English language
-
శశిథరూర్లాగా ఇంగ్లీష్ గిట్ల మాట్లాడాలే...
కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ అరుదైన, పలకడానికి కష్టంగా ఉన్న ఇంగ్లీష్ పదాలు వాడుతుంటాడు అనేది తెలిసిన విషయమే. అతడి ఖరీదైన ఇంగ్లీష్‌కు చాలామంది అభిమానులు ఉన్నారు. తాజాగా ఆస్ట్రేలియాకు చెందిన జే అనే టీచర్ ‘శశి థరూర్స్ ఇంగ్లీష్ యాక్సెంట్ ఈజ్ బ్యూటీఫుల్’ అనడమే కాదు అతడిలా చక్కని ఇంగ్లీష్ మాట్లాడాలంటే అంటూ కొన్ని టిప్స్ చెప్పాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో జే పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్ అయింది. శశి థరూర్ ఇంగ్లీష్‌లో మాట్లాడుతున్న వీడియోలను ప్లే చేస్తూ.... ‘చూడండి ఈ పదాన్ని ఎలా పలికాడో. ఆ పదాన్ని ఎలా స్ట్రెస్ చేశాడో’ అంటూ చెబుతూ పోతాడు జే. -
Yashoda Lodhi: పల్లెటూరోళ్లు ఇంగ్లిష్ మాట్లాడొద్దా?
యూ ట్యూబ్ తెరుస్తున్న కొత్త ద్వారాలు చూస్తూనే ఉన్నాం. మన దగ్గర ఒక బర్రెలక్క ఉన్నట్టుగానే ఉత్తర ప్రదేశ్‌లో ఒక టీచరక్క ఉంది. ఇంటర్ మాత్రమే చదివిన వ్యవసాయ కూలీ యశోదా లోధి ఇంగ్లిష్ మీద ఆసక్తితో నేర్చుకుంది. ‘నాలాగే పల్లెటూరి ఆడవాళ్లు ఇంగ్లిష్ మాట్లాడాలి’ అనుకుని ఒకరోజు పొలం పని చేస్తూ, ఇంగ్లిష్ పాఠం వీడియో విడుదల చేసింది. ఇవాళ దాదాపు మూడు లక్షల మంది సబ్స్క్రయిబర్లు ఆమె ఇంగ్లిష్ పాఠాలను నేర్చుకుంటున్నారు. యశోదా లోధి సక్సెస్ స్టోరీ. ‘కట్ టు ద చేజ్’ అంటే ఏమిటి? ‘బై ఆల్ మీన్స్’ అని ఎప్పుడు ఉపయోగించాలి? ‘అకేషనల్లీకి సమ్టైమ్స్కి తేడా ఏమిటి?’... ఇలాంటి చిన్న చిన్న విషయాల నుంచి మంచినీళ్లు తాగినంత సులభంగా ఇంగ్లిష్ మాట్లాడటం ఎలాగో నేర్పుతోంది ఒక పల్లెటూరి పంతులమ్మ. ఆశ్చర్యం ఏమిటంటే తాను ఒకవైపు నేర్చుకుంటూ మరో వైపు నేర్పుతూ. చదివింది ఇంటర్మీడియట్ మాత్రమే. అది కూడా హిందీ మీడియమ్‌లో. కాని యశోదా లోధి వీడియోలు చూస్తే ఆమె అంత చక్కగా ఇంగ్లిష్ మాట్లాడుతున్నప్పుడు మనమెందుకు మాట్లాడకూడదు అనిపిస్తుంది. అలా అనిపించేలా చేయడమే ఆమె సక్సెస్. ఆమె యూట్యూబ్ చానల్ సక్సెస్. ఇంగ్లిష్ విత్ దేహాతీ మేడమ్ ‘దెహాత్’ అంటే పల్లెటూరు అని అర్థం. యశోదా లోధి ఉత్తర ప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లాలో సిరాతు నగర్ అనే చిన్న పల్లెటూళ్లో ఉంటోంది. అందుకే తన యూట్యూబ్ చానల్‌కు ‘ఇంగ్లిష్ విత్ దెహాతి మేడమ్’ అనే పేరు పెట్టుకుంది. ఆమె ఇంగ్లిష్ పాఠాలకు ఇప్పటికి రెండున్నర కోట్ల వ్యూస్ వచ్చాయి. మూడు లక్షల మంది సబ్స్క్రయిబర్లు ఉన్నారు. అంతే కాదు... ఆమెను చూసిన ధైర్యంతో చాలామంది గృహిణులు ఇంగ్లిష్ ఎంతో కొంత నేర్చుకుని ఆమెతో లైవ్‌లో ఇంగ్లిష్‌లో మాట్లాడుతూ మురిసిపోతుంటారు. ఇంగ్లిష్ మన భాష కాదు, మనం మాట్లాడలేము అనుకునే పల్లెటూరి స్త్రీలకు, గృహిణులకు యశోద గొప్ప ఇన్స్పిరేషన్గా ఉంది. 300 రూపాయల రోజు కూలి యశోద కుటుంబం నిరుపేదది. చిన్నప్పటి నుంచి యశోదకు బాగా చదువుకోవాలని ఉండేది. కాని డబ్బులేక అతి కష్టమ్మీద ఇంటర్ వరకు చదివింది. ఆ తర్వాత పెళ్లి చేసుకుంది. భర్త ఎనిమిది వరకు చదివారు. ఆడపడుచులు స్కూలు ముఖం చూడలేదు. అలాంటి ఇంటికి కోడలైంది యశోద. పల్లెలో భర్తతో పాటు బంగాళదుంప చేలలో కూలి పనికి వెళితే రోజుకు రూ. 300 కూలి ఇచ్చేవారు. మరోవైపు భర్తకు ప్రమాదం జరిగి కూలి పని చేయలేని స్థితికి వచ్చాడు. అలాంటి స్థితిలో ఏం చేయాలా... కుటుంబాన్ని ఎలా ఆదుకోవాలా... అని తీవ్రంగా ఆలోచించేది యశోద. ఒంటి గంట నుంచి మూడు వరకు పల్లెలో ఇంటి పని, పొలం పని చేసుకుంటూ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు వరకు దొరికే ఖాళీలో మాత్రమే యశోద వీడియోలు చేస్తుంది. ‘మా ప్రాంతంలో నెలంతా సంపాదిస్తే 9 వేలు వస్తాయి. చాలామంది పిల్లలకు మంచి చదువు లేదు. నేను యూట్యూబ్‌లో బాగా సంపాదించి అందరికీ సాయం చేయాలని, మంచి స్కూల్ నడపాలని కోరిక’ అంటుంది యశోద. పల్లెటూరి వనితగా ఎప్పుడూ తల మీద చీర కొంగును కప్పుకుని వీడియోలు చేసే యశోదకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు ఆమె ఆదాయం కూడా చాలా బాగా ఉంది. ఇది నేటి పల్లెటూరి విజయగాథ. గతి మార్చిన స్మార్ట్‌ఫోన్ ‘2021లో స్మార్ట్‌ఫోన్ కొనడంతో నా జీవితమే మారిపోయింది. అప్పటి వరకూ నాకు ఈమెయిల్ క్రియేట్ చేయడం తెలియదు, యూట్యూబ్ చూడటం తెలియదు. కాని ఫోన్ నుంచి అన్నీ తెలుసుకున్నాను. యూట్యూబ్‌లో మోటివేషనల్ స్పీచ్‌లు వినేదాన్ని. నాకు అలా మోటివేషనల్ స్పీకర్ కావాలని ఉండేది. కాని నా మాతృభాషలో చెప్తే ఎవరు వింటారు? అదీగాక నా మాతృభాష కొద్దిమందికే. అదే ఇంగ్లిష్ నేర్చుకుంటే ప్రపంచంలో ఎవరినైనా చేరవచ్చు అనుకున్నాను. అలా ఇంగ్లిష్ నేర్చుకోవాలని ఇంగ్లిష్ నేర్పించే చానల్స్ చూడసాగాను. నేర్చుకుంటూ వెళ్లాను. అలా నేర్చుకుంటున్నప్పుడే నాకు ఆలోచన వచ్చింది. నాలాగా ఇంగ్లిష్ నేర్చుకోవాలనుకునే పేద మహిళలు, పెద్దగా చదువుకోని మహిళలు ఉంటారు... వారి కోసం ఇంగ్లిష్ పాఠాలు చెప్పాలి అని. నేను ఆశించేదీ, అందరు మహిళలు చేయాలని కోరుకునేదీ ఒక్కటే... భయం లేకుండా ఇంగ్లిష్ మాట్లాడటం. అది కష్టం కాదు. నేను నేర్చుకున్నాను అంటే అందరికీ వస్తుందనే అర్థం’ అంటుంది యశోద. -
సార్... దిస్ అబ్బాయి బీట్ మీ... బట్ ఐయామ్ నాట్ తిరిగి బీట్!
అస్సాంలోని పచిమ్ నగామ్ గ్రామంలోని ‘న్యూ లైఫ్ హైస్కూల్’లో పిల్లలు ఇంగ్లిష్‌లో మాత్రమే మాట్లాడాలనే నిబంధన ఉంది. ఒకరోజు ఇద్దరు పిల్లలు గొడవ పడ్డారు. క్లాస్ టీచర్ వారిని పిలిపించి ‘టెల్ మీ, వాట్ హ్యాపెన్డ్?’ అని అడిగారు. ‘ఇతడు నా మెడ పట్టుకున్నాడు’ అని ఒకరు చెప్పాలనుకున్నారు. ‘ఇతడు నా తలపై పంచ్ ఇచ్చాడు’ అని మరొకరు చెప్పాలనుకున్నారు. అట్టి విషయాన్ని పూర్తిగా ఇంగ్లిష్ లాంగ్వేజ్‌లో చెప్పలేక సైన్ లాంగ్వేజ్‌ను కూడా అప్పు తెచ్చుకొని కాస్తో కూస్తో ఇంగ్లిష్‌లో ఆ పిల్లలు చెబుతున్న మాటలు నెటిజనులను నవ్వుల్లో ముంచెత్తాయి. -
గణితంలో గర్వించేలా! స్కిల్ టాలెంట్ లో ఏపీ అదరహో
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా ఉద్యోగావకాశాలు విస్తృతంగా ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ నాలుగో స్థానంలో ఉంది. ప్రతిభ కలిగిన యువతతో 65.58 శాతం స్కోరు సాధించింది. ఇక ఆంగ్లం, గణితం నైపుణ్యాల్లో అగ్రశ్రేణిలో నిలిచింది. ఇండియా స్కిల్ నివేదిక 2023లో కేంద్ర ప్రభుత్వం ఈ అంశాలను వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక, సాంకేతిక మౌలిక సదుపాయాలు మెరుగ్గా ఉన్నాయని తెలిపింది. 2022లో ఏపీ అత్యధిక వృద్ధి సాధించినట్లు నివేదికలో పేర్కొంది. అందులో ముఖ్యాంశాలు ఇవీ.. ♦ అత్యధికంగా ఉపాధి కల్పించే రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ (72.7 శాతం) మొదటి స్థానంలో ఉండగా 69.8 శాతంతో మహారాష్ట రెండో స్థానంలో ఉంది. 68.9 శాతంతో ఢిల్లీ మూడో స్థానంలో నిలవగా 65.58 శాతంతో ఆంధ్రప్రదేశ్ నాలుగో స్థానంలో నిలిచింది. రాజస్థాన్, కర్నాటక వరుసగా తరువాత స్థానాల్లో ఉన్నాయి. ♦ ఏపీలో యువత ఉపాధి అవకాశాలను పెంపొందించేలా నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పీఎం కేవీవై ద్వారా రాష్ట్రంలో నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు పెద్దఎత్తున కొనసాగుతున్నాయి. ♦ ఆంగ్లం, గణితంలో చక్కటి నైపుణ్యాలున్న తొలి ఐదు రాష్ట్రాల సరసన ఆంధ్రప్రదేశ్ చోటు సాధించింది. గణితంలో మంచి నైపుణ్యం ఉన్న యువత లభ్యతలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. ఇంగ్లీషు ప్రావీణ్యం కలిగిన యువత లభ్యత రాష్ట్రాల్లో ఏపీ మూడో స్థానంలో ఉంది. ♦ ఆంధ్రప్రదేశ్‌లో 22 – 25 ఏళ్ల వయసున్న యువత ఉపాధి స్కోరు 64.36 శాతం ఉంది. ♦ మహిళలకు అత్యధికంగా ఉపాధి కల్పించే వనరులు రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్నాయి. ఒడిశా, ఢిల్లీలో పురుషులకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పన వనరులున్నాయి. రానున్న సంవత్సరాల్లో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, ఒడిశా, కేరళలో ఉపాధి అవకాశాలు మరిన్ని పెరుగుతాయి. ♦ ఘజియాబాద్, తిరుపతి, కర్నూలు, మంగుళూరు తదితర పది నగరాల్లో నైపుణ్యం కలిగిన మహిళా కార్మిక వనరులు అందుబాటులో ఉన్నాయి. ♦ న్యూమరికల్ స్కిల్స్ అత్యధికంగా ఉన్న నగరాల్లో చిత్తూరు, అమలాపురం ఉన్నాయి, ♦ ఆంగ్ల భాషతోపాటు బిజినెస్ కమ్యూనికేషన్ నైపుణ్యాలున్న నగరాల్లో ముంబై, తిరుపతి, పుణే ముందు వరుసలో ఉన్నాయి. -
ఆంగ్లంపై ఏపీ చర్యలు భేష్
విశాఖపట్నం (ఏయూ క్యాంపస్): ఆంగ్ల భాషను అందరికీ చేరువ చేసేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న చర్యలు అభినందనీయమని అమెరికన్ కాన్సుల్ జనరల్ (హైదరాబాద్) జెన్నిఫర్ లార్సన్ అన్నారు. సోమవారం ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని సందర్శించిన ఆమె అధికారులతో సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపుతూ గ్రామీణ ప్రాంతాలకు సైతం ఆంగ్ల భాషను చేరువ చేసేందుకు కృషి చేస్తున్నారన్నారు. విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం స్కాలర్షిప్లు వంటివి అందిస్తోందా అని ఏయూ వీసీ పీవీజీడీ ప్రసాదరెడ్డిని అడిగారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో అత్యధిక శాతం విద్యార్థులకు కళాశాల రుసుములను, హాస్టల్ చార్జీలను జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాల ద్వారా చెల్లిస్తోందని వివరించారు. ఏయూలో ఇంక్యుబేషన్, స్టార్టప్‌లకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ప్రోత్సహిస్తున్నామన్నారు. భారత్, అమెరికా దేశాల విద్యార్థులు స్టార్టప్ రంగాలలో పరస్పరం కలసి పనిచేసే దిశగా కృషి చేస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవతో ఏయూలో అమెరికన్ కార్నర్ ఏర్పాటైందన్నారు. ఏడాది కాలంలో ముప్పైకి పైగా కార్యక్రమాలను అమెరికన్ కార్నర్ నిర్వహించడాన్ని జెన్నిఫర్ ప్రశంసించారు. ఏయూలో 58 దేశాలకు చెందిన వెయ్యి మందికిపైగా విదేశీ విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారని రిజిస్ట్రార్ ఆచార్య వి.కృష్ణమోహన్ వివరించగా, అత్యధికంగా విదేశీ విద్యార్థులను కలిగి ఉండటంతో జెన్నిఫర్ హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులతో మాటామంతి గ్లోబల్ వర్చువల్ స్కూల్ ఇంగ్లిష్ ప్రోగ్రాంలో భాగంగా ఆంగ్ల భాషలో తర్ఫీదు పొందుతున్న విద్యార్థులతో జెన్నిఫర్ లార్సన్ అమెరికన్ కార్నర్లో సమావేశమయ్యారు. తరగతులు జరుగుతున్న విధానం, విద్యార్థుల ప్రగతిపై ఆరా తీశారు. అమెరికన్ కార్నర్లో నిర్వహించిన కార్యక్రమాలు, విద్యార్థులకు కల్పిస్తున్న వసతులు తదితర వివరాలు పాలకమండలి సభ్యుడు జేమ్స్ స్టీఫెన్ వివరించారు. రెక్టార్ కె.సమత, రిజిస్ట్రార్ వి.కృష్ణమోహన్, ప్రిన్సిపాల్స్ కె.శ్రీనివాసరావు, వి.విజయలక్ష్మి, టి.శోభశ్రీ, ఎస్కే భట్టి, డీన్లు ఎన్.కిశోర్‌బాబు, కె.బసవయ్య పాల్గొన్నారు. -
స్థానిక భాషల్లో వైద్య విద్యా?
భారతదేశంలో సుమారు 600 వైద్య కళాశాలలు ఉన్నాయి. విద్యార్థులకు తమ రాష్ట్రం వెలుపలి కాలేజీల్లో అడ్మిషన్లను పొందే స్వేచ్ఛ ఉంది. ఇంగ్లిష్ ఉపయోగాన్ని త్యజించడం వల్ల అలాంటి అవకాశం వీరికి కష్టమవుతుంది. హిందీ మీడియం విద్యార్థి ఇకపై కర్ణాటక లేక మహారాష్ట్రలో చదవటం కష్టమైపోతుంది. అక్కడ బోధనా మాధ్యమం ఇంగ్లిష్ లేదా స్థానిక భాషలో ఉంటుంది. ఇలాంటి విద్యార్థులు విదేశీ డిగ్రీ చదవడం ఇంకా కష్టసాధ్యమైన విషయం. హిందీ వైద్య పాఠ్యపుస్తకాలను ప్రారంభించడాన్ని మన విద్యా రంగంలో పునరుజ్జీవనం, పునర్నిర్మాణంగా కేంద్ర పాలకులు కొనియాడుతున్నారు. కానీ నిజమైన పునరుజ్జీవనం భారతీయ భాషల్లో కొత్తదైన మూల జ్ఞానాన్ని సృష్టించడంతోనే సాధ్యపడుతుంది. ఇంగ్లిష్ నుంచి హిందీలోకి అనువదించిన మూడు సెట్ల వైద్య పాఠ్య పుస్తకాలను గత వారాంతంలో భోపాల్‌లో అట్టహాసంగా విడుదల చేశారు. మధ్య ప్రదేశ్‌లో ఎంబీబీఎస్ కోర్సు కోసం హిందీని బోధనా మాధ్యమంగా ప్రవేశపెట్టడానికి చేసిన ప్రయత్నంలో ఈ పాఠ్యపుస్తకాలు భాగం. నూతన విద్యావిధానం అమలుచేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రక టించిన ఆదేశాన్ని మధ్యప్రదేశ్ ప్రభుత్వం పాటిస్తోంది. ఇతర అంశా లతోపాటు, భారతీయ భాషల్లో సాంకేతిక, వైద్య కోర్సుల బోధనను నూతన విద్యావిధానం నొక్కి చెబుతోంది. వృత్తివిద్యా కోర్సుల కోసం జాయింట్ ఎంట్రెన్స్ పరీక్షలు వంటి అన్ని ప్రధానమైన పోటీ పరీక్షలను ఇప్పటికే ఇంగ్లిష్తో పాటు 12 భారతీయ భాషల్లో నిర్వ హిస్తున్నారు. యూనివర్సిటీలలో గ్రాడ్యుయేషన్ కోర్సులలో ప్రవేశం కోసం ఇటీవలే ప్రారంభించిన కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ పరీక్షలో కూడా ఈ విధానాన్నే అమలు పరుస్తున్నారు. ఉన్నత విద్య స్థాయిలో భారతీయ భాషల్లో బోధన పూర్తిగా కొత్త విషయం కాదు. దేశవ్యాప్తంగా విద్యా సంస్థలు వివిధ భారతీయ భాషల్లో పీహెచ్డీ స్థాయి వరకు కోర్సులను ప్రతిపాదిస్తున్నాయి. ఆయుర్వేదిక్ వైద్య కోర్సులను హిందీ, ఇతర భారతీయ భాషల్లో బోధిస్తున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం, తమిళనాడు ప్రభుత్వం తమిళంలో వైద్య విద్యా బోధన చేయాలనే ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. గతంలో ఉస్మానియా యూనివర్సిటీలో 1918 నుంచి 1948 వరకు ఉర్దూలో మెడిసిన్, ఇంజినీరింగ్ కోర్సులను బోధించారు. భోపాల్‌లో పాఠ్య పుస్తకాలను విడుదల చేసిన సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పినట్లుగా హిందీలో ఎంబీబీఎస్ కోర్సుల వెనుక లాజిక్ ఏమిటంటే– ఇంగ్లిషులో కంటే మాతృభాషలో విద్యా బోధన చేస్తే ఆలోచించడం, మననం చేయడం, హేతుపూర్వకంగా ఆలోచించడం, నిర్ణయాలు తీసుకోవడం వంటి అభిజ్ఞా నైపుణ్యాలు నేర్చుకోవడంలో పిల్లలు మెరుగ్గా ఉంటారన్నదే. మాతృభాషల్లో విద్యాబోధన వల్ల ప్రయోజనాలు ఉన్నప్పటికీ, ఈ మార్పును మరీ తొందరగా మొదలెట్టినట్లు కనిపిస్తోంది. సాంకే తిక, శాస్త్రీయ అంశాలకు సంబంధించిన పాఠ్యపుస్తకాలను అనువదిం చడంలో అతిపెద్ద సమస్య ఏమిటంటే, శాస్త్రీయ పదజాలాన్ని ఉపయో గించడమే. ఇంగ్లిష్‌లోని మూల పదజాలాన్ని అలాగే ఉంచాలా, భార తీయ భాషల్లోకి అనువదించవచ్చా? భోపాల్‌లో విడుదల చేసిన మూడు మెడికల్ పుస్తకాల (అనాటమీ, బయోకెమిస్ట్రీ, ఫిజియాలజీ) టైటిల్సు చూసినట్లయితే, ఇంగ్లిష్‌లో సుపరిచితమైన పదాలను యథా తథంగా తీసుకున్నట్లు కనిపిస్తోంది. అంటే వివరణాత్మక విషయాన్ని హిందీలో అందుబాటులో ఉంచుతారు. అది సంస్కృతీకరించిన హిందీలా కాకుండా, వాడుక భాషలోనే ఉంటుందని ఆశిద్దాము. ఏవిధంగా చూసినా సరే, వైద్య పుస్తకాలను అనువదించటం కష్టమైన ప్రయత్నం. ఎందుకంటే ఈ వైద్యవిద్యా పట్టభద్రులు మానవుల ప్రాణాలతో వ్యవహరిస్తారు. పైగా పాఠ్యపుస్తకాలు అనేవి వైద్య కోర్సులో ఒక భాగం మాత్రమే. పాఠ్యపుస్తకాలతోపాటు, వంద లాది రిఫరెన్స్ పుస్తకాలు, మాన్యువల్స్ కూడా వీరు తిరగేస్తారు. ఇవి చాలావరకు ఇంగ్లిష్‌లోనే ఉంటాయి. ఒక డాక్టర్ శిక్షణ, బాధ్యతల నిర్వహణలో ఇవి చాలా ముఖ్యమైనవి. హిందీ, ఇతర భారతీయ భాషల్లో శిక్షణ పొందిన వైద్యులకు తదుపరి చదువులు, కెరీర్ అవకా శాలు సవాలుగా నిలుస్తాయి. ఎందుకంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టడీస్, సూపర్ స్పెషలైజేషన్, మెడికల్ రీసెర్చ్ వంటివి ఇంగ్లిష్‌లోనే కొనసాగుతాయి. వైద్య బోధనను భారతీయ భాషల్లోనే చేయాలని ఆతృత ప్రదర్శిస్తున్నవారు వీటిని కూడా అనువదించి ఇస్తారా, ఇది ఎలా సాధ్యపడుతుంది అనేది స్పష్టం కావడం లేదు. పాఠ్యపుస్తకాలు, ‘కోర్స్‌వేర్’తో పాటు శిక్షణ పొందిన టీచర్లు, పరీక్ష యంత్రాంగం, బహు భాషా రీసెర్చ్ జర్నల్స్ వగైరాలు కూడా అవసరమే. జాతీయ వైద్య కమిషన్ లేక రాష్ట్ర వైద్య విద్యా విభాగాలు దీనికి సంబంధించి ఏదైనా బ్లూప్రింట్‌ను రూపొందించి ఉంటే దాన్ని ప్రజలకు అందు బాటులో ఉంచాలి. ప్రస్తుతం, భారతదేశంలో 600 వైద్య కళాశాలలు ఉన్నాయి. విద్యార్థులకు తమ రాష్ట్రం వెలుపలి కాలేజీల్లో అడ్మిషన్లను పొందే స్వేచ్ఛ ఉంది. ఇంగ్లిష్ ఉపయోగాన్ని త్యజించడం వల్ల అలాంటి అవకాశం వీరికి కష్టమవుతుంది. ఉదాహరణకు, మధ్యప్రదేశ్ నుండి హిందీ మీడియం డిగ్రీ ఉన్న ఒక విద్యార్థి ఇకపై కర్ణాటక లేక మహా రాష్ట్రలోని కాలేజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదవటం కష్టమైపోతుంది. ఎందుకంటే అక్కడ బోధనా మాధ్యమం ఇంగ్లిష్ లేదా స్థానిక భాషలో ఉంటుంది. ఈ పరిస్థితుల్లో ఇలాంటి విద్యార్థులు విదేశీ డిగ్రీ చదవడం ఇంకా కష్టసాధ్యమైన విషయంగా ఉంటుంది. ఉస్మానియా యూనివర్సిటీలో వైద్య విద్యలో కోర్సులు బోధిస్తు న్నప్పుడు విద్యార్థులందరికీ ఇంగ్లిష్‌లో ప్రావీణ్యం ఉండటం తప్పని సరిగా ఉండేది. పాఠ్యపుస్తకాలు కూడా ఆంగ్లంలో ఉండేవి. ఉర్దూలో బోధన ప్రారంభం కావడానికి ముందే, ఒక అనువాద బ్యూరోని ఏర్ప ర్చారు. శాస్త్రీయ పదజాలంతో వ్యవహరించడానికి అనువాద మెథడా లజీ వృద్ధిచేశారు. రవీంద్రనాథ్ టాగూరు సహా దేశమంతటి నుంచి విద్యా నిపుణులను సంప్రదించేవారు. ప్రస్తుత సందర్భంలో అలాంటి పథకం లేదు. విద్యార్థి బృందంతో సహా విద్యతో సంబంధమున్న ప్రతి ఒక్కరితోనూ విస్తృత సంప్రదింపులు జరపడం కూడా ఇప్పుడు లేకుండా పోయింది. పలు భారతీయ భాషల్లోకి పాఠ్య పుస్తకాలు అనువదించినట్లయితే, అనుకూలత లేదా సమరూపతకు హామీ ఇవ్వ డానికి సాంకేతిక పదాలను ప్రామాణీకరించాలి. మాతృభాషలో సాంకేతిక కోర్సులను బోధించడాన్ని సమర్థించే వారు జపాన్ను ఉదాహరణగా చూపుతున్నారు. జపనీస్ భాషలో బోధన ద్వారా జపాన్ గొప్ప సాంకేతిక, పారిశ్రామిక ముందంజ వేయగలిగిందని చెబుతున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం కూడా అప్పట్లో జపాన్ నుండి ప్రేరణ పొందింది. 1920లలో హైదరాబాద్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ డైరెక్టర్ సయ్యద్ రాస్ మసూద్‌ను జపనీస్ సాంకేతిక విద్యా నమూనా అధ్యయనం కోసం జపాన్ పంపించారు. చైనా, రష్యా, జర్మనీ కూడా తమతమ భాషల్లోనే సాంకే తిక విద్యలను బోధించేవి. ఇవి దశాబ్దాలపాటు శాస్త్ర సంబంధ పదజాలాన్ని అభివృద్ధి చేసుకున్నాయి. ఈ దేశాలకూ, భారతదేశానికీ మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసం ఏమిటంటే, అవి చాలావరకు ఏక భాషా సమాజాలు. భారత్ బహు భాషల నిలయం. ఐఐటీ, ఐఐఎం వంటి ఉన్నత విద్యాసంస్థల్లో కూడా భారతీయ భాషల్లో కోర్సులను ప్రవేశపెడతామని కేంద్ర హోంమంత్రి సెల విచ్చారు. ఇంజినీరింగ్ విద్యను భారతీయ భాషల్లోనే బోధించడానికి పది రాష్ట్రాల్లో సన్నాహాలు చేస్తున్నామని అమిత్ షా చెప్పారు. తమిళం, తెలుగు, మరాఠీ, బెంగాలీ, మలయాళం, గుజరాతీ భాష ల్లోకి ఇంజినీరింగ్ పుస్తకాలను అనువదిస్తున్నట్లు తెలిపారు. భారతీయ భాషల్లో బోధనలో పదజాలం, ఇతర సమస్యలతో పాటు అలాంటి ఇంజినీరింగ్ కోర్సులు కీలక రంగాల్లో పోటీతత్వాన్ని హరింప జేస్తాయి. ప్రత్యేకించి ఔట్ సోర్సింగ్ పరిశ్రమలో పోటీ ఎంతగా ఉంటుందో తెలిసిందే. సాఫ్ట్వేర్, ఐటీ ఆధారిత సేవల్లో భారత్ అగ్రగామిగా ఉండటానికి ఆంగ్లంతో సుపరిచితమైన ఇంజినీరింగ్ వర్క్ ఫోర్స్ కారణం అని చెప్పాల్సి ఉంటుంది. ప్రత్యేకించి ఇతర దేశాలు కూడా పోటీ పడుతున్నప్పుడు, సాధారణ ఉద్యోగాల స్థానంలో యాంత్రికీకరణ వేగంగా ప్రవేశిస్తున్నప్పుడు ఈ మార్కెట్లో భారత్ తన స్థానాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కోల్పోకూడదు. హిందీ వైద్య పాఠ్యపుస్తకాలను ప్రారంభించడాన్ని మన విద్యా రంగంలో పునరుజ్జీవనం, పునర్నిర్మాణంగా కొనియాడుతున్నారు. నిజమైన పునరుజ్జీవనం అనేది భారతీయ భాషల్లో కొత్తదైన మూల జ్ఞానాన్ని సృష్టించడంతోనే సాధ్యపడుతుంది. దినేశ్ సి. శర్మ వ్యాసకర్త వైజ్ఞానిక అంశాల వ్యాఖ్యాత (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
ఇంగ్లిష్ వెలుగులు చెదరనివ్వొద్దు
ఒకే దేశం, ఒకే భాష పేరుతో గతంలో హిందీని ప్రచారం చేసిన కేంద్ర హోంమంత్రి ఇప్పుడు ప్రాంతీయ భాషా రాగం అందుకున్నారు. భారతీయుల ప్రతిభా సామర్థ్యాలు పూర్తిగా వెల్లడి కావాలంటే, ప్రాంతీయ భాషలను ప్రోత్సహించడం తప్పనిసరి అంటున్నారు. ఇది పూర్తిగా గ్రామీణ ప్రజానీకాన్ని వెనుకబాటుతనంలో ఉంచే సిద్ధాంతం. ఇప్పటికే అంతర్జాతీయంగా ఎదగాలంటే ఇంగ్లిష్ విద్య కీలకమైనదని గ్రామీణ ప్రజానీకం అర్థం చేసుకుంది. ఈ అవగాహనతోనే ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఇంగ్లిష్ మీడియంను ప్రవేశపెట్టాయి. ఇంగ్లిష్ వల్ల తమ పిల్లల ముఖాల్లోని వెలుగును ఏపీ ప్రజానీకం చూస్తోంది. అదే రానున్న ఎన్నికల్లో వైసీపీకి భారీ ఓట్లు తేనుంది. దీన్నొక శక్తిమంతమైన ఆయుధంగా టీఆర్ఎస్ ఇంకా మల్చుకోవాల్సి ఉంది. ఒకే దేశం, ఒకే భాష సూత్రానికి నిరంతర సమర్థకుడిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యవహరించి ఎక్కువ కాలం కాలేదు. ఆ ఒకే భాషగా హిందీని షా పదేపదే ప్రచారం చేశారు. కానీ అలాంటి ప్రతిపాదన పట్ల దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా ప్రతిఘటించడం; ప్రధాని నరేంద్రమోదీ, ఆరెస్సెస్ అధినేత మోహన్ భాగవత్ కూడా అన్ని భారతీయ భాషలూ సమాన ప్రాధాన్యత కలిగినట్టివే అని ప్రకటించడంతో అమిత్ షా కాస్తా గేర్లు మార్చారు. మోదీ తర్వాత ఆరెస్సెస్, బీజేపీలకు ప్రధాని అభ్యర్థి అమిత్ షాయేనని అన్ని సంకేతాలూ వెలువడుతున్నాయి. భారతీయ ప్రతిభా సామర్థ్యాలు పూర్తిగా వెల్లడి కావాలంటే, ప్రాంతీయ భాషలను ప్రోత్సహించడం తప్పనిసరి అనే అభిప్రా యాన్ని ఆయన కలిగివున్నారు. జాతీయ విద్యావిధానం 2020 (ఎన్ఈపీ) రెండో వార్షికోత్సవం సందర్భంగా అమిత్ షా ఆగస్టు 19న ఢిల్లీలో మాట్లాడారు. న్యాయ శాస్త్రం, వైద్యశాస్త్రం, ఇంజినీరింగ్ వంటివాటిని భారతీయ భాషల్లోనే బోధించాలని ఆయన నొక్కి చెప్పారు. ఎవరైనా తమ సొంత భాషలో ఆలోచించినప్పుడే పరిశోధన, అభివృద్ధి సాధ్యపడతాయన్నారు. సొంత భాషలో ఆలోచించకపోవడమే పరిశోధనా రంగంలో భారత్ వెనుకబడి ఉండటానికి ఒక కారణంగా చూపారు.ప్రత్యేకించి కర్ణాటక తర్వాత తెలంగాణలో అధికారంలోకి రాగలమని ఆరెస్సెస్, బీజేపీ కూటమి పెద్ద ఆశలు పెట్టుకుని ఉంది. ఈ కొత్త సిద్ధాంతంతో అమిత్ షా దక్షిణాదిలో కూడా ఆమోద నీయమైన నాయకుడిగా మారాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇంగ్లిష్ మీడియం విద్యకు సంబంధించిన చైతన్యం గతంలో కంటే ఇప్పుడు దక్షిణాదిలో మరింత ఎక్కువగా విస్తరించింది. అంత ర్జాతీయ ఉపాధి మార్కెట్లలో స్థానం సంపాదించాలని దక్షిణాదిలోని ప్రతి గ్రామమూ ఆకలిగొని ఉంది. జాతీయంగా, అంతర్జాతీయంగా ఎదగాలంటే ఇంగ్లిష్ విద్య కీలకమైనదని గ్రామీణ ప్రజానీకం కూడా అర్థం చేసుకున్నారు. కానీ ప్రాంతీయభాషా ప్రాతిపదికన ఉన్న ఉన్నత విద్యా వ్యవస్థ వీరిని తమ భాషా రాష్ట్రాన్ని దాటి ముందుకు పోనీయడం లేదు. అదే సమయంలో ఎగువ, మధ్యతరగతి వర్గాలు ఇప్పటికే ప్రాంతీయ భాషా విద్యను దాటి ముందుకెళ్లిపోయాయి. వారిలోని ఈ కొత్త శక్తికీ, అధికార సంపదలకూ ప్రైవేట్ ఇంగ్లిష్ మీడియం విద్యే ప్రధాన వనరుగా మారింది. ఇప్పుడు వీరు ప్రాంతీయ భాషా విద్య వైపు వెనక్కు మళ్లరు. ఈ అవగాహనే ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలను ప్రభుత్వరంగంలో ఇంగ్లిష్ మీడియం స్కూలు విద్యవైపు మరలేట్టు చేసింది. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని అనుకుంటే, అప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో మీడియం తిరిగి తెలుగుకు మారుతుందా? అమిత్ షా ఆంతర్యం సరిగ్గా ఇదే మరి. కానీ అదే జరిగితే తెలంగాణలోని అత్యంత వెనుకబడిన గ్రామీణ వర్గాలు దెబ్బతిని పోతాయి. నిజానికి ప్రభుత్వ పాఠశాలలు తిరిగి తెలుగుకు మళ్లితే– రైతు బంధు, దళిత బంధు వంటి సంక్షేమ పథకాలు ఆగిపోవడం కంటే కూడా ఎక్కువ ప్రతికూలతను అది ప్రజల మీద కలిగిస్తుంది. తన కుమారుడైన జయ్ షాను ప్రపంచ స్థాయి ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో చదివించిన అమిత్ షాకు... తన కార్పొరేట్ స్నేహితు లందరూ సంపన్నుల కోసం ప్రపంచ ప్రమాణాలతో కూడిన ఇంగ్లిష్ మీడియం ప్రైవేట్ పాఠశాలలను ప్రారంభిస్తున్నారని చక్కగా తెలుసు. అమిత్ షా ప్రాంతీయ భాషా విద్యా అజెండా ఈ సంపన్నుల కోసం ఉద్దేశించింది కాదు. ప్రాంతీయ భాషల్లోనే తమ పిల్లలను చదివిం చాలని గ్రామీణ ప్రజానీకాన్ని కోరడం ద్వారా, భాషా ప్రయోజనాలు ఏవీ పొందలేని చారిత్రక వెనుకబాటుతనంలో వీరిని ఉంచాలని ఆయన కోరుకుంటున్నారు. నాణ్యమైన వసతులు, బోధనా సిబ్బందితో కూడిన ఇంగ్లిష్ మీడియం చదువు అంతర్జాతీయంగా అనుసంధానం కలిగి ఉండి, నాణ్యమైన జాతి నిర్మాణానికి పెట్టుబడిగా ఉంటుంది. అయితే ఇంగ్లిష్ మీడియం స్కూల్ విద్య ద్వారా విద్యాపరమైన సమానత్వం సాధించడానికి ఆరెస్సెస్, బీజేపీ కూటమి వ్యతిరేకం. ఇంగ్లిష్‌ను రహస్యంగా ఉపయోగిస్తూ, సంస్కృతం, హిందీని వీరు సైద్ధాంతి కంగా సమర్థిస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మనం చూస్తున్నట్లుగా ప్రజానీకం అంతర్జాతీయ అనుసంధానం కలిగిన నాణ్యమైన విద్యకు మద్దతు తెలుపుతున్నారు. పరిశోధన, వైద్యం, ఇంజనీరింగ్, తదితర అంశాలను ప్రాంతీయ భాషల్లోనే సాగించాలని అమిత్ షా చెబుతున్న సిద్ధాంతం ఆ వ్యవస్థలో భాగమైన వారికి విధ్వంసకరంగా పరిణమిస్తుంది. తెలంగాణలోని పాఠశాల విద్యా వ్యవస్థను మెరుగపర్చడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం చేయవలసింది చాలానే ఉన్నప్పటికీ, అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంను ప్రవేశపెట్టాలని తీసుకున్న నిర్ణయం సైద్ధాంతికంగా చదువులో సమానత్వం వైపు వేసిన తొలి అడుగు. కానీ తాము ప్రవేశపెట్టిన ఇంగ్లిష్ మీడియానికి వ్యతిరేకంగా బీజేపీ విద్యా విధానం ఉందని టీఆర్ఎస్ నేతలు ప్రజలకు సమర్థంగా చెప్పలేకపోతున్నారు. మరోవైపున ఢిల్లీలో ఆమ్ ఆద్మీ ప్రభుత్వం తమ పాఠశాల విద్యా వ్యవస్థ గురించిన ప్రచారం ద్వారా ఆరెస్సెస్, బీజేపీలను ఆత్మరక్షణలో పడవేసిందనే చెప్పాలి. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దీని విశ్వసనీయతను అంతర్జాతీయ స్థాయి ప్రచారంగా మలిచారు. తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లిష్ మీడియంను టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. కానీ, ప్రత్యేకించి ఇంగ్లిష్ వ్యతిరేకి అయిన అమిత్ షాతో, సాధార ణంగా ఆరెస్సెస్, బీజేపీ శక్తులతో పోరాటానికి తగిన శక్తిమంతమైన సైద్ధాంతిక సంక్షేమ పథకంగా దీన్ని టీఆర్ఎస్ పరిగణించడం లేదు. ఇంగ్లిష్ మీడియం విద్యపై ఉన్న అరకొర అవగాహన కారణంగా అతి పెద్ద సంఖ్యలో ఓట్లు రాబట్టే శక్తిగా దాన్ని గుర్తించడం లేదు. దక్షిణాదిలో, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే... ప్రత్యేకించి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ్రామీణ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం విద్య ప్రాధాన్యాన్ని అర్థం చేసు కున్నారు. దక్షిణాది రాష్ట్రాలన్నింటిలో కొంత శాతం మేరకు ఇంగ్లిష్ మీడియం ప్రభుత్వ పాఠశాలలు ఉంటుండగా, జగన్ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలనూ ఇంగ్లిష్ మీడియం పాఠశాలలుగా మార్చడానికి తీవ్ర ప్రయత్నం జరిగింది. ఏపీలోని అన్ని అండర్ గ్రాడ్యుయేట్ కాలేజీల్లోనూ ఇంగ్లిష్ మీడియం తప్పనిసరిగా ప్రవేశపెట్టాలని కూడా వైఎస్ జగన్ సంవత్సరం క్రితం ప్రకటించారు. అమ్మ ఒడి పథకంతో కూడిన ఇంగ్లిష్ విద్య కారణంగా ఏపీలో టీడీపీ సంకటస్థితిలో పడిపోయింది. పిల్లలందరికీ మెరుగైన ఇంగ్లిష్ మీడియం పాఠశాల విద్య అనేది ‘ఉచితాల’లో భాగమేనని ఆరోపించడానికి ఎవరూ సాహసించలేరు. పాఠశాల విద్యపై పెట్టే వ్యయాన్ని ‘ఉచితాలు’ అని చెప్పి ఏ కోర్టూ, ఏ శాసన సభ కూడా ఖండించలేవు. ఆంధ్రప్రదేశ్‌లో ఇంగ్లిష్ మీడియం పాఠశాల విద్య 2024లో భారీ స్థాయిలో ఓట్లను సమీకరించబోతోంది. ప్రధానంగా స్కూల్ విద్యపై వైఎస్ జగన్ రోజువారీ ప్రాతిపదికన చేసిన పోరాటం కారణంగా టీడీపీ, బీజేపీ రెండింటికీ పరాజయాలు ఇప్పటికే నమోదయ్యాయి. ఇంగ్లిష్ విద్య వల్ల తమ పిల్లల ముఖాల్లోని వెలుగును ప్రజానీకం చూస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ పోరాటమే... తెలంగాణలో ఎలాంటి వ్యతిరేకతా లేకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంగ్లిష్ మీడియంను ప్రవేశపెట్టడాన్ని సులభతరం చేసింది. కానీ దీన్ని ఇంకా ఓట్లుగా మల్చుకోవడం జరగలేదు. తెలంగాణ ప్రభుత్వం కూడా తన పాఠ శాల విద్యకు సంబంధించి సరైన ప్రచారం చేసుకోగలిగితే, ప్రతి తల్లీ తన పిల్లల శత్రువును ఓడించడానికి పోలింగ్ బూతుకు వెళ్తుంది. ప్రతి గ్రామీణ మహిళా కూడా అమిత్ షా కంటే ఉత్తమమైన జాతీయవాది. ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
బడ్జెట్ ఇంగ్లిష్‌లోనే ఎందుకు?
న్యూఢిల్లీ: మన దేశంలో ఒక రకంగా చూస్తే హిందీ అధికార భాష. దానికి తోడుగా 22 గుర్తింపు పొందిన స్థానిక భాషలు ఉన్నాయి. గుర్తింపు పొందిన భాషల్లో ఇంగ్లిష్ లేనే లేదు. మరి ఏటా బడ్జెట్ ప్రసంగాన్ని ఇంగ్లిష్‌లో మాత్రమే ఎందుకు చదువుతారో తెలుసా? దానికి గట్టి కారణమే ఉంది. నిజానికి స్వాతంత్య్రం వచ్చిన కొత్తలోనే.. కేంద్ర ప్రభుత్వ వ్యవహారాలన్నీ హిందీలో నిర్వహించేందుకు ప్రయత్నాలు జరిగాయి. కానీ దేశంలోని కొన్ని ప్రాంతాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఇతర భాషలను తీసుకునే పరిస్థితి లేదు. దాంతో బ్రిటిష్‌కాలం నుంచి కొనసాగుతూ.. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో పరిచయం ఉన్న ఇంగ్లిష్‌ను మధ్యే మార్గంగా.. ‘అనుసంధాన భాష’గా ఎంపిక చేశారు. ఇప్పటికీ అదే కొనసాగుతోంది. అయితే రాజ్యాంగం ప్రకారం.. రాష్ట్రాలకు భాష విషయంలో స్వేచ్ఛ ఉంది. ఏ రాష్ట్రమైనా కేంద్ర గుర్తింపు పొందిన భాషనుగానీ, తమకు నచ్చిన మరే భాషను గానీ.. సదరు రాష్ట్ర పరిధిలో అధికారిక భాషగా ప్రకటించవచ్చు. ఆ భాషలో కార్యకలాపాలు కొనసాగించవచ్చు. చదవండి: (Biggest Budget: అతిపెద్ద బడ్జెట్ మన్మోహన్‌దే..) -
అక్కడ ఇంగ్లిష్! ఇక్కడేమో హిందీనా?
భారతదేశంలో ఇంగ్లిష్ భాష జీవం పోసుకొని 2021 అక్టోబర్ 5 నాటికి 204 ఏళ్లవుతుంది. ఇంగ్లిష్ వల్లే, ప్రపంచం నలుమూలల్లో ఉన్న మానవులు మరింతగా అనుసంధానమయ్యారు. పరస్పరం జ్ఞానాన్ని పెంచుకున్నారు. కానీ కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో, విద్యా సంస్థల్లో పీహెచ్డీ సిద్ధాంత పత్రాలను కూడా హిందీలోనే రాసి సమర్పించేలా హిందీని బోధనా మాధ్యమంగా మార్చేందుకు బీజేపీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అదేసమయంలో ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థలు, పాఠశాలలు, కాలేజీల్లో ఇంగ్లిష్‌నే బోధించేలా, పరిశోధనను కూడా ఇంగ్లిష్‌లోనే చేసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధానాలు రూపొందించాయి. ఇది దళిత, బీసీ, శూద్ర, ఆదివాసీ యువతకు ఇంగ్లిష్‌ను దూరం చేయడంలో భాగమే. భారతదేశంలో ఇంగ్లిష్ భాష జీవం పోసుకొని 2021 అక్టోబర్ 5 నాటికి 204 సంవత్సరాలవుతుంది. ప్రతి ఏటా ఆ రోజున భారతీయ ఇంగ్లిష్ దినోత్సవం ఘనంగా జరుపుకోవడం గత కొన్నేళ్లుగా కొనసాగుతోంది. 1817 అక్టోబర్ 5న కోల్‌కతాలో మొట్టమొదటి ఇంగ్లిష్ మీడియం పాఠశాల ప్రారంభమైంది మొదలుకొని ఇంగ్లిష్ భాషను లేకుండా చేయడానికి భారతదేశం ఎన్నడూ అనుమతించలేదు. ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగానూ నేడు ఇంగ్లిష్ వృద్ధి చెందుతోంది. ఇంగ్లిష్ మాట్లాడే దేశాలను సవాలు చేస్తున్న చైనా... మాండరిన్ భాషతో పాటు ఇంగ్లిష్‌ని కూడా తన సొంతం చేసుకుంది. భారత్, చైనా రెండూ తమ మాతృభాషలతోపాటు ఇంగ్లిష్‌ని తమ పిల్లలందరికీ బోధించినట్లయితే, (ఉదాహరణకు తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లాగా) ఎవరూ ఊహించలేనంత వేగంగా అది అంతర్జాతీయ అనుసంధానాన్ని, శాస్త్ర పరిజ్ఞానాన్ని మార్చివేస్తుంది. చాలా కాలం క్రితం ఒక ఇజ్రాయెల్ ప్రవక్త, ప్రపంచమంతా ఒకే భాషను మాట్లాడే రోజు వస్తుందని జోస్యం చెప్పారు. అయితే ఆ భాష ఏది అని ఆయన అప్పట్లో చెప్పలేదు. ఇప్పుడు ఆ భాష ఇంగ్లిషేనని మనం చెప్పవచ్చు. భూమండలంలోని అత్యధిక సంఖ్యాక ప్రజలు మాట్లాడుతున్న, రాస్తున్న, అర్థం చేసుకుంటున్న భాష ఇంగ్లిష్ మాత్రమే. ప్రపంచంలో మాట్లాడే, రాసే భాషలకు నాలుగు వేల సంవత్సరాల చరిత్ర ఉంది. అయితే ఇంగ్లిష్ వల్లే, ప్రపంచం నలుమూలల్లో ఉన్న మానవులు మరింతగా అనుసంధానమయ్యారు. పరస్పరం జ్ఞానాన్ని పెంచుకున్నారు. మానవ చరిత్రలో ఇంతకుముందెన్నడూ ఇలాంటి గుణాత్మక మార్పు జరగలేదు. చరిత్రలో చాలాకాలం పాటు అనేక తెగలు అతి చిన్న బృందాలతో భావవ్యక్తీకరణ చేసుకునే భాషా యంత్రాంగాలతో జీవించేవి. ఒకే ప్రాంతంలో లేదా ఒకే దేశంలోని ఇతర భాషా బృందాలతో ఇవి వ్యక్తీకరణ సామర్థ్యాన్ని కలిగి ఉండేవి కాదు. కానీ ప్రపంచంలోని ప్రతి దేశంలోనూ ఇలాంటి పరిమిత స్థాయిలోని అనేక బృందాల్లోకి ఇప్పుడు ఇంగ్లిష్ భాష కొద్దో గొప్పో చొచ్చుకుపోయింది. ఇలాంటి అనేక భాషా బృందాలకు పదాలు, వాక్యాల రూపంలో చేరువైన ఇంగ్లిష్ భాష... వారిని ఇంతవరకు తమకు తెలియని స్థలాల్లోని పెద్ద పెద్ద మార్కెట్లతో కూడా భావ ప్రసారం జరుపుకొనేలా చేసింది. పరస్పరం భావ వ్యక్తీకరణ, భావ ప్రసారం చేసుకోలేని వేలాది చిన్న చిన్న భాషా బృందాల ఉనికికి భారతదేశం ఒక ప్రామాణిక ఉదాహరణగా నిలుస్తుంది. తమకు సమీపంలోనే ఉంటున్న ఇతర భాషా బృందాలకు, పట్టణ మార్కెట్లకు పెద్దగా పరిచయం కాకుండానే మనుగడ సాగిస్తున్న తెగలు, పర్వత ప్రాంతాల్లో నివసించే భాషా బృందాలు భారతదేశంలో అనేకం ఉన్నాయి. ఇతర సంస్కృతులకు, జీవన విధానాలకు పరిచయం కాకుండానే నివసిస్తున్న భారతీయ ఉత్పాదక ప్రజారాశులకు భాషే ప్రధాన అవరోధం. కానీ కేవలం 200 సంవత్సరాలలోపే ఈ భాషాపరమైన అవరోధాన్ని ఇంగ్లిష్ తొలగించివేసింది. ప్రత్యేకించి గత 30 ఏళ్లుగా ప్రపంచీకరణ, దేశ ప్రజలను ప్రపంచ మార్కెట్లతో అనుసంధానించడంతో ప్రజల భావ వ్యక్తీకరణలో చాలా మార్పులొచ్చాయి. పాఠశాలల్లో విద్యార్థులకు క్రమబద్ధమైన ఇంగ్లిష్ నేర్పింది ప్రభుత్వాలు కాదు. ప్రపంచవ్యాప్తంగా నిరక్షరాస్యులకు, వివిధ భాషా బృందాలకు ఇంగ్లిష్ నేర్పుతూవచ్చింది మార్కెట్ మాత్రమే. ఒక భాషగా ఇంగ్లిష్‌ని మాట్లాడటం, రాయడం తెలీనప్పటికీ సమాజానికీ లేదా మార్కెట్‌కీ ప్రాణాధారమైన విషయాలను మనం ఇంగ్లిష్ ద్వారానే తెలుసుకుంటూ వస్తున్నాము. ఆ భాష తెలీకున్నా వాటర్, ఫుడ్, బస్, ట్రెయిన్, సాల్ట్, రైస్, టికెట్, మిల్క్, టీ, బెడ్, ఫోన్, లిక్కర్, ప్లేట్ వంటి ఎన్నో ఇంగ్లిష్ పదాలను మనం సాధారణ అవగాహనతో అర్థం చేసుకుంటున్నాము. ప్రపంచంలోని నలుమూలల్లో ఇంగ్లిష్ ఇలాంటి పదాలతో చొచ్చుకుపోయింది. అత్యంత వెనుకబడిన ప్రాంతంలోని తెలుగు మాట్లాడే ఓ కుగ్రామంలోని సగటు నిరక్షరాస్యుడైన కూలీకి కూడా ఇప్పుడు కనీసం 250 నుంచి 300 వరకు ఇంగ్లిష్ పదాలు తెలుసు. దేశవ్యాప్తంగా రిక్షా తోలేవారు, ఆటో డ్రైవర్లు, టాక్సీ డ్రైవర్లు, ధాన్యం, కూరగాయలు అమ్మేవారు, కార్మికులకు కూడా ఇంగ్లిష్ పదాలతో పరిచయమైపోయింది. మరే స్థానికేతర భాషా పదాలు కూడా ఇంగ్లిష్ లాగా జనజీవితంలో ఈ స్థాయిలో ప్రవేశించలేదు. భారతదేశంలో ఎక్కువమంది ప్రజలు మాట్లాడే, రాసే భాష హిందీ అని తెలుసు. కానీ దేశం నలుమూలల్లో హిందీ కంటే ఎక్కువగా ఇంగ్లిష్ పదాలే ఎక్కువ మంది ప్రజల వాడుకలోకి వచ్చేశాయి. వివిధ యాసలతో కూడిన సాధారణ సంభాషణకు సంబంధించి 250 నుంచి 300 పదాలను తెలుసుకుంటే చాలు... మనకు తెలియని మార్కెట్లో కూడా ఇతరులతో భావ వ్యక్తీకరణ సాధ్యమవుతుంది. కాబట్టి భారతీయ గ్రామం నుంచి ఒక కూలీని మనం ఆఫ్రికన్ లేదా లాటిన్ అమెరికన్ దేశంలోకి పంపించినట్లయితే, అక్కడి స్థానిక భాషను నేర్చుకోకపోయినా అతిముఖ్యమైన ఇంగ్లిష్ మార్కెట్ పదాల సహాయంతో వాళ్లు ఆ దేశాల్లో మనగలుగుతారు. ఇక స్థానిక భాషను కూడా నేర్చుకుని ఇంగ్లిష్‌ని మెరుగుపర్చుకుంటే మరింత మెరుగ్గా జీవించగలరు. కొన్ని పదాలను తెలుసుకోవడం ద్వారా యావత్ ప్రపంచంలో ఇంత సులభంగా జీవించగల, మనుగడ సాధించగల అవకాశాన్ని ఇంగ్లిష్ తప్ప మరే భాషా కల్పించడం లేదు. ఇంగ్లిష్ పదాలు, భాష ప్రపంచంలోని నలుమూలలకు ఇంత విస్తృతంగా ఎలా విస్తరించాయి అంటే ప్రపంచీకరణ మార్కెట్టే అని చెప్పాలి. చారిత్రకంగా సంస్కృతంపై నియంత్రణ సాధిస్తూవచ్చిన బ్రాహ్మణులు, ఇతర ద్విజ కులస్థులు... ఇప్పుడు వారు ఏ పార్టీలో లేదా ఏ సంస్థలో ఉన్నప్పటికీ ఇంగ్లిష్‌పై అదుపు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. పురాతనకాలంలో సంస్కృతం లాగా, నాణ్యమైన ఇంగ్లిష్ ఇప్పటికే వీరికి ఆలంబనగా మారిపోయింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన ఇటీవలి స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం ద్వారా రాష్ట్రీయ స్వయం సేవక్, భారతీయ జనతా పార్టీలు ఒక విషయాన్ని స్పష్టం చేశాయి. అదేమిటంటే శూద్రులు, దళితులు, ఆదివాసీలు, ఇతర పేదప్రజల పిల్లలు మాతృభాషలోనే చదువుకోవాలట! ఇంగ్లిషేతర భాషే విద్యా మాధ్యమంగా ఉండాలట! చివరకు కేంద్ర విశ్వవిద్యాలయాల్లో, విద్యా సంస్థల్లో పీహెచ్డీ సిద్ధాంత పత్రాలను కూడా హిందీలోనే రాసి సమర్పించేలా హిందీని బోధనా మాధ్యమంగా మార్చేందుకు బీజేపీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అదేసమయంలో ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థలు, పాఠశాలలు, కాలేజీల్లో ఇంగ్లిష్‌నే బోధించేలా, పరిశోధనను కూడా ఇంగ్లిష్‌లోనే చేసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధానాలు రూపొందించాయి. దేశంలో అగ్రవర్ణాల (బ్రాహ్మణులు, బనియాలు, కాయస్థులు, ఖాత్రీలు, క్షత్రియులు) యాజమాన్యంలోని గుత్త పారిశ్రామిక కంపెనీలు అశోక, అమిటీ, ఓపీ జిందాల్ వంటి అత్యున్నత ప్రైవేట్ విశ్వవిద్యాలయాలను నెలకొల్పాయి. ఇవి ఇంగ్లిష్ మాధ్యమంలో బోధించేందుకు యూరో–అమెరికన్ సిలబస్‌ని చేపడుతున్నాయి. మరోవైపున ప్రభుత్వ విద్యాసంస్థలన్నింటినీ ప్రాంతీయ భాషలో ప్రధానంగా హిందీ మీడియంలో బోధన చేసేలా కేంద్ర ప్రభుత్వం పథక రచన చేస్తోంది. దీని పర్యవసానంగా దళితులు, ఓబీసీలు, శూద్రులు, ఆదివాసీ యువత పూర్తిగా చలనరహితంగా ఉండిపోతారు. మెరుగైన విద్యా, జీవన అవకాశాల కోసం ఇక వారు ఎక్కడికీ వెళ్లలేరు. ఉత్పాదక కులాల నుంచి ఇంగ్లిష్ చదవగల, రాయగల మేధావులు ఉద్భవించకూడదని ఆర్ఎస్ఎస్, బీజేపీ కోరుకుంటున్నాయి. కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థల్లో చదువుకుంటున్న యువత భారతీయ ఇంగ్లిష్ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలి. సంపన్న అగ్రవర్ణ యువతతో సమానంగా అంతర్జాతీయ భాషను నేర్చుకుంటున్న దళిత, ఆదివాసీ, శూద్ర యువతకు వ్యతిరేకంగా పథక రచన చేస్తున్న శక్తులను ఆ విధంగా ఓడించగలగాలి. ప్రొ. కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
ఇంగ్లిష్ తొలగింపే లక్ష్యంగా...
హిందుత్వ ప్రాపంచిక దృక్పథం 2014 నుంచి సంపూర్ణంగా దేశాన్ని నియంత్రిస్తూ ఉంది. ఢిల్లీలో నరేంద్రమోదీ, అమిత్ షాలు, నాగ్‌పూర్‌లోని మోహన్ భగవత్, దత్తాత్రేయ హొసబలె తదితర ఆర్ఎస్ఎస్ అధినేతలు ఒక అసాధారణమైన జాతీయవాద భావజాలాన్ని అమలుచేస్తూ వస్తున్నారు. హిందూ ఆధ్యాత్మిక వ్యవస్థలో చారిత్రకంగా మినహాయించిన కులాలు, కమ్యూనిటీలను ఈ జాతీయవాద లక్ష్యం మినహాయించబోదనీ, వారు హిందువులైతే విద్యా వ్యవస్థల్లోంచి వారిని పక్కన పెట్టమని వీరు చెబుతూ వస్తున్నారు. అదే సమయంలో ముస్లింలను, క్రిస్టియన్లను ఇతరులుగా మాత్రమే ఈ దృక్పథం చూస్తుంటుంది. 1990ల సరళీకరణ తర్వాత బడా వాణిజ్య కుటుంబాలు విద్యా వ్యాపారంలోకి అడుగుపెడుతూ వచ్చాయి. రాజీవ్‌గాంధీ హయాం లోనే హరియాణాలోని సోనిపట్‌లో ప్రైవేట్ విద్యారంగం కోసం ఏర్పర్చిన ప్రత్యేక ఆర్థిక మండళ్లలో వీరికి భారీ స్థాయిలో భూమిని కేటాయించారు. ఆ తర్వాతే అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించే విశ్వవిద్యాలయాలు ఉనికిలోకి వచ్చాయి. అత్యంత ఖర్చుతో కూడిన ప్రైవేట్ ఇంగ్లిష్ మీడియంని వీటిలో ప్రవేశపెట్టారు. ప్రభుత్వ రిజర్వేషన్ పాలసీని ఇవి పాటించలేదు. ఇప్పుడు అత్యంత సరళమైన ఆర్ట్, ప్రాథమిక సైన్స్ విశ్వవిద్యాలయాలుగా పేరొందిన అశోకా, ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీలు ఇక్కడే మనుగడలో ఉన్నాయి. దేశంలోని అత్యంత ఖరీదైన ప్రైవేట్ విశ్వవిద్యాలయాల్లో ఒకటైన అశోకా విశ్వవిద్యలయాన్ని 2014లోనే స్థాపించడం గమనార్హం. కేంద్ర విద్యా చట్టాలు, నిబంధనలను అమలు చేస్తున్న జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం, ఢిల్లీ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ సెంట్రల్ విశ్వవిద్యాలయం, అలీఘర్ ముస్లిం వర్సిటీలతో పోలిస్తే పై వర్సిటీల స్వభావం, పనితీరు పూర్తిగా భిన్నమైనవి. ఇవి తమ సొంత సిలబస్‌ని కలిగి ఉండటమే కాకుండా, అత్యత నాణ్యమైన ఆంగ్లో - అమెరికన్ ఇంగ్లిష్‌ను బోధిస్తున్నాయి. కాబట్టే ఈ విశ్వవిద్యాలయాల్లోని విద్యార్థులు ప్రపంచ మార్కెట్లలో తమ ఉద్యోగావకాశాలకు సంబంధించి సమర్థవంతంగా పోటీ పడగలుగుతున్నారు. నిరుపేద ఆర్థిక నేపథ్యం కలిగి ఉండి తొలి తరం ప్రాంతీయ భాషా స్కూల్ విద్యా విధానంలో పెరిగివచ్చిన దళితులు, ఆదివాసీలు, ఓబీసీలు ఈ ప్రైవేట్ విద్యా కేంపస్లలోకి కనీసం అడుగు కూడా పెట్టలేరు. జేఎన్‌యూ, ఢిల్లీ, హైదరాబాద్ విశ్వవిద్యాలయం నాణ్యమైన విద్యను అందించేవి. ప్రాంతీయ భాషలో చదువుకున్న తొలితరం యువత కూడా ఇవి అందించే నాణ్యమైన విద్యను, ఇంగ్లిష్ భాషను క్రమంగా అందిపుచ్చుకోగల వాతావరణం ఈ విద్యాసంస్థల్లో ఉండేది. కానీ ప్రైవేట్ విశ్వవిద్యాలయాల్లో అలాంటి వాతావరణం ఉండదు. మనం ఉత్తమమైన ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను బలహీనపర్చి శుద్ధ ప్రైవేట్ ఉన్నత విద్యను ప్రోత్సహించినట్లయితే పేదవర్గాలు అతి త్వరలో లేక తర్వాతైనా నిస్పృహకు గురికాక తప్పదు. ఐఐటీలు, ఐఐఎమ్‌లు వంటి కేంద్ర విద్యా సంస్థలు, సెంట్రల్ విశ్వవిద్యాలయాల్లో హిందుత్వ శక్తులు హిందీని మరింతగా ముందుకు తీసుకు వస్తున్నారు. అలాగే వారి శుద్ధ జాతి కేంద్రక హిందుత్వ సిలబస్‌ని కూడా ప్రోత్సహిస్తున్నారు. ఒకవైపు ప్రభుత్వ విద్యా సంస్థలను బలహీనపరుస్తూ, మరోవైపు విదేశీ మార్కెట్ల కోసం సంపన్నులను విద్యావంతులను చేయడానికి ప్రైవేట్ విద్యా సంస్థలను ప్రోత్సహించడం జాతీయవాదం కానే కాదు. భారతదేశం భాషా పరంగా చూస్తే చైనా, జపాన్ వంటి ఇంగ్లిషేతర జాతీయ భాషను కలిగిన దేశం కాదు. అలాగే హిందీ భాష మాండరిన్ (చైనా), జపనీస్ భాష లాంటిది అసలే కాదు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఇంగ్లిష్‌ను వ్యతిరేకిస్తూ, ప్రైవేట్ విద్యా సంస్థల్లో దానికి అపారమైన ప్రోత్సాహాన్ని ఇవ్వడం ప్రమాదకరమైన పద్ధతి. దీని ద్వారా ఒకనాటికి భారతీయ ఇంగ్లిష్, పూర్వపు సంస్కృతంలాగా కొద్దిమంది చేతివిద్యలా మారిపోతుంది. హిందుత్వ శక్తుల ద్వారా తీసుకొస్తున్న ఈ భాషా, సిలబస్ కంటెంట్ రాజకీయాల ప్రమాదాన్ని శూద్ర/దళిత/ఆదివాసీ మేధావులు గమనించే స్థితిలో లేరు. పైగా విద్యా విభాగాల నుంచి దీనికి ప్రతిఘటన ఎదురుకావడం లేదు. హిందుత్వ స్కూల్ మానసపుత్రిక బెనారస్ హిందూ యూనివర్సిటీ ఇప్పుడు చాలావరకు హిందీలో బోధన చేస్తూ పీజీ, అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు తమ పరీక్షలను హిందీ, ఇంగ్లిష్ భాషల్లో రాసేలా అనుమతిస్తోంది. కానీ చాలామంది హిందీలోనే పరీక్షలు రాస్తున్నారు, తమ పరిశోధనలను సమర్పిస్తున్నారు. అయితే గత 35 ఏళ్లుగా మన విద్యావ్యవస్థను ప్రభావితం చేయగల మేధావులను ఈ విశ్వవిద్యాలయం సృష్టించలేకపోయింది. తద్భిన్నంగా, జేఎన్‌యూ, ఢిల్లీ యూనివర్సిటీ, హైదరాబాద్ యూనివర్సిటీ అనేకమంది స్కాలర్లను, ప్రభుత్వ ఉన్నతోద్యోగులను, ప్రముఖ రాజకీయ నేతలను రూపొందించాయి. ప్రమాణాలను తీసివేసే ధోరణి ఇలాగే కొనసాగితే, ఈ వర్సిటీలు కూడా మన పేరుమోసిన జాతీయవాద విశ్వవిద్యాలయాల స్థాయికి పడిపోతాయి. పైగా, హిందుత్వ స్కూల్ దేశీయ పరిశ్రమలు, వ్యవసాయం, విద్యారంగాల్లో భారీ ప్రైవేటీకరణ పట్ల అనుకూలత వ్యక్తం చేస్తోంది. పారిశ్రామిక ఆర్థిక వ్యవస్థను వారు ప్రైవేటీకరిస్తున్న తీరు అందరికీ తెలిసిందే. ఇప్పుడు కొత్త సాగుచట్టాల ద్వారా వ్యవసాయ మార్కెట్లను కూడా ప్రైవేటీకరించాలని నిర్ణయించారు. ఈ చట్టాలకు వ్యతిరేకంగానే రైతులు పోరాడుతున్నారు. ఇక ఉన్నత విద్యలో వీరి విధానం కచ్చితంగా భవిష్యత్తుకు భారం కానుంది. ప్రైవేట్ విద్యా సంస్థలను జాతీయీకరణకు బదులుగా అంతర్జాతీయీకరణ వైపు అనుమతిస్తున్నారు. అదే సమయంలో ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను ప్రమాణాలు పెద్దగా లేని శుద్ధ జాతీయవాద పంథా వైపు తీసుకుపోతున్నారు. ప్రస్తుతం అంతర్జాతీయీకరణ పొందిన ప్రపంచంలో ప్రాంతీయీకరించిన విద్యావ్యవస్థను తీసుకురావడంతో పేదలు మరింతగా అవకాశాలు కోల్పోయి ప్రమాణాలు దిగజారిన వర్గంగా మిగిలిపోతారు. కేంద్రప్రభుత్వం యూజీసీ ద్వారా అన్ని ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో సిలబస్‌నీ, భాషనీ, సంస్థాగత చట్రాన్నీ నియంత్రిస్తోంది. అంతర్జాతీయ ప్రమాణాలు లేదా స్పర్థాతత్వం వంటివి కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్యాంశాలు కావు. భారతీయతపై కాకుండా ప్రాచీన హిందూతత్వంపై, హిందూ విజ్ఞానంపై దృష్టి సారించే హిందూ జాతీయవాదం లక్ష్యం ఏమిటంటే, మెల్లగా ఆంగ్లీకరణను రంగం నుంచి తప్పించడమే. ఉదాహరణకు రాజకీయ తత్వవిచారాన్ని బోధించేటప్పుడు దాంట్లోని యూరోపియన్ చింతనను తగ్గించివేసి భారతీయ వేద విజ్ఞానాన్ని, ఉపనిషత్ చింతనను ముందుకు తీసుకువస్తున్నారు. అయితే దీంట్లోనూ బౌద్ధచింతనను మినహాయించడం కుట్రపూరితం అనిపిస్తోంది. చివరకు జేఎన్‌యూ, ఢిల్లీ వర్సిటీలు కూడా ఇప్పుడు ఇంగ్లిష్ నైపుణ్యాలను, అంతర్జాతీయ స్పర్థకు తావిచ్చే జ్ఞానాన్ని మెరుగుపర్చడంపై కాకుండా, హిందీ, హిందుత్వ భావజాలానికి పరిమితం కావడంపైనే దృష్టి పెడుతున్నాయి. చివరకు కేంద్రీకృత పాలన ఉన్న చైనాలో కూడా విద్యావ్యవహారాల్లో ఇంత సంకుచిత దృష్టితో వ్యవహరించడం లేదు. ఈమధ్యనే ప్రతాప్ భాను మెహతా రాజీనామా, వెనువెంటనే అశోకా యూనివర్సిటీలలో జరిగిన చర్చను చూస్తే, విద్యా దార్శనికత కలిగిన ఆధ్యాపకులు జేఎన్‌యూ, ఢిల్లీ వర్శిటీల వంటి కేంద్ర విశ్వవిద్యాలయాలను వదిలిపెట్టి వెళ్లిపోతున్న సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కంచ ఐలయ్య, వ్యాసకర్త ఇంగ్లిష్, తెలుగు భాషల్లో ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
కమలా మేడమ్
‘వెల్కమ్ మై ఫ్రెండ్’ అంటూ మొదలయ్యే మూడు వాక్యాల బుల్లి కథ. దానికి తెలుగులో అర్థం. ఎదురుగా బొమ్మ. మరో పేజీలో ‘ద ఎలిఫెంట్ అండ్ ద డాగ్ బికేమ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్’ అంటూ ఏనుగు– కుక్క కథ. ఇవన్నీ స్కూలుకెళ్లే పిల్లల కోసం అజ్వాని కమల మేడమ్ రూపొందించిన చిన్న కథల పుస్తకాల్లోని బుజ్జి బుజ్జి కథలు. ‘ఐ కెన్ రీడ్ బై మైసెల్ఫ్’ అంటూ ఆమె చిన్న పిల్లల కోసం కథల పుస్తకాలు తయారు చేశారు. ఇందుకు తగిన కారణమే ఉంది. కారణం కన్నా ఆమె స్వీకరించిన సామాజిక బాధ్యత ఉంది. ‘‘మన దగ్గర తెలుగు మీడియంలో చదివే పిల్లలకు పదేళ్లు వచ్చేవరకు ఇంగ్లిష్తో పరిచయమే ఉండడం లేదు. ఐదారు తరగతుల్లో ఇంగ్లిష్ అక్షరాలు నేర్చుకోవడం, ఆ వెంటనే పాఠాలు మొదలవుతున్నాయి. బాగా చదువుతూన్న పిల్లలు కూడా ఇంగ్లిష్ భయంతో స్కూలు ఎగ్గొడతారు. నిజానికి ఇంగ్లిష్ భాష పిల్లలను బడి దొంగలుగా మార్చే మహమ్మారి కాదు. చిన్నప్పటి నుంచే ఇంగ్లిష్‌ను పరిచయం చేస్తే పెద్దయ్యాక ఇంగ్లిష్‌ని మించిన ఫ్రెండ్ మరొకరు ఉండరు. భూగోళంలో ఎక్కడికి వెళ్లినా మనకు తోడు ఎవరూ లేకపోయినా ఇంగ్లిష్ భాషే తోడుగా ఉండి నడిపిస్తుంది’’ అంటారు కమలా మేడమ్. మన ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక విద్యలో ఇంగ్లిష్ లేకపోవడం తో ఆమె స్వయంగా కరికులమ్ రూపొందించారు. లెవెల్–1, లెవెల్–2.. ఇలా మొత్తం 120 పుస్తకాలకు రూపమిచ్చారు. తొంభయ్ ఏళ్ల వయసులో చలాకీగా స్కూళ్లకు వెళ్లి ఆ పుస్తకాలను పిల్లలకు పంచుతున్నారు, ఇంగ్లిష్ పాఠాలు చెబుతున్నారు. తెలుగింటి కోడలు కమల 1931లో చెన్నైలో జన్మించారు. విద్యావంతుల కుటుంబం. తండ్రి అజ్వాని డాక్టర్, తల్లి చంద్రావతి. కమల ఆ రోజుల్లోనే ఇంజనీరింగ్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. జెట్టి దశరథరామిరెడ్డిని పెళ్లి చేసుకుని నెల్లూరును సొంతూరు చేసుకున్నారామె. ఆమెకు చదువుకోవడం, చదువు చెప్పడం ఇష్టం. ఆ ఇష్టంతోనే పెళ్లి తర్వాత ఎం.ఈ. చేశారు. పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్లో జూనియర్ ఇంజనీర్ ఉద్యోగం చేశారు. అదే సమయంలో టెక్నికల్ ఎడ్యుకేషన్ అవసరాన్ని తెలియచేస్తూ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఆమె సూచనతో 1962లో ప్రభుత్వం తూర్పుగోదావరి జిల్లా, కాకినాడలో మహిళా పాలిటెక్నిక్ కళాశాలను స్థాపించింది. అది ఆసియా ఖండంలోనే మహిళల కోసం స్థాపించిన తొలి పాలిటెక్నిక్ విద్యాసంస్థ. ఆ కాలేజ్‌కు ప్రిన్సిపల్‌గా కమలా మేడమ్‌నే నియమించింది ప్రభుత్వం. గుంటూరు, మహిళా పాలిటెక్నిక్ కాలేజ్, నెల్లూరు కరికులం డెవలప్మెంట్ సెంటర్లో విధులు నిర్వర్తించారు. తేలిగ్గా చదవాలి ప్రభుత్వ స్కూలు పిల్లలతో కమలామేడమ్ విద్యావిధానాన్ని తేలిక పరిచిన గురువు ఆమె. సివిల్ ఇంజనీరింగ్ సిలబస్‌లో పాఠ్యాంశాలు బరువైన శాస్త్ర సాంకేతిక పదాలతో ఉండేవి. ఇంగ్లిష్ నేపథ్యం లేని విద్యార్థులకు ఏ మాత్రం కొరుకుడు పడనంత కఠినమైన పారిభాషిక పదాలుండేవి. దాంతో స్టూడెంట్స్ ఫెయిలయ్యేవాళ్లు. కొంతమంది కోర్సు సగంలో వదిలేసే వాళ్లు. ఇదంతా గమనించిన కమలామేడమ్కి సబ్జెక్టు సులభంగా అర్థం అయితే ఈ దుస్థితి రాదనిపించింది. తేలికైన ఇంగ్లిష్పదాలతో ఇంజనీరింగ్ పాఠ్యాంశాలన్నింటినీ తిరిగి రాశారామె. అలా ఇంజనీరింగ్ వాళ్ల కోసమే పదకొండు పుస్తకాలు రాశారు. ఆమె చూపించిన దారిలోనే మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ ప్రొఫెసర్లు కూడా కొత్త పుస్తకాలు రాసుకున్నారు. విద్యార్థుల కోసం ఆమె తీసుకున్న ఆ చొరవ ఆమెను విద్యాశాఖ టెక్నికల్ ఎడ్యుకేషన్ జాయింట్ డైరెక్టర్ని చేసింది. కీలకమైన బాధ్యతలు నిర్వర్తించి 1989లో రిటైర్ అయ్యారు కమల. అమెరికా వెళ్లారు.. కానీ కమలామేడమ్కి ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి. అందరూ యూఎస్‌లో సెటిలయ్యారు. రిటైర్ అయిన తర్వాత భర్తతో పాటు మేడమ్ కూడా అమెరికా వెళ్లారు. ఎనిమిది మంది మనుమలు– మనుమరాళ్లతో సంపూర్ణమైన జీవితాన్ని గడిపారు. ఐదేళ్ల కిందట భర్త పోవడంతో ఆమె ఇండియాకు తిరిగి వచ్చేశారు. మిగిలిన జీవితం సమాజానికే అని స్థిరంగా నిశ్చయించుకున్నారు. నాలుగేళ్ల నుంచి ఆమె నెల్లూరు జిల్లాలోని గ్రామాలకు వెళ్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లోని విద్యార్థులకు ఇంగ్లిష్ నేర్పించడం అనే మహాయజ్ఞాన్ని తలకెత్తుకున్నారు. శేష జీవితం విద్యాసేవకే అంకితం అని స్వచ్ఛంగా నవ్వారు కమలా మేడమ్. – కొండా సుబ్రహ్మణ్యం, సాక్షి, నెల్లూరు ఫొటోలు: ఆవుల కమలాకర్ ఇంగ్లిష్ మీడియం అత్యవసరం ప్రస్తుతం అన్నిరంగాల్లో పోటీ పెరిగింది. ఉద్యోగాలు రావాలంటే ఇంగ్లీష్ రాయడం, చదవడం, మాట్లాడటం బాగా వచ్చి ఉండాలి. ఇంగ్లిష్ రాకపోవడం అనే ఒకే ఒక్క కారణంగా చాలామంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు కూడా వాళ్ల చదువుకు సంబంధం లేని చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ప్రభుత్వపాఠశాలల్లో మాతృభాషతో పాటు ఇంగ్లీషులో విద్యాబోధన జరగాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంచి నిర్ణయం తీసుకున్నారు. రాబోయే తరాల భవిష్యత్తు గురించి ఆలోచించగలిగిన దార్శనికత అది. – అజ్వాని కమల, విశ్రాంత జాయింట్ డైరెక్టర్, స్టేట్ టెక్నికల్ ఎడ్యుకేషన్ బోర్డు -
ఇంగ్లీష్‌తో పాటు తెలుగుకు ప్రాధాన్యత
సాక్షి, కృష్ణా: అంతర్జాతీయ ప్రమాణాలకు ధీటుగా రాష్ట్ర విద్యా ప్రణాళికను రూపొందిస్తున్నామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ..ఇంగ్లీష్ తో పాటు తెలుగుభాషకు సముచిత ప్రాధాన్యం ఇస్తామని మరోసారి మంత్రి స్పష్టం చేసారు. ఇబ్రహీంపట్నంలో రాష్ట్ర విద్యా పరిశోధనా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్షకు సురేష్ హాజరయ్యారు. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దే అంశం పై కూలంకుష చర్చ జరిగిందని చెప్పారు. పేద విద్యార్థులకు మెరుగైన విద్యాప్రమాణాలు అందిస్తామని స్పష్టం చేశారు. అభ్యాసన ఫలితాలు, ఫౌండేషనల్ లెర్నింగ్ ఆధారంగా పాఠ్య పుస్తకాలు రూపొందించబడుతున్నాయని తెలిపారు. ఆంగ్ల మాధ్యమంలో బోధన చేసేందుకు ఉపాధ్యాయులకు మూడు స్థాయిలలో శిక్షణ ఇప్పిస్తామన్నారు. బోధనలో ఉపాధ్యాయులకు సహకారం అందించేందుకు ఆన్ లైన్ సేవలు వినియోగిస్తామన్నారు. పాఠశాలల్లో లాంగ్వేజ్ లేబరేటరీలు ఏర్పాటు చేసి ఇంగ్లీష్ భాషా నైపుణ్యాన్ని పెంపొందించేందుకు కృషి జరుగుతోందని ఆదిములపు సురేష్ తెలిపారు. -
ఏ దేశమేగినా...
పిల్లలచేత మమ్మీ డాడీ అని తొలి పలుకులుగా పలికించేటప్పుడు ఎవ్వరికీ మాతృభాష గుర్తుకు రాదు. తప్పటడుగులు వేసేటప్పుడు సోప్, షాంపూ, షవర్ అని పిల్లలు కేరింతలు కొడుతుంటే మహదానందపడుతుంటాం. అన్నప్రాసన అయ్యాక డైనింగ్ టేబుల్, ప్లేటు, గ్లాసు, వాటర్, రైస్, కర్రీ, చట్నీ, సాంబార్, రసం, సాల్ట్, కర్డ్ అని పిల్లలు మాట్లాడుతుంటే మురిసిపోతాం. ఏ తల్లిదండ్రులైనా ఇంగ్లిష్ మాటల్ని ఒకసారైనా సరిచేశారా? పొద్దున లేచి బ్రష్ పేస్ట్ నించీ అంతా ఇంగ్లిషే. బడికి బయలుదేరుతుంటే పెన్సిల్, పెన్, బుక్స్, బ్యాగ్, షూస్, హోంవర్క్, యూని ఫాం ఇలా అన్నీ ఆంగ్లపదాలే. స్కూలు ఆవరణలో అడుగుపెట్టాక తెలుగు నిషేధం. అక్కడ పిల్లల నోటెంట తెలుగు ముక్క దొర్లితే ఫైన్ చెల్లిం చాల్సి ఉంటుంది. వీటిని తల్లిదండ్రులు ఘనంగా గర్వంగా చెప్పుకుంటారుగానీ స్కూలుకి వెళ్లిపోట్లాడతారా అంటే లేదు. ఎందుకంటే ఖరీదైన స్కూల్స్‌లో అవన్నీ ఉండే నియమ నిబంధనలే. విచిత్రం ఏమిటంటే, ఏ పల్లెకైనా వెళ్లి ఫోన్ నంబరు అడగండి. పది సెల్ నెంబర్లూ స్పష్టంగా ఇంగ్లిష్‌లోనే చెబుతారు. ఇంగ్లిష్‌లో చెప్పారేమని అడిగితే, ‘ఏంటోనండీ ఈ నంబర్ తెలుగులో చెప్పడానికి రాదండీ’ అన్నదా యువతి. మన సీఎం తెలుగు కాదు, పదో ఏడు వచ్చేదాకా ఇంగ్లిష్ అనేసరికి ఇంటిమీద పెంకులు లేచిపోతున్నాయ్. అంతా ఒక్కసారి ఆలోచించాలి. మా తరం అంటే అరవై ఏళ్లు దాటిన వాళ్లం స్కూలు ఫైనల్ కాగానే పై చదువుకి దగ్గరి బస్తీకో, బస్తీలో ఉన్న సమీప బంధువులింటికో వెళ్లాల్సి వచ్చేది. పీయూసీలో చేరే వాళ్లం. నిక్కర్లు వదిలి ప్యాంటు వేసుకోవడమే చాలా తికమకగా ఉండేది. చాలా మందికి చెప్పులుండేవి కావు. వాచీలు చాలా కొందరికే. బస్తీల్లో పుట్టి బస్తీల్లో పెరిగినవాళ్లు చాలా స్టయిల్‌గా ఉండేవాళ్లు. వాళ్లకి ‘బినాకా గీత్‌మాలా’ తెలుసు. హిందీ సినిమాల గురించి తెలుసు. వాళ్లు ఇంగ్లిష్ పిల్లలు. మేమంతా పల్లెటూరి బైతు పిల్లలం. ఇంగ్లిష్‌లో అటెండెన్స్ పిలిచేవారు. వాళ్లు మాస్టర్లు కారు లెక్చరర్లు. వాళ్ల పేర్లు కూడా పొడి అక్షరాల్లో పొట్టిగా ఉండేవి. కొంతమంది లెక్చరర్లు ఇంగ్లిష్‌లో తప్ప మాట్లాడేవారు కాదు. అర్థం అయినా కాకపోయినా, పెద్దవాళ్లం అయిపోయాం అనే నమ్మకమైన భ్రమ మమ్మల్ని ఆవరించేది. ఇంగ్లిష్ రాకపోవడంవల్ల చుట్టుకునే చిన్న చిన్న అవమానాలు తరచూ బాధించేవి. తమాషా ఏమిటంటే మా తెలుగు మేస్టారు కూడా ఇంగ్లిష్‌లో మాకు వార్నింగ్లిచ్చేవారు. ఇంగ్లిష్ రాదనకుంటారనే బెంగ ఆయన్ని పీడిస్తూ ఉండేది. ఇప్పుడు కాదు ఎప్పట్నించో పల్లెల్లో కూడా బోలెడు ఇంగ్లిష్ వినిపిస్తూనే ఉంది. రేడియో కంటే టీవీ చాలా మాటలు నేర్పింది. రోజూ పొలాల్లో వేసే ఎరువులు, పురుగుమందులు అన్నీ ఇంగ్లిష్‌లోనే కదా ఉంటాయి. కానీ ఇదంతా వ్యవసాయ పరిభాష. ఇదొక జార్గాన్. దానికి తెలుగు ఉండదు. స్టేషన్, రైలు లాగానే. బ్రిటిష్ హయాంలో మనమంతా వాళ్ల మనుషులం కాబట్టి మన చదువుల్ని వారికి అనుకూలంగా ఉండేలా మనపై రుద్దారు. వాటినే ‘మెకాలే చదువులు’ అనుకుంటూనే చచ్చినట్టు చదువుకున్నాం. అదెందుకు, ఇదెందుకు అని అడగలేదు. అదేమిటి ఇదేమిటని ప్రశ్నించలేదు. తర్వాత ఆ శకం అంతరించింది. అయినా ఇంకా అవశేషాలు మిగిలే ఉన్నాయి. ఆ చదువులు పోయి అమెరికా చదువులు వచ్చాయి. ‘మొత్తం బతుకంతా ఆ డాలర్ రాజ్యంలోనే ఉంది నాయనా, మనోళ్లంతా ఆ నీళ్లే తాగి బతుకుతున్నా రయ్యా’ అంటూ ఆప్తులు పుట్టినప్పట్నించి ప్రోత్సహిస్తున్నారు. ఒకప్పటిలాగా మన ఊళ్లోనే, మన రాష్ట్రంలోనే, మన దేశంలోనే జీవితం గడిచిపోతుందనే గ్యారంటీ ఎవ్వడికీ లేదు. టీడీపీ వాళ్లకి లాజిక్‌తో పనిలేదు. జగన్ ఏది ప్రవేశపెట్టినా వారికి నచ్చదు. ఈ వ్యతిరేకుల సమీప కుటుంబ సభ్యులలో ఎందరికి తెలుగు చదవను, రాయను వచ్చునో కనుక్కోండి. మన దేశం లాంటి ప్రజా రాజ్యంలో అడుగడుగునా పేదవాడికి అన్యాయం జరుగుతూనే ఉంటుంది. అది విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, న్యాయం, చట్టం కావచ్చు, నీతి నియమాలు కావచ్చు. అందరూ సమానమే. కొందరు మరీ ఎక్కువ సమానం. మా చిన్నప్పటినించీ తెలుగు మేష్టారంటే అలుసే. అందుకని పాపం ఆయన అవసరం లేకపోయినా ఇంగ్లిష్‌లో మాకు వార్నింగ్‌లు ఇస్తూ ఉండేవారు. నిజంగానే ఇంగ్లిష్, సైన్సులు, లెక్కలకు ఉన్న డిమాండ్ తెలుగుకి అప్పట్నించీ లేదు. పెళ్లికొడుకుని వెదికేటప్పుడు కూడా, ‘పిల్లకి వయసు మీరుతోంది. పోనీ బడిపంతులుగానీ, ఆహరికి తెలుగు మేష్టారైనా పర్వాలేదు...’ అనే వారు. ఏదేశమేగినా ఎందుకాలిడినా ఇంగ్లిషే బెటరు! శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
తల్లిదండ్రులూ ఇంగ్లిష్ నేర్చుకోవాలి
మణికొండ: రాబోయే రోజుల్లో ఆంగ్లభాష ప్రతి ఒక్కరికీ ఎంతో అవసరం అవుతుందని, దాన్ని నేర్చుకునేందుకు ప్రతి గురుకుల విద్యార్థుల తల్లిదండ్రులు ప్రయత్నం చేయాలని రాష్ట్ర మార్కెటింగ్ డైరెక్టర్ జి.లక్ష్మీబాయి పేర్కొన్నారు. గండిపేట మండలం నార్సింగి గురుకుల బాలకల పాఠశాలలో ఆరు రోజులుగా తల్లిదండ్రులకు బోలో ఇంగ్లీష్ ధనాధన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. శుక్రవారం నిర్వహించిన ముగింపు కార్యక్రమానికి డెవలప్మెంట్ ఆఫ్ అలుమి రిలేషన్స్ ప్రత్యేక అధికారి కొరివి వినయకళ అధ్యక్షత వహించగా ఆమె ముఖ్యఅథితిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రపంచభాషగా పిలుస్తున్న ఆంగ్లభాషను నేర్చుకోవాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. విద్యార్థులకు తాము పాఠశాలల్లో ఆంగ్లంలో బోధిస్తున్నా తల్లిదండ్రులు వారితో మాట్లాడలేక పోవటంతో పూర్తి స్థాయి ఫలితం రావడం లేదన్నారు. అందుకే తల్లిదండ్రులకు సైతం ఆగ్లభాష నేర్చించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు. ఈ సందర్భంగా కొందరు తల్లిదండ్రులు మాట్లాడుతూ తమకు ఆంగ్లభాష నేర్చుకోవాల్సిన అవసరాన్ని సమగ్రంగా వివరించారని, రాబోయే రోజుల్లో ప్రయత్నిస్తామన్నారు. గురుకుల పాఠశాలల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ తల్లితండ్రులు ఆంగ్లం నేర్చుకుని తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించే దిశగా వారితోనే పోటీ పడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్సీఓలు, ప్రిన్సిపాల్లు, కోఆర్డినేటర్లు పాల్గొన్నారు. -
ఎదగడానికి ఇంగ్లిషే రాచబాట
వేలసంవత్సరాల భారతీయ చరిత్రలో ప్రధాన పాలక భాషలుగా చలామణి అయిన సంస్కృతం, పర్షియన్, ఇంగ్లిషు భాషలకు శూద్రులు, దళితులు, ఆదివాసీలు వెలుపలే ఉంటూ వచ్చారు. పాలకభాషకు దూరమయ్యారు కాబట్టే తొలినుంచీ వీరికి దేశవ్యాప్తంగా సంబంధాలుండేవి కావు. చిన్న స్థాయి భాషలతోటే వీరి మనుగడ సాగేది. దేశ చరిత్రలో ఇంగ్లిష్ విద్యను పొందిన మొట్టమొదటి శూద్రుడు మహాత్మా పూలే. భారతదేశంలో శూద్రులు బానిసలుగా ఉన్నారని ఆయన ఇంగ్లిష్ ద్వారానే ప్రపంచానికి చాటిచెప్పారు. శూద్ర, దళిత, ఆదివాసీలలో నిజమైన విద్యా విప్లవం అంబేద్కర్తోటే ప్రారంభమైంది. వెనుకబడిన వర్గాలు జాతీయ స్థాయి సంబంధాల్లోకి రావాలంటే ఇంగ్లిషు తప్పనిసరి. కానీ ఇంగ్లిష్ భాష ఎన్నికల అంశంగా మారితే తప్ప సామాన్య ప్రజలందరి భాషగా ఇంగ్లిషును పాలకులు అనుమతించరన్నది వాస్తవం. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ఒక ఆసక్తికరమైన చర్చ చోటు చేసుకుంది: చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్.. వీరిలో ఇంగ్లీషు చక్కగా ఎవరు మాట్లాడతారు అన్నదే ఆ చర్చ సారాంశం. వీళ్లు ముగ్గురూ శూద్రులే. చంద్రబాబు, కేసీఆర్‌లు తొలి తరంలో ఇంగ్లిష్ నేర్చుకున్న వారు కాగా, వైఎస్ జగన్ రెండో తరానికి చెందిన, ఇంగ్లిష్ మీడియంలో చదువుకున్న విద్యావంతుడైన నాయకుడు. ఆయన తండ్రి కూడా డాక్టరే. పైగా ఇంగ్లిష్ చక్కగా మాట్లాడేవారు. వైఎస్ రాజశేఖరరెడ్డి 2006లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 6000 ప్రభుత్వ పాఠశాలల్ని ఇంగ్లిష్ మీడియంలోకి మార్చడం ద్వారా ప్రభుత్వ బడులలో ఇంగ్లీష్ బోధనను ప్రారంభించారు. గ్రామీణ విద్యా పరివర్తన విషయంలో ఒక రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కీలకమైన మార్పు ఇదే. దీన్ని మంచి రాజకీయ ఆవిష్కరణగా భావిస్తూనే, చారిత్రకంగా ఇంగ్లిష్ విద్యలో శూద్రులు/దళితులు/ఆదివాసుల స్థానమేంటో చూద్దామా? మనకు తెలిసిన చరిత్రలో ఇంగ్లిష్ మూడో భారతీయ పాలక (అధికారిక) భాషగా ఉంటోంది. కలకత్తా ప్రావిన్స్‌లో భాషా విధానాన్ని పర్షియన్ భాష నుంచి ఇంగ్లిష్‌కు మార్చడం ద్వారా 1858లో ఇంగ్లిష్ భారతీయ పాలక భాషగా మారింది. దీనికి ముందు పర్షియన్ భాషే అఖిల భారత స్థాయిలో పాలనాభాషగా ఉండేది. పర్షియన్ భాష పాలనా భాషగా మారడానికి ముందు దేశంలో సంస్కృతమే పాలకుల భాషగా ఉండేది. ఇంతవరకు ఈ మూడు భాషలు మాత్రమే అఖిల భారత స్వభావాన్ని సంతరించుకుని ఉండేవి. ఇతర భాషలన్నీ భారతీయ చరిత్ర పొడవునా ప్రాంతీయ, స్థానిక, గిరిజన భాషలుగా ఉండేవి. హరప్పా నగర నాగరికతలో ఏ భాష అమల్లో ఉండేదో మనకు తెలీదు. బహుశా అది బౌద్ధుల కాలంలో ప్రాచుర్యంలో ఉండిన పాళీ వంటి భాష అయివుండవచ్చు. నాటి పాలక రాజవంశాలు పాళి భాషను ఏమేరకు ఉపయోగించి ఉంటాయో మనకు తెలీదు. బౌద్ధ, జైన సాహిత్యం పాళి భాషలోనే ఉండటంతో ఇది కూడా ప్రధాన భారతీయ భాషగా ఉండవచ్చు కానీ సంస్కృత ఆధిపత్యం సాగిన కాలంలో పాళీని నిర్మూలించివేశారు. పలు దక్షిణ భారత భాషలు పాళీతో సంబంధం కలిగి ఉన్నప్పటికీ దక్షిణ భారతదేశంలో ఇప్పటికీ సంస్కృతం ఉనికిలో ఉన్న విధంగా పాళీ ఒక భాషగా మనలేదు. సంస్కృత భాషను ఇంటి భాషగా, మార్కెట్ భాషగా అనుమతించనప్పటికీ హిందూ ఆధ్యాత్మిక వ్యవస్థతోపాటు సంస్కృతం కొనసాగుతూ వచ్చింది. సంస్కృత ఆధిపత్యం రాజ్యమేలిన కాలంలో ఇప్పటి ఇతర వెనుకబడిన కులాలు, రిజర్వ్డ్ విభాగంలో లేని భూమి కలిగివున్న శూద్ర ఉన్నత వర్గం, రైతాంగంతో సహా శూద్ర వ్యవసాయ ఉత్పత్తిదారులకు సంస్కృత భాషలో చదివే, రాసే హక్కు ఉండేది కాదు. ఇక దళితులను, గిరిజనులను తొలి నుంచి పౌర సమాజ వ్యవస్థకు వెలుపలనే ఉంచేశారు. కాబట్టి సంస్కృతం లేదా పర్షియన్ భాషల్లో వారి ప్రవేశం అనే ప్రశ్నే తలెత్తేది కాదు. దాదాపుగా కులవంశాలు, తెగలు మాట్లాడే చిన్నచిన్న భాషలతోటే వీరు మనుగడ సాగించేవారు. జాతి గురించిన వారి భావన కేవలం తెగ లేక వంశం అనే అర్థంలో ఉండేది. 21వ శతాబ్ది ప్రారంభం నాటికి శూద్రులు/దళితులు/గిరిజనులు తమ తమ భాషా ప్రాంత రాష్ట్రాల్లోని ప్రాంతీయ భాషల్లో చక్కగా వ్యక్తీకరించగల స్థాయిని పొందారు. కానీ దేశవ్యాప్తంగా ప్రజలతో వీరి సంబంధ బాంధవ్యాలు నామమాత్రంగానే ఉంటున్నాయి. అదే సమయంలో బ్రాహ్మణులు/బనియాలు కొత్త భాష అయిన ఇంగ్లిషుపై పట్టు సాధించి అంతర్జాతీయ కమ్యూనిటీలోకి పరివర్తన చెందారు. ప్రారంభంలో వీరు కూడా ఇంగ్లిష్‌ని వలసభాషగా నిందించేవారు కానీ ప్రైవేట్ పాఠశాలల్లో, కళాశాలల్లో ఆ భాషను నేర్చుకోవడం కొనసాగించారు. 21వ శతాబ్ది ప్రారంభం నాటికి వీరు తమకుతాముగా ఇంగ్లిష్ మాట్లాడే, రాసే వర్గంగా మారారు. అయితే ముఖ్య విషయమేమిటంటే, ఇంగ్లిష్ జాతీయ భాషగా మారినప్పటికీ, శూద్రులు, ఓబీసీలు, దళితులు, ఆది వాసీలు దేశవ్యాప్తంగా పరస్పర సంబంధాలలో ఉండేవారు కాదు. సంస్కృతం చలామణిలో ఉన్న కాలంలో బ్రాహ్మణులు మాత్రమే దేశ వ్యాప్తంగా సంబంధాలు కలిగి ఉండేవారు. కొంతమంది బనియాలు, క్షత్రియులకు కూడా సంస్కృతం తెలిసినప్పటికీ అది వారి ఇంటి భాషగా ఉండేది కాదు. బ్రాహ్మణులకు మాత్రం సంస్కృతం ఇంటిభాషే. ఈరోజు దేశంలోని 29 రాష్ట్రాల్లోనూ శూద్రులు, దళితులు, ఆదివాసుల్లో కొద్దిమంది మాత్రమే ఇంగ్లిష్‌ను చదివి, రాయడమే కాకుండా రాష్ట్ర పాలనాపరమైన అంశాల్లో పాలుపంచుకుంటున్నారు. వారి ఆత్మవిశ్వాస స్థాయిలు పెరుగుతూ వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు వీరికి కూడా అంతర్జాతీయ భాష గురించి తెలుసు, పైగా ఉత్పత్తిలో పాలుపంచుకోనప్పటికీ రాష్ట్రంలోని, మార్కెట్లోని ప్రతి రంగంలోనూ ఆధిక్యత కలి గివున్న బ్రాహ్మణులు, బనియాలతో వీరు పోటీపడుతున్నారు. శూద్రులు, దళితులు, ఆదివాసీ శక్తులు వ్యవసాయ, చేతివృత్తులకు చెందిన ఉత్పత్తికి కట్టుబడిపోవడంతో వీరికి రాష్ట్రాల మధ్య సంబంధాలతో పనిలేకుండా పోయింది. వ్యాపార కార్యాచరణ, రాష్ట్ర పాలనకు లాగా గ్రామీణ, చేతివృత్తుల ఉత్పత్తికి దేశవ్యాప్త ప్రయాణాలు, అనుసంధానం అవసరం లేదు. ఆధ్యాత్మిక రంగంలోని బ్రాహ్మణులు, వ్యాపారరంగంలోని బనియాలు సంస్కృతంలో, ప్రాంతీయ భాషల్లో అధునాతన భాషా నైపుణ్యాలను పొందారు. శూద్రులు, దళితులు, ఆదివాసీ ప్రజానీకంపై ఆధిపత్యం వహించడానికి వీరు తమ బాషా నైపుణ్యాలను ఉపయోగించేవారు. ఈ పరిస్థితుల్లో భారతీయులందరికీ ఇంగ్లిషును పరి చయం చేయకపోతే, ఈ శూద్ర, దళిత, ఆదివాసీలు ఆధునిక ఆర్థికవ్యవస్థలోకి ప్రవేశించలేరు కూడా. చివరకు అన్ని రాష్ట్రాల్లోనూ మార్కెట్ సంబంధాలు కూడా ఇంగ్లిషులోనే నడుస్తున్నాయి. సాధారణ మార్కెట్ పూర్తిగా ఇంగ్లిషుకు మారనప్పటికీ, సాంకేతిక మార్కెట్లో మాత్రం ఇంగ్లిష్ ఇప్పుడు విస్తరిస్తోంది. హిందీకి అలాంటి విస్తరణ లేదు. 16వ శతాబ్దిలో మొఘల్ పాలన నుంచి బ్రిటిష్ పాలన మధ్యకాలం వరకు పర్షియన్ భాష దేశవ్యాప్తంగా వ్యవహారంలో ఉండేది. చిన్నచిన్న పాలకులు పర్షియన్, ఇతర భాషల్లోనే పాలనను నిర్వహించినప్పటికీ ముఖ్యంగా వీరు ముస్లిం లేక బ్రాహ్మణ అధికారులపైనే ఆధారపడేవారు. ఉదాహరణకు, హైదరాబాద్ రాష్ట్రంలో నిజాం ఉర్దూ, పర్షియన్ భాషలను ఉపయోగించేవారు. కొన్ని రాష్ట్రాలు పర్షియన్, ఇతర భాషలను ఉపయోగించేవి. శూద్రులలో ఉన్నత స్థాయి కలిగిన వారు 20 శతాబ్ది ప్రారంభంలో భూయజమానులుగా లేక భూస్వాములుగా మారి నప్పటికీ, వారిలో పర్షియన్ భాషా నైపుణ్యాలు పెరగలేదు. సంస్కృతభాష మాత్రం హిందూ మతపరమైన భాషగా ఉనికిని సాగించింది కానీ శూద్రులకు ఈనాటికీ పౌరోహిత్య హక్కు లేదు. అందుకే వీరు సంస్కృత పాఠాలతో పాండిత్య స్థాయిలో సంబంధం కలిగిలేరు. కొద్దిమంది శూద్రులు మాత్రమే సంస్కృతంలో ప్రావీణ్యం సంపాదించినప్పటికీ, వీరు గొప్ప పండితులు కాలేకపోయారు. పైగా హిందూ ధార్మిక గ్రం«థా లపై వీరు చేసే వ్యాఖ్యానాలకు సాధికారిక ఆమోదం లభించలేదు. బ్రాహ్మణ పండితుడి సంస్కృతం మాత్రమే ప్రామాణికంగా గుర్తింపు పొందేది. అందుచేతే సంస్కృత భాషా రంగంలో సమయాన్ని, శక్తిని, వనరులను వెచ్చించడానికి శూద్రులలో ఎవరికీ ఆసక్తి లేకుండా పోయింది. ఫలితంగా వేల ఏళ్లుగా వీరు జాతీయతత్వం అనే భావనకు దూరంగా ప్రత్యేక ప్రాంతాల్లోనే మిగిలిపోయి ఉన్నారు. ప్రస్తుతం దళితుల ముందున్న మార్గం ఏది? శూద్రులు, దళితులు, ఆదివాసీల అభ్యున్నతికి ఏకైక పరిష్కారం దేశం లోని అన్ని రాష్ట్రాల్లోనూ ఇంగ్లిష్ మీడియం విద్యను ప్రవేశపెట్టడమే. విద్యలో ద్వంద్వ మీడియం.. అంటే ప్రభుత్వ స్కూళ్లలో ప్రాంతీయ భాష, ప్రైవేట్ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం అనేది ఒక వంచనాత్మక వ్యవస్థ. శూద్రులను, దళితులను, ఆదివాసీలను జాతీయ, అంతర్జాతీయ స్థాయిని అందుకోకుండా అడ్డుకోవడమే దీని లక్ష్యం. భారత స్వాతంత్య్రానంతరం కూడా బ్రాహ్మణ, బనియా శక్తులు తమ ఆధిపత్యాన్ని కొనసాగించడానికి ఇలాంటి వ్యవస్థకు పథక రచన చేశారు. శూద్ర, దళిత, ఆదివాసీలకు జాతీయస్థాయిలో వారిని అనుసంధానించే భాషే లేకుండా పోయింది. దేశ చరిత్రలో ఇంగ్లిష్ విద్యను పొందిన మొట్టమొదటి శూద్రుడు మహాత్మా పూలే. భారత్‌లో శూద్రులు బానిసలుగా ఉన్నారని ఆయన ఇంగ్లిష్ ద్వారానే ప్రపంచానికి చాటిచెప్పారు. ఆనాటికి రాజారామ్మోహన్ రాయ్, గోపాలకృష్ణ గోఖలే, బాల గంగాధర్ తిలక్, మహదేవ్ గోవింద్ రనడే (అందరూ బ్రాహ్మణులే) ఇంగ్లిష్‌లోనే చదువుకున్నారు. నిజానికి తిలక్ 1880లోనే ఇంగ్లిష్ మీడి యం స్కూల్‌ను ప్రారంభించారు. మహాత్మా పూలే ఆయన సీనియర్. కానీ ఒక స్కాటిష్ మిషన్ స్కూల్లో 7వ తరగతి వరకే ఆయన చదువుకున్నారు. శూద్రులను చారిత్రక నిరక్షరాస్యత నుంచి ఆయన కాపాడారు. శూద్రులలో కొద్దిమంది మాత్రమే ఇంగ్లండ్‌కు వెళ్లే అవకాశం పొంది ఇంగ్లిషు విద్యను నేర్చుకున్నారు కానీ ఇంగ్లిష్ నేర్వడంలో వారికి పరిమితులు ఉండేవి. ఆర్థికంగా మంచి స్థాయిలో ఉన్న కొందరు శూద్రులు విద్యపై ఎన్నడూ పెద్దగా దృష్టి పెట్టలేదు. మైసూర్ రాజు, బరోడా రాజు వంటి చిన్న చిన్న రాజులు ఉండేవారు. ఈయనే తర్వాత అంబేడ్కర్‌కి విద్యలో సహాయం చేశారు. కాని ఇలాంటి రాజులు తమ కుటుంబ సభ్యులను ఇంగ్లండ్‌కు పంపించి ఇంగ్లిష్ విద్య నేర్పించిన రుజువులేవీ లేవు. విద్యకున్న శక్తి ఏమిటో గ్రహించిన వారు కాబట్టి బ్రాహ్మణులు, బనియాలు మాత్రమే విద్య గురించి తీవ్రంగా ఆలోచించేవారు. ఏమైనప్పటికీ శూద్ర, దళిత, ఆదివాసీలలో నిజమైన విద్యా విప్లవం అంబేడ్కర్తోటే ప్రారంభమైంది. ఆ విప్లవం ప్రాథమికంగా అనిశ్చితంగానే ఉంటోంది. అది ఆత్మిక, భౌతిక రూపొన్ని సంతరించుకోలేదు. హిందుత్వ శక్తులు అందరికీ ఇంగ్లిషు విద్యను అనుమతిస్తాయో అన్నది ముఖ్యమైన ప్రశ్న. ఎన్నికల అంశంగా మారితే తప్ప ప్రభుత్వ రంగంలో ఇంగ్లిష్ వ్యతిరేక మేధావులు ఇంగ్లిష్ భాషను సామాన్య ప్రజాభాషగా అనుమతించబోరని వారితో సుదీర్ఘకాలంగా పోరాడుతున్న నా అనుభవం తేల్చి చెబుతోంది. వ్యాసకర్త డైరెక్టర్, సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సోషల్ ఎక్స్‌క్లూజన్ అండ్ ఇంక్లూజివ్ పాలసీ ప్రొ‘‘ కంచ ఐలయ్య షెఫర్డ్ ప్రొ‘‘ కంచ ఐలయ్య షెఫర్డ్ -
సాక్షి స్పెల్‌బీ–2018 తెలంగాణ రాష్ట్ర విజేతలు వీరే
హైదరాబాద్: ‘సాక్షి’ మీడియా గ్రూప్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సాక్షి స్పెల్‌బీ–2018 (కేటగిరీ–1, 2, 3, 4, తెలంగాణ రాష్ట్రం) విజేతలను ప్రకటించారు. వేలాది మంది విద్యార్థులు పాల్గొన్న ఈ పోటీలు ఎంతో ఉత్కంఠగా కొనసాగాయి. చివరగా నిర్వహించిన ఫైనల్స్‌లో ప్రథమ, ద్వితీయ, తృతీయ విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందించారు. ఈ సందర్భంగా విజేతలు, వారి తల్లిదండ్రులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. విద్యార్థుల్లో ఇంగ్లిష్ భాషపై అంతర్గతంగా ఉన్న భయాలు పోగొట్టి, వారికి ఇంగ్లిష్‌లో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీయడంతో పాటు గొప్ప ఆత్మవిశ్వాసాన్ని ఈ పోటీలు కలిగించాయని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సాక్షి యజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు. కేటగిరీ–1: ప్రథమ బహుమతి: హైదరాబాద్‌లోని కెన్నడీ హై ద గ్లోబల్ స్కూల్(బాచుపల్లి)లో చదువుతున్న ‘అథర్వ్ మిశ్రా’ కైవసం చేసుకున్నారు. విజేతకు బంగారు పతకంతో పాటు రూ. 15వేలు, సర్టిఫికెట్, డ్యూక్స్ గిప్ట్ హాంపర్ అందజేశారు. ద్వితీయ బహుమతి: హైదరాబాద్‌లోని మెరీడియన్ స్కూల్ (మాధాపూర్)లో చదువుతున్న ‘సిద్ధాంత్ చోవిశ్యా’ కైవసం చేసుకున్నారు. విజేతకు రజత పతకంతో పాటు రూ. 10వేలు, సర్టిఫికెట్, డ్యూక్స్ గిప్ట్ హాంపర్ అందజేశారు. తృతీయ బహుమతి: హైదరాబాద్‌లోని గ్లెండల్ క్రియేటివ్ ఆర్ట్స్ అకాడమీ స్కూల్(తెల్లాపూర్)లో చదువుతున్న ‘కర్ణన్ తిరూ’ కైవసం చేసుకున్నారు. విజేతకు కాంస్య పతకంతో పాటు రూ. 5,000లు, సర్టిఫికెట్, డ్యూక్స్ గిఫ్ట్ హాంపర్ అందజేశారు. కేటగిరీ–2: ప్రథమ బహుమతి: హైదరాబాద్‌లోని భారతీయ విద్యాభవన్ పబ్లిక్ స్కూల్(జూబ్లిహిల్స్)లో చదువుతున్న ‘అనిమేశ్ పాణిగ్రాహి’ కైవసం చేసుకున్నారు. విజేతకు బంగారు పతకంతో పాటు రూ. 15వేలు, సర్టిఫికెట్, డ్యూక్స్ గిప్ట్ హాంపర్ అందజేశారు. ద్వితీయ బహుమతి: హైదరాబాద్‌లోని కెన్నడీ హై ద గ్లోబల్ స్కూల్(బాచుపల్లి)లో చదువుతున్న ‘అనుష్ గుడిమెట్ల’ కైవసం చేసుకున్నారు. విజేతకు రజత పతకంతో పాటు రూ. 10వేలు, సర్టిఫికెట్, డ్యూక్స్ గిప్ట్ హాంపర్ అందజేశారు. తృతీయ బహుమతి: హైదరాబాద్‌లోని కెన్నడీ హై ద గ్లోబల్ స్కూల్(బాచుపల్లి)లో చదువుతున్న ‘హిమజ ద్రోణంరాజు’ కైవసం చేసుకున్నారు. విజేతకు కాంస్య పతకంతో పాటు రూ. 5,000లు, సర్టిఫికెట్, డ్యూక్స్ గిఫ్ట్ హాంపర్ అందజేశారు. కేటగిరీ–3: ప్రథమ బహుమతి: హైదరాబాద్‌లోని చిరక్ ఇంటర్నేషనల్ స్కూల్(కొండాపూర్)లో చదువుతున్న ‘అరిట్రో రే’ కైవసం చేసుకున్నారు. విజేతకు బంగారు పతకంతో పాటు రూ. 15వేలు, సర్టిఫికెట్, డ్యూక్స్ గిప్ట్ హాంపర్ అందజేశారు. ద్వితీయ బహుమతి: హైదరాబాద్‌లోని చిరక్ ఇంటర్నేషనల్ స్కూల్(కొండాపూర్)లో చదువుతున్న ‘దిశా సోమేంద్ర’ కైవసం చేసుకున్నారు. విజేతకు రజత పతకంతో పాటు రూ. 10వేలు, సర్టిఫికెట్, డ్యూక్స్ గిప్ట్ హాంపర్ అందజేశారు. తృతీయ బహుమతి: హైదరాబాద్‌లోని కెన్నడీ హై ద గ్లోబల్ స్కూల్(బాచుపల్లి)లో చదువుతున్న ‘ఆధ్యాష ఆచార్య’ కైవసం చేసుకున్నారు. విజేతకు కాంస్య పతకంతో పాటు రూ. 5,000లు, సర్టిఫికెట్, డ్యూక్స్ గిఫ్ట్ హాంపర్ అందజేశారు. కేటగిరీ–4: ప్రథమ బహుమతి: హైదరాబాద్‌లోని గీతాంజలి దేవశాలలో చదువుతున్న ‘మ్రిణల్ కుట్టేరీ’ కైవసం చేసుకున్నారు. విజేతకు బంగారు పతకంతో పాటు రూ. 15వేలు, సర్టిఫికెట్, డ్యూక్స్ గిప్ట్ హాంపర్ అందజేశారు. ద్వితీయ బహుమతి: హైదరాబాద్‌లోని భారతీయ విద్యాభవన్ పబ్లిక్ స్కూల్(జూబ్లిహిల్స్)లో చదువుతున్న ‘వీ. కృష్ణ సాయి గాయత్రి’ కైవసం చేసుకున్నారు. విజేతకు రజత పతకంతో పాటు రూ. 10వేలు, సర్టిఫికెట్, డ్యూక్స్ గిప్ట్ హాంపర్ అందజేశారు. తృతీయ బహుమతి: హైదరాబాద్‌లోని రాక్వెల్ ఇంటర్నేషనల్ స్కూల్(కోకాపేట్)లో చదువుతున్న ‘ స్పర్శ్ లవాటే’ కైవసం చేసుకున్నారు. విజేతకు కాంస్య పతకంతో పాటు రూ. 5,000లు, సర్టిఫికెట్, డ్యూక్స్ గిఫ్ట్ హాంపర్ అందజేశారు. -
తీసుకోవడం అంటే ఇవ్వడమే
దేశాలను వేటికవిగా ఉంచడానికి సరిహద్దులు ఉన్నట్లే, వేటికవిగా ఉన్న దేశాలను కలిపేయడానికి ‘ఇంగ్లిష్’ ఉన్నట్లు అనిపిస్తుంది. ఏ దేశం ఏ భాషలో ఉన్నా, ఇంగ్లిష్‌లో ఆ భాషను అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ ఇంగ్లిష్ భాషా సముద్రంలో ఇంగ్లిష్ భాషను ఎవరు కనిపెట్టారన్న విషయాన్ని మాత్రం శోధించి సాధించలేం! భాష నిరంతరం పుడుతూనే ఉంటుంది కనుక ఇంగ్లిష్‌కే కాదు, ఏ భాషకూ సృష్టికర్త ఉండరు. వాడుకలోకి తెచ్చేవాళ్లు, పలుకుబడిలో ఉంచేవాళ్లు.. వీళ్లు మాత్రమే ఉంటారు. మనుషులు మాట్లాడినన్నాళ్లు భాష ఉంటుంది. వాడుక, పలుకుబడి తగ్గితే వడలిపోతుంది. పదును తగ్గుతుంది. అప్పుడు మన భాషలోని పదాలే, మన భాషలోని భావాలే కొత్తవిగా అనిపించి ఇంగ్లిష్‌లో వాటి అర్థాలను వెతుక్కోడానికి పేజీలు తిప్పుతాం! తెలుగు టు ఇంగ్లిష్. ‘నులక మంచం’ అంటే ఏంటి తాతయ్యా (డాడీకి తెలిసే అవకాశం తక్కువ కనుక) అని అడిగితే తాతయ్య చెప్పగలడు. ఇంగ్లిష్‌లో చెప్పు తాతయ్యా అర్థం కావడం లేదు అంటే it is a cot with a simple wooden frame onto which ropes are woven tightly అంటాడు. నులక మంచానికి ఇంగ్లిష్‌లో అచ్చంగా ఒక పదం లేదు. అది భారతీయ సంస్కృతిలోనిది. ఉర్దూలో నులక మంచాన్ని ‘చార్పాయ్’ అంటారు. సంస్కృతంలో, హిందీలో, పంజాబీలో ఇంకా కొన్ని నాన్–ఇంగ్లిష్ భాషల్లో ‘చార్పాయ్’ అనే అంటారు. ఇంగ్లిష్ భాషలోని గొప్పతనం ఏంటంటే.. అది లాంగ్వేజ్ ఫ్రెండ్లీ లాంగ్వేజ్. అన్ని భాషల్నీ తనవి చేసుకుంటుంది. అంటే కొట్టేయడం కాదు. చోటు ఇవ్వడం. చార్పాయ్ అనేది 1835–45 మధ్య వాడుకలోకి వచ్చిన పదం. కాలక్రమంలో దాన్ని కాలిన్స్ ఇంగ్లిష్ డిక్షనరీ తీసుకుంది. తీసుకోవడం అంటే.. భాషకు, పదానికి గౌరవస్థానం ఇవ్వడం. జీవితం కూడా అంతే. ఉన్నది కొంత, తెచ్చుకున్నది కొంత అయితేనే సంపూర్ణంగా ముందుకు సాగుతుంది. తెలిసిన దానిని తరచి చూసుకోకుండా, తెలియనిదాన్ని తెరిచి చూడకుండా ఉంటే నిర్జీవమైపోతుంది. ఈ విషయాన్నంతా ఇంగ్లిష్‌లో మొదలుపెట్టి, ఇంగ్లిష్‌లో కంప్లీట్ చెయ్యడం దేనికంటే.. ఇవాళ ‘ఇంగ్లిష్ లాంగ్వేజ్ డే’. – మాధవ్ శింగరాజు -
ఇంగ్లిష్ కావాలంటే తెలుగు పోవాల్సిందేనా?
ఇంగ్లిష్ కావాలంటే తెలుగు పోవాల్సిందేనా?పిల్లలకు విద్యాబోధన విషయంలో మాతృభాష ప్రాధా న్యత గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లో మరోసారి చర్చ మొదలైంది. మునిసిపల్ పాఠశాలల్లో విద్యా బోధనను పూర్తిగా ఆంగ్లమాధ్యమంలోకి మార్చాలని ఏపీ మునిసి పల్ శాఖ తీసుకున్న నిర్ణయం వెనుక ఉన్న రాజకీయ కారణాలను పక్కనపెడదాం. బోధనా భాష వరకు మాత్రమే పరిమితమవుదాం. వాణిజ్యానికి కీలకం కాబట్టి ఇంగ్లిష్ ప్రపంచవ్యాప్తంగా అనుసంధాన భాషగా వుంది. అంతమాత్రాన ఇంగ్లిషే సర్వస్వంగా భావించ నక్కర్లేదు. అభివృద్ధిలో అగ్రగాములుగా భావించే జపాన్, చైనా, జర్మనీ లాంటి దేశాలేవీ ఇంగ్లిష్‌ను ఏనాడూ పట్టుకుని వేలాడలేదు. తమ మాతృభాషల ప్రాధాన్యతను పెంచుకుంటూనే, ప్రపంచ వాణిజ్య భాష ఇంగ్లిష్‌ను కూడా బాగా బోధిస్తున్నాయి. ఈరోజు పోటీ మార్కెట్లో నెగ్గుకురావాలంటే ఇంగ్లిష్ పరిజ్ఞానం ఉండడం తప్పనిసరి. కానీ, అది లేక పోతే జీవితమే లేదు అనుకోవడం భ్రమ. ఇంగ్లి్లషైనా, ఇంకో భాషయినా, లేదా ఇంకో సబ్జెక్ట్ అయినా అంతి మంగా అది ఉపయోగపడాల్సింది మన జీవనోపాధికి, మన టార్గెట్ ఆడియన్స్ (కస్టమర్లు)ను చేరడానికే. ఇంగ్లిష్‌లో మాత్రమే చదువుకుని డాక్టర్లయినవారిని ఉదాహరణగా తీసుకుందాం. వీళ్లు చదువుకునే మెడికల్ టెర్మినాలజీ అంతా ఇంగ్లిష్‌లోనే. కానీ ప్రాక్టీస్ చేసేది మాత్రం తెలుగు నేల మీదే. పేషెంట్లకు రోగసమాచారం ఇవ్వాల్సిందీ, సమాధానాలు చెప్పాల్సిందీ తెలుగులోనే. ప్రాథమిక విద్య నుంచి 12వ తరగతి (ఇంటర్మీ డియేట్) దాకా అన్ని అంశాల్నీ సొంత భాషలోనే బోధిం చుకుంటూ, ఇంగ్లిష్‌ను కూడా ఒక ప్రధాన భాషగా బోధించాల్సిన అవసరాన్ని గుర్తించాల్సివుంది. 1990– 95ల మధ్య ప్రపంచ మార్కెట్ విస్తృతి పెరిగింది. ఈ సమయంలోనే ఈ విద్యా కార్పొరేటీకరణ జాఢ్యం మొద లైంది. 300 ఏళ్లపాటు విపరీతమైన ఇంగ్లిష్ ప్రభావంలో వుండి కూడా మన మాతృభాషలు చచ్చిపోలేదంటే దీన్నెలా అర్థం చేసుకుంటారు? నాకున్న అవగాహన మేరకు రెండు పరిష్కారా లున్నాయి. ఇంగ్లిష్‌ను ప్రాధాన్యభాషగా ఎలా గుర్తి స్తామో తెలుగును కూడా అలాగే గుర్తించాలి. ఇందు కోసం–టెర్మినాలజీ గైడ్లను రూపొందించడం, కమ్యూ నికేషన్ పద్ధతుల్ని తప్పనిసరి చేయడం అనే రెండు పద్ధతులు ఎంచుకోవచ్చు. 1. సైన్స్, గణితం సబ్జెక్టుల్లో కఠినమైన, ప్రామాణిక, ప్రాధాన్య పదాలన్నిటికీ ఇంగ్లిష్, తెలుగు భాషల్లో అర్థాలు చెప్పే ప్రాక్టికల్ నోట్స్‌ను పాఠ్యాంశాల్లో భాగం చేయాలి. 2. ఇక రెండో పరిష్కారం–హైస్కూలు స్థాయిలోనే విద్యార్థులకు కమ్యూనికేషన్ నైపుణ్యాలపై నిర్బంధ శిక్షణ ఇప్పిం చడం. ఈ రెండు పద్ధతుల్నీ ప్రభుత్వాలు పాటించగలి గితే.. బోధనాభాషగా ఇంగ్లిష్, తెలుగు అనే ప్రశ్నలకి అడ్డుకట్ట వేసినవారిమవుతాం. అన్నిటినీ మించి, రాబోయే తరాలు వారి బతుకుల్ని వారు అర్థవంతంగా బతకడానికి ఆయువిచ్చినవాళ్లం కూడా అవుతాం. (సురేశ్ వెలుగూరి, రచయిత, ప్రచురణకర్త మొబైల్ : 8125968527) -
ప్రపంచంలో శక్తిమంతమైన భాషలివే
న్యూయార్క్: ప్రపంచంలో నేడు ప్రజలు ఆరువేల భాషలను మాట్లాడుతున్నారు. వారిలో రెండువేల భాషలను మాట్లాడేవారు వెయ్యి మందికన్నా తక్కువున్నారు. నేటి ప్రపంచీకరణ నేపథ్యంలో భాషకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఒకరి నుంచి ఒకరు సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవడానికే పరిమితం కాకుండా సాంస్కృతిక, సామాజిక, ఆర్థిక కార్యకాలాపాల్లో ప్రజలను ప్రత్యక్ష భాగస్వామ్యం చేసేందుకు భాష ఎంతో ఉపయోగపడుతుంది. ప్రపంచంలోని ఆరువేల భాషల్లో ఏ భాషలు శక్తివంతమైనవి? ఒకవేళ గ్రహాంతరవాసులు మన భూగ్రహంపై అడుగుపెడితే వారు ఏ భాష నేర్చుకుంటే వారు మనతో సులభంగా సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోగలరు? ఏ ప్రాతిపదికపైనా శక్తివంతమైన భాషను అంచనావేయాలి? జియాగ్రఫీ, అంటే ఒక చోటు నుంచి మరో చోటుకు ప్రయాణించడం, ఎకానమీ, కమ్యూనికేషన్, నాలెడ్జ్, డిప్లమసీ అన్న కేటగిరీలను పరిగణలోకి తీసుకొని అత్యంత శక్తివంతమైన లేదా ప్రభావిత 20 భాషలను నిపుణులు లెక్కించారు. అందరూ ఊహించినట్లుగా ఇంగ్లీషుకు మొదటిస్థానంరాగా, ఆశ్చర్యంగా మండారిన్ ద్వితీయ భాషగా, హిందీ పదవ భాషగా ఎంపికయింది. మండారిన్ తర్వాతా వరుసగా స్థానాలను ఫ్రెంచ్, స్పానిష్, అరబిక్, రష్యన్, జర్మన్, జపాన్, పోర్చుగీస్ భాషలు ఆక్రమించుకున్నాయి. మొత్తం ప్రపంచంలో ఆర్థికంగా పది శక్తివంతమైన దేశాల్లో నాలుగు దేశాలకు ఇంగ్లీషే అధికార భాష. వాటిల్లో మొత్తం ఎనిమిది దేశాలకు ఇంగ్లీషు భాష బాగా వచ్చు. బ్రిటీష్ పాలన వల్ల ప్రపంచంలో ఎక్కువ దేశాలకు ఇంగ్లీషు భాష విస్తరించగా ఆ తర్వాత ప్రపంచీకరణ వల్ల ఇంగ్లీషుకు ప్రాధాన్యత పెరుగుతూ వచ్చింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో భాషా ప్రాధాన్యతలు మారుతున్నాయి. ఏ భాష నుంచి ఏ భాషలోకైనా అనువదించుకునే వెసలుబాటు రావడమె ఇందుకు కారణం. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని 2050 నాటికి ప్రపంచంలో శక్తివంతమైన భాషలు ఏవవుతాయన్న అంశాన్ని కూడా నిపుణులు అంచనా వేశారు. ఇంగ్లీషు, మండారిన్ ఆక్రమించిన మొదటి రెండు స్థానాల్లో మార్పులు లేకపోయినా మిగతా వాటిల్లో మార్పులు ఉంటాయి. మూడవ స్థానానికి స్పానిష్, తొమ్మిదవ స్థానానికి హిందీ చేరుకునే అవకాశం ఉంది. -
ఇంగ్లిష్‌కు బానిసలమైనందుకు సిగ్గుపడాలి
న్యూఢిల్లీ : దేశానికి స్వాతంత్య్రం వచ్చి 68 ఏళ్లు దాటినా మనం ఇంగ్లిష్ భాష బానిసత్వంలోనే ఉన్నామనీ, ఇది సిగ్గుపడాల్సిన విషయమని కేంద్ర జలవనరుల మంత్రి ఉమా భారతి అన్నారు. పరిపాలన వ్యవహారాల్లో దేశభాష హిందీని వాడాలని అధికారులను కోరారు. సొంత భాషను తక్కువ చేసుకునే జాతికి ఆత్మగౌరవం ఉండదని బుధవారమిక్కడ ఓ కార్యక్రమంలో అన్నారు. -
అంపైర్లకు బీసీసీఐ పాఠాలు!
ముంబై:భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) సరికొత్త బాధ్యతకు శ్రీకారం చుట్టింది. క్రికెట్ మ్యాచ్ ఫలితాల్లో కీలక పాత్ర పోషించే అంపైర్ల కమ్యూనికేషన్ స్కిల్స్ ను మెరుగుపరిచేందుకు సిద్దమైంది. దీనిలో భాగంగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ), బ్రిటీష్ కౌన్సిల్ సంయుక్తంగా రూపొందించిన కోర్సులను బ్యాచ్‌లు వారీగా బీసీసీఐ నిర్వహించనుంది. ఈ మేరకు తొలి బ్యాచ్ కు ఈ నెల 12 నుంచి 16 వరకూ ముంబైలో శిక్షణ ఇవ్వనుండగా, జూలై 16 నుంచి 23వ తేదీ వరకూ రెండో బ్యాచ్ కు శిక్షణ ఇవ్వనుంది. జట్టు కెప్టెన్లతోపాటు క్రికెటర్లతో ఫీల్డ్ అంపైర్లు ఎలా సంభాషించాలనేది ఈ కోర్సు ప్రధాన ఉద్దేశం. దాంతోపాటు థర్డ్ అంపైర్ తో ఫీల్డ్ అంపైర్లు ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు ఎటువంటి వ్యాకరణ తప్పులు లేకుండా ఉచ్ఛరించేందుకు ఈ కోర్సు ఉపయోగపడుతుందని బీసీసీఐ తెలిపింది. ఈ మేరకు అంపైర్ల ఇంగ్లిష్ పాఠాల వివరాలను బీసీసీఐ తన వెబ్ సైట్లో ఉంచింది. -
తెలుగునే లాగేస్తే మిగిలేదేంటి?
ఇప్పుడు పట్నాలలో, పల్లెల్లో చదివే అట్టడుగువారికి ఒకే ఒక సౌకర్యముంది. అది వారు సులభంగా అర్థం చేసుకోగలిగే తెలుగు భాషలో విద్య లభించే సౌకర్యం. ఆ కాస్త తెలుగును కూడా లాగేస్తే వారి భవిష్యత్తు ఏంటి? తెలుగు భాష కొన్ని శతాబ్దాలుగా తెలంగాణాలో అందరూ విరివిగా మాట్లాడుతున్న, సగటు పౌరులు అనేకానేక అవ సరాలకు ఉపయోగి స్తున్న ప్రజా భాష, అది బోధనా మాధ్యమంగా గత అరవై ఏళ్లకు పైగా నిలదొక్కుకున్న భాష. మరి అలాంటి భాషను అకస్మాత్తుగా ఇంగ్లిష్ భాషతో భర్తీ చేస్తే అది ఎన్ని సామాజిక సంక్షోభాలకు దారి తీస్తుందో మన ప్రభుత్వం సావధానంగా ఆలోచిస్తు న్నట్లు లేదు. అది మన సమాజంలోని అనేకానేక రంగాలను ఎలా దెబ్బతీస్తుందో, వాటిలో పనిచేసే వారి గతి, వాటిలో పెట్టుబడులు పెట్టిన వారి గతి ఏమి కాబోతోందో ప్రభుత్వమే కాదు, సమాజం కూడా ఆలోచిస్తున్నట్లు లేదు. ఈ భాషా సమస్య ఏ కొందరి సమస్యో కాదు, ఇది ఒక పదేళ్ళలో అందరినీ ముంచే, అందరినీ ముసురుకునే సునామీ లాంటి సమస్య. అనేకా నేకులను అనేకానేక నష్టాలకు కష్టాలకు గురిచేసే సమస్య. అలాంటిదాన్ని అలా నిర్లక్ష్యం చేస్తే ఎలా? ఇపుడు చిన్నాచితకా బడుల్లో, పట్నాలలో, పల్లెల్లో చదివే అట్టడుగువారికి ఒకే ఒక సౌకర్య ముంది. అది వారు సులభంగా, సునాయాసంగా అర్థం చేసుకోగలిగే తెలుగు భాషలో విద్య లభించే సౌకర్యం, తక్కినవన్నీ లోటులూ, లొసుగులే. పాపం.. పసివారికి ఉండే ఒకే ఒక సౌకర్యం ఒక్క తెలుగు మీడియం మాత్రమే. అది కాస్తా లాగేస్తే మిగిలేదేముంది ఆ బడుల్లో? మన విద్యాలయాల ఉద్ధరణను మనం అలాంటి బడుల వసతి సౌకర్యాల ఉద్ధరణతో మొదలెట్టాలి కాని తెలుగు మాధ్యమాన్ని తీసివేసి ఇంగ్లిష్ మాధ్యమాన్ని ప్రవేశపెట్టడం ద్వారా కాదు. దాని వలన జరిగేదీ లేదు, ఒరిగేదీ లేదు. పెపైచ్చు వారి విద్య ఇప్పటికన్నా అధ్వానమవుతుంది. అసలు అంత మంది అధ్యాపకులేరీ? ఇంగ్లిష్‌లో అన్ని సబ్జెక్ట్‌లు చెప్పగలిగేవారు ఏరీ?. వచ్చీరాని ఇంగ్లిష్‌లో వచ్చీ రాని వారు వచ్చీరాని విధంగా విద్య బోధిస్తే విద్యార్థులు ఇంటా బయటా దేనికి పనికొస్తారు? వారి పట్టాలు దేనికి పనికొస్తాయి? వారు న్యూనతా భావనకు లోనై ఇప్పటిలాగే భవి ష్యత్తులోనూ ఆత్మహత్యలకు పాల్పడరా? అసలు మీడియం ముఖ్యమా? వనరులు, వసతులు, సౌకర్యాలు, ఉపాధ్యాయులు, సాంకేతిక పరికరాలు, క్రమశిక్షణ, సరైన విద్యా వాతావరణం, కార్యక్రమాలు ముఖ్యమా? విద్యాలయాలు అన్ని విధాలా బాగుంటే విద్యలు బాగుంటాయి, అవి బాగుండకపోతే ఇవి బాగుండవు. ఇతర ముఖ్యాం శాలను సమకూర్చకుండా, ఒక్క మాధ్యమం మాత్రమే ఏ అద్భుతాలనూ సాధించజాలదు. వాటిని గుర్తించి బాగుపరచడానికి ఇప్పటి పరిస్థి తుల్లో కనీసం రెండుమూడు దశాబ్దాలైనా పట్టొచ్చు. అందువలన మీడియంను గభాలున మార్చకుండా కొన్నాళ్ళు తెలుగు మీడియంను కొన సాగిస్తూ ఈలోగా వాటిని మెరుగు పరచుకుంటూ, మెల్లమెల్లగా అడుగులు వేయడం అవసరం. తెలుగు మీడియం విద్యాలయాలు తెలుగు మీడియం వలన వెనకబడలేదు వాటికి ప్రభుత్వ చేయూత సరియైనంత లభించనందునే వెనకబడి పోయాయి. కనుక మొదట ఆ విద్యాలయాల వసతి సౌకర్యాలు, వనరులు మెరుగుపరచండి. గవర్న మెంట్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్‌కు ఈ మాత్రం తీసిపోవని నిరూపించండి. తొందరపడి మూకుమ్మడి కన్వర్షన్‌కు నిర్ణయాలు తీసుకొని విద్యార్థుల భవిష్యత్తులను పాడుచేని అయ్యో ఇంత మంది భవిష్యత్తులు పాడుచేశామేమిటని ఆ తదుపరి నాలుక కరచుకోకండి. కనీసం అత్యధికులైన బీదవారికి, పల్లెటూరి వారికి, వెనకబడినవారికి చెందిన గవర్నమెంట్ స్కూళ్ళలో ఇంతవరకే ఉన్న విద్యా విధానాన్ని కొన్నాళ్ళు అలాగే ఉంచి వాటిలో బోధనా అధ్య యన పరిస్థితులను మెరుగుపరచి అటు తదుపరి ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడం మంచిదని గ్రహించండి. ఇంతవరకే పాడయిన వారిని ఇంగ్లిష్ మీడియం ద్వారా మరింత పాడు చేయకండి. సదరు సమాజం, స్థానిక ప్రజలు కూడా మొదట వసతులు మెరుగుపర్చడానికి పట్టుబట్టాలి కాని ఇంగ్లిష్ మీడియం కోసం కాదు. వసతులు, వనరులు లేని ఇంగ్లిష్ మీడియం వారి పిల్లలకు ఇప్పటికన్నా ఎక్కువ హాని కలిగిస్తుందని, అలాంటి దాని వలన వారి పిల్లలు పట్నాలలోని మంచి వసతులు గల బడుల్లో చదివే వారితో పోటీపడ లేరని గ్రహించాలి. అలాంటి వనరులు, వసతులే కల్పిస్తే తెలుగు మీడియం స్కూళ్లూ అంతకన్నా బాగుం టాయని తెలుసుకోవాలి. ప్రభుత్వం ఉన్న వాటిని ఉద్ధరించడానికి ఒత్తిడి ఎక్కువ తేవాలి కాని కేవలం ఇంగ్లిష్ మీడియం కోసం కాదు. తెలుగు మీడియం ఒకవిధంగా విద్యారం గంలో వెనకబడిన వారికి ఫార్వర్డ్ క్లాస్ వారితో పోటీ పడడానికి ఒక సబ్సిడీ లాంటిది, రిజర్వేషన్ లాంటిది. దానిని పోగొట్టుకోకండి. ఇంగ్లిష్ మీడి యంలో చేరగానే, చేర్పించినంత మాత్రాన్నే విద్యార్థి ఐ.ఐ.టి.కి పోతాడని, అమెరికాకు పోతా డనీ అనుకోకండి. అలా నెగ్గే వారి సంఖ్య ఆ మీడి యంలో చేరేవారి సంఖ్యలో ఎంతభాగమో తెలుసు కోండి. తక్కినవారు నెగ్గకపోవడానికి ప్రధానమైన కారణం ఇంగ్లిష్ భాష బరువేనని నెగ్గినవారినడి గితే మీకే తెలుస్తుంది. వారినడిగి తెలుసుకోండి. ఇపుడు సులభమైన తెలుగు మీడియం ఉండగానే అనేకానేక గవర్నమెంటు స్కూళ్ళలో పరీక్షా ఫలితాలు దారుణంగా ఉన్నాయి. ఇక ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టాక దాని భారం వలన అవి మరింత దారుణంగా తయారవుతాయని అటు ప్రభుత్వమూ, ఇటు తల్లిదండ్రులూ, వారి పిల్లలు, సమాజం కాస్త నెమ్మదిగా ఆలోచిస్తే తెలు స్తుంది. ఏళ్ళ తరబడి ఇంగ్లిష్ మీడియంలో చది వినా కూడా నూటికి 90 శాతం విద్యార్థులు ఇంగ్లిష్‌లో బాగా మాట్లాడలేకపోవడం, రాయ లేకపోవడం ఆ భాషాభారం వలననే అని తెలుసుకోండి. వ్యాసకర్త వ్యవస్థాపక కన్వీనర్, తెలంగాణ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ ఫోరమ్ మొబైల్: 98481 95959 - డాక్టర్ వెల్చాల కొండలరావు -
ఒక గానమూ - కొన్ని పలవరింతలు
రాయలసీమా! నువ్వు శాప దత్త భూమివి. ఆంగ్లేయులముందు నిజాం విసిరిన పాచికవి. భాష ఒక మిష. సోదరత్వం ఒక సాకు. భాషోద్యమం ఒక కుట్ర. ఏ చారిత్రక మలుపులో ఎవరితో ఎటువంటి రచనలు రాయించుకోవాలో సమాజానికి తెలుసు. తెలంగాణ విడిపోయింది. సమైక్యాంధ్ర బద్దలైంది. నవ్యాంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ అస్తిత్వం ప్రశ్నార్థకమైంది. రాయలసీమ కరువూ, భాషా, సంస్కృతి, చరిత్రా వెరసి స్థానిక ప్రత్యేకత ఒక చర్చనీయ సందర్భమైంది. ఈ సామాజిక సందర్భమే హంద్రీగానానికి గొంతు సవరించుకుంది. రాయలసీమ నేలగీతం క్రిష్ణానది. రాయలసీమకు చెందిన ముఖ్యమంత్రులు కోస్తాకు వనరులై ఉపయోగపడుతుంటే, మా క్రిష్ణానది ఒక పరాధీనగీతమే! రాయలసీమ ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో కేంద్ర ప్రణాళికాసంఘం ఆమోదంకూడా పొందిన క్రిష్ణా పెన్నార్ ప్రాజెక్టు ఏమైంది? ఆ ప్రాజెక్టునుంచి రాయలసీమకు రావాల్సిన 400 టీఎంసీలు ఎక్కడకు పోయినాయి. మనది ఒకే భాష ఒకే జాతి అనే నెపం మీద రాయలసీమను ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోంచి బైటికి తీసుకువచ్చి మోసం చేసిందెవరు? క్రిష్ణా పెన్నార్‌ను నాగార్జునసాగర్ అనే బానపొట్టగా మార్చి హైజాక్ చేసిందెవరు? వాడే! బ్రిటన్ హయాంలోనే నీటి రుచి మరిగినవాడు! రాయలసీమ నీళ్ళకోసం భాషను కూడా పాచికగా విసరగలిగిన వాడు! వాడే!! రాయలసీమా! నువ్వు శాప దత్త భూమివి. ఆంగ్లేయులముందు నిజాం విసిరిన పాచికవి. లాభంలేనివాన్ని చివరకు నెట్టే కుట్రను దొరలపాలనే కనిపెట్టింది. రెళైై్ల, నీళ్లై కోస్తాకు ఆధునిక వికాసమైన ఆంగ్లపాలన నీ దేహం మీద కరువుల పర్వమే రచించింది. భాష ఒక మిష. సోదరత్వం ఒక సాకు. భాషోద్యమం ఒక కుట్ర. సర్కారు సోదరులమీద సీమ హృదయప్రేమ అనుమానపు తెరలుగా ఊగింది. చరిత్రలో పెద్దన్న బుద్ధి ద్రోహ ఉదాహరణలుగానే నమోదయ్యింది. సియామిస్ కవలల కల అట్లా భగ్నమైంది. అలిగిన కోటి రతనాల వీణ తీగలు తెంచుకు వెళ్ళిపోయింది. కానీ, ఆ పొరపాటు అతుకు కోసం నువ్వు కోల్పోయిన బళ్ళారి మాటేమిటి? భద్ర నీటి హక్కు మాటేమిటి? కొండారెడ్డి ఋరుజు ముందు చెదరిన గుడారాలు చార్మినార్ ఎదుట రాజధానిగా మారిన మాటేమిటి? ఆంధ్రా బూర్జువాలకేం? తమ పెట్టుబడి గుడ్లను పొదుగుతూనే ఉంటారు, ఎక్కడైనా ఎప్పుడైనా! కోస్తాకు స్తన్యమిచ్చిన నా రాయలసీమ తల్లీ! శ్రీబాగ్ ఒడంబడికను సమాధి చేసిన నా సోదరుల నేర చరిత్ర మాటేమిటి? వారు మాట్లాడినదే భాషంట! వారు జీవించినదే నాగరికతంట! అట్లయితే, మైసూరు నుండీ శ్రీలంక దాకా మాది దుఃఖ తెనుగు స్వగతమేకదా! కానీ, ప్రతి అస్తిత్వ హననమూ చివరికి పునరుజ్జీవనాన్నే వాగ్దానం చేస్తుంది కదా! అదిగో ఫినిక్స్ గానం! రాయలసీమా! నీ కావ్యజగత్తును ఏమని వర్ణించను? పెద్దనకు హిమవన్నగమై, తిమ్మనకు దివ్యలోక పారిజాతమై, ధూర్జటికి భక్తి నేర్పిన మూగప్రాణాలై, సూరనకు కళాపూర్ణో దయ వైభవమై... అంతేనా? ఈస్తటిక్సును కాస్సేపు పక్కకు పెట్టు. అన్నమయ్యకు మాత్రమే జీర్ణమైన నీ తెనుగు పదం మాటేమిటి? వేమన పలికిన సమాజ నిష్టూరాల్నీ, వీరబ్రహ్మం తెచ్చిన అపండిత భాషా విప్లవాన్నీ, సూఫీ గురువుల సామరస్య మార్గాన్నీ సాంస్కృతిక జిగిబిగిగా అల్లుకున్నది నువ్వేకదా రాయలసీమా! జనసమూహాల ఆశలపై జీమూతంలా వాలే రాజకీయ పాలేగాళ్ళకు నీ చరిత్రా, సంస్కృతి ఏం అక్కరకు వస్తాయిలే! అధికారపు నిచ్చెన మెట్లకు ఒక్కొక్క సహోదరుణ్ణీ బలి ఇచ్చేవాళ్ళేకదా నేటి రాయలసీమ రాజకీయ విభులు! రాయలసీమా! నీవు జలదాహాల దేహార్తివి. కరువు మాత్రమే పండే పంటపొలానివి. చరిత్ర చిల్లర దేవుళ్ళకు చించి చుట్టబెట్టిన వస్త్రానివి. నీ బాధ్యతల్ని భుజానికెత్తుకునే దాహపు వీలునామా ఎక్కడ? ఇదంతా చూస్తూ కూడా నీ లేపాక్షి బసవడో, యాగంటి బసవడో తోక తొక్కిన త్రాచుపామై ఎందుకు లేవడు? నువ్వెవరని ఎవరైనా ఎందుకంటారు రాయలసీమా! బతుకుతెరువు కోసం యుద్ధమైనావు. చరిత్ర నేర్పిన గుణపాఠాల జ్ఞాపకమైనావు. అనాదిక్రోధపు సంకేతమైన దేవరగుట్ట కర్రల సమర శబ్దానివయినావు. రాగిముద్దా ఊరుమింటిని సద్ది కట్టుకో రాయలసీమా! రాజధానిని చూడవద్దువు గానీ. గుట్టల మీదా కొండల కిందా వెలసిన అవధూతల దర్గాతాతల ఆశీర్వాదాలు తీసుకోవడం మరిచిపొయేవు సుమా. అదిగో నీ దారి. ఊరి బొడ్రాయి గడ్డన వెలసిన మారెమ్మ గుడి సందులనుంచీ, బీరప్ప పరసల జాతర్లనుంచీ రా! సూఫీ దర్గాలనుంచీ, ఆదోని మాదిగ లక్ష్మమ్మ కరుణా ప్రసాదంతో రా! దుఃఖాన్ని పండించే పంటపొలాలనుంచీ, పెన్నా క్రిష్ణలు కలిసే కలను ఛిద్రం చేసిన ఆ తీరప్రాంతానికి రా! మూన్నాళ్ళ ముచ్చటైన రాజధానిని చూసి నా ఎద మీద ప్రశ్నగా మొలుచుకొస్తావేమో! చిట్లిపోయిన కన్నీటి చుక్కల మట్టి కేకనవుతాను. ఉరి పేనిన బతుకుపంటనవుతాను. కోడెగిత్తలు కాడి తప్పిపోతుంటే, నదీ మూలాలు నడకలు మరిచిపోతుంటే, నెర్రెలు చీలిన పగుళ్ళలోంచి ఆత్మశ్వాసనవుతాను. కానీ, రాయలసీమ ఫీనిక్స్ గానంలో ఉన్నానున్నానేనున్నాను కవీ! అనంతపురం గూగూడుకుళ్ళాయి స్వామి సూఫీతత్వపు మంత్ర కణికనై, చిత్తూరు గంగ జాతరలో అనాది చిందునై, కడప అమీర్ పీరా దర్గాలో సామరస్య ప్రార్థననై, ఒంగోలు గిత్త చర్మపు డప్పు జనక జనక జజ్జనకనై, గుండ్లకమ్మ నుండీ పెన్న దాకా, కొండారెడ్డి బురుజు నుంచీ హోసూరు దాకా ఉన్నానున్నానేనున్నాను రాయలసీమ కవీ! రాయలసీమ భూమిపుత్రులను మేల్కొలిపే శబ్దశరంకదా నీ హంద్రీగానం! ఉపసంహారం: వెంకటక్రిష్ణ హంద్రీగానంలో కాలం పేజీలు వెనక్కితిప్పి చరిత్రను తడిమే స్పర్శ జ్ఞానముంది. సాంస్కృతిక పునరుజ్జీవన భవిష్యద్దర్శనముంది. ఐతిహాసిక చిత్రణ ఉంది. జీసస్ వెప్ట్ అన్నట్లు రాయలసీమ కోసం ఇతనిది ప్రవక్త దుఃఖం. ఇతనిలో దున్నేకొద్దీ దుఃఖముంది. మండే కొద్దీ ధర్మాగ్రహముంది. చరిత్ర వైపు వేలెత్తి చూపే సాహసముంది. ఇతడు రాయలసీమ జనహృదయ గానాన్ని సాధన చేసినవాడు. ఈ కవికి అభినందనలు. ఇతని కవిత్వానికి జేజేలు. - బండి నారాయణస్వామి 8886540990 -
వెబ్సైట్లో ఇంగ్లిషు పాఠాలు
మనోహర్ మరో ప్రయత్నం ఉచితంగా డౌన్లోడ్ చేసుకునే సదుపాయం సీతంపేట : తనకున్న ఆంగ్ల భాషా ప్రావీణ్యాన్ని పదిమందికీ ఉచితంగా అందించాలన్న లక్ష్యంతో 24 సంవత్సరాలుగా స్పోకెన్ ఇంగ్లిష్ పాఠాలు చెబుతున్న మనోహర్ ఇప్పుడు వెబ్సైట్ ద్వారా సేవలందిస్తున్నారు. ఆయన మధురానగర్ జీవీఎంసీ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తూ ఇప్పటివరకు సుమారు 23 వేల మందికి శిక్షణ ఇచ్చి వారిని ఉన్నత పదవుల్లో చేర్చిన ఘనత దక్కించుకున్నారు. కేవలం 30 రోజులలో అవలీలగా ఇంగ్లిష్‌లో మాట్లాడేలా తీర్చిదిద్దే నైపుణ్యం మనోహర్ మాస్టారి సొత్తు. తను రూపొందించిన స్పోకెన్ ఇంగ్లిష్ కోర్సును సులభ మార్గాన్ని మరింతమందికి చేరువ చేసేందుకు manoharspokenenglish.com పేరిట వెబ్ సైట్‌ను ప్రత్యేకంగా రూపొందించి అందుబాటులోకి తెచ్చారు. వీడియో గాలరీలో రెండు గంటల నిడివి గ ల వీడియో పాఠాలను వెబ్సైట్లో పొందుపర్చారు. ఎవరైనా ఉచితంగా వెబ్ సైట్ద్వారా స్పోకెన్ ఇంగ్లిష్ నేర్చుకునే వీలు కల్పించారు మనోహర్ మాస్టారు. అంతేకాదు ఉచితంగా డౌన్ లోడ్చేసుకునే సదుపాయం కూడా ఉంది. వెబ్ సైట్లో ఏముంది... ఇంగ్లిష్ సులభంగా మాట్లాడేందుకు అవసరమైన 300 సింపుల్ వెర్బ్స్, నాలుగు చాప్టర్ల గ్రామర్‌ను పొందుపర్చారు. గ్రామర్‌లో స్రక్చర్స్, సింపుల్ ప్రెజెంటెన్స్, ప్రెజెంట్ కంటిన్యువస్, సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్ అనే నాలుగు టెన్స్‌లు, వాటిని 300 వెర్బ్స్తో ఎలా ఉపయోగించి ఇంగ్లిష్ నేర్చుకోవచ్చునో వీడియోలో వివరించారు. నిత్యజీవితంలో ఉపయోగించే సంభాషణలతో వీడియోను పొందుపరిచారు. మరింత చేరువ కావాలని... ప్రపంచం మాట్లాడే భాష ఇంగ్లిష్. ఇంగ్లిష్ అంటే చాలా మందికి భయం. మాట్లాడటం రాక ఉద్యోగాాలను చేజార్చుకున్న వారు ఎంతో మంది ఉన్నారు. నేటి సమాజంలో విద్య, వ్యాపారం,ఉద్యోగంలో రాణించాలంటే ఇంగ్లిష్‌లో మాట్లాడటం తప్పనిసరైపోయింది. ఎంఎన్సీ కంపెనీలలో కొలువు కావాలన్నా, ఆఖరికి ఇంటిలో పిల్లలకు చదువుచెప్పాలన్నా గృహిణులకు ఆంగ్లంలో మాట్లాడటం అవసరమైంది. ఇలాంటి వారిలో భయాన్ని పోగొట్టి కేవలం 30 రోజులలో ఇంగ్లిష్‌లో మాట్లాడేలా పుస్తకాన్ని, డీవీడీ రూపొందించాను. 1991 నుంచి ఉచితంగా శిక్షణ ఇస్తున్నాను. ఈ సులభమైన పద్ధతి మరింతమందికి చేరువ కావడానికి సంఘమిత్ర సర్వీసెస్ ద్వారా మనోహర్ స్పోకెన్ ఇంగ్లిష్ డాట్ కామ్ వెబ్ సైట్‌ను అందుబాటులోకి తెచ్చాను. - దామోదల మనోహర్, జీవీఎంసీ ఉపాధ్యాయుడు, సీతంపేట -
సేవాయువకులు
నవతరం దేశవ్యాప్తంగా ఆరు నగరాల్లో విస్తరించిన సేవాసంస్థ... గ్రీన్‌నెస్ట్. ‘బుక్వింగ్స్’, ‘గో గ్రీన్’ అనేవి ఈ సంస్థ విభాగాలు. అనాథాశ్రమాల్లోని విద్యార్థులకు ఇంగ్లిష్ భాషను బోధించడం బుక్వింగ్స్ బృందం లక్ష్యం కాగా, ప్రజల్లో పర్యావరణ స్పృహను పెంపొందించడం గ్రో గ్రీన్ ఉద్దేశం. బీదాల జీవన్‌రెడ్డి ప్రాథమిక దశలో ఇంగ్లిష్‌లో చదువుకోవడానికి అవకాశం లేని వాళ్లు ఎంతోమంది. అలాంటి వారికి, తనకు చేతనైనంత మేరకు ఇంగ్లిష్ బోధనను అందించాలని పృథ్వితేజ్ తాళ్లూరి అనే యువకుడు భావించాడు. అలా పృథ్వికి తోడైన వాళ్లు... జయదీప్‌రెడ్డి, జాయ్, రాఘవేంద్ర, శ్రీవాణి, లహరి, గుణశేఖర్, మౌనిక, కార్తీక్, నిఖిల్, అమోల్, మహిమా భరద్వాజ్ తదితరులు. వీళ్లందరి ఆధ్వర్యంలోనే ‘గ్రీన్‌నెస్ట్’ సంస్థ నడుస్తోంది. ఇంగ్లిష్ చదవడం, మాట్లాడ్డం తెలియకపోవడం వల్ల, దాన్ని బోధించే వాళ్లు లేకపోవడం వల్ల చాలా మంది అనాథలు, మురికివాడల్లోని పిల్లలకు ప్రపంచం సరిగా పరిచయం కావడం లేదని జయదీప్ అంటాడు. ఆ లోటును భర్తీ చేయడానికి తమకు చేతనైనంతలో ప్రణాళిక బద్ధంగా పని చేస్తున్నారు. హైదరాబాద్‌లోని కొన్ని అనాథశ్రమాలను ఎంచుకుని, అక్కడికి తమ వలంటీర్లను పంపుతోంది బుక్ వింగ్స్. వాళ్లు వెళ్లి, సిలబస్ ప్రకారం అక్కడి పిల్లలు ఇంగ్లిష్‌ను అభ్యసించేలా చూస్తున్నారు. గ్రీన్‌నెస్ట్ నేతృత్వంలో ప్రస్తుతం 120 మంది వరకూ వలంటీర్లు పనిచేస్తున్నారు. వారిలో సగం మంది బుక్ వింగ్స్ ఆధ్వర్యంలో ఇంగ్లిష్ బోధనకు, మిగతా సగం గో గ్రీన్ ఆధ్వర్యంలో పర్యావరణ స్పృహను పెంపొందించేందుకు కృషి చేస్తున్నారు. గోగ్రీన్ వలంటీర్లు నగరంలో జనసమ్మర్ధం ఉన్న ప్రాంతాల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు. పారిశుధ్య పనులను చేపడుతుంటారు. ప్రస్తుతం అనేక మంది స్వచ్ఛభారత్‌లో ఉత్సాహంగా పాల్గొంటున్నారని చెబుతూ,ఇలాంటి కార్యక్రమాన్ని ప్రతి ఆదివారం నగరంలోని ఏదో ఒక మూల తమ సభ్యులు నిర్వహిస్తుంటారని గ్రీన్‌నెస్ట్ వ్యవస్థాపక సభ్యులయిన జాయ్, రాఘవేంద్రలు వివరించారు. అలాగే ప్లాస్టిక్ వినియోగ వ్యతిరేక ఉద్యమాన్ని నిర్వహిస్తున్నామని, ప్రత్యేక శ్రద్ధతో ప్లాస్టిక్‌ను రీసైకిల్ చేయిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, పుణె, ఢిల్లీ, ముంబాయి నగరాల్లో జరుగుతున్న తమ సేవాకార్యక్రమాలను మున్ముందు మరిన్ని నగరాలకు విస్తరించే ఉద్దేశం ఉందని చెప్పారు. విద్యార్థులే వలంటీర్లు హైదరాబాద్‌నే తీసుకొంటే.. ఇక్కడ ఎక్కువ మంది వలంటీర్లు ఇంజనీరింగ్ కాలేజీల్లో చదువుకుంటున్నవాళ్లే. ప్రతి ఆదివారం వీరంతా గ్రీన్‌నెస్ట్ ద్వారా సేవలను అందించడానికి కొన్ని గంటల సమయాన్ని కేటాయిస్తున్నారు. ఎవరె వరు ఎక్కడ ఏయే కార్యక్రమాలను చేపట్టాలనే సమాచారం వీరికి గ్రీన్‌నెస్ట్ గ్రూప్ నుంచి అందుతుంది. ఫేస్బుక్, వాట్సప్‌లు ఇందుకు బాగా ఉపయోగపడుతున్నాయి. తమ కార్యక్రమాలు నచ్చి అనేకమంది తమతో కలిసి పనిచేసేందుకు ఉత్సాహం చూపుతున్నారని,అయితే వారిని ఎంపిక చేసుకునే విషయంలో కొన్ని విధివిధానాలు పాటిస్తున్నామని గ్రీన్‌నెస్ట్ సభ్యులు తెలిపారు. సమాజ సేవ విషయంలో వారి దృక్పథాలను దగ్గరగా పరిశీలించాక మాత్రమే చేర్చుకోవడం జరుగుతుందని చెప్పారు. ఇటీవలే డిసెంబర్ 21న ఈ సంస్థ కొత్తగా వలంటీర్లను చేర్చుకోవడంపై ప్రత్యేక సమాలోచనను నిర్వహించింది. అప్పటికే వారి దగ్గర 1200 పైగా దరఖాస్తులు సిద్ధంగా ఉన్నాయి. విద్యార్థి దశలోనే ఇలాంటి కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొనడం వల్ల నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని కోర్ గ్రూప్ సభ్యులు అభిప్రాయపడ్డారు. డ్రైవర్ అవుతానన్నాడు! మురికివాడలలోకి వెళ్లినప్పుడు అక్కడ పిల్లలతో మాట్లాడితే చాలా ఆశ్చర్యం కలుగుతుంటుంది. అలా ఒక పిల్లాడితో మాట్లాడుతూ పెద్దయ్యాక నువ్వు ఏమవుతావు? అని అడిగితే డ్రైవర్ అవుతానన్నాడు. ఎందుకలా అంటే, నాకు ఇంగ్లిష్ రాదు, అంతకు మించి ఏం కాగలను? అని ఆ పిల్లాడు ప్రశ్నించాడు! రెండేళ్లుగా అలాంటి పిల్లలకు ఇంగ్లిష్ బోధిస్తున్నాం. ఇప్పుడు వారి ఆలోచనల్లో చాలా మార్పు వచ్చింది. - రాఘవేంద్ర, గ్రీన్‌నెస్ట్ సభ్యుడు చొరవలేక ఆగిపోతున్నారు! మనలో చాలామందికి సామాజిక సేవ మీద ఆసక్తి ఉంది. అయితే వీధి చివర్లో ఉన్న చెత్తను తొలగించడానికి, అశుభ్రతతో ఉన్న పరిసరాలను పరిశుభ్రం చేయడానికి చొరవ చూపలేకపోతున్నామని మాతో కొంతమంది స్పష్టంగా చెప్పారు. ఎలాంటి బిడియం, సంశయం లేకుండా పరిసరాలను శుభ్రం చేస్తున్న మమ్మల్ని వారు అభినందిస్తున్నారు. మెల్లిగా మా వైపు వస్తున్నారు. - జయదీప్‌రెడ్డి, గ్రీన్‌నెస్ట్ అధ్యక్షుడు