High Court of Hyderabad
-
ఆ ఫోన్ ఎక్కడ.. విదేశీ మద్యం ఎక్కడ నుంచి తెచ్చారు?
శంకర్పల్లి: విజయ్ మద్దూరిపై పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించినట్టు తెలిసింది. కొకైన్ ఎక్కడ తీసుకున్నావ్? ఫోన్ ఎక్కడ దాచావ్? విదేశీ మద్యం ఎక్కడ నుంచి తెచ్చారు? పార్టీలో ఎవరెవరు డ్రగ్స్ తీసుకున్నారు అంటూ ప్రశ్నించనట్టు సమాచారం. మాజీ మంత్రి కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల కేసులో డ్రగ్ టెస్ట్‌లో పాజిటివ్ వచ్చిన విజయ్ మద్దూరి హైకోర్టు ఆదేశాల మేరకు బుధవారం మోకిల పోలీస్‌స్టేషన్‌లో తన న్యాయవాది అవినాష్‌తో కలిసి విచారణకు హాజరయ్యాడు. ఈ సందర్భంగా నార్సింగి ఏసీపీ రమణగౌడ్ సమక్షంలో మోకిల సీఐ వీరబాబు విచారణ చేపట్టారు. రెండుసార్లు నోటీసులు ఇచ్చిన తర్వాత విజయ్ పోలీస్‌స్టేషన్‌కు రావడంతో పోలీసులు ఆయన్ను పలుకోణాల్లో ప్రశ్నించినట్టు తెలిసింది. తాను అక్టోబర్ 10 నుంచి 14 వరకు నెదర్లాండ్స్‌లో రోజూ కొకైన్ తీసుకున్నానని..రాజ్ పాకాల ఇంట్లో పార్టీలో తీసుకోలేదని సమాధానం ఇచ్చారు. పార్టీ సమయంలో తన ఫోన్లో చార్జింగ్ లేక అక్కడే చార్జింగ్ పెట్టానన్నాడు. ఎవరైనా తీసుకున్నట్టు తెలిస్తే అప్పగిస్తానని పోలీసులకు చెప్పాడు. సుమారు మూడు గంటల పాటు విచారించిన పోలీసులు, మళ్లీ అవసరమైతే పిలుస్తామని పంపించారు. ఇంటికి వెళ్లే సమయంలో విజయ్ మద్దూరితో మీడియా ప్రతినిధులు మాట్లాడే ప్రయత్నం చేయగా, ఆయన నిరాకరించారు. -
హైకోర్టు ఆదేశాలా.. అయితే మాకేంటి!
సాక్షి, హైదరాబాద్: హైకోర్టు ఆదేశాలన్నా కొందరు అధికారులు లెక్కలేనట్లు వ్యవహరిస్తున్నారు. తాము ఆదేశాలిచ్చే వరకు ఫలితాలు ప్రకటించవద్దని చెప్పినా బేఖాతర్ చేశారు. ఫలితాలు వెల్లడించడమే కాదు ఏకంగా పోస్టింగ్‌లు కూడా ఇచ్చేశారు. ఇదేమని అడిగితే అసలు కోర్టు ఆదేశాలే లేవంటూ విద్యాశాఖ అధికారులు సెలవిస్తున్నారు. దీంతో టీచర్ల నియామకంలో అన్యాయం జరిగిందని కోర్టుకెక్కిన స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు తీవ్ర నైరాశ్యంలో మునిగిపోయారు. రాష్ట్రవ్యాప్తంగా 11,062 టీచర్ పోస్టుల భర్తీ కోసం 2024, ఫిబ్రవరి 29న ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. వీటిలో స్పోర్ట్స్ కోటాకు సంబంధించి 2018లో ప్రభుత్వం జీవో 107ను విడుదల చేసింది. దీని ప్రకారం ఫామ్–1.. ఇంటర్నేషనల్ గేమ్స్, ఫామ్–2.. నేషనల్ గేమ్స్(అసోసియేషన్), ఫామ్–3.. నేషనల్ గేమ్స్(యూనివర్సిటీ లెవెల్), ఫామ్–4.. నేషనల్ గేమ్స్(సూ్కల్/స్టేట్ లెవెల్)గా పరిగణిస్తారు. ఆయా ఆటల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు నియామకాల్లో సంబంధిత ఫామ్‌లను సమరి్పంచాల్సి ఉంటుంది. దీన్ని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ (శాట్) పరిశీలించి డైరెక్టరేట్‌కు పంపిస్తుంది. ప్రాధాన్యత ఆధారంగా స్పోర్ట్ కోటాలో వీరిని భర్తీ చేశారు. అయితే తాజా డీఎస్సీలో ఫామ్–1, ఫామ్–2 ఉన్న అభ్యర్థులకు మాత్రమే కొన్ని జిల్లాల్లో పోస్టింగ్ ఇవ్వగా.. మరికొన్ని జిల్లాల్లో ఫామ్–3, ఫామ్–4 వారికి కూడా ఇచ్చారని, ఫామ్–3, ఫామ్–4 ఉన్నా తమకు ఇవ్వలేదనేది బాధితుల ప్రధాన ఆరోపణ. ఇంకొందరు రాష్ట్రస్థాయి క్రీడాకారులే అయినా జాతీయ స్థాయి ఫామ్ అందజేశారని.. శాట్ పరిశీలించకుండానే డైరెక్టరేట్‌కు అందజేయడంతో అలాంటి వారు కూడా ఉద్యోగాలు పొందారని అంటున్నారు. టీచర్ పోస్టులకు సంబంధించి శాట్‌కు దాదాపు 390 దరఖాస్తులు వచ్చాయి. వీటిని సమగ్రంగా పరిశీలించి నిజంగా వారు ఆయా రంగాల్లో ప్రతిభ కనబరిచారా? లేదా? అనేది చూడాలి. కానీ శాట్ వచ్చినవి వచ్చినట్లు పంపేయడంతో అవకతవకలు చోటుచేసుకున్నాయని వారు చెబుతున్నారు. నవంబర్ 21 వరకు..జీవో సరిగా లేదంటూ నల్లగొండ జిల్లా కేతేపల్లికి చెందిన ఆర్.రమేశ్‌తోపాటు మరో 9 మంది హైకోర్టును ఆశ్రయించగా.. జస్టిస్ పుల్ల కార్తీక్ ధర్మాసనం వీరి పిటిషన్‌పై సెపె్టంబర్ 25న విచారణ చేపట్టింది. ఎస్జీటీ పోస్టుల భర్తీకి పిటిషనర్ల నుంచి సరి్టఫికెట్లన్నీ తీసుకుని పరిశీలించాలని, తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు పిటిషనర్ల ఫలితాలు వెల్లడించవద్దని ఆదేశించింది. తదుపరి విచారణ నవంబర్ 21కి వాయిదా వేసింది. అయినా ఈలోపే ఫలితాలు వెల్లడించారు. పిటిషనర్లలో ఒక్కరు మాత్రమే ఎంపికైనట్లు ప్రకటించి ఉద్యోగం ఇచ్చారు.ఎలాంటి జీవో లేకుండా..ప్రభుత్వంగానీ, శాట్గానీ, నియామక డైరెక్టరేట్గానీ ఫామ్–1, ఫామ్–2 ఉన్న వాళ్లకే స్పోర్ట్స్ కోటా కింద పోస్టింగ్‌లు ఇస్తామని చెప్పలేదు. ఎలాంటి జీవో ఇవ్వలేదు. ప్రాధాన్యత ఆధారంగా మొదట ఫామ్–1 వారికి.. లేకుంటే ఫామ్–2 వారికి.. లేకుంటే ఫామ్–3 వారికి.. లేకుంటే ఫామ్–4 వారికి ఉద్యోగం ఇవ్వాలి. మాకు హైకోర్టు ఉత్తర్వులిచి్చనా వాటిని డైరెక్టరేట్ పాటించలేదు. నల్లగొండ జిల్లాలో స్పోర్ట్స్ కోటాలో లేరంటూ ఆ పోస్టులు జనరల్ అభ్యర్థులకు ఇచ్చారు. – ఆర్.రమేశ్, బాధితుడుఇదెక్కడి న్యాయం... ఎంసెట్ లాంటి వాటికే స్పోర్ట్స్ సర్టిఫికెట్లను ఫిజికల్‌గా తనిఖీ చేస్తున్నప్పుడు.. పోస్టింగ్‌లకు దాన్ని ఎందుకు అమలు చేయరు? ఆన్లైన్లో ఎవరు ఏది పెడితే అది పంపిస్తారా? స్కూల్ అసిస్టెంట్‌ను గ్రూప్–1 స్థాయిగా, ఎస్జీటీని గ్రూప్–2 స్థాయి పోస్టులుగా ప్రభుత్వం పేర్కొంటోంది. మరి ఇంత ప్రాధాన్యమున్న ఉద్యోగాల భర్తీలో పారదర్శకత ఏదీ? ప్రభుత్వం బాధితులతో మాట్లాడి పరిష్కారం చూపాలి. – కృష్ణమూర్తి, బాధితుడు శాట్ పరిశీలన ప్రకారమే.. స్పోర్ట్స్ అథారిటీ ఫైనల్ చేసిన తర్వాతే మేం నిర్ణయం తీసుకుంటాం. 393 దరఖాస్తులను పంపిస్తే శాట్ పరిశీలన చేసి 35 మంది అర్హులను మాకు పంపారు. ఫామ్–1, ఫామ్–2 వారికి అవకాశం ఇచ్చారు. ఇద్దరు నాన్ లోకల్, 33 మంది లోకల్ వారికి పోస్టింగ్‌లు వచ్చాయి. ఇతరులు కూడా తమకు అర్హత ఉందని చెబుతున్నారు. అనుమానం ఉంటే మరోసారి అప్లికేషన్లు ఇస్తే శాట్‌కు పంపించి పరిష్కరిస్తాం. హైకోర్టు నుంచి మాకు ఎలాంటి ఆదేశాల్లేవు. పోస్టింగ్‌లు ఇచ్చాక ఇప్పుడు చేసేదేం లేదు. – డైరెక్టర్, పాఠశాల విద్య -
కలెక్టర్..ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు?
సాక్షి, హైదరాబాద్: ఓ సివిల్ కేసులో అప్పీల్ దాఖలు చేయడంలో ప్రభుత్వ ఆలస్యానికి కారణం ఎన్నికలని చెప్పడంపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. అధికారులు ఏమన్నా రాజకీయ నాయకులా..కలెక్టర్ ఏ నియోజక వర్గం నుంచి పోటీ చేశారు..గెలిచారా? లేదా? అని ప్రశ్నించింది. ఎన్నికలు వచ్చినా అధికారులు తమ విధుల్లో నిర్లక్ష్యం వహించకూడదు కదా.. అప్పీల్ దాఖలుకు ఎన్నికలు ఎందుకు అడ్డంకి అవుతాయంటూ తప్పబట్టింది. కలెక్టర్ ఏ పార్టీ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని నిలదీసింది. హైదరాబాద్ గుడిమల్కాపూర్‌లోని ఓ స్థలం ఏపీ ప్రభుత్వానిదని 2014లో కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ ఫజలుల్లాల్ హక్‌తో పాటు మరో 9 మంది 2016లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారణ చేపట్టిన సింగిల్ జడ్జి..ఆ స్థలం ప్రైవేట్ వ్యక్తులకే చెందుతుందని ఉత్తర్వులు జారీ చేశారు. 1968 నుంచి ప్రభుత్వం ఆ స్థలాన్ని లీజుకు తీసుకుని పాఠశాల నిర్వహిస్తున్నందున ఖాళీ చేయాలని చెప్పలేమన్నారు. భూ సేకరణ చట్టం కింద ఆరు నెలల్లో ప్రక్రియ పూర్తి చేయాలని, ఒకవేళ ప్రక్రియ చేపట్టకుంటే స్థాలాన్ని ప్రైవేట్ వ్యక్తులకు స్వా«దీనం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు 2016లో తీర్పు వెలువరించారు. సింగిల్ జడ్జి తీర్పుపై హైదరాబాద్ కలెక్టర్ 2024, జూలైలో అప్పీల్ దాఖలు చేశారు. ఎన్నికల కారణంగా అప్పీల్లో ఆలస్యం జరిగిందంటూ మధ్యంతర అప్లికేషన్లో విజ్ఞప్తి చేశారు. ఈ అప్పీల్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె.శ్రీనివాస్‌రావు ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరఫునన స్పెషల్ జీపీ ఎ.దివ్య వాదనలు వినిపిస్తూ..ఎన్నికల నోటిఫికేషన్ కారణంగా అప్పీల్లో ఆలస్యం జరిగిందని, విచారణకు స్వీకరించాలని కోరారు. అప్పీల్ దాఖలుకు ఎన్నికల నోటిఫికేషన్‌ను ఎలా కారణంగా చెబుతారని ధర్మాసనం ప్రశ్నించింది. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ, ఎన్నికల కోడ్ కారణంగా అధికారులు ఇతర పలు కార్యక్రమాల్లో బిజీ ఉన్నారని జీపీ సమాధానమిచ్చారు. దీనికి ధర్మాసనం మరింత అసహనం వ్యక్తం చేస్తూ.. మీ స్పందన ఇలానే ఉంటే ఇంకా ఇబ్బందికరమైన ప్రశ్నలు వేయాల్సి వస్తుందని, అప్పీల్‌ను తిరస్కరించాల్సి వస్తుందని హెచ్చరించింది. సరైన కారణాలతో అప్పీల్ దాఖలు చేస్తామని న్యాయవాది చెప్పడంతో ధర్మాసనం వాయిదా వేసింది. -
తెలంగాణలో గ్రూప్-1 మెయిన్స్ కు గ్రీన్ సిగ్నల్
-
57 ఏళ్ల తర్వాత రికార్డులు కోరలేరు
సాక్షి, హైదరాబాద్: దాదాపు 57 ఏళ్ల తర్వాత భూరికార్డులు కోరలేరని మ్యుటేషన్ వివాదం అప్పీల్లో హైకోర్టు స్పష్టం చేసింది. చట్టంలో కాలవ్యవధి పేర్కొననప్పటికీ కక్షిదారులు సహేతుకమైన వ్యవధిలోనే అధికారులను సంప్రదించాలని తేల్చిచెప్పింది. 57 ఏళ్ల తర్వాత రికార్డుల్లో నమోదుకు దరఖాస్తు సమరి్పంచినందున అప్పీలుదారు సవరణకు అర్హుడు కాదని చెప్పింది. సింగిల్ జడ్జి ఆదేశాల్లో జోక్యం చేసుకోవడానికి ఎలాంటి కారణాలు కనిపించడం లేదని వ్యాఖ్యానించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె.శ్రీనివాస్‌రావు ధర్మాసనం అప్పీల్‌ను కొట్టివేసింది. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కొండాయ్‌పల్లిలోని 64.30 ఎకరాల భూమి తమదేనంటూ బూరుగుపల్లికి చెందిన హనుమంతరావు హైకోర్టులో పిటిషన్ వేశారు. తన తల్లి 1963లో ఆ భూమిని కొనుగోలు చేసిందని, మ్యుటేషన్ కోసం తహసీల్దార్‌ను సంప్రదించిందన్నారు. అయితే మొత్తం భూమిలోని 4.23 ఎకరాలు ఆమె పేరు మీద లేదంటూ మ్యుటేషన్‌కు నిరాకరించారని.. ఈ క్రమంలోనే భూమి, పట్టాదార్ పాస్‌బుక్‌లో తెలంగాణ హక్కుల చట్టం–2020 అమల్లోకి వచ్చిందని చెప్పారు. అనంతరం కలెక్టర్ (ప్రత్యేక ట్రిబ్యునల్)కు అప్పీల్ చేసుకోగా.. దీన్ని కొట్టివేశారన్నారు. దీంతో హైకోర్టును ఆశ్రయించినట్లు వివరించారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన సింగిల్ జడ్జి.. 1963లో భూమి కొనుగోలు చేసి 2019లో మ్యుటేషన్‌కు అధికారులను సంప్రదించడాన్ని తప్పుబట్టి పిటిషన్‌ను కొట్టివేశారు. దీనిపై హనుమంతరావు అప్పీల్ దాఖలు చేయగా.. ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. వాదనలు విని అప్పీల్‌ను కొట్టివేసింది. అయితే, అప్పీలుదారు, అతని తల్లి చట్టప్రకారం సివిల్ కోర్టును ఆశ్రయించవచ్చంటూ స్వేచ్ఛనిచి్చంది. -
TG: ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలు.. స్థానికతపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల ప్రవేశాల్లో స్థానికత అంశంపై రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పును వెల్లడించింది. స్థానిక కోటా కింద స్థానికులంతా అర్హులేనని సీజే ధర్మాసనం తీర్పు ఇచ్చింది. ఇదే సమయంలో స్థానికులు ఎవరు అనే అంశంపై సరైన మార్గదర్శకాలు లేవని ధర్మాసనం స్పష్టం చేసింది. ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల్లో స్థానికులు ఎవరనే విషయంలో మార్గదర్శకాలు రూపొందించాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. ప్రభుత్వం రూపొందించిన మార్గ నిర్దేశకాల ప్రకారం కాళోజీ వైద్య విశ్వవిద్యాలయం విద్యార్థులకు ప్రవేశాలు కల్పించాలని హైకోర్టు సూచించింది. కాగా, ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సు ప్రవేశాల్లో స్థానికత జీవోకు సంబంధించి నేడు తెలంగాణ హైకోర్టులో వాదనలు జరిగాయి. వైద్య ఆరోగ్యశాఖ జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ పలువురు విద్యార్థులు హైకోర్టులో వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. ఇక, జీవోలో భాగంగా నీట్ ప్రవేశ పరీక్ష రాసే సమయానికి విద్యార్థి వరుసగా నాలుగేళ్లు చదివితేనే స్థానికుడిగా పరిగణించాలంటూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఈ జీవో రాజ్యాంగంలోని ఆర్టికల్ 14కు విరుద్ధమంటూ పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఈ పిటిషన్లపై విచారణ సందర్భంగా ధర్మాసనం తీర్పును వెల్లడించింది. -
పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్.. విచారణ రేపటికి వాయిదా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై హైకోర్టులో నేడు విచారణ కొనసాగింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్‌లపై అర్హనత వేటు వేయాలని బీఆర్ఎస్ నేతలు పిటిషన్ దాఖలు చేశారు.వీరిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, వివేకానంద రెడ్డిలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వీరిపై చర్యలు తీసుకునేలా స్పీకర్‌ను ఆదేశించాలని బీఆర్ఎస్ నేతలు పిటిషన్ దాఖలైంది. ఈ క్రమంలో ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించగా. ప్రతివాదుల తరఫున వాదనలు వినిపించారు జంధ్యాల రవిశంకర్. ఇరువైపుల వాదనలు విన్న తర్వాత తదుపరి విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది. ఇదే సమయంలో ఎమ్మెల్యేల అనర్హతపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యేల అనర్హత అంశంపై సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులతో చర్చించాము. పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని తీసుకొచ్చిన కాంగ్రెస్ ఫిరాయింపులను ప్రోత్సహిస్తుంది అంటూ వ్యాఖ్యలు చేశారు. -
TG: కుక్కల దాడులను ఆపలేరా?.. ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కుక్కల దాడి ఘటనల పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలతో అనిమల్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు భేటీ అయ్యి పరిష్కారం చూపాలని హైకోర్టు సూచించింది. ఈ క్రమంలో తదుపరి విచారణను రెండు వారాలకు కోర్టు వాయిదా వేసింది.కాగా, నిన్న జవహర్ నగర్లో కుక్కల దాడిలో ఏడాదిన్నర బాలుడు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కుక్కల దాడుల ఘటనపై వేసిన పిటిషన్లపై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా వీధి కుక్కల దాడి ఘటనలను నివారించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని హైకోర్టు ప్రశ్నించింది.ఈ క్రమంలో అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపిస్తూ.. జీహెచ్ఎంసీ వ్యాప్తంగా 3.79 లక్షల వీధి కుక్కలు ఉన్నాయి. కుక్కల దాడి ఘటనలను నివారించడానికి స్టేట్ లెవల్ కమిటీ చేశాము. హైదరాబాద్‌లో ఆరు కేంద్రాల వద్ద కుక్కలకు స్టెరిలైజేషన్ చేస్తున్నారు. ఒక్కో కేంద్రం వద్ద రోజుకు సుమారు 200 కుక్కలకు స్టెరిలైజేషన్ జరుగుతోందన్నారు. ఈ సందర్భంగా హైకోర్టు.. స్టెరిలైజేషన్ ద్వారా ఎలా దాడులను ఆపుతారని ప్రశ్నించింది.ఈ నేపథ్యంలో అనిమల్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. కుక్కలను షెల్టర్ హోమ్స్‌కు తరలిస్తే సమస్య పరిష్కారం అవుతుందన్నారు. నాగపూర్‌లో దాదాపు 90వేల కుక్కలను షెల్టర్ హోమ్‌లో పెట్టినట్టు చెప్పారు. దీంతో, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలతో అనిమల్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు భేటీ అయ్యి పరిష్కారం చూపాలని హైకోర్టు సూచించింది. అనంతరం, పిటిషన్లపై తదుపరి విచారణను రెండు వారాలకు కోర్టు వాయిదా వేసింది. -
మాజీ సీఎం కేసీఆర్‌కు హైకోర్టులో ఊరట
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం 2011లో జరిగిన రైలు రోకో కేసు వ్యవహారంలో విచారణపై హైకోర్టు స్టే విధించింది.కాగా, 2011లో తెలంగాణ ఉద్యమం సందర్భంగా తనపై రైలు రోకో కేసులో కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన కేసును కొట్టేయాలని పిటిషన్లో కోరారు. తాను రైలు రోకోలో పాల్గొనలేదని తెలిపారు. తనపై తప్పుడు కేసు నమోదు చేశారని చెప్పుకొచ్చారు. కాగా, కేసీఆర్ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా కేసుపై స్టే విధించింది. ఇదే సమయంలో ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. అనంతరం విచారణను జూలై 18వ తేదీకి వాయిదా వేసింది. -
పోలీసు భూమిపై మాజీ పోలీస్ భార్య కన్ను
సాక్షి, హైదరాబాద్: అసైన్డ్ ల్యాండ్స్ స్కామ్, ప్రీలాంచ్ ఆఫర్స్ పేరుతో మోసాలకు పాల్పడిన కేసులో హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసుల నుంచి తప్పించుకుపోయిన ఏపీలోని నంద్యాల టీడీపీ అభ్యర్థి, మాజీ పోలీసు అధికారి మాండ్ర శివానందరెడ్డి భార్య ఉమాదేవిపై మరో కేసు కూడా ఉంది. మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్ విభాగం గ్రేహౌండ్స్‌కు చెందిన భూమిపై ఆమె కన్నేశారు. తన సమీప బంధువు ఆరోగ్యరెడ్డితో కలిసి కాజేయడానికి కుట్ర పన్నారు. రెవెన్యూ అధికారుల ఫిర్యాదుతో సీసీఎస్ పోలీసులు గతంలో కేసు నమోదు చేశారు. దీన్ని దర్యాప్తు చేసిన అధికారులు నిందితులపై సప్లిమెంటరీ చార్జ్‌షిట్ ఫైల్ చేశారు. శివానందరెడ్డికి సంబంధించిన తాజా ఎపిసోడ్ నేపథ్యంలో ఈ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఇందులో త్వరలో పూర్తిస్థాయి అభియోగ పత్రాలు దాఖలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం గ్రేహౌండ్స్ ఆధీనంలోనే ఉన్న ఆ భూమి మార్కెట్ విలువ రూ.2,500 కోట్లకు పైనే ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. తాజా కేసులో శివానందరెడ్డితో పాటు ఆయన భార్య ఉమాదేవి కూడా నిందితురాలిగా ఉన్న విషయం విదితమే. 1993లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్) గండిపేట మండలం మంచిరేవుల గ్రామంలో ఉన్న సర్వే నంబర్ 393/1 నుంచి 392/20 వరకు ఉన్న భూమిని గ్రేహౌండ్స్‌కు కేటాయించింది. మొత్తం 142 ఎకరాల 39 కుంటల విస్తీర్ణంలో ఉన్న ఈ భూమి అప్పటి నుంచి గ్రేహౌండ్స్ ఆధీనంలోనే ఉంది. అ స్టే ఉత్తర్వులు ఉన్నా.. కాగా.. ఈ భూమిని 1961లో ప్రభుత్వం తమకు కేటాయించిందంటూ 20 మంది అసైనీలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం దీనిపై న్యాయస్థానం విధించిన స్టేటస్ కో (యధాత«థ స్థితి) ఉత్తర్వులు కొనసాగుతున్నాయి. ఓ దశలో ఈ వివాదాన్ని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టు దృష్టికి తీసుకువెళ్లింది. హైకోర్టులోనే తేల్చుకోవాలంటూ ఆ న్యాయస్థానం స్పష్టం చేయడంతో స్టేటస్ కో కొనసాగుతోంది. ఈ వివాదాల నేపథ్యంలో ఉమాదేవి తన సమీప బంధువు ఆరోగ్యరెడ్డితో కలిసి రంగంలోకి దిగారు. యూ అండ్ ఏ పేరుతో ఉన్న కంపెనీ ముసుగులో కథ నడిపారు. ఆ భూమికి సంబంధించిన అసైనీల వారసుల పేరుతో కొందరి నుంచి తమ కంపెనీ పేరుతో ఒప్పందాలు చేసుకున్నారు. ఎకరం రూ.4 కోట్లకు బేరమాడుకుని, రూ.8 లక్షల చొప్పున అడ్వాన్స్ చెల్లిస్తూ అనేక మంది వారసులతో ఒప్పందాలు చేసుకున్నారు. ఇది జరిగిన కొన్నాళ్లకు ఆ భూములపై హక్కు పొందేందుకు తమవేనంటూ జీపీఓ కూడా చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న గ్రేహౌండ్స్ ఉన్నతాధికారులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. ప్రాథమిక విచారణ అనంతరం వారు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. సర్కారు ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకోవడంతో రాజేంద్రనగర్ రెవెన్యూ అధికారులు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉమాదేవి, ఆరోగ్యరెడ్డి తదితరులు గ్రేహౌండ్స్ స్థలం కాజేయడానికి కుట్ర పన్నారని ఆరోపిస్తూ పోలీసులు ఐపీసీ 406, 420, 120 (బి) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. నేరం జరిగినట్టు నిర్ధారణ కావడంతో ఉమాదేవి, ఆరోగ్యరెడ్డితో పాటు అసైనీ వారసులుగా చెప్పుకుని ఒప్పందాలు చేసుకున్న 60 మందికి సీసీఎస్ పోలీసులు సీఆరీ్పసీ 41ఏ కింద నోటీసులు జారీ చేశారు. దర్యాప్తు తుది దశకు చేరిన నేపథ్యంలో ఉమాదేవి సహా మరికొందరిపై సప్లిమెంటరీ చార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఈ వ్యవహారంలోనూ తెరవెనుక శివానందరెడ్డి పాత్ర ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. భూ వివాదం సుప్రీం కోర్టు వరకు వెళ్లింది. ఆ భూమి ప్రభుత్వానిదే అని, సర్కారే గ్రేహౌండ్స్‌కు కేటాయించడంతో ప్రస్తుతం ఆ విభాగానికి చెందినదే అంటూ తీర్పు కూడా ఇచ్చింది. అరెస్టులు వద్దు మరోవైపు బుద్వేల్ అస్సైన్డ్ భూముల కబ్జా కేసులో తదుపరి విచారణ వరకు నంద్యాల టీడీపీ అభ్యర్థి, మాజీ ఎస్పీ శివానందరెడ్డి, అతని భార్య ఉమాదేవి, కుమారుడు కని‹Ù్కలను అరెస్టు చేయవద్దని సీసీఎస్ పోలీసులను తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 8కి వాయిదా వేసింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని బుద్వేల్‌లో 26 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా చేసి ప్లాట్లుగా మార్చి విక్రయించారన్న ఆరోపణలపై శివానందరెడ్డితోపాటు ఉమాదేవి, కనిష్క్(నిందితులు)లపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో తమను అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన న్యాయమూర్తి జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి 8వ తేదీ వరకు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించారు. -
స్పీకర్‌కు కోర్టులు ఆదేశాలు జారీ చేయవచ్చా?
సాక్షి, హైదరాబాద్: పార్టీ మారిన ఖైరతాబాద్ ఎమ్మెల్యేని అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ ఒక ఓటర్ పిటిషన్ వేయవచ్చా? దీనిపై స్పీకర్ విధుల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవచ్చా? ఆయన ముందు వినతిని పరిశీలించి నిర్ణయం తీసుకోవాల ని చెప్పవచ్చా? అలా గతంలో ఏవైనా తీర్పులుంటే తమ ముందు ఉంచాలని ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై కేసు దాఖలు చేసిన పిటిషనర్‌ను హైకోర్టు ఆదేశించింది. ‘2023, నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేశారు. దీంతో నేను ఆయనకు ఓటు వేశాను. ఆ ఎన్నికల్లో గెలిచిన దానం.. ఎమ్మెల్యేగా రాజీనామా చేయకుండానే కాంగ్రెస్ పార్టీలో చేరారు. అంతేకాదు సికింద్రాబాద్ నుంచి ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసి.. మరో పార్టీలో చేరిన దానంను అనర్హుడిగా ప్రకటించాలని మార్చి 23న స్పీకర్‌కు ఈ–మెయిల్ ద్వారా వినతిపత్రం సమర్పించాం. ఇంకా దానిపై ఆయన నిర్ణయం తీసుకోలేదు. స్పీకర్ వెంటనే నిర్ణయం తీసుకుని దానంను అనుర్హుడిగా ప్రకటించేలా ఆదేశాలు ఇవ్వండి’అని కోరుతూ ఖైరతాబాద్‌కు చెందిన బొల్లబోయిన రాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి విచారణ చేపట్టారు. ఈ రిట్ పిటిషన్‌ను దాఖలు చేయడంలో పిటిషనర్‌కు ఎలాంటి అర్హత ఉందని అతని తరఫు న్యాయవాదిని న్యాయమూర్తి ప్రశ్నించారు. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్‌పై గెలిచి మూడు నెలలు తిరగకుండానే కాంగ్రెస్‌కు విధేయుడిగా మారిన ఎమ్మెల్యేకు పిటిషనర్ ఓటేశారని న్యాయవాది చెప్పారు. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేయడం ప్రజల్లో గందరగోళాన్ని సృష్టిస్తుందన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. గత తీర్పుల కాపీలుంటే తమ ముందు ఉంచాలని ఆదేశిస్తూ, విచారణను వాయిదా వేశారు. -
‘అఫిడవిట్’పై మళ్లీ చర్చ..
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: శాసనసభ ఎన్నికల ప్రక్రియ సందర్భంగా అభ్యర్థులు సమర్పించే అఫిడివిట్లో సరైన వివరాలు అందించలేదనే వ్యాజ్యంపై వివరణ ఇవ్వాలంటూ కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేసి సాంబశివరావుకు రాష్ట్ర హై కోర్టు నోటీసులు పంపింది. దీంతో మరోసారి అఫిడవిట్ అంశం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. జలగం వర్సెస్ వనమా.. తెలంగాణ అసెంబ్లీకి రెండోసారి 2018లో జరిగిన ఎన్నికల సందర్భంగా కొత్తగూడెం స్థానం నుంచి బీఆర్ఎస్ తరఫున జలగం వెంకటరావు, కాంగ్రెస్ నుంచి వనమా వెంకటేశ్వరరావు పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో జలగంపై వనమా గెలుపొందారు. అయితే నామినేషన్ సందర్భంగా వనమా సరైన వివరాలు సమర్పించలేదంటూ జలగం వెంకటరావు వెంటనే హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై సుదీర్ఘంగా విచారణ జరిపిన తర్వాత 2023 జూన్‌లో వనమా ఎన్నిక చెల్లదంటూ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. దీంతో ఆ ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన తనను ఎమ్మెల్యేగా గుర్తించాలని శాసన సభ కార్యదర్శిని జలగం వెంకటరావు కోరారు. ఇంతలో హై కోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ వనమా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గతేడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ అంశం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. అప్పటి నుంచే రగడ.. జలగం వర్సెస్ వనమా కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో ఈసారి ఎన్నికల సందర్భంగా నామినేషన్ల అంశంపై అన్ని పార్టీలు ప్రత్యేక దృష్టి సారించాయి. బీఆర్ఎస్ అయితే రాష్ట్ర కార్యాలయంలో నామినేషన్ పత్రాలు నింపేందుకు, సరి చూసుకునేందుకు ప్రత్యేక శిబిరం నిర్వహించింది. ఇక కొత్తగూడెం విషయానికి వస్తే నామినేషన్ దరఖాస్తుల పరిశీలన గరం గరంగా జరిగింది. ఈ స్థానం నుంచి మొత్తం 36 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో సీపీఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు, బీఎస్పీ అభ్యర్థి వై. కామేశ్‌తో పాటు మరికొందరు అభ్యర్థులు అఫిడవిట్లో సమర్పించిన అంశాలపై మరో అభ్యర్థి జలగం వెంకటరావు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీంతో ఎన్నికల అధికారులు రాష్ట్ర అధికారులతో సంప్రదింపులు జరిపి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. కాగా ఇప్పుడు హై కోర్టులో వ్యాజ్యం దాఖలు కావడంతో మరోసారి అఫిడవిట్ అంశంపై జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. -
ఆరుగురు ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు..
సాక్షి, హైదరాబాద్: శాసనసభ్యులుగా ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పలు పిటిషన్లకు సంబంధించి కాంగ్రెస్ నుంచి గెలిచిన ఇద్దరు, బీఆర్ఎస్ నుంచి గెలిచిన ముగ్గురు, ఒక సీపీఐ ఎమ్మెల్యేకు హైకోర్టు శుక్రవారం వేర్వేరుగా నోటీసులు జారీ చేసింది. వారంతా వచ్చే నెలలోగా స్పందించి కౌంటర్ దాఖలు చేయాలని పేర్కొంది. తదుపరి విచారణను వచ్చేనెల (ఏప్రిల్ 16, 18, 19 తేదీలకు) వాయిదా వేసింది. అఫిడవిట్లలో తప్పుడు సమాచారం ఇచ్చారంటూ.. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి దానం నాగేందర్ (బీఆర్ఎస్), జూబ్లీహిల్స్ నుంచి మాగంటి గోపీనాథ్ (బీఆర్ఎస్), ఆసిఫాబాద్ నుంచి కోవ లక్ష్మి (బీఆర్ఎస్), మహబూబ్‌నగర్ నుంచి యెన్నం శ్రీనివాస్‌రెడ్డి (కాంగ్రెస్), దేవరకద్ర నుంచి జి.మధుసూదన్‌రెడ్డి (కాంగ్రెస్), కొత్తగూడెం నుంచి కూనంనేని సాంబశివరావు(సీపీఐ) విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో ఓడిన ప్రత్యర్థులు కొందరు వీరి ఎన్నికను సవాల్ చేస్తూ హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. వారు ఎన్నికల అఫిడవిట్లలో తప్పుడు సమాచారం ఇచ్చారని, సరైన సమాచారం ఇవ్వలేదని వాటిలో పేర్కొన్నారు. ఆ ఎమ్మెల్యేల ఎన్నికను కొట్టివేయాలని కోరారు. ఈ పిటిషన్లపై జస్టిస్ కె.లక్ష్మణ్, జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి, జస్టిస్ సూరేపల్లి నందా తదితరులతో కూడిన వేర్వేరు ధర్మాసనాలు శుక్రవారం విచారణ చేపట్టారు. ప్రతివాదులకు నోటీసులు జారీచేశాయి. ఎవరెవరిపై పిటిషన్లు..? మహబూబ్‌నగర్ నుంచి కాంగ్రెస్ తరఫున గెలిచిన యెన్నం శ్రీనివాస్‌రెడ్డి ఎన్నికను సవాల్ చేస్తూ బీఆర్ఎస్ అభ్యర్థి, మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పిటిషన్ వేశారు; జూబ్లీహిల్స్ నుంచి బీఆర్ఎస్ నేత మాగంటి గోపీనాథ్ ఎన్నిక చెల్లదంటూ కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్, నవీన్‌యాదవ్..; కొత్తగూడెం నుంచి సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు ఎన్నికను సవాల్ చేస్తూ కొత్తగూడెం పట్టణానికి చెందిన నందూలాల్ అగర్వాల్..; ఆసిఫాబాద్ నుంచి బీఆర్ఎస్ నేత కోవ లక్ష్మి ఎన్నికను రద్దు చేయాలంటూ కాంగ్రెస్ అభ్యర్థి అజ్మీరా శ్యామ్..; ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ తరఫున గెలిచిన దానం నాగేందర్ (ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఉన్నారు) ఎన్నికను సవాల్ చేస్తూ కాంగ్రెస్ అభ్యర్థి పి.విజయారెడ్డి..; దేవరకద్ర నుంచి కాంగ్రెస్ తరఫున విజయం సాధించిన జి.మధుసూదన్‌రెడ్డి ఎన్నిక రద్దు కోరుతూ బీఆర్ఎస్ అభ్యర్థి ఆల వెంకటేశ్వర్‌రెడ్డి పిటిషన్లు దాఖలు చేశారు. -
వైఎస్ వివేకా హత్య కేసులో శివశంకర్‌రెడ్డికి బెయిల్
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడి (ఏ5)గా సీబీఐ పేర్కొన్న డి.శివశంకర్‌రెడ్డికి తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.2 లక్షల పూచీకత్తు సీబీఐ కోర్టుకు సమర్పించాలని, ప్రతి సోమవారం సీసీఎస్ పోలీస్ స్టేషన్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య హాజరు కావాలని, కేసులో ప్రత్యక్షంగా, పరోక్షంగా జోక్యం చేసుకోవద్దని, కోర్టులో విచారణ ముగిసే వరకు ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించొద్దని ఆదేశించింది. అలాగే పాస్‌పోర్టు ట్రయల్ కోర్టుకు సమర్పించాలని, విచారణలో కోర్టుకు సహకరించాలని, ఎలాంటి క్రిమినల్ కార్యకలాపాలకు పాల్పడవద్దని స్పష్టం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్ వివేకా హత్య కేసులో శివశంకర్‌రెడ్డిని సీబీఐ 2021లో అరెస్టు చేసింది. అప్పటి నుంచి జైలులో ఉంటున్న ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను గత సంవత్సరం సెప్టెంబర్ 19న సీబీఐ కోర్టు కొట్టివేసింది. దీన్ని సవాల్ చేస్తూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. తనకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని, సీబీఐ వద్ద ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేకుండానే అరెస్టు చేసిందని, బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ విచారణ జరిపి, సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ఉమామహేశ్వర్రావు, సీబీఐ తరఫున స్పెషల్ పీపీ అనిల్ థన్వర్ వాదనలు వినిపించారు. హైకోర్టు బెయిల్ మంజూరు చేసినందున శివశంకర్‌రెడ్డి నేడు జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. ఏళ్లుగా జైలులో ఉంచడం సరికాదు నిందితులనే పేరుతో ఏళ్ల తరబడి జైలులో ఉంచడం సరికాదని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పలు సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశాయని తెలిపారు. నిందితుని తరపు న్యాయవాది వాదనలతో పాటు ఈ విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకొని బెయిల్ మంజూరు చేస్తున్నట్లు వివరించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం నిందితులకు కూడా హక్కులు ఉంటాయని స్పష్టం చేశారు. నిందితుని తరపున న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ‘2021 అక్టోబర్ 26న సీబీఐ దాఖలు చేసిన అభియోగపత్రంలో శివశంకర్‌రెడ్డిపై ఎలాంటి ఆరోపణలు లేవు. హంతకుడు దస్తగిరి (ఏ4)ని అప్రూవర్‌గా పేర్కొన్నారు. అతను చెప్పిన స్టేట్మెంట్లో శివశంకర్‌రెడ్డిపై ఆరోపణలు చేశాడు. 2022 జనవరి 31న దాఖలు చేసిన తొలి మధ్యంతర అభియోగపత్రంలో శివశంకర్‌రెడ్డిని ఏ5గా చేర్చారు. కేసులో ఇరికించడానికే నిందితుడిగా చేర్చారు. దస్తగిరి చెప్పిన సెక్షన్ 161, 164 స్టేట్మెంట్లలో పరస్పర విరుద్ధ అంశాలున్నాయి. కేసు తీవ్రతను గుర్తించని ట్రయల్ కోర్టు కీలక నిందితుడు దస్తగిరికి ముందస్తు బెయిల్ ఇచ్చి విడుదల చేసింది. హత్య, సాక్ష్యాల చెరిపివేతలో శివశంకర్‌రెడ్డికి సంబంధం ఉన్నట్లు ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేవు. అయినా 2021 నవంబర్ 17 నుంచి జైలులో ఉంచడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం. 55 ఏళ్ల శివశంకర్‌రెడ్డి వెన్ను నొప్పితో బాధపడుతున్నారు. భుజానికి కూడా ఇటీవలే శస్త్రచికిత్స జరిగింది. నిరంతరం వైద్యుల పర్యవేక్షణ అవసరం. దీని మెడికల్ రిపోర్టును కూడా అందజేశాం’ అని కోర్టుకు వివరించారు. -
తెలంగాణ హైకోర్టు.. ఇద్దరు ఎమ్మెల్సీల నియామకం కొట్టివేత
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కాంగ్రెస్ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. రాష్ట్ర గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామకాన్ని తెలంగాణ హైకోర్టు తప్పుపట్టింది. ఈ సందర్భంగా కోదండరామ్, అలీఖాన్‌ల నియామకాన్ని హైకోర్టు కొట్టివేసింది. వివరాల ప్రకారం.. తెలంగాణలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ నియామకంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దాసోజు శ్రవణ్, సత్యనారాయణ.. సిఫార్సుల తిరస్కరణలో గవర్నర్ తమిళిసై తీరును హైకోర్టు తప్పు పట్టింది. వీరి ఎన్నికను పున:పరిశీలించాలని గవర్నర్‌ను కోర్టు ఆదేశించింది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల జాబితాను మరోసారి కేబినెట్ ముందు ఉంచి నిర్ణయం తీసుకోవాలని సూచించింది. ఇదే సమయంలో ఇద్దరు ఎమ్మెల్సీలను నియమిస్తూ ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఈ క్రమంలో ఎమ్మెల్సీలుగా కోదండరామ్, అమీర్ అలీఖాన్ నియామకాలను కోర్టు కొట్టివేసింది. అలాగే, మంత్రి మండలి నిర్ణయాలకు గవర్నర్ కట్టుబడి ఉండాల్సిదేనని హైకోర్టు సూచించింది. ఇక, మళ్లీ కొత్తగా ఎమ్మెల్సీల నియామకాలను చేపట్టాలని కోర్టు తెలిపింది. ఈ సందర్భంలో ఆర్టికల్ 171 ప్రకారం కేబినెట్ నిర్ణయాన్ని గవర్నర్ ఆపడానికి వీల్లేదని హైకోర్టు దృష్టికి పిటిషనర్ తరుపు న్యాయవాదులు తీసుకెళ్లారు. -
‘కాళేశ్వరం’ బాధ్యులపై చర్యలు షురూ
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ పియర్ల కుంగుబాటుపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం సమర్పించిన ప్రాథమిక విచారణ నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు ప్రారంభించామని అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎ.సుదర్శన్‌రెడ్డి హైకోర్టుకు తెలిపారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) ఏర్పాటు చేసిన కమిటీ పూర్తి స్థాయి పరిశీలన చేసి నివేదిక సమర్పించిన తర్వాత మరిన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. పదవీ విరమణ పొందిన సుప్రీంకోర్టు లేదా హైకోర్టు న్యాయమూర్తితో విచారణ అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామన్నారు. పిల్‌పై విచారణ: మేడిగడ్డ ఘటనకు కారకులెవరో తేల్చేందుకు గాను కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) దర్యాప్తునకు ఆదేశించాలని విజ్ఞప్తి చేస్తూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. కాంగ్రెస్ నేత జి.నిరంజన్ గత నవంబర్‌లో ఈ పిల్ దాఖలు చేశారు. కాగా ఫైలింగ్ నంబర్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్‌కుమార్ ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున న్యాయవాది టి.నరేందర్‌రావు, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ సుదర్శన్‌రెడ్డి, కేంద్రం తరఫున న్యాయవాది ఎల్.ప్రణతిరెడ్డి, సీబీఐ తరఫున స్పెషల్ పీపీ టి.సృజన్‌కుమార్‌రెడ్డి హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం కొన్ని అవకతవకలు గుర్తించింది మేడిగడ్డ రిజర్వాయర్ కుంగుబాటుపై ప్రభుత్వ దర్యాప్తు ఎంత వరకు వచ్చింది? ఏం చర్యలు తీసుకున్నారు? తదితర వివరాలతో నివేదిక అందజేయాలని గత నెల విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఇందుకు సంబంధించిన నివేదికను ధర్మాసనానికి ఏజీ అందజేశారు. అనంతరం వాదనలు వినిపించారు. ‘కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కొన్ని అవకతవకలు జరిగినట్లు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఎన్డీఎస్ఏ అధికారులు గత ఏడాది అక్టోబర్ 24, 25 తేదీల్లో ప్రాజెక్టును సందర్శించి ప్రాథమిక విచారణ జరిపారు. మేడిగడ్డ బ్యారేజీ పియర్ కుంగిపోవడానికి కారణాలను ఎన్డీఎస్ఏ సమర్పించింది. ‘ప్రణాళిక, రూపకల్పన, నాణ్యత, నియంత్రణ, ఆపరేషన్–నిర్వహణకు సంబంధించిన సమస్యలతో పాటు పియర్లు ఏకశిలగా ఉండటంతో కదిలి పగుళ్లు ఏర్పడ్డాయి. ఇతర కారణాలు కూడా ఉండొచ్చు. కచ్చితమైన కారణాలను గుర్తించడానికి పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలి..’అని ప్రాథమికంగా అభిప్రాయపడింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణకు ఆదేశించింది. ఈ విభాగం ప్రాథమిక విచారణ జరిపి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక సమర్పించింది. దీని ఆధారంగా ఈఎన్సీ వెంకటేశ్వర్లును తొలగించాం. ఇతర అధికారులపై కూడా చర్యలు తీసుకుంటాం. అయితే ‘కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్, 1952లోని సెక్షన్ 3(1) ప్రకారం హైకోర్టు/సుప్రీంకోర్టు మాజీ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది’అని వివరించారు. ఈ నేపథ్యంలో తదుపరి విచారణను ధర్మాసనం 4 నెలలకు వాయిదా వేసింది. -
డ్రగ్స్ కేసు.. హైకోర్టులో పిటిషన్ విత్‌డ్రా చేసుకున్న క్రిష్
రీసెంట్గా టాలీవుడ్లో డ్రగ్స్ కేసు కలకలం రేపింది. మిగతా వాళ్ల సంగతి పక్కనబెడితే పవన్ కల్యాణ్‌తో సినిమా చేస్తున్న డైరెక్టర్ క్రిష్ పేరు తెరపైకి రావడం చర్చనీయాంశంగా మారింది. డ్రగ్స్ కేసులో క్రిష్ పేరు బయటకు రాగానే విచారణకు హాజరు కావాలని పోలీసులు ఆదేశించారు. తొలుత సరేనని ఒప్పుకొన్న క్రిష్.. ముంబయిలో ఉన్నానని రెండు రోజులు టైమ్ కావాలని కోరాడు. (ఇదీ చదవండి: 'అజ్ఞాతవాసి' పవన్ కల్యాణ్ పొలిటికల్ సినిమా) కానీ అంతలోనే తనన పోలీసులు అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ డైరెక్టర్ క్రిష్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. అది అలా ఉండగానే తాజాగా డ్రగ్స్ కేసులో పోలీసుల ముందు క్రిష్ విచారణకు హాజరయ్యాడు. టెస్టుల్లో నెగిటివ్ అని తేలింది. దీంతో క్రిష్.. తన పిటిషన్‌ని విత్ డ్రా చేసుకుంటున్నట్లు అతడి తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలియజేశారు. (ఇదీ చదవండి: డ్రగ్స్ కేసులో డైరెక్టర్ క్రిష్.. కీలక వ్యాఖ్యలు చేసిన మాదాపుర్ డీసీపీ) -
ఆ 553 పోస్టులను మెరిట్ ప్రకారం భర్తీ చేయండి
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ శాఖలో ఖాళీగా ఉన్న 553 జూనియర్ లైన్మెన్ (జేఎల్ఎం) పోస్టులను పరీక్షలు నిర్వహించిన వారితో భర్తీ చేయాలని తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్కంపెనీ లిమిటెడ్ (టీఎస్ఎస్పీడీసీఎల్)ను హైకోర్టు ఆదేశించింది. జేఎల్ఎం నియామకాలకు రాష్ట్రపతి ఉత్తర్వులు, ‘స్థానికత’లాంటి అంశాలు వర్తించవని తేల్చిచెప్పింది. ఇప్పటికే స్తంభం ఎక్కే పరీక్ష నిర్వహిస్తే వారితో పోస్టులను భర్తీ చేయాలని, ఒకవేళ ఆ పరీక్ష నిర్వహించిన వారు లేకుంటే వెంటనే నిర్వహించి ఖాళీలను భర్తీ చేయాలని స్పష్టం చేసింది. 2019లో టీఎస్ఎస్పీడీసీఎల్ 2,500 జేఎల్ఎం పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. దీనికి రాష్ట్రపతి ఉత్తర్వులను అమలు చేయడాన్ని సవాల్ చేస్తూ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన తిరుమలేశ్ సహా మరికొందరు హైకోర్టులో 2020లో పిటిషన్లు దాఖలు చేశారు. జిల్లాల విభజన కారణంగా అటు ఉమ్మడి జిల్లాకు, ఇటు కొత్త జిల్లాకు కాకుండా తాము నష్టపోయామని పేర్కొన్నారు. ఈ పిటిషన్లపై జస్టిస్ మాధవీదేవి విచారణ చేపట్టి గురువారం తీర్పు వెలువరించారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది డి.ప్రకాశ్‌రెడ్డి, న్యాయవాదులు సుంకర చంద్రయ్య, చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయూమూర్తి.. రాష్ట్రపతి ఉత్తర్వులను జేఎల్ఎం పోస్టులకు వర్తింపజేయలేరని టీఎస్ఎస్పీడీసీఎల్కు తేల్చిచెప్పారు. కొత్తగా ఏర్పాటైన జిల్లాలను యూనిట్‌గా తీసుకొని 95 శాతం స్థానిక రిజర్వేషన్లు అమలు చేయడాన్ని తప్పుబడుతూ కొత్త జిల్లాల అభ్యర్థులు ఉమ్మడి జిల్లాకు నాన్ లోకల్ కారని చెప్పారు. ఇప్పటికే 1,900కుపైగా పోస్టులను అధికారులు భర్తీ చేయడంతో మిగిలిన ఖాళీలను మెరిట్ ప్రకారం భర్తీ చేయాలని ఆదేశించారు. -
చంద్రబాబు తీరును తప్పుబట్టిన తెలంగాణ హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 850 ఎకరాలు.. కారుచౌక ధరకు.. అదీ హైదరాబాద్‌లో అత్యంత విలువైన ప్రాంతం గచ్చిబౌలో.. ఒక్క రోజులో చకచకా అనుమతులిచ్చేశారు. కంపెనీ ఏర్పాటైన 5 రోజులకే రూ.వేల కోట్ల విలువైన భూమి అప్పగించేశారు. ఆపద్ధర్మ ప్రభుత్వంగా ఉంటూ ‘ఐఎంజీ అకాడెమీస్ భారత ప్రైవేట్ లిమిటెడ్ (ఐఎంజీబీపీఎల్)’కు 850 ఎకరాలు కేటాయించేలా చంద్రబాబు సర్కారు అవగాహన ఒప్పందం(ఎంవోయూ) చేసుకుంది. వెంటనే 400 ఎకరాలను సేల్‌డీడ్ ద్వారా ధారాదత్తం చేసేసింది. క్రీడా మౌలిక వసతుల కల్పన కోసం అంటూ 2003లో నాటి చంద్రబాబు నాయుడి సర్కారు చేసిన నిర్వాకంలో... ప్రభుత్వ పెద్దల తీరును తెలంగాణ హైకోర్టు తప్పుబట్టింది. ఏకపక్షంగా అంత భూమిని అప్పగించడంలో ప్రభుత్వంలోనూ దోషులున్నారని కోర్టు వ్యాఖ్యానించింది. తరువాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం 2006లో సేల్‌డీడ్‌ను రద్దు చేయటాన్ని కోర్టు ప్రస్తావిస్తూ... భూములను వెనక్కి తీసుకున్న ప్రభుత్వం దీనికి కారకులైన అధికారులు, నాయకులపై చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించింది. నాడు ప్రభుత్వం భూముల కేటాయింపును రద్దు చేయటాన్ని సవాలు చేస్తూ 2006లో బిల్లీరావు వేసిన పిటిషన్, ఇతర పిటిషన్లపై గురువారం హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్‌కుమార్ జూకంటితో కూడిన ధర్మాసనం విచారణ జరిపిన సందర్భంగా పై వ్యాఖ్యలు చేసింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఏ.సుదర్శన్‌రెడ్డి సుదీర్ఘ వాదనలు వినిపించారు. 5 రోజులకే 850 ఎకరాలు... ప్రభుత్వం తరఫున ఏజీ సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘ఐఎంజీ అకాడెమీస్ భారత ప్రైవేట్ లిమిటెడ్‌తో రాష్ట్ర(చంద్రబాబు) ప్రభుత్వం 2003 ఆగస్టు 9న 850 ఎకరాలు కేటాయించేలా ఎంవోయూ కుదుర్చుకుంది. విచిత్రమేంటంటే.. అంతకు కేవలం 5 రోజుల ముందే 2003, ఆగస్టు 5న కంపెనీ ఏర్పాటైంది. అలాంటి కంపెనీకి ఎలాంటి టెండర్లు, బిడ్డింగ్ లేకుండా బంజారాహిల్స్ నుంచి శిల్పారామం మార్గంలోని మాదాపూర్ పరిధిలోకి వచ్చే రూ.వేల కోట్ల విలువైన ప్రజల భూమిని చంద్రబాబు ప్రభుత్వం స్వల్ప ధరకు అప్పగించింది. యువజన, సాంస్కృతిక, పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శితోపాటు నాటి ముఖ్యమంత్రి(చంద్రబాబు)తో కలిపి 6 దశల ఐఎంజీబీ ఒప్పందానికి ఆగమేఘాల మీద ఒక్కరోజులోనే అన్ని అనుమతులు జారీ చేశారు. 2003, నవంబర్ 14న అప్పటి ముఖ్యమంత్రి అభ్యర్థన మేరకు అసెంబ్లీని గవర్నర్ రద్దు చేయడం గమనార్హం (అంటే.. అసెంబ్లీ రద్దుకు 3 నెలల ముందు ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు). 2004, ఫిబ్రవరి 10న 400 ఎకరాల భూమిని ఐఎంజీబీకి అప్పగిస్తూ సేల్ డీడ్ చేశారు. అయితే ఏ అంతర్జాతీయ సంస్థతో సంబంధం లేని ఐఎంజీ భారత్‌కు రూ.వేల కోట్ల భూముల అప్పగింతపై రాష్ట్ర ప్రభుత్వం 2006లో కమిటీ నియమించింది. ఆ కమిటీ నివేదిక మేరకు ఐఎంజీ భారత్‌తో ఎంవోయూను, సేల్‌డీడ్‌ను ప్రభుత్వం రద్దు చేసింది’ అని వెల్లడించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం... తదుపరి విచారణను ఈనెల 28కి వాయిదా వేసింది. -
75 గజాల్లోపు ఉన్నా.. అనుమతి తప్పనిసరి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 75 చదరపు గజాల కంటే తక్కువ విస్తీర్ణం ప్లాట్‌లో ఎలాంటి నిర్మాణాన్ని చేపట్టాలనుకున్నా.. భవన యజమానులు మున్సిపాలిటీ లేదా కార్పొరేషన్ నుంచి ధ్రువీకరణ పత్రాన్ని పొందడం తప్పనిసరి అని హైకోర్టు స్పష్టం చేసింది. 75 చదరపు గజాల కంటే తక్కువ ఉన్నా.. ఎక్కువ ఉన్నా అధికారుల నుంచి ధ్రువీకరణ, పని ప్రారంభ ఉత్తర్వును పొందాలని, దీనికి ఎలాంటి మినహాయింపు లేదని తేల్చిచెప్పింది. తమ ప్లాట్లలో నిర్మాణ పనులను ఆపివేయాలంటూ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) నోటీసులు జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ నేరేడ్మెట్ వినాయకనగర్‌కు చెందిన ఒక కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులు పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్లలో తండ్రీ కొడుకులు, ప్లాట్‌ను రెండు భాగాలుగా విభజించారు. టీఎస్ బీపాస్ చట్టం–2020 ప్రకారం నిర్మాణాలకు రిజిస్ట్రేషన్ చేసుకుని ఒక్కొక్కటి 40 చదరపు గజాల్లో నిర్మాణాన్ని ప్రారంభించారు. మరొక పిటిషనర్ 54 చదరపు గజాలలో నిర్మాణాన్ని ప్రారంభించారు. అయితే వీరి నిర్మాణాలపై పొరుగు వారు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిర్మాణాలను ఆపివేయాలంటూ జీహెచ్ఎంసీ నోటీసులు జారీ చేసింది. అయితే టీఎస్ బీపాస్ చట్ట ప్రకారం నిర్మాణాలను ప్రారంభించామని.. జీహెచ్ఎంసీ ఇచి్చన నోటీసులను రద్దు చేస్తూ ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్లు కోరారు. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ తడకమళ్ల వినోద్‌కుమార్ విచారణ చేపట్టారు. జీహెచ్ఎంసీ తరఫున స్టాండింగ్ కౌన్సిల్ వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్లు రిజిస్ట్రేషన్ చేసుకుంటే మాత్రమే సరిపోదని, దాని పరిశీలన తర్వాతే నిర్మాణంపై ముందుకు వెళ్లాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని టీఎస్ బీపాస్ చట్టంలోని సెక్షన్ 7 చెబుతోందని చెప్పారు. రిజిస్ట్రేషన్ తర్వాత అధికారులు నిర్ణయం తీసుకోవడానికి 21 రోజుల సమయం ఉంటుందని, ఆ తర్వాత ఎలాంటి కారణం చూపకుండా దరఖాస్తును ఆపితే పిటిషనర్లు ముందుకు వెళ్లవచ్చని తెలిపారు. కానీ, పిటిషనర్లు జనవరి 9న రిజిస్ట్రేషన్ చేసి, వెంటనే నిర్మాణం ప్రారంభించారని పేర్కొన్నారు. దీంతో అదే నెల 18న జీహెచ్ఎంసీ నోటీసులు జారీ చేసిందని వెల్లడించారు. టీఎస్ బీపాస్ నిబంధనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. జీహెచ్ఎంసీ వాదనలను సమర్థించారు. 75 చదరపు గజాల కంటే తక్కువ ప్లాట్లలో నిర్మాణానికి ప్రారంభ అనుమతి సర్టీఫికెట్ అవసరమని స్పష్టం చేశారు. అయితే వీటికి రూ.1 మాత్రమే నామమాత్రపు రుసుము ఉంటుందని, నిర్మాణం పూర్తయిన తర్వాత ఆక్యుపెన్సీ సర్టీఫికెట్ పొందవలసిన అవసరం ఉండదని తేల్చిచెప్పారు. -
ఆరు నెలల్లో 7,877 కేసుల పరిష్కారం
సాక్షి, హైదరాబాద్: ఆరు నెలల్లోనే 7,877 కేసులను పరిష్కారించామని, ఈ విషయంలో న్యాయమూర్తులు, న్యాయవాదులతో పాటు ఇతర సిబ్బంది కృషి ప్రశంసనీయమని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే కొనియాడారు. ఆన్లైన్ సేవలను మరింత చేరువ చేయడం, కాగిత రహిత ఫైలింగ్ వంటి అంశాలు కేసుల సత్వర పరిష్కారానికి దోహదం చేస్తున్నాయని చెప్పారు. భవిష్యత్‌లో మరిన్ని సాంకేతిక సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం హైకోర్టు ప్రాంగణంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం కొత్త హైకోర్టు నిర్మాణానికి 100 ఎకరాలు కేటాయించడం హర్షణీయమన్నారు. త్వరలోనే భవన నిర్మాణం ప్రారంభం కానుందని, అందరికీ అన్ని వసతులు, సాంకేతికతతో నిర్మాణం జరుగుతుందని పేర్కొన్నారు. కొత్త జిల్లాల్లోనూ న్యాయస్థానాల నిర్మాణానికి ప్రభుత్వం భూములు కేటాయించిందన్నారు. ఈ జిల్లాల్లో అన్ని వసతులతో భవన నిర్మాణాలు జరిగేలా చర్యలు చేపడతామని వెల్లడించారు. అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎ.సుదర్శన్‌రెడ్డి, తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్ ఎ.నరసింహారెడ్డి, హైకోర్టు అడ్వొకేట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నాగేశ్వర్రావు, న్యాయమూర్తులు, రిజిస్ట్రార్లు, ఏఏజీలు ఇమ్రాన్‌ఖాన్, తేరా రజనీకాంత్‌రెడ్డి, న్యాయవాదులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంబేడ్కర్ విగ్రహ ప్రతిష్టాపనకు భూమిపూజ.. హైకోర్టు ఆవరణలో అంబేడ్కర్ విగ్రహ ప్రతిష్టాపనకు సీజే జస్టిస్ అలోక్ అరాధే శుక్రవారం భూమిపూజ చేశారు. గణతంత్ర దినోత్సవం రోజున ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు సంతోషంగా ఉన్నదన్నారు. -
జోక్యం చేసుకోలేం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికలకు ఇప్పటికే నోటిఫికేషన్ వచ్చినందున జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 329(బీ) ప్రకారం.. ఈ దశలో జోక్యం చట్టవిరుద్ధమని అభిప్రాయపడింది. ఎమ్మెల్యేలుగా ఎన్నికైన పాడి కౌశిక్‌రెడ్డి, కడియం శ్రీహరి రాజీనామాలతో ఖాళీ ఏర్పడిన రెండు ఎమ్మెల్సీ సీట్లకు విడివిడిగానే ఎన్నిక నిర్వహించాలని షెడ్యూల్లో ఈసీ పేర్కొంది. రెండింటికీ బ్యాలెట్ పేపర్లను సైతం వేర్వేరు సెట్స్ సిద్ధం చేయాలని, ఒకటి తెలుపు, మరొకటి గులాబీ రంగులో ముద్రించాలని వివరించింది. పోలింగ్ స్టేషన్లనూ విడిగానే ఏర్పాటు చేయాలంది. ఓటర్ల జాబితా కూడా విడివిడిగా రూపొందించాలని నిర్దేశించింది. ఓట్ల లెక్కింపు కూడా విడివిడిగానే జరుగుతుందని పేర్కొంది. ఎన్నికల అధికారులు సహా అన్నీ వేర్వేరుగానే ఉండాలని నిర్దేశించింది. అయితే విడివిడిగా జరిగితే ప్రతి ఎన్నికకు అసెంబ్లీలోని 119 మంది ఎమ్మెల్యేలు ఓటర్లుగా మారుతారు. దీంతో కాంగ్రెస్సే రెండు స్థానాలు గెలిచే అవకాశం ఉంటుంది. ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ అధికార ప్రతినిధి పటోళ్ల కార్తీక్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్‌కుమార్ జూకంటి ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తూ.. భారత రాజ్యాంగంలోని ఆర్టీకల్ 171(4), ఎన్నికల ప్రవర్తన నియమావళి 1961లోని రూల్ 70 ప్రకారం.. ఒకేసారి ముగియనున్న (నవంబర్ 30, 2027) ఎమ్మెల్సీ పదవీ కాల పరిమితికి ఉప ఎన్నికలు నిర్వహిస్తే ఒకే ఎన్నిక నిర్వహించాలన్నారు. విడివిడిగా ఎన్నిక జరుపుతామంటూ జనవరి 4.. ఎన్నికల కమిషన్ విడుదల చేసిన నోటిఫికేషన్ రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. ఈసీ తరఫున అవినాశ్ దేశాయ్ వాదనలు వినిపిస్తూ.. ప్రజాప్రాతినిధ్య చట్టం, 1950లోని సెక్షన్ 151 ప్రకారమే కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసిందని వివరించారు. వాదనలు విన్న ధర్మాసనం.. పిటిషన్‌ను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. -
‘కేడర్ వివాదం’లో కేంద్రమే నిర్ణయం తీసుకోవాలి
సాక్షి, హైదరాబాద్: ఆలిండియా సర్వీస్ (ఏఐఎస్) అధికారులను రాష్ట్రాల మధ్య కేటాయించే అప్పీలేట్ అథారిటీ బాధ్యతను కోర్టులు నిర్వర్తించనందున.. క్యాట్ ఇచ్చిన ఆదేశాలను రద్దు చేసి, కేంద్రమే నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు జారీ చేస్తామని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇరు రాష్ట్రాల మధ్య అధికారుల కేటాయింపును మరోసారి పరిశీలించి పదేళ్లకు పైగా తెలంగాణలో ఉంటున్న వారు, త్వరలో సర్విస్ ముగిసేవారికి సంబంధించి సహేతుక నిర్ణయం తీసుకుంటుందని అభిప్రాయపడింది. అయితే అలా వద్దని పిటిషన్ వారీగా విచారణ జరపాలని పిటిషనర్ తరఫు న్యాయవాది విజ్ఞప్తి చేశారు. దీంతో అధికారుల కేటాయింపునకు సంబంధించిన కేడర్ వివాదంలో వాదనలను వచ్చే నెల 2వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది. 2014 నుంచి కొనసాగుతున్న కేడర్ వివాదం 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన నేపథ్యంలో కేంద్రం నియమించిన ప్రత్యూష్ సిన్హా కమిటీ నివేదిక ప్రకారం ఏఐఎస్ ఉద్యోగుల విభజన జరిగింది. నాటి నుంచి కొందరు ఐఏఎస్, ఐపీఎస్‌ల కేడర్ వివాదం సాగుతోంది. విభజన సమయంలో పలువురు అధికారులను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించారు. అయితే వీరిలో కొందరు ఈ కేటాయింపులపై కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ (క్యాట్)ను ఆశ్రయించి.. తెలంగాణలో విధులు నిర్వహించేలా ఉత్తర్వులు పొందారు. క్యాట్ ఉత్తర్వులను కేంద్ర ప్రభుత్వం తప్పుబడుతూ.. తెలంగాణ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలు చేసింది. ఈ క్రమంలోనే గత జనవరిలో తెలంగాణ సీఎస్ సోమేశ్‌కుమార్‌ను ఏపీకి వెళ్లాల్సిందేనంటూ ఇదే హైకోర్టు సీజే ధర్మాసనం తీర్పునిచ్చింది. అయితే కేడర్, సర్వీస్ సహా ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉన్న దృష్ట్యా తమ పిటిషన్లను విడిగా విచారణ జరపాలని డీజీపీ అంజనీకుమార్ సహా ఇతర అధికారులు కోరడంతో విచారణను సీజే ధర్మాసనం మరో బెంచ్‌కు బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్లపై జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలీ, జస్టిస్ నామవరపు రాజేశ్వర్‌రావు ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. ఓ పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది కె.లక్ష్మి నర్సింహ వాదనలు వినిపిస్తూ.. ధర్మాసనం అలా నిర్ణయా న్ని కేంద్రానికి వదిలేయ వద్దని విజ్ఞప్తి చేశారు. పిటి షన్ల వారీగా విచారణ చేయాలని కోరారు. ఇతర పిటిషన్ల న్యాయవాదులు కూడా దీన్ని సమరి్థంచారు. దీంతో తదుపరి విచారణ కోసం ధర్మాసనం.. విచారణను వచ్చే నెల 2కు వాయిదా వేసింది. -
ఫైల్స్ చోరీ కేసు.. హైకోర్టును ఆశ్రయించిన తలసాని ఓఎస్డీ
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీ కల్యాణ్ కుమార్ తాజాగా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. పశుసంవర్ధక శాఖలో ఫైల్స్ చోరీపై నమోదైన కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలుచేశారు. అయితే, మూడు రోజుల క్రితం.. పశుసంవర్ధక శాఖలో ఫైల్స్ చోరీ అయిన ఉదంతంలో కల్యాణ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. కార్యాలయం నుంచి పలు కీలక పైళ్లను తీసుకెళ్లారని, మిగతా ఫైళ్లను చిందరవందరగా పడేశారని పేరొన్నారు. ఆఫీస్‌లో సీసీ కెమెరాలను ధ్వంసం చేశారన్న వాచ్‌మన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కల్యాణ్‌తోపాటు మరో నలుగురిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ కోరుతూ కల్యాణ్ హైకోర్టును ఆశ్రయించారు. ఇదిలా ఉండగా.. మాసబ్‌ట్యాంక్‌లోని పశు సంవర్థకశాఖ కార్యాలయంలోనికి అక్రమంగా ప్రవేశించిన కల్యాణ్ బీరువాలో ఉన్న ద్రస్తాలను కారులో తరలించుకునిపోయారు. వాచ్‌మన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతడిపై కేసు నమోదు చేశారు. అక్కడి సిబ్బంది సహాయంతో బీరువాలో ఉన్న ఫైళ్లను చింపేశారు. అంతటితో ఆగకుండా చించివేసిన ఫైళ్లను తన కారులో తరలించుకుని పోయారు. అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు సైతం పనిచేయకుండా చేశారు. దీంతో వాచ్మెన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కళ్యాణ్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వివరించారు. అతడికి సహకరించిన కంప్యూటర్ ఆపరేటర్స్ ఎలిజ మోహన్, అటెండర్లు వెంకటేశ్, ప్రశాంత్‌లపైనా కేసులు నమోదు చేశామని పోలీసులు చెప్పారు. -
27న సింగరేణి ఎన్నికలు
శ్రీరాంపూర్ (మంచిర్యాల), గోదావరిఖని, సింగరేణి (కొత్తగూడెం): హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 27న సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి సోమవా రం హైదరాబాద్‌లోని డిప్యూటీ సీఎల్సీ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి శ్రీనివాసులు కార్మిక సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యా రు. మొత్తం 13 కార్మిక సంఘాల నాయకులు, కంపెనీ అధికారులు పాల్గొన్నారు. ఇప్పటివరకు ఎన్ని కల షెడ్యూల్ ప్రకారం నామినేషన్ల పర్వం, స్క్రూటి నీ పూర్తయిన విషయం తెలిసిందే. కోర్టుకు వెళ్లిన కారణంగా విడుదల చేయని ఓటరు జాబితాను కంపెనీ విడుదల చేసింది. జాబితా ప్రతుల ను రిటర్నింగ్ అధికారి కార్మిక సంఘాలకు అందజేశారు. 8న తుదిజాబితా ఈనెల 6లోగా అభ్యంతరాలు స్వీకరిస్తారు. 8న తుదిజాబితా ప్రచురించనున్నారు. బీఆర్ఎస్ అను బంధ టీబీజీకేఎస్‌తోపాటు ఐదు జాతీయ కార్మిక సంఘాలు ఐఎన్టీయూసీ, హెచ్ఎంఎస్, బీఎంఎస్, సీఐటీయూ, ఏఐటీయూసీ సహా 13 సంఘాలు బరిలో ఉంటున్నాయి. గుర్తింపు, ప్రాతినిధ్య సంఘం కోసం ఒకే ఓటు పద్ధతి అమలు చేస్తారు. ఎన్నికల నిర్వహణకు ఆరు జిల్లాల కలెక్టర్ల ద్వారా రెవెన్యూ యంత్రాంగాన్ని సిద్ధం చేయాలని కోరా రు. గుర్తులను రిటర్నింగ్ అధికారి శ్రీనివాసులు ఇప్పటికే కేటాయించారు. ఈ ఎన్నికల్లో 39748 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకో నున్నారు. శాశ్వత ఉద్యోగులు మాత్రమే ఓటు హ క్కు వినియోగించుకుంటారు. సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిన ఈనెల 27న పోలింగ్ నిర్వహిస్తారు. అదేరోజు రాత్రి 7గంటల నుంచి ఓట్లు లెక్కిస్తారు. సమావేశంలో ఏఐటీయూసీ అధ్యక్షుడు వి.సీతారామయ్య, టీబీజీకేఎస్ అధ్యక్షుడు బి.వెంకట్రావు, ఐఎనీ్టయూసీ సెక్రటరీ జనరల్ బి.జనక్‌ప్రసాద్, హెచ్ఎమ్మెస్ అధ్యక్షుడు రియాజ్ అహ్మద్, బీఎంఎస్ అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య, సీఐటీయూ కార్యదర్శి మంద నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు. ఏరియాల వారీగా ఓటర్లు బెల్లంపల్లి ఏరియాలో 985 మంది ఓటర్లు, మందమర్రిలో 4876, శ్రీరాంపూర్‌లో 9124, కార్పొరేట్లో 1192, కొత్తగూడెంలో 2370, మణుగూరులో 2414, ఎల్లందులో 603, నైనీబ్లాక్‌లో 2, భూపాలపల్లిలో 5350, ఆర్జీ 1లో 5430, ఆర్జీ 2లో 3479, అడ్రియాలాలో 944, ఆర్జీ 3లో 3063 మంది ఓటర్లు ఉన్నారు. ఈ నెల ఒకటి నాటికి రిటైర్డ్ అయిన వారు పోనూ మొత్తం 39748మంది ఉన్నారు.