Tamil Nadu
-
‘దైవానై’ కన్నీటి పర్యంతం
● మేత తినకుండా శోకంలో మునిగిన తిరుచందూరు ఆలయ ఏనుగు సేలం: మావటితో సహా ఇద్దరిని తొక్కి చంపిన తిరుచెందూరు ఆలయ ఏనుగు దైవానై మంగళవారం కన్నీటి పర్యంతమైంది. మేత తినకుండా శోకంలో మునిగిపోయింది. తిరుచెందూరు ఆలయంలో దైవానై(25) అనే పేరుతో ఆడ ఏనుగు ఉంది. ఈ ఏనుగును భక్తులు అత్యంత గౌరవంతో పూజిస్తుంటారు. ఉత్సవాల సమయంలో, ఉదయం, సాయంత్రం వేళల్లో జరిగే పూజల్లో ఈ ఏనుగు పాల్గొంటుంది. ఆలయం సమీపంలోనే ఈ ఏనుగు సంరక్షణ శిబిరం ఉంది. సోమవారం మధ్యాహ్నం దైవానై సంరక్షణ శిబిరంలో అరుపులు వినబడడంతో పోలీసులు పరుగులు తీశారు. అక్కడ దైవానై కాళ్ల కింద నలిగిన స్థితిలో ఓ యువకుడు మరణించి ఉండడాన్ని గుర్తించారు. సమీపంలోనే ఆ ఏనుగు సంరక్షకుడు మావటి ఉదయకుమార్ తీవ్రగాయాలతో పడి ఉండడంతో ఆస్పత్రికి తరలించారు. మార్గమధ్యంలో అతడు మరణించారు. మరో మృతుడిని మావటి ఉదయకుమార్ బంధువు శిశుకుమార్గా గుర్తించారు. జిల్లా అటవీ అధికారులు, వైద్యులు అక్కడికి చేరుకుని దైవానై ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో ఏనుగు మంగళవారం కన్నీటి పర్యంతమైంది. మావటి చనిపోవడంతో ఆహారం తినకుండా దిగాలుగా శోకంతో ఉన్న దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్నాయి. -
చైన్నె విమానంలో మహిళ మృతి
కొరుక్కుపేట: మలేషియా నుంచి చైన్నె వచ్చిన విమానంలో ఓ యువకుడు మృతి చెందిన ఘటన కలకలం రేపింది. వివరాలు..మలేషియా రాజధాని కౌలాలంపూర్ నుంచి ప్రయాణికుల విమానం చైన్నెకి చేరుకుంది. ఇందులో కళ్లకురిచికి చెందిన మహిళ రాసత్తి మాయవన్ (37) సహా 167 మంది ప్రయాణించారు. విమానం ల్యాండ్ అయిన వెంటనే ప్రయాణికులంతా విమానం నుంచి దిగిపోయారు. కానీ రాసత్తి మాత్రం సీట్లో కూర్చోనే ఉన్నారు. అనుమానం వచ్చిన విమాన సిబ్బంది ఎయిర్‌పోర్టు వైద్య బృందానికి సమాచారం అందించారు. వెంటనే వైద్య బృందం విమానం ఎక్కి రాసత్తిని పరీక్షించగా అప్పటికే మృతి చెందినట్లు వారు తెలిపారు. గుండెపోటుతో చనిపోయిందా? లేక మరేదైనా కారణమా? ఎయిర్ పోర్ట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆమె మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం క్రోంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో తరలించారు. -
బీజేపీలో సంస్థాగత సమరం
సాక్షి, చైన్నె: రాష్ట్ర బీజేపీలో సంస్థాగత ఎన్నికల సందడి మొదలైంది. వార్డు కమిటీలకు తొలుత ఎన్నికలను నిర్వహించేందుకు మంగళవారం చర్యలు తీసుకున్నారు. బీజేపీ సభ్యత్వ నమోదు ప్రక్రియ రాష్ట్రంలో గత కొన్ని నెలలుగా జరిగిన విషయం తెలిసిందే. ఆశించిన మేరకు సభ్యత్వ నమోదు ముందుకు సాగలేదు. కోటి సభ్యులను చేరుస్తామని నేతలు ప్రకటించినా, ఆచరణలో విఫలమయ్యారు. సభ్యత్వ నమోదు ప్రక్రియను ముగించిన రాష్ట్ర నేతలు సంస్థాగత ఎన్నికల నిర్వహణపై దృష్టి పెట్టారు. పార్టీ సీనియర్ నేత చక్రవర్తి నేతృత్వంలో సంస్థాగత ఎన్నికల ప్రక్రియ మొదలైంది. తొలుత పార్టీ పరంగా ఉన్న 68,144 వార్డు శాఖలకు 30వ తేదిలోపు సంస్థాగత ఎన్నికల ప్రక్రియను ముగించేందుకు నిర్ణయించారు. ఒక్కో శాఖలో ఓ అధ్యక్షుడు, 11 మంది సభ్యులను ఎంపిక చేయనున్నారు. వీరిలో ముగ్గురు మహిళలు తప్పనిసరిగా ఉండే విధంగా ఆదేశాలు ఇచ్చారు. సంస్థాగత ఎన్నికల ప్రక్రియ గురించి చక్రవర్తి పేర్కొంటూ, రాష్ట్రంలో 68 వేల వార్డు కమిటీ శాఖలు ఉన్నాయని, వీటికి తొలుత సంస్థాగత ఎన్నికలను ముగించి తర్వాత 1231 మండలాలు, పార్టీ పరంగా ఉన్న 66 జిల్లాలకు ఎన్నికలు నిర్వహించనున్నామన్నారు. రాష్ట్రంలో బీజేపీ సభ్యుల సంఖ్య 40 లక్షలకు చేరినట్టు ప్రకటించారు. సభ్యత్వ నమోదులో ఉన్న కొన్ని చిక్కులను తొలగించే విధంగా పార్టీ అధిష్టానం ఈనెల 22వ తేదీన నిర్వహించనున్న సమావేశంలో విజ్ఞప్తి చేయనున్నామన్నారు. -
నాలుగున్నర కిలోల బంగారం సీజ్
– ఇద్దరు అరెస్టు అన్నానగర్: మండపం సమీపంలో కారులో తీసుకువచ్చిన నాలుగున్నర కిలోల స్మగ్లింగ్ బంగారు కడ్డీలను సెంట్రల్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. వివరాలు.. శ్రీలంక నుంచి బంగారు కడ్డీలు అక్రమంగా తరలిస్తున్నట్లు అధికారులకు సోమవారం రాత్రి రహస్య సమాచారం అందింది. దీంతో మండపం–ఉచిపుల్లి మధ్య కుంజ్ చర్వలసాయి సమీపంలో వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో కారులో నాలుగున్నర కిలోల బంగారు కడ్డీలు ఉన్నట్లు గుర్తించి సీజ్ చేశారు. కారులో వచ్చిన రామనాథపురానికి చెందిన సేతు ఇబ్రహీం, మండపానికి చెందిన నాజర్‌ను అరెస్టు చేశారు. కాగా స్వాధీనం చేసుకున్న బంగారు కడ్డీల విలువ సుమారు రూ.మూడున్నర కోట్లు ఉంటుందని భావిస్తున్నారు. -
ఆన్లైన్లో మత్తుమాత్రల విక్రయం
తిరువొత్తియూరు: ముంబయి నుంచి ఉసిలంపట్టికి అక్రమంగా తీసుకువచ్చిన మత్తుమాత్రలను విద్యార్థులకు ఆన్లైన్లో విక్రయిస్తున్న యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. మత్తుమాత్రలను ఆౖన్‌లైన్‌లో విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు ముంబయి నుంచి అక్రమంగా తెచ్చిన తర్వాత వాటిని విక్రయిస్తున్నట్లు తెలియ వచ్చింది. దీంతో ఉసిలంపట్టి తిరుమంగళం ప్రాంతంలో మత్తు మాత్రలు సప్లై చేస్తున్న వ్యక్తిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. విచారణలో అతను ఉసిలంపట్టికి చెందిన మూవేంద్రన్ (25) అని తెలిసింది. 300 మత్తు మాత్రలు స్వాధీనం చేసుకున్నారు. ఒకే చోట ఆరు కోతులు మృతి అన్నానగర్: నీలగిరి జిల్లాలోని కొత్తగిరి నగర్ ప్రాంతంలోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా కోతుల బెడద రోజురోజుకు పెరుగుతోంది. ఇళ్లలోకి ప్రవేశించి ఆహార పదార్థాలు తినేస్తున్నాయి. వంట పాత్రలను కూడా పాడు చేస్తున్నాయి. కొత్తగిరి డాన్‌బాస్కో రోడ్డులోని ఆదివాసీ సంక్షేమ సంఘం కాంప్లెక్స్‌లో మంగళవారం ఆరు కోతులు చనిపోయాయి. దీనిపై సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని కోతులను పరిశీలించారు. అనంతరం కోతుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కొత్తగిరి వెటర్నరీ ఆస్పత్రికి తరలించారు. కోతులకు విషం ఇచ్చి చంపారేమోనని అటవీశాఖ అధికారులు విచారణ చేస్తున్నారు. పరిశ్రమలో మంటలు తిరువొత్తియూరు: శ్రీపెరంబుదూరు సమీపం ఇరుంగాట్టుకోట్టై సిప్కాట్ ప్రాంతంలో కాంక్రీట్ మిక్సింగ్ మిషన్లు తయారవుతున్నాయి. ఇక్కడ 500 మందికి పైగా కార్మికులు పని చేస్తున్నారు. సోమవారం రాత్రి కూలీలు పనిలో ఉండగా మెషినరీ పెయింటింగ్ విభాగంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కొద్దిసేపటికే అక్కడ ఉన్న పెయింట్ అంతా కాలిపోయింది. దీనిపై సమాచారం మేరకు అగ్నిమాపక శాఖ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. -
ఘనంగా ఇందిరా గాంధీ జయంతి
వేలూరు: వేలూరు, తిరువణ్ణామలై జిల్లాల్లో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 107వ జయంతి దినోత్సవాన్ని మంగళవారం ఉదయం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ముందుగా వేలూరు అన్నా రోడ్డులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మైనారిటీ విభాగం జిల్లా కార్యదర్శి వాహీద్ బాషా అధ్యక్షతన అధ్యక్షుడు టీకా రామన్ ఎస్సీఎస్టీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిత్తరంజన్, జిల్లా ఉపాధ్యక్షుడు పీపీ చంద్రప్రకాష్, జిల్లా ప్రధాన కార్యదర్శి అగస్టిన్రావ్, కార్యకర్తలు అధిక సంఖ్యలో చేరుకుని ఇందిరాగాంధీ చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ దేశంలోనే మొదటి మహిళా ప్రధానిగా ఎన్నికై న ఉక్కు మనిషిగా పేరుగాంచిన ఏకై క నాయకురాలు ఇందిరాగాంధీ అని కొనియాడారు. అనంతరం స్వీట్లు పంచి పెట్టడంతోపాటు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ పట్టణ అధ్యక్షుడు తిరువలం గణేష్, జార్జి, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తిరుపత్తూరు, రాణిపేట, తిరువణ్ణామలై జిల్లాలోనూ కార్యకర్తలు ఇందిరాగాంధీ చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. -
పైపును బాగు చేయాలని నిరసన
అన్నానగర్: దిండుక్కల్ సమీపంలో మంగళవారం పగిలిన పైపును బాగు చేయాలంటూ రోడ్డు మధ్యలో మంచంపై పడుకుని రైతు నిరసన చేపట్టాడు. దిండుక్కల్ జిల్లాలోని కొంబాయిపట్టి పాదాలలో మూలకడై ప్రాంతం ఉంది. కొద్ది రోజుల క్రితం మూలకడై ప్రాంతానికి వెళ్లే తాగునీటి పైపు పగిలిపోయింది. దీంతో అక్కడి నీటి సరఫరాపై ప్రభావం పడినట్లు తెలుస్తోంది. అనంతరం పంచాయతీ కార్మికులు అక్కడకు వెళ్లి పగిలిన పైపును సరిచేశారు. అయితే ఆ ప్రాంతానికి చెందిన ఈశ్వరి తన తోటలో నుంచి వెళుతున్న పైపు పగిలిపోయిందని, మరమ్మతులు చేయవద్దని నిరసన తెలిపినట్లు సమాచారం. ఇదిలా ఉండగా మంగళవారం మూలకడై ప్రాంతానికి చెందిన రాజారాం(50) అనే రైతు మూలకడై–కొంబాయిపట్టి రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్లను నరికి వాహనాలు వెళ్లకుండా అడ్డుగా వేశాడు. పగిలిపోయిన తాగునీటి పైపును సరిచేయాలని నిరసన వ్యక్తం చేశాడు. అంతేకాకుండా రోడ్డు మధ్యలో మంచంపై పడుకుని ఆందోళన వ్యక్తం చేశాడు. సమాచారం అందుకున్న ఛత్రపట్టి పోలీసులు, రెవెన్యూ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం నిరసన తెలుపుతున్న రాజారాంతో చర్చలు జరిపారు. ప్రస్తుతం జరుగుతున్న పైపుల పగుళ్లను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అదే సమయంలో రాజారాంను పగిలిన పైపు మరమ్మతులను అడ్డుకోవద్దని, ప్రజలకు ఇబ్బంది కలిగించవద్దని ఈశ్వరిని అధికారులు హెచ్చరించారు. ఆ తర్వాత రాజారాం అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అలాగే పంచాయతీ పాలకవర్గం పగిలిపోయిన పైపును సరిచేసే పనిలో నిమగ్నమైంది. ఓ రైతు రోడ్డు మధ్యలో మంచం వేసి నిరసన తెలిపిన ఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది. -
ఇల్లు కూల్చివేయాలని నోటీసు
● మనస్తాపంతో కార్మికుడి ఆత్మహత్య ● తిరువేర్కాడులో 300 మంది ఆకస్మిక రోడ్డు దిగ్బంధం కొరుక్కుపేట: ఆక్రమణకు గురైన ఇళ్లను కూల్చివేస్తున్నట్టు అధికారులు నోటీసులు అంటించారు. దీంతో మనస్తాపానికి గురైన ఓ కార్మికుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన కలకలం రేపింది. ఈ క్రమంలో మంగళవారం 300 మంది ప్రజలు ఆకస్మికంగా రోడ్డు దిగ్బంధంనం చేయడంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. తిరువేర్కాడు వద్ద చెరువులో ఆక్రమణలకు గురైన ఇళ్లు, భవనాలపై దేవదాయ శాఖ అధికారులు సర్వే చేశారు. దాదాపు వెయ్యికి పైగా ఇళ్లు, భవనాలు సరస్సును ఆక్రమించి, కట్టినట్లు గుర్తించారు. కొన్ని రోజుల క్రితం ఆక్రమణలకు గురైన ఇళ్లు, భవనాల కూల్చివేతలకు సంబంధించి నోటీసులు జారీ చేశారు. ఇందులో కొలాడి చెల్లియమ్మన్ నగర్లో నివాసముంటున్న కార్పెంటర్ శంకర్(44) ఇంటికి కూడా దేవదాయ శాఖ అధికారులు నోటీసులు అంటించారు. దీంతో మనస్తాపానికి గురైన శంకర్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోస్టుమార్టం అనంతరం అతని మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. ఈ పరిస్థితిలో శంకర్ ఆత్మహత్య సంఘటనతో ఆగ్రహించిన 300 మంది ప్రజలు మంగళవారం తిరువేర్కాడు–అంబత్తూరు రహదారిపై నిరసనకు దిగారు. శంకర్ మృతికి న్యాయం చేయాలని, ఇళ్లను తొలగించవద్దని నినాదాలు చేశారు. రెవెన్యూ అధికారులు, తహసీల్దార్ గోవిందరాజులు, పోలీసులు ఆందోళనకారులతో చర్చలు జరిపినా విఫలమయ్యాయి. జిల్లా కలెక్టర్‌ను చర్చలకు రావాలని డిమాండ్ చేస్తూ తమ నిరసన కొనసాగించారు. దీంతో ఆ ప్రాంతంలో విపరీతమైన రద్దీ నెలకొంది. భద్రత కోసం భారీ సంఖ్యలో పోలీసులను మోహరించారు. ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. -
చికెన్ రైస్ తిన్న అథ్లెట్ మృతి!
అన్నానగర్: చైన్నెలో ‘చికెన్ రైస్’ తిన్న అథ్లెట్ విషాదకరంగా మరణించింది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కోయంబత్తూరులోని సుకునాపురానికి చెందిన రాబిన్ డెన్నిస్(40) కుమార్తె ఎలీనా లారెట్(15) బాస్కెట్‌బాల్ క్రీడాకారిణి. ఈమె అదే ప్రాంతంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. ఈ క్రమంలో మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో 8 నుంచి 15వ తేదీ వరకు అంతర్ పాఠశాలల బాస్కెట్‌బాల్ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో ఆడేందుకు ఎలీనా లారెట్ తన తోటి విద్యార్థులతో కలిసి రైలులో మధ్యప్రదేశ్ వెళ్లింది. పోటీ ముగించుకుని గ్రాండ్ ట్రంక్ ఎక్స్‌ప్రెస్ రైలులో సోమవారం చైన్నెకి వచ్చారు. రైలు ప్రయాణంలో తినేందుకు ఆన్లైన్లో ఆర్డర్ చేసి చికెన్ రైస్ కొనుగోలు చేసింది. విద్యార్థిని ఎలీనా లారెట్ తోటి విద్యార్థులతో కలిసి రైలులో చికెన్ రైస్, బర్గర్లు తిన్నట్లు తెలుస్తోంది. దీంతో తీవ్ర కడుపునొప్పితో వాంతులు, స్పృహ తప్పి పడిపోయింది. ఈ విషయాన్ని ఎలీనా లారెట్ చైన్నెలోని అన్నానగర్‌లో ఉన్న తన బంధువు డేవిడ్ విలియమ్స్‌కు చెప్పింది. రైలు చైన్నె చేరుకోగానే ఎలీనాను చికిత్స నిమిత్తం అన్నానగర్ 4వ అవెన్యూలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స అనంతరం ఎలీనా పెరవళ్లూరులోని మరో బంధువుల ఇంటికి వెళ్లింది.అక్కడికి వెళ్లిన కొద్దిసేపటి తర్వాత ఎలీనాకు మళ్లీ కడుపునొప్పి వచ్చింది. దీంతో ఆమె స్పృహతప్పి పడిపోయింది. వెంటనే బంధువులు ఆమెని పెరవళ్లూరులోని పెరియార్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో ఎలీనాను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. పెరవళ్లూరు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఎలీనా మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం కీల్పాక్కం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పెరవళ్లూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చికెన్ రైస్ తిని విద్యార్థిని మృతి చెందిందా? లేక ఆమె మరణానికి మరేదైనా కారణాలు ఉన్నాయా? అనేది పోస్టుమార్టం నివేదిక తర్వాతే తేలనుందని పోలీసులు తెలిపారు. ఆడుకోవడానికి వెళ్లిన విద్యార్థిని ఆకస్మికంగా మృతి చెందడంతో కుటుంబసభ్యులు, తోటి విద్యార్థుల్లో తీవ్ర విషాదం నెలకొంది. -
క్లుప్తంగా
బాలికపై లైంగిక దాడి ● ఇద్దరు ట్యాక్సీ డ్రైవర్లు అరెస్ట్ అన్నానగర్: చైన్నె సమీపంలోని నందంబాక్కంలో తల్లిదండ్రులను కోల్పోయిన 17 ఏళ్ల యువతి తన మేనత్త ఇంట్లో పెరుగుతోంది. అత్త మందలించిందని ఆగ్రహించిన బాలిక 8వ తేదీన ఇంటి నుంచి వెళ్లిపోయింది. తిరిగి రాకపోవడంతో ఈ విషయమై ఆమె అత్త నందంబాక్కం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ స్థితిలో 15వ తేదీన బాలిక పమ్మల్‌లో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు అక్కడికి వెళ్లి ఆమెను రక్షించి, బంధువులకు అప్పగించారు. పోలీసులు బాలికను విచారించగా దిగ్భ్రాంతికరమైన సమాచారం వెల్లడైంది. ఇంటి నుంచి బయటకు వెళ్లిన తర్వాత రోడ్డు పక్కన నిలబడి ఉన్న కడలూరు జిల్లా పులియాంగుడికి చెందిన ట్యాక్సీ డ్రైవర్ భాగ్యరాజ్(38 ) సహాయం కోరింది. ఉద్యోగం ఇప్పిస్తానని భాగ్యరాజ్ తన స్నేహితుడు పరమశివన్(40)కి ఫోన్ చేశాడు. ఉద్యోగం ఇప్పించకుండా కారులో పెట్టుకుని ఇద్దరూ కలిసి బాలికపై అత్యాచారం చేసినట్లు తెలిసింది. అనంతరం ఆ బాలికను పమ్మల్‌లో వదిలేశారు. అనంతరం బాలికపై అత్యాచారానికి పాల్పడిన భాగ్యరాజ్, పరమశివన్లను మంగళవారం పోలీసులు ఫోక్సో చట్టం కింద అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచి, జైలుకు తరలించారు. సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా తిరువళ్లూరు: పట్టణంలోని పార్క్‌ను ధ్వంసం చేసి వ్యాపార దుకాణాలను నిర్మించాలన్న మున్సిపాలిటీ నిర్ణయాన్ని వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో ఽమంగళవారం ధర్నా నిర్వహించారు. తిరువళ్లూరు పట్టణంలో రాజమ్మాళ్దేవి పార్క్ వుంది. ఈ పార్క్‌ను సుమారు వందేళ్ల క్రితం నిర్మించారు. అప్పటి నుంచి చిన్నారులకు ఆటస్థలంగా, వృద్ధులు, యువకులకు వాకింగ్ పాత్‌గా ఉపయోగపడుతోంది. ఈ క్రమంలో పార్క్‌ను తొలగించేసిన మున్సిపాలిటీ అధికారులు 21 వ్యాపార దుకాణాలను రూ.90 లక్షల వ్యయంతో నిర్మిస్తున్నారు. దుకాణాలు పూర్తయితే మున్సిపాలిటీకి నెలకు సుమారు మూడులక్షల రూపాయల మేరకు ఆదాయం వచ్చే అవకాశఽం ఉంది. అయితే పార్క్‌ను తొలగించేసి దుకాణాలు నిర్మించడాన్ని నిరసిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమానికి జిల్లా కన్వీనర్ గోపాల్ అధ్యక్షత వహించాడు. రాష్ట్ర కమిటీ సభ్యుడు సుందరరాజన్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. పార్క్‌ను యఽథావిధిగా కొనసాగించాలని కోరుతూ నినాదాలు చేశారు. ఈ ఆందోళన కార్యక్రమంలో డివిజన్ కార్యదర్శి కలైయరసన్, జిల్లా కార్యవర్గ సభ్యులు తమిళరసు, ఎయిళరసన్, మురుగన్, ఉదయనిల, నల్లరాసు తదితర నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. సాగు భూముల సేకరణపై వ్యతిరేకత కొరుక్కుపేట: చైన్నె మహానగరాభివృద్ధి కోసం వ్యవసాయ భూముల సేకరణపై స్థానిక రైతులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. తాంబరం పక్కనే ఉన్న తెన్పడువంచేరి, మేడంబాక్కం, నుంతనంజచేరి తదితర ప్రాంతాల్లోని 600 ఎకరాల వ్యవసాయ భూమిని చైన్నె మహానగరాభివృద్ధి సంస్థ స్వాధీనం చేసుకుంది. ఇళ్ల స్థలాలు, పార్కులు, రోడ్లుగా అభివృద్ధి చేయనుందని చెబుతున్నారు. దీన్ని ఆ ప్రాంత రైతులు, సామాన్య ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ పరిస్థితిలో మంగళవారం వ్యవసాయ భూముల సేకరణకు వ్యతిరేకంగా అన్నాడీఎంకే తరఫున ప్రదర్శన ఉంటుందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి ప్రకటించారు. దీని ప్రకారం తాంబరంలో సౌత్, చెంగల్పట్టు పశ్చిమ జిల్లా ఏడీఎంకే జిల్లా కార్యదర్శి చిట్లపాక్కం రాజేంద్రన్ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఇందులో అన్నాడీఎంకే మాజీ మంత్రి టీకేంఎం చిన్నయ్య, మాజీ ఎంపీపీ రామచంద్ర, తాంబరం కార్పొరేషన్ ప్రతిపక్ష నాయకుడు సెలయూరు శంకర్, పార్లమెంట్ సభ్యుడు వాటర్ రాజ్‌తోపాటు రైతులు సహా వెయ్యి మంది నిరసనలో పాల్గొన్నారు. నిరసన ప్రదర్శనలో వ్యవసాయ భూముల సేకరణకు వ్యతిరేకంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమావేశానికి వస్తే.. కుర్చీ ఫ్రీ ● తిరుపూర్ అన్నాడీఎంకే నేత ప్రకటన సేలం: తిరుపూర్ పెరుమానల్లూర్లో నగర జిల్లా ఎంజీఆర్ యువజన విభాగం కార్యదర్శి వేల్కుమార్ స్వామినాథన్ అన్నాడీఎంకే 53వ వార్షిక ఉత్సవాలను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో సమావేశంలో సంక్షేమ పథకాలను అందజేస్తారని ప్రకటించారు. ఆ మాటలు నమ్మి పెద్ద సంఖ్యలో జనం పోగయ్యారు. మైదానం అంతా కొత్త కుర్చీలను ఏర్పాటు చేశారు. అయితే సమావేశం స్టేజ్ సమీపంలో ప్రజలకు ఇవ్వడానికి వస్తువులు ఏవీ కనిపించలేదని తెలుస్తోంది. అక్కడ సమావేశానికి వచ్చిన వారంతా కుర్చీలపై కూర్చున్నారు. సమావేశంలో మాజీ మంత్రి డాక్టర్ విజయకుమార్, పొల్లాచ్చి జయరామన్ సంతోషం వ్యక్తం చేశారు. ఆ సమయంలో అకస్మాత్తుగా స్టేజీ పైకి ఎక్కిన వేల్ కుమార్ మైక్‌లో సమావేశానికి వచ్చిన వారంతా సమావేశం ముగిసిన తరువాత వారు కూర్చుని ఉన్న కుర్చీలను వాళ్లే తీసుకువెళ్లవచ్చని ప్రకటించారు. దీంతో బయట నిల్చుని ఉన్న వారంతా కూడా అక్కడి వచ్చి కుర్చీలలో కూర్చుని, సమావేశం తర్వాత ఆ కుర్చీలను తీసుకుపోవడం కలకలం రేపింది. వేల్కుమార్ మాట్లాడుతూ.. ఒక కుర్చీ ధర రూ.350 అని, దానిని కంపెనీ నుంచి రూ.280 లెక్కన 2000 కుర్చీలను కొనుగోలు చేసినట్టు తెలిపారు. తనకు రూ.5 లక్షల 60 వేల ఖర్చు అయినట్టు వెల్లడించారు. -
ఏనుగు దంతాల కేసులో 9 మంది అరెస్ట్
వేలూరు: అరియూరు మలైకోడి గ్రామానికి చెందిన సంపత్ ఇంటిలో ఏనుగు దంతాలతోపాటు ఇతర వస్తువులు ఉన్నట్లు అటవీశాఖ అధికారులకు రహస్య సమాచారం వచ్చింది. దీంతో అటవీ శాఖ సిబ్బంది, పోలీసులు సంపత్ ఇంటిలో సోమవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ఇంటిలో దాచి ఉంచిన ఏనుగు దంతాలు నాలుగు ముక్కలు, ఒక దంతం ఉన్నట్లు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. సంపత్‌ను అదుపులోకి తీసుకొని విచారణ జరిపారు. విచారణలో ఏనుగు దంతాలు దాచి ఉంచిన కేసులో పలువురికి సంబంధం ఉన్నట్లు తెలియ వచ్చింది. సంపత్ తెలిపిన సమాచారం ప్రకారం అరియూరు సమీపంలోని ఏజీనగర్కు చెందిన శరత్‌కుమార్, తిరువణ్ణామలై జిల్లా నిమ్మయంబట్టు సమీపంలోని కీల్ కోయలూరుకు చెందిన కుమార్, తూత్తుకుడి జిల్లా మేల్ ఆతూరుకు చెందిన ధనపాల్, వేలూరు సత్వచ్చారికి చెందిన ధరణికుమార్, చిన్న అల్లాపురానికి చెందిన పయణి, ఆనీస్, అనకట్టుకు చెందిన రవి, అరియూరు కుప్పంకు చెందిన మణిగండన్లు కలిసి ఈ ఏనుగు దంతాలు దాచి ఉంచినట్లు తెలియవచ్చింది. దీంతో ఈ తొమ్మిది మందిని అటవీశాఖ అధికారులు అరెస్ట్ చేసి వారి వద్ద విచారణ చేస్తున్నారు. ఇదిలా ఉండగా చైన్నె, రామనాథపురానికి చెందిన ప్రత్యేక విచారణ బృందం సోమవారం రాత్రి వేలూరుకు వచ్చి పట్టుబడిన వారిని రహస్య ప్రాంతంలో పెట్టి విచారణ చేస్తోంది. -
దారి తప్పించిన గూగుల్ మ్యాప్స్
● బురదలో చిక్కుకున్న దివ్యాంగుడు ● 4 గంటల తర్వాత రక్షించిన పోలీసులు అన్నానగర్: కర్ణాటక నుంచి శబరిమల వెళ్లి తిరిగి వచ్చిన ఓ దివ్యాంగుడు గూగుల్ మ్యాప్స్పై ఆధారపడి వస్తుండగా దిండిగల్ సమీపంలో సోమవారం రాత్రి 4 గంటలపాటు స్కూటర్‌తోపాటు బురదలో చిక్కుకుపోయాడు. కర్ణాటకలోని మంగళూరుకు చెందిన పరశురామన్(30) దివ్యాంగుడు. శబరిమల అయ్యప్పను దర్శనం కోసం దీక్షబూనితన 3 చక్రాల స్కూటర్‌పై ఒంటరిగా మంగళూరు నుండి శబరిమలకు వెళ్లాడు. కొన్ని రోజుల క్రితం స్కూటర్‌పై శబరిమలకు వెళ్లి స్వామి దర్శనం చేసుకున్నాడు. అనంతరం గత 16వ తేదీన శబరిమల నుంచి స్కూటర్‌పై తిరిగి బయల్దేరాడు. సోమవారం రాత్రి 8.30 గంటలకు వత్తలకుండు మీదుగా దిండిగల్ జిల్లా పట్టివీరన్‌పట్టి సమీపంలోని శ్రీఎశ్రీ సెక్షన్‌కు చేరుకున్నారు. అది నాలుగు రోడ్లు కలిసే జంక్షన్ రోడ్డు. దీంతో అయోమయంలో పడ్డాడు. అందుకే సెల్ఫోన్లో గూగుల్ మ్యాప్ చూశాడు. అతి తక్కువ దూరం చూపించే దారిని ఎంచుకుని ప్రయాణించాడు. గూగుల్ మ్యాప్స్ చూస్తూ స్కూటర్ నడుపుతున్నాడు. రాత్రి 9 గంటలకు ఎం.వడ్డిపట్టి సముద్రం కన్మాయి ప్రాంతంలోని మట్టిరోడ్డు మీదుగా వెళ్లాడు. అయితే ఊహించని విధంగా స్కూటర్ చక్రాలు బురదలో కూరుకుపోయాయి. స్కూటర్ని ఆ బురద నుంచి విడిపించడానికి ఎంత ప్రయత్నించినా ఒక్క అడుగు కూడా కదలలేదు. చీకటిలో బురద మధ్యలో స్కూటర్‌తో ఒంటరిగా ఇరుక్కుపోయాడు. అతను కేకలు వేసి సహాయం కోసం ప్రజలను పిలిచాడు. కానీ వర్షం కారణంగా జనం రాకపోకలు సాగించలేదు. తమిళ భాష తెలియని పరశురామన్ సెల్ఫోన్లో కర్ణాటక పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో కర్ణాటక పోలీసులు దిందిగల్ పోలీస్ కంట్రోల్ రూంకు సమాచారం అందించారు. కంట్రోల్ రూం నుంచి వత్తలకుండు పోలీసులకు సమాచారం అందించారు. దీని ప్రకారం వత్తలకుండు పోలీస్ ఇన్స్పెక్టర్ సిలైమణి ఆధ్వర్యంలో పోలీసులు, పత్తివీరన్పట్టి పోలీసులు అర్ధరాత్రి పరశురామన్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చాలాసేపు వెతకగా, అర్ధరాత్రి 1 గంటకు సెల్ ఫోన్ సిగ్నల్ ద్వారా పరశురామన్ ఆచూకీని గుర్తించారు. చీకట్లో, వర్షంలో తడుస్తున్న పరశురామన్‌ను పోలీసులు రక్షించి వత్తలకుండు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అతనికి ప్రథమ చికిత్స అనంతరం ఆహారం అందించారు. అయితే బురదలో ఇరుక్కుపోయిన స్కూటర్‌ను ఆపరేట్ చేయలేకపోయారు. దీంతో మంగళవారం ఉదయం స్కూటర్ రిపేర్ చేసేందుకు మెకానిక్‌ను తీసుకెళ్లి పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. దీంతో పోలీసులు అతడిని అదే స్కూటర్‌పై స్వగ్రామానికి పంపించారు. తనను రక్షించిన పోలీసులకు కృతజ్ఞతలు తెలుపుతూ పరశురామన్ కన్నీటి పర్యంతమయ్యాడు. గూగుల్ మ్యాప్స్పై ఆధారపడి స్కూటర్‌తో దివ్యాంగుడైన వ్యక్తి బురదలో ఇరుక్కున్న ఘటన కలకలం సృష్టిస్తోంది. -
దక్షిణ రైల్వేలో సఫాయి కమిషన్ అధ్యయనం
ఇల్లు కట్టిస్తానని రూ.1.5 కోట్ల మోసం ఆక్రమణలను తొలగించాలని వినతి సాక్షి, చైన్నె: సఫాయి కర్మచారిల జాతీయ కమిషన్ గౌరవాధ్యక్షుడు ఎస్.వెంకటేషన్ బృందం మంగళవారం దక్షిణ రైల్వేలో అధ్యయనం చేసింది. దక్షిణ రైల్వే జనరల్ మేనేజర్ ఆర్ఎన్ సింగ్, అధికారులు కౌశల్ కిషోర్, బి.విశ్వనాథ్ తదితర అధికారులతో సమావేశమయ్యారు. వివిధ క్లీనింగ్ కాంట్రాక్టుల కింద కాంట్రాక్టు ఉద్యోగుల విస్తరణకు సంబంధించి పలు ముఖ్యమైన పాలసీ మార్గదర్శకాలపై చర్చించారు. సఫాయి కర్మచారుల సామాజిక–ఆర్థిక, పని, సేవా పరిస్థితులకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు. స్టేషన్ క్లీనింగ్, ఆన్‌బోర్డ్ హౌస్‌కీపింగ్ స్టాఫ్, కోచ్ క్లీనింగ్, హౌస్ కీపింగ్, ట్రాక్ క్లీనింగ్ సిబ్బంది తదితర అవుట్సోర్స్ కాంట్రాక్ట్ ఏజెన్సీల ప్రతినిధులతోనూ సమావేశమయ్యారు. సౌకర్యాలను ఆరాతీశారు. వారి జీతాలు, పని గంటలు, వారి కాంట్రాక్టు యజమానులు దీపావళి బోనస్ అన్న వివరాలను సేకరించారు. సఫాయి కర్మచారిలకు వారి పని ప్రదేశాలలో యూనిఫాం, తాగు నీరు ఇతర పని పరిస్థితుల పరిస్థితిని సమీక్షించారు.ఇద్దరి అరెస్టు తిరువొత్తియూరు: చైన్నె కొడుంగయూరు పార్వతి నగర్ బస్‌స్టేషన్ వెనుక అనుమానాస్పదంగా నిలబడి ఉన్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద తనిఖీ చేయగా చిన్నచిన్న పార్శిళ్లలో గంజాయి కలిగి ఉన్నారు. ఇద్దరినీ పోలీస్‌స్టేషన్‌కు తీసుకువెళ్లి విచారణ చేశారు. కొడుంగయూరు తిరువళ్లూరు రోడ్డు ప్రాంతానికి చెందిన మణి అనే వడైమణి(26), చోళవరం ప్రాంతానికి చెందిన శివ అనే వెంకటేశ్(27) అని తెలిసింది. వీరిద్దరిపై పలు కేసులు నమోదు ఉన్నాయి. వీరు గంజాయి విక్రయిస్తూ ఉన్నట్లు తెలిసింది. ఇద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు. గాంధీ విగ్రహం స్థలం మార్పుపై సమావేశం తిరుత్తణి: మపోసీ రోడ్డు మార్గంలోని గాంధీ విగ్రహం స్థలం మార్పునకు సంబంధించి ఆర్డీఓ దీప అధ్యక్షతన మంగళవారం వివిధ శాఖల అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, వ్యాపార సంఘం నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ సరస్వతి, తహసీల్దారు మలర్విలి, మున్సిపల్ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం తదితర అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలో నెలకొంటున్న ట్రాఫిక్ సమస్య పరిష్కరించే విధంగా ప్రస్తుతం మార్కెట్ వద్ద ఉన్న గాంధీ విగ్రహానికి ఎలాంటి మార్పు చేయకుండా తీసుకెళ్లి నూతన బస్టాండులో ఏర్పాటు చేయాలని అధికారులు, ప్రజా ప్రతినిధులు సంయుక్తంగా తీర్మానించారు. దీంతో త్వరలో గాంధీ విగ్రహాన్ని పటిష్ట భద్రత నడుమ తీసుకెళ్లి నూతన బస్టాండులో ఏర్పాట్లు చేయనున్నట్లు ఆర్డీఓ దీప తెలిపారు. ఆదాయ పన్ను శాఖ ఆకస్మిక తనిఖీలు తిరువళ్లూరు: ప్లాస్టిక్షీట్ వాహనాలకు హోస్ పైపులు తయారు చేసే పరిశ్రమల్లో అదాయపు పన్ను శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. తిరువళ్లూరు జిల్లాలోని నయపాక్కం, గుమ్మిడిపూండి, శ్రీపెరంబదూరు తదితర ప్రాంతాల్లో పాలీహోస్ టోఫ్లీ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ ఉంది. ఈ సంస్థలో ఇంటి పైకప్పులకు ఉపయోగించే రేకులు(షీట్లు) వాహనాలకు ఉపయోగించే ప్లాస్టిక్ పైపులు తయారు చేసి దేశం నలుమూలలకు సరఫరా చేస్తున్నారు. ఈ సంస్థకు మూడు వాహనాల్లో మంగళవారం ఉదయం అదాయపు పన్నుశాఖ అధికారులు పోలీసుల సాయంతో ప్రవేశించి ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు. ఆర్థిక లావాదేవీలు, వివిధ రాష్ట్రాలకు సరఫరా అవుతున్న వస్తువుల వివరాలు, ఉద్యోగుల సమాచారాన్ని పరిశీలించారు. పనులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు తనిఖీ చేపట్టారు. ఆయుధాలు ధరించిన పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఎంఎస్ సుబ్బులక్ష్మి పేరుతో అవార్డు ఇవ్వొద్దు ● మ్యూజిక్ అకాడమీకి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు కొరుక్కుపేట: 2025 సంవత్సరానికిగాను సంగీత కళానిధి అవార్డును ఎంఎస్ సుబ్బులక్ష్మి పేరుతో ఇవ్వవద్దు అని మ్యూజిక్ అకాడమీకి మద్రాసు హైకోర్టు మధ్యంతరంగా ఆదేశించింది. మ్యూజిక్ అకాడమీ వార్షిక కచేరీ సీజన్లో ‘సంగీత కళానిధి అవార్డు’ అందజేయడం ఆనవాయితీ. డిసెంబర్లో జరిగే 98వ వార్షికోత్సవ కార్యక్రమంలో గాయకుడు టీఎం కృష్ణకు ఈ అవార్డును అందజేస్తామని ప్రకటించారు. తన అమ్మమ్మపై అవమానకరమైన, నీచమైన, అపవాదు వ్యాఖ్యలు కృష్ణ చేసినట్టుగా ఆమె మనవడు శ్రీనివాసన్ తెలిపారు. కృష్ణకు వార్డును అందజేయకూడదని సుబ్బులక్ష్మి మనవడు పిటిషన్ వేశారు. పిటిషన్‌పై విచారణ న్యాయమూర్తి జి.జయచంద్రన్ ముందు మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. సంగీత కళానిధి అవార్డును ఎంఎస్ సుబ్బులక్ష్మి పేరు మీద టి.ఎం.కృష్ణకు ఇవ్వవద్దు అని ఆదేశించారు. ● నిర్మాణ సంస్థ డైరెక్టర్ అరెస్ట్ అన్నానగర్: ఊటీలో ఇల్లు కట్టిస్తానని చెప్పి రూ.ఒకటిన్నర కోట్లు మోసం చేసిన చైన్నె నిర్మాణ సంస్థ డైరెక్టర్‌ను మంగళవారం అరెస్టు చేశారు. చైన్నె రాజా అన్నామలైపురం, శ్రీనివాస అవెన్యూకి చెందిన ఇగ్నాసిస్ థామస్ సురేష్(59) చైన్నె పోలీస్ కమిషనర్ అరుణ్‌కు ఓ ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్యానయి. త్యాగరాయనగర్‌లో నిర్వహిస్తున్న ఎం.ఎస్.నాథన్ ఫౌండేషన్ అనే నిర్మాణ సంస్థ డైరెక్టర్ కేవీ శంకరలింగం ఊటీలో ఇళ్లు నిర్మించి విక్రయిస్తున్నట్లు ప్రచారం చేశాడు. 8 నెలల్లో ఫ్లాట్లు నిర్మించకుంటే నష్టపరిహారం ఇస్తామని ప్రకటనలో పేర్కొన్నారు. దీనిపై ఆధారపడి థామస్, అతని భార్య, బావ, ఇద్దరు స్నేహితుల పేర్లతో మొత్తం 6 ఫ్లాట్లను కొనుగోలు చేసేందుకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అందుకు రూ.1కోటి 45 లక్షల 42 వేలు చెల్లించారు. కానీ కేవీ. శంకరలింగం మాత్రం ఫ్లాట్లు కట్టకుండా డబ్బు తిరిగి ఇవ్వకుండా మోసం చేస్తున్నాడని పేర్కొన్నారు. అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఫిర్యాదుపై విచారణకు కమిషనర్ అరుణ్ ఆదేశించారు. దీని ప్రకారం సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కేవీ శంకరలింగాన్ని మంగళవారం అరెస్ట్ చేశారు. అనంతరం అతడిని జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ఈ నిర్మాణ సంస్థ బాధితులు ఇంకా ఎవరైనా ఉంటే ఫిర్యాదు చేయవచ్చని కేంద్ర నేర పరిశోధన విభాగం కోరింది. తిరువళ్లూరు: వేపంబట్టులో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన కట్టడాలను వెంటనే తొలగించాలని కోరుతూ మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్ వేషధారణతో వచ్చిన ప్రభుత్వ మాజీ ఉద్యోగి విశ్వనాథన్ కలెక్టర్ డాక్టర్ ప్రభుశంకర్‌కు వినతి పత్రం సమర్పించారు. తిరువళ్లూరు జిల్లా 89–వేపంబట్టు గ్రామం ఉంది. ఈ గ్రామానికి చెందిన మునస్వామి, అజంతతోపాటు మరో ఐదుగురు వ్యక్తులు అక్రమంగా కట్టడాలను నిర్మించారు. ఈ కట్టడాల కారణంగా రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. అక్రమ కట్టడాలను కూల్చివేయాలని, రాకపోకలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతూ విశ్వనాథన్ పలుసార్లు స్థానిక సర్పంచ్, బీడీఓతోపాటు ఇతర అధికారులకు వినతి పత్రాలు సమర్పించాడు. అయితే ఇంత వరకు చర్యలు తీసుకోకపోవడంతో మంగళవారం ఎంజీఆర్ వేషధారణలో వచ్చి కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించాడు. కలెక్టర్ తక్షణం స్పందించి, ఆ ప్రాంతంలో పర్యటించి, అక్రమకట్టడాలను కూల్చి రాకపోకలకు ఇబ్బంది లేకుండా చూడాలని కోరారు. ఈ వినతి పత్రంపై తక్షణం చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎంజీఆర్ వేషధారణలో కలెక్టర్ కార్యాలయానికి వినతిపత్రం ఇవ్వడానికి వచ్చిన వ్యక్తితో పలువురు సెల్ఫీలు తీసుకోవడానికి యత్నించారు. ఎంజీఆర్ వేషధారణలో కలెక్టరేట్‌కు వచ్చిన మాజీ ప్రభుత్వ ఉద్యోగి తాంబరం నుంచి మూడు ఎక్స్‌ప్రెస్ రైళ్లు సదరన్ రైల్వే అధికారులు ప్రకటన కొరుక్కుపేట: చైన్నె ఎగ్మోర్ రైల్వేస్టేషన్ అభివృద్ధి పనుల కారణంగా సిలంబు ఎక్స్‌ప్రెస్ రైలుతోపాటు 3 ఎక్స్‌ప్రెస్ రైళ్లను తాంబరం నుండి తాత్కాలికంగా నడుపుతున్నట్లు సదరన్ రైల్వే ప్రకటించింది. ఈ మేరకు సదరన్ రైల్వే విడుదల చేసిన పత్రికా ప్రకటన ఇలా ఉంది. ఎగ్మోర్ రైల్వే స్టేషన్లో అభివృద్ధి పనులు సాగుతున్నాయి. ఫలితంగా మూడు రైళ్ల సర్వీసులు తాత్కాలికంగా దారి మళ్లించబడ్డాయని, తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఇలాగే నడుపబడతాయని వెల్లడించారు. చైన్నె ఎగ్మోర్–రాజస్థాన్ జోధ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ రైలు(22663) ఈ నెల 23 నుండి ఎగ్మోర్కు బదులుగా తాంబరం నుండి నడుస్తుంది. మధ్యాహ్నం 2.50 గంటలకు బయల్దేరుతుంది. జోధ్‌పూర్–ఎగ్మోర్ ఎక్స్‌ప్రెస్ (22664) ఈ నెల 26 నుండి తాంబరం వరకు నడుస్తుంది. చైన్నె ఎగ్మోర్–నాగర్‌కోయిల్ ఎక్స్‌ప్రెస్ (12667) ఈ నెల 21వ తేదీ నుంచి రాత్రి 7.30 గంటలకు తాంబరం నుంచి నడుస్తుంది. చైన్నె ఎగ్మోర్ –సెంగోట్టై సిలంబు ఎక్స్‌ప్రెస్ రైలు (20681) ఈనెల 20 నుండి తాంబరం నుండి రాత్రి 8.55 గంటలకు నడుస్తుంది. సెంగోట్టై–తాంబరం ఎక్స్‌ప్రెస్(20682) ఈనెల 21 నుండి తాంబరం వరకు మాత్రమే నడుస్తుందని వెల్లడించింది. -
ఆర్థిక సంఘ సభ్యుల విస్తృత పర్యటన
సాక్షి, చైన్నె : ఆర్థిక సంఘం బృందం మంగళవారం చైన్నె శివారులలో విస్తృతంగా పర్యటించింది. నెమ్మేలి నిర్లవణీకరణ ప్రాజెక్టును సందర్శించారు. 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగారియా, సభ్యులుు అజయ్ నారాయణ్, అనీ జార్జ్ మాథ్యూ, మనోజ్ పాండా బృందం రాష్ట్ర పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. సీఎం స్టాలిన్, అఽధికారులతో భేటీ తొలి రోజున జరిగింది. మంగళవారం ఈ బృందం ఈసీఆర్ మార్గంలోని నెమ్మెలిలో ఇటీవల పూర్తిచేసిన నిర్లవణీకరణ ప్రాజెక్టును సందర్శించింది. ఇక్కడ నీటి శుద్ధీకరణ ప్లాంట్లు, సముద్రం నుంచి నీటి తరలింపు, ఇక్కడి నుంచి చైన్నెనగరం వైపుగా నీటిని సరఫరా చేసేందుకు చేసిన ఏర్పాట్ల గురించి అధికారులు ఈ బృందానికి వివరించారు. ఇక్కడి నీరు ఎంత మందికి ఉపయోగకరంగా ఉంది. ఈ ప్రాజెక్టుకు వెచ్చించిన మొత్తం తదితర అంశాలపై అధ్యయనం చేసింది. అక్కడి నుంచి నేరుగా శ్రీపెరంబదూరు పారిశ్రామికవాడకు చేరుకుని ఇక్కడి పారిశ్రామిక ప్రగతిని అధ్యయనం చేశారు. ఫాక్స్‌కాన్ పరిశ్రమ, మొబైల్ విడి భాగాల తయారీ పరిశ్రమ, ఎగుమతి కేంద్రాన్ని సందర్శించారు. ఇక్కడి ఏర్పాట్లను పరిశీలించారు. అలాగే, ఆసియాలోనే వర్కింగ్ ఉమెన్స్ కోసం ఇక్కడ నిర్మించిన బహుళ అంతస్తుల తరహా హాస్టల్‌ను పరిశీలించారు. ఇక్కడ బస చేసి ఉన్న మహిళలకు కల్పించిన సౌకార్యలు, భద్రతను పరిశీలించారు. 18 వేల మంది ఇక్కడ బస చేసి ఉన్న సమాచారంతో విస్మయం చెందారు. అక్కడి నుంచి చైన్నె కు చేరుకున్న ఈ బృందం సాయంత్రం మదురైకు విమానంలో బయలు దేరి వెళ్లింది. అక్కడి నుంచి కారులో రామేశ్వరానికి వెళ్లారు. బుధవారం రామేశ్వరంలోని రామనాథస్వామి ఆలయంలోపూజల అనంతరం తంగచ్చి మండపానికి వెళ్లనున్నారు. ఇక్కగ పీఎం గృహ నిర్మాణ పనులను పరిశీలించనున్నారు. రామనాథపురం నగర పాలక సంస్థలో జరిగే కార్యక్రమానికి హాజరు అవుతున్నారు. కిలడి పురావస్తు పరిశోధన ప్రదేశానికి వెళ్లనున్నారు. తర్వాత మదురైకు చేరుకుంటారు. అనంతరం మదురై నుంచి ఈ బృందం ఢిల్లీకి బయలుదేరి వెళ్లనుంది. -
క్లుప్తంగా
టాస్మాక్ దుకాణం ముందు ఆందోళన ● పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట, అరెస్ట్ వేలూరు: వేలూరు పాత బస్టాండ్‌లోని టాస్మాక్ దుకాణాన్ని మూయించాలని కోరుతూ సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఏయుమలై అద్యక్షతన కార్యకర్తలు దుకాణానికి తాళం వేసే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొత్త, పాత బస్టాండ్‌లోని సుమారు 5 టాస్మాక్ దుకాణాలను మూసి వేయాలని వీటి వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రాత్రి వేళల్లో మహిళలు బస్టాండ్‌కు రావాలంటే భయాందోళన చెందుతున్నారని ఆరోపించారు. వీరిని పోలీసులు అడ్డుకోవడంతో పోలీసులు కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. దీంతో పోలీసులు చేసేది లేక కార్యకర్తలను అరెస్ట్ చేసి ప్రైవేటు కళ్యాణ మండపంలో ఉంచారు. ఈ ధర్నాలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి సరోజ, పట్టణ కార్యదర్శి సింబుదేవన్ తదితరులు పాల్గొన్నారు. లారీ చక్రంలో చిక్కుకుని మహిళ మృతి అన్నానగర్: చైన్నె సమీపంలోని కోవిలంపాక్కం కలైనార్ రోడ్డుకు చెందిన ధనభాగ్యం (45). ఆమె ఇంటి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. మంగళవారం నార్త్‌బౌండ్ రోడ్డు నుంచి మేడవాక్కం మెయిన్ రోడ్డు జంక్షన్ వద్ద రోడ్డు దాటుతుండగా.. లారీ ధనభాగ్యంను ఢీకొట్టింది. ఈ క్రమంలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. రాజరాజ చోళుని కాలం నాటి రాగి నాణెం లభ్యం అన్నానగర్: కడలూరు జిల్లాలోని పన్రూట్టి అదుతు ల్లా ఉలుంతంప ట్టు తెన్ పెన్నా నదీ తీరంలో పు రావస్తు శాస్త్రవేత్త ఇమ్మాన్యుయేల్ మెల్ ఫీల్డ్ సర్వే చేపట్టారు. ఈ స మయంలో పురాతన రాగి నాణెం బయల్పడింది. ఇది దేవనాగరి లిపిలో ‘శ్రీ రాజరాజ’’అని చెక్కిన రాజరాజ చోళుడి కాలం నాటి నాణెం అని తేలింది. కాగా ఉలుంతంపట్టులో లభించిన ఈ రాగి నాణెం ఇప్పటివరకు లభించిన నాణేల్లో పరిమాణంలో చిన్నదని పురావస్తు శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. మరుగుదొడ్ల నిర్మాణాలను పూర్తి చేయండి తిరువళ్లూరు: మరుగుదొడ్లు నిర్మాణం కోసం ప్రభుత్వం నుంచి రుణాలు పొందిన వారు వెంటనే పనులను పూర్తి చేయాలని కలెక్టర్ డాక్టర్ ప్రభుశంకర్ సూచించారు. తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా స్వచ్భ భారత్ కార్యక్రమంలో భాగంగా ప్రపంచ టాయిలెట్స్ డేను నిర్వహించారు. ఈ సందర్బంగా విష్ణువాక్కంలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ ప్రభుశంకర్ హాజరై ప్రసంగించారు. మరుగుదొడ్లు నిర్మాణాల కోసం ప్రభుత్వం నుంచి రుణాలు పొందిన వారు వెంటనే పనులను పూర్తీ చేయాలని ఆదేశించారు. అనంతరం స్వచ్చ భారత్‌పై ప్రజల చేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు డైరెక్టర్ జయకుమార్, బీడిఓ రవితో పాటు పలువురు పాల్గొన్నారు. వండలూర్ జూలో హిప్పోపొటామస్ జననం తిరువొత్తియూరు: వండలూరు, జూలాజికల్ పార్కులో 5 ఆడ హిప్పోలు, 2 మగ హిప్పోలను సంరక్షిస్తున్నారు. ఈక్రమంలో ప్రక్ష్ కుర్ది అనే ఆడ నీటి ఏనుగు 8 నెలలు గర్భిణిగా ఉన్న క్రమంలో ఆగస్టు 21న ప్రసవించింది. తల్లి పిల్లను వేర్వేరుగా పరిరక్షిస్తున్నారు. ఈక్రమంలో ఆడ హిప్పో పిల్ల పుట్టిన 8వ రోజున అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అలాగే మరో ఆడ నీటి ఏనుగు రెండు రోజుల క్రి తం పిల్లకు జన్మనిచ్చింది. పార్కు నిర్వాహకులు నిరంతరం వీటిని పర్యవేక్షిస్తున్నారు. చైన్నె ఫ్లవర్ షోకు ముమ్మర ఏర్పాట్లు కొరుక్కుపేట: చైన్నెలో జరిగే పూల ప్రదర్శనకు ఏర్పాట్లు ఊపందుకున్నాయి. ఇందుకోసం ఊటీ బొటానికల్ గార్డెన్లో పూలకుండీలను సిద్ధం చేస్తున్నారు. నీలగిరిజి ల్లాలోని ఊటీలో ఏటా వేసవి కాలంలో పూల ప్రదర్శన నిర్వహించారు. కొడైకెనాల్లోని బ్రయంట్ పార్క్‌లో ఫ్లవర్ షో కూడా జరుగుతోంది. ఇప్పుడు చైన్నెలోని సెమ్మెలీ పార్క్‌లో కూడా వార్షిక పూల ప్రదర్శన నిర్వహిస్తున్నారు. చైన్నెలో పూల ప్రదర్శన కోసం తమిళనాడులోని వివిధ ప్రాంతాల్లో ఉద్యానవన శాఖ వారు తోటలోని పూల మొక్కలను సిద్ధం చేసి చైన్నెకి తరలించి అలంకరించనున్నారు. ఇందుకోసం తమిళనాడులోని అన్ని పార్కుల్లో పూల కుండీలను సిద్ధం చేసే పనులు కొనసాగుతున్నాయి. ఇందుకోసం నీలగిరి జిల్లా ఊటీలోని బొటానికల్ గార్డెన్లో పూల కుండీలను సిద్ధం చేసే పని కూడా ప్రారంభించారు. నీలగిరి జిల్లాలో లక్ష పూల కుండీల తయారీ పనులు శరవేగంగా సాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. -
నరువి ఆసుపత్రిలో ప్రాక్టికల్ రేడియాలజీపై సదస్సు
వేలూరు: ఇండియన్ మెడికల్ అసోషియేషన్, ఇమ్మాజింగ్ సంఘం, తమిళనాడు, పుదుచ్చేరి సంయుక్తంగా ప్రాక్టికల్ రేడియాలజిపై ఒక రోజు సదస్సు వేలూరు నరువి ఆసుపత్రిలో జరిగింది. ఈ సదస్సుకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు చిన్నదురై అబ్దుల్లా అధ్యక్షత వహించగా వేలూరు బ్రాంచ్ అధ్యక్షులు మదన్మోహన్ ఆహ్వానించారు. నరువి ఆసుపత్రి చైర్మన్ సంపత్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రసంగించారు. రాష్ట్ర స్థాయి సదస్సును వేలూరు లో నిర్వహించడం అభినందనీయమన్నారు. డాక్ట ర్లు కొత్త కొత్త విషయాలను తెలుసుకునేందుకు పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం సదస్సు పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి ప్లోరో నెల్సన్, వేలూరు సీఎంసీ ఆసుపత్రి డాక్టర్లు శ్యామ్, శ్రీధర్, జిల్లా కోశాధికారి సహాన, డాక్టర్ మైకిల్ రాజన్, అశోక్ మిత్ర, డాక్టర్లు గురు క్రిష్ణన్, ప్రియాంక, కలైఅరసన్ తదితరులు పాల్గొన్నారు. -
పెళ్లి కళ?
నటి కీర్తి సురేష్కునటి కీర్తి సురేష్ తమిళసినిమా: నటి కీర్తి సురేష్‌కు పెళ్లికళ వచ్చేసిందా ప్రస్తుతం సినీ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఇదే. 2013లో గీతాంజలి అనే చిత్రం ద్వారా మాతృభాషలో కథానాయకగా పరిచయమైన నటి కీర్తి సురేష్ ఆ తర్వాత రింగ్ మాస్టర్ అనే చిత్రంలో నటించారు. దాంతో కోలీవుడ్ దృష్టి కీర్తిపై పడింది. అలా దర్శకుడు విజయ్ ఆమెను ఇదు ఎన్న మాయం అనే చిత్రం ద్వారా తమిళ చిత్రపరిశ్రమకు పరిచయం చేశారు. విక్రమ్ ప్రభు కథానాయకుడిగా నటించిన ఆ చిత్రం ఆశించని విజయాన్ని సాధించలేదు. అయితే ఆ తర్వాత శివ కార్తికేయన్ సరసన నటించిన రజిని మురుగన్, రెమో చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. ఆ తర్వాత కెరీర్ పరంగా కీర్తి సురేష్‌కు వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం రాలేదు. తెలుగులో నటించిన మహానటి చిత్రం జాతీయ అవార్డును తెచ్చిపెట్టింది. అలా మలయాళం, తమిళం, తెలుగు భాషల్లో క్రేజీ కథానాయకిగా రాణిస్తున్న ఈ అమ్మడు ఇటీవలే బేబీ జాన్ చిత్రంతో బాలీవుడ్ రంగ ప్రవేశం చేశారు. అలా దశాబ్దం కాలంలోనే పాన్ ఇండియా కథానాయకిగా పేరు తెచ్చుకున్నారు. కాగా ఈమె గట్టిగా పరిచయమైన అతి తక్కువ కాలంలోనే ఉమెన్ సెంట్రిక్ కథ చిత్రాల గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడీ కేరళ కుట్టి వయసు 32 ఏళ్లు. అయితే చాలా కాలంగానే కీర్తి సురేష్ పెళ్లికి సిద్ధమవుతున్నట్లు ప్రచారం జోరుగానే సాగింది. ముంబాయికి చెందిన ఒక యువ వ్యాపారవేత్తను కీర్తి సురేష్ పెళ్లి చేసుకోబోతున్నారు అనే ప్రచారాన్ని ఆమె తండ్రి సురేష్ ఖండించారు. కాగా తాజాగా మరోసారి కీర్తి సురేష్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో హోరెత్తుతోంది. అంతేకాకుండా ఈసారి పెళ్లి కొడుకు పేరు, పెళ్లి వేదిక వంటి విషయాలు కూడా వైరల్ అవుతున్నాయి . కీర్తి సురేష్ తన 15 ఏళ్ల స్నేహితుడయిన ఆంటోనితో ఏడడుగులు వేయడానికి సిద్ధమవుతున్నారని, కేరళలో పుట్టిన అతను దుబాయ్ కి వెళ్లి అక్కడ సెటిల్ అయినట్టు, వీరి పెళ్లి ఇరు కుటుంబాల అనుమతితో డిసెంబర్లో జరగబోతున్నట్లు వీరి పెళ్లికి గోవాలోని సుందరమైన ప్రదేశం వేదిక కాబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. అదేవిధంగా కీర్తి సురేష్ తన ప్రేమికుడితో ఉన్న ఫొటోలు ఇప్పుడు సామాజి మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ విషయంపై నటి కీర్తి సురేష్ కానీ ఆమె తల్లిదండ్రులు గానీ స్పందించకోవడం గమనార్హం. -
గ్రామీణ రాజకీయ నేపథ్యంలో పరారీ
రివ్యూలపై పరారీ చిత్ర యూనిట్ తమిళసినిమా: ప్రముఖ దర్శకుడు రాజు మురుగన్ సమర్పణలో రూపొందిన చిత్రం పరారీ. కళా ఫిలిమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై హరి శంకర్ నిర్మించి, కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం ద్వారా నవ నటి సంగీత కథా నాయకిగా పరిచయం అయ్యారు. కాగా దర్శకుడు రాజు మురుగన్ శిష్యుడు ఎళిల్ పెరియ వేడు దర్శకుడిగా పరిచయం అయ్యారు. శ్యాన్ రోల్డన్ సంగీతాన్ని, శ్రీధర్ ఛాయాగ్రహణం అందించిన పరారీ చిత్రం ఈనెల 22న తెరపైకి రానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మంగళవారం సాయంత్రం స్థానిక సాలిగ్రామలోని ప్రసాద్ ల్యాబ్‌లో మీడి యా సమావేశం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న దర్శకుడు రాజు మురుగన్ మాట్లాడుతూ ఇది తన శిష్యుడు ఎళిల్ పెరియ వేడు దర్శకత్వం వహించిన చిత్రం అనీ, ఈ చిత్రానికి మోరల్ సపోర్ట్ చేయడానికే సమర్పకుడి వ్యవహరించినట్లు చెప్పారు. కథ, దర్శకుడు,ఆలోచన అంతా ఆయనదేనని చెప్పారు. సామాజిక బాధ్యతతో కూడిన గ్రామీణ రాజకీయ నేపథ్యంలో సాగే కథా చిత్రం పరారీ అని పేర్కొ న్నారు. నిర్మాత, కథానాయకుడు హరి శంకర్ మాట్లాడుతూ నిర్మాతగా తనకింది తొలి ప్రయత్నం అని, అందరం కలిసి మంచి చిత్రాన్ని చేశామని భావిస్తున్నానన్నారు. తనకిది తొలి చిత్రం అని నటి సంగీత అన్నారు. తాను మినహా ఈ చిత్రంలో నటించిన వారంతా స్టేజ్ ఆర్టిస్టులని, వారి నుంచి తాను చాలా నేర్చుకున్నానని ఆమె చెప్పారు. చిత్ర దర్శకుడు ఎళిల్ పెరియ వేడు మాట్లాడుతూ తాను గురువు రాజు మురుగన్ సహకారం లేకపోతే ఈ చిత్రం సాధ్యం అయ్యేది కాదన్నారు. ఎలాంటి అసమానతలు లేకుండా ప్రజలు జీవించాలన్న ఇతివృత్తంతో రూపొందించిన చిత్రం పరారీ అని పేర్కొన్నారు. చిత్రం తిరువణ్ణామలై నేపథ్యంలో సాగుతుందని చెప్పారు. దీంతో అక్కడ మూడు నెలలు నటీనటులతో రిహార్సల్స్ చేయించి ఆ తర్వాత షూటింగ్ నిర్వహించినట్లు చెప్పారు.తమిళసినిమా: సినిమాలపై విమర్శలు (రివ్యూలు)హద్దు మీరుతున్నా యా? విశ్లేషణ పేరుతో కొందరు పబ్లిసిటీ పొందే ప్రయత్నం చేస్తున్నారా? అలాంటి అదుపు తప్పిన విమర్శలతో చిత్రాలకు ఇబ్బంది కలుగుతుందా ? ఈ ప్రశ్నలకు సినీ ప్రముఖుల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. ఇటీవల నటుడు రజినీకాంత్ కథానాయకుడిగా నటించిన వేట్టైయన్, సూర్య కథానాయకుడిగా నటించిన కంగువ వంటి భారీ చిత్రాలకు ప్రేక్షకులు థియేటర్లకు రాకపోవడానికి కారణం ఇలాంటి విమర్శలేనని ప్రముఖ సినీ పంపిణీదారుడు, మల్టీప్లెక్స్ థియేటర్ల సంఘం అధ్యక్షుడు తిరుపూర్ సుబ్రమణియన్ పేర్కొన్నారు. ఈయన ఇటీవల ఓ వీడియోలో పేర్కొంటూ కొత్త చిత్రాలు విడుదలై మొదటి షో పూర్తి అయిన వెంటనే యూట్యూబ్ ఛానెల్స్‌లో ప్రేక్షకుల విమర్శలు భయానికి గురిచేస్తున్నాయన్నారు. ఈ ఏడాది విడుదలైన మెగా బడ్జెట్ చిత్రాలకు కూడా ప్రేక్షకులు థియేటర్లకు రాకపోవడానికి కారణం ఇదేనన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఒకే సమయంలో సినిమాలు విడుదలైతే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తమిళనాడులో కొత్త చిత్రాలు ఉదయం 9 గంటల షో తో ప్రారంభమవుతున్నాయని, అయితే ఇతర రాష్ట్రాల్లో వేకువ జామున నాలుగు గంటలకే షోలు మొదలవుతున్నాయి అన్నారు. దీంతో అక్కడి నుంచి ఉదయం 7 గంటలకే సోషల్ మీడియా ద్వారా వ్యాపిస్తున్న విమర్శలు తమిళనాడులో 9 గంటలకు విడుదలవుతున్న చిత్రాలకు ప్రేక్షకులను థియేటర్లకు రాకుండా చేస్తున్నాయన్నారు. కొత్త చిత్రాల గురించి నెగిటివ్ విమర్శలు చేస్తూ యూట్యూబ్ ఛానల్‌ను లబ్ధి పొందవచ్చుననే భావనతో చాలా అడ్డదిడ్డంగా విమర్శల దాడి చేస్తున్నారన్నారని ఆరోపించారు. దీంతో కోట్లు ఖర్చు చేసి చిత్రాలు నిర్మించి చిత్రాలు థియేటర్లకు తీసుకువచ్చే నిర్మాతలకు అలాంటి విమర్శలతో వ్యాపారానికి ముప్పు కలుగుతోందన్నారు. ఇటీవల కేరళలో ఒక నిర్మాత కోర్టులో కేసు వేసి సినీ విమర్శలను కొద్ది రోజులు వాయిదా వేయాలన్న కోరికను వ్యక్తం చేసినట్లు విన్నానని, అదేవిధంగా ఇక్కడ కూడా చిత్రాలు విడుదలైన రెండు వారాల వరకు విమర్శలు రాకుండా నిషేధం విధించాలని కోరికలు వ్యక్తం చేశారు. ఈ ఏడాది విడుదలైన ఇండియన్ – 2, వేట్టయన్, కంగువ అలాంటి వ్యతిరేక విమర్శల కారణంగా తీవ్ర నష్టం కలిగిందని తిరుపూర్ సుబ్రమణియన్ పేర్కొన్నారు. తిరుపూర్ సుబ్రమణియన్ -
అజిత్ చిత్రంలో యోగిబాబు
తమిళసినిమా: నటుడు అజిత్ ప్రస్తుతం విడాముయర్చి, గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఆయన ఇలా ఏకకాలంలో రెండు చిత్రాల్లో నటించడం ఇదే మొదటిసారి అని చెప్పవచ్చు. వీటిలో లైకా ప్రొడక్షనన్స్ సంస్థ నిర్మిస్తున్న విడాముయర్చి షూటింగ్ జాప్యం జరగడంతో, అజిత్ గుడ్ బాడ్ అగ్లీ చిత్రానికి కూడా కాల్ షీట్స్ కేటాయించారు. తెలుగు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆధిక్ రవిచంద్రన్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. నటి త్రిష నటిస్తున్న ఇందులో ప్రసన్న సునీల్ అర్జున్‌దాస్, ప్రభు తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రంలోని ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ఇటీవల విడుదల చేయగా మంచి రెస్పెన్స్ తెచ్చుకుంది. ముఖ్యంగా అజిత్ అభిమానులను ఖుషీ చేసింది. కాగా తాజాగా ఇందులో మరో ముఖ్యపాత్రకు నటుడు యోగిబాబు ఎంపిక చేశారు. ఇప్పుడు ఆయన అజిత్‌తో దిగిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. నటుడు అజిత్ చాలా కాలం తర్వాత ఈ చిత్రంలో త్రిపాత్రాబినయం చేయడం విశేషం. పూర్తిగా కమర్షియల్ అంశాలతో యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రం షూటింగ్ ఇప్పటికే హైదరాబాద్, స్పెయిన్ దేశంలో చిత్రీకరణను జరుపుకుంది. త్వరలో తదుపరి షెడ్యూల్‌కు చిత్ర యూనిట్ సిద్ధమవుతున్నారు. కాగా చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. -
ధన్వంతరి పీఠంలో 1008 శంఖ తీర్థ అభిషేక పూజలు
వేలూరు: రాణిపేట జిల్లా వాలాజ సమీపంలోని దన్వంతరి ఆరోగ్య పీఠంలో పీఠాధిపతి మురళీధర స్వామిజీ ఆధ్వర్యంలో లోక క్షేమం కోరుతూ 1,008 శంఖ తీర్థ అభిషేక పూజలు జరిగాయి. ఈనెల 22,23న కాల బైరవర్ జయంతిని పురష్కరించుకుని వెయ్యి కిలోల వీభూది అభిషేక పూజలు నిర్వహించనున్నారు. దీంతో ముందుస్తుగా పీఠంలోని శివన్ సన్నిధిలో వేద పండితులు స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, పుష్పాలంకరణలు చేశారు. అనంతరం దీపారధన పూజలు చేసి శంఖాలను ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామి వారికి శంక అభిషేక పూజలు చేపట్టారు. ఈ పూజా కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో చేరుకొని ప్రార్థనలు నిర్వహించారు. -
సెంట్రల్‌జైలులో మరుగుదొడ్ల కొరత
● వేకువ జామున రెండు గంటల నుంచి క్యూలైన్ ● నిద్రాహారాలు మాని అనారోగ్యంతో ఖైదీల ఇబ్బందులు పళ్లిపట్టు పాఠశాల హెచ్ఎం అరెస్టు పళ్లిపట్టు: 3వ తరగతి విద్యార్థినిని లైంగిక వేధింపులకు గురిచేసిన పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని పోక్సో యాక్ట్, ఎస్సీ, ఎస్టీ నేరాల కింద పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. వివరాలు.. పళ్లిపట్టు ఆంజనేయనగర్ ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలలో 3వ తరగతి చదువుతున్న ఇరుళ కుటుంబానికి చెందిన విద్యార్ధినిపై ఆ పాఠశాల హెచ్ఎం చంగల్వరాయన్ లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన పళ్లిపట్టులో కలకలం రేపింది. సంఘటనకు సంబంధించి చిన్నారి తల్లి పళ్లిపట్టు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు డీఎస్పీ కందన్ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి హెచ్ఎం చెంగల్వరాయన్‌ను మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. కోర్టులో హాజరుపరిచి పుళళ్ సెంట్రల్ జైలుకు తరలించారు. వేలూరు: వేలూరు పేరు చెబితేనే గుర్తుకు వచ్చేది సెంట్రల్ జైలు మాత్రమే. తమిళనాడులోనే రెండో పెద్ద జైలైన వేలూరులో 1078 మంది విచారణ, శిక్ష పొందుతున్న వేర్వేరు ఖైదీలు ఉంటున్నారు. అయితే 60 మంది ఖైదీలు మాత్రమే ఉండాల్సిన ప్రాంతంలో మొత్తం 70 మంది ఖైదీలను ఉంచారు. దీంతో స్థలం లేక రాత్రి వేళల్లో ఖైదీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీటితో పాటు ఒక్కో ప్రాంతంలో మూడు మరుగుదొడ్లు మాత్రమే ఉన్నాయి. జైళ్లశాఖ నిబంధనల ప్రకారం జైలు ఖైదీలు వేకువ జామున 5.30 గంటలకే నిద్ర లేవాలి, అనంతరం నిద్రపోయిన వారిపై జైలు అధికారులు చర్యలు తీసుకుంటారు. గదుల వద్ద మూడు మరుగుదొడ్లు మాత్రమే ఉన్నందున ఖైదీలు ఉదయం చాలా సమయంలో క్యూలైన్లో వేచి ఉండి కాలకృత్యాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో జైలులోని ఖైదీలు వేకువ జామున 2 గంటలకే నిద్ర లేచి మరుగుదొడ్లు వద్ద క్యూలైన్లో నిలిచి కాలకృత్యాలు తీర్చుకుంటున్నారు. వేకువ జామున 2 గంటలకే నిద్ర లేవడంతో ఖైదీలకు నిద్ర చాలడం లేదు. వృద్ధ ఖైదీలు నిద్రాహారాలు నిలిచి వెళ్లడంతో తీవ్ర అనారోగ్యానికి గురి అవుతున్నారు. వీటిపై ఇటీవల జైలు నుంచి బయటకు వచ్చిన ఒక ఖైదీ మాట్లాడుతూ వేలూరు సెంట్రల్ జైలులో ఖైదీలకు అవసరమైన మరుగుదొడ్లు లేవని తెలిపారు. ఉదయం 5.30 గంటలకే ఖైదీలు నిద్ర లేచి హాజరు కావాల్సిన పరిస్థితి ఉందన్నారు. వీటిపై అధికారులు విచారణ జరిపి ఖైదీలకు న్యాయం చేయాలని కోరారు. -
రౌడీ సీసింగ్ రాజ బంధువుల ఇళ్లలో సోదాలు
సాక్షి, చైన్నె: ఎన్కౌంటర్లో ఇటీవల హతమైన రౌడీ ిసీసింగ్ రాజ బంధువులు, సన్నిహితులకు చెందిన 14 చోట్ల మంగళవారం పోలీసులు, రెవెన్యూ అధికారులు విస్తృత సోదాలలో నిమగ్నమయ్యారు. కట్ట పంచాయతీలు, స్థల కబ్జాలు, హత్య కేసులలో నిందితుడైన రౌడీ సీసింగ్ రాజ కోసం పోలీసులు గతకొన్ని నెలలుగా తీవ్రంగా గాలించిన విషయం తెలిసిందే. బీఎస్పీ నేత ఆర్మ్ స్ట్రాంగ్ హత్యలో ఇతడి మీద తొలుత అనుమానాలు వచ్చాయి. ఎట్టకేలకు ఆంధ్రాలో పట్టుబడ్డ ఇతడిని చైన్నెకు తీసుకొచ్చారు. తప్పించుకునే క్రమంలో పోలీసులు ఎన్కౌంటర్లో హతం చేశారు. గతంలో ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి వందలాది మందికి చేతులు మార్చిన సీసింగ్ రాజపై ప్రస్తుతం రెవెన్యూ అధికారులు దృష్టి పెట్టారు. అతడు ఎన్కౌంటర్లో మరణించడంతో బంధువులు, సన్నిహితుల మీద గురి పెట్టారు. తాంబరం, సేలయూరు, ముడిచ్చూరు, పెరుంగళత్తూరు పరిసరాలలోని వీరి నివాసాలలో విస్తృతంగా సోదాలు జరుగుతున్నాయి. స్థల కబ్జాలకు సంబంధించి సృష్టించి డాక్యుమెంట్లు, స్థలాలను చేతులు మార్చడం ద్వారా సంపాదించిన ఆస్తులు తదితర వివరాల సేకరణలో 14 మంది రెవెన్యూ అధికారులతో కూడిన బృందం నిమగ్నమైంది. -
మద్యం బాటిల్‌పై అదనపు వసూళ్లు
● 8 మంది టాస్మాక్ షాపు ఉద్యోగుల తొలగింపు అన్నానగర్: ఎంఆర్పీ కంటే ఒక్కో మద్యం బాటిల్‌పై రూ.10 అధికంగా వసూలు చేస్తున్న టాస్మాక్లోని 8 మంది ఉద్యోగులను అధికారులు తొలగించారు. వివరాలు.. చైన్నె పక్కనే ఉన్న కాంచీపురం జిల్లాలో 131 టాస్మాక్ దుకాణాలు, చెంగల్పట్టు జిల్లాలో 89 టాస్మాక్ దుకాణాలు ఉన్నాయి. వీటిలో మద్యం తాగేవారి నుంచి అదనపు సొమ్మును నిరోధించేందుకు ఈనెల 15వ తేదీ నుంచి 220 టాస్మాక్ దుకాణాల్లో డిజిటల్‌గా స్కానర్ల ద్వారా రసీదులు జారీ చేస్తున్నారు. ఈ క్రమంలో కాంచీపురం జిల్లా వాలాజాబాద్ సమీపం ఊట్టుకాడు పక్కనే ఉన్న టాస్మాక్ షాపులో డిజిటల్ పద్ధతిలో విక్రయించే ఒక్కో బాటిల్‌పై అదనంగా రూ.10 వసూలు చేస్తున్నట్లు మద్యం ప్రియులు వీడియో తీసి సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. దీంతో కాంచీపురం జిల్లా టాస్మార్క్ అధికారులు సోమవారం విచారణ జరిపి ఊత్తుకాడు టాస్మాక్ షాపులో మద్యం విక్రయ ధర కంటే రూ.10 అధికంగా వసూలు చేసిన టాస్మాక్ షాపు ఇద్దరు సూపర్ వైజర్లు, ఆరుగురు ఉద్యోగులు సహా 8 మందిని విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
తైవాన్ అమ్మాయి.. కరైకుడి అబ్బాయి..
●తమిళ సంప్రదాయంలో వివాహం అన్నానగర్: కారైకుడికి చెందిన ఓ యువకుడు తైవాన్ యువతిని ప్రేమించి తమిళ సంస్కృతి ప్రకారం పెళ్లి చేసుకున్నాడు. వివరాలు.. శివగంగై జిల్లా కారైకుడి సమీపంలోని పాధరకుడికి చెందిన ఆరుముగం రెండో కుమారుడు సతీష్ కుమార్. ఇతను గత 6 సంవత్సరాలుగా తైవాన్‌లోని ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఆ సమయంలో తైవాన్‌కు చెందిన హో హాసిన్ హీతో ప్రేమలో పడ్డాడు. ఇదిలా ఉండగా సతీష్ కుమార్ ఉద్యోగం మారడంతో ప్రస్తుతం అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో సతీష్ కుమార్, హో హాసిన్ హీ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఇద్దరూ తమ తల్లిదండ్రులకు చెప్పారు. ఇరు కుటుంబీకులు అంగీకరించారు. దీంతో హో హాసిన్ హీ తల్లిదండ్రులు తమిళ సంస్కృతి ప్రకారం వివాహాన్ని నిర్వహించడానికి అంగీకరించారు. దీని ప్రకారం అతని తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు అందరూ తైవాన్ నుంచి కరైకుడి వచ్చారు. ఆదివారం కారైకుడిలోని ఓ కల్యాణమండపంలో సతీష్ కుమార్, హో హాసిన్ హీ దంపతులు వేద మంత్రోచ్ఛారణలతో తమిళ సంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకున్నారు. ఈ వివాహ వేడుకకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. -
నీటిలో పడి మహిళ మృతి
●స్కూటీ అదుపు తప్పడంతో ప్రమాదం అన్నానగర్: కారైకుడి సమీపంలో ఆదివారం రాత్రి స్కూటీ అదుపుతప్పి రోడ్డు పై నిల్వ ఉన్న వర్షపు నీటిలో పడి ఓ మహిళ ఊపిరాడక మృతి చెందారు. శివగంగై జిల్లా కారైకుడి సమీపంలోని రాస్తా ప్రాంతానికి చెందిన కలైచెల్వి (50) కారైకుడిలోని ఓ కేఫ్‌లో పనిచేస్తున్నారు. ఆదివారం రాత్రి పని ముగించుకుని స్కూటీ పై ఇంటికి వెళ్తుండగా.. రాస్తా నది వంతెన దగ్గరకు రాగానే ఎదురుగా వస్తున్న వాహనం హెడ్ లైట్ల వెలుగులో రోడ్డు కనిపించలేదు. దీంతో స్కూటీ తప్పి రోడ్డు పక్కనే ఉన్న బారియర్ ను ఢీకొట్టింది. గాయాలపాలై స్ఫృహతప్పి పక్కనే ఉన్న కాలువలో నిలిచిన వర్షపు నీటిలో కలైచెల్వి పడిపోయారు. ఈ క్రమంలో ఊపిరాడక ఆమె మృతి చెందినట్లు తెలుస్తోంది. పాదచారులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. గర్భిణి వద్ద నగలు నగదు చోరీ తిరువొత్తియూరు: ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గర్భిణి వద్ద నగలు, నగదును చోరీ చేసిన గుర్తు తెలియని వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తూ ఉన్నారు. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా, పొన్నేరి పుదురుకు చెందిన కమల (65). ఈమె 8 నెలల గర్భం గర్భిణిగా ఉన్న తన కుమార్తెను తీసుకుని గత 7వ తేదీ చైన్నె తండయార్‌పేట ప్రాంతంలో ఉన్న మహిళా ప్రసూతి ఆసుపత్రిలో చికిత్సకు చేర్చారు. ఆ సమయంలో గర్భిణి వద్ద ఉన్న ఆరు సవర్ల బంగారు నగలు, వెండి గొలుసులు, వెయ్యి రూపాయలను ఆ మాయమాటలు చెప్పి ఓ వ్యక్తి ఆమె వద్ద చోరీ చేశాడు. దీని గురించి ఆ తల్లి ఆమె తల్లి కమల ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.