Constitution of India
-
చర్చ జరగాలి కానీ, ఇలాగా..?
పార్లమెంట్ శీతకాల సమావేశాలు ఈ సోమవారంతో ఆఖరి వారం వ్యవధిలోకి ప్రవేశించాయి. దేశంలో చలి పెరుగుతుంటే, సభలో వాతావరణం మాత్రం వేగంగా వేడెక్కుతోంది. మొన్న నవంబర్ 26న 75 వసంతాలు పూర్తి చేసుకున్న భారత రాజ్యాంగం అమలుపై అధికార, ప్రతిపక్షాల మధ్య విమర్శల పర్వం చూస్తే ఆ భావనే కలుగుతుంది. లోక్‌సభలో గత శుక్ర, శనివారాలు రాజ్యాంగ చర్చ జరిగితే, ఈ సోమ, మంగళవారాలు రాజ్యసభలో అది కొనసాగుతోంది. ‘ఒకే దేశం... ఒకే ఎన్నిక’ బిల్లుకు కావాల్సిన రాజ్యాంగ సవరణ మాట అటుంచితే, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు కాక గాంధీల కుటుంబ శ్రేయానికై కాంగ్రెస్ నిస్సిగ్గుగా రాజ్యాంగాన్ని సవరిస్తూ పోయిందని ఆర్థిక మంత్రి ఆరోపించడం తాజాగా అగ్గి రాజేసింది. అనేక జటిల సమస్యలకు రాజ్యాంగ సవరణలే ఏకైక పరిష్కారం అంటూ నెహ్రూకు సాక్షాత్తూ సర్దార్ పటేలే లేఖ రాశారంటూ రాజ్యసభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తిప్పికొట్టాల్సి వచ్చింది. వెరసి, భారత గణతంత్రానికి ఆత్మ లాంటి రాజ్యాంగంపై చర్చ పక్కదోవ పట్టి, పార్టీలు బురదజల్లుకొనే ప్రక్రియగా మారిపోయింది. నిజానికి, స్వాతంత్య్రానంతరం భారతదేశ భవితవ్యమెలా ఉంటుందన్న దానిపై బోలెడన్ని అనుమానాలు, జోస్యాలు వెలువడినా, మన రాజ్యాంగం పటాపంచలు చేసింది. నిజానికి, నవ యువ గణతంత్ర రాజ్యంగా మనం అనేక ఒడుదొడుకులను ఎదుర్కొన్నాం. వాటన్నిటినీ తట్టుకొని నిలవడంలోనూ విజయవంతమయ్యాం. భారత రాజ్యాంగం కాలపరీక్షకు నిలిచి, దేశానికి మూలస్తంభంగా నిలిచింది. ఇవాళ అనేక దేశాల్లో, చివరకు సోకాల్డ్ ప్రజాస్వామ్యాల్లోనూ అధికార బదలాయింపులో పలు సమస్యలను ఎదుర్కొంటున్నా, భారత్‌లో మాత్రం ప్రజాభీష్టాన్ని ప్రతిఫలించే అధికార బదలీ శాంతియుతంగా సాగిపోవడం మన రాజ్యాంగం వేసిన పటిష్ఠమైన పునాదికీ, చూపిన ఆచరణాత్మకమైన మార్గానికీ తార్కాణం. ఈ ఏడున్నర దశాబ్దాల సుదీర్ఘ ప్రస్థానంలో వేర్వేరు రాజకీయ పార్టీలు, కూటములు దేశాన్ని పాలించాయి. 1975లో ఎమర్జెన్సీ విధింపు లాంటి అశనిపాతాలు అడపాదడపా ఎదురైనా, ప్రభుత్వాలన్నీ దేశాన్ని ముందుకే నడిపాయి. క్రియాశీలక సజీవపత్రంగా రాజ్యాంగ రూపకర్తలు సంభావించిన భారత రాజ్యాంగం అంతర్గత సంకల్పబలం, స్థితిస్థాపక చైతన్యంతో నవ భారత అవసరాలకు తగ్గట్టుగా మార్పులతో నిత్య నూతనంగా నిలుస్తూ వచ్చింది. దానికి తగ్గట్టే రాజ్యాంగాన్ని ఇప్పటికి శతాధిక పర్యాయాలు సవరించడం జరిగింది. దేశ సామాజిక, ఆర్థిక ప్రయోజనాలకు తగ్గట్టు దేశం ముందుకు పోయేందుకు అనేక ఏళ్ళుగా భారత రాజ్యాంగం వీలు కల్పిస్తూనే వచ్చింది. అనేక పార్ష్వాలున్న ఈ రాజ్యాంగ ప్రస్థానాన్ని పార్లమెంట్లో చర్చిస్తున్నారంటే, భవిష్యత్తుపై దృష్టి సారిస్తారని భావించాం. రాజ్యాంగంలో పొందుపరిచిన ఆదర్శాలు, లక్ష్యాలు సాకారమయ్యేందుకు పథ నిర్దేశం జరుగుతుందని ఆశించాం. భారత స్వాతంత్య్ర శతవర్ష సమారోహం సాగే 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎలా తీర్చిదిద్దాలన్న దానిపై మేధా మథనం జరపాలని ఆకాంక్షించాం. ఆ దిశలో సామాన్యుల జీవితాలు మెరుగయ్యేలా లక్షించాల్సింది పోయి విమర్శల పర్వానికే చర్చ పరిమితమైపోవడం శోచనీయం. నిజానికి, ఎవరూ విమర్శలకు అతీతులు కారు. గాంధీ, నెహ్రూలైనా అంతే. వారిని విమర్శించ దలుచుకుంటే నేరుగా విమర్శించవచ్చు. అంతేకానీ, రాజ్యాంగంపై చర్చ పేరిట పరోక్షంగా కొంద రిపై బురద జల్లడం ఏమిటన్నది ఒక వాదన. తాజా చర్చ సందర్భంలో అధికార ఎన్డీఏ వర్గీయులు ఉద్దేశపూర్వకంగానే రాజ్యాంగ నిర్మాతల లక్ష్యాలను తప్పుబడుతున్నారని కూడా ఆరోపణ. అయితే, అసలు భావప్రకటనా స్వేచ్ఛపై సహేతుకమైన పరిమితులు పెట్టవచ్చంటూ తొలి రాజ్యాంగ సవరణ తెచ్చింది కాంగ్రెసే అని బీజేపీ ఎత్తిచూపుతోంది. స్వేచ్ఛ ఉండాలి నిజమే కానీ, అన్ని సమయాల్లోనూ అది నిర్నిబంధమైతే కష్టం గనక సహేతుకమైన పరిమితులు విధించవచ్చని అలా ప్రథమ సవరణతో రాజ్యాంగ రూపకర్తలే దిద్దుబాటు బాట పట్టారన్నది కాంగ్రెస్ వర్గీయుల ప్రతివాదన. రాజ్యాంగ అమలుకు అమృతోత్సవ వేళ చర్చ దాని అమలు తీరుతెన్నులు, భవిష్యత్ సవాళ్ళపైనే సాగాల్సింది. సామూహిక ఆత్మపరిశీలనకు దీన్ని అవకాశంగా మలుచుకోవాల్సింది. కానీ, జరుగుతున్నది వేరు. చర్చంతా రాజకీయ రంగు పులుముకొని, నెహ్రూ కుటుంబం, ఎమర్జెన్సీ, మోదీ సర్కార్ చుట్టూ సాగుతోంది. ఆరోపణలు, ప్రత్యారోపణలతో అవిశ్వాస తీర్మానంపై చర్చ ఫక్కీలోకి జారిపోయింది.1975 ఎమర్జెన్సీలోనైనా, ఇప్పుడు ‘అప్రకటిత ఎమర్జెన్సీ’ ఉందంటున్నా... రెండు సందర్భాల్లో పాలకుల చేతిలో నలిగిపోయింది రాజ్యాంగానికి గుండె లాంటి పౌరుల ప్రాథమిక హక్కులే అని విస్మరించరాదు. ఏళ్ళు గడుస్తున్నకొద్దీ సవాళ్ళు అధికరిస్తున్నాయి. లౌకికవాదం, సమాఖ్య వాదం, న్యాయవ్యవస్థ స్వతంత్రత, దుర్విచక్షణ లేకపోవడం, మైనారిటీల హక్కుల పరిరక్షణ లాంటి రాజ్యాంగ మౌలిక సూత్రాలపైనే ప్రశ్నార్థకాలు పొడసూపుతున్నాయి. సమాన అవకాశాల మాట దేవుడెరుగు, ఆర్థికంగా– సామాజికంగా– లింగపరంగా సమానత్వం సైతం నేటికీ పూజ్యం. అంత రాలు పెరుగుతున్న సమాజంలో అసమానతల నిర్మూలనకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామా? అన్ని పక్షాలూ ఆత్మావలోకనం చేసుకోవాలి. రాజకీయ పత్రం, దేశ రాజకీయాలకు పునాది అయినప్పటికీ, రాజ్యాంగమనేది అదే సమయంలో రాజకీయాలకు అతీతమైనది. దానిపై చర్చలో ప్రధాని సహా అందరూ సంకుచిత రాజకీయాలకే చోటిస్తే ఇంకేమనాలి? ఈ ధోరణి మారాలి. రాజ్యాంగం ఇన్నేళ్ళుగా జాతికి దిక్సూచిగా నిలిచింది. ప్రభుతకూ, పౌరులకూ ప్రజాస్వామ్య ఫర్మానాగా వెలిగింది. ఆ ఉజ్జ్వల స్ఫూర్తికి కట్టుబడడమే సమస్త సమస్యలకూ పరిష్కారం. సామాన్యుల హక్కులకు శ్రీరామరక్ష. -
విశ్వబంధు భారత్‌కు.. రాజ్యాంగమే పునాది
న్యూఢిల్లీ: రాజ్యాంగ స్ఫూర్తిని అనుసరిస్తూ సామాన్య ప్రజల జీవితాలను మెరుగ్గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కలిసికట్టుగా పని చేయాల్సిన బాధ్యత కార్యనిర్వాహక వర్గం, శాసననిర్వాహక వర్గం, న్యాయ వ్యవస్థపై ఉందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సూచించారు. పౌరుల ప్రాథమిక విధులను రాజ్యాంగంలో స్పష్టంగా నిర్దేశించారని చెప్పారు. దేశ ఐక్యత, సమగ్రత, సమాజంలో సామరస్యంతోపాటు మహిళల గౌరవాన్ని కాపాడడం పౌరుల విధి అని చెప్పారు. కార్యనిర్వాహక వర్గం, శాసననిర్వాహక వర్గం, న్యాయ వ్యవస్థతోపాటు ప్రజలు కూడా కలిసి క్రియాశీలకంగా పనిచేస్తే రాజ్యాంగ ఆశయాలకు బలం చేకూరుతుందని తెలిపారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేలా కేంద్ర ప్రభుత్వం గత కొన్నేళ్లలో పార్లమెంట్లో ఎన్నో చట్టాలు తీసుకొచ్చిందని గుర్తుచేశారు. సమాజంలో అన్ని వర్గాల అభివృద్ధి కోసం చర్యలు చేపట్టిందన్నారు. ప్రభుత్వ నిర్ణయాలతో ప్రజల జీవితాలు మెరుగుపడుతున్నాయని, వారి పురోభివృద్ధికి నూతన అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయని వివరించారు. భారత రాజ్యాంగాన్ని ఆమోదించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పాత పార్లమెంట్ భవనం సెంట్రల్ హాల్లో మంగళవారం నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవంలో రాష్ట్రపతి ప్రసంగించారు. కార్యక్రమానికి పార్లమెంట్ ఉభయ సభల సభ్యులు హాజరయ్యారు. మన రాజ్యాంగం ఒక ప్రగతిశీల పత్రం అని రాష్ట్రపతి పేర్కొన్నారు. దూరదృష్టి కలిగిన మన రాజ్యాంగ నిర్మాతలు మారుతున్న కాలానికి అనుగుణంగా నూతన ఆలోచనలను అందిపుచ్చుకొనే వ్యవస్థను అందించారని కొనియాడారు. సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ధికి సంబంధించి రాజ్యాంగం ద్వారా మనం ఎన్నో ఘనతలు సాధించామని హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ముర్ము ఇంకా ఏం మాట్లాడారంటే.. విశ్వబంధు భారత్ ‘‘దేశ ఐక్యత, సమగ్రతతోపాటు పర్యావరణాన్ని కాపాడుకోవడం, శాస్త్రీయ దృక్పథం పెంచుకోవడం, ప్రభుత్వ ఆస్తులను రక్షించుకోవడం, అభివృద్ధిలో దేశాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చడం పౌరుల ప్రాథమిక విధులు. నూతన పథంలో పయనిస్తే అంతర్జాతీయ వేదికలపై మన దేశానికి నూతన గుర్తింపును సాధించిపెట్టగలం. అంతర్జాతీయంగా శాంతి భద్రతలను పెంపొందించేలా కీలక పాత్ర పోషించడానికి రాజ్యాంగ నిర్మాతలు భారత్‌కు మార్గనిర్దేశం చేశారు. నేడు మన దేశం అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారింది. విశ్వబంధుగా ప్రపంచవ్యాప్తంగా చురుకైన పాత్ర పోషిస్తోంది. భారత ప్రజాస్వామ్య గణతంత్రానికి రాజ్యాంగమే బలమైన పునాది రాయి. ప్రజల సమ్మిళిత, వ్యక్తిగత గౌరవాన్ని రాజ్యాంగం కాపాడుతోంది. స్వాతంత్య్ర పోరాట ఫలితమే రాజ్యాంగం వచ్చే ఏడాది జనవరి 26వ తేదీన 75వ గణతంత్ర వేడుకలు నిర్వహించుకోబోతున్నాం. ఇప్పటిదాకా సాగిన మన ప్రయాణాన్ని సమీక్షించుకోవడానికి, భవిష్యత్తులో మరింత మెరుగైన ప్రయాణానికి ప్రణాళిక సిద్ధం చేసుకోవడానికి ఇలాంటి వేడుకలు ఎంతగానో తోడ్పడతాయి. మన ఐక్యతను బలోపేతం చేస్తాయి. జాతీయ లక్ష్యాలను సాధించడంలో మనమంతా కలిసకట్టుగా ఉన్నామని తెలియజేశాయి. ఎందరో మహామహులు దాదాపు మూడేళ్లపాటు కృషి చేయడంతో రాజ్యాంగం మన చేతికి వచ్చింది. నిజానికి సుదీర్ఘంగా జరిగిన స్వాతంత్య్ర పోరాట ఫలితమే భారత రాజ్యాంగం. ఈ పోరాట స్ఫూర్తి, ఆశయాలను రాజ్యాంగం ప్రతిబింబిస్తోంది. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే సమున్నత ఆశయలను రాజ్యాంగ పీఠికలో పొందుపర్చారు. ఇవే దశాబ్దాలుగా భారత్‌ను నిర్వచిస్తున్నాయి. స్వశక్తితో పైకి ఎదిగే, సమాజానికి సేవలందించే, తోటి మానవులకు సాయం అందించే వాతావరణాన్ని రాజ్యాంగ పీఠిక కల్పించింది. 2015 నుంచి సంవిధాన దివస్ జరుపుకుంటున్నాం. దీనివల్ల రాజ్యాంగంపై యువతలో అవగాహన పెరుగుతోంది. మీ ప్రవర్తనలో రాజ్యాంగ విలువలను, ఆశయాలను జోడించాలని ప్రజలందరినీ కోరుతున్నా. పౌరులంతా ప్రాథమిక విధులను నిర్వర్తించాలి. ‘2047 నాటికి వికసిత్ భారత్’ అనే లక్ష్యం దిశగా అంకితభావంతో ముందుకు సాగాలి’’ అని రాష్ట్రపతి పిలుపునిచ్చారు. రాజ్యాంగం ప్రకారం ప్రజలే అత్యున్నతం: జగదీప్ ధన్‌ఖడ్ రాజకీయ పార్టీలు దేశం కంటే మత విశ్వాసాలకు, స్వార్థ ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తే మన స్వాతంత్య్రం రెండోసారి ప్రమాదంలో పడుతుందని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చెప్పినట్లు ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ గుర్తుచేశారు. ఆయన పాత పార్లమెంట్ భవనంలో రాజ్యాంగ దినోత్సవంలో ఎంపీలను ఉద్దేశించి మాట్లాడారు. ప్రజలకు ప్రభావవంతంగా సేవలందించాలంటే చట్టసభల్లో అర్థవంతమైన చర్చలు, నిర్మాణాత్మక సంవాదాలు జరగాలని చెప్పారు. మన ప్రజాస్వామ్య దేవాలయాల పవిత్రతను పునరుద్ధరించాల్సిన సమయం వచ్చిందన్నారు. ‘భారతదేశ ప్రజలమైన మేము’ అని రాజ్యాంగ పీఠికలో ప్రారంభంలోనే పేర్కొన్నారని, ఇందులో లోతైన అర్థం ఉందని, ప్రజలే అత్యున్నతం అని తేల్చి చెప్పారు. ప్రజల గొంతుకగా పార్లమెంట్ పని చేస్తోందని వివరించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో శాసనవర్గం, కార్యనిర్వాహక వర్గం, న్యాయ వ్యవస్థ అనే మూడు మూలస్తంభాలను రాజ్యాంగం ఏర్పాటు చేసిందని తెలిపారు. రాజ్యాంగ సంస్థలు కలిసి పనిచేస్తే ప్రజాస్వామ్యం మరింత వెలుగులీనుతుందని సూచించారు. రాజ్యాంగం నిర్దేశించిన ప్రాథమిక విధులను ప్రజలంతా నిర్వర్తించాలని కోరారు. దేశ సార్వభౌమత్వాన్ని, ఐక్యతను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. దేశ ప్రయోజనాలకే అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. వికసిత్ భారత్ అనే లక్ష్య సాధనకు గతంలో కంటే ఇప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని జగదీప్ ధన్‌ఖడ్ వెల్లడించారు. రాజ్యాంగం ఒక ఉ్రత్పేరకం: ఓం బిర్లా చట్టసభల్లో నిర్మాణాత్మక, గౌరవప్రదమైన చర్చలు జరగాలని రాజ్యాంగ సభ సూచించినట్లు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా చెప్పారు. ఇదే సంప్రదాయాన్ని చట్టసభల సభ్యులు తూచా తప్పకుండా పాటించాలని కోరారు. రాజ్యాంగ దినోత్సవంలో ఓం బిర్లా ప్రసంగించారు. మన స్వాతంత్య్ర పోరాట వీరుల త్యాగం, అంకితభావం, దార్శనికతకు రాజ్యాంగం ఒక ప్రతీకగా నిలిచిందని పేర్కొన్నారు. సామాజిక మార్పునకు, ఆర్థిక ప్రగతికి రాజ్యాంగమే ఒక ఉ్రత్పేరకం అని చెప్పారు. సాధారణ ప్రజల స్థితిగతుల్లో ఎన్నో గణనీయమైన మార్పులు తీసుకొచ్చిందని, ప్రజాస్వామ్యం పట్ల వారి విశ్వాసాన్ని మరింత బలోపేతం చేసిందని వివరించారు. చట్టసభల్లో చక్కటి చర్చల ద్వారా రాజ్యాంగ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని ఎంపీలకు ఓం బిర్లా పిలుపునిచ్చారు. రాజ్యాంగ విలువల పట్ల మన తిరుగులేని అంకితభావం అంతర్జాతీయంగా భారతదేశ ప్రతిష్టను మరింత పెంచుతుందని ఉద్ఘాటించారు. రాజ్యాంగ దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ప్రజలతో కలిసి నిర్వహించాలని ఎంపీలకు లోక్‌సభ స్పీకర్ సూచించారు. -
దేశ ప్రజల గుండె చప్పుడు రాజ్యాంగం
భారత రాజ్యాంగం ఆమోదం పొందిన నవంబర్ 26ను ‘రాజ్యాంగ దినోత్సవం’గా జరుపుకొంటున్నాం. అయితే పాలన అందించే రాజకీయ పక్షాల్లో కొన్ని రాజ్యాంగ మూలాలూ, లక్ష్యాలనూ మరచి వ్యవహరించడమే బాధాకరం. టీ అమ్మిన సాధారణ పేద బాలుడు పెరిగి పెద్దవాడై ప్రధాని పదవిని పొందాడన్నా, ఒక భర్త చనిపోయిన స్త్రీ దేశ ప్రధాని అయ్యిందన్నా, అంటరానితనాన్ని ఎదుర్కొన్న జాతులు చదువుకుని ఉద్యోగాలు చేస్తున్నాయన్నా... ఒకటేమిటి ఈ దేశంలో అంతో ఇంతో మానవ విలువలూ, ప్రజా స్వామ్యం మనగలుగుతున్నాయంటే దానికి కారణం మన రాజ్యాంగమే. భారత రాజ్యాంగం ఒక విప్లవాత్మకమైన లిఖిత గ్రంథం. ప్రత్యామ్నాయ భావజాలంతో కూడిన దేశ అభివృద్ధికి సంబంధించిన పత్రం. దాన్ని రాయడానికి ఎందరు ఎన్ని విధాలుగా త్యాగం చేశారో మాటల్లో చెప్పడం కష్టమే. ముఖ్యంగా బాబా సాహెబ్ అంబేడ్కర్ పూర్తి సమయాన్ని, మేధస్సును రాజ్యాంగ రచనపై కేంద్రీకరించి తన ఆరోగ్యాన్ని సైతం పణంగా పెట్టారు.395 ఆర్టికల్స్, 8 షెడ్యూళ్ళు (ప్రస్తుతం 12 షెడ్యూళ్ళు), 22 భాగాలతో ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగంగా అవతరించింది మన రాజ్యాంగం. 11 సార్లు సమావేశమైన రాజ్యాంగ సభ 165 రోజుల పాటు సాగింది. 114 రోజులు ముసాయిదా రాజ్యాంగం గురించి చర్చ జరిగింది. 1946 డిసెంబర్ 9న మొట్టమొదటి సమావేశం జరిగితే 1947 ఆగస్టు 29న రాజ్యాంగ రచన సభ డ్రాఫ్టింగ్ కమిటీని ఎన్నుకుంది. 7,635 ఆర్టికల్స్ సవరణలను సభ ముందు ఉంచగా 2,473 సవరణలను ఆమోదించారు. 1949 నవంబర్ 26న రాజ్యాంగ సభ మన రాజ్యాగాన్ని ఆమోదించింది. మారుతున్న దేశ సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగాన్ని సవరించుకునే వెసులుబాటు కల్పించడం విశేషం. ప్రస్తుతం సెప్టెంబర్ 2023 వరకు 106 సవరణలు జరిగాయి. అయితే రాజకీయపార్టీలు, నాయకుల పనితీరు రాజ్యాంగం ఆశించిన విధంగా కాకుండా రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఉండటమే బాధాకరం. బహుళ జాతులూ, సంస్కృతులూ, మతాలూ, కులాలూ ఉన్న దేశంలో ‘ఒకే దేశం– ఒకే జాతి’ అనే ధోరణిలో కేంద్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో అనేక నిర్ణయాలు తీసుకుంటోంది. రాష్ట్రాల హక్కులను కాలరాసి రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా సమాఖ్య విధానానికి తూట్లు పొడుస్తోంది. రైతు వ్యతిరేక చట్టాలు, పౌరహక్కులను కాలరాసే చట్టాలు, మైనారిటీ వ్యతిరేక చట్టాల రూప కల్పనకు పాటుపడుతూ రాజ్యాంగ మూల సూత్రా లకు విరుద్ధంగా వ్యవహరిస్తోందనే విమర్శ ప్రస్తుత ప్రభుత్వంపై ఉంది.భారతదేశంలో రాజ్యాంగం ప్రమాదంలో ఉన్న దన్నది వాస్తవం. రాజ్యాంగాన్ని సమూలంగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయనేది ఇటీవలి ప్రజా స్వామ్యవాదుల ప్రధాన ఆందోళన. నిజంగా అదే జరిగితే దేశం సౌభ్రాతృత్వం కోల్పోయి... స్వాతంత్య్రం ప్రమాదంలో పడుతుంది. ‘నేను ఎంతో కష్టపడి సాధించిన ఈ హక్కుల గిడారును చేతనైతే ముందుకు తీసుకుని వెళ్ళండి లేదా అక్కడే వదిలి వేయండి.అంతేకానీ వెనక్కి మాత్రం లాగవద్దు’ అన్న బాబా సాహెబ్ మాటలు గుర్తెరిగి ప్రతి భారతీయుడూ బాధ్యత గల పౌరునిగా రాజ్యాంగాన్ని యథాతథంగా అంగీకరించాలి. తదనుగుణంగా వ్యవహరించాలి. భారతదేశం ఊపిరి, గౌరవం, ఉనికి రాజ్యాంగంలో నిక్షిప్తమై... దేశ ప్రజల గుండె చప్పుడై ఉంది. కావున యావత్ భారత ప్రజల పవిత్ర గ్రంథమైన భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడమే ప్రాథమిక బాధ్య తగా ఉండాలి.– డా‘‘ బోరుగడ్డ సుబ్బయ్య; అసిస్టెంట్ ప్రొఫెసర్, ఆంధ్రా యూనివర్సిటీ ‘ 94927 04401(నేడు 75వ రాజ్యాంగ దినోత్సవం) -
అక్షరానికి సంకెళ్లు నిలవగలవా?
నిజాలు చెప్పినందుకు కలాలకు సంకెళ్లు వేస్తామంటే, ఆ కలాలు వెన్ను చూపుతాయా? మరింత పదునెక్కి మును ముందుకు సాగుతూ అక్ష రాస్త్రాలని ‘నారాచాలు’గా సంధిస్తాయా? ప్రజాస్వామ్య దేశాల్లో పత్రికల గొంతు నొక్కేయాలని యత్నించిన నియంతలు చరిత్రలో ఎలా మిగిలిపోయారో తెలియంది ఏముంది? భారత రాజ్యాంగం పత్రికా స్వేచ్ఛకు ఇచ్చిన హక్కులేమిటో, కోర్టులు ఎన్నిసార్లు తమ తీర్పుల్లో ఈ విషయాన్ని స్పష్టం చేశాయో తెలుసుకుంటే పత్రికల గొంతు నొక్కేయాలని ఎవరూ ప్రయ త్నించరు. ఒకవేళ అధికార గర్వంతో అలా చేసినా చివ రికి చరిత్రలో అప్రజాస్వామిక వాదులుగా వారే మిగిలి పోతారు. కేసులు మాత్రం కొట్టి వేయబడతాయి.పత్రికా స్వేచ్ఛ మీద న్యాయస్థానాల్లో ఎన్నో ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ ఉన్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాశాడనే కారణంగా జర్నలిస్టు మీద క్రిమినల్ కేసులు పెట్టవద్దని లక్నోకి చెందిన కేసులో సుప్రీంకోర్టు చాలా విస్పష్టమైన ఆదేశాలిస్తూ పత్రిక స్వేచ్ఛ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. అసలు భారతదేశంలో పత్రికలకు ఉన్న రాజ్యాంగపర మైన హక్కుల గురించి ఈ రాజకీయ నాయకులు స్పష్టంగా తెలుసుకుంటే జర్నలిస్టులపై అక్రమ కేసులు బనాయించాలనే ప్రయత్నం చేయరు. గడిచిన మే నెలలో ‘న్యూస్ క్లిక్’ ఎడిటర్ ప్రబీర్æ అరెస్టుని సుప్రీంకోర్టు ఖండిస్తూ అతనిపై మోపిన ఆరోపణలు నిరాధారమైనవనీ, వాటికి హేతుబద్ధత లేదనీ వ్యాఖ్యానించింది. సరైన ఆధారాలు లేకుండా ఆరోపణలపై విశ్లేషణ చేయకుండా అరెస్టు చేయటం సరికాదని బాంబే హైకోర్టు డివిజన్ బెంచ్ ‘మోహిత్ అండ్ శ్యామ్ చందక్’ కేసులో ఆదేశించింది. జర్నలిస్టు అభిజిత్ అర్జున్ అరెస్టుపై వ్యాఖ్యానిస్తూ... అసలు ఈ అరెస్ట్‌కి ఎందుకు పాల్పడవలసి వచ్చిందో ఎంక్వయిరీ చేయాలని ముంబై పోలీస్ కమిషనర్‌కి ఆదేశాలు ఇచ్చింది ధర్మాసనం. డిప్యూటీ కమిషనర్ హోదా కలి గిన అధికారులతో విచారణ జరిపించి ఎనిమిది వారాల్లోగా ధర్మాసనానికి నివేదించాలని ఆదేశించింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కేసుల్ని ఉదాహరించవచ్చు. ఇక్కడ గమనించాల్సిందేమిటంటే ప్రభుత్వాలు తమ కున్న తాత్కాలిక అధికారాన్ని అడ్డం పెట్టుకొని తమకు నచ్చని వార్తలు ప్రచురించే జర్నలిస్టులను, ప్రసారం చేసే జర్నలిస్టులనూ అరెస్టు చేయమని ఆదేశాలు ఇవ్వ డంతో పోలీసులు తప్పనిసరిగా వారి ఆదేశాలు పాటించవలసి వస్తోంది. అయితే ఈ అక్రమ అరెస్టుల పట్ల కోర్టులు కఠినంగా వ్యవహరించడంతో భవిష్యత్తులో ఏ పోలీసులైతే అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారో వాళ్ళు న్యాయస్థానం ముందు కచ్చితంగా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. అది అలా ఉంటే, తమ అధికారానికి ఎదురు లేదని వ్యవహరించే పాలకులు సైతం జర్నలిస్టుల మీద దాస్టీకానికి పూనుకుంటే... వారు సైతం అందుకు భారీ మూల్యమే చెల్లించవలసి వస్తుంది. ఈ దేశంలో జర్నలిస్టులకు.... రాజకీయ నాయకులకు ఉన్న సౌఖ్యం, వసతులు, ఆర్థిక పరిపుష్టి లేకపోవచ్చు; కానీ వారిని మించిన బలమైన శక్తులు జర్నలిస్టులే అనే వాస్తవాన్ని విస్మరించడానికి వీల్లేదు. నాయకుల అధికారం తాత్కాలికం. కానీ వృత్తి జర్నలిస్టులు ఒకసారి జర్నలిజంలోకి ప్రవేశించిన తర్వాత ఎలాంటి ఒడిదు డుకులు ఎదురైనా, ఎలాంటి ఒత్తిళ్లు ఉన్నా , ఎలాంటి కష్టాలకు గురి కావలసి వచ్చినా, ఎలాంటి నష్టాలకు ఎర కావాల్సి వచ్చినా ప్రస్థానాన్ని కొనసాగిస్తారు. మాస్ మీడియా, కమ్యూనికేషన్ రంగంలో సాంకే తిక విప్లవం వచ్చిన తర్వాత... రాతపూర్వక, మౌఖిక, దృశ్య, శ్రవణ మాధ్యమాల ద్వారా కోట్లాది మందికి సమాచార వ్యాప్తి సులభతరమైంది. ఫలితంగా పార దర్శకత లేని ప్రభుత్వాలకూ, నిజాయితీ లోపించిన వ్యక్తులకూ ఇబ్బందిగా మారింది. దాంతో మీడియాపై దాడికి చట్టాలను ఆయుధాలుగా మార్చుకున్నారు వీరు. అందులో ప్రధానమైనది ‘పరువునష్టం చట్టం.’ ఒక వ్యక్తి పరువు, ప్రతిష్ఠకు హాని కలిగించే విధంగా మాట్లాడటం లేదా రాయడం పరువు నష్టం కిందికి వస్తుంది. భారతీయ శిక్షాస్మృతి, 1860 లోని సెక్షన్ 499 ప్రకారం ఇది నేరం. ఉద్దేశపూర్వకంగా ఒకరి ప్రతిష్ఠకు భంగం కలిగించడం, టెక్ట్స్, ఇమేజ్, కార్టూన్లు, క్యారి కేచర్లు ద్వారా వారిని ద్వేషించడం లేదా అవమానించడం చట్ట విరుద్ధం. దీని ఆసరాతో తమకు అనుకూ లంగా వార్తలు లేకపోతే, పరువునష్టం దావా వేయ డానికి తయారవుతారు.వీళ్ళకు అర్థం కాని విషయం ఏమిటంటే... విమర్శ సదుద్దేశంతో చేసినా, విస్తృత ప్రజాప్రయోజ నాలకు సంబంధించినదైనా అది పరువునష్టం దావా కిందికి రాదు. మీడియాకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కులు బలంగా ఉన్నాయి. వీటిని ప్రజలు కానీ, ప్రభుత్వాలు కానీ హరించలేవని కోర్టు తీర్పులు అనేకం వున్నాయి. తాత్కాలిక అధికార గర్వంతో మీడియా మీద వీరు పెట్టే కేసులు కొంత కాలానికి కొట్టి వేయబడతాయి. సమాచారాన్ని రాయడానికి, ప్రచురించడానికి, ప్రసారం చేయడానికి పత్రికలు, మీడియాకు కొన్ని హక్కులు ఉన్నాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఎ)లో వాక్ స్వాతంత్య్రం, భావ ప్రకటనా స్వేచ్ఛ నుంచి పత్రికలకు ఈ హక్కు లభించింది.వాక్ స్వాతంత్య్రం, భావ ప్రకటనా స్వేచ్ఛలో నోటి మాట, రాత, ముద్రణ, చిత్రాలు లేదా మరేదైనా మార్గం ద్వారా వ్యక్తీకరించే హక్కు ఉంటుంది. ఇందులో కమ్యూనికేషన్ స్వేచ్ఛ, ఒకరి అభిప్రాయాన్ని ప్రచారం చేసే లేదా ప్రచురించే హక్కు ఉన్నాయి.జైల్లో ఉన్న ఖైదీలను కూడా ఇంటర్వ్యూ చేసే హక్కు జర్నలిస్టులకు ఉంది. ‘ప్రభాదత్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా’ (1982) కేసులో జైలులో ఖైదీలను ఇంటర్వ్యూ చేయడానికి పత్రికలు ప్రయత్నించాయి. చారులతా జోషి (1999) కేసులో సుప్రీంకోర్టు తీహార్ జైలులో బబ్లూ శ్రీవాస్తవను ఇంటర్వ్యూ చేయడానికి అనుమతి ఇచ్చింది. ఈ సందర్భంగా అండర్ ట్రయల్ ఖైదీ ఇంటర్వ్యూ చేయడానికి సుముఖత వ్యక్తం చేస్తేనే ఇంటర్వ్యూ చేయవచ్చు లేదా ఫోటో తీయవచ్చు అని పేర్కొంది.ఇన్ని హక్కులు ఉన్న జర్నలిస్ట్‌లను కేవలం చిన్న ఉద్యోగస్తులు అనుకోవడం పొరపాటు. వాళ్లు ప్రజా స్వామ్య సౌధానికి వాచ్ డాగ్స్ అని గమనించాలి. ప్రజా ప్రతినిధులుగా వ్యవహరించేవారు చట్టాలకు లోబడి నడుచుకోవాలే కాని మనకు ఎదురేముంది? అనుకుంటే ఇటు ప్రజా కోర్ట్, అటు జ్యూడిషియల్ కోర్టులు చూస్తూ ఊరుకోవు. ప్రపంచంలో హిట్లర్ లాంటి నియంతలు కూడా ‘నేను 1000 ఫిరంగులకి భయపడను కానీ ఒక కలానికి భయపడతాను’ అని వ్యాఖ్యానించడం గమనార్హం.పి. విజయబాబు వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు,రాజ్యాంగ న్యాయశాస్త్ర పట్టభద్రుడు -
PM Narendra Modi: కుటుంబ పార్టీలు రాజ్యాంగానికి శత్రువులు
జమ్మూ: కుటుంబ పార్టీలైన కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ(పీడీపీ) భారత రాజ్యాంగానికి అతిపెద్ద శత్రువులని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. ఓటు బ్యాంక్ కోసం సమాజంలో అణగారిన వర్గాల హక్కులను కాలరాశాయని, రాజ్యాంగ స్ఫూర్తిని హత్య చేశాయని నిప్పులు చెరిగారు. ఆ మూడు పార్టీలు జమ్మూకశ్మీర్‌కు తీవ్ర గాయాలు చేశాయని ఆరోపించారు. జమ్మూకశీ్మర్ ప్రజలు తమ బిడ్డల బంగారు భవిష్యత్తు, శాంతి కోసం అవినీతి, ఉగ్రవాదం, వేర్పాటువాదం లేని మంచి ప్రభుత్వం కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు. శనివారం జమ్మూలోని ఎంఏఎం స్టేడియంలో ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో మూడు కుటుంబ పార్టీలకు గట్టిగా బుద్ధి చెప్పాలని ఇక్కడి ప్రజలు నిర్ణయించుకున్నారని పేర్కొన్నారు. అవినీతి, అక్రమాలు, అరాచకాలు, ఉగ్రవాదం, వేర్పాటువాదం, రక్తపాతం, ఉద్యోగాల్లో వివక్షను జనం కోరుకోవడం లేదని తేలి్చచెప్పారు. బీజేపీ ప్రభుత్వం రావాలన్నదే వారి ఆకాంక్ష అని స్పష్టంచేశారు. మొదటి రెండు దశల పోలింగ్ ఓటర్ల మనోగతాన్ని ప్రతిబింబిస్తోందని వెల్లడించారు. బీజేపీ పూర్తి మెజార్టీతో సొంతంగా అధికారంలోకి రావడం తథ్యమని ధీమా వ్యక్తంచేశారు. పాకిస్తాన్ భాషలో మాట్లాడుతున్న కాంగ్రెస్‌ను ప్రజలు క్షమిస్తారా అని మోదీ ప్రశ్నించారు. హరియాణాలో కాంగ్రెస్ వస్తే అస్థిరతే: మోదీ హిస్సార్: హరియాణాలో పొరపాటున కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అస్థిరత తప్పదని ప్రధాని మోదీ హెచ్చరించారు. ఆ పార్టీలో అంతర్గత పోరాటం సాగుతోందని, ముఖ్యమంత్రి పదవి కోసం నేతలంతా పోటీ పడుతున్నారని చెప్పారు. బాపు(భూపీందర్ సింగ్), బేటా(దీపేందర్ సింగ్) పోటీలో ఉన్నారని తెలిపారు. శనివారం హరియాణాలోని హిసార్‌లో ఎన్నికల ప్రచార ర్యాలీలో మోదీ మాట్లాడారు. -
మూలవాసుల అభివృద్ధా? మూలాల విధ్వంసమా?
స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లవుతున్నా దేశ అభివృద్ధి నమూనా మారడం లేదు. అభివృద్ధి ఫలాలు కొందరి దగ్గరే పోగుబడడం అంతకంతకూ పెరిగిపోతోంది. సాంస్కృతిక హననంతోపాటు మూలవాసుల పేదరికమూ హెచ్చవుతోంది.భారతదేశం ప్రపంచ దేశాల ముందు తలయెత్తుకొని నిలబడగలిగిన ప్రాకృతిక సంపదను కలిగి ఉంది. దాన్ని పరిరక్షించుకుంటూ, దేశ అభివృద్ధిని నిరంతరం పెంచి పోషించుకునే సూత్రాలు, అధికరణాలు రాజ్యాంగంలో ఎల్లెడలా పరచుకొని ఉన్నాయి. ముఖ్యంగా భారత రాజ్యాంగం మానవ హక్కుల పరిరక్షణలో బలమైన సూత్రాలను మనకు అందించింది. అధికరణం 46లో ‘బలహీన వర్గాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. బలహీన వర్గాలకు చెందిన ప్రజల (ప్రత్యేకించి షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగలకు చెందిన ప్రజలు) ఆర్థికాభివృద్ధికి, వారిలో విద్యావకాశాల అభివృద్ధికి ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధను తీసుకోవాలి. ఏ విధంగానూ దోపిడీకి గురి కాకుండా వారిని కాపాడాలి. వారికి సామాజికంగా అన్యాయం జరగకుండా చూడాల’ని ఉంది.కానీ, ఇవాళ అర్థికాభివృద్ధి పేరుతో సహజవనరులు, సాంస్కృతిక సంపద హననానికి గురవు తోందనేది వాస్తవం. దక్షిణ భారత దేశం పారిశ్రామికంగా మిగతా ప్రాంతాల కన్నా వేగంగా అభివృద్ధి చెందుతోంది. అయితే ఈ అభివృద్ధి క్రమంలో... వేల ఏళ్ల పాటు తరతరాలు వారసత్వంగా మనకు అందించిన సాంస్కృతిక సంపద ధ్వంసమవుతోంది. దక్షిణ భారతదేశ నవీన రాతియుగ సంస్కృతి మూలాలు అంతరించే పరిస్థితులు వచ్చాయని చరిత్రకారులు, పర్యావరణ శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. సమాజ పరిణామక్రమంలో కొంత కాలానికి ప్రభుత్వాలేర్పడ్డాయి. చాలాకాలం వరకు అప్పటి ప్రభుత్వాలు భూమి పైన శిస్తు వసూలుకే పరిమితమయ్యాయి. కాని, భూమిపై హక్కును ఏర్పరచుకొనలేదు. కాలక్రమంలో భారతదేశాన్ని అనేక స్వదేశీ, విదేశీ తెగలు పరిపాలించాయి. మొగలాయీ చక్రవర్తుల కాలంలో భూమిశిస్తు వసూలు బాధ్యత ప్రభుత్వ అధికారుల నుండి ప్రైవేటు వ్యక్తులకు బదిలీ అయింది. వారే జమీందారు లయ్యారు. బ్రిటీష్ వారి పాలనలో జమీందారులకు వారి అజమాయిషీలోని ఎస్టేటు లపై 1793లో లార్డ్ కారన్వాలిస్ ఆస్తి హక్కు నిచ్చారు. భూమి కాస్తా అమ్మకపు సరుకైంది. కరవు కాటకాల సమయాల్లో నిర్బంధపు శిస్తులు కట్టలేక భూమిని అమ్ముకున్న రైతులు భూమిలేని పేదలయ్యారు. హెచ్చుగా భూములను కొన్నవారేమో... వడ్డీ వ్యాపా రులు, భూస్వాములయ్యారు. భూమిని పోగొట్టుకున్న వారిలో చాలామంది కౌలు దారులయ్యారు. క్రమంగా భూస్వాముల నిర్బంధపు కౌలు వసూలును కౌలుదార్లు భరించలేని స్థితికి చేరారు. ఆ క్రమంలో వారు భూమిలేని గ్రామీణ పేదలయ్యారు. తిరిగి భూమిని పేదలకు పంచాలనే ఉద్యమాలు ప్రారంభమయ్యాయి, 1947 తర్వాత స్వతంత్ర భారతంలో ఈ ఉద్యమాలు ఊపందుకున్నాయి.1948లో జమీందారీ వ్యవస్థ రద్దు కాక పూర్వం మామూలు భూస్వాములకు సగటున 100 ఎకరాలుండేది. 1938లో వచ్చిన ప్రకాశం కమిటీ రిపోర్టు ఆధారంగా తయారుచేసిన ‘మద్రాసు ఎస్టేట్ రద్దు – రైత్వారీకి మార్పు బిల్లు’ 1949 ఏప్రిల్ 19న శాసనసభ ఆమోదం పొంది, 1950లో రాష్ట్రపతి ఆమోదముద్ర పడి చట్టమైంది. ఈ చట్టం ప్రకారం పర్మనెంట్ సెటిల్మెంట్ ఎస్టేటు భూములు, అడవులు, గనులు, ఖనిజాలు గల భూములన్నీ రాష్ట్ర ప్రభుత్వం అధీనంలోకి వచ్చాయి. జమీందారులకు పెద్ద ఎత్తున నష్టపరిహారం చెల్లిస్తూ, వారి సొంత సేద్యానికి సారవంతమైన వేలాది ఎకరాలు వదిలి వేయబడ్డాయి. దీనితో జమీందారులు బడా భూస్వాములయ్యారు.ప్రధానమైన వనరులన్నీ కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి వెళ్ళాక... దేశంలో కరవు, అవిద్య, అనారోగ్యం, దురాక్రమణలతో కూడిన పాలనా విధానాలు పెరుగుతున్నాయి. డా‘‘ బీఆర్ అంబేడ్కర్ ఆనాడే దక్షిణ భారత అస్తిత్వాన్ని గురించీ, భారతదేశంలోని ఇతర రాష్ట్రాల అస్తిత్వాల గురించి అనేక సూత్రాలు మనకు అందించారు. ముఖ్యంగా దక్షిణ భారత భూభాగంలో... స్థానిక భాషలు,సంస్కృతి, చరిత్ర, పురాతత్వ భావనలను పెంపొందించాలన్నారు. అంతేకాని వాటిని ఇతరులకు తాకట్టు పెట్టే విధానాలను అవలంబించరాదనీ, అందువల్ల భారతదేశం అంతర్గతంగా తాకట్టులోకి వెళ్ళే ప్రమాదం ఉందనీ చెప్పారు. నిజానికి ప్రస్తుత పాలకవర్గ నిష్క్రియాపర్వాన్ని అలా ఉంచితే... కాంగ్రెస్ నాయకత్వంలో ఉన్న ‘ఇండియా’ కూటమి కూడా దేశాన్ని తాకట్టు నుంచి విముక్తి చేసే విధంగా పార్లమెంటులో వాదించలేకపోతోంది. ఆ మాట ఒప్పుకోవాల్సిందే! కొన్ని కార్పొరేట్ శక్తులు వీరి వెనక కూడా ఉండడమే ఇందుకు ఒక కారణం కావచ్చు. ఇదే సమయంలో రాజ్యాంగ హక్కుల్ని కాపాడుకునే విషయంలో పార్లమెంటులోని దళిత బహుజన ఎం.పీలు నోరు మెదపకపోవడం వారి బానిసత్వాన్ని గుర్తు చేస్తోంది. నిజానికి ఈ దేశం ఇలా కార్పొరేట్ శక్తుల, అగ్రవర్ణ భూస్వామ్య శక్తుల చేతుల్లోకి వెళ్ళడానికి ప్రధాన కారణం పూనా ప్యాక్ట్ ద్వారా ఉమ్మడి నియోజక వర్గాల్లో గెలిచిన దళిత ఎంపీలు, ఎమ్మెల్యేలని చెప్పక తప్పదు. ఇప్పటికీ ఈ వర్గాలకు చెందిన ప్రజాప్రతినిధులు దళిత హక్కుల కోసం ఎలుగెత్తి మాట్లాడలేకపోతున్నారు అనేది స్పష్టమైన అంశం. అలాగే వామపక్షాలు కూడా అనేక సందర్భాల్లో దళిత బహుజనుల భూమి హక్కు మీద, కౌలుదార్ల హక్కుల మీద మాట్లాడటం తగ్గించారు.మరోపక్క సెంటు భూమి కూడా లేని వారు భారతదేశంలో 80 కోట్ల మంది ఉన్నారు. బ్యాంకులో అప్పుల్లో ఉన్నవారి సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. ప్రభుత్వాలు ప్రజలకు ఉత్పత్తి క్రమాన్ని నేర్పటం లేదు. ప్రజల్లో జీవశక్తినీ, ఆత్మ విశ్వాసాన్నీ, ఆత్మ గౌరవ స్ఫూర్తినీ, స్వీయ జీవన ప్రమాణాన్నీ పెంచినప్పుడే దేశం ఇతర దేశాలకు అప్పులు ఇవ్వగలిగిన స్థాయికి ఎదుగుతుంది. ఈనాడు దేశీయ భావన, జాతీయ భావన, రాజ్యాంగ స్ఫూర్తి ప్రతి ఒక్కరిలో పెంచాల్సిన బాధ్యత లౌకికవాద ప్రజాస్వామ్య శక్తుల చేతుల్లో ఉంది. రాజకీయ పార్టీల కన్నా ... ఎప్పుడూ ప్రజా ఉద్య మాలే దేశాన్ని మేల్కొలుపుతాయి. నిద్రావస్థలో మునిగిన సమాజాన్ని చైతన్యవంతం చేసి, అంబేడ్కర్ మార్గంలో ఈ దేశ సాంస్కృతిక వికాసానికి అందరం పాటుపడుదాం.డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త దళితోద్యమ నాయకుడు ‘ 98497 41695 -
చేసిన చట్టానికి... చేజేతులా తూట్లు!
భారతదేశం ప్రజాస్వామిక దేశం. ప్రజల హక్కులను కాపాడుతూ, ప్రజల కోణంలో పాలన సాగేందుకు దిక్సూచిగా రాజ్యాంగం ఉంది. అయితే ఇవాళ మహోన్నతమైన రాజ్యాంగ స్ఫూర్తి రాజకీయాల్లో కొరవడింది. రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలకు రాజ్యాంగాన్ని కేంద్ర బిందువుగా మార్చారు. అధికారమే పరమావధిగా ఎవరికి తోచిన విధంగా వారు ‘మీరే రాజ్యాంగాన్ని కాల రాస్తున్నారంటే... కాదు మీరే రాజ్యాంగానికి సమాధి కడుతున్నారని’ పరస్పరారోపణలు చేసుకుంటున్నారు. అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీతో పాటుగా కొన్ని ప్రాంతీయ పార్టీలు సైతం రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కుతూనే ఉన్నాయి. రాహుల్ గాంధీ రాజ్యాంగ ప్రతిని చేత బూని ఎన్నికల ప్రచారంలో, పార్లమెంటు సమావేశాల్లో చూపుతూ ‘రాజ్యాంగాన్ని కాపాడాలి’ అనే నినాదం ఇచ్చారు. తమ ఎన్నికల మేని ఫెస్టోలో ‘న్యాయపత్ర’లోని 13వ న్యాయ సూత్రంగా ‘ప్రజాప్రతినిధులు గెలిచిన సొంత పార్టీని వీడి మరొక పార్టీలో చేరితే వెనువెంటనే అనర్హత వేటు పడే విధంగా 10వ షెడ్యూలును సవరించి పార్టీ ఫిరాయింపులను నిరోధిస్తా’మని హామీ ఇచ్చారు. కానీ తెలంగాణలో కాంగ్రెస్ అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 63 స్థానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రతీకార ధోరణితో 39 స్థానాలను గెలుచు కున్న భారత రాష్ట్ర సమితి శాసన సభ్యులను, శాసన మండలి సభ్యులను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుని పార్టీ ఫిరాయింపులను ప్రోత్స హిస్తూ రాజ్యాంగానికి తూట్లు పొడుస్తోంది. తాము ఎన్నికల హామీగా ఏమిచ్చారో దాన్నే వారు స్వయంగా అతిక్రమించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకంగా కేంద్రంలో కాంగ్రెస్ అగ్రనాయకత్వం రాజ్యాంగాన్ని చేతబూని ప్రకటనలు ఇస్తుంటే... మరోవైపు తెలంగాణ రాష్ట్ర నాయకత్వం అందుకు పూర్తి భిన్నంగా బీఆర్ఎస్ శాసన సభ్యులు ఆరుగురిని దఫదఫాలుగా, శాసన మండలి సభ్యులు పదిమందిని ఒకేసారి చేర్చుకుంది. కాంగ్రెస్ ప్రధాని రాజీవ్ గాంధీ హయాంలో 1985లో 52వ రాజ్యాంగ సవరణ ద్వారా 10వ షెడ్యూల్లో 101, 102 (2), 190, 191 (2) అధికరణాల ద్వారా అమలులోకి తెచ్చిన పార్టీ ఫిరాయింపుల చట్టానికి ఈ చర్యతో కాంగ్రెస్ తూట్లు పొడిచినట్లే కదా! బీజేపీ సైతం ఫిరాయింపులకు వ్యతిరేకం అంటూనే గతంలో దాదాపు ఎనిమిది నుండి పది రాష్ట్రాల ప్రజా ప్రభుత్వాలను పడగొట్టి, మిత్రపక్షాలతో కలిసి అనైతిక ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన సంగతినీ మరువరాదు. 2014లో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో పదేండ్లు అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి కూడా తొలుత బలం పెంచుకోవాలనే ఆలోచనతో కాంగ్రెస్, టీడీపీ శాసన సభ్యు లను చేర్చుకున్నపటికీ న్యాయపరంగా చిక్కులు రావొచ్చనే ఆలోచనతో ఆ యా పార్టీల ‘సభా పక్షాలను’ విలీనం చేసుకుంది. అనాడు పలువురు రాజకీయ ప్రముఖులు, విశ్లేషకులు ఈ విలీనాలను తప్పు పట్టారు.తెలంగాణలో పార్టీలు మారిన ప్రజా ప్రతినిధులు అధికారమే పరమావధిగా వ్యవహరిస్తున్నారు. పదేండ్లు కారు పార్టీలో అధికారాన్ని అనుభవించి, ఆ పార్టీ అధికారం కోల్పోగానే రాజకీయ విలువలకు తిలోదకాలు ఇస్తూ గెలిచిన పార్టీ (కాంగ్రెస్)లోకి చేరడం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నది. వారిని నమ్ముకుని భుజానికెత్తుకొని గెలిపించిన కార్య కర్తలకు అండగా ఉండాల్సిన వీరు ఎన్నికైన పదవికి రాజీనామా చేయకుండా పార్టీ మార డాన్ని ప్రజలు గర్హిస్తున్నారు. పార్టీ ఫిరాయింపుల పట్ల రెండు నాలుకల ధోరణితో ఉన్న కాంగ్రెస్ పార్టీ ముందు ముందు ప్రజాక్షేత్రంలో ఎదురుదెబ్బ తినక తప్పదు.– పిన్నింటి విజయ్ కుమార్పొలిటికల్ సైన్స్ విద్యార్థి ‘ 90520 39109 -
హృదయం, ప్రాణం, రక్తంతో రాజ్యాంగాన్ని కాపాడుతాం: రాహుల్ గాంధీ
బనస్‌గావ్: కేంద్రంలో విపక్ష ‘ఇండియా’ కూటమి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లపై అమల్లో ఉన్న 50 శాతం పరిమితిని తొలగిస్తామని, బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు పెంచుతామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. భారత రాజ్యాంగాన్ని హృదయం, ప్రాణం, రక్తంతో కాపాడుతామని ప్రకటించారు. మంగళవారం ఉత్తరప్రదేశ్‌లోని బనస్‌గావ్‌లో ఎన్నికల ప్రచార సభలో రాహుల్ ప్రసంగించారు.కేవలం అంబానీకి, అదానీకి మేలు చేయడానికే ప్రధాని మోదీని భగవంతుడు భూమికిపైకి పంపించాడని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో సిద్ధాంతాల మధ్య పోరాటం కొనసాగుతోందన్నారు. ఇండియా కూటమి, రాజ్యాంగం ఒకవైపు, రాజ్యాంగాన్ని అంతం చేయాలనుకుంటున్న శక్తులు మరోవైపు ఉన్నాయని చెప్పారు. భారత రాజ్యాంగానికి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తన జీవితాన్ని అంకితం చేశారని ఉద్ఘాటించారు.దళితులకు రాజ్యాంగం తగిన గౌరవం కలి్పంచిందని గుర్తుచేశారు. అలాంటి రాజ్యాంగాన్ని రద్దు చేయాలని బీజేపీ కుట్రలు పన్నుతోందని మండిపడ్డారు. అంబేడ్కర్, జవహర్లాల్ నెహ్రూ ఇచ్చిన ఇచ్చిన రాజ్యాంగం జోలికి ఎవరూ రావొద్దని రాహుల్ గాంధీ హెచ్చరించారు. ఈ ఎన్నికలు చాలా కీలకం ప్రధాని నరేంద్ర మోదీ పదేళ్ల పాలనలో 22 మంది బిలియనీర్లను సృష్టించారని, తమకు అధికారం అప్పగిస్తే దేశంలో కోట్లాది మంది లక్షాధికారులను సృష్టిస్తామని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. మోదీ తన బిలియనీర్ మిత్రుల కోసం రూ.16 లక్షల కోట్ల రుణాలు రద్దు చేశారని, ఈ విషయాన్ని దేశం ఎప్పటికీ మర్చిపోదని అన్నారు. పేదలను లూటీ చేసి, పెద్దలకు కట్టబెట్టారని, ఆ సొమ్మంతా విదేశాలకు తరలిపోయిందని విమర్శించారు. ఈ ఎన్నికలు ప్రజలకు చాలా కీలకమని వెల్లడించారు. మన దేశాన్ని, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, రిజర్వేషన్లను కాపాడుకోవడానికి ఈ ఎన్నికలను ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు. -
దేశ భవిష్యత్తుకు దిక్సూచి!
ప్రపంచ మేధావి, ఆలోచనాపరుడు, తత్వవేత్త, భారత రాజ్యాంగ నిర్మాణ కర్త డా‘‘ బీఆర్ అంబేడ్కర్ 133వ జయంతి ప్రపంచవ్యాప్తంగా స్ఫూర్తిని నింపుతున్న ఒక చారిత్రక ఉత్సవం. అంబేడ్కర్ నిరంతర అధ్యయనం, విశ్లేషణ, తర్కం, హేతు వాదం, మానవతావాదం; ఆర్థిక,సాంఘిక, రాజకీయవాదాలు; బౌద్ధ విప్లవ ప్రస్థానం... ఆయన విస్తృతినీ, వ్యాప్తినీ, ప్రాపంచిక తాత్విక దృక్పథాన్నీ మనకు సాక్షాత్కరింప జేస్తున్నాయి. ఆయన ఒక వాల్టేర్ లాగా, రూసో లాగా ప్రపంచానికి ఒక నూతన దర్శనాన్ని అందించారు. ఆయన వ్యక్తిత్వంలో విద్యా జ్ఞానం, పరిశోధన, నైతికత, విమోచన కలిసి నడుస్తాయి. ఆయన బహుభాషా నిష్ణాతులు. మరాఠా భాష ఎంత బలంగా వచ్చో ఇంగ్లీషు, జర్మనీ కూడా అంతే నిశితంగా వచ్చు. ఆయన ఒక భాషా నిఘంటువు. ఆయన విద్యాభ్యాసంలో ఒక యుద్ధ ప్రక్రియ ఉంది. ఆయన ఆర్థిక శాస్త్ర నిపుణులు. అంబేడ్కర్ అపారమైన జ్ఞాపక శక్తి కలవారు. రాజ్యాంగ సభ డిబేట్స్‌లో కొన్ని వందల అంశాలు చూడకుండా చెప్పగలిగే వారు. ఆయన వాక్చాతుర్యా నికీ, వాదనా పటిమకూ, విషయ పరిజ్ఞానానికీ బాబు రాజేంద్ర ప్రసాద్, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, రాజాజీ వంటి వారు అచ్చెరువొందేవారు. అంబేడ్కర్ సున్నితమైన హాస్య చతురుడు. చక్కని చిరునవ్వుతో ఆయన కళ్ళు మెరుస్తూ ఉండేవి. ఆయన చూపుడు వేలు ప్రపంచానికి ఓ ప్రశ్నోపనిషత్తు వంటిది. అంబేడ్కర్ 1913లో న్యూయార్క్‌లోని కొలంబియా విశ్వవిద్యాలయంలో విద్యార్థిగా, పరిశోధకుడిగా ‘బ్రిటిష్ ఇండియాలో ప్రొవెన్షియల్ ఫైనాన్స్ పరిణామం’ అనే థీసిస్ రాసి ఎందరి మెప్పునో పొందారు. 1916లో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో డాక్టరేట్ పట్టా పుచ్చు కోవడం కోసం రాత్రింబవళ్లు శరీరం శుష్కించే వరకూ చదివారు. విద్య పట్ల అంబేడ్కర్ దృక్పథాన్ని గమనిస్తే ఆయన విద్య అంటే కేవలం అక్షరాస్యత అనో, చదువనో అనుకోలేదని స్పష్టమ వుతుంది. విద్య మనిషిని సంపూర్ణంగా మార్చగలిగే సాధనమ న్నది అంబేడ్కర్ నమ్మకం. ఈ విషయంలో ఆయనపై బౌద్ధ ధర్మ ప్రభావం ఉన్నట్లు అనిపిస్తుంది. బుద్ధుడి బోధనలు, తాత్విక చింతన కేంద్రంగానే అంబేడ్కర్ విద్యను అభ్యసించారు. విద్య పర మార్థం ప్రజ్ఞ, కరుణ, సమత అనీ, ఈ త్రిగుణాలు పెంపొందించినప్పుడే విద్యకు పరిపూర్ణత చేకూరుతుందనీ అంబేడ్కర్ భావించారు. సమాజంలో విద్య ద్వారా చైతన్యం వస్తుందన్న ఉద్దేశంతో ఆయన విద్యా వ్యాప్తి కోసం 1945 నుంచి ఒక ఉద్యమం ప్రారంభించారు. ‘పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ’ పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేసి, అనేక విద్యాలయాలు, కళాశాలల ఏర్పాటుకు కృషి చేశారు. జ్ఞానం, కరుణ అనేవి తాను స్థాపించిన సొసైటీ ప్రధాన లక్ష్యా లుగా పేర్కొన్న అంబేడ్కర్ ‘హక్కుల సాధన కోసం చదువుకోండి! సంఘటితం కండి! పోరాడండి! మీపైన మీరు విశ్వాసం పెంచుకోండి! ఏ రకంగా కూడా మనకు ఓటమి ఉండదు. ఇది విజయం కోసం చేస్తున్న పోరాటం, స్వేచ్ఛ కోసం సాగిస్తోన్న యుద్ధం, ఈ యుద్ధం మనం కోల్పోయిన వ్యక్తిత్వాన్ని తిరిగిపొందడానికి చేస్తున్నది’ అని ఉద్బోధించారు. సామాజిక మార్పు పోరాటాల ద్వారా, పోరాటాలు విజ్ఞానం ద్వారా, విజ్ఞానం విద్య ద్వారా అందుతాయన్నది అంబేడ్కర్ మార్గం. అలాగే దళితులు చదువు కోవడం ద్వారా సంప్రదాయ వృత్తుల్లో స్థిరపడే అవకాశం ఉండదనీ, తద్వారా తమ తరతరాల కులవృత్తులు చేస్తున్నందువల్ల ఎదురవుతున్న చిన్నచూపు తప్పుతుందనీ అంబేడ్కర్ ఆలోచన. అంబేడ్కర్ మనుస్మృతి భావజాలానికి ప్రత్యామ్నాయంగా భారత రాజ్యాంగాన్ని రూపొందించారు. ఆయన పాండిత్యం, విజ్ఞత, మానవతా దృష్టి, బౌద్ధనీతి, సమ సమాజ భావన, భారత రాజ్యాంగంలో సముచితంగా సమన్వయించబడ్డాయి. అంబేడ్క ర్లో కుల నిర్మూలనా భావం, దార్శనికత, అహింసాతత్వం, భారతదేశాన్ని రక్తపాతం లేని దేశంగా సృష్టించగలిగింది. రాజ్యాంగంలో స్త్రీలందరికీ చదువుకునే హక్కు ఇవ్వటం ద్వారానూ, అçస్పృశ్యులందరికీ రిజర్వేషన్ కల్పించడం ద్వారానూ, శూద్రులందరికీ హక్కులు కల్పించడం ద్వారానూ ఆయన సమ సమాజ నిర్మాణానికి పునాదులు వేశారు. అంబేడ్కర్ విద్యా విప్లవంతో పాటు రాజకీయోద్యమాన్నీ నడిపారు. 1936 ఆగస్టులో దళిత జాతుల సముద్ధరణకు ‘ఇండిపెండెంట్ లేబర్ పార్టీ’(ఐఎల్పీ)ని ఆయన స్థాపించారు. ఈ పార్టీ బొంబాయిలో షెడ్యూల్డ్ కులాలకు కేటాయించిన పది హేను సీట్లలో పదమూడింటిని కైవసం చేసుకుంది. జనరల్ సీట్లను కూడా రెండింటిని కైవసం చేసుకుంది. ఆయన ‘లేబర్’ అనే పదానికి ‘అణగదొక్కబడిన’ అనే అర్థాన్ని రూపొందించారు. ఆర్థికంగా, సాంఘికంగా అణగదొక్కబడిన వారందరినీ ఈ పార్టీ లోనికి తేవడానికి ప్రయత్నించారు. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సుల్లో కాంగ్రెస్ వ్యవహరించిన తీరును బట్టి ఆ పార్టీ దళితులకు ప్రాతినిధ్యం వహించడం లేదని డా‘‘ అంబేడ్కర్ స్పష్టం చేశారు. ఆ పార్టీని విస్తృత పరచాలనే ఉద్దేశ్యంతో అంబేడ్కర్ 1942 జూలైలో ఆలిండియా షెడ్యూల్డ్ క్యాస్ట్స్ ఫెడరేషన్ (ఏఐఎస్‌సీఎఫ్) ను స్థాపించారు. ఆ సందర్భంగా దళితుల సాంఘిక, ఆర్థిక హక్కు లను సాధించడానికి వారికి రాజకీయ అధికారం కావాలని ప్రబోధించారు. 1962లో విడుదల చేసిన ప్రణాళికలో ఆయన తన వామ పక్షాల భావాలను ప్రకటించారు. భారతీయుడైన ప్రతివాడూ ఆర్థిక, సాంఘిక స్వాతంత్య్రాలను పొందాలని నొక్కి వక్కాణించారు. ప్రతి మనిషికీ నిర్భయంతో కూడిన స్వేచ్ఛను సాధించడం ప్రభుత్వ బాధ్యత అని ప్రతిపాదించారు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలను ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ ప్రణాళిక అణగదొక్కబడ్డ వారి సాంఘిక సమానత్వాన్ని నొక్కి చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగస్తులకు బీమా పథకాన్ని తప్పనిసరిగా అమలు జరపాలని కోరారు. ఏఐఎస్‌సీఎఫ్ నుండి రిపబ్లికన్ పార్టీ వరకు నడిచిన దారిలో దళితుల కోసం ఆర్థిక, సాంఘిక, రాజకీయ సమానతల కోసం తన శక్తిని ధారపోశారు. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాను పార్టీగా ప్రకటించక ముందే ఆయన పరి నిర్వాణం చెందారు. ఈ విధంగా అంబేడ్కర్ సామాజికంగా, సాంస్కృతికంగా, రాజకీయంగా, తాత్వికంగా, భారతీయ సమాజాన్ని పునః నిర్మించటానికి కృషి చేశారు. ఆయన ప్రపంచ మానవునిగా ఎదిగారు, ప్రపంచ తత్వవేత్తలలో ఒకరిగా నిలిచారు. భారతదేశానికి ఎనలేని కీర్తి తెచ్చారు. ఆయన నిర్మించిన రాజ్యాంగమే మన దేశ భవి ష్యత్తుకు దిక్సూచి. ఆయన మార్గంలో నడుద్దాం. డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త దళితోద్యమ నాయకులు ‘ 98497 41695 (నేడు డా‘‘ బీఆర్ అంబేడ్కర్ జయంతి) -
రాజ్యాంగాన్ని మార్చే యత్నాలు: ఖర్గే
బెంగళూరు: దేశ రాజ్యాంగాన్ని మార్చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో దీనిని సమైక్యంగా ఉండి, గట్టిగా ఎదుర్కోలేకపోతే దేశంలో నియంతృత్వపాలన తథ్యమని ఆయన హెచ్చరించారు. ఆదివారం బెంగళూరులో జరిగిన ఒక కార్యక్రమంలో ఖర్గే ప్రసంగించారు. ‘రాజ్యాంగాన్ని మార్చేసేందుకు, పూర్తిగా లేకుండా చేసేందుకు చాలా మంది ప్రయత్నిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో గట్టిగా, ఐక్యంగా నిలబడకుంటే, దేశంలో నియంతృత్వం రావడం ఖాయం. నియంతృత్వం కావాలనుకుంటున్నారా లేక న్యాయంతో కూడిన జీవితాన్ని గడపాలనుకుంటున్నారా, అన్నది నిర్ణయించుకోవాల్సిన అవసరం చాలా ఉంది. రాజ్యాంగం మనుగడ సాధించిన పక్షంలో దేశం ఐక్యంగా ముందుకు సాగుతుంది. ప్రజాస్వామ్యం ఉంటే ప్రతి ఒక్కరూ సుభిక్షంగా జీవించగలుగుతారు. కానీ, ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని పరిరక్షించడం లేదు, రాజ్యాంగం ప్రకారం పనిచేయడం లేదు’అని ఖర్గే వ్యాఖ్యానించారు. అందుకే, రాజ్యాంగాన్ని కాపాడుకోవడం, దానికి కట్టుబడి ఉండటం ఎంతో ముఖ్యమని చెప్పారు. ఒక భావజాలాన్ని ప్రజలపై రుద్దేందుకు జరుగుతున్న ప్రయత్నాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. ప్రస్తుతం ఉన్న రాజ్యాంగాన్ని వదులుకుని కొత్త రాజ్యాంగాన్ని రూపొందించే కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. రాజ్యాంగ పరిరక్షణ గురించి మాట్లాడుతున్న ప్రధాని మోదీ.. ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రతిపక్షాల పాలిత రాష్ట్రాలు లేదా ప్రభుత్వాలను ఎందుకు పడగొడుతున్నారని ప్రశ్నించారు. ఇది ఎంతవరకు రాజ్యాంగబద్ధమైందని నిలదీశారు. ఇది ఇలాగే కొనసాగితే ఏదో ఒక రోజు దేశంలో నియంతృత్వం రావచ్చని అన్నారు. ప్రభుత్వ గ్యారెంటీయే కనీసం బీజేపీ ప్రభుత్వ గ్యారెంటీయే అని చెప్పకుండా మోదీ తన గ్యారెంటీ అని చెప్పుకోవడం ఏమిటన్నారు. ‘అది నీ గ్యారెంటీ ఎలా అవుతుంది? అది నీది కాదు. ప్రజలు డబ్బుతో అమలు చేసే గ్యారెంటీ’’ అన్నారు. -
రాజ్యాంగమే సమ సమాజానికి దిక్సూచి
భారతదేశంలో రాజ్యాంగం అమలైన జనవరి 26 ఒక మహత్తరమైన పండుగదినం. భారత రాజ్యాంగం సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాలను కలిగిస్తానని ప్రజలకు వాగ్దానం చేసింది. ఆలోచనా స్వేచ్ఛ, భావ ప్రకటనా స్వేచ్ఛ ఇస్తానని భరోసా ఇచ్చింది. సమాన హోదా, సమాన అవకాశాలు, సమైక్యతా భావన, సోదర భావన కలిగించడానికే రాజ్యాంగం రూపొందింది. సమతా భావాలను అంబేడ్కర్ రాజ్యాంగంలో పొందుపరిచారు. అమెరికా, బ్రిటన్ రాజ్యాంగాల నుంచి, ఫ్రెంచ్ విప్లవం నుంచి ఆయన స్ఫూర్తి పొందినా... బౌద్ధ తత్వంలోని ప్రేమ, కరుణ, ప్రజ్ఞ, మానవత్వం, సమానత్వం, స్వేచ్ఛ, తర్కం, ప్రశ్న వంటి అనేక భావాల్ని పొందుపర్చడం వల్లే, స్వాతంత్య్రం వచ్చిన తరువాత రక్తపాతం లేని సమాజంగా భారతదేశం రూపుదిద్దుకుంది. డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్... మహా మేధావి, ఆలోచనాపరుడు, లౌకికవాద శిఖరం, సమతా దర్శనకర్త, గొప్పవక్త, లోతైన రచయిత. ఆయన శైలిలో గాఢత, విశ్లేషణ బలంగా వుంటాయి. విద్యా సంపన్నమైన ఆయన భాషలో సరళత, అభివ్యక్తిలో సాంద్రత కనిపిస్తాయి. అంబేడ్కర్ మానవ హక్కుల పోరాట ధీరుడు. బౌద్ధంలో ఉన్న సామాజిక సమతా నీతిని రాజ్యాంగంలో పొందుపర్చారు. ఆయన జీవితంలో అస్పృశ్యతను ఎదుర్కోవడం ప్రధాన అంశం అయ్యింది. మానవోత్తేజితమైన, వైజ్ఞానికమైన ఎన్నో కార్యక్రమాల్లో అస్పృశ్యులకు చోటు లేకపోయిందని మథనపడ్డారు. అందువలననే అస్పృశ్యతా నివారణా చట్టం గురించి పోరాడారు. ఈ సమాజాన్ని అస్పృశ్యత లేని సమాజంగా రూపొందించాలని తపన పడ్డారు. దాని వల్ల ఎంతో మంది తమ ప్రతిభకు తగిన స్థానం లేక సంఘర్షణకు గురయ్యారు, అణచి వేయబడ్డారు. అంబేడ్కర్ ఒక తాత్వికుడు కూడా. కుల సమాజానికి ప్రత్యామ్నాయంగా కుల నిర్మూలనా సమాజాన్ని బోధించారు. అగ్రకుల రాజ్యాధికారంలో దళితులకు విముక్తి లేదని చాటారు. ప్రత్యామ్నాయ వ్యవస్థను రూపొందించుకోవడానికి రాజ్యాధికారం అవసరం అని ప్రబోధించారు. ఆయన రాజకీయ తత్వశాస్త్రం భావాత్మకమైంది కాదు... అది సాంఘిక, ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించగల సత్తా కలిగినది. బొంబాయి వంటి నగరాల్లో కూడా కులతత్వం వ్యాపించి ఉండ టంతో అంబేడ్కర్ సోదరులు అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. కుల తత్వపు గొడ్డలి వేటు వారిని చిన్నప్పుడే తాకింది. ఒకే పాఠశాలలో చదివే పిల్లలు ఒక కూజా నీళ్ళు తాగలేకపోవడం, తోటి విద్యార్థులు ఆ కూజాలోని నీళ్ళను పైనుంచి పోస్తే దోసిళ్ళు పట్టి త్రాగవలసి రావడం వంటి ఘటనలు అంబేడ్కర్ గుండెల్ని పిండివేశాయి. ఆ గాయాలే రాబోయే కాలంలో కుల నిర్మూలన గ్రంథం రాయడానికి పునాదులేశాయి. కేవలం నీటి దగ్గరే కాదు, భాష దగ్గర కూడా ఆయనకు అస్పృశ్యత ఎదురైంది. అంబేడ్కర్ హైస్కూల్లో ప్రత్యేక పాఠ్యభాగంగా సంస్కృతాన్ని కోరుకున్నారు. ఒక అస్పృశ్యుడు సంస్కృతం నేర్చుకోవడం ఏమిటని నిరాకరించారు. దాంతో పర్షియన్ భాషను తీసుకోవలసి వచ్చింది. కానీ సంస్కృతాన్ని స్వయంగా కష్టపడి నేర్చుకున్నారు. వాల్మీకి, వ్యాసుడు, కపిలుడు, లోకాయతులు ఇంకా ఎందరో బ్రాహ్మణేతరులు, క్షత్రియులు సంస్కృతంలో గ్రంథాలు రాశారు. ఎందరో పాశ్చాత్య పండితులు సంస్కృతం నేర్చుకుని, వేదాలు, ఉపనిషత్తులు, దర్శనాలు, కావ్యాలు, అన్నీ ఇంగ్లీషులోకి అనువాదం చేశారు. అంబేడ్కర్ కూడా వేదాలు, ఉపనిషత్తులు, దర్శనాలు అన్నింటినీ అధ్యయనం చేసి, వ్యాఖ్యానించారు. ఏ భాషైనా, ఏ మనిషైనా నేర్చుకోవచ్చని నిరూపించారు. అభివృద్ధిని తరచిచూస్తే... దేశం ఎంతగానో అభివృద్ధి చెందుతోందని ఇప్పుడు గొప్పగా చెప్పుకొంటున్నాం. కానీ గణతంత్ర దినోత్సవ వేళ కొన్ని కఠిన వాస్తవాలను మనం అంగీకరించాల్సి ఉంటుంది. 2023 ప్రపంచ ఆకలి సూచీలో 125 దేశాల్లో ఇండియా 111వ స్థానంలో ఉంది. దేశంలో 81.35 కోట్ల మందికి ఇప్పటికీ ఉచిత బియ్యం పంపిణీ చేయాల్సి వస్తున్నదంటేనే దేశం ఎక్కడ ఉన్నదో అర్థమవుతుంది. కూడు, గూడు, బట్ట లేని ప్రజలు ఇంకా ఉన్నప్పుడు రాజ్యాంగం అమలవుతున్నట్టా అనే ప్రశ్న ఎదురవుతుంది. అంబేడ్కర్ భూమిని జాతీయం చెయ్య మన్నారు. కానీ అదేమో కార్పోరేట్ చేతుల్లోకి వెళ్లిపోతోంది. ఇతర దేశాల నుంచి దిగుమతి అవుతున్న తిండి గింజల వల్ల ఇక్కడి వ్యవసాయం సంక్షోభంలో వుంది. ఇతర దేశాల నుంచి దిగుమతి అవుతున్న వస్త్రాల వల్ల చేనేత పరిశ్రమ కుంటుపడింది. భారతదేశంలో పేదరికం ఎందుకు ఉందంటే రాజ్యాంగాన్ని నూటికి 90 శాతం ఉల్లంఘించడం వల్లనే అని చెప్పొచ్చు. ప్రజలు ఇప్పటికీ అనారోగ్యంతో కునారిల్లుతున్నారు. పారిశుద్ధ్య వ్యవస్థ దెబ్బతింది. కేంద్ర ప్రభుత్వం పారిశుద్ధ్యంపై దృష్టి పెట్టినా, ఎన్నో పట్టణాలు ఇంకా మురికి కూపాలుగానే వున్నాయి. వందశాతం బహిరంగ మల విసర్జన రహిత రాష్ట్రాలుగా ప్రకటించినవాటిల్లో కూడా 71 శాతం మేరకే నిరోధించగలిగారని జాతీయ గణాంక కార్యాలయ సర్వే వెల్లడించింది. ఇళ్లు, వ్యాపార, పారిశ్రామిక సముదాయాల నుంచి వ్యర్థ జలాలను శుద్ధి చేసిన తరువాతే బయటకు వదిలే నగరాలకు ‘స్వచ్ఛ సర్వేక్షణ్’ పోటీలో వాటర్ ప్లస్ సర్టిఫికేషన్ ఇస్తారు. ఆ వ్యవస్థ సరిగ్గా లేని నగరాలకూ పురస్కారాలు ఇవ్వడం... పోటీ నిష్పాక్షికతపై సందేహాలు లేవనెత్తుతోంది. ఇకపోతే రోడ్లు నెత్తుటిమయం అవుతున్నాయి. దేశవ్యాప్తంగా ప్రతి గంటకూ 53 రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటే, 19 మంది మృత్యువాత పడుతున్నారని 2022 నాటి గణాంకాల్ని కేంద్ర సర్కారే ప్రస్తావిస్తోంది. అంతక్రితం ఏడాదితో పోలిస్తే ప్రమాదాల్లో 11.9 శాతం, మృతుల సంఖ్యలో 9.45 శాతం, క్షతగాత్రుల లెక్కలో 15.3 శాతం పెరుగుదల రహదార్ల రక్తదాహ తీవ్రతను కళ్లకు కడుతోంది. రోడ్డు ప్రమాద మృతుల్లో 18–45 ఏళ్ల వయస్కులే 69 శాతం దాకా ఉంటున్నారన్న వాస్తవం గుండెల్ని మెలిపెట్టేదే. కుటుంబ పోషణకు రోడ్డెక్కిన మనిషి అకాల మృత్యువాత పడితే, ఇంటిల్లిపాదీ రోడ్డున పడే దుఃస్థితి ఏటా లక్షల మంది అభాగ్యుల్ని దుఃఖసాగరంలో ముంచేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా రహదారి ప్రమాద మృతుల సంఖ్య అయిదు శాతం దాకా తగ్గితే, అంతకు రెట్టింపు ఇండియాలో పెరగడం నిశ్చేష్టపరుస్తోంది. రహదార్ల మారణహోమానికి కారణమేమిటో సుప్రీంకోర్టే నియమించిన నిపుణుల కమిటీ పూసగుచ్చినా, సరికొత్త మోటారు వాహనాల చట్టం ద్వారా అవ్యవస్థను ఊడ్చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించినా జరిగిందీ ఒరిగిందీ ఏమీ లేదు. వాహన వేగాన్ని 5 శాతం తగ్గించ గలిగినా ప్రమాద మరణాల్ని 30 శాతం దాకా నియంత్రించగల వీలుందని తెలిసినా ‘ఏడెనిమిది సెకన్లలోనే 100 కిలో మీటర్ల వేగం’ అందుకొనే శకటాలు ఎందుకు రోడ్డెక్కుతున్నట్లు? ఇకపోతే వాయు కాలుష్య భూతం భయపెడుతోంది. శారీరక మానసిక సమస్యలు పెంచి, ఏటా లక్షల కుటుంబాల్లో శోక సంద్రాల్ని ఉప్పొంగిస్తున్న వాయు కాలుష్య భూతం గర్భస్త పిండాల్ని సైతం కర్కశంగా కాటేస్తోంది. వాయు కాలుష్యంతో పోటీపడుతూ... గాలిలో, నీటిలో, భూమిపై అంతటా పరుచుకుంటున్న ప్లాస్టిక్ వ్యర్థాలు ఆరోగ్య, ఆహార రంగాల్లో పెను సంక్షోభం సృష్టిస్తున్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాలు గాలిలో ఉన్నా, భూగర్భ జలాల్లోకి చేరినా ప్రమా దమే. అవి మనుషుల దేహాల్లోకి చొచ్చుకుపోయి, శరీర కణాలను దెబ్బతీస్తాయనీ, క్యాన్సర్ల ముప్పు పెచ్చరిల్లుతుందనీ ఇప్పటికే పలు దేశాల శాస్త్రవేత్తలు, పరిశోధకులు హెచ్చరించారు. అందుకే అంబేడ్కర్ ఆశయాలు రాజ్యాంగంలో ప్రతిఫలిస్తు న్నాయా అన్నది పెద్ద ప్రశ్నగా మిగిలింది. నిజానికి రాజ్యాంగంలో ఆయన ఆలోచనలు ప్రతిఫలిస్తే 100 శాతం అక్షరాస్యత ఏర్పడుతుంది. విద్య మహోన్నత స్థాయికి చేరుతుంది. ప్రపంచం గర్వించే మేధో సంపన్నులు ఆవిర్భవిస్తారు. పేదరిక నిర్మూలన జరిగి, సమ సమాజం ఏర్పడుతుంది. స్త్రీలు ఆత్మ రక్షణతో, పురుషులతో సమానంగా జీవించగలుగుతారు. యువత శక్తి సంపన్నులై సంపదను సృష్టించగలుగుతారు. నిరుద్యోగం, పేదరికం లేని సమ సమాజం ఏర్పడుతుంది. అందుకే రాజ్యాంగ మార్గంలో నడుద్దాం! డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త దళితోద్యమ నాయకుడు ‘ 98497 41695 -
ప్రత్యామ్నాయ సాంస్కృతిక శిఖరం
ప్రపంచ మేధావిగా గుర్తింపు పొందిన అరుదైన భారతీయుడు డా‘‘ బీఆర్ అంబేడ్కర్. అమానవీయ పరిస్థితులను ఎదుర్కొంటూ, విద్యను ఆయుధంగా ఎంచి ఎన్నో ఉన్నత డిగ్రీలు పొంది దేశానికి రాజ్యాంగ రచనలో దీపధారి అయ్యారు. దళితులూ, ఆదివాసీలూ, మహిళలూ, ఇతర అణగారిన వర్గాలకు ఆయన ఒక ధైర్య వచనం. తన కాలంలోనే గాక, ఆ తరువాత కాలాన్నీ వెలిగించడానికి అక్షర సముచ్చయాన్ని నిర్మించిన మేధావి. భారత ఉపఖండంలో తన సౌజన్యం ద్వారా రక్తపాతాన్ని నివారించి, నిర్మాణాత్మక సామాజిక విప్లవాన్ని నడిపిన ప్రత్యామ్నాయ సాంస్కృతిక శిఖరం ఆయన. ఆ మహాను భావుడి జ్ఞాపకార్థం 125 అడుగుల భారీ విగ్రహాన్నీ, ఓ స్మృతి వనాన్నీ నిర్మించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజారాశుల ఆదరణను చూరగొంటోంది. జనవరి 19వ తేదీన విజయవాడ ‘అంబే డ్కర్ నగర్’గా వెలుగొందుతుంది. ప్రత్యామ్నాయ సంస్కృతీ నిర్మాణంలో స్వాతంత్య్రం తర్వాత కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు వెలుగొందిన అంబేడ్కర్ శిల్ప నిర్మాణం అత్యు న్నతమైంది, విస్తృతమైంది. దక్షిణ భారతదేశానికి నడిబొడ్డున ఉన్న విజయవాడలో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహ నిర్మాణం, ఆవిష్కరణ, స్మృతివన వికాసం చెరపలేని సంఘటనలు. అశోకుని సాంచీ స్తూపానికి ఎంత పేరు వస్తుందో విజయవాడలోని స్మృతివనానికీ అంతే పేరు వస్తుందనడం అతిశయోక్తి కాదు. బౌద్ధమతాన్ని స్వీకరించి బౌద్ధునిగా మహాపరినిర్వాణం పొందిన అంబేడ్కర్ జ్ఞాపకార్థం నిర్మించిన ఈ విగ్రహం కానీ, స్మృతివనం కానీ ప్రపంచ బౌద్ధ పర్యా టకులను ఆకర్షించడం తథ్యం. నిజానికి బౌద్ధానికి ఈ ప్రాంతం కొత్తేమీ కాదు. అశోకుని కాలంలోనే ఆంధ్ర ప్రదేశ్ ప్రాంతానికి బౌద్ధం విస్తరించింది. అమరావతి స్తూపం మొదటి దశ నిర్మాణాలు మౌర్యుల వాస్తు నిర్మాణాలనే పోలి ఉండటం, అనేక విద్దాంక నాణెములు (పంచ్ మార్క్డ్ కాయిన్స్) లభించడం, అశోకుని కాలపు నాటి బ్రాహ్మీ లిపిలోనే కొన్ని శాసనాలు లభించడాన్ని బట్టి ఆయన కాలంలోనే బౌద్ధం ఇక్కడికి వ్యాపించిందని చెప్పవచ్చు. అలాగే అప్పట్లోనే ఇవ్వాళ దళితులుగా వ్యవహరించ బడుతున్న జన సమూహాలు బౌద్ధాన్ని అవలంబించాయి. అమరావతి స్తూపంపై ఉన్న... ఓ చర్మకారుడు స్తూపానికి ఇచ్చిన దానాన్ని తెలియచేసే శాసనం ఇందుకు మంచి ఉదాహరణ. దళితులు, కులవృత్తులవారే ఆ నాటి స్తూప నిర్మాణానికి రాళ్లు, మట్టినీ మోశారు. అద్భుత శిల్పాలను మలిచారు. అందుకే భారతదేశ చరిత్రలో మొదటి సాంస్కృతిక విప్లవం బౌద్ధం నుండే ప్రారంభమైందని చెప్పవచ్చు. హిందూ మతోన్మాదం బౌద్ధ శిల్పాలను, స్తూపాలను, చైత్యాలను, ఆశ్రమాలను హింసాత్మకంగా కూల్చివేసింది. కానీ మళ్లీ డా‘‘ బీఆర్ అంబేడ్కర్ శిల్పంలో ఒక ప్రత్యామ్నాయ ప్రకాశిత, విభాసిత శిల్ప కాంతులు వెల్లివిరుస్తున్నాయి. అంబేడ్కర్ విగ్రహమే ఒక విశ్వవిద్యాలయంలా ఉంటుంది. ఆయన వేలు ఒక ప్రశ్నోపనిషత్తు. ఆయన విగ్రహం విద్యా వికాసానికి నిలువెత్తు నిదర్శనం. ఆయన ప్రపంచ మానవుడు. లండన్ హౌస్ ఆఫ్ కామన్స్ ముందు డా‘‘ బీఆర్ అంబేడ్కర్ నిలువెత్తు విగ్రహం భారత దేశ వ్యక్తిత్వాన్ని ప్రకాశింపచేస్తుంది. లండన్ మ్యూజియం లైబ్రరీలో ఆయన చిత్రపటం ప్రపంచ మేధావుల పంక్తిలో మెరుస్తుంది. లండన్ ఇండియన్ హౌస్‌లో ఆయన బంగారు విగ్రహం ఆయన జీవన సాఫల్యానికి గుర్తుగా వుంది. అంబేడ్కర్ పోరాటం ద్వారానే అధికార ప్రతిష్ఠ జరుగుతుందని నొక్కి వక్కాణించాడు. దళితులను దేవుడిపైన లేక సూపర్ మ్యాన్ పైన ఆధారపడవద్దని హెచ్చరించాడు. ‘మీపై మీరు విశ్వాసం ఉంచుకొని నడవండి. ఎవరిపైనా ఆధార పడకండి. నిజాయితీగా ఉండండి. ఎప్పుడూ సత్యాన్ని ఆశ్రయించండి. దేనికీ లోబడకండి. ఎవరికీ తలవంచకండి’ అని అంబేడ్కర్ పిలుపు నిచ్చాడు. అంబేడ్కర్ ఒక ప్రవక్త, దార్శనికుడు. ఆయన ఒక జీవన వ్యవస్థల నిర్మాత. అణగారిన ప్రజల గుండె దివ్వెలు వెలిగించిన భానుడు. ఆయన జీవించిన కాలంలోనే గాక ఆ తరువాత కాలాన్నీ వెలిగించడానికి అక్షర సముచ్చయాన్ని నిర్మించిన మేధావి. జాన్డ్యూ యిని అధ్యయనం చేసిన అంబేడ్కర్ ప్రజాస్వామ్య లౌకికవాది. భారత ఉపఖండంలో తన సౌజన్యం ద్వారా, రక్తపాతాన్ని నివారించి, నిర్మా ణాత్మక సామాజిక విప్లవాన్ని ఆయన నడిపించారు. ఇకపోతే అంబేడ్కర్ పార్క్‌ను మాయావతి గవర్నమెంట్ 125 కోట్ల బడ్జెట్‌తో రూపొందించింది. ప్రత్యామ్నాయ సంస్కృతిని ఆ పార్కు విస్తరించింది. అంబేడ్కర్, మహాత్మాఫూలే, పెరియార్, నారాయణ్ గురూ, సాహూ మహరాజ్ వంటి వారినే కాకుండా ఉత్తర ప్రదేశ్‌లో ఉన్న ఎందరో పోరాట వీరుల విగ్రహాలను ఆ పార్క్‌లో ఆవిష్కరించారు. ప్రత్యామ్నాయ సంస్కృతికి ఆ పార్కు నిలువెత్తు సాక్ష్యంగా నిలబడింది. వ్యక్తిత్వ నిర్మాణానికి సాంస్కృతిక విప్లవ పునరుజ్జీవానికి సాహిత్యంతోపాటు శిల్పసంపద కూడా ఎంతో ఉప యుక్తం. కొన్ని శిల్పాలు మానవ మస్తిష్కాన్ని ప్రజ్వలింపచేస్తాయి. భారతదేశంలోని ఆర్కిటెక్చర్ ప్రపంచ దేశాల్లో ఉన్న ఆర్కిటెక్చర్లను సమన్వయం చేసుకుంది. భారతదేశానికి వలస వచ్చిన కుషానులు, అరబ్బులు, తురుష్కులు, పారసీకులు ఎందరో భారతీయ శిల్ప సౌందర్యానికి మురిసిపోయారు. వారి శిల్పనైపుణ్యాలు, భారతీయ శిల్ప నైపుణ్యానికి సమన్వయించారు. ‘గాంధార శిల్పం’ వంటివి రూపు దిద్దుకున్నాయి. మన అమరావతి శిల్పం ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. భారతదేశంలో ఈనాడు ప్రత్యామ్నాయ శిల్పసంపద అభివృద్ధి చెందు తోంది. లండన్ హౌస్ ఆఫ్ కామన్స్ ముందు ఉన్న డా‘‘ బీఆర్ అంబే డ్కర్ నిలువెత్తు విగ్రహం స్ఫూర్తితో ప్రతి ఊరిలో అంబేడ్కర్ విగ్రహం ఉండాలని ‘ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ’ కృషి చేసింది. అనేక గ్రామాలకు ఆ మహానుభావుడి విగ్రహాలను అందించింది కూడా! ఈ సందర్భంగానే అంబేడ్కర్ 150 అడుగుల విగ్రహాన్ని ఉమ్మడి రాష్ట్ర సచివాలయం ముందు నిలపాలని చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోరాటం చేసింది. 40 రోజులు సచివాలయం ముందు ధర్నా చేసింది. అంబేడ్కర్ యువజన సంఘాలు, ప్రజా సంఘాలు, అన్ని పార్టీలూ సపోర్ట్ చేశాయి. అయితే అంబేడ్కర్ వ్యతిరేక భావ వాది, అగ్రవర్ణ కుల అహంకారి, రాజకీయ కపటి, మానవ వనరుల విధ్వంసకుడు, ప్రకృతి వనరుల దోపిడీదారు, నేర రాజకీయ కోవి దుడు, దళిత ద్రోహి నారా చంద్రబాబు నాయుడు అంబేడ్కర్ విగ్రహా నికి బదులు మహాత్మాగాంధీ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత కేసీఆర్ తెలంగాణ సచి వాలయం ముందే అంబేడ్కర్ విగ్రహాన్ని నిర్మించారు. ఏపీలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం విజయవాడ నడిబొడ్డున అంబేడ్కర్ విగ్ర హానికి పూనుకొని నిర్మించింది. జనవరి 19వ తేదీన ఈ విగ్రహ ఆవిష్కరణ జరగడం ఒక చరిత్రాత్మక సంఘటన. అంబేడ్కర్ విగ్రహ నిర్మాణంతో విజయవాడకు ప్రత్యామ్నాయ సంస్కృతి ప్రజ్వలనం వస్తుంది. అంతేగాకుండా చైనా, టిబెట్, థాయ్‌లాండ్, జపాన్, జర్మనీ, బర్మా, శ్రీలంక దేశాల నుండి యాత్రికులు వస్తారు. ఇక విజయవాడ భారతదేశానికే తలమానికమైన నగరంగా వెలుగొందుతుంది. కుల, మత, జాతి, లింగ భేదాలు తరమబడతాయి. ప్రపంచంలో పేరెన్నిక గన్న నగరాల్లో ఒకటిగా కీర్తించబడుతుంది. విద్యావ్యాప్తి పెరుగుతుంది. ‘బోధించు, సమీకరించు, పోరాడు’ అనే అంబేడ్కర్ నినా దాన్ని ఈ నిలువెత్తు విగ్రహం పదే పదే గుర్తుచేసి ప్రజారాశులను చైతన్యవంతం చేస్తుంది. అంబేడ్కర్ స్మృతివనం ఏమి చెప్తుందంటే పిల్లల్ని విద్యావంతులు చేసుకోండి. కుల, మత భేదాలు లేని సమసమాజాన్ని నిర్మించుకోండి. హింసలేని కరుణ, ప్రజ్ఞ, నీతి, ఆత్మీయత, అనుబంధం కలిగిన భారత రాజ్యాంగ సూత్ర నిబద్ధమైన ఒక సమాజాన్ని నిర్మించుకోండని ఎలుగెత్తి చాటుతుంది. ఇక విజయవాడ అంబేడ్కర్ నగర్ అవుతుంది. ప్రపంచ కీర్తిని పొందుతుంది. అంబేడ్కర్ స్మృతివనంలోని లైబ్రరీ,అంబేడ్కర్ చిత్రపటాల దృశ్య మాలిక సందర్శనం, అంబేడ్కర్ సమా వేశ మందిరం ప్రపంచ పర్యాటకులకు దృశ్యమాన సౌందర్యం. జ్ఞానభాండాగార సదృశం. బహుముఖ వ్యక్తిత్వానికి నిలువెత్తు నిద ర్శనం. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రపంచ పటంలో ఓ వెలుగుతున్న ప్రత్నా మ్నాయ వెలుగుల సంద్రం. ఆ వెలుగుల తరంగాలలో మనమూ ప్రకాశిద్దాం. ప్రజ్వరిల్లుదాం, ప్రమోదిద్దాం. ఇక పదండి ముందుకు అంబేడ్కర్ ఆశయాలతో... కత్తి పద్మారావు వ్యాసకర్త దళితోద్యమ నాయకుడు ‘ 98497 41695 (రేపు విజయవాడలో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణ) -
జమిలి అమలుకు అవరోధాలు
ఒక దేశ రాజకీయ నిర్మాణంలో వివిధ స్థాయులలో ఏకకాల ఎన్నికల కంటే అసెంబ్లీలకు, పార్లమెంట్ ఎన్నికలకు వేర్వేరు నిర్ణీత తేదీలు ఉండటం సర్వ సాధారణం. అయితే, భారత్‌లో ఆసక్తికరంగా లోక్‌సభ, అసెంబ్లీలకు జమిలి ఎన్నికలపై ఏకాభిప్రాయాన్ని రూపొందించడానికి పెద్ద ఎత్తున ప్రయ త్నాలు జరుగుతున్నాయి. కానీ, పార్లమెంటరీ కమిటీ నిశ్చితాభిప్రాయం ఏమిటంటే, రెండు దశల్లో ఎన్నికలు జరగాలన్నదే! కొన్ని రాష్ట్రాలకు లోక్‌సభ పదవీ కాలం మధ్యలోనూ, మరికొన్నింటికి లోక్‌సభతోపాటు ఎన్నికలు జరపాల్సి ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ, పదేపదే జరిగే ఎన్నికల ద్వారా అనవ సరంగా సమయం, ఖర్చు చేయకూడదనే ఆలోచన నుంచి వచ్చిన ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’ విధానం అనేది దాని అమలు సాధ్యతపైనే ఆధారపడి ఉంది. ఒక దేశం, ఒకే ఎన్నిక’ విధానం అమలుకు రాజ్యాంగ సవరణలు, ఇతర పరిశీలనల విషయమై ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ... దీనికి సంబంధించి ప్రజల సూచనలను కోరింది. ‘ఒక దేశం, ఒకే ఎన్నికలు’ అనే ఆలోచనకు ప్రధాన కారణం సమయం, ఖర్చు, ఆదా చేయడం. ఈ రెండు అంశాలు ప్రపంచవ్యాప్తంగా వర్తిస్తాయి. కానీ, సమాఖ్య పార్లమెంటరీ ప్రజాస్వామ్య దేశాలలో దాదాపు ఎక్కడా సమాఖ్య స్థాయిలో, ప్రాంతీయ (రాష్ట్ర) స్థాయులలో ఏకకాల ఎన్నికలు జరగడం లేదు. నిజానికి సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, చట్టం– న్యాయంపై ఏర్పర్చిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ, ఏకకాల ఎన్నికల అంశాన్ని పరిశీలించిన 79వ నివేదిక... ప్రపంచవ్యాప్తంగా దక్షిణాఫ్రికా, స్వీడన్ దేశాల్లోని రెండు కేసులను మాత్రమే ఉదాహరించింది. సార్వత్రిక వయోజన ఓటు హక్కును ప్రతి పాదిస్తున్న దక్షిణాఫ్రికాలో ఎన్నికలు 1994లో మాత్రమే ప్రారంభమయ్యాయి. స్వాతంత్య్ర పోరా టానికి నాయకత్వం వహించిన ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్... సమాఖ్య, ప్రాంతీయ స్థాయులలో (వెస్ట్రన్ కేప్ మినహా) దేశమంతటా విజయం సాధించడం కొనసాగించింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మొదటి 25 ఏళ్లలో, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా గెలుస్తూ వచ్చిన భారతదేశ పరి స్థితికి ఇది భిన్నమైనది కాదు. భారతదేశంలో మరింత స్పర్థాత్మక రాజకీయ దృశ్యం కారణంగా, ఆ తర్వాత హంగ్ అసెంబ్లీలు (హంగ్ పార్లమెంటు కూడా), పార్టీని మొత్తంగా ఖాళీ చేసి వేరే పార్టీలోకి గెంతేయడం (ఫ్లోర్ క్రాసింగ్) మొదలైనవి కనిపించడం ప్రారంభమైంది. ఫలితంగా చట్టసభల రద్దు, ఎన్నికలు, వివిధ సమయాల్లో పార్లమెంటుకు, రాష్ట్రాలకు (శాసనసభ లేకుండా) ఆరు నెలల కంటే ఎక్కువ విరామం ఏర్పడుతూ వచ్చింది. కేంద్రంలో, రాష్ట్రాలలో ఇలాంటి స్థితి ప్రజాస్వా మ్యానికి ఆమోదయోగ్యం కాదు. పైగా భారత రాజ్యాంగం దీనికి అనుమతించదు. స్వీడన్ విషయానికి వస్తే ఆ దేశం మునిసి పాలిటీలు, రీజియన్లలో ఏకీకృత ప్రభుత్వాన్ని కలిగి ఉంది, కానీ రీజియన్లలో మాత్రం ఫెడరల్ వ్యవస్థలోని ప్రావిన్సుల వలె ఉండదు. పైగా వాటి మధ్యన క్రమానుగత సంబంధం లేదు. ముఖ్యంగా, రెండూ వేర్వేరు రకాల పనులను చేపట్టే స్థానిక ప్రభుత్వ రూపాలు. స్వీడిష్ రాజ్యాంగం ముందస్తు ఎన్నికలను అనుమతిస్తుంది. అయితే ఇవి రద్దు అయిన కాలం నుండి మిగిలి ఉన్న కాలానికి మాత్రమే పరిమిత మవుతాయి. ఒక దేశంలోని రాజకీయ నిర్మాణంలో వివిధ స్థాయులలో ఏకకాల ఎన్నికల కంటే అసెంబ్లీలు, సమాఖ్య పార్లమెంట్ల ఎన్నికలకు నిర్ణీత తేదీలు ఉండటం చాలా సాధారణ లక్షణం. పార్లమెంటరీ ప్రభుత్వ రూపాన్ని కలిగి ఉన్న కెనడా సమాఖ్య వ్యవస్థ ఫెడరల్ స్థాయిలోనూ, దాని ప్రావిన్సు లలోనూ రెండు చట్టాలను రూపొందించింది. ఎన్నికల నిర్వహణకు ఒక నిర్ణీత తేదీని ప్రతి పాదిస్తుంది, ఆ తేదీ ప్రావిన్స్ నుండి ప్రావిన్స్‌కు మారుతూ ఉంటుంది. ఫెడరల్ ఎన్నికల షెడ్యూల్ వేరొక దానిని అనుసరిస్తుంది. ఆస్ట్రేలియాలో ఫెడ రల్ పార్లమెంట్, రాష్ట్ర శాసనసభల (వాటిలో చాలా వరకు) కాలావధులు వరుసగా మూడు, నాలుగు సంవత్సరాలు ఉంటాయి. తద్వారా అక్కడ జమిలి ఎన్నికలను మినహాయించారు. ‘నిర్దిష్ట తేదీ, పదవీకాలం’ ఎన్నికల నమూనా తక్షణమే అమెరికాను గుర్తు చేస్తుంది. అక్కడ అధ్యక్ష, గవర్నర్ ఎన్నికలు ప్రతి నాలుగు సంవ త్సరాలకు ఒకసారి మాత్రమే జరుగుతాయి. అధ్యక్షుడు లేదా గవర్నర్ పని చేయనట్లయితే వారి స్థానంలోకి రాగల యోగ్యత ఉన్నవారి కోసం ఒక వ్యవస్థ అమలులో ఉంది. ఆ ప్రక్రియ ద్వారా పూర్తి కాలాన్ని కొనసాగించడం సాధ్యమవుతుంది, అయితే ఇది కొన్నిసార్లు ‘ప్రజల స్థాయిలో’ ఎన్ని కల్లో పోటీ చేయకుండానే 1974లో గెరాల్డ్ ఫోర్డ్ అధ్యక్షుడిగా మారడం వంటి క్రమరాహిత్యాలకు దారి తీస్తుంది. అంతేకాకుండా, ప్రతి రెండు సంవ త్సరాలకు ఒకసారి అమెరికా కాంగ్రెస్‌లో, రాష్ట్రాల అసెంబ్లీలలో ప్రతినిధుల సభకు ఎన్నికలు జరుగు తాయి. ప్రైమరీలకు సంబంధించి అమెరికన్ సంప్ర దాయం ప్రకారం, దేశం ఆచరణాత్మకంగా ప్రతి సంవత్సరం ఎన్నికల మోడ్‌లో ఉంటుంది. భారత్‌లో ఆసక్తికరంగా లోక్‌సభ, అసెంబ్లీలకు జమిలి ఎన్నికలపై ఏకాభిప్రాయాన్ని రూపొందించడానికి పెద్ద ప్రయత్నాలు జరిగినప్పటికీ, పార్లమెంటరీ కమిటీ నిశ్చితాభిప్రాయం ఏమి టంటే – రెండు దశల్లో ఎన్నికలు జరగాలన్నదే! కొన్ని రాష్ట్రాలకు లోక్‌సభ పదవీకాలం మధ్య లోనూ, మరి కొన్నింటికి లోక్‌సభతోపాటు ఎన్ని కలు జరపాల్సి ఉంటుంది. సమాఖ్య, ప్రాదేశిక ఎన్నికలను వేరు చేయడం వల్ల ఓటర్లు తమ రాష్ట్రం లేదా ప్రావిన్స్‌లో ఉన్న నాయకులు లేదా జాతీయ ఎన్నికల సమస్యల కారణంగా ఇటూ అటూ అవగల సంభావ్యతకు గురికాకుండా ఉంటారని నమ్మకం. పోరులో ఉన్న ప్రాంతీయ పార్టీలకు (లేదా పార్టీలకు) ప్రత్యేక గుర్తింపు లేనప్పుడు అలాగే ఓటర్లు సులభంగా గుర్తించగలిగేలా పార్లమెంటరీ, అసెంబ్లీ ఎన్నికలకు మధ్య తేడాను సూచించే కారణం లేనప్పుడు ఇది జరిగే అవకాశం ఉందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ, పదేపదే జరిగే ఎన్నికల ద్వారా అనవసరంగా సమయం, డబ్బులు ఖర్చు చేయకూడదనే ఆలోచన ఆమోదయోగ్యమైనదే. జర్మనీలో ఇటీవల నేపాల్ అనుభవాల నుండి, ఎక్కువ రాజకీయ సుస్థిరతను అందించే రాజ్యాంగపరమైన నిబంధనలు సాధ్యమయ్యే అవకాశం కనిపించింది. ఉదాహరణకు, జర్మన్ బేసిక్ లా, 2015 నేపాలీ రాజ్యాంగం అవిశ్వాసంలో సాను కూల ఓట్లను మాత్రమే అనుమతిస్తాయి. అటువంటి తీర్మానంతో పాటు తదుపరి నాయకుడి పేరు కూడా ఉండాలి. బ్రిటన్ లో, కెనడాలో కూడా పార్లమెంటు నిబంధనలను పరిష్కరించే ప్రయత్నాలు... కామన్వెల్త్ సంప్రదాయం ద్వారా సభను రద్దు చేసి, తాజా తీర్పును కోరే హక్కును ప్రధానమంత్రి కలిగి ఉండటం ద్వారా విఫలమయ్యాయి. నేపాల్‌లో అదే సంప్రదాయాన్ని అమలు చేయాలని కోరినప్పుడు, దానిని సుప్రీంకోర్టు 2021లో రెండు సందర్భాల్లో అనుమతించకపోగా, కొత్త నాయకుడిని ఎన్నుకో మని సభను కోరింది. మధ్యంతర ఎన్నికలపై ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా 2017లో ఎన్ని కైన సభ పూర్తి ఐదేళ్ల కాల వ్యవధిలో పాలన సాగించేలా అది దోహదపడింది. మంజీవ్ సింగ్ పురి వ్యాసకర్త భారత మాజీ రాయబారి -
ఇక్కడ ముస్లిమ్ కావడం నేరమా?
భారత రాజ్యాంగం భారతదేశాన్ని లౌకికరాజ్యంగా నిర్వచించింది. అందులోని లౌకిక భావానికి తీవ్రమైన సవాలుగా పరిణమిస్తున్న ఘటనలు నేడు దేశంలో అనేకచోట్ల సంభవిస్తున్నాయి. అధిక సంఖ్యాకుల ప్రాధాన్యాలకు కట్టుబడి అల్పసంఖ్యాకులు, ముఖ్యంగా ముస్లింలు జీవించక తప్పదనే వాస్తవాన్ని పాలనాపరమైన నిర్ణయాలు బలపరుస్తున్నాయి. దీనివల్ల ‘అధిక సంఖ్యాకుల దేశంలో అల్పసంఖ్యాకులుగా ఉండటం అనేది ఎలాంటిది?’ అనే ప్రశ్న రావడంలో ఆశ్చర్యమేమీ లేదు. కానీ, ఆ ప్రశ్న అడిగే భారతీయుల సంఖ్య నానాటికీ ఎక్కువవుతుండటం గురించే మనం ఆందోళన చెందాలి. ఆఖరికి, ఉనికి వంటి అతి ముఖ్యమైన గుర్తింపు నిరాకరణకు కూడా ఒక వర్గాన్ని గురి చేయడం సమ్మతం అవుతుందా? వాదనలకిది తావులేని ప్రశ్న కాకున్నా, ‘‘భారతదేశంలో ముస్లింగా ఉండటం ఎలాంటిది?’’ అని మనం ఎక్కువగా అడుగుతుండటాన్ని అత్యంత దురదృష్టకరమైన అభియోగాలలో ఒకటిగా నేడు మనదేశం ఎదుర్కొంటూ ఉంది. ‘‘భారతదేశంలో ముస్లింగా ఉండటమన్నది ఎలాంటిది?’’ అనే ఈ ప్రశ్నకు జవాబు – ఒక హిందువు, క్రిస్టియన్, సిక్కు, బౌద్ధ, జైన, పార్శీ లేదా నాస్తికుడిగా ఉండటం ఎలాంటిది అనే ప్రశ్నకు వచ్చే సమాధానానికి భిన్నంగా ఏమీ ఉండనవసరం లేదు. కానీ ఉంటోంది! అలా ఎందుకు ఉంటున్నదో... జియా ఉస్ సలామ్ తాజా పుస్తకం ‘బీయింగ్ ముస్లిం ఇన్ హిందూ ఇండియా: ఎ క్రిటికల్ వ్యూ’... కలవర పాటును కలిగించే వివరాలతో విశదీకరిస్తోంది. కాస్త వెనక్కెళ్లి ముందుకొస్తాను. కానీ ఒకటి గుర్తుంచుకోవాలి. గత దశాబ్ద కాలంలో పరిస్థితి ఇంతని అంతని చెప్పలేనంతగా దిగజారిపోయింది. దేశంలో ముస్లింల జనాభా 15 శాతం. కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులలో వారి వాటా కేవలం 4.9 శాతం. పారా మిలిటరీ సైనిక దళాల్లో 4.6 శాతం. ఐయ్యేఎస్‌లు, ఐఎఫ్ఎస్లు, ఐపీఎస్‌లలో 3.2 శాతం. సైన్యంలో బహుశా తక్కువలో తక్కువగా 1 శాతం. 2006 సచార్ కమిటీ నివేదిక ప్రకారం... ముస్లింలు ఆర్థికంగా, సామాజికంగా షెడ్యూల్డు కులాలు, తెగల కంటే కూడా మరీ అధ్వా న్నమైన జీవన స్థితిగతులలో ఉన్నారన్నది మనకు తెలిసిన విషయమే. రాజకీయాలలో సైతం, ఒకప్పుడు వారి స్వరం వినిపించిన చోట ఇప్పుడది క్షీణిస్తూ ఉండటం మాత్రమే కాదు, కొన్ని చోట్ల వెనక్కు మళ్లుతూ కూడా ఉంది. దామాషా ప్రకారం ముస్లింలకు లోక్‌సభలో 74 సీట్లు ఉండాలి. కానీ ఉన్నది 27 మంది. మన 28 రాష్ట్రాలలో ఒక్క రాష్ట్రానికి కూడా ముస్లిం ముఖ్యమంత్రి లేరు. 15 రాష్ట్రాలలో ముస్లిం ఎంపీలే లేరు. 10 రాష్ట్రాలలో మాత్రమే మైనారిటీ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఒక ముస్లిం ఉన్నారు. అదేమీ విశేషం కాదు కదా! నిజానికి ఏ పార్టీ కూడా భారతీయ జనతాపార్టీ అంత కరాఖండిగా ముస్లింలకు ముఖం చాటేయలేదు. 2014లో గానీ, 2019లో గానీ బీజేపీ ఒక్క ముస్లింను కూడా లోక్‌సభ ఎంపీగా ఎన్నికలకు ఎంపిక చేసుకోలేదు. నేటికీ ఆ పార్టీ కనీసం రాజ్యసభకు ఎంచుకున్న ముస్లిం ఎంపీ ఒక్కరు కూడా లేరు. కర్ణాటకలో 14 శాతం మంది, ఉత్తర ప్రదేశ్‌లో 19 శాతం మంది ముస్లింలు ఉన్నప్పటికీ బీజేపీకి ఆ రాష్ట్రా లలో ఒక్క ముస్లిం ఎమ్మెల్యే కూడా లేరు. గుజరాత్లో 1998 నుండి ఏ లోక్‌సభకు, లేదా ఏ విధాన సభకు కూడా ముస్లిం అభ్యర్థిని నిల బెట్టలేదు. అంతెందుకు, గత ఏప్రిల్‌లో కర్ణాటక మాజీ ఉప ముఖ్య మంత్రి కె.ఎస్. ఈశ్వరప్ప బీజేపీకి ముస్లింల ఓట్లే అవసరం లేదన్నారు. పాలకపక్ష నాయకులు, వారి సన్నిహిత మద్దతుదారులు ముస్లింల గురించి ఏదైతే మాట్లాడుతుంటారో ఆ ప్రకారం ముస్లింల పరిస్థితి మన దేశంలో దిగజారిపోతూ ఉంటుంది. వారిని ‘బాబర్ కీ ఔలాద్’ (బాబర్ సంతానం) అంటుంటారు. ‘అబ్బా జాన్’లు అంటూ అవహేళన చేస్తుంటారు. ‘పాకిస్తాన్‌కు వెళ్లిపొండి’ అని పదే పదే చెబుతుంటారు. వారి ఊచకోతకు íపిలుపు అందినప్పుడు – అయితే గియితే, కొన్ని బీజేపీ గొంతులు ఆ పిలుపును ఖండిస్తూ మాట్లాడతాయి. వారు అల్లర్లకు పాల్పడినట్లు ఆరోపణలు వస్తే నేర నిర్ధారణ కాకముందే వారి ఇళ్లు నేలమట్టం అవుతాయి. తరచూ వారు లవ్ జిహాద్, పశువుల అక్రమ రవాణా ఆరోపణలతో హత్యకు గురవుతుంటారు. 2019 జూన్‌లో జార్ఖండ్‌లో ఒక ముస్లిం వ్యక్తికి ఏం జరిగిందనే దాని గురించి జియా ఉస్ సలామ్ పుస్తకం నుంచి నేనొక ఉదాహరణ ఇస్తాను. ఏదో ఒక ఉదంతాన్ని ప్రత్యేకంగా పేర్కొనడం ముస్లింలపై కనబరుస్తున్న అసహనాన్ని వేలెత్తి చూపడం కోసమేనని అనిపించవచ్చు కానీ, అటువంటి అనేక ఘటనలకు ఇదొక దృష్టాంతం. ‘‘విధ్వంసకరమైన ఆ హింసాత్మక సమూహం... అతడిని దీపస్తంభానికి కట్టివేసి ఇనుప కడ్డీలు మొదలు... కర్రలు, టైర్లు, బెల్టుల వరకు... చేతిలో ఏది ఉంటే అది తీసుకుని చావబాదింది. ఆ వ్యక్తి తల, చేతులు, ముఖం రక్తం ఓడుతున్నాయి. అతని కాళ్లు వాచిపోయాయి. చాలాచోట్ల ఎముకలు విరిగి పోయాయి. ఆ దెబ్బలకు నిలబడలేక మనిషి కూలి పోయాడు. అతడు చేసిన నేరం ఏమిటి? నేటి కొత్త భారతదేశంలో అతడొక ముస్లిం అవడమేనా?’’ ఇదేమీ నూటికో కోటికో ఒకటిగా జరిగిన ఘటన కాదని పుస్తకంలో జియా పొందుపరిచిన వాస్తవాలు సూచిస్తున్నాయి. ‘‘ముస్లింలపై ఇటు వంటి ద్వేషపూరితమైన నేరాలు 2014–2017 మధ్య కాలంలో 30 శాతం పెరిగాయి. అనంతరం, 2019లో మోదీ రెండోసారి ప్రధానమంత్రి అయ్యాక లెక్కకు మిక్కిలిగా పెరిగిపోయాయి. మతవిద్వేష నేరాలు రెట్టింపు అయ్యాయి. ఉనికి వంటి అతి ముఖ్యమైన గుర్తింపు నిరా కరణకు కూడా ముస్లింలు గురయ్యారు. ఆరెస్సెస్ సర్ సంఘ్‌చాలక్ మోహన్ భాగవత్... ‘‘ప్రతి భారతీయుడూ హిందువే’’ అని అన్నారు. ఈ మాటను ముస్లింలు మాత్రమే కాదు, సిక్కులు కూడా సమ్మతించరు. అయినప్పటికీ ఆయన మరికాస్త ముందుకు వెళ్లి... ‘‘ఈ రోజున భారత దేశంలో ఉన్నవారంతా హైందవ సంస్కృతికి,హిందూ పూర్వీకులకు, హిందూ భూభాగానికి చెందినవారు. ఇందులో రెండో మాటే లేదు’’ అన్నారు. ‘‘భారతదేశంలో ముస్లింగా ఉండటం ఎలాంటిది?’’ అనే ప్రశ్నకు వచ్చే సమాధానం ఎందుకని మన దేశ సమగ్రతకూ, భవిష్యత్తుకూ ముప్పు కలిగించేలా ఉంటుందో వివరించేందుకు చాలినంతగా చెప్పాననే నేను భావిస్తున్నాను. ఇది చాలా స్పష్టమైన సమాధానమని నేను చెప్పగలను. కానీ ఈ సమాధానం మన ముస్లిం సోదరులకు, సోదరీ మణులకు ఎలా అనిపిస్తుందో ఒక్కక్షణం ఆలోచించండి. తక్కిన మనందరికీ ఇది మనదికాని సమస్యపై ఒక విశ్లేషణ. వారికి మాత్రం వారి జీవన్మరణ సమస్య. సమస్య గురించి మనం ఆశాజనకమైన రీతిలో లోతుగా ఆలోచిస్తాం. కానీ వారు ఆ పరిస్థితిలో జీవిస్తారు. అది మరింత దారుణంగా తయారవదు కదా అని బిక్కుబిక్కుమంటుంటారు. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
సుదీర్ఘ వివాదానికి తెర
జమ్మూ–కశ్మీర్‌కు స్వయంప్రతిపత్తినిచ్చే రాజ్యాంగంలోని 370వ అధికరణను రద్దు చేస్తూ రాష్ట్రపతి జారీచేసిన నోటిఫికేషన్ రాజ్యాంగబద్ధమేనని సుప్రీంకోర్టు అయిదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం సోమవారం వెలువరించిన తీర్పుపై సహజంగానే అటు హర్షామోదాలతోపాటు ఇటు అసంతృప్తి, అసమ్మతి కూడా వ్యక్తమయ్యాయి. సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ చరిత్రాత్మకమైనదిగా అభివర్ణించగా, కశ్మీర్‌కు చెందిన వివిధ పార్టీలు నిరాశ వ్యక్తంచేశాయి. దశాబ్దాలుగా ఈ అధికరణ చుట్టూ సాగుతున్న వివాదానికి తాజా తీర్పు ముగింపు పలికింది. 370వ అధికరణ రద్దు సహా అన్ని విషయాల్లోనూ ధర్మాసనంలోని న్యాయమూర్తులందరూ ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్‌లు కలిసి ఒక తీర్పు వెలువరించగా దానితో ఏకీభవిస్తూనే జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ సంజీవ్ ఖన్నాలు రెండు వేర్వేరు తీర్పులిచ్చారు. ప్రభుత్వాల విధాన నిర్ణయాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావటం సహజమే. కశ్మీర్ వంటి భావోద్వేగాలతో ముడిపడివుండే అంశంలో వీటి తీవ్రత కాస్త అధికంగానే ఉంటుంది. అందువల్లే సుప్రీంకోర్టు నిర్ణయం ఎలా ఉంటుందన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. కశ్మీర్లో ఉగ్రవాదం వేళ్లూన డానికీ, భద్రతాబలగాలపై దాడులకూ మూలం 370వ అధికరణలో ఉందన్నది జనసంఘ్‌గా ఉన్నప్పటి నుంచీ బీజేపీ నిశ్చితాభిప్రాయం. దానికితోడు పాకిస్తాన్, చైనా సరిహద్దుల సమీపంలో ఉండటంవల్ల కశ్మీర్ ఘటనలు దేశ పౌరులందరినీ కలవరపరుస్తుంటాయి. అయితే అధికరణ రద్దుపై స్థాని కులు ఏమనుకుంటున్నారన్నది స్పష్టంగా తెలియదు. అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరిగి పదేళ్లవుతోంది. 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కశ్మీర్ ప్రాంతంలోని మూడు స్థానాలనూ నేషనల్ కాన్ఫరెన్స్ గెలుచుకోగా, జమ్మూ ప్రాంతంలోని మూడు స్థానాలు బీజేపీకి లభించాయి. 2019 ఆగస్టు 5న రాష్ట్ర పతి నోటిఫికేషన్ జారీకి నాలుగు రోజుల ముందు నుంచీ కశ్మీర్‌కు భద్రతా బలగాల తరలింపు, విద్యా సంస్థలకు సెలవులు, శ్రీనగర్‌లో నిరవధిక కర్ఫ్యూ, అమర్నాథ్ యాత్ర నిలుపుదల వంటి నిర్ణయాలు తీసుకున్నారు. సుప్రీంకోర్టు తీర్పు వెలువడే ముందు సైతం కశ్మీర్లో ప్రధాన పార్టీల నేతలంతా తమను గృహనిర్బంధం చేశారని ఆరోపించారు. ఇదంతా గమనిస్తే కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి అత్యంత సున్నితమైన సమస్య అని అర్థమవుతుంది. జమ్మూ–కశ్మీర్ పాలకుడు హరిసింగ్ ఆ ప్రాంతాన్ని 1947లో భారత్‌లో విలీనం చేసినప్పుడి చ్చిన హామీకి అనుగుణంగా 1949లో రాజ్యాంగ నిర్ణాయక సభ 370వ అధికరణాన్ని రాజ్యాంగంలో చేర్చింది. ఆ అధికరణ ప్రకారం విదేశీ వ్యవహారాలు, ఆర్థికం, కమ్యూనికేషన్లు, రక్షణ మినహా ఇతర అంశాలు జమ్మూ–కశ్మీర్ అసెంబ్లీ ఆమోదిస్తే తప్ప ఆ రాష్ట్రంలో అమలు కావు. అయితే ఒకసారంటూ దేశంలో విలీనమయ్యాక ఇక ‘అంతర్గత సార్వభౌమత్వం’ అనేదే ఉండదని తాజా తీర్పుల్లో సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. 370వ అధికరణ తాత్కాలిక స్వభావంతో కూడుకున్నదని... తాత్కాలిక, మధ్యంతర అధికరణలున్న రాజ్యాంగంలోని 21వ భాగంలో చేర్చటమే ఇందుకు నిదర్శమని జస్టిస్ చంద్రచూడ్ ఆధ్వర్యంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం భాష్యం చెప్పగా... నెమ్మదిగా జమ్మూ– కశ్మీర్‌ను కూడా ఇతర రాష్ట్రాలతో సమానం చేయటమే దాని ఉద్దేశమని విడిగా ఇచ్చిన తీర్పులో జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ అభిప్రాయపడ్డారు. ఈ రెండు అభిప్రాయాలతోనూ విడిగా తీర్పునిచ్చిన మరో న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా ఏకీభవించారు. ఈ అధికరణ స్వభావం ఏమిటన్న అంశాన్ని 2016లో సుప్రీంకోర్టు పరిశీలించింది. అది తాత్కాలికమైనదన్న వాదనను అప్పట్లో తోసి పుచ్చింది. అందుకు అదే అధికరణలోని సబ్ క్లాజ్ 3ని ఉదాహరించింది. రాష్ట్ర రాజ్యాంగసభ సిఫా ర్సుతో రాష్ట్రపతి నోటిఫికేషన్ విడుదల చేసినప్పుడే 370 రద్దవుతుందని ఆ క్లాజ్ సారాంశం. 1957 తర్వాత రాజ్యాంగసభ ఉనికిలో లేదు గనుక ఇక దాని రద్దు అసాధ్యమని అప్పట్లో సుప్రీంకోర్టు భావించింది. అయితే రాజ్యాంగసభ రద్దుతో సబ్ క్లాజ్ 3 నిరర్థకమైపోయిందని, ఆ అధికారం రాష్ట్ర అసెంబ్లీకి దఖలు పడిందని తాజా తీర్పుల్లో న్యాయమూర్తులు భావించారు. రాష్ట్ర అసెంబ్లీ రద్దయింది గనుక గవర్నర్ సిఫార్సు సరిపోతుందని వారు అభిప్రాయపడ్డారు. కశ్మీర్లో ఎన్నికలు జరిపించాలని పిటిషనర్లు ఎవరూ కోరకపోయినా ఆ విషయాన్ని న్యాయమూర్తులు పరిగణనలోకి తీసు కున్నారు. వచ్చే ఏడాది సెప్టెంబర్ 30లోగా ఆ ప్రక్రియ పూర్తి కావాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించారు. అంటే లోక్‌సభ ఎన్నికలు పూర్తయ్యాకే అక్కడ అసెంబ్లీ ఎన్నికలుంటాయి. రాజ్యాంగ నిర్ణాయక సభలో కూలంకషంగా చర్చించిన తర్వాతే వివిధ అధికరణలు రాజ్యాంగంలో చేరాయి. ఆ అధికరణలు చేర్చటంలోని అంతర్గత ఉద్దేశాలను అర్థం చేసుకోవటానికి ఆ చర్చలు దోహదపడతాయి. అయితే దేశ కాలమాన పరిస్థితుల్లో వచ్చే మార్పులు న్యాయమూర్తుల దృక్పథా లను నిర్దేశిస్తాయి. ఆ అధికరణలకు కొత్త చేర్పులు తీసుకొస్తాయి. వాటి పరిధి విశాలమవుతుంది. లేదా వాటి రద్దు సబబే అనిపించవచ్చు. ఏదేమైనా కేంద్రం ఈ నిర్ణయానికి ముందు అక్కడి ప్రజానీ కాన్ని, మాజీ సీఎంలు ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ తదితరులను కూడా సంప్రదిస్తే బాగుండేది. వీరంతా భారత్‌లో కశ్మీర్ విడదీయరాని భాగమని దృఢంగా విశ్వసిస్తున్న వారు. వర్తమాన పరిస్థితుల్లో సత్వర నిర్ణయం అవసరమని కేంద్రం భావించివుండొచ్చు. ఇప్పటికైనా ఆ ప్రాంతప్రజల అపోహలు తొలగించే కృషి మొదలుకావాలి. కశ్మీర్ అభివృద్ధి సాకారం కావాలి. -
రాజ్యాంగ విలువలు అమలవుతున్నాయా?
రాజ్యాంగ నిర్మాతలు జాతి లక్ష్యాలనూ వాటిని సాధించేందుకు అవసరమైన వ్యవస్థలనూ, ప్రక్రియలనూ రాజ్యాంగంలో పొందు పర చారు. జాతి సమైక్యత, సమగ్రత, ప్రజాస్వామిక సమాజం ఏర్పాటు అనేవి జాతి లక్ష్యాలుగా ఉద్దేశించబడ్డాయి. వీటిని సాధించేందుకు ప్రజాస్వామిక స్ఫూర్తితో రాజ్యాంగ ప్రజాస్వామిక వ్యవస్థలను విని యోగించుకుంటూ సామాజిక, ఆర్థిక విప్లవం ద్వారా నూతన సమాజాన్ని నిర్మించవలసి ఉంటుందని భావించారు. రాజ్యాంగ వ్యవస్థలు వాటికి అవే పనిచెయ్యవు. ఆ వ్యవస్థ ద్వారా ఎంపిక కాబడ్డ రాజకీయ యంత్రాంగం నడిపించాల్సి ఉంటుంది. ప్రముఖ న్యాయమూర్తి జాన్ మార్షల్ అన్నట్లు ‘రాజ్యాంగం అనేది భావితరాల కోసం రూపొందించ బడుతుంది, కానీ దాని నిర్దిష్ట క్రమం ఎప్పుడూ ఒడుదొడుకులు లేకుండా ఉండదు’. రాజ్యాంగం అంటే ఒక జాతి సామాజిక లక్ష్యాలను సాధించేందుకు ఉపయోగించే దిక్సూచిలాగా భావించాలి. నిజానికి నిత్య జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకూ పరిష్కార మార్గం ఏ రాజ్యాంగంలోనూ లభించదు. వాటిని రాజ్యాంగ సూత్రాల పరిధిలో పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. రాజ్యాంగం ఏర్పాటు చేసుకున్న లక్ష్యాలకూ, చారిత్రక అసమా నతల మీద ఏర్పడ్డ సామాజిక వ్యవస్థకూ భిన్నత్వం ఉంది. ఈ వైరుద్ధ్యాల నడుమనే భారత రాజకీయ వ్యవస్థ రాజ్యానికీ, వ్యక్తుల హక్కు లకూ మధ్య సమన్వయం సాధిస్తూ ముందుకు సాగాలి. వ్యక్తి స్వేచ్ఛ, పౌరస్వేచ్ఛ ప్రధానమైనవిగా భావించాలి. అంబేడ్కర్ చెప్పిన ‘చట్టం ముందర సమానత్వం’ భావన కేవలం సూత్రప్రాయంగా కాక ‘రూల్ ఆఫ్ లా’ ప్రాతిపదికన ముందుకు సాగాలి. వర్తమానంలో రాజ్యాంగానికి ఆవల ఉండే పద్ధతుల్లో ఎన్నో విధ్వంసకర విధానాలు ‘సర్వసమ్మతి’ పేరున జరుగుతున్నాయి. 1990ల్లో వచ్చిన నయా ఉదారవాద విధానాల నేపథ్యంలో ప్రభుత్వ రంగ సంస్థల్లో పెద్ద ఎత్తున ప్రైవేటు పెట్టుబడులు పెరిగాయి. దీనితో ‘సంక్షేమ రాజ్య’ స్థాపన లక్ష్యానికి గండిపడింది. సామాజిక సంక్షేమం సందిగ్ధంలో పడింది. ఫలితంగా సమాజ సంక్షేమం స్థానే మార్కెట్ ప్రయోజనాలే ముందుకొచ్చాయి. వరల్డ్ బ్యాంక్ విధానాలు స్థానిక ప్రభుత్వాలను సైతం దెబ్బతీశాయి. ఈ నేపథ్యంలోనే నేడు దేశంలో ‘విశ్వాసమే’ ప్రధానం అనే భావనను సర్వసమ్మతి పేరున రాజ్యాంగం ప్రసాదించిన వాక్ స్వాతంత్య్రాన్నీ భిన్న అభిప్రాయాలనూ, నేర పూరిత కుట్రగా చలామణీ చేస్తున్నాయి. భిన్నత్వంలో ఏకత్వంగా ఉన్న దేశంలో నేడు ఏకతా సూత్రాల దిశగా దేశాన్ని నడిపిస్తున్నారు. ఆహార నియమాల పట్ల కూడ ప్రత్యక్ష ఆంక్షలు తలెత్తుతున్నాయి. చట్ట ప్రకారం పరిపాలన కంటే విశ్వాసమే చట్టంగా పాటించాల్సిన పరిస్థితుల్లోకి ప్రజలు నెట్టబడుతున్నారు. ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తే దేశ వ్యతిరే కిగా, దేశద్రోహిగా కేసులు వస్తున్నాయి. ఎమర్జెన్సీ తరువాత వచ్చిన 42వ రాజ్యాంగ సవరణలో సుప్రీంకోర్టు భారత రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని పార్లమెంట్ కూడా మార్చలేదని చెప్పిన తీర్పు స్పష్టంగానే ఉంది. రాజ్యాంగ బద్ధంగా పరిపాలిస్తామని రాజ్యాంగంపై ప్రమాణం చేసిన వాళ్ళే ’విశ్వాసమే’ ప్రధానం అనే భావజాలాన్ని ముందుకు తెస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాజ్యాంగ విలువల సాక్షిగా ప్రజలు తమ హక్కులకు, జీవితాలకు, రాజ్యాంగ రక్షణకు, తామే నిబద్ధులుగా వ్యవహరించాల్సిన, కాపాడుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది. భారతదేశంలో ‘చట్టబద్ధ పాలన’ (రూల్ ఆఫ్ లా) సజాపుగా సాగాలంటే దేశ పౌరసమాజం ద్వారా మాత్రమే రూల్ ఆఫ్ లాను పొందగలరు. – డా‘‘ నూతక్కి సతీష్, నాగార్జున విశ్వవిద్యాలయం డా‘‘ బి.ఆర్. అంబేడ్కర్ స్కూల్ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ – రీసెర్చ్‌లో గెస్ట్ ఫ్యాకల్టీ -
రాజ్యాంగ పఠనం మన తక్షణావసరం
1949 నవంబర్ 26వ తేదీన, రాజ్యాంగ సభలో భారత ప్రజలు తమకి తాము రాజ్యాంగాన్ని సమర్పించుకున్నారని చరిత్ర చెపుతుంది. 1950 జనవరి 24న రాజ్యాంగ సభ సభ్యులు 284 మంది రాజ్యాంగ ప్రతి మీద సంతకాలు చేశారు. ఆ సమయంలో వానజల్లులు పడుతూ ఉండడం శుభ శకునంగా భావించారట. శాస్త్రీయ దృష్టి కోణం, స్వేచ్ఛ, సమానత్వాల ఆకాంక్షలతో రాసుకున్నది రాజ్యాంగం. ఆ ప్రయత్నపు ఆమోద సమయంలో ఇటు వంటి వ్యక్తీకరణ కాస్త వింతగానే ఉంటుంది. కానీ భారత రాజ్యాంగ రచనా ప్రస్థానం మొత్తం చూస్తే పై విలువలు రాజ్యాంగంలో పాదుకొల్పడానికి ఒంటి చేత్తో పోరాటం చేస్తూ, నిప్పులవాగులో నిరంతరం ఎదురీదిన అంబేడ్కర్ గుర్తుకు వస్తే ఆ చిరుజల్లులు కురవాల్సినవే అనిపిస్తుంది. ఇంతకుముందు ఎప్పుడూ లేనంతగా రాజ్యాంగం ఇపుడు తరుచూ మాట్లాడుకునే అవసరం అయింది. ముఖ్యంగా పీడిత వర్గాలు తమ హృదయాలలో వెలిగించు కున్న ఆశాదీపం అయింది. తమ తమ మతగ్రంథాల కన్నా మిన్నగా రాజ్యాంగాన్ని ప్రాచుర్యంలోకి తీసుకు వచ్చే ప్రయత్నాలు చురుకుగా సాగుతున్నాయి. భారత రాజ్యాంగం చుట్టూ దాని ఆచరణలో విరోధాభాస కొంత ఉంది. నిజంగా రాజ్యాంగపు రక్షణ తప్పనిసరిగా కావాల్సిన వర్గాల వారు ఆ స్ఫూర్తిని ప్రకటించడం మొదలు పెట్టగానే ఆధిపత్య వర్గాలు, ప్రభుత్వాలు ఆ స్ఫూర్తిని హైజాక్ చేసే ప్రయత్నాలు మొదలు పెడతాయి. రాజ్యాంగం శ్రమజీవులను విముక్తి చేయగలదా అన్న ప్రశ్నకి జవాబు అంత సులువు కాదు. రాజ్యాంగం ద్వారా సాధించుకోవలసిన విలువలను గుర్తిస్తూనే ఆచరణలో ఆ విలువలను నిలబెట్టలేని పరిమితులు కూడా రాజ్యాంగంలో ఉన్నాయన్నది గ్రహించాలి. ప్రజలకి రాజ్యాంగం ఇచ్చిన శక్తిమంతమైన ఆయుధం ‘ఓటు’ అనుకుంటాము కదా! తమని తాము పరిపాలించుకోవడానికి తమని తామే ఎన్నుకునే వ్యవస్థ మనది. దాని ప్రకారం మెజారిటీ ప్రజలు తమ సంక్షేమానికి పాటుపడే పార్టీలని ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఎన్నుకుంటారు. మరి ఆచరణలో ఇంత సింపుల్‌గా జరుతున్నదా? కొన్నేళ్ళ కిందట ‘న్యూటన్’ అని ఒక సినిమా వచ్చింది. ఎన్నికలు ఎంత ఫార్స్‌గా మారిపోయాయో మనసుకు హత్తుకునేట్లు చెప్పడం కోసం త్రిముఖ నేపథ్యాన్ని తీసుకున్నారు. ప్రజల కోసం ప్రత్యామ్నాయ రాజకీయ సాధనాలతో పోరాడే మావోయిస్టులు, ఎన్నికలని నిజాయితీగా జరిపించాలనుకునే పోలింగ్ బూత్ అధికారి, ఓటు అంటే తెలియని అమాయకపు ఆదివాసీలు – ఈ ముప్పేట కథనంతో భారత ప్రజాస్వామ్యపు లొసుగులను కళ్ళకి కట్టినట్లు చూపించారు. రాజ్యాంగంలో తాము ఏమి హక్కులు పొందు పరుచుకున్నారో తెలియని ప్రజలు కోట్లాది మంది. ఓటుని హక్కుగా ప్రజలకి ఇవ్వగలిగిన రాజ్యాంగం, ఇన్నేళ్లలో ఆ ఓటు చుట్టూ ఉన్న దట్టమైన డబ్బు అల్లికని తెంపలేకపోయింది. అనేక మౌలిక హక్కు లను ప్రకటించిన రాజ్యాంగం దొంతర్లుగా పేరుకు పోయిన అంతరాలను తగ్గించలేకపోయింది. అలాగని ఇప్పటికిపుడు దేశవ్యాప్తంగా అందరినీ సమానత్వపు తాటిమీదకి తెచ్చే పూర్తి భరోసాని ఏ రాజ కీయాలూ ఇవ్వలేకపోతున్నాయి. కులం, మతం, వర్గం, జెండర్ తదితర అంశాలలోని ఆధిపత్య శక్తులని అదుపు చేయగలిగే తక్షణ రక్షణ కవచంగా రాజ్యాంగం మాత్రమే కనిపిస్తోంది. సూక్ష్మస్థాయి సంగతి సరే, స్థూలంగానైనా మేళ్ళు జరగాలంటే రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాపా డుకోవడానికి పోరాటం చేయక తప్పదు. రాజ్యాంగాన్ని అక్కున చేర్చుకోక తప్పదు. గత పదేళ్లుగా రాజ్యాంగ ఉల్లంఘనలు అపరిమితంగా పెరిగిపోయాయి. తినడానికి ఒక ముద్ద తక్కువైనా ఓర్చుకోగలిగే మనుషులు, తమ విశ్వాసాల పట్ల నిక్క చ్చిగా స్వాభిమానంతో ఉంటారు. భిన్నమతాలకి నిలయమైన ఇండియాలో మైనార్టీలకి హక్కులకి రక్షణ ఉండాలని, మతాల మధ్య చిచ్చు రేగకూడదనే భారతదేశాన్ని లౌకిక రాజ్యంగా ప్రకటించింది రాజ్యాంగం. దాని ప్రకారం భారత ప్రజలు మతస్వేచ్ఛని కలిగి ఉంటారు. ప్రజలని పరిపాలించే ప్రభుత్వాలు మాత్రం మతాతీతంగా పరిపాలన చేయాలి. కానీ మనుషులు పౌరులుగా కాక ఓటుబాంకులుగా కనపడడం మొదలయ్యాక మత సామ రస్యం కాలం చెల్లిన విలువ అయిపోయింది. ఇక మెజారిటీ మత రాజ్యస్థాపన లక్ష్యంగా కలిగిన పార్టీలు పరిపాల నలోకి రావడం వల్ల రాజ్యాంగస్ఫూర్తి మరింత క్షీణించింది. మన వ్యక్తిగత విశ్వాసాలు, భావోద్వేగాలకి రాజ్యాంగం విలువ ఇచ్చినట్లే, మనమే రాసుకున్న రాజ్యాంగం పట్ల మనందరికీ అవగాహన ఏర్పడడం చాలా అవసరం. పౌరులుగా ఎలా మెలగాలన్న రాజకీయ స్పృహని మౌలి కంగా రాజ్యాంగం ఇస్తుంది. రాజకీయాలంటే అయిదేళ్ళ కోసారి వచ్చే ఎన్నికలు, కుల, మత, వర్గ గోదాల్లో నిలబడే అభ్యర్థుల గెలుపోటముల బెట్టింగ్ కాదనీ, అది తరతరాలుగా సమాజాన్ని ప్రభావితం చేయగల చైతన్యమనీ తెలుపుతుంది. ఈ రాజకీయ స్పృహ కలిగిననాడు రాజ్యాంగం ఇచ్చిన బాధ్యతల ఆలోచన కూడా మొదలవుతుంది. రాజ్యాంగం ఇపుడు మన తక్షణావసరం అన్నామంటే అది బేషరతు కానక్కర్లేదు. రాజ్యాంగ విలువలని కాపాడు కోవడానికి కృషి చేస్తూనే, ఆధిపత్య వర్గాలకి అనువుగా మారే పరిమితులను కూడా గుర్తించాలి. దృఢ అదృఢ లక్షణాలు కలిగిన భారత రాజ్యాంగానికి ఎపుడైనా సవరణ జరిగితే పీడిత ప్రజల ఆకాంక్షలు అందులో ప్రతిఫలించేట్లు జాగరూకులమై ఉండాలి. కె.ఎన్. మల్లీశ్వరి వ్యాసకర్త జాతీయ కార్యదర్శి, ప్రరవే malleswari.kn2008@gmail.com (నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం) -
సమాఖ్య వ్యవస్థకు ఎంతటి దుర్గతి!
గవర్నర్ల వ్యవహార శైలి కారణంగా దేశానికి సమాఖ్య వ్యవస్థను ఇచ్చిన రాజ్యాంగం స్ఫూర్తి దెబ్బతింటోంది. భారత రాజ్యాంగం ఆర్టికల్ 153 ప్రకారం ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉండాలి. ఆర్టికల్ 155 ప్రకారం గవర్నర్ నియామకాన్ని భారత రాష్ట్రపతి చేస్తారు. ఆర్టికల్ 156 ప్రకారం రాష్ట్రపతి అనుగ్రహం ఉన్నంత వరకు గవర్నర్ పదవిలో ఐదేళ్లపాటు కొనసాగుతారు. దీనినిబట్టి ఎవరి కైనా ఏమి అర్థమవుతుంది? గవర్నర్ పదవిలో ఉండే వారెవరూ కేంద్ర ప్రభుత్వానికి దాసులుగా ఉండాల్సిన అవసరం లేదనేకదా? ఇందుకు సంబంధించి 1979 మే 4న సుప్రీం కోర్టు ఓ కీలకమైన తీర్పు ఇచ్చింది. ఒక యజమాని (ఎంప్లాయర్)కీ, ఒక ఉద్యోగి (ఎంప్లాయీ)కీ ఉండే సంబంధం కేంద్ర ప్రభుత్వానికీ, గవర్నర్‌కూ మధ్య ఉండదనీ, కేంద్ర ప్రభుత్వ అధీనంలో గవర్నర్ ఉండరనీ సుప్రీం కోర్టు ‘డాక్టర్ రఘుకుల్ కేసు’లో స్పష్టంగా చెప్పింది. అంటే, ‘గవర్నర్’ అన్నది ఓ రాజ్యాంగబద్ధమైన పదవి. ఆ స్థానంలో ఉండే వారు రాజ్యాంగబద్ధమైన విధులను మాత్రమే నిర్వహించాలి. కానీ, ఆచరణలో అలా జరుగుతోందా? గవర్నర్ల వ్యవస్థను కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే, వారు దుర్వినియోగం చేసిన దృష్టాంతాలు అనేకం ఉన్నాయి. గవర్నర్ల నియామకంలోనూ పాటించవలసిన మార్గదర్శకాలనూ, విధివిధానా లనూ తుంగలో తొక్కి ఇష్టానుసారంగా వ్యవహరించడం గత ఏడు న్నర దశాబ్దాలుగా కనిపిస్తోంది. గవర్నర్‌ను కీలుబొమ్మగా చేసుకొని ఆయా రాష్ట్రాలలో ఆర్టికల్ 356ను దుర్వినియోగ పరిచి ప్రజా ప్రభు త్వాలను కూలగొట్టిన సంఘటనలు అనేకం. కేరళ కమ్యూనిస్టు యోధుడు ఇఎంఎస్ నంబూద్రిపాద్ మొదలుకొని ఆంధ్రప్రదేశ్‌లో ఎన్.టి. రామారావు వరకు గవర్నర్ బాధితులు ఎందరో ఉన్నారు. గవర్నర్ వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగపర్చడం శ్రీమతి ఇందిరా గాంధీ దేశ ప్రధానిగా ఉన్నప్పుడు ఎక్కువగా జరిగింది. కేంద్రం– రాష్ట్రాల మధ్య ఉండే సంబంధాల సమతుల్యతపై అధ్యయనం చేసి నివేదిక అందించేందుకు 1983లో ఏర్పాటయిన జస్టిస్ రాజేందర్ సింగ్ సర్కారియా ఐదేళ్ల తర్వాత సమర్పించిన నివే దికలో గవర్నర్ల నియామకం, వారి పనితీరుపై స్పష్టమైన సూచనల్ని చేసింది. నిజానికి సర్కారియా కమిషన్ కంటే ముందు... 1969లో అప్పటి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర–రాష్ట్ర సంబంధాల మెరు గుదలపై నివేదిక ఇవ్వాలని రాజమన్నార్ కమిటీని ఏర్పాటుచేసింది. ఆ కమిటీ చాలా స్పష్టంగా ‘గవర్నర్ నియామకంలో తప్పనిసరిగా రాష్ట్ర క్యాబినెట్‌తో సంప్రదింపులు జరపాలి’ అని చెప్పింది. కానీ, ఈ కమిటీ రికమండేషన్లను కేంద్రం పరిగణనలోకి తీసుకోలేదు. ఆ తర్వాత దాదాపు 2 దశాబ్దాల అనంతరం, సర్కారియా కమిషన్ కూడా ఇదే సిఫార్సు చేసింది. కానీ, కేంద్రంలో ఎవరున్నా గవర్నర్లను ఏకపక్షంగా నియమించే సంప్రదాయమే కొనసాగుతోంది. ఇటీవలి కాలంలో పంజాబ్, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల గవర్నర్ల వ్యవహారశైలి దుమారం రేపుతోంది. కొన్ని నెలల క్రితం తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్. రవి ఆ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన గవర్నర్ ప్రసంగ పాఠానికి సొంతంగా మార్పులు చేర్పులు చేసి అసెంబ్లీలో ప్రసంగించడం కలవరం రేపింది. అలాగే, కొన్ని బిల్లుల్ని ఆమోదించకుండా తిప్పిపంపారు. ఇక పంజాబ్ గవర్నర్ అయితే, రాష్ట్ర అసెంబ్లీని సమావేశపర్చాలని ఆ రాష్ట్ర క్యాబినెట్ తీర్మానించినా అందుకు ఆయన అనుమతి ఇవ్వలేదు. దీనిపై పంజాబ్ ప్రభుత్వం విధిలేని పరిస్థితులలో సర్వోన్నత న్యాయ స్థానం గడప తొక్కింది. ‘శాసనసభ నిర్వహణకు సంబంధించిన అధి కారాలు అసెంబ్లీ స్పీకర్‌కు ఉండగా, వాటి నిర్వహణలో మీకు అభ్యంతరం ఏమిటి’ అని పంజాబ్ గవర్నర్ భన్వర్‌లాల్ పురోహిత్ తీసు కున్న చర్యను సుప్రీం కోర్టు తప్పు పట్టింది. అంతేకాదు... ‘మీరు నిప్పుతో చెలగాటమాడుతున్నారు’ అని తీవ్రస్వరంతో సుప్రీం కోర్టు గవర్నర్ పట్ల తన అసంతృప్తిని వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వానికి, గవర్నర్‌కు మధ్య ఉండాల్సిన సుహృద్భావ వాతావరణం స్థానంలో రాజకీయ వైరం నెలకొని వారు ఎడమొఖం పెడమొఖంగా మారిన ఉదంతాలు గతంలో కోకొల్లలు. గవర్నర్ల రాజ్యాంగ అతిక్రమణలపై పార్లమెంట్ ఉభయ సభలలో ఎన్నో సంద ర్భాలలో వాడీ వేడీగా చర్చోపచర్చలు జరిగాయి. గవర్నర్ వ్యవస్థ ఆరోవేలు లాంటిదని, దానిని రద్దు చేయాలనే డిమాండ్ సైతం వినిపించింది. ఆశ్చర్యం ఏమంటే, గవర్నర్ వ్యవస్థ వల్ల లోగడ ఇబ్బందులు ఎదుర్కొన్న భారతీయ జనతా పార్టీ... కేంద్రంలో అధికారంలోకి వచ్చాక ‘మేము సైతం’ అంటూ కాంగ్రెస్ పార్టీ తరహాలోనే గవర్నర్ వ్యవస్థను దుర్వినియోగపర్చడమే చర్చనీయాంశం. అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధానిగా ఉండగా ఇటువంటి వివాదాలు చేటు చోసుకొన్న దాఖలాలు లేవుగానీ, 2014లో నరేంద్రమోదీ నేతృత్వంలో అధికారం చేపట్టిన ఎన్డీఏ ఈ తొమ్మిదిన్నరేళ్ల పాలనలో గవర్నర్లను తమ ఇష్టానుసారం బీజేపీయేతర ప్రభుత్వాలపై సవారీ చేయిస్తున్న తీరు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోంది. ముఖ్యంగా బిల్లుల విష యంలో తమకులేని అధికారాలను ఆపాదించుకొని గవర్నర్ వాటిని ఆమోదించకుండా తొక్కిపెట్టడంతోనే ఆ యా రాష్ట్ర ప్రభుత్వాలు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. కొందరు గవర్నర్లు పోషిస్తున్న రాజ్యాంగ వ్యతిరేక చర్యల్ని సర్వోన్నత న్యాయస్థానంలో ప్రశ్నించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకోవడం దేశంలో సమాఖ్య వ్యవస్థకు పట్టిన దుర్గతిగా రాజ్యాంగ నిపుణులు అభివర్ణించడంలో అతిశయోక్తి ఏమీ లేదు. ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి కొన్ని అంశాలలో గవర్నర్లకు రాజ్యాంగం కొన్ని ప్రత్యేక అధికారాలు కట్టబెట్టిన మాట నిజం. గవ ర్నర్ తన విచక్షణాధికారాలు ఉపయోగించి నిర్ణయాలు తీసుకొనే స్వేచ్ఛ రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్ ప్రకారం దఖలు పడింది. కానీ, రాష్ట్ర క్యాబినెట్ ఆమోదించిన బిల్లులను సుదీర్ఘకాలం ఆమోదించకుండా లేదా తిప్పిపంపకుండా తొక్కి పెట్టడానికి గవర్నర్‌కు హక్కు లేదు. కాగా, తమ ప్రభుత్వానికి సహకరించని గవర్నర్ పట్ల రాష్ట్ర ప్రభుత్వాలు అనుచితంగా ప్రవర్తిస్తూ కక్ష తీర్చుకొంటున్న ఉదంతాలు కూడా చోటుచేసుకొంటున్నాయి. గవర్నర్‌కు ఇవ్వాల్సిన ప్రోటోకాల్ పాటించకపోవడం మొదలుకొని, అసలు గవర్నర్ లేకుండానే శాసన సభ సమావేశాలు నిర్వహించుకొనేందుకు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధపడుతున్నాయి. ఈ మొత్తం వ్యవహారం భారతదేశ ప్రజాస్వామ్యానికి తలవంపులు తెస్తున్నది. ప్రజాస్వామ్య విలువల పతనంలో దేశం పాతాళంలోకి శీఘ్రగతిన ప్రయాణిస్తున్న వేళ... దేశం శాస్త్ర సాంకేతిక రంగా లలో అద్భుతంగా ముందుకు సాగిపోతోందనీ; చంద్రయాన్, సూర్య యాన్లతో ప్రపంచంలోనే భారతదేశ ప్రతిష్ఠ ఆకాశాన్నంటుతోందనీ కేంద్రం జబ్బలు చరుచుకొంటే ఉపయోగం ఏమిటి? సి. రామచంద్రయ్య వ్యాసకర్త ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు -
భారత్ వెలుపల అత్యంత ఎత్తైన అంబేడ్కర్ విగ్రహం
వాషింగ్టన్: భారత రాజ్యాంగ రూపశిల్పి బీఆర్ అంబేద్కర్ అత్యంత ఎత్తయిన విగ్రహాన్ని అమెరికా రాజధాని వాషింగ్టన్ శివారులోని మేరీల్యాండ్‌లో ఆవిష్కరించారు. అంబేడ్కర్ వర్థంతి రోజైన ఈ నెల 14వ తేదీన అంబేడ్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ ప్రెసిడెంట్ రామ్ కుమార్ 19 అడుగుల ఎత్తైన ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ‘స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ’గా పిలుచుకునే ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి 500 మందికి పైగా భారతీయ అమెరికన్లతోపాటు, భారత్, తదితర దేశాల నుంచి కూడా తరలివచ్చారు. ‘మేం దీనిని సమానత్వ విగ్రహం అని పిలుస్తున్నాం. అసమానత్వమనే సమస్య భారతదేశంలో మాత్రమే కాదు, ప్రతిచోటా వివిధ రూపాల్లో ఇది ఉనికిలో ఉంది’అని ఈ సందర్భంగా రామ్ కుమార్ అన్నారు. ఈ విగ్రహాన్ని ప్రఖ్యాత శిల్పి రామ్ సుతార్ రూపొందించారు. గుజరాత్లో నర్మదా తీరాన ఏర్పాటైన సర్దార్ పటేల్ విగ్రహం ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ని రూపొందించింది కూడా ఈయనే. అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్‌కు సరిగ్గా 22 మైళ్ల దూరంలో ఉన్న అకోకీక్ టౌన్‌షిప్‌లోని 13 ఎకరాల విస్తీర్ణంలో అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో బుద్ధా గార్డెన్‌తోపాటు లైబ్రరీ, కన్వెన్షన్ సెంటర్ ఉన్నాయి. ఈ సెంటర్ ఆవరణలోనే అంబేడ్కర్ విగ్రహాన్ని నెలకొల్పారు. -
ఏమిటీ తీర్మానం...?
ఒక్కోసారి కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ప్రభుత్వ మే లోక్‌సభలో తన బలాన్ని నిరూపించుకునేందుకు ప్రవేశపెట్టేదే విశ్వాస తీర్మానం. ఇలా విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి మూడు ప్రభుత్వా లు బలం నిరూపించుకోలేక పడిపోయాయి... పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఏ ప్రభుత్వమైనా అది ప్రత్యక్షంగా ఎన్నికయ్యే చట్టసభలో (భారత్‌లో అయితే లోక్‌సభ) మెజారిటీ ఉన్నంత కాలమే మనుగడ సాగించగలదు. కేంద్ర మంత్రిమండలి లోక్‌సభకు ఉమ్మడిగా బాధ్యత వహిస్తుందని రాజ్యాంగంలో 75(3) ఆర్టీకల్ నిర్దేశిస్తోంది. ఏమిటీ అవిశ్వాస తీర్మానం? ► ప్రభుత్వం, అంటే మంత్రిమండలి లోక్‌సభ విశ్వాసం కోల్పోయిందని, మరోలా చెప్పాలంటే మెజారిటీ కోల్పోయిందని భావించినప్పుడు బలం నిరూపించుకోవాలని ఎవరైనా డిమాండ్ చేసేందుకు అవకాశముంది. ► సాధారణంగా విపక్షాలే ఈ పని చేస్తుంటాయి. ఇందుకోసం అవి లోక్‌సభలో ప్రవేశపెట్టే తీర్మానమే అవిశ్వాస తీర్మానం. ► అవిశ్వాస తీర్మానాన్ని లోక్‌సభలో మాత్రమే ప్రవేశపెట్టే వీలుంది. ► లోక్‌సభ రూల్స్ ఆఫ్ ప్రొసీజర్, కండక్ట్ ఆఫ్ బిజినెస్లోని 198వ నిబంధన మేరకు దీన్ని ప్రవేశపెడతారు. ► కనీసం 50 మంది సహచర ఎంపీల మద్దతు కూడగట్టగలిగిన ఏ లోక్‌సభ సభ్యుడైనా ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టవచ్చు. ► అనంతరం తీర్మానంపై చర్చ, అధికార–విపక్షాల మధ్య సంవాదం జరుగుతాయి. ప్రభుత్వ లోపాలు, తప్పిదాలు తదితరాలను విపక్షాలు ఎత్తిచూపుతాయి. వాటిని ఖండిస్తూ అధికార పక్షం తమ వాదన విని్పస్తుంది. ► చర్చ అనంతరం అంతిమంగా తీర్మానంపై ఓటింగ్ జరుగుతుంది. ► లోక్‌సభకు హాజరైన ఎంపీల్లో మెజారిటీ, అంటే సగం మంది కంటే ఎక్కువ తీర్మానానికి మద్దతుగా ఓటేస్తే అది నెగ్గినట్టు. అంటే ప్రభుత్వం సభ విశ్వాసం కోల్పోయినట్టు. అప్పుడు మంత్రిమండలి రాజీనామా చేయాల్సి ఉంటుంది. అంటే ప్రభుత్వం పడిపోతుంది. ప్రభుత్వమే పరీక్షకు నిలిస్తే.. విశ్వాస తీర్మానం ► అలాగే 1997లో హెచ్డీ దేవెగౌడ ప్రభుత్వం కూడా అధికారంలోకి వచి్చన 10 నెలలకే బలపరీక్షకు వెళ్లింది. కేవలం 158 మంది ఎంపీలే దానికి మద్దతిచ్చారు. 292 మంది వ్యతిరేకంగా ఓటేయడంతో ప్రభుత్వం కుప్పకూలింది. ► ఇక 1999లో అటల్ బిహారీ వాజ్‌పేయీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానం చివరి క్షణంలో అన్నాడీఎంకే ప్లేటు ఫిరాయించి వ్యతిరేకంగా ఓటేయడంతో అనూహ్యంగా ఓడి ప్రభుత్వం పడిపోయింది. ► 1990లో రామమందిర అంశంపై బీజేపీ మద్దతు ఉపసంహరించుకోవడంతో లోక్‌సభలో బలం నిరూపించుకునేందుకు వీపీ సింగ్ ప్రభుత్వం విశ్వాస తీర్మానం పెట్టింది. తీర్మానానికి అనుకూలంగా కేవలం 142 ఓట్లు రాగా వ్యతిరేకంగా ఏకంగా 346 ఓట్లు రావడంతో ప్రభుత్వం పడిపోయింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
చెయ్యాల్సింది వదిలి ఇంకేదో చేస్తున్నారు!
‘‘భారత రాజ్యాంగంలో కీలకమైన 44వ అధికరణ ప్రకారం దేశానికంతకూ కలిపి ఒకే ఒక పౌర స్మృతి అమలులో ఉండాలి. ఇది లేనందుననే దేశంలోని సామాజికులలో ఐక్యత, అమలు జరగాల్సిన ఆర్థిక న్యాయం కుంటుపడి పోతున్నాయి’’ – ఎం. వెంకయ్య నాయుడు, భారత మాజీ ఉపరాష్ట్రపతి ప్రకటన (7.7.2023) వెనకటికొకడు ‘తాడి చెట్టు ఎందుకెక్కావురా’ అంటే, కల్లు కోసమనే రీతిగా సమాధానం చెప్పకుండా ‘దూడ మేత కోసం’ అని సమాధానం చెప్పాడట. ‘ఒకే దేశం ఒకే జాతి’ అనే బీజేపీ ఎజెండాను అమలు చేయడంలో భాగంగా ‘ఉమ్మడి పౌర స్మృతి’ని ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ముందుకు తెచ్చిందనేది బహిరంగ రహస్యమే. అసమానతలను రూపు మాపుకునే హక్కు రాజ్యాంగం ప్రసాదించింది. కానీ ఆ విషయాన్ని మరచి అందుకు పూర్తిగా భిన్నమైన భూస్వామ్య, పెట్టు బడిదారీ వ్యవస్థల మూలాలు చెక్కు చెదరకుండా భారత కాంగ్రెస్, బీజేపీ పాలకులు సంపూర్ణ మంత్రి వర్గాల పేరుతోనో, సంకీర్ణ ప్రభుత్వాల నాటకంతోనో ఇంతకాలం కాలక్షేపం చేస్తూ వచ్చారు. కుల, మత, వర్గ విభేదాలు ప్రజల మధ్య పెరగ డానికి, పాక్షిక రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకుని తాత్కాలికంగా గట్టెక్కడానికి ఎత్తులు, పైఎత్తులతో కాలక్షేపం చేస్తూ వస్తున్నారు. అటువంటి ఒక ఎత్తుగడే ‘ఉమ్మడి పౌర స్మృతి.’ తమ స్వార్థ రాజకీయాలను వివిధ అణగారిన ప్రజా శక్తులు ఆందోళనల ద్వారా, సమ్మెల ద్వారా, ఉధృత స్థాయిలో ఉద్యమాల ద్వారా ఎదుర్కొంటూ వస్తూండటంతో పాలక వర్గాలు అరెస్టులు, కాల్పులు, నిర్బంధ విధానాల ద్వారా ప్రజా శక్తుల్ని అణచ జూస్తు న్నారు. ఈ సందర్భంగా, ప్రజలపై నిర్బంధ విధానాన్ని అమలు జరపడం ద్వారా పాలకులు అనుసరించే ఎత్తుగడలకు విచిత్రమైన రెండు ఘటనలను చరిత్రనుంచి ఉదహరించుకుందాం: ముందుగా పాత సోవియెట్ యూనియన్‌లో చోటుచేసుకున్న సంఘటన. పంటలు పండించడంలో ఆరితేరిన ఒక రైతు ఒక మార్కెట్ స్క్వేర్‌లో నిలబడి, ‘మన వ్యవసాయ మంత్రి ఒక తెలివితక్కువ దద్దమ్మ (ఫూల్) అని అరిచాడట. అంతే ఆ రైతును అరెస్టు చేసి 10 సంవత్సరాల ఒక మాసం పాటు జైల్లో నిర్బంధించారు. అందులో ఆ రైతు, మంత్రి గారిని ‘ఫూల్’ అని అగౌరవ పరచినందుకు ఒక మాసం పాటు, ప్రభుత్వ గుట్టును రట్టు చేసినందుకు 10 ఏళ్ళూ శిక్ష విధించారు. ఇంతకూ అసలు రహస్యం – ఆ రైతు పెద్ద మంత్రిని ఎద్దేవా చేసినందుకు విధించిన జరిమానా చిన్నదే, కానీ మంత్రిని ‘పనికిమాలిన దద్దమ్మ’ అన్న విమర్శ ప్రజల మనస్సుల్ని బాగా ప్రభావితం చేసినందుకు బారీ పెనాల్టీ విధించడం జరిగిందట! అలాగే మన దేశంలో జరిగిన మరో సంఘటన చూద్దాం. ‘నీరవ్ మోదీ, లలిత్ మోదీ, నరేంద్ర మోదీ... వీళ్లందరి ఇంటిపేర్లుగా మోదీ ఎలా వచ్చింది? దొంగలందరి ఇంటిపేరుగా మోదీ ఎలా వచ్చింది’ అన్న రాహుల్ గాంధీ ‘జోక్’ కూడా క్రిమినల్ కేసులో చేరిపోయింది. దీనిపైన సుప్రీంకోర్టు సీనియర్ అడ్వొకేట్ సంజయ్ హెగ్డే వ్యాఖ్యా నిస్తూ ‘జోక్‌ను, విమర్శను పరువు నష్టం కింద భావించి ఒక వ్యక్తిని అమెరికాలో జైలులో నిర్బంధించరు. ‘ఏలిననాటి శని’ లాంటి వలస చట్టం వల్ల ఇది ఇక్కడ సాధ్యమయింద’న్నారు. ‘ఏదో ఒక మోదీని అవమానించారని కాదు, మోదీలందరినీ ఉద్దేశించి అన్న సాధారణ అర్థంలో రాహుల్ వ్యాఖ్యలు ఉన్నాయని కోర్ట్ శిక్ష విధించింది’ అని ఆయన వివరించారు. పలువురు వ్యక్తులను సంబోధించే క్రమంలో ఇంటి పేర్లు, వంశనామాలు పెట్టి పిలిచినంత మాత్రాన ‘పరువు నష్టం’ కింద జమ కట్టడానికి వీలు కాదన్నారు. ఈ సందర్భంగా ఆయన హోమీ మోదీ, లాలా మోదీ, సయెద్ మోదీ, పూర్ణేందు మోదీ వంటి పేర్లను ప్రస్తావించారు. భారత రాజ్యాంగానికి విశిష్టమైన వ్యాఖ్యాన పరంపర అందించిన సుప్రసిద్ధ మానవ హక్కుల పరిరక్షణా ఉద్యమ నేతల్లో అగ్రజుడైన ఉన్నత న్యాయవాది కేజీ కన్నాభిరాన్ దేశంలోని పౌరహక్కుల ఉద్యమ కార్యకర్తల్ని భూస్వామ్య పెట్టుబడిదారీ ప్రభుత్వం అన్యాయంగా అరెస్టులు చేసి, నిరా ధారమైన ఆరోపణలతో జైళ్లపాలు చేసినప్పుడు నిద్రాహారాలు లెక్క చేయ కుండా వారికి లీగల్ సహాయం అందించి విడుదలయ్యేటట్టు చేశారు. నక్సలైట్ ఖైదీల విడుదల కోసం ఏర్పడిన రక్షణ కమిటీకి కన్వీనర్‌గా పనిచేశారు. దేశంలో న్యాయ వ్యవస్థ పనితీరును ప్రస్తావిస్తూ కన్నాభిరాన్, న్యాయ వ్యవస్థ పనిచేస్తున్న తీరును ప్రస్తావించి ఇలా వ్యాఖ్యానించారు: ‘‘దేశంలోని కోర్టులు అధికార, అనధికార స్థానాల్లో ఆధిపత్య స్థానాల్లో ఉన్న బలవంతులైన వారిని దుర్మార్గపు పరిణామాలకు బాధ్యుల్ని చేసి శిక్షించలేక పోతున్నాయి. చివరికి అణగారిన కార్మికులు ఆత్మగౌరవం కోసం పోరాడు తున్న సందర్భాల్లో కూడా అలాంటి వారి రక్షణకు కొన్ని కోర్టులు ముందుకు రావడం లేదు’’! చివరగా... చరిత్రలో కొందరు పాలకులు ప్రజలపైన, చివరికి, ప్రసిద్ధ చరిత్రకారులపైన ఎన్ని కిరాతకమైన ఆంక్షలు విధిస్తారో, దుర్మార్గాలకు పాల్పడుతుంటారో తెలియచేసే ఉదాహరణ ఒకటి చూద్దాం. చైనా చరిత్రలో ‘సీమా కియాన్’ అనే ప్రసిద్ధ చరిత్రకారుడు చక్రవర్తిని విమర్శించి ప్రజల ముందు అభాసుపాలు చేశాడు. అందుకు ఆ చక్రవర్తి ఒక దుర్మార్గమైన ‘ఆఫర్’ ఇచ్చాడు. చేసిన నేరానికి ‘ఉరిశిక్ష కావాలా లేక ఆ స్థానంలో నపుంస కుడిగా మారి పోతావా’ అని అడిగాడు. మరి తాను చరిత్రకారుడు కాబట్టి నపుంసకుడిగా ఉండిపోయి అయినా తాను ప్రారంభించిన చరిత్ర రచనను పూర్తిచేయాలనుకున్న కియాన్ నపుంసకునిగా మారడానికే మొగ్గాడు. (సైమన్ సీబాగ్ మాంటిఫియోర్ ‘ది వరల్డ్: ఎ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ హుమా నిటీ’). బహుశా కారల్ మార్క్స్ మహనీయుడు అందుకే అని ఉంటాడు: ‘‘మనుషులు తమ చరిత్రను తామే లిఖించుకుంటారు. కానీ, తమ ఇష్టా ఇష్టానుసారంగా రాసుకుంటూ పోలేరు. ఎవరికి వారు తమకు తామై ఎంచు కునే సందర్భాల ప్రకారమూ రాసుకోలేరు. మరి ఏ పునాది ఆధారంగా రాస్తారు – సిద్ధాన్నంలాగా అప్ప టికే ఉన్న పరిస్థితులు ఆధారంగా, గతం నుంచి సంక్రమించిన పరిస్థితులు ఆసరాగా తప్ప మరొక మార్గం లేదు’’! అవును కదా మరి – ‘‘భూమిలోన పుట్టు భూసారమెల్లను తనువులోన పుట్టు తత్వమెల్ల శ్రమములోన పుట్టు సర్వంబు తానేను’’! abkprasad2006@yahoo.co.in -
విశ్వ సమానత్వాన్ని తిరస్కరిస్తారా?
జాతి, మతం, లింగం, లైంగిక ధోరణితోపాటు కుల ప్రాతిపదికన వివక్షను నిషేధించే చట్టాలు అమెరికా, కెనడాల్లోని కొన్ని రాష్ట్రాలు ఆమోదించాయి. వీటిని ఆర్ఎస్ఎస్, బీజేపీ మేధావులు వ్యతిరేకించారు. అమెరికాలో హిందూ ప్రతిభ పురోగతిని అడ్డుకునేందుకు కుట్ర పన్నుతున్నారనీ, ప్రపంచంలో హిందూ మతానికి హాని కలిగించడానికే ఈ వివక్షా కార్డును ఉపయోగిస్తున్నారనీ వారు ఆరోపించారు. భారతీయ వలసల్లో కుల వివక్ష ఎలా పనిచేస్తోందని అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, యూరప్ దేశాల్లో ఇప్పటికే కొన్ని అధ్యయనాలు జరిగాయి. సాధారణంగా మానవ సమానత్వం వైపు, ప్రపంచంలో ఎక్కడ నివసిస్తున్నప్పటికీ భారతీయులు సమానత్వం వైపు నిలబడుతున్నట్లయితే, ఎవరైనా అలాంటి శాసనాలను ఎందుకు వ్యతిరేకించాలి? అమెరికాలో పలువురు వలస భారతీయుల కేంద్రంగా ఉన్న సుసంపన్న రాష్ట్రం కాలిఫోర్నియా సెనేట్‌లో 2023 మార్చి 22న కుల వివక్ష వ్యతిరేక బిల్లును ప్రవేశపెట్టారు. ఇది ఆమోదం పొందినట్లయితే, ప్రపంచంలోనే కులాన్ని మరింత మౌలికంగా చర్చించే మొదటి చట్టం అవుతుంది. భారత రాజ్యాంగం అస్పృశ్యతను రద్దు చేసింది కానీ కులాన్ని కాదు. హిందుత్వ ప్రవాసులు ఇలాంటి కీలక పరిణామం చోటు చేసుకోబోదని భావించారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, బీజేపీ శక్తులు కూడా అలాంటి ఘటన జరగకూడదని భావించాయి. కానీ ప్రపంచం వీరి పరిధిని దాటిపోయింది. జాతి, మతం, లింగం, లైంగిక ధోరణితోపాటు కుల ప్రాతిపదికన పౌరులు, పెద్దలు లేదా పిల్లలపై వివక్షను నిషేధించే చట్టాన్ని సియాటిల్ సిటీ కౌన్సిల్(అమెరికా), టొరొంటో డిస్ట్రిక్ట్ స్కూల్ బోర్డ్(కెనడా) ఆమోదించినప్పుడు పలువురు ఆర్ఎస్ఎస్, బీజేపీ మేధావులు వ్యతి రేకించారు. ఇలాంటి శాసనాలను ‘హిందూఫోబియా’గా వారు ఖండించారు.అటువంటి శాసనాలను వ్యతిరేకిస్తూ పలు పత్రికలు, సోషల్ మీడియా వేదికల్లో రాశారు, మాట్లాడారు. సాధారణంగా మానవ సమానత్వం వైపు, ప్రపంచంలో ఎక్కడ నివసిస్తున్నప్పటికీ భారతీయుల సమానత్వం వైపు నిలబడుతున్నట్లయితే, అలాంటి శాస నాలను ఎందుకు వ్యతిరేకించాలి? వివక్షకు సమర్థనా? సియాటిల్ సిటీ కౌన్సిల్ ఇటీవలే ఆమోదించిన తీర్మానంలో వివక్ష వ్యతిరేక చట్టాలకు కులాన్ని కూడా జోడించడాన్ని ఆర్ఎస్ఎస్ అనుబంధ పత్రిక పాంచజన్య ‘సంస్థాగత మార్గం ద్వారా అమెరికాలో హిందూఫోబియాను ప్రోత్సహిస్తున్నారు, అమెరికాలో హిందూ ప్రతిభ పురోగతిని అడ్డుకునేందుకు కుట్ర పన్నుతున్నారు’ అని పేర్కొన్నట్టుగా ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ రాసింది. ఆర్ఎస్ఎస్ సీనియర్ నాయకుడు రామ్ మాధవ్ ఈ వాదననే మరింత ముందుకు తీసుకు పోయారు. కుల వివక్షకు సంబంధించిన ఈ తప్పుడు జెండాను ఎత్తుతున్న బృందాలు సాధారణంగా హిందూభయంతో ఉంటు న్నాయని ఆయన ఒక జాతీయ దినపత్రికలో రాశారు. ప్రపంచంలో హిందూ మతానికి హాని కలిగించడానికే ఈ వివక్షా కార్డును ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. అమెరికా కేంద్రంగా వ్యవహరించే పరిశోధనా సంస్థ ‘ఈక్వాలిటీ ల్యాబ్’నూ, అలాగే అమెరికా, కెనడా, యూరప్ తదితర ప్రాంతాల్లో అలాంటి కుల వ్యతిరేక చట్టాలు, శాస నాలపై పనిచేసే పౌర సమాజ బృందాలనూ పశ్చిమ దేశాల్లోని హిందూఫోబిక్ గ్రూపులుగా రామ్ మాధవ్ తప్పుపట్టారు. పాంచజన్య ఆరెస్సెస్ అధికార పత్రిక. వివక్షా వ్యతిరేక చట్టం హిందూఫోబియాకు సంకేతమనీ, భారతీయ ప్రతిభ పురోగతిని అడ్డుకునే కుట్ర అనీ అది పేర్కొంటోంది. భారత్ లేదా ప్రపంచంలో గణనీయ సంఖ్యలో భారతీయులు నివసిస్తున్న చోట సంస్థాగత శాసనాలను రూపొందించకుండా కులవివక్ష సమస్యను పరిష్కరించడం ఎలా? వివక్షను ప్రదర్శిస్తున్న వారు అలాంటి వివక్షా వైఖరి తప్పు అని ఎన్నడూ భావించరు. ఒక వ్యక్తి లేదా వర్గ మానసిక లక్షణాల్లో వివక్షా పూరితమైన ప్రవర్తన భాగమవుతుంది. హిందూ మతానికి సంబంధించి, అలాంటి వివక్షను ఆధ్యాత్మిక పాఠ్య గ్రంథాల ద్వారా సమర్థిస్తున్నారు. దానికి పవిత్రతను కల్పిస్తున్నారు. వివక్షాపూరిత అనుభవాలెన్నో! భారతీయ వలసల్లో కుల వివక్ష ఎలా పనిచేస్తోందని అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, యూరప్ దేశాల్లో ఇప్పటికే కొన్ని అధ్యయనాలు జరిగాయి. స్కూల్, కాలేజీ, పిల్లలు, యువత రోజువారీగా అను భవిస్తున్న వేదనకు సంబంధించిన ఇవి గాథలను వర్ణించాయి. వ్యక్తుల కుల నేపథ్యాన్ని తెలుసుకోవడానికి, అమలవుతున్న వివక్షా పద్ధతు లను కనుగొనడానికి సంబంధించిన యంత్రాంగాలను పలు నివేది కలు వెలికి తెచ్చాయి. ఉదాహరణకు, తెన్ మొళి సౌందరరాజన్ తాజా పుస్తకం ‘ద ట్రామా ఆఫ్ కాస్ట్ – ఎ దళిత్ ఫెమినిస్ట్ మెడిటేషన్ ఆన్ సర్వైవర్‌షిప్, హీలింగ్, అబాలిషన్’ అమెరికాలోని భారతీయ వలస ప్రజలలో వివక్షకు సంబంధించిన అసంఖ్యాక ఘటనలను గుది గుచ్చింది. ఈమె రెండో తరం భారతీయ అమెరికన్ దళిత మహిళ. టొరొంటో శాసనాలను రూపొందించిన తర్వాత, కెనడాలోని ఒక కాలేజీ విద్యార్థి త్రినా కుమార్ తన జీవితంలో ఎదుర్కొన్న ఒక అనుభవాన్ని సమగ్రంగా వర్ణించారు. తమ వేదనా గాథలను చెబు తున్న, భవిష్యత్తును ప్రేమిస్తున్న యువ మహిళగా ఆమె కనిపిస్తారు. ‘‘గ్రేటర్ టొరొంటో పాఠశాలల్లో కులపరమైన వేధింపును చాలానే ఎదుర్కొన్నాను. ఈ వేధింపు నాకు అయోమయం కలిగించింది. ప్రత్యేకించి మేమంతా కెనడియన్లమే అయినప్పటికీ నా తోటి క్లాస్ మేట్లకు కులం అంటే ఇంత ప్రాధాన్యం ఎందుకు అని నేను ఆశ్చర్య పడ్డాను’’ అని ఆమె చెబుతున్నారు. ‘‘వారి అగ్రకుల సంప్రదాయా లను నేను అనుసరించలేదు, దళిత క్రిస్టియన్ గా ఉంటున్నందుకు వారు నన్ను ఆటపట్టించేవారు’’ అని ఆమె చెప్పారు. క్రిస్టియన్లు మెజారిటీగా ఉంటున్న దేశంలో వారు ఇలా చేస్తున్నారు. ఇది క్రిస్టోఫోబియా కాదా? పాశ్చాత్య కులతత్వ వలస ప్రజల్లో ఈక్వాలిటీ ల్యాబ్స్ ఒక సంక్షోభాన్ని సృష్టించింది. అయితే, అమెరికాలో కుల వివక్షపై ఈక్వా లిటీ ల్యాబ్స్ అధ్యయనాన్ని రామ్ మాధవ్ తోసిపుచ్చారు. ఇలాగైతే, మొత్తంగా గోధుమవర్ణపు భారతీయులు తమ మీద శ్వేత అమెరికన్లు వివక్ష ప్రదర్శిస్తారని ఎలా ఆరోపించగలరు? సమానత్వం కోసం పనిచేస్తున్న గ్రూపులెన్నో! అమెరికా, కెనడాల్లో కుల వివక్షా వ్యతిరేక చట్టాలపై ఈక్వాలిటీ ల్యాబ్స్ ఒక్కటే పనిచేయలేదు. ఉత్తర అమెరికా అంబేడ్కర్ అసోసి యేషన్, బోస్టన్ స్టడీ గ్రూప్, పెరియార్ అంబేడ్కర్ స్టడీ సర్కిల్,అంబేడ్కర్ బుద్ధిస్ట్ అసోసియేషన్, అంబేడ్కర్ కింగ్ స్టడీ సర్కిల్, అంబేడ్కర్ ఇంటర్నేషనల్ మిషన్ వివక్షను ఎండగట్టడానికీ, పీడిత కుల వలస ప్రజలను చైతన్యవంతం చేయడానికీ కృషి చేశాయి. భారత్‌లో కులం, మానవ అస్పృశ్యత ఎలా పనిచేస్తున్నాయో, దాన్ని అమెరికా, యూరప్, కెనడా, ఆస్ట్రేలియాల్లో ఎలా విస్తరింపజేస్తున్నారో పాశ్చాత్య సమాజాలకు తెలియపర్చేందుకు ఈ సంస్థలు బహుముఖ కార్యక్రమాలను చేపడుతూ వచ్చాయి. ఎక్కడ ఉన్నా సరే... కుల అణచివేత, దాని కార్యకలాపాలు ఎంత అమానుషంగా ఉంటు న్నాయో ఈ దేశాల్లోని నల్లవారికీ, శ్వేత జాతీయులకూ తెలియజెప్పేందుకు ఈ సంస్థలు తమ వనరులనూ, మానవ శ్రమనూ చాలా వెచ్చించాయి. కులవ్యవస్థ గురించి, దాని అమానుషమైన ఆచరణ గురించి ప్రపంచానికి అవగాహన కల్పించడంలో తప్పేముంది? మానవ సమా నత్వం కోసం నిలబడకుండా ఆర్ఎస్ఎస్, బీజేపీ ప్రజాస్వామ్యం కోసం ఎలా నిలబడతాయి? జాతి వివక్ష, ఇతర దేశాల పట్ల దురభిప్రాయం, దానికి సంబంధించిన అసహనాలకు వ్యతిరేకంగా డర్బన్ లో ఐక్యరాజ్యసమితి సదస్సు జరిగిన 2001 నుంచి ప్రపంచం చాలా దూరం పయనించింది. ఆనాటి సదస్సులో జాతి సమస్యతోపాటు కుల సమస్యను కూడా చర్చించడానికి అనుమతించలేదు. ఆనాడు ఐ.రా.స. అంగా లకు కుల వ్యవస్థ గురించి ఏమీ తెలియదనే చెప్పాలి. కుల సమస్యను అంతర్గత అంశం అని ప్రకటించి, దానిపై ఎలాంటి చర్చను కూడా అనుమతించడానికి బీజేపీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం సుముఖత చూపడం లేదు. హిందూఫోబియా పేరిట వివక్షను, అసమాన త్వాన్ని, జాతి హత్యాకాండను విశ్వగురువు ఎందుకు ప్రేమిస్తున్నారు? హిందూయిజం మానవ సమానత్వాన్ని కోరుకోవడం లేదని దీని అర్థం కాదా? ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
ఈ యుగం బాబాసాహెబ్‌దే!
ఇవ్వాళ పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు అందరూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్‌ను భుజానికి ఎత్తుకుంటున్నారు. ఇందులో కొందరు అంబేడ్కర్ చెప్పిన సామాజిక న్యాయాన్ని ప్రజలకు అందించేవారూ ఉన్నారు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... బాబాసాహెబ్ ఏం చెప్పారో దానికి పూర్తి వ్యతిరేకంగా వ్యవహరిస్తూ దేశ రాజ్యాంగ మౌలిక సూత్రాలనే దెబ్బతీయ చూస్తున్నవారూ ఉండటం! విభిన్న భౌగోళిక ప్రాంతాలూ, అనేక జాతులూ, మతాలూ, కులాలూ, భాషలూ ఉన్న భారతదేశం సమాఖ్య లౌకిక రాజ్యంగా విలసిల్లాలని అంబేడ్కర్ ఆశించారు. ఆ మేర రాజ్యాంగంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. కానీ నేడు కొందరు పాలకులు, ప్రభుత్వాలు రాజ్యాంగ మౌలిక సూత్రాలకు తూట్లు పొడిచే విధంగా అడుగులు వేస్తుండడం విషాదకరం. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 132వ జయంతి సందర్భంగా, ప్రపంచవ్యాప్తంగా ఆయన వ్యక్తిత్వాన్ని గురించి, సిద్ధాంత అన్వ యం గురించి ముఖ్యంగా భారత రాజ్యాంగ నిర్మాణం గురించి, కుల నిర్మూలనా సిద్ధాంత ప్రతిపాదన గురించి చర్చ జరుగుతోంది. ఆయన తన జీవిత కాలంలో విస్తృతంగా రచనలు చేశారు. ఆయన మేధో సంపన్నత ఆయన గవేషణ పద్ధతిలోనే ఉంది. ముఖ్యంగా వేదాలను పరిశీలించిన పద్ధతి వినూత్నమైనది, విప్లవాత్మకమైనది. ఎందుకంటే అంతకుముందు వేదాల గురించి పరిశోధించిన మాక్స్ ముల్లర్, సురేంద్ర దాస్ గుప్తా, సర్వేపల్లి రాధాకష్ణన్ వంటివారు ఎవరూ కూడా వేదాలు అశాస్త్రీయమైన భావాలతో రూపొందాయని చెప్ప లేకపోయారు. ముఖ్యంగా శంకరాచార్యులు, రామా నుజాచార్యులు, మధ్వాచార్యులు తమ తమ కోణాల్లో వేద సమర్థుకులుగా భాష్యం రాసు కున్నారు. అంబేడ్కర్ ఒక్కరే వేదాలను, భగవద్గీ తను హింసాత్మక గ్రంథాలుగా పేర్కొన్న సాహస వంతుడు. అలాగే ఆయన ‘శాక్రెడ్ ఆఫ్ ఈస్ట్’ పేరుతో వచ్చిన 50 వాల్యూమ్స్ చదివి రాసుకున్న నోట్స్ ఎంతో విలువైనది. దాన్ని ముద్రిస్తే ప్రపంచ మూల తత్త్వ శాస్త్రానికి ఎంతో విలువైన సమా చారం జోడించగల గ్రంథాలు అందుబాటులోకి వస్తాయి. ఆయన తాత్త్విక దర్శనాలు శాస్త్రీయమైన చర్చతో కూడి ఉంటాయి. మార్క్స్, ఎంగెల్స్‌లు రాసిన ‘కమ్యూనిస్ట్ మేనిఫెస్టో’, ఎంగెల్స్ రాసిన ‘డైలెక్టిక్స్ ఆఫ్ నేచర్’, మోర్గాన్ రాసిన ‘ఏన్షియంట్ సొసైటీ’ వంటి వాటి స్థాయిలో... ఆయన తాత్విక, సామాజిక, రాజకీయ చర్చలు ఉంటాయి. వేదాల గురించి అంబేడ్కర్ ఇలా అన్నారు. ‘వేదాలు హిందువుల మతసాహిత్యంలో అత్యు న్నత స్థానాన్ని ఆక్రమించుకున్నాయని చెప్పడం వాటిని గురించి చాలా తక్కువ చెప్పినట్టే అవుతుంది. వేదాలు హిందువుల పవిత్ర సాహిత్యం అని చెప్పినా సరిపోనిదే అవుతుంది. ఎందుచేతనంటే అవి తప్పు పట్టడానికి వీలు లేనివి. వాటిని అపౌరు షేయాలని నమ్ముతారు కాబట్టి’. అంటే వేదాలు మానవ కల్పితాలు కావు అని అర్థం. మానవ కల్పి తాలు కాకపోవడం వల్ల సాధారణంగా ప్రతి మానవుడు చేసే తప్పిదాలకు, దోషాలకు, పొరపాట్లకు అవి అతీతంగా ఉంటాయి. అందుచేతనే అవి అమోఘమైనవిగా భారతీయులు నమ్ముతున్నారు. అయితే అంబేడ్కర్ వేదాలను మానవ మాత్రులైన రుషులే రచించారని చెప్పారు. ఒకరిని ద్వేషించే, అపహాస్యం చేసే, హింసను ప్రోత్సహించే ఏ గ్రంథా లైనా అవి విశ్వజనీనమైనవి కావు అని అంబేడ్కర్ చెప్పారు. అంబేడ్కర్ ప్రతిభ బహుముఖీనం. ప్రధానంగా ఆయన తాత్వికులు. ముందు తన్ను తాను తెలుసుకున్నారు. తర్వాత తన చుట్టూ ఉన్న సమా జాన్ని కూడా తెలుసుకున్నారు. తనకూ సమాజానికీ ఉండే అంతఃసంబంధాలను అధ్యయనం చేశారు. సమాజానికి అంతః ప్రకృతి అయిన రాజ్యాన్నీ, దాని అంగమైన ప్రభుత్వాన్నీ, వాటి పునాదుల్నీ పరిశోధించారు. వాటికీ తనకూ ఉండే వైరుధ్యాలనూ బయటకు తీశారు. ఈ దృష్టితో చూసిన ప్పుడు భారతావనిలో బుద్ధుని తర్వాత అంత లోతైన నైతిక వ్యక్తిత్వం అంబేడ్కర్‌దే అవుతుంది. ఆయన సామాజిక జీవితానికి పునాది బుద్ధుని బోధనా తత్వంలోనే అంతర్లీనంగా ఉంది. ఆయన బోధనలో ప్రేమ, కరుణ, ప్రజ్ఞ, ఆచరణ, దుఃఖ నివారణ, సంఘ నిర్మాణం, నైతికత, త్యాగం, ప్రధానమైనవి. ఆయన ఎంతో నిబద్ధంగా జీవించారు. రాత్రి పది గంటలకు ఆయన అన్నం తినేటప్పుడు పుస్తకాల జ్వలనంతో పాటు ఆకలి మంట కూడా రగులుతూనే ఉండేది. లండన్ వీధుల్లో అర్ధాకలితో తిరిగారు. ఆయన ధనాన్ని జ్ఞానానికి ఎక్కువ ఖర్చు చేశారు. ఆకలి తీర్చుకోవడానికి తక్కువ డబ్బు వాడేవారు. కాల్చిన రొట్టె ముక్క లను ఒక కప్పు టీలో ముంచి తిని అనంత అధ్యయనం చేసిన త్యాగశీలి ఆయన. ఈరోజు స్కాలర్‌షిప్‌తో చదు వుకుంటున్న కొందరు దళిత విద్యార్థులు తమ ఉపకార వేతనాన్ని విలాసాలకు వాడుతున్న వైనం చూస్తుంటే అంబేడ్కర్ నుంచి వీరు ఎంత నేర్చు కోవాలో అర్థమవుతుంది. అంబేడ్కర్ పరీక్షల కోసం చదవలేదు. విజ్ఞానం కోసం, అవగాహన కోసం సిద్ధాంత నిర్మాణం కోసం, సాక్ష్యాధారాల కోసం చదివారు. రాత్రంతా చదువుతూ కనిపించే అంబేడ్కర్‌తో రూవ్ుమేట్ ఎప్పుడైనా చదువు ఆపు అంటే...‘నా పరిస్థితులు, నా పేదరికం, నేను ఎంత త్వరగా విద్యార్జన పూర్తి చేస్తే అంత మంచిది. నా కాలాన్ని నేను ఎంత విద్యార్జనలో గడిపితే, ఎంత సద్వి నియోగం చేసుకుంటే అంత మంచిది’ అని చెప్పే వారు. ఆయన చదువు పట్ల చూపిన నిబద్ధతని ఈనాటి దళిత విద్యార్థి లోకం అనుసరించినట్లయితే మేధోసంపన్నత వీరి సొంతమై వీరు భారత దేశ పునర్నిర్మాణానికి ముందుకు వస్తారు. నీటి వినియోగం పైన అంబేడ్కర్ పెట్టిన శ్రద్ధ ఏ జాతీయ నాయకుడూ పెట్టలేదు. అంతగా పట్టించుకోలేదు. ఆయన ప్రణాళికలు నిర్దిష్టమై నవి. కార్మి కుల అభివృద్ధి కోసం, వ్యవసాయ, వ్యవసాయేతర కార్మికులకు ఉపాధి కల్పించాలని ఆయన పోరా డారు. గ్రామీణ శ్రామి కులను పారిశ్రామిక పనుల్లో ఉపయోగించుకుంటే పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా కొలంబియా, హార్వార్డ్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలలో అంబేడ్కర్ మీద జరిగి నంత పరిశోధన భారతదేశంలో జరగడం లేదు. అన్ని కేంద్రీయ, రాష్ట్రీయ, దేశీయ విశ్వ విద్యాలయాల్లోనూ అంబేడ్కర్ పరిశోధనా కేంద్రాలు నిర్మించి... తగినన్ని నిధులు ఇచ్చి ప్రోత్సహించటం ద్వారా ఆయన రచనల లోని ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ, విద్యా అంశాలపై పరి శోధనలు జరిగేలా చూడాలి. ఆయన నడిపిన పత్రికలు, ఆయన నిర్మించిన సంస్థలు, పార్టీలు, ఆయన ప్రణాళికలు దేశ భవిష్యత్తుకు మార్గదర్శ కాలు. ముఖ్యంగా భూమినీ, పరిశ్రమలనూ జాతీయం చేయాలనే ఆయన ఆలోచన... దళిత, బహుజన, మైనారిటీలు రాజకీయ అధికార సాధన మీద ఆధారపడి ఉంది. అంబేడ్కర్ ముందటి భారతదేశం వేరు. ఆయన తర్వాతి భారతదేశం వేరు. అందుకే అంబేడ్కర్ యుగ కర్త. ఈ యుగం ఆయనదే. ఆయన మార్గంలో నడుద్దాం. డాక్టర్ కత్తి పద్మారావు వ్యాసకర్త దళిత ఉద్యమనేత ‘ 98497 41695 రాజ్యాంగం నిర్దేశించిన సూత్రాల ప్రకారమే భారత్‌లో సమాఖ్య ప్రభుత్వాలు పూర్తిగా నడవక పోయినా... రాజ్యాంగ మౌలిక సూత్రాలను మాత్రం గత ఆరు దశాబ్దాల్లో అవి అతిక్రమించ లేదనేది వాస్తవం. ఒక వేళ అటువంటి పరిస్థితులు తలెత్తినా న్యాయవ్యవస్థ ఎప్పటికప్పుడు తన న్యాయ సమీక్షాధికారం ద్వారా రాజ్యాంగాన్ని రక్షిస్తూ వచ్చింది. ఆర్ఎస్ఎస్ భావజాలం పుణికిపుచ్చుకున్న బీజేపీ ‘ఒకే జాతి, ఒకే భాష, ఒకే దేశం’ అంటూ నియంతృత్వ భారతాన్ని నిర్మించడానికి వడి వడిగా అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. భారత రాజ్యాంగం బోధిస్తున్న బహుళత్వం, పరస్పర సహకారం, రాష్ట్రాల హక్కులు, స్థానిక స్వయం పరిపాలన వంటి వాటిని తుంగలో తొక్కడానికే అఖండ ఏకైక భారత్ ప్రాపగాండా అనేది స్పష్టం. ఈ దేశంలోని వేల కులాలు, విభిన్న జాతులు, మతాలు, ప్రాంతాల అస్తిత్వాలను కనుమరుగు చేసి మెజారిటీ మతాన్నీ, భాషనూ ఇతరులపై రుద్దడానికి చేస్తున్న ప్రయత్నాలను ఇంతకన్నా ఏవిధంగా అర్థం చేసుకోవాలి? ‘రాష్ట్రాలు మిథ్య, కేంద్రమే నిజం’ అన్న రీతిలో కేంద్రంలోని అధికార పార్టీ విధానాలు సాగుతున్నాయి. ఇదే సమయంలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ మాత్రం చైతన్యరహితంగా తన పాత పద్ధతుల్లోనే వ్యవహ రిస్తూ అనేక రుగ్మతలతో కునారిల్లుతోంది. దేశ నవ నిర్మాణంపై స్పష్టమైన జాతీయ విధానాలు లేని మిగతా జాతీయ పార్టీలు నామమాత్రంగానే మను గడ సాగిస్తున్నాయి. మరో పక్క చాలా ప్రాంతీయ పార్టీలు అవినీతికి, కుటుంబ పాలనకు కేరాఫ్ అడ్రస్‌గా ఉంటూ జాతీయ రాజకీయాల్లో ప్రభావ వంతమైన పాత్రను పోషించే స్థితిలో లేవు. ఈ పరిస్థితులను అనువుగా తీసుకుని బీజేపీ ఈసారి పార్లమెంట్లో అత్యధిక మెజారిటీ సాధించడంతో పాటూ, దేశంలోని సగానికి పైగా రాష్ట్రాల్లో ప్రభుత్వాలను హస్తగతం చేసుకోవాలని వ్యూహం పన్నుతోంది. నిజంగా ఈ వ్యూహం ఫలిస్తే రాజ్యాంగానికి భారీ సవరణలు చేపట్టి దాని మౌలిక స్వరూపాన్ని మార్చడం బీజేపీకి సులువవుతుంది. మెజారిటీ మతం దేశ ప్రజలందరి మతం అయినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఆ మతానుయాయుల సంస్కృతే మొత్తం దేశ సంస్కృతిగా చలామణీ అవుతుంది. ఇప్పటికే మైనారిటీలు, నిమ్నవర్గాల ఆహార విహారాలపై ఛాందసవాదుల దాడులు, ఆంక్షలను చూస్తూనే ఉన్నాం. బీఫ్‌ను ఆహారంగా తీసుకున్న వారు మత విలువల్ని కించపరచిన వారుగా దాడులకు గురవుతున్నారు. ఎక్కువగా ఉత్తరాదికి పరిమితమైన మూక దాడుల సంస్కృతిని దక్షిణాదికీ, ఈశాన్య భారతానికీ ఛాందస వాదులు విస్తరింపచూస్తున్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశ మైన భారత్‌లో ఇప్పటి వరకు ఎలాంటి సైనిక, ప్రజా తిరుగుబాటులు జరుగలేదంటే అందుకు రాజ్యాంగం ఇచ్చిన లౌకిక ప్రజాస్వామ్య విలువలే ప్రధాన కారణం. అన్ని కులాలూ, జాతులూ, మతాలూ, భాషలూ, ప్రాంతాలకు సమాన ప్రాతినిధ్యం, హక్కులు కల్పించడమనే మౌలిక సూత్రం రాజ్యాంగంలో ఉన్నది కాబట్టే తిరుగుబాట్లు తలెత్తలేదు. కానీ ఒకే దేశం, ఒకే జాతి లాంటి నినాదాలను ముందుకు తెచ్చి కేంద్రీకృత నియంతృత్వ విధానాలనూ, ఫాసిజాన్నీ దేశంలో అమలు చేయడానికి నేడు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అధికార పార్టీ తన నియంతృత్వ ధోరణిలో భాగంగానే పెద్ద నోట్ల రద్దు వంటి నిర్ణయాలను రాత్రికి రాత్రే తీసుకుని ప్రజలను ఇక్కట్ల పాలు చేసింది. ప్రాతినిధ్య ప్రజాస్వామ్య దేశ నిర్మాణంలో భాగంగా డాక్టర్ అంబేడ్కర్... ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు సామాజికంగా వెనుక బడిన కారణంగా వారికి రాజ్యాంగంలో రిజర్వే షన్లు పొందుపరచి... విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో అవకాశాలు కల్పించారు. కానీ అంబేడ్కర్ నిర్దేశించిన రిజ ర్వేషన్ల స్ఫూర్తికి తూట్లు పొడుస్తూ ఆర్థికంగా వెనుకబాటు ఆధారంగా 10 శాతం అగ్ర వర్ణ పేదలకు రిజర్వేషన్లను ఎటువంటి కమిషన్ వేయ కుండా, ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మూడు రోజుల్లోనే పార్లమెంట్లో ఆమోదింపచేసుకున్న మోదీ ప్రభుత్వాన్ని ఏవిధంగా అర్థం చేసుకోవాలి? 6 కోట్ల జనాభా ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు సామా జిక న్యాయాన్ని పాటిస్తూ అయిదుగురికి ఉప ముఖ్యమంత్రి పదవులనిచ్చి ముఖ్యమ్రంతి జగన్ దేశానికే ఆదర్శంగా నిలిచారు. 135 కోట్ల జనా భాను పాలించే బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కనీసం అయిదు ప్రాంతాలకు అయిదు గురు ఉపప్రధానులను చేస్తే తప్పేమిటి? 1955 లోనే మొదటి ‘రాష్ట్రాల విభజన కమిషన్’కు భారత రాజ్యాంగ పిత అంబేడ్కర్ ఓ లేఖ రాస్తూ... ఉత్తరాదిన ఢిల్లీని మొదటి దేశ రాజధానిగానూ, దక్షిణాదిన ఉన్న హైద్రాబాద్‌ను దేశ రెండో రాజ ధానిగానూ చేయాలని ప్రతిపాదించారు. ఇంత వరకు కాంగ్రెస్ కాని, బీజేపీ కానీ ఈ ప్రతిపాదనను పట్టించుకోలేదు. పాలన, అధికార వికేంద్రీకరణ జరిగితేనే కదా అన్ని ప్రాంతాల ప్రజలకూ న్యాయం జరిగేది. స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా... 135 కోట్ల జనాభాకు కేవలం 29 రాష్ట్రాలు మాత్రమే ఉన్నాయి. అన్ని అంశాల్లో అమెరికాను ఆదర్శంగా తీసుకుంటున్న భారత్ రాష్ట్రాల సంఖ్య విషయంలో ఎందుకు తీసుకోదో అర్థం కాదు. 35 కోట్ల జనాభాకన్నా తక్కువే ఉన్న అమెరికాలో 50 రాష్ట్రాలు ఉన్నాయి. స్వయం నిర్ణ యాధికారాలూ, సొంత సుప్రీంకోర్టు, సొంత రాజ్యాంగం, సొంత జెండా, ఎజెండా కలిగి ఉండే స్వేచ్ఛ అక్కడి రాష్ట్రాలకు ఉంది. అందుకే అక్కడ రాష్ట్రాలు సర్వతోముఖాభివృద్ధి చెందాయి. బాబా సాహెబ్ సూచించినట్లు భారత్‌లో 2 కోట్ల జనాభాకు ఒక రాష్ట్రం చొప్పున ఏర్పాటు చేస్తే మేలు జరిగి ఉండేది. జాతీయ వాదం ముసుగులో దళిత, మైనార్టీలపై దాడులు చేస్తే... దేశ జనాభాలో 35 శాతం ఉన్న ఈ వర్గాలు ఎలా నవభారత నిర్మాణంలో భాగస్వాములు అవుతాయి? అందుకే బీజేపీ పాల కులు దుందుడుకు పోకడలకు పోకుండా అంబే డ్కర్ ఆశయాల సాధనకు పాటు పడితే దేశం దానంతట అదే అభివృద్ధి చెందుతుంది. డా‘‘ గాలి వినోద్ కుమార్ వ్యాసకర్త ఫౌండర్ చైర్మన్, నవ భారత్ నిర్మాణ్ ఛారిటబుల్ ట్రస్టు -
మన రాజ్యాంగం ‘పక్కా లోకల్’
ముంబై: ‘‘భారత రాజ్యాంగం అతి గొప్ప స్వదేశీ రూపకల్పన. ఆత్మగౌరవం, స్వతంత్రం, స్వపరిపాలనకు అత్యుత్తమ కరదీపిక’’ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ కొనియాడారు. ‘‘కానీ కొందరు దాని విజయాలను అతిగా కొనియాడుతుంటే మరికొందరు పూర్తిగా పెదవి విరుస్తుంటారు. ఇది నిజంగా బాధాకరం. మన రాజ్యాంగం ఎన్నో గొప్ప ఘనతలు సాధించిందన్నది నిస్సందేహం. అయితే సాధించాల్సింది ఇంకా ఎంతో ఉంది. ముఖ్యంగా భారత సమాజంలో లోతుగా వేళ్లూనుకుపోయిన అసమానతలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి’’ అని అభిప్రాయపడ్డారు. రాజ్యాంగ స్ఫూర్తిని సమాజం పూర్తిస్థాయిలో అందిపుచ్చుకున్నప్పుడే ఈ అసమానతలు పోతాయన్నారు. శనివారం నాగపూర్‌లోని మహారాష్ట్ర నేషనల్ లా యూనివర్సిటీ తొలి కాన్వకేషన్‌లో సీజేఐ పాల్గొన్నారు. రాజ్యాంగ నిర్దేశిత విలువలకు కట్టుబడితే రాణిస్తారంటూ యువ న్యాయ పట్టభద్రులకు ఈ సందర్భంగా ఉద్బోధించారు. ‘‘నేడు మనం అనుభవిస్తున్న రాజ్యాంగ హక్కులు, పరిహారాలకు అంబేడ్కర్‌కు రుణపడి ఉండాలి. ఎన్నో అడ్డంకులను అధిగమించి ఆయన ప్రపంచంలోనే అతి గొప్ప సామాజిక సంస్కర్తగా ఎదిగారు’’ అంటూ కొనియాడారు. -
అంబేడ్కర్ స్ఫూర్తి ప్రతిఫలించేదెప్పుడు!
సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం, ప్రజాస్వామ్యం, మానవ హక్కులు వంటి వాటన్నింటినీ వాగ్దానం చేస్తున్న భారత రాజ్యాంగ నిర్దేశాలకు విలువే లేకుండా పోతోంది. అతి కొద్దిమందిగా ఉన్న అత్యధిక సంపన్నులను ఒక వైపు, అత్యధికులైన అతి పేదలను మరొక వైపు చూస్తున్నాం. ఈ విషయంగా మనం తప్పక బాబా సాహెబ్ అంబేడ్కర్ ఆలోచనలను మననం చేసుకోవలసిన అవసరం ఉంది. సామాజిక అసమానతల్ని తొలగించే క్రమంలోనే ఆర్థిక అసమానతలూ తొలగాలని అంబేడ్కర్ అన్నారు. అలాగే దేశంలోని ప్రజలందరూ ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక, రాజకీయ సాంకేతిక రంగాల న్నింటిలో సమానతను సాధించుకోవడమే రాజ్యాంగ లక్ష్యమని బాబాసాహెబ్ స్పష్టంగా ప్రకటించారు. ఆ మార్గంలో నడవడం మన పాలకుల ధర్మం. భారతదేశాన్ని ఎందరో పరిపాలించారు. వారందరికీ భారతదేశం అర్థం కావాలని ఏమీ లేదు. ఆర్యులకు, యవనులకు, కుషానులకు, అరబ్బులకు, మొఘలు లకు, బ్రిటిష్ వాళ్ళకు కూడా భారతదేశం అర్థం అయ్యిందని చెప్పలేం. వారంతా మూలవాసుల్ని అణచివేయడానికి ప్రయత్నించిన వారే. సామరస్యమూ, శాంతి, ప్రేమతో కూడిన మూలవాసుల భావన లను ధ్వంసం చేసే క్రమంలో వారంతా భారత చరిత్ర వక్రీకరణకు కారణం అయినవారే. ప్రస్తుత పాలకులు సైతం మన పూర్వ పాల కుల్లా నిజమైన సంస్కృతీ వికాసం మతవాదుల్లో ఉందనే నమ్ము తున్నారు. నిజానికి ఆ వికాసం హేతువాదులు, భౌతికవాదులు, అంబేడ్కర్ వాదులు, లౌకికవాదుల్లో వుంది. అసలు భారతదేశానికి మొదటి దర్శనం చార్వాక దర్శనం, రెండవ దర్శనం జైన దర్శనం, మూడు బౌద్ధ దర్శనం, నాలుగు సాంఖ్య దర్శనం. ఇవన్నీ నిరీశ్వర వాద దర్శనాలే. బౌద్ధ దర్శనం సాంఘిక సమానత్వానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలబడింది. అది మూలవాసుల నుండి జనించింది. మాన వాళి పట్ల దయార్ధ్ర దృష్టితో మెలగడం కరుణ అనీ, సాటి వారి పట్ల సౌహార్ద్ర దృష్టిని కలిగి ఉండటమే మైత్రి అనీ, ఈ సౌశీల్య విధానాలు ప్రతి ఒక్కరూ శక్తివంచన లేకుండా పాటించాలనీ బుద్ధుడు ప్రబోధించాడు. వ్యక్తి నిర్మలత్వానికి కూడా ఆయన ప్రాధాన్యం ఇచ్చాడు. బుద్ధుని సిద్ధాంతాలు.. అప్పటి వరకు వైదిక సంస్కృతి ఆచరణలోకి తీసుకు వచ్చిన మూఢ నమ్మకాలను, యజ్ఞ యాగాదులను, వ్యక్తి స్వార్థాన్ని, దుష్ట ప్రవర్తనను ఖండించి నూత్న సామాజిక దృక్పథాన్ని కలిగించాయి. క్రీ.పూ. 6వ శతాబ్దం నుండే భారతదేశం బౌద్ధ సంస్కృతిలో నడిచింది. భారత రాజ్యాంగంలో అంబేడ్కర్ ఈ బౌద్ధ సూత్రాలనే పొందు పరిచారు. ఆ ప్రకారం.. ఏ మతానికి చెందిన పాలకులైనా ఆ మతాన్ని వ్యక్తిగతంగానే ఉంచుకోవాలిగాని, దాన్ని రాజ్యం మీద రుద్దకూడదు. అయితే మతం, మతస్వేచ్ఛ గురించి చర్చించుకునే క్రమంలో మనం ప్రధానంగా గమనించాల్సింది ఏమిటంటే లౌకిక భావంతో వ్యవహ రించాల్సిన ప్రభుత్వాలే మతతత్వాన్ని ప్రేరేపిస్తుండటం! మరోవైపు సుసంపన్నమైన దేశంగా పరిగణన పొందుతున్న మన నేలలో ఆకలి చావులతో మరణిస్తున్న వారి సంఖ్య పెరగడం ఆశ్చర్యం కలిగించే విషయం. ముఖ్యంగా అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకునే వారి సంఖ్య పెరుగుతోంది. కుల, మత, అసమానతలు నిరంతరం వృద్ధి చెందుతున్నాయనీ; అణచివేతలు, గృహహింస విపరీతంగా పెరిగిపోతున్నాయనీ సామాజిక సర్వేలు చెపుతున్నాయి. ఇదే సమ యంలో కార్పొరేట్ పెట్టుబడిదారీ సామ్రాజ్యాన్ని కొన్ని శక్తులు యథేచ్ఛగా విస్తరించుకుంటూ వెళ్తున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలన్ని టినీ ప్రైవేటు వ్యక్తులకు అధీనం చేయడం వల్ల భారతదేశంలో దళిత బహుజన యువకులకు ఉద్యోగ వసతి గగన కుసుమం అయింది. వ్యవసాయరంగం దారుణంగా దెబ్బతిన్నది. అయితే ఇది వ్యవసాయ ఉత్పత్తులు తగ్గడం మూలాన కాదు. వ్యవసాయ ఉత్పత్తి ధరలు విప రీతంగా పడిపోవడం వల్ల. దీంతో వ్యవసాయం గిట్టుబాటు కాకుండా పోయింది. రైతులు రుణగ్రస్థులయ్యారు. లక్షలాదిమంది జీవన వ్యవస్థలు కుంటుపడ్డాయి. గ్రామాల నుంచి వలసలు పెరిగాయి. ఈ సంక్షోభం నుండి రైతాంగాన్ని కాపాడటానికి బదులు పాలకులు వ్యవసాయ రంగం కార్పొరేటీకరణను ప్రోత్సహిస్తున్నారు. ప్రపంచ వాణిజ్య (డబ్ల్యూటీఓ) షరతులు కూడ మన దేశ రైతాంగానికి ప్రతికూలంగా ఉన్నాయి. అధికార పార్టీ తన సంఖ్యాబలంతో పార్ల మెంటరీ కమిటీల పరిశీలనలు, పార్లమెంటరీ ప్రొసీజర్లు లేకుండానే చట్టాలకు దారి ఏర్పచుకుంటోంది. ముఖ్యమైన చట్టాలు ఎలాంటి చర్చ లేకుండా గందరగోళాల మధ్యనే ఆమోదం పొందుతున్నాయి. అందుకే పార్లమెంట్లో అంతర్గత నియంతృత్వం కొనసాగుతోందన్న విమర్శలు వస్తున్నాయి. పార్లమెంట్ పట్ల తన జవాబుదారీతనం నుండి ప్రభుత్వం తప్పుకుంటున్నది. నూట పదకొండుమంది ఎస్సీ, ఎస్టీ ఎంపీలు పార్లమెంట్లో సామాజిక న్యాయాన్ని సాధించటంలో నిరంతరం విఫలం అవుతున్నారు. మహిళా ఎంపీల హక్కుల పోరాట స్వరాలు నిష్ఫలం అవుతున్నాయి. సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం, ప్రజాస్వామ్యం, మానవ హక్కులు వంటి వాటన్నింటినీ వాగ్దానం చేస్తున్న భారత రాజ్యాంగ నిర్దేశాలకు విలువే లేకుండాపోతోంది. పేదలకు భూమి పంపకం లేదు. గిరిజనుల భూములకు రక్షణ లేదు. ఆదివాసుల జీవన ప్రమా ణాలు, విద్యా వైద్య వసతులు నానాటికీ కుంటుపడుతున్నాయి. రక్తలేమితో బాధపడుతున్న స్త్రీల సంఖ్య పెరుగుతోంది. గర్భవతులకు, వితంతువులకు సంరక్షణ లేదు. ఆర్థిక సామాజిక, రాజకీయ అంత రాలు ఎక్కువవుతున్నాయి. అతి కొద్ది మందిగా ఉన్న అత్యధిక సంపన్నులు ఒకవైపు, అత్యధికులైన అతి పేదలు మరొక వైపు అన్నట్లుగా ఉంది. ఈ విషయంగా మనం తప్పక బాబా సాహెబ్ అంబేడ్కర్ ఆలోచనలను మననం చేసుకోవలసిన అవసరం ఉంది. సామాజిక అసమానతల్ని తొలగించే క్రమంలోనే ఆర్థిక అసమా నతలూ తొలగాలని చెబుతూ అంబేడ్కర్... శ్రామికవర్గం హక్కులు, ప్రాతినిధ్యం, సాధికారతల గురించి చాలా నిశితమైన వివరణల్ని 1943 సెప్టెంబర్ 6, 7 తేదీల్లో కొత్త ఢిల్లీలో జరిగిన కార్మిక సమ్మేళనంలో వ్యక్తపరిచారు. అందులోని చాలా అంశాల ఉల్లంఘన నేడు మనకు దృశ్యీకృతం అవుతోంది. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ కింద అత్యధికుల అభీష్టం మేరకు శాసన, పాలనా విధానాలు అమల వుతున్నాయి. ఎవరైతే సంఘానికి ఆర్థిక నిర్మాణాన్ని దేశ సామాజికత ఆధారంగా రూపకల్పన చేయదలిచారో... వారు ప్రాథమిక ఆవశ్యకతను విస్మరించకుండా తమ లక్ష్యాన్ని పూర్తిచేయాలని గుర్తుంచుకోవాలి. సంఘ ఆర్థిక నిర్మాణాన్ని రాజ్యాంగం నిర్దేశించాలన్న ప్రతిపాదన నిర్వివాదాంశం. ఆర్థిక నిర్మాణ విధానం ఎలా ఉండాలన్నదే మిగిలి ఉన్న ప్రశ్న. దానిని ఈ మూడు విధానాల నుండి ఎంపిక చేయాలి. 1. పెట్టుబడిదారీ విధానం, 2. సోషలిజం, 3. కమ్యూనిజం. మరి శ్రామికుల ఎంపిక ఎలా ఉండాలి? శ్రామికులు పెట్టుబడిదారీ విధానాన్ని ఎంపిక చేసుకోలేరు, ఆ విధంగా పెట్టుబడిదారీ విధానాన్ని ఎంపిక చేసుకుంటే శ్రామికులు వారి స్వేచ్ఛను కోల్పో తారు. అందుకే వారి భవితవ్యానికి ముఖ్యమైన ప్రాథమిక హక్కులు, స్వేచ్ఛ, సంతోషాలు పొందడంలో ప్రజాస్వామ్య దేశాలు అవలంబించవలసిన మార్గాలు ఏంటంటే... ప్రభుత్వ అధికారాన్ని రాజకీయ రంగంలో తక్కువగా జోక్యం చేసుకోనివ్వడం; చాలా శక్తిమంతమైన వ్యక్తుల ఆధిక్యతను అణచటానికి సాధారణ శాసనాధికారాన్ని మేల్కొల్పి, తక్కువ శక్తిమంతమైన ఆర్థికరంగంపై అసంబద్ధమైన ఇబ్బందులను విధించకుండా ఉండడం. ఈ విధమైన అంబేడ్కర్ ఆలోచనలు రాను రాను భారతీయ సమాజాన్ని పున ర్నిర్మించడానికి అత్యవసరం అవుతున్నాయి. ఆయన రాజ్యాంగ రచనకు ముందూ, వెనుకా అన్ని తరగతుల ప్రజల జీవన ప్రమాణాలను దర్శించారు. ‘‘భారతదేశానికి అనేక మతాలు వచ్చాయి, అనేక మతాలు ఇక్కడే ఆవిర్భవించాయి. అయితే ఏ మతా ధిపత్యంలోకీ భారతదేశం వెళ్లకూడదు. భారతదేశం లౌకిక రాజ్యంగానే మనగలగాలి. భారతదేశంలో ప్రతీ పౌరుడు ఒకే సామాజిక, ఆర్థిక, రాజకీయ గౌరవాన్ని కలిగి ఉండాలి. అలా ఉన్నప్పుడే నేను రూపొందించిన రాజ్యాంగం అన్ని దిశలా ప్రతిఫలిస్తుంది’’ అని అంబేడ్కర్ భావించారు. రాజ్యాంగ రూపకల్పన కృషిలో అంబేడ్కర్ తన ఆరోగ్యాన్ని కూడా పణంగా పెట్టారు. భారతదేశంలోని ప్రజలందరూ ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక, రాజకీయ సాంకేతిక రంగాల న్నింటిలో సమానతను సాధించుకోవడమే ఈ రాజ్యాగం లక్ష్యమని ఆయన ప్రకటించారు. ఆ మార్గంలో నడుద్దాం. డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త దళిత ఉద్యమ నేత ‘ 98497 41695