kathi Padma Rao
-
సమతా పథంలో సాగాలంటే...
మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ అంబేడ్కర్ జపం చేస్తోంది. దేవేంద్ర ఫడ్నవీస్ రాజ్యాంగం మీద ఎక్కడలేని ప్రేమను కురిపిస్తున్నారు. రాజ్యాంగం తనకు శిరోధార్యం అని నమ్మించడానికి ప్రయత్నిస్తున్నారు. అంబేడ్కర్‌ను బీజేపీ, ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్ ఇప్పుడు కొనియాడటంలో మార్మికత ఉంది. వాటిని దళిత బహుజనులు అర్థం చేసుకుంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా రాజ్యాంగాన్ని చేత బూనుతుంది. కానీ కుల నిర్మూలనకు, స్త్రీ విముక్తికి, సంపద అందరికీ పంచడానికి పాటుపడటం లేదు. ఈ కార్పొరేట్ భారతాన్ని మతవాదులు పెంచి పోషిస్తున్నారు. అంబేడ్కర్ ఒక విస్తృతమైన మానవాభ్యుదయం కోసం కృషి చేశారు. సామ్యవాద భారతం కావాలంటే అంబేడ్కర్ మార్గం ఒక్కటే దిక్సూచి.భారతదేశంలో అనేక భావ విప్లవ ఉద్య మాలు, సామాజిక సాంస్కృతిక పరిణా మాలు ఆ యా కాలాల్లో వచ్చాయి. అవి రాజకీయ సిద్ధాంతాలపై ప్రభావం చూపాయి. ముఖ్యంగా భారతదేశంలో 1927వ సంవత్సరం నుండి సామాజిక విప్లవోద్యమం ప్రారంభమైంది. బి.ఆర్. అంబేడ్కర్ మనుస్మృతిని దహనం చెయ్యటంతోనే ఈ సాంస్కృతిక విప్లవం ప్రారంభమైంది. అంబేడ్కర్ పుట్టిన మహారాష్ట్రలో అడుగుపెట్టిన నోబెల్ బహుమతి గ్రహీత వి.ఎస్.నైపాల్ ముంబయి నగరాన్ని చూస్తుంటే అంబేడ్కర్ నగరంగా కనిపిస్తుందని అన్నారు. ఎక్కడ చూసినా అంబేడ్కర్ విగ్రహాలు, అంబేడ్కర్ కాలేజీలు, అంబేడ్కర్ విశ్వవిద్యాలయాలు, అంబేడ్కర్ చైత్యాలు, అంబేడ్కర్ గ్రంథాలయా లతో నిండివుందని నైపాల్ రాశారు. భారతదేశం మొత్తం ఎక్కడ చూసినా– బెంVýæళూరు, చెన్నై, కలకత్తా అన్ని మహనగరాల్లోనూ అంబేడ్కర్ స్ఫూర్తే కనపడుతుంది. నిజానికి ఆర్ఎస్ఎస్కు, విశ్వహిందూ పరిషత్‌కు భావజాల పరంగా, సిద్ధాంతపరంగా ప్రత్యామ్నాయంగా రూపొందించిందే మన రాజ్యాంగం. భారత రాజ్యాంగం పూర్తిగా మనుస్మృతి భావజాలాన్ని నిరాకరించిన గ్రంథం. అంబేడ్కర్ రాజ్యాంగ ప్రతిని రాజ్యాంగ పరి షత్తులో ప్రవేశపెట్టిన నాటి నుండి ఆర్ఎస్ఎస్ నిరాకరిస్తూనే వచ్చింది. బీజేపీ ద్వారా సంపూర్ణ రాజ్యాధికారమే వస్తే రాజ్యాంగాన్నే మార్చా లనే దుర్వ్యూహం వాళ్ళ దగ్గర వుంది.అంబేడ్కర్ భారతదేశాన్ని సమసమాజ నిర్మాణంలోకి తీసుకు వెళ్ళాలని ఎంతో ప్రయత్నం చేశారు. పెను వృక్షంలాంటి కాంగ్రెస్ బ్రాహ్మణవాదాన్ని ఎదిరించటానికి, అంతర్గతంగా కాంగ్రెస్‌లో దాగి వున్న హిందూ సాంప్రదాయవాదాన్ని ఎదిరించడానికి ఒక దశలో ఒంటరి పోరాటం చేయవలసి వచ్చింది. తన ప్రజలు కూడా తనకు తోడురాని పరిస్థితుల్లోనూ నిక్కచ్చిగా నిలబడ్డారు. అంబేడ్కర్ దేశ వ్యాప్తంగా తన తాత్విక ముద్ర వేయగలగడానికి కారణం ఆయన బౌద్ధతాత్విక జీవన విధానమే. ఆయన రాజ్యాంగ రచనా రూప కల్పనలో అష్టాంగ మార్గాన్ని ఆదర్శ సూత్రాల్లోకి సమన్వయించ గలి గారు. సమదృష్టి, సత్సంకల్పము, సత్ వచనము, సత్ కర్మ, సత్ జీవనము, సత్ ప్రయత్నము, సత్ కృతి, సత్ సమాధి సూత్రాలను భారత రాజ్యాంగంలో చేర్చిన తరువాత దానికి సామాజిక, తాత్విక జీవన పరిమళం వచ్చింది. భారత రాజ్యాంగం ఒక గొప్ప సమతా మార్గ నిర్దేశంగా నిలబడింది. ఈనాడు మహారాష్ట్ర ఎన్నికల సందర్భంలో బీజేపీ కొత్త ఎత్తు గడతో అంబేడ్కర్ జపం చేస్తోంది. మహారాష్ట్ర రాజకీయాల్లో ఈ దశాబ్దంలో అనేక మార్పులు వచ్చాయి. బీజేపీ దుర్వ్యూహాల గురించి దళితులు, బహుజనులు అర్థం చేసుకుంటున్నారు. ఇప్పుడు బీజేపీ నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ రాజ్యాంగం మీద ఎక్కడలేని ప్రేమ కురిపిస్తున్నారు. రాజ్యాంగం తనకు శిరోధార్యం అని నమ్మించడానికి ప్రయత్నిస్తున్నారు. ఫడ్నవీస్ రాజ్యాంగానికి, అంబేడ్కర్‌కు మోకరిల్లు తున్న పోస్టర్లు మహారాష్ట్రలో విస్తృతంగా దర్శనమిస్తున్నాయి. రాజ్యాంగ రూపకల్పన పూర్తయిన సందర్భంగా, రాజ్యాంగ నిర్ణాయక సభలో 1949 నవంబర్ 25న అంబేడ్కర్ చేసిన రాజ్యాంగం తుది ప్రతి మీద ఆర్ఎస్ఎస్ దుమ్మెత్తి పోసింది. రాజ్యాంగంలో భారతీయత అనేది ఉదాహరణ ప్రాయంగా కూడా లేదని దెప్పి పొడిచింది.దేశానికి స్వాతంత్య్రం వచ్చి 76 ఏళ్లు పూర్తయినా దళితులపై ప్రతిరోజూ అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. కొన్నిసార్లు బహి రంగంగా కొట్టడం, మరి కొన్నిసార్లు గుడిలోకి రానివ్వకపోవడం, చేసిన పనికి జీతం అడిగితే దాడులకు దిగడం, దొంగతనం చేశారన్న అరోపణలతో అకృత్యాలకు పాల్పడటం నిత్యకృత్యాలుగా మారి శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతూనే ఉన్నాయి. దళితులను అవమానించడం, సాంఘిక బహిష్కరణ కేసులు నిత్యం వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. నేషనల్ క్రైవ్‌ు రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) గణాంకాల ప్రకారం, దళితులపై అఘాయిత్యాలకు సంబంధించి ప్రతిరోజూ 150కి పైగా కేసులు నమోదవుతున్నాయి. ఎన్డీయే పాలనలో 2018 నుండి 2022 మధ్య దళితులపై లైంగికదాడులు 35 శాతం పెరిగాయని ఆ నివేదిక తెలిపింది. ఆ నివేదిక ప్రకారం 2018 నుంచి ప్రతి సంవ త్సరం కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నది. దళితులపై నేరాలకు సంబంధించి 2018లో 42,793 కేసులు నమోదయ్యాయి. 2021లో 50,900 కేసులు, 2022లో 57,582 కేసులు నమోదయ్యాయి. ఆ నివేదిక ప్రకారం ఉత్తరప్రదేశ్‌లో దళితులపై అఘాయిత్యాల కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. 2022లో అక్కడ 15 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. ఎనిమిదిన్నర వేలకు పైగా కేసులు నమో దైన రాజస్థాన్ రెండో స్థానంలో ఉంది. యోగీ ఆదిత్యనాథ్ ఇలాకాలోని భరూచ్ జిల్లా తాజ్పూర్ తెడియా గ్రామంలో ఇద్దరు కోళ్ల ఫారం యజమానులు దళిత బాలురు దొంగతనం చేశారన్న అనుమానంతో దాష్టీకానికి దిగారు. బాలురను కొట్టి, గుండు గీయించి, ముఖానికి నల్లరంగు పులిమి గ్రామంలో ఊరేగించారు. ఐదు కిలోల గోధుమలు అపహరించారని ఆరోపిస్తూ 12–14 ఏళ్ల వయసున్న ముగ్గురు బాలుర ముంజేతులపై ‘దొంగ’ అని రాసి గ్రామంలో ఊరేగించారు. దళితుల మానవ హక్కుల పోరాటం గురించి అంబేడ్కర్ ఎంతో అధ్యయనం చేశారు. మొదట డ్రాఫ్టింగ్ కమిటీ సభ్యుడిగా ఎన్నుకో బడిన అంబేడ్కర్ ఆ పిదప 1947 ఆగస్ట్ 29వ తేదీన రాజ్యాంగ రచన సంఘ అధ్యక్షునిగా ఎన్నుకోబడ్డారు. ఎన్. గోపాల స్వామి అయ్యంగార్, సర్ అల్లాడి కుప్పుస్వామి అయ్యర్, కె.ఎం. మున్షీ, మహ్మద్ సాదుల్లా, ఎన్. మాధవ రావు, డి.పి. ఖైతాన్ యితర సభ్యులు కాగా, బి.ఎన్.రావు రాజ్యాంగ సలహాదారులు. కాంగ్రెస్ పార్టీని, ఆ పార్టీ నాయకులను విమర్శించే అంబేడ్కర్‌ను రాజ్యాంగ రచన సంఘా ధ్యక్షులుగా ఆహ్వానించారు. ఇది ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ ఔదార్యంగా చెప్పబడినా అంబేడ్కర్ అసాధారణ ప్రతిభ, ఒక చారిత్రక అవసరంగా మాత్రమే పరిగణించబడుతుంది. అంబేడ్కర్ తనపై మోపబడిన ఈ భారాన్ని సమర్థవంతంగా, నిజాయితీగా నిర్వర్తించడానికి కృషి చేశారు. అంబేడ్కర్ అమెరికాలో చదువుతున్న కాలంలో నీగ్రోల చరిత్రను అధ్యయనం చేశారు. నీగ్రోలు తమ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్ళే క్రమంలో అమెరికా రాజ్యాంగంలోని 14వ అధికరణం ద్వారా ఎలా స్వాతంత్య్రం పొందారో తెలుసుకున్నారు. నీగ్రోల విముక్తి పోరాటంలో ప్రధాన పాత్ర వహించిన బుకర్ టి.వాషింగ్టన్ చరిత్రను అధ్యయనం చేశారు. నీగ్రోల పోరాట చరిత్ర ద్వారా భారతదేశంలో దళితుల్ని ఎలా విముక్తి చేయాలో అర్థం చేసుకొన్నారు.అంబేడ్కర్ ఒక విస్తృతమైన మానవాభ్యుదయం కోసం కృషి చేశారు. ఆయనకు కుల మత బేధాలు లేవు. ఆయన బౌద్ధ జీవన పథికుడు. ఆయన ఆర్థిక, వ్యాపార, రాజకీయ, పరిపాలన, ధర్మ శాస్త్రాల నిపుణుడు. మనుస్మృతిని, యాజ్ఞవల్క్య స్మృతిని, శారదా స్మృతిని అధ్యయనం చేసిన భారతీయుడు. అవి అధర్మశాస్త్రాలని తేల్చిన పరిశోధకుడు. చార్వాకాన్ని, బౌద్ధాన్ని, జైనాన్ని, సాంఖ్యాన్ని అవపో సన పట్టారు. జాన్ డ్యూయీ శిష్యునిగా ప్రజాస్వామ్య శాస్త్రాన్ని ప్రపంచానికి బోధించారు. ఆయన్ని బీజేపీ, ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరి షత్ ఇప్పుడు కొనియాడటంలో మార్మికత ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా రాజ్యాంగాన్ని చేత బూనుతుంది కానీ అస్పృశ్యత నివారణకు, కుల నిర్మూలనకు, స్త్రీ విముక్తికి, సంపద అందరికీ పంచడానికి పాటు పడటం లేదు. ఈ కార్పొరేట్ భారతాన్ని మతవాదులు పెంచి పోషిస్తున్నారు. సామ్యవాద భారతం కావాలంటే అంబేడ్కర్ మార్గం ఒక్కటే దిక్సూచి. ఆయన మార్గంలో నడుద్దాం.డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త దళితోద్యమ నాయకులు ‘ 98497 41695 -
మన పునాది లౌకికం
భారతదేశం లౌకిక ప్రజాస్వామ్య దేశం. ఇక్కడ ఎవరికైనా తమ మతాన్ని అనుసరించే, మార్చుకునే హక్కు ఉంది. నిజానికి హిందూ మతంలో ఉన్న అనేక నియమాల వల్ల, దేవాలయాలకు శూద్రులను కొన్ని సందర్భాల్లో దూరం పెట్టడం వల్ల క్రైస్తవ మతం బాగా పెరిగింది. తర్వాత వీరశైవం, వీరవైష్ణవ ఉద్యమాలు శూద్రులను, అతిశూద్రులను దగ్గరకు తీశాయి. ప్రజలను పాలించేవారికి అన్ని మతాలవారు ఓట్లు వేస్తారు. ‘నేను సనాతన ధర్మానికి బద్ధుడిని’ అనేవాళ్లు పాలక వర్గంగా అందరి హక్కులను కాపాడే బాధ్యత నుండి పాక్షికమైన వాదనలకు దిగుతున్నారని అర్థం. ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం ద్వారా రాజకీయ పరివ్యాప్తి చెందాలి గానీ మతాంశాల ద్వారా కాదని మన నాయకులు గ్రహించాలి.భారతదేశ చరిత్ర, సంస్కృతి, నాగరికత అతి ప్రాచీనమైనవి. మెసçపటోమియా నాగరి కతతో, గ్రీకు ఫిలాసఫీతో పోల్చదగిన స్థాయిలో భారతదేశ చరిత్ర, నాగరికతలు ఉన్నాయి. అందుకనే ప్రపంచ దేశాల చరిత్ర కారులు, పురాతత్వవేత్తలు, భాషాతత్వవేత్తలు ఇంకా ఈ మూలాల్లోకి వెళ్ళి పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. భారతీయ గతంలోకి దర్యాప్తు తూర్పు భాషలు నేర్చిన ఇండా లజిస్టులతో ప్రారంభమైంది. ముఖ్యంగా భారతీయ చరిత్ర, మరీ ముఖ్యంగా భారతీయ భాషలను తమ అధ్యయనంగా ఎంచుకున్న ఐరోపా పండితులతో ఇది మొదలైంది. వివిధ పాలనాపరమైన హోదా లలో ఈస్టిండియా కంపెనీ నియమించిన విలియం జోన్స్, కోల్ బ్రూక్, హెచ్.హెచ్.విల్సన్ వంటివాళ్లు ఇండాలజిస్టులలో కనిపిస్తారు. వారంతా ఐరోపా ప్రాచీన సంప్రదాయంలో శిక్షణ పొందినవారు. ప్రాచీన భాషల పట్ల ఆసక్తి పెంచుకుని, కొత్త రంగంలో నైపుణ్యం సాధించేందుకు ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నారు. పాలనా వేత్తలుగా వారికి సంప్రదాయ భారతీయ చట్టం, రాజకీ యాలు, సమాజం, మతం పట్ల ప్రత్యేక జ్ఞానం కలిగి ఉండాలి. ఇదే వారిని సంస్కృతం, పర్షియన్ సాహిత్యం వైపు నడిపించింది. ఈ విషయా లను ప్రసిద్ధ చరిత్రకారిణి రొమిల్లా థాపర్ తన ‘ఐడియాలజీ అండ్ ది ఇంటర్‌ప్రిటేషన్ ఆఫ్ ఎర్లీ హిస్టరీ’ అనే గ్రంథంలో చెప్పారు. భారతదేశంలోని మానవజాతుల పరిణామాలను పరిశీలించి నట్లయితే, మానవజాతి పరిణామానికి సంబంధించిన ప్రాచీన పరిణామ దశలన్నీ దళితుల్లో కనిపిస్తున్నాయి. మోర్గాన్ చెప్పినట్లు మానవజాతి పరిణామంలో జీవనోపాధి, ఆహారం, పాలనాంగం, ప్రభుత్వం, భాష, కుటుంబం, మతం, గృహæనిర్మాణం, సంపద కీలక పాత్ర వహిస్తాయి. ఈ దశలన్నీ ఇప్పటికీ దళితుల జీవన విధానంలో కనిపించడం వలన, భారతదేశంలో మానవజాతి పరిణామ లక్షణాలన్నీ దళిత జాతుల్లో ఉండటం వలన బి.ఆర్. అంబేడ్కర్ నిర్వచించినట్లు వీరు ఆది భారతీయులనేది నిర్ధారణ అవుతుంది. డేనిష్ పురాతన శాస్త్రవేత్తలు నిర్వచించినట్లు శిల, కాంస్య, ఇనుప యుగలక్షణాలు కూడా భారత సమాజంలోని ఆదిమ జాతుల్లో ఉన్నాయి. నిజానికి భారతదేశంలో సింధునది వారసులు దళితులు. ఆ తర్వాత వచ్చిన ఆర్యులు వీరిని ప్రాచీనులు అని వాడారు. వారికి ఆ తర్వాత వచ్చినవారు అర్వాచీనులు అవుతారు. ఏది సనాతనం? ఏది అధునాతనం? అనే దగ్గర ఋగ్వేద ఆర్యులే ఋగ్వేదాన్ని సనాతనం అయిందనీ, అధర్వణ వేదాన్ని అధునాతనమైనదనీ ప్రస్తావించారు. పూర్వం కంటే ఉత్తర బలీయమైనదనేది శాస్త్రం. అందుకే ఋగ్వేదం, యుజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం... ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వచ్చి ముందుదాని కంటే తర్వాత దానిలో ఇంకా విస్తృతి ఉంది అని చెప్పబడింది. మొట్టమొదటి ఇటుకల చైత్యగృహం, అశోకుని కాలం నాటిది, రాజస్థాన్‌లో బైరాuŠ‡ దగ్గర బయల్పడింది. ఇటుకల చైత్యగృహాలు ఆంధ్రదేశంలో పలుచోట్ల బయల్పడినాయి. కానీ వాస్తు వైశిష్ట్యం ఉన్న కళాఖండాలుగా ప్రసిద్ధి చెందినవి గుహాలయాలే. వీనిలో చాలా భాగం మహారాష్ట్రలోనే ఉన్నాయి. బుద్ధగయ చెంత బరాబర్ కొండల్లో అశోకుడు తొలిపించిన సుదామ– లోమశ ఋషి గుహలే మన దేశంలో మొదటి గుహలు. అదే కాలానికి చెందినవి గుంటుపల్లి గుహాల యాలు. క్రమంగా గుహాలయ వాస్తు భాజా, బేడ్సే, జున్నార్, విఠల్కేరా, కన్హేరీ, కార్లాలలో వికసించి అజంతా – ఎల్లోరాలలో పరిణతి పొందింది. గుహాలయాలన్నింటిలో తలమానికం వంటిది కార్లా చైత్యాలయం.ఆంధ్రుల చరిత్ర సంస్కృతి రచించిన బి.ఎస్.ఎల్. హనుమంత రావు గారు ఆంధ్రులు బౌద్ధ సంస్కృతి వికాసితులు అని చెప్పారు. దక్షిణ భారతదేశంలో ప్రాచీనంగా బౌద్ధం విస్తరిల్లిందని విశ్లేషించారు. బౌద్ధ దర్శన ప్రభావం సుమారు ఆరు శతాబ్దాల కాలం దేశ ప్రజలపై, ప్రభుత్వాలపై స్పష్టంగా కన్పిస్తుంది. ఇంచుమించు భారతదేశాన్ని సమైక్యం చేసి తన ప్రభుత్వానికి ధర్మాన్ని గీటురాయిగా చేసిన అశోక మౌర్యుడు దండ సమత, వ్యవహార సమత నెలకొల్పాడు. దీన్ని బట్టి చూస్తే శిక్షాస్మృతి విషయంలో అందరూ సమానులేననే విధానాన్ని ప్రవేశపెట్టినట్లు అతని శాసనాలు చాటుతున్నాయి.ఆర్య ఋషులు ఈ దేశంలోకి పశుపాలకులుగా ప్రవేశించారు. గోపాలకులు (గోవులను పాలించే వారు), గవేషణ (గోవులను వెదకడం), గోపతి (గోవుల కధిపతి), గోమేధం (గోవులతో చేయు యజ్ఞం), గోఘ్నుడు (అతి«థిగా వచ్చి గోవులను చంపించువాడు), గోత్రం (గోశాల) అని వారిని వెన్నాడుతూ వచ్చిన ఈ విశేషణాలే వారి వృత్తిని ప్రకటిస్తున్నాయి అని రాహుల్ సాంకృత్యాయన్ చెప్పారు. ఆర్యులు గోపాలకులనీ, బౌద్ధం ప్రభావానికి గురయ్యేవరకూ వారు గోవును యజ్ఞయాగాల్లో బలి ఇచ్చారనీ చెప్పబడింది. తైత్తరీయ బ్రాహ్మణంలో చెప్పిన కామేష్టి యజ్ఞాలలో గోవృష భాలను బలి ఇవ్వటమే కాకుండా, ఎలాంటి వాటిని బలి యివ్వాలో కూడా ఉంది. విష్ణువుకి పొట్టి వృషభాన్ని, ఇంద్రుడికి వాలిన కొమ్ములు, ఎర్రని రంగు నుదురుగల వాటినీ, శని దేవుడికి నల్ల ఆవును, రుద్రుడికి ఎర్రగోవుని – ఆ రకంగా బలి ఇవ్వాలని నిర్దేశింపబడింది. అందులోనే ‘పంచశరదీయ’ సేవ అనే మరో రకమైన బలిని గూర్చి కూడా ప్రస్తావించబడింది. అందులో ముఖ్యాంశం ఏమంటే – ఐదేళ్ల వయసున్న 17 పొట్టి గిత్తల్నీ, అదే సంఖ్యలో మూడేళ్ళు నిండని పొట్టి లేగల్నీ బలి ఇవ్వాలని చెప్పబడింది.నిజానికి అమరావతి ప్రపంచ ప్రసిద్ధి చెందిన బౌద్ధ క్షేత్రం.అందుండి బౌద్ధం గురించి మాట్లాడటం ఆంధ్రుల చారిత్రక కర్తవ్యం. ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ అమరావతిని ఆంధ్రుల రాజధానిగా శ్రీకృష్ణ కమిటీకి ప్రతిపాదించిన దానిలో అర్థం అదే. ఆంధ్రులు వైదికేతర మతాలను, ధర్మాలను అన్నింటినీ ఆహ్వానించారు.ముఖ్యంగా బౌద్ధాన్ని, జైనాన్ని, ఇస్లాంను, క్రైస్తవాన్ని, ఇంకా అనేక మతాలను, ధర్మాలను ఆహ్వానించారు. ఆంధ్రదేశంలో శిల్పరూపం క్రీ.పూ. 2వ శతాబ్దికి ముందు లేదు. క్రీ.పూ. 2వ శతాబ్దానికి ముందు నిరాకార తత్వాలే ఉన్నాయి. ఆ తర్వాత శిల్పరూపాలు వచ్చినాక కూడా ఒకరి నొకరు గౌరవించుకోవడమే ఎక్కువ కాలం ఉంది.అంబేడ్కర్ భారత రాజ్యాంగంలో మతం మార్చుకునే హక్కు పొందు పరిచాడు. నిజానికి హిందూ మతంలో ఉన్న అనేక నియమాల వల్ల, దేవాలయాలకు శూద్రులను కొన్ని సందర్భాల్లో దూరం పెట్టడం వల్ల క్రైస్తవ మతం బాగా పెరిగింది. తర్వాత వీరశైవం, వీరవైష్ణవ ఉద్య మాలు శూద్రు లను, అతిశూద్రులను దగ్గరకు తీశాయి. ప్రజలను పాలించే వారికి అన్ని మతాలవారు ఓట్లు వేస్తారు. ‘నేను సనాతన ధర్మానికి బద్ధుడిని’ అనేవాళ్లు పాలక వర్గంగా అందరి హక్కులను కాపాడే బాధ్యత నుండి పాక్షికమైన వాదనలకు దిగుతున్నారని మనకు అర్థం అవుతుంది. అందుకే భారతదేశాన్ని లౌకిక ప్రజాస్వామ్య దేశంగా చెప్పారు. ప్రజలకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవడం ద్వారా రాజకీయ పరివ్యాప్తి చెందాలి గానీ మతాంశాల ద్వారా కాదు అని రాజ్యాంగం చెప్తుంది. రాజ్యాంగంలోని 25, 26, 27, 28వ అధికరణా లను అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. అంబేడ్కర్ ‘విముక్తి అంటే ఏమిటి?’ అని చెప్తూ, 1835 అక్టోబర్ 13న చేసిన ప్రకటనలో మతం మారే హక్కు అందరికీ ఉందన్నారు. నిజానికి ఆంధ్ర దేశం భౌతికవాద తత్వాలతో ప్రభావితమైన దేశం. నార్ల వేంకటేశ్వరరావు, గుర్రం జాషువా, మహాకవి వేమన హేతు వాదాన్ని బోధించారు. భారత రాజ్యాంగ స్ఫూర్తితో నడుస్తూ మాన వతా వాదాన్ని ప్రజ్వలింపజేసే కర్తవ్యంలో భాగస్వాములం అవుదాం.డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త దళితోద్యమ నాయకులు ‘ 98497 41695 -
సమానతే కులానికి ప్రత్యామ్నాయం
కులానికీ, వర్ణానికీ ఉన్న సంబంధాన్ని సామాజిక శాస్త్ర పునాదిగా చర్చిస్తే గానీ కులానికి ఉన్న పట్టు మనకు అవగతం కాదు. వర్ణ వ్యవస్థ నాలుగు వర్ణాలను పేర్కొంది. అవర్ణులుగా పంచములను పేర్కొంది. ఐతే ఆ విభజన సిద్ధాంతం, ప్రయోగంలో భారతదేశంలో శాఖోపశాఖలుగా విస్తరించింది. అంబేడ్కర్ కులనిర్మూలనను శాస్త్రబద్ధంగా నమ్మారు. భారతదేశంలో కులం పునాదులను అర్థం చేసుకున్న తర్వాత కుల నిర్మూలనా సిద్ధాంత గ్రంథాన్ని రచించారు. కులం పునాదుల మీద ఒక జాతిని నిర్మించలేము, ఒక నీతిని నిర్మించలేమని చెప్పారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ సమానతను బోధించారు. సమానత్వపు విలువలను బోధించే భారత రాజ్యాంగమే కులనిర్మూలనా జీవన విధానానికి దిక్సూచి.భారతదేశంలో కులం మూలాల గురించి చాలా చర్చ జరిగింది. కులం పునాదుల గురించి రాసిన వారిలో వి.ఎ.స్మిత్, జె.హెచ్.హట్టన్, హెచ్.హెచ్.రిజ్లీ, ఎస్.వి. కేత్కర్, జి.ఎస్.ఘుర్యే, జ్యోతిబా ఫూలే, బి.ఆర్.అంబేడ్కర్, రామ్ మనోహర్ లోహియా లాంటి ఎందరో ఉన్నారు. హట్టన్ కులాన్ని ఇలా విశ్లేషించారు: ‘‘క్యాస్టు అనే మాట, కాస్టా అనే పోర్చుగీసు శబ్దం నుండి వచ్చింది. ‘కాస్ట’ అను శబ్దము ‘చాలు’, ‘జాతి’, ‘రకము’ అను పదముల అర్థమును తెలుపును. ఆ భాషలో ‘హోమెన్ డీబోవ కాస్టియ అను పద సమూహమునకు ‘మంచి కుటుంబంలోని మనిషి’ లేక ‘కులీనుడు’ అని అర్థము’’. 1563లో గార్సియా డి ఓర్టా ‘తన తండ్రి వృత్తి నుండి ఎవడూ మారడు. చెప్పులు కుట్టు ఒకే కులం వారంతా ఒకటే’ అని రాసిన నాటి నుండి ఈ ‘కాస్ట’ మాటను మనమిపుడు గ్రహించు పరిమితమైన ‘కులం (కాస్టు)’ అనే అర్థములో వాడుతున్నట్లు కనిపిస్తున్నది. హట్టన్ ‘కాస్ట్ ఇన్ ఇండియా’ అనే గొప్ప గ్రంథం రాశారు. అది ప్రపంచ వ్యాప్తంగా చాలా చర్చకు దారి తీసింది. అలాగే రిజ్లీ కులం గురించి ఇలా రాశారు: ‘‘కులం కొన్ని కుటుంబాల సముదాయంగా లేదా కుటుంబ సమూహాల సముదాయంగా ఉండి సామాన్య (ఒకే) నామాన్ని కలిగి ఉంటున్నది. ఒకే మానవుని నుండి లేదా దైవాంశ గల పురాణ పూర్వీకుని నుండి వంశక్రమాన్ని చెప్పుకుంటున్నది. వారస త్వంగా వచ్చిన ఒకే వృత్తిని అనుసరిస్తున్నట్లు బహిరంగంగా ప్రకటించుకుంటున్నది.’’. కులం అనేది వర్ణ వ్యవస్థ నుండి రూపొందించబడిందని ఘుర్యే విశ్లేషించారు: ‘రంగు అను అర్థం గల ‘వర్ణం’ సమాజంలోని వర్గాలను వివరించుటకు వాడబడింది. తరువాత ‘జాతి’ పదం పుట్టుకతో వచ్చిన సమూహ సభ్యత్వమును ‘కులము’గా తెలుపుటకు ప్రత్యేక ముగా ఉపయోగించబడింది’. ‘ఒకడు దేనిలో పుడతాడో అది’ అని ‘జాతి’ శబ్దానికి వ్యుత్పత్తి అర్థం. దీనిని ‘వర్ణా’నికి సమానార్థంలో యోగ్యులైన ప్రాచీన సాధికారులు అడపా దడపా వాడారు.ఈ కులం మూలాల మీద జరిగిన చర్చ తరువాత కులం మూలాలు వర్ణ వ్యవస్థలో ఉన్నాయనేది స్పష్టమైంది. ఒంటి రంగును బట్టి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణములు ప్రత్యేకింపబడినట్లు తెలుస్తుంది. ‘కపిల వర్ణం బ్రాహ్మణుడు, అరుణ వర్ణం క్షత్రియుడు, గోధుమ వర్ణం వైశ్యుడు, కృష్ణ వర్ణం శూద్రుడు’ అని నామలింగాను శాసనం చెబుతుంది. ఈ సందర్భంగా సామాజిక శాస్త్రవేత్తలు పంచమ వర్ణం ఎలా పుట్టిందో చర్చించారు. వర్ణశబ్దం ఋగ్వేదంలో ప్రార్థ, మలాని ఆర్యులకూ, దస్యులకూ తేడాని తేల్చేదిగా వాడారు. ఋగ్వేదం పదవ మండలం రచనా కాలానికి 4 వర్ణాలు పేర్కొన బడ్డాయి. నాలుగు వర్ణాలలో మూడు ఆర్య వర్ణాలు కాగా నాల్గవది ఆర్యేతర వర్గం. అందుకే ఈ నాల్గవ వర్ణం వారు బ్రహ్మ పాదాల నుండి జనించారని చెప్పబడింది. వీరు ఆర్య సమాజంలో కలిసి నాల్గవ మెట్టులో జీవించే సామాజిక చారిత్రక పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ వర్ణ సమాజానికి దూరంగా జీవించిన చండాలురు, పిపీలకాదులు, నిషాదులు పంచములుగా పిలవబడి ఆ తరువాత కాలంలో అస్పృశ్యులు అయి నారు. వీరిని ఋగ్వేద కాలంలో వైదికార్యులు అస్పృశ్యులుగా పరిగణించలేదు, పంచజనులుగా మాత్రమే పరిగణించారు. వర్ణ వ్యవస్థ నాలుగు వర్ణాలను పేర్కొంది. అవర్ణులుగా పంచములను పేర్కొంది. ఐతే ఆ విభజన సిద్ధాంతం ప్రయోగంలో భారతదేశంలో శాఖోపశాఖలుగా విస్తరించింది. అవి శాఖలుగా ఉపశాఖలుగా వంశపారంపర్య తత్వంతో అంతశ్శాఖ వివాహ సంబంధాలు మాత్రమే కలిగి కుంచించుకు పోయాయి. ఆర్యులు వర్ణతత్వాన్ని భారతదేశానికి మోసుకు రాకముందు ఈ విధమైన విభజన భారతదేశంలో లేదు. అంబేడ్కర్ భారతదేశంలో కులం పునాదులను అర్థం చేసుకున్న తర్వాత కుల నిర్మూలనా సిద్ధాంత గ్రంథాన్ని రచించారు. ఈ సంద ర్భంగా ఆయన అప్పటికి ప్రసిద్ధంగా ఉన్న అన్ని పార్టీల సిద్ధాంతాల తోనూ, నాయకులతోనూ పోరాడారు. మహత్మాగాంధీకి సమాధాన మిస్తూ తన కులనిర్మూలనా వాదనను లేఖ ద్వారా తెలియజేశారు:‘నా ఉద్దేశంలో హిందూ సమాజం కులరహిత సమాజం అయినప్పుడు మాత్రమే అది తనను తాను రక్షించుకొనే శక్తినీ, సామర్థ్యాన్నీ సంతరించుకోగలదు. ఆంతరంగికమైన బలం లేకుండా హిందువులకు స్వరాజ్యం వచ్చినా, అది మళ్ళీ దాస్యం వైపు ఒక అడుగు ముందుకు వెయ్యడమే కావచ్చు. బాగా ఆలోచించండి’ అని గాంధీకి విన్నవించారు. అంబేడ్కర్ కులనిర్మూలనను శాస్త్రబద్ధంగా నమ్మారు. కులం చేత పీడింపబడుతున్న వారిలో అస్పృశ్యులుగా చెప్పబడుతున్న పంచమ వర్ణులు ప్రధానంగా ఉన్నారని గుర్తించారు. అస్పృశ్యతను పాటించడం వల్ల భారతదేశంలో సోషలిజం రాదని కూడా చెప్పారు. సోషలిస్టులు, కమ్యూనిస్టులు ఈ విషయాన్ని గుర్తించాలని కోరారు. బుద్ధుడు, మహత్మా ఫూలే స్ఫూర్తితో అంబేడ్కర్ తన సిద్ధాంతాలు రూపొందించు కున్నారు. భూములను జాతీయం చేయండి, పరిశ్రమలను జాతీయం చేయండి, స్త్రీలకు సమాన హక్కులు కలుVýæజేయండి, బహుజనులు రాజ్యాధికారానికి సొంతంగా ఉద్యుక్తులు కండి అని ప్రబో ధిస్తూ వెళ్ళారు. రామ్ మనోహర్ లోహియా తన ‘కులాల సమస్య’ గ్రంథంలో భారత రాజకీయాలు కులాల గుప్పిట్లోకి వెళ్ళిపోతున్నా యని రాశారు. ప్రజా సోషలిస్టు, సోషలిస్టు, కమ్యూనిస్టు పార్టీల నాయకత్వాలు కూడా కులీనులు, ధనవంతుల గుప్పిళ్లలోనే ఉన్నాయి. ఒకప్పుడు పండిత నెహ్రూ కూడా దేశంలో విప్లవ నాయకుడుగానే ఉండేవారు. కాంగ్రెసులోని ఈ నాయకులే సమానత్వం గురించి మాట్లాడుతూ ఉండేవారు. కాని ఇప్పుడు వారు ఎలా మారిపోయారు? వర్గ స్వభావం, వర్గ పక్షపాతం ఎప్పుడూ అంతరించవు. రామ్ మనోహర్ లోహియా రాజకీయాల్లో కులాధిపత్యాన్ని నిర్మూలించి బహుజన రాజ్యాధికారం కోసం కృషి చేయాలని చెప్పారు. పెరియార్ రామ స్వామి నాయకర్ 1924 మార్చిలో కేరళలో అస్పృశ్యత నివారణ కోసం ‘వైకోమ్’ ఉద్యమం నడుపుతూ, ఆత్మగౌరవ పోరాటానికి పిలుపు నిచ్చారు. ‘‘ఆత్మగౌరవం పట్ల అవగాహన ఉంటేనే స్వతంత్రం గురించి మాట్లాడగలుగుతాం. అయితే ఇప్పుడు స్వతంత్రం గురించి మాట్లాడుతున్నవాళ్ళు ఆత్మగౌరవాన్ని విస్మరిస్తున్నారు. ఆత్మగౌరవం లేని స్వతంత్రానికి అర్థమే లేదు’’ అని ఆయన ఆనాటి కాంగ్రెస్ నాయకులకు చురకలు వేశారు. తన ఇరవై యేళ్ళ వయస్సులోనే కాంగ్రెస్ సభలో రామాయణం, మహాభారతం, పురాణాలు, శాస్త్రా లను తీవ్రంగా విమర్శించేవారు.నిజానికి భారతదేశంలో కుల నిర్మూలనా ఉద్యమాలుగా నడిచిన బౌద్ధం, జైనం, సాంఖ్యం ప్రేరణతో... ఫూలే, పెరియార్, లోహియా భావజాలంతో అంబేడ్కర్ మార్గంలో నడిస్తే ప్రత్యామ్నాయ సంస్కృతి రూపొందుతుంది. బహుజన రాజ్యాధికారాన్ని అనతి కాలంలో సాధించుకోవచ్చు. భారతదేశ రాజకీయాల్లో, సామాజిక వ్యవస్థల్లో, అన్ని మతాల్లో, పార్టీల్లో కులతత్వం చొచ్చుకుపోవడానికి కారణం అంబే డ్కర్ రాజ్యాంగ స్ఫూర్తిని అందుకోకపోవడమే. అందుకే కులం పునా దుల మీద ఒక జాతిని నిర్మించలేము, ఒక నీతిని నిర్మించలేమని అంబేడ్కర్ చెప్పారు. కులానికి ప్రత్యామ్నాయంగానే ఆయన లక్ష పేజీల వాఙ్మయాన్ని రచించారు. కులనిర్మూలనా సిద్ధాంతకర్తగా పేరు పొందారు. అంబేడ్కర్ రచించిన రాజకీయ ప్రణాళికల్లో సామాజిక, ఆర్థిక, రాజకీయ సమానతను బోధించారు. ఆయన బౌద్ధ సూత్రాలతో భారత రాజ్యాంగాన్ని నిర్మించారు. భారత రాజ్యాంగమే కుల నిర్మూ లనా జీవన విధానానికి దిక్సూచి. ఆ మార్గంలో నడుద్దాం!డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త దళితోద్యమ నాయకులు ‘ 98497 41695 -
మూలవాసుల అభివృద్ధా? మూలాల విధ్వంసమా?
స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లవుతున్నా దేశ అభివృద్ధి నమూనా మారడం లేదు. అభివృద్ధి ఫలాలు కొందరి దగ్గరే పోగుబడడం అంతకంతకూ పెరిగిపోతోంది. సాంస్కృతిక హననంతోపాటు మూలవాసుల పేదరికమూ హెచ్చవుతోంది.భారతదేశం ప్రపంచ దేశాల ముందు తలయెత్తుకొని నిలబడగలిగిన ప్రాకృతిక సంపదను కలిగి ఉంది. దాన్ని పరిరక్షించుకుంటూ, దేశ అభివృద్ధిని నిరంతరం పెంచి పోషించుకునే సూత్రాలు, అధికరణాలు రాజ్యాంగంలో ఎల్లెడలా పరచుకొని ఉన్నాయి. ముఖ్యంగా భారత రాజ్యాంగం మానవ హక్కుల పరిరక్షణలో బలమైన సూత్రాలను మనకు అందించింది. అధికరణం 46లో ‘బలహీన వర్గాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. బలహీన వర్గాలకు చెందిన ప్రజల (ప్రత్యేకించి షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగలకు చెందిన ప్రజలు) ఆర్థికాభివృద్ధికి, వారిలో విద్యావకాశాల అభివృద్ధికి ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధను తీసుకోవాలి. ఏ విధంగానూ దోపిడీకి గురి కాకుండా వారిని కాపాడాలి. వారికి సామాజికంగా అన్యాయం జరగకుండా చూడాల’ని ఉంది.కానీ, ఇవాళ అర్థికాభివృద్ధి పేరుతో సహజవనరులు, సాంస్కృతిక సంపద హననానికి గురవు తోందనేది వాస్తవం. దక్షిణ భారత దేశం పారిశ్రామికంగా మిగతా ప్రాంతాల కన్నా వేగంగా అభివృద్ధి చెందుతోంది. అయితే ఈ అభివృద్ధి క్రమంలో... వేల ఏళ్ల పాటు తరతరాలు వారసత్వంగా మనకు అందించిన సాంస్కృతిక సంపద ధ్వంసమవుతోంది. దక్షిణ భారతదేశ నవీన రాతియుగ సంస్కృతి మూలాలు అంతరించే పరిస్థితులు వచ్చాయని చరిత్రకారులు, పర్యావరణ శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. సమాజ పరిణామక్రమంలో కొంత కాలానికి ప్రభుత్వాలేర్పడ్డాయి. చాలాకాలం వరకు అప్పటి ప్రభుత్వాలు భూమి పైన శిస్తు వసూలుకే పరిమితమయ్యాయి. కాని, భూమిపై హక్కును ఏర్పరచుకొనలేదు. కాలక్రమంలో భారతదేశాన్ని అనేక స్వదేశీ, విదేశీ తెగలు పరిపాలించాయి. మొగలాయీ చక్రవర్తుల కాలంలో భూమిశిస్తు వసూలు బాధ్యత ప్రభుత్వ అధికారుల నుండి ప్రైవేటు వ్యక్తులకు బదిలీ అయింది. వారే జమీందారు లయ్యారు. బ్రిటీష్ వారి పాలనలో జమీందారులకు వారి అజమాయిషీలోని ఎస్టేటు లపై 1793లో లార్డ్ కారన్వాలిస్ ఆస్తి హక్కు నిచ్చారు. భూమి కాస్తా అమ్మకపు సరుకైంది. కరవు కాటకాల సమయాల్లో నిర్బంధపు శిస్తులు కట్టలేక భూమిని అమ్ముకున్న రైతులు భూమిలేని పేదలయ్యారు. హెచ్చుగా భూములను కొన్నవారేమో... వడ్డీ వ్యాపా రులు, భూస్వాములయ్యారు. భూమిని పోగొట్టుకున్న వారిలో చాలామంది కౌలు దారులయ్యారు. క్రమంగా భూస్వాముల నిర్బంధపు కౌలు వసూలును కౌలుదార్లు భరించలేని స్థితికి చేరారు. ఆ క్రమంలో వారు భూమిలేని గ్రామీణ పేదలయ్యారు. తిరిగి భూమిని పేదలకు పంచాలనే ఉద్యమాలు ప్రారంభమయ్యాయి, 1947 తర్వాత స్వతంత్ర భారతంలో ఈ ఉద్యమాలు ఊపందుకున్నాయి.1948లో జమీందారీ వ్యవస్థ రద్దు కాక పూర్వం మామూలు భూస్వాములకు సగటున 100 ఎకరాలుండేది. 1938లో వచ్చిన ప్రకాశం కమిటీ రిపోర్టు ఆధారంగా తయారుచేసిన ‘మద్రాసు ఎస్టేట్ రద్దు – రైత్వారీకి మార్పు బిల్లు’ 1949 ఏప్రిల్ 19న శాసనసభ ఆమోదం పొంది, 1950లో రాష్ట్రపతి ఆమోదముద్ర పడి చట్టమైంది. ఈ చట్టం ప్రకారం పర్మనెంట్ సెటిల్మెంట్ ఎస్టేటు భూములు, అడవులు, గనులు, ఖనిజాలు గల భూములన్నీ రాష్ట్ర ప్రభుత్వం అధీనంలోకి వచ్చాయి. జమీందారులకు పెద్ద ఎత్తున నష్టపరిహారం చెల్లిస్తూ, వారి సొంత సేద్యానికి సారవంతమైన వేలాది ఎకరాలు వదిలి వేయబడ్డాయి. దీనితో జమీందారులు బడా భూస్వాములయ్యారు.ప్రధానమైన వనరులన్నీ కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి వెళ్ళాక... దేశంలో కరవు, అవిద్య, అనారోగ్యం, దురాక్రమణలతో కూడిన పాలనా విధానాలు పెరుగుతున్నాయి. డా‘‘ బీఆర్ అంబేడ్కర్ ఆనాడే దక్షిణ భారత అస్తిత్వాన్ని గురించీ, భారతదేశంలోని ఇతర రాష్ట్రాల అస్తిత్వాల గురించి అనేక సూత్రాలు మనకు అందించారు. ముఖ్యంగా దక్షిణ భారత భూభాగంలో... స్థానిక భాషలు,సంస్కృతి, చరిత్ర, పురాతత్వ భావనలను పెంపొందించాలన్నారు. అంతేకాని వాటిని ఇతరులకు తాకట్టు పెట్టే విధానాలను అవలంబించరాదనీ, అందువల్ల భారతదేశం అంతర్గతంగా తాకట్టులోకి వెళ్ళే ప్రమాదం ఉందనీ చెప్పారు. నిజానికి ప్రస్తుత పాలకవర్గ నిష్క్రియాపర్వాన్ని అలా ఉంచితే... కాంగ్రెస్ నాయకత్వంలో ఉన్న ‘ఇండియా’ కూటమి కూడా దేశాన్ని తాకట్టు నుంచి విముక్తి చేసే విధంగా పార్లమెంటులో వాదించలేకపోతోంది. ఆ మాట ఒప్పుకోవాల్సిందే! కొన్ని కార్పొరేట్ శక్తులు వీరి వెనక కూడా ఉండడమే ఇందుకు ఒక కారణం కావచ్చు. ఇదే సమయంలో రాజ్యాంగ హక్కుల్ని కాపాడుకునే విషయంలో పార్లమెంటులోని దళిత బహుజన ఎం.పీలు నోరు మెదపకపోవడం వారి బానిసత్వాన్ని గుర్తు చేస్తోంది. నిజానికి ఈ దేశం ఇలా కార్పొరేట్ శక్తుల, అగ్రవర్ణ భూస్వామ్య శక్తుల చేతుల్లోకి వెళ్ళడానికి ప్రధాన కారణం పూనా ప్యాక్ట్ ద్వారా ఉమ్మడి నియోజక వర్గాల్లో గెలిచిన దళిత ఎంపీలు, ఎమ్మెల్యేలని చెప్పక తప్పదు. ఇప్పటికీ ఈ వర్గాలకు చెందిన ప్రజాప్రతినిధులు దళిత హక్కుల కోసం ఎలుగెత్తి మాట్లాడలేకపోతున్నారు అనేది స్పష్టమైన అంశం. అలాగే వామపక్షాలు కూడా అనేక సందర్భాల్లో దళిత బహుజనుల భూమి హక్కు మీద, కౌలుదార్ల హక్కుల మీద మాట్లాడటం తగ్గించారు.మరోపక్క సెంటు భూమి కూడా లేని వారు భారతదేశంలో 80 కోట్ల మంది ఉన్నారు. బ్యాంకులో అప్పుల్లో ఉన్నవారి సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. ప్రభుత్వాలు ప్రజలకు ఉత్పత్తి క్రమాన్ని నేర్పటం లేదు. ప్రజల్లో జీవశక్తినీ, ఆత్మ విశ్వాసాన్నీ, ఆత్మ గౌరవ స్ఫూర్తినీ, స్వీయ జీవన ప్రమాణాన్నీ పెంచినప్పుడే దేశం ఇతర దేశాలకు అప్పులు ఇవ్వగలిగిన స్థాయికి ఎదుగుతుంది. ఈనాడు దేశీయ భావన, జాతీయ భావన, రాజ్యాంగ స్ఫూర్తి ప్రతి ఒక్కరిలో పెంచాల్సిన బాధ్యత లౌకికవాద ప్రజాస్వామ్య శక్తుల చేతుల్లో ఉంది. రాజకీయ పార్టీల కన్నా ... ఎప్పుడూ ప్రజా ఉద్య మాలే దేశాన్ని మేల్కొలుపుతాయి. నిద్రావస్థలో మునిగిన సమాజాన్ని చైతన్యవంతం చేసి, అంబేడ్కర్ మార్గంలో ఈ దేశ సాంస్కృతిక వికాసానికి అందరం పాటుపడుదాం.డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త దళితోద్యమ నాయకుడు ‘ 98497 41695 -
అంబేడ్కర్ ఆలోచనల్ని ప్రతిఫలిస్తాయా?
నూతనంగా ఏర్పడిన ఎన్డీఏ 3.0 ప్రభుత్వం 2024–25కి బడ్జెట్‌ను ప్రవేశపెట్టడానికి సమాయత్తమవుతోంది. దీనిమీద అందరిలోనూ ఆసక్తి నెలకొని వుంది. అణగారిన సామాజిక వర్గాలు అభివృద్ధి చెందితేనే ప్రపంచ వ్యాప్తమైన ఆర్థికాభివృద్ధిలో భారతదేశం భాగస్వామ్యం కాగలుగుతుందని అంబేడ్కర్ ఏనాడో చెప్పారు. షెడ్యూల్డ్ కులాల ఆర్థిక విమోచన జరగాలంటే, వారికి భూములను పంచే ముఖ్య విషయం మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలని కూడా అంబేడ్కర్ సూచించారు. దానికి బడ్జెట్లో ప్రాధాన్యమివ్వాలి. కుల నిర్మూలనకు, స్త్రీ సాధికారతకు, వ్యవసాయ కూలీలను వ్యవసాయదారులుగా మలిచేందుకు బడ్జెట్ కేటాయింపులు జరగాలి. బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేసేలా, కొత్త ఉద్యోగాలు కల్పించేలా బడ్జెట్ కేటాయింపులు జరపాలి.2024–25 సంవత్సరానికి కేంద్రంలోని నూతన ఎన్డీఏ ప్రభుత్వం జూలై 22, 23 తేదీల్లో బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా దళితుల్లోనూ, స్త్రీలలోనూ, ఆదివాసీలలోనూ కొత్త ఆశలు కలుగుతున్నాయి. మొత్తం పార్లమెంట్లో 111 మంది దళిత ఎంపీలు ఉన్నారు. అస్పృశ్యతా నిర్మూలనకు, కుల నిర్మూలనకు, స్త్రీ సాధికారతకు, వ్యవసాయ కూలీలను వ్యవసాయదారులుగా మలిచే అంశాల పట్ల దేశంలో ఎంతో ఆసక్తి నెలకొనివుంది. ఈ క్రమంలో ముఖ్యంగా స్త్రీ సాధికారత భారతదేశంలో చాలా అవసరంగా కనిపిస్తుంది. పురుషుల సంఖ్యతో దాదాపు సమానంగా ఉన్న స్త్రీలలో 20 కోట్ల మందికి పనిలేదు. ముఖ్యంగా దళిత స్త్రీలకు సొంత భూమి లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. భూమి చరిత్ర చూస్తే భూస్వామ్య ఆధిపత్య కులాలకే భూమి ఉంది. భూమి ఉత్పాదకతపై వారికి పూర్తి అవగాహన ఉండేది. సమాజంలో వారు బలమైన వర్గంగా వ్యవహరించేవారు. అందుకే కేంద్ర పాలకులు వారిని విస్మరించడం కానీ, వారితో వైరం పెట్టుకోవడం కానీ జరిగేది కాదు. తరతరాలుగా పాలకవర్గాలు అగ్రకులాలకు భూ వసతిని కల్పించడంలోనూ, వాటికి నీటి వసతి కల్పించడంలోనూ జాగరూకతతో ఉన్నాయి.ఆంధ్రప్రదేశ్ భూపరిమితి చట్టాన్ని 1958లో అప్పటి ప్రభుత్వం తెచ్చింది. అది జూన్ 1961లో అమల్లోకి వచ్చింది. కానీ ఇప్పటి వరకూ దానికి తూట్లు పడుతూనే వున్నాయి. ప్రధానమైన విషయం ఆంధ్రప్రదేశ్ వ్యావసాయిక రాష్ట్రం. ఇందులో 69.7 శాతం మంది వ్యవసాయ కూలీలు. అందులో 90 శాతం మంది దళితులు. ఈ దళితులకు ఉన్నత స్థాయి కలిగించాలంటే తప్పకుండా వీరికి భూమి ఇవ్వాలి. రాను రాను వ్యవసాయ కూలీపని మీద శిథిలమౌతున్న వృత్తులవారందరూ ఆధారపడుతున్నారు.పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో భూమి రేటు విపరీతంగా పెరగడం వల్ల ఏ వ్యవసాయ కూలీలైతే భూమిని చదును చేసి వ్యవసాయీకరించారో వారు భూమి కొనలేని పరిస్థితుల్లోకి నెట్టబడ్డారు. అలాగే కృష్ణా డెల్టాలో అసలు మిగులు భూమి లేదని అధికారులు ప్రకటిస్తున్నారు. ఇటు వ్యవసాయ కూలి పని లేక, అటు ప్రభుత్వం భూమి ఇవ్వక, గ్రామాల్లో ఉండే పరిస్థితులు లేక తీవ్రమైన వలసలకు దళితులు గురి అవుతున్నారు. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో కనీసం రూ.1,000 కోట్లు అయినా భూమి కొనుగోలు పథకానికి కేటాయించవలసిన అవసరం ఉందని సామాజిక ఆర్థిక శాస్త్రవేత్తలు కోరుకుంటున్నారు. ఈ విషయంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మొదటి ప్రణాళిక సంఘంలోనే భూమి కొనుగోలు పథకానికి 20 కోట్ల కేటాయింపు చేసిన విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి.అంబేడ్కర్ 1954 సెప్టెంబర్ 6వ తేదీన రాజ్యసభలోని చర్చల్లో ఇలా నివేదించారు: ‘‘ఆర్యా! నేనిప్పుడు షెడ్యూల్డ్ కులాల ఆర్థిక విమోచన సమస్యను ప్రస్తావిస్తున్నాను. చదువుతో పాటుగా ఉద్యోగాలు కూడా షెడ్యూల్డ్ కులాల ఆర్థిక హోదా పెరుగుదలకు ఎక్కువ ప్రాధాన్యమైనవి. అయితే ఇప్పుడు షెడ్యూల్డ్ కులాల ఆర్థిక హోదా పెరుగుదలకు ఏమి అవకాశాలున్నాయి? షెడ్యూల్డ్ కులాల ఆర్థిక విమోచన లాభదాయకమైన వృత్తులలో ప్రవేశం పొందే అవకాశం మీదనే ఆధారపడి ఉందని స్పష్టమైంది. లాభదాయకమైన వృత్తుల్లోకి ద్వారాలు తెరవబడనంత వరకు, వారి ఆర్థిక విమోచన జరిగే వీలు లేదు. వారు బానిసలుగానే మిగిలి పోతారు. బానిసలు కాకపోయినా, గ్రామాలలో భూస్వాముల సేవకులుగా మిగిలిపోతారు. ఆ విషయంలో ఏమాత్రం అనుమానం లేదు. ఆర్యా! నిస్సందేహంగా షెడ్యూల్డ్ కులాల వారికి ప్రభుత్వంవారు భూమిని పంచే ముఖ్యమైన విషయంపై దృష్టి ఉంచాలి. భూస్వాముల పొలాలపై పరిమితిని విధించి, అంతకన్నా ఎక్కువ ఉన్న భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని దానిని షెడ్యూల్డ్ కులాల వారికి ఇవ్వాలి. రెండవదేమిటంటే అమ్మకానికి వచ్చిన భూమిని కొనుక్కోవటం కోసం వారికి ఋణాలివ్వాలి.’’ఇకపోతే స్త్రీలకు భారతదేశ వ్యాప్తంగా కుటీర పరిశ్రమలు రూపొందించి వాటిని వస్తూత్పత్తి కేంద్రాలుగా రూపొందించాలి. అక్కడ తయారైన వస్తువులకు ప్రపంచ మార్కెట్లో స్థానం ఏర్పాటు చేయగలిగితే మన స్త్రీలు చైనాను మించిపోతారు. నిజానికి గత రెండు దశాబ్దాలుగా నిరుద్యోగుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. చైనా నుంచి దిగుమతులు పెరుగుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వల్ల గ్రాడ్యుయేట్ యువతలో నిరుద్యోగ రేటు 42 శాతానికి పెరిగింది. దీని వల్ల నిరుద్యోగులలో నిరాసక్తత, సోమరితనం పెరుగుతున్నాయి. మత్తు మందుల వాడకం పెరగడానికి కూడ నిరుద్యోగితే కారణం. ఈ నిరుద్యోగుల్లో మహిళలు ఎక్కువగా ఉండటం గమనించదగ్గ విషయం. స్త్రీల విద్య, ఉపాధి విషయాల గురించి అంబేడ్కర్ హిందూ కోడ్ బిల్లులోనూ, ఆ తరువాత పార్లమెంట్ చర్చల్లోనూ ఎన్నో సలహాలు ఇచ్చారు. వాటిని పెడచెవిన పెట్టడం వల్లే ఈ రోజున స్త్రీలు చదువుకొని కూడా అటు వ్యవసాయపని చేయలేకా, ఇటు ఉద్యోగం దొరక్కా సంక్షోభంలో ఉండిపోయారు. నిరుద్యోగ నిర్మూలన కోసం బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేసేలా, కొత్త ఉద్యోగాలు కల్పించేలా బడ్జెట్ కేటాయింపులు జరపాలి. దళిత విద్యార్థుల కోసం గురుకుల పాఠశాలలను దేశం మొత్తంగా మండలానికి ఒకటి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. నిజానికి గురుకుల పాఠశాలల్లోనే దళితులకు సరైన విద్య, ఆహారం లభిస్తాయి. ఈ బడ్జెట్లో కుల నిర్మూలన కోసం, కులాంతర వివాహితుల రక్షణ కోసం కూడా కేటాయింపులు తప్పకుండా అవసరం. కుల నిర్మూలనను ఒక ఉద్యమంగా చేపట్టడం వల్ల సమాజంలో విస్తృతమైన మార్పులు వస్తాయనీ, సామాజిక సమతుల్యత ఏర్పడుతుందనీ అంబేడ్కర్ స్పష్టం చేశారు. అందుకే సాంఘిక స్వాతంత్య్రాన్ని, మేధా స్వాతంత్య్రాన్ని, ఆర్థిక స్వాతంత్య్రాన్ని, రాజకీయ స్వాతంత్య్రాన్ని ప్రజలకు కలిగించాలంటే దానికి అవసరమైన బడ్జెట్ కేటాయింపులు ఉండాలని సూచించారు. దేశ బడ్జెట్ అనేది ఉత్పత్తి శక్తుల మానసిక, శారీరక సౌష్టవాన్ని పెంచే దిశగా ఉండాలన్నారు. తాగుడు, సిగరెట్, ఇతర వ్యసనాల నుండి దూరం చేసే నైతిక అధ్యయన కేంద్రాలు పెంచడం వల్ల సంపద మిగులు ఏర్పడుతుందని చెప్పారు. యువకుల నైపుణ్యాలను పెంచే కేంద్రాలను పెంచడం వల్ల వాళ్లు ఏ రంగంలోనైనా అభివృద్ధి చెందగలుగుతారనీ, ఆధీనత భావాన్ని తగ్గించే దిశగా బడ్జెట్ ఉండాలనీ సామాజిక, ఆర్థికవేత్తలు కోరుతున్నారు. శ్రమ నుండే మానవాళి అభివృద్ధి జరుగుతుంది. శ్రమ నుండే చైతన్యం వస్తుంది. ప్రభుత్వం ఎన్ని సబ్సిడీలు కల్పించినా ప్రజలు ఆర్థికాభివృద్ధి చెందరు. వారిలో ఉత్సాహాన్ని, జీవన భద్రతని కల్పించాలంటే వారు చేసే పనికి ప్రతిఫలం లభించాలి. ‘ప్రభుత్వం ఏదైనా ఇస్తే బతుకుదాం’ అనే పరిస్థితుల్లోకి ప్రజలు నెట్టబడుతున్నారు. దీని వల్ల చాలా నష్టం కలగడమే కాక జాతుల్లో అలసత్వం పెరిగే ప్రమాదం ముంచుకొస్తుందని అంబేడ్కర్ ప్రజలకు ఉద్బోధించారు. నిజానికి ఆయన భూమిని జాతీయం చేయండి, పరిశ్రమలను జాతీయం చేయండి అని పిలుపును ఇచ్చిన మేధావి. భారతదేశంలో అణగారిన సామాజిక వర్గాలు అభివృద్ధి చెందితేనే ప్రపంచవ్యాప్తమైన ఆర్థికాభివృద్ధిలో భారతదేశం భాగస్వామ్యం కాగలుగుతుందని చెప్పారు. విద్య, విజ్ఞానం, ఉత్పత్తి, భూపంపిణీ, సామాజిక అభివృద్ధి, పారిశ్రామికీకరణ, స్త్రీ అభివృద్ధి, యువశక్తి వినియోగం, వృద్ధుల రక్షణ, పర్యావరణ పరిరక్షణ, నదుల అనుసంధానం... వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని కేంద్ర బడ్జెట్ రూపకల్పన జరిగినపుడు భారతదేశం నిజమైన వికాసాన్ని, ప్రాభవాన్ని పొందుతుందని చెప్పారు. ఆ దిశగా పాలకులు, ప్రజలు నడుస్తారని ఆశిద్దాం.డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త దళితోద్యమ నాయకుడు ‘ 98497 41695 -
వాస్తవ చరిత్రతోనే మెరుగైన భవిత
దేశంలో కోట్లాది మంది విద్యార్థులు అభ్యసించే ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాల్లో మతవాద భావజాలాన్ని చొప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మతవాద భావాలు లౌకికవాద భావజాలానికి విఘాతం కలిగిస్తాయని అంబేడ్కర్ ఏనాడో అన్నారు. లౌకికవాద రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా పాఠ్య ప్రణాళికలు రూపొందించే విధానం చరిత్రకు నష్టం కలిగిస్తుంది. విద్యార్థి సమూహానికి దేశంలోని భౌగోళిక పరిస్థితులు, సామాజిక పరిస్థితులు, చరిత్ర... వాస్తవంగా, ఉన్నది ఉన్నట్టుగా అర్థం కావలసి ఉంది. మతవాదాన్నే జాతీయ వాదంగా ప్రచారం చేసే ప్రయత్నాలు మంచివి కావు. భారతదేశంలో చదువుకుంటున్న విద్యార్థులు దేశ చరిత్రను శాస్త్రీయ భావాలతో, సరైన పద్ధతుల్లో అర్థం చేసుకోకపోతే దేశ భవిష్యత్తును తీర్చిదిద్దగలరా?ప్రస్తుతం భారతదేశ వ్యాప్తంగా ఎన్సీఈఆర్టీ సిలబస్‌ను అభ్యసిస్తున్న విద్యార్థులు సుమారు నాలుగు కోట్ల మంది ఉన్నారు. మొదట సిలబస్ రూపకల్పనలో భారత దేశ రాజ్యాంగ స్ఫూర్తి కలిగిన, జాతీయ భావాలు కలిగిన, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక రంగాలలో పరిశోధకులు అయిన మేధావులు ఉన్నారు. అయితే వాజ్‌పేయి కాలం నుంచి ఎన్సీఈఆర్టీ సిలబస్‌ను మార్చి మతవాద పూరితమైన భావజాలాన్ని చూపించాలనే ప్రయత్నాన్ని బీజేపీ ప్రభుత్వాలు చేస్తూ వస్తున్నాయి. భారతదేశంలో చదువుకుంటున్న విద్యార్థులు దేశ చరిత్రను శాస్త్రీయ భావాలతో, సరైన పద్ధతుల్లో అర్థం చేసుకోకపోతే దేశ భవిష్యత్తును తీర్చిదిద్దగలరా? విద్యార్థి సమూహానికి దేశంలోని భౌగోళిక పరిస్థితులు, సామాజిక, లౌకికవాదాల పరిస్థితులు, చరిత్ర... వాస్తవంగా, ఉన్నది ఉన్నట్టుగా అర్థం కావలసి ఉంది. అయితే బీజేపీ ప్రభుత్వం మతవాదాన్నే జాతీయవాదంగా ప్రచారం చేసే ప్రయత్నాలు చేస్తోంది. పాఠ్య గ్రంథాలు రూపొందించినవారి అనుమతి లేకుండా తమకు అనుకూలంగా పాఠ్య గ్రంథాలను మార్చేశారు. అందుకే తమ అనుమతి లేకుండా పాఠ్య గ్రంథాలను మార్చేసి, సలహాదారుల్లో తమ పేరు ఉంచి ప్రచురిస్తే కోర్టులో కేసులు దాఖలు చేస్తామని ప్రొఫెసర్లు యోగేంద్ర యాదవ్, సుహాస్ పల్శీకర్ హెచ్చరించే దాకా పరిస్థితి వచ్చింది. ఈ మేరకు వారు ఎన్సీఈఆర్టీ డైరెక్టర్ దినేశ్ ప్రసాద్ సక్లానీకి లేఖ రాశారు. చరిత్రలో వాస్తవ ఘట్టాలను తొలగించి, కల్పిత కథలను చేర్చి, వాస్తవ ఆధునిక రాజకీయ చరిత్రను విద్యార్థులకు అందకుండా చేసే నైతిక హక్కు మీకు లేదని వారు వాదించారు. ముఖ్యంగా భారతదేశ ఆధునిక చరిత్రలో అద్వానీ చేసిన రథయాత్రను, హిందూమత వాదాన్ని రాజకీయాల్లో చొప్పించి భారతదేశంలో హిందువులు, హిందూయేతరులు అనే భావజాలాన్ని తీసుకొచ్చారు. అద్వానీ రథ యాత్ర దేశ రాజకీయాల్లో హిందూ భావజాలాన్ని పెంపొందించింది. అంతకు మునుపే హిందూ, ముస్లిం రాజకీయ విభేదాలను పెంచే మతవాద చరిత్రలు కొందరి చేత రాయబడి ఈ వైషమ్యాలను బాగా పెంచాయి. స్వాతంత్రోద్యమానికి ముందు నుంచి కూడా ఈ వైషమ్యాలను పెంచే భావజాల చరిత్ర రాయబడుతూ వచ్చింది. 19వ శతాబ్దంలో భారతీయ రాజకీయాల్లో మతవాదం చోటు చేసుకొనే సరికి మతాన్ని అన్వయించి రాయడం మొదలయింది. మధ్యయుగ భారత చరిత్రను మతవాదులు సుదీర్ఘమయిన హిందూ, ముస్లిం సంఘర్షణగా చూస్తూ, అనివార్యంగా అదే దృష్టిని 19, 20 శతాబ్దాలకు అన్వయిస్తూ, జాతి వివక్ష సిద్ధాంతానికి, రాజకీయాలకు ఈ ఆధునిక యుగంలో ‘న్యాయం’ చేయగలిగామనుకొంటున్నారు. మత వివక్షతా చరిత్రకారులు మధ్యయుగాల్లోని ముస్లిం పాలకుల పాలనను విదేశీయుల పాలనగా చిత్రీకరిస్తూ, భారత సమాజానికి ముస్లింలు శాశ్వతంగా విదేశీయులని చెప్పగలుగుతున్నారు. ఈ దారుణమైన భావం హిందూ, ముస్లింల వైషమ్యాలను పెంచడానికి మరింతగా తోడ్పడింది. మతాన్ని రాజకీయాలకు ఉపయోగించుకోవడమనే ప్రక్రియ భారతదేశ చీలికకు దారితీసింది. ఈ విషయంగా మొదటి నుండి బి.ఆర్.అంబేడ్కర్ ఆందోళన చెందారు. భారతదేశంలో మతవాద భావాలు లౌకికవాద భావజాలానికి విఘాతం కలిగిస్తాయనీ, రాజ్యాంగంలో పేర్కొన్న సౌభ్రాతృత్వం, సామాజిక సమతుల్యత భావాలు దెబ్బతింటాయనీ అన్నారు. ఇప్పుడు చరిత్రలో వీరు తొలగించిన పాఠ్యాంశాల్లో ఎంతో రాజకీయ చరిత్ర దాగి వుంది. ‘బాబ్రి మసీదు’ కూల్చివేత చిన్న విషయం కాదు. ఆ కూల్చివేత వెనుక ‘హిందూ రాజ్య’ నిర్మాణ భావన ఉంది. లౌకికవాద భావజాలానికి ఆ చర్య గొడ్డలి పెట్టు. బాబ్రీ మసీదు కూల్చివేత ముస్లింలకు అభద్రత తీసుకొచ్చింది. నిజానికి చరిత్ర అనేది వాస్తవ ఘటనల సముచ్ఛయంగా ఉండాలి. కొత్తగా సిద్ధం చేసిన పాఠ్యపుస్తకాలలో బాబ్రీ మసీదు విధ్వంసానికి ముందు జరిగిన అద్వానీ రథయాత్ర, ఆ తరువాత జరిగిన పరిణామాలను తొలగించేశారు. వివాదాస్పద స్థలంలో రామ మందిరం నిర్మించడానికి అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు గురించి మాత్రం విస్తారంగా ప్రస్తావించారు. అయోధ్య గురించి మునుపటి పుస్తకాలలో నాలుగు పేజీలు ఉంటే ఇప్పుడు రెండు పేజీలకు కుదించారు. వాస్తవ ఘటనలను తొలగిస్తే, ‘బాబ్రీ మసీదు’ కూల్చివేతను గురించిన మూలాలు, ‘రామ మందిరం’ నిర్మాణం దృక్పథం తెలియకుండా పోతాయి.పాఠ్యపుస్తకాలను కాషాయీకరించాలన్న ప్రస్తుత పాలకుల ధోరణికి అనుగుణంగా మార్పులు చేర్పులు చేయడాన్ని లౌకికవాదులు, ప్రజాస్వామ్యవాదులు, సామ్యవాదులు, చరిత్ర రచనా ప్రవీణులు నిరసిస్తున్నారు. దేశంలో అంబేడ్కర్ కృషి వలన లౌకికభావ స్ఫూర్తి బలంగా ఉంది. దేశ చరిత్ర ఎప్పుడూ కూడా మతవాదంతో సాగదు. అది ఉత్పత్తి శక్తుల వల్లే ముందుకు సాగుతుంది. ఈనాటి పాఠ్య ప్రణాళిక భారత రాజ్యాంగ స్ఫూర్తితోనే ముందుకు నడవవలసి ఉంది. భారతదేశ సంస్కృతిలో, ప్రజల్లో మొదటి నుండి కూడా పోరాట పటిమ ఉంది. ఇంగ్లీషువాళ్ళు అనేక రూపాల్లో మన సంపదను దోచుకుని, సుఖాలు పొందుతున్న విషయాలను ప్రజలు అర్థం చేసుకున్నారు. ముఖ్యంగా రైతులు, కార్మికులు, పేద ప్రజలు బ్రిటిష్ ప్రభుత్వ కాలంలో పన్నుల చేత వేధించబడ్డారు. అందుకే భారతదేశంలో అన్ని వర్గాల ప్రజల్లో పోరాట పటిమ పెరిగింది. ‘రూపాయి సమస్య’ అనే గ్రంథంలో బ్రిటిష్ వాళ్ళ ఆర్థిక దోపిడీని గురించి అంబేడ్కర్ స్పష్టంగా నివేదించారు.ఇకపోతే రాబోయే చరిత్రలో మోదీ పాలనలోని ఎన్నో దాడులు, అణచివేతలు చరిత్రకు సాక్ష్యాలు. ఒకసారి మనం అవలోకిస్తే ఎన్నో దారుణమైన ఘట్టాలు మనముందు వచ్చి నిలబడతాయి. ప్రజల జీవనోపాధిపై దాడి, నోట్ల రద్దు వల్ల ఏర్పడిన సంక్షోభం, గో రక్షణ పేరుతో జరిగిన దాడులు, ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణతో పాటు వాటి విక్రయాలు... ఇలా ఎన్నో. కేంద్ర కార్మిక సంఘాల ఉమ్మడి వేదిక సుదీర్ఘ కాలంగా ఉనికిలో ఉండటమేగాక, ఆయా సంఘాలు దశాబ్దాలుగా నయా ఉదారవాద విధానాలను ఎదుర్కోవడంలో ప్రధానపాత్ర పోషించాయి. వారి అనుభవం కూడా రైతు ఉద్యమానికి లాభించింది. 2018 మార్చిలో నాసిక్ నుండి ముంబై వరకు సుదీర్ఘంగా సాగిన కిసాన్ లాంగ్ మార్చ్ రైతుల డిమాండ్లను నొక్కిచెప్పింది. ఈ లాంగ్ మార్చ్ బీజేపీని ఓడించటం సాధ్యమేనని... బీజేపీ అజేయశక్తి అనే అభిప్రాయం కేవలం కార్పొరేట్ మీడియా ప్రచార సృష్టి మాత్రమేనని స్పష్టమైన సందేశాన్ని పంపింది. 2019 సంవత్సరంలో జరిగిన పుల్వామా ఘటన, ప్రతిగా జరిగిన బాలాకోట్ వైమానిక దాడి, ఆ తరువాత తీవ్ర జాతీయవాద ప్రచార నేపథ్యంలో బీజేపీ విజయం సాధించినప్పటికీ... 2024 కల్లా 240 సీట్లకు ఎందుకు పడిపోయిందో ప్రజలకు, విద్యార్థులకు తెలియాల్సిన అవసరం ఉంది.దేశంలో లౌకికవాదం, రాజ్యాంగ స్ఫూర్తి పెరుగుతున్నాయి. ఈ రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా పాఠ్య ప్రణాళికలు రూపొందించే విధానం చరిత్రకు నష్టం కలిగిస్తుంది. రాబోయే తరాలు లౌకికవాదానికీ, మతవాదానికీ జరిగిన సమరాన్ని తప్పకుండా తెలుసుకోవాలి. భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు భారతీయులే అనేది ముందు గుర్తించాలి. భారతీయులందరికీ వాస్తవమైన చరిత్రను అందించినప్పుడే భారతదేశ పరిణామం త్వరితం అవుతుంది. డీడీ కోశాంబీ, రొమిల్లా థాపర్, బిపిన్ చంద్ర, అంబేడ్కర్ రచనలు భారతదేశ చరిత్ర నిర్మాణానికి దిశా నిర్దేశం చేస్తున్నాయి. ఆ వైపు నడుద్దాం.డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త దళితోద్యమ నాయకుడు ‘ 98497 41695 -
నవ భారత నిర్మాణం కోసం...
రాజ్యాంగమే మనకు దిక్సూచి. రాజ్యాంగమే మనకు ప్రమాణం. రాజ్యాంగం హామీ ఇచ్చిన వ్యక్తిస్వేచ్ఛ, జీవించే హక్కులను కాపాడుకోవాల్సి ఉంది. రాజ్యాంగం భావ ప్రకటన స్వేచ్ఛను ఇచ్చింది. భారతదేశమంతా స్వేచ్ఛగా సంచరించే హక్కు, ఏ ప్రాంతంలో అయినా నివసించే హక్కు కలిగి ఉన్నాం. దోపిడీ నుండి రక్షణ పొందే హక్కును కలిగి ఉన్నాం. బౌద్ధం ప్రవచించిన సామాజిక సమానత్వం తిరిగి సాకారం కావాలి. ప్రజలు సిరిసంపదలతో తులతూగే, సుఖ సంతోషాలతో శాంతమయమైన జీవితాన్ని గడిపే రోజులు మళ్లీ రావాలి. ప్రేమతత్వాన్ని పెంపొందించాలి, ద్వేషాన్ని విడనాడాలి.అంబేడ్కర్ భారతదేశాన్ని బౌద్ధ భారతంగా గుర్తించారు. బీజేపీ పార్టీ రాముడు అని నినాదం చేస్తే, ఆవ్‌ు ఆద్మీ పార్టీ వాళ్ళు ఆంజనేయుడు అన్నారు. కొందరు రామరాజ్యం కావాలి అంటే, ఇంకొందరు కృష్ణరాజ్యం కావాలి అన్నారు. కానీ ఈరోజు కావాల్సింది బౌద్ధ రాజ్యం. బౌద్ధంలో సామాజిక సమానత్వం ఉంది. బౌద్ధ సూత్రాలతోనే అంబేడ్కర్ రాజ్యాంగం రచించారు. ‘మన ఉద్యమాలు హిందువుల మనసులను మార్చలేకపోయాయి. మనం ఆశించిన సమానత్వాన్ని అందుకోలేకపోయాం. వర్ణ వ్యవస్థకు, అస్పృశ్యతకు మూలమైన హిందూమతంలో కొనసాగేకంటే ఆ మతానికి స్వస్తి చెప్పి మరో మతాన్ని స్వీకరించడం మేలు. దురదృష్టవశాత్తూ నేను హిందువుగా జన్మించాను. అది నా చేతిలో లేదు. కానీ నేను హిందువుగా మరణించను’ అని అంబేడ్కర్ ప్రకటించారు. ఈ ప్రకటన హిందువుల గుండెల్లో ఆందోళన రగిలించింది. అంబేడ్కర్ హిందూ మతాన్ని విడనాడేందుకు నిర్ణయం తీసుకున్నారని తెలిసిన హైందవేతర మతాధిపతులు అంబేడ్కర్‌ను తమ తమ మతాలను స్వీకరించాల్సిందని రాయబారాలు సాగించారు. ఆ సమయంలో ఇటలీ బౌద్ధ భిక్షువు లోక్‌నాథ్ శ్రీలంక వెళ్తూ బొంబాయిలోని రాజగృహ గ్రంథాలయంలో అంబేడ్కర్‌ను కలుసుకొని బౌద్ధ మత విశిష్టత గూర్చి సుదీర్ఘ చర్చలు జరిపారు. భారత దేశంలో అస్పృశులకు స్వాతంత్య్రాన్నీ, సమానత్వాన్నీ అందివ్వగలిగేది బౌద్ధమేననీ, అందుకు బౌద్ధాన్ని ప్రచారం చేయమనీ కోరారు. శ్రీలంక చేరుకున్న తర్వాత కూడా ఒక ఉత్తరాన్ని రాశారు. ‘‘...ఈ ఉత్తరాన్ని ముగించే ముందు నేను మీతో మీ గ్రంథాలయంలో మాట్లాడిన విషయాన్ని మరొక్క మారు గుర్తుకు తేనివ్వండి. డాక్టర్ అంబేడ్కర్! మీ భుజస్కంధాలపై ఎంతో బాధ్యత ఉంది. పీడిత ప్రజానీకానికి ఆనందమైన జీవితాన్ని అందించినా లేక వారిని దుఃఖంలో ముంచినా అంతా మీపై ఆధారపడి ఉంది. వారి భవిష్యత్ అంతా మీ చేతుల్లో ఉంది. మీరు మరో సామాన్యమైన మతాన్ని స్వీకరించినట్లయితే మీరే కాకుండా కోట్లాది ప్రజలు నష్టపోతారు. వారిని బౌద్ధమతం వైపు నడిపించండి. బౌద్ధమతం గురించి మీరు ప్రశంసించిన మాటలు నాకింకా బాగా గుర్తున్నాయి. మీ గ్రంథాలయ గోడపై ధ్యాన నిమగ్నంలో ఉన్న అత్యంత సౌందర్యవంతమైన బుద్ధుని చిత్రపటం నాకళ్ళ ఎదుటే వున్నట్లు కనిపిస్తుంది’ అంటూ భిక్కు లోక్‌నాథ్ రాశారు. అంబేడ్కర్ బౌద్ధమతం తీసుకోవటం వెనుక లోక్‌నాథ్ ప్రభావం కూడా ఉంది.నిజానికి బౌద్ధం గొప్ప చారిత్రక, రాజకీయ ధర్మం. శాతవాహన, ఇక్ష్వాకు రాజకుటుంబాల్లోని స్త్రీలు బౌద్ధం పట్ల మక్కువజూపి లెక్కలేనన్ని బౌద్ధచైత్యాల్ని, మండపాల్ని, విహారాల్ని నిర్మించారు. నాగార్జున కొండలో బయల్పడిన ప్రాకృత శాసనాలను పరిశీలిస్తే, ఆ కాలపు ప్రజలు సిరిసంపదలతో తులతూగి, సుఖ సంతోషాలతో, శాంతమయమైన జీవితాన్ని గడిపారని తెలుస్తుంది. వర్తకులు, కళాకారులు, భూస్వాములు, సైనికులు, ఉన్నతోద్యోగులు, ఒకరేమిటి వివిధ వృత్తులవారు ఒక్కటై బౌద్ధారాధనలో అంకిత భావంతో అమితోత్సాహంగా పాలు పంచుకొన్నారు. దీనికి అప్పటి సాంఘిక, ఆర్థిక పరిస్థితులు అనుకూలించి తెలంగాణా, ఆంధ్ర ప్రాంతాల్లో బౌద్ధం విస్తరించటానికి తోడ్పడినాయి. అంబేడ్కర్‌కు ఈ చరిత్రంతా తెలుసు. అందుకే ఆయన బౌద్ధాన్ని ఒక జీవన విధానంగానే కాక, ఒక దేశీయ విధానంగానూ భావించారు. నిజానికి మనది బౌద్ధ భారతం. మన రాజముద్ర ఏది? బౌద్ధ చక్రవర్తి అశోకుడు చెక్కించిన సారనాథ్‌లోని నాలుగు తలల సింహస్తూపం, 24 ఆకులు గల ధర్మ చక్రాలతో కూడిన ముద్రే కదా! ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముద్ర ఏదీ? విదికుడనే చర్మకారుడు క్రీస్తు శకం 12 శతాబ్దంలో అమరావతి స్తూపంపై చెక్కిన పూర్ణ ఘట శిలాఫలకమే కదా! మనం వాడే ధర్మం అనే పదం ఎక్కడిది? బుద్ధుడు నైతిక విలువలకు చిహ్నంగా బోధించిన ‘ధమ్మ’ పదం నుంచి వచ్చిందే కదా! దక్షిణ భారతంలో ప్రసిద్ధులైన అనేకమంది మేధావులు బౌద్ధం నుండి వచ్చినవారే. నాగార్జునుడు, ఆర్యదేవ, భవ్య, దిఙ్నాగ, ధర్మకీర్తి, వసుబంధు, బుద్ధపాలిత, భావవివేక, అసంగ తదితర తత్వవేత్తలు అందరూ బౌద్ధులే. బౌద్ధం ప్రేమ తత్వాన్ని బోధించింది. ద్వేషాన్ని తొలగించింది. బౌద్ధ భారత నిర్మాణంలోనే ‘కుల నిర్మూలన’ జరుగుతుందని అంబేడ్కర్ బోధించారు. నిజానికి భారత రాజ్యాంగం అంతా బౌద్ధ సాంస్కృతిక జ్ఞాన వికాసంతో నిండి ఉంది. నిజానికి మత భావకులు ప్రేమను, నైతికతను, జ్ఞాన సంపదను చెప్పవలసిందిపోయి పరలోక రాజ్యాల గురించి బోధిస్తున్నారు.ఇటువంటి పరిస్థితుల్లో రాజ్యాంగంలోని వ్యక్తి స్వేచ్ఛ, జీవించే హక్కులను కాపాడుకోవాల్సి ఉంది. భారత రాజ్యాంగం అంతా అహింసా సూత్రాలతో నడుస్తుంది. అంటరానితనం నిషేధించబడింది. భావ ప్రకటన స్వేచ్ఛను ఇచ్చింది. భారతదేశమంతా స్వేచ్ఛగా సంచరించే హక్కు, భారత భూభాగంలో ఏ ప్రాంతంలో అయినా నివసించే హక్కు కలిగి ఉన్నాం. దోపిడీ నుండి రక్షణ పొందే హక్కును కలిగి ఉన్నాం. రాజ్యాంగాన్ని పరిశీలిస్తే అంబేడ్కర్ బౌద్ధ ధమ్మపథ సారాన్ని అంతా ఎలా అందులోకి ఇమిడ్చారో మనకు అర్థమౌతుంది. అంబేడ్కర్ భారతదేశ చరిత్రను, సంస్కృతిని, నీతిశాస్త్రాన్ని, అహింసా ధర్మాన్ని, ప్రేమతత్వాన్ని, కరుణ భావాన్ని రాజ్యాంగంలో పొందుపరిచి బౌద్ధ భారత నిర్మాణానికి పునాదులు వేశారు. ఈనాడు ప్రజలు, మేధావులు, ఆలోచనాపరులు, లౌకిక వాదులు, సాంస్కృతిక వాదులు అందరం అంబేడ్కర్ స్ఫూర్తితో బౌద్ధ భారత నిర్మాణానికి తిరిగి పూనుకుందాం. అప్పుడే భారతదేశంలో క్రాంతి, శాంతి, అహింస, నైతికత, ఉత్పత్తి, ప్రేమ సమతుల్యం అవుతాయి. డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త దళితోద్యమ నాయకుడు ‘ 98497 41695 -
ఆ మూలసూత్రాలను అందుకుంటేనే...
భారతదేశం పునర్నిర్మాణంలో ప్రతి సందర్భంలోను డా‘‘ బి.ఆర్.అంబేడ్కర్ సూత్రాలే నిజమైన ప్రత్యామ్నాయాన్ని అందించగలుగుతున్నాయి. అంబేడ్కర్ నిర్మించిన రాజ్యాంగ సౌధాన్ని ఆయన సూత్రాలతోనే పునర్నిర్మించాలి అనే నూతన భావన మన నాయకులకు ఉంటే అంబేడ్కర్ కుల నిర్మూలన భావాన్ని, సామ్యవాద భావాల్ని తప్పక ఆచరించవలసిన చారిత్రక సందర్భం ఇది. నిజానికి దేశాన్ని రక్షించాల్సిన వారు దేశంలో నేడు మత వైరుద్ధ్యాలు పెంచడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అశోకుడు, అక్బరు వంటి మహా చక్రవర్తులే మత సామరస్యం కోసం ప్రయత్నం చేస్తే, ఇప్పటి నాయకులు మతాధిపత్యం కోసం ప్రచారం చేసి మత సామరస్యాన్ని దెబ్బతీస్తున్నారని సామాజిక శాస్త్రవేత్తలు, రాజకీయ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ నెల 13న జరిగిన రెండు తెలుగు రాష్ట్రాల ఎన్నికల్లో మహిళలు పోటెత్తి ఓటెయ్యడం ఒక సామాజిక, సాంస్కృతిక పరిణామం. మహిళకు రాజకీయ అస్తిత్వం పెరిగింది అనడానికి ఇది ఒక నిదర్శనం. మహిళలు ఎక్కడ చైతన్యవంతం అవుతారో అక్కడ సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ పరిణామాలు త్వరితం అవుతాయని అంబేడ్కర్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో 81.86 శాతం ఓట్లు పోయ్యాయి. నడి ఎండలో కూడ ప్రజలు నిలబడి తమ ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. మరోప్రక్క కుల, మతం, మద్యం, డబ్బు ప్రభావం కూడా బలంగానే ఎన్నికల మీద ఉంది. ఎన్నికల సంగ్రామంలో ఈసారి సోషల్ మీడియా కీలకపాత్ర పోషించింది. ఒక రకంగా సామాజిక వేదికలపై పెద్ద యుద్ధమే నడిచింది. పార్టీలు, అభ్యర్థుల వారీగా ఏర్పడ్డ గ్రూపుల్లో ఓటింగ్ సందర్భంగా రాతలతో కత్తులు దూశారు. ఫేక్ ఫోటోలు, ఫేక్ ఆడియోలతో పాటు ఫేక్ వార్తలను క్షేత్రస్థాయిలో వైరల్ చేశారు. సోషల్ మీడియాను ఫాలో అయ్యేవారు అయోయయానికి గురయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. తెలుగు రాష్ట్రాల పరిస్థితులు ఇలా వుంటే మొత్తం భారతదేశం వ్యాప్తంగా పెను వృక్షాలు కూలుతున్న చప్పుళ్లు వినబడుతున్నాయి. కొన్ని అధికార పీఠాలు బీటలు వారుతున్నాయి. మే 15న భువనేశ్వర్‌లోని భువనంగిరిలో ఇండియా కూటమి నాయకుడు రాహుల్‌గాంధీ ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ, ఈ ఎన్నికల్లో భాజపా నెగ్గితే ప్రభుత్వరంగ సంస్థలన్నీ ప్రైవేటుపరం అవుతాయని, దేశాన్ని 22 మంది బిలియనీర్లు పాలిస్తారని, రాజ్యాంగ పుస్తకాన్ని భాజపా చించి అవతల పారేస్తుందని అన్నారు. బడుగు వర్గాలకు ప్రయోజనాలు లభించటానికి కారణమే రాజ్యాంగం అని తమ చేతిలోని రాజ్యాంగ ప్రతిని చూపిస్తూ చెప్పారు. 22 మంది బిలియనీర్లు తీసుకున్న రూ. 16 లక్షల కోట్ల రుణాలను కేంద్ర సర్కారు మాఫీ చేసిందని, ఉపాధి హామీ పథకం కింద కూలీలకు 24 ఏళ్ల పాటు వేతనాలు చెల్లించేందుకు అయ్యే మొత్తంతో ఇది సమానమని వివరించారు. ‘‘రైతుల, విద్యార్థుల రుణాలను మాఫీ చేయలేదు. చిరు వ్యాపారులకు రుణాలే ఇవ్వలేదు. జీయస్టీ మొత్తమంతా ఇద్దరు ముగ్గురు వ్యక్తులకు వెళ్లిపోతోంది. మేం వచ్చాక కులగణనతో విప్లవాత్మక ప్రజాస్వామ్యాన్ని, ప్రజాపాలనను తీసుకువస్తాం. దేశంలో దేశంలో 50 శాతం మంది ఓబిసీలు, 15 శాతం దళితులు, 8 శాతం గిరిజనులు, 15 శాతం మైనార్టీలు, 5 శాతం ఆర్థికంగా వెనుకబడిన వర్గాలవారున్నారు. ఈ 90 శాతం మందికిపైగా ప్రజలు మోదీ పాలనలో వంచితులయ్యారు. ఎన్ని రకాల అబద్ధాలను భాజపా చెప్పినా జూన్ 4 తర్వాత ప్రధాని పదవిలో మోదీ ఉండరు’’ అని రాహుల్ ఉద్ఘాటించారు.మోడీ ప్రభుత్వంలో రాజ్యం కంటే కూడా కార్పోరేట్ శక్తులు బలపడ్డాయి. విశ్వవిద్యాలయాలు అన్నింటిలో మతోన్మాద భావాలను ప్రచారం చేస్తూ శాస్త్ర జ్ఞానాన్ని వక్రీకరిస్తున్నాయి. అందుకే శ్రీనగర్‌లో మే 15న మాట్లాడుతూ నేషనల్ కాన్ఫరెన్స్ (ఎస్పీ)అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా ఇలా విమర్శించారు. భవిష్యత్తులో తాను పదవిలో లేకపోయినా దేశం మనుగడ సాగిస్తుందన్న విషయాన్ని ప్రధాని గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు. దక్షిణ కాశ్మీర్ అనంత్‌నాగ్‌లోని షాంగుస్ ప్రాంతంలో ర్యాలీ నిర్వహించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘మనం కలిసి జీవించాలి. దేశాన్ని రక్షించాలి. పదవి ఎల్లకాలం ఉండదు. కానీ దేశం శాశ్వతం. ఆయన (మోడీ) ఏ దేశాన్ని తయారు చేయాలని ప్రయత్నిస్తున్నారో అది వినాశకరమైనది’’ అన్నారు.నిజానికి దేశాన్ని రక్షించాల్సిన ప్రధానమంత్రి దేశంలో మత వైరుధ్యాలు పెంచడం ఆశ్చర్యకరం. అశోకుడు, అక్బరు వంటి మహా చక్రవర్తులే మతసామరస్యం కోసం ప్రయత్నం చేస్తే, మోడీ ప్రభుత్వం మతాధిపత్యం కోసం ప్రచారం చేసి మత సామరస్యాన్ని దెబ్బతీసిందని సామాజిక శాస్త్రవేత్తలు, రాజకీయ విశ్లేషకులందరూ భావిస్తున్నారు. మోడీ ఆవేశపూరితమైన ప్రసంగాల్లో 400 సీట్లు వస్తున్నాయని చెప్పుకుంటున్నా 150 నుంచి 200కే పరిమితం అవుతారని కమ్యూనిస్టు నాయకులు చెబుతున్నారు. బీజేపీకి బలమైన ఉత్తరాది రాష్ట్రాల్లోనే ఈ ఎన్నికల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమౌతోంది. ఉత్తరప్రదేశ్, రాజస్తాన్, బిహార్, మధ్యప్రదేశ్, హర్యానా, ఢిల్లీ తదితర రాష్ట్రాల్లోనే బీజేపీకి ఎదురు గాలి వీస్తున్నది. పైకి డాంబికంగా 370–400 సీట్లు వస్తాయని గొప్పలు చెప్పుకుంటున్నా ఏ సర్వేలోనూ ఆఖరికి బీజేపీని బలపరిచే విశ్లేషకులు సైతం 250కి మించి రావని చెప్పాల్సిన పరిస్థితి. బీజేపీ ప్రభుత్వం ఈ దశాబ్దంలో ఏ సోషల్ మీడియాలోనైతే దళిత బహుజన మైనార్టీ స్త్రీల మీద, రాజ్యాంగం మీద, మానవ హక్కుల మీద, విద్యార్థుల ప్రతిభ మీద, దళితుల జీవన సంస్కృతి మీద, ముస్లింలు జీవించే హక్కు మీద దాడి చేసిందో అదే సామాజిక మాధ్యమాన్ని ఉపయుక్తం చేసుకొని ఈ సామాజిక శ్రేణుల అన్నింటిలో వున్న మే«ధావర్గం ఎదురుదాడి ప్రారంభించింది. నిజానికి మోడీ ద్వంద్వ భావజాల ఘర్షణలో ఇరుక్కుపోయారా అనిపిస్తుంది. ఏ ప్రజలైతే ఏ బడుగువర్గాలైతే అధిక ఓట్ల శక్తిగా ఉన్నాయో, ఆ వర్గాల జీవన వ్యవస్థలను ధ్వంసం చేస్తూ చేస్తూ, కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తూ ఈ వర్గాలను మతం పేరుతో ఓట్లు అడుగుతున్న సందర్భంగా, తమ కాళ్ల కింద పునాదులు తొలగిపోతున్న స్థితిలో కేవలం మతోన్మాద నినాదం ఫలిస్తుందా? అనేది ఇప్పుడు మోడీ ముందు నిలబడిన పెద్ద ప్రశ్నలా కనిపిస్తోంది.ఉత్తర ప్రదేశ్ కేంద్రంగా మొత్తం భారతదేశం గురించి మనం ఆలోచించినప్పుడు అన్ని మతాల్లో బానిసలుగా బతుకుతున్న వారికి సమాన గౌరవ జీవన వ్యవస్థ లేకపోవటం కనిపిస్తోంది. మతోన్మాద నినాదం గౌరవం ఇవ్వదు. ఆచరణ గౌరవం ఇస్తుంది. భారతదేశంలో కుల గణన చేయిస్తామని కాంగ్రెస్ పేర్కొన్నాక ఓబిసీలు ఆలోచనలో పడినట్లే ఉంది. తమకు రిజర్వేషన్ హక్కు వస్తుందని, రిజర్వేషన్ వల్ల విద్య, ఉద్యోగ హక్కులు విస్తృతం అవుతాయని ఓబిసీలు భావించడం ద్వారా భారతదేశంలో అతి పెద్ద సామాజిక తరగతి ‘ఇండియా’ కూటమి వైపు మొగ్గుతుందనక తప్పదు. ‘ఇండియా’ కూటమికి నూతన దశ వస్తున్న ఈ తరుణంలో అంబేడ్కర్ నిర్మించిన రాజ్యాంగ సౌధాన్ని ఆయన సూత్రాలతోనే పునర్నిర్మించాలి అనే నూతన భావన ఆ కూటమికి ఉంటే అంబేడ్కర్ కుల నిర్మూలన భావాన్ని, సామ్యవాద భావాల్ని తప్పక ఆచరించవలసిన చారిత్రక సందర్భం ఇది. ఆ పరిణతి మాత్రం ‘ఇండియా’ కూటమికి వచ్చినట్టు లేదు. అంబేడ్కర్ పరిశ్రమలను జాతీయం చేయండి, భూములను జాతీయం చేయండి అనే ప్రధాన సూత్రాన్ని ముందుకు తెచ్చారు. ఆయా రాష్ట్రాల ఆధిపత్య కులాల పార్టీ నుంచి వస్తున్న ‘ఇండియా’ కూటమి ఇంకా సామాజిక, సామ్యవాద భావాలను పరిపుష్టం చేయవలసిన అవసరం ఉంది. విశ్వవిద్యాలయాల్లో చారిత్రక, సాంస్కృతిక శాస్త్ర జ్ఞాన పునరుజ్జీవనానికి కూడా వీరు హామీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మండల కమిషన్ రిపోర్ట్స్‌ను, సచార్ కమిటీ రిపోర్ట్స్‌ను, రిపబ్లికన్ పార్టీలోని మూల సూత్రాలను ‘ఇండియా’ కూటమి తీసుకోగలిగితే నిజమైన ప్రత్యామ్నాయంగా నిలబడుతుంది. భారతదేశం పునర్నిర్మాణంలో ప్రతి సందర్భంలోను డా‘‘ బి.ఆర్.అంబేడ్కర్ సూత్రాలే నిజమైన ప్రత్యామ్నాయాన్ని అందించగలుగుతున్నాయి. ఈసారైనా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని కూటమి ఒక దళిత ప్రధానమంత్రిని ప్రకటించగలిగిన విశాలతను సంతరించుకోవలసిన అవసరం ఉంది. అంతేకాకుండా భారతదేశంలోని రాజకీయ నాయకుల వ్యక్తిత్వ నిర్మాణంలో నైతికత, అవినీతి రహిత, రుజువర్తన జీవన విధానం, మానవతా స్పృహ, సామాజిక విప్లవ భావన, ఆర్థిక స్వావలంబనా దృష్టి అనుసరణీయం అవ్వవలసి ఉంది. రాజకీయ నీతిశాస్త్ర అధ్యయనం ఈనాటి చారిత్రక కర్తవ్యం. అంబేడ్కర్ రాజకీయ జీవన మార్గమే దేశానికి దిక్సూచి.డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త దళితోద్యమ నాయకుడు -
దేశ భవిష్యత్తుకు దిక్సూచి!
ప్రపంచ మేధావి, ఆలోచనాపరుడు, తత్వవేత్త, భారత రాజ్యాంగ నిర్మాణ కర్త డా‘‘ బీఆర్ అంబేడ్కర్ 133వ జయంతి ప్రపంచవ్యాప్తంగా స్ఫూర్తిని నింపుతున్న ఒక చారిత్రక ఉత్సవం. అంబేడ్కర్ నిరంతర అధ్యయనం, విశ్లేషణ, తర్కం, హేతు వాదం, మానవతావాదం; ఆర్థిక,సాంఘిక, రాజకీయవాదాలు; బౌద్ధ విప్లవ ప్రస్థానం... ఆయన విస్తృతినీ, వ్యాప్తినీ, ప్రాపంచిక తాత్విక దృక్పథాన్నీ మనకు సాక్షాత్కరింప జేస్తున్నాయి. ఆయన ఒక వాల్టేర్ లాగా, రూసో లాగా ప్రపంచానికి ఒక నూతన దర్శనాన్ని అందించారు. ఆయన వ్యక్తిత్వంలో విద్యా జ్ఞానం, పరిశోధన, నైతికత, విమోచన కలిసి నడుస్తాయి. ఆయన బహుభాషా నిష్ణాతులు. మరాఠా భాష ఎంత బలంగా వచ్చో ఇంగ్లీషు, జర్మనీ కూడా అంతే నిశితంగా వచ్చు. ఆయన ఒక భాషా నిఘంటువు. ఆయన విద్యాభ్యాసంలో ఒక యుద్ధ ప్రక్రియ ఉంది. ఆయన ఆర్థిక శాస్త్ర నిపుణులు. అంబేడ్కర్ అపారమైన జ్ఞాపక శక్తి కలవారు. రాజ్యాంగ సభ డిబేట్స్‌లో కొన్ని వందల అంశాలు చూడకుండా చెప్పగలిగే వారు. ఆయన వాక్చాతుర్యా నికీ, వాదనా పటిమకూ, విషయ పరిజ్ఞానానికీ బాబు రాజేంద్ర ప్రసాద్, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, రాజాజీ వంటి వారు అచ్చెరువొందేవారు. అంబేడ్కర్ సున్నితమైన హాస్య చతురుడు. చక్కని చిరునవ్వుతో ఆయన కళ్ళు మెరుస్తూ ఉండేవి. ఆయన చూపుడు వేలు ప్రపంచానికి ఓ ప్రశ్నోపనిషత్తు వంటిది. అంబేడ్కర్ 1913లో న్యూయార్క్‌లోని కొలంబియా విశ్వవిద్యాలయంలో విద్యార్థిగా, పరిశోధకుడిగా ‘బ్రిటిష్ ఇండియాలో ప్రొవెన్షియల్ ఫైనాన్స్ పరిణామం’ అనే థీసిస్ రాసి ఎందరి మెప్పునో పొందారు. 1916లో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో డాక్టరేట్ పట్టా పుచ్చు కోవడం కోసం రాత్రింబవళ్లు శరీరం శుష్కించే వరకూ చదివారు. విద్య పట్ల అంబేడ్కర్ దృక్పథాన్ని గమనిస్తే ఆయన విద్య అంటే కేవలం అక్షరాస్యత అనో, చదువనో అనుకోలేదని స్పష్టమ వుతుంది. విద్య మనిషిని సంపూర్ణంగా మార్చగలిగే సాధనమ న్నది అంబేడ్కర్ నమ్మకం. ఈ విషయంలో ఆయనపై బౌద్ధ ధర్మ ప్రభావం ఉన్నట్లు అనిపిస్తుంది. బుద్ధుడి బోధనలు, తాత్విక చింతన కేంద్రంగానే అంబేడ్కర్ విద్యను అభ్యసించారు. విద్య పర మార్థం ప్రజ్ఞ, కరుణ, సమత అనీ, ఈ త్రిగుణాలు పెంపొందించినప్పుడే విద్యకు పరిపూర్ణత చేకూరుతుందనీ అంబేడ్కర్ భావించారు. సమాజంలో విద్య ద్వారా చైతన్యం వస్తుందన్న ఉద్దేశంతో ఆయన విద్యా వ్యాప్తి కోసం 1945 నుంచి ఒక ఉద్యమం ప్రారంభించారు. ‘పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ’ పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేసి, అనేక విద్యాలయాలు, కళాశాలల ఏర్పాటుకు కృషి చేశారు. జ్ఞానం, కరుణ అనేవి తాను స్థాపించిన సొసైటీ ప్రధాన లక్ష్యా లుగా పేర్కొన్న అంబేడ్కర్ ‘హక్కుల సాధన కోసం చదువుకోండి! సంఘటితం కండి! పోరాడండి! మీపైన మీరు విశ్వాసం పెంచుకోండి! ఏ రకంగా కూడా మనకు ఓటమి ఉండదు. ఇది విజయం కోసం చేస్తున్న పోరాటం, స్వేచ్ఛ కోసం సాగిస్తోన్న యుద్ధం, ఈ యుద్ధం మనం కోల్పోయిన వ్యక్తిత్వాన్ని తిరిగిపొందడానికి చేస్తున్నది’ అని ఉద్బోధించారు. సామాజిక మార్పు పోరాటాల ద్వారా, పోరాటాలు విజ్ఞానం ద్వారా, విజ్ఞానం విద్య ద్వారా అందుతాయన్నది అంబేడ్కర్ మార్గం. అలాగే దళితులు చదువు కోవడం ద్వారా సంప్రదాయ వృత్తుల్లో స్థిరపడే అవకాశం ఉండదనీ, తద్వారా తమ తరతరాల కులవృత్తులు చేస్తున్నందువల్ల ఎదురవుతున్న చిన్నచూపు తప్పుతుందనీ అంబేడ్కర్ ఆలోచన. అంబేడ్కర్ మనుస్మృతి భావజాలానికి ప్రత్యామ్నాయంగా భారత రాజ్యాంగాన్ని రూపొందించారు. ఆయన పాండిత్యం, విజ్ఞత, మానవతా దృష్టి, బౌద్ధనీతి, సమ సమాజ భావన, భారత రాజ్యాంగంలో సముచితంగా సమన్వయించబడ్డాయి. అంబేడ్క ర్లో కుల నిర్మూలనా భావం, దార్శనికత, అహింసాతత్వం, భారతదేశాన్ని రక్తపాతం లేని దేశంగా సృష్టించగలిగింది. రాజ్యాంగంలో స్త్రీలందరికీ చదువుకునే హక్కు ఇవ్వటం ద్వారానూ, అçస్పృశ్యులందరికీ రిజర్వేషన్ కల్పించడం ద్వారానూ, శూద్రులందరికీ హక్కులు కల్పించడం ద్వారానూ ఆయన సమ సమాజ నిర్మాణానికి పునాదులు వేశారు. అంబేడ్కర్ విద్యా విప్లవంతో పాటు రాజకీయోద్యమాన్నీ నడిపారు. 1936 ఆగస్టులో దళిత జాతుల సముద్ధరణకు ‘ఇండిపెండెంట్ లేబర్ పార్టీ’(ఐఎల్పీ)ని ఆయన స్థాపించారు. ఈ పార్టీ బొంబాయిలో షెడ్యూల్డ్ కులాలకు కేటాయించిన పది హేను సీట్లలో పదమూడింటిని కైవసం చేసుకుంది. జనరల్ సీట్లను కూడా రెండింటిని కైవసం చేసుకుంది. ఆయన ‘లేబర్’ అనే పదానికి ‘అణగదొక్కబడిన’ అనే అర్థాన్ని రూపొందించారు. ఆర్థికంగా, సాంఘికంగా అణగదొక్కబడిన వారందరినీ ఈ పార్టీ లోనికి తేవడానికి ప్రయత్నించారు. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సుల్లో కాంగ్రెస్ వ్యవహరించిన తీరును బట్టి ఆ పార్టీ దళితులకు ప్రాతినిధ్యం వహించడం లేదని డా‘‘ అంబేడ్కర్ స్పష్టం చేశారు. ఆ పార్టీని విస్తృత పరచాలనే ఉద్దేశ్యంతో అంబేడ్కర్ 1942 జూలైలో ఆలిండియా షెడ్యూల్డ్ క్యాస్ట్స్ ఫెడరేషన్ (ఏఐఎస్‌సీఎఫ్) ను స్థాపించారు. ఆ సందర్భంగా దళితుల సాంఘిక, ఆర్థిక హక్కు లను సాధించడానికి వారికి రాజకీయ అధికారం కావాలని ప్రబోధించారు. 1962లో విడుదల చేసిన ప్రణాళికలో ఆయన తన వామ పక్షాల భావాలను ప్రకటించారు. భారతీయుడైన ప్రతివాడూ ఆర్థిక, సాంఘిక స్వాతంత్య్రాలను పొందాలని నొక్కి వక్కాణించారు. ప్రతి మనిషికీ నిర్భయంతో కూడిన స్వేచ్ఛను సాధించడం ప్రభుత్వ బాధ్యత అని ప్రతిపాదించారు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలను ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ ప్రణాళిక అణగదొక్కబడ్డ వారి సాంఘిక సమానత్వాన్ని నొక్కి చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగస్తులకు బీమా పథకాన్ని తప్పనిసరిగా అమలు జరపాలని కోరారు. ఏఐఎస్‌సీఎఫ్ నుండి రిపబ్లికన్ పార్టీ వరకు నడిచిన దారిలో దళితుల కోసం ఆర్థిక, సాంఘిక, రాజకీయ సమానతల కోసం తన శక్తిని ధారపోశారు. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాను పార్టీగా ప్రకటించక ముందే ఆయన పరి నిర్వాణం చెందారు. ఈ విధంగా అంబేడ్కర్ సామాజికంగా, సాంస్కృతికంగా, రాజకీయంగా, తాత్వికంగా, భారతీయ సమాజాన్ని పునః నిర్మించటానికి కృషి చేశారు. ఆయన ప్రపంచ మానవునిగా ఎదిగారు, ప్రపంచ తత్వవేత్తలలో ఒకరిగా నిలిచారు. భారతదేశానికి ఎనలేని కీర్తి తెచ్చారు. ఆయన నిర్మించిన రాజ్యాంగమే మన దేశ భవి ష్యత్తుకు దిక్సూచి. ఆయన మార్గంలో నడుద్దాం. డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త దళితోద్యమ నాయకులు ‘ 98497 41695 (నేడు డా‘‘ బీఆర్ అంబేడ్కర్ జయంతి) -
రాజ్యాంగ స్ఫూర్తికి ప్రమాదం
ఎన్నికల వేళ దేశంలో అధికార–ప్రతిపక్ష కూటములు పోటాపోటీగా ప్రకటనలు చేస్తూ తమ విధానాలను ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాయి. ఇదే సమయంలో అధికార బీజేపీ ఏకంగా బలమైన ప్రతిపక్ష నాయకులపై కేసులు బనాయించి జైళ్లలోనూ పెడుతోంది. ఇందుకు కేజ్రీవాల్ అరెస్ట్ ఉదంతంతాజా ఉదాహరణ. దీనిపై ప్రతిపక్ష కూటమి భగ్గుమంటోంది. బీజేపీ ఈ సారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని రద్దుచేసినా ఆశ్చర్య పోవలసిన అవసరం లేదని వారు అంటున్నారు. ఉత్తరప్రదేశ్‌తో సహా దేశంలో అనేక చోట్ల దళితులపై జరుగుతున్న దాడులూ, కర్నాటక బీజేపీ నాయకుడు అనంత కుమార్ హెగ్డే ‘బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తాం’ అని ప్రకటించడం వంటివన్నీ చూస్తుంటే ఆందోళన కలుగుతోంది. ప్రతిపక్షాల వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే క్రమంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను కేంద్రం అరెస్టు చేసింది. ఎన్నికల ముందు ఇలా ఒక ముఖ్యమంత్రిని అరెస్టు చేయడం గురించి ప్రపంచ దేశాలు విస్తుబోయాయి. ఇది కేవలం రాజకీయ కక్షతో చేసిన అరెస్టేనని ప్రపంచ దేశాలు ముఖ్యంగా అమెరికా, జపాన్‌లు వ్యాఖ్యానించటం గమనార్హం. జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ ఢిల్లీ ర్యాలీలో మాట్లాడుతూ ‘దళితులు, గిరిజనులు, వెనకబడిన వర్గాలకు మేలు చేయబట్టే నా మీద బీజేపీ దాడులకు దిగింద’ని వక్కాణించారు. కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీ వాల్ ఢిల్లీ రామ్ లీలా మైదానంలో జరిగిన సభలో మాట్లాడుతూ... నిర్విరామ విద్యుత్ సరఫరా, పేదలకు ఉచిత విద్యుత్తు, ప్రభుత్వ బడులు బలోపేతం, మొహల్లా క్లినిక్‌లు, మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు, రైతులకు కనీస మద్దతు ధర, ఢిల్లీకి రాష్ట్ర హోదా వంటి అనేక హామీలతో కేజ్రీవాల్ జైలు నుంచి ఒక లేఖ పంపినట్టు ప్రకటించారు. ఇటువంటి హామీలను బీజేపీ ప్రభుత్వం ఇవ్వగలదా అని ప్రశ్నించారు. బీజేపీ 400 సీట్లు వస్తాయని బీరాలు పలుకుతుందనీ, 180 సీట్లన్నా తెచ్చుకోగలదా? అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని రద్దు చేసే కుతంత్రంలో భాగంగా ఈ ఎన్నికలు జరుగుతున్నా యని, మాట్లాడే స్వేచ్ఛను కాలరాయడం, నియంతృత్వ రాజ్యాన్ని తీసుకురావడం, ఆర్ఎస్ఎస్ అజెండాను అమలు పరచడం వంటివి బీజేపీ వ్యూహమనీ ఆయన అన్నారు. నియంతలను గద్దె దించటం ఎలాగో ప్రజలకు తెలుసనీ పేర్కొన్నారు. నిజానికి బీజేపీ తన ఎన్నికల ప్రచారంలో భాగంగా దక్షిణాది రాష్ట్రాల మీద... ముఖ్యంగా తమిళనాడు సామాజిక సాంస్కృతిక అస్తిత్వం మీద దాడిచేస్తోంది. కులాంతర వివాహాలకు రక్షణ కల్పించడం, 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వడం మీద బీజేపీ అసహనంగా ఉంది. సనాతన ధర్మాన్ని నిరాకరించి అధునాతన ధర్మానికీ,రాజ్యాంగ పరిరక్షణకూ పూనుకునే కార్యక్రమాలు నిర్వహించడం మీద బీజేపీ ఆగ్రహంగా ఉంది. ఎన్నికల వేళ నరేంద్ర మోదీ ‘కచ్చతీవు’ అంశాన్ని ప్రస్తావించడంపై కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ ప్రధాన కార్య దర్శి జయరాం రమేష్‌లు తగిన విధంగా స్పందించారు. 1974లో కాంగ్రెస్ ప్రభుత్వం కచ్చతీవు (దీవి)ని శ్రీలంకకు అప్పగించిందని మోదీ ఆరోపించారనీ, మరి 2015లో బంగ్లాదేశ్‌తో ఎన్డీఏ ప్రభుత్వం చేసుకున్న భూమి సరిహద్దు ఒప్పందంలో భాగంగా 1051 ఎకరాల భారత భూభాగం కోల్పోవాల్సి వచ్చింది కదా అని జయరాం రమేష్ గుర్తు చేశారు. మొత్తం 17,161 ఎకరాల భారత భూభాగంలో 7,110 ఎకరాలు మాత్రమే మనకు వచ్చాయి అన్నారు. ఆ సమయంలో మోదీపై ఆరోపణలు చేయకుండా పార్లమెంటు ఉభయసభల్లో బిల్లుకి కాంగ్రెస్ మద్దతునిచ్చిందని వెల్లడించారు. తమిళనాడులో వారికి ఒక్క సీటు కూడా రాకపోవడం బీజేపీ వర్గాలను కలవరపెట్టిందని విమర్శించారు. తమిళనాడులో వస్తున్న సామాజిక ఆర్థిక పరిణామాలను తట్టుకోలేక మోదీ ‘కచ్చతీవు’ ప్రస్తావన తెచ్చారని అన్నారు. 1974లో సిరిమావో బండారు నాయకే– ఇందిరా గాంధీ మధ్య కుదిరిన ఒప్పందం కారణంగా శ్రీలంక నుండి ఇందిరా గాంధీ చాతుర్యం వల్ల ఆరు లక్షల మంది తమిళ భారతీయులు స్వదేశానికి రాగలిగారని ఆయన వ్యాఖ్యానించారు. మోదీ ప్రభుత్వం దక్షిణ భారతదేశంలో వస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల చైతన్యానికి బెదిరి ఎప్పటివో సరిహద్దు విషయాలను ముందుకు తెచ్చి లబ్ధి పొందాలని చూస్తోందన్నారు. బిహార్ ఓబీసీ రాజకీయ నాయకులు తేజస్వీ యాదవ్ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ఓబీసీ నాయకుల్ని బతకనివ్వటం లేదనీ, తన తల్లి, తండ్రి, తోబుట్టువులపై కేసులు పెట్టి వేధిస్తున్నారనీ, ఆర్ఎస్ఎస్ భావజాలం ప్రకారం ఓబీసీలు అంటే శూద్ర బానిసలనీ, వారు రాజ్యపాలనకు పనికిరారనేది వారి భావ జాలం అన్నారు. బీజేపీ ప్రభుత్వం ఏ గిరిజనుల, దళితుల, బీసీల రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పనిచేస్తోందో, మాట్లాడుతోందో వారే నిజానికి సామా జిక ఉత్పత్తి శక్తులు. భారతీయ గిరిజనులు మన ప్రకృతినీ, సంస్కృతినీ రక్షించినవారు. దళితులు నదీ నాగరికతను సృష్టించినవారు. వీరి శ్రమ లేనిదే భారతదేశ సంపద లేదు. ఎవరు సంపద సృష్టిస్తున్నారో వారి రక్షణ కోసమే భారత రాజ్యాంగం రాయబడింది. ప్రధాని దేశంలో సామాజిక, సాంస్కృతిక, పారిశ్రామిక, విద్యా వ్యవస్థలను విస్తృతం చేయాలనే పథకాలను రూపొందించుకోలేక పోతున్నారు. విశ్వవిద్యాలయాల్లో పరిశోధనా విభాగం సీట్లన్నీ తగ్గించేశారు. ఎస్సీలకు ఇస్తున్న ఉపకార వేతనాలను తగ్గించేశారు. ఇకపోతే మహిళా సంక్షేమ పథకాల అమలులో మోదీ ప్రభుత్వం ఈ పదేళ్ళ కాలంలో ఘోరంగా విఫలమయ్యింది. బడ్జెట్లోనూ మోదీ ప్రభుత్వం మహిళల సంక్షేమ పథకాల కేటాయింపును తగ్గించింది. 5 కీలక మహిళల సమస్యల పరిష్కారంలో విఫలమైంది. 2023 – 24 కేంద్ర బడ్జెట్లో అంగన్వాడీ కేంద్రాలు, మహిళల భద్రత, శిశు సంరక్షణ సంస్థలకు బీజేపీ ప్రభుత్వం కేవలం 0.55 శాతం నిధులు మాత్రమే కేటాయించింది. వాచాలత్వం నుండి, ఆధిపత్యం నుండి, అణచివేత నుండి, హింస నుండి ఉత్పత్తి జరగదు. ఉత్పత్తి జీవులు అయిన గిరిజనులు, దళితులు చెట్టును ప్రేమిస్తారు, నదిని ప్రేమిస్తారు, భూమిని ప్రేమిస్తారు, గాలిని ప్రేమిస్తారు. భారతదేశం ప్రకృతి జీవులది. పెట్టుబడి దారీ సామ్రాజ్యవాద శక్తులు వీరి శ్రమను దోపిడీ చేసి అభివృద్ధి చెందుతున్నాయి. ఎవరి శ్రమ దోచుకుంటున్నారో వారిపై అరాచకాలు చేస్తు న్నారు. బీజేపీ పాలనలో ఉన్న ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల ఆరు గురు యువకులు ఒక దళిత బాలికపై (16 ఏళ్ళు) లైంగిక దాడి చేశారు. వారిపై కేసు పెట్టినందుకు ఆమెను వారు అగ్నిలో దహించారు. ఇటు వంటి పాలకులను అందిస్తున్న బీజేపీకి చెందిన కర్నాటక నాయకుడు అనంత కుమార్ హెగ్డే ‘బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తాం’ అని ప్రకటించడం ముందు ముందు ఏమి జరగను న్నదనే సంగతిని సూచిస్తోంది. ఇకపోతే ఇండియా కూటమి కూడా అంబేడ్కర్‌ని ముందు పెట్టుకోకుండా వెళితే రాజ్యాంగాన్ని రక్షించలేదు. భావ ప్రకటనా స్వేచ్ఛ ఇక ప్రజలకు ఉండదు. రాజ్యాంగంలోని ‘ప్రవేశిక’ ‘భారత దేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం’గా ప్రకటించింది. ప్రస్తుత బీజేపీ ప్రభుత్వ దూకుడు చూస్తుంటే ఈ లౌకిక, ప్రజాస్వామ్య భావనలు ప్రమాదంలో పడబో తున్నట్లనిపిస్తోంది. రాజ్యాంగం ప్రాథమిక హక్కులను మనకు ప్రసాదించింది. ఇప్పుడు అవీ ప్రమాదంలో ఉన్నట్లు స్పష్టమవుతోంది. రాజ్యాంగ 11వ అధికరణం ప్రాథమిక హక్కులను హరించే ఏ శాసనం చెల్లదని చెప్పడం కొంత ఊరటనిస్తోంది. అంబేడ్కర్ ఈ రాజ్యాంగాన్ని రూపకల్పన చేయడానికి తన జీవితాన్ని అంకితం చేశారు. ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవలసిన బాధ్యత ప్రతి దళిత, బహుజన, ఆదివాసీ మీదా ఉంది. ఇప్పుడు బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైన కులతత్వ, మత తత్వవాది. ఇవాళ దక్షిణ భారతదేశం మొత్తం తన అస్తిత్వం కోసం పోరాడుతోంది. ఈ దశలో అంబేడ్కర్ ఆలోచనలతో లౌకిక భారత పునరుజ్జీవనం కోసం బడుగు వర్గాలు, లౌకికవాదులం ఏకమై రాజ్యాంగ స్ఫూర్తినీ, చైత న్యాన్నీ, ప్రతిష్ఠనూ, వ్యక్తిత్వాన్నీ కాపాడే పోరాటంలో భాగస్వాముల మవుదాం. విజయం సాధిద్దాం! డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త దళితోద్యమ నాయకులు ‘ 98497 41695 -
చారిత్రక మూలాల్లో జ్ఞాన కాంతులు
ఏ దేశానికైనా, ఏ జాతికైనా చారిత్రక తాత్విక జ్ఞానం అవసరం. నిజానికి తొలి నుంచీ ఉన్నది భౌతికవాదమే. భారతదేశంలోని భౌతికవాద చింతన అన్ని కీలక పరిణామాల్లో ప్రధాన శక్తిగా నిలిచింది. మానవుడు భౌతిక ప్రపంచం నుండి ప్రభవించడం వల్ల అతని ఆలోచనలు, భావాలు, ఊహలు భౌతిక వాస్తవికత వైపే మొదట్లో పయనించాయి. నిప్పును, నీరును, గాలిని, భూమిని; వాటి భౌతిక రూపాలను తెలుసుకోవడమే మానవుని అభివృద్ధి సోపానం. అయితే అనేక సందర్భాలలో ప్రజలు వెలుగు నుండి చీకట్లోకి, జ్ఞానం నుండి అజ్ఞానంలోకి, వాస్తవం నుండి భ్రమలలోకి తిరోగమిస్తూ ఉంటారు. అప్పుడే అభ్యుదయవాదులు వారిలో జ్ఞానతృష్ణను కలిగించాలి. భారతదేశ తాత్విక మూలాలపై ఈనాడు లోతైన చర్చ జరుగుతోంది. నిజానికి భారతీయ తత్వశాస్త్రాన్ని సృష్టించినవారు మూలవాసులు. వీరు మెసపటో మియా, సింధూ నాగరికతల కాలం నాటివారు. వీరి మౌఖిక జ్ఞాన సంపదకు ప్రత్యామ్నాయంగానే వైదిక సాహిత్యం వచ్చింది. వైదిక సాహిత్యం కూడా మొదట్లో మౌఖిక రూపంలోనే ఉంది. తర్వాత లిఖిత రూపం ధరించింది. భారతీయ తత్వశాస్త్రం ప్రధానంగా భౌతికవాద తత్వశాస్త్రం. భారతదేశంలో తత్వశాస్త్రమంటే ఆధ్యాత్మిక వాదంగా ప్రచారం చేశారు. తత్వశాస్త్రమనగానే అది ఆత్మ గురించో, పరలోకం గురించో చెప్పేదనే భావన ఏర్పడింది. నిజానికి భౌతిక అంశాల నుండి రూపొందినదే తత్వశాస్త్రం. భారతదేశంలో అతి ప్రాచీన జాతులు తాత్వికాంశాల మీద సుదీర్ఘమైన చర్చ చేశాయి. శరీరానికీ, చైతన్యానికీ ఉన్న సంబంధాన్నీ; మానవునికీ, ప్రకృతికీ ఉన్న సంబంధాన్నీ, విశ్వ పరిణామాన్నీ, మానవ పరిణామాన్నీ వీరు అర్థం చేసు కోవడానికి ప్రయత్నించారు. ప్రకృతి; సమాజం పట్ల ఉదయించిన అనేక ప్రశ్నలకు భౌతిక దృక్పథంతో సమాధానం వెదికారు. మానవుడు భౌతిక ప్రపంచం నుండి ప్రభవించడం వల్ల అతని ఆలోచనలు, భావాలు, ఊహలు భౌతిక వాస్తవికత వైపే మొదట్లో పయనించాయి. నిప్పును, నీరును, గాలిని, భూమిని; వాటి భౌతిక రూపాలను తెలుసుకోవడమే మానవుని అభివృద్ధి సోపానం. నిప్పు మానవ సామాజిక పరిణామంలో కీలక పాత్ర వహించింది. నిప్పును ఆరాధించిన జాతుల కంటే, నిప్పును భౌతిక శక్తిగా గుర్తించిన జాతులు శక్తిమంతంగా ముందుకు నడిచాయి. నిప్పు మానవ జీవితాన్ని ఒక భౌతిక శక్తిగా ప్రభావితం చేసింది. నిప్పును ఆరాధించే జాతులకూ, నిప్పును అధీనం చేసుకొన్న జాతులకూ సమరం జరిగింది. తన చుట్టూ వున్న భౌతిక ప్రపంచాన్ని సమన్వయించుకోవడంలో విఫలమై నవారు భావవాదులుగా రూపొందారు. వీరు భౌతిక సామాజిక వాస్తవికతకు భిన్నమైన భావవాదంతో భౌతికవాదులకు ఎదురు నిలుస్తూ వచ్చారు. అంతేగాక వానరుడి నుండి నరుడిగా పరిణామం చెందిన ప్రతి కీలక దశలోనూ మానవుని భౌతిక దృక్పథమే అతనికి నిర్ణయాత్మక మెట్టుగా ఉపకరించింది. లక్షలాది సంవత్సరాలకు పూర్వం ఉష్ణమండలంలో ఎక్కడో ఒక చోట నరవానరుడిగా ఉన్న మానవుడు మానవుడిగా రూపొందిన పరిణామంలో చేతుల్ని ఉపయోగించుకున్న తీరును ఎంగెల్స్ వర్ణించాడు. రోమ శరీరులైన మన పూర్వీకులు మొదట ఒక నియమంగానూ, తరువాత అవసరంగానూ నిలబడ టానికి కారణం ఆనాటికి చేతులకు వివిధ రకాలైన ఇతర పనులు ఏర్పడి ఉంటాయని అనుకోవాలి. వానరాలు ఆహారాన్ని స్వీకరించడానికి, ఆహారాన్ని పట్టుకోవడానికి చేతులను ఉపయోగిస్తాయి. కొన్ని రకాల క్రింది తరగతి స్తన్య జంతువులలో కూడా ముందు పంజాలను ఉపయోగించడం మనం చూస్తాం. చాలా రకాల కోతులు తాము చెట్ల మీద నివసించడానికై గూళ్ళను నిర్మించడానికి చేతులను ఉప యోగిస్తాయి. చింపాంజీలు తమ చేతులతో చెట్ల కొమ్మల మధ్య కప్పులు చేసుకొని ఎండ వానల నుండి కాపాడుకుంటాయి. శత్రువుల నుండి ఆత్మ రక్షణకై ఇవి చేతులతో కర్రలను, కొమ్మలను పట్టుకొని కొట్టడానికి పూనుకొంటాయి. బోనుల్లో ఉంచిన కోతులు మానవులను చూచి నేర్చుకున్న అనేక చిన్న చిన్న పనులను తమ చేతులతో చేయగలవు. కానీ మానవునికెంతో సన్నిహితమైన దశకు చేరుకున్న వానరుని చేతినీ, అనేక లక్షల సంవత్సరాల కర్మల వల్ల అభివృద్ధి నొందిన మానవుడి చేతిని చూస్తే ఎంతో భేదం కనబడుతుంది. కండ రాల సంఖ్య ఒక్కటే, నిర్మాణం కూడా ఒక్కటే. అయినా ఎంతటి నికృష్టస్థితిలోని ఆటవికుడైన మానవుని హస్తం కూడా ఎంతో అభివృద్ధి చెందిన వానర హస్తం చేయలేని వందలాది పనులను అలవోకగా చేస్తుంది. వానర హస్తం ఏ చిన్న రాతి పనిముట్టును ఎంత బండగా నైన చేసి ఎరుగదు. భారతదేశంలోని భౌతికవాద చింతన అన్ని కీలక పరిణామాల్లో ప్రధాన శక్తిగా నిలిచింది. మానవ జాతి ప్రతి అడుగులో తన అస్తిత్వాన్ని, వ్యక్తిత్వాన్ని నిలుపుకొంటూ ముందుకు నడిచింది. ఈ భౌతిక దృక్పథంతో కూడిన మానవ ప్రయాణానికి భావవాదం ఒక పెద్ద అవరోధంగా నిలిచింది. మానవ ప్రగతిలో అసమానతలు సృష్టించింది. చరిత్ర పరిణామ క్రమంలో మానవ సమాజాన్ని సమన్వయించడాన్ని మార్క్స్ గతి తార్కిక చారిత్రక భౌతికవాద దృక్పథం అన్నాడు. ఈ క్రమంలో భారత సమాజాన్ని పరిశీలిస్తే చార్వాకులు భారత ఉత్తరఖండంలో భౌతిక సిద్ధాంత కర్తలుగా మన ముందు నిలుస్తారు. వారికి ఎదురు నిలిచిన వైదికులు భావ వాదానికి కొమ్ము కాసిన ప్రతినిధులు అయ్యారు. వేద వాఙ్మయానికి ప్రత్యామ్నాయంగా భారతీయ భౌతికవాదంగా చార్వాకవాదం ముందుకొచ్చింది. భారతీయ భౌతికవాదాన్ని సాంఖ్యదర్శనం ముందుకు తీసుకువెళ్ళింది. ఈ సాంఖ్య శాస్త్రానికి మూల పురుషులు కపిలుడు, అసురీ, పంచశిఖుడు, ఈశ్వర కృష్ణుడు. ఈశ్వర కృష్ణుని 26 మంది గురుతరాల నుండి ఈ సాంఖ్యం బోధింపబడినట్లు చెప్పబడింది. ఒక్కొక్క గురువు నుండి మరొక గురువు తరానికి 30 సంవత్సరాల అంతరం ఉందని అనుకుంటే, 780 సంవ త్సరాల అంతరం కపిలుడికీ, ఈశ్వర కృష్ణుడికీ ఉంది. దీనిని బట్టి కపిలుడు క్రీ.పూ.7, 8 శతాబ్దాల వాడై ఉండవచ్చునని చరిత్రకారుల అంచానా. బుద్ధుడి మీద కూడా సాంఖ్య ప్రభావం ఉందనేది స్పష్టం. బుద్ధుడు క్రీ.పూ. 6వ శతాబ్దం వాడనుకుంటే సాంఖ్య సిద్ధాంతం అప్పటికే ప్రాచుర్యం పొంది ఉంది. దీనినిబట్టి కూడా కపిలుని సాంఖ్య శాస్త్రం క్రీ.పూ. 8 శతాబ్దిదని అనుకోవచ్చు. ఇకపోతే సమాజ నిర్మాణానికి సంబంధించిన మూలాలను అధ్య యనం చేయకుండా, సమాజ వ్యవస్థను ఉన్నదున్నట్లుగా అంగీకరించడం యధాతథవాదం. అది మార్పును అంగీకరించని వాదం. మార్పునకు భావజాలం ఒక చోదకశక్తి. దళితుల చరిత్ర నిర్మాణంలో హేతువాదమే కీలకం అవుతుంది. బి.ఆర్. అంబేడ్కర్ హేతువాద దృక్పథంతోనే సామాజిక చరిత్ర నిర్మాణంలోని చిక్కుముడులను విప్పారు. కానీ లిఖిత పరమైన ఆధారాలు లేవని వీరి చరిత్రను మనువాదులు నిరాకరిస్తారు. భారతదేశంలో మనువాదం ఉత్పత్తికి భిన్నమైనది. జీవిక కోసం సృష్టించిన ఆ«ధ్యాత్మిక కల్పన వాదం ఇబ్బడి ముబ్బడిగా పెరిగి చివరికి దేశ చరిత్రను గజిబిజి చేసింది. అనేక వైరుద్ధ్యాలు, ప్రక్షిప్తాలతో కూడిన సాహిత్యంలో తాత్విక అంశాలు, చారిత్రక అంశాలు మృగ్యమైనాయి. ప్రజలు ఎల్లప్పుడు రాజకీయాల్లో వంచనకు, ఆత్మ వంచనకు తెలివి తక్కువగా బలి అవుతూనే ఉన్నారు. అన్ని నైతిక, మత, రాజ కీయ, సాంఘిక పదజాలాల ప్రకటనల వెనుక ఏదో ఒక వర్గపు ప్రయోజనాలు దాగివున్నాయనే విషయాన్ని గ్రహించేంత వరకు వారలా బలి అవుతూనే ఉంటారు. ప్రతి పురాతన సంస్థ అది ఎంత అనాగరికమైనదిగా, కుళ్ళిపోయినదిగా కనబడినప్పటికీ పాలక వర్గాలకు చెందిన కొన్ని శక్తులచే అది నిలబెట్టబడుతోంది. ఈ విషయాన్ని గ్రహించనంతవరకూ సంస్కరణ వాదులు, అభివృద్ధి కాముకులు పాత వ్యవస్థను సమర్థించే వారి చేత మోసగించబడుతూనే వుంటారు. ఆ వర్గాల ప్రతిఘటనను పటాపంచలు చేయడానికి ఒకే ఒక మార్గం వుంది. అదేమిటంటే మన చుట్టూ ఉన్న సమాజంలోనే పాతను తుడిచి వేసి కొత్తను సృష్టించే సామర్థ్యం కలిగివున్న శక్తులను విజ్ఞానవంతులను చేసి సంఘటిత పర్చడం. డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త దళితోద్యమ నాయకుడు ‘ 98497 41695 -
రాజ్యాంగమే సమ సమాజానికి దిక్సూచి
భారతదేశంలో రాజ్యాంగం అమలైన జనవరి 26 ఒక మహత్తరమైన పండుగదినం. భారత రాజ్యాంగం సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాలను కలిగిస్తానని ప్రజలకు వాగ్దానం చేసింది. ఆలోచనా స్వేచ్ఛ, భావ ప్రకటనా స్వేచ్ఛ ఇస్తానని భరోసా ఇచ్చింది. సమాన హోదా, సమాన అవకాశాలు, సమైక్యతా భావన, సోదర భావన కలిగించడానికే రాజ్యాంగం రూపొందింది. సమతా భావాలను అంబేడ్కర్ రాజ్యాంగంలో పొందుపరిచారు. అమెరికా, బ్రిటన్ రాజ్యాంగాల నుంచి, ఫ్రెంచ్ విప్లవం నుంచి ఆయన స్ఫూర్తి పొందినా... బౌద్ధ తత్వంలోని ప్రేమ, కరుణ, ప్రజ్ఞ, మానవత్వం, సమానత్వం, స్వేచ్ఛ, తర్కం, ప్రశ్న వంటి అనేక భావాల్ని పొందుపర్చడం వల్లే, స్వాతంత్య్రం వచ్చిన తరువాత రక్తపాతం లేని సమాజంగా భారతదేశం రూపుదిద్దుకుంది. డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్... మహా మేధావి, ఆలోచనాపరుడు, లౌకికవాద శిఖరం, సమతా దర్శనకర్త, గొప్పవక్త, లోతైన రచయిత. ఆయన శైలిలో గాఢత, విశ్లేషణ బలంగా వుంటాయి. విద్యా సంపన్నమైన ఆయన భాషలో సరళత, అభివ్యక్తిలో సాంద్రత కనిపిస్తాయి. అంబేడ్కర్ మానవ హక్కుల పోరాట ధీరుడు. బౌద్ధంలో ఉన్న సామాజిక సమతా నీతిని రాజ్యాంగంలో పొందుపర్చారు. ఆయన జీవితంలో అస్పృశ్యతను ఎదుర్కోవడం ప్రధాన అంశం అయ్యింది. మానవోత్తేజితమైన, వైజ్ఞానికమైన ఎన్నో కార్యక్రమాల్లో అస్పృశ్యులకు చోటు లేకపోయిందని మథనపడ్డారు. అందువలననే అస్పృశ్యతా నివారణా చట్టం గురించి పోరాడారు. ఈ సమాజాన్ని అస్పృశ్యత లేని సమాజంగా రూపొందించాలని తపన పడ్డారు. దాని వల్ల ఎంతో మంది తమ ప్రతిభకు తగిన స్థానం లేక సంఘర్షణకు గురయ్యారు, అణచి వేయబడ్డారు. అంబేడ్కర్ ఒక తాత్వికుడు కూడా. కుల సమాజానికి ప్రత్యామ్నాయంగా కుల నిర్మూలనా సమాజాన్ని బోధించారు. అగ్రకుల రాజ్యాధికారంలో దళితులకు విముక్తి లేదని చాటారు. ప్రత్యామ్నాయ వ్యవస్థను రూపొందించుకోవడానికి రాజ్యాధికారం అవసరం అని ప్రబోధించారు. ఆయన రాజకీయ తత్వశాస్త్రం భావాత్మకమైంది కాదు... అది సాంఘిక, ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించగల సత్తా కలిగినది. బొంబాయి వంటి నగరాల్లో కూడా కులతత్వం వ్యాపించి ఉండ టంతో అంబేడ్కర్ సోదరులు అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. కుల తత్వపు గొడ్డలి వేటు వారిని చిన్నప్పుడే తాకింది. ఒకే పాఠశాలలో చదివే పిల్లలు ఒక కూజా నీళ్ళు తాగలేకపోవడం, తోటి విద్యార్థులు ఆ కూజాలోని నీళ్ళను పైనుంచి పోస్తే దోసిళ్ళు పట్టి త్రాగవలసి రావడం వంటి ఘటనలు అంబేడ్కర్ గుండెల్ని పిండివేశాయి. ఆ గాయాలే రాబోయే కాలంలో కుల నిర్మూలన గ్రంథం రాయడానికి పునాదులేశాయి. కేవలం నీటి దగ్గరే కాదు, భాష దగ్గర కూడా ఆయనకు అస్పృశ్యత ఎదురైంది. అంబేడ్కర్ హైస్కూల్లో ప్రత్యేక పాఠ్యభాగంగా సంస్కృతాన్ని కోరుకున్నారు. ఒక అస్పృశ్యుడు సంస్కృతం నేర్చుకోవడం ఏమిటని నిరాకరించారు. దాంతో పర్షియన్ భాషను తీసుకోవలసి వచ్చింది. కానీ సంస్కృతాన్ని స్వయంగా కష్టపడి నేర్చుకున్నారు. వాల్మీకి, వ్యాసుడు, కపిలుడు, లోకాయతులు ఇంకా ఎందరో బ్రాహ్మణేతరులు, క్షత్రియులు సంస్కృతంలో గ్రంథాలు రాశారు. ఎందరో పాశ్చాత్య పండితులు సంస్కృతం నేర్చుకుని, వేదాలు, ఉపనిషత్తులు, దర్శనాలు, కావ్యాలు, అన్నీ ఇంగ్లీషులోకి అనువాదం చేశారు. అంబేడ్కర్ కూడా వేదాలు, ఉపనిషత్తులు, దర్శనాలు అన్నింటినీ అధ్యయనం చేసి, వ్యాఖ్యానించారు. ఏ భాషైనా, ఏ మనిషైనా నేర్చుకోవచ్చని నిరూపించారు. అభివృద్ధిని తరచిచూస్తే... దేశం ఎంతగానో అభివృద్ధి చెందుతోందని ఇప్పుడు గొప్పగా చెప్పుకొంటున్నాం. కానీ గణతంత్ర దినోత్సవ వేళ కొన్ని కఠిన వాస్తవాలను మనం అంగీకరించాల్సి ఉంటుంది. 2023 ప్రపంచ ఆకలి సూచీలో 125 దేశాల్లో ఇండియా 111వ స్థానంలో ఉంది. దేశంలో 81.35 కోట్ల మందికి ఇప్పటికీ ఉచిత బియ్యం పంపిణీ చేయాల్సి వస్తున్నదంటేనే దేశం ఎక్కడ ఉన్నదో అర్థమవుతుంది. కూడు, గూడు, బట్ట లేని ప్రజలు ఇంకా ఉన్నప్పుడు రాజ్యాంగం అమలవుతున్నట్టా అనే ప్రశ్న ఎదురవుతుంది. అంబేడ్కర్ భూమిని జాతీయం చెయ్య మన్నారు. కానీ అదేమో కార్పోరేట్ చేతుల్లోకి వెళ్లిపోతోంది. ఇతర దేశాల నుంచి దిగుమతి అవుతున్న తిండి గింజల వల్ల ఇక్కడి వ్యవసాయం సంక్షోభంలో వుంది. ఇతర దేశాల నుంచి దిగుమతి అవుతున్న వస్త్రాల వల్ల చేనేత పరిశ్రమ కుంటుపడింది. భారతదేశంలో పేదరికం ఎందుకు ఉందంటే రాజ్యాంగాన్ని నూటికి 90 శాతం ఉల్లంఘించడం వల్లనే అని చెప్పొచ్చు. ప్రజలు ఇప్పటికీ అనారోగ్యంతో కునారిల్లుతున్నారు. పారిశుద్ధ్య వ్యవస్థ దెబ్బతింది. కేంద్ర ప్రభుత్వం పారిశుద్ధ్యంపై దృష్టి పెట్టినా, ఎన్నో పట్టణాలు ఇంకా మురికి కూపాలుగానే వున్నాయి. వందశాతం బహిరంగ మల విసర్జన రహిత రాష్ట్రాలుగా ప్రకటించినవాటిల్లో కూడా 71 శాతం మేరకే నిరోధించగలిగారని జాతీయ గణాంక కార్యాలయ సర్వే వెల్లడించింది. ఇళ్లు, వ్యాపార, పారిశ్రామిక సముదాయాల నుంచి వ్యర్థ జలాలను శుద్ధి చేసిన తరువాతే బయటకు వదిలే నగరాలకు ‘స్వచ్ఛ సర్వేక్షణ్’ పోటీలో వాటర్ ప్లస్ సర్టిఫికేషన్ ఇస్తారు. ఆ వ్యవస్థ సరిగ్గా లేని నగరాలకూ పురస్కారాలు ఇవ్వడం... పోటీ నిష్పాక్షికతపై సందేహాలు లేవనెత్తుతోంది. ఇకపోతే రోడ్లు నెత్తుటిమయం అవుతున్నాయి. దేశవ్యాప్తంగా ప్రతి గంటకూ 53 రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటే, 19 మంది మృత్యువాత పడుతున్నారని 2022 నాటి గణాంకాల్ని కేంద్ర సర్కారే ప్రస్తావిస్తోంది. అంతక్రితం ఏడాదితో పోలిస్తే ప్రమాదాల్లో 11.9 శాతం, మృతుల సంఖ్యలో 9.45 శాతం, క్షతగాత్రుల లెక్కలో 15.3 శాతం పెరుగుదల రహదార్ల రక్తదాహ తీవ్రతను కళ్లకు కడుతోంది. రోడ్డు ప్రమాద మృతుల్లో 18–45 ఏళ్ల వయస్కులే 69 శాతం దాకా ఉంటున్నారన్న వాస్తవం గుండెల్ని మెలిపెట్టేదే. కుటుంబ పోషణకు రోడ్డెక్కిన మనిషి అకాల మృత్యువాత పడితే, ఇంటిల్లిపాదీ రోడ్డున పడే దుఃస్థితి ఏటా లక్షల మంది అభాగ్యుల్ని దుఃఖసాగరంలో ముంచేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా రహదారి ప్రమాద మృతుల సంఖ్య అయిదు శాతం దాకా తగ్గితే, అంతకు రెట్టింపు ఇండియాలో పెరగడం నిశ్చేష్టపరుస్తోంది. రహదార్ల మారణహోమానికి కారణమేమిటో సుప్రీంకోర్టే నియమించిన నిపుణుల కమిటీ పూసగుచ్చినా, సరికొత్త మోటారు వాహనాల చట్టం ద్వారా అవ్యవస్థను ఊడ్చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించినా జరిగిందీ ఒరిగిందీ ఏమీ లేదు. వాహన వేగాన్ని 5 శాతం తగ్గించ గలిగినా ప్రమాద మరణాల్ని 30 శాతం దాకా నియంత్రించగల వీలుందని తెలిసినా ‘ఏడెనిమిది సెకన్లలోనే 100 కిలో మీటర్ల వేగం’ అందుకొనే శకటాలు ఎందుకు రోడ్డెక్కుతున్నట్లు? ఇకపోతే వాయు కాలుష్య భూతం భయపెడుతోంది. శారీరక మానసిక సమస్యలు పెంచి, ఏటా లక్షల కుటుంబాల్లో శోక సంద్రాల్ని ఉప్పొంగిస్తున్న వాయు కాలుష్య భూతం గర్భస్త పిండాల్ని సైతం కర్కశంగా కాటేస్తోంది. వాయు కాలుష్యంతో పోటీపడుతూ... గాలిలో, నీటిలో, భూమిపై అంతటా పరుచుకుంటున్న ప్లాస్టిక్ వ్యర్థాలు ఆరోగ్య, ఆహార రంగాల్లో పెను సంక్షోభం సృష్టిస్తున్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాలు గాలిలో ఉన్నా, భూగర్భ జలాల్లోకి చేరినా ప్రమా దమే. అవి మనుషుల దేహాల్లోకి చొచ్చుకుపోయి, శరీర కణాలను దెబ్బతీస్తాయనీ, క్యాన్సర్ల ముప్పు పెచ్చరిల్లుతుందనీ ఇప్పటికే పలు దేశాల శాస్త్రవేత్తలు, పరిశోధకులు హెచ్చరించారు. అందుకే అంబేడ్కర్ ఆశయాలు రాజ్యాంగంలో ప్రతిఫలిస్తు న్నాయా అన్నది పెద్ద ప్రశ్నగా మిగిలింది. నిజానికి రాజ్యాంగంలో ఆయన ఆలోచనలు ప్రతిఫలిస్తే 100 శాతం అక్షరాస్యత ఏర్పడుతుంది. విద్య మహోన్నత స్థాయికి చేరుతుంది. ప్రపంచం గర్వించే మేధో సంపన్నులు ఆవిర్భవిస్తారు. పేదరిక నిర్మూలన జరిగి, సమ సమాజం ఏర్పడుతుంది. స్త్రీలు ఆత్మ రక్షణతో, పురుషులతో సమానంగా జీవించగలుగుతారు. యువత శక్తి సంపన్నులై సంపదను సృష్టించగలుగుతారు. నిరుద్యోగం, పేదరికం లేని సమ సమాజం ఏర్పడుతుంది. అందుకే రాజ్యాంగ మార్గంలో నడుద్దాం! డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త దళితోద్యమ నాయకుడు ‘ 98497 41695 -
సామాన్యులను వేధించే ప్రశ్నలెన్నో!
ఐదు రాష్ట్రాల శాసనసభల ఎన్నికలు అలా ముగిశాయో లేదో... 2024 సాధారణ ఎన్నికల ఫలితాల గురించిన ఊహాగానాలు అప్పుడే మొదలైనాయి.ఈ ఫలితాల ఊపుతో బీజేపీనే తిరిగి కేంద్రంలో అధికారంలోకి వస్తుందని కొందరు చెబుతున్న విషయం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అసలు ముస్లింలకు సీట్లు ఇవ్వని బీజేపీ మళ్ళీ ఎలా అధికారంలోకి వస్తుందనే ప్రశ్న వేధిస్తోంది. అంకెలకు ఉద్వేగాలు ఉండవు. నిరావేశంగా ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే, వాస్తవాలు నిగ్గుదేలుతాయి. అధికార పక్షానికీ, ప్రతిపక్షానికీ ఓట్ల శాతంలో తేడా అతి తక్కువ. ఆ ఎన్నికల ఫలితాలకు ముందూ, తరువాతా ఆయా పార్టీల బలాబలాల్లో పెద్ద మార్పు లేదు. మరి 2024లో ప్రతిపక్షాల విజయం ఒక ఎండమావి అని ఎలా నిర్ణయిస్తారు? ఈనాడు భారతదేశం మొత్తం రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ ఎన్నికల గురించే ఆలోచిస్తోంది. అయితే ఈ ఎన్నికల కంటే కూడా 2024 సాధారణ ఎన్నికలలో బీజేపీ మళ్లీ గెలుస్తుందా లేక కాంగ్రెస్‌తో కూడిన ‘ఇండియా’ కూటమి వస్తుందా అనే దాని గురించి ప్రజలు మరింత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నిజానికి ‘ఇండియా’ కూటమికి సంబంధించి ఈ నాలుగు రాష్ట్రాల సీట్ల ఎంపిక విషయంలో కాంగ్రెస్ అలసత్వం చేసింది. ఈ ఎన్నికలలో బీజేపీకీ, కాంగ్రెస్‌కూ వచ్చిన ఉన్న ఓట్ల శాతంలో తేడా అతి తక్కువ. అసలు ముస్లివ్ులకు సీట్లు ఇవ్వని బీజేపీ, మళ్ళీ 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఎలా అధికారంలోకి వస్తుంది అనే ప్రశ్న అందరినీ వేధిస్తోంది. మొన్న తెలంగాణ ఎన్నికలలో గెలిచాక ప్రోటెవ్‌ు స్పీకర్‌గా అక్బరుద్దీన్‌ను కాంగ్రెస్ నియమించినందుకు అసెంబ్లీలో ఆయన సార థ్యంలో సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయకుండా బీజేపీ బాయ్ కాట్ చేసింది. ఇది అప్రజాస్వామిక చర్య. ఎందుకంటే ముస్లివ్ుల పాత్ర లేకుండా హైదరాబాద్ జీవితమే లేదు. ప్రపంచ మొత్తం పర్యాటకులు హైదరాబాద్ బిర్యానీని ఇష్టపడతారు. చార్మినార్ దగ్గర సెంటు, గాజులు కొనుక్కొనని హిందూ స్త్రీలు లేరు. వారి ఉత్పత్తులను అనుభవిస్తూనే వారిని శత్రువులుగా చూడడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. వారి సంగీతాన్ని ఆస్వాదిస్తూ, వారి హీరోలతో సినిమాలు నిర్మించి వందల కోట్లు సంపాదిస్తూ, రాజకీయంగా వచ్చేటప్పటికి మాత్రం వారిని నిరోధించడం అప్రజాస్వామికం కాదా! మరో పక్క సామాజిక రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాటలు ఏంటంటే, ఈ ఎన్నికలలో వచ్చిన సీట్ల సంఖ్య మనకు అంత ప్రధానం కాదు. ఓట్ల శాతమే మనకు నమూనా. మూడు ఉత్తరాది రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌కు ఎదురు దెబ్బేననడం సందేహం లేదు. అంతేకాదు 2024లో ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరుగుతుందని ఆశిస్తున్న వారికి ఆ ఫలితాలు తీవ్ర ఆశాభంగం కలిగించాయని కూడా చెప్పొచ్చు. తెలంగాణలో కాంగ్రెస్ చరిత్రాత్మక పునరాగమనంతో నెల కొన్న ఉత్సాహాన్ని ఉత్తరాది అపజయాలు ఒక విధంగా తగ్గించి వేశాయి. తదుపరి లోక్‌సభ ఎన్నికలలో బీజేపీకి అవి అనేక అను కూల తలను సృష్టించాయని కూడా అంటున్నారు. కానీ ఇదెంతవరకు నిజం? అంకెలకు ఉద్వేగాలుండవు. నిరావేశంగా ఆ నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను విశ్లేషించండి, వాస్తవాలు నిగ్గు దేలుతాయి. ఆ ఎన్నికల ఫలితాలకు ముందూ, తరువాతా ఆ యా పార్టీల బలాబలాల్లో పెద్ద మార్పు లేదని స్పష్టమవుతుంది. మరి 2024లో ప్రతిపక్షాల విజయం ఒక ఎండమావి అని ఎలా నిర్ణయిస్తారు? మూడు రాష్ట్రాలలో బీజేపీకి తిరుగులేని విజయం లభించడంతో, కేంద్రంలో ఆ పార్టీని మరోసారి అధికారంలోకి రావాలని ప్రజలు ప్రగాఢంగా కోరుకుంటున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదలా ఉంచి అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాలలో ప్రధాన రాజ కీయ పక్షాలకు లభించిన ఓట్ల గణాంకాలను చూద్దాం. మిజోరం, తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లలో మొత్తం 12.29 కోట్ల ఓట్లు పోల్ అయ్యాయి. ఇందులో బీజేపీకి 4.82 కోట్లు, కాంగ్రె స్కు 4.92 కోట్లు (‘ఇండియా’ కూటమి భాగస్వామ్య పక్షాలను కూడా కలుపుకొంటే 5.06 కోట్లు) లభించాయి. మధ్యప్రదేశ్‌లో మినహా, ఓట్ల పరంగా బీజేపీకి లభించిన ఆధిక్యత స్వల్ప స్థాయిలో మాత్రమే ఉంది. తెలంగాణాలో బీజేపీ కంటే కాంగ్రెస్‌కు పెద్ద మొత్తంలో ఓట్లు లభించాయి. మిగతా రాష్ట్రాలలో కాంగ్రెస్ ఓట్ల లోటును తెలంగాణ గణ నీయంగా భర్తీ చేసింది. మీడియా ఊదరకు విరుద్ధంగా తాజా అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీకి ప్రజల మద్దతు మరీ విశేషంగా ఏమీ లభించలేదని చెప్పొచ్చు. అసలు బీజేపీ ప్రాతినిధ్యం వహించే హిందూ ధార్మిక వ్యవస్థ గురించి అంబేడ్కర్ విశ్లేషించారు. హిందూమతం ధర్మవ్యాపక సంస్థ (మిషనరీ మతం) అవునా, కాదా అనేది చర్చనీయాంశం. హిందూ మతం ఏనాడూ ప్రచారక మతంగా లేదని కొందరంటారు. ఒకానొక కాలంలో హిందూ మతం ప్రచారక మతంగా ఉన్నదనడమే సరిౖయెన వాదంగా కన్పిస్తుంది. అది ప్రచారక మతం కాకపోతే భారత భూభాగంలో ఇంతగా వ్యాపించి ఉండేది కాదు. ఈనాడు అది ప్రచారక మతం కాదనేది కూడా సత్యమే. ఒకప్పుడు ప్రచారక మతంగా ఉన్న హిందూమతం ఇప్పుడెందుకు దానికి వ్యతిరేకంగా మారింది? ఈ ప్రశ్నకు నా జవాబు ఇది: హిందూమతం ప్రచారక మతంగా ఎప్పుడాగి పోయిందంటే, హిందువులలో కులవ్యవస్థ ఏర్ప డినప్పుడు! కుల వ్యవస్థకూ, మతం మార్పునకూ పొసగదు. మతం మార్పునకు కావలసింది విశ్వాసాలూ ,సిద్ధాంతాలూ స్వీకరించడం మాత్రమే కాదు; ఈ మతం మార్పులో అంతకంటే ముఖ్యమైన మరొక విషయం ఉంది. అది – మతం మార్చుకొన్న వారికి సంఘ జీవనంలో లభించే స్థానం. ఈనాడు ఇతరుడెవరైనా హిందూ మతాన్ని స్వీకరించదలిస్తే, హిందూ మతంలో అతని స్థానమెక్కడ? ఏ కులంలో చేర్చుకోవడం? అన్యులైన వారిని తన మతంలో చేర్చుకోవాలనుకునే ప్రతీ హిందువునీ తికమకపరిచే సమస్య ఇది. ఏదో ఒక క్లబ్బులో చేరినట్టు ఒక కులంలో అందరూ చేరడానికి వీలు లేదు. క్లబ్బు సభ్యత్వం వలే కుల సభ్యత్వం స్వేచ్ఛాయుతమైంది కాదు. ఆ కులంలో పుట్టిన వారికే ఆ కులంలో సభ్యత్వం. అది కుల న్యాయం. ఈ న్యాయం కింద ఏ కులానికి ఆ కులమే స్వయం స్వతంత్రం. ఎవరైనా కొత్త వారిని ఏ కులంలోనైనా చేర్పించే అధికారం ఈ భూమి మీద ఎవ్వరికీ లేదు. నిజానికి అంబేడ్కర్ హిందూ భారతాన్ని ఆశించ లేదు. లౌకిక, ప్రజాస్వామిక, సామ్యవాద భారతాన్ని ఆశించాడు. ఆయన మార్గంలో నడవకపోతే భారతదేశం ఆర్థిక, సాంఘిక,సాంస్కృతిక, విద్య, తాత్విక రంగాలలో అణగారిపోతుంది. డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త దళితోద్యమ నాయకుడు ‘ 98497 41695 -
అస్తమించని మేధా సూర్యుడు
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ప్రపంచ మేధావుల్లో అగ్రగణ్యులు. భారతదేశ పునర్నిర్మాణ దృష్టితో రాజ్యాంగాన్ని రూపొందించారు. ఆయన చెక్కిన రాజ్యాంగ శిల్పంలో ప్రపంచ మానవతా సూత్రాలన్నీ ఇమిడి ఉన్నాయి. లౌకిక భావన, ప్రజాస్వామ్య వ్యవస్థలలోని స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలను భారత ప్రజలకు లభించడానికి తీవ్రంగా కృషి చేశారు. ఆయన విశుద్ధంగా, వినిర్మలంగా, ద్వేష రహితంగా జీవించారు. అదే జీవన విధానం అందరికీ ఆచరణీయం. ఆయన సిద్ధాంతాలైన కుల నిర్మూలన, అస్పృశ్యతా నివారణ , ఆర్థిక సమత, మానవ హక్కులు, బహుజన సాధికారితలను సాధించడానికి మనందరం ముందుకెళ్ళాల్సిన చారిత్రక సందర్భమిది. అంబేడ్కర్‌కి పూర్వం, అంబేడ్కర్ తర్వాత అని భారతదేశ చరిత్రను మనం లిఖించాల్సి ఉంటుంది. అంబేడ్కర్‌కి పూర్వం భారతదేశం మనుస్మృతి రాజ్యం, వర్ణ వ్యవస్థ రాజ్యం, బ్రాహ్మణాధిపత్య రాజ్యం, లౌకికేతర రాజ్యం, అప్రజాస్వామిక రాజ్యం, నియంతృత్వ రాజ్యం. అంబేడ్కర్ భారత దేశం రూపురేఖలను మార్చారు. లౌకిక ప్రజాస్వామిక దేశంగా చేశారు. ఆయన భారత రాజ్యాంగ శిల్పంలో ప్రపంచ మానవతా సూత్రాలన్నీ ఇమిడి ఉన్నాయి. లౌకిక భావన ప్రజాస్వామ్య వ్యవస్థలలోని స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలను భారత రాజ్యాంగం ద్వారా భారత ప్రజలకు లభించడానికి కారకులయ్యారు. కులాతీత, మతాతీత రాజ్యాంగాన్ని రూపొందించి భారతదేశానికి కానుకగా సమ ర్పించారు. భారత దేశ భవిష్యత్తుకు ఆ రాజ్యాంగమే దిక్సూచి. అంబేడ్కర్ ప్రపంచంలోనే పేరెన్నిక గన్న మేధావి. తత్వవేత్త, దార్శనికుడు అని ఎవరిని అంటారు? ప్రపంచ గమన సూత్రాలను మార్చ గలిగిన వారినే అంటారు. అంబేడ్కర్‌కు ముందు ఒక బుద్ధుణ్ణి, ఒక మార్క్స్‌ను ప్రజలు తత్వవేత్తగా కొనియాడారు. ఆయన బుద్ధుని కంటే, మార్క్స్ కంటే కూడా విశిష్ట లక్షణాలు ఉన్న మేధావి. భారత దేశాన్ని పట్టి పీడిస్తున్న కుల సమస్యకు, అçస్పృశ్యతా నిర్మూలనకు నిర్మాణాత్మకమైన సిద్ధాంతాలు, సూత్రాలు అందించారు. అణగారిన ప్రజల హక్కుల సిద్ధాంతానికి కర్త అయ్యారు. అంతే కాక, దానికి చట్ట రూపాన్ని తీసుకొచ్చిన నిర్మాణ కర్త ఆయన. అంబే డ్కర్ పరినిర్వాణం 67వ ఏట అడుగు పెడుతున్నా ఆయన కీర్తి తరగ లేదు. ఆయన సిద్ధాంతాలు విశ్వవ్యాప్తమవ్వడానికి కారణం, ఆయన జీవితం అంతా అనంత పరిశోధన చేసి, కుల నిర్మూలన, అస్పృశ్యతా నిర్మూలనం, ఆర్థిక అసమానతల నిర్మూలనకు బాటలు వేయడమే. ఆయనలా విశుద్ధంగా, నిర్మలంగా, ద్వేష రహితంగా జీవించిన మేధావులు అరుదు. ఆయన భారత రాజ్యాంగ నిర్మాణాన్ని భారతదేశ పునర్నిర్మాణ దృష్టితో రూపొందించారు. అందుకు ఆయన తన ఆరోగ్యాన్ని పణంగా పెట్టారు. ఆయన విద్యార్జన గమ్యం అçస్పృశ్యుల ఉద్ధరణ. అదీ దళిత విద్యావంతులలో ఉండాల్సిన ఆదర్శం. దళిత విద్యార్థులు ఆ నిర్దేÔè కత్వం నుండి తప్పితే అంబేడ్కర్ మార్గాన్ని నిరోధించిన వారే అవు తారు. ఈ సత్యాన్ని ప్రతి అంబేడ్కర్‌వాది గుర్తుంచుకోవాలి. ఆయన లండన్‌లో ఉన్నప్పుడు కూడా తన మనస్సు మాత్రం భారతదేశ అస్పృశ్య సమాజం మీదే ఉండేది. భారతదేశంలో అస్పృశ్యుల కోసం పని చేస్తున్న సంఘాలు ఏమి చేస్తున్నాయా అని ఆయన ఎప్పటికప్పుడు తెలుసుకొంటూ ఉండేవారు. అంబేడ్కర్ విద్యార్థి దశ నుండే నాయకత్వ లక్షణాలను సంతరించుకున్నారు. నాయకుడు కేవలం తన వ్యక్తిగత జీవితం గురించి ఆలోచించడు. తన జాతి గురించే ఆలోచిస్తాడు. త్యాగపూరితంగా పనిచేయడం ద్వారా తన జాతీయుల మనసులను చూరగొంటాడు. నాయకుడు తన భావజాలాన్ని జాతికి అందించడానికి వాహికను రూపొందించుకుంటాడు. అది ఉత్తరాల ద్వారా కావచ్చు, పత్రికల ద్వారా గావచ్చు, సభలు, సమావేశాల ద్వారా గావచ్చు. ఆయన చేసిందీ అదే! ఆయన అనేక పత్రికల్లో రాయడమే కాక స్వయంగా ‘మూక్ నాయక్’, ‘బహిష్కృత్ భారత్’, ‘జనత’, ప్రబుద్ధ భారత్’ వంటి పత్రికలు స్థాపించి వాటి ద్వారా తాను చెప్పాలనుకున్నది నిర్భ యంగా, కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ఎన్నో సభల్లో ఉపన్యసించి అణగారిన వర్గాలను ఉత్తేజితులను చేశారు. నాటి ప్రభుత్వ పెద్దలకూ, రాజకీయ నాయకులకూ ఆయన రాసిన ఉత్తరాలు ఇప్పటికీ చారిత్రక ప్రాధాన్యం కలిగి ఉన్నాయి. అంబేడ్కర్ నిశిత పరిశీలకుడు. ముఖ్యంగా ఆయన పోరాటానికి పునాది పూర్తి కుల త్యాగ నిరతి. అందుకే పూర్వీకుల వీరోచిత గాథ లను వర్ణించారు. ఆయన క్రమశిక్షణతో కూడిన నిర్భయత్వాన్ని ప్రద ర్శిస్తూ వీరోచితమైన సాహసాన్నీ, మొక్కవోని నిబ్బరాన్నీ, ధైర్యాన్నీ కొనియాడదగిన నిశ్చితత్వాన్నీ ప్రదర్శించిన మహర్ సైనికులకు శాశ్వతమైన గుర్తింపును తెచ్చారు. ‘ఇద్దరిలో ఎవరి కీర్తి గొప్పదో చెప్పడం కష్టం. అది భారతీయ సైనికులదో లేక అంతటి విధేయతను, విశ్వాసాన్ని పొందేలా వ్యవహరించిన బ్రిటిష్ ఆఫీసర్లదా?’ (భారతీయ సైనికులలో అధికులు మహర్లు) అంటూ మేజర్ జె.టి. గోర్మన్ తన ‘హిస్టారికల్ రికార్డ్ ఆఫ్ ది సెకండ్ బెటాలియన్ ఫోర్త్ బాంబే గ్రెనెడీర్స్, 1796–1933’లో పేర్కొనడం ఈ సందర్భంగా గమనార్హం. అనతికాలంలోనే కోరెగాంవ్ చర్యకున్న ప్రాముఖ్యతను గుర్తించారు. కోరెగాంవ్‌లో మొదటి తూటా పేలిన స్థలంలో 65 అడుగుల ఎత్తు, 32 చదరపు అడుగుల వెడల్పు ఉన్న స్మృతి చిహ్నాన్ని నిర్మించాలని తల పెట్టారు. దీనికి 1821 మార్చి 26న పునాది రాయి వేశారు. ఈ దళం సాహసానికి స్మృతిగా ఈ స్తూపాన్ని నిర్మించారు. ఈ సాహసాన్ని కొనసాగించే ఉద్దేశంతో దీనిని నెలకొల్పారు. అస్పృశ్యులు అనబడినవారు వీరోచితమైన జాతులు అని అంబేడ్కర్ తన అస్పృశ్యుల వాడలో నిరూపించారు. పల్నాటి యుద్ధంలో తెలుగు నేలలో దళితులే పాల్గొన్నారు. కృష్ణదేవరాయల సైన్యంలో ఏనుగులను, గుర్రాలను నడిపింది దళితులే. ముఖ్యంగా పల్నాటి వీర చరిత్రలో కన్నమదాసు సైన్యాధ్యక్షుడు. ఆయన ఉపయోగించిన కత్తి ఇప్పటికీ కారంపూడిలో ఉంది. డా‘‘ అంబేడ్కర్ కృషి వలన అస్పృశ్యత ఒక నేరంగా రాజ్యాంగం పరిగణిస్తూ ఉంది. కాని భారతదేశంలో లక్ష లాది గ్రామాలలో ఇంకా అస్పృశ్యత వెన్నాడుతోంది. ఎన్నో హోట ళ్ళలో గ్లాసులు అస్పృశ్యులకు వేరుగా ఉంచుతున్నారు. కొన్ని ప్రభు త్వాలు ఊరికి దూరంగా ఇళ్ళు కట్టిస్తున్న సందర్భాలూ ఉన్నాయి. భారత రాజ్యాంగంలో 21వ ఆర్టికల్‌ను వివరిస్తూ డా‘‘ అంబే డ్కర్ ‘ప్రభుత్వ సొమ్మును మత బోధకులకు, మత కార్యకలాపాలకు ఉపయోగించరాదు. మత బోధలకు సంబంధించి స్వయంగా లేక ప్రయివేటు సంస్థల ద్వారా ప్రభుత్వం ఖజానా డబ్బును ఖర్చు చేయ డానికి వీలులేదు’ అని స్పష్టం చేశారు. దీనికి పూర్తిగా, భిన్నంగా ఈనాడు జరుగుతూ ఉంది. ప్రభుత్వ ప్రచార సాధనాలయిన రేడియో, టీవీ వంటివాటిలో మత ప్రచారం చేయడం రాజ్యాంగ విరుద్ధం. ఆనాడు అంబేడ్కర్ వివరించిన దానికి పూర్తి భిన్నంగా జరుగుతూ ఉంది. సెక్యులరిజం అంటే ‘మత ప్రమేయం లేని రాజ్యం’ అని అర్థం. ఈనాడు ప్రభుత్వం పూర్తిగా మతపరంగా వ్యవహరిస్తూ వుంది. ఇది భారత రాజ్యాంగ శిల్పి అంబేడ్కర్‌కూ, ఆయన ఆలోచనలకూ పూర్తిగా వ్యతిరేకమయిన విషయం. అందుకే రానురానూ అంబేడ్కర్ అవసరం పెరిగింది. ప్రపంచ వ్యాప్తంగా అంబేడ్కర్ మేధావిగా గుర్తింపు పొందారు. లండన్‌లోని ‘ఇండియా హౌస్’లో ఆయన బంగారు విగ్రహం ఉంది. బ్రిటిష్ పార్లమెంట్ ఎదురుగా ఆయన నిలువెత్తు విగ్రహం ఉంది. ఇక భారత్‌లో సరేసరి. ఇండియన్ పార్లమెంట్ ఎదురుగా ఆయన సము న్నత విగ్రహం వుంది. ఇవాళ హైద్రాబాద్ నడిబొడ్డులో అంబేడ్కర్ 125 అడుగుల విగ్రహం వెలుగులీనుతోంది. విజయవాడలో 125 అడుగుల విగ్రహం జనవరిలో ఆవిష్కరించబడుతుంది. ఆయన రాజ్యాంగ నిర్మాణ దక్షత, ప్రతిభా సామర్థ్యాలను గుర్తిస్తూ కశ్మీరు నుండి కన్యాకుమారి వరకు ఆయన విగ్రహాలు నిరంతరం వెలుస్తూనే ఉన్నాయి. ఈనాడు ఆయన భావజాల అవసరం చాలా ఉంది. మన మందరం ఆయన వర్ధంతికి నివాళిగా ఆయన సిద్ధాంతా లైన కుల నిర్మూలన, అస్పృశ్యతా నివారణ, ఆర్థిక సమత, మానవ హక్కుల పోరాట దీక్షలతో బహుజన సాధికారిత రాజ్యాధికార భావనలతో ముందుకెళ్ళాల్సిన చారిత్రక సందర్భమిది. డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త దళితోద్యమ నాయకుడు ‘ 98497 41695 (రేపు డా‘‘ బి.ఆర్. అంబేడ్కర్ వర్ధంతి) -
మేధావులకు నిలయాలు కావాలంటే...
విశ్వవిద్యాలయం అంటే ఒక అధ్యయన బోధన కేంద్రమని మరిచిపోతున్నామా? జ్ఞాన సముపార్జనకు అదొక నెలవని విస్మరిస్తున్నామా? కొన్నికేంద్రీయ విశ్వవిద్యాలయాలను చూస్తుంటే పరిస్థితి అలాగే కనబడుతోంది. అధ్యాపక వర్గంలో సామర్థ్యం ఉన్నవారు కొరవడుతున్నారు. విద్యార్థులు మత్తుమందులకు బానిసలవుతున్నారు. అసాంఘిక చర్యలకు నిర్భయంగా దిగుతున్నారు. మతోన్మాదం, కులోన్మాదాలు పెరుగుతున్నాయి.విశ్వవిద్యాలయాలు అంబేడ్కర్, సర్వేపల్లి రాధాకృష్ణన్, ఇమాన్యుయేల్ కాంట్, హెగెల్, జీన్‌పాల్ సాత్రే, చిన్నయ సూరి వంటి ప్రపంచ మేధావుల్నిసృష్టించాలంటే... జ్ఞానం, నీతి, వ్యక్తిత్వం, మానవత, ప్రజ్ఞ విస్తరించాలి. అప్పుడే ప్రపంచ యవనికపై భారతీయ విశ్వవిద్యాలయాలు మెరుస్తాయి. ప్రపంచ వ్యాప్తంగా విద్య... సామాజిక,సాంస్కృతిక, సాంకేతిక రంగాల్లో విప్లవంగా ముందుకొస్తూ ఉంది. నూతన సామాజిక నిర్మాణానికీ, ప్రపంచ అవగాహనకూ విద్యే ముఖ్యసాధనం. అటువంటి విద్యనందించే కేంద్రాలుగా విశ్వవిద్యాలయాలకు ఒక గుర్తింపు ఉంది. ఇవి దేశంలో కేంద్రీయ, రాష్ట్ర, డీమ్డ్, ప్రైవేట్ విశ్వవిద్యాలయాలుగా సేవలు అంది స్తున్నాయి. ఉన్నత విద్యను ఒక జీవనశాస్త్రంగా అధ్యయనం చేసిన వారిలో డా‘‘ బీఆర్ అంబేడ్కర్, జవహర్లాల్ నెహ్రూ, సర్వేపల్లి రాధాకృష్ణన్, మౌలానా అబుల్‌కలామ్ ఆజాద్, రామ్ మనోహర్ లోహియా, సర్ సి.వి.రామన్ వంటి మేధావులు ఎందరో ఉన్నారు. కానీ దేశంలో ఈనాడున్న 56 సెంట్రల్ యూనివర్సిటీలలో ఉన్న విద్యార్థులు, పరిశోధకులు వీరిలాగా నూత్న జ్ఞానాన్ని సృష్టించలేక పోతున్నారు. విశ్వ విద్యాలయ గ్రంథాలయాలు అధ్యయనపరుల కోసం ఆకలితో ఎదురుచూడాల్సి వస్తోంది. అధ్యాపక వర్గంలో అత్యున్నత బోధనా సామర్థ్యం వున్న వారి సంఖ్య తగ్గిపోతోంది. దొంగ డాక్టరేట్లు ఇచ్చి డబ్బు గుంజుకున్న చర్య లతో అనేక విశ్వవిద్యాలయాలు పీకల్లోతు ఆరోపణలలో కూరుకొని ఉన్నాయి. కొన్ని విశ్వవిద్యాలయాలలో విద్యార్థులు మత్తుమందులకు బానిసలవుతున్నారు. అసాంఘిక చర్యలకు నిర్భయంగా దిగు తున్నారు. ఇక ర్యాగింగ్ పేరుతో కొందరు సీనియర్స్... విద్యార్థినీ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకొనేంతగా వేధింపులకు గురి చేయ డమూ కనిపిస్తోంది. శరీరాలను నగ్నంగా చూడాలనే... మనుషులను వేధించి, బాధించి ప్రేమను పొందాలనే మానవుడిలో అంతర్ నిహి తంగా వున్న క్రూర స్వభావాన్ని జనారణ్యంలో ప్రదర్శించడం అనేది, ఈనాడు కొందరు విద్యార్థులకు ఒక దినచర్యగా మారింది. మెడికల్ కాలేజీలలో అమ్మాయిల మీద లైంగికంగా దాడులు జరుగుతున్నాయి. ఉస్మానియా యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్ లైంగికంగా వేధించడం భారతదేశాన్ని కుదిపివేసింది. ఒక డాక్టరు మనిషికి ఉన్న రుగ్మతను చూడాలి. కానీ ఆమెను అనుభవించాలని అనుకోకూడదు. ఈనాటి ప్రొఫెసర్లు ఎందుకో బోధనేతర అంశాల పట్ల ఆసక్తి చూపు తున్నారు. జూదం, త్రాగుడు, క్లబ్బులు, పబ్బులు, డ్రగ్స్, ఇతర వినోదాంశాల వైపు ఉపాధ్యాయుడు వెళితే విద్యార్థుల పరిస్థితి ఏమిటి? విద్యార్థులు జ్ఞానేతర, వినోదభరిత జీవన సంస్కృతిలో కొట్టు మిట్టాడుతున్నారు. ‘నన్ను ప్రేమించకపోతే నీ మీద యాసిడ్ పోస్తా’ నని బెదిరిస్తున్నారు. కృతిమత్వం, క్రూరత్వం కొందరు విద్యా ర్థులను అలుముకుంది. నిజానికి గ్రంథాలయ పఠనం బాగా తగ్గింది. అందువల్ల లక్షలు పెట్టి కొన్న పుస్తకాలు వ్యర్థమవుతున్నాయి. ఈరోజు విద్యార్థినులు అన్ని రంగాలలో విద్యార్థులను దాటి ముందుకెళ్లి పోయారు. అది ఈర్ష్య యగా పరిణమించింది. ఈర్ష్య య మనిషిని విచ్ఛిన్నం చేస్తుంది. ఈర్ష్య య మనిషిని తినేస్తుంది. ఈరోజు విద్యార్థులు ప్రేమ అని చేస్తున్న ప్రపోజల్స్‌లో ప్రేమ లేదు, కామమే వుంది. కామం మనిషి కళ్లు కప్పుతుంది, అంధుణ్ణి చేస్తుంది, బధిరుణ్ణి చేస్తుంది. ఇలాంటి రుగ్మతల వల్లనే ఈ విద్యాలయాల నుంచి మంచి పరిశోధనా గ్రంథాలు రావట్లేదు. శాస్త్రజ్ఞానం అనేది మనుష్యుల బుర్రల కెక్కాలంటే, విశ్వాసాలకు అతీతంగా ఆలోచించగలగాలి. తత్వవేత్తకు, శాస్త్రవేత్తకు సమన్వయం సాధించడంలో అద్వితీయమైన పాత్రను బెర్ట్రాండ్ రస్సెల్ సాధించాడు. డార్విన్‌లో కానీ, కారల్ మార్క్స్‌లో కానీ, మరి ఏ తాత్వి కునిలోనూ, శాస్త్రవేత్తలోనూ ఉన్న లోపాన్నీ, ఆధిక్యభావాన్నీ ఎత్తి చూపడంలో కూడా రస్సెల్ వెనుకాడలేదు. ప్రతి తత్వవేత్త, శాస్త్రవేత్త జ్ఞానానికి పరిమితులు ఉంటాయి. రాబోయే కాలం వారు గతంలో చెప్పినవాటిలో కొన్నింటిని ఖండించవచ్చు. కొన్నింటిని పూరించ వచ్చు. ఆ శాస్త్రజ్ఞానం వలన సమాజానికి జరిగే నష్టాన్ని గూర్చి చెప్ప వచ్చు. ఇదొక సత్యాన్వేషణా క్రమం. ప్రతి పౌరుడు, విద్యార్థి, పరిశోధకుడు... శాస్త్రవేత్తల జీవితాలను అధ్యయనం చేయడం వలన స్ఫూర్తి పొందవచ్చు. అంతేకాదు, వారి అధ్యయన క్రమాన్నీ, పరిశోధనా క్రమాన్నీ మనం అనుసరించవచ్చు. చార్లెస్ డార్విన్ గొప్ప పరిశోధకుడే కాదు, గొప్ప అధ్యయనపరుడు కూడా! ఆయనది శాస్త్రపరమైన రచన. ఆయన జీవితంలోని ఆటు పోటులను ధైర్యంగా ఎదుర్కొన్నాడు. అపారమైన ధైర్యశాలి ఆయన. అనేక జంతు సమూహాలనూ, పక్షి సమూహాలనూ, సముద్రాలనూ, వివిధ ఖండాలనూ చూసినపుడు సహజంగా ఆ ధైర్యం వస్తుంది. జీవులు జనిస్తాయి, నశిస్తాయనే శాస్త్ర జ్ఞానం అబ్బుతుంది. ఆ అవ గాహనే అపారమైన శక్తినీ, వ్యక్తిత్వ నిర్మాణాన్నీ మనిషికి కలుగజేస్తుంది. జీవించడమే కాదు, ఈ జీవుల ప్రాదుర్భావాన్ని గూర్చి తెలుసుకోవడం కూడా ఒక గొప్ప జ్ఞానమే. ఈ పునాదిగా శాస్త్రం ఎంతో అభివృద్ధి చెందింది. 20వ శతాబ్దిలో ఎరిక్ కండెల్ చేసిన పరిశోధనలు కొత్త వెలుగులు చూశాయి. కండెల్ బయో కెమిస్త్రీ, బయో ఫిజిక్స్‌లను అధ్యయనం చేసి ‘ఇన్ సెర్చ్ ఆఫ్ మెమొరీ: ది ఎమర్జెన్స్ ఆఫ్ ఏ న్యూ సైన్స్ ఆఫ్ మైండ్’ అనే గ్రంథం రాశాడు. ఇందులో ఆద్భుత విషయాలు తెలియ చేశాడు. న్యూరో సైన్సుపై అభిరుచితో మనిషి జ్ఞాపక శక్తి గురించి ఎంతో పరిశోధన చేశాడు. జంతువులకు, మనుషులకు జ్ఞాపకశక్తిలో ఎంతో తేడా ఉందని కనిపెట్టాడు. ఇపుడు సైన్సు శాఖోపశాఖలుగా విస్తరించడానికి ఆనాడు డార్విన్ చేసిన పరిశోధనలే ప్రధాన కారణం. నిజానికి డార్విన్ లాగా, ఐన్స్టీన్లాగా మన విశ్వవిద్యాలయాలలో పరి శోధన చేస్తే భారతదేశం ప్రపంచానికి ఒక ఆదర్శమయ్యేది. కానీ దురదృష్టవశాత్తూ జ్ఞానార్జనకు నెలవు కావాల్సిన చోట మతోన్మాదం, కులోన్మాదాలు పెరిగాయి. రాజకీయ రంగులు పులుముకుంటున్నాయి. కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో మతోన్మాద అరాచకత్వం పెరిగిపోతోంది. చరిత్ర జ్ఞానాన్ని నిరాకరిస్తూ, పౌరాణిక జ్ఞానానికి పతాక లెత్తుతున్నారు. దుష్ట శిక్షణ పేరుతో దళితుల్ని, మైనారిటీలను వేటాడు తున్నారు. కులతత్వంతో ఊగిపోతూ కులాంతర వివాహితులను వేధి స్తున్నారు. అంబేడ్కర్ నిర్మించిన రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ జ్ఞాన శూన్యులుగా జీవిస్తున్నారు. మైనారిటీలైన ఆచార్యులను కించ పరుస్తున్నారు. చరిత్రలో ప్రసిద్ధులైన అశోకుడు, అంబేడ్కర్ అంతటి వాళ్లను తక్కువచేస్తూ, బౌద్ధ సంస్కృతిని నిరాకరిస్తున్నారు. ఓ పక్క కార్పొరేట్ శక్తులకు బానిసలుగా ఉండి అమెరికన్ సామ్రాజ్య వాదానికి తొత్తులై, ఇజ్రాయెల్ దాడులను సమర్థిస్తూ, మహిళా విద్యార్థినులను హింసిస్తూ, విశ్వవిద్యాలయాలను భయకంపిత కేంద్రాలుగా చేస్తున్నారు. విశ్వవిద్యాలయం అంటే ఒక విజ్ఞాన అధ్యయన, బోధన కేంద్ర మని మరిచిపోయారు. మతోన్మాద క్రీడలకు నెలవు చేస్తున్నారు.శాంతి, కాంతులను విధ్వంసిస్తూ ఉన్మాదాన్ని, ఉద్రేకాన్ని కలిగి స్తున్నారు. అందుకే అంబేడ్కర్ భావజాలంతో పాటు, అంబేడ్కర్ గ్రంథాలయాలు, అంబేడ్కర్ పరిశోధనా కేంద్రాలు అన్నీ విశ్వవిద్యాల యాల్లో ఏర్పాటు చేయాల్సి ఉంది. మన విశ్వ విద్యాలయాలు అంబేడ్కర్, సర్వేపల్లి రాధాకృష్ణన్, ఇమాన్యుయేల్ కాంట్, హెగెల్, జీన్‌పాల్ సాత్రే, చిన్నయ సూరి వంటి ప్రపంచ మేధావుల్ని సృష్టించాలంటే... జ్ఞానం, నీతి, వ్యక్తిత్వం, మాన వత, ప్రజ్ఞ విస్తరించాలి. అప్పుడే ప్రపంచ యవనికపై మన విశ్వ విద్యాలయాలు మెరుస్తాయి. ఆ ప్రగతి పథంలో మనం నడుద్దాం. అప్పుడే భారతదేశానికి కీర్తి వస్తుంది. డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త దళితోద్యమ నాయకుడు ‘ 98497 41695 -
తాత్సారంలో ఆంతర్యమేమిటి?
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ నూతన పార్లమెంట్ భవనంలో అట్టహాసంగా తెచ్చిన తొలి బిల్లుకు తాజాగా రాష్ట్రపతి ఆమోదం తెలపడంతో చట్టరూపం దాల్చింది. ‘నారీ శక్తి వందన్ యాక్ట్–2023’గా పిలుస్తున్న దీన్ని సెప్టెంబర్ 19న లోక్‌సభ, సెప్టెంబర్ 21న రాజ్యసభ ఆమోదించాయి. అయితే దీన్ని నియోజక వర్గాల పునర్విభజన తర్వాత, అంటే 2029 ఎన్నికల వరకు గానీ అమలుచేయకపోవడం గమనార్హం. కాబట్టి, ఈ రిజర్వేషన్లను జాప్యం చేయాలన్న ఉద్దేశం ఇందులో కనబడుతోంది. స్త్రీలు పార్లమెంట్‌లోకి వెళ్తే సమాజ భవితవ్యమే మారిపోతుంది. వీరు కుటుంబాన్ని తీర్చిదిద్దినట్లే సమాజాన్ని తీర్చిదిద్దగలరు. స్త్రీలనూ, బీసీలనూ, దళితులనూ నిర్లక్ష్యం చేసినంతకాలం ఆ పార్లమెంటుకు అర్థంలేదు. నూతన పార్లమెంటు భవనంలో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టడం ఒక చారిత్రా త్మకమైన విషయంగా చెప్పవచ్చు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం తెచ్చింది. కేంద్ర కేబినెట్ ఆమోదించిన ఈ బిల్లును కొత్త పార్లమెంటు భవనాన్ని ప్రారంభించిన రోజున తొలి బిల్లుగా ప్రవేశపెట్టడం విశేషం. ఈ బిల్లు ప్రకారం రాజ్యసభ, పార్లమెంటు, అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం కోటాను అమలు చేస్తారు. 33 శాతంలో ఎస్సీ, ఎస్టీ మహిళలకు వారి రిజర్వేషన్ల కోటా ఆధారంగా కేటాయిస్తారు. 15 ఏళ్ల పాటు అమల్లో ఉండే ఈ రిజర్వేషన్లను వెంటనే కాకుండా నియో జకవర్గాల పునర్విభజన (డీ లిమిటేషన్) తర్వాత అమల్లోకి తేవాలని నిర్ణయించడం గమనార్హం. 2026లో డీలిమిటేషన్ చేపట్టాల్సి ఉంది. అది పూర్తయ్యి రిజర్వేషన్లు అమల్లోకి రావడానికి కొంత సమయం పట్టడం ఖాయం. అంటే 2024 ఎన్నికల నాటికి రిజర్వేషన్లు అమల్లోకి రావు. 2029 లోనే ఈ కోటా అమలయ్యే అవకాశముంది. ఆశ్చర్యకరమైన బిల్లు ఈ రిజర్వేషన్ల బిల్లు చాలాసార్లు సభల ముందుకు వచ్చింది. ప్రతిసారీ ఏకాభిప్రాయం కుదరక ఆమోదం పొందలేదు. దాదాపుగా 27 ఏళ్లుగా అది పెండింగ్‌లోనే ఉండిపోయింది. కనీసం 50 శాతం రాష్ట్రాలు ఈ బిల్లును ర్యాటిఫై చేయాల్సి ఉంటుంది. ఇకపోతే ఈ బిల్లులో చాలా లొసుగులు వున్నాయి. ఆవ్‌ు ఆద్మీ పార్టీ సీనియర్ నేత ఆతిషి మహిళా రిజర్వేషన్ బిల్లును 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు మహిళలను మోసం చేసేందుకు తెచ్చిన బిల్లు అని ఆరోపించారు. నిజానికి ఈ బిల్లులో పితృస్వామిక ఆధిపత్యం ఉంది. దళిత బహుజన వివక్ష ఉంది. ముఖ్యంగా బీసీలను అధికారం లోనికి రాకుండా చేసే కుట్ర దాగి ఉంది. డీలిమిటేషన్ అయిన తర్వాత ఎప్పుడో 2029లో రిజర్వేషన్లు అమలు చేయబడతాయి అనడంలోనే వీటిని జాప్యం చేయాలనే ఆలోచన వుంది. నిజానికి హిందుత్వవాదులు మనుస్మృతి అనుచరులు. మనుçస్మృతిని క్రీ.పూ. రెండవ శతాబ్దంలో రాసివుంటారని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ పేర్కొన్నారు. బౌద్ధయుగం అంతరించి హిందూ రాజ్యాలు ఆవిర్భవించే క్రమములో పుష్యమిత్రులు ఈ మనుస్మృని బ్రాహ్మణ రాజ్య నిర్మాణానికి సాధనంగా వాడుకున్నారు. వర్ణవ్యవస్థ పున రుద్ధరణ, స్త్రీ అణచివేత యిందులో ప్రధానమైన అంశాలుగా ముందుకు వచ్చాయి. ‘పితా రక్షతి కౌమారే భర్తా రక్షతి యౌవనే రక్షంతి స్థావిరే పుత్రాన స్త్రీ స్వాతంత్య్రమర్హతి’ అని చెబుతుంది మనుస్మృతి. బాల్యమున తండ్రి స్త్రీలను రక్షించును. యౌవనమున మగడు రక్షించును. ముసలితనమున పుత్రుడు రక్షించును. కావున స్త్రీ స్వతంత్రురాలిగా నుండటానికి వీల్లేదు. (భర్త, కుమారులు లేనప్పుడు బంధువులు రక్షింతురు). దీన్నిబట్టి మనకేమి అర్థమౌతుందంటే హిందూ పురుషుడు స్త్రీకి భయపడ్డాడు. ఈ భావజాలానికి ప్రతీకగా వున్న పార్టీ మహిళా బిల్లు ప్రవేశపెట్టిందంటే, నమ్మశక్యంగా లేదు. రాజకీయాల్లోకి స్త్రీలను అసలు రాకుండా అడ్డుకోవడం జరుగు తూనే ఉంది. ఆయా పార్టీలు స్త్రీలకు సీట్లు ఇవ్వడమే తక్కువ. ఆ రాజకీయ ప్రాతినిధ్యం కూడా అగ్రకులాల స్త్రీలకే లభ్యం అయ్యింది. భారతదేశంలో ఇప్పుడు 5 శాతం కంటే తక్కువ స్త్రీలు పార్లమెంట్లో ఉన్నారు. జెకోస్లేవేకియా, సోవియట్ రష్యాల చట్టసభలలో 27 నుండి 28 శాతం వరకు స్త్రీలకు ప్రాతినిధ్యం ఉంది. పశ్చిమ యూరప్‌లో, యూఎస్ఏలో 3 నుండి 4 శాతం స్త్రీల ప్రాతినిధ్యం మాత్రమే చట్ట సభలలో ఉంది. పార్టీలు 10 నుండి 15 శాతం సీట్లు కేటాయించినట్లు ప్రకటించినా, భారతదేశంలో స్త్రీలకు 7 శాతం కంటే సీట్లు మించలేదు. వారిలోనూ ఎన్నికైన స్త్రీల అభ్యర్థుల సంఖ్య ఇంకా తక్కువగా ఉంటోంది. నామమాత్ర రిజర్వేషన్లు పట్టణీకరణ ప్రభావం స్త్రీల రాజకీయ ప్రవేశానికి ఏ మాత్రం ఉపయోగపడటం లేదు. స్టేటస్ ఆఫ్ వుమెన్ కమిటీ 1977లో చేసిన సర్వే ప్రకారం, గ్రామీణ స్త్రీలే ఎక్కువ రాజకీయ చైతన్యంతో తమ ఓటు హక్కును వినియోగిస్తున్నారు. స్త్రీల రిజర్వేషన్‌కు సంబంధించిన విషయాలే ఇలా ఉంటే, ఇక స్త్రీలు ఓపెన్ కాంపిటిషన్లో సీట్లు గెలవడం కష్టంగా ఉంది. గ్రామ పంచాయితీల్లో పురుషుల ప్రాతి నిధ్యం ఎక్కువ ఉండడం వలన ఎన్నికైన స్త్రీలు కూడా నామమాత్రంగానే తమ ప్రాతినిధ్య విలువను వ్యక్తీకరించగలుగుతున్నారు. మొత్తం రాజకీయ పెత్తనం అగ్రకులాల పురుషులదైనపుడు దళితులకు, స్త్రీలకు ఇస్తున్న రాజకీయ రిజర్వేషన్లు నామమాత్రం అవుతున్నాయి. దళిత స్త్రీలకు దాదాపు రాజకీయాధికారంలో భాగస్వామ్యం లేదు. భారత ఉపఖండంలో ప్రజాస్వామ్య బద్ధంగా జరుగుతున్న ఎన్నికలు కూడా ఒక పెద్ద ఫార్సుగా తయారయ్యాయి. డబ్బు, మత్తు మందులు, హైటెక్ ప్రచారం, గూండాయిజం ఉన్నవాళ్ళకే పార్టీలు సీట్లు ఇస్తున్నాయి. ఎవరికైనా స్త్రీలకు సీట్లు ఇస్తే పితృస్వామ్యాన్ని పోషించగలిగిన స్త్రీలకే ఎక్కువ ప్రాధాన్యత నిస్తున్నారు. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా పెక్కు సంవత్సరాలు భారతదేశాన్ని పరిపా లించారు. ఆమె కాలంలో కాంగ్రెస్ పార్టీలో స్త్రీలకు ఎక్కువ ప్రాతి నిధ్యం కల్పించడం కానీ, ఏ విధమైన స్త్రీల సంస్కరణలు కానీ జరగలేదు. కొందరు స్త్రీలు పురుష పెత్తందారితనాన్ని అనుకరించ డమే స్త్రీవాదం అనుకుంటారు. దళితులు, స్త్రీలు రాజకీయ భాగస్వామ్యాన్ని పొందకపోవడంతో సమంగా నష్టపోతున్నారు. ఈ విషయాన్ని చెబుతూ డాక్టర్ మణి పి. కమేర్కర్ ఇలా అన్నారు: ‘స్త్రీలను ఒక అల్ప సంఖ్యాక వర్గంగా లెక్కించి, దళితులను నిర్లక్ష్యం చేసినట్లే రాజకీయాల్లో స్త్రీలను కూడా నిర్లక్ష్యం చేశారు. ప్రభుత్వం తన ప్రచార సాధనాల ద్వారా స్త్రీలను వస్తువులు, అలంకారాలు, ఫ్యాషన్ల మోజులో పడేలా చేసి, సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాల పట్ల వారి చైతన్యాన్ని దిగజార్చడానికి ప్రయత్నాలు చేస్తోంది. పురుష సమాజం చేస్తున్న కుట్రలతో స్త్రీలలో కూడా రాజకీయేతర జీవనం ఎక్కువైంది. భారతదేశంలోనే కాదు అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా స్త్రీల రాజకీయ చైతన్యం చాలా తక్కువ స్థాయిలో ఉంది.’ నాయకత్వ స్థానంలోకి వచ్చినప్పుడే... రాజకీయ చైతన్యానికి ముందు భారత ఉపఖండంలో స్త్రీలలో ఇంకా బలంగా, సామాజిక ఆర్థిక, సాంస్కృతిక పోరాటాలు జరగాలి. ఉద్యమాల నుండి వచ్చిన కార్యకర్తలు గ్రామస్థాయిలో రాజకీయ నాయకులుగా ఎదగాలి. సమాజ పునర్నిర్మాణానికి, పితృస్వామ్యానికి భిన్నంగా వారు కృషి చేయాలి. ఇతర దేశాలలో కూడా సమాజ ఉపరి తలానికి సంబంధించిన స్త్రీలే నాయకత్వ స్థానాలలో ఉన్నారు. సమాజ పునాదిని నిర్మించిన దళిత స్త్రీలు రాజకీయ చైతన్యాన్ని, నాయ కత్వాన్ని పొందగలిగినపుడే స్త్రీ స్వామ్యం సాధ్యమౌతుంది. జనాభా నిష్పత్తిని బట్టి అందరికీ సమాన అవకాశాలు వచ్చినప్పుడే భారతదేశంలో నూత్న విప్లవం వస్తుందని అంబేడ్కర్ చెప్పారు. స్త్రీ ఒక ఉజ్వల శక్తి. వీరు పార్లమెట్‌లోకి వెళ్తే సమాజ భవితవ్యమే మారి పోతుంది. కుటుంబాన్ని తీర్చిదిద్దినట్లే సమాజాన్ని తీర్చిదిద్దగలరు. స్త్రీలను, బీసీలను, దళితులను నిర్లక్ష్యం చేసినంతకాలం ఆ పార్లమెంటుకు అర్థంలేదు. శ్రామిక శక్తులు, ఉత్పత్తి శక్తులు, దళిత బహుజన స్త్రీ నారీ మణులు, ఈ పార్లమెంట్‌ను అలంకరించే రోజు రావాలి. డా. కత్తి పద్మారావు వ్యాసకర్త దళితోద్యమనేత ‘ 98497 41695 -
చరిత్రను మార్చడం ఏమార్చడమే!
చరిత్రను సృష్టించకపోయినా ఫరవాలేదు. కాని, దానికి మసిపూసి మారేడుకాయ చేయడం, లేదా అసలు పాఠ్యగ్రంథాల నుంచీ, చరిత్రపుస్తకాల నుంచీ తీసివేయడం కూడదు కదా! ఇవ్వాళ కేంద్ర పాలకులు ఈ దుశ్చర్యకు పూనుకున్నారు. ‘ఒకే దేశం, ఒకే జాతి, ఒకే సంస్కృతి’ వంటి నినాదాలతో రాజకీయాలు చేస్తున్న పెద్దల మాటలు నీటి మూటలని కొన్ని చారిత్రక అంశాలు తేల్చి చెబుతున్నాయి. అందుకే వీరు తమ సిద్ధాంతాల డొల్లతనాన్ని బయటపెట్టే చారిత్రక అంశాలకు తిలోదకాలు ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చారు. మానవ పరిణామ క్రమం, మొగలాయీ చక్రవర్తుల పాలనా కాలంలోని ఘట్టాలు వంటి అనేక అంశాలు ఆ విధంగా వీరి కత్తిరింపునకు బలయ్యాయి. భారతదేశంలో పాలకులు చరిత్రను వక్రీకరించాలనే దుర్వ్యూహాలు పన్నుతున్నారు. హిందు మతవాద భావజాలం ఆధారంగా చరిత్రను బోధించాలను కోవడం ఒక అసంబద్ధ చర్యే అవుతుంది. క్రీస్తు పూర్వం 7000 నుంచి 1500 మధ్యలో ఆవిర్భవించిన వైదిక సాహిత్యం... క్రీస్తు పూర్వం 50 వేల ఏళ్ల చరిత్రను కుదించి... భారతీయ మూలాలను దెబ్బతీసింది. రాతియుగాల నుంచీ మానవుడు నేటి ఆధునిక యుగాల వరకూ ఎలా పరిణామం చెందాడనేది మానవ మహాచరిత్రలో అందరూ తెలుసు కోవలసిన ముఖ్యమైన అంశం. ప్రస్తుతం మానవుడు ఉన్న స్థితికి... వందలు, వేల తరాల మానవులు అనుభవ పూర్వకంగా తెలుసుకున్న విజ్ఞానం, దాని ఆధారంగా చేసిన ఆవిష్కరణలు ఎలా కారణమయ్యా యనేది మానవ భవిష్యత్ గమనానికి అద్భుతమైన పాఠం. కానీ ఇవ్వాళ ఇంతటి ప్రాముఖ్యం ఉన్న మానవ పరిణామ క్రమాన్నీ, ఇతర చారిత్రక అంశాలనూ ఎన్సీఆర్టీ పుస్తకాల నుంచి కేంద్ర ప్రభుత్వం తొలగించడానికి నిర్ణయించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి. సంస్కృత భాషా గ్రంథాల్లో చేసిన కృత్రిమ కల్పనలు, వ్యుత్ప త్తులు, నీచార్థాల ద్వారా భారతీయ మూలవాసుల సాంస్కృతిక మూలాలను దెబ్బతీయడానికి ప్రయత్నాలు జరిగాయి. సామర్థ్యమూ, శాంతి, సమన్వయము ప్రేమతో కూడిన మూలవాసుల భావనలను ధ్వంసం చేసే క్రమంలో బీభత్స, భయానక రసాలకు ఎక్కువ ప్రాధా న్యత ఇస్తూ చాలా చరిత్ర వక్రీకరణకు గురయ్యింది. భారతదేశానికి ఆర్యుల రాక ముందటి చరిత్ర భారతీయ మూలవాసులదీ, దళితులదీ అని హిందూవాద రచయితలకు తెలుసు. అయినా దాని ప్రస్తావన చరిత్ర రచనలో రానివ్వడం లేదు. చరిత్ర నిర్మాణానికి అవసరమైన పరికరాలనూ, ఆధారాలనూ పరిగణనలోకి తీసుకోకపోవడం సరి కాదు. చరిత్రతో మానవ పరిణామానికి, పురాతత్త్వ శాస్త్రానికి, శాసనా లకు, నాణేలకు ఉన్న అనుబంధాన్ని నిరాకరించి నెట్టివేయడం చారి త్రక ద్రోహమే. ఇప్పుడు పాఠ్యపుస్తకాల నుంచి కొన్ని అంశాలను తొలగించడాన్ని ఈ కోణంలోనే చూడాలి. భారతదేశ చరిత్ర, సంస్కృతులను నిర్మించడంలో పురావస్తు శాస్త్రానిది తిరుగులేని పాత్ర. 19వ శతాబ్దపు చతుర్ధ పాదంలో దేశంలో ఈ శాస్త్రం అడుగిడింది. ఎందరో ప్రముఖులైన బ్రిటిష్, పురాతత్వ వేత్తలు ఈ విజ్ఞానం అభివృద్ధి పొందటానికి ఎంతో తోడ్పడ్డారు. పురావస్తు శాస్త్రం వెలుగులో బయటపడ్డ కొత్త కొత్త మానవ అవశేషాలు, వాడిన పనిముట్లను ఆధారం చేసుకుని నాటి మనిషి ఆర్థిక, సామాజిక, విశ్వాస వ్యవస్థలను నిర్మిస్తూ వస్తున్నారు. అటువంటి చరిత్ర... మతాలు చెప్పే విషయాలకు పూర్తి భిన్నంగా ఉంటుంది. అందుకే మత తత్త్వవాదులు తమకు ఇబ్బంది అనుకున్న అంశాలను పాఠాల నుండి, చరిత్ర గంథాల నుండి మాయం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. లేదా తప్పుడు వ్యాఖ్యానాలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు చరిత్ర పాఠ్యాంశాల నుంచి మానవ పరిణామ క్రమాన్ని తొలగించడం ఇందుకు మంచి ఉదాహరణ. ప్రసిద్ధ చరిత్రకారులు డీడీ కోశాంబి హిందూ పునరుద్ధరణ వాదం వల్ల వచ్చిన అనేక పరిణామాలను మన ముందుకు పరిశోధనాత్మకంగా తెచ్చారు. మూఢాచారాలు మానవ పరిణామాన్ని అడ్డుకుంటాయి అని చెప్పారు. వైదికవాదులు వ్యవసాయ సంస్కృతిని నిరసి స్తారు. కానీ వ్యవసాయం మీద వచ్చే అన్ని ఫలితాలు అనుభవిస్తారు. వాటిని దానం రూపంలో పొందుతారు. అయితే వ్యవసాయదారులను శూద్రులుగాను, వ్యవసాయ కూలీలగానూ, అతిశూద్రులు గానూ చూస్తారు. వీరు ఎంతో బౌద్ధ సాహిత్యాన్ని నాశనం చేశారు. బౌద్ధంలో దాగివున్న సమానతావాదం వీరికి వ్యతిరేకం. గుప్తుల కాలంలో అశ్వమేధ యాగాలతో క్రూరమైన హింస భారతదేశంలో కొనసాగింది. శూద్రులు, అతిశూద్రులు తీవ్ర వధకు గురయ్యారని ఆయన అన్నారు. భారతదేశ చరిత్రలో నూతన అధ్యాయాన్ని నిర్మించిన అశోకుని మానవతావాద పాలనాముద్రను చెరిపివేయాలని గుప్త వంశంలో ప్రసిద్ధుడైన సముద్ర గుప్తుడు ఎలా ప్రయత్నించాడో రొమిల్లా థాపర్ తన ‘భారతదేశ చరిత్ర’లో విశ్లేషణాత్మకంగా వివరించారు. ‘ఈ శాసనం అశోకుని ఇతర శాసనాలతో విభేదిస్తుంది. మౌర్యపాలకుడు, గుప్తులకన్నా విశాలమైన సామ్రాజ్యాన్ని పరిపాలించినా అతడు తన అధికారాన్ని అమలు పరచటంలో చాలా సాత్వికంగా ప్రవర్తించాడు.అశోకుడు దిగ్విజయ యాత్రను వదులుకుంటే, సముద్ర గుప్తుడు దిగ్విజయాలలో తేలియాడాడు. అతడు ఉత్తర రాజస్థాన్‌లోని చిన్న చిన్న రాజ్యాల అధికారాన్ని కూలద్రోశాడు. ఫలితంగా వాయవ్య భారతంపై హూణుల దండయాత్ర, చివరి గుప్త రాజులకు దురదృష్టకరంగా పరిణమించింది’. చరిత్రను వక్రీకరించాలనే ప్రయత్నం వలన భారతదేశ వ్యక్తి త్వానికి దెబ్బ తగులుతుందని తెలుసుకోలేక పోతున్నారు పాలకులు. ఇలా చేస్తే ఉత్పత్తి పరికరాలు కనిపెట్టిన దేశీయుల చరిత్ర మసక బారుతుంది. నదీ నదాలూ, కొండ కోనలూ, దట్టమైన అరణ్యాలూ, సారవంతమైన మైదానాలూ, చిట్టడవులూ... ఇలా విభిన్న ప్రాంతాల్లో ఎక్కడికక్కడ పరిస్థితులకు అనుకూలమైన జీవన పోరాట పద్ధతులు (స్ట్రాటజీస్)ను రూపొందించుకుని విభిన్న సాంస్కృతిక సమూహాలుగా జనం మనుగడ సాగించే క్రమంలో... అటువంటి సమూహాలను జయించి ఒకే రాజ్యంగానో, సామ్రాజ్యంగానో చేయాలని చేసిన ప్రయత్నాలు చరిత్రలో ఉన్నాయి. ఆ ప్రయత్నాలు కొన్నిసార్లు ఫలించినా... అదను చూసుకుని దేశీ సమూహాలు ఎక్కడి కక్కడ తిరుగుబాట్లు చేసి తమ అస్తిత్వాన్ని కాపాడుకుంటూ వచ్చాయి. మొగలాయీల కాలం కావచ్చు, బ్రిటిష్ వాళ్ల కాలం కావచ్చు... మూలవాసులైన ఆదివాసుల తిరుగుబాట్లు ఎన్నో మనకు ఇందుకు ఉదాహరణలుగా కనిపిస్తాయి. ఈ చరిత్రను మరచి ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ‘ఒకే దేశం, ఒకే మతం, ఒకే జాతి, ఒకే సంస్కృతి’ అనే నినాదాన్ని భుజానికి ఎత్తుకొని చరిత్రలోని ముఖ్యమైన ఘటనలను మాయం చేసే ప్రయత్నాలు చేస్తోంది. భారతదేశ మూలవాసులు ఏ మతాధిపత్యానికి, కులాధి పత్యానికి లొంగలేదు. స్వతంత్ర ప్రతిపత్తితో జీవించారు. మతం అనేది వ్యక్తిగత విశ్వాసంగానే మానవ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు... అత్యధిక కాలం మనుగడ సాగించింది. చరిత్రకారుడు తారాచంద్ చెప్పినట్లు చరిత్ర అనేది అనేక వైవిధ్యాలను సమన్వయం చేస్తుంది. అంతేకాదు అనేక జాతులను, అనేక సంస్కృతులను, అనేక ధర్మాలను, అనేక వ్యక్తిత్వాలను, అనేక ప్రాంతాలను సమన్వయం చేస్తూ గమిస్తుంది. మొగల్ చక్రవర్తి అక్బర్ ఒక గొప్ప చక్రవర్తి. ఆయన చరిత్రను పాఠ్యాంశాల నుండి తొలగించినందువల్ల ఎంతో విలువైన చారిత్రక జ్ఞానాన్ని కోల్పోతాం. ఆయన కాలంలో భారతదేశంలో అనేకమైన మార్పులు జరిగాయి. అక్బరు పాలించిన సుదీర్ఘకాలంలో ఆయన ప్రతి 10 ఏళ్లకు ఒకసారి మారుతూ వచ్చాడు. మొదట హిందూ రాజ్యాలపై కత్తి దూసిన అక్బర్... ఆ తరువాత హిందూ రాజ్యాలతో సమన్వయానికి ఎక్కువ పనిచేశాడు. ఇటువంటి రాజనీతిజ్ఞుడి పాఠం సిలబస్ నుంచి తీసివేస్తే విద్యార్థులకు భారత చరిత్రపై సరైన అవగాహన కలుగదు. నిజానికి అంబేద్కర్, మహాత్మాఫూలే, పెరియార్ రామస్వామి నాయకర్, నారాయణ గురు, ఝల్కారీ బాయి... ఇలా అనేక మంది సామాజిక విప్లవకారుల ప్రభావం దేశం మీద ఎంతో ఉంది. వారి జీవన చిత్రాలను కూడా మన చరిత్రలో ప్రజ్వలింపచేయాలి. అప్పుడే దేశానికి మేలు. ప్రతీ విద్యార్థికి చరిత్ర అనే వెలుగు దిక్సూచి అవుతుంది. చరిత్రను వాస్తవంగా అర్థం చేసుకున్నప్పుడే, భారతదేశాన్ని గానీ, ప్రపంచాన్ని గానీ, పునఃనిర్మించే పనిలో విద్యార్థులు, ప్రజలు విజేతలు అవుతారు. అందుకే చరిత్రను రక్షించుకుందాం, దేశాన్ని రక్షించుకుందాం! డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త దళిత ఉద్యమ నేత ‘ 98497 41695 -
ఈ యుగం బాబాసాహెబ్‌దే!
ఇవ్వాళ పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు అందరూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్‌ను భుజానికి ఎత్తుకుంటున్నారు. ఇందులో కొందరు అంబేడ్కర్ చెప్పిన సామాజిక న్యాయాన్ని ప్రజలకు అందించేవారూ ఉన్నారు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... బాబాసాహెబ్ ఏం చెప్పారో దానికి పూర్తి వ్యతిరేకంగా వ్యవహరిస్తూ దేశ రాజ్యాంగ మౌలిక సూత్రాలనే దెబ్బతీయ చూస్తున్నవారూ ఉండటం! విభిన్న భౌగోళిక ప్రాంతాలూ, అనేక జాతులూ, మతాలూ, కులాలూ, భాషలూ ఉన్న భారతదేశం సమాఖ్య లౌకిక రాజ్యంగా విలసిల్లాలని అంబేడ్కర్ ఆశించారు. ఆ మేర రాజ్యాంగంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. కానీ నేడు కొందరు పాలకులు, ప్రభుత్వాలు రాజ్యాంగ మౌలిక సూత్రాలకు తూట్లు పొడిచే విధంగా అడుగులు వేస్తుండడం విషాదకరం. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 132వ జయంతి సందర్భంగా, ప్రపంచవ్యాప్తంగా ఆయన వ్యక్తిత్వాన్ని గురించి, సిద్ధాంత అన్వ యం గురించి ముఖ్యంగా భారత రాజ్యాంగ నిర్మాణం గురించి, కుల నిర్మూలనా సిద్ధాంత ప్రతిపాదన గురించి చర్చ జరుగుతోంది. ఆయన తన జీవిత కాలంలో విస్తృతంగా రచనలు చేశారు. ఆయన మేధో సంపన్నత ఆయన గవేషణ పద్ధతిలోనే ఉంది. ముఖ్యంగా వేదాలను పరిశీలించిన పద్ధతి వినూత్నమైనది, విప్లవాత్మకమైనది. ఎందుకంటే అంతకుముందు వేదాల గురించి పరిశోధించిన మాక్స్ ముల్లర్, సురేంద్ర దాస్ గుప్తా, సర్వేపల్లి రాధాకష్ణన్ వంటివారు ఎవరూ కూడా వేదాలు అశాస్త్రీయమైన భావాలతో రూపొందాయని చెప్ప లేకపోయారు. ముఖ్యంగా శంకరాచార్యులు, రామా నుజాచార్యులు, మధ్వాచార్యులు తమ తమ కోణాల్లో వేద సమర్థుకులుగా భాష్యం రాసు కున్నారు. అంబేడ్కర్ ఒక్కరే వేదాలను, భగవద్గీ తను హింసాత్మక గ్రంథాలుగా పేర్కొన్న సాహస వంతుడు. అలాగే ఆయన ‘శాక్రెడ్ ఆఫ్ ఈస్ట్’ పేరుతో వచ్చిన 50 వాల్యూమ్స్ చదివి రాసుకున్న నోట్స్ ఎంతో విలువైనది. దాన్ని ముద్రిస్తే ప్రపంచ మూల తత్త్వ శాస్త్రానికి ఎంతో విలువైన సమా చారం జోడించగల గ్రంథాలు అందుబాటులోకి వస్తాయి. ఆయన తాత్త్విక దర్శనాలు శాస్త్రీయమైన చర్చతో కూడి ఉంటాయి. మార్క్స్, ఎంగెల్స్‌లు రాసిన ‘కమ్యూనిస్ట్ మేనిఫెస్టో’, ఎంగెల్స్ రాసిన ‘డైలెక్టిక్స్ ఆఫ్ నేచర్’, మోర్గాన్ రాసిన ‘ఏన్షియంట్ సొసైటీ’ వంటి వాటి స్థాయిలో... ఆయన తాత్విక, సామాజిక, రాజకీయ చర్చలు ఉంటాయి. వేదాల గురించి అంబేడ్కర్ ఇలా అన్నారు. ‘వేదాలు హిందువుల మతసాహిత్యంలో అత్యు న్నత స్థానాన్ని ఆక్రమించుకున్నాయని చెప్పడం వాటిని గురించి చాలా తక్కువ చెప్పినట్టే అవుతుంది. వేదాలు హిందువుల పవిత్ర సాహిత్యం అని చెప్పినా సరిపోనిదే అవుతుంది. ఎందుచేతనంటే అవి తప్పు పట్టడానికి వీలు లేనివి. వాటిని అపౌరు షేయాలని నమ్ముతారు కాబట్టి’. అంటే వేదాలు మానవ కల్పితాలు కావు అని అర్థం. మానవ కల్పి తాలు కాకపోవడం వల్ల సాధారణంగా ప్రతి మానవుడు చేసే తప్పిదాలకు, దోషాలకు, పొరపాట్లకు అవి అతీతంగా ఉంటాయి. అందుచేతనే అవి అమోఘమైనవిగా భారతీయులు నమ్ముతున్నారు. అయితే అంబేడ్కర్ వేదాలను మానవ మాత్రులైన రుషులే రచించారని చెప్పారు. ఒకరిని ద్వేషించే, అపహాస్యం చేసే, హింసను ప్రోత్సహించే ఏ గ్రంథా లైనా అవి విశ్వజనీనమైనవి కావు అని అంబేడ్కర్ చెప్పారు. అంబేడ్కర్ ప్రతిభ బహుముఖీనం. ప్రధానంగా ఆయన తాత్వికులు. ముందు తన్ను తాను తెలుసుకున్నారు. తర్వాత తన చుట్టూ ఉన్న సమా జాన్ని కూడా తెలుసుకున్నారు. తనకూ సమాజానికీ ఉండే అంతఃసంబంధాలను అధ్యయనం చేశారు. సమాజానికి అంతః ప్రకృతి అయిన రాజ్యాన్నీ, దాని అంగమైన ప్రభుత్వాన్నీ, వాటి పునాదుల్నీ పరిశోధించారు. వాటికీ తనకూ ఉండే వైరుధ్యాలనూ బయటకు తీశారు. ఈ దృష్టితో చూసిన ప్పుడు భారతావనిలో బుద్ధుని తర్వాత అంత లోతైన నైతిక వ్యక్తిత్వం అంబేడ్కర్‌దే అవుతుంది. ఆయన సామాజిక జీవితానికి పునాది బుద్ధుని బోధనా తత్వంలోనే అంతర్లీనంగా ఉంది. ఆయన బోధనలో ప్రేమ, కరుణ, ప్రజ్ఞ, ఆచరణ, దుఃఖ నివారణ, సంఘ నిర్మాణం, నైతికత, త్యాగం, ప్రధానమైనవి. ఆయన ఎంతో నిబద్ధంగా జీవించారు. రాత్రి పది గంటలకు ఆయన అన్నం తినేటప్పుడు పుస్తకాల జ్వలనంతో పాటు ఆకలి మంట కూడా రగులుతూనే ఉండేది. లండన్ వీధుల్లో అర్ధాకలితో తిరిగారు. ఆయన ధనాన్ని జ్ఞానానికి ఎక్కువ ఖర్చు చేశారు. ఆకలి తీర్చుకోవడానికి తక్కువ డబ్బు వాడేవారు. కాల్చిన రొట్టె ముక్క లను ఒక కప్పు టీలో ముంచి తిని అనంత అధ్యయనం చేసిన త్యాగశీలి ఆయన. ఈరోజు స్కాలర్‌షిప్‌తో చదు వుకుంటున్న కొందరు దళిత విద్యార్థులు తమ ఉపకార వేతనాన్ని విలాసాలకు వాడుతున్న వైనం చూస్తుంటే అంబేడ్కర్ నుంచి వీరు ఎంత నేర్చు కోవాలో అర్థమవుతుంది. అంబేడ్కర్ పరీక్షల కోసం చదవలేదు. విజ్ఞానం కోసం, అవగాహన కోసం సిద్ధాంత నిర్మాణం కోసం, సాక్ష్యాధారాల కోసం చదివారు. రాత్రంతా చదువుతూ కనిపించే అంబేడ్కర్‌తో రూవ్ుమేట్ ఎప్పుడైనా చదువు ఆపు అంటే...‘నా పరిస్థితులు, నా పేదరికం, నేను ఎంత త్వరగా విద్యార్జన పూర్తి చేస్తే అంత మంచిది. నా కాలాన్ని నేను ఎంత విద్యార్జనలో గడిపితే, ఎంత సద్వి నియోగం చేసుకుంటే అంత మంచిది’ అని చెప్పే వారు. ఆయన చదువు పట్ల చూపిన నిబద్ధతని ఈనాటి దళిత విద్యార్థి లోకం అనుసరించినట్లయితే మేధోసంపన్నత వీరి సొంతమై వీరు భారత దేశ పునర్నిర్మాణానికి ముందుకు వస్తారు. నీటి వినియోగం పైన అంబేడ్కర్ పెట్టిన శ్రద్ధ ఏ జాతీయ నాయకుడూ పెట్టలేదు. అంతగా పట్టించుకోలేదు. ఆయన ప్రణాళికలు నిర్దిష్టమై నవి. కార్మి కుల అభివృద్ధి కోసం, వ్యవసాయ, వ్యవసాయేతర కార్మికులకు ఉపాధి కల్పించాలని ఆయన పోరా డారు. గ్రామీణ శ్రామి కులను పారిశ్రామిక పనుల్లో ఉపయోగించుకుంటే పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా కొలంబియా, హార్వార్డ్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలలో అంబేడ్కర్ మీద జరిగి నంత పరిశోధన భారతదేశంలో జరగడం లేదు. అన్ని కేంద్రీయ, రాష్ట్రీయ, దేశీయ విశ్వ విద్యాలయాల్లోనూ అంబేడ్కర్ పరిశోధనా కేంద్రాలు నిర్మించి... తగినన్ని నిధులు ఇచ్చి ప్రోత్సహించటం ద్వారా ఆయన రచనల లోని ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ, విద్యా అంశాలపై పరి శోధనలు జరిగేలా చూడాలి. ఆయన నడిపిన పత్రికలు, ఆయన నిర్మించిన సంస్థలు, పార్టీలు, ఆయన ప్రణాళికలు దేశ భవిష్యత్తుకు మార్గదర్శ కాలు. ముఖ్యంగా భూమినీ, పరిశ్రమలనూ జాతీయం చేయాలనే ఆయన ఆలోచన... దళిత, బహుజన, మైనారిటీలు రాజకీయ అధికార సాధన మీద ఆధారపడి ఉంది. అంబేడ్కర్ ముందటి భారతదేశం వేరు. ఆయన తర్వాతి భారతదేశం వేరు. అందుకే అంబేడ్కర్ యుగ కర్త. ఈ యుగం ఆయనదే. ఆయన మార్గంలో నడుద్దాం. డాక్టర్ కత్తి పద్మారావు వ్యాసకర్త దళిత ఉద్యమనేత ‘ 98497 41695 రాజ్యాంగం నిర్దేశించిన సూత్రాల ప్రకారమే భారత్‌లో సమాఖ్య ప్రభుత్వాలు పూర్తిగా నడవక పోయినా... రాజ్యాంగ మౌలిక సూత్రాలను మాత్రం గత ఆరు దశాబ్దాల్లో అవి అతిక్రమించ లేదనేది వాస్తవం. ఒక వేళ అటువంటి పరిస్థితులు తలెత్తినా న్యాయవ్యవస్థ ఎప్పటికప్పుడు తన న్యాయ సమీక్షాధికారం ద్వారా రాజ్యాంగాన్ని రక్షిస్తూ వచ్చింది. ఆర్ఎస్ఎస్ భావజాలం పుణికిపుచ్చుకున్న బీజేపీ ‘ఒకే జాతి, ఒకే భాష, ఒకే దేశం’ అంటూ నియంతృత్వ భారతాన్ని నిర్మించడానికి వడి వడిగా అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. భారత రాజ్యాంగం బోధిస్తున్న బహుళత్వం, పరస్పర సహకారం, రాష్ట్రాల హక్కులు, స్థానిక స్వయం పరిపాలన వంటి వాటిని తుంగలో తొక్కడానికే అఖండ ఏకైక భారత్ ప్రాపగాండా అనేది స్పష్టం. ఈ దేశంలోని వేల కులాలు, విభిన్న జాతులు, మతాలు, ప్రాంతాల అస్తిత్వాలను కనుమరుగు చేసి మెజారిటీ మతాన్నీ, భాషనూ ఇతరులపై రుద్దడానికి చేస్తున్న ప్రయత్నాలను ఇంతకన్నా ఏవిధంగా అర్థం చేసుకోవాలి? ‘రాష్ట్రాలు మిథ్య, కేంద్రమే నిజం’ అన్న రీతిలో కేంద్రంలోని అధికార పార్టీ విధానాలు సాగుతున్నాయి. ఇదే సమయంలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ మాత్రం చైతన్యరహితంగా తన పాత పద్ధతుల్లోనే వ్యవహ రిస్తూ అనేక రుగ్మతలతో కునారిల్లుతోంది. దేశ నవ నిర్మాణంపై స్పష్టమైన జాతీయ విధానాలు లేని మిగతా జాతీయ పార్టీలు నామమాత్రంగానే మను గడ సాగిస్తున్నాయి. మరో పక్క చాలా ప్రాంతీయ పార్టీలు అవినీతికి, కుటుంబ పాలనకు కేరాఫ్ అడ్రస్‌గా ఉంటూ జాతీయ రాజకీయాల్లో ప్రభావ వంతమైన పాత్రను పోషించే స్థితిలో లేవు. ఈ పరిస్థితులను అనువుగా తీసుకుని బీజేపీ ఈసారి పార్లమెంట్లో అత్యధిక మెజారిటీ సాధించడంతో పాటూ, దేశంలోని సగానికి పైగా రాష్ట్రాల్లో ప్రభుత్వాలను హస్తగతం చేసుకోవాలని వ్యూహం పన్నుతోంది. నిజంగా ఈ వ్యూహం ఫలిస్తే రాజ్యాంగానికి భారీ సవరణలు చేపట్టి దాని మౌలిక స్వరూపాన్ని మార్చడం బీజేపీకి సులువవుతుంది. మెజారిటీ మతం దేశ ప్రజలందరి మతం అయినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఆ మతానుయాయుల సంస్కృతే మొత్తం దేశ సంస్కృతిగా చలామణీ అవుతుంది. ఇప్పటికే మైనారిటీలు, నిమ్నవర్గాల ఆహార విహారాలపై ఛాందసవాదుల దాడులు, ఆంక్షలను చూస్తూనే ఉన్నాం. బీఫ్‌ను ఆహారంగా తీసుకున్న వారు మత విలువల్ని కించపరచిన వారుగా దాడులకు గురవుతున్నారు. ఎక్కువగా ఉత్తరాదికి పరిమితమైన మూక దాడుల సంస్కృతిని దక్షిణాదికీ, ఈశాన్య భారతానికీ ఛాందస వాదులు విస్తరింపచూస్తున్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశ మైన భారత్‌లో ఇప్పటి వరకు ఎలాంటి సైనిక, ప్రజా తిరుగుబాటులు జరుగలేదంటే అందుకు రాజ్యాంగం ఇచ్చిన లౌకిక ప్రజాస్వామ్య విలువలే ప్రధాన కారణం. అన్ని కులాలూ, జాతులూ, మతాలూ, భాషలూ, ప్రాంతాలకు సమాన ప్రాతినిధ్యం, హక్కులు కల్పించడమనే మౌలిక సూత్రం రాజ్యాంగంలో ఉన్నది కాబట్టే తిరుగుబాట్లు తలెత్తలేదు. కానీ ఒకే దేశం, ఒకే జాతి లాంటి నినాదాలను ముందుకు తెచ్చి కేంద్రీకృత నియంతృత్వ విధానాలనూ, ఫాసిజాన్నీ దేశంలో అమలు చేయడానికి నేడు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అధికార పార్టీ తన నియంతృత్వ ధోరణిలో భాగంగానే పెద్ద నోట్ల రద్దు వంటి నిర్ణయాలను రాత్రికి రాత్రే తీసుకుని ప్రజలను ఇక్కట్ల పాలు చేసింది. ప్రాతినిధ్య ప్రజాస్వామ్య దేశ నిర్మాణంలో భాగంగా డాక్టర్ అంబేడ్కర్... ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు సామాజికంగా వెనుక బడిన కారణంగా వారికి రాజ్యాంగంలో రిజర్వే షన్లు పొందుపరచి... విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో అవకాశాలు కల్పించారు. కానీ అంబేడ్కర్ నిర్దేశించిన రిజ ర్వేషన్ల స్ఫూర్తికి తూట్లు పొడుస్తూ ఆర్థికంగా వెనుకబాటు ఆధారంగా 10 శాతం అగ్ర వర్ణ పేదలకు రిజర్వేషన్లను ఎటువంటి కమిషన్ వేయ కుండా, ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మూడు రోజుల్లోనే పార్లమెంట్లో ఆమోదింపచేసుకున్న మోదీ ప్రభుత్వాన్ని ఏవిధంగా అర్థం చేసుకోవాలి? 6 కోట్ల జనాభా ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు సామా జిక న్యాయాన్ని పాటిస్తూ అయిదుగురికి ఉప ముఖ్యమంత్రి పదవులనిచ్చి ముఖ్యమ్రంతి జగన్ దేశానికే ఆదర్శంగా నిలిచారు. 135 కోట్ల జనా భాను పాలించే బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కనీసం అయిదు ప్రాంతాలకు అయిదు గురు ఉపప్రధానులను చేస్తే తప్పేమిటి? 1955 లోనే మొదటి ‘రాష్ట్రాల విభజన కమిషన్’కు భారత రాజ్యాంగ పిత అంబేడ్కర్ ఓ లేఖ రాస్తూ... ఉత్తరాదిన ఢిల్లీని మొదటి దేశ రాజధానిగానూ, దక్షిణాదిన ఉన్న హైద్రాబాద్‌ను దేశ రెండో రాజ ధానిగానూ చేయాలని ప్రతిపాదించారు. ఇంత వరకు కాంగ్రెస్ కాని, బీజేపీ కానీ ఈ ప్రతిపాదనను పట్టించుకోలేదు. పాలన, అధికార వికేంద్రీకరణ జరిగితేనే కదా అన్ని ప్రాంతాల ప్రజలకూ న్యాయం జరిగేది. స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా... 135 కోట్ల జనాభాకు కేవలం 29 రాష్ట్రాలు మాత్రమే ఉన్నాయి. అన్ని అంశాల్లో అమెరికాను ఆదర్శంగా తీసుకుంటున్న భారత్ రాష్ట్రాల సంఖ్య విషయంలో ఎందుకు తీసుకోదో అర్థం కాదు. 35 కోట్ల జనాభాకన్నా తక్కువే ఉన్న అమెరికాలో 50 రాష్ట్రాలు ఉన్నాయి. స్వయం నిర్ణ యాధికారాలూ, సొంత సుప్రీంకోర్టు, సొంత రాజ్యాంగం, సొంత జెండా, ఎజెండా కలిగి ఉండే స్వేచ్ఛ అక్కడి రాష్ట్రాలకు ఉంది. అందుకే అక్కడ రాష్ట్రాలు సర్వతోముఖాభివృద్ధి చెందాయి. బాబా సాహెబ్ సూచించినట్లు భారత్‌లో 2 కోట్ల జనాభాకు ఒక రాష్ట్రం చొప్పున ఏర్పాటు చేస్తే మేలు జరిగి ఉండేది. జాతీయ వాదం ముసుగులో దళిత, మైనార్టీలపై దాడులు చేస్తే... దేశ జనాభాలో 35 శాతం ఉన్న ఈ వర్గాలు ఎలా నవభారత నిర్మాణంలో భాగస్వాములు అవుతాయి? అందుకే బీజేపీ పాల కులు దుందుడుకు పోకడలకు పోకుండా అంబే డ్కర్ ఆశయాల సాధనకు పాటు పడితే దేశం దానంతట అదే అభివృద్ధి చెందుతుంది. డా‘‘ గాలి వినోద్ కుమార్ వ్యాసకర్త ఫౌండర్ చైర్మన్, నవ భారత్ నిర్మాణ్ ఛారిటబుల్ ట్రస్టు -
రెండు భాషల విధ్వంసకుడు ‘బాబే’
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ విద్యను ప్రవేశపెట్టే అంశంపై నేడు సుదీర్ఘమైన చర్చ జరుగుతోంది. నిజానికి విద్య వేరు, మాతృభాష వేరు, సంస్కృతి వేరు, సాహిత్యం వేరు. ఇవన్నీ కూడా అంతస్సంబంధితంగా వుంటాయి. పలు సందర్భాల్లో ప్రత్యేక అస్తిత్వాలుగాను వుంటాయి. తల్లి భాష మూడేళ్లలోపే తల్లి, తండ్రి, కుటుంబ సభ్యులు, పరిసరాలు.. సమాజం నుంచి ఎక్కువగా అలవడుతుంది. ఈ రోజున 50% మందికి అసలు అక్షరాలే రావు. అయితే వారికి జీవించే భాష వచ్చు. సామాజిక కుటుంబ జీవనానికి సంబంధించిన మౌఖిక సాహిత్యం వచ్చు. నిజానికి మా అమ్మకు 100 పాటలు వచ్చేవి. నాకు వందల పద్యాలు వచ్చుగాని వంద పాటలు రావు. మాతృభాష పరంగా నాకంటే ఎప్పుడు మా అమ్మే ముందు వుంటుంది. ఇంగ్లిష్ వాళ్ళు భారతదేశం వచ్చిన తరువాత పరిపాలనా రంగంలోకి ఎక్కువ మందిని తీసుకోవడం కోసం విద్యాశాలలో కొన్ని చోట్ల ఇంగ్లిష్ ప్రవేశపెట్టారు. రాజకీయ నాయకులు కూడా అయ్యారు. గాంధీ, నెహ్రూ రాకముందు స్వాతంత్రోద్యమం ప్రాంతీయ భాషలో నడిచింది. ఆ తరువాత అది జాతీయ అంతర్జాతీయ స్థాయికి వెళ్ళడానికి ఇంగ్లిష్ భాషే వాహిక అయ్యింది. ఇంగ్లిష్ భాషలో ప్రపంచ చరిత్రను అధ్యయనం చేసిన యం. యన్. రాయ్, రాజారామ్మోహన్ రాయ్, డాంగే ఇంకా అనేకమంది సంప్రదాయ బ్రాహ్మణులు సంస్కర్తలుగా మారారు. డా. బి.ఆర్. అంబేడ్కర్ ఇంగ్లిష్ భాషలో ప్రావీణ్యం సంపాదించిన తరువాత కొలంబియా యూనివర్సిటీలో చదవగలిగారు. ప్రపంచ తత్వవేత్తలందరి పుస్తకాలతోపాటు వేదాలు, దర్శనాలను కూడా ఆయన ఇంగ్లిష్ భాషలో చదవగలిగారు. నిజానికి తెలుగు భాష మూలాలు దళిత వాడల్లో వున్నాయి. కారణం అనేక వలస రాజ్యాల భాషా ప్రభావం వారి మీద పడలేదు. అందుకే తెలుగు భాషను, సాహిత్యాన్ని దళితవాడలు, ఆదిమవాసుల మాటల్లోనుంచి, పాటల్లోనుంచి, సంస్కృతుల్లోనుంచి మనం పరిశోధించుకుంటున్నాం. తెలుగును అభివృద్ధి చేస్తే దళిత వాడలు అభివృద్ధి అవుతాయనే దుర్భుద్ధితోనే.. తెలుగు భాషను గురించి నేడు మాట్లాడుతున్న వారు దళితవాడల్లో తెలుగు గ్రంథాలయాలు ఏర్పరచలేదు, తెలుగు నేర్పే పాఠశాలలు పెట్టడం లేదు. విద్యాపరమైన అంశాల్లో వాళ్ళు ముందుకు వెళుతూ దళిత బలహీన వర్గాలకు లిఖిత తెలుగు కూడా రాకుండా చేస్తున్నారు. కార్పొరేట్ కాలేజీల్లో తమ పిల్లలకు తెలుగు రాకుండా చేయడమే గాక దళిత వాడల్లో వున్న ప్రజలకు తెలుగు రాత రాయకుండా చేస్తూ వారిని నిరక్షరాస్యులుగా ఉంచే ప్రయత్నం చేస్తూనే.. అమెరికాలో తానాల పేరుతో కుల తత్వాలను ఇతర దేశాలకు మోసుకెళ్తున్న ఈ తెలుగు మహానుభావులే తెలుగుకు శత్రువులు. తెలుగుని ద్వేషించేవాళ్ళు, తెలుగుని తమ ఇంట్లో విధ్వంసం చేసేవాళ్ళు, తమ పిల్లలు తెలుగులో మాట్లాడితే కొట్టేవాళ్ళు.. వీళ్ళు తెలుగు పునరుద్ధరణ గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారు. ప్రభుత్వం కూడా ఇంగ్లిష్ మాధ్యమం ప్రవేశ పెట్టినా తెలుగు భాషా పదాలను నేర్పే ఒక ప్రత్యేకమైన పీరియడ్ కొనసాగించాలి. వక్తృత్వపోటీలు పెట్టాలి. తెలుగు మౌఖిక కళలని పునరుద్ధరించాలి. అసలు తెలుగు రాజులు ఎంతో సాహిత్యం సృష్టిం చారు. రాజుకు, పాలకుడికి భాష మీద మక్కువ వుండాలి. కానీ ఒక పాలకుడిగా చంద్రబాబు తెలుగు భాషా విధ్వంసకుడు. ఆయన కార్పొరేట్ల కొమ్ముకాసి తెలుగు భాషను ధ్వంసం చేశాడు. పైగా బడుగు బలహీన వర్గాల అనేక వ్యవస్ధలను ధ్వంసం చేశాడు. తెలుగు సంస్కృతికి బదులుగా సొంత కుల సంస్కృతిని తేవాలని ప్రయత్నం చేశాడు. తెలుగు విధ్వం సంలో చంద్రబాబు పాత్ర సాధారణమైంది కాదు. కమ్మ సామాజిక వర్గ సాహిత్య పీఠాలను కూడా ఆయన ధ్వంసం చేశారు. నిజానికి వెంకయ్య నాయుడి జిల్లా నెల్లూరు తెలుగు పత్రికా రంగానికి పెట్టని కోట. కానీ ఆయన కూడా అక్కడ తెలుగు భాష గురించి ఏ ప్రోత్సాహాన్ని ఇవ్వలేదు. ఏపీలో ప్రభుత్వ పాఠశాలలు ఆంగ్ల బోధన లేక చిక్కిపోతున్నాయి. నేడు తెలుగువారు ప్రపంచ మానవులు అవుతున్నారు. తమ తల్లి నేర్పిన భాష వారి దగ్గర బలంగా వుంది. కానీ ఇప్పుడు ఇంగ్లిష్ నేర్చితీరవలసిన ఒక చారిత్రక భాషగా తల్లిదండ్రులు, విద్యార్ధులూ భావిస్తున్నారు. మొత్తం కార్పొరేట్ వ్యవస్థ 60% పిల్లల్ని ఇంగ్లిష్మయం చేస్తున్నప్పుడు ప్రభుత్వ పాఠశాలలో తెలుగు విద్యా బోధన మాత్రమే ఆచరణ సాధ్యం కాదు. అయితే ఇంగ్లిష్ నేర్పుతూనే ఒక తెలుగు సబ్జెక్టును బలంగా వుంచి అదనంగా తెలుగు పద్యాల పఠనం, తెలుగు వక్తృత్వ పోటీలు, తెలుగు సాంస్కృతిక వికాస అధ్యయనం, తెలుగు కార్యక్రమాలు జరుపుకొంటూ ముందుకు వెళ్ళాల్సి ఉంది. ప్రభుత్వం కూడా ప్లే స్కూళ్ళు ఇంగ్లిష్‌లో నిర్వహించకుండా అంగన్వాడి నుంచి పిల్లల్ని పంపి ఒకటో తరగతిలో ఇంగ్లిష్ చెప్పడం సాధ్యం కాదు. స్కూలు వున్న ప్రతి చోటా మళ్ళీ ప్లే స్కూల్స్ పెట్టాలి. అలాగే ఉపాధ్యాయులకు ఇంగ్లిష్ బోధనా కార్యక్రమాన్ని ఎండాకాలం నిర్వహించాలి. ఇంగ్లిష్, తెలుగు సాంస్కృతిక వికాసానికి సంబంధించి కవుల చిత్రపటాలు, రీడింగ్ రూములు అన్నీ రూపొందించాలి. తెలుగు కోసం పోరాడే వాళ్ళు కూడా తాము తెలుగు కోసం ఏమి చేశామో ఆత్మ పరిశీలన చేసుకోవాలి. వాళ్ళందరికి ఎంతో పని మిగిలివుంది. వాటి కోసం ఎంతో మంది నిరక్ష రాస్యులు ఎదురుచూస్తున్నారు. వారి ఇళ్లలో తెలుగు పుస్తకాలు 100 అయినా వున్నాయో లేదో వెనక్కు తిరిగి చూసుకోవాలి. ప్రభుత్వం కూడా ప్రకటనలకు తగ్గట్టుగా ప్రణాళికను రూపొందించుకోవాల్సి వుంది. ప్రకటనలు వున్నంత బలంగా కార్యక్రమంలేకపోతే ప్రజలు సంక్షోభంలో కూరుకుపోతారు. డా. బి.ఆర్. అంబేడ్కర్ చెప్పినట్టు దేశీయ భాషలు, జాతీయ భాషలు ప్రపంచ భాషల్ని నేర్చుకొంటూ, వ్యక్తిత్వాన్ని విస్తృతం చేసుకొంటూ మానవులందరూ సమానంగా జీవించే సమసమాజ నిర్మాణం కోసం చిత్తశుద్ధితో అందరూ ముందుకు నడవాల్సిన చారిత్రక కాలం ఇది. అంబేడ్కర్, మహాత్మాఫూలే ఆలోచనా క్రమంలో ప్రధానమైంది సామాజిక విద్యా విప్లవం. ఆ విప్లవంలో భాగస్వాములం అవుదాం. కత్తిపద్మారావు వ్యాసకర్త సామాజిక తత్త్వవేత్త, వ్యవస్థాపక అధ్యక్షులు, నవ్యాంధ్రపార్టీ మొబైల్ : 98497 41695 -
అభద్రత, అవినీతి ఊబిలో చంద్రబాబు
‘నాకు జూన్ 8 వరకు సమీక్షలు చేసే అవకాశం ఉంది’ అని ఈసీని అభ్యర్ధిస్తున్న చంద్రబాబులో ఆ తరువాత నేను ముఖ్యమంత్రిని కాను అనే అభద్రత తొంగిచూస్తోంది. సీఎం కాకపోతే ప్రతిపక్షం నాయకుడవచ్చు, లేకపోతే అసలు తానే ఎన్నికల్లో ఓడిపోవచ్చు. ఇదంతా ప్రజాస్వామ్య దేశంలో సామాన్యమే అని చంద్రబాబు భావించకపోవడం ఆశ్చర్యం. ఆయనకు 2018 డిసెంబర్లోనే తాను దిగిపోతున్న కథ అర్థ మయ్యింది. ఆయన మనసులో లేని అనేకమైన చర్యలు ఈ నాలుగు నెలల్లో హడావుడిగా చేశారు. ఇందులో కొన్ని కేసీఆర్‌ని అనుకరించినవి కాగా, కొన్ని వైఎస్ జగన్ పాదయాత్రలోని ఒప్పందాలను పూర్వపక్షం చేయాలని చేశారు. నిజానికి వృద్ధాప్య పెన్షన్ 2 వేలు చేయడంలో వృద్ధుల్లో ఉత్సాహం వచ్చిన మాట నిజం. చంద్రబాబు ఇంకా మిగిలిన అన్నదాత సుఖీభవ, పసుపు కుంకుమ. సామాజిక పింఛన్లకు సంబంధించి 2018–19 బడ్జెట్లో పెట్టకుండా ఎలా ప్రకటించాడు? ఈనాడు రూ.14,400 కోట్ల మేరకు పెండింగ్ బిల్లులు ఎందుకున్నాయి. నిజానికి వృద్ధులు, వితంతువులు నిరాధారులు అవడానికి కారకుడు చంద్రబాబు కాదా? తమ పిల్లల్ని ఎంతో కష్టపడి చదివించుకొని ఏదో ఒక ఉద్యోగ మొస్తుందని ఆశపడ్డవారు తాము వృద్ధులైనా తమ పిల్లలు ఉద్యోగస్తులు కాలేకపోయారు. బాబు వస్తే జాబు వస్తుందని చెప్పిన బాబు మొత్తం ప్రభుత్వోద్యోగ వ్యవస్థను ధ్వంసం చేశారు. దానికితోడు నారాయణ, చైతన్య సంస్ధల దోపిడీకి ద్వారాలు తెరిచాడు. రెండు సంస్థలు భిన్నమైన బినామీ సంస్థల పేరుతో సుమారు 8 వేల కోట్ల ఆస్తులు సంపాదించారు. ఏకంగా నారాయణకు మంత్రి పదవి ఇచ్చాడు. ఎందరో విద్యార్థినీ విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకొన్నా నారాయణ సంస్థల మీద ఈగ వాలకుండా చూశారు. ప్రభుత్వ విద్య గుండెను నులిమేశాడు. మెదడును తొలిచివేశాడు. సొంత కుల సంస్థగా ప్రభుత్వాన్ని నిర్వహిం చాడు. తెలుగు నేలలో సామాజిక సాంస్కృతిక విద్యా ఆర్థిక వ్యవస్థలనన్నింటినీ ధ్వంసం చేశాడు. అందుకు గాను బూకరింపు భాష నేర్చుకొన్నాడు. తన అసత్యాల ప్రచారానికి కోట్లు ఖర్చుపెట్టి ప్రచార వ్యవస్థను నిర్మించుకొన్నాడు. బాబు ఇటీవల ఎన్నికల నిర్వహణాధికారుల మీద ధ్వజమెత్తడం ప్రారంభించాడు. తన ఓటమికి రేపు ఈసీని సాకుగా చూపాలనేది తన వ్యూహం. ఎన్నో అంశాల్లో ఈసీ తనను నిలదీయవలసి ఉండగా, బాబే ఈసీని నిలదీయడం ఆయన అభద్రతలోని మూడవ అంశం. పైగా చంద్రబాబు రాజకీయంగా తప్ప రాయలసీమకు, ఉత్తరాంధ్రకు పరిపాలనా క్రమంలో పయనించలేదు. ఈనాడు రాయలసీమలో మంచినీళ్ళకు, గంజి నీళ్ళకు అల్లాడడానికి కారకులు బాబు కాదా! బాబుది దయాహీనమైన స్వభావం. రాష్ట్రంలో పిల్లతల్లులు, శిశువులు పౌష్టికాహారలోపంతో కునారిల్లుతున్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా 10 శాతం మందికే అందుతుంది. వందకి 58% మంది స్త్రీలు రాష్ట్రంలో రక్తహీనతతో బాధపడుతున్నారు. మరోపక్క వ్యవసాయదారుల్లో జూదం, తాగుడును బాబు పెంచాడు. యువతలో జ్ఞాన సంపదను పెంచవలసిన పాలకుడు తాగుడుకు బానిసలను చేశాడు. ఆహారోత్పత్తిని దెబ్బతీశాడు. రాష్ట్రంలో సబ్‌ప్లాన్ నిధులను తన సొంత కార్యక్రమాలకు చంద్రబాబు తరలించారు. సబ్‌ప్లాన్ నిధులతో దళితులకు భూమి కొని ఇవ్వడంకాని, ఇళ్ళ స్ధలాలు, శ్మశాన భూములు ఇవ్వలేదు. దళితులు గ్రామాల్లో విశాలంగా ఉండడానికి వీలు లేదని నిర్దేశించాడు. దళితులు చనిపోతే పూడ్చడానికి çశ్మశాన భూములు రాష్ట్రంలో 80 శాతం దళితవాడలకు లేవు. అంతరానితనం స్కూళ్ళు, కాలేజీలు, విశ్వవిద్యాలయాల్లో నిరంతరాయంగా కొనసాగుతోంది. 18,000 బ్యాక్‌లాగ్‌లు పూరించకపోవడంలోనే ఆయన కుల వివక్ష కొనసాగుతుంది. చంద్రబాబు అవినీతి, ఆశ్రిత పక్షపాతం, ఆత్మాశ్రయం రాష్ట్ర ప్రజల ఊపిర్లను పీల్చేస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా పాలిం చని చంద్రబాబు వంటి పాలకులను ప్రజలు గద్దె నుంచి దించేస్తారు. ఎన్ని ప్రలోభాలు పెట్టినా జనం చైతన్యవంతంగానే వుంటారు. చంద్రబాబు ఈ వాస్తవాన్ని గుర్తించలేదు. ఆయన ఇప్పుడు అవినీతి అభద్రత ఊబిలో వున్నారు. అందుకే అస్థిరంగా అపవాక్యాలు మాట్లాడుతున్నారు. ప్రజలు సామాజిక, సాంస్కృతిక, ఆర్ధిక, రాజకీయ పునరుజ్జీవనం కోసం నియంతలైన పాలకులపై నిరంతరం పోరాటం చేయాలి. రాజ్యాంగం మనకు ఇచ్చిన హక్కుల్ని కాపాడుకోవాలి. పాలకులు విసిరే ఏ మాయాజాలానికీ లొంగిపోని వ్యక్తిత్వాన్ని ప్రజలు కలిగివుండాలి. అప్పుడే ప్రజాస్వామ్యం భారతదేశంలో మనగలుగుతుంది. ఆ దిశగానే పయనిద్దాం. డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త సామాజిక తత్వవేత్త, నవ్యాంధ్ర పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ‘ 98497 41695 -
ఓటమి అంచుల్లో బాబు విన్యాసాలు
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రణరంగంలో చంద్రబాబు కులాధిపత్యం, డబ్బు, మాఫియా, మద్యంతో ముంచెత్తుతున్నారు.అక్రమ మార్గంలో నల్లడబ్బును రాజకీయాల్లోకి ప్రవహింప జేస్తున్నారు. నీతి, నియమాలను పక్కనబెట్టి అబద్ధా లకు రంగులు పూసి గాలి పటాలు ఎగురవేస్తున్నాడు. తమకు ఓటు వేయని వారిని భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. చంద్రబాబు కులాధిపత్య భావం పుత్రవ్యామోహం, ధన కాంక్ష, నియంతృత్వ స్వభావం, అనృత భాషణ ఆంధ్ర ప్రజలు అర్ధం చేసుకొంటున్నారు. ఈ మోసపూరిత ప్రభుత్వాన్ని దించి వేయాలని కంకణం కట్టుకొంటున్నారు. ఏపీలోని సంపదనంతా మల్టీనేషనల్ కంపెనీలకు అమ్ముకొంటున్న చంద్రబాబు.. కోస్తాతీరాన్ని ఇసుక మాఫియా చేతుల్లో పెట్టిన చంద్రబాబు, కులతత్వం ఊబిలోకి గ్రామాలను నెట్టిన చంద్రబాబు.. రౌడీలకు స్వేచ్ఛనిచ్చి స్త్రీల మానప్రాణాలను తీసిన చంద్రబాబు ఇక పాలించడానికి తగడని ప్రజలు నిర్ణయించారు. చంద్రబాబు అన్ని వ్యవస్థల్ని సొంత సామాజిక వర్గానికి ధారాదత్తం చేస్తున్నారని దళితులకు బోధపడింది. ముఖ్యంగా దళితుల పట్ల ఉన్న వ్యతిరేకతను బడ్జెట్లో చూపించాడు. ఎస్సీ ఎస్టీ సబ్‌ప్లాన్ కేటాయింపుల్లో ప్రభుత్వం అంకెల గారడీ చూపిం చింది. ఈ బడ్జెట్లో ఎస్సీ సబ్‌ప్లాన్‌కు 27.96 శాతం పెంచి రూ.14,367 కోట్లు, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు 28.97 శాతం పెంచి రూ.5,385 కోట్లు, బీసీ సబ్‌ప్లాన్‌కు 33 శాతం పెంచి రూ.16,226 కోట్లు, మైనారిటీ సంక్షేమానికి 18.57 శాతం పెంచి రూ.1304 కోట్లు కేటాయిం చారు. అయితే గడిచిన నాలుగేళ్లలో ఎస్సీ/ఎస్టీ/బీసీ సబ్ప్లాన్ల నిధులు ఖర్చు చేసింది చాలా తక్కువేనని ఆర్ధిక మంత్రే రాష్ట్ర శాసన సభలో ప్రకటించారు. గత బడ్జెట్లోని కేటాయింపుల్లో దాదాపు రూ.5 వేల కోట్లు మిగిలి ఉన్నాయనేది ఒక వాస్తవం. కాబట్టి బడ్జెట్లోని కేటాయింపులంతా ఆయా వర్గాలను మభ్యపెట్టడానికి తప్ప వారి సంక్షేమానికి కాదనేది స్పష్టమవుతున్నది. ఈ రోజు చంద్రబాబు పతనావస్థకు రావడానికి కారణం దళితులను పక్కన పెట్టడమే. దళితులను అవమానించడమే. ఎవరైనా దళితులుగా పుట్టాలనుకుంటారా? అంటూ అపహాస్యం చేయడమే కాదు.. దళితులపై దాడిచేసిన చింతమనేని ప్రభాకర్, కరణం బలరామ్ వంటి వారికి టికెట్లు ఇవ్వడమే కాక తమ సొంత ఊరు హైస్కూల్లో అస్పృశ్యులను వేరుగా కూర్చోపెట్టి అన్నం పెట్టిస్తున్న కోడెల శివప్రసాద్‌కు టికెట్టు ఇవ్వడం, పొన్నూరు నడిబొడ్డులో మందు షాపు పెట్టిన ధూళిపాళ్ళ నరేంద్రకు టికెట్టు ఇవ్వడం, నీరుచెట్టు పేరుతో దళితుల భూములు ఆక్రమించిన ప్రత్తిపాటి పుల్లారావుకు టిక్కెట్ ఇవ్వ డం ఇవన్నీ బాబు దళిత వ్యతిరేకతకు సంకేతాలే. బీసీ పార్టీ అని ప్రచారం చేసుకొంటూ సుమారు 70 సీట్లు రావాల్సిన బీసీలకు 26 మాత్రమే కట్టబెట్టి అదికూడా బీసీల్లో ఆధిపత్యం ఉన్న కులాలకు ఆ సీట్లు ఇచ్చి నిజమైన వృత్తికారుల్ని, సామాజిక తరగతుల్ని నిర్లక్ష్యం చేసిన చంద్రబాబు వారి ఓట్లను పొందే పరిస్థితుల్లో లేడు. నిజానికి పశ్చిమ గోదావరిని పరిశీలిస్తే కాపులు, శెట్టిబలిజలు, ఎస్సీలు, అగ్నికుల క్షత్రియులు, మిగిలిన బీసీ వర్గాలు ఎక్కువగా ఉంటారు. కానీ ఇక్కడ కూడా కమ్మవారికి సీట్లు ఇవ్వడం ఆశ్చర్యం. ఆంధ్రదేశాన్ని అంతా సొంత కుల జాగీరుగా మార్చాలని చూస్తున్నాడు. పోలీసు, రెవెన్యూ, అధికారుల్ని ఎన్నికల్లో వాడాలని చూస్తున్నారు. దానికి వ్యూహాలు పొందుతున్నారు. బీసీ లను సామాజిక సాంస్కృతిక దేశ నిర్మాణ శక్తులుగా బాబు గమనించడం లేదు. అందువల్లే 2019 ఎన్నికలలో చంద్రబాబు ఓటమి భయంతో ఊగిసలాడుతున్నాడు. అటు రాయలసీమలో దివాకర్ రెడ్డి కొడుక్కి, కోట్ల విజయ్‌బాస్కర్ రెడ్డి కొడుక్కి, ఇటు కాంగ్రెస్ నుంచి వచ్చిన వారికి రాత్రికి రాత్రి సీట్లు ఇవ్వడంతో సొంత పార్టీల వాళ్ళే ఎంపీలుగా నిలబడటానికి వెనకాడారని అర్థమౌతుంది. ఇవాళ ఆంధ్ర ప్రజలు కోరుకొంటుంది ఏమిటంటే రెండు కోట్ల ఎకరాల భూమి ఉంది దాన్ని భూమి లేని పేద ప్రజలకు పంచాలనేది. అధికార పక్షం గాని, ప్రతిపక్షం గాని కేవలం సంక్షేమ పథకాలే కాకుండా మానవ శ్రమకు మానవ వనరులకు అనుసంధానం కలిగించి ఆంధ్రరాష్ట్రాన్ని ఉత్పత్తి కేంద్రంగా మలచాలనేది ముఖ్యమైన విషయం. చంద్రబాబు దిగిపోవడం తథ్యం అనుకున్న సందర్భంలో చంద్రబాబు నాయుడుకు ప్రత్యామ్నాయమైన ఎజెండాతో కూడిన నూతన పరిపాలనా విధానాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకొంటున్నారు. కేవలం సంక్షేమమే కాకుండా సమాజం మార్పుకు దోహదం చేసే ఎజెండాను ప్రకటించాల్సి ఉంది. ఈ దిశగా లౌకిక ప్రజాస్వామ్య సామ్యవాద శక్తులన్ని ఓటును సాధనంగా మలచుకొని నూతన సామాజిక రాజకీయ విప్లవానికి పునాది వేస్తారని ఆశిద్దాం. డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త సామాజిక తత్వవేత్త, నవ్యాంధ్ర పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మొబైల్ : 98497 41695 -
బడుగు విద్యార్థుల సంక్షేమం పట్టదా?
రెండు తెలుగు రాష్ట్రాల్లో పాలకులు సంక్షేమ హాస్టళ్ళను గాలికి వదిలేశారు. రెండు రాష్ట్రాల్లో కలిపి 5,765 సంక్షేమ వసతి గృహాలు ఉన్నాయి. ఇందులో 8,70,000 మంది పిల్లలు చేరి చదువుకుంటున్నారు. రెండు రాష్ట్రాల్లో రెండు లక్షలకు పైగా వార్షిక బడ్జెట్ వుంది. కానీ సంక్షేమ హాస్టళ్ళు మాత్రం నలభై రెండు శాతం అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. ఒక్కొక్క గదిలో పది మంది పిల్లల్ని కుక్కారు. ఒక్కొక్క బాత్రూమ్ను ముప్పై మందిదాకా ఉపయోగిస్తున్నారు. బాత్రూమ్లు ఎప్పటివో. హాస్టళ్ళ క్యాంపస్‌లోకి వెళితే దుర్వాసన. వంటగది అంతా ఈగల మయం. పిల్లల శరీరం నిండా గజ్జి, తామర వంటి చర్మవ్యాధులతో గోళ్ళు పెంచుకొని గీకటం వల్ల రక్తపు మరకలు వారి శరీరం మీద కనపడుతున్నాయి. ఇక ఆడపిల్లల విషయానికి వస్తే 52 మంది ఒక బాత్రూమ్ లోనే స్నానం చేయాలి. ఈ సంవత్సరం 10 వేలమంది ఆడపిల్లలు ఈ దుర్భర పరిస్ధితులు భరించలేక చదువు కూడా మానుకున్నారు. యాభైశాతం హాస్టళ్ళకు మంచి నీళ్ళు లేవు. హాస్టల్లో చదివే ఆడపిల్లలకు అయితే నూటికి తొంభైతొమ్మిది మందికి తగిన పాళ్లలో రక్తం లేదు. ఉడికీ ఉడకని అన్నంతో కడుపులో నొప్పి. చింతపండు బాగా పిసికిన చారు పోయడంతో విపరీతమైన కడుపు మంటలు, అల్సర్లు. పిల్లలకు జీవితం మీద విరక్తి కలుగుతుంది. చంద్రబాబు తన మనవడికి పట్టువస్త్రాలు కట్టి, టోపీలు పెట్టి, రత్నాలతో కూడిన దండలు వేసి తిరుపతి వేంకటేశ్వర స్వామి చుట్టూ ప్రదర్శనలు చేయిస్తున్నారు. కానీ తన పరిపాలనలో ఉన్న పిల్లలకు దుప్పట్లు లేక చలికి గజగజవణుకుతూ ఒక పిల్లవాడు ఇంకో పిల్లవాణ్ని కరుచుకొని పడుకుంటున్నారని తెలియదా! ఈ హాస్టళ్ళల్లో ఎస్సీ, ఎస్టీ పిల్లలు వుంటారని వాళ్ళకు తెలుసు. ఈ పిల్లలు చదువుకోవడం, ఆరోగ్యంగా ఉండటం పాలకులకు ఇష్టం లేదనిపిస్తోంది. 2016–17 ఆర్థిక సంవత్సరంలో తెలుగు రాష్ట్రాల వసతి గృహాలకు వినియోగించాల్సిన డబ్బు 33% ఖర్చుకాకుండా మిగిలిపోయింది. అంటే ఎస్సీ, ఎస్టీ పిల్లల సంక్షేమంపై ఖర్చు పెట్టకూడదు, వీళ్ళకు విద్య రాకూడదు, వీళ్ళు మెరుగ్గా ఉండకూడదు, వీళ్ళు కళగా ఉండకూడదు, వీళ్ళు ఆరోగ్యంగా ఉండకూడదనే ఫ్యూడల్ భావజాలం సీఎంలిద్దరికీ ఉంది. 2017–18లో విషజ్వరాలతో హాస్టళ్ళ నుంచి పదివేల మంది విద్యార్థుల వరకు ఇళ్ళకు వెళ్ళిపోయారు. నలభై శాతం మంది విరోచనాల బారిన పడ్డారు. సాంఘిక సంక్షేమ హాస్టళ్ళంటే బందెల దొడ్లనీ, కిటికీల తలుపులు సరిగా లేక కుక్కలు వచ్చి అక్కడ పడుకుంటాయని, మంచాలు దుప్పట్లు లేక గచ్చు బండల మీద ఒట్టి ఒంటితో విద్యార్ధులు పడుకుంటారని కాగ్, లోకాయుక్త సంస్ధలు తమ రిపోర్టులో పేర్కొన్నాయి. హైకోర్టు ఆరేళ్ళ క్రితమే హాస్టళ్ళ మీద దాఖలైన పిటిషన్ మీద విచారిస్తూ ‘ఈ పిల్లలు మనుషులు కాదా, పాలకులకు మానవత్వం లేదా?’ అని వాఖ్యానించింది. జ్ఞానం విషయం అలా ఉంచి, బడుగు పిల్లల పట్ల కనీసం కరుణ, మానవత్వం కూడా లేవని బాబు నిత్యం నిరూపించుకుంటున్నారు. ఏపీ రాష్ట్రంలో శిశువులను కనలేక తల్లులు, తల్లి ప్రసవంలోనే పిల్లలు వేలాది మంది చనిపోతున్నారు. వీరందరూ బడుగు జీవుల పిల్లలే కదా! కొందరు మరింత కోటీశ్వరులు కొందరు మరింత పేదలు అవ్వడానికి బాబు కారణం కాదా? పసుపు కుంకుమల పేరుతో డ్వాక్రా మహిళలకు 10 వేల ఫండ్ ఇస్తానంటున్నారు కానీ దాని కంటే మద్యపాన నిషేధం చేస్తే కుటుంబం, ఊళ్ళు బాగుపడతాయి కదా! తాను ఎన్నికల్లో గెలవడం కోసమే బెల్టు షాపులను ఉధృతంగా పెంచుతున్నారు. ఈ ఒక్క సంవత్సరంలో ఆరు లక్షల మంది అమ్మాయిలు లేత వయస్సులో భర్తలేని వారు కావడానికి బాబు మద్యవిధానం కారణం కాదా! అంబేడ్కర్ పాలకునికి సామాజిక న్యాయ దృష్టి ఉండాలని చెప్పాడు. రాజ్యాంగం బడుగుల విద్యా వ్యవస్ధకు పటిష్టమైన పునాదులు ఏర్పరచింది. సంక్షేమ రాజ్యం అంటే విద్యా, వైద్య రంగాల్ని నిరంతరం ప్రజ్వలింప జేయడం. కానీ లక్షల మంది బడుగు పిల్లల శరీర శక్తిని, మానసిక శక్తిని నిర్వీర్యం చేస్తున్న చంద్రబాబు రాజ్యాంగ లక్ష్యాలనే నిరాకరిస్తున్నారు. పైకి ఎన్ని మాటలు చెప్పినా బడుగు జీవుల సంక్షేమాన్ని తెలుగు నేలను పాలిస్తున్న పాలకులు తూట్లు పొడుస్తున్నారు. ఓటు పునాదిగా ఉన్న రాజకీయాలు, ఓట్లు లేనివారి జీవన విధ్వంసానికి పూనుకుంటున్నాయనే చారిత్రక సత్యాన్ని గమనించి నూతన సామాజిక విప్లవానికి అందరు సన్నద్ధం కావాల్సిన సమయం ఇది. చరిత్ర నియంతలను కూలుస్తుంది. ప్రజాస్వామ్య వాదులకు పట్టం గడుతుంది. అసలైన వ్యక్తిత్వ నిర్మాణానికి రాజ్యాంగమే గీటురాయి. వ్యాసకర్త సామాజిక తత్వవేత్త, నవ్యాంధ్ర పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు‘ 98497 41695 డా‘‘ కత్తి పద్మారావు -
కులరక్కసిపై అమృత పొలికేక
అభిప్రాయం కమ్యూనిష్టు ఉద్యమానికి కంచుకోటైన నల్గొండ జిల్లా మిర్యాలగూడలో దళిత యువకుడు ప్రేమించి వైశ్య యువతి అమృతను పెండ్లి చేసుకున్నందుకు పెండ్లి కుమార్తె తండ్రి తిరునగర్ మారుతీరావు కోటి రూపాయలు వెచ్చించి హత్య చేయించిన ఘటన అన్నివర్గాల ప్రజలకూ ఆశ్చ ర్యాన్ని కల్గించింది. ఈ హత్య ద్వారా కులాంతర వివాహాలు ఆగుతాయి, ప్రేమించే వాళ్ళు ఇక ప్రేమించడం మానివేస్తారు, పెండ్లిళ్ళు చేసుకోవడం మానేస్తారు అనుకోవడం ఒక చారిత్రక తప్పిదమే అవుతుంది. కులం అనేది ఒకనాడు పుట్టింది ఒకనాడు మళ్ళీ పోతుందని అంబేడ్కర్ స్పష్టంగా చెప్పాడు. ‘‘కులం అనేది కొన్ని మత విశ్వాసాల కారణంగా ఏర్పడిన వ్యవస్ధ. కుల వ్యవస్థను వదులుకొమ్మని ప్రజలను కోరడం వారి ప్రాథమిక మత భావాలకు విరుద్ధంగా వారిని నడుచుకోమనడమే. హిందువులు తమ సామాజిక వ్యవస్థను పరమ పవిత్రంగా భావిస్తారు. కులానికి దైవిక ప్రాతిపదికను ఆపాది స్తారు. అందువల్ల కులాన్ని నిర్మూలించాలంటే దానికి ఆధారంగా కల్పించిన దైవికతను, పవిత్రతను ముందు నిర్మూలించవలసి ఉంది. అంటే శాస్త్రాల, వేదాల అధికారాన్ని నిర్మూలించవలసి ఉంటుంది’’ (కుల నిర్మూలన) కులాంతర వివాహాన్ని డా‘‘ బి.ఆర్.అంబేడ్కర్ రాజ్యాంగబద్ధం చేశారు. ఇక్కడ అమృత తండ్రి తిరునగరి మారుతీరావు తన కుమార్తెను ప్రేమించి పెండ్లి చేసుకొన్న దళిత యువకుడు ప్రణయ్‌ను క్రూరంగా కిరాయి గూండాలతో హత్య చేయించాడు. ఇది రాజ్యాంగేతరమైన చర్య. సామాజిక మార్పుపై గొడ్డలి వేటు వేసిన చర్య. మరి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఎందుకు స్పందించలేదు? తనకు బృహత్తరంగా చందాలిచ్చే వైశ్యుల ఓట్లు పోతాయనా? రెండు తెలుగు రాష్ట్రాల్లో కులాంతర సంస్కృతి విస్తరించడానికి ఆయా ప్రభుత్వ అధినేతలు ఎందుకు ప్రయత్నం చేయడం లేదు? ఒక ప్రక్క విద్యావంతులైన పిల్లలు కులం పట్టింపు లేకుండా ప్రేమించుకొంటున్నారు. తల్లిదండ్రులు కులం ఊబి లోనే కూరుకు పోయారని తెలిసి కులాంతర వివాహాలు చేసుకొంటున్నారు. ఈ పరిణామాన్ని ఆహ్వానించే చైతన్యం కమ్యూనిస్టులకు కంచుకోటైన నల్ల గొండ జిల్లాలో ఎందుకు లేదు? నక్సలైట్ ఉద్యమానికి పెట్టని కోట అయిన కరీంనగర్ జిల్లాలో కుల నిర్మూలనా చైతన్యం ఎందుకు లేదు? కులం మీరెంత పట్టుకు వేలాడినా నిలవదు. దాని పునాది బలహీనమైందని అంబేడ్కర్ పరిశోధించి చెప్పారు. ఒక ఆర్థ్ధిక వ్యవస్థ్ధగా కుల వ్యవస్థ ఎంతో హానికరమైన సంస్థ అని చెప్పాలి. ఎందుకంటే అది మానవుని సహజశక్తులను, అభిలాషలను క్రూరంగా అణచివేస్తోంది. రాజ్యాంగం అందరికీ విద్యావకాశాలు కల్పిం చాక , సమాజంలో తెలియకుండానే ఒక అంతర్గతమైన మార్పు కొనసాగుతుంది. విద్యకు వున్న శక్తి సామాన్యమైంది కాదు. ప్రధాన స్రవంతి సమాజంలోకి దళితులు విద్య ద్వారా వేగంగా వస్తున్నారు. రూపం, భాష, ఆహార్యం, ప్రవర్తన మారే కొలది ప్రేమకు వారి పుట్టుక అడ్డురావడం లేదనేది ఒక చారిత్రక సత్యం. ఒక పక్క సామాజిక వైజ్ఞానిక సాంకేతిక విప్లవాలు అంతరాలను తొలగించే పనిలో వున్నాయి. మరోవైపున ఓబీసీ కులాలు తమ కుమార్తెలను దళితులు ప్రేమించి పెండ్లి చేసుకోవడాన్ని అడ్డుకొంటున్నాయి. అంబేడ్కర్ చెప్పినట్లు ఇండియాలో సాంఘిక వ్యవస్థను సోషలిస్టులు ఎదుర్కొనక తప్పదు. అలా ఎదుర్కొనకుండా విప్లవం సాధ్యం కాదు. ఒకవేళ ఏ పరిస్థితుల వల్లనో అది సాధ్యమైనా వారి ఆశయాలు నెరవేరాలంటే సదరు సాంఘిక వ్యవస్థతో సోషలిస్టులు కుస్తీ పట్టక తప్పదు. నీవు ఏ దిక్కుకు తిరిగినా సరే దారికడ్డంగా నిలబడే పెనుభూతం కుల వ్యవçస్థ. ఈ భూతాన్ని చంపి పారవేస్తే తప్ప రాజకీయ, ఆర్థిక సంస్కరణలను సాధించలేవు. ఇప్పుడు అమృత కుల నిర్మూలనా ఉద్యమానికి కేక వేస్తోంది. ఆ కేకలో ఆర్తివుంది, ఆవేదన వుంది, సామాజిక సమత వుంది, తండ్రినే నేరస్తుడిగా నిలబెట్టి, తండ్రినే ఉరి తీయమన్న సామాజికనీతి అందరికీ ఆదర్శప్రాయం కావల్సి ఉంది. బాధితురాలు ఒంటరికాదు. భారత రాజ్యాంగం, రాజ్యాంగ శక్తులన్నీ ఆమెకు తోడున్నాయి. కులాంతర వివాహితుల గురించిన రక్షణలు బలపడటమేగాక వారి కోసం ప్రత్యేక కోర్టులు పెట్టించగలిగిన స్థాయికి మనం వెళ్ళాల్సివుంది. ప్రేమించే హక్కును కాపాడాలి, పెండ్లి హక్కునూ కాపాడాలి. అందుకని రోడ్ రోమియోల్లాగా యువకులు మారకూడదు. విద్యాజ్ఞానం, వ్యక్తిత్వ నిర్మాణంతోనే ప్రేమను సాధించవలసి ఉంది. ప్రణయ్‌ను భౌతికంగా హత్య చేయగలరేమో కానీ అతడి ప్రేమను, తాను ఆచరించిన కులాంతర సంస్కృతిని బలివ్వలేరు. ప్రేమ, ఆత్మీయత, సామాజిక సమత అనేవి రాజ్యం కంటే గొప్పవి. అవి కులాల హద్దులనే కాదు దేశాల హద్దులను దాటి ప్రపంచాన్ని ఏకం చేయగలవు. కత్తి పద్మా రావు వ్యాసకర్త సామాజిక తత్వవేత్త, నవ్యాంధ్ర పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ‘ 98497 41695 -
ఆకాశంలో సగం.. భద్రత శూన్యం
ఏ దేశం, ఏ రాష్ట్రం వర్ధిల్ల డానికైనా స్త్రీయే ప్రధాన కారణం. స్త్రీని గౌరవించిన రాష్ట్రాలు, దేశాలు, స్త్రీకి ప్రాధాన్యమిచ్చిన అన్ని వ్యవస్థలు వర్ధిల్లుతూ వచ్చాయి. అయితే ఈనాడు దేశంలోనూ, రాష్ట్రంలోనూ స్త్రీల ఉత్పత్తి శక్తిపై తీవ్రమైన దాడి జరుగుతుంది. స్త్రీని కేవలం గృహిణిగా మార్చి వారిని ద్వితీయులుగా పురుషుల మీద ఆధారపడి బ్రతికేవారిగా మార్చివేసి, టి.వి.సీరియల్స్ చూసి ముచ్చటించుకొనే వారిగా నెట్టివేశారు. మధ్య తరగతి స్త్రీలంటే పనీపాటాలేని వారు అన్నట్లు తేల్చివేశారు. చంద్రబాబు ప్రభుత్వంలో స్త్రీలపై దాడులు, దమనకాండలు, అరాచకాలు, గృహ హింస నిరంతర దుష్క్రియగా మారింది. స్త్రీల రక్షణ మీద, స్త్రీలకు పని కల్పించడం మీద చంద్రబాబుకు చూపులేదు. స్త్రీ విద్యపై నిరంతరం గొడ్డలివేటు పడుతూ వుంది. కుటుంబం, మత సాంప్రదాయం, పురుష పెత్తనంతో పాటు ప్రభుత్వం స్త్రీ విద్యకు పూర్తిగా విరుద్ధంగా పనిచేస్తుంది. ఆరు, ఏడు తరగతుల్లోనే అమ్మాయిలు ఎందుకు డ్రాప్ ఔట్ అవుతున్నారనే కనీస ఆలోచన లేని ప్రభుత్వాలు స్త్రీ విద్యకు అడుగడుగునా ముళ్ళ కంచె వేస్తున్నాయి. ఇక దళిత స్త్రీలు వ్యవసాయ కూలీలుగా ఆర్థిక పేదరికాన్ని ఎంత అనుభవిస్తున్నారో కులాధిపత్యం దారుణ అణచివేతను అంతకంటే ఎక్కువ అనుభవిస్తున్నారు. ప్రధానంగా వ్యవసాయ కార్మికులైన దళిత స్త్రీలు ఊరిబయట పూరిగుడిసెల్లో బతుకుతున్నారు. వారికి ఇళ్లస్థలాలు లేవు. పోషకాహార లోపం వల్ల బలహీనులవుతున్నారు. పగలంతా చెమటోడ్చి, పొలాల్లో పనిచేస్తే దళిత స్త్రీలకు మరీ తక్కువ కూలి ఇస్తున్నారు. వ్యవసాయ పునాది దెబ్బతినడంతో దళిత స్త్రీలు ఇతర జిల్లాలకు వెళ్ళి కూలి చేసుకోవాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు భూస్వాములు వాళ్ళ చావిళ్ళలో కుక్కి పశువులతో సమానంగా చూస్తున్న ఘటనలు గుండెలను తొలిచివేస్తాయి. చంద్రబాబుకు సమాజాన్ని లోతుగా చూడటం రాదు. ఆయన ఉపరితలం మనిషి. ఆయన కళ్ళ ముందు మెరిసే జిలుగు వెలుగులను చూసి సమాజమంతా ఇలాగే వుందని అనుకుంటాడు. అనేక గృహాల్లో జరుగుతున్న హింస, నెత్తుటి చారల వెనుక ఆయన నిర్వహిస్తున్న మందు షాపుల బార్లు వున్నాయని ఆయనకు తెలియదా!. అనేక దుర్వ్యసనాలకు కాణాచిగా రాష్ట్రాన్ని దుర్గంధపూరితంగా మార్చివేస్తున్న చంద్రబాబు స్త్రీ హింసను సామాన్యంగా తీసుకోవడం ఆశ్చర్యమేస్తుంది. గృహ హింస నిరోధక చట్టం 2005 ఏ పోలీస్ స్టేషన్ సరైన పద్ధతిలో అమలు జరపడం లేదు. మరోవైపున ఇండ్లలో పనిచేసే అమ్మాయిలకు రక్షణ లేకుండా పోయింది. వీరు లైంగిక వేధింపులకే గాక, యజమానురాళ్ళ వేధింపులకు కూడా గురవుతున్నారు. ప్రభుత్వం అనేక విషయాల్లో ఇంటింటికీ తిరిగి లెక్కలు తీస్తుంది కానీ ఈ ఇండ్లలో పనిచేస్తున్న బాలకార్మికుల గురించి, వారి వేధింపుల గురించిన ఏ విధమైన సమాచారం ప్రభుత్వానికి లేదు. సినీరంగంలో చిన్నచిన్న వేషాలు వేసి జీవిస్తున్న యువతుల మీద కూడా లైంగిక వేధింపులు జరుగుతున్నాయి. వారిలో వున్న కళను గుర్తించకుండా వారి దగ్గరకు పనికోసం వచ్చిన జూనియర్ ఆర్టిస్టులను వేధిస్తున్నారు. జూనియర్ ఆర్టిస్టులకు హెల్త్ కార్డులు లేవు, లైఫ్ ఇన్సూరెన్స్ లేదు, వారి జీవితానికి భద్రత లేదు. వారిని వేధిస్తున్నవారు పెద్ద పెద్ద ధనవంతులు అవ్వడంతో, బడా పెట్టుబడిదారులు కావడంతో వారి కేసును తీసుకొనే పోలీస్ స్టేషన్ లేదు. ఒకవేళ తీసుకున్నా ఆ పలుకుబడిగల నిర్మాతల, దర్శకుల ఒత్తిడితో ఆ కేసు నిలవదు. వారికి నిర్దిష్ట పారితోషికం లేదు. అభద్రతలో వారు జీవిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. వారిపై శ్రమదోపిడీ, శారీరక దోపిడీ జరుగుతుంది. రాష్ట్రంలో వృత్తికారులైన స్త్రీల విషయం మరీ దయనీయంగా మారిపోయింది. చేనేతను ధ్వంసంచేసి కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తూ పవర్లూమ్ మగ్గాలను ప్రోత్సహించడంతో చేనేత స్త్రీల బతుకులను చంద్రబాబు దెబ్బతీశారు. ఇక కమ్మరి, కుమ్మరి, చాకలి, మంగలి స్త్రీలు పనిలేక వ్యవసాయ కూలీలుగా మారినా వారి పరిస్థితి కూడు, గూడు లేని స్థితికి నెట్టబడింది. గిరిజన ప్రాంతాల్లోనైతే ఊళ్ళకు ఊళ్ళు మంచాలెక్కాయి. రెండు మందు బిళ్ళలిచ్చే దిక్కు లేకుండా పోయింది. అసలు రాష్ట్రంలో పాలన వుందో, పడకేసిందో తెలియని పరిస్థితి. చంద్రబాబు చూపు ధనవంతులపైన, సొంత కులం పైనే ఉంటోంది. రాష్ట్రంలో స్త్రీ అణచివేతలు అన్ని రంగాల్లో పెరిగిపోతున్న ఈ దశలో స్త్రీలు కూడా ప్రత్యామ్నాయ రాజకీయాల వైపు దృష్టి సారించాలి. ఏపీలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల రీత్యా చంద్రబాబును గద్దె నుంచి దించివేయడం కూడా స్త్రీ ఉద్యమంలో భాగమే. తెలుగు రాష్ట్రాల్లో సామాజిక సాంస్కృతిక ఆర్థిక రాజ కీయ విప్లవానికి స్త్రీ నడుం కట్టాల్సివుంది. స్త్రీ మేలుకున్నప్పుడే దేశానికి నిజమైన విముక్తి. వ్యాసకర్త సామాజిక తత్వవేత్త, వ్యవస్థాపక అధ్యక్షుడు, నవ్యాంధ్రపార్టీ ‘ 98497 41695 -
అమరావతి మూలాలు తెలియని బాబు..!
సందర్భం చంద్రబాబుకు సింగపూర్ నమూనాపై విపరీతమైన మోజు ఉంది. ఆయన బుర్ర నిండా అమెరికా తరహా అభివృద్ధి సాధించాలనే ఆలోచనలే ఉన్నాయి. నిజానికి ఈ రెండూ ప్రధానంగా వ్యాపార దేశాలు. కానీ ఆంధ్రప్రదేశ్ మానవ వనరులు, సహజ వనరులు పుష్కలంగా ఉన్న ఉత్పత్తి కేంద్రం. ఈ రెంటినీ సమన్వయంచేసి, సంపదను వృద్ధి చేయాల్సిన బాబు ఆ పనిచేయడం లేదు. దేశదేశాలు తిరిగి టెక్నాలజీని కూడా అడుక్కోవడం భావదారిద్య్రానికి గుర్తు. చంద్రబాబు వల్లే ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలు ప్రత్యేక రాష్ట్రాల నినాదాలు చేసే పరిస్థితులు ముందుకు వస్తున్నాయి. అందుకే రాష్ట్ర పాలనా వికేంద్రీకరణ జరగాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిలో కట్టే భవనాల గురించి సింగపూర్‌లో ఇటీవల దృశ్య శ్రవణ విన్యాసాలు చేసి వచ్చారు. ఆంధ్రుల సాంస్కృతిక భౌగోళిక చారిత్రక పునాదులు ఆయనకు బొత్తిగా తెలియవని అర్థమౌతోంది. క్రీస్తు పూర్వం రెండో శతాబ్దిలోనే అత్యున్నత నగర నిర్మాణ ప్రావీణ్యం కలిగింది అమరావతి. కృష్ణా నదికి రెండు వైపులా నీటి అద్దంలో భవంతులు కనపడేంత ఎత్తులో అమరావతి నిర్మాణం జరిగింది. ప్రధానంగా అమరావతి ప్రాంతపు నేల చెట్లు, చేమలతో కూడిన విశాలమైన గృహనిర్మాణానికి అనువైంది. ఇక్కడ ఎత్తయిన భవనాలు దీర్ఘకాలం నిలవవు. నిజానికి ఎత్తయిన భవనాల్లో గాలి, నీరు, వెలుతురు తగినంత చేకూరవు. మొదట్లో పూరిళ్లు, తర్వాత పెంకుటిళ్లు చుట్టూ వేప, రావి, గోరింటాకు చెట్లతో నిర్మించుకొనేవారు. వారికి ఈ నేల మీద స్పష్టమైన అవగాహన ఉంది. చంద్రబాబుకు ఆంధ్రుల భౌగోళిక అంశాలపై అధ్యయనం లేదు. ఈ ప్రాంతమంతా బౌద్ధభూమి. అమరావతి నుంచి భట్టిప్రోలు వరకు, ఇంకా అనంతపురం వరకు బౌద్ధ చైత్యాలే. అవేవీ బహుళ అంతస్తుల మేడలు కాదు. అందుకే ఇంతకాలం ఉన్నాయి. ముఖ్యమంత్రి ఒక అమరావతినే కాదు మొత్తం రాష్ట్రాన్ని గుర్తుపెట్టుకొని రాజధాని నిర్మించాలి. అప్పుడే ఆంధ్రులకు పరిపాలనా సమతుల్యత ఏర్పడుతుంది. హైదరాబాద్ రాజధానిగా ఉండగా ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందలేదు. ఇప్పటికీ విశాఖపట్నానికి నగరశోభ రాలేదు. రాష్ట్రానికి ఇద్దరు ఉపముఖ్యమంత్రులు ఉండగా రెండు ఉప రాజధానులు ఉంటే మంచిది. అప్పుడు పరిపాలన వికేంద్రీకరణ జరుగుతుంది. మొదట ఆంధ్ర రాష్ట్ర రాజధాని కర్నూలు అయ్యింది. భాషా ప్రయుక్త ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ రాజధానిగా అవతరించకపోయి ఉంటే ఆంధ్ర రాష్ట్ర రాజధానిగా కర్నూలు, రాయలసీమ చాలా అభివృద్ధి చెందేవి. రాయలసీమ ఒకనాడు రత్నగడ్డ. స్వాతంత్య్రం వచ్చాక నిజంగా చెరువులన్నీ భూస్వాములు ఆక్రమించాక రాయలసీమలో నీటి పారుదల వ్యవస్ధ నాశనమైంది. కర్నూలు జిల్లాకు చెందిన కె.ఇ.కృష్ణమూర్తి ఉప ముఖ్యమంత్రిగా, రెవెన్యూ మంత్రిగా ఉన్నాగాని అక్కడి నీటి పారుదల వ్యవస్థ దిగజారిందే గాని అభివృద్ధి చెందలేదు. దళిత బలహీన వర్గాలేగాక, పేద రైతులు కూడా పంటలు లేక మరింత పేదలవుతున్నారు. రాయలసీమలో పుట్టిన చంద్రబాబు నాయుడు పాలనలో ఈ ప్రాంతంలో విద్యాప్రమాణాలు మరింత దిగజారాయి. ఉదాహరణకు ఒక్క గుంటూరు జిల్లాలోనే 4 లక్షల మంది పిల్లలు, కృష్ణా జిల్లాలో 5 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ స్కూళ్లలో చదువుతుండగా, కర్నూలు జిల్లాలో ప్రైమరీ స్కూళ్లు 394, అప్పర్ ప్రైమరీ స్కూళ్లు 284. ఈ పాఠశాలల్లో మొత్తం విద్యార్థుల సంఖ్య 2,01,199 మాత్రమే. కోస్తా జిల్లాలతో పోల్చితే రాయలసీమలో పాఠశాలల సంఖ్య బాగా తక్కువ. కొన్ని వందల గ్రామాల్లో పాఠశాలలు, లేవు. గ్రంథాలయాలు కనిపించవు. దిన పత్రికలు కూడా వెళ్లని గ్రామాలు ఎన్నో ఉన్నాయి. రాయలసీమలో అక్షరాలు కూడా రాని ప్రజలు గణనీయ సంఖ్యలో ఉన్నారు. చంద్రబాబు కుమారుడు, రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి నారా లోకేష్ ఇటీవల కర్నూలులో మాట్లాడుతూ, గ్రామ స్వరాజ్యం తెస్తానని, ఇంటికో కుళాయి వేయిస్తానని హామీ ఇచ్చారు. ఆయన తండ్రి అంతకు ముందు ఉమ్మడి ఏపీకి తొమ్మిదేళ్లు సీఎంగా పనిచేశారు. తెలంగాణ అవతరించాక ఏపీ సీఎంగా గత నాలుగేళ్లుగా పదవిలో ఉన్నారు. అయినా, ఎందుకు రాయలసీమ ప్రజలందరికీ మంచినీరు కూడా ఇవ్వలేకపోతున్నారు? మరి సీమ ప్రజలు తమ ప్రాంతంలో తగినన్ని వర్షాలు లేక ఇతర నగరాలకు వలసపోతున్నారు. వారు బెంగళూరులో రాళ్ళు మోస్తున్నారు. కేరళలో నిర్మాణం పనుల్లో కూలీలుగా బతుకుతున్నారు. చెన్నైలో భవన నిర్మాణానికి రాళ్లు ఎత్తుతూ పొట్ట నింపుకుంటున్నారు. ఇలా రాష్ట్ర ప్రజలు ఇతర రాష్ట్ర రాజధానుల్లో కూలీలుగా పనిచేయడానికి వలసపోవడం చూసి చంద్రబాబు, లోకేష్‌కు బాధ కలగడం లేదా? రాష్ట్ర బడ్జెట్ రూ.1,56,000 కోట్లు. ఇంతటి బడ్జెట్ ఉన్నా, కేంద్రం నుంచి వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి వచ్చిన నిధులు చేతిలో పెట్టుకొని మంచినీళ్లు కూడా లేని పరిస్థితిని ఎందుకు తెచ్చారు? నాకు తెలిసిన మిత్రుడు ఒకరు పొద్దున్నే కాలకృత్యాలు తీర్చుకోవడానికి కూడా నీరు దొరకని ఊళ్లు రాయలసీమలో ఉన్నాయని చెప్పారు. ఉత్తరాంధ్రలోని అటవీ ప్రాంతం పాడేరులో విషజ్వరాలతో మరణించిన గిరిజన కుటుంబాల గురించి లోకేష్ ఏమి ఆలోచిస్తున్నారు. స్వాతంత్య్రోద్యమంలో పోరాడిన మన ప్రాంత ప్రజలు ఇప్పుడు ఎందుకు రోగాల బారిన పడుతున్నారో ఆలోచించాల్సిన అవసరం పంచాయతీరాజ్ మంత్రిగా ఆయనకు లేదా? రాజకీయ ప్రకటనలు చేసే సభలో అధికారులను కూర్చో బెట్టుకోకూడదనే రాజ్యాంగ సూత్రం కూడా లోకేష్‌కు తెలిసినట్టు లేదు! నిజానికి 15,16వ శతాబ్దాల్లో ఉచ్ఛస్థితిలో ఉన్న రాయలసీమ ఎందుకు కరువు ప్రాంతంగా మారిపోయిందో ఆలోచించాల్సిన అవసరం లేదా? చంద్రబాబుకు సింగపూర్ నమూనాపై విపరీతమైన మోజుంది. ఆయన బుర్రనిండా అమెరికా తరహా అభివృద్ధి సాధించాలనే ఆలోచనలే ఉన్నాయి. నిజానికి ఈ రెండూ ప్రధానంగా వ్యాపార దేశాలు. ఉత్పత్తి దేశాలు కాదు. ఆంధ్రప్రదేశ్ ఉత్పత్తి కేంద్రం. మానవ వనరులు, సహజ వనరులు పుష్కలంగా ఉన్న రాష్ట్రం. ఈ రెంటినీ సమన్వయంచేసి, సంపదను అభివృద్ధి చేయాల్సిన చంద్రబాబు ఆ పనిచేయడం లేదు. దేశదేశాలు తిరిగి టెక్నాలజీని కూడా అడుక్కోవడం భావదారిద్య్రానికి గుర్తు. నిజానికి కోస్తా జిల్లాలతోపాటు చారిత్రక ప్రాధాన్యం కలిగిన ప్రాంతాలైన ఉత్తరాంధ్ర, రాయలసీమ తీవ్ర నిర్లక్ష్యానికి గురవు తున్నాయి. చంద్రబాబు సామాజిక ప్రాంతీయతత్వం వల్ల ఈ రెండు ప్రాంతాలు నష్టపోతున్నాయి. ప్రజల్లో అసంతృప్తి, వేదన పెరుగుతున్నాయి. పాలకుడు స్వార్థపరుడై, తన ప్రాంతపు చారిత్రక పునాదులు తెలియనివాడైతే నిష్పాక్షిక పాలన జరగదు. చంద్ర బాబు వల్లే ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలు ప్రత్యేక రాష్ట్రాల నినాదాలు చేసే పరిస్థితులు ముందుకు వస్తున్నాయి. అందుకే రాష్ట్ర పాలనా వికేంద్రీకరణ జరగాలి. రాష్ట్ర రాజధానిగా అమరావతిని అభివృద్ధిచేసి, కర్నూలు, విశాఖపట్నాలను ఉప రాజధానులుగా తీర్చిదిద్దాలి. అప్పుడే సామాజిక, ప్రాంతీయ పాలనా సమతుల్యత ఏర్పడుతుంది. దీని కోసం ప్రతిపక్షాలు, వామపక్షాలు, లౌకికవాద పార్టీలు ఐక్యంగా పోరాడవలసిన చారిత్రక సందర్భం ఇది. చరిత్ర అంటే సమాజాన్ని మార్చే శక్తుల ఐక్యతే. వ్యాసకర్త సామాజిక తత్వవేత్త, నవ్యాంధ్ర పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు డా '' కత్తి పద్మారావు మొబైల్ : ‘ 98497 41695