Funday
-
శరదృతువులో అక్కడ పడవలతో పండుగ సందడి..ఏకంగా..!
సరస్సులో పడవల సందడితో కనువిందు చేసే పండుగ ఇది. ఏటా శరదృతువులో పద్దెనిమిది రోజుల పాటు కొనసాగే ఈ పండుగ కోలాహలం చూసి తీరాల్సిందే! మయాన్మార్‌లోని ఇన్లే సరస్సు ఒడ్డున ఉన్న ‘ఫాంగ్ డా వూ’ పగోడా వరకు పద్దెనిమిది రోజుల పాటు పడవల ఊరేగింపు జరుగుతుంది. మయాన్మార్ చాంద్రమాన కేలండర్లోని ఏడో నెల అయిన థాడింగ్యుట్ నెలలో శుక్లపక్షం మొదటి రోజు నుంచి బహుళపక్షం మూడో రోజు వరకు జరిగే ఈ పండుగలో లక్షలాది మంది జనాలు పాల్గొంటారు. ఈసారి ఈ పండుగ అక్టోబర్ 3 నుంచి ప్రారంభమై, 20 వరకు జరుగుతోంది. మయాన్మార్‌లోని మైనారిటీ తెగలకు చెందిన ‘ఇంథా’, ‘పావో’ తెగలవారు ఈ పండుగలో పెద్దసంఖ్యలో పాల్గొంటారు. పండుగ జరిగే పద్దెనిమిది రోజుల్లోనూ ఇన్లే సరస్సులో పడవల మీద ఊరేగింపుగా వెళ్లి ‘ఫాంగ్ డా వూ’ పగోడాకు చేరుకుంటారు. పగోడాలో బంగారుపూతతో కొలువుదీరిన ఐదు బుద్ధప్రతిమలను భక్తిగా తాకి, వాటికి బంగారు రేకులను అతికిస్తారు. విగ్రహాలు మరీ బరువుగా మారడం వల్ల పగోడా నిర్వాహకులు విగ్రహాలకు భక్తులు బంగారు రేకులను అతికే ప్రక్రియపై 2019 నుంచి నిషేధం అమలు చేస్తున్నారు. ఈ విగ్రహాల వద్ద భక్తులు సామూహికంగా ప్రార్థనలు జరుపుతారు. ఇన్లే సరస్సు తీరంలోని గ్రామాల్లో ఈ పద్దెనిమిది రోజులూ పండుగ కోలాహలం అట్టహాసంగా కనిపిస్తుంది. పడవల ఊరేగింపు జరిగినన్ని రోజులూ హంస ఆకారంలో ఉన్న రాచపడవను అనుసరించి వందలాది పడవలు ‘ఫాంగ్ డా వూ’ పగోడా తీరం వరకు ప్రయాణిస్తాయి.(చదవండి: అత్యంత అరుదైన వరుణదేవుడి ఆలయం..!) -
అత్యంత అరుదైన వరుణదేవుడి ఆలయం..!
మన పురాణాల్లో ప్రతి దేవుడికి ఆలయాలు ఉన్నాయి. బ్రహ్మ, అష్టదిక్పాలకులతో సహా అక్కడక్కడ అరుదైన దేవాలయాలు ఉన్నాయి. కానీ వర్ష దేవుడికి ప్రత్యేకంగా ఆలయం ఉన్నట్లు విన్నారా..?. మహా అయితే వర్షాలు రావాలని యజ్జ యాగాదులు వంటిటి చేయడం చూశాం. కానీ ప్రత్యేకంగా ఆలయం నిర్మించి ఆరాధించడం గురించి విన్నారా..?. మరీ ఇది ఎక్కడుందంటే..?అత్యంత అరుదైన వరుణదేవుడి ఆలయం ఇది. ఈ ఆలయం మనదేశంలో లేదు. పాకిస్తాన్‌లోని కరాచీ తీరంలోని మనోరా దీవిలో ఉంది. ఇక్కడి సింధీ ప్రజలు వరుణదేవుడిని భక్తిగా ‘ఝూలేలాల్’ పేరుతో కొలుచుకుంటూ ఉంటారు. ఈ ఆలయ నిర్మాణం ఎప్పుడు జరిగిందో తెలిపే ఆధారాలేవీ లేవు. సింధ్ రాష్ట్రంలోనిభిరియా పట్టణానికి చెందిన సేఠ్ హర్చంద్మల్ దయాల్ దాస్ ఈ ఆలయానికి జీర్ణోద్ధరణ చేసినట్లు ఇక్కడి శిలాఫలకం ద్వారా తెలుస్తోంది.(చదవండి: ఉజ్జీవన్ బ్యాంకు రంగురంగుల పూలతో అతిపెద్ద బతుకమ్మ..!) -
నైంటీస్ జమానా దుకాణం..! ఆ తరం మధుర జ్ఞాపకాలు..
ముయ్యేళ్ల కిందట– అంటే..నైంటీస్ జమానాలో ఇప్పుడున్నస్మార్ట్ఫోన్లు లేవు, ఆన్లైన్ గేమ్స్ లేవు. అప్పటి పిల్లలకు గోలీలు, బొంగరాలువంటి ఆరుబయటి ఆటలే కాలక్షేపం. అప్పట్లో పిజ్జాలు, బర్గర్లు లేవు. నారింజ మిఠాయిలు, అంకెలు, అక్షరాల ఆకారంలో ఉండే బిస్కట్లు వంటివే పిల్లల జిహ్వచాపల్యాన్ని తీర్చే చిరుతిళ్లు. అప్పటి పిల్లలు ఇప్పుడు యువకులైపోయారు. పిల్లలకు తల్లిదండ్రులైపోయారు. తమ పిల్లలకు తమచిన్ననాటి కాలక్షేపాలను, చిరుతిళ్లను పరిచయం చేయాలని ఉన్నా, బజారులో అవేవీ ఇప్పుడు అందుబాటులో లేవు. ఆ లోటును తీర్చడానికే చెన్నైలోని తెలుగు సంతతికి చెందిన ఆర్.జయంతన్ చెన్నై క్రోంపేటలో ‘నైంటీస్ మిఠాయి కడై’ పేరుతో ఆనాటి జ్ఞాపకాలను కొలువుతీర్చి దుకాణం ఏర్పాటు చేశారు. ఇందులోని వస్తువులను ఆన్‌లైన్‌లోనూ విక్రయిస్తున్నారు. ఆనాటి జ్ఞాపకాలను ఇప్పటి తరానికి కూడా అందుబాటులోకి తెచ్చేఉద్దేశంతో జయంతన్ ప్రారంభించిన ఈ దుకాణం జనాలను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని తమిళనాడు రాష్ట్రం ధర్మపురి జిల్లా పాపిరెడ్డి పట్టి కడత్తూరు గ్రామానికి చెందిన తెలుగు కుటుంబానికి చెందిన యువకుడు ఆర్.జయంతన్ చెన్నైలోని ఓ కళాశాలలో ఎంటెక్ పూర్తి చేశారు. ఎంబీఏ పట్టభద్రురాలైన తన భార్య విద్య ఇచ్చిన సలహాతో విలక్షణంగా ఏదైనా చేయాలనే నిర్ణయానికి వచ్చాడు. అందుకే ఉద్యోగం చూసుకునే బదులు వ్యాపార రంగంలోకిఅడుగుపెట్టి, ఆనాటి జ్ఞాపకాలను నేటి తరానికి గుర్తు చేసేలా చెన్నై క్రోంపేటలో దుకాణం ఏర్పాటు చేశాడు. ఎనభై, తొంభై దశకాల్లో విస్తృతంగా వాడుకలో ఉన్న వివిధ రకాల ఆట వస్తువులు, పెన్నులు, పుస్తకాలు, బ్యాగ్‌లు, బిస్కట్లు, చాక్లెట్లు వంటివి సేకరించి, తన దుకాణంలో కొలువుదీర్చారు. అలాగే ఆన్‌లైన్‌లోనూ వీటి అమ్మకాలను సాగించేందుకు'www.90smittaikadai.com' వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ఈ దుకాణంలోకి అడుగుపెడితే చాలు, నైంటీస్ నాటివారు తమ బాల్యజ్ఞాపకాల్లో తేలిపోతారు.వారి కళ్లలో ఆనందాన్ని చూస్తున్నా: ఆర్.జయంతన్మా దుకాణానికి వచ్చే నైంటీస్ తరంవారు తమ పిల్లలకు ఇక్కడి వస్తువులను ఒక్కొక్కటే చూపిస్తూ, వాటిని తాము ఎలా ఉపయోగించేవారో, ఎలా ఆటలాడే వారో వివరిస్తుంటే ఎనలేని ఆనందం కలుగుతోంది. ఇక్కడికొచ్చే కస్టమర్ల కళ్లలో బాల్య స్మృతుల ఆనందాన్ని చూస్తున్నా. అప్పట్లో ఇలాంటివి కొనేందుకు డబ్బులు లేకున్నా, చూసి ఆనందంతో గంతులేసే వాళ్లం. ఇప్పుడుచేతిలో డబ్బులు ఉన్నా, ఈ వస్తువులు దొరకడం అరుదైపోయింది. అందుకే ఈ అరుదైన వస్తువులను వెతికి, ప్రత్యేకంగా తయారు చేయించి మరీ మా దుకాణంలో విక్రయాలకు పెట్టాం. ఈ వస్తువులను నైంటీస్ తరంవారు తమ పిల్లలకు కొనివ్వడమే కాకుండా, నాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటుండటం సంతోషం కలిగిస్తోంది. ఇవి మరింత విస్తృతం కావాలన్న కాంక్షతోనే ఆన్‌లైన్‌లోనూ విక్రయాలను ప్రారంభించా. ఇందులో లాభాపేక్ష కన్నా, ఆనాటి జ్ఞాపకాలను నేటి తరానికి చేరవేయాలనేదే మా లక్ష్యం. దేశంలో ఏ మూలకైనా సరే ఈ వస్తువులను సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. చిన్నప్పుడు నేను ఆడుకున్న వస్తువులు సైతం ఇక్కడ ఎన్నో ఉన్నాయి. కొందరు కస్టమర్లు తమకు కావాల్సిన కొన్ని వస్తువులను సూచిస్తుంటారు. వారి ఆర్డర్‌కు తగినట్లుగా, వాటిని కొంత సమయం పట్టినా సరే సేకరించి లేదా తయారు చేయించి కొరియర్ ద్వారాపంపిస్తున్నాం. కనుమరుగైన వస్తువులు కూడా ఈ నైంటీస్ జమానా దుకాణంలో కనుమరుగైపోయిన పాతకాలం వస్తువులను కూడా కొలువుదీర్చారు. గ్రామఫోన్, కిరోసిన్ లాంతరు వంటి వస్తువులతో పాటు ఆనాటి గేమ్ కిట్స్, బొంగరాలు, కర్రా బిళ్ల, గోలీలు, నారింజ మిఠాయి, ఐస్ట్యూబ్, పాపిన్స్, ఫాంటమ్ స్వీట్ సిగరెట్లు, బొంబాయి మిఠాయి, టిట్ బిట్స్, అక్షరాలు, అంకెలతో కూడిన బిస్కట్లు, కిస్మీ బార్, చాక్లెట్లు, ట్రంప్ కార్డులు, కొయ్య బొమ్మలు, ఫ్రిజ్ మేగ్నెట్లు, రెండు నిబ్బుల ఫౌంటెన్ పెన్నులు, కాప్సూ్యల్పెన్నులు, కొయ్య పెన్నులు, హీరో పెన్నులు, కామ్లిన్ పెన్నులు, ఇన్విజిబుల్ పెన్నులు, ఇంక్ ఇరేజర్లు వంటి వస్తువులు, బొమ్మ కార్లు, బొమ్మ బైకులు, సైకిల్ హారన్లు, విసనకర్రలు, మౌతార్గాన్ వంటి సంగీత పరికరాలు, ఆనాటి సినిమా పాటల పుస్తకాలు వంటి ఎన్నోవస్తువులు ఈ దుకాణంలో ఐదు రూపాయలు మొదలుకొని పదిహేనువందల రూపాయలవరకు వివిధ ధరల్లో అందుబాటులోఉంటాయి. అస్మతీన్ మైదిన్, బ్యూరో ఇన్చార్జ్, చెన్నై (చదవండి: డ్యూటీకి.. టిక్.. టిక్..కానీ బాడీ క్లాక్ బీట్ వినండి ప్లీజ్..!) -
తారీఫ్ కరే క్యా ఉస్కీ..
లిసా మిశ్రా.. గాయనిగా, గేయరచయితగా సంగీత, సాహిత్యాభిమానులకు ఏనాడో పరిచయం. తాజాగా నటనారంగంలోకి అడుగుపెట్టి తన అభినయ కళనూ ప్రదర్శించింది. ఆ ఫ్యాన్ బేస్నూ సంపాదించుకుంది.👉లిసా పుట్టింది ఒడిశాలోని బరంపురంలో. పెరిగింది అమెరికాలోని షికాగోలో. నాలుగో ఏట నుంచే సంగీతం నేర్చుకోవడం ప్రారంభించింది. పదిహేనో ఏట నుంచి గిటార్లో శిక్షణ పొందటం మొదలుపెట్టింది. అకడమిక్స్ విషయానికి వస్తే ఇల్లినాయీ వెజ్లీయన్ యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్ అండ్ రిలిజియన్‌లో గ్రాడ్యుయేషన్ చేసింది.👉పదమూడేళ్ల వయసులో లిసా.. యూట్యూబ్ చానల్ స్టార్ట్ చేసి, తన పాటల వీడియోలను అందులో పోస్ట్ చేయసాగింది. అయితే ఆమె అలా వీడియోలు అప్లోడ్ చేయడం వాళ్లమ్మకు నచ్చలేదు. ఎందుకు అందరి కళ్లల్లో పడటం అంటూ అభ్యంతరం చెప్పింది. దాంతో కేవలం ఆడియో రికార్డింగ్స్‌ని మాత్రమే పోస్ట్ చేయసాగింది. ఆమె స్వరమాధుర్యానికి ఫిదా అయిపోయారు శ్రోతలు. ఆ ఆడియో పోస్ట్‌లకు వచ్చిన రెస్పాన్స్ చూసి లిసా వాళ్లమ్మ, కూతురి పాటల వీడియోలకూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. 👉యూట్యూబ్‌లోని ఆమె పాటల వీడియోలకు అమెరికన్ పాప్ మ్యూజిక్ కూడా స్పందించింది. 2016, గ్రామీ అవార్డ్ గెలుచుకున్న ‘కలరింగ్ బుక్’ ఆల్బమ్‌లో పాడే అవకాశాన్నిచ్చింది. 2017లో ఎమ్మీ అవార్డ్స్‌కి నామినేట్ అయిన ‘బ్రౌన్ గర్ల్స్’ వెబ్ సిరీస్‌లోనూ థీమ్ సాంగ్ పాడింది.👉పాశ్చాత్య ప్రపంచంలో లిసా అంత కీర్తి సాధించినా.. ఆమె మీద భారత్ దృష్టి పడింది మాత్రం ఆమె ‘వీరే ది వెడ్డింగ్’లోని ‘తారీఫా’ పాటను పాడి, ఇన్‌స్టాలో పోస్ట్ చేశాకే! ఇన్‌స్టాలో ఆ వీడియో చూసిన సోనమ్ కపూర్, రియా కపూర్లు ఆమెను బాలీవుడ్‌కి పిలిచి, ‘తారీఫా’ రిప్రైజ్ వర్షన్‌ను పాడించారు. దాంతో ఇక్కడా ఆమె లైమ్‌లైట్‌లోకి వచ్చింది. బాలీవుడ్ ప్రయాణాన్ని మొదలుపెట్టింది.👉‘జడ్జ్‌మెంటల్ హై క్యా’, ‘స్కై ఈజ్ పింక్’, ‘గుడ్ న్యూస్’, ‘జుగ్‌జుగ్ జియో’, ‘లైగర్’, ‘దోనో’ వంటి సినిమాల్లో ఆమె పాడిన పాటలన్నీ హిట్టే! సినిమాల్లో పాడే చాన్స్ రాగానే తనకు ఇష్టమైన పాప్ మ్యూజిక్ వరల్డ్‌కి గుడ్ బై చెప్పలేదు. అక్కడా వినిపించడానికి ప్లాన్ చేసుకుంటోంది. గాయనిగానే కాదు పాటలను రాస్తూ తన రచనా పాటవాన్నీ చూపిస్తోంది.👉క్షణం తీరిక లేని ఆమె షెడ్యూల్లో తన కోసం కాల్షీట్ సర్దే వీలుంటుందేమో చూడమని ఓటీటీ రిక్వెస్ట్ చేసింది.. ‘కాల్ మి బే’ వెబ్ సిరీస్ ఆఫర్‌తో! ఎంతో ఉత్సాహంగా ‘యెస్’ చెప్పింది లిసా. ప్రాధాన్యమున్న పాత్రలో నటించి వీక్షకులు, విమర్శల ప్రశంసలు అందుకుంటోంది. ఆ సిరీస్ ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’లో స్ట్రీమ్ అవుతోంది.సింగర్, సాంగ్ రైటర్ అయిన నాకు యాక్టింగ్ అనేది సవాలే! చాలెంజెస్ అంటే ఇష్టం కాబట్టి యాక్టర్‌గానూ ఇంట్రడ్యూస్ అయ్యాను. మంచి రోల్స్ వస్తే నటననూ కంటిన్యూ చేస్తాను.– లిసా మిశ్రా. -
Aanchal Morwan: సిగ ధగ నైపుణ్యం
ఒత్తయిన తలకట్టుతోనే అందం, ఆకర్షణ! ఆరోగ్యకరమైన జుట్టుంటే ఎన్ని సోకులైనా పోవచ్చు!అలా సెలబ్రిటీల హెయిర్‌ని హెల్దీగా ఉంచుతూ .. ఆన్‌స్క్రీన్ పాత్రలకు తగ్గట్టు, ఆఫ్ స్క్రీన్ వేడుకలకు సూట్ అయ్యేట్టు కేశాలను అలంకరిస్తూ, తారల మీద నుంచి తల తిప్పుకోనివ్వకుండా చేసేది హెయిర్ స్టయిలిస్ట్లే! ఆ లిస్ట్‌లో.. బాలీవుడ్ జపించే పేరు ఆంచల్ మోర్వానీ!ఇన్‌స్టా హ్యాండిల్ ‘హాట్ హెయిర్ బెలూన్’తో ప్రసిద్ధి!జాన్వీ కపూర్, ఖుషీ కపూర్, కృతి సనన్, దీపికా పదుకోణ్, తృప్తి డిమ్రీ, నోరా ఫతే, కియారా ఆడ్వాణీ, సుహానా ఖాన్, అనన్యా పాండే, సారా అలీ ఖాన్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్, కరీనా కపూర్ ఖాన్, కరిశ్మా కపూర్, డయానా పెంటీ, శనాయా కపూర్, దిశా పాట్నీ, మృణాల్ ఠాకూర్, రశ్మికా మందన్నా, మిథిలా పాల్కర్, యామీ గౌతమ్, అమలా పాల్, చిత్రాంగదా సింగ్, సోనాక్షీ సిన్హా, పరిణీతి చోప్రా, స్వరా భాస్కర్, రియా కపూర్.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతమందో! ఆమె చేతికి జుట్టిచ్చి.. అందాన్ని తురుముకునే సెలబ్రిటీలు! నటీమణులే కాదు మోడల్స్ కూడా ఆంచల్ చేత జుట్టు ముడిపించుకోవాలని ఆరాటపడుతుంటారు. సిల్వర్ స్క్రీన్, ర్యాంప్‌ల మీదే కాదు ఫొటో షూట్స్, రెడ్ కార్పెట్ వాక్స్, సినిమా ఈవెంట్స్, పార్టీలకూ ఆంచల్ చేసిన హెయిర్ స్టయిల్‌తోనే హాజరవుతుంటారు. సినిమా లోకానికి అవతల కూడా ఆంచల్ హెయిర్ స్టయిలింగ్కి అశేష అభిమానగణం ఉంది. పండుగలు, బర్త్‌డేలు, పెళ్లిళ్లు, పురుళ్లు ఇలా ప్రతి సందర్భానికీ ఆమె హెయిర్ స్టయిల్ని కోరుకునేవారున్నారు. ఇంత ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ ముంబై వాసి ఈ రంగంలోకి ఎలా వచ్చిందో ఆమె మాటల్లోనే తెలుసుకుందాం..‘నాకు చిన్నప్పటి నుంచీ రకరకాల జడలు వేయడమన్నా, వేయించుకోవడమన్నా చాలా ఇష్టం. క్లాస్‌లో నా ముందు కూర్చున్న ఫ్రెండ్స్‌కి జడలు వేసి టీచర్‌తో తిట్లు తినేదాన్ని. ఇంట్లో కూడా అమ్మ, నానమ్మ, అత్త, పిన్ని, కజిన్స్.. అందరినీ రకరకాల హెయిర్ స్టయిల్స్‌తో ముస్తాబు చేసేదాన్ని. నా ఈ కళకు మా అమ్మ తెగ మురిసిపోయేది. హెయిర్ స్టయిల్స్లోనే కాదు కుట్లు, అల్లికలు, పెయింటింగ్‌లో కూడా ఫస్ట్ ఉండేదాన్ని. అయితే హెయిర్ స్టయిలిస్ట్‌ను అవ్వాలని మాత్రం ఎప్పుడూ అనుకోలేదు. అసలు దాన్నో కెరీర్‌గా తీసుకుంటారనీ తెలియదప్పుడు. అందుకే ఏంబీఏ అయిపోగానే ఒక అడ్వర్టయిజ్మెంట్ కంపెనీలో చేరాను. కానీ జాబ్ శాటిస్ఫాక్షన్ ఉండేది కాదు. ఏదో మిస్ అవుతున్న భావన. దాన్ని వదిలేసి మా సొంత సంస్థలో కొంతకాలం మార్కెటింగ్ జాబ్ చేశాను. అదీ నచ్చలేదు. క్రియేటివ్ వర్క్ మీదకే పోయేది మనసు. అప్పుడు గ్రహించాను హెయిర్ స్టయిలింగే నా కాలింగ్ అని. దాని మీద రీసర్చ్ చేస్తే తెలిసింది దానికోసం స్పెషల్ కోర్సులున్నాయని. అంతే పేరెంట్స్‌కి చెప్పి లండన్ వెళ్లాను. అక్కడ Vida Sassoon Academyలో చేరాను. దాని తర్వాత అక్కడే స్టయిలింగ్కి సంబంధించే మరో రెండు కోర్సులు చేసి, ఇండియా వచ్చేశా. ఈ రంగంలో అవకాశాలైతే కనపడ్డాయి కానీ మొదట్లో కొంత స్ట్రగుల్ తప్పలేదు. భయపడలేదు. నా విద్యనే నమ్ముకున్నాను. వమ్ము చేయలేదు. ఇప్పటిదాకా వెనక్కి తిరిగి చూడలేదు. నచ్చిన పని ఇచ్చే ఆనందం అంతా ఇంతా కాదు’ అని చెబుతుంది ఆంచల్. బాలీవుడ్లో పనిచేస్తూనే, ‘హాట్ హెయిర్ బెలూన్’ పేరుతో ఇన్‌స్టాలో జుట్టు సంరక్షణకు సంబంధించిన టిప్స్ ఇస్తోంది. హెయిర్ కేర్ ట్యుటోరియల్స్ కూడా నిర్వహిస్తోంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఇన్‌స్టాలో ఆమెకు అసంఖ్యాకమైన ఫాలోయింగ్ ఉంది. ‘మనలో ఎంత క్రియేటివిటీ ఉన్నా దానికి సంబంధించిన ఫార్మల్ ఎడ్యుకేషన్ తప్పనిసరి. అది మన సృజనను సానబెడుతుంది’ అంటూ ఔత్సాహిక హెయిర్ స్టయిలిస్ట్లకు సలహా ఇస్తుంది ఆంచల్ మోర్వానీ. -
అకడమిక్ ప్రెజర్‌తో తస్మాత్ జాగ్రత్త!
యవ్వనం అంటేనే ఒక తుఫాను. అనేకానేక శారీరక, మానసిక, భావోద్వేగ, హార్మోన్ల మార్పులు ఒక్కసారిగా చుట్టుముడతాయి. వాటిని అర్థం చేసుకోలేక యువత ఒత్తిడికి లోనవుతుంటారు. ఇవి చాలవన్నట్టు పదోతరగతి, ఇంటర్మీడియట్లలో చదువుల ఒత్తిడి పెరుగుతోంది. అది ప్రాణాలు బలికోరేంత ప్రమాదకరంగా మారుతోంది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (Nఇఖఆ) డేటా ప్రకారం 2020లో సుమారు 10,500 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆ ఆత్మహత్యల్లో 40 శాతం చదువుల ఒత్తిడితో ముడిపడి ఉన్నవేనని విద్యా మంత్రిత్వ శాఖ నివేదికలో పేర్కొంది. మరికొందరు తీవ్ర మానసిక సమస్యలకు లోనవుతున్నట్లు తేలింది. తల్లిదండ్రులు, కార్పొరేట్ కాలేజీలు..తమ పిల్లల భవిష్యత్తు బాగుండాలని ఆశిస్తూ తల్లిదండ్రులు చదువు విషయంలో పిల్లల మీద వాళ్ల స్థాయికి మించిన ఒత్తిడి పెడుతున్నారు. ఇంట్లో ఉంటే చదువుకు ఇబ్బంది పడతారని హాస్టళ్లలో చేర్పిస్తున్నారు. ఇక కార్పొరేట్ కళాశాలలు కల్పించే ఒత్తిడి చెప్పనలవికాదు. వారం వారం పరీక్షలు నిర్వహిస్తూ, వాటిలో వచ్చే మార్కులను బట్టి క్లాసులు మారుస్తూ మరింత ఒత్తిడి పెంచుతున్నారు.‡ తూతూమంత్రంలా ఏడాది చివర స్ట్రెస్ మేనేజ్మెంట్ క్లాసులు నిర్వహించి చేతులు దులిపేసుకుంటున్నారు. మొదటిసారి ఇంటికి దూరంగా హాస్టళ్లలో ఉండటం, ఆటపాటలు, వ్యాయామం లేకుండా నిరంతరం పరీక్షలు, గ్రేడ్ పాయింట్లు, ర్యాంకులు వంటివన్నీ విద్యార్థుల ఆత్మవిశ్వాసంపై తీవ్రమైన ప్రభావం చూపుతున్నాయి. పర్ఫెక్షనిజం ప్రభావం.. ఇన్ని ఒత్తిళ్ల నేపథ్యంలో ఎలాగైనా సక్సెస్ సాధించాలని టీనేజర్లు భావిస్తారు. అందుకోసం అసాధ్యమైన టార్గెట్స్ పెట్టుకుంటారు. వాటిని సాధించేందుకు నిద్రమాని చదువుతుంటారు. కానీ పర్ఫెక్షనిజం ఫిక్స్డ్ మైండ్‌సెట్‌కు దారితీస్తుంది. చదువుకూ, వ్యక్తిత్వానికీ తేడా తెలుసుకోలేరు. పర్ఫెక్షనిజం వల్ల తమ తెలివితేటలు, సామర్థ్యాలు స్థిరంగా ఉంటాయని టీనేజర్లు నమ్ముతారు. ఇది వైఫల్యాలు శాశ్వతమని భావించేట్లు చేస్తుంది. దీంతో చిన్న ఫెయిల్యూర్ ఎదురైనా తట్టుకోలేక ఆందోళన, డిప్రెషన్ లాంటి మానసిక సమస్యలకు లోనవుతున్నారు. ఇష్టంలేని చదువులు..చాలామంది విద్యార్థులు క్రీడలు, సంగీతం, డిస్కష¯Œ ్స, వాలంటీరింగ్ లాంటి భిన్న రంగాల్లో రాణించాలనుకుంటారు. కానీ ఆ వైపుగా ప్రోత్సహించే తల్లిదండ్రులు తక్కువ. దాంతో ఇష్టంలేని చదువులు టీనేజర్లలో ఒత్తిడి పెంచుతోంది. మరోవైపు వారం వారం పరీక్షలు, మార్కులు, గ్రేడ్లు– టీనేజర్లను మానసికంగా, శారీరకంగా, భావోద్వేగాలపరంగా పూర్తిగా అలసిపోయేలా చేస్తున్నాయి. ప్రతి పనికీ వంద శాతం సమయం ఇవ్వలేకపోతున్నామనే అపరాధభావానికి లోనుచేస్తున్నాయి.బ్యాలెన్స్ ముఖ్యం.. అకడమిక్ ప్రెజర్ తగ్గాలంటే టీనేజర్లను తమకు నచ్చింది చదవనివ్వాలి. ఏం చదివామనేది కాదు, ఎలా చదివామనేది ముఖ్యమని తల్లిదండ్రులు గ్రహించాలి. ఇష్టంగా చదివినప్పుడు ఎలాంటి ఒత్తిడీ ఉండదు. చదువుతో పాటు స్పోర్ట్స్ లేదా వ్యాయామానికి అవకాశం కల్పించాలి. కేవలం మార్కులు, ర్యాంకులు సాధించడం మాత్రమే సక్సెస్ అని భావించకుండా ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, ఆనందమే అసలైన సక్సెస్ అని నిర్వచించాలి.చదువుల ఒత్తిడికి కారణాలు.. 👉తమ పిల్లలు అత్యున్నత కెరీర్లో ఉండాలనే తల్లిదండ్రుల అంచనాలు · ఐఐటీ, జేఈఈ, నీట్ వంటి పోటీ పరీక్షలు, ఉన్నత విద్యాసంస్థల కోసం తీవ్ర పోటీ · క్రియేటివిటీ, క్రిటికల్ థింకింగ్ కన్నా మార్కులు, ర్యాంకులపైనే ఎక్కువ దృష్టి పెట్టడం · పాఠశాలల్లో, కళాశాలల్లో కౌన్సెలింగ్ సౌకర్యాలు తక్కువగా ఉండటం 👉 ఆటపాటలకు అవకాశం లేకపోవడం, కోచింగ్, ట్యూషన్ల వల్ల అదనపు భారం · తగిన వనరుల్లేకుండానే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు పట్టణ విద్యార్థులతో పోటీ 👉 అకడమిక్స్‌ను, ట్రెడిషనల్ జెండర్ రోల్స్‌ను బ్యాలెన్స్ చేయడానికి యువతులపై అదనపు ఒత్తిడిఒత్తిడిని తగ్గించుకోవడానికి వ్యూహాలు.. 👉 మీ బలాలను అర్థం చేసుకుని వాస్తవిక లక్ష్యాలను పెట్టుకోండి · తప్పులు, వైఫల్యాలను అర్థం చేసుకుని, వాటిని సవాళ్లుగా తీసుకుని ముందుకు సాగే గ్రోత్ మైండ్ సెట్‌ను పెంపొందించుకోండి · చదువు ఎంత ముఖ్యమో నిద్ర, వ్యాయామం, విశ్రాంతి కూడా అంతే ముఖ్యమని గుర్తించండి · సరైన టైమ్ మేనేజ్మెంట్ పద్ధతులు నేర్చుకుని, అమల్లో పెట్టండి · ఒత్తిడిని ఎదుర్కోలేకపోతున్నప్పుడు మీలో మీరే బాధపడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సైకాలజిస్టుల సహాయం తీసుకోండి. -
ఈ వారం కథ: రహమాన్ కొడుకు
కోపం, బాధ కారణంగా అతనికి చిరాకుతో పిచ్చెక్కిపోయింది. మాట మాటకి ఆవేశంతో చీదరించుకుంటున్నాడు. అదే సమయంలో గోపి కనక రాకపోయుంటే ఏదో ఒక పిల్లాడి వీపు చితక్కొట్టి తన అక్కసు తీర్చుకునేవాడు. గోపి వచ్చి దూరం నుండే ‘సలాం సాహెబ్, భాయ్ రహమాన్’ అంటూ పలకరిస్తూ,‘చెప్పు ఏం జేస్తున్నావు?’ అని అడిగాడు.రహమాన్ తలకెక్కిన పిచ్చికోపం కాస్త శాంతించింది. ‘రా, గోపి కాకా సాహెబ్, సలాం’ అన్నాడు. ‘అంత కోపంగా వున్నావ్, ఏమిటి సంగతి?’ అంటూ గోపి కూర్చున్నాడు. రహమాన్ బీడీకట్ట తీసి అతని ముందు పెట్టాడు. తాను ఒక బీడీని వెలిగించుకుంటూ ‘ఏముంటది కాకా, ఈ తరం పిల్లల బుద్ధి భ్రష్టు పట్టింది. ఎలాంటి కాలం వచ్చింది! తల్లిదండ్రులంటే లెక్కలేదు, వాళ్లనర్థం చేసుకోరు..’గోపి బీడీ వెలిగించి ఒక గట్టి దమ్ములాగి, నవ్వుకుంటూ ‘రహమాన్, పరిస్థితులెప్పుడూ ఇలాగే ఉంటాయి. నాకు చాలా జ్ఞాపకం.. మా నాయన నెత్తి బాదుకుని చెప్పడం, నేను ఆయన మాటను బేఖాతరు చేయడం! ఆయనెంత చెప్పినా నేనెన్నడూ బడికెళ్లి హాజరివ్వలేదు. ఈ ముసలి వయసులో ఆ రోజులన్నీ గుర్తుకొస్తుంటాయి. ఆలోచిస్తూంటాను.. నాయన చెప్పినట్టే చదువుకొనివుంటే, రెండక్షరాలు పొట్టలో పడేవి కదా అని!’ అన్నాడు.మధ్యలోనే మాటల్ని తుంచేస్తూ రహమాన్ ‘ఐతే కాకా, మత్తు ఎక్కిపోతుందా? అక్షరాల్లో మర్యాద కన్నా మత్తు ఉంటుందా? ఈ రెండక్షరాల మత్తుతోనే కదా సలీం ఎగిరెగిరి పడుతున్నాడు? ఈ బస్తీలో ఉండటానికి నా మనసు ఇష్టపడటం లేదు, అందరూ మురికిగా వుంటారు, మాట్లాడే మర్యాద తెలీదు, దొంగతనాలు చేయకుండా ఉండలేరు.. అంటూ వాగుతూ వుండాలా?’గోపి ఆశ్చర్యంతో ‘సలీం అలా అన్నాడా?’ అడిగాడు. ‘ ఆ.. ఔను, అలాగే అన్నాడు. ఇంకా ఏమన్నాడో విను! మనం మనుషులమే కాదు అంటాడు. జంతువులం అంటాడు. అంతేకాదు మురికి కాలువల్లోని పురుగుల్లా బతుకుతున్నామంటాడు..’ అంటూ చెప్పుకుపోతున్న రహమాన్ కళ్లు ఎర్రబడ్డాయి. శరీరం వణకసాగింది. అప్పటిదాకా తాకని హుక్కాని, కాలితో గట్టిగా తన్ని తనవైపు జరుపుకున్నాడు. ఆ తాకిడికి హుక్కాలోని ‘చిల్లం’ కిందపడిపోయింది. అంతే అందులో వున్న నిప్పు చిందరవందరగా చెదిరిపోయింది. ‘కరీమున్, ఓ మొండిదానా, ఎక్కడ చచ్చావ్? తీసుకపో ఈ హుక్కాను, సాలా నన్ను గుండా అంటాడా!’ అంటూ గట్టిగా అరిచాడు.రహమాన్ ఆవేశాన్ని చూసి గోపి ‘వాడి తండ్రి స్కూల్లో చప్రాసీగా చేశాడు గదా!’ అన్నాడు. ‘ఔను, అదే ప్రభావం వాడి మీద పడి చెడగొట్టింది. చదువు లేదు, కానీ, ప్రతిక్షణం చదువుకున్న వారి మధ్య మసలుకునేవాడు. కానీ సాలేగాడు ఏం జేశాడు? నిండు యవ్వనంలో కాళ్లు చాపి కాటికిపోయాడు. పెళ్లాన్ని ఎటూ గాకుండా జేశాడు. తెలియదు, ఏం ఖర్మనో, ఎవరి నెత్తి మీది బరువో! వాడి తల్లి వచ్చినా ఎదురుగ ధర్నా చేసి కూర్చుంటుంది. ఆరోజు అలాగే చేసింది. ఈ రోజు కూడా నా నెత్తి మీదే మోపింది. ఎవరైనా చెబితే బాగుండేది. సలీం, రహమాన్ కొడుకు కాదని, అదేమైన మాటనా కాకా!’ఎక్కడినుండో వచ్చి రహమాన్ కంట్లో నలుసు పడినట్లుంది. గట్టిగా నులుముకోసాగాడు. అదే సమయంలో.. చెప్పాలా వద్దా అనుకుంటూ గోపి ‘సలీం తల్లి చాలా మంచి మనసుగలావిడ!’ అన్నాడు.వెంటనే రహమాన్ అందుకున్నాడు ‘కాకా, ఆమె దేవత, అంత మంచి మనసుగలావిడ ఈ రోజుల్లో వెతికినా కనబడదు. ఆమె భర్త పేరు ఎత్తేదని చెప్పడానికి ఎవరికైనా ధైర్యం ఉందా? ప్రాణమంతా ధారబోసి ఎంతసేవ జేసిందో! ఎప్పుడూ తలెత్తి జూసేదే కాదు. కాకా, దాని ఫలితమే ఇది. నీ నుండి ఏమైనా దాపరికం ఉందా! నన్నెప్పుడైనా అక్కడిక్కడ చూశావా?’ అంటూ. గోపి కంగారుగా ‘ఎప్పుడూ లేదు రహమాన్, ముఖం చూసి చెప్పడం కాదు, న్యాయమైన మాటే. ఇదే మాట ఐదు పంచాయతీల పెద్దల ముందు చెప్పమన్నా చెప్పడానికి సిద్ధంగా వున్నాను’ అన్నాడు. ‘ఇక దొంగతనం విషయానికొస్తే, కన్నం వేయడానికి ఎవరింటికి ఎవరెళ్లారు? పొలాల నుండి గడ్డిగాదెం కోసుకొని నువ్వు కూడా తెచ్చుకుంటావు గదా కాకా!’‘ఆ.. తెస్తాను, ఇందులో దాపరికం మాటేముంది? ఐనా, ఎందుకు తెచ్చుకోకూడదు? మనం అంతకు దిగజారివున్నామా? పెద్దమనుషులు రోజూ జేబులు నింపుకొని ఇంటికొస్తారు.నిజం చెప్పనా రహమాన్! జీతం డబ్బులిచ్చేటప్పుడు వేలిముద్ర ముందుగానే తీసుకుంటారు. పైసలిచ్చేటప్పుడు మాత్రం పేదోడి వైపు చూసి ఎంతలా చీదరించుకుంటారంటే.. పాపం! ఆ అమాయకుడు మొహం చూస్తూ మాటరాక ఉండిపోతాడు. మంచితనమన్నది ఈ లోకంలో ఎక్కడున్నది? అంతా చీకటి రాజ్యమే! చెప్పుకోవడానికి దిక్కులేని ఈ ప్రభుత్వంలో మన నుదుటి రాత ఎలా వుందో తెలియదు! రాత్రి – పగలు లేకుండా నాలుగు రెట్లు అభివృద్ధి జరుగుతుంది అంటారు. కానీ, గాంధీతాతకు సంబంధించి ఏ విషయం బయటికి రాదు’ అన్నాడు గోపి. అతని మాటలు పట్టించుకోకుండానే రహమాన్ అంతే వేగంగా సమాధానమిచ్చాడు, ‘పెద్దమనుషుల దాకా ఎందుకు? ఈ అధికారులున్నారు, చూశావా? అందరూ మహానుభావులే.. వారేం తక్కువ గాదు! దేనికీ నయాపైస బయటికి తీయరు. ఇంకా కాకా.. నిన్న మొన్నటి పోరగాడు ఈ సలీం మనల్ని గుండా అంటాడు. వాళ్లే గుండా సాలేగాళ్లు. నిజం కాదా కాకా, క్లబ్బుల్లో వీళ్లు చేసే బద్మాష్గిరీ తప్ప ఇంకేముంది? సారా తాగేది వాళ్లే, జూదం ఆడేదీ వాళ్లే, ఇంకా, ఇంకా ..!’ అంటూ.‘ఇంకా ఏమిటి? మా సాహెబ్ దగ్గరకి ప్రతిరోజు క్లబ్లో పనిచేసే చప్రాసీ వస్తాడు. అన్నీ చెప్తాడు. ఒకరోజు వంద, ఇంకోరోజు వంద యాభై పోగొట్టుకున్నా.. అతని భార్య వుంది చూశావూ.. అదృష్టాన్ని నెత్తి మీద పెట్టుకొని వస్తుంది. ఎప్పుడు పోయినా వంద రెండొందలు కొట్టుకొని వస్తది.’‘మేమ్సాబ్, కాకా నీకేం తెలుసు, ఆమె సంగతే వేరు. ఈ సాహెబ్ ఎంత మొనగాడో! ఈ సాహెబే ఎందుకు, పేరు మోసిన వకీళ్లు, బారిస్టర్లు, వ్యాపారులు అందరూ ఈ మధ్య క్లబ్బులకు అలవాటు పడ్డారు. ముసల్మానులు సారా తాగడం ‘హరామ్’ అంటారు. కానీ, అక్కడ కూర్చొని విస్కీ, జిన్, పోర్ట్ అన్నీ లాగిస్తారు. ఇక ఆడాళ్ల సంగతి చెప్పకు, ఎంతగా దిగజారి పోయారంటే పరాయి మగవారి నడుం మీద చెయ్యి వేసి తిరుగుతారు, కలిసి డాన్స్ చేస్తారు. ఇకఇకలు పకపకలతో సంభాషణలు. కాకా, ఎంతసేపు అక్కడ వుంటారో అంతసేపు పక్కవాడి మీద చాడీలు, వెటకారాలు.. రోజంతా గుసగుసలు పోతారు. ఇక అవకాశం దొరికితే ఎవరు ఎవరితో పోతారో తెలియదు. ఒక రోజు గెలిచిన సంతోషంలో డ్రామా వేశారు. పోలీసు పెద్దగా లాలాజీ నటించారు. జనాలను నవ్విస్తూ ఉండిపోయారు. మేజర్ సాహెబ్.. ఆయన భార్యను డాక్ బంగ్లాకు షికారుకు తీసుకెళ్లాడు. ఇదీ పెద్ద మనుషుల నడవడిక. వీళ్లు మనకు పెద్దవాళ్లు. మన అదృష్టాన్ని నిర్ణయించేవారు.’గోపి మరోమారు గట్టిగా దమ్ములాగి గంభీరంగా ‘రహమాన్, కనబడ్డానికి ఎంత పెద్ద మనుషులో అంత చిన్నగుణం వారిది’ అన్నాడు. ‘అంతా పైపై మెరుగులే!’‘మరింకేం!’ ‘వీళ్ల కోసమా, సలీం మనల్ని మర్యాద తెలీనివాళ్లు, అనాగరికులు, తెలివి తక్కువవాళ్లు.. ఇంకా ఏమేమి వాగాడో! నేను కూడా నిర్ణయించుకున్నాను, వాడితో తాడోపేడో తేల్చుకోవాలని. వాణ్ణెప్పుడూ పరాయివాడిగా చూడలేదు కాబట్టి వాడన్ని కూతలు కూస్తున్నా ఊరుకున్నాను. లేకపోతేనా, లేకపోతేనా..’ గోపి తన చేతికర్ర ఎత్తుకుంటూ,‘రహమాన్, ఏమైనా కానీ, సలీం నీ కొడుకే అని అనుకుంటున్నారు. వయసులో వున్న కుర్రాడు.. ‘అబే , తబే’ అని తిట్టమాకు.. అర్థమైందా! ఈ తరం ఇలాగే నడుస్తుంది. మన ముందు తరాలు కూడా ఇలాగే ఉండేవి. కాకపొతే తన్నులు తిని నోరెత్తకపోయేవారు. కానీ, ఇప్పటి పిల్లలు ఏకంగా జవాబే ఇచ్చేస్తున్నారు’ అన్నాడు.రహమాన్ ఆవేశంతోనే వున్నాడు.. ‘నేను వాడి సమాధానాలేవీ మనసులో పెట్టుకోను కాకా, నరకంలో పడనీ.. నాకేం సంబంధం వాడితో? ఐనా కాకా, నేనెందుకు కొడతాను వాణ్ణి? నా చేతులకేమైనా దురదా? కానీ రెండు మాటలు మాత్రం అడుగుతాను. ఆ తరువాత వాడి దారి అటో, ఇటో! ఇంకా కాకా, ఆ సాలేగాని మీద నాకేమీ ఫికర్ లేదు. ఫికర్ ఏమైనా వుందీ అంటే వాడి తల్లి మీదే. కన్నకొడుకు కదా, ఏదో కాస్త బుద్ధితో మంచిగుంటాడని ఆమెకు ఆశ ఉంటుంది కదా కాకా. ఎంతోకొంత చదివి, ఎక్కడో ఇంత గుమస్తా ఉద్యోగం చేసుకుంటూ వాడి వంశం పేరు నిలబెడతాడని అనుకున్నాను. చదువెన్నడూ చెడిపోదు గదా, ఆ చదువు సంగతి దేవుడెరుగు, ఎవ్వరితోనూ సక్కగుండడు’ అన్నాడు.‘ఔను రహమాన్, చదివిన చదువు ఎన్నడూ వృథా పోదు. యజమాని అనుకున్నా చదువును చెరిపేయలేడు. ఇంత గాఢమైన గీత ఆ చదువుల తల్లే గీసింది. మన ఇజ్జత్ మన చేతుల్లోనే వుంది. ఎక్కువగా మందలించకు. చదువుకున్న వారికి అభిమానం ఎక్కువ, అర్థమైందా?’ అన్నాడు గోపి. ‘అర్థమైంది కాకా!’గోపి లేచి నిలబడ్డాడు. తన కర్ర తీసుకొని గడ్డి మోపుని భుజాన వేసుకొని ‘సలాం’ అంటూ వెళ్లిపోయాడు. ఎటూ తోచని స్థితిలో వున్న రహమాన్ శూన్యంలోకి చూస్తూండిపోయాడు. మనసులో అర్థం కాని ఆలోచనలు చెలరేగి అలజడి సృష్టి్టస్తున్నాయి. అవి జలపాతపు దూకుడులా వేగంగా వున్న అనుభవాన్నిస్తూ బాధిస్తున్నాయి. ఆలోచనలు, అలజడి, బాధ తీవ్రత ఎక్కువగావడం తప్ప మరేమీ లాభం లేదు. సానుభూతి, విషాదం లాంటి పలకరింపులు ఆ బాధ నుండి ఉపశమనం కలిగించలేవని తెలిసి చివరికి లేచి లోపలికెళ్లిపోయాడు.ఇంట్లో భయంకరమైన నిశ్శబ్దం కమ్ముకుంది. పిల్లలు ఆడుకొని ఇంకా ఇంటికి రానేలేదు. రహమాన్ భార్య రొట్టెలు కాలుస్తోంది. కమ్మటి కూర వాసన అతని నాసికకు చేరింది. తన దృష్టిని మరల్చి భార్య వైపు చూశాడు. ప్రశాంతంగా తన పనిలో నిమగ్నమైపోయింది. రొట్టెలు చేస్తూ వుంటే ఆమె చెవుల జుంకాలు వేగంగా కదుల్తున్నాయి. నెత్తికి చుట్టుకున్న మురికి గుడ్డ జారి భుజంపై పడింది. వయసు పైబడుతున్నా ముఖం మీద ఆ యవ్వన ఛాయలు ఇంకా తేలిపోలేదు. మేని ఛాయ తెలుపు కాదు, అలాగని నలుపూ కాదు. ఆమె కళ్లల్లో ఏదో తెలియని మత్తు వుంది. ఆ కళ్లే ఆమె అందాన్ని ద్విగుణీకృతం చేస్తున్నాయి. ఎవరైనా ఆమె వైపు ఒక్కసారి చూస్తే చాలు అలా చేష్టలుడిగి నిలబడిపోవాల్సిందే. రహమాన్ అలా నిశ్చేష్టుడైపోయేగదా.. ఆమె మత్తెక్కించే కళ్లల్లో మునిగిపోయాడు. లేకపోతే..!అతన్ని చూసి అతని భార్య,‘అంతలా ఆవేశపడి పోతావెందుకు? బయటి వాళ్లకు ఇంటి విషయాలు చెప్పుకుంటారా ఎవరైనా?’ అంది. రహమాన్ కాస్త సంభాళించుకొని ‘బయటివాళ్లెదురుగా ఏమి? ఇప్పుడు నీళ్లు నెత్తి మీదికి వచ్చాయి. రేపు ఇంటి నుండి వెళ్లిపోతే ఈ సమాజం చెవుల్లో దూది నింపుకొని ఉండిపోతుందా.. లేక కళ్లు మూసుకొని వుండిపోతుందా!’ అన్నాడు.భార్యకు బాధ కలిగింది. ‘తండ్రీకొడుకులు ప్రపంచంలో ఎక్కడా విడిపోరా?’‘ఎవరన్నారు వాడు నా కొడుకని?’ ‘మరి ఎవరి కొడుకు?’ ‘నాకేం తెలుసు?’ ‘ఏదీ ఓసారి ఇటు చూడూ.. నన్ను కూడా విననీ?’విసుక్కుంటూ, ‘ఏం వింటావ్? నాకే పుడితే ఇలా అంటాడా? నాలుక పీకేసే వాడిని సాలేగానిది?’‘చూస్తాను, ఎవరెవరి నాలుకలు పీకేస్తావో! ఇప్పటిదాకా ఒక్కమాట కూడా నిలబెట్టుకోలేదు!’ ‘పిల్లలు, వయసొచ్చిన వారు ఒక్కటే అంటావా?’ ‘కాకపోవచ్చు కానీ, వాడి లక్షణాలు చూస్తూంటే ముందు ముందు ఏమౌతాడో తెలుస్తోంది. వయసులోకొచ్చాడు అంటున్నావు, ఏమంత వయసొచ్చింది? పచ్చి వయసు. ఏదో ఒకమాట నోరు జారాడు.. దాన్ని పట్టుకొని వేలాడుతున్నావు. నీకు సంబంధం లేదంటున్నావు కదా! అందుకేనేమో, నీకే సంబంధముంటే ఇంతలా డప్పు వాయించుకుంటూ తిరుగుతావా! మన తప్పులు మన కళ్లకు కనబడవు. వేరే వాళ్లదైతే చిన్న తప్పైనా కొండలా చేసుకొని తిరుగుతావు.’ రహమాన్ ఎలాంటి వాడైనా అంత మూర్ఖుడు కాదు. అతనికర్థమైంది.. తాను భార్య మనసును నొప్పించాడని! కానీ ఏం జేయగలడు? సలీం అంటే తనకేం ప్రేమ లేదా? కడుపు కట్టుకొని తనే కదా అతన్ని స్కూలుకి పంపింది. అతని కోసమే గదా, అవసరం పడితే పెద్దమనుషుల ముందు, డిప్టీల ముందు, అధికారుల ముందు కాళ్లావేళ్లా పడి దేహీ అని అర్థిస్తాడు. తల్లడిల్లిపోతాడు. ఇంత గాఢమైన ప్రేమ వుంది కనుకనే ఇంతలా బాధపడేది. పరాయివాడైతే..’అప్పుడే రహమాన్ నలుగురు పిల్లలు బయట నుండి అల్లరి చేస్తూ వచ్చారు. దుమ్ము, ధూళి కొట్టుకుపోయి వున్నారు. మురికిగా వున్నా, అర్ధనగ్నంగా వున్నా వాళ్లు సంతోషంగా వున్నారు. అందరి కంటే పెద్దమ్మాయి పన్నెండేళ్ల వయసుంటది. వస్తూనే సంతోషంతో, ‘అమ్మీ, ఈ రోజు మేము భయ్యా వెళ్లే చోటుకి వెళ్లాం’ అంది. రహమాన్‌కు ఆశ్చర్యం కలిగింది. కానీ మొహం మాడ్చుకొనే వున్నాడు. గట్టి గొంతుతో ‘ఎక్కడికి పోయినవే దయ్యమా?’ అడిగాడు. అమ్మాయి భయపడిపోయింది. ‘భయ్యా వెళ్లిన చోటికి’ గాభరాపడుతూ అంది. ‘ఏ చోటు?’‘భయ్యా అక్కడికెళ్తుంటాడు గదా, దూరం..’ చిన్నకొడుకు పదేళ్ల వయసుంటుంది, వెంటనే అందుకున్నాడు.‘అబ్బా.. అక్కడ చాలామంది వున్నారు.’ మూడోవాడు ఎనిమిదేళ్ల కుర్రాడు ముందుకొచ్చి,‘అక్కడ లెక్చర్ ఇచ్చారు’ అన్నాడు. రహమాన్ తికమకచెంది ‘లెక్చరా?’ అన్నాడు. ‘ఔను, అబ్బా.. లెక్చర్లు అయినయి. భయ్యా కూడా లెక్చర్ ఇచ్చాడు. వచ్చిన జనాలు చప్పట్లు కొట్టి మెచ్చుకున్నారు’ అని కూతురు చెప్పింది.అది విన్న అమ్మ ముఖం వికసించింది. గర్వంగా ఒకసారి రహమాన్ వైపు చూసి మళ్లీ అడిగింది, ‘ఏం చెప్పాడు?’ అప్పటిదాకా భయంతో ముడుచుకుపోయిన కూతురు తల్లి ప్రశ్నకు రెట్టించిన ఉత్సాహంతో ‘అమ్మీ.. భయ్యా చాలా చాలా మాటలు చెప్పాడు. మనం మురికిగా ఉంటామని, మనకు చదువు రాదని, మనం దొంగతనాలు చేస్తామని, మనకు తిండి దొరకదు, మనకు మాట్లాడే పద్ధతి తెల్వదని.. ఇలా ..’చిరాకుపడుతూ రహమాన్ ‘విన్నావా, నువ్వే?’ అన్నాడు.భార్య విసుక్కుంటూ ‘విన్నాను, ఔను, ఇంకా ఏం సంగతులు లాతీ?’ అడిగింది. పిల్లాడు చెప్పాడు, ‘నేను చెప్పనా అమ్మీ.. భయ్యా ఇంకా ఏమన్నాడంటే, ఇందులో మన తప్పే వుంది అన్నాడు.’‘ఔను’ కూతురు అందుకుంది. ‘పెద్దమనుషులు కావాలనే మనల్ని తోక్కేస్తున్నారు. ఐనా మనం నోరు విప్పం’ అంటూ తండ్రి వైపు తిరిగి ‘అబ్బా, ఈ మనుషులు ఎవరు?’ అడిగింది. అబ్బా మాత్రం దయ్యం పట్టినట్లు కూర్చున్నాడు. ఏమంటాడు? పిల్లాడు చెప్పసాగాడు,‘అబ్బా, వాళ్లలో ఎవరైతే పెద్దమనుషులుగా వున్నారో అందరూ ఇదే మాట అన్నారు. మేము కూడా మనుషులమే, మాకూ జీవించే హక్కు వుంది, మనమంతా మేల్కోవాలి అని!’ అమ్మీ ఒక దీర్ఘ శ్వాస తీసుకుంది. ముఖం వెలుగుతో నిండిపోయింది . ‘వింటున్నావా, సలీం మాటలు..’ రహమాన్ ఇప్పుడు కూడా నోరు విప్పలేదు. కూతురు అంది,‘ఇంకా అమ్మీ.. భయ్యా నాతో అన్నాడు, ఇక నేను ఇంటికి రాను అని.’‘రానన్నాడా?’‘ఔను అమ్మీ..’రహమాన్ మత్తు ఒక్కసారిగా దిగిపోయింది, ‘ఎందుకు రాడు, మనం మురికిగా, అసహ్యంగా ..?’‘కాదు అబ్బా..’ కూతురు గాంభీర్యాన్ని పులుముకొని చెప్పింది.. ‘భయ్యా నాతో చెప్పాడు, ఇక నుండి ఈ ఇంట్లో ఉండను, కొత్త ఇల్లు తీసుకుంటాను, చాలా మంచి ఇల్లు, శుభ్రంగా వుండే ఇల్లు. అబ్బాతో చెప్పు, అక్కడే ఉంటే గొడవలవుతాయి.. మనపై ఎప్పుడూ పోలీసులు ఒక కన్నేసి వుంచుతారు. ఒకవేళ పోలీసులే వస్తే అబ్బా ఉద్యోగం వున్నది కూడా ఊడిపోతుంది అని..!’కానీ, తను అబ్బా ఐతే కదా చెప్పడానికి.. భూకంపం వచ్చినట్లు అతని తల పగిలి పోసాగింది. తలగిర్రున తిరగసాగింది, ఆగకుండా! మూల రచయిత పరిచయం :సుప్రసిద్ధ హిందీ రచయిత విష్ణు ప్రభాకర్ ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్ నగర్లో, 1912 జూన్ 21న జన్మించారు. కథ, నవల, కవిత్వం, విమర్శ, నాటకం, బాల సాహిత్యం ఇలా అనేక ప్రక్రియల్లో రచనలు చేసిన సాహితీవేత్త. ఆయన రాసిన నవలల్లో ఢల్ తీ రాత్, స్వప్నమయి, అర్ధనారీశ్వర్, పర్ఛాయీ, కథల్లో ‘రహమాన్ కా బేటా’ ప్రముఖమైనవి. మూర్తి దేవి సమ్మాన్, సాహిత్య అకాడమీ, సోవియట్‌ల్యాండ్ నెహ్రూ అవార్డు, పద్మభూషణ్ వంటి పురస్కారాలందుకున్నారు. 2009, ఏప్రిల్ 11న ఢిల్లీలో మరణించారు.రహమాన్ ఎలాంటి వాడైనా అంత మూర్ఖుడు కాదు. అతనికర్థమైంది.. తాను భార్య మనసును నొప్పించాడని! కానీ ఏం జేయగలడు? సలీం అంటే తనకేం ప్రేమ లేదా? కడుపు కట్టుకొని తనే కదా అతన్ని స్కూలుకి పంపింది. అతని కోసమే గదా, అవసరం పడితే పెద్దమనుషుల ముందు, డిప్టీల ముందు, అధికారుల ముందు కాళ్లావేళ్లా పడి దేహీ అని అర్థిస్తాడు. తల్లడిల్లిపోతాడు. ఇంత గాఢమైన ప్రేమ వుంది కనుకనే ఇంతలా బాధపడేది.హిందీ కథ : రహమాన్ కా బేటా మూల రచయిత : విష్ణు ప్రభాకర్ తెలుగు అనువాదం: డా. రూప్ కుమార్ డబ్బీకార్ -
అడవి మొక్క
శిశిరానికి ఆకులు రాలుస్తున్న ఒక పెద్ద వేపచెట్టు మొదట్లో గోధుమ రంగు ప్లాస్టిక్ పైపు పెట్టి నీళ్ళు పడుతోంది కరుణ. రెండు చేతులకు చెరొక రెండు డజన్ల గాజులు వేసుకుని, పడమటి ఎండ మొహం మీద పడుతుంటే, చీర తడిసిపోకుండా సర్దుకుంటూ, మొక్కలకు నీళ్ళు పడుతోందామె. ఓ వైపు మొత్తం కొత్త పూల కుండీలు, మరోపక్క కాయగూరల పాదులు, మరోపక్క వేప, మామిడి చెట్లు.. మధ్యలో రెండు చిన్న గదులతో డాబా ఇల్లు.‘విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం.. ఈ మూడు జిల్లాల్లో ఇంత అందమైన ఇల్లు మరొకటి లేదు. ఏమంటావ్’ అంటాడు కుమార్ ఆమెతో. ‘అవునవును’ అని భర్త వైపు అంగీకారంగా చూస్తూ నవ్వుతుంది కరుణ.కుమార్ విశాఖపట్నంలో టూరిస్ట్ ఆపరేటర్‌గా పని చేస్తూ ఉంటాడు. ఉత్తరాంధ్రలోని పర్యాటక ప్రాంతాలకు టూరిస్టులను తన ట్వంటీఫైవ్ సీటర్ వ్యాన్‌లో తీసుకెళ్ళి వస్తూ వుంటాడు. వారంలో నాలుగైదు రోజులు ఉండడు. విశాఖపట్నంలో కాపురం పెట్టేంత స్తోమత లేక కాశీబుగ్గలో పెట్టాడు. భార్య సిటీ మాట ఎత్తకుండా ఇలా ఇంటిని పొగుడుతుంటాడు. ఉన్న దాంట్లో సంసారాన్ని సర్దడానికి, తనని సంతోష పెట్టడానికి భర్త పడే ఆపసోపాలు గుర్తొచ్చి నవ్వుకుంది కరుణ. ఫోన్ చేయాలని బలంగా అనిపించింది. టూర్లో ఉన్నప్పుడు సాధారణంగా చేయదు.. ఏ బిజీలో ఉంటాడోనని. కాని ఇవాళ తప్పేలా లేదు. పొట్ట నిమురుకుంది. నాలుగురోజులుగా అనుమానంగా ఉంటే ఉదయం కిట్ తెచ్చుకుని టెస్ట్ చేసుకుంది. అవును. తమ తోటలోకి దోగాడే చిట్టిపాదాలు రానున్నాయి.భర్తకు ఫోన్ చేసింది. కలవలేదు. అయితే ఆ సమయానికి కుమార్ చాలా ఆందోళనగా ఉన్నాడని ఆమెకు తెలియదు. కాంబాలకొండ అడవుల మధ్యలో గుడారాలలో నైట్ క్యాంపు ముందురోజు రాత్రే ముగిసింది. ఎప్పటిలాగే క్యాంపుకని 25 మంది యువ పర్యాటకులను తీసుకుని వెళ్ళాడు. అందమైన కటికి జలపాతం చేరుకోవడానికి చేసిన ట్రెక్కింగ్, బొర్రాగుహలలో సందడి, అరకు ట్రైబల్ మ్యూజియం.. ఇలా ట్రిప్ మొత్తం సరదాగా పూర్తి చేసుకుని నైట్ క్యాంపుకు వచ్చేశారు. అంతా బాగా సాగింది. ఉదయం 6 గంటలకు తిరుగు ప్రయాణం అని చెప్పాడు కుమార్. తెల్లవారి అందరూ రెడీ అయ్యి వ్యాన్ దగ్గరకు వచ్చేశారు. లెక్క చూసుకుంటే ఒక అమ్మాయి కనపడలేదు. ఆ అమ్మాయి ట్రిప్పుకి కూడా ఒంటరిగా వచ్చింది. బ్యాగు, చెప్పులు, ఫోను అన్నీ ఆమె టెన్టులో వున్నాయి కాని ఆమె అక్కడ లేదు. కుమార్ దగ్గర వున్న లిస్టులో ఆమె పేరు ‘షర్కియా’ అని వుంది. ఇతర వివరాలు ఏమీ ఉండకపోవడంతో ఫోను చేశాడు. ఫోను టెంట్లో నుంచే మోగుతోంది. అందరూ ఆమె కోసం ఎదురు చూస్తూ ఏదైనా వాక్‌కి లేదా ఫొటోల కోసం వెళ్ళిందేమో అని మాట్లాడుకుంటున్నారు. కొందరు ‘షర్కియా గారూ’ అంటూ గాలించడం మొదలు పెట్టారు. ఆమెతో రెండు రోజుల నుండి కలసి ప్రయాణం చేసిన ఇద్దరు యువతులు ముందుకు వచ్చి ‘ఆ అమ్మాయి కాకినాడ నుండి వచ్చాను అని చెప్పింది. ఈ అడవికి చాలాసార్లు వచ్చాను కానీ రాత్రి క్యాంపు చేయడం ఇదే మొదటిసారి అని చెప్పింది. ఆమెకు ఒక చేయి లేదు. ఉన్నది కృత్రిమ చేయి. గ్లౌసు తీసే వరకు మేము కూడా గమనించలేదు’ అని తెల్సిన సమాచారం ఇచ్చారు. సమయం పదిన్నర అయ్యింది. మిగతా టూరిస్ట్‌లలో విశాఖపట్నం నుండి విమానం ఎక్కాల్సిన వారు వున్నారు. వారికి ఆలస్యం అవుతోంది. కొందరు కాలేజీ పిల్లలు ‘ఇంట్లో రెండు రోజుల ట్రిప్ అని చెప్పి వచ్చాము ఆలస్యం ఐతే ఇబ్బంది అవుతుంది’ అంటూ కుమార్‌తో చెబుతున్నారు.పరిస్థితి కాంప్లికేట్ అవుతోంది అని అర్థం అయింది కుమార్‌కి. తప్పక ఒక నిర్ణయం తీసుకోవాలి. మిస్ అయిన అమ్మాయి కోసం తాను ఆగిపోయి అందరినీ వేరే బస్ మాట్లాడి వారికి క్షమాపణలు చెప్పి విశాఖపట్నం పంపించాడు. అన్నీ పోను మిగిలే పది వేలు.. ఇపుడా డబ్బు కూడా బస్కి ఇచ్చేయాలి. కానీ తప్పదు. పొద్దున పదకొండు కావొస్తోంది. క్యాంపుకు దగ్గరలోనే చెక్‌పోస్టులో ఉన్న ఫారెస్ట్ గార్డ్లకు విషయం తెలిసింది. అమ్మాయి నాలుగు గంటల నుండి కనపడటం లేదు అనగానే వారికి కూడా భయం మొదలు అయింది. వయసులో వున్న ఆడపిల్ల, అడవిలో నుండి టింబర్ డిపోకు వెళ్ళే లారీలు చాలానే ఉంటాయి. ఏ లారీవాడు ఆపి తీసుకెళ్ళి పోయినా చేయగలిగేది ఏమీ లేదు. భయం అంతకంతకూ పెరిగిపోతోంది. అమ్మాయి ఫోనుకి ఎవరైనా ఫోను చేస్తారేమో వివరాలు తెలుస్తాయి అని గార్డ్లు ఆమె ఫోను చేతుల్లో పెట్టుకుని ఎదురు చూస్తున్నారు. ‘పదండి వెతుకుదాం’ అని అడవి దారి పట్టారు. సూర్యుడు మొహం మీద నుండి మాడు మీదకు వచ్చి తాండవం చేయడానికి సిద్ధం ఐపోతున్నాడు. చుట్టూ నిశ్శబ్దం. వెతుకుతూనే వున్నారు. పన్నెండు అవుతూ ఉండగా వారంతా ఒక కొండ ఎక్కి దిగేశారు.. సెలయేరు చప్పుడు గట్టిగా దగ్గరగా వినపడుతోంది.. ఆ అమ్మాయి ఏమైనా కిందకి దిగిందేమో అని ఆశగా చూశారు. చుట్టూ ఊబి గుంటలు వుండే సెలయేరు కావడంతో ఎవరూ అటుగా వెళ్లరు. అటువంటిది ఆ సెలయేరుకి అవతలి గట్టు మీద నీలిరంగు దుస్తుల ఆకారం ఉన్నట్టు కనిపించింది. గబగబ దిగి అటువైపుగా అడుగులు వేశారు. దగ్గరకి వెళ్ళేసరికి ఆ అమ్మాయి ఒక ఊబి గుంటలో కాళ్లు దిగబడి కనిపించింది. వీరి అలికిడికి ‘ఇక్కడున్నాను.. ఇక్కడా’ అని అరిచింది. నీటి మధ్యలో బండరాళ్ళు వున్నాయి. పుస్తకం, పెన్ను, కృత్రిమ చేయిని బండరాయి మీద విడిచి అవతలి ఒడ్డుకు వెళ్ళి తిరిగి వచ్చే సమయంలో ఊబిలో చిక్కుకున్నట్టు పరిసరాలు చూస్తే అర్థం అవుతోంది. ఆ అమ్మాయికి ఏమీ కాలేదని అర్థమైన కుమార్‌కు ప్రాణం తిరిగి వచ్చినట్లు అయింది. ‘ఏమ్మా ఇక్కడకి ఎందుకు వచ్చారు.. మీ సరదాలు మా చావుకి వస్తాయమ్మా. చూస్తే చదువుకున్న దానిలా ఉన్నావు.. ఎందుకు ఇక్కడకి వచ్చావు. అసలెలా ఊబిలో ఇరుక్కున్నావు’ అని కోపంగా అడిగేశాడు. ఈలోపు గార్డులు ఆమెను బయటకు లాగారు. ఆ అమ్మాయి ఏమీ మాట్లాడలేదు. మౌనంగా ఉంది. అప్పటికి కుమార్ కోపం తగ్గింది. గట్టిగా తిట్టానా అనుకున్నాడు. ఆ అమ్మాయి కోలుకుని–‘ఈ అడవి నాకు కొత్త కాదు. నేను ఇదే అడవిలో పుట్టి పెరిగాను. మా అమ్మ నాన్న నక్సలైట్స్. నాకు పన్నెండేళ్లు వుండగా నా కళ్ళ ముందే మా అమ్మను చంపేశారు పోలీసులు. మా అమ్మ ఇదిగో ఇదే చోట సమాధి అయ్యింది. ఈరోజు మా అమ్మ చనిపోయిన రోజు.. మా నాన్న ఇక్కడకు వస్తాడనే ఆశతో వచ్చాను. కాని ఆయన బతికి ఉన్నాడో లేదో కూడా తెలియడం లేదు’ అంది.గార్డ్లు అలర్ట్ అయ్యారు.‘అమ్మ చనిపోయాక మా నాన్న ఒక విలేఖరి సహాయంతో నన్ను రంపచోడవరంలో ప్రభుత్వ హాస్టలుకు పంపించాడు. ఆ విలేఖరి రెండేళ్ల తర్వాత నన్ను అమ్మేయాలని చూశాడు. వ్యభిచార గృహం నుండి తప్పించుకునే ప్రయత్నంలో నా చేయి కోల్పోయాను. కాకినాడలో మూలికా వైద్యం చేస్తూ బతుకుతున్నాను. చిన్నప్పుడు అడవిలో మా నాన్న నేర్పాడు. తర్వాత ఆసక్తి కొద్ది నేర్చుకున్నాను. ఇన్నాళ్ల తర్వాత ఇక్కడకు వచ్చాను. ఒక కొత్త రకం మొక్కను గమనిస్తూ పొరబాటున ఊబిలో ఇరుక్కుపోయాను..’కుమార్‌కి ఒక నిమిషం జాలి వేసింది. ఇంతలో చెక్‌పోస్ట్ దగ్గరికి పోలీస్ జీప్ చేరుకున్నట్టు ఫోన్ వచ్చింది. అప్పటికే అమ్మాయి వివరాలు గార్డులు పోలీసులకు చెప్పడంతో ‘ఆమెను స్టేషన్లో దించి మీరు వెళ్లండి’ అన్నారు కుమార్‌తో.‘అదెలా సార్. ఆమెను తిరిగి వైజాగ్‌లో దించడం నా బాధ్యత’ అన్నాడు కుమార్.‘ఏం కుమారూ.. ఈ పిల్లకి నీకు ఏమైనా వుందా ఏంటి? మేము చూసుకుంటాములే. నువ్వు బయలుదేరు’ అన్నాడు ఎస్.ఐ.ఎదురు మాట్లాడితే బతుకుతెరువు దెబ్బ తింటుంది. పోలీసుల హెల్ప్ లేకుండా ఫారెస్ట్‌లో టూరిస్ట్ క్యాంపులు చేయలేడు. ‘ఇదంతా మీరే తెచ్చుకున్నారు. సారీ’ అన్నాడు ఆ అమ్మాయితో స్టేషన్లో దిగబెట్టాక బయలుదేరుతూ.‘పర్వాలేదు. నేను చూసుకుంటాను. మీరు వెళ్లండి’ అందా అమ్మాయి. తన దగ్గరున్న చిన్న నేత సంచిని ఇచ్చింది. ‘అడవి విత్తనాలు. ఇంట్లో వేసుకోండి. నా గిఫ్ట్’ అంది. సంచి చెమ్మగా ఉంది.ఆమె వైపే చూస్తూ స్టేషన్ నుంచి బయటపడ్డాడు. తెల్లవారుజామున ఇల్లు చేరుకున్న కుమార్‌కు నిద్ర కళ్లతో తలుపు తీసిన కరుణ జరిగింది విని మత్తు వదిలి కూచుంది.‘ఆ అమ్మాయి?’ అంది.‘ఏం చేస్తారో ఏమో, తెలుసుకోవాలన్నా భయంగా ఉంది’ అన్నాడు కుమార్.అతని టెన్షన్ చూసి చెప్పాలనుకున్న శుభవార్త చెప్పలేదు కరుణ. పొద్దున లేచాక భర్త లగేజీ నుంచి గింజల సంచిని తీసిన కరుణకు వాటిలోని రెండు మూడు గింజలకు చిన్నగా మొలకలు కనిపించాయి. వెంటనే ఇంట్లో ఖాళీగా వున్న కుండీలో పాతింది. రెండు రోజులు గడిచాయి.. మొలకలు వచ్చాయి. ఈలోపు పెద్ద తుఫాను అని ప్రకటన వచ్చింది. నాలుగైదు రోజుల పాటు కుంభ వృష్టి. ఈదురు గాలులకు ఎందరో ఇళ్ళు కోల్పోయారు. కరుణ, కుమార్ ఇంటికే పరిమితం అయ్యారు. తుఫాను ముగిశాక బయటికొచ్చి పరిశీలనగా చూసుకుంటే ఆ బీభత్సానికి ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్న మొక్కల కొమ్మలు విరిగిపోయి, ఇంట్లో వున్న మామిడి వేపచెట్లు పక్కకి వాలి జీవం కోల్పోయి కనిపించాయి. కరుణ చాలా బాధపడింది. చనిపోయిన మొక్కలను తీసి పక్కన వేస్తుండగా తొట్టిలోని మొలకల్లో నుంచి ఒకటి మాత్రం గట్టిగా తల వొంచకుండా నిలబడి ఉంది. ‘బావా ఇది చూడు .. ఇంత తుఫానునీ తట్టుకుని నిలబడింది అంటే అడవి మొక్క అయ్యుంటుంది. నువ్వు తెచ్చిన విత్తనాలు వేస్తే వచ్చింది’ అంది.కుమార్‌కు షర్కియా గుర్తుకు వచ్చింది. ఇక ఆగలేక స్టేషన్లో తెలిసిన కానిస్టేబుల్‌కు ఫోన్ చేశాడు.‘అన్నా.. ఆ అమ్మాయిని ఏం చేశారు?’ ఆందోళనగా అడిగాడు.‘ఏమైనా చేయడానికి ఆ అమ్మాయేమైనా కుందేలు పిల్లా? నక్సలైట్ కూతురు. నాలుగు సెక్షన్లు చదివి ఎస్సైకే వార్నింగ్ ఇచ్చింది. చాలా ధైర్యం. అలా ఉండాలి ఆడపిల్లంటే’ ‘మరి ఊరెళ్లిపోయిందా?’‘నేనే బస్సెక్కించాను ఆ రోజే’ ‘బతికించావు’ ఫోన్ పెట్టేశాడు.హుషారుగా తోటను బాగు చేసే పనిలో పడ్డాడు కుమార్.కరుణ అతడి దగ్గరకు వచ్చి ‘మనకో కూతురు పుడితే ఎలా ఉండాలనుకుంటావ్ బావా’ అనడిగింది.కుమార్ కుండీలో ఉన్న మొలక వైపు చూపుతూ ‘అదిగో అలా’ అన్నాడు.కరుణ అప్పుడు మెల్లగా అతని చేయి అందుకుని తన కడుపు మీద వేసుకుంటూ నవ్వింది. గొప్ప వెలుతురు నవ్వు అది. -
దుర్గమాసుర సంహారం
పూర్వం దుర్గమాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. హిరణ్యాక్షుడి వంశానికి చెందిన రురుడి కొడుకు అతడు. దుర్గముడు పరమనీచుడు, దుర్మార్గుడు, అతిక్రూరుడు, పరపీడనా పరాయణుడు. దేవతల బలమంతా వేదాలలోనే ఉన్నందున వేదాలను నాశనం చేస్తే చాలు, దేవతలందరినీ ఇట్టే నాశనం చేయవచ్చని తలచాడు. అదంత తేలికగా అయ్యే పనికాదు. అందువల్ల ముందుగా బ్రహ్మను ప్రసన్నుడిని చేసుకుని, అనుకున్న పని సాధించాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా హిమాలయాలకు వెళ్లి, అక్కడ బ్రహ్మదేవుడి గురించి ఘోరమైన తపస్సు చేశాడు. దుర్గముడి తపస్సు తీవ్రతకు ముల్లోకాలు గడగడలాడాయి. నక్షత్రాలు గతులు తప్పాయి. సూర్యచంద్రులు తేజోవిహీనులయ్యారు. దేవతలంతా హాహాకారాలు చేయడంతో బ్రహ్మదేవుడు హంసవాహనంపై బయలుదేరి, దుర్గముడి ఎదుట ప్రత్యక్షమయ్యాడు.‘దుర్గమా! నీ తపస్సుకు ప్రసన్నుడనయ్యాను. వరం కోరుకో’ అన్నాడు బ్రహ్మదేవుడు. ‘బ్రహ్మదేవా! వేదాలలోను, ఈ ముల్లోకాలలోను బ్రాహ్మణులకు తెలిసిన మంత్రాలన్నింటినీ నాకు స్వాధీనం చేయి. దేవతలను జయించే బలం ఇవ్వు’ అని కోరాడు దుర్గముడు.‘తథాస్తు’ అని పలికి బ్రహ్మదేవుడు అంతర్ధానమయ్యాడు. దుర్గముడికి బ్రహ్మదేవుడు ఈ వరమిచ్చిన తక్షణమే వేదమంత్రాలు విప్రులకు దూరమయ్యాయి. ఎవరికీ ఏ మంత్రమూ స్ఫురించని పరిస్థితి వాటిల్లింది. సంధ్యావందనాదుల వంటి నిత్య నైమిత్తిక కర్మానుష్ఠానాలు, యజ్ఞ యాగాదులు నిలిచిపోయాయి. ఇలా ఎందుకు జరిగిందో అర్థంకాక వేదపండితులు పరస్పరం ప్రశ్నించుకోసాగారు. ఎవరికీ సమాధానం దొరకదాయె! ముల్లోకాల్లోనూ హాహాకారాలే తప్ప ఎక్కడా స్వాహాకారాలు వినిపించని పరిస్థితి దాపురించింది. హవిర్భాగాలు అందక దేవతలందరూ శక్తిహీనులుగా మారారు. దుర్గముడు ఇదే అదనుగా తలచి స్వర్గాన్ని ముట్టడించాడు.వజ్రదేహుడైన దుర్గముడిని ఎదిరించడం దేవతలకు శక్తికి మించిన పని అయింది. అతడి చేతిలో చావు దెబ్బలు తిని తలో దిక్కూ పారిపోయారు. దుర్గముడు అమరావతిలోని దేవేంద్ర భవనానికి చేరుకున్నాడు. అతడు అక్కడకు రాకముందే, సమాచారం తెలుసుకున్న దేవేంద్రుడు పలాయనం చిత్తగించాడు. స్వర్గాన్ని విడిచి పారిపోయిన దేవతలందరూ దేవేంద్రుడితో పాటు కొండల్లోను, కోనల్లోను ఎవరికీ కనిపించకుండా తలదాచుకోసాగారు. దిక్కుతోచక అడవులు పట్టిన దేవతలంతా ఆపద నుంచి బయటపడటానికి ఆదిపరాశక్తిని పూజించడం ప్రారంభించారు.మరోవైపు, హోమాలు లేక వర్షాలు కురవడం మానేశాయి. నేలంతా ఎండి బీటలు పడింది. చెరువులు, నూతులు ఎండిపోయాయి. నదీ నదాలలో కూడా నీటిజాడ కనుమరుగైంది. ఈ అనావృష్టి వందేళ్లు కొనసాగింది. కరవు కరాళ నృత్యానికి పశుపక్ష్యాదులు చాలా వరకు అంతరించాయి. మనుషులు అసంఖ్యాకంగా ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇంటింటా శవాలు, ఏ ఊళ్లో చూసినా కళేబరాల గుట్టలు పడి ఉన్న దృశ్యాలే కనిపించసాగాయి. ఈ దారుణ పరిస్థితికి విప్రులందరూ కలత చెందారు. ఏం చేయాలో దిక్కుతోచక వారందరూ హిమాలయాలకు చేరి, నిరాహారులై ఆదిపరాశక్తిని స్తుతించసాగారు. విప్రుల ప్రార్థనలకు ప్రసన్నురాలైన ఆదిపరాశక్తి వారి ఎదుట ప్రత్యక్షమైంది. మెడలో ఫలపుష్ప వనమూలికాదుల మాలలను, అనంత హస్తాలలో అశేష ఆయుధాలను ధరించి కరుణారస సాగరంలా వారి ముందు నిలిచింది. దుఃఖిస్తున్న ప్రజలను చూసి, జగజ్జనని అనంత నయనాలు ఏకధారగా వర్షించాయి. ఆ వర్షధారలకు భూమిపైనున్న వాపీ కూప తటాకాదులు నీటితో నిండాయి. ఓషధులు పులకించాయి. ఫలపుష్పాది వృక్షాలు పచ్చదనాన్ని సంతరించుకున్నాయి. అప్పటి వరకు కొండ కోనల్లో దాక్కున్న దేవతలందరూ బయటకు తరలి వచ్చి, విప్రులతో కలసి గొంతు కలిపి దేవిని స్తుతించడం ప్రారంభించారు. జగన్మాత పరవశురాలైంది. తన చేతుల్లోని పండ్లు, కాయలు అందరికీ అందించింది. పశుపక్ష్యాదులకు కావలసిన ఆహారాన్ని వాటికి అందించింది. ఫల శాకాదులు అందించడంతో విప్రులు, దేవతలు జగజ్జననిని ‘శాకంబరి’ అంటూ శ్లాఘించారు. సురనరాది ప్రాణికోటి ఆహారాన్ని అందుకుంటున్న కోలాహలం దుర్గముడికి వినిపించింది. ఏం జరుగుతోందో తెలుసుకుని రమ్మని దూతలను పంపించాడు. వారు తిరిగి వచ్చి, తాము చూసినదంతా చెప్పారు. దుర్గముడు ఆగ్రహోదగ్రుడయ్యాడు. ఆయుధాలు ధరించి, రథారూఢుడై సైన్య సమేతంగా హుటాహుటిన జగజ్జనని చుట్టూ ఉన్న దేవతల వద్దకు చేరుకున్నాడు. వస్తూనే శరపరంపర కురిపించాడు. దేవతలందరూ ఎదిరించి పోరాడు. విప్రులు కూడా శక్తి మేరకు యుద్ధం చేశారు. రాక్షస సేనల ధాటికి దేవ సేనలు, విప్రసమూహం తట్టుకోలేకపోవడంతో హాహాకారాలు మిన్నుముట్టాయి. ‘త్రాహి! త్రాహి!’ అంటూ వారంతా జగజ్జననిని శరణు కోరారు.జగజ్జనని దేవ మానవుల చుట్టూ తేజోమయ రక్షణవలయాన్ని ఏర్పరచింది. రాక్షసుల ఆయుధాలు ఆ వలయం అంచులను తాకి, గోడను తాకిన గులకరాళ్లలా రాలిపోతున్నాయి. జగన్మాత స్వయంగా యుద్ధరంగానికి వచ్చింది. దేవి శరీరం నుంచి అనంతంగా శక్తి స్వరూపిణులు ఆవిర్భవించారు. వారంతా చిత్ర విచిత్రమైన ఆయుధాలతో రాక్షస సేనలను ముట్టడించి, క్షణాల్లోనే తుదముట్టించారు.దుర్గముడు విచిత్రరథంపై రణరంగానికి వచ్చాడు. చండప్రచండంగా యుద్ధం చేశాడు. భూమ్యాకాశాలను కమ్మేసినట్లుగా శరపరంపరను కురిపించి, అనంతశక్తులను జయించాడు. జగన్మాత ఎదుట తన రథాన్ని నిలిపాడు. ఇద్దరికీ ఘోర యుద్ధం జరిగింది. చివరకు జగజ్జనని ప్రయోగించిన బాణాలకు దుర్గముడు నెత్తురు కక్కుకుంటూ రథం మీద నుంచి నేలమీద దొర్లిపడి మరణించాడు. దుర్గముడి చావుతో దేవతలు ఆనంద తాండవం చేశారు. ముల్లోకాలూ తిరిగి శాంతిని పొందాయి. -
మైక్ ఎమర్ట్
వాషింగ్టన్ , రెడ్‌మండ్‌లో నివసించే రియల్ ఎస్టేట్ ఏజెంట్ మైక్ ఎమర్ట్ 2001లో స్టీవెన్ అనే కస్టమర్‌కి వుడిన్విల్ శివార్లలో ఉన్న గెయిల్ ఇంటిని చూపించడానికి వెళ్లి, అక్కడే హత్యకు గురయ్యాడు. స్టీవెన్ ఇల్లు చూడటానికి వచ్చినప్పుడు ఉత్తర కాలిఫోర్నియా నుంచి మకాం మారుతున్నట్లు చెప్పాడట! 2011లో కీలక ఆధారాలు దొరికినా, ఫలితం లేకుండా పోయింది. న్యాయపోరాటం చేసీ చేసీ చివరికి మేరీ 2024 జనవరిలో ఈ కే సును క్లోజ్ చేయాలని అధికారులను కోరారు. ‘మైక్! మైక్! ఎక్కడున్నావ్? చాలాసేపటి నుంచి నీ ఫోన్ మోగుతోంది, ఏదో అన్నోన్ నంబర్’ అంటూనే అతడి ఫోన్ పట్టుకుని బెడ్రూమ్లోకి వచ్చింది మేరీ. ‘హా వస్తున్నా మేరీ! టూ మినిట్స్. స్నానం అయిపోయింది’ అని బాత్రూమ్లోంచి బదులిచ్చాడు మైక్. ‘సరే అయితే ఫోన్ బెడ్ మీద పెడుతున్నా. బ్రేక్‌ఫాస్ట్ చేసే వెళ్లు, రెడీ అయిపోయింది’ అని చెప్పి మళ్లీ కిచెన్‌లోకి వెళ్లిపోయింది మేరీ. వారిది ప్రేమ వివాహం. ఇరువురూ సంపన్నులే కావడంతో పెళ్లికి ముందే రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలుపెట్టారు. పిల్లలు మేరీ తల్లి దగ్గర పెరగడంతో చాలా డీల్స్ ఇద్దరూ కలిసే చేస్తుండేవారు. మైక్ రెడీ అయ్యి ఫోన్‌ను మెడకు, భుజానికి మధ్య నొక్కిపెట్టి మాట్లాడుకుంటూ, చేతి షర్ట్ బటన్ పెట్టుకుంటూ డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. ఇంతలో మేరీ తింటూనే అతడికీ బ్రేక్‌ఫాస్ట్ అందించింది. ‘అయ్యో, స్టీవెన్ గారు! మీకు నచ్చడమే మాకు కావాలి. మీరు కోరుకున్నట్లే అదే ఇల్లు, మళ్లీ ఒకసారి మొత్తం చూపిస్తా. నచ్చితే బయానా మాట్లాడుకుందాం. ఓనర్ ఎలాగో ఆఫీస్‌కి వెళ్లుంటారు, సెకండ్ కీ నా దగ్గరే ఉంది, సో మనం వెళ్లొచ్చు. ఇబ్బందేమీలేదు. మీరు కొనుక్కునేవాళ్లు, మేము అమ్ముకునేవాళ్లం. ఒకటికి పదిసార్లు చూసుకోవడం మీ హక్కు. ఓకే సార్! మీరు చెప్పిన∙టైమ్‌కి కిర్క్లాండ్ షాపింగ్ మాల్కి వచ్చేస్తా’ అనేసి ఫోన్ పెట్టేశాడు మైక్.అంతా విన్న మేరీ తింటూనే, ‘ఎవరు మైక్? స్టీవెనేనా? అంటే, ఆరోజు కుంటుకుంటూ వచ్చాడే అతనేనా?’ అంది ఆత్రంగా. ‘అవును మేరీ! అతనే, మళ్లీ వచ్చాడు. మనం చూపించిన అన్ని ఇళ్లల్లోనూ గెయిల్ ఇల్లు అతనికి బాగా నచ్చిందట. నన్ను కిర్క్లాండ్ మాల్కి రమ్మన్నాడు. ఇద్దరం కలసి ఆ ఇంటికి వెళ్తాం. ఈ బేరం కుదిరేలానే ఉంది’ అన్నాడు మైక్. మరి నేనూ రానా అంది మేరీ. ‘వద్దు. చూపించడమే కదా! బేరం ఓకే అయితే అప్పుడొద్దువుగానిలే’ అన్నాడు మైక్.అదే రోజు మధ్యాహ్నం పన్నెండున్నర అయ్యేసరికి గెయిల్ ఆఫీస్ నుంచి భోజనానికి తన ఇంటికి వచ్చింది. పైన బాత్రూమ్లో ఏకధారగా నీళ్లుపోతున్న శబ్దం విని, ఇంట్లో ఎవరో ఉన్నారనిపించింది. ధైర్యం చేసి మెట్లు ఎక్కి బెడ్రూమ్ నుంచి బాత్రూమ్కి నడుస్తుంటే, దారిపొడవునా రక్తం చారలు ఆమెను వణికించాయి. బాత్ టబ్‌లో మనిషి శవం నీళ్లల్లో మునిగి ఉంది, పైన షవర్ నుంచి నీరు ధారగా పడి, బాత్ టబ్ పొంగుతోంది. టబ్‌లో నిండిన నీళ్లు రక్తంతో కలసి పారుతున్నాయి. అది చూసి అప్రయత్నంగా కెవ్వుమంది గెయిల్. కాస్త తేరుకుని, గజగజ వణుకుతూ మరోసారి ఆ శవం ఎవరిదా? అని పరికించి చూసింది. తన ఇల్లు అమ్మకానికి తీసుకున్న రియల్ఎస్టేట్ వ్యాపారీ మైక్దని గుర్తించి నిర్ఘాంతపోయింది.రంగంలోకి దిగిన పోలీసులు బాడీని పోస్ట్‌మార్టమ్‌కి పంపించి, మేరీకి సమాచారం అందించారు. మైక్ ఒంటి మీద 19 కత్తిపోట్లు ఉన్నాయని రిపోర్ట్‌లో తేలింది. అతడి ఖరీదైన వాచ్, డైమండ్ రింగ్, పర్స్ కనిపించడం లేదని దర్యాప్తులో తెలిసింది. వాటిని కిల్లర్ దోచుకెళ్లాడని నమ్మారు. వేలిముద్రల వంటి ఆధారాలను నాశనం చేయడానికే మైక్‌ని బెడ్రూమ్లో చంపి, బాత్‌టబ్‌లో ముంచాడని స్పష్టత వచ్చింది.‘ఉదయం స్టీవెన్ అనే పెద్దాయన మైక్‌కి కాల్ చేసి, కిర్క్లాండ్ మాల్కి రమ్మన్నాడు. అక్కడి నుంచే గెయిల్ ఇంటికి వెళ్లాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారు. స్టీవెన్ మొదటిసారి గెయిల్ ఇంటిని చూడటానికి వచ్చినప్పుడు మైక్‌తో పాటు నేను కూడా అతణ్ణి చూశాను. అతడికి 50 ఏళ్లుపైనే ఉంటాయి. అతను కుంటివాడు, కర్ర సాయంతో నడవడం చూశాను’ అని చెప్పింది మేరీ. వెంటనే మేరీ చెప్పిన మాల్కి వెళ్లారు అధికారులు. అక్కడ పార్కింగ్‌లో మైక్ కారు దొరకడంతో స్టీవెనే కిల్లర్ అనే క్లారిటీ వచ్చేసింది.అయితే స్టీవెన్ అనే పేరు అబద్ధం కావచ్చని, స్టిక్ పట్టుకుని నడవడమనేది నాటకం కావచ్చని, ఆ స్టిక్లోనే పదునైన కత్తి దాచి ఉంటాడని, కేవలం దొంగతనమే అతడి టార్గెట్ కాకపోవచ్చని అంచనాలు మొదలయ్యాయి. స్టీవెన్ ప్రొఫెషనల్ హిట్మెన్ అయ్యి ఉంటాడని, మైక్‌ని చంపడానికి ఎవరితోనో సుపారీ మాట్లాడుకుని వచ్చి ఉంటాడని అధికారులు నమ్మసాగారు. అందుకే మైక్‌ను హత్య చేయడానికి జనసంచారానికి దూరంగా ఉండే గెయిల్ ఇంటినే కిల్లర్ ఎంచుకుని ఉంటాడని భావించారు. అయితే మైక్‌ని చంపాలనుకునేంత శత్రువులు ఎవరూ లేరని మేరీ చెప్పింది. బంధుమిత్రులూ అదే మాటన్నారు.సరిగ్గా పదేళ్లకి టెక్నాలజీ సాయంతో నేరం జరిగిన ప్రదేశంలో ఒక డీఎన్ఏని గుర్తించారు. అది గ్యారీ క్రూగేర్ అనే మాజీ పోలీస్ అధికారిదని రుజువైంది. అతడు అప్పటికే చనిపోయాడు. అతడికి మైక్ మర్డర్ కేసులోనే కాదు, మరో మూడునాలుగు మర్డర్ కేసులతో సంబంధం ఉందని తేలింది. పైగా రిటైర్మెంట్ తర్వాత గ్యారీ రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా కూడా పని చేశాడు. రియల్ ఎస్టేట్ ఏజెంట్లు జిమ్ బారీ హత్య కేసులోనూ, బ్రాడ్షా మిస్సింగ్లోనూ గ్యారీకి సంబంధం ఉంది.ఏది ఏమైనా గ్యారీ, స్టీవెన్ ఇద్దరూ ఒక్కరేనా? మైక్‌ని చంపింది ఒక వ్యక్తేనా? అతడితో పాటు ఇంకెవరైనా ఉన్నారా? గ్యారీ రియల్ఎస్టేట్ రంగంలో తనకు పోటీ లేకుండా చేసుకోవడానికి మైక్‌తో పాటు మిగిలిన హత్యలు చేశాడా? లేదంటే ఎవరైనా మైక్ శత్రువులు గ్యారీతో బేరం కుదుర్చుకున్నారా? అనే ప్రశ్నలు నేటికీ మిస్టరీనే! ∙సంహిత నిమ్మన -
జావెలిన్ దిగిందా లేదా!
మొహమ్మద్ అబ్దుల్ హాది ఏమీ చేతకాని, ఏ పనీ చేయలేని బతుకూ ఒక బతుకేనా? దీనికంటే ఆత్మహత్య నయమంటూ, మరుగుజ్జు అంటూ హేళన చేసిన వాళ్లంతా ఇప్పుడు అతని మీద ప్రశంసలు కురిపిస్తున్నారు. కారణం.. పారిస్ పారాలింపిక్స్‌లో అతను జావెలిన్ త్రోలో స్వర్ణాన్ని అందుకోవడమే! ఆ క్రీడాకారుడు 23 ఏళ్ల నవదీప్ సింగ్. విజయానంతరం ఆ జావెలిన్ త్రోయర్ భారత్ తిరిగి వచ్చాక, దేశ ప్రధాని నరేంద్ర మోదీ అతనితో సరదాగా మాట్లాడిన తీరు చూస్తే.. నవదీప్ తన ఆటతో ప్రపంచం దృష్టిని ఎలా ఆకర్షించాడో అర్థమవుతుంది. పారాలింపిక్స్‌లో అతను సాధించిన విజయం సామాన్యమైంది కాదు. ఆత్మన్యూనతాభావంతో బతికే ఎంతోమంది నేర్చుకోవాల్సిన పాఠం. ఆ ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకం. హరియాణాలోని పానిపట్ సమీపంలో బువానా లాఖు నవదీప్ సొంత ఊరు. తండ్రి దల్వీర్ సింగ్ స్థానిక పంచాయతీ కార్యాలయంలో ఉద్యోగి. జన్యుపరమైన లోపాలతో పుట్టడం వల్ల నవదీప్ వయసుకు తగ్గట్టు ఎదగలేకపోయాడు. పిల్లాడికి రెండేళ్లు వస్తేగానీ పరిస్థితి తీవ్రత తల్లిదండ్రులకు అర్థం కాలేదు. అప్పుడు కొడుకు చికిత్స కోసం వాళ్లు ఎంత ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. ఊర్లో అతను మరుగుజ్జు నవదీప్గా స్థిరపడిపోయాడు. దాంతో బాల్యం నుంచే అతను అత్యంత అవసరమైతే తప్ప బయటకు రాకుండా, ఇంట్లోనే ఉండిపోసాగాడు. ‘కొన్నిసార్లు మాతో కూడా మాట్లాడకుండా గదికి గడియ పెట్టుకుని, ఏడుస్తూ ఉండిపోయేవాడ’ని అతని పెద్దన్న మన్దీప్ గుర్తు చేసుకుంటాడు. కొడుకును సాధారణ స్థితికి తెచ్చేందుకు నవదీప్ తండ్రి తనకు సాధ్యమైనంతగా ప్రయత్నించాడు. నవదీప్ చదువుకునేందుకు మంచి మంచి పుస్తకాలను తెచ్చివ్వడంతో పాటు, ఇతర అంశాలపై అతను దృష్టి సారించేలా చేశాడు. రాష్ట్రపతి అవార్డుతో..నవదీప్‌ని ఒంటరితనం నుంచి బయటపడేసేవి ఆటలే అని భావించారంతా! దాంతో ఇంట్లోవాళ్లు అతణ్ణి ఆటల వైపు ప్రోత్సహించారు. నవదీప్ తండ్రికి రెజ్లింగ్‌లో స్థానిక పోటీల్లో పాల్గొన్న అనుభవం ఉంది. నవదీప్ కూడా ముందుగా రెజ్లింగ్‌లోనే సాధన చేశాడు. అయితే అక్కడా అతనికి తన ఆరోగ్యం కొంత సమస్యగా మారింది. వెన్ను నొప్పి కారణంగా రెజ్లింగ్ సాధ్యం కాదని అర్థమవడంతో దానిని వదిలేశాడు. స్థానిక గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నప్పుడు స్పోర్ట్స్‌పై మరింత ఆసక్తి పెరిగింది. పీఈటీ ప్రోత్సాహంతో అతను అథ్లెటిక్స్ వైపు మళ్లాడు. అందులో అందరితో పోటీపడుతూ సాధించిన విజయాలు నవదీప్‌కు గ్రామంలో మంచి పేరు తెచ్చి పెట్టాయి. అతని క్రీడా ప్రతిభ హరియాణాను దాటింది. వైకల్యాన్ని అధిగమించి పలు జాతీయ స్థాయి పోటీల్లోనూ మంచి ప్రదర్శన నమోదు చేశాడు. 12 ఏళ్ల వయసులో అతను కేంద్ర ప్రభుత్వం అందించే ‘రాష్ట్రీయ బాల్పురస్కార్’ అవార్డుకు ఎంపికయ్యాడు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా అందుకున్న ఈ అవార్డు తన మరుగుజ్జుతనాన్ని మరచిపోయేలా చేసింది. ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ప్రత్యేక శిక్షణతో ..బాల్పురస్కార్ అవార్డు తర్వాత క్రీడలపై పూర్తిగా దృష్టి సారించవచ్చని నవదీప్‌కు నమ్మకం కలిగింది. మరికొంత కాలం అథ్లెటిక్స్‌పై మరింత సాధన చేసి ఆటలో పదును పెంచుకున్నాడు. ఆ తర్వాత శ్రేయోభిలాషులందరూ అండగా నిలవడంతో పెద్దస్థాయిలో శిక్షణ కోసం, నవదీప్ తన 16వ ఏట ఢిల్లీకి చేరుకున్నాడు. అక్కడి కోచ్ నావల్ సింగ్ వద్ద అథ్లెటిక్స్‌లో కోచింగ్, ప్రాక్టీస్ సాగింది. నవదీప్‌కి ఇంకా తోడుగా ఉండటం వల్ల అతను పైకి రాలేడని, అతను స్వతంత్రంగా ఉండే ఏర్పాట్లు చేయాలని పెద్దన్న మన్దీప్ తన తండ్రిపై ఒత్తిడి తెచ్చాడు. దాంతో తండ్రి ఎల్ఐసీ పాలసీ ద్వారా అప్పు చేసి మరీ కొడుకు కోసం అన్ని ఏర్పాట్లు చేశాడు. కానీ కొడుకు ఒలింపిక్ విజయానికి కొన్ని నెలల ముందే ఆయన కన్నుమూశాడు. కొడుకు గెలుపును చూడలేకపోయాడు. కఠోర సాధనతో..ఢిల్లీలో శిక్షణ పొందే క్రమంలో అథ్లెటిక్స్‌లో ఏదైనా ఒక ఈవెంట్‌పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాల్సిన టైమ్ వచ్చింది. అప్పుడే హరియాణాకే చెందిన నీరజ్ చోప్రా.. అండర్–20 వరల్డ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించడం నవదీప్‌ను ఆకర్షించింది. దాంతో తనూ జావెలిన్ త్రో వైపు మొగ్గు చూపాడు. అక్కడి జావెలిన్ కోచ్ విపిన్ కసానా ఒక ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. ‘నా కెరీర్లో నేను ఎంతో మందికి శిక్షణనిచ్చాను. కానీ ఇంత తక్కువ ఎత్తు ఉన్న ఆటగాళ్లెవరూ నా వద్దకు రాలేదు. దాంతో నవదీప్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సి వచ్చింది. 2.2 మీటర్ల పొడవు ఉన్న జావెలిన్‌ను పట్టుకోవడం మొదలు భుజాలపై భారం ఉంచి విసిరే వరకు అంతా భిన్నమే. జావెలిన్‌ను విసిరే కోణాల్లో కూడా మార్పు చేయాల్సి వచ్చింది. కానీ ఏం చేసినా అతని పట్టుదల ముందు అన్నీ చిన్నవిగా అనిపించాయి. కఠోర సాధనకు నవదీప్ ఏ దశలోనూ వెనుకాడలేదు’ అని విపిన్ చెప్పారు. ఒలింపిక్ పతకాన్ని ముద్దాడి..నవదీప్ కష్టానికి ప్రతిఫలం కొద్దిరోజులకే దక్కింది. 17 ఏళ్ల వయసులో ఆసియా యూత్ పారా గేమ్స్‌లో స్వర్ణంతో అతని విజయ ప్రస్థానం మొదలైంది. ఆ తర్వాత వరల్డ్ పారా గ్రాండ్ ప్రీలో స్వర్ణం గెలిచిన అతను ఈ ఏడాది ఆరంభంలో వరల్డ్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం సాధించి ఒలింపిక్స్‌పై ఆశలు రేపాడు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ జావెలిన్ త్రో ఎఫ్ 41 విభాగంలో (తక్కువ ఎత్తు ఉన్న ఆటగాళ్ల కేటగిరీ) స్వర్ణం గెలుచుకున్నాడు. చిన్నప్పటి నుంచి చేస్తూ వస్తున్నట్లే ఈసారి కూడా తన ఊర్లో అందరికీ ఆ పతకాన్ని చూపించి గర్వంగా నిలబడ్డాడు. -
ఎల్ఈడీ లిప్ మెషిన్
ఏ ఛాయలో ఉన్నా, ఏ వయసు వారైనా తమ పెదవులు మృదువుగా, చూడచక్కగా ఉండాలనే కోరుకుంటారు. అలాంటి వారికి చిత్రంలోని ఈ డివైస్ చాలా చక్కగా పని చేస్తుంది. ఈ ఎల్ఈడీ లిప్ మెషిన్ అధరాలను అందంగా మార్చేస్తుంది.పదవులపై ముడతలు, పగుళ్లు, గీతలు ఇలా అన్నింటినీ పోగొట్టి, ‘అధర’హో అన్నట్లుగా మెరిపిస్తుంది. ఈ మెషిన్ నాలుగు వేరువేరు మోడ్స్‌తో, 56 డీప్ పెనిట్రేటింగ్ ఎల్ఈడీ టెక్నాలజీతో యూజర్ ఫ్రెండ్లీగా ఉపయోగపడుతుంది. దీన్ని పెదవులకు ఆనించి, బటన్ ఆన్ చేసుకుంటే సరిపోతుంది. సుమారు 8 వారాల పాటు రోజుకు 3 నిమిషాలు ఈ లిప్ డివైస్‌తో ట్రీట్మెంట్ తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.ఈ మెషిన్ని మీ మేకప్ కిట్‌లో భాగం చేసుకుంటే పెదవులను అందంగా, సహజంగా దొండపండులా మలచుకోవచ్చు. సురక్షితమైన సిలికాన్ తో రూపొందిన ఈ డివైస్‌తో ఎలాంటి నొప్పి కలుగదు. వేడి తీవ్రత ఇబ్బందికరంగా ఉండదు. ఈ పరికరం కొలాజన్ ఉత్పత్తిని ప్రేరేపించడంతో పాటు రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. దీనితో ట్రీట్మెంట్ ఎవరికి వారు స్వయంగా చేసుకోవచ్చు. అయితే దీన్ని వినియోగించిన ప్రతిసారి పెదవులకు ఆనించే సిలికాన్ భాగాన్ని టిష్యూతో లేదా క్లాత్‌తో క్లీన్ చేసుకుంటూ ఉండాలి. డివైస్‌కి ముందే చార్జింగ్ పెట్టుకుని వైర్‌లెస్‌గా వాడుకోవచ్చు. చార్జింగ్ బేస్ వేరుగా, ట్రీట్మెంట్ వైబ్రేషన్ మసాజర్ వేరుగా ఉండటంతో వాడకం సులభంగా ఉంటుంది. -
Diabetes: ఎలాంటి డైట్‌తో అదుపులో ఉంచొచ్చు
నాకు ఇప్పుడు 8వ నెల. డయాబెటిస్ వచ్చిందని డాక్టర్ చెప్పారు. మా తల్లిదండ్రులకు కూడా ఉంది. డైట్ చెయ్యమన్నారు. ఈ సమయంలో ఎలాంటి డైట్‌తో డయాబెటిస్‌ని అదుపులో ఉంచవచ్చు.– శిరీష, మెదక్గర్భధారణ సమయంలో డయాబెటిస్ అనేది ఏ నెలలో అయినా రావచ్చు. కుటుంబ నేపథ్యంలో ఉన్నా, ఊబకాయం ఉన్నా డయాబెటిస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జీవన శైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా అదుపు చేయవచ్చు. వీటితో తగ్గనప్పుడు మందులు ఇస్తాం. బిడ్డ పరిణతి, ఎదుగుదల బాగుండాలంటే ఎప్పుడూ డయాబెటిస్ అదుపులో ఉండాలి. గర్భధారణ సమయంలో బరువు తగ్గడానికి ప్రయత్నించకూడదు. ఎక్కువ బరువు పెరిగి డయాబెటిస్ రాకుండా ముందుగానే జాగ్రత్తపడాలి. డైటీషియన్, న్యూట్రిషన్ కౌన్సెలర్లు మీ బరువు, ఎన్ని నెలలు, మీ ఇష్టాలు వంటి అంశాలను బట్టి ఆరోగ్యకరమైన ఆహారాన్ని సూచిస్తారు. మీరు తీసుకునే ఆహారంలో చక్కెర పాళ్లు తక్కువ ఉండే ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉండే ఆహారం ఎంచుకోవాలి. అంటే ఎక్కువ ఫైబర్ ఉండే ఆహారం– బ్రౌన్ రైస్, అన్ని రకాల గింజలతో తయారు చేసిన పాస్తా, బాస్మతీ రైస్, తృణ ధాన్యాలతో తయారు చేసే ఆహార ఉత్పత్తులను తీసుకోవాలి. కొన్నిరకాల ఆహార పదార్థాలు రక్తంలో గ్లూకోజ్ స్థాయిని పెంచవు. మాంసం, చేప, గుడ్లు, పౌల్ట్రీ, నట్స్, సీడ్స్, పప్పులు, సలాడ్స్ లాంటివి మనం తినే భోజనంలో భాగం చేసుకోవాలి. మీ ఆహారం తీసుకునేటప్పుడు ఒక్కసారే ఎక్కువ మోతాదులో కాకుండా మూడుసార్లుగా విభజించుకోండి. తీపి పదార్థాలు, కేక్స్, బిస్కట్స్, చాక్లెట్స్, పుడ్డింగ్స్, ఫాస్ట్ ఫుడ్స్ లాంటివి పూర్తిగా మానేయండి. వీటికి బదులుగా రైస్ కేక్స్, క్రిస్ప్ బ్రెడ్, హోల్ గ్రెయిన్ క్రాకర్స్, ఓట్స్ కేక్స్, పాప్‌కార్న్ లాంటివి తక్కువ మోతాదులో తీసుకోవాలి. ఒకసారి తినే ఆహారంలో 40గ్రాముల కన్నా ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకోకూడదు. ప్రతి ఒక్కరి శరీర జీవక్రియ (మెటబాలిజమ్) ఒక్కలా ఉండదు. అందుకే 40గ్రాములతో మొదలుపెట్టి, రక్తంలో గ్లూకోజ్ స్థాయి రెండు గంటలకు అదుపులో ఉంటే కొంచెం పెంచుకోవచ్చు. ఎక్కువ అయితే గ్రాములను కొంచెం తగ్గించాలి. భోజనానికీ భోజనానికీ మధ్యలో ఆకలి వేస్తుందని జంక్ ఫుడ్ తినేస్తారు. అలా కాకుండా 10–15 గ్రాముల కార్బోహైడ్రేట్స్ ఉన్న చిరుతిళ్లు మాత్రమే తీసుకోవాలి. అంటే, 200 ఎంఎల్ పాలు, పెరుగు, ఒక టేబుల్ స్పూన్ పాస్తా, ఒక గుడ్డు లాంటివి. బ్రెడ్, పాస్తా, బంగాళదుంపలలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. కూరగాయలు, సలాడ్స్ ఎక్కువగా తీసుకోవచ్చు. నూనె ఎక్కువగా ఉన్న, వేయించిన పదార్థాలు తినకూడదు. పండ్లరసాలతో చక్కెర శాతం అధికంగా పెరుగుతుంది. అందుకే çపండ్లను నేరుగా తినాలి. గ్రీన్ ఆపిల్, నారింజ, ద్రాక్ష తినాలి. పాలు, పాల ఉత్పత్తులలో కాల్షియం అధికంగా ఉంటుంది. రోజుకి 2–3 సార్లు తీసుకోవాలి. 200 ఎంఎల్ పాలు, 125 గ్రాముల పెరుగు తీసుకోవచ్చు. ప్రొటీన్ ఫుడ్ ఎక్కువ తింటే పోస్ట్ మీల్ సుగర్ రాదు, అందుకే ప్రొటీన్‌ను ప్రతి ఆహారంలో చేర్చుకోవాలి. హై ఫ్యాట్ ఫుడ్ తీసుకోకూడదు. ప్రతి రెండుగంటలకోసారి నీళ్లు తాగాలి. దీనితో అజీర్ణం, మలబద్ధకం తగ్గుతాయి. బయట దొరికే ఆహారపదార్థాలను తీసుకోవడం మానేస్తే మంచిది. సుగర్ ఫ్రీ కుకీస్ కూడా ఈ సమయంలో మంచిదికాదు. మీరు డైట్ మొదలుపెట్టిన 2వారాలకి బ్లడ్ çసుగర్ లెవెల్స్ ల్యాబ్‌లో పరిశీలిస్తారు. అదుపులో ఉంటే ప్రసవం అయ్యే వరకూ అదే డైట్‌ను తీసుకోమంటారు. ఒకవేళ 9వ నెలలో ఎక్కువ అయితే తక్కువ మోతాదు సుగర్ మందులను వాడమని చెబుతారు. క్రమం తప్పకుండా ముఖ్యంగా ఆఖరి రెండు నెలలు గైనకాలజిస్ట్ సలహాలు పాటించాలి. ప్రసవం తరువాత కూడా 95శాతం డయాబెటిస్ తగ్గిపోతుంది. కానీ భవిష్యత్తులో ఎప్పుడైనా డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి సంవత్సరం ఫాస్టింగ్ బ్లడ్ సుగర్ లెవెల్స్ చెక్ చేయించుకోవాలి. ఈ లెవెల్ 100 ఎంజీ/డీఎల్ ఉంటే, ఒకసారి డయాబెటిస్ నిపుణులను కలవాలి. భవిష్యత్తులో టైప్–2 డయాబెటిస్ రాకుండా ఆహారం, వ్యాయామం, ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించాలి. నెలసరి బాధలకు చెక్‌పెట్టే ఔషధంచాలామంది మహిళలు ఎండోమెట్రియాసిస్ సమస్య కారణంగా నెలసరి సమయంలో తీవ్రమైన నొప్పి, అధిక రక్తస్రావం వంటి ఇబ్బందులతో బాధపడుతుంటారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది మహిళలు ఎండోమెట్రియాసిస్‌తో బాధపడుతున్నారు. ఈ సమస్య వల్ల మహిళలు తీవ్రమైన రక్తహీనతకు లోనవుతారు. ఎండోమెట్రియాసిస్ సమస్యను శాశ్వతంగా నయం చేసే చికిత్స పద్ధతులేవీ ఇప్పటికీ అందుబాటులోకి రాలేదు. అయితే, ఎండోమెట్రియాసిస్ వల్ల తలెత్తే నొప్పులను, అధిక రక్తస్రావాన్ని అరికట్టే ఔషధం ఇంగ్లండ్‌లో అందుబాటులోకి వచ్చింది. ‘ఇవాన్–500ఎంజీ’ పేరుతో ఇటీవల మార్కెట్లోకి విడుదలైన ఈ మాత్రలను ఎలాంటి ప్రిస్క్రిప్షన్ లేకున్నా కొనుక్కోవచ్చు. ఈ మాత్రలలో ఉండే ‘ట్రానెక్సిమిక్ యాసిడ్’ నెలసరి బాధలకు చాలా వరకు చెక్ పెడుతుంది. ఇప్పటికే ఈ మాత్రలు వాడిన మహిళలు ఇవి అద్భుతంగా పనిచేస్తున్నాయని చెబుతున్నారు. -
దుర్గార్తిశమనీ దశదిశలా దసరా
జగన్మాత అయిన దుర్గాదేవి దుర్గతులను దూరం చేస్తుందని, ఆర్తత్రాణ పరాయణ అని భక్తుల నమ్మకం. ఆర్తితో పూజించే భక్తులకు ఆపదలు రాకుండా చూసుకుంటుందని, ఐహిక ఆముష్మిక సుఖశాంతులను ప్రసాదిస్తుందని ప్రగాఢ విశ్వాసం. అందుకే ద్వాత్రింశన్నామ స్తోత్రం దుర్గాదేవిని దుర్గార్తిశమనీ అని స్తుతిస్తోంది.ప్రతి ఏటా ఆశ్వయుజ మాసంలోని శుక్లపక్ష పాడ్యమి నుంచి దశమి వరకు దేవీ నవరాత్రులు జరుగుతాయి. శరదృతువులో వచ్చే నవరాత్రులు గనుక వీటిని శరన్నవరాత్రులు అని, చివరి రోజైన దశమి రోజును విజయ దశమిగా, దసరా పండుగగా జరుపుకుంటారు గనుక వీటిని దసరా నవరాత్రులని కూడా అంటారు. ఈ నవరాత్రి వేడుకల్లో దుర్గాదేవిని వివిధ రూపాలలో ఆరాధిస్తారు.‘భూతాని దుర్గా! భువనాని దుర్గా! స్త్రీయో నరాశ్చపి పశుశ్చ దుర్గా!యద్యద్ధి దృశ్యం ఖలు నైవ దుర్గా! దుర్గా స్వరూపాదపరం న కించిత్.’పై శ్లోకానికి తాత్పర్యం ఏమిటంటే, సమస్త ప్రాణికోటి దుర్గా స్వరూపమే! సమస్త లోకాలూ దుర్గా స్వరూపమే! స్త్రీలు పురుషులు పశువులు అన్నీ దుర్గా స్వరూపమే! లోకంలో కంటికి కనిపించేవన్నీ దుర్గా స్వరూపమే! దుర్గా స్వరూపం కానిదంటూ ఏదీ లేదు. దుర్గాదేవిని నమ్ముకున్న భక్తుల భావన ఇది.దేవీ నవరాత్రులను అష్టాదశ శక్తిపీఠాలు సహా అమ్మవారి ఆలయాలన్నింటిలోనూ అత్యంత వైభవోపేతంగా జరుపుకుంటారు. ఆంధ్రప్రదేశ్ విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గ ఆలయంలో విశేషంగా జరుపుకొంటారు. నవరాత్రులలో కనకదుర్గ అమ్మవారిని వివిధ రూపాలలో అలంకరించి, రోజుకో నైవేద్యాన్ని నివేదిస్తారు.నవరాత్రులలో కనకదుర్గాదేవి అలంకారాలు1 మొదటిరోజున శ్రీ స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా బంగారురంగు వస్త్రాలతో అలంకరిస్తారు. నైవేద్యంగా తీపి బూందీ, సుండలు సమర్పిస్తారు.2 రెండో రోజున శ్రీ బాలా త్రిపురసుందరీదేవిగా గులాబిరంగు వస్త్రాలతో అలంకరిస్తారు. నైవేద్యంగా పెసరపప్పు పాయసాన్ని సమర్పిస్తారు.3 మూడో రోజున శ్రీ గాయత్రీదేవిగా కనకాంబరంరంగు వస్త్రాలతో అలంకరిస్తారు. అల్లం గారెలను నైవేద్యంగా సమర్పిస్తారు.4 నాలుగో రోజున శ్రీ అన్నపూర్ణాదేవిగా గంధంరంగు వస్త్రాలతో అలంకరిస్తారు. దద్ధ్యోదనం, కట్టెపొంగలి నైవేద్యంగా సమర్పిస్తారు.5 ఐదో రోజున శ్రీ లలితా త్రిపురసుందరీదేవిగా బంగారు రంగు వస్త్రాలతో అలంకరిస్తారు. నైవేద్యంగా పులిహోర, పెసర బూరెలను సమర్పిస్తారు.6 ఆరో రోజున శ్రీ మహాలక్ష్మీదేవిగా గులాబిరంగు వస్త్రాలతో అలంకరిస్తారు. నైవేద్యంగా పూర్ణాలు, క్షీరాన్నం సమర్పిస్తారు.7 ఏడో రోజున శ్రీ సరస్వతీదేవిగా తెలుపురంగు వస్త్రాలతో అలంకరిస్తారు. నైవేద్యంగా పరమాన్నం, దధ్యోదనం, అటుకులు, బెల్లం, శనగ పప్పు సమర్పిస్తారు.8 ఎనిమిదో రోజున శ్రీ దుర్గాదేవిగా ఎరుపురంగు వస్త్రాలతో అలంకరిస్తారు. పులగం, పులిహోరలను నైవేద్యంగా సమర్పిస్తారు.9 తొమ్మిదో రోజున శ్రీ మహిషాసురమర్దనిగా ముదురు గోధుమరంగు వస్త్రాలతో అలంకరిస్తారు. నైవేద్యంగా పులగం, పులిహోర, గారెలు, నిమ్మరసం, వడపప్పు, పానకం సమర్పిస్తారు.10 పదో రోజున శ్రీ రాజరాజేశ్వరీదేవిగా ఆకుపచ్చరంగు వస్త్రాలతో అలంకరిస్తారు. నైవేద్యంగా లడ్డూలను సమర్పిస్తారు.నవదుర్గల ఆరాధనదసరా నవరాత్రులలో అమ్మవారిని నవదుర్గల రూపాలలో కూడా పూజిస్తారు. శ్రీచక్రంలోని నవచక్రాలలో కొలువుండే దుర్గాదేవి నవరూపాల గురించి బ్రహ్మదేవుడు మార్కండేయునికి చెప్పినట్లుగా వరాహ పురాణం చెబుతోంది. వరాహ పురాణం చెప్పిన ప్రకారం–ప్రథమం శైలపుత్రీ చ ద్వితీయం బ్రహ్మచారిణీతృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకమ్పంచమం స్కందమాతేతి షష్ఠం కాత్యాయనీతి చసప్తమం కాలరాత్రీతి మహాగౌరీతి చాష్టకమ్నవమం సిద్ధిధాత్రీ చ నవదుర్గాః ప్రకీర్తితాఃఉక్తాన్యేతాని నామాని బ్రహ్మణైవ మహాత్మనాఈ నవరాత్రులలో దుర్గాదేవి భక్తులు అమ్మవారిని శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాలరాత్రి, మహాగౌరి, సిద్ధిధాత్రి అనే నవదుర్గా రూపాలలో భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు.దుర్గా సప్తశతిలో అమ్మవారి తొమ్మిదిరూపాల ప్రస్తావన మరోవిధంగా ఉన్నా, వాటిని నవదుర్గలుగా పేర్కొనలేదు. దుర్గా సప్తశతిలో మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి, నంద, శాకంబరి, భీమ, రక్తదంతిక, దుర్గా, భ్రామరీ అనే రూపాల ప్రస్తావన ఉంది. కొన్నిచోట్ల నవరాత్రులలో అమ్మవారిని ఈ రూపాలలో కూడా ప్రత్యేక అలంకరణలు, నైవేద్యాలతో ఆరాధించే సంప్రదాయం ఉంది. శమీపూజనవరాత్రుల చివరి రోజైన విజయ దశమినాడు శమీపూజ చేయడం ఆనవాయితీ. పాండవులు అరణ్యవాసం ముగించుకుని, అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు తమ ఆయుధాలను, వస్త్రాలను ఎవరికీ కనిపించకుండా శమీవృక్షం– అంటే జమ్మిచెట్టు మీద దాచారు. అజ్ఞాతవాసం ముగిసిన తర్వాత వారు శమీవృక్షానికి పూజించి, దానిపై తాము దాచుకున్న ఆయుధాలను వస్త్రాలను తిరిగి తీసుకున్నారు. శమీవృక్షంలో అపరాజితా దేవి కొలువై ఉంటుందని నమ్మకం. అపరాజితా దేవి ఆశీస్సులతోనే పాండవులు కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులపై విజయం సాధించినట్లు మహాభారతం చెబుతోంది. శ్రీరాముడు కూడా విజయదశమి రోజున అపరాజితా దేవిని పూజించి, రావణునిపై విజయం సాధించినట్లు రామాయణం చెబుతోంది. ఈ సందర్భంగా చాలాచోట్ల ఆయుధపూజలు కూడా జరుపుతారు. తెలంగాణలో శమీపూజ తర్వాత పాలపిట్ట దర్శనం చేసుకునే ఆచారం కూడా ఉంది. విజయదశమి రోజు సాయంత్రం నక్షత్ర దర్శనమైన తర్వాత శమీవృక్షం వద్దకు చేరుకుని, అపరాజితా దేవిని పూజించిన తర్వాత– ‘శమీ శమయుతే పాపం శమీ శత్రు వినాశినీఅర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియదర్శినీ’ అనే శ్లోకాన్ని పఠిస్తూ, శమీవృక్షం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. కొందరు శమీ అష్టోత్తరాన్ని కూడా పఠించి, పూజ జరుపుతారు. శమీపూజ చేయడం వల్ల అపరాజితా దేవి ఆశీస్సులు లభించడమే కాకుండా, శనిదోష నివారణ జరుగుతుందని ప్రతీతి.దసరా నవరాత్రుల సమయంలో తెలంగాణలో బతుకమ్మ పండుగను తొమ్మిది రోజుల పాటు వైభవంగా జరుపుకొంటారు. రకరకాల రంగు రంగుల పూలతో బతుకమ్మను పేర్చి, మహిళలు బతుకమ్మ చుట్టూ వలయాకారంలో తిరుగుతూ, పాటలు పాడుతూ సందడి చేస్తారు. ఈ నవరాత్రుల రోజులలో కొన్ని ప్రాంతాల్లోని మహిళలు ‘గ్రామ కుంకుమ నోము’, ‘కైలాసగౌరీ నోము’ వంటి నోములను నోచుకుంటారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బతుకమ్మ పండుగను తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రపండుగగా నిర్వహిస్తోంది. బతుకమ్మ పండుగలోనూ రోజుకో తీరులో నైవేద్యాలను సమర్పిస్తారు.పూల వేడుక బతుకమ్మ పండుగఎంగిలిపూల బతుకమ్మ: మొదటిరోజు బతుకమ్మను ఎంగిలిపూల బతుకమ్మ అంటారు. మహాలయ అమావాస్య రోజున ఈ పండుగ మొదలవుతుంది. ఈ రోజున బియ్యప్పిండి, నూకలు, నువ్వులు కలిపి నైవేద్యం తయారు చేసి సమర్పిస్తారు.అటుకుల బతుకమ్మ: ఆశ్వయుజ శుక్ల పాడ్యమి నాడు చేస్తారు. రెండో రోజు జరిగే ఈ వేడుకను అటుకుల బతుకమ్మ అంటారు. ఈ రోజున సప్పిడి పప్పు, అటుకులు, బెల్లంతో తయారు చేసిన నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పిస్తారు.ముద్దపప్పు బతుకమ్మ: మూడో రోజు వేడుకను ముద్దపప్పు బతుకమ్మ అంటారు. ఈ రోజున పాలు, బెల్లం, ముద్దపప్పుతో తయారు చేసిన నైవేద్యం సమర్పిస్తారు.నానేబియ్యం బతుకమ్మ: నాలుగో రోజు వేడుకను నానేబియ్యం బతుకమ్మ అంటారు.ఈ రోజున నానబెట్టిన బియ్యం, పాలు, బెల్లం కలిపి తయారు చేసిన నైవేద్యం సమర్పిస్తారు.అట్ల బతుకమ్మ: ఐదో రోజు వేడుకను అట్ల బతుకమ్మ అంటారు. ఈ రోజున అమ్మవారికి అట్లు లేదా దోశలను నైవేద్యంగా సమర్పిస్తారు.అలిగిన బతుకమ్మ: ఆరో రోజు వేడుకను అలిగిన బతుకమ్మ అంటారు. ఈ రోజున నైవేద్యమేమీ సమర్పించరు.వేపపండ్ల బతుకమ్మ: ఏడో రోజు వేడుకను వేపపండ్ల బతుకమ్మ అంటారు. ఈ రోజున బాగా వేపిన బియ్యప్పిండితో వేపపండ్లలా వంటకాన్ని తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు.వెన్నముద్దల బతుకమ్మ: ఎనిమిదో రోజు వేడుకను వెన్నముద్దల బతుకమ్మ అంటారు. ఈ రోజున నువ్వులు, బెల్లం వెన్నముద్ద లేదా నెయ్యిలో కలిపి నైవేద్యంగా సమర్పిస్తారు.సద్దుల బతుకమ్మ: తొమ్మిదో రోజు వేడుకను సద్దుల బతుకమ్మ అంటారు. ఇదే రోజున దుర్గాష్టమి జరుపుకొంటారు. ఈ రోజున బతుకమ్మకు పెరుగన్నం, చింతపండు పులిహోర, నిమ్మకాయ పులిహోర, కొబ్బరన్నం, నువ్వులన్నం– ఐదు రకాల నైవేద్యాలను సమర్పిస్తారు.ఆడపడుచులందరూ అత్తవారింటి నుంచి వచ్చి పుట్టింట్లో ఈ తొమ్మిదిరోజుల పూల పండుగను జరుపుకొంటారు. పండుగ ముగిసిన తర్వాత బతుకమ్మను దగ్గర్లో ఉన్న జలాల్లో నిమజ్జనం చేస్తారు. ఆంధ్రప్రదేశ్‌లోని పలనాడు ప్రాంతంలో కూడా కొన్ని చోట్ల బతుకమ్మ పండుగను జరుపుకొంటారు. పన్యాల జగన్నాథదాసు -
మెరిసే పుట్టగొడుగులు..! తింటే.. అంతే..!
మిణుగురు పురుగులు చీకట్లో వెలుగులు వెదజల్లుతూ ఎగురుతుంటాయి. ఈ పుట్టగొడుగులు కూడా మిణుగురుల్లాగానే చీకట్లో వెలుగులు వెదజల్లుతుంటాయి. రాత్రి పూర్తిగా చీకటి పడిన తర్వాత ఇవి ఆకుపచ్చ రంగులో వెలుగుతూ మిరుమిట్లు గొలుపుతాయి.‘మైసీనీ క్లోరోఫాస్’ అనే ఈ పుట్టగొడుగులు పగటివేళ మిగిలిన పుట్టగొడుగుల మాదిరిగానే బూడిదరంగు గోధుమరంగు కలగలసిన రంగులో కనిపిస్తాయి. ఇవి భారత్, శ్రీలంక, తైవాన్, ఇండోనేసియా, పోలినేసియా, ఆస్ట్రేలియా, బ్రెజిల్ తదితర దేశాల్లో కనిపిస్తాయి. అమెరికన్ వృక్షశాస్త్రవేత్త చాల్స్ రైట్ 1854లో తొలిసారిగా వీటిని జపాన్‌లోని బోనిన్ దీవుల్లో గుర్తించాడు. ఈ పుట్టగొడుగుల కాండం 2–12 అంగుళాల వరకు ఉంటుంది. పైనున్న గొడుగు వంటి భాగం 1.2 అంగుళాల వరకు ఉంటుంది. జపాన్‌లో దీనిని ‘యాకో టాకె’ అని అంటారు. అంటే, ‘రాత్రి దీపం’ అని అర్థం. రాత్రివేళ వెలుగుతూ ఆకర్షణీయంగా కనిపించే ఈ పుట్టగొడుగులు తినడానికి మాత్రం పనికిరావు. పొరపాటున తింటే, వీటిలోని విషపదార్థాలు ఒక్కోసారి ప్రాణాంతక పరిస్థితులకు దారితీస్తాయి. (చదవండి: గుండెకు ముప్పు రాకూడదంటే ఈ పరీక్షలు తప్పనిసరి..) -
ఆ ముచ్చట తీర్చే సెల్ఫీ ప్రింటర్
స్మార్ట్ఫోన్లు చేతిలోకి వచ్చాక జనాలకు ఎడాపెడా సెల్ఫీలు తీసుకోవడం అలవాటుగా మారిపోయింది. సెల్ఫీలు ఎంతసేపూ ఫోన్లోనో, కంప్యూటర్లలోనో చూసుకోవడమే తప్ప పాతకాలంలోలా వాటిని ప్రింట్ చేయించి, ఆల్బమ్స్‌లో దాచుకునే అలవాటు దాదాపు అంతరించింది.అయితే, సెల్ఫీలను ప్రింట్ చేసుకుని, దాచుకోవాలనే ముచ్చట కూడా కొందరికి ఉంటుంది. ఆ ముచ్చట తీర్చడానికే జపానీస్ కెమెరాల తయారీ కంపెనీ ‘కేనన్’ తాజాగా సెల్ఫీ ప్రింటర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ‘సెల్ఫీ క్యూఎక్స్20’ పేరుతో ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసిన ఈ ప్రింటర్‌తో స్మార్ట్‌ఫోన్ నుంచి ఫొటోలను నేరుగా ముద్రించుకోవచ్చు.అలాగే, లాప్టాప్, డెస్క్‌టాప్‌లలో భద్రపరచుకున్న ఫొటోలను కూడా ముద్రించుకోవచ్చు. సెల్ఫీ లేఔట్ యాప్ ద్వారా ఈ ప్రింటర్ పనిచేస్తుంది. ఈ యాప్ ద్వారా ప్రింట్ తీసుకోవడానికి ముందు ఫొటోలను ఎడిట్ చేసుకోవడానికి, ఎంపిక చేసుకున్న ఫొటోల కొలాజ్ తయారు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. భారత్ మార్కెట్లో దీని ధర రూ. 7,495 మాత్రమే! -
‘క్లిప్’ ఉంటే మీ సైకిల్ ఇక ఈ-సైకిల్
ప్రపంచవ్యాప్తంగా ఇటీవలి కాలంలో ఎలక్ట్రిక్ వాహనాల వాడకం బాగా పెరిగింది. ఈ–స్కూటర్లు, బైక్‌లే కాకుండా, ఈ–సైకిళ్లు కూడా వాడుకలోకి వచ్చాయి. మామూలు సైకిల్‌ను నడిపించాలంటే, పెడల్ తొక్కక తప్పదు. బలం ఉపయోగించక తప్పదు. ఎగుడు దిగుడు దారుల్లో ఎక్కువ దూరం సైకిల్ మీద వెళ్లాలంటే అలసట తప్పదు...ఇక అలాంటి ఇబ్బందేమీ ఉండదు. ఈ ‘క్లిప్’ను సైకిల్ ముందు చక్రం వైపు తగిలిస్తే చాలు, మామూలు సైకిల్ కూడా ఈ–సైకిల్‌గా మారిపోతుంది. ఇది ఎలక్ట్రిక్ మోటార్ క్లిప్. ఇది 26 అంగుళాలు, 28 అంగుళాల టైర్లకు సరిపోతుంది. దీనిలోని స్ప్రింగ్‌లోడెడ్ క్లాంప్ను ముందు చక్రం ఫోర్క్‌కు తగిలించుకుంటే, గట్టిగా పట్టి ఉంటుంది.ఇదీ చదవండి: హైదరాబాద్ హైస్పీడ్ ఎలక్ట్రిక్ బైక్లుఇందులోని లిథియం అయాన్ బ్యాటరీ ద్వారా సరఫరా అయ్యే విద్యుత్తుతో మామూలు సైకిల్ కూడా ఇట్టే ఈ–సైకిల్‌గా మారి, గంటకు గరిష్ఠంగా 25 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది. అమెరికన్ కంపెనీ ‘క్లిప్ బైక్’ దీనిని రూపొందించింది. దీని ధర 499 డాలర్లు (రూ.41,799). -
గుట్టు విప్పిన సమాధి..
‘తండ్రి సమాధి దగ్గర అన్నదమ్ముల తన్నులాట. ఉత్తరప్రదేశ్‌లోని అజీజ్పూర్లో జరిగిన ఈ సంఘటన ఊళ్లో వాళ్లందరినీ విస్మయానికి గురి చేసింది. శిథిలావస్థకు చేరిన తండ్రి సమాధికి మరమ్మతులు చేయాలని తమ్ముడు, అవసరంలేదు.. ఎలా ఉందో అలాగే ఉంచాలని అన్న పట్టుబట్టడంతో వాదన తగువుగా మారి, చేయి చేసుకోవడం వరకు వెళ్లింది. అన్న మొండిపట్టుపై అనుమానం వచ్చిన తమ్ముడు, అన్న మీద నిఘా పెట్టాడు. ఓ రాత్రివేళ అన్న.. తండ్రి సమాధి పక్కనున్న గుంతలోంచి ఒక కుండను తీసుకెళ్లడం తమ్ముడి కంటబడింది. అన్నకు ఎదురెళ్లి ఆ కుండను లాక్కొని చూశాడు. అందులో బంగారం ఉంది. హతాశుడయ్యాడు. అన్న మీద పోలీసులకు ఫిర్యాదు చేశాడు.. ’ అంటూ చదువుకుపోతున్నాడు ఐటీ ఆఫీస్‌లో.. ఓ ఉద్యోగి.నవ్వుతూ ఆ వార్తను వింటున్న ఓ మహిళా ఉద్యోగికి ఏదో అనుమానం వచ్చినట్టుంది. వెంటనే తన కొలీగ్ చేతుల్లోంచి ఆ పేపర్ లాక్కొని తమ ఆఫీసర్ క్యుబికల్ వైపు పరుగెత్తినట్టే వెళ్లింది. ఆమె చర్యకు ఆశ్చర్యపోయాడు అప్పటిదాకా వార్త చదివిన కొలీగ్. బాస్ దగ్గరకు వెళ్లిన ఆ మహిళా ఉద్యోగి ‘సర్.. మన లాస్ట్ రైడ్‌లో..’ అని ఏదో చెప్పబోతుండగా..‘లీవిట్ .. ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ వల్ల ఓ పెద్ద వ్యక్తిని ఇన్సల్ట్ చేసినట్టయింది. డిపార్ట్మెంట్ పరువుపోయింది’ అన్నాడు బాస్ అసహనంగా!‘సర్.. అతని సొంతూరులో.. ’ అని మళ్లీ ఆమె ఏదో చెప్పబోతుండగా.. ‘ఆ విషయాన్ని వదిలేయండి అన్నాను కదా..’ అన్నాడు ఫైల్లోంచి ముఖం బయటపెట్టకుండానే!‘అదికాదు సర్.. అతని సొంతూరు.. ’ అని తన మాటను పూర్తి చేయాలని ఆమె ప్రయత్నిస్తుండగా.. బాస్ మళ్లీ అడ్డుపడుతూ ‘సొంతిల్లు, బంధువుల ఇళ్లు, ఫ్యాక్టరీ, గోదామ్లు అన్నీ సర్చ్ చేశాం. ఎక్కడా చిల్లి గవ్వ, చిరిగిన డాక్యుమెంట్ కూడా దొరకలేదు’ అన్నాడు కాస్త చిరాగ్గా. ‘బట్ సర్ అతని తండ్రి సమాధి సర్చ్ చేయలేదు కదా’ స్థిరంగా అన్నది ఆ ఉద్యోగిని. అప్పుడు తలెత్తి ఆమె వంక చూశాడు అతను. ఆమె అతనికి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంటూ.. ‘సర్.. ఆ బడాబాబు, రీసెంట్గా తన తండ్రి పదిహేనో వర్ధంతి సందర్భంగా.. తన పొలంలో ఉన్న తండ్రి సమాధిని రెనోవేట్ చేశాడని మొన్ననే పేపర్లో చదివాను. దాన్నో విశ్రాంతి మందిరంలా తీర్చిదిద్దాడని పేపర్లు తెగ పొగిడాయి’ అంటూ ఆగింది. ‘అయితే ఏంటీ?’ అన్నట్టుగా చూశాడు. వెంటనే అతని చేతుల్లో తను లాక్కొచ్చిన పేపర్ పెట్టి, ఇందాక తన కొలీగ్ చదివిన వార్తను చూపించింది ఆమె. ఆ వార్త మీద దృష్టిసారించాడు ఆఫీసర్. రెండు నిమిషాల తర్వాత ‘యెస్.. ఎలా మిస్ అయ్యాం ఈ పాయింట్‌ని?’ అన్నాడు పేపర్‌ను మడిచేస్తూ!‘సర్.. ఇప్పుడు ప్లాన్ చేసుకోవచ్చు!’ అంది ఆమె ఉత్సాహంగా!నాలుగు రోజలకు.. బడాబాబు సొంతూరులోని పొలానికి చేరుకుంది ఐటీ టీమ్. పేపర్లు పొగిడినట్టే అది నిజంగానే సమాధిలా లేదు. వాచ్‌మన్ ఉన్నాడు. తామెవరో చెప్పి, ముందుకు మూవ్ అయ్యారు. ఆ సమాధిని పరిశీలిస్తుండగానే బడాబాబు తన పరివారంతో రెండు కార్లలో అక్కడికి చేరుకున్నాడు. కారు పార్క్ అవుతుండగానే హడావిడిగా కారు దిగి, పరుగెడుతున్నట్టుగా ఐటీ టీమ్‌ని చేరాడు. ‘మా కుటుంబానికి మాత్రమే పర్మిషన్ ఉన్న ప్లేస్ ఇది’ అంటూ బడాబాబు.. ఐటీ ఆఫీసర్ మీదకు పళ్లునూరుతుండగానే ‘కూల్ సర్, మీకు సంబంధించిన అన్ని చోట్లా ఇన్క్లూడింగ్ ఈ సమాధి.. సర్చ్ చేసుకునే పర్మిషన్ మాకుంది’ అంటూ అనుమతుల పత్రం చూపించాడు ఐటీ ఆఫీసర్. ప్యాంట్ జేబులోంచి కర్చీఫ్ తీసుకుని నుదుటికి పట్టిన చెమట తుడుచుకున్నాడు బడాబాబు. పక్కనే ఉన్న అతని అíసిస్టెంట్తో ‘సర్కి మంచినీళ్లు’ అంటూ సైగ చేశాడు ఐటీ ఆఫీసర్. ‘నో థాంక్స్’ అంటూ కోపంగా అక్కడే ఉన్న సిమెంట్ బెంచ్ మీద కూలబడ్డాడు బడాబాబు. సమాధి చుట్టూ పరిశీలించారు ఐటీ వాళ్లు. అనుమానం ఉన్న చోటల్లా తట్టారు. ఏమీ కనిపించలేదు. రహస్య అరలేవీ తెరుచుకోలేదు. ఇదీ వృథా ప్రయాసే కాదు కదా అనుకుంటూ బడాబాబు వైపు చూశాడు ఐటీ ఆఫీసర్. అతని ముఖంలో చాలా కంగారు కనపడుతోంది. అయితే అంతా కరెక్ట్‌గానే జరుగుతోంది అనే భరోసాకు వచ్చాడు ఐటీ ఆఫీసర్. అతను అలా అనుకుంటున్నాడో లేదో.. ‘సర్’ అంటూ పిలిచాడు ఉద్యోగి. ఒక్క అంగలో అక్కడికి వెళ్లాడు ఆఫీసర్. సరిగ్గా సమాధికి ముందు ఫ్లోరింగ్‌లోని నాలుగు మార్బుల్స్ డిజైన్‌లో ఏదో తేడాగా ఉంది. చూపించాడు ఉద్యోగి. చూశాడు ఆఫీసర్. ప్రత్యేక డిజైన్లా కనపడుతోంది కానీ.. సమ్‌థింగ్ ఫిషీ అనుకున్నాడు. బడాబాబు వైపు చూశాడు. అతనిలో కంగారు ఎక్కువైంది. కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. క్లారిటీ వచ్చేసింది ఆఫీసర్‌కి.‘సర్..’ పిలిచాడు ఆఫీసర్. ‘ఏంటీ?’ అన్నట్టుగా చూశాడు బడాబాబు. ‘కుడ్ యూ ప్లీజ్ ఓపెన్ ఇట్?’ అడిగాడు ఆఫీసర్. ‘ఓపెన్ చేయడానికి అదేమన్నా తలుపా?’ బడాబాబు సమాధానం.‘డోర్ అయితే మేమే ఓపెన్ చేసేవాళ్లం. ప్లీజ్ ఓపెన్ ఇట్..’ స్థిరంగా చెప్పాడు ఆఫీసర్. అట్టే బెట్టు చేయక జేబులోంచి రిమోట్ తీసి ఓపెన్ చేశాడు. టెన్ బై టెన్ సైజులోని నేలమాళిగ అది. అందులో అన్నీ లాకర్లే! డబ్బు, బంగారం, వెండి, బంగారు విగ్రహాలు, వజ్రాలు ఎట్సెట్రా చాలానే దొరికాయి. అయినా ఆ ఆఫీసర్ ముఖంలో విజయం తాలూకు ఆనవాళ్లు లేవు. ఎందుకంటే ఆయనకందిన లెక్కలో దొరికినవాటి లెక్క సగం కూడా లేదు. ఫార్మాలిటీస్ పూర్తిచేసుకొని, తిరుగు ప్రయాణమవుతూ ‘ఇంకేదో క్లూ మిస్ అయి ఉంటాం’ అనుకున్నాడు.ఇవి చదవండి: ఈ కిక్కిరిసిన అపార్ట్మెంట్ ఎక్కడుందో తెలుసా!? -
ఈ కిక్కిరిసిన అపార్ట్మెంట్ ఎక్కడుందో తెలుసా!?
ప్రపంచంలోనే అత్యధిక జనాభా నివాసం ఉండే అపార్ట్మెంట్ భవన సముదాయం ఇది. ఈ భవన సముదాయం రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ సమీపంలో ఉంది. ఇందులో ఏకంగా ఇరవైవేల మందికి పైగా జనాలు నివాసం ఉంటున్నారు. మనుషులతో కిక్కిరిసిన ఈ అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌ను పాశ్చాత్య మీడియా ‘హ్యూమన్ యాంట్‌హిల్’గా అభివర్ణిస్తోంది. అంటే, మనుషులు ఉండే చీమలపుట్ట అన్నమాట!ఈ భారీ అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లో 25 అంతస్తుల్లో 3,708 అపార్ట్మెంట్లు ఉన్నాయి. ఈ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ నిర్మాణం 2015లో పూర్తయింది. అప్పటి నుంచి జనాలు ఇందులోకి చేరడం మొదలుపెట్టారు. స్వల్పకాలంలోనే ఇది పూర్తిగా జనాలతో కిక్కిరిసిపోయే పరిస్థితికి చేరుకుంది. ఉచిత పార్కింగ్, కాంప్లెక్స్ లోపలే సెలూన్లు, కాఫీ షాపులు, నర్సరీ, పోస్టాఫీసు, సూపర్‌మార్కెట్ వంటి సమస్త సౌకర్యాలూ ఉండటంతో జనాలు ఇక్కడ ఉండటానికి ఇష్టపడుతున్నారు.ఇవి చదవండి: మీ ముఖాన్ని.. మెరిపించే మంత్రదండం! -
పళ్ల చిగుళ్ల.. సమస్య! ఏ ట్రీట్మెంట్ వాడాలి?
నాకు 3వ నెల. ప్రతిరోజు పళ్ల చిగుళ్ల నుంచి రక్తం కారుతోంది. భయపడి పళ్లు తోముకోవడం మానేస్తే నోటి నుంచి దుర్వాసన వస్తోంది. డాక్టర్ని కలిస్తే ఏ ట్రీట్మెంట్ చేయించుకోమంటారో అని భయంగా ఉంది. ఇలాంటి సమయంలో ఏ చికిత్స తీసుకోవాలి? – పద్మ, కొమరిపాలెంగర్భం దాల్చిన 3వ నెల నుంచే కొన్ని హార్మోన్ల మార్పుల వల్ల పళ్ల చిగుళ్లు వాపు రావడంతో పాటు కొంచెం తిమ్మిరి, నొప్పిగా కూడా ఉంటాయి. ఈ నొప్పి వల్ల చాలామంది పళ్లు తోముకోవడం మానేస్తారు. దానితో వ్యర్థ పదార్థాలు పళ్ల మధ్య ఉండి ఇన్ఫెక్షన్ ఏర్పడి దుర్వాసన వస్తుంది. చాలామందికి రక్తస్రావం కూడా అవుతుంది.దీనిని చిగురువాపు అంటారు. దంత వైద్యుణ్ణి సంప్రదించాలి. దీనికి కొన్ని మౌత్‌వాష్ లోషన్స్, మెత్తటి కుచ్చు ఉన్న చిన్న బ్రష్‌లు వాడమంటారు తప్ప ఎటువంటి చికిత్సలూ ఉండవు. దంతవైద్యుణ్ణి కలిసినప్పుడు మీరు గర్భవతని చెప్పాలి. ఏ కారణంతో అయినా చికిత్స అవసరమైతే ఈ సమయంలో చేయరు. ఎక్స్‌రే కూడా సరికాదు. ప్రసవానంతరమే చికిత్స చేస్తారు. ఈలోపు ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంటే తక్కువ మెతాదులో యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్ ఇస్తారు.దంత సమస్యలు రాకుండా మొదటి నెల నుంచే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. 2–5 నిమిషాల సమయం కేటాయించి రోజుకు రెండుసార్లు బ్రష్ చేసుకోవాలి. ఫ్లోరైడ్ ఉన్న పేస్ట్ వాడాలి. తిన్న వెంటనే పళ్ల మధ్య వ్యర్థాలు లేకుండా నోటిని శుభ్రం చేసుకోవాలి. మొదటి మూడునెలల్లో వాంతులు ఎక్కువ ఉన్నవారు, వాంతి అయిన తర్వాత నోటిని మంచినీళ్లతో కడుక్కోవాలి. దీనివల్ల వాంతిలో ఉండే ఎసిడిటీ పళ్లను పాడు చేయకుండా ఉంటుంది.వాంతి అయిన వెంటనే ఎసిడిటీతో పళ్లు బాగా సున్నితంగా అవుతాయి. అందుకే గంట తరువాత బ్రష్ చెయ్యాలి. తీపి పదార్థాలు, చల్లని పానీయాలు తాగకూడదు. టీ, కాఫీ తాగిన తరువాత నోరు శుభ్రం చేసుకోవాలి. పండ్లు, కాయగూరలు, పెరుగు లాంటివి తీసుకోవాలి. ఆల్కహాల్ ఎక్కువ ఉన్న మౌత్ వాష్‌లు వాడకూడదు. ఏదైనా శస్త్రచికిత్స తప్పనిసరైతే 5–7 నెలలో చేస్తారు. చిగుళ్ల నుంచి రక్తస్రావానికి ఏ విధమైన మందులు అవసరం లేదు. చల్లని ఐస్ ప్యాక్ పెట్టుకోవాలి. డాక్టర్ని కలిసినప్పుడు మీ ఇబ్బందులు చెబితే దానిని బట్టి ఎప్పుడెప్పుడు సంప్రదించాలో సూచిస్తారు. – డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ఇవి చదవండి: కిడ్నీ రోగులకు ఉపశమనం హెల్త్ ట్రీట్..మెనోపాజ్ ఔషధంతో లివర్‌కు ముప్పు!మెనోపాజ్ లక్షణాల నుంచి ఉపశమనం కోసం ఉపయోగించే ఔషధం వల్ల లివర్‌కు ముప్పు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఇటీవల తేలింది. మెనోపాజ్‌లో సర్వసాధారణంగా ఒంటి నుంచి వేడి ఆవిర్లు రావడం, చిరాకు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాల నుంచి ఉపశమనానికి ‘వియోజా’ మాత్రలను ఎక్కువమంది వాడుతుంటారు. ‘వియోజా’ మాత్రలలో ‘ఫెజోలినెటంట్’ అనే ఔషధం ఉంటుంది. ఇది నాన్‌హార్మోనల్ ఔషధం.ఈ ఔషధాన్ని దీర్ఘకాలం వాడినట్లయితే, లివర్‌కు తీవ్రమైన సమస్యలు ఏర్పడతాయని అమెరికాకు చెందిన ఆహార ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ) వెల్లడించింది. ఇప్పటికే లివర్ సమస్యలు ఉన్న మహిళలు ఈ ఔషధాన్ని వాడకుండా ఉండటమే మంచిదని సూచించింది. వరుసగా నలబై రోజుల పాటు ఈ ఔషధం తీసుకున్న వారిలో లివర్ దెబ్బతినడాన్ని గుర్తించినట్లు ఎఫ్‌డీఏ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అందువల్ల ఈ ఔషధం లేబుల్‌పై ‘లివర్‌కు హానికరం’ అనే హెచ్చరికను జోడించనున్నట్లు తెలిపారు. -
ప్రెగ్నెంట్ సమయంలో.. ఎలాంటి ఆహార జాగ్రత్తలు పాటించాలి?
నాకు 3వ నెల. ఆహారం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? ఏ ఆహారం తినకూడదు. తింటే ఎలాంటి ప్రమాదం ఉంటుంది. – హారిక, పెదపూడిగర్భధారణ సమయంలో రోజువారీ ఆహారాన్నే తినవచ్చు. ఇంటిలో తయారు చేసినది అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు. చాలామంది అపోహలతో ఆరోగ్యకరమైన ఆహారం కూడా తినరు. సాధారణంగా మీరు తినే ఆహారమే ఇప్పుడు కూడా తినండి. మీరు ఎప్పుడూ తినని కొత్త ఆహార పదార్థాలు, పండ్లు, కూరగాయలు, పాల ఉత్పత్తులను ఈ సమయంలో తినకండి. అవి మీ శరీరానికి సరిపడకపోతే వచ్చే ఇబ్బందులకు ఏమైనా మందులు వాడాల్సి వస్తే మంచిదికాదు. అందుకే కొత్తవి తినకండి.చాలామందికి గుడ్లు, మష్రూమ్స్, పల్లీలు, సోయా వల్ల ఎలర్జీలు వస్తాయి. పాశ్చరైజ్ చేయని చీజ్, పాలు, క్రీమ్ అసలు వాడకూడదు. వీటివల్ల ‘లిస్టెరియోసిస్’ ఇన్ఫెక్షన్ తల్లికి, బిడ్డకి వస్తుంది. మాంసాహారం తినేవారు చికెన్, మటన్లాంటివి బాగా ఉడికించి తినాలి. ఉడికించని మాంసంలో టాక్సోప్లాస్మా అనే పరాన్నజీవి ఉంటుంది. ఇది గర్భస్రావం, ఇన్ఫెక్షన్లకు దారి తీస్తుంది. లివర్‌తో తయారు చేసే ఆహార పదార్థాలలో విటమిన్ ఎ ఉంటుంది. ఇది ఎక్కువ శాతం బిడ్డకి ప్రమాదం చేస్తుంది.గుడ్లు కూడా బాగా ఉడికించినవే తినాలి. తెల్లసొన అయితే ఇంకా మంచిది. బాగా ఉడికించని గుడ్లలో సాల్మొనెల్లా బ్యాక్టీరియా ఉంటుంది. ఇది ఆహారాన్ని విషపూరితం చేస్తుంది. దీంతో బిడ్డకు ప్రమాదం లేదు కానీ తల్లికి వాంతులు, నీళ్ల విరేచనాలు కావచ్చు. చేపలు తినేవారు కూడా బాగా ఉడికించిన సముద్రపు చేపలను తినొచ్చు. ఒకవేళ తింటే కొన్ని కాలుష్య కారకాలు బిడ్డకు హాని చేస్తాయి. ట్యూనా చేపలో పాదరసం శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి అది కూడా తినకూడదు. ఆయిల్ ఎక్కువగా ఉండే చేపలు కూడా తినకూడదు. చాలామందిలో కాఫీ తాగడం మంచిదేనా అనే ప్రశ్న కూడా ఉంటుంది. నిజానికి మానేయడం మంచిది. కానీ అలవాటు ఉంది, తప్పకుండా తీసుకోవాలి అంటే రోజుకి 200 ఎంజీ కన్నా ఎక్కువ కాఫీ పొడిని తీసుకోకూడదు. అంటే ఒక కప్పు కాఫీ అని అర్థం. ఈ కెఫీన్ వేరే డ్రింక్స్‌లో కూడా ఉంటుంది. ఉదాహరణకి గ్రీన్ టీ లేదా మామూలు టీలో ప్రతి గ్రాముకు 75ఎంజీ కెఫీన్ ఉంటుంది. డార్క్ చాక్లెట్స్‌లో ప్రతి గ్రాముకు 10–25 ఎంజీ ఉంటుంది. కోలా డ్రింక్స్‌లో 40–80 ఎంజీ ఉంటుంది. ఫిల్టర్ కాఫీలో 140 ఎంజీ ఉంటుంది. అందుకే తాగకపోవడమే మంచిది. కనీసం మొదటి మూడునెలల్లో మానేయండి. పండ్లు, కూరగాయలను గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. గర్భధారణ సమయంలో డాక్టర్ సూచించిన మేరకే విటమిన్ మాత్రలు వేసుకోవాలి. – డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ఇవి చదవండి: ఒక అడవిలో తాబేళ్లు... చేపలు... కోతులు -
ఒక అడవిలో తాబేళ్లు... చేపలు... కోతులు
ఒక అడవిలో గుబురుగా ఉన్న చెట్ల మీద ఒక కోతుల జంట నివసిస్తోంది. పెద్దకోతులు మంచివే కానీ పిల్ల కోతులు నాలుగు మాత్రం చాలా అల్లరి చేస్తూ దారిలో వెళ్ళే అందరినీ ఇబ్బంది పెట్టసాగాయి. ఆ చెట్లకు కాస్త దూరంలో ఒక సెలయేరు ఉంది. అందులో కొన్ని తాబేళ్లు, చేపలు నివసిస్తున్నాయి. చేపలు, తాబేళ్లు నీటి మీద తేలియాడగానే కోతులు చెట్ల పైనుంచి పండ్లు, కాయలు, ఎండుకొమ్మలు వాటి మీదకు విసిరి బాధ పెట్టసాగాయి.‘కోతి నేస్తాలూ! మేము మీకు ఏ విధంగానూ అడ్డురావడం లేదు. మరి మీరెందుకు మమ్మల్ని నీటి పైకి రానివ్వకుండా గాయపరుస్తున్నారు?’ అని ఒకరోజు ఒక చేప ప్రశ్నించింది. ‘మేము పిల్లలం, అల్లరి చేస్తూ ఆటలు ఆడుకుంటున్నాం. మేము తినగా మిగిలినవి గిరాటు వేస్తుండగా అవి పొరపాటుగా నీళ్లల్లో పడుతున్నాయి’ అని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చింది ఓ పిల్లకోతి.‘చేప నేస్తాలూ! పిల్లకోతులు కావాలని అలా గిరాటు వేస్తున్నాయి. మనం వాటిని అడగడం వల్ల ఏమీ ఉపయోగం ఉండదు’ అంది ఓ తాబేలు.రోజురోజుకు కోతుల ఆగడాలు పెరగసాగాయి. పాపం! తాబేళ్లు, చేపలు ఏమీ చేయలేక అలాగే అవస్థపడసాగాయి. ఒక రోజున పిల్ల కోతులు ఒక కొమ్మ మీద కూర్చుని ఉయ్యాలూగుతున్నాయి. ఆ కొమ్మ బలహీనంగా ఉండటం వలన ఫెళ్లున విరిగిపోయింది. ఊగుతున్న కోతులు ఆ వేగానికి సెలయేటి నీళ్లల్లో పడిపోయాయి. వాటికి ఈత రాకపోవడంతో ‘కాపాడండి.. కాపాడండి..’ అంటూ పెద్దగా అరవసాగాయి. ఆ అరుపులకు నీళ్లల్లో ఉన్న చేపలు, తాబేళ్లు బయటకు వచ్చాయి. ‘అయ్యో! పిల్ల కోతులు నీళ్లల్లో మునిగిపోతున్నాయి, వాటిని కాపాడుదాం’ అంది ఒక తాబేలు.‘పిల్లకోతులూ! ఇలా మా వీపు మీద కూర్చోండి’ అంటూ నాలుగు పెద్ద తాబేళ్లు వాటి దగ్గరకు వెళ్ళాయి. అవి తాబేళ్ల మీద కూర్చోగానే ఈదుతూ వాటిని ఒడ్డుకు చేర్చాయి. ‘మేము మిమ్మల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టినా మీరు మా ప్రాణాలను రక్షించారు. ఇక నుంచి మనం మంచి మిత్రులుగా ఉందాం’ అన్నాయి పిల్ల కోతులు. ‘అలాగే!’ అన్నాయి తాబేళ్లు.అప్పటి నుంచి అవన్నీ చాలా స్నేహంగా ఉండసాగాయి. ఒకరోజు అడవికి ఒక బెస్తవాడు సెలయేటిలో చేపలు పట్టడానికి వచ్చాడు. అతణ్ణి చెట్టు మీద ఉన్న పిల్లకోతులు చూశాయి. ఈలోగా బెస్తవాడు వలను నీటిలోకి విసిరాడు. ఆదమరచి ఉన్న చేపలు, తాబేళ్లు వలలో చిక్కుకున్నాయి.‘ఈ రోజు నా అదృష్టం పండింది. చాలా చేపలు, తాబేళ్లు కూడా దొరికాయి’ అంటూ బెస్తవాడు సంబరపడి వాటిని తనతో తెచ్చుకున్న బుట్టలో వేసుకున్నాడు. ‘అయ్యో! మన నేస్తాలను ఇతను తీసుకెళ్లిపోతున్నాడు’ అని పిల్ల కోతులు మాట్లాడుకున్నాయి. అన్నీ కూడబలుక్కుని ఒక్కసారిగా బెస్తవాడి మీదకు దూకాయి. ఊహించని పరిణామానికి అతను కంగారుపడ్డాడు. తప్పించుకోవడానికి ప్రయత్నించినా.. కోతులు అతని శరీరాన్ని రక్కేశాయి. బుట్ట, వల అక్కడే వదిలేసి పరుగెత్తుకుంటూ పారిపోయాడు. కోతులు బుట్టను తెరిచి చేపలను, తాబేళ్లను సెలయేటిలోకి వదిలేశాయి. అవి పిల్ల కోతులకు కృతజ్ఞతలు తెలిపి హాయిగా ఊపిరి పీల్చుకున్నాయి. ‘మనం ఎప్పుడూ ఇలాగే ఒకరికి ఒకరం స్నేహంగా ఉండాలి’ అనుకున్నాయి అన్నీ! మనం ఒకరికి సహాయపడితే మనకు దేవుడు సహాయపడతాడు. – కైకాల వెంకట సుమలత -
అవును... అది యాపిల్ కోతల పండుగ!
ఏటా శరదృతువు ప్రారంభంలో యాపిల్ కోతల కాలంలో అక్కడ పండుగ జరుపుకొంటారు. ఊరంతా భారీస్థాయిలో యాపిల్పండ్ల ప్రదర్శనలు కనిపిస్తాయి. కూడళ్లలో యాపిల్పండ్లతో తీర్చిదిద్దిన కళాఖండాలు కనువిందు చేస్తాయి. ఈ విలక్షణమైన పండుగ స్వీడన్లో సిమ్రిషామ్ మునిసిపాలిటీ పరిధిలోని కివిక్ ప్రాంతంలో జరుగుతుంది. ‘కివిక్ యాపిల్ మార్కెట్ ఫెస్టివల్’గా పేరుపొందిన ఈ పండుగకు స్వీడన్ నలుమూలల నుంచే కాకుండా, యూరోప్‌లోని పలు ఇతర దేశాల నుంచి కూడా జనాలు పెద్దసంఖ్యలో వస్తుంటారు.యాపిల్ కోతల పండుగ రోజుల్లో కివిక్ ప్రాంతంలోని పిల్లా పెద్దా అందరూ యాపిల్ తోటల్లోకి, శివార్లలోని చిట్టడవుల్లోకి వెళ్లి యాపిల్‌పండ్లను కోసుకొస్తారు. యాపిల్ బుట్టలు మోసుకుంటూ, సంప్రదాయ నృత్య సంగీతాల నడుమ ఊరేగింపులు జరుపుతారు. యాపిల్ విస్తారంగా పండే కివిక్ను ‘యాపిల్ కేపిటల్ ఆఫ్ స్వీడన్’ అని కూడా అంటారు. ఇక్కడి నుంచి రకరకాల యాపిల్‌పండ్లు పెద్ద ఎత్తున విదేశాలకు ఎగుమతి అవుతుంటాయి.కివిక్లో జరిగే యాపిల్ పండుగను చూడటానికే కాకుండా, ఇక్కడి పురాతన రాతియుగం నాటి ఆనవాళ్లను, కాంస్యయుగానికి చెందిన మూడువేల ఏళ్ల నాటి శ్మశాన వాటికను, అందులోని ఆనాటి రాజు సమాధిని చూడటానికి కూడా పర్యాటకులు వస్తుంటారు. పర్యాటకులను మరింత ఆకట్టుకునేందుకు సిమ్రిషాన్ స్థానిక పరిపాలనా సంస్థ 1988 నుంచి ఇక్కడ యాపిల్ పండుగను వార్షిక వేడుకగా నిర్వహించడం ప్రారంభించింది. యాపిల్ పండుగ సందర్భంగా ఊళ్లో ఏర్పాటు చేసిన బహిరంగ వేదికలపై పలు సాంస్కృతిక కార్యక్రమాలు, కళా ప్రదర్శనలు జరుగుతాయి. ఈ ఏడాది యాపిల్ పండుగ వేడుకలు సెప్టెంబర్ 28న మొదలయ్యాయి. ఈ వేడుకలు అక్టోబర్ 6 నాటితో ముగుస్తాయి. -
కాకి హంసల కథ! పూర్వం ఒకానొక ద్వీపాన్ని..
పూర్వం ఒకానొక ద్వీపాన్ని ధర్మవర్తి అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ రాజుగారు ఉండే నగరంలోనే ఒక సంపన్న వర్తకుడు ఉండేవాడు. అతడు ఉత్తముడు. ఒకరోజు ఒక కాకి అతడి పెరటి గోడ మీద వాలింది. వర్తకుడి కొడుకులు ఆ కాకికి ఎంగిలి మెతుకులు పెట్టారు. అప్పటి నుంచి కాకి ఆ ఇంటికి అలవాటు పడింది. వర్తకుడి కొడుకులు రోజూ పెట్టే ఎంగిలి మెతుకులు తింటూ బాగా బలిసింది. బలిసి కొవ్వెక్కిన కాకికి గర్వం తలకెక్కింది. లోకంలోని పక్షులేవీ బలంలో తనకు సాటిరావని ప్రగల్భాలు పలుకుతుండేది.ఒకనాడు వర్తకుని కొడుకులు ఆ కాకిని వ్యాహ్యాళిగా సముద్ర తీరానికి తీసుకెళ్లారు. సముద్రతీరంలో కొన్ని రాజహంసలు కనిపించాయి. వర్తకుని కొడుకులు ఆ రాజహంసలను కాకికి చూపించి, ‘నువ్వు వాటి కంటే ఎత్తుగా ఎగరగలవా?’ అని అడిగారు. ‘చూడటానికి ఆ పక్షులు తెల్లగా కనిపిస్తున్నాయే గాని, బలంలో నాకు సాటిరాలేవు. అదెంత పని, అవలీలగా వాటి కంటే ఎత్తుగా ఎగరగలను’ అంది కాకి.‘సరే, వాటితో పందేనికి వెళ్లు’ ఉసిగొల్పారు వర్తకుడి కొడుకులు. ఎంగిళ్లు తిని బలిసిన కాకి తారతమ్యాలు మరచి, హంసల దగ్గరకు డాంబికంగా వెళ్లింది. తనతో పందేనికి రమ్మని పిలిచింది. కాకి తమను పందేనికి పిలవడంతో హంసలు పకపక నవ్వాయి. ‘మేం రాజహంసలం. మానససరోవరంలో ఉంటాం. విహారానికని ఇలా ఈ సముద్రతీరానికి వచ్చాం. మేం మహాబలవంతులం. హంసలకు సాటి అయిన కాకులు ఉండటం లోకంలో ఎక్కడైనా విన్నావా?’ అని హేళన చేశాయి.కాకికి పౌరుషం పొడుచుకొచ్చింది.‘నేను నూటొక్క గతులలో ఎగరగలను. ఒక్కో గతిలో ఒక్కో యోజనం చొప్పున ఆగకుండా వంద యోజనాలు అవలీలగా ఎగరగలను. మీరెలా కావాలంటే అలా ఎగురుదాం. కావాలంటే పందెం కాద్దాం’ కవ్వించింది కాకి.‘మేము నీలా రకరకాల గతులలో ఎగరలేం. నిటారుగా ఎంతదూరమైనా ఎగరగలం. అయినా, నీతో పోటీకి మేమంతా రావడం దండగ. మాలో ఏదో ఒక హంస నీతో పోటీకి వస్తుంది’ అన్నాయి హంసలు.ఒక హంస గుంపు నుంచి ముందుకు వచ్చి, ‘కాకితో పందేనికి నేను సిద్ధం’ అని పలికింది.పందెం ప్రారంభమైంది.కాకి, హంస సముద్రం మీదుగా ఎగరసాగాయి.హంస నెమ్మదిగా నిటారుగా ఎగురుతూ వెళుతుంటే, కాకి వేగంగా హంసను దాటిపోయి, మళ్లీ వెనక్కు వచ్చి హంసను వెక్కిరించసాగింది. ఎగతాళిగా ముక్కు మీద ముక్కుతో పొడవడం, తన గోళ్లతో హంస తల మీద జుట్టును రేపడం వంటి చేష్టలు చేయసాగింది. కాకి వెక్కిరింతలకు, చికాకు చేష్టలకు హంస ఏమాత్రం చలించకుండా, చిరునవ్వు నవ్వి ఊరుకుంది. చాలాదూరం ఎగిరాక కాకి అలసిపోయింది. అప్పుడు హంస నిటారుగా ఎగసి, పడమటి దిశగా ఎగరసాగింది. కాకి ఎగరలేక బలాన్నంతా కూడదీసుకుని ఎగురుతూ రొప్పసాగింది. హంస నెమ్మదిగానే ఎగురుతున్నా, కాకి ఆ వేగాన్ని కూడా అందుకోలేక బిక్కమొహం వేసింది. ఎటు చూసినా సముద్రమే కనిపిస్తోంది. కాసేపు వాలి అలసట తీర్చుకోవడానికి ఒక్క చెట్టయినా లేదు. సముద్రంలో పడిపోయి, చనిపోతానేమోనని కాకికి ప్రాణభీతి పట్టుకుంది. కాకి పరిస్థితిని గమనించిన హంస కొంటెగా, ‘నీకు రకరకాల గమనాలు వచ్చునన్నావు. ఆ విన్యాసాలేవీ చూపడం లేదేం కాకిరాజా?’ అని అడిగింది.కాకి సిగ్గుపడింది. అప్పటికే అది సముద్రంలో పడిపోయేలా ఉంది. ‘ఎంగిళ్లు తిని కొవ్వెక్కి నాకెవరూ ఎదురులేరని అనుకునేదాన్ని. నా సామర్థ్యం ఏమిటో ఇప్పుడు తెలిసి వచ్చింది. సముద్రంలో పడిపోతున్నాను. దయచేసి నన్ను కాపాడు’ అని దీనాలాపాలు చేసింది. కాకి పరిస్థితికి హంస జాలిపడింది. సముద్రంలో పడిపోతున్న కాకి శరీరాన్ని తన కాళ్లతో పైకిలాగింది. ఎగురుకుంటూ వెళ్లి ఒడ్డుకు చేర్చింది.‘ఇంకెప్పుడూ లేనిపోని డాంబికాలు పలుకకు’ అని బుద్ధిచెప్పింది హంస. ఈ కథను కురుక్షేత్రంలో శల్యుడు కర్ణుడికి చెప్పాడు.‘కర్ణా! నువ్వు కూడా వర్తకుడి పుత్రుల ఎంగిళ్లు తిన్న కాకిలాగ కౌరవుల ఎంగిళ్లు తిని అర్జునుణ్ణి ధిక్కరిస్తున్నావు. అనవసరంగా హెచ్చులకుపోతే చేటు తప్పదు! బుద్ధితెచ్చుకుని మసలుకో’ అని కర్ణుణ్ణి హెచ్చరించాడు. – సాంఖ్యాయన -
‘డార్లీ.. డార్లీ.. నీకేం కాలేదుగా?’
అ ర్థరాత్రి 2 దాటింది. ఉన్నట్టుండి ‘డా..రిన్.. సేవ్ మీ.. సేవ్ మీ’ అనే ఆర్తనాదాలు వినిపించసాగాయి. గాఢనిద్రలోంచి ఉలిక్కిపడి లేచిన డారిన్, ఆ గొంతు.. కింద నిద్రపోతున్న తన భార్యదేనని గ్రహించి క్షణాల్లో ‘డార్లీ ఏమైంది?’ అంటూ మెట్లవైపు పరుగుతీశాడు. వెళ్తూ వెళ్తూ లైట్స్ ఆన్ చేశాడు. డార్లీ నొప్పితో రొప్పుతూ గుమ్మం నుంచి బయటికి పరుగులు తీయడం కనిపించింది. ఆమె చేతిలో రక్తమోడుతున్న కత్తి ఉంది. ఆమె పరుగు చూస్తుంటే, ముందు ఎవరో పారిపోతున్నట్లే అనిపించింది. డారిన్ వేగం పెంచాడు.ఇంటికి కాస్తదూరంలో డార్లీ ఆగడం చూసి ‘డార్లీ.. డార్లీ.. నీకేం కాలేదుగా?’ అంటూనే ఆమెను పరిశీలనగా చూశాడు. ఆమె దుస్తుల నిండా రక్తం, ఒంటి మీద కత్తిపోట్లు చూసి డారిన్కి వణుకు పుట్టుకొచ్చింది. ‘డ.. డా..రిన్ .. ఎవ..డో ఇంట్లోకొచ్చి, క.. కత్తితో దాడి చేసి పారిపోయాడు’ అంది డార్లీ వణుకుతున్న స్వరంతో. భార్య మాటలు వినగానే డారిన్ కు ఇంట్లో నిద్రపోతున్న పిల్లలు గుర్తొచ్చారు. ‘íపిల్లలు?!’ అని అరుస్తూనే క్షణాల్లో లోపలికి పరుగుపెట్టాడు. చేతిలోని కత్తి అక్కడే పారేసి, అతడి వెనుకే డార్లీ కూడా పరుగెత్తింది.డార్లీ అరుపులకు కంగారులో బయటికి పరుగు తీసినప్పుడు చూడలేదు కానీ హాల్ అంతా నెత్తుటిమయంగా ఉంది. చాలాచోట్ల మనిషి ఎర్రటి అడుగుజాడలు ఉన్నాయి. అవన్నీ చూస్తూ పిల్లలు పడుకున్నవైపు వెళ్తుంటే, డారిన్ కి ప్రాణం పోయినట్లు అనిపించింది. ధైర్యం చేసి పిల్లల దగ్గరకు వెళ్లేసరికి ఇద్దరు కొడుకులు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు.అంబులెన్ ్స వచ్చేసరికే పెద్దకొడుకు ఆరేళ్ల డెవాన్ కన్నుమూశాడు. ఆసుపత్రికి వెళ్లేసరికి రెండో కొడుకు ఐదేళ్ల డామన్ చనిపోయాడు. ఆసుపత్రిలో ఉండగా అప్పటికే కత్తిగాయాలతో అల్లాడుతున్న డార్లీకి సీరియస్ అయిపోయింది. వెంటనే ఐసీయూలో పెట్టి డాక్టర్లు ఆమెకు చికిత్స మొదలుపెట్టారు. ఆ ఇంట్లో ఏ ప్రమాదానికి గురికానివారు ఇద్దరే మిగిలారు. ఒకరు డారిన్ , ఇంకొకరు మూడో కొడుకు డ్రేక్. (ఆ రాత్రి తండ్రితోనే నిద్రపోయాడు) వాడికి 9 నెలలు. దాంతో పోలీసుల కన్ను డారిన్ పైనే పడింది. అయితే 24 గంటలు గడవకముందే కథ అడ్డం తిరిగింది. డార్లీనే పిల్లల్ని చంపి, ఆత్మహత్యాయత్నం చేసుకుందంటూ ఆధారాలు పుట్టుకొచ్చాయి.కత్తి మీద డార్లీ వేలిముద్రలు బలమైన సాక్ష్యాలయ్యాయి. ఇంటి లోపలికి చొరబడటానికి వీలుగా మనిషి పట్టేంత రంధ్రం ఓ తలుపు పక్కనే కనిపించింది. అయితే అక్కడ డార్లీ తల వెంట్రుకలు దొరకడంతో నేరం నుంచి తప్పించుకోవడానికి డార్లీనే ఆ రంధ్రాన్ని చేసుంటుందని అనుమానించారు. దాంతో ఆమె కోలుకోగానే అదుపులోకి తీసుకుని విచారణ మొదలుపెట్టారు అధికారులు.‘‘ఆ రాత్రి కిల్లర్ నా పిల్లల్ని, నన్నూ పొడిచిన కత్తిని పడేసి పారిపోతుంటే, కంగారులో అదే కత్తిని నేను తీసుకుని వెంటపడ్డాను. వాడు గ్యారేజీ వైపు పారిపోయాడు’’ చెప్పింది డార్లీ. ‘సింక్‌లో రక్తం క్లీన్ చేసిన ఆనవాళ్లు ఉన్నాయని, పిల్లల్ని పొడిచేశాక, తనని తాను జాగ్రత్తగా పొడుచుకోవడం కోసం డార్లీ సింక్ ముందు చాలాసేపు ఉందని, ఆ తర్వాత డ్రామాలో భాగంగా పైన నిద్రపోతున్న డారిన్ ని పిలవడం మొదలుపెట్టిందని, ఇంట్లోకి ఏ దుండగుడు రాలేదని నమ్మిన అధికారులు ఆమెను కోర్టుకెక్కించారు.సరిగ్గా మర్డర్స్ జరిగిన వారానికి డెవాన్ పుట్టినరోజు వేడుక జరిగింది. ఈ క్రమంలోనే ఓ జర్నలిస్ట్ తీసిన డెవాన్ బర్త్‌డే వీడియోలో సమాధి దగ్గర డార్లీ నవ్వడమే కోర్టుకు బలమైన ఆధారంగా మారింది. పైగా డార్లీకి డ్రేక్ పుట్టాక, మానసిక సమస్యలతో కొన్ని నెలలు డిప్రెషన్ లోకి వెళ్లిందనే పాయింట్ డిటెక్టివ్స్ నమ్మకానికి ఊతమైంది. దాంతో కోర్టు డార్లీకి మరణశిక్ష విధించింది.అయితే భర్త డారిన్ మాత్రం డార్లీ నిర్దోషి అని బలంగా నమ్మాడు. ‘అసలే డిప్రెషన్లో ఉన్న ఒక మనిషి తన ఇద్దరు పిల్లల్ని కళ్లముందే పోగొట్టుకున్నప్పుడు మానసిక స్థితి ఏ స్థాయిలో ఉంటుందో ఆలోచించాలి. అదేరోజు(బర్త్‌డే) ఉదయం తను చాలా ఏడ్చింది’ అంటూ డార్లీ కుటుంబం మొత్తం ఆమెకే మద్దతుగా నిలిచింది. దాంతో మరణశిక్షకు బ్రేక్స్ పడ్డాయి. మరోవైపు హత్యలు జరిగిన రాత్రి ఒంటిగంటన్నర సమయంలో ఒక నల్లటి వింత కారు డార్లీ ఇంటికి సమీపంలో ఆగి ఉండటం చూశామని కొందరు సాక్షులు చెప్పారు. డార్లీ అరుపులు వినిపిస్తున్నప్పుడే ఒక కారు స్టార్ట్ అయిన శబ్దం విన్నామని ఇంకొందరు పొరుగువారు చెప్పారు. పైగా అప్పటికే ఆ ప్రాంతంలో అనేక హింసాత్మక హత్యలు, అత్యాచారాలు జరిగాయి. కొందరు దుండగులు వేలిముద్రలు దొరక్కుండా చేతులకు గ్లోవ్స్ ఉపయోగించేవారు. ఆ క్రమంలోనే డార్లీ ఇరుక్కుని ఉంటుందని కొందరు, లేదంటే డార్లీపై కక్షతో ఎవరైనా ఆమెను ఇరికించారేమోనని ఇంకొందరు నమ్మడం మొదలుపెట్టారు.1996 జూన్ 6 రాత్రి, అమెరికా, టెక్సస్, రౌలెట్లో ఈ ఉదంతం జరిగింది. డార్లీ తన ఇద్దరు పిల్లల్ని చంపిందన్న నేరారోపణలతో నేటికీ జైల్లోనే ఉంది. టెక్నాలజీ పెరగడంతో కోర్టు డీఎన్ఏ పరీక్షలకు అనేకసార్లు ఆదేశించింది. అయితే, ఇప్పటికీ ఆ పరీక్షా ఫలితాలు పెండింగ్‌లోనే ఉన్నాయి. మరోవైపు విచారణలో భాగంగా అధికారులకు ఆ ఇంట్లో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తుల వేలిముద్రలు లభించాయి. వాటిని గ్యారేజీ తలుపు మీద, ఆ రాత్రి డార్లీ నిద్రపోయిన సోఫా మీద గుర్తించారు. అయినా డార్లీ విడుదల కాలేదు.ఇద్దరు కొడుకులకు జీవిత బీమా పాలసీ ఉన్నందుకే డార్లీ పిల్లల్ని చంపిందని ప్రాసిక్యూషన్ వాదించింది. నిజానికి డార్లీ డబ్బుకోసమే హత్యలు చేసుంటే, ఆమె భర్త డారిన్ పేరుమీద ఇంకా పెద్దమొత్తంలో జీవిత బీమా పాలసీ ఉందని, మరి అతడ్ని ఎందుకు చంపలేదనే వాదన డార్లీకి అండగా నిలిచింది. సుమారు 28 ఏళ్లుగా ఈ కేసు కొనసాగుతోంది. నేరం జరిగిన పదిహేనేళ్లకు డారిన్ తన భవిష్యత్తు కోసం డార్లీకి విడాకులిచ్చేశాడు. మూడో కొడుకు డ్రేక్ ఇప్పటికీ తల్లి తరçఫునే పోరాడుతున్నాడు. ఏదిఏమైనా ముద్దులొలికే చిన్నారుల్ని ఆ రాత్రి పొడిచి చంపిందెవరో? నేటికీ మిస్టరీనే! – సంహిత నిమ్మన