్షన్ టోర్నీ రన్నరప్ అమిత్ ధనకర్‌కు ఎంపిక చేశారు. ►వాస్తవానికి వరల్డ్ ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీ కోసం మళ్లీ ట్రయల్స్ నిర్వహించాలని భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) భావించింది. అయితే దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి కారణంగా శిక్షణ శిబిరాలు మూతబడ్డాయి. దాంతో ట్రయల్స్ లేకుండానే తొలి ట్రయల్స్ టోర్నీ ఆధారంగా అమిత్‌కు అవకాశం ఇచ్చారు. ►74 కేజీల విభాగంలో మరో స్టార్ రెజ్లర్ నర్సింగ్ యాదవ్ ట్రయల్స్ టోర్నీలో సెమీఫైనల్లో ఓడిపోవడంతో అతను కూడా టోక్యో ఒలింపిక్స్ అవకాశాలు కోల్పోయాడు. ►ఫ్రీస్టయిల్ విభాగంలో భారత్‌కు ఇప్పటికే మూడు ఒలింపిక్ బెర్త్‌లు (రవి–57 కేజలు; బజరంగ్–65 కేజీలు; దీపక్ పూనియా–86 కేజీలు) ఖరారయ్యాయి. మరో మూడు బెర్త్‌లు (74 కేజీలు, 97 కేజీలు, 125 కేజీలు) మిగిలి ఉన్నాయి. 97 కేజీల విభాగంలో సత్యవర్త్... 125 కేజీల విభాగంలో సుమిత్ వరల్డ్ క్వాలిఫయింగ్ టోర్నీ లో పోటీపడనున్నారు. ఈ టోర్నీలో ఫైనల్ చేరిన వారికి ఒలింపిక్ బెర్త్‌లు ఖాయమవుతాయి. ►వరల్డ్ క్వాలిఫయింగ్ టోర్నీలో పాల్గొనే భారత గ్రీకో రోమన్ పురుషుల జట్టును కూడా ప్రకటించారు. సచిన్ రాణా (60 కేజీలు), ఆశు (67 కేజీలు), గుర్ప్రీత్ సింగ్ (77 కేజీలు), సునీల్ (87 కేజీలు), దీపాంశు (97 కేజీలు), నవీన్ కుమార్ (130 కేజీలు) భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తారు. ►మహిళల ఫ్రీస్టయిల్ విభాగంలో వరల్డ్ క్వాలిఫయింగ్ టోర్నీలో మూడు ఒలింపిక్ బెర్త్‌ల కోసం సీమా (50 కేజీలు)... నిషా (68 కేజీలు)... పూజా (76 కేజీలు) పోటీపడతారు. ఈ టోర్నీలో ఫైనల్ చేరిన వారికి ఒలింపిక్ బెర్త్‌లు లభిస్తాయి. -
చిన్న లక్ష్యాలు పెట్టుకోను
న్యూఢిల్లీ: అనూహ్య పరిస్థితుల్లో టోక్యో ఒలింపిక్స్ వాయిదా పడటం కారణంగా మేలు పొందిన వారిలో భారత దిగ్గజ రెజ్లర్ సుశీల్ కుమార్ ఒకడు. వ్యక్తిగత విభాగంలో రెండు ఒలింపిక్ పతకాలు గెలుపొందిన ఏకైక భారత క్రీడాకారుడిగా చరిత్ర సృష్టించిన సుశీల్... ఈ విరామ సమయాన్ని సద్వినియోగం చేసుకునే పనిలో పడ్డాడు. తాను బరిలో దిగే 74 కేజీల వెయిట్ కేటగిరీలో ఒలింపిక్ బెర్త్ కోసం తీవ్ర పోటీ నెలకొన్నప్పటికీ, తన పనైపోయిందంటూ పలువురు విమర్శలు చేస్తున్నప్పటికీ అవేమీ తనను ప్రభావితం చేయలేవంటున్నాడు. టోక్యో పతకమే లక్ష్యంగా సాధన చేస్తున్నానన్న సుశీల్ మనోగతం అతని మాటల్లోనే... వారికి అలవాటే... చాలా కాలం నుంచి నా గురించి ఎవరికి తోచింది వారు రాయడం అందరికి అలవాటైపోయింది. కానీ వారి రాతలు, అభిప్రాయాలు నాపై ప్రభావం చూపలేవు. 2011లోనే సుశీల్ పనైపోయిందని అన్నారు. కానీ 2008 బీజింగ్‌లో గెల్చిన కాంస్య పతకాన్ని లండన్ 2012 ఒలింపిక్స్‌లో రజతంగా మార్చాను. ఈ వ్యాఖ్యల్ని ఎలా ఎదుర్కోవాలో తెలుసు. ఇది నాకు రోజువారీ కార్యక్రమం అయిపోయింది. సన్నద్ధతకు ఇదే సమయం... మరో నెల రోజుల్లో నేను 37వ పడిలో అడుగుపెడతా. అయితేనేం... నేను రెజ్లింగ్‌ను వదిలి వెళ్లే ప్రసక్తే లేదు. ఒలింపిక్ బెర్తు సంపాదించేందుకు ప్రస్తుతం నాకు మంచి సమయం లభించింది. దీన్ని నేను టోక్యో సన్నద్ధత కోసం వినియోగించుకుంటా. గాయాల బారిన పడకూడదు... రెజ్లింగ్ క్రీడలో గాయాల బారిన పడకుండా, మంచి లక్ష్యాన్ని నిర్దేశించుకొని నిరంతరం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే చాలు. మనం అనుకున్నది సాధించవచ్చు. నేను ఇప్పటికీ రోజులో రెండుసార్లు ప్రాక్టీస్ చేస్తున్నా. మ్యాచ్ ఫిట్నెస్తో ఉండేందుకు ప్రయత్నిస్తున్నా. దేవుని దయతో టోక్యో ఒలింపిక్స్‌కు కూడా అర్హత సాధిస్తాననే నమ్మకముంది. నర్సింగ్కు అభినందనలు... డోపింగ్‌లో పట్టుబడి నాలుగేళ్ల నిషేధం తర్వాత తిరిగి జూలైలో బరిలో దిగనున్న నర్సింగ్ యాదవ్‌కు అభినందనలు. పునరాగమనం అతనికి అత్యుత్తమంగా ఉండాలని కోరుకుంటున్నా. నర్సింగ్‌తో పోటీ గురించి ఇప్పుడే ఏం మాట్లాడలేను. సమయం వచ్చినప్పుడు దాని గురించి చూద్దాం. రియో ఒలింపిక్స్‌కు నర్సింగ్ కారణంగానే సుశీల్ దూరమైన సంగతి తెలిసిందే. విదేశీ రెజ్లర్లే నా ప్రత్యర్థులు... చిన్న లక్ష్యాలు పెట్టుకుంటే మనం ఏదీ సాధించలేం. జితేందర్ కుమార్, నర్సింగ్ యాదవ్‌లు కాదు... ఉజ్బెకిస్తాన్ రెజ్లర్, ఆసియా క్రీడల స్వర్ణపతక విజేత బెక్జోడ్ అబ్దురఖ్మోనోవ్లాంటి ప్రత్యర్థులను ఎలా ఎదుర్కోవాలో అనే అంశంపై దృష్టి సారించా. నా సన్నాహాలు మేటి రెజ్లర్లను ఎదుర్కొనేలా సాగుతున్నాయి. -
రెజ్లర్ సుశీల్ కుమార్‌కు ఝలక్
న్యూఢిల్లీ: రెండు సార్లు ఒలింపిక్ పతక విజేత, భారత రెజ్లర్ సుశీల్ కుమార్‌కు భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) ఝలక్ ఇచ్చింది. తాను గాయంతో బాధపడుతున్న కారణంగా తన 74 కేజీల విభాగంలో నిర్వహించే ట్రయల్స్‌ను వాయిదా వేయాలంటూ కోరిన విన్నపాన్ని తోసిపుచ్చింది. ఈ ట్రయల్స్‌లో విజేతలుగా నిలిచిన వారు ఈ నెలలో రోమ్ వేదికగా జరిగే ఫస్ట్ ర్యాంకింగ్ సిరీస్ టోర్నీకి, న్యూఢిల్లీలో ఫిబ్రవరిలో జరిగే ఆసియా చాంపియన్‌షిప్‌కు, మార్చిలో చైనాలోని జియాన్‌లో జరిగే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్‌కు అర్హత సాధిస్తారు. అయితే ఈ టోర్నీకి రోజుల వ్యవధిలో సుశీల్ గాయపడటంతో... తన విభాగంలో జరిగే ట్రయల్స్‌ను వాయిదా వేయాలని కోరాడు. దీనిపై స్పందించిన డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ‘ట్రయల్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగవు. 74 కేజీల విభాగంలో పోటీ పడటానికి చాలా మంది రెజ్లర్లు ఉన్నారు. సుశీల్ గాయపడితే మేమేం చేయగలం. 74 కేజీల విభాగంలో అర్హత సాధించిన రెజ్లర్ల ప్రదర్శనను ర్యాంకింగ్ సిరీస్ ఈవెంట్స్‌లో పరిశీలిస్తాం. ఈ విభాగంలో సుశీల్ కంటే మెరుగైన రెజ్లర్ లేరనిపిస్తే... మార్చిలో జరిగే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్‌లో అతనికి తప్పక అవకాశం ఇస్తాం’ అని పేర్కొన్నాడు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన సుశీల్ ‘నేను రెండు వారాల్లో పూర్తి ఫిట్నెస్ సాధిస్తాను. నేను గాయంతో బాధపడుతున్న సంగతి వారికి (డబ్ల్యూఎఫ్ఐ) తెలుసు. ఒక వేళ వారు ట్రయల్స్‌ను కొనసాగించాలనుకుంటే కొనసాగించుకోవచ్చు.’ అంటూ ఘాటుగా బదులిచ్చాడు. -
సుశీల్‌కు స్వర్ణం
ఇండోర్: మూడేళ్ల తర్వాత మళ్లీ బరిలోకి దిగిన భారత స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ జాతీయ సీనియర్ రెజ్లింగ్ చాంపి యన్‌షిప్‌లో స్వర్ణ పతకాన్ని సాధించాడు. 74 కేజీల విభాగంలో పోటీ పడ్డ సుశీల్‌కు (రైల్వేస్) ఫైనల్లో ప్రవీణ్ రాణా నుంచి ‘వాకోవర్’ లభించగా... సెమీఫైనల్లో సచిన్ (యూపీ), క్వార్టర్ ఫైనల్లో ప్రవీణ్ (హరియాణా) ‘వాకోవర్’ ఇచ్చారు. తొలి రౌండ్లో లాల్మల్సామా (మిజోరం)పై 48 సెకన్లలో నెగ్గిన సుశీల్, రెండో రౌండ్లో ముకుల్‌ను నిమిషం 45 సెకన్లలో చిత్తు చేశాడు. మహిళల 62 కేజీల విభాగంలో రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సాక్షి మలిక్ స్వర్ణాన్ని సాధించింది. ఫైనల్లో సాక్షి 10–0తో పూజా (హరియాణా)పై గెలిచింది. భార్యభర్తలైన స్టార్ రెజ్లర్లు గీతా ఫోగట్ (59 కేజీలు), పవన్ కుమార్ (86 కేజీలు) పసిడి పతకాలు నెగ్గడం విశేషం. ఫైనల్స్‌లో రవితపై గీత; దీపక్‌పై పవన్ నెగ్గారు. -
ఇండియాతో పెట్టుకోవద్దు.. జాగ్రత్త!
నియంత్రణ రేఖను దాటి వెళ్లి పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతంలో సర్జికల్ స్ట్రైక్స్ చేసిన భారత సైన్యంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అన్ని రంగాలకు చెందినవాళ్లు సైన్యాన్ని పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు. తాజాగా ఈ జాబితాలో భారతీయ రెజ్లర్, ఒలింపిక్ పతక విజేత సుశీల్ కుమార్ చేరాడు. భారత సైన్యంతో పెట్టుకోవద్దు జాగ్రత్త అంటూ పాకిస్థాన్‌ను హెచ్చరించాడు. ఈ మేరకు శుక్రవారం ఉదయం సుశీల్ కుమార్ ఒక ట్వీట్ చేశాడు. 'భారతీయ్ సేనా సే పంగా మత్ లేనా.. జైహింద్' అని హిందీలో కూడా పేర్కొన్నాడు. ఇంతకుముందు వీరేంద్ర సెహ్వాగ్, యోగేశ్వర్ దత్, విజేందర్ సింగ్ కూడా ఈ సర్జికల్ స్ట్రైక్స్ మీద తమ హర్షాన్ని వ్యక్తం చేశారు. తాజాగా సుశీల్ కుమార్ కూడా వారి సరసన చేరాడు. మరోవైపు బాలీవుడ్ హీరో అజయ్ దేవ్‌గణ్ కూడా ఈ అంశంపై స్పందించి ట్వీట్ చేశాడు. ప్రతి ఒక్క భారతీయుడి ప్రాణం ఎంతో విలువైందని నిరూపించిన భారతీయ సైన్యానికి హ్యాట్సాఫ్ అంటూ తన ట్వీట్లో అజయ్ దేవ్‌గణ్ పేర్కొన్నాడు. పలు సినిమాల్లో పోలీసు పాత్రలతో పాటు సైనిక పాత్రలు కూడా ధరించిన అజయ్.. ఈ అంశంపై స్పందించాడు. Don't mess with the Indian Army. भारतीय सेना से पंगा मत लेना l जय हिंद #SurgicalStrike — Sushil Kumar (@WrestlerSushil) 30 September 2016 Hats off to the Indian army for proving that every Indian life matters.#SaluteToTheArmy — Ajay Devgn (@ajaydevgn) 30 September 2016