Funday
-
Tamara Dsouza: లవ్ తమారా
తమారా డిసూజా గురించి సింపుల్‌గా ఒక్కమాటలో చెప్పలేం! ఆమె.. ప్రతిభా గని! యాక్ట్రెస్, మేకప్ ఆర్టిస్ట్, హెయిర్ స్టయిలిస్ట్, వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్, గాయని, ఉకులెలె ప్లేయర్ కూడా!ఆ గుర్తింపు తమారా ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. దాంతో నటననే ఫుల్‌టైమ్ జాబ్‌గా ఎంచుకుంది. ఆమె తాజా చిత్రం ‘లవ్ సితారా’ జీ5లో స్ట్రీమ్ అవుతోంది.తమారా తన నటనతోనే కాదు గాత్రంతోనూ ఆకట్టుకుంటోంది. ప్రీతమ్, షాన్, నీతీ మోహన్, ఏఆర్ రెహమాన్ లాంటి మహామహులతో కలసి పాడుతోంది. నటన, సంగీతం, మేకప్, హెయిర్ స్టయిలింగ్లతో క్షణం తీరికలేని షెడ్యూల్స్‌లో ఎప్పుడన్నా సమయం చిక్కితే సోలో ట్రావెల్‌కి వెళ్లిపోతూ, ఉకులెలె ప్లే చేస్తూ ఆస్వాదిస్తోంది.తమారా .. ముంబైలో పుట్టి, పెరిగింది. కామర్స్ అండ్ ఎకనామిక్స్ గ్రాడ్యుయేట్. న్యాయశాస్త్రంలోనూ డిగ్రీ పుచ్చుకుంది.చదువైపోగానే ‘రెయిన్ డ్రాప్ మీడియా’ సంస్థలో పబ్లిక్ రిలేషన్స్ ఎగ్జిక్యూటివ్‌గా జాయిన్ అయింది. విద్యా బాలన్, శ్రుతి హాసన్, ఫరా ఖాన్, బొమన్ ఇరానీ లాంటి యాక్టర్స్ కోసం పనిచేసింది. అంతేకాదు రేస్ 2, వికీ డోనర్, హౌస్‌ఫుల్ 2 లాంటి సినిమాలకు పీఆర్ ఈవెంట్స్‌నూ నిర్వహించింది.ఏడాది తర్వాత ఆమె ఖీఐ్క ఇండస్ట్రీస్ లిమిటెడ్‌లో చేరింది.. మార్కెటింగ్, ప్రమోషన్స్ విభాగంలో అసిస్టెంట్ మేనేజర్‌గా. ఆమె పనితీరుకు ముచ్చటపడిన వైకింగ్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ తమ సంస్థలో ఉద్యోగాన్ని ఆఫర్ చేసింది. సద్వినియోగం చేసుకుంది తమారా. ఇందులో ఉన్నప్పుడే ఆమె చురుకుదనం, సమయస్ఫూర్తికి మెచ్చి పలు యాడ్ ఏజెన్సీలు వాణిజ్య ప్రకటనల్లో మెరిసే చాన్స్నిచ్చాయి. అలా తమారా.. తనిష్క్, టైటాన్, డ్యూరోఫ్లెక్స్ వంటి ఫేమస్ బ్రాండ్స్ కమర్షియల్ యాడ్స్‌లో కనిపించింది.ఆ కమర్షియల్ యాడ్సే తమారా వెబ్‌స్క్రీన్ ఎంట్రీని ఖరారు చేశాయి. మేడిన్ హెవెన్, లిటిల్ థింగ్స్, హెలో మినీ లాంటి వెబ్ సిరీస్‌లలో నటించే అవకాశాన్నిచ్చాయి. ఆమె నటనకు సిల్వర్‌స్క్రీన్ కూడా స్పేస్ ఇచ్చింది. ‘క్లాస్ ఆఫ్ 83’ , ‘అటాక్’ సినిమాల్లో ప్రధాన పాత్రల్లో మెప్పించి, విమర్శకుల ప్రశంసలు పొందింది.యాడ్స్, వెబ్, సినిమా.. ఈ మూడిట్లో నటించే అవకాశం.. నాకు యాదృచ్ఛికంగా అందిన వరమని చెప్పుకోవచ్చు! సంగీతం, మేకప్, హెయిర్ స్టయిలింగ్ వగైరా వగైరా.. నేను ఇష్టపడి, నేర్చుకుని ఆ దిశగా ప్రయత్నిస్తే సాధించినవి. కానీ నటన విషయం అలాకాదు. నటిని కావాలని నేనెప్పుడూ అనుకోలేదు. అది అనుకోకుండా జరిగింది. కంటిన్యూ అవుతోంది. – తమారా డిసూజా -
దేశవాళీ సేద్యకారుడు
దాదాపు సగం జనాభాలో మధుమేహం కనిపిస్తే తెలిసొచ్చింది .. నేల నెరిగి సాగు చేయాలని! భూమాతను గౌరవిస్తే ఆరోగ్య సిరిని ఒంటికందిస్తుందని! కనుమరుగవుతున్న దేశవాళీ ధాన్యానికి మళ్లీ నారుపోయాలని! అందుకే ఇప్పుడు కర్షకలోకమంతా సేంద్రియ సాగు వైపు మళ్లింది! ఆ బాటలోనే.. ఆంధ్రప్రదేశ్, ఏలూరు జిల్లా, కొయ్యలగూడెం వాసి పొట్టిపోతుల పోతురాజు కూడా నడుస్తూ తోటి రైతులకు స్ఫూర్తి పంచుతున్నారు.పుడమితల్లి బాగుంటే ఆ తల్లిని నమ్ముకున్న జనం కూడా బాగుంటారు. భావితరాల ఆరోగ్యానికీ భరోసా ఉంటుంది. అదే లక్ష్యంతో ప్రకృతి వ్యవసాయానికి నాగలి పట్టింది ‘ఆర్గానిక్ ప్లానెట్’. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ మూవ్ టు నేచర్, నేచర్ ఫ్రెండ్లీ నినాదాలతో వేదభారత్ నేచురల్ ఫుడ్ ప్రోడక్ట్స్ పేరిట దేశవాళీ బియ్యాన్ని అందిస్తోంది. ‘భూమి మీది.. విత్తనం, మార్గదర్శనం మావి! పండించిన పంటకు మార్కెటింగ్ సహకారం కూడా మాదే’ అంటూ తెలుగు రాష్ట్రాల రైతులను ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గేలా చేస్తోంది. అలా పోతురాజు కూడా సేంద్రియ సాగుకు ఆకర్షితుడయ్యారు. తొలుత ఎకరం విస్తీర్ణంలో నారు పోశారు. కలుపు తీయలేదు. ఎరువు వేయలేదు. నెల దాటినా పైరు పెద్దగా ఎదగలేదు. పది బస్తాల దిగుబడే వచ్చింది. ఇరుగు పొరుగు రైతులు నిరుత్సాహపరచారు. అయినా పోతురాజు దైర్యం వీడలేదు. రెండో ఏడాది విస్తీర్ణం పెంచారు. పట్టువదలకుండా ఆరేళ్లుగా ప్రకృతి వ్యవసాయం బాటలోనే సాగుతున్నారు. ఇప్పుడది పది ఎకరాలకు విస్తరించింది. ఆరోగ్యంతో పాటు, మధుమేహాన్ని క్రమంగా తగ్గించే గుణం కలిగిన నవారా, కాలాభట్టి, బహురూపి, మైసూరు మల్లిగ లాంటి దేశవాళీ రకాల వరిని మాత్రమే పండిస్తూ.. ఎకరాకు 25 బస్తాల దిగుబడి సాధిస్తున్నారు. ఎకరాకు 80 వేల రూపాయల ఆదాయాన్ని అందుకుంటున్నారు. 210 రోజుల్లో పంటకు వచ్చే మాపిలై సాంబ రకాన్ని, కూరగాయలు, పండ్లు, ఆయిల్ పామ్‌ను పండించే ఆలోచనలో ఉన్నారు. సతీమణి నాగమణి సహకారంతో దేశవాళీ సేంద్రియ ధాన్యం సాగులో పోతురాజు చేస్తున్న కృషికి ప్రధాని కార్యాలయం నుంచీ ప్రశంసలు అందాయి. మొన్నటి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనే అవకాశమూ అతనికి వచ్చింది. ∙వై.మురళీకృష్ణ, రిపోర్టర్ , తాడేపల్లిగూడెం27 రకాలు ప్రకృతి వ్యవసాయ విధానంలో పండించేందుకు 27 రకాల విత్తనాలను వేదభారత్ సరఫరా చేస్తోంది. వాటిల్లో బహురూపి, చింతలూరి సన్నాలు, మైసూర్ మల్లిగ, నారాయణ కామిని, నవారా, బర్మాబ్లాక్, రక్తశాలి (ఎర్రబియ్యం), సిద్ధ సన్నాలు, రాజోలు సన్నాలు, కేతిరి మహరాజ్ , కుజు పటాలియా, దూదేశ్వర్ మొదలైన రకాలున్నాయి. -
సిగకారుడు.. సావియో జాన్ పరేరా
సావియో జాన్ పరేరా.. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన హెయిర్ స్టయిలిస్ట్. బాలీవుడ్ స్టార్స్, స్పోర్ట్స్ లెజెండ్స్ జుట్టు ఆయన చేతుల్లోనే ఉంటుంది. సినిమా ప్రమోషన్, అవార్డ్ ఫంక్షన్, రెడ్ కార్పెట్ వాక్.. ఏ ఈవెంట్‌కైనా.. సావియో వచ్చి సెలబ్రిటీల కొప్పు ముడిస్తేనే వాళ్లు గడప దాటేది! అంతెందుకు ఇంగ్లిష్ యాక్ట్రెస్ లిజ్ హార్లీ.. తన పెళ్లిలో కేశాలంకరణకు ఏరికోరి మరీ సావియో జాన్నే అపాయింట్ చేసుకుంది! అదీ ఈ ముంబై వాసి రెప్యుటేషన్!!హెయిర్ డ్రెసింగ్‌లో సావియోది దాదాపు ముప్పై ఏళ్ల అనుభవం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ హెయిర్ డ్రెసర్స్, హెయిర్ స్టయిలిస్ట్‌లు అందరి దగ్గరా శిక్షణ పొంది వచ్చాడు. నైపుణ్యం సాధించాడు. హెయిర్ సెలూన్స్ పెట్టాడు. ఫ్యాషన్ షోస్‌కి, అడ్వర్టయిజ్మెంట్ క్యాంపెయిన్స్కి, ఎల్, వోగ్, హార్పర్స్ బజార్, కాస్మోపాలిటన్ లాంటి మేగజీన్స్ ఫొటో షూట్స్‌కి పనిచేశాడు. బాంబే టైమ్స్, హిందుస్తాన్ టైమ్స్, మిడ్–డే, ముంబై మిర్రర్, సినీ బ్లిట్జ్ వంటి పత్రికలకు కాలమ్స్ రాస్తుంటాడు. జూమ్, ఎన్డీటీవీ గుడ్ టైమ్స్ వంటి చానల్స్కీ పానలిస్ట్గా ఉన్నాడు. ఎన్నో బ్యూటీ కాంటెస్ట్‌లకు జడ్జిగా వ్యవహరించాడు. ఎన్నో బాలీవుడ్ చిత్రాలకు హెయిర్ డ్రెసర్‌గా పనిచేశాడు. ప్రియంకా చోప్రా, ప్రీతి జింటా, కంగనా రనౌత్, సోనాక్షీ సిన్హా, శిల్పా శెట్టీ, నేహా ధూపియా, అదితీరావ్ హైదరీ, డింపుల్ కపాడియా, మేరీ కోమ్, ఇంతియాజ్ అలీ, యువరాజ్ సింగ్ లాంటి సెలబ్రిటీలకు పర్సనల్ హెయిర్ డ్రెసర్‌గా ఉన్నాడు. హెయిర్ డ్రెసింగ్‌లో మెలకువలు సంపాదించుకోవాలనుకునేవాళ్ల కోసం ‘సావియో జాన్ పరేరా.. ది అకాడమీ’నీ నెలకొల్పాడు. జాతీయ, అంతర్జాతీయ అవార్డులెన్నో గెలుచుకున్నాడు.‘నాకు పనే దైవం. అందులో నిత్యం ఏదో కొత్తదనాన్ని చూపించడానికి ఇష్టపడతాను. నా క్లయింట్స్ కాన్ఫిడెన్స్‌ను పెంచే స్టయిల్స్‌ని క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తుంటా. స్టయిల్ అనేది వ్యక్తిగతం. పరిశీలన, మెలకువలతో ఎవరికివారే తమదైన సిగ్నేచర్ స్టయిల్ని క్రియేట్ చేసుకోవాలి. అలాంటి సృజనకు ఆకాశం కూడా హద్దు కాదు. స్టయిల్ అనేది ఒక ఐడెంటిటీ. అది వ్యక్తిత్వాన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది’ అంటాడు సావియో జాన్ పరేరా. -
ఈవారం కథ: అమృతం కురవని రాత్రి
రాత్రి పదకొండయ్యింది. పొద్దటినించీ, ఇంటి పని, ఆఫీస్ పని, పిల్లల లెక్కల పరీక్షకు హెల్ప్ చెయ్యడం వీటితో తల దిమ్మెక్కిపోయింది. ఈ మధ్య సివియర్ ఇన్సోమ్నియాతో రోజులు రోజులు నిద్రలేక ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంది. ఇంక లాభం లేదని లాప్టాప్ మూసేసి నిద్ర మాత్ర వేసుకున్నా. మరుసటి రోజు గడవాలంటే తప్పదు మరి. అదిచ్చే రెండుగంటల నిద్ర అనబడే మత్తు, దాని వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కంటే మంచిదా అని ఎప్పుడూ సందిగ్ధమే. అయినా ఎట్లాగూ త్వరలోనే మానేస్తా. అదిచ్చే మత్తు అయిదారు రోజుల్లోనే అయిదు గంటల నించి రెండు గంటలకు పడిపోయింది.అస్సలు పని చేయకపోవడానికి ఇంక ఎక్కువ రోజులు పట్టదు. ఈ ఆలోచనలను పక్కన పెట్టి గీతాంజలి గారి ‘ఆమె అడవిని జయించింది’ పుస్తకాన్ని చేతుల్లోకి తీసుకొని, కిరణ్ నిద్రని డిస్టర్బ్ చెయ్యడమెందుకని కింద బెడ్రూమ్లోకి పోయిన. సాయంత్రం నించీ కురుస్తున్న కుండపోత ఆగిపోయి సన్న జల్లుతో బయటంతా చల్లగా ఉంది. నిద్ర కోసం ఎదురుచూడకుండా బెడ్రూమ్ కిటికీ తలుపులు తీసి, బెడ్ హెడ్బోర్డ్కి దిండుపెట్టుకొని, పుస్తకాన్ని ఒళ్లో పెట్టుకొని, మంచం మీద కాళ్లు జాపి కొంచెం జారి కూర్చొని చదవడం మొదలు పెట్టిన. కిటికీలోంచి చల్ల గాలి తనతో పాటు మధు మాలతి అలియాస్ రాధా మాధవం అలియాస్ రంగూన్ క్రీపర్ పువ్వుల కమ్మని వాసనను మోసుకొస్తూంది. అది ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నించి వస్తున్న నాచు వాసన నాకు చేరకుండా జాగ్రత్తపడుతోంది. ఎవరో కొట్టి లేపినట్టు ఠక్కున లేచిన. ఎప్పడు కూర్చున్న పొజిషన్ లోంచి మారి మంచానికి అనించిన దిండు కింద పెట్టి కాళ్లు జాపి పడుకున్నానో, ఎప్పడు నిద్ర పట్టిందో గుర్తు లేదు. లైట్లన్నీ వేసే ఉన్నాయ్. టైమ్ ఒకటిన్నర అవుతూంది. బయట ఉరుముల శబ్దంతో పోటీ పడుతున్న వర్షం. కానీ ఇంకేదో వినిపిస్తూంది. బెడ్రూమ్లోంచి బయటకొస్తూంటే ఎవరో బాధతో మూలుగుతున్నట్టు వినిపించింది. హాల్లోకి ఉరికి పోయి చూస్తే మెయిన్ డోర్ తెరిచి ఉంది. కార్ పార్కింగ్‌లో లైట్ వెలుతురులో ఒక నిండు గర్భిణి బాధతో అరుస్తూ మూలుగుతూ ఎటో చూస్తూ కనబడింది. బక్కగా, చామన ఛాయ.. నలుపు రంగుకు మధ్యలో ఆకర్షణీయంగా ఉంది. చిన్న వయసే. అంత నీరసంలో కూడా తన కళ్లు వింతగా మెరుస్తూ ఉన్నాయి. అక్కడ తడి చూస్తే అర్థమయ్యింది, ఇంక నిమిషాల్లో ప్రసవమౌతుందని. ఏమో, కౌముది పుట్టినప్పుడు గంటలో అయిపోతుందని లేబర్ రూమ్‌కు తీసుకుపోయినాక 13 గంటల భయంకరమైన పురిటి నొప్పుల తర్వాత ప్రసవమయింది కదా. తన అదృష్టం ఎట్లుందో! కిరణ్ తనకి సహాయం చేయాలని ప్రయత్నిస్తున్నాడు. నా అడుగుల చప్పుడు విని ఒక్కసారి వెనక్కి చూసి ఎందుకు నిద్రలేచినవ్ అన్నట్టు ప్రేమా, విసుగూ కలిసిన ఒక చూపు విసిరినడు. ఏందో ఈయన, కొంపలు మునుగుతున్నా సరే నాకు నిద్ర పట్టిందంటే అస్సలు డిస్టర్బ్ చెయ్యడు. పిల్లలు డిస్టర్బ్ చేస్తే వాళ్ల పని అయిపోయినట్టే. ఒక్కోసారి నాకే విసుగొచ్చి పర్లేదు నానీ అని సర్దుతుంటా. పక్కింటి వాళ్లు గాఢ నిద్రలో ఉన్నారో లేక ఏసీ చప్పుడుకు వినపడలేదో కానీ బయటకు రాలేదు. తనకి బాధ ఎక్కువైనట్టుంది, మూలుగులు అరుపులు ఇంకా ఎక్కువైనయ్. పడుకునే ముందు చదివిన పుస్తకం వల్లనేమో తనని చూస్తుంటే ఏవేవో ఆలోచనలు వచ్చినయ్. అసలు ఇంత చిన్న వయసులో తను ఎందుకు తల్లి కావాలనుకుందో! తనకి మాతృత్వం అంటే అంత ఇష్టమా, వంశాన్ని నిలబెట్టడానికి తన వాళ్లు చేసిన కుట్రనా, అపురూపమైనదమ్మ ఆడజన్మ లాంటి పాటల వలలో తను కూడా పడిపోయి ఆ జన్మను ఇంకొంచెం సార్థకం చేసుకోవాలనుకుందా, లేదా క్షణికావేశంలో చేసిన తప్పుకు శిక్ష అనుభవిస్తోందా? ఆ ఆవేశంలో ఆడ మగ ఇద్దరూ సుఖపడినా, కష్టాలు మాత్రం ఆడవాళ్లకే కదా. అబార్షన్ కూడా కష్టమైంది, రిస్క్‌తో కూడుకున్నదే. నా ఆలోచనల్లో నేనుంటే కిరణ్ పైన లైబ్రరీ రూమ్‌లో తనకు పరుపు ఏర్పాటు చేసి వచ్చినడు. కార్ పార్కింగ్ అంతా తడి. క్షణాల్లో ప్రసవమయ్యేట్టుంది. ఎవరికీ ఫోన్ చేసే సమయం కూడా లేదు. తను వివరాలు చెప్పే పరిస్థితుల్లో లేదు. మేమిద్దరం కలిసి గబగబా తనను లైబ్రరీ రూమ్‌లో పడుకోబెట్టినం.ఎవరో, ఎక్కడినించి వచ్చిందో అని చూడకుండా ఆపదలో సహాయం చేస్తుంటే కూడా తను మావైపు కోపంగా అసహనంగా చూస్తోంది ఎందుకో! ఏమోలే ఈ టైమ్‌లో ఎమోషన్స్ హార్మోన్స్ , నొప్పులూ కంట్రోల్ చెస్తాయి కదా అని సర్ది చెప్పుకున్నా. తనకు ఏకాంతం కావాలేమోనని తలుపు దగ్గరగా వేసి ఇద్దరం కిందికొచ్చినం. నా నిద్ర మాత్ర అప్పుడు పని చేయడం మొదలుపెట్టిందనిపించి, తూలకముందే బెడ్ మీద పడుకున్నా. మళ్లీ ఆలోచనలు. అసలు ప్రతి స్త్రీ ఇష్టంగానే మాతృత్వాన్ని కోరుకుంటుందా లేక సంఘానికి భయపడి తల్లవుతుందా? మాతృత్వం స్త్రీలను మరింత కట్టి పడేస్తుంది కదా, అయినా ఎందుకు తల్లి కావాలని అంత ఉవ్విళ్లూరుతారు. డాక్టర్ల చుట్టూ తిరిగి మంట పుట్టించే ఇంటర్నల్ స్కానింగ్లూ, మాత్రల సైడ్‌ఎఫెక్ట్‌లూ, రోజంతా అలసిపోయినా రోజులు లెక్కపెట్టుకొని యాంత్రిక కలయికలూ, ప్రెగ్నెన్సీ టెస్ట్‌లూ, నిరాశలూ, ఒత్తిళ్లూ ఇవన్నీ ఎందుకు భరిస్తారు. మాతృత్వం స్త్రీకి వరమా, శాపమా? శాపం సంగతేమో తెలియదు కానీ వరం కానే కాదు. వరమనుకోవడం, వరమని స్త్రీలను బ్రెయిన్ వాష్ చేయడం ఎంత తప్పు! అది పిల్లలు కనమని పరోక్షంగా ఒత్తిడి పెట్టడం కాదా? పిల్లలు పుట్టని స్త్రీలను, శారీరక లేదా మానసిక బాధల వల్ల, ఇతర ఇబ్బందులు నిర్బంధాల వల్ల పిల్లలు కనని, కనలేని వాళ్లను అవమానించడం కదా! మాతృత్వం ఒక్కోసారి శాపం కావొచ్చనీ, ప్రసవంలో ప్రాణాలు పోవచ్చనీ పైన రూమ్‌లో ఉన్న తనకు తెలుసా? ఏందీ పిచ్చి ఆలోచన అని తిట్టుకుంటూ నిద్రపోయిన. ఏదో టక్కు టక్కుమని చప్పుడొస్తుంటే మెలకువ అయ్యింది. టైమ్ చూస్తే 5:55. అమ్మో లేవడం అరగంట లేట్ అయ్యింది, 6:45 లోపల టిఫిన్, వంట ఎట్ల అవుతుంది? రాత్రి కూరగాయలు కూడా తరుక్కోలేదు. నిద్ర పట్టదు కాబట్టి అలారం పెట్టుకొనే అలవాటు లేదు. దాని వల్ల ఇట్ల అప్పుడప్పుడూ ఇబ్బంది పడుతుంటా.ఒళ్లు నొప్పులు, నీరసం, జ్వరంతో తూలుకుంటూ తలుపు తెరిస్తే కిరణ్ ఆలుగడ్డలు తరుగుతూ కనిపించినడు. ‘ఈ రోజు నేను వంట చేస్తాన్లే బుజ్జీ..’ అని బలవంతం చేస్తే డోలో వేసుకొని పడుకున్న కానీ ఉండబుద్ధవలేదు. కొంచెంసేపు అయినాక లేచి వంట, బాక్సుల కార్యక్రమం పూర్తిచేసి ఆఫీస్‌కి రెడీ అయి కిందకొచ్చేవరకు, ఇల్లంతా ఖాళీ. అందరూ వెళ్లిపోయినరు. ఇంత హడావుడిలో తన గురించి కిరణ్‌ని అడగనేలేదు, కిరణ్ కూడా కూర చేయడం, పిల్లల యూనిఫామ్‌లు ఇస్త్రీ చేయడంలో లేట్ అయ్యి మాట్లాడే టైమ్ లేక కాలేజ్‌కి పరిగెత్తినడు.ఏవో చెడు ఆలోచనలు వస్తుంటే తనను చూడడం పోస్ట్‌పోన్ చేసి ఏదో కొంచెం టిఫిన్ తిని , టీవీలో శ్రీరంగం గోపాలరత్నం గారి అన్నమాచార్య కృతులు వింటూ టీ తాగి, క్యాబ్ బుక్ చేసి బ్యాగ్ సర్దుకున్నా. ఇంక తప్పదని, పైకి పోయి లైబ్రరీ రూమ్ తలుపు తెరిచి తనని చూస్తుంటే, ఫోన్ మోగింది. క్యాబ్ ఎంట్రీకి మైగేట్ యాప్ పంపిన అప్రూవల్ అది. ‘అబ్బా ఈ క్యాబ్ ఎప్పడు రానే రాదు కానీ రెడీగా లేనప్పుడు మాత్రం వెంటనే వస్తుంది’ అని తిట్టుకుంటూ గబగబా కిందికి పోయి తాళమేసి క్యాబ్ ఎక్కి కూర్చున్న. ఆఫీస్‌కి పోతుంటే పాలిస్తూ ప్రశాంతంగా నా వైపు కృతజ్ఞతగా చూసిన తన చూపే గుర్తొస్తూంది. నిన్నటికి ఈ రోజుకి తన చూపులో ఎంత తేడా! మాతృత్వ భావన గర్భం దాల్చగానే కలుగుతుందా లేక పిల్లలు పుట్టినాక కలుగుతుందా? ఏమో మొత్తానికి తను క్షేమంగా ఉందని తెలిసినాక నాకెంత హాయిగా ఉందో!ఎంత పిల్లి అయినా తను కూడా ఒక తల్లే కదా! ఆరు నెలల కిందట శ్రీరామ నవమి రోజే కదా మూడు పిల్లల్ని కనింది. మళ్లీ అప్పుడే నాలుగా (అయిదింటిలో ఒకటి మృత శిశువు). అమ్మో, పిల్లినైనా కాకపోతిని అని ఇంక అస్సలు పాడకూడదు. మగ పిల్లినైనా అని పాడితేనేమో రాగం కుదరదు.ఇంతకీ ఇంటి నించి వెళ్లిపోయిన పిల్లి మళ్లీ వచ్చి పిల్లల్ని కంటే పురుడొస్తుందా? తనకి మాతృత్వం అంటే అంత ఇష్టమా, వంశాన్ని నిలబెట్టడానికి తన వాళ్లు చేసిన కుట్రనా, అపురూపమైనదమ్మ ఆడజన్మ లాంటి పాటల వలలో తను కూడా పడిపోయి ఆ జన్మను ఇంకొంచెం సార్థకం చేసుకోవాలనుకుందా, లేదా క్షణికావేశంలో చేసిన తప్పుకు శిక్ష అనుభవిస్తోందా? -
ప్రేమాకర్షణలు సహజం.. శాశ్వతం కావు
ఇంట్లో టీనేజర్స్ ఉన్నారంటే తల్లిదండ్రులకు గుండెల్లో గుబులే. ఎప్పుడేం మాట్లాడతారో, ఏం చేస్తారో, ఏ గొడవ తీసుకొస్తారో అని! అన్నింటికంటే భయపెట్టే అంశం.. ప్రేమ వ్యవహారాలు. పెళ్లికి ముందు శృంగారం కూడా పెరిగిందని అనేక అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఇది తల్లిదండ్రులకు ఆందోళన కలిగించే అంశం. కానీ కాలంతో పాటు అన్నీ మారుతూ ఉంటాయి. ఈ కాలం పిల్లలకు రిలేషన్స్, బ్రేకప్స్ సర్వసాధారణమయ్యాయి. కొందరు ఈ రిలేషన్స్‌లో పడి చదువును నిర్లక్ష్యం చేస్తే, మరికొందరు బ్రేకప్ వల్ల అనేక మానసిక సమస్యలకు లోనవుతున్నారు. అందుకే పిల్లలు ప్రేమలో పడ్డారని తెలియగానే అభ్యంతరం వ్యక్తం చేస్తారు. కొందరైతే తిడతారు, కొడతారు, కంట్రోల్ చేస్తారు, హౌస్ అరెస్ట్ చేస్తారు. దీనివల్ల టీనేజర్లలో తల్లిదండ్రుల పట్ల వ్యతిరేకత పెరగడం తప్ప ఆశించిన ప్రయోజనాలు నెరవేరవు. దీనికన్నా టీనేజర్లతో ఓపెన్‌గా మాట్లాడటం, సరైన గైడెన్స్‌ను అందించడమే మంచిదని గుర్తించాలి. అదెలాగో ఈరోజు తెలుసుకుందాం. సెక్సువల్ డెవలప్మెంట్..సెక్సువల్ డెవలప్మెంట్ అనేది సహజమైన పరిణామం. పీరియడ్స్, వెట్ డ్రీమ్స్ లాంటి శారీరక మార్పులు, అపోజిట్ సెక్స్ పట్ల ఆసక్తి లాంటి భావోద్వేగ మార్పులు మొదలవుతాయి. ఇదంతా వారికి కొత్తగా, కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. అందుకే ఫ్రెండ్స్‌తో చర్చిస్తారు. లేదా ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తారు. అందులో తప్పుడు సమాచారం అందే ప్రమాదం ఉంది. అందుకే ఈ అంశాలపై తల్లిదండ్రులే చర్చించాలి. అలా చర్చించడంలో ఎలాంటి తప్పూ లేదని గుర్తించాలి. ప్రేమ, ఆకర్షణ..టీనేజ్‌లో ప్రేమ, ఆకర్షణ సహజమైన భావోద్వేగాలు. నచ్చిన వ్యక్తి పట్ల బలమైన ఆకర్షణను కలిగి ఉంటారు. అదే ప్రేమ అని భ్రమపడుతుంటారు. ఇది చూసి తల్లిదండ్రులు ఆందోళన పడుతుంటారు. కానీ చాలా సందర్భాల్లో ఈ ఆకర్షణ కేవలం కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. కొందరిలో ఎక్కువకాలం కొనసాగవచ్చు. అయినా ఆందోళన పడాల్సిన అవసరం లేదు.పిల్లలను జడ్జ్ చేయకుండా, వారి క్రష్, లవ్ గురించి ఓపెన్‌గా మాట్లాడండి, తప్పొప్పులు, పర్యవసానాల గురించి చర్చించండి. అప్పుడే వాళ్లు తమ భావోద్వేగాలను సరైన రీతిలో అర్థం చేసుకోగలుగుతారు. సరైన నిర్ణయం తీసుకోగలుగుతారు.టీనేజ్ సెక్స్..యవ్వనంలో సెక్స్ అనే అంశం చాలా సున్నితమైనది. యవ్వనంలో వచ్చే హార్మోన్ మార్పుల వల్ల లేదా సోషల్ మీడియా లేదా ఫ్రెండ్స్ ప్రభావం వల్ల టీనేజ్ సెక్స్ పెరుగుతుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అందుకే ఈ దశలో టీనేజర్లకు సరైన గైడెన్స్ అవసరం. అది ఫ్రెండ్స్ ద్వారానో, పోర్న్ ద్వారానో వచ్చేకంటే, పేరెంట్స్ ద్వారా అందడం అవసరం. భయపెట్టడం, నియంత్రించడం కంటే గైడెన్స్ ద్వారానే పిల్లలను సరైన దారిలో నడపగలమని గుర్తించాలి. తల్లిదండ్రులు ఏం చేయాలి? పిల్లలు ఎలాంటి సందేహాలనైనా అడగడానికి, వారి భావాలు పంచుకోవడానికి అవకాశాన్ని ఇవ్వాలి ∙సెక్సువల్ డెవలప్మెంట్, రిలేషన్స్ గురించి కచ్చితమైన సమాచారాన్ని ఇవ్వాలి ∙ తాత్కాలిక ఆకర్షణలు, టీనేజ్ లవ్, సంపూర్ణ ప్రేమ మధ్య తేడాలు అర్థం చేసుకునేందుకు సహాయపడాలి ∙సోషల్ మీడియా ప్రభావం, స్నేహితుల ఒత్తిళ్లను అర్థం చేసుకోవడానికి సహాయపడాలి ∙టీనేజర్ల ఫ్రీడమ్, తల్లిదండ్రుల గైడె¯న్స్ మధ్య బ్యాలె¯న్స్ సాధించాలి ∙పేరెంట్స్ చర్చించలేని అంశాల గురించి చెప్పేందుకు సైకాలజిస్ట్ సహాయం తీసుకోవాలి.టీనేజర్లు చేయాల్సింది..టీనేజ్‌లో జరిగే మార్పుల గురించి చదవాలి, అవగాహన పెంచుకోవాలి. పేరెంట్స్‌తో మాట్లాడి సందేహాలను నివృత్తి చేసుకోవాలి టీనేజ్ లవ్, ఇన్‌ఫాచ్యుయేషన్ సహజమైన విషయాలని, శాశ్వతం కావని గుర్తించాలి తొందరపాటు చర్యల వల్ల వచ్చే ఎమోషనల్ పెయిన్ గురించి అవగాహన పెంచుకోవాలి ఈ వయసులో ప్రేమ వ్యవహారాల కంటే అకడమిక్ సక్సెస్ ముఖ్యమని అర్థం చేసుకుని లక్ష్యాలను నిర్దేశించుకోవాలి కొత్త ఆసక్తులు, హాబీలను కనుగొనేందుకు సమయం కేటాయించాలి మైండ్‌ఫుల్‌నెస్, జర్నలింగ్, నమ్మకమైన వ్యక్తితో మాట్లాడటం వంటి పనుల ద్వారా ఎమోష¯న్స్ను నియంత్రించుకోవడం ప్రాక్టీస్ చేయాలి సోషల్ మీడియా వినియోగాన్ని పరిమితం చేసుకోవాలి. నిజమైన సంబంధాలకు ప్రాధాన్యం ఇవ్వాలి ఒత్తిడి, ఆందోళన లేదా నిరాశగా అనిపిస్తే సైకాలజిస్ట్‌తో మాట్లాడి సహాయం తీసుకోవాలి. -
IT Raid : దుల్హన్ హమ్ లేజాయేంగే..
ఐటీ టీమ్‌ల గ్రేట్ డ్రామాదుమ్మురేపిన బారాత్బడాబాబులు బేజారు రెండేళ్ల కిందట.. మహారాష్ట్ర, జాల్నా.. ప్రధాన రహదారంతా పెళ్లి బారాత్‌తో నిండిపోయింది. అవును మరి.. ఒకటా రెండా.. దాదాపు 120 కార్లలో బయలుదేరారు మగపెళ్లివారు. ‘దుల్హన్ హమ్ లేజాయేంగే’ అనే స్టికర్స్‌ని విండ్ షీల్డ్స్ మీద అతికించుకుని! పాటలు పాడుతూ, మధ్యమధ్యలో ఆ కార్లను స్లో చేసుకుంటూ.. బ్యాండ్ మేళం వాయించే బాలీవుడ్ పాటలకు స్టెప్పులు వేస్తూ.. పెళ్లి కొడుకు చేత డాన్స్ చేయిస్తూ.. లోకంలోని పెళ్లి కళ, సందడంతా వాళ్లతోనే అన్నట్లుంది ఆ సంబడం! ఆ దారి పొడవున ఉన్న జాల్నా వాసులంతా ఆశ్చర్యపోయారు ‘ఎవరింటికబ్బా.. ఇంత ఘనమైన బారాత్’ అనుకుంటూ! ఓ కూడలి దాకా వెళ్లగానే ఆ 120 కార్లు అయిదు టీమ్‌లుగా విడిపోయాయి. ఓ టీమ్ జాల్నాలోని ఓ స్టీల్ ఫ్యాక్టరీని, ఇంకో టీమ్ టెక్స్టైల్ మిల్‌ను, మరో టీమ్ ఆ రెండు ఫ్యాక్టరీలకు చెందిన యజమానుల ఇళ్లను, వేరే టీమ్ ఫామ్హౌసెస్ను, ఒక టీమేమో అక్కడి కో ఆపరేటివ్ బ్యాంక్‌కి.. వెళ్లాయి. ఆయా చోట్లకు చేరుకోగానే ఆ బృందాల్లోని సభ్యులంతా ఒక్కసారిగా సీరియస్ అయిపోయారు. ‘ఫ్రమ్ నాసిక్ ఐటీ డిపార్ట్మెంట్’ అని ఐడీ చూపిస్తూ రెయిడ్స్‌కి దిగారు. సదరు యజమానులు హతాశులయ్యారు. బ్యాంక్ వాళ్లు .. ఐటీ ఉద్యోగులకు అవసరమైన సమాచారం ఇవ్వడానికి సిద్ధపడ్డారు. సోదాలు మొదలయ్యాయి. ఫ్యాక్టరీల్లో, ఇళ్లల్లో ఏమీ దొరకలేదు. ఫామ్హౌసెస్ను అంగుళం అంగుళం గాలించారు. అక్కడ సీక్రెట్ రూమ్స్ బయటపడ్డాయి. వాటిల్లోనే లెక్కతేలని డబ్బు కోట్లలో దొరికింది. డాక్యుమెంట్స్ కూడా కనిపించాయి. బినామీ పేర్లతో ఉన్న అకౌంట్ల వివరాలు తెలిశాయి. వెంటనే వీళ్లు కో ఆపరేటివ్ బ్యాంక్‌లో తనిఖీలో ఉన్న ఐటీ టీమ్‌కి సమాచారమిచ్చారు. దాంతో బ్యాంక్‌లోని టీమ్ పని సులువైపోయింది. ఆ వివరాల ప్రకారం అకౌంట్స్ చెక్ చేశారు. లాకర్స్‌లో ఉన్న నగలను తీశారు. అదే సమయంలో యజమానులకు సంబంధించి ఔరంగాబాద్, నాసిక్, ముంబైల్లో ఉన్న ఇళ్లు, ఆఫీస్‌లలోనూ సోదా జరిగింది. రూ. 56 కోట్ల డబ్బు, 32 కిలోల బంగారం, రూ.14 కోట్ల విలువైన ముత్యాలు, వజ్రాలను సీజ్ చేశారు. మొత్తం అన్ని చోట్లా దొరికిన ఆ ఆస్తుల విలువ రూ. 390 కోట్లు. లెక్కాపత్రాల్లేని ఆ డబ్బునంతా జాల్నా స్టేట్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్‌కి తీసుకెళ్లి లెక్కించారట. దాన్ని లెక్కించడానికి ఐటీ టీమ్‌కి పదమూడు గంటల సమయం పట్టింది. స్టీల్, టెక్స్టైల్, రియల్ ఎస్టేట్ రంగాల్లో పేరుమోసిన వ్యాపార సంస్థలు ఎస్సార్జే పీటీ స్టీల్స్ ప్రైవేట్ లిమిటెడ్, కలికా స్టీల్ మాన్యుఫాక్చర్స్కి సంబంధించిన యజమానులపై జరిగిన ఈ రెయిడ్ దాదాపు అయిదురోజుల పాటు సాగింది. ఇందులో నాసిక్, పుణే, ఠాణే, ముంబై ఐటీ డిపార్ట్మెంట్లోని సుమారు 260 మంది ఉద్యోగులు పాల్గొన్నారు. జాల్నాకు చెందిన ఓ సోర్స్ ద్వారా సమాచారం అందుకున్న నాసిక్ ఐటీ డిపార్ట్మెంట్ ఈ రెయిడ్కి రూపకల్పన చేసింది. యజమానులకు ఏ మాత్రం అనుమానం రాకుండా జాగ్రత్తపడింది. డిపార్ట్మెంట్ వాహనాలు వాడితే యజమానులు అప్రమత్తమవుతారని భావించి 120 వాహనాలను అద్దెకు తీసుకున్నారు. అలాగే ఫార్మల్గా వెళితే వాళ్లకు ఉప్పందే ప్రమాదం ఉంటుందని అలా పెళ్లి బృందంలా తయారయ్యారు. ఆ ఆపరేషన్‌కి ‘దుల్హన్ హమ్ లేజాయేంగే’ అని పేరుపెట్టుకున్నారు. సినిమా ఫక్కీలో జరిగిన ఈ రెయిడ్ దేశవ్యాప్తంగా వైరల్ అయింది. -
Mushroom: పుట్టగొడుగుల సంబరాలు
పుట్టగొడుగుల్లో ఒక జాతికి చెందిన ‘వైట్ ట్రఫల్’ పుట్టగొడుగుల కోసం ఇటలీలో ఏటా దాదాపు రెండు నెలల పాటు సంబరాలు జరుగుతాయి. ఇటలీలోని అల్బా నగరంలో ఈ సంబరాలు అక్టోబర్ 12న మొదలై, డిసెంబర్ 8 వరకు కొనసాగుతున్నాయి. పుట్టగొడుగుల్లోని అత్యంత ప్రత్యేకమైనవిగా పరిగణించే వైట్ ట్రఫల్ అభిమానులు దేశ విదేశాల నుంచి ఈ వేడుకలకు హాజరవుతారు. ఈ వేడుకల్లో భాగంగా వైట్ ట్రఫల్ వేలంపాటలు జరుగుతుంటాయి. అల్బా నగరంలో 94 ఏళ్లుగా ‘ఇంటర్నేషనల్ వైట్ ట్రఫల్ ఫెస్టివల్’ పేరిట ఈ సంబరాలు జరుగుతున్నాయి. వేలంపాటల్లో పెద్దసైజులో ఉండే నాణ్యమైన వైట్ ట్రఫల్కు కళ్లు చెదిరే ధరలు పలుకుతుంటాయి. వైట్ ట్రఫల్ సంబరాల్లో భాగంగా వైట్ ట్రఫల్తో ప్రత్యేకమైన వంటకాలు తయారు చేయడంలో శిక్షణ శిబిరాలు, వైట్ ట్రఫల్ను రుచి చూసి నాణ్యతను ఎంపిక చేసే నైపుణ్యాన్ని పెంపొందించేందుకు టేస్ట్ వర్క్‌షాప్, మ్యూడెట్ ట్రఫల్ మ్యూజియం సందర్శన, ట్రఫల్ వంటకాలతో ప్రతిరోజూ విందులు, ట్రఫల్ వంటకాల తయారీలో షెఫ్‌లకు పోటీలు, అల్బా నగరానికి చేరువలోని రోడీ పట్టణంలో ఉన్న రోడీ కోట సందర్శనతో పాటు ఆ కోటలో ప్రత్యేక విందు వంటి కార్యక్రమాలు జరుగుతాయి. అల్బాలో వేడుకలు జరిగే చోట ఏర్పాటు చేసే ట్రఫల్ దుకాణాలు జనాలతో కిక్కిరిసి కనిపిస్తాయి. వైట్ ట్రఫల్ కిలో ధర దాదాపుగా 2,300 యూరోల (రూ.2.38 లక్షలు) వరకు ఉంటుంది. అల్బాలో జరిగే ఇంటర్నేషనల్ వైట్ ట్రఫల్ ఫెస్టివల్లో పెద్ద పరిమాణంలో ఉండే వైట్ ట్రఫల్ను ప్రత్యేకంగా ఎంపిక చేసి, వాటిని వేలం పాటల్లో విక్రయిస్తుంటారు. రెండేళ్ల కిందట జరిగిన వేలంలో 700 గ్రాముల బరువున్న వైట్ ట్రఫల్కు ఏకంగా 1.84 లక్షల యూరోల (రూ.16.91 కోట్లు) పలికింది. వేలంలో పాల్గొన్న హాంకాంగ్ సంపన్నుడు ఒకరు దీనిని సొంతం చేసుకున్నారు. వైట్ ట్రఫల్ వేలం పాటల్లో ఇప్పటి వరకు ఇదే రికార్డు. -
Diwali 2024: నరకాసుర సంహారం
శ్రీమహావిష్ణువు వరాహావతారం ఎత్తినప్పుడు ఆయన వలన భూదేవికి ఒక కొడుకు పుట్టాడు. అతడే నరకుడు. పుట్టిన వేళ దోషప్రదమైనది కావడంతో అతడు అసుర లక్షణాలన్నిటినీ పుణికిపుచ్చుకున్నాడు. అసుర చేష్టలతో జనాలను పీడిస్తూ నరకాసురుడిగా ప్రతీతి పొందాడు. అతడు ప్రాగ్జ్యోతిషపురాన్ని రాజధానిగా చేసుకుని, కామరూప దేశాన్ని పరిపాలించసాగాడు. పొరుగునే ఉన్న శోణితపురం రాజు బాణాసురుడితో నరకుడికి మైత్రి కుదిరింది.బాణాసురుడి ప్రోద్బలంతో నరకుడు మరింత దుండగుడిగా మారాడు. తన కంటికి నచ్చిన పడతినల్లా ఎత్తుకొచ్చి, చెరపట్టేవాడు. ప్రపంచంలోని అన్ని రాజ్యాల మీద దండెత్తి పదహారువేల మంది పడతులను ఎత్తుకొచ్చి, వారందరినీ చెరలో పెట్టాడు. బాణాసురుడి ప్రోద్బలంతో నరకాసురుడు అమాయకులను హింసించేవాడు. తనకు ఎదురు తిరిగిన వారిని నిర్దాక్షిణ్యంగా హతమార్చేవాడు. అతడి దుండగాలను భూదేవి కూడా సహించలేకపోయింది. నరకాసురుడు తన రాజధాని చుట్టూ నాలుగు దుర్భేద్యమైన దుర్గాలను నిర్మించుకున్నాడు. అవి: గిరి దుర్గం, జల దుర్గం, అగ్ని దుర్గం, వాయు దుర్గం. వాటిని దాటి వెళ్లి, ప్రాగ్జ్యోతిషపురం మీదకు దండయాత్రకు వెళ్లడం దేవతలకు సైతం దుస్సాధ్యంగా ఉండేది. నాలుగు దుర్గాల మధ్య శత్రుదుర్భేద్యంగా ఉన్న నరకుడు ముల్లోకాలనూ ముప్పుతిప్పలు పెట్టేవాడు. బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేసి, నరకాసురుడు అనేక దివ్యాస్త్రాలను సాధించాడు. వరగర్వం తలకెక్కి, దేవతల మీద తరచు దండెత్తి వాళ్లను నానా హింసలు పెట్టేవాడు. దేవతలపై దండెత్తిన నరకుడు బలవంతంగా వరుణుడి ఛత్రాన్ని, అదితీదేవి కర్ణకుండలాలను చేజిక్కించుకున్నాడు. దేవతలకు చెందిన మణిపర్వతాన్ని స్వాధీనం చేసుకున్నాడు. నరకుడి ధాటిని అరికట్టడం దేవేంద్రుడికి కూడా సాధ్యంకాలేదు. స్వర్గం మీద దండెత్తిన నరకుడి ధాటికి నిలువలేక దేవేంద్రుడు పలాయనం చిత్తగించాడు. నరకాసురుడు స్వర్గాన్ని ఆక్రమించుకుని, యథేచ్ఛగా తన దాష్టీకాలను కొనసాగించాడు. యజ్ఞ యాగాదుల ఫలితం తనకే దక్కాలని ఆజ్ఞాపించాడు. కాదన్న మహర్షులను చెరసాలలో బంధించి, వారిని చిత్రహింసలు పెట్టాడు. ఒకనాడు వసిష్ఠుడు కామాఖ్యదేవిని పూజించడానికి ప్రాగ్జ్యోతిషపురం చేరుకున్నాడు. ఆయన ఆలయం వద్దకు చేరుకునే వేళకు నరకాసురుడు ఆలయ ద్వారాన్ని మూసివేయించాడు. ఈ దుశ్చర్యకు ఆగ్రహించిన వసిష్ఠుడు, ‘దుర్మదాంధుడా! నీ జన్మదాత చేతిలోనే మరణిస్తావు’ అని శపించాడు.నరకాసురుడి ఆగడాలు నానాటికీ శ్రుతిమించసాగాయి. ముల్లోకాల్లోనూ జనాలు హాహాకారాలు చేయసాగారు. నరకుడి బాధలు భరించలేక దేవేంద్రుడు దేవతలందరితోనూ కలసి శ్రీకృష్ణుడి వద్దకు వచ్చాడు. ‘శ్రీకృష్ణా! పాహిమాం, పాహిమాం! నరకుడి బాధలు వర్ణనాతీతంగా ఉంటున్నాయి. మమ్మల్నందరినీ తరిమికొట్టి, స్వర్గాన్ని చేజిక్కించుకున్నాడు. ఎదురు చెప్పిన మహర్షులను చెరలో బంధించి హింసిస్తున్నాడు. కంటికి నచ్చిన పడతినల్లా ఎత్తుకొచ్చి, చెరపట్టాడు. నరకుడి దాష్టీకాలతో ధర్మం గాడి తప్పుతోంది. నరకుడిని అంతమొందించగల సమర్థుడవు నువ్వే! అతడి బారి నుంచి మమ్మల్ని కాపాడు. ఆలస్యం చేయక అతణ్ణి సంహరించు’ అని ప్రార్థించాడు. నరకుడి పీడ విరగడ చేయమని ముక్కోటి దేవతలూ ముక్తకంఠంతో మొరపెట్టుకున్నారు. దేవత మొరను సావకాశంగా ఆలకించిన నరకుడిపై యుద్ధానికి శ్రీకృష్ణుడు సమాయత్తమయ్యాడు. ‘నాథా! నేను కూడా యుద్ధానికి వస్తాను. నన్ను కూడా తీసుకువెళ్లండి’ అంది సత్యభామ.సత్యభామా సమేతంగా శ్రీకృష్ణుడు గరుడవాహనంపై నరకుడిపై దండయాత్రకు బయలుదేరాడు. తన మిత్రులైన మురాది రాక్షసులను శ్రీకృష్ణుడు అప్పటికే సంహరించడంతో నరకుడు అతడిపై కోపంగా ఉన్నాడు. సుప్రతీకం అనే ఏనుగునెక్కి నరకుడు భారీ సైన్యంతో రణరంగానికి వచ్చాడు. హోరా హోరీగా యుద్ధం జరిగింది. శ్రీకృష్ణుడితో నరకుడు వెనక్కు తగ్గకుండా పోరాడాడు. నరకుడి బాణం తాకి శ్రీకృష్ణుడు మూర్ఛిల్లాడు. సత్యభామ ఆగ్రహోదగ్రురాలైంది. విల్లంబులు చేతిలోకి తీసుకుని, నరకుడిపై శరపరంపరను కురిపించింది. యుద్ధరంగంలో సత్యభామ ఆదిశక్తిలా విజృంభించింది. ఆమె ధాటికి నరకుడి సేనలు చెల్లాచెదురయ్యాయి. ఈలోగా మూర్ఛ నుంచి తేరుకున్న శ్రీకృష్ణుడు తన చక్రాన్ని సంధించి, నరకుడి తలను తెగ నరికాడు. నరకుడు అపహరించిన కుండలాలను అదితికి, ఛత్రాన్ని వరుణుడికి అప్పగించాడు. నరకుడి చెరలో ఉన్న పదహారువేల మంది పడతులను విడిపించి, వారిని పెళ్లాడాడు. నరకుడి పీడ విరగడ చేసినందుకు దేవతలంతా శ్రీకృష్ణుడిని వేనోళ్ల పొగిడారు. నరకాసుర సంహారం తర్వాత తిరిగి వస్తున్న సత్యభామా శ్రీకృష్ణులకు ద్వారకా పురవాసులు ముంగిళ్లలో దీపాలు వెలిగించి స్వాగతం పలికారు.∙సాంఖ్యాయన -
రికవరీ లేట్ అవుతుందా?
నాకు మూడవ నెల. నోట్లో అల్సర్స్ ఉన్నాయి. మెడ భాగంలో కూడా గడ్డలు వచ్చిపోతున్నాయి. నా భర్తకు కూడా ఇలానే వస్తున్నాయి. మందులు వాడాక తగ్గాయి. ఇప్పుడు బేబీకి ఏమైనా రిస్క్ ఉంటుందా?నళినీ రాణి, మాధవరంమీరు చెప్పిన దానిని బట్టి ఇది రిపీటెడ్ ఇన్ఫెక్షన్లా ఉంది. నోట్లో, వెజైనా ఏరియాలో అల్సర్స్ రావడం, మీ ఆయనకు కూడా రావడం చాలా వరకు సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్లో ఉంటుంది. వెంటనే తగిన చికిత్స తీసుకుంటే పూర్తిగా నయమవుతుంది. నిర్లక్ష్యం చేస్తే తల్లి నుంచి బిడ్డకు సోకే ప్రమాదం ఉంటుంది. చికిత్స తీసుకోకుంటే బిడ్డ మీద తీవ్రమైన దుష్ప్రభావాలు ఉంటాయి. ఏ లక్షణాలూ లేకుండా, కొంతమందికి మూడు నెలల తర్వాతే ఇన్ఫెక్షన్ ఉందని తెలుస్తుంది. అందుకే ఇలా అల్సర్స్ రావడంతోనే వీడీఆర్ఎల్ టెస్ట్ చెయ్యాలి. రొటీన్ టెస్టుల్లో భాగంగానే గర్భవతికి కూడా ఈ టెస్ట్ చేస్తున్నారు. కండోమ్స్ వాడటంతో ఈ ఇన్ఫెక్షన్ని దూరం చెయ్యవచ్చు. మీరు వెంటనే దగ్గరలోని గైనకాలజిస్ట్‌ని కలవండి. కొన్ని రక్తపరీక్షలు, కొన్నిసార్లు ఈ అల్సర్స్ నుంచి స్వాబ్ టెస్ట్, వెజైనా స్వాబ్ టెస్ట్ చేస్తారు. గర్భిణులకు ఈ పరీక్షలు 3, 7, 9 నెలల్లో చేసి, చికిత్స ఇచ్చిన తరువాత నయమైందా లేదా అని చెక్ చెయ్యాలి. పెన్సిలిన్ ఇంజక్షన్‌తో ఈ ఇన్ఫెక్షన్ బాగా నయమవుతుంది. వీడీఆర్ఎల్ టెస్ట్ పాజిటివ్ ఉన్నవారిలో టీపీపీఏ, టీపీహెచ్ఏ చెయ్యాలి. ఒకవేళ ఆ టెస్ట్‌లో ఏమీ తెలియకపోతే చికిత్స చేసి, రెండు మూడు వారాల తరువాత పరీక్షల కోసం మళ్లీ శాంపిల్స్ పంపించాలి. సిఫిలిస్ ఇన్ఫెక్షన్ తొలిదశలో వస్తే ఫీటల్ మెడిసిన్ నిపుణులతో గర్భస్థ శిశువుకు స్కానింగ్ చేయించాలి. 5,7వ నెలలో చేసే ఈ స్కానింగ్‌లో ఇన్ఫెక్షన్ వల్ల బిడ్డలో ఏమైనా మార్పులు ఉన్నాయా అని చెక్ చేస్తారు. అల్సర్స్ వెజైనల్ ఏరియాలో మానకుండా ఉంటే 9వ నెలలో మళ్లీ టెస్ట్ చేసి, సిజేరియన్‌కు రికమండ్ చేస్తారు. బ్రెస్ట్ ఫీడింగ్ చేయవచ్చు. బ్రెస్ట్ మీద మానని పుండ్లు లేకపోతే డైరెక్ట్ ఫీడింగ్‌కి అనుమతి ఇస్తారు. పిల్లల డాక్టర్‌కి కూడా ముందుగానే ఈ టెస్ట్ రిజల్ట్ చెప్పాలి. శిశువుకు కూడా 3వ నెలలో, ఏడాదిన్నర వయసులో పరీక్షలు చేస్తారు.నాకు డేకేర్‌లో హిస్టరోస్కోపీ అనే ప్రొసీజర్ ప్లాన్ చేశారు. గర్భసంచిలో చిన్న గడ్డ ఉందని చెప్పారు. డైరెక్ట్‌గా కాకుండా ఇలాంటి ప్రొసీజర్‌తో రికవరీ లేట్ అవుతుందా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?– గాయత్రి, వరంగల్హిస్టరోస్కోపీ ప్రొసీజర్‌లో చిన్న కెమెరా ద్వారా గర్భసంచిని, లోపలి పొరను స్పష్టంగా చూసి, ఉన్న సమస్యను పరిష్కరించడం జరుగుతుంది. ఇది చాలా సురక్షితమైన ప్రక్రియ. డైరెక్ట్‌గా డీ అండ్ సీ లాంటి వాటిలో సమస్య మూలం మిస్ అయ్యే చాన్స్ ఎక్కువ. పైగా బ్లీడింగ్ కూడా ఎక్కువగా అవుతుంది. హిస్టరోస్కోపీలో చాలా చిన్న పల్చటి పరికరంతో ప్రక్రియ పూర్తవుతుంది. కాబట్టి బ్లీడింగ్ తక్కువగా ఉంటుంది. త్వరగా కోలుకోవడం కూడా జరుగుతుంది. హిస్టరోస్కోపీ పూర్తయ్యాక అదే రోజు డిశ్చార్జ్ చేస్తారు. ఒకరోజు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది. కొన్ని రోజులు స్పాటింగ్లాగ ఉండవచ్చు. కొంతమందికి వెజైనా పెయిన్ ఉండవచ్చు. రెండురోజులు పెయిన్ కిల్లర్స్ ఇస్తారు. ప్రొసీజర్ తరువాత రొటీన్ పనులను రెండు రోజుల్లో మొదలుపెట్టుకోవచ్చు. ప్రతిరోజూ షవర్‌బాత్ చెయ్యాలి. బయట స్విమ్మింగ్ పూల్స్ రెండు వారాల వరకు వాడకూడదు. ఒకవేళ మీకు ఈ ప్రక్రియలో ‘పాలిపెక్టమీ’ చేసినట్లయితే, రెండు వారాల తరువాత రిపోర్ట్స్‌తో డాక్టర్ని సంప్రదించాలి. తర్వాత ట్రీట్మెంట్, కేర్ అప్పుడు చెబుతారు. ఈ ప్రొసీజర్ తరువాత మీకు వెజైనల్ డిశ్చార్జ్, దుర్వాసన, జ్వరం, వెజైనల్ పెయిన్, హెవీ బ్లీడింగ్ ఉంటే మాత్రం వెంటనే మీ డాక్టర్‌ను కలవండి. డా‘‘ భావన కాసుగైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్హైదరాబాద్ -
Mystery: లీన్ అమోస్
తెల్లవారుజామున మూడున్నర కావస్తోంది. పక్కింటి బెడ్రూమ్లో పొగతో కూడిన మంటలు చూసి, విలియమ్ కంగారుగా ఫైర్ స్టేషన్ కి కాల్ చేశాడు. పావుగంటలో ఫైర్ ఇంజిన్ హారన్ ఆ కాలనీలో మారుమోగింది. ఆ మోత చుట్టూ ఉన్నవారిని నిద్రలేపింది. ఎవరికి ఏమైందోనన్న కంగారుతో ఇరుగుపొరుగూ పోగయ్యారు. ఫైర్ స్టేషన్ అధికారులు తలుపులు పగలగొట్టి మరీ ఆ ఇంటి లోపలికి వెళ్లేసరికి బెడ్ మీద ఓ మహిళ అపస్మారకస్థితిలో మంటల్లో కాలిపోతోంది. వెంటనే మంటలార్పి, ఆమెను ఆసుపత్రికి తరలించారు.‘పేషెంట్ 80 శాతం వరకూ కాలిపోయింది. బతకడం కష్టం. మా ప్రయత్నం మేము చేస్తాం’ అన్నారు డాక్టర్లు. వెంటనే పోలీసులు ఆమె వివరాలు సేకరించే పనిలో పడ్డారు. ఆమె పేరు లీన్ అమోస్, బ్యాంక్ ఫైనాన్షియల్ కన్సల్ట్టంట్గా పని చేస్తోంది. ప్రమాదం జరిగిన ఇంట్లో ఆమె ఒంటరిగా నివసిస్తోంది. ఆమెకు 38 ఏళ్లు.కొంత సమయానికి లీన్ బాయ్ ఫ్రెండ్ ఎమిలీ స్మిత్‌తో సహా ఆమె పేరెంట్స్, బంధువులు, స్నేహితులు ఆసుపత్రికి చేరుకున్నారు. స్మిత్ ‘ఇది ప్రమాదం కాదు, ముమ్మాటికీ హత్యే! దీని వెనుక పెద్ద పెద్దవాళ్ల హస్తం ఉంది’ అని ఆరోపించాడు. లీన్ చాలా మంచి అమ్మాయి. తనని చంపాలనుకోవడం ఏమిటని అంతా నోళ్లు వెళ్లబెట్టారు. అయితే, స్మిత్ ఆరోపణలను పోలీసులు లెక్కలోకి తీసుకోలేదు. ఫార్మాలిటీ కోసం ప్రమాదం జరిగిన గదికి వెళ్లి తనిఖీలు చేశారు. కాలిపోయిన మంచానికి సమీపంలో ఒక సిగరెట్ పీక దొరికింది. పైగా అప్పటికే డాక్టర్లు లీన్ శరీరంలో అధిక మోతాదులో ఆల్కహాల్ ఉందని చెప్పడంతో ఓ ఊహాగానాన్ని అల్లేశారు.బహుశా లీన్ మంచం మీద కూర్చుని పొగ తాగుతూ, మద్యం సేవిస్తూ రాత్రంతా గడిపి ఉంటుందని, మత్తులో మునిగిపోయి, నిప్పులు చెలరేగిన విషయం గుర్తించకపోవడం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని!దాంతో దాన్ని ప్రమాదవశాత్తు జరిగిన సంఘటనగానే నమోదు చేసుకున్నారు. అయితే లీన్‌కు సిగరెట్ అలవాటే లేదని ఆమె తల్లితో సహా ఆమె గురించి తెలిసినవారంతా వాదించినా, పోలీసులు పట్టించుకోలేదు. స్మిత్ వాదనతో ప్రభావితమైన లీన్ కుటుంబం న్యాయపోరాటం మొదలుపెట్టింది.పదిరోజులు కొనఊపిరితో కొట్టుమిట్టాడిన లీన్, ఆసుపత్రిలోనే తుదిశ్వాస విడిచింది. దాంతో లీన్ కుటుంబం నుంచి ఆందోళన ఉద్ధృతమైంది. ‘లీన్‌కు సిగరెట్ అలవాటు లేదంటుంటే మీరు నమ్మడం లేదు కాబట్టి, కావాలంటే ఆమె ఇంట్లో ఎక్కడైనా సిగరెట్ పెట్టెకాని, యాష్‌ట్రే కాని ఉందేమో కనిపెట్టండి. ఒకవేళ దొరికితే ఈ కేసును ఇక్కడితోనే వదిలేస్తాం’ అంటూ పోలీసులకు సవాలు విసిరారు.అధికారులు ఇల్లంతా వెతికినా, ఎక్కడా లీన్‌కు సిగరెట్ అలవాటు ఉన్న ఆనవాళ్లు దొరకలేదు. పైగా బెడ్రూమ్లో ఒక మూలన కిరోసిన్, గ్యాసోలిన్ మిశ్రమం దొరికింది. మంటలు చెలరేగడానికి కారణమైన కిరోసిన్ మిశ్రమం లీన్ శరీరంపై ఉన్నట్లు పోస్ట్‌మార్టమ్ రిపోర్టులో తేలింది. లీన్ మరణం హత్య కేసుగా మారింది. మరి లీన్‌ను చంపింది ఎవరు? ఆమె మీద అంత పగ ఎవరికి ఉంది? ఈ ప్రశ్నలకు సమాధానం అంతుచిక్కలేదు.ఈలోగా, స్మిత్ మరోసారి గొంతు విప్పాడు. ‘కొన్ని వారాల క్రితం లీన్ పని చేస్తున్న బ్యాంక్ చాలా ఆర్థిక అవకతవకలకు పాల్పడుతోందని, ఆ లిస్ట్ మొత్తం వెలికి తీస్తున్నానని చెప్పింది. అంటే ఆ బ్యాంక్ అక్రమార్కులే కుట్ర పన్ని లీన్‌ను చంపేసి ఉంటారు’ అని వాదించాడు. ఆ వాదనను లీన్ తల్లితో సహా స్నేహితులు కూడా నమ్మారు.1995 డిసెంబర్ 11న వాషింగ్టన్, జార్జ్‌టౌన్‌లో లీన్ నివాసంలోనే ఈ సంఘటన జరిగింది. అదే ఏడాది ఆగస్ట్ నుంచి వాషింగ్టన్లో మెక్సికన్ బ్యాంకుల లావాదేవీలపై దృష్టిపెట్టిన లీన్, ‘నా దర్యాప్తు చాలా రహస్యంగా సాగుతోంది, కొన్ని విషయాలు ఇప్పుడే నీకు చెప్పడం మంచిదికాదు, ఇదంతా చాలా ప్రమాదకరమైన ఇన్వెస్టిగేషన్. ఇది బయటపడితే దేశం అట్టుడుకుతుంది’ అని తన స్నేహితుడు స్మిత్‌తో చెప్పిందట! అలా చెప్పిన కొన్ని వారాలకే ఆమెపై దాడి జరిగింది.ఇంట్లో ఎక్కడా ఆమె దర్యాప్తుకు సంబంధించిన పేపర్స్ కూడా లేవు. అంటే వాటిని ఎవరో దొంగలించి ఉంటారనే స్మిత్ నమ్మకం. అయితే ఇంట్లోకి కిల్లర్ బలవంతంగా ప్రవేశించిన సంకేతాలు లేకపోవడంతో కిల్లర్ లీన్‌కు సుపరిచితుడేనని అంచనాకొచ్చారు అధికారులు. ఎక్కువగా మద్యం తాగించి అపస్మారకస్థితికి చేర్చాకే ఆమె బెడ్‌పై కిరోసిన్ మిశ్రమాన్ని చల్లి, నిప్పు అంటించి పారిపోయినట్లు స్పష్టత వచ్చింది. కానీ హంతకుడు ఎవరో తెలియకపోవడంతో లీన్ మరణం నేటికీ మిస్టరీగానే మిగిలిపోయింది.∙సంహిత నిమ్మన -
జిమ్నాస్టిక్స్‌లో వెలిగిన దీపం
ఆరేళ్ల వయసులోనే ఆ అమ్మాయి జిమ్నాస్టిక్స్ వైపు ఆకర్షితురాలైంది. అయితే ఆమె పాదం కింది భాగం చూస్తే సమతలంగా ఉంది. ఈ ఆటకు ఇలాంటి పాదం పనికి రాదని, జంప్ చేసే సమయంలో ఇబ్బంది కలుగుతుందని స్థానిక కోచ్‌లు చెప్పేశారు. కానీ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) కోచ్‌గా ఉన్న బిశ్వేశ్వర్ నంది మాత్రం ఆ అమ్మాయిలో చురుకుదనాన్ని గుర్తించాడు. తాను ఆమె లోపాన్ని ఎలాగైనా సరిదిద్ది మరీ ఆటలో తీర్చిదిద్దుతానని ఆమె తండ్రికి మాటిచ్చాడు. అక్కడి నుంచి మొదలైన ఆ చిన్నారి ప్రస్థానం ఆపై భారత జిమ్నాస్టిక్స్ చరిత్రలో అత్యుత్తమ ప్లేయర్‌గా నిలిచే వరకు సాగింది. ఆ అమ్మాయే దీపా కర్మాకర్. 16 ఏళ్ల సుదీర్ఘ శ్రమ తర్వాత తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న దీప.. ఎన్నో అరుదైన రికార్డులను, గతంలో ఎవరికీ సాధ్యం కాని మరెన్నో ఘనతలను నమోదు చేసింది.ఓడినా విజేతగా నిలిచి..ప్రొడునోవా వాల్ట్.. జిమ్నాస్టిక్స్‌లో అత్యంత కఠినమైన, ప్రమాదకరమైన ఈవెంట్. ప్రపంచ జిమ్నాస్టిక్స్ చరిత్రలో ఐదుగురు మాత్రమే ఈ ఈవెంట్‌ను విజయవంతంగా పూర్తి చేయగలిగారు. వారిలో దీప కూడా ఉంది. 2016 రియో ఒలింపిక్స్‌లో ఆమె ఈ విన్యాసాన్ని చేసి చూపించింది. తన సత్తాను చాటింది. అప్పటి వరకు మన దేశం నుంచి.. ఒలింపిక్స్ క్రీడల చరిత్రలో మహిళల విభాగంలో ఎవరూ కనీసం అర్హత కూడా సాధించలేకపోయారు. అది దీపకు మాత్రమే సాధ్యమైంది. ఆపై ఫైనల్‌కు కూడా చేరిన ఆమె తన అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసింది. కానీ దురదృష్టవశాత్తు 0.15 పాయింట్ల తేడాతో నాలుగో స్థానంలో నిలిచి త్రుటిలో కాంస్యం చేజార్చుకుంది. అయితేనేమి.. ఆమె ఘనతను అందరూ గుర్తించారు. అందుకే పతకాలు గెలుచుకున్నవారితో సమానంగా ఆమెకూ అభినందనలు, ప్రశంసలు, ప్రోత్సాహకాలు లభించాయి. ఒలింపిక్ పతకం గెలవకపోయినా ఆటలో తన 17 ఏళ్ల కష్టానికి దక్కిన ప్రతిఫలంతో దీప కన్నీళ్లపర్యంతమైంది. ఈ క్రమంలో సహజంగానే ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక పురస్కారాలు అర్జున, ఖేల్‌రత్న, పద్మశ్రీ.. దీపను వరించాయి. జాతీయ స్థాయిలో..త్రిపుర రాజధాని అగర్తలా దీప స్వస్థలం. తండ్రి ప్రోత్సాహంతో ఆటల వైపు ఆసక్తి చూపించిన ఆమె బిశ్వేశ్వర్ నంది అండగా నిలవడంతో పూర్తి స్థాయిలో జిమ్నాస్టిక్స్‌పై దృష్టి సారించింది. కఠోర శ్రమ, ప్రాక్టీస్ తర్వాత తన సమతల పాదం లోపాన్నీ అధిగమించిన దీపకు ఆపై ఎలాంటి ఇబ్బందీ తలెత్తలేదు. స్థానికంగా చిన్న చిన్న టోర్నీల్లో విజయాలు సాధించిన తర్వాత 15 ఏళ్ల వయసులో దీప పేరు తొలిసారి పెద్ద స్థాయికి చేరింది. బెంగాల్‌లోని జల్పాయీగుడీలో జరిగిన జాతీయ జూనియర్ చాంపియన్‌షిప్‌లో ఆమె విజేతగా నిలిచింది. ఆ తర్వాత ఆమె తన సాధనకు మరింత పదును పెట్టింది. ఫలితంగా సీనియర్ టీమ్‌లోకి పిలుపు వచ్చింది. రెండేళ్ల తర్వాత న్యూఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ క్రీడలకు ఎంపిక చేసిన భారత జట్టులో దీపకు చోటు దక్కింది. అయితే పోటీల్లో పాల్గొనే అవకాశం మాత్రం రాలేదు. కానీ తర్వాతి ఏడాది జాతీయ క్రీడల్లో త్రిపుర తరఫున పాల్గొని అందుబాటులో ఉన్న నాలుగు స్వర్ణాలనూ దీప గెలుచుకోవడం విశేషం. విమర్శలను దాటి..అంతర్జాతీయ స్థాయికి వచ్చేసరికి దీప ఏం చేసినా అది భారత్ తరఫున మొదటి ఘనతగానే నమోదైంది. 2014 గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో కాంస్యం సాధించిన దీప ఈ క్రీడల్లో పతకం గెలిచిన తొలి భారత జిమ్నాస్ట్‌గా నిలిచింది. తర్వాతి ఏడాదే ప్రతిష్ఠాత్మక ఆసియా చాంపియన్‌షిప్‌లో కూడా ఆమె కాంస్యం గెలుచుకుంది. ఆ తర్వాత ప్రపంచ చాంపియన్‌షిప్‌లో తన అత్యుత్తమ ప్రదర్శనను కనబరుస్తూ ఐదో స్థానం సాధించింది. ఇదే ఆమెను రియో ఒలింపిక్స్ దిశగా తీసుకెళ్లింది. ‘నా గురించి విమర్శలు వచ్చిన ప్రతిసారి వారికి నా ఆటతోనే సమాధానం ఇచ్చాను. 2014లో ప్రొడునోవా మొదలుపెట్టినప్పుడు నన్ను బఫెలో అంటూ చాలా మంది ఆట పట్టించారు. వెంటనే కామన్వెల్త్ పతకం సాధించి చూపించాను. వయసు అయిపోయింది, ఆటలో దమ్ము లేదు అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు 31 ఏళ్ల వయసులో ఆసియా చాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచి చూపించాను. ఇలాంటి ముగింపు ఇవ్వాలనే ఇంతకాలం ఆగాను. ఇప్పుడు సంతృప్తిగా ఉంది’ అంటూ దీప తన రిటైర్మెంట్ సమయంలో వెల్లడించింది. వండర్‌ఫుల్‌గా ముగించి..తన ఆత్మకథ స్మాల్ వండర్‌లో ఆమె తన కెరీర్‌లోని పలు మలుపుల గురించి చెప్పుకుంది. రియో ఒలింపిక్స్ తర్వాత ఒక్కసారిగా స్టార్ ప్లేయర్ హోదా వచ్చినా ఆ తర్వాత పరిస్థితులు ప్రతికూలంగా మారాయి. వరుస గాయాలతో ఆమె దాదాపు రెండేళ్ల పాటు ఆటకు దూరం కావాల్సి వచ్చింది. పైగా పెద్ద స్థాయి వ్యక్తుల నుంచి మద్దతు దక్కకపోవడంతో ట్రయల్స్‌లో అగ్ర స్థానంలో నిలిచినా పలు సాకులు వెతికి ఆమెను ఆసియా క్రీడలకు పంపకుండా ఫెడరేషన్ నిలిపివేసింది. ఇలాంటి కఠిన సమయాల్లో తాను మానసికంగా మరింత దృఢంగా తయారైంది. విరామం తర్వాత 2018లో రెండు పెద్ద విజయాలతో ఆమె తన సత్తా చాటింది. రెండు వరల్డ్ కప్‌లలో వరుసగా స్వర్ణం, కాంస్యం గెలిచి ఘనంగా పునరాగమనం చేసింది. ఆస్తమా, దగ్గు కోసం వాడే హైజినమైన్ మందును అనుకోకుండా తీసుకొని నిషేధానికి గురైనప్పుడు ఆమెకు ఎక్కడా కనీస మద్దతు లభించలేదు. ఈ ఘటన తర్వాత మళ్లీ తానేంటో నిరూపించుకోవాలనే పట్టుదల ఆమెలో కనిపించింది. 30 ఏళ్లు దాటినా.. అదే జిమ్నాస్టిక్స్ బార్‌పై తీవ్రంగా సాధన చేసింది. 2024 మేలో తాష్కెంట్లో జరిగిన ఆసియా చాంపియన్‌షిప్ బరిలోకి దిగి స్వర్ణ పతకంతో మెరిసి.. ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలిగా నిలిచింది. ఈ టోర్నీకి ముందు ‘నేను ఇంకా బతికే ఉన్నానని చాటాలనిపించింది. అందుకే పోటీ పడుతున్నా’ అని భావోద్వేగంతో చెప్పిన దీప సగర్వంగా తన కెరీర్‌ను ముగించి భవిష్యత్ తరాలకు జిమ్నాస్టిక్స్‌లో వెలుగుల దారి చూపించింది. -
అమావాస్య రోజుని పున్నమి వెలుగులా మార్చే వేడుక..!
దీపావళి అమావాస్య రోజున జరుపుకొనే వెలుగుల వేడుక. సాధారణంగా పండుగలు ఏదో ఒక మతానికి చెందినవి అయి ఉంటాయి. దీపావళి ఒక మతానికి మాత్రమే పరిమితం కాదు, నాలుగు మతాల వారు జరుపుకొనే అరుదైన పండుగ. దీపావళి పండుగ రోజున ఊరూరా ఇంటింటా ముంగిళ్లలో అసంఖ్యాకంగా దీపాలు వెలుగుతాయి. అమావాస్య రాత్రిని పున్నమిని మించిన వెలుగులతో వెలిగిస్తాయి. ముంగిళ్లలో వెలిగించే గోరంత దీపాలు జగమంతటికీ వెలుగులు పంచుతాయి.దీపావళి నేపథ్యానికి సంబంధించి అనేక పురాణగాథలు ఉన్నాయి. దీపావళి మూలాలు భారత్‌లోనే ఉన్నా, ఇది దేశదేశాల పండుగగా విస్తరించింది. చాలా పండుగల మాదిరిగానే అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళిని జరుపుకొంటారు. దీపావళికి మూలంగా నరకాసుర సంహారం గాథ బాగా ప్రాచుర్యంలో ఉంది. రావణ సంహారం తర్వాత శ్రీరాముడు సీతా సమేతంగా ఇదేరోజున అయోధ్యకు తిరిగి చేరుకున్నట్లు పురాణగాథలు ఉన్నాయి.ఐదు రోజుల ఆనందాల పండుగదీపావళి వేడుకలు ఒకరోజుకు మాత్రమే పరిమితం కాదు. ఇది ఐదురోజుల ఆనందాల పండుగ. ఆశ్వయుజ అమావాస్య రోజున దీపావళి జరుపుకొంటే, అంతకు ముందు వచ్చే ఆశ్వయుజ బహుళ త్రయోదశిని ధన త్రయోదశిగా, చతుర్దశిని నరక చతుర్దశిగా జరుపుకొంటారు. దీపావళి మరునాడు కార్తీక శుక్ల పాడ్యమిని బలి పాడ్యమిగా, కార్తీక శుక్ల విదియను యమ ద్వితీయగా జరుపుకొంటారు. ఈ ఐదురోజులకు సంబంధించి వేర్వేరు పురాణగాథలు ప్రాచుర్యంలో ఉన్నాయి.ధన త్రయోదశి: అమృతం కోసం దేవదానవులు క్షీరసాగర మథనం చేసినప్పుడు అమృతకలశ హస్తుడై ఆరోగ్య ప్రదాతగా ధన్వంతరి ఆవిర్భవించాడు. క్షీరసాగర మథనంలో లక్ష్మీదేవి కూడా ఉద్భవించింది. ధన త్రయోదశి రోజున «నదీ స్నానాలు, సముద్ర స్నానాలు ఆచరించి, ధన్వంతరిని పూజిస్తారు. అలాగే లక్ష్మీదేవి పూజలు కూడా చేస్తారు. ధన త్రయోదశి రోజున బంగారం అమ్మకాలు బాగా జరుగుతాయి. ఈ రోజున బంగారం కొన్నట్లయితే, సంపద పెరుగుతుందని చాలామంది నమ్మకం.నరక చతుర్దశి: ముల్లోకాలనూ పీడించిన నరకాసురుడిని ఇదే రోజు సత్యభామా సమేతుడై యుద్ధానికి వెళ్లిన శ్రీకృష్ణుడు సంహరించాడు. నరకాసురుడి పీడ విరగడైనందున మరునాడు ద్వారకాపురికి చేరుకున్న సత్యభామా శ్రీకృష్ణులను జనాలు దీపాలు వెలిగించి స్వాగతం పలికారని, అప్పటి నుంచి దీపావళి జరుపుకోవడం ఆనవాయితీగా మారిందని ప్రతీతి.దీపావళి: దీపావళికి సంబంధించి ఒక ఆసక్తికరమైన పురాణగాథ ఉంది. ముక్కోపిగా పేరుపొందిన దుర్వాస మహర్షి ఒకసారి స్వర్గానికి వెళ్లాడు. దేవేంద్రుడు ఆయనకు అద్భుతమైన ఆతిథ్యం ఇచ్చాడు. ఇంద్రుడి ఆతిథ్యానికి సంతోషించిన దుర్వాసుడు అతడికి కానుకగా ఒక హారాన్ని బహూకరించాడు. ఇంద్రుడు ఆ హారాన్ని తాను ధరించకుండా, దానిని తన పట్టపుటేనుగైన ఐరావతం మెడలో వేశాడు. ఐరావతం ఆ హారాన్ని నేల మీదకు పడవేసి, కాలితో తొక్కింది. ఆ దృశ్యం చూసిన దుర్వాసుడు మండిపడి, ఇంధ్రుణ్ణి శపించాడు. దుర్వాసుడి శాపంతో ఇంద్రుడు స్వర్గాన్ని, సర్వసంపదలను కోల్పోయి రాజ్యభ్రష్టుడయ్యాడు. దిక్కుతోచని ఇంద్రుడు విష్ణువు వద్దకు వెళ్లి మొరపెట్టుకున్నాడు. ‘అమావాస్య రోజున ఒక జ్యోతిని వెలిగించి, దానిని శ్రీమహాలక్ష్మీ స్వరూపంగా తలచి ప్రార్థించు. నీకు పునర్వైభవం ప్రాప్తిస్తుంది’ అని చెప్పాడు విష్ణువు. అమావాస్య రోజున జ్యోతిని వెలిగించి పూజించిన ఇంద్రుడు తిరిగి స్వర్గాధిపత్యాన్ని పొందాడు. పోగొట్టుకున్న సంపదలన్నీ మళ్లీ పొందాడు. అందువల్ల దీపావళి అమావాస్య రోజున లక్ష్మీదేవిని పూజించడం ఆచారంగా మారినట్లు చెబుతారు. లక్ష్మీపూజ తర్వాత ప్రజలు కొత్త వస్త్రాలు ధరించి, విందు వినోదాలతో సరదాగా కాలక్షేపం చేస్తారు. బలి పాడ్యమి: దీపావళి మరునాడు కార్తీక శుక్ల పాడ్యమి. దీనినే బలి పాడ్యమి అంటారు. వామనావతారం దాల్చిన శ్రీమహావిష్ణువు బాలవటువులా వెళ్లి బలి చక్రవర్తిని దానంగా మూడడుగుల చోటు కోరుకున్నాడు. త్రివిక్రముడిగా మారిన వామనుడు రెండు పాదాలతోనూ భూమ్యాకాశాలను ఆక్రమించుకున్నాడు. మూడో అడుగు ఎక్కడ మోపాలో చోటు చూపించమని బలి చక్రవర్తిని అడిగాడు. అప్పుడు బలి చక్రవర్తి త్రివిక్రముడి పాదాల ముందు శిరసు వంచి, తన తల మీదనే మూడో అడుగు మోపమన్నాడు. వెంటనే బలి తలపై వామనుడు తన పాదాన్ని మోపి, అతణ్ణి పాతాళానికి అణగదొక్కాడు. ఇది కార్తీక శుక్ల పాడ్యమి నాడు జరిగింది. విష్ణువు ఇచ్చిన వరం మేరకు ఈ రోజున బలి చక్రవర్తి భూమ్మీదకు వస్తాడని పలువురు నమ్ముతారు. అందువల్ల కొన్ని ప్రాంతాల్లో బలి చక్రవర్తి గౌరవార్థం వివిధ పద్ధతుల్లో ప్రత్యేక పూజలు జరుపుతారు. జమ్ము, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో బలి పాడ్యమిని విశేషంగా జరుపుకొంటారు.యమ ద్వితీయ: దీపావళి తర్వాత వచ్చే కార్తీక శుక్ల విదియ రోజును యమ ద్వితీయగా పాటిస్తారు. ఈ రోజున యముడిని, చిత్రగుప్తుడిని పూజిస్తారు. ఈ రోజున యముడికి ఆయన సోదరి యమున ఇంటికి పిలిచి, భోజనం పెట్టిందని, ఎన్ని పనులు ఉన్నా ఏడాదికి ఒకసారి ఇలా తన ఇంటికి వచ్చి తన ఆతిథ్యం స్వీకరించాలని యమున కోరిన కోరికను యముడు సరేనని వరమిచ్చినట్లు పురాణాల కథనం. అందుకే ఈ రోజును ‘భగినీ హస్తభోజనం’, ‘భాయీ దూజ్’ పేర్లతో జరుపుకొంటారు. ఈ రోజున ఆడపడుచులు తమ సోదరులను ఆహ్వానించి విందు భోజనాలు పెడతారు. యమ ద్వితీయ రోజున సోదరులను ఇంటికి ఆహ్వానించి ఆతిథ్యమిచ్చే ఆడపడుచులు సౌభాగ్యంతో వర్ధిల్లుతారని, సోదరీమణుల చేతి భోజనం తిన్న సోదరులు దీర్ఘాయుష్మంతులు అవుతారని నమ్మకం.దేశదేశాల దీపావళిదీపావళి పండుగను దాదాపు రెండువేల ఏళ్ల కిందట భారత ఉపఖండం సహా అన్ని దక్షిణాసియా దేశాల్లోనూ జరుపుకొనే వారు. ఇటీవలి కాలంలో ఈ పండుగ ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. హిందువులు, జైనులు, బౌద్ధులు, సిక్కులు ఈ పండుగను జరుపుకొంటారు. ఈ నాలుగు మతాలూ భారత భూభాగంలోనే పుట్టాయి. ఈ నాలుగు మతాల వారు ఎక్కువగా ఉండే దేశాల్లో ఈ పండుగ ఘనంగా జరుగుతుంది. బౌద్ధ మతం తొలిరోజుల్లోనే దక్షిణాసియా ప్రాంతమంతటా విస్తరించింది. ఇరవయ్యో శతాబ్ది నుంచి పాశ్చాత్య దేశాలకు భారతీయుల వలసలు పెరిగాయి.ప్రస్తుతం అమెరికా, కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా తదితర దేశాల్లో భారత సంతతివారి సంఖ్య గణనీయంగా పెరిగింది. పలు దేశాల్లో భారత సంతతి ప్రజలు రాజకీయంగా కూడా క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. దాదాపు డజను దేశాల్లో దీపావళి అధికారిక సెలవు దినం. ఇంకొన్ని దేశాల్లో దీపావళి అధికారిక సెలవుదినం కాకపోయినా, ఆ దేశాల్లో దీపావళి వేడుకలను అధికారికంగా జరుపుకోవడం కొన్నేళ్లుగా కొనసాగుతోంది. అమెరికాలో దీపావళి వేడుకలను అధికారికంగా జరుపుకోవడం 2003 నుంచి కొనసాగుతోంది. దీపావళి రోజున అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లో ఘనంగా వేడుకలు జరుగుతాయి. నేపాల్, భూటాన్, ఇండోనేసియా, మలేసియా, శ్రీలంక, థాయ్‌లండ్, లావోస్, తైవాన్, కంబోడియా తదితర దేశాల్లో బౌద్ధులు, హిందువులు దీపావళిని తమ తమ సంప్రదాయ పద్ధతుల్లో జరుపుకొంటారు. బౌద్ధారామాల్లోను, హిందూ దేవాలయాల్లోనూ దీపాలు వెలిగించి, ప్రార్థనలు, పూజలు జరుపుతారు. కెనడాలో స్థిరపడిన భారతీయుల్లో హిందువులతో పాటు సిక్కులు కూడా పెద్దసంఖ్యలో ఉంటున్నారు. సిక్కులు దీపావళిని ‘బందీ ఛోడ్ దివస్’– అంటే చెర నుంచి విడుదలైన రోజుగా జరుపుకొంటారు. గురుద్వారాలను దీపాలతో అలంకరించి, బాణసంచా కాల్పులు జరుపుతారు. భారత సంతతి ప్రజలు నివసించే పలు ఇతర దేశాల్లోనూ ఇటీవలి కాలంలో దీపావళి వేడుకలను విశేషంగా జరుపుకొంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు వందకోట్ల మందికి పైగా జనాలు దీపావళి వేడుకలను జరుపుకొంటారు. అరుదైన విశేషాలుదీపావళికి సంబంధించి రకరకాల ఆచారాలు, సంప్రదాయాలు ఉన్నాయి. కొన్నింటికి విశేష ప్రాచుర్యం ఉంటే, ఇంకొన్ని చాలా అరుదైనవి. దీపావళికి సంబంధించి కొన్ని ప్రాంతాల్లో కొద్దిమందికే పరిమితమైన ఆచారాలు ఉన్నాయి. వీటిలో కొన్ని ఆచారాలకు సంబంధించి ఆసక్తికరమైన కథనాలు ఉన్నాయి. వీటిలో ఉదాహరణకు చెప్పుకోవాలంటే, బిహార్‌లో దీపావళి సందర్భంగా ‘హుక్కా పాతీ’ అనే ఆచారం ఉంది. దీని వెనుక కర్ణుడికి సంబంధించిన కథ ఉంది. మహాభారత కాలంలో కర్ణుడు అంగరాజ్యాన్ని పరిపాలించాడు. ఆనాటి అంగరాజ్యం ఇప్పటి బిహార్, ఝార్ఖండ్‌లలోని అంగ, మిథిలాంచల్, కోసి ప్రాంతాలలో ఉండేది. ఈ ప్రాంతాల్లో ఇప్పటికీ ఈ ఆచారం కొనసాగుతుండటం విశేషం. ఈ ఆచారం ప్రకారం దీపావళి రోజున మధ్యాహ్నం భోజనాలయ్యాక ఇంటిపెద్ద ‘హుక్కా పాతీ’ని సిద్ధం చేస్తారు. జనప కట్టెలను, గోగునారతో పేనిన తాడును కట్టి, ఎండబెడతారు. సాయంత్రం దీపాలు వెలిగించిన తర్వాత ఇంటిలోని పూజా మందిరాల్లో గాని, ఇంటికి చేరువలోని ఆలయ ప్రాంగణాల్లో గాని వాటిని దహనం చేస్తారు. దీపావళి రోజున కర్ణుడు ఈ ఆచారం పాటించేవాడని ఇక్కడి ప్రజలు చెబుతారు. ‘హుక్కా పాతి’ వలన ఐశ్వర్యాభివృద్ధి, కుటుంబాభివృద్ధి, ఆయురారోగ్యాలు కలుగుతాయని వారు నమ్ముతారు.దీపావళికి ముందు రోజును ఎక్కువమంది ప్రజలు నరక చతుర్దశిగా జరుపుకొంటే, పశ్చిమ బెంగాల్‌లోని కొందరు ప్రజలు మాత్రం దీనిని ‘భూత చతుర్దశి’గా పాటిస్తారు. భూత చతుర్దశి రోజు రాత్రివేళ ఇంటి ముంగిళ్లలో మట్టి ప్రమిదల్లో పద్నాలుగు దీపాలను వెలిగిస్తారు. ఈ పద్నాలుగు దీపాలూ పద్నాలుగు లోకాలలో ఉండే తమ పూర్వీకుల ఆత్మలకు దారి చూపుతాయని, తద్వారా వారు తమ ఇళ్లలోకి దుష్టశక్తులు చొరబడకుండా నిలువరిస్తారని నమ్ముతారు.దీపావళి సందర్భంగా పశ్చిమ భారత ప్రాంతంలో కొందరు కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకొంటారు. వ్యాపారులు తమ వ్యాపారాల జమా ఖర్చులకు సంబంధించిన కొత్త ఖాతాలను ప్రారంభిస్తారు. మహారాష్ట్రలో ఈ సందర్భంగా ‘చోప్డా పూజ’ జరుపుతారు. ‘చోప్డా’ అంటే జమా ఖర్చుల పుస్తకం. దీపావళి రోజున వారు కొత్త జమా ఖర్చుల పుస్తకాలను ప్రారంభించి, వాటిని లక్ష్మీనారాయణుల పటాల ముందు పెట్టి శాస్త్రోక్తంగా పూజలు జరుపుతారు. కొందరు ఇప్పటికీ జమా ఖర్చుల పుస్తకాలకు పూజలు చేస్తుంటే, ఆధునికత సంతరించుకున్న యువతరం తమ వ్యాపారాల జమా ఖర్చుల వివరాలను నిక్షిప్తం చేసుకున్న లాప్‌టాప్‌లకు, కంప్యూటర్లకు కూడా ‘చోప్డా పూజ’ జరుపుతూ ఈ ఆచారాన్ని కొనసాగిస్తుండటం విశేషం.మనకు దసరా పాటలు తెలుసు. బడుల్లో చదువుకునే పిల్లలు తమ ఉపాధ్యాయులతో కలసి ఇంటింటికీ వెళ్లి దసరా పాటలు పాడుతూ, వారు ఇచ్చే కానుకలు పుచ్చుకునేవారు. దాదాపు ఇలాంటి ఆచారాన్నే దీపావళి సందర్భంగా ఉత్తరాఖండ్‌లో పాటిస్తారు. ఉత్తరాఖండ్‌లోని కుమావూ ప్రాంతంలో ఇప్పటికీ ఈ ఆచారం మిగిలి ఉంది. దీపావళి రోజున మధ్యాహ్నం వేళ బడుల్లో చదువుకునే పిల్లలు తమ చుట్టు పక్కల ఇళ్ల ముంగిళ్లలో నిలిచి, పాటలు పాడతారు. ఇళ్లలోని వారు పిల్లలకు కానుకగా డబ్బులు, బాణసంచా వస్తువులు, మిఠాయిలు ఇస్తారు. దీపావళి రాత్రివేళ వీరంతా ఆరుబయట కట్టెలతో చలిమంటలు వేసుకుని, ఆట పాటలతో ఆనందంగా గడుపుతారు.దీపావళి రోజున అన్ని ప్రాంతాల వారు విరివిగా మిఠాయిలు, పిండివంటలు దేవతలకు నివేదించి, వాటిని ఆరగిస్తారు. తమిళనాడులో మిఠాయిలు, పిండివంటలతో పాటు ప్రత్యేకంగా దీపావళి లేహ్యాన్ని తయారు చేస్తారు. ఇతర పదార్థాలతో పాటు ఈ లేహ్యాన్ని కూడా దేవతలకు నివేదిస్తారు. దీనిని తమిళులు ‘దీపావళి లేగియం’ అని, ‘దీపావళి మరుందు’ అని అంటారు. దీపావళి రోజున వేకువ జామునే పూజలు జరిపి, ఈ లేహ్యాన్ని నివేదించి, పరగడుపునే ఆరగిస్తారు. ధనియాలు, వాము, జీలకర్ర, మిరియాలు, సొంఠి, నెయ్యి, బెల్లంతో తయారు చేసే ఈ లేహ్యం ఆరోగ్యాన్ని కాపాడుతుందని చెబుతారు.దీపావళి తర్వాత కార్తీక శుక్ల విదియ రోజున కొందరు గోవర్ధన పూజ నిర్వహిస్తారు. ఈ ఆచారం పాటించే పలు ప్రాంతాల్లో ఆవుపేడతో గోవర్ధన పర్వత ప్రతిమను రూపొందించి, పూజలు జరుపుతారు. ప్రసిద్ధ శ్రీకృష్ణ క్షేత్రమైన బృందావనంలో గోవర్ధన పూజ సందర్భంగా ‘అన్నకూట పూజ’ నిర్వహిస్తారు. అన్నాన్ని పర్వతాకారంలో రాశిగా పోసి పూజిస్తారు. తర్వాత శ్రీకృష్ణుడికి ఛప్పన్న నైవేద్యాలను సమర్పిస్తారు.దీపావళికి ముందు ధనత్రయోదశి నాడు దేశంలో పలుచోట్ల ధన్వంతరి పూజలు, లక్ష్మీపూజలు ఘనంగా జరుగుతాయి. మహారాష్ట్రలో మాత్రం పలుచోట్ల ఈరోజున యమధర్మరాజును పూజిస్తారు. మరాఠీ మహిళలు తమ కుటుంబంలో ఉన్న పురుషులందరి పేరిట చెరొక దీపం చొప్పున వెలిగిస్తారు. ఈ క్రతువును ‘యమ దీపదానం’ అంటారు.మొఘల్ సామ్రాజ్యంలో బాణసంచాకు రాజాదరణ మొదలైంది. బాణసంచా తయారు చేసే నిపుణులను ఔరంగజేబు మినహా మిగిలిన మొఘల్ చక్రవర్తులు, వారి సామంతులు బాగా ఆదరించేవారు. అక్బర్ చక్రవర్తి బాణసంచా కాల్పులను, వాటి తయారీ నిపుణులను బాగా ప్రోత్సహించేవారు. బాణసంచా తయారీ నిపుణులకు భారీ నజరానాలను చెల్లించేవారు.మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు బాణసంచా కాల్పులపై నిషేధం విధించాడు. ఆయన 1667లో విధించిన నిషేధం ఆయన మరణించేంత వరకు కొనసాగింది. మొఘల్ పాలన అంతరించి, బ్రిటిష్ పాలన మొదలైన తర్వాత బాణసంచాకు పునర్వైభవం మొదలైంది. -
రైజింగ్ స్టార్ సీత
బాడీ షేమింగ్‌ని పట్టించుకోకుండా, ప్రతిభకు అందుతున్న ప్రశంసలకు పొంగిపోకుండా, విమర్శల తీరును గ్రహిస్తూ.. తన వ్యక్తిత్వానికి, టాలెంట్‌కి మెరుగులు దిద్దుకుంటూ సాగిపోతున్న నటి.. సీత! ఆమె పరిచయమే ఇది..👉చెన్నైలో పుట్టి, పెరిగిన సీత.. ఆట, పాటల్లోనే కాదు చదువులోనూ చురుకే! తనను చూసి తనతో స్నేహం చేసిన వాళ్లకంటే వెక్కిరించే వాళ్లే ఎక్కువగా ఉండటంతో చిన్నప్పటి నుంచీ పెద్దగా ఫ్రెండ్స్ లేకుండా పోయారు. దాంతో మనోధైర్యమే ఆమెకు ఆప్తురాలైంది.👉ఒకరోజు.. సీత తనకున్న అతికొద్ది మంది స్నేహితులతో కలిసి.. బీచ్‌లో సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తుండగా, ఒకతను సీతను గమనించి, ఆమె దగ్గరకు వెళ్లి ‘నేను ఓ సినిమా తీస్తున్నాను. అందులో నటిస్తారా?’ అని అడిగాడు. అతనెవరో తనను ఆట పట్టిస్తున్నాడనుకుని గబగబా అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆటపట్టించడం కాదు, నిజంగానే అతను సినిమా పర్సన్ అని సీతకు .. సినిమా సెట్స్ మీదకు వెళ్లాక తెలిసింది. అతనే.. విజయ్ మిల్టన్. ఆమె తొలిచిత్రం ‘గోలీ సోడా’ డైరెక్టర్. 👉విజయం సాధించిన ‘గోలీ సోడా’.. అంతకుముందు కెమెరాను ఫేస్ చేసిన అనుభవమే లేని సీతకూ మంచి పేరే తెచ్చిపెట్టింది. ఆమె ప్రతిభకు ముగ్ధుడైన విజయ్ మిల్టన్ తన తర్వాత సినిమా ‘10 ఎండ్రాతుకుళ్లా’లోనూ అవకాశం ఇచ్చాడు. అలా ప్రభుదేవా నటించిన ‘చార్లీ చాప్లిన్’ తో పాటు మరికొన్ని సినిమాల్లోనూ నటించింది. 👉 వెండితెర అవకాశాల్ని అందించిన పాత్రే నన్ను వెబ్ ప్రపంచానికీ పరిచయం చేయడం సంతోషం. నిజానికి ఆ రోల్.. నా లైఫ్‌ని రిఫ్లెక్ట్ చేస్తున్నట్టు ఉంటుంది. నా ఫిజికల్ అపియరెన్స్ గురించి ఎవరేం కామెంట్ చేసినా పట్టించుకోను. నా పని నేను చేసుకుంటూ పోతా!👉‘గోలీ సోడా’కు సీక్వెల్‌గా తీసిన ‘గోలీ సోడా – ద రైజింగ్ ’ వెబ్‌సిరీస్‌తో సీత ఓటీటీలోకీ ఎంటర్ అయింది. ఇది డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమ్ అవుతోంది. – సీత. -
ఈ వారం కథ: హైవే
ఉదయం 7:30కే కల్లాల వద్ద రోడ్డు మీద బస్సు దిగి, రోడ్డు అవతలికి దాటేందుకు రెండడుగులు వేసిన. ఇటు నుండి ఒకదాని వెనుక ఒకటి రెండు ఇసుక టిప్పర్లు, అటు నుండి రెండు కార్లు ఒకదాని తర్వాత ఒకటి దుమ్ములేపుకుంటూ పోయినాయి. ఏమాత్రం ఏ మారినా పెద్ద ప్రమాదం జరిగుండేది. ఈమధ్యనే ఇది డబుల్ రోడ్డు కావడంతో ప్రొద్దుటూరు నుండి కమలాపురానికి వచ్చిపోయే వాహనాలన్నీ ఈ పల్లెల దారి పట్టాయి. రోడ్డు వెడల్పు కావడంతో వేగం మితిమీరింది. మా ఊరి పెన్నలో ఇసుక క్వారీకీ అనుమతిచ్చారు. రేయింబవళ్లు భారీ ఇసుక టిప్పర్లు. ఈసారి అటూ ఇటూ చూసుకొని రోడ్డు దాటాను. రోడ్డుకు ఊరి రచ్చబండకు ఓ అర ఫర్లాంగు దూరం. రచ్చబండ వరకున్న సిమెంటు బాటకు ఇరువైపులా ఊరి రైతుల కల్లాలు. రచ్చబండ వద్ద నుండి రెండు దారులు చీలి వాటికిరువైపులా ఇండ్లు మొదలవుతాయి. రోడ్డు దాటుకుని పది అడుగులు వేయగానే గవిని కాడి నాగిరెడ్డి కల్లం గోడ మీద.. వేపచెట్టు కింద ఓ పదిపన్నెండు మంది కూర్చొని గట్టిగా మాట్లాడుకుంటున్నారు. నన్ను చూసి ఓ నలుగురు వరుసలు పెట్టి పలకరిస్తూ క్షేమసమాచారాలడిగినారు. ‘మామకు కచ్చితంగా తెలిసుంటుంది.. ఏం మామా! మన చేలల్లో ఎక్స్‌ప్రెస్ హైవే ఖాయమే కదా, మళ్లా ఏమన్నా మారుస్తారా?’ పని వుంటే తప్ప వూరు దాటని శీను అడిగినాడు.నాకు జవాబు చెప్పే అవకాశం రానివ్వలేదు. ఊరి రాజకీయాల్లో ఉంటూ ఆఫీసుల చుట్టూ తిరిగే నారపరెడ్డి అందుకొని ‘సర్వే అయిపోయి ల్యాండ్ అక్విజిషన్ కూడా అయిపోయింది. రేపో మాపో భూములకు లెక్క ఇచ్చి పొజిషన్లోకి తీసుకుంటారు. ఇంకేం మారుస్తారు!’ అన్నాడు. నేను అందరికీ చేయూపుతూ అక్కడి నుండి ముందుకు కదిలిన. రచ్చబండ వద్ద ఓ పదీపన్నెండు మంది మాట్లాడుకుంటున్నారు. బహుశా హైవే గురించే అనిపించింది. బావమరిది ఇంటికి చేరి కాళ్లూ, మొహం కడుక్కుని కూర్చున్నాక, ఒక కాగితం తెచ్చి చేతికిచ్చాడు. ఫలానా సర్వే నంబర్లో 55 సెంట్లను రోడ్డు నిర్మాణం కోసం తీసుకోబోతున్నట్లు, ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఫలానా తేదీలోపు తెలియజేయాలని భూసేకరణ అధికారి నుండి వచ్చిన నోటీసు. హైవే కోసం స్వాధీనం చేసుకోబోతున్న భూముల గురించి భూయజమానులందరితో పాటు నాకూ పంపిన ఫార్మల్ నోటీసు అది. ఊరి అడ్రస్‌కు వచ్చింది. ఈ సారాంశం రెండు రోజుల కింద నా మొబైల్‌కు వచ్చినదే. ఇప్పుడు అభ్యంతరాలు తీసుకునేదేమీ ఉండదు. పరిహారం ఇచ్చి స్వాధీనం చేసుకుంటారంతే! ఏమైనా అభ్యంతరాలుంటే కోర్టులో పిటిషన్ ఫైల్ చేసి కోర్టుల చుట్టూ తిరగాల్సిందే. నోటీసు పక్కన పడేసి, ‘ఊర్లో అంతా దీని మీదే మాట్లాడుకుంటున్నట్లుందే!’ అన్నాను. ‘అవును బావా! హైవే కోసం భూములు పోతున్న వారి బాధ ఒకటైతే, తమ భూములు హైవే పక్కన లేకుండా ఎక్కడో ఉన్న వారి బాధ ఇంకొకటి’ అన్నాడు శివ. నాకు అర్థమైంది. హైవే కోసం సేకరిస్తున్న భూములకు ఇప్పుడున్న రేటు కన్నా ఎక్కువే ఇస్తున్నా, హైవే పక్కనున్న భూములకు ఊహించని రేట్లు వస్తాయి. అందుకే హైవే కోసం భూమి పోవడం కన్నా హైవే పక్కన భూమి ఉన్న రైతులను చూసి ఒకింత ఈర‡్ష్య పడుతున్నట్లుంది. ఒకప్పుడు తమవి మంచి కండగలిగిన భూములని మురిసిపోయిన రైతులు, ఇప్పుడా భూములు హైవే చుట్టుపక్కల లేనందుకు ఖిన్నులవుతున్నారు. ‘మనసులో బాధపడటంతోనే ఇది ఆగిపోదు. ఎన్ని అనర్థాలు జరుగుతాయో! మనుషులంతా ఎలా విడిపోతారో!’ నాలో నేను అనుకున్నట్లే అన్నాను. ‘నిజమే బావా! ఎప్పుడో చేల పంపకాలు జరిగిన అన్నదమ్ముల నడుమ ఇప్పుడు కొత్తగా అసూయలు, సరిపోనితనాలు పొడచూపుతున్నాయి. పెద్ద సుబ్బన్న గారి కొండారెడ్డి, రామిరెడ్డి పదహైదేళ్ల కిందట భూములు పంచుకొని వేరుపడినారు. రాళ్లవాగు చేను నాలుగెకరాల్లో, పెద్దోడు కొండారెడ్డికి పైదిక్కు అంటే పడమర దిక్కు రెండెకరాలు, చిన్నోడు రామిరెడ్డికి తగ్గు దిక్కు తూర్పున రెండెకరాలు వచ్చింది. ఇప్పుడు చిన్నోడి చేను రెండెకరాలు పూర్తిగా హైవే కోసం పోతోంది. పెద్దోడి రెండెకరాలు హైవే పక్కన నిలబడింది. అప్పుడు చేను నిలువునా పంచినారు, ఇప్పుడు అడ్డంగా పంచి ఇద్దరికీ సమంగా లాభం వచ్చేలా చూడాలని చిన్నోడు సర్పంచు దగ్గరికి, ఎమ్మెల్యే దగ్గరికి తిరుగుతున్నాడు. పదహైదేళ్లనాడు జరిగిన పంపకం, ఎవరి పాస్ పుస్తకాలు వాళ్లవైనాయి, తిరిగి పంపకానికి ఒప్పుకోనని పెద్దోడు భీష్మించుకున్నాడు. చిన్నోడు ఓర్పు తక్కువ మనిషి. ఏమైతుందో!’ శివ మాటల్లో కొంత ఆందోళన కనపడింది. నాకు తెలియకుండానే ఒక నిట్టూర్పు వెలువడింది. నేను ఊరికి వచ్చింది కూడా ఈ హైవే గొడవల పంచాయతీకే. మేనమామ కొడుకులిద్దరూ ఎప్పుడో జరిగిన భూముల పంపకం మీద ఇప్పుడు గొడవ పడుతున్నారు. ఆరోజు అన్నదమ్ములు ఇద్దరూ ఆస్తులు పంచుకునేటప్పుడు ఉన్న పెద్ద మనుషుల్లో నేనొకడిని. మేనరికపు చుట్టరికం కూడా ఉండడంతో పెద్దోడు రాఘవ ఫోన్ చేసి రమ్మన్నాడు. ఐదేళ్ల కిందట రాఘవ, చంద్ర భూములు పంచుకునేటప్పుడు వడ్డోనివంక పంపుల్లో నాలుగెకరాలు, రాళ్లవాగున ఐదెకరాలు త్రాసులో పెట్టి కోరుకోమన్నాము. వడ్డోనివంకన పంపులు కండగలిగిన సారవంతమైన భూములు. రాళ్లవాగున సాధారణ భూములు. అందుకనే ఇక్కడి నాలుగెకరాలు అక్కడి ఐదెకరాలకు సమానమని పెద్ద మనుషుల తీర్మానం. పెద్దోడు కాబట్టి రాఘవకే మొదట కోరుకునే అవకాశం వున్నింది. ఆరోజు రాఘవ కండగలిగిన వడ్డోనివంకన నాలుగెకరాల భూమి కావాలన్నాడు. చంద్ర మారు మాట్లాడకుండా రాళ్లవాగున ఐదెకరాలు తీసుకున్నాడు. ఇప్పుడు రాళ్లవాగు చేల మీదుగా ఆరులైన్ల హైవే నిర్మాణం జరుగుతోంది. చంద్ర చేలో ఒక ఎకరా హైవే భూసేకరణలో పోయి, హైవే పక్కన నాలుగు ఎకరాలు మిగులుతోంది. ఇప్పుడు రాఘవకు భరించలేనంత బాధగా వుంది. ఆడపిల్లలు గలోన్ని, ఐదారేళ్లుంటే పెళ్లికి ఎదుగుతారు. వడ్డోనివంకన రెండెకరాలు తీసుకొని హైవే పక్కన తనకు రెండెకరాలు ఇవ్వాలని అడుగుతున్నాడు. చంద్ర అందుకు ససేమిరా అంటున్నాడు. రాఘవ నాలుగెకరాలు ఇస్తే హైవే పక్కన రెండెకరాలు ఇస్తానంటున్నాడు. ఇది మరీ అన్యాయం అని చెబితే వినడం లేదు. మంచి పంట పండే నాలుగెకరాల భూమి అంతా తనకిచ్చి, హైవే పక్కన రెండెకరాలు రాఘవ ఏం చేసుకుంటాడు! పైగా అది సాధారణ భూమి. హైవే పక్కన పొల్యూషన్ వల్ల అసలు పంట పండదని చెబితే చంద్ర వినడం లేదు. ‘హైవే పక్కన పంటలు పండించుకోవడానికా వాడు అడిగేది? రెండేళ్లలో హైవే పడితే ఎకరా నలభై యాభై లక్షలు పోతుంది. ఇప్పుడే ఇరవైయైదు లక్షలకు అడుగుతున్నార’ని ఎదురు వాదన తీస్తున్నాడు చంద్ర.‘భూముల ధరలు గాలిలో దీపం రా! మొదట్లో పెరగొచ్చు. తర్వాత నిలబడి పోవచ్చు. రెండేళ్లకు పెరుగుతాయని గ్యారంటీ లేదు. అదంతా రియల్ దందాల మాయాజాలం మీద ఆధారపడి ఉంటుంది. పెరిగినప్పుడు ఇంకా పెరుగుతుందని మీరు అమ్ముకోలేకపోవచ్చు. తర్వాత కొనేవాడు ఉండడు’ అని ఎంత చెప్పినా వినడం లేదు.రాఘవేమో కనీసం ఒక ఎకరంన్నర అయినా హైవే పక్కన తనకిప్పించమంటున్నాడు. ఆడపిల్లలు గలోన్నని ఏడుపు మొహం పెడతాడు. అన్నదమ్ముల నడుమ ఆ పంచాయతీ తీర్చడానికే ఇప్పుడు నేను ఊర్లో అడుగు పెట్టింది. నేను వస్తున్నానని నిన్ననే ఫోన్లో చెప్పడంతో అన్నదమ్ములతో పాటు వాళ్ల భార్యలు ఇండ్ల వద్దే వున్నారు.. మొగుళ్లకు దన్నుగా నిలబడటానికి. రాఘవ ఇంట్లోనే కూర్చున్నాం. కాఫీలు, టిఫిన్లు అని హడావిడి చేయబోతే వద్దన్నాను. శివుడి ఇంటి వద్ద కాఫీ తాగి వచ్చానన్నాను. మా కోసం వచ్చి అక్కడ తాగడమేమిటని రాఘవ భార్య నిష్ఠూరమాడింది. అన్నదమ్ములతో ఎంతసేపు మాట్లాడినా పాతపాటే. ఎవరూ ఒక మెట్టు దిగి రావడం లేదు. వాళ్లు ఒక మెట్టు దిగాలనుకున్నా, వాళ్ల భార్యలు దిగనివ్వడం లేదు.విడవమంటే పాముకు కోపం, కరవమంటే కప్పకు కోపం. ఆఖరకు ఆడోళ్లను గట్టిగా కసురుకునేసరికి, నా మీద రుసరుసలాడుతూ ఇద్దరూ నోరు మూసుకొని కూర్చున్నారు. మధ్యాహ్నం భోజన సమయానికి ఇద్దరినీ ఒక మాట మీదికి తెచ్చిన. వడ్డోనివంకనున్న నాలుగు ఎకరాల్లో రాఘవ ఎకరంన్నర చంద్రకు ఇచ్చేటట్లు, హైవే పక్కన చంద్రకు మిగిలిన నాలుగెకరాల్లో ఒక ఎకరా రాఘవకు ఇచ్చేటట్లు ఖరారైంది. ఎకరాకు మించి ఇవ్వడానికి చంద్ర ససేమిరా ఒప్పుకోలేదు. ఆ ఎకరాకే రాఘవను ఒప్పించి ఇద్దరి నడుమ అప్పటికప్పుడు అగ్రిమెంటు రాయించాను. ఇద్దరికీ, ముఖ్యంగా ఆడవాళ్లిద్దరికీ నా మీద కోపంగానే వుంది. భోంచేసి పొమ్మని రాఘవ మొహమాటానికి పిలుస్తున్నా, వద్దని వారించి నేను బయటపడిన. నేను వచ్చినప్పటి నుండి ఆడవాళ్లిద్దరూ అక్కడే ఉన్నారు. ఇంకేం భోజనం ఉంటుంది? శివుని ఇంటికి చేరి, ఇంత తిని ఓ కునుకు తీసి, సాయంత్రం నాలుగు గంటల బస్సుకు కడపకు పోదామని బయలుదేరిన.రచ్చబండ వద్ద ఉదయం కన్నా ఇంకా ఎక్కువ మందే గుమిగూడి ఉన్నారు. ఈ నడుమ కాలంలో రచ్చబండ మీద ఒకరిద్దరు కునికిపాట్లు పడటం మినహా ఇంత జనాన్ని చూడలేదు. టీవీలు, తర్వాత సెల్ఫోన్లు వచ్చాక సంఘజీవనం మాయమైపోయింది. మనుషులు ఒంటరిగా మిగిలిపోయారు. ఇప్పుడు ఆశ్చర్యంగా రచ్చబండ మీద పదహైదు పదహారుమంది ఉన్నారు. రెండు రోజుల్లో భూములు కోల్పోయిన రైతులకు హైవే భూసేకరణ డబ్బు, అందబోతోంది. ల్యాండ్ అక్విజిషన్ పూర్తయిందనే సమాచారం రైతులకన్నా ముందు రాజకీయ నాయకులకు తెలుస్తుంది. రాజకీయ నాయకుల అనుచరగణమంతా నెలరోజుల కిందటి నుండే హైవే పక్కనున్న భూములు కొనేందుకు రైతులను ఒకరికి తెలియకుండా ఒకరిని ప్రలోభ పెడుతున్నారు. ఇప్పుడు గ్రామీణ జనం అంత అమాయకంగా లేరు. ఆ ముచ్చట్లు చెప్పుకునేందుకే రచ్చబండ మీద కూడినట్లుంది.తనను ఫలానా వాడు ఎకరా ఇరవై లక్షలకు అడిగాడని ఒకడు చెబుతుంటే, మరొకడు ఆ ఫలానా వాడే నాకు ఇరవైయైదు లక్షలు ఇస్తానన్నాడని చెబుతున్నాడు. ఫలానా సుబ్బారెడ్డికి కోటి వస్తుందంటే, ఫలానా ఎల్లారెడ్డికి కోటిన్నర వస్తుందని చెప్పుకుంటున్నారు. అప్పుడే ఎందుకు అమ్మడం! హైవే ఓపెనింగ్ అయ్యేవరకు ఆగాలని ఒకడు అంటున్నాడు. మొదట్లోనే భూములు అమ్మి సొమ్ము చేసుకోవాలని, తర్వాత ఈ వేడి చల్లబడి భూముల అమ్మకం మందగిస్తే అప్పుడు అమ్ముకోవాలన్నా కొనేవాడు ఉండడని మరొకడు అంటున్నాడు. దోవన పోతున్న నన్ను చూసి కొందరు వాళ్ల డబ్బు మాటలు ఆపి, క్షేమ సమాచారాలు అడిగినారు. నేను పొడిపొడిగా సమాధానమిస్తూ దాటుకుందామని చూసిన.‘ఒక నిమిషం రావోయ్!’ అని టంగుటూరోల్ల జయరామిరెడ్డి పిలవడంతో, పెద్దవాడు పిలిచాడనే గౌరవంతో రచ్చబండ మీదకు చేరక తప్పలేదు. ‘హైవే పక్కన భూములకు ఇప్పుడే ఊహించని ధరలు పలుకుతున్నాయి. హైవే కోసం తీసుకున్న భూములకు పరిహారం పెంచాలని మండలాఫీసు కాడ ధర్నా చేస్తే ఎట్లుంటుంది? ఏమన్నా సలహా ఇయ్యి’ ఒక పెద్దమనిషి నన్ను సలహా అడిగినాడు.‘మైలవరం డ్యామ్ నుండి మన పొలాలకు నీళ్లు విడిచి పదహైదేళ్లయింది. ఒక్కసారన్నా మన నీళ్ల హక్కు గురించి అడిగినామా! డ్యామ్ నీళ్లన్నీ ఫ్యాక్టరీలకు ఇచ్చి మమ్మల్ని ఎండబెడుతున్నారని ధర్నా చేసినామా? కాలువలకు నీళ్లొచ్చేటప్పుడు రెండు పంటలు పండించుకున్నది మతికి లేదా? వాన లేని కరువులో కూడా నమ్మకంగా ఒక పంటైనా వచ్చింది. ఆ నీళ్ల హక్కును మనం అడగకుండా ఎందుకు వదిలేసుకుంటున్నాం’ అనడిగిన. అందరూ నన్ను తిక్కోడ్ని చూసినట్లు చూసినారు. జయరామిరెడ్డి కల్పించుకుంటూ ‘ఆ నీళ్ల కత ఇప్పుడెందుకు లేవోయ్! ఇప్పుడు నీళ్ల అవసరం లేకుండా అందరూ బుడ్డసెనగ వేయడం మరిగినారు. వానాకాలం పోయేముందు అక్టోబర్ ఆఖర్లో విత్తనం వేస్తే, తర్వాత చలికి అదే పండుతుంది. నీళ్లవసరం ఎవరికీ లేదు గానీ, ఇప్పుడు ఈ హైవే భూముల పరిహారం గురించి చెప్పు’ అన్నాడు. ‘ఈ హైవే ఎవరికి లాభం? ఊర్లో పదిమందికి లాభమేమో, మిగతా అందరూ దాని నష్టాలను అనుభవిస్తారు’ అన్నాను. ‘నష్టమేముంది మామా! హైవే పడితే విజయవాడకు కార్లో నాలుగ్గంటల్లో పోవచ్చు’ అన్నాడు రాము.‘హైవే పక్కన నీ రెండెకరాలు 50 లక్షలకు అమ్మి 20 లక్షలతో కారు తేవాలనుకుంటున్నావేమో! కారు బంగారు బాతు కాదు, రెండెకరాల పంట పొలం మాదిరి గుడ్లు పెట్టడానికి. అయినా నీయట్లాటోళ్లు నలుగురు కార్లు తెచ్చుకున్నా రోజూ విజయవాడకు ఏం అడుక్కు తినడానికి పోతావురా! ఆరేడు గంటల్లో పోతే నష్టమొస్తుందా?’ అని అడిగేసరికి వాడు గతుక్కుమన్నాడు. ‘కారు కొనేవాడివి, ఏడాదికి ఒకసారో రెండుసార్లో విజయవాడకు నాలుగైదు గంటల్లో పోవచ్చని నువ్వు సంతోషపడొచ్చు. బస్సులో పోయే వాళ్లు ఆ భారం ఎందుకు మోయాల్రా! ఇక్కడి నుండి విజయవాడకు పది టోల్గేట్లు పెడతారు. టోల్గేట్ చార్జీల భారం అంతా బస్సు ప్రయాణికుల మీద పడుతుంది. ఈ టోల్ చార్జీలన్నీ ఎవడి కోసం కట్టాలి? ఎవడో హైవే అవసరమైన వాడి కోసం లక్షలాది సామాన్యులు ఎందుకు నష్టపోవాలి?’‘ఏందబ్బా నువ్వు ఇట్లా అంటావు! రోడ్లు అభివృద్ధికి చిహ్నం’ అని అందరూ అంటుంటే చెండ్రాయుడు అర్ధోక్తిలో అన్నాడు.‘రోడ్లు అభివృద్ధికి చిహ్నమే. ఎంతవరకు? ఊర్ల కోసం, ఊర్లో జనం కోసం రోడ్లు ఉండాలి. అంతేగాని రోడ్ల కోసం ఊర్లు అన్నట్లు మారకూడదు.’ ‘మాకేం అర్థం కాలే!’ చెండ్రాయుడు మళ్లీ అదే అర్ధోక్తిలో. మిగతావాళ్లంతా తమకు రుచించని మాటలు వింటున్నట్లు మొహాలు పెట్టినారు.‘హైవే వల్ల మన ప్రాంత ఖనిజ సంపదంతా రాష్ట్రాలు, దేశాలు దాటిపోతుంది. మన ఖనిజ సంపదతో మనకు పరిశ్రమలొస్తే మనకు మేలు గానీ, తరలిపోతే మనకేం లాభం? ఇట్లాంటివెన్నో నష్టాలు. మన ఊరి రోడ్డునే తీసుకుందాం. రెండేళ్ల కిందట దాకా సింగిల్ రోడ్డు. ప్రొద్దుటూరు నుండి కమలాపురం వరకు బస్సు తిరిగేది. ఈ రూట్లో ఉన్న ఊర్ల వాళ్ల మోటార్ సైకిళ్లు తిరిగేవి. అంతవరకు మనకు అవసరం. నిరుడు డబుల్ రోడ్డు వేసినారు. బస్సుతోపాటు కమలాపురం – ప్రొద్దుటూరు తిరిగే వాహనాల సంఖ్య పెరిగింది. ఏడెనిమిది కిలోమీటర్లు కలిసొస్తుందని కడపకు పోయే వాహనాలన్నీ ఇదే రూట్లో పోతున్నాయి. అది కూడా నష్టం లేదనుకుందాం. డబుల్ రోడ్డు కాగానే మన ఊరి పెన్నలో ఇసుక క్వారీ లీజుకు ఇచ్చినారు. ఆ ఇసుక వల్ల ప్రభుత్వానికి వచ్చేదెంతో గానీ, ఎమ్మెల్యే మాత్రం రేయింబవళ్లు పెద్దపెద్ద టిప్పర్లతో ఇసుక తీసుకుపోతున్నాడు. మన సంపదను ఎవడో దోచుకుపోతున్నాడు. ఏట్లో ఇసుక లేకుండా పోవడంతో భూగర్భజలం అడుగంటింది. నిన్న వేసవిలో నీళ్లు లేక ఎంత అలమటించామో గుర్తులేదా! ఈ టిప్పర్లు వాహనాల వల్ల ఎన్ని యాక్సిడెంట్లు జరిగినాయో తెలుసు కదా! మన ఊరిలోనే ఈ ఏడాదిలో నలుగురు యాక్సిడెంట్లో చనిపోయినారు. పల్లెలకు ఎంత వెడల్పు రోడ్లు అవసరమో అంతే వెడల్పు రోడ్లు వుంటే అభివృద్ధి. అది జనం కోసం. అంతకు మించిన వెడల్పు వేసినారంటే అది జనం కోసం కాదు. ఇంకెవరి కోసమో! ఆ నష్టాలను మాత్రం మనమందరం పంచుకోవాలి. రోడ్డు వల్ల వచ్చే లాభాలను వాళ్లెవరో దండుకుంటారు. హైవే కూడా అంతే’ నేను ఊరి రోడ్డు గురించి చెప్పేసరికి ఒకరిద్దరు ఆలోచనలో పడినట్లున్నారు. రచ్చబండ మీదున్న చాలామందికి నా మాటలు రుచించలేదు. ‘సరేలేవోయ్, మనం వద్దంటే ఆగుతుందా! ఆ పరిహారం పెంపు కోసం ధర్నా చేద్దాం! నువ్వు కూడా ఈరోజు ఊర్లోనే ఉండి రేపు మాతోపాటు రా! నీది యాభైయైదు సెంట్లు రోడ్డుకు పోయింది కదా!’ అన్నాడు జయరామి రెడ్డి రచ్చబండ దిగిపోతూ. నేనూ రచ్చబండ దిగి కల్లాల బయటున్న రోడ్డు మొహం పట్టిన, కడపకు పోయేందుకు. ‘ఏ అభివృద్ధి ఎవరికోసమో తెలుసుకోలేనంత అజ్ఞానంలోకి భ్రమల్లోకి జనాన్ని తోసేస్తున్నారు. ఆ జ్ఞానం ఎవరు కలిగించాలి?’ నాలో ముసురుకుంటున్న ఆలోచనలు.ఇంతలో రచ్చబండ మీద పెద్ద పెద్దగా మాటల అలికిడి వినిపించింది. వెనక్కు తిరిగి చూసిన. రచ్చబండ మీద నుండి అందరూ బిలబిలమంటూ దిగి తగ్గుబజారు దిక్కు పరుగులు తీస్తున్నారు. ఏమైందోననే ఆందోళన నాకు. వెనక్కు వచ్చి, జనంలో పోతున్న రామును కేకేసి పిలిచిన. వచ్చినాడు.నేను అడగక ముందే ‘చేల పంపకాల్లో హైవే పక్కన సగం భూమిని తనకివ్వడానికి ఒప్పుకోలేదని రామిరెడ్డి, కొండారెడ్డి ఏదో గొడవపడినారంట. ఆ గొడవలో రామిరెడ్డి గొడ్డలి తీసుకుని అన్న తలకాయ పగుల కొట్టినాడంట. రా! నువ్వూ!’ అంటూ పరుగు లాంటి నడకతో ముందుకు కదిలినాడు.నాకు విస్మయం కలిగింది. ‘ఎవరి కోసమో జరుగుతున్న అభివృద్ధి. సాధారణ జనాలకు అవసరం లేని, సంబంధం లేని అభివృద్ధి. తను సాగినంత పొడవునా గ్రామాల్లో ఇంకా ఎంతమంది అన్నదమ్ముల్లో చిచ్చు పెట్టిందో ఈ హైవే’ ఆలోచిస్తూ, కొండారెడ్డి ఇంటిదిక్కు వడివడిగా అడుగులేసిన. పడమట పొద్దు మునిగిపోతూ ఆకాశమంతా ఎర్రగావు లేచింది. ‘ఆ నీళ్ల కత ఇప్పుడెందుకు లేవోయ్! ఇప్పుడు నీళ్ల అవసరం లేకుండా అందరూ బుడ్డసెనగ వేయడం మరిగినారు. వానాకాలం పోయేముందు అక్టోబర్ ఆఖర్లో విత్తనం వేస్తే, తర్వాత చలికి అదే పండుతుంది. నీళ్లవసరం ఎవరికీ లేదు గానీ, ఇప్పుడు ఈ హైవే భూముల పరిహారం గురించి చెప్పు’ అన్నాడు. -
గార్ధభ సంరంభం
గాడిదల సంతలు దేశంలో చాలా చోట్ల జరుగుతూ ఉంటాయి గాని, రాజస్థాన్‌లో జైపూర్ సమీపంలోని లునియావాస్ గ్రామంలో జరిగేది మాత్రం ప్రపంచంలోనే అతిపెద్ద గాడిదల సంత. ఏటా దసరా నవరాత్రుల్లో ఇక్కడ గాడిదల సంత జరుగుతుంది. దాదాపు ఐదువందల ఏళ్లుగా కొనసాగుతూ వస్తున్న పురాతనమైన గాడిదల సంతగా ఇది ప్రసిద్ధి పొందింది. ఈ సంత జైపూర్–ఆగ్రా రహదారిపై ఏకంగా 22 కిలోమీటర్ల పొడవున ఉంటుంది. నవరాత్రుల రోజుల్లో ఈ మార్గంలో ప్రయాణించేవారికి ఎటుచూసినా గాడిదలే కనిపిస్తాయి. ఈ సంతకు వివిధ రాష్ట్రాలకు చెందిన వర్తకులు తమ గాడిదలను తీసుకు వస్తారు. చారిత్రక ప్రాశస్త్యం ఉన్న ఈ సంతను పర్యాటక ఆకర్షణగా మార్చేందుకు రాజస్థాన్ పర్యాటక శాఖ ఇటీవలి కాలంలో ప్రయత్నాలు ప్రారంభించింది. దీనివల్ల ఈ సంతకు దేశ విదేశాల పర్యాటకులు కూడా వస్తుండటం విశేషం. మొఘల్ సామ్రాజ్య కాలంలో అప్పటి రాజస్థాన్ పాలకుడు దులేరాజ్ సింగ్ హయాం నుంచి ఇక్కడ గాడిదల సంత జరుగుతూ వస్తోందని చెబుతారు. ఈ సంత జరిగే సమయంలో ‘ఖాలాకానీ’ అని స్థానికులు పిలుచుకునే ‘కాళరాత్రి’ అమ్మవారి పూజ కూడా విశేషంగా జరుపుతారు. కాళరాత్రి అమ్మవారి వాహనం గార్ధభం కనుక ఇక్కడ ఈ ఆచారాన్ని కొనసాగిస్తున్నారు.ఈ సంతలో గాడిదల అమ్మకాలు, కొనుగోళ్లు మాత్రమే కాకుండా, గాడిదల అందాల పోటీలు, గాడిదల పరుగు పందేలు, గాడిదలు లాగే బళ్ల పందేలు కూడా జరుగుతాయి. ఈ సంతలో స్వదేశీ జాతులకు చెందిన కథియవాడీ, మార్వాడీ గాడిదలకు, అఫ్గాన్ గాడిదలకు గిరాకీ ఎక్కువగా ఉంటుంది. విచిత్రంగా ఈ సంతలో గాడిదలకు బాలీవుడ్ హీరో హీరోయిన్ల పేర్లు, రాజకీయ నాయకుల పేర్లు పెట్టి మరీ అమ్ముతుంటారు. గత ఏడాది ప్రియంకా చోప్రా పేరు ఉన్న గాడిదకు ఏడువేల రూపాయల ధర పలికినట్లు ఒక వర్తకుడు చెప్పాడు. ఈ సంతలోని గాడిదల ధరలు మూడువేల రూపాయల నుంచి పదిహేనువేల రూపాయల వరకు ఉంటాయి. అఫ్గాన్ గాడిదలు ఎక్కువ ధర పలుకుతుంటాయి. గాడిదల అందాల పోటీలు, పరుగు పందేలు వంటి వేర్వేరు పోటీల్లో విజేతలుగా నిలిచిన గాడిదల యజమానులకు వేర్వేరు దశల్లో ఐదువందల నుంచి పదివేల రూపాయల వరకు నగదు బహుమతులు కూడా ఉంటాయి. -
నిమి–వసిష్ఠుల పరస్పర శాపాలు
నిమి మహారాజు ఇక్ష్వాకుని పుత్రుడు. మిథిలానగరం రాజధానిగా గల విదేహ రాజ్యానికి మొదటి మహారాజు. గొప్ప ధర్మజ్ఞుడు, పరిపాలకుడిగా ప్రజారంజకుడు, సత్యవాది, దానశీలి, మహాజ్ఞాని. నిమి మహారాజు అనేక యజ్ఞాలు చేశాడు. గౌతమ ఆశ్రమ సమీపంలో పురోహితుల కోసం ప్రత్యేకంగా ‘జయం’ అనే పట్టణాన్ని నిర్మించాడు. యజ్ఞ యాగాదులు నిర్వహించే పురోహితులంతా జయంలో చేరి, నిత్యం యజ్ఞ యాగాదులు చేసుకుంటూ, జపతపాదులతో, నిరంతర వేదాధ్యయనంతో సుఖంగా జీవించసాగారు.ఒకనాడు నిమి మహారాజు అట్టహాసంగా బహుకాలం కొనసాగే మహాయజ్ఞం చేయాలని సంకల్పించాడు. యజ్ఞ నిర్వహణకు తండ్రి ఇక్ష్వాకుడి అనుమతి పొందాడు. మహర్షులతోను, పురోహితులతోను సంప్రదించి, యజ్ఞ సంభారాలన్నింటినీ సమకూర్చుకున్నాడు. వసిష్ఠ, వామదేవ, భృగు, అంగిరస, పులహ, పులస్త్య, ఋచీక, గౌతమాది మహర్షులందరినీ ఆహ్వానించాడు. యజ్ఞకోవిదులైన వేదపండితులను రప్పించాడు. కులగురువు వసిష్ఠుడికి పాదపూజ చేసి, ‘గురూత్తమా! నువ్వు సర్వజ్ఞుడివి. యజ్ఞ సంభారాలన్నింటినీ సమకూర్చుకున్నాను. దయచేసి, నాతో ఈ మహాయజ్ఞం చేయించు. ఇది ఐదువేల ఏళ్ల పాటు సాగాలి. అటువంటి యజ్ఞదీక్షను ఇప్పించి, నాతో యజ్ఞం చేయించు. ఇది దేవీయజ్ఞం. జగజ్జనని ప్రీతి కోసం ఈ యజ్ఞాన్ని తలపెట్టాను. కాదనక ఆధ్వర్యం వహించు’ అని ప్రార్థించాడు.‘నిమి మహారాజా! నీ సంకల్పం ప్రశస్తం. కాని ఇంద్రుడు కూడా ఇదే యజ్ఞాన్ని తలపెట్టి, నన్ను ఆధ్వర్యం వహించమని కోరాడు. ఐదువేల సంవత్సరాల దీక్ష చేపట్టాడు. నేను అంగీకరించి, అతడికి మాట ఇచ్చాను. అందువల్ల ముందు ఇంద్రుడి యజ్ఞం పూర్తి చేయించి, ఆ తర్వాత నీతో యజ్ఞం జరిపిస్తాను. అంతవరకు ఓపిక పట్టు. ఆ పని పూర్తికాగానే క్షణమైనా ఆలస్యం చేయకుండా నీ దగ్గరకు వస్తాను. అయినా, దేవేంద్రుడి పనికి అగ్రస్థానం ఇవ్వాలి కదా!’ అని బదులిచ్చాడు వసిష్ఠుడు.‘గురుదేవా! నేను యజ్ఞ సంభారాలన్నింటినీ సమకూర్చుకున్నాను, మహర్షులు, ఋత్విక్కులందరినీ ఆహ్వానించాను. వారందరూ వచ్చేశారు. ఇప్పుడు తలపెట్టిన యజ్ఞాన్ని వాయిదా వేసి, ఐదువేల ఏళ్లు ఆగడమంటే ఎలా? నువ్వు మా ఇక్ష్వాకుల కులగురువువు. మా పనిని కాదని, మరొకరి పనికి వెళ్లడం నీకు భావ్యమేనా? బహుశా, ధనాశకు లొంగిపోయినట్లు ఉన్నావు. కాస్త ఆలోచించు’ అని నిష్ఠూరంగా ప్రాధేయపడ్డాడు నిమి.నిమి మాటలకు వసిష్ఠుడు బదులివ్వకుండా, ఇంద్రుడి యజ్ఞం జరిపించడానికి వెళ్లిపోయాడు. వసిష్ఠుడి ప్రవర్తనకు నిమి కలత చెందాడు. ఏది ఏమైనా తలపెట్టిన యజ్ఞం నిర్వహించాలని అనుకున్నాడు. వెంటనే, గౌతమ మహర్షిని యజ్ఞానికి ఆధ్వర్యుడిగా ఉండమని అభ్యర్థించి, ఒప్పించాడు. హిమాలయాల సన్నిధిలో గౌతముడి ఆధ్వర్యంలో దేవీ మహాయజ్ఞాన్ని వైభవోపేతంగా ప్రారంభించాడు. ఋత్విక్కులకు, పురోహితులకు, వేదపండితులకు భూరిదక్షిణలు ఇచ్చాడు. గో భూ సువర్ణదానాలతో వారిని సంతృప్తులను చేశాడు. ఐదువేల ఏళ్ల దీక్ష చేపట్టి, మహాయజ్ఞం చేశాడు. నిమి చేపట్టిన యజ్ఞం పూర్తి కావస్తుండగా, వసిష్ఠుడు దేవేంద్రుడి చేత యజ్ఞాన్ని దిగ్విజయవంతంగా పూర్తి చేయించాడు. వెంటనే ఇంద్రుడి దగ్గర సెలవు తీసుకుని, నిమి వద్దకు బయలుదేరాడు.స్వర్గం నుంచి బయలుదేరిన వసిష్ఠుడు నేరుగా నిమి మహారాజు ప్రాసాదానికి వచ్చాడు. అప్పటికే యజ్ఞం ముగించుకున్న నిమి మహారాజు అలసి సొలసి అంతఃపురంలో నిద్రపోతూ ఉన్నాడు. మహారాజు విశ్రాంతి తీసుకుంటున్నాడని చెప్పి, సేవకులు వసిష్ఠుడిని కూర్చుండబెట్టారు. అయితే, వారెవరూ నిమి మహారాజును నిద్రలేపడానికి సాహసించలేదు.కొన్ని గంటలు కూర్చుని ఎదురుచూసిన వసిష్ఠుడికి ఇదంతా అవమానంగా తోచింది. సహనం నశించింది. అక్కడి నుంచి వెళ్లిపోవడానికి సిద్ధపడి కోపంగా లేచాడు.‘కులగురువునైన నన్ను కాదని, వేరొకరిని గురువుగా స్వీకరించి యజ్ఞం నిర్వహించడమే నాకు అవమానం అనుకుంటే, ఇంటికి వచ్చిన నాకు దర్శనం ఇవ్వకుండా ఇలా అవమానిస్తావా? అహంకారంతో కన్నూ మిన్నూ కానని నీకు తగిన శాస్తి జరగాల్సిందే! శరీరం రాలిపోయి, నువ్వు విదేహుడివి అగుదువు గాక!’ అని శపించాడు. వసిష్ఠుడి శాపం విన్న రాజభటులు భయభ్రాంతులయ్యారు. పరుగు పరుగున వెళ్లి, నిమి మహారాజును నిద్రలేపారు. కోపోద్రిక్తుడై ఉన్న వసిష్ఠుడు శపించిన సంగతి చెప్పారు.నిమి మహారాజు ఒక్క ఉదుటన బయటకు వచ్చాడు. వసిష్ఠుడికి నమస్కరించాడు.‘గురువర్యా! ఇందులో నా దోషం ఆవగింజంత అయినా లేదు. నువ్వు సర్వజ్ఞుడివి. ధర్మజ్ఞుడివి. నీకు నేను చెప్పాలా? ధనలోభంతో ఇంద్రుడు తలపెట్టిన యజ్ఞానికి వెళ్లావు. నేనెంత ప్రార్థించినా కనికరించకుండా, యజమానుడినైన నన్ను వదిలేశావు. ఆహ్వానితులను నిరీక్షణలో ఉంచడం తగని పని కాబట్టి, నేను యజ్ఞం తలపెట్టిన విధంగా పూర్తి చేశాను. ఇటువంటి పని చేసినందుకు సిగ్గుపడవలసినది పోయి తిరిగి నన్ను శపిస్తావా? వేదవేదాంగవేత్తవు, బ్రాహ్మణోత్తముడవు అయిన నువ్వు నిరపరాధిని దండించరాదనే సూక్ష్మ బ్రాహ్మణధర్మాన్ని మరచి, నీ తప్పును కప్పిపుచ్చుకోవడానికి నన్ను శపిస్తున్నావు. ఎదురుదాడి చేస్తున్నావు. నిష్కారణ క్రోధం ఎవరికీ పనికిరాదు. నీవంటి జ్ఞానులకు అసలు పనికిరాదు. విప్రుడివై ఉండి, నిరపరాధిని అయిన నన్ను శపించావంటే, నువ్వు కూడా ప్రతిశాపానికి అర్హుడివే! నేను నీకు ప్రతిశాపం ఇవ్వడంలో ఎలాంటి దోషమూ ఉండదు. అందువల్ల నేను కూడా శపిస్తున్నాను. క్రోధంతో రగిలిపోతున్న నీ శరీరం రాలిపోవుగాక! నువ్వు కూడా దేహరహితుడవు అగుదువు గాక!’ అని శపించాడు.పరస్పర శాపాల వల్ల నిమి మహారాజు, వసిష్ఠుడు ఇద్దరూ విదేహులయ్యారు.∙సాంఖ్యాయన -
మిస్టరీ.. రసెల్ ఎవాన్స్
అర్ధరాత్రి పన్నెండున్నర దాటేసరికి జాన్ ఎవాన్స్ ఇంట్లో ల్యాండ్ ఫోన్ మోగింది. లిఫ్ట్ చేసి హలో అనగానే, ‘డాడ్! ఫ్రెండ్ ఇంట్లో ఉన్నా, బయలుదేరుతున్నా. కాసేపట్లో ఇంటికి వచ్చేస్తా’ అన్నాడు రసెల్. ‘సరే నాన్నా జాగ్రత్త!’ అని ఫోన్ పెట్టేశాడు జాన్. గంట దాటేసరికి, మళ్లీ ఫోన్ మోగింది. ఈసారి కాల్ చేసింది సేక్రడ్ హాస్పిటల్ రిసెప్షనిస్ట్. తమ ఆసుపత్రి వివరాలన్నీ చెప్పి, ‘మీ అబ్బాయి రసెల్ పరిస్థితి సీరియస్‌గా ఉంది. త్వరగా రండి’ అంది. జాన్ కి కాళ్ల కింద భూమి కదిలినట్లు అనిపించింది. ‘ఏమంటున్నావ్?’ అని గట్టిగా అరిచాడు. వెంటనే రిసెప్షనిస్ట్ చేతిలోంచి ఫోన్ అందుకున్న రసెల్ స్నేహితురాలు శాండీ.. ‘అంకుల్! మన రసెల్ కోమాలోకెళ్లాడంటున్నారు త్వరగా రా అంకుల్’ అంటూ ఏడ్చేసింది. దాంతో జాన్ వెంటనే భార్య స్యూ ఎవాన్స్ని తీసుకుని ఆ ఆసుపత్రికి పరుగు తీశాడు.ఆసుపత్రిలో ఓ పక్క పోలీసుల ఫార్మాలిటీస్, మరో పక్క ఆసుపత్రి సిబ్బంది పరుగులు జాన్ దంపతుల్ని వణికించేశాయి. ఏం జరిగిందో చెప్పడానికి రసెల్ స్పృహలో లేడు. ఏమైందో తెలుసుకోవడానికి గుండెధైర్యం చాలట్లేదు. అయినా ఏడుస్తూనే పోలీసుల్ని ఆరా తీస్తే, హిట్ అండ్ రసెల్ కేసన్నారు. శాండీ మాత్రం అందుకు విరుద్ధంగా చెప్పింది. ‘అంకుల్! నేను ఇందాకే వ¯Œ అయ్యేసరికి పార్ట్‌టైమ్ జాబ్ ముగించుకుని నడుస్తూ ఇంటికొస్తుంటే, మన అపార్ట్మెంట్కి సమీపంలో రోడ్డు మీద రసెల్ కదల్లేని స్థితిలో పడున్నాడు. ‘బ్రియాన్! బ్రియాన్!’ అని గట్టిగా అరుస్తున్నాడు. దగ్గరకెళ్లి చూస్తే ఒళ్లంతా రక్తం, భయమేసి అంబులెన్స్ కి కాల్ చేసి, ఆసుపత్రికి తీసుకొచ్చాం. రాగానే కోమాలోకి వెళ్లిపోయాడు. కానీ నేను రసెల్‌ని గుర్తించిన సమయంలో అక్కడ పొదల్లో ఎవరో ఉన్నట్లనిపించింది. ఎవరా? అని నేను వంగి చూసేసరికి, తెల్ల చొక్కా వేసుకున్న ఒక అబ్బాయి మన అపార్ట్మెంట్స్ వెనకున్న కొండలవైపు పారిపోయాడు. కానీ మన రసెల్‌కి బ్రియాన్ అనే స్నేహితుడున్నాడు కదా. తను అప్పటిదాకా రసెల్తోనే ఉన్నాడేమోనని నా అనుమానం. ఇదంతా పోలీసులకు చెప్పినా, హిట్ అండ్ రసెల్ అనే రాసుకున్నారు’ చెప్పింది శాండీ.జాన్ కుటుంబానికి శాండీ కుటుంబం ఫ్యామిలీ ఫ్రెండ్సే. అంతా ఒకే బ్లాక్‌లో ఉండేవారు. రసెల్, శాండీలు మంచి స్నేహితులు. ఎనిమిదో తరగతి చదువుతున్న రసెల్‌కి 13 ఏళ్లు. శాండీ అతడికంటే రెండేళ్లు పెద్దది. రసెల్‌కి డయానా అనే ఐదేళ్ల చెల్లెలు కూడా ఉంది. చదువులో ముందుండే రసెల్ బెస్ట్ బాస్కెట్‌బాల్ ప్లేయర్‌గా పేరు తెచ్చుకున్నాడు. టీన్స్‌లోకి వచ్చేసరికి స్నేహితులు పెరగడంతో ఇంట్లో కంటే బయటే ఎక్కువ గడిపేవాడు. గతంలో స్యూ ఎవాన్స్ నర్స్‌గా, జాన్ కార్డియో పల్మనరీ టెక్నాలజిస్ట్‌గా పనిచేయడంతో వైద్యరంగంపై వారికి బాగానే అనుభవముంది. శాండీ మాటలు విన్న వెంటనే, తమ గత అనుభవాన్ని ఆ ఆసుపత్రి వైద్యులకు వివరించి, రసెల్ పరిస్థితిని గమనించడానికి చికిత్స జరుగుతున్న గదికెళ్లారు. రసెల్‌ని ఒక పెద్ద వాహనం ఢీ కొట్టినమాట నిజమే కాని, దానికంటే ముందు అతన్ని ఎవరో బ్యాట్‌లాంటి బలమైన వస్తువుతో కొట్టినట్లు అతడి ఒంటిపై ఆనవాళ్లున్నాయి. అదే విషయం పోలీసులకు చెప్పి వాపోయారు. అయినా అధికారుల్లో చలనం లేదు. దురదృష్టవశాత్తు ఉదయం తొమ్మిదయ్యేసరికి రసెల్ చనిపోయాడు. కొడుకు మరణంతో అల్లాడిపోతున్న ఆ దంపతులకు అప్పుడే ఆ ఆసుపత్రి రిసెప్షనిస్ట్ మరో క్లూ ఇచ్చింది. రసెల్ ఆసుపత్రిలో జాయిన్ అయిన ఒక గంటకే బ్రియాన్ అనే వ్యక్తి కాల్ చేసి, రసెల్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశాడని చెప్పింది. వెంటనే రసెల్ స్నేహితుడు బ్రియాన్‌ని పిలిపించాడు జాన్. మొదటి నుంచి ‘నాకేం తెలియదు’ అన్నట్లే మాట్లాడాడు బ్రియాన్. జాన్ అడిగిన చాలా ప్రశ్నలకు సమాధానాలిస్తూ, రసెల్‌పై దాడి జరిగిన రాత్రి వైట్ కలర్ షర్ట్ వేసుకున్నానని అసంకల్పితంగా చెప్పేశాడు. అదే విషయాన్ని జాన్ పోలీసులకు చెప్పాడంతో బ్రియాన్‌ని అదుపులోకి తీసుకుని నిలదీశారు. అయితే బ్రియాన్ తనకసలు వైట్ షర్టే లేదని మాట మార్చేశాడు. దాంతో రసెల్ కుటుంబం ఈ విషాదంలో ప్రత్యక్ష సాక్షి బ్రియాన్ అని నమ్మడం మొదలుపెట్టింది.ఈలోపు పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్ వచ్చింది. దానిలో రసెల్‌ని ఏదో వాహనం గుద్దేయడంతోనే మరణం సంభవించిందని అందులో ఉంది. ఇంతలో రసెల్ చనిపోయాడని తెలియగానే, ఆరోన్ అనే స్నేహితుడు ముందుకొచ్చాడు. ‘ఆ రాత్రి తొమ్మిది అయ్యేసరికి మేమిద్దరం దగ్గర్లోని పార్క్‌కి వెళ్లాం. అక్కడ నాకు గతంలో నా గర్ల్‌ఫ్రెండ్‌ని ఏడిపించిన ఒక అబ్బాయి కనిపించాడు. వాడికి వార్నింగ్ ఇచ్చేక్రమంలో నా పక్కనే ఉన్న రసెల్ వాడ్ని కొట్టాడు. అయితే ఆ అబ్బాయి కోపంగా తన వాళ్లని తీసుకొస్తానని పరుగెత్తాడు. పార్క్‌లో మా గొడవ చూసిన కొందరు పెద్దవాళ్లు ‘ఆ అబ్బాయి బ్యాక్‌గ్రౌండ్ మాకు తెలుసు. వాళ్లతో గొడవ మంచిది కాదు, ఇక్కడి నుంచి త్వరగా వెళ్లిపోండి’ అని సలహా ఇచ్చారు. దాంతో మేము అక్కడి నుంచి వచ్చేశాం. రసెల్ తన బాస్కెట్‌బాల్ ఫ్రెండ్ ఇంటికి వెళ్తాననడంతో నేను మా ఇంటికి వెళ్లిపోయా. బహుశా ఆ పార్క్‌లో అబ్బాయిగానీ రసెల్‌పై పగ తీర్చుకున్నాడేమో?’ అని తన మనసులో అనుమానాన్ని పోలీసుల ముందు బయటపెట్టాడు.దాంతో దేశంలోనే ప్రముఖ డాక్టర్ విలియం ఎకెర్ట్ని నియమించి, మరణానికి అసలు కారణం తేల్చమన్నారు జాన్ దంపతులు. విలియం మళ్లీ శవపరీక్ష చేసి, యాక్సిడెంట్‌కి ముందే రసెల్‌పై తీవ్రమైన దాడి జరిగిందని, అంటే ఎవరో కావాలనే ఆ యాక్సిడెంట్ చేశారని క్లారిటీ ఇచ్చాడు. రెసెల్ పడి ఉన్న ప్రదేశానికి 86 అడుగుల ముందే అతని షూస్, సాక్స్ రక్తం మరకలతో దొరికాయి. బహుశా మనిషిని కింద పడేసి, బండితో ఈడ్చి పారేసి ఉంటారని విలియం అంచనా వేశాడు.1996 జూన్ 3న అర్ధరాత్రి ఒంటిగంటకు వాషింగ్టన్, స్పోకాన్లో ర సెల్ అపార్ట్మెంట్కి చేరువలో రోడ్డుపై.. చావు బతుకుల మధ్య శాండీ అనే స్నేహితురాలికి కనిపించాడు. సుమారు 8 గంటలు కోమాలో ఉన్న రసెల్, జూన్ 4న ఉదయం 9 గంటలకు చనిపోయాడు.ఆ రాత్రి పార్క్‌లో గొడవపడిన కుర్రాడితో పాటు అతడి గ్యాంగ్‌ని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. కానీ నిజాలు బయటికి రాలేదు. కొడుకు చనిపోయాడన్న బెంగతోనే జాన్ 1998లో మరణించాడు. మరో పదమూడేళ్ల న్యాయపోరాటం తర్వాత రసెల్ తల్లి స్యూ చనిపోయింది. ఇప్పటికీ అతని సోదరి డయానా తన అన్నను చంపిందెవరో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంది. ఏది ఏమైనా, కొన ఊపిరితో ఉన్న రసెల్ తన స్నేహితుడు బ్రియాన్ పేరెందుకు పిలిచాడు? ఆసుపత్రికి కాల్ చేసింది ఎవరు? నిజంగానే పార్క్‌లో కుర్రాడికి, అతని గ్యాంగ్‌కి ఆ రాత్రి రసెల్ ఒంటరిగా దొరికేశాడా? ఇలా ఎన్నో ప్రశ్నలు నేటికీ మిస్టరీనే!∙సంహిత నిమ్మన -
పుష్కర కాలానికి పూచే నీలకురంజి పుష్పం..!
భారతదేశంలో కనిపించే అరుదైన పుష్పం ఈ నీలకురంజి పుష్పం. ఇది పన్నెండేళ్లకు ఒకసారి మాత్రమే పూస్తుంది. సముద్రమట్టానికి 1300–2400 మీటర్ల ఎత్తులో ఉండే కొండ ప్రాంతాల్లో నీలకురంజి మొక్కలు పెరుగుతాయి. ఈ మొక్కలు సాధారణంగా 30–60 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతాయి. అరుదుగా 180 మీటర్లకు మించి కూడా ఎదుగుతాయి. కేరళ, కర్ణాటక, తమిళనాడుల్లోని పడమటి కనుమల ప్రాంతంలో నీలగిరి కొండలు, అన్నామలై కొండలు, పళని కొండలు, బాబా బుడాన్‌గిరి కొండలపై ఈ పూలు కనిపిస్తాయి. ఈ పూలు పూసినప్పుడు కొండలన్నీ నీలాల రాశుల్లా కనిపిస్తాయి. పన్నెండేళ్లకు ఒకసారి పూసే ఈ పూలను తిలకించడానికి పర్యాటకులు తండోపతండాలుగా ఈ కొండ ప్రాంతాలకు చేరుకుంటారు. (చదవండి: బొమ్మలు చెప్పే చరిత్ర..) -
సోషల్ మీడియాతో తప్పని తిప్పలు
దేశంలోని ప్రతి టీనేజర్ రాత్రి నిద్రకు ముందు, ఉదయం నిద్ర లేవగానే చూసేది సోషల్ మీడియానే అంటే అతిశయోక్తి కాదేమో! ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్, స్నాప్ చాట్, షేర్ చాట్, డిస్కార్డ్, వాట్సప్, టెలిగ్రామ్.. ఒకటా రెండా, అనేకానేక సోషల్ మీడియా యాప్‌లు యువత జీవితాలను చుట్టేస్తున్నాయి. సోషల్ మీడియా లేకుండా బతకడం లేదా దాన్ని తప్పించుకోవడం దాదాపు అసాధ్యంగా మారింది. అయితే సోషల్ మీడియా కేవలం కమ్యూనికేషన్ సాధనంగా కాకుండా, టీనేజర్లు తమను తాము ఎలా చూసుకుంటున్నారనేదాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. వారి బాడీ ఇమేజ్, సోషల్ లైఫ్, మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తోంది. మానసిక ఆరోగ్య సమస్యలుసోషల్ మీడియా విపరీత వినియోగానికీ ఆందోళన, డిప్రెషన్, ఒంటరితనం వంటి సమస్యలకూ మధ్య సంబంధం ఉందని అధ్యయనాలు చూపిస్తున్నాయి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి ప్లాట్‌ఫామ్స్‌లో చూపించే లైఫ్‌స్టయిల్, ఐడియలైజ్డ్ ఇమేజ్‌లు టీనేజర్లలో అసంతృప్తికి, ఆత్మవిశ్వాసలోపానికి దారితీస్తాయి. ఇన్ఫ్లుయెన్సర్లు సృష్టించే స్టాండర్డ్లు అందుకోలేక తామెందుకూ పనికిరామనే భావనకు లోనవుతారు. సోషల్ మీడియాను ఎక్కువగా వాడే వారిలో తమ ఫ్రెండ్స్ గురించి అప్డేటెడ్గా ఉండాలన్న ఒత్తిడి ఉంటుంది. ఫ్రెండ్స్ పోస్టులు ఎప్పటికప్పుడు చూడకపోతే ఆందోళన, ఒత్తిడి పెరుగుతుంది. అంతులేని సోషల్ మీడియా ఫీడ్స్ చూసి, లైకులు, కామెంట్స్ కోసం ఎదురుచూడటం వారి ఆత్మవిశ్వాసం మీద ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. వీటితోపాటు ‘ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్’ అనే సమస్య కూడా టీనేజర్ల మానసిక ఆరోగ్యం మీద ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. బాడీ ఇమేజ్‌పై దుష్ప్రభావం..సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ అందం, విజయానికి సంబంధించిన ఐడియలైజ్డ్ వర్షన్లను చూపడం వల్ల టీనేజర్లలో తమ శరీరం పట్ల ప్రతికూల ప్రభావం పడుతోంది. నాజూకుగా ఉండే ఫొటోలను పదేపదే చూడటం వల్ల కాస్తంత బొద్దుగా ఉన్న తాను బాలేనని అసంతృప్తికి లోనవుతున్నారని అధ్యయనాలు వెల్లడించాయి. ‘ఫిట్‌స్పిరేషన్’,‘థిన్సిపిరేషన్’ వంటి కంటెంట్ల వల్ల టీనేజర్లు తక్కువ బరువు, ప్రత్యేకమైన శరీరాకృతికై తహతహలాడుతుంటారు. జీరోసైజ్ చేరుకోవాలని లేదా సిక్స్ ప్యాక్ సాధించాలని ప్రయత్నిస్తుంటారు. ఇది అనారోగ్యకరమైన ఆహార అలవాట్లను ప్రేరేపిస్తుంది.సామాజిక సంబంధాలకు దూరంగా.. సామాజిక సంబంధాలను ఎలా ఏర్పరచుకోవాలో, ఎలా నిర్వహించాలో సోషల్ మీడియా పూర్తిగా మార్చేస్తుంది. ఒకవైపు, తమలాంటి అభిరుచులున్న వ్యక్తులను కలుసుకునేందుకు, అభిప్రాయాలను పంచుకునేందుకు అవకాశం కల్పిస్తుంది. మరోవైపు, వ్యక్తిగత సంబంధాలను ఏర్పరచుకోవడానికి అంతరాయం కలిగిస్తుంది. డిజిటల్ కమ్యూనికేషన్, సోషల్ మీడియాలపై విపరీతంగా ఆధారపడటం వల్ల అవసరమైన సామాజిక నైపుణ్యాలను అభివృద్ధి చేయడంలో ఇబ్బందులు తలెత్తుతాయి. ఆన్లైన్లో చురుగ్గా ఉండే టీనేజర్లు కూడా వ్యక్తిగత సంబంధాలు ఏర్పరచుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు. కొత్తవారితో కలవాలంటే ఆందోళన చెందుతున్నారు. దీనికి తోడు సైబర్ బుల్లీయింగ్, ట్రోలింగ్ వల్ల అనేకమంది మానసిక సమస్యల పాలవుతున్నారు. మరోవైపు నిజమైన స్నేహానికి, ఆన్లైన్ కనెక్షన్ల సంఖ్యకు తేడా గుర్తించలేకపోతున్నారు. ఎంత ఎక్కువమంది ఆన్లైన్ స్నేహితులు లేదా ఫాలోయర్లు ఉంటే అంత గొప్పగా ఫీలవుతున్నారు. కానీ జీవితంలో కష్టాలు ఎదురైనప్పుడు వారెవ్వరూ తోడురాక ఒంటరితనానికి లోనవుతున్నారు. వీటన్నింటి నుంచీ తప్పించుకోవాలంటే సోషల్ మీడియాను పరిమితంగా వాడటం నేర్చుకోవాలి.మరేం చెయ్యాలి?👉 స్క్రీన్ సమయాన్ని పరిమితం చేయండి. విరామాలు తీసుకోండి ∙కుటుంబ సభ్యులు, స్నేహితులతో మాట్లాడండి 👉 రోజుకు కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయండి ∙సమతుల ఆహారం తీసుకోండి, సరిపడినంత నీటిని తాగండి ∙స్పష్టమైన లక్ష్యాలను సెట్ చేసుకోండి. దాన్ని చిన్నచిన్న భాగాలుగా విభజించుకోండి 👉మీ ఆలోచనలు, భావాలు, అనుభవాలు రోజూ రాయండి. అలాగే ప్రతిరోజూ మీరు కృతజ్ఞత తెలపాల్సిన మూడు విషయాలను రాసుకోండి 👉ఏ తీర్పులూ లేకుండా ఈ క్షణంపై దృష్టి పెట్టండి. ప్రతిరోజూ మైండ్‌ఫుల్‌నెస్, మెడిటేషన్ ప్రాక్టీస్ చేయండి 👉మీ గురించిన నెగటివ్ ఆలోచనలను సవాలు చేయండి. మీ పట్ల మీరు క్షమతో ఉండండి 👉మీ హాబీలపై సమయాన్ని పెంచండి. మీరు ఆస్వాదించే కార్యక్రమాల్లో పాల్గొనండి ∙ఇవన్నీ చేసినా మీరు ఒత్తిడికి లోనవుతుంటే ప్రొఫెషనల్ సహాయం తీసుకోవడానికి సందేహించకండి. -
బెట్టీ ద ఫ్యాషన్ క్వీన్
శ్వేతా శర్మది సాధారణ మధ్యతరగతి కుటుంబ నేపథ్యం. విజయగాథలు వింటూ పెరిగింది. అవన్నీ ఆమెలో ఏదో సాధించాలనే తపనను రగిలించాయి. వివిధ రంగాల పట్ల ఆసక్తిని కలిగించాయి. వాటిల్లో ఒకటే ఫ్యాషన్ డిజైనింగ్. ముంబైలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ నుంచి ఫ్యాషన్ కమ్యూనికేషన్లో బ్యాచిలర్స్ డిగ్రీ చేసింది. ‘బెట్టీ ఆఫ్ ఎల్’ పోటీలో గెలిచి, ‘ఎల్ ఇండియా’లో ఇంటర్న్‌గా చేరింది. అప్పుడే తన పేరును శ్వేతా బెట్టీగా మార్చుకుంది. ఆ సమయంలోనే ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ల దగ్గర పనిచేసే చాన్స్‌ను అందుకుంది. స్టయిలింగ్‌పై పట్టు సాధించింది. తర్వాత టీఎల్సీ చానల్లో ఫ్యాషన్ ఎడిటర్‌గా చేరింది. కాస్ట్యూమ్ డిజైనర్‌గానూ చేసింది. ఆ వర్కే ఆమెకు బాలీవుడ్లో ఎంట్రన్స్ కల్పించింది. అమితాబ్ బచ్చన్, ఫర్హాన్ అఖ్తర్లాంటి ఉద్దండులు నటించిన ‘వజీర్’ సినిమాకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా అవకాశం ఇస్తూ! ఆ తర్వాత ఆమె వెనక్కి మళ్లే అవసరమే రాలేదు. ఆమె ఈస్తటిక్ సెన్స్‌కి ముచ్చటపడిన రాధికా ఆప్టే.. తనకు స్టయిలింగ్ చేయమని కోరింది. యెస్ చెప్పింది శ్వేతా. మూవీ ఈవెంట్స్‌లో రాధికా స్టయిల్, గ్రేస్ చూసిన బాలీవుడ్ దివాస్ అంతా శ్వేతా స్టయిలింగ్కి క్యూ కట్టారు. సోనమ్ కపూర్, రియా కపూర్, అదితీ రావ్ హైదరీ, ట్వింకిల్ ఖన్నా, లీసా రే, కృతి సనన్, కియారా ఆడ్వాణీ, జాక్వెలిన్ ఫెర్నాండేజ్, కరిశ్మా కపూర్, యామీ గౌతమ్, సోనాక్షీ సిన్హా.. ఆ వరుసలోని వాళ్లే! నటీమణులే కాదు ఇంటర్నేషనల్ మోడల్స్ కూడా ఆమె స్టయిలింగ్కి ఫ్యాన్స్ అయిపోయారు. తమ స్టయిలిస్ట్‌గా ఆమెను అపాయింట్ చేసుకున్నారు. అలా తన ఫ్యాషన్ సెన్స్‌తో సెలబ్రిటీలకు మెరుగులు దిద్దుతూనే సెంట్రల్ సెయింట్ మార్టిన్స్ (యూనివర్సిటీ ఆఫ్ ది ఆర్ట్స్ లండన్) కాలేజ్‌లో కాంటెంపరరీ ఫైన్ ఆర్ట్స్‌లో కోర్స్ చేసింది. ఫొటోగ్రఫీ నేర్చుకుని, మహిళా క్రికెటర్స్‌తో ఫొటో సిరీస్ కూడా చేసింది. ఫ్యాషన్ కంటెంట్‌తో శ్వేతా.. బ్లాగ్నూ నిర్వహిస్తోంది. ఆమె ఇన్‌స్టా హ్యాండిల్కూ క్రేజీ ఫాలోయింగ్ ఉంది. అలాగే స్టయిలింగ్ అనేది నా దృష్టిలో మన పర్సనాలిటీని వ్యక్తపరచే ఒక మీడియం లాంటిది. వార్డ్రోబ్ మన స్వభావాన్ని రిఫ్లెక్ట్ చేసే అద్దం లాంటిదని అంటోంది శ్వేతా.– శ్వేతా బెట్టీ. (చదవండి: లాక్మే ఫ్యాషన్ వీక్ ర్యాంప్: ‘తగ్గేదెలే’ అంటున్న స్పెషల్ బ్యూటీ) -
ఊరి దారిలో టూరిజం
చారిత్రక నేపథ్యం తెలుసుకోవాలనుకున్నా, ఇంజినీరింగ్ అద్భుతాలను చూడాలనుకున్నా ఈఫిల్ టవర్కో, లండన్ బ్రిడ్జ్కో ప్లాన్ చేసుకోవచ్చు! లేదంటే బుర్జ్ ఖలీఫానో, సిడ్నీ ఒపేరా హౌస్నో సందర్శించొచ్చు! స్టాచ్యూ ఆఫ్ లిబర్టీనీ చుట్టి రావచ్చు, డిస్నీల్యాండ్‌తో అబ్బురపడొచ్చు!దూరభారం అనుకునేవాళ్లు తాజ్‌మహల్, ఎర్రకోటతో సరిపెట్టుకోచ్చు! కాని, చల్లటి గాలిలో, పచ్చటి నేలమీద సేద తీరాలనుకుంటే, ట్రెడిషనల్ లైఫ్ స్టయిల్ని పరిచయం చేసుకోవాలనుకుంటే, పలు యాసలను వినాలనుకుంటే, స్థానిక రుచులను ఆస్వాదించాలనుకుంటే మాత్రం పల్లెలే ద బెస్ట్ హాలీడే స్పాట్స్! ఇప్పుడు చిన్నా పెద్దా అందరి వీకెండ్స్‌ను, సెలవులను అవే ఆక్యుపై చేస్తున్నాయి! వీళ్లకు తమ ఇళ్లల్లో ఆతిథ్యం ఇచ్చేందుకు స్థానికులూ ఉత్సాహపడుతున్నారు. పరాయి ఊళ్లో సొంతింటి భావనను కలిగిస్తున్నారు!ఆ జర్నీనే రూరల్ టూరిజం. ఆ హాస్పిటాలిటీయే హోమ్ స్టేస్! ఆ ట్రెండ్ మీదే ఈ కథనం!సెలవుల్లో ఇదివరకైతే అమ్మమ్మ వాళ్లూరో, నానమ్మ వాళ్లూరో వెళ్లేవాళ్లు. చెట్లు– పుట్టలు, చేనులు– చెలకలు, చెరువులు– బావులు, కొండలు– గుట్టలు తిరగడం వల్ల ఆ ఊరి భౌగోళిక స్థితిగతులు, ఆర్థిక వనరుల మీద తెలియకుండానే ఒక అవగాహన ఏర్పడేది. అలాగే అక్కడి సంస్కృతీ సంప్రదాయాలూ తెలిసేవి. అక్కడి పిల్లలతో ఆటలు, ఈతలు, సరదాలు, కబుర్లు, కాలక్షేపాలతో రెండు ప్రాంతాల మధ్య ఉన్న వ్యత్యాసాలు, ప్రత్యేకతలు, వైవి«ధ్యాలు అర్థమయ్యేవి. తెలివిడి వచ్చేది. నగరీకరణ పెరగడం, చదువుల ఒత్తిడి, మొదటి తరానికి, మూడో తరానికి కనెక్టివిటీ తగ్గడం వల్ల గ్రామీణ భారతం కథల్లో, సినిమాల్లో వినిపించే, కనిపించే ఫిక్షన్‌గా మారిపోయింది. పిల్లల దగ్గర్నుంచి పెద్దల వరకు రోబోటిక్ లైఫ్ స్టయిలే లా ఆఫ్ లైఫ్‌గా మారిపోయింది. ఫీడ్ చేసిన ప్రోగ్రామింగ్లా వారంలో అయిదు రోజులు ఆఫీస్ పనితో కుస్తీ, వీకెండ్ షాపింగ్ మాల్స్‌లో వ్యాహ్యాళి. ఏడాదికి ఒకసారో, రెండుసార్లో లాంగ్ డెస్టినేషన్ టూర్స్ తప్ప ఆ షరా మామూలులో మార్పు లేదు. కోవిడ్ పుణ్యమా అని సూర్యోదయాలు, సూర్యాస్తమయాలతో ఇంట్రడక్షన్ లేని, ట్రాఫిక్, టార్గెట్స్, ప్రాజెక్ట్స్‌తోనే డీప్ రిలేషన్షిప్లో పడిపోయిన నగర జనాభాలో కోవిడ్ ఒక రియలైజేషన్‌ను తెచ్చింది. పని, పొల్యూషనే కాదు ప్రకృతి, పల్లెలతో ఇంటరాక్షన్ చాలా అవసరమని, ఆ సమయం ఆసన్నమైందని! అందుకే కోవిడ్ ఇంట్రడ్యూస్ చేసిన (అంతకుముందు అరుదుగా ఉండే) వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్‌ను చక్కగా ఉపయోగించుకున్నారు. లాప్టాప్, బ్యాక్‌ప్యాక్‌తో పల్లెలకు చేరుకున్నారు. పచ్చని ఆవరణం, స్వచ్ఛమైన గాలితో సేదతీరారు. పని ఒత్తిడిని తగ్గించుకున్నారు. కొత్త ఉత్సాహాన్ని నింపు కున్నారు. ‘బియ్యం ఏ చెట్టుకు కాస్తాయి? పప్పులు ఏ డబ్బాలో మాగుతాయి? పిండి ఏ మొక్క నుంచి రాలుతుంది? కూరగాయలను ఏ మార్కెట్లో తయారు చేస్తారు?’ లాంటి ప్రశ్నలు వేసే పిల్లలకూ పల్లెలతో ప్రత్యేక పరిచయం అవసరమని గుర్తించారు. కోవిడ్ తగ్గుముఖం పట్టాక పల్లె సందర్శనను జీవనశైలిలో భాగం చేసుకున్నారు. వీకెండ్స్ నుంచి వెకేషన్స్ దాకా ప్రతి సందర్భాన్నీ రూరల్ టూర్‌కే రిజర్వ్ చేసుకోవడం మొదలుపెట్టారు. సకుటుంబ సమేతంగా! క్యాంప్‌లు వేసుకునేవాళ్లు, ట్రెకింగ్ని ఇష్టపడేవాళ్లు, పిల్లలకు పల్లె జీవితాన్ని చూపించాలనుకునే వాళ్లు, సాగు నేర్చుకోవాలనుకునే వాళ్లు, పని ఒత్తిడి నుంచి రిలాక్సేషన్‌ను కోరుకునేవాళ్లు, నిరాడంబర జీవనశైలిని అనుసరిస్తున్నవాళ్లు, గిరిజన సంస్కృతిని తెలుసుకోవాలనుకునేవాళ్లు, ప్రకృతిని ఆరాధించేవాళ్లు.. ఎట్సెట్రా ఎట్సెట్రా అభిరుచికి తగినట్టుగా గ్రామీణ పర్యటనకు సంబంధించి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో ట్రావెల్ గ్రూప్స్‌ని ఏర్పాటు చేసుకున్నారు. ఇలా మొత్తంగా రూరల్ టూరిజాన్ని ఓ ఒరవడిగా మార్చారు. వాళ్లందరికీ తెలుగు రాష్ట్రాల్లోని గ్రామాలు, ఏజెన్సీ ఏరియాలు, వనాలు, నదీ, సముద్ర తీరప్రాంతాలు ఆతిథ్యమిస్తున్నాయి.ముందుగా ఉత్తరాంధ్రకు వెళితే.. శ్రీకాకుళం జిల్లాలో జీడి మామిడి, కొబ్బరి తోటలకు ఆలవాలమైన ఉద్దానం, సైబీరియా వలస పక్షుల విడిది కేంద్రాలు తేలుకుంచి, తేలినీలాపురాలను చూసేందుకు ఎక్కడెక్కడి నుంచో పర్యాటకులు తరలివస్తుంటారు. పాఠశాల విద్యార్థులు కూడా స్టడీ టూర్ పేరిట ఈ ప్రాంతాల్ని సందర్శిస్తుంటారు. తేలినీలాపురంలో సైబీరియ¯Œ పక్షులకు సంబంధించిన మ్యూజియం కూడా ఉంది. వారాంతాల్లో ఈ కేంద్రాలు టూరిస్ట్‌లతో బిజీగా ఉంటాయి. మన్యం పార్వతీపురం జిల్లా పరిధిలోని పాలకొండ ఏజెన్సీలో జలపాతాలకు, హిల్ వ్యూ పాయింట్లకు కొదువ లేదు. ఇది అరుదైన జంతుజాతులకూ నెలవు. దీనికి పరిశోధకుల తాకిడీ అధికమే!ఆంధ్రా ఊటీ అందాల అరకు..పచ్చటి లోయలు, అబ్బురపరచే గుహలు, అలరించే థింసా నృత్యాలు, వెదురు బొంగులో చికె¯Œ ఘుమఘుమలు, మైమరపించే కాఫీ కమ్మదనం, మేఘాలను ముద్దాడే పర్వతాలతో పర్యాటకులను కట్టిపడేసే అద్భుతమైన ప్రదేశం. కోవిడ్‌లో కూడా బాగా కట్టడి చేస్తే తప్ప సందర్శకుల తాకిడి ఆగని ప్రాంతం. అరకు వచ్చే వారికి ఆతిథ్యం ఇచ్చేందుకు స్థానిక గిరిజనులు రిసార్ట్స్ మాదిరి అతిథి గృహాలనూ అందుబాటులోకి తీసుకొచ్చారు. మంచు ముసుగేసుకునే లంబసింగి, పాడేరు కూడా సందర్శకులకు స్వాగతం పలుకుతున్నాయి. ఇక్కడికి అక్టోబర్ చివరివారంలో ఒడిశా, పశ్చిమ బెంగాల్ నుంచి అధికసంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. కోస్తాకు వస్తే.. ఆంధ్రా కేరళగా పిలుచుకునే కోనసీమ రూరల్ టూరిజానికి అసలు సిసలైన కేంద్రం. ప్రకృతి అందాలు, పసందైన రుచులకు ఈ ప్రాంతాన్ని మించింది లేదు. సువిశాల గోదావరి, అది సముద్రంలో కలిసే అంతర్వేది, ఓడల రేవు, మడ అడవుల కోరంగి, ఫ్రెంచ్ కల్చర్‌తో ఆసక్తి రేకెత్తించే యానాం, పట్టునేత ఉప్పాడ, పూల వనాల కడియం, ప్రకృతి సోయగాల పాపికొండలు, ధవళేశ్వరం, మన్యప్రాంతాల రంపచోడవరం, మోతుగూడెం, మారేడుమిల్లి, సూర్యోదయాల గుడిసె, గలగలపాడే సెలయేరుల పింజరకొండ.. ఇలా అన్నింటినీ చుట్టిరావాల్సిందే.. పనసపొట్టు కూర నుంచి పులసల పులుసుదాకా, పూతరేకుల నుంచి కాకినాడ కాజా దాకా అన్నింటినీ రుచి చూడాల్సిందే! ఇంకా ఆంధ్రలో కృష్ణా పరీవాహక ప్రాంతాలు, హార్సిలీ హిల్స్, బెలూం కేవ్స్, గండికోట, కొండవీడు, ఉదయగిరి, ఒరవకల్లు, చంద్రగిరి, పెనుకొండ లాంటివాటినీ లిస్ట్‌లో చేర్చుకోవచ్చు. దక్షిణ భారతంలో కేరళ, ఉత్తర భారతంలో ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మధ్య భారతంలో ఛత్తీస్‌గఢ్, ఈశాన్యంలో మేఘాలయాలో రూరల్ టూరిజం ఎక్కువగా ఉంది. మనదేశంలో రూరల్ టూరిజం ద్వారా రూ. 4,300 కోట్ల అదనపు ఆదాయాన్ని సృష్టించవచ్చని నిపుణుల అభిప్రాయం. ఇది గ్రామీణ భారతానికి, పట్టణ భారతానికి మధ్య ఉన్న అంతరాన్ని తగ్గిస్తుందని, దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పెరుగుతుందని, అందుకే దీన్నో ఇండస్ట్రీగా, భారీ ఆదాయ వనరుగా పేర్కొనవచ్చని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. తెలంగాణకు చేరితే.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భద్రాచలం, కిన్నెరసాని అభయారణ్యం, ఉమ్మడి వరంగల్ జిల్లాలో లక్నవరం, రామప్ప, పాండవులగుట్ట, వాజేడు, ఉమ్మడి నల్లగొండ జిల్లాకు వస్తే రాచకొండ, భువనగిరి ఫోర్ట్, కొలనుపాక, వైజాగ్ కాలనీ, మెదక్‌లో నర్సాపూర్, ఏడుపాయల ప్లాన్ చేసుకోవచ్చు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో నల్లమల ఉండనే ఉంది. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో రోజంతా గడపాలనుకునేవారికి ‘టైగర్ స్టే ప్యాకేజీ’ అందుబాటులోకి వచ్చింది. ఇదే దారిలో వటవర్లపల్లి సమీపంలో మల్లెలతీర్థం, ఆక్టోపస్ వ్యూపాయింట్ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. మన్ననూర్, ఈగలపెంట ఊళ్లల్లో తిరిగి అక్కడివారి జీవన శైలిని పరిశీలించవచ్చు. శ్రీశైలం జలాశయం బ్యాక్‌వాటర్‌లోని సుందర ప్రదేశాలనూ సందర్శించొచ్చు. వారాంతాల్లో సోమశిల, అమరగిరి, మంచాలకట్ట ప్రాంతాలూ రద్దీగా ఉంటున్నాయి. ఉత్తర తెలంగాణకు చేరితే.. వరంగల్ మినహా మిగిలిన ప్రాంతమంతా తెలంగాణ– ఆంధ్ర– మరాఠీ సంస్కృతి, గోదావరి ప్రవాహం, పచ్చని చేలతో భలే ఆకట్టుకుంటుంది. నిజామాబాద్‌లో నిజాంసాగర్, కందకుర్తి, శ్రీరాంసాగర్, పసుపు పంటల అంకాపూర్, ఆర్మూర్ ప్రాంతాలను చూడాల్సిందే.ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రత్యేకం ..ఇది వైవిధ్యాలకు నెలవు. పచ్చని ప్రకృతి, ఆదివాసుల సంస్కృతీ సంప్రదాయాలు, మహారాష్ట్ర ప్రభావం.. ఇవన్నీ కలిసి దీనికి స్పెషల్ అపియరెన్స్‌ను ఇస్తున్నాయి. ఈ వైవిధ్యాన్ని ఆస్వాదించడానికి, అబ్జర్వ్చేయడానికి జనాలు ఇక్కడికి వస్తుంటారు. చలికాలంలో జీరో డిగ్రీకి వెళ్లే తిర్యాణిలాంటి ప్రాంతాలను చూసేందుకు, ఆ మంచు వాతావరణాన్ని ఎంజాయ్ చేసేందుకు భ్రమణకాంక్ష కలవారు ఇక్కడికి క్యూ కడుతుంటారు. కవ్వాల్ టైగర్ రిజర్వ్, కుంటాల, పొచ్చెర, సప్తగుండాలతో పాటు 30కి పైగా చిన్నా పెద్దా జలపాతాలు మరచిపోలేని అనుభూతులను పంచుతున్నాయి. వీటితోపాటు గోదావరి, కడెం, ప్రాణహిత, పెన్‌గంగా, వెన్‌గంగా తీరాలు, సమీప గ్రామాలు, జోడే ఘాట్, ఇం్రదవెల్లి, చారిత్రక ప్రాశస్త్యం కలిగిన గిరిజన కోటలు, పూర్వయుగం నాటి ఆనవాళ్లున్న ప్రాంతాలకు సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉంటోంది. ఇక్కడి పరిస్థితులను అధ్యయనం చేయడానికి దేశవిదేశాల అధ్యయనకారులూ వస్తుంటారు. ఇలా రూరల్ టూరిజానికి తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో డెస్టినేషన్స్ ఉన్నాయి. గ్రామీణ పర్యాటకం ఎన్నో ప్రాక్టికల్ లెసన్స్‌ను నేర్పుతుంది. ప్రకృతి వనరుల మీద అవగాహన కల్పిస్తుంది. వాటి మీద గౌరవాన్ని పెంచుతుంది. శ్రమ విలువను చూపిస్తుంది. నిరాడంబర జీవన శైలి అవసరాన్ని తెలియజేస్తుంది. పరిణతినిస్తుంది. రూరల్ టూర్‌ని ఇంకా మొదలుపెట్టని వాళ్లు ఐటినరీ ప్రిపేర్ చేసేసుకోండి ఇక! ఇన్పుట్స్: కడారి రాజా, కిషోర్ కుమార్ పెరుమాండ్ల, పాదం వెంకటేశ్, తాండ్ర కృష్ణగోవింద్, ఆకుల రాజుపెద్దగా ఖర్చులేనిది..రూరల్ టూరిజాన్ని ఇష్టపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇది అతి తక్కువ ఖర్చుతో కూడుకున్నది కూడా! ఇలాంటి పర్యటనకు తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రాంతాలు ఎంతో అనుకూలంగా ఉన్నాయి. ప్రకృతికి నష్టం చేయకుండా గ్రామీణ, నేచర్ బేస్డ్గా ఉండే పర్యాటకాన్ని ప్రోత్సహిస్తే రాష్ట్రాల ఆర్థిక వృద్ధికీ మేలు కలుగుతుంది. – శ్యామ్‌సుందర్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్, యూత్ హాస్టల్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (వైహెచ్‌ఏఐ) తెలంగాణ చాప్టర్పల్లెల గురించి తెలియాలినాకు రకరకాల భాషలు, కళలు, సంస్కృతీ సంప్రదాయాలు, ఆర్కిటెక్చర్‌ను తెలుసుకోవడం, పరిశీలించడం ఇష్టం. అందుకే చాలా తరచుగా దేశీ, విదేశీ యానాలు చేస్తుంటా. వీకెండ్స్‌లో కచ్చితంగా గ్రామీణ ప్రాంతాలకు వెళ్తుంటా. కరోనా తర్వాత రూరల్ టూర్స్ పెరిగాయి. స్వచ్ఛమైన గాలి, ఆహ్లాదకరమైన వాతావరణం కోసం రిటైర్డ్ ఎంప్లాయ్సే ఎక్కువగా రూరల్ టూర్స్‌ని ఇష్టపడేవాళ్లు! ఇప్పుడు ఫ్యామిలీస్, యూత్, స్కూల్ పిల్లలూ వస్తున్నారు. శుభపరిణామం. మనదేశ సాంఘిక, సాంస్కృతిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు అర్థంకావాలంటే మన గ్రామాల గురించి తెలియాలి. కాబట్టి పల్లెటూళ్లకు వెళ్లాలి. – గిరిజ పైడిమర్రి, విహంగ (వైహెచ్‌ఏఐ) వైస్ ప్రెసిడెంట్ -
ముట్టుకున్నా నొప్పి?!
నాకు డెలివరీ అయ్యి సంవత్సరం అవుతోంది. నార్మల్ డెలివరీనే! కానీ ఇప్పటికీ ఎక్స్టర్నల్ వెజైనా ఏరియాలో చాలా నొప్పిగా ఉంటోంది. ముట్టుకున్నా నొప్పి అనిపిస్తుంది. ఏ మందులు వాడినా, ఇన్ఫెక్షన్కి మందులు వాడినా ఏమీ తగ్గలేదు. నాకు సలహా ఇవ్వండి.విశాల, నాచారంమీరు చెప్పే నొప్పిని వల్వల్ పెయిన్ అంటారు. ఏ ఇన్ఫెక్షన్ లేనప్పుడు, ఏ కారణం తెలియనప్పుడు దీనిని డయాగ్నైజ్ చేస్తారు. కొన్నిసార్లు ప్రసవం జరిగే సమయంలో గాయపడినా, భయానికీ ఒత్తిడికీ గురైనా ఈ నొప్పి మొదలవుతుంది. కొన్నిసార్లు ఏ కారణం లేకుండా కూడా వస్తుంది. ఈ నొప్పికి గైనకాలజిస్ట్‌ని కలవాలి. ఇంటర్నల్‌గా చెక్ చేసి వెజైనల్ ఇన్ఫెక్షన్ ఉందా లేదా అని చూస్తారు. అవసరమైతే వెజైనల్ స్వాబ్ చేస్తారు. లిడోకేయిన్ 2% లోకల్ అప్లికేషన్ జెల్లీ వాడమని చెబుతారు. ఈ ఆయింట్మెంట్ని వెజైనా, వల్వా భాగంలో ఎక్కడ నొప్పి ఉంటే అక్కడ అప్లై చేసుకోవాలి. ఇది బాగా పని చేస్తుంది. ఈ ఆయింట్మెంట్ని ప్రతిరోజూ 3–4 సార్లు అప్లై చేసుకుంటూ, మీరు రోజువారీ పనులు చేసుకోవచ్చు. నడుము కండరాలు బలం పుంజుకోవడానికి ఎక్సర్సైజ్ కూడా చెయ్యాలి. ఈ క్రీమ్‌కి అలర్జీ చాలా అరుదుగా రావచ్చు. చాలా మందికి ఈ క్రీమ్‌తో నొప్పి తగ్గుతుంది. వెజైనల్ వాషెస్, స్ట్రాంగ్ సోప్స్, ఫెర్ఫ్యూమ్లు వాడకూడదు. కొంతమందికి సెన్సిటివిటీ తగ్గడానికి ఓరల్ ట్యాబ్లెట్స్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. నొప్పి ఎక్కువకాలం కొనసాగుతుంటే, ఫిజియోథెరపిస్ట్ ద్వారా నడుము కండరాల బలానికి ఎక్సర్సైజెస్ నేర్పిస్తారు.నాకు మొదటి నుంచీ రక్తంలో ఐరన్ శాతం తక్కువ అని చెప్పారు. ఇప్పుడు 3వ నెల. వయసు 22 సంవత్సరాలు. రక్త పరీక్ష చేయించినప్పుడు ఐరన్ శాతం మాత్రమే ఎందుకు తగ్గుతుందో తెలియడం లేదు. ఎలాంటి ఆహారం తీసుకోవాలి?– సృజన, శంకరపల్లిఐరన్ తక్కువ ఉన్న వాళ్లకి నీరసం, అలసట ఎక్కువ ఉంటాయి. హీమోగ్లోబిన్ 10 శాతం కన్నా తక్కువ ఉంటే రక్తహీనత అంటారు. గర్భధారణ సమయంలో రక్తంలో ఐరన్ శాతం బాగా ఉన్నప్పుడే రక్తకణాలు బాగా ఉంటాయి. ఈ రక్తకణాలు ఆక్సిజన్‌ను శరీరంలోని అన్ని అవయవాలకు పంపిస్తాయి. మీరు తీసుకునే ఆహారంలో ఐరన్ శాతం పెరగాలంటే కొన్ని ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. మాంసాహార పదార్థాలు అంటే చికెన్, మటన్, చేప, పౌల్ట్రీలో ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుంది. లివర్, లివర్ ఉత్పత్తుల్లో ఐరన్ శాతం ఎక్కువ ఉన్నా గర్భధారణ సమయంలో తీసుకోకూడదు. వాటిలోని విటమిన్–ఎ పెరిగే బిడ్డకి ప్రమాదం. శాకాహార పదార్థాలు చాలావాటిలో ఐరన్ శాతం ఎక్కువగానే ఉంటుంది. ఆకుకూరలు, కూరగాయలు, రాజ్మా, బఠాణీ వంటి గింజలు, బ్రొకొలీ, సోయా ఉత్పత్తులు, పనీర్‌లలో ఐరన్శాతం ఎక్కువ ఉంటుంది. ఐరన్ శాతం పెరగాలంటే విటమిన్–సి కూడా అవసరం. అందుకే ఐరన్ ఎక్కువ ఉండే ఆహర పదార్థాలతో పాటు విటమిన్–సి కూడా తీసుకోవాలి. విటమిన్–సి ఎక్కువగా ఉండే సిట్రస్ ఫ్రూట్స్– నారింజ, కివీ, నిమ్మ వంటివి తీసుకోవాలి. టీ, కాఫీలు తాగకూడదు. భోజనంతో పాటు అస్సలు తీసుకోకూడదు. గర్భిణీలకు 3, 7, 9 నెలల్లో తప్పనిసరిగా కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అనే రక్తపరీక్ష చేస్తారు. దీనిలో మీ ఐరన్ శాతం తెలుస్తుంది. డైట్‌తో పాటు కొంతమందికి ఐరన్ సప్లిమెంట్స్ కూడా ఇవ్వవలసి వస్తుంది. కొంతమందికి రక్తహీనతతో పాటు విటమిన్– బి12 కూడా తక్కువ ఉండొచ్చు. అలాంటి వారికి అదనంగా సప్లిమెంట్స్ ఇవ్వాలి. డైట్, మందులతో ఐరన్ పెరగనప్పుడు హెచ్బి ఎలక్ట్రోఫోరెసిస్, ఐరన్ స్టడీస్ అనే అడ్వాన్స్డ్ టెస్ట్ చేసి సమస్య ఎక్కడ ఉందో కనిపెట్టి, ఫిజీషియన్ సూచన మేరకు ట్రీట్మెంట్ చేస్తారు. -
రాక్‌స్టార్ రవీంద్ర జడేజా
భారత క్రికెట్ జట్టులోకి తొలిసారి అడుగు పెట్టినప్పుడు రవీంద్ర జడేజా వయసు 21 ఏళ్లు. అతని ఆట మెరుగ్గానే ఉన్నా అతని వ్యవహారశైలిపై అందరికీ సందేహాలు ఉండేవి. ఐపీఎల్లో మంచి ప్రదర్శనతో గుర్తింపు తెచ్చుకొని జట్టులోకి వచ్చిన జడేజాలోని ‘యూత్’ లక్షణాలు టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో చాలా మందికి కొత్తగా అనిపించాయి. కానీ పదిహేనేళ్ల అంతర్జాతీయ కెరీర్ తర్వాత అతను భారత అత్యుత్తమ ఆల్రౌండర్లలో ఒకడిగా కనిపించసాగాడు. ‘రాక్‌స్టార్’ అనే ముద్దు పేరుతో మొదలైన అతని ప్రస్థానం టీమిండియా అద్భుత విజయాలకు చుక్కానిగా నిలిచింది. కెరీర్ ఆరంభంలో వన్డే, టి20 ఆటగాడిగానే ముద్ర పడినా కఠోర శ్రమ, పట్టుదలతో ఎరుపు బంతిపై పట్టు సాధించిన జడేజా ఇప్పుడు టెస్టు క్రికెట్లో కూడా అరుదైన మైలురాయిని అందుకున్నాడు. 92 ఏళ్ల చరిత్ర ఉన్న భారత టెస్టు క్రికెట్లో 300కు పైగా వికెట్లు తీసిన ఏడుగురు ఆటగాళ్లలో ఒకడిగా తన పేరును లిఖించుకున్నాడు. అంతేకాదు.. ప్రపంచవ్యాప్తంగా 3 వేల పరుగులు సాధించి, 300 వికెట్లు తీసిన 11 మందిలో ఒకడిగా ఉన్నాడు. ప్రతికూలతలను అధిగమించి..సెంచరీ లేదా హాఫ్ సెంచరీ సాధించినప్పుడు కత్తిసాము తరహాలో తన బ్యాట్‌ను తిప్పుతూ జడేజా చేసే విన్యాసం భారత అభిమానులందరికీ సుపరిచితమే. రాజపుత్రుల కుటుంబానికి చెందిన అతను తన సంబరాన్ని ఇలా ప్రదర్శిస్తూ ఉంటాడు. అయితే పేరుకు అలాంటి నేపథ్యం ఉన్నా జడేజా జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నాడు. అవి అతనిలో పోరాట పటిమను పెంచి, మానసికంగా దృఢంగా మార్చాయి. అతి సాధారణ కుటుంబం అతనిది. వాచ్‌మన్‌గా పనిచేసే తండ్రి తన కుమారుడు తొందరగా ఆర్మీలో ఒక సిపాయి ఉద్యోగంలో చేరితే చాలు.. ఆర్థికంగా గట్టెక్కుతామనే ఆలోచనతో ఉండేవాడు. కానీ జడేజా మాత్రం భిన్న మార్గాన్ని ఎంచుకున్నాడు. తనకెంతో ఇష్టమైన క్రికెట్లోనే ఏదైనా చేసి చూపిస్తాననే పట్టుదల కనబరచి తండ్రిని ఒప్పించగలిగాడు. అతనికి తల్లి కూడా మద్దతు పలికింది. అయితే ఆటలో జడేజా ఎదుగుతున్న సమయంలోనే ఒక ప్రమాదంలో తల్లి చనిపోయింది. అప్పుడు అతని వయసు 16 ఏళ్లు. ఆ బాధలో క్రికెట్‌కు గుడ్‌బై చెబుదామనుకున్నాడు. కానీ తండ్రి అండగా నిలవడంతో క్రికెట్‌పై మళ్లీ శ్రద్ధపెట్టాడు. దేశవాళీలో చెలరేగి..యూత్ క్రికెట్లో సౌరాష్ట్ర జట్టు తరఫున చెలరేగిన జడేజా ఆట అతనికి భారత అండర్–19 జట్టులో చోటు కల్పించింది. 2006లో రన్నరప్‌గా నిలిచిన జట్టులో భాగంగా ఉన్న జడేజా.. 2008లో విరాట్ కోహ్లీ నేతృత్వంలో టైటిల్ నెగ్గిన టీమ్‌లో కీలక సభ్యుడిగా సత్తా చాటాడు. ఆరు మ్యాచ్‌లలో అతను తీసిన 10 వికెట్లు జట్టుకు విజయాలను అందించాయి. ఫలితంగా 2008లో జరిగిన తొలి ఐపీఎల్లో ప్రతిభ గల వర్ధమాన ఆటగాడిగా రాజస్థాన్ రాయల్స్ టీమ్‌లో చోటు దక్కించుకున్నాడు. రాజస్థాన్ ఐపీఎల్ విజేతగా నిలవడంతో జడేజాకు కూడా మంచి గుర్తింపు దక్కింది. ఇక్కడే షేన్‌వార్న్ అతనికి రాక్‌స్టార్ అంటూ పేరు పెట్టాడు. అయితే ఉడుకు రక్తం ఉప్పొంగే 20 ఏళ్ల వయసులో సరైన మార్గనిర్దేశనం లేకుండా అతను చేసిన తప్పుతో వివాదానికి కేంద్రంగా నిలిచాడు. ఒక జట్టుతో కాంట్రాక్ట్‌లో ఉండగానే ఎక్కువ మొత్తం కోసం మరో జట్టుతో ఒప్పందం కుదుర్చుకునే ప్రయత్నం చేయడం బీసీసీఐకి ఆగ్రహం తెప్పించింది. దాంతో ఏడాది నిషేధం విధించడంతో 2009 ఐపీఎల్‌కు అతను దూరమయ్యాడు. ఐపీఎల్‌కు రెండు నెలల ముందే కేవలం ప్రతిభ కారణంగా భారత జట్టు తరఫున తొలి వన్డే, తొలి టి20 అవకాశం రావడం అతనికి కలిగిన ఊరట. అయితే ఆ నిషేధం వ్యక్తిగా కూడా అతను మెరుగుపడే అవకాశాన్నిచ్చింది. 2012 ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో చేరడం జడేజా కెరీర్‌ను మలుపు తిప్పింది. ఎన్నో రికార్డులు సొంతం చేసుకున్నాడు. చెన్నై టీమ్ మూల స్తంభాల్లో ఒకడిగా నిలిచాడు. టీమ్ తరఫున మూడు టైటిల్స్ విజయాల్లో భాగంగా ఉన్నాడు. దశాబ్దంన్నర కాలంలో భారత్ తరఫున ఆడిన 197 వన్డేలు, 74 టి20 మ్యాచ్‌లు పరిమిత ఓవర్ల క్రికెట్లో అతని విలువను చూపించాయి. టెస్టుల్లో సూపర్ హీరోగా..వన్డేలు, టి20లతో పోలిస్తే టెస్టు క్రికెట్లో జడేజా సాధించిన ఘనతలు అసాధారణమైనవి. రంజీ ట్రోఫీలో ఏకంగా మూడు ట్రిపుల్ సెంచరీలు సాధించిన ఏకైక భారతీయుడిగా అతను రికార్డు నెలకొల్పాడు. ప్రపంచ క్రికెట్లో అతనికి ముందు మరో ఏడుగురు మాత్రమే ఇలాంటి ఫీట్‌ను సాధించారు. ఆ జోరులో 2012లో జడేజా భారత టెస్టు జట్టులోకి తొలిసారి ఎంపికయ్యాడు. ఈ పుష్కర కాలంలో జడేజా ఒంటి చేత్తో జట్టుకు అందించిన విజయాలు ఎన్నో. తన లెఫ్టార్మ్ స్పిన్‌తో ప్రత్యర్థి బ్యాటర్లను కట్టిపడేసి చకచకా వికెట్లు పడగొట్టడం.. లేదంటే లోయర్ ఆర్డర్లో తన బ్యాటింగ్‌తో కీలక పరుగులతో జట్టుకు భారీ స్కోరు అందించడం.. ఇలా ఏదో రూపంలో అతని భాగస్వామ్యం లేని టెస్టులు దాదాపుగా లేవంటే అతిశయోక్తి కాదు. జట్టులో మరో సహచరుడు, అగ్రశ్రేణి స్పిన్నర్‌గా అశ్విన్‌ను దాటి కూడా కొన్నిసార్లు ఏకైక స్పిన్నర్‌గా టీమ్‌లో అవకాశాన్ని దక్కించుకోగలిగాడంటే జడేజా సత్తాపై టీమ్ మేనేజ్మెంట్కున్న నమ్మకం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఆస్ట్రేలియాపై వరుసగా రెండు సిరీస్‌లలో 24, 25 చొప్పున, దక్షిణాఫ్రికాపై 23, ఇంగ్లండ్‌పై 26.. ఇలా సొంతగడ్డపై సిరీస్ ఏదైనా ప్రత్యర్థిని కుప్పకూల్చడం జడేజాకు మంచినీళ్లప్రాయంలా మారింది. అనిల్ కుంబ్లే (1993) తర్వాత ఐసీసీ టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌గా తొలి భారత బౌలర్‌గా జడేజా గుర్తింపు తెచ్చుకున్నాడు.∙మొహమ్మద్ అబ్దుల్ హాది -
బొమ్మలు చెప్పే చరిత్ర..!
భావాన్ని వ్యక్తపరచడానికి భాషే అవసరం లేదు, సంజ్ఞ చాలు! కళలో ప్రావీణ్యం ఉంటే గనుక అదొక అద్భుతమే! ఆ అద్భుతం పార్వతీపురం మన్యం జిల్లా, సీతంపేట గిరిజనుల సొంతం! ఆదిమానవుడు తన బతుకు చిత్రాన్ని బొమ్మలతోనే చూపించాడు. అదే భావితరాలకు చరిత్రగా నిలిచింది. ఆ కళ నేటికీ ఉనికిలో ఉంది..ఆంధ్రప్రదేశ్‌లోని ఏజెన్సీ ప్రాంతంలో! పార్వతీపురం మన్యం జిల్లాలోని సీతంపేట సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ) పరిధిలోని సవర తెగకు చెందిన గిరిజనులు తమ జీవన విధానాన్ని, సంస్కృతీ సంప్రదాయాలను గీతల బొమ్మలతోనే అభివర్ణిస్తారు. అదే సవర చిత్రకళ! ప్రకృతిని దైవంగా కొలిచే గిరిజనులు అటవీ ఉత్పత్తుల దగ్గర్నుంచి పంట చేతికందే వరకు ప్రతిదశనూ పండుగలా జరుపుకుంటారు. ఆ క్రమంలో టెంక పండుగ, విత్తనాల పండుగ, పుష్పి పండుగ, గాటి వారాలు, పులి పండుగ, ఆగం పండుగ, అమ్మవారి పండుగ, సంబరాలు (ఇంటి పండుగ), కొత్త అమావాస్య, గొడ్డాలమ్మ (కంది పండుగ), కొర్ర కొత్త పండుగ, కొండెం కొత్త పండుగ, ఉజ్జీడమ్మ తల్లి పండుగ వంటి పర్వదినాల్లో ఇళ్లు, ముంగిళ్లు, చెట్లు, తోటలు, ఆలయాలను సవర చిత్రకళతో అద్భుతంగా అలంకరించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ చిత్రాలకు ఉపయోగించే ప్రతీది సహజసిద్ధమైందే. వరి, బొగ్గు, మట్టి, ఇటుక బెడ్డ రాయి, పసుపు, చెట్టు బెరడును ఉపయోగించి బొమ్మలు వేస్తారు. ఈ చిత్రకళ సుమారు మూడువేల ఏళ్ల కిందటిది. మధ్యప్రదేశ్‌లోని భీమ్ భేట్కా గుహల్లో గుర్తించిన ఆదీవాసీ చిత్రాలను ఈ కళకు తొలి ఉదాహరణలుగా చెబుతున్నారు పురాతత్వ శాస్త్రవేత్తలు. భాష లేని ఆ కాలంలో భావాలను వ్యక్తపరచడానికి ఆనాటి మానవుడు తనలోని సృజనకు పదునుపెట్టి ఆ చిత్రాలను గీసినట్టు తేల్చారు. సవర చిత్రకళను కాపాడుకోవడానికి ఉత్సాహవంతులకు శిక్షణనూ అందిస్తున్నారు.కార్డులను అందజేస్తున్నాం..ఈ కళను సవర తెగకు చెందిన గిరిజనులు కాలానుగుణంగా అభివృద్ధిచేస్తూ బతికిస్తున్నారు. దాదాపు 500 మంది కళాకారులకు ఇదే జీవనోపాధి. రెండేళ్లుగా నేను, గౌరీశ్ మాష్టారు గిరిజన ప్రాంతాలన్నీ తిరుగుతూ సవర చిత్రకళాకారులను గుర్తిస్తూ, వారికి లేపాక్షి అధికారుల సాయంతో హస్తకళ(డీసీహెచ్) కార్డులను అందజేస్తున్నాం.బేతాళ అనిల్‌కుమార్, హస్తకళల రిసోర్స్‌పర్సన్, పాలకొండవస్తువుల మీదా బొమ్మలు..మా నాన్నకు సవర చిత్రకళలో మంచి నైపుణ్యం ఉంది. ఆయన మా ఇంటి గోడలపై బొమ్మలు వేస్తుండటం చూసి నాకూ దానిపట్ల ఆసక్తి పెరిగింది. సవర ఆదివాసీ డ్రాయింగ్‌లో ట్రైనింగ్ తీసుకున్నాను. గోడలు, కాగితాల మీదే కాదు వస్తువుల మీదా బొమ్మలు వేస్తాను. లేపాక్షి ద్వారా మాలాంటి యువతకు ఉపాధి కల్పించే ప్రయత్నం జరగాలి.గేదెల శంకర్, సవర చిత్రకళాకారుడుఅదొక వరం కేవలం గీతలతోనే సందర్భానికి తగిన సన్నివేశాన్ని గీయడం గొప్ప నైపుణ్యం. ఆదొక వరం. డిగ్రీ చదివిన నాకు సరైన ఉద్యోగం లేకపోడంతో చిన్నప్పటి నుంచీ నేర్చుకున్న ఈ కళే కొంతవరకు ఉపాధినిస్తోంది.సవర నరేష్, జగత్పల్లి గ్రామం, సీతంపేటం మండల యిర్రింకి ఉమామహేశ్వరరావు, సాక్షి, అమరావతి(చదవండి: పొడవాటి రోడ్డు సొరంగంగా రికార్డు..) -
పొడవాటి రోడ్డు సొరంగంగా రికార్డు..!
ఇది ప్రపంచంలోనే పొడవాటి రోడ్డు సొరంగం. ఆస్ట్రేలియాలోన సిడ్నీ నగరంలో ఉన్న ఈ సొరంగం పొడవు ఏకంగా 26 కిలోమీటర్లు. ఈ సొరంగ రహదారి పేరు ‘వెస్ట్ కనెక్స్’ ఆస్ట్రేలియా ఫెడరల్ ప్రభుత్వం, న్యూసౌత్ వేల్స్ రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడిగా ఈ సొరంగ నిర్మాణం చేపట్టి, గత ఏడాది నవంబరు 26 నాటికి దీనిని పూర్తి చేశాయి. ఉభయ ప్రభుత్వాలూ హోమ్‌బుష్–కింగ్స్గ్రోవ్ల మధ్య చేపట్టిన 33 కిలోమీటర్ల మోటారు రహదారిలో భాగంగా ఈ సొరంగాన్ని నిర్మించాయి. ఈ రహదారి నిర్మాణం పనులు 2016 డిసెంబర్ 20న ప్రారంభించగా, సొరంగం సహా మొత్తం నిర్మాణం పూర్తి కావడానికి దాదాపు ఏడేళ్లు పట్టింది. దీని నిర్మాణానికి 4500 కోట్ల ఆస్ట్రేలియన్ డాలర్ల ఖర్చు (రూ.2.60 లక్షల కోట్లు) జరిగింది. దీని నిర్మాణం పూర్తయిన తర్వాత ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పొడవాటి సొరంగ రహదారిగా రికార్డులకెక్కింది.(చదవండి: మనం ధరించే డ్రెస్‌కి ఇంత పవర్ ఉంటుందా..?)