Funday
-
నేటి బాలలే రేపటి మేధావులు!
నేటి బాలలే రేపటి పౌరులంటే అందరూ ఒప్పుకుంటారు. కానీ, నేటి బాలలే రేపటి మేధావులంటే అనుమానంగా చూస్తారు. పిల్లలందరూ జీనియస్‌లు ఎలా కాగలరు? అని ప్రశ్నిస్తారు. నాకో పదిమంది పిల్లలను ఇవ్వండి. వారు పెరిగి పెద్దయ్యాక ఏం కావాలనుకుంటే అదయ్యేలా పెంచగలనని అప్పుడెప్పుడో చెప్పాడు ప్రముఖ బిహేవియరల్ సైకాలజిస్ట్ జేబీ వాట్సన్.ఇదిగో వీరికి సాధ్యమైంది.. తల్లిదండ్రులు తలచుకుంటే, సరైన వాతావరణాన్ని సృష్టిస్తే ప్రతి బిడ్డా తానెంచుకున్న రంగంలో అత్యున్నత స్థాయికి చేరతాడనడానికి అనేక ఉదాహరణలున్నాయి. 1898లో పుట్టిన విలియమ్ జేమ్స్ సిడిస్ అనే బాలుణ్ని బాలమేధావిగా మార్చారు. రిచర్డ్స్ విలియమ్స్ అనే తండ్రి తన బిడ్డలిద్దరినీ ప్రపంచ ప్రఖ్యాత టెన్నిస్ క్రీడాకారిణులు విలియమ్స్ సిస్టర్స్‌గా తీర్చిదిద్దాడు. లాజ్లో పోల్గార్ అనే టీచర్ తన ముగ్గురు బిడ్డలనూ చెస్ గ్రాండ్ మాస్టర్స్ పోల్గార్ సిస్టర్స్‌గా తీర్చిదిద్దాడు. పట్నాకు చెందిన నారాయణ్ తులసి అనే ప్రభుత్వ ఉద్యోగి తన కుమారుడు తథాగత్ అవతార్ తులసిని బాల మేధావిగా తీర్చిదిద్దాడు. తాజాగా కేరళకు చెందిన ఆవిర్భావ్ అనే ఏడేళ్ల బాలుడు సూపర్ స్టార్ సింగర్–3 విజేతగా నిలిచాడు. రెండేళ్ల వయసు నుంచే అతని చుట్టూ సంగీత ప్రపంచాన్ని సృష్టి్టంచడంతో అది సాధ్యమైంది. గట్టిగా అనుకుంటే అవుతుంది..మీరు తలచుకుంటే మీ బిడ్డనూ మేధావిగా పెంచవచ్చు. అందుకు చేయాల్సిందల్లా వారి మనసులోని అనేకానేక మ్యాట్రిక్స్లను బలోపేతం చేయడమే. కాగ్నిటివ్ మ్యాట్రిక్స్: పిల్లల మేధో వికాసానికి పునాది. సమాచారాన్ని ప్రాసెస్ చేయడంలో, ప్రతికూలతలను అధిగమించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. ‘ఎందుకు’, ‘ఎలా’ వంటి ప్రశ్నలతో సంభాషణలను ప్రోత్సహించడం ద్వారా ఇన్వెంటివ్ మైండ్‌సెట్‌ని ప్రోత్సహించాలి.ఎమోషనల్ మ్యాట్రిక్స్: పిల్లలకు తెలివితేటలు ఎంత ముఖ్యమో భావోద్వేగాలు కూడా అంతే ముఖ్యం. భావోద్వేగాలను గుర్తించడం, అర్థం చేసుకోవడం, నియంత్రించడం వంటి అంశాలు ఇందులో ఉంటాయి. ఇది వారిలో ధైర్యాన్ని, ఇతరులను అర్థం చేసుకునే సామర్థ్యాన్ని పెంచుతుంది.హెరిడిటరీ మ్యాట్రిక్స్: కుటుంబ వాతావరణం, సామాజిక పరిస్థితులు జన్యు వ్యక్తీకరణను ప్రభావితం చేయగలవని ఎపిజెనెటిక్స్ పరిశోధనలు చెబుతున్నాయి. ఇంట్లో సానుకూల, ప్రేరణాత్మక వాతావరణాన్ని సృష్టించడం ద్వారా జీన్స్ మ్యాట్రిక్స్‌ను అభివృద్ధి చేయవచ్చు. లాంగ్వేజ్ మ్యాట్రిక్స్: పిల్లలు ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి, మనసులోని భావాలను అందరికీ అర్థమయ్యేలా చెప్పడానికి భాష అవసరం. పిల్లలతో కలిసి కథలు చదవడం, చెప్పడం, చర్చించడం ద్వారా దీన్ని సుసంపన్నం చేయవచ్చు. బిహేవియర్ మ్యాట్రిక్స్: పిల్లల దీర్ఘకాల విజయంలో అలవాట్లు, సంకల్పం ప్రధానపాత్ర పోషిస్తాయి. ఆరోగ్యకరమైన రొటీన్లను సృష్టించడానికి పిల్లలకు సహాయం చేయడం ద్వారా దీన్ని బలోపేతం చేయవచ్చు. సోషల్ మ్యాట్రిక్స్: మనిషి సంఘజీవి. పిల్లల వ్యక్తిత్వ వికాసంలో కుటుంబం, స్నేహితులు, పరిసరాల ప్రభావం ఉంటుంది. గౌరవం, దయ, సానుభూతి వంటి లక్షణాలను పిల్లలకు నేర్పడంలో ఆదర్శంగా ఉండాలి. మోరల్ మ్యాట్రిక్స్: పిల్లలు ఎదుగుతున్న కొద్దీ నైతిక భావనలు అభివృద్ధి చెందుతాయి. ఇవి వారి ప్రవర్తనను, నిజాయితీని, జీవితం పట్ల వారి ఉద్దేశాన్ని ప్రభావితం చేస్తాయి. న్యాయం, దయ, బాధ్యత గురించి పిల్లలతో చర్చించడం ద్వారా వారిలో బలమైన నైతిక చైతన్యాన్ని పెంపొందించవచ్చు.స్కూల్లో చేర్పించడంతో తల్లిదండ్రుల పాత్ర పూర్తికాదని గుర్తించాలి. వారి మనసులోని అనేకానేక మ్యాట్రిక్స్లను అభివృద్ధి చేయడం బాధ్యతగా తీసుకోవాలి. అప్పుడే బిడ్డ సంపూర్ణ సామర్థ్యంతో ఎదుగుతాడు. అతనిలోని జీనియస్ మ్యాట్రిక్స్ ఆవిష్కృతమవుతుంది. ఆ దిశగా ఈరోజే అడుగులు వేయండి. అందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతి బిడ్డా మేధావే..పుట్టిన ప్రతి బిడ్డా జీనియస్ కాగలిగిన సామర్థ్యంతోనే పుడుతుంది. కానీ, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, పరిసరాలు, పాఠశాల, ఉపాధ్యాయులు, సమాజం ఆ బిడ్డ చుట్టూ కనిపించని పరిమితులను ఏర్పరుస్తారు. కనిపించని ఆ వలలో చిక్కుకున్నవారు అదే నిజమని నమ్మి, ఆ పరిమితుల్లోనే పనిచేసి, పరిమితమైన విజయాలతో సంతృప్తి చెందుతుంటారు. కొద్దిమంది మాత్రమే తమ చుట్టూ ఉన్న పరిమితులను అధిగమించి, తమలోని ప్రతిభను పూర్తిగా చాటడం ద్వారా జీవితాల్లో, సమాజంలో శాశ్వతమైన మార్పు తీసుకువస్తారు. అలాంటి వ్యక్తులనే జీనియస్ అంటారు. -
పిసినారి పుల్లయ్య
ముక్కామల అనే గ్రామంలో మల్లయ్య, పుల్లయ్య అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వారి ఇళ్లు పక్క పక్కనే ఉండేవి. పుల్లయ్య పిసినారి వాడు. ఉచితంగా వస్తుందంటే ఉరుక్కుంటూ వెళ్లి తెచ్చుకునే రకం. కానీ పుల్లయ్య భార్య ఎల్లమ్మ ఇంటి ముందుకు వచ్చిన భిక్షకులకు.. ఉన్నంతలో ఏదో ఒకటి ఇచ్చి పంపుతుంది. అది చూసిన పుల్లయ్య ఎప్పడూ భార్యతో గొడవకు దిగేవాడు. నేను రేయనక, పగలనక కష్టపడి సంపాదిస్తుంటే నువ్వేమో దానధర్మాలు చేస్తూ ఇంటిని సత్రంగా మారుస్తున్నావు’ అంటూ! ‘ఎందుకండీ.. ఇలా మాట్లాడుతారు. దానధర్మాలు చేస్తే పుణ్యం దక్కుతుంది. మన పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుంది. మనం చేసిన ధర్మాలే మనల్ని కాపాడుతాయి’ అని బదులిచ్చేది ఎల్లమ్మ. ఒకసారి అలా ఎల్లమ్మ జవాబు విని, ‘ఎంత చెప్పినా అంతే! దాని మంకు దానిదే.. నా మాట ఎప్పుడు విన్నది గనుక’ అని విసుక్కుంటూ దొడ్లో ఉన్న పశువులను తీసుకుని చేనుకు వెళ్లాడు పుల్లయ్య.. వాటిని మేపడానికి. అక్కడే ఉన్న మల్లయ్య ‘ఏరా పుల్లయ్యా.. ఇంత పొద్దు పోయింది?’ అని అడిగాడు. ‘ఏముందిరా.. ఊళ్లో వాళ్లందరికీ నా ఇల్లే కనిపిస్తుంది. నా ఇల్లొక సత్రం అయింది. ఎంత చెప్పినా ఎల్లి వినిపించుకోదు. నేనేమో కష్టపడి పైసా పైసా పోగు చేస్తుంటే.. అదేమో దాన ధర్మాలకు ధారపోస్తోంది’ అని ఇంట్లో జరిగిన సంగతి అంతా చెప్పాడు పుల్లయ్య.‘సరే గానీ, ఎండాకాలం వస్తోంది. పక్కనే ఉన్న చెరుకుపల్లి అంగడిలో నాణ్యమైన కుండలు దొరుకుతున్నాయి అని విన్నాను. నేను రేపు వెళ్తున్నాను. నువ్వు కూడా రా.. వెళ్లి కుండలు తెచ్చుకుందాం’ అన్నాడు మల్లయ్య. ‘ఇప్పుడు కుండలకు ధరలు బాగా పెరిగాయి. పొలంలో, ఇంట్లో ఉన్న సిమెంటు గాబుల్లో నీళ్లు చల్లగానే ఉంటున్నాయి కదా? కుండలు అవసరమా! డబ్బులు దండగ కాకపోతే’ అని బదులిచ్చాడు పుల్లయ్య. ‘సరే రా.. నీ ఇష్టం! నేనైతే రేపు పొద్దున బయలుదేరుతాను’ అన్నాడు మల్లయ్య. ఇంటికి వెళ్లాక పుల్లయ్య భార్య కూడా కుండ తెమ్మని పోరు బెట్టడంతో మరుసటి రోజే మల్లయ్యతో కలిసి కుండలు కొనడానికి అంగడికి బయలుదేరాడు పుల్లయ్య. ఇద్దరూ అంగడిలో రకరకాల కుండలను చూశారు. మల్లయ్య ఒక కుండను కొన్నాడు. పుల్లయ్య మాత్రం ‘అమ్మో! ఈ కుండకు ఇంత ధరా! ఇంకా ముందుకు వెళ్తే తక్కువకు దొరుకుతాయి’ అన్నాడు మల్లయ్యతో. ‘నాకు ఓపిక లేదు. నువ్వు వెళ్లు. నేను ఇక్కడే కూర్చుంటాను’ అంటూ ఓ చెట్టు కింద కూర్చున్నాడు మల్లయ్య. పుల్లయ్య ఇంకాస్త ముందుకు వెళ్లాడు. అక్కడ కుండల వ్యాపారితో బేరం చేశాడు. బేరం కుదరలేదు. సంతలోనే ఉన్న ఒక వ్యక్తి ‘ఇక్కడి నుంచి ఇంకా ముందుకు వెళ్లండి. అక్కడ తక్కువకు దొరుకుతాయి’ అని చెప్పాడు. వెంటనే ఒక మైలు దూరం నడుచుకుంటూ వెళ్లి అక్కడ కుండలయ్యతో బేరం సాగించాడు. ‘లేదండీ .. ఆ ధరకు మాకే రాలేదు’ అని అన్నాడు కుండలయ్య. అయినా సరే, పట్టువిడవకుండా అతనితో బేరం చేయసాగాడు. పుల్లయ్య పోరుబట్టలేక తక్కువ ధరకే కుండను ఇచ్చేశాడు ఆ వ్యాపారి. సంతోషంగా కుండను నెత్తిన పెట్టుకొని నడక సాగించాడు పుల్లయ్య. అప్పటికే ఎండ నెత్తిమీదకి ఎక్కడంతో కళ్లు తిరిగి, స్పృహ తప్పి పడిపోయాడు పుల్లయ్య. అందరూ గుమిగూడారు. చెట్టు కింద కూర్చున్న మల్లయ్య వెళ్లి చూడగా.. పుల్లయ్య కిందపడి ఉన్నాడు. వెంటనే ముఖంపై నీళ్లు చల్లి, మజ్జిగ తాగించాడు. స్పృహలోకొచ్చాడు పుల్లయ్య. కుండ పుటుక్కుమనడం చూసి, భోరున విలపించాడు. ఖాళీ చేతులతో ఇంటికి వెళ్తే, భార్య తిడుతుందేమోనని భయపడి పక్కనే ఉన్న కుండల వ్యాపారి వద్ద చెప్పిన ధరకే మరో కుండను కొన్నాడు. ‘మల్లయ్య మాట వినుంటే బాగుండేది. అనవసరంగా రెండు కుండలు కొనాల్సి వచ్చింది. ఇంకెప్పుడు ఇలా చేయకూడదు’ అనుకుంటూ నిరాశగా ఇంటి ముఖం పట్టాడు. విషయం తెలుసుకున్న పుల్లయ్య భార్య పొరకతో తరిమింది. -
ఈవారం కథ: గోపి వాళ్ళ నాన్నకు మంచి ఉద్యోగం
గోపి వాళ్ళ నాన్నకు మంచి ఉద్యోగం వచ్చింది. ఇంట్లో అంతా చాలా సంతోషంగా ఉన్నారు. ఈ ఉద్యోగం కోసం ఆయన ఎంత కష్టపడ్డాడో గోపికి తెలుసు. నాన్న రోజూ ఆఫీస్ నుంచి వచ్చాక చదువుకుంటూ ఉండేవాడు. ఒకసారి గోపి.. నాన్నతో ఆడుకోవడానికి కుదరట్లేదని పేచీ పెట్టాడు. అప్పుడు వాళ్లమ్మ ‘మన కోసమే నాన్న మంచి ఉద్యోగం తెచ్చుకోవాలనుకుంటున్నారు. మనం ఇబ్బంది పడకుండా ఉండాలనే ఆయన ప్రయత్నం. ఈ కొన్ని రోజులు నాన్నను చదువుకోనిస్తే, పరీక్ష అయిపోయాక నాన్నతో హాయిగా ఆడుకోవచ్చు’ అని సముదాయించింది. అప్పటి నుంచి గోపి కూడా నాన్నకు మంచి ఉద్యోగం రావాలని కోరుకోసాగాడు. నాన్నను ఇబ్బంది పెట్టకుండా, అమ్మతో ఆడుకోసాగాడు. పరీక్ష రోజున నాన్నతో పాటు గుడికి వెళ్లి దేవుడిని ప్రార్థించాడు. పరీక్ష పాసై, తాను కోరుకున్న ఉద్యాగాన్ని పొందాడు గోపి వాళ్ల నాన్న. ఆయన కష్టానికి తగ్గ ఫలితం వచ్చిందని అందరూ అంటుంటే, తను కూడా నాన్నలాగే ఏదైనా సాధించాలి అనుకున్నాడు గోపి. నాన్న కొత్త ఉద్యోగానికి వెళుతున్నాడు. ప్రభుత్వ బడిలో చదివే గోపి కూడా ఇప్పుడు ఊళ్లో ఉన్న పెద్ద బడికి వెళుతున్నాడు. ఆ కొత్త బడి చాలా బాగుంది. బస్సులో వెళ్లడం, రావడం అంతా సరదాగా ఉంది. బట్టలు, భాష అంతా కొత్తగా ఉంది. ‘క్రమశిక్షణతో లేకపోతే ఇంటికి పంపించేస్తారుట. అందుకే జాగ్రత్తగా ఉండాల’ని గోపికి మరీ మరీ చెప్పింది అమ్మ. కొత్త స్నేహితుల పరిచయాలు, వాళ్ల గురించి తెలుసుకోవడం చాలా హుషారుగా ఉంది. నెమ్మదిగా కొత్త బడికి అలవాటుపడ్డాడు గోపి. పాత బడిలో కన్నా ఇక్కడ చాలా బాగుందనిపించింది అతనికి. ఓ ఆదివారం.. పాత బడిలోని స్నేహితులు తమతో ఆడుకోవడానికి గోపిని రమ్మన్నారు. వాళ్లను చూడగానే ఆ అబ్బాయికి చాలా సంతోషమనిపించింది. తన కొత్త బడి సంగతులన్నీ ఒక్కొక్కటిగా వాళ్లకు చెప్పడం మొదలుపెట్టాడు. ప్రభుత్వ బడిలో అవన్నీ లేకపోవడంతో వాళ్లు ఆశ్చర్యంగా వినసాగారు. వాళ్ల ముఖాల్లోని ఆశ్చర్యాన్ని చూస్తూ తనకు తెలియకుండానే మరిన్ని గొప్పలు చెప్పుకుపోసాగాడు గోపి. కాసేపటికి ఆ పిల్లలకు విసుగనిపించింది. దాంతో ఆడుకోకుండానే ఇళ్లకు వెళ్లిపోయారు. గోపికి కోపం వచ్చింది. ఇంకెప్పుడూ వాళ్లతో మాట్లాడకూడదనుకున్నాడు. దిగులుగా కూర్చున్నాడు. ఇంతలో గోపికి ఎంతో ఇష్టమైన కిరణ్ మామయ్య వచ్చాడు. అతన్ని చూడగానే గోపి దిగులు ఎగిరిపోయింది. కిరణ్ మామయ్య, గోపి వాళ్ల నాన్నతో కలిసి పని చేసేవాడు. ఇరు కుటుంబాలు చాలా స్నేహంగా ఉంటాయి. కిరణ్ మామయ్యతో కొత్త బడి విశేషాలను చెప్తుండగా నాన్న వచ్చాడు. గోపి వాళ్ల నాన్న కూడా కిరణ్ మామయ్యను చూడగానే ఎంతో ఉత్సాహంగా పలకరించాడు. వాళ్ల పాత ఆఫీసులో సంగతుల గురించి, తన స్నేహితుల గురించి అడిగి తెలుసుకున్నాడు నాన్న. ఒకరిద్దరి స్నేహితులకు ఫోన్ చేసి ఇంటికి రమ్మని ఆహ్వానించాడు. కొత్త ఆఫీసు గురించి పెద్దగా ఏమీ చెప్పలేదు. ఇదివరకటిలాగానే ఇద్దరూ మాట్లాడుకుంటున్నారు. నాన్న ఇప్పుడు కిరణ్ మామయ్య కన్నా మంచి ఉద్యోగం చేస్తున్నాడు. అయినా ఎందుకు తన గురించి ఎక్కువ చెప్పుకోవట్లేదు? తను అలా ఎక్కువ చెప్పుకోవడం వలనే తన స్నేహితులు వెళ్లిపోయారా? ఆలోచించసాగాడు గోపి!∙డా. హారిక చెరుకుపల్లి -
Funday Story: మంత్రి గారి నేర్పు
సమీర రాజ్యాన్ని సమీరుడనే రాజు పరిపాలించేవాడు. ఒకరోజు ఆస్థానానికి ఇద్దరు యువకులతో కలిసి ఒక వ్యక్తి వచ్చాడు. ‘మహారాజా! నాపేరు సుమంతుడు. నేను కొన్ని ప్రశ్నలు అడిగి సభాసదుల తెలివిని పరీక్షించాలనుకుంటున్నాను. నా ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పిన వారికి పదివేల వరహాలిస్తాను. ఎవరూ చెప్పలేకపోతే మీ రాజ్యం తరుపున మీరు ఓటమిని అంగీకరించి పదివేల వరహాలివ్వాలి’ అన్నాడు. అది రాజ్యం పరువు, ప్రతిష్ఠలకు సంబంధించినది కావడంతో రాజు అంగీకరించాడు. ‘మహారాజా! ఈ యువకుల్లో వీడు సూర్యుడు, వాడు చంద్రుడు. ఈ ఇద్దరిలో ఒకడు మాత్రమే నా కుమారుడు. వారిని పలకరించకుండా నా కుమారుడు ఎవరో చెప్పగలరా?’ అని అడిగాడు. రాజు సభవైపు చూశాడు. ఏ ఒక్కరూ ముందుకు రాకపోవడంతో మంత్రి వైపు చూశాడు. మంత్రి ఆ యువకులను తన దగ్గరకు పిలిచి, కరచాలనం చేసి, వారి చేతులను తన చేతుల్లోకి తీసుకుని జాతకం చూసే వారిలాగా పరిశీలించి .. వాళ్ల స్థానాల్లోకి తిరిగి పంపించేశాడు. ‘సుమంతా! వీరిలో సూర్యుడు నీ కుమారుడు’ అన్నాడు మంత్రి.‘మహామంత్రీ.. మీరు చెప్పింది సరైన సమాధానం. ఈ ఇద్దరిలో ఒకరికి తల్లి లేదు. చిన్నప్పుడే చనిపోయింది. తల్లి లేని వారెవరో చెప్పగలరా?’ అడిగాడు సుమంతుడు. ‘సుమంతా! నీ కుమారుడు సూర్యుడే తల్లి్లలేని బిడ్డ’ చెప్పాడు మంత్రి.‘మీ సమాధానం సరైనదే. ఈ ఇద్దరిలో ఒకరు వైద్యరంగంలో, మరొకరు విలువిద్యలో ఆరితేరారు. ఎవరు ఏ విద్య నేర్చుకున్నారో చెప్పగలరా?’ అడిగాడు సుమంతుడు.మంత్రి చిరునవ్వు నవ్వి ‘సుమంతా! నీ కుమారుడు సూర్యుడు విలువిద్య, చంద్రుడు వైద్యవిద్య నేర్చుకున్నారు’ అని చెప్పాడు.‘మంత్రివర్యా! మీరు చెప్పింది సరైనదే. వీరిలో ఒకరికి మాత్రమే వివాహమయింది. ఎవరికో చెప్పగలరా?’అని మరో ప్రశ్న అడిగాడు. ‘సుమంతా! మీ కుమారుడికి వివాహమయింది’ అన్నాడు మంత్రి.సుమంతుడు తన ఓటమిని అంగీకరించి పదివేల వరహాలు మంత్రి చేతిలో పెట్టాడు. మంత్రి ఆ వరహాలను సుమంతుడికే తిరిగి ఇస్తూ మరో పదివేల వరహాలతో సత్కరించి పంపాడు.మంత్రితో రాజు ‘మంత్రివర్యా! నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. మీరు సరైన సమాధానాలు ఎలా చెప్పగలిగారు?’ అని అడిగాడు. సభాసదులందరూ మంత్రి మాటల కోసం చెవులు రిక్కించారు. ‘మహారాజా! ఆ యువకుల చేతులను ఒక్క నిమిషం పరిశీలించి పంపాను కదా! సూర్యుడి చేతిపై సుమంతుడి పేరు చిన్న అక్షరాల్లో పచ్చపొడిచి ఉంది. దాంతో సుమంతుడి కొడుకు అతడే అని గ్రహించాను. చేతిపై తండ్రి పేరు మాత్రమే ఉంది కాబట్టి తల్లి చిన్నతనంలోనే చనిపోయి ఉంటుందని భావించాను. విలువిద్య నేర్చినవారు వింటినారి లాగి అనేక బాణాలు సంధించడం వల్ల చూపుడువేలు, బొటనవేలు భాగాలు కంది ఉంటాయి. సూర్యుడి చేతివేళ్లు అలా ఉండడం చూశాను కాబట్టి సూర్యుడే విలువిద్య నేర్చుకున్నాడని, చంద్రుడు వైద్యవిద్య నేర్చుకున్నాడని గుర్తించాను. సూర్యుడి చిన్నతనంలోనే తల్లి చనిపోవడంతో ఆ ఇంట్లో ఆడవారు లేకుండాపోయారు. కాబట్టి సూర్యుడికి వయస్సు రాగానే వివాహం చేసి ఉంటారని గ్రహించాను’ అంటూ వివరించాడు మంత్రి.‘చేతిపై పేరు లేకుంటే ఎలా గుర్తించేవారు?’ అడిగాడు రాజు. ‘అదేముంది మహారాజా! చాలా కుటుంబాల్లో పెద్దల పేర్లు, పిల్లల పేర్లు వారు నమ్మిన దైవం పేరులోని మొదటి అక్షరంతో ఉంటాయి. అలా పెట్టుకోవడం విశ్వాసం. ఇక్కడ తండ్రి పేరు సుమంతుడు, కనుక కొడుకు పేరులో మొదటి అక్షరం ‘సు’ ఉండాలి. కాబట్టి సుమంతుడి కొడుకు సూర్యుడని గ్రహించేవాడిని. మంత్రి సునిశిత పరిశీలనకు, నేర్పుకు రాజు ఆశ్చర్యచకితుడై అభినందించాడు. సభాసదులు హర్షధ్వానాలు చేశారు. ∙డి.కె.చదువులబాబు -
బుల్లి డిజైనర్ బ్రూక్...
స్కూల్ ఫ్యాన్సీ డ్రెస్ పోటీలను ఆ అమ్మాయి ఫ్యాషన్ షోగా భావించేది. పోటీదారులకు దుస్తుల డిజైనింగే కాదు స్టయిలింగ్ కూడా చేసేది! ఫ్యాషన్ మీద ఆమెకున్న ఇష్టాన్ని అమ్మ, అమ్మమ్మ కూడా గుర్తించి, ప్రోత్సహించడంతో అతి చిన్న వయసులోనే పలువురు మెచ్చే ఫ్యాషన్ డిజైనర్‌గా మారింది! బ్రాండ్నీ క్రియేట్ చేసింది! ఆ లిటిల్ స్టయిలిస్టే బ్రూక్ లారెన్ సంప్టర్.బ్రూక్ లారెన్ సంప్టర్ చిన్నప్పటి నుంచి దుస్తులు, నగలు, పాదరక్షలు.. ఏవైబుల్లి డిజైనర్ బ్రూక్...నా సరే తనకిష్టమైనవే వేసుకునేది. బర్త్‌డేలు, పండుగలప్పుడే కాదు మామూలు రోజుల్లోనూ అదే తీరు! ఇంకా చెప్పాలంటే నైట్ గౌన్స్ పట్ల కూడా శ్రద్ధ చూపేది. ఈ తీరును మొదట్లో వాళ్లమ్మ ఎర్రిస్ ఆబ్రీ.. కూతురి మొండితనంగా భావించింది. కానీ రెండేళ్ల వయసు నుంచే బ్రూక్ తనకి స్టయిలింగ్‌లో సలహాలు ఇవ్వటం, ఫ్రెండ్స్ కోసం పిక్నిక్ టేబుల్, ఫ్లవర్ పాట్స్, గిఫ్ట్ బాక్స్‌ను డిజైన్ చేయడం వంటివి చూసి.. కూతురిలో ఈస్తటిక్ సెన్స్, క్రియేటివిటీ మెండు అని గ్రహించింది. బ్రూక్ చూపిస్తున్న ఆసక్తిని ఆమె అమ్మమ్మా గమనించి మనమరాలికి దుస్తులు కుట్టడం నేర్పించింది. దాంతో స్కూల్ నుంచి రాగానే ఫ్యాబ్రిక్‌ని ముందేసుకుని డిౖజñ న్ చేయడం మొదలుపెట్టేది. అలా కేవలం ఐదేళ్ల వయసులోనే బ్రూక్ తన మొదటి ఫ్యాషన్ షోను నిర్వహించింది. దాని ద్వారా వచ్చిన డబ్బుతో రెండు కుట్టుమిషన్లను కొనిపించుకుంది. అమ్మా, అమ్మమ్మను తన అసిస్టెంట్లుగా పెట్టుకుంది. వందకు పైగా డిజైన్స్‌ను క్రియేట్ చేసేసింది. అవి ఆమెకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపును తెచ్చిపెట్టాయి. 2022 చిల్డ్రన్ అండ్ ఫ్యామిలీ ఎమ్మీ అవార్డు వేడుక కోసం ప్రముఖ రచయిత, వ్యాపారవేత్త, నటి తబితా బ్రౌన్కి బ్రూక్ సంప్టర్ ఒక అందమైన గౌన్‌ను డిజైన్ చేసింది. దీంతో ఎమ్మీ వేడుకల కోసం దుస్తులను డిజైన్ చేసిన అతి పిన్న వయస్కురాలిగా బ్రూక్ చరిత్ర సృష్టించింది. అంతేకాదు. బార్బీ సంస్థకు బేస్ బాల్ బార్బీ, ఫొటోగ్రాఫర్ బార్బీ అనే రెండు థీమ్ డిజైన్స్‌నూ అందించింది. ఈ మధ్యనే తన పేరు మీద ‘బ్రూక్ లారెన్’ అనే ఫ్యాషన్ బ్రాండ్‌నూ స్థాపించింది. ఇప్పుడు ఆ బ్రాండ్ టర్నోవర్ కోటి డాలర్లకు (రూ.84 కోట్లు) పైమాటే! చిన్నపిల్లల కోసం ఈ బ్రాండ్.. చక్కటి దుస్తులను డిజైన్ చేస్తోంది. ఇవి ఎంత ఫ్యాషనబుల్‌గా కనిపిస్తాయో అంతే కంఫర్ట్గానూ ఉంటాయి. అదే బ్రూక్ ‘బ్రాండ్’ వాల్యూ! కొన్ని నెలల కిందటన్ బ్రూక్ ‘టామ్రాన్ హాల్’ షోలోనూ కనిపించింది. అందులో తన డిజైన్స్, ఫ్యాషన్ పరిశ్రమలో తనకెదురైన అనుభవాలు, సాధించిన విజయాలను వివరించింది. కలను సాకారం చేసుకోవడానికి కావాలసింది పట్టుదల అని, లక్ష్య సాధనలో వయసు ఏ రకంగానూ అడ్డు కాదని నిరూపించింది బ్రూక్ లారెన్. స్కూల్ ఫ్యాన్సీ డ్రెస్ పోటీల్లో గెలవటం కంటే ఆడియన్స్ నా డిజైన్స్‌ను చూసి, కేరింతలతో ఇచ్చే ప్రశంసలే నాకు ఉత్సాహాన్నిస్తాయి. అందుకే ఆ పోటీల్లో నాతో పాటు నా ఫ్రెండ్స్‌కీ డ్రెసెస్ డిజైన్ చేసేదాన్ని.– బ్రూక్ లారెన్ సంప్టర్ -
Manasvi Kottachi: బేబీ మనస్వి
వారసత్వంగా పరిచయమై కొంతమంది పేరు తెచ్చుకుంటే.. మరి కొంతమంది తమ ప్రతిభతో కుటుంబానికి వన్నె తెస్తారు. అలాంటి వారిలో బాల నటి మనస్వి కొట్టాచ్చి ఒకరు. చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి ఎంటరై, తండ్రికే పోటీ ఇచ్చి, వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. ఈ లిటిల్ స్టార్ గురించి∙ కొన్ని విషయాలు..⇒ నాన్‌వెజ్ అంటే చాలా ఇష్టం. రకరకాల నాన్‌వెజ్ ఐటమ్స్ తినొచ్చనే నాన్నతో కలిసి షూటింగ్స్‌కు వెళ్లేదాన్ని. కానీ ఇప్పుడు అలా కాదు నటనపై ఇష్టం, ప్రేమతో పాటు సీరియస్‌నెస్ కూడా పెరిగింది.– మనస్వి కొట్టాచ్చి.⇒∙చెన్నైలో పుట్టి, పెరిగిన మనస్వి తమిళ హాస్య నటుడు కొట్టాచ్చి కుమార్తె. కొట్టాచ్చి తమిళ సినీరంగంలో మంచి గుర్తింపు పొందాడు.⇒ తనకు ఊహ తెలిసినప్పటి నుంచి సినీ ప్రపంచంలోనే ఉంది మనస్వి. మూడేళ్ల వయసులో ‘సూపర్ డాడీ’ టీవీ షో ద్వారా తొలిసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది.⇒ చెన్నైలో పుట్టి, పెరిగిన మనస్వి తమిళ హాస్య నటుడు కొట్టాచ్చి కుమార్తె. కొట్టాచ్చి తమిళ సినీరంగంలో మంచి గుర్తింపు పొందాడు.⇒ఈ చిన్నారి నటనకు ముచ్చటపడిన మలయాళ చిత్రపరిశ్రమా చక్కటి అవకాశాలను ఇచ్చింది. అందులో ఒకటే ‘మై శాంటా’ మూవీ. ఇందులో ఆమెది ప్రధాన పాత్ర. శ్రీమణి దర్శకత్వంలో తెరకెక్కుతున్న హారర్ చిత్రం ‘కన్మణి పాప’లోనూ ముఖ్య భూమికే! ⇒ తర్వాత ‘ఇమైక్క నొడిగళ్’ అనే చిత్రం ద్వారా బాలనటిగా సినీరంగ ప్రవేశం చేసింది. ఇందులో నయనతార కుమార్తెగా నటించింది. ఇది ఆమెకు మంచి గుర్తింపు తెచ్చింది. ఆపై ‘దర్బార్’, ‘మామణిదన్’, ‘చంద్రముఖి–2’ వంటి సినిమాల్లోనూ నటించింది.⇒మనస్వి నటించిన ‘మామణిదన్’ను ఢిల్లీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించారు. దాని ఫలితంగా మనస్వికి బాలీవుడ్‌లోనూ చాన్స్ వచ్చింది. ఆమె నటించిన హిందీ సినిమా ‘బేబీ కాజల్’ విడుదలకు సిద్ధంగా ఉంది. -
పిల్లలూ దేవుడూ చల్లని వారే
పాటలు హీరో, హీరోయిన్ల సొంత సొత్తు కాదు. ఒకప్పుడు సినిమాల్లో పిల్లల పాత్రలు ఉండేవి. వారికి పాటలు ఉండేవి. పిల్లలు కథను నడిపించేవారు. పాటలు పాడి కథను నిలబెట్టేవారు. పిల్లల పాటల కోసం సినిమాలు హిట్ అయిన సందర్భాలున్నాయి. పిల్లల పాటలతో స్టార్స్ అయిన బాల నటీనటులు ఉన్నారు. కాని నేటి సినిమాల్లో పిల్లల పాటలు కనుమరుగయ్యాయి. వారి గొంతును వినపడనివ్వడం లేదు.పిల్లల పాట మళ్లీ బతకాలి. పిల్లల పాత్ర మళ్లీ నిలవాలి.‘లేరు కుశలవుల సాటి...సరి వీరులు ధారుణిలో’....‘లవ కుశ’లో లవుణ్ణి, కుశుణ్ణి చూడటానికి పల్లెల నుంచి జనం బండ్లు కట్టుకుని వచ్చేవారు. వారి నోటి నుంచి రామాయణ గాథను పాటలుగా విని పరవశించి పోయేవారు. ఉద్వేగంతో ఆనందబాష్పాలు రాల్చేవారు. పెద్దలు రామాయణం చెప్తేనే ఎంతో రుచిగా ఉంటుందే, మరి పిల్లలు చెప్తే ఇంకెంత రుచి!శ్రీ రాముని చరితమును తెలిపెదమమ్మా!ఘన శీలవతి సీత కథ వినుడోయమ్మా!చెప్పాలంటే మనవాళ్లు చాలా గొప్పోళ్లోయి! ఏమంటే 1934లోనే లవకుశ తీశారు. అందులోని బాలనటులను, వారి పాటలను చూసి డబ్బులు కుమ్మరించారు. దాంతో దర్శకుడు సి.పుల్లయ్య పిల్లలు ప్రధాన పాత్రలుగా అంటే పిల్లలే అన్ని పాత్రలు చేసేలా ‘సతీ అనసూయ’ (1936) సినిమా తీసి దాంతో పాటు మరో పిల్లల సినిమా ‘ధ్రువ విజయం’ తీసి ఒకే టికెట్ మీద ఈ రెండు సినిమాలు ప్రదర్శించి రికార్డు స్థాపించారు. ఇలా మరో భాషలో జరగలేదు. ఈ విషయం మనవారు ప్రచారం చేసుకోరు. అన్ని పాత్రలను బాలలే ధరించిన సినిమాను దేశంలో తొలిగా తీసింది మనమే.చిన్నప్పుడు పెద్దప్పుడు:పాఠకులు ప్రేక్షకులుగా మారుతున్న కాలం. చదివే కథ నుంచి చూసే కథకు మారాలంటే వారికి ‘సినిమా’ అనే మీడియం మెల్లగా అలవాటు చేయాలి. అందుకని దర్శకులు కథను మెల్లగా చెప్పేవారు. కథానాయిక, నాయకుల జీవితాన్ని బాల్యం నుంచి మొదలుపెట్టి వారు పెద్దయ్యాక ఏం జరుగుతుందో చూపేవారు. అందువల్ల నాటి సినిమాల్లో పిల్లల పాత్రలు తప్పనిసరిగా ఉండేవి. ‘మల్లీశ్వరి’ సినిమాలో చిన్నప్పటి ఎన్టీఆర్, చిన్నప్పటి భానుమతిగా నటించిన మాస్టర్ వెంకటరమణ, బేబీ మల్లిక –‘రావిచెట్టు తిన్నె చుట్టు రాతి బొమ్మలు చెక్కాలోయ్మంచి బొమ్మలు చెక్కాలోయ్ నీ మల్లి బొమ్మలు చెక్కాలోయ్’అని పాడుకుంటే చూడటం ముచ్చటగా ఉంటుంది. మరి ఇవాళ రావిచెట్టు ఎంతమంది పిల్లలకు తెలుసో, తిన్నె అనే మాట ఎంతమంది పిల్లలకు అర్థమవుతోందో!అక్కినేని ‘దేవదాసు’లో చిన్నప్పటి దేవదాసు, చిన్నప్పటి పార్వతి పాడుకుంటారు. స్కూల్ ఎగ్గొట్టి తిరిగే దేవదాసును పార్వతి ఆ పాటలో ఆట పట్టిస్తుంది.‘ఓ దేవదా.. చదువు ఇదేనాఅయ్యవారు నిదరోతే తమరు ఇలాగే దౌడుదౌడా’...ఇక నేటికీ నిలిచి వెలుగుతున్న ‘నిదురపోరా తమ్ముడా’ పాట సంతానంలో రెండు సందర్భాల్లో వస్తుంది. ఒకటి చిన్నప్పుడు, ఒకటి పెద్దప్పుడు. చిన్నప్పటి పాటలో లతా మంగేశ్కర్ మూడు చరణాలు పాడితే, పెద్దప్పటి పాటలో ఒక చరణం ఘంటసాల పాడారు. చిన్నప్పటి పాటలో లతా–‘కలలు పండే కాలమంతా కనుల ముందే కదిలిపోయేలేత మనసుల చిగురుటాశ పూతలోనే రాలిపోయే నిదురపోరా తమ్ముడా’... అని పాడుతుంటే కలత నిద్రలతో బతుకుతున్న వారంతా కన్నీరు కారుస్తారు.బొమ్మల పెళ్లి:నాటి సినిమాలు పిల్లల్నే కాదు పిల్లల ఆటపాటల్ని కూడా పట్టించుకున్నాయి. అప్పటి పిల్లలకు బొమ్మల పెళ్లి చేయడం ఒక పెద్ద సరదా. ఈ బొమ్మల పెళ్లిళ్లు పిల్లల మధ్య నిజం పెళ్లిళ్లుగా మారి కథలు మలుపు తిరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. అసలు వీడియో గేమ్‌లు ముంచెత్తే ఈ రోజుల్లో పిల్లలు బొమ్మలు అనే మాట ఎత్తడం లేదు. పెద్దలు కూడా సెల్‌ఫోన్ నే బొమ్మగా చేతిలో పడేస్తున్నారు. బొమ్మలు పిల్లలకు నేస్తాలు. వాటినే సర్వస్వంగా భావించి ఆలనా పాలనా చూసి పెళ్లిళ్లు చేసేవారు పిల్లలు. ‘కన్యాశుల్కం (1955)’లో బొమ్మల పెళ్లి కోసం పిల్లలు పాడే పాట చాలా బాగుంటుంది.చేదాము రారే కల్యాణము... చిలకా గోరింక పెళ్లి సింగారము...‘మాంగల్యబలం’ (1959)లో పిల్లలు పాడే బొమ్మల పెళ్లి పాట వైవాహిక జీవితానికి ఒక వ్యాఖ్యానం లాంటిది. ఈ పాటను శ్రీశ్రీ రాశారంటే కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది. ఇంత సంప్రదాయ భావనలను ఇంత బాగా ఎలా రాశాడా అని.హాయిగా ఆలుమగలై కాలం గడపాలివేయేళ్లు మీరనుకూలంగా ఒకటై బతకాలి...తర్వాతి రోజుల్లో అక్కినేని పక్కన హీరోయిన్ గా ‘ప్రేమాభిషేకం’ వంటి సూపర్‌హిట్‌ను సాధించిన శ్రీదేవి బాలనటిగా అదే అక్కినేని ‘శ్రీమంతుడు (1971)’ లో బొమ్మల పెళ్లి పాట పాడింది. అంత చిన్న వయసులో ఆమె ఎక్స్ప్రెషన్ ్స చూడాలి ఇప్పుడైనా. భలే ఉంటాయి. మరి పాటో?చిట్టిపొట్టి బొమ్మలు చిన్నారి బొమ్మలుబుల్లిబుల్లి రాధకు ముద్దుముద్దు రాజుకుపెళ్లండీ పెళ్లి ముచ్చటైన పెళ్లిమర్యాదలు చెప్తూ... అల్లరి చేస్తూ:పిల్లలు అల్లరి చేస్తే ముద్దు. అలాగే వారు బుద్ధిమంతులుగా ఉంటే మరీ ముద్దు. అల్లరి చేయడం పిల్లల హక్కు అనేది మర్చిపోయి, ఇవాళ వాళ్లను ఊపిరి సలపని హాస్టళ్లలో పడేసి తెగ తోమిస్తున్నారు తల్లిదండ్రులు. పరీక్షల భయం ఇవాళే కాదు ఆవాళ కూడా ఉంది. అందుకే ‘పెళ్లి చేసి చూడు’ (1952)లో స్టేజి నాటకంలో చిన్నారి బాలుడు పరీక్షలు ఎగ్గొట్టడానికి దొంగ కడుపునొప్పి తెచ్చుకుని పాడే పాట అల్లరి... చాలా వల్లరి.అమ్మా నొప్పులే అమ్మమ్మ నొప్పులేఫస్టుక్లాసులో పాసవుదామని పట్టుబట్టి నే పాఠాల్ చదివితేపరీక్షనాడే పట్టుకున్నదే బడికెట్లా నే వెళ్లేదే?ఇలా అల్లరి చేసే పిల్లలే సుద్దులు కూడా చెబుతారు. కె.వి.రెడ్డి తీసిన ‘దొంగరాముడు’ అల్లరి చేసే చిన్న అక్కినేనికి, చిన్న సావిత్రి సుద్దులు చెబుతుంది. ఎలా మసలుకోవాలో హితబోధ చేస్తుంది.తెలిసిందా బాబూ ఇపుడు తెలిసిందా బాబు అయవారు తెలిపే నీతులు ఆలించకపోతే వాతలే...కె.విశ్వనాథ్ తొలి సినిమా ‘ఆత్మగౌరవం’లో ఆయన ఎంత మంచి పాట పెట్టారంటే ఇంటికి వచ్చిన అతిథులను ఆ ఇంటి పిల్లలు ఎలా గౌరవించి ఆహ్వానించాలో అందులో ఉంటుంది. ఇంటి సంస్కారం పిల్లల ప్రవర్తనలోనే తెలుస్తుంది. ఇవాళ ఇంటికి బంధువులొస్తే పిల్లలు పలకరించనైనా పలకరించట్లేదు– నమస్కారం పెట్టే సంగతి తర్వాత. అంతే కాదు తమ గదుల్లోకి వెళ్లి తలుపులు వేసుకుంటున్నారు. తల్లిదండ్రులు వారిని అందుకు ఎంకరేజ్ చేస్తున్నారు. కాని ఆత్మగౌరవంలో రేలంగి, గుమ్మడి అతిథులుగా వస్తే పిల్లలు ఎంత బాగా పాడతారో!మారాజులొచ్చారు మహరాజులొచ్చారు మా ఇంటికొచ్చారుమామంచి వారంట మనసున్న వారంట మాకెంతో నచ్చారు...భక్తి... దైవభక్తి:పిల్లలకు దేవుడు మంచి స్నేహితుడు. పిల్లలు దేవుని మీద సందేహం లేని భక్తి పెట్టుకుంటారు. పిల్లల ద్వారా భక్తిని చెప్పేందుకు ‘యశోదకృష్ణ’, ‘భక్త ప్రహ్లాద’, ‘భక్త ధ్రువ మార్కండేయ’లాంటి సినిమాలు వచ్చి ప్రజాదరణ పొందాయి. ‘యశోదకృష్ణ’తో శ్రీదేవి, ‘భక్త ప్రహ్లాద’తో రోజా రమణి పెద్ద స్టార్స్ అయ్యారు. ‘భక్త ప్రహ్లాద’లో ప్రహ్లాదుడు పాడిన పాటలు హిట్.నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనంమరోపాట–జీవము నీవే కదా...నేటికీ నిలిచి ఉన్నాయి.ఇక ‘లేత మనసులు (1966)’తో స్టార్ అయిన ‘కుట్టి పద్మిని’ పాడిన ఈ పాట 60 ఏళ్ల తర్వాత కూడా చల్లదనాన్ని కురిపిస్తూనే ఉంది.పిల్లలూ దేవుడూ చల్లని వారేకల్లకపటమెరుగని కరుణామయులే...‘మూగనోము’లో–తల్లివి నీవే తండ్రివి నీవేచల్లగ కరుణించే దైవము నీవే....సంభ్రమం... సందేహం:పిల్లలకు సందేహాలు జాస్తి. అలాగే ప్రతిదానికీ వారు వింత పడతారు. ఇప్పటి పిల్లల్లా అన్నీ గుగుల్ ద్వారా తెలుసుకొని నిమ్మళంగా ఉండిపోరు. పెద్దలను విసిగించేవారు. అలా పిల్లలకూ పెద్దలకూ ఒక సంభాషణ జరిగేది. ‘బాలరాజు కథ’లో ఈ పాట చూడండి–అడిగానని అనుకోవద్దు చెప్పకుండా దాటేయొద్దుఏమిటీ రహస్యం స్వామి ఏమిటీ విచిత్రంఆ రోజుల్లో ఫోన్ ఒక వింత. ఇంట్లో ఫోన్ ఉండటం ఒక హోదా. ఇరుగింటి పొరుగింటి వారికి అది పి.పి. నంబర్. ఇంట్లో పిల్లలకు ‘ట్రింగ్ ట్రింగ్’మన్నప్పుడల్లా సరదా. ఫోన్ రాకపోయినా రిసీవర్ చెవిన పెట్టుకుని మాట్లాడతారు. పాట పాడతారు ‘బడి పంతులు’లో బుల్లి శ్రీదేవి పాడింది.బూచాడమ్మ బూచాడు బుల్లి పెట్టెలో ఉన్నాడుకళ్లకెపుడు కనపడడు కబురులెన్నో చెబుతాడు...అనుబంధాల పాట:పెద్దవాళ్ల సమస్యలు పిల్లలకూ కష్టాలు తెస్తాయి. పిల్లలు చలించిపోతారు. ఆ అనుబంధాల కోసం పరితపిస్తారు. తమ లోపలి భావాలను పాట ద్వారా చెబుతారు. తల్లిదండ్రులను కోల్పోయి చెల్లెలితో మిగిలిన అన్న పాడే ఈ జోలపాట ఎంత ఆర్ద్రమైనది... ‘చిట్టి చెల్లెలు’లో.అందాల పసిపాప అన్నయ్యకు కనుపాపబజ్జోవే... బుజ్జాయి... నేనున్నది నీ కొరకే...నీకన్నా నాకెవరే...‘భార్యాబిడ్డలు’ సినిమాలో కన్నతండ్రయిన అక్కినేనిని దూరం చేసుకుని అతణ్ణి వెతుకుతూ వీధుల్లో తిరుగుతూ అతడి పిల్లలు పాడే పాట... ఇందులో కూడా శ్రీదేవి ఉంది...చక్కనయ్యా చందమామ ఎక్కడున్నావునీవు లేక దిక్కులేని చుక్కలయ్యాముఎక్కడైనా తల్లిదండ్రులు పిల్లలకు జోకొడతారు. కాని ‘రాము’లో తల్లిదండ్రులకు జోకొడుతూ చిన్నారి కొడుకు పాడే పాట హిట్.పచ్చని చెట్టు ఒకటి వెచ్చని చిలుకలు రెండుపాటలు పాడి జోకొట్టాలి జోజోజో...ఇక పిల్లలకు ఫ్రెండ్స్ అంటే ఇష్టం కదా. స్నేహంలో వారికి అంతరాలు ఉండవు, అభిమానం తప్ప! అందుకే స్నేహాన్ని నిర్వచిస్తూ ‘బాల మిత్రుల కథ’లోని ఈ పాట గొప్పగా ఉంటుంది.గున్నమామిడి కొమ్మ మీద గూళ్లు రెండున్నాయిఒక గూటిలోన రామచిలకుంది ఒక గూటిలోన కోయిలుంది...పాపం పసివాడు:ఒక పాట... అమ్మానాన్నల కోసం తప్పి పోయిన పిల్లవాడు పరితపిస్తూ పాడే పాట సినిమాను సూపర్‌హిట్ చేయగలదు. ‘లాస్ట్ ఇన్ ద డెజర్ట్’ అనే ఇంగ్లిష్ సినిమా ఆధారంగా తెలుగులో తీసిన ‘పాపం పసివాడు’ సినిమా చూసిన మహిళా ప్రేక్షకులు కన్నీరు మున్నీరయ్యారు. కారణం తప్పిపోయిన పిల్లాడిలో తమ పిల్లల్ని చూసి ఇలాంటి పరిస్థితి వస్తే అనుకోవడమే. మాస్టర్ రాము నటించిన ఈ పాట ఆత్రేయ రాసిన తేలిక మాటల పాట పిల్లల భావోద్వేగాన్ని గొప్పగా చూపుతుంది.అమ్మా చూడాలి... నిన్నూ నాన్నను చూడాలినాన్నకు ముద్దులు ఇవ్వాలి నీ ఒడిలో నిద్దుర పోవాలి...అంజలి అంజలి అంజలి:ఆ తర్వాత కూడా పిల్లల పాత్రలు, వారి పాటలు కొనసాగాయి. ‘బాల భారతం’ తీశారు. టి.కృష్ణ ‘రేపటి పౌరులు’ సినిమా తీశారు. ‘మణిరత్నం ‘అంజలి’ తీసి హిట్ కొట్టారు. గుణశేఖర్ ‘బాల రామాయణం’ తీశారు. ‘లిటిల్ సోల్జర్స్’ పిల్లల కోసం తీసిన చివరి హిట్ సినిమాగా నిలిచింది. ‘స్వాతి కిరణం’లో మాస్టర్ మంజునాథ్ బాల సంగీతకారుడుగా ‘ఆనతినియ్యరా హరా’...లాంటి క్లాసిక్ ఇచ్చాడు. ‘మనసంతా నువ్వే’ సినిమాలోని ‘తూనీగా... తూనీగా’ పాట ఇంటింటి పాటైంది. ‘అమ్మ రాజీనామా’, ‘దేవుళ్లు’ తదితర చిత్రాల్లో పిల్లలు పాటలు పాడి మెప్పించారు.అయితే ఆ తర్వాత ఫ్యాక్షన్ సినిమాలు వచ్చి తొడ గొట్టే పిల్లలు, కత్తి పట్టే పిల్లలు వచ్చారు. ఇవాళ టీవీల నిండా పిల్లలు అశ్లీల నృత్యాలు చేసే పెద్దల పాటలే తప్ప పిల్లల పాటలంటూ లేకుండా పోయాయి. కనీసం పిల్లలతో పాటు పెద్దలు పాడే పాటలైనా.పిల్లల పాటలు మళ్లీ బతకాలని కోరుకుందాం.ముద్దు ముద్దు నవ్వు... బజ్జోమ్మ నువ్వుతెలుగు సినిమాల్లో పిల్లలు తాముగా పాటలు పాడితే పిల్లల కోసం పెద్దలు తమంతట తాముగా పాడిన పాటలు చాలా ఉన్నాయి. అందరూ ఇష్టపడేవి ఉన్నాయి. ఆ పాటలు ఇప్పటికీ వినపడుతూనే ఉన్నాయి. ‘బంగారు పాప’లో ఎస్వీ రంగారావు అంతటి నిలువెత్తు మనిషి ఒక చిన్నారి పాపను చూసి పాడే ‘తాధిమి తకధిమి తోల్బొమ్మ’ పాట ఎందరికో ఇష్టం. ఆర్ద్రమయం. ‘ఖైదీ కన్నయ్య’లో ‘ఈ నిజం తెలుకో తెలివిగా నడుచుకో’ ఇప్పుడు కూడా ప్రతి బాలబాలికలకు బోధ చేసే గీతం. తర్వాతి రోజుల్లో ‘మంచి మనుషులు’లో శోభన్‌బాబు పాడిన ‘ఇది నా మాట విన్నావంటే జీవితమంతా పువ్వుల బాట’ కూడా ఇదే కోవలో హిట్‌గా నిలిచింది. ‘పండంటి కాపురం’లో ‘బాబూ... వినరా అన్నాదమ్ముల కథ ఒకటి’ పాట పిల్లలకు అనుబంధాలు చెప్తే, ‘ఎదగడానికెందుకురా తొందరా ఎదర బతుకంతా చిందర వందర’ అని బాల్యాన్ని అనుభవించాల్సిన వయసులో భవిష్యత్తు గురించి కోచింగ్‌లు తీసుకుంటున్న నేటి బాలల కోసం అన్నట్టుగా ‘అందాల రాముడు’లో అక్కినేని పాడుతారు. ఇక పిల్లల పుట్టిన రోజులకు అందరూ పాడేవారే. ‘వెలుగు నీడలు’లో ‘చిట్టిపొట్టి చిన్నారి పుట్టిన రోజు చేరి మనం ఆడిపాడే పండుగరోజు’లో సావిత్రి హుషారుగా పిల్లవాడితో పాటు గెంతడం కనిపిస్తుంది. ‘బంగారు కలలు’లో ‘పుట్టిన రోజు జేజేలు చిట్టి పాపాయి’, ‘తాత మనవడు’లో మనవడిని పట్టుకుని అంజలీ దేవి ఉద్వేగంగా పాడే ‘ఈనాడే బాబూ నీ పుట్టిన రోజు’ గొప్ప ఆశీర్వాద వచనం. ఇక పిల్లలను బుజ్జగించే, ఊరడించే పాటలు సినిమాల్లో బోలెడు. గంభీరంగా ఉండే ఎన్.టి.ఆర్ కూడా పసిపిల్లాడిని చూసి ‘ఆడబ్రతుకు’లో ‘బుజ్జిబుజ్జి పాపాయి.. బుల్లిబుల్లి పాపాయి.. నీ బోసి నవ్వులలో పూచే పున్నవి వెన్నెలలోయి’ అని పాడతాడు. ఇదే పి.బి.శ్రీనివాస్ ‘ముద్దు ముద్దు నవ్వు బుగ్గల్లో రువ్వు జాజిమల్లె పువ్వు బజ్జొమ్మ నువ్వు’ పాట ‘సత్తెకాలపు సత్తెయ్య’లో చలం గొంతులో పాడతాడు. ఈ హీరో చలమే ‘సంబరాల రాంబాబు’లో చిన్నారి బాబుకు జోల పాడుతూ చందమామను సాయమడుగుతూ ‘మామా.. చందమామా.. వినరావా నా కథ’ అని అందుకుంటాడు. ‘జీవన తరంగాలు’లో శోభన్‌బాబు పాపకు జూ మొత్తం చూపుతూ ‘ఉడతా ఉడతా ఉచ్’ పాడటం రేడియో శ్రోతలు ఇప్పుడూ వింటారు. ‘స్వయంకృషి’లో చిరంజీవి ‘పారా హుషార్.. పారా హుషార్... తూరుపమ్మ ఉత్తరమ్మ పడమరమ్మ దక్షిణమ్మ పారా హుషార్’ అని పాడి వీపున కట్టుకున్న చిన్నారికి ఉల్లాసం కలిగిస్తాడు. ‘కలిసి పాడుదాం తెలుగు పాట కలిసి సాగుదాం వెలుగుబాట’ (బలిపీఠం), ‘భారత మాతకు జేజేలు బంగరుభూమికి జేజేలు’ (బడిపంతులు) అని పాడే ఉపాధ్యాయులు ఇప్పటి సినిమాల్లో ఎక్కడ? ఏమైనా ఆ రోజులే వేరు ఆ పాటలే వేరు. -
రామ్మా చిలుకమ్మా..
‘సత్యం సుందరం’ సినిమాలో అరవింద్ స్వామి.. ప్రతిరోజూ తమ ఇంటి టెర్రస్ మీద వందల కొద్ది చిలుకలకు దాణా వేస్తూ వాటితో ఆత్మీయానుబంధాన్ని అల్లుకుంటాడు! అలాంటి వ్యక్తులు రియల్ లైఫ్‌లోనూ ఉన్నారు. వాళ్లే నూర్‌బాషా బాబావలీ, లాల్‌బీ దంపతులు!ఆంధ్రప్రదేశ్, తెనాలిలోని గాంధీనగర్, ఎన్వీఆర్ కాలనీలో నివాసముంటారు నూర్‌బాషా బాబావలీ దంపతులు. వృత్తిరీత్యా నూర్‌బాషా టైలర్. తమ మేడ మీదకొచ్చి అరిచే కాకుల గుంపు కోసం నూర్‌బాషా భార్య లాల్‌బీ.. కాసిన్ని బియ్యం చల్లి.. ఓ గిన్నెలో నీళ్లనుంచడం మొదలుపెట్టింది. కాకులు ఆ దాణా తిని, నీళ్లు తాగి ఎగిరిపోయేవి. కొన్నాళ్లకు కొన్ని చిలుకలూ వచ్చి వాలాయి ఆ మేడ మీద.. ఇంచక్కా ఓ పక్క బియ్యం, మరోపక్క మంచి నీళ్లు కనిపించేసరికి సంతోషంగా బియ్యం గింజలు తిని, మంచినీళ్లు తాగి ఎగిరిపోయాయి. మర్నాడు మరిన్ని చిలుకలను వెంటబెట్టుకొచ్చి.. ఆ దాణాను ఆరగించసాగాయి. క్రమంగా అది వాటికి రోజువారీ కార్యక్రమం అయింది. వాటి సంఖ్యా వందల్లోకి పెరిగింది. ఒక్కపూట కాస్త రెండుపూటలకు మారింది. ప్రకృతి పంపుతున్న ఆ అతిథులను చూసి నూర్‌బాషా, లాల్‌బీ దంపతులు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. వాటికోసం ఉదయం, సాయంకాలం రెండుపూటలా దాణా చల్లుతూ చక్కటి ఆతిథ్యమివ్వసాగారు. క్రమంగా అది ఆత్మీయానుబంధంగా బలపడింది. ప్రతిరోజూ ఉదయం ఆరు నుంచి ఎనిమిది గంటల మధ్య, సాయంకాలం నాలుగు నుంచి ఆరు గంటల మధ్య చిలుకలు ఆ మేడ మీద వాలి.. దాణా తిని, నీళ్లు తాగి ఆకాశంలోకి ఎగిరిపోతాయి. కొన్ని చిలుకలు దాణా తింటున్నప్పుడు మరికొన్ని గుంపులు గుంపులుగా అక్కడున్న దండేల మీద, లేదంటే పక్కనే ఉన్న చెట్ల కొమ్మల మీద వేచి చూస్తుంటాయి. తమ వంతు రాగానే టెర్రస్ ఫ్లోర్ మీద వాలి విందును ఆరగిస్తాయి. ఏటా గురు పౌర్ణమి నుంచి కార్తీక పౌర్ణమి దాకా ఇలా ఆ చిలుకలు నూర్‌బాషా కుటుంబమిచ్చే ఆతిథ్యాన్ని స్వీకరిస్తాయి. అవి బియ్యం గింజల్ని తింటున్నప్పుడు నూర్‌బాషా కుటుంబీకులు కాక కొత్తవారెవరు కనిపించినా రివ్వున ఎగిరిపోతాయి. వీటి కోసం ఉదయం మూడు కిలోలు, సాయంత్రం రెండు కిలోల చొప్పున రోజుకు అయిదు కిలోల బియ్యాన్ని ఆహారంగా పెడుతోందా కుటుంబం. అంటే నెలకు 150 కిలోలు. చిలుకలను ఇంత ప్రేమగా ఆదరిస్తున్న నూర్‌బాషా, లాల్‌బీ దంపతులను చూసి ముచ్చటపడిన లాల్‌బీ స్నేహితురాలు అంజమ్మ .. నెలకు 20 కిలోల బియ్యాన్ని తన వంతు సాయంగా అందిస్తోంది. ‘ఇప్పుడు కాకులు, చిలుకలతోపాటు పావురాలు కూడా వచ్చి దాణా తినిపోతున్నాయి. కార్తీక పౌర్ణమి తర్వాత చిలుకల సంఖ్య బాగా తగ్గుతుంది. మళ్లీ గురు పౌర్ణమి నుంచి వాటి సంఖ్య పెరుగుతుంది. అలా కొన్ని వందల చిలుకలు మా మేడ మీద వాలుతుంటే భలేగా ఉంటుంది!’ – నూర్‌బాషా బాబావలీ. -
ఈ వారం కథ: టిఫిన్బాక్సుల నోము
‘అమ్మమ్మా.. ఎక్కడ వున్నావ్?’ అంటూ ఇంట్లోకి వచ్చి మా అమ్మ గదిలోకి దూరింది బిందు. మా మేనకోడలు. ఇంట్లో మా అమ్మ లేకపోయేసరికి గదిలో నుండి బయటకు వస్తూ ‘ఇదేంటి మామయ్యా ఈ బాక్స్ చాలా కొత్తగా వుంది.. చాలా వెరైటీగా కూడా వుంది?’ అంది మా అమ్మ గదిలోని కొత్త టిఫిన్‌బాక్స్‌ను చూపిస్తూ. ‘ఓహ్ అదా.. టిఫిన్బాక్స్ల నోము అనీ కొత్త కాన్సెప్ట్.. ఈ మధ్యే మా అపార్ట్మెంట్లో మామ్మలు మొదలుపెట్టిన కొత్త నోము. రోజూ ఈవెనింగ్ మాకు ఇది మాములే’ అన్నాను.‘టిఫిన్బాక్స్ల నోమా.. అదేంటి కొత్తగా? లక్ష పసుపు, గరిస ధాన్యం ఇలాంటి నోముల పేర్లు విన్నాను. కానీ ఈ టిఫిన్బాక్స్ల నోము ఏమిటి మామయ్యా ఎప్పుడు వినలేదు?’ అంది.నేను నవ్వుతూ ‘ఏముంది.. లేటెస్ట్గా మా అపార్ట్మెంట్లో మీ అమ్మమ్మ వాళ్ళ బ్యాచ్ వుంది కదా! వాళ్ళు కనుక్కున్న కొత్త నోము. ముసలమ్మలు అందరికీ ఆటవిడుపు. ఇంట్లో మీ అత్తలాంటి కోడళ్ళకు పని పొదుపు. దేముడిని బట్టి పాత నోములు. అవసరాన్ని బట్టి కొత్త నోములు. నోములలో ఎవల్యూషన్.. అదే నీ భాషలో చెప్పాలి అంటే కొత్త వర్షన్ అన్న మాట’ అన్నాను.‘ఇందులో ఏదో చిన్న తేడా కొడుతోంది.. నాకు డౌటే! ఇదేదో నీ స్కీమ్లాగే వుంది. డీటైల్డ్‌గా చెప్పు మామయ్యా..’ అంది బిందు ఆత్రుతతో.‘సరే.. ఎలాగూ మీ అమ్మమ్మ లేదు. పెదమామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళింది. కాబట్టి ఈ బాక్స్‌లో ఈరోజు వెరైటీ ఏముందో తింటూ మాట్లాడుకుందాం’ అంటూ బాక్స్ ఓపెన్ చేశాను.‘ఆలూ పరాఠా విత్ భేండీ కా సాలన్.. బై 506’ అని చిన్న పేపర్ మీద రాసిన స్లిప్‌తో పాటు 4 ఆలూ పరాఠాలు, కూర వేడిగా వుండటంతో నేనూ, బిందు ఒక పట్టుపట్టాం. ఎప్పుడూ వాళ్ళమ్మ వండే చపాతీ, బంగాళదుంపల కూర తినీ మొహం వాచిందో ఏమో నాలుగు పరాఠాల్లో మూడు తనే తినేసింది. నోము వెనుక కథ చెప్పేదాక వదల్లేదు. నాకూ ఆ టిఫిన్బాక్స్ల నోము వ్రత కథ పుట్టుకను వివరించక తప్పలేదు.కార్తిక మాసం, శనివారం.. తెల్లవారి 5.00 కావస్తోంది. చలి కాస్త ఎక్కువగా వుండడంతో నేను చాలా వేగిరంగా అడుగులు వేస్తున్నాను. ఇంకా 6 ప్రదక్షిణలు వున్నాయి. మొత్తం 9 అయితేనే శనీశ్వరున్ని దర్శించాలంట! నేను 5వ ప్రదక్షిణలో వుండగా ‘హే భగవాన్ నా కష్టాన్ని తీర్చు. నీకెలా చెప్పుకోవాలి.. నాదేమీ పెద్ద కష్టం కాదు. నా కోడలు మనసు మార్చు చాలు. లేదా నా చేయి బాగుచెయ్. నాకింకేమీ వద్దు. నా భర్తకు కడుపు నిండా ఇంత పెట్టలేని నా బతుకూ ఒక బతుకేనా? ఛ.. భగవాన్ నా కష్టాన్ని తీర్చు’ అంటూ ఒక ముసలి స్త్రీ మనసులో కోరుకుంటున్నాను అనుకుంటూ బయటకే మాట్లాడుతూ భక్తిగా ప్రదక్షిణలు చేస్తోంది.నేను ఆమెకు దారిచ్చి ‘ఎవరో పాపం’ అనుకుంటూ వెనుకకు తగ్గాను. అప్పుడే ఎవరో గుడి వరండాలో లైట్ వేయడంతో చూశాను. ఆవిడ మా అపార్ట్మెంట్లో కిందటేడాది వచ్చిన సిక్కుల మామ్మగారు. అయ్యో ఈవిడకు ఇన్ని కష్టాలా! చాలా మంచి ఫ్యామిలీ. వాళ్ళ అబ్బాయికి ఎదో బ్యాంకులో ఉద్యోగం అని విన్నాను. సర్లే తాటిచెట్టుకు కల్లు, కష్టాలు లేని ఇల్లు లేకుండా ఎక్కడైనా ఉంటాయా అనుకొని నా ప్రదక్షిణలు ముగించి నువ్వుల నూనె అభిషేకం కోసం కోవెలలోకి ప్రవేశించాను. లోపల కనీసం అయిదారుగురు ముసలమ్మలు మా అపార్ట్మెంట్ వాళ్ళే వున్నారు. నాకు ఆశ్చర్యం వేసింది. అందరినీ చిన్న నవ్వుతో పలకరించి నా పూజ ముగించి ఇంటి దారి పట్టాను.ఇంట్లో అమ్మ.. మా ఆవిడ పెట్టిన పెరుగన్నం తినకుండా, టిఫిన్‌బాక్స్‌లో మా చిన్నోడు వదిలేసిన రెండు ఇడ్లీలను తిని బ్రేక్ఫస్ట్ కానిచ్చింది. లోపల వంటగదిలో గిన్నెలు మాట్లాడుకుంటున్నాయి. ఏదో జరిగిందని నాకు చూచాయగా తెలుస్తోంది. ఎస్.. మా ఇంట్లో మ్యూజిక్ స్టార్ట్ అయింది. కాకపోతే ఇద్దరూ వాయించేది నన్నే! ఏం జరిగిందని ఎవరిని ముందు అడగాలో తెలియక ‘టిఫిన్ పెటు’్ట అన్నాను మా శ్రీమతితో.‘ఆవిడ వదిలిన అన్నం తినేయండి.. ఈ రోజు టిఫిన్ చేయలేదు. చేయను కూడా!’ వంటింట్లోంచి గిన్నెల శబ్దాల మధ్య నుంచే సమాధానం. అప్పుడప్పుడు మా ఆవిడ భీష్మ ప్రతిజ్ఞ సారీ మంగమ్మ శపథం చేస్తుంది.‘ఇదిగో చిన్నా.. మీ నాన్నకు ఈ పెరుగన్నం ఇవ్వరా’ అని మా అమ్మ, మా చిన్నోడికి హుకుం జారీచేసింది. మరికొంతసేపు వుంటే తుఫాను తీరం దాటేటట్టు వుందని, నాలుగు ముద్దలు పెరుగన్నం తిని చల్లగా ఆఫీస్‌కు జారుకున్నాను. ∙∙ ఆఫీస్‌లో అటెండర్ 11 గంటలకు టీతో పాటు ఒక పాంఫ్లెట్ కూడా ఇచ్చాడు. ‘టేస్ట్ అఫ్ ఇండియా’ న్యూ స్టార్టప్ అట. నలుగురు కుర్రాళ్ళు సాధించిన విజయం. కరోనా సమయంలో మార్కెట్లు, హోటళ్ళు తెరుచుకోనప్పుడు, ప్రజలంతా ఇళ్ళలోనే వివిధ రుచులకు యూట్యూబ్ ద్వారా అలవాటు పడినప్పుడు, వారు చదివింది ఏంబీఏ అయినా రోజుకో రాష్ట్ర రుచిని చాలా సింపుల్‌గా తక్కువ మొత్తానికి మన ఇంటికే అందించిన స్టార్టప్ అది. ఈ మధ్య మా ఆఫీస్‌లో చాలామంది దీని గురించి మాట్లాడుకోవడం చూశాను. ఇంట్లో క్యారేజ్ టైమ్‌కి అవకపోతే ఆర్డర్ ఇస్తే అర్ధగంటలో ఆఫీస్‌కే భోజనం, అలాగే స్కూల్ పిల్లలకు కూడా వారి స్కూల్‌కే మధ్యాహ్నం క్యారేజ్ పంపే సౌకర్యం. చెప్పానుగా ఈ రోజు నుంచి మా ఇంట్లో మా అమ్మకి, మా ఆవిడకి సంగీత సాధన అని, ఆ వాయిద్యం నేనే అని! అందుకే ఎలాగూ నాకు ఈ రోజు క్యారేజ్ లేదు. ఒకసారి ట్రై చేద్దామని ఆర్డర్ చేశాను.ఈరోజు తమిళనాడు ఫుడ్ అంట.. ఇంకేం సాంబార్ కన్ఫర్మ్ అనుకున్నా. సరిగ్గా ఒంటి గంటకి ఫుడ్ వచ్చింది. నేను ఊహించిన దానికన్నా చాలా బాగుంది. ఒక మనిషికి సరిగ్గా సరిపోతుంది. పైగా చివర్లో పెరుగు అన్నం కూడా ఇచ్చాడు. రోజూ మా ఆవిడ వంటలకు అలవాటుపడ్డ నాకు ఈ రోజు చిన్న రిలీఫే! సాయంత్రం ఇంటికి వెళుతూ ఎందుకైనా మంచిదని మల్లెపూలు, దగ్గు మందు రెండూ కొనుక్కెళ్ళా.మొదటిది మా ఆవిడ అడగనిది.. రెండోది మా అమ్మ మొన్నే అడిగినది!మా ఇంటి ముందు ఎప్పటిలాగే కారిడార్‌లో మీటింగ్ జరుగుతోంది.. మా చిన్నోడు దానిని ‘నానమ్మ అసెంబ్లీ’ అంటాడు. అది మా ఇంటి దగ్గర అవుతుంది కాబట్టి అందులో మా అమ్మ సీఎం అంట. మా ఎదురింటావిడ ఫుడ్ మినిస్టర్ అంట. మిగతా అందరికీ ఏవేవో మినిస్ట్రీలు ఇచ్చాడు. నిజమే.. ప్రతిరోజు సాయంత్రం నాలుగు నుంచి 7.30 వరకూ ఈ బామ్మల మీటింగ్ ఎందుకంటే ఏడున్నరకి అదేదో దీపం సీరియల్ వుంది. వీళ్ళకు అదే సభా వాయిదా మంత్రం.వారిని దాటి ఇంట్లోకి వెళ్ళానో లేదో మా ఆవిడ తన చేతిలోని చీపురును కిందపడేసి ‘బయట సభాప్రాంగణాన్ని, అదే మన కారిడార్‌ని మీటింగ్ అయిపోయిన తరువాత మీ అమ్మను తుడవమనండి. ఇల్లు అంతా తుడిచేశాను’ అంటూ విసురుగా బెడ్రూమ్లోకి వెళ్ళిపోయింది.‘ఏంటి ప్రాబ్లం?’ అని డైరెక్ట్‌గానే అడిగేశాను నేను తెచ్చిన మల్లెపూలను ఆమె చేతికిస్తూ! మా ఆవిడ ఆ ప్రశ్న కోసమే ఎదురుచూస్తున్నట్లు వెంటనే ‘ఆవిడగారికి రోజూ చపాతీలు చెయ్యాలట. దానికో కూర మళ్ళీ వేరేగా! మీరు, పిల్లలు చపాతీలు ఎప్పుడో గాని తినరు. కాబట్టి మీకొక కూర.. నా వల్ల కాదు బాబోయ్! ఒక్క రోజులో ఎన్ని వంటలు? నా బతుకంతా వంటిల్లే. కనీసం చపాతీ పిండి కలిపి సాయం చేసేవాళ్ళు లేరు. పోనీ మొన్న ఒక 6 చపాతీలు చేసి ఆ రోజు మూడు మీ అమ్మకు పెట్టి, మిగిలిన ఆ మూడిటిని నిన్న పెడితే ‘ఛీ.. ఛీ.. చల్లగా వున్నాయి. నేను తినను. ఇవి నాకొద్దు’ అంది. ప్రతిరోజూ చేయడం నా వల్ల కాదు. మీరా బయటి నుంచి తీసుకురారు. ఏదయినా అంటే కరోనా అంటారు. పోనీ ఆవిడను చేసుకోమంటే ‘సరే ఈరోజుకి అన్నం తినేసా’్త అంటుంది. అంటే కేవలం నాకు పని కల్పించడం కోసమేనా ఆవిడ వున్నది’ అంటూ దానవీరశూరకర్ణలో ఎన్టీఆర్ పెద్ద డైలాగ్‌లాగ ఆగకుండా చెప్పింది. నేనింకా ఉదయం తిన్న సాంబార్ రుచి గురించి చెప్పి, అలా చేయమందామని అడుగుదాం అనుకున్నా. ఈ పరిస్థితులలో అడగ గలనా? నో.. నెవర్! తెలివిగా మాట్లాడటమో లేక నోరు మూసుకుని కూర్చోవడమో ఎదో ఒకటి తెలిసివుండాలి అనే వాట్సాప్ సామెత గుర్తుకు వచ్చి నేను ఆ రెండో దానికే ఓటు వేశాను. రాత్రికి మా అమ్మకు టాబ్లెట్ ఇస్తూ ‘అమ్మా.. ఈరోజు గుడికి ఆ పంజాబీ అంటీ, మన అపార్ట్మెంట్లోని ఇంకొందరు బామ్మలు కూడా వచ్చారు’ అని చెప్పాను.‘ఓహ్ అదా! ఈ కార్తిక మాసంలో త్రయోదశి నాడు ఆ శనీశ్వరుని అభిషేకిస్తే కష్టాలన్నీ తొలగి పోతాయని ఎవరో స్వామిజీ సుశీలమ్మ గారికి చెప్పారట. ఆవిడ ఆ వీడియోను వాట్సాప్‌లో పంపారు. అందుకే అందరూ వెళ్ళారు. నేనే తెల్లవారి లేవలేక వెళ్ళలేదురా. అయినా నాకేం కష్టాలున్నాయని? నువ్వు వున్నావు కదరా చూసుకోవడానికి’ అంది. ప్రేమతో కూడిన రాగం అది.‘వాళ్లకు మాత్రం వచ్చిన కష్టమేంటమ్మా? పిల్లలు సెటిల్ అయ్యారు. పెళ్ళిళ్ళు చేశారు. ఇల్లూ వాకిలీ సమకూర్చుకున్నారు కదా’ అన్నాను.మా అమ్మ ఒక నవ్వు నవ్వి ‘వారిది కాసుల కష్టం కాదురా.. కడుపు కష్టం’ అంది. ‘కడుపు కష్టమా? అదేమిటమ్మా.. హయిగా అందరూ అన్నీ వండుకొని తింటున్నారు, లేకపోతే బయటి నుంచి తెప్పించుకొని మరీ తింటున్నారుగా’ అన్నాను.‘ఒరే బుజ్జీ.. మేము అన్నీ తినలేమురా! అందరికీ బీపీలు, షుగర్లు. మా తిండి వేరు, మా రుచులు వేరు. ఎదో రోజూ రాత్రి ఏడింటికి ఒక రెండు వేడి వేడి చపాతీలు లేదా పుల్కా.. చాలు రా! కానీ దానికే మేము నోచుకోవడం లేదు’ అంటూ తనను కూడా కలిపి చెప్పింది.నాకు అర్థమయింది. దగ్గు మందు కొద్దిగా గ్లాసులో పోసి ఇచ్చాను. తాగింది. ‘సరే.. మరి ఆ పంజాబీ అంటీ బాధేంటమ్మా..’ అడిగాను.‘ఓహ్ అదా! ఆ పంజాబీ వాళ్ళ కోడలు.. మన తెలుగు పిల్ల. వాళ్ళ అబ్బాయిది ప్రేమ పెళ్ళాయే! వారికా రెండు పూటలా చపాతీలు లేనిదే ముద్ద దిగదు. పోనీ ఆవిడే చేసుకుందామనుకుంటే ఆమె చేతికి తిమ్మిర్లు. చేసుకోలేదు. ఆ పిల్లకేమో ఉద్యోగం. రాత్రి ఏడింటికి గానీ ఇల్లు చేరదు. ఈసురోమంటూ ఇల్లు చేరేసరికే ఉన్న ఓపిక నశిస్తుంది. దాంతో ఉదయం చేసినవాటితోనే సరిపెట్టేస్తుంది. అలా ఆ మొగుడూపెళ్ళాలు నోటికింత నచ్చిన తిండి దొరకక బాధపడుతున్నారు. ఆలూమగలు ఉద్యోగం చేయనిదే గడవని జీవితాలు.. ఏమిటో ఈ జీవితాలు! అన్నీ వున్నాయి.. కానీ..’ అంటూ నిస్పృహతో కూడిన నిట్టుర్పు విడిచింది అమ్మ.‘ఇక అక్కడ వుండలేక బయటకు వచ్చేశాను. నాకు అర్థమయింది ఏమిటంటే.. దాదాపు ప్రతి ఇంట్లో మా ఇంటి ప్రాబ్లమే అని. ఉద్యోగం నుంచి వచ్చిన కోడళ్ళు తమకెవరైనా ఒక ముద్ద పడేస్తే తిని పడుకుందాం అనుకుంటారు. మరి అమ్మలు, అమ్మమ్మలు, నానమ్మల చిన్న ఆశతో కూడిన అవసరం ఎలా తీరాలి? అని ఆలోచిస్తూ నిద్రకు ఉపక్రమించాను. ఉదయం తిన్న సాంబారు.. టేస్ట్ అఫ్ ఇండియా.. ఏంబీఏ కుర్రాళ్ళు.. కలిస్తే రోజుకొక వెరైటీ భోజనం! అంతే ఒక ఆలోచన.. నా మెదడులో ఫ్లాష్ లైట్లా వెలిగింది.తెల్లవారి మా అమ్మను వాకింగ్‌కి తీసుకెళ్ళి, నా ప్లాన్ మొత్తం చెప్పాను. మా అమ్మ సన్నగా నవ్వి, ‘బాగుంది కానీ వర్కవుట్ అవుతుంది అంటావా?’ అంది.మళ్ళీ తనే ‘సరే చెప్పిచూస్తాను. నిన్న మా సభ ఈ రోజు ఉదయానికి వాయిదా పడింది. అందులో ఈ బిల్లు ప్రవేశపెడతాను. సభ్యుల ఆమోదంతో శాసనంగా మారితే ఇక మా పంట .. సారీ వంట పండినట్టే. మా కడుపు నిండినట్టే’ అంది నవ్వుతూ.ఆఫీసుకు వెళ్ళానేగానీ మనసులో ఒకటే ఆలోచన.. మా బామ్మలు నా ఐడియాకి ఎలా రియాక్ట్ అవుతారో అని. అయినా ఇందులో పెద్ద లాజిక్ లేదు.మా అపార్ట్మెంట్లో 14 ఫ్లాట్స్ ఉన్నాయి. దాదాపు ప్రతి ఇంట్లో 60 దాటిన వాళ్ళు వున్నారు. వాళ్ళందరికీ షుగర్, బీపీలున్నాయి. సో వాళ్ళకు రాత్రి తప్పనిసరిగా పుల్కానో చపాతీనో కావాలి. ఎవరూ రాత్రి అన్నం తినరు. కొందరి కోడళ్ళకు చేయడం కుదరదు. మరికొందరికి పొదుపుతో కూడిన బద్ధకం. దీంతో ఆ అత్తలకు అలక. కోడళ్ళు వినక కుటుంబాలన్నీ గతుకుల రోడ్డులో నడక. కాబట్టి నా ప్లాన్ ప్రకారం ఈ కారిడార్ అసెంబ్లీలో సభ్యులు అందరూ ప్రతిరోజు సాయంత్రం 4 గంటలకు రోజుకొకరి ఇంట్లో కలుస్తారు. అందరూ కలిసి నచ్చిన వంటను చేసుకుంటారు. ఒకరికొకరు సాయం.. పర్యవేక్షణ.. 14 టిఫిన్బాక్సుల్లో.. ఇంట్లో కనీసం ఇద్దరికి సరిపోయేలా పెట్టివ్వటం, హోస్ట్ చేసిన వారింట్లో అందరికీ సరిపోయేలాగా వండుతారు కాబట్టి వారికీ మరి రాత్రి వండుకొనే సమస్య ఉండదు. ఇక ఏ కోడలూ తన అత్తమామలకు ప్రత్యేకంగా రాత్రి టిఫిన్ చేసిపెట్టాల్సిన అవసరం ఉండదు. బయట నుంచి తీసుకురానక్కర్లేదు. సాయంత్రం భర్తతో సరదాగా షాపింగ్ చేసుకోవచ్చు, షికారుకెళ్ళొచ్చు. లేటుగా ఇంటికి రావచ్చు. పెద్దలకు రోజుకొక వెరైటీ.. బామ్మలు అందరికీ కాలక్షేపం.. డిగ్నిటీ అఫ్ లేబర్! తను చేసిన వెరైటీని మొత్తం అపార్ట్మెంట్లో వాళ్ళు మెచ్చుకుంటే అదొక ఆనందం, గౌరవం. ఇంటి ఫుడ్ కాబట్టి అందరికీ ఆరోగ్యం! చివరకు ‘రోగీ అదే కోరాడు.. వైద్యుడూ అదే ఇచ్చాడు’ అనే సామెతలా.. అంతే సింపుల్!∙∙ ఆఫీస్ నుండి వెళుతూ ‘ఒకవేళ నా ఐడియా శాసనంగా మారితే ఈ 14 టిఫిన్‌బాక్స్‌లు ఎలా ఉండాలో ఒకసారి చూద్దాం’ అనుకుంటూ ఒక గిఫ్ట్షాప్లోకి వెళ్ళాను. అక్కడ అప్పటికే మా అపార్ట్మెంట్ రావుగారు వచ్చి టిఫిన్‌బాక్స్ సెక్షన్లో బాక్స్‌లు వెతుకుతూ కనపడ్డారు. ‘ఏమోయ్.. రఘూ.. రా.. రా.. ఇద్దరికి సరిపడా టిఫిన్ పట్టే 14 టిఫిన్‌బాక్స్‌లు కావాలోయ్. సెలెక్ట్ చేయలేకపోతున్నాను. సరైన సమయానికి వచ్చావ్.. చూడూ.. ఈ మోడల్స్‌లో ఏవి బాగుంటాయో.. సెలెక్ట్ చేయవా?’ అన్నాడు. ‘అన్నెందుకు సార్?’ అడిగాను ఆత్రుతగా.‘ఎమోనోయ్.. మీ అంటీ ఎదో కొత్త నోము మొదలు పెడుతోందట. రోజూ మన అపార్ట్మెంట్లో ఆడాళ్ళు చేస్తారుట. అందుకే’అన్నారు రావుగారు.నాకు అర్థమైపోయింది.. నా ఐడియా వర్కవుట్ అయిందని. దాని ఫలితమే ఈ బాక్స్‌లు అని. వాళ్ళకు నా ప్లాన్‌ను సరిగ్గా వివరించి ఒప్పించినందుకు మా అమ్మకు మనసులోనే థాంక్స్ చెప్పుకున్నాను. ∙∙ కారిడార్ మీటింగ్ చాలా హుషారుగా సాగుతోంది. మా అమ్మ నన్ను విజయగర్వంతో చూసింది. ఆవిడ పెట్టిన బిల్ పాస్ అయిందని అర్థమైంది. చెప్పుల్ని ఒకపక్కగా విడుస్తూ, ఒకింత గర్వంగా ఫీల్ అయ్యాను. ఒకింత అనుమానమూ వేసింది..‘మీ అందరికీ నచ్చిందా.. ఒకేనా.. చేయగలరా?’ అని అడిగాను. ముక్తకంఠంతో అంతా ‘ఇప్పుడయితే మేము అమ్మమ్మలం.. నానమ్మలం.. కానీ ఎప్పటికీ అమ్మలమే కదా! కుటుంబంలో అందరి ఆకలి తీర్చిన వాళ్ళమే కదా’ అన్నారు.నా మనసు తేలికపడింది. హుషారుగా ఇంట్లోకి నడిచా. నన్ను చూస్తూనే మా ఆవిడ ‘ఈరోజు వేడిగా చపాతీలు చేయాలా? ఫుల్కాలు చేయాలా?’ అడిగింది చిరుకోపంతో! ‘ఈరోజే చివరిసారి కదా.. నీకు నచ్చింది చెయ్’ అన్నాను. కొత్త టిఫిన్బాక్స్ల నోము గూర్చి చెప్పి, ‘రేపే నోము ప్రారంభం’ అన్నాను. అంతే .. మా ఆవిడ నవ్వుతూ ముందురోజు నేను కొన్న మల్లెపూల దండను ఫ్రిజ్‌లోంచి తీసి సిగలో తురుముకుంది. ∙∙ టిఫిన్బాక్స్ల నోము చరిత్ర సంపూర్ణం. ఇది శ్రద్ధగా చదివినవారికి.. విన్నవారికి .. ఆచరించినవారికి గృహంలో సుఖశాంతులు కలుగుతాయి. అపార్ట్మెంట్లు చల్లగా.. హయిగా ఉంటాయి. -
మిస్టరీ.. బ్రయాన్ నిసెన్ ఫెల్డ్
స్టీవ్ గాఢనిద్రలో ఉండగా హాల్లో ఫోన్ మోగింది. అదే మత్తులో మెల్లగా నడిచి వెళ్లి ఫోన్ లిఫ్ట్ చేసి, కాస్త అసహనంగా ‘హలో?’ అన్నాడు స్టీవ్. ‘డాడ్.. డాడ్.. డాడ్! నాకు చాలా భయంగా ఉంది. నన్ను వాడు వదిలిపెట్టడు. కిడ్నాప్ చేస్తానంటున్నాడు. సేవ్ మీ డాడ్.. సేవ్ మీ డాడ్’ అని అరుస్తూనే ఉన్నాడు అవతలి నుంచి బ్రయాన్ నిసెన్ ఫెల్డ్. కొడుకు అరుపులు విని స్టీవ్‌కు గుండె ఆగినంత పనైంది. ‘ఏం అంటున్నావ్ బ్రయాన్? ఏమైందిరా?’ అన్నాడు కంగారుగా. ఆ అలికిడికి లేచిన అతని భార్య మరియాన్ . భర్త మాటలను బట్టి కాల్ చేసింది బ్రయాన్ అని అర్థం చేసుకుంది. బ్రయాన్ మాటల్లో తడబాటు, వణుకు స్టీవ్‌ను కుదురుగా ఉండనివ్వడం లేదు. ఏం చెయ్యాలో తోచడం లేదు. స్టీవ్ గట్టిగా ఊపిరి తీసుకుని, ‘బ్రయాన్ ఏమైంది నాన్నా! ఎందుకు అలా మాట్లాడుతున్నావ్? ప్లీజ్, నువ్వు వివరంగా చెబితేనే కదా నేనేదైనా చేయగలను’ అన్నాడు. దాంతో బ్రయాన్ కాస్త కూల్ అయ్యి ‘డాడ్ , జోష్ అని నా సీనియర్.. చదువు పూర్తి చేసుకుని ఈ క్యాంపస్ నుంచి వెళ్లిపోయాడు. కానీ వెళ్లేముందు మా మధ్య పెద్ద గొడవైంది. దాన్ని మనసులో పెట్టుకుని, ఫోన్ చేసి బెదిరిస్తున్నాడు. నన్ను కిడ్నాప్ చేసి చంపుతానంటున్నాడు. ఏ సమయంలోనైనా మా యూనివర్సిటీకి వచ్చి, నన్ను ఎత్తుకుపోతాడట! నా శవాన్ని కూడా ఎవరికీ కనిపించనివ్వడట! ప్లీజ్ నువ్వు నన్ను ఇంటికి తీసుకెళ్లిపో’ అని ఏడుస్తూ వణికిపోతూ చెప్పాడు బ్రయాన్. దాంతో స్టీవ్, తనకి తాను ధైర్యం చెప్పుకుంటూ కొడుక్కి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశాడు. పక్కనే ఉండి కంగారుపడుతున్న మరియాన్ కి కొద్దికొద్దిగా విషయం అర్థమైంది. ‘నాన్నా బ్రయాన్! భయపడకు, నువ్వు ఉన్నది పెద్ద క్యాంపస్‌లో. అలాంటి చోటికి వచ్చి ఒక మనిషిని ఎత్తుకెళ్లడం సాధ్యం కాదు. ముందు నువ్వు అక్కడి సెక్యూరిటీకి కాల్ చేసి అతడిపై కంప్లైంట్ చెయ్యి. తర్వాత నీ ఫోన్ నంబర్ మార్చేయ్, రేపు నేను వస్తాను’ అంటూ చాలాసేపు నచ్చజెప్పి ఫోన్ పెట్టేశాడు స్టీవ్. మధ్యలో ఫోన్ అందుకున్న మరియాన్ కూడా ప్రేమగా సర్దిచెప్పింది. అప్పుడు సమయం అర్ధరాత్రి రెండు కావస్తో్తంది. మరునాడు కొడుకుని చూసుకునేదాకా వారికి నిద్రపట్టలేదు.రోజర్ విలియమ్స్ యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్ రెండో ఏడాది చదువుతున్న బ్రయాన్‌కి 18ఏళ్లు. సంగీతం నేర్చుకోవడమన్నా, వినడమన్నా, యూనివర్సిటీ సమీపంలోని టౌంటన్ నది మీదున్న వంతెనపై ఒంటరిగా కూర్చుని పుస్తకాలు చదువుకోవడమన్నా చాలా ఇష్టం. బ్రయాన్ కి మాటిచ్చినట్లే మరునాడు స్టీవ్ దంపతులు వెళ్లి కలిశారు. వాళ్లు చెప్పినట్లే ఫోన్ నంబర్ మార్చేశాడు. తన జాగ్రత్తలో తాను ఉండటం మొదలుపెట్టాడు. అయితే సరిగ్గా నెలకి బ్రయాన్ నుంచి ఎలాంటి అప్ డేట్స్ రాకపోవడంతో వారు మళ్లీ యూనివర్సిటీకి వెళ్లాల్సి వచ్చింది. కాని, బ్రయాన్ అక్కడ లేడు. యాజమాన్యంతో సహా ఎవరిని అడిగినా తెలియదనే చెప్పారు. దాంతో ఆ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ కి పరుగుతీశారు. రంగంలోకి దిగిన పోలీసులు ‘బ్రయాన్ వారం క్రితం సంగీతం క్లాస్‌కి హాజరైన తర్వాత నుంచి ఎవరికీ కనిపించలేదు’ అని తేల్చారు. మరి బ్రయాన్ ఏమైనట్లు? ఈ ప్రశ్న రాగానే, జోష్ అనే పూర్వవిద్యార్థి గురించి స్టీవ్ పోలీసులకు చెప్పడంతో ఆ దిశగా విచారణ మొదలైంది.స్టీవ్ అనుమానించిన జోష్ అనే కుర్రాడితో బ్రయాన్ కి గతంలో గొడవ అయిన మాట నిజమేనని, వారిద్దరూ మొదట్లో మంచి స్నేహితులని, తర్వాత శత్రువులై కొట్టుకున్నారని తేలింది. అయితే జోష్ని పిలిపించి నిలదీస్తే, ‘నాకేం తెలియదు. గొడవ తర్వాత బ్రయాన్ ని నేను కలిసిందే లేదు’ అన్నాడు. అయితే కొన్నిరోజులకు ఆ యూనివర్సిటీ నుంచి ఒక గుర్తు తెలియని అమ్మాయి స్టీవ్ ఇంటికి కాల్ చేసి, బ్రయాన్ తల్లి మరియాన్ తో మాట్లాడింది. ‘బ్రయాన్ మిస్సింగ్ వెనుక చాలా పెద్ద కుట్రే ఉంది. దీని వెనుక ఇద్దరు అధ్యాపకులు ఉన్నారు’ అని చెప్పి ఫోన్ కట్ చేసింది. మరి అది నిజమా? కేసును పక్కదారి పట్టించే ప్రయత్నమా? అనే అనుమానంతోనే ఆ దిశగా కూడా విచారించారు. కానీ బ్రయాన్ ఆచూకీ తెలియలేదు.ఆరు నెలలు గడిచిపోయాయి. ఒకరోజు ఉదయాన్నే టౌంటన్ నది ఒడ్డున లోరీ వేల్స్ అనే 30 ఏళ్ల మహిళ తన కూతురితో కలిసి వాకింగ్ చేస్తుంటే, ఒక షూ దొరికింది. దగ్గరకు వెళ్లి చూస్తే అందులో మనిషి పాదం ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఆ పాదాన్ని డీఎన్ ఏ పరీక్షకు పంపారు. అది బ్రయాన్ దని తేలింది. రేపోమాపో దొరుకుతాడనుకున్న కొడుకు ఇక లేడు, రాడనే వార్త స్టీవ్ కుటుంబాన్ని అంతులేని దుఃఖంలో ముంచేసింది.బ్రయాన్ కి బ్రిడ్జ్ మీద కూర్చుని చదువుకునే అలవాటు ఉంది కాబట్టి, పొరపాటున కాలు జారి నదిలో పడుంటాడని, లేదంటే ఏవో భయాలతో ఆత్మహత్య చేసుకుని ఉంటాడని అధికారులు అంచనా వేశారు. అయితే స్టీవ్, మరియాన్ లు మాత్రం నమ్మలేదు. ఆ యూనివర్సిటీలో స్వయంగా రహస్య సమాచార సేకరణ మొదలుపెట్టారు. అయితే వారికి తెలిసిన విషయాలు వారిని మరింత బాధపెట్టాయి.‘బ్రయాన్, జోష్లిద్దరూ స్వలింగ సంపర్కులు. బ్రయాన్ మొదటి సెమిస్టర్లో ఉన్నప్పుడు ఇద్దరూ ప్రాణమిత్రుల్లా ఉండేవారు. కొన్ని నెలలకు వారి బంధం ఎక్కడ బయటపడి పరువు పోతుందోనని బ్రయాన్ భయపడేవాడు. జోష్ మాత్రం బయటపడితే తప్పేంటి? అన్నట్లుగా ఉండేవాడు. అందుకే వారి మధ్య గొడవలొచ్చాయి’ అని చాలామంది చెప్పారు. బ్రయాన్ స్వలింగ సంపర్కుడని ప్రపంచానికి తెలిస్తే తన పరువుపోతుందని ఆత్మహత్య చేసుకుని ఉంటాడని కొందరు, జోష్ ప్రేమోన్మాదిగా మారి చంపేసి ఉంటాడని మరికొందరు అభిప్రాయపడ్డారు. అయితే వేటికీ ఆధారాలు లేవు. జోష్ని మరోసారి విచారించినప్పుడు, ‘బ్రయాన్ కు కాల్ చేసి బెదిరించింది నేనే. కాని, అది ప్రాంక్. అతని మిస్సింగ్‌కి, నాకు ఏ సంబంధం లేదు’ అని చెప్పాడు.1997 ఫిబ్రవరి 6న బ్రయాన్ తన యూనివర్సిటీ నుంచి మిస్ అయినట్లు ఫిబ్రవరి 13న కేసు నమోదైంది. ఆరు నెలలకు నది ఒడ్డున తెగిపోయిన అతని పాదం దొరికింది. మృతదేహం ఇప్పటికీ దొరకలేదు. అసలు బ్రయాన్ కి ఏమైంది? జోష్, బ్రయాన్ ల మధ్య నిజంగానే రహస్య బంధం ఉందా? అది బయటపడకూడదనే బ్రయాన్ ఆత్మహత్య చేసుకున్నాడా? దూరంపెట్టడాన్ని భరించలేక జోష్ ఉన్మాదిగా మారి బ్రయాన్ ని చంపేశాడా? అనే ప్రశ్నలకు సమాధానాల కోసం స్టీవ్ కుటుంబం ఇంకా ప్రయత్నిస్తూనే ఉంది. అయినా ఈ ఉదంతం మిస్టరీగానే మిగిలిపోయింది. సంహిత నిమ్మన -
ఇంకా ఇన్కా సంబరాలు
దక్షిణ అమెరికా భూభాగంలో ఒకప్పుడు వర్ధిల్లిన ఇన్కా నాగరికత స్పానిష్ దాడుల దెబ్బకు పదహారో శతాబ్ది నాటికి దాదాపుగా కనుమరుగైంది. అయితే, ఇన్కా నాగరికత అవశేషాలు ఇక్కడి జనాల్లో ఇప్పటికీ ఇంకా మిగిలే ఉన్నాయి. ఇన్కా నాగరికత నాటి సంస్కృతీ సంప్రదాయాలు ఇప్పటికీ ఇక్కడి ప్రజల వేడుకల్లో ప్రతిఫలిస్తుంటాయి. పెరులోని ప్యూనో ప్రాంతంలో జరిగే ప్యూనో వారోత్సవాలు నేటికీ పురాతన ఇన్కా సంప్రదాయ పద్ధతుల్లోనే కొనసాగుతుండటం విశేషం. ఏటా నవంబర్ మొదటివారంలో ఈ వారోత్సవాలు జరుగుతాయి. ఈ వారం రోజుల్లోనూ నవంబర్ 5వ తేదీన ప్రత్యేకంగా ‘ప్యూనో డే’ వేడుకలను అత్యంత వైభవోపేతంగా జరుపుకొంటారు.పెరు ఆగ్నేయ ప్రాంతంలో ప్యూనో ప్రావిన్స్ ఉంది. దీని రాజధాని ప్యూనో నగరం. టిటికాకా సరోవర తీరంలో ఉన్న ఈ ప్రాంతంలో స్పెయిన్ అధీనంలోకి వచ్చాక, స్పానిష్ రాజప్రతినిధి పెడ్రో ఆంటోనియో ఫెర్నాండేజ్ డి క్యాస్ట్రో 1668లో ప్యూనో నగరాన్ని నెలకొల్పాడు. అంతకు ముందు ఈ ప్రాంతలో ఇన్కా నాగరికత ఉజ్వలంగా వర్ధిల్లింది. స్పానిష్ పాలకుల ప్రభావంతో స్థానిక కెచువా ప్రజలు క్రైస్తవ మతాన్ని స్వీకరించినా, తమ పూర్వ ఆచారాలను వదులుకోలేదు. ఇన్కా సామ్రాజ్య వ్యవస్థాపకుడైన మాంకో కాపాక్ జయంతి సందర్భంగా నవంబర్ 5న ‘ప్యూనో డే’ జరుపుకొనే ఆచారాన్ని నేటికీ కొనసాగిస్తున్నారు. ఇన్కా ప్రజలు ‘ఇన్టీ’గా పిలుచుకునే సూర్యుడి కొడుకు మాంకో కాపాక్. అతడే ఇన్కా ప్రజలకు మూలపురుషుడని చెబుతారు. ఇన్కా నాగరికత కాలంలో ఈ ప్రాంతంలో కూజ్కో నగరం ఉండేది. ప్యూనో వారోత్సవాలను ఇక్కడి ప్రజలు ఇన్కా సంప్రదాయ పద్ధతుల్లో ఘనంగా జరుపుకొంటారు. ఇన్కా సంప్రదాయ దుస్తులు ధరించి ఊరేగింపుల్లో పాల్గొంటారు. సంప్రదాయ వాద్య పరికరాలను మోగిస్తూ, వీథుల్లో తిరుగుతూ పాటలు పాడతారు. ప్యూనో నగర కూడళ్లలో ఏర్పాటు చేసిన వేదికలపై సంప్రదాయ సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శిస్తారు. టిటికాకా సరోవరంలో సంప్రదాయ పడవల్లో నౌకా విహారాలు చేస్తారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో మాంకో కాపాక్ జీవిత విశేషాలను ప్రదర్శిస్తారు. పురాతన పద్ధతుల్లో జరిగే ఈ ప్యూనో వారోత్సవాలను తిలకించేందుకు పెద్దసంఖ్యలో విదేశీ పర్యాటకులు ఇక్కడకు వస్తుంటారు. -
Dadhichi Maharshi: క్షువ దధీచుల వివాదం
దధీచి మహర్షి సరస్వతీ నదీతీరంలో తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ఒకనాడు ఇంద్రుడు అతడి వద్దకు వచ్చాడు. ‘మునీశ్వరా! నీకు నేను మహోత్తమమైన శాస్త్రాలను ఉపదేశిస్తాను. వాటిని నువ్వు ఇతరులకు చెప్పరాదు. ఒకవేళ ఇతరులకు చెబితే, నీ తల ఖండిస్తాను’ అని చెప్పాడు. దధీచి సరేననడంతో, ఇంద్రుడు అతడికి మహోత్తమ రహస్య శాస్త్రాలను ఉపదేశించాడు. ఈ సంగతి అశ్వనీ దేవతలకు తెలిసింది. ఇంద్రుడు బోధించిన రహస్య శాస్త్రాలను దధీచి నుంచి పొందాలనుకున్నారు. వెంటనే వారు దధీచి వద్దకు వెళ్లారు. ‘మహర్షీ! ఇంద్రుడు నీకు బోధించిన రహస్య శాస్త్రాలను మాకు ఉపదేశించు. అందుకు ప్రతిగా నీకు తగిన మేలు చేస్తాము’ అని అభ్యర్థించారు.‘ఇతరులకు బోధిస్తే, నా తల ఖండిస్తానన్నాడు ఇంద్రుడు. మీకు ఆ శాస్త్రాలు బోధిస్తే, నా ప్రాణమే మిగిలి ఉండదు. ఇక మీరు నాకు చేసే మేలు ఏముంటుంది?’ అన్నాడు దధీచి.‘మహర్షీ! భయపడకు. నీకు ఎలాంటి ప్రాణాపాయం లేకుండా చూసుకునే బాధ్యత మాది’ అని అశ్వనీ దేవతలు అభయం ఇచ్చారు.వారు దధీచి తలను తీసి, రహస్య ప్రదేశంలో భద్రపరచారు. అతడి మొండేనికి గుర్రం తలను అతికించారు. ఇంద్రుడి ద్వారా పొందిన రహస్య శాస్త్రాలను అతడి ద్వారా తెలుసుకున్నారు. ఇదంతా ఇంద్రుడికి తెలిసింది. కోపోద్రిక్తుడైన ఇంద్రుడు వచ్చి, దధీచికి ఉన్న గుర్రం తలను నరికేసి వెళ్లిపోయాడు. అశ్వనీ దేవతలు తాము భద్రపరచిన దధీచి తలను తీసుకువచ్చి, అతడికి అతికించి, ప్రాణం పోశారు. అశ్వనీ దేవతల ద్వారా పునర్జీవం పొందిన దధీచి తన బాల్యమిత్రుడైన క్షువ మహారాజు వద్దకు వెళ్లాడు. క్షువుడు దధీచిని ఆప్యాయంగా పలకరించి, ఆదరించాడు. ఇద్దరూ కబుర్లు చెప్పుకోసాగారు. ఈలోగా వారి మధ్య దీర్ఘ తపస్సులో ఎవరు శక్తిమంతులు అనే విషయమై విభేదం ఏర్పడింది. ‘దీర్ఘ తపస్సులో ఇతరుల కంటే బ్రాహ్మణుడే శక్తిమంతుడు’ అన్నాడు శివభక్తుడైన దధీచి. ‘కానే కాదు. వర్ణాశ్రమ ధర్మాలను రక్షించే రాజే శక్తిమంతుడు’ అన్నాడు క్షువుడు. అంతటితో ఆగకుండా, ‘రాజు సర్వదేవతా స్వరూపుడు’ అని శ్రుతులు చెబుతున్నాయి. కనుక నేను దేవతా స్వరూపుడను. అందువల్ల నువ్వు నన్ను పూజించాలి’ అన్నాడు.క్షువుడి మాటలతో దధీచికి సహనం నశించింది. ఎడమచేతి పిడికిలి బిగించి, క్షువుడి నెత్తి మీద బలంగా మోదాడు. దధీచి చర్యకు క్షువుడు మండిపడ్డాడు. వెంటనే కత్తి దూసి, దధీచిని చీల్చేశాడు. ‘ఇప్పుడు తెలిసిందా ఎవరు శక్తిమంతుడో?’ అని గర్జించాడు. నెత్తరోడుతూ నేలకూలిన దధీచి భృగువంశ తిలకుడు, అసుర గురుడైన శుక్రాచార్యుడిని స్మరించాడు. వెంటనే శుక్రాచార్యుడు అక్కడ ప్రత్యక్షమై, తన మృత సంజీవని విద్యతో చీలిన దధీచి శరీరాన్ని సంధించి, అతడిని బతికించాడు. దధీచి లేచి కూర్చున్నాక శుక్రాచార్యుడు అతడికి మృత్యుంజయ మంత్రాన్ని ఉపదేశించాడు. ఈ మంత్రాన్ని జపిస్తూ శివుని గురించి తపస్సు చేయమని ఆదేశించాడు. దధీచి అక్కడి నుంచి బయలుదేరి, తన ఆశ్రమానికి చేరుకున్నాడు. శుక్రాచార్యుడి ఆదేశం మేరకు శివుడి గురించి తపస్సు ప్రారంభించాడు. దధీచి తపస్సుకు మెచ్చిన పరమశివుడు అతడికి ప్రత్యక్షమయ్యాడు. ‘వత్సా! ఏం కావాలి?’ అని అడిగాడు. ‘సాంబ సదాశివా! నాకు వజ్రతుల్య దేహాన్ని. దైన్యరహిత జీవనాన్ని, స్వచ్ఛంద మరణాన్ని ప్రసాదించు’ అని కోరాడు దధీచి. ‘తథాస్తు’ అని పరమశివుడు అంతర్ధానమయ్యాడు.క్షువుడిపై కోపం చల్లారని దధీచి అతడి వద్దకు వెళ్లి, ఎడమకాలితో అతడి తలను తన్నాడు. కుపితుడైన క్షువుడు దధీచిపైకి కత్తి దూశాడు. కత్తి వేటు పడినా, దధీచికి ఏమీ కాలేదు. రకరకాల అస్త్ర శస్త్రాలను ప్రయోగించాడు. దధీచి వాటన్నింటినీ తిప్పికొట్టి, ‘ఇప్పటికైనా తెలిసిందా ఎవరు అధికుడో?’ అన్నాడు.దధీచి చేతిలో ఈ పరాభవానికి క్షువుడు కలత చెంది, మహారణ్యానికి వెళ్లి విష్ణువు గురించి తపస్సు చేశాడు. విష్ణువు ప్రత్యక్షమయ్యాడు. క్షువుడు తనకు దధీచి చేతిలో ఎదురైన పరాభవాన్ని చెప్పుకుని, అతడికి గుణపాఠం చెప్పాలని కోరాడు. క్షువుడిని వెంటబెట్టుకుని విష్ణువు దధీచి ఆశ్రమం వద్దకు వెళ్లాడు. విష్ణువు బ్రాహ్మణ వేషం ధరించి, దధీచి ఆశ్రమంలోకి ప్రవేశించాడు. దధీచి అతడికి అతిథి మర్యాదలు చేశాడు. ‘మహర్షీ! నువ్వు క్షువ మహారాజు ఎదుట నిలబడి, ‘నేను భయపడుతున్నాను’ అనే మాట చెప్పు చాలు’ అన్నాడు.వచ్చిన వాడు విష్ణువని దధీచి గ్రహించాడు. ‘శివ వరప్రసాదినైన నేను ముల్లోకాలలో దేనికీ భయపడను. అలాంటిది క్షువుడి ఎదుట నిలిచి, నేను భయపడుతున్నట్లు చెప్పాలా? కుదరదు’ అని ఖండితంగా చెప్పాడు. దధీచిని శిక్షించడానికి విష్ణువు తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. సుదర్శనం అతడిని సమీపించలేక వెనుదిరిగింది. విష్ణువు అనేక అస్త్ర శస్త్రాలను ప్రయోగించాడు. అతడికి అండగా ఇంద్రాది దేవతలు ఆయుధాలతో వచ్చి, దధీచితో తలపడ్డారు. దధీచి గుప్పెడు దర్భలను మంత్రించి, వాటిని దేవతా బలగాలపైకి ప్రయోగించాడు. ఒక్కొక్క దర్భపోచ ఒక్కొక్క త్రిశూలంలా మారి నిప్పులు కక్కుతూ వెళ్లి దేవతలను దహించడం ప్రారంభించాయి. దేవతలు పలాయనం చిత్తగించారు. దధీచిని భయభ్రాంతుడిని చేయడానికి విష్ణువు విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. పరమశివుని అనుగ్రహంతో దధీచి కూడా విశ్వరూపం ధరించి, విష్ణువు ఎదుట నిలిచాడు. ఈలోగా బ్రహ్మదేవుడు అక్కడకు వచ్చి, ఉభయులనూ శాంతింపజేశాడు. ‘సాక్షాత్తు పరమశివుని వరప్రసాది అయిన ఈ బ్రహ్మర్షిని భయపెట్టడం ఎవరికీ సాధ్యం కాదు’ అని పలికాడు బ్రహ్మదేవుడు.ఇదంతా ప్రత్యక్షంగా చూసినా క్షువ మహారాజు దీనంగా వెళ్లి, దధీచి మహర్షి పాదాల ముందు మోకరిల్లాడు. ‘మూర్ఖత్వం కొద్ది నీపై దుశ్చర్యలకు తెగబడ్డాను. దయచేసి, నన్ను క్షమించు’ అని అభ్యర్థించాడు. దధీచి ప్రసన్నుడయ్యాడు. బాల్యమిత్రుడైన క్షువుడిని లేవనెత్తి, అక్కున చేర్చుకున్నాడు.∙సాంఖ్యాయన -
యువ కథ.. లాయర్ నోటీస్
పేషంట్లు, నర్సులు, డాక్టర్లతో గైనిక్ వార్డంతా హడావిడిగా ఉంది. ఒక్కొక్కరి మొహంలో ఒక్కో భావం. కూతురి వైపు చూశాడు లాయర్ బ్రహ్మారెడ్డి. తల గోడకు ఆన్చి, నిద్ర పోతున్నట్టుగా ఉంది. ఆమెకిప్పుడు ఆరో నెల. తాత కాబోతున్న సంతోషం తొలి రెండు నెలలు మాత్రమే. మాటా మాటా పెరిగి, అల్లుడు చెయ్యి చేసుకున్నాడంట. నేరుగా ఇంటికి వచ్చింది కూతురు. కొత్త సంసారంలో చిన్న చిన్న మనస్పర్థలు మామూలే అనుకున్నాడు. రోజులు గడుస్తున్నకొద్దీ అర్థమైంది సర్దుకునేంత చిన్నది కాదని.చూస్తుండగానే మూడు దాటి, నాలుగో నెల వచ్చింది. వీళ్లు చూస్తే పంతంబట్టినట్టు ఎవరి లోకంలో వాళ్లున్నారు. రేపేదైనా తేడా జరిగితే పుట్టబోయే బిడ్డ ప్రధాన సమస్య అవుతుందని ఎన్నో కేసులు వాదించిన అనుభవం మెదడు తడుతోంది.బిడ్డ పుడితే కలవకపోతారా అనే దింపుడు కల్లం ఆశ కూడా లేకపోలేదు. తీరా బిడ్డ పుట్టేక వాళ్లు రాకుంటే? కూతురు ఇంకో పెళ్లి వద్దంటే? కూతురు ఒప్పుకున్నా బిడ్డ తల్లిని చేసుకోవడానికి ఎవరైనా ముందుకొస్తారా? చేసుకున్నా కూడా కూతురు జీవితం సంతోషంగా ఉంటుందా? ఇవన్నీ లేకుండా కడుపులో బిడ్డకు ఏదో ఒక అవయవ లోపముంది అని డాక్టరే అబార్షన్ సూచిస్తే మేలనిపిస్తోంది. వాళ్లు చెప్పకుండా మనమే ఆ మాట అడిగితే బాగుండదేమో.పొంతనలేని ఆలోచనలు ఎటెటో తరుముతున్నాయి. చుట్టూ చూశాడు. ఎంతకూ తరగడం లేదు జనాలు. తమ పేరు ఎప్పుడు పిలుస్తారా అని ఎదురుచూస్తున్నారు. ఫోన్ చేతిలోకి తీసుకున్నాడు. న్యూస్, వీడియోలు, కోర్టు కేసులు దేని మీదా ధ్యాస కుదరక బయటికి నడిచాడు. లోపల స్థలం సరిపోనోళ్లంతా మెట్ల మీద, గేటు దగ్గర ఎక్కడపడితే అక్కడ కూర్చున్నారు.ఇంతలో గలగలా మాట్లాడుతూ బయటికొచ్చింది ఒక గుంపు. నడి వయస్కురాలి చేతిలో బెడ్, మధ్యలో చిన్న ఆకారం. పాపో బాబో గానీ అందరి మొహాల్లోనూ మురిపెం తెలుస్తోంది. చూస్తేనే చెప్పొచ్చు అబ్బాయి తరపు వాళ్లని. ఇలాంటివి చూసినప్పుడే అల్లుడి నుంచి గానీ, వాళ్ల తల్లిదండ్రుల నుంచి గానీ కనీసం ఇందులో పది శాతం కూడా అమ్మాయి మీద ఆపేక్ష లేదే అని బాధపడిపోతాడు బ్రహ్మారెడ్డి. వీటన్నింటి మధ్యన మరింత కుంగదీసేది కూతురి మౌనం. జీవితమంతా అయిపోయిన దానిలా ఎప్పుడూ దిగాలేసుకుని ఉంటుంది. ఇప్పుడు దిగులుపడితే మాత్రం చెయ్యగలిగేదేముందీ..!ఏదో పెళ్లిలో అమ్మాయిని చూశారంట. బాగా నచ్చింది, రూపాయి కట్నం వద్దు అని తెలిసిన మనిషిని పంపించారు. ఒక జిల్లా డిప్యూటీ కలెక్టర్ స్థాయి వ్యక్తి కోరి కోడలిగా చేసుకుంటాం అని ఇంటికొస్తే ఎవరు మాత్రం కాదనుకుంటారు. అబ్బాయి ఏ ఉద్యోగం చెయ్యకున్నా తండ్రి సంపాదించిన ఆస్తి దండిగా ఉంది. కూతురు భవిష్యత్తే కాదు, కలెక్టర్ వియ్యంకుడిగా సమాజంలో తనకెంత గౌరవం, పరపతి! అందుకే ఒప్పుకున్నాను. ఇప్పుడు చూస్తే ఇలా..! కూతురి పేరు అనౌన్స్మెంట్లో రావడంతో ఆలోచనలు ఆపి, లోపలికి నడిచాడు. ‘బేబీ గ్రోత్ బాగుంది. మదర్ కొంచెం వీక్‌గా ఉంది. హెల్దీ డైట్ మెయింటెయిన్ చెయ్యండి’ అంటూ జాగ్రత్తలు చెప్పింది డాక్టర్.రోజులు, వారాలు, నెలలు గడుస్తున్నాయి. అల్లుడు రాలేదు.‘డెలివరీ అయ్యాకైనా వస్తాడా రాడా?’ అంటూ బెదిరిపోతున్నాడు బ్రహ్మారెడ్డి. అమ్మాయికి నార్మల్ డెలివరీ కుదరక, సీరియస్ అయ్యి, సిజేరియన్ చేసినారని తెలిసినా కూడా రాలేదు. అల్లుడే కాదు, వాళ్ల తరపునుంచి ఒక్కరూ రాలేదు. తెలిసిన వాళ్ల చేత మాట్లాడించాడు. పెద్దవాళ్లు అదీ ఇదని ఏదో చెప్పబోయారంట గానీ ‘నాకే పుట్టిందని గ్యారెంటీ ఏముందీ’ అన్నట్టు అన్నాడంట అబ్బాయి. ఇదే మాట ఎదురుగా అని ఉండుంటే తల పగలగొట్టాలి అనేంత కోపం వచ్చింది. కూతురితో చెప్పలేదు. భార్యతో అంటే ‘వానికి లేని చెడ్డలవాట్లు లేవంట. ఆ విషయం వాళ్లమ్మా నాయనకు ముందే తెలిసినా పెళ్లి చేస్తే అయినా దారికొస్తాడని చేశారంట. కొత్తవాళ్లతో సంబంధం మంచిది గాదని చెప్తున్నా వినకుండా పెద్ద వాళ్ల సంబంధం అని దాని గొంతు కోశావు’ అన్నాళ్లూ లోపల దాచుకున్న ఆక్రోశమంతా బయటికి వెళ్లగక్కింది.ఏదో ఫంక్షన్లో స్నేహితుడు కలిస్తే జరిగిందంతా చెప్పాడు.‘ఇలాంటి కేసులు నీ సర్వీసులో ఎన్ని చూసుంటావు! అయినా ఈ కాలంలో ఎవర్రా విడాకులకు భయపడేది?’ అన్నాడు.నిజమే. లాయర్ బ్రహ్మారెడ్డి అమ్మాయి తరపున వకాల్తా పుచ్చుకున్నాడంటే అబ్బాయి వాళ్లు, అబ్బాయి తరపునైతే అమ్మాయి వాళ్లు తలలు పట్టుకుంటారు. కానీ ఇది స్వంత కూతురి విషయం. మధ్యవర్తిత్వం ద్వారా కొంత ప్రయత్నం చేశాడు. కుదరలేదు.‘అందరికీ విడాకులు ఇప్పించి ఇప్పించి వాళ్ల ఉసురు కొట్టుకుని కూతురి జీవితం ఇలా చేసుకున్నాడని తలా ఒక మాట అంటారని ఇన్నాళ్లూ రాజీ కోసం చూశాను. అది నా అసమర్థత అనుకుంటున్నారు’ అనుకుంటూ ఆఫీసుకెళ్లి గృహహింస కేసు, వారం తర్వాత మెయింటెనె¯Œ ్స కేసు ఫైల్ చేశాడు. ఈ రెండింట్లో వీలైనంత వరకూ విసిగించి, వాళ్లే విడాకులకు అప్లై చేసేలా చేస్తే భరణం అడగొచ్చు అనుకుంటే ఎన్నాళ్లు చూసినా కేసు హియరింగ్‌కి రాలేదు. పంపించిన నోటీసులు వెనక్కి వచ్చాయి. ఏమైందని కనుక్కుంటే ఇచ్చిన అడ్రస్‌లో వాళ్లు లేరన్నారంట. క్లైంట్ల కోసం తను వాడే పోస్ట్ మ్యాన్ మేనేజ్మెంట్ టెక్నిక్‌ను తిరిగి తన మీదకే ప్రయోగిస్తున్నారని అర్థమైంది లాయర్ బ్రహ్మారెడ్డికి.మరో నెల చూసి పేపర్ స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది. కోర్టులో కేసు మొదలైంది. అయితే అనుకున్నట్టుగా సాగడంలేదు. చిన్న చిన్న విషయాలకు కూడా వాయిదాలు అడుగుతున్న అవతలి లాయర్‌ను చొక్కా పట్టుకుని కొట్టాలన్నంత కసి. లాయర్ అంటే పోనీ చంటి బిడ్డను తీసుకుని కోర్టుకు వచ్చే నా కూతురి గురించి ఒకసారి ఆలోచిస్తే అర్థం కాదా ఆ జడ్జికి..! ఆమె కూడా మహిళే కదా. తీర్పు దగ్గరకొస్తోంది అనంగా పై కోర్టుకు అప్లై చేశారు. అక్కడా అదే సాగతీత. చేసేదేం లేదు చట్టంలో వెసులుబాటు అలాంటిది. ఇన్నాళ్లూ క్లైంట్ తరపున ఇవన్నీ చూస్తుంటే తనేదో విజయం సాధిస్తున్నట్టుగా అనిపించేది గానీ ఇప్పుడు తనే ఒక పిటిషనర్‌గా అవి అనుభవిస్తుంటే ఆక్రోశంగా ఉంది. ప్రతి చిన్న విషయానికి కోపం, చిరాకు. కానీ ఎవరి మీద చూపించాలో తెలియట్లేదు. కేసును అంత సులభంగా వదలనని బ్రహ్మారెడ్డికీ తెలుసు గానీ, వాళ్లకున్న పలుకుబడి, డబ్బుతో తీర్పును ఎక్కడ అనుకూలంగా మార్చుకుంటారోనని చిన్న సంశయం.అదే జరిగితే శ్రమ, సంపాదన, జీవితం గురించి కనీసం ఆలోచన కూడా చెయ్యని కూతురి భవిష్యత్ ఏంటో అర్థం కాలేదు అతనికి. ఆరోజు కోర్టు కేసులు ఏమీ లేకపోవడంతో టీవీ పెట్టుకుని, సోఫాలో పడుకున్నాడు.‘పాప బర్త్‌డేకి లంగా జాకెట్ కుట్టించమని చెప్పొస్తాం. చూస్తూ ఉండు నాన్నా’ అంటూ కూతురు, భార్య బయటికి వెళ్లారు.మనమరాలి వైపు చూశాడు. ఆడుకుంటూ ఆడుకుంటూ నేల మీదనే నిద్రపోయినట్టుంది. ‘కేసు గెలుస్తామో, ఓడిపోతామో? భరణం వస్తుందో, రాదో? విడాకులైతే తీసుకోవాలి. తీసుకుంటుంది సరే, కానీ కూతురి భవిష్యత్..! పాపను వదిలెయ్యి అంటే కూతురు ఒప్పుకుంటుందా? ఎక్కడెక్కడి ఆలోచనలన్నీ పాప దగ్గరే ఆగుతున్నాయి. అసలు ఆ పాపే పుట్టకుండా ఉండుంటే ఇంతగా ఆలోచించాల్సిన అవసరం ఉండేది కాదు కదా! ఆరోజే అబార్షన్ చేయించాల్సింది.. తప్పు చేశాను’ అనుకుంటూ నిద్రకు, మెలకువకు కాని స్థితిలో కళ్లు మూసుకున్నాడు.మెలకువ వచ్చి చూసేసరికి పాప అక్కడ లేదు. వరండాలో పారిజాతం చెట్టుకింద రాలిపడిన పూలతో ఆడుకుంటోంది. పక్కనే వాటర్ సంప్ ఉంది. కొంచెం కదిలినా అందులో పడిపోతుంది.పక్కకు తీసుకొద్దామా, వద్దా..! చుట్టూ చూశాడు. తనను ఎవరూ గమనించలేదు అని అర్థమైంది. ఇదే అవకాశం. డోరు చాటుకు నక్కి, కిటికీలో నుంచి తొంగి చూస్తున్నాడు. అయిదు నిమిషాలు గడిచాయి. పాప కదలకుండా కింద పడిన పూలన్నీ ఏరి కుప్పగా పోస్తోంది.‘పాప పడిందా, రెండే రెండు నిమిషాలు చాలు. గమనించకుండా నిద్రపోయినందుకు కూతురు నన్ను తిట్టుకుంటుంది, వారం పది రోజులు మహా అయితే ఓ నెల రోజులు బాధపడుతుంది. పడనీ తర్వాత మెల్లిగా మరిచిపోతుంది. నిదానంగా పెళ్లి చెయ్యొచ్చు. ఒకవేళ పాప నీళ్లల్లో పడిన శబ్దం పక్కింటోళ్లో, దారిలో పొయ్యే వాళ్లో ఎవరైనా గమనించారా మన దరిద్రం’ రకరకాల ఆలోచనలు చుట్టుముట్టాయి ఒక్కసారిగా.గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఒళ్లంతా చెమటలు. పది నిమిషాలకు కదిలింది. చెయ్యి తీసి మరో చెయ్యి మారిస్తే చాలు పడబోతుంది అనంగా గేటు తీసిన శబ్దం. గట్టిగా కేకేసి పరిగెత్తుకుంటూ వచ్చి పాపను ఎత్తుకుంది కూతురు. మొహానికి పట్టిన చెమట తుడుచుకుని, ఏం తెలియనట్టు వెళ్లి సోఫాలో పడుకున్నాడు.‘ఒక్క అడుగు ఆలస్యమైనింటే..!’ కేకలేస్తూ ఇంట్లోకి వచ్చింది భార్య. ఆ అరుపులకు మెలకువొచ్చినట్టు లేచి ‘ఏమైందీ’ అడిగాడు అమాయకంగా.మనమరాలి ప్రాణాపాయం నుంచి మొదలు కోర్టు కేసు, విడాకులు, అత్తగారింట్లో కూతురి కష్టాలు, పెళ్లి మొదలు మొగుడి చేతగానితనం వరకూ అన్నీ చదువుతూనే ఉంది సాయంత్రం వరకూ. ఎలా తప్పించుకోవాలి అనుకుంటుండగా ‘స్టేషన్‌కి కొత్త ఎస్సై వచ్చిందంట. వెళ్లి ఫార్మాలిటీగా కలిసొద్దాంరా’ అని లాయర్ ఫోన్ చెయ్యడంతో వెళ్లాడు.యంగ్ ఆఫీసర్. ట్రైనింగ్ తర్వాత తొలి పోస్టింగ్. అందరూ పరిచయం చేసుకున్నారు. అవీ ఇవీ మాట్లాడి, కదలబోతుండగా నేమ్ ప్లేట్ చూశాడు. ఈ పేరు ఎక్కడో చూసినట్టు ఉందే అనుకుంటూ మొహం చూశాడు. గుర్తుకొచ్చింది. నాలుగేళ్ల కిందట తాను వాదనలు వినిపించిన విడాకుల కేసులో ఆ అమ్మాయి రెస్పాండెంట్.లాయర్ బ్రహ్మారెడ్డి మనసులోని భావం గ్రహించినట్టు నవ్విందామె. ఇంటికొచ్చాడు. తిని పడుకున్నా కూడా అదే నవ్వు వెంటాడుతోంది. నిద్రపట్టలేదు. ఆ అమ్మాయి కేసు కళ్ల ముందు మెదిలింది. తిరిగి చూస్తే ఇప్పుడు తన కూతురిదీ అదే పరిస్థితి. మనసులో ఎంత సంఘర్షణ అనుభవించేదో గానీ బయటికి మాత్రం నిండు కుండలా ఉండేది. అంత బాధనూ దిగమింగుకుని, పడిలేచిన కెరటంలా ఇప్పుడు ఎస్సైగా రావడం చూసి తల తీసేసినట్టుగా ఉంది. ఏదో అపరాధభావం.నెల రోజులు గడిచాయి. ఒకట్రెండు సార్లు కలిసే అవకాశం వచ్చినా కూడా ఎదురుపడే ధైర్యం లేక కలవలేదు. కూతురి కేసు వాయిదా ఉంటే కోర్టుకు వచ్చాడు. ఏదో కేసు అటెండ్ అవ్వడానికి కోర్టుకొచ్చి, టైమ్ ఉండడంతో జీప్‌లో కూర్చుని ఉంది ఎస్సై.‘నేను నీ కేసు విషయంలో బాగా ఇబ్బంది పెట్టాను. ఆరోజు అలా చెయ్యాల్సింది కాదు’ అంటూ బాధపడ్డాడు. అతని మాటల్లో తేడా తెలుస్తోంది.అంతా విని, ‘ఇన్నాళ్లకు తెలిసిందా లాయర్ బ్రహ్మారెడ్డి గారూ. నేను మగాన్ని ఏమైనా అంటాను, నువ్వు ఆడదానివి పడాలి అన్నట్టు బిహేవ్ చేసేవాడు. నా వల్ల కాలేదు. విడిపోదాం అనుకునేంతలో కడుపులో బిడ్డ. తెలిసో తెలియకో పెళ్లి చేసుకున్న పాపానికి పుట్టబోయే బిడ్డనెందుకు ఒంటరి చెయ్యడం అని సర్దుకుపోదామనుకున్న ప్రతిసారీ వాళ్లమ్మొక మాట, నాన్నొక మాట, అక్కొక మాట. ఎంతకాలం పడాలి? అసలెందుకు పడాలి? విడిపోతాం. ఎవరి బతుకు వారిది. మరి పాప పరిస్థితి? పాప భవిష్యత్ కోసం మెయింటెనె¯Œ ్స, భరణం అడిగితే చట్ట పరంగా ఒకపక్క, నా క్యారెక్టర్‌ను తక్కువ చేస్తూ మరోపక్క ఎంతలా వేధించారు. నీకూ ఒక కూతురుండి, తనకు ఇలా జరిగినా కూడా ఇలాగే చేస్తావా అని అడుగుదామని ఆరోజు మీ దగ్గరికి రాబోతుంటే అద్దాల చాటున మీరు చూసిన చూపు గుర్తుందా?’ అతని వైపు చూసింది.ఆమె కళ్లల్లోకి చూసే ధైర్యం చాలక పక్కకు చూస్తూ నిలబడ్డాడు.‘ఏదోకరోజు కాళ్ల బేరానికి రాకపోదా అని మీరనుకున్నారు. నేను నాలా బతుకుతున్నా’ జీప్ దిగి, క్యాప్ సర్దుకుంటూ కదిలిపోయింది.ఆమె వెళ్లిన వైపు చూస్తూ నిలబడ్డాడు. ఆమె నోటి నుంచి వచ్చిన ఒక్కొక్కమాట ఒక్కో సూదిలా గుచ్చుతున్నాయి. నిజమే. ఆ అమ్మాయికి సమస్య వస్తే సమస్యను సవాలు చేసి గెలిచింది. మరి నేను..? పాప మరణాన్ని కోరుకున్నాను. తన అల్పత్వానికి వణికిపొయ్యాడు. కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి. నీళ్లు తుడుచుకుని చుట్టూ చూశాడు. ఇంతకుముందు క్లైంట్లు, రెస్పాండెంట్లు కనపడేవాళ్లు. ఇప్పుడు మనుషులు కనిపిస్తున్నారు. -
Archana Jois: మహాదేవి
హీరోయిన్స్ కెరీర్ తల్లి పాత్రలతో ఎండ్ అవుతుందనే అభిప్రాయం ఉంది సినీఫీల్డ్‌లో! కానీ అర్చనా జోయిస్ సినీ ప్రయాణమే తల్లి పాత్రతో మొదలైంది. ‘కేజీఎఫ్’లో రాకీ భాయ్‌కి అమ్మగా నటించి, దేశవ్యాప్తంగా కోట్లాది అభిమానులను సంపాదించుకుంది. వరుస సినీ, సిరీస్ అవకాశాలతో అదరగొడుతున్న ఆమె గురించి కొన్ని వివరాలు...అర్చన పుట్టి పెరిగిందంతా కర్ణాటకలోని రామనాథపురలో. నాన్న శ్రీనివాసన్, అమ్మ వీణ.. ఇద్దరూ ప్రైవేటు టీచర్లు. అర్చనకు క్రమశిక్షణతో పాటు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడం నేర్పించారు.చిన్నప్పటి నుంచే సంగీతం, నాట్యంలో శిక్షణ తీసుకోవడం మొదలుపెట్టింది. ఇంటర్ తర్వాత డిగ్రీ చేయాలా? లేక నాట్యం వైపు వెళ్లాలా? అనే సందిగ్ధంలో పడింది.మామూలు డిగ్రీలో జాయిన్ అయితే బాల్యం నుంచి ప్రేమించిన నాట్యానికి దూరమవుతానేమో అని భావించి, బెంగళూరు యూనివర్సిటీ, నాట్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ కథక్ అండ్ కొరియోగ్రఫీలో చేరింది. మూడేళ్ల ఆ డిగ్రీలో పట్టా పొంది, దేశవిదేశాల్లో నృత్యప్రదర్శనలు ఇచ్చింది.బీఎఫ్ఏ చేస్తున్న రోజుల్లోనే ‘మహాదేవి’ సీరియల్ కోసం జరిగిన ఆడిషన్స్‌లో ఆమె పాల్గొంది. ఇచ్చిన డైలాగ్స్‌ని తడబడకుండా బ్రహ్మాండమైన ఫీల్‌తో చెప్పి, ఆ సీరియల్లో నటించే చాన్స్‌ని దక్కించుకుంది. అనుకున్నట్టుగానే అది ఆమెకు మంచిపేరే కాదు.. మరెన్నో సీరియల్స్‌లో అవకాశాలనూ తెచ్చిపెట్టింది. అలా వరుస సీరియల్స్ చేస్తూనే చెన్నైలోని పద్మా సుబ్రహ్మణ్యం అకాడమీలో చేరి ఫైన్ఆర్ట్స్లో మాస్టర్స్ చదివింది.సీరియల్స్ అంటే ఒకే పాత్రలో నెలల తరబడి నటించడం వల్ల వైవిధ్యానికి చోటుండదు. ఆ వైవిధ్యం కోసమే సమయం చిక్కినప్పుడల్లా నృత్యప్రదర్శనలిస్తూ, కవర్ సాంగ్స్ కూడా చేయడం మొదలుపెట్టింది. అవన్నీ మంచి ఆదరణ పొందాయి. ఆ పర్ఫార్మెన్స్ చూసే దర్శకుడు ప్రశాంత్ నీల్ ‘కేజీఎఫ్’లో తల్లి పాత్రను ఆఫర్ చేశాడు. అప్పటికి అర్చన వయసు 21ఏళ్లు మాత్రమే. అయినప్పటికీ ఆ పాత్రలో అలవోకగా నటించి, మెప్పించింది. ఆ తర్వాత ‘ఘోస్ట్’, ‘మ్యూట్’ చిత్రాలతోనూ తన ప్రతిభ చాటుకుంది. ‘మాన్షన్ 24’ అనే సిరీస్‌తో వెబ్ దునియాలోకీ అడుగుపెట్టింది. ఆ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమ్ అవుతోంది. అర్చన నటించిన తాజా చిత్రం ‘యుద్ధ కాండ’ విడుదలకు సిద్ధంగా ఉంది.సినిమాల్లోకి రాకముందే మా దూరపు బంధువు శ్రేయస్‌తో నాకు పెళ్లయింది. నా నాట్యం, నటనకు వైవాహిక జీవితం ఎప్పుడూ అడ్డు కాలేదు. సినిమా, సిరీస్‌ల వల్లే నాకిష్టమైన డా¯Œ ్సకు కాస్త దూరమయ్యాను. అందుకే ఇకపై నాట్యానికి, నటనకు ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలని, ఎప్పటికీ గర్తుండిపోయే పాత్రలు చేయాలని నిర్ణయించుకున్నాను!– అర్చనా జోయిస్. -
Sophie Devine: డివైన్ కల తీరగా...
2010 మహిళల టి20 వరల్డ్ కప్ ఫైనల్.. కేవలం 107 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చేరువగా వచ్చిన న్యూజీలండ్ 3 పరుగుల స్వల్ప తేడాతో ఆసీస్ చేతిలో ఓటమిపాలైంది. చివరి వరకు పోరాడిన సోఫీ డివైన్ జట్టును గెలిపించలేక కన్నీళ్ల పర్యంతమైంది. 2024 మహిళల టి20 వరల్డ్ కప్ ఫైనల్.. 32 పరుగులతో దక్షిణాఫ్రికాను ఓడించి తొలిసారి న్యూజీలండ్ టి20 వరల్డ్ కప్ గెలుచుకుంది. ఇక్కడా సోఫీ డివైన్ కన్నీళ్లను ఆపడం ఎవరి వల్లా కాలేదు. కానీ ఈసారి ఆమె విజేత స్థానంలో ఉంది. ఈ రెండు సందర్భాల మధ్య ఏకంగా 14 సంవత్సరాల అంతరం ఉంది. 21 ఏళ్ల వయసులో ఓటమిని తట్టుకోలేక ఏడ్చేసిన సోఫీ డివైన్ ఇప్పుడు 35 ఏళ్ల వయసులో సారథిగా, ప్రపంచ అత్యుత్తమ ప్లేయర్లలో ఒకరిగా తన కెరీర్‌ను పరిపూర్ణం చేసుకుంది.దేశం తరఫున రెండు వేర్వేరు క్రీడల్లో ప్రాతినిధ్యం వహించిన క్రీడాకారులు ప్రపంచవ్యాప్తంగా చాలా అరుదుగా ఉంటారు. అలాంటి వారిలో సోఫీ డివైన్ కూడా ఉంది. న్యూజీలండ్ జట్టు తరఫున అంతర్జాతీయ హాకీ మ్యాచ్‌లు ఆడిన ఆమె ఆపై క్రికెటర్‌గా సత్తా చాటి ఇప్పుడు ఆ దేశం తరఫున అరుదైన రికార్డులు సొంతం చేసుకుంది. చిన్నప్పటి నుంచి క్రీడలంటే బాగా ఇష్టపడేది. అందుకే ఆ దేశంలో అంతా పడిచచ్చే రగ్బీ క్రీడాకారిణి కావాలనుకుంది. అయితే 11 ఏళ్ల వయసులో స్కూల్లో క్రికెట్ జట్టులో అవకాశం దక్కడంతో అటు వైపు మళ్లింది. ఆపై మూడేళ్ల పాటు క్రికెట్‌పైనే దృష్టి పెట్టింది. తన స్కూల్, కాలేజీలకు చెందిన అబ్బాయిల జట్టు తరఫునే డివైన్ ఆడేది. మరోవైపు అదే కాలేజీ తరఫున అబ్బాయిల హాకీ టీమ్‌లోకి కూడా ఎంపిక కావడం విశేషం. దాంతో దాదాపు సమానంగా రెండు క్రీడల్లో ఆమె ప్రస్థానం మొదలైంది. 14 ఏళ్ల వయసులో మహిళల సీనియర్ హాకీ టీమ్ తరఫున సత్తా చాటడంతో 2009 జూనియర్ హాకీ వరల్డ్ కప్‌లో ఆడే అవకాశం వచ్చింది. అయితే తండ్రి ఉద్యోగం కారణంగా ఆమె కుటుంబం వెలింగ్టన్ నుంచి క్రైస్ట్‌చర్చ్ వెళ్లిపోగా కెరీర్ పరంగా కీలక దశలో ఏదో ఒక ఆటను ఎంచుకోవాల్సిన తరుణం వచ్చింది. దాంతో హాకీకి గుడ్‌బై చెప్పిన డివైన్ క్రికెట్‌పైనే పూర్తి దృష్టి పెట్టింది. పిన్న వయస్కురాలిగా..క్రికెటర్‌గా డివైన్ పడిన శ్రమ వృథా కాలేదు. పేస్ బౌలర్‌గా కెరీర్ ప్రారంభించిన ఆమె మూడేళ్లపాటు రాష్ట్ర జట్టు కాంటర్బరీ తరఫున సత్తా చాటింది. దాంతో 17 ఏళ్ల వయసులోనే న్యూజీలండ్ టీమ్‌లో స్థానం లభించింది. అతి పిన్న వయసులో ఇలాంటి అవకాశం దక్కించుకున్న ప్లేయర్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న డివైన్‌కు ఈ వార్త తెలిసే సమయంలో ఆమె కాలేజీ పరీక్షలు రాస్తోంది. ఒక్కసారి టీమ్‌లోకి వచ్చాక మళ్లీ వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేకపోయింది. అటు బౌలింగ్‌తో పాటు ఇటు దూకుడైన బ్యాటింగ్‌లో కూడా తన ముద్ర చూపించడంతో 2009 టి20 వరల్డ్ కప్‌లో ఆడే కివీస్ టీమ్‌లోకి ఎంపికైంది. ఈ టోర్నమెంట్లో కివీస్ రన్నరప్‌గా నిలిచింది. ఫైనల్ తర్వాత ఒక్కొక్కరుగా సీనియర్లు ఆటకు దూరం అవుతుండగా.. తమ ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించి భవిష్యత్ తారగా గుర్తింపు తెచ్చుకున్నవారిలో డివైన్ ప్రత్యేకతే వేరు. 15 ఏళ్ల వయసులోనే తాను టైప్ 1 డయాబెటిస్తో బాధపడినా పట్టుదల, తగిన డైటింగ్‌తో దాని ప్రభావం తన మీద పడకుండా ఆ ప్రతికూలతను అధిగమించింది. విధ్వంసకర బ్యాటింగ్‌తో..పేస్ బౌలింగ్‌తో పాటు బ్యాటర్‌గా తన ఆటను అద్భుతంగా మార్చుకోవడంతో డివైన్ కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. ఒక సమయంలో 11వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ఆమె తన విధ్వంసకర బ్యాటింగ్‌తో ఓపెనర్ స్థాయికి ఎదగడం విశేషం. ఒకసారి బ్యాటర్‌గా కూడా గుర్తింపు తెచ్చుకున్న తర్వాత బ్యాటింగ్‌లో తన భారీ షాట్లతో పలు సంచలనాలు సృష్టించింది. 2013 వన్డే వరల్డ్ కప్‌లో దక్షిణాఫ్రికాపై 131 బంతుల్లో 145 పరుగులు, అంతర్జాతీయ మహిళల టి20ల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ (18 బంతుల్లో), పాకిస్తాన్‌పై ఒక వన్డేలో బాదిన 9 సిక్సర్లు ఆమె ధాటిని తెలియజేశాయి. ఓవరాల్‌గా మహిళల టి20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ (36 బంతుల్లో) రికార్డు డివైన్ పేరిటే ఉండగా అటు పురుషుల, మహిళల అంతర్జాతీయ టి20ల్లో వరుసగా 6 మ్యాచ్‌లలో కనీసం అర్ధ సెంచరీ సాధించిన రికార్డు ఆమె సొంతం. మహిళల బిగ్‌బాష్ లీగ్ టి20 టోర్నీలో డివైన్ ఖాతాలో ఏకంగా 4 శతకాలు ఉండటం మరో విశేషం. సారథిగా నడిపించి..దుబాయ్‌లో జరిగిన టి20 వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు న్యూజీలండ్ జట్టు వరుసగా 10 మ్యాచ్‌లలో ఓటమిపాలైంది. ఈ టోర్నీలో అడుగుపెట్టినప్పుడు ఆ జట్టుపై ఎలాంటి కనీస అంచనాలు కూడా లేవు. సహజంగానే టీమ్‌లో వాతావరణం గంభీరంగా ఉండేది. అలాంటి సమయంలో డివైన్ జట్టు సహచరుల్లో స్ఫూర్తి నింపింది. ‘వరల్డ్ క్రికెట్లో ఏదీ సులువుగా రాదు. 14 ఏళ్ల తర్వాత కూడా నేను ప్రపంచ కప్ కల కంటున్నానంటే ఏదీ అసాధ్యం కాదనే నమ్మకంతోనే! ఫలితం గురించి ఆలోచించవద్దు. ఓడినా నాలాగా మీకు భవిష్యత్తులో మళ్లీ అవకాశం వస్తుంది’ అని చెప్పింది. ఆ గ్రూప్ నుంచి ఆసీస్‌తో పాటు భారత్ మాత్రమే సెమీస్ చేరుతుందని అంతా భావించారు. అయితే డివైన్ మాత్రం తొలి మ్యాచ్‌లో భారత్‌తో గెలిస్తే చాలు.. అంతా మారిపోతుందని నమ్మింది. భారత్‌పై తానే అర్ధసెంచరీతో గెలిపించి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచింది. ఆమె చెప్పినట్లు నిజంగానే ఆపై కివీస్ ఎదురులేకుండా దూసుకుపోయింది. వరల్డ్ కప్ విజేతగా నిలిచే వరకు సోఫీ డివైన్ టీమ్ ఆగిపోలేదు. ∙మొహమ్మద్ అబ్దుల్ హాది -
నెలసరి బాధలకు చెక్‌పెట్టే ఔషధం
చాలామంది మహిళలు ఎండోమెట్రియాసిస్ సమస్య కారణంగా నెలసరి సమయంలో తీవ్రమైన నొప్పి, అధిక రక్తస్రావం వంటి ఇబ్బందులతో బాధపడుతుంటారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది మహిళలు ఎండోమెట్రియాసిస్‌తో బాధపడుతున్నారు. ఈ సమస్య వల్ల మహిళలు తీవ్రమైన రక్తహీనతకు లోనవుతారు. ఎండోమెట్రియాసిస్ సమస్యను శాశ్వతంగా నయం చేసే చికిత్స పద్ధతులేవీ ఇప్పటికీ అందుబాటులోకి రాలేదు. అయితే, ఎండోమెట్రియాసిస్ వల్ల తలెత్తే నొప్పులను, అధిక రక్తస్రావాన్ని అరికట్టే ఔషధం ఇంగ్లండ్‌లో అందబాటులోకి వచ్చింది. ‘ఇవాన్–500ఎంజీ’ పేరుతో ఇటీవల మార్కెట్లోకి విడుదలైన ఈ మాత్రలను ఎలాంటి ప్రిస్క్రిప్షన్ లేకున్నా కొనుక్కోవచ్చు. ఈ మాత్రలలో ఉండే ‘ట్రానెక్సిమిక్ యాసిడ్’ నెలసరి బాధలకు చాలా వరకు చెక్ పెడుతుంది. ఇప్పటికే ఈ మాత్రలు వాడిన మహిళలు ఇవి అద్భుతంగా పనిచేస్తున్నాయని చెబుతున్నారు.(చదవండి: బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం వారికే ఎక్కువ..! నిపుణుల వార్నింగ్) -
Rashmita Thapa: సింపుల్ సిగ్నేచర్
రశ్మితా పుట్టి పెరిగిందంతా ముంబైలోనే! సినిమాలు అంటే పిచ్చి! వారానికో సినిమా చూసి అందులోని హీరోయిన్ స్టయిలింగ్‌ను కాపీ చేసేది. అలా గ్లామర్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ మీదున్న ఆసక్తితో డిగ్రీ చదువుతుండగానే మోడలింగ్‌లోకి అడుగుపెట్టింది. కానీ ఆ తర్వాత గ్రహించింది తన అసలు ఆసక్తి స్టయిల్ని కాపీ చేయడంలో కాదు క్రియేట్ చేయడంలో అని! అందుకే చదువుతున్న డిగ్రీకి గుడ్ బై చెప్పి ఫ్యాషన్ డిజైనింగ్‌లో చేరింది. ఆ కోర్స్ పూర్తయిన తర్వాత పలు ఫ్యాషన్ డిజైనర్స్ దగ్గర పనిచేసింది. స్టయిలింగ్‌లో ప్రాక్టికల్ ఎక్స్‌పీరియెన్స్ కోసం కొంతమంది సెలబ్రిటీ స్టయిలిస్ట్‌ల వద్ద ఇంటర్న్‌గా చేరింది. ఆమె పరిశీలన, పనితీరుకు చాలామంది సెలబ్రిటీలు ఇంప్రెస్ అయ్యి, ఆమెను స్టయిలిస్ట్‌గా పెట్టుకున్నారు. వారిలో శ్రీలీల, రీతూ వర్మ, లావణ్యా త్రిపాఠీ, నేహా శెట్టీ, నిధీ అగర్వాల్, చాందినీ చౌదరి, రుహానా శర్మ, నభా నటేశ్, ఆకాంక్షా సింగ్, అనుపమా పరమేశ్వరన్, కీర్తీ సురేష్‌తో పాటు బాలీవుడ్ సెలబ్రిటీలు కియారా ఆడ్వాణీ, జాక్వెలిన్ ఫెర్నాండేజ్, జాన్వీ కపూర్, ఆలియా భట్, సారా అలీ ఖాన్, అనన్యా పాండే, అవికా గోర్, సోనాల్ చౌహాన్ కూడా ఉన్నారు. రశ్మితా స్టయిలింగ్ మంత్ర.. సింపుల్ అండ్ కంఫర్ట్! దానివల్లే ఎందరో సెలబ్రిటీలకు ఆమె ఫేవరట్ స్టయిలిస్ట్ అయింది. క్యాజువల్ లుక్ నుంచి రెడ్ కార్పెట్ వాక్స్, కార్పొరేట్ ఈవెంట్స్, ఎండార్స్మెంట్స్, సినిమా ప్రమోషన్స్, ఫంక్షన్స్, పెళ్లిళ్ల దాకా.. సందర్భానికి తగ్గట్టు సెలబ్రిటీలకు స్టయిలింగ్ చేసి సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్‌గా నిలబెడుతుంది. అందుకే ఆమెకు ఫిమేల్ సెలబ్రిటీలే కాదు మేల్ సెలబ్రిటీలూ ఫ్యాన్సే! వాళ్లలో అల్లు శిరీష్ ముందుంటాడు. తర్వాత విజయ్ దేవరకొండ. ఆ ఇద్దరికీ రశ్మితానే స్టయిలింగ్ చేస్తోంది. తన క్రియేటివ్ జీల్‌తో ఫ్యాషన్ వ్లాగ్స్ కూడా చేస్తూ సోషల్ మీడియాలోనూ పాపులారిటీ సంపాదించింది. వీటితోపాటు అప్పుడప్పుడు మోడల్‌గానూ మెరుస్తోంది. -
మెల్ల ఉందని తెలుసుకోవడమెలా? ఎలా సరిదిద్దాలి..?
చిన్నపిల్లలు తమ కళ్లను అటు ఇటు తిప్పి చూస్తున్నప్పుడు వాళ్ల రెండు కన్నులు సమానంగా ఉండాలి. అలా కాకుండా వాటిలో ఏదైనా కనుపాప పక్కకు చూస్తున్నట్లుగా ఉండి. కన్నుల మధ్య అలైన్మెంట్ లోపించడాన్ని మెల్ల కన్నుగా చెప్పవచ్చు. కొంతమంది చిన్నారుల్లో ఇది చాలా సాధారణంగా కనిపించే సమస్య. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే... అప్పుడే పుట్టిన చిన్నారుల నుంచి మూడు నెలల వయసప్పటివరకు పిల్లల్లో చూపు కాస్త మసగ్గా ఉండవచ్చు లేదా పూర్తిగా అభివృద్ధి చెంది ఉండకపోవచ్చు. అందుకే చిన్నారులు తమ మూడో నెల వరకు ఒకేచోట దృష్టి కేంద్రీకరించలేరు. మూడు నెలల వయసప్పటి నుంచి పిల్లలు ఒక వస్తువు (ఆబ్జెక్ట్) మీద దృష్టి పెట్టడం మెుదలుపెడతారు. మూడు నెలల వయసు దాటాక పిల్లల్లో మెల్లకన్ను కనిపిస్తుంటే వీలైనంత త్వరగా చికిత్స అందించాలి. అంతేతప్ప మెల్ల అదృష్టమనే అపోహతో దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. నిజానికి అది దురదృష్టం. మెల్ల ఉందని తెలుసుకోవడమెలా, కారణాలూ, చికిత్స త్వరగా ఎందుకు చేయించాలనే అనేక అంశాలపై అవగాహన కోసం ఈ కథనం. మెల్ల ఉందని తెలుసుకోవడమెలా? పిల్లల కన్నులు ఒకేలా లేకపోవడం, ఒక పక్కకు చూసినప్పుడు వాళ్లలో కేవలం ఒక కన్నుకు మాత్రమే ఆ పక్కకు తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తే దాన్ని ‘మెల్ల’ అని అనుకోవచ్చు. పసిపాపలు బలహీనంగా ఉండి, వాళ్లలో ఏదైనా రుగ్మత ఉండటం వల్ల ఈ లక్షణం కనిపించినా దాన్ని మెల్ల అనే అనుకోవాలి. అప్పుడే పుట్టిన పిల్లల నుంచి మూడు నెలల వయసప్పటివరకు పై లక్షణాలు కనిపిస్తే దాని గురించి అంతగా ఆందోళన అక్కర్లేదు. అయితే మూడు నెలలు దాటాక కూడా అవే లక్షణాలు కనిపిస్తే వెంటనే పూర్తిస్థాయి కంటి పరీక్షలు చేయించాలి.కారణాలు... మెల్లకన్ను రావడానికి ఇదీ కారణమని నిర్దిష్టంగా చెప్పడం కష్టం. కొందరిలో పుట్టుకతోనే రావచ్చు. లేదా దృష్టిలోపాలు (రిఫ్రాక్టివ్ ఎర్రర్స్) ఉండటం వల్ల... అంటే హ్రస్వ దృష్టి, దూరదృష్టి, ఆస్టిగ్మాటిజం, మజిల్ ఇంబాలెన్సెస్, నరాల సమస్యల వల్ల కూడా కనిపించవచ్చు. అయితే స్పష్టంగా కనిపించడం అన్నది కాస్త పిల్లలు పెద్దయ్యాక జరుగుతుంటుంది. మెదడుకు సంబంధించిన రుగ్మతలు, జెనెటిక్ సిండ్రోమ్స్ ఉన్నప్పుడు కూడా మెల్ల కన్ను వస్తుంది. త్వరిత నిర్ధారణ చాలా ముఖ్యం చిన్నారుల్లో మెల్ల కన్ను ఉన్నట్లు చూడటంగానీ లేదా అనుమానించడం గాని జరిగినప్పుడు వీలైనంత త్వరగా దాన్ని నిర్ధారణ చేయడం చాలా ముఖ్యం. వుూడు నెలలు దాటాక లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే గుర్తించి, తగిన చికిత్స అందించక΄ోతే ఆ కండిషన్ శాశ్వతం అయ్యే అవకాశం ఉంది. మెల్లకన్ను ఉన్న పిల్లల్లో దృష్టిలోపాలు (రిఫ్రాక్టివ్ ఎర్రర్స్) ఏమైనా ఉన్నాయా అని నిర్ధారణ చేయడం కూడా చాలా ముఖ్యం. ఒకవేళ రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ ఉంటే చక్కదిద్దేందుకు కళ్లద్దాలు (కరెక్టివ్ స్పెక్టకిల్స్) వాడటం తప్పనిసరి. ఆ తర్వాత కూడా డాక్టర్ చెప్పిన విధంగా పిల్లలను కంటి డాక్టర్ ఫాలో అప్‌లో ఉంచాలి. మెల్లకన్నుకు వీలైనంత త్వరగా చికిత్స చేయించకోకపోతే అది ఆంబ్లోపియా (లేజీ ఐ) అనే కండిషన్‌కు / కాంప్లికేషన్కు దారితీయవచ్చు. అంటే... మెల్ల ఉన్న కంటిలో చూపు క్రవుంగా తగ్గిపోతూ ఉంటుంది. ఆరేళ్ల లోపు దీన్ని చక్కదిద్దకోకపోతే ఆ దృష్టిలోపం శాశ్వతమయ్యే అవకాశాలూ ఎక్కువే.చికిత్సమెల్ల కన్నుల్లోని అకామడేటివ్, ఈసోట్రోపియా అనే రకాలకు ‘ప్లస్’ కళ్లజోళ్లను డాక్టర్లు సూచిస్తారు. ఒక కన్నులో దృష్టిలోపం ఉండి, ఒక కన్ను నార్మల్‌గా ఉన్నప్పటికీ... దృష్టిలోపం ఉన్న కన్ను క్రమంగా మెల్లకన్నులా మారుతుంది. రానురానూ ఇది ‘లేజీ ఐ’ (యాంబ్లోపియా) అనే కండిషన్‌కు దారితీస్తుంది. దీనికి కూడా కళ్లజోడు వాడటమే సరైన చికిత్స. అప్పుడప్పుడూ కనిపించే మెల్ల కన్ను (ఇంటర్మిటెంట్ స్క్వింట్) అనేది కంటి కండరాల బలహీనత వల్ల వస్తుంది. కంటి వ్యాయామాల ద్వారా దీన్ని సరిచేయవచ్చు. కొందరు చిన్నారులు పుట్టుకతోనే మెల్లకన్ను కలిగి ఉంటారు. దీనికి న్యూరాలజిస్ట్ సహాయంతో చికిత్స అందించాల్సి వస్తుంది. వీటన్నింటితోనూ సమస్య పరిష్కారం కాకపోతే అప్పుడు కంటి వైద్య నిపుణులు శస్త్రచికిత్సను సూచిస్తారు. ఈ శస్త్రచికిత్స చాలా సులువైనదీ, ఫలితాలు కూడా చక్కగా ఉంటాయి. ఇప్పటికీ చాలాచోట్ల మారుమూల పల్లెల్లో మెల్ల కన్ను అదృష్టమనే అభిప్రాయం కొందరిలో ఉంటుంది. ఇది కేవలం అపోహ మాత్రమే. చిన్నారులు తమ దృష్టి జ్ఞానం కోల్పోయే ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకుని వీలైనంత త్వరగా మెల్లకన్నుకు చికిత్స అందించడం అవసరం.డాక్టర్ రవికుమార్ రెడ్డి, సీనియర్ కంటి వైద్య నిపుణులు (చదవండి: వాసన కోల్పోవడం..ఏకంగా అన్ని వ్యాధుల రూపంలో..!) -
‘ఇంతకీ నువ్వు కట్టుకుంది నన్నా? మీ అక్కనా?’
బాలీవుడ్లో కరీనా కపూర్ ఖాన్‌కి గాసిప్ క్వీన్ అనే పేరుంది. అక్క కరిశ్మా కపూర్‌తో ఫోన్లో గంటలు గంటలు కబుర్లు చెబుతూ ఉంటుందట. అందులో సగం గాసిప్సే ఉంటాయని ఆ ఇద్దరి సన్నిహితుల కామెంట్! అదటుంచితే.. ఈ అక్కాచెల్లెళ్ల ఎడతెగని ఫోన్ సంభాషణలతో కరీనా కపూర్ ఖాన్ హజ్బెండ్, నటుడు.. సైఫ్ అలీ ఖాన్ తెగ ఉడుక్కుంటాడట. ‘ఇంతకీ నువ్వు కట్టుకుంది నన్నా? మీ అక్కనా?’ అంటూ ఆ ఉడుకుమోత్తనాన్ని చూపిస్తాడట కూడా! -
పేరెంట్స్ కన్నా, ఫ్రెండ్స్ మాటలే ముఖ్యం
‘మావాడు మేం చెప్పేది అస్సలు వినడండీ. ఎప్పుడూ ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ అంటుంటాడు. వాళ్లందరూ ఒక గ్యాంగయ్యారు. బైక్‌తో రిస్కీ ఫీట్స్ చేస్తుంటారు. ఎప్పుడేం తెచ్చుకుంటారోనని గుండె అదురుతుంటుంది..’‘మా పాప మేమేం చెప్పినా పట్టించుకోదండీ. ఫ్రెండ్స్ చెప్తే మాత్రం వెంటనే చేసేస్తుంది. తనకు నచ్చేలా ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు.’‘మా అబ్బాయి ఒకరోజు చాలా కాన్ఫిడెంట్‌గా కనిపిస్తాడు, మరుసటి రోజే డల్‌గా కనిపిస్తాడు. ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుంటాడు.’కౌన్సెలింగ్‌కు వచ్చే చాలామంది పేరెంట్స్ తమ టీనేజ్ పిల్లల గురించి చెప్పే మాటలవి. చిన్నప్పటి నుంచీ అమ్మ కూచిలా లేదా నాన్న బిడ్డలా ఉన్న పిల్లలు, అప్పటివరకు తమ అభిప్రాయలను గౌరవించి, తాము చెప్పే సూచనలు పాటించే పిల్లలు ఒక్కసారిగా మారేసరికి పేరెంట్స్ తట్టుకోలేరు. వారెక్కడ చేజారిపోతారోనని బాధపడుతుంటారు, ఆందోళన చెందుతుంటారు. కానీ, ఆ వయసుకు అది సహజం. టీనేజ్‌కు వచ్చేసరికి వారి ప్రపంచం కుటుంబాన్ని దాటి విస్తృతమవుతుంది. ఈ దశలో స్నేహితులు, ఆన్లైన్ కమ్యూనిటీల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. పేరెంట్స్ కంటే ఫ్రెండ్స్ మాటలకే ఎక్కువ విలువిస్తారు. స్నేహితుల ఆమోదం, గుర్తింపు పొందడానికి ప్రయత్నిస్తారు. ఈ మార్పును అర్థం చేసుకోవడం ద్వారా తల్లిదండ్రులు.. సున్నితమైన ఈ దశలో పిల్లలకు సరైన మద్దతు అందించగలుగుతారు. పీర్ ప్రెజర్.. స్నేహితుల ఆమోదం పొందాలనే ఒత్తిడి అందరిపైనా ఉంటుంది. కానీ టీనేజ్‌లో ఎక్కువగా ఉంటుంది. టీనేజర్లు ఒక గ్యాంగ్‌లో చేరేందుకు ప్రయత్నిస్తారు. ఆ వయసులో అది అత్యవసరమనిపిస్తుంది. ఆ స్నేహితుల ఒత్తిడికి లోనైనప్పుడు తప్పులు చేసే అవకాశాలు పెరుగుతాయి. కొందరు టీనేజర్లు మితిమీరి ప్రవర్తించవచ్చు. మద్యం సేవించడం, ప్రమాదకరమైన ఫీట్స్ చేయడం, విచిత్రమైన వేషధారణలోనూ కనిపించవచ్చు. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి, తల్లిదండ్రులు సంయమనంతో ఉండటం ముఖ్యం. పీర్ ప్రెజర్ గురించి పెద్దలతో స్వేచ్ఛగా మాట్లాడగలిగే వాతావరణాన్ని కల్పించాలి. పిల్లలతో చర్చించి, వారి నిర్ణయాలపై గల ప్రభావాన్ని అర్థంచేయించేందుకు ప్రయత్నించాలి. స్నేహితులకు ‘నో’ చెప్పగలిగే ధైర్యాన్ని నేర్పాలి. సోషల్ మీడియా ప్రభావం.. స్నేహితుల ఒత్తిడి కేవలం పాఠశాల సమయంతో ఆగిపోదు. ఇన్స్టాగ్రామ్, స్నాప్‌చాట్ వంటి సోషల్ మీడియా ద్వారా 24/7 కొనసాగుతుంది. ఇవి తమ వ్యక్తీకరణకు ఎంత ఉపయోగపడతాయో, అంతే నెగటివ్ ప్రభావాన్నీ చూపించే సామర్థ్యం గలవి. సోషల్ మీడియాలో ఇతరులను చూస్తూ, పోల్చుకోవడం వల్ల కొందరు టీనేజర్లు ఆత్మన్యూనతకు లోనవుతుంటారు. పోస్టులకు లైకులు, కామెంట్ల ద్వారా వెంటనే గౌరవాన్ని పొందాలనుకునే తీరు కూడా వారిని కుంగిపోయేలా చేయవచ్చు. సోషల్ మీడియా ద్వారా వచ్చే ఈ ఒత్తిడిని తల్లిదండ్రులు గ్రహించి, వారితో మాట్లాడాలి. వారు చూస్తున్న కంటెంట్ గురించి చర్చించాలి. అది నిజ జీవితాన్ని ప్రతిబింబించదని వారికి అర్థమయ్యేలా వివరించాలి. నిర్ణయాలు, ఆత్మగౌరవంస్నేహితులు, సోషల్ మీడియా ఒత్తిడికి లోనైనప్పుడు టీనేజర్లు ఏ మాత్రం ఆలోచించకుండా ఎమోషన్‌తో నిర్ణయాలు తీసుకుంటారు. లో సెల్ఫ్ ఎస్టీమ్‌తో ఉంటే వారు మరింతగా స్నేహితుల ఒత్తిడికి లోనవుతారు. పిల్లల్లో ఆత్మగౌరవాన్ని పెంపొందించడం అత్యంత కీలకం. తల్లిదండ్రులు ఆ బాధ్యతను తీసుకోవాలి. పిల్లలు తమ ప్రతిభను గుర్తించేలా చేయాలి, వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచాలి. ప్రతిరోజూ వారి అభిరుచులు, కష్టాలను గుర్తిస్తూ విజయం దిశగా వారిని ప్రోత్సహించాలి. తల్లిదండ్రులు చేయాల్సింది..యవ్వనంలో, స్నేహితుల ఒత్తిడి సహజమే. కానీ, మీరు సున్నితంగా, ప్రేమతో పిల్లలకు మార్గనిర్దేశం చేస్తే, వారు సంయమనం, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. అందుకు మీరు చేయాల్సింది.. పిల్లలకు మీరెప్పుడూ అందుబాటులో ఉంటారని చెప్పాలి. వారు తమ సమస్యలు మీతో పంచుకునేలా నమ్మకాన్ని కలిగించాలి.ఆత్మవిశ్వాసంతో ప్రవర్తించడం, స్నేహితుల ఒత్తిడిని ఎదుర్కొనే నైపుణ్యాలను నేర్పాలి.సోషల్ మీడియా కంటెంట్ గురించి ఓపికగా చర్చించాలి.వారి కృషి, కష్టాలు, ప్రత్యేకతలను గుర్తించి ప్రశంసించాలి.వారు తీసుకునే నిర్ణయాల ఫలితాలను అర్థంచేసుకోవడంలో వారికి సహాయం చేయాలి. -
Health Tips: వైట్ డిశ్చార్జ్ అవ్వడం సాధారణమేనా?
నాకిప్పుడు ఏడవ నెల. బేబీకి కిడ్నీలో వాపు ఉందన్నారు. దీని వలన బేబీ పుట్టిన తర్వాత ఏమైనా సమస్య వస్తుందా? ఇది అందరికీ ఉంటుందా? – నీరజ, కర్నూలుమీరు చెప్పిన సమస్యను ఫీటల్ హైడ్రోనెఫ్రోసిస్ అంటారు. ఇది సర్వసాధారణ సమస్య. సాధారణంగా ఐదవ నెల స్కాన్‌లో బయటపడుతుంది. కొద్దిమందికి మాత్రమే ఏడవ నెల, ఎనిమిదో నెల స్కానింగ్‌లలో కనబడుతుంది. ప్రెగ్నెన్సీలో తల్లి శరీరంలోని తాత్కాలికంగా కండరాలు సాగడం వలన బేబీకి కిడ్నీ వాపు కనిపించవచ్చు. ఇది డెలివరీ తరువాత తగ్గిపోతుంది. కానీ కొన్నిసార్లు కిడ్నీకి, యురేటర్కి మధ్య బ్లాకేజ్ రావచ్చు లేదా యూరేటర్కి , బ్లాడర్కి మధ్య వాల్వ్ పనిచేయకపోవచ్చు. కిడ్నీలో సిస్ట్ ఉన్నప్పుడు బేబీ కిడ్నీలో వాపు ఎక్కువగా ఉంటుంది. డెలివరీ తర్వాత స్కానింగ్‌లో బేబీ సైజును బట్టి పీడియాట్రిక్ నెఫ్రాలజిస్ట్‌ను సంప్రదించి జాగ్రత్తలు తీసుకోవాలి. చాలావరకు మందులతోనే తగ్గిపోతుంది. అరుదుగా కొంతమందికి చిన్న సర్జరీ చేయాల్సి వస్తుంది. గర్భిణీలకు 8వ నెల, 9వ నెలలో చేసే స్కాన్‌లో బేబీ కిడ్నీ వాపును బట్టి పీడియాట్రిక్ నెఫ్రాలాజిస్ట్ను సంప్రదించి తగిన చికిత్స చేయాల్సి ఉంటుంది. డెలివరీ తర్వాత పేరెంట్స్‌కు కౌన్సెలింగ్ చేసి, అవసరమైతే సర్జరీకి ప్లాన్ చేస్తారు. బేబీ స్కాన్‌లో రీనల్ పెల్విస్ వాపు 7 మి.మీ. కంటే ఎక్కువగా ఉన్నట్లయితే సర్జరీ అవసరమవుతుంది. సాధారణంగా 4 వారాల తరువాత మళ్లీ స్కానింగ్ చేసి, కణితి ఏమైనా ఉందో లేదో చూస్తారు. కణితి ఉన్నట్లయితే, హిస్ట్టరోస్కోపీ చేసి, దాన్ని చిన్న ప్రక్రియ ద్వారా తీసివేసి, బయాప్సీకి పంపుతారు. డెలివరీ తర్వాత బేబీకి ఇంకా కిడ్నీ సమస్య ఉందో లేదో తెలుసుకోవడానికి అల్ట్రాసౌండ్ స్కాన్, కొందరికి అవసరాన్ని బట్టి ఎక్స్‌రే తీస్తారు. డెలివరీ తర్వాత స్కాన్‌లో నార్మల్‌గా ఉంటే ఆ తర్వాత ఏ పరీక్షలూ అవసరం ఉండవు.నాకు 25 ఏళ్లు. ఈ మధ్యే పెళ్లయింది. మొదటి నుంచీ వైట్ డిశ్చార్జ్ ఉంది. పెళ్లయ్యాక మరీ ఎక్కువైంది. కొన్నిసార్లు బ్లడ్ స్టెయిన్స్ కూడా ఉంటున్నాయి. డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సి ఉంటుందా? లేదంటే మెడికల్ షాప్‌లో మందులు అడిగి వేసుకోవచ్చా?– సంధ్యారాణి, కామారెడ్డియంగ్ ఏజ్‌లో వైట్ డిశ్చార్జ్‌ని నిర్లక్ష్యం చేయకూడదు. చాలామందికి వైట్ డిశ్చార్జ్‌తో పాటు దుర్వాసన, దురద, మంట కూడా ఉంటాయి. ఇవన్నీ ఉంటే వెజైనల్ ఇన్ఫెక్షన్ అని అర్థం. ఇది యాంటీబయాటిక్స్‌తో తగ్గవచ్చు. కానీ డాక్టర్ని సంప్రదించకుండా మెడికల్ షాప్‌లో మందులు కొని వేసుకోవద్దు. గైనకాలజిస్ట్‌ని సంప్రదిస్తే వెజైనల్ స్పెక్యులమ్ ఎగ్జామ్ చేసి సమస్యను తెలుసుకుంటారు. గర్భసంచి ముఖద్వారానికి ఇన్ఫెక్షన్ రావడం మంచిది కాదు. భవిష్యత్తులో ప్రెగ్నెన్సీ ప్లానింగ్‌కి కూడా అది హాని చేస్తుంది. అందుకే డాక్టర్‌కి చూపించుకుంటే అసలు సమస్య ఏంటనేది తెలుస్తుంది. కొంతమందికి గర్భసంచి ముఖద్వారం పైన కొన్ని గ్రోత్స్ ఉంటాయి. అదనంగా టిష్యూ పెరగడం వల్ల వస్తాయివి. వీటిని పాలిప్స్ అంటారు. సాధారణంగా ఇవి రెడ్ లేదా గ్రే కలర్లో ఉంటాయి. వీటికి సంబంధించి చాలావరకు ఏ సింప్టమ్ ఉండకపోవచ్చు. చెక్ చేసినప్పుడు మాత్రమే తెలుస్తుంది. కానీ కొంతమందికి ఎప్పుడూ నీళ్లలా వైట్ డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది. లైంగికచర్యలో పాల్గొన్నప్పుడు స్పాటింగ్, బ్లీడింగ్ అవుతుంది. ఇలాంటివి కనిపిస్తే కచ్చితంగా తగిన వైద్య పరీక్షలు చేయించుకోవాలి. సెలైన్ సోనోగ్రఫీ ద్వారా ఈ పాలిప్ గర్భసంచిలో ఉందా లేదా గర్భసంచి ముఖద్వారం మీద ఉందా అని చెక్ చేస్తారు. పాలిప్ సైజ్, నేచర్ కూడా తెలుస్తాయి. హిస్టరోస్కోపీ ప్రక్రియ ద్వారా ఈ పాలిప్ని డే కేర్‌లోనే రిమూవ్ చేస్తారు. దాన్ని బయాప్సీకి పంపితే, అది ఎలాంటి పాలిప్, మళ్లీ వచ్చే చాన్స్ ఉందా, ఫాలో అప్ ఎలా చెయ్యాలి అనేవి డీటెయిల్డ్‌గా తెలుస్తాయి. ఏడాదికోసారి రెగ్యులర్ పెల్విక్ పరీక్ష చేయించుకోవాలి. డా‘‘ భావన కాసుగైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్హైదరాబాద్ -
ఇదేం జైలు రా సామీ..! ఏకంగా నీటి నడిబొడ్డున..
నీటి నడిబొడ్డునున్న ఈ కట్టడం ఒక చెరసాల. ఇది ఇస్టోనియాలోని వసలెమా పారిష్ పట్టణ సమీపంలోని రుమ్ము గ్రామంలో ఉంది. ఒకప్పుడు ఇక్కడ పాలరాతి గనులు, సున్నపురాతి గనులు ఉండేవి. సోవియట్ హయాంలో ఇక్కడ రుమ్ము, ముర్రు చెరసాలల్లో బందీలుగా ఉండే ఖైదీలతో ఈ గనుల్లో పనులు చేయించుకునేవారు. గని నుంచి వెలికి తీసిన సున్నపురాతిని శుద్ధి చేయడానికి చాలా నీటిని వాడేవాళ్లు. ఈ నీరు గనిని లోతుగా తవ్విన ప్రాంతంలోకి చేరి నిల్వ ఉండటం మొదలైంది. క్రమంగా ఈ నీరు ఖాళీ అయిపోయిన గని ప్రాంతమంతా నిండిపోయి, మడుగులా మారింది. చెరసాల చుట్టూ గనులు తవ్వడంతో ఇప్పుడు రుమ్ము చెరసాల భవనం నీటి మధ్యలో ఇలా మిగిలింది. ముర్రు చెరసాలను 2001లో రుమ్ము చెరసాలలో విలీనం చేశారు. తర్వాత ఈ చెరసాల 2012లో శాశ్వతంగా మూతబడింది. దీనిని చూడటానికి అప్పుడప్పుడు ఆసక్తిగల పరిశోధకులు, విద్యార్థులు ఇక్కడకు వస్తుంటారు.(చదవండి: బెట్టీ ద ఫ్యాషన్ క్వీన్) -
మహాప్రాణులకు మళ్లీ జీవం!
డైనోసార్లు, మామత్‌లు వంటి ప్రాణులను ఇప్పటి వరకు సైన్స్ ఫిక్షన్ సినిమాల్లోనూ, టీవీ సిరీస్‌లలోను మాత్రమే చూశాం. ఇలాంటి ప్రాణుల్లో కొన్ని త్వరలోనే మన కళ్ల ముందు సజీవంగా కనిపించనున్నాయి. సహస్రాబ్దాల కిందట అంతరించిపోయిన ప్రాణులు మొదలుకొని, మన కళ్ల ముందే కనుమరుగైపోయిన చాలా ప్రాణులు తిరిగి ప్రాణం పోసుకోనున్నాయి. అంతరించిపోయిన ప్రాణుల పునరుత్థానానికి ఇప్పటి శాస్త్రవేత్తలు సాగిస్తున్న ప్రయత్నాలపై ఒక విహంగ వీక్షణమే ఈ కథనం.పన్యాల జగన్నాథదాసుఈ భూమ్మీద తొలి జీవకణం ఎప్పుడు పుట్టిందో ఎవరికీ తెలీదు. భూమ్మీద మనుషులు పుట్టక ముందే ఎన్నో జీవజాతులు ప్రాణం పోసుకున్నాయి. వాటిలో కొన్ని జీవజాతులు ఆదిమానవుల కాలంలోనే అంతరించిపోయాయి. మన కాలంలోనూ మరికొన్ని జీవజాతులు అంతరించిపోయాయి. ఇంకొన్ని జీవజాతులు ప్రమాదం అంచుల్లో అంతరించిపోయే దశకు చేరువగా ఉన్నాయి. ఒకప్పుడు భూమ్మీద సంచరించిన డైనోసార్లు, మామత్‌లు వంటి వాటి గురించి పుస్తకాల ద్వారా, సైన్స్‌ఫిక్షన్ సినిమాల ద్వారా మాత్రమే తెలుసుకోగలుగుతున్నామే తప్ప వాటిని ఈ భూమ్మీద సజీవంగా చూసిన మనుషులెవరూ ఇప్పుడు లేరు. శతాబ్దాల కిందటే అంతరించిన కొన్ని జీవజాతులు సమీప భవితవ్యంలోనే తిరిగి మన కళ్ల ముందు కనిపించనున్నాయి. అంతరించిపోయిన ప్రాణుల పునరుజ్జీవానికి శాస్త్రవేత్తలు కొన్నేళ్లుగా కొనసాగిస్తున్న ప్రయోగాల్లో కొన్ని ఒక కొలిక్కి వచ్చాయి. మరో నాలుగేళ్లలోనే మామత్‌కు మళ్లీ ప్రాణం పోయనున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇదే రీతిలో మరిన్ని జీవులకూ పునర్జీవం కల్పించనున్నట్లు చెబుతున్నారు. అంతరించిపోయిన జీవులకు తిరిగి ప్రాణం పోసే ప్రక్రియను ‘జైవ పునరుత్థానం’గా (బయో రిసరెక్షన్) అభివర్ణిస్తున్నారు.మరో నాలుగేళ్లలోనే మామత్ పునరుత్థానంఎప్పుడో మంచుయుగంలో అంతరించిపోయిన ప్రాణి మామత్. ఏనుగులాంటి భారీ జంతువు ఇది. దీనికి ఏనుగులాగానే తొండం, దంతాలతో పాటు ఒంటి నిండా దట్టంగా రోమాలు ఉండేవి. భూమ్మీద మంచు యుగం 26 లక్షల ఏళ్ల కిందటి నుంచి 11 వేల ఏళ్ల కిందటి వరకు కొనసాగింది. ఆ కాలంలోనే మామత్ భూమ్మీద సంచరించేది. మంచుయుగం ముగిసిన తర్వాత మామత్ జనాభా క్రమంగా క్షీణించింది. నాలుగు వేల ఏళ్ల కిందట ఇది పూర్తిగా అంతరించిపోయింది. సహస్రాబ్దాల కిందటే అంతరించిపోయిన మామత్‌కు పునర్జీవం కల్పించేందుకు శాస్త్రవేత్తలు కొన్నేళ్లుగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. మామత్ 2028 నాటికల్లా పునరుత్థానం చెందుతుందని, అప్పటికల్లా దీనికి మళ్లీ ప్రాణం పోయనున్నామని అమెరికన్ స్టార్టప్ కంపెనీ ‘కలోసల్ బయోసైన్సెస్’కు చెందిన శాస్త్రవేత్తలు ఇటీవల ప్రకటించారు.‘కలోసల్ బయోసైన్సెస్’ అమెరికాలోని తొలి డీ–ఎక్స్‌టింక్షన్ కంపెనీ. మామత్ పునరుత్థానం కోసం దీనికి చెందిన అత్యంత కీలకమైన జన్యువులను సేకరించామని ఈ కంపెనీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రాణుల పునరుత్థానం లక్ష్యంగా ఏర్పాటు చేసిన ఈ కంపెనీకి ‘పేపాల్’ సహ వ్యవస్థాపకుడు పీటర్ థీల్, సెలబ్రిటీ మోటివేషనల్ స్పీకర్ టోనీ రాబిన్స్ వంటి ప్రముఖులే కాకుండా, అమెరికన్ గూఢచర్య సంస్థ సీఐఏ కూడా భారీ స్థాయిలో నిధులు సమకూరుస్తున్నట్లు అమెరికన్ వార్తా సంస్థ ‘ది ఇంటర్సెప్ట్’ వెల్లడించింది. ‘తొలి మామత్‌కు 2028 ద్వితీయార్ధం నాటికల్లా ప్రాణం పోయాలని లక్ష్యం నిర్ణయించుకున్నాం. ప్రస్తుతం అదే పనిలో పురోగతిలో కొనసాగుతున్నాం.అంతరించిపోయిన జీవుల్లో మొదటిగా పునరుత్థానం పొందే ప్రాణి మామత్ మాత్రమే కాగలదు. దీని గర్భధారణ వ్యవధి ఇరవైరెండు నెలలు. మామత్ జన్యువుల్లో 99.5 శాతం జన్యువులు ఆసియన్ ఏనుగుల్లో ఉన్నాయి. జన్యు సవరణ, మూలకణాల అనుసంధానం ప్రక్రియల ద్వారా ఆడ ఆసియన్ ఏనుగు అండానికి ఫలదీకరణ జరిపి మామత్‌కు పునరుత్థానం కల్పించనున్నాం’ అని కలోసల్ బయోసైన్సెస్ సీఈవో బెన్ లామ్ తెలిపారు.‘జురాసిక్ పార్క్’ మాదిరిగా కాదు స్టీవెన్ స్పీల్బర్గ్ దర్శకత్వంలోని సైన్స్ ఫిక్షన్ సినిమా ‘జురాసిక్ పార్క్’ చాలామంది చూసే ఉంటారు. ఇదే పేరుతో మైకేల్ క్రైటన్ రాసిన నవల ఆధారంగా ఈ సినిమా తీశారు. ఇందులో ఒక పారిశ్రామికవేత్త క్లోనింగ్ ద్వారా పునర్జీవం కల్పించిన డైనోసార్లతో ఒక థీమ్ పార్కు ఏర్పాటు చేస్తాడు. డైనోసార్ల బాగోగులను చూసుకునే ఒక వ్యక్తిని వెలాసిరేప్టర్ జాతికి చెందిన డైనోసార్ చంపేస్తుంది. ఇందులో క్లోనింగ్ కోసం అంతరించిన డైనోసార్ల డీఎన్ఏ ఉపయోగించినట్లుగా ఉంది. కలోసల్ బయోసైన్సెస్ జరుపుతున్న ప్రయోగాల్లో మాత్రం డీఎన్ఏను నేరుగా ఉపయోగించడం లేదు. ‘ జురాసిక్ పార్క్‌లో మాదిరిగా మేము మామత్ డీఎన్ఏను తీసుకుని, దాంతో ఆసియన్ ఏనుగు జన్యువుల రంధ్రాలను పూడ్చే పని చేయడం లేదు. సవరించిన మామత్ జన్యువులను, మూలకణాలను ఆరోగ్యకరమైన ఆడ ఆసియన్ ఏనుగు అండంలోకి ప్రవేశపెట్టి ఫలదీకరణ జరపనున్నాం’ అని బెన్ లామ్ వివరించారు.దశాబ్ద కాలంగా సంఘటిత కృషి అంతరించిపోయిన ప్రాణుల పునరుత్థానికి దాదాపు దశాబ్ద కాలంగా అంతర్జాతీయ శాస్త్రవేత్తలు సంఘటితంగా కృషి చేస్తున్నారు. ప్రాణుల పునరుత్థాన ప్రయోగాల కోసం ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్‌కు (ఐయూసీఎన్) చెందిన స్పీసీస్ సర్వైవల్ కమిషన్ 2014లో డీ ఎక్స్‌టింక్షన్ టాస్క్‌ఫోర్స్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. ఇందులో వివిధ దేశాలకు చెందిన తొమ్మిదివేల మంది శాస్త్రవేత్తలు పనిచేస్తున్నారు. ఈ టాస్క్‌ఫోర్స్‌లోని శాస్త్రవేత్తలు అంతరించిపోయిన ప్రాణుల్లో వేటికి పునరుత్థానం కల్పిస్తే, పర్యావరణానికి ఎక్కువగా మేలు కలుగుతుందో గుర్తించడంతో పాటు ప్రాణుల పునరుత్థాన ప్రయోగాల కోసం ఎంపిక చేసుకున్న ప్రక్రియల సాధ్యాసాధ్యాలపై తమ విశ్లేషణలను అందిస్తారు. మామత్తో పాటు మరికొన్ని అంతరించిపోయిన ప్రాణులకు కూడా తిరిగి ప్రాణం పోయడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇప్పటికే కొన్ని అంతరించిన ప్రాణులకు చెందిన జన్యుపదార్థాలను సేకరించి, వివిధ దశల్లో ప్రయోగాలు చేస్తున్నారు. వాటి గురించి తెలుసుకుందాం.క్వాగాఇది జీబ్రా జాతికి చెందిన జంతువు. జీబ్రాలా క్వాగాకు ఒంటి నిండా చారలు ఉండవు. తల నుంచి ఛాతీ భాగం వరకు చారలు ఉంటాయి. ఇది లేత గోధుమ రంగులో ఉంటుంది. తల నుంచి ముదురు రంగులో ఉండే ఛారలు ఛాతీ భాగం వద్దకు వచ్చే సరికి మసకబారుతాయి. క్వాగాలు ఒకప్పుడు దక్షిణాఫ్రికాలో విరివిగా కనిపించేవి. చిట్టచివరి క్వాగా 1878లో మరణించినట్లుగా రికార్డులు ఉన్నాయి. అంతరించిపోయిన క్వాగాకు తిరిగి ప్రాణం పోసేందుకు 1987లో ‘క్వాగా ప్రాజెక్టు’ ప్రారంభమైంది. జీబ్రా జాతుల్లోని బర్షెల్స్ జీబ్రాలో క్వాగా జన్యువులు అధిక శాతం ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. బర్షెల్స్ జీబ్రా ద్వారా క్వాగా పునరుత్థానానికి వారు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.ఎలిఫంట్ బర్డ్ఎగరలేని భారీ పక్షుల్లో ఎలిఫంట్ బర్డ్ ఒకటి. మడగాస్కర్‌లో ఈ పక్షులు విరివిగా ఉండేవి. స్థానికులు ఇష్టానుసారం వీటిని వేటాడి తినేయడంతో దాదాపు వెయ్యేళ్ల కిందటే ఇవి అంతరించిపోయాయి. మడగాస్కర్‌లో పరిశోధనలు సాగిస్తున్న అంతర్జాతీయ శాస్త్రవేత్తలకు ఎలిఫంట్ బర్డ్ గుడ్ల శిలాజాలు దొరికాయి. వాటి నుంచి వారు ఎలిఫంట్ బర్డ్ జన్యు పదార్థాలను సేకరించగలిగారు. ఎలిఫంట్ బర్డ్ పక్షుల్లో ఎనిమిది జాతులు ఉన్నట్లుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. డోడో మాదిరిగానే ఎలిఫంట్ బర్డ్‌కు కూడా తిరిగి ప్రాణం పోసేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.స్టెల్లర్స్ సీ కౌఇది తిమింగలంలాంటి భారీ జలచరం. ఒకప్పుడు అలాస్కా, రష్యాల మధ్య బేరింగ్ సముద్రంలో కమాండర్ దీవుల చుట్టూ కనిపించేది. పర్యావరణ మార్పులు, విచ్చలవిడిగా సాగిన వేట ఫలితంగా స్టెల్లర్స్ సీ కౌ జాతి పద్దెనిమిదో శతాబ్దిలో అంతరించిపోయింది. చివరిసారిగా ఇది 1768లో కనిపించినట్లుగా రికార్డులు ఉన్నాయి. జర్మన్ ప్రకృతి శాస్త్రవేత్త జార్జ్ విల్హెల్మ్ స్టెల్లర్ 1741లో ఈ జలచరం గురించి తన రచనల్లో విపులంగా వర్ణించాడు. అందువల్ల దీనికి అతడి పేరు మీదుగా ‘స్టెల్లర్స్ సీ కౌ’ అనే పేరు వచ్చింది. బేరింగ్ దీవి తీరంలో స్టెల్లర్స్ సీ కౌ పూర్తి అస్థిపంజరం 1987లో శాస్త్రవేత్తలకు దొరికింది. దీని ఆధారంగా జన్యు పరిశోధనలు జరిపిన శాస్త్రవేత్తలు స్టెల్లర్స్ సీ కౌకు పునరుత్థానం కల్పించడం సాధ్యమేనని, ఆ దిశగా ప్రయత్నాలు సాగిస్తున్నామని చెబుతున్నారు.ఐరిష్ ఎల్క్జింక జాతుల్లో అతిపెద్ద జంతువు ఇది. సహస్రాబ్దాల కిందట భూమ్మీద సంచరించేది. ఐర్లండ్ నుంచి సైబీరియాలోని బైకాల్ సరస్సు వరకు గల ప్రాంతంలోని దట్టమైన అడవుల్లో ఉండేది. పర్యావరణ కారణాల వల్ల, మనుగడకు సంబంధించిన పరిమితుల వల్ల ఐరిష్ ఎల్క్ జాతి ఏడువేల ఏళ్ల కిందటే అంతరించింది. ప్రస్తుతం భూమ్మీద మనుగడ సాగిస్తున్న జింక జాతుల్లో ఐరిష్ ఎల్క్ జన్యువుల్లో ఎక్కువ శాతం జన్యువులు ఉన్న జాతి ఫ్యాలో డీర్ అని శాస్త్రవేత్తలు గుర్తించారు. పంతొమ్మిదో శతాబ్ది నుంచి సాగిన పరిశోధనల్లో శాస్త్రవేత్తలకు ఐర్లండ్‌లో ఐరిష్ ఎల్క్ అస్థిపంజరాలు విరివిగా దొరికాయి. వీటి ఆధారంగా ఇప్పటికీ శాస్త్రవేత్తలు పరిశోధనలు సాగిస్తున్నారు. ఫ్యాలో డీర్ ద్వారా ఐరిష్ ఎల్క్కు పునర్జీవం కల్పించవచ్చనే అంచనాతో ఆ దిశగా ప్రయోగాలు చేస్తున్నారు.వూలీ రైనోసరస్ఇది ఖడ్గమృగం జాతికి చెందిన భారీ జంతువు. ఖడ్గమృగం శరీరం నున్నగా ఉంటే, దీనికి మాత్రం ఒంటి నిండా దట్టంగా రోమాలు ఉంటాయి. ఈ జంతువు సహస్రాబ్దాల కిందటే అంతరించిపోయింది. పర్యావరణ మార్పుల ఫలితంగా దాదాపు 8,700 ఏళ్ల కింద వూలీ రైనోసరస్ అంతరించిపోయినట్లు శాస్త్రవేత్తల అంచనా. మామత్‌కు ఏనుగు ద్వారా పునర్జీవం కల్పించే ప్రయత్నాలు సాగిస్తున్నట్లుగానే, వూలీ రైనోసరస్కు ఖడ్గమృగం ద్వారా పునర్జీవం కల్పించేందుకు శాస్త్రవేత్తలు ప్రయోగాలు జరుపుతున్నారు.ఆరోక్స్ఇది గోజాతికి చెందిన పురాతన జంతువు. ఇవి మిగిలిన జాతుల ఎద్దులు, ఆవుల కంటే భారీగా ఉంటాయి. నాలుగేళ్ల కిందటి వరకు ఆసియా, యూరోప్, ఉత్తరాఫ్రికా ప్రాంతాల్లో ఇవి విరివిగా ఉండేవి. ఆ తర్వాత పదిహేడో శతాబ్దం ప్రారంభం నాటికి ఇవి పూర్తిగా అంతరించిపోయాయి. ఆరోక్స్ జాతికి తిరిగి ప్రాణం పోయడానికి శాస్త్రవేత్తలు 2009 నుంచి ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇప్పటికీ మనుగడలో ఉన్న పురాతన గోజాతుల్లో ఆరోక్స్ డీఎన్ఏ ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆరోక్స్ డీఎన్ఏ ఎక్కువ శాతం ఉన్న గోజాతులను ప్రత్యేకంగా ఎంపిక చేసి, వాటి ద్వారా ఆరోక్స్ జాతికి పునరుత్థానం కల్పించడానికి ప్రయోగాలు చేస్తున్నారు.టాస్మానియన్ టైగర్పెద్దపులి మాదిరిగానే దీని ఒంటి మీద చారలు ఉంటాయి గాని, ఇది తోడేలు జాతికి చెందిన జంతువు. ఒకప్పుడు టాస్మానియా ప్రాంతంలో విరివిగా సంచరించిన ఈ జంతువుకు ఒంటి మీద చారల కారణంగా ‘టాస్మానియన్ టైగర్’ అనే పేరు వచ్చింది. కొందరు దీనిని ‘టాస్మానియన్ వూల్ఫ్’ అని కూడా అంటారు. ఈ జంతువు దాదాపు శతాబ్దం కిందట అంతరించిపోయింది. దాదాపు 110 ఏళ్ల కిందట చనిపోయిన టాస్మానియన్ టైగర్ అస్థిపంజరం నుంచి శాస్త్రవేత్తలు దీని ఆర్ఎన్ఏను సేకరించారు. ఈ ఆర్ఎన్ఏను ఇథనాల్‌లో భద్రపరచారు. దీని ద్వారా టాస్మానియన్ టైగర్‌కు తిరిగి ప్రాణం పోయడానికి కలోసల్ బయోసైన్సెస్ కంపెనీ ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ యూనివర్సిటీకి చెందిన ‘థైలాసైన్ ఇంటిగ్రేటెడ్ జెనెటిక్ రిస్టరేషన్ రీసెర్చ్ లాబ్ శాస్త్రవేత్తల సహకారంతో ప్రయోగాలు సాగిస్తోంది.వూలీ రైనోసరస్ఇది ఖడ్గమృగం జాతికి చెందిన భారీ జంతువు. ఖడ్గమృగం శరీరం నున్నగా ఉంటే, దీనికి మాత్రం ఒంటి నిండా దట్టంగా రోమాలు ఉంటాయి. ఈ జంతువు సహస్రాబ్దాల కిందటే అంతరించిపోయింది. పర్యావరణ మార్పుల ఫలితంగా దాదాపు 8,700 ఏళ్ల కింద వూలీ రైనోసరస్ అంతరించిపోయినట్లు శాస్త్రవేత్తల అంచనా. మామత్‌కు ఏనుగు ద్వారా పునర్జీవం కల్పించే ప్రయత్నాలు సాగిస్తున్నట్లుగానే, వూలీ రైనోసరస్కు ఖడ్గమృగం ద్వారా పునర్జీవం కల్పించేందుకు శాస్త్రవేత్తలు ప్రయోగాలు జరుపుతున్నారు.ది గ్రేట్ ఆక్ఇది చూడటానికి పెంగ్విన్‌లా కనిపించే ఎగరలేని పక్షి. వేటగాళ్ల తాకిడి వల్ల ది గ్రేట్ ఆక్ పక్షిజాతి పంతొమ్మిదో శతాబ్దిలో అంతరించిపోయింది. చిట్టచివరి ది గ్రేట్ ఆక్ పక్షిని 1844 జూలైలో వేటగాళ్లు చేజిక్కించుకుని, చంపి తినేసినట్లు రికార్డులు ఉన్నాయి. స్పెయిన్ ఉత్తర తీరం నుంచి కెనడా వరకు అట్లాంటిక్ తీర ప్రాంతమంతటా ఈ పక్షులు ఒకప్పుడు విరివిగా ఉండేవి. ధ్రువపు ఎలుగుబంట్లు ఈ పక్షులను తినేవి. వాటి కంటే ఎక్కువగా మనుషులు వేటాడి తినేవారు. ది గ్రేట్ ఆక్ పునరుత్థానం కోసం శాస్త్రవేత్తలు దశాబ్దాలుగా కృషి చేస్తున్నారు. టెక్సస్‌లోని ఏ అండ్ ఎం యూనివర్సిటీ, ఆస్ట్రేలియన్ యానిమల్ హెల్త్ లేబొరేటరీ వంటి సంస్థలకు చెందిన శాస్త్రవేత్తలు ఈ దిశగా ప్రయోగాలు కొనసాగిస్తున్నారు.శాస్త్రవేత్తల ప్రయోగాలు ఫలించినట్లయితే, అంతరించిపోయిన జీవరాశుల్లో కనీసం కొన్ని అయినా తిరిగి ప్రాణం పోసుకోగలవు. వాటి వల్ల భూమ్మీద జీవవైవిధ్యం మాత్రమే కాకుండా, ప్రకృతి సమతుల్యత కూడా మెరుగుపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతరించిపోయిన జీవుల పునరుత్థానం కోసం సూక్షా్మతి సూక్ష్మస్థాయిలో సాగిస్తున్న జన్యు ప్రయోగాలు, మూలకణాల ప్రయోగాల వల్ల మానవాళిని పట్టి పీడించే ఎన్నో వ్యాధులకు చికిత్స మార్గాలను కూడా కనుగొనే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు. -
యువ కథ: మనసు రుచి
వైనతేయ గోదారి ఎర్రగా మారింది. గోదారికి పైన నల్లటి మేఘాలు తప్ప వర్షం లేకపోయినా పై నుంచి పడుతున్న వర్షాలకు కాబోలు రోజు రోజుకి నీరు పోటెత్తుతోంది. బోడసకుర్రు నుంచి పాశర్లపూడికి మధ్య వైనతేయ పాయ పోతూ ఉంటే దాని మీద ఒకటే పంట్ నడుస్తోంది. ఆరోజు అది కూడా రద్దయ్యింది. కారణం పొద్దున వచ్చిన వెంటనే బోడసకుర్రులో సూరన్న కాలం చేశాడు. బోడసకుర్రు రేవు దగ్గర గుమాస్తా ఉద్యోగం సూరన్నది. 70 ఏళ్లు వచ్చినా పని చెయ్యడం మానలేదు. పొద్దున్నే సాధు హోటల్లో రెండు రొట్టెలు ఫట్టు చట్నీ తినడం రేవుకి సైకిలు మీద బయలుదేరడం, టికెట్ కొట్టడం... ఆ రోజు జనాలు ఎక్కువ ఉంటారేమో అని ఫట్టు చట్నీని కాస్త ఎక్కువ చేశాడు సాధు. అప్పుడే తిని వెళ్లిన సూరన్న పోయాడన్న కబురొచ్చింది. సూరన్న పోగానే చుట్టాలకి, పక్కోళ్లకి కుబురు పెట్టాడు పెద్ద కొడుకు లక్ష్మన్న. హైదరాబాదులో ఉంటున్న చిన్న కొడుకు, ఇద్దరు కూతుళ్లు రావాలి. కాలంతో పాటు కదిలిపోయిన కుటుంబాలలో సూరన్న, సూరన్న పెద్ద కొడుకు మాత్రం బోడసకుర్రులోనే ఉండిపోయారు. అందులోను సూరన్నది మరీ చాదస్తం. పొద్దున్నే ఫిల్టర్ కాఫీ, సాధు టిఫిన్స్ పడాల్సిందే.సూరన్నని బయట పడుకోబెట్టారు. జనాలు ఒక్కొక్కళ్లే పోగయ్యారు. ‘పెద్దాయన కదండీ’ అన్నాడు ముత్యాల వెంకట రత్నం పెద్దోడు లక్ష్మన్నతో. ‘అవునండి మీ వయసే’ అన్నాడు ఏడుస్తూ పెద్దోడు. ‘ఇంతకీ అందరికీ కబురెట్టారా’ అన్నాడు ఊర్లో పెళ్లికి, చావుకి ముందుండి పనులు చూసుకునే యేసునాథం. ‘మహా గొప్ప ఇట్టమండి బాబా.. సూరన్నకి ఫట్టు చట్నీ అంటే’ అన్నాడు అక్కడే ఉన్న సాధు. ‘కాస్త ఆ చట్నీ తీసుకొచ్చి నోట్లో ఏసి చూడు లేచి కూర్చుంటాడేమో’ అన్నాడు యెటకారంగా యేసునాథం. ‘సావు దగ్గర పరాచకాలు ఏంటండీ బాబు’ అన్నాడు పక్కనే ఉన్న ముత్యాల వెంకట రత్నం. ‘మహా గొప్పగా పోయాడయ్యా సూరన్న ..’ అన్నాడు సాధు. ‘మరే.. నీ చట్నీ తిని పోయాడు. తులసి తీర్థంలా పడి ఉంటాది’ అన్నాడు యేసునాథం. సూరన్న బంధు వర్గం పెద్దది. మంచి చెడ్డలతో సంబంధం లేకుండా ప్రతి ఇంటికీ వెళ్లేవాడు. అంచేత ఆయన్ని చూడటానికి కూడా చాలా మంది జనం వచ్చారు. వచ్చినోళ్లందరికీ టిఫినీలు, కాఫీలు చూసుకోమని సాధుకి అప్పచెప్పాడు పెద్దోడు. అంతమంది జనాల్ని చూసిన సాధు ‘ఇంతమందికి రొట్టెలేత్తే రేపు నా పాడే ఎత్తాలి’ అన్నాడు. ‘చావు ఇంట్లో టిఫినీలు పెట్టడమే. శవం లేచే దాకా ఏం తినకూడదు. అందులోను మేము సూరన్న వేలు విడిచిన చుట్టాలాయె’ అంది సూరన్న వేలు విడిచిన మేనత్త గారి తోడికోడలు. ‘మీరు తినద్దు లెండి. యేలు యిడిచిన చుట్టాలు గందా. యిడవనోళ్లు ఉంటారు ఆల్లు తింటారు. అందులోను మా సాధు ఫట్టు చట్నీ అంటే నాకేత్తారు. మీరు తినకపోతే కలిసొత్తాది’ అన్నాడు యేసునాథం. టిఫినీలు పెడతన్నా కూడా సూరన్న పోయాడన్న బాధ మనసులో తొలిచేస్తోంది సాధుకి. అయినా సరే పిల్లా జెల్లా అందరికీ ఇడ్డెనులు వడ్డించేశాడు. ‘డబ్బులు లెక్కట్టుకో మరి’ అని సూరన్న బంధువొకడు అంటే ‘ఇలాటి సోట నాకు లెక్కలు రావు బాబా’ అని నింపాదిగా తన పని చేసుకుంటూ పోయాడు.మొహం ఎర్రబడ్డ సాధుని చూసి ‘పుసుక్కున అనేశాడులేరా. నేను లెంపలేయిత్తాను లే’ అన్నాడు యేసునాథం. సాయంత్రానికి సూరన్న కొడుకు, కూతుళ్లు కన్నీళ్లతో దిగితే .. మనవళ్లు మాత్రం లాప్‌టాప్‌లు వేసుకుని దిగారు. తర్వాత రోజు కార్యక్రమాలు. ఈసారి పెద్దోడు చెప్పకుండానే అందరికీ టిఫినీలు తెచ్చేశాడు సాధు– కష్టమైనా దోరగా అందరికీ రొట్టెలు కాల్చి. అలాగే ఇడ్డెనులు కూడా పట్టుకొచ్చేశాడు పెద్ద ఆటోలో. మండువా ఇంట్లో పొద్దు ఎండ పడుతుండగా లాప్టాప్ నొక్కుతున్నాడు సూరన్న రెండో కూతురు రెండో వాడు. సాధు రెండు రొట్టెలు పట్టుకొచ్చి ‘ఈ రెండు తినెయ్యండి’ అన్నాడు. ‘సాధు.. బాగున్నావా’ అని అడిగాడు. ‘చాలా పెద్దోడు అయిపోయేరు. సాలా సిన్నప్పుడు సూసాను’‘చట్నీ ఏం మారలేదు సాధు’ అన్నాడు. చిన్నగా నవ్వి ‘నేను మారలేదులెండి. ఇది యేటి బాబు’ అని అడగ్గానే ‘నేను చేసే పని సాధు. ఇంతకి ఇవ్వాళ హోటల్ వదిలి వచ్చేశావా’ ‘అంతే కదా బాబు. మనిషిని మించిన పనులేముంటాయ్ సెప్పండి. నా సేత అయ్యింది సేద్దామని వచ్చాను సేత్తన్నాను’లాప్టాప్ మూసేసి విస్తరిలో ఇచ్చిన రొట్టెలను మూడు గరిటెల చట్నీతో గబాగబా తిని, పోయి తాత దగ్గర కూర్చున్నాడు. ‘ఆకుని కూడా వదలలేదు. ఏం చట్నీ నో ఏమో’ అని విసుక్కుంది సూరన్న వేలు విడిచిన మేనత్త గారి తోడికోడలు. ‘సూరన్న గారికి కూడా చాలా ఇట్టం అండి సాధు ఫట్టు చట్నీ అంటే. ఊరంతా కూడా ఇట్టం అనుకోండి’ అన్నాడు టీలు ఇస్తూ ఇరటం రాంబాబు. ‘అబ్బో గొప్పే.., నేను చేసిన చట్నీలకు ఈ ఆకులు కూడా మిగలవు’‘అంటే మీరొండినవి కాకుండా ఆకులు తినేత్తారా అండి’ అల్లం వేసిన టీ ఆమెకు అందిస్తూ. ‘మీ ఊరంతా యెటకారమేరా. ఎప్పుడు ఎవరు తిన్నంగా సమాధానం చెప్పరు’‘మా ఊరెంట గోదారి యెళ్తాది అండి. అది కూడా అంతేనండీ తిన్నంగా యెల్లదు’‘ఊరుకోరా ఇరటం పెద్దావిడతో’ అన్నాడు సాధు టిఫినీలు అందిస్తూ. సూరన్న వేలు విడిచిన మేనత్తగారి తోడికోడలు మనవరాలికి ఆకలంటే ఆవిడ సాధుని పిలిచి ‘టిఫిన్స్ ఏం తెచ్చావురా’‘సావు ఇంట టిఫినీలే ..’ అన్నాడు రాంబాబు. ‘నువ్వు ఊరుకోరా. రొట్టెలు అయిపోయాయ్ అమ్మా. ఇడ్డెనులు ఉన్నాయి’ ‘అరే .. నా మనవరాలు ఇడ్డెన్లు తినదే’ ‘మీరు తాపీగా టీ తాగుతూ కూర్చోండి. నే పెట్టేత్తాను’ అని ఒక అరిటాకు కోసుకొచ్చి కడిగి చిన్న ముక్క కింద కోసి వేడి వేడి మూడు ఇడ్డెన్లు వేసి ఫట్టు చట్నీ వేశాడు. మారాం చేస్తున్న పిల్లని బుజ్జగించి ఒక వేలుడు చట్నీని నాకించగానే తింటానంది. చిన్న ఇడ్లీని ఎక్కువ చట్నీలో ముంచి పెడితే మొత్తం కానిచ్చేసింది. అది చూసి ఆశ్చర్యపోయిన ఆవిడ ‘మా సూరన్న చెప్తుంటే ఏదో అనుకున్నాను’ అని అదే అరిటాకులో ఇంకో నాలుగు ఇడ్డెన్లు వేయించుకుని .. ఐదు గరిటెల చట్నీతో ముగించింది.చేతి నిండా ఉన్న చట్నీని నాకుతూ ‘నీ చట్నీలో ఏదో మహత్యం ఉందయ్యా. కాస్త చెప్పరాదు’‘సావు ఇంట రుచుల గురించి మాట్టాడడమే’ అన్నాడు నవ్వుతూ అప్పుడే వచ్చిన యేసునాథం. ‘మహత్యం ఏముంది అండి. నలుగురు మెచ్చేలా ఉండాలనుకుంటాను అంతే’ అన్నాడు సాధు. ‘పెహిడెంటు గారొచ్చేత్తన్నారండోయ్’ అని పరిగెత్తుకుంటూ వచ్చి చెప్పాడు వార్డ్ మెంబెర్ వరాలి మొగుడు వెంకట్రావ్ . ‘పెహిడెంటు గారే.. ఆయనకు సెంటిమెంట్లు గందా’ అన్నాడు యేసునాథం. ‘ఆయనే కాదండి మాజీ పెహిడెంటు గారు కూడా వచ్చేత్తన్నారు’‘ఒకే ఒరలో రెండేసి కత్తులు .. సూరన్న మీద ప్రేమే’ ‘అంటే ఒక్కోసారి ఎండా వాన ఒకేసారి ఒత్తాయి కదా అండి’ అన్నాడు వరాలి మొగుడు వెంకట్రావ్ .‘మనిసి బతికుండగా ఎవరూ మాట్టాడరండి. పోయాక అదేమంటారు.. సూక్తి వాక్యాలు చెప్తారు ఆయన గురించి’ అన్నాడు సాధు వెంకట్రావ్కి టిఫిన్స్ అందిస్తూ. ‘నేనలా కాదండోయ్ యేసునాథం గారు .. మిమ్మల్ని, సాధుని పలకరిత్తున్నానా. పోయాక మీ గురించి సుత్తి వాక్యాలు చెప్పకుండా ఉంటానా’‘అది సూక్తి .. సుత్తి కాదు వరాలు మొగుడోయ్’ అన్నాడు యేసునాథం. వచ్చిన ప్రెసిడెంట్ గారు వాళ్లు సూరన్న గణాన్ని పరామర్శించి నేరుగా సాధు టిఫిన్లు తీనేసి వెళ్లిపోయారు.ఆ రోజు కార్యక్రమాలన్నీ అయిపోయాయి. ఆ తర్వాతి పది రోజులు సాధు హోటలు నడపడం ఆపై సూరన్న ఇంటికి వచ్చి సాయం చెయ్యడం ఇలా సాగిపోయింది . సూరన్న బంధుగణం సాధు హోటల్ చట్నీ రుచి మరిగారు. రొట్టె ఒకటి ఐదు రూపాయిలు ఎంత తిన్నా తక్కువే. మరి ఇంత తక్కువ రేటా అని ఆశ్చర్యపోయేవారు. అలా అని రూపాయి ఎక్కువ తీసుకునేవాడు కాదు. కొంతమంది హైదరాబాదు వచ్చేసి వ్యాపారం పెట్టుమని ఈ టిఫినీకి బోళ్లు లాభం అని చెప్పేవారు. సాధు చిన్నగా నవ్వి ఊరుకునేవాడు .ఇదంతా గమనిస్తున్న సూరన్న రెండో కూతురి కొడుకు వైకుంఠ సమారాధన అయిపోయిన తర్వాతి రోజు తెల్లారకుండానే సాధు హోటలుకి వెళ్లి కూర్చున్నాడు.‘అప్పుడే వచ్చేశారేటండి. టిఫినీకి చాలా టైమ్ పడతాది’ అన్నాడు అప్పుడే స్నానం చేసి వచ్చిన సాధు. ‘నువ్వు చట్నీ ఎలా చేస్తావో చూద్దాం అని’ అన్నాడు. ‘కూర్చోండి అయితే’ అని. దేవుడికి దండం పెట్టి లేత కొబ్బరి కాయని తెచ్చి మెత్తగా కోరి పక్కన పెట్టుకున్నాడు. ‘ఫట్టు చట్నీ అంటే ఏంటి సాధు’ ‘ఈ యేలప్పుడు నేను కూర్చుని శ్రద్ధగా చేత్తానండి. ఇది ఎంత చేసినా ఒక్కోసారి ఎనిమిదింటికల్లా అయిపోతాది. అప్పుడు రెండోది చేస్తాను. అదేటో మరి ఫట్టు చట్నీకి ఉన్నంత రుచి రెండో దానికి రాదంటారు. నిజానికి రెండూ ఒకటే’ మాట్లాడుతూనే వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలని, కరివేపాకుని, కొత్తిమీరని చెక్కులా తరిగి పక్కన పెట్టుకున్నాడు.‘ఫట్టు చట్నీ అంటే ఫస్ట్ చట్నీ యా’ అనుకుని నవ్వుకున్నాడు తనలో తానే. సాధు కొబ్బరాకు మట్టలు అన్నీ పొయ్యిలోకి పెట్టి మండించి తరిగిన సామాన్లతో పాటు పోపేసి నీళ్లు మరిగించాడు. ఇంక మరుగుతున్న నీళ్లలో శనగపిండి వేసి మరిగాక కొబ్బరి అందులో వేశాడు. అంతే .. వేడిగా కాలిన పెద్ద పెనం మీద పల్చని మినప రొట్టెను వేశాడు.‘సాధూ రొట్టెకి ఐదు రూపాయిలు ఏం మిగుల్తుందయ్యా’ ‘ఏదో మిగులుతుందని ఏదైనా చెయ్యాలి అంటారా. మొన్నటి దాకా 2 రూపాయిలు ఉండేది ..ఊర్లో వాళ్లు కిట్టదని 5 రూపాయిలు చేశారు’‘కొనేవాళ్లు పెంచారన్నమాట. రేపు సరుకుల రేట్లు అవీ ఇంకా పెరిగితే’ఇదిగోండి అని వేడి రొట్టెని చట్నీకి కలిపి ఇచ్చి ‘ఈ రోజు ఉండగా రేపటి గురించి ఎందుకు బాబా! అయిపోయిన నిన్నటి గురించి ఎందుకయ్యా! నచ్చిన పనిని నచ్చిన మనషుల మధ్య ఇట్టంగా చేస్తూ పోతే చాలదా’ అన్నాడు. చట్నీ అదే రుచి. ఆనందంతో డబ్బులు ఎక్కువ ఇస్తుంటే ‘కంటి నిండా నిద్ర, కడుపు నిండా కూడు, అత్యాశ లేని జీవితం, నవ్వుతూ మాట్టాడే మనుషులు .. మాకు ఇవి చాలండి. అందులోను నాకు లెక్కలు రావండి’ అన్నాడు డబ్బులు తీసుకోకుండా. ఆ తర్వాత ఆ కుర్రాడు హైదరాబాద్ వచ్చి సాధు ఎలా చేశాడో అలానే చేస్తే దాని రుచి పడలేదు. నోట్లో వేసి ఊసేశాడు. సాధు ఫట్టు చట్నీ రుచి ఏ చీకు చింతా లేకుండా ఇష్టంగా చేసే సాధు చేతిది.. దానిలో పడ్డ సామాల్ది కాదు. చేతి నిండా ఉన్న చట్నీని నాకుతూ ‘నీ చట్నీలో ఏదో మహత్యం ఉందయ్యా. కాస్త చెప్పరాదు’‘సావు ఇంట రుచుల గురించి మాట్టాడడమే’ అన్నాడు నవ్వుతూ అప్పుడే వచ్చిన యేసునాథం. -
ప్రపంచంలోనే ఖరీదైన బియ్యం
జపాన్‌లో పండించే ‘కిన్‌మెమాయి’ అనే రకానికి చెందిన ఈ బియ్యం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బియ్యం. జపాన్‌లోని టోయో రైస్ కార్పొరేషన్ ఐదు రకాల వరి వంగడాలను ప్రత్యేకంగా అభివృద్ధి చేసి, పండిస్తోంది. ఈ బియ్యం కిలో ప్యాకెట్లలోను, బస్తాల్లో కాకుండా, 140 గ్రాముల ఆరు సాచెట్లు నింపిన ప్యాకెట్లలో విక్రయిస్తుండటం విశేషం. టోయో రైస్ కార్పొరేషన్ పేటెంట్ పొందిన ప్రత్యేక ప్రక్రియ ద్వారా ఈ బియ్యం గింజల పొట్టు పూర్తిగా తొలగించకుండా ప్యాక్ చేస్తుంది. ఈ కిన్‌మెమాయి’ బియ్యం గింజలు చిన్నగా ఉంటాయి. మిగిలిన రకాల బియ్యంతో పోల్చుకుంటే, కిన్‌మెమాయి రకం బియ్యంలో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయని, దీని రుచి కూడా చాలా బాగుంటుందని టోయో రైస్ కార్పొరేషన్ చెబుతోంది. ఈ బియ్యం ధరలు రకాన్ని బట్టి కనీసం కిలోకు 109 డాలర్ల నుంచి 155 డాలర్ల (రూ.9,135 నుంచి రూ. 12,990) వరకు ఉంటాయి.