Irrigation Department
-
‘సీతారామ’ అంచనాలు మోపెడు!
సాక్షి, హైదరాబాద్: సీతారామ ఎత్తిపోతల పథకం అంచనా వ్యయం మరింతగా పెంచేందుకు రంగం సిద్ధమైంది. 2016 ఫిబ్రవరి 18న రూ.7,926.14 కోట్ల అంచనా వ్యయంతో గత ప్రభుత్వం సీతారామ ప్రాజెక్టు నిర్మాణా నికి అనుమతులు జారీ చేసింది. ఆ తర్వాత 2018 ఆగస్టు 2న రూ.13,057.98 కోట్లకు అంచనా వ్యయాన్ని పెంచింది. తాజాగా అంచనా వ్యయాన్ని రూ.19,800 కోట్లకు సవరిస్తూ పాలనాపర అనుమతులు జారీ చేయాలని ప్రాజెక్టు నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్న కొత్తగూడెం చీఫ్ ఇంజనీర్ ఎ.శ్రీనివాస్ రెడ్డి నీటిపారుదల శాఖకు ప్రతిపాదనలు సమర్పించారు. సరైన అనుమతులు లేకుండానే ప్రాజెక్టు డిస్ట్రి బ్యూటరీల నిర్మాణం, ఇతర పనులకు నీటిపారుదల శాఖ ఇటీవల రూ.1,842 కోట్ల అంచనాతో టెండర్లను ఆహ్వానించడంపై ఇటీవల అధికారుల మధ్య వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టెండర్లను ఆహ్వానించిన అనంతరం పాలనాపర అనుమతులు కోరుతూ ప్రతిపాదనలను సమర్పించడం గమనార్హం. 16 ప్యాకేజీలుగా కాల్వల పనులు 3,28,853 ఎకరాల కొత్త ఆయకట్టు, 3,45,534 ఎకరాల ఆయకట్టు స్థిరీకరించడానికి సీతారామ ప్రాజెక్టును చేపట్టారు. ప్రాజెక్టులో భాగమైన పంప్‌హౌస్‌ల నిర్మాణం, ఇతర ప్రధాన పనులు పూర్తికాగా, డి్రస్టిబ్యూటరీ కాల్వల నిర్మాణం జరగాల్సి ఉంది. ప్రాధాన్యత ప్రాజెక్టుల జాబితాలో సీతారామను చేర్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సత్వరంగా డి్రస్టిబ్యూటరీల పనుల పూర్తికి ఆదేశించింది. ప్రాజెక్టు కాల్వల పనులను 16 ప్యాకేజీలుగా విభజించగా, 1–8 ప్యాకేజీల కింద ప్రధాన కాల్వ, 9–12 ప్యాకేజీలుగా సత్తుపల్లి ట్రంక్ కాల్వ, 13–16 ప్యాకేజీలుగా పాలేరు లింక్ కాల్వ పనులను చేర్చారు. ఇక డిస్ట్రిబ్యూటరీల పనులను మరో 8 ప్యాకేజీలుగా విభజించి రూ.3,858.93 కోట్ల అంచనాలతో అనుమతుల కోసం ప్రతిపాదనలను సమర్పించారు. గతంలో నిర్వహించిన ఓ సమీక్షలో డిస్ట్రిబ్యూటరీల పనులకు తక్షణమే టెండర్లను జరపాలని ప్రభుత్వం ఆదేశించడంతో రూ.1,842 కోట్ల అంచనాలతో కొత్తగూడెం సీఈ టెండర్లను ఆహ్వానించారు. అందులో కేవలం రూ.768 కోట్లకే పరిపాలన అనుమతి ఉండగా, రూ.1,074 కోట్ల పనులకు అనుమతి లేకపోవడం వివాదంగా మారింది. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నిర్వహించిన ఓ సమీక్షలో ఈఎన్సీ (జనరల్) జి.అనిల్‌కుమార్, సీఈ ఎ.శ్రీనివాస్ రెడ్డి ఘర్షణకు దిగి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడంతో ప్రభుత్వం వారిద్దరిని మందలించి సంజాయిషీ కోరింది. దీంతో కొత్తగూడెం సీఈ శ్రీనివాస్ రెడ్డి ఎట్టకేలకు పాలనాపర అనుమతుల కోసం తాజాగా ప్రతిపాదనలు సమర్పించడం గమనార్హం. ప్రామాణిక ధరల పట్టిక 2024–25 ఆధారంగా అంచనాలను రూ.19,800 కోట్లకు పెంచాలని ఆయన కోరారు. స్టేట్ లెవల్ స్టాండింగ్ కమిటీ ఈ ప్రతిపాదనలను పరిశీలించి అనుమతుల కోసం సిఫారసు చేయాలా? వద్దా? అని నిర్ణయం తీసుకోనుంది. -
తక్షణమే సెలవుపై వెళ్లండి!
సాక్షి, హైదరాబాద్: పరిపాలనపరమైన అనుమతుల్లే కుండానే సీతారామ ఎత్తిపోతల పథకం డిస్ట్రిబ్యూటరీల నిర్మాణం, అనుబంధ పనులకు టెండర్ల నిర్వహణలో జరిగిన తప్పిదాలపై రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. సీతారామ ప్రాజెక్టు పనులను పర్యవేక్షిస్తున్న కొత్తగూడెం చీఫ్ ఇంజనీర్ ఎ.శ్రీనివాస్‌రెడ్డిని తక్షణమే సెలవుపై వెళ్లాల్సిందిగా ఆదేశించినట్టు సమాచారం. అలాగే నీటిపారుదల శాఖ ఈఎన్సీ (జనరల్) జి. అనిల్‌కుమార్‌కు సంజాయిషీ నోటీసులు జారీ చేయాల్సిందిగా ఆ శాఖ కార్యదర్శిని కోరినట్టు తెలిసింది. సీతారామ ప్రాజెక్టుపై ఉమ్మడి ఖమ్మం జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వర్రావుతో కలిసి శనివారం జలసౌధలో నిర్వహించిన సమీక్ష సందర్భంగా మంత్రి వారిపై మండిపడినట్టు తెలిసింది. డిస్ట్రిబ్యూటరీలు, ఇతర పనులకు పరిపాలనపరమైన అనుమతుల కోసం ప్రతిపాదనలు సమర్పించినా సహకరించడం లేదని ఈఎన్సీపై సీఈ శ్రీనివాస్‌రెడ్డి ఆరోపించగా, అసలు ఇప్పటివరకు తనకు డిటైల్డ్ ఎస్టిమేట్లు (సవివర అంచనాలు) సమర్పించలేదని ఈఎన్సీ అనిల్‌కుమార్ బదులిచ్చినట్టు తెలిసింది. డిటైల్డ్ ఎస్టిమేట్లు లేకుండా అనుమతులిచ్చేస్తే తర్వాత పనుల అంచనాలు భారీగా పెరిగే అవకాశం ఉంటుందని ఆయన స్పష్టం చేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఇద్దరు అధికారులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. మంత్రుల ఆదేశాల మేరకే..!వాస్తవానికి డిస్ట్రిబ్యూటరీల నిర్మాణం, ఇతర పనులకు పాలనాపరమైన అనుమతులు జారీ చేయాలని కోరుతూ కొత్తగూడెం సీఈ గత నెలలో నీటిపారుదల శాఖకు ప్రతిపాదనలు పంపించారు. అయితే డిటైల్డ్ ఎస్టిమేట్లతో పాటు డిజైన్లు, డ్రాయింగ్లు కూడా లేకపోవడంతో వాటిని సమర్పించాలని కోరుతూ ఈఎన్సీ ఆ ప్రతిపాదనలను తిప్పి పంపించారు. ఇప్పటివరకు డిటైల్డ్ ఎస్టిమేట్లతో పాటు డిజైన్లు, డ్రాయింగ్స్‌ను సమర్పించలేదు. మరోవైపు గత నెలలో నిర్వహించిన ఓ సమీక్షలో మంత్రులు ఆదేశించడంతో ప్రాజెక్టు అధికారులు తొందరపడి టెండర్లను ఆహ్వానించినట్టు తెలుస్తోంది. అయితే తక్షణమే టెండర్లు నిర్వహించాలని మంత్రులు ఆదేశించిట్టు మీటింగ్ మినట్స్‌లో సైతం ఉందని, అందుకే ఆహ్వానించట్టు బాధ్యులైన అధికారులు పేర్కొంటున్నారని సమాచారం. కాగా పాలనాపరమైన అనుమతులే కాకుండా ఆర్థిక శాఖ ఆమోదం కూడా లేకుండా టెండర్లను ఆహ్వానించడం నిబంధనల తీవ్ర ఉల్లంఘనే అని నీటిపారుదల శాఖలో చర్చ జరుగుతోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో నాగార్జునసాగర్ కాల్వకు గండ్లుపడగా, పాలనాపరమైన అనుమతుల జారీ తర్వాతే అత్యవసర మరమ్మతులు చేపట్టారని, అనుమతుల విషయంలో మినహాయింపు ఉండదని అధికారులు పేర్కొంటున్నారు. అనుమతుల్లేకుండా బిడ్లను ఎలా తెరుస్తారు ?డిస్ట్రిబ్యూటరీల నిర్మాణం, ఇతర పనులకు సంబంధించిన ఆరు టెండర్లకు ఈ నెల 8తో, ఒక టెండర్‌కు ఈ నెల 4తో బిడ్ల దాఖలు గడువు ముగియనుంది. కమిషనరేట్ ఆఫ్ టెండర్స్ (సీఓటీ)లోని చీఫ్ ఇంజనీర్ల కమిటీ బిడ్లను పరిశీలించి ఎల్–1 బిడ్డర్‌ను ఖరారు చేయాల్సి ఉంటుంది. అయితే సంబంధిత పనులకు పాలనాపరమైన అనుమతులు, ఆర్థిక శాఖ ఆమోదం లేకుండా బిడ్లను తెరిచి పరిశీలించడానికి నిబంధనలు ఒప్పుకోవని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. గతంలో ఇలాంటి సంఘటనలు జరిగి ఉంటే ఎలాంటి చర్యలు తీసుకున్నారో పరిశీలించి ముందుకు వెళ్లాల్సి ఉంటుందని ఓ అధికారి ‘సాక్షి’కి తెలిపారు.టెండర్లపై రాజకీయ రగడ– ఇప్పుడు మీపై ఏ కమిషన్ వేయాలి?: కేటీఆర్పాలనాపరమైన అనుమతుల్లేండానే సీతారామ ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీలు, ఇతర పనులకు అధికారులు టెండర్లను ఆహ్వానించినట్టు వెలుగులోకి రావడంతో రాజకీయ రగడ ప్రారంభమైంది. సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 5 మధ్య ఏడు పనులకు రూ. 1,842 కోట్ల అంచనాతో నీటిపారుదల శాఖ టెండర్లను ఆహ్వానించగా, అందులో రూ. 1,074 కోట్ల పనులకు పాలనాపరమైన అనుమతుల్లేవంటూ ఆదివారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. వార్తా కథనాన్ని షేర్ చేస్తూ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం, పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుల మీద పగబట్టి హాహాకారాలు చేస్తూ బురదజల్లిన వారు..అనుమతి లేకుండానే రూ.1,074 కోట్ల పనులకు టెండర్లు ఎలా పిలుస్తారంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రజాపాలన అని రోజుకు పదిమార్లు ప్రగల్భాలు పలికేటోళ్లు ఇలా ఎలా చేస్తారని ప్రశ్నించారు. ఒక సమావేశంలో త్వరగా టెండర్లు పిలవాలని ఆదేశించి, మరో సమావేశంలో ఇదేంటి అంటూ నంగనాచి మాటలు మాట్లాడడం కాంగ్రెస్ ప్రభుత్వానికే చెల్లిందని ఎద్దేవా చేశారు. ప్రాజెక్టు పూర్తయ్యి కోటి ఎకరాలకు జీవం పోస్తున్న కాళేశ్వరంపై కమిషన్ వేసి విచారణ జరిపిస్తున్న మీపై.. ఇప్పుడు ఏ కమిషన్ వేయాలని ప్రశ్నించారు. ఢిల్లీ నేస్తం..అవినీతి హస్తంకాళేశ్వరంపై కక్షగట్టి రైతుల పొట్టగొట్టారని, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల మీద పగబట్టి మళ్లీ వలసలకు పచ్చజెండా ఊపారని కేటీఆర్ మండిపడ్డారు. ఢిల్లీ నేస్తం–అవినీతి హస్తం అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. సీతారామ ఎత్తిపోతల పథకానికి రూ.7,926.14 కోట్ల అంచనాతో 2016 ఫిబ్రవరి 18న పాలనాపరమైన అనుమతులివ్వగా, ఆ తర్వాత 2018 ఆగస్టులో అప్పటి ప్రభుత్వం రూ.13,057 కోట్లకు అంచనాలను సవరించింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక దీనిని తప్పుబడుతూ రాష్ట్ర మంత్రులు తీవ్ర ఆరోపణలు చేశారు. ఇదే విషయాన్ని ఇప్పుడు గుర్తుచేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ విమర్శలు గుప్పించారు. -
అనుమతి లేకున్నా రూ. వెయ్యి కోట్ల ‘సీతారామ’ టెండర్లు!
సాక్షి, హైదరాబాద్: సీతారామ ఎత్తిపోతల పథకంలో భాగంగా పరిపాలనా అనుమతుల్లేకుండానే సుమారు రూ. 1,074 కోట్ల అంచనా వ్యయంతో డిస్ట్రిబ్యూటరీల నిర్మాణం, ఇతర పనులకు ప్రాజెక్టు అధికారులు టెండర్లను ఆహ్వానించడం నీటిపారుదల శాఖలో వివాదస్పదంగా మారింది. సెపె్టంబర్ 28 నుంచి అక్టోబర్ 5 మధ్య ఏడు పనులకు రూ. 1,842 కోట్ల అంచనాతో నీటిపారుదల శాఖ టెండర్లను ఆహ్వానించింది. అయితే వాటిలో సుమారు రూ. 768 కోట్లు విలువ చేసే పనులకే ఆర్థిక శాఖ ఆమోదం తెలపగా ఆ మేరకు నీటిపారుదల శాఖ పరిపాలనా అనుమతులు జారీ చేసింది. మిగిలిన రూ. 1,074 కోట్ల పనులకు ఆమోదం తెలపడంపై నిర్ణయాన్ని ఆర్థిక శాఖ పెండింగ్‌లో ఉంచింది. అయినప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా ఈ పనులకు ప్రాజెక్టు అధికారులు టెండర్లను ఆహ్వానించారు. ఈ ప్రాజెక్టుపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఉమ్మడి ఖమ్మం జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు శనివారం చేపట్టిన సమీక్షలో ఈ అంశం ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. పరిపాలనా అనుమతుల్లేకుండానే టెండర్లు పిలిచి ప్రభుత్వాన్ని తప్పుదోవపట్టించారని సంబంధిత చీఫ్ ఇంజనీర్‌పై మంత్రి ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. గతంలో మంత్రులు నిర్వహించిన ఓ సమీక్షలో వెంటనే టెండర్లు పిలవాలని ఆదేశించగా.. ప్రాజెక్టు అధికారులు అనుమతులు పొందకుండానే తొందరపాటుతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చర్చ జరుగుతోంది. ప్రభుత్వం సత్వరమే టెండర్లు పిలవాలని ఆదేశిస్తే దానర్థం అనుమతుల్లేకుండానే టెండర్లు ఆహ్వానించాలని కాదని, అనుమతులన్నీ తీసుకోవాల్సిన బాధ్యత సంబంధిత అధికారులదేనని ఉన్నతాధికారులు అంటున్నారు. అనుమతులు రాకుంటే ఏం చేస్తారు? అన్ని ప్రభుత్వ ఇంజనీరింగ్ శాఖల ఈఎన్సీలు/చీఫ్ ఇంజనీర్లతో కూడిన కమిషనరేట్ ఆఫ్ టెండర్స్ (సీఓటీ) కమిటీ ఆమోదించాకే రూ. 10 కోట్లు, ఆపై విలువగల పనుల టెండర్లను ఖరారు చేయాల్సి ఉంటుంది. పనులకు అన్ని రకాల అనుమతులు ఉంటేనే సీఓటీ కమిటీ టెండర్లను ఆమోదిస్తుంది. అనుమతుల ఉత్తర్వుల్లో పేర్కొన్న పదాల్లో స్వల్ప తేడాలున్నా మళ్లీ కొత్త ఉత్తర్వులతో వస్తేనే ఆమోదముద్ర వేస్తుంది. ప్రస్తుతం సీతారామ ప్రాజెక్టు డి్రస్టిబ్యూటరీలకు సంబంధించిన ఆరు టెండర్లకు బిడ్ల దాఖలు గడువు ఈ నెల 8తో ముగియనుండగా మరో టెండర్ గడువు 4తో ముగియనుంది. ఆ తర్వాత ఈ బిడ్లను సీఓటీ కమిటీ పరిశీలించి ఆమోదించాల్సి ఉంది. అయితే అనుమతుల్లేకుండానే టెండర్లు జారీ కావడంతో సీఓటీ కమిటీ నుంచి వాటికి ఆమోదం లభించే అవకాశం లేదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఒకవేళ అనుమతులు లభించకపోతే టెండర్లను రద్దు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేస్తున్నాయి. కాగా, టెండర్లను ఆహ్వానించిన తర్వాత అనుమతుల్లేని పనులకు ర్యాటిఫికేషన్ (క్రమబద్ధీకరణ అనుమతులు) జారీ చేయాలని కోరుతూ నీటిపారుదల శాఖకు ప్రాజెక్టు అధికారులు విజ్ఞప్తి చేయగా అంచనాలను సమర్పించాలని నీటిపారుదల శాఖ ఆదేశించింది. ఇప్పటికే సీతారామపై వివాదాలు... సీతారామ ఎత్తిపోతల పథకానికి రూ. 7,926.14 కోట్ల అంచనాతో 2016 ఫిబ్రవరి 18న ప్రభుత్వం పరిపాలనా అనుమతులిచ్చిoది. ఆ తర్వాత 2018 ఆగస్టులో రూ. 13,057 కోట్లకు అంచనాలను పెంచింది. ఈ ప్రాజెక్టు కింద 3,28,853 ఎకరాల కొత్త ఆయకట్టుతోపాటు 3,45,534 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరపాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే పంప్‌హౌస్‌ల పనులు పూర్తవగా డిస్ట్రిబ్యూటరీలు, ఇతర పనులు జరగాల్సి ఉంది. గత ప్రభుత్వ హయాంలో ఈ పనుల అంచనాలను భారీగా పెంచారని ప్రస్తుత ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఇదే సమయంలో పరిపాలనా అనుమతుల్లేకుండానే అధికారులు టెండర్లను నిర్వహిస్తే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని ఉన్నతాధికారులు అంటున్నారు. ఈ అంశంపై ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్‌ను ‘సాక్షి’ ఫోన్లో సంప్రదించగా ఆయన స్పందించలేదు. -
‘కొడంగల్’ లిఫ్టుపై మీమాంస
సాక్షి,హైదరాబాద్: నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకం టెండర్లకు కమిషనర్ ఆఫ్ టెండర్స్(సీఓటీ) ఆమోదముద్ర లభించలేదు. పలు ఇంజనీరింగ్ శాఖల పనులకు సంబంధించిన టెండర్లపై శనివారం నీటిపారుదల శాఖ ఈఎన్సీ(జనరల్) జి.అనిల్‌కుమార్ నేతృత్వంలోని సీఓటీ సమావేశమై చర్చించింది. ఈ సమావేశంలో నారాయణపేట–కొడంగల్ టెండర్లపై ప్రధానంగా చర్చ జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌తోపాటు నారాయణపేట నియోజకవర్గంలో లక్ష ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించడానికి రూ.4,350కోట్లతో ఈ ప్రాజెక్టును ప్రభుత్వం చేపట్టింది.టెండర్ల ఆమోదంపై నిర్ణయం తీసుకోని సీఓటీప్రాజెక్టును రెండు ప్యాకేజీలుగా విభజించి గత నెల లో టెండర్లను ఆహ్వానించారు. ప్యాకేజీ–1 కింద రూ.1,134.62 కోట్ల అంచనాలతో టెండర్లను పిల వగా, 3.9% అధిక ధరను కోట్ చేసి రాఘవ–జ్యోతి జాయింట్ వెంచర్ ఎల్–1గా నిలిచింది. 4.85% అధిక ధరను కోట్ చేసి ఎల్–2గా మేఘా ఇంజనీ రింగ్ నిలిచింది. రూ.1,126.85 కోట్ల అంచనాలతో రెండో ప్యాకేజీ పనులకు టెండర్లను పిలవగా 3.95% అధిక ధరను కోట్ చేసి ఎల్–1గా మేఘా ఇంజనీరింగ్, 4.8% అధిక ధరను కోట్ చేసిన ఎల్–2గా రాఘవ కన్స్ట్రక్షన్స్ నిలిచాయి. ఈ టెండర్లను సీఓటీ ఆమోదించాల్సి ఉండగా, ఇప్పటికే పలుమార్లు సమావేశమైన సీఓటీ ఏ నిర్ణయం తీసుకోలేకపోయింది. 21న జరిగే సమావేశంలోనైనా...ప్యాకేజీ–1 టెండర్ల విషయంలో సీఓటీలోని కొందరు చీఫ్ ఇంజనీర్లు కొన్ని అంశాలపై కొర్రీలు వేసినట్లు సమాచారం. ఈ నెల 21న జరగనున్న సీఓటీ సమావేశంలో ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. సూర్యాపేట జిల్లా నాగార్జునసాగర్ ఆయకట్టు స్థిరీకరణకు రూ.360 కోట్లతో చేపట్టిన ఎత్తిపోతల పథకం పనులకు సీఓటీ ఆమోదముద్ర వేసింది. రూ.14 కోట్లతో చేపట్టిన సదర్మట్ బరాజ్ విద్యుదీకరణ పనులకు సైతం అనుమతిచ్చింది. -
Telangana: బుల్డోజర్లకు బ్రేక్!
సాక్షి, హైదరాబాద్: వరుసగా అక్రమ నిర్మాణాల కూల్చివేతలతో కలకలం రేపిన ‘హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా)’కు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఇటీవలి పరిణామాలు, సంస్థాగత లోపాలు, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. కనీసం 3 నెలలపాటు కూల్చివేతల జోలికి వెళ్లవద్దని సూచించింది. దీనితో హైడ్రా తమ విభాగం అంతర్గత నిర్మాణంపై దృష్టి పెట్టనుంది. మరోవైపు హెచ్ఎండీఏ, రెవెన్యూ, నీటిపారుదల శాఖల అధికారులు చెరువులు, కుంటలపై విస్తృత సర్వే చేపట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు.ఏర్పడటానికి ముందు నుంచే కూల్చివేతలతో..చెరువుల ఆక్రమణల తొలగింపు కోసం హైడ్రా ఏర్పడటానికి ముందే.. జీహెచ్ఎంసీ అధీనంలో డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్, ‘విజిలెన్స్ అండ్ డిజాస్టర్స్ మేనేజ్మెంట్ (ఈవీడీఎం)’రూపంలో కూల్చివేతలు ప్రారంభించారు. జూన్ 27న ఫిల్మ్‌నగర్ కో–ఆపరేటివ్ సొసైటీలో తొలి ఆపరేషన్ చేపట్టారు. నార్నే గోకుల్ ఆక్రమించిన లోటస్ పాండ్‌లోని 0.16 ఎకరాలకు విముక్తి కల్పించారు. తర్వాత ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసి, ఓఆర్ఆర్ వరకు పరిధిని కల్పిస్తూ జూలై 19న ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటి నుంచి దాదాపు 20 చోట్ల అక్రమ నిర్మాణాలను తొలగించారు. 50 ఎకరాలకుపైగా ప్రభుత్వ భూమి, చెరువులను పరిరక్షించారు.విరామానికి కారణాలెన్నో..హైడ్రా ప్రభావంతో రాష్ట్రంలో, ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రియల్ ఎస్టేట్ రంగం దెబ్బతింది. ఇళ్లు, స్థలాల క్రయవిక్రయాలు పడిపోయాయి. మరో వైపు అమీన్పూర్లో హైడ్రా కూల్చివేతల వ్యవహారంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే సమయంలో మూసీ సుందరీకరణ ప్రాజెక్టు ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. నది వెంట ఇళ్ల సర్వే, ఖాళీ చేయించడం, కూల్చివేయడం వంటి చర్యలు చేపట్టింది. మూసీ ప్రాజెక్టుతో హైడ్రాకు సంబంధం లేకపోయినా.. రెండింటి కూల్చివేతలపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. ఈ కారణాల నేపథ్యంలో ప్రభుత్వం హైడ్రా కూల్చివేతలకు తాత్కాలికంగా బ్రేక్ వేసింది.‘హైడ్రా’వ్యవస్థ నిర్మాణంపై ఫోకస్కనీసం మూడు నెలల పాటు హైడ్రా ఆపరేషన్లు నిలిపివేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఈ సమయంలో హైడ్రాకు సంబంధించిన పలు అంశాలను చక్కదిద్దనున్నట్టు సమాచారం. ప్రస్తుతం హైడ్రాకు పూర్తిస్థాయిలో సిబ్బంది లేరు. ఇటీవలే వివిధ విభాగాల నుంచి 169 మందిని డిప్యూటేషన్‌పై నియమించారు. కానీ పోలీసు విభాగం నుంచి వచ్చిన 20 మంది మినహా మరే ఇతర విభాగాల సిబ్బంది హైడ్రా విధుల్లో చేరలేదు. మరోవైపు హైడ్రాలో చేరేందుకు ఆసక్తి చూపుతూ కొందరు ఉద్యోగులు దరఖాస్తు పెట్టుకున్నారు. అయితే వారిని రిలీవ్ చేయడానికి పలువురు శాఖాధిపతులు విముఖత చూపుతున్నట్టు తెలిసింది. ప్రస్తుతం హైడ్రా వినియోగిస్తున్న కార్యాలయంతోపాటు సిబ్బందిలో దాదాపు అంతా జీహెచ్ఎంసీకి సంబంధించిన వారే. ఈ విషయంలో అటు జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులకు, ఇటు హైడ్రాకు మధ్య కోల్డ్ వార్ నడుస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి సంస్థాగత అంశాలు, సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టనున్నారు.జల వనరుల ‘లెక్క’తేల్చేలా..జల వనరుల పరిరక్షణే ప్రధాన ధ్యేయంగా హైడ్రాను ఏర్పాటు చేసినట్టు ప్రభుత్వం చెబుతోంది. తొలిదశలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చెరువులు, కుంటలకు సంబంధించిన ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్టీఎల్)లో ఉన్న ఆక్రమణలు తొలగించాలని నిర్ణయించింది. ఈ ప్రక్రియ చేపట్టడానికి ముందు ఆయా చెరువులు, వాటి ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను నోటిఫై చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తికాకపోవడాన్ని ఇటీవల న్యాయస్థానం సైతం ప్రశ్నించింది. దీనికోసం రెవెన్యూ, ఇరిగేషన్ విభాగాలతోపాటు హెచ్ఎండీఏ ఉమ్మడిగా చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. తొలుత ప్రాథమిక, ఆపై తుది నోటిఫికేషన్లు జారీ చేయాలి. హెచ్ఎండీఏ లెక్కల ప్రకారం హైదరాబాద్‌తోపాటు శివారు జిల్లాల్లో కలిపి 2,688 జలవనరులు ఉన్నాయి. వీటిలో 2,364 ప్రిలిమినరీ నోటిఫికేషన్ స్థితి దాటగా, 324 మాత్రమే తుది నోటిఫికేషన్ దాకా వెళ్లాయి. 95 చెరువులకు హైడ్రా ఏర్పడిన తర్వాతే ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ క్రమంలో వచ్చే మూడు నెలల్లో అన్ని చెరువుల సర్వే పూర్తి చేసి, తుది నోటిఫికేషన్ ఇచ్చేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. -
తప్పు చేయకూడదనే దానికి ఉదాహరణ కాళేశ్వరం ప్రాజెక్టు: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నీటి పారుదల శాఖ లో కొత్తగా నియమకమైన 700 మంది ఏఈఈలకులకు సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలను అందజేశారు. ఎర్రమంజిల్‌లో జలసౌధలో గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. తెలంగాణ ఇరిగేషన్‌ను ప్రపంచానికి చాటేలాగా అందరం కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. జలవివాదాలు కారణంగా ప్రాజెక్టులు ఆలస్యం అవుతున్నాయని తెలిపారు. తెలంగాణలో ప్రాజెక్టులు ఎందుకు ఆలస్యం అయ్యాయో గత పది ఏళ్లలో చేశామని, ఆ పరిస్థితి మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో రెండు లక్షల కోట్ల రూపాయలు ఇప్పటివరకు సాగునీటి ప్రాజెక్టుల కోసం ఖర్చు చేశామని తెలిపారు.‘నీళ్లు, నియామకాల ఆకాంక్షల కోసమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. నీళ్లు మన సంస్కృతిలో భాగస్వామ్యం.. అలాంటి శాఖకు మీరు ప్రతినిధులుగా నియామకమవుతున్నారు. తెలంగాణ ఏర్పడిన దశాబ్దం తరువాత నియామకాల ప్రక్రియ వేగంగా జరుగుతోంది. ఇది మీకు ఉద్యోగం కాదు.. ఇది మీకు ఒక భావోద్వేగం. తెలంగాణ ప్రజల భావోద్వేగం నీళ్లతో ముడిపడి ఉంది. వారి భావోద్వేగాలకు అనుగుణంగా నీళ్లను ఒడిసిపట్టి ప్రజలకు అందించాల్సిన బాధ్యత మీపై ఉంది. ఏ వృత్తిలోనైనా క్షేత్ర స్థాయిలో అనుభవం ఉన్నవాళ్లే రాణిస్తారు. రాజకీయాల్లోనూ క్షేత్ర స్థాయి నుంచి వచ్చిన వారే ఎక్కువ రాణిస్తారు.పీవీ నరసింహారావు, కోట్ల విజయ భాస్కర్ రెడ్డి, నీలం సంజీవ రెడ్డి లాంటి వారు సర్పంచ్ స్థాయి నుంచి ముఖ్యమంత్రులు, ప్రధానులుగా ఎదిగారు. నేను కూడా జిల్లా పరిషత్ మెంబర్ స్థాయి నుంచే సీఎం స్థాయికి వచ్చా. గతంలో ఇంజనీర్లు ఉదయం 5 గంటలకే క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లేవారు. ఫీల్డ్ విజిట్ చేసాకే రిపోర్టులు రాసే వారు. కానీ ఈ మధ్య క్షేత్ర స్థాయి పర్యటనలకు వెళ్లే వారు తగ్గిపోయారు. మేం అధికారంలోకి వచ్చాక అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించాల్సిందేనని ఆదేశించాం. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులకు లక్ష కోట్లు ఖర్చు చేస్తే.. కట్టడం కూలడం రెండూ జరిగాయి. అధికారులు జీవితంలో ఎలాంటి తప్పు చేయకూడదో దానికి ఉదాహరణ కాళేశ్వరం ప్రాజెక్టు. దీనికి ఎవరిని బాధ్యులను చేయాలో మీరే చెప్పాలి. అధికారులనా? రాజకీయ నాయకులనా?.మీ మోడల్ స్టడీకి కాళేశ్వరమే సరైన ఉదాహరణ. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నిర్మించిన మోక్షగుండం విశ్వేశ్వరయ్యను ఆదర్శంగా తీసుకోండి. కాళేశ్వరం విషయంలో అందరిపై చర్యలు తీసుకుంటే డిపార్ట్మెంటే ఉండదు. చర్యలు తీసుకోకపోతే చర్యలు తీసుకోవడం లేదని ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈఈ చెప్పారని ఒకరు, ఎస్ఈ చెప్పారని ఇంకొకరు.. ఇలా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. రాజకీయ నాయకులు తీసుకునే తప్పుడు నిర్ణయాలను అమలు చేయకుండా ఉంటే ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నం అయ్యేవి కాదు. లక్ష కోట్లు ఖర్చు చేసినా లక్ష ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేకపోయారు.పదేళ్లలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి కాకపోవడానికి కారణం ఏమిటో గమనించండి. 2లక్షల కోట్లు ఖర్చు చేసినా తెలంగాణలో ప్రాజెక్టులు పూర్తి కాలేదు. భవిష్యత్ లో ఇలాంటివి పునరావృతం కావొద్దు. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో నీళ్లు అత్యంత కీలకం.ప్రాజెక్టుల పూర్తికి క్షేత్ర స్థాయిలో పని చేయాలి. రికమెండేషన్‌తో వచ్చే వారికి సుదూర ప్రాంతాల్లో పోస్టింగ్ ఇచ్చి పనిష్మెంట్ ఇవ్వండి. పని మీద శ్రద్ధ పెట్టండి.. పోస్టింగ్‌ల మీద కాదు. అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేస్తే తెలంగాణ దేశంలోనే ఆదర్శంగా నిలబడుతుంది. క్షేత్రస్థాయిలో పని చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించండి.’ అని పేర్కొన్నారు. -
కాంట్రాక్టర్లకు బిల్లుల కోసమే ‘కాళేశ్వరం’ కార్పొరేషన్!
సాక్షి, హైదరాబాద్: బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు పొంది కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడం కోసమే కాళేశ్వరం ఇరిగేషన్ కార్పొరేషన్ ఏర్పాటైందని నీటిపారుదల శాఖ చీఫ్ అకౌంట్స్ అధికారి పద్మావతి, కాళేశ్వరం కార్పొరేషన్ చీఫ్ అకౌంట్స్ అధికారి కొమర్రాజు వెంకట అప్పారావు వెల్లడించారు. కాళేశ్వరం బరాజ్‌ల నిర్మాణంపై విచారణ చేస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్.. బుధవారం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఆర్థిక అంశాలతో ముడిపడి ఉన్న ముగ్గురు అధికారులను వేర్వేరుగా క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. నాటి నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్ ఆదేశాలతో కార్పొరేషన్ రుణాలను సమీకరించిందని ఓ ప్రశ్నకు సమాధానంగా కొమర్రాజు వెంకట అప్పారావు తెలిపారు. కాళేశ్వరం కార్పొరేషన్‌కు స్వతహాగా ఆదాయం ఏమీ లేదన్నారు. రుణా లు మంజూరైన వెంటనే కాంట్రాక్టర్లకు చెల్లింపులు జరపకుండా బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తామని.. వాటిపై వచ్చే వడ్డీలతో కార్పొరేషన్ నిర్వహణ జరుగుతోందని చెప్పారు. కాంట్రాక్టర్ల బ్యాంకు డిపాజిట్లపై వచ్చే వడ్డీలను సైతం కార్పొరేషన్ అవసరాలకు వాడుకుంటున్నామని వివరించారు. పూర్తయిన పనులన్నింటినీ కార్పొరేషన్ ఆస్తులుగానే పరిగణిస్తామని తెలిపారు. రామగుండం ఫెర్టిలైజర్, ఎనీ్టపీసీ నుంచి నీటి విడుదలకు సంబంధించిన బిల్లులు 2023 నుంచి వస్తున్నాయని వివరించారు. కొలతలు చూశాకే బిల్లులు ఇస్తారా? అని కమిషన్ ప్రశ్నించగా.. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు సిద్ధం చేసిన బిల్లులను పేఅండ్‌అకౌంట్స్ విభాగం పరిశీలించి కార్పొరేషన్‌కు పంపిస్తుందని, తర్వాత చెల్లింపులు చేస్తామని బదులిచ్చారు. కాగ్ అభ్యంతరాలపై రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపించామన్నారు.మిమ్మల్ని మీరే రక్షించుకోవాలినీటి పారుదల శాఖ బడ్జెట్ రూపకల్పనలో మీ పాత్ర ఏమిటని ఆ శాఖ చీఫ్ అకౌంట్స్ అదికారి పద్మావతిని కమిషన్ ప్రశ్నించగా.. చీఫ్ ఇంజనీర్ల నుంచి వివరాలను సేకరించి ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపిస్తానని ఆమె బదులిచ్చారు. కార్పొరేషన్ రుణాల తిరిగి చెల్లింపు కోసం ప్రభు త్వం బడ్జెట్లో నిధులు కేటాయిస్తోందని తెలిపారు. ‘కాళేశ్వరం ప్రాజెక్టుపై కాగ్ అభ్యంతరాల విషయంలో మీ అభిప్రాయమేంటి? రుణాలపై నిర్వహించిన సమావేశాల్లో గత ప్రభుత్వంలోని సీఎంఓ అధికారులు పాల్గొన్నారా? ప్రాజెక్టుతో ఆర్థికభారం పడే అవకాశం ఉండటంతో ఆర్థిక క్రమశిక్షణ కోసం సలహాలు ఏమైనా ఇచ్చారా?’ కమిషన్ ప్రశ్నించగా.. ఆమె సమాధానం దాటవేసినట్టు తెలిసింది. ‘కాళేశ్వరం ప్రాజెక్టుతో పడే ఆర్థిక భారం? దీనికి మీ సమర్థన ఉందా? రాష్ట్రంపై ఈ భారం రానున్న రోజుల్లో ఎలా ఉంటుంది? మీ బాధ్యతగా ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశారా?’ అన్న ప్రశ్నలకు తాను జవాబు చెప్పలేనని పేర్కొన్నట్టు సమాచారం. ఇక ఆర్థిక క్రమశిక్షణ లేకుండా కాళేశ్వరం ప్రాజెక్టుపై నిర్ణయం తీసుకున్నదెవరని ప్రశ్నించగా.. అది చాలా విస్తృతమైన అంశమని, దానిపై తానేమీ చెప్పలేనని చెప్పినట్టు తెలిసింది. దీంతో కమిషన్ కొంత ఘాటుగా స్పందిస్తూ.. ‘‘విచారణ సందర్భంగా ఎవరినో రక్షించే ప్రయత్నం చేయవద్దు. మిమ్మల్ని మీరే రక్షించుకోవాలి. విచారణలో వాస్తవాలనే తెలపాలి. దాపరికాలు వద్దు’’ అని పేర్కొన్నట్టు సమాచారం. మరోవైపు బిల్లులను పరిశీలించి చెల్లింపులకు సిఫారసు చేయడమే తన బాధ్యత అని వర్క్ అకౌంట్స్ డైరెక్టర్ ఫణిభూషణ్ శర్మ కమిషన్‌కు వివరించారు. కాగ్ నివేదికలోని ఒకటి రెండు విషయాలు మాత్రమే వాస్తవాలని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇచి్చందని తెలిపారు. -
‘దుర్గం చెరువు’ దోషులు అధికారులే!
సాక్షి, హైదరాబాద్/గచ్చిబౌలి: ‘‘హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ (హుడా) అనుమతులు ఇచ్చిందంటే ప్రభుత్వం ఇచ్చినట్టే కదా! నీటి పారుదల శాఖ ఇచ్చిన నిరభ్యంతర పత్రాల(ఎన్వోసీ) మేరకే ఇళ్లు, భవనాలు నిర్మించాం. 30 ఏళ్లు దాటింది. ఇప్పుడు ఏకంగా 204 నిర్మాణాలు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలో ఉన్నాయంటూ నోటీసులు ఇచ్చారు. ఇక్కడ దోషులెవరు? ఎఫ్టీఎల్, బఫర్‌జోన్ పరిధిలో ఈ లేఅవుట్లు ఉన్నట్టు అప్పుడే నిర్ధారిస్తే.. ఇప్పుడు కూల్చివేతలు ఉండేవి కాదు కదా’’.. .. దుర్గం చెరువు సమీపంలోని నెక్టార్ గార్డెన్‌కు చెందిన ఓ ఇంటి యజమాని ఆందోళన ఇది. ఆయనే కాదు.. గత 30 ఏళ్లుగా అక్కడ నివాసం ఉంటున్న చాలా మంది తమ ఇళ్లు, భవనాలు చెరువు ఎఫ్టీఎల్, బఫర్‌జోన్ పరిధిలో ఉన్నాయంటూ నోటీసులు ఇవ్వడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్క దుర్గం చెరువు ప్రాంతంలోనే కాదు.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అనేక ప్రాంతాల్లో చెరువులు, కుంటలు, నాలాలను ఆనుకొని నిర్మించిన విల్లాలు, అపార్ట్మెంట్లు, బహుళ అంతస్తుల భవనాలకు ఇరిగేషన్, రెవెన్యూ, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, తదితర ప్రభుత్వ విభాగాలు అనుమతులు ఇచ్చాయి. ఇప్పుడేమో అధికారులు ఆ ఇళ్లు ఎఫ్టీఎల్ పరిధిలో, బఫర్‌జోన్‌లో ఉన్నట్టు నోటీసులు ఇవ్వడం కలకలం రేపుతోంది. నోటీసులు ఇచ్చిన తహసీల్దార్ దుర్గం చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో ఇళ్లు నిర్మించారంటూ.. శేరిలింగంపల్లి తహసీల్దార్ వెంకారెడ్డి ఈ నెల 5న వాల్టా చట్టం కింద అమర్ కో–ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ, కావూరిహిల్స్, నెక్టార్ గార్డెన్లలో ఉన్న 204 నిర్మాణాలకు నోటీసులు ఇచ్చారు. 30 రోజుల్లో నిర్మాణాలను తొలగించుకోవాలని పేర్కొన్నారు. ఎఫ్టీఎల్ పరిధిలోకి వచ్చే నిర్మాణాలకు ‘ఎఫ్’అని.. కొంతభాగం ఎఫ్టీఎల్లోకి వస్తే ‘ఎఫ్/పీ’అని.. బఫర్‌జోన్‌లోకి వచ్చే నిర్మాణాలపై ‘బీ’అని గోడలపైన రాశారు. రాజకీయ, సినీ ప్రముఖులు, ఉన్నతాధికారులు కూడా ఈ నోటీసులు అందుకున్న వారిలో ఉన్నారు. ఓ పర్యావరణవేత్తకు చెందిన ఇల్లు కూడా ఉన్నట్టు సమాచారం. అమర్ సొసైటీలో సీఎం రేవంత్‌రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి ఇల్లు కూడా ఉంది. ఎకరా రూ.వంద కోట్లపైనే..! దుర్గం చెరువు ప్రాంతంలో ఆక్రమణకు గురైన భూముల ప్రస్తుత మార్కెట్ విలువ ఎకరానికి రూ.వంద కోట్లపైనే ఉంటుందని అంచనా. చదరపు గజం విలువే రూ.2 లక్షలపైన ఉంటుంది. హైటెక్‌సిటీని ఆనుకొని ఉన్న దుర్గం చెరువు ప్రాంతం రియల్టర్లకు, బిల్డర్లకు హాట్‌కేక్‌లా మారింది. దాంతో రెండు, మూడు దశాబ్దాల క్రితం నుంచే కబ్జాల పర్వం మొదలైంది. ఈ అక్రమ నిర్మాణాలకు అందరూ బాధ్యులే. అప్పటి ప్రభుత్వ పెద్దలు, రాజకీయ ప్రముఖుల నుంచి అక్రమ లేఅవుట్లకు అడ్డగోలుగా అనుమతులిచ్చిన హుడా అధికారులు.. చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లు ఆక్రమణకు గురవుతున్నట్టు తెలిసినా ఎన్వోసీలు ఇచ్చిన నీటిపారుదల, రెవెన్యూ అధికారులు కూడా బాధ్యులే. నిజాం కాలంలో నిర్మించిన దుర్గం చెరువు రెండు గుట్టల మధ్య సుమారు 160.7 ఎకరాలకుపైగా విస్తరించి ఉండేది. రాయదుర్గం పాయెగాలో 62ఎకరాలు, మాదాపూర్ సర్వే నం.63, 64లలో 28 ఎకరాలు, గుట్టల బేగంపేట్ సర్వే నంబర్లు 42 నుంచి 61 వరకు 70.7 ఎకరాల విస్తీర్ణంలో దుర్గంచెరువు ఉండేది.హుడా ఆమోదంతో నిర్మాణాలు.. ఈ ప్రాంతంలో 1991లో మొదట అమర్ కో–ఆపరేటివ్ హౌసింగ్ సోసైటీ 15 ఎకరాల విస్తీర్ణంలో 150 ప్లాట్లతో లేఅవుట్ చేసింది. అయితే చెరువు చుట్టూ 30 అడుగుల పరిధిలో స్థలాన్ని గ్రీన్‌బెల్ట్ కోసం కేటాయించిన హుడా.. 130 ప్లాట్లకు 1995లో తుది ఆమోదం ఇచ్చింది. ఈ క్రమంలోనే వరుసగా కావూరి హిల్స్, నెక్టార్ గార్డెన్ గేటెడ్ కమ్యూనిటీలకు కూడా హుడా ఆమోదం లభించింది. నెక్టార్ గార్డెన్ పూర్తిగా, కావూరి హిల్స్‌లోని కొంత భాగం దుర్గం చెరువు ఎఫ్టీఎల్లో ఉంది. గతంలో భారీ వర్షాలు వచ్చినప్పుడు కావూరి హిల్స్, నెక్టార్ గార్డెన్, అమర్ సొసైటీలలోకి వరద నీరు చేరేది. దీనితో దుర్గంచెరువు పూర్తిగా నిండకుండా, ఎప్పటికప్పుడు నీటిని కిందికి వదిలేస్తూ.. ఎఫ్‌టీఎల్‌పై ఫోకస్ పడకుండా చేశారు. అధికారంలో ఏ ప్రభుత్వం ఉన్నా సరే ఒత్తిడి తీసుకొచ్చి వర్షాకాలంలో దుర్గం చెరువు గేట్లు మూసివేయ కుండా చూసుకుంటూ వస్తున్నారు. అయితే చెరువు సుందరీకరణ పేరిట చుట్టూ వాకింగ్ ట్రాక్ వేయడంతో.. ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న వారికి అదో రక్షణ గోడగా మారిపోయింది.అధికారులు ఏమంటున్నారు? 2013లో సుమారు 160.7 ఎకరాల్లో దుర్గం చెరువు విస్తీర్ణాన్ని గుర్తిస్తూ ఎఫ్టీఎల్ను నిర్ధారించామని ఇరిగేషన్ అధికారులు చెప్తున్నారు. నీటిపారుదల, రెవెన్యూ శాఖల నుంచి వచ్చిన ఎన్వోసీల మేరకు అనుమతులను ఇచ్చినట్లు హెచ్ఎండీఏ అధికారులు అంటున్నారు. ఇక ‘‘ప్రభుత్వం ఆమోదించిన మాస్టర్ ప్లాన్‌ను పరిగణనలోకి తీసుకుంటాం. చాలా చోట్ల కాలువలను పూర్తిగా మూసివేయడం వల్ల బ్యాక్ వాటర్ వచ్చి చేరుతుంది. దీంతో ఎఫ్టీఎల్ నిర్ధారణలో శాస్త్రీయత లోపిస్తోంది’’అని హెచ్ఎండీఏ ప్లానింగ్ విభాగానికి చెందిన అధికారి ఒకరు పేర్కొనడం గమనార్హం.అక్రమమైతే కూల్చేయండి.. వాల్టా చట్టం రాకముందే 1995లో లేఅవుట్‌కు ఆమో దం లభించింది. హుడా అనుమతితోనే ఇళ్లు నిర్మించారు. 2016లో 600 చదరపు గజాల స్థలంలో ఇల్లు కొనుగోలు చేశాం. ఈ ప్రాంతం చెరువు పరిధిలోకి వస్తుందన్న సమాచారమేదీ లేదు. ఇప్పుడు బఫర్ జోన్లోకి వస్తుందంటూ అధికారులు నోటీసులు ఇచ్చారు. అక్రమ మైతే కూల్చేయండి, ముఖ్యమంత్రి నా ఒక్కడి కోసం పనిచేయడం లేదు కదా! బీఆర్ఎస్ నాయకులు నా ఇంటి విషయంలో రాజకీయం చేస్తున్నారు. – సీఎం రేవంత్‌రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డిభయభ్రాంతులకు గురిచేయొద్దు 1995లో హుడా అనుమతి ఇవ్వడంతోనే ప్లాట్లు కొనుగోలు చేసి ఇ ళ్లు కట్టుకున్నాం. ఇప్పటికీ ఈఎంఐలు కట్టేవారు ఉన్నారు. 2023 లో జీహెచ్ఎంసీ హైపవర్ కమిటీ ఈ ప్రాంతం ఎఫ్టీఎల్లోకి రాదని తేల్చింది. ప్రభుత్వాలు మారితే ఎఫ్టీఎల్ మారుతుందా? – అమర్ కో–ఆపరేటివ్ సొసైటీ ప్రధాన కార్యదర్శి గోపాల కృష్ణారెడ్డిఇళ్లు కట్టాలంటే ఏ అనుమతులు ఉండాలిగ్రీన్బెల్ట్ను వదిలి అమర్ సొసైటీ లేఅవుట్‌కు హుడా అధికారులు ఆమోదం తెలిపారు. అనుమతి ఉన్న లేఅవుట్లో ప్లాట్ తీసుకొని, ఇంటి నిర్మాణం కోసం జీహెచ్ఎంసీ అనుమతి తీసుకున్నాం. హైదరాబాద్‌లో ఇళ్లు కట్టుకోవాలంటే ఇంకా ఏమేం అనుమతులు తీసుకోవాలో చెప్పండి. – పోలవరపు శ్రీనివాస్, అమర్ సొసైటీ వాసి -
‘కృష్ణా’లో సిరుల పంట
సాక్షి, హైదరాబాద్: కృష్ణా ప్రాజెక్టుల కింద ఈ ఏడాది సిరుల పంట పండనుంది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో కృష్ణా నది పరీవాహకంలోని చిన్నా, పెద్దా అన్ని ప్రాజెక్టుల కింద పూర్తిస్థాయి ఆయకట్టుకు సాగునీరు సరఫరా చేసేందుకు రాష్ట్ర నీటిపారుదల శాఖ సిద్ధమైంది. కృష్ణా ప్రాజెక్టుల కింద ఉన్న 14.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు 125 టీఎంసీలు.. గోదావరి పరీవాహక ప్రాంతంలోని ప్రాజెక్టుల కింద 17.95లక్షల ఎకరాల ఆయకట్టుకు 188 టీఎంసీల సాగునీటిని సరఫరా చేయాలని నిర్ణయించింది. శనివారం జలసౌధలో నీటి పారుదల శాఖ ఈఎన్సీ (జనరల్) జి.అనిల్‌కుమార్ నేతృత్వంలో రాష్ట్రస్థాయి సమగ్ర నీటి ప్రణాళిక, నిర్వహణ కమిటీ (స్కివం) సమావేశమైంది. కృష్ణా, గోదావరి బేసిన్ల లోని జలాశయాల్లో ప్రస్తుత నీటి లభ్యత, సమీప భవిష్యత్తులో రానున్న వరద ప్రవాహాల అంచనాపై విస్తృతంగా చర్చించింది. రాష్ట్రంలోని భారీ, మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టుల కింద.. ప్రస్తుత ఖరీ ఫ్లో మొత్తం 33లక్షల ఎకరాలకు 314 టీఎంసీల సాగునీటిని సరఫరా చేయాలని తీర్మానించింది. ఈ ప్రతిపాదనలను త్వరలోనే ప్రభుత్వానికి సమర్పించి ఆమోదం పొందనుంది. సమావేశంలో ఈఎన్సీ (ఓఅండ్ఎం) బి.నాగేందర్రావుతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చీఫ్ ఇంజనీర్లు పాల్గొని తమ పరిధిలోని ప్రాజెక్టుల పరిస్థితి, ఆయకట్టుకు సాగునీటి సరఫరా కోసం ప్రతిపాదనలు సమరి్పంచారు. కృష్ణాలో ముగిసిన క్రాప్ హాలిడే.. గత ఏడాది కృష్ణా బేసిన్లో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాలు నీళ్లు లేక వెలవెలబోయాయి. దీనితో గత రబీలో కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టుల కింద క్రాప్ హాలిడే ప్రకటించాల్సి వచ్చింది. ప్రస్తుతం బేసిన్ పరిధిలోని జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, మూసీ తదితర ప్రాజెక్టుల్లో పుష్కలంగా నీటి లభ్యత ఉండటంతో.. అన్ని ప్రాజెక్టుల కింద పూర్తి ఆయకట్టుకు సాగునీరు అందనుంది. జూన్‌లో వర్షాకాలం మొదలవగా.. రెండు నెలల్లోనే శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాలు నిండిపోయాయి. ఎగువ నుంచి కృష్ణాలో భారీ వరద కొనసాగుతోంది. దీనితో పరీవాహక ప్రాంతంలో ఆయకట్టుకు ఈ ఏడాది ఎలాంటి ఢోకా లేకుండా పోయింది. నీటి పారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శుక్రవారమే నాగార్జునసాగర్ ఎడమ కాల్వకు సాగునీటి విడుదలను ప్రారంభించడం గమనార్హం. సాగర్ నుంచి ఇంత ముందే నీళ్లు విడుదల చేయడం గత పదేళ్లలో ఇది రెండోసారి. 2021లో సైతం ఆగస్టు 2వ తేదీనే సాగర్ నుంచి సాగునీటి విడుదల ప్రారంభించారు. గోదావరిలో లోయర్ మానేరు దిగువన కష్టమే..! గోదావరి నదిలో పైనుంచి వరదలు పెద్దగా రాక.. ఎగువన ఉన్న ప్రాజెక్టుల్లో నీటి లభ్యత ఆశించిన మేరకు లేకుండా పోయింది. ఈ క్రమంలో లోయర్ మానేరు ప్రాజెక్టు వరకు ఉన్న ఆయకట్టు వరకే నీటి సరఫరాపై స్కివం కమిటీ నిర్ణయం తీసుకుంది. దాని దిగువన ఉన్న ప్రాజెక్టులతోపాటు సింగూరు ప్రాజెక్టు ఆయకట్టుకు సాగునీటి సరఫరాపై మరో 15 రోజుల తర్వాత సమావేశమై.. అప్పటి నీటి లభ్యత ఆధారంగా నిర్ణయాలు తీసుకోనున్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు గరిష్ట నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలుకాగా.. ప్రస్తుతం 42.81 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉన్నాయి. ఎగువ నుంచి కాస్త వరద కొనసాగుతోంది. దీనితో ఈ ప్రాజెక్టు కింద మొత్తం ఆయకట్టుకు సాగునీరు అందించాలని నిర్ణయించారు. సింగూరు ప్రాజెక్టు నుంచి ఘనపూర్ ఆనికట్‌కు నీళ్లను తరలించి దాని కింద ఉన్న 21వేల ఎకరాలకు సాగునీరు అందించనున్నారు. -
పంపింగ్ ప్రారంభం.. కాళేశ్వరం ప్రాజెక్టులో ఎత్తిపోతలు షురూ
సాక్షి, హైదరాబాద్/రామగుండం/ధర్మారం: అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణల నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన పంప్‌హౌస్‌ల ద్వారా నీటి పంపింగ్ ప్రక్రియను శనివారం రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఎల్లంపల్లి ప్రాజెక్టులోని నీళ్లను నంది, గాయత్రి పంప్‌హౌస్‌ల ద్వారా నందిమేడారం, మిడ్‌మానేరు జలాశయాల్లోకి ఎత్తిపోస్తున్నారు. ఆగస్టు 2లోగా కాళేశ్వరం పంప్‌హౌస్‌లను ఆన్ చేయకుంటే 50వేల మంది రైతులతో కలిసి తామే ఆన్ చేస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అల్టిమేటం జారీ చేసిన నేపథ్యంలో పంపింగ్ ప్రారంభం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లు దెబ్బతిని ఉండడంతో వాటిలో నీటి నిల్వలు చేయరాదని నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆథారిటీ(ఎన్డీఎస్ఏ) నిపుణుల కమిటీ కోరిందని, దీంతో ఈ మూడు జలాశయాల నుంచి నీళ్లను పంపింగ్ చేసి ఎల్లంపల్లి ప్రాజెక్టుకు తరలించడం సాధ్యం కాదని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బదులిచి్చన విషయం తెలిసిందే. అయితే, ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి మిడ్‌మానేరుకు, అక్కడి నుంచి అనంతగిరి, రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్‌కు నీటిని తరలిస్తామని ప్రకటించారు. మంత్రి ప్రకటన మేరకు నీటిపారుదల శాఖ శనివారం నుంచే పంపింగ్ ప్రారంభించింది. ఎల్లంపల్లి ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా భారీ వర్షాలతో వస్తువన్న వరదలతో శనివారం 17.34 టీఎంసీలకు నిల్వలు చేరాయి. 14,358 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. నంది, గాయత్రి పంపుహౌస్‌ల ద్వారా శనివారం ఎత్తిపోతలు ప్రారంభించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు గ్రావిటీ కాలువ ద్వారా తరలివస్తున్న నీటిని ధర్మారం మండలం నందిమేడారం వద్ద ఉన్న నంది పంప్‌హౌస్ ద్వారా నందిమేడారం రిజర్వాయర్‌లోకి ఎత్తిపోస్తున్నారు. మొత్తం 7 పంపులు ఉండగా, 4 పంప్‌లను ఆపరేట్ చేస్తూ 13,076 క్యూసెక్కులను తరలిస్తున్నారు. శనివారం మధ్యాహ్నం ఒక మోటారును ఆన్‌చేసిన అధికారులు.. సాయంత్రం 6గంటల వరకు మరో మూడు విద్యుత్ మోటార్లు రన్ చేశారు. నందిమేడారం రిజర్వాయర్ రెండు గేట్లు ఎత్తి రామడుగు మండలం లక్ష్మీపూర్ వద్ద గల గాయత్రి పంప్‌హౌస్‌లోకి అంతే స్థాయిలో 13,076 క్యూసెక్కులను తరలిస్తున్నారు. గాయత్రి పంప్‌హౌస్‌లోని నాలుగు బాహుబలి పంపుల ద్వారా నీళ్లను గ్రావిటీ కాల్వలోకి ఎత్తిపోస్తున్నారు. అక్కడి నుంచి ఆ నీళ్లు మిడ్‌మానేరుకు తరలిపోతున్నాయి. నీటి పంపింగ్ ప్రారంభం కావడంతో మడుగు, గంగాధర, బోయినపల్లి మండలాల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, మంత్రి ఉత్తమ్ ఆదేశాలతో మధ్యమానేరుకు నీటిని ఎత్తిపోస్తున్నామని, దీనిని రైతులు సది్వనియోగం చేసుకోవాలని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కోరారు. -
సాగునీటికి కటకటే
సాక్షి, హైదరాబాద్: నీటిపారుదల శాఖకు నిధుల కేటాయింపుల్లో రాష్ట్ర ప్రభుత్వం కోత పెట్టింది. 2023–24 బడ్జెట్లో రూ.26,885 కోట్లు ఇవ్వగా, 2024–25 బడ్జెట్లో రూ.22,301 కోట్లే కేటాయించారు. కాళేశ్వరం, ఇతర ప్రాజెక్టుల నిర్మాణానికి చేసిన రుణాల తిరిగి చెల్లింపులకు కేటాయింపులను ప్రభుత్వం గణనీయంగా తగ్గించింది. మరోవైపు నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడానికి రూ.10,829 కోట్లు కేటాయించింది. గతేడాది వీటికి రూ.9381 కోట్లు మాత్రమే ఇచ్చారు.ప్రాథమ్యాలకు నిధుల కరువే..రాష్ట్ర ప్రభుత్వ ప్రాథమ్యాలకు అనుగుణంగా వచ్చే మూడేళ్లలో పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులపై 2024–25లో రూ.19,287 కోట్లు ఖర్చు చేయాలని నీటిపారుదల శాఖ ప్రణాళికలు సిద్ధం చేసు కోగా, బడ్జెట్లో మాత్రం ప్రభుత్వం ఆశించిన మేరకు కేటాయింపులు జర పలేదు. నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల పనులకు రూ.10,829 కోట్లు కేటాయించగా, మిగిలిన నిధులు కాళేశ్వరం, పాలమూరు –రంగారెడ్డి తదితర ప్రాజెక్టుల నిర్మాణం కోసం చేసిన రుణాల చెల్లింపులు, ఉద్యోగుల జీతభత్యాలకు వెళ్లనున్నాయి.రుణాల చెల్లింపులకు నిధుల కోత..కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి, ఇతర ప్రాజెక్టుల నిర్మాణం కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్, తెలంగాణ రాష్ట్ర జల వనరుల సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్ డబ్ల్యూఆర్ఐడీసీ)తో పాటు ఇతర మార్గాల ద్వారా రుణా లను సమీకరించింది. ఈ రుణాలను తిరిగి చెల్లించడానికి 2023–24 బడ్జెట్లో రూ.15,773 కోట్లు ప్రతి పాదించగా, తాజా బడ్జెట్లో రూ.9951 కోట్లకు కేటాయింపులను ప్రభుత్వం తగ్గించింది.కాళేశ్వరం కార్పొరేషన్‌కు రూ.12, 500 కోట్లు కేటాయించగా, తాజాగా రూ.6914.54 కోట్లకు కేటాయింపులు తగ్గాయి. ఇక టీఎస్ డబ్ల్యూఆర్ ఐడీసీకి కేటాయింపులు రూ.3200కోట్ల నుంచి రూ.2962. 47 కోట్లకు తగ్గాయి. ఈ రుణాల తిరిగి చెల్లింపుల గడువును పొడిగించి వాటి కిస్తీల సంఖ్యను సైతం పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రుణా ల తిరిగి చెల్లింపులకు కేటాయింపులను కోత పెట్టింది.కేటగిరీల వారీగా ప్రాజెక్టులకు కేటాయింపులు ఇలా ఉన్నాయి..భారీ నీటిపారుదల ప్రాజెక్టులకు రూ.8476.48 కోట్లుమధ్య తరహా ప్రాజెక్టులకు రూ.953.21మైనర్ ఇరిగేషన్‌కు రూ.857.73వరదల నియంత్రణ, డ్రైనేజీ రూ.282.24 -
నిరంతర గరిష్ట నిల్వలతోనే నష్టం!
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్‌ల నిర్మాణం పూర్తయిన నాటి నుంచీ నిరంతరం గరిష్ట నిల్వలను కొనసాగించారని.. దాంతో ఒత్తిడి పెరిగి వాటికి తీవ్ర నష్టం కలిగిందని జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్‌కు నిపుణుల కమిటీ నివేదించింది. నీటి పారుదల శాఖలోని హైడ్రాలజీ విభాగం ఇంజనీర్లు, విచారణ కమిషన్‌కు సహకరించేందుకు ఏర్పాటైన నిపుణుల కమిటీ సభ్యులను జస్టిస్ పినాకి చంద్రఘోష్ గురువారం బీఆర్కేఆర్ భవన్‌లోని తన కార్యాలయంలో విచారించారు. ప్రాథమిక పరిశీలన అంశాలతో.. ఎన్ఐటీ వరంగల్ రిటైర్డ్ ప్రొఫెసర్ సీబీ కామేశ్వర్రావు, రిటైర్డ్ సీఈ కె.సత్యనారాయణ, ఎన్ఐటీ వరంగల్ ప్రొఫెసర్ ఎన్.రమణమూర్తి, ఉస్మానియా వర్సిటీ సివిల్ ఇంజనీరింగ్ విభాగం హెచ్ఓడీ పి.రాజశేఖర్, రాష్ట్ర నీటి పారుదల శాఖ ఈఎన్సీ (జనరల్) జి.అనిల్‌కుమార్‌తో ఏర్పాటైన నిపుణుల కమిటీ ఇటీవల బరాజ్‌లను పరిశీలించి ప్రాథమిక నివేదిక సమర్పించింది. తమ దృష్టికి వచి్చన లోపాలను తాజాగా జస్టిస్ చంద్రఘోష్‌కు వివరించింది. బరాజ్‌లను సుదీర్ఘకాలం పూర్తిస్థాయిలో నీటితో నింపి ఉంచడంతో.. బరాజ్‌లపై ఒత్తిడి పెరిగి బుంగలు ఏర్పడ్డాయని కమిటీ సభ్యులు పేర్కొన్నట్టు తెలిసింది. బుంగలను వెంటనే పూడ్చయకపోవడంతో వాటి తీవ్రత పెరిగి బరాజ్‌లకు తీవ్ర నష్టం కలిగించిందని వెల్లడించినట్టు సమాచారం. బరాజ్‌ల వైఫల్యంపై రెండు వారాల్లోగా మధ్యంతర నివేదిక ఇవ్వాలని.. సాధ్యమైనంత త్వరగా పూర్తిస్థాయి నివేదికను అఫిడవిట్ రూపంలో సమరి్పంచాలని నిపుణుల కమిటీకి ఈ సందర్భంగా జస్టిస్ పినాకి చంద్రఘోష్ ఆదేశించారు. నేడు ఈఎన్సీల ఆఫీసుల సిబ్బంది విచారణ రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈఎన్సీ (జనరల్), ఈఎన్సీ (ఓ అండ్ ఎం) కార్యాలయాల్లో పనిచేస్తున్న ఇంజనీర్లను జస్టిస్ చంద్రఘోష్ శుక్రవారం విచారించనున్నారు. చీఫ్ ఇంజనీర్ నుంచి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ స్థాయి వరకు అధికారులను విచారణకు రావాలని కోరారు. త్వరలో బహిరంగ విచారణ కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్‌ల నిర్మాణంపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ త్వరలో బహిరంగ విచారణ నిర్వహించాలని నిర్ణయించింది. అఫిడవిట్ల రూపంలో విచారణ కమిషన్‌కు సమాచారాన్ని సమరి్పంచిన వారందరినీ బహిరంగ విచారణలో ప్రశ్నించనుంది. అఫిడవిట్ల పరిశీలన పూర్తయిన తర్వాత ఎవరెవరిని పిలవాలనే అంశంపై నిర్ణయం తీసుకోనుంది. బ్యారేజీలపై విజిలెన్స్ విభాగం నిర్వహించిన దర్యాప్తునకు సంబంధించిన తుది నివేదికను సత్వరం సమర్పించాలని కమిషన్ కోరగా.. రాష్ట్ర ప్రభుత్వం ఇంకా సమరి్పంచలేదు. విజిలెన్స్ తుది నివేదిక కోరుతూ మరోసారి లేఖ రాయనుంది. బరాజ్‌ల నిర్మాణంతో సంబంధమున్న ప్రభుత్వ కార్యాలయాలు, మోడల్ స్టడీస్ ల్యాబ్స్‌లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి సంబంధిత రికార్డులను పరిశీలించాలని జస్టిస్ చంద్రఘోష్ నిర్ణయం తీసుకున్నారు. పుణెలోని సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ (సీడబ్ల్యూపీఆర్ఎస్)ను సైతం ఆయన సందర్శించనున్నట్టు తెలిసింది. కాళేశ్వరం బరాజ్‌లకు సంబంధించిన సాంకేతిక అంశాలపై విచారణ ముగించిన తర్వాత.. ఆర్థిక అవకతవకతలపై జస్టిస్ చంద్రఘోష్ దృష్టిసారించనున్నారు. అంచనా వ్యయం, ఖర్చులు, రుణాలు, వడ్డీ రేట్లు తదితర అంశాలపై విచారణ నిర్వహించనున్నారు. అఫిడవిట్ల పరిశీలన తర్వాత నిర్ణయం గురువారం విచారణ ముగిసిన తర్వాత జస్టిస్ పినాకి చంద్రఘోష్ మీడియాతో క్లుప్తంగా మాట్లాడారు. బరాజ్‌ల వ్యవహారంలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావులకు నోటీసులేమైనా జారీ చేస్తారా? అని మీడియా ప్రశ్నించగా.. అధికారులు సమరి్పంచిన అఫిడవిట్లను పరిశీలించాక నిర్ణయం తీసుకుంటానని పేర్కొన్నారు. -
‘టైమ్‌బౌండ్’ ఒత్తిడే!
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్ ల నిర్మాణ పనులను నిర్ణీత గడువు (టైమ్ బౌండ్)లోగా పూర్తి చేయాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఒత్తిడి చేసిందని జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలోని విచారణ కమిషన్‌కు బరాజ్‌ల నిర్మాణ సంస్థలు తెలిపాయి. పనులు సత్వరంగా పూర్తి చేయాలంటూ పరుగులు పెట్టించిందని పేర్కొన్నా యి. ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేసి బరాజ్‌లను అప్పగించామని వివరించాయి. ఈ అంశాలను నెలాఖరు లోగా అఫిడవిట్ రూపంలో సమర్పించాలని నిర్మాణ సంస్థలను జస్టిస్ పినాకి చంద్రఘోష్ ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్‌ల నిర్మాణంపై న్యాయవిచారణలో భాగంగా బుధవారం బీఆర్కేఆర్ భవన్‌లోని కార్యాలయంలో నిర్మాణ సంస్థల ఉన్నతాధికారులను ఆయన ప్రశ్నించారు. మేడిగడ్డ బరాజ్ నిర్మాణ సంస్థ ‘ఎల్అండ్టీ’ తరఫున ఉపాధ్యక్షులు ఎంవీ కృష్ణరాజు, సురేశ్‌కుమార్, సీనియర్ డీజీఎం రంజీష్ చౌహాన్, అన్నారం బరాజ్ నిర్మాణ సంస్థ ‘అఫ్కాన్స్–విజేత జేవీ’ తరఫున హైడ్రో ప్రాజెక్టుల విభాగాధిపతి కె.మల్లికార్జునరావు, జీఎం శేఖర్‌దాస్, సుందిళ్ల బరాజ్ నిర్మాణ సంస్థ ‘నవయుగ’ తరఫున డైరెక్టర్ రామేశ్ యెద్దూరి, ప్రాజెక్టు మేనేజర్ కె.ఈశ్వర్రావు, జీఎం సి.మాధవ్ తదితరులు కమిషన్ ఎదుట హాజరై సమాధానాలు ఇచ్చారు. డిజైన్లు, హైడ్రాలజీ విభాగం ఇంజనీర్లు కూడా.. బరాజ్‌ల డిజైన్లను రూపొందించిన నీటిపారుదల శాఖలోని సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ (సీడీఓ)లో పనిచేస్తున్న చీఫ్ ఇంజనీర్లు టి.శ్రీనివాస్, వి.మోహన్‌కుమార్ సహా మొత్తం 13 మంది ఇంజనీర్లను కూడా జస్టిస్ పినాకి చంద్రఘోష్ బుధవారం తన కార్యాలయం విచారించారు. డిజైన్ల తయారీలో ఒక్కొక్కరి పాత్రను అడిగి తెలుసుకున్నారు. డిజైన్ల ప్రకారమే పనులు జరిగాయా? తర్వాత డిజైన్లను ఏమైనా మార్చారా? ఎవరి ఆదేశాలతో మార్పులు చేశారు? షీట్‌పైల్స్‌కు బదులు సెకెంట్ పైల్స్‌ను ఎందుకు డిజైన్లలో సిఫారసు చేశారు? వంటి అంశాలపై ప్రశ్నలు గుప్పించినట్టు సమాచారం. ఇక బరాజ్‌ల వద్ద నీటి లభ్యతను నిర్ధారించిన హైడ్రాలజీ విభాగంలో పనిచేస్తున్న చీఫ్ ఇంజనీర్ శంకర్‌నాయక్, మరో ఐదుగురు ఇంజనీర్లను సైతం జస్టిస్ చంద్రఘోష్ ప్రశ్నించారు.ఆదేశించిన వారినీ పిలిచి విచారిస్తాం: జస్టిస్ చంద్రఘోష్ బ్యారేజీల డిజైన్లు, నిర్మాణం, నిర్వహణలో లోపం ఎక్కడ జరిగింది? ఎవరు చేశారో తేలుస్తామని జస్టిస్ చంద్రఘోష్ వెల్లడించారు. నిర్మాణ సంస్థల ప్రతినిధులను ప్రశ్నించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎవరి ఆదేశాలతో బరాజ్‌ల నిర్మాణ పనులు జరిగాయో రికార్డు రూపంలో సమాచారం అందిన తర్వాత వారిని సైతం విచారణకు పిలుస్తామన్నారు. నీటిపారుదల శాఖ ఇంజనీర్లు, నిర్మాణ సంస్థలు సమర్పించిన అఫిడవిట్లను పరిశీలించాక అవసరమైన వారిని మళ్లీ పిలిపించి విచారిస్తామని తెలిపారు. క్షేత్రస్థాయిలోని వాస్తవాలను తెలుసుకోవడానికే అఫిడవిట్లను దాఖలు చేయాలని కోరినట్టు చెప్పారు. బరాజ్‌ల డిజైన్లు, నిర్మాణం, నిర్వహణపై సమగ్ర వివరాలు అఫిడవిట్లలో ఉండాలని నిర్మాణ సంస్థలను కోరినట్టు తెలిపారు. ఎలాంటి సమాచారమైనా అఫిడవిట్ రూపంలో దాఖలు చేస్తేనే కమిషన్ స్వీకరిస్తుందన్నారు. తప్పుడు సమాచారంతో అఫిడవిట్లు దాఖలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విజిలెన్స్, కాగ్ నివేదికలు అందాయని.. వాటిని పరిశీలిస్తున్నామని తెలిపారు. న్యాయ విచారణలో భాగంగా విజిలెన్స్, కాగ్ అధికారులను సైతం ప్రశ్నిస్తామన్నారు. నేడు నిపుణుల కమిటీ సభ్యుల విచారణజస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ గురువారం నీటిపారుదల శాఖలోని హైడ్రాలజీ విభాగం ఇంజనీర్లతోపాటు కమిషన్‌కు సహకరించేందుకు ఏర్పాటైన నిపుణుల కమిటీ సభ్యులను విచారించనుంది. నిపుణుల కమిటీలో ఎన్ఐటీ వరంగల్ రిటైర్డ్ ప్రొఫెసర్ సీబీ కామేశ్వర్రావు, రిటైర్డ్ సీఈ కె.సత్యనారాయణ, ఎన్ఐటీ వరంగల్ ప్రొఫెసర్ ఎన్.రమణమూర్తి, ఉస్మానియా వర్సిటీ సివిల్ ఇంజనీరింగ్ విభాగం హెచ్ఓడీ పి.రాజశేఖర్, రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈఎన్సీ (జనరల్) జి.అనిల్‌కుమార్ ఉన్నారు. నిపుణుల కమిటీ ఇప్పటికే బరాజ్‌లకు చేసిన తనిఖీ నివేదికను కమిషన్‌కు సమర్పించింది. -
బరాజ్‌లపై విచారణ స్పీడప్!
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్‌ల నిర్మాణంపై న్యాయ విచారణ ప్రక్రియను జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ వేగిరం చేసింది. బరాజ్‌ల నిర్మాణానికి సంబంధించిన నిర్ణయాల్లో కీలక పాత్ర పోషించిన నీటి పారుదల శాఖ మాజీ ఈఎన్సీ (జనరల్) సి.మురళీధర్, రామగుండం మాజీ ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు, బరాజ్‌ల డిజైన్లను రూపొందించిన సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ (సీడీఓ) మాజీ చీఫ్ ఇంజనీర్/రిటైర్డ్ ఈఎన్సీ నరేందర్‌రెడ్డి, చీఫ్ ఇంజనీర్ చంద్రశేఖర్, ఎస్ఈ బస్వరాజ్.. అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లుగా వాటి నిర్మాణాన్ని పర్యవేక్షించిన యాదగిరి, ఓంకార్ సింగ్‌లను సోమవారం జస్టిస్ చంద్రఘోష్ బీఆర్కేఆర్ భవన్‌లోని తన కార్యాలయానికి పిలిపించి విడివిడిగా విచారించారు. బరాజ్‌ల నిర్మాణానికి సంబంధించిన సాంకేతిక అంశాలపై ప్రశ్నించారు. ‘బరాజ్‌ల నిర్మాణ స్థలాలను ఎవరు నిర్ణయించారు? స్థలాల ఎంపికకు ముందు భూ¿ౌతిక పరీక్షలు నిర్వహించారా? బరాజ్‌లకు డిజైన్లు, డ్రాయింగ్స్ ఎవరు రూపొందించారు? తర్వాత డిజైన్లలో ఏమైనా మార్పులు చేశారా? నిర్మాణ సమయంలో నాణ్యత పర్యవేక్షణ చేశారా? ఆ బాధ్యతను ఎవరు చూశారు? నిర్మాణం పూర్తయిన తర్వాత నిర్వహణ, పర్యవేక్షణ ఎవరు చూశారు? బరాజ్‌ల వైఫల్యానికి కారణాలేమిటి? డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ పూర్తికాక ముందే నిర్మాణ సంస్థలకు వర్క్ కంప్లీషన్ సరి్టఫికెట్లు ఎందుకు జారీ చేశారు?’ వంటి అంశాలపై ఆయన వివరణ కోరినట్టు తెలిసింది. నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, జాయింట్ సెక్రెటరీ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఈఎన్సీ (జనరల్) అనిల్‌కుమార్, డిప్యూటీ ఈఎన్సీ కె.శ్రీనివాస్ తదితరులు విచారణకు హాజరై కమిషన్‌కు సహకరించారు. నేడు 18 మంది ఇంజనీర్ల విచారణ.. నీటిపారుదల శాఖలోని సీడీఓ, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్, క్వాలిటీ కంట్రోల్, కన్స్ట్రక్షన్ విభాగాల్లో గతంలో పనిచేసిన/ప్రస్తుతం పనిచేస్తున్న మొత్తం 18 మంది ఇంజనీర్లను మంగళవారం జస్టిస్ పినాకి చంద్రఘోష్ విచారించనున్నారు. ఈఎన్సీ (ఓ అండ్ ఎం) బి.నాగేంద్రరావు, సీడీఓ చీఫ్ ఇంజనీర్ మోహన్‌కుమార్, మేడిగడ్డ బరాజ్ నిర్మాణాన్ని పర్యవేక్షించిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తిరుపతితోపాటు ఇతర కీలక ఇంజనీర్లు ఈ విచారణకు హాజరుకావాలంటూ కమిషన్ ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. ఇక బుధవారం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల నిర్మాణ సంస్థలైన ఎల్అండ్టీ, అఫ్కాన్స్, నవయుగ కంపెనీల ప్రతినిధులను కమిషన్ విచారించనుంది. త్వరలోఅసలు విషయాలు బయటికి..: జస్టిస్ చంద్రఘోష్ కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్‌ల నిర్మాణం విషయంలో అసలు విషయాలు రానున్న రోజుల్లో బయటికి వస్తాయని జస్టిస్ పినాకి చంద్రఘోష్ తెలిపారు. సోమవారం బీఆర్కేఆర్ భవన్‌లోని తన కార్యాలయంలో తనను కలిసిన మీడియాతో ఆయన క్లుప్తంగా మాట్లాడారు. బరాజ్‌ల నిర్మాణంపై ఇప్పటివరకు కమిషన్‌కు 54 ఫిర్యాదులొచ్చాయని, వాటిని పరిశీలిస్తున్నామని చెప్పారు. విచారణ కమిషన్‌కు సమాచారం ఇవ్వడానికి వచ్చే ప్రతి ఒక్కరికి తనను కలిసే అవకాశం ఇస్తానని, వారి వాదన వింటానని తెలిపారు. ప్రస్తుతం సాంకేతిక లోపాలపై విచారణ సాగుతోందని.. తర్వాత ఆర్థిక, ఇతర అవకతవకలపై విచారణ ప్రారంభిస్తామని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన గడువు మేరకు జూన్ 30లోగా విచారణ పూర్తికాదని.. గడువు పొడిగింపుపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. సమగ్రంగా అన్ని విషయాలు, వాస్తవాలు తెలుసుకోకుండా నివేదిక ఇవ్వడం సాధ్యం కాదన్నారు. తమకు నష్టపరిహారం చెల్లించలేదంటూ కొందరు భూనిర్వాసితులు తమకు ఫిర్యాదు చేశారని తెలిపారు. బరాజ్‌లకు సంబంధించిన అన్ని ఫైళ్లను ప్రభుత్వం సమరి్పంచిందని, వాటిని పరిశీలిస్తున్నామని వెల్లడించారు. బరాజ్‌లపై విజిలెన్స్ జరిపిన విచారణ నివేదికను తమకు అందజేయాలని ఆ విభాగానికి లేఖ రాశామన్నారు. -
ఆ పదవి నుంచి ఆదిత్యనాథ్ దాస్‌ను తొలగించండి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నీటిపారుదల శాఖ సలహాదారు పదవి నుంచి ఆదిత్యనాథ్ దాస్‌ను తొలగించాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆయన నియామకం తెలంగాణ ప్రయోజనాలకు గొడ్డలిపెట్టు అని ఆరోపించారు. చంద్రబాబు ఆదేశాలను శిష్యుడు రేవంత్‌రెడ్డి పాటిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రమాణ స్వీకారానికి ముందే చంద్రబాబు కర్రపెత్తనం ప్రారంభమైందనడానికి ఇదే నిదర్శనం అని ఆయన పేర్కొన్నారు.జలయజ్ఞం ప్రాజెక్టుల నుంచి నిన్నటి పాలమూరు రంగారెడ్డిపై కేసులు వేసి పనులు ఆపిన వ్యవహారంలో ఆదిత్యనాథ్ దాస్ది కీలకపాత్ర అని ఆయన శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఏపీ నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శిగా, ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన వ్యక్తిని ఏ విధంగా సలహాదారుగా నియమించుకున్నారని ఆయన ప్రశ్నించారు.అధికారిగా ఆయన పట్ల తమకు ఎలాంటి వ్యతిరేకత లేదని, కానీ ఆంధ్రలోని కృష్ణ ప్రాజెక్టుల నుంచి నీటిని తరలించడంతో ఆయనది కీలకపాత్ర అని అన్నారు. కేఆర్ఎంబీలో తెలంగాణ వాదనను తొక్కిపట్టి ప్రాజెక్టుల మీద హక్కులు కోల్పోయేలా చేసిన వ్యక్తిని నియమించడం వెనుక కాంగ్రెస్ ఆలోచన ఏమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో పాలమూరు మరోసారి ఎడారి అయ్యేలా ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. -
మేడిగడ్డ వద్ద మళ్లీ శబ్దాలు
-
మేడిగడ్డ వద్ద మళ్లీ శబ్దాలు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం బ్యారేజీలోని మేడిగడ్డ బ్యారేజీ వద్ద మళ్లీ ధ్వనులు, ప్రకంపనలు వచ్చాయి. కుంగిన ఏడో బ్లాకులోని 16వ నంబర్ గేటును పైకి ఎత్తడానికి నీటిపారుదల శాఖ ప్రయత్నించగా.. బ్యారేజీ కింద భూగర్భంలో నుంచి భారీగా బోలు శబ్దాలు (Hallow Sounds), ప్రకంపనలు రావడంతో వెంటనే ఆ పనులను నిలిపేశారు. అక్కడ ఏర్పాటు చేసిన సెన్సర్లు సైతం శబ్దాలు, ప్రకంపనలను గుర్తించి అలర్ట్ చేశాయి. దీంతో బ్యారేజీ పెను ప్రమాదానికి లోనయ్యే అవకాశం కనిపిస్తోందంటూ నీటిపారుదల శాఖ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పునాదుల కింద ఇసుక కొట్టుకుపోయి.. గతంలో వరదల సమయంలో బ్యారేజీ పునాదుల కింద నుంచి ఇసుక కొట్టుకుపోయి, 12 వేల నుంచి 15 వేల క్యూబిక్ మీటర్ల పరిమాణంలో భారీ బొరియ ఏర్పడి ఉండవచ్చని ఇప్పటికే నిర్వహించిన జియోఫిజికల్, జియోటెక్నికల్ పరీక్షల ద్వారా ఓ అంచనాకు వచ్చినట్టు నీటిపారుదల శాఖ వర్గాలు చెప్తున్నాయి. టన్నుల కొద్దీ బరువుండే గేటును పైకి ఎత్తే క్రమంలో పునాదులపై ఒత్తిడి పెరుగుతుందని.. పునాదుల కింద భూగర్భంలో బొరియ ఉండటంతో ఆ ఒత్తిడికి బ్యారేజీ మరింత కుంగిపోవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గ్రౌటింగ్ ద్వారా భూగర్భంలోని ఖాళీలను పూడ్చివేశాకే గేట్లను పైకెత్తే పనులు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. నిజానికి 7వ బ్లాకు కుంగిన తర్వాత అక్కడి నుంచి నీటి లీకేజీని ఆపడానికి.. ఏకంగా 40వేల ఇసుక బస్తాలు వేశారు. అయినా బ్యారేజీ కింద భారీగా ఖాళీ ఉందని అంచనాకు రావడం గమనార్హం. ఇప్పటికే హెచ్చరించిన ఎన్డీఎస్ఏ.. మేడిగడ్డ బ్యారేజీలో మొత్తం 8 బ్లాకులు, 85 గేట్లు ఉండగా.. గతేడాది అక్టోబర్ 21న ఏడో బ్లాకు కుంగిన వెంటనే 77 గేట్లను ఎత్తి నీటిని వదిలేశారు. 7వ బ్లాకులోని 15 నుంచి 22 నంబర్ వరకు గేట్లు మొరాయించాయి. కాళేశ్వరం బ్యారేజీల్లోని లోపాలపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) ఏర్పాటు చేసిన చంద్రశేఖర్ అయ్యర్ కమిటీ.. బ్యారేజీలను పలుమార్లు పరిశీలించి ఇటీవల మధ్యంతర నివేదిక సమర్పించింది. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం 2019 జూలైలో పూర్తవగా.. అదే ఏడాది వచ్చిన వరదల సమయంలో బ్యారేజీ ప్రమాద సంకేతాలను వెలువరించిందని పేర్కొంది. బ్యారేజీలకు వానాకాలంలోగా నిర్వహించాల్సిన అత్యవసర మరమ్మతులు, చర్యలను సిఫారసు చేసింది. అయితే వానాకాలానికి ముందే మేడిగడ్డ బ్యారేజీలో మొరాయించిన గేట్లను పైకి ఎత్తేయాలని సూచించింది. అందులోనూ పగుళ్లు వచ్చిన 19, 20, 21 పియర్ల మధ్య ఉన్న గేట్లను అత్యంత జాగ్రత్తగా పైకి ఎత్తాలని స్పష్టం చేసింది. నీటి పారుదల శాఖ అధికారులు నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ సిబ్బందితో కలసి ఈ నెల 17న 15వ నంబర్ గేటును విజయవంతంగా పైకి ఎత్తారు. తర్వాత 16వ నంబర్ గేటును ఎత్తడానికి ప్రయత్నించగా.. శబ్దాలు, ప్రకంపనలు వచ్చినట్టు అధికారవర్గాలు తెలిపాయి. పరీక్షలన్నీ చేయించడంపై దృష్టి మేడిగడ్డ బ్యారేజీ దిగువన ఇసుక కొట్టుకుపోవడంతో ఏర్పడిన ఖాళీ ప్రదేశం.. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందన్న అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. కుంగిన ఏడో నంబర్ బ్లాకు దిగువకే ఈ బొరియ పరిమితమై లేదని.. మొత్తం బ్యారేజీ కింద ఓ చివరి నుంచి మరో చివరి వరకు ఖాళీ ప్రదేశం ఏర్పడి ఉండవచ్చని భావిస్తున్నారు. దీనిపై స్పష్టత వచ్చాక.. నిపుణుల కమిటీ సూచనల మేరకు ఇసుక, సిమెంట్ మిశ్రమాన్ని పంపించి పూడ్చివేయాల్సి ఉంటుందని చెప్తున్నారు. తొలుత ఆ ఖాళీ ప్రదేశాన్ని గుర్తించడానికి సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్ (సీడబ్ల్యూపీఆర్), సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ (సీఎస్ఎంఆర్ఎస్), నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎన్జీఆర్ఐ)లతో జియోఫిజికల్, జియోటెక్నికల్ పరీక్షలు నిర్వహించడానికి నీటిపారుదల శాఖ ఏర్పాట్లు చేస్తోంది. -
Medigadda Barrage: గత సర్కారే కారణం!
సాక్షి,హైదరాబాద్: మేడిగడ్డ బ్యారేజీ 2019 వరదల సమయంలోనే ప్రమాద సంకేతాలిచ్చింది. బ్యారేజీ దిగువన దెబ్బతిన్న భాగానికి మరమ్మతులు నిర్వహించాలని సంబంధిత ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పలుమార్లు నిర్మాణ సంస్థను కోరారు. స్పందించిన నిర్మాణ సంస్థ మరమ్మతులు నిర్వహణ కోసం బ్యారేజీని ఖాళీ చేయాలని కోరింది. ఖాళీ చేయడానికి (గత)రాష్ట్ర ప్రభుత్వం అనుమతించకపోవడంతోనే బ్యారేజీ పరిస్థితి నానాటికి క్షీణిస్తూ వచ్చింది.’ అని రాష్ట్ర నీటిపారుదల శాఖ స్పష్టం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మూడు బ్యారేజీలు 2019 వర్షాకాలంలో ప్రమాద సంకేతాలిచ్చినా, నిర్లక్ష్యం చేయడంతోనే వాటి పరిస్థితి రోజురోజుకు క్షీణించడంతో పాటు బ్యారేజీల్లోని స్ట్రక్చర్లకు నష్టం పెరిగిందా? అని కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ అడిగిన ఓ కీలక ప్రశ్నకు నీటిపారుదల శాఖ ఈ మేరకు సమాధానమిచ్చింది.2019లో మేడిగడ్డ బ్యారేజీ ప్రమాద సంకేతాలిచ్చినా, ప్రాజెక్టు యంత్రాంగం సకాలంలో మరమ్మతులు, నిర్వహణ, పర్యవేక్షణ(ఓ అండ్ ఎం) చేపట్టకపోవడంతోనే బ్యారేజీ పియర్లు, ర్యాఫ్ట్ కుంగిపోయాయని మరో ప్రశ్నకు సమాధానమిచ్చింది. సుందిళ్ల బ్యారేజీ 2019లో ప్రమాద సంకేతాలిచ్చినా, మరమ్మతులు నిర్వహించడంతో ఆ తర్వాతికాలంలో పరిస్థితి క్షీణించలేదని వెల్లడించింది. బ్యారేజీలోని 46, 52, 50, 33 గేట్ల వద్ద సీపేజీ ఏర్పడగా, పీయూ గ్రౌంటింగ్ ద్వారా పూడ్చివేశారని, బ్యారేజీ దిగువన చెల్లాచెదురైన సీసీ బ్లాకులను మళ్లీ పూర్వ స్థితికి తెచ్చినట్టు నిపుణుల కమిటీకి తెలియజేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల్లోని లోపాలపై అధ్యయనం జరిపి, పరిష్కారాలను సూచించడానికి చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో నిపుణుల కమిటీని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. గత మార్చిలో రాష్ట్రంలో రెండోసారి పర్యటించిన కమిటీ .. నీటిపారుదల శాఖ ఈఎన్సీ(జనరల్) జి.అనీల్కుమార్కి 25 ప్రశ్నలను అందించగా, ఆయన ఈ మేరకు రాతపూర్వకంగా బదులిచ్చారు.బ్యారేజీలు తాత్కాలిక నిల్వకే ! వరదల సమయంలో తాత్కాలికంగా నీళ్లను నిల్వ చేసి మళ్లించడం కోసమే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను నిర్మించినట్టు అయ్యర్ కమిటీకి రాష్ట్ర నీటిపారుదల శాఖ తెలిపింది. గోదావరి నుంచి మళ్లించి త్కాలికంగా నిల్వ చేసిన నీళ్లను..మేడిగడ్డ బ్యారేజీ నుంచి అన్నారం బ్యారేజీకి...అక్కడి నుంచి సుందిళ్ల బ్యారేజీ.. అక్కడి నుంచి ఎల్లంపల్లి బ్యారెజీకి.. అక్కడ నుంచి మిడ్‌మానేరు జలాశయానికి తరలించి కాళేశ్వరం ప్రాజెక్టు కింద ప్రతిపాదించిన ఆయకట్టుకు సరఫరా చేయడమే బ్యారేజీల ముఖ్య ఉద్దేశమని వెల్లడించింది.కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణానికి ముఖ్య ఉద్దేశాలను తెలపాలని కమిటీ కోరగా, ఈ మేరకు బదులిచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీలను నిర్మాణం పూర్తైన నాటి నుంచి గతేడాది అక్టోబర్‌లో మేడిగడ్డ బ్యారేజీ కుంగే వరకు.. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను నిరంతరం పూర్తిగా నీటితో నింపిపెట్టారు. దీనికి విరుద్ధంగా కేవలం వరదల సమయంలో తాత్కాలికంగా నీళ్లను నిల్వ చేయడానికే బ్యారేజీలను నిర్మించినట్టు ఇప్పుడు నీటిపారుదల నిపుణుల కమిటీకి బదులివ్వడం ఆశ్చర్యకరంగా మారింది.గత ప్రభుత్వం మేడిగడ్డ బ్యారేజీ లోని నిలువలను ఖాళీ చేసేందుకు అనుమతి ఇవ్వకపోవడంతో సకాలంలో మరమ్మతులు నిర్వహించక పోయామని, బ్యారేజీ పరిస్థితి నానాటికి క్షీణించడానికి ఇదే కారణమని చంద్రశేఖర్ అయ్యర్ కమిటీకి రాష్ట్ర నీటిపారుదల శాఖ తెలిపిన అంశాన్ని లేఖలో చూడవచ్చు -
కాళేశ్వరానికి ‘అత్యవసర’ గడువు మించిపోతోంది!
సాక్షి, హైదరాబాద్: మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు మరింత నష్టం జరగకుండా వానాకాలానికి ముందే తీసుకోవాల్సిన నివారణ చర్యలపై సత్వరమే సిఫారసు చేయాలని చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని నిపుణుల కమిటీకి రాష్ట్ర నీటిపారుదల శాఖ విజ్ఞప్తి చేసింది. వర్షాకాలం ప్రారంభానికి ముందు చేపట్టాల్సిన పనులకు చాలా తక్కువ సమయం మిగిలి ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈఎన్సీ జి.అనీల్‌కుమార్ ఇటీవల అయ్యర్ కమిటీకి లేఖ రాశారు. ఈ నెల ముగిశాక ఎప్పుడైనా వానాకాలం ప్రారంభం కావచ్చని, ఆలోగా అత్యవసర మరమ్మతులు నిర్వహించాల్సి ఉందని పేర్కొన్నారు. నిపుణుల కమిటీ విజ్ఞప్తి మేరకు ఇప్పటికే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబందించిన ప్రాథమిక సమాచారంతోపాటు మేడిగడ్డ బ్యారేజీలోని 6, 7, 8వ బ్లాకులకు నిర్వహించిన ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ టోమోగ్రఫీ (ఈఆర్టీ), గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ (జీపీఆర్) పరీక్షల నివేదికలను సమరి్పంచామని ఈ ఖలో గుర్తుచేశారు. బ్యారేజీల డిజైన్లు, నిర్మాణంలో లోపాలపై అధ్యయనం చేసి వాటి పునరుద్ధరణకు తీసుకోవాల్సిన చర్యలను సిఫారసు చేయడానికి కేంద్ర జలసంఘం మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో ఒక కమిటీని నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆథారిటీ ఏర్పాటు చేయడం తెలిసిందే. ఆ కమిటీ ఇప్పటికే రెండుసార్లు రాష్ట్రంలో పర్యటించి వివరాలు సేకరించింది. కమిటీ మధ్యంతర నివేదిక కోసం గత నెల రోజులుగా నీటిపారుదల శాఖ నిరీక్షిస్తోంది. ఎన్నికల ఫలితాలొచ్చాకే మధ్యంతర నివేదిక? సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చాకే అయ్యర్ కమిటీ మరమ్మతులపై మధ్యంతర నివేదిక ఇచ్చే అవకాశముందని నీటిపారుదల శాఖలో ఉన్నత స్థాయి అధికార వర్గాలు భావిస్తున్నాయి. ఆలోగా వర్షాకాలం మొదలవుతుందని.. దీనివల్ల బ్యారేజీలకు అత్యవసర మరమ్మతులు చేపట్టడానికి వీలుండదని ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తే బ్యారేజీలకు అత్యవసరంగా గ్రౌంటింగ్ వంటి పనులను పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు అయ్యర్ సిఫారసులు వచ్చాకే మరమ్మతులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో నీటిపారుదల శాఖలో ఆందోళన వ్యక్తమవుతోంది. -
కాళేశ్వరంపై న్యాయ విచారణ షురూ
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంపై సుప్రీం కోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్ న్యాయ విచారణ ప్రక్రియను ప్రారంభించారు. బుధవారం హైదరాబాద్‌కు చేరుకున్న ఆయన బీఆర్కేఆర్ భవన్లో తనకు కేటాయించిన కార్యాలయంలో నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.నీటిపారుదల శాఖపై ఇటీవల శాసనసభలో ప్రవేశపెట్టిన శ్వేతపత్రం, మేడిగడ్డ బ్యారేజీపై విజిలెన్స్ నిర్వహించిన దర్యాప్తు నివేదిక, కాళేశ్వరం ప్రాజెక్టుపై కాగ్ సమర్పించిన ఆడిట్ నివేదికలతో పాటు బ్యారేజీల నిర్మాణానికి సంబంధించిన కీలక ఫైళ్లను జస్టిస్ చంద్రఘోష్ కు ఈ సందర్భంగా నీటిపారుదల శాఖ అధికారులు అందజేసినట్టు తెలిసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల ప్లానింగ్, డిజైనింగ్, నిర్మాణంలో నిర్లక్ష్యం, అక్రమాలు, లోపాలపై న్యాయ విచారణ కోసం ఆయన్ను రాష్ట్ర ప్రభుత్వం నియమించడం తెలిసిందే. కాగా, 26 లేదా 27 తేదీల్లో బ్యారేజీల సందర్శనకు ఆయన వెళ్లే అవకాశముందని అధికారవర్గాలు వెల్లడించాయి. నేడు అధికారులతో మళ్లీ భేటీ గురువారం ఉదయం 10 గంటలకు నీటిపారుదల శాఖ అధికారులతో మరోసారి జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై వివిధ సందర్భాల్లో మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ప్రత్యేక నివేదికను ప్రభుత్వం ఆయనకు అందజేయనున్నట్టు తెలిసింది. కాగా, ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వామ్యమైన ప్రజాప్రతినిధులు, అధికారులు, ఇంజనీర్లకు నోటీసుల జారీపై గురువారం నాటి సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. -
ప్రమాద సంకేతాల విస్మరణతోనే నష్టమా?
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు 2019 వానాకాలం తర్వాత ప్రమాద సంకేతాలు ఇచ్చినా.. నివారణ చర్యలు తీసుకోకపోవడంతోనే నష్టాన్ని పెంచిందా? అని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ నీటి పారుదల శాఖను ప్రశ్నించింది. మూడు బ్యారేజీలను ప్రారంభించిన కొద్దిరోజులకే వాటి దిగువన రక్షణ కోసం ఏర్పాటు చేసిన ప్లింత్ శ్లాబు, సీసీ బ్లాకులు, టోయ్ వాల్, లాంచింగ్ అప్రాన్ వంటివి ఎందుకు కొట్టుకుపోయాయని నిలదీసింది. ఇటీవల మూడు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించిన అయ్యర్ కమిటీ.. నీటి పారుదలశాఖలోని అన్ని విభాగాలతో విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించింది. తిరిగి వెళ్లేప్పుడు ఒక ప్రశ్నావళిని అందించి, సీల్డ్ కవర్లో సమాధానాలు అందజేయాలని కోరింది. ప్రమాదం పొంచి ఉంటే ఏం చేశారు? బ్యారేజీలకు ప్రమాదాలు పొంచి ఉన్నట్టు/నష్టాలు జరిగినట్టు గుర్తించిన సమాచారాన్ని వరుస క్రమంలో తెలుపుతూ సమగ్ర నివేదిక సమర్పించాలని అయ్యర్ కమిటీ కోరింది. ‘‘ప్రమాదాలు పొంచి ఉన్నట్టు గుర్తించినప్పుడు తీసుకున్న చర్యలేమిటి? నిర్మాణ సంస్థలకు జారీచేసిన ఆదేశాలేమిటి? తక్షణమే నిర్మాణ సంస్థలు మరమ్మతులు నిర్వహించాయా? వంటి వివరాలు నివేదికలో ఉండాలి. ముందు జాగ్రత్త చర్యలేమైనా తీసుకుని ఉంటే తెలపాలి. తీసుకోకపోతే కారణాలు వెల్లడించాలి. బ్యారేజీలలో ఏదైనా అసాధారణ మార్పును గుర్తించిన సందర్భాల్లో పరికరాల డేటా నమోదు, విశ్లేషణ, అన్వయింపు(డేటా ఇంటర్‌ప్రిటేషన్), వాటి ఆధారంగా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసే విభాగం ఏదీ? దీనికోసం ఎలాంటి ప్రొటోకాల్స్‌ను అనుసరిస్తున్నారు?’’ అని ప్రశ్నించింది. జరిగిన తప్పులేమిటి? చేసింది ఎవరు? నీటి పారుదల శాఖలోని వివిధ విభాగాల పనితీరు, సమన్వయా న్ని అర్థం చేసుకోవడానికి శాఖ మౌలిక స్వరూపం వివరాలును అయ్యర్ కమిటీ కోరింది. బ్యారేజీల నిర్మాణంలో జరిగిన లోటుపాట్లకు బాధ్యులను తేల్చడానికి ఈ సమాచారం కీలకమని పే ర్కొంది. శాఖలోని అన్ని విభాగాల ఈఎన్సీల నుంచి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ స్థాయి వరకు ఉన్న అధికారుల క్రమాన్ని తెలిపేలా శాఖ ఆర్గనైజేషన్ చార్ట్‌ను సమరి్పంచాలని కమిటీ కోరింది. ‘‘ఈఎన్సీ (జనరల్), హైడ్రాలజీ అండ్ ఇన్వెస్టిగేషన్, సీడీఓ, ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్, క్వాలిటీ కంట్రోల్ అండ్ ఇన్స్పెక్షన్, ఓ అండ్ ఎం, ఇతర విభాగాల బాధ్యతలు, విధులు వివరించండి. బ్యారేజీల నిర్మాణంలో కీలకంగా వ్యవహరించిన సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ (సీడీఓ) చీఫ్ ఇంజనీర్, రామగుండం చీఫ్ ఇంజనీర్, క్వాలిటీ కంట్రోల్ అండ్ ఇన్స్పెక్షన్ విభాగం చీఫ్ ఇంజనీర్, ఈఎన్సీ (ఓఅండ్ఎం)లు తమపై అధికారిగా ఎవరికి రిపోర్ట్ చేస్తారు?’’ అని ప్రశ్నించింది. సీడీఓ, క్వాలిటీ సలహాలను పాటించారా? ‘‘సీడీఓ, క్వాలిటీ కంట్రోల్ అండ్ ఇన్స్పెక్షన్ విభాగాలు ఇచ్చే సలహాలు/ఆదేశాలకు ప్రాజెక్టుల కన్స్ట్రక్షన్ విభాగం కట్టుబడి ఉంటుందా? బ్యారేజీల గేట్లను ఎత్తే సమయం (ఆపరేషన్ షెడ్యూలింగ్)ను నిర్ణయించడంలో బాధ్యులు ఎవరు? ఈ విషయంలో సీడీఓ/ తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ల్యాబ్(టీఎస్ఈఆర్ఎల్)ల సలహాను ఏమైనా ఉల్లంఘించారా?’’ అని కమిటీ ప్రశ్నించింది. ప్రాజెక్టు డీపీఆర్‌ను కేంద్ర జల సంఘాని (సీడబ్ల్యూసీ)కి సమరి్పంచడానికి ముందు దాని రూపకల్పన సీడబ్ల్యూసీ మార్గదర్శకాలకు అనుగుణంగా జరిగేలా పర్యవేక్షణ చేసే విభాగం ఏది? దానికోసం నీటిపారుదల శాఖలో ఎలాంటి ప్రొటోకాల్స్ ఉన్నాయో తెలపాలని కోరింది. బ్యారేజీలు నీటి మళ్లింపు కోసమా? నిల్వ కోసమా? మూడు బ్యారేజీలను నీటి నిల్వ అవసరాలను దృష్టిలో పెట్టుకుని డిజైన్, నిర్మాణం చేశారా? లేక నీటి మళ్లింపు అవసరాలను దృష్టిలో పెట్టుకుని జరిపారా? అని అయ్యర్ కమిటీ ప్రశ్నించింది. బ్యారేజీలను ప్రారంభించిన నాటి నుంచి నిల్వ స్థాయిలను నెలవారీగా తెలియజేసే నివేదికను సమరి్పంచాలని కోరింది. బ్యారేజీలకు తనిఖీలు, మరమ్మతులు, నిర్వహణ పనుల కోసం ఎప్పుడైనా నిల్వలను తగ్గించారా? చేస్తే వివరాలు అందించాలని సూచించింది. బ్యారేజీల నిర్మాణ ప్రారంభం, ముగింపు తేదీలను అందించాలని.. డీపీఆర్‌ల ప్రకారం బ్యారేజీల విశిష్టతల(సేలియంట్ ఫీచర్స్)ను తెలిపాలని పేర్కొంది. నిర్మాణంలో ఈ విశిష్టతలను పాటించారా? అని ప్రశ్నించింది. బ్యారేజీల నిర్మాణానికి అనుమతిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను సమరి్పంచాలని కోరింది. సీడబ్ల్యూసీ అభ్యంతరాలను పరిష్కరించారా? డీపీఆర్ మదింపు సందర్భంగా సీడబ్ల్యూసీలోని వివిధ డైరెక్టరేట్లు వ్యక్తం చేసిన అభ్యంతరాలు ఏమిటి? సీఎస్ఎంఆర్ఎస్, జీఎస్ఐ, సీజీడబ్ల్యూబీ వంటి ఇతర సంస్థల కామెంట్లు/ అబ్జర్వేషన్లు ఏమిటి? వాటిని తగిన రీతిలో పరిష్కరించారా? అని అయ్యర్ కమిటీ కోరింది. నిర్మాణ దశ డిజైన్లు ఎవరివి? నిర్మాణ దశలో మూడు బ్యారేజీల డిజైన్లు, బ్యారేజీల వివిధ విభాగాల డ్రాయింగ్స్‌ను రూపొందించింది ఎవరని కమిటీ ప్రశ్నించింది. బ్యారేజీల నిర్మాణానికి ప్రత్యామ్నాయ ప్రాంతాల ఎంపిక కోసం జరిపిన అధ్యయనాలు, ప్రస్తుత ప్రాంతాల ఎంపికను సమర్థించే కారణాలు, బ్యా రేజీల కింద భూగర్భంలో నీటి ప్ర వాహంపై చేసిన అంచనాల వివరాలను ఇవ్వాలని కోరింది. లోపాలు బహిర్గతమైన తర్వాత బ్యారేజీలకు ని ర్వహించిన సబ్‌సర్ఫేస్ జియోలాజికల్ పరీక్షల నివేదికలు సమరి్పంచాలని సూచించింది. లోపాలు, పునరుద్ధరణ పనులపై మీ అభిప్రాయమేంటి? ‘‘మేడిగడ్డ బ్యారేజీ ర్యాఫ్ట్, పియర్లు కుంగిపోవడానికి కారణాలేమిటి? బ్యారేజీల పునాదుల కింద ఇసుక కొట్టుకుపోయి సీపేజీ జరగడానికి కారణాలేమిటి? వచ్చే వర్షాకాలంలో బ్యారేజీలకు మరింత నష్టం జరగకుండా రక్షించడానికి తీసుకోవాల్సిన చర్యలు ఏమిటో వివరించండి’’ అని నీటి పారుదల శాఖను అయ్యర్ కమిటీ కోరింది. ఈ ప్రశ్నావళి మేరకు తగిన సమాధానాలను సిద్ధం చేస్తున్నట్టు నీటిపారుదల శాఖ వర్గాలు వెల్లడించాయి. -
అన్నారం డ్యామేజీలకు మేము బాధ్యులం కాదు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన అన్నారం బ్యారేజీకి డిజైన్ లోపాలతో తీవ్ర ముప్పు పొంచి ఉందని నిర్మాణ సంస్థ ఆఫ్కాన్స్–విజేత–పీఈఎస్ జాయింట్ వెంచర్ తెలిపింది. ఎలాంటి డ్యామేజీలకైనా తాము బాధ్యులం కాదని స్పష్టం చేసింది. బ్యారేజీలో లోపాలు తెలుసుకోవడానికి పుణేలోని సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్లో ఫిబ్రవరి 7న నిర్వహించిన మోడల్ స్టడీలో డిజైన్‌లో లోపాలున్నట్టుగా తేలిందని పేర్కొంది. వచ్చే వర్షాకాలం ప్రారంభం కావడానికి ముందే బ్యారేజీకి అత్యవసర రక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరముందని స్పష్టం చేసింది. ఈ మేరకు గత ఫిబ్రవరి 10న నీటిపారుదల శాఖకు లేఖ రాసింది. నీళ్లు నిల్వ ఉండేలా డిజైన్ చేయలేదు బ్యారేజీలు, డ్యామ్‌ల గేట్లు ఎత్తినప్పుడు వరద భీకర వేగంతో కిందికి దూకినట్టుగా ప్రవహిస్తుంది. ఆ వరద నేరుగా దిగువన (అప్రాన్ ఏరియా) ఉన్న కాంక్రీట్ బ్లాకులపై పడడంతో అవి కొట్టుకుపోయి భారీగా లోతైన గుంతలు పడే ప్రమాదం ఉంటుంది. దీనిని నివారించడానికే బ్యారేజీ దిగువ ప్రాంతంలో తగిన స్థాయిలో నీళ్లు నిల్వ (టెయిల్ వాటర్ లెవల్) చేస్తారు. పైనుంచి పడే వరద ఆ నీటిలో పడటం వల్ల ఉధృతి తగ్గి కాంక్రీట్ బ్లాకులకు నష్టం జరగదు. అయితే అన్నారం బ్యారేజీకి దిగువన తగిన రీతిలో నీళ్లు నిల్వ ఉండేలా డిజైన్ చేయలేదు. దీంతో గతంలో వచ్చిన వరదలతో దిగువన ఉన్న కాంక్రీట్ బ్లాకులు కొట్టుకుపోయి ఆ ప్రాంతంలో లోతైన గుంతలు ఏర్పడ్డాయి. నిరంతర వరదలతో బ్యారేజీ ర్యాఫ్ట్(పునాది) కింద రక్షణగా ఉండే సెకెంట్ పైల్స్ వరకు ఈ గుంతలు విస్తరించాయి. వీటివల్ల సెకెంట్ పైల్స్ దెబ్బతిని వాటికి, ర్యాఫ్ట్‌కు మధ్య అగాధం ఏర్పడి ఉండడానికి అవకాశం ఉంది. దీని వల్లనే బ్యారేజీలో బుంగలు పడి నీళ్లు లీక్ అవుతున్నాయని ఆఫ్కాన్స్–విజేత– పీఈఎస్ జాయింట్ వెంచర్ స్పష్టం చేసింది. కాగా స్టేట్ డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానెల్ చైర్మన్ ఏబీ పాండ్య, రామగుండం మాజీ ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు మోడల్ స్టడీలో పాల్గొన్నారు. సెకనుకు 15–30 మీటర్ల వేగంతో వరద వరదలు తగ్గుముఖం పట్టాక తక్కువ మొత్తంలో నీళ్లను కిందికి విడుదల చేసేందుకు వీలుగా బ్యారేజీ గేట్లను తక్కువ ఎత్తులో పైకి లేపుతారు. అయితే బ్యారేజీ పూర్తిగా నిండి ఉండడంతో పీడనం పెరిగి వరద భీకర ఉధృతితో గేట్ల కింద నుంచి దూసుకు వస్తుంది. అన్నారం గేట్లను 10–30 సెంటిమీటర్లు మాత్రమే పైకి ఎత్తినా, సెకనుకు 15–30 మీటర్ల భీకర వేగంతో వరద బయటికి వస్తోందని మోడల్ స్టడీలో తేలింది. ఈ నేపథ్యంలోనే బ్యారేజీ రక్షణకు ల్యాబ్ సూచనల మేరకు అత్యవసర చర్యలు తీసుకోవాలని నిర్మాణ సంస్థ లేఖలో కోరింది. మూడేళ్ల కిందే ముగిసిన డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ అన్నారం బ్యారేజీ డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ 2021 డిసెంబర్ 17లోనే ముగిసింది. నాటి నుంచి మూడేళ్ల పాటు కేవలం బ్యారేజీ నిర్వహణ కోసం రూ.6.42 కోట్ల అంచనాలతో అఫ్కాన్స్ –విజేత–పీఈఎస్ జేవీతో నీటిపారుదల శాఖ ‘ఆపరేషన్ అండ్ మెయింటినెన్స్’ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం కూడా ఈ ఏడాది డిసెంబర్ 16తో ముగియనుంది. డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్‌లో బ్యారేజీకి జరిగే నష్టాలకు నిర్మాణ సంస్థే పూర్తి బాధ్యత తీసుకుని పునరుద్ధరిస్తుంది. -
నాటి సీఎం స్థాయిలోనే నిర్ణయాలు!
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంపై 2016లో నిర్వహించిన సమావేశాల్లో నాటి ముఖ్యమంత్రి స్థాయిలో నిర్ణయాలు తీసుకున్నట్టు కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేత్వంలోని నిపుణుల కమిటీకి రాష్ట్ర నీటిపారుదల శాఖ నివేదించింది. ఆ నిర్ణయాలకు అనుగుణంగానే సవివర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)లను రూపొందించి కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ఆమోదం కోసం పంపించామని తెలిపింది. అయితే ఆమోదం లభించకముందే నిర్మాణ పనులు ప్రారంభించామని వివరించింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల డిజైన్, నిర్మాణాలపై అధ్యయనం కోసం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) ఇటీవల చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. రెండో విడత రాష్ట్ర పర్యటనకు వచ్చిన ఆ కమిటీ.. బుధవారం మధ్యాహ్నం 3.30 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జలసౌధలో నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు, మాజీ అధికారులతో సుదీర్ఘంగా సమావేశమైంది. నీటి పారుదల శాఖ ఈఎన్సీ(జనరల్) అనిల్‌కుమార్, ఈఎన్సీ (ఓ అండ్ ఎం) బి.నాగేందర్రావు, మాజీ ఈఎన్సీలు సి.మురళీధర్, నల్లా వెంకటేశ్వర్లు తదితరులు ఈ సమావేశంలో పాల్గొని వివరాలు అందించారు. ‘నీటిపారుదల శాఖలో జనరల్, సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ చీఫ్ ఇంజనీర్, హైడ్రాలజీ విభాగాల పనితీరు, బాధ్యతలు ఏమిటి? ప్రభుత్వం–నీటిపారుదలశాఖకు మధ్య ఫైళ్ల రాకపోకలు ఎలా సాగుతాయి?’వంటి అంశాలను నిపుణుల కమిటీ అడిగి తెలుసుకుంది. నాణ్యత పర్యవేక్షణ ఎలా? ‘కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణానికి మూడేళ్ల గడువు ఉండగా.. రెండేళ్లలో ఎందుకు పూర్తి చేశారు? అంత వేగంతో పనులు చేస్తే నాణ్యతను ఎలా పర్యవేక్షించారు? బ్యారేజీల పునాదులు (ర్యాఫ్ట్)కు రక్షణగా తొలుత షీట్ పైల్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించి.. తర్వాత సెకెంట్ పైల్స్‌కు ఎందుకు మారారు? ఈ డిజైన్ మార్పులకు అప్రూవల్స్ తీసుకున్నారా?’అని బ్యారేజీ నిర్మాణంలో భాగస్వాములైన ఇంజనీర్లను అయ్యర్ కమిటీ ప్రశ్నించింది. ఎక్కడో తప్పిదం జరిగింది: మాజీ ఈఎన్సీ మురళీధర్ మేడిగడ్డ బ్యారేజీ పునాదుల(ర్యాఫ్ట్)కు దిగువన ఏర్పాటు చేసిన సెకెంట్ పైల్స్ (నిలువు స్తంభాలు) దిగువ నుంచి, లేదా వాటి మధ్య నుంచి ఇసుక కొట్టుకుపోవడంతోనే బ్యారేజీ కుంగిందని భావిస్తున్నానని అయ్యర్ కమిటీకి మాజీ ఈఎన్సీ (జనరల్) సి.మురళీధర్ వివరించారు. కావాలని ఎవరూ అలా చేయలేదని, అనుకోని రీతిలో ఎక్కడో తప్పిదం జరిగి ఉండవచ్చని కూడా ఆయన పేర్కొన్నట్టు సమాచారం. రామగుండం మాజీ ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లుతో నిపుణుల కమిటీ విడిగా సమావేశమై బ్యారేజీల నిర్మాణంలో ఆయన అనుసరించిన విధానాన్ని అడిగి తెలుసుకుంది. తప్పులు ఎక్కడ జరిగి ఉంటాయి.. చెప్పండి! ‘బ్యారేజీల నిర్మాణంలో ఎక్కడ తప్పులు జరిగి ఉంటాయి? మీ అభిప్రాయం ఏమిటి?’అని నీటి పారుదల శాఖలోని వివిధ విభాగాల ఇంజనీర్లను అయ్యర్ కమిటీ ప్రశ్నించింది. ‘బ్యారేజీల గేట్లను ఎవరు ఆపరేట్ చేశారు? ఈఎన్సీల నుంచి ఏఈ వరకు వివిధ స్థాయిల్లోని ఇంజనీర్ల జాబ్ చార్ట్ ఏమిటి? నీటిపారుదల శాఖ హైపవర్ కమిటీ నిర్ణయాలు ఎలా తీసుకుంటుంది? డిజైన్లను ఎవరు సిఫారసు చేస్తారు? ఎవరు ఆమోదిస్తారు? బ్యారేజీల నిర్మాణానికి ముందు ఇన్వెస్టిగేషన్ జరిపిన వ్యాప్కోస్ వద్ద ఉన్న సాంకేతికత ఏమిటి? మోడల్ స్టడీస్ చేశారా? క్వాలిటీ కంట్రోల్ ఈఎన్సీ(ఓఅండ్ ఎం) పరిధిలోకి వస్తుందా? లేక ఈఎన్సీ (జనరల్) పరిధిలోకి వస్తుందా?’వంటి అంశాలనూ ఆరా తీసింది. బ్యారేజీ నిర్మాణానికి సంబంధించి ప్రతి అంశంపై ప్రశ్నలు సంధించి ఎక్కడ లోపాలు జరిగి ఉంటాయనేది గుర్తించేందుకు ప్రయత్నించింది. ఈ పర్యటనలో భాగంగా గురు, శుక్రవారాల్లో సైతం నిపుణుల కమిటీ నీటి పారుదల శాఖ అధికారులతో సమావేశం కానుంది. అత్యవసర మరమ్మతులపై ఇప్పుడే చెప్పలేం.. బ్యారేజీలకు అత్యవసర మరమ్మతులను సూచించాలని ఈఎన్సీ(జనరల్) అనిల్‌కుమార్ విజ్ఞప్తి చేయగా.. ఈ అంశంపై సిఫారసులతో మధ్యంతర నివేదిక ఇవ్వడంపై ఇప్పుడే ఏమీ చెప్పలేమని చంద్రశేఖర్ అయ్యర్ స్పష్టం చేశారు. బ్యారేజీలపై అధ్యయనం జరిపి, లోపాలను తెలుసుకోవడానికి ఎంత సమయం పడుతుందో ఇప్పుడే చెప్పలేమన్నారు. -
20 రకాల సమాచారం ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్/కాళేశ్వరం: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని తమకు అందజేయాలని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ రాష్ట్ర నీటిపారుదల శాఖను కోరింది. మొత్తం 20 రకాల సమాచారం కావాలని అడిగింది. మూడు బ్యారేజీల డిజైన్లు, వాటి నిర్మాణంపై అధ్యయనం జరిపి లోపాలను గుర్తించి పరిష్కారాలను సిఫారసు చేయడానికి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని మేడిగడ్డతో పాటు అన్నారం బ్యారేజీలను సందర్శించి పరీశీలన జరిపింది. గతేడాది అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజీలోని 7వ బ్లాక్ కుంగిపోవడంతో అప్పట్లో ఎన్డీఎస్ఏ నియమించిన మరో నిపుణుల కమిటీ, ఆ బ్లాక్‌కి సంబంధించిన 20 రకాల సమాచారాన్ని సమర్పించాలని అప్పట్లో రాష్ట్ర నీటిపారుదల శాఖను కోరింది. తాజాగా చంద్రశేఖర్ అయ్యర్ కమిటీ కూడా మూడు బ్యారేజీల్లోని అన్ని బ్లాకులకు సంబంధించిన అదే విధమైన 20 రకాల సమాచారాన్ని తమకు అందజేయాలని విజ్ఞప్తి చేసింది. పగుళ్లు, పునాది పరిశీలన అయ్యర్ నేతృత్వంలో సైంటిస్టులు యూసీ విద్యార్థి, ఆర్.పాటిల్, డైరెక్టర్లు శివకుమార్‌శర్మ, రాహుల్‌కుమార్, అమితాబ్ మీనాలతో కూడిన బృందం మేడిగడ్డను తనిఖీ చేసింది. బ్యారేజీ అప్ స్ట్రీమ్‌లోకి దిగి 6, 7, 8 బ్లాక్‌లను నిశితంగా పరిశీలించింది. డౌన్ స్ట్రీమ్‌లోకి కూడా కాలినడకన వెళ్లి బ్యారేజీ కుంగిన తీరు, పగుళ్లు, పునాది ఎలా ఉందీ చూసింది. కుంగినప్పటి నుంచి ఎలాంటి పరీక్షలు జరిపారు, ఇప్పటివరకు చేపట్టిన చర్యలు అడిగి తెలుసుకున్నారు. ఉదయం నుంచి సాయత్రం 6.30 గంటల వరకు జరిగిన తనిఖీల్లో సీఈ సుధాకర్‌రెడ్డి, ఇతర ఇంజినీర్లు, ఎల్అండ్టీ ప్రతినిధులు పాల్గొన్నారు. అయితే మీడియా ప్రతినిధులను బ్యారేజీ లోపలికి అనుమతించ లేదు. కాగా నేడు సుందిళ్ల బ్యారేజీని కమిటీ సందర్శించనుంది. ఎట్టకేలకు ‘జియో’ సెక్షనల్ డ్రాయింగ్స్ మేడిగడ్డ బ్యారేజీ కింద భూగర్భంలో రాతి పొరల నిర్మాణ క్రమాన్ని తెలియజేసే ‘జియోలాజికల్ సెక్షన్’ డేటాను, ప్రత్యేకించి బ్యారేజీకి సంబంధించిన ఒక్కో విభాగానికి సంబంధించిన ‘సెక్షనల్ డ్రాయింగ్స్’ను వేర్వేరుగా రాష్ట్ర ప్రభుత్వం సమర్పించడంపై గతంలో ఎన్డీఎస్ఏ తీవ్ర అభ్యంతరం తెలిపింది. లోతైన పరిశీలన కోసం జియోలాజికల్ వివరాలతో కూడిన బ్యారేజీ విభాగాల డ్రాయింగ్స్ (సెక్షనల్ డ్రాయింగ్స్)ను సమర్పించాలని కోరింది. అయితే ఇలాంటి డ్రాయింగ్స్‌ను తయారు చేయకుండానే బ్యారేజీని నిర్మించడంతో అప్పట్లో అధికారులు వాటిని సమర్పించలేకపోయారు. కానీ ఎన్డీఎస్ఏ పదేపదే కోరుతుండడంతో ఇటీవల జియోలాజికల్ వివరాలతో కూడిన సెక్షనల్ డ్రాయింగ్స్‌ను రూపొందించి ఎన్డీఎస్ఏకు నీటిపారుదల శాఖ పంపించింది. -
మేడిగడ్డ ఇంజనీర్లపై త్వరలో వేటు
సాక్షి, హైదరాబాద్: మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం పూర్తయిందని ధ్రువీకరిస్తూ నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీకి తప్పుడు మార్గంలో వర్క్ కంప్లీషన్ సర్టిఫికెట్లు జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఈఈ), సూపరింటెండింగ్ ఇంజనీర్ (ఎస్ఈ)లపై చర్యలకు నీటిపారుదల శాఖ సిద్ధమైంది. తొలుత షోకాజ్ నోటీసులు జారీ చేసి సంజాయిషీ కోరాలని, ఆ తర్వాత సస్పెన్షన్ వేటు వేయాలని నిర్ణయం తీసుకుంది. ఒప్పందంలోని నిబంధనల మేరకు నాణ్యత, రక్షణా ప్రమాణాలు పాటిస్తూ బ్యారేజీ నిర్మాణ పనులను పూర్తి చేసినట్లు ధ్రువీకరిస్తూ 2019 సెప్టెంబర్ 10న మహదేవపూర్ డివిజన్–1 ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తిరుపతిరావు ఎల్ అండ్ టీకి ‘సబ్‌స్టాన్షియల్ కన్స్ట్రక్షన్ కంప్లీషన్ సర్టిఫికెట్’ను జారీచేశారు. దానిపై నాటి సూపరింటెండింగ్ ఇంజనీర్, ప్రస్తుత మహబూబ్‌నగర్ జిల్లా చీఫ్ ఇంజనీర్ రమణారెడ్డి కౌంటర్ సంతకం చేశారు. నిర్మాణ సంస్థ విజ్ఞప్తి మేరకు 2021 మార్చి 15న పనులు పూర్తయినట్లు ధ్రువీకరిస్తూ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తిరుపతిరావు మళ్లీ సర్టిఫికెట్ జారీ చేశారు. మరోవైపు ఒప్పందం గడువును 2022 మార్చి 31 వరకు పొడగిస్తూ ఈఎన్సీ ఆరోసారి పొడిగింపు ఉత్తర్వులు జారీచేశారు. పలు అంశాల్లో నిబంధనలకు అనుగుణంగా పనులు చేయనందుకుగాను నిర్మాణ సంస్థకు జారీ చేసిన నోటిసులను పట్టించుకోకుండా రూ. 159.72 కోట్ల సెక్యూరిటీ డిపాజిట్‌ను సైతం విడుదల చేశారు. 2020 ఫిబ్రవరి 29 నుంచి డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ వర్తిస్తుందని నాటి ఈఎన్సీ రామగుండం నల్లా వెంకటేశ్వర్లు జారీ చేసిన ఉత్తర్వులకు విరుద్ధంగా సెక్యూరిటీ డిపాజిట్‌ను ని ర్మాణ సంస్థకు తిరిగి ఇచ్చేశారు. విజిలెన్స్ దర్యాప్తు ఆధారంగా నాటి ఈఎన్సీ సి.మురళీధర్, రా మగుండం ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు ను ప్రభు త్వం తొలగించడం తెలిసిందే. వర్క్ కంప్లీషన్ సర్టిఫికెట్ జారీ వెనక మతలబు ఉందని విజిలెన్స్ విభాగం తేల్చినట్లు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. ఈ సర్టిఫికెట్లను ఆధారంగా చూపి డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ ముగిసిందంటూ మేడిగడ్డ పునరుద్ధరణను సొంత ఖర్చులతో చేపట్టేందుకు ఎల్ అండ్ టీ నిరాకరిస్తోంది. ఒప్పందం ప్రకారం కాంట్రాక్టర్‌కు తుది బిల్లు జారీ కాకపోయినా ఈ సర్టిఫికెట్లను జారీ చేసినట్లు ఆరోపణలు రావడం నీటిపారుదల శాఖకు అప్రతిష్టగా మారింది. ఇద్దరు అధికారులు చేసిన తప్పులకు మొత్తం శాఖ బద్నాం అయిందని, వారిపై చర్య లు తీసు కోవాల్సిందేనని ఉన్నతస్థాయి అధికార వర్గాలు ప్రభుత్వానికి సిఫారసు చేసినట్లు తెలిసింది.