Anjaneya swamy temple
-
టీడీపీ పాలనలో మళ్లీ దేవాలయాల కూల్చివేత ప్రారంభం
-
జపాలి హనుమాన్ ఆలయం చరిత్ర..!
-
హనుమా.. భూమాయ కనుమా
సాక్షి, రంగారెడ్డి జిల్లా: రెవెన్యూ అధికారులు, పూజారి వారసులు కలిసి ఏకంగా ఆంజనేయస్వామి భూములకే ఎసరు పెట్టారు. పహాణీలు, ధరణిలోని నిషేధిత జాబితాను పక్కన పెట్టి ఏకంగా 34 ఎకరాల దేవాదాయ భూమికి ఓఆర్సీ జారీ చేయడం వివాదాస్పదంగా మారింది. ప్రస్తుతం అక్కడ ఎకరం రూ.కోటి వరకు పలుకుతుండటంతో ఎలాగైనా ఈ భూములను కొట్టేయాలని పక్కాగా ప్లాన్ చేశారు. మాడ్గుల మండలం అర్కపల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 88లో 9.18 ఎకరాలు, సర్వే నంబర్ 79/ఎ4లో 20 గుంటలు, సర్వే నంబర్ 283లో 11 ఎకరాలు, సర్వే నంబర్ 241లో 11.06 ఎకరాల భూమి ఆంజనేయస్వామి దేవాలయం పేరున ఉంది. ఈ భూమికి అప్పటి ఆలయ పూజారి పప్పు లక్ష్మయ్య దంపతులను రక్షిత కాపలాదారుగా నియమించి, ఆ మేరకు రికార్డుల్లో వారి పేర్లను నమోదు చేశారు. భూమి కౌలు ద్వారా వచ్చి న డబ్బులతో ధూపదీప నైవేద్యాలు సమకూర్చా ల్సి ఉంది. ఆశించినస్థాయిలో కౌలు రాక, ఆలయ నిర్వహణ భారంగా మారి పూజారి లక్ష్మయ్య దంపతులు సుమారు 40 ఏళ్ల క్రితమే ఊరు విడిచి వెళ్లారు. అప్పటి నుంచి ఆలయ నిర్వహణ బాధ్యతను గ్రామస్తులే చూసుకుంటున్నారు. పహాణీల్లోనే కాదు ధరణి పోర్టల్లోనూ ఈ భూములు ఆంజనేయస్వామి దేవాలయం పేరునే రికార్డు అయి ఉన్నాయి. గుడ్డిగా ఓఆర్సీ జారీ చేసిన రెవెన్యూ.. తాజాగా ఈ భూమి తనదేనని, ఆయా భూములను తమ పేరున మార్చాల్సిందిగా కోరుతూ ఆలయ పూజారి కుమారుడు ఫైల్ నంబర్ 6820/2022న రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేసుకున్నాడు. ఆయన అడిగిందే తడవుగా రెవెన్యూ అధికారులు ఓఆర్సీ జారీ చేశారు. ఈ విషయం తెలిసి ఆలయ కమిటీ, గ్రామ పంచాయతీ సభ్యులు సహా దేవాదాయశాఖ కమిషనర్ అప్రమత్తమయ్యారు. ఈ భూమిపై లావాదేవీలతో పాటు రెవెన్యూ అధికారులు జారీ చేసిన ఓఆర్సీని సైతం నిలిపి వేయాల్సిందిగా కోరుతూ దేవాదాయశాఖ కమిషనర్ సహా గ్రామ పంచాయతీ సభ్యులు రెవెన్యూ అధికారులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. నేడు ఇబ్రహీంపట్నం ఆర్డీఓ ఆఫీసులో విచారణ జిల్లా అదనపు కలెక్టర్(రెవెన్యూ) తిరుపతిరా>వు ఆర్డీఓ జారీ చేసిన ఓఆర్సీని నిలిపివేయడంతో పాటు రెవెన్యూ కోర్టుకు ఈ కేసును సిఫార్సు చేశారు. శనివారం ఉదయం ఇబ్రహీంపట్నం రెవెన్యూ కోర్టులో ఈ అంశంపై ఇటు దేవాదాయశాఖ, అటు పూజారి వారసులు, ఆంజనేయస్వామి దేవాలయం కమిటీ సభ్యుల సమక్షంలో విచారణ చేపట్టాలని నిర్ణయించారు. పరిశీలించకుండానే మ్యుటేషన్! అర్కపల్లి రెవెన్యూ గ్రామానికి ఆనుకునే సర్వే నంబర్ 95/2లో సుమారు ఆరు ఎకరాల వ్యవ సాయ భూమి ఉంది. రైతు ఇప్పటికే దీనిలో కొంత భాగాన్ని స్థానికులకు గుంటల్లో విక్రయించాడు. ప్రస్తుతం ఆ భూమిలో నివాసాలు కూడా వెలిశాయి. రెవెన్యూ రికార్డుల్లో గ్రామకంఠం భూమిగా రికార్డు చేశారు. ఇప్పటికే విక్రయించ గా మిగిలిన పది గుంటల భూమిని తన పేరున మ్యుటేషన్ చేయాల్సిందిగా సదరు రైతు ఇటీవల రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేసుకున్నాడు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించకుండా, కనీస రికార్డులను పరిశీలించకుండా ఏకంగా నివాసాలు వెలిసిన భూమిని సైతం అమ్మిన రైతు పేరున మ్యుటేషన్ చేయడం గమనార్హం. భూ రికార్డుల నిర్వహణలో రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యానికి ఇదో నిదర్శనం. -
కొండగట్టు ఆలయంలో భారీచోరీ
కొండగట్టు(చొప్పదండి): ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో భారీచోరీ జరిగింది. దాదాపు 800 ఏళ్ల ఆలయ చరిత్రలోనే తొలిసారి దొంగతనం జరగడం కలకలం రేపుతోంది. పోలీసుల కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లా కొండగట్టులోని ఆంజనేయస్వామి ఆలయం వెనకాల తలుపుల పట్టీలను తొలగించి, ముగ్గురు ముసుగు దొంగలు శుక్రవారం వేకువజామున 1.10 గంటల ప్రాంతంలో లోనికి ప్రవేశించారు. గర్భాలయంలోకి వెళ్లిన దొంగలు సుమారు రెండు కిలోల ఆంజనేయస్వామి వెండికిరీటం, ఆరుకిలోల వెండి మకరతోరణం, 250 గ్రాముల శ్రీరామరక్ష గొడుగులు రెండు, కిలో మకరతోరణ వెండిస్తంభం, మూడు కిలోల వెండి శఠగోపాలు 4, ఆరు కిలోల హనుమాన్ కవచం.. ఇలా మొత్తంగా 15 కిలోల వెండి ఆభరణాలను అపహరించారు. వీటి విలువ దాదాపు రూ.9 లక్షల వరకు ఉంటుందని వెల్లడించారు. అయితే, ఆలయంలోని హనుమాన్ విగ్రహంపైగల శంఖుచక్రం, బంగారు శ్రీరామ రక్షతోరణం, శ్రీలక్ష్మీఅమ్మవారి ఆలయంలోని వెండితోరణం, శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలోని శ్రీరామ పట్టాభిషేకం వస్తువులను దొంగలు ముట్టుకోకపోవడం పోలీసులు డాగ్‌స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు. సాగర్ గెస్ట్‌హౌస్ సమీపంలోకి వెళ్లిన డాగ్‌స్క్వాడ్.. హనుమాన్ కవచానికి సంబంధించిన ఓ ఫ్రేమ్‌ను గుర్తించాయి. చదవండి: వ్యాయామం చేస్తూ.. గుండెపోటుతో కుప్పకూలిన యువ కానిస్టేబుల్ -
కొండగట్టు అంజన్నను దర్శించుకున్న సీఎం కేసీఆర్ (ఫొటోలు)
-
యాదాద్రి తరహాలో ‘కొండగట్టు’
కొండగట్టు(చొప్పదండి): జగిత్యాల జిల్లా కొండగట్టు శ్రీఆంజనేయస్వామి ఆలయాన్ని ఆగమశాస్త్రం ప్రకారం యాదాద్రి తరహాలో అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారని వాస్తు సలహాదారు, ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయి వెల్లడించారు. సీఎం కేసీఆర్ ఈ నెల 14న కొండగట్టు పర్యటనకు రానున్న నేపథ్యంలో ఆనందసాయి ఆదివారం స్వామివారి సన్నిధికి చేరుకున్నారు. అంజన్న దర్శనం తర్వాత కలెక్టర్ యాస్మిన్ బాషా, ఎస్పీ భాస్కర్, ఇతర అధికారులు, నాయకులతో సమావేశమై ఆలయ మాస్టర్‌ప్లాన్‌పై చర్చించారు. ఆలయంలో ఇప్పుడున్న ప్రాకారంతోపాటు మరోదానిని నిర్మించాల్సి ఉందన్నారు. పుణ్యక్షేత్రంలో 1980 నాటి భవనాలు ఉన్నాయని, గర్భగుడిలోని స్వామివారు భక్తులకు కనిపించడంలేదని చెప్పారు. ఆలయానికి నాలుగువైపులా గోపురాలు, ముఖమండపం నిర్మాణాన్ని ప్రత్యేకంగా డిజైన్ చేస్తామని ఆనందసాయి వివరించారు. ఆలయంలోకి వచ్చే భక్తులకు స్వామివారి చరిత్ర తెలిసేలా ప్రతీస్తంభంపై రాసి ఉంచుతామని చెప్పారు. ఆలయంలో 108 అడుగుల పొడవైన ఆంజనేయస్వామి విగ్రహం ఏర్పాటు చేయాలని సీఎం యోచిస్తున్నారని పేర్కొన్నారు. భేతాళ స్వామి, శ్రీరాముడి ఆలయం, సీతమ్మ కన్నీటిధారలు పరిశీలించిన ఆనంద్‌సాయి ఆలయంలో చాలామార్పులు ఉంటాయని వెల్లడించారు. ఈ సమాచారం మొత్తాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు. -
ఆంజనేయుడికే ఆ భూములు..
సాక్షి, అమరావతి: గుంటూరు నగర శివారులో దాదాపు పాతికేళ్లుగా ఆక్రమణదారుల చెరలో ఉన్న రూ.120 కోట్ల విలువచేసే 16 ఎకరాల దేవుడి భూమికి ఎట్టకేలకు మోక్షం సిద్ధించింది. సుదీర్ఘకాలం పాటు నడుస్తున్న ఈ వివాదానికి రాష్ట్ర ప్రభుత్వం ముగింపు పలుకుతూ సోమవారం ఆ భూములను ఆలయానికి అప్పగించింది. గుంటూరు కొరిటపాడు ప్రాంతంలోని శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానానికి నగర శివారులోని సర్వేనెం.78లో 17.70 ఎకరాల భూమి ఉంది. అందులో 16 ఎకరాల భూమిపై ఏటా వచ్చే ఆదాయాన్ని జీతభత్యాల కింద వినియోగించుకునేందుకు వీలుగా అర్చకునికి ఆ భూమిని దేవదాయ శాఖ అప్పట్లో ఈనాంగా కేటాయించింది. ఆ తర్వాత.. భూమిని లీజుకు తీసుకున్న కౌలుదారులు తనకు ఏటా లీజు డబ్బులు చెల్లించడంలేదని.. తనకు గుడి నుంచి ప్రతినెలా కొంత మొత్తం జీతం రూపంలోనే చెల్లించాలంటూ సదరు పూజారి ఆ భూమిని 1998లో తిరిగి ఆలయానికే అప్పగించారు. దీంతో ప్రతినెలా జీతం చెల్లించేందుకు దేవదాయశాఖ అంగీకరించింది. అయితే, అప్పటికే ఆ 16 ఎకరాల భూమి ఆక్రమణదారుల చెరలోకి వెళ్లిపోయింది. 2003లో ఆక్రమణదారుల నుంచి భూమిని విడిపించాల్సిన నాటి ప్రభుత్వం.. ఈ వివాదానికి శాశ్వత పరిష్కారం కుదిరే వరకు ఎకరాకు రూ.5 వేల చొప్పున ఏటా డ్యామేజీ రూపంలో ఆలయానికి చెల్లించాలని ఆక్రమణదారులకు ఆదేశాలిచ్చి సరిపెట్టింది. దీంతో అప్పటినుంచి ఆక్రమణదారులు ఏటా రూ.80 వేలు చెల్లిస్తున్నారు. ఆదాయం సరిపోక అప్పుల బాట విలువైన భూములుండీ ఆ స్వామికి అప్పులు తప్పడంలేదు. ఆక్రమణదారులు ఏటా చెల్లించే రూ.80 వేలే ఆలయానికి ఆదాయం. రెండు లక్షల డిపాజిట్‌పై మరో రూ.పది వేల వడ్డీ వస్తుందని ఆలయ ఈఓ తెలిపారు. పూజారికి అన్నీ కలుపుకుని రూ.12 వేల వేతనం చెల్లిస్తున్నారు. అందులో రూ.5 వేలను ధూపదీప నైవేద్యం కోసం. ఈ నేపథ్యంలో.. పూజారి జీతభత్యం, ఆలయంలో కరెంటు బిల్లులకు ఆదాయం సరిపోక పొరుగున ఉండే కొన్ని ఆలయాల నిధుల నుంచి అప్పులు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆలయం పేరిట రూ.70 వేల దాకా అప్పు ఉంది. ఇటీవలే ఆలయంలో సీసీ కెమెరాలు ఏర్పాటుకు రూ.40 వేలను పొరుగు ఆలయం నిధుల నుంచి సర్దుబాటు చేశారు. టీడీపీ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం.. ఇక ఆక్రమణలో ఉన్న ఈ ఆలయ భూములను విడిపించేందుకు ఈవో ఎన్నిసార్లు గత టీడీపీ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినా స్పందనలేదు. దీంతో దేవదాయ శాఖ మంత్రి ఆధ్వర్యంలో ఉండే ప్రత్యేక కోర్టులో ఈ భూమి వివాదం పెండింగ్‌లో ఉండిపోయింది. జగన్ ప్రభుత్వం వచ్చాక ఈ భూమి సమస్య పరిష్కరించేందుకు మూడుసార్లు మంత్రి కోర్టు భేటీ అయింది. ఆక్రమణదారుల నుంచి భూమిని విడిపించాలని ఆదేశాలు జారీచేసింది. దీంతో సోమవారం గుంటూరు జిల్లా పోలీసులు, రెవెన్యూ సిబ్బంది సమక్షంలో గుంటూరు జిల్లా దేవదాయ శాఖ అధికారి మహేశ్వరరెడ్డి ఆ భూములను స్వాధీనం చేసుకుని ఆలయ ఈఓకు అప్పగించారు. అప్పట్లో నా రిపోర్టులకు సమాధానం వచ్చేదికాదు.. గుంటూరు జిల్లా నల్లపాడు గ్రూపు టెంపుల్స్‌లో ఇదీ ఒకటి. వాటన్నింటికీ నేను ఈఓగా ఉన్నాను. 2017 నుంచి ఈ వివాదాస్పద భూములను ఆక్రమణదారుల నుంచి విడిపించడానికి ప్రయత్నిస్తున్నా. అప్పట్లో కోర్టు భేటీకి నేను రాసిన రిపోర్టులకు ప్రభుత్వం నుంచి రిప్లయ్ వచ్చేది కాదు. రెండున్నర ఏళ్ల క్రితం నేను చేసిన ప్రతిపాదనకు స్పందనగా ప్రత్యేక కోర్టు భేటీని ప్రస్తుత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటుచేసి సమస్యను పరిష్కరించింది. – విజయభాస్కరరెడ్డి, శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం, కొరిటపాడు, గుంటూరు -
మాంసమే నైవేద్యంగా..
పెబ్బేరు రూరల్: అన్ని హనుమంతుడి ఆలయాల్లో సిందూరం, తమలపాకులు, టెంకాయలతో ప్రత్యేక పూజలు చేయడం చూస్తుంటాం. కానీ, చింతలకుంట ఆంజనేయస్వామికి మాత్రం మాంసం, మద్యాన్ని నైవేద్యంగా ఉంచి భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం నుంచి 8 కి.మీ. దూరంలో పాతపల్లి శివారులో చింతలకుంట ఆంజనేయస్వామి కొలువుదీరాడు. ఇక్కడ ఏటా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మూడు రోజులపాటు ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తారు. తాము కోరుకున్న కోరికలు తీరిన భక్తులు కోళ్లు, పొట్టేళ్లను స్వామి వారికి బలిస్తారు. దీంతోపాటు కొత్తగా కొనుగోలు చేసిన వాహనాలకు స్వామివారి సన్నిధిలో పొట్టేళ్లను బలిచ్చి పూజలు చేస్తారు. శుక్రవారం పలువురు భక్తులు కోళ్లను బలి ఇచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. చరిత్ర..: ఈ ఆలయం చుట్టుపక్కల చింతచెట్లు ఎక్కువగా ఉండడంతో అప్పట్లో రాక్షసులు ఎక్కువగా సంచరించేవారట. మనుషులు, పశుపక్షాదులను చంపుతుండటంతో ప్రజలు రక్షించాలని హనుమంతుడిని వేడుకోవడంతో ఆయనే ఇక్కడ కొలువై రాక్షసకాండకు ముగింపు పలికాడని చెబుతారు. ఈక్రమంలోనే రాక్షసులంతా హనుమంతుడిని వేడుకోవడంతో.. భక్తులు వారి ఇష్టపూర్తితో తనకు జంతువులను బలి ఇస్తారని, వాటితో కడుపు నింపుకోవాలని, మనుషుల జోలికి వెళ్లవద్దని చెప్పినట్లు ఓ కథ ప్రచారంలో ఉంది. అయితే శ్రీరంగాపూర్ మొదటి పరిపాలన రాజు వాసుదేవరావు సైతం తాను అనుకున్నది నెరవేరడంతో గుడిని నిర్మించారు. గుడి సమీపంలో చింతల చెరువు ఉండటంతో చింతలకుంట ఆంజనేయస్వామి అని పేరొచ్చిందని చెబుతారు. -
ఆధారసహితం.. అంజనాద్రే హనుమ జన్మస్థలం
యూనివర్సిటీ క్యాంపస్ (తిరుపతి): తిరుమలలోని అంజనాద్రే ఆంజనేయుని జన్మస్థలమని పురాణాలు, శాసనాలు, భౌగోళిక ఆధారాలన్నీ స్పష్టంగా చెబుతున్నాయని, ఈ విషయంలో ఆలోచించాల్సిందేమీ లేదని పలువురు పీఠాధిపతులు, పండితులు, చారిత్రక పరిశోధకులు తేల్చిచెప్పారు. టీటీడీ శ్రీవేంకటేశ్వర ఉన్నత వేదాధ్యయన సంస్థ ఆధ్వర్యంలో ‘హనుమంతుని జన్మస్థలం అంజనాద్రి’ అంశంపై నిర్వహించిన రెండురోజుల అంతర్జాతీయ వెబినార్ శనివారం ముగిసింది. తిరుమల క్షేత్రంలో అంతర్భాగమైన అంజనాద్రి పర్వతమే ఆంజనేయస్వామి జన్మస్థలమని, ఆళ్వారుల పాశురాల్లోని వైష్ణవ సాహిత్యం ద్వారా తెలుస్తోందని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఆచార్యులు చక్రవర్తి రంగనాథన్ తెలిపారు. ‘వైష్ణవ సాహిత్యంలో తిరుమల–అంజనాద్రి’ అంశంపై మాట్లాడుతూ ఆళ్వారులు రచించిన 4 వేల పాశురాల్లో 207 పాశురాలు తిరుమల క్షేత్ర వైభవాన్ని, అందులో 12 పాశురాలు విశేషంగా ఆంజనేయస్వామి గురించి తెలుపుతున్నాయన్నారు. పండిత పరిషత్ కార్యదర్శి డాక్టర్ ఆకెళ్ల విభీషణ శర్మ ‘భక్తి కీర్తనల్లో అంజనాద్రి’ అంశంపై ప్రసంగిస్తూ, అన్నమయ్య, పురంధర దాసులు, వెంగమాంబ లాంటి వాగ్గేయకారులు అంజనాద్రి గురించి కీర్తనల్లో ప్రస్తావించారన్నారు. జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఆచార్యులు రాణి సదాశివమూర్తి ‘పురాణ భూగోళంలో హనుమంతుడు– అంజనాద్రి’ అంశంపై ఉపన్యాసిస్తూ, అంజనాద్రి దాస క్షేత్రమని, వేంకటాచల మహాత్మ్యం అనేది వివిధ పురాణాల సంకలనమన్నారు. సాహిత్య ఆధారాలు.. శ్రీవారి ఆలయ అర్చకులు అర్చకం రామకృష్ణ దీక్షితులు ‘సప్తగిరులలో అంజనాద్రి ప్రాముఖ్యం’పై మాట్లాడారు. కాలిఫోర్నియా నుంచి ప్రముఖ ఐటీ నిపుణులు పాలడుగు చరణ్ ‘సంస్కృత సాహిత్యంలో హనుమంతుడు’ అంశంపై ప్రసంగించారు. ఋగ్వేదం నుంచి వర్తమాన సాహిత్యం వరకు అన్ని పదాల్లో అంజనాద్రి హనుమంతుని జన్మస్థలమని నిరూపితమైందన్నారు. దానికి సాహిత్య ఆధారాలు ఉన్నట్లు వివరించారు. అందుకే అంజనాద్రి అయ్యింది.. మధ్యప్రదేశ్ చిత్రకూట్‌లోని రామభద్రాచార్య ప్రత్యేక ప్రతిభావంతుల విశ్వవిద్యాలయం ఉపకులపతి జగద్గురు రామభద్రాచార్య, తిరువనంతపురంలోని ప్రభుత్వ సంస్కృత కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె.ఉన్నికృష్ణన్ మాట్లాడుతూ, తిరుమలలో అంజనాదేవి తపస్సు చేసి ఆంజనేయునికి జన్మ ఇచ్చినందువల్లే ఆ కొండకు అంజనాద్రి అని పేరొచ్చిందన్నారు. తెలంగాణ ప్రభుత్వ ముఖ్య ప్రజాసంబంధాల అధికారి వనం జ్వాలా నరసింహారావు, ముంబైకి చెందిన ప్రసిద్ధ కవి, ఆధ్యాత్మిక వేత్త సాంపతి సురేంద్రనాథ్ మాట్లాడారు. కర్ణాటక సోసలేలోని వ్యాసరాజ మఠాధిపతి విద్యా శ్రీశతీర్థ మహాస్వామి అనుగ్రహ భాషణం చేశారు. అంజనాద్రిని అభివృద్ధి చేస్తాం: ధర్మారెడ్డి తిరుమల అంజనాద్రిలోని ఆంజనేయుడు జన్మించిన స్థలంలో ఆలయాన్ని మరింతగా అభివృద్ధి చేసి భక్తులు దర్శించుకునే సదుపాయాలు కల్పిస్తామని అదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. వెబినార్ అంశాలను జాతీయ సంసృత విశ్వవిద్యాలయంలో ఆయన మీడియాకు వెల్లడించారు. ఆంజనేయుని జన్మస్థలం అంజనాద్రి అని ఆధారాలతో త్వరలో ఒక గ్రంథం ముద్రించనున్నామన్నారు. -
ఈ హనుమాన్ జయంతికి ఓ ప్రత్యేకత ఉంది : చిరంజీవి
హిందూ పండుగలలో మరో ముఖ్యమైన పండగ హనుమాన్ జయంతి నేడు(ఏప్రిల్ 27), ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ హనుమాన్ జయంతికి ఒక ప్రత్యేకత ఉందని, హనుమాన్ మన వాడే అని, ఈ విషయాన్ని అన్ని ఆధారాలతో తిరుమల తిరుపతి దేవస్థానం రుజువు చేసిందని గుర్తుచేశారు. ‘ఈ హనుమజ్జయంతి కి ఓ ప్రత్యేకత ఉంది.హనుమాన్ మన వాడే అని.. మన తిరుమల కొండల్లోనే జన్మించాడని ఆధారాలతో సహా తిరుమలతిరుపతి దేవస్థానం రుజువు చేసింది.ఎక్కడివాడు ఎప్పటివాడు అన్న విషయం పక్కనపెడితే మన గుండెలో కొలువైన సూపర్ మేన్ లార్డ్ హనుమ’ అంటూ భార్త సురేఖతో కలిసి హనుమంతుడి విగ్రహం ముందు దిగిన ఫోటోని ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. కాగా, హనుమంతుడు తిరుమల గిరుల్లోని అంజనాద్రిలో జన్మించాడని టీటీడీ ఆధారాలతో సహా ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై లోతుగా అధ్యయనం జరిపిన తర్వాత, తిరుమలలో శ్రీవారి ఆలయానికి సమీపంలోని జాపాలి తీర్థమే హనుమంతుడి జన్మస్థలమని.. అదే అంజనాద్రి అని తెలిపింది. View this post on Instagram A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela) చదవండి: ఆంజనేయుడి జన్మస్థలం అంజనాద్రే -
ఆంజనేయుడి జన్మస్థలం అంజనాద్రే
సాక్షి, తిరుపతి, తిరుమల: కలియుగ దైవం శ్రీనివాసుడు కొలువుదీరిన ఏడుకొండలే రామభక్తుడైన ఆంజనేయుడి జన్మస్థలం అని టీటీడీ ఆధారాలతో సహా నిరూపించింది. తిరుమలలో శ్రీవారి ఆలయానికి సమీపంలోని జాపాలి తీర్థమే హనుమంతుడి జన్మస్థలమని.. అదే అంజనాద్రి అని తెలిపింది. ఈ మహత్తర, పురాణ, చారిత్రక ఆవిష్కరణను బుధవారం శ్రీరామనవమి రోజు టీటీడీ ప్రకటించటం విశేషం. 15వ శతాబ్దంలో విజయ రాఘవరాయలు జాపాలిలో నిర్మించిన శ్రీఆంజనేయుని ఆలయమే హనుమ జన్మస్థలం అని ఆధారాలతో టీటీడీ వెలుగులోకి తెచ్చింది. జాపాలి మహర్షి జపం ఆచరించి శ్రీనివాసుడిని ప్రసన్నం చేసుకోవడంతో ఈ తీర్థానికి జాపాలి అనే పేరు వచ్చింది. శాస్త్రబద్ధంగా నిరూపణ: తమిళనాడు గవర్నర్ పురోహిత్ భక్త హనుమ జన్మస్థలాన్ని నిర్ధారిస్తూ పండితుల కమిటీ రూపొందించిన నివేదికను నవమి రోజు తిరుమలలోని నాదనీరాజనం వేదికపై ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి తమిళనాడు గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్ హాజరయ్యారు. హనుమ జన్మస్థలాన్ని టీటీడీ శాస్త్రబద్ధంగా నిరూపించడం తనకెంతో సంతోషాన్ని కలిగించిందని చెప్పారు. క్షుణ్నంగా పరిశీలించి ఆధారాలు సేకరించడం ఎంత కష్టమో తమిళనాడులోని 20 విశ్వవిద్యాలయాల చాన్సలర్‌గా తనకు బాగా తెలుసన్నారు. నాలుగు నెలలపాటు అవిశ్రాంతంగా శ్రమించిన పండితుల కమిటీని ఆయన అభినందించారు. త్వరలో పుస్తక రూపంలో నివేదిక: ఈవో జవహర్‌రెడ్డి భగవత్ సంకల్పంతోనే శ్రీరామనవమి నాడు హనుమంతుడి జన్మస్థానాన్ని తిరుమలగా నిరూపించామని టీటీడీ ఈవో డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి చెప్పారు. పండితులతో కూడిన కమిటీ పౌరాణిక, వాజ్ఞయ, శాసన, భౌగోళిక ఆధారాలను సేకరించి ఈ విషయాన్ని నిర్ధారించిందన్నారు. ఆధారాలతో కూడిన నివేదికను టీటీడీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచామని, త్వరలో పుస్తక రూపంలోకి తెస్తామని ప్రకటించారు. కర్ణాటకలోని హంపి క్షేత్రాన్ని కూడా హనుమంతుడి జన్మస్థలంగా చెబుతున్నారని, దీన్ని శాస్త్రీయంగా పరిశీలించామని, అక్కడ కిష్కింద అనే రాజ్యం ఉండవచ్చని, హనుమంతుడు అంజనాద్రి నుంచి అక్కడికి వెళ్లి సుగ్రీవుడికి సాయం చేసినట్లుగా భావించవచ్చన్నారు. గుజరాత్, మహారాష్ట్ర, హరియాణాలో హనుమంతుడు జన్మించినట్లుగా ఎలాంటి ఆధారాలు లభించలేదన్నారు. కమిటీ సభ్యులకు అభినందనలు.. కమిటీ సభ్యులైన ఎస్వీ వేద విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య సన్నిధానం సుదర్శనశర్మ, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య మురళీధరశర్మ, ఆచార్య రాణి సదాశివమూర్తి, ఆచార్య జానమద్ది రామకృష్ణ, ఆచార్య శంకరనారాయణ, ఇస్రో శాస్త్రవేత్త రేమెళ్ల మూర్తి, రాష్ట్ర పురావస్తుశాఖ మాజీ డిప్యూటీ డైరెక్టర్ విజయ్‌కుమార్, టీటీడీ ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ప్రాజెక్టు అధికారి డాక్టర్ ఆకెళ్ల విభీషణశర్మలను ఈవో అభినందించారు. పండితుల కమిటీ నాలుగు నెలల పాటు విస్తృతంగా పరిశోధించి బలమైన ఆధారాలు సేకరించిందని టీటీడీ అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. ఇవీ ఆధారాలు.. శ్రీమద్రామాయణంలోని సుందరకాండ, అనేక పురాణాలు, వేంకటాచల మహాత్యం, ఎన్నో కావ్యాల్లో హనుమంతుని జన్మవృత్తాంతం గురించి వర్ణించి ఉందని ఆచార్య మురళీధరశర్మ చెప్పారు. కంబ రామాయణం, వేదాంత దేశికులు, తాళ్లపాక అన్నమాచార్యులు తమ రచనల్లో వేంకటాద్రిగా, అంజనాద్రిగా అభివర్ణించారని తెలిపారు. బ్రిటీష్ అధికారి స్టాటన్ క్రీ.శ.1800లో తిరుమల ఆలయం గురించి సంకలనం చేసిన అంశాలతో సవాల్–ఏ–జవాబ్ పుస్తకాన్ని రాశారని, అందులో అంజనాద్రి అనే పదాన్ని వివరిస్తూ అంజనాదేవికి ఆంజనేయుడు పుట్టినచోటు కావడం వల్లే అంజనాద్రి అనే పేరు వచ్చిందని ప్రస్తావించారని తెలిపారు. బాలాంజనేయుడు సూర్యదేవుడిని పట్టుకోవడానికి వేంకటాద్రి నుంచి లంఘించడం, శ్రీరాముని దర్శనానంతరం సీతాన్వేషణలో తిరిగి వేంకటగిరికి రావడం, అక్కడ అంజనాదేవిని మళ్లీ చూడడం, వానరవీరులు వైకుంఠగుహలో ప్రవేశించడం.. లాంటి అనేక విషయాలు వేంకటాచల మహాత్యం ద్వారా తెలుస్తున్నాయన్నారు. ఈ గ్రంథం ప్రమాణమే అని చెప్పడానికి రెండు శిలాశాసనాలు తిరుమల గుడిలో ఉన్నాయన్నారు. మొదటి శాసనం 1491 జూన్ 27వ తేదీ నాటిది కాగా రెండో శాసనం 1545 మార్చి 6వ తేదీకి చెందినదని వివరించారు. శ్రీరంగంలో ఉన్న ఒక శిలాశాసనం కూడా దీన్ని తెలియజేస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీటీడీ సీవీఎస్వో గోపీనాథ్‌జెట్టి, ఎస్వీబీసీ సీఈవో సురేష్‌కుమార్, అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు ఆచార్య దక్షిణామూర్తి, ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ప్రాజెక్టు అధికారి డాక్టర్ ఆకెళ్ల విభీషణశర్మ తదితరులు పాల్గొన్నారు. -
తిరుమల అంజనాద్రే ఆంజనేయుని జన్మస్థలం
తిరుమల: తిరుమల గిరుల్లోని అంజనాద్రి శ్రీ ఆంజనేయస్వామివారి జన్మ క్షేత్రమని పురాణాలు ముక్త కంఠంతో చెబుతున్నాయని పలువురు పండితులు టీటీడీ ఈఓ కేఎస్ జవహర్‌రెడ్డికి వివరించారు. దీనిపై విస్తృతంగా పరిశోధనలు జరిపి ఆధారాలతో నిరూపించాలని ఈఓ పండితులను కోరారు. టీటీడీ పరిపాలన భవనంలోని ఈఓ కార్యాలయంలో బుధవారం సాయంత్రం ఆయన పండితులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ కొన్ని దేవాలయాల స్థల పురాణాల ఆధారంగా వేరువేరు ప్రాంతాలను హనుమంతుని జన్మ స్థలంగా ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో పౌరాణిక, చారిత్రక, ఆచార వ్యవహార దృష్టితో ఆంజనేయస్వామివారు తిరుమలలో జన్మించారని పరిశోధించి నిరూపించడానికి పండితులతో ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఆధునిక కాలంలో శ్రీవారి భక్తులందరికీ అంజనాద్రిపై మరింత భక్తి విశ్వాసాలు ఏర్పడాలని ఈఓ సూచించారు. స్కంధ పురాణం, వరాహ పురాణం, పద్మ పురాణం, బ్రహ్మాండ పురాణం, భవిష్యోత్తర పురాణం, వెంకటాచల మహాత్మ్య మొదలైన పురాణాల్లో ఉన్న శ్లోకాలను పండితులు సమావేశంలో ప్రస్తావించారు. ఈ సమావేశంలో జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆచార్య మురళీధర శర్మ, ఎస్వీ వేద విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆచార్య సన్నిధానం సుదర్శన శర్మ, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఆచార్యులు జె.రామక్రిష్ణ, శంకరనారాయణ, ఎస్వీ వేద ఆధ్యయన సంస్థ ప్రత్యేకాధికారి విభీషణ శర్మ పాల్గొన్నారు. -
గోడపై గుడి చరిత్ర!
సాక్షి, హైదరాబాద్: నగర శివారులోని కర్మన్‌ఘాట్ ఆంజనేయస్వామి ఆలయం ఎవరు నిర్మించారు.. ఎప్పుడు నిర్మించారు.. ఆలయానికి వెళ్లే భక్తుల్లో చాలామందికి తెలియని విషయాలివి. కానీ, ఇప్పుడు ఆలయానికి వెళ్తే దాన్ని చారిత్రక కారణాలు, ఆలయ నిర్మాణం తర్వాత జరిగిన ఘటనలు కళ్లకు కట్టేలా గోడలపై చిత్రాలతో కూడిన వర్ణన కనిపిస్తుంది. ఈ దేవాలయం వెనక ఇంతటి నేపథ్యం ఉందా అని భక్తులు అబ్బురపడుతున్నారు. రాష్ట్రంలో ఎన్నో ఆలయాల గురించి పుస్తకాల్లో తప్ప గుడిలో చెప్పేవారుండరు. అందుకే దేవాదాయశాఖ ఆలయాల చరిత్ర భక్తులకు తెలియజెప్పాలని నిర్ణయించింది. ఇక ఆలయాల చరిత్రకు ఆ గుడిగోడలు ఆలవా లం కానున్నాయి. అన్ని పురాతన దేవాలయాల నిర్మాణ నేపథ్యం వంటి వివరాలు దేవాలయాల గోడలపై రాయించాలని, చిత్రాలు వేయించాలని నిర్ణయించింది. ఈ మేరకు దేవా దాయ శాఖ కమిషనర్ అనిల్‌కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగా కర్మన్‌ఘాట్ ఆంజనేయస్వామి దేవాలయంలో దాని చరిత్రను గోడలపై ఏర్పాటు చేయించారు. దేవాలయాల ప్రాధాన్యం పెంచేందుకే..... పట్టణాలు, పల్లెల్లో ఇప్పుడు విరివిగా ఆలయాలు నిర్మితమవుతున్నాయి. చెత్తకుప్పల పక్కన, చిన్న, చిన్న ఇరుకు గదుల్లో, అపార్ట్మెంట్ తరహా నిర్మాణాలోనూ గుడులు వెలుస్తున్నాయి. కొన్ని గుడుల్లో, కొన్ని సందర్భాల్లో సినిమా పాటలు, రికార్డింగ్ డాన్సులు లాంటి వాటితో హోరెత్తిస్తున్నారు. దీంతో భక్తిభావం సన్నగిల్లేలా అవకాశముందనే ఫిర్యాదులు చాలాకాలంగా ఉన్నాయి. వీటివల్ల పురాతన దేవాలయాల ప్రాభవం తగ్గుతోంది. దీన్ని గమనంలో ఉంచుకుని దేవాదాయశాఖ భక్తుల్లో ఆలయాల ప్రాధాన్యంపై అవగాహన కల్పిం చి వాటి వైభవం పెరిగేలా చేయాలని నిర్ణయించింది. పెయింటింగ్స్‌కు కంటే మెరుగైన పద్ధతిలో... స్థానికులకు, ఆలయాలపై కొంత అవగాహన ఉన్నవారికే వాటి చరిత్ర తెలుస్తోంది. కొత్త భక్తులకు వాటి నేపథ్యంపై అవగాహన ఉండటం లేదు. ఇప్పుడు భక్తులందరికీ గుడుల చారిత్రక నేపథ్యంపై అవగాహన తెచ్చేలా ఈ ఏర్పాటు చేస్తున్నారు. గోడలపై పెయింటింగ్ వేయిస్తే అది ఎక్కువ కాలం నిలిచే అవకాశం లేదు. పండుగలప్పుడు రంగులేస్తే ఈ పెయింటింగ్స్ మలిగిపోయే అవకాశం ఉంది. అవసరమైనప్పుడు వాటిని తొలగించి మళ్లీ ఏర్పాటు చేసే అవకాశం ఉండే పద్ధతులను అనుసరిస్తున్నారు. -
కొండగట్టు కాషాయమయం
కొండగట్టు (చొప్పదండి): తెలంగాణలోని పుణ్యక్షేత్రం జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం శుక్రవారం కాషాయమయమైంది. హనుమాన్ చిన్నజయంతి సందర్భంగా దీక్షాపరులు భారీ సంఖ్యలో వచ్చి మాలవిరమణలు చేసుకొని మొక్కులు చెల్లించారు. లక్షకు పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. జగిత్యాల కలెక్టర్ శరత్, బీజేపీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ స్వామివారిని దర్శించుకున్నారు. ఏటా చైత్రపౌర్ణమిని పురస్కరించుకుని నిర్వహించే ఈ జయంతి ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి వేకువజామున సుప్రభాత సేవ, పంచామృతాభిషేకం, పట్టువస్త్రాలంకరణ చేశారు. భక్తులకు సరిపడా తాగునీరు లేక ఇబ్బంది పడ్డారు. పాతకోనేరులో నీరు బురదగా మారడంతో భక్తులు ఒక్కో బకెట్‌కు రూ.20 చొప్పున కొనుగోలు చేశారు. -
ఆ నీటి మడుగున ఏముంది..?
సాక్షి, కృష్ణా (మాగనూర్): మండల పరిధిలోని ముడుమాల్, పుంజనూర్ గ్రామాల మధ్యన ఉన్న కృష్ణానదిలో దాదాపు కిలోమీటర్ పొడవునా ఓ సొరంగంలా నీటి మడుగు కలదు. కొన్ని వందల సంవత్సరాల నుంచి ఈ నీటి మడుగు ఉందని, దీని దిగువన కూడ రాతి బండనే ఉందని ఈ ప్రాంత ప్రజలు చెబుతున్నారు. ఈ నీటి మడుగు దాదాపు 50 అడుగుల లోతు వరకు ఉందని, నీటి దిగువన ఓ ఆంజనేయస్వామి ఆలయం, బంగారు రథం ఉందని ఈ ప్రాంతంలో ప్రచారం ఉంది. ఈ నీటి మడుగు బయటకు ఎప్పుడు కన్పించదు. కానీ దీని దిగువకు కూడ ఎవ్వరుకూడ వెళ్లడానికి ప్రయత్నించలేదని పేర్కొంటున్నారు. ప్రస్తుతం నదిలో నీరు లేకపోవడంతో ఈ మడుగు స్పష్టంగా కన్పిస్తుంది. ఈ ప్రాంత ప్రజలకు ఈ మడుగుతో వరి పంటలకు, పశువులకు తాగునీటికి వరప్రదాయి అని హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నీటి మడుగులో ఏముందో తెలుసుకోడానికి ప్రభుత్వం ప్రయత్నించాలని స్థానికులు కోరతున్నారు. -
ఆలయ ప్రహరీపై హనుమాన్ ఆకారం
తార్నాక: తార్నాక– సీతాఫల్మండి వెళ్లే రహదారిలోని ద ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇఫ్లూ) వద్ద ఉన్న మూడుగుళ్ల అమ్మవారి ఆలయ ప్రహరీపై çఆంజనేయస్వామిని తలపించేలా ఆకారం ప్రత్యక్షం కావడం సంచలనం రేపింది. గోడపై ఆంజనేయ స్వామి చిత్రాన్ని చూసిన కొందరు ఈ విషయాన్ని తమకు తెలిసిన వారికి చెప్పడంతో ఈ సమాచారం దావానంలా వ్యాప్తించింది. మంగళవారం జరిగిన ఈ సంఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. తార్నాక నుంచి సీతాఫల్మండి బ్రిడ్జి వైపు వెళ్లే రహదారిలో ద ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇఫ్లూ) ప్రహరీని ఆనుకుని నల్లపోచమ్మ, ముత్యాలమ్మ, మైసమ్మ మూడుగుళ్ల దేవాలయం ఉంది. వందేళ్ల చరిత్ర కలిగిన ఈ దేవాలయాన్ని ఇటీవలే ఆధునికీకరించారు. మంగళవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో ఆలయ ప్రహరీపై ఆలయం ఎదురుగా ఉన్న చెట్టు ఆకుల మధ్య నుంచి ఆంజనేయస్వామి ఆకారం కనిపించింది. విద్యుత్ కాంతుల మధ్య గోడపై ధగధగా మెరుస్తున్న ఆంజనేయస్వామి ఆకారాన్ని అటుగా వెళ్లున్నవారు గమనించారు. ఈ సమాచారం ఆ నోటా ఈనోటా బయటకు రావడంతో కొద్ది క్షణాల్లోనే ఆలయ ప్రాంగణం జనంతో నిండిపోయింది. దీంతో రోడ్డుపై ట్రాఫిక్‌తో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. విషయం గమనించిన పోలీసులు అక్కడికి చేరుకుని ఆలయం వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. -
ఆంజనేయా..ఆస్తులు కాపాడుకో తండ్రీ ..!
బొబ్బిలి విజయనగరం : ఎంతో విలువైన దేవాదాయ శాఖకు చెందిన షాపింగ్ కాంప్లెక్స్‌లోని షాపులను వేలం వేయడంలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పట్టణంలోని ఆంజనేయస్వామి దేవస్థానం దేవాదాయ శాఖ పరిధిలో ఉంది. ఈ ఆలయానికి చెందిన స్థలంతో పాటు మున్సిపాలిటీ స్థలంలో మున్సిపల్ అధికారులు షాపింగ్ కాంప్లెక్స్‌ను నిర్మించారు. ఈ కాంప్లెక్స్‌కు మున్సిపల్ మాజీ చైర్మన్ ఆరి గంగయ్య పేరు పెట్టారు. అయితే దేవాదాయ శాఖ మా స్థలంలో కట్టిన షాపులను మాకు అప్పగించాలని కోర్టుకు వెళ్లారు. చివరకు ఏళ్ల తరబడి నడచిన ఈ కేసు సుమారు ఎనిమిది నెలల కిందట కోర్టు ఆ షాపులు దేవాదాయ శాఖకు చెందుతాయని తీర్పిచ్చిందని దేవాదాయ శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే నేటికీ ఆ షాపులను వేలం వేయడం లేదు. ఇదిగో అదిగో అని తాత్సారం చేస్తున్నారే తప్ప షాపులకు వేలం వేయడం లేదు. ఇదిలా ఉంటే పైరవీలు చేసుకున్న వారికే షాపులు కట్టబెట్టేందుకు ఏర్పాట్లు సాగుతున్నట్లు సమాచారం. ఇక్కడ ఒక్కో దుకాణానికి నెలసరి అద్దె రూ.4 వేల నుంచి పది వేల రూపాయల వరకు పలుకుతోంది. అలాగే డిపాజిట్లు కూడా రూ. లక్షల్లో చెల్లించాల్సి ఉంటుంది.అయితే దుకాణాల వేలాన్ని దేవాదాయ శాఖాధికారులు కావాలనే తాత్సారం చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. చాలా మంది ఔత్సాహికులు షాపులను దక్కించుకునేందుకు ఎదురు చూస్తున్నారు. బహిరంగ వేలం అయితే ఎవరు ఎక్కువ ధరకు పాడుకుంటే వారికే షాపులు కేటాయించాలి. అయితే కౌన్సిలర్లు, కొంతమంది రాజకీయ నాయకులు బహిరంగ వేలం కాకుండా అడ్డుపడుతున్నారు. కోర్టు వేలంపాట నిర్వహించుకోవాలని చెప్పినప్పుడు దేవాదాయ శాఖాధికారులు ఎందుకు ఆలస్యం చేస్తున్నారో అర్థం కావడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయమై ఈఓ శ్రీనివాసరావును వివరణ కోరగా స్థలాల కొలతలను బట్టి అద్దెలుంటాయనీ, ఈనెల 27న వేలం ప్రక్రియను నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అందరికీ తెలిసేలా కరపత్రాలు పంచి వేలం ధరను నిర్ణయిస్తామన్నారు. ఇప్పటివరకూ కొన్ని దుకాణలకు వసూలు చేసిన అద్దెలు మున్సిపాలిటీ వద్దనే ఉండొచ్చన్నారు. -
ఆంజనేయస్వామి ఆలయం కూల్చివేత
శాంతిపురం: కుప్పం–పలమనేరు జాతీ య రహదారి పక్కన కూతేగానిపల్లి క్రాసు సమీపంలోని ఆంజనేయస్వామి ఆలయాన్ని మంగళవారం అధికారులు, కాంట్రాక్టర్లు కలిసి నేలమట్టం చేశారు. రోడ్డు విస్తరణకు అడ్డంగా ఉన్న గుడిని తొలగించటంపై ఎలాంటి అభ్యంతరాలూ లేకున్నా పనులు చేసిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేవతామూర్తుల విగ్రహాలను సమీపంలోని బస్ షెల్టర్‌లో పెట్టడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విగ్రహాలను సమీపంలోని ఇతర ఆలయాల్లో భద్రపరిచే అవకాశాలున్నా నిర్లక్ష్యంగా వ్యవహరించారని మండిపడుతున్నారు. జాతీయ రహదారి పనుల్లో భాగంగా మలుపును తొలగించడంపై ఆరు నెలలుగా చర్చలు సాగుతున్నాయి. ఆలయ సమీపంలోని తమ పట్టా భూమిలో స్థలం ఇస్తానని గుడి ధర్మకర్త రమేష్‌రెడ్డి ముందుకు వచ్చారు. రోడ్డుకు తన భూమి తీసుకోవటంతో ప్రభుత్వం నుంచి వచ్చే దాదాపు రూ.70 వేల పరిహారం కూడా ఆలయానికే ఇస్తానని అధికారుల సమక్షంలో చెప్పారు. గుడిని కూల్చే ముందుగా చిన్న పాటి గుడి నిర్మించినా దేవతామూర్తులను అందులోకి మార్చుకుని పూజలు చేస్తామన్నారు. స్థానికుల నుంచి కూడా ఇదే అభిప్రాయం రావటంతో అప్పట్లో దీనిపై కాంట్రాక్టర్ల వైపు నుంచి సానుకూ ల స్పందన వచ్చింది. ఆలయ నిర్మాణ విలువను అధికారులు దాదాపు రూ 1.70 లక్షలకు అంచనా వేశారు. ఈ ప్రతి పాదనలను ప్రభుత్వానికి పంపారు. గుడి స్థలం ప్రభుత్వానిదేనన్న సాకుతో పరిహారం మంజూరుకు సర్కారు తిరస్కరించింది. ప్రత్యామ్నాయ నిర్మాణ అం శం మరుగున పడిపోయింది. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం విగ్రహాల ను ఎదురుగా ఉన్న బస్ షెల్టరులోకి తరలించి, గుడిని నేలమట్టం చేశారు. దీనిపై తహసీల్దారు ప్రసాద్‌ను వివరణ కోరగా గుడిని తొలగించిన విషయం తెలియదని చెప్పారు. జాతీయ రహదారుల శాఖ జేఈ చంద్రశేఖర్‌ను సంప్రదించగా ఇతర మార్గాలు తెలియక విగ్రహాలను బస్సు షెల్టరులో పెట్టామన్నారు. -
అభయాంజనేయుడు కొలువుదీరేనా?
సాక్షి, హైదరాబాద్: యాదాద్రి క్షేత్రపాలకుడిగా భారీ ఆకృతిలో భక్తులకు దర్శనమివ్వాల్సిన ఆంజనేయస్వామి విగ్రహానికి ఇబ్బంది వచ్చి పడింది. దేవాలయాన్ని భారీఎత్తున అభివృద్ధి చేస్తూ పూర్తిగా పునర్నిర్మిస్తున్న నేపథ్యంలో క్షేత్రపాలకుడైన హనుమంతుడి భారీ కాంస్య విగ్రహాన్ని ప్రతిష్టించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. పెద్ద క్షేత్రాల్లో ఎక్కడా లేనట్టుగా ఏకంగా 108 అడుగుల ఎత్తయిన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వెరసి కొత్తరూపు సంతరించుకుని దివ్యక్షేత్రంగా వెలుగొందే మహా మందిరానికి ఈ భారీ ఆంజనేయ విగ్రహమే ప్రధానాకర్షణగా నిలవాల్సి ఉంది. కానీ ఇప్పుడు ఆ భారీ విగ్రహ ప్రతిష్టాపన విషయంలో పునరాలోచన చేయాల్సిన పరిస్థితి నెలకొంది. అంత బరువైన విగ్రహాన్ని ఏర్పాటుచేస్తే కట్టడానికి ఇబ్బంది కలిగే ప్రమాదం ఉందన్న ఆందోళన నేపథ్యంలో యాదాద్రి అభివృద్ధి సంస్థ పునరాలోచనలో పడింది. అఖండ శిల కాకపోవటమే కారణం... యాదగిరీశుడు గుట్టపై కొలువుదీరి ఉన్నాడు. ఇది స్వయంభూక్షేత్రంగా అనాదిగా విరాజిల్లుతోంది. విశాలమైన గుట్ట కావటంతో పైభాగంలో 14.11ఎకరాల స్థలాన్ని సిద్ధం చేసి మహా క్షేత్రాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో 2.33 ఎకరాలు కేవలం ప్రధానాలయానికే కేటాయించారు. మిగతా వాటిల్లో తిరుమల తరహాలో నాలుగు మాడవీధులు, బ్రహ్మోత్సవ కల్యాణ మండపం, సత్యనారాయణ స్వామి వ్రతాల మండపం, విశ్రాంతి మందిరం, యాగశాల, పుష్కరిణి, రెండు ప్రాకారాలు, హనుమదాలయం, శివాలయం అభివృద్ధి చేస్తున్నారు. ఇక్కడే 108 అడుగుల ఎత్తుతో అభయాంజనేయుడి కాంస్య విగ్రహానికి స్థలాన్ని కేటాయిం చారు. అదంతా గుట్ట కావటంతో, విగ్రహానికి ప్రతిపాదించిన స్థలంలో అడుగుభాగం అఖండరాయిగా భావించారు. ఇటీవల ప్రాకార నిర్మాణానికి పునాదులు తవ్వగా అడుగున అఖండ రాయి కాదని, అది వదులుగా ఉన్న రాతి పొర లని తేలింది. దీంతో ఎక్కువ లోతుకు తవ్వి ప్రాకార నిర్మాణం చేపట్టాల్సి వచ్చింది. ఇప్పుడదే ఆందోళనకు కారణమవుతోంది. అలాంటి రాతి పొరలపై భారీ విగ్రహాన్ని ఏర్పాటు సరికాదని నిపుణులు అనుమానాలు వ్యక్తం చేశారు. దీంతో ఆ ప్రాంతాన్ని పూర్తిగా అధ్యయనం చేసి విగ్రహం ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై తేల్చాలని అధికారులు కోరటంతో నిపుణులు ఆ పని ప్రారంభించారు. నివేదిక వచ్చాక తుది నిర్ణయం తీసుకోనున్నారు. అయితే, భారీ విగ్రహం అక్కడ ఏర్పాటు చేస్తే అది మందిర కట్టడానికి ఇబ్బందిగా మారుతుందని ప్రాథమికంగా వారు పేర్కొన్నట్టు తెలిసింది. దీంతో ప్రస్తుతానికి విగ్రహం ఏర్పాటు అంశాన్ని పక్కన పెట్టి మిగతా నిర్మాణాలను కొనసాగిస్తున్నారు. జూన్ నాటికి ఆలయ పైభాగం నిర్మాణం పూర్తి చేసి, దసరా నాటికి మిగతా పనులు కొలిక్కి తెచ్చి ఆ వెంటనే ప్రధాన గర్భాలయంలోకి బాలాలయంలో ఉన్న స్వామి ఉత్సవ మూర్తులను తరలించాలని నిర్ణయించారు. దసరా తర్వాత మంచి ముహూర్తం గుర్తించి ప్రధానాలయంలోనే లక్ష్మీనారసింహుడు భక్తులకు దర్శనమిచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు యాడా ప్రత్యేకాధికారి కిషన్‌రావు పేర్కొంటున్నారు. నిపుణులు అనుమానం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఇప్పటికే కొలువైన ఆంజనేయుడే భక్తులకు దర్శనమివ్వనున్నారు. -
ఎంపీల ఆరోగ్యం బాగుండాలని...
సుండుపల్లి : ఢిల్లీలో ప్రత్యేకహోదా సాధనకు ఆమరణ నిరాహారదీక్ష చేపట్టిన వైఎస్సార్సీపీ ఎంపీల ఆరోగ్యం బాగుండాలని కోరుతూ మండలంలోని భైరాగిగుట్ట సమీపంలో వెలసిన శ్రీ అభయాంజనేయస్వామి, సాయిబాబా ఆలయాల్లో గురువారం వైఎస్సార్సీపీ నాయకులు 101 టెంకాయలు కొట్టారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు చేశారు. జెడ్పీటీసీ సభ్యుడు హకీంసాహెబ్, వైఎస్సార్సీపీ జిల్లా సంయుక్త కార్యదర్శి ఆరంరెడ్డి, ఉపసర్పంచ్ సిరాజుద్దీన్, మండల కోఆప్షన్మెంబర్ ఇర్ఫాన్, యువనాయకులు చింటూ, బాబురెడ్డి, సీనియర్ నాయకులు జయరామిరెడ్డి, ఆనందరెడ్డి, రఘురెడ్డి, నాగేశ్వర్, ఎస్సీ మండల కన్వీనర్ చిన్నప్ప, ఎస్సీ నాయకులు మారయ్య, నాగేశ్వర్, మాజీ ఎంపీటీసీ చంద్రానాయక్, విద్యార్థిసంఘ నాయకుడు బాబురెడ్డి పాల్గొన్నారు. -
అంజనీపుత్రుడిని దర్శించుకున్న పవన్
సాక్షి, కొండగట్టు(జగిత్యాల) : ప్రముఖ పుణ్యక్షేత్రమైన జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామిని జనసేన అధినేత, సినీ నటుడు పవన్‌కల్యాణ్ సోమవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయానికి రూ. 11 లక్షల నగదును విరాళంగా అందజేశారు. రాజకీయ యాత్రను ఆరంభించబోయే ముందు కొండగట్టులో వెలసిన అంజనీపుత్రుడిని దర్శించుకుంటానని పవన్ ప్రకటించిన విషయం తెలిసిందే. హైదరాబాద్ నుంచి 50 కార్ల భారీ కాన్వాయ్‌తో కొండగట్టు చేరుకున్న పవన్‌కు అభిమానులు, జనసేన కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఆంజనేయస్వామిని దర్శించుకున్న అనంతరం పవన్ కరీంనగర్ చేరుకున్నారు. సాయంత్రం రాజకీయ యాత్రపై మీడియాతో మాట్లాడనున్నారు. -
ఆలయ మడిగల కబ్జా- నిందితులకు జైలు
ఎల్బీనగర్(హైదరాబాద్): ఆలయానికి చెందిన మడిగలను కబ్జా చేసిన కేసులో నలుగురు నిందితులకు రంగారెడ్డి జిల్లా కోర్టు జైలు శిక్ష విధించింది. ఎల్బీ నగర్‌లోని శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయం పరిధిలో 102 మడిగలు(దుకాణాలు) ఉన్నాయి. వీటిలో 76, 77 మడిగలలో మల్లారెడ్డి అనే వ్యక్తి ఇరవయ్యేళ్లుగా కిరాయికి ఉంటున్నాడు. అయితే 2011లో నకిలీ పత్రాలు సృష్టించి వాటిని తన భార్య పేరుపై ఇతను రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. దీనిపై ఆలయ చైర్మన్ రాజేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసును విచారించిన రంగారెడ్డిజిల్లా కోర్టు రెండో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కవితాదేవి మంగళవారం తీర్పు చెప్పారు. ప్రధాన నిందితుడు మల్లారెడ్డి, మరో ముగ్గురికి ఏడాది జైలు, రూ.3వేల చొప్పున జరిమానా విధించారు. -
మూడు ఆలయాల ముంగిలి
నిరంతరం నీళ్లతో నిండుగా ఉండే గుండం, అద్దంలా మెరిసే బండలు, ప్రశాంతమైన వాతావరణం. పురాణ ప్రాశస్త్యంతో పాటు చారిత్రక ప్రాధాన్యాన్ని సొంతం చేసుకున్న దేవాలయమిది. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం భీముని మల్లారెడ్డిపేటలోని శ్రీవీరాంజనేయస్వామి కోరిన కోర్కెలు తీర్చే దేవుడిగా పూజలందుకుంటున్నాడు. తొమ్మిది అడుగుల ఏకశిలా విగ్రహమూర్తిగా భక్తులకు దర్శనమిస్తాడు. అక్కడి ఆలయాలే కాదు, ఆప్రాంతమంతా ప్రకృతి రమణీయతకు, అధ్యాత్మిక శోభకు పెట్టింది పేరు. కాకతీయు కాలంలో కట్టిన ఈ రెండంతస్థుల అపురూప రాతి కట్టడానికి ఎదురుగా తొమ్మిది అడుగుల వీరాంజనేయస్వామి, వెంకటేశ్వరస్వామి, శివుని ఆలయాలు ఉన్నాయి. ఇవన్నీ కాకతీయుల కాలంలో నిర్మితమైనట్లు ఆనవాళ్లను బట్టి స్పష్టమవుతుంది. ఈ ఆలయాలన్నీ ఒకే ప్రాంగణంలో ఉన్నాయి. ఆలయ ప్రాకారాల మీద ఉన్న శిల్పకళ నాటి శిల్పుల కళా నైపుణ్యాన్ని చాటుతుంది. రామాలయంలోని సీతారాముల విగ్రహాల పాదాలకు సమాంతరంగా, ఎదురుగా వీరాంజనేయస్వామి విగ్రహం రూపుదిద్దుకోవడం చెప్పుకోదగ్గ విశేషం. నిర్మలమైన నది... ఎండని గుండం వీరాంజనేయస్వామి ఆలయానికి వచ్చే భక్తులు విధిగా మాండవ్య నది (ఇప్పటి మానేరు వాగు) దాటాల్సిందే. కాళ్లకు తడి తాకనిదే ఆలయంలోకి ప్రవేశించలేం. అప్పట్లో మాండవ్య మహాముని తపస్సు చేయడం వల్ల ఈ ప్రాంతంలోని వాగుకు ‘మాండవ్య నది’ అని పేరు వచ్చిందని స్థల పురాణం చెబుతోంది. ఆలయం చుట్టూ ఈ నది ప్రవహిస్తుంది. భక్తులు ఏ దిక్కున వచ్చినా నదిలో కాలు తడవాల్సిందే. ఆలయ ఆవరణలో ఉన్న గుండం ఎప్పుడూ ఎండిపోదు. కరవు వచ్చినా, ఎన్నో సంవత్సరాలు వానలు కురవకపోయినా గుండం లో నీరు ఎండిపోదు. అందుచేత ఈ గుండంలోని జలాలను ఎంతో పవిత్రమైనవిగా స్థానికులు భావిస్తారు. ఆలయ పరిసరాల్లోని బండ రాళ్ల నుంచి ‘నీరు’ జాలు వారుతుంది. ఈ దృశ్యం చూడముచ్చటగా ఉంటుంది. స్థలపురాణం ఇదీ... సీతారాముల ఆలయంతోపాటు వేంకటేశ్వరస్వామి, శివుడి ఆలయాలు కూడా ఉన్నాయి. పూర్వం ఈ మూడు ఆలయాలను భక్తులు దర్శించుకుని రోజూ పూజలు చేసేవారు. దేవుళ్లకు ఎంతో ప్రీతితో పలు రకాల నైవేద్యాలు తీసుకెళ్లేవారు. కానీ, అక్కడ ఒక రావిచెట్టు మీద ఉన్న బ్రహ్మరాక్షసి ఆ ప్రసాదాలను అపవిత్రం చేస్తుండేది. ప్రసాదాలను స్వామికి సమర్పించకుండా ఆటంకాలు కలిగిస్తుండడంతో వారు ఎంతో ఆందోళనకు గురై, ఒకరోజు రాత్రి రాముని కోవెలలో నిద్రించారు. ఆ రాత్రి వారికిఆంజనేయస్వామి కలలో ప్రత్యక్షమై ‘తాను సమీప గ్రామంలో ఉన్నానని, తనను ఇక్కడకు తీసుకువచ్చి ప్రతిష్ఠించాలని చెప్పడంతో గ్రామస్థులంతా ఎడ్లబండ్లతో ఆ ప్రాంతానికి వెళ్లి తవ్వకాలు జరిపారు. ఆశ్చర్యం..! సుందరాకారం లో తొమ్మిది అడుగుల ఏకశిల వీరాంజనేయస్వామి విగ్రహం బయటపడింది. స్వామివారు కలలో చెప్పిందే కంటి ముందు సాక్షాత్కరించడంతో గ్రామస్థుల ఆనందానికి అంతులేదు. గ్రామ శివారులోకి విగ్రహం చేరుకోవడంతోటే రావిచెట్టుపై ఉన్న బ్రహ్మరాక్షసి మంటల్లో కాలిపోయిందట. బ్రహ్మరాక్షసిని హతం చేసిన వీరాంజనేయస్వామి విగ్రహాన్ని రాములోరి పాదాల ముందు ప్రతిష్ఠించారు. భీముని మల్లారెడ్డిపేటగా... పూర్వం మహాభారత కాలంలో పాండవులు అరణ్యవాసం చేస్తూ ఇక్కడ సంచరించినట్లుగా మల్లారెడ్డిపేట ప్రాంతానికి గుర్తింపు ఉంది. ఆ కాలంలో పాండవులు కొన్ని ఆటలు ముఖ్యంగా ‘చిర్ర గోనె’ ఆడారని ప్రచారం. ఆట ఆడుతుండగా... ఒక బండ కిందకు చిర్ర వెళ్లి పడిందట. అగ్రజుడైన ధర్మరాజు దానిని తీసుకురావాలని భీముడిని కోరాడట. భీముడు బండను నెత్తితో పైకి ఎత్తి చిర్రను తెచ్చాడట. దీనికి నిదర్శనం గా ఓ గుహ మనకు ఇక్కడ కనిపిస్తుంది. అందువల్లనే మల్లారెడ్డిపేటను ‘భీముని మల్లారెడ్డిపేట’గా పిలుస్తారని ప్రతీతి. ఊరంతా అంజన్నలే! ఆంజనేయస్వామి అంటే భీముని మల్లారెడ్డిపేట ప్రజలకు ఎనలేని భక్తి. ఏ కష్టమొచ్చినా స్వామిని వేడుకుంటారు. తమ పిల్లలు ఎప్పుడూ క్షేమంగా ఉండాలని కోరుతూ అంజన్న పేర్లు పెడుతున్నారు. ఏ ఇంటికెళ్లినా అంజన్న పేరున్న వ్యక్తులు కనబడతారు. దేవుని పేరు స్ఫురించే విధంగా పేర్లు ఉన్న వారు ఇక్కడ వందల సంఖ్యలో ఉన్నారు. ఎలా వెళ్లాలంటే... హైదరాబాద్ నుంచి వచ్చే వారు కామారెడ్డి మీదుగా 160 కిలోమీటర్లు ప్రయాణించి భీముని మల్లారెడ్డిపేటకు చేరుకోవచ్చు.రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం నుంచి కామారెడ్డి–సిరిసిల్ల మార్గంలో 32 కిలోమీటర్లు ప్రయాణిస్తే గొల్లపల్లి స్టేజీ నుంచి భీముని మల్లారెడ్డిపేట చేరుకోవచ్చు. గొల్లపల్లి నుంచి బస్‌లు, ప్రైవేటు వాహనాలు ఉంటాయి. సిద్దిపేట నుంచి వచ్చే వారు కామారెడ్డి రహదారిలో 45కిలోమీటర్లు ప్రయాణించి లింగన్నపేట నుంచి భీముని మల్లారెడ్డిపేటకు చేరుకోవచ్చు. బస్‌సౌకర్యం ఉంటుంది. ప్రైవేటు వాహనాలు అందుబాటులో ఉంటాయి. – వూరడి మల్లికార్జున్, ‘సాక్షి’ రాజన్న సిరిసిల్ల. ఫొటోలు: ఎర్ర శ్రీనివాస్, గంభీరావుపేట -
మద్ది అంజన్న సేవలో బుల్లితెర నటులు
జంగారెడ్డిగూడెం రూరల్: మండలంలోని గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి ఆలయాన్ని బుల్లితెర నటులు దర్శించుకున్నారు. శతమానం భవతి సీరియల్, కల్యాణ వైభోగమే తెలుగు ధారావాహికలో నటిస్తున్న శ్రీరామ్, ప్రముఖ నటి మేఘనలు శుక్రవారం దర్శించుకున్నారు. పాపికొండల పరివాహక ప్రాంతంలో జరుగుతున్న కల్యాణ వైభోగమే సీరియల్ చిత్రీకరణకు వచ్చిన వారు అంజన్నను దర్శించుకున్నారు. వీరికి ఆలయ మర్యాదలతో సత్కరించి, స్వామి ప్రసాదాలు అందజేశారు. అర్చకులు ఆశ్వీరచనాలు అందించారు. స్వామిని దర్శించుకున్న ఆర్డీఓ స్వామి వారిని కొత్తగా బాధ్యతలు చేపట్టిన జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కె.మోహన్ కుమార్ దర్శించుకున్నారు. ఆర్డీఓకు ఆలయ చైర్మన్ యిందుకూరి రంగరాజు, కార్యనిర్వాహణాధికారి పెన్మెత్స విశ్వనాధరాజులు శేషవస్త్రాన్ని కప్పి సత్కరించారు. స్వామి వారిచిత్రపటం, ప్రసాదాన్ని అందజేశారు. నేడు తమలపాకుల పూజ కార్తీకమాసం మూడో శనివారం కావడంతో స్వామికి లక్ష తమలపాకులతో పూజ చేస్తామని ఆలయ అధికారులు తెలిపారు. తొలుత స్వామి వారికి పంచామృతాలతో అభిషేకం అనంతరం తమలపాకుల పూజ చేస్తామని పేర్కొన్నారు. -
భక్తజనంతో పోటెత్తిన కసాపురం
గుంతకల్లు రూరల్: శ్రావణ మాస రెండో శనివారం ప్రముఖ పుణ్యక్షేత్రం కసాపురం భక్తజనంతో పోటెత్తింది. ఆంజనేయ నామస్మరణతో ఆలయ పురవీధులు ప్రతిధ్వనించాయి. నెట్టికంటి ఆంజనేయస్వామి గరుడవాహనంపై కొలువుదీరి పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. ఈవో ముత్యాలరావు, ఆలయ అనువంశిక ధర్మకర్త సుగుణమ్మ, పాలకమండలి సభ్యల ఆధ్వర్యంలో సీతారామలక్ష్మణ సహిత ఆంజనేయస్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రాకారోత్సవాన్ని ప్రారంభించారు. ఏఈవో మధు, సూపరింటెండెంట్లు వెంకట్వేర్లు, సీనియర్ అసిస్టెంట్ వేమన్నలు ఏర్పాట్లను పర్యవేక్షించారు. నెట్టికంటుడికి అరకిలో వెండి బహూకరణ : నెట్టికంటి ఆంజనేయస్వామి వెండి రథం నిర్మాణానికి రాయచూరుకు చెందిన శ్రీనివాసులు అనే భక్తుడు తనవంతుగా అరకిలో వెండిని బహూకరించారు. -
భక్తులతో పోటెత్తిన కసాపురం
గుంతకల్లు రూరల్: శ్రావణమాసం మొదటి మంగళవారం సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రం కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానం మంగళవారం భక్తులతో పోటెత్తింది. సాయంత్రం స్వామివారు ఒంటె వాహనం పై కొలువదీరి ఆలయ పురవీధుల్లో ఊరేగారు. మంగళవారం వేకువజామునుంచే స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలను నిర్వహించారు. రాత్రి 8 గంటలకు ఆంజనేయ స్వామి ఉత్సవ మూర్తిని ఒంటెవాహనం పై కొలువు దీర్చి పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఈవో ముత్యాలరావు, అణువంశిక ధర్మకర్త సుగుణమ్మ, పాలకమండలి సభ్యులు నారికేళను సమర్పించి ఊరేగింపు కార్యక్రమాన్ని ప్రారంభించారు. వేలాది మంది భక్తుల మధ్య కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. -
నెట్టికంటుడి హుండీ ఆదాయం రూ.27 లక్షలు
గుంతకల్లు రూరల్ : కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానానికి హుండీ లెక్కింపు ద్వారా రూ. 27.97 లక్షలు ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈఓ ముత్యాలరావు తెలిపారు. మంగళవారం ఆలయంలోని 24 హుండీలను లెక్కించగా 63 రోజులకు గానూ రూ. 27,97,954 రూపాయల నగదుతోపాటు ,10 గ్రాముల బంగారం, 1.7 కిలోల వెండి వచ్చినట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా అన్నదానం హుండీ ద్వారా రూ. 34,211 నగదును భక్తులు సమర్పించినట్లు తెలిపారు. ఆలయ అణువంశిక ధర్మకర్త సుగుణమ్మ, ఏఈఓ మధు ఇతర పాలకవర్గం ఆధ్వర్యంలో సాగిన హుండీ లెక్కింపును దేవాదాయశాఖ అనంతపురం అసిస్టెంట్ కమిషనర్ రాణి, పాలకమండలి సభ్యులు సతీష్ గుప్త, జగదీష్ ప్రసాద్, మహేష్, వనగొంది విజయలక్ష్మి, ప్రసాద్‌రెడ్డి, గుడిపాటి ఆంజనేయులు తదితరులు పర్యవేక్షించారు. -
శయన హనుమానుడు... కోరికలు తీర్చే కరుణా సాగరుడు
బడే హనుమాన్ జీ మందిర్ నిలువెత్తు హనుమంతుడు నిలబడి ఉన్న విగ్రహాన్నే చూస్తాం ఎక్కడైనా ఆంజనేయస్వామి గుడి అంటే. లేదంటే రాములవారి పాదాల చెంత ఉన్న విగ్రహాన్ని చూడచ్చు. కానీ శయనించి ఉన్న హనుమంతుడు, ఆయనకు ఇరుపక్కలా రామలక్ష్మణులు, పాదాల చెంత రావణాసురుడు ఉన్న విగ్రహాన్ని ఎక్కడైనా చూడగలమా? అలాంటి అపురూపమైన శయన హనుమంతుని కళ్లనిండుగా చూసి, ఆ అద్భుతమైన రూపాన్ని గుండెలనిండా నింపుకోవాలంటే ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్ వెళ్లవలసిందే. అలహాబాద్‌లోని సంగం వద్ద బడే హనుమాన్ జీ ఆలయం ఉంది. నిత్యం వందలాది మంది భక్తుల సందర్శనంతో కిటకిటలాడే ఈ ఆలయం ఎంతో పరిశుభ్రంగా, పరమ ప్రశాంతంగా, ఆహ్లాదకర వాతావరణంలో, అడుగు పెట్టగానే అన్ని బాధలూ తీరిపోతాయన్న నమ్మకం కలిగేలా ఉంటుంది. ఆలయంలోకి అడుగుపెట్టగానే ఆంజనేయస్వామి నిలువెత్తు విగ్రహాన్ని చూడటం కోసం మన కనులు అన్వేషణ మొదలు పెడతాయి. అయితే ఆలయంలో ఒక నేలమాళిగ వంటి దానిలో స్వామి వారు శయనించి ఉన్న భంగిమలో సాక్షాత్కరిస్తారు. ఆయన ఛాతీకి ఇరువైపులా రామలక్ష్మణులు, పాదాల చెంత రావణాసురుడు కనిపిస్తారు. అలసటతో గాఢనిద్దురలోకి చేరుకున్న స్వామి ఏ క్షణంలోనైనా కన్నులు విప్పారుస్తాడేమో అన్నట్లుగా ఉంటాడు. ఆయనకు నిద్రాభంగం కలుగకుండా ఆలయ అర్చకులు ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తారు. పడుకుని ఉండగానే ఆయనకు నిత్యపూజలు, నివేదలర్పిస్తారు హారతులిస్తారు. కోరిక కోర్కెలను తీర్చే బడే హనుమాన్జీ... భక్తుల కోరికలన్నింటినీ నెరవేర్చే పెద్ద హనుమంతుడిగా స్వామికి పేరు. అవివాహితులకు వివాహాన్ని, సంతానార్థులకు సంతానాన్ని, దీర్ఘరోగులకు ఆరోగ్యాన్ని చేకూరుస్తాడు స్వామి. జీవితంలో ఏవిధమైన కష్టాలు, నష్టాలు వచ్చినా స్వామిని సేవించుకుని సమస్యల నుంచి బయట పడుతుంటారు భక్తులు. అసలు ఆలయంలోకి అడుగు పెట్టగానే సానుకూల తరంగాలు శరీరాన్ని తాకుతాయి. స్థలపురాణం: రావణాసురుడి పినతండ్రి కొడుకు, మహా మాయావి అయిన మైరావణుడు ఆంజనేయుడి కన్నుగప్పి రామలక్ష్మణులను అపహరించి వారిని పాతాళంలో దాచిపెడతాడు. వారికోసం అన్వేషిస్తూ తీవ్ర నిర్వేదంలో కూరుకుపోయి ఏమి చేయాలో పాలుపోక అలాగే పడుకుని ఉన్న ఆంజనేయుడి వద్దకు గంగమ్మ వచ్చి తన పావన స్పర్శతో అలసట పోగొడుతుంది. తేరుకున్న హనుమ గంగమ్మకు నమస్కరిస్తాడు. అప్పుడు గంగ హనుమా! నీవు ఇక్కడే, ఇదే ఇక్కడే వెలిసి భక్తుల కోరికలు నెరవేరుస్తూ ఉండు’’ అని కోరింది. మరో కథనం ప్రకారం రావణ వధానంతరం రామలక్ష్మణులు హనుమంతుడితో కలసి అయోధ్యకి వెళుతుంటారు. మార్గమధ్యంలో తీవ్రమైన దప్పికతో హనుమ అల్లల్లాడు తుండటాన్ని చూసిన రామలక్ష్మణులు సంగమస్థానం వద్ద విమానాన్ని నిలుపు చేస్తారు. గంగనీళ్లు తాగి దప్పిక తీర్చుకున్న హనుమ అక్కడే కాసేపు శయనిస్తాడు. అదే భంగిమలో ఇక్కడ వెలిశాడు. గంగానది ప్రతి రెండేళ్లకోసారి ఆలయంలో ప్రవేశిస్తుంది. దాంతో హనుమంతుని విగ్రహం జలనిక్షిప్తం అవుతుంది. ఆ సమయంలో మందిరంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మరో విగ్రహానికి పూజాదికాలు నిర్వహిస్తారు. ఇతర సందర్శనీయ స్థలాలు: బడేహనుమాన్ జీ మందిరాన్ని సందర్శించేవారు అలహాబాద్‌లోనే గల సంకట మోచన్ హనుమాన్ మందిరానికి కూడా వెళ్లడం ఆనవాయితీ. అన్నింటికన్నా ముందు సకల పాపాలూ హరించే త్రివేణీ సంగమంలో స్నానం చేయడం గొప్ప అనుభూతి. అలహాబాద్‌లో గల ఆనంద భవన్, ఆల్ సెయింట్స్ కాథడ్రల్, ఖుశ్రో బాగ్, చంద్రశేఖర్ ఆజాద్ పార్క్, న్యూ యమునా బ్రిడ్జ్, అలహాబాద్ యూనివర్శిటీ, అలహాబాద్ మ్యూజియం, వేణి మాధవుని ఆలయం, అలోపి దేవి మందిరం, అలహాబాద్ హై కోర్టు, మాంకామేశ్వర్ టెంపుల్, కల్యాణి దేవి టెంపుల్, అక్షయ వట్, లలితా దేవి మందిరం, పాతాళపురి మందిరాలను కూడా సందర్శించవచ్చు. – డి.వి.ఆర్. భాస్కర్ ఎలా వెళ్లాలంటే.. బడే హనుమాన్ జీ మందిరానికి వెళ్లాలంటే ముందుగా అలహాబాద్ వెళ్లాలి. దేశంలోని ఇంచుమించు అన్ని ప్రధాన నగరాలనుంచి అలహాబాద్‌కు రైళ్లున్నాయి. అక్కడినుంచి కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలో గల బడే హనుమాన్ జీ మందిరానికి వెళ్లడం చాలా సులువు. అలహాబాద్‌లో అన్ని తరగతుల వారికీ సరిపడే హోటళ్లున్నాయి. సత్రాలున్నాయి కాబట్టి భోజన వసతి సదుపాయాలకు ఎటువంటి ఇబ్బందీ ఉండదు. -
ఆరోగ్యప్రదాత ఈ ఆంజనేయుడు
పుణ్య తీర్థం ఊర్కొండపేట్ ఆంజనేయ స్వామి రోగపీడిత జనావళికి ఉపశమనం కల్గించే ఆరోగ్యాలయంగా ప్రసిద్ధి చెందిన ఊర్కొండపేట్ ఆంజనేయస్వామి భక్తులు కోరిన కోరికలు తీర్చే మహిమ గల స్వామిగా సుప్రసిద్ధుడు. నాగర్ కర్నూల్ జిల్లా, ఊర్కొండ మండల పరిధిలోని ఊర్కొండపేట్ గ్రామ శివారులో ఆంజనేయస్వామి ఆలయం జడ్చర్ల– కల్వకుర్తి ప్రదాన రహదారిపై ఉన్న ఊర్కొండ స్టేజి నుండి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ ఆంజనేయస్వామి విగ్రహానికి సింధూర లేపనం చేయరు. తైలాభిషేకం, నువ్వులనూనె స్వామికి ఇష్టం. గత 80 సంవత్సరాల క్రితం ఒక బ్రాహ్మణుడు, తహసీల్దార్ వచ్చి సింధూర లేపనం చేస్తే ఏమవుతుందని అర్చకులతో వాదిస్తూ, స్వామి వారి విగ్రహానికి బలవంతంగా సింధూరం పూత పూయించి ఇంటికి వెళ్లిపోయాడట. ఆ తర్వాత కొద్దిసేపటికే ఒంటినిండా బొబ్బలు లేచి, ఒళ్ళంతా జిలపెట్టి మంటలు మండినాయట. మరుసటి రోజు వచ్చి ఈ సంగతి చెప్పగా, అర్చకులు సింధూరం తడిపి తైలం రుద్దిన తర్వాత అతని మంటలు తగ్గాయట. అప్పటి నుండి గతంలో పూసినట్లు తైలం పూస్తున్నట్లు అర్చకులు తెలిపారు. ఇక్కడ ప్రతి శనివారం వందలాది మంది సత్యనారాయణ వ్రతాలు చేస్తారు. అభిషేకాలు నిర్వహిస్తారు. ఇక్కడ నిద్ర చేస్తే రోగాలు నయమవుతాయని విశ్వాసం. అందుకు నిదర్శనం 1975 నుండి 1980 మధ్యకాలంలో వనపట్ల గ్రామస్థులు గ్రామంలో బాణామతి ఎక్కువ అవడంతో, ఆ గ్రామస్థులు కొన్ని నెలలపాటు ఇక్కడ ఉండి ఆరోగ్యం బాగుపడిన తర్వాత వెళ్ళిన్నట్లు ఇక్కడి ప్రజలు చర్చించుకుంటారు. ఇంత ప్రసిద్ధి చెందిన ఆలయంలో ప్రతి సంవత్సరం పుష్యమాసంలో అమావాస్య ఏ వారం వస్తుందో అప్పటినుంచి వారం రోజుల పాటు అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఆలయ చరిత్ర పూర్వం భోజరాయపల్లికి సమీపంలో అమ్మపల్లి అనే గ్రామం ఉండేది. ఆ రెండు గ్రామాల ప్రజలు ఏదో విషయమై గొడవపడి ఒకరి గ్రామాన్ని ఒకరు తగులబెట్టుకున్నారు. పరశురామ ప్రీతి అయిన గ్రామంలో నివసిం^è టం వీలుగాక భోజరాయలు ఆ గ్రామాన్ని ఖాళీ చేయించి గట్టుల నడుమ ఇప్పచెట్లలో నూతన గ్రామాన్ని నిర్మించారు. అదే గట్టి ఇప్పలపల్లి. భోజరాయులు శివోపాసకులు కాబట్టి గట్టి ఇప్పలపల్లిలో కాళికాదేవితో పాటుగా, పంచలింగాలు ప్రతిష్టించారు. వీరు మధ్వ సంప్రదాయానికి చెందిన వారు కాబట్టి ఆగ్రామంలో ఆంజనేయస్వామి ప్రతిమను ప్రతిష్టింపదలచి, తగిన శిలకై వెదుకుతూ వచ్చి ఇక్కడ ఊరుకొండపేటపై శిలను కనుగొన్నారు. 40 రోజుల పాటు పాలు, పండ్లు మాత్రమే తీసుకుంటూ నియమబద్ధంగా ప్రతిమను మలచిన తర్వాత, గట్టి ఇప్పలపల్లికి తలారు బండ్లతో తరలిస్తుండగా, ఇప్పుడు ఆలయం ఉన్నచోట తలారు బండ్లు విరిగిపోయాయి. స్వామి వారు కలలో కనిపించి నన్ను తరలించవద్దు ఇక్కడే ప్రతిష్టించాలని చెప్పడంతో, అక్కడే అరుగు నిర్మించి ప్రతిమను ప్రతిష్టించారు. అలాగే 50 సంవత్సరాలు స్వామివారికి గుడి లేకుండా ఉండగా, ఊర్కొండపేట్ గ్రామస్థులు పూనుకుని ఇప్పుడు ఉన్న చోట ఆలయం నిర్మించినట్లు ఆధారాలను బట్టి తెలుస్తోంది. కాళికాదేవి వర్ఛస్సు: ఆలయంలో కొలువుదీరిన స్వామివారి ప్రతిమామూర్తి ఆరడుగులు ఉండి కాళికావర్ఛస్సులో ప్రకాశిస్తుంది. ఆలయం సమీపంలో 40 అడుగుల శంకరుడి విగ్రహం ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఆలయం ఎదుట ఉన్న ఎల్తైన గుట్టలపై స్వామివారి కోనేరు ఉంది. ఈ కోనేటిలో ఎంత మండువేసవిలో అయినా నీరు ఇంకదు. ఈ నీటిని తాగితే సర్వపాపాలు నశిస్తాయని, రోగాలు తొలగి పోతాయని భక్తుల విశ్వాసం. అలాగే గట్టుపైన ఉన్న స్వామి వారి పాదాలకి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అలాగే ఆలయం గర్భగుడి దగ్గర తూర్పుదిశలో ఉన్న రేగి చెట్టుపైన నివసించే కోతులు స్వామివారి ప్రతిరూపాలన్న నమ్మకంతో భక్తులు ఫలహారాలు, పండ్లను చెట్టువద్ద ఉంచుతారు. కొబ్బరికాయలు కూడా ఈ చెట్టు వద్దే కొడతారు. -
భక్తిశ్రద్ధలతో ఆంజనేయుడి విగ్రహ ప్రతిష్ట
నార్శింపల్లి (తాడిమర్రి) : మండలంలో నార్శింపల్లిలోని ఆంజనేయస్వామి ఆలయంలో ఆదివారం విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అలాగే లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వినాయకుడు, లక్ష్మీదేవి విగ్రహాలను కూడా ప్రతిష్టించారు. ప్రత్యేక పూజల తర్వాత అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పూజా కార్యక్రమాల్లో విశ్రాంత డీజీపీ జేవీ.రాములు, డీఐజీ ప్రభాకర్ రావు, కలెక్టర్ కోన శశిధర్, ఎస్పీ ఎస్వీ రాజశేఖర్‌బాబు, ఎమ్మెల్యే జి.సూర్యనారాయణ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. -
కసాపురం ఆలయ సమాచారం
గుంతకల్లు రూరల్ : కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామివారికి శుక్రవారం నిర్వహించే పూజల వివరాలు. :వేకువజామున 4.15 గంటలకు స్వామివారి మూలవిరాట్‌కు పంచామృతాభిషేకం. :5.30 గంటలకు అలంకరణ నిజరూప దర్శనం. ఉదయం 6.30 గంటలకుప్రత్యేక పుష్పాలంకరణ, నిత్య పూజలతో భక్తులకు దర్శనం. :ఉదయం 11.30 గంటలకు మహా నివేదన. మధ్యాహ్నం 12.30 గంటలకు మహామంగళహారతి. అనంతరం ఆలయం మూసివేత. మధ్యాహ్నం 2 గంటల నుంచి పూజలు రాత్రి 8.30 గంటలకు మహామంగళ హారతితో ఆలయం మూసివేత. -
కనులపండువగా ఆంజనేయస్వామి బ్రహ్మరథోత్సవం
మడకశిర రూరల్: మండల పరిధిలోని భక్తరపల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి, జిల్లేడగుంట శ్రీఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం జిల్లేడుగుంటలో ఆంజినేయస్వామి బ్రహ్మరథోత్సవాన్ని వేలాది మంది భక్తుల నడుమ అత్యంత వైభవంగా నిర్వహించారు. తొలుత ఆంజనేయస్వామి దేవాలయంలో స్వామి వార్ల ఉత్సవ విగ్రహాలను భక్తులు గోవింద నామస్మరణతో ఊరేగింపుగా తీసుకువచ్చి రథంలో ఉంచి హోమం, విశేష పూజలు జరిపారు. మధ్యాహ్నం వేలాది మంది భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి రథాన్ని లాగారు. భక్తులు బొరుగులు, అరటిపండ్లు రథంపై విసిరి మొక్కుబడులు తీర్చుకున్నారు. ఈఓ శ్రీనివాసులు, సర్పంచుల ఆధ్వర్యంలో రథోత్సవాన్ని నిర్వహించారు. రథోత్సవాన్ని తిలకించడానికి ఆంధ్ర, కర్ణాటక ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సీఐ దేవానంద్, ఎస్ఐ మక్భూల్‌బాషా సిబ్బందితో గట్టిపోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ఈఓ శ్రీనివాసులు, సర్పంచులు మహేశ్వర్‌రెడ్డి, భీమప్ప, అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. కాగా బ్రహ్మరథోత్సవంలో ఎమ్మెల్యే ఈరన్న, ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి పాల్గొని రథాన్ని లాగారు. -
వైభవంగా నెట్టికంటుడి శోభాయాత్ర
గుంతకల్లు రూరల్: హనుమాన్ మాలధారుల పాదయాత్ర సందర్భంగా చేపట్టిన నెట్టికంటుడి శోభాయాత్ర ఆద్యంతం అత్యంత వైభవంగా సాగింది. ఆంజనేయ స్వామి నామస్మరణతో గుంతకల్లు పట్టణ పురవీధులు మార్మోగాయి. అశ్వ వాహనంపై కొలువుదీరిన నెట్టికంటుడిని అడుగడుగునా దర్శించుకుంటూ భక్తులు పునీతులయ్యారు. హనుమద్ వ్రతం ఉత్సవాలలో భాగంగా ఆదివారం పట్టణంలోని హనుమాన్ సర్కిల్‌నుండి కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవాలయం వరకూ శోభాయాత్రను నిర్వహించారు. ముందుగా విశేష పుష్పాలు, వివిధ రకాల స్వర్ణాభరణాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన ఆంజనేయస్వామి ఉత్సవ మూర్తిని, అంతే అందంగా అలంకరించిన అశ్వవాహనంపై కొలువుదీర్చారు. అనంతరం ఆలయ ఈవో ముత్యాలరావు, అనువంశిక ధర్మకర్త సుగుణమ్మ, పాలకమండలి సభ్యుల ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గుంతకల్లు ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ నారికేâýæను సమర్పించి శోభాయాత్రను ప్రారంభించారు. శోభాయాత్రలో మున్సిపల్ వైస్ చైర్మెన్ శ్రీనాథ్ గౌడ్, మార్కెట్ యార్డు చైర్మెన్ బండారు ఆనంద్, పాలకమండలి సభ్యులు, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
భక్తులతో పోటెత్తిన కసాపురం
గుంతకల్లు రూరల్ : శ్రావణమాసం నాల్గవ శనివారం సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రం కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానం వేలాదిగా తరలివచ్చిన భక్తులతో పోటెత్తింది. రాత్రి 8 గంటలకు ఆంజనేయస్వామి ఉత్సవమూర్తిని ఒంటెవాహనంపై కొలువుదీర్చి పురవీధుల్లో ఊరేగించారు. ఆలయ ఈఓ ముత్యాలరావు ,ఆలయ అణువంశిక ధర్మకర్త సగుణమ్మల ఆధ్వర్యంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రాకారోత్సవం నిర్వహించారు. బళ్లారి మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్‌రెడ్డి సౌజన్యంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తులకు చెక్కెర పొంగళి ,పులిహోర ప్రసాదాలు పంపిణీ చేశారు. నిత్యాన్నదాన సత్రంలో భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. ఆలయ ఏఈఓ మధు , సూపరింటెండెంట్ వెంకటేశులు ఇతర అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
కసాపురం ఆలయ సమాచారం
గుంతకల్లు రూరల్: కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామివారికి గురువారం నిర్వహించే పూజల వివరాలు. = వేకువజామున 4.15 గంటలకు స్వామివారి మూలవిరాట్‌కు పంచామృతాభిషేకం. = 5.30 గంటలకు అలంకరణ నిజరూప దర్శనం. =ఉదయం 6.30 గంటలకుప్రత్యేక పుష్పాలంకరణ, నిత్య పూజలతో భక్తులకు దర్శనం. = ఉదయం 11.30 గంటలకు మహా నివేదన. = మధ్యాహ్నం 12.30 గంటలకు మహామంగళహారతి. అనంతరం ఆలయం మూసివేత. = మధ్యాహ్నం 2 గంటల నుంచి పూజలు = రాత్రి 8.30 గంటలకు మహామంగళ హారతితో ఆలయం మూసివేత. -
ఆంజనేయస్వామి విగ్రహం లభ్యం
సంస్థాన్ నారాయణపురం: మండలంలోని రాచకొండ అటవీ ప్రాంతం పల్లగట్టుతండానుంచి ఐదుదొనల తండాకు వెళ్లే దారిలో ఆంజనేయస్వామి విగ్రహాన్ని గురువారం తండావాసులు గుర్తించారు. తండావాసులు తెలిపిన వివరాల ప్రకారం ఎక్కడో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపి, అక్కడి నుంచి ఆంజనేయస్వామి విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ పడేసి ఉంటారని తెలిపారు. ఫారెస్ట్ వాచర్ సేవ పోలీసులకు, అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఎస్ఐ పి.అశోక్‌కుమార్ స్థలాన్ని పరిశీలించారు. తండావాసులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. చుట్టుపక్కల తండావాసులు వచ్చి విగ్రహానికి పూజలు నిర్వహించారు. -
ఆంజనేయస్వామి విగ్రహం లభ్యం
సంస్థాన్ నారాయణపురం: మండలంలోని రాచకొండ అటవీ ప్రాంత పల్లగట్టుతండా నుంచి ఐదుదొనల తండాకు వెళ్లే దారిలో ఆంజనేయస్వామి విగ్రహాన్ని గురువారం తండావాసులు గుర్తించారు. తండావాసులు తెలిపిన వివరాల ప్రకారం ఎక్కడో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపి, అక్కడి నుంచి ఆంజనేయస్వామి విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ పడేసి ఉంటారని తెలిపారు. ఫారెస్ట్ వాచర్ సేవ పోలీసులకు, అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఎస్ఐ పి.అశోక్‌కుమార్ స్థలాన్ని పరిశీలించారు. తండావాసులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. చుట్టుపక్కల తండావాసులు వచ్చి విగ్రహానికి పూజలు నిర్వహించారు. -
రాయల చెరువు గుట్టపై ఆంజనేయుడు
– భారీ విగ్రహ నిర్మాణానికి టీటీడీ తీర్మానం –వరలక్ష్మి వ్రతం పోస్టర్ల ఆవిష్కరణ –పుష్కరాల ప్రాముఖ్యతపై ఎస్వీబీసీలో ప్రోమో సాక్షి, తిరుమల: రామచంద్రాపురం మండలం రాయలచెరువు గుట్టపై ఆంజనేయుడు కొలువుదీరనున్నాడు. ఇక్కడ ఆంజనేయ స్వామి భారీ విగ్రహాన్ని నిర్మించేందుకు టీటీడీ బోర్డు సిద్ధమైంది. మంగళవారం తిరుమల అన్నమయ్య భవన్ అతిథిగృహంలో జరిగిన బోర్డు సమావేశంలో దీనిపై తీర్మానం చేశారు. దాదాపు రూ.32 లక్షల ఖర్చుతో 46 అడుగుల ఎత్తులో ఈ విగ్రహాన్ని నిర్మించనున్నారు. దీనివల్ల శ్రీవారి దర్శనానికి వచ్చే పాదచారులతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో భక్తి భావం పెంపొందించే అవకాశం ఉంటుందని టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు తెలిపారు. వరలక్ష్మి వత్రం పోస్టర్ల అవిష్కరణ తిరుచానూరు పద్మావతి అమ్మవారి వరలక్ష్మి వ్రతం ఈ నెల 12వ తేదీన జరగనుంది. ఈ ఉత్సవానికి సంబంధించిన పోస్టర్లను మంగళవారం టీటీడీ చైర్మన్, ఈవో, బోర్డు సభ్యులు, తిరుచానూరు ఆలయ డెప్యూటీ ఈవో చిన్నంగారి రమణ ఆవిష్కరించారు. శ్రావణ మాసంలో అమ్మవారి వరలక్ష్మి వ్రతం ఆగస్టు 12న శుక్రవారం ఉదయం 10 నుంచి 12 గంటల మధ్యలో జరుగుతుందని చైర్మన్, ఈవో వెల్లడించారు. సాయంత్రం 6 గంటలకు బంగారు రథంపై అమ్మవారి ఊరేగింపు ఉంటుందని తెలిపారు. కష్ణాపుష్కరాల్లో సేవలందించనున్న టీటీడీ సిబ్బందికి భారత్ బయోటెక్ రూపొందించిన టైఫాయిడ్ వ్యాక్సిన్‌ను ఉచితంగా అందిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. పుష్కరాల ప్రాముఖ్యతపై ఎస్వీబీసీలో ప్రోమో కృష్ణా పుష్కరాల ప్రాముఖ్యతను తెలియజేస్తూ ఎస్వీబీసీ తయారు చేసిన ప్రోమోను టీటీడీ చైర్మన్, ఈవో, బోర్డు సభ్యులు ప్రారంభించారు. ఐదున్నర నిమిషాల నిడివి గల ఈ ప్రోమోలో కృష్ణానది ప్రాముఖ్యత, సంపద, వివిధ నదులు, వివిధ కళలకు చెందిన ప్రముఖులు, రచయితలు, వాగ్గేయకారులు, సినీ పరిశ్రమ, తదితర రంగాల ప్రాముఖ్యతను తెలియజేసే అంశాలు ఉన్నాయి.. ప్రముఖ దర్శకులు, టీటీడీ బోర్డు సభ్యుడు కె.రాఘవేంద్రరావు పర్యవేక్షణలో ఈ ప్రోమోను చిత్రీకరించారు. పుష్కరాలు పూర్తయ్యేవరకు ఈ ప్రోమో ఎస్వీబీసీలో ప్రసారం కానుంది. -
7న ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ఠ
కీతవారిగూడెం (గరిడేపల్లి) : మండలంలోని కీతవారిగూడెం రామలింగేశ్వరస్వామి దేవాలయంలో నూతనంగా నిర్మించిన శ్రీ శివాంజనేయ విగ్రహా ప్రతిష్ట మహోత్సవాన్ని ఈ నెల 7న నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు శ్రీరాయప్రోలు భద్రశర్మ, శ్రీరామశర్మలు మంగళవారం తెలిపారు. హుజుర్‌నగర్‌కు చెందిన కన్నెగుండ్ల వెంకటేశ్వర్లు, పుష్పావతి దంపతుల సహకారంతో ఆలయంలో 25 అడుగుల ఎత్తుగల శివాంజనేయస్వామి విగ్రహాన్ని నిర్మించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. -
ఉత్సాహంగా ఉట్లోత్సవం
గోరంట్ల : తొలి ఏకాదశి పర్వదిన వేడుకల్లో భాగంగా మండలంలోని మల్లాపల్లి గ్రామంలో ఉట్ల పరుషను బుధవారం ఘనంగా నిర్వహించారు. వందలాది మంది ప్రజలు ఉట్ల పరుషకు హాజరై ఉట్లను కొట్టడం, ఉట్ల మాను ఎక్కే దృశ్యాలు కనులవిందు కలిగించాయి. ఈ సందర్భంగా కదిరి– హిందూపురం ప్రధాన రహదారి కిరువైపులా ఏర్పాటు చేసిన వివిధ దుకాణాలలో ఆట వస్తువులు, గాజుల అంగళ్లు కొనుగోలు దారులతో కిటకిటలాడాయి. ఈ కార్యక్రమంలో యువకులతో పాటు మల్లాపల్లి పంచాయతీకి చెందిన వసంతరావు, దేవనరసింహప్పలు ఊరేగింపుగా వచ్చి, స్థానిక ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం ఉట్ల పరుషను నిర్వహించారు. -
ఆంజనేయ స్వామి ఆలయంలో చోరీ
హైదరాబాద్: నగరంలోని ఆంజనేయస్వామి ఆలయంలో చోరీ జరిగింది. ఆదివారం రాత్రి ఆలయంలోకి ప్రవేశించిన గుర్తుతెలియని దుండగులు హుండీని ధ్వంసం చేసి అందులో ఉన్న సోత్తుతో పాటు ఆలయంలో ఉన్న వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు. సోమవారం పూజ చేయడానికి వచ్చిన వారు ఇది గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
శాఖాధిపతుల కేంద్రం.. ఇబ్రహీంపట్నం
- ఆంజనేయ టవర్స్‌లో ఎక్కువ శాఖల కార్యాలయాలు - 27వ తేదీ కల్లా తరలివెళ్లేందుకు శాఖాధిపతుల ఏర్పాట్లు - రెయిన్ ట్రీ పార్కులో ఐఏఎస్ అధికారులకు వసతి - రవాణా చార్జీలపై నేడో రేపో ఉత్తర్వులు జారీ - తరలింపు చర్యలపై సీఎస్ ఉన్నతస్థాయి సమీక్ష సాక్షి, హైదరాబాద్: శాఖాధిపతుల కార్యాలయాలకు విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం కేంద్రం కానుంది. హైదరాబాద్ నుంచి నూతన రాజధాని ప్రాంతానికి తరలివెళ్లే శాఖాధిపతుల కార్యాలయాలు అత్యధిక భాగం ఇబ్రహీంపట్నంలోనే ఏర్పాటు కానున్నాయి. ఇబ్రహీంపట్నంలోని అంజనేయ టవర్స్‌లో ఎక్కువమంది శాఖాధిపతులు తమ కార్యాలయాల కోసం అద్దెకు తీసుకున్నారు. ఈ నెల 27వ తేదీ కల్లా శాఖాధిపతుల కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగుల్లో ఎంతో కొంత మంది నూతన రాజధాని ప్రాంతం నుంచి పనిచేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. 27వ తేదీ కల్లా శాఖాధిపతుల కార్యాలయాలను నూతన రాజధాని ప్రాంతం విజయవాడ-గుంటూరులకు తరలించేందుకు తీసుకున్న చర్యలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సత్య ప్రకాశ్ టక్కర్ సోమవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రతీ శాఖాధిపతిని నూతన రాజధానిలో కార్యాలయాల గుర్తింపు, అద్దెకు తీసుకోవడంపై సీఎస్ అడిగి తెలుసుకున్నారు. రవాణా చార్జీల ఖరారు.. అన్ని శాఖాధిపతులు కార్యాలయాలను గుర్తించినట్లు సమీక్షలో తెలిపారు. శాఖాధిపతుల కార్యాలయాల్లో ఫర్నీచర్, ఫైళ్లు, కంప్యూటర్ల తరలింపునకై రవాణా చార్జీలను కూడా ఖరారు చేశామని, నేడో రేపో ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు రహదారులు-భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంబాబ్ సమీక్షలో తెలిపారు. ఇబ్రహీంపట్నం నుంచి హైదరాబాద్‌కు రావడానికి, హైదరాబాద్ నుంచి ఇబ్రహీంపట్నం వెళ్లడానికి అనువుగా ఉంటుందనే భావనతోనే అత్యధిక శాతం శాఖాధిపతుల కార్యాలయాలను ఇంబ్రహీంపట్నంలో చూసుకున్నారు. ఇలా ఉండగా అఖిల భారత సర్వీసు అధికారులకు నివాస వసతిని రెయిన్ ట్రీ పార్కులో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రెయిన్ ట్రీ పార్కులోనే కుటుంబాలతో ఉండే అధికారులకు, అలాగే బ్యాచ్‌లర్ నివాస వసతిని ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆర్థిక శాఖకు చెందిన శాఖాధిపతుల కార్యాలయాలన్నీ కూడా ఇబ్రహీంపట్నంలోనే ఉండనున్నాయి. కొద్దిమంది శాఖాధిపతులు తమ కార్యాలయాలను ఈ నెల 24వ తేదీ నుంచే తరలించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు -
కొంగుబంగారం... కొండ గట్టు
పెద్ద పెద్ద వృక్షాలు... నిశ్శబ్ద వాతావరణం... నల్ల రాతి బండల గాంభీర్యత... పక్షుల కిలకిలా రావాలతో ఓ పక్కన ప్రశాంతతను ప్రసాదిస్తూనే, మరోపక్క ఆధ్యాత్మిక నిలయంగా వెలుగొందుతోంది... కొండగట్టు. అక్కడ కొలువైన ఆంజనేయస్వామి భక్తుల కోరికలు తీరుస్తూ పూజలందుకుంటున్నాడు. కరీంనగర్ జిల్లా, మల్యాల మండలం, ముత్యంపేట గ్రామ శివారులో... కొండగట్టు మీద... కోరంద పొదల మధ్యన పవన సుతుడు, శ్రీరామ పాదదాసుడు అయిన ఆంజనేయస్వామి స్వయంభువుగా వెలిశాడు. భక్తులు కోరిన కోర్కెలు తీర్చే ఆరాధ్యదైవ ంగా వెలుగొందుతున్నాడు. కొండగట్టులో ఆంజనేయ స్వామి... నారసింహస్వామి, ఆంజనేయస్వామి రెండు ముఖాలతో ఉంటాడు. నరసింహస్వామి అంటే సాక్షాత్తూ విష్ణుస్వరూపం కాబట్టి కొండగట్టు ఆంజనేయస్వామి వారికి శంఖం, చక్రం, వక్షస్థలంలో రాముడు, సీత ఉండడం విశేషం. ఆలయ ప్రాశస్త్యం.. ఐదు వందల ఏళ్ల క్రితం సింగం సంజీవుడనే వ్యక్తి ఆవులను మేపుతూ కొండకు రాగా, ఒక ఆవు తప్పిపోయింది. వెతికి వేసారి చివరికి ఓ చింతచెట్టు కింద సేదతీరుతుండగా స్వప్నంలో స్వామి కనపడి ‘నేను కోరంద పొదల్లో ఉన్నాను. నాకు కాస్త ఎండ.. వాన.. ముండ్ల నుండి రక్షణ కల్పించు. నీ ఆవు ఇదిగో, ఇక్కడే ఉంది’ అని చెప్పాడు. సంజీవుడు నిద్రలోంచి లేచి చూడగా ఆవు ఎదురు వచ్చింది. వెంటనే కోరంద పొదలను తొలగించి చూస్తే శంఖు, చక్ర గదాలంకరణతో ఆంజనేయ స్వామి విశ్వరూపం దర్శనమిచ్చింది. వెంటనే అతడక్కడ ఆలయాన్ని నిర్మించాడు. దక్షిణ భాగంలో చెక్కిన శిలాక్షరాలు ఈ కథ అంతటినీ మన కళ్లకు కడతాయి. కొండ గట్టు మీద చుట్టూ చిన్న కోటగోడ ఆకారంలో మూడు భిన్నమైన ప్రహరీలున్నాయి. వీటిని కొండల్రాయుడు కట్టించాడు. స్వామి భక్తుడైన చిలుమూరి రఘు పతిరావును చంపిన వారిపై పగ సాధించేం దుకు అతడి కొడుకు కొండల్ రాయుడు కోట, బురుజు కట్టి బలగాన్ని సేకరించాడు. అతడి గుర్రం అడుగులు, కోట గోడలు, కొలను గుంటలు ఇక్కడ దర్శనమిస్తాయి. కొండగట్టు పేరు ఎలా వచ్చిందంటే.. ఆంజనేయస్వామి దేవాలయం నల్లరాతి బండల సమూహాలు, గుహలు, అనేక రకాల వృక్షజాతులతో కూడిన అటవీ ప్రాంతంలో ఉంది. చుట్టూ పెద్ద పెద్ద కొండలు, ఆ కొండలపై మళ్లీ ఒక చిన్న గుట్ట ఏర్పడగా, ఆ గుట్టపై ఆంజనేయస్వామి వెలిశాడు. అందుకే కొండగట్టు అని పేరువచ్చిందనే ప్రచారం ఉంది. లక్ష్మణుడు మూర్ఛిల్లినప్పుడు ఆంజనేయస్వామి సంజీవని పర్వతం తీసుకొని వెళ్తుండగా అందులోంచి ఒక ముక్క రాలి ఈ కొండలలో పడిందని, అదే కొండగట్టుగా ప్రసిద్ధి చెందిందని, అందుకే శారీరక, మానసిక బాధలు, ఇతర గ్రహ బాధలున్నవారు స్వామిని దర్శించుకోగానే తొలగిపోతాయని పూర్వీకులు చెబుతుండేవారు. దేవాలయానికి సమీపంలో రాతి బండల మధ్య 30 గజాల లోతు పుష్కరిణి ఉంది. తపస్వీకులు స్నానాలు చేసి, స్వామిని సేవించి, సమీపంలోని గుహలో తపస్సు చేసేవారు. ఒకే మంటపంలో మూడు వేర్వేరు గర్భగుడులున్నాయి. మధ్యలో ఆంజనేయ స్వామి, కుడిపక్కన వేంకటేశ్వరస్వామి ఉత్సవ మూర్తులు, ఎడమ పక్కన అమ్మవారు వెలిసి ఉండగా, ఆలయానికి పడమరవైపు క్షేత్ర పాలకుడు భేతాళస్వామి ఆలయం ఉంది. బేతాళస్వామికి దక్షిణాన రామపాదుకలు ఉండగా... ఫర్లాంగు దూరంలో పొలిమేర దేవత బొజ్జ పోతన్న ఉంటాడు. రామ పాదుకలకు కొద్ది ముందు భాగంలో సీతా పతివ్రతా తల్లి కూర్చొని, తన కష్టాలు తలుచుకుని ఏడ్చేదట. ఆ సాధ్వి కన్నీటి గుర్తులూ ఇక్కడ ఉన్నాయి. ఐదు వందల ఏళ్లుగా నిత్య హారతులు.. కొండగట్టు ఆంజనేయస్వామికి ఐదు వందల ఏళ్లుగా నిత్య హారతులు కొనసాగు తున్నాయి. అనారోగ్యం, దీర్ఘకాల పీడితులు, మతిస్థిమితం లేనివారు, స్వామి సన్నిధిలో 11, 21, 41 రోజులు నిష్టతో పూజలు చేయడమే కాక, మూడుపూటలా భజనలు చేస్తున్నారు. బేతాళస్వామి ఆలయం వద్ద గ్రహపీడితులు విగ్రహానికి మొక్కి, అల్లుబండను ఆలింగనం చేసుకుంటారు. స్వామి కలలోకి వచ్చి గ్రహ బాధ నుండి విముక్తి కలిగిస్తున్నట్లు భక్తులు చెబుతుంటారు. స్వామిని సేవిస్తే సంపూర్ణ ఆరోగ్యం పొందుతారని భక్తుల విశ్వాసం. చైత్ర పౌర్ణమి రోజున ఆంజనేయస్వామి జయంతి ఉత్సవాలను హనుమాన్ చిన్న జయంతిగా నిర్వహిస్తారు. వైశాఖ బహుళ దశమి రోజున అత్యంత ైవె భవంగా హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలు నిర్వహిస్తారు. త్రయాహ్నిక, త్రికుండాత్మక, మహాయాగం, మూడురోజులపాటు స్వామికి ప్రత్యేక పంచా మృత అభిషేకం, సహస్ర నాగవల్లి అర్చన, సహస్ర దీపాలంకరణ, గరుడ వాహన సేవ నిర్వహిస్తారు. సుమారు 3 నుండి 5 లక్షల మంది దీక్షా పరులు స్వామిని దర్శించుకుని, దీక్ష విరమణ చేస్తారు. - జవ్వాజి చంద్రశేఖర్, మల్యాల కంట్రిబ్యూటర్ -
చిరు కుటుంబ సభ్యుల ప్రత్యేక పూజలు
-
చిరు కుటుంబ సభ్యుల ప్రత్యేక పూజలు
హైదరాబాద్ : మెగాస్టార్, కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు చిరంజీవి 60వ జన్మదినం నేపథ్యంలో ఆయన కుటుంబసభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. శనివారం ఉదయం ఫిల్మ్‌నగర్‌లోని ఆంజనేయస్వామి వారి ఆలయానికి చిరంజీవి భార్య సురేఖ, పెద్ద కుమార్తె సుష్మిత చేరుకున్నారు. అనంతరం వారు ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిరంజీవికి శనివారం 60 వసంతాలు నిండి 61వ వసంతంలోకి అడుగుపెడుతున్న విషయం తెలిసిందే. -
దేవుడి ఆభరణాలు ఎత్తుకెళ్లారు
నల్లగొండ (హాలియా) : నల్లగొండ జిల్లా హాలియా మండలంలోని ఓ ఆలయంలో దొంగతనం జరిగింది. మండలంలోని నాయుడుపాలెం గ్రామంలో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయంలో 3 తులాల బంగారం, 3 కేజీల వెండి ఆభరణాలు గుర్తు తెలియని వ్యక్తులు శనివారం అర్ధరాత్రి తర్వాత ఎత్తుకెళ్లారు. ఈ ఘటన ఆదివారం తెల్లవారు జామున వెలుగు చూసింది. గ్రామస్తులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
ఓ మై గాడ్!
రోడ్డును ఆక్రమించారంటూ నోటీసులు భింద్ : మధ్యప్రదేశ్‌లోని భింద్ జిల్లాలో రోడ్డును ఆక్రమించారంటూ ఆంజనేయస్వామికి నోటీసులు జారీ చేశారు మున్సిపల్ అధికారులు. బజారియాలో రోడ్డు పక్కనే హనుమంతుడి గుడి ఉంది. రోడ్డు స్థలం కొంచెం ఆలయ ప్రాంగణంలో ఉండడంతో నోటీసులిచ్చారు. అయితే గుడి పూజారికో లేదా ఆలయ ట్రస్టీకో బదులు ఏకంగా దేవుడి పేరుతోనే నోటీసులు జారీ చేశారు. ‘హనుమాన్ దేవుడా? మీరు చట్టవిరుద్ధంగా రోడ్డును ఆక్రమించారు. ప్రమాదాలకు ఆస్కారమిస్తోంది. ఆక్రమించిన స్థలం నుంచి వెనక్కి వెళ్లాలని గ్వాలియర్ హైకోర్టు నోటీసులు ఇచ్చినా పట్టించుకోలేదు. మీపై కోర్టు ధిక్కరణ కేసు కూడా పెట్టాం’ అని నోటీసులో పేర్కొన్నారు. స్థానికులు మండిపడ్డంతో అధికారులు నాలిక్కరుచుకున్నారు. పొరపాటున దేవుడి పేరుతో ఇచ్చామని, నోటీసులను వెనక్కి తీసుకుంటామన్నారు. -
గుడిలో మహిళల ప్రవేశం పై నిషేదం
-
మామూళ్ల ‘కిక్’
ఆబ్కారీ శాఖ అధికారులకు మామూళ్ల మత్తు తలకెక్కింది. జిల్లాలో ఏటా ఆబ్కారీ మామూళ్ల మొత్తం రూ.3.6 కోట్లు అంటే ఆశ్చర్యం కలగక మానదు. ఎక్సైజ్ సిబ్బందికి ఆమ్యామ్యాల ద్వారా వచ్చే ‘గీతం’తో పోలిస్తే ప్రభుత్వం చెల్లించే ‘జీతం’ దిగదుడుపే. ఇదంతా చాలదన్నట్లు అధికారులు తాజాగా చందాల పేరిట కొత్త దందాకు శ్రీకారం చుట్టారు. ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ఠాపన పేరుతో ప్రతీ వైన్‌షాపు నుంచి చందాలు సేకరిస్తున్నారు. వసూళ్లు, చందాలతో లబోదిబోమంటున్న మద్యం దుకాణాల యజమానులు ఆమ్యామ్యాల భారం ప్రజలపై రుద్దుతున్నారు. - సాక్షి ప్రతినిధి, కరీంనగర్ సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : జిల్లాలో 301 మద్యం దుకాణాలున్నాయి. ఆయా దుకాణాల్లో అమ్మకాల ఆధారంగా గ్రేడ్లుగా విభజించి నెలవారీ లంచాలు ఫిక్స్ చేశారు. తక్కువగా అమ్మకాలు జరిగే మద్యం దుకాణానికి రూ.5 వేలు, భారీగా విక్రయించే దుకాణానికి రూ.15 వేలు వసూలు చేస్తున్నారు. ఈ లెక్కన నెలనెలా రూ.30 లక్షలకుపైగా లంచాల రూపంలో ఎక్సైజ్ అధికారులకు చేరుతున్నాయి. అంటే ఏటా రూ.3.6 కోట్లు ఎక్సైజ్ సిబ్బంది జేబుల్లోకి వెళ్తోంది. ఎక్సైజ్ సూపరింటెండెంట్ స్క్వాడ్, విజిలెన్స్ పేరిట అప్పుడప్పుడు దాడులకు దిగే వారికి చెల్లించే సొమ్ము అదనమే. కానిస్టేబుల్ నుంచి డీసీ వరకు.. నెలనెలా వసూలవుతున్న ఆమ్యామ్యాల మొత్తాన్ని కానిస్టేబుల్ నుంచి డెప్యూటీ కమిషనర్ వరకు ఎవరి వాటాలు వారు పంచుకుంటున్నారు. జిల్లాలో మొత్తం 16 ఎక్సైజ్ స్టేషన్లుండగా.. సూపరింటెండెంట్‌కు గరిష్టంగా రూ.5 లక్షలు, సీఐలకు లక్ష, ఎస్సైలకు రూ.40 వేలు, కానిస్టేబుల్‌కు రూ.10 వేల చొప్పున పంపకాలు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అసిస్టెంట్ కమిషనర్, డెప్యూటీ కమిషన ర్లకూ మామూళ్లు అందుతున్నాయి. ప్రస్తుతం డెప్యూటీ కమిషనర్ లేకపోవడంతో ఆయన స్థానంలో అసిస్టెంట్ కమిషనర్ ఇన్చార్జి డీసీగా కొనసాగుతుండటంతో ఎక్సైజ్ సిబ్బందిపై ఆజమాయిషీ లేకుండా పోయిందనే ఆరోపణలున్నాయి. దేవుడి పేరిట చందాల దందా రెగ్యూలర్‌గా మామూళ్లు వసూలు చేస్తున్న ఆబ్కారీ సిబ్బంది.. కొత్తగా చందాల దందాకు శ్రీకారం చుట్టారు. ఇన్చార్జి డెప్యూటీ కమిషనర్‌గా వ్యవహరిస్తున్న శివనాయక్ స్వస్థలం కర్నూలు జిల్లా పాములపాడు మండలం వేంపెంట. ఆ ఊర్లో శ్రీ ప్రసన్నాంజయనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని నిర్ణయించిన శివనాయక్ విరాళాల సేకరణకు కార్యాచరణ రూపొందించారు. చందాల పుస్తకాన్ని సిబ్బందికి అందజేశారు. దేవుడి పేరిట నిర్వహించే కార్యమైనందున ఎవరైనా స్వచ్ఛందంగా విరాళాలిస్తే తగిన రశీదు ఇవ్వాలని సూచించారు. దీన్ని అలుసుగా తీసుకున్న సిబ్బంది మద్యం దుకాణాల నుంచి బలవంతంగా వసూళ్లకు దిగారు. ఒక్కో మద్యం దుకాణ యజమాని రూ.వెయ్యి నుంచి రూ.5 వేలు ఇవ్వాలని పట్టుబడుతున్నారు. కొందరు సిబ్బంది దుకాణ యజమానులు చెల్లించే సొమ్ములో సగం నొక్కేసి మిగితా మొత్తానికి రశీదు ఇస్తున్నారు. విషయం తెలుసుకున్న శివనాయక్ దేవుడి పేరుతో సత్కార్యాన్ని చేయాలని భావిస్తే దానినీ సొంతానికి వాడుకుంటున్నారని కొందరు అధికారుల వద్ద వాపోయినట్లు తెలిసింది. చందాల పేరుతో ఎవరినీ బలవంతపెట్టొద్దని సూచించినా.. సిబ్బంది మాత్రం అదేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. లాభం లేదని భావించిన శివనాయక్ రశీదుల పుస్తకాన్ని వాపస్ చేయాలని సిబ్బందిని ఆదేశించినట్లు తెలిసింది. భారమంతా మందుబాబులపైనే ఆమ్యామ్యాలు, చందాలు, ఇతర మామూళ్ల భారాన్ని మద్యం దుకాణాల యజమానులు మందుబాబులపై మోపుతున్నారు. ఒక్కో క్వార్టర్ బాటిల్‌పై రూ.10, బీరు సీసాపై రూ.15 చొప్పున అదనంగా వసూలు చేస్తున్నారు. దీనిపై పలువురు ఫిర్యాదు చేస్తున్నా ఎక్సైజ్ అధికారుల నుంచి సరైన స్పందన కరువైంది. -
కొనసాగుతున్న విగ్రహ నిర్మాణ పనులు
భివండీ, న్యూస్‌లైన్ : స్థానిక వరాలదేవి మందిరం వద్ద శ్రీ హనుమాన్ సేవా ట్రస్టు ఆధ్వర్యంలో చేపట్టిన ఆంజనేయస్వామి విగ్రహ తయారీ పనులు కొనసాగుతున్నాయి. ప్రతి ఏడాది హనుమాన్ జయంతిని పురస్కరించుకొని కొంతమంది భక్తులు 41 రోజుల ముందు హనుమాన్ మాలధారణ చే స్తారు. నిత్యం ఉపవాస దీక్షలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. దీనిని దృష్టిలో ఉంచుకుని శ్రీ హనుమాన్ సేవా ట్రస్టు భారీ ఆంజనేయ స్వామి విగ్రహ తయారీకి పూనుకుంది. అంతేకాకుండా ప్రతి ఏటా హనుజ్జయంతి సందర్భంగా నిత్యాన్నదాన కార్యక్రమాలను కూడా నిర్వహిస్తోంది. 2007లో సంపూర్ణ రామకోటి రాసి భద్రాచల రామయ్యకు అంకితం కూడా చేశామని ట్రస్ట్ సభ్యుడొకరు పేర్కొన్నారు. 2009లో లక్షదీపార్చన కార్యక్రమం కూడా నిర్వహించామన్నారు. 2010 లో 1,111 మంది మహిళా భక్తులతో లలితాదేవి కుంకుమార్చన, శ్రీచక్ర పూజ తదితర కార్యక్రమాలను నిర్వహించామన్నారు. ఇలా ప్రతి ఏడాది ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహిస్తూన్న ట్రస్టు సంస్థాపకుడు గుండేటి నాగేష్, కార్యదర్శి బాలకిషన్ కోశాధికారి కోడూరి మల్లేశంలు తెలిపారు. కాగా కరీంనగర్ జిల్లా సిరిసిల్ల గ్రామానికి చెందిన వడ్డెపల్లి సత్యనారాయణ... ఆంజనేయ విగ్రహాన్ని తయారు చేస్తున్నారు. ఈ సందర్భంగా ట్రస్టు సభ్యులు మాట్లాడుతూ విగ్రహం తయారీకోసం పెద్దఎత్తున విరాళాలను సేకరించాల్సి ఉందన్నారు. పట్టణానికి చెందిన కొంతమంది దాతలు ముందుకొచ్చి విరాళాలు ఇచ్చారన్నారు. అయినప్పటికీ అవి సరిపోవన్నారు. అందువల్ల విగ్రహ తయారీకి ఆర్థిక సహాయం చేయాలని స్థానికులను వారు కోరారు. ఆర్థిక సహాయం చేయదలచిన వారు తమను 09320607696 నంబర్‌పై సంప్రదించాలని కోరారు. -
అంజన్న భక్తులతో జనసంద్రమైన కొండగట్టు
హైదరాబాద్ : కరీంనగర్ జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం భక్తసంద్రమైంది. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం అంజన్న మాలధారులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. వాయుపుత్రుడు విశేష అలంకరణలతో భక్తులకు దర్శనమిస్తున్నారు. కాగా ఈరోజు తెల్లవారుజాము నుంచే పవన పుత్రుడిని దర్శించుకునేందుకు భక్తులు క్యూ లైన్లలో వేచి ఉన్నారు. అయితే ఏర్పాట్లపై భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా ఉత్తర తెలంగాణలోని పలు ప్రాంతాల నుంచి సుమారు 50వేలకు పైగా భక్తులు తరలి వచ్చారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా హనుమన్ జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. భక్తులతో ఆంజనేయుని ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. -
చెలి కోసం నెచ్చెలి పూజలు
రాష్ట్ర ముఖ్యమంత్రి జే జయలలిత నెచ్చలి శశికళ బుధవారం ఉదయాన్నే కృష్ణగిరి జిల్లాలోని అటవీ గ్రామంలో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయం లో ప్రత్యక్షం అయ్యారు. కొబ్బరి కాయలు చేత బట్టి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఆంజనేయుడికి ప్రత్యేకంగా కొబ్బరి కాయలతో మొక్కులు చెల్లించారు. అన్నాడీఎంకే అధినేత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి జె జయలలిత, ఆమె నెచ్చెలి శశికళ బంధం దాదాపు 30 ఏళ్లు పైమాటే. జయలలిత ఎక్కడికి వెళ్లినా వెన్నంటి శశికళ ఉంటారు. జయలలితకు ఏ మేరకు గౌరవాలు, విలువలు దక్కుతాయో అవన్నీ ఆమెకూ దక్కాల్సిందే. జయలలితకు నీడలా ఉంటూ వచ్చిన శశికళకు రెండేళ్ల క్రితం చేదు అనుభవం ఎదురైంది. పోయేస్ గార్డెన్ నుంచి ఆమెను గెంటివేయడంతో ఇక జయ-శశి బం ధానికి కాలం చెల్లినట్టే సర్వత్రా భావించారు. అయితే, కొందరు మాత్రం ఇది వారికి కొత్తేమీ కాదన్నట్టుగా వ్యాఖ్యానించారు. అదే సమయంలో చోటు చేసుకున్న పరిణామాలు ఇక, వీరిద్దరి మధ్య అగాథం పెంచినట్టేనన్న భావన ప్రతి ఒక్కరి మదిలోనూ నెలకొంది. అయి తే, ఈ అగాథం వెనుక భారీ కుట్ర వెలుగు చూసింది. ఈ పరిస్థితుల్లో బాధనంతా ఏకరువు పెడుతూ కన్నీరు మున్నీరై మనసులోని మాటను తలైవికి చేరవేస్తున్నట్లు ఓ లేఖాస్త్రం మీడియాకు శశికళ విడుదల చేశారు. అం దులో ‘ఆనమీర గలనా... జయ సఖి’ అంటూ తప్పొప్పులు తానెరుగనని, అంతా ఎవరో చేసి తనపై వేశారని, తనకు ప్రాణస్నేహితురాలు జయను ప్రేమిం చటం తప్ప వేరే ప్రపంచమే తెలియదన్న విషయాన్ని కుండబద్దలు కొట్టారు. ఇక తన జీవితం జయలలిత సేవకే అంటూ ప్రకటించారు. దీంతో కరిగిపోయిన పురట్చి తలైవి మళ్లీ పోయేస్ గార్డెన్లో శశికళకు చోటు ఇచ్చారు. ఆ నాటి నుంచి జయలలితకు మళ్లీ నీడలా ఉంటూ వస్తున్న శశికళ తన చెలిని ప్రధానిగా చూడాలన్న తపనతో ఉంటున్నారు. ఆలయ బాట తాము కేసుల నుంచి నిర్దోషులుగా బయట పడాలని, జయలలిత అత్యున్నత స్థానంలో ఉండాలని కాంక్షిస్తూ నెచ్చెలి శశికళ ఆలయాల బాట సైతం పట్టారు. గత ఏడాది రాష్ర్టంలోని అన్ని ప్రధాన ఆలయాలను ఆమె రహస్యంగా సందర్శించారు. ఈ ఆలయ బాట పట్టేం దుకు చెన్నై కోటూరు పురంలోని బొజ్జగణపయ్య ఆల యంలో జయలలితతో కలసి పూజలను సైతం నిర్వహించారు. ఆ తర్వాత ఓమారు తిరుచ్చిలో జయలలిత కలసి ఆలయ దర్శనానికి వెళ్లిన శశికళ బుధవారం ఉదయాన్నే కృష్ణగిరిలోని ఓ అటవీ గ్రామంలో ఉన్న ఆలయంలో ప్రత్యక్షం కావడం ప్రాధాన్యతను సంతరించుకునేలా చేసింది. పవిత్ర క్షేత్రాలన్నీ సందర్శించి ప్రత్యేక పూజలను శశికళ చేసి ఉన్నారు. చిన్నమ్మ పూజలు జయలలిత అత్యున్నత స్థానంలో కూర్చోవాలని కలలు కంటున్న శశికళ తన కోరికను తీర్చాలంటూ ఆంజనేయస్వామిని వేడుకున్నారు. 40 లోక్‌సభ స్థానాలు చేజిక్కించుకుని పీఎం సింహాసనంలో కూర్చోవాలని జయలలిత తపన పడుతుండటం, ఆమె కలను నెరవేర్చడం లక్ష్యంగా ఎన్నికలకు ముందు రోజు ఈ ఆల యాన్ని శశికళ సందర్శించినట్టుందన్న ప్రచారం సాగుతోంది. కృష్ణగిరి జిల్లా నయాన్ పారై సమీపంలోని అటవీ గ్రామంలో కాట్టు ఆంజేయ స్వామి ఆలయం ఉంది. ఇక్కడ ప్రతి శని వారం, పౌర్ణమి పర్వదినాన ప్రత్యేక పూజాధి కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఇక్కడ కొబ్బరికాయను కొట్టడం ఉండదు. కొబ్బరికాయను ఓ సంచిలో పెట్టి ఆలయ ప్రద క్షిణ చేస్తే, కోరిన కోరికలు నెరవేరుతాయన్నది భక్తుల నమ్మకం. ఈ ఆలయం గురించి శశికళ తెలుసుకున్నట్టుంది. ఉదయాన్నే చెన్నై నుంచి రోడ్డు మార్గంలో కృష్ణగిరి చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా ఆలయానికి వెళ్లిన ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొబ్బరి సంచిని చేత బట్టి ఆలయం చుట్టూ 11 సార్లు ప్రదక్షిణ చేశారు. పూజాది కార్యక్రమాల అనంతరం ఆగమేఘాలపై చెన్నైకు ఆమె తిరుగు పయనం అయ్యారు. శశికళ వెంట ఓ మహిళ, మరో ముగ్గురు ఉన్నట్టు ఆలయ వర్గాలు పేర్కొంటున్నాయి. బెంగళూరు కోర్టులో సాగుతున్న విచారణ తుది దశకు చేరిన దృష్ట్యా, అందులో నుంచి నిర్దోషులుగా బయట పడాలని, జయలలిత ప్రధాని కావాలని ఆమె పూజలు చేశారు. -
అప్పిలేపల్లిలో ఉద్రిక్తత
కుందుర్పి, న్యూస్‌లైన్ : కుందుర్పి మండలం అప్పిలేపల్లిలో ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శనివారం అర్ధరాత్రి ప్రదర్శించిన వీధి నాటకం ఉద్రిక్తతకు దారితీసింది. నాటకం మధ్యలో చేస్తున్న అశ్లీల నృత్యాల ప్రదర్శన ఆపాలని ఎస్ఐ కోరగా.. కళాకారులు బేఖాతరు చేస్తూ కొనసాగించారు. చివరకు ఎస్ఐ లైట్లు ఆర్పివేయడంతో జనం స్టేజీపైకి దూసుకొచ్చారు. ఈ క్రమంలో ఒక మహిళ స్పృహ తప్పిపడిపోయింది. దీంతో ఆగ్రహంతో రెచ్చిపోయిన జనం పోలీసులపైకి రాళ్లు రువ్వారు. ఎస్ఐ, కానిస్టేబుల్‌కు చెందిన రెండు బైక్‌లకు నిప్పుపెట్టారు. కళ్యాణదుర్గం డీఎస్పీ వేణుగోపాల్ , సర్కిల్ ఇన్స్పెక్టర్ వంశీధర్‌గౌడ్ తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా అప్పిలేపల్లిలో ఆదివారం నిర్వహించనున్న గావు ఉత్సవానికి నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చారు. శనివారం అర్ధరాత్రి ‘బొబ్బిలి రాముడు’ సాంఘిక నాటకం ప్రదర్శించారు. మధ్య మధ్యలో కళాకారులు అశ్లీల నృత్యాలతో రెచ్చిపోయారు. దీంతో ఎస్ఐ శ్రీనివాసులు, మరో పది మంది పోలీసు సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. అశ్లీల ప్రదర్శనలు చట్టరీత్యా నేరమని, వెంటనే ఆపేయాలని ఎస్ఐ సూచించారు. తాము రూ.90 వేలు వెచ్చించి నాటకం ప్రదర్శిస్తున్నామని, ఇప్పుడిలా ఆపాలంటే కుదరదని, తమకు సడలింపు ఇవ్వాల్సిందేనంటూ అశ్లీల నృత్యాలు కొనసాగించారు. ఓపిక నశించిన ఎస్ఐ స్టేజీపైకి వెళ్లి లైట్లు ఆర్పివేయడంతో జనం దూసుకొచ్చారు. తొక్కిసలాటలో వడ్డే రామక్క అనే మహిళ స్పృహ తప్పి కిందపడింది. ఆగ్రహించిన జనంలో కొందరు పోలీసులపైకి ఇసుక, కంకరరాళ్లు విసిరారు. ప్రాణ భయంతో పోలీసులు అక్కడి నుంచి పరుగులు తీశారు. అప్పటికీ శాంతించని కొందరు ఆకతాయిలు ఎస్ఐ శ్రీనివాసులు, కానిస్టేబుల్ రామాంజనేయులు అక్కడే వదిలి వెళ్లిన రెండు బైక్‌లకు నిప్పంటించారు. సమాచారం అందుకున్న డీఎస్పీ వేణుగోపాల్, సీఐ వంశీధర్ గ్రామానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఎస్ఐకి, పోలీసు సిబ్బందికి రివార్డులు అశ్లీల నృత్య ప్రదర్శనను అడ్డుకుని, శాంతిభద్రతల పరిరక్షణలో తమ వంతు పాత్ర పోషించిన కుందుర్పి ఎస్ఐ శ్రీనివాసులుతోపాటు పది మంది పోలీసు కానిస్టేబుళ్లకు ఎస్పీ సెంథిల్‌కుమార్ రివార్డులు ప్రకటించారు. భయం గుప్పిట్లో అప్పిలేపల్లి దాడి ఘటనలో 18 మందిని పోలీసులు అరెస్ట్ చేయడంతో అప్పిలేపల్లి గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పుడు ఏమి జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటున్నారు. బంధు, మిత్రులతో ఆనందంగా ఉండాల్సిన ఆంజనేయస్వామి రథోత్సవం నాడు పోలీసుస్టేషన్లో కాలం గడపడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అనుమానితులతో పాటు గ్రామంలోని పెద్దమనుషులను, రాజకీయ నాయకులను సహితం కళ్యాణదుర్గం సర్కిల్ కార్యాలయానికి పిలిపించి విచారణ చేస్తున్నారు. ఈ ఘటనలతో జాతర కళ తప్పి.. వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి. 20 మందిపై కేసు... 18 మంది అరెస్ట్ కళ్యాణదుర్గం రూరల్ : కుందుర్పి మండలం అపిలేపల్లి గ్రామంలో పోలీసులపై దాడి చేసిన ఘటనలో ఓంకార్, తిమ్మరాజులు, చిరంజీవి, నాగరాజు, తిమ్మప్పతో సహా 20 మందిపై కేసు నమోదు చేసినట్లు సీఐ వంశీధర్‌గౌడ్ తెలిపారు. వీరిలో 18 మందిని అరెస్ట్ చేశామన్నారు. ఈ విషయాన్ని ఆదివారం కళ్యాణదుర్గం రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఆయన విలేకరులకు వెల్లడించారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై దాడిచేశారన్న అభియోగంపై కేసు నమోదు చేశామని, నిందితులను రిమాండ్‌కు పంపించామని తెలిపారు. -
వారానికి రెండు రోజులు!
గుంతకల్లు, న్యూస్‌లైన్: కసాపురంలోని ఆంజనేయస్వామి దేవాలయ ఎగ్జిక్యూటివ్ అధికారి(ఈఓ) సురేష్ బాబు వ్యవహార శైలిపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. నిత్యం భక్తులతో కిటకిటలాడుతూ.. సంవత్సరానికి రూ.6 కోట్ల ఆదాయం ఆర్జించే దేవాలయాన్ని పర్యవేక్షించాల్సిన అధికారి వారంలో రెండు రోజులు మాత్రమే విధి నిర్వహణలో ఉంటారని, మిగిలిన ఐదు రోజులు ‘టూర్’ పేరుతో ఎగనామం పెడతారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారికంగా రాయాల్సిన ‘టూర్ డైరీ’ని నమోదు చేయకపోవడంతో ఆరోపణలకు బలం చేకూరుతోంది. ప్రతి శనివారం ఉదయం డ్యూటీకి వచ్చే ఆయన మరుసటి రోజు ఆదివారం రాత్రి వెళ్లిపోతున్నా ప్రశ్నించే అధికారి లేకపోవడంతో ‘ఆడిందే ఆట.. పాడిండే పాట’ చందంగా తయారైంది. ఈయన తీరుపై జిల్లా కలెక్టరుకు సమాచారం అందకుండా దేవాదాయ శాఖలోని కొందరు సిబ్బంది అడ్డుపడుతున్నారని బాహాటంగా చెప్పుకుంటున్నారు. గాడి తప్పిన పాలన.. మూడు సంవత్సరాల క్రితం ఈఓగా సురేష్‌బాబు బాధ్యతలు చేపట్టారు. విజయవాడకు చెందిన ఈయనకు స్థానిక ప్రజాప్రతినిధి అండదండలు ఉన్నాయి. ఎక్కువ రోజులు ఆఫీసులో ఉండకపోవడంతో ఆలయ అధికారులు, సిబ్బందిలో నిర్లక్ష్యం, అవినీతి పెచ్చుమీరిపోయాయి. పరిపాలన పూర్తిగా గాడి తప్పింది. ఆలయ సిబ్బంది గ్రూపులుగా విడిపోయి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండడంతో సౌకర్యాలు అందక భక్తులు ఇబ్బంది పడుతున్నారు. దేవస్థానం పరిధిలో రూ.5.5 కోట్లతో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో అవినీతి పెరిగింది. పనుల్లో నాణ్యత లేదని ఓ గ్రూపు సిబ్బంది, గ్రామస్తులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. కాంట్రాక్టర్ల నుంచి భారీగా ‘మామూళ్లు’ డిమాండ్ చేసిన అనధికార ఈఓకు ఆశించిన మేరకు సొమ్ము ముట్టకపోవడంతో పరోక్షంగా వర్గాన్ని ప్రోత్సహిస్తూ.. ఫిర్యాదులకు తెరతీశారని చర్చించుకుంటున్నారు. ఆలయ వ్యవహారాలపై ఆందోళన చెందిన ఆలయ ధర్మకర్త సుగుణమ్మ రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. అనధికార ఈఓ తీరుతో గ్రూపులుగా సిబ్బంది కసాపురం దేవస్థానంలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఓ అధికారి ఏకంగా అనధికార ఈఓగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఆలయ పరిపాలనలో ఆశ్రీత పక్షపాతం పెరిగిపోయింది. స్థానిక రాజకీయ నాయకుల అండదండలతో కాంట్రాక్టు పనులను బంధువుల పేర్ల మీద పనులు చేయిస్తూ అర్హత ఉన్న కాంట్రాక్టర్లను వేధిస్తున్నారు. ఇదేమిటని ప్రశ్నించిన వారికి.. ఈఓకు ఫిర్యాదు చేసుకోండంటూ నిర్లక్ష్యంగా సమాధానమిస్తూ అవమానిస్తున్నాడని కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
కురుమతి రాయ గోవిందా.. గోవిందా
ఆత్మకూర్, న్యూస్‌లైన్: జిల్లాలోనే ప్రసిద్ధిగాంచిన కురుమూర్తిస్వామి బ్రహ్మోత్సవాల ప్రధాన ఘట్టమైన ఉద్దాల ఉత్సవం శనివారం రాత్రి అత్యంత వైభవంగా జరిగింది. ‘ఏడుకొండల వాడా వెంకట రమణ.. గోవిందా.. గోవిందా’ అంటూ శ్రీహరి నామస్మరణతో కురుమూర్తి గిరులు మార్మోగాయి. కురుమతి రాయుడి సన్నిధి భక్తజనసంద్రంగా మారింది. భక్తులు దాసంగాలతో దేవదేవుడికి నైవేద్యం సమర్పించారు. రెండో తిరుపతిగా పేరొందిన కురుమూర్తి కొండకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. ఉదయం నుంచే భక్తులు పుష్కరి(కోనేటి)లో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు. ముందుగా చిన్నచింతకుంట మండలం అప్పంపల్లి గ్రామంలోని నెల్లి వంశస్తుల నుంచి కలియకుండ పూజలు నిర్వహించి వడ్డెమాన్‌కు చేరుకున్నారు. అలాగే పల్లమర్రి గ్రామం నుంచి ప్రత్యేంగా తయారుచేసిన చాటను ఆలయానికి తీసుకొచ్చారు. వడ్డెమాన్‌లోని పాదుకల కర్మాగారం(దేవాలయం)లో దళితులు తయారు చేసిన స్వామివారి పాదుకలకు(ఉద్దాలు)మధ్యాహ్నం ప్రత్యేకపూజలు నిర్వహిం చారు. అనంతరం వడ్డెమాన్‌లో భక్తుల దర్శనార్థం పాదుకలను ఉంచారు. పాదుకలను మోచేతుల మీదుగా ఊకచెట్టు వరకు ఊరేగించారు. పాదుకలు ఉంచిన చాట కింద దూరేందుకు భ క్తులు పోటీపడ్డారు. ఊకచెట్టు వరకు ఊరేగించి తిరునాళ్లు నిర్వహించారు. అక్కడి నుంచి పాదుకలను చాటలో ఉంచి తిర్మలాపూర్ ఆంజనేయస్వామి ఆలయంలో ఉంచి ప్రత్యేకపూజలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరిం చిన వాహనంపై ఉద్దాలను కురుమూర్తి కొండ వరకు ఊరేగించారు. స్వామివారి పాదుకలు ఆలయం వద్దకు చేరుకోగానే ఆలయ ప్రాంగణం పరిసరాలు కురుమూర్తి నామస్మరణతో మార్మోగాయి. ఉదయం ఏడు గంటలకే కురుమూర్తికొండల పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. కోనేరు పరిసర ప్రాంతాలతోపాటు చుట్టూ ఎటుచూసినా దాసంగాలే దర్శనమిచ్చాయి. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు గంటల తరబడి క్యూలో నిలబడ్డారు. దర్శించుకున్న ప్రముఖులు ఉత్సవాల సందర్భంగా చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, ఈఓ బాలచంద్రుడు, ఆలయ కమిటి సభ్యులు భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించారు. జిల్లా నలుమూలల నుంచి భక్తులు అశేషంగా తరలొచ్చి సామివారిని దర్శించుకున్నారు. ఉత్సవాల సందర్భంగా గద్వాల డిఎస్పీ గోవింద్‌రెడ్డి, ఆత్మకూర్ సీఐ గోవర్దనగిరి, ఎస్ఐలు షేక్‌గౌస్, అబ్దుల్జ్రాక్, శ్రీకాంత్‌రెడ్డి, నర్సిములు ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ప్రధాన ఆర్చకులు వెంకటేశ్వర్లు, మక్తల్, ఎమ్మెల్యే దయాకర్‌రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే సీతమ్మ, మాజీ ఎమ్మెల్యేలు చిట్టెం రాంమ్మోహన్‌రెడ్డి, స్వర్ణ సుధాకర్‌రెడ్డి, టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు వావిళ్ల వెంకటేశ్వర్‌రెడ్డి, నాయకులు వజీర్‌బాబు, మహదేవన్‌గౌడ్, మాసన్న, ఆలయ కమిటీ సబ్యులు పాల్గొన్నారు. గట్టి బందోబస్తు శ్రీశ్రీ కురుమూర్తిస్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఉద్దాల ఉత్సవానికి జిల్లా, రాష్ట్ర న లుమూలల నుంచి సుమారు రెండు లక్షల మం దికిపైగా భక్తులు హాజరైనట్లు ఆలయకమిటీ సభ్యులు తెలిపారు. గద్వాల డీఎస్పీ గోవిందరెడ్డి, సీఐ గోవర్దనగిరి ఆధ్వర్యంలో 500మంది బలగాలతోపాటు రెండు స్పెషల్‌పార్టీ బలగాలతో గట్టి బందోస్తు ఏర్పాటు చేశారు. ఆర్టీసీ వారు ఆయా డిపోల నుంచి జాతరలో బస్‌స్టేషన్ ఏర్పాటు చేసి 200 ప్రత్యేక బస్సులు నడిపారు. జిల్లా కేంద్రంతో పాటు నాగర్‌కర్నూల్, వనపర్తి, గద్వాల, అచ్చంపేట, కల్వకుర్తి డిపోల నుంచి ప్రత్యేకబస్సులు నడిపారు. -
బిగిసిన పిడికిలి
సాక్షి, మచిలీపట్నం :సమైక్య ఆందోళనలతో జిల్లా అట్టుడుకుతోంది. చల్లపల్లిలో సమైక్యాంధ్రను కాంక్షిస్తూ జేఏసీ ఆధ్వర్యంలో పంచముఖ ఆంజనేయస్వామి ఆలయం ఎదురుగా రహదారిపై హోమం నిర్వహించారు. అవనిగడ్డ జేఏసీ ఆధ్వర్యంలో పులిగడ్డలో 216 జాతీయ రహదారిని దిగ్బంధించారు. రోడ్డుపైనే వంటావార్పు నిర్వహించి భోజనాలు ముగించారు. అధికార భాషాసంఘం అధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్, వైఎస్సార్ సీపీ నియోజకవర్గసమన్వయకర్త సింహాద్రి రమేష్‌బాబు దీక్షలో పాల్గొని మద్దతు తెలిపారు. నూజివీడు ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్య తన పదవికి రాజీనామా చేశారు. కిరాణా మర్చంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కిలో ఉల్లిని రూ.10కే విక్రయించారు. కూరగాయల దుకాణాల అసోసియేషన్ ఆధ్వర్యంలో బంద్ పాటించారు. ఆర్టీసీ కార్మికులు వంటావార్పు నిర్వహించారు. ఆర్టీసీ కార్మికులు పట్టణంలో అద్దె బస్సులతో ర్యాలీ నిర్వహించారు. జగ్గయ్యపేటలో బంద్ నిర్వహించారు. ముస్లింల ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీలో వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను పాల్గొన్నారు. నాన్ పొలిటికల్ జేఏసీ పిలుపు మేరకు చేపట్టిన కైకలూరు బంద్ విజయవంతమైంది. ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్‌రావులు ర్యాలీలో పాల్గొన్నారు. దేవినేని ఉమామహేశ్వరరావు అరెస్టుకు నిరసనగా మైలవరంలో టీడీపీ నాయకులు మన్నె సాంబశివరావు, షేక్ సుభానీలు తారకరామనగర్‌లోని వాటర్ ట్యాంకు పైకి ఎక్కి నిరసన తెలియజేశారు. గుడివాడలో మున్సిపల్ కార్మికులు విధులు బహిష్కరించి రిలేనిరాహారదీక్ష చేశారు. నెహ్రూచౌక్ సెంటర్లో ఎన్జీవోల దీక్షలు కొనసాగాయి. డ్వాక్రా మహిళలు భారీ ర్యాలీ నిర్వహించారు. పామర్రులో బంద్ నిర్వహించారు. వత్సవాయిలో ప్రైవేటు పాఠశాలల ఆధ్వర్యంలో రహదారిపై పాఠాలు బోధించారు. గోపినేనిపాలెం గ్రామంలో సోనియాగాంధీ, కేసీఆర్ దిష్టిబొమ్మలకు శవయాత్ర నిర్వహించి గ్రామ ప్రధాన సెంటర్లో దహనం చేశారు. ఏపీ డాక్టర్స్, ఎన్జీవోల సంఘం ఆధ్వర్యంలో కంకిపాడులో భారీ ప్రదర్శన నిర్వహించారు. కానూరులో వీఆర్ సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు, పోరంకిలో టీడీపీ నేతలు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పెనమలూరు నియోజకవర్గ సమన్వయకర్త పడమట సురేష్‌బాబు విద్యార్థులతో కలసి బందరురోడ్డుపై రాస్తారోకో చేశారు. నందిగామ నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ, ప్రైవేట్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో దీక్షలు కొనసాగాయి. తిరువూరులో భవన నిర్మాణ కార్మికులు పనులు బహిష్కరించి నిరసన ప్రదర్శన చేశారు. న్యాయవాదులు కోర్టు విధులు బహిష్కరించగా, న్యాయశాఖ ఉద్యోగులు భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి ధర్నా చేశారు. విస్సన్నపేటలో జర్నలిస్టులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. పెనుగంచిప్రోలులో ఆటోడ్రైవర్లు, యజమానులు భారీ ర్యాలీ నిర్వహించారు. న్యాయశాఖ ఉద్యోగుల సంఘం భోజన విరామ సమయంలో నల్లబ్యాడ్జీలతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. పెడనలో పీఏసీఎస్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు రిలే నిరాహార దీక్షను చేపట్టారు. వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్తలు ఉప్పాల రాంప్రసాదు వాకా వాసుదేవరావు మద్దతు ప్రకటించారు. నూజివీడు చిన్నగాంధీబొమ్మ సెంటర్లో చేస్తున్న దీక్షలకు వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కన్వీనర్ మేకా వెంకట ప్రతాప్ అప్పారావు మద్దతు ప్రకటించారు. ఉయ్యూరు రైతుబజార్ కూరగాయల రైతులు కూరగాయల దండలతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఎన్టీటీపీఎస్ ఉద్యోగులు, ఆర్టీసీ ఉద్యోగులు ఇబ్రహీంపట్నంలో భారీ ర్యాలీ నిర్వహించారు. విజయవాడలో.. నగరంలో మున్సిపల్ ఉద్యోగులు రిలే దీక్షలు చేయడంతో పాటు రోడ్లపైనే ఆటలు ఆడుతూ నిరసన తెలిపారు. వన్‌టౌన్‌లోని సెయింట్ థామస్ ఇంగ్లీషు మీడియం స్కూల్ చిన్నారులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. రాష్ర్ట విభజన వద్దు... సమైక్యాంధ్ర ముద్దు అంటూ ప్లకార్డులు పట్టుకుని రోడ్లపై నిర్వహించిన తరగతులకు హాజరయ్యారు. చిట్టినగర్ పొలిటికల్ జేఏసీ చేపట్టిన రిలే దీక్షలు తొమ్మిదవ రోజుకు చేరాయి. టీడీపీ నేతల అరెస్టును నిరసిస్తూ బుద్దా వెంకన్న ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ అద్దెబస్సుల ఓనర్స్, వర్కర్స్ జేఏసీ ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వైద్యుల సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. తెలుగు తల్లి విగ్రహం వద్ద విజయవాడ మాస్టర్ ప్రింటర్స్ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ సెంట్రల్ సమన్వయకర్త పి.గౌతమ్‌రెడ్డి పాల్గొన్నారు. విజయవాడ టైలర్స్ జేఏసీ ఆధ్వర్యంలో లెనిన్ సెంటర్ నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించారు. మోటార్ మెకానిక్స్ ఆధ్వర్యంలో జరిగిన మోటార్ సైకిల్ ర్యాలీలో వైఎస్సార్ సీపీ తూర్పు సమన్వయకర్త వంగవీటి రాధాకృష్ణ పాల్గొన్నారు. సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద సమైక్యాంధ్ర ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో నిరసన దీక్షలు జరిగాయి. సిద్ధార్థ మెడికల్ కాలేజీ వద్ద వైద్య ఉద్యోగులు వంటావార్పు నిర్వహించారు.