Vikram kumar
-
మహేశ్ ఫ్యాన్స్ అధ్యక్షుడిగా అక్కినేని హీరో!
యంగ్ హీరో నాగచైతన్య వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న ‘లవ్‌స్టోరీ’షూటింగ్ పూర్తి చేసుకున్న చైతూ.. ప్రస్తుతం విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో ‘థాంక్యూ’ సినిమా చేస్తూన్నాడు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం అబిడ్స్‌లోని రామకృష్ణ సినిమా హాల్లో జరుగుతుండగా.. చైతుపై కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అయితే చిత్రానికి సంబంధించి ఆసక్తికర విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. (చదవండి : బంపరాఫర్ కొట్టేసిన అఖిల్.. పెద్ద సినిమాలో చాన్స్!) ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేశ్ బాబు అభిమాన సంఘం అధ్యక్షుడిగా కనిపించబోతున్నాడని సమాచారం. అలాగే ఈ సినిమాలో మహేశ్ కొన్ని నిమిషాలపాటు తళుక్కున మెరవబోతున్నారనే ప్రచారం కూడా సాగుతోంది. తాజాగా లీకైన ఫోటోలను బట్టి చూస్తే ఇది నిజమనే తెలుస్తోంది. అభిరామ్ పేరు పేరిట, మహేష్ బాబు పోస్టర్లతో థియేటర్ ప్రాంగణంలో బ్యానర్లు ఏర్పాటు చేసిన పోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మరోవైపు మహేశ్‌కి అక్కినేని ఫ్యామిలీతో మంచి బాండింగ్ ఉంది. అఖిల్ తొలి సినిమా అఖిల్ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు మహేశ్ బాబు హాజరయ్యాడు. తాజాగా నాగచైతన్య సినిమాలోనూ కనిపించి.. మరోసారి అక్కినేని ఫ్యామిలీతో బాండింగ్‌ను మహేశ్ బాబు మరోసారి గుర్తు చేయబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. అలాగే ఈ సినిమాలో చైతన్య మొదటి సారి హాకీ ప్లేయర్‌గా కనిపిస్తున్నాడు. గతంలో మజిలీ సినిమాలో క్రికెటర్‌గా కనిపించి మెప్పించాడు. ఈ మూవీలో ఐశ్వర్య లక్ష్మి, అవికా గోర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్లలో ఒకరైన దిల్ రాజు ఈ మూవీని నిర్మిస్తున్నారు. థాంక్యూ సినిమాని 2021 చివర్లో విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. -
ముగ్గురు భామలతో థాంక్యూ..!
అక్కినేని కుటుంబానికి ఫ్యామిలీ డైరెక్టర్ అయిపోయాడు విక్రమ్ కె కుమార్. లెజండరీ నటుడు అక్కినేని నాగేశ్వర్ రావు చివరి చిత్రం మనంతో మొదలైంది అక్కినేని కుటుంబానికి, విక్రమ్ కుమార్‌కు మధ్య అనుబంధం. ఆ తర్వాత అఖిల్‌తో ఆయన హలో మూవీ తెరకెక్కించారు. ఇప్పుడు నాగచైతన్యతో థాంక్యూ అంటూ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన తాజా అప్డేట్ ప్రస్తుతం మూవీ దునియాలో చక్కర్లు కొడుతోంది. థాంక్యూ సినిమాలో నాగచైతన్యతో ముగ్గురు హీరోయిన్లు నటించబోతున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. డిసెంబర్ నుంచి మొదలుకానున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ మెయిన్ హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసినట్లు సమాచారం. మరో హీరోయిన్గా గ్యాంగ్‌లీడర్ ఫేమ్ ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తుందన్న ఊహాగానాలూ కూడా వినిపిస్తున్నాయి. అయితే, మూవీ టీమ్ నుంచి ఇందుకు సంబంధించి ఎటువంటి ప్రకటన వెలువరించలేదు. ఈ పుకార్లన్నీ నిజమా కాదా అని తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న థాంక్యూ ఒక కమర్శియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోంది. దీన్ని దిల్ రాజు తన బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్నారు. ఇది 2021 చివర్లో విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ప్రస్తుతం నాగచైతన్య సాయి పల్లవితో కలిసి లవ్‌స్టోరీ సినిమాలో నటిస్తున్నారు. 2014లో విడుదల అయిన మనం సినిమా అక్కినేని కుటుంబానికి ఎంతో ప్రత్యేకమైనది. కానీ దాని తర్వాత ఆయన తీసిన హలో అక్కినేని వారికి హిట్ ఇవ్వలేకపోయింది. థాంక్యూతో అయినా విక్రమ్ మళ్లీ మనం లాంటి హిట్ ఇస్తాడేమో చూడాలి. -
‘మనం’ దర్శకుడితో చైతూ కొత్త సినిమా
టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా ఆయన తనయుడు హీరో నాగ చైతన్య తన కొత్త సినిమాను ప్రకటించారు. మనం సినిమా డైరెక్టర్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో చైతన్య హీరోగా ఓ సినిమా చేయనున్నారు. ఈ సినిమాకు ‘థాంక్యూ’ అనే టైటిల్‌ను కూడా ఖరారు చేశారు. దర్శకుడు విక్రమ్ విభిన్న కథను సిద్ధం చేసుకొని దానిని నాగ చైతన్యకు వినిపించగా..కథ ఎంతో నచ్చడంతో ఈ సినిమాకు చైతూ ఓకే చెప్పాడు. దిల్ రాజ్ నిర్మిస్తున్న ఈ మూవీలో హీరోయిన్ను ఇంకా ప్రకటించలేదు. ఇప్పటికే అక్కినేని కుటుంబం మొత్తంతో విక్రమ్ మనం సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే. అలాగే అఖిల్‌తోనూ ‘హలో’ సినిమాను తీశాడు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి అక్కినేని వారితో సినిమాను పట్టాలెక్కించనున్నాడు. ప్రస్తుతం చైతూ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్‌స్టోరి అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో సాయి పల్లవి హీరోయిన్గా చేస్తున్నారు. కరోనావైరస్ లేకపోయుంటే ఈ చిత్రం ఇప్పటికే విడుదలై ఉండేది. అంతేగాక ‘గీతగోవిందం’ ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో కూడా నాగ చైతన్య సినిమా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. -
హారర్‌కి సై
సిల్వర్ స్క్రీన్ పై తొలిసారి భయపెట్టడానికి రెడీ అవుతున్నారట నాగచైతన్య. ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’ చిత్రం చేస్తున్నారు చైతన్య. ఈ సినిమా తర్వాత విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారని తెలిసిందే. ఇది హారర్ థ్రిల్లర్ జానర్ లో ఉంటుందని తాజా సమాచారం. హారర్ బ్యాక్ డ్రాప్ లో చైతన్య ఇప్పటి వరకూ సినిమా చేయలేదు. ఇదే అతని తొలి హారర్ సినిమా అవుతుంది. ‘లవ్ స్టోరీ’ షూటింగ్ పూర్తి అయినా వెంటనే విక్రమ్ కుమార్ సినిమా మొదలుపెడతారు చైతన్య. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో చైతన్య ‘మనం’ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. -
ముదురుతున్న ‘గ్యాంగ్ లీడర్’ వివాదం
నాని, విక్రమ్ కె కుమార్, మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో ఇటీవలే ఓ సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఆ చిత్రానికి గ్యాంగ్ లీడర్ అనే టైటిల్‌తో టీజర్ కూడా రిలీజ్ చేశారు. అయితే గ్యాంగ్ లీడర్ అనే టైటిల్ తమ బ్యానర్లో రిజిస్టర్ చేసుకున్నామని, గ్యాంగ్ లీడర్ పేరుతో తాము సినిమా కూడా ప్రారంభించామని చిత్ర నిర్మాత, హీరో మోహన కృష్ణ ఫిలిం చాంబర్లో జరిగిన ప్రెస్ మీట్లో తెలియజేశారు. మాణిక్యం మూవీస్ బ్యానర్ మీద తెలంగాణ, ఏపి ఫిలిం చాంబర్లో టైటిల్ రిజిస్ట్రేషన్ చేసుకున్నామని తెలిపారు. ఈ సందర్భంగా మోహన కృష్ణ మాట్లాడుతూ.. ‘మా మాణిక్యం మూవీస్ బ్యానర్లో బావా మరదలు అనే సినిమా నిర్మించాం. ఇప్పుడు నాయుడు గారి అబ్బాయి నిర్మిస్తున్నాం. త్వరలోనే గ్యాంగ్ లీడర్ అనే సినిమా చేయబోతున్నాం. ఇందులో నేనే హీరోగా, నిర్మాతగా సెట్స్ మీదకు వెళ్ల బోతున్నాం. అక్టోబర్‌లో గ్యాంగ్ లీడర్ అనే టైటిల్ రిజిస్ట్రేషన్ చేశాం. ఉగాది రోజున ఈస్ట్ గోదావరిలో దాదాపు 40 రోజుల పాటు షూటింగ్‌కు ప్లాన్ చేశాం. చిరంజీవి గారి బర్త్ డే సందర్భంగా ఆగస్ట్ 22న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం. నేను చిరంజీవి గారికి వీరాభిమానిని. గ్యాంగ్ లీడర్ టైటిల్ తో ఏ మెగా హీరో సినిమా చేసినా ఇచ్చేస్తాను. వేరే వాళ్లకు ఇచ్చే ప్రసక్తి లేదు. టైటిల్ కావాలని మైత్రీ మూవీ మేకర్స్ నుంచి కాల్ చేశారు. కానీ నేను టైటిల్ ఇవ్వను, అమ్మను అని చెప్పాను. వాళ్లు చాలా రకాలుగా ట్రై చేశారు. కానీ టైటిల్ మాకే దక్కింది. అయినప్పటికీ నాని బర్త్ డే రోజు మా టైటిల్ తో పబ్లిసిటీ చేసుకున్నారు. నా పర్మీషన్ తీసుకోకుండా ఎలా టైటిల్ ను ఎనౌన్స్ చేస్తారు. ఇటువంటి నిర్ణయం ఎలా తీసుకున్నారో తెలియదు. చాంబర్ రూల్స్ కు విరుద్దంగా టైటిల్‌ను ఎలా ఎనౌన్స్ చేస్తారు. నేను చాంబర్ లో కంప్లైంట్ ఇచ్చాను. ఈ టైటిల్ మాకే వచ్చింది. ఏపి, తెలంగాణ చాంబర్స్ మాకే అనుకూలంగా ఉన్నాయి. నేను రిజిస్ట్రేషన్ చేసి మూడు నెలలు అవుతుంది. ఉగాది నుంచి షూటింగ్ కు వెళ్తున్నాం. 3 కోట్ల బడ్జెట్ తో సినిమా చేస్తున్నాం. చిరంజీవి గారి టైటిల్ పెట్టడం వల్ల చాలా ఫండింగ్ వచ్చింది. 50 లక్షల రూపాయలు అడ్వాన్స్ కూడా వచ్చింది. పక్కోడి టైటిల్ తీసుకోవడం కరెక్ట్ కాదు. పెద్ద ప్రొడ్యూసర్ అవ్వాలని వచ్చాను. చిరంజీవి గారి టైటిల్ కు ఎటువంటి ఆటంకం లేకుండా మంచి పేరు తీసుకోవాలని కథ రెడీ చేశాం. టైటిల్ విషయంలో లీగల్ గా మేం కరెక్ట్ గా ఉన్నాం. తుమ్మల పల్లి రామసత్యనారాయణ, సముద్ర, నట్టి కుమార్, ముత్యాల రాందాసు లాంటి పెద్దలు కూడా మాకు సపోర్టివ్ గా ఉన్నారు. ఏపీ ఎలక్షన్స్ అయ్యాక... 16 సినిమాలు తీసిన పెద్ద బ్యానర్ తో కలిసి మా బ్యానర్లో సినిమాలు తీసి యంగ్ టాలెంట్ ని ఎంకరేజ్ చేయబోతున్నాం. అని అన్నారు. -
గ్యాంగ్‌లీడర్
‘‘ఐదుగురు అమ్మాయిలు. వాళ్ల గ్యాంగ్‌కి ఓ లీడర్. ఐదు వేళ్లను మోసే అరచేతిలాగా, పాండవుల వెనకుండే కృష్ణుడిలా ఆ గ్యాంగ్‌ని చూసుకుంటుంటాడు’ అంటూ సాగే వీడియోతో నాని–విక్రమ్ కె.కుమార్ చిత్ర టైటిల్‌ను నాని బర్త్‌డే సందర్భంగా ‘గ్యాంగ్‌లీడర్’ అని ప్రకటించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, రవిశంకర్, మోహన్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఇది నాని 24వ చిత్రం. ఈ సినిమాలో ‘ఆర్ఎక్స్ 100’ కార్తికేయ విలన్‌గా నటించనున్నారు. ‘‘చిరంజీవిగారి సినిమాలకు ఫస్ట్ డే ఫస్ట్ షోకు వెళ్లిన జ్ఞాపకాలు ఇంకా గుర్తున్నాయి. ఆయన అభిమాని అయిన నేను.. ఆయన సినిమా టైటిల్‌ను నా సినిమాకి పెట్టడం సంతోషంగా ఉంది’’ అని నాని ట్వీటర్లో పేర్కొన్నారు. ఈ సినిమాలో ప్రియాంక, శరణ్య, ప్రియదర్శి కీలక పాత్రల్లో కనిపిస్తారు. ఆగస్ట్‌లో రిలీజ్ కానున్న ఈ చిత్రానికి సంగీతం: అనిరు«ద్. -
జున్నూవాళ్ల డాడీ
సన్నాఫ్ సెలబ్రిటీ అయితేనే అడ్రస్ ఉండే సొసౌటీ ఇది! పోలీస్ ఆపితే.. 'మా డాడీ ఎవరో తెలుసా' అని అడిగే జనరేషన్ ఇది! కాని..'జున్నూ' అలా కకూడదని నానీ ప్రేమ పోలీసింగ్ చేస్తున్నాడు. వేలు చూపి 'ఇది చెయ్యొద్దు' అనడు. రేప్పొద్దున ఎవరు తన కొడుకు వైపు వేలెత్తి చూపకుండా ఇప్పుడే అన్నీ నేర్పిస్తున్నాడు. పిల్లలకు తండ్రి హీరో అవ్వాలంటే మురపాలే సరిపోవు మరి. ►మీ బర్త్‌డే 24న. రీసెంట్గా 24వ సినిమాకు కొబ్బరికాయ కొట్టారు. అది కూడా ‘24’ అనే సినిమా తీసిన డైరెక్టర్ విక్రమ్ కె. కుమార్‌తో. 24 అంకెకు మీ జీవితంలో ఏదైనా స్పెషాలిటీ ఉందా? ►ఉందనుకుంటాను. కానీ దానికి లాజికల్ వివరణ ఇవ్వలేను. చిన్నప్పటి నుంచి 24తో చాలా కనెక్షన్ ఉంది. ట్రైన్ టికెట్, ఫ్లైట్ టికెట్ అనుకోకుండా 24వ సీట్ రావడం, ఇల్లు కొనుక్కుంటే అది ఫ్లాట్ నం. 24 అవ్వడం... ఇలా అనుకోకుండా కుదురుతుంటాయి. ఇక నేను పని చేస్తున్నది 24 శాఖలున్న ఇండస్ట్రీలో. సెకన్‌కు 24 ఫ్రేమ్‌లు ఉంటాయి. నా బర్త్‌డే 24. హీరోగా నా కెరీర్ స్టార్ట్ అయింది 24ఏళ్లకు. విచిత్రంగా అనిపిస్తుంటుంది. అది యాదృచ్ఛికమో దానికేమైనా కనెక్షన్ ఉందో నాకు తెలియదు. సరే ఇన్ని కనెక్షన్లు ఉన్నాయి కదా అని నా కారు నెంబర్లు కూడా 24 అని పెట్టించుకున్నాను (నవ్వుతూ). లక్కీ అని కాదు. 24తో ఓ చిన్న ఎమోషన్ ఏర్పడింది. ►ఈ బర్త్‌డే విశేషాలు ఏమైనా? ►బేసిక్‌గా బర్త్‌డే అంటే భయం. ఆ ఒక్క రోజు మాత్రం మన క్యాలెండర్ నుంచి స్కిప్ అయిపోతే బావుండు అనిపిస్తుంటుంది. ఒకలాంటి ప్రెషర్ ఫీల్ అవుతుంటాను. చిన్నప్పుడు బర్త్‌డే అంటే స్కూల్లో మనం చాలా స్పెషల్. క్లాస్‌లో ఎక్కువగా మాట్లాడని క్లాస్మేట్స్ కూడా వచ్చి మనకు విషెస్ చెబుతారు. యాక్టర్ అయ్యాక మనం వద్దనుకున్నా అటెన్షన్ ఉంటుంది. దాంతో ప్రైవేట్ టైమ్ కోసం వెతుకుతూ ఉంటాం. బర్త్‌డే రోజు లెక్కపెట్టలేనంత మంది విష్ చేస్తుంటారు. వాళ్లందరికీ రిప్లయ్ ఇవ్వాలనుంటుంది. కానీ ప్రాక్టికల్‌గా కుదరదు. అదో ప్రెషర్. అంత టైమ్ కూడా ఉండదు. ఫ్రెండ్స్ కలవాలనుకుంటారు, ఫ్యామిలీ మనతో టైమ్ స్పెండ్ చేయాలనుకుంటారు. సినిమా షూటింగ్ ఉంటే వెళ్లిపోవాలి. అందుకే బర్త్‌డే డేట్ వరకు స్కిప్ అయి నెక్ట్స్ డేట్‌కి వెళ్లిపోతే బావుండు (నవ్వుతూ). ► గుర్తుండిపోయిన బర్త్‌డే ఏదైనా ఉందా? ►చిన్నప్పటి బర్త్డేల్లో ఓ అమాయకత్వం ఉండేది. ఏం చాక్లెట్లు కొనాలి? మన క్లోజ్ ఫ్రెండ్స్‌కు రెండు మూడు ఇచ్చి మిగతావాళ్లను ఒకటే తీసుకోమనడం... ఆ క్యూట్‌నెస్, ఇన్నోసెన్స్ ఇప్పుడు ఉండవు కదా. చిన్నప్పుడు సెలబ్రేట్ చేసుకున్న బర్త్డేలన్నీ గుర్తుండిపోయినవే. నా చిన్నప్పటి ఫొటోలన్నీ నా పుట్టినరోజుకు దిగినవే. అది కూడా సరోజ్ అనే ఫోటో స్టూడియోలో. నా ఆల్బమ్ తీస్తే ఫస్ట్ వచ్చే పది ఫొటోలు పది సంవత్సరాల బర్త్డేలవే. ప్రతి ఫొటో వెనుక ‘సరోజ్ ఫొటో స్టూడియో ఫిబ్రవరి 24’ అని కామన్‌గా ఉంటుంది. నా ఫొటోలన్నింటికీ ఒకటే బ్యాక్‌గ్రౌండ్ ఉంటుంది. వెనకాల కర్టెన్ అలానే ఉంటుంది. ఫ్లవర్‌వాజ్ బొమ్మ సైజ్ అలానే ఉంటుంది. నా సైజ్ మారుతుంది. నేను పెద్దగా అవుతూ వచ్చాను. ఇప్పుడు అలా ఫొటోలు దిగడం మిస్ అవుతున్నాను. అమ్మ పొద్దునే లేపి నలుగు పెట్టి, తల స్నానం చేయించి ఫొటో తీయించడానికి రైల్వే ట్రాక్ దాటించి తీసుకెళ్లేది. అదో స్పెషల్ మెమొరీ. ► ఇంతకీ ఈ బర్త్‌డేకు ఇంట్లోనే ఉంటున్నారా? ►ఉంటున్నాను. ఉండకపోతే అదో ప్రాబ్లమ్. నాకు ఏదైనా పని ఉండి ఊరెళ్తే పని అయ్యాక తిరిగొస్తా. కానీ బర్త్‌డే ఉంటే పనిమధ్యలో తిరిగి రావాలి. ఇంట్లో లేకపోతే బాగోదు కదా. ► మీ భార్య అంజన ఏమైనా గొడవ చేస్తారా? అలాంటిదేం లేదు.. బర్త్‌డే వస్తుంది. స్కిప్ అయిపోతే బావుండు అని తనతో అంటుంటా. అయితే ఇంట్లోవాళ్లతో ఉండాలని వాళ్లు కోరుకుంటారు... నాకూ ఉండాలని ఉంటుంది కదా. ► మీ జున్ను (నాని తనయుడి ముద్దు పేరు) మీ జీవితంలోకి వచ్చాక మీకిది రెండో బర్త్‌డే. మీ అబ్బాయి ఫస్ట్ బర్త్‌డే ఎలా సెలబ్రేట్ చేశారు? లాస్ట్ ఇయర్ మార్చిలో జున్నూది ఫస్ట్ బర్త్‌డే. ఫస్ట్ బర్త్‌డే గ్రాండ్‌గా చేస్తున్నారా? అని కొంతమంది అడిగారు. వాడికి అర్థం కాని వయసులో వాడి ఫంక్షన్ చేసి ఉపయోగమేంటి? అనుకున్నాను. మా ఇంట్లోనే స్పెండ్ చేశాం. ఈ ఇయర్ కూడా అలానే జరుపుకుంటాం. బర్త్డేఫంక్షన్స్ అన్నీ మన ఫ్రెండ్స్‌ని కలుసుకోవడానికి సెలబ్రేట్ చేసుకుంటాం. మన ఆనందం, గొప్ప చూపించుకోవడం కోసం బర్త్‌డేలు సెలబ్రేట్ చేసుకోవడం నాకిష్టం ఉండదు. అందుకే బర్త్‌డే అంటే మనవాళ్లతో టైమ్ స్పెండ్ చేయడమే. ► ఈ బర్త్‌డేకి కొత్త బట్టలు కొనుక్కున్నారా? ►చిన్నప్పుడు మోస్ట్ ఎగై్జటింగ్ వాటిలో కొత్త బట్టలు కొనుక్కోవడం. ఇప్పుడు కొత్త బట్టలు సందర్భానికి సంబంధం లేకుండా కొనుక్కుంటున్నాం, కొన్న వెంటనే వేసుకుంటున్నాం. నటులకు షూటింగ్లో రోజూ కొత్త బట్టలే కదా (నవ్వుతూ). ఆ ఎగై్జటింగ్ విషయం ఇప్పుడు నార్మల్ అయిపోయింది. ►కెరీర్‌వైజ్‌గా గతేడాది స్పీడ్ కొంచెం తగ్గించారు... ►కృష్ణార్జున యుద్ధం, దేవదాస్... రెండు సినిమాలే చేశాను. ‘బిగ్ బాస్’ షో వల్ల ఇంకోటి మిస్ అయింది. ఈ ఏడాది మూడు సినిమాలు వస్తాయి. ►మీ మొదటి సినిమా (అష్టా చెమ్మా) ఇంద్రగంటి మోహనకృష్ణతో చేశారు. 25వ సినిమా కూడా ఆయనతోనే చేయబోతున్నారు. ఇందులో విలన్‌గా కనిపిస్తారట? ►డిఫరెంట్ రోల్ చేస్తున్నాను. ఇప్పటి వరకూ ఎప్పుడూ చేయని పాత్ర అది. ఇది మల్టీస్టారర్ కాదు. మోహనకృష్ణగారు ఓ హీరో (సుధీర్‌బాబు)తో సినిమా చేస్తున్నారు. అందులో నేనో చిన్న పాత్ర పోషిస్తున్నాను. అంతే. కథ చాలా ఆసక్తిగా ఉంటుంది. ఈ సినిమా గురించి ఇప్పుడు నేనేం చెప్పినా లాజికల్‌గా ఉండదు. త్వరలోనే అనౌన్స్ చేస్తాం. ►సబ్జెక్ట్‌లు ఎంచుకోవడంలో నాని రూట్ మార్చాడని కొందరు అంటున్నారు.. ►లేదు. అయితే నేను రూట్ మార్చానని చాలామంది అనుకుంటున్నారు. రెండు రొటీన్ ఫిల్మ్స్ చేసి నాని కొత్త రూట్ వెతుకుంటున్నాడు, కొత్త రోల్స్ చేయబోతున్నాడు అని. నేనెప్పుడూ అలా ఆలోచించలేదు. అవన్నీ బయటివాళ్ల అనాలసిస్‌లు. ‘ఎవడే సుబ్రహ్మణ్యం, పైసా, జెండా పై కపిరాజు, జెంటిల్‌మేన్’ లాంటి ఇంట్రెస్టింగ్ ఐడియాలు చేశాం కదా .. మనం కమర్షియల్ మీటర్‌కు సెట్ అవుతామా? లేదా? అని ‘నేను లోకల్, యంసీఏ’ సినిమాలు చేశాను. రొటీన్ సినిమాలు అన్నారు. అన్నవాళ్లకు రొటీన్ కానీ నాకు కాదు. అవి చేశాను కదా అని మళ్లీ ఇటు సైడ్ వస్తున్నాను. యాక్టర్‌గా అన్నీ చేయాలి. అదే చేస్తూ వస్తున్నాను. చూసే విధానం బట్టి ఎవరికి వారు ఒక ఒపీనియన్ ఏర్పరుచుకుంటారు. నాని ఇటు వెళ్లాడు, అటు వచ్చాడు అని. ఇది సైకిల్. భవిష్యతుల్లో ‘ఎంసీఏ, నేను లోకల్’ లాంటివి చేయనని చెప్పడం లేదు. మళ్లీ వేరే రూట్లోకి వచ్చి చేస్తా. ►నాని ఏ పాత్ర అయినా బాగా చేయగలడు అనే కాంప్లిమెంట్ విన్నప్పుడు మీకేమనిపిస్తుంది? ►చాలా మంది అనుకుంటారు.. నాని బాగా చేశాడు అని. కాదు.. స్క్రిప్ట్‌లో విషయం ఉండాలి. బాగా చేయడం, చేయకపోవడం ఉండదు. స్క్రిప్ట్‌లో స్కోప్ ఉండటం, ఉండకపోవడమే తేడా. ►హిట్, ఫ్లాప్ మీతో ఎన్నిరోజులు ట్రావెల్ అవుతాయి? ►అవి నాకు పెద్ద విషయం కాదు. నేను ఇంపార్టెంట్‌గా ఫీల్ అయ్యేది ఏంటంటే టీమ్ అంతా కష్టపడి సినిమా చేస్తుంటాం. దానికి తగ్గ క్రెడిట్ రాకపోతే కొంచెం బాధగా ఉంటుంది. వాళ్లంతా బాధపడతారు అనే బాధ తప్పితే నా కెరీర్ ఏమైపోతుంది... అనే ఆలోచన ఉండదు. సక్సెస్, ఫ్లాప్ బాధపెట్టవు. ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవచ్చు. జయాపజయాలకు అతీతంగా ప్రేక్షకులతో నాకు ఓ కనెక్షన్ వచ్చేసింది అనే నమ్మకం ఏర్పడింది. ►‘నా కెరీర్ ఏమైపోతుంది’ అనే ఆలోచన లేదన్నారు.. ఆ మాటల్లోనే ఏమీ కాదనే మీ ఆత్మవిశ్వాసం కనపడుతోంది. ఇది ఎప్పుడు డెవలప్ అయింది? ►ఎప్పుడు కుదిరిందో తెలియదు కానీ కుదిరింది. కొన్ని నెలలు కలసి టీమ్ అందరం కష్టపడతాం. పని చేసినవాళ్లు ఎప్పుడు తలుచుకున్నా వాళ్లకు ఆ సినిమా ఓ చేదు జ్ఞాపకంలా మిగిలిపోకూడదు. ఎవరూ నష్టపోకూడదని కోరుకుంటాను. అందుకోసం సక్సెస్ అవసరం అయితే ఆ సక్సెస్ నాకు కావాలి. అయితే నేను ఏరోజూ సినిమా సక్సెస్ అవ్వాలి అని చేయలేదు. ఎంజాయ్ చేస్తూ చేశాను. నా పనిని ఎంజాయ్ చేస్తున్నంత వరకూ నాకు పని ఉంటుంది. జెన్యూన్‌గా కష్టపడితే వర్క్ మనల్ని ఫాలో అవుతుంటుందని నమ్ముతాను. సక్సెస్ అవ్వాలి, సెటిల్ అవ్వాలి అని మొక్కుబడిగా చేస్తే అది కూడా మనల్ని వదిలేస్తుంది. దానివెనకాల మనం పరిగెత్తనప్పుడు అది మనపక్కనే బుద్ధిగా కూర్చుని ఉంటుందని నా ఫీలింగ్. ►మీ వయసుకన్నా ఎక్కువ వయసున్న పాత్రలు కూడా చేస్తున్నారు? ►‘జెర్సీ’లో నా వయసుకు మించిన పాత్ర చేశాను. ఇది నేను గర్వంగా చెప్పుకునే సినిమా అవుతుంది. ఇప్పటి వరకూ ఏ సినిమాకీ ఈ స్టేట్మెంట్ వాడలేదు. ‘జెర్సీ’ నా కెరీర్లో బెస్ట్ అవుతుంది. ►ఇంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చేశారు? అంత కాన్ఫిడెన్స్ ఏంటి? ►రిజల్ట్ గురించి చెబుతున్న స్టేట్మెంట్ కాదిది. యాక్టర్‌గా పూర్తి సంతృప్తి ఇచ్చింది. నటుడిగా కెరీర్ స్టార్ట్ చేసిన తర్వాత ‘ఇంకా ఏదో చేస్తే బావుండు’ అనే ఓ ఫీలింగ్ ఉంటుంది కదా.. అది లేదు ఈ సినిమా చూసిన తర్వాత. అందుకే నా బెస్ట్ వర్క్ అంటాను. ఈరోజు వరకూ ఇది బెస్ట్ అన్నాను. దాని అర్థం దీన్ని మించే సినిమాలు రావని కాదు. ఇప్పటివరకూ నా కెరీర్లో ఇది బెస్ట్. ఇదివరకూ మంచి సినిమాలు చేశా. అవి చేసినప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యాను. అయితే ఆ సినిమాల్లో ఆ పాత్రగా మారిపోయినప్పటికీ ఎక్కడో చోట నాని అనేవాడు కనపడి ఉంటాడు. ఆర్టిస్ట్‌గా పూర్తి స్థాయి పాత్రగా మారిపోయే అవకాశం ఎప్పుడూ రాలేదు. ఈ సినిమా చేసినప్పుడు అనిపించలేదు కానీ చూసుకున్నప్పుడు ‘నేను’ అనే ఫీలింగ్ నాకు రాలేదు. అర్జున్ అనే వ్యక్తి కథను చూస్తారు. వాడితోపాటూ ఏడ్చాను, నవ్వాను. రేపు థియేటర్స్‌లోకి వచ్చినప్పుడు అది ఎంతవరకూ నిజం అన్నది మాత్రం మీరే చెప్పాలి. యాక్టర్‌గా నాకు లభించిన సంతృప్తి వర్ణించలేనిది. ► అర్జున్ అంటే మీ అబ్బాయి పేరు. కావాలనే సినిమాలో పెట్టారా? ►అవును. సినిమాలో నా పేరు అర్జున్. మా అబ్బాయి పేరు నాని. రివర్స్ చేశాను (నవ్వుతూ). ►ఇంతకుముందు ‘ఎటో వెళ్లిపోయింది మనసు’లో మీ భార్య అంజన ఇంటి పేరు వాడారు. కావాలని మీరు చెబుతుంటారా? ►ఆ సినిమాలో హీరోయిన్ సమంత పేరు నిత్యా. ఆ పాత్రకు ఓ ఇంటిపేరు కావాలని గౌతమ్ మీనన్ అడిగారు. అప్పుడు నేను అంజనతో రిలేషన్లో ఉన్నాను. పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యాం. తన ఇంటిపేరు (యలవర్తి)ని హీరోయిన్ ఇంటిపేరుగా సజెస్ట్ చేస్తే, గౌతమ్ బాగుందన్నారు. ఆ తర్వాత ‘మజ్ను’లో ‘రాంబాబు గారి అబ్బాయా మజాకా’ అని ఓ డైలాగ్ చెప్పాను. నిజానికి ఆ సీన్లో ఆ డైలాగ్ లేదు, నేనే కావాలని సరదాగా చెప్పాను. బాగుందని ఉంచేశారు. అది మా నాన్నగారి పేరు. ఏదో సరదాకి ఇలాంటివి చేస్తుంటాను కానీ ఇవే ఉండాలని ఒత్తిడి చేయను. ►ఎంతమంది కొత్త హీరోలు వచ్చినా మీ స్థానం మీదే. అదెలా వీలవుతుంది? ►ఎందుకంటే నేను రేస్‌లో లేను కాబట్టి. అందరూ పరిగెడుతున్న డైరెక్షన్లో నేను పరిగెడితే నేను రేస్‌లో ఉన్నట్టు. నా స్థానానికి డేంజర్. అందరూ వెళ్తున్న గమ్యం వైపు నేను వెళ్లడం లేదు. సో.. నన్ను దాటేస్తారు, నన్ను గెలిచేస్తారు అని భయపడను. నాకు డేంజర్ ఉందని అనుకోను. అందరూ సూపర్ స్టార్లు అవుదాం అని వెళ్తున్నారు కానీ నేను వెళ్తున్న మార్గంలో ఎవ్వరూ రావడం లేదని నేను అనుకుంటున్నాను. వాళ్లను డిస్ట్రబ్ చేసి నా దారిలో కూడా వచ్చేలా చేసుకోవడం లేదు (నవ్వుతూ). ►అంటే మీరు సూపర్‌స్టార్ అవ్వాలనుకోవడం లేదా? ►నేనెప్పుడూ యాక్టర్‌గానే ఉండాలి అనుకున్నాను. మీరు ఏ పేరుతో అయినా పిలుచుకోండి. న్యాచురల్ స్టార్ అదీ ఇదీ అనుకోవచ్చు. ప్రేమతో పిలుస్తున్నారు అని అనుకుంటాను. ఇందాక యాక్టర్‌గా బాగా సంతృప్తి చెందాను అని చెప్పాను కదా. దాని ముందు ఏ సూపర్‌స్టార్ ఫీలింగ్లూ దగ్గరకు రాలేవు. యాక్టర్ అనేవాళ్లకు దాన్ని మించిన సంతృప్తి ఉండదు. అదే ఉంటున్నప్పుడు ఇక దేనికోసం పరిగెత్తాలి. ►గేమ్ ఆడేటప్పుడు పోటీ లేకపోతే కిక్ ఉండదు కదా? ►నేను గేమ్ ఆడటం లేదు. ఒకరి మీద గెలవడానికి పోటీ అయితే అప్పుడు పోటీ కావాలి. నేనెవరి మీదా గెలవాలనుకోవడం లేదు. నాకు పిచ్చిగా నచ్చే ఓ పని చేస్తున్నాను. పొద్దున లేస్తే ఫుడ్ ఫర్ సోల్ అంటాం కదా.. ఆత్మసంతృప్తి కోసం పని చేస్తున్నాను. ఈ ప్రాసెస్‌ని ఆస్వాదించాలి అనుకుంటున్నాను. చేసిన ప్రతి షాట్ బావుంటే నాకు కిక్ వస్తుంది. అందులో కిక్ వెతుక్కుంటున్నాను కానీ పోటీలోకాదు. ►నటుడిగా సంతృప్తి ఇచ్చిన సినిమా బాగా ఆడలేదనుకోండి.. ఆ ఫ్లాప్ ఎఫెక్ట్ మీ కెరీర్ మీద ఎంత ఉంటుంది? ►బాక్సాఫీస్ నంబర్ల వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. ఉదాహరణకు ఓ భారీకథ మన దగ్గరకు వచ్చిందనుకోండి. దానికి పెద్ద బడ్జెట్ కావాలి. అంత బడ్జెట్ పెట్టాలంటే నా అంతకుముందు సినిమా బాక్సాఫీస్ నంబర్ బాగుండాలి. అప్పుడు ఆ భారీ కథను అడ్జెస్ట్ కాకుండా తీయొచ్చు. లేకపోతే రాజీపడిపోవాల్సి వస్తుంది. ఇందుకోసం బాక్సాఫీస్ నంబర్ని పట్టించుకోవాలి. డబ్బులు వస్తే బాగా ఆనందపడతాను. మా నిర్మాత, టీమ్ హ్యాపీగా ఉంటారు. వాళ్లంతా హ్యాపీ అయితే నేను హ్యాపీ. ►నాని నిర్మాతల హీరో అంటారు. ఒకవేళ చేసిన నిర్మాతకే మళ్లీ డేట్స్ ఇవ్వకపోతే ‘నానీకి బిల్డప్’ అంటారు. రెంటినీ ఎలా తీసుకుంటారు? ►కరెక్టే. నేను డేట్స్ ఇచ్చినప్పుడు నాని మనోడే అనుకునే చాన్స్ ఎక్కువ. అయితే నాని మనోడే కదా.. సినిమా చేస్తాడు అని ప్రతిసారీ అనుకుంటే కుదరకపోవచ్చు. దానికి చాలా కారణాలు ఉంటాయి. నాకు కథ ముఖ్యం. మంచి కథ కుదిరితేనే సినిమా. రెండు హిట్స్ కొట్టాం అని అదే కాంబినేషన్లో మూడోసారి సినిమా చేసేయాలి అనుకోను. మూడో సినిమా కథ కూడా కుదరాలి. బావుండాలి. ఇలా ఆలోచించడం నటుడిగా నాకు చాలా అవసరం. కెరీర్ స్టార్టింగ్‌లో మొహమాటానికి కొన్ని చేశాను. ఇప్పుడు నచ్చిందే చేస్తున్నాను. ►ఒకవేళ మీకు బాగా అనిపించని కథ సక్సెస్ అయ్యే అవకాశం ఉంది కదా? ►అది కాదనడంలేదు. అయితే నాకు డౌట్ ఉన్న కథతో సినిమాకి ఓకే చెబితే షూటింగ్ జరిగే నెక్ట్స్ ఆరు నెలలు డౌట్‌తో పడుకోవాలి, డౌట్‌తో నిద్రలేవాలి. నమ్మకంగా ఉన్న స్క్రిప్ట్‌తో చేస్తే ఏదో కొత్త ఉత్సాహంతో పని చేస్తాను. ఎగై్జటింగ్‌గా నిద్రలేస్తాను. సినిమా రిజల్ట్‌తో సంబంధం లేదు. డౌట్ ఉన్న సినిమాలు కూడా హిట్ అవుతుంటాయి. నమ్మకంగా ఉన్న సినిమాలు పోతాయి. రిజల్ట్ రెండే రోజులు, అయితే షూటింగ్ ప్రాసెస్ మాత్రం దాదాపు 9 నెలలు. తొమ్మిదినెలలు ఇంపార్టెంటా? రెండు రోజులు ఇంపార్టెంటా? ►ఓకే.. పెళ్లి తర్వాత మీలో వచ్చిన మార్పు? పెళ్లయ్యాక జీవితం నా చేతుల్లో లేదు, నా భార్య చేతుల్లో ఉందని చాలామంది అంటుంటారు... ►జీవితం వాళ్ల చేతుల్లోకి వెళ్లదు, మనమే పెడతాం. మనమే సరెండర్ అవుతాం. వాళ్లు లాక్కోవడం ఉండదు. అందరూ ఎలా మాట్లాడతారంటే నాకు స్వాతంత్య్రం లేదు అని జోకులేస్తారు. కానీ స్వేచ్ఛ కోల్పోయే విషయంలో ఒక్క శాతం కూడా వాళ్లు కారణం అవ్వరు. పని అయిపోయిందా? ఇంటికొస్తున్నావా? అని వాళ్లు ఫోన్ చేసినా చేయకపోయినా మనకే వెళ్లాలనిపిస్తుంది. అది రెస్పాన్సిబుల్‌గా ఫీల్ అవుతాం. నిజం చెప్పాలంటే పెళ్లి పెద్దగా ఏం మార్చలేదు నన్ను. పిల్లోడు మార్చాడు. చాలా మార్చాడు. పెళ్లి ఓవర్ రేటెడ్. కంట్రోల్ అదీ ఇదీ అంటాం కానీ. కంట్రోల్లో ఉండేది మాత్రం పిల్లల తర్వాతే. పెళ్లయ్యాక మూడేళ్లకు మా జున్ను పుట్టాడు. వీడొచ్చాక లైఫ్‌ని చూసే కోణమే మారిపోయింది. పొరపాటున ఏపని చేసినా ఒక ఎగ్జాంపుల్ అవుతాం. పొరపాటున పేపర్ పక్కన విసిరేసినా, వాడూ అదే నేర్చుకుంటాడని భయం. డస్ట్‌బిన్‌లో వేస్తున్నాను. నోట్లోంచి వచ్చే మాటలన్నీ మంచివే అయ్యుండాలి. ఆ విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నాను. ఎందుకంటే పిల్లోడికి రాంగ్ ఎగ్జాంపుల్ ఇవ్వకూడదు. ప్రపంచం దృష్టిలో హీరో అవడంకన్నా కొడుకు దృష్టిలో హీరో అవడానికి మించింది మరోటి లేదనుకుంటాను. సినిమా హీరో కాదు మా నాన్న రియల్ లైఫ్ హీరో అని పిల్లలు అనుకుంటే అది ప్రతి తండ్రికి పెద్ద సంతృప్తి. ‘జెర్సీ’ సినిమా ఆ పాయింట్ మాట్లాడుతుంది. ► మీ జున్నూ మిమ్మల్ని ఏమని పిలుస్తాడు? ►నాన్న అంటాడు. ఇప్పుడు అదొక్క మాటే వచ్చు. పొద్దున్నుంచి నాన్న నాన్న అంటాడు. అమ్మ కూడా రాదు. నాన్నకూచి. నేను షూటింగ్లో ఉండి వీడియో కాల్ చేస్తే దిండు చూపిస్తాడు. నేను పక్కనే ఉండాలని అర్థం అన్నమాట. మేమిద్దరం ఉంటే అల్లరి మామూలుగా ఉండదు. మామూలుగా కొందరు పిల్లలు పదిమంది వస్తే ముడుచుకుపోతారు. జున్నుగాడు మాత్రం ఎంతమంది వస్తే అంత యాక్టివ్ అవుతాడు. ఎంటర్టైనర్. ఎవరు పిలిస్తే వాళ్ల దగ్గరకు వెళ్తాడు. నేనైనా డబ్బులు తీసుకొని ఎంటర్టైన్ చేస్తానేమో, వాడు ఫ్రీగా ఎంటర్టైన్ చేస్తాడు (నవ్వుతూ). ► 24 గంటలే ఎందుకు.. ఇంకొన్ని గంటలుంటే బావుండే అని ఎప్పుడైనా అనుకున్నారా? ►అలా ఎప్పుడూ అనుకోలేదు. కానీ ఒకడినే ఉన్నానే నాలా ఇంకొకడుంటే బావుండే అనుకుంటాను. ఒక్కసారి కాదు చాలాసార్లు అనిపించింది. ఒకచోట ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది, ఇంకోచోట ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. రెండూ మిస్సవ్వలేం. ఫ్యామిలీ అందరూ కలసి ఏదో స్పెషల్ ప్లాన్ ఫిక్స్ చేసుకొని ఉంటాం. వర్క్ కూడా మిస్ అవలేని పరిస్థితి ఉంటుంది. అలాంటప్పుడు నాలోనే ఇద్దరుంటే నువ్వు ఈ పని చూసుకో, నేను ఇంకో పని చూసుకుంటాను అని సర్దుకోవచ్చు కదా. ఇలా ఊహించుకుని నవ్వుకుంటాను. ►ఒకప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేశారు కదా... యాక్టింగ్ టు డైరెక్షన్ ఎప్పుడు? ►డైరెక్షన్ ఏమో కానీ ప్రొడక్షన్ సైడ్ ఉంటాను. ఓన్లీ కొత్త రకం సినిమాలే నిర్మించాలనుకుంటున్నాను. ‘అ!’ తర్వాత చాలా కథలు విన్నాను. సూపర్ హిట్ ప్రాజెక్ట్స్. నిర్మిస్తే డబ్బులొచ్చేస్తాయి. కానీ చేయలేదు. ఎందుకంటే నా బ్యానర్ మీద యూనిక్ సినిమాలు మాత్రమే చేయాలని. ► ‘అ!’ కమర్షియల్‌గా వర్కౌట్ అయిందా? ►అయింది. అలాగే పాత్ బ్రేకింగ్‌గా నిలిచింది. వాల్‌పోస్టర్ సినిమా నుంచి ఏ సినిమా వచ్చినా అలా యూనిక్‌గా ఉండాలన్నది నా ఆలోచన. ► 24 సినిమాల అనుభవం ఉంది మీకిప్పుడు. మీ పదేళ్ల కెరీర్‌ని ఎప్పటికప్పుడు యాక్టర్‌గా మనం ఏంటి అని సమీక్షించుకుంటారా? ►సమీక్షించుకోవడం అన్నట్టుగా కాదు కాని పాతజ్ఞాపకాల్ని విజిట్ చేస్తుంటాను. పాత సినిమాలు చూసినప్పుడు ‘అరే.. అప్పుడు మన పర్ఫార్మెన్స్ ఏంటి, ఇలా ఉంది?’ అనే యాంగిల్లో మాత్రమే ఆలోచిస్తా. నటుడిగా ఇంత పరణితి చెందా అది ఇదీ అని ఆలోచించుకోను. ► ఫైనల్లీ.. యాక్టర్‌గా ఇన్ని సినిమాలు చేయాలి అని టార్గెట్ ఏమైనా? ►నెక్స్ సినిమా గురించే ఆలోచించను. ఇంకా యాక్టర్‌గా ఎన్ని చేస్తాను అంటే ఇందాక ‘నచ్చిన కథలే చేస్తాను’ అని మాట్లాడిన ఐడియాలజీకి విరుద్ధం అయిపోతుంది. – డి.జి.భవాని -
నాని సినిమాలో సెన్సేషనల్ బ్యూటీ..!
ఇటీవల సక్సెస్ విషయంలో కాస్త తడబడుతున్న యంగ్ హీరో నాని వరుసగా రెండు సినిమాలను లైన్లో పెట్టాడు. ఇప్పటికే గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో జెర్సీ సినిమాలో నటిస్తున్న నాని, తరువాత విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. తాజాగా నాని, విక్రమ్‌ల సినిమాకు సంబంధించి మరో ఇంట్రస్టింగ్ అప్డేట్ టాలీవుడ్లో హల్చల్ చేస్తోంది. ఇటీవల ఒక్క కంటి సైగతో సోషల్ మీడియాను ఊపేసిన బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ ఈ సినిమాలో హీరోయిన్గా నటించనుందట. రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. -
చాన్స్ కొట్టేశారా?
తెలుగులో అనుకున్నంత స్పీడ్‌గా సినిమాలు ఒప్పుకోకపోయినా తమిళంలో మంచి ఫామ్‌తో దూసుకెళ్తున్నారు మేఘా ఆకాశ్. ఇటీవలే రజనీకాంత్ ‘పేట’ సినిమాలో చిన్న రోల్ కూడా చేశారు. తాజాగా తెలుగులో నాని సరసన హీరోయిన్గా నటించే చాన్స్ కొట్టేశారని టాక్. ‘మనం’ ఫేమ్ విక్రమ్ కుమార్, నాని కాంబినేషన్లో ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించనున్నారు. పీసీ శ్రీరామ్ కెమెరామేన్. ఈ సినిమాలో హీరోయిన్గా మేఘా ఆకాశ్ పేరుని ఫిక్స్ చేశారట. సినిమా అనౌన్స్మెంట్ రోజు ‘నాని... మరో ఐదుగురు’ అంటూ పేర్కొన్నారు చిత్రబృందం. అంటే ఈ సినిమాలో ఐదుగురు భామలు ఉండే ఛాన్స్ ఉందా? వేచి చూడాలి. ‘జెర్సీ’ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత ఫిబ్రవరి నుంచి ఈ సినిమా షూట్లో జాయిన్ అవుతారట నాని. -
నాని స్క్రిప్ట్ రాస్తున్నాడా...?
నేచురల్ స్టార్ నాని హీరోగానే కాక ఇటీవల నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టాడు. అ! సినిమాతో అభిరుచి గల నిర్మాతగా పేరు తెచ్చుకున్న నాని ప్రస్తుతానికి హీరోగా ఫుల్ బిజీగా ఉన్నాడు. అయితే తాజాగా నాని స్క్రిప్ట్ రైటర్ అవతారం ఎత్తినట్టుగా వార్తలు వినిపించాయి. త్వరలో విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు నాని. ఈ సినిమాకు విక్రమ్‌తో కలిసి నాని రచయితగా పనిచేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై దర్శకుడు విక్రమ్‌కుమార్ క్లారిటీ ఇచ్చారు. నాని స్క్రిప్ట్ వర్క్ లో ఇన్వాల్ కావటం లేదని చెప్పారు. ప్రస్తుతం నాని జెర్సీ మూవీ షూటింగ్లో బిజీగా ఉన్నాడు. మళ్ళీరావా ఫేం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్గా నటిస్తున్నారు. నాని క్రికెటర్‌గా నటిస్తున్న ఈసినిమా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతోంది. -
‘అమ్మాయిలు... ఇది మీ కోసమే!’
ప్రస్తుతం జెర్సీ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న యంగ్ హీరో నాని తన తదుపరి చిత్రాన్ని ప్రకటించాడు. చాలా రోజులుగా ప్రచారం జరుగుతున్నట్టుగానే విభిన్న చిత్రాల దర్శకుడు విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తన 24వ సినిమా చేస్తున్నట్టుగా ప్రకటించాడు నాని. ఇష్క్, మనం, 24, హలో లాంటి సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైన విక్రమ్ కుమార్ లాంగ్ గ్యాప్ తరువాత మరో సినిమాకు రెడీ అవుతున్నాడు. చాలా రోజులుగా విక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్లో సినిమా ఉంటుందన్న టాక్ వినిపించింది. అయితే బన్నీ , త్రివిక్రమ్‌తో సినిమా చేసేందుకు ఇంట్రస్ట్చూపిస్తుండటంతో విక్రమ్, నానితో సినిమా చేసేందుకు రెడీ అయ్యారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా అనౌన్స్మెంట్ పోస్టర్‌ను విభిన్నంగా డిజైన్ చేశారు. ఓ పిట్టగోడ మీద నాని, విక్రమ్‌లో టీ తాగుతున్న చర్చించుకుంటున్న ఫొటోను ‘నేను, విక్రమ్ ఇంకా ఆ మిగతా ఐదుగురు వచ్చే సంవత్సరంలో.. అమ్మాయిలు ఇది మీ కోసమే’ అనే కామెంట్‌తో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా ఫిబ్రవరి 19న ప్రారంభ కానుంది. #Nani24 నేను, విక్రమ్ ఇంకా ఆ మిగతా ఐదుగురు. వచ్చే సంవత్సరం లో :)) Girls !! This ones for you 🤗@MythriOfficial @Vikram_K_Kumar and the legendary @pcsreeram sir pic.twitter.com/l3lj5II2N2 — Nani (@NameisNani) 2 December 2018 -
విక్రమ్.. నానికే ఫిక్స్..!
ఇష్క్, మనం, 24, హలో లాంటి సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైన విక్రమ్ కుమార్ లాంగ్ గ్యాప్ తరువాత మరో సినిమాకు రెడీ అవుతున్నాడు. చాలా రోజులుగా విక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్లో సినిమా ఉంటుందన్న టాక్ వినిపించింది. అయితే బన్నీ , త్రివిక్రమ్‌తో సినిమా చేసేందుకు ఇంట్రస్ట్చూపిస్తుండటంతో విక్రమ్ మరో హీరోతో సినిమాకు రెడీ అవుతున్నాడు. డబుల్ హ్యాట్రిక్ విజయాలు సాధించిన నేచురల్ స్టార్ నాని ఇటీవల కాస్త తడబడుతున్నాడు. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో జెర్సీ సినిమాలో నటిస్తున్న నాని తరువాత విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నటించేందుకు ఓకె చెప్పినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థనిర్మించనుంది. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌పై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. -
బన్నీ ఇంకా ఫిక్స్ అవ్వలేదా..!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నా పేరు సూర్య సినిమా తరువాత ఇంత వరకు మరో సినిమా అంగీకరించలేదు. ఆ సినిమా ఆశించిన స్థాయి విజయం సాధించకపోవటంతో తదుపరి చిత్రం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు బన్నీ. ఇప్పటికే విక్రమ్ కుమార్ దర్శకత్వంలో బన్నీ హీరోగా ఓ సినిమా ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై అల్లు అర్జున్ టీం ఎలాంటి ప్రకటనా చేయలేదు. తాజాగా మరో ఆసక్తికరమైన వార్త టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. యువ దర్శకులు మారుతి, పరుశురాంలు కూడా బన్నీ కోసం కథ రెడీ చేస్తున్నారట. అంటే విక్రమ్ కథను ఇంకా బన్నీ ఫైనల్ చేయలేదా..? లేక విక్రమ్ సినిమా తరువాత చేయబోయే సినిమాను కూడా బన్నీ లైన్లో పెడుతున్నాడా..? అన్న అనుమానాలు మొదలయ్యాయి. ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం దొరకాలంటే మాత్రం బన్నీ క్లారిటీ ఇవ్వాల్సిందే. -
మకాం మార్చిన బన్నీ
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం తన తదుపరి చిత్రానికి సిద్ధమవుతున్నారు. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోకపోవటంతో తదుపరి చిత్రం కోసం సిద్ధమవుతున్నాడు. ఇంత వరుకు నెక్ట్స్ ప్రాజెక్ట్ ప్రకటించకపోయినా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో బన్నీ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఉంటుందున్న టాక్ వినిపిస్తోంది. తాజాగా బన్నీ కొత్త ఆఫీస్‌లోకి వెళ్లారట. ఇన్నాళ్లు గీతా ఆర్ట్స్ ఆఫీస్‌నే తన ఆఫీస్‌గా వినియోగించుకున్న బన్నీ తాజాగా జూబ్లీ హిల్స్‌లో కొత్త ఆఫీస్‌ను ప్రారంభించారు. ఇక మీదట తన సినిమాలకు సంబంధించిన స్క్రిప్ట్ డిస్కషన్స్, ఇతర పనులు ఈ ఆఫీస్‌నుంచే చేయనున్నాడట బన్నీ. బన్నీ కొత్త సినిమాకు సంబంధించిన పనులు కూడా కొత్త ఆఫీస్ నుంచే జరగనున్నాయి. -
బన్నీకి జోడి సమంత..!
‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమాతో నిరాశపరిచిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. ఆ సినిమా తరువాత గ్యాప్ తీసుకుంటున్నాడు. నా పేరు సూర్య రిలీజ్ అయి 4 నెలలు దాటుతున్న బన్నీ కొత్త సినిమాను ఇంకా మొదలు పెట్టలేదు. చాలా మంది దర్శకుల పేర్లు వినిపించినా ఇంకా ఎవరికీ బన్నీ ఓకె చెప్పలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నటించేందుకు బన్నీ ఇంట్రస్ట్ చూపిస్తున్నాడట. ఇప్పటికే విక్రమ్ కథకు బన్నీ ఓకె చెప్పాడన్న టాక్ వినిపిస్తోంది. అంతేకాదు ఈ సినిమాకు నటీనటుల ఎంపిక కూడా జరుగుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో బన్నీకి జోడిగా సమంతను తీసుకునే ఆలోచనలో ఉన్నాడు దర్శకుడు విక్రమ్ కుమార్. గతంలో బన్నీకి జోడిగా సమంత నటించిన సన్నాఫ్ సత్యమూర్తి మంచి విజయం సాధించింది. విక్రమ్ కాంబినేషన్లో సమంత నటించిన 24 కూడా మంచి విజయం సాధించింది. దీంతో సెంటిమెంట్ పరంగా కూడా సమంత అయితే కలిసొస్తుందని భావిస్తున్నారట చిత్రయూనిట్. అయితే ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. -
కాన్సెప్ట్ అదేనా?
‘మనం’ సినిమా కథ చెప్పి, ఒప్పించడం కష్టం. పోనీ ‘24’ సినిమా కథ? మళ్లీ అదే పరిస్థితి. ఇలా.. చెప్పుకోవడానికి చాలా క్లిష్టంగా చూడటానికి చాలా క్లియర్‌గా ఉంటాయి దర్శకుడు విక్రమ్‌కుమార్ సినిమా కథలు. ఈసారి కూడా ఆడియన్స్‌కు ఇలాంటి అవుట్ ఆఫ్ ది బాక్స్ ఐడియా చెప్పడానికే రెడీ అవుతున్నారట విక్రమ్ కుమార్. అల్లు అర్జున్ హీరోగా విక్రమ్‌కుమార్ ఓ సినిమా తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. అయితే లేటెస్ట్గా షికారు చేస్తున్న పుకారు ఏంటంటే ఈ సినిమా కథ పునర్జన్మల నేప«థ్యంలో సాగనుందని. ‘నా పేరు సూర్య’ సినిమా తర్వాత వెంటనే సినిమా స్టార్ట్ చేయకుండా కొంచెం టైమ్ తీసుకున్నారు అల్లు అర్జున్. విక్రమ్‌కుమార్ చెప్పిన ఈ పాయింట్ బన్నీని చాలా ఎగై్జట్ చేసిందని సమాచారం. ఈ ఏడాది ఆఖర్లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందట. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ నిర్మించనున్నారట. -
వరల్డ్ స్టంట్ అవార్డ్స్‌కు హలో
‘టారస్ వరల్డ్ స్టంట్ అవార్డ్స్’ పేరుతో ప్రతి సంవత్సరం వరల్డ్ మూవీస్‌లోని బెస్ట్ స్టంట్ పెర్ఫార్మర్స్కు అవార్డ్స్ ప్రకటిస్తారు. ఈ ఉత్సవం లాస్ ఏంజెల్స్‌లో జరుగుతుంది. విశేషం ఏంటంటే.. ‘బెస్ట్ యాక్షన్ ఇన్ ఏ ఫారిన్ ఫిల్మ్ కేటగిరీ’లో ‘హలో’ సినిమా నామినేట్ అయింది. ఈ సందర్భంగా చిత్రదర్శకుడు విక్రమ్ కె. కుమార్ మాట్లాడుతూ – ‘‘హలో’ సినిమా ‘టారస్ వరల్డ్ అవార్డ్స్ క్యాటగిరీలో నామినేట్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. నాగార్జున సార్, యాక్షన్ డైరెక్టర్ బాబ్ బ్రౌన్, కెమెరామేన్ పీయస్ వినోద్, ఎడిటర్ ప్రవీణ్ పూడి, సంగీతదర్శకుడు అనూప్ రూబెన్స్లకు థ్యాంక్స్. ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ బాగా రావడానికి మీరంతా కారణం. లాస్ట్ బట్ నాట్ లీస్ట్.. అఖిల్.. నీ డెడికేషన్, హార్డ్ వర్క్, నీ యాటీట్యూడ్ నిన్ను కొత్త హైట్స్‌కు తీసుకువెళ్తాయి. ఎప్పుడూ ఇలానే ఉండు’’ అని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. నామినేషన్ అయితే సంపాదించుకుంది కానీ ‘హలో’కి అవార్డు దక్కలేదు. చైనీస్ మూవీ ‘ఉల్ఫ్ వారియర్ 2’కి అవార్డు దక్కింది. ఏది ఏమైనా ‘ప్రపంచ సినిమాలు’ పోటీ పడే అవార్డ్స్‌లో ఓ ఇండియన్ మూవీ నామినేషన్ వరకూ వెళ్లడం గొప్ప అని సినిమా లవర్స్ అంటున్నారు. -
ప్రయోగానికి రెడీ అవుతున్న బన్నీ
ఈ శుక్రవారం నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో బన్నీ సరికొత్త లుక్‌లో దర్శనమిస్తున్నాడు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాతో మరో ఘన విజయం ఖాయం అన్న నమ్మకంతో ఉన్నాడు. ఈ సినిమా తరువాత బన్నీ చేయబోయే సినిమాపై చర్చ మొదలైంది. వరుసగా కమర్షియల్ ఎంటర్టైనర్లు చేస్తూ వస్తున్న అల్లు అర్జున్ తన నెక్ట్స్ సినిమా కాస్త డిఫరెంట్‌గా చేసే ఆలోచనలో ఉన్నాడట. లింగుస్వామి దర్శకత్వంలో గతంలో ఓ సినిమా ప్రారంభమైనా ఆ సినిమా ఇప్పట్లో పట్టాలెక్కే ఛాన్స్ కనిపించటం లేదు. దీంతో ప్రయోగాత్మక చిత్రాల దర్శకుడు విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడట బన్నీ. ఈ సినిమాతో పాటు కొరటాల శివ దర్శకత్వంలో బన్నీ సినిమా ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది. మరి వీటిలో బన్నీ ఏ ప్రాజెక్ట్‌ను ముందుగా స్టార్ట్ చేస్తాడో చూడాలి. -
వెనక్కి తగ్గిన నాని
సహజమైన నటనతో మూడేళ్లపాటు వరుసగా విజయాలు అందుకున్న నానిపై ఇప్పుడు విమర్శలు వినిపిస్తున్నాయి. కొత్తదనం లేకపోగా.. పైగా కమర్షియల్ రూట్లో వెళ్తున్నాడంటూ క్రిటిక్స్ ఏకేస్తున్నారు. వరుస విజయాలకు కృష్ణార్జున యుద్ధం బ్రేక్ వేసింది. ఈ నేపథ్యంలో తన తర్వాతి చిత్రం విషయంలో నాని అలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నాని.. నాగార్జునతో కలిసి శ్రీరామ్ ఆదిత్యా డైరెక్షన్లో నటిస్తున్నాడు. ఈ చిత్రం తర్వాత విక్రమ్ కుమార్ డైరెక్షన్లో ఓ సినిమా చేయబోతున్నాడంటూ గత కొంత కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రయోగాత్మక చిత్రం అయినప్పటికీ.. కథ నచ్చటంతో నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని ఆ కథనాలు పేర్కొన్నాయి. అయితే ఆ ప్రాజెక్టును పక్కన పెట్టేయాలన్న నాని నిర్ణయించుకున్నాడంట. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రయోగాల జోలికి వెళ్తే ఇమేజ్ డ్యామేజ్ అవుతుందే తప్ప.. పెద్దగా పేరు రాదనే అంచనాకు నాని వచ్చినట్లు సమాచారం. అవసరాల శ్రీనివాస్, హను రాఘవపూడి ఇద్దరితో స్టోరీ డిస్కషన్లు అవుతుండటంతో.. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరితో సినిమా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
అఖిల్ వంద గంటలు కష్టపడ్డాడు..!
హలో సినిమాతో తొలి విజయాన్ని అందుకున్న అక్కినేని యంగ్ హీరో అఖిల్, ఆ సక్సెస్‌ను ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ సినిమాతో హీరోగానే కాదు గాయకుడిగానూ ప్రూవ్ చేసుకున్నాడు అఖిల్. ఈ సినిమాలో ‘ఏవేవో కలలు కన్నా’ అంటూ సాగే రొమాంటిక్ మెలోడిని ఆలపించాడు అఖిల్. ఈ పాటను పలు వేదికల మీద కూడా పర్ఫామ్ చేసిన అఖిల్ మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇటీవల ఆ పాటకు సంబంధించి ఆసక్తికర విషయాలను వెల్లడించాడు అఖిల్. తనను గాయకుడిగా మార్చిన క్రెడిట్ సంగీత దర్శకుడు అనూప్ రెబెన్స్ దే అన్న అఖిల్, తామిద్దరం ఆ పాట కోసం వంద గంటలకు పైగా శ్రమించినట్టు వెల్లడించాడు. అనూప్ తనకు రెగ్యులర్ సింగర్‌లా పాట పాడేందుకు కావాల్సిన మెలకువలు నేర్చించాడని తెలిపాడు. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన హలో సినిమాతో కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ గా పరిచయం అయ్యింది. -
హలో.. అక్కినేని సర్ప్రైజ్ ఇదే..!
త్వరలో ‘హలో’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్న అక్కినేని వారసుడు అఖిల్, తన రెండో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలెట్టేశాడు. మనం ఫేం విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో అఖిల్ ‘హలో’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాతో ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ కుమార్తె కళ్యాణీ హీరోయిన్గా పరిచయం అవుతోంది. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్‌ను నవంబర్ 16న రిలీజ్ చేయనున్నారు. టీజర్ రిలీజ్ డేట్ ను ప్రకటిస్తూ ఓ ఆసక్తికర పోస్టర్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. అక్కినేని నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమాకు అనూప్ రుబెన్స్ సంగీతమందిస్తున్నాడు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా డిసెంబర్ 22న రిలీజ్ చేయనున్నారు. And November 16th it is! The teaser is headed your way and we can’t be more thrilled. No looking back. #HelloTeaserOnNov16 #HelloOnDec22 pic.twitter.com/jf1dW3kC0S — Akhil Akkineni (@AkhilAkkineni8) 14 November 2017 -
'హలో' తాజా అప్ డేట్
తొలి సినిమాతో తీవ్రంగా నిరాశపరిచిన అక్కినేని వారసుడు అఖిల్ రెండో సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. నాగార్జున దగ్గరుండి సినిమాకు సంబంధించిన అన్ని విషయాలను చక్కబెడుతున్నారు. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ కు నాగచైతన్య, సమంత పెళ్లి పనులతో బ్రేక్ వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తయిపోవటంతో హాలో టీం తిరిగి షూటింగ్ మొదలు పెట్టేసింది. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా పేజ్ ద్వారా కన్ఫామ్ చేసిన హీరో అఖిల్, హలో ఆఖరి షెడ్యూల్ మొదలైంది. త్వరలో మరిన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించనున్నాం డిసెంబర్ 22న సినిమా రిలీజ్ అవుతుందంటూ తెలిపారు. అఖిల్ సరసన దర్శకుడు ప్రియదర్శన్ కూతురు కళ్యాణీ ప్రియదర్శన్ హీరోయిన్ గా పరిచయం అవుతోంది. మనం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. Started the last and final schedule of #HELLO! December 22nd here we come. Lots of excitement soon :) #Hello!ondec22nd — Akhil Akkineni (@AkhilAkkineni8) 21 October 2017 -
అఖిల్ క్లారిటీ ఇచ్చేది ఎప్పుడంటే..!
తొలి సినిమా అఖిల్‌తో అభిమానులను తీవ్రంగా నిరాశపరిచిన అక్కినేని నట వారసుడు అఖిల్, రెండో సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఈ సారి తన కొడుకుకి సూపర్ హిట్ ఇస్తానని చెప్పి మరి నాగార్జున ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. మనం ఫేం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా సినిమాను తెరకెక్కిస్తున్నారు. చాలా రోజులుగా సినిమా షూటింగ్ జరుగుతున్నా సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ ఏవీ బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు చిత్రయూనిట్. ఇంత వరకు హీరోయిన్ ఎవరన్న విషయంలో కూడా క్లారిటీ ఇవ్వలేదు. జున్ను, ఎక్కడ ఎక్కడ ఉండో తారక, రంగుల రాట్నం లాంటి టైటిల్స్ వినిపించినా.. యూనిట్ సభ్యుల మాత్రం దేన్నీ కన్ఫామ్ చేయలేదు. దీంతో సినిమా మీద క్లారిటీ ఎప్పుడిస్తారో అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. త్వరలోనే అభిమానుల కోరిక తీర్చేందుకు అక్కినేని హీరోలు రెడీ అవుతున్నారు. కింగ్ నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా ఆగస్టు 29న అఖిల్ రెండవ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ కానుందట. అదే రోజు సినిమా టైటిల్ పై కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది, ఈ సినిమాను డిసెంబర్ 22న రిలీజ్ చేస్తున్నట్టుగా గతంలోనే ప్రకటించాడు నాగ్. -
అఖిల్ చేతిపై టాటూ.. సినిమా కోసమేనా..!
తొలి సినిమాతో నిరాశపరిచన అఖిల్, ప్రస్తుతం తన రెండో సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. తొలి ప్రయత్నంలో జరిగిన తప్పులు రిపీట్ కావద్దన్న ఉద్దేశంతో చాలా కేర్ తీసుకొని రెండో సినిమాను పూర్తి చేస్తున్నాడు. ఇప్పటి వరకు సినిమా కథా కథనాలు ఎలా ఉండబోతున్నాయన్న విషయం బయటకు రానివ్వలేదు. అంతేకాదు హీరోయిన్ ఎవరన్న విషయం కూడా వెల్లడించలేదు. అయితే తాజాగా ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న అఖిల్ చేతి మీద ఇంట్రస్టింగ్ టాటూ కనిపించింది. బాణం దాని ముందు 8 అనే అంకె తో ఉన్న ఈ టాటూ తన కొత్త సినిమా కోసమేనా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అఖిల్ రెండో సినిమా దర్శకుడు విక్రమ్ కుమార్ కావటం కూడా ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. విక్రమ్‌కు గుర్తింపు తీసుకువచ్చిన 13, 24 సినిమాలు నెంబర్ చుట్టూనే తిరుగుతాయి. అదే బాటలో అఖిల్ రెండో సినిమా కూడా 8 అనే అంకె చుట్టూ నడుస్తుందా..? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న ఈ సినిమాపై మరింత సమాచారం త్వరలోనే వెల్లడించనున్నారు. -
హీరో అఖిలే లీక్ చేశాడు..?
దుబాయ్‌లోని అబుదాబిలో జరుగుతున్న సైమా వేడుకల్లో యంగ్ హీరో అఖిల్ తొలిసారిగా పాట పాడిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు నటుడిగానే తెలిసిన అఖిల్‌లోని సింగింగ్ టాలెంట్ చూసి ఇండస్ట్రీ వర్గాలు కూడా షాక్ అయ్యారు. అయితే తాజాగా ఈ పర్ఫామెన్స్‌కు సంబంధించిన మరో ఇంట్రస్టింగ్ వార్త టాలీవుడ్ సర్కిల్స్‌లో సందడి చేస్తుంది. సైమా వేడుకల్లో అఖిల్ పాడిన పాట తన కొత్త సినిమాలోనిదట. ఏవేవొ కలలు కన్నా అనే పల్లవితో సాగిన మెలోడియస్ సాంగ్, ప్రేక్షకులను కట్టి పడేసింది. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు అనూప్ రుబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. అయితే ఈ సినిమా కోసం అనూప్ ట్యూన్ చేసిన పాటనే అఖిల్ సైమా స్టేజ్ మీద పర్ఫామ్ చేశాడట. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉండగా అఖిల్ పర్ఫామెన్స్ తరువాత ఆ అంచనాలు తారా స్థాయికి చేరాయి.